Activities calendar

12 July 2015

22:09 - July 12, 2015

"బాహుబలి". గడిచిన వారం రోజులుగా తెలుగునాట చర్చంతా ఈ సినిమా గురించే. సినీ ప్రియుల నుంచి సినిమాలంటే పెద్దగా ఆసక్తి చూపనివారి దాకా అందరూ ఈ బాహుబలి సినిమా గురించే మాట్లాడేలా చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్‌ అయింది. ఫస్ట్‌డే కలెక్షన్‌లలోనూ ఇంతకు ముందు రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు సినిమా అయితే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక అందరి దృష్టి అంతా..కలెక్షన్‌లపైనే ఉంది. చిత్ర బడ్జెట్‌లాగే, ఫస్ట్‌డే కలెక్షన్‌ల గురించి రకరకాల అంకెలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి.
27 కోట్లదాక వచ్చినట్లు సమాచారం
అంకెలగారడి ఏమైనా..., ప్రపంచమంతా కలిపి తెలుగు వర్షన్‌ వరకు తొలిరోజు నికర వసూళ్లు అంటే ట్యాక్స్‌ పోగా మిగిలే షేర్స్‌ 27 కోట్లదాక వచ్చినట్లు సినీ వ్యాపార వర్గాల విశ్వసనీయ సమాచారం.
బాహుబలి ఫస్ట్ డే టికెట్‌ 20 డాలర్ల నుంచి 25 డాలర్లు
రాయలసీమ ఏరియాలోనే 4 కోట్లకుపైగా, నైజామ్‌లో 5కోట్లకుపైగా, ఆంధ్రాలో 9కోట్లకు పైగా షేర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అమెరికా సంగతికొస్తే...సాధారణంగా అక్కడ టికెట్‌ రేట్‌ ఆరేడు డాలర్లు, పెద్ద సినిమాల ప్రీమియర్‌కు 12 డాలర్లుంటుంది. అక్కడా బాహుబలి ఫస్ట్‌డే టికెట్‌ 20 డాలర్ల నుంచి 25 డాలర్లు పెట్టారు. ఆ దెబ్బతో ఓవర్సీస్‌లో ఏ తెలుగు చిత్రానికి రాని కలెక్షన్స్ ఈ బాహుబలికి దక్కాయి.
నెట్‌లల్లో పైరసీ హల్‌చల్
అయితే చిత్ర యూనిట్‌ భయపడ్డట్లే..నెట్‌లల్లో పైరసీ హల్‌చల్ చేస్తోంది. టికెట్‌ రేట్ల దెబ్బతో పైరసీని ఆశ్రయించేవారూ పెరిగారు. తెలుగు, తమిళ స్ర్టేయిట్ వెర్షన్‌తోపాటు హిందీ, మలయాళ డబ్బింగ్‌లకు కూడా శుక్రవారం రిలీజైన బాహుబలి ది బిగినింగ్‌ పైరసీ ఇప్పటికే ఇంటర్నేట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. అంతేకాదు..హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా హిందీ వెర్షన్ సీడీలు బయటపడ్డాయి. సీడీలు విక్రయిస్తున్న షాప్‌లపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి 115 సీడీలను స్వాధీనం చేసుకున్నారు. సీడీలు అమ్ముతున్న సంబంధిత వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దురదృష్టవశాత్తూ, చిత్రం హిందీ వెర్షన్‌ పైరసీ ఉత్తరాదితోపాటు దక్షిణాదిలోనూ అందుబాటులోకొచ్చింది. పైరసీ నిరోధానికి కట్టుదిట్టుమైన చర్యలు తీసుకున్నామని యూనిట్‌, సినీ పరిశ్రమ ప్రకటించినా..పైరసీ జరుగుతండడం గమనార్హం.
బాహుబలిపై పరస్పర భిన్నమైన టాక్‌
ఇక ఫస్ట్ డే కలెక్షన్స్, పైరసీ గడబిడ మాట ఇలా ఉంటే, ఆడియన్స్‌ టాక్‌ మరోకథ. ప్రతి సినిమాలాగే ప్రైడ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా..ఇండియా సినిమాగా ప్రచారమైన బాహుబలి గురించీ పరస్పర భిన్నమైన టాక్‌ వినబడుతోంది. ఇలాంటి అద్భుతమైన సినిమా ఇప్పటిదాక చూడలేదు. అని ఒకటాక్, ఇంకా ఆశించినంతా గొప్పగా తీయలేదని మరోటాక్‌ ఇలా పరస్పర భిన్నమైన స్పందనలు వినబడుతున్నాయి. ఈటాక్‌కు కారణం మిగిలిన ఆంశాలతోపాటు బాహుబలి ఫస్ట్‌పార్ట్‌ అర్థంతరంగా ముగిసినట్లు ఉండడమని కొందరి అభిప్రాయం. మామూలుగా రాజమౌళి తన చిత్రాల చివర్లో వాటి మేకింగ్‌ దృశ్యాల్ని చూపెడతారు. కాని బాహుబలికీ అలా చేసుంటే బాగుందేదని కొందరంటున్నారు.

22:02 - July 12, 2015

హైదరాబాద్: పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజాం కాలేజ్‌ ప్రాంగణంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు, రాష్ట్ర ప్రముఖులు, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు.

 

22:00 - July 12, 2015

హైదరాబాద్: ప్రైవేటురంగంలో రిజర్వేషన్ల కోసం పోరాటం తీవ్రమవుతోంది. దళిత, వెనుకబడిన వర్గాల భవిష్యత్‌ కోసం మేధావులు గళమెత్తుతున్నారు.. రిజర్వేషన్ల సాధనలో సీపీఎం ముందుండి పోరాడితే తామంతా అండగా ఉంటామని నినదిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రైవేటు రిజర్వేషన్ల అంశం దేశ రాజకీయాలనే మార్చేస్తుందని మేధావులు ధీమాగా చెబుతున్నారు.
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం మహాసదస్సు
ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో నినదించిన గళమిది... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై మేధావుల స్వరమిది.. హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలుపై మహాసదస్సు జరిగింది.. సీపీఎం నేతలతో పాటు మేధావులు, ప్రజాసంఘాలు, విద్యార్థులు తరలివచ్చారు.. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అవసరమని నినదించారు.. సీపీఎం ముందుండి ఈ పోరాటాన్ని నడుపుతోందున్నారు తమ్మినేని వీరభద్రం.. తామొక్కరమే కాకుండా అందర్నీ కులుపుకుపోయి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు.
దళిత, వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాలేవీ..?
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు మేధావులు.. ప్రభుత్వ ప్రజాధనాన్ని ఖర్చుచేసి పెట్టుబడిదారులకు సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు దళితులు, వెనకబడిన వర్గాలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు... ప్రైవేటు రిజర్వేషన్ల అంశాన్ని జాతీయ స్థాయిలో తీవ్రతరం చేయాలని పిలుపిచ్చారు.. ఈ పోరాటానికి అన్ని వర్గాలు మద్ధతిస్తాయని హామీ ఇచ్చారు మేధావులు..
రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదా..?
అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు మేధావులు.. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు అమలైనా అది గుమాస్తా ఉద్యోగాలకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.. రానురాను పూర్తిగా ప్రైవేటు రంగానికి పాలకులు ప్రాధన్యమిస్తున్నారని .. అలాంటప్పుడు ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.. అలాగైతేనే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు.
ప్రైవేటు రిజర్వేషన్లతోనే మనుగడ
వెనుకబడిన తరగుతులు సమాజంలో ముందుకు వెళ్లాలంటే అన్ని అంశాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని గళమెత్తారు వక్తలు... కాంట్రాక్టు పనుల్లోనూ రిజర్వేషన్ల విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.. అలాంటప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు

 

టీ.టీడీపీ నేతలకు మంత్రి జూపల్లి బహిరంగలేఖ

హైదరాబాద్: టీ.టీడీపీ నేతలకు మంత్రి జూపల్లి కృష్ణారావు బహిరంగలేఖ రాశారు. పాలమూరు ప్రాజెక్టులపై టీ.టీడీపీ నేతలతో చర్చకు తాను సిద్ధమే అని జూపల్లి తెలిపారు. 13, 14, 16తేదీల్లో అసెంబ్లీ కమిటీ హాల్లో చర్చకు రావాలని లేఖలో పేర్కొన్నారు.  

విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి

మహబూబ్ నగర్: బిజినేపల్లి మండలం పాలెంలోని శాంతినికేతన్ స్కూల్ కు సున్నం వేయడానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థి మహబూస్ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. స్కూల్ కరస్పాండెంట్.. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఇఫ్తార్ విందులో అపశ్రుతి...

కృష్ణా: నూజివీడు హనుమాన్ జంక్షన్ రోడ్డులోని మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో అపశ్రుతి చోటుచేసుకుంది. గంజి మీద పడి ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

 

ఖమ్మం జిల్లాలో లారీ బీభత్సం

ఖమ్మం: తల్లాడ మండలం రెడ్డిగూడెం వద్ద లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనున్న ముగ్గురి పైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

 

జింబాబ్వేపై భారత్ విజయం

హారారే: భారత్, జింబాబ్వే ల మధ్య జరిగిన రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. జింబాబ్వేపై 62 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి.. 271 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. భారత ఓపెనర్ మురళి విజయ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 
భారత బ్యాటింగ్: మురళీవిజయ్(72), రహానే(63), రాయుడు(41), బిన్నీ(25), తివారి(22), జాదవ్(16), రాబిన్ ఉతప్ప(13), హర్భజన్(5) నాటౌట్.

తెలంగాణలో కరెంట్ కోతలుండవ్: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో ఇక నుంచి కరెంట్ కోతలుండవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నిజాంకాలేజీ గ్రౌండ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. అల్లా దయతో తెలంగాణ వచ్చిందన్నారు. 1.96లక్షల మంది ముస్లీంలకు బట్టలు పంపిణీ చేస్తామని చెప్పారు. 'ఇంకా చాలా చేయాల్సి ఉంది.. అందుకు మీ ఆశీస్సులు కావాలి' అని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తోపాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ ఒవైసీ, పులువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ముస్లీం సోదరులు పాల్గొన్నారు.

