Activities calendar

17 July 2015

22:04 - July 17, 2015

కారంచేడు ఘటన.... పెత్తందారుల అహంకారానికి నిదర్శనమని వక్తలు అన్నారు. నేటితో కారంచేడు ఘటనకు ముప్పైయేళ్లు పూర్తి కావడంతో టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో దళిత ఉద్యమనేత కత్తి పద్మారావు, న్యాయవాది కోటేశ్వర్ రావు, కెవిపిఎస్ ఎపి రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి పాల్గొని, మాట్లాడారు. కారంచేడు ఘటన దళితుల్లో చైతన్యం కలిగించిందని వక్తలు అభిప్రాయపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:50 - July 17, 2015

హారారే: జింబాబ్వే గడ్డపై భారత జట్టు దూకుడు కొనసాగుతోంది. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌ స్వీస్‌ చేసిన టీమిండియా టీ 20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు...ఓపెనర్లు రహానే, విజయ్‌తో పాటు రాబిన్‌ఉతప్ప రాణించడంతో 20 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లకు 178 పరుగులు చేసి జింబాబ్వే జట్టుకు సవాల్‌ విసిరింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు.....ఓపెనర్లు రాణించినా , మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమవ్వడంతో 124 పరుగులు మాత్రమే చేయగలిగింది.4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన అక్షర్‌ పటేల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. 

21:42 - July 17, 2015

హైదరాబాద్: ఎపి సీఎం చంద్రబాబుతో మున్సిపల్‌ కార్మికులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి సమ్మెను మరింత ఉద్ధృతం చేయనున్నట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. మరోవైపు అరెస్టయిన మున్సిపల్‌ కార్మికులను విజయవాడ వన్‌టౌన్‌ పీఎస్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, మున్సిపల్‌ కార్మిక జేఏసీ నేతలు పరామర్శించారు. మున్సిపల్‌ కార్మికుల హక్కులను సీఎం చంద్రబాబు కాలరాసేలా వ్యవహరిస్తున్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు. ఈనెల 20న విజయవాడలో జరగనున్న అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

 

21:37 - July 17, 2015

హైదరాబాద్: తెలంగాణ సర్కార్‌పై వామపక్షాలు యుద్ధభేరీ మోగించాయి. రాష్ట్రవ్యాప్త బంద్‌లో సమరశంకం పూరించాయి. అరెస్ట్‌లు, లాఠీఛార్జీలతో పోలీసులు అడ్డుకోవడానికి యత్నించగా.. అంతే దూకుడుతో కామ్రేడ్లు వారి చర్యలను ప్రతిఘటించారు. రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తించారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులందరికీ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్‌...
ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌ నగర్‌లో సీఐటీయూ కార్యకర్తలు, మున్సిపల్‌ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఆందోళనకారులపై లాఠీలు ఝుళిపించారు. అనంతరం వారిని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇందుకు నిరసనగా పలు కార్మిక సంఘాల నేతలు, మహిళలు కాగజ్‌ నగర్‌ పీఎస్‌ను ముట్టడించారు. దురుసుగా ప్రవర్తించిన ఎస్సై మాజీద్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేశారు. అటు ఆసీఫాబాద్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించి అనంతరం దహనం చేశారు. అనంతరం నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిజామాబాద్..
పారిశుద్ద కార్మికులకు మద్దతుగా వామపక్షాలు చేపట్టిన బంద్‌ నిజామాబాద్ జిల్లాలో విజయవంతమైంది. బస్తాండ్ ఎదుట ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకోవడంతో.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అటు కామ్రేడ్ల ధర్నాతో బోధన్‌ పట్టణం హోరెత్తింది. జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలతో నిరసన తెలిపారు లెఫ్ట్ పార్టీ నేతలు.
ఖమ్మం...
ఖమ్మం జిల్లాలో బంద్‌ ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వామపక్ష, ఇతర పక్షాల నాయకుల అరెస్టులతో అట్టుడికింది. స్థానిక బస్టాండ్ సెంటర్ లో రాస్తోరోకో చేపట్టారు. వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మధిర, కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, పాల్వంచ మున్సిపల్ కార్యాలయాల ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు.
కరీంనగర్‌..
కరీంనగర్‌లో వామపక్ష నాయకులు కదం తొక్కారు. బస్టాండ్ ముందు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వామపక్షనేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు తెలంగాణ చౌక్‌లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు పోలీసులు. గోదావరిఖనిలో మున్సిపల్‌ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. గోదావరి ఖని చౌరస్తాలో భారీ మానవ హారం నిర్వహించారు.
మెదక్‌..
మెదక్‌ జిల్లా కేంద్రంలో వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. బస్‌ డిపో ఎదుట వామపక్ష నేతలు ధర్నా చేపట్టారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ బస్‌డిపోల ఎదుట పారిశుద్ధ్య కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. సిద్దిపేటలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
నల్లగొండ..
వామపక్ష నాయకుల అరెస్ట్ లతో నల్లగొండ జిల్లా అట్టుడికింది. జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదుట బస్సులను అడ్డుకున్న నాయకులు, కార్మికులపై పోలీసులు విరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా అమానుషంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. సూర్యాపేట బస్‌ డిపో ఎదుట ధర్నా చేస్తున్న అఖిలపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహబూబ్ నగర్..
లెప్ట్ నేతల ఆందోళనలు, నిరసనలతో వలసల ఖిల్లా పాలమూరు జిల్లా హోరెత్తింది. మహబూబ్ నగర్, వనపర్తి,నాగర్ కర్నూల్,షాద్‌నగర్‌, నారాయణపేట,కల్వకుర్తిలో బస్సు డిపోల్లో బస్సులను అడ్డుకున్నారు. గద్వాల్‌ బస్సు డిపో ఎదుట శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీ ఛార్జ్‌ చేసి నిరసనకారులను బలవంతంగా అరెస్ట్ చేశారు.
వరంగల్‌..
వరంగల్‌ బస్టాండ్ వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కార్మికులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. నేతల అరెస్ట్‌ను నిరసిస్తూ కార్మికులు హన్మకొండ పోలీసు స్టేషన్ ముట్టడించారు. నర్సంపేట, జనగామ నియోజకవర్గంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 

21:28 - July 17, 2015

నల్లగొండ: మిర్యాలగూడలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో భారీ దోపిడి జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి ప్రవేశించిన దొంగలు, బీరువా తాళాలు పగలగొట్టి 14 తులాల బంగారం, లక్షా 50 వేల రూపాయలు ఎత్తుకెళ్లిపోయారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో నాగమణి అనే మహిళా నివాసముంటోంది. రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి తన పుట్టింటికి వెళ్లింది. ఇవాళ ఇంటికి తిరిగొచ్చేసరికి ఇళ్లంతా దోపిడికి గురయింది. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

విజయవాడ ఏ-1 కన్వెన్షన్ సెంటర్ లో ఇఫ్తార్ విందు..

విజయవాడ: నగరంలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు.

 

మంత్రి జగదీష్ రెడ్డిని అడ్డుకున్న పలువురి అరెస్టు

నల్గొండ: జిల్లాలోని భువనగిరి మండలం రాయగిరి వద్ద మంత్రి జగదీష్ రెడ్డిని అడ్డుకునేందుకు యత్నించిన వామపక్ష, కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 

పెద్దపులిని బంధించిన అటవీశాఖ అధికారులు

కర్నూలు: ఆత్మకూరు మండలం వెంకటాపురంలో సంచరిస్తున్న పెద్దపులిని అటవీశాఖ అధికారులు బంధించారు. పులిని తిరుపతికి తరలించారు. 

రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పెరిగిన రద్దీ

హైదరాబాద్: రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద రద్దీ పెరిగింది. రేపు, ఎల్లుండి సెలవులు కావడంతో పుష్కరయాత్రలకు వెళ్లే.. ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.

 

20:40 - July 17, 2015

ఇంటి అలంకరణపై ఎంతో ఆసక్తి చూపే తత్వం కొందరు మహిళలది. అదే ఆసక్తితో అనేక వస్తువులకు కళాత్మకతను జోడించి కొత్త రూపు తీసుకొస్తారు. అలాంటి వారి కోసం ఇవాళ్టి సొగసు సిద్ధంగా ఉంది. ఆ.. వివరాలను వీడియోలో చూద్దాం....


 

20:18 - July 17, 2015

కబీర్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ హీరోహీరోయిన్స్ గా నటించిన చిత్రం బజ్రంగి బైజాన్. ఈ చిత్రం ఇవాళా విడుదలయింది. మరి ఆ... చిత్రం ఎలా వుందో చూద్దాం...
కథ:
పాకిస్తాన్ దేశం లోని ఒక గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన శాహిదా అనే ఒక పాపకి మాటలు రావు. ఆ కుటుంబం యొక్క మతగురువు సలహా మేరకు భర్త వారిస్తున్నా పాపను తీసుకుని భారత్ దేశంలో డిల్లీలో ఉన్న ప్రముఖ దర్గాకి ట్రైన్ లో వస్తుంది శాహిదా తల్లి.శాహిదా కి మాటలు రావాలని దేవుడికి మొక్కుకుని తిరుగు ప్రయాణం లో రైలు ఆగి అందరు నిదురపోతున్న సమయంలో పొరపాటున షాహిద రైలు దిగి భారత్ వెళ్ళే గూడ్స్ రైలు ఎక్కుతుంది.దీంతో షాహిద మళ్లీ భారత్ చేరడం సల్మాన్ ఖాన్ పాపను చేరదీయడంతో అసలు కథ మొదలవుతుంది.మాటలు రాని శాహిదా ను సల్మాన్ ఎలా అర్ధం చేసుకున్నాడు పాప పాకిస్తాన్ కు చెందినదని ఎలా తెలుసు కున్నాడు చివరకు శాహిదాను పాకిస్తాన్ లోని తల్లి దండ్రుల దగ్గరకు చేర్చడా లేదా అనేది మిగిలిన కథ...
విశ్లేషణ:
ఎంత మంది స్టార్లు ఉన్నా వందల కోట్లు ఖర్చుపెట్టినా కథ కథనం లేకపోతే ఆ.. సినిమా ఫట్ అనడం కాయం. కానీ అదే స్టార్ డంకి మంచి కథ తోడయితే సునామి లాంటి హిట్టు కొట్టడం అత్యంత ఈజీ...ఈ విషయాన్ని మరొక్కసారి సల్మాన్ ఖాన్ నటించిన బజ్రంగి బైజాన్ చిత్రం నిరూపించింది. అధ్బుతమైన కథ కథనాలతో మనసుని హత్తుకునే సన్నివేశాలతో దర్శకుడు కబీర్ ఖాన్ ఆదరగోట్టగా తన ఇమేజ్ ని స్టార్ డం ని పక్కన పెట్టి ఇంతవరకు ఎన్నడూ చేయని అభినయంతో సల్మాన్ ఖాన్ ఇరగదీసాడు. అసలు సల్మాన్ ఖాన్ ఏనా ఇలా పెర్ఫార్మన్స్ ఇస్తుంది అని ప్రేక్షకులు తమను తామే నమ్మలేనంతగా తన నటన తో సల్లు భాయ్ మైమరిపించాడు. అగ్నికి వాయువు తోడైనట్లు సల్మాన్ ఖాన్ కి తోటి నటీనటులు నటించడం ఈ చిత్రం యొక్క ప్రత్యేకత. ముఖ్యంగా జర్నలిస్ట్ గా చేసిన నవాజుద్దీన్ చైల్డ్ ఆర్టిస్ట్ అయిన హర్శాలి మల్హోత్రా తమ నటనతో అలరించారు. ఇక దర్శకుడు కబీర్ ఖాన్ రాసిన డైలాగులు అయితే ప్రేక్షకులను కాసేపు ఏడిపించాయి, కాసేపు నవ్వించాయి,పాత్రల్లో లీనమయ్యేలా చేసాయి. ఇక మిగిలిన టెక్నికల్ అంశాల్లో పాకిస్తాన్ లోనే ఉన్నామా అనేంతగా ఆర్ట్ వర్క్, భారత్ పాకిస్తాన్ మధ్యన ఇంత అందంగా ప్రకృతి ఉంటుందా అనేలా చూపించిన అసీం మిశ్రా సినిమాటోగ్రఫి, సినిమాలోని భావోద్వేగాలను మనసుని తాకేలా చేసిన సంగీతం ఇవన్నీ నభూతో న భవిష్యత్,ఇక నుంచి సల్మాన్ ఖాన్ కెరీర్ గురించి మాట్లాడుకునేటప్పుడు బజ్రంగి బాయజాన్ కి ముందు ఆ తర్వాత అని మాట్లాడుకుంటారు. ఈ ఒక్క సినిమాతోనే సల్మాన్ ఖాన్ మిగతా ఖాన్ లకు మిగతా హీరోలకు అందనంత ఎత్తుకి ఎదుగుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు బాలీవుడ్ లోని అన్ని సినిమాల రికార్డులు బజ్రంగి బాయజాన్ తో తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. చివరగా ఈ చిత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మనుషులు ఏదో ఒక మతాన్ని అనుసరించడం సహజం కానీ ఒక మనిషిని మరొక మనిషి ప్రేమించడానికి గాని సాయపడటానికి గాని మధ్యన మతం అనేది అడ్డు రాకూడదు. మనుషుల మధ్య మతం పేరిట చిచ్చుపెట్టే స్వార్ధపరులకు ఈ సినిమా ఒక చెంప పెట్టు. మానవత్వమే నిజమైన మతమని బజ్రంగి బైజాన్ హెచ్చరిక చేస్తున్నాడు. మన దేశానికి ఈ హెచ్చరికను జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

