Activities calendar

19 July 2015

తెలంగాణలో పుష్కరాలపై ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష

హైదరాబాద్: తెలంగాణలో పుష్కరాలపై ఉన్నతాధికారులతో డీజీపీ అనురాగ్ శర్మ సమీక్షించారు. బాసర, ధర్మపురి, కాళేశ్వరం ఘాట్ల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ ఆదేశించారు. ఈ సమావేశానికి ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి హాజరయ్యారు.

 

21:55 - July 19, 2015

నిర్మాత సురేష్ బాబుతో ''ప్లెయిన్ స్పీక్ విత్ రవి తెలకపల్లి'' కార్యక్రమంలో గత, ప్రస్తుత సినిమాల తీరును సురేష్ బాబు వివరించారు. సినిమాలు నిర్మించడంలో తన అనుభాలను వివరించారు. తన కుమారుడు రానా నటనపై మాట్లాడారు. బాహుబలిలో రానా నటనను ప్రస్తావించారు. గతానికి, ప్రస్తుతానికి నటన పరంగా రానాలో అభివృద్ధి వచ్చిందన్నారు. సినీ ఇండస్ట్రీపై వివరణ ఇచ్చారు. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పోయిందని తెలిపారు. సురేష్ బాబు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఉభయగోదావరి జిల్లాల్లో 2.2 కోట్ల మంది పుష్కరస్నానం

రాజమండ్రి: ఉభయగోదావరి జిల్లాల్లో ఆరు రోజుల్లో 2.2 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానమాచరించారు. ప.గో జిల్లాలో ఇవాళా 15.5 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. ఆరు రోజుల్లో 66 లక్షల మంది పుష్కరస్నానాలు మాచరించారు.

 

గండిపేటలో జోరుగా బైక్ రైసింగ్ లు..

హైదరాబాద్: గండిపేటలో జోరుగా బైక్ రైసింగ్ లకు పాల్పడుతున్న 29 మంది యువకులను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 15 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

 

21:08 - July 19, 2015

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని పెబ్బేరు మండలంలో అంబేద్కర్‌ మనువడు...ఆనంద్‌ తేల్ తుమ్డే పర్యటించారు. అంబేద్కర్ చౌరస్తాలో 12 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్న...దళితులను పరామర్శించారు. పాతపల్లి గ్రామంలో మూడు నెలలుగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఓ స్థలం విషయంలో వారి మధ్య తగాదా నెలకొంది. ఇళ్లస్థలాలకు ప్రభుత్వం పట్టాలిచ్చిందని...ఒక దళితులు చెబుతున్నారు. ఆ స్థలాన్ని ప్రభుత్వం స్మశానవాటికకు కేటాయించిదని మరోవర్గం వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దళితులపై మరోవర్గం వారు దాడికి పాల్పడ్డారు. అందుకు నిరసనగా వారు 12 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారిని అంబేద్కర్ మనువడు ఆనంద్‌ తేల్ తుమ్డే పరామర్శించారు. ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమని ఆయన అన్నారు. దాడిచేసిన వారిని అరెస్టు చేసి...దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

 

20:56 - July 19, 2015

చిత్తూరు: సీఎం చంద్రబాబుకు ప్రజల సమస్యలు పట్టడం లేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా పర్యాటక కేంద్రం హార్స్ లీ హిల్స్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే...ఈ నెల 24న అనంతపురం జిల్లాలో రాహుల్‌గాంధీ పర్యటిస్తారని చెప్పారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాలను...పార్లమెంట్‌లో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు వల్లే... రాజమండ్రి పుష్కరాల్లో విషాదం చోటుచేసుకుందని ఆరోపించారు.

 

20:51 - July 19, 2015

ఖమ్మం: కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఖమ్మంలోని మంచికంటి భవనంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ తీరుపై తమ్మినేని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్నిశాఖల కార్మికులు ఆందోళన బాటపట్టారని చెప్పారు. సమస్యలను పరిష్కరించాల్సిన సర్కార్... కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం....తాము కార్మికులకు అండదండగా ఉంటామని స్పష్టం చేశారు. వారిని పోరాటాలకు సన్నద్ధం చేసేందుకు.. ఈ నెల 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతామని తమ్మినేని చెప్పారు. ఈ సమావేశానికి ఖమ్మం జిల్లా సీపీఎం నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

 

20:43 - July 19, 2015

కరీంనగర్‌: జిల్లాలోని గోదావరిఖని పుష్కరఘాట్‌లో ఓ అఘోర పుష్కర స్నానమాచరించారు. హైదరాబాద్‌కు చెందిన అరవింద్‌ ఎనిదేళ్ల క్రితం కాశీకి వెళ్లి అఘోరాగా మారాడు. గోదావరిలో స్నానం చేసేందుకు.. ఆయన గోదావరిఖనికి రాగా.. స్థానిక మహదేవ భక్తసమాజం ఘనంగా స్వాగతం పలికింది. పుణ్య స్నానం అనంతరం పుష్కర ప్రాముఖ్యతను అరవింద్‌ చెప్పారు.

 

20:40 - July 19, 2015

హైదరాబాద్: గోదావరి పుష్కరాలపై సీఎం కేసీఆర్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న అధికారులు, మంత్రులతో పుష్కరాలపై సమీక్షించారు. సెలవు దినాలు కావడంతో.. భక్తుల రద్దీ తీవ్రంగా ఉందని.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అవరసమైతే హెలికాఫ్టర్ల ద్వారా ఏరియల్‌ సర్వేలు చేపట్టాలని సూచించారు. ఏపీ నుంచి కూడా భద్రాచలానికి భక్తులు తరలివస్తుండడంతో.. వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

 

20:37 - July 19, 2015

కరీంనగర్: మంథనిలో గోదావరి నిత్య హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల తాకిడితో పుష్కర ఘాట్‌...జనసంద్రాన్ని తలపించింది. వేదమంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు గోదావరికి హారతినిచ్చారు. నాగసాధువులు...గోదావరి మాత రూపానికి ప్రత్యేక పూజలు చేశారు.

20:32 - July 19, 2015

చిత్తూరు: టీటీడీ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురయింది. ఆన్‌లైన్‌లో స్వామివారి దర్శనం టికెట్లు విక్రయించే వెబ్‌సైట్‌ను...దుండగులు హ్యాక్ చేశారు. కోయంబత్తూర్, షోలాపూర్‌ కేంద్రంగా ఈ తంతు జరుగుతున్నట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో టికెట్లు పెట్టిన వెంటనే..సైట్‌ను హ్యాక్‌ చేసి టికెట్లను గుంపగుత్తగా...క్షణాల్లో బుక్ చేస్తున్నారు. టీటీడీ సర్వర్‌ను హ్యాక్ చేసి సాక్ష్యాలు దొరక్కుండా... జాగ్రత్త పడుతున్నారు. మొత్తం టికెట్లను కాజేసి, అధిక ధరకు మరో వైబ్‌సైట్‌ ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. కొంత కాలంగా ఈ వ్యవహారంపై దృష్టిపెట్టిన అధికారులు. టెంపుల్ యాత్ర వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌చేసుకున్న....భక్తులను విచారించగా ఈ హ్యాకింగ్ బాగోతం బయపటింది. ఇందులో కోయంబత్తూరుకు చెందిన వ్యక్తి హస్తమున్నట్లు తేలింది. ఐతే హ్యాకర్లకు కొందరు టీటీడీ అధికారులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.

 

20:27 - July 19, 2015

తూర్పుగోదావరి: జిల్లాలోని సామర్లకోట మండలం జి. మేడపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా తుని నియోజకవర్గం కొత్త కొట్టాయంపాలెం వాసులుగా గుర్తించారు. రాజమండ్రిలో పుష్కర స్నానానికి వెళ్లి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.

 

20:16 - July 19, 2015


రాజమండ్రి: గోదావరి పుష్కరాలకు రాజమండ్రి నగరం తరలివస్తున్న భక్తులు పుణ్యస్నానాలు ముగిశాక ఉల్లాసంగా గడిపేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ దఫా మహా పుష్కరాలకు పవన్‌హాన్స్ ప్రైవేట్ హెలికాఫ్టర్ సంస్థ.. గోదావరి తీర ప్రాంతం గగన విహారానికి రెండు హెలికాఫ్టర్‌లను సిద్ధం చేసింది. 8 నిమిషాల పాటు ఆకాశవీధిలో జరిగే ప్రయాణానికి ఒక్కొక్కరికి 2వేల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి టికెట్ ధరను వసూలు చేస్తుంది.
గైట్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో సర్వీసులు
దీంతో గగన విహరానికి చిన్నారులతో పాటు తల్లితండ్రులు మక్కువ చూపుతున్నారు. రాజమండ్రి నగర శివారులోని రాజానగరం మండలం గైట్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఈ సర్వీసులకు సంబంధించి హెలీపాడ్‌ను ఏర్పాటు చేశారు. హెలికాఫ్టర్‌లో రాజమండ్రి నగరంతో పాటు... గోదావరి వంతెనపై నదికి వడ్డాణంలా ఉన్న నాలుగు బ్రిడ్జిలను గగనతలం నుంచి చూసేందుకు క్యూ కడుతున్నారు.
11మందికి ఒకేసారి ప్రయాణం
ముందస్తుగా టికెట్లు కొనుగోలు చేసి ఆకాశవీధిలో విహరించే మధురక్షణం కోసం క్షణక్షణం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తొలుత ఆరుగురు మాత్రమే విహరం చేసే సామర్ధ్యం ఉన్న హెలికాఫ్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చిన పవన్ హన్స్ సంస్థ... 11మంది గగనవిహారం చేయడానికి వీలుగా మరో హెలీకాఫ్టర్‌ను రంగంలోని దించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో విహంగవీక్షణానికి భక్తులు ఉత్సాహంగా క్యూకడుతున్నారు. మొత్తంగా పుష్కర వేడుకలో గగన విహరం ఓ హైలెట్‌గా నిలిచింది.

 

బాసర రైల్వేస్టేషన్ లో పుష్కర భక్తుల అవస్థలు

ఆదిలాబాద్: బాసర రైల్వేస్టేషన్ లో పుష్కర భక్తుల అవస్థలు పడుతున్నారు. రైళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. 

భారత్ పై జింబాబ్వే గెలుపు..

హారారే: రెండో టీ.20 మ్యాచ్ లో భారత్ పై జింబాబ్వే విజయం సాధించింది. 10 పరుగుల తేడాతో జింబాబ్వే.. భారత్ పై గెలుపొందింది. రెండు మ్యాచ్ ల టీ.20 సీరీస్ 1-1 తో సమం అయింది. 

పిఠాపురం-కత్తిపూడి మధ్య ట్రాఫిక్ జాం..

తూ.గో: పిఠాపురం-కత్తిపూడి మధ్య ట్రాఫిక్ స్తంభించింది. 10 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రెండుగంటలుగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నాయి. 