 

19:43 - July 12, 2015

హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై రాఘవులు ఫైర్ అయ్యారు. ఇరు రాష్ట్రాల్లో సమ్మె చేపడుతున్న మున్సిపల్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

19:36 - July 12, 2015

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవిత్ర గోదావరి పుష్కరాలను చంద్రబాబు అపవిత్రం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు.. గోదావరిలో మునిగినా ఆయన చేసిన పాపాలు పోవని చెప్పారు. చంద్రబాబును గోదావరి క్షమించదన్నారు. చంద్రబాబు పుష్కరస్నానం చేయకపోతే.. గోదావారి స్వచ్ఛంగా ఉంటుందన్నారు. పుష్కరాల సొమ్మును కూడా... చంద్రబాబు తన సంపాదనకు ఆదాయమార్గంగా ఉపయోగించుకుంటున్నారని చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

19:26 - July 12, 2015

రంగారెడ్డి: హయత్‌నగర్‌ మండలం బాట సింగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బోడుప్పల్‌కు చెందిన చిరంజీవులు తన కుటుంబసభ్యులతో కలిసి రాజమండ్రికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

ముగిసిన పది వామపక్షపార్టీల సదస్సు

హైదరాబాద్: ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో 10 వామపక్ష పార్టీలు నిర్వహించిన సదస్సు ముగిసింది. మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా రేపటి నుంచి ప్రత్యక్ష పోరాటం చేయాలని వామపక్షపార్టీలు నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా... ఈనెల 20న వామపక్షాల ఆధ్వర్యంలో సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ, బహిరంగసభ నిర్వహిస్తామని నేతలు తెలిపారు. 21న బెల్లంపల్లిలో ప్రాణిహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై వామపక్షాల ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే యోచనలో వామపక్ష పార్టీలున్నాయి.

 

 

19:07 - July 12, 2015

హైదరాబాద్‌: నగర అభివృద్ధి ఒక్క సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. బంజారాహిల్స్ బస్తీల్లోని వందలాది మంది ఇతర పార్టీలకు రాజీనామా చేసి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంలో రాష్ట్రం.. దేశంలోనే ముందుందని హరీష్‌రావు అన్నారు.

 

19:03 - July 12, 2015

నల్గొండ: జిల్లాలో నకిలీ నోట్ల దందా వెలుగుచూసింది. భువనగిరి కేంద్రంగా ఈ దందా సాగుతోంది. రూ.10వేలు ఇస్తే... 20వేల రూపాయల విలువైన నకిలీ నోట్లు అందిస్తున్నారు. లక్ష రూపాయలు ఇచ్చిన వారికి...3లక్షల రూపాయల నకిలీ నోట్లు ఇస్తున్నట్టుగా తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. 

నిజాంకాలేజీ గ్రౌండ్ లో టీసర్కార్ ఇఫ్తార్ విందు

హైదరాబాద్: నిజాంకాలేజీ గ్రౌండ్ లో టీసర్కార్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

18:54 - July 12, 2015

చిత్తూరు: తిరుమలను నో ప్లై జోన్‌గా ప్రకటించే అంశం డిఫెన్స్ పరిధిలోనిదని కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. టిడిపి కేంద్ర అధికార ప్రతినిధి కంభంపాటి రాంమోహన్, మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డిలతో కలసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.

 

18:51 - July 12, 2015

హైదరాబాద్: ఎన్ ఎస్ యూఐ, యుత్‌కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ పార్టీకి తమ జీవితాన్ని అంకితం చేసిన ప్రతి ఒక్కరికి పార్టీలో గుర్తింపునివ్వాల్సిన అవసరం ఉందని టీ-కాంగ్రెస్ నేతలన్నారు. ఎన్ ఎస్ యూఐ, యూత్‌ కాంగ్రెస్ మాజీ నేతలు హైదరాబాద్‌ గాంధీభవన్‌లో సమ్మేళనంలో పాల్గొన్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. పార్టీకోసం పాటు పడే ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపునిచ్చే బాధ్యత తమదన్నారు.

 

18:46 - July 12, 2015

హైదరాబాద్: చార్మినార్ వద్ద పోలీసులు మరోసారి స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహించారు. జిహెచ్ ఎంసి కార్మికుల సమ్మెతో.. చెత్త బాగా పేరుకుపోవడంతో... పోలీసులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఉదయమే.. చెత్త తొలగించే పని చేపట్టారు. అయితే వీరిని గమనించిన జిహెచ్ ఎంసి కార్మికులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అదనపు బలగాలు... ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

 

కన్నా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: చినరాజప్ప

రాజమండ్రి: పుష్కరాల ఏర్పాట్లపై కన్నా లక్ష్మీనారాయణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎపి డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరితో సమన్వయం చేసుకుంటూ పుష్కరాలు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మంత్రి మాణిక్యాలరావు పర్యవేక్షణలో పుష్కరాల పనులకు దేవదాయశాఖ ప్రణాళికలు రూపొందించిందని పేర్కొన్నారు.

 

విశాఖ జిల్లాలో వివాహిత ఆత్మహత్య

విశాఖ: జిల్లాలోని ఆరివిలోవకాలనీ శ్రీకాంత్ నగర్ లో సృజన అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మాజీ ప్రియుడు మోహన్ వర్మ వేధింపులే సృజన ఆత్మహత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. 

 

మాజీ ఎంపీ హర్షకుమార్ కు 14 రోజుల రిమాండ్

రాజమండ్రి: మాజీ ఎంపీ హర్షకుమార్ ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. కోర్టు.. హర్షకుమార్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. క్రైస్తవ స్మశానవాటిక కోసం హర్షకుమార్ ఆమరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

 

17:58 - July 12, 2015

నెల్లూరు: కోట్ల రూపాయలే లక్ష్యం.. రోగిని కోయడమే మార్గం అన్నది చాలా ఆస్పత్రుల పద్ధతి..! కానీ, సేవే లక్ష్యం.. మానవతే మార్గం అన్నది ఆ... ఆస్పత్రి సిద్ధాంతం..! డబ్బుకోసం శవాలకు కూడా వైద్యం చేస్తారు కొందరు డాక్టర్లు.. కానీ, పైసల కన్నా, ప్రాణాలు నిలిపేందుకే తాపత్రయ పడతారు అక్కడి వైద్యులు..! నిరుపేదలకు ఆరోగ్యం అందించడమే పరమావధిగా భావించి, ఏడు దశాబ్దాలుగా అలుపెరగని సేవలందిస్తోంది ఆ... ప్రజావైద్యశాల.
నిరుపేదల దేవాలయం..
నెల్లూరు జిల్లాలోని రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల నిరుపేదల పాటిట దేవాలయం. వారి ప్రాణాలు నిలిపే సంజీవని. అందులో పని చేసే వైద్యులే అభాగ్యుల పాలిటి ప్రాణదాతలు. టీవీల్లో వచ్చే ప్రకటనల మాదిరిగా అక్కడ హంగూ ఆర్భాటాలు కనిపించవు. ఆ.. ప్రకటనల్లోని డాక్టర్ల మాదిరిగా నటించడం అక్కడి వైద్యులకు తెలియదు. రకరకాల వ్యాధుల పేర్లు చెప్పి డబ్బులు గుంజడం ఆ.. ఆస్పత్రికి అలవాటులేదు. అవసరం లేకున్నా పేషెంట్ల ఒంట్లోకి కత్తులు దుయ్యడం అక్కడి డాక్టర్లకు తెలీని తెలీదు. ఆవేదనతో ఆస్పత్రి గడపతొక్కే రోగిని.. ఆనందంతో ఇంటికి పంపడమే దవాఖానకు తెలిసింది.
ప్రజావైద్యశాల.. పేదవాడి ఆస్పత్రి
డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల. నెల్లూరు జిల్లా మొత్తంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లి, ఎవర్నడిగినా ఈ హాస్పిటల్ గురించి చెబుతారు. ఎందుకంటే.. అది పేదవాడి ఆస్పత్రి. చిన్నపాటి జ్వరం నుంచి, పెద్ద పెద్ద రోగాల వరకూ అక్కడ వైద్యం అందిస్తారు. ఇందులో వింత లేకపోవచ్చు.. ఇది అన్ని ఆస్పత్రులు చేసే పనే కావచ్చు.. కానీ, ప్రాణానికి వెలకట్టడం, రోగి బతికుండగానే డబ్బుల కోసం పీడించుకు తినడం ఆ.. ఆస్పత్రికి తెలియదు.
నామమాత్రపు ఫీజులు వసూలు
కేవలం నామమాత్రపు ఫీజులు వసూలు చేసే ఈ ఆస్పత్రిలో.. 24 గంటలు డాక్టర్లు విధుల్లో ఉంటారు. ఇక్కడ పనిచేసే వైద్యులంతా నిస్వార్థంతో.. సేవే పరమావధిగా భావిస్తారు. ఏ హాస్పిటల్ లోనైనా ఒక్కో డిపార్ట్ మెంటుకి ఒక్కో డాక్టరుంటాడు. అయితే.. ఇక్కడ మాత్రం... ప్రతీ కేసును, ప్రతి వైద్యుడూ టేకప్‌ చేయగలరు. సేవా దృక్ఫథంతో ఎంతోమందికి వైద్య సేవలందిస్తున్న ఈ వైద్యశాలను ఏర్పాటుచేసిన మానవతామూర్తి గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రజావైద్యశాలను స్థాపించిన రామచంద్రారెడ్డి
కమ్యూనిస్టు యోధుడు.. పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఈ హాస్పిటల్ ను స్థాపించారు. 1940లో ప్రారంభమైన ఈ ఆస్పత్రి నాటి నుంచి నేటి వరకూ ప్రజలకోసమే పనిచేస్తోంది. సుందరయ్య సలహా మేరకు వైద్య విద్యను అభ్యసించిన రామచంద్రారెడ్డి.. పేదలకు అత్యంత చౌకగా ఆధునాతన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ప్రజావైద్యశాలను స్థాపించారు. తన యావదాస్థిని కూడా ఈ ఆస్పత్రికే రాసిచ్చిన రామచంద్రారెడ్డి.. 1967లో మరణించారు.
నాడు 20 పడకలు...నేడు 250 పడకలు
మొదట్లో 20 పడకలతో ప్రారంభమైన రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల.. ఇపుడు 250 పడకల ఆసుపత్రిగా ఎదిగింది. వందలాది మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. నిత్యం వేలాది మంది రోగులు ఆస్పత్రికి వచ్చిపోతుంటారు. ఇక్కడికి వచ్చే రోగులు... ఆస్పత్రి చేస్తున్న సేవలను ఎల్లప్పుడూ కొనియాడుతుంటారు.
ప్రజావైద్యశాల తీరు అభినందనీయం
సేవ అనే పదానికి కాలం చెల్లిన కాలమిది. డబ్బు కోసం ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగట్టే స్థాయికి వైద్య రంగం దిగజారిపోయిన రోజులివి. ఇలాంటి కాలంలోనూ.. సేవే లక్ష్యంగా, ప్రజారోగ్యమే పరమావధిగా భావిస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల తీరు ఎంతైనా అభినందనీయం. ఇదే స్ఫూర్తితో కలకాలం ఆ.. ఆస్పత్రి సేవలందించాలని ఆశిద్దాం...

