Activities calendar

07 July 2015

21:35 - July 7, 2015

ఢిల్లీ : ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు రాజకీయ పార్టీలు ఆర్టీఐ పరిధిలోకి ఎందుకు రావని సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ఆరు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు చీఫ్‌ జస్టిస్‌ హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు నోటీసులు పంపింది. ఇదే విషయంపై కేంద్రం, ఎన్నికల సంఘం తమ వైఖరేంటో చెప్పాలని నోటీసులు పంపింది. రాజకీయ పార్టీలు - ఆర్టీఐ పరిధి విషయమై గతంలో ఓ ఎన్జీఓ అసోసియేషన్‌ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన దత్తు నేతృత్వంలోని ధర్మాసనం జాతీయ పార్టీలు, కేంద్రం, ఈసీ అభిప్రాయాలు కోరుతూ నోటీసులు పంపింది. 

21:24 - July 7, 2015

విజయనగరం : జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదనపై ఏపీ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. ఎయిర్‌పోర్టు నిర్మాణంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తున్నా.. ఆగమేఘాల మీద సర్కార్‌ తుది నిర్ణయాలు తీసుకుంటోంది. రైతులకు ఏం కావాలో చెప్పండి చేస్తామంటూనే.. ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. దీంతో ఇప్పుడు భోగాపురం మండలం అట్టుడుకుతోంది. అభివృద్ధి పేరుతో వినాశన చర్యలకు దిగొద్దని ఇటు ప్రజాసంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి.
5,585 ఎకరాల సేకరణ..
ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం రైతులు భూములివ్వాలని ప్రభుత్వం కోరడంతో.. కొంతకాలంగా భోగాపురం మండల రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎన్నోఏళ్ల నుంచి సాగు చేస్తున్న తమ పంట భూములను ఇచ్చేది లేదని తేగేసి చెబుతున్నారు. తాజాగా ఎయిర్‌ పోర్టు నిర్మాణంపై సర్కార్‌ మరింత దూకుడుగా వ్యవహరిస్తుండడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైన వాతావరణం తీసుకొచ్చే బాధ్యతను చంద్రబాబు.. మంత్రి గంటా శ్రీనివాస్‌రావుకు అప్పగించారు. దీంతో కీలక సమావేశం విశాఖ సర్క్యూట్ హౌస్‌లో విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశ అనంతరం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 5 వేల 585 ఎకరాలు సేకరిస్తున్నట్లు గంటా ప్రకటించారు. రైతులు ఎయిర్‌పోర్టు వద్దంటే కుదరదన్నారు. మొత్తం 7 పంచాయితీల పరిధిలోని భూములను సేకరించాలని నిర్ణయించారు. 
మృణాళిని కారును అడ్డుకున్న అఖిలపక్ష నేతలు..
మంత్రుల సమావేశం జరుగుతండగానే.. భోగాపురం రైతులు అఖిల పక్ష నేతల సారథ్యంలో విశాఖకు తరలివచ్చారు. ఎయిర్‌పోర్టు వద్దంటూ నినాదాలు చేశారు. తాగు, సాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం ఎయిర్ పోర్టులు కడితే ఎవరికి ప్రయోజనమని ప్రశ్నించారు. ప్రాణాలు ఒడ్డి అయినా పోరాడుతామని హెచ్చరించారు. మంత్రులను కలిసి తమ నిర్ణయాన్ని చెప్పాలని వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి మృణాళిని కారును అడ్డుకుని నినాదాలు చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.
ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్‌..
అభివృద్ధి పేరుతో పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టొద్దని, తమ కడుపులను కొట్టొద్దని భోగాపురం మండల వాసులు దీనంగా వేడుకుంటున్నారు. తమ భవిష్యత్తును అంధకారంలో నెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. చట్టాలు, సెక్షన్లతో తమను ఇబ్బంది పెట్టినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంలో సర్కార్‌ మొండిగా ముందుకెళ్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. 

21:21 - July 7, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో తాజాగా సండ్రను అరెస్టు చేసిన ఏసీబీ.. మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డిని మరోసారి ప్రశ్నించడానికి నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇక ఎఫ్ఎస్ఎల్ పూర్తి స్థాయి నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించనుండటంతో వాయిస్‌ టెస్టింగ్‌ చేసేందుకు మరికొందరు టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
త్వరలో వేం నరేందర్ రెడ్డికి ఏసీబీ నోటీసులు..
ఈ కేసులో తాజాగా సండ్ర కస్టడీ కోసం పిటిషన్ వేసిన ఏసీబీ... టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. వేం నరేందర్ రెడ్డిని అధికారులు ఇప్పటికే ఓసారి విచారించారు. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు 41 ఎ కింద నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని నిందితులుగా పేర్కొన్న ఏసిబి ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసింది. ఇంకా మత్తయ్యను, జిమ్మిబాబును విచారించాల్సి ఉంది. మత్తయ్య అరెస్టు నుంచి తప్పించుకునేందుకు హైకోర్టు నుంచి స్టే పొందగా.. జిమ్మిబాబు ఎసిబి జారీ చేసి నోటీసును సవాల్‌ చేస్తూ కోర్టులో పిటిషన్‌ వేయనున్నట్లు సమాచారం.
ఆ ఇద్దరికీ నోటీసులు...
ఇక ఎమ్మెల్యేలను ప్రభావితం చేసిన వారితో పాటు ఈ కుట్ర అమలుకు అవసరమైన డబ్బును అందించిన వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు ఎసిబి ప్రయత్నాలు చేస్తోంది. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు అడ్వాన్స్‌గా ఇచ్చిన 50 లక్షల రూపాయలు కొందరు తెలుగుదేశం ప్రముఖల ఖాతాల నుంచి డ్రాచేసినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. వీరిలో ప్రధానంగా సిఎం రమేష్‌, గరికపాటి రామ్మోహన్‌ల ఖాతాల నుంచి డబ్బు వచ్చినట్లు సమాచారం అందింది. దీంతో వీరిద్దరికి కూడా నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించే అవకాశం ఉంది.
నేతల వాయిస్ రికార్డింగ్ చేసే అవకాశం..
మరోవైపు వాయిస్‌ రికార్డింగ్‌లకు సంబంధించి ఫోరెన్సిక్‌ సైన్స్ లాబ్... త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను కోర్టుకు అందించనుంది. ఈ రిపోర్ట్ అందిన తరువాత కొందరు నేతల వాయిస్‌ రికార్డింగ్‌ చేసేందుకు ఎసిబి కోర్టులో పిటిషన్‌ వేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వాయిస్‌ ఉండటంతో ఆయన వాయిస్‌ కూడా తీసుకునే అవకాశం ఉంది. వాయిస్‌లు వాస్తవమేనని నిర్థారణ అయితే మరి కొందరిని నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఇదే జోరుతో దర్యాప్తు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో మరో 20 మందికి నోటీసులను జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. 

21:18 - July 7, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆయనకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సండ్రను తమకు ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని ఏసీబీ అధికారులు, బెయిల్‌ మంజూరు చేయాలంటూ సండ్ర కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వీటిపై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. సండ్రను చర్లపల్లి జైలుకు తరలించిన అధికారులు ఖైదీ నెంబర్‌ 4887ను కేటాయించారు.
ఏ 5 నిందితుడు..
ఏసీబీ నోటీసులతో సోమవారం విచారణకు హాజరైన ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నించి.. అరెస్టు చేసి మంగళవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో సండ్రను ఏ5 నిందితునిగా చేర్చారు. మరోవైపు సండ్రకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. సండ్రను తమకు ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు, బెయిల్‌ మంజూరు చేయాలంటూ సండ్ర కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. వీటిపై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
సండ్ర..వెంకట కాల్ డేటా..
సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ మధ్య కాల్‌డేటా ఎలా బయటికి వచ్చిందన్న విషయాన్ని ఏసీబీ బయటపెట్టింది. సెబాస్టియన్, సండ్రల మధ్య ఫోన్ సంభాషణలు జరిగిన సమయంలో సెబాస్టియన్ హెచ్‌టీసీ స్మార్ట్ ఫోన్ వాడారని... అయితే ఈ ఫోన్‌లో ఆటో రికార్డింగ్ ఆప్షన్ వల్ల వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలన్నీ రికార్డు అయ్యాయని తెలిపారు. సండ్ర అరెస్టుకు ఈ సంభాషణే కీలకమైంది. మే 27 నుంచి 30 వరకు వీరిద్దరి మధ్య 32 సార్లు ఫోన్ సంభాషణ జరిగిందని ఏసీబీ తెలిపింది.
బాబు నివాసంలో కీలక భేటీలు...
సెబాస్టియన్‌తో మాట్లాడే సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎక్కడున్నాడు, ఎవరి వద్ద ఉన్నాడు అనే విషయాలను సైతం ఏసీబీ అంచనా వేయగలగింది. ఈ ఫోన్ కాల్ సంభాషణల్లో సండ్ర రెండు నెంబర్లు వాడినట్లు దర్యాప్తులో తేలింది. కాల్ డేటా విశ్లేషణ ప్రకారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, చంద్రబాబు నివాసంలో కీలక భేటీలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఎమ్మెల్యేలను కొనే ప్లాన్‌ను అమలు చేసేందుకే చర్చలు జరిపారని.. ఈ సమయంలో సండ్ర అత్యంత జాగ్రత్తగా వ్యవహరించినట్లు ఏసీబీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.
కీలక పాత్ర సండ్రదే..
రేవంత్ అరెస్టయిన రోజు, అంతకు ముందు రెండు రోజులు సండ్ర ఎక్కడికి వెళ్లారు ?, ఎవరిని కలిశారు ? ఎంతసేపు మాట్లాడారు ? అనే విషయాలను సండ్ర డ్రైవర్ లచ్చును అడిగి ఏసీబీ వివరాలు రాబట్టినట్లు సమాచారం. చంద్రబాబు, రేవంత్‌తో పాటు మరికొంత మంది కీలక వ్యక్తులతో సండ్ర చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సెబాస్టియన్‌తో సండ్ర జరిపిన ఫోన్ సంభాషణల ఆధారంగా ఓటుకు నోటు కేసులో కీలక పాత్ర పోషించింది ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యనే అని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది.

విశాఖ ఏజన్సీలో మావోయిస్టుల ప్రజా సభ..

విశాఖపట్టణం : ఏజెన్సీ ముంచంగిపుట్ లో మావోయిస్టులు ప్రజా సభ నిర్వహించారు. బూటకపు ఎన్ కౌంటర్లు, అక్రమ అరెస్టులను సభ ఖండించింది. మీడియాకు మావోయిస్టులు వీడియోలు పంపించారు.  

సమన్లను తిప్పి పంపిన మోడీ న్యాయవాది..

ఢిల్లీ : ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్‌మోడీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీచేసిన సమన్లను లలిత్‌మోడీ తరుపు న్యాయవాది తిప్పి పంపారు. సమన్లు తీసుకోవడానికి తాను అధికారిక వ్యక్తిని కాదన్న మహమూద్ యూకేలో ఉన్న లలిత్‌మోడీ చిరునామాకు సమన్లు పంపించాలని ఈడీకి సూచించారు. 

కార్మికుల సమ్మెను కేసీఆర్ పట్టించుకోవడం లేదు - బీజేపీ..

హైదరాబాద్ : మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని బీజేపీ నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. మున్సిపల్ శాఖను తనవద్దే ఉంచుకున్నా ఈ సమస్యను పరిష్కరించేందుకు కనీసం చొరవ తీసుకోకపోవడం ఆయన నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు.

 

మిక్స్ డ్ డబుల్స్ క్వార్టర్స్ లో పేస్..మార్టినా జోడి..

ఇంగ్లాండ్ : వింబుల్డన్ లో జరుగుతున్న టెన్సిన్ టోర్నమెంట్ లో మిక్స్ డ్ డబుల్స్ లో లియాండర్ పేస్, మార్టినా హింగీస్ జోడి క్వార్టర్స్ కు చేరుకున్నారు. అర్టెన్ సిటక్, అనాస్తసియా రొడియెవా జోడిపై 6-2, 6-2 తో గెలుపొందారు. 

ఢిల్లీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం...

ఢిల్లీ : అడ్మిషన్ కోసం వచ్చిన ఓ విద్యార్థిని కళాశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఢిల్లీ విశ్వ విద్యాలయ పరిధిలోని కాళింది కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

బుధవారం నుండి ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్..

ఇంగ్లాండ్ : బుధవారం నుండి బుధవారం నుండి ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో 5 టెస్టు మ్యాచ్ లు, టి-20 మ్యాచ్ లు, ఐదు వన్డేలు జరుగనున్నాయి.

20:40 - July 7, 2015

హైదరాబాద్ : సింగరేణి కార్మికులు పోరుబాట పట్టారు. కంపెనీలో డిస్మిస్‌ అయిన వీఆర్‌ఎస్‌, సీఆర్‌ఎస్‌ కార్మికులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని... హైదరాబాద్‌లోని సింగరేణి కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. డిస్మిస్‌ కార్మికులను పనిలోని తీసుకుంటామని గతంలో హామీలు ఇచ్చారని.. తెలంగాణ ఏర్పడినా కూడా ఇంకా కార్మిలను విధుల్లోకి తీసుకోలేదని మండిపడ్డారు. సింగరేణి యాజమాన్యం, నాయకులకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు.

20:39 - July 7, 2015

కడప : జిల్లాలో నిధుల గోల్‌మాల్‌పై కలెక్టర్ కె.వి.రమణ విచారణ చేపట్టారు. జడ్పీలో 13వ ఆర్థిక సంఘ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, జనరల్ ఫండ్స్ లను వైసిపి ఎమ్మెల్యేలు, జడ్పీటిసిలు, ఎంపీలు ఇష్టారాజ్యంగా పంచుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్‌ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. వైసిపి ప్రజా ప్రతినిధులకు సహకరించిన అధికారులపై వేటు వేసేందుకు కూడా కలెక్టర్‌ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. విచారణలో దోషులు ఎవరనేది బయటకు వస్తారని కలెక్టర్‌ చెబుతున్నారు.

20:38 - July 7, 2015

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడ, కోదాడల్లో సీఐటీయూ బస్‌ జాత నిర్వహించారు. వీరికి స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని, ఈఎఫ్‌, పీఎఫ్‌లు చెల్లించాలని సీఐటీయూ నేతలు డిమాండ్‌ చేశారు. కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ నిరంతర పోరాటం చేస్తోందని కార్మిక నేతలు అన్నారు. వెంటనే కార్మికులకు కనీస వేతనం 15వేల రూపాయలు అమలు చేయాలన్నారు.

20:35 - July 7, 2015

ఖమ్మం : సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను అరెస్టు నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో టిడిపి నేతలు ఆందోళనలు చేపట్టారు. పాల్వంచలోని అంబేద్కర్‌ సెంటర్‌లో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. సండ్రను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. సత్తుపల్లిలో టిడిపి నేతలు బంద్ ప్రకటించారు. పట్టణంలోని పలు షాపులను మూసేయించారు. దీంతో టీఆర్‌ఎస్‌ నేతలు షాపులను ఓపెన్‌ చేయించడంతో... పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో సత్తుపల్లిలో బంద్‌ విఫలమైందని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రకటించారు. మరోవైపు సత్తుపల్లిలో ఆందోళనలకు దిగిన టిడిపి నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఖమ్మంలోని జడ్పీ సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద టిడిపి నేతలు నిరసన తెలిపారు.

20:32 - July 7, 2015

విజయవాడ : కరెంట్ షాక్ తగిలి చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల చొప్పున ముష్టివేసినట్లు నష్టపరిహారం ప్రకటించారని ప్రతిపక్షనేత జగన్‌ మండిపడ్డారు. విజయవాడ ఊర్మిళానగర్‌లో కొద్దిరోజుల క్రితం జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో మరణించిన కుటుంబాలను జగన్‌ పరామర్శించారు. ఒక్కొక్కరికి 30 లక్షల పరిహారాన్ని ఇచ్చేంతవరకు పోరాడతామని, ట్రాన్స్‌కోపై కోర్టులో న్యాయపోరాటం చేస్తామని జగన్ అన్నారు. ఇది పూర్తిగా విద్యుత్ శాఖ వైఫల్యమేనని, అవసరమైతే ఉద్యమం చేసేందుకు వెనుకాడబోమని కుటుంబ సభ్యులకు జగన్‌ హామీ ఇచ్చారు. 