19:57 - July 17, 2015

అడుగడుగునా పురుషాధిక్య భావజాలం నెలకొన్న మన సమాజంలో మహిళలు పని ప్రదేశాలలో అనేక రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపులు భరిస్తూ తప్పనిసరి పరిస్థితులలో పనిచేయాల్సిన స్థితి ఎంతో మంది మహిళలది. మరి అలాంటి సందర్భంలో వేధింపులను ఎలా అడ్డుకోవాలి? లైంగిక వేధింపులను ఎలా ఎదిరించాలి? వంటి అంశాలను మీకు తెలియజేసేందుకు ఇవాళ్టి నిర్భయ మీ ముందుకు వచ్చింది. ఆ... వివరాలను వీడియోలో చూద్దాం..


 

జింబాబ్వేపై భారత్ విజయం

ఢిల్లీ: భారత్, జింబాబ్వేల మధ్య జరిగిన తొలి టీ-20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 54 పరుగుల తేడాతో జింబాబ్వేపై భారత్ గెలుపొందింది.

19:48 - July 17, 2015

హైదరాబాద్ లో బాలకార్మిక వ్యవస్థపై సెమినార్
దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని పాలకులు ఎన్ని గొప్పలు చెప్పినా బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించటంలో చిత్తశుద్ధి అంతంతమాత్రంగానే ఉంటోంది. ఫలితంగా బడిలో ఉండాల్సిన బాల్యం కార్ఖానాలకు పరిమితమవుతోంది. ఇదే అంశంపై పనిచేస్తున్న అనేక స్వచ్ఛంద సంస్థలు తెలుగు రాష్ట్ర రాజధానిలో సెమినార్ ను నిర్వహించాయి.
మహిళలపై లైంగికవేధింపులు..
పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. పని ప్రదేశాలలో లైంగిక నిరోధింపుల చట్టం వచ్చి రెండు సంవత్సరాలు దాటినా అమలులోని జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది.
కేరళలో షీ బస్సుల ఏర్పాటు
మహిళల భద్రత కోసం కేరళ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మహిళల రవాణా కోసం కొత్తగా షీ బస్సులను ఏర్పాటు చేసేందకు సన్నాహాలు చేస్తోంది.
ప్రఖ్యాత పురస్కారానికి శ్రేయా ఘోషాల్ ఎంపిక
సినిమాలలో తన గానంతో ప్రత్యేకత చాటిన యువ సింగర్ శ్రేయా ఘోషాల్ ప్రఖ్యాత పురస్కారానికి ఎంపికైంది. అనేక భాషలలో సత్తా చాటుతున్న శ్రేయా ఈ అవార్డును దక్కించుకుంది.

 

ఐదో వికెట్ కోల్పోయిన జింబాబ్వే

ఢిల్లీ: భారత్, జింబాబ్వేల మధ్య జరుగుతున్న తొలి టీ-20 క్రికెట్ మ్యాచ్ జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. 82 పరుగుల వద్ద ఎర్విన్(2) రనౌట్ ఔట్ అయ్యారు.

 

నాలుగో వికెట్ కోల్పోయిన జింబాబ్వే

ఢిల్లీ: భారత్, జింబాబ్వేల మధ్య జరుగుతున్న తొలి టీ-20 క్రికెట్ మ్యాచ్ జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. హర్భజన్ సింగ్ బౌలింగ్ లో 68 పరుగులు వద్ద కోవెంట్రి(10) ఔట్ అయ్యారు.

జింబాబ్వే విజయలక్ష్యం-179 పరుగులు

ఢిల్లీ: భారత్, జింబాబ్వే ల మధ్య జరుగుతున్న టీ20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి.. 178 పరుగులు చేసింది. జింబాబ్వే విజయలక్ష్యం 179 పరుగులుగా ఉంది. భారత్ బ్యాటింగ్: ఊతప్ప-39(నాటౌట్), హర్భజన్-4(నాటౌట్), రహానే(33), మురళీ విజయ్ (34), పాండే(19), బిన్నీ(11). 

ముగిసిన వామపక్షాల సమావేశం

హైదరాబాద్: ముగ్ధుంభవన్ లో నిర్వహించిన వామపక్షాల సమావేశం ముగిసింది. కేసీఆర్ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని వామపక్ష నేతలు మండిపడ్డారు. చట్టబద్దమైన సమ్మెను గుర్తించకపోవడం అప్రజాస్వామికమన్నారు. టీఆర్ ఎస్ కార్మిక సంఘం నేతలు...జీహెచ్ ఎంసీ ఎన్నికల కోసమే.. ఇక్కడి కార్మికులకు వేతనాలు పెంచినట్లు కనిపిస్తోందని వెల్లడించారు. రాష్ట్ర బంద్ కు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. జిల్లాలోనూ వేతనాలు పెంచే వరకూ సమ్మె కొనసాగుతోందన్నారు. దీని కోసం జిల్లాల్లో వామపక్షాల ఆధ్వర్యంలో యాత్రలు చేస్తామని చెప్పారు.

18:28 - July 17, 2015

ఢిల్లీ: వ్యాపం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలపై... మధ్యప్రదేశ్‌లో కమలనాథుల చర్యలు ప్రారంభమయ్యాయి. వ్యాపం స్కాం కేసు ఎఫ్ ఐఆర్లో పేరు నమోదైన... పార్టీ సీనియర్ నేత గులాబ్ సింగ్ కిరర్‌ను సస్పెండ్ చేసింది. వాస్తవానికి గతేడాదే ఈయన పేరును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేర్చింది. ఈయన కుమారుడు డాక్టర్ శక్తి సింగ్‌పైనా ఆరోపణలు వున్నాయి. గులాబ్‌ సింగ్‌ కిరర్‌పై పోలీసులు క్యాష్‌ రివార్డ్ సైతం ప్రకటించారు. ఐతే బీజేపీ మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోయింది. కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టడంతో... ఎట్టకేలకూ చర్యలకు ఉపక్రమించింది.

 

18:24 - July 17, 2015

జైపూర్: ఎట్టి పరిస్థితుల్లోను భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లును పార్లమెంట్‌లో పాస్‌ కానివ్వమని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ఒక్క ఇంచ్ భూమి కూడా రైతుల నుంచి లాక్కోనివ్వమని పేర్కొన్నారు. జైపూర్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజస్థాన్‌లో లలిత్‌ మోడీ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, రైతులు, దేశప్రజలంతా కలిసి ప్రధాని మోడీ 56 ఈంచ్‌ల ఛాతీని 5.6 ఈంచ్‌లకు కుదిస్తారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. 6 నెలల్లోనే మోడీ సర్కార్‌ నిజ స్వరూపం బయటపడిందని ధ్వజమెత్తారు.

 

18:14 - July 17, 2015

తూర్పుగోదావరి: రాజమండ్రి వీఐపీ పుష్కరఘాట్‌లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి పుష్కర స్నానమాచరించారు. వేదపండితులచే ఆశీర్వచనం పొందారు. అనంతరం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని.. అందుకు పశ్చాతపడుతూ మృతుల ఆత్మలకు శాంతి కలిగించాలని గోదారమ్మను కోరామన్నారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని .. ప్రకృతి సహకరించేలా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు.

 

17:48 - July 17, 2015

రాజమండ్రి: గోదావరి పుష్కర ఘాట్ వద్ద స్నానం ఆచరిస్తున్న ఓ భక్తురాలి మెడలోంచి ఓ దొంగ గొలుసు దొంగిలించాడు. పుష్కర ఘాట్‌లో బోట్‌కు కాపలాగా ఉన్న వ్యక్తే ఈ దోపిడికి పాల్పడ్డాడు. గొలుసు తీసుకొని పారిపోతుండగా అక్కడ పహరా కాస్తున్న పోలీస్ బోట్‌ చేజ్‌ చేసి పట్టుకుంది. అయితే ప్రభుత్వం నియమించిన గజ ఈతగాళ్లే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో..భక్తులు ఆందోళన చెందుతున్నారు. పుష్కరాలు మొదలైన నాలుగు రోజుల్లో ఇప్పటికి 10 మంది చైన్‌స్నాచర్స్ ను పోలీసులు పట్టుకున్నారు.

 

17:46 - July 17, 2015

కృష్ణా: జిల్లాలోని కొత్తూరు, తాడేపల్లిలో జరుగుతున్న పోలవరం కాల్వ పనులను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. పనులు జరుగుతున్న విధానాన్ని ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆగస్ట్‌ 15 లోపు పనులు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు .

 

17:41 - July 17, 2015

జమ్మూకాశ్మీర్: ఈతరం నేతలకు... గిరిధర్‌ లాల్‌ దోగ్రా ఆదర్శప్రాయుడని... ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ మామ, జమ్మూకాశ్మీర్‌ మాజీ మంత్రి... గిరిధర్‌లాల్‌ డోగ్రా జయంతి కార్యక్రమానికి మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా మోదీ రాజకీయ జీవితాన్ని కొనియాడారు.

 

17:20 - July 17, 2015

హైదరాబాద్: ప్రభుత్వం చిత్తశుద్ధితో మున్సిపల్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు అన్నారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు అన్నివర్గాలు మద్దతు తెలిపాయన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె అందరి మద్దతు పొందడం విశేషమని చెప్పారు. కార్మికులు కోరేవి న్యాయమైన డిమాండ్లని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అహంకారం ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతుందన్నారు. కార్మికుల ఐక్యతను చీల్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను విభజన చేసి... సమ్మెను వమ్ము చేయాలని ప్రభుత్వం భావిస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్ లోని మున్సిపల్ కార్మికుల వేతనాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులకు కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

 

17:09 - July 17, 2015

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ పరిధిలో సమ్మె విరమిస్తున్నట్లు మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ తెలిపింది. పండుగలు, ప్రజారోగ్యం దృష్ట్యా జీహెచ్ ఎంసీ కార్మికులు సమ్మె విరమించి... విధులకు హాజరవుతున్నారని జెఎసి నేతలు చెప్పారు. సమ్మెలో ఉన్నవారిని విధులోకి తీసుకోవాలని కోరారు. సమ్మె విరమించిన వారందరికీ.. కొత్త వేతనాలు ఇవ్వాలన్నారు. మిగతా 9 జిల్లాల్లో కార్మికుల వేతనం పెంచే వరకూ సమ్మె కొనసాగుతుందని తెలిపారు. సమ్మెపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన జీతాల పెంపుదల పాక్షిక ఫలితమే అన్నారు. 

చంద్రబాబుతో మున్సిపల్ కార్మికుల చర్చలు విఫలం..

విజయవాడ: సీఎం చంద్రబాబుతో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ చర్చలు విఫలమయ్యాయి. సమ్మె విరమించాలని చంద్రబాబు కార్మికులను కోరారు. అయితే కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకూ.. సమ్మె కొనసాగుతుందని మున్సిపల్ కార్మిక సంఘాల జెఎసి ప్రకటించింది.

 

ముగ్ధుంభవన్ లో వామపక్షాల సమావేశం ప్రారంభం

హైదరాబాద్: ముగ్ధుంభవన్ లో వామపక్షాల సమావేశం ప్రారంభం అయింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఇతర వామపక్ష నేతలు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశముంది.

