Activities calendar

18 July 2015

ట్రాఫిక్ దిగ్బంధనంలో భద్రాచలం..

ఖమ్మం: పుష్కరాలకు వచ్చిన భక్తులతో భద్రాచలం ట్రాఫిక్ దిగ్బంధనంలో చిక్కుకుంది. బస్సుల కోసం లక్షలాది భక్తులు పడిగాపులు కాస్తున్నారు. డ్యూటీ టైమ్ ముగిసిందని డ్రైవర్లు బస్సులను నిలిపి వేశారు.

 

 

21:57 - July 18, 2015

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రంజాన్‌ పర్వదినాన్ని ముస్లీం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రత్యేకప్రార్థనలతో ప్రారంభమైన ఈ రంజాన్‌ వేడుకలలో ప్రజా ప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్‌..
తెలంగాణ వ్యాప్తంగా రంజాన్‌ పర్వదినాన్ని ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని మక్కా మసీదు, నాంపల్లిలోని ఏక్‌మినార్‌, ఖైరతాబాద్‌ మసీదు, నిజాం కాలేజి మైదానం, కూకట్‌పల్లిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలకు వేలాదిమంది ముస్లింలు హాజరయ్యారు. సామూహిక ప్రార్థనలతో నాంపల్లి, చార్మినార్‌ ప్రాంతాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి.
వరంగల్..
వరంగల్ జిల్లాలో రంజాన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. మసీదులు, ఈద్గాలలో వేలాది మంది ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లీ సోదరులకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సుదీర్‌బాబు, ఎమ్మెల్యే వినయ్‌బాస్కర్, కొండా సురేఖ ఈద్‌ ముబారక్‌ తెలిపారు.
మెదక్
మెదక్ జిల్లాలో రంజాన్‌ సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక ఈద్గా వద్ద ముస్లీం సోదరులు ప్రత్యే ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్సీ ఫారుఖ్‌ హుస్సేన్‌ ఈ సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మంత్రి హరీష్‌రావు ముస్లీం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 వందల మసీదుల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామని హరీష్‌రావు అన్నారు. అలాగే పేద ముస్లీంకు తోఫా అందజేశామన్నారు.
మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ జిల్లాలో మసీదులు, ఈద్గాల వద్ద ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, వివిధ పార్టీలకు చెందిన నేతలు ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతపురం..
ఆంధ్రప్రదేశ్‌లో మసీదులు, ఈద్గాలు ముస్లీం సోదరరుల ప్రత్యేక ప్రార్థనలతో ఆహ్లాదకరంగా మారాయి. అనంతపురం జిల్లాలో రంజాన్‌ పండగను ముస్లీం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈవేడుకల్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుమన్, మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌లు ముస్లీం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.
కడప
కడప జిల్లాలో ముస్లీం సోదరులు ఆనందోత్సాహాలతో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మసీదులు, ఈద్గా మైదానాలు ముస్లిం సోదరుల ప్రార్థనలతో ఆహ్లాదకరంగా మారాయి. కడప ఎమ్మెల్యే అంజద్ బాష, మాజీ మంత్రి అహ్మదుల్లా, టిడిపి నేతలు దుర్గా ప్రసాద్, అమీర్ బాబు, పెద్ద దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. మత గురువులు మహ్మద్ ప్రవక్త బోధనలను భక్తులకు వినిపించారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ప్రశాంతంగా రంజాన్‌ వేడుకలు
మొత్తానికి పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఇరు రాష్ట్రాల్లో రంజాన్‌ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. పేద, ధనిక తేడా లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

 

21:49 - July 18, 2015

ఢిల్లీ: బిజెపి అధికారంలోకి వచ్చినప్పటినుంచి మతతత్వశక్తులు రెచ్చిపోతున్నాయి. తాజాగా విహెచ్‌పి అధినేత అశోక్‌ సింఘాల్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2020 నాటికి భారతదేశం హిందూ దేశంగా మారుతుందన్నారు. సాయిబాబా ఆశ్రమంలో సాయిబాబానే స్వయంగా ఈ విషయం చెప్పారని తెలిపారు. అంతేకాదు.. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం వ్యాపిస్తుందన్నారు. ఇప్పటికే హిందూ విప్లవం ప్రారంభమైందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి సుష్మస్వరాజ్‌ కూడా హాజరయ్యారు. నరేంద్రమోడీ అధికారంలోకి రాగానే- 8 వందల ఏళ్ల తర్వాత హిందూ రాజ్యం ఏర్పడుతుందని అశోక్‌ సింఘాల్‌ కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే.

21:45 - July 18, 2015

ఆదిలాబాద్: పుష్కరాలకు వెళ్లిన ఓ కుటుంబం మృత్యువాత పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కుంటాల మండలం నందన్‌ గ్రామానికి చెందిన సురేష్‌, భార్య గంగామణి, కూతుళ్లు సౌమ్య, సౌజన్యలతో కలిసి బైక్‌పై గోదావరి పుణ్యస్నానాలకు వెళ్లారు. స్నానం చేసి వస్తుండగా దిలావార్‌పూర్‌ వద్ద అతివేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేష్‌తో పాటు ఆయన భార్య గంగామణి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన చిన్నారులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో సౌజన్య మృతి చెందింది.

 

కుటుంబసభ్యులకు నిప్పంటించిన ఘటనలో.. ఇద్దరి మృతి

విజయవాడ: చిట్టినగర్ లో కుటుంబసభ్యులపై ఇంటి యజమాని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో భార్య, కుమారుడు మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

 

నల్గొండ జిల్లా రేవులగడ్డలో విషాదం..

నల్గొండ: నిడమనూరు మండలం రేవులగడ్డలో విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారులతో బావిలో దూకి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిన్నారులు యామని(5), ప్రశాంత్ (9) మృతి చెందారు. 

20:34 - July 18, 2015

రాజమండ్రి: గోదావరి పుష్కర ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం మరొకరి ప్రాణాలను బలి తీసుకుంది. కొవ్వూరులోని సుబ్రమణ్యేశ్వర ఘాట్ వద్ద ఓ భక్తుడు మెట్లపై నుంచి జారి పడ్డాడు. అయితే ప్రథమ చికిత్స అందుబాటులో లేకపోవడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచినట్టు సమాచారం. బాధితునికి అరగంట పాటు కనీసం ఆక్సిజన్ అందించే అవకాశం లేకపోవడంతోనే మృత్యువాత పడ్డట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రథమ చికిత్స కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడమే అతని మృతికి కారణమని తెలుస్తోంది. మృతుడు చిత్తూరు జిల్లాకు చెందిన రామకృష్ణగా పోలీసులు గుర్తించారు.

 

కోటిలింగాల రేవు వద్ద మహిళ మృతి

రాజమండ్రి: కోటిలింగాల రేవు వద్ద వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి.. భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో ఓ మహిళ మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా మర్రివలసకు చిందిన మీనాక్షిగా గుర్తించారు. 

20:14 - July 18, 2015

విశాఖ: పుష్కరాలకు వెళ్ళే యాత్రికలతో విశాఖలోని బస్‌స్టేషన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి విశాఖ చేరుకున్న యాత్రికులకు కష్టాలు తప్పడం లేదు. గంటలకొద్ది పడిగాపులు కాస్తున్నా..రద్దీకి సరిపడా బస్సుల్లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఆర్డినరీ బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో సామాన్య ప్రయాణికులు బాధలు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 

కోటిలింగాల ఘాట్ కు పోటెత్తిన భక్తులు..

రాజమండ్రి: కోటిలింగాల ఘాట్ కు భక్తులు పోటెత్తారు. పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీకి సంబంధించిన సమాచారాన్ని డిజిపి పోలీసులను అడిగి తెలుసుకుంటున్నారు. రాజానగరం నుంచి రాజమండ్రి వరకు, వేమనగిరి నుంచి మొరంపూడి వరకూ వాహనాలు నిలిచిపోయాయి.

 

పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం:చంద్రబాబు

రాజమండ్రి: పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఎపి సీఎం చంద్రబాబు చెప్పారు. విమర్శించే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 'రాష్ట్ర అభివృద్ధిలో నా విజన్ నాకుంది' అని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పుష్కర ఘాట్ గా కోటిలింగాల రేవును తయారు చేస్తామని తెలిపారు.  కోటిలింగాలలో గంటకు లక్షమంది పుష్కరస్నానం చేస్తున్నారు. తొలిరోజు పుష్కరాలలో భక్తులు చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను కలిశానని... వారు తపను అర్థం చేసుకున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి కొన్ని విషయాల్లో సహకారం అందుతోంది.. ఇంకొన్ని విషయాల్లో సహకారం అందాల్సివుందన్నార.

భద్రాచలంలో భారీగా ట్రాఫిక్ జామ్..

ఖమ్మం: పుష్కరాలకు అధిక సంఖ్యలో జనం తరలిరావడంతో భద్రాచలంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు స్వయంగా మంత్రులే రంగంలోకి దిగారు.

 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

చిత్తూరు: తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్ మెంట్లు నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 14 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తుల దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. భక్తులు నడకదారిలో తిరుమలకు భారీగా చేరుకున్నారు. వసతి గదులు దొరక్క భక్తులు అవస్థలు పడుతున్నారు.

 

పుష్కర స్నానానికి వెళ్లి భక్తుడి గల్లంతు..

ప.గో: జిల్లాలోని పెనుగొండ మండలం సిద్ధాంతం ఘాట్ వద్ద విషాదం నెలకొంది. పుష్కర స్నానానికి వెళ్లిన భక్తుడు గల్లంతయ్యాడు. 

పూంచ్ సెక్టార్ వద్ద పాక్ సైన్యం కాల్పులు..

జమ్మూకాశ్మీర్: పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్ సెక్టార్ వద్ద పాక్ సైన్యం కాల్పులు జరిపింది. సరిహద్దు వద్ద 2 గ్రామాలు లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.

 

19:21 - July 18, 2015

కడప: హర్యానాకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ జైపాల్ సింగ్‌ను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రచందనంతో మాలలు తయారు చేయించి.. విదేశాలకు తరలించి.. వ్యాపారం చేస్తున్న జైపాల్ సింగ్‌ను హర్యానా రాష్ట్రం గుర్గావ్ జిల్లాలోని నవ్‌రంగ్‌పూర్‌లో అరెస్ట్ చేశారు. అతడిపై కడప జిల్లాలో రెండు కేసులు ఉన్నాయి.

 

19:15 - July 18, 2015

హైదరాబాద్: నవ్యాంధ్ర నూతన రాజధానికి సంబంధించి ఊహా చిత్రాలను ఏపి సర్కార్ విడుదల చేసింది. ఈ నెల 20వ తారీఖున రాజమండ్రిలో సీఎం చంద్రబాబుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ బృందం సీడ్‌ క్యాపిటల్‌ ప్రణాళికను ఏర్పాటు అందచేయబోతోంది. ఇందుకు సంబంధించి రాజధాని ప్రాంతం ఎలా ఉండబోతోందనే 4చిత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది.