భద్రాచలం ఘాట్ వద్ద భక్తుడి మృతి

ఖమ్మం: భద్రాచలం ఘాట్ వద్ద గుండెపోటుతో ఓ భక్తుడు మృతి చెందాడు. మృతుడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వాసి శ్యాంప్రసాద్ గా గుర్తించారు.

 

19:38 - July 19, 2015

ఢిల్లీ: రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. పాలకులు, ప్రభుత్వాలు మారినా...విధానాలు మారకపోవడంతో రైతు మరణాలకు అంతే లేకుండా పోతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా ప్రతిరోజు 16 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక ప్రభుత్వ లెక్కలోకి ఎక్కని రైతు మరణాలు ఇంతకి రెట్టింపు ఉంటాయి. నేషనల్ క్రైమ్ రికార్ట్స్ బ్యూరో తాజా లెక్కల ప్రకారం గత ఏడాది దేశ వ్యాప్తంగా 5 వేల 600 మంది అన్నదాతలు ఆత్యహత్యలు చేసుకున్నారు. అంటే గంటన్నరోకో రైతు బలవన్మరణానికి దిగుతున్నాడన్న మాట. వాతావరణం అనుకూలించక, సకాలానికి రుణాలు దొరక్క, దొరికిన రుణాలకు వడ్డీలు కట్టలేక, పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలు..రైతలను ఉసురు తీసుకునేలా చేస్తున్నాయి. అన్నపూర్ణగా పేరున్న దేశంలో రైతన్నల ఆక్రందనలు వినే నాథుడే కరువయ్యాడు.
రైతు మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానం
నేషనల్ క్రైమ్ రికార్ట్స్ బ్యూరో తాజా లెక్కల ప్రకారం...రైతు మరణాల్లో పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది అక్కడ 2 వేల 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మహారాష్ట తర్వాతి స్థానం మన తెలంగాణదే. కొత్త రాష్టం ఏర్పడ్డ తర్వాత కూడా ఇక్కడి రైతుల కష్టాలు తీరలేదు. కడగండ్లు ఆగలేదు. తెలంగాణలో 898 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్టు క్రైమ్ రికార్ట్స్ బ్యూరో లెక్కలో తేలింది. రైతుల కోసం అంత చేస్తున్నాం..ఇంత చేస్తున్నాం అని కేసీఆర్ సర్కార్ చెబుతున్నా..రైతుల్లో మాత్రం ధైర్యాన్ని నింపలేకపోతుందనటానికి రైతు మరణాలే నిదర్శనం.
మహారాష్ట, తెలంగాణల్లో రుణాలు అత్యల్పం
మహారాష్ట, తెలంగాణలో బ్యాంకుల నుంచి రైతులకు అందుతున్న రుణాలు అత్యల్పం. దీంతో పెట్టుబడి కోసం రైతులు వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంటనష్టంతో పాటు వడ్డీ వ్యాపారుల వేధింపులతో రైతన్నలు చావును ఆశ్రయిస్తున్నారని క్రైమ్ రికార్డ్ బ్యూరో తెలిపింది.
మధ్యప్రదేశ్ లో అధిక సంఖ్యలో ఆత్మహత్యలు
ఈ రెండు రాష్టాల తర్వాత ఎక్కువ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది మధ్యప్రదేశ్ లో. అక్కడ 826 మంది రైతులు గత ఏడాది ప్రాణాలు తీసుకున్నారు. మొత్తం రైతు మరణాల్లో మహారాష్ట 45. 5 శాతం, తెలంగాణ 15.9, మధ్యప్రదేశ్ 14.6 శాతంగా నమోదైంది. రైతుమరణాల్లో 75 శాతం మరణాలు ఈ మూడు రాష్టాల్లోనే నమోదవుతున్నాయి. రైతు మరణాల్లో నాలుగో స్థానం ఛత్తీస్‌గఢ్. నిలుస్తుంది. అక్కడ 400 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక నిలుస్తుంది. అక్కడ 321 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు. అదే ఏపీలో 160 మంది, కేరళా 107, తమళనాడు 68, ఉత్తరప్రదేశ్ 63.
వామపక్షాల పాలన.. గ్రామీణ వ్యవస్థ బలోపేతం
అయితే అస్సాం మినహా ఈశాన్య రాష్ట్రాలు, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి స్టేట్స్ లో ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడలేదని నేషనల్ క్రైమ్ రికార్ట్స్ బ్యూరో తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో ఏళ్లకొద్దీ సాగిన వామపక్షాల పాలన గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో అక్కడ అన్నదాతల ఆత్మహత్యల్లేవు.

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్టు..

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూ ఎసిబి నోటీసులిచ్చే అవకాశం వుంది. సుధీర్ పేరు మీద మాగంటి ఫోన్ నంబర్ తీసుకున్నారు. ఈరోజు టీడీపీ నేత సుధీర్ కు ఏసీబీ నోటీసులు పంపింది. 

బొలెరో-మారుతి వ్యాన్ ఢీ..ఒకరి మృతి

వరంగల్: ములుగు వద్ద బొలెరో వాహనం, మారుతి వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 17 మందికి గాయాలయ్యాయి. పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. 

18:45 - July 19, 2015

హైదరాబాద్: అసలే గులాబీ పార్టీపై గరగరంగా ఉన్నారు. అధికార పార్టీ టార్గెట్‌గానే అడుగులేస్తున్నారు. ఆరోపణలతో మాటల తూటాలు పేల్చుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే... ప్రతిపక్షాలకు ఓ బ్రహ్మాస్త్రం దొరికింది. శ్రీనివాస్ యాదవ్‌ రాజీనామా వ్యవహారం కలిసొచ్చేలా కనిపిస్తోంది. స్పీకర్ కార్యాలయం ఇచ్చిన సమాచారంతో... తలసాని కనికట్టుపై గళమెత్తుతున్నారు ప్రతిపక్ష నేతలు. టీఆర్‌ఎస్‌ నేతలు అనైతిక, నీతిరహిత విధానాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఒకవైపు ప్రతిపక్షాలు ముప్పేటదాడి చేస్తున్నా... తానెప్పుడో లేఖ సమర్పించానని, స్పీకర్‌దే తుది నిర్ణయమంటూ తలసాని శ్రీనివాస్ అనేక సందర్భాల్లో ప్రకటించారు.
ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రాలు
తలసాని మాటలపై ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రాలు మారాయి. ఇన్నాళ్లు తలసాని రాజీనామాపై ఆరోపణలకే పరిమితమైన టీ-కాంగ్రెస్‌ లీడర్లు... సాక్ష్యాధారాలను సైతం సాధించారు. శ్రీనివాస్ యాదవ్‌ రాజీనామా ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. సమాచార హక్కు చట్టం గులాబీ పార్టీకి షాకిచ్చే నిజాలను బయటపెట్టింది.
తలసానిపై చీటింగ్ కేసు నమోదు చేయాలి: గండ్ర
ఆర్ టిఐ ద్వారా తాను సేకరించిన ఈ వివరాలను మీడియాకు అందించారు మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి. తలసాని రాజీనామా చేసినట్టు అందరిని నమ్మించారని ఆయన మండిపడ్డారు. స్పీకర్ కార్యాలయం నుంచి సమాచారం తెప్పించుకుని సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు గండ్ర వివరించారు. గవర్నర్‌తో పాటు రాజ్యాంగాన్ని తలసాని తప్పుదోవ పట్టించారని వెంకటరమణ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించిన తలసానిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై సోమవారం గవర్నర్‌కు మరోసారి ఫిర్యాదు చేస్తామన్నారు.
గవర్నర్ తీరుపై ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆగ్రహం..
గవర్నర్ తీరుపై ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఏడు నెలలుగా అన్ని రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదు చేస్తున్నామని.. అయినా గవర్నర్‌ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. తలసాని మంత్రి పదవిలో కొనసాగడంపై ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని షబ్బీర్ అలీ అన్నారు. ఇప్పటికే గవర్నర్‌ వ్యవహార శైలిని నిశితంగా విమర్శిస్తూ లేఖాస్త్రం సంధించారు మరో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగేతర చర్యలకు గవర్నర్‌ కొమ్ముకాస్తున్నారంటూ మండిపడ్డారు.
తెలుగు తమ్ముళ్లు దూకుడు
తెలుగు తమ్ముళ్లు సైతం దూకుడు పెంచారు. టీడీపీ ఎమ్మెల్యేగాఉంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న శ్రీనివాస్ యాదవ్‌ ముప్పేటదాడి చేస్తున్నారు. మొత్తానికి అటు టీడీపీ... ఇటు కాంగ్రెస్... మంత్రి తలసాని రాజీనామా కోసం ఏదారీ వదలడంలేదు ఈ రెండు పార్టీలు.. చివరికి సమాచారహక్కుచట్టాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు.. ఓవైపు స్పీకర్‌పై.. మరోవైపు గవర్నర్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. మరి అధికార పార్టీ ఈ చిక్కుల నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.

 

తమ డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్తాం:కార్మికసంఘాలు

ఢిల్లీ: రేపు జరుగనున్న 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరేన్స్ లో తమ డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని కార్మిక సంఘాలు చెప్పాయి.  

కేంద్రమంత్రులతో ముగిసిన కార్మికసంఘాల భేటీ

ఢిల్లీ: కేంద్రమంత్రులతో కార్మికసంఘాల సమావేశం ముగిసింది. కార్మికుల సమస్యలు, డిమాండ్లపై చర్చిస్తున్నామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కార్మిక సంఘాలతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 

18:13 - July 19, 2015

కరీంనగర్: తెలంగాణ పుష్కర ఘాట్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించారని పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ టీసర్కార్ ను ప్రశంసించారు. కాళేశ్వరంలో ఆయన పుష్కరస్నానం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో కాళేశ్వరానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. అందుకే ఇక్కడ పుష్కర స్నానానికి వచ్చినట్టు లగడపాటి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పుష్కర ప్రాంతాల్లో పోటెత్తుతున్న జనాన్ని అదుపు చేసేందుకు, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు సీఎం కేసీఆర్‌ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని అభినందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 

17:56 - July 19, 2015

భోపాల్: మధ్యప్రదేశ్‌ను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉజ్జయినిలో రికార్డుస్థాయిలో 31.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భోపాల్‌లో 14.9, ఇండోర్‌లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత పదేళ్లలో ఇంత భారీస్థాయిలో వర్షాలు కురవటం ఇదే మొదటిసారి. ఎడతెరిపిలేని వర్షాలతో ఉజ్జయినిలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వర్షం నీరు చేరింది. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వరదల ధాటికి ఉజ్జయినిలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
ప్రవహిస్తున్న క్షిప్రా, గంభీర్ నదులు
ఉజ్జయినిలో క్షిప్రా, గంభీర్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. రెండు నదుల ప్రవాహ ఉధృతితో...పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. క్షిప్రా నది తీరంలోని పలు దేవాలయాల గర్భ గుడులు నీటమునిగాయి. దేవాలయాలు పూర్తిగా నీట మునిగి...గోపురం పైభాగాలు మాత్రమే కనడుతున్నాయి.
ఉజ్జయిని, షాజాపూర్‌లో స్తంభించిన రవాణా
వర్షాల ధాటికి ఉజ్జయిని, షాజాపూర్‌లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రధాన రహదారులన్నీ....నీట మునిగాయి. పలు చోట్ల వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. భారీ వాహనాలు సైతం అదుపుతప్పి పడిపోయాయి. ఆగ్రా-ముంబై హైవేతో పాటు మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రైళ్ల రాకపోకలకు అంతరాయం
వర్షాల ప్రభావం రైల్వే వ్యవస్థపైనా పడింది. ఉజ్జయిని పరిధిలోని రైల్వేస్టేషన్‌లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ట్రాక్‌లపైకి భారీగా వరద నీరు రావటంతో...రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాల్‌వా ఎక్స్ ప్రెస్, అవంతిక ఎక్స్ ప్రెస్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రైళ్లను దారిమళ్లించారు. ఇక ఇండోర్‌లోనూ పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

 

ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షునిగా సురేష్ బాబు

హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష ఎన్నికల్లో సురేష్ బాబు ప్యానెల్ విజయం సాధించింది. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు సురేష్ బాబు పదవిలో కొనసాగనున్నారు.

