Activities calendar

20 July 2015

22:03 - July 20, 2015

ఉత్తరాధిని వరదలు ముంచెత్తుతున్నాయి. దక్షిణాదిలో వరుణుడి జాడే లేదు. దేశంలో ఒకే సారి విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య సమరమే అనేలా సంకేతాలు కనిపిస్తున్నాయి.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

21:51 - July 20, 2015

రాజమండ్రి: దేశంలో ఉత్తమ నగరంగా అమవరావతి నిర్మాణం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని సింగపూర్ ప్రభుత్వని కూడా కోరామని తెలిపారు. అక్టోబర్ 22న రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. 2018 లోగా తొలివిడత రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. 16 చదరపు కిలో మీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణం ఉంటుందని తెలిపారు. పైసా ఇవ్వకున్నా.. భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. 40 లక్షల మందికి సరిపోయేలా రాజధాని అభివృద్ధి జరుగుతుందన్నారు. రాజధానిలో 18 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. 40 వేల ఎకరాల అటవీ భూమిని రాజధాని నిర్మాణానికి వినియోగించుకునేందుకు కేంద్రం అంగీకరించిందని చెప్పారు. సీడ్ క్యాపిటల్ ప్రణాళిక అందించిన 30 మంది సింగపూర్ బృందానికి, సింగపూర్ ప్రధానికి ప్రభుత్వం తరపున బాబు కృతజ్ఞతలు తెలిపారు. 3 లక్షల నివాసగృహాల నిర్మాణానికి ప్రణాళిక రూపకల్పన చేశారని చెప్పారు. మూడు దశల్లో అనుకున్న సమయానికి ప్రణాళిక ఇచ్చారని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో ప్రణాళిక అందివ్వడం శుభ సూచకమన్నారు. డిసెంబర్ 8, 2014న సింగపూర్ తో ఎంవోయూ కుదుర్చుకున్నామని గుర్తు చేశారు.

 

 

 

21:18 - July 20, 2015

కడప: అంతర్జాతీయ ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో కడప జిల్లా పోలీసులు మరో ముందడుగు వేశారు. అంతర్జాతీయ స్మగ్లర్‌ టింకూశర్మను కడప పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. ఢిల్లీలోని శెకార్‌పూర్‌కు చెందిన టింకూశర్మ.. వాహనాల వ్యాపారం చేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన లక్ష్మణ్‌ డాంగ్, నవరంగ్‌ పూర్‌ వాసి జైపాల్‌ సింగ్‌తో కలిసి పెద్ద ఎత్తున విదేశాలకు తరలిస్తూ అంతర్జాతీయ స్మగ్లర్‌గా మారారు. ఇన్నాళ్లూ తప్పించుకు తిరుగుతున్న టింకూశర్మపై కడప, తమిళనాడు, ఢిల్లీలో అనేక కేసులు నమోదై ఉన్నాయి. కాగా ముందస్తు సమాచారం మేరకు టింకూశర్మపై నిఘా పెట్టిన కడప జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఢిల్లీలోని లక్ష్మినగర్‌ రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నారు.

 

21:12 - July 20, 2015

నల్లగొండ: జిల్లాలోని యాదగిరిగుట్ట మండలంలో లంచం తీసుకుంటూ.. వీఆర్వో, వీఆర్‌ఏలు ఏసీబీకి చిక్కారు. తండ్రి చనిపోవడంతో ఉన్న భూములను తన పేరు మీద మార్చాలని మాటూరి కృష్ణ అనే రైతు వీఆర్వోను అడిగారు. అయితే ఇందుకు 20 వేల రూపాయలు ఇవ్వాలని రంగారావు డిమాండ్ చేశారు. దీంతో కృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కృష్ణ నుంచి లంచం తీసుకుంటుండగా దాతరపల్లి వీఆర్వో రంగారావు, వీఆర్‌ఏ బాబులను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.

 

21:04 - July 20, 2015

హైదరాబాద్: 20 రోజుల్లో హైదరాబాద్‌లో ఆధార్‌ అనుసంధానం పూర్తి చేస్తామని... ఇందుకు ప్రజలు సహకరించాలని సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌ సచివాలయంలో సమావేశమైన ఇరువురు.. ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్‌ అనుసంధానంపై చర్చించారు. బోగస్‌ ఓటర్ల ఏరివేతలో ఈసీకి పూర్తిగా సహకరిస్తామని కేసీఆర్‌ అన్నారు.

 

21:00 - July 20, 2015

నల్గొండ: కార్మికుల సమస్యలపై వామపక్షాలు పోరాటానికి దిగాయి. సమ్మెలో ఉన్న మున్సిపల్, గ్రామపంచాయతీ, ఉపాధి హామీ కార్మికులకు మద్దతుగా బస్సు యాత్రను ప్రారంభించాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో పాటు ఇతర వామపక్ష నేతలు బస్సుయాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తమ్మినేనీ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. బస్సు యాత్ర ముగిసేలోపు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని..లేకుంటే మరో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

కేసీఆర్ పట్టుబడితే... ఏదైనా జరిగి తీరాల్సిందే: హరీష్ రావు

హైదరాబాద్: కేసీఆర్ పట్టుబడితే... ఏదైనా జరిగి తీరాల్సిందే అని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ఇంజినీరింగ్ అవతారమెత్తి... ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నారని చెప్పారు. పాలమూరు-ఎత్తిపోతల పూర్తయితే అత్యధికంగా సాగు అయ్యేది కొడంగల్ ప్రాంతమే అని స్పష్టం చేశారు. 'హక్కు దారులం మనమైతే.. నీళ్లు తీసుకుపోయింది.. ఆంధ్రావాళ్లు' అని గుర్తు చేశారు.

వారసత్వ కట్టడాల గుర్తింపు కోసం కమిటీ ఏర్పాటు

హైదరాబాద్: వారసత్వ కట్టడాల గుర్తింపు కోసం... సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షుడిగా సీఎస్ రాజీవ్ శర్మను నియమించారు.

 

రాజకీయాలను ప్రభావితం చేస్తున్న బోగస్ ఓట్లు: సీఎం కేసీఆర్

హైదరాబాద్: బోగస్ ఓట్లు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఈమేరకు ఈసీ భన్వర్ లాల్ తో సీఎం భేటీ అయ్యారు. ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానంపై చర్చించారు. బోగస్ ఓటర్ల ఏరివేతలో ఈసీకి సహకరిస్తామన్నారు. 20 రోజుల్లో హైదరాబాద్ లో అనుసంధానం పూర్తి చేస్తామని చెప్పారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరన్నారు. ఎవరైతే అనుసంధానం చేసుకోరో వారి ఓట్లను తొలగిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ లో 15 లక్షల మంది బోగస్ ఓటర్లున్నారని తెలిపారు. ఆధార్ అనుసంధానానికి ప్రజలు సహకరించాలని కోరారు. 

20:17 - July 20, 2015

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె మరింత ఉధృతంగా సాగుతోంది. ఆందోళనలో భాగంగా విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం ఎదుట కార్మికులు, ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. ఈ సమ్మెకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటున్నారు. ప్రైవేటీకరణ పేరుతో మున్సిపాలిటీలను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని విమర్శించారు.

 

20:12 - July 20, 2015

రంగారెడ్డి: టీ.కాంగ్రెస్‌లో వర్గ పోరు మరోసారి రచ్చకెక్కింది. రంగారెడ్డి జిల్లా తాండూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో రసాభాస నెలకొంది. రమేష్‌ వర్గం, నారాయణ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. జిల్లా పార్టీ నేతల ముందే కార్యకర్తలు రెండు గ్రూపులుగా చీలి తన్నుకున్నారు. మండల, పట్ణణ స్థాయి పార్టీ పదవుల భర్తీ విషయంలో తమకు అన్యాయం జరిగిందని రమేష్‌ వర్గం ఆరోపిస్తోంది. పదవులన్నీ నారాయణ వర్గానికే కట్టబెట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల కార్యకర్తల మధ్య మాటల యుద్ధం...కుర్చీలతో కొట్టుకునే దాకా వెళ్లింది. దీంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టారు.