19:08 - July 18, 2015

వరంగల్: జిల్లాలో పుష్కరాల్లో గోదావరి పరివాహక ప్రాంతం యాత్రికులతో కిక్కిరిసిపోతోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఘాట్లకు జనం తాకిడి ఎక్కువైంది. ఏటూరునాగారం, రామన్నగూడెం, మంగపేట ప్రాంతాల్లో యాత్రికులు స్నానం ఆచరిస్తున్నారు. భక్తుల నుద్దేశించి ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి ఇక్కడ వైద్య బృందం ప్రాథమిక చికిత్సను అందిస్తోంది. 

19:01 - July 18, 2015

నిజామాబాద్: వరుస సెలవులు కావడంతో పుష్కరాలకు జనం పోటెత్తుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 5వ రోజు పుష్కరాలకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పుష్కర స్నానం చేసేందుకు భక్తులు తరలి వస్తుండడంతో..రహదారులన్నీ వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆర్టీసి,ప్రైవేటు వాహనాల్లో జనం తరలివస్తుండడంతో..కిలోమీటర్లమేర ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడుతోంది.

 

18:45 - July 18, 2015

కరీంనగర్: జిల్లాలోని జగిత్యాలలో అతిచిన్న ఖురాన్‌ అందరిని ఆకట్టుకుంటోంది. జగిత్యాలోని గంజ్‌రోడ్డులో ఇమ్రాన్‌ జైన్‌ అనే వ్యక్తి వద్ద ఈ ఖురాన్ ఉంది. ఇది దాదాపు వంద ఏళ్ల కిందటిదని ముస్లీం మతపెద్దలు చెబుతున్నారు. దీని వెడల్పు 1.5 సెంటీమీటర్లు, పొడవు 2.5 సెంటీ మీటర్లుగా ఉంది. దీనిని తన స్నేహితుడు మీర్‌ఖాజీ అలీకి వారి తాతయ్య గిఫ్ట్‌గా ఇచ్చినట్టు ఇమ్రాన్‌ జైన్ తెలిపాడు. దీనిని జాగ్రత్తగా భద్రపరచడం కోసం చిన్న ఉంగరం పెట్టెలో ఉంచతున్నారు. దీనిని రంజాన్ మాసం సందర్భంగా ఎవరైనా..సందర్శించవచ్చని ఇమ్రాన్ జైన్ తెలిపాడు. దీనిని చదివి, వినిపించడం ద్వారా చాలా పుణ్యం వస్తుందని ముస్లీం మతపెద్దలు చెబుతున్నారు.

 

 

18:42 - July 18, 2015

హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తల్లి తెలకపల్లి లక్ష్మమ్మ చనిపోయారు. 84 ఏళ్ల లక్ష్మమ్మ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. రేపు మధ్యాహ్నం కర్నూలులో లక్ష్మమ్మ అంత్యక్రియలు జరుగుతాయి. లక్ష్మమ్మ కమ్యూనిస్టు పార్టీలో పని చేశారు. మహిళా సంఘ నాయకురాలిగా కీలక పాత్ర పోషించారు. భర్త తెలకపల్లి నరసింహయ్యగారితో కలిసి కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

 

18:38 - July 18, 2015

హైదరాబాద్: అయిన వారి చేతిలో నరకయాతనను చవి చూసిన ప్రత్యూషను తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులు పరామర్శించారు. అవేర్‌ గ్లోబల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష వద్దకు సీఎం కేసీఆర్‌ వెళ్లారు. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వాకబు చేశారు. ప్రత్యూష పూర్తి బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చిన నేపథ్యంలో సీఎం ప్రత్యూషను పరామర్శించారు.

 

పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేస్తున్నారు. బాసర నుంచి భద్రాచలం వరకూ ఏరియల్ సర్వేపై డీజీపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పుష్కర ఘాట్ల వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మంత్రులతో సీఎం ఫోన్ లో మాట్లాడారు. దక్షిణ తెలంగాణ పోలీసులనూ పుష్కర విధులకు ఉపయోగించుకోవాలని సూచించారు. పుష్కర ఘాట్ల వద్ద ఉండే గ్రామాల పొలిమేర్లలోనే వాహనాలు నిలిపివేయాలన్నారు.

 

పూరీజగన్నాథస్వామి రథయాత్రలో తొక్కిసలాట

ఒడిషా: పూరీ జగన్నాథస్వామి రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో ఇద్దరు భక్తులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

 

18:06 - July 18, 2015

మహారాష్ట్ర: తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే స్పందించారు. అంగన్‌వాడి పిల్లలకిచ్చే పల్లి పట్టి, పుస్తకాలు తదితర వస్తు సామాగ్రి కొనుగోళ్ల కాంట్రాక్ట్ ఇవ్వడంలో కొంత తప్పిదం జరిగిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. 206 కోట్ల రూపాయల కాంట్రాక్టును ఒకేరోజు ఇవ్వడం తప్పేనని విధానసభలో పేర్కొన్నారు. పల్లీ పట్టీ, ఖిచిడీలకు సంబంధించి గత ప్రభుత్వం అనుసరించిన విధానంలోనే ఇవ్వడం జరిగిందన్నారు. కోటి రూపాయలకన్నా ఎక్కువ కాంట్రాక్టు ఇవ్వడానికి ప్రస్తుత నిబంధనలు ఒప్పుకోవన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఇచ్చారని విపక్షాలు మంత్రిని టార్గెట్‌ చేయడంతో పంకజా ముండే సభకు వివరణ ఇచ్చారు. పల్లిపట్టి కొనుగోళ్లలో రాద్దాంతం జరగడంతో ప్రభుత్వం కాంట్రాక్టులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.

 

17:58 - July 18, 2015

హైదరాబాద్: ఫైళ్ల క్లియరెన్స్ లో అలసత్వం...నిధులను రాబట్టడంలో నిర్లక్ష్యం...జనం గోడు పట్టడం లేదు. పెండింగ్ పనులపై దృష్టిపెట్టడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరిది. దస్త్రాలపై సంతకం పెట్టాలన్న ముఖ్యమంత్రికి తీరిక దొరకడం లేదు. నవ తెలంగాణలో పాలన పడకేస్తోంది. సచివాలయంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఫైల్స్ అస్సలు కదలడం లేదు. పాలకుల నిర్లక్ష్యం... అధికారుల అలసత్వంతో... పెండింగ్ సమస్యలు పోగు పడుతున్నాయి. అయినా పాలకులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు.
కేంద్ర నిధులు రాబట్టడంలోఅలసత్వం
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని రాబట్టడంలోనూ తెలంగాణ ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. కేంద్రానికి లెటర్లు రాయడంలోనూ లేజీగా వ్యవహరిస్తోంది. వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం 54 వేల కోట్లను కేటాయించాలంటూ... తెగ హడావుడి చేసిన టీ-సర్కార్‌... ఆ అంచనాలను రివైజ్ చేసి పంపమని కేంద్రం కోరినా పట్టించుకోవడం లేదు. నిధుల వేట కోసం... ఆఫీసర్లు ఫైళ్లు తయారు చేసినా... ముఖ్యమంత్రిగారికి వాటిపై సంతకం చేసి కేంద్రానికి పంపే సమయమే దొరకటం లేదు. సీఎం పేషీకి వెళ్లిన ఫైళ్లు తిరిగి రావడం లేదంటూ అధికారులు వాపోతున్నారు.
ముఖ్యమంత్రి పేషీలో మూలుగుతోన్న ఫైళ్లు
కొద్దిరోజులుగా ఎన్నో కీలకమైన ఫైళ్లు ముఖ్యమంత్రి పేషీలో మూలుగుతున్నాయి. ఉద్యోగుల పీఆర్సీ బకాయిల ఫైల్... కేసీఆర్ సంతకం కోసం నెలల తరబడిగా వేచి చూస్తోంది. ఉద్యోగులకు చెల్లించాల్సిన 9 నెలల బకాయిలను... ఏ రూపంలో చెల్లించాలో తెలియజేయాలని ఆర్థికశాఖ ఫైల్ పంపినా చంద్రశేఖరుడు మాత్రం కరుణించడం లేదు. ఆయన సంతకమే బంగారమైపోయింది. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్ ఫైల్ కూడా సీఎంవో కార్యాలయంలోనే పడకేసింది. ఇంఛార్జీగా బాధ్యతలు చేపట్టి సంవత్సరమైనా తమకు రావాల్సిన ప్రమోషన్లు రాలేదని పలు శాఖల అధికారులు హెచ్‌వోడీలను నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి ఫైల్ పై సంతకం చేస్తే తప్ప... తామేం చేయలేమని శాఖాధిపతులు చేతులెత్తేస్తున్నారు. ఇక మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులు 200 రోజులిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. తీరా అధికారులు ఫైల్ పుట్ అప్ చేస్తే దానిపై ముఖ్యమంత్రి నేటీకి నిర్ణయం తీసుకోలేదు.
వృద్ధుల పింఛన్ పెంపుపై తర్జనభర్జన
ఇక వృద్ధులకు పింఛన్ మొత్తాన్ని 15 శాతం పెంచే దస్త్రం కూడా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఆర్థికశాఖ సిద్ధం చేసిన ఫైల్... సీఎం కార్యాలయానికే పరిమితమైంది. అంతేకాకుండా చిన్న చితకా కాంట్రాక్టర్లకు రావాల్సిన 200 కోట్ల రుపాయల ఫైల్ కూడా... కల్వకుంట్ల క్లియరెన్స్ కోసం ఎదురు చూపులు చూస్తోంది.
అమల్లోకి రాని క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్‌
అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు జిల్లా కలెక్టర్లకు 10 కోట్ల క్రూషియల్ బాలెన్స్ ఫండ్‌ను కేటాయిస్తామని ప్రకటించారు. కానీ నేటికీ గైడ్‌లైన్స్ విడుదల కాలేదు. ఇక ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై వేసిన సీఐడీ విచారణ నివేదిక సీఎం పేషీలోనే ఆరు నెలలుగా మూలుగుతోంది. ముఖ్యమంత్రి అమోదిస్తే నివేదిక బయటకొచ్చి... అక్రమార్కులు జైలు పాలయ్యే వారు. కానీ సీఎం గారికి తీరిక లేకపోవడంతో పెండింగ్ జాబితాలోనే చేరిపోయింది. అడ్వకేట్ జనరల్ కార్యాలయం పంపిన బిల్లుల ఫైళ్లను కూడా సీఎం పెండింగ్‌లోనే పెట్టారు.
ఉద్యోగ ప్రకటనల ఊసేలేదు
ఇక ఉద్యోగాలపై ఊసే ఎత్తడం లేదు. నోటిఫికేషన్‌ దస్త్రాలపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. జులై నెలాఖరులోపు 25 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని... రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో ప్రకటించారు. కానీ ఉద్యోగాల భర్తీపై అడుగు ముందుకు పడటం లేదు. దీంతో నోటిఫికేషన్లు ఎండమావిగానే మిగిలాయి. ఇక నిరుద్యోగుల వయో పరిమితి సడలింపులోనూ ఇదే వైఖరి.
సీఎం సంతకం కోసం వేచిచూస్తున్న ఫైల్లు
ఇలా వందలకు వందల సంఖ్యలో కీలకమైన ఫైల్లు సీఎం సంతకం కోసం వేచి చూస్తున్నాయి. ఫైళ్లు క్లియర్ కాలేదన్న సాకుతో... అధికార యంత్రాంగం సైతం ఆలసత్వాన్ని ప్రదర్శిస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రమాదం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ తన బిజీలో తానుండి... ప్రజల్ని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు సామాన్యుడి బతుకు సంకటంలో పడింది. మరి ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.

