Activities calendar

15 July 2015

హస్తినలో పెరిగిన పెట్రోల్..డీజిల్ ధరలు..

హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్..డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్ ను డీజిల్ పై 16.6 శాతం, పెట్రోల్ పై 25 శాతం పెంచింది. దీనితో లీటర్ పెట్రోల్ పై రూ.2.78 పైసలు, లీటర్ డీజిల్ పై రూ.1.83 పైసలు పెంచారు. ఈ ధరలు బుధవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి రానున్నాయి.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కిలో బంగారం...

హైదరాబాద్ :  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బుధవారం సాయంత్రం రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విజయవాడ నుంచి ముంబైకి తరలిస్తున్న కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

టీడీపీ నేతలకు జూపల్లి బహిరంగ లేఖ..

హైదరాబాద్: పాలమూరు జిల్లా టీడీపీ నేతలకు మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బహిరంగ లేఖ రాశారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చించేందుకు రేపు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10గంటల నుంచి అందుబాటులో ఉంటానని టీడీపీ నేతలకు సవాలు విసిరారు. 

రేపు మోడీ వారణాసి పర్యటన..

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ రేపు సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బెనారస్ హిందూ యూనివర్సిటీలోని ట్రౌమా సెంటర్‌లో పవర్‌ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు.  

21:32 - July 15, 2015

హైదరాబాద్ : భూసేకరణ ఆర్డినెన్స్ ఎలాగైనా తీసుకురావాలని పట్టుదలతో ఉన్న ప్రధాని నీతి ఆయోగ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావాల్సి ఉన్న సమావేశంలో కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల సిఎంలు మాత్రమే హాజరయ్యారు. ల్యాండ్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన డజన్ మంది సిఎంలు నీతి ఆయోగ్‌ మీటింగ్‌కు డుమ్మా కొట్టారు. నీతి ఆయోగ్‌లో ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ ప్రధానంగా భూసేకరణ బిల్లు ఆర్డినెన్స్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ఆర్డినెన్స్ పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి ఓ అవగాహన కల్పించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం.
కేంద్రం ఉద్ధేశ్యాన్ని పసిగట్టిన ప్రతిపక్షాలు..
కేంద్రం ఉద్దేశాన్ని ముందే పసిగట్టిన ప్రతిపక్షాలు నీతిఆయోగ్‌కు డుమ్మా కొట్టాయి. మొదటి నుంచి భూసేకరణ ఆర్డినెన్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు చెందిన 9 మంది ముఖ్యమంత్రులతో పాటు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిషా సిఎం నవీన్‌ పట్నాయక్, యుపి సిఎం అఖిలేష్‌ యాదవ్‌లు గైర్హాజరయ్యారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను తమ పార్టీ వ్యతిరేకిస్తున్నందున తాను హాజరు కావడం లేదని ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని మమతా బెనర్జీ ప్రధానికి లేఖ రాశారు. ల్యాండ్‌ బిల్లును సంయుక్త పార్లమెంట్‌ కమిటీ పరిశీలిస్తున్నందున దీనిపై సమావేశం జరపడం అనవసరమని సమాజ్‌వాది పార్టీ స్పష్టం చేసింది. ల్యాండ్‌ ఆర్డినెన్స్‌పై తమ పార్టీ వైఖరేంటో పార్లమెంట్‌ సమావేశాల్లో అవగతమవుతుందని ఎస్పీ పేర్కొంది. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌, ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నీతీ ఆయోగ్‌లో పాల్గొన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను జెడియు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు ముఖ్యమంత్రులు మొదట నీతిఆయోగ్‌కు హాజరవ్వొద్దని నిర్ణయించినప్పటికీ, మంగళవారం నాడు నితీష్‌ కేజ్రీవాల్‌ను కలుసుకున్న సందర్భంలో నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ సమావేశానికి బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా హాజరయ్యారు. మాజీ ఐపిఎల్‌ ఛైర్మన్ లలిత్‌మోదికి సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రధానమంత్రి నరేంద్రమోడీని తొలిసారిగా కలుసుకున్నారు. ఆర్థిక సంస్కరణలో భాగంగా భూసేకరణ ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రధాని మోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లు ద్వారా అభివృద్ధితో పాటు మౌళిక వసతులు ఏర్పాటవుతాయని కేంద్రం చెబుతోంది. రైతులను మోసం చేసి కార్పోరేట్లకు లబ్ది చేకూర్చేందుకే కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ తెస్తోందని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

21:28 - July 15, 2015

ఢిల్లీ : వ్యాపం స్కాంతో బిజెపికి చెందిన కేంద్రమంత్రులు ఎంపీలు, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు సంబంధం ఉందని కాంగ్రెస్‌ ఆరోపించింది. తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కాంగ్రెస్‌ టార్గెట్‌ చేసింది. వ్యాపం స్కాం ప్రధాన సూత్రధారి సుధీర్‌శర్మ, లక్ష్మీకాంత్‌ శర్మలతో కేంద్రమంత్రి ప్రధాన్‌ డబ్బులు పంచుకున్నారని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కాంగ్రెస్‌ బహిర్గతం చేసింది. ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రయాణానికి కావలసిన విమాన టికెట్లను సుధీర్‌ శర్మ తీసుకున్నట్టు పేర్కొంది. 2011లో సుధీర్‌ శర్మ తదితరుల ఆదాయానికి సంబంధించి ఐటి శాఖ నిర్వహించిన సోదాలో ఈ విషయం బయటపడిందని తెలిపింది. నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్‌ పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా డిమాండ్‌ చేశారు. సిబిఐ విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది.

21:26 - July 15, 2015

హైదరాబాద్ : అటు జేఎన్టీయూ... ఇటు ప్రైవేటు కాలేజీలకు షాక్ ఇచ్చింది హైకోర్టు. కాలేజీలకు ఊరటనిచ్చేలా తీర్పునిచ్చినా మళ్లీ తనిఖీలంటూ మెలిక పెట్టింది.. నిబంధనలు పాటిస్తేనే అనుమతులంటూ రూల్ పెట్టింది. దీంతో కోర్టు కెళ్లిన కాలేజీలతో పాటు జేఎన్టీయూకూడా చిక్కుల్లో పడింది. సుదీర్ఘ వాదనలతర్వాత ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల కౌన్సిలింగ్‌పై కండిషనల్ తీర్పునిచ్చింది హైకోర్టు డివిజన్ బెంచ్. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులోని ప్రధాన అంశాలను సవరించింది. అన్ని కాలేజీలు కౌన్సిలింగ్‌లో పాల్గొనేలా ఆదేశాలిచ్చింది.. అయితే కోర్టును ఆశ్రయించిన కాలేజీలు తమ కళాశాలలపై కోర్టులో కేసు నడుస్తోందని. ఇష్టం ఉంటేనే సీటు తీసుకోవాలంటూ ప్రకటించాలని రూల్ పెట్టింది. ఏఐసీటీఈ నిబంధనలు పాటించకపోతే కాలేజీని రద్దు చేయొచ్చని స్పష్టం చేసింది. అప్పుడు సీటు కోల్పోయిన విద్యార్థులకు సూపర్ న్యూమర్ ప్రకారం మరో కాలేజీలో సీటివ్వాలని తీర్పులో తెలిపింది కోర్టు.
తనిఖీలకోసం 25 కమిటీలు ఏర్పాటుచేయాలి..
అలాగే కోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో తనిఖీలకోసం 25 కమిటీలు ఏర్పాటుచేయాలని ఏఐసీటీయూ, జేఎన్టీయూ ఆదేశించింది ధర్మాసనం.. ఈ కమిటీలో ఏఐసీటీయూ నుంచి ఇద్దరు , జేఎన్టీయూ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది. కాలేజీల తనిఖీ పూర్తయ్యాక మూడురోజుల్లో ఈ వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్‌కు సమర్పించాలని చెప్పింది. అలాగే ఈ తనిఖీలకోసం ప్రైవేటు కాలేజీలు జేన్టీయూ రిజిస్ట్రార్ పేరుమీద 2లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని సూచించింది.. ఇందులో విఫలమైతే ఆ కళాశాలలకు కౌన్సిలింగ్‌లో అనుమతి ఇవ్వాల్సిన అవసరంలేదని స్పష్టంచేసింది. అలాగే మైనార్టీ కాలేజీల్లో ఈ నెల 20 తర్వాత తనిఖీలు జరపాలని ఆదేశించింది. అయితే తనీఖీలు చేసే సమయంలో బోదనాసిబ్బంది వివరాలన్నీ పకడ్బందీగా ఉండాలని ఆదేశించింది కోర్టు. ఫ్యాకల్టీ ఫొటోలతో పాటు పాన్ కార్డు నెంబర్లుకూడా సేకరించాలని సూచించింది. ఈ కేసు తుదితీర్పును ఆగస్టు నాలుగున ప్రకటించనుంది న్యాయస్థానం.
117 తనిఖీలకు సిద్ధం కావాల్సి ఉంటుంది..
అటు కోర్టు ఆదేశం రెండు వర్గాలను చిక్కుల్లోపెట్టింది హైకోర్టును ఆశ్రయించిన 117 కాలేజీలు ఇప్పుడు మళ్లీ తనిఖీలకోసం సిద్ధమవ్వాలి. నిబంధనలప్రకారం సౌకర్యాల ఏర్పాటుచేయాలంటూ ఆర్థిక ఇబ్బందులు తప్పవని యాజమాన్యాలు టెన్షన్ పడుతున్నాయి. అటు మళ్లీ కమిటీలు ఏర్పాటు చేసి తనిఖీలంటే ఇబ్బందులు తప్పవని జేఎన్టీయూ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ తీర్పుపై ఏం చేయాలన్న అంశంపై ఉన్నతవిద్యామండలి కసరత్తు చేస్తోంది. 