 

చెరువులో ఈతకెళ్లి ముగ్గురి గల్లంతు..

ఖమ్మం: సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో విషాదం నెలకొంది. ఐదుమంది చెరువులో ఈతకు వెళ్లారు. వీరిలో ముగ్గురు గల్లంతయ్యారు.

 

కార్మికసంఘాల సార్వత్రిక సమ్మె నివారణకు కేంద్రం చర్యలు

ఢిల్లీ: సెప్టెంబర్ 2న కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె నివారణకు కేంద్రప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కార్మిక సంఘాల నేతలతో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, బండారు దత్తాత్రేయ, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రదాన్ లు సమావేశం అయ్యారు. కార్మిక సమస్యలు, డిమాండ్లపై చర్చిస్తున్నారు. 

పుష్కరాలకు వెళ్లి ముగ్గురు మహిళల అదృశ్యం

విజయనగరం: గొర్ల మండలం పున్నపురెడ్డిపేటకు చెందిన ముగ్గురు మహిళలు అదృశ్యమయ్యారు. మహిళలు రాజమండ్రి పుష్కరాలకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు.

 

17:27 - July 19, 2015

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలోకి ప్రపంచ బ్యాంకు కాలుమోపెందుకు తహతహలాడుతోందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటి విమర్శించింది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పర్చేందుకు సిద్ధమైందని మండిపడింది. ఉన్నతవిద్యలో సంస్కరణలపై హైదరాబాద్‌లో తెలంగాణ విద్యాపరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇప్పుడు విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టకపోతే ఉన్నత విద్యారంగం పూర్తిగా ప్రమాదంలో పడే అవకాశముందని సమావేశానికి హాజరయిన విద్యావేత్తలు, వక్తలు అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం
విద్యారంగంలో ప్రవేశ పెట్టబోయే ప్రమాదకర సంస్కరణలపై దేశవ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చేపట్టబోతున్నామని విద్యావేత్తలు తెలిపారు. అందుకే ఆగస్టులో క్విట్ ఇండియా రోజు సందర్భంగా క్విట్ డబ్ల్యుటీవో, డబ్ల్యుఏటీటీ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
విదేశీసంస్థల చేతుల్లో ఉన్నతవిద్య
మరోవైపు డిసెంబర్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నత విద్యామండళ్లు, రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో తమ విద్యాసంస్కరణలను వివరించనుంది. ఈ సమావేశం ద్వారా మద్దతు కూడగట్టుకొని విదేశీ సంస్థల చేతుల్లోకి ఉన్నత విద్యను అప్పగించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విదానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమాలను తీవ్రతరం చేయాలని విద్యాపరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది.

17:11 - July 19, 2015

హైదరాబాద్‌: నగరంలో గోల్కొండ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లంగర్‌హౌజ్‌లో తొట్టెల ఊరేగింపు కార్యక్రమం జరుగుతోంది. బోనాల జాతరకు భక్తులు పోటెత్తారు. ప్రభుత్వం తరపున హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

 

16:44 - July 19, 2015

రాజమండ్రి: ఏపీ డీజీపీ రాముడు, ఐజీ హరీష్‌ పుష్కర పరిసరాలను పరిశీలించారు. హెలీకాఫ్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పరిసరాలను, ట్రాఫిక్‌ను హెలీకాఫ్టర్‌ నుంచే సమీక్షించారు. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడానికి సిబ్బంది తగు సూచనలు ఇచ్చారు.

16:42 - July 19, 2015

అనంతపురం: అమరువీరుల ఆశయాలను సాధించడం కోసం నిరంతరం కృషి చేస్తామని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు స్పష్టం చేశారు. జిల్లాలోని వికేభవన్ లో సీపీఎం ఆధ్వర్యంలో కమ్యూనిస్టు సీనియర్ నాయకుల కుటుంబసభ్యుల సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధు హాజరయ్యారు. ఆయనతో పాటు సీపీఎం నేతలతో పాటు భారీ ఎత్తున పాల్గొన్నారు. సీనీయర్ కమ్యూనిస్టుల నాయకులతో మధు ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వారందరితో కాసేపు ముచ్చటించారు.

 

16:36 - July 19, 2015

హైదరాబాద్: వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక వనస్థలిపురంలో ఓ ఆర్ ఎంపి డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని వనస్థలిపురంలో లక్ష్మీనారాయణ అనే ఆర్ ఎంపి డాక్టర్ నివాసముంటున్నాడు. కొంతకాలం క్రితం తన స్నేహితుడికి లక్ష్మీనారాయణ దాదాపు 4లక్షల రుపాయలు అప్పు ఇచ్చాడు. అయితే ఆ.. స్నేహితుడు ఎంతకీ అప్పు తీర్చకపోవటంతో లక్ష్మీనారాయణ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకుని ఆ బాకీ చెల్లించాడు. అటు ఆ స్నేహితుడు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవటం, ఇటు వడ్డీ వ్యాపారులకు డబ్బు చెల్లించే స్తోమత లేకపోవటంతో అప్పు ఇచ్చిన వారు తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో మనస్తాపానికి లోనై... ఆత్మహత్య చేసుకున్నాడు. 'వడ్డీ వ్యాపారుల ఒత్తిడి వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు... సూసైడ్ నోట్‌ రాసి' లక్ష్మీనారాయణ బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో తమకు న్యాయం చేయాలని మృతుడి బంధువులు వేడుకుంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

ప్రాథమికరంగం మిషన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష

రాజమండ్రి: ప్రాథమికరంగం మిషన్ పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో ప్రాథమిక రంగం మిషన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నా.. లక్ష్యానికి తగినట్లు వరినాట్లు పడలేదని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమికరంగం మిషన్ లోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఆగస్టు 1 లోగా అన్ని ఫర్టిలైజర్ షాపులను ఆధార్, ఇ-పాస్ తో అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. ఉద్యాన రైతులకు స్వల్పకాలిక రుణాలిస్తామని చెప్పారు.

టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న జింబాబ్వే

హారారే: భారత్, జింబాబ్వేల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. జింబాబ్వే టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది. 

ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం

ముంబై: ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. రాజీవ్ శుక్లా, గంగూలీ, అనురాగ్ ఠాకూర్ లు హాజరయ్యారు. 

15:57 - July 19, 2015

గుంటూరు: యూనివర్సిటీ క్యాంపస్‌లలో కుల రక్కసి రంకెలు వేస్తోంది. విద్యార్థుల బంగారు భవితను కులజాఢ్యం అణచివేస్తోంది. తరగతి గతుల్లో కుటిల కుల రాజకీయాలు వెర్రితలలు వేస్తున్నాయి. విద్యార్థులు కులాల వారీగా విడిపోయి...కుమ్ములాటలకు దిగుతున్నారు. ఈవ్‌టీజింగ్‌లు, ర్యాగింగ్‌లు, రాజకీయాలు...నిత్యం క్యాంపస్‌లు రగిలిపోతున్నాయి. ఆధిపత్య పోరులో... క్లాసు రూముల్లోనే విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి.
నాగార్జున యూనివర్సిటీలో కులాల కుమ్ములాటలు
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఎన్నో సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం. వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను ప్రసాదిస్తున్న ప్రదేశం. కాని కొంతకాలంగా యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతోంది. కులాల కుమ్ములాటలతో కునారిల్లుతోంది. నిత్యం విద్యార్థుల ఘర్షణలతో...గజ గజ వణుకుతోంది.
ఒక్కోకులానికి ఒక్కో విద్యార్థి సంఘం
నాగార్జున యూనివర్సిటీలో కుల పిచ్చి తారాస్థాయికి చేరింది. కులాల పేరుతో కుప్పలు తెప్పులుగా విద్యార్థి సంఘాలు పుట్టుకొచ్చాయి. క్యాంపస్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఎటు చూసినా....కుల సంఘాల బోర్డులే స్వాగతం పలుకుతాయి. ఒకటి కాదు రెండు కాదు. ఇక్కడ ఏకంగా 14 కుల సంఘాలు ఉన్నాయి. ఒక్కో కులానికి...ఒక్కో విద్యార్థి సంఘం ఉంది. ఎస్ ఎఫ్ ఐ, ఎబివిపి లాంటి విద్యార్థి పోరాట సంఘాలు ఉన్నా....కుల సంఘాల ఆధిపత్యమే నెగ్గుతోంది.
కుల సంఘంలో చేరాల్సిందే
యూనివర్సిటీలో చదుకోవడానికి వచ్చే విద్యార్థులు...అడ్మిషన్ అవ్వగానే తన కులానికి చెందిన సంఘంలో సభ్యుడిగా చేరాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా విద్యార్థి కుల సంఘంలో సభ్యుడిగా చేరాల్సిందే. ఒకవేళ చేరకపోతే సదరు విద్యార్థి కుల సంఘాల వారు... అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. ఏ కార్యక్రమం జరిగినా... ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలోనే చేసుకుంటారు. అప్పుడుప్పుడూ యూనివర్సిటీ కార్యక్రమాలను....అన్ని విద్యార్థి కుల సంఘాలు అన్ని కలిసి జరుపుకున్నప్పటికీ...అవి వివాదాలతోనే ముగుస్తాయి.
ర్యాగింగ్ కారణంగా విద్యార్థిని ఆత్మహత్య
ఒక విద్యార్థి కుల సంఘం, వేరోక విద్యార్ధి కుల సంఘం వారితో గొడవలు పడడం, ర్యాంగింగ్‌కు పాల్పడడం ఇక్కడ సర్వసాధారణం. ఎక్కడ ఏ గొడవ జరిగినా... విద్యార్ధి సంఘాలే రంగంలోకి దిగి సెటిల్మెంట్ చేస్తాయి. ఈ సంఘాలకు కొందరు లెక్చరర్ల సపోర్టు కూడా ఉందని తెలుస్తోంది. ఐతే 5 రోజుల క్రిందట క్యాంపస్‌లో ఆర్కిటెక్ మొదటి సంవత్సరం విద్యార్ధిని రిషికేశ్వరి ర్యాగింగ్ కారణంగా ఆత్యహత్య చేసుకుంది. ఈ ఘటనతో విద్యార్థి కుల వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రిషికేశ్వరి మృతిపై అధికారులతో చర్చించేందుకు నాగార్జున యూనివర్సిటీకి వచ్చారు. క్యాంపస్‌లో విద్యార్థి కుల సంఘాల బోర్డులు చూసి ఆయన షాక్‌కు గురయ్యారు.
విద్యార్థి కులసంఘాలపై గంటా సీరియస్
విద్యార్థి కులసంఘాలపై మంత్రి సీరియస్ అయ్యారు. వాటిని వెంటనే రద్దు చేసి, బోర్డులను తొలగించాలని వైస్ ఛాల్సర్ ను ఆదేశించారు. విద్యార్ధుల ఆలోచన ధోరణిని...కుల సంఘాలు ప్రభావితం చేసే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు.
మంత్రి గంటా నిర్ణయాన్ని స్వాగతించిన ఎస్‌ఎఫ్‌ఐ
మంత్రి గంటా నిర్ణయాన్ని ఎస్‌ఎఫ్‌ఐ స్వాగతించింది. విద్యార్థుల సమస్యపై గొంతు వినిపించడానికి....విద్యార్థి సంఘాలు ఉండాలి తప్పా, దాడులు చేసుకోవడానికి కాదని వారు చెప్పుకొచ్చారు.
మంత్రి నిర్ణయంపై కొన్ని విద్యార్థి సంఘాల అభ్యంతరం
ఐతే మంత్రి నిర్ణయంపై కొన్ని విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి విశ్వవిద్యాయంలో కేవలం అగ్రకులాల వారి ఆధిపత్యమే ఉంటుందని వాపోయారు. రాజకీయాల్లో ఏ కులం వారు అధికారంలో ఉంటే వారే విశ్వవిద్యాలయాల్లో చక్రం తిప్పుతున్నారని చెప్పారు. సమస్యలపై పోరాడేందుకే కులాల వారీగా..తాము సంఘాలు ఏర్పాటు చేసుకున్నామని చెబుతున్నారు.
కులసంఘాలను రద్దు చేయాలి
నాగార్జున యూనివర్సిటీలో ఉన్న పరిస్థితే రాష్ట్రంలోని అనేక ప్రవేటు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కూడా ఉంటుంది. కుల సంఘాలతో విద్యార్థుల చదువులు పెడదారిన పడుతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కుల పిచ్చితో విద్యార్థులకే గాక..దేశ భవిష్యత్తుకే ప్రమాదని స్పష్టం చేస్తున్నారు. అన్ని యూనివర్సిటీల్లోని కులసంఘాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