 

17:48 - July 18, 2015

హైదరాబాద్: త్వరలో జరగనున్న పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల్లో ప్రధానంగా ఓటుకు నోటు అంశాన్ని లేవనెత్తుతామని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని గట్టిగా పట్టుబడతామన్నారు.

 

గంగోత్రిమార్గంలో విరిగిపడిన కొండచరియలు

ఉత్తరాఖండ్: గంగోత్రి మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడి.. అమర్ నాథ్ యాత్ర నిలిచిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో పుష్కర ఘాట్లు జనమయం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లు జనమయంగా మారాయి. పుష్కరఘాట్లకు చేరే రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. రైళ్లు గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. తగినన్నీ బస్సులు లేక బస్టాండ్లలో భక్తులు పడిగాపులుకాస్తున్నారు.

పుష్కరాల వాహనాలకు తూప్రాన్ టోల్ గేట్ ఉచిత ఎంట్రీ

మెదక్: తూప్రాన్ టోల్ గేట్ సిబ్బంది.. పుష్కరాలకు వెళ్లే వాహనాలను రుసుము లేకుండా అనుమతిస్తున్నారు. 

శ్రీరాంసాగర్ డ్యామ్ పై నుంచి కిందపడ్డ వ్యక్తి

నిజామాబాద్: శ్రీరాంసాగర్ పుష్కర ఘాట్ వద్ద డ్యామ్ పై నుంచి ప్రమాదవశాత్తు.. ఓ వ్యక్తి కిందపడ్డాడు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

16:56 - July 18, 2015

ముంబై: రంజాన్ పర్వదినం సందర్భంగా... బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్‌... శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా శాంతి, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శుక్రవారమే విడుదలైన భజరంగి భాయ్‌జాన్‌ సినిమా చూడాలని ఆతృతతో ఎదురుచూస్తున్నానని... ఈ రాత్రి సెకెండ్‌ షోకు వెళ్లనున్నట్లు అమీర్‌ఖాన్‌ వెల్లడించారు.

 

16:52 - July 18, 2015

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీని బెంగాల్ ప్రభుత్వమే చంపించిందని ఆరోపించారు. వెస్ట్ మిడ్నాపూర్‌ జిల్లాలోని బెల్పహరిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన అభిషేక్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో వరుసగా మావోయిస్టు హత్యలు జరిగేవని... తృణమూల్ కాంగ్రెస్...అధికారంలోకి వచ్చాక అవి ఆగిపోయాయని...కేవలం కిషన్‌జీ హత్య మాత్రమే జరిగిందని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా వున్న అభిషేక్ బెనర్జీ కొన్నిరోజుల క్రితమే కిషన్‌జీ మృతిపై మరో విధంగా కామెంట్ చేశారు. సరెండర్ కావటానికి కిషన్‌జీ ఆమోదించలేదని... మూడు రోజులు గడువు ఇచ్చినా సానుకూల స్పందన రాలేదని... పైగా వారే తిరిగి కాల్పులకు దిగటంతో తప్పనిసరి పరిస్థతుల్లో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని... భద్రతా దళాలు అప్పట్లో తనకు చెప్పినట్లుగా అభిషేక్‌ బెనర్జీ చెప్పారు. ఐతే తాజా వ్యాఖ్యలు మాత్రం ఇందుకు విరుద్ధంగా బెంగాల్ ప్రభుత్వమే హత్య చేయించిందనటం చర్చనీయాంశమైంది.

 

 

 

16:47 - July 18, 2015

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉరుముతోంది. ఓ వైపు కరువు రక్కసి కోరలు చాస్తున్నా పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తొలకరి పలకరింపుతో ఆశలు రేపిన వరుణుడు ముఖం చాటేయడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎండిపోతున్న పంటలు చూసి బోరుమంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేయాల్సిందేమిటి? చేస్తున్నదేంటి? వాచ్ దిస్ స్టోరీ.                                                                
తాగునీటికి తీవ్ర ఎద్దడి 
తెలంగాణలో కరువు పంజా విసురుతోంది. వరుణుడు ముఖం చాటేయడంతో సాగునీటికే కాదు తాగునీటికి తీవ్ర ఎద్దడి ఏర్పడుతోంది. ఖరీఫ్‌ సీజన్ ప్రారంభంలో ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో ఏరువాక జోరందుకుంది. వర్షాభావ పరిస్థితులతో పత్తి, మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తలేదు. మరికొన్ని చోట్ల విత్తనాలు మొలకెత్తినా సరిగా ఎదగలేదు. దీంతో రైతన్న పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
రాష్ట్రంలో 54 లక్షల ఎకరాల్లో పంటసాగు
రాష్ట్రంలో సుమారు 54 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. ఇది ఖరీఫ్ సీజన్ లో సాగయ్యే మొత్తం విస్తీర్ణంలో 53 శాతం. వేసిన పంటల్లోనూ మెట్ట పంటలే అత్యధికం. ఇందులో సగానికి పైగా పత్తి పంటనే సాగు చేశారు. మిగతా స్థానాల్లో మొక్కజొన్న, సోయా, పప్పు ధాన్యాలు పండించారు. అయితే మొక్కలు ఎదిగే దశలో 25రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పాటు.. ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. అప్పులు చేసి పంటసాగు చేసిన అన్నదాతలు వాడిపోయిన మొక్కలను చూసి కంటతడిపెడుతున్నారు.
35 మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం
రాష్ట్రంలో 35 శాతం మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది. జూన్‌లో కురవాల్సిన వర్షం కంటే ఎక్కువ వర్షపాతం వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రికార్డయింది. ఇక పాలమూరు జిల్లాలో సాధారణం కంటే 43 మిల్లిమీటర్ల తక్కువ వర్షపాతం నమోదయింది. జిల్లాలో 48 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో సుమారు 39 మిల్లీమీటర్ల తక్కువ వర్షపాతం రికార్డయింది. అటు మెదక్ జిల్లాలోనూ సాధారణం కంటే 36 మిల్లీమీటర్ల తక్కువ వర్షపాతం నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. జూలై నెలలో చినుకు పలకరించకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి.
ముందుజాగ్రత్త చర్యలు.. ప్రభుత్వం విఫలం..
అయితే గతేడాది తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. వర్షాభావ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరముంది. రాష్ట్రానికి కరువు ముప్పు పొంచివుందని శాస్ర్తవేత్తలు ముందుగానే హెచ్చరించారు. అయినా సర్కార్‌ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట దిగుబడి భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరువు నివారణ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

 

16:40 - July 18, 2015

తమిళనాడు: భారతీయ వైద్యం రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అత్యంత అరుదైన శస్త్రచికిత్స చెన్నైలో జరిగింది. 81 ఏళ్ల వృద్ధురాలికి ఆవు గుండె కవాటాలతో ప్రాణం పోశారు వైద్యులు. ఎలాంటి కోతలేకుండా శస్త్రచికిత్స చేయడం ద్వారా ఈ అరుదైన రికార్డును చెన్నై ప్రంటియర్‌ లైఫ్‌ లైన్‌ ఆస్పత్రి సొంతం చేసుకుంది.
పూడుకుపోయిన గుండెలోని మహాధమని
హైదరాబాద్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలు అట్లూరి సీతాయమ్మకు 11 ఏళ్ల క్రితమే బైపాస్ సర్జరీ జరిగింది. గుండెలోని మహాధమని పూడుకుపోవడంతో మళ్లీ సమస్య తిరగబడింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా డాక్టర్ల నుంచి సానుకూలస్పందన రాలేదు. దీంతో చెన్నైలోని ప్రంటియర్ ఆస్పత్రిని సంప్రదించారు. పరీక్షలు జరిపిన వైద్యులు గతంతో అమర్చిన వాల్వ్ పూర్తిగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. అయితే ఆమె వయసు రిత్యా ఆపరేషన్ చేసేందుకు తొలుత వైద్యులు సంశయించారు.
ఆవు గుండె కవాటాన్ని అమర్చిన వైద్యులు
చివరకు కేసును చాలెంజ్‌గా తీసుకున్న ప్రంటియర్ ఆస్పత్రి వైద్యులు ఆవు గుండె నుంచి సేకరించిన కవాటాన్ని అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో వృద్ధురాలు బాగానే ఉన్నారు. జనరల్ వార్డుకు తరలించారు. డాక్టర్ అనంతరామన్ అనే వైద్యుడి పర్యవేక్షణలో మూడు గంటల పాటు ఆపరేషన్ జరిగింది. ఎలాంటి గాటు లేకుండా వీఐవీ-టీఎవీఆర్ విధానంలో శస్త్ర చికిత్స విజయవంతంగా జరిపినట్లు వైద్యులు డాక్టర్ కేమ్ చెరియన్, కార్డియాలజిస్టు అనంతరామన్ తెలిపారు. సీతాయమ్మ ఆరోగ్యంగానే ఉన్నట్లు... రెండు, మూడు రోజుల్లో ఆమెను ఇంటికి పంపుతున్నట్లు చెప్పారు. ఈనెల 11వ తేదీన సీతాయమ్మకు ఆపరేషన్‌ నిర్వహించగా... ఆస్పత్రిలో వేగంగా ఆమె కోలుకుంటోంది. ఆపరేషన్‌ తర్వాత తాను సంతోషంగా ఉన్నట్లు సీతాయమ్మ చెబుతోంది.

 

ప్రత్యూషను పరామర్శించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: నగరంలోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ప్రత్యూషను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం.. ప్రత్యూష బాధ్యతలను స్వీకరించనుంది.  

16:18 - July 18, 2015

బాగ్దాద్‌: ఇరాక్‌లో ఉగ్రవాదులు పంజావిసిరారు. ఆత్మాహుతి దాడితో అమాయక ప్రజలను పొట్టనబెట్టుకున్నారు. బాగ్దాద్‌కు 35 కిలోమీటర్ల దూరంలో వుండే ఖాన్‌బనిసాద్‌లో శుక్రవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. అత్యంత రద్దీగా వుండే మార్కెట్‌ గేట్‌ వద్ద ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాదాపు వందమంది మృతి చెందగా... మరో వందమందికి పైగా క్షతగాత్రులయ్యారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా వున్నట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్లు ఐఎస్ ఐఎస్ గ్రూప్ ప్రకటించుకుంది.

 

 

16:13 - July 18, 2015

అహ్మదాబాద్‌: గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లో జగన్నాథుని రథయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది. జగన్నాథుని రథయాత్రను చూసేందుకు లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. దీంతో అహ్మదాబాద్‌లోని వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జగన్నాథుని రథయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

16:07 - July 18, 2015

రాజమండ్రి: గోదావరి పుష్కరాలకు రద్దీ పెరిగిన నేపథ్యంలో రాజమండ్రిలో సీఎం చంద్రబాబు అధికాకారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు వెళ్లి స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. అడ్మినిస్ట్రేటివ్‌కు భక్తులందరు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరు క్యూ పద్ధతి పాటించాలన్నారు. ఘాట్లను ఏప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్నామని చెప్పారు. పుష్కరాలు ముగిసే వరకు జాతీయ రహదారులపై టోల్‌ ఫీజును రద్దు చేసే ప్రతిపాదన పరిలిస్తున్నామన్నారు.