 

ఖమ్మం జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం..

ఖమ్మం: జిల్లాలోని గోపాలపురంలో ఓ యువకుడు బాలికపై అత్యాచారయత్నం చేశాడు. స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి.. పిఎస్ లో అప్పగించారు. 

బాహుబలి పైరసీ సీడీలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్: చార్మినార్ ప్రాంతంలో బాహుబలి పైరసీ సీడీలు విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్నుంచి 115 పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. 

 

నల్గొండ జిల్లా భువనగిరిలో నకిలీ నోట్ల దందా

నల్గొండ: జిల్లాలోని భువనగిరిలో నకిలీ నోట్ల దందా కొనసాగుతోంది. రూ.10 వేలకు... రూ.20 వేల నకిలీ నోట్లు, రూ.లక్షకు రూ.3 లక్షల నకిలీనోట్లను ముఠా సభ్యులు ఇస్తున్నారు.

17:13 - July 12, 2015

ఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసు విచారణ వేగవంతం చేయాలని భారత్‌, పాక్‌ ప్రధానుల నిర్ణయించి రెండు రోజులైనా గడవలేదు. అప్పుడే విచారణకు బ్రేకులు వేసే పని అడ్డదారిలో మొదలైంది. ముంబై పేలుళ్ల కేసు నిందితుడు జకీర్ రెహ్మాన్‌ లఖ్వీ తన వాయిస్ శాంపిల్స్ భారత్‌కు ఇవ్వడని... అతని తరపు న్యాయవాది ప్రకటించారు. అతనిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేరని స్పష్టం చేశారు. గతంలోనే వాయిస్ శాంపిల్స్ ఇచ్చేందుకు లఖ్వీ తిరస్కరించాడని... ఇప్పుడు మరోసారి వ్యతిరేకించినట్లు వెల్లడించారు.

 

17:09 - July 12, 2015

ఛత్తీస్‌గఢ్‌: విద్యా బుద్ధులు చెప్పి, పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సింది గురువులు. పైగా వారి నడక, నడత అన్నీ విద్యార్థులను ఇన్‌స్పైర్‌ చేసే అంశాలే. ఇంతగొప్ప గురుతర బాధ్యతల్లో వున్న ఓ ఉపాధ్యాయుడు మద్యం సేవించి తరగతి గదిలో ప్రవేశించాడు. అంతటితో ఆగక పిల్లలకు పాఠాలు బోధించాడు. అవి ఏ.. పాఠాలు అనుకుంటున్నారు... మందు పాఠాలే. డి ఫర్ డాగ్‌, డాల్‌.... పి ఫర్‌ పీకాక్, ప్యారెట్‌ అని అందరూ చెబితే... కానీ ఆ టీచర్ మాత్రం డి ఫర్ దారు... పి ఫర్ పీయో అంటూ తాగుబోతు అర్థాలు బోధించారు. దారు అంటే ఆల్కహాల్, పీయో అంటే డ్రింక్‌ అని అర్థం. ఇదంతా ఛత్తీష్‌గఢ్‌లోని కొరియా జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.

 

17:04 - July 12, 2015

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

17:00 - July 12, 2015

హైదరాబాద్: జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి సమాజ హితం కోసం పాటుపడుతున్నారని మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. టీడబ్ల్యూజేఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎంహెచ్‌ భవన్‌లో నిర్వహించిన మెడికల్‌ క్యాంపును స్వామిగౌడ్‌ ప్రారంభించారు. జర్నలిస్టుల పిల్లలకు నోట్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా జర్నలిస్టుల సేవలను స్వామిగౌడ్‌ కొనియాడారు. పాత్రికేయుల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 

16:51 - July 12, 2015

అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు నోటీసులు జారీ చేసేందుకు లోకాయుక్త కోర్టు సిద్ధమైంది. 1991లో హిందూపురం పట్టణంలో 80 అడుగుల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం జరిగినందుకు.. బాలకృష్ణతో పాటు మున్సిపల్‌ ఛైర్మన్‌, కమిషనర్‌కు నోటీసులు సిద్ధం చేసింది.

 

16:45 - July 12, 2015

హైదరాబాద్: దళితులు అభివృద్ధి చెందాలంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు కావాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 'ఎస్ సి, ఎస్ టి, బిసిలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు'...అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ, ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన మహా సదస్సులో ఆయన ప్రసంగించారు. అనాదిగా వస్తున్న కొన్ని సంప్రదాయాల వల్ల దళితులు వెనకబడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వేదాలతో పాటు చదువును వారికి దూరం చేశారని ఆరోపించారు. పని, విద్య కలిస్తేనే సైన్స్ అండ్‌ టెక్నాలజీ... ఇది లోపించడం వల్లే దేశం వెనకబడుతోందని పేర్కొన్నారు.

 

16:33 - July 12, 2015

ఢిల్లీ: ఇస్రో వెబ్ సైట్ హ్యాక్ గురైంది. వాణిజ్య విభాగానికి యాంత్రిక్ సైట్ హ్యాక్ అయింది. ఇస్రో.. 2 రోజుల క్రితమే 5 కమర్షియల్ రాకెట్స్ ప్రయోగించింది. ఇస్రో వెబ్ సైట్ ను చైనా ప్రభుత్వం హ్యాక్ చేసినట్లు ఇస్రో అధికారులు అనుమానిస్తున్నారు. హ్యాక్ గురైన వెబ్ సైట్ ను తిరిగి తమ అధీనంలోకి తీసుకరావడానికి ఇస్రో అధికారులు త్రీవ ప్రయత్నాలు చేస్తున్నారు. 

16:30 - July 12, 2015

హైదరాబాద్: సీఎం కేసీఆర్ తో జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ భేటీ అయ్యారు. మున్సిపల్ కార్మికుల సమ్మెపై చర్చిస్తున్నారు. ఏడు రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో భాగ్యనగరంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. ప్రస్తుతం మున్సిపల్ కార్మికులకు 8 వేల వేతనం ఇస్తున్నారు. అయితే మున్సిపల్ కార్మికులు.. వేతనాన్ని రూ. 14,750 వేలకు పెంచాలి, కాంట్రాక్ట కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి, ఆరోగ్యభద్రత కల్పించాలి.. అనే మూడు ప్రధాన డిమాండ్లతోపాటు మరో 12 డిమాండ్లను ప్రభుత్వం ఉంచుతున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం మున్సిపల్ కార్మికులతో నాలుగు సార్లు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో నేరుగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. సోమేష్ కుమార్ తో భేటీ అయ్యారు. అయితే సమస్యల పరిష్కారానికి కాలపరిమితి విధించి సీఎం హామి ఇస్తే.. తప్ప సమ్మెను విరిమించేది లేదని కార్మికులు చెబుతున్నారు. 

జింబాబ్వే విజయలక్ష్యం 272 పరుగులు

హారారే: జింబాబ్వే, భారత్ ల మధ్య జరుగుతున్న రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ నిర్ణీత ఓవర్లలలో ఎనిమిది వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. జింబాబ్వే విజయలక్ష్యం 272 పరుగులుగా ఉంది. 

ఇస్రో వెబ్ సైట్ హ్యాక్

ఢిల్లీ: ఇస్రో వెబ్ సైట్ హ్యాక్ గురైంది. వాణిజ్య విభాగానికి యాంత్రిక్ సైట్ హ్యాక్ అయింది. ఇస్రో.. 2 రోజుల క్రితమే 5 కమర్షియల్ రాకెట్స్ ప్రయోగించింది.

 

ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్

హారారే: భారత్, జింబాబ్వే ల మధ్య జరుగుతున్న రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్(8) ఔట్ అయ్యారు. 

 

ఐదో వికెట్ కోల్పోయిన భారత్

హారారే: భారత్, జింబాబ్వే ల మధ్య జరుగుతున్న రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. రాబిన్ ఊతప్ప(13) ఔట్ అయ్యారు. 

15:57 - July 12, 2015

హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో విప్లవ రచయితల సంఘం(విరసం) 45 వ ఆవిర్భావ సభ ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం అధ్యక్షుడు వరవరరావు చేతుల మీదుగా 'యుద్ధగీతం' పుస్తక ఆవిష్కరణతో విరసం సభలను ప్రారంభించారు.     

15:43 - July 12, 2015

నెల్లూరు: డా.రామచంద్రారెడ్డి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రజారోగ్యం పరిరక్షణ-కార్పొరేటీకరణ' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ప్రముఖ ఐఎఎస్ అధికారులు, మేధావులు, డాక్టర్లు హాజరయ్యారు. 

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

హారారే: భారత్, జింబాబ్వే ల మధ్య జరుగుతున్న రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 205 పరుగుల వద్ద తివారి(22) ఔట్ అయ్యారు. 

ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సిలింగ్ వద్ద ఉద్రిక్తత

నల్గొండ: డైట్ కళాశాల్లో ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సిలింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ పూల రవీందర్ కౌన్సిలింగ్ ను వాయిదా వేశారు. దీనికి నిరసనగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.  

రెండో వికెట్ కోల్పోయిన భారత్

హారారే: జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 159పరుగుల వద్ద మురళీ విజయ్ ఔట్ అయ్యారు. 95 బంతుల్లో విజయ్.. 72 పరుగులు చేశాడు.  