21:22 - July 15, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భక్తుల రద్దీతో పుష్కర ఘాట్లు కిక్కిరిసిపోతున్నాయి. పుష్కర గోదావరిలో పుణ్యస్నానం చేయడానికి భక్తులు లక్షలాదిగా తరలివెళ్తున్నారు. భక్తుల జయజయ ధ్వానాలతో పుష్కర ఘాట్లు మారుమోగుతున్నాయి. కనీవినీ ఎరగని రీతిలో గోదావరి పుష్కరాలకు భక్తులు లక్షల సంఖ్యలో పొటెత్తుతున్నారు. ఏపీ, తెలంగాణల్లో ఉన్న పుష్కర ఘాట్లలో స్నానాలు చేయడానికి తరలివెళ్తున్నారు. రెండో రోజు కూడా అన్ని దార్లు గోదావరి వైపు మళ్లాయి.
మేల్కొన్న అధికార యంత్రాంగం..
రెండవ రోజు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. గోదావరిలో స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
స్నానం చేసిన జగన్..
ఏపి ప్రతిపక్ష నేత జగన్‌ పుష్కర స్నానం చేశారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆయన గోదావరిలో పుష్కరస్నానం చేశారు. అనంతరం ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి పిండ ప్రదానం చేశారు.
రాజమండ్రిలో వీహెచ్..
రాజమండ్రిలోని వీఐపీ ఘాట్‌ వద్ద ఎంపీ వి.హనుమంతరావు పుష్కర స్నానం ఆచరించారు. చంద్రబాబు వీఐపీ ఘాట్‌ వద్ద స్నానం ఆచరించకపోవడం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు.
పుష్కరాల్లో కనుమూరి..
రాజమండ్రి పుష్కరఘాట్‌లో టీటీడీ మాజీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు పుష్కరస్నానం చేశారు. సతీసమేతంగా పుష్కరాలకు వచ్చిన ఆయన గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నరసాపురంలో పుష్కర హారతి..
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పుష్కర హారతితో రెండో రోజు పుష్కరాలు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. పుష్కరాల్లో నాగసాధువులు సందడి చేశారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాధువుల పుష్కర స్నానానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు పిండప్రదానాలు నిర్వహించారు.
కాకినాడలో జయేంద్ర సరస్వతి..
కాకినాడలో శారదా పీఠాధిపతి జయేంద్రసరస్వతి పుష్కరస్నానం ఆచరించారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసిన ఆయన ఎంపీ మురళీమోహన్‌, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పుష్కరస్నానం ఆచరించారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పీతల..
పశ్చిమగోదావరి జిల్లాలోని పుష్కర ఘాట్లలో ఏర్పాట్లను మంత్రి పీతల సుజాత పరిశీలించారు. భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించని అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో..
ఇటు తెలంగాణలోని అన్ని ఘాట్లలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో మహా పుష్కరాలు రెండో రోజు ఘనంగా జరుగుతున్నాయి. పుష్కరస్నానం చేసేందుకు భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. బాసర పుణ్య క్షేత్రంలో మహా పుష్కరాల్లో రెండవ రోజు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. భద్రత విషయంలో పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఆదిలాబాల్‌ జిల్లా నిర్మల్‌మండలం, సోన్‌ పుష్కర ఘాట్‌ను... దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. సోన్‌కు చేరుకున్న మంత్రికి.. వేదపండితులు ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు మాదాపూర్‌ ఘాట్‌ వద్ద పుష్కరస్నానం చేసి.. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే విశ్వశాంతి మహాయజ్ఞానికి వచ్చిన సాధువులకు.. అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారు. దీంతో నాగసాధువులు, శైవసాధువులు, వైష్ణవ సాధువులు, పీఠాధిపతులు, జగత్‌ గురూలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వశాంతి యజ్ఞానికి హోమగుండాలను నామమాత్రంగా ఏర్పాటు చేశారు. అందులోనూ ఈ యజ్ఞం ఘనంగా జరగాలని సీఎం కోటీ 50లక్షల రూపాయలను కేటాయించారు. అయినా అధికారులు యాగానికి తెచ్చిన వస్తువులను తిరిగి వెనక్కి తీసుకున్నారని సాధువులు మండిపడ్డారు. కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరంలో పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. అయితే ఇక్కడ పార్కింగ్‌ సమస్య తీవ్రంగా ఉందని భక్తులు అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో 11 ప్రాంతాల్లో 18 పుష్కర ఘాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. నందిపేట మండలం ఉమ్మెడ ఘాట్‌కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తెలుగు రాష్ర్టాల్లోని గోదావరి పుష్కర ఘాట్లు భక్తుల కొలాహలంతో పులకించిపోతున్నాయి. ఆధ్యాత్మికతో పరవశించిపోతున్నాయి. 

21:16 - July 15, 2015

రాజమండ్రి : పుష్కరాలకుపోతే పుణ్యం వస్తుందంటారు. మరి మన స్వామి వారికి మాత్రం జ్ఞానం వచ్చింది. పుష్కర స్నానానికి వెళ్లేముందు తొక్కిసలాట ఘటన గురించి బాబుది ఏకపక్షధోరణి అంటూ మొదట మండిపడ్డ స్వరూపానంద స్వామి నీళ్లలో మునిగాక మాట మర్చారు. పుష్కర స్నానమయ్యాక చంద్రబాబు తప్పేమీ లేదని సమర్ధించుకొచ్చారు శారదా పీఠాధిపతి. మరి ఈ మార్పుకు కారణమేంటో స్వామి వారే సెలవివ్వాలి.

21:14 - July 15, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. కనీస వేతనాలు ఇవ్వాలని కార్మికులు ఆందోళన చేస్తుంటే.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చెత్త తరలించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఈ ప్రయత్నాలను అడ్డుకున్న కార్మికులు.. సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు..
రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. అయితే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమైన ప్రభుత్వం. చెత్త తరలింపునకు చర్యలు చేపట్టింది. జేసీబీ వాహనాలతో చెత్త తరలించేందుకు సిద్ధమవగా. ఆ ప్రయత్నాన్ని మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వామపక్షాల మద్దతు..
మరోవైపు.. మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు వామపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలో భారీ మానవహారం నిర్వహించారు. సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటిని నెరవేర్చాలని కోరితే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సమ్మె విచ్చిన్నానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లెఫ్ట్‌ నేతలు డిమాండ్‌ చేశారు. లేకపోతే.. సమ్మె మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

21:09 - July 15, 2015

దేవదాసి వ్యవస్థ ఇంకా కొనసాగుతోందని, ఇదొక సాంఘీక దురాచారమని న్యాయవాది పార్వతి పేర్కొన్నారు. మహిళల పట్ల సాంఘీక దురాచారం ఉందని, వరకట్నం..సతీ సహగమనం లాంటి ఉండేవన్నారు. దేవుడు సేవకు అంకితం చేయబడే స్ర్రీ అని అర్థమని, మత సంబంధమైన ప్రదేశానికి సేవలు నిర్వహించేందుకు అంకితమవుతుందన్నారు. సమాజంలో ఇది దురాచారంగా వచ్చిందని, కుటుంబంలో ఒక ఆడపిల్లను దేవుడుకి ఇచ్చేసి ఒక కార్యకలాపం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ అంశంపై టెన్ టివి 'వేదిక' కార్యక్రమంలో లాయర్ పార్వతి విశ్లేషించారు. అలాగే పలు న్యాయపరమైన అంశాలపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు పార్వతి సమధానాలు ఇచ్చారు. 

ట్రావెల్ డాక్యుమెంట్లు పరిశీలించుకోవచ్చు - ధర్మేంద్ర ప్రధాన్..

ఢిల్లీ : తన ప్రయాణ డాక్యుమెంట్లను పరిశీలించుకోవచ్చని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టయిన సుధీర్ శర్మ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు డబ్బు వెచ్చించినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనితో ధర్మేంద్ర ప్రధాన్ పై కాంగ్రెస్ పలు విమర్శలు చేసింది. 

నీతి ఆయోగ్ లో మా కోణం వెల్లడించాం - నితీష్..

ఢిల్లీ : నీతి ఆయోగ్ సమావేశంలో తమ కోణం వెల్లడించినట్లు బీహార్ సీఎం నితీష్ కుమార్ పేర్కొన్నారు. రైతుల అనుమతితోనే భూ సేకరణ జరగాలని ఆయన పేర్కొన్నారు. 

19:57 - July 15, 2015

హైదరాబాద్ : ఇందిరాపార్కు..పోలీసుల బూట్ల చప్పుడు..ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అలజడి..తమ నేతలను ఎక్కడ అరెస్టు చేస్తారో..దీక్షలు ఎక్కడ భగ్నం చేస్తారోమోనని పారిశుధ్య కార్మికుల్లో భయం..నేతలకు రక్షణగా కార్మికులు..తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు..కానీ పోలీసులు వారి వేదనను..శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వామపక్ష నేతల ఆవేదనను అర్థం చేసుకోలేదు.. భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు దీక్షా శిబిరంపై దాడి చేశారు.. దీక్షలు చేస్తున్న నేతలను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.. కానీ వీరి ప్రయత్నాన్ని కార్మికులు అడ్డుకున్నారు.. మహిళా నేతలు..కార్మికులని చూడకుండా కర్కశంగా ప్రవర్తించారు.. అడ్డుగా వచ్చిన వారిని విచక్షాణారహితంగా లాక్కెళ్లి వ్యాన్ లలో పడేశారు.. పోలీసు జులుం నశించాలి..కేసీఆర్ డౌన్..డౌన్ అంటూ నినాదాలతో ధర్నా చౌక్ మొత్తం మారుమ్రోగింది.. చివరకు పోలీసులు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం..తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో పాటు ఎనిమిది వామపక్ష నేతలను లాక్కెళ్లారు.. నేతలను తరలించకుండా వ్యాన్ లకు వామపక్ష నేతలు, కార్మికులు అడ్డుగా పడుకున్నారు.. వారిని కూడా పోలీసులు ఈడ్చిపారేశారు..నేతలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
దుర్మార్గం - తమ్మినేని..
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ దీక్షలు చేస్తున్న వామపక్ష నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వామపక్ష నేతల్ని అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తమ్మినేని తెలిపారు.
పోరాటాన్ని భగ్నం చేయలేరు - వెంకట్..
దుర్మార్గంగా దీక్షను భగ్నం చేశారని సీపీఎం నేత వెంకట్ పేర్కొన్నారు. మా పోరాటాన్ని భగ్నం చేయలేరని, ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ అరెస్టులను నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాపితంగా మండల, మున్సిపల్, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు..దిష్టిబొమ్మ దగ్ధాల కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. టీఆర్ఎస్ నిరంకుశ చర్యలను ఖండిస్తూ అంతేగాక ఈనెల 17వ తేదీన రాష్ట్ర బంద్ జరుగుతుందన్నారు. 
కొనసాగుతున్న కార్మికుల సమ్మె..
గత పది రోజులుగా తెలంగాణలో పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తమ వేతనాలు పెంచాలని..ఇతరత్రా సమస్యలపై వారు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపింది. సమ్మె విరమిస్తేనే డిమాండ్లపై నిర్ణయం తీసుకుంటామని పలు దఫాలుగా జరిగిన చర్చల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు జరిగాయి. వీరికి పది వామపక్ష నేతలు సంఘీభావం తెలిపారు. ఇందిరాపార్కు వద్ద శాంతియుతంగా దీక్షలను ఆరంభించారు. డిమండ్లు నెరవేర్చేదాక పోరాటం ఆగదని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. వామపక్ష నేతల అరెస్టుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేయనున్నట్లు వామపక్ష నేతలు పేర్కొన్నారు.

పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం - తమ్మినేని.

హైదరాబాద్ : పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వామపక్ష నేతల్ని అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఇందిరా పార్కు వద్ద పరిస్థితి ఉద్రిక్తం.

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వామపక్ష నేతలు చేస్తున్న దీక్షా శిబిరాన్ని పోలీసులు ముట్టడించారు. పలువురు మున్సిపల్ కార్మికులు నేతలకు రక్షణగా నిలిచారు. దీక్షలను భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని వారు హెచ్చరించారు. పారిశుధ్య కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ వామపక్ష నేతలు దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

19:18 - July 15, 2015

రాజమండ్రి : మహా పుష్కరాల్లో జరిగిన మహా విషాదం చూపెట్టిన మీడియాపై ఏపీ డీజీపీ కక్ష గట్టారు. కోటగుమ్మం వద్ద మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 31 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మృతి చెందిన వారి మృతదేహాలు రోడ్డుపైనే పడి ఉన్నా ఏ ఒక్క పోలీసు కనబడలేదు. జరుగుతున్న ఘోరాన్ని ఆపేందుకు ప్రయత్నించేందుక ఏ ఒక్క ఖాకీ ప్రయత్నించలేదు. పుష్కర పుణ్యం అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కితే చాలని అనుకున్నారో ఏమో కానీ ఆయనతో పాటు పోలీసులంతా వెళ్లిపోయారు. ఈ వాస్తవాలు చెప్పిన మీడియాపై మాత్రం ఏపీ పోలీసులు గుర్రుగా ఉన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎత్తి చూపిన మీడియాపై కక్ష గట్టారు. బుధవారం ఉదయం విహంగ వీక్షణకు వెళ్లిన ఏపీ డీజీపీ రాముడు ఒక మీడియా సంస్థకు మాత్రమే సందర్శనకు అనుమతినిచ్చారు. ఆ విజువల్స్ కూడా ఆ మీడియా సంస్థకే సొంతం అని పేర్కొన్నారు. విజువల్స్ ఇవ్వాలని అడిగినా ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. దీనిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఇదేనా ప్రజాస్వామ్యం - అన్నా..

ఢిల్లీ : రైతుల సమ్మతి లేకున్నా భూ సేకరణ చేయడం ఎలాంటి ప్రజాస్వామ్యమని ప్రముఖ సామాజిక వేత్త అన్నా హాజారే ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

ఏపీ పోలీసు శాఖ పక్షపాత వైఖరి..