 

20:10 - July 20, 2015

రాజమండ్రి: ఆకాశహార్మ్యాలు... అద్భుతమైన కట్టడాలు... ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న... సీడ్ కేపిటల్ రూపురేఖలు బయటకొచ్చాయి. అమరావతి నిర్మాణ ఊహాచిత్రాన్ని ఏపీ సర్కార్ అధికారికంగా విడుదల చేసింది. చుట్టూ కృష్ణానది పరీవాహక ప్రాంతం, మధ్యలో సీడ్ క్యాపిటల్ ఉండే విధంగా సింగపూర్ బృందం డిజైన్ చేసింది. చక్కటి రవాణా సౌకర్యాలు... సుందరమైన పచ్చదనం... మధ్య మధ్యలో వాగులు, వంకలు వచ్చేలా రూపకల్పన చేసింది. లేటుగానైనా లేటెస్టుగా కేపిటల్ ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ భావిస్తోంది. ప్రపంచంలో ఏ దేశానికి లేని... రీతిలో రాజధాని నిర్మాణానికి కసరత్తు చేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఊహా చిత్రాలను ఈశ్వరన్ బృందం ఏపీ ప్రభుత్వానికి ఇచ్చింది. నవ్యాంధ్ర కలల రాజధాని ఎంత అద్భుతంగా ఉండబోతోందన్న దానికి ఈ ఊహా చిత్రాలే నిదర్శనంగా నిలవనున్నాయి. చుట్టూ కృష్ణానది పరీవాహక ప్రాంతం, మధ్యలో సీడ్ కేపిటల్ ఉండే విధంగా సింగపూర్ బృందం డిజైన్ చేసింది. పెద్ద పెద్ద భవనాలు, విశాలమైన రహదారులు, మెట్రోరైల్ వంటి పలు ప్రత్యేకలతో అమరావతి నగరాన్ని నిపుణులు డిజైన్ చేశారు. నూతన రాజధానిని పర్యాటకంగానే కాకుండా ప్రపంచస్థాయి గుర్తింపు పొందేలా రూపొందించనున్నారు. కృష్ణా నదికి ఇరువైపులా ఆకాశహార్మ్యాలను తలపించే ఎత్తైన భవంతులు నిర్మించనున్నారు. నాలుగైదు ప్రాంతాల్లో భారీ వంతెనలు నిర్మించడం ద్వారా... రెండు ప్రాంతాలను కలుపుతూ జల, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా నదితో పాటు విజయవాడ వద్ద ఉన్న బ్యారేజీకి అనుసంధానంగా ఉన్న ఏలూరు, బకింగ్‌హామ్‌, బందరు, రైవస్‌కాల్వల్లో జలరవాణా వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
అమరావతిలో 7 లక్షల ఉద్యోగాల కల్పన
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సుమారు ఏడు లక్షల ఉద్యోగాల కల్పనకు వీలుండేలా రూపకల్పన చేసినట్లు సింగపూర్ బృందం తెలిపింది. 16 చదరపు కిలో మీటర్ల పరిధిలో అమరావతి నిర్మాణం జరగనుంది. అందులో సుమారు 3 లక్షల నివాస గృహాల నిర్మాణానికి తగ్గట్లుగా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సుమారు తొమ్మిది ప్రధానాంశాలతో ప్రణాళిక ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతంలో ఒక మహానగరం, ఏడు ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి, గుడివాడ, గన్నవరం, నూజివీడు, నందిగామ ప్రాంతాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఉండనున్నాయి.

 

20:02 - July 20, 2015

ఖమ్మం: జిల్లాలోని పాల్వంచలో ఓ మహిళ.. నిరాహార దీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. భర్త ఇంటి ముందు టెంట్ వేసుకుని మౌనపోరాటం సాగిస్తోంది. దమ్మపేట సెంటర్‌కు చెందిన భవాని.. కెటిపిఎస్ కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్‌ రజీమ్‌ముదిన్‌ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత చదువు నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లిన వీరు.. ఇరువురి తల్లిదండ్రులకు తెలియకుండా నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం ఇరుకుటుంబాల్లో తెలియడంతో పెద్దల సమక్షంలో భవాని పేరును సమీరాగా మార్చి ముస్లిం మత సంప్రదాయాల ప్రకారం వివాహం జరిపారు. అయితే పెళ్లి అయిన నెల రోజుల నుంచి భర్త, అత్తమామలు కలిసి అమ్మాయిని తీవ్రంగా వేధించసాగారు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.

 

 

18:47 - July 20, 2015

హైదరాబాద్: టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత శ్రవణ్‌కుమార్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల మారణహోమం జరుగుతుంటే సీఎం కేసీఆర్‌ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు పిట్టల్లా రాలిపోతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. తప్పుడు లెక్కలతో పార్లమెంటునే పక్కదోవ పట్టించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని శ్రవణ్‌కుమార్‌ ఘాటుగా విమర్శించారు.

 

18:44 - July 20, 2015

రాజమండ్రి: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద గోదావరి పుష్కరాలకు విచ్చేశారు. రాజమండ్రిలోని వీఐపీ ఘాట్‌లో సోదరి, సోదరుడితో కలిసి ఆమె పుణ్యస్నానం ఆచరించారు. జన్మభూమి రాజమండ్రిలో పుష్కర స్నానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని జయప్రద అన్నారు.

 

18:29 - July 20, 2015

మహబూబ్ నగర్: పాలమూరు ప్రాజెక్టుపై తమ్ముళ్లే టార్గెట్‌గా టీఆర్ఎస్ లీడర్లు దూకుడు పెంచారు. టీ-టీడీపీ నేతలపై ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్ రావు మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో... పాలమూరు ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికైనా టిడిపి ఎంపీ సీఎం రమేశ్ ఇచ్చిన లేఖను... తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ టీడీపీ నేతలు ప్రజల పక్షమో..? చంద్రబాబు పక్షమో తేల్చుకోవాలన్నారు.

 

18:23 - July 20, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణకు టీడీపీ నేతలు ప్రదీప్‌ చౌదరి, మనోజ్‌, సుధీర్‌, పుల్లారావు, రేవంత్‌ రెడ్డి కారు డ్రైవర్‌ రాఘవేంద్రా రెడ్డి హాజరయ్యారు. ఓటుకు నోటు కేసుతో తమకు సంబంధం లేదని ప్రదీప్‌, పుల్లారావు అన్నారు. కేసీఆర్‌ కుట్ర పన్ని తమను కేసులో ఇరికించారని ఆరోపించారు.

 

18:21 - July 20, 2015

కృష్ణా: చేపల చెరువుల తవ్వకాల సొమ్ము పంపకం విషయంలో తలెత్తిన వివాదం కృష్ణా జిల్లా పాతరామాపురంలో ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. చేపల చెరువుల తవ్వకాలకు సంబంధించి భూ యాజమానుల నుంచి వసూలు చేసిన సొమ్మును గ్రామస్థులు పంచుకున్నారు. తాగునీటి కొరకు కేటాయించిన 4 లక్షల రూపాయల విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.

 

18:18 - July 20, 2015

విజయవాడ: ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ...విజయవాడలో కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ సర్కిల్‌లో వినూత్న రీతిలో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు హయాంలో మున్సిపల్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని....వారు మండిపడ్డారు. 40 వేల కార్మికుల విధులు బహిష్కరించి సమ్మె చేస్తుంటే...ప్రభుత్వం తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కార్పొరేట్ కంపెనీలకు తొత్తుగా వ్యవహరిస్తూ...కార్మికులను విస్మరిస్తున్నారని విమర్శించారు. తక్షణం మున్సిపల్ కార్మికులకు తగిన వేతనం పెంచాలని...లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.