 

పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కొత్త డైరెక్టర్ గా ప్రశాంత్ పత్రబె..

ముంబై: పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కొత్త డైరెక్టర్ గా ప్రశాంత్ పత్రబె నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

వివాదాలతో కేంద్రప్రభుత్వం విలవిల: రాహుల్

రాజస్థాన్: ఆరు నెలలుగా కేంద్రప్రభుత్వం వివాదాలతో విలవిలలాడుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. 56 అంగుళాల మోడీ ఛాతీ 5.6 అంగుళాలకు తుస్సుమందని ఎద్దేవా చేశారు. ఐపీఎల్ లో ఆర్థిక నేరస్తుడు లలిత్ మోడీ.. లండన్ పారిపోవడానికి వసుంధర రాజె సాయం చేశారని రాహుల్ ఆరోపించారు. వసుంధరరాజె చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. వసుంధరరాజె, సుష్మాస్వరాజ్ లపై మోడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పార్లమెంట్ లో మోడీని నిలదీస్తామన్నారు.

 

వివిధ బ్యాంకుల అధికారులతో 'అనంత' కలెక్టర్-ఎస్పీ భేటీ

అనంతపురం: వివిధ బ్యాంకుల అధికారులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ భేటీ అయ్యారు. నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు తీసుకున్న వ్యవహారంపై చర్చిస్తున్నారు. అధికారుల నుండి కలెక్టర్, ఎస్పీ వివరాలు తెలుసుకుంటున్నారు.

 

జీహెచ్ ఎంసీలో సమ్మె విరమించిన కార్మిక సంఘాలు..

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ పరిధిలో సమ్మె విరమిస్తున్నట్లు మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ తెలిపింది. పండుగలు, ప్రజారోగ్యం దృష్ట్య జీహెచ్ ఎంసీ కార్మికులు సమ్మె విరమించి... విధులకు హాజరవుతున్నారని జెఎసి నేతలు చెప్పారు. సమ్మె విరమించిన వారందరికీ.. కొత్త వేతనాలు ఇవ్వాలన్నారు. మిగతా 9 జిల్లాలో కార్మికుల వేతనం పెంచే వరకూ సమ్మె కొనసాగుతుందని తెలిపారు. 

16:11 - July 17, 2015

పశ్చిమ గోదావరి: జిల్లాలోని వాడపల్లి ఘాట్‌ వద్ద కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పుష్కర స్నానం చేశారు. 12 ఏళ్లకు వచ్చే పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. పుష్కరాల్లో భక్తులు సంయనం పాటించాలని..రెండు రోజుల క్రితం జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని వెంకయ్యనాయుడు అన్నారు. 

నేడు సీపీఐ ఆఫీసులో వామపక్షపార్టీల మీడియా సమావేశం

హైదరాబాద్: ఇవాళా సాయంత్రం 5 గంటలకు సీపీఐ కార్యాలయంలో వామపక్ష పార్టీల మీడియా సమావేశం జరుగనుంది. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.

 

ప్రత్యూష కేసుపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: ప్రత్యూష కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యూషతో స్వయంగా తామే మాట్లాడతామని, సోమవారం కోర్టుకు తీసుకురావాలని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ప్రత్యూష పిన్ని చాముండేశ్వరి తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ ప్రత్యూష సంరక్షణకు ఎవరూ ముందుకు రాకపోవడంపై హైకోర్టు విచారణ వ్యక్తం చేసింది. ప్రత్యూష తండ్రి రమేష్, మేనమామ సాయిప్రతాప్ లను కోర్టులో సోమవారం హాజరుపర్చాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యూష పెద్దనాన్న కోర్టుకు హాజరయ్యారు.

 

15:26 - July 17, 2015

పశ్చిమగోదావరి: కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో పుష్కరాల్లో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. పుష్కర స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకునే గది వద్ద స్ప్రహతప్పి పడిపోయి అంతలోనే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వలి గ్రామానికి చెందిన దుర్గమ్మగా గుర్తించారు. మృతదేహాన్ని 108 వాహనంలో స్వగ్రామానికి తరలించారు.  

టీ.కాంగ్రెస్ లో నిరసనల ముసలం

హైదారాబాద్: తెలంగాణ కాంగ్రెస్ లో నిరసనల ముసలం మొదలయింది. ఉత్తమ్, దానం నాగేందర్ పై ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించకుండా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఉంటే పార్టీలో ఎలా కొనసాగాలని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలు అవమానిస్తుంటే...టీఆర్ ఎస్ నేతలు గౌరవిస్తున్నారని చెప్పారు. వీరి తీరుపై సోనియాకు లేఖ రాస్తానని పేర్కొన్నారు.

 

15:15 - July 17, 2015

కృష్ణా: ప్రపంచంలోనే బెస్ట్ రాజధానిగా అమరావతిని తీర్చి దిద్దుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. జిల్లాలోని కొత్తూరు-తాడేపల్లిలో ఏర్పాటు చేసిన 66వ వనమహోత్సవాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్, చంద్రబాబు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. 13 జిల్లాల్లో 15 నగర వనాలను అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు.

 

15:09 - July 17, 2015

నల్గొండ: వామపక్షాల మద్దతుతో నల్గొండ జిల్లాలో ధర్నా చేస్తున్న మున్సిపల్ కార్మికులు, లెఫ్ట్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో భువనగిరిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతియుతంగా ధర్నా చేస్తున్న కార్మికులపై లాఠీఛార్జ్ చేయడంతో అనేకమందికి గాయాలయ్యాయి. పోలీసుల అక్రమ అరెస్టులను లెఫ్ట్ నేతలు ఖండించారు. అప్రజాస్వామికంగా కార్మికుల హక్కులను కాలరాస్తున్న సీఎం కేసీఆర్‌....నియంతృత్వ పోకడలను నిరసించారు. వెంటనే ప్రభుత్వం కార్మికుల వేతనాలను పెంచాలని లెఫ్ట్ నేతలు డిమాండ్ చేశారు.

 

14:55 - July 17, 2015

వరంగల్‌: జిల్లాలో ఆందోళనలు చేస్తున్న మున్సిపల్ కార్మికులు, లెఫ్ట్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి సమీప పోలీస్‌స్టేషన్లకు తరలించారు. దీంతో నగరంలోని పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే...ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని లెఫ్ట్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కార్మికుల వేతనాలు పెంచాలని నేతలు డిమాండ్ చేశారు.

 

14:53 - July 17, 2015

మహబూబ్‌నగర్: జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. వామపక్షాల మద్దతుతో బంద్‌లో పాల్గొన్న మున్సిపల్ కార్మికులను, ధర్నా చేస్తున్న విపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కల్వకుర్తి ఆర్టీసి డిపో ముందు ధర్నా చేస్తున్న సీపీఎం, టిడిపి, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్టులతో కార్మికులు చేస్తున్న సమ్మెను ఆపలేరని లెఫ్ట్ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

మంత్రులను జిల్లాల్లో తిరగనివ్వం: మున్సిపల్ కార్మికులు..

విజయవాడ:సమస్యల పరిష్కారానికి మున్సిపల్‌ కార్మికులు తమ సమ్మెను మరింత ఉధృతం చేశారు. 13 జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన కార్మికులు బందర్‌రోడ్డులోని సీఎం ఆఫీసు ముట్టడికి యత్నించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. పలువురు మున్సిపల్‌ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్మికులు మాట్లాడుతూ ఈనెల 20 నుంచి సీఎం, మంత్రుల ఆఫీసు ఎదుట ధర్నాలు చేస్తామని, మంత్రులను జిల్లాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు.

హిందూ దేశంగా మార్చడమే మాలక్ష్యం: ప్రవీణ్ తొగాడియా...

ఖమ్మం:భారతదేశాన్ని హిందూ దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ విశ్వహిందూ పరిషత్‌ కృషి చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్‌తొగాడియా చెప్పారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో పర్యటించిన ప్రవీణ్‌తొగాడియా మీడియాతో మాట్లాడారు. మత మార్పిడులను అడ్డుకోవడంతోపాటు గోపూజలు చేయడం, పేద హిందువులకు ఉచితంగా విద్యా, వైద్యం అందించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామన్నారు. ముస్లిమ్‌లు, క్రైస్తవులకు మక్కా, వాటికన్‌ సిటీల యాత్రలకు డబ్బులు ఇస్తున్నారని కాని హిందువులను విస్మరిస్తున్నారన్నారు. హిందువుల అభివృద్ధికి తాము కట్టుబడి పనిచేస్తున్నామన్నారు.

కొల్లేరు పక్షులనే కాదు....ప్రజలనూ కాపాడుతాం:జవదేకర్..

విజయవాడ:కొల్లేరు పక్షులనే కాదు....ప్రజలనూ కాపాడాల్సిన అవసరముందని కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ అన్నారు. శుక్రవారం కొల్లేరు ప్రాంతంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జవదేకర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా జవదేకర్‌ మాట్లాడుతూ చట్టాలకు సవరణ చేసైనా ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో సర్కారి కాలువపై వంతెన నిర్మాణం ఉంటుందని జవేదకర్‌ వెల్లడించారు. 

13:04 - July 17, 2015

హైదరాబాద్:ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో ఓ స్కూలు యాజమాన్యం రెచ్చిపోయింది. అలీపూర్ ఏరియాలోని సర్వోదయ పాఠశాలలో... సరిగా చదవటం లేదనే కారణంతో.. ముగ్గురు విద్యార్థులను స్కూలు మేనేజర్ చితకబాదారు. కర్రతో విద్యార్థుల వీపుపై వాతలు పడేలా కసిదీరా కొట్టారు. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియటంతో... వారు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఐతే పాఠశాల యాజమాన్యం మాత్రం చర్యలు తీసుకున్నామంటూనే... తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేసింది. 

13:00 - July 17, 2015

విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. కార్మికుల సమ్మెకు మద్ధతుగా సీఐటీయూ, సీపీఎం చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి పెద్ద ఎత్తున కార్మికులు బయలుదేరారు. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న సీఐటీయూ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పోలీసులకు, లెఫ్ట్‌ కార్యకర్తలకు జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి.

 

'కేసీఆర్ ను జీహెచ్ ఎంసీ కమిషనర్ తప్పుదోవ పట్టిస్తున్నారు'

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ను జీహెచ్ ఎంసీ కమిషనర్ తప్పుదోవ పట్టిస్తున్నారని టి. కాంగ్రెస్ నేత దానం నాగేదంర్ ఆరోపించారు. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా వామపక్షాల చేపట్టిన సమ్మెకు మద్దతు తెలుపుతూ టి. సచివాలయం ముందు టి. కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను తొలగిస్తామంటే ఊరకోమని హెచ్చరించారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని జానారెడ్డి విమర్శించారు. రాత్రికి రాత్రే జీహెచ్ ఎంసీ వరకే జీతాలు పెంచడం సరికాదని... ఉద్యోగులపై ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు.

ప్రత్యూషకు తండ్రి వేతనంలో సగం ఇవ్వాలి: హైకోర్టు...

హైదరాబాద్‌:సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూషకు తండ్రి వేతనంలో కొంత భాగం కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యూష సంరక్షణపై హైకోర్టు దృష్టి సారించింది. ప్రత్యూష కోరుకున్న చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆమెను రెస్క్యూహోంకు తరలింపునకు హైకోర్టు నిరాకరించింది. రెస్క్యూహోంల నిర్వహణపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యూషను సవతి తల్లి హింసిస్తుంటే బంధువులు, చుట్టుపక్కల వారు స్పందించక పోవడం దారుణమని వ్యాఖ్యానించింది. సోమవారం ప్రత్యూష మేనమామ, తండ్రిని హాజరు పర్చాలని ఆదేశించింది.

టి.కాంగ్రెస్ నేతలను అరెస్టుచేసిన పోలీసులు

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సమ్మె కు మద్దతుగా 10 వామపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. వారి సమ్మెకు మద్దతు తెలుపుతూ టి. కాంగ్రెస్ నేతలు తెలంగాణ సచివాలయం ముందు ఆందోళన చేపట్టాయి. ఆందోళన చేస్తున్నా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, ఎంపి హనుమంతరావు, దానం నాగేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

మేడ్చల్ లో పోలీసులు ఓవరాక్షన్: పలువురికి గాయాలు..