20:31 - July 7, 2015

శ్రీకాకుళం : తన కొడుకు జాడ చెప్పమంటూ ఓ తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అన్నల్లో నుంచి వచ్చి జనజీవన స్రవంతిలో కలసిన మాజీ మావోయిస్టు కేశవరావు అలియాస్‌ ఆజాద్‌ నాలుగేళ్లుగా ఏమయ్యాడో తెలియదంటూ తల్లి కోర్టులో ఫిర్యాదు చేసింది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కేశవరావు.. 2011లో పోలీసులకు లొంగిపోయాడు. అప్పటి నుంచి మావోయిస్టుల సమాచారం చెప్పాలంటూ పోలీసులు తన కొడుకు వేధించేవారని తల్లి కాములమ్మ వాపోతుంది. అప్పటి నుంచి తన కొడుకు కనిపిండంలేదని పోలీసులే ఏమైనా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది. కోర్టు తనకు న్యాయం చేయాలని, తన కొడుకు ఆచూకీ చెప్పాలని కోరింది.

20:30 - July 7, 2015

గుంటూరు : జిల్లా అమర్తలూరు మండలం, కోడితాపర్రులో ఆరుగురు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో చికిత్స పొందుతూ ఓ రైతు చనిపోయాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన వ్యవసాయ భూముల్లో.. దేవాదాయశాఖ అధికారులకు, రైతులకు మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో ఆరుగురు రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వెంటనే గమనించి.. తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బోస్‌ అనే రైతు చనిపోయాడు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

 

20:29 - July 7, 2015

వరంగల్‌ : జిల్లా ఆత్మకూర్‌ మండలం, దామెర గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా బెల్టు షాపు నిర్వహించే మలహల్‌రావును గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్‌ పోసి నిప్పంటించిన ఆనవాళ్లు ఉన్నాయి. అయితే భార్య మాత్రం మలహల్‌రావు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతోంది. కొంతకాలంగా భార్యభర్తలకు గొడవలు ఉన్నాయని... భార్యే పథకం ప్రకారం చంపించి ఉంటుందని మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మలహల్‌రావు గుర్తుతెలియని వ్యక్తులతో అర్ధరాత్రి వరకు మాట్లాడాడని.. ఉదయం శవమై కనిపించాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

20:27 - July 7, 2015

హైదరాబాద్‌ : కోఠి ప్రాంతంలోని రంగమహల్‌లో ఓ మహిళ హత్యకు గురైంది. ఆస్తి తగాదాలతో లఖన్‌ అనే వ్యక్తి భార్యా భర్తలపై దాడికి దిగాడు. ఈ దాడిలో భార్య సోనూబాయి అక్కడికక్కడే చనిపోయింది. భర్త ఆనంద్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆనంద్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తలు ఇద్దరూ పుత్లీబౌలి ప్రాంతంలోని స్వామినారాయణ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆనంద్‌, లఖన్‌ కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే హత్య జరిగిందని సుల్తాన్‌బజార్‌ పోలీసులు చెబుతున్నారు.

20:20 - July 7, 2015

విజయవాడ : పగలయినా ఎంత రాత్రయినా అక్కడికే వస్తున్నారు చంద్రబాబు. ఆఫీస్ నిర్మాణం పూర్తికాకపోయినా ఈ ప్లేస్‌లోని బస్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ముఖ్యమైన సమావేశాలు, నిర్ణయాలు అన్నీ క్యాంప్‌నుంచే జరిగిపోతున్నాయి. దీనికి కారణమేంటి? విజయవాడ క్యాంప్ కార్యాలయం సీఎంకు చాలా కలిసొచ్చినట్లుంది. నిర్మాణం పూర్తికాకపోయినా అక్కడే ఉండేందుకు ఆసక్తిచూపుతున్నారు చంద్రబాబు. బస్సులో అయినా సరే ఇక్కడ బస చేస్తున్నారు. వాస్తును విపరీతంగా నమ్మే చంద్రబాబుకు ఈ ప్లేస్ బాగా కలిసొచ్చిందని. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిచ్చాయని క్యాంప్ కార్యాలయంలో జోరుగా చర్చ నడుస్తోంది. అందుకే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఇక్కడినుంచే నడుస్తున్నాయని చెప్పుకుంటున్నారు నేతలు.
మంత్రులతో కీలక సమావేశాలు..
జూన్ 8న క్యాంపు ఆఫీస్ నుంచి మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించారు సీఎం. హైదరాబాద్ మినహా ఏ ఇతర జిల్లాల్లో పర్యటనజరిపినా రాత్రి ఈ కార్యాలయానికే వస్తున్నారు. ఎంత పొద్దుపోయినా సరే ఇక్కడికే వస్తున్నారు. వైజాగ్ టూర్ పూర్తయ్యాక రాత్రి 11 గంటలకు, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన తర్వాత రాత్రి 10 గంటలకు ఇక్కడే బస్సులోనే విశ్రాంతి తీసుకున్నారు చంద్రబాబు. అలాగే పట్టిసీమ ఎత్తిపోతలపై సమీక్షా సమావేశాలు సైతం ఇక్కడే జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది.
కుటుంబ సభ్యులతో విందుకు డైనింగ్ హాల్..
బాబు ఎక్కువగా క్యాంపులోనే ఉండటం. బెజవాడ పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడంతో ఆఫీస్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు అధికారులు. క్యాంపు ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్ లోని కుడివైపు బ్లాక్ అంతా సీఎంకే కేటాయించేలా పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడే ఆయన కార్యాలయం, రెస్ట్ రూమ్, కుటుంబ సభ్యులతో విందుకు వీలుగా డైనింగ్ హాల్ సిద్ధం చేస్తున్నారు. ఈ బ్లాక్‌లో సెంట్రల్ ఏసీ పెట్టిస్తున్నారు. ఎడమవైపు బ్లాక్ ను మంత్రివర్గ సమావేశాలకు సీఎం పేషీలకు కేటాయించాని భావిస్తున్నారు. భవనం కింద భాగంలో ఆధునికీకరణ పనులు నడుస్తున్నాయి.
సీఎస్ ఆఫీస్‌ను ఇక్కడికే మార్చాలని భావిస్తున్న చంద్రబాబు..
ఈ భవనంలో వాస్తు బాగుండటంతో చీఫ్ సెక్రటరీ క్యాంపు ఆఫీసును కూడా ఇక్కడికే మార్చాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బ్లాక్‌లో సీఎస్ ఉంటే చంద్రబాబుకు ఎప్పటికీ అందుబాటులోఉంటారని అభివృద్ధి పనులు కూడా స్పీడందుకుంటాయని కొందరు నేతలు చెబుతున్నారు.

20:19 - July 7, 2015

హైదరాబాద్ : రంజాన్ సీజన్లో అత్తరు సందడి చేస్తోంది.. పాతబస్తీలో అమ్మకాలు జోరందుకున్నాయి.. గులాభీ గుభాలింపులు, మల్లెల సువాసనతో ఈ వాసన అందరినీ మైమరపింపజేస్తున్నాయి. వంద రూపాయలనుంచి పదివేలరూపాయలవరకూ ధర పలుకుతున్న సెంట్ల అమ్మకాలపై స్పెషల్ స్టోరీ.

20:18 - July 7, 2015

హైదరాబాద్ : ఇప్పటికే పప్పులు.. ఉప్పులు ఆకాశాన్నంటుతున్నాయి... ఇప్పుడు కూరగాయలూ బాదేస్తున్నాయి.. ఈ ధరలుచూసి సామాన్యజనాలు బెంబేలెత్తిపోతున్నారు.. ఏం కొనాలో తెలియక లబోదిబోమంటున్నారు.. హైదరాబాద్‌లో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. నిత్యావసరాల పెరుగుదలతో అల్లాడిపోతున్న జనాల నడ్డివిరుస్తున్నాయి. డిమాండ్ కు తగినట్లు సరఫరాలేకపోవడంతో రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. వేసవి తరువాతకూడా అవే ధరలు కొనసాగుతున్నాయి. అన్ని మార్కెట్లతో పాటు కాలనీల్లోని సంతల్లోనూ రేట్లు ఇలాగే ఉన్నాయి. కిలో టమాటా క్వాలిటీని బట్టి 40 నుంచి 60 రూపాయలు... వంకాయ 35 నుంచి 60 రూపాయలు ధర పలుకుతోంది. బెండకాయ 40 రూపాయలు.. కాకరకాయ 30నుంచి 50, బంగాళ దుంప 30నుంచి 40, క్యారెట్‌ 30నుంచి 45 రూపాయలు, పచ్చిమిర్చి 30నుంచి 60, బీరకాయ 30నుంచి 45, క్యాప్సికం 40నుంచి 60, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, ఉల్లిగడ్డ ఇలా ఏ కూరగాయల ధరలుచూసినా జనాలుకు దిమ్మతిరిగిపోతోంది. కొత్తిమీర, పుదీనాలాంటి ఆకుకూరలుకూడా బాదేస్తున్నాయి.
కురవని వర్షాలు...
ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అటు కూరగాయలసాగూ తగ్గిపోయింది. దీనికితోడు దళారుల ఇష్టారాజ్యంతో ధరలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. ఇలా మండిపోతున్న కూరగాయల్ని కొనలేక అలాగని పస్తులుండలేక ఇబ్బందులుపడుతున్నారు నగరవాసులు. వెంటనే ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

బంతి తగిలి మరో యువ క్రికెటర్ దుర్మరణం..

ఇంగ్లండ్ : క్రికెట్ లో మరో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ బంతి మరో యువ క్రికెటర్ ను బలితీసుకుంది. ఇంగ్లండ్ లో భారత సంతతికి చెందిన యువ క్రికెటర్ బాలవన్ పద్మనాథన్ (24)  బంతి తగిలి మృతి చెందాడు. పద్మనాథన్ బ్యాటింగ్ చేస్తుండగా వేగంగా వచ్చిన బంతి ఛాతికి తగలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బాలవన్ ఇంగ్లండ్ లో కౌంటీ మ్యాచ్ లు ఆడుతున్నాడు. కాగా గత కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఘటన మర్చిపోక ముందే క్రికెట్ ప్రపంచాన్ని మరో చేదు వార్త దిగ్ర్భాంతికి గురిచేసింది. 

19:41 - July 7, 2015

ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత - చేవెళ్ల రగడ సృష్టిస్తోంది. డిజైన్ మార్పు నిర్ణయంపై సెగలు రేగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.4,489 కోట్ల పనులు వృథాయేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. కాళేశ్వరంలో నిర్మిస్తే 90 మీటర్ల ఎత్తులో వాటర్ ఫ్లో జరగనుంది. కానీ విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం లేదు. తుమ్మిడి హెట్టి వద్ద నిర్మిస్తే 150 మీటర్ల ఎత్తులో వాటర్ ఫ్లో జరుగనుందని, విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరంలో నిర్మిస్తే ఆదిలాబాద్ జిల్లాకు నీరు రాదని విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వ వాదన మరోలా ఉంది. డిజైన్ మార్పు వల్ల అంతర్ రాష్ట్ర వివాదాలకు తావుండదని సర్కార్ పేర్కొంటోంది. మార్పు వల్ల ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వ స్పష్టం చేస్తోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వి.ప్రకాష్ (జయశంకర్ రీసెర్చి డెవలప్ మెంట్ సెంటర్ అధ్యక్షులు), కె.వి. ప్రతాప్ (న్యాయవాది, ఎన్విరాలమిస్టు, తుమ్మిడిహెట్టు ప్రాణహిత పరిరక్షణ వేదిక కన్వీనర్), నయనాల గోవర్ధన్ (ప్రాణహిత - చేవెళ్ల జలసాధన కమిటీ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

ముగిసిన తేనీటి విందు..

హైదరాబాద్ : రాష్ట్రపతి భవన్ లో తేనేటి విందు ముగిసింది. తేనీటి విందులో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఇరు రాష్ట్రాల మంత్రులు, టీఎస్ మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, స్పీకర్ మధుసూధానచారి, ఏపీ మండలి ఛైర్మన్ చక్రపాణి పాల్గొన్నారు. 

రేపటితో ముగియనున్న రాష్ట్రపతి విడిది..

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారంతో విడిది ముగియనుంది. బుధవారం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. 

ప్రత్తిపాడులోని స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం..

గుంటూరు : ప్రత్తిపాడులో ఓ స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పత్తిబేళ్లు అగ్నికి తగులబడుతున్నాయి. 

ఏసీబీకి చిక్కిన తెలకపల్లి వీఆర్వో..

మహబూబ్ నగర్ : తెలకపల్లి వీఆర్వో కాశన్న ఏసీబీకి చిక్కారు. రూ.నాలుగు వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో పట్టుబడ్డాడు. 

పుష్కరాలకు టర్బో మెగా ఎయిర్ లైన్స్ విమానాలు..

ఢిల్లీ : పుష్కరాల సందర్భంగా టర్బో మెగా ఎయిర్ లైన్స్ ప్రత్యేక విమానాలు నడుపనుంది. విమానయాన సేవలకు డీజీసీఎ అనుమతులు పొందింది. హైదరాబాద్ కేంద్రంగా ఈనెల 18న సేవలు ప్రారంభం కానున్నాయి. టర్మో ఎయిర్ లైన్స్ కు సినీ నటుడు రాంచరణ్, వంకాయలపాటి ఉమేష్ ప్రమోటర్లుగా ఉన్నారు. 

రాష్ట్రపతి నిలయంలో తేనేటి విందు..

హైదరాబాద్ : బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన తేనీటి విందులో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఇరు రాష్ట్రాల మంత్రులు, టీఎస్ మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, స్పీకర్ మధుసూధానచారి, ఏపీ మండలి ఛైర్మన్ చక్రపాణి పాల్గొన్నారు. 

వ్యాపం కేసులో మరో నిందితుడి పరిస్థితి విషమం..

మధ్యప్రదేశ్ : వ్యాపం కేసులో మరో నిందితుడు ఓపీ శుక్లా ఆరోగ్య పరిస్థితి విషంగా ఉంది. ప్రస్తుతం అతను ఫిల్ హిలా జైల్లో ఉన్నారు. గతంలో మాజీ మంత్రి లక్ష్మణ్ కాంత్ శర్మకు ఓఎస్డీగా శుక్లా పనిచేశారు. 

పోరాడుతూనే ఉన్నాం - కొనకళ్ల..

విజయవాడ : ప్రత్యేక హోదా కోసం తాము నిత్యం పోరాడుతూనే ఉన్నామని టిడిపి ఎంపి కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. ఎన్డీయేలో మిత్రపక్షం కావడం వల్ల పద్ధతిగా ముందుకెళుతున్నామని, పవన్ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు.

 

రెవెన్యూ ఉద్యోగులకు ఆహ్వానం..

హైదరాబాద్ : రెవెన్యూ ఉద్యోగులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. బుధవారం సీఎస్ రాజీవ్ శర్మతో రెవెన్యూ ఉద్యోగులు చర్చలు జరుపనున్నారు. 

బ్లడ్ బ్యాంకుల్లో తనిఖీలు..

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా 120 బ్లడ్ బ్యాంకులలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించిన 20 బ్లడ్ బ్యాంకులపై కేసు నమోదు చేశారు. 