15:46 - July 19, 2015

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తూ.. ఆమ్ ఆద్మీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రెండురోజుల క్రితం జరిగిన 19ఏళ్ల మీనాక్షి అనే యువతి హత్య కేసులో... కమిషనర్ బన్సీ రాజీనామా చేయాలని కోరుతూ... పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ హత్యకేసులో ఆమె అన్నలే ప్రధాన నిందితులని తెలిసినా... ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. ఆందోళన తీవ్రమవడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత తలెత్తింది.

 

15:42 - July 19, 2015

కరీంనగర్‌: జిల్లాలో రాయికల్‌ మండలం ఒడ్డె లింగాపూర్‌లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. చిన్నారులపై కిరాతకంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారులను మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

15:39 - July 19, 2015

ఆదిలాబాద్‌: జిల్లాలోని జన్నారం మండలంలో గోదావరి స్నానానికి వెళ్లి నిన్న గల్లంతైన వ్యక్తి మృతి చెందాడు. అతడి మృతదేహం లభించింది. కరీంనగర్‌ జిల్లా మల్యాల్‌కు చెందిన కార్తిక్‌ నిన్న ఆదిలాబాద్‌ జిల్లా కలమడుగు పుష్కర ఘాట్‌లో స్నానానికి వెళ్లి గోదావరిలో గల్లంతయ్యాడు. అప్పటి నుంచి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన సహాయక బృందాలకు ఇవాళ కార్తిక్ మృతదేహం లభించింది. 

15:32 - July 19, 2015

అనంతపురం: డ్వాక్రా మహిళలకు ఇసుకలో 25 శాతం వాటా ఇస్తామని టీడీపీ ప్రభుత్వం చేసిన వాగ్ధానాన్ని వెంటనే అమలు చేయాలని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై మధు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 31న రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళా సంఘాలు భారీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఈ ఉద్యమానికి వామపక్షాల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

 

గోల్కొండ బోనాలు ప్రారంభం

హైదరాబాద్: గోల్కొండ బోనాలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం తరపున హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, మంత్రి పద్మారావులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 

15:12 - July 19, 2015

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి తలసాని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదన్నారు. ఆర్ టిఐ సమచారాన్ని షబ్బర్‌ అలీ వెల్లడించారు. 

15:00 - July 19, 2015

హైదరాబాద్: తలసాని శ్రీనివాస్‌ రాజీనామా ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తలసాని యాదవ్ పై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ డిమాండ్ చేశారు. తలసాని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదన్న విషయం ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిందని తెలిపారు. గవర్నర్‌ను తలసాని మోసం చేశారని గండ్ర ఆరోపించారు. రాజీనామా లేఖ అందలేదని స్పీకర్‌ ఆఫీస్‌ వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై రేపు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు గండ్ర వెల్లడించారు.

 

వనస్థలిపురంలో డా.లక్ష్మీనారాయణ ఆత్మహత్య..

రంగారెడ్డి: వనస్థలిపురంలో డాక్టర్ లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు చేసుకున్నాడు. వడ్డీవ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వడ్డీ వ్యాపారులు పరారీలో ఉన్నారు.

 

గుంటూరు జిల్లాలో భూప్రకంపనలు..

గుంటూరు: జిల్లాలోని శావల్యాపురం మండలంలో భూప్రకంపనలు సంభవించాయి. మతుకుమల్లి, బొందికలపాలెంలో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు.

 

ఆ దారిలో పెట్రోల్, డీజిల్ లేదు..

మెదక్ : జిల్లాలో పుష్కరాల ఎఫెక్ట్ కనిపిస్తోంది. భక్తుల రద్దీ పెరగడంతో రాజీవ్ రహదారిపై బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఖాళీ అయింది. బంక్‌ల ఎదుట నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరస్నానాలకు వెళ్తున్న యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లా అల్లాపూర్ టోల్‌గేట్ వద్ద ఎన్‌హెచ్-44పై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకునన్న  మంత్రి పోచారం టోల్ ఫీజు నిలిపివేయాలని ఆదేశించారు. అంబారిపేట నుంచి ధర్మపురి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మహదేవ్‌పూర్ నుంచి కాళేశ్వరం వరకు ట్రాఫిక్ స్తంభించింది.

ఉత్తరాఖండ్ లో భూకంపం..

హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. నేటి ఉదయం ఉత్తరాఖాండోలని ఛమోలీ జిల్లాలో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదైంది. కాగా ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగలేదని అధికారులు వెల్లడించారు. 

12:49 - July 19, 2015

''నడినెత్తిన భూగోళం పడినట్టుగా ఉంది. అణువణువున గ్లోబల్ వైరస్ మెదడును విచ్ఛిన్నం చేస్తోంది. అంతరాత్మ మూగగా రోదిస్తోంది'' అంటూ బలంగా కవిత్వం వినిపిస్తున్న రాయలసీమ యువకవి చిన కెంగార మోహన్. అతడు ఇటీవలే 'విన్యాసం' అన్న కవితా సంపుటిని వెలువరించాడు. ప్రపంచీకరణ దుష్ప్రభావాలు మానవ విధ్వంసానికి ఎలా కారకాలయ్యాయో కవిత్వీకరించారు. 

12:43 - July 19, 2015

తెలంగాణా అంటేనే బతుకమ్మ పాటల పూలతోట. బడుగు జీవుల కన్నీటి పాట. ప్రజా పోరాటాల ప్రగతి బాట. ఈ మట్టిపై ఎన్నో పాటల పారిజాతాలు, విప్లవాల అరుణ మందారాలు పూయించిన పాటల తొటమాలులున్నారు. ఇక్కడి కవులు గేయ రచయితలు అభ్యుదయ గీతాలు రాశారు, విప్లవకారులను కీర్తించారు. ఉద్యమాల అరుణారుణ రాగాల కెరటాలై ఎగసిపడ్డారు. ప్రజాచైతన్య గేయాలై ఎగసిపడ్డారు. ప్రజల గాయాల బతుకులకు రాగాలలేపనాలద్దారు. అలాంటి గేయ రచయితే కె.వెంకటేశ్వరరావ్. కె.వి.ఎల్ పేరుతో ప్రజా చైతన్య గీతాలు రాసిన ప్రజా గేయ రచయితపై ప్రత్యేక కథనం..

12:41 - July 19, 2015

సాహిత్యం మనిషికి మంచిని బోధిస్తుంది. మానవత్వాన్ని ప్రభోధిస్తుంది. ఉన్నత సమాజం వైపు మానవాళిని నడిపిస్తుంది. సాహిత్య నేపథ్యం లేని మానవ సమూహాల్లో.. సమాజాల్లో.. చైతన్యం తొణికిసలాడదు. ప్రగతి కనిపించదు. మానవజాతి చరిత్రను మలుపుతిప్పడంలో సాహిత్యం చారిత్రాత్మకమైన పాత్రను పోషించిందనడంలో ఎట్టి సందేహం లేదు. అందుకు ప్రధాన కారకులు..ప్రేరకులు.. సృజనకారులే. .అలాంటి వారిలో జాతీయోద్యమకాలంలో మాకొద్దీ తెల్లదొరతనం అంటూ గరిమెళ్ల సత్యనారాయణ గర్జించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో కవులు రచయితలు తమ కలాలకు పదును పెట్టారు. పదునైన భావజాలంతో పద్యాలు గేయాలు రాసి బ్రిటీష్ పాలకులను బెంబే లెత్తించారు. అలాంటి వారిలో మాకొద్దీ తెల్లదొరతనం అంటూ గేయమై జాతీయ కవి గరిమెళ్ల సత్యనారాయణ గర్జించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గేయకవి, సీనియర్ పాత్రికేయులు గరిమెళ్ల సత్యనారాయణ 122వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

12:29 - July 19, 2015

విశాఖపట్టణం : జిల్లాలో పారిశుధ్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని గత కొన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ వీరి సమస్యను ప్రభుత్వం పెడచెవిన పెడుతుండడంతో కార్మికులు పోరాట పంథాను మార్చారు. ఎమ్మెల్యేల కార్యాలయాల ఎదుట ధర్నాలు..రాస్తారోకోలు చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలంటూ ఎమ్మెల్యేలపై వత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చేలా కృషి చేయాలని, భవిష్యత్ లో వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకరావాలని కార్మికులు కోరారు. వీరి ఆందోళనకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం రాజమండ్రిలో పుష్కరాలు జరుగుతున్నాయని, పుష్కరాలు అయిపోగానే సీఎంతో మాట్లాడుతానని ఆయన కార్మికులకు హామీనిచ్చారు. 