రంగారెడ్డి: మేడ్చల్ లో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న వామపక్షాలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. మహిలా కార్యకర్తలతో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

12:13 - July 17, 2015

ఎప్పుడూ గింజలు, పళ్లు తినే ఉడుత బీరు తాగితే ఎలా ఉంటుందో ఆ పబ్ యజమానికి తెలిసొచ్చింది. తప్ప తాగిన ఓ ఉడుత మూసి ఉన్న పబ్‌లో వీరంగం సృష్టంచి యజమానికి వందల పౌండ్ల నష్టం మిగిల్చింది. లండన్‌లోని హనీబోర్న్ రైల్వే క్లబ్‌లోకి దూరిన ఓ ఉడుత ఓ బ్యారెల్ బీరు తాగేసింది. అనంతరం కిక్కు నషాళానికి ఎక్కడంతో బారంతా గెంతుతూ తిరిగింది. షెల్ఫ్‌ల్లోని విలువైన మద్యం సీసాలను కింద పడేసింది. పబ్ మొత్తాన్ని ఐరిష్ బీర్‌తో నింపేసింది. అంతేకాకుండా డబ్బులున్న షెల్ఫ్‌ల్లోకి కూడా వెళ్లి చిందర వందర చేసేసింది. అనంతరం ఆ పబ్‌ను తెరిచిన ఆ యజమానికి మొదట జరిగిందేంటో అర్థం కాలేదు. తర్వాత ఇదంతా ఓ ఉడుత చేసిన పని అని తెలుసుకొని అవాక్కయ్యాడు. ఉడుత బీరు తాగడం ఏంటని ఆశ్చర్యపోయాడు. అయితే మిగతా బీరు, మద్యం బాటిళ్లను కింద పడేసిన ఉడుత ‘కఫ్రేష్ అలే’ ఉత్పత్తి చేసిన బీరు సీసాలను మాత్రం చుక్క కింద పడకుండా గుటుక్కుమనపించడం విశేషం. పబ్‌కి వచ్చిన మరో ఇద్దరు కష్టమర్లతో కలిసి ఆ ఉడుతను పట్టుకోవడానికి రెండు గంటల కష్టపడ్డాడు. అయితే అది కిటికీలో నుంచి తుర్రమనడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆ ఉడుత చేసిన నష్టం 300 పౌండ్లు (దాదాపు 30 వేల రూపాయలు)గా తేలింది. అయినా చేసేదేం లేక పెంపుడు జంతువులను పబ్‌లోకి తీసుకురావద్దని ఆ పబ్ యజమాని బోర్డు పెట్టాడు.

యువతిని వేధిస్తోన్న ఉడుత.. అరెస్టు చేసిన పోలీసులు...

హైదరాబాద్:అమ్మాయిల వెంట అబ్బాయిలేంటి..? ఉడుతలు కూడా పడతాయ్ అని జపాన్ పోలీసులు అంటున్నారు. ఇలాంటి విచిత్రమైన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది.  మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఓ ఉడుతను అరెస్టు చేశారు. ఇందులో ఉడుత చేసిన నేరం ఏంటంటే.. ఆ మహిళ వెంటపడి వేధించడమే. జర్మనీ పశ్చిమ ప్రాంతంలోని బోట్రాప్ నగరంలో సదరు మహిళ వీధిలో వెళుతుండగా ఓ ఉడుత వెంటపడింది. ఎంత అదలించినా పోలేదు. ఆమె చుట్టూ తిరుగుతూ.. తెగ ఇబ్బంది పెట్టేసింది. దీంతో, ఆ మహిళ చివరకు ఎమర్జెన్సీ కాల్ చేసింది.

సీపీఎం, సిఐటియూ నేతలపై లాఠీచార్జిచేసిన పోలీసులు

ఆదిలాబాద్: కాగజ్ నగర్ లో పోలీసుల ఓవరాక్షన్ చేశారు. సీపీఎం, సిఐటియూ నేతలను పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట సీఐటియు, సీపీఎం మహిలా కార్యకర్తలు రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

హీరో ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన వర్మ

హైదరాబాద్: బాహుబలి హీరో ప్రభాస్‌పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. బాహుబలితో స్టార్ డమ్ సాధించిన ప్రభాస్‌ను వర్మ ఆకాశానికెత్తేశారు. కేవలం ఒక్క సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు షూటింగ్‌లో పాల్గొన్న ప్రభాస్‌ను చూసి..తప్పు చేశాడని అనుకుని మనమే ఫూల్స్ అయ్యామని ట్వీట్ చేశాడు. రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా మరింత తప్పు చేశాడని అనుకున్నామని వర్మ చెప్పాడు.అయితే బాహుబలి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న బాహుబలి పార్ట్ -1 లాభాల్లోంచి ప్రభాస్‌కు రూ.65 కోట్ల షేర్ వచ్చిందన్నాడు. ఒక్క సినిమా కోసం రూ. 65 కోట్లు తీసుకున్న హీరో భారతీయ సినీ చరిత్రలో మరెవరైనా ఉన్నారా? అని ప్రశ్నించాడు.

స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి:చంద్రబాబు

రాజమండ్రి:పుష్కర యాత్రికులకు సేవలందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రిలోని రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు భోజనం, తాగునీటి వసతి కల్పించాలని ఆయన సూచించారు.

కదులుతున్న బస్సు నుండి దూకిన మహిళా కండెక్టర్

ప.గో:జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమ నుంచి వస్తున్న ఓ ఆర్టీసీ బస్సులో శుక్రవారం ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మహిళా కండెక్టర్‌ భయంతో నడుస్తున్న బస్సులో నుంచి కిందకు దూకేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే కండెక్టర్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

తెలుగు రాష్ట్రాలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల ఆందోళన

హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికుల ఆందోళనలతో అట్టుకుడుతోంది. ఏపీలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఉన్న ఏపీ సీఎంక్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరిన మున్సిపల్ కార్మికులను, కార్మిక నేతలను బందర్ రోడ్డులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో కార్మికులందరికీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులకు మద్దతుగా 10 వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ జరుగుతోంది. ఆందోళనలో పాల్గొన్నా వామపక్ష నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.

11:35 - July 17, 2015

తూ.గో: రాజమండ్రి పుష్కర ఘాట్ల వద్ద పురోహితులు రోడ్డెక్కారు. తమ పై పోలీసులు దౌర్జన్యం చేస్తూ నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూ.. బూటు కాలుతో నెడుతున్నారని వారు మండి పడుతున్నారు. పిండ ప్రదానం చేయకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.

అమెరికా మిలటరీ కేంద్రంపై ఉగ్రదాడి:నలుగురు సైనికులమృతి

హైదరాబాద్:అమెరికా మరోసారి ఉగ్రదాడితో వణికింది. మిలటరీ కేంద్రంపై మహమ్మద్ యూసఫ్ అబ్దులాజీజ్ (24) అనే ఉగ్రవాది విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు భద్రతాదళ సిబ్బంది మరణించగా, సైన్యం జరిపిన కాల్పుల్లో అబ్దులాజీజ్ హతమయ్యాడు. ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. దేశంలో ఉగ్రవాద మూలాలు ఏ రూపంలో ఉన్నా ఉక్కుపాదం మోపుతామని ఒబామా హెచ్చరించారు. కాగా, సైనిక కేంద్రంలోని కాపలా సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడమే నలుగురిని బలితీసుకుందని విమర్శలు వస్తున్నాయి.  

గాంధీ ఆసుపత్రిలో భవనం పైకెక్కి నర్సుల ఆందోళన

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతూ కాంట్రాక్టు నర్సులు ఆసుపత్రి భవనం పైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించక పోతే భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

వేం నరేందర్ రెడ్డి కారు డ్రైవర్లకు ఏసీబీ నోటీసులు

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి కారు డ్రైవర్లకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని సెక్షన్ 160 సీఆర్‌పీసీ కింద ఇద్దరు కారు డ్రైవర్లను ఏసీబీ ఆదేశించింది. మరి కాసేపట్లో ఇద్దరు కారు డ్రైవర్లు ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. నిన్న, మొన్న వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌ను ఏసీబీ విచారించిన విషయం విదితమే.

11:22 - July 17, 2015

హైదరాబాద్:పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. తెలంగాణ సచివాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శానససభా పక్ష నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ వి. హనుమంతరావు, భట్టి విక్రమార్క, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

విజయవాడలో కార్మికులను అరెస్టు చేస్తున్న పోలీసులు

విజయవాడ: తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఎంక్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరిన మున్సిపల్ కార్మికులు, వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

తెలంగాణ సచివాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా

హైదరాబాద్:పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ సచివాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శానససభా పక్ష నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ వి. హనుమంతరావు, భట్టి విక్రమార్క, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరిన ఏపీ మున్సిపల్ కార్మికులు..

విజయవాడ: తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మున్సిపల్ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. కాసేపట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించేందుకు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి భారీ ర్యాలీగా కార్మికులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సిఐటియు నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని అరెస్టు చేసేందుకు భారీగా పోలీసులు మోహరించారు.

వ్యాపం కుంభకోణంలో బిజెపి నేత సస్పెండ్

హైదరాబాద్: సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణంలో సీబీఐ ఎఫ్ ఐఆర్ లో పేరున్న ఓ నేతను బిజెపి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. సస్పెండ్ చేసిన నేత పేరును మాత్రం ఆ ప్రకటనలో పేర్కొనలేదు.

వరల్డ్ బ్యాంకు నుండి ఏపీకి 250 మిలియన్ డాలర్ల రుణం...

హైదరాబాద్:లోటు బడ్జెట్ తో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రుణ సాయం చేసేందుకు ప్రపంచబ్యాంకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో విపత్తు పునరుద్ధరణ పనులకుగానూ 250 మిలియన్ డాలర్లు (రూ.1500 కోట్లకు పైగా) అప్పుగా ఇచ్చేందుకు ఒప్పుకుంది. రుణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ప్రపంచబ్యాంకు మధ్య ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంపై ఏపీ తరపున భూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్ చందర్ శర్మ సంతకం చేశారు. ఏపీలో ఏర్పడే విపత్తుల్ని తట్టుకునే శక్తి సామర్థ్యాల పెంపుకు, ఆయా ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఈ నిధులను వినియోగిస్తారు.

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి.......

విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి శనివారానికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తిరుమలగిరిలో రోడ్డు ప్రమాదం:వృద్ధురాలి మృతి

హైదరాబాద్: తిరుమలగిరి లాల్ బజార్ చౌరస్తా వద్ద ప్రఐవేటు బస్సు ఢీ కొన్ని వృద్ధురాలు మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

'తొక్కిసలాట'ను రాజకీయం చేయడం తగదు:వెంకయ్యనాయుడు...

హైదరాబాద్:కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఈరోజు కొవ్వూరు సమీపంలోని వాడపల్లి వద్ద పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటపై స్పందించారు. జరిగిన ఘటన బాధాకరమే అని చెప్పారు. అయితే, దేశంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని... ఇలాంటి సున్నిత అంశాలను రాజకీయం చేయడం తగదని సూచించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు అన్ని పార్టీల నేతలు సంయమనం పాటించాలని కోరారు.  

ప్రభుత్వం ప్రయత్నాలు విఫలం: సీపీఎం నేత వెంకట్

హైదరాబాద్: బంద్ ను విఫలం చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని సీపీఎం నేత వెంకట్ అన్నారు. సాయంత్రలోగా సమస్యలు పరిష్కరించకుంటే రేపటి నుంచి బంద్ ను మరింత ఉధృతం చేస్తామని వెంకట్ హెచ్చరించారు.

పుత్తూరులో భర్యకు నిప్పటించి చంపిన భర్త....

తిరుపతి: పుత్తూరులోని జెండా మాను వీధిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో నిప్పటించి భార్యను చంపేశాడు. ఈ ఘటనలో భర్తకు కూడా గాయాలు కావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బీసీసీఐకి కొత్త చీఫ్?

హైదరాబాద్: బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించడం ఆయనకు తలకు మించిన భారంగానే పరిణమిస్తోందట. దీంతో పదవి నుంచి తప్పుకోవాలని ఆయనను బోర్డు సభ్యులు కోరనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేకాక సెప్టెంబరులో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం తర్వాత బీసీసీఐకి కొత్త చీఫ్ రానున్నారన్న వదంతులూ జోరందుకున్నాయి.