ఢిల్లీలో మహా సంపర్క్ అభియాన్ సమావేశం ప్రారంభం..

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు 'మహా సంపర్క్ అభియాన్' సమావేశంలో పాల్గొన్నారు. షా జ్యోతి వెలిగించినంతరం సమావేశం ప్రారంభమైంది. 

బాసరలో భక్తుల రద్దీ..

ఆదిలాబాద్ : పుష్కరాలు ప్రారంభం కాకముందే బాసరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం పుష్కర స్నానం చేసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

కిర్గిజిస్థాన్ అధ్యక్షుడితో చర్చలు ఫలప్రదం - మోడీ..

కిర్గిజిస్థాన్ : కిర్గిజిస్థాన్ అధ్యక్షుడితో చర్చలు ఫలప్రదంగా జరిగాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆసియా దేశాల పర్యటనలో భాగంగా మోడీ కిర్గిజిస్థాన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 

భారీ వర్షాలకు గోడ కూలి ముగ్గురి మృతి..

బీహార్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కైమూర్ జిల్లాలో ఓ ఇంటి గోడ కూలిపోగ ఇద్దరు మహిళలు..ఓ చిన్నారి మృతి చెందారు. 

డా.రామచంద్రారెడ్డి శత జయంతి ఉత్సవాలు...

నెల్లూరు : జిల్లాలో డా. రామచంద్రారెడ్డి శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాల సందర్భంగా 'ప్రజారోగ్యం పరిరక్షణ - కార్పోరేటీకరణ'పై సెమినార్ నిర్వహించారు. ప్రముఖ ఐఎఎస్ అధికారులు, మేధావులు, వైద్యులు హాజరయ్యారు. 

13:27 - July 12, 2015

ఆయన సినిమాల్లో అంటరానితనంపై రగులుతున్న వ్యతిరేకత ఎగసిపడుతుంది. శ్రమదోపిడిపై ఉక్కుపిడికిలి బిగిస్తుంది. పేద ప్రజల ఆకలి బాధ ప్రతిధ్వనిస్తుంది. సగటు మహిళ హృదయాన్ని హృద్యంగా ఆవిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి. భారతీయ సినిమాకు సామాజిక నడక నేర్పి, సంగీత సౌరభాలు నింపి, సృజనాత్మకత అద్దిన చిత్రశిల్పి..బిమల్ రాయ్. ఆయన జయంతి సందర్భంగా టెన్‌ టీవీ స్పెషల్‌ ఫోకస్..
బిమల్ రాయ్‌. భారతీయ సినీ ప్రేక్షకలకు పరిచయం అక్కర్లేని పేరు. ఇండియన్ సినిమాను ప్రపంచ తెరపై మెరిపించిన గొప్ప దర్శకుడు. సామాజిక రుగ్మతలపై సినిమాస్త్రాన్ని సంధించిన దార్శనికుడు. బిమల్ రాయ్ సినిమాలు సామాజిక సమస్యలు, వాస్తవికత చుట్టూ తిరుగుతాయి. ముఖ్యంగా స్త్రీ పాత్రలకి అత్యంత ప్రాధాన్యత, స్థానమూ, సామాజిక అన్వయం కల్పించడం బిమల్ రాయ్ నిర్మించిన చిత్రాల్లోని మౌళిక లక్షణం. అందుకే మహిళా చిత్రాల దర్శకుడిగా ఆయన పేరు పొందారు. ఆయన సినిమాల్లో ఆకలి, శ్రమ, నిజాయితీ, అంటరానితనం, నిరుద్యోగం వంటి అనేక సామాజిక అంశాలు ప్రధాన ఇతివృత్తాలయ్యాయి. సుజాత, నౌకరీ, పరక్, పరిణీత, బిరాజ్ బహు, మధుమిత, బందిని వంటి విశేష ఆదరణ పొందిన సినిమాలే అందుకు తార్కాణాలు. బిమల్‌ రాయ్ నిర్మించిన దో భీగా జమీన్ దేశ విదేశాల్లో విమర్శకుల ప్రశంసలు పొందింది. సామాన్యుల హృదయాన్ని ఆవిష్కరించిన సినిమా ఇది. 1953లో విడుదలైన ఈ చిత్రం గొప్ప విజయాన్ని నమోదు చేసింది. అనేక భాషల్లో పునర్ నిర్మాణమైంది.
అంటరానితనాన్ని చీల్చిచెండాడిన బిమల్ రాయ్..
ఒక మహిళ. అమ్మా నాన్నలను కోల్పోయిన అనాధ. అందులోనూ దళిత స్త్రీ. సమాజంలో ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. వివక్షను ఎలా తట్టుకుంది. సుజాత సినిమాలో హృద్యంగా ఆవిష్కరించారు బిమల్ రాయ్. స్త్రీ భావ సంఘర్షణను కళాత్మకంగా తెరకెక్కించారు. వివక్ష, అంటరానితనాన్ని రక్తం సాక్షిగా చీల్చి చెండాడారు.
దళిత స్త్రీ ఆవేదన, దుఃఖం..
బిమల్ రాయ్ 1959లో నిర్మించిన చిత్రం...సుజాత. ఆ కాలపు ప్రగతిశీలమయిన చిత్రమిది. అంటరానితనాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని నిర్మించిన ఈ చిత్రంలో స్త్రీ సమస్యకు తోడు అంటరానితనమూ తోడయినపుడు ఆ స్త్రీ పడే ఆవేదనా, అనుభవించే దుఃఖమూ హృద్యంగా తెరకెక్కించారు బిమల్ రాయ్. సుజాత పాత్రలో నటించిన నూతన్ ప్రశంసలు పొందింది.
సినిమా కథ..
ఇక సినిమా కథ విషయానికి వస్తే ఓ రైల్వే కూలీ చిన్నారి కూతురు సుజాత. అమ్మానాన్నలను కోల్పోయి అనాధగా మిగులుతుంది. రైల్వేలో పనిచేసే ఇంజనీరు ఉపేంద్రనాధ్ చౌదరీ, ఆయన భార్య చారు ఆ చిన్నారి సుజాతను చేరదీస్తారు. ఓ పక్క సుజాత అంటరానిదేమోనన్న భావం తొలుస్తున్నప్పటికీ ఆ అమ్మాయికి ఏ లోటూ రానీయకుండా పెంచుతారు. తమ కూతురు రమకు తోడుగా సుజాతను చూసినప్పటికీ ఆమె కులం వారికి పెద్ద అడ్డుగానే మిగిలిపోతుంది. సుజాతకు నీడనిచ్చి పెంచడాన్ని అందరూ హర్షించరు. తమలాంటి బ్రాహ్మణ కుటుంబంలో సుజాతకు స్థానం కల్పించడం సరైంది కాదని కూడా ఉపేంద్రనాధ్‌కి చెబుతారు. ఆమెను వీలైంత త్వరగా ఇంటి నుంచి పంపాలని లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తారు. కానీ ఆ భార్యాభర్తలు వినరు. ఎంత మామూలుగా ఉన్నప్పటికీ రమని తమ కూతురని, సుజాత తమ కూతురులాంటిదని అన్నప్పుడల్లా సుజాత తన గతాన్ని తలుచుకొని కుమిలిపోతుంది.
కుటుంబంలో గొడవకు దారితీసే సుజాత పెళ్లి వివాదం..
సుజాత పెళ్లి వివాదం కుటుంబంలో పెద్ద గొడవకు దారి తీస్తుంది. అంటరానిదాన్ని ఎలా చేసుకుంటావంటూ వరుడిపై కోప్పడతారు. అయితే పెంచిన తల్లయిన చారు మెట్ల మీదనుంచి కిందపడి తీవ్రంగా గాయపడుతుంది. అప్పుడు పేషంట్‌కు రక్తం అవసరమవుతుంది. అందరి రక్తాన్ని పరీక్షిస్తారు. అయితే అందరిలోకి చారుకి సుజాత రక్తమే సరిపోతుంది. అంటరానిదానిగా భావించే సుజాత రక్తమే చారును కాపాడుతుంది. మన సమాజంలో అంటరానితనమన్నది సామాజిక దురాచారమే తప్ప వాస్తవానికి మనుషుల మధ్య తేడాలేమీ ఉండవని ప్రభోదిస్తుందీ చిత్రం. సుజాత సినిమాకు సామాజిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకున్నప్పటికీ చిత్రీకరణ కథా కథనం కళాత్మకంగానూ, లిరికల్‌గానూ హృద్యంగా సాగుతుంది. బిమల్ రాయ్ చిత్రీకరణకు తోడు నూతన్ నటన సినిమాకు ప్లస్సయ్యింది.
పాటలు మధురాలే..
సుజాత చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఆ పాత మధురాలే. ముఖ్యంగా సునో మేరీ బంధూరే, జల్తెహై జిస్కేలియే లాంటీ పాటలు సుజాత సినిమాకే వన్నె తెచ్చాయి. కులాల కతీతంగా మనష్యుల రక్తం ఎక్కడయినా ఎరుపే అని చిత్రం ద్వారా గుర్తు చేస్తాడు దర్శకుడు బిమల్ రాయ్. నాడు అంటరానితనం ఏ స్థాయిలో ఉందో అద్భుతంగా తెరకెక్కించాడు. హిందీలో పెద్ద హిట్టయిన సుజాత తర్వాత అనేక భారతీయ సినిమాల్లో రీమేకయ్యింది. రక్త సంబంధాల్ని ఇతివృత్తాలుగా అనేక సినిమాలు నిర్మాణమవ్వడం మొదలైంది సుజాత విజయం తర్వాతే. 

రౌడీషీటర్ ను చితకబాదిన భోపాల్ పోలీసులు..

మధ్యప్రదేశ్‌ : భోపాల్‌లో నేరాలకు పాల్పడిన ఓ రౌడీషీటర్‌కు జనం ముందే బుద్ది చెప్పారు. మరోసారి అదే ప్రజల వద్దకు వెళ్లి... రౌడీయిజం ప్రదర్శించకుండా... చితకబాదారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే వారికీ ఇదేగతి పడుతుందని హెచ్చరించారు. 

