Activities calendar

13 July 2015

21:48 - July 13, 2015

ఢిల్లీ: 26/11 ముంబై దాడులకు సంబంధించి భారత్- పాక్‌ ప్రధానుల మధ్య ఉఫాలో జరిగిన చర్చలపై పాకిస్తాన్‌ యూ టర్న్ తీసుకుంది. ముంబై దాడులపై మరిన్ని ఆధారాలు, సాక్ష్యాలు కావలాంటూ పాకిస్తాన్‌ మళ్లీ మెలిక పెట్టింది. అంతేకాదు... కాశ్మీర్‌ ఎజెండా లేకుండా రెండు దేశాల మధ్య చర్చలు జరగడం అసాధ్యమని పాకిస్తాన్‌ జాతీయ భద్రతా సలహాదారుడు సర్తాజ్‌ అజీజ్‌ స్పష్టం చేశారు. ముంబై దాడులకు సంబంధించిన ఆధారాలను భారత్‌ పాక్‌ సమర్పించినా ఉగ్రవాదులపై ఇంతవరకు విచారణ జరపలేదు. ఇరుదేశాల ప్రధానులు జరిపిన చర్చలపై ముంబై దాడులతో పాటు, కాశ్మీర్‌ అంశం కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చర్చకు వచ్చింది. ఇంతలోనే పాకిస్తాన్‌ మాట మార్చింది. ముంబై దాడుల ప్రధాన సూత్రధారి లఖ్వీ వాయిస్‌ శాంపిల్స్ ను తమ దేశ చట్టాలు అంగీకరించవని పాకిస్తాన్‌ పేర్కొంది.

 

21:44 - July 13, 2015

ఢిల్లీ: వ్యాపం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది. మొత్తం 40 మంది అధికారుల బృందం విచారణలో భాగస్వామ్యం అవుతోంది. ఈ బృందానికి 1986 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి... అస్సాం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన ఆర్ పి. అగర్వాల్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఇవాళ ఉదయమే బోపాల్‌ చేరుకున్న సీబీఐ టీమ్‌... వచ్చీ రాగానే తనపని మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ వ్యాపం స్కాంపై దర్యాప్తు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్-ఎస్ టిఎఫ్ ను కలిసి... వారి నుంచి కేసు దర్యాప్తు బాధ్యతలు తీసుకున్నారు. 

21:41 - July 13, 2015

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇఫ్తార్‌ విందు ప్రారంభమైంది. ఈ విందుకు ఎన్డీయేతర సెక్యులర్‌ పార్టీలను ఆహ్వానించారు. త్వరలో ప్రారంభమయ్యే వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల ముందు ఈ విందు- రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వ్యాపం స్కాం, లలిత్‌ మోదీ అంశాలపై పార్లమెంట్‌లో అనుసరించే వ్యూహాలపై సెక్యులర్‌ పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. ఈ విందుకు ఎస్పీ అధినేత ములాయం, బిఎస్పీ చీఫ్‌ మాయావతి, సిపిఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ తరపున రాజా, ఎన్‌సిపి చీఫ్‌ శరద్‌పవార్, దేవెగౌడతో పాటు డిఎంకె, టిఎంసి, అన్నాడిఎంకె, బిజెడి, టిఆర్‌ఎస్ తదితర నేతలు హాజరు కానున్నారు. బీహార్‌లో బిజీ షెడ్యూల్‌ ఉండడం వల్ల తాను ఇఫ్తార్‌కు హాజరు కావడం లేదని ఆర్జేడి అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ పేర్కొన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు జూలై 21 నుంచి ప్రారంభం కానున్నాయి.

 

రేపటి నుంచి తెలంగాణ, ఎపిలో గోదావరి పుష్కరాలు

హైదరాబాద్: తెలంగాణ, ఎపిలలో రేపటి నుంచి గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నారు. 12 రోజులపాటు పుష్కరాలు జరుగనున్నాయి. 

హైదరాబాద్ లో బాలుడిపై లైంగిక దాడి..

హైదరాబాద్: పాతబస్తీ మాదన్నపేటలో దారుణం జరిగింది. స్మశానవాటికలో ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగింది. లైంగిక దాడికి గురైన బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు బాలలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

20:33 - July 13, 2015

మహబూబ్‌నగర్‌: టీఆర్‌ఎస్‌, టీడీపీలపై కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం, టీడీపీ నేతలు మాట్లాడుతున్నా...పనులు మాత్రం ముందుకు సాగడం లేదని మండిపడ్డారు. జిల్లా అభివృద్ధిపై సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రాజెక్టుల పనులు ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు.

 

20:25 - July 13, 2015

కడప: గ్రామంలో మద్యం దుకాణాన్ని ఎత్తేయ్యాలని కోరుతూ మహిళలు ఏకంగా మద్యం షాపునే ధ్వంసం చేశారు. ఈ ఘటన కడప జిల్లా మైలవరం మండలం వేపరాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన వైన్‌ షాపును మరో ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని గత పదిహేను రోజులుగా ధర్నా చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించినా ఫలితం లేకుండాపోయింది. నివాసం ఉంటున్న ఇళ్ల మధ్య దుకాణం ఏర్పాటు చేయడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో మద్యం దుకాణంపై మహిళలు మూకుమ్మడిగా దాడి చేసి ధ్వంసం చేసారు.

 

20:21 - July 13, 2015

రాజమండ్రి: పుష్కరాలను ప్రతీ రోజు పండుగలా జరపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లపై రాజమండ్రిలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా పుష్కర కార్యక్రమాలను కలకాలం గుర్తిండిపోయేలా జరపాలన్నారు. పుష్కరాలు సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమని చంద్రబాబు అన్నారు. తెలుగువారి పవిత్ర పండుగ గోదావరి పుష్కరాలని సీఎం అభివర్ణించారు.

 

 

కర్నూలు జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం..

కర్నూలు: బనగానిపల్లె తహశీల్దార్ కార్యాలయం ఎదుట రాళ్లకొత్తూరుకు చెందిన రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. రైతు పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పొలం వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయకుండా... తహశీల్దార్, వీఆర్వో వేధిస్తున్నారని రైతు ఆరోపిస్తున్నారు.

 

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: తమ్మినేని

వరంగల్: పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పాలకుర్తిలో గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన ఆందోళనకు పది వామపక్షపార్టీల నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరి నరసింహస్వామికి రూ. 200 కోట్లు కేటాయించి.. నోరు తెరిచి అడుగుతోన్న కార్మికులకు రూ. 50 కోట్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వముందని ఎద్దేవా చేశారు. కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా...ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని విమర్శించారు.

 

పవన్ ట్విట్టర్ వ్యాఖ్యలపై రఘువీరా స్పందన

హైదరాబాద్: కాంగ్రెస్ పై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలపై ఎపి పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి స్పందించారు. పవన్ వ్యాఖ్యలు అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రత్యేకహోదా కోసం ఏడాది కాలంగా సోనియాతోపాటు తామంతా... పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పారు.

 

ప్రతొక్కరు పుష్కర స్నానం చేయాలి: చంద్రబాబు

రాజమండ్రి: రేపు ఉదయం 6.25 గంటలకు పుష్కరాలు ప్రారంభమవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరు పుష్కర స్నానం చేయాలని సూచించారు.

 

19:16 - July 13, 2015

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని వివాహిత కిడ్నాప్‌ డ్రామాను పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. నిందితుడు రిజ్వాన్‌తో రాధిక ఇష్టపూర్వకంగానే వెళ్లిందని తెలిపారు. కోల్‌కతాలో ఇద్దరినీ అరెస్టు చేశామని చెప్పారు. తొలుత కటక్.. ఆ తర్వాత కోల్‌కతాకు మకాం మార్చారని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా ఫేస్‌బుక్‌ ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఇద్దరూ పెళ్లికి నిశ్చయించుకుని భర్తను బెదిరించి రూ. 3 లక్షలు వసూలు చేయాలని పథకం వేశారని పేర్కొన్నారు. మహిళను గాయపరిచినట్లు భర్తకు వాట్సప్ లో ఫోటోలు పంపారని చెప్పారు. నిందితులు ఇద్దరిపైనా కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఇద్దరిని పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. 

19:10 - July 13, 2015

కరీంనగర్‌: తనకు న్యాయం చేయాలంటూ కరీంనగర్ లో ఓ మహిళ ఆందోళనకు దిగింది. తనను పోలీసు ఎస్సై అన్యాయం చేశాడంటూ నగరంలోని కలెక్టరేట్ ఎదుట బైఠాయించింది. కరీంనగర్ ట్రాఫిక్ ఎస్సైగా పనిచేస్తున్న మారెపల్లి రాజు అనే వ్యక్తి గత పది సంవత్సరాలుగా ప్రేమ పేరుతో తనను లొంగదీసుకున్నట్లు భాధితురాలు తెలిపింది. ఎస్సై ఉద్యోగం రాగానే తనను వదిలేసి వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని.. ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

 

19:06 - July 13, 2015

హైదరాబాద్: మహబూబ్‌ నగర్‌ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులపై చర్చకు సంబంధించి అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాలుకు జవాబుగా టీడీపీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. టీడీపీ హయాంలో పాలమూరులో మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులు జరగలేదని జూపల్లి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని రావుల అన్నారు. చర్చకు సిద్ధమని జూపల్లి మాటతప్పారని రావుల విమర్శించారు.