09:55 - July 17, 2015

దళితుల తలలపై భూస్వాముల గొడ్డళ్లు నాట్యం చేశాయి. నిరుపేదల ఒంటిపై వేట కొడవళ్లు వీర విహారం చేశాయి. ఇదేమి అన్యాయం అని అడిగినందుకు కత్తులు కాలుదువ్వాయి. సరిగ్గా 30 ఏళ్ల క్రితం కారంచేడులో దళితుల నెత్తురు కాల్వలై పారింది. అగ్రవర్ణపు దురహంకారం అమాయకుల్ని పొట్టనపెట్టుకుంది. దళితులపై అగ్రవర్ణ భూస్వాముల దాడితో... దళితులంతా ఏకమై అనేక పోరాటాలు చేసి కొంతమేర విజయం సాధించారు.
1985 జులై 17 చరిత్రలో చీకటి అధ్యాయం....
1985 జులై 17... చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. దళితులపై అగ్రకుల శక్తులు దాడి చేసిన రోజు. కత్తులు, బరిసెలతో వెంటాడి, వేటాడి... భూస్వాములు రాక్షసానందం పొందిన రోజు. కారంచేడు మారణహోమంతో... యావత్భారతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఈ దుర్ఘటన నేటికీ మానని గాయంగానే మిగిలిపోయింది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
1985 జులై 16న మంచినీటి చెరువు వద్ద వివాదం.....
1985 జులై 16న... కారంచేడులోని మాదిగపల్లె మంచినీటి చెరువు వద్దకు... కావడితో కత్తి చంద్రయ్య నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్ళాడు. అగ్రకులానికి చెందిన శ్రీనివాసరావు చెరువులో కుడితి పోశాడు. ఇదేంటని ప్రశ్నించిన కత్తి చంద్రయ్యపై శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డాడు. అప్పుడే మంచినీరు తెచ్చుకునేందుకు వచ్చిన సువార్త అనే మహిళ చంద్రయ్యపై దాడిని అడ్డుకొని శ్రీనివాసరావును బిందెతో కొట్టింది. దీంతో ఈ విషయం కాస్తా చినికిచికిని గాలివానలా మారింది. మరుసటి రోజు గ్రామంలోని భూస్వాములంతా కూడబలుక్కొని ఉదయం ఆరుగంటల ప్రాంతంలో కత్తులు, బరిసెలు లాంటి... మారణాయుధాలతో పథకం ప్రకారం మాదిగపల్లెపై దాడిచేశారు. సుమారు వెయ్యి మంది గ్రూపులుగా విడిపోయి దొరికిన వారిని దొరికినట్లు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ పాశవికదాడిలో తేళ్ళ మోషే, తేళ్ళ యేహోషువ, తేళ్ళ ముత్తయ్య, దుడ్డు వందనం, దుడ్డు రమేష్ హత్యకుగురయ్యారు. సుమారు 50 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి.
ఉద్యమాన్ని ఉధృతం చేసిన అభ్యుదయవాదులు.......
కారంచేడు దుర్ఘటనను నిరసిస్తూ... వామపక్ష, హేతువాద, రాడికల్ విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమాన్ని ప్రారంభించాయి. అమాయకుల ప్రాణాల్ని పొట్టనపెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. అప్పటి ప్రభుత్వం దోషులను అరెస్ట్ చేయకపోగా... ఉద్యమం చేస్తున్న వారిని అరెస్ట్ చేసి జైల్లోపెట్టి అణిచివేసే ప్రయత్నం చేసింది. కానీ ఉద్యమం చల్లారిపోలేదు.
55 మందికి శిక్ష విధిస్తూ గుంటూరు సెషన్స్ కోర్టు తీర్పు......
విద్యార్ధులు, దళితులతో పాటు అణగారిన వర్గాలకు సంబంధించిన సంఘాలు బాధితులకు పునరావాసం కల్పించి న్యాయ పోరాటం చేశారు. దీంతో గుంటూరు సెషన్స్ కోర్డులో 55 మంది... నిందితులకు వివిధ రకాల శిక్షలు విధిస్తూ తీర్పు వెలువడింది. క్రింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ... నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్డు నిందితుల శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎన్నడూ లేని విధంగా ఐదు రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం... కారంచేడు సంఘటన జరిగిన 24 ఏళ్ల తర్వాత గుంటూరు సెషన్స్ కోర్టు తీర్పును సమర్థిస్తూ 55 మందికి జైలు శిక్షను విధించింది ధర్మాసనం.
కారంచేడు ఘటన జరిగిన తరువాత ఎన్నో దాడులు...
కారంచేడు ఘటన జరిగిన తరువాత రాష్ట్రంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయి. కానీ కారంచేడు ఉద్యమ పోరాట స్ఫూర్తితో దళితులపై దాడికి కారకులైన వారిని శిక్షించాలంటూ ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కొన్ని సంఘటనలలో నిందితులు శిక్షించబడ్డారు, మరికొన్ని సంఘటనల్లో తప్పించుకున్నారు. నరమేధం సృష్టించిన కుల క్రౌర్యంతో... కారంచేడు మాదిగలంతా యుద్ధం చేసి ఆధునిక దళిత శకం ప్రారంభించారు. రుధిర క్షేత్ర ఘటన భారతదేశంలో దళితుల ఆత్మగౌరవ ఉద్యమానికి ఒక ప్రతీకగా నిలిచింది.

సిద్ధి పేటలో కొనసాగుతున్న బంద్..

మెదక్: వామపక్షాలు పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు మద్దతుగా మెదక్‌జిల్లా సిద్ధిపేటలో బంద్‌ పాటిస్తున్నారు. సిద్ధిపేట బస్‌ డిపో ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు బైఠాయించారు. సిద్ధిపేటలోని వ్యాపార, కార్యాలయాలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నాయి. మున్సిపల్‌ కార్మికుల పోరాటాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని నేతలు పిలుపునిచ్చారు.

వనపర్తిలో బంద్ ప్రశాంతం..

పాలమూరు: వనపర్తిలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది.. తెల్లవారుజామునే బస్ డిపోముందు బైఠాయించారు సీపీఎం, సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలు.. బస్సులు బయటకురాకుండా అక్కడే ధర్నా చేశారు.

09:49 - July 17, 2015

ఖమ్మం:మున్సిపల్ కార్మికుల సమ్మెపట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్షాలు చేపట్టిన బంద్ ఖమ్మం జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. తెల్లవారుజామునే..జిల్లాలోని అన్ని బస్ డిపోల ఎదుట వామపక్షాల కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా 600 పైగా బస్సులు రోడ్డెక్కలేదు. బంద్ నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్లకు ముందస్తుగా యాజమాన్యాలు సెలవులను ప్రకటించాయి. దుకాణాలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. ఖమ్మం, మధిర, కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, పాల్వంచ మున్సిపల్ కార్యాలయాల ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. 

గోష్పాద రేవు దగ్గర పుష్కర స్నానాల్లో అపశ్రుతి...

ప.గో: కొవ్వూరు పట్టణంలోని గోష్పాద రేవు దగ్గర పుష్కర స్నానాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. గోదావరి నదిలో యువతి మునిగి మృతిచెందింది. ఈ సంఘటనతో పుష్కరఘాట్‌లో విషాదం అలముకుంది. తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో రావటంతో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు.

పుష్కర స్నానం చేసిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు

ప.గో: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కొవ్వూరు మండలం వాడపల్లి ఘాట్ లో పుష్కరస్నానం చేశారు. అనంతరం గోదావరి మాతకు పూజలు నిర్వహించారు.

లారీని ఢీకొట్టిన కారు:10మందికి గాయాలు..

తూర్పుగోదావరి: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పుష్కరాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఏఆర్ కానిస్టేబుల్ రాజేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ గురువారం ఆర్థరాత్రి తన వద్దనున్న గన్ తో తనకు తాను కాల్చుకున్నాడు. దాంతో అతడు రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

09:26 - July 17, 2015

హైదరాబాద్:సీఎం కేసీఆర్ కార్మికుల పట్ల అనుసరిస్తునన్న తలతిక్క నిర్ణయాల వల్ల బంగారు తెలంగాణ వచ్చే దానికంటే బొందల తెలంగాణ వస్తుందని వామపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు వామపక్షాలు బంద్ చేపట్టాయి. ఈ బంద్ లో పాల్గొన్న వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేసి అప్ఝల్ గంజ్ పీఎస్ కు తరలించారు. అరెస్టయిన వారలో తమ్మినేని వీరభద్రం, చాడా వెంకట్ రెడ్డి, న్యూడెమోక్రసీ నేతలు, తదితర నేతలు ఉన్నారు. వారు '10 టివి'తో మాట్లాడూ..కనీస వేతనం ఇవ్వమని అడిగితేనే సహించని ప్రభుత్వం మిలటరీనీ, పోలీసులను ప్రయోగిస్తామని అనడం హాస్యాస్పదమని అన్నారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను ఉద్యోగాల నుండి తీసేస్తామని చెప్పడం కేసీఆర్ చేతగాని తనానికి నిదర్శమన్నారు. కార్మికుల మధ్య చిచ్చు పెట్టి విభజించు.. పాలించు అంటూ బ్రిటీష్ వారు అనుసరించిన విధానాన్ని కేసీర్ అనుసరించడం చాలా దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. కేసీఆర్ చర్యలను తప్పికొట్టి కార్మికులు విజయం సాధిస్తారని నేతలు వారు స్పష్టం చేశారు.తెలంగాణ ప్రభుత్వమా, లేక జీహెచ్ ఎంసీ పాలన నడుస్తోందా అనేది ప్రభుత్వ ఆలోచించాలని మున్సిపల్ జేఏసీ నేత అన్నారు.

అన్నదమ్ముల మధ్య ఘర్షణ: అన్న మృతి

నల్గొండ: ఆస్తి వివాదంతో అన్నదమ్ముల మధ్య వివాదం రాజుకున్న సంఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. మేళ్లచెరువు మండలం ఎర్రకుంట తండాలో అన్నదమ్ముల మధ్య ఘర్షణలో అన్న మరణించాడు. పోలీసులు రంగంలోకి దిగి కేసును విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ఆస్తి వివాదం హత్యకు దారితీయడంపై తండాలో చర్చనీయాంశంగా మారింది. 

సీడబ్ల్యూసీలో కి జైపాల్ రెడ్డి!

హైదరాబాద్: తెలంగాణలో పట్టు సాధించాలన్న కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంతో తెలంగాణకు చెందిన నేతలకు పార్టీలో కీలక పదవులు దక్కనున్నాయన్న వాదన వినిపిస్తోంది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డిని పార్టీ కీలక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లోకి తీసుకునే దిశగా అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. ఇక పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ నిజామాబాదు మాజీ ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి మధు యాష్కీ గౌడ్ కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కనుందన్న ప్రచారం సాగుతోంది.  

సీపీఎం, సీపీఐ ఆఫీసుల వద్ద పోలీసుల మోహరింపు

హైదరాబాద్: సీపీఎం, సీపీఐ, సిఐటియు కార్యాలయాల వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. బంద్ లో పాల్గొంటున్న నేతలను అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు.

తెలంగాణ లో కొనసాగుతున్న వామపక్షాల బంద్

హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మె కు మద్దతుగా వామపాక్షల బంద్ కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు బంద్ కు సంఘీభావం తెలిపాయి.