 

16:00 - July 18, 2015

తూర్పుగోదావరి: జిల్లాలోని సోంపల్లి-అంతర్వేదిలోని పుష్కరఘాట్లు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు రావడంతో...లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో అటు అటు పుష్కరఘాట్లు భక్తుల రద్దీతో చీమలదండును తలపిస్తున్నాయి. పుష్కరస్నానాలు చేసిన భక్తులు..అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, సోంపల్లి సోమేశ్వర ఆలయంలోని స్వామివార్లను దర్శించుకునేందుకు గంటలతరబడి క్యూలైన్లలో వేచిచూస్తున్నారు.

 

15:58 - July 18, 2015

కరీంనగర్: జిల్లాలో గోదావరి పుష్కరాలకు వెళ్తున్న ప్రయాణీకులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. నగరంలోని బస్టాండ్ వద్ద వేలాది మంది భక్తులు గంటలతరబడి బస్సులకోసం నిరీక్షిస్తున్నారు. వరుస సెలవులు రావడంతో..భక్తులు అధికసంఖ్యలో తరలివస్తున్న ఆర్టీసీ మాత్రం రద్దీకి తగ్గట్లుగా బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో...భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పుష్కరాలకు వెళ్లేందుకు అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

 

తెలకపల్లి రవి మాతృమూర్తి టీసీ లక్ష్మమ్మ కన్నుమూత

హైదరాబాద్: సీనియర్ కమ్యూనిస్టు, మహిళా సంఘం నాయకురాలు, తెలకపల్లి రవి మాతృమూర్తి టీసీ లక్ష్మమ్మ(84) అస్తమించారు. అనారోగ్యంతో ఆమె మరణించారు. రేపు మధ్యాహ్నం కర్నూలులో లక్ష్మమ్మ అంత్యక్రియలు జరుగనున్నాయి. 

15:48 - July 18, 2015

హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు వెళ్లేందుకు బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌ నుంచి భద్రాచలం, రాజమండ్రి, నెల్లూరు వెళ్లడానికి ప్రయాణికులు ఎల్బీనగర్‌ వద్ద బస్సుల కోసం గంటలతరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. మరోవైపు ఇదే అదనుగా ఆర్టీసీ ఛార్జీల మోత మోగిస్తోంది. ప్రయాణికుల నుంచి అదనంగా డబ్బులను వసూలు చేస్తూ ప్రయాణికుల జేబుకు భారీగా చిల్లు పెడుతోంది. ఆర్టీసీ బస్సుల తీరు ఇలా ఉంటే ఇంకా ప్రైవేటు వాహనాల పరిస్థితి చెప్పనక్కర్లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

15:44 - July 18, 2015

గుంటూరు: రుషికేశ్వరి కేసుకు సంబంధించి ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు. మంత్రి గంటా శ్రీనివాస్‌రావు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రుషికేశ్వరి చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు. అనంతరం నిజ నిర్ధారణ కమిటీతో మంత్రి గంటా భేటీ అయ్యారు. రిషికేశ్వరి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

 

ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

తూ.గో: ముమ్మిడివరం మండలం గేదెలలంకలో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. 10 మందికి గాయాలయ్యాయి. పుష్కరాలకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల పరిహారాన్ని ఎపి ప్రభుత్వం ప్రకటించింది. 

14:01 - July 18, 2015

హైదరాబాద్ : రంజాన్ పర్వదినాన్ని హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంటున్నారు. నాంపల్లిలోని మాసబ్ ట్యాంక్ మజీద్ లో.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం... ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పర్వదినాన్ని ఖమ్మంలో సంప్రదాయ పద్దతుల్లో జరుపుకున్నారు. ఖమ్మంలోని గాంధీచౌక్, గొల్లగూడెం ఈద్గాలో ముస్లీంలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి, భక్తిశ్రద్దలతో నమాజ్ ను చేశారు. అనంతరం ముస్లింలు పరస్పరం శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు. కరీంనగర్‌లో ఈదుల్‌ ఫితర్‌ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని సాలెహ్ నగర్ లోని ఈద్గా వద్ద భారీ సంఖ్యలో ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎంపీ వినోద్ కుమార్ తోపాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు వివిధ రంగాల నాయకులు పలువురు ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 

13:31 - July 18, 2015

ఖమ్మం : గోదావరి పుష్కరాలకు వెళ్లేందుకు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్లేందుకు సరిపడా బస్సుల లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న కొద్ది పాటి బస్సులు జనంతో కిక్కరిసి పోతుండడంతో..ఖమ్మం బస్టాండ్, బస్ డిపో ప్రాంతాలు జాతరను తలపిస్తున్నాయి. పుష్కరాల కోసం సరిపడా బస్సులను వేయడంలో ప్రభుత్వం విఫలమయిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే..అటు భద్రాచలంలోనూ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్‌ స్థలం నుంచి భద్రాచలంలోని ఘాట్ల వద్దకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలంలోని పార్కింగ్‌ స్థలం వాహనాలతో కిక్కిరిసిపోవడంతో..సొంతవాహనాల్లో వచ్చిన భక్తులు వాహనాలను ఎక్కడ పార్కింగ్‌ చేయాలో అర్థంకాక ఇబ్బందులు పడుతున్నారు. 

13:28 - July 18, 2015

నల్గొండ : జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని టోల్‌ ప్లాజాలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. 65వ నెంబర్ జాతీయ రహదారిపై కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీనితో హైదరాబాద్‌ నుంచి భద్రాచలం పుష్కరాలకు వెళ్తున్న బస్సులు, వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. భద్రాచలంలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సుమారు 2 గంటల పాటు వాహనాలను నిలిపి ఆ తర్వాత పంపనున్నారు.

ఆనంద్ ప్రభాత్ హత్య కేసుపై మెజిస్ట్రియల్ విచారణ..

ఢిల్లీ : ఇటీవల హస్తినలో దారుణ హత్యకు గురైన ఆనంద్ ప్రభాత్ బాలిక హత్యపై మెజిస్ట్రియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడిన ఆకతాయికి ఎదురు తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు దుండగులు బాలికను హత్య చేసిన సంగతి తెలిసిందే.

సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న హరీష్...

మెదక్: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్ధిపేటలోని ఈద్గాలో జరిగిన సామూహిక ప్రార్థనల్లో రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు.

ఇస్కాన్ దేవాలయంలో మమత ప్రార్థనలు..

కోల్ కతా : జగన్నాథ్ రథయాత్ర సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఇస్కాన్ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

 

12:18 - July 18, 2015

పశ్చిమగోదావరి : జిల్లాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. పేరుగాంచిన గోష్పాద క్షేత్రంలో స్నానం చేసేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. దీనితో పుష్కర ఘాట్ ల వద్ద భక్తుల సందడి కనిపిస్తోంది. మరోవైపు శనివారం ఎండ తీవ్రత అధికంగా ఉంది. దీనితో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధుల్లో కొంతమంది సృహ తప్పి పడిపోతున్నారు. ఇలానే ఓ యువతి ఉదయం సొమ్మసిల్లి పడిపోయింది. దీనితో అక్కడనే ఉన్న ఇతరులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అంబులెన్స్ తెప్పించే ప్రయత్నం చేశారు. కానీ సకాలంలో అంబులెన్స్ చేరుకోకపోవడంతో యువతి పరిస్థితి విషమంగా తయారైంది. అక్కడనే ఉన్న ఓ ప్రభుత్వ వాహనంలో యువతిని తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్న ప్రభుత్వంపై యాత్రికులు విమర్శలు చేస్తున్నారు. ప్రాథమిక వైద్య చికిత్స శిబిరం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 

నిలిచిపోయిన వాహనాలు...

నిజమాబాద్ : డిచ్ పల్లి 44వ జాతీయ రహదారిపై సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ధర్మపురి - కరీంనగర్ మార్గంలో 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. కాళేశ్వరం మార్గంలో 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

గోష్పాద క్షేత్రంలో ప్రమాదం..

పశ్చిమగోదావరి : గోష్పాద క్షేత్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన ఓ వాటర్ ట్యాంకర్ జనాలపైకి దూసుకరావడంతో పలువురు యాత్రికులకు గాయాలయ్యాయి. 

'బాహుబలి'పై రాంగోపాల్ వర్మ ట్వీట్స్..

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై తరచూ వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశారు. ఈ చిత్రం కోసం ప్రభాస్ రెండేళ్ల పాటు పని చేసి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని, కానీ ఈ చిత్రం మొదటి పార్ట్ లో వచ్చిన లాభంలో 65 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు ట్వీట్ చేశారు. పార్ట్ -2 చిత్రీకరణ కోసం ఓ బిగ్ కార్పొరేట్ కంపెనీ 325 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోందని ట్వీట్ చేశారు. 

రిషితేశ్వరీ మృతిపై విచారణ..

గుంటూరు : రిషితేశ్వరీ మృతి పై నాగార్జున వర్సిటీలో విచారణ జరుగుతోంది. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై మంత్రి గంటా ఆరా తీస్తున్నారు. అనంతరం విచారన కమిటీతో ఆయన సమావేశమయ్యారు. 

భద్రాచలంలో నాలుగున్నర లక్షల మంది పుణ్యస్నానాలు..

ఖమ్మం : ఈ రోజు ఉదయం 11గంటల వరకు నాలుగున్నర లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి వారి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. భద్రాచలం ఘాట్ వద్ద భక్తులు కిక్కిరిసిపోవడంతో ఇతర ఘాట్ లో స్నానాలు ఆచరించాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. 

మంత్రి జగదీష్ ను అడ్డుకున్న ఆలయ సిబ్బంది..

భద్రాచలం : మంత్రి జగదీష్ రెడ్డిని ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని భక్తులు ఫిర్యాదు చేశారు. అధికారులతో మాట్లాడుతానని మంత్రి హామీనిచ్చారు. 

భద్రాచంలో డీజీపీ అనురాగ్ శర్మ..

ఖమ్మం : భద్రాచలంలో పుష్కర ఘాట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను డీజీపీ అనురాగ్ శర్మ పరిశీలిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు, రేపు కూడా ఇదే విధంగా రద్దీ ఉంటుందన్నారు. 

పుష్కరాలపై కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ మళ్లింపునకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సూచించారు. అవసరమైతే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని, పుష్కర ఘాట్ల వద్ద 24 గంటల పాటు పడవలు, గజ ఈత గాళ్లను అందుబాటులో ఉంచాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

తణుకు టోల్ గేట్ లో ఫీజులు వసూలు చేయవద్దన్న కలెక్టర్..