 

18:57 - July 13, 2015

వరంగల్: ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తేనే.. నిజమైన సామాజిక న్యాయం జరిగినట్లువుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వరంగల్ జిల్లాలో చాకలి ఐలమ్మ విగ్రహాష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాడే నేతనే వరంగల్ పార్లమెంట్ నియోజవర్గం నుంచి పంపాలని సూచించారు. మోడీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించే వ్యక్తిని పార్లమెంట్ కు పంపితే పేద ప్రజల తరపు మాట్లాడతాడని చెప్పారు. అలా కాకుండా మోడీ ప్రజావ్యతిరేక విధానాలను ఆమోదించే వ్యక్తి పార్లమెంట్ కు పంపితే పేద ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని పేర్కొన్నారు. నరేంద్రమోడీ బిసి వర్గం నుంచి వెళ్లి ప్రధాని అయితే బిసిలకు గానీ వెనుకబడిన వర్గాలకు గానీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని వెల్లడించారు. అందుకే వ్యక్తిని కాకుండా... అతని విధానాలను చూసి ఎన్నుకోవాలని సూంచించారు. దళితులు, బీసీ, మైనారిటీల కోసమే సామాజిక న్యాయమని స్పష్టం చేశారు. ఎస్ సి, ఎస్టీ, బిసి, మైనారిటీలకు రిజర్వేన్లు..ఉంటేనే చదువుకునే అకాశం లభిస్తుందని చెప్పారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి సాధ్యమతుందన్నారు. ఎస్ సి, ఎస్టీ, బిసిలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కావాలని వివరించారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వ్యతిరేకించే ఏ పార్టీ అయినా..అది సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన పార్టే అవుతుందన్నారు. కమ్యూనిస్టుపార్టీలు సామాజిక న్యాయం కోసం పోరాడాతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ,బిసి, మైనారిటీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, సామాజిక న్యాయం కోరే అగ్రవర్ణాల వ్యక్తులను కూడా కలుపుకుపోవాలని సూంచించారు.

 

టీఎస్ ట్రాన్స్ కో పిటిషన్ పై విచారణ వాయిదా...

హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్ కో రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగులకు వేతనం చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల రిలీవ్ పై స్టే తొలగించాలని టీఎస్ ట్రాన్స్ కో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టీఎస్ ట్రాన్స్ కో వేసిన పిటిషన్ పై విచారణను 15కు వాయిదా వేసింది.

 

ప్రత్యూషపై దాడిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్: నాగోల్ లో ప్రత్యూషపై ఆమె తల్లిదండ్రుల దాడి ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రత్యూష పేరు మీద ఆస్తులున్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆస్తుల కోసమే ప్రత్యూష పట్ల ఆమె తల్లిదండ్రులు అలా వ్యవహరించారా అని నిలదీసింది. ప్రత్యూష మానసిక, శారీరక స్థితిపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తరుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేశారు.

 

ధర్మపురి చేరుకున్న సీఎం కేసీఆర్

కరీంనగర్: సీఎం కేసీఆర్ ధర్మపురి చేరుకున్నారు. హరిత హోటల్ లో కేసీఆర్ బస చేయనున్నారు. రేపు ఉదయం 6.25 గంటలకు ధర్మపురిలో కేసీఆర్ పుష్కర స్నానం చేయనున్నారు. 

17:29 - July 13, 2015

హైదరాబాద్: 'కాంగ్రెస్ ఉత్సాహం, జీల్‌ అంటే నాకెంతో ప్రేమ, ఆరాధన. బీజేపీపై విమర్శలు చేయడంలో ఆ పార్టీ ప్రదర్శించే తపన నాకెంతో నచ్చుతుంది. కానీ కాంగ్రెస్‌ నాయకులకు ఒక్క లలిత్ మోడీ ఇష్యూనే కనిపిస్తోందా...ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదాపై వారు పోరాడరా'...ఇదీ లేటెస్టుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ట్విట్టర్లో కాంగ్రెస్ పై వేసిన సైటెర్లు, విసుర్లు. ప్రేమ, ఆరాధన అంటూనే ఏపీ స్పెషల్ స్టేటస్‌ పై పవన్ కాంగ్రెస్ తీరును ఎండగట్టారు .

 

కర్నూలు జిల్లా కనకదిన్నెలో దారుణం

కర్నూలు: పత్తికొండ మండలం కనకదిన్నెలో దారుణం జరిగింది. తండ్రి.. 9 రోజుల పసికందును చంపి బావిలో పడేశాడు. నాలుగో సంతానం కూడా కూతురే కావడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 

కీసర ఎంపిడివో ఆఫీస్ లో కార్మికుడి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: కీసర ఎంపిడివో కార్యాలయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని కార్మికుడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

అసెంబ్లీ కమిటీ హాల్ లో హౌస్ కమిటీ సమావేశం..

హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్ లో హౌస్ కమిటీ సమావేశం.. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్ సొసైటీల్లో అక్రమాలపై ఆగస్టు ఒకటిలోగా సమగ్ర సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించామని కమిటీ ఛైర్మన్ ఆరూరి రమేష్ తెలిపారు. సికింద్రాబాద్ లోని ముత్యాలరావు హౌసింగ్ సొసైటీలో భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నాలాలు, పార్కులు కబ్జాకు గురయ్యాయని పేర్కొన్నారు.

16:46 - July 13, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే సండ్ర వెంటకవీరయ్య బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఎలాంటి ప్రయోజనం లేకుండా ఒక ఎమ్మెల్యేను జైల్లో ఉంచడం ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందనే విధంగా వాదనలు కొనసాగాయి. ఓటుకు నోటు కేసులో అందరికి బెయిల్‌ వచ్చింది..సండ్రకు కూడా బెయిల్‌ ఇవ్వాలని సండ్ర తరపు లాయర్‌ వాదనలు వినిపించారు. సండ్ర బెయిల్‌ పిటిషన్‌పై రేపు తుది తీర్పు వెలువడనుంది. అయితే ఏసీబీకి మొదటి నుంచి సండ్ర సహకరించడం లేదని తాము వాదనలు వినిపించామని ఏసీబీ స్పెషల్‌ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌రావు అన్నారు. సండ్రకు బెయిల్‌ ఇస్తే సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పారు.

 

15:10 - July 13, 2015

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయంత్రంలోగా సమ్మె విరమించి విధుల్లో చేరకుంటే... వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నా... కార్మికులు సమ్మె కొనసాగించడంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మికులు మొండిగా వ్యవహరిస్తే రేపటి నుంచి ఆర్మీ, పోలీసులు, ఇతర ఉద్యోగుల సహకారం తీసుకుంటామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ కార్మికులు కార్పొరేషన్ ఉద్యోగులు కానప్పటికీ...వారిపట్ల సానుభూతితో ఉన్నామని చెప్పారు. అయితే ప్రభుత్వ మొండి వైఖరిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొత్తవారిని విధుల్లో నియమించే ప్రభుత్వం యోచనను విరమించుకోవాలన్నారు. రేపటి నుంచి పారిశుధ్య సేవలకు ఆర్మీ, పోలీసులు, ఉద్యోగులను వినియోగిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై కార్మికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాము గొంతమ్మ కొర్కెలు కోరడం లేదని.. న్యాయమసమ్మతమైన డిమాండ్లనే కోరుతున్నామని చెప్పారు. వేతనాలు పెంచిన తర్వాతే.. సమ్మె విరమిస్తామని చెప్పారు. ప్రభుత్వ బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 

15:00 - July 13, 2015

ఫ్రాన్స్: ప్యారిస్‌లో ఓ గన్‌మెన్‌ కలకలం రేపాడు. ప్రిమార్క్ అనే బట్టల దుకాణంలో ప్రవేశించి.. అక్కడున్న పదిమందిని బందీలుగా చేశాడు. ఏం జరుగుతుందో తెలీక బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గన్‌మెన్‌ చెరనుంచి...బాధితులను విడిపించేందుకు పోలీసులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ఇద్దరు లేదా ముగ్గురు ఆగంతకులు షాపు లోపలకు ప్రవేశించి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రిమార్క్‌ దుకాణం చుట్టూ భారీగా పోలీసుల్ని మోహరించారు. అటు... బందీలుగా చేసుకున్న ఆగంతకులు... ఏ క్షణం ఎలా రియాక్టవుతారో అన్న ఆందోళన... సర్వత్రా వ్యక్తమవుతోంది. 

ప్యారిస్‌లో కలకలం

ఫ్రాన్స్: ప్యారిస్‌లో ఓ గన్‌మెన్‌ కలకలం రేపాడు. ప్రిమార్క్ అనే బట్టల దుకాణంలో ప్రవేశించి.. అక్కడున్న పదిమందిని బందీలుగా చేశాడు. ఏం జరుగుతుందో తెలీక బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

జీహెచ్ ఎంసీ కార్మికుల సమ్మెపై టీ.ప్రభుత్వం ఆగ్రహం..

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయంత్రంలోగా సమ్మె విరమించి విధుల్లో చేరకుంటే... వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నా... కార్మికులు సమ్మె కొనసాగించడంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మికులు మొండిగా వ్యవహరిస్తే రేపటి నుంచి ఆర్మీ, పోలీసులు, ఇతర ఉద్యోగుల సహకారం తీసుకుంటామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ కార్మికులు కార్పొరేషన్ ఉద్యోగులు కానప్పటికీ...వారిపట్ల సానుభూతితో ఉన్నామని చెప్పారు.

 

కేసీఆర్ తో నాయినీ సమావేశం..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తో కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమావేశమయ్యారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై చర్చిస్తున్నట్లు సమాచారం. 

భోపాల్ కు చేరుకున్న ఢిల్లీ సీబీఐ టీం..

మధ్యప్రదేశ్ : సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణాన్ని విచారించడానికి ఢిల్లీకి చెందిన సీబీఐ బృందం రాజధాని భోపాల్ చేరుకుంది. ఈ బృందంలో 40 మంది సభ్యులు ఉన్నారు. పలువురి మరణాలతో సంబంధమున్నట్లుగా భావిస్తున్న కోట్లాది రూపాయల వ్యాపం కుంభకోణంను విచారించమని సీబీఐని సుప్రీంకోర్టు గత వారం ఆదేశించిన విషయం తెలిసిందే. 

సండ్ర బెయిల్..తీర్పు రేపటికి వాయిదా..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకటవీరయ్య బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం సండ్ర చర్లపల్లి జైలులో ఉంటున్నారు. సండ్రకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

జాతీయ రహదారిని దిగ్భందం చేసిన ఉపాధి హామీ సిబ్బంది..

నల్గొండ : సమ్మె చేపట్టి 29 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఉపాధి హామీ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్యాల వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిని దిగ్భందం చేశారు. వీరి ఆందోళనకు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు మద్దతు తెలిపారు. 

హికెన్ షాపై బీసీసీఐ వేటు..