08:34 - July 17, 2015

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచినట్లు అని ప్రభుత్వం చేసిన కార్మికులను రెచ్చ గొట్టే విధంగా ఉందని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్'కార్యక్రమంలో ది హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా 70 వేల మంది కార్మికులు సమ్మె చేస్తుంటే కొంత మందికి మాత్రమే వేతనాలు పెంచినట్లు ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన పార్టీకి ఇది తగునా? పేద మున్సిపల్ కార్మికులు కేసీఆర్ కు శత్రువులు అయ్యారా? మున్సిపల్ కార్మికులు దేవుళ్లు అన్న కేసీఆర్... ఇప్పుడు ఎందుకు కార్మికులను పట్టించుకోవడం లేదు? పిచుకల పై బ్రహాస్త్రం ప్రయోగించనట్లు కేసీఆర్ చేస్తున్నారా? హైకోర్టు విభజనపై టిఆర్ ఎస్ ఎంపీల ఆందోళన కరెక్టేనా? ఇప్పటికైనా కేంద్రం వెంటనే స్పందిచాలి. ఇలాంటి అంశాలపై నాగేశ్వర్ విశ్లేషించారు. ఈ విశ్లేషణను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

నైజీరియాలో బాంబే పేలుళ్లు: 49 మంది మృతి

హైదరాబాద్:నైజీరియాలోని గాంబే రక్తమోడింది. నిన్న రాత్రి గాంబేలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. రెండు చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 49 మంది మృతి చెందారు. 71 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. మొదట చెప్పుల దుకాణం వద్ద పేలుళ్లు జరిగాయి. కొద్ది నిమిషాల వ్యవధిలోనే మరో షాపింగ్ మాల్ వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నాయి. రంజాన్ సందర్భంగా షాపింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి వచ్చారు. క్షతగాత్రులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

08:13 - July 17, 2015

హైదరాబాద్: కార్మిక హక్కులను కాలరాసే కేసీఆర్ కార్మిక చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కార్మిక నేతలు సూచించారు. ప్రభుత్వం విభజించు.. పాలించు విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కార్మిక నేతలు విమర్శించారు. అలాంటి విధానాలను తప్పకుండా తిప్పికొడతామని నేతలు హెచ్చరించారు. ఇప్పటికైనా సమ్మె చేస్తున్న కార్మికులందరికీ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. 11 రోజులుగా మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాలు ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు బైఠాయించి ఆందోళన చేపట్టాయి. డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. అయితే ఎక్కడికక్కడ కార్మికులను, నేతలను అరెస్టులు చేస్తున్నారు. 

08:04 - July 17, 2015

హైదరాబాద్:కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ నియంతృత్వవగా వ్యవహరిస్తున్నారని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయ పడ్డారు. కార్మికుల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? దళితులు కాబట్టే మున్సిపల్ కార్మికుల పట్ల వివక్ష చూపిస్తున్నారా? మున్సిపల్ కార్మికులను విభజించేందుకు కేసీఆర్ ఎత్తుగడ వేస్తున్నారా? తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముందు ముద్దాయిగా నిలబడిందా? రాజకీయ కోణంతోనే కార్మికులను చూస్తున్నారా? అధికార మార్పిడి జరిగింది తప్పా... ప్రజలకు న్యాయం జరగలేదని చెప్పడానికి మున్సిపల్ కార్మికుల సమ్మె ఒక ఉదాహరణ? ప్రతి అంశాన్ని టిఆర్ ఎస్, టిడిపి మధ్య వివాదంగా మార్చడం సరైందేనా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, సతీష్ మాదిగ టి. టిడిపి నేత,కాసు వెంకటేశ్వర్లు, సంపత్ కుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, తాడూరి శ్రీనివాసరావు టిఆర్ ఎస్ నేత పాల్గొన్నారు. ఈ చర్చను మీరూ చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

నాలుగో రోజు కొనసాగుతున్న పుష్కర స్నానాలు...

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాల పుణ్యస్నానాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. గోదావరి తీరంలో తెల్లవారు జామునుంచే పలు క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీలో రాజమండ్రి, కొవ్వూరు, అంతర్వేది, నర్సాపురం, తెలంగాణ లోని భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం, తదితర ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది.

నగరంలో రంజాన్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు...

హైదరాబాద్ : రంజాన్ సందర్భంగా మీరాలం ఈద్గా, సికింద్రాబాద్ ఈద్గాల వద్ద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వన్‌వే ట్రాఫిక్‌ను ప్రవేశపెట్టారు. ఈ నెల 18, 19 తేదీల్లో పండుగ ఎప్పుడుంటే ఆ రోజు ఈ అంక్షలు ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటలకు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మీరాలం ఈద్గాకు వెళ్ళే వాహనాలను పురానాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్, బహదూర్‌పురా క్రాస్‌రోడ్డులో అనుతిస్తారు.

అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు:డీటీసీ

విజయవాడ: గోదావరి పుష్కరాలకు వెళ్ళే యాత్రీకుల నుంచి ప్రయివేటు బస్సులలో అధికంగా చార్జీలను వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీటీసీ ఎస్‌.వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ నుంచి ప్రయివేటు బస్సులు నడుస్తున్నాయని, రద్దీని దృష్టిలో ఉంచుకుని కొంత మంది ప్రైవేటు ఆపరేటర్లు అధిక చార్జీలను వసూలు చేస్తున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని టీడీసీ తెలిపారు.

సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది: తమ్మినేని, చాడ

హైదరాబాద్: కార్మికుల ఐక్యతను దెబ్బతీసి సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత చాడ వెంకటేశ్వర్ రెడ్డి విమర్శించారు. జీహెచ్ ఎంసీలో కొంత మంది కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచి, కార్మికుల మధ్య చిచ్చు పెడుతున్నారని మండి పడ్డారు. కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మె కొనసాగుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ఉద్యమం ఆగదని, కార్మికులందరికీ వేతనాలు పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు.

07:32 - July 17, 2015

ఢిల్లీ: భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పరం ఆరోపణలకు దిగాయి. వాస్తవాధీన రేఖ వద్ద గూఢచర్యానికి ఉపయోగించే డ్రోన్‌తో ఏరియల్‌ వ్యూలో చిత్రాలు తీయడానికి భారత్‌ ప్రయత్నించిందని పాకిస్తాన్‌ ఆరోపించింది. తమ భూభాగంలో చిత్రాలు తీయడం ద్వారా భారత్‌ నిబంధనలు ఉల్లంఘించిందంటూ పాకిస్తాన్‌లోని భారత రాయబారి సమన్లు జారీ చేసినట్టు పాకిస్తాన్‌ విదేశాంగశాఖ కార్యదర్శి ఐజాజ్‌ అహ్మద్‌ చౌదరి తెలిపారు. భారత్‌ సరిహద్దులో కాల్పులకు పాల్పడుతూ తమ దేశ అస్థిత్వాన్ని దెబ్బతీసే యత్నం చేస్తోందని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో గూఢచర్యానికి పాల్పడుతున్న భారత డ్రోన్‌ను పేల్చివేశామని పాకిస్తాన్‌ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

పాక్‌ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్....

పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘనపై కేంద్రం అత్యవసర సమావేశం జరిపింది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, రక్షణమంత్రి మనోహర్‌ పారీకర్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. పాకిస్తాన్‌ ఆరోపణలపై భారత్‌ భగ్గుమంది. డ్రోన్‌ విషయంలో పాకిస్తాన్‌ తప్పుడు వార్తను ప్రచారం చేస్తోందని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌ విడుదల చేసిన డ్రోన్‌ చిత్రం భారత్‌ డిజైన్‌ చేసింది కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. సరిహద్దులో తాము శాంతినే కోరుకుంటున్నామని, పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే తగినరీతిలో జవాబు చెబుతామని భారత్‌ పేర్కొంది.

కాల్పుల ఉల్లంఘనపై పాక్‌ రాయబారి అబ్దుల్‌ బాసిత్‌కు భారత్‌ నిరసన....

పాకిస్తాన్ తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతుండడంపై ఆ దేశ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌కు భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే కాశ్మీర్‌ సరిహద్దులో పాకిస్తాన్ మళ్లీ కాల్పులకు తెగబడింది. జమ్ములోని అక్నూర్‌ సెక్టార్‌లో పాకిస్తాన్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందగా...భారత జవాన్లతోపాటు మొత్తం ఆరుగురు గాయపడ్డారు. ప్రధాని జమ్ము పర్యటనకు ఒకరోజు ముందు పాక్‌ కాల్పులకు తెగబడడం గమనార్హం.

ఉల్ఫానగరంలో ఇరు దేశాల ప్రధానులు చర్చలు....

గత వారం రష్యాలోని ఉల్ఫానగరంలో ఇరు దేశాల ప్రధానులు చర్చలు జరిపారు. సరిహద్దులో ఉద్రిక్తతలు సడలించేందుకు సీనియర్‌ మిలిటరీ అధికారులతో సమవేశం జరపాలని నిర్ణయించారు. కానీ పాకిస్తాన్‌ బుద్ధి ఏమాత్రం మారకపోగా మళ్లీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తప్పుడు ప్రచారాలతో భారత్‌ను అప్రతిష్టపాలు చేయాలని చూస్తోంది. 

07:27 - July 17, 2015

హైదరాబాద్: మధ్యప్రదేశ్‌ వ్యాపం కుంభకోణంపై సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వ్యాపం కుంభకోణంలో దాఖలైన అన్ని చార్జిషీట్లను దర్యాప్తు పూర్తయ్యేవరకు భద్రంగా ఉంచేవిధంగా సిట్‌ను ఆదేశించాలని సిబిఐ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో సిట్‌ చార్జిషీట్లు వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. వ్యాపం స్కామ్‌లో దాఖలైన 185 కేసుల బదిలీకి సమయం పట్టనున్నందున, నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దని సిబిఐ పిటిషన్‌లో పేర్కొంది. సిబిఐ అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఈ నెల 20న విచారణ చేపట్టనుంది. వ్యాపం కింద నిర్వహించే ఉద్యోగాలు, మెడికల్‌ సీట్ల భర్తీలో భారీ అక్రమాలు జరిగాయి. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న 46 మంది చనిపోయారు. వ్యాపం స్కాంపై సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

07:25 - July 17, 2015

హైదరాబాద్: నిరంజన్ రెడ్డి... తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు. కేబినెట్ ర్యాంక్ కలిగిన వ్యక్తి. బంగారు తెలంగాణ కోసం... ప్రణాళికలు రూపొందించే బాధ్యత ఆయనదే. సర్కార్ లెక్క పద్దులను దగ్గరుండి పర్యవేక్షిస్తారు. మంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు... సంప్రదింపులు జరిపే... నిరంజన్ రెడ్డికి సచివాలయంలో వింత అనుభవం ఎదురైంది.                                                                 
బిల్లు చెల్లించకపోవటంతో అవుట్‌గోయింగ్‌ కట్ ....
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి కోసం డి-బ్లాక్‌లో ఓ ఛాంబర్‌ను కేటాయించింది టీ-సర్కార్‌. అక్కడ బీఎస్ ఎన్ ఎల్ ల్యాండ్ లైన్‌ను సైతం ఏర్పాటు చేసింది. దాని నెంబర్ 040-23459936. మంత్రులు, అధికారులను ఆ ఫోన్లోలోనే సంప్రదిస్తుంటారు నిరంజన్ రెడ్డి. జిల్లా కలెక్టర్లు, అధికారులతో... పథకాల అమలుపై అక్కడ నుంచే సమీక్షిస్తుంటారు. అయితే ఈ మధ్య ఆయన ఫోన్ మూగబోయింది. ప్లానింగ్ బోర్డ్‌ వైస్ ఛైర్మన్‌ వాడుతోన్న ల్యాండ్ లైన్ బిల్లును చెల్లించకపోవడంతో... అవుట్ గోయింగ్ ఫెసిలిటీని కట్ చేసింది బీఎస్ ఎన్ ఎల్.
మే, జూన్‌ నెలలకు రూ. 4133 బిల్లు....
మే, జూన్ మాసాలకు 4 వేల 133 రుపాయల పెండింగ్ బిల్లు ఉంది. అధికారుల అలసత్వమో..? మరే ఇతర కారణమో..? తెలీదు కానీ, ఆ బిల్లును క్లీయర్ చేయలేదు. దీంతో కేవలం ఇన్ కమింగ్ కాల్స్‌కే ఆయన ఫోన్ పరిమితమైంది. కేబినెట్ ర్యాంక్ కలిగిన వ్యక్తి పరిస్థితి... ఓన్లీ ఇన్ కమింగ్-నో అవుట్ గోయింగ్ అన్నట్లుగా తయారైంది. బిల్లు చెల్లించపోతే త్వరలో... ఇన్ కమింగ్ ఫెసిలిటీనీ సైతం కట్ చేస్తామని... BSNL సిబ్బంది ఆయన కార్యాలయానికి సమాచారం కూడా ఇచ్చారు.
అవుట్‌గోయింగ్‌ లేకపోవటంపై నిరంజన్ ఫైర్.....
స్వయంగా తన ఫోన్ కే అవుట్ గోయింగ్ లేకపోవడంతో... అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు నిరంజన్ రెడ్డి. తానంటే లెక్కే లేకుండా పోయిందా..? అంటూ ఫైర్ అయ్యారు. ఆయనను శాంత పరిచేందుకు అఘమేగాల మీద జీవో నెం 364 ను తెచ్చింది ప్లానింగ్ శాఖ. బిల్లు చెల్లింపుల కోసం తక్షణం 4 వేల 133 రుపాయలను విడుదల చేయాలని ఆదేశించింది. బిల్లు చెల్లింపునకు ఆర్ధిక శాఖ అంగీకారం తప్పని సరి అవుతుంది. అయితే అత్యవసరంగా బిల్లు చెల్లించాల్సి ఉన్నందున అర్ధిక శాఖ అంగీకారం అవసరం లేకుండానే బిల్లు చెల్లించాలని ఉత్వర్తుల్లో పేర్కొంది ప్లానింగ్ శాఖ. అయితే ఈ వ్యవహరం ఏలా ఉన్నా... అన్ని శాఖలపై ఆజామాయిషీ ప్రదర్శించే ప్లానింగ్ శాఖ అధిపతికే ఫోన్ దిక్కు లేకపోవడం పట్ల అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. 