హైదరాబాద్ : రాజమండ్రిలో జరిగిన విషాద ఘటనపై ఏపీ పోలీసు పక్షపాత వైఖరి అవలింబిస్తోంది. పుష్కరాలపై ఏపీ డీజీపీ ఏకపక్ష ధోరణి అవలింబించారు. బుధవారం డీజీపీ జరిపిన విహంగ వీక్ష విజువల్స్ ను మీడియాలో ఒకరికే ఇచ్చారు. పుష్కర ప్రమాదంపై పోలీసుల వైఫల్యాన్ని మీడియా ఎత్తి చూపింది. అందుకే కక్షగట్టినట్లు ఏపీ డీజీపీ వ్యవహరిస్తోంది. 

ఆలస్యంగా నడుస్తున్న పుష్కర ప్రత్యేక రైళ్లు..

రాజమండ్రి : పుష్కర ప్రత్యేక రైళ్లలో ప్రయాణీకుల అవస్థలు పడుతున్నారు. గంట నుండి గంటన్నర ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి. సీట్లు దొరక్క యాత్రీకులు ఇక్కట్లకుగురవుతున్నారు. రైల్వే శాఖ చోద్యం చూస్తోందని ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వేం నరేందర్ రెడ్డి కుమారుడిని విచారించిన ఏసీబీ..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టిడిపి నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ ను 8గంటలకు పైగా ఏసీబీ అధికారులు విచారించారు.

 

సికింద్రాబాద్ లో ట్రాఫిక్ జాం..

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో బుధవారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. బేగంపేట నుండి సికింద్రాబాద్ మెట్టు గూడ వరకు ట్రాఫిక్ జాం అయ్యింది. రోడ్డు మరమ్మత్తులతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. 

ఇందిరాపార్కు వద్ద భారీగా పోలీసులు..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. వామపక్ష నేతలు చేస్తున్న దీక్షలను ఏ క్షణమైనా భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించే అవకాశం ఉంది.

18:36 - July 15, 2015

రాజమండ్రి : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ రాజమండ్రిలోని వీఐపీ ఘాట్ లో పుష్కర స్నానం చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాటలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలన్నారు. వీఐపీ ఘాట్ లో చంద్రబాబు స్నానం చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. వీరి మృతికి ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం తెలిపారని వీహెచ్ పేర్కొన్నారు. 

18:30 - July 15, 2015

ఢిల్లీ : రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటకు ఏపీ సీఎం చంద్రబాబే కారణమని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రఘువీరా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై రాహుల్ తో రఘువీరా చర్చించారు. ఈ సందర్భంగా రఘువీరా మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు వీఐపీ ఘాట్ లో స్నానం చేసి ఉంటే ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగి ఉండేది కాదన్నారు. ఇతరులు స్నానం చేసే చోట మూడున్నర గంటల వరకు స్నానం చేశారని విమర్శించారు. ఆ సమయంలో సామాన్య భక్తులను ఎవరినీ వదలలేదని ఇది తాము చెబుతున్న మాటలు కాదని, చనిపోయిన వారు కుటుంబసభ్యులు..క్షతగాత్రులు పేర్కొన్నారని తెలిపారు. 

కోర్టులో ఆశారం తనయుడు..

గుజరాత్ : ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయిని పోలీసులు సూరత్ లోని కోర్టులో హాజరు పరిచారు. నారాయణ్‌ సాయితో పాటు ఆయన తండ్రి ఆశారాంబాపు పై అక్టోబర్‌లో అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లపై వీరు అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులందాయి.

18:11 - July 15, 2015

విజయవాడ : మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమించాలని విజయవాడ మున్సిపల్ మేయర్ కోరారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. గత ఎప్రిల్ నెలలో రూ.6,700 ఉన్న వేతనాన్ని రూ.8,300కు పెంచడం జరిగిందన్నారు. సంవత్సన్నరం తరువాత మళ్లీ పెంచాలంటే ఇబ్బందిగా ఉంటుందని, ప్రధానంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు. కానీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రూ.10,300 ఇస్తామని పేర్కొనడం జరిగినా కార్మికులు వినిపించుకోవడం లేదన్నారు. ఈ తరుణంలో పుష్కరాలు రావడంతో సీఎం..మంత్రులు రాజమండ్రిలో ఉన్నారని తెలిపారు. అంతేగాక విజయవాడ కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, ప్రస్తుతం గాడిలో పడుతుందన్నారు. వీరి సమస్యలపై ప్రభుత్వం నియమించిన కమిటీ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు నివేదిక ఇచ్చిందని, ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిందన్నారు. వెంటనే సమ్మెను విరమించి విధులకు హాజరు కావాలని సూచించారు. 

భూ సేకరణ బిల్లుకు కేజ్రీవాల్ నో..

ఢిల్లీ : భూ సేకరణ బిల్లును రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిరాకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశానికి కేజ్రీవాల్ హాజరయ్యారు. 

కల్వకుర్తిలో అఖిలపక్ష సమావేశం..

మహబూబ్ నగర్ : కల్వకుర్తిలో పాలమూరు ఎత్తిపోతలపై అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. మంత్రి జూపల్లి పాల్గొన్న ఈ సమావేశానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ నేతలు హాజరయ్యారు. ఇదిలా ఉంటే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమావేశ మందిరం బయట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. 

ఆర్థిక శాఖ కార్యదర్శుతో ముగిసిన టి.మంత్రుల భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యదర్శులతో మంత్రులు హరీష్ రావు, ఈటెల జరిపిన సమావేశం ముగిసింది. భూ నిర్వాసితులకు విడతల వారీగా పరిహారం చెల్లించాలని నిర్ణయించినట్లు, ఈ చెల్లింపులు బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. వారం రోజుల్లో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు భూ సేకరణ చేయనున్నట్లు, ఈ భూ సేకరణకు రూ.100 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేస్తుందని మంత్రులు హరీష్, ఈటెల పేర్కొన్నారు. మిషన్ కాకతీయ కోసం 94 మంది సిబ్బందిని నియామకానికి పచ్చ జెండా ఊపినట్లు తెలిపారు.

భార్యపై యాసిడ్ తో దాడి చేసిన భర్త..

తిరుపతి : చంద్రగిరిలో దారుణం చోటు చేసుకుంది. రెజీనాపై భర్త ఖాజా యాసిడ్ దాడి చేశాడు. దీనితో ఆమెను రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రెజీనా పరిస్థితి విషమంగా ఉంది. ఆమె ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తోంది. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. 

వ్యాపం స్కాంపై రెండు కేసులు నమోదు చేసైఇన సీబీఐ

ఢిల్లీ : వ్యాపం స్కాంలో సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. రెండు పరీక్షలకు సంబంధించి మొత్తం 29 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 

స్కిల్ ఇండియా మిషన్ ను ప్రారంభించిన మోడీ..

ఢిల్లీ : స్కిల్ ఇండియా మిషన్ ను భారత ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించారు. యువతకు ప్రత్యేక శిక్షణ కోసం స్కిల్ ఇండియా ప్రవేశ పెట్టినట్లు మోడీ పేర్కొన్నారు. నైపుణ్యంలో శిక్షణ అవసరమని, శిక్షణ పొందిన వారికి ప్రభుత్వం సాయం అందిస్తుందని హామీనిచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా దేశం నుండి పేదరికాన్ని తరిమికొట్టవచ్చని పేర్కొన్నారు.

అమర్ నాథ్ యాత్రలో ఆరుగురి మృతి..

జమ్మూ కాశ్మీర్ : అమర్ నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యల కారణంగా ఐదుగురు యాత్రికులు..ఒక సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందారు. 

17:31 - July 15, 2015

హైదరాబాద్ : తెలంగాణ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మె పదో రోజుకు చేరుకుంది. ఎక్కడికక్కడ కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఇందిరాపార్కు వద్ద వామపక్షాల నేతలు నిరహార దీక్షలు చేపట్టారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు మున్సిపల్ కార్మికులు ధర్నా చౌక్ కు తరలివచ్చారు. ఈ సందర్భంగా టెన్ టివితో వారు పడుతున్న ఇబ్బందులు..సమస్యలను ఏకరువు పెట్టారు.
''పొద్దుగల్ల పనిచేయండి అని మాకు తరిమి తరిమి కొట్టి పని చేయిస్తున్నరు..చీపుర్లతో కొడుతున్నరు. డీసీఎం ఎక్కితే లాఠీఛార్జీ చేసిండ్రు. జీతం పెంచేదాక పనిచేయం..కేసీఆర్ దగ్గరకు నన్ను తీసుకెళ్లాలని పోలీసులతో చెప్పిన..మొగుడు దవఖానాలో పన్నడు. ఏట్ల కిరాయి కట్టాలి..దేవుళ్లు అన్నవు..నువ్వు ఎట్ల సమ్మె చేసినవో గట్ల మేము చేస్తున్నం..పుష్కరాల్లో మునిగిపోతున్నవు..మీ గుడి మంచి గుండాలా ? మా బ్రతుకులు ఎవరు బాగు చేయాలె..సార్..మేము పనిచేస్తున్నం..మురికి కాలువలో పని చేయనీయం అన్నవు..ఇప్పుడు బెదిరిస్తున్నరు..కూర్చొన్న కాడ బెదిరిస్తున్నరు..బెదిరిస్తే పడాలా ?..మా పిల్లలు ఎలా బతకాలి..పేరుకపోయిన చెత్త కేసీఆర్ వచ్చి ఎత్తుతాడా'' అంటూ మహిళా కార్మికులు పేర్కొన్నారు.

30వ లేజర్ సెయిలింగ్ ఛాంపియన్ పోటీలు ప్రారంభం...

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ లో 30వ లేజర్ సెయిలింగ్ ఛాంపియన్ పోటీలను మంత్రి ఈటెల ప్రారంభించారు.

 

వారణాసిలో మహబూబ్ నగర్ వాసుల ఇక్కట్లు..

మహబూబ్ నగర్ :వారణాసిలో జిల్లాకు చెందిన వాసులు అవస్థలు పడుతున్నారు. రేపు సాయంత్రం బయలుదేరాల్సిన పాట్నా ఎక్స్ ప్రెస్ రద్దైంది. 

ముగిసిన సీఎస్ రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్...

హైదరాబాద్ : జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఖరీప్ సీజన్ లో రైతులకు తగిన సూచనలు చేయాలని, వర్షాభావ పరిస్థితులుంటే ప్రత్యామ్నాయ పైర్ల వైపు రైతులను ప్రోత్సాహించాలని సీఎస్ సూచించారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఖమ్మంలో ఆర్టీసీ బస్సు - లారీ ఢీ..

ఖమ్మం : కొణిజర్ల (మం) వి.వెంకటయాలపాలెం వద్ద ఆర్టీసీ బస్సు - లారీ కొన్న ఘటనలో బస్సు డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. 

డార్జిలింగ్ లో విరిగిపడుతున్న కొండచరియలు..

డార్జిలింగ్ : కలింపాంగ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సిక్కింకు వెళ్లడానికి రహదారి కావడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

నగరంలో భారీ వర్షం..

హైదరాబాద్ : నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. కొత్తపేట, చైతన్యపురం, రాజేంద్రనగర్, తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లోని రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. 

16:36 - July 15, 2015

విజయవాడ : నగర శివారులోని రాజీవ్ నగర్ లో కట్ట ప్రాంతంలోని గుడిసెలను అధికారులు తొలగించారు. అనుమతి లేదనే కారణంతో సుమారు 400 గుడిసెలను నేలమట్టం చేశారు. తాము గత 15 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, ఇప్పుడు వెళ్లిపోవాలని ఆదేశాలు ఇస్తే ఎక్కడకు పోవాలని గుడిసె వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ పక్కా ఇళ్లు నిర్మాణం చేస్తామని ఇటీవల పేర్లు నమోదు చేసుకున్న అధికారులు ఇలా చేయడం సబబు కాదని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలను తొలగించడం పట్ల సీపీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్ణయాన్ని తప్పుబట్టింది. నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించాల్సింది పోయి ఉన్న గుడిసెలను తొలగించడం ఏంటనీ, బాధితులకు పక్కా ఇళ్లు ఏర్పాటు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. 

16:29 - July 15, 2015

కరీంనగర్ : గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతోంది. ప్రభుత్వం స్పందించకపోవడంతో సీఐటీయూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం కోట చౌరస్తాలోని ఎమ్మెల్యే గంగుల కమాలాకర్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు. తమ జీతాలు పెంచండి..జీవితాలు కాపాడండి..ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న ప్రాంతానికి వచ్చిన పోలీసులు వారిని శాంతింప చేశారు. 

