ఏపీలో కేన్సర్, కిడ్నీ ఆసుపత్రులు : రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ

Submitted on 13 August 2019
ap cm jagan review on medical and health departments

ఏపీలో అక్టోబర్ 10 నుంచి వైఎస్ఆర్ కంటి వెలుగు పరీక్షలు ప్రారంభం అవుతాయని సీఎం జగన్ తెలిపారు. మంగళవారం(ఆగస్టు 13, 2019) సచివాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై జగన్ సమీక్ష నిర్వహించారు. పట్టాలు తప్పిన ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెడుతున్నామని సీఎం చెప్పారు. కొత్తగా 3 మెడికల్‌ కాలేజీలు.. పేద రోగులకు అండగా ఉండేందుకు 5 క్యాన్సర్, 2 కిడ్నీ ఆస్పత్రుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రాధాన్యతల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రులను... 108, 104 సర్వీసులను మెరుగుపరుస్తున్నాం అన్నారు.

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డు ఇవ్వాలని సీఎం చెప్పారు. డిసెంబర్ 21 నుంచి కార్డుల జారీ ప్రారంభించాలన్నారు. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు. 108, 104 వాహనాలు ఎప్పుడూ కండీషన్ లో ఉండాలన్నారు. వెయ్యి వాహనాలను కొత్తగా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య రంగంపై ట్విట్టర్ లో సీఎం జగన్ స్పందించారు.

పూర్తిస్థాయిలో అన్నిరకాల సదుపాయాలతో 5 కేన్సర్ ఆసుపత్రులు నిర్మిస్తామన్నారు. కడప, విశాఖ, గుంటూరు కర్నూలు, తిరుపతిలో కేన్సర్ ఆసుపత్రులు.. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆసుపత్రులు నిర్మిస్తామన్నారు. పాడేరు, విజయనగరం, గురజాలతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి క్యూఆర్ కోడ్ తో కూడిన హెల్త్ కార్డు జారీ చేస్తామని.. ప్రతి కుటుంబం ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని సీఎం చెప్పారు. ఆరోగ్యశ్రీతో కోటిన్నర మందికి లబ్ది చేకూరుతుందని అంచనా వేశారు. 3 నెలల పాటు పథకం అమలుకు అధ్యయనం చేయనున్నారు. ఆ తర్వాత అన్ని జిల్లాలకు వర్తింపజేస్తారు. జాబితాలో చేర్చాల్సిన వ్యాధుల లిస్ట్ ని తయారు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఏపీ బయట 150 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

 

AP
cm jagan
review
Medical
health departments
Amaravathi

మరిన్ని వార్తలు