ముంబై : రంజీ క్రికెట్ క్రీడాకారుడు హికెన్ షాపై వేటు పడింది. అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ లో హికెన్ షా అక్రమాలకు పాల్పడినట్లు బీసీసీఐ జరిపిన విచారణలో వెల్లడైంది. 

కాప్రా చెరువు వద్ద ఇద్దరు బీటెక్ విద్యార్థుల అరెస్టు...

హైదరాబాద్ : కుషాయిగూడ పరిధిలోని కాప్రా చెరువు వద్ద ఇద్దరు బీటెక్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

కమీషనర్..కార్మికుల చర్చలు రసాభాస..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ తో పారిశుధ్య కార్మికుల జరిపిన సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. దీనితో కార్మికులు సమావేశం నుండి వెళ్లిపోయారు.

మైలార్ దేవులపల్లిలో సైకో వీరంగం..

హైదరాబాద్ : మైలార్ దేవులపల్లి గోదాంగడ్డ వద్ద సైకో వీరంగం చేశాడు. స్థానికులపై కత్తితో దాడి చేయడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు ఆ సైకోను అదుపులోకి తీసుకున్నారు.

 

బాబుపై మహబూబ్ నగర్ నేతల ఆగ్రహం..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు పై మహబూబ్ నగర్ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 450 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉందని, ఆంధ్రా తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటే చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి టిడిపి మినహా అన్ని పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 

13:40 - July 13, 2015

హైదరాబాద్ : పాలమూరు ప్రాజెక్టు వివాదం గవర్నర్ వద్దకు చేరింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ జిల్లా నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. టీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్..ఇతర పార్టీలకు చెందిన నేతలు కలిసిన వారిలో ఉన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకొనేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరడం జరిగిందని మంత్రి జూపల్లి విలేకరులకు తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం..దిండి ఎత్తిపోతల పథకంపై ఏపీ సీఎం చంద్రబాబు జూన్ 15వ తేదీన కృష్ణా ట్రిబ్యునల్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ రెండు పథకాలకు అసలు అనుమతులు ఉన్నాయా ? లేదా ? తెలపాలని లేఖలో బాబు కోరారు. దీనితో ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రాజెకక్టు కొత్తదని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. 70టీఎంసీల నీటిని వాడుకోవచ్చని కృష్ణా ట్రిబ్యునల్ 2013లో పేర్కొనడం జరిగిందని, ఇందుకు కేంద్రం అనుమతి కూడా ఇచ్చిందని టీఆర్ఎస్ పేర్కొంటోంది. జిల్లాలో వలస కూలీలుగా మారుతుండడం..కరువు తాండవిస్తుండడంతో ఈ నీటిని వాడుకొనేందుకు తాము చర్యలు తీసుకుంటున్నట్లు టీఆర్ఎస్ పేర్కొంటోంది. ఈ విషయంలో గవర్నర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

13:34 - July 13, 2015

హైదరాబాద్ : అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 41ని అమలు చేయాలని, జీవో నెంబర్ 81ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు లేబర్ కమీషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీడీ కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి నశించాలి.. నెలకు 25 రోజుల పని దినం కల్పించాలి..అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టెన్ టివితో సీఐటీయూ నేత మాట్లాడారు. కనీస వేతనాల జీవో 41ని అమలు చేయాలని తాము కోరడం జరుగుతోందని, ఎన్నికలకు ముందు జీవన భృతి వెయ్యి రూపాయలు ఇస్తామని పేర్కొందని గుర్తు చేశారు. బీడీ కార్మికులు ఆరు లక్షల మందికి రూ.721 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా ప్రభుత్వం కేవలం రూ.188 కోట్లు కేటాయించిందన్నారు. అంటే 75 శాతం అందడం లేదని, 1.50 వేల మందికి కల్పించిన భృతిలో కూడా కొర్రీలు పెట్టిందని విమర్శించారు. వందల గుళ్లకు ప్రభుత్వం కోట్లకు కోట్లు కేటాయిస్తోందని, కార్మికురాలకు మాత్రం కేటాయించడం లేదని విమర్శించారు. వెంటనే బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ పై పవన్ ట్వీట్లు..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పలు వ్యాఖ్యలు ట్వీట్ చేశారు. ఈసారి కాంగ్రెస్ నేతలపై ట్వీట్స్ చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలు వదిలి పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా లలిత్ మోడీ వివాదానికే పరిమితమయ్యారని పవన్ ట్వీట్స్ చేశారు. 

13:21 - July 13, 2015

హైదరాబాద్ : ఎల్ బినగర్ లో మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. తమ డిమాండ్లు పరిష్కరించాలని గత ఎనిమిది రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. నిరసనలో భాగంగా సర్కిల్ నెంబర్ 3 వద్ద మున్సిపల్ కార్మికులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. అదే సమయంలో టీఆర్ఎస్ నేత గోపాల్ అక్కడకు వచ్చారు. సమ్మె విరమించాలని కార్మికులకు సూచించారు. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కార్మికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆయన్ను నిలదీశారు. దీనితో గోపాల్ అక్కడి నుండి నిష్ర్కమించారు. ఈ తరుణంలో ఆయనపై కోడిగుడ్లతో దాడి జరిగినట్లు తెలుస్తోంది. 

సోనియా ఇఫ్తార్ విందుకు నితీష్..

బీహార్ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చే ఇఫ్తార్ పార్టీలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరవుతున్నారు. ఇందులో ఎలాంటి ప్రాధాన్యం లేదన్నారు. సీఎం కేజ్రీవాల్ తో సమావేశం అవుతానని నితీష్ కుమార్ వెల్లడించారు. 

ఫెరా కేసులో విజయ్ మాల్యాకు సుప్రీం జరిమాన..

న్యూఢిల్లీ : ఫెరా కేసులో యూపీ గ్రూప్ ఛైర్మన్ విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు రూ.10 లక్షల జరిమాన విధించింది. ఫెరా నిబంధనలను అతిక్రమించిన కేసులో తనపై ఉన్న కేసును కొట్టి వేయాల్సిందిగా ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిని విచారించిన సుప్రీం కొట్టివేసింది.

 

శ్రీనగర్ లో వేర్పాటు వాదుల ఆందోళన..

శ్రీనగర్ : వేర్పాటు వాదులు నిర్వహిస్తున్న ఆందోళనను శ్రీనగర్ పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. 

12:47 - July 13, 2015

స్నేహితుడు శింబుకి 'వాలు' చిత్రంతో ఓ మంచి హిట్‌ రావాలనే ఉద్దేశ్యంతో ధనుష్‌ తన 'మారి'చిత్రం విడుదల తేదీని మార్చుకున్న సంగతి తెలిసిందే. కష్టాల్లో ఉన్న స్నేహితుడిని ఆదుకోవడం కోసం ముందుకొచ్చిన ధనుష్‌ని కోలీవుడ్‌ సినిమా వర్గాలు ప్రశంసలతో ముంచెత్తాయి. స్నేహితుడి కోసం ధనుష్‌ ఎలాంటి సపోర్ట్‌ ఇచ్చాడో, అలాగే మాజీ ప్రియుడు శింబు కోసం హన్సిక కూడా అటువంటి సపోర్టే ఇస్తోంది. 'వాలు'చిత్ర షూటింగ్‌ సమయంలో శింబు, హన్సిక ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. దాదాపు సంవత్సరంకిపైగా వీళ్ళ ప్రేమ బాగానే సాగింది. తర్వాత కొన్ని కారణాలతో వీళ్ళిద్దరూ విడిపోయారు. విడిపోయి చాలా రోజులైనా.. ప్రియుడు సమస్యల్లో ఉన్నాడని తెలుసుకుని హన్సిక సపోర్ట్‌ చేయడానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం ఉన్న సమస్యల్ని శింబు ధైర్యంతో జయిస్తాడంటూ ట్విట్టర్‌లో ట్వీట్స్‌ కూడా పెట్టి మాజీ ప్రియుడిపై ఉన్న మమకారాన్ని మరోమారు చాటింది. 
'వాలు' విడుదలకు అడ్డంకి
ఈనెల 17న విడుదల కావాల్సిన శింబు 'వాలు' చిత్రం విడుదలకు మద్రాస్‌ హైకోర్టు స్టే ఇచ్చింది. శింబు, హన్సిక జంటగా 'వాలు' చిత్రం మూడేళ్ళ కిందట ప్రారంభమైంది. ఆ సమయంలో ఈచిత్రానికి సంబంధించి తమిళం, తెలుగు, మళయాళం రైట్స్‌ను ఎన్‌ఐసి ఆర్ట్స్‌ అధినేత చక్రవర్తి పొందారు. ఇప్పుడు ఆ రైట్స్‌ తనకి ఇవ్వకుండా, టి.రాజేందర్‌ తన సొంత సంస్థ శింబు సినీ ఆర్ట్స్‌ ద్వారా విడుదల చేసేందుకు రెడీ అవ్వడంతో చక్రవర్తి మద్రాస్‌ హైకోర్టుని ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు, మరో వారం రోజుల్లో దీనికి సంబంధించి నిర్మాతలు చక్రవర్తికి స్పష్టత ఇవ్వాలంటూ ఈనెల 13కి వాయిదా వేసింది. నేడు కోర్టులో జరిగే వాదోపవాదాలపైనే 'వాలు' భవిత్యవ్యం ఆధారపడి ఉంది.

12:39 - July 13, 2015

2011లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన 'ఫోర్స్‌' చిత్రానికి సీక్వెల్‌గా అభినరు డియోల్‌ దర్శకత్వంలో 'ఫోర్స్‌2' చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత విపుల్‌షా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నాయకానాయికలుగా జాన్‌ అబ్రహం, సోనాక్షి సిన్హాను ఎంపిక చేశారు. సెప్టెంబర్‌ నుంచి షూటింగ్‌ జరుపుకునే ఈచిత్రం 2016లో విడుదల కానుంది. 'తొలిసారి జాన్‌అబ్రహంతో నటిస్తున్నా. 'ఫోర్స్‌2' కథెంతో బాగుంది. హీరోయిన్‌కి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పటివరకు చేయని క్యారెక్టర్‌ని ఈచిత్రంలో చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని సోనాక్షి సిన్హా తెలిపింది. 