13:18 - July 12, 2015

నిజామాబాద్ : జిల్లాలో ఓ ఇద్దరు దొంగలను స్థానికులు చితకబాదారు. రక్తం వచ్చేలా చితక్కొట్టిన అనంతరం ఆ దొంగలను పోలీసులకు అప్పచెప్పారు. ఆదివారం ఓ వ్యక్తి ఏటీఎం దగ్గరకు వెళ్లి నగదును డ్రా చేసుకుని బస్టాండ్ వద్ద నిలబడ్డాడు. ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి పది వేల రూపాయల నగదును తస్కరించారు. వెంటనే తేరుకున్న వ్యక్తి దొంగ..దొంగ అంటూ కేకలు వేశాడు. స్థానికులు అప్రమత్తమై ఆ ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. అనంతరం స్థానికులు ఆ ఇద్దరు దొంగలపై తమ ప్రతాపం చూపెట్టారు. ఒకరు తన్నుతుంటే..మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీనితో ఆ దొంగలకు తీవ్రగాయాలయ్యాయి. ఆగ్రహం చల్లారిన తరువాత స్థానికులు పోలీసులకు అప్పచెప్పారు.
ఇలాంటే ఘటనే కామారెడ్డిలో శనివారం చోటు చేసుకుంది. దొంగతనం చేసిన ఇద్దరిని పట్టుకుని స్థానికులు చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు. జిల్లాలో నిత్యం దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలను ప్రారంభించిన వెంకయ్య...

నెల్లూరు : జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు.

 

12:58 - July 12, 2015

సాహిత్యం నేపథ్యంగా ఉన్న వారి జీవితాల్లో విలువలుంటాయి. వెలుగులుంటాయి. జాలి, ప్రేమ, కరుణలు జాలు వారుతుంటాయి. సృజన కారుల కళ్లల్లో మానవత్వం తొనికిసలాడుతుంటుంది. సమ సమాజం కోసం ఎందరో కవులు..రచయితలు కలలు కన్నారు. కలాలు ఝులిపించారు. సృజన స్వరాలై గర్జించారు. తమ ధిక్కార స్వరాలు వినిపించారు. అలాంటి వారిలో డా.రావి రంగారావు ఒకరు.
'నీ కన్నుల వృషభాలు వాలు చూపుల నాగలి కట్టి నా గుండెను దున్నుతున్నావు. నా గుండెలో పేరుకున్న తరతరాల చెత్తను ఊడ్చి తగులేస్తా. క్షణం క్షణం రైతును గుర్తు చేసే నీతో నేను కలిసి పనిచేస్తా'' అంటూ ''శ్రీమతి రైతు'' కవితను రాసి తెలుగు కవిత్వా కేదారంలో రైతుకు పట్టం కట్టిన గొప్ప కవి ''డా.రావి రంగారావు''. రైతులాంటి స్వచ్చమైన మనస్సుతో అక్షర సేద్యం చేసి పచ్చని కవిత్వమై పరిమళించిన సాహితీ మూర్తి. తెలుగు భాషా కళా సాహితి లతికపై ఎన్నో కావ్యసుమాలు పూయించిన తోటమాలి ఆయన. ప్రముఖ కవి, మినీ కవితల పితామహుడు రావి రంగారావుపై ప్రత్యేక కథనం..

12:49 - July 12, 2015

మట్టి నరాలు తెగిన చోట పచ్చదనం శ్వాసించదంటూ ప్రపంచీకరణ ఇంద్రజలాన్ని కవిత్వంతో ఇంద్రజాలంగా మార్చిన యువ కవితా కెరటం గవిడి శ్రీనివాస్. మానసిక నేత్రంతో ప్రపంచాన్ని వీక్షించి చీకట్లో వెలుగుతున్న ఆత్మను కవిత్వంగా ఆవిష్కరించిన అనుభూతి కవి. గవిడి శ్రీనివాస్ పరిచయ కథనం..

12:43 - July 12, 2015

బాల్యం ఎగిరి గంతులేస్తుంది. యవ్వనం గంభీరంగా రంకెలేస్తుంది. వృద్దాప్యం మౌనంగా ఘోషిస్తుందని అంటారో ఓ కవి. కానీ తెలంగాణ కళాకారుడు మాత్రం ఈమూడు దశల్లోనూ పాటై పల్లవిస్తాడు. భావమై పరిమళిస్తాడు. కాళ్ల గజ్జెలు ఘల్లుమనేలా వేదికపై కదం తొక్కుతాడు. కరుణ..వీర..రౌద్ర రసాలను ఏకకాలంలో పోషిస్తాడు. మానత్వం సజీవంగా ఉందని చాటి చెబుతాడు. అలాంటి ఉత్తమ ఉపాధ్యాయుడు, ప్రజా వాగ్గేయకారుడే బయ్యారం వీరన్నపై ప్రత్యేక కథనం..

12:35 - July 12, 2015

భోపాల్ : వ్యాపం స్కాం విచారణ బాధ్యతలు సీబీఐకి అప్పగించాక మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. కుంభకోణంపై దర్యాప్తును కావాలనే ఆలస్యం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధాన సభ రికార్డులే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వ్యాపం స్కాంపై 2009లో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాచారం సేకరిస్తున్నట్లు సర్కార్ సమాధానం చెప్పింది. అప్పటికే స్కాంలో సీఎం భాగస్వామ్యం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మెడికల్ అడ్మిషన్ వ్యవహారంప నిజనిజాలు తేల్చేందుకు ఓ కమిటీ వేశారు. మరొకసారి 2007, 2010 సంవత్సరాల మధ్య డెంటల్, మెడికల్ కాలేజీలో జరిగిన అడ్మిషన్ల తీరుపై ప్రశ్నించారు. అవకతవకలు జరిగినట్లు గుర్తించలేదని సీఎం చౌహాన్ సింపుల్ గా సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు విధాన సభలో మరోసారి 2011 నవంబర్ 29వ తేదీన ఈ ప్రశ్ననే మరోసారి అడిగారు. అప్పుడు మాత్రం సీఎం చౌహాన్ సమాధానాన్ని మార్చారు. 114 మంది విద్యార్థుల అడ్మిషన్ లు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఈవ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని వివరించారు. ప్రభుత్వం ఈ స్కాంపై ఉద్ధేశ్యపూర్వకంగానే వ్యవహరించినట్లు అర్థమౌతోందని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 

మెరైన్ కానిస్టేబుళ్లకు దేహశుద్ధి..

ప్రకాశం : పినాకిని ఎక్స్ ప్రెస్ లో మెరైన్ కానిస్టేబుళ్లు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. సింగరాయకొండ వద్ద ఆ కానిస్టేబుళ్లకు యువతి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు.

 

12:18 - July 12, 2015

హైదరాబాద్ : వామపక్ష పార్టీలన్నీ కలిసి పోరాడాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో మహాసదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రొ.కంచె ఐలయ్య ప్రసంగించారు. 1980లో ప్రారంభమైన కమ్యూనిస్టు పోరాటంలో 17వేల మంది చనిపోయారని, తెలంగాణలో ఆరు వేల మంది చనిపోయారని తెలిపారు. వామపక్షాలు విడివిడిగా ఉండకుండా కలిసి పోరాటం చేయాలని ఆకాక్షించారు. వీరు ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. సమయం చాలా తక్కువగా ఉందని, ప్రజలు ఛస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన ఈ సదస్సు సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. ఈ సదస్సులో మేధావులు, 19 విశ్వ విద్యాలయాల పది జిల్లాల ప్రొఫెసర్లు, మొత్తం 2500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు పాటు వామపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. 

11:32 - July 12, 2015

విజయనగరం : జిల్లాలో గోదావరి మహా పుష్కర శోభాయాత్ర ప్రారంభమైంది. మంత్రి మృణాళిని ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మృణాళిని మీడియాతో మాట్లాడారు. యాత్రకు వెళ్లే భక్తులు బస్సుల్లో ద్వారకా తిరుమల వరకు చేరుకున్న అనంతరం అక్కడి నుండి కాలినడకన రాజమండ్రికి చేరుకుని పుష్కర స్నానాలు ఆచరిస్తారని తెలిపారు. స్వచ్ఛందంగా వారి ఖర్చులతో వెళుతున్నారని, ప్రతొక్కరూ పుష్కర స్నానాలు చేయాలని సూచించారు. 

11:12 - July 12, 2015

హైదరాబాద్ : దేశీయ విమాన రంగంలోకి మరో కొత్త ఎయిర్ లైన్స్ అడుగు పెట్టింది. ట్రూ జెట్ విమాన సేవలు ఈ రోజు ఉదయం నుండి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుండి తిరుపతికి ట్రూజెట్ తొలి విమాన సర్వీసు ప్రారంభమైంది. ఈ సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ప్రారంభించారు. పుష్కరాల నేపథ్యంలో త్వరలోనే హైదరాబాద్ నుండి రాజమండ్రికి విమానం నడుపనున్నట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సినీ నటుడు రాంచరణ్ తేజ ట్రూ జెట్ లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా కంపెనీ డైరక్టర్, బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ గా ఎండీ ఉమేష్ వ్యవహరిస్తున్నారు.

 

గోదావరి పుష్కరాలకు గవర్నర్ ను ఆహ్వానించిన బాబు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. గోదావరి పుష్కరాలకు గవర్నర్ ను ఆహ్వానించారు. 

ముదురుతున్న ములాయం..ఐపిఎస్ మధ్య వివాదం..

లక్నో : సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్, ఐపిఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ మధ్య వివాదం ముదురుతోంది. ములాయం వల్ల తనకు, తన భార్యకు ముప్పు ఉందని ఠాకూర్ పోలీసులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఠాకూర్ పై ఓ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదైంది. తన భర్త..తన మీద ఇంకా ఎన్ని కేసులు రిజిష్టర్ అవుతాయో అని ఠాకూర్ సతీమని నూతన్ ఠాకూర్ పేర్కొన్నారు. 

