బీజేపీలోకి 10మంది ఎమ్మెల్యేలు : ఒక్క సీటు గెలవకపోయినా రెండో అతిపెద్ద పార్టీగా గుర్తింపు

Submitted on 13 August 2019
Boost for BJP 10 MLAs join bjp

సిక్కింలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ బలంగా పని చేసింది. సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఇప్పుడు ఒక్క రోజులోనే రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎలాగంటే.... ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీగా ఉన్న సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి బీజేపీలో చేరారు. మంగళవారం(ఆగస్టు 13,2019) బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిసిన ఎమ్మెల్యేలు.. పార్టీ జనరల్‌ సెక్రటరీ రామ్‌ మాధవ్‌ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 

ఒక్క సిక్కిం మినహా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో బీజేపీ పవర్ లో ఉంది. కొన్నింటిలో నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారంలో ఉంది. తాజా చేరికలతో సిక్కింలోనూ బీజేపీ బలపడినట్లు అయ్యింది.

సిక్కింలో 32 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్‌(ఎస్‌డీఎఫ్‌) ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. ఈ పార్టీకి 15 స్థానాలు వచ్చాయి. సిక్కిం క్రాంతికారి మోర్చా 17 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఎస్‌డీఎఫ్‌ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఇద్దరు చెరో రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఫలితాల తర్వాత వారు ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలా ఎస్‌డీఎఫ్‌ సంఖ్యా బలం 13కు పడిపోయింది. ఈ 13 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. ఎస్‌డీఎఫ్‌ అధినేత పవన్ చామ్లింగ్‌ దేశంలోనే అత్యంత ఎక్కువ కాలం సీఎంగా పనిచేసి రికార్డు సృష్టించారు. 25ఏళ్లకు పైగా సిక్కిం సీఎంగా ఉన్నారు.

తాజా పరిణామాలతో బీజేపీ నేతలు ఖుషీగా ఉన్నారు. సిక్కింలో పార్టీ బలపడటంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి పనులు చూసే ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ఈ పరిణామం బీజేపీకి బూస్టింగ్ ఇచ్చింది. దీన్ని ఘన విజయంగా కమలనాథులు అభివర్ణిస్తున్నారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లోనూ ఇలానే బలపడతామన్నారు.

Boost for BJP
10 MLAs
Sikkim Democratic Front join party
Pawan Chamling
join
BJP
rammadhav
JP NADDA

మరిన్ని వార్తలు