16:22 - July 15, 2015

హైదరాబాద్ : రాజమండ్రిలో జరిగిన దుర్ఘటనను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, భూతద్ధంలో చూపిస్తున్నాయని టిడిపి ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ విమర్శించారు. ప్రతి సంఘటనకు సీఎం రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేయడం సబబు కాదన్నారు. రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన దుర్ఘటనలో 31 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు ప్రభుత్వంపై పలు విమర్శలు చేశాయి. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జూపల్లి మీడియాతో మాట్లాడారు. 6.10 నుండి 7.17 నిమిషాల వరకు పండితులు ముహూర్తం నిర్ణయించారని, రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రి దంపతులు పుష్కరాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రాజమండ్రిలో జరిగిన దుర్ఘటనపై పలు పార్టీలు విమర్శలు చేస్తున్నారని, బాబు పూజలు చేయడం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇదంతా శుద్ధ అబద్ధమన్నారు. వైసీపీ పార్టీకి సంబంధించిన సంఘాలను వాలంటీర్లగా ఎందుకు పెట్టలేదని జూపల్లి ప్రశ్నించారు.

 

16:20 - July 15, 2015

అనంతపురం : రానున్న పార్లమెంట్ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీలు కేంద్రంపై వత్తిడి పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం ఆర్ట్స్ కళాశాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రత్యేక హోద సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా కేంద్రం కాలయాపన చేస్తోందని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి రావాలని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మేధావుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

కడియంతో పాపిరెడ్డి భేటీ..

హైదరాబాద్ : డిప్యూటి సీఎం కడియం శ్రీహరితో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి భేటీ అయ్యారు. ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలపై హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో తదుపరి చర్యలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు.

నదుల అనుసంధానం ఎంతో ఉపయోగం - బాబు..

రాజమండ్రి : ఆనం కళాకేంద్రంలో 'నీటి ప్రాముఖ్యత – నదుల అనుసంధానం'పై జరిగిన సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాజెక్టుల నమూనాలను పరిశీలించిన బాబు నదుల అనుసంధానం వల్ల ఎంతో ఉపయోగమన్నారు. కరువు రహిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమౌతుందన్నారు. 

మళ్లీ దీక్ష చేపట్టనున్న అన్నా..

ఢిల్లీ : ప్రముఖ సామాజిక వేత్త అన్నా హాజారే మళ్లీ నిరహార దీక్ష చేయబోతున్నారు. రాంలీలా మైదాన్ లో అక్టోబర్ 2వ తేదీన అన్నా నిరహార దీక్షకు కూర్చొంటున్నారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ దీక్ష చేయనున్నారు.

మధ్యప్రదేశ్ లో కిల్ ఇండియా - జైరాం రమేష్..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి స్కిల్ ఇండియా అంటుంటే మధ్యప్రదేశ్ కిల్ ఇండియాగా మారుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. 

కోఠిలో రోడ్డుపై బైఠాయించిన వ్యాపారులు...

హైదరాబాద్: కోఠీలో వ్యాపారులు రోడ్డుపై బైఠాయించారు. రోడ్డు ఇరువైపులా నిర్మించిన అక్రమ కట్టడాలు కూల్చివేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.

గజ్వేల్ లో దొంగల ముఠా అరెస్టు..

మెదక్: గజ్వేల్‌లో ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పోలీసులు 19 తులాల బంగారం, 2.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

విద్యుదాఘాతానికి ఇంటర్ విద్యార్థిని మృతి..

ప్రకాశం : జిల్లాలోని మార్కాపురం రెడ్డి మహిళా కళాశాలలో విద్యుదాఘాతానికి మల్లీశ్వరి ఇంటర్ విద్యార్థిని దుర్మరణం చెందింది.

 

15:24 - July 15, 2015

హైదరాబాద్ : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. వీరికి మద్దతుగా ధర్నా చౌక్ ఇందిరాపార్కు వద్ద వామపక్షాలు నిర్వహిస్తున్న నిరహార దీక్షలకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడారు. కార్మిక సంక్షేమానికి నేతగా ఉన్న నాయినీ పోలీసు బుద్దిని వదిలిపెట్టాలని సూచించారు. డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు మద్దతివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. 14 రోజులుగా గ్రామ పంచాయతీ వర్కర్లు..ఇతరులు ఆందోళన చేస్తున్నారని, కార్మికులు అసంతృప్తితో ఉంటే ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. వెంటనే వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వామపక్ష నేతలు వీరికి అండగా ఉంటారని, వీరి పోరాటం విజయం సాధిస్తుందని భరోసా ఇచ్చారుఅనేక పార్టీలు కార్మికులకు అండదండలు అందించాలి. కాంగ్రెస్..టిడిపి..ఇతర పార్టీలని వీరికి మద్దతివ్వాలన్నారు. 

15:19 - July 15, 2015

మహబూబ్ నగర్ : హైదరాబాద్ నగరంలో అక్కా చెళ్లెలను హత్య చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు..ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎల్ బినగర్ లో కొత్తపేట మోహన్ నగర్ గాయత్రీపురంలో మంగళవారం ఉదయం యామినీ సరస్వతి, శ్రీలేఖలను ప్రేమోన్మాది అమీత్ సింగ్ దారుణంగా హత్య చేశాడు. మృతి చెందిన అక్కా చెళ్లెలు మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ పట్టణ వాసులు. వారు మృతి చెందారని తెలుసుకున్న పట్టణ వాసులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రేమోన్మాది కఠినంగా శిక్షించాలంటూ పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు. ఇందులో విద్యార్థులు..విద్యార్థులు..ఉపాధ్యాయులు..మహిళా సంఘాలు పాల్గొన్నాయి. ఎంపిడిఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. షీ టీమ్స్ ను పటిష్ట పరచాలని, వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. 

పాక్ కాల్పులతో మహిళ దుర్మరణం..

జమ్మూ కాశ్మీర్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి పాక్ ఉల్లంఘించింది. సరిహద్దు ప్రాంతంలోని అకునూర్ ప్రాంతంలో పాక్ సైన్యం కాల్పులు జరపడంతో ఓ మహిళ మృతి చెందింది.

పుష్కరాలపై మంత్రి తుమ్మల సమీక్ష..

ఖమ్మం: భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో గోదావరి పుష్కరాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.

పారిశుధ్య కార్మికుల డిమాండ్లు సరైనవే - భట్టి..

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న పారిశుధ్య కార్మికుల డిమాండ్లు సరైనవేనని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వారికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. 

14:54 - July 15, 2015

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ రెండో విడత సమావేశానికి 14మంది ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు 9మందితో పాటు జయలలిత, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశానికి గైర్హాజరయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు హాజరయ్యారు. వివాదాస్పద భూసేకరణ బిల్లుతో పాటు కేంద్ర పథకాలపై చర్చిస్తున్నారు. 

14:54 - July 15, 2015

హైదరాబాద్ : సామాజిక కార్యకర్త తీస్తా సెతల్‌వాద్ విదేశీ విరాళాల కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కోర్టు ఆదేశాలతో నిన్న మూడుచోట్ల దాడులు నిర్వహించిన సీబీఐ.. త్వరలో ఈ కేసులో నోటీసులు జారీ చేయనుంది. అయితే మోడీ సర్కార్ తనపై కావాలనే ఇలా వేధింపులకు పాల్పడుతోందని తీస్తా ఆరోపించింది. 
తీస్తా ఇంటిపై సీబీఐ దాడులు...
కేంద్ర హోం శాఖ అనుమతి పొందకుండా.. విదేశీ విరాళాలను స్వీకరించారంటూ... సామాజిక కార్యకర్త తీస్తా సెతల్ వాద్ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహించింది. కోర్టు అనుమతితో తీస్తా ఇల్లు, ఆమె భర్త నిర్వహిస్తున్న సబ్ రంగ్ కమ్యునికేషన్స్ కార్యాలయం, ప్రింటింగ్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ రైడింగ్‌లో 16 మంది అధికారులు పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో కీలక ఆధారాలు, డాక్యుమెంట్లు లభించినట్టు సీబీఐ తెలిపింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నిబంధనలు ఉల్లఘించారనేందుకు కావల్సిన సాక్ష్యాలు లభించినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.
గుజరాత్ అల్లర్ల బాధితులకు తీస్తా చేయూత..
గుజరాత్‌ అల్లర్ల బాధితులను ఆదుకునేందుకు కొన్నేళ్లుగా తీస్తా సెతల్‌వాద్‌ కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 2010లో విదేశాల నుంచి స్వీకరించిన నిధుల వెనక. ఎఫ్సీఆర్ఏ నిబంధనలు ఉల్లఘించారని ఆమెపై ఆరోపణలొచ్చాయి. దీనిపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ కేసులో తీస్తాతో పాటు ఆమె భర్త జావిద్ అహ్మద్, పెషిమామ్ గులామ్ మోహమ్మద్ మరో వ్యక్తిపై గతవారం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిన్నటి తనిఖీల్లో లభించిన డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం నిందితులకు సమన్లు జారీ చేస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు. మరోవైపు తాము విచారణకు పూర్తిగా సహకరిస్తామని లేఖ రాసినప్పటికి ఇలా ఆకస్మిక దాడులు నిర్వహించడాన్ని తీస్తా తప్పుపట్టారు. తనపై విచారణ కోసం ప్రధాని కార్యాలయం సిబిఐపై ఒత్తిడి తెస్తునట్టు ఆమె ఆరోపించారు. 

14:30 - July 15, 2015

నెల్లూరు : తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు సమ్మె చేపడుతున్నారు. తమకు మద్దతు తెలపాలని కోరిన మహిళా కార్మికులపై టిడిపి కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. మహిళలని చూడకుండా బూతులుదండకం చదివాడు. దీనిపై మహిళా కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏడో డివిజన్ కు చెందిన టిడిపి కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ చెత్తను తొలగించడానికి ఇతరులను డివిజన్ కు తీసుకొచ్చాడు. దీనిని మహిళా కార్మికులు వ్యతిరేకించారు. తమకు మద్దతు తెలపాలని కార్పొరేటర్ ను కోరారు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన కిన్నెర ప్రసాద్ ఇష్టమొచ్చినట్లు తిట్టారు. అక్కడనే ఉన్న అతని సోదరుడు, శానిటేషన్ అధికారి మాల్యాద్రి, అతని అనుచరులు వీరంగం సృష్టించారు. మహిళలపై దాడి కూడా చేసినట్లు తెలుస్తోంది. తమకు జరిగిన అన్యాయంపై మహిళా కార్మికులు పోలీసులను ఆశ్రయించారు. కానీ వారికి అక్కడ కూడా న్యాయం జరగలేదని తెలుస్తోంది. 

14:25 - July 15, 2015

హైదరాబాద్ : సీట్లలో భారీ కోత, కాలేజీల అనుమతుల రద్దుపై హైకోర్టును ఆశ్రయించిన ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలకు ఊరట లభించింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. తనిఖీల్లో అవకతవకలు జరిగితే అనుమతులు రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. సింగిల్‌ బెంచ్‌ ఆర్డర్‌ తీర్పులో ఒక అంశాన్ని డివిజన్‌ బెంచ్‌ సవరించింది. 10 రోజుల్లోగా మరోసారి తనిఖీలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 

14:21 - July 15, 2015

హైదరాబాద్ : పాలమూరు ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఇంకా సద్దుమణగలేదు. మంత్రి జూపల్లి...టిడిపి నేత రావుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాము బహిరంగ చర్చకు సిద్ధమని జూపల్లి ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ టిడిపి నేతలు మాటలకే పరిమితమయ్యారని మంత్రి జూపల్లి పేర్కొనడంపై టిడిపి నేత రావుల స్పందించారు. మంత్రి జూపల్లి అసెంబ్లీ కమిటీ హాల్‌లో కూర్చొని చర్చకు రమ్మనడం సమంజసం కాదని ఎక్స్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రవేశం లేదని రావుల అన్నారు. మంత్రి జూపల్లి పాలమూరు ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు ఎన్టీఆర్‌ భవన్‌కు వస్తానని చెప్పి రాలేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పాలమూరులో ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు మొదలు పెట్టారని రావుల గతంలో ప్రకటించారు. 

ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలకు వ్యాపం సొమ్ము..

ఢిల్లీ : ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలకు వ్యాపం సొమ్ము అందినట్లు ఓ మీడియా సంస్థకు ఆధారాలు చిక్కాయి. గనుల వ్యాపారి సుధీర్ శర్మ నుండి బీజేపీ నేతలకు నిధులు అందినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో నగదుతో పాటు విమాన టికెట్లు..ఇతర రవాణా బిల్లులకూ చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ అధినేత సురేష్ సోనీకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాత్ ఝూకు నిధులు అందినట్లు ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.

13:50 - July 15, 2015

విశాఖ: మున్సిపల్‌ కార్మికుల సమ్మెతో స్మార్ట్‌ విశాఖ చెత్త సిటీగా మారిపోయింది. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మెతో నగరమంతా కంపుమయం అయ్యింది. 72 వార్డుల్లో దుర్గంధమయం అయ్యాయి. రోజుకు 800 టన్నుల చెత్త విశాఖలో పేరుకుపోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో జనం పరిస్థితి దయనీయంగా మారింది. 

13:46 - July 15, 2015

విజయవాడ: ప్రముఖ ఇంజనీరింగ్‌ నిపుణుడు కెఎల్‌ రావు జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు కేఎల్‌ రావు విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించారు. కేఎల్‌ రావు లాంటి నిపుణులకు రాష్ట్రంలో కొదవ లేదని రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల సలహా తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే గోదావరి పుష్కరాల్లో దుర్ఘటన చోటు చేసుకుందని మధు విమర్శించారు.  

13:45 - July 15, 2015

హైదరాబాద్: గ్రీస్ ప్రమాదం తప్పింది... స్టాక్ మార్కెట్ బాగానే ఉంది... ద్రవ్యోల్బణమే కాస్త పెరిగి భయపెడుతుంటే... వర్షాలు నిరాశపరుస్తున్నాయి... ఇన్ని అంశాల మధ్య ఇప్పుడు దేశంలో ఆర్థిక నిపుణులు, కార్పొరేట్ సంస్థల్లో కొత్త చర్చ మొదలైంది. వచ్చేనెల 4న జరిగే పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచుతుందా... లేదా... ఎకనామిక్ వరల్డ్ లో ఇదే ఇప్పుడు హాట్ డిస్కషన్.
రాజన్ మరోసారి తీపికబురే పంచుతారా...?
ఆగస్ట్ 4న జరిగే మధ్యంతర పరపతి సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నెక్ట్ స్టెప్ ఏంటి... ఎలా ఉండబోతోందో... ఆర్థిక వేత్తలు అప్పుడే అంచనాలు ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే... మరోసారి రాజన్ తీపికబురే పంచుతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మోడీ మెకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా పథకాలకు సపోర్టుగా... ఈ ఏడాది ముచ్చటగా నాలుగుసారి కనీసం పావుశాతం కీలక వడ్డీరేటు తగ్గిస్తారని కొందరు నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఫలితాలు ఆశాజనకంగా లేకపోవటంతో... ఆర్బీఐ నుంచి కార్పొరేట్ సంస్థలు ద్రవ్య మద్దతు.కోరుకుంటున్నాయి. పడిపోతున్న ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రేటింగ్ ను వారు సాకుగా చూపిస్తున్నారు. రేటింగ్ సంస్థల అంచనాలు కూడా పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు బాగా ఉంటే వచ్చేనెల వడ్డీరేట్లు పావుశాతం తగ్గడం ఖాయమని మూడీస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిలించ్ తమ రీసెర్చ్ రిపోర్టులో పేర్కొన్నాయి.
జులైలో 30శాతం తగ్గిన వర్షపాతం....
అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జులైలో వర్షాభావ పరిస్థితులు మరోసారి రేట్లకోతకు అడ్డుగా పరిణమించే అవకాశాలు లేకపోలేదు. ఈనెలలో ఇప్పటివరకు వర్షపాతం 30శాతం తగ్గింది. జూన్ లో సాధారణం కంటే 16శాతం అధికంగా నమోదైన వర్షాలు ... ఇప్పుడు మొహం చాటేచాయి. ఈ ప్రభావం.. వ్యవసాయ ఉత్పత్తులపై కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేలో 4శాతం పెరిగిన పప్పుధాన్యాల ధరలు... ఈనెలలో ఇప్పుడు 22శాతం పెరగడం కలవరం కలిగిస్తోంది. మరోవైపు ద్రవ్యోల్బణం 8నెలల గరిష్ఠానికి చేరడం మరో ప్రమాదకర అంశం. జూన్ లో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 5.4శాతంగా నమోదైంది. అంతకు ముందు మేలో ఇది 5.01శాతం. ద్రవ్యోల్బణ కట్టడే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న రాజన్ ... ఈసారి వడ్డీరేట్ల తగ్గింపు సమీక్షలో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. వడ్డీరేట్లు తగ్గి.. కంపెనీల విస్తరణ, చౌక గృహరుణాలతో ఆర్థికాభివృద్ధి పుంజుకుంటుందని కార్పొరేట్ సంస్థలు భావిస్తుంటే... పెరుగుతున్న ద్రవ్యోల్బణ భూతం వారి ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తోంది. ఏదేమైనా రఘురామ్ రాజన్ మనసులో ఏముందో బయటపడాలంటే ఆగస్ట్ 4 వరకు వేచి చూడాలి.

13:40 - July 15, 2015

హైదరాబాద్: కూసింత వయ్యారం..కూసింత సింగారం. దీనికి తోడు కాసంత బంగారం.. ఇంకేముందు ఫ్యాషన్‌ షో అదుర్స్‌ అనిపించింది. పట్టు చీరలు.. అందునా కాంచీపురం చీరలు. వీటికి 72 గ్రాముల బంగారు తీగలతో మరింత బంగారు మెరుగులు దిద్దారు డిజైనర్లు. అవే తంగపట్టు చీరలు. సిక్స్‌ యార్డ్‌ వండర్‌ పద్ధతిలో ఈ చీరలను 14 రోజులపాటు నేశారు. పసిడి తీగలు, పట్టు ఉలెన్‌ల సమ్మేళనంతో తయారైన తంగపట్టు చీరల్లో మోడళ్లు కేకపుట్టించారు. సొగసైన, మృదువైన, తక్కువ బరువుండే కాంచీపురం చీరలకు బంగారం అద్దులు అద్ది మరింత వన్నె తెచ్చారు. లైట్ అండ్ డార్క్‌ కలర్స్‌లోని ప్రీమియం డిజైన్లు అందరినీ ఆకట్టుకున్నాయి.
చెన్నైలో కుమరన్ స్టోర్స్ ఆధ్వర్యంలో ....
చెన్నైలో కుమరన్ స్టోర్స్ ఆధ్వర్యంలో ఈ ఫ్యాషన్‌ షో నిర్వహించారు. దక్షిణ భారతదేశపు సంస్కృతీ సంప్రదాయాలదు ఉట్టిపడేలా జరిగిన ఈ ఫ్యాషన్‌ షోలో చెన్నై ఫ్యాషన్‌ వీక్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ రోషన్‌ రావ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

13:36 - July 15, 2015

హైదరాబాద్: ఛత్తీస్‌గడ్‌ లోని బిజాపూర్‌ జిల్లాలో రెండు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన పోలీసులను మావోయిస్టులు మట్టుబెట్టారు. వారి మృత దేహాలను కిడ్నాప్‌కు గురైన ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో వదిలివెళ్లారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం బస్సులో ప్రయాణిస్తుండగా కిడ్నాప్‌కు గురైన అసిస్టెంట్‌ కానిస్టేబుళ్లను మావోయిస్టులు కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. అనంతరం వారిని తుపాకులతో కాల్చి చంపి రోడ్డు పక్కన పారవేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. చనిపోయిన కానిస్టేబుల్స్‌ను జైదేవ్‌ యాదవ్‌, మంగల్‌ సోదీ, తేల రాజు, మజ్జి రాము గా గుర్తించారు. 

తెలంగాణ సచివాలయ ముట్టడికి యత్నించిన ఏఐఎస్‌ఎఫ్‌ఐ

హైదరాబాద్:విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సచివాలయ ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు యత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు.

తోట్ల వళ్లూరులో ప్రబలిన విషజ్వరాలు...

కృష్ణా:తోట్లవళ్లూరు గ్రామంలోవిషజ్వరాలు ప్రబలి, 60 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురికి డెంగ్యూ లక్షణాలుకనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఇంత జరుగుతున్నా సంబందిత అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో తక్షనమే వైద్య శిబిరం ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు.

కోఠిలో వ్యాపారుల ఆందోళన

హైదరాబాద్: ఫుట్ పాత్ లపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ కోఠి ఆంధ్రాబ్యాంక్ సమీపంలో వ్యాపారులు రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

 

ధర్మపురిలో పుష్కరస్నానం చేసిన మంత్రి బండారు దత్తాత్రేయ

కరీంనగర్‌: ఈ రోజు ఉదయం ధర్మపురిలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో పాటు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పుష్కర స్నానం చేశారు. వర్షాలు పడకపోవడం, మహారాష్ట్ర ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడం వల్ల నీటి మట్టం తక్కువగా ఉందని దత్తాత్రేయ అన్నారు. రాజమండ్రి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో నివేదిక వచ్చాక భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు.

చాంపియన్స్ లీగ్ టీ 20 రద్దు చేసిన బీసీసీఐ

ముంబై: చాంపియన్స్ లీగ్ టి20 ను బీసీసీఐ రద్దు చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ టోర్నీని నిర్వహించడం కష్టమని బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో దీన్ని రద్దు చేసింది. సీఎల్ టి20 స్థానంలో ఐపీఎల్‌లోని టాప్-4 జట్లతో మినీ ఐపీఎల్‌లాంటిది నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. బేబీ ఐపీఎల్ పేరుతో టోర్నీ నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

బాసరలో అమ్మవారికి మహానైవేధ్యం...

ఆదిలాబాద్: బాసరలక్ష అమ్మవారికి వేదపండితులు మహానైవేద్యం సమర్పించారు. బాసర పుష్కరఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పుణ్యస్నానాల అనంతరం సరస్వతి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల కోసం అధికారులు సౌకర్యాలను పెంచారు. ఉన్నతాధికారులు గోదావరి తీరంలో కలియదిరుగుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

నల్గొండ జిల్లాలో విద్యుద్ఘాతంతో రైతు మృతి

నల్గొండ:వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై ఓ యువరైతు మృతి చెందాడు. వివరాలు.. గ్రామానికి చెందిన లింగస్వామి(24) బుధవారం పొలం దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలిస్తుండగా ప్రమాదవ శాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికందొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. లింగస్వామి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలి:పౌరహక్కుల సంఘం..

విశాఖ:నూతన భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని పౌరహక్కుల నేతలు విమర్శించారు. విశాఖ మన్యంలోని విస్తారమైన ఖనిజ సంపదను పెట్టబడిదారులకు కట్టబెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ప్రయత్నిస్తున్నాయన్నారు.అందుకు నిరసన, ఈనెల 19న విశాఖలో గిరిజనులతో భారీ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.

కపడలో ఎర్రచందనం ముఠా అరెస్ట్

హైదరాబాద్: కడప జిల్లా చాపాడు వద్ద పోలీసుల తనిఖీలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా పట్టుబడింది. నిందితుల నుంచి రూ.25 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న ముఠా సభ్యుల్లో ఇద్దరిది అనంతపురం జిల్లా కాగా, మిగిలిన నలుగురిది కర్నూలు జిల్లాగా తేలింది. 