పశ్చిమగోదావరి : తణుకు టోల్ గేట్ లో పుష్కరాలకు వెళ్లే వాహనాల నుండి ఫీజులు వసూలు చేయవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 

11:41 - July 18, 2015

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ లో వేర్పాటు వాద గిలానీ మద్దతు దారుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. గిలానీ గృహ నిర్భందాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళకారులు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లతో దాడి చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీనితో పోలీసులు నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇదే సందర్భంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్, ఐఎస్ఎస్ జెండాలు ప్రదర్శించారు. గత మూడు రోజులుగా శ్రీనగర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. 

11:36 - July 18, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పుష్కరాలు ఐదో రోజుకు చేరాయి. వరుస సెలవులు రావడంతో పుష్కర స్నానాలు చేయడానికి భక్తులు భారీగా తరలివెళుతున్నారు. ఎక్కడ చూసినా పుష్కరాలకు వెళ్లే దారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. హైదరాబాద్ నుండి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల వైపు గోదావరి పుష్కరాలకు వెళ్లే వాహనాలతో 44వ జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ ఏర్పడింది. మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ గేట్ వద్ద వాహనాలు అధిక సంఖ్యలో నిలిచిపోయాయి. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్, కొంపల్లి ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

11:29 - July 18, 2015

నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గోదావరి తీరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తుతుండడంతో కొంతమంది శ్రీరాంసాగర్ లో పుణ్యస్నానం ఆచరించడానికి మొగ్గు చూపుతున్నారు. దీనితో ఈ రహదారిలో సైతం వాహనాలు బారులు తీరుతున్నాయి. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పోచంపాడ్ ..తదితర ప్రాంతాల్లో చెక్ పోస్టులను పెట్టి ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నట్లు ఆర్మూర్ డీఎస్పీ పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. శ్రీరాంసాగర్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు తరలివస్తున్నారని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాలుగు ఘాట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఒకటి వీఐపీ ఘాట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీఐపీ ఘాట్ లో వృద్ధులు, పిల్లలకు కూడా స్నానానికి అనుమతినివ్వనున్నట్లు తెలిపారు.

11:20 - July 18, 2015

రాజమండ్రి : గోదావరి పుష్కరాలు..వారంతపు సెలవులు రావడంతో రాజమండ్రిలో భక్తులు భారీగా పోటెత్తారు. పుష్కర ఘాట్ వద్ద ఇసుకేస్తే రాలనంత జనాలతో నిండిపోయాయి. ముఖ్యంగా రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్ లో రద్దీ భారీగా నెలకొంది. దీనితో గోదావరి తీరంలో ప్రమాదం పొంచి ఉంది. అనధికారికంగా ఉండే ఘాట్ ల వద్ద భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రమాద హెచ్చరికలు..బందోబస్తు లేని ఘాట్ వద్ద కూడా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీనితో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం తలెత్తుతుందనే ఆందోళన నెలకొంది. వెంటనే అధికారులు మేల్కోని అనధికారికంగా ఉండే ఘాట్ ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలనే సూచనలు వినిపిస్తున్నాయి. సుమారు 24 లక్షల మంది రాజమండ్రిలో ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
భారీగా ట్రాఫిక్ జాం..
మరోవైపు రాజమండ్రికి వెళ్లే రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. విశాఖ, విజయవాడ నుండి రాజమండ్రికి చేరుకోవడానికి 10-12గంటల సమయం పడుతోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 24 లక్షల మంది భక్తులున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు..ప్రత్యేక రైళ్లు సరిపోవడం లేదు. సొంత, అద్దె వాహనాల్లో భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బందోబస్తుకు ఉపయోగిస్తున్న 25వేల మంది పోలీసులు ఏమాత్రం సరిపోవడం లేదు. వారంతపు సెలవుల నేపథ్యంలో భారీగా భక్తులు తరలివస్తారని తెలిసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  హైవేపై ట్రాఫిక్ ను పోలీసులు నియంత్రించలేకపోతున్నారు. విజయవాడ – రాజమండ్రి, విశాఖ - రాజమండ్రికి 10గంటల సమయం పడుతోంది. పుష్కర స్నానానికి 4-5గంటల సమయం పడుతోంది. దీనితో పుష్కర స్నానం చేయడానికి పిల్లలు, వృద్ధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 

15ఏళ్ల బాలికపై సామూహిక ఆత్యాచారం..

విజయవాడ : గుణదలలో దారుణం చోటు చేసుకుంది. 15ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులకు అత్యాచారం జరిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాచవరం పోలీసులకు బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు. 

పుష్కరాలు..అంతా గందరగోళం..

హైదరాబాద్ : వారంతపు సెలవలు రావడంతో పుష్కరాలకు భక్తులు క్యూ కడుతున్నారు. దీనితో గోదావరి తీరంలో ప్రమాదం పొంచి ఉంది. బస్సుల రద్దీ పెరగడంతో అనధికారిక ఘాట్ లలోనే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రమాద హెచ్చరికలు, బందోబస్తు లేని ఘాట్ లలో స్నానాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే జాతీయ రహదారిపై వేలాదిగా వాహనాలు నిలిచిపోయాయి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 24 లక్షల మంది భక్తులున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు..ప్రత్యేక రైళ్లు సరిపోవడం లేదు. సొంత, అద్దె వాహనాల్లో భారీగా భక్తులు తరలివస్తున్నారు. హైవేపై ట్రాఫిక్ ను పోలీసులు నియంత్రించలేకపోతున్నారు.

మరోసారి పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నౌషారి సెక్టార్‌లో భారత స్థావరాలపై పాక్ 108 రౌండ్ల కాల్పులు జరిపింది. 

మళ్లీ పాక్..ఐఎస్ఐఎస్ జెండాల ప్రదర్శన...

శ్రీనగర్ : మళ్లీ పాక్, ఐఎస్ఐఎస్ జెండాలు దర్శనమిచ్చాయి. రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించే ఈద్గా వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఈ జెండాలను ప్రదర్శించారు. హురియత్ నేతల నిర్భందనాన్ని నిరసిస్తూ జెండాలను ప్రదర్శించినట్లు తెలుస్తోంది.

గోదారిలో 'ఈకోలీ' బ్యాక్టీరియా..

రాజమండ్రి : పుష్కరాలకు వెళ్లే వారు మూడు నిమిషాల్లో స్నానం ముగించాలని తీర ప్రాంత పరిశోధన శాస్త్రవేత్త సత్యాజీరావు సూచనలు చేశారు. గోదారిలో ప్రమాదకరస్థాయిలో 'ఈకోలీ' బ్యాక్టీరియా ఉందని, దీనివల్ల వాంతులు, విరోచనాల సమస్య ఏర్పడే అవకాశం ఉందన్నారు. మందులకు ఈకోలి ఒక పట్టాన లొంగదని, సాధారణం కన్నా 10 రెట్లు అధికంగా ఈకోలి బ్యాక్టీరియా ఉందన్నారు. కళ్లు, ముక్కు, నోటిలోకి నీళ్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పోరపాటున నీళ్లు తాగితే రెండు రోజుల తరువాత వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. 

3గంటలకు గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్...

హైదరాబాద్ : మధ్యాహ్నాం మూడు గంటలకు గ్లోబల్ ఆసుపత్రిలో ప్రత్యూషను సీఎం కేసీఆర్ దంపతులు కలువనున్నారు. 

ఈద్గా వద్ద భారీ భద్రత – సీపీ..

హైదరాబాద్ : మీరాలం ఈద్గాలో పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి భద్రతను పర్యవేక్షించారు. ఈద్గా వద్ద 15వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లు, మసీదులు, ఈద్గాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సీపీ పేర్కొన్నారు. సమస్యత్మాక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ జరుగుతోందని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

చౌటుప్పల్ లో వాహనాల నిలిపివేత..

నల్గొండ : చౌటుప్పల్ లో గోదావరి పుష్కరాలకు వెళ్లే ప్రైవేటు వాహనాలు, బస్సులను పోలీసులు నిలిపివేశారు. పుష్కరాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నాం రెండు గంటల తరువాత వాహనాలను పోలీసులు అనుమతించనున్నారు. 

10:34 - July 18, 2015

ఖమ్మం : వేలు దాటి లక్షల్లోకి చేరుతున్నారు..అందరిలో ఒకటే ఆరాటం..గోదావని చూడాలని..అందులో పుష్కర స్నానం ఆచరించాలని..భక్తజనం, ప్రణవనాదంలా..ప్రశాంత హోమంలా తరలివస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు అత్యంత వైభంగా సాగుతున్నాయి. గత నాలుగు రోజులకంటే శనివారం అధికంగా భక్తులు హాజరవుతున్నారు. వారంతపు సెలవులు కావడంతో భక్తులు భద్రాద్రికి పోటెత్తారు. ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుండి భక్తులు భద్రాద్రికి వస్తున్నారు. శనివారం ఉదయం పది గంటల వరకే దాదాపు 2లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు 10 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక పుష్కర ఘాట్ లలో భక్తులతో జనసంద్రంగా మారిపోయింది. నిషేధిత ప్రాంతంలో భక్తులకు స్నానాలు ఆచరిచేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. మరోవైపు శ్రీరాముడిని దర్శనం చేసుకొనే సమయాల్లో మార్పులు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారీగా ట్రాఫిక్..
లక్షల సంఖ్యల్లో భక్తులు తరలివస్తుండడంతో భద్రాచలం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కొత్తగూడెం వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సారపాక వద్దకే వాహనాలను అనుమతినిస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ఆరు పార్కింగ్ స్థలాలు కూడా సరిపోవకపోవడంతో ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేస్తున్నారు.  

10:16 - July 18, 2015

రాజమండ్రి : వారంతపు సెలవులు..గోదావరి పుష్కరాలు..దీనితో రాజమండ్రికి భక్తులు భారీగా పోటెత్తారు. లక్షల సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో రాజమండ్రి పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారిపోయాయి. దీనితో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గంటలు..గంటలు గడుస్తున్నా వాహనాలు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. భక్తులు పోటెత్తుతారని తెలిసినా అధికారులు ఎక్కడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ – విశాఖపట్టణం నుండి రాజమండ్రికి కేవలం మూడు, నాలుగు గంటల ప్రయాణం ఉంటే ఈ రోజు సుమారు 12-15 గంటల సమయం పడుతోంది. తాము శనివారం రాత్రి బయలుదేరితే ఈ రోజు ఉదయం 9గంటలకు చేరుకోవడం జరిగిందని ఓ ప్రయాణీకుడు వాపోయారు. కంబాళ చెరువులో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ట్రాఫిక్ అంతా అస్తవ్యస్థంగా తయారైందని ప్రయాణీకుడు తెలిపాడు. ఇప్పటికైనా అధికారులు మేల్కోని ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

నగరంలో రంజాన్ సందడి..

హైదరాబాద్ : నగరంలో రంజాన్ సందడి నెలకొంది. ఉదయం నుండే మసీదులు..ఈద్గాల వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ, గవర్నర్ నరసింహన్, ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 

రాజమండ్రిలో భక్తుల రద్దీ..

రాజమండ్రి : పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. లాలా చెరువు - వేమగిరి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రైల్వే స్టేషన్, బస్టాండు, తాత్కాలిక బస్టాండ్ లకు భారీగా వాహనాలు చేరుకుంటున్నాయి. రాజమండ్రిలో అనధికారికంగా ఆరువేలకు పైగా ఆటోలు నడుస్తున్నాయి. రాజమండ్రి రూరల్ ప్రాంతంలో 25 లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలకు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఈద్ వేడుకల్లో నితీష్..మమత బెనర్జీ..

