మీ డబ్బు, సామాను దోచేస్తారు : నకిలీ ప్యాకర్స్‌ అండ్ మూవర్స్ తో జాగ్రత్త

Submitted on 14 July 2019
becare ful with fake packers and movers

రోజురోజుకి మోసాలు పెరిగిపోతున్నాయి. జనాలను అడ్డంగా దోచేస్తున్నారు. ఇప్పటికే అనేక రకాల ఫ్రాడ్స్ వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో మోసం బయటపడింది. అదే ప్యాకర్స్ అండ్ మూవర్స్. అవును.. ప్యాకర్స్  అండ్ మూవర్స్ ముసుగులో కన్నింగ్ గాళ్లు డబ్బు దోచేస్తున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జాగ్రత్తగా ఉండాలని నగరవాసులను హెచ్చరించారు. నకిలీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ తో కేర్ ఫుల్ గా ఉండాలని  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు.

వివరాల్లోకి వెళితే.. ఇల్లు ఖాళీ చేసి మరో ఇంటికి లేదా ఊరికి వెళ్తున్న సమయంలో ఎవరైనా ఏం చేస్తారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ ని ఆశ్రయిస్తారు. ఆ సంస్థకు చెందిన వారు మన ఇంటికి వచ్చి అన్నీ ప్యాక్ చేసి వాళ్లే  వాహనాల్లో తరలిస్తారు. అయితే ఇలాంటి సంస్థల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్ కోరారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థల్లో కొన్ని ఫేక్ సంస్థలు ఉన్నాయని చెప్పారు. ఆకర్షణీయమైన ఆఫర్లు, తక్కువ ధరకే సేవల పేరుతో గాలమేసి మన సామాగ్రిని, అడ్వాన్స్‌ రూపంలో డబ్బుని కాజేసి మోసం చేస్తున్నాయని వెల్లడించారు. ఇటీవల ఇలాంటివి 2 కేసులు నమోదయ్యాయన్నారు.

నకిలీ ఆన్ లైన్ రివ్యూలు, తప్పుడు క్లాసిఫైడ్స్ లిస్టింగ్స్, ప్రస్తుత మార్కెట్ రేట్ల కన్నా తక్కువ ధరకు కోట్ చేసి చాలా కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయని సజ్జనార్ తెలిపారు. ఇంటి సామాగ్రి తరలించడానికి  ముందే భారీ మొత్తంలో డబ్బు డిపాజిట్ చేస్తే.. ఆ డబ్బుతో పారిపోతారని చెప్పారు. ఇటీవల VRS లాజిస్టిక్స్ లిమిటెడ్ బ్రాండ్ పేరుతో నకిలీ సంస్థలు ఏర్పాటు చేసి ఎంతో మంది వినియోగదారులను  మోసగించారని సీపీ అన్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసి జైలుకి పంపామన్నారు. ఈ క్రమంలో ప్యాకర్స్ అండ్ మూవర్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీపీ తెలిపారు. 

పాటించాల్సిన జాగ్రత్తలు:
* వెబ్‌సైట్లను అన్ని రకాలుగా పరిశీలించాలి.
* మొబైల్ నెంబర్లు తీసుకోవడమే కాకుండా కార్యాలయాలకు స్వయంగా వెళ్లాలి. సరైందా, కాదా చెక్ చేసుకోవాలి.
* పేరున్న సంస్థల పేర్లలో కొన్ని అక్షరాలను అటు ఇటుగా మార్చి నకిలీ సంస్థలు పెట్టుకుంటాయి. జాగ్రత్తగా గమనించాలి.
* సామాగ్రిని తరలించేందుకు వాడే వాహనాలనూ పరీక్షించాలి. సొంత వాహనాలు వాడుతున్నారో లేదో చెక్ చేసుకోవాలి.
* వినియోగదారులు తమ వాహనాల తాళాలు వారి చేతికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు.
* సామాగ్రిని తీసుకెళ్లేందుకు వచ్చే వారి నుంచి సరకు బీమా కాపీని తీసుకోవాలి. 
* ఉత్తమ బ్రాంచ్‌ నెట్‌వర్క్‌ ఉన్నదీ లేనిదీ చెక్ చేసుకోవాలి. 
* సంస్థలకు తప్పకుండా తగిన రిజిస్ట్రేషన్‌ నెంబర్, బ్యాంకు ఖాతా, పాన్‌ కార్డు నెంబర్ పరిశీలించాలి.
* గతంలో సేవలు పొందిన వినియోగదారుల గురించి అడిగి తెలుసుకోవాలి.
* వారిచ్చే హెల్ప్‌ డెస్క్‌, కస్టమర్‌ కేర్‌ మొబైల్ నెంబర్లు పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవాలి.
* సిబ్బంది గుర్తింపు కార్డు పరిశీలించడమే కాకుండా ఫోన్‌ నెంబర్ తీసుకోవాలి. 
* సామాగ్రి తరలించేందుకు వచ్చే వాహనాల పర్మిట్‌ తదితర పత్రాలు తనిఖీ చేసుకోవాలి. 
* నియమ నిబంధనలు క్షుణ్ణంగా చదవాలి. 
* మొబైల్ లో కాకుండా నేరుగా వెళ్లి సిబ్బందితో మాట్లాడాకే సామాగ్రి తరలించే నిర్ణయం తీసుకోవాలి.
* భారీ మొత్తంలో అడ్వాన్స్ చెల్లింపులు చేయకూడదు.

ఇలా మోసం చేస్తారు:
* మోసగాళ్లు నకిలీ సంస్థల వివరాలను వెబ్‌సైట్లలో ఉంచుతారు. వాటిలో వినియోగదారుల ఫేక్ రివ్యూలు ఉంచుతారు. క్లాసిఫైడ్‌ సైట్ల వారికి డబ్బులిచ్చి తమ సంస్థ అగ్రస్థానంలో ఉన్నట్లు నకిలీ క్లాసిఫైడ్‌ లిస్టింగ్‌లను  తయారు చేస్తారు.
* ప్రస్తుత మార్కెట్‌ ధర కన్నా తక్కువ ధరలంటూ ప్రకటనలిస్తారు.
* ఆకట్టుకునే ఆఫర్లూ ప్రకటిస్తారు.
* భారీ మొత్తంలో డబ్బులు డిపాజిట్‌ చేయాలని కోరతారు. అలా వసూలు చేసే సంస్థలు డబ్బుతో పారిపోతారు.

pakcers and movers
Fake
fraud
Hyderabad
Sajjanar
be careful
crime
vrs logistics

మరిన్ని వార్తలు