పాక్ కాల్పుల్లో బిఎస్ ఎఫ్ జవాన్ కు గాయాలు

జమ్మూకశ్మీర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బుధవారం ఉదయం పాకిస్థాన్ రేంజర్స్ బీఎస్‌ఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటన ఆక్నూర్ సెక్టార్‌లో చోటు చేసుకుంది. పాక్ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ జవాను తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళ మృతి చెందింది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాక్ కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు.

ఎంఎస్ విశ్వనాథన్ అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్: చెన్నై బీసెంట్ నగర్ శ్మశాసన వాటికలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. 

కార్మికుల పోరాటానికి వామపక్షాలు అండగా ఉంటాయి: రాఘవులు..

హైదరాబాద్:పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్ధతుగా వామపక్ష పార్టీల దీక్షను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి రాఘవువులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. వెట్టి చాకిరీ చేయించుకుంటూ కూడా కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. సైన్యాన్ని దించడానికి కార్మికులు ఏమన్నా దేశ ద్రోహానికి పాల్పడ్డారా అని రాఘవులు సూటిగా ప్రశ్నించారు. కార్మికులతో పెట్టుకుంటే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. కార్మికుల పోరాటానికి వామపక్షాలు అండగా ఉంటాయన్నారు.

12:38 - July 15, 2015

హైదరాబాద్:తెలంగాణ టీడీపీ నేతలకు పాలమూరు ప్రాజెక్టులపై చర్చించే దమ్ము లేదని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు.తెలంగాణ టీడీపీ నేతలు మాటలకే పరిమితమయ్యారని.. మాటలు పక్కన పెట్టి చర్చకు వస్తే నిజాలు ఏంటో తెలుస్తాయన్నారు. అసెంబ్లీ కమిటీ హాలుకు రాలేము అనుకుంటే మీరే హైదరాబాద్ నగరంలోని ఏదైనా ఫంక్షన్ హాలులో చర్చ పెట్టండి. నేనే అక్కడికి వస్తా. అవసరమైతే ఫంక్షన్ హాలు కిరాయి కూడా నేనే భరిస్తా. పాత్రికేయులే న్యాయనిర్ణేతలుగా ఉంటారని తెలిపారు. మీకు చర్చకు దమ్ము లేకుంటే.. మీ చంద్రబాబుతో ఒక లేఖ రాయించండి. పాలమూరు ఎత్తిపోతల విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రానికి, సీడబ్ల్యూసీకి లేఖ రాయించండి అని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని బాబు లేఖ రాసిండని నిరూపిస్తా. ఇప్పటికీ తన మాటకు కట్టుబడి ఉన్నానని ఉద్ఘాటించారు.

ఆర్థికశాఖ కార్యదర్శులతో మంత్రులు ఈటెల, హరీష్ రావు భేటీ

హైదరాబాద్: సచివాలయంలో ఆర్థికశాఖ కార్యదర్శులతో మంత్రులు ఈటెల, హరీష్ రావు భేటీ అయ్యారు. వీరి భేటీలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు విషయం పై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

భద్రాద్రిలో ఎండగ వేడిమితో సొమ్మసిల్లుతున్న భక్తులు...

ఖమ్మం: భద్రాద్రిలో ఎండగ సెగ వేడిమి తట్టుకోలేక.. నీడ లేక భక్తులు సొమ్మసిల్లుతున్నారు. మరో వైపు పురోహితులు షెడ్లను ఆక్రమించారు. పుష్కర ఘాట్లలో తాగునీటి కొరత ఉంది. ఉచిత బస్సులు చాలక అవస్థలు పడుతున్నారు. అంతేకాక పుష్కర ఘాట్లలో చెత్తా చెదారం చేరి దుర్వాసన కొడుతోంది.

12:14 - July 15, 2015

హైదరాబాద్:ప్రభుత్వానికి కళ్ల నెత్తికెక్కాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద పది వామక్షాలు దీక్షను చేపట్టాయి. ఈ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... మున్సిపల్ కార్మికులపై కేసీఆర్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని మండి పడ్డారు. చర్చలకు పిలిచి పరిష్కార దిశగా వ్యవహరించకుండా జమిందారీ విధానంలో.. కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేసే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చాలా వెంకట్ రెడ్డి మండి పడ్డారు.

11:58 - July 15, 2015

తూ.గో: రాజమండ్రి పుష్కర ఘాట్లను దేవాదాయశాఖమంత్రి మాణిక్యాలరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుష్కరాల ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు అభిప్రాయపడ్డారు.

11:56 - July 15, 2015

శ్రీకాకుళం:రాజమండ్రిలో నిన్న తొక్కిసలాటలో మృతిచెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురి భక్తుల మృతదేహాలు స్వగ్రామానికి చేరుకున్నాయి. ఒకే కుటుంబంలో నలుగురు పుష్కర తొక్కిసలాటలో మృతి చెందటంతో స్థానికంగా విషాదం నింపింది. మృతదేహాలు స్వగ్రామమైన సంతకవిటి మండలం బొద్దూరుకు చేరడంతో బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. కొత్తకోట కళావతి తన కుటుంబ సభ్యులతో రాజమండ్రి పుష్కరాలకు వెళ్లగా..అక్కడ జరిగిన తొక్కిసలాటలో కళావతితో పాటు..ఆమె ఇద్దరు కుమార్తెలు, మనవడు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆముదాలవలసలోని కుమార్తె అమరావతి ఇంట్లో నలుగురికి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.

 

11:54 - July 15, 2015

శ్రీకాకుళం: జిల్లా సోంపేట కాల్పుల ఘటనకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా.. అఖిలపక్ష్యం ఆధ్వర్యంలో నిరసన గళం వినిపించాయి విపక్షాలు.. థర్మల్ పవర్ ప్లాంట్‌కు అనుకూలంగా ఉన్న 1107 జీవోను రద్దు చేయాల్సిందేనని ఉద్యమకారులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు.. అమరు వీరుల స్తూపం వద్ద పలువురు నేతలు నివాళులు అర్పించారు.. అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించారు.                                                   
చంద్రబాబు సర్కార్‌పై నిప్పులు చెరిగిన విపక్షాలు.....
సోంపేట గాంధీ మండపం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు సర్కార్‌పై నిప్పులు చెరిగారు నేతలు... సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సిపిఐ ముఖ్య నేత నారాయణ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి తదితరులు పవర్ ప్లాంట్ పరిసర ప్రాంతవాసులకు భరోసా ఇచ్చారు. 1107 జీవో రద్దు చేసేందుకు చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నట్టు స్థానిక ఎమ్మెల్యే అశోక్‌ స్పష్టం చేశారు. చంద్రబాబు తీరుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. నాడు ప్రతిపక్షంలో మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారని మండిపడ్డారు.
ప్రభుత్వాలు మారినా....
ప్రభుత్వాలు మారినా పాత జి.ఓ లు మార్చడానికి సిద్ధంగా లేరని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలను రక్షించుకోవాలనే కనీస జ్ఞానం ప్రస్తుత ప్రభుత్వాలకు లేదని ఆరోపించారు. 2048 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో పర్యావరణ పరిరక్షణ సమితి ప్రతినిధులు ప్రతిజ్ఞ బూనారు. 1107 జీవో రద్దు అయ్యే వరకూ దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాల్పుల ఘటనకు ఐదేళ్ళు పూర్తయిన సందర్బంగా కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో స్థానికులు స్వచ్చందంగా బంద్ పాటించి నిరసన తెలిపారు. 

11:51 - July 15, 2015

హైదరాబాద్:వైసీపీ నేత జగన్‌ పుష్కర స్నానం చేశారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆయన గోదావరిలో పుష్కరస్నానం చేశారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు

ప్రధాని నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం

ఢిల్లీ: ప్రధాని నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి 14 మంది సీఎంలు డుమ్మా కొట్టారు. తొమ్మిది మంది కాంగ్రెస్ సీఎం ల సహా నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ గైర్హాజరయ్యారు. గోదావరి పుష్కరా కారణంగా చంద్రబాబు, కేసీఆర్ కూడా దూరంగా ఉన్నారు.

విజయవాడలో రాజీవ్ నగర్ కరకట్ట వద్ద ఉద్రిక్తత

విజయవాడ: రాజీవ్ నగర్ కరకట్ట వద్ద అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారని బాధితులు ఆందోళన చేపట్టారు. వీరికి సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన దిగ్విజయ్ సింగ్...

ఢిల్లీ: ఏఐసీసీ కార్యాలయంలో దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ఏపీ, టీఎస్ కాంగ్రెస్ నేతల సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశానికి టీఎస్ పీసీసీ చీఫ్ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా, జానా, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

గుర్గావ్ లో కాల్పుల కలకలం

ఢిల్లీ: గుర్గావ్ లో కాల్పుల కలకలం చెలరేగింది. ఈ రోజు ఉదయం ఓ మాల్ దగ్గర కాలుపై దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. బుల్లెట్లు తగిలి మూడు వాహనాలు బోల్తా పడ్డాయి.

కార్మికులతో తలపడితే...అధికారం వదులుకోవాల్సిందే:బి.వి.రాఘవులు

హైదరాబాద్: కార్మికులతో తలపడితే.. అధికారం వదులు కోవాల్సి వస్తుందని.. గత అనుభవాలు ఇదే అనుభవాలు ఉన్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు హెచ్చరించారు. ఇందిరా పార్క్ వద్ద 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు మద్దతుగా దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ... గత పది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా సీఎం కేసీఆర్ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించడం లేదని విమర్శించారు. సమస్యలపై చర్చలకు అవకాశం లేకుండా సీఎం వ్యవహరించే తీరు గర్హనీయమన్నారు.

11:30 - July 15, 2015

హైదరాబాద్:తమ సమస్యలు పరిష్కారం కోరుతూ గత పది రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సీఎం కేసీఆర్ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించకుండా పోలీసులను ఉసికొల్పి, మహిళా కార్మికులను అరెస్టు చేయిస్తున్నారని కార్మికులు మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో కార్మికులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరో వైపు కేసీఆర్, జీహెచ్ ఎంసీ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి ఇందిరా పార్క్ వరకు ర్యాలీగా బయలు దేరారు. ఈ సందర్భంగానేతలు మాట్లాడుతూ.. అడగని దేవుళ్లకు వేల కోట్లు ఇస్తున్న కేసీఆర్ అడిగిన వారికి నయా పైసా కూడా విదిలించడం లేదని కార్మిక నేతలు మండి పడ్డారు. కేసీఆర్ మరో నిజాంలా పరిపాలిస్తున్నారని..మహిళల భద్రతకు షీక్యాబ్ లను పెట్టిన సీఎం మున్సిపల్ మహిళా కార్మికులను అరెస్టు చేయిస్తావా అని ప్రశ్నించారు. 

ప్రభుత్వ దిష్టి బొమ్మను తగలబెట్టిన మున్సిపల్ కార్మికులు

హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కారం కోరుతూ గత పది రోజులుగా సమ్మె చేస్తున్నా సీఎం కేసీఆర్ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించకుండా పోలీసులను ఉసికొల్పి, మహిళా కార్మికులను అరెస్టు చేయిస్తున్నారని కార్మికులు మండి పడ్డారు. దీన్ని నిరసిస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో కార్మికులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరో వైపు కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి.

ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మున్సిపల్ కార్మికుల ఆందోళన

హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మె 10 రోజుకు చేరింది. ఇప్పటి వరకు తమసమ స్యలు పరిష్కరించకపోవడంతో ప్రభుత్వ దిష్టి బొమ్మను తగలబెట్టేందుకు కార్మికులు యత్నిస్తుండగా పోలీసులు.. కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

సాంకేతిక లోపంతో నిలిచిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్

నల్లగొండ : బీబీనగర్ రైల్వేస్టేషన్‌లో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎంఎస్ విశ్వనాథన్ అంతిమ యాత్ర ప్రారంభం

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్(87) అనారోగ్యంతో నిన్న ఉదయం మృతి చెందారు. చెన్నైలోని ఆయన నివాసం నుండి ఈ రోజు ఉదయం విశ్వనాథన్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. బీసెంట్ రోడ్డు లోని స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

గోష్పాద ఘాట్ లో పుష్కర స్నానం చేసిన వైఎస్ జగన్...