10:44 - July 12, 2015

జమ్మూ కాశ్మీర్ : దేశ సరిహద్దు వద్ద మళ్లీ అలజడి చెలరేగింది. భారత్ లోకి ప్రవేశించేందుకు చొరబాటు దారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంఇ. జమ్మూ కాశ్మీర్ లో తీరాన్ సెక్టార్ వాస్తవాధీన రేఖ గుండా ముగ్గురు తీవ్రవాదులు ప్రయత్నించారు. దీనిని గుర్తించిన భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు చొరబాటు దారులు అక్కడికక్కడనే మృతి చెందారు. వీరి వద్ద నుండి మూడు ఏకే 47 రైఫిళ్లు, గ్రానైడ్లు, 300 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 

10:37 - July 12, 2015

అనంతపురం : దైవ దర్శనానికి వెళ్లిన వారి ఆటో బోల్తా పడడంతో 8మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుత్తి శివారులో చోటు చేసుకుంది. గార్లదిన్నె మండలం తాటిచెట్ల గ్రామానికి చెందిన కొంతమంది కసాయిపురంలోని నెట్టికంట ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అదుపు తప్పిన ఆటో బోల్తా కొట్టింది. గాయపడిన ఎనిమిది మందిని సమీప ఆసుపత్రికి తరలించారు. 

10:22 - July 12, 2015

హైదరాబాద్: ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని సీపీఎం నేత బి.వెంకట్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో మహాసదస్సు జరుగనుంది. ఈసదస్సులో పాల్గొనడానికి వచ్చిన బి.వెంకట్ టెన్ టివితో మాట్లాడారు. ప్రపంచంలో దోపిడి ఉందని, భారతదేశంలో కూడా దోపిడి ఉందన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న దోపిడి స్వరూపం భిన్నమైందని, మనుషుల పట్టుకొతోనే అంటే కులం పేరిట దోపిడి ఉందన్నారు. కుల నిర్మూలనాలు, అసమానతలు పోవాలని రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న అసమానతలు తగ్గించడం అభివృద్ధి ఫలాలు బలహీనవర్గాలకు అందివ్వడం ముఖ్యమన్నారు. ఇక్కడ ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సాహిస్తోందని, ఈ రంగంలో రిజర్వేషన్లు కల్పించకుండా అసమానతలు ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు. సంక్షోభం వచ్చినప్పుడు పేదలు మరింత పేదలుగా మారుతుంటే కార్పొరేట్ రంగాలకు చెందిన వారి ఆస్తులు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ సదస్సులో వామపక్షాలే కాకుండా సమాజంలో ఉన్న అభ్యుదయవాదులందరూ పాల్గొంటున్నారని తెలిపారు.

అప్పన్నదేవాలయంలో పుష్కర శోభాయాత్ర ప్రారంభం..

విశాఖపట్టణం : సింహాచలం అప్పన్నదేవాలయంలో పుష్కర శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ శోభాయాత్రను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ యాత్రలో 400 మంది భక్తులు పాల్గొన్నారు. 

100 కిలోల గంజాయి స్వాధీనం..

విశాఖపట్టణం : అనంతగిరిలో ఒడిశా - ఏపీ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్ లో 100 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు. 

గవర్నర్ ను కలువనున్న చంద్రబాబు..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను ఏపీ సీఎం చంద్రబాబు కలువనున్నారు. గోదావరి పుష్కరాలకు గవర్నర్ ను బాబు ఆహ్వానించనున్నారు.

10:08 - July 12, 2015

గుంటూరు : జిల్లాలోని పొన్నూరు మండలం నండూరులో విషాదం చోటు చేసుకుంది. దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికంగా అబ్దుల్లా..షర్మిల దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శనివారం ఇరుగుపొరుగు వారితో సరదాగ గడిపిన దంపతులు ఆదివారం ఉదయానికి విగతజీవులయ్యారు. కుటుంబకలహాలు..ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లే దంపతులు బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఆర్థిక సమస్యల వల్ల వీరిద్దరి మధ్య గత కొద్దిరోజులుగా విబేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. 

స్వచ్చ హైదరాబాద్ ను అడ్డుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది..

హైదరాబాద్ : చార్మీనార్ వద్ద స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసులు సిబ్బందిని అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. 

విమాన సర్వీసులను ప్రారంభించిన ట్రూజెట్..

హైదరాబాద్ : ట్రూజెట్ సంస్థ విమాన సర్వీసులను ప్రారంభించింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో హైదరాబాద్ - తిరుపతి సర్వీసును కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు ప్రారంభించారు. 

09:28 - July 12, 2015

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో మహాసదస్సు జరుగనుంది. ఉదయం 10గంటలకు సదస్సు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. దీనికోసం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా నిర్వహాకులు టెన్ టివితో మాట్లాడారు. దేశంలో ప్రభుత్వ రంగం కుదించబడిందని, విస్తారంగా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు వెలిశాయని, వివక్షకు గురవుతున్న వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లు ప్రైవేటు సంస్థలో అమలుకు నోచుకోవడం లేదని, ఈ వర్గాలకు ఉపశమనం కల్పించడం కోసం గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. ఈ ఉద్యమాన్ని మరింత విశాలంగా చేయడం కోసం ఈ మహాసదస్సు జరగనున్నదని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే రోజని, తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న బలహీనవర్గాలకు ప్రైవేటు రంగంలో సమాన అవకాశాలు రావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలతిపారు. సరళీకర..తదితర విధానాల వల్ల ప్రభుత్వ రంగం కుచించుకపోయిందని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు జరిగితేనే బలహీనవర్గాలకు న్యాయం కలుగుతుందన్నారు. సదస్సు అనంతరం ఒక కార్యాచరణను రూపొందించడం జరుగుతుందన్నారు. ఒక సంవత్సర కాలం నుండి సీపీఎం ఈ అంశంపై పోరాడుతోందని, ఆ పార్టీ అందించిన స్పూర్తితో ముందుకెళుతున్నట్లు చెప్పారు. 

09:23 - July 12, 2015

హైదరాబాద్ : ఎల్ బినగర్ లో ఉన్న ఓ ఎటిఎంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరికి ప్రయత్నించారు. శ్రీ శంకర్ కాలనీలో ఉన్న ఎస్ బిఐ ఎటిఎంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎటిఎంలో చొరబడ్డారు. ఎటిఎం లాక్ ను విరగ్గొట్టి బాక్స్ లో ఉన్న డబ్బును దొంగిలించేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. డబ్బును డ్రా చేసుకోవడానికి వచ్చిన వ్యక్తులు దొంగతనం విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం తీరును పరిశీలించారు. 

నిలిచిన అమర్ నాథ్ యాత్ర..

జమ్మూ కాశ్మీర్ : అమర్ నాథ్ యాత్ర నిలిచిపోయింది. జమ్మూలో వాతావరణ పరిస్థితులు బాగా లేకపోవడం వల్లే యాత్ర నిలిచిపోయినట్లు తెలుస్తోంది. 

09:10 - July 12, 2015

హైదరాబాద్ : మూసీలో శనివారం రాత్రి గల్లంతైన శ్రీనివాస్ మృతి చెందాడు. ఆదివారం ఉదయం అతని బాడీని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కృష్ణనగర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి శనివారం రాత్రి నడుచుకుంటూ వస్తుండగా గోల్నాక బ్రిడిపై ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుండి మూసీ నదిలో పడిపోయాడని పోలీసులు తెలిపారు. విద్యార్థులు సమాచారం అందించడంతో గాలింపులు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కానీ శ్రీనివాస్ ఆచూకి తెలియలేదన్నారు. అనంతరం ఆదివారం ఉదయం గాలింపు చర్యలకు ఉపక్రమిస్తుండగా వెనుకవైపున ఉన్న ట్రీట్ మెంట్ ప్లాంట్ లో శ్రీనివాస్ మృతదేహం లభ్యమైందన్నారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించినట్లు తెలిపారు. అధికారులు ఆలస్యంగా వచ్చారని, తొందరగా వస్తే శ్రీనివాస్ ఆచూకి తెలిసే అవకాశం ఉండేదని మృతుడు కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. శ్రీనివాస్ మృతి చెందాడన్న సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఢిల్లీలో అగ్నిప్రమాదం..

ఢిల్లీ : లజ్ పత్ నగర్ లోని ఓ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. 

షిమ్లాలో భారీ వర్షాలు..

హిమాచల్ ప్రదేశ్ : ఉత్తర భారతదేశంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. షిమ్లా ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. 

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు..

వారణాశి : ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో జనజీవనం స్తంభించింది. రహదారులపై భారీగా నీరు చేరుకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఆశారం కేసులో కీలక సాక్షి మృతి..

ఉత్తర్ ప్రదేశ్ : లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాబు కేసులో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మరో క్రిపాల్ సింగ్ పై మృతి చెందాడు. సదర్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 

సానియా, హింగీస్ లకు రాష్ట్రపతి శుభాకాంక్షలు..

ఢిల్లీ : సానియా మీర్జా , మార్టినా హింగీస్ లకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో రాష్ట్రపతి ప్రణబ్ ట్వీట్ చేశారు. సానియ, హింగీస్ లు తొలి గ్రాండ్‌ స్లామ్‌ మహిళల డబుల్స్ టైటిల్‌ సొంతం చేసుకోనున్న సంగతి తెలిసిందే.

మూసీలో పడిపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం..

హైదరాబాద్ : కాచిగూడ సమీపంలో ప్రమాదవశాత్తు మూసీ నదిలో పడిపోయిన శ్రీనివాస్ మృతదేహం లభించింది. కృష్ణానగర్ ప్రాంతంలోని జలశుద్ధి ప్లాంట్ వద్ద అతడి మృతదేహం లభ్యమైంది. 

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..11 మందిపై కేసులు నమోదు..

హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఆరు ద్విచక్రవాహనాలు, నాలుగు కార్లు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.

 

నేటి నుండి ట్రూజెట్ విమాన సర్వీసులు..

హైదరాబాద్ : నేటి నుండి ట్రూజెట్ విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. హైదరాబాద్-తిరుపతి, రాజమండ్రికి సర్వీసులు కొనసాగనున్నాయి. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు..కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. 