ఢిల్లీ : దేశంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు..నేతలు ప్రార్థనల్లో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ లో సీఎం నితీష్ కుమార్..కోల్ కతాలో సీఎం మమత బెనర్జీ ప్రార్థనల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. 

09:25 - July 18, 2015

ఖమ్మం : భద్రాద్రిలో భక్తజన ప్రవాహం..పుష్క సందోహం..భక్తుల పులకరింత..పవిత్ర గోదావరి పుష్కరాల సందర్భంగా భద్రాద్రిలో రోజు రోజుకూ భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. సెలవు దినాలు కావడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. శుక్రవారం దాదాపు 3 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తే ఆ సంఖ్య నేడు..రేపు రెట్టింపు కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు 8-9 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం ఉదయం నుండే గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మూడు కిలోమీటర్ల వరకు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు..వివిధ ప్రైవేటు వాహనాల ద్వారా భారీ సంఖ్యలో భద్రాద్రికి తరలి రావడంతో పార్కింగ్ ప్లేసులు నిండిపోయాయి. ఆరు పార్కింగ్ ప్లేస్ లున్నా సరిపోవడం లేదంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రామదర్శనం కోసం వెళ్లే భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. పుష్కరాలు ప్రారంభమైన రోజుల్లో దర్శనానికి 4-5గంటలు పడగా నేడు, రేపు దర్శనానికి 8-9 గంటలు పట్టే అవకాశం ఉంది. భద్రాచలంలో ఎండ వేడిమి అధికంగా ఉండడంతో భక్తులు పలు ఇబ్బందులు పడుతున్నారు. సరియైన టెంట్లు..చలువ పందిళ్లు వేయకపోవడంతో సమస్యలు పడుతున్నామని భక్తులు పేర్కొంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

09:15 - July 18, 2015

కరీంనగర్ : వరుస సెలవులు రావడంతో నగరంలోని ప్రజలు గోదావరి పుష్కరాలకు తరలివెళుతున్నారు. పుణ్యక్షేత్రమైన ధర్మపురికి భక్తులు పోటెత్తుతున్నారు. దీనితో జాతీయ రహదారిపై వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. మూడు నుండి నాలుగు గంటల వరకు వాహనాలను కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శని, ఆదివారాలు సెలవు దినం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని తెలిసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 7-8 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ధర్మపురికి చేరుకునే వాహనాలను 15 కిలో మీటర్ల దూరంలోనే నిలిపివేస్తున్నారు. ధర్మపురి పుష్కర ఘాట్ల వద్ద రద్దీ తగ్గిన తరువాత భక్తులను లోనికి అనుమతిస్తున్నారు. కానీ మంచినీటి సమస్య ప్రధానంగా నెలకొందని, ఒక లీటర్ మంచినీటి బాటిల్ కు రూ.30-40 వసూళ్లు చేస్తున్నారని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. పుష్కరాలకు భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ఘనంగా ప్రార్థనలు..

ఢిల్లీ : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. గౌహతిలో సీఎం తరుణ్ గొగాయ్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. 

రాజీవ్ రహదారిపై భారీగా వాహనాలు..

హైదరాబాద్ : ఇవాళ, రేపు సెలవులు కావడంతో గోదావరి పుష్కరాలకు నగరం నుంచి భారీ సంఖ్యలో భక్తులు బయల్దేరుతున్నారు. ఈ క్రమంలో రాజీవ్ రహదారిపై భారీగావాహనాలు నిలిచిపోయాయి. టోల్‌గేట్‌ల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.

ప్రార్థనలు చేసిన కేంద్ర మంత్రి నఖ్వీ..

కాశ్మీర్ : కేంద్ర మైనార్టీ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కాశ్మీర్ గేట్ వద్ద జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు.

 

08:20 - July 18, 2015

రాజమండ్రి : వరుస సెలవు దినాలు..ఆపై గోదావరి పుష్కరాలు..ఇంకేముంది రాజమండ్రి గోదావరి తీరానికి భక్తులు పోటెత్తారు. విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల నుండి రాజమండ్రి పుష్కర ఘాట్లలో పుణ్యస్నానం చేసేందుకు యాత్రికులు బయలుదేరారు. దీనితో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలన్నీ రోడ్డుపైకి ఒకేసారి రావడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. వేలాది వాహనాలు నిలిచిపోవడంతో యాత్రికులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జగ్గంపేట మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
విషాదం..
రాజమండ్రిలోని రైల్వేస్టేషన్లు..బస్ స్టేషన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇదిలా ఉంటే జాతీయ రహదారిపై విషాదం నెలకొంది. వాహనాలు నిలిచిపోవడంతో కిందకు దిగుదామని తండ్రి కొడుకులు ప్రయత్నించడం..వెనుకనే వచ్చిన వాహనాన్ని వీరిని ఢీకొనడంతో ఇద్దరూ దుర్మరణం చెందారు. మరో వ్యక్తి గాయపడినట్లు సమాచారం.
రాజమండ్రిలో 12 లక్షల మంది..
మరోవైపు రాజమండ్రిలోని కోటిలింగాల రేవుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. సుమారు రాజమండ్రిలో 12 లక్షల మంది భక్తులున్నట్లు అంచనా. రూరల్ ప్రాంతంలో మరో 6 లక్షల మంది భక్తులున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనితో రాజమండ్రి జనసంద్రంగా మారిపోయింది. 

రంజాన్ వేడుకల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్..

భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

07:58 - July 18, 2015

రాజమండ్రి పుష్కరఘాట్ లో తొక్కిసలాట ఘటన సర్వ సాధారణమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి స్నానఘట్టంలో శుక్రవారం ఆయన పుష్కరస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో పారిశుధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా శుక్రవారం పది వామపక్ష పార్టీలు ఇచ్చిన రాష్ట్ర బంద్ సక్సెస్ అయ్యింది. పోలీసు నిర్భందాలు..అరెస్టుల మధ్య జిల్లాల్లో బంద్ జరిగింది. మున్సిపల్ ఉద్యోగులకు వేతనాల పెంపులో వివక్ష పాటించారని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడితో మున్సిపల్ జేఏసీ నాయకులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తండ్రి..పినతల్లి దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ప్రత్యూష ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఆమె బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్), వకుళా భరణం కృష్ణ మోహన్ (కాంగ్రెస్), శ్రీధర్ రెడ్డి (బీజేపీ), శ్రీరాములు (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

ఫతేపురి మజీద్ ఇమామ్ తో భేటీ అయిన పాక్ హై కమీషనర్..

ఢిల్లీ : రంజాన్ పండుగను పురస్కరించుకుని పాకిస్తాన్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్ ఢిల్లీలో ఫతేపురి మజీద్ ఇమామ్ తో భేటీ అయ్యారు. 

పుష్కరాలు..భారీగా నిలిచిపోయిన వాహనాలు..

హైదరాబాద్ : వరుసగా రెండు రోజుల పాటు సెలవు దినాలు రావడంతో నగరం నుండి భారీగా ప్రజలు పుష్కరాలకు బయలుదేరారు. దీనితో గోదావరి తీరానికి దారితీసే రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. హైదరాబాద్ నుండి బాసర, కరీంనగర్, ఖమ్మం తదితర తెలంగాణ జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల రహదారులపై భారీ రద్దీ నెలకొంది. టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ పొడుగునా వాహనాలు నిలిచిపోయాయి.

జామా మసీదులో మొదలైన ప్రార్థనలు..

న్యూ ఢిల్లీ : జామా మసీదులో రంజాన్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు తుమ్మల, జగదీష్ రెడ్డి..

ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి పుష్కరాల ఏర్పాట్లను తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్ రెడ్డి పరిశీలించారు. 

బాసరకు పోటెత్తిన భక్తులు..

ఆదిలాబాద్ : సెలవు దినాలు కావడంతో బాసరకు భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. పుష్కర ఘాట్ లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బాసర ఆలయ సమీపంలోకి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

పూరీ యాత్రకు సర్వం సిద్ధం..

ఒడిశా : జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ఉదయం 9.30గంటలకు రథాల ప్రతిష్ట..10 గంటలకు విగ్రహాలను రథాలపైకి తరలించే పొహండి ప్రారంభం కానుంది. మూడున్నర గంటలకు భక్తుల జయజయధ్వానాల నడుమ నందిఘోష్, తాళ ధ్వజ, దర్పదళన్ రథాలు గుండిచా మందిరం వైపు ఊరేగింపుగా బయలుదేరనున్నాయి. 

నేడు బస్ పాస్ కౌంటర్లకు హాలీడే..

హైదరాబాద్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం బస్‌పాస్ కౌంటర్లకు సెలవు ప్రకటించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

 

రక్తమోడిన ఇరాక్..

బాగ్దాద్ : ఇరాక్‌లో మరోసారి రక్తమోడింది. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కారు బాంబు పేల్చారు. ఈ ప్రమాదంలో 80 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

 

06:43 - July 18, 2015

కేరళ : వెలుగులు పంచాల్సిన పథకం కోట్లు మింగేసింది. పట్టించుకోవల్సిన వారు ప్రేక్షక పాత్ర వహిస్తే, చర్యలు తీసుకోవాల్సిన వారు చోద్యం చూశారు.దీంతో కోట్లకు కోట్ల ప్రజాధనం అక్రమార్కుల అకౌంట్లలోకి తరలిపోయింది. ఇప్పుడిప్పుడే ఈ స్కాం డొంక కదులుతోంది. 2013 కేరళ. మాది మచ్చలేని ప్రభుత్వమని గప్పాలు కొట్టుకుంటున్న వూమెన్‌చాందీ ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడింది. సౌరశక్తి ఆధారంగా నడిచే ప్లాంట్ల ఏర్పాటుకు, సోలార్‌ పరికరాల కొనుగోలుకు సంబంధించిన సోలార్‌ కుంభకోణం ప్రజాక్షేత్రంలో వూమెన్‌ సర్కార్‌ను దోషిగా నిలబెట్టింది.
రంగంలోకి జస్టిస్‌ శివరాజన్‌ కమిషన్‌..
కోట్లాదిరూపాయలు దుర్వినియోగమైన ఈ స్కాంలో నిజాలను నిగ్గుతేల్చేందుకు జస్టిస్‌ శివరాజన్ కమిషన్ రంగంలోకి దిగింది. ఈ విచారణలో భాగంగానే కేరళ సీఎం వూమెన్‌ చాందీతో పాటు పలువురు మంత్రులు, రాజకీయ నేతలకు సమన్లు జారీ చేసింది. సెక్షన్‌ 8బి కమిషన్‌ ఎంక్వైరీ యాక్ట్‌ 1952 కింద సమన్లు జారీ అయ్యాయి.
మూడేళ్ల జైలుశిక్ష, కోటి 20 లక్షల జరిమానా..
అయితే సమన్ల సారాంశం ప్రకారం ఇప్పటికిప్పుడు సిఎం కమిషన్‌ ముందు హాజరు కావాల్సిన పనిలేదు. కానీ గడువులోగా న్యాయవాదుల చేత వివరణ మాత్రం ఇచ్చుకోవల్సి ఉంటుంది. ఈ మధ్యలో విచారణకు అవసరమయితే ఎప్పుడైనా హాజరుకావల్సి ఉంటుందని కమిషన్‌ సమన్లలో వివరించింది. 2013లో కేరళలో వెలుగు చూసిన సోలార్‌ స్కాం వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. సోలార్‌ స్కాం ప్రధాన నిందితులు సరితా నాయర్, ఆమె పార్ట్‌నర్ బిజు రాధాకృష్ణన్‌లకు చీటింగ్‌ చేశారన్న ఆరోపణలతో కోర్టు మూడేళ్ల జైలుశిక్షతో పాటు కోటి 20 లక్షల జరిమానా విధించింది.
అయితే త్వరలోనే వూమెన్‌ చాందీ సర్కార్‌ అసలు స్వరూపం బయటపడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు స్వాహా అయిన సోలార్‌ స్కాంలో సీఎంతో సహా క్యాబినెట్ మంత్రులు తప్పించుకోవటం అసాధ్యమని చెప్పుకొస్తున్నాయి.