తూ.గో:గోదావరిలో వైసిపీ నేత జగన్ పుష్కర స్నానమాచరించారు. రాజమండ్రికి అవతల ఒడ్డున ఉన్న కొవ్వూరులోని గోష్పాద ఘాట్ లో పురోహితుల వేద మంత్రోచ్చారణల మధ్య ఆయన పుష్కర స్నానం చేశారు. కాపేసట్లో తన తండ్రి, దివంగత రాజశేఖర రెడ్డికి జగన్ పిండ ప్రదానం చేసే అవకాశం ఉంది. తమ అధినేత పుష్కర స్నానానికి రావడంతో, వైకాపా నేతలు, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో గోష్పాద ఘాట్ కు చేరుకున్నారు.

 

ఇందిరా పార్క్ వద్ద వామపక్ష పార్టీల దీక్షలు...

హైదరాబాద్:పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద వామపక్ష పార్టీల దీక్షలు చేపట్టాయి. ఈ కార్యక్రమానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, మరో నేత నారాయణ హాజరు కానున్నారు. 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు....

ముంబై:నేడు మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 194 పాయింట్ల లాభంతో 28,126 దగ్గర, నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 8,505 దగ్గర ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్లు రెండు శాతం నష్టాల్లో ఉన్నాయి. 

రాజమండ్రిలో పుష్కర స్నానం చేసిన స్వరూపానందేంద్ర స్వామి

తూ.గో: రాజమండిలోని వీఐపీ పుష్కర ఘాట్ లో విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి, ఎంపి మురళీమోహన్ తదితరులు పుష్కర స్నానం చే
శారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సమర్పించారు.

రిటైర్డ్ పోలీసు అధికారిని కాల్చిచంపిన ఉగ్రవాదులు...

శ్రీనగర్ : కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు రిటైర్డ్ పోలీసు అధికారిని పొట్టన పెట్టుకున్నారు. స్థానికంగా ఉన్న మసీదులో ప్రార్థనలు చేసి తిరిగి వస్తున్న ఓ రిటైర్డ్ పోలీసు అధికారి(బషీర్ అహ్మద్)ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. పోలీసు అధికారి బషీర్‌ను జమ్మూకశ్మీర్ డీఎస్పీగా పని చేశారు. మైటార్ సైకిల్‌పై వచ్చిన ఉగ్రవాదులు బషీర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

యాకుబ్ మెమెన్ కు ఉరిశిక్ష ఖరారు

న్యూఢిల్లీ:ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యాకుబ్ మెమెన్(53)కు ఉరిశిక్ష ఖాయమైంది. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ మెమెన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం విదితమే. మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా తోసిపుచ్చారు. జులై 30న మెమెన్‌ను ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెమెన్ నాగపూర్ సెంట్రల్ జైలులో ఉంటున్నారు. ముంబయి బాంబు పేలుళ్ల కేసులో మెమెన్‌కు 2007లో కోర్టు మరణశిక్ష విధించింది. 

09:48 - July 15, 2015

విశాఖ:ఎస్‌ రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని యాత్రికుల బస్సు ఢీకొట్టడంతో...బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మిగిలిన 16మంది బాధితులనను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుష్కర యాత్రను ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న బస్సు డ్రైవర్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చికిత్స పొందుతున్న బాధితులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరంతా శ్రీకాకుళం జిల్లా రాజాం, విజయనగరం జిల్లాకు చెందిన వారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల అరెస్టులు...

హైదరాబాద్: తెలంగాణ‌లో మున్సిప‌ల్ కార్మికుల స‌మ్మె రోజుకు రోజుకూ ఉద్ధృతమవుతోంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అరెస్ట్‌లు, నిర్బందాలతో త‌మ‌ను అడ్డుకోలేరని నిన‌దిస్తున్నారు. మరోవైపు స‌మ్మె ప‌ట్ల ప్రభుత్వ తీరును ఖండిస్తూ వామ‌ప‌క్షాలు నేటి నుంచి ఇందిరాపార్క్ వ‌ద్ద నిర‌హార‌దీక్షలు చేపట్టేందుకు సన్నద్ధమయ్యాయి.

టాఫ్రిక్ పోలీసులుగా మంత్రులు హరీష్, తుమ్మల!

భద్రాచలం:తెలంగాణ రాష్ట్ర మంత్రులు ట్రాఫిక్‌ సిబ్బంది అయ్యారు. భద్రాచలం..సారపాక మధ్య ట్రాఫిక్‌ను పర్యవేక్షించారు. బ్రిడ్జిపై రాకపోకలు స్తంభించాయన్న విషయం తెలుసుకున్న మంత్రులు తన్నీరు హరీ్‌షరావు, తుమ్మల నాగేశ్వరరావులు సారపాక చేరుకొని వాకీ-టాకీలు చేబూని వాహనాలను మళ్లించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. ఆ తరువాత రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ షాన్‌వాజ్‌ఖాసీంతో ట్రాఫిక్‌ మళ్లింపుపై పలు సూచనలు ఇచ్చారు.

దంపతులపై దుండగుల దాడి:భర్త మృతి, భార్య పరిస్థితి విషమం

మెదక్: నర్సాపూర్‌లో దంపతులపై దుండగుల దాడిచేశారు ఈఘటనలో భర్త మ‌ృతి చెందాడు భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. నర్సాపూర్‌లో విషాదం నిలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఎస్ ఆర్ నగర్ లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి

హైదరాబాద్:ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని రేణుకానగర్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆగి ఉన్న ఆటోలో యూసఫ్ అనే వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. యూసఫ్ మృతిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విద్యార్థి అరెస్టు

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ ధృవీకరణ పత్రాలతో దుబాయ్ వెళ్లడానికి యత్నించిన వెంకటేశ్వరరావు అనే విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు.

నలుగురు పోలీసు అధికారుల మృతదేహాలు లభ్యం

హైదరాబాద్: ఛత్తీస్ గఢ్ లోని బీజీపూర్ జిల్లాలో నలుగురు పోలీసు అధికారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు మావోయిస్టులు అపహరించిన పోలీసు అధికారులుగా అధికారులు గుర్తించారు.

భద్రాచలం పుష్కర ఘాట్లకు పోటెత్తిన భక్తులు...

హైదరాబాద్ : గోదావరి పుష్కరాలు మహా వైభవంగా కొనసాగుతోన్నాయి. బాసర నుంచి భద్రాద్రి వరకు పుష్కర శోభ సంతరించుకుంది. భక్తులు పుణ్యస్నానం ఆచరించడానికి పుష్కరఘాట్ల వద్ద బారులు తీరారు. భక్తులతో పుష్కరఘాట్లు కిక్కిరిసిపోయాయి. భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులతో పుష్కరఘాట్లు, ఆలయాలు కళకళలాడుతున్నాయి. పుష్కరఘాట్ల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్కరఘాట్ల నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతోన్నాయి.

కడెం ప్రాజెక్ట్ నుంచి ధర్మపురి పుష్కరఘాట్‌కు నీరు నిలిపివేత

హైదరాబాద్:తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్ర మైన ధర్మపురి పుష్కరఘాట్‌కు కడెం ప్రాజెక్ట్‌ నుంచి నీరు నిలిపివేశారు. దీంతో గోదావరి నీటి మట్టం తగ్గుతోంది. దీనివల్ల పుణ్యస్నాలకు వచ్చే భక్తులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని పుష్కరాలు ముగిసే వరకు కడెం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు.

నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్న వేం నరేందర్ రెడ్డి కుమారుడు...

హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌కు ఏసీబీ నోటీసులు అందజేసింది. నేడు ఉదయం 10 గంటలా 30 నిమిషాలకు విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసులో తెలిపింది. తన తండ్రి నరేందర్‌రెడ్డి గెలుపు కోసం గత నెల 31న స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇవ్వడానికి ముందు ఉదయ్‌సింహా, సెబాస్టీయన్‌తో కృష్ణ ఫోన్‌లో మాట్లాడినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు ఏసీబీ తెలిపింది. కృష్ణను విచారిస్తే.. మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

ఢిల్లీలో ఇద్దరు సెక్యూరిటీ గార్డుల హత్య

న్యూఢిల్లీ:ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో దారుణం జరిగింది. సివిల్ లైన్స్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు దారుణ హత్యకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధారాలు సేకరించారు.

నెల్లూరు టూటౌన్ పీఎస్ ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

నెల్లూరు:నగరంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులపై తెలుగుదేశం కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్, తన తమ్ముడు, ఇద్దరు అనుచరులతో కలిసి కులం పేరుతో దూషిస్తూ దాడి పాల్పడ్డాడు. దీనిపై టూటౌన్ పీఎస్ లో కార్మికులు ఫిర్యాదు చేసినా ఎస్సై స్వీకరించలేదు. దీంతో పీఎస్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు.

పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య

ఖమ్మం:పినపాక మండలం వెంకటరావు పల్లిలో పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

రాజమండ్రి జాతీయ రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు

తూ.గో: రాజమండ్రిలో పుష్కరాలకు భక్తులు భారీగా తరలి రావడంతో నిన్న రాత్రి నుంచి జాతీయ రహదారిపై రాజానగరం నుంచి రాజమండ్రి వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 7 గంటల పాటు భక్తులు వాహనాల్లో ఉండిపోయారు. ప్రస్తుతం నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి.

08:42 - July 15, 2015

హైదరాబాద్:గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరగడానికి ప్రభుత్వ అసమర్థత, పాలనా వైఫల్యం స్పష్టంగా కనపుడుతోందని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ది హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. విపత్తు నిర్వహణపై కేంద్రీకరించాల్సిన అవసరం లేదా? మానవ కల్పిత విపత్తు వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోందా? పని కన్నా ప్రచారాలకు ఆర్భాటాలు ఇచ్చారా? డిమాండ్ మేనేజ్ మెంట్ సప్లిమెంటేషన్ లేదా? ఆధునిక కాలానికి అనుగుణంగా పండితులు ముహూర్తాలను మార్చాల్సిన అవసరం వుందా? మెడికల్ ఎమర్జెన్సీ లో కూడా పూర్తిగా విఫలం అయ్యిందా? క్రౌడ్ మేనేజ్ మెంట్ పై అధికారులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇలాంటి అంశాలపై ప్రొ.కె. నాగేశ్వర్ చక్కటి విశ్లేషణ చేశారు. మరి ఆ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

కిటకిటలాడుతున్న పుష్కర ఘాట్ లు

తూ.గో: రాజమండ్రిలోని పుష్కర ఘాట్ లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిన్న జరిగిన పెను విషాదంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. యాత్రీకుల రద్దీ దృష్ట్యా అదనపు బలగాలను మోహరించారు. కోటిలింగాల రేవు వద్ద డీజీపీ జేవీ రాయుడు సమీక్షించారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 3 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

ఆగి ఉన్న రోడ్డురోలర్‌ను ఢీకొట్టిన కారు :ఒకరి మృతి

నల్గొండ:కోదాడ బైపాస్‌రోడ్డ పై ఆగి ఉన్న రోడ్డురోలర్‌ను కారు ఢీకొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందారు.మరోముగ్గురికి గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డైవర్ నిర్లక్షంవల్ల ప్రమాదం జరిగిందని బావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్టు పోలీసులు తెలిపారు.

 

నేడు ప్రధాని నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం...

న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ బుధవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో వివాదాస్పద భూసేకరణ బిల్లుపై ముఖ్యమంత్రులతో చర్చించాలని భావిస్తున్నారు. రేస్ కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసంలో జరిగే సమావేశానికి మోడీ అధ్యక్షత వహిస్తారని పీఎంవో తెలిపింది. ఈ సమావేశానికి కాంగ్రస్ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులతో పాటు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా సమావేశానికి హాజరు కావడం లేదని తెలుస్తోంది.