12:13 - July 19, 2015

విశాఖపట్టణం : ఏపీ పుష్కరాలకు లక్షలాది సంఖ్యలో యాత్రీకులు పోటెత్తుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో యాత్రీకులు రాజమండ్రి పుష్కర ఘాట్ లకు చేరుకొనేందుకు తరలివస్తుండడంతో భారీ రద్దీ నెలకొంది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద వందలాది వాహనాలు బారులు తీరాయి. దీనితో ఎక్కడా టోల్ ఫీజు వసూలు చేయకూడదని సీఎం చంద్రబాబాబు ఆదేశాలు ఇచ్చారు. కానీ కొంతమంది టోల్ గేట్స్ సిబ్బంది సీఎం ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. విశాఖ - రాజమండ్రి రహదారిపై నున్న టోల్ గేట్ల వద్ద వాహనదారుల నుండి ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనితో వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. దీనిని చిత్రీకరిస్తున్న మీడియాపై దాడికి యత్నించారు. ఒక్కో వాహనం నుండి రూ.200-300 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు లిఖితపూర్వకంగా ఆదేశాలు రాలేదని టోల్ గేట్ సిబ్బంది పేర్కొంటున్నారు. వెంటనే సీఎం చంద్రబాబు స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు. 

టి.సి.లక్ష్మమ్మ భౌతికకాయానికి పలువురి నివాళి..

కర్నూలు : ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాతృమూర్తి టి.సి.లక్ష్మమ్మ భౌతికకాయాన్ని సుందరయ్య భవన్ కు తరలించారు. ఆమె పార్థివ దేహానికి పలువురు నివాళులర్పించారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, ఎమ్మెల్సీ గేయానంద్, ఏపీ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, అనంతపురం సీపీఎం జిల్లా నేత ఓబుల కొండారెడ్డి, అఖిల భారత ఐద్వా నాయకురాలు జ్యోతి, నవతెలంగాణ న్యూస్ ఎడిటర్ అర్జున్ లు నివాళులర్పించారు. 

మంగంపేట వద్ద ఆటో బోల్తా..

వరంగల్ : మంగంపేట వద్ద పుష్కరాలకు వెళుతున్న ఓ ఆటో బోల్తా కొట్టింది. అందులో ఉన్న 15మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

 

బాబు ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న టోల్ గేట్ సిబ్బంది..

విశాఖపట్టణం : సీఎం చంద్రబాబు ఆదేశాలను టోల్ గేట్ సిబ్బంది బేఖాతర్ చేస్తున్నారు. విశాఖ - రాజమండ్రి మధ్య టోల్ రుసుంను సిబ్బంది వసూలు చేస్తున్నారు. దీనిని చిత్రీకరిస్తున్న మీడియాపై దాడికి యత్నించారు. 

భద్రాద్రికి వీఐపీలు రావద్దు - మంత్రి తుమ్మల..

ఖమ్మం : భద్రాచలానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీనితో వీఐపీలు భద్రాచలానికి రావద్దని మంత్రి తుమ్మల సూచించారు. భక్తుల కోసం అదనంగా 200 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. 

శ్రీనగర్ లోని బుడ్గామ్ లో భారీ వర్షాలు..బాలుడి మృతి..

శ్రీనగర్ : గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీనగర్ లో జన జీవనం స్తంభించింది. బుడ్గామ్ జిల్లాలోని యూన్ మార్గ్ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఓ 14 ఏళ్ల బాలుడు నీటి ప్రవాహానికి కొట్టుకపోయాడు. అనంతరం అతడి మృతదేహాన్ని వెలికి తీశారు. 

భవంతి కూలిన ప్రదేశాన్ని పరిశీలించిన బీజేపీ ఎంపీ..

ఢిల్లీ : విష్ణుగార్డెన్ లో భవంతి కూలిన ఘటనా ప్రదేశాన్ని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ పరిశీలించారు. అక్కడున్న వారితో మాట్లాడారు.

అమీత్ షా నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ..

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా నివాసంలో సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, నిర్మల సీతరామన్, పీయుష్ గోయల్, రవి శంకర్ ప్రసాద్ హాజరయ్యారు. 

బాలిక హత్య కేసుపై పోలీసులు చర్యలు తీసుకోవాలి - సతీష్ ఉపాధ్యాయ..

ఢిల్లీ : ఇటీవలే దారుణ హత్యకు గురైన ఆనంద్ ప్రభాత్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత సతీష్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజకీయం చేయవద్దని సూచించారు. 

11:10 - July 19, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టీఎన్ఎస్ఎఫ్ నేత ప్రదీప్ కు ఏసీబీ ఆదివారం నోటీసులు జారీ చేసింది. 160 సీఆర్పీసీ కింద ప్రదీప్ చౌదరికి నోటీసులు ఇచ్చింది. సోమవారం ఉదయం 10.30గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆదేశాలు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ సన్నిహితుడిగా తెలుస్తోంది. 
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స్టన్ ఓటు కొనుగోలు విషయంలో టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. స్టీఫెన్ స్టన్ కు రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు ఇస్తూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెండ్ గా పట్టుబడ్డారు. అనంతరం అతడిని అరెస్టు చేసి విచారించారు. అతడితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాలను కూడా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో స్టీఫెన్ స్టన్ తో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు కూడా బహిర్గతం కావడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కూడా నోటీసుల జారీ చేశారు. కానీ నోటీసులు తీసుకోకుండా సండ్ర వెంకట వీరయ్య తప్పించుకున్నారు. ఆడియో, వీడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఇదిలా ఉండగానే సుమారు నెల రోజుల పాటు జైల్లో ఉన్న రేవంత్, మరో ఇద్దరు నిందితులు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో జైలు నుండి విడుదలయ్యారు. అజ్ఞానంలో ఉన్న సండ్ర ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. నోటీసులు తనకు అందించవచ్చని..విచారణకు సహకరిస్తానని సండ్ర పేర్కొనడంతో ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణ చేసిన అనంతరం సండ్రను అరెస్టు చేశారు. తదనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో సండ్ర విడుదలయ్యారు. ఇది గడిచిన కొద్ది రోజులకు ఏసీబీ మరో టిడిపి నేతకు నోటీసులు జారీ చేయడం ఆ పార్టీలో కలకలం సృష్టించింది. 

టీఎన్ఎస్ఎఫ్ నేత ప్రదీప్ కు ఏసీబీ నోటీసులు..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టీఎన్ఎస్ఎఫ్ నేత ప్రదీప్ కు ఏసీబీ ఆదివారం నోటీసులు జారీ చేసింది. 160 సీఆర్పీసీ కింద ప్రదీప్ చౌదరికి నోటీసులు ఇచ్చింది. సోమవారం ఉదయం 10.30గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆదేశాలు జారీ చేసింది. 

హస్తినకు చేరుకున్న చౌహాన్..

ఢిల్లీ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన బీజేపీకి చెందిన సీనియర్ నేతలతో భేటీ కానున్నారు.

10:40 - July 19, 2015

''పోయిన సారి మిమ్మల్ని నిరుత్సాహ పరిచా..అభిమానులు నన్ను క్షమించండి'' అంటూ మహేష్ బాబు పేర్కొన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన 'శ్రీమంతుడు' పాటల విడుదల వేడుక శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ చిత్రంలో ప్రిన్స్ కు జోడిగా శృతి హాసన్ నటించింది. తొలి సిడీని సినీ నటుడు వెంకటేష్ ఆవిష్కరించగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వీకరించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడారు. దేవీ ప్రసాద్ అంటే తనకు ఎంతో ఇష్టమని..ఈ చిత్రంలో 'జాగో..జాగో' పాట నా కెరీర్ లో ఉత్తమ గీతంగా నిలుస్తుందన్నారు. కొరటాల శివ చిత్రాన్ని బాగా తీశారని, ఈసినిమా ఒప్పుకున్నందుకు జగపతిబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మహేష్ పేర్కొన్నారు. ఈ సినిమా ట్రైలర్ చూశాక తాను రెండు సైకిళ్లను కొనడం జరిగిందని మరో నటుడు వెంకటేశ్ తెలిపారు. సైకిల్ పై తాను రఫ్ గా కనిపిస్తే చిన్నోడు అందంగా కనిపించాడని ప్రిన్స్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నటశేఖర కృష్ణ 50 ఏళ్ల నటప్రయాణాన్ని పురస్కరించుకుని ఆయనకు చిత్ర బృందం ఘన సన్మానం చేసింది. కృష్ణను వెంకటేష్ పూలమాలతో సన్మానించగా మంత్రి గంటా శాలువతో సత్కరించారు. ఎంపీ గల్లా జయదేవ్, హీరోయిన్ శృతి హాసన్, జగపతి బాబు, వి.వి.వినాయక్, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. 

బాసరలో డీజీపీ, స్మితా సబర్వాల్ పర్యటన..

ఆదిలాబాద్ : బాసరలో పుష్కరఘాట్ల ఏర్పాట్లు..భద్రతను డీజీపీ అనురాగ్ శర్మ, సీఎంఓ స్పెషల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ పరిశీలించారు. 

సుందరయ్య భవన్ లో టి.సి.లక్ష్మమ్మ సంతాప సభ..

కర్నూలు : సుందరయ్య భవన్ లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాతృమూర్తి టి.సి లక్ష్మమ్మ సంతాప సభ నిర్వహించారు. 

ట్రాఫిక్ సమస్యకు అన్ని చర్యలు - మంత్రి మాణిక్యాలరావు..

పశ్చిమగోదావరి : ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. టోల్ ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

 

అల్లాపూర్ టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జాం..

మెదక్ : గోదావరి పుష్కరాలకు వెళుతున్న వాహనాలతో అల్లాపూర్ టోల్ గేట్ వద్ద ఎన్ హెచ్ -44 పై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనాలతో టోల్ గేట్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

10:20 - July 19, 2015

కరీంనగర్ : గోదావరి పుష్కరాలకు తరలివెళ్లే యాత్రీకులతో కాళేశ్వరం కోలహాలంగా మారింది. భారీగా యాత్రీకులు తరలివస్తుండడంతో గోదావరి తీరం అంతా సందడిగా మారింది. యాత్రికుల వాహనాలతో రహదారులన్నీ రద్దీగా ఉన్నాయి. హైదరాబాద్ నుండి యాత్రికులు పుష్కరస్నానమాచరించేందుకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు వెళుతున్నారు. ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లాలోని మహదేవ్ పూర్ నుండి కాళేశ్వరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఐదు లక్షల మంది పుణ్యస్నానాలు చేయడానికి వచ్చారు. విపరీతమైన రద్దీ నెలకొందని, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నట్లు పంచాయతీ రాజ్ సీఈవో పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. 60 మంది గజ ఈతగాళ్లు, 30 మంది ఎన్డీఆర్ ఎఫ్ బృందంతో తీర ప్రాంతంలో గస్తీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం నదిలో పడిపోయిన వ్యక్తిని గజ ఈతగాళ్లు రక్షించారని తెలిపారు. 