07:20 - July 17, 2015

హైదరాబాద్ :రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త వివాదం మొదలు కాబోతోంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికే రెండు ప్రభుత్వాల మధ్య పంచాయితీ తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారం చాలదన్నట్టుగా తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. అప్పట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టు పేరు మార్చే ప్రయత్నం దుమారం రేపగా.. ఇప్పుడు బేగంపేట ఏయిర్ పోర్టు సరికొత్త వివాదాన్ని కేంద్రబిందువు కాబోతోంది.
బేగంపేట ఎయిర్ పోర్టును ఆర్మీకి అప్పగించే ప్రయత్నాలు ....
బేగంపేట ఎయిర్ పోర్టును ఆర్మీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక గజపతిరాజు పావులు కదుపుతున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. బేగంపేట ఎయిర్‌ పోర్టు ప్రాంతంలో.. తెలంగాణ ప్రభుత్వం ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతుంటే.. ఏపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎయిర్ పోర్టును ఆర్మీకి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

వెంటనే విరమించుకోవాలని, లేకపోతే..

ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని, లేకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీఆర్‌ఎస్‌ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పద్ధతి ప్రకారం నడుచుకోవాలని, ఏపీ ప్రతిపాదనను ఆమోదిస్తే చూస్తూ ఊరుకోబోమంటున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. మొత్తానికి మరో వివాదం తెరపైకి వచ్చింది. మరి, ఈ పంచాయితీ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

07:14 - July 17, 2015

హైదరాబాద్:తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ హై కమాండ్... నేరుగా రంగంలోకి దిగింది.. అటు కొత్త రాష్ట్రం ఇచ్చినా పరాజయాన్ని జీర్ణించుకోలేకోతున్న ఢిల్లీ పెద్దలను... మరింత చికాకు పెడుతున్నాయి వలసలు.. వీటికి బ్రేకులేసి పార్టీని గాడిలోపెట్టాలని నిర్ణయించింది పార్టీ అధిష్టానం..                            
తెలంగాణ కాంగ్రెస్‌పై ప్రత్యేక దృష్టిపెట్టి....                                      
తెలంగాణ కాంగ్రెస్‌పై ప్రత్యేక దృష్టిపెట్టిన పార్టీ పెద్దలు... టిపిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌తోపాటు... జానారెడ్డి... షబ్బీర్ అలీలను ఉన్నపళంగా ఢిల్లీకి పిలిపించుకున్నారు.. వారికి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.. యువనేత రాహుల్ గాంధీకూడా ఇందులో పాలుపంచుకున్నారు. తనను కలిసిన నేతల్లో ఉత్సాహం పెంచారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ... ఓటమినుంచి బయటకురావాలని సూచించారు. కేవలం గాంధీభవన్‌కే పరిమితం కావొద్దన్నారు.. ప్రజలతోకలిసి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధంకావాలని ఆదేశించారు..
పార్టీలోని అంద‌రిని క‌లుపుకు పోవాల‌ని....
అంతేకాదు పార్టీలోని అంద‌రిని క‌లుపుకు పోవాల‌ని ఉత్తమ్‌కు సూచించారు మేడమ్.. తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు 20 లక్షలని... ఈ టార్గెట్‌ను నెలాఖరుకల్లా పూర్తిచేయాలని చెప్పినట్లు సమాచారం.. పార్టీనుంచి వలసలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించిన సోనియా.. కేసీఆర్ వైఫల్యాలే ఎజెండాగా ఆందోళనబాట పట్టాలని దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ పదవుల్లో తెలంగాణకు ప్రాధాన్యతఇచ్చి నేతల్లో ఉత్సాహం నింపాలని భావిస్తోంది కాంగ్రెస్.. ఈ పదవులపై కొంత స్పష్టతకూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుండి ఒకరికి సీడబ్ల్యూసీ మెంబర్‌తోపాటు.. ఏఐసీసీలో జనరల్ సెక్రటరీ... రెండు సెక్రటరీ పదవులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం...పార్టీలో ఎవరు ఖాళీగా ఉండకుండా.. ప్రతి ఒక్కరిని బిజీగా చేసి.. టిఆర్ఎస్ పై దూకుడు పెంచాలని చూస్తున్నారు ఢిల్లీ పెద్దలు..అధిష్ఠానం పఠిస్తున్న ఈ యాక్టివ్ మంత్రం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో వేచిచూడాలి.

07:10 - July 17, 2015

హైదరాబాద్: ఈ నెల 21న రాజమండ్రిలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఐతే గతానికి భిన్నంగా...ఈసారి రాజమండ్రిలో భేటీని నిర్వహించనున్నారు. సమావేశంలో పలు అభివృద్ధిపనులు, పథకాల అమలుపై చర్చించనున్నారు. ఐతే పుష్కరాల సమయంలో రాజమండ్రిలో మంతివర్గ సమావేశాన్ని నిర్వహించడంపై.. అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
భేటీకి మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, కమిషనర్లు, శాఖాధిపతులు....
ఇప్పటికే రాజమండ్రి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులపై మళ్లీ ఒత్తిడి పెంచేలా అక్కడ మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహిరచాలనే నిర్ణయంపై... ప్రభుత్వవర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి, కార్యదర్శి హోదా కలిగిన కమిషనర్లు, శాఖాధిపతులు హాజరవుతారు. దీనివల్ల పుష్కర విధుల్లో ఉన్న అధికారులు....తమతమ శాఖల ఉన్నతాధికారుల సేవలకు రావాల్సి ఉంటుంది. దీనివల్ల పుష్కర విధులకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేబినెట్ భేటీతో అధికారులకు మరో తలనొప్పి!....
కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలతోనే సతమతమవుతున్న అధికారులకు... తాజాగా మంత్రివర్గ భేటీ కూడా ఇబ్బందికరంగా మారుతోంది. పుష్కరాల్లో తొలిరోజే ముప్పు సంభవించినా కూడా చంద్రబాబు వైఖరిలో మార్పు కనిపించడం లేదన్న విమర్శలూ వస్తున్నాయి. కీలక నేతలు, మంత్రులు ఎక్కువగా రాజమండ్రిలో మకాం వేయడం వల్లే.... పుష్కర భద్రత, భక్తుల రక్షణపై పెద్దగా దృష్టి సారించలేకపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం... కేబినెట్‌ భేటీ కోసం రాజమండ్రి వెళ్తుండటంతో...ఈసారి ఎలాంటి సమస్యలు తలెత్తుతాయోనని అధికారుల్లో భయం నెలకొంది.
పూర్తిస్థాయి ఈ-కేబినెట్‌కు సన్నాహాలు.....
మరోవైపు అంతా డిజిటల్ మయం చేస్తానంటున్న చంద్రబాబు...మంత్రివర్గ సమావేశాల్లో కూడా ఈ-కేబినెట్‌కు తెరదీశారు. ఇన్నాళ్లూ కేబినెట్ భేటీల్లో కేవలం ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల సాయంతో చర్చించారే తప్ప పూర్తిస్థాయి ఈ-కేబినెట్‌ను అమలు చేయలేదు. కాని ఈసారి రాజమండ్రిలో జరగనున్న కేబినెట్ మీటింగ్‌లో...పూర్తిస్థాయి ఈ-కేబినెట్‌ను అమలుపర్చాలని బాబు భావిస్తున్నారు. రాజమండ్రిలో ఉంటూ..హైదరాబాద్‌లోని అధికారులతో చర్చించవచ్చని సీనియర్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ-కేబినెట్‌కు ప్రాధాన్యత పెరగటంతో పాటు, పుష్కరపనులకు ఎలాంటి ఆటంకం కలగదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక మంత్రివర్గ భేటీని 21వ తేదీ జరపాలని నిర్ణయిరచినప్పటికీ, దానిని 22వ తేదీకి మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనికిపై అధికారిక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది.

07:08 - July 17, 2015

హైదరాబాద్:అంతా ఓకే అనుకున్నారు.. ఇక నిర్మాణమే ఆలస్యమని భావించారు.. ఇంతలో టీ సర్కారుకు షాక్ తగిలింది. వ్యాప్కోస్‌ రూపొందించిన కొత్త డిజైన్‌ సర్కార్ అవాక్కైంది. మొదట ఒక డిజైన్‌ను చేసి...అంతా అయ్యాక మరో డిజైన్‌ను తెరపైకి తెచ్చింది. దీంతో గోదావరిపై ప్రాజెక్టుల డిజైన్‌కు మరిన్ని సమస్యలొచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన సర్కారు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.
50 నియోజకవర్గాల్లో 50 లక్షల ఎకరాలకు సాగునీరు....
తెలంగాణను సస్యస్యామలం చేసేలా ప్రాజెక్టుల రూపకల్పనకు టీప్రభుత్వం సిద్ధమైంది. గోదావరి బేసిన్ కింద 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో 50 లక్షల ఎకరాలకు సాగునీరందించే అవకాశం ఉందని సర్కారు అంచనావేసింది. గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను సంపూర్ణంగా వాడుకునేలా ప్రాజెక్టులు డిజైన్ చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
మొదట మహారాష్ట్రకు ముప్పు ఉండదన్న వ్యాప్కోస్‌.....
ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనిని ప్రభుత్వం.....కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్విసెస్‌... వ్యాప్కోస్‌కి అప్పగించింది. మొదట దీనిపై సర్వేచేసిన వ్యాప్కోస్‌....మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రలో ఎలాంటి ముంపు ఉండదని పేర్కొంది. దీని ఆధారంగానే ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల రీఇంజనీరింగ్‌కు శ్రీకారం చుట్టింది. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మించి, కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎల్లంపల్లికి... అక్కడి నుంచి మిడ్‌ మానేరుకు 160 టీఎంసీలను తరలించాలని ప్రతిపాదించింది. కాని రెండో సారి సర్వేచేసిన వ్యాప్కోస్‌... బ్యారేజీ వల్ల మహారాష్ట్రలో 500ల హెక్టార్ల ముంపు తప్పదని చావుకబురు మెల్లగా చెప్పింది.
ముంపు నివారణకు గైడ్‌బండ్స్‌ నిర్మించాలని ప్రతిపాదన....
దీంతో ప్రాజెక్టుల డిజైన్‌పై తీవ్ర గందగరోళం నెలకొంది. ఐతే ముంపును నివారించటానికి..గైడ్ బండ్స్ నిర్మించొచ్చని వ్యాప్కోస్‌ ప్రతిపాదించింది. మేడిగడ్డకు బదులు...దానికి సమీపంలోని అంబడిపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని చెప్పింది. కాని అక్కడ నిర్మిస్తే...బెగ్లూరు గ్రామంలోని భూములు ముంపుకు గురవుతాయి. ఇక్కడా ముంపు జరగకుండా...గైడ్‌బండ్‌లను నిర్మించొచ్చని వ్యాప్కోస్‌ స్పష్టం చేసింది. కాని వ్యవసాయ భూములు మాత్రం మునిగిపోక తప్పదని తెలిపింది. కాని బ్యారేజీ నిర్మాణంతో....ముంపుకు గురయ్యే అటవీప్రాంతమెంత? వ్యవసాయ భూములెన్ని? అనే వివరాలపై మాత్రం క్లారిటీ లేదు.
నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు....
ఈ అంశంపై మంత్రి హరీశ్ రావుతోపాటు.... వ్యాప్కోస్ ప్రతినిధులు, నీటిపారుదల అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. గోదావరి బేసిన్‌లో అవ‌స‌ర‌మైన కొత్త డిజైన్లు రూపొందించాల‌ని అధికారులను ఆదేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున కనీసం లక్ష ఎకరాలకు సాగునీరందించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గోదావరిపై ఎక్కడెక్కడ లిప్టులు పెట్టాలి? ఎక్కడ రిజర్వాయర్లు కట్టాలి? ఎక్కడ ఎన్ని టిఎంసిలు వాడాలి? ఏ ప్రాంతానికి ఏ మార్గం ద్వారా నీరు తీసుకోవాలి? తదితర అంశాలపై గూగుల్‌ ఎర్త్‌ మ్యాపులు, నివేదికల ఆధారంతో విస్తృతంగా చర్చించారు.
గోదావరి జలాల్లో తెలంగాణ వాటా 953 టీఎంసీలు....
గోదావరి జలాల్లో 953 టిఎంసిలనీటిని వాడుకునే హక్కు తెలంగాణకు ఉంది. 433 టిఎంసిల కోసం ప్రాజెక్టులున్నాయి. ఇంకా 521 టిఎంసిలు వాడుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకోవాలి. వీటిలో ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల ద్వారా 400 టిఎంసిలు వాడుకునేందుకు అనుమతులు వచ్చాయని అధికారులు తెలిపారు. వీటిని శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే... ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తోంది.
తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టుకు కడితే ఆదిలాబాద్‌కు నీరు....
ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టుకు ప్రస్తుతమున్న డిజైన్ పనికిరాదని ప్రభుత్వం యోచిస్తోంది. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్‌ జిల్లాకు నీరివ్వాలని చూస్తోంది. కాళేశ్వరం దిగువన మరో ప్రాజెక్టు కట్టి నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌తోపాటు వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లోని జనగామ, భువనగిరి డివిజన్లకు నీరివ్వాలని భావిస్తోంది. ఇటు నిజాంసాగర్‌కు, ఎస్ ఆర్ ఎస్పీ కి కూడా అనుసంధానం చేయాలని సూచించారు అధికారులు. ప్రస్తుతం కంతనపల్లికోసం ప్రతిపాదించిన ప్రాంతం దగ్గర కాకుండా... కొంచెం ముందుకు ప్రాజెక్టు కడితే... దేవాదులకు మ‌రింత ఉపయోగమని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. అన్నీ శాస్త్రీయంగా చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం... ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంనుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తంకాకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రాజెక్టులన్నీ మూడేళ్లలోపు పూర్తికావాలని సీఎం అధికారులను ఆదేశించారు.