 

06:41 - July 18, 2015

ఒడిశా : పూరీ జగన్నాథుడు... ఈ పేరు వినగానే... మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రథయాత్ర. ప్రపంచంలో మరెక్కడా లేని అతి పెద్ద రథయాత్ర. లక్షలాది భక్తులు అతి పెద్ద రథాలను లాగే... అపురూప ఉత్సవం. ప్రతి ఏడాది భక్తులు వేయి కళ్లతో... ఎదురుచూసే వేడుక ప్రారంభమైంది. ఒడిశాలో భక్తజన సందడి నెలకొంది. జగన్నాథ రథయాత్రకు పూరీ పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విశ్వవిఖ్యాత నవకళేబర ఉత్సవాలు... ఏటా ఆషాడ మాసం శుక్లపక్ష విదియ నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండువగా సాగనున్నాయి. నేటి నుంచి జగన్నాథ రథచక్రాలు మరోసారి కదలనున్నాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు మూడు రథాలపై పూరీలో తిరుగునున్నారు. ఈ మహాత్తర ఘట్టాన్ని చూసేందుకే లక్షలాది భక్తులు తరలి వచ్చారు.
యాత్రికులతో కళకళ..
జగన్నాథ రథయాత్ర జరిగే బొడొదండో యాత్రికులతో కళకళలాడుతోంది. భక్తుల తాకిడితో హోటళ్లు, మఠాలు, విడిది మందిరాలు, ధర్మశాలలు నిండిపోయాయి. జగన్నాథ నామస్మరణతో వీధులన్నీ మార్మోగిపోయాయి. రథాన్ని లాగేందుకు భక్తులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. మామూలుగా ఎక్కడైనా రథంలో ఊరేగే దేవుడు ఉత్సవమూర్తే. కానీ పూరీలో సాక్షాత్తూ మూలవిరాట్టే వీధిలోకి వచ్చి రథంపై కూర్చొని ఊరేగుతాడు.. ఇదే ఇక్కడి ప్రత్యేకత. గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు మూర్తులను కదిలించి బయటకు తీసుకువచ్చి రథంపై కూర్చోబెట్టి తొమ్మిది రోజుల పాటు రథయాత్ర నిర్వహించటం.. ఇక్కడ మాత్రమే కనిపించే సాంప్రదాయం.
ఉపయోగించిన రథాన్ని మళ్లీ ఉపయోగించరు...
గమ్మత్తేమిటంటే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఊరేగే రథాలు ఏ యేటికాయేడు కొత్తగా తయారు చేసేవే. ఒకసారి ఉపయోగించిన రథాన్ని మళ్లీ ఉపయోగించరు. పోనీ ఆ రథం మామూలుగా ఉంటుందా అంటే అదీ లేదు. ఒక్క జగన్నాథుడి రథమే 45 అడుగుల ఎత్తు ఉంటుంది. ఏకంగా పదహారు రథచక్రాలు ఉంటాయి. ఇక బలభద్రుడి రథం ఒక అడుగు తక్కువ ఉంటుంది. ఇదీ 14 రథచక్రాలతో నడుస్తుంది. మూడోరథం సుభద్ర రథంలో 12 చక్రాలు ఉంటాయి.ఇందులో ఇంకో అడుగు తక్కువతో తయారు చేస్తారు.
భారీ బందోబస్తు..
మరోవైపు జగన్నాథ రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉత్సవాల్ని సజావుగా జరిపేందుకు ఒడిశా ప్రభుత్వం... అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా... నవీన్ పట్నాయక్ ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 

06:38 - July 18, 2015

హైదరాబాద్ : చర్లపల్లి వద్ద శుక్రవారం రాత్రి హై డ్రామా నెలకొంది. జైలు దగ్గర అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆక్టోబస్‌ బలగాలు జైలు చుట్టూ భారీగా మోహరించారు. ఉగ్రవాది యాసిన్ భత్కల్‌ జైలు నుంచి పారిపోయేందుకు స్కెచ్ వేసినట్లు ఐబీ హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్టయ్యారు. 30 మందితో కూడిన ఓ ప్లాటూన్‌తో పహారా కాశారు.
భత్కల్‌తో పాటు 13 మంది ఉగ్రవాదులు..
ఈ విషయాన్ని జైలు అధికారులమ మాత్రం ధృవీకరించటం లేదు. పుకార్లను కొట్టిపారేస్తూనే....జైలు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలులో దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు, ఇండియన్ ముజాహిద్దీన్‌ వ్యవస్థాపకుడు భత్కల్‌తో పాటు మరో 13 మంది ఉగ్రవాదులు చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
జైలు నుంచి బయటకొస్తానని భార్యకు ఫోన్..
అంతకుముందు భత్కల్‌..తన భార్యకు చేసిన ఫోన్‌కాల్స్ దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. తాను త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తానని...భార్యకు చెప్పాడు. తనను జైలు నుంచి తప్పించేందుకు....ఐసిస్‌ ఉగ్రవాదులు సహకరిస్తారని ఫోన్‌లో వివరించాడు. చర్లపల్లి జైలులోని అధికారిక ల్యాండ్‌ఫోన్‌ నుంచే ఈ సంభాషణలు చేసినట్లు సమాచారం. ఆ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితం భత్కల్‌ను పోలీసులు రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో జైలు ఆవరణలో భత్కల్‌ హల్‌చల్ చేశాడు. కిటీకీ నుంచి ఓ లేఖను రాసి బయటకు విసిరాడు. తాను పారిపోవటానికి ప్రయత్నించినట్లు సృష్టించి...చంపేందుకు పోలీసులు కుట్రచేస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు. 
చర్లపల్లి జైలులో వరుసగా ఈ తరహా ఘటనలు జరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన మొదలైంది. అసలు చర్లపల్లి జైలులో ఏం జరుగుతోందనే...ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

 

06:35 - July 18, 2015

హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ రాష్ట్ర సారథిని మార్చినా కాంగ్రెస్‌లో ఆసంతృప్తి జాల్వలు ఆగడం లేదా? పార్టీ కార్యక్రమాల్లో అందరినీ భాగస్వామ్యులను చేయాలని హైకమాండ్‌ ఆదేశించినా బేఖాతర్‌ చేస్తున్నారా? పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని చెప్పినా... ఆధిపత్యధోరణి ప్రదర్శించాలని చూస్తున్నారా? ఈ ప్రశ్నలకు కొందరు హస్తం పార్టీ లీడర్లు ఔననే అంటున్నారు. పీసీసీ ఛీప్‌ ఉత్తం కుమార్‌ రెడ్డి తీరుపై కొందరు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో అంద‌రిని సమన్వయపరుచుకోవాలనే సంగ‌తే మరిచిపోతున్నారని మండిపడుతున్నారు. పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో ముందుండి నడిపించాల్సిన పెద్దలు నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుమ్ములాటలు పక్కనబెట్టి..అంద‌రినీ క‌లుపుకుపోవాలని ఢిల్లీ పెద్దలు ఆదేశించినా పీసీసీ చీఫ్‌ మాత్రం పాటించడంలేదని ఆరోపిస్తున్నారు.
పార్టీ కార్యక్రమాలకు అందని ఆహ్వానం..
నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మద్దతుగా సెక్రటేరియట్‌ ముట్టడి ఈ వివాదానికి ఆజ్యం పోసింది. గ్రేట‌ర్ ప‌రిధిలో జ‌రిగే పార్టీ కార్యక్రమాలకు తమకు ఆహ్వానం అందడం లేదని రాజధాని నేతలు వాపోతున్నారు. పీసీసీ ఛీఫ్ , గ్రేటర్ అధ్యక్షుడి తీరుపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు ఎమ్మెల్సీ ప్రభాకర్‌. త‌ను ద‌ళితుడిన‌నే చిన్నచూపు చూస్తున్నార‌ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సోనియాకు లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
చాలా మంది అసంతృప్తి...
ఇది ఒక్క ఎమ్మెల్సీ ప్రభాకర్ అభిప్రాయమే కాకుండా..పార్టీలోని చాలమంది ఇదే తరహాలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. హైదరాబాద్‌లో ఉన్న నేతలకే కాదు...జిల్లాలో లీడర్లది ఇదే పరిస్థితి అని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికీ తీరు మార్చుకోకపోతే పార్టీ మరింత నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు అసంతృప్తి నేతలు. 

06:28 - July 18, 2015

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా..? రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు మంజూరవుతాయా..? అవుననే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో... కేంద్రంపై అపార నమ్మకం పెట్టుకున్నారు టీడీపీ ఎంపీలు. ఏపీకి నెల రోజుల్లో ప్రత్యేక హోదా వస్తుందని సుజనా చౌదరి స్పష్టం చేశారు. పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు త్వరలో జరగబోతున్న తరుణంలో.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతం విజయవాడలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ పనితీరు, ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని, రైల్వే జోన్, ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి తదితర అంశాలపై ఎంపీలు చర్చించారు.
60 శాతం పని పూర్తి..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి 60 శాతం పని పూర్తయిందని కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. మరో నెలన్నర రోజుల్లో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని సుజనా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం.. రాజధానికి ఇప్పటికే కొన్ని నిధులు కేటాయించిందని.. త్వరలో మరికొన్ని నిధులు మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. రాజధాని పరిధిలోని 30 వేల ఎకరాల అటవీ భూమి డీనోటిఫైకి పర్యావరణ శాఖ అంగీకరించిందని సుజనా చౌదరి తెలిపారు.
భేటీలో పలు అంశాలపై చర్చ...
ఇక తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నలుగుతున్న సెక్షన్-8 అంశంపైనా ఈ భేటీలో ఎంపీలు చర్చించారు. హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలుకు కేంద్రానికి మరోసారి గట్టిగా కోరాలని సమావేశంలో తీర్మానించారు. 9,10 షెడ్యూల్‌లోని ఉమ్మడి సంస్థల పరిరక్షణకు వర్కింగ్ గ్రూప్‌ను నియమించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. ఇక కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీలు.. భూసేకరణ బిల్లుకు టిడిపి మద్దతివ్వాలని ఏకపక్షంగా నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి సంస్థలను స్వాధీనం చేసుకుంటే.. ఆంధ్రాలో వాటి ఏర్పాటుకయ్యే ఖర్చును తెలంగాణ సర్కారే భరించాలని చెప్పారు.
కేంద్రంపై వత్తిడి తేవాలని నిర్ణయం..
ఇటీవల ఎంపీలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఎంపీలు.. సమావేశంలో సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. పవన్‌ మిత్రపక్షనేత అని.. ఆయన సూచనలను పరిగణలోకి తీసుకోవాలని.. చంద్రబాబు ఎంపీలకు హితువు పలికినట్టు సమాచారం. రాజధాని సహా మెట్రో రైలుకు నిధులు, ప్రత్యేక రైల్వేజోన్ కేటాయింపు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని భేటీలో నిర్ణయించారు. 