10:14 - July 19, 2015

ఆదిలాబాద్ : జిల్లాలోని బాసరకు భక్తుల తాకిడి అధికమవుతోంది. వారంతపు సెలవు దినాలు కావడంతో బాసరకు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. పుష్కర స్నానం ఆచరించిన అనంతరం అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ కడుతున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేట్లను క్యూ లైన్లు దాటి పోయాయి. శనివారం అర్థరాత్రి నుండే భక్తులు పుణ్యస్నానాలాచరించి అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. తెల్లవారుజామున మూడు గంటలకు అమ్మవారికి అభిషేకం అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లవారుజామున క్యూ లైన్ లో నిలబడినా అమ్మవారిని దర్శించుకోలేకపోయామని భక్తులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అమ్మవారిని దర్శించుకోవడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరిగితే దర్శనం వేళలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అధిక సంఖ్యలో యాత్రీకులు తరలివస్తుండడంతో బాసర జనసంద్రంగా మారిపోయింది. ఆదివారం నాలుగు లక్షల వరకు యాత్రీకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

భవంతి కూలిన ప్రాంతంలో సత్యేంద్ర, జైర్నాల్ సింగ్ పరిశీలన..

ఢిల్లీ : విష్ణుగార్డెన్ లో భవంతి కూలిన ప్రాంతాన్ని మంత్రి సత్యేంద్ర జైన్, ఆప్ ఎమ్మెల్యే జైర్నాల్ సింగ్ పరిశీలించారు. దీనిపై సమగ్ర నివేదికను ఏడు రోజుల్లోగా ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. 

09:15 - July 19, 2015

రాజమండ్రి : శని..ఆది వారాలు సెలవు రోజులు కావడం..సోమ..మంగళవారాలు ఉన్నత విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో యాత్రికులు వరుసగా పుష్కర స్నానాలకు క్యూ కట్టారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి బయలుదేరిన యాత్రికులతో రాజమండ్రి పుష్కరఘాట్లు కిక్కిరిసిపోతున్నాయి. ఒక్క శనివారం రోజున రాత్రి 11.30 గంటల వరకు 61 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. మూడు రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ భారీగా భక్తులు వాహనాల్లో తరలి వస్తుండడంతో జాతీయ రహదారులపై రద్దీ నెలకొంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ గేట్ల వద్ద రుసుం వసూలు చేయవద్దని చెప్పినా రుసుం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో టోల్ గేట్ల వద్ద భారీగా వాహనాలు బారులు తీరి నిలబడిపోతున్నాయి. తెచ్చుకున్న మంచినీరు..ఆహార పదార్థాలు మార్గమధ్యంలోనే అయిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు పుష్కర ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి అకస్మిక తనిఖీలు చేపట్టారు. భక్తుల రద్దీ దృష్ట్యా కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల కలెక్టర్లు, డీఎస్పీలను అప్రమత్తం చేశారు.

అంబారీపేట వద్ద రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి..

కరీంనగర్ : వెల్గటూరు (మం) అంబారీపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో - కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ కు చెందిన శేరిలింగంపల్లి వాసులుగా గుర్తించారు. 

తిరుమనలో ఇరువర్గాల మధ్య ఘర్షణ..

నెల్లూరు : ఏఎస్పేట (మం) తిరుమనలో ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అగ్రిగోల్డ్ డబ్బుల విషయంలో వివాదం తలెత్తినట్లు సమాచారం.

08:18 - July 19, 2015

కరీంనగర్ : ఇసుకేస్తే రాలనంత..అడుగు తీసి అడుగు వేయలేనంత..దారులెంట జనం..తీరమెంట జనం..ఘాట్ల నిండా జనం..ఎటు చూసినా జనమే జనం..రోడ్లన్నీ వాహనమయం..వరుస సెలవుల ప్రభావంతో ధర్మపురిని జన కెరటం ముంచెత్తింది..శనివారం ఎలాంటి రద్దీ నెలకొందే అదే పరిస్థితి ఆదివారం కూడా నెలకొంది. తెల్లవారుజామునే స్నానాలు మొదలయ్యాయి. మూడు లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అంచనా.
శనివారం 26 లక్షలకు పైగా భక్తులు జిల్లాలో పుష్కర స్నానం ఆచరించినట్లు లెక్క తేలింది. రాష్ట్ర నలుమూలల నుండి ఆదివారం కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. లక్షల సంఖ్యలో వస్తున్న భక్తులను నియంత్రించడం పోలీసుల వల్ల కావడం లేదు. కరీంనగర్ నుండి ధర్మపురికి వచ్చే మార్గంలో తీవ్రమైన రద్దీ నెలకొంది. శనివారం రాత్రంతా రోడ్లపైనే పడిగాపులు పడాల్సి వచ్చిందని భక్తులు పేర్కొంటున్నారు. వెంట తెచ్చుకున్న మంచినీరు..ఆహార పదార్థాలు అంతా అయిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని భక్తులు వాపోతున్నారు. ఎలాగో అలా ట్రాఫిక్ నుండి బయటపడి ధర్మపురికి చేరుకున్నా అక్కడా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. మూడు..నాలుగు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. భక్తుల అంచనాల మేరకు వాహనాలను ఏర్పాటు చేయకపోవడంతో పుష్కరఘాట్లకు చేరుకోవడానికి భక్తులు నానా తంటాలు పడుతున్నారు. క్షేత్రంలో మంచినీరు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన పలు వ్యాపారస్తులు మంచినీటి బాటిళ్లను అధిక ధరకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

యాదాద్రిలో భక్తుల రద్దీ..

నల్గొండ: యాదాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ధర్మ దర్శనానికి 5 గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగటంతో పోలీసులు వాహనాలను గుట్టపైకి అనుమతించటం లేదు. 

ఢిల్లీలో భవంతి కూలిన ఘటనలో 5గురు మృతి..

ఢిల్లీ : దేశ రాజధాని విష్ణు గార్డెన్ లో భవంతి కుప్పకూలిన ఘటనలో మొత్తం ఐదుగురు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

07:57 - July 19, 2015

హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురి ఆధిపత్యం పోవాలంటన్నారు చిన్న నిర్మాతలు నట్టికుమార్, ప్రసన్నకుమార్. ఈ ఆదివారం జరగనున్న తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్ష ఎన్నికల్లో సురేష్ బాబు, దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్లపై పోటీకి దిగబోతున్నట్లు తెలిపారు.
పలు పదవుల కోసం రెండు పానెల్స్ కు చెందినవారు పోటీ పడుతున్నారు. సురేష్‌బాబు, సుధాకర్‌రెడ్డిలది ఒక పానెల్ అయితే, నట్టికుమార్, ప్రసన్నకుమార్‌లది మరో పానెల్. మొదటిసారిగా చాంబర్‌కు చెందిన నాలుగు పానెల్స్ కు ఒకేసారి ఓటింగ్ జరగుతుంది. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో సెక్టార్ వంటి నాలుగు విభాగాల్లోనూ మా పానెల్ పోటీ చేస్తోంది. సురేష్‌బాబుకు మేము గట్టిపోటీ ఇస్తామని, ఇప్పటికే ఏకపక్ష విధానాలతో చిన్న నిర్మాతలను కొందరు ఎన్నో కష్టనష్టాలకు గురిచేస్తున్నారని నట్టికుమార్ పలు ఆరోపణలు చేశారు. అప్పట్లో 150 వరకు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు ఉండేవని, ఇప్పుడవి కేవలం ఐదారుగా మిగిలాయాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను అణచివేసి నియంతల్లా పాలిస్తున్న వారిని గెలిపిస్తే కష్టాలు తప్పవని, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి చేయాలని భావించే తమ పానెల్‌నే గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు అని నట్టికుమార్ పేర్కొన్నారు. మరి ఏ ప్యానెల్ గెలువనుందో వేచి చూడాలి. 

07:48 - July 19, 2015

హైదరాబాద్ : రాంగోపాల్ వర్మ..ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కలకలం సృష్టిస్తుంటారు. సమయం..సందర్భం అసలే ఉండదు. ఎప్పుడు ఎలా మాట్లాడుతారో తనకే తెలియదు. ట్విటర్‌లో క్షణానికో ట్వీట్‌తో... తనుకు తాను గుర్తు చేస్తూ ఉంటారు. తాజాగా చిరంజీవి 150వ సినిమాపై వర్మ తనదైన శైలిలో స్పందించారు.                                                                    
బాహుబలిని మించిన స్టార్ లేడంటూ ట్వీట్లు..
బాహుబలి సినిమాపై వర్మ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. బాహుబలి మూవీ.. అడవిలో సింహమైతే...కలెక్షన్‌లు అడవిని మించిపోయాయని ఆకాశానికెత్తాడు. బాహుబలి రికార్డుల ప్రవాహంలో మెగాస్టార్‌, పవర్‌స్టార్‌, సూపర్‌స్టార్‌లన్నీ కొట్టుకుపోయాయని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి బాహుబలిని మించిన స్టారే లేడంటూ...తనదైన శైలిలో కామెంట్ చేశాడు.
భారీ కలెక్షన్స్ లతోనే చిరుకు మెగాస్టార్ -వర్మ..
ఇక బాహుబలి మూవీని...చిరంజీవి 150 సినిమాతో లింకుపెట్టాడు వర్మ. చిరంజీవి 150వ సినిమా బాహుబలి రికార్డులను తిరగరాయకపోతే మెగాస్టార్ అనే హోదాకే అర్ధముండదట. బాహుబలి కలెక్షన్‌ల ప్రవాహంలో మెగా కొట్టుకుపోతోందని అభిప్రాయపడ్డారు. అసలు మెగా కలెక్షన్స్ లతోనే చిరంజీవికి మెగా స్టార్ బిరుదు వచ్చిందన్నాడు. చిరు మూవీ బాహుబలిని అధిగమించకపోతే ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎంత తప్పు చేశారో..అంత తప్పు చేసినట్లని చెప్పుకొచ్చాడు.
రాజమౌళి తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు-వర్మ..
మొన్నటి దాకా చిరంజీవి 150వ సినిమా తన శిష్యుడు పూరిజగన్నాథ్ తీస్తేనే బాగంటుందని వర్మ అభిప్రాయపడ్డాడు. కానీ బాహుబలి రికార్డుతో ఆ అభిప్రాయాన్నీ మార్చుకున్నాడు. చిరంజీవి మూవీకి రాజమౌళి తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరని...జక్కన్నను ఆకాశానికెత్తుతున్నాడు. చిరంజీవి రాబోయే మూవీ విషయంలో....మొన్నటి దాకా పూరీని పొగిడిన వర్మ ఇప్పుడు జక్కన జపం చేస్తున్నాడు. బాహుబలి రికార్డుల ప్రవాహంలో తడిసి ముద్దవుతున్నాడు. మరి ఈయన వ్యాఖ్యలపై శిష్యుడు పూరిజగన్నాథ్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

విష్ణుగార్డెన్ లో శిథిలాల తొలగింపు..