ఛత్రినాకలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు..

హైదరాబాద్ : ఛత్రినాకలో నకిలీ కరెన్సీ ముఠా గట్టురట్టైంది. ఇందులో నలుగురు అరెస్టు కాగా రూ.1.54 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

 

ఢిల్లీలో రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శుల సమావేశం..

ఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శుల సమావేశం జరుగుతోంది. 

సండ్ర బెయిల్ పిటిషన్..మొదలైన వాదనలు..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు మొదలయ్యాయి.

ఏసీబీకి చిక్కిన పీఏడీఆర్ డిప్యూటీ తహశీల్దార్..

అనంతపురం : పీఏడీఆర్ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఓ రైతు నుండి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి డిప్యూటి తహశీల్దార్ దావూద్ పట్టుబడ్డాడు.

 

కోటి విలువ ఎర్రచందనం దుంగల స్వాధీనం..

కడప : ఓబులవారిపల్లి (మం) గాదెల అటవీ ప్రాంతంలో దాచిన రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

ఖమ్మంలో కల్వర్టు కింద పేలుడు పదార్థాలు స్వాధీనం..

ఖమ్మం : పాల్వంచ ఇందిరానగర్ వద్ద కల్వర్టు కింద జిలెటిన్ స్టిక్స్, వైర్లు స్వాధీనం చేసుకున్నారు. ఒకసారి వాడిన అక్కడ పారేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. 

ఎంవోబి బాలికల హాస్టల్ లో వికటించిన భోజనం..

విశాఖపట్టణం : రాంబల్లి (మం) ఎంవోబి బాలికల హాస్టల్ లో భోజనం వికటించి 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 

12:27 - July 13, 2015

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులకు ఒక న్యాయం..మున్సిపల్ కార్మికులకు ఒక న్యాయమా అని కార్మిక సంఘ నేతలు ప్రశించారు. తెలంగాణలో తమ డిమాండ్లు పరిష్కరించాలని పారిశుధ్య కార్మికులు గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. నిరసనలో భాగంగా ఖైరతాబాద్ సర్కిల్ నెంబర్ 10 కు పెద్ద ఎత్తున కార్మికులు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. జీహెచ్ఎంసీ కమీషనర్ సోమేశ్ కుమార్ ఇక్కడకు చేరుకుని సమ్మె విరమించాలని కోరారు. వేతనాల పెంపు విషయంలో స్పష్టమైన వైఖరి వెల్లడించాలని కార్మికులు డిమాండ్ చేయడంతో సోమేశ్ కుమార్ తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నేతలు టెన్ టివితో మాట్లాడారు. వేతనాలు..ఇతరత్రా డిమాండ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మెను విరమిస్తామని స్పష్టం చేశారు. వేతనాలు పెంచుతామని సమ్మెను విరమింప చేయాలని కమిషనర్ సోమేశ్ కుమార్ పేర్కొనడం జరిగిందని, జీతాలు ఎంత పెంచుతారని కార్మికులు అడిగిన ప్రశ్నకు సోమేశ్ కుమార్ సమాధానం చెప్పలేదన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నప్పుడు వారి నాయకులతో చర్చించారని, ఆర్టీసీ కార్మికులకు ఒక రూలు..మాకొక రూలా అని పేర్కొన్నారు. ప్రధానంగా మున్సిపల్ కార్మికులు అంటే చాలా తక్కువ అని, అట్టడుగ ఉన్నారనే దృక్పథంలో ప్రభుత్వం ఉందని తెలిపారు. వెంటనే కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

12:17 - July 13, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్టయి బెయిల్ పై విడుదలైన టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోమవారం కోర్టు వాయిదాకు గైర్హాజర్ అయ్యారు. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సింహలు కోర్టు ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్ కు రావద్దని..నియోజకవర్గంలో ఉండాలని హైకోర్టు సూచనలతోనే తాను రావడం లేదని రేవంత్ తరపు న్యాయవాదులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ సీరియస్ అయినట్లు సమాచారం. నగరం తిరగరాదని..సాక్షులను ప్రభావితం చేయవద్దని కోర్టు పేర్కొందని, కోర్టుకు రావద్దు అని పేర్కొనడం లేదని ఏసీబీ కోర్టు పేర్కొంది. వచ్చే నెల మూడో తేదీ వాయిదాకు రేవంత్ హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్ పై మరి కొద్దిసేపట్లో వాదనలు కొనసాగనున్నాయి.
రూ.50లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్..
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలో టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స్టన్ తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50లక్షలు అడ్వాన్స్ ఇస్తూ టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు బహిర్గతమయ్యాయి. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహలను అరెస్టు చేశారు. అనంతరం స్టీఫెన్ స్టన్ తో సీఎం బాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటపడడం కలకలం సృష్టించింది. ప్రధాన నిందితులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 30 రోజుల పాటు రేవంత్ జైల్లో గడిపారు. అనంతరం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నియోజకవర్గం వదిలి రావద్దని..ముగ్గురు నిందితులు పాస్ పోర్టులు సమర్పించాలని..రూ.5లక్షల పూచీకత్తులు సమర్పించాలని హైకోర్టు సూచించింది. 

కార్మికుల సమ్మెపై హెచ్ ఆర్సీలో లాయర్ ఫిర్యాదు..

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మెపై హెచ్ఆర్సీలో లాయర్ రమ్యకుమారి ఫిర్యాదు చేసింది. చెత్తతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కడియం నివాస ముట్టడికి మున్సిపల్ కార్మికుల ప్రయత్నం...

వరంగల్ : డిప్యూటి సీఎం కడియం నివాసానికి ముట్టడికి ప్రయత్నించిన మున్సిపల్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

 

నిందితుడు అరెస్టు...రూ.4లక్షలు స్వాధీనం..

కృష్ణా : వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న వెంకట నారాయణను విసన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. రూ. 4లక్షలు స్వాధీనం చేసుకుని తిరువూరు కోర్టుకు తరలించారు. 

సీఎం క్యాంపు ముట్టడికి ఎన్ఎస్ యుఐ యత్నం..

విజయవాడ : సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి ఎన్ఎస్ యుఐ యత్నించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఎన్ఎస్ యుఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

విచారణకు హాజరు కాని రేవంత్..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీ ఎదుట హాజరు కాలేదు. హైకోర్టు ఆదేశాలతో తాను నియోజకవర్గం వదిలి రాలేనని రేవంత్ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనితో వచ్చే నెల 3వ తేదీన విచారణకు హాజరు కావాలని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 

నడుస్తున్న కారులో బాలికపై అత్యాచారం..

రాజస్థాన్ : జోధ్ పూర్ లో కామాంధులు రెచ్చిపోయారు. నడుస్తున్న కారులో బాలికపై అత్యాచారం జరిపారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 

11:36 - July 13, 2015

హైదరాబాద్ : మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మెపై జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ స్పందించారు. గత ఎనిమిది రోజులుగా కార్మికులు సమ్మె చేపడుతున్న సంగతి తెలిసిందే. సోమవారం సోమేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమ్మె విరమించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సమ్మె విరమిస్తే జీతం విషయంలో రేపే నిర్ణయం వెలువడుతుందని, మెట్రో వాటర్ వర్క్స్ విషయంలో ఎలా చేశారో అలానే ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. తాము చీలిక తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టివేశారు. సమ్మె వల్ల చెత్త పేరుకపోయిందని, వివిధ ప్రాంతాల్లో చెత్తను తీసివేస్తామని మీరు వచ్చి చూడండి అని విలేకరులకు కమిషనర్ సూచించారు. సమ్మె విరమిస్తే పాజిటివ్ గా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. 

పుష్కరాల్లో అదనపు ఛార్జీలు లేవు - సాంబశివరావు..

హైదరాబాద్ : ఏపీలో పుష్కరాల ప్రత్యేక బస్సులకు ఛార్జీల పెంపు లేదని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు పేర్కొన్నారు. పుష్కరాల ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని, సీఎం చంద్రబాబు ఆదేశాలతో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.

 

పాతనవరసపురంలో ఉపాధ్యాయుడి నిర్భందం..

పశ్చిమగోదావరి : నరసాపురం మండలం పాతనవరసపురంలో ఉపాధ్యాయుడిని గ్రామస్తులు నిర్భందించారు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. 

గోద్రాలో ట్యాంకర్ బీభత్సం..నలుగురు మృతి..

గుజరాత్ : గోద్రాలో ఓ ట్యాంకర్ బీభత్సాన్ని సృష్టించింది. జాతీయ రహదారి పక్కన నిలబడి వారి మీద నుండి ట్యాంకర్ దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. 

విశాఖ కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ఆందోళన..

విశాఖపట్టణం : కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 

గవర్నర్ ను కలిసిన మహబూబ్ నగర్ ప్రజాప్రతినిధులు..

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు లిశారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏపీ వైఖరిపై వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

 

తనను బెదిరించే హక్కు ములాయంకు లేదు - అమితాబ్ ఠాకూర్..

లక్నో : తనను బెదిరించే హక్కు ములాయం సింగ్ కు లేదని ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం తనను బెదిరిస్తున్నాడంటూ ఠాకూర్ లక్నోలోని హజ్రత్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఠాకూర్ పై అత్యాచారం కేసు నమోదైంది. 

జమ్మూలో జాతీయ రహదారి మూసివేత..

జమ్మూ కాశ్మీర్ : వరదల కారణంగా జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. రాంబన్ ఏరియాలో కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో రోజు అమర్ నాథ్ యాత్ర నిలిచిపోయింది. మరోవైపు వరదల్లో 10వేల మంది యాత్రికులు చిక్కుకపోయారు.

 

రాజమండ్రికి పెరిగిన యాత్రికుల తాకిడి..

రాజమండ్రి : యాత్రికులు భారీగా వస్తుండడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్, వీఐపీ ఘాట్ ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 171 సీసీ కెమెరాలతో పరిస్థితిని పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

జూట్ మిల్లు తెరిపించాలని కోరుతూ కార్మికుల దీక్షలు..