 

18:16 - July 20, 2015

హైదరాబాద్: తెలంగాణలో బోనాల నిర్వహణను టీ.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బోనాల ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో బోనాల నిర్వహణపై కేబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు. హోంమంత్రి నాయిని నర్శింహారెడ్డి అధ్యక్షతన ఈ సబ్‌కమిటీ పని చేస్తుందని తెలియచేశారు.

 

18:10 - July 20, 2015

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను వెంటనే బర్తరఫ్ చేసి... సనత్‌నగర్‌లో ఉప ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వెంటనే రాజీనామా పత్రం సమర్పించానని చెప్పి..మోసం చేయటం సిగ్గుచేటన్నారు.

 

18:06 - July 20, 2015

ఢిల్లీ: ఎన్‌డీఏ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూసేకరణ బిల్లుకు తాము తప్పక మద్దతిస్తామని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. పార్లమెంట్‌ సమావేశాలపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన కేంద్రమంత్రి సుజనాచౌదరి తమ పార్టీ అభిప్రాయాలను తెలియచేశారు. రాష్ట్ర పునర్విభజన బిల్లులో ఇంకా పెండింగ్‌లోఉన్న అంశాలపై అవసరమైతే సవరణలు కూడా కోరతామని, ప్రత్యేకహోదాపై పట్టుబడతామని సుజనాచౌదరి స్పష్టం చేశారు.

 

హైకోర్టును విభజించాలని కోరతాం: జితేందర్ రెడ్డి

ఢిల్లీ: హైకోర్టును విభజించాలని పార్లమెంట్ లో కోరతామని టీఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి అన్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లోనే హైకోర్టు విభజనపై కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. బేగంపేట విమానాశ్రయ భూమిని రక్షణ శాఖకు ఇవ్వొద్దని ప్రధాని మోడీకి విరిస్తామని చెప్పారు.

 

అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల...

రాజమండ్రి: అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ విడుదలయింది. అమరావతి మధ్యలో సీడ్ క్యాపిటల్ ఉండనుంది. 15 చదరపు కిలోమీటర్ల మేర సీడ్ క్యాపిటల్ ఉండనుంది. దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకతలు అమరావతికి ఉన్నాయి. చుట్టూ కృష్ణా నది పరివాహక ప్రాంతం ఉంది. పర్యావరణ సమతుల్యానికి పెద్దపీట వేశారు. 

సభా సజావుగా జరిగేందుకు సహకరించండి: లోక్ సభ స్పీకర్

ఢిల్లీ: సభా సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన సమావేశం రెండు గంటలపాటు కొనసాగింది. వెంకయ్య అధ్యక్షతన మరో 2 గంటలపాటు సమావేశం కొనసాగింది. 

16:56 - July 20, 2015

సృజనాత్మకత ఉంటే ఎలాంటి వస్తువుకైనా కళాత్మక రూపం తీసుకురావచ్చు. అలా సృజనాత్మకత కలిగిన ఒక అతివ న్యూస్ పేపర్ తో అందమైన కళాకృతులను తయారు చేస్తోంది. అవేంటో ఇవాళ్టి సొగసులో చూసి తెలుసుకుందాం.
ఆ...వివరాలను వీడియోలో చూద్దాం...

16:54 - July 20, 2015

చదువులు, మార్కులే కొలమానంగా మారిన ప్రస్తుత నేపథ్యంలో చదువుతో పాటు ఆట, పాటలలో ప్రత్యేకత చాటుతోంది ఒకమ్మాయి. ఎంచుకున్న రంగాలలో అతి వేగంగా దూసుకెళ్తోంది. అంతటి ప్రత్యేకతలతో రేపటి తరానికి ప్రతినిధిగా నిలుస్తున్న యువ కెరటాన్ని మీకు పరిచయం చేస్తోంది ఈ వారం స్ఫూర్తి.
అనేక రంగాల్లో సత్తా చాటుతున్న నైనా 
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనటానికి నిదర్శనంగా నిలుస్తోంది. అనేక రంగాలలో సత్తా చాటుతూ ఈ తరం పిల్లలకు ఆదర్శంగా నిలుస్తోంది. తల్లిదండ్రుల కంటికి దీపంలా వెలుగుతూ వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతోంది నైనా జైస్వాల్.
ఆదర్శంగా నిలుస్తోన్న నైనా
చదువును భారంగా భావిస్తున్న నేటి తరంలోని అనేక మంది పిల్లలకు నైనా ఆదర్శంగా నిలుస్తోంది. ఏ పనినైనా ఇష్టంగా చేస్తే ఫలితాలు తథ్యం అని భావిస్తూ అదే బాటలో పయనిస్తున్న నైనా ప్రస్తుత తరానికి స్ఫూర్తినిస్తోంది. అటు చదువులో, ఇటు ఆటల్లో రాణిస్తున్న నైనా జైస్వాల్ పయనం అప్రతిహతంగా కొనసాగాలని మానవి ఆశిస్తోంది.

 

సరూర్ నగర్ పీఎస్ పరిధిలో దారి దోపిడీ

హైదరాబాద్: సరూర్ నగర్ పీఎస్ పరిధిలో దారి దోపిడీ జరిగింది. స్వర్ణరేఖ అనే మహిళ దృష్టి మరల్చి కారులో నుంచి 70 తులాల బంగారం, అరకిలో వెండి, రూ.10 వేల నగదు చోరీ జరిగింది.

 

ఎసిబి వలలో అవినీతి తిమింగలాలు

నల్గొండ: యాదరిగిగుట్టలో వీఆర్వో రంగారావు, వీఆర్ ఏ బాబులు భూమి పట్టా కోసం ఓ రైతు నుంచి రూ.10 వేలు తీసుకుంటూ ఎసిబికి చిక్కారు. వారిని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

కారు బోల్తా.. ముగ్గురి మృతి

గుంటూరు: శావల్యాపురం వద్ద బ్రిడ్డ్ పై నుంచి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

 

సెక్షన్8 అమలు చేయాలన్న పిటిషన్ పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: హైదరాబాద్ లో సెక్షన్8 అమలు చేయాలన్న పిటిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండా పిటిణ్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఆధారాలు లేనప్పుడు కొంత సొమ్మును డిపాజిట్ చేసి పిటిషన్ దాఖలు చేయాలన్ని చెప్పింది. దీంతో గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం పిటిషన్ ను ఉపసంహరించుకుంది.  