తూ.గో జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్ని ఇద్దరు మృతి

 తూ.గో: కడియం మండలం వెంకాయమ్మపేటలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారి కుంటుంబాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

08:01 - July 15, 2015

హైదరాబాద్:మున్సిపల్ కార్మికుల సమ్మె పట్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీరు సరికాదు అని 'న్యూస్ మార్నింగ్'చర్చలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అభిప్రాయ పడ్డారు. కార్మికులపై సైన్యాన్ని,ఎస్మా ప్రయోగిస్తాం అని చెప్పడం సరియైందేనా? ప్రభుత్వం వెంటనే సమ్మె పై స్పందించాల్సిన అవసరం లేదా? రాజమండ్రి వద్ద తొక్కిసలాటలో 31 మంది మృతి చెందారు. ఇలా జరగడం చాలా దురదృష్టకరం. ఈ మరణాలు ప్రభుత్వ హత్యలు గా భావించవచ్చా? ఘటన పై ప్రతిపక్షం రాజకీయం చేస్తోందా? ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పిస్తోంది? పుష్కరాల వద్ద తాగేనీటి కొరత, టాయిలెట్ల కొరత వుందా? ప్రభుత్వం ప్రచారంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తే బాగుండేదా? ఇలాంటి అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్హణరావుతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహేష్ గౌడ్, బిజెపి నేత రఘునందనరావు, టిడిపి నేత సూర్యప్రకాష్ , వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై వుందని...బాధ్యతలను ప్రభుత్వాలు విస్మరించకూడదని నేతలు అభిప్రాయపడ్డారు. మరి ఇలాంటి చర్చను మీరూ చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

నేటి నుంచి సిల్క్ ఎక్స్ పో....

హైదరాబాద్ : మాదాపూర్‌లోని శిల్ప కళావేదికలో హస్తశిల్పి ఆర్టిషన్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిల్క్ ఇండియా - 2015 వస్త్ర ప్రదర్శన నిర్వహించనున్నారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రదర్శనలో చేనేత కళాకారులు, చేతి పని బృందాలు, పట్టు సహకార సంస్థలు దాదాపు 70కి పైగా స్టాల్స్‌లో విభిన్న రకాల ఉత్పత్తులను ప్రదర్శిస్తారని నిర్వాహకుడు అభినంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగుతుందన్నారు.

తెలుగు వర్శిటీలో కంప్యూర్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం...

హైదరాబాద్: నాంపల్లిలోని పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మూడు నెలల పాటు ‘కంప్యూటర్‌ సర్టిఫికేషన్‌ కోర్సు’కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సర్టిఫికేషన్‌ కోర్సు, కంప్యూటర్‌ అప్లికేషన్‌, ఆఫీస్‌ అడ్మినిస్ర్టేషన్‌ తదితర కోర్సులకు విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణిత, దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. ఈ మేరకు విశ్వవిద్యాలయం రిజిసా్త్రర్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల నుంచే తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తుల సమర్పనకు ఈ నెల 25వ తేదీ చివరి రోజు.

07:00 - July 15, 2015

విజయవాడ: గోదావరి పుష్కరాలు ప్రారంభమైన తొలి గంటల్లోనే అంతులేని విషాదం జరిగింది. రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 29మంది చనిపోయారు. ఈ మహా విషాదం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. సామూహిక కార్యక్రమాల నిర్వహణలో మనమెంత అప్రమత్తంగా వుండాలో హెచ్చరిస్తోంది. ఇంతకీ లోపం ఎక్కడ జరిగింది? దీనికి బాధ్యులెవరు? మళ్లీ మళ్లీ ఇలాంటి విషాదాలు జరగకుండా వుండాలంటే ఏమి చేయాలి? ఈ విషాద సంఘటన నేపథ్యంలో మనం తీసుకుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావుగారు, ప్రముఖ అడ్వకేట్‌ ముప్పాళ్ల సుబ్బారావుగారు రాజమండ్రి నుండి పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:57 - July 15, 2015

ఢిల్లీ:అమెరికా ఆధ్వర్యంలోని 6 శక్తిమంతమైన దేశాలతో ఇరాన్‌ చారిత్రాత్మక అణు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించారు. అమెరికా- ఇరాన్‌ల మధ్య దాదాపు 20 నెలలుగా సాగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. ఈ కీలక ఒప్పందంతో ఇరాన్‌ చమురు ఉత్తత్తి, ఫైనాన్షియలకు సంబంధించిన వ్యవహారాలపై అమెరికా దాని మిత్రదేశాలు పెట్టిన ఆంక్షలు తొలగిపోనున్నాయి. టెహరాన్‌, వాషింగ్టన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరాన్‌ అణ్వస్త్ర కార్యకలాపాలను ఐక్యరాజ్యసమితి బృందం పర్యవేక్షిస్తుంది. ఇరాన్‌ సైనిక స్థావరాలను సైతం సోదా చేసే అధికారం ఉంటుంది. ఈ ఒప్పందంపై ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహాని హర్షం వ్యక్తం చేశారు. 

06:55 - July 15, 2015

ఢిల్లీ: రాష్ట్రపతిభవన్‌లో ప్రణబ్‌ ముఖర్జీ ఇవ్వనున్న...ఇఫ్తార్‌ విందుకు ప్రధాని హాజరుకావటం లేదని తెలుస్తోంది. మోదీ బిజీ షెడ్యూల్ కారణంగానే.. విందుకు హాజరుకావటం లేదని పీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజుసాయంత్రం ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో మోడీ సమావేశమవుతారు. సిక్కిం సహా పలు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై సమావేశంలో చర్చించనున్నారు.
షెడ్యూల్ మార్చాలని కోరినా స్పందించలేదు-కాంగ్రెస్....
ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఐదింటిలో అధికారంలో ఉంది. మోడీ షెడ్యూల్‌పై కాంగ్రెస్‌ వాదన మాత్రం మరోలా ఉంది. ఈశాన్యరాష్ట్రాల పర్యటన షెడ్యూల్‌ను మార్చుకొని....ఇఫ్తార్‌ విందుకు హాజరుకావాలని కోరినా ప్రధాని స్పందించలేదని ఆరోపిస్తున్నారు. ఇఫ్తార్‌ ముస్లింల కార్యక్రమం కావటంతోనే... మోడీ కావాలని విస్మరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
మోడీ తీరుపై విపక్షాల విమర్శలు....
కాంగ్రెస్‌ విమర్శలను పీఎంవో వర్గాలు తిప్పికొడుతున్నాయి. పలు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రామలపై సమావేశం ఉందని...అందుకే మోడీ దానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఐతే మోడీ తీరుపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని సెక్యులరిజానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శిస్తున్నారు.

గతేడాది కూడా హాజరుకాని మోడీ....
ఐతే మోడీ గతేడాది కూడా రాష్ట్రపతి ఇఫ్తార్‌ విందుకు హాజరుకాలేదు. చాలావరకు కేంద్రమంత్రులు సైతం విందుకు వెళ్లలేదు. ఒక్క రాజనాథ్‌సింగ్‌ మాత్రమే ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యారు. మోడీ మరోసారి ఇఫ్తార్ విందుకు డుమ్మాకొడుతున్నారని ఇప్పటికే తేలిపోయింది. మరి ఎంతమంది కేంద్రమంత్రులు..విందుకు హాజరవుతారో చూడాలి.

06:52 - July 15, 2015

హైదరాబాద్: తెలంగాణ‌లోమున్సిపల్ కార్మికుల సమ్మె పదవ రోజుకు చేరింది. ఓ వైపు బెదిరింపులు..మరోవైపు బుజ్జగింపులు...ఇది తొమ్మిదో రోజు మున్సిప‌ల్ కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.
హైదరాబాద్‌లో 550 మంది కార్మికుల అరెస్టు....
రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కేసీఆర్ సర్కారు వ్యవహరించిన తీరు.. అరెస్ట్‌లు పలు చోట్ల ఉద్రిక్తతకు దారితీశాయి. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌, రాజేంద్రనగర్, ఖైరతాబాద్‌, అబిడ్స్‌, కుత్బుల్లాపూర్‌ తదితర ప్రాంతాలతో పాటు పలు జిల్లాల్లోని పలువురిని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా.. కార్మికులు అడ్డుకున్నారు. హైదరాబాద్‌లో సమ్మెలో ఉన్న సుమారు 550 మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో 250 మందిని అరెస్టు చేశారు. వీరిలో మహిళా కార్మికులు కూడా ఉన్నారు.
సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వ యత్నాలు....
ఇక గ్రేట‌ర్ ప‌రిధిలో చెత్త తొలగింపునకు.. కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం చేసిన యత్నాలు ఫలించలేదు. ప్రభుత్వ అనుకూల మీడియాలో కార్మికులు సమ్మె విరమించినట్లు జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్న ఆయన.. ఎప్పటికప్పులు తన కార్యాలయం నుంచి టీవీ స్క్రోలింగ్‌ల కోసం ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారు. 18 వేల‌ మంది స్వీపర్లలో 11వేల మంది విధుల‌కు హాజ‌రైనట్లు సోమేష్‌ కుమార్‌ తెలిపారు.
375 మందిని విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటన....
మరోవైపు.. కార్మికుల పట్ల బెదరింపులకు పాల్పడుతున్న డిప్యూటీ మున్సిపల్ కమిషనర్.. కుత్బుల్లాపూర్‌లో సుమారు 375 మందిని విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణం విధుల్లోకి చేరకుంటే.. పాతవారందర్నీ తొలగించి.. కొత్తవారిని తీసుకుంటామని హెచ్చరించారు. అయితే దీనిని కార్మిక సంఘాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. జీతాల పెంపుపై లిఖిత పూర్వకమైన హామీ ఇస్తే తప్ప స‌మ్మె విర‌మించేది లేద‌ని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్భంధాలకు బెదిరేది లేదన్నారు. కేసీఆర్ సర్కారు నిర్భంధ చర్యలు వీడాల‌ని హెచ్చరించారు.
సమ్మెపై ప్రభుత్వ తీరును తప్పుబట్టిన లెప్ట్‌పార్టీలు.....
మున్సిప‌ల్ కార్మికుల స‌మ్మెపై ప్రభుత్వ నిరంకుశ చర్యల్ని 10 వామపక్ష పార్టీలు త‌ప్పుబ‌ట్టాయి. సుంద‌రయ్య విజ్జ్ఞాన కేంద్రంలో స‌మావేశమైన అన్ని కమ్యూనిస్టు పార్టీల నేతలు కార్మికుల స‌మ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బుధవారం నుంచి ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామన్న నాయకులు.. నేడు ఇందిరాపార్క్ వ‌ద్ద నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.
బుధవారం నుంచి నిరాహార దీక్షకు దిగుతున్నట్లు వెల్లడి.....
మున్సిపల్‌ కార్మికుల సమ్మెతో నగర వాసులకు ఇక్కట్లు తప్పలేదు. వీధులన్నీ చెత్తా, చెదారంతో కంపుకొడుతున్నాయి. పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో.. వ్యాధులు ప్రబలుతాయని హైదరాబాదీలు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందో.. లేక పోలీసుల ప్రయోగంతో బెదిరింపుల పర్వం కొనసాగిస్తుందో చూడాలి.  

టాటా ఏన్ వ్యాన్ - ఆటో ఢీ: ఇద్దరి మృతి

విశాఖ:సబ్బవరం మండలంలోని అనకాపల్లి -ఆనందపురం జాతీయ రహదారిపై సున్నపు బట్టీల వద్ద వేకువజామున టాటాఏన్ వ్యాన్ - ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ పట్నంలోని కేజీహెచ్ కు తరలించారు. 

రెండో రోజు కొనసాగుతున్న పుష్కరాలు

హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. రాజమండ్రి, కొవ్వూరు ల్లో భక్తులతో కిటకిటలాడుతోంది.

ఉప్పల్ లో పోలీసుల దౌర్జన్యం

హైదరాబాద్:ఉప్పల్ లో చెత్త తరలింపును కార్మికులు అడ్డుకోవడంతో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు దౌర్జన్యం చేశారు. 

ఆగివున్న లారీని ఢీకొన్న టూరిస్టు బస్సు

విశాఖ:ఎస్.రాయవరం మండలం అడ్డ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది.ఆగివున్న లారీని టూరిస్టు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయలయ్యాయి. క్షత గాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Don't Miss