18:29 - July 7, 2015

విజయవాడ : సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ చేసిన వ్యాఖ్యలపై నెమ్మదిగా ఒక్కొక్కరిగా తెలుగు తమ్ముళ్లు స్పందిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో సీమాంధ్ర ఎంపీల వ్యవహరిస్తున్న తీరుపై సోమవారం పవన్ పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం విజయవాడలో ఎంపీ కొనకళ్ల నారాయణ మీడియా సమావేశంలో పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిత్రపక్షంతో మెలిగే తీరు ఇది కాదన్నారు. మిత్రపక్షం కాదు కాబట్టే గతంలో పార్లమెంట్ ను స్తంభింప చేయడం జరిగిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం మిత్రపక్షం అని, ప్రత్యర్థి..వేరు..మిత్రపక్షం వేరు అని పేర్కొన్నారు. తమ పనితీరు ప్రజలు అడగాలి లేదా చంద్రబాబు నాయుడు అడగాలని పేర్కొన్నారు. ఏమీ తెలియకుండా పవన్ మాట్లాడడం చాలా బాధకరమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమి చేయాలో కూర్చొని మాట్లాడితే బాగుంటుందని, ఎప్పుడో ఒకసారి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. సంస్కారం కేసీఆర్ లాగా తిట్టలేకపోవచ్చు కాని సమయం వస్తే తమ తడాఖా చూపిస్తామని కొనకళ్ల పేర్కొన్నారు.
ఆరు నెలల తరువాత లేస్తే ఏం తెలుస్తుంది ? కేశినేని నాని...
ఆరు నెలల తరువాత లేస్తే తాము ఏం చేస్తున్నామో ఎలా తెలుస్తుందని మరో ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని పలు ప్రశ్నలు సంధించారు. వారి సినిమాలు..వ్యాపారాలు చేసుకోవడానికే కేసీఆర్ ను కాకా పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన బిల్లులో కొద్ది హక్కుల్లో సెక్షన్ 8ఒకటని, అది ఎందుకు వద్దో పవన్ తెలుపాలని సూచించారు. సీఎం...మంత్రులు..అధికారుల ఫొన్ ట్యాపింగ్ చేస్తే శాంతి భద్రతకు విఘాతం కలిగినట్లు అనిపించలేదా అని ప్రశ్నించారు. ఏ రకంగా కేసీఆర్ ను ఎందుకు వేనకేసుకొస్తున్నారన్నారు. తాను టికెట్టు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డానని, సుజనా చౌదరి ఏం చేస్తున్నారో ఇప్పుడు లేస్తే ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. గత మార్చిలో బడ్జెట్ అయిపోతుంటే సీమాంధ్ర బాగోగు కోసం 8,500 కోట్లు ఆంధ్రాకు ఇప్పించిన ఘనత సుజనాదని తెలిపారు. పవన్ ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. 

బ్లడ్ బ్యాంకుల్లో తనిఖీలు..

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా 120 బ్లడ్ బ్యాంకులలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించిన 20 బ్లడ్ బ్యాంకులపై కేసు నమోదు చేశారు. 

కజకిస్థాన్ కు చేరుకున్న మోడీ...

హైదరాబాద్: ఆరు దేశాల్లో పర్యటనలో భాగంగా న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోడీ ఇవాళ ఉజ్బెకిస్థాన్ నుంచి కజకిస్థాన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఆ దేశ అధ్యక్షుడు, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. 

పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు - హరీష్..

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. 

ఢిల్లీలో భారీ వర్షం..

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మంగళవారం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. ప్రధాన కూడళ్లలో నీళ్లు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

17:43 - July 7, 2015

హైదరాబాద్ : తెలంగాన రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు టి.కాంగ్రెస్ మద్దతు తెలిపింది. వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. సమ్మె మూలంగా ఎక్కడి చెత్త అక్కడ పేరుకపోయిందని, కార్మికుల డిమాండ్లను ఒప్పుకుని వారు విధుల్లోకి హజరయ్యే విధంగా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. నగరానికి శోభ తెచ్చే కార్మికుల శ్రమ దోపిడికి గురి కావద్దని పేర్కొన్నారు. వెంటనే కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 

17:39 - July 7, 2015

హైదరాబాద్ : తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుండి మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా సాగుతోంది. రెండో రోజైన మంగళవారం ఎల్ బినగర్ లో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వారు తీవ్రంగా విమర్శించారు. మునిస్పల్ కార్మికుల కష్టాలన్ని సర్కార్ గుర్తించడం లేదని దుయ్యబట్టారు. తమ వేతనాలు పెంచేదాక సమ్మె విరమించేది లేదన్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రజాప్రతనిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. రోడ్లపై ఉన్న చెత్తను వారి ఇళ్ల ఎదుట వేస్తామని, సమ్మె విరమించి చర్చలకు వెళ్లడం ఎక్కడా సంప్రదాయం లేదని తెలిపారు. 

సెప్టెంబర్ నుండి ఫ్లిప్‌ కార్ట్ వెబ్ సైట్ మూసివేత!

హైదరాబాద్ :భారత ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్ సెప్టెంబర్ నుంచి తన వెబ్ సైటును మూసివేయనుంది. ఈ విషయాన్ని సంస్థ చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ పునిత్ సోని మంగళవారం తెలియజేశారు. ఫ్లిప్‌ కార్ట్ వెబ్‌ సైటును మూసేసి, కేవలం మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు సాగించాలన్నది తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. ఫ్లిప్ కార్ట్ కొనుగోళ్లలో 70 శాతం మొబైల్ మాధ్యమంగానే సాగుతున్నయని ఆయన గుర్తు చేశారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కాగా, ఫ్లిప్ కార్ట్ వెబ్ సైటును మూసివేస్తారని గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నేడు అధికారిక ప్రకటన వెలువడింది.  

17:34 - July 7, 2015

నెల్లూరు : ప్రజా సమస్యలపై సీపీఎం ఉద్యమిస్తుందని, ఆగస్టు 1 నుండి 14 వరకు ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. కమ్యూనిస్టు ప్రజాతంత్ర శక్తులు బలోపేతం అయితే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకొనేందు సీఎం కొత్త మద్యం పాలసీని ప్రవేశ పెట్టారని విమర్శించారు. రైతాంగంలో తీవ్ర అలజడి నెలకొందని, కేంద్ర ప్రభుత్వం ఎక్స్ పోర్టుకు ఆర్డర్స్ తేవాలని పొగాకు ఉత్పత్తులను కొనాలని ఆయన డిమాండ్ చేశారు. 

విశాఖ హెచ్ పీసీఎల్ కొండపై మంటలు

విశాఖ:హెచ్ పీసీఎల్ కొండపై మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రతకు కొండపై ఎండిన చెట్లు తగలబడుతున్నాయి. హెచ్ పీసీఎల్ కు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.

భద్రాచలం రామయ్య సేవలకు ఆన్ లైన్ సౌకర్యం.

ఖమ్మం: భద్రాచలం రామయ్య సేవలకు ప్రభుత్వం ఆన్‌లైన్ సౌకర్యం కల్పించింది. ఆన్‌లైన్ సేవలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆన్‌లైన్ సేవలను ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో పుష్కర దర్శనం, శీఘ్రదర్శనం, నిత్య కళ్యాణం, సహస్రనామార్చన, ఊంజల్ సేవ టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌కు అందుబాటులో ఉన్న వెబ్‌సైట్లు.. WWW.BHADRACHALAM.CO.IN, WWW.BADRACHALAM.CO.IN. పుష్కరాల సమయంలో రోజుకు 20 గంటలు స్వామి దర్శనం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి నిత్యకళ్యాణం ప్రారంభమవుతుందన్నారు.

17:28 - July 7, 2015

హైదరాబాద్ : మున్సిపల్ కార్మికుల సమ్మె యదావిధిగా కొనసాగనుంది. మంగళవారం నాడు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘాలతో మంత్రులు నాయినీ ఈటెలు చర్చలు జరిపారు. కానీ కార్మికులు డిమాండ్లపై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు. దీనితో సమ్మెను కొనసాగిస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమ్మెను విరమించి చర్చలకు రావాలని, ముఖ్యమంత్రి అందుబాటులో లేరని పేర్కొనడం సబబు కాదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
ఎక్కడి చెత్త అక్కడే....
తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుండి మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా సాగుతోంది. రోడ్లు..వీధులను ఊడ్చే కార్మికులెవరూ విధుల్లోకి రాలేదు. చెత్తను తీసుకెళ్లే వాహనాలు నగరంలో ఎక్కడా కదలలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుధ్య సేవలన్నీ నిలిచిపోయాయి. రోడ్లు..దుకాణాల సముదాయాల పక్కన ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపించింది. సుమారు 40వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటుండడంతో అనేక ప్రాంతాల్లో చెత్త పేరుకపోతోంది. నగరంలో ప్రతి రోజు దాదాపు 4వేల టన్నుల చెత్త బయటపడుతోంది. ఇదంతా తీయకపోయేసరికి దుర్ఘందం వెదజల్లుతోంది. వెంటనే తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. 

17:23 - July 7, 2015

మధ్యప్రదేశ్ : వ్యాపమ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి నిర్మూలన, నల్లధనం వెలికి తీస్తామని చెప్పి అధికారంలో వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యాపం కుంభకోణంలో ఒకరి తరువాత ఒకరు చనిపోతుంటే సీబీఐ విచారణ జరిపించాలని అంటున్నా కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాఘవులు స్పందించారు. రాష్ట్ర సమస్యలు పవన్ కు ఇప్పుడు గుర్తొచ్చాయా అని ఎద్దేవా చేశారు. ఎవరికీ అర్థం కాకుండా పవన్ మాట్లాడారని విమర్శించారు. 

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సుజనా చౌదరి

హైదరాబాద్:ఏపీ ఎంపీలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పందిచారు. వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి రాకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని... వ్యాపారం నీతిగా చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యమని చౌదరి అన్నారు. ఆంధ్రా ఎంపీలు ఎలా పని చేస్తున్నారో నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగా మంచి సూచనలు ఇస్తే స్వీకరిస్తామని చౌదరి స్పష్టం చేశారు.

17:16 - July 7, 2015

జపాన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఆ దేశ ప్రధాని షింజోతో బాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణంలో సాంకేతిక..ఆర్థిక సహకారం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి జపాన్ అంగీకరించిందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని బాబు ఆహ్వానం పలికారు. 

లారీ -కారు ఢీ:ఇద్దరి మృతి

కర్నూలు: జిల్లాలోని డోన్ సమీపంలో జాతీయ రహదారిపూ ఈ రోజు మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారి సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మున్సిపల్ ఉద్యోగసంఘాలతో ప్రభుత్వ చర్చలు విఫలం

హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిన్నటి నుండి సమ్మె చేస్తోన్న మున్సిపల్ ఉద్యోగులతో ప్రభుత్వం రెండో రోజు చర్చలు విఫలం అయ్యాయి. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశారు.

మహిళలకు చదువు ముఖ్యం: స్పీకర్ సుమిత్రా మహాజన్

హైదరాబాద్:మహిళలకు చదువు అనేది ముఖ్యమైనదని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. కోఠి జాంబాగ్‌లోని వివేకవర్ధిని పాఠశాల శతాబ్ది ఉత్సవాలలో సుమిత్రా మహాజన్, టీఆర్‌ఎస్ ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. నిజాం కాలంలోనే మహిళల విద్య కోసం వివేక వర్ధిని కళాశాల ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ప్రతి బాలిక చదువుకోవాలని సూచించారు. మహారాష్ట్రీయులు ఎక్కడ ఉన్నా అక్కడి ప్రజలతో త్వరగా కలిసిపోతారని చెప్పారు. ఎంపీ కవిత మంచి నాయకురాలు అని కొనియాడారు. కొద్ది రోజుల క్రితం తాము యూరప్‌కు వెళ్లినప్పుడు కవిత భారతీయ మహిళల గురించి గొప్పగా చెప్పారని తెలిపారు.

16:22 - July 7, 2015

హైదరాబాద్ : ఏపీ ప్రత్యేక హోదా అశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేసినట్లు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. మంగళశారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా ఐదు కాదు..పది సంవత్సరాలు ఇస్తామని ఎన్నికల ప్రచారం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై మాట తప్పుతున్నారని, ఇందులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి ఓ వినతిపత్రం అందించినట్లు రఘువీరా పేర్కొన్నారు. 

మున్సిపల్ కార్మికులతో ప్రారంభమైన చర్చలు

హైదరాబాద్:తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిన్నటి నుండి సమ్మె చేస్తున్నా కార్మికులతో మరోసారి టి.సర్కార్ చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చల్లో మంత్రులు నాయిని నర్శింహారెడ్డి, ఈటెల రాజేంద్ర, తో పాటు అన్ని కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ రోజైనా చర్చలు సఫలం కావాలని కార్మికులు కోరుకుంటున్నారు.

సోమ్ నాథ్ భారతికి ముందస్తు బెయిల్ నిరాకరణ..

న్యూఢిల్లీ: గృహహింస చట్టం కింద నమోదైన కేసు విషయంలో ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్ నాథ్ భారతికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు విషయంలో నిందితుడు అలా కోరడం అనుభవరాహిత్యం అని పేర్కొంది. బెయిల్ పిటిషన్ను విచారించిన అడిషనల్ సెషన్స్ జడ్జి పరమ్ జీత్ సింగ్ అసలు ఇంతవరకు ఈ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, ఎలాంటి అరెస్టులు జరగలేదని, దరఖాస్తు కూడా పూర్తిస్థాయిలో లేదని పేర్కొన్నారు. గత జూన్లో సోమ్నాథ్ భారతి భార్య లిపికా భారతి 2010 నుంచి ఆయన గృహహింసకు పాల్పడుతున్నారని, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ కేసు పెట్టిన విషం తెలిసిందే.

16:17 - July 7, 2015

అనంతపురం : జిల్లాలో మళ్లీ నకిలీ రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు కలకలం సృష్టించాయి. అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఓ బ్యాంకులో సుమారు 500 పాస్ పుస్తకాలు బయటపడ్డాయి. ఇటీవలే నకిలీ పుస్తకాలను తయారు చేస్తున్న గుట్టును పోలీసులు రట్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో 20 బృందాలు జిల్లాల్లోని తహశీల్దార్ కార్యాలయాలు..పలు బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం కుమ్మదూరులో ఓ బ్యాంకులో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు 500 నకిలీ పాస్ పుస్తకాలున్నట్లు గుర్తించారు. బ్యాంకులో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబధించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రుణాలు మంజూరు చేశారు ? ఎంత మంది రైతులకు రుణాలు అందాయి ? వారి పేర్లు తదితర విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు. సాయంత్రం వరకు రిపోర్టు అంద చేయాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు నివేదిక తయారీ చేయడంలో తలమునకలై ఉన్నారు.

ఎన్డీఏ 'వ్యాపమ్ స్కాం' ను కప్పిపెట్టాలని చూస్తోంది:రాఘవులు

ఢిల్లీ : ఎన్డీఏ వ్యాపమ్ స్కాం ను కప్పిపెట్టాలని చూస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘువులు ఆరోపించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వ్యాపమ్ స్కాం పై సుఈప్రం కోర్టు ఆదేశిస్తే సీబీఐకి కేసును బదిలీ చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అనడం విచిత్రంగా ఉందన్నారు. అవినీతి నిర్మూలన, నల్లధనం వెలికితీస్తామని ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని అన్నారు. అవినీతి కుంభకోణాలపై మోదీ మౌనాన్ని ఖండిస్తున్నామన్నారు. పవన్ కల్యాణ్ కు రాష్ట్ర సమస్యలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు. పవన్ ఎవరికీ అర్థం కాకుండా తన అభిప్రాయాన్ని చెప్పాడని...

మంజీరా జలాలపై మంత్రి హరీష్ రావు సమీక్ష

మెదక్:సింగూరు జలాశయం వద్ద మంజీరా జలాలపై మంత్రి హరీష్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే బాబు మోహన్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆగస్టు 15 నాటికి సింగూరు జలాశయం నుంచి వ్యవసాయానికి నీళ్లు విడుదల చేస్తామని హరీష్‌రావు తెలిపారు. ఖరీఫ్‌లో 10 వేల ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు.

15:46 - July 7, 2015

విశాఖపట్టణం : రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు ముందుకెళుతోంది..కొద్ది సేపటి తరువాత బోగీల్లో కూర్చొన్న వారు రైలు కదలడం లేదని గుర్తించారు. దీంతో ప్రయాణీకులకు అర్థం కాలేదు.. ఏ అయ్యింది చెప్మా అంటూ కిందకు దిగి చూశారు. రైలు ఇంజిన్ మాత్రం వెళ్లిపోతోంది..ఇలా ఎందుకు అయ్యిందో వారికి అర్థం కాలేదు..ఈ విచిత్ర పరిస్థితి ప్రయాణీకులు మంగళవారం ఎదుర్కొన్నారు.
రెండు గంటల ఆలస్యం..
రత్నాచల్ ఎక్స్ ప్రెస్ విశాఖ నుండి విజయవాడ వెళుతోంది. రెండు గంటల ఆలస్యంగా రైలు ప్లాట్ ఫాం మీదకు వచ్చింది. ఇప్పటికైనా వచ్చింది అని ప్రయాణీకులు ఎక్కారు. కానీ దువ్వాడ - అనాకపల్లి వద్ద రైలు ముందుకు వెళ్లడం లేదని గుర్తించారు. కానీ రైలు ఇంజిన్ మాత్రం ఒక కిలో మీటర్ మేర ముందుకెళ్లిపోయింది. ఆలస్యంగా గుర్తించిన డ్రైవర్ రైలును నిలిపివేశాడు. సాంకేతిక లోపంతోనే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంటున్నారు. బోగీలు నిలుచున్నా అధికారులు ఎవరు చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

15:38 - July 7, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఏపీ కార్మిక సంక్షేమ భవనం ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం మీద మరొక ప్రభుత్వంపై అజామాయిషీ చేసే హక్కు లేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం చెలాయించడాన్ని ఒప్పుకొనేది లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధానిలో కార్మికుల కోసం హైదరాబాద్ లో కార్మిక సంక్షేమ భవనాన్ని ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం జీవో కూడా జారీ చేయనన్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

15:34 - July 7, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జేఎన్టీయూ రద్దు చేసిన ఇంజనీరింగ్ కాలేజీలకు ఊరట లభించింది. రేపటి నుండి ప్రారంభమయ్యే అడ్మిషన్ల కౌన్సిలింగ్ లో ఆ కాలేజీలకు కూడా అనుమతినివ్వాలని హైకోర్టు సూచించింది. దీనితో రద్దయిన 25 కాలేజీలు కౌన్సిలింగ్ నిర్వహణలో పాల్గొననున్నాయి. కాలేజీల్లో కనీస సౌకర్యాలు లేవని 25 కాలేజీలకు జేఎన్టీయూ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కళాశాలల యాజమాన్యం హైకోర్టు మెట్లు ఎక్కింది. తనిఖీలు చేసే అధికారం జేఎన్టీయూకు లేదని, తనిఖీల పేరిట ఇబ్బందులకు గురి చేస్తోందని కళాశాలల తరపు న్యాయవాది వాదించారు. ల్యాబ్, సౌకర్యాలు, ఒకే కాలేజీలో కాకుండా ఇతర కాలేజీల్లో టీచింగ్ చేస్తున్నారని ఇతరత్రా కారణాలను జేఎన్టీయూ తరపు న్యాయవాది వాదించారు. జేఎన్టీయూకు తనిఖీలు చేసే హక్కు ఉందని కోర్టు తేల్చిచెప్పింది. మళ్లీ తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు సూచించింది. 

జపాన్ ప్రధాని షింజోని కలిసిన చంద్రబాబు

హైదరాబాద్:ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జపాన్ ప్రధాని షింజోని కలిశారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందింస్తామని షింజో తెలిపారు. రాజధాని నిర్మాణంలో కనీస వసతుల ఏర్పాట్లలోనూ పాలు పంచుకుంటామని షింజో తెలిపినట్లు సమాచారం. అమరావతి శంకుస్థాన కార్యక్రమానికి రావాలని షింజోను చంద్రబాబు ఆహ్వానించారు.

సెటిలర్స్ అంటూ కించపరుస్తున్నారు: కేఈ

హైదరాబాద్: ఉమ్మడి రాజధానిలో ఉంటున్న ఏపీ ప్రజలను సెటిలర్స్ అంటూ కించపరుస్తున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. అలా అనడం తమను తీవ్రంగా బాధిస్తోందని చెప్పారు. సెక్షన్-8, ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ మధ్యాహ్నం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ముఖర్జీని ఏపీ మంత్రులు కేఈ, అచ్చెన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణమూర్తి, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు కలిశారు. ఏపీలో ప్రస్తుత పరిణామాలు, ఇతర అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ పై తమ వద్ద ఆధారాలున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

15:26 - July 7, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. సండ్ర కస్టడీ పిటిషన్..బెయిల్ పిటిషన్ లను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. అనంతరం సండ్రను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా సండ్ర మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కుట్రతో వ్యవహరించిందని, లొంగడం లేదని కుట్ర చేసిందన్నారు. మొదట ఉన్న ఎమ్మెల్యే సంఖ్య ఇప్పుడు ఎమ్మెల్యేల సంఖ్య ఎలా పెరిగిందో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభలో ప్రభుత్వంపై ఉద్యమం చేస్తున్న వారిపై టి.సర్కార్ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ కేసులో చట్ట ప్రకారం ముందుకెళుతామని, వెనక్కి వెళ్లేది లేదని స్ఫష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు.
ఏడు గంటల పాటు విచారణ...
సోమవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో సండ్ర ఏసీబీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. సుమారు ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. విచారణలో పలు కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో ఏసీబీ ఆయన్ను అరెస్టు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో రేవంత్ రెడ్డి..సెబాస్టియన్, ఉదయ్ సింహాలు అరెస్టయి బెయిల్ పై విడుదల సంగతి తెలిసిందే. 

రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం

విశాఖ: రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. బోగీలను వదిలేసి ఇంజన్ కిలో మీటర్ ముందుకెళ్లింది. కొంత సేపటి తర్వాత బోగీలతో ఇంజన్ ను అధికారులు కలపడంతో విశాఖ నుండి విజయవాడకు రత్నాచల్ రైలు బయలు దేరింది.

15:17 - July 7, 2015

ఢిల్లీ : న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కిష్ విమానం (టికె-85) అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో బాంబు ఉందన్న సమాచారంతో పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఏస్పీజీ భద్రతా అధికారులు విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇదిలా ఉంటే విమానంలో బాంబు లేదని కేంద్ర పౌరవిమాన శాఖ సహాయ మంత్రి వెల్లడించినట్లు తెలుస్తోంది.
148 మంది ప్రయాణీకులు..
బ్యాంకాక్ నుండి ఇస్తాంబుల్ కు ఓ విమానం వెళుతోంది. అందులో 148 మంది ప్రయాణీకులున్నారు. విమానంలోని టాయిలెట్ లో ఉన్న అద్దంపై 'విమానంలో బాంబు ఉందని' లిప్ స్టిక్ తో రాసి ఉన్న మెసేజీని గుర్తించిన సిబ్బంది వెంటనే పైలట్ ను అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని నాగ్ పూర్ ఎయిర్ కంట్రోల్ కు తెలియచేశాడు. వెంటనే వారు సూచించిన మేరకు పైలట్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. వెంటనే విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అన్ని భద్రతా దళాలతో పాటు నేషనల్ సెక్యూర్టీ దళాలను అప్రమత్తం చేశారు. చివరకు ఎలాంటి బాబు లేదని తేల్చినట్లు తెలుస్తోంది. 

15:14 - July 7, 2015

బెంగళూరు : ఎట్టకేలకు భారత్‌ బ్యాట్స్‌ఉమెన్‌ జూలు విదిల్చారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో 221 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో ఆరు ఓవర్లు ఉండగానే ఛేదించింది. దీంతో ఇరుజట్ల మధ్య జరుగుతున్న ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-2 తో సమం చేసింది. చివరిదైన మూడో వన్డే జులై 8న జరుగుతుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ మూడో ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. ప్రీస్ట్‌ 2 పరుగులు చేసి జులన్‌ గోస్వామి బౌలింగ్‌లో ఔటైంది. తర్వాత సాటెర్‌ త్యెయిట్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడింది. ఈ దశలో మరో ఓపెనర్‌ బేట్స్‌ 27 పరుగులు చేసి పదహారో ఓవర్లో వెనుదిరిగింది. అనంతరం వచ్చిన గ్రీన్‌ కూడా (14 పరుగులు ) తక్కువ స్కోరుకే ఔటయింది. దీంతో కివీస్‌ 77 పరు గులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వచ్చిన డివైన్‌ భారత బౌలర్లను సమ ర్థంగా ఎదుర్కొంది. అవకాశం దొరికి నప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడింది. అయితే ఆమెకు మరోవైపు నుంచి సరైన సహకారం లభించలేదు. సాటెర్‌త్వెయిట్‌ 43 పరుగులు చేయగా, డివైన్‌ 89 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి ఇన్నింగ్స్‌ చివరి బంతికి ఔటయింది. 
     అనంతరం బ్యాటింగ్‌ ప్రార ంభించిన భారత్‌కు ఓపెనర్లు కమిని (31 పరుగులు, 7 ఫోర్లు), మందన (66 పరుగులు, 8 ఫోర్లు) శుభారంభాన్ని అందిం చారు. కమిని 15వ ఓవర్లో తొలి వికెట్‌గా ఔటయింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ మిథాలీ మరో ఓపెనర్‌ మందనతో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించింది. తొలి మూడు వన్డేల్లో రాణించని మిథాలి ఈ మ్యాచ్‌ లో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌్‌ ఆడింది. మరోవైపు మందన కూడా జాగ్రత్తగా ఆడుతూనే కెప్టెన్‌కు సహకార మందిం చింది. మిథాలీతో కలిసి 124 పరుగులు జోడిం చిన మందన జట్టు స్కోరు 173 పరు గుల వద్ద 66 పరుగులు చేసి ఔటయింది. అనంతరం కౌర్‌ చక చకా 32 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి మ్యాచ్‌ను ముగించింది. మిథాలీ 81 పరుగుల (10 ఫోర్లు)తో నాటౌట్‌గా నిలిచింది. 
స్కోరుబోర్డు : 
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ : బేట్స్‌ 27, ప్రీస్ట్‌ 2, సాటెర్‌త్వెయిట్‌ 43, గ్రీన్‌ 14, డివైన్‌ 89, పెర్కిన్స్‌ 8, కాస్పెరెక్‌ 0, పీటర్‌సన్‌ 14, తుహుహు 0, నీల్సన్‌ 1, గై 0, ఎక్స్‌ట్రాలు 22. మొత్తం 50 ఓవర్లలో 220 ఆలౌట్‌. 
బౌలింగ్‌ : జులన్‌ గోస్వామి 10-2-31-1, నిరంజనా 5.5-0-35-3, శర్మ 9-0-43-0, గయక్వాడ్‌ 10-2-25-3, పూనమ్‌ యాదవ్‌ 7-0-45-1, కౌర్‌ 8-2-23-2. 
భారత్‌ ఇన్నింగ్స్‌ : కమిని 31, మందన 66, మిథాలీ 81 నాటౌట్‌, హర్మాన్‌ ప్రీత్‌ కౌర్‌ 32, ఎక్స్‌ ట్రాలు 11. మొత్తం 44.2 ఓవర్లలో 2 వికెట్లకు 221. 
బౌలింగ్‌ : తహుహు 9-1-39-0, డివైన్‌ 6-1-29-0, గై 3-0-20-0, బేట్స్‌ 4-0-14-0, కాస్పెరెక్‌ 6.2-0-36-0 నీల్సన్‌ 7-0-32-0, సాటెర్‌త్వెయిట్‌ 5-0-27-1, పీటర్‌సన్‌ 4-0-19-1.

టర్కీ విమానం లో బాంబు లేదు....

న్యూఢిల్లీ:ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు. బాంబు బెదిరింపులతో టర్కీ విమానాన్ని అత్యవసరంగా దించివేశారు. విమానం ల్యాండ్ అయిన అనంతరం భద్రతా సిబ్బంది తనిఖీలు చేసింది. తనిఖీల అనంతరం బాంబు లేదని నిర్ధారించింది. అయితే విమానం బాత్‌రూమ్‌లో ఉన్న అద్దంపై విమానంలో బాంబు పెట్టినట్లు లిప్‌స్టిక్‌తో రాసి ఉందని పైలట్ ఏయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌కు సమాచారం అందించారు. ఈ క్రమంలో అత్యవసరంగా విమానాన్ని ఢిల్లీలో దించేశారు. విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులను కిందకు దించివేశారు.

15:09 - July 7, 2015

హైదరాబాద్: 'హౌస్ వుయ్ ఆర్ కాస్టింగ్' అంటూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు చెందిన ప్రొడక్షన్ చక్కగా పాడగల టీనేజీ అమ్మాయి కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఇందుకోసం రూపొందించిన ఓ ప్రకటనను అమిర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 12 నుంచి 17 మధ్య వయసు ఉన్న బాగా పాడగల అమ్మాయి కావాలనుకుంటున్నట్టు ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు తమకు నచ్చిన హిందీ పాట పాడిన వీడియోను తమ మెయిల్ కు పంపాలని చెప్పారు. అంతేగాకుండా బాలికలు తమ తల్లిదండ్రులు లేదా గార్డియన్ సంతకం చేయించిన పరిచయ పత్రాన్ని జతపరుస్తూ [email protected]కు వివరాలను మెయిల్ చేయాలని వివరించారు.

రద్దు చేసిన ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: జేఎన్టీయూ రద్దు చేసిన ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట లభించింది. రేపటి నుంచి జరిగే కౌన్సిలింగ్ కు అనుమతి ఇవ్వాలని జేఎన్టీయూకు హైకోర్టు ఆదేశించింది. మరోసారి తనిఖీలు జరిపి నివేదిక సమర్పించాలని జేఎన్టీయూకు హైకోర్టు ఆదేశించింది.

వ్యాపమ్ కుంభకోణంపై సీబీఐ విచారణకు సీపీఎం డిమాండ్

హైదరాబాద్: గత రెండు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. అనంతరం పొలిట్ బ్యూరో సభ్యులు బివి. రాఘవులు మీడియాతో మాట్లాడుతూ... బిజెపి అవినీతి పాలన, కుంభకోణాలపై దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ లో వ్యాపమ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపించాలని రాఘవులు డిమాండ్ చేశారు

14:52 - July 7, 2015

ఒక ఉన్నతాధికారిణి పట్ల ఓ ఆంగ్ల పత్రిక వెలువరించిన క్యారికేచర్, చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఆలోచింప చేస్తున్నాయి. ఒకవైపు సమాజంలో మహిళల పట్ల అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి..వారి పట్ల దాడులు జరుగుతున్నాయి. మరోవైపు ఉన్నతాధికారిణిపట్ల ఇటువంటి వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి ? ఈ స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి ? ఇది సమంజసమేనా ? ఎలాంటి సంకేతాలు ఇస్తుంది ? అనే దానిపై మానవి 'వేదిక' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వనజ (సీనియర్ జర్నలిస్టు), గిరిజ (నిర్ణయ స్వచ్చంద సంస్థ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మహిళను చూసే ధృక్కోణం మారాలని, జెండర్ సెన్సిటివిటిని పెంచాలని సూచించారు. మరిన్ని విశేషాల కోసం వీడియోలో చూడండి.

ఏసీబీకి పట్టుబడిన విద్యుత్ లైన్ మెన్

ఆదిలాబాద్: జైపూర్ మండలం కొత్తపల్లిలో ట్రాన్స్ ఫార్మర్ కోసం లైన్ మెన్ శంకర్ రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.

14:47 - July 7, 2015

లండన్‌ : వింబుల్డన్‌లో సానియా-హింగిస్‌ జోడి జోరు కొనసాగుతోంది. మూడో రౌండ్‌లో వారు 6-4, 6-3తో స్పెయిన్‌కు చెందిన మెడినా గారిగెస్‌-పారా సంతోంజా జంటపై ఘన విజ యం సాధించారు. అయితే పురుషుల డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌-డేనియల్‌ నెస్టర్‌ (కెనడా) జంట 3-6, 5-7, 6-3, 6-2, 2-6 తో పెయా (ఆస్ట్రియా)-బ్రూనో సోరెస్‌ (బ్రెజిల్‌) పై ఓడి పోయారు. మరో మ్యాచ్‌లో రోహన్‌ బోపన్న- ఫ్లోరిన్‌ మెర్జా (రొమేనియా) జోడి 7-6, 6-7, 7-6, 7-6 తేడాతో కుబెట్‌ (పోలాండ్‌)-మిర్ని (బల్గేరియా)పై గెలుపొందారు. 
మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్‌ 6-4, 6-3 తో వీనస్‌ విలియమ్స్‌పై, రష్యా అందం షరపోవా 6-4, 6-4తో దియాస ్‌(కజకిస్తాన్‌)ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. మరో మ్యాచ్‌లో పదమూడో సీడ్‌ రద్వాన్‌ స్కా (పోలాండ్‌) 7-5, 6-4తో జంకోవిచ్‌పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో 20 వ సీడ్‌ స్పెయిన్‌కు చెందిన మురుగుజ 6-4, 6-4 తో ఐదో సీడ్‌ వోజ్నియాకిని (డెన్మార్క్‌) చిత్తు చేసింది. యుఎస్‌కు చెందిన కొకొ వందే వెగె 7-6, 7-6 తో చెక్‌ భామ సఫరోవాకు షాకివ్వగా, బెలారస్‌ బ్యూటీ విక్టోరియా అజరెంక 6-2, 6-3తో బెలిండా (స్విట్జర్లాండ్‌)ను ఓడించింది. 
పురుషుల సింగిల్స్‌్‌లో మూడో సీడ్‌ ఆండీ ముర్రే 7-6, 6-4, 5-7, 6-4తో కార్లోవిక్‌ (క్రొయేషియా)పై గెలుపొందగా, నాలుగో సీడ్‌ వారింకా 7-6, 7-6, 6-4 తో 15వ సీడ్‌ గఫిన్‌ (బెల్జియం)పై విజయం సాధించారు. రిచర్డ్‌ గాస్కెట్‌ (ఫ్రాన్స్‌) 7-5, 6-1, 6-7, 7-6తో కిర్జిస్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు.