15:43 - July 20, 2015

హైదరాబాద్: ఆ.. ప్రాజెక్టు పూర్తైతే వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయి. పచ్చని చేలతో గ్రామాలన్నీ కళకళలాడుతాయి. ఆర్థికంగా చితికిపోతున్న రైతుల కష్టాలు తీరుతాయి. కానీ, ప్రాజెక్టు నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. నిత్యం వివాదాలే తప్ప.. పనులు జరగడం లేదు. ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని సర్కార్‌ తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతున్నాయి. పొరుగు రాష్ర్టం పెచీ పెడుతుండడంతో తెలంగాణ సర్కార్‌ ఎలా ముందుకు సాగుతుందో అర్థం కాని పరిస్థితి.
తెలంగాణకు వరప్రదాయిని ప్రాణహిత-చేవెళ్ల
తెలంగాణ రాష్ట్రానికే వరప్రదాయిని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తైతే రాష్ర్టంలోని 7 జిల్లాలకు సాగు నీరందుతుంది. అయితే కొన్నేళ్లుగా ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాలకుల నిర్ణయాలతో ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగడం లేదు. ఇప్పటికే వందల కోట్లు ఖర్చు చేశారు. అయినా ఎటువంటి ప్రయోజనం లేదు. వైఎస్‌ హయంలో ప్రాజెక్టుకు పునాదిరాయి పడ్డా.. ఇప్పటికీ అదే స్టేజీలో ఉంది. మధ్యలో కొన్ని నిర్మాణ పనులు చేపట్టినా.. అవి ఉపయోగం లేకుండా పోయాయి.
వివాదాస్పదమవుతున్న డిజైన్‌ మార్పు
ప్రాజెక్టు పూర్తైతే వేల ఎకరాలకు సాగునీరందుతుంది. రైతులు ఏడాదికి మూడు పంటలు పండించుకోవచ్చు. గొంతెండుతున్న ప్రజల దాహార్తి తీరుంది. కానీ, ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలన్న సర్కారు నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ప్రస్తుత స్వరూపాన్ని మారిస్తే వేల కోట్ల రూపాయలు వృథా అవుతాయని ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతున్నాయి. సర్కార్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఉమ్మడి రాష్ర్టంలో పూర్తిచేయని ప్రాజెక్టును.. స్వరాష్ర్టం వచ్చాక తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ.. పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. మహారాష్ర్ట సర్కార్‌ పేచీ పెడుతుండడంతో ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలనుకుంటున్నారు కేసీఆర్‌. దీంతో ప్రాజెక్టు అదిలాబాద్‌ నుంచి కరీంనగర్‌కు మారింది. తర్వాత అంతరాష్ర్ట జలవివాదాలు కాస్తా.. అంతర్‌ జిల్లాల జలవివాదాలుగా మారాయి.
55 టీఎంసీలకు తడ్కపల్లి రిజర్వాయర్‌ మార్పు
ముందుగా పదుల సంఖ్యలో టీఎంసీల నీటిని వాడుకోవచ్చని ఆలోచించారు. దీంతో కరీంనగర్‌లోని మిడ్‌ మానేరు గుండా.. సిద్దిపేట పక్కనున్న తడ్కపల్లి వద్ద 1.5 టీఎంసీలతో రిజర్వాయర్‌ నిర్మించాలని ప్లాన్‌. కానీ, తర్వాత దాన్ని ఏకంగా 25 టీఎంసీల వరకు చేర్చారు. దీంతో ఆ రిజర్వాయర్‌ కింద దాదాపు 5 గ్రామాలు ముంపునకు గురవుతాయని అధికారులు అంచనా వేశారు. కొన్నిచోట్ల పరిహారం చెల్లించి.. పనులు మొదలుపెట్టారు. కానీ, ఇప్పుడు కేసీఆర్‌ నిర్ణయంతో వ్యాప్కోస్‌ ఇచ్చిన కొత్త డిజైన్‌ ప్రకారం.. ఈ ప్రాజెక్టును 160 టీఎంసీలకు మార్చారు. అందులో తడ్కపల్లి రిజర్వాయర్‌ను 55 టీఎంసీలకు పెంచారు. దీంతో ఆ ముంపు మరింత పెరిగే అవకాశముంది. అధికారుల అంచనా ప్రకారం దాదాపు 12 నుంచి 15 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశముంది. దీని కింద దాదాపు 10 వేలమంది నిర్వాసితులతో పాటు, వేల ఎకరాల సాగు భూమి కూడా కోల్పోయే అవకాశముంది.
గందరగోళానికి గరవుతున్న రైతులు
ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణంపై రోజుకో వార్త బయటకు వస్తుండడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులు అయోమయంలో పడ్డారు. మరి ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సర్కార్‌ అఖిలపక్ష నేత సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్తుందా..? లేక సొంత నిర్ణయాలతో వివాదాల్లో చిక్కుకుంటుందా..? అనేది వేచిచూడాలి.

 

పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కరాలు జరుగుతున్న జిల్లాల్లోని కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. పుష్కర రద్దీ ఎక్కువగా ఉందని అధికారులు... సీఎంకు తెలిపారు. ధర్మపురికి మధ్యాహ్నానానికే 6 లక్షల మంది చేరుకున్నారని తెలిపారు. తక్షణమే ధర్మపురి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని సీఎం డీజీపీని అదేశించారు. పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో డీజీపీ ధర్మపురికి బయల్దేరారు.

 

రాజ్యాంగానికి తూట్లు పొడిచిన టీసర్కార్: ఎర్రబెల్లి

హైదరాబాద్: టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికీ తూట్లు పొడిచిందని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా.. టీఆర్ ఎస్ లో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారంలో త్వరలో గవర్నర్ ను కలిసి తలసానిపై చర్యలు తీసుకునేవరకూ.. అక్కడే కూర్చుంటామని తెలిపారు.

 

సీఎం కేసీఆర్ ను కలిసిన మంత్రి తలసాని

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు. రేపు బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ ను తలసాని, అర్చకులు ఆహ్వానించారు.

 

కార్మికుల సంక్షేమం కోసమే చట్ట సవరణలు: మోడీ

ఢిల్లీ: కార్మికుల సంక్షేమం కోసమే చట్ట సవరణలు చేస్తున్నామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 46వ జాతీయ కార్మిక కదస్సుకు ప్రధాని హాజరై, మాట్లాడారు. సంస్కరణలపై కార్మికసంఘాలతో చర్చిస్తున్నామని తెలిపారు. కార్మిక సంఘాల ఏకాభిప్రాయంతోనే చట్టాల్లో మార్పులు చేస్తామని చెప్పారు. కార్మికులు సంతోషంగా లేకపోతే దేశం సంతోషంగా ఉండబోదని స్పష్టం చేశారు.

 

14:53 - July 20, 2015

నల్గొండ: కార్మికుల సమ్మెలకు మద్దతుగా వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర నల్లగొండ జిల్లాలో ప్రారంభమైంది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఇతర వామపక్ష పార్టీల నేతలు బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జానారెడ్డి, గుత్తా సుఖేందర్‌ వామపక్ష నేతలను కలిసి సంఘీభావం ప్రకటించారు. అనంతరం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరుపై లెఫ్ట్ నేతలు నిప్పులు చెరిగారు.

 

'తొక్కిలసాట'ను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్: ధవలేశ్వరం వద్ద ప్రమాద ఘటనపై న్యాయవాది లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఎపి హోంమంత్రికి, సీఎస్, ఇరిగేషన్, ట్రాన్స్ కో అధికారులకు నోటీసులు జారీ చేసింది. ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. సోమవారం లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

 

14:45 - July 20, 2015

హైదరాబాద్: సింగపూర్ బృందంతో ఎపి సీఎం చంద్రబాబు భేటీ కొనసాగుతోంది. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్‌ బృందం చంద్రబాబుకు అందజేయనుంది. సాయంత్రం ఏపీ సీడ్‌ క్యాపిటల్ ఆవిష్కరణ జరగనుంది.

 

కర్నూలు జిల్లాలో ప్రబలిన అతిసార

కర్నూలు: సిరివెళ్లలో ప్రబలిన అతిసార వ్యాధి ప్రబలింది. కర్నూలు, నంద్యాల అస్పత్రుల్లో 70 మంది చికిత్స పొందుతున్నారు. 

హైకోర్టు విభజనతో గవర్నర్‌కు సంబంధం లేదు: పొన్నం....

హైదరాబాద్:హైకోర్టు విభజనతో గవర్నర్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయం టీఆర్‌ఎస్‌ ఎంపీలకు తెలియదా అని కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలోని అంశాలపై గట్టిగా పోరాడటం లేదని విమర్శించారు. కేంద్రంలో మంత్రి పదవుల కోసమే ఆరటపడుతున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసును పార్లమెంటులో ప్రస్తావించాలని పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

తెలంగాణ వచ్చాక రైతు ఆత్మహత్యలు పెరిగాయి: రావుల

హైదరాబాద్:రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తరువాతే రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే సమయం మంత్రులకు లేదని దుయ్యబట్టారు. మాటలు కోటుల దాటుతున్నాయి...కాళ్లు ఫాంహౌస్‌ దాటడం లేదన్నారు.