06:26 - July 18, 2015

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో దగ్గరవుతోందా ? కేంద్ర ప్రభుత్వం చేరుతుందా ? ప్రభుత్వంలో ఉన్న ఇద్దరికీ కేంద్ర మంత్రులు పదవులు వస్తాయా ? అవునని కొద్ది రోజుల క్రితం అటు జాతీయ, ఇటు ప్రాంతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. బీజేపీతో చెలిమి చేసేందుకు... గులాబీ దళం సిద్ధమైనట్లు వార్తలు జోరందుకున్నాయి. అప్పట్లో ఇరుపార్టీల నేతల భేటీలు సైతం ఊహాగానాలకు ఊతమిచ్చాయి. ఒకానొక దశలో కేంద్రమంత్రివర్గంలో కవిత చేరుతారంటూ వార్తలొచ్చాయి. కవిత సైతం మోడీ ఆహ్వానిస్తే మంత్రివర్గంలో చేరతానంటూ ప్రకటించారు. రేపోమాపో ఎన్డీయేలో టీఆర్ఎస్ చేరిపోవడం ఖాయమంటూ సిగ్నల్స్ ఇచ్చారు.
ప్రధానిపై నిప్పులు చెరిగిన కవిత..
టీఆర్ఎస్‌, బీజేపీ చెలిమిపై ఆయా పార్టీల నేతలు కూడా మాట్లాడేవారు కాదు. మౌనం అంగీకారమంటూనే కాలం వెళ్లదీశారు. ఇదంతా గతం. ఏమైందో..? ఏమో తెలీదు. ఎక్కడ బెడిసికొట్టిందో తెలీదు. ఒక్కసారిగా గులాబీ పార్టీ స్వరం మారిపోయింది. కారు పార్టీ ఏకంగా మోడీనే టార్గెట్ చేసింది. ప్రధానిపై టీఆర్ఎస్ ఎంపీ కవిత నిప్పులు చెరిగారు. ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. పోలవరం నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకూ... అన్ని తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు సమర్థిస్తామని.. లేదంటే వ్యతిరేకిస్తామని కవిత స్పష్టం చేశారు. ఇన్‌ డైరెక్ట్‌గా బీజేపీతో దోస్తీ లేదంటూ చెప్పకనే చెప్పారు. కేంద్రంపై పోరు తప్పదంటూ హెచ్చరికలు పంపారు. టీఆర్ఎస్‌లో మరే..! లీడరో మాట్లాడితే... ఆ మాటలకు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ సాక్షాత్తు కేసీఆర్ కూతురే... మోడీపై మాటాల తూటాలు పేలుస్తుండటంతో హాట్‌ టాపిక్‌గా మారింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే..!
మోడీ పిలిస్తే మంత్రివర్గంలో చేరతానన్న కవిత...నేరుగా మోదీపైనే విరుచుకుపడటం గులాబీ లీడర్లను కూడా అయోమయంలో పడేసింది. టీఆర్‌ఎస్‌ బిజెపికి దగ్గరగా వెళ్లినట్టే వెళ్లి... మళ్లీ దూరమవుతుందా..? అన్న ప్రశ్నలే వినిపిస్తున్నారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండటం వల్లనే... ఆమె అలా మాట్లాడారంటూ గులాబీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. గ్రేటర్‌లో ఎంఐఎంతో కలిసి వెళ్లడం కోసమే కవిత అలా మాట్లాడి ఉంటారని ఇంకొందరు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం నిజంగానే టీఆర్ఎస్‌, బీజేపీ మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయని అంటున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును అడ్డంగా బుక్ చేద్దామనుకున్నా... హస్తిన పెద్దలు బాబుకే మద్దతు పలికారని టీఆర్ఎస్ నేతలు లోలోపల అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. శత్రువును కాపాడుతున్న పార్టీతో చెలిమేంటని..? ఇక తాడోపేడో తేల్చుకుంటామని స్పీడ్ పెంచుతున్నారు.
కయ్యం మొదలైందంటున్న నెటిజన్లు..
మొత్తానికి ఇటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు... అటు చంద్రబాబు చాణక్యం టీఆర్ఎస్, బీజేపీ స్నేహానికి బ్రేకులు వేశాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. అందుకే పాత ఇష్యూలను కూడా టీఆర్ఎస్ మళ్లీ తెరపైకి తెస్తోందని భావిస్తున్నారు. ఇక సోషల్ వెబ్ సైట్లలోనూ ఇవే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కమలం, గులాబీల మధ్య కయ్యం మొదలైందని నెటిజన్లు అంటున్నారు. 

06:23 - July 18, 2015

తూర్పుగోదావరి : గోదావరి ఒడిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు అశేష జనవాహిని పోటెత్తుతోంది. భక్తుల రద్దీతో పుష్కర ఘాట్లు కిక్కిరిసిపోతున్నాయి. జయ జయ ధ్వానాలతో మార్మోగిపోతున్నాయి. వరుసగా రెండ్రోజుల పాటు సెలవులు రావడంతో... భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు... చోటుచేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
భక్తల తాకిడి మరింత పెరిగే అవకాశం..
జన గోదారిలా మారిన గౌతమీ తీరం.. మహా జన మహేంద్రిగా మారిన రాజమండ్రి.. నిండుకుండలా మారింది. కనీవినీ ఎరగని రీతిలో గోదావరి పుష్కరాలకు భక్తులు లక్షల సంఖ్యలో పొటెత్తుతున్నారు. యాత్రికుల రద్దీతోను ప్రముఖులు, భక్తుల జయజయ ధ్వానాలతోను పుష్కర ఘాట్లు మారుమోగుతున్నాయి.
దుర్ఘటనతో మేల్కోన్న ఏపీ సర్కార్..
మొదటి రోజు జరిగిన దుర్ఘటనతో మేల్కొన్న ఏపీ ప్రభుత్వం మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ప్రతిరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితిని సమీక్షిస్తూ మంత్రులు, అధికారులను దిశానిర్ధేశం చేస్తున్నారు. మరోవైపు.. రాజమండ్రి ప్రధాన రైల్వేస్టేషన్‌లో రాత్రి చంద్రబాబు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైళ్ల ఆలస్యం, ఇతర సమస్యలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్‌ల నుంచి నేరుగా పుష్కర ఘాట్లకు వెళ్లేందుకు వీలుగా ట్రాఫిక్‌ను మార్చాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
వారంతంలో పెరగనున్న రద్దీ..
ఇక శని, ఆదివారాలు వరుసగా ప్రభుత్వ సెలవుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు, భద్రతపై దృష్టి పెట్టింది. రెండ్రోజుల పాటు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు మెరుగైన సేవలు అందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే.. గోదావరి పుష్కరాలకు మరో 52 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. నేటి నుంచి నడిచే ఈ రైళ్లన్నీ రిజర్వేషన్ లేకుండా నడవనున్నాయి.

06:22 - July 18, 2015

రాజమండ్రి : గోదావరి నిత్య హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల తాకిడితో పుష్కర ఘాట్‌ జనసంద్రాన్ని తలపించింది. వేదమంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు గోదావరికి హారతినిచ్చారు. నాగసాధువులు...గోదావరి మాత రూపానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్‌షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

06:21 - July 18, 2015

హైదరాబాద్ : పవిత్ర ఉపవాస దీక్షలు ముగిసాయి. నెలవంక దర్శనంతో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. నెల రోజుల పాటు కఠిన ఉపవాసాన్ని ఆచరించిన ముస్లిం సోదరులంతా పవిత్ర రంజాన్‌ను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. కులమతాలకు అతీతంగా నిరుపేదలు కడుపునిండా తినేలా చూడాలనే రంజాన్‌ స్ఫూర్తిని చాటనున్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే పవిత్ర రంజాన్‌ అందించే సందేశం. అందుకే అంతరాలు తెలియని ఆకలిదప్పుల విలువ తెలుసుకునేందుకు, ప్రపంచానికి చాటి చెప్పేందుకు ముస్లిం సోదరులు 30రోజులు కఠిన ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. అలా 30రోజులు కఠిన ఉపవాసం ఆచరించిన ముస్లిం సోదరులు నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్‌ను జరుపుకుంటారు.
కనిపించిన నెలవంక..
శుక్రవారం సాయంత్రం వేళల్లో వినీలాకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో ప్రపంచంలోని యావత్‌ ముస్లిం సోదరులు రంజాన్‌ను నేడు జరుపుకుంటున్నారు. ఇటు రువాయత్‌-ఎ-హిలాల్‌ కమిటీ కూడా నేడే రంజాన్‌ అని ప్రకటించటంతో ముస్లిం సమాజం అత్యంత భక్తి పవత్తులతో రంజాన్‌ను నేడు ఘనంగా జరుపుకుంటోంది. 
శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్.. ఇరు రాష్ట్రాల సీఎంలు...
రంజాన్ పండుగ సంధర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ కూడా రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్‌ను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.

10టీవీ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు.

హైదరాబాద్ : సోమవారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలు మంగళవారం రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. 10టీవీ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు.

పార్టీ ఎంపీలతో భేటీ కానున్న జగన్..

హైదరాబాద్ : నేటి ఉదయం పది గంటలకు పార్టీ ఎంపీలతో వైసీపీ అధ్యక్షుడు జగన్ భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

నేడు ప్రత్యూషను కలువనున్న కేసీఆర్..

హైదరాబాద్ : నేడు ఉదయం 10గంటలకు అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో ప్రత్యూషను కలువనున్నారు.

 

ఐదో రోజుకు చేరిన పుష్కరాలు..

పశ్చిమగోదావరి : గోదావరి పుష్కరాలు ఐదో రోజుకు చేరాయి. వారాంతం కావడంతో పుష్కరఘాట్ల వద్ద యాత్రికులు భారీగా తరలివస్తున్నారు. కొవ్వూరులోని గోష్పాదక్షేత్రంలో లక్షల సంఖ్యలో యాత్రికులు పుణ్యస్నానాలచరిస్తున్నారు.

నేడు మున్సిపల్ జేఏసీ ఆధ్వర్యంలో ఏపీ మంత్రుల ఇళ్ల ముట్టడి..

విజయవాడ : మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏపీ మంత్రుల, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించనుంది. 

Don't Miss