పెనుగొండ సమీపంలో వ్యక్తి దారుణ హత్య....

అనంతపురం:సోమందేపల్లిలో మల్లికార్జున్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. ఇతను 12 రోజుల క్రితమే కిడ్నాప్‌కు గురయ్యాడు. పెనుగొండ సమీపంలోమల్లికార్జున్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండయిన టర్కిష్ విమానం.

ఢిల్లీ:బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఢిల్లీ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండయింది. విమానంలో 148 మంది ప్రయాణీకులు ఉన్నారు. ప్రయాణీకులందరినీ ఢిల్లీ ఎయిర్ పోర్టులో క్షేమంగా దించి... తనిఖీలు చేపట్టారు.

14:29 - July 7, 2015

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర ఎంపీ సుమన్ మండిపడ్డారు. సోమవారం పవన్ కళ్యాణ్ పలు అంశాలపై స్పందించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియాలో సుమన్ మాట్లాడారు. ఆయన పవన్ కళ్యాణ్ కాదని..ప్యాకేజీ కళ్యాణ్ అంటూ విమర్శించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదని సూటిగా ప్రశ్నించారు. ఒక్క అంశానికి సంబంధించిన దానిపై స్పష్టత ఇవ్వలేదని, బాబును ప్రశ్నించాల్సింది పోయి ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇంకో అంశం లేవనెత్తారంటూ సుమన్ ఎద్దేవా చేశారు. 

ఎమ్మెల్యే 'భూమా'కు ఏదైనా జరిగితే ఊరుకోం:వైఎస్ జగన్

కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ లేకున్నా... టిడీపీ అక్రమంగా విజయం సాధించిందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. అనారోగ్యంతో కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు ఓటర్లను కొనుగోలు చేశారని మండి పడ్డారు. అఖిల ప్రియను దుర్భాషలాడినందుకే అధికారులతో భూమానాగిరెడ్డి వ్యాగ్వాదానికి దిగారని జగన్ తెలిపారు. డోంట్ టచ్ మీ అన్నందుకు భూమానాగిరెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు భూమాను నిమ్స్కు తరలించమంంటే తరలించలేదన్నారు.

14:22 - July 7, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు వ్యవహారంలో టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మంగళవారం ఉదయం ఏసీబీ న్యాయస్థానంలో సండ్రను ఏసీబీ అధికారులు హాజరుపరిచారు. ఇందులో ఏసీబీ తరపు న్యాయవాదులు, సండ్ర తరపు న్యాయవాదులు వాదించారు. చివరకు కోర్టు రిమాండ్ విధించడంతో సండ్రను చర్లపల్లి జైలుకు తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అంతకు ముందు సండ్రకు ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 
బెయిల్ పై రేపు విచారణ..
సండ్ర వెంకట వీరయ్యకు రిమాండ్ విధించవద్దని తాము కోరడం జరిగిందని సండ్ర తరపు న్యాయవాది మీడియాకు తెలిపారు. కానీ కోర్టు దీనికి అంగీకరించలేదని పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ, తాము సండ్రకు బెయిల్ ఇవ్వాలని కోరడం జరిగిందని తెలిపారు. దీనిపై దీనిపై మంగళవారం విచారణ జరుగుతుందని న్యాయవాది తెలిపారు.
ఏడు గంటల పాటు విచారణ...
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సండ్ర మే 30, 31వ తేదీల్లో రేవంత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతన్ని విచారించేందుకు ఏసీబీ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేందుకు హైదర్ గూడలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో సండ్ర ఇంట్లో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వెనుదిరిగారు. ఆ తరువాత స్పందించిన సండ్ర తాను అనారోగ్యంతో బాధ పడుతున్నానని విచారణకు పది రోజుల తరువాత హజరవుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. అయితే సోమవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో సండ్ర ఏసీబీ ఎదుట హాజరయ్యారు. సుమారు ఏడు గంటల పాటు విచారించారు. విచారణలు పలు కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో ఏసీబీ ఆయన్ను అరెస్టు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో రేవంత్ రెడ్డి..సెబాస్టియన్, ఉదయ్ సింహాలు అరెస్టయి బెయిల్ పై విడుదల సంగతి తెలిసిందే. 

రెండు రాష్ట్రాల జన్ కో, ట్రాన్స్ సీఎండీల భేటీ

హైదరాబాద్: రెండు రాష్ట్రాల జన్ కో, ట్రాన్స్ సీఎండీలు భేటీ అయ్యారు. వీరి భేటీలో విద్యుత్ ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదిలీలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే సండ్ర కు 14 రోజుల రిమాండ్

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఐదవ ముద్దాయిగా ఉన్న సండ్ర వెంకట వీరయ్యను 14 రోజుల జ్యుడిషయల్ కస్టడీ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. సండ్రను చర్లపల్లిజైలు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని కోర్టు ఆదేశించింది.

'వ్యాపమ్' పై సీబీఐ విచారణకు సీఎం సిఫారసు

భోపాల్: దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన వ్యాపమ్ కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంగీకరించారు. ఈ కేసును విచారణ చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని చౌహాన్ మధ్యప్రదేశ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

 

రాష్ట్రపతితో భేటీ అయిన ఏపీ కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ తో ఏపీ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో ఏపీ పీసీసీ చీఫ్ రఘుశీరా, చిరంజీవి, కేవీపీ, రామచంద్రయ్య ఉన్నారు.

పట్టాదారు పాస్ పుస్తకాల స్కాంలో దర్యాప్తు ముమ్మరం

అనంతపురం: పట్టాదారు పాస్ పుస్తకాల స్కాంలో దర్యాప్తు ముమ్మరం అయ్యింది. జిల్లాలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లోనూ జిరాక్స్ షాపుల్లోనూ 20 బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నారు. కంబదూరు ఎస్ బీఐలో 500 నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

భీమిలి బిల్డింగ్ సొసైటీ పై ఏసీబీ సోదాలు

విశాఖ: భీమిలి బిల్డింగ్ సొసైటీ పై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఏసీబీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

13:40 - July 7, 2015

కృష్ణా: జిల్లా గుడివాడలో విద్యార్థిని మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. జులై 19న గురుకుల పాఠశాల నుంచి అదృశ్యమైన నాగలక్ష్మీ ఆచూకి ఇంకా లభించలేదు. రూరల్ పీఎస్‌లో కేసు నమోదైంది. నాగలక్ష్మీ ఆచూకి లభించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనలో ఉన్నారు.

 

13:37 - July 7, 2015

విశాఖ: విశాఖపట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను విరమించుకోవాలని... నిర్వాసితులు ఏపీ మంత్రులను అడ్డుకున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై విజయనగరం, విశాఖపట్టణం కలెక్టర్లతో మంత్రులు గంటా, మృణాళిని సమీక్ష నిర్వహించారు. ఏడు గ్రామాలకు చెందిన భూములను సేకరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 5 వేల 585 ఎకరాల భూములను సేకరిస్తామని చెప్పారు. రైతాంగానికి మంచి ప్యాకేజీ ఇస్తామన్నారు. ఐతే కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. ఎయిర్‌పోర్టుకు భూములను ఇచ్చేది లేదని...రైతులు తేల్చిచెప్పారు. మంత్రి మృణాళిని వాహనాన్ని అడ్డుకున్నారు. భూసేకరణ ప్రతిపాదనను విరమించుకోవాని డిమాండ్ చేశారు. నిర్వాసితుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భోగాపురం ఎయిర్‌పోర్టు వద్దంటే కుదరదని గంటా స్పష్టం చేశారు. రైతులకు ఏం కావాలో చెప్పాలన్నారు.

 

13:30 - July 7, 2015

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఇవాళా మధ్యాహ్నం 1.45 గంటలకు ఎపి మంత్రులు కలవనున్నారు. కేఈ, బొజ్జల, మంత్రులు అచ్చెన్నాయుడు, రావెల కిషోర్ బాబు, గంటా శ్రీనివాస్ లు భేటీ కానున్నారు. ఓటుకు నోటు వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్, ఇరు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌, సెక్షన్-8, షెడ్యూల్‌ 9, 10లపై ఫిర్యాదు మంత్రులు చేయనున్నారు. 

13:23 - July 7, 2015

హైదరాబాద్: ఎపి కొత్త రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. టోక్యోలో పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాజధాని అమరావతి కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందన్నారు. జపాన్ పెట్టుబడిదారుల కోసం... ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. 

చచ్చిపోతానేమోనని భయంగా ఉంది: ఉమాభారతి

న్యూఢిల్లీ:మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న కిల్లింగ్ స్కాం 'వ్యాపమ్' మృత్యుహేల సొంతపార్టీ మంత్రులనే గజగజ వణికిస్తోంది. 'మంత్రిగా ఉన్ననాకే పిచ్చెక్కిపోతోంది. చచ్చిపోతానేమోనని చాలా భయంగా ఉంది. ఎందుకంటే నా పేరు కూడా వ్యాపమ్ కేసు ఎఫ్ఐఆర్ లో ఉంది. ఇక అమాయకుల పరిస్థితి ఏంటని' ఉమాభారతి మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయంలో స్పందించి ఏదైనా చేయాలని ఆమె సూచించారు.

13:09 - July 7, 2015

హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కస్టడీపై ఎసిబి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఎసిబి అధికారులు, సండ్ర తరపు లాయర్ల వాదనలు వినిపిస్తున్నారు. సండ్ర రిమాండ్ నివేదికలో కీలక అంశాలను ఎసిబి తెలిపింది. ఎసిబి కోర్టు కాసేపట్లో నిర్ణయం ప్రకటించనుంది.

 

సండ్ర రిమాండ్ పై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తి

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిన్న అరెస్టయిన టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ను మంగళవారం ఏసీబీ అధికారులు కోర్టు లో హాజరు పరిచారు. సండ్రను ఐదో నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ అధికారులు మెమో దాఖలు చేశారు. 14. రోజుల జ్యుడిషయల్ కస్టడీకి పంపాలని కోరారు. సండ్ర రిమాండ్ పై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. రిమాండ్ పై ఇవాళ మధ్యాహ్నం కోర్టు నిర్ణయం వెలువరించనుంది.

12:59 - July 7, 2015

హైదరాబాద్: డిప్, మైక్రో ఇరిగేషన్ కు ప్రభుత్వం నుంచి ప్రోత్సహం ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. సచివాలయంలో అగ్రి ఫ్యాబ్రెట్ ను ఆయన ఆవిష్కరించారు. 'ఇక్రిశాట్ లాంటి అంతర్జాతీయ సంస్థ మన దగ్గర ఉండటం గర్వకారణం' అన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచుకోవడానికి.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

 

జడ్చర్ల లో ఈ- హెల్త్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మహబూబ్ నగర్: జడ్చర్ల కమ్యూనిటీ ఆస్పత్రిలో ఈ- హెల్త్ నుమంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి లు ప్రారరంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి లు కూడా పాల్గొన్నారు.

 

12:51 - July 7, 2015

హైదరాబాద్: 'బాహుబలి' సినిమాను పెద్ద తెరపైనే చూడాలని చిత్ర దర్శకుడు రాజమౌళి అన్నారు. ఈమేరకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రతి డిజిటల్ ప్రింట్ మీద వాటర్ మార్కింగ్ ఉంటుందని.. ఏ.. థియేటర్ లో పైరసీ చేసిన డేట్, టైమ్ తో సహా తెలుస్తుందన్నారు. థియేటర్ల యజమానులు ఆపరేటర్లకు హెచ్చరికలు జారీ చేయాలని చెప్పారు. నైట్ షో తర్వాత స్పెషల్ షో వేసుకుని పైరసీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. పైరసీకి పాల్పడిన థియేటర్ లను ఏడాదిపాటు నిషేధిస్తామన్నారు. పైరసీ నియంత్రణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సినిమా అనేది కళ..కళను దొంగతనం చేయకూడదని నటుడు రానా అన్నారు.
తెలుగువాడు గర్వించే సినిమా బాహుబలి:అల్లు అరవింద్
'ప్రతి తెలుగువాడు గర్వించే సినిమా బాహుబలి. భారీ బడ్జెట్‌తో బాహుబలిని నిర్మించారు. పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ నష్టపోతోంది. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయవద్దు. ఆన్‌లైన్ పైరసీని అడ్డుకునేందుకు కోర్టు జాండో ఆర్డర్ ఇచ్చింది. 350 సర్వీస్‌ ప్రొవైడర్లకు మార్గదర్శకాలు ఇచ్చాం. ఏ థియేటర్‌లో పైరసీకి పాల్పడ్డా..మాకు తెలుస్తోంది. థియేటర్‌లు పైరసీకి పాల్పడితే ఏడాది వరకు బ్యాన్ చేస్తాం. పైరసీని అరికట్టేలా ఇరురాష్ట్రాల పోలీసులు చర్యలు తీసుకోవాలి. పైరసీని అరికట్టేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. పైరసీ సినిమాల్ని చూస్తే తల్లి రొమ్మును పొడిచినట్లే. బాహుబలి సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత మీడియాదే. అని అన్నారు.

సెబాస్టియన్ తో సండ్ర 32 సార్లు మాట్లాడాడు:ఏసీబీ

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో సోమవారం అరెస్టు అయిన సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సండ్ర రిమాండ్ నివేదికలో ఏసీబీ కీలక విషయాలు వెల్లడించింది. నివేదికలో ని అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 'ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్‌తో సండ్ర 32 సార్లు ఫోన్‌లో మాట్లాడారు. స్టీఫెన్‌సన్‌ను ప్రభావితం చేసే కుట్రలో సండ్ర కీలక పాత్ర పోషించారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు సండ్ర రాజమండ్రి ఆస్పత్రిలో చేరారు. సండ్ర డ్రైవర్‌ను విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ కేసులో సండ్ర ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలున్నాయి.

12:35 - July 7, 2015

ఢిల్లీ: వ్యాపం... మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ కుంభకోణం పేరు చెబితేనే దేశమంతటా ప్రకంపనలు వస్తున్నాయి. ఒక్కొక్కరుగా చనిపోతున్న మిస్టిరీయస్‌ ఇన్సిడెంట్స్ ను చూస్తోంటే రేపు ఎవరి వంతోననే భేతాళ ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి.
స్కాంస్టర్స్ కు ఆశిష్‌ చతుర్వేది సవాల్‌
సాక్షులు, స్కాంస్టర్లు... ఇలా వ్యాపంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగా టచ్‌లో ఉన్న వారంతా ఒక్కొక్కరుగా ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మరణాలను చూసి వ్యాపం కుంభకోణం గురించి తెలిసిన వారు కూడా వాస్తవాలను బయటి ప్రపంచానికి తెలియచేసేందుకు జంకుతున్నారు. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే గ్వాలియర్‌కు చెందిన ఓ యువకుడు వ్యాపం స్కాంస్టర్లకు సవాల్ విసురుతున్నాడు. ప్రాణాలయినా అర్పిస్తాను కానీ వెనకడుగు వేసేదే లేదంటూ తెగేసీ చెబుతున్నాడు.
2013లో బయటపడిన వ్యాపం కుంభకోణం
ఆశిష్‌ చతుర్వేది. గ్వాలియర్‌కు చెందిన హక్కుల కార్యకర్త. 2009లో తన తల్లిని క్యాన్సర్‌ మహమ్మారి కబళించటంతో ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. కానీ అక్కడ అర్హత లేని వారు, నిపుణులు కాని వారు వైద్యం చేయటం చూసిన ఆశిష్‌ అసలు వీరందరిని సర్కార్‌ కొలువులు ఎలా వరించాయని తెలుసుకునేందుకు 2009లో దర్యాప్తు మొదలుపెట్టాడు. అడ్డంకులెన్నో ఎదురైనా ఆశిష్‌ విద్యార్ధి చేసిన దర్యాప్తుకు ఫలితమే 2013లో బయటపడిన వ్యాపం కుంభకోణం. హైకోర్టు పర్యవేక్షణలో మహారాష్ట్ర పోలీసులు చేస్తున్న దర్యాప్తుకు ఆశిష్‌ సాక్ష్యమే అసలు కారణం.
ఆశిష్‌ పై 10 సార్లకు పైగా హత్యాయత్నాలు
దీంతో ఆశిష్‌ను తుదముట్టించేందుకు 10 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. దీంతో హైకోర్టు ఆశిష్‌కు అంగరక్షకులను నియమించింది.అయినా పరిస్ధితిలో ఏ మార్పు రాలేదు. తాజాగా... పారిపోకుంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తాం అంటూ బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. అయినా సరే ఆశిష్‌ విద్యార్ధి మడమతిప్పటం లేదు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతానంటున్నాడు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో పాటు బడాబాబుల గుట్టు రట్టు చేస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ అవినీతికి వ్యతిరేకంగా చేసే పోరులో నేను మరణించినా పర్వాలేదు.. కానీ సత్యం మాత్రం జీవించే ఉండాలంటూ నిజాయితీగా కోరుకుంటున్నాడు.
అక్రమార్కుల గుండెల్లో రైళ్లు
ఆశిష్‌ చతుర్వేది ధైర్యాన్ని చూసి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వంటి వాళ్లయితే వ్యాపం కుంభకోణంలోని మరణాలన్నీ సహజమైనవే అంటున్నారు. అదృశ్య శక్తులేవీ లేవంటూ చెబుతుండటం కొసమెరుపు.

 

12:23 - July 7, 2015

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు సమ్మె సైరన్‌ మోగించారు. తమకు కనీస వేతనం 14 వేల 170 రూపాయలు ఇవ్వాలని మున్సిపల్‌ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పర్మినెంట్‌ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మున్సిపల్‌ కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.
గతంలో సమ్మెను వాయిదా వేసిన కార్మిక సంఘాలు
గత నెల 25నే కార్మికులు సమ్మెకు సిద్ధమైనప్పటికీ తమకు సమయం కావాలని ప్రభుత్వం కోరడంతో సమ్మెను వాయిదా వేశామని, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లామంటున్నాయి.
ప్రభుత్వంతో కొలిక్కిరాని చర్చలు..
తెలంగాణ వ్యాప్తంగా సుమారు 40వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అన్ని మునిసిపాలిటీల్లో పారిశుధ్య సేవలు నిలిచిపోయాయి. దాంతో ప్రభుత్వం కార్మిక సంఘాలను చర్చలకు పిలిచింది. రెండు గంటలకు పైగా జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండా అర్థాంతరంగా సమావేశం ముగిసింది. ప్రభుత్వం కార్మికుల డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉందని ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పనులు చెయ్యాలని కార్మిక మంత్రి నాయిని కార్మికులను కోరారు.
సమ్మె విరమణకు కార్మిక సంఘాలు ససేమిరా
ప్రభుత్వ విజ్ఞప్తిపై కార్మిక సంఘాలు మాత్రం సమ్మె విరమణకు ససేమిరా అంటున్నాయి. కనీస వేతనం 14వేల170 రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాయి. పీఆర్‌సీలో కనీస వేతనాన్ని కూడా ఇవ్వకుంటే కార్మికులు ఎలా జీవించాలని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి . సమస్యలు పరిష్కరించేంత వరకూ సమ్మె ఆపేది లేదంటున్నారు కార్మికులు. ఇదిలా ఉంటే మరోసారి సమావేశం అయ్యేందుకు ప్రభుత్వం కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి.

 

రెండు టిప్పర్లు ఢీ:పలువురికి గాయాలు...

నిజామాబాద్ :జిల్లాలోని అర్సపల్లి వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు టిప్పర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరికొందరు రెండు టిప్పర్ల మధ్యలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె వాయిదా

విజయవాడ:ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె వాయిదా పడినట్లు కార్మికులు తెలిపారు. ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ జపాన్ పర్యటనలో ఉన్నందున రెండు రోజుల పాటు సమ్మెను వాయిదా వేసినట్లు కార్మికులు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే 9వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఏపీ మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది.

12:17 - July 7, 2015

హైదరాబాద్: తెలంగాణ ఇచ్చినా..అధికారానికి దూరం కావడాన్ని జీర్ణించుకోలేక పోతుంది టి కాంగ్రెస్. ఓటమిపై దఫ దఫాలుగా పోస్ట్ మార్టం చేసిన కాంగ్రెస్‌ పార్టీ. దానికి కారణమైన అంశాన్ని గుర్తించింది. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలే తమ పుట్టిముంచాయని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చంది.
కార్యరూపం దాల్చని కేసీఆర్ హామీలు
టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. అప్పుడు ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటికి అమలుకాలేదని ఆరోపిస్తుంది కాంగ్రెస్. ముఖ్యంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్స్, దళితులకు మూడెకరల భూమి..కేజీ టూ పీజీ, ఉచిత విద్య, వైద్యం, ఇంటికో ఉధ్యోగం ఇలా అన్ని హామీలు నీటి మూటలు అయ్యాయని ఆరోపిస్తోంది.
ప్రభుత్వ పనితీరు పరిశీలన కమిటీ
వీటన్నింటిపై ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా ప్రణాళికలను రూపొందించుకుంది కాంగ్రెస్. దీని కోసం మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి చైర్మన్ గా 17 మంది తో ప్రభుత్వ పనితీరు పరిశీలన కమీటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈఅన్ని అంశాలపై క్షేత్ర స్థాయి అధ్యనం చేసి పీసీసీ, ఏఐసీసీలకు నివేదిక ఇవ్వనుంది.
హక్కుల సాధించడంలో కేసీఆర్ విఫలం: కాంగ్రెస్ 
మరోవైపు తెలంగాణ బిల్లులో రాష్ట్రానికి కల్పించిన హక్కుల సాధించడంలో కేసీఆర్ విఫలమయ్యారని అంటుంది కాంగ్రెస్. కొత్త పథకాలలో అవినీతీ రాజ్యమేలుతుందంటున్న కాంగ్రెస్.. వీటన్నంటిపై అధ్యయనం చేసి టిఆర్ఎస్ ను ప్రజలముందు నిదీస్తామని హస్తం నేతలు అన్నారు. 

 

మఠంపల్లి గురుకుల పాఠశాలలో కలుషితాహారం:15మంది అస్వస్థత

నల్గొండ: మఠంపల్లి గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

పైరసీ జరిగిన థియేటర్ ను ఏడాది పాటు నిషేధిస్తాం:అల్లు అరవింద్

హైదరాబాద్: తెలుగు వారు గర్వపడేలా బాహుబలి సినిమా తీశానని.. బాహుబలి సినిమా పైరసీ అరికట్టేలా పోలీసులు కృషి చేయాలని ఆ సినిమా డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు. బాహుబలి టీం, అల్లు అరవింద్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ పైరసీ వల్ల సినిమా పరిశ్రమ దెబ్బతింటుంది అని అల్లు అరవింద్ అన్నారు. 350 సర్వీస్ ప్రొవైడర్లకు పైరసీ సైట్ల వివారాలిచ్చామన్నారు. పైరసీ జరిగిన థియేటర్ ను ఏడాది పాటు నిషేధిస్తాం అని స్పష్టం చేశారు. పైరసీ నియంత్రణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు రాజమౌళి స్పష్టం చేశారు. పైరసీ జరగకుండా థియేటర్ల యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

12:07 - July 7, 2015

యుపి: ఉత్తరప్రదేశ్‌లో ఓ విద్యార్థిని అపర కాళిక అవతారమెత్తింది. పోకిరీల పాలిట సింహస్వప్నంలా మారింది. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన... ఓ ఆకతాయి చెంప చెళ్లుమనిపించింది. ఫిల్బిత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా తమను వేధిస్తున్న కేటుగాళ్లపై కసి తీసుకుంది. సాక్షాత్తు పోలీసు స్టేషన్‌లోనే పోకిరీకి బుద్ధి చెప్పింది. షూతో దిమ్మతిరిగేలా దంచి కొట్టింది. చివరకు ఆ యువకుడు అమ్మాయి కాళ్లు పట్టుకున్నాడు. జీవితంలో ఏ అమ్మాయిల జోలికి వెళ్లనంటూ ప్రాధేయపడ్డాడు. తమను బూతు మాటలతో వేధించాడని... అందుకే తగిన బుద్ధి చెప్పానని ఆ.. అమ్మాయి చెబుతోంది.

ఆర్థిక వేత్తల కంటే జ్యోతిష్యులునయం:కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విసుర్లు

హైదరాబాద్:గ్రీస్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో జరిగిన రెఫరెండం తర్వాత భారత కేపిటల్ మార్కెట్ ఒడిదుడుకులకు గురవుతుందన్న ఆర్థికవేత్తల వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విరుచుకుపడ్డారు. అసంబద్ధంగా ఉన్న ఆర్థికవేత్తల అంచనాలను చూస్తోంటే, జ్యోతిష్యులు చెప్పే విషయాలపై విశ్వసనీయత కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రముఖ ఆర్థికవేత్త మేఘనాథ్ దేశాయ్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా నిన్న జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచ అత్యంత వృద్ధుడు కన్నుమూత

టోక్యో:ప్రపంచ అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ బుక్ రికార్డుకెక్కిన సాకరీ మమొయీ(112) మంగళవారం కన్నుమూశారు. హైస్కూల్‌లో ప్రిన్సిపాల్‌గా పనిచేసియన సకారి.. 1903 ఫిబ్రవరి 5న జన్మించారు. ప్రపంచ నంబర్ వన్ వృద్ధుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సొంతం చేసుకున్నారు. 2014లో గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ ను అందుకున్నారు. ఆ రోజున ఆయన మాట్లాడుతూ.. నేను ఇంకా మరో రెండేండ్లు బతకాలి ఉంది. బతికితీరుతానన్న నమ్మకం ఉంది.. అంటూ వేదికపై ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు.

భజరంగ్ జూట్ మిల్లు కార్మికులతో ఏపీ మంత్రుల భేటీ

హైదరాబాద్: ఏపీ మం ప్రతిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుతో గుంటూరు భజరంగ్ జూట్ మిల్లు కార్మికులు సమావేశం అయ్యారు.

11:53 - July 7, 2015

హైదరాబాద్: ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను అధికారులు ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టారు. ఐదు రోజుల కస్టడీ కోరతూ.. ఎసిబి కోర్టులో అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 14 రోజులపాటు రిమాండ్ విధించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎఫ్ ఐఆర్ లో వెంకటవీరయ్యను ఐదో నిందితుడిగా పేర్కొన్నారు. ఎసిబి.. రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. రిమాండ్ రిపోర్టులో ఏ.. ఏ.. అంశాలున్నాయోననే ఉత్కంఠ నెలకొంది. సండ్రను చర్లపల్లి జైలుకు తరిలించే యోచనలో ఉన్నారు.
న్యాయపోరాటం చేస్తా:సండ్ర 
అయితే సండ్ర కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదిలావుంటే సండ్ర వెంకటవీరయ్య మీడియతో మాట్లాడుతూ తనకు ఏ పాపం తెలియదన్నారు. తనను నిరంకుశంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే ఎసిబి తనను ఈ కేసులో ఇరికించిందని ఆరోపించారు. న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. 

ఖమ్మం జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య....

ఖమ్మం : భద్రాచలంలోని కొండిపల్లి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ప్రేమజంట భద్రాచలానికి చెందిన జగదీష్‌, చోటిగా గుర్తించారు. మూడురోజుల క్రితం ఈ సంఘటన జరిగిందని పోలీసులు చెప్పారు.

11:40 - July 7, 2015

గ్రీస్ ప్రజల తీర్పు అభినందనీయమని ది హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. గ్రీస్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఆహ్వానించదగినదన్నారు. గ్రీస్ ఆర్థిక వ్యవస్థ భారత్ పై ప్రత్యక్షంగా ప్రభావం చూపకపోయనా.. పరోక్షంగా ప్రభావం చూపుతుందని తెలిపారు. విదేశీ పెట్టుబడులు.. ఆ.. దేశాలకు తరలిపోతాయని చెప్పారు. సంక్షోభం వచ్చినప్పుడు ద్రవ్య పెట్టుబడులు తరలిపోతాయని పేర్కొన్నారు. భారత్ నుంచి పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. అయితే వెంటనే వెళ్లకపోవచ్చని.. ఆలస్యంగానైనా.. తరలివెళ్లవచ్చని చెప్పారు. రూపాయిపై ఒత్తిడి పడే అవకాశం ఉందని వెల్లడించారు.
మధ్యప్రదేశ్.. వ్యాపం స్కాం
మధ్యప్రదేశ్ లోని వ్యాపం స్కాం కేసులో ఇప్పటికీ 48 మంది చనిపోయారని తెలిపారు. బీజేపీకి అనేక ఉచ్చులు బిగుసుకుంటున్నాయని వివరించారు. స్కాంపై ప్రధాని నోరు మెదపడం లేదని... సిబిఐ విచారణకు ఆదేశించడం లేదన్నారు. వ్యాపం స్కాం, హత్యల వెనుకాల పెద్ద మాఫియా ఉందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు మానిటరింగ్ చేస్తూ... సీబిఐ విచారణ జరిపించాలన్నారు.
పవననిజాన్ని అర్థం చేసుకోలేం...
పవననిజాన్ని సాధారణ వ్యక్తులు అర్థం చేసుకోలేరని.. అత్యంత మేధావులే అర్థం చేసుకోగలరని ఆయన వ్యంగాస్త్రాలు సంధించారు. కేసీఆర్ కు సెక్షన్ -8 అమలు చేసే అధికారం, హక్కులు లేవని చెప్పారు. సెక్షన్-8 పేరుతో గవర్నర్ కు అపరిమిత అధికారులను కట్టబెట్టడాన్ని టీఆర్ ఎస్ వ్యతిరేకిస్తుంది తప్పా... సెక్షన్ 8 ను కాదని తేల్చి చెప్పారు. పవన్.. రాజకీయపార్టీ పెట్టి.. రాజకీయాలతో సంబంధం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

విద్యుత్ శాఖ కార్యదర్శి, ట్రాన్స్ కో సీఎండీకి నోటీసులు...

హైదరాబాద్:ట్రాన్స్‌కో ఉద్యోగుల రిలీవ్ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను పట్టించుకోవడం లేదంటూ ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణ అర్జీని కోర్టు విచారణకు స్వీకరించింది. విద్యుత్‌ ఉద్యోగుల వివాదంలో తెలంగాణ ఎనర్జీ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌తోపాటు సీఎండీపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. కోర్టు ఈ కేసు విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది.

'వ్యాపమ్' స్పందించిన సుప్రీం కోర్టు

ఢిల్లీ:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యాపమ్ కుంభకోణంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ కుంభకోణానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై ఈ నెల 9న విచారణ జరుపుతామని వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ కుంభకోణంలో అనుమానాస్పద మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలంటూ అత్యున్నత న్యాయస్థానంలో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై స్పందించిన కోర్టు అన్ని పిటిషన్లపై ఈ నెల 9న విచారణ జరుపుతామని మంగళవారం వెల్లడించింది.

పుత్లీబౌలి దంపతులపై కత్తులతో దాడి:భార్య మృతి

హైదరాబాద్:పుత్లీబౌలి రంగామహల్‌లో దంపతులపై కత్తులతో దాడి చేశారు. దాడిలో భార్య సోనుభాయి(45) మృతి చెందింది. భర్త సోనుకు తీవ్ర గాయాలయ్యాయి. దంపతులపై విచక్షణా రహితంగా దాడి జరిగింది. దాడి చేసిన వ్యక్తిని సికింద్రాబాద్ వాసి లఖన్‌గా పోలీసులు గుర్తించారు. దాడికి ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

జపాన్ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు:చంద్రబాబు

హైదరాబాద్: ఏపీ రాజధానిప్రాంతంలో జపాన్ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేశామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. జపాన్ లో ట్యోక్యో పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాం అని , రాజధాని అమరావతి కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని స్పష్టం చేశారు.

ఏసీబీ కోర్టులో ఎమ్మెల్యే సండ్ర

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎఫ్ ఐఆర్ లో సండ్రను ఐదో నిందితుడుగా ఏసీబీ పేర్కొంది. సోమవారం విచారణకు పిలిచి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని నేడు కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.

సండ్ర అరెస్ట్ ముమ్మాటికి దళితులపై దాడే:జూపూడి

హైదరాబాద్:ఓటుకు నోటు అంశంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను అరెస్ట్ చేయడం ముమ్మాటికీ దళితులపై జరుగుతున్న దాడే అని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సండ్ర అరెస్ట్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. విచారణకు సండ్ర పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ... అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏసీబీకి ఏమొచ్చిందని ప్రశ్నించారు. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా దళిత వ్యతిరేకి అని... టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ చివరకు తానే సీఎం పీఠాన్ని అధిష్టించారని... డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను పదవి నుంచి తొలగించారని...

10:56 - July 7, 2015

వీక్లీ ఆఫ్‌...! వారమంతా కష్టపడ్డవారికి అదో రిలీఫ్‌. అదో టానిక్‌. కుటుంబ సభ్యులతో ఒక రోజంతా సరదాగా గడిపితే, ఆ ఆనందమే వేరే. ఆ సంతోష క్షణాలు మరో వారం రోజులు శ్రమించడానికి అవసరమైన ఎనర్జీనిస్తాయి. కానీ, పోలీసులకు మాత్రం ఇలాంటి సంతోషాలు, ఆనందాలు లేకుండా పోతున్నాయి.
పోలీసులంటే చాలా మందికి భయం..
పోలీసులంటే మనలో చాలా మందికి భయం. వారు మన దగ్గరకు వస్తున్నారంటే హడలిపోతుంటాం. విధి నిర్వహణలో, శాంతి భద్రతల పరిరక్షణలో, ట్రాఫిక్‌ నియంత్రణలో ఒక్కొక్కసారి కఠినంగా వ్యవహరిస్తుండడం, మరికొన్ని సందర్భాలలో నిబంధనలు అతిక్రమిస్తుండడం వల్ల పోలీసులంటే మన సమాజంలో కొన్ని రకాల అభిప్రాయాలు ఏర్పడిపోయాయి.
ఖాకీలంతా క్రౌర్యానికి ప్రతీకలే అనుకుంటే పొరపాటే
కానీ, ఖాకీలంతా క్రౌర్యానికి ప్రతీకలే అనుకుంటే పొరపాటే. ఆ ఖాకీ దుస్తుల వెనక సున్నిత హృదయమూ దాగి వుంటుంది. వారికీ కన్నీళ్లుంటాయి. విధి నిర్వహణలో అనేక కష్టాలుంటాయి. వానొచ్చినా, వరదొచ్చినా, ఉప్పెనొచ్చినా తామే ముందు పరుగులు తీస్తారు. గొడవలైనా, ఘర్షణలైనా, కొట్లాటలైనా సమాచారం అందిన మరుక్షణమే అక్కడకు పరుగెత్తుతారు. పండుగలైనా, ఉత్సవాలైనా, సభలైనా, సంబరాలైనా, ఊరేగింపులైనా మేమున్నామంటూ బందోబస్తు డ్యూటీలకొస్తారు.
అర్ధరాత్రికి ఇంటికి చేరే పోలీసులెందరో..
తెల్లవారుఝామున డ్యూటీకి ఎక్కితే, ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరే పోలీసులెందరో. రోజుకి కనీసం 16 గంటలకు తక్కువ కాకుండా పనిచేసే పోలీసులు మన చుట్టూ ఎందరో వున్నారు. ఇన్ని గంటలపాటు ఒక్కొక్కసారి నిల్చొనే వుండాల్సి వస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో టాయ్‌లెట్స్‌కి వెళ్లలేని పరిస్థితుల్లో డ్యూటీ చేయాల్సి వుంటుంది. పొద్దస్తమానం నిల్చొనే డ్యూటీ చేయాల్సి వస్తుంది. కొంతమంది పోలీసుల జీవితాలను దగ్గరగా వెళ్లి పరిశీలిస్తే ఆ ఉద్యోగమే ఒక శిక్షేమో అన్న వేదన మనల్ని ఆవహిస్తుంది.
వారంతపు సెలవు పోలీసులకు అందని ద్రాక్ష
బర్త్ డే, మ్యారేజ్‌ డే, పిల్లల పుట్టిన రోజు ఇలాంటి సందర్భాలలో కూడా సెలవు తీసుకోలేని, అడగలేని వాతావరణంలో అనేకమంది పోలీసులు పనిచేయాల్సి వస్తుంది. వీక్లీ ఆఫ్‌ లేదా వారంతపు సెలవు అన్నది పోలీసులకు అందని ద్రాక్ష పండుగానే వెక్కిరిస్తోంది. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలంటే ఇప్పుడున్న సిబ్బంది సరిపోరన్నది వాస్తవం. సిబ్బంది సంఖ్యను మరో 30 శాతం పైగా పెంచుకోవాల్సి వుంటుంది. అంటే పోలీసులు ఇప్పటికే తాము మోయాల్సిన బరువు కంటే 30 శాతం అదనంగా మోస్తున్నట్టే లెక్క. అప్పుడప్పుడు పోలీసుల్లో కనిపించే విపరీత స్వభవాలకు ఇలా ఎక్కువ పని ఒత్తిడి ప్రయోగించడం కూడా కారణమేనేమో. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచిస్తే మంచిది. విపరీతమైన పని ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యాలను కుళ్లబొడుస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. మరి ఖాకీలేసుకున్న పోలీసులూ మనుషులే కదా. వారికి వారాంతపు సెలవు ఇవ్వకుండా పని చేయించడం ధర్మమేనా?

 

'ఓటుకు నోటు'లో కేంద్రమే ముద్దాయి:సీపీఐ నారాయణ

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో కేంద్రమే ముద్దాయి అని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ... పార్టీ మారిన ఎమ్మెల్యేల పై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం వల్లే సమస్యలు పెరుగుతున్నాయన్నారు. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిందే చంద్రబాబు అని ఆరోపించారు. ఎన్డీఏలో పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్నా కేంద్ర ప్రభుత్వానికి మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు. వ్యాపం స్కాం హత్యలను చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

10:51 - July 7, 2015

రాజకీయనాయకులకు భాష ముఖ్యమని వక్తలు తెలిపారు. కేసీఆర్ మాటలు ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా ఉండాలని సూచించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ది హిందూ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, టిడిపి నేత రాజారాంయాదవ్ లు పాల్గొని, మాట్లాడారు. ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు తగ్గించాలన్నారు. 

10:41 - July 7, 2015

భూపాల్: మధ్యప్రదేశ్‌లో మరణ మృదంగం మోగుతూనే ఉంది. వ్యాపమ్ స్కామ్‌లో వరుస మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి మహిళ ఎస్‌ఐ చనిపోయిన ఘటన మరువక ముందే...తాజాగా మరో మరణం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌ఘర్‌లో కానిస్టేబుల్ రమాకాంత్‌ పాండే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని నివాసంలోనే మృతదేహం లభ్యమైంది. కొన్నిరోజుల క్రితం వ్యాపం స్కాంలో భాగంగా స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్ అధికారులు ...కానిస్టేబుల్‌ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వ్యాపమ్ స్కామ్‌లో వరుసగా నాలుగు రోజుల్లో నలుగురు చనిపోయారు.

 

10:39 - July 7, 2015

హైదరాబాద్: జపాన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం మిజుహో బ్యాంకు ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణానికి సహాయం చేసే జపనీస్ కార్పొరేషన్‌లపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. ఏపీలో మానవవనరులు పుష్కలంగా ఉన్నాయని బ్యాంకు అధికారులకు వివరించారు. అమరావతిని ఆర్థిక కేంద్రంగా....రాజధానిలో మిజుహో బ్యాంకు శాఖను ఏర్పాటుచేయాలని కోరారు. అమరావతి శాఖను భారత్‌లో హెడ్‌ ఆఫీసుగా తీర్చిదిద్దాలని కోరినట్లు చంద్రబాబు చెప్పారు. మిజుహో జపాన్‌లో అతి ప్రాచీనమైన రెండో అతిపెద్ద బ్యాంకుగా వెల్లడించారు. ఆ తర్వాత సాఫ్ట్‌ బ్యాంకు ప్రతినిధులతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. అక్కడి నుంచి జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రి మియజవాను కలిశారు. ఏపీ రాజధాని అభివృద్ధి, నిర్వహణ సంస్థతో ఈక్విటీ భాగస్వామ్యం కోరుకుంటున్నట్లు మియజవా చెప్పారు. మెట్రోప్రాజెక్టుపై భారత్‌ నుంచి ప్రతిపాదన వస్తే .... పెట్టుబడులు పెట్టటానికి పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

 

 

చెత్త సేకరణ వాహనాలను అడ్డుకున్న కార్మికులు

హైదరాబాద్:ఇమ్లిబన్ బస్ స్టేషన్ సమీపంలో జీహెచ్ ఎంసీ చెత్త సేకరణ వాహనాలను కార్మికులు అడ్డుకుని, వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

ఎస్సీ హాస్టల్ లో కలుషితాహరం:60 మందికి అస్వస్థత

హైదరాబాద్‌:సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్‌లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే యాజమాన్యం విద్యార్థినులను చికిత్స నిమిత్తం నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

10:34 - July 7, 2015

కర్నూలు: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయబావుటా ఎగరవేసింది. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గెలుపొందింది. ఆ.. పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి 100 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. 1080 ఓట్లు పోల్ అయ్యాయి. శిల్పాకు సుమారు 600 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

10:28 - July 7, 2015

ప్రకాశం: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయబావుటా ఎగరవేసింది. ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి గెలుపొందారు. మొత్తం 992 ఓట్లకుగానూ... 755 ఓట్లు పోల్ అయ్యాయి. మాగుంటకు 724 ఓట్లు వచ్చాయి. 13 చెల్లని ఓట్లు పడ్డాయి. మాగుంట గెలుపుతో టిడిపి కార్యకర్తల్లో ఆనందాలు వెల్లివిరిశాయి.

ఎమ్మెల్యే సండ్ర అరెస్టుకు నిరసగా సత్తుపల్లి బంద్

ఖమ్మం: ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అరెస్టుకు నిరసనగా ఖమ్మంజిల్లా సత్తుపల్లిలో టీడీపీ కార్యకర్తలు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా సండ్ర వెంకటవీరయ్యకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం సండ్రను ఏసీబీ ఆఫీసుకు తరలించారు.

అగ్రి ఫ్యాబ్రెట్ ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: సచివాలయంలో మంత్రి కేటీఆర్ అగ్రి ఫ్యాబ్రెట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్రిశాట్ లాంటి అంతర్జాతీయ సంస్థ మన దగ్గర ఉండటం గర్వకారణం మన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

చంద్రగిరి మండలంలో భారీగా ఎర్ర చందనం స్వాధీనం

చిత్తూరు:శేషాచలం అడవుల్లో కూబింగ్ నిర్వహింస్తున్న అటవీ సిబ్బందికి చంద్రగిరి మండలం ఈతకుంట వద్ద రూ.70 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

ముంబై:నేడు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 28,235 దగ్గర, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 8,532 దగ్గర ట్రేడవుతున్నాయి. 

కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయం

హైదరాబాద్:కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు. 

'వ్యాపమ్' మరో వ్యక్తి మృతి

హైదరాబాద్:మధ్యప్రదేశ్ వైద్య విద్యప్రవేశాలు, ప్రభుత్వోద్యోగాల నియామకాల కుంభకోణం సంచలనాలకు కేంద్రస్థానం అవుతోంది. ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులు వరుసగా చనిపోతున్నారు. దేశవ్యాప్తంగా వ్యాపమ్ మరణాలు కలవరం కలిగిస్తున్నాయి. తాజాగా కేసుతో సంబంధం ఉన్న కానిస్టేబుల్ రామాకాంత్ పాండే తికంగఢ్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయాడు. కేసుకు సంబంధించి టాస్క్‌ఫోర్స్ గతంలో పాండేను ప్రశ్నించింది. వరుసగా నాలుగు రోజుల్లో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు.

నేడు మరోసారి మున్సిపల్ కార్మికులతో టీసర్కార్ చర్చలు

హైదరాబాద్: నేడు మరోసారి మున్సిపల్ కార్మికులో టీసర్కార్ చర్చలు జరుపనుంది. చర్చల్లో మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, ఈటెల రాజేందర్ లు పాల్గొననున్నారు.

సండ్రకు వైద్య పరీక్షలు పూర్తి..

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. సండ్రను అధికారులు ఎసిబి ఆఫీస్ కు తరలించారు.

 

ఎన్ ఈసీతో చంద్రబాబు బృందం సమావేశం

జపాన్: ఎన్ ఈసీతో సీఎం చంద్రబాబు బృందం సమావేశం అయింది. జపాన్ ఆర్థికమంత్రి మియజవాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఎపి రాజధాని అభివృద్ధి, నిర్వహణ సంస్థతో ఈక్విటీ భాగస్వామ్యం కోరుకుంటున్నామని జపాన్ మంత్రి మియజవా అన్నారు. ఎపి రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవడానికి తమ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని మంత్రి తెలిపారు. మెట్రో ప్రాజెక్టుపై భారత ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తే...పెట్టుబడులు పెట్టడానికి పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తామని చెప్పారు. 

కొనసాగుతోన్న కర్నూలు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

కర్నూలు: జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టౌన్ హాల్ మోడల్ స్కూల్ లో కౌంటింగ్ జరుగుతోంది. టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి 30 ఓట్ల ఆధీక్యంలో ఉన్నారు.

 

09:12 - July 7, 2015

హైదరాబాద్: వైద్యపరీక్షల నిమిత్తం సండ్ర వెంకటవీరయ్యను అధికారులు ఎసిబి కార్యాలయం నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. రిపోర్టు రావడానికి 40 నిమిషాల సమసయం పట్టనుంది. కాసేపట్లో అధికారులు సండ్రను ఎసిబి కోర్టులో హాజరుపరచనున్నారు. విచారణ కోసం సండ్రను కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతివ్వాలని ఎసిబి అధికారులు కోర్టును కోరనున్నారు.

ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాగుంట గెలుపు

ప్రకాశం: జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి గెలుపొందారు. మాగుంటకు 711 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్థి అట్ల చిన్నవెంకట్ రెడ్డికి 13 ఒట్లు వచ్చాయి. 17 చెల్లని ఓట్లు పడ్డాయి. 

08:56 - July 7, 2015

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్‌ పర్యటన తొలి రోజు బిజీబిజీగా సాగింది. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు జరిపారు. ముందుగా..ప్యూజీ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. విజయవాడలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన స్మార్ట్‌ గ్రిడ్‌ నిర్మాణ పురోగతిపై చర్చించారు. ఉమ్మడి భాగస్వామ్యంతో స్మార్ట్ గ్రిడ్‌ నిర్మాణాన్ని చేపట్టాలని చంద్రబాబు ప్యూజీ కంపెనీ ప్రతినిధులను కోరారు. అందుకు ఆ కంపెనీ అంగీకరిస్తూ..ఆగస్టులో క్షేత్రస్థాయి పర్యటన కోసం విజయవాడను సందర్శిస్తామన్నారు.
మిత్సుబిషి కంపెనీ ప్రతినిధులతో బాబు చర్చలు
ఆ.. తర్వాత..మిత్సుబిషి కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి కింద విశాఖలో జపాన్‌ ఇన్ఫర్మేఫషన్‌ అండ్‌ స్టడీస్‌ సెంటర్‌ నెలకొల్పడానికి మిత్సుబిషి కంపెనీ ముందుకొచ్చింది. అలాగే చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్‌ నోడ్‌పై మిత్సుబిషి కంపెనీ ప్రతినిధులు ఆసక్తి చూపించారు. కృష్ణపట్నంలో క్లస్టర్‌ ఏర్పాటుకు ఆ కంపెనీ సానుకూలత వ్యక్తం చేసింది. తమ యూనిట్లన్నీ అక్కడే ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ సంసిద్ధత తెలిపింది. అలాగే స్వామినాథన్‌ ఫౌండేషన్‌తో కలిసి కృష్ణాజిల్లాలో 5ఏళ్లపాటు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని మిత్సుబిషి కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. దాంతో పాటు..స్మార్ట్ విలేజ్‌, స్మార్ట్ వార్డు కార్యక్రమానికి సహకరిస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
మయావక కంపెనీ ప్రతినిథులతో చర్చలు
చంద్రబాబు బృందం మయావక కంపెనీ ఛైర్మన్‌ యోషిరో టనాక, ఇతర ప్రతినిధులతో భేటీ అయింది. రాష్ట్రంలో రొయ్యల ప్రాసెసింగ్‌లో తమకు సహకరించాలని చంద్రబాబు వారిని కోరగా..అందుకు మయావక ఛైర్మన్‌ అంగీకరిస్తూ..వచ్చే నెలలో గోదావరి జిల్లాల్లో పర్యటించి మత్య్య పరిశ్రమపై అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు. ఆతర్వాత సుమిటోమో కార్పొరేషన్‌ కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా పోలాకిలో వెయ్యిమెగావాట్ల విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుపై సుమిటోమో కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. గతేడాది నవంబర్‌లో సుమిటోమో కార్పొరేషన్‌ పోలాకి దగ్గర విద్యుత్‌ ప్లాంటుపై ఏపీ ప్రభుత్వంతో ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పాటు..రాజధాని అమరావతిలో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణానికి అంగీకారం తెలిపారు. త్రాగునీరు. సీవరేజ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ విభాగాల్లో సహకారం అందిస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. అనంతరం జైకా ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణం, మెట్రోరైలు ప్రాజెక్టు, పవర్‌ ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు జైకా ముందుకొచ్చిందని ఏపీ మంత్రులు తెలిపారు.
చంద్రబాబు వెంట మంత్రులు
జపాన్‌ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ , వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తం ఐదురోజుల విదేశీ పర్యటనలో భాగంగా జపాన్‌లో మరో రెండు రోజులపాటు చంద్రబాబు పర్యటించనున్నారు. ఆ తర్వాత హాంకాంగ్ వెళ్లనున్నారు.

 

08:46 - July 7, 2015

నిజామాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా టూర్‌లో సీఎం కేసీఆర్‌ బిజీ బిజీగా ఉన్నారు. నిజామాబాద్ నగరంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని పాలిటెక్నిక్ కాలేజీలో మొక్కను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. వర్షాలు రావాలంటే చెట్లను నాటాలని కోరారు. చెట్లు లేకుంటే వానలు పడవని తెలిపారు. సింగూరు జలాలను నిజామాబాద్‌కు...కాళేశ్వరం నుంచి కామారెడ్డికి నీళ్లు తెప్పిస్తాన్నారు. హరితహారం పథకంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ కోరారు. నిజామాబాద్ పట్టణంలో 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సూచించారు.
ధర్మారం జెడ్పీ స్కూల్‌లో మొక్కలు నాటిన కేసీఆర్‌
నిజామాబాద్ నుంచి నేరుగా రూరల్ నియోజకవర్గంలోని ధర్మారం జెడ్పీ స్కూల్‌లో కేసీఆర్‌ మొక్కలు నాటారు. ధర్మారంలో కళ్యాణ మండపం నిర్మిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత సదాశివనగర్ మండలం పెద్ద చెరువులో మొక్కలు నాటారు. అక్కడి నుంచి కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు కేసీఆర్. గతంలో బెల్లం మార్కెట్‌కు కామారెడ్డి పట్టణం పెట్టింది పేరని సీఎం గుర్తుచేశారు. జిల్లాలో చెట్లు లేకపోవడం వల్లే వర్షాలు పడటంలేదన్నారు.
మోతె గ్రామంపై సీఎం వరాల జల్లు
అంతకుముందు కేసీఆర్ పర్యటన వేల్పూర్ నుంచి మొదలైంది. అక్కడ మొక్కలు నాటిన సీఎం అనంతరం మోతె గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మోతె గ్రామంపై వరాల జల్లు కురిపించారు. గ్రామంలో 200 డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. సీఎంతో పాటు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో దేశంలో ఎక్కడా లేదన్నారాయన. అన్ని రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.
200 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం
వెల్పూర్ నుంచి నేరుగా ఆర్మూర్‌కు చేరుకున్నారు కేసీఆర్. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి జవదేకర్, సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మొత్తానికి నిజామాబాద్‌ జిల్లాలో టూర్‌లో సీఎం కేసీఆర్‌ బిజీ బిజీగా గడిపారు.

 

ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.. ఒంగోలు మున్సిపల్ ఆఫీసులో కౌంటింగ్ జరుగుతోంది. లెక్కింపు కేంద్రంలోకి పోలీసులు మీడియాను అనుమతించడం లేదు. దీంతో మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నంలోగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

 

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

కర్నూలు: జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. టౌన్ హాల్ మోడల్ స్కూల్ లో ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. లెక్కింపు కేంద్రంలోకి పోలీసులు మీడియాను అనుమతించడం లేదు. దీంతో మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నంలోగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.   

08:13 - July 7, 2015

కర్నూలు: కాసేపట్లో జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. కర్నూలు టౌన్ మాడల్ స్కూల్ లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. మొత్తం 1087 ఓట్లకు గానూ 1080 ఓట్లు పోల్ అయ్యాయి. 

వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి సండ్ర తరలింపు

హైదరాబాద్: వైద్యపరీక్షల కోసం టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  

నేడు ఎమ్మెల్యే సండ్రకు వైద్యపరీక్షలు...

హైదరాబాద్: టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు నేడు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

 

ఇంజనీరింగ్ కాలేజీల పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు

హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల పిటిషన్ పై ఇవాళా సాయంత్రం 4 గంటలకు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. సౌకర్యాలు లేవని 20 కాలేజీలను జెఎన్ టియూ రద్దు చేసింది. దీంతో కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.

07:28 - July 7, 2015

పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలని పోలీస్‌ ఆఫీసర్స్ అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోపిరెడ్డి కోరారు. అప్పుడే పోలీసులు ప్రశాంతంగా విధులు నిర్వర్తించగలరని చెప్పారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఇతర ఉద్యోగులకు మాదిరిగానే పోలీసులకు వారంలో ఒకరోజు సెలవు అవసరం లేదా? వారికి వీక్లీ ఆఫ్‌ ఇవ్వడం సాధ్యం కాదా? పోలీసులకూ వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలనే ప్రతిపాదనలు, నిర్ణయాలు ఎందుకు అమలు కావడం లేదు? వృత్తిపరంగా పోలీసులు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలేమిటి? వీటికి పరిష్కారం ఏమిటి'? అనే అంశాలపై గోపిరెడ్డి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

07:22 - July 7, 2015

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పెద్దమనిషి పాత్రను పోషించారు. ఇద్దరు చంద్రులకు సుతిమెత్తగా చురకలంటించారు. ఓటుకు నోటు కేసుతో పాటు చాలా అంశాలపై పవన్‌ స్పందించడం లేదన్నా నేతల కామెంట్లకు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవర్‌స్టార్‌ రియాక్ట్ అయ్యారు. పార్టీ పెట్టిన ఏడాదిన్నర నుంచే తాను తక్కువగా మాట్లాడుతున్నానన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత బాధ్యతగా మాట్లాడాల్సిన కర్తవ్యం అందరిపైనా ఉందన్నారు. ఎలా పడితే అలా మాట్లాడటం తనకు ఇష్టముండదని పవన్‌ అన్నారు.
విడిపోయే సమయంలో సమగ్రత భయం
తెలుగుజాతి ఐక్యత దేశ సమగ్రత అని మోడీ గతంలోనే తనతో చెప్పారన్నారు. రాష్ట్రం విడిపోయినపుడు తనకు ఇలాంటి భయాలే వేశాయన్నారు పవన్‌.. ఇద్దరు ముఖ్యమంత్రుల తీరుతో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రేగే ప్రమాదం కనిపిస్తోందన్నారు. ఇద్దరు సీఎంలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు పవన్‌. యాదాద్రి డెవలప్‌మెంట్‌ ప్లాన్‌కోసం విజయనగరం జిల్లాకు చెందిన ఆనంద్‌సాయిని ఆర్కిటెక్చర్‌గా కేసీఆర్‌ ఎన్నుకోవడం తనకు ఆనందం కలిగించిందన్నారు. ఈ చర్య ద్వారా కేసీఆర్‌ పెద్దమనసును చాటుకున్నారని అభిప్రాయపడ్డారు పవన్. ప్రస్తుతం నేతలందరి తీరు ఒకేరకంగా ఉందని అభిప్రాయపడ్డారు.
రేవంత్‌ ఎపిసోడ్‌పై లైట్‌ రియాక్షన్‌
రేవంత్‌ వ్యవహారంలో ఆరోపణలకు అందరూ బాధ్యులే అన్నట్లుగా స్పందించారు జనసేనాని.. ఇందులో టీడీపీని ప్రత్యేకంగా తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నట్లుగా కామెంట్లు చేశారు. పార్టీలు మారుతున్న నేతలకు చురకలంటించారు. తలసాని పార్టీ మారిన అతన్ని గెలిపించిన ప్రజల మద్ధతు కూడగట్టగలరా అని ప్రశ్నించారు పవన్‌.. ఓటుకు నోటు కేసులో సర్దుకుపోవాలని పవర్‌స్టార్‌ వేదాంత ధోరణితో చెప్పారు.
ఫోన్‌ట్యాపింగ్‌పై ఏపీ సర్కార్‌కు పవన్ సపోర్ట్
రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్‌ చీవాట్లు పెట్టారు. సున్నితమైన సమస్యల్లో ఉన్న ప్రజల మధ్య ఏది మాట్లాడితే తప్పు.. ఏది మాట్లాడితే ఒప్పు అనే విధంగా పరిస్థితి ఉందన్నారు.. ప్రజల అవసరాలకన్నా పార్టీల ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా ముందుపెడితే వచ్చే సమస్యల్లాగే రెండు రాష్ట్రాల్లో ఉందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం మాని నెల రోజుల నుంచి సమయం వృధా చేశారని మండిపడ్డారు.. అలాగే ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో ఏపీ ప్రభుత్వానికి అండగా మాట్లాడారు పవన్.. ట్యాపింగ్‌ జరిగిందో జరగలేదో అనే అంశం తేలాల్సి ఉన్నా ఇలాంటి పరిణామాలు మంచివికావన్నారు.
మీడియాపై నియంత్రణ సరికాదు
మీడియా స్వేచ్చను హరించేలా రెండు ప్రభుత్వాలు వ్యవహరించరాదన్నారు.. ప్రజాజీవితంలో ఉన్నవారిపై స్పందించడంలో కొంత మనోభావాలు దెబ్బతిన్నా మీడియాపై నియంత్రణ సరికాదన్నారు.. దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలోనూ మీడియాను నియంత్రించాలన్న ఇందిరాగాంధీ ప్రయత్నం నెరవేరలేదని పవన్‌ అన్నారు.

 

 

07:11 - July 7, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు కొనసాగిస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి గుండెళ్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. ఇన్నాళ్లూ విచారణకు గైర్హాజరైన సండ్ర వెంకట వీరయ్యను సుదీర్ఘంగా విచారించి అరెస్ట్ చేసింది. సండ్ర విచారణకు సోమవారంతో గడువు ముగియనుంది. ఇక అరెస్టు తప్పదని భావించిన ఆయన ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అరెస్ట్
సండ్రను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏసీబీ విచారించింది. ఓటుకు నోటు కేసులో సండ్ర ఫోన్ సంభాషణల ఆధారంగా ఏసీబీ విచారణ సాగింది. ఎంత మంది ఎమ్మెల్యేలను కొనడానికి ప్లాన్ వేశారు? టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు ఎక్కన్నుంచి తెచ్చారు. వంటి ప్రశ్నలను ఏసీబీ సండ్రపై సంధించినట్లు సమాచారం. విచారణలో సరైన సమాధానాలు సండ్ర చెప్పకుండా సహకరించకపోవడంతో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.
రేవంత్‌, మత్తయ్యలతో ఫోన్‌లో మాట్లాడిన సండ్ర-ఏసీబీ
గత నెల 30,31 తేదీల్లో రేవంత్‌రెడ్డితో సండ్ర ఫోన్‌లో సంభాషించినట్లు ఏసీబీ ఐజీ తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు మత్తయ్యకు ఎనిమిది సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు ఏసీబీ గుర్తించింది. మరోవైపు సండ్రతో పాటు మరో నిందితుడు జిమ్మీకి కూడా ఈ సాయంత్రంతో గడువు ముగియనుంది. ఆయనకు అరెస్టు వారెంటు జారీ చేసే అవకాశముంది. గుట్టు బయట పెట్టేవరకు ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని అధికారులంటున్నారు. సండ్ర అరెస్ట్ పై తెలంగాణ టీడీపీ నేతలు ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వం కక్ష పూరితంగా అరెస్ట్‌ చేయించిందని విమర్శల వర్షం కురిపించారు.

 

07:05 - July 7, 2015

ప్రకాశం: జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ నేడు జరుగనుంది. ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టిడిపి నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి, వైసిపి నుంచి అట్ల చినవెంకటరెడ్డిలు బరిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికలను వైసిపి ఇప్పటికే బహిష్కరించింది. ఈనెల 3న ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ఎంపిడివో కార్యాలయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది. బ్యాలెట్ బాక్సులను ఒంగోలులోని మున్సిపల్ కార్యాలయంలో భద్రపరిచారు. మొత్తం మూడు పోలింగ్ కేంద్రాల్లో 992 ఓట్లకు గాను, 755 ఓట్లు పోలయ్యాయి. అయితే ఎన్నికల కౌంటింగ్‌ను మంగళవారం ఉదయం 8 గంటలకు ఒంగోలులోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో లెక్కింపు ప్రారంభం అవుతుంది. లెక్కింపు ప్రారంభమైన 2 గంటల్లో ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.

 

రాత్రంతా ఎసిబి కార్యాలయంలోనే సండ్ర

హైదరాబాద్: టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రాత్రంతా ఎసిబి కార్యాలయంలోనే ఉన్నారు. ఈ కేసులో ఏడేళ్లకు పైగా శిక్ష లేనందునా.. బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరనున్నట్లు సండ్ర తరపు లాయర్లు తెలిపారు.  ఎసిబి పిలుపు మేరకు విచారణ కోసం వెళ్లిన సండ్రను నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  

మిజుహో బ్యాంక్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ...

జపాన్: మిజుహో బ్యాంక్ ప్రతినిధులతో ఎపి సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణానికి ఆర్థికంగా తోడ్పాటు అందించే జపనీస్ కార్పొరేషన్లపై దృష్టి పెట్టామని చంద్రబాబు చెప్పారు. మిజుహో బ్యాంకు జపాన్ లో ప్రాచీనమైనదని పేర్కొన్నారు. అమరావతిలో ఒక శాఖను నెలకొల్పాలని కోరినట్లు తెలిపారు. ఎపిలో మానవ వనరులు పుష్కలంగా వున్నాయని వెల్లడించారు.

 

నేడు మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

మహబూబ్ నగర్: మంత్రి కేటీఆర్ నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తొలిసారిగా ఈ-హెల్త్ సెంటర్ ను ఆయన ప్రారంభించనున్నారు. 

నేడు రాష్ట్రపతిని కలవనున్న ఎపి కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: మధ్యాహ్నం 1గంటకు ఎపి కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. 

నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

కర్నూలు: నేడు కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. 

నేడు హైదరాబాద్ లో లోక్ సభ స్పీకర్ పర్యటన

హైదరాబాద్: లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. వివేకవర్ధిని కాలేజీ ఉత్సవాల్లో ఆమె పాల్గొననున్నారు.  

Don't Miss