ఢిల్లీ : విష్ణుగార్డెన్ లో కూలిన భవంతి శిథిలాలను సహాయక బృందం తొలగించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనాస్థలంలో ఉంది. 

ప్రజల జీవితాలతో ఎంసిడి ఆటలాడుతోంది - ఆప్..

ఢిల్లీ : ప్రజల జీవితాలతో మున్సిపల్ కార్పొరేషన్ ఆటలాడుతోందని ఆప్ ఎమ్మెల్యే జర్నియల్ సింగ్ ఆరోపించారు. మున్సిపల్ అవినీతి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విష్ణుగార్డెన్ లో ఓ భవంతి కూలడంపై ఆయన పై విధంగా స్పందించారు. 

07:32 - July 19, 2015

హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడపకండి..విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు..కుటుంబాల్లో విషాదం నింపకండి ప్రచారం చేపడుతున్నా మద్యం బాబులు బేఖాతర్ చేస్తున్నారు. ఫుల్లుగా మందు కొట్టి వాహనాలపై రయ్ మంటూ దూసుకెళుతున్నారు. వీరికి ముకుతాడు వేసేందుకు ట్రాఫిక్ పోలీసులు 'డ్రంక్ అండ్ డ్రైవ్' నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం రాత్రి జూబ్లిహిల్స్ వెంకటగిరిలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 22 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో దంత వైద్యురాలు..ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కూడా ఉండడం గమనార్హం. అంతేగాకుండా ఓ వ్యక్తి మద్యం మత్తులో కానిస్టేబుల్ పై దాడి చేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఇతర పోలీసులు వెంబడించి దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో 10 కార్లు..11 ద్విచక్రవాహనాలు..ఒక లారీని పోలీసులు స్వాధీనం చేశారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరు పరచనున్నారు. 

07:26 - July 19, 2015

పశ్చిమగోదావరి : పుష్కరాల్లో భాగంగా ఆరో రోజు భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతం కావడంతో కొవ్వూరుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజామునుండే పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు గోష్పాదక్షేత్రానికి క్యూ కట్టారు. శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పలు సమస్యలు ఎదురయ్యాయి. జాతీయ రహదారులపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీనితో యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనితో ఆదివారం రోజున అదే పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారులపై ట్రాఫిక్ ను మళ్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అంతేగాకుండా టోల్ గేట్ల వద్ద వాహనాలు నిలిచిపోకుండా ఫీజును రద్దు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో గత నాలుగు రోజులుగా 30 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తే శనివారం ఒక్క రోజే 18 లక్షల మంది స్నానాలు ఆచరించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కొవ్వూరులో వాతావరణం చల్లబడింది. 

07:20 - July 19, 2015

శ్రీకాకుళం : పుష్కరాలకు వెళ్లి తిరుగు ప్రయాణమైన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒక అరగంటలో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన వారు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. రూరల్ మండలం పాత్రునివలస వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు పలాస వాసులుగా గుర్తించారు. రెండు వ్యాపారస్తుల కుటుంబం పుష్కరాలకు జైలో వాహనం (ఎపి 30ఎస్ 7404) లో హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. పాత్రునివలస జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వేగంగా వున్న జైలో వాహనం అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. దీనితో ఉన్న ఇద్దరు అక్కడికక్కడనే మృతి చెందారు. బస్సు సడెన్ గా బ్రేక్ వేయడంతోనే ఈ ఘటన జరిగిందని బాధితుడు పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో జైలో వాహనంలో తొమ్మిది మంది ఉన్నారని తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన నలుగురిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 

ఆర్టీసీ బస్సును ఢీకొన్న వాహనం..ఇద్దరు మృతి..

శ్రీకాకుళం : రూరల్ (మం) పాత్రునివలస వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుండి వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందిన వారు పలాస వాసులుగా గుర్తించారు. గోదావరి పుష్కరాల నుండి తిరిగి వెళుతుండగా ఈప్రమాదం చోటు చేసుకుంది. 

నేడు తెలకపల్లి రవి మాతృమూర్తి అంత్యక్రియలు...

కర్నూలు : ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాతృమూర్తి టి.సి.లక్ష్మమ్మ (84) కన్నుమూశారు. నేడు మధ్యాహ్నాం కర్నూలులో లక్ష్మమ్మ అంత్యక్రియలు జరుగనున్నాయి.

06:57 - July 19, 2015

హైదరాబాద్ : ముమ్మాటికి ఇది రైతు రాజ్యం.. రుణమాఫీయే దీనికి సాక్ష్యం అంటూ ప్రకటనలిస్తోంది కేసిఆర్ సర్కార్. కానీ, ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా.. బ్యాంకుల షరతుల కారణంగా ఇప్పటికీ రైతులకు రుణమాఫీ కాలేదు. సీజన్ ప్రారంభం కాకముందే రుణ ప్రణాళిక పేరుతో ఆర్భాటం చేసిన బ్యాంకులు ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రైతులకు రుణంగా ఇవ్వలేదు. ఇటు అప్పు తెచ్చి సాగుచేసిన పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు నేల తల్లినే నమ్ముకుని సాగు చేసిన ఆ భూమిలోనే ప్రాణాలు విడుస్తున్నారు.
ఖరీఫ్‌ రుణాలు రబీలో అందజేత..
గత సంవత్సరం ప్రకటించిన రుణమాఫీపై స్తంభన నెలకొనడంతో ఖరీఫ్‌లో అందాల్సిన రుణాలు రబీ ప్రారంభమయ్యాక ఇచ్చారు. మొత్తం 18 వేల కోట్ల రూపాయల పంట రుణాలు బ్యాంకులకు రైతులు బకాయి పడ్డట్టు ప్రకటించింది సర్కారు. రుణమాఫీని ఒకేసారి కాకుండా నాలుగు సంవత్సరాల్లో మాఫీ చేస్తామని ప్రకటించింది. గత సంవత్సరం వాటా 4, 250 కోట్ల రూపాయలను ప్రభుత్వం బ్యాంకులకు ఇచ్చింది. ఇచ్చిన మొత్తాన్ని మాఫీ చేసి రైతుకు పూర్తి రుణం ఇవ్వాల్సిన బ్యాంకులు బుక్ అడ్జెస్ట్ మెంట్ చేశాయి.
ఏడు కోట్ల రుణాలు...
రైతులకు ఇవ్వాల్సిన 18 వేల కోట్లలో కేవలం ఏడు వేల కోట్లే రుణం అందడంతో మిగిలిన11 వేల కోట్లు ప్రైవేటు అప్పులే చేయాల్సి వచ్చింది అన్నదాతలు. గత సంవత్సరం తగినంత వర్షం పడక కరువు రావడంతో పంటలు ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక దాదాపు వెయ్యిమందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మొత్తం వ్యాపారంలో బ్యాంకులు 18 శాతం రుణాలు పంట రుణాలివ్వాలి. ఆ లెక్కన తెలంగాణలో పంట రుణాలు 59 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ, బ్యాంకర్లు ఇస్తామన్నది 23 వేల కోట్ల రూపాయలు.
ఇటు రైతన్నలు సాగుకోసం వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి.. నిండా మునుగుతున్నారు. సాగు చేసిన పంట చేతికందకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సర్కారు ప్రతిష్టకు పోకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా రైతుల సమస్యలు పరిష్కరిస్తేనే రైతురాజ్యం అవుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

06:39 - July 19, 2015

ఢిల్లీ : రంజాన్‌ ఈద్‌ పర్వదినం పురస్కరించుకుని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బిఎస్‌ఎఫ్‌ తరపున ఇచ్చిన మిఠాయిని పాకిస్తాన్‌ రేంజర్లు తిరస్కరించారు. పండుగల సందర్భాల్లో వాఘా, జమ్ము సరిహద్దులో రెండు దేశాల భద్రతా దళాలు స్వీట్లు పంచుకోవడం ఆనవాయితి. ఎప్పటిలాగే తాము స్వీట్‌ తీసుకెళ్లగా పాకిస్తాన్‌ రేంజర్లు తిరస్కరించినట్లు- అమృత్‌సర్ సెక్టార్‌కు చెందిన బిఎస్‌ఎఫ్‌ అధికారి ఎమ్‌ఎఫ్‌ ఫరూకీ మీడియాకు తెలిపారు. వాస్తవదీన రేఖ వద్ద తాము శాంతినే కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

06:38 - July 19, 2015

ఢిల్లీ : విష్ణుగార్డెన్స్ లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ముగ్గురు చనిపోగా 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద 15 మంది దాక చిక్కుకపోయినట్లు సమాచారం. వారిని రక్షించడం కోసం పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక శాఖ తరపున ఎనిమిది శకటాలు, జాతీయ విపత్తు ఉపశమనం దళం (ఎన్డీఆర్ఎఫ్) బలగాలు రంగంలోకి దిగాయి. ప్రమాదస్థలానికి చేరుకొనే మార్గం ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలుస్తోంది. 

06:32 - July 19, 2015

హైదరాబాద్ : విద్యారంగాన్ని అంగడిసరుకులా మారుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ విద్యాపరిరక్షణ సమితి కన్నెర్ర చేసింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న నూతన విద్యావిధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. దేశ వ్యాప్తంగా ఉద్యమాలకు అన్ని వర్గాలు సిద్ధమవ్వాలని ప్రకటించింది. ఉన్నత విద్యలోకి ప్రపంచ బ్యాంకు కాలుమోపెందుకు తహతహలాడుతోందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటి విమర్శించింది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పర్చేందుకు సిద్ధమైందని మండిపడింది. ఉన్నతవిద్యలో సంస్కరణలపై హైదరాబాద్‌లో తెలంగాణ విద్యాపరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇప్పుడు విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టకపోతే ఉన్నత విద్యారంగం పూర్తిగా ప్రమాదంలో పడే అవకాశముందని సమావేశానికి హాజరయిన విద్యావేత్తలు, వక్తలు అభిప్రాయపడ్డారు. విద్యారంగంలో ప్రవేశ పెట్టబోయే ప్రమాదకర సంస్కరణలపై దేశవ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చేపట్టబోతున్నామని విద్యావేత్తలు తెలిపారు. అందుకే ఆగస్టులో క్విట్ ఇండియా రోజు సందర్భంగా క్విట్ డబ్ల్యూటీవో, డబ్ల్యూఎటిటి అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
డిసెంబర్‌లో ఉన్నత విద్యామండళ్లు..
మరోవైపు డిసెంబర్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నత విద్యామండళ్లు, రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో తమ విద్యాసంస్కరణలను వివరించనుంది. ఈ సమావేశం ద్వారా మద్దతు కూడగట్టుకొని విదేశీ సంస్థల చేతుల్లోకి ఉన్నత విద్యను అప్పగించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విదానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమాలను తీవ్రతరం చేయాలని విద్యాపరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది.