07:15 - July 12, 2015

హైదరాబాద్ : మూసీ నది మరోసారి వార్తల్లోకి ఎక్కింది. బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మూసీ నదిలో పడిపోయాడు. దీనితో అతని ఆచూకీ కోసం మున్సిపల్ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. శనివారం రాత్రి కాచిగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణనగర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి శనివారం రాత్రి నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుండి మూసీ నదిలో పడిపోయాడు. అక్కడనే ఉన్న స్థానికులు గమనించి అధికారులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అధికారులు రెండు, మూడు గంటలు ఆలస్యంగా రావడంతో గాలింపు చర్యలు ఆలస్యంగా మొదలయ్యాయి. చీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. సమాచారం అందుకున్న స్థానిక సీపీఎం నేతలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అతని ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందించినా అధికారులు ఆలస్యంగా స్పందించారని కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మృతి చెందినట్లు అనుమానం - కిషన్ రెడ్డి...
కాచిగూడ సమీపంలోని మూసీ ఉప నాలాలో శ్రీనివాస్ అనే వ్యక్తి పడిపోయాడని ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ఆయన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం శ్రీనివాస్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈసందర్భంగా మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. గత నాలుగు గంటలుగా బస్తీకి చెందిన యువకులు, మున్సిపల్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది గాలింపులు చర్యలు చేపట్టారని కానీ అతని ఆచూకీ తెలియలేదన్నారు. మురికిలో ఇరుక్కపోయి చనిపోయి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. 

06:43 - July 12, 2015

ఇంగ్లండ్ : సానియా మీర్జా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఆమె తొలి గ్రాండ్‌ స్లామ్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది. స్విస్‌ వెటరన్‌ మార్టినా హింగిస్‌తో కలిసి ఆమె వింబుల్డన్‌ టైటిల్‌ గెలుచుకుంది. ఇప్పటికే మూడు మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్‌ స్లామ్‌లు గెలిచిన సానియాకు.. మహిళల డబుల్స్ లో ఇది తొలి టైటిల్‌. 

06:42 - July 12, 2015

తుర్కెమెనిస్తాన్ : టెర్రరిజం, వాతావరణంలో మార్పులు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కానికి గాంధీ జీవితం, బోధనలు ఎంతగానో దోహదం చేస్తాయని ప్రధాని అన్నారు. తుర్కెమెనిస్తాన్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన అష్‌గాబిట్‌లో యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. తుర్కెమెనిస్తాన్‌ అధ్యక్షుడితో ప్రధాని మోది ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. తుర్కెమెనిస్తాన్‌తో భారత్‌ ఏడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. మధ్య ఆసియా పర్యటనలో భాగంగా మోడీ తుర్కెమెనిస్తాన్‌లో పర్యటిస్తున్నారు.

 

06:38 - July 12, 2015

హైదరాబాద్ : ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్ల సాధన ఉద్యమం రోజురోజుకు ఊపందుకుంటోంది. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్న తరుణంలో ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించాల్సిందేనన్న నినాదాలు బలపడుతున్నాయి. చట్టసభల్లో ప్రత్యేక చట్టం చేయాలని వామపక్షాలు, దళిత, బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. లేనిపక్షంలో అశాంతి చెలరేగి.. అంతర్యుద్ధం తప్పదని హెచ్చరిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తప్పనిసరి చేస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని.. వామపక్షాలు, దళిత, బీసీ సంఘాలు పోరాటం చేస్తున్నాయి. ఇందుకోసం గొంతులన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రను చేపట్టారు. రిజర్వేషన్లపై ప్రజలను చైతన్యపరిచారు. దుండగులు దాడి చేసినా.. ఉద్యమాన్ని ఆపలేదు. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు సాధించేదాకా ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. దాంతో పాటు జిల్లాలవారీగా మేధావులతో కలిసి చర్చాగోష్టిలు నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లను ముట్టడించారు.
నేడు సదస్సు..
ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు గొంతుకలన్నీ ఏకమవుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాలంటే ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు ఉండాల్సిందేనని పలువురు నినదిస్తున్నారు. ఇందుకోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం నాడు ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్‌ పోరాట సంఘం ఆధ్వర్యంలో మహా సదస్సు నిర్వహిస్తున్నారు.
కుచించుకపోతున్న ప్రభుత్వ రంగం..
నానాటికి ప్రభుత్వ రంగం కుచించుకుపోతుండడంతో.. ఉద్యోగాలు లభించడం కష్టంగా మారింది. దీంతో రాజ్యాంగం కల్పిచిన రిజర్వేషన్లకు అర్ధమే లేకుండాపోతుంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ కారణంగా 85 శాతం ఉద్యోగాలు ప్రైవేట్‌ రంగంలోనే ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడం.. ఉద్యోగాలు ఉన్న ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు లేకపోవడంతో సమాజంలో వెనకబడ్డ కులాలు, వర్గాలకు ఉద్యోగాలు దక్కడం లేదు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, వికలాంగులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. అందుకే ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు ఉండాల్సిందేనని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.
ప్రైవేటు కంపెనీలు ఎందుకు రిజర్వేషన్లు కల్పించవు ?
ప్రభుత్వం నుంచి అనేక రాయితీలు పొందుతున్న ప్రైవేట్‌ కంపెనీలు రిజర్వేషన్లు ఎందుకు కల్పించవు ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్‌ రంగం ఎంత ముందుకు దూసుకుపోయినా.. ప్రభుత్వ సహాయ సహకారం కావాల్సిందే అంటున్నారు. నైపుణ్యం ప్రకారమే ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు వస్తాయనే అపోహలు అవాస్తవమని ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభను గుర్తించి శిక్షణ ఇస్తే ఎలాంటి వారైనా రాణిస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పార్లమెంట్ లో చట్టం తేవాలి..
ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో చట్టం తేవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చట్టాలు తేవాలని ఒత్తిడి తెస్తున్నారు. రిజర్వేషన్లు అమలు చేయని ప్రైవేట్‌ కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించని పక్షంలో సమాజంలో ఉన్న అంతరాలు మరింత పెరుగుతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించి సమ సమజానికి దోహదపడాలని కోరుతున్నారు. లేనిపక్షంలో సమాజంలో అశాంతి చెలరేగి అంతర్యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంటుందంటున్నారు.

06:35 - July 12, 2015

మహబూబ్ నగర్ : ఓటుకు నోటు వ్యవహారంతో టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రాజకీయ భవిష్యత్‌పై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా గులాబీ గాలి వీచినా పాలమూరు జిల్లాల్లో మాత్రం ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో స్థానాలు దక్కలేదు. దీనికి తోడు ప్రతిపక్షంలో బలమైన నేతగా గుర్తింపు పొందుతున్న రేవంత్ పాలమూరు జిల్లా కొడంగల్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో.. కేసీఆర్‌ ఆ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో తాను పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహించిన జిల్లాలో...టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతం కాకపోవడంపై కేసీఆర్‌ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే పాలమూరు ఎత్తిపోతల పథకం వివాదాన్ని రాజేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ జిల్లా ప్రజలకు వ్యతిరేకమనే సంకేతాలిచ్చేలా బంద్‌ పిలుపిచ్చి సక్సెస్‌ అయ్యారు గులాబీ నేతలు.. ఈ పరిణామాలను తప్పుపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.
రేవంత్ రాజీనామా ?
మరోవైపు రేవంత్ రాజీనామా చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా ఆమోదం పొందుతుందా లేదా అన్న విషయాలను పరిగణలోకి తీసుకోకుండా...పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసేంది అధికార పార్టీ. అందులో భాగంగానే శనివారం ఓ జెడ్పీటీసీని కారెక్కించుకుంది. దౌల్తాబాద్ మండల జెడ్పీటీసి వెంకటమ్మ ఎంపీ కవిత సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
రేవంత్ చెక్ పెడుతారా ?
ఇక కొడంగల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మరింత చేరువయ్యేలా నేతలు వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారట. రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి చెందిన మరికొంత మంది టీడీపీ నేతలు కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నారని టిఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఉప ఎన్నికలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చినా..రాకపోయినా..తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. అధికార పార్టీ ఎత్తులకు రేవంత్‌ ఎలా చెక్‌ పెడతారో చూడాలి. 

06:33 - July 12, 2015

గుంటూరు : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రాజకీయ భవిష్యత్తు సరికొత్తగా మలుపులు తిరుగుతోంది. ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న డొక్కా.. ఎంపీ రాయపాటి సాంబశివరావుకు శిష్యుడు. రాష్ర్ట విభజన తర్వాత రాయపాటి కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వెళ్లినా.. డొక్కా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కొంతకాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న డొక్కా ఆడపాదడపా ఏపీ రాజధాని అంశాలపై మీడియా ఎదుట తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే క్రీయాశీలక రాజకీయాల్లో రావాలంటే ప్రధాన పార్టీలో ఏదో ఒక దాంట్లో చేరాలన్న ఆలోచన ఇటీవల కాలంలో ఆయనలో మొదలైంది. దీంతో పార్టీ మారడానికి డొక్కా అంతా సిద్ధం చేసుకున్నారు.
ఈ నెల 13న వైసీపీలో చేరేందుకు నిర్ణయం..
ఐదు నెలల క్రితమే డొక్కా టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, విశాఖ తుపాను నేపథ్యంలో డొక్కాను టీడీపీలో చేర్చుకునే అంశం కాస్తా మరుగునపడింది. ఈ క్రమంలో తన వాయిస్‌ను వినిపించేందుకు బలమైన రాజకీయ వేదిక ఏంచుకోవాలన్న యోచనలో భాగంగా వైసీపీలో చేరేందుకు డొక్కా ఆ పార్టీ నేత అంబటి రాంబాబుతో రాయబరాలు సాగించారు. వైసీపీ అధినాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో ఈ నెల 13న ఆ పార్టీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే ఆయన నిర్ణయానికి బ్రేకులు పడ్డాయి.
వైసీపీలోకి వెళ్లకుండా నిలువరించిన టీడీపీ..
డొక్కా రాజకీయ గురువైన రాయపాటిని టీడీపీ రంగంలోకి దింపి.. ఆయన్ను వైసీపీలో చేరకుండా నిలుపదల చేసింది. డొక్కాతో రాయపాటి మీడియా సమావేశం పెట్టి.. డొక్కా పార్టీ మారడం లేదని ప్రకటింపచేశారు. తామంతా ఓ కుటుంబమని ఏక్కడికైనా కలిసే ప్రయాణిస్తామంటూ డొక్కా రాజకీయ భవిష్యత్తు టీడీపీలోనే అన్నట్లు చెప్పేశారు.
రాజకీయ భవిష్యత్తుపై ఆచితూచి స్పందిస్తున్న డొక్కా..
డొక్కా తడబాటు మాటల వెనుక రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుని.. అర్ధాంతరంగా నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇప్పటికప్పుడు టీడీపీలో చేరితే ప్రజలు హర్షించరన్న ఆలోచనతోనే డొక్కా రాజకీయ భవిష్యత్తుపై ఆచితూచి స్పందిస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం డొక్కాను పార్టీలోకి తీసుకురమ్మని రాయపాటికి బాధ్యత అప్పగించినా, ఆయన పార్టీలో చేరితో ఏ పదవి కట్టబెడుతారో స్పష్టం చేయకపోవటమే.. ప్రస్తుతం డొక్కా ఊగిసలాటకు కారణంగా తెలుస్తోంది. ఇటు డొక్కాలాంటి నేత టీడీపీలో ఉండడం వల్ల ఆ పార్టీకి ఎస్సీ సామాజిక వర్గ పరంగా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఉన్న తాడికొండ నియోజకవర్గంలో బలమైన ప్రతిపక్ష నేత లేకపోవడంతో రాజధాని భూ సమీకరణలాంటి ప్రక్రియను, చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ, వాటిని అధిగమించి అధికార పార్టీ చక్కపెట్టుకోగలిగింది. డొక్కా వైసీపీ తీర్థం పుచ్చుకుని ఉంటే తాడికొండ నియోజకవర్గంలో బలమైన నేతగా ముద్రపడ్డ ఆయన, రానున్న రోజుల్లో ఉద్యమాల ద్వారా ప్రభుత్వానికి తలనొప్పిగా మారి ఉండేవాడన్న అభిప్రాయాన్ని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలే మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా డొక్కాను వైసీపీలో వెళ్లకుండా టీడీపీ చక్రం తిప్పినప్పటికీ.. ఆయన్ను ఏప్పుడు పార్టీలో చేర్చుకుంటారన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇటు డొక్కా కూడా ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేకపోతున్నారు. 