07:04 - July 17, 2015

హైదరాబాద్:ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై సస్పెన్స్‌కు తెరపడింది... ఈ శుక్రవారంనుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది.. ఈ నెల 21వరకూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేసింది తెలంగాణ ఉన్నతవిద్యామండలి.. 22న ఆప్షన్ల మార్పులకు అవకాశం ఇస్తారు. 23న డేటా ప్రాసెసింగ్ పూర్తిచేసి 24న సీట్ల కేటాయింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.. 25నుంచి 27లోపు ఆయా కాలేజీల్లో విద్యార్ధులు రిపోర్టు చేయాలి... అలాగే కోర్టు తీర్పుప్రకారం కాలేజీల్లో తనిఖీలకు కూడా రెడీ అవుతున్నారు అధికారులు.
నెల 29 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌...
రెండో విడత కౌన్సిలింగ్‌ తేదీలనుకూడా విడుదలచేసింది ప్రభుత్వం... మొదటి దఫా కౌన్సిలింగ్‌లో పాల్గొనలేకపోయిన విద్యార్థులు... ఈ నెల 29న సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించింది.. 29 నుంచి 30వరకూ ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. 31న సీట్లు కేటాయిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ నెలాఖర్లోగా ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తయ్యేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం.. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు ఒకటిన క్లాసులు ప్రారంభించేలా ప్లాన్ చేస్తోంది.. ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సిలింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు... వారి తల్లిదండ్రులు.

07:02 - July 17, 2015

విజయవాడ: ఏపీలో మున్సిపల్ కార్మికులు కదం తొక్కుతున్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతం అవుతోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఏపీలో మున్సిపల్‌ కార్మికులు విధులు బహిష్కరించి.. ఆందోళనలో పాల్గొంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమైన ప్రభుత్వం.. చెత్త తరలింపునకు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ యత్నాన్ని...పలు చోట్ల కార్మికులు అడ్డుకున్నారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించకుండా.. ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్కారు తీరుపై కార్మికుల ఆగ్రహం....
మరోవైపు మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మద్దుగా వామపక్ష పార్టీలు సైతం ఆందోళన కొనసాగిస్తున్నాయి. సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలో పటమట ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గర నుంచి మేయర్ కోనేరు శ్రీధర్‌ ఇంటి వరకు బిక్షాటన కార్మికులు చేపట్టారు. ఆ తర్వాత జీవీఎంసీ మేయర్‌ శ్రీధర్‌ ఇంటి వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. సమ్మెపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటిని నెరవేర్చాలని కోరితే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
కార్మికులపై నేతలు, పోలీసుల దౌర్జన్యం.....
మరోవైపు గుంటూరులో ఉద్రిక్తత నెలకొంది. కార్మికుల సమ్మెను భగ్నం చేసేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ అధికారులు యత్నించారు. గుంటూరు నగరపాలక సంస్థ ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తున్న కార్మికులను....అడ్డుకునే ప్రయత్నం చేశారు. సమ్మె చేస్తున్న ప్రాంతంలోకి ఎమ్మెల్యే మోదుగుల రావటంతో పోలీసులు అతిగా ప్రవర్తించారు. ఎమ్మెల్యేను కలవటానికి వెళ్లిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరు కార్మికులపై ఎమ్మెల్యే అనుచరులు పిడిగుద్దులతో దాడులు కూడా చేశారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు... ఎమ్మెల్యే, పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన తీవ్ర తరం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ నుంచి లాడ్జిసెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సమ్మె విచ్చిన్నానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లెఫ్ట్‌ నేతలు డిమాండ్‌ చేశారు. లేకపోతే.. సమ్మె మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వారం రోజులుగా సమ్మె చేస్తున్నా...
వారం రోజులుగా సమ్మె చేస్తున్నా...ప్రభుత్వం పట్టించుకోవటంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఇవాళ చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం మొండివైఖరిని వీడకుండా...భవిష్యత్‌లో సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

06:58 - July 17, 2015

హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలి రాష్ట్ర బంద్‌కు రంగం సిద్ధమైంది. మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై పంతానికి పోతున్న సర్కార్‌కు ఇప్పటికే సమ్మెతో స్ట్రోకు తగిలింది. అయినా దిగిరాని ప్రభుత్వ మెడలు వంచడానికి బంద్‌ పిలుపునిచ్చాయి వామపక్షాలు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి.
అధికారంలోకి రాకముందే...
అధికారంలోకి రాకముందే మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్‌.. గద్దెనెక్కాక ఆ హామీలను పూర్తిగా మర్చిపోయింది. డిమాండ్ల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న సమ్మెపై స్పందించడం లేదు. పైగా వారికి మద్దతు తెలుపుతున్న వామపక్ష నాయకులను అన్యాయంగా అరెస్ట్‌ చేయిస్తోంది. తమ హక్కుల కోసం గళమెత్తిన సామాన్యులపై తన ప్రతాపం చూపుతోంది.
ప్రభుత్వ తీరుకు నిరసనగా...
ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలంగాణలోని అన్ని వామపక్షాలు మున్సిపల్‌, గ్రామ పంచాయతీ కార్మికులకు మద్దతు తెలుపుతూ.. శుక్రవారం రాష్ర్ట బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి.. డిమాండ్లను సాధించుకునే వరకూ ఆందోళనలు, నిరసనలు ఆపేది లేదని స్పష్టం చేశాయి.
అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగల సంఘాలు మద్దతు...
కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ, ఇతర ప్రజా, కార్మిక, ఉద్యోగ సంఘాలు సమ్మెలో ఉన్న కార్మికులకు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు వామపక్షాలు ఇచ్చిన రాష్ర్ట బంద్‌ను విజయవంతం చేసేందుకు.. బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొననున్నాయి. బంద్‌కు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు సహకరించాలని కాంగ్రెస్‌, టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.
వామపక్ష నేతలను అరెస్ట్‌లు చేసి..
శాంతియుతంగా దీక్ష చేస్తున్న వామపక్ష నేతలను అరెస్ట్‌లు చేసి.. వారిపై కేసులు పెట్టడాన్ని ఆ పార్టీల నేతలు తప్పుపడుతున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. శుక్రవారం ఉదయం ఎంజీబీఎస్ బస్‌ డిపో వద్ద పది వామపక్షాల నేతలు బంద్‌లో పాల్గొని నిరసన తెలపనున్నారు. ఉదయం 11 గంటలకు నారాయణ గూడ చౌరస్తా నుంచి హిమాయత్‌ నగర్‌ మీదుగా అబిడ్స్‌ వరకు ప్రదర్శన నిర్వహించనున్నారు. పుష్కరాలు, రంజాన్‌ పండుగ సందర్భంగా ప్రజలకు కొంత అసౌకర్యం కల్గినా.. కార్మికుల న్యాయమైన డిమాండ్లకు అన్ని వర్గాల ప్రజలు సహకరించి.. రాష్ర్ట బంద్‌లో పాల్గొనాలని తమ్మినేని కోరారు. 

06:52 - July 17, 2015

హైదరాబాద్: కార్మికులను చీల్చడం కోసం కేసీఆర్ ఎత్తుగడ వేస్తున్నారని.... కేసీఆర్ దుష్ట పన్నాగాన్ని ఎదుర్కొవాలని కార్మికులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. కార్మికులకు మద్దతుగా... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా 10 వామపక్షాల ఆధ్వర్యంలో తెలంగాణ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా ఎంజీబీఎస్ వద్ద వామపక్షాల నేతలు బస్సులను అడ్డుకున్నారు. పోలీసులకు, వామపక్ష నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ...జీహెచ్ ఎంసీలో 40 వేల మంది కార్మికులు సమ్మెలో ఉంటే కేవలం 24 వేల మందికి మాత్రమే వేతనాల పెంపు వర్తించేలా సీఎం నిర్ణయం తీసుకోవడంపై మండి పడ్డారు. సమ్మె నోటీసులో పేర్కొన్న డిమాండ్లపై స్పస్టత ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో సమ్మెను, బంద్ ను యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఉప్పల్ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన

హైదరాబాద్:ఉప్పల్ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని వారు ఆందోళన చేపట్టారు. విభజించూ పాలించు విధానాన్ని సీఎం కేసీఆర్ మానుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు.

తమ్మినేని వీరభద్రంను అరెస్టు చేసిన పోలీసులు...

హైదరాబాద్: కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 10 వామపక్షాలు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో నగరంలో ఎంజీబీఎస్ వద్ద 10 వామపక్ష నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టాయి. ఆందోళన చేపట్టిన నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ఎక్కడికక్కడ బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత చాడా వెంకట్ రెడ్డి, న్యూడెమోక్రసీ నేతలు తదితరులు ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా డిపోలకే పరిమితమైన బస్సులు...

హైదరాబాద్:కార్మికులకు మద్దతుగా... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా 10 వామపక్షాల ఆధ్వర్యంలో తెలంగాణ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాలో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. మరో వైపు నగరంలో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వద్ద 10 వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు చాలా పాశవికంగా ప్రదర్శిస్తున్నారు: తమ్మినేని

హైదరాబాద్: పాశవికమైన రాజ్య సింహను పోలీసులు ప్రదర్శిస్తున్నారు. ప్రజాగ్రహంలో ఈ ప్రభుత్వం కొట్టుకోక తప్పదని సీపీఎం నేత తమ్మినేని హెచ్చరించారు. కార్మికులను చీల్చడం కోసం కేసీఆర్ ఎత్తుగడ వేస్తున్నారు. కార్మికులు కేసీఆర్ దుష్ట పన్నాగాన్ని ఎదుర్కొవాలని కార్మికులకు తమ్మినేని పిలుపునిచ్చారు.

ఎంజీబీఎస్ ఎదుట ఉద్రిక్తత

హైదరాబాద్: కార్మికులకు మద్దతుగా... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా 10 వామపక్షాల ఆధ్వర్యంలో తెలంగాణ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా ఎంజీబీఎస్ వద్ద వామపక్షాల నేతలు బస్సులను అడ్డుకున్నారు. పోలీసులకు, వామపక్ష నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధమవ్వగా... కార్మిక నేతలు బస్టాండ్ బైట బయిఠాయించి నినాదాలు చస్తూ ఆందోళన చేపట్టారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Don't Miss