06:30 - July 19, 2015

రాజమండ్రి : ఓ వైపు పుష్కర శోభతో గోదారి పులకించిపోతోంది. భక్తులు... పుణ్యస్నానాలు చేస్తూ పునీతులవుతున్నారు. నిత్యహారతిని చూసి తరించిపోతున్నారు. రోజూ లక్షలాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోతున్నారు. సందట్లో సడేమియాలో చెలరేగిపోతున్నారు. వరుస చోరీలతో భక్తులను బెంబేలెత్తిస్తున్నారు. రాజమండ్రి పుష్కరాల్లో దొంగల బెడద ఎక్కువైంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినా ఫలితం లేదు. నీటిలో మునిగి లేచే సరికి నగలు మాయవుతున్నాయి. నీటిలోపలి నుంచే దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఉత్తరాది నుంచి వచ్చిన ముఠాలు, కొన్ని ప్రభుత్వం నియమించిన గజ ఈతగాళ్లే చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
5 రోజుల్లో 500లకు పైగా చోరీలు..
రాజమండ్రి పుష్కరాల్లో ఐదురోజుల్లోనే 500లకు పైగా చోరీలు జరిగాయి. ముఖ్యంగా బంగారు ఆభరణాలే లక్ష్యంగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఘాట్లలో రద్దీప్రాంతాలు, మహిళలు, వృద్ధులను టార్గెట్ చేస్తూ నగలను దోచుకెళ్తున్నారు. నీటిలో స్నానం చేస్తున్న సమయంలో తాళి బొట్లు, చైన్లను తెంచుకుపోతున్నారు. భక్తులు స్నానాలకెళ్లేటప్పుడు బ్యాగులను గట్లపై వదిలి వెళ్తారు. అదే అదనుగా దోపిడీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. స్నానం వచ్చే సరికి బ్యాగులకు బ్యాగులే మాయమవుతున్నాయి.
పుష్కరాల్లో తిష్ట వేసిన బీహార్, ఒడిశా గ్యాంగులు..
పుష్కరాల్లో బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ముఠాలు తిష్టవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుమారు 300ల మంది దొంగలు పుష్కర ఘాట్లో సంచరిస్తున్నట్లు సమాచారం. ఇక కొన్నిచోట్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన గజ ఈతగాళ్లే దొంగతనాలు చేస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు. రాజమండ్రి పుష్కరఘాట్లలో ఇప్పటి వరకు 15 మంది దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వరుస చోరీలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చులకు డబ్బులు లేకుండా అష్టకష్టాలు పడుతున్నారు. ఏకంగా బ్యాగులే మాయమవుతుండటంతో..దూర ప్రాంతాలకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్లలో పోలీసుల నిఘా వైఫల్యంపై వారు మండిపడుతున్నారు. ఐతే పోలీసులు చోరీలను తేలిగ్గా తీసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పుష్కరాలకు విలువైన ఆభరణాలను వేసుకురావద్దని చెప్పినా... భక్తులు వినిపించుకోవటం లేదని పోలీసులు వాపోతున్నారు. పుష్కరాల్లో నిరంతర నిఘా పెట్టకుండా నగలను పెట్టుకురావద్దనంటం సరికాదని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పుష్కర ఘాట్లలో అడుగడుగునా నిఘా పెట్టి దొంగల బెడద లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

06:29 - July 19, 2015

ఖమ్మం : గోదావరి పుష్కరాలు..లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారు..ఎక్కడికక్కడ భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి..ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు..అయినా వాహనాలు పద్మవ్యూహం నుండి బయటకు రాలేకపోతున్నాయి..దీనితో తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్వర్ రెడ్డిలు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడానికి రంగంలోకి దిగారు. హోదాలు వదిలేసి జనం కోసం పని చేశారు. యాత్రికులు కురిపించిన ప్రశ్నల వర్షానికి ఓపికిగా సమాధానం చెప్పారు.
ఐదో రోజు భారీ రద్దీ..
ఐదో రోజు భద్రాచలంలో పుష్కర స్నానం ఆచరించేందుకు లక్షలాదిగా జనం తరలి రావడంతో... కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. దీన్ని క్లియర్‌ చేసేందుకు పోలీసులు నానా పాట్లు పడాల్సి వచ్చింది. దీంతో.. రంగంలోకి దిగిన తెలంగాణ మంత్రులు.. ట్రాఫిక్‌ క్లియరెన్స్ కోసం తమ వంతు ప్రయత్నం చేశారు. ఎప్పుడూ తమ కాన్వాయ్‌ సాఫీగా సాగిపోవడానికి ట్రాఫిక్‌ను నియంత్రించే మంత్రులు.. ఈ సారి ప్రజారవాణా సాఫీగా సాగేందుకు ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. రోడ్లమీద హల్‌చల్‌ చేసిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్‌ రెడ్డి.. తమదైన శైలిలో ట్రాఫిక్‌ను నియంత్రించారు.
పలువురి ప్రశంసలు..
రైళ్లలో కిక్కిరిసి.. బస్సుల్లో వేలాడుతూ, ప్రైవేటు వాహనాల్లో అవస్థలు పడుతూ భద్రాచలం చేరుకున్నారు లక్షలాది మంది భక్తులు. అయితే... భారీ స్థాయిలో భక్తులు పోటెత్తడంతో భద్రాద్రి క్షేత్రం జన సంద్రంగా మారింది. దీంతో.. ఇటు వారు అటు వెళ్లలేక.. అటువారు ఇటు రాలేక నానా అవస్థలు పడ్డారు. వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఇరుక్కుపోయాయి. ఈ క్రమంలో స్పందించిన మంత్రులు రోడ్లమీద పాగావేసి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. ఏకంగా మంత్రులే ట్రాఫిక్‌ పోలీసుల అవతారం ఎత్తడాన్ని పలువురు ప్రశంసించారు. ప్రజాసమస్యల పరిష్కారంలోనూ ఇదే తరహా విధానాన్ని అవలంభిస్తే మేలు జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

06:26 - July 19, 2015

హైదరాబాద్ : గోదావరి ఒడిలో పుణ్యస్నానం ఆచరించేందుకు.. భక్తకోటి క్యూ కట్టింది. వరుస సెలవులు రావడంతో.. తెలుగు రాష్ట్రాల రహదారులు గోదావరి వైపు మళ్లాయి. ఏ రోడ్డు చూసినా భయంకరమైన ట్రాఫిక్‌ కనిపిస్తోంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వాహనాలు గోదారమ్మ వైపే మళ్లడంతో రహదారులు స్తంభించాయి. దీంతో పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. అనేక చోట్ల రోడ్లపైనే వాహనాలు నిలిచిపోతున్నాయి. హైదరాబాద్‌లో రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు భక్తులు తరలివెళ్తున్నారు. దీంతో రాజధాని శివారు ప్రాంతాల్లో... కిలోమేటర్ల మేర ట్రాఫిక్‌ చిక్కులు తప్పడం లేదు. పలుచోట్ల వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో పోలీసులకు తలకుమించిన భారంగా మారుతోంది.
వాహనాల నిలిపివేత..
భక్తుల తాకిడి పెరిగిపోవడంతో భద్రాచలం పుష్కరాలకు వెళ్తున్న బస్సులు, వాహనాలను కొన్ని చోట్ల పోలీసులు నిలిపివేస్తున్నారు. ఇక ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్లేందుకు సరిపడా బస్సుల లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయివేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. నిజామాబాద్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రహదారులన్నీ వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో బాసరకు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్‌ వ్యూహంలో చిక్కుకున్నాయి.
ఉభయగోదావరి జిల్లాల్లో..
ఉభయగోదావరి జిల్లాల్లోనూ భక్తుల తాకిడి తీవ్రతరమైంది. గౌతమీ తీరం జనసంద్రాన్ని తలపిస్తోంది. పవిత్ర పుష్కర ఘాట్లన్నీ నిండు కుండల్లా మారిపోయాయి. గోదారిలో స్నానం ఆచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల జయజయ ధ్వానాలతోను పుష్కర ఘాట్లు మార్మోగిపోతున్నాయి. మరోవైపు భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. వీఐపీల తాకిడితో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌ల నుంచి నేరుగా పుష్కర ఘాట్లకు వెళ్లేందుకు వీలుగా ట్రాఫిక్‌ను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.

ఆరో రోజు పుష్కర స్నానాలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి తీరాల్లో ఆరో రోజు పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి. వరుసగా రెండు రోజులు సెలవు దినాలు రావడంతో భక్తులు గోదారి తీరాలకు పోటెత్తారు. ఇప్పటికే రాజమండ్రి, గోష్పాదక్షేత్రం, అంతర్వేది, కోనసీమలోని పుష్కరఘాట్లు, తెలంగాణలోని ధర్మపురి, బాసర, భద్రాద్రి, కాళేశ్వరం పుష్కర ఘాట్లకు జనం పోటెత్తారు. 

రాజమండ్రిలో ఏపీ సీఎం అకస్మిక తనిఖీలు..

రాజమండ్రి : ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రిలో అకస్మిక తనిఖీలు జరిపారు. శనివారం అర్ధరాత్రి రేవులో ఉన్న యాత్రికులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 

నేటి నుండి బోనాలు..

హైదరాబాద్ : ఆషాడ మాసం బోనాలు ఆదివారం చారిత్రక గోల్కొండ కోట నుండి ప్రారంభం కానున్నాయి. దీనికి లంగర్ హౌస్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అంకుర్పారణ జరుగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని నిర్వాహకులు పేర్కొంటున్నారు. 

నేడు జింబాబ్వేతో భారత్ టి-20 మ్యాచ్..

హరారే : నేడు జింబాబ్వే - భారత్ జట్ల మధ్య టి-20 మ్యాచ్ జరుగనుంది. రెండో టి-20లోనూ గెలిచేసి టూర్ ను అజేయంగా ముగించాలని భారత టీం కసితో ఉంది. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి 1-1తో సిరీస్ ను సమం చేయడం ద్వారా వన్డే సిరీస్ లో వైట్ వాష్ కు గురైన అవమానం నుండి జింబాబ్వే ఉపశమనం పొందాలని అనుకొంటోంది. సాయంత్రం 4.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.  

ఢిల్లీలో కూలిన నాలుగంతస్తుల భవనం..

ఢిల్లీ : దేశ రాజధానిలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందతా మరో 9మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పశ్చిమ ఢిల్లీలోని విష్ణు గార్డెల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

రాజమండ్రిలో ఏపీ సీఎం అకస్మిక తనిఖీలు..

రాజమండ్రి : ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రిలో అకస్మిక తనిఖీలు జరిపారు. శనివారం అర్ధరాత్రి రేవులో ఉన్న యాత్రికులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం..

మెదక్ : కుకునూరుపల్లి సమీపంలోని రాజీవ్ రహదారిపై తుఫాన్ వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. 

టంగుటూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి..

నెల్లూరు : టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో గుర్తు తెలియని వాహనాన్ని ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు.

 

Don't Miss