కార్యకర్త పాడె మోసిన స్మృతి ఇరానీ : కన్నీటి వీడ్కోలు

Submitted on 26 May 2019
BJP MP Smriti Irani lends a shoulder to mortal remains of Surendra Singh

అమేథీ: ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ కక్షలు రగులుతున్నాయి. బీజేపీ కార్యకర్త, బరూలియా గ్రామ మాజీ సర్పంచ్, అమేథీలో స్మృతి ఇరానీ అనుచరుడు సురేంద్ర సింగ్ ని శనివారం రాత్రి హత్య చేశారు. అతని ఇంటి దగ్గరే దుండగులు తుపాకీతో కాల్చి చంపారు.  జాము పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సురేంద్రసింగ్ అంత్యక్రియలకు హాజరైన స్మృతి ఇరానీ.. సురేంద్ర సింగ్ భౌతిక కాయాన్ని స్వయంగా తన భుజాలపై మోశారు. 

బరూలియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ మొదటి నుంచి బీజేపీకి మద్దతుదారుడిగా ఉన్నాడు. స్మృతి ఇరానీకి సన్నిహితుడు. ఎన్నికల ప్రచారంలో ఆమె వెంటే ఉండి బీజేపీ గెలుపుకు కృషి చేశారు. శనివారం (మే 25, 2019) రాత్రి  సురేంద్రసింగ్ ను దుండగులు హత్య చేశారు. సురేంద్రసింగ్ ను కాల్చిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేనట్లుగా తెలుస్తోంది.  లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేంద్ర సింగ్ కన్నుమూశాడు. ఈ  ఘటనలో ఇద్దరూ అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

అమేథీ రాజకీయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించారు. 15 ఏళ్లుగా అమేథిలో కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. కానీ అక్కడి ప్రజలకు రాహుల్ గాంధీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందించలేదని బీజేపీ కార్యర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అమేథీ నుంచి స్మృతి ఇరానీ గెలుపొందిన తర్వాత ఈ హత్య జరగడం కలకలం రేపింది. ఇది రాజకీయ హత్యగా బరోలియా గ్రామస్తులు భావిస్తున్నారు. 

BJP. MP
Amethi
Smriti Irani
Surendra Singh
Barauli

మరిన్ని వార్తలు