తెలంగాణలో కమల వ్యూహం : బీజేపీ టచ్‌లో కాంగ్రెస్ ఎంపీ ?

Submitted on 26 May 2019
BJP Winning 4 Seats in Telangana | BJP strategies in Telangana

టార్గెట్ సౌత్.. మరోసారి ఇదే విషయంపై దృష్టిపెడుతోంది బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెల్చిన కమలనాథులు.. తెలంగాణలో పాగా వేసేందుకు ట్రై చేస్తున్నారు. 4 ఎంపీ స్థానాలను గెల్చి జోష్ మీదున్న ఆ పార్టీ నేతలు.. అదే జోరు కొనసాగించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అవసరమైతే.. ఆకర్ష్ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. 

పార్లమెంట్ ఎన్నికల్లో 303 సీట్లు సాధించి బీజేపీ ఫుల్ స్వింగ్ మీదుంది. ఎన్డీఏ పక్షాలతో కలిపితో పార్లమెంట్‌లో ఆ పార్టీ బలం 352 సీట్లున్నాయి. మొన్నటి ఫలితాలపై బేరీజు వేసుకుంటున్న నేతలు.. దేశమంతా బీజేపీ గాలి వీస్తోందనే చెబుతున్నారు. ఈ వేవ్ కంటిన్యూ చేయాలని.. అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని కమలనాథులు గట్టిగానే అనుకుంటున్నారు. ఇటు తెలంగాణలో కూడా దూకుడుగా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం.. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలను గెల్చుకుంది. గతంలో ఒక్క స్థానానికి పరిమితమైనా.. ఈ సారి మాత్రం కీలక నియోజకవర్గాలైన నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్‌తో పాటు.. ఆదిలాబాద్‌ను తన ఖాతాలో వేసుకుంది. 

సౌత్‌లో పాగా వేయాలని బీజేపీ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. దానికి తగ్గట్లుగానే వ్యూహాలు రచించినా.. అవి అంతగా వర్కవుట్ కాలేదు. అయితే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్‌లో చేరిపోయారు. దీంతో.. హస్తం పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోయిందనే ఇప్పుడు బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అంతే కాకుండా.. కాంగ్రెస్ ఖతం అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఏకంగా అధ్యక్షుడు రాహుల్ గాంధీనే ఓడిపోయారు కాబట్టి ఇక కాంగ్రెస్ ఎక్కడుంది అని జనాల దృష్టికి తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 

4 ఎంపీ సీట్లు వచ్చిన ఆత్మ విశ్వాసంతో... ఇతర పార్టీల నేతలకు గాలం వేయాలని బీజేపీ స్కెచ్ వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చి చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన లీడర్లతో బీజేపీ నేతలు టచ్‌లో ఉంటున్నారు. అంతే కాకుండా.. కాంగ్రెస్‌కు ఇంతకాలం అండగా ఉన్న ఓ సామాజికవర్గాన్ని టార్గెట్ చేయాలని వ్యూహం పన్నుతోంది.

పైగా.. ఇటీవలే కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెల్చిన ఓ నేత తమతో టచ్‌లో ఉన్నాడనే టాక్ కాక రేపుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా 19.5 శాతం ఓట్ షేర్‌ను బీజేపీ సాధించింది. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే.. త్వరలోనే తెలంగాణలో పాగా వేయొచ్చని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మరి కమలం పార్టీ వ్యూహాలు ఎంత వరకు వర్కవుట్ అవుతాయో చూడాలి. 

BJP
Winning 4 Seats
Telangana BJP
strategies
Telangana Election 2019

మరిన్ని వార్తలు