జలపాతంలో దిగి మృతి చెందిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి

విశాఖ‌: చోడవరం మండలం వి ఎస్ పేట గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కూనిశెట్టి కుమార్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చండీఘర్ సమీపంలోని జలపాతంలో దిగి కొట్టుకుపోయి, మృతి చెందాడు. కుమార్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్ మెంట్ లో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

13:43 - July 20, 2015

ఢిల్లీ: దేశాభివృద్ధిలో కార్మికులు అత్యంత కీలకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన 46వ జాతీయ కార్మిక సదస్సుకు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ జాబ్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. కార్మికులు అందిస్తోన్న సేవల అభినందనీయమన్న మోదీ... కార్మిక రంగం అభివృద్ధి చెందితేనే... దేశం అభివృద్ది చెందుతుందని స్పష్టం చేశారు. 

13:41 - July 20, 2015

హైదరాబాద్: వర్షాలు ఊరించి ఉసూరు మనిపించాయి..! జోరుగా సాగాల్సిన సాగు.. రోజురోజుకూ సాగిలపడుతోంది..! దీంతో.. అపరాల సాగువైపు దృష్టిసారిస్తోంది రైతాంగం. వాతావరణ పరిస్థితులకు తోడు.. అవకాశాలు కూడా మెరుగ్గా కనిపిస్తుండడంతో ఆరుతడి పంటలవైపే మొగ్గుచూపుతున్నారు అన్నదాతలు. ఈ ఏడాది వర్షాలు సాధారణం కన్నా తక్కువేనన్న వాతావరణ శాస్త్రవేత్తల మాటలు దాదాపుగా నిజమవుతున్నాయి. ముందుగానే రంగప్రవేశం చేసిన రుతుపవనాలు.. ఆ తర్వాత ముఖం చాటేయడంతో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో.. ఆరుతడి పంటలవైపు మళ్లుతోంది రైతాంగం.
కందులు, పెసలు, మినుము, వేరుశనగ వంటి పంటలను....
దేశవ్యాప్తంగా కందులు, పెసలు, మినుము, వేరుశనగ వంటి పంటలను సాగుచేసేందుకు అన్నదాతలు మొగ్గుచూపుతున్నారు. ఈ కారణంగానే.. సాగు విస్తీర్ణం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో 346 లక్షల హెక్టార్లలో అపరాలు సాగుచేస్తే.. ఈ దఫా విస్తీర్ణం 563 లక్షల హెక్టార్లకు పెరిగిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది.
దేశంలో పెరుగుతున్న పప్పు ధాన్యాల సాగు....
బహిరంగ మార్కెట్లో పప్పుల ధరలు పెరగడం, ఆహార ద్రవ్యోల్బణం కూడా భారీగా పెరగడంతో.. దాన్ని తగ్గించేందుకు పప్పు ధాన్యాల సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. వరికి కనీస మద్దతు ధరను పెంచుతున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం.. కందులు క్వింటాల్‌కు 4 వేల 625 రూపాయలు, పెసర్లు, మినుములకు 4 వేల 850 చొప్పున ధర నిర్ణయించారు. దీంతోపాటు అదనగా 2 వందల రూపాయల బోనస్‌ కూడా ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సారైనా పప్పుల ధరలు తగ్గేనా..?
ఈ ప్రకటనతో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఖరీఫ్‌లో అపరాలనే అధికంగా సాగుచేస్తున్నట్టు కేంద్ర నివేదిక వెల్లడించింది. మొత్తానికి పప్పుధాన్యాల సాగు పెరిగింది. అయితే.. బహిరంగ మార్కెట్లో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న పప్పుల ధరలు ఈ సారైనా దిగిస్తాయో లేదో చూడాలి.

13:38 - July 20, 2015

కృష్ణా : విజయవాడ భవానీ ద్వీపం టూరిస్టులతో కళకళలాడుతోంది.. బోట్‌లో బఫె బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ అంటూ ప్రవేశపెట్టిన కొత్త ప్యాకేజీలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.... కృష్ణానదిలో పరవళ్ల మధ్య ఊగుతూ... చల్లని పిల్లగాలులమధ్య క్యాండిల్ లైట్ డిన్నర్... ఈ అనుభవం ఎప్పటికీ మరచిపోలేమంటున్నారు టూరిస్టులు.. ఈనెల 14నుంచి ఈ కొత్త స్కీంను అమల్లోకి తెచ్చారు నిర్వాహకులు..
ఉదయం ఏడున్నరగంటలనుంచి బ్రేక్ ఫాస్ట్
మధ్యతరగతివారికికూడా అందుబాటు ధరలో ఈ స్కీం ప్రవేశపెట్టింది ఏపీటిడిసీ .. విజయవాడ భవానీపురం పున్నమి రిసార్ట్స్ నుంచి భవానీ ద్వీపం వరకు ఉదయం ఏడున్నరగంటలనుంచి బ్రేక్ ఫాస్ట్... రాత్రి 8నుంచి 9గంటలవరకూ డిన్నర్ అందుబాటులో ఉంచుతున్నారు.. బ్రేక్‌ఫాస్ట్‌ ఆఫర్‌ పెద్దవాళ్లకు 150, చిన్నపిల్లలకు 100 రూపాయలు చెల్లించాలి..
పెద్దవాళ్లకు రూ. 300, పిల్లలకు రూ. 200....
ఇక రాత్రి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలంటే పెద్దవాళ్లు 300.... పిల్లలు 200 రూపాయలు చెల్లించాలి.. ఈ సమయంలో స్పెషల్ మ్యూజిక్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌తో ప్రయాణిస్తూ.. కబుర్లు చెప్పుకుంటూ... నదిమధ్యలో సేదతీరే ఈ రెండు ఆఫర్లు చాలా బాగున్నాయంటున్నారు పర్యాటకులు.. నగరవాసులేకాదు.. దూరప్రాంతాలవాళ్లుకూడా ఈ ప్యాకేజీపై ఆసక్తిచూపుతున్నారు..
రోజుకు రూ. 15 నుంచి 20 వేల ఆదాయం....
ఈ సరికొత్త ఆఫర్లు టూరిజం శాఖకు మంచి ఆదాయాన్ని సమకూర్చుతోంది.. రోజుకు దాదాపు 15 వేల నుంచి 20 వేలవరకూ అదనంగా ఆదాయం వస్తోందని అధికారులు చెబుతున్నారు.. ఇక వారాంతాలు... సెలవురోజుల్లోఅయితే 35 వేల నుంచి 50 వేల రూపాయలు సమకూరుతోందని.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. రాజధాని పనులు వేగవంతమైన తర్వాత భవానీ ద్వీపానికి ఆదరణ మరింత పెరిగింది.. పుష్కరాల ప్యాకేజీలకు డిమాండ్ కొనసాగుతోంది.. అందుకే ఇలాంటి మరికొన్ని కొత్త ప్యాకేజీలను త్వరలో ప్రకటిస్తామంటున్నారు నిర్వాహకులు..

13:35 - July 20, 2015

హైదరాబాద్: తలసాని రాజీనామా విషయంలో కేసీఆర్‌ గవర్నర్‌ను తప్పుదారి పట్టించారని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... తలసానిని మంత్రి పదవి నుంచి ఇప్పటికైనా బర్తరఫ్ చేయాలన్నారు. తలసాని వ్యవహారంలో త్వరలో గవర్నర్‌ను కలిసి.. చర్యలు తీసుకునే వరకూ అక్కడే కూర్చుంటామన్నారు. 

13:33 - July 20, 2015

హైదరాబాద్: ఏపీ కాంగ్రెస్‌ నేతలకు చురకలంటించారు టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రాహుల్‌ పర్యటనతో నిద్ర మేల్కొనేది టీడీపీ ప్రభుత్వం కాదని..దేశంలో చచ్చిపోయిన పార్టీ మాకు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. రాహుల్‌ను ప్రధాని చేయాలన్న లక్ష్యంతో హడావుడిగా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై గొంతుచించుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు.. ఆనాడే ఆర్డినెన్స్‌ ఎందుకు తేలేదని ప్రశ్నించారు.

