లిఫ్ట్‌లో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు : గోడ పగులగొట్టి రక్షించారు

Submitted on 12 June 2019
boy saved lift chanda nagar Police Limits

మూడేళ్ల బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కుని నరకయాతన పడ్డాడు. 4 గంటల పాటు అందులోనే ఉండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. సురక్షితంగా బయటకు రావాలని వేడుకున్నారు. 108, అగ్నిమాపక సిబ్బంది శ్రమించి బాలుడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తమ కుమారుడిని బయటకు తీసుకొచ్చినందుకు పేరెంట్స్ కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. 

రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్‌లో ఎమ్ రాల్ ఎ 2 బ్లాక్ మొదటి అంతస్తులో మూడేళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు. లిఫ్ట్‌లోకి వెళ్లాడు. ఎవరో స్విచ్ నొక్కడంతో లిఫ్ట్ ఐదో అంతస్తుకు వెళ్లింది. అక్కడ ఆగకుండా పూర్తిగా పైకి వెళ్లి ఆగిపోయింది. మరలా ఆన్ కాలేదు. అందులో ఇరుక్కున్న బాలుడు కేకలు వేయసాగాడు. భోరున ఏడ్చాడు. ఏడుపు శబ్దాలు ఎవరికీ వినిపించలేదు. చివరకు కొద్దిసేపటికి అపార్ట్ మెంట్‌లో ఉన్న వారు లిఫ్ట్‌లో బాలుడున్నట్లు గమనించారు. తల్లిదండ్రులకు తెలియచేశారు. స్థానికుల సహాయంతో లిఫ్ట్ తలుపులను తెరిచేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. అప్పటికే పేరెంట్స్‌‌ ఆందోళన పడుతున్నారు. 

ఇలా చేస్తే లాభం లేదని అనుకుని 108, అగ్నిమాపక దళం, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడకు చేరుకున్నారు. బాలుడిని బయటకు ఎలా తీసుకరావాలనే దానిపై ఆలోచించారు. చివరకు లిఫ్ట్ ఎక్కడైతే ఆగిందో..అక్కడ గోడ పగులగొట్టాలని అనుకున్నారు. గోడను పగులగొట్టారు. అందులో నుండి బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇది పూర్తవ్వడానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. ఈ దృశ్యాలను కొంతమంది సెల్ ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బాలుడు క్షేమంగా బయటకు రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

boy saved
Lift
chanda nagar
Police
limits

మరిన్ని వార్తలు