గుంటూరు : జూట్ మిల్లును తెరిపించాలని కోరుతూ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

 

10:24 - July 13, 2015

హైదరాబాద్ : 'తాము చెత్తలో పని చేస్తాం..కంపు కొడుతున్నా చెత్తను ఏరివేస్తాం..చెత్తను లారీల్లో తరలిస్తాం..కానీ సర్కార్ మాత్రం తమను 'చెత్త'గానే చూస్తున్నారు. ఇలా ఎందుకు చూస్తున్నారో తమకు అర్థం కావడం లేదు'' అంటూ మున్సిపల్ కార్మికులు తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. తెలంగాణలో తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ గత ఎన్నిమిది రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీనితో నగరంలోని పలు ప్రాంతాల్లో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకపోయింది. దీనితో జీహెచ్ఎంసీ ప్రత్యామ్నాయాలు చేపట్టింది. బయటి వ్యక్తులకు డైలీ పేమెంట్ తో చెత్తను ఏరివేసే విధంగా చర్యలు చేపట్టింది. దీనిని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డైలీ పేమెంట్ ఇస్తూ వారితో పనులు చేయిస్తున్నారని, అదే పేమెంట్ ఇస్తే తాము చేయలేమా అని కార్మికులు టెన్ టివితో పేర్కొన్నారు. తాము ఏళ్ల తరబడి పని చేస్తున్నామని, జీతాలు పెంచాలని కోరడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం రాకముందు మున్సిపల్ కార్మికులకు హామీలు ఇవ్వడం జరిగిందని, ప్రస్తుతం దానిని ఎ ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. ఇతరులపై సర్కార్ స్పందిస్తోందని, తమపై మాత్రం కరుణ చూపడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కార్మికులు కోరుతున్నారు. 

10:16 - July 13, 2015

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇమ్మానియేల్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయనికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున కూకట్ పల్లి బాలాజీనగర్ లో అద్దెకు నివాసం ఉంటున్న ఇమ్మానియల్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వరంగల్ లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. వరంగల్ లో రెండు ఎకరాల స్థలం..ఫాం హౌస్, హైదరాబాద్ లో మూడు స్థలాలున్నట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. అలాగే బ్యాంకు డిపాజట్లు, బంగారం..వెండి ఆభరణాలున్నట్లు సమాచారం. సుమారు దీని విలువ రెండు కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ భావిస్తుండగా మార్కెట్ విలువ సుమారు ఐదు కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
అక్రమాస్తులు సంపాదించారనే ఆరోపణలతో సోదాలు - ఏసీబీ..
అక్రమాస్తులు సంపాదించారనే ఆరోపణలు రావడంతో తాము సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారి పేర్కొన్నారు. కోర్టు ద్వారా సెర్చ్ వారెంట్ తో ఈ సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వరంగల్ లో రెండు స్థలాలు..ఇతరత్రా రూ.1.5 కోట్లకు పైగా ఆస్తున్నట్లు తేలిందని, బహిరంగ మార్కెట్ లో వీటి విలువ ఎక్కువగానే ఉంటుందన్నారు. 

మున్సిపల్ జేఏసీ ఆధ్వర్యంలో ఏపీలో పలు ఆందోళనలు..

హైదరాబాద్ : ఏపీ మున్సిపల్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లు, ఆర్డీవో కార్యాలయాల ముట్టడి జరుగనుంది. ఆదివారం రాత్రి నుండి మంచినీటి సరఫరా, అత్యవసర సేవలను నిలిపివేశారు. 

ద్వారకా తిరుమలలో శోభయాత్ర...

పశ్చిమగోదావరి : ద్వారకా తిరుమలలో పుష్కర శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం చిన రాజప్ప, మంత్రులు పీతల సుజాత, మాణిక్యాలరావు పాల్గొన్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో పుష్కర సందడి..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాల సందడి మొదలైంది. పుష్కరాలకు ఇంకా ఒక రోజు మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, నరసాపురం, ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పర్ణశాలలో ఈ రోజు తెల్లవారుజాము నుండే భక్తులు పుష్కరఘాట్లకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. 

బాసరలో మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి..

ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి బాసర పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 70 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి.

 

పుష్కరయాత్రలో అపశృతి..

విశాఖపట్టణం : పుష్కర యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. సింహాచలం నుండి పుష్కరాలకు వెళుతుండగా పైనాపిల్ కాలనీ సమీపంలో కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వీరంతా చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. 

పేస్, సుమిత్ లకు జైట్లీ శుభాకాంక్షలు..

ఢిల్లీ : టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ పేస్, సుమిత్ నాగల్ కు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుభాకాంక్షలు అందచేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో మిక్స్ డ్ డబుల్స్ లో లియాండర్ పేస్, బాలుర డబుల్స్ ఫైనల్ లో సుమిత్ నాగల్ లు విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

09:22 - July 13, 2015

హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. దీనితో నగరంలోని పలు ప్రాంతాల్లో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకపోతోంది. దుర్ఘందం వ్యాపిస్తుండడంతో నివాశిత ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నగరంలోని బాగ్ లింగంపల్లి పార్కు నిత్యం వాకర్స్..చిన్న పిల్లలతో సందడిగా ఉండేది. ప్రస్తుతం అక్కడ ఘోరమైన పరిస్థితి నెలకొంది. పార్కుకు సమీపంలో చెత్త భారీగా పేరుకపోయింది. సుమారు ఐదు లారీల సరిపడా చెత్త పేరుకపోతుండడంతో పార్కుకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది పార్కుకే రావడం లేదు. తాము ఇక్కడకు రావాలంటేనే భయంగా ఉంటోందని, చెత్త పేరుకపోవడంతో దుర్ఘందం వ్యాపిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 

09:15 - July 13, 2015

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లోని ఉప్పరపల్లిలో వివాహిత కిడ్నాప్ మిస్టరీ విడింది. వివాహిత..నిందితుడిని కోల్ కతాలో పట్టుకున్నారు. ఈనెల ఆరవ తేదీన వివాహిత కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. అనంతరం మహిళను అపహరించిన దుండగుడు ఆమె ఫోటోలు వాట్సప్ ద్వారా భర్తకు పంపించి లక్షల్లో నగదు డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సెల్ ఫోన్ టవర్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. విశాఖపట్టణం నుండి నిందితుడు కోల్ కతాకు వెళ్లినట్లు ఎస్ ఓటి పోలీసులు నిర్ధారించారు. అనంతరం ప్రత్యేక విమానంలో వెళ్లిన పోలీసులు కోల్ కతాలో ఓ నివాసంపై దాడి చేసి వివాహితను విడిపించారు. నిందితుడిని..మహిళను తీసుకుని మంగళవారం తెల్లవారుజామున ఎస్ వోటి పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. అనంతరం బాధితురాలి భర్తకు సమాచారం అందించారు. నిందితుడు..ఆ వివాహితకు గతంలో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు బీహార్ రాష్ట్రానికి చెందిన వాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

రఘుబీర్ నగర్ లో రాహుల్..

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రఘుబీర్ నగర్ లోని వీధి వ్యాపారులతో మాట్లాడారు. తమ ప్రాంతానికి రావాలని కోరడంతో తాను వెళ్లినట్లు రాహుల్ పేర్కొన్నారు. వీరంతా దేశానికి చెందిన వారని గుజరాత్, లేదా ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదని, వీరి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతానని ఈ సందర్భంగా రాహుల్ పేర్కొన్నారు.

08:38 - July 13, 2015

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సమ్మె ఎనిమిదో రోజుకు చేరడంతో నగరంలోని ప్రాంతాలు చెత్తమయంగా మారాయి. కార్మికులు చేస్తున్న డిమాండ్లు సరైనవేనని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలు..మున్సిపల్ కార్మికుల సమ్మె..ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ తదితర అంశాలపై ఆయన టెన్ టివిలో 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో విశ్లేషణ చేశారు. ఆయన మాటల్లోనే...
నీళ్లేక్కడ ?
''పుష్కరాలు విజయవంతం కావడానికి భక్తుల భక్తి శ్రద్ధలే కారణమవుతాయి. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రుతుపవనాలు అదృశ్యమయ్యాయి. గోదావరి మహారాష్ట్ర నుండి బాసర మీదుగా ప్రవహిస్తుంటుంది. నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఒక్కటే ఉంది. ఇంద్రావతి, ప్రాణహిత కలిసిన తరువాతే గోదావరి ఉధృతి పెరుగుతుంది.
మహారాష్ట్ర నీళ్లు విడుదల చేయాలి..
కానీ ఇక్కడ మహారాష్ట్ర జల చౌర్యానికి పాల్పడుతోందని గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అఖిలపక్షం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అక్కడి రాష్ట్రం బాబ్లీయే కాక 1-2 టీఎంసీల ఆపుకోగలిగే నిర్మాణాలు చేస్తోంది. వాటర్ ను డైవెర్ట్ చేసి ఎప్పటికప్పుడు తీసుకెళుతుంటారు. మహారాష్ట్ర గవర్నర్ తో మాట్లాడడం జరిగిందని టీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ అక్కడ గవర్నర్ నిర్ణయం తీసుకోరు. సీఎం నిర్ణయం తీసుకుంటారు. పవిత్ర సమయంలో కావాల్సిన నీటిని విడుదల చేయడానికి మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం సహేతుకం కాదు. గైక్వాడ్ ప్రాజెక్టు నుండి బాబ్లీ గేట్లు ఎత్తివేస్తే నీరు వచ్చే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులు..భౌగోళికంగా కాళేశ్వరం ఎగువన ప్రాంతంలో నీరు ఉండకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. పెనుగంగ, ఆదిలాబాద్ లో ఉన్న చిన్న చిన్న వాగుల పనులు కొన్ని పూర్తయ్యాయి. కొన్ని కాలేదు. జిల్లాకు రెండు వేల కోట్లు కేటాయిస్తే మరో కృష్ణా జిల్లా అవుతుంది. ఇక్కడ ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. పవిత్ర గోదావరి ప్రజల గోదావరి అని ప్రజలు ప్రతిజ్ఞ చేయాలి. ఇచ్చంపల్లి ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. ఇచ్చంపల్లి సగం తెలంగాణను సస్యశ్యామలం చేసేది
మున్సిపల్ కార్మికుల సమ్మె..
యాదగిరి లక్ష్మినరసింహ స్వామి ఎలాంటి స్ట్రైక్ చేయలేదు. పారిశుధ్య కార్మికులు దేవుళ్లు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కానీ ఆ దేవుడికి ఐదొందుల కోట్లు ఇచ్చారు. ఈ దేవుళ్లకు రూ.30 కోట్లు ఇవ్వలేదు. దైవత్యం అవసరం లేదు. మనిషిగా బతికేలా చూడండి అంటున్నారు. వాళ్లు అడిగింది న్యాయమే. ఒక ఎమ్మెల్యేకు ఇంటి అద్దెలో సగం అడుగుతున్నారు. పారిశ్రామిక వేత్తల కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం ఇచ్చి వారికి పరిష్మన్ లు ఇస్తారు. కార్మికులను సీఎం కార్యాలయానికి ఎందుకు పిలవరు. ఈ విషయం ఏపీ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది. ఆ రాష్ట్ర సీఎం ఇటీవల విదేశాల్లో పర్యటించారు. జపాన్..సింగపూర్..చైనా దేశాల్లో మున్సిపల్ కార్మికుల పరిస్థితి ఇలానే ఉందా ? స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో నేతలు..సెలబ్రిటీలు ఫోజులు ఇస్తూ గతంలో హడావుడి చేశారు. అంబాసిడర్ లను కూడా నియమించారు. వీరంతా ప్రస్తుతం ఎక్కడ పోయారు ? వీళ్లందరూ మున్సిపల్ కార్మికులు పని చేస్తున్న సమయంలో పని చేశారు. ఇప్పుడు రండి. చీపురు పట్టిన పేదవాడికి జీతం ఇవ్వండి అప్పుడే స్వచ్ఛ హైదరాబాద్ అవుతుంది.
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్..
తెలంగాణ జనాభాలో ముస్లింలు, గిరిజనులు కలిపితే అది 25 శాతం అవుతుంది. అందులో ముస్లింలు 40 శాతం హైదరాబాద్ లో ఉంటారు. భూమి లేని వారిలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. అసంఘటిత రంగ కార్మికులు ఎక్కువగా ఉంటారు. వారి జీవితం బాగు చేయడానికి కృషి చేయాలి. 12 శాతం రిజర్వేషన్ కల్పించడంలో ఇబ్బందులున్నాయి. మతప్రాదికన రిజర్వేషన్ ఇవ్వడం ప్రమాదకరం. చేపలు..బట్టలు..ఇతర వ్యవహారాల్లో హిందువుడికి రిజర్వేషన్ ఉంటుంది. అదే పని చేసే ముస్లింకు మాత్రం రిజర్వేషన్ ఉండదు. ముస్లింల్లో కూడా నిర్ధిష్టమైన వెనుకబాటుతనాన్ని గుర్తించి ఆ విధంగా రిజర్వేషన్లు కల్పిస్తే అది రాజ్యాంగ బద్ధం అవుతుందని కమిటీలు పేర్కొన్నాయి''. అని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇమ్మానియేల్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయనికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో కూకట్ పల్లిలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

 

07:52 - July 13, 2015

మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. సమ్మె విరమిస్తేనే..సమస్యలు పరిష్కరిస్తామని పట్టుదలకు పోతోంది. సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తానని ఏడు కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు వ్యాపం స్కాంలో సీఎం చౌహాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ స్కాంపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ కుంభకోణంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంలోని రాజకీయ నేతలు..బ్యూరోక్రాట్ల పాత్ర ఇమిడి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు) అనీల్ (కాంగ్రెస్), ఆచారి (బీజేపీ), తాడూరీ శ్రీనివాస్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

వ్యాపం స్కాంపై నేడు సీబీఐ విచారణ ?

భోపాల్ : వ్యాపం స్కాంపై సీబీఐ నేటి నుండి విచారణ చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భోపాల్ లో సీబీఐ అధికారులు పర్యటిస్తారని సమాచారం.

ఢిల్లీలో వీధి వ్యాపారులతో రాహుల్..

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం ఉదయం రఘుబీర్ నగర్ లో ఉన్న ఆలయాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలోని వీధి వ్యాపారులతో రాహుల్ మాట్లాడారు. 

07:42 - July 13, 2015

గోదావరి నదికి పన్నెండేళ్లకొకసారి వచ్చే పుష్కరాల సందడి జోరందుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కొన్ని కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేస్తారన్న అంచనాలతో ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. గోదావరి నది ప్రవహించే ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ పన్నెండు రోజుల్లో కొన్ని కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేస్తారన్న అంచనాలున్నాయి. ఇంతమందికి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడమన్నది చిన్నవిషయమేమీ కాదు. ఎక్కడా ఏ అపశృతి జరగకుండా చూడడం ప్రభుత్వ యంత్రాంగం సమర్ధతకు గీటురాయి కాబోతోంది.
అనేక సెంటిమెంట్లు..నమ్మకాలు..
పుష్కరాల చుట్టూ అనేక నమ్మకాలు, సెంటిమెంట్లు వున్నాయి. నదిలో స్నానమాచరించడం, పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం ఈ పుష్కరాల్లో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం. ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి సంప్రదాయాలు వారివి. పుష్కరాల సమయంలో వివిధ రకాల సెంటిమెంట్ల మీద నమ్మకంతోనో, సహసిద్ధమైన ఉత్సుకతతోనో, వాటికి లభిస్తున్న ప్రచారం వల్లనో అనేక మంది పుష్కర యాత్రకు, నదీస్నానాలకూ సన్నద్ధమవుతున్నారు. కారణం ఏదైనా కాంక్రీట్‌ జంగిల్‌ లాంటి మహానగరాల్లో జీవించేవారు సైతం ఈ పన్నెండు రోజులు నదీమతల్లితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనుసంధానమవుతున్నారు. నదుల వల్ల, వాటి సహజ ప్రవాహం వల్ల మనందరికీ జరుగుతున్న మేలు గురించి, వాటిని మనం నాశనం చేసుకుంటున్న తీరు గురించి, దానివల్ల జరుగుతున్న అనర్ధాల గురించి మాట్లాడుకోవడానికి ఇదొక చక్కని సందర్భం. ఇంతమంది ప్రజలు నదులు స్నానమాచారించేందుకు బయలుదేరుతుంటే చాలా చోట్ల కాళ్లు కడుక్కుని, నెత్తిన చల్లుకోవడానికైనా కాసిన్ని నీళ్లు లేని పరిస్థితి ఎందుకు దాపురించిందో సీరియస్‌ గా ఆలోచించాల్సిన సమయమిది. కొద్దిపాటి నీళ్లైనా ఎంత పరిశుభ్రంగానూ, స్వచ్ఛంగానూ వున్నాయన్నది మరో ప్రశ్న.
గలగలాపారుతూ, ఆహ్లాదాన్ని పంచాల్సిన నదులు, కాలకూట విషంగామారి, మన ముక్కుపుటాలు భరించలేనంత దుర్గంధాన్ని వెదజల్లుతున్న దృశ్యమే చాలా చోట్ల కనిపిస్తోంది. మానవ నాగరికతా వికాసానికి కేంద్ర బిందువులుగా పనిచేసిన నదులు ఇప్పుడు ఇలా ఎందుకు కాలకూట విషంగా మారాయో అవలోకించాల్సిన సందర్భమిది. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కర సమయంలో తప్ప మిగిలిన రోజుల్లో నదుల గురించి, వాటి స్వచ్ఛత గురించి, ఆలోచించకపోవడం మన బలహీనత. ఇప్పటికైనా అలాంటి బలహీనతలను అధిగమించి, మన నదుల పరిశుభ్రతను కాపాడేందుకు ప్రయత్నించకపోతే, మనం చేసుకునే పుష్కరాలకు అర్ధం వుండదు. 

వీడిన రాజేంద్రనగర్ వివాహిత కిడ్నాప్..

హైదరాబాద్ : రాజేంద్రనగర్ ఉప్పరపల్లి వివాహిత కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడింది. కోల్ కతాలో కిడ్నాపర్ ను పోలీసులు అరెస్టు చేసి వివాహితకు విముక్తి కల్పించారు. నేడు వివాహితను హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది.

 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటలు..నడక దారి భక్తులకు ఐదు గంటల సమయం పడుతోంది.

07:16 - July 13, 2015

రేపటి నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ పన్నెండు రోజులూ భారీ సంఖ్యలో భక్తులు ఒక చోట చేరబోతున్నారు. అయితే, ఇలాంటి సమయంలో యాత్రికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? పుష్కరాలకీ, మానవ జీవితాలకీ ఉన్న సంబంధం ఏమిటి? మానవ నాగరికతా వికాసంలో నదుల పాత్ర ఏమిటి? ఇలాంటి అంశాలపై టెన్ టివి జనపథంలో జనవిజ్ఞాన వేదిక నేత శంకరయ్య విశ్లేషించారు. 

ద్వారకా తిరుమలలో పుష్కర శోభాయాత్ర..

పశ్చిమగోదావరి : నేడు ద్వారకా తిరుమల నుండి పుష్కర శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరు కానున్నారు. 

నేడు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు..

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగనున్నాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో పెంచిన బస్సు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తోంది.

 

నేడు సానియా ఇఫ్తార్ విందు..

ఢిల్లీ : నేడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు పార్టీల నేతలు హాజరు కానున్నారు. 

సాయంత్రం ధర్మపురికి సీఎం కేసీఆర్..

కరీంనగర్ : సాయంత్రం నాలుగు గంటలకు ధర్మపురికి సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. మంగళవారం ధర్మపురి వద్ద కేసీఆర్ పుష్కర స్నానం చేయనున్నారు.

 

ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె..

హైదరాబాద్ : ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. నేటి నుండి నీటి సరఫరా, వీధి దీపాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. 

06:46 - July 13, 2015

ఇంగ్లండ్ : అనుకున్నట్లే జరిగింది. హేమాహేమీల పోరు హోరాహోరీగా సాగింది. ఉత్కంఠ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్‌కే వింబుల్డన్‌ టైటిల్ దక్కింది. పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో...సెర్బియన్ సెన్సేషన్‌ జకోవిచ్ గెలిచాడు. స్విస్ ఏస్ ఫెదరర్‌ను ఓడించి కెరీర్లో మూడో వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ సెంటర్‌ కోర్టులో హాట్‌ ఫేవరేట్ల ఫైట్ హాట్‌హాట్‌గా సాగింది. టైటిల్ ఫైట్లో డిఫెండింగ్ ఛాంపియన్‌, టాప్ సీడ్‌ నొవాక్ జకోవిచ్‌ మరోసారి సత్తాచాటాడు. వరుసగా రెండోసారి వింబుల్డన్‌ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలిచాడు. ఫైనల్‌ పోరుతో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ను బోల్తాకొట్టించి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.
7-6, 6-7, 6-4, 6-3 తేడాతో విజయం..
ఫైనల్‌లో ఫెదరర్‌పై జకోవిచ్ 7-6, 6-7, 6-4, 6-3 తేడాతో విజయం సాధించాడు. తొలిసెట్‌లో ఫెదరర్‌ ముందంజలో కనిపించినా చివరకు ఆ సెట్‌ టై బ్రేక్‌కు దారితీసింది. ఆ టైమ్‌లో జోకోవిచ్ రెచ్చిపోయాడు. టై బ్రేక్‌లో ఒకేఒక్క పాయింట్ చేజార్చుకున్న జోకోవిచ్‌...ఆ సెట్‌ను వశపరుచుకున్నాడు. ఇక రెండో సెట్‌ చేరేసరికి...ఇరువురి మధ్య ఫైట్‌..యుద్ధాన్ని తలపించింది. నువ్వా-నేనా...అన్నట్లు సాగిన రెండో సెట్‌ కూడా టై బ్రేక్‌కు వెళ్లింది. ఐతే ధాటిగా ఆడిన ఫెదరర్ రెండో సెట్‌ను దక్కించుకొని...స్కోరును సమం చేశాడు. స్కోర్లు సమం కావటంతో టైటిల్ ఫైట్‌లో మరింత ఉత్కంఠ పెరిగింది. కీలకమైన మూడో సెట్లో డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్‌ పైచేయిసాధించి ఆధిపత్యం దిశగా దూసుకుపోయాడు. ఆ తర్వాత జోవోవిచ్‌కు ఎదురులేకుండాపోయింది. నిర్ణయాత్మక నాలుగో సెట్లో దూకుడుగా ఆడి...ఫెదరర్‌ను ఓడించాడు.
మూడోసారి వింబుల్డన్‌ టైటిల్‌..
జకోవిచ్ కెరీర్‌లో మూడోసారి వింబుల్డన్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అంతేకాకుండా తొమ్మిదోసారి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ను నెగ్గాడు. మరోవైపు వరుసగా రెండోసారి ఫెదరర్‌కు ఓటమి తప్పలేదు. 18వ గ్రాండ్‌ స్లామ్‌ సాధించాలన్న ఫెదరర్ ఆశ నెరవేరలేదు. 

06:45 - July 13, 2015

బీహార్ : త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్‌పై రాజకీయ పార్టీల ఫోకస్ మొదలైంది. యుద్దానికి సన్నద్దం అయ్యేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఎప్పటిలాగే ఈసారీ అక్కడ కులరాజకీయాలే రాజ్యమేలేలా కనిపిస్తున్నాయి. వ్యూహాలు పన్నటంలో దిట్టగా పేరొందిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా బీహార్‌లో అపుడే వ్యూహాల అమలు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో అత్యధికంగా వున్న వెనకబడిన తరగతుల ఓట్లు కొల్లగొట్టడానికి ఓబీసీ మంత్రం జపిస్తున్నారు. దేశంలోనే తొలి ఓబీసీ ప్రధాని నరేంద్రమోదీ అని... బీజేపీ హయాంలోనే వెనకబడిన వర్గాలకు మేలు జరిగిందని ప్రచారం చేస్తున్నారు.
బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రత్యర్థి వర్గం..
బీజేపీ ప్రచారాన్ని ప్రత్యర్థి వర్గమైన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి తిప్పికొట్టింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసమే మోడీ బీసీ కార్డును బీజేపీ తెరపైకి తెస్తోందని విమర్శించింది. గతంలో ప్రధానులుగా పనిచేసిన చౌదరి చరణ్‌సింగ్, దేవెగౌడ వెనకబడిన తరగతులకు చెందినవారేనని గుర్తు చేసింది. సమాజంలో మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టడం కమలనాథులకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేసింది. సామాజిక, ఆర్థిక, కులగణన రిపోర్టును కేంద్రం ఎందుకు బహిర్గతం చేయలేకపోయిందని ప్రశ్నించింది.
మొత్తానికి రెండు వర్గాలూ కుల రాజకీయాలనే టార్గెట్ చేశాయి. మరి వారి పాచికలు పారుతాయా? ప్రజలు ఎవరికి జైకొడతారు? ఎవరిని అందలం ఎక్కిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే... ఇంకొంత కాలం వేచి వుండాల్సిందే.

06:44 - July 13, 2015

తుర్కెమెనిస్థాన్ : మధ్య ఆసియా దేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. తుర్కెమెనిస్థాన్ పర్యటన ముగించుకున్న మోడీ ఆదివారం ఉదయం కిర్గిజిస్థాన్ చేరుకున్నారు. అక్కడ భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. తర్వాత కిర్గిజిస్థాన్ అధ్యక్షుడితో మోడీ సమావేశమయ్యారు. వాణిజ్యం, పర్యాటకం, మానవ వనరులు సహా ఇతర రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలని, ఏటా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత ఇరు దేశాలకు చెందిన ఉత్యున్నత స్థాయి బృందం సమావేశమైంది. కీలక అంశాలపై చర్చించింది. కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం స్థానిక ఆస్పత్రులను మోడీ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ఆస్పత్రులకు వైద్య పరికరాలు అందజేశారు.

06:32 - July 13, 2015

హైదరాబాద్ : మున్సిపల్ కార్మికుల సమ్మెతో హైదరాబాద్ నగరం డర్టీసిటిగా మారిపోయింది. స్వచ్ఛ్ హైదరాబాద్ సూత్రం మురుగుకాల్వలో కలిసిపోయి కంపు కొడుతోంది. ప్రభుత్వం బెట్టు, కార్మికుల డిమాండ్ల మధ్య రాజధాని నగరం కళావిహీనంగా మారింది. మరి స్వచ్ఛ్ హైదరాబాద్, పచ్చదనం పరిశుభ్రత అంటూ నెలరోజుల క్రితం ఊదరగొట్టిన నేతలు ఇప్పుడు ఏమయ్యారు.. హైదరాబాద్ రోడ్లను అద్దంలా మారుద్దాం, పరిశుభ్రత అందరి బాధ్యత అంటూ లెక్చర్లిచ్చిన నేతలు ఇప్పుడెక్కడున్నారు ?.
ఫోజులిచ్చిన సెలబ్రిటీలు..నేతలు..
స్వచ్ఛ్ హైదరాబాద్ లో గతంలో కెమెరాల ముందు నేతలు, టాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు చేసిన హంగామా. నగరం పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని ప్రసంగాలు దంచిన వాళ్లు వీరంతా. చేతిలో చీపురుతో అలా ఇలా ఊడ్చి మీడియా ముందు హల్చల్‌ చేసి ఫోటోలు దిగి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. భాగ్యనగరం పరిశుభ్రంగా ఉండాలి అందరూ చేతులు కలపాలంటూ ప్రతిజ్ఞలు చేయించారు. స్వచ్ఛమైన నగరం కోసం ఇంత హంగామా చేసిన వాళ్లంతా ప్రస్తుతం ఎక్కడున్నారు.
భారీగా పేరుకపోయిన చెత్త..
మున్సిపల్ ఉద్యోగుల సమ్మెతో వారం రోజులుగా హైదరాబాద్ నగరంలో భారీగా చెత్త పేరుకు పోయింది. రోజూ టన్నుల కొద్ది చెత్త.. వీధుల్లో ప్రత్యక్షమవుతోంది. అదే కంపులో నగర ప్రజలు ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థతి. ఇక వర్షం వస్తే ఈ చెత్త పుణ్యమా అని వచ్చే సీజనల్ వ్యాధులతో కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ మన ప్రజా ప్రతినిధులకు తెలియనివి కాదు. మరి భాగ్యనగరం ఇంత కంపు కొడుతుంటే స్వచ్ఛత గురించి మాట్లాడిన వీరంతా ఎందుకు ఉలకరు... పలకరు.
ఏ ఒక్కరు చేతిలోకి చీపురు ఎందుకు తీసుకోరు. ?
స్వచ్ఛ హైదరాబాద్ లో అంత ప్రేమే ఉంటే... ఇప్పుడు హైదరాబాదు చెత్త పేరుకుపోయి కంపుకొడుతోంది. నాడు ఉపన్యాసాలతో ఊదరగొట్టిన ఏ ఒక్కరు చేతిలోకి చీపురు తీసుకోరు ఎందుకు? నాడు చేతిలో చీపురు పట్టుకొని లెక్చర్ ఇచ్చిన నేతలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. నగరం సమస్యల్లో ఉంటే ఎందుకు స్పందించడం లేదు. నేతలు, సెలబ్రిటీలు గతంలో చేసిన హంగామా చూసి ఇప్పుడు వారి మౌనం చూస్తుంటే... వారిదంతా ప్రచారం కోసం చేసిన ఆర్భాటమా అన్న అనుమానాలు నిజమేననిపిస్తోంది. అందమైన భాగ్యనగరం కోసం కలలు కనే నేతలైతే ఎవరూ ఇలా చేతులు ముడుచుకొని కూర్చోరు.
ఇప్పుడైనా చీపురులు పడుతారా ?
స్వచ్చ హైదరాబాద్ పై తమది నిజమైన బాధ్యతే అనుకుంటే... ఇప్పుడు మీరు చీపురు చేతబట్టే సమయం ఆసన్నమయిందని, నేతలు, సెలబ్రిటీలు... ఇకనైనా మేల్కొనండనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగర చెత్త కంపును వదిలించండి.... చెత్తను ఎత్తి సెల్ఫీలు తీసుకుని ప్రచారం చేసుకోండనే పలువురు సూచనలు కూడా చేస్తున్నారు. 

06:31 - July 13, 2015

కృష్ణా : తహశీర్దాల్‌ వనజాక్షికి న్యాయం జరిగిందా..? చింతమనేని ప్రభాకర్‌రావును ఏపీ సీఎం గట్టిగా మందలించారా...? ఇకమీదట అధికారుల జోలికి వెళ్లాలంటే నాయకులు బయపడతారా..? అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా బుద్ధిగా ఉంటారా..? చంద్రబాబు ఇచ్చిన తీర్పు ఓసారి చూస్తే ఏం జరుగుతుందో కళ్లకు కడుతుంది.
అండగా నిలిచిన రెవెన్యూ ఉద్యోగులు..
కృష్ణా జిల్లాలో రేగిన ఇసుక తఫానులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయాలు పక్కనపెడితే.. మహిళా అధికారి పట్ల ఓ ప్రజాప్రతినిధి వ్యవహరించిన తీరు దుమారం రేపింది.. అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే తన అనుచరులతో దాడి చేయించడం చర్చనీయాంశమైంది. తీవ్రమనస్థాపం చెందిన తహశీల్దార్‌ న్యాయం కోసం ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఆమెకు మద్దతుగా ఆందోళనకు దిగిన రెవెన్యూ సంఘాల ప్రతినిధులు సైతం బాబుతో భేటీ అయ్యారు.. వాళ్ల వాదనలు విన్న ఏపీ సీఎం సీనియర్‌ ఐఏఎస్‌ నేతృత్వంలో విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చి శాంతింపజేశారు.
చింతమనేనికి క్లీన్‌చిట్‌ ఇచ్చిన సీఎం..
జపాన్‌ టూర్‌ నుంచి ఢిల్లీ.. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చిన చంద్రబాబుకు ఇసుక రగడ చికాకు తెప్పించింది. ఎమ్మెల్యే చింతమనేనిని బాబు గట్టిగా మందలిస్తారని రెవెన్యూ ఉద్యోగులు భావించారు. కానీ, సీన్‌ మొత్తం రివర్స్‌ అయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న చింతమనేని ప్రభాకర్‌రావును కనీసం వివరణ కూడా అడిగిన దాఖలాలు కనిపించలేదు. ప్రజాప్రతినిధిగా పరిధులు దాటారని మందిలించిందీ లేదు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారితో విచారణ జరిపిస్తానన్న బాబు ఆ దిశగా అడుగు పడకుండానే వనజాక్షిదే తప్పని తీర్పు ఇచ్చేశారు. రాజమండ్రిలో పుష్కర పనులను సమీక్షించిన సీఎం చింతమనేనికి క్లీన్‌ చిట్‌ ఇచ్చారు.
అధికారులకు తలంటిన చంద్రబాబు..
వనజాక్షి లాంటి సమస్యలు మరోసారి తలెత్తకుండా చూడాలంటూ బాబు అధికారులకు తలంటారు. తప్పంతా తహశీల్దార్‌దే అన్నట్లు మాట్లాడారు. ఇక ముందు అధికారపక్ష నాయకులు ఏం చేసినా చూసీచూడనట్లు వెళ్లాలనే సంకేతాలిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి. పైగా వనజాక్షి కోసం రెవెన్యూ అధికారులంతా నిరసన తెలపడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు చంద్రబాబు.
అక్రమాలను అడ్డుకునేందుకు సాహసించరా..?
చంద్రబాబు తీరు చూస్తే అధికారుల కన్నా అధికార పార్టీ నేతలే ముఖ్యమన్నట్లుగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.. దురుసుగా ప్రవర్తించిన చింతమనేని పల్లెత్తుమాట కూడా అనకడపోవడం విమర్శలకు తావిస్తోంది.. ఈ ఘటనతో అక్రమాలను అడ్డుకోవాలనుకునే అధికారుల మనోధైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు పరిశీలకులు.. రాష్ట్రంలో అధికార పక్ష నేతల అండతో ఇసుక మాఫియా చెలరేగుతుందన్న తమ ఆరోపణలు నిజమవుతున్నాయంటున్నారు విపక్ష నేతలు.

06:30 - July 13, 2015

హైదరాబాద్ : 45 ఏళ్ల క్రితం ఉదయించిన ప్రశ్న. చరిత్రాత్మక పోరాటాన్ని జనబాహుళ్యంలోనికి తీసుకువెళ్లింది. జడలు విప్పి వికట్టాటహాసం చేసే సామ్రాజ్యవాదంపై అలుపెరగని పోరు చేసేలా చేసింది. అయినా ఇప్పుడు మళ్లీ అదే ప్రశ్న సమాజం పైకి దూసుకొచ్చింది. అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతున్న ఈ పాలనలో కింకర్తవ్యాన్ని గుర్తుచేస్తోంది. కవులు,కళాకారులు, బుద్దిజీవులు అంతా కొలువై ఉన్న ఉత్సవ సమయం. ఈ తరుణంలోనే విశాఖ విద్యార్ధులు వేసిన ప్రశ్న రచయితలారా మీరెటు వైపు..? పొరుగునే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీ సమాజంపై పెట్టుబడి, వడ్డీ వ్యాపార వర్గాలు చేస్తున్న హింసకు వ్యతిరేకంగా విద్యార్ధిలోకం సంధించిన ఈ ప్రశ్న వాయువేగంతో దూసుకొచ్చింది. ఇదే ప్రశ్న విప్లవ రచయితల సంఘం ఆవిర్భావానికి నాంది పలికింది.
తెలుగు రాష్ట్రాధినేతల పాలన పై మండిపాటు..
45ఏళ్ల క్రితం ఉద్భవించిన ఆ ప్రశ్ననే విరసం మరోసారి సంధిచింది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిర్భావ సభను జరుపుకున్న విరసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు అనుసరిస్తున్న పంథాను తూర్పార పట్టింది. తెలుగురాష్ట్రాల్లో అభివృద్ధి మాటున అరాచకం రాజ్యమేలుతోందంటూ విరసం సభ్యులు మండిపడ్డారు.ఇలాంటి తరుణంలో సామాన్యుల్లో చైతన్యం కల్గించాల్సిన కొందరు రచయితలు మౌనం వహిస్తున్నారని, అందుకే రచయితలారా మీరెటు వైపు అని మళ్లీ ప్రశ్నిస్తున్నట్లు విప్లవ కవి వరవరరావు చెప్పారు. రెండు విడతలుగా జరిగిన ఈ సెషన్‌లో ఇటీవలే ఎన్‌కౌంటర్‌లో మరణించిన వివేక్‌ పై విరసం ప్రచురించిన సాహిత్యంతో పాటు అనేక పుస్తకావిష్కరణలు, ప్రజాసమస్యలపై చర్చలు జరిగాయి.ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక పలు రాష్ట్రాలకు చెందిన రచయితలు, సాహిత్యాభిమానులు హాజరయ్యారు.

06:29 - July 13, 2015

హైదరాబాద్ : మున్సిపల్ సమ్మెతో తెలుగు రాష్ట్రాలు కంపు కొడుతున్నాయి. ప్రభుత్వాల బెట్టుతో.. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోడ్లపైకి వెళ్లాలంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. సమ్మె చేపట్టి వారం గడుస్తున్న ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం దిమ్మ తిరిగేలా సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించాయి. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ఉధృతం చేయనున్నారు కార్మికులు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కర విధులకు కూడా దూరంగా ఉండాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది.
గుట్టలు గుట్టలుగా చెత్త..
జంట నగరాల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. వీధులు, రహదారులు దుర్గంధంతో నిండిపోయాయి. రోడ్లపైకి వెళ్లాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. జనావాసాల మధ్య కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన వ్యర్థాలతో నగరవాసుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. భాగ్య నగరంలో తాజా పరిస్థితిపై జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ సోమేష్ కుమార్... టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. మరోవైపు చార్మినార్ వద్ద పోలీసులు మరోసారి స్వచ్ఛ్ హైదరాబాద్ నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో.. చెత్త బాగా పేరుకుపోవడంతో... ఉదయమే.. చెత్తతొలగించే పని చేపట్టారు. అయితే వీరిని గమనించిన జీహెచ్ఎంసీ కార్మికులు పోలీసులను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఏపీలోనూ..
అటు ఆంధ్రప్రదేశ్ లోనూ సమ్మె కొనసాగుతోంది. అన్ని జిల్లాలో కార్మికులు విధులు బహిష్కరించి.. ఆందోళనలు నిర్వహించారు. చర్చల పేరుతో కార్మికులను అవమాన పరిచేలా మంత్రులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ విజయవాడలో ధర్నాకు దిగారు. కర్నూలులో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... కొండారెడ్డి బురుజు వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అటు పుట్టపర్తిలోనూ కార్మికులు... ర్యాలీ నిర్వహించి... ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

నేడు ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో బెయిల్ పై విడుదలైన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సింహాలు సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరు కానున్నారు. 

సండ్ర బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్టయి..జైలులో ఉన్న టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం విచారణకు రానుంది.

 

ఎనిమిదో రోజుకు చేరిన మున్సిపల్ సమ్మె...

హైదరాబాద్ : తమ డిమాండ్ల సాధనకై మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. తమ నిరసనలో భాగంగా నేడు మున్సిపల్ కార్యాలయాల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. 

నేడు విచారణకు అఫిలియేషన్ల కేసు...

హైదరాబాద్ : ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల అఫిలియేషన్ల కేసు సోమవారం హైకోర్టులో విచారణకు రానున్నది. ఎంసెట్ కౌన్సెలింగ్ ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందోనని కాలేజీలు, ప్రభుత్వం, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

వింబుల్డన్ విజేత జకోవిచ్..

లండన్ : వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్ లో సెర్బియా ఆటగాడు జకోవిచ్ విజేతగా నిలిచాడు. ఫెదరర్ పై 7-6, 6-7, 6-4, 6-3 తేడాతో విజయం సాధించాడు.  

పేస్ - హింగీస్ జోడికి వింబుల్డన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్...

లండన్ : ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఆదివారం జరిగిన మిక్స్ డ్ డబుల్స్ లో లియాండర్ పేస్ - హింగీస్ జోడి విజయం సాధించారు.

Don't Miss