 

13:32 - July 20, 2015

విజయనగరం: జిల్లా కలెక్టరేట్‌లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసాడు. ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ మూలకు రైతు స్పృహ తప్పి పడి ఉండటాన్నిఅధికారులు గమనించారు. తీరా చూస్తే నోటి వెంట నురుగులు కక్కుతున్నాడు. దీంతో హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. రైతు దగ్గరున్న వివరాల ప్రకారం బాధితుడు ఉత్తరావల్లి గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది. అయితే ఆత్మహత్యాయత్నానికి మాత్రం ఇంకా వివరాలు తెలియరాలేదు.

శ్రీశైలం సమీపంలో లోయలో పడ్డ బస్సు...

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేటు టూరిస్టు బస్సు అదుపుతప్పి 30 అడుగుల లోతులో పడి పోయింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.

మోతెలో పుష్కరస్నానం చేసిన గవర్నర్ దంపతులు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతె గ్రామం వద్ద గోదావరి లో పుష్కరస్నానం చేశారు.

'తొక్కిసలాట' ఘటనపై ఏపీ సర్కార్ కు నోటీసులు

హైదరాబాద్: రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తొక్కిసలాట ఎలా జరిగింది, ప్రమాదానికి కారకులెవరు, ఎలాంటి సహాయచర్యలు తీసుకున్నారంటూ నోటీసుల్లో ప్రశ్నించింది. నోటీసులకు సమాదానం చెబుతూ కౌంటర్ దాఖలు చేయాలని వారం గడువు విధించింది. ఈ ఉదయం న్యాయవాది రఘునందన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. 

భూసేకరణ బిల్లును ప్రవేశపెడతాం: ప్రధాని

ఢిల్లీ:పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాల్లో భూసేకరణ బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందేలా అన్ని పార్టీలు సహకరించాల్సిన అవసరముందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు విపక్షాలపై కూడా ఉందని తెలిపారు. అన్ని సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవాలని చెప్పారు. 

12:55 - July 20, 2015

హైదరాబాద్ : కర్నూలు పాతబస్తీలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికను నిర్బంధించి హత్యాచారం చేశాడో ప్రబుద్దుడు. ఖడక్‌పుర వీధిలో నివాసముంటున్న ఖాజాబాష అనే వ్యక్తి తన ఇంటి వద్దకు వచ్చిన బాలికను రెండు రోజులుగా తన గదిలో బంధించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి బాలికను వదిలివేయడంతో.. ఆమె తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, బంధువుల నిందితుడు ఖాజా బాషకు దేహశుద్ధి చేశారు.  

12:53 - July 20, 2015

శ్రీకాకుళం: ఓ బట్టల షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మూడు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. పాలకొండ రోడ్‌లోని సిటి సెంట్రల్‌ షాపింగ్‌ మాల్‌లో ఈ ఘటన జరిగింది. సుమారు 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం చెబుతోంది. రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది 2 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చింది. షాప్‌ యాజమానులు పుష్కరాలకు వెళ్ళడంతో.. తాళాలు అందుబాటులో లేక సకాలంలో మంటలు అదుపుచేయలేకపోయారు.  

12:51 - July 20, 2015

విశాఖ: మారికవలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఢీకొన్న బస్సు సమీపంలోని గోతిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.

 

12:49 - July 20, 2015

హైదరాబాద్: వివాదాస్పద భూ సేకరణ బిల్లుపై మోడీ సర్కార్ మళ్లీ మల్లగుల్లాలు పడుతోంది. మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపట్టే అంశంపై వెనకడుగు వేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక ఆలస్యం అవుతుండటం, సవరణలపై విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో... మరోసారి ఆర్డినెన్స్ జారీకే కేంద్రం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ బిల్లుపై మూడుసార్లు ఆర్డినెన్స్ జారీ చేసింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లును చట్ట రూపంలోకి తీసుకురావడం ఎన్డీఏ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీంతో ప్రతిసారీ ఆర్డినెన్స్ లను ఆశ్రయించక తప్పడం లేదు.
వచ్చేనెల 3న జేపీసీ రిపోర్ట్....
రాజ్యసభలో మోడీ సర్కార్ కు తగినంత బలం లేకపోవడం, విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో వస్తున్న వ్యతిరేకతతో.. బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఏ మాత్రం లేవు. అంతే కాకుండా... బిల్లులోని వివాదాస్పద అంశాలను పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను వచ్చేనెల 3న సమర్పించే అవకాశాలున్నాయి. బిజెపి ఎంపీ ఎస్ ఎస్ అహ్లువాలియా నేతృత్వంలోని ఈ కమిటీకి ఇప్పటివరకు 672 వినతిపత్రాలు రాగా... అందులో 670 వినతులు చట్టానికి వ్యతిరేకంగా వచ్చాయి. మరోవైపు నివేదిక కేంద్రం చేతికి వచ్చే నాటికి సమావేశాలు పూర్తి కానున్నాయి. దీంతో ముచ్చటగా నాలుగోసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ఎన్డీఏ సర్కార్ సిద్ధమైనట్టు సమాచారం. బీహార్ ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వానికి ఈ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చే ఉద్దేశ్యం లేదని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇలా ఆర్డినెన్సులు జారీ చేయటం కొత్తేమీ కాదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. యూపీఏ సర్కార్ ఎస్సీ బిల్లుపై 3సార్లు ఆర్డినెన్సులు తీసుకొచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు.

12:46 - July 20, 2015

హైదరాబాద్: హోరాహోరీ పోరులో విజేతగా నిలిచి జయకేతనం ఎగురవేయాలనేది అతని ఆకాంక్ష. అందుకే మరణమృదంగాన్ని వినిపించే సముద్రానికి సవాల్ విసిరాడు. ఎగసిపడే కెరటాలతో ధీటుగా పోటీ పడుతున్నాడు. విజయతీరానికి చేరువవుతున్న తరుణంలో మృత్యువు కోరలు చాచేందుకు ప్రయత్నించింది. అమాంతం మింగేసేందుకు ఒక్క ఉదుటున వచ్చింది. మరి ఇద్దరిలో ఎవరు గెలిచారు..?
సౌత్‌ ఆఫ్రికాలోని జెఫ్రీస్‌ బే మహాసముద్రం...
సౌత్‌ ఆఫ్రికాలోని జెఫ్రీస్‌ బే మహాసముద్రం....తీరాన్ని తాకేందుకు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.....అయినా సరే సముద్రానికే సవాల్ విసిరి విజేతగా నిలిచేందుకు కాకలు తీరిన సర్ఫర్లు పోటీ పడుతున్నారు. ఎలాగైనా సరే సర్ఫింగ్‌లో సత్తా చాటాలని మిక్‌ ఫేనింగ్ అనే ఆస్ట్రేలియన్‌ సర్ఫర్‌ అలలతో ఆటలాడుకుంటున్నాడు.
మిక్‌ను ఎటాక్‌ చేసిన షార్క్‌...
జేబే సర్ఫింగ్‌ ఫైనల్స్‌లో మిక్‌ మరికాసేపట్లో విజేతగా అవతరించే తరుణం ఆసన్నమైంది. ఇంతలోనే వాయువేగంతో వచ్చిన ఓ షార్క్‌ మిక్‌ను ఎటాక్‌ చేసింది. పదునైన కోరలతో మిక్‌ను గాయపరిచేందుకు ప్రయత్నించింది. అదీ కుదరకపోవడంతో అమాంతం నోట కరుచుకుని వెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేసింది.
పై చేయి సాధించిన మిక్‌.....
కానీ షార్క్‌దాడి నుంచి మిక్‌ వెంటనే తేరుకున్నాడు. మహమ్మారి షార్క్‌ బారినుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. ఈ టగ్‌ ఆఫ్‌ వార్‌లో ఎట్టకేలకు మిక్‌ పై చేయి సాధించాడు. ఆకలి తీర్చుకుందామనుకున్న షార్క్‌ ప్రయత్నం కాస్తా బెడిసికొట్టడంతో మెల్లగా జారుకుంది.
మృత్యువు నుంచి బయటపడేందుకు...
షార్క్‌ దాడి, మృత్యువు నుంచి బయటపడేందుకు మిక్‌ తండ్లాట చూసిన రెస్క్యూటీం హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకుంది. వెంట్రుక వాసిలో చావు తప్పించుకున్న మిక్‌ను వెంటనే అక్కడి నుంచి తప్పించింది. మొత్తానికి షార్క్ ఎటాక్‌ నుంచి మిక్‌ సురక్షితంగా బయటపడటంతో ఆయన కుటుంబ సభ్యులే కాదు సర్ఫింగ్‌ క్ర్యూ ఊపిరి పీల్చుకున్నారు. మిక్ నువ్వు మృత్యుజయుండివి అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

12:42 - July 20, 2015

ఢిల్లీ: నిన్నటి వరకు ఎండలతో ఠారెత్తిపోయిన ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై దాదాపు అరగంట పాటు భారీ వర్షం కురిసింది. ఇప్పుడు కూడా ఓ మోస్తరు వర్షం పడుతోంది. ఉక్కపోతతో అల్లాడిపోయిన ఢిల్లీ వాసులు చిరుజల్లుల పలకరింతకు మైమరిచిపోయారు. వాతావరణంలోని అనూహ్యమార్పును ఎంజాయ్‌ చేస్తున్నారు.

12:41 - July 20, 2015

హైదరాబాద్: సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ "భజ్ రంగీ బాయీజాన్" కొత్త రికార్డు నెలకొల్పింది. మూడురోజుల్లోనే వందకోట్లు కలెక్ట్‌ చేసి బాక్సాఫీసును షేక్ చేసింది. నిన్నటి వరకు ఈ మూవీ 102కోట్ల 60లక్షలు వసూళ్లు చేసింది. తొలిరోజు 27కోట్లను కొల్లగొట్టిన భజ్ రంగీ.. శని, ఆదివారాల్లో 75కోట్ల 60లక్షలను తన ఖాతాలో వేసుకుంది. మూవీని రిలీజ్ చేసిన ఎరోస్.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 

గవర్నర్ ను తప్పుదోవ పట్టించిన కేసీఆర్: ఎర్రబెల్లి...

హైదరాబాద్: తలసానికి మంత్రి పదవి ఇచ్చే క్రమంలో, గవర్నర్ ను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఆలుగడ్డల శీనుకు సిగ్గు, శరం లేదని ఎద్దేవా చేశారు. రాజీనామా చేశానని తలసాని చేసిన ప్రకటన అంతా అబద్దమే అని తేలిపోయిందని అన్నారు. ఈ తప్పుడు పనికి తలసానితో పాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారిలు కూడా బాధ్యత వహించాలని చెప్పారు. తప్పుడు పని చేసిన తలసానిని రాజకీయాల నుంచి బహిష్కరించాలని... ఆయనను బర్తరఫ్ చేయడం ద్వారా గవర్నర్ పదవికున్న గౌరవాన్ని నరసింహన్ కాపాడాలని డిమాండ్ చేశారు. 

కుందుకూరు ఆర్డీవో ఆఫీసు ముందు దళితుల ఆందోళన

ప్రకాశం:కుందుకూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట సామాజిక బహిష్కరణకు గురైన పందలపాడు దళితులు ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు.

విజయనగరం కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్య...

విజయనగరం:భూసమస్య పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ వద్ద రైతు వెంకట సూర్యారావు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందతూ మృతి చెందాడు. మృతుడు మెరకముడిదాం మండలం ఉత్తరవిల్లి వాసిగా గుర్తించారు.

'సెక్షన్ -8' పై పిటిషన్ ను కొట్టేసిన హైకోరు..

హైదరాబాద్: సెక్షన్ -8 అమలు చేయాలన్న పిటిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఆధారాలు లేనపుడు కొంత సొమ్మును డిపాజిట్ చేసి పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం పిటిషన్ ను ఉపసంహరిచుకుంది.

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ పింకూ అరెస్టు

కడప: ఢిల్లీలో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ పింకూ కడప టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.  

రైల్వే మాజీ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య

శ్రీకాకుళం: సమస్యలతో మనోవేదన చెందిన ఓ రైల్వే మాజీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగింది. ఆర్‌ సంజీవరావు అనే 60 ఏళ్ల మాజీ రైల్వే ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వేపోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం:ఏడుగురు మృతి

విశాఖ:జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మధురవాడలోని మారికవలస దగ్గర వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఓ ఆటోను ఢీకొని 50 అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లంది.  ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

ప్రత్యూష కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా...

హైదరాబాద్: సవతితల్లి, తండ్రి చేతిలో తీవ్రచిత్రహింసలకు గురైన ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రత్యూష్‌ కేసు విచారణను హైకోర్టు వచ్చేవారానికి వాయిదా వేసింది.  ప్రత్యూష ప్రస్తుతం కోర్టుకు వచ్చే పరిస్థితి లేనందున విచారణను ధర్మాసనం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

 

సుందర్ బాన్స్ అడవుల్లో టూరిస్టును లాక్కెళ్లిన పెద్దపులి..

పశ్చిమ బెంగాల్ :సుందర్ బాన్స్ అభయారణ్యంలోని ఓ పెద్దపులి టూరిస్టును లాక్కెళ్లింది. ఈ ఘటనలో తన సోదరుడిని కాపాడేందుకు ప్రయత్నించిన యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అడవుల్లో పర్యటనకు 24 పరగణాల జిల్లా, కుల్తాలీ ప్రాంతానికి చెందిన బాదల్ నాస్కార్, సుప్రియో నాస్కార్ అనే సోదరులు వచ్చారు. వారు అజాగ్రత్తగా ఉండడంతో, బాదల్ పై దాడి చేసిన ఓ పెద్దపులి అతని మెడను పట్టుకుని అడవుల్లోకి లాక్కెళ్లింది. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన సుప్రియోపై తన పంజా విసిరింది. తీవ్రగాయాల పాలైన సుప్రియోను ఆసుపత్రికి తరలించారు.

ఓఎంసీ కేసు విచారణ వచ్చే నెల 3కి వాయిదా...

హైదరాబాద్: ఓఎంసీ కేసు విచారణ వచ్చేనెల 3కు వాయిదా పడింది. ఈ కేసులో నిందితులు గాలి జనార్థన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, కృపానంద, అలీఖాన్, రాజగోపాల్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.

 

'తొక్కిసలాట' ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో ప్రారంభం రోజు తొక్కిసలాట జరిగి 27 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

11:25 - July 20, 2015

సల్మాన్‌ఖాన్‌ కెరీర్‌లోనే 'భజరంగీ భాయిజాన్‌' ఉత్తమ చిత్రం. సల్మాన్ ఈ సినిమాలో తన నటనతో నన్ను ఏడ్పించాడు. ఈ సినిమాలో సల్మాన్ అదరగొట్టేశాడంటూ బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. ఆదివారం ముంబైలో అమీర్‌ ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం, 'ఇప్పటివరకు సల్మాన్‌ నటించిన సినిమాల్లో 'భజరంగీ..' ద బెస్ట్‌, మంచి కథ, సంభాషణలు, కబీర్‌ఖాన్‌ చాలా బాగా ఈచిత్రాన్ని తెరకెక్కించారంటూ' ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 
పన్ను మినహాయింపు ఇవ్వండి : సల్మాన్‌ఖాన్‌
        తాజాగా నటించిన 'భజరంగీ' చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని సల్మాన్‌ఖాన్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సినిమా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలని కోరుకుంటున్నానని, అయితే పన్ను మినహాయింపు ఇస్తే సినిమా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం వినియోగించినట్లే అవుతుందని సల్మాన్‌ అభిప్రాయపడ్డారు. కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన 'భజరంగీ భాయిజాన్‌' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ పాకిస్థాన్‌ బాలిక తన సొంత ఇంటికి చేరుకునేందుకు ఓ భారతీయుడు సహాయం చేసే నేపథ్యంలో తీసిన ఈ చిత్రానికి పాజిటివ్‌ సమీక్షలతోపాటు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని సామాజిక కోణంలో చూడాలని భారత, పాక్‌ ప్రధానులు నరేంద్రమోడీ, నవాజ్‌ షరీఫ్‌లకు సల్మాన్‌ విజ్ఞప్తి చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన సల్మాన్‌ 'భజరంగీ...' తొలి రోజు ఏకంగా 27.25 కోట్ల రూపాయల్ని వసూలు చేయడం విశేషం.

11:16 - July 20, 2015

హైదరాబాద్:బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. అంతర్జాతీయంగా సేల్స్ రోజురోజుకు పడిపోతున్నాయి. డాలర్ విలువ పెరుగుతుండటం, అమెరికాలో వడ్డీరేట్లు పెరుగుతాయన్న అంచనాలు, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఆర్డర్లు తగ్గడంతో... పుత్తిడి మెరుపులు తగ్గుతున్నాయి. దీంతో బంగారం ధర అంతర్జాతీయంగా ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఔన్స్ ధర ఈవారం 11వందల 33 డాలర్ల వద్ద ముగిసింది. అంటే ఓ రకంగా 2010 ఏప్రిల్ నాటి ధరల స్థాయికి పసిడి దిగివచ్చింది.
అమెరికాలో అన్ ఎంప్లాయ్ మెంట్ గ్రాఫ్ తగ్గుతుండటం....
అమెరికాలో అన్ ఎంప్లాయ్ మెంట్ గ్రాఫ్ తగ్గుతుండటం, గ్రీస్, చైనా ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడడం, ఇరాన్ అణు ఒప్పందం వంటి కారణాలతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు మళ్లీ గాడినపడ్డాయి. దీంతో సురక్షిత పెట్టుబడిగా పేరున్న బంగారంపై ఇన్వస్టర్ల చూపు మరలింది. అయితే ధర తగ్గినా.. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి కొనుగోళ్లు ఏమాత్రం పుంజుకోవడం లేదు. జులైలో ముహూర్తాలు లేకపోవటంతో జ్యూయలరీ సేల్స్ 20శాతం వరకు తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా 24క్యారెట్ 10గ్రాముల ధర 25వేల 900. అటు వెండి ధర కూడా 35వేలకు పడిపోయింది.
కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన గోల్డ్ బాండ్స్ స్కీమ్ తో.....
వచ్చే 6నెలల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు బులియన్ నిపుణులు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన గోల్డ్ బాండ్స్ స్కీమ్ తో ఫిజికల్ గా బంగారం దాచుకోవాల్సిన అవసరం లేదు. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుండటంతో.... ఆ దేశ కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్లు పెంచితే.. మళ్లీ డాలర్ విలువ పెరుగుతుంది. ఆ ప్రభావంతో బంగారం ధర మరింత తగ్గుతుందంటున్నారు నిపుణులు. అయితే ఇప్పటికే బులియన్ ధరలు అట్టడుగు స్థాయికి చేరినందున... మళ్లీ రికవరీ ఉంటుందని అంచనావేస్తున్నారు మరికొందరు నిపుణులు. 

11:13 - July 20, 2015

హైదరాబాద్:సమస్యలు తీర్చడం లేదంటూ గ్రామస్థులు ఎమ్మెల్యేను కుర్చీకి కట్టేసి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి వచ్చి, గెలిచి ,ఎమ్మెల్యే అయ్యాక నియోజక వర్గం ముఖం చూడని ప్రజాప్రతినిధులను నిలదీయాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ పనిని వినూత్న రీతిలో చేశారు చాందౌలీ గ్రామ ప్రజలు. తన నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకోడానికి బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే బబ్బన్ సింగ్ చౌహన్ పర్యటనకు వెళ్లగా ప్రజలు ఆయనకు గట్టి షాక్‌ ఇచ్చారు.
బబ్బన్‌ సింగ్‌ చౌహాన్‌ ముఘల్‌ సరాయ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే......
బబ్బన్‌ సింగ్‌ చౌహాన్‌..ఆయనొక ఎమ్మెల్యే. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ముఘల్‌ సారాయ్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీఎస్పీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి. అయితే ప్రజా సమస్యలపై ఆరా తీద్దామని చాందౌలీ గ్రామంలో మూడో వార్డుకు వెళ్లారు. ఇక్కడ సదరు ఎమ్మెల్యేకు దిమ్మతిరిగే ప్రతిఘటన ఎదురైంది. తమ నియోజక వర్గంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆగ్రహించిన గ్రామస్తులు ఈ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ప్రధానంగా గ్రామంలో నిత్యావసరాలైన తాగు నీరు, విద్యుత్‌ లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తమను పట్టించుకునే నాథుడే లేడంటూ తీవ్ర ఆందోళన చేపట్టారు.
ఎమ్మెల్యేను, కౌన్సిలర్‌ను తాళ్లతో కట్టేసి అక్కడే నిర్బంధించిన గ్రామస్తులు....
అంతటితో ఆగకుండా ఆ ఎమ్మెల్యేను, కౌన్సిలర్‌ను తాళ్లతో కట్టేసి అక్కడే నిర్బంధించారు. తమ సమస్యకు అక్కడే తక్షణ పరిష్కారం చూపాలని నిలదీశారు. గతంలో గ్రామానికి 80 లక్షల రూపాయల నిధులు మంజూరు అయినా ఇప్పటి వరకూ పనులు ఎందుకు చేపట్టలేదని గ్రామస్థులు ఎమ్మెల్యేను నిలదీశారు.
ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఎస్పీ....
ఎమ్మెల్యేను, కౌన్సిలర్‌ను తాళ్లతో కట్టేసిన సమాచారం అందుకున్న ఎస్పీ ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడి ఎమ్మెల్యేను, కౌన్సిలర్‌ను గ్రామస్తుల నిర్బంధం నుంచి విడిపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోనే గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే బబ్బన్‌ సింగ్‌ చౌహాన్‌ మాత్రం గ్రామస్తులపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఎస్పీ వివరించారు. 

శ్రీకాకుళం సిటీ సెంట్రల్ షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం...

శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని పాలకొండ రోడ్డు వద్ద సిటీ సెంట్రల్ షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మూడు అంతస్తుల్లో వున్న వస్త్రాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వలేల్ ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఎసీబీ కార్యాలయానికి తెలుగు యువత నేతలు...

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు నిన్న ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్న టీడీపీ యువజన విభాగం తెలుగు యువత నేతలు ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్, పుల్లారావు యాదవ్ లు కొద్దిసేపటి క్రితం బంజారా హిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసులో టీడీపీ యువ నేత నారా లోకేశ్ ప్రమేయాన్ని రాబట్టేందుకే ఏసీబీ అధికారులు యత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. మరికాసేపట్లో ఈ నలుగురిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. విచారణలో సంధించాల్సిన ప్రశ్నావళిని కూడా ఇప్పటికే ఏసీబీ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.  

10:56 - July 20, 2015

ఢిల్లీ:పార్లమెంట్‌ సమావేశాలు మంగళవారం ప్రారంభంకానున్న... నేపథ్యంలో కాసేపట్లో వెంకయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. సభ సజావుగా జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని వెంకయ్య ప్రతిపక్షాలను కోరనున్నారు.

10:52 - July 20, 2015

హైదరాబాద్:సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా వామపక్షాలు తలపెట్టిన బస్సుయాత్ర ప్రారంభమైంది. సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 5రోజుల పాటు 9జిల్లాల్లో కొనసాగుతుంది. భరోసా యాత్ర పేరుతో ప్రారంభమైన ఈ యాత్రలో కార్మికుల సమస్యలను తెలుసుకుంటామని, వాటిