క్యాబ్ రైడ్ రద్దు చేస్తే లక్ష కట్టాల్సిందే..

18:04 - September 30, 2018

ఢిల్లీ : బస్ రావాలి..బైటకు పోవాలి అనేది పాతసంగతి. చేతిలో స్మార్ట్ ఫోన్ వుంటే హలో అంటే పొలో అని వచ్చేస్తున్నాయి క్యాబ్ లు. ఒక్క క్లిక్ తో ఇంటిముందు వాలిపోతున్నాయి. ప్రయాణీకులకు చక్కటి ప్రయాణ సాధనంగా క్యాబ్ లు మారిపోయాయి. ఈ సౌకర్యం బాగానే వున్నా..కొంతమంది డ్రైవర్లు ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఒక్కసారి బుక్ చేసుకున్నాక ఆ క్యాబ్ డ్రైవర్ రాలేనంటే ఇకపై కుదరదు. 
క్యాబ్‌ సర్వీసులు. దిల్లీ, బెంగళూరు, ముంబయి వంటి నగరాల్లో అయితే.. చాలా మంది వరకు వీటి మీదే ఆధారపడతారు. గత కొన్నేళ్లుగా ఓలా, ఉబెర్‌ వంటి సంస్థలు ప్రజలకు క్యాబ్‌ సేవలను అందిస్తున్నాయి. మనం ఏదైనా ప్రాంతానికి వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసుకున్న తర్వాత కొంతమంది డ్రైవర్లు ఆ ప్రదేశానికి రాలేమంటూ రైడ్‌ను రద్దు చేసుకుంటారు. ఇక మీదట అలా ఎవరైన డ్రైవర్‌ రైడ్‌ను రద్దు చేస్తే రూ.25వేల వరకు జరిమానా ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఓ ప్రతిపాదనను దిల్లీ ప్రభుత్వం త్వరలోనే తీసుకురానుంది.
క్యాబ్‌ సేవల ధరలు పెరుగుదలను నియంత్రించడంతో పాటు, వాటిల్లో ప్రయాణించే ప్రయాణికుల భద్రతకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిందిగా కోరుతూ దిల్లీ రోడ్డు రవాణా శాఖ సరికొత్త డ్రాఫ్ట్‌ను రూపొందించింది. క్యాబ్‌ డ్రైవర్లు ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై పోలీస్‌ కేసు పెట్టాలని ఆ డ్రాఫ్ట్‌లో పేర్కొన్నారు. ఒకవేళ కేసు పెట్టకుండా ఉన్నట్లయితే సదరు డ్రైవర్ లక్ష రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ముసాయిదాను దిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి సత్యేంద్ర జైన్‌ త్వరలోనే కేబినెట్‌ ముందు పెట్టనున్నారు. 

 

Don't Miss