06:26 - July 12, 2015

తూర్పుగోదావరి : సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహానికి ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ కు గురయ్యారు. పుష్కర పనుల్లో జరుగుతున్న జాప్యమే ఇందుకు కారణం. ఉద్యోగులే దీనికి కారణమని భావించిన సీఎం బాబు వారిని సస్పెండ్ చేశారు. రాజమండ్రికి శనివారం చేరుకున్న సీఎం ఆకస్మిక తనిఖీలతో అధికారులను బెంబేలెత్తించారు. పుష్కర పనుల్లో జరుగుతున్న అలసత్వంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి ప్రత్యేక సర్వీసులో వచ్చిన ఆయనకు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తో సహ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం సీఎం రోడ్డుమార్గంలో నగరంలోని పుష్కరాల సుందరీకరణ పనులను, నమూనా దేవాలయాలను, పుష్కరనగర్ లను పరిశీలించారు. పుష్కరాలకు కౌంట్ డౌన్ మొదలైన నేపధ్యంలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పనుల పురోగతిలో అధికారుల తీరు చూసి నివ్వెరపోయారు. ఇంకా డ్రైయిన్ల నిర్మాణాలను అనుకున్న మేర పూర్తి చేయకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. బాధ్యులను సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు.
అసౌకర్యం కలిగితే చర్యలు తప్పవన్న బాబు...
సెంట్రల్ జైల్ ఎదురుగా సుందరీకరణ పనులను, నమూనా దేవాలయాలను, అభివృద్ధి చేసిన రోడ్లను, కోటిలింగాల ఘాట్ ను చంద్రబాబు పరిశీలించారు. జూలై14నాటికి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో గోదావరి పుష్కర ఏర్పాట్లపై సమగ్రంగా విచారించారు. పుష్కర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రానివ్వద్దని, పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు.
పుష్కరాలకు ఇంకా కొద్ది గంటలు మిగిలి ఉండగా సీఎం చేస్తున్న హడావిడి ఏ మేరకు ఫలితం ఇస్తుందా అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది కాలంగా కొనసాగుతున్న పుష్కర పనులు ఇంక కొలిక్కి రాకపోవడం పై జిల్లా వాసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

06:25 - July 12, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి కేంద్ర ఎన్నికల కమిషన్‌ పూర్తిస్థాయిలో ఎంటరైంది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో టేపులను కోర్టు నుంచి తీసుకున్న ఈసీ.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించే పనిలో పడింది. వీటిపై వచ్చిన ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక, ఎఫ్‌ఐఆర్‌ పత్రాలు, నిందితుల రిమాండ్‌ డైరీలు ఈసీ చేతికి అందాయి.                                                                  
సీఈసీకి నివేదిక ?
ఓటుకు నోటు కేసు ఎన్నికల విషయానికి సంబంధించినది కాబట్టి, ఈ కేసులో తాము కూడా దర్యాప్తు జరుపుతామని ఇప్పటికే ప్రకటించిన ఈసీ.. ఇందులో భాగంగానే ఈ వివరాలను పొందినట్టు సమాచారం. దీంతో ఈ కేసులో ఈసీ వేగంగా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. అదనపు వివరాలను కూడా సీఈసీకి అందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
పోటీ చేయకుండా నిషేధం ?
ఇదిలా ఉంటే.. ఓటుకు నోటు కేసులో నిందితులు దోషులుగా తేలితే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ నిషేధించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే, ప్రధాన నిందితుడు రేవంత్‌ రెడ్డితోపాటు, సండ్ర వెంకటవీరయ్య రాజకీయ భవిష్యత్‌ ఏమవుతుందనే ఆందోళనలో తెలంగాణ తమ్ముళ్లు ఉన్నారు. మరి, ఈ కేసు విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఏవిధంగా దర్యాప్తు చేస్తుంది..? ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుంది..? అన్నది రానున్న రోజుల్లో చూడాలి.

06:23 - July 12, 2015

హైదరాబాద్ : పారిశుధ్య కార్మికుల డిమండ్లపై టి.సర్కార్ సానుకూలంగా స్పందించకపోవడంతో సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. శనివారం మున్సిపల్ కార్మీకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సర్కార్‌ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో.. సమ్మె మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. కనీస వేతనాలు, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించే వరకు సమ్మెను విరమించేది లేదని హెచ్చరించాయి. ఇప్పటికీ నాలుగు దఫాలుగా మున్సిపల్‌ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ అటు ప్రభుత్వం..ఇటు మున్సిపల్ కార్మికులు పట్టు వీడకపోవడంతో చర్చలు సఫలం కాలేదు. డిమాండ్ల పరిష్కారంలో నాయిని చేతులు ఎత్తేశారు. రంజాన్ ఉన్నందున సమ్మెను వాయిదా వేసుకోవాలని కోరారు. సీఎంతో చర్చించి సమస్యలను పరిష్కారిస్తానన్నారు. అయితే ఎప్పటి లోపు సమస్యలు పరిష్కారిస్తారో చెప్పాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. సీఎం నుంచి స్పష్టమైన హామీ ఇప్పిస్తే సమ్మే విరమిస్తామన్నారు. అయితే దీంతో నాయిని ఏలాంటి హామీ ఇవ్వకపోవడంతో.. సమ్మె కొనసాగుతుందని కార్మీక సంఘాలు ప్రకటించాయి.
ప్రభుత్వ తీరుపై కార్మిక సంఘాల ఆగ్రహం..
ప్రభుత్వ తీరు పట్ల కార్మిక సంఘాలు తీవ్ర నిరసన వక్తం చేశాయి. కనీస వేతనం, కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్దీకరణ, ఆరోగ్య భద్రత వంటి ప్రధాన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ప్రకటించాయి. అంతకుముందు మున్సిపల్‌ కార్మికులు ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహించారు. అన్ని పార్టీల నాయకులు ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. మున్సిపల్‌ కార్మికులకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలిపింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లపై సర్కారు వెంటనే స్పందించాలని సీపీఐ డిమాండ్‌ చేసింది. ధర్నా విజయవంతం కావడంతో కార్యాచరణ ప్రకటించింది మున్సిపల్‌ జేఏసీ. అన్ని మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలియజేస్తూ...కార్యకలాపాలు స్తంభింప చేయాలని తీర్మానించింది. రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలతో నిరసనలు తెలియజేయాలని ప్రకటించింది. అయితే రోడ్లపై పేరుకుపోయిన చెత్తతో నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా మన్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 

బాటసింగారం వద్ద కారు - లారీ ఢీ..ఇద్దరు మృతి..

హైదరాబాద్ : బాటసింగారం వద్ద కారు - లారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

కడపలో గవర్నర్ రోశయ్య పర్యటన..

కడప : తమిళనాడు గవర్నర్ రోశయ్య ఆదివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. లయన్స్ క్లబ్ 36వ ఇంటర్నేషనల్ సమావేశానికి రోశయ్య హాజరు కానున్నారు. 

నేడు ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో మహా సదస్సు...

హైదరాబాద్ : ఉదయం 10గంటలకు ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో మహాసదస్సు జరుగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలనే దానిపై చర్చ జరుగనుంది. సీపీఎం నేత తమ్మినేని, కాకి మాధవరావు, 9 వామపక్ష పార్టీల నేతలు, పలువురు ప్రొఫెసర్లు పాల్గొనున్నారు. 

నేడు ఆదిలాబాద్ తూర్పులో హరిత మహోత్సవం..

ఆదిలాబాద్ : హరితహారంలో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లా తూర్పు ప్రాంతంలోని మూడు మున్సిపాల్టీల్లో 2.5 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, అటవీ శాఖ మంతిల్ర జోగు రామన్న, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొననున్నారు. 

నేడు జేసీజే టెస్టు..

హైదరాబాద్ : జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీల ప్రక్రియలో భాగంగా ఆదివారం స్ర్కీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కాలేజీ ప్రాంగణంతో పాటు ఏపీలో మరో మూడు కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి.

 

ఏడో రోజుకు చేరుకున్న పారిశుధ్య కార్మికుల సమ్మె..

హైదరాబాద్ : మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. శనివారం నాడు ప్రభుత్వం..కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 

నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు...

హైదరాబాద్ : నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 195 మసీదులలో ముస్లింలకు ఇఫ్తార్ విందులు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో దాదాపు ఐదువేల మంది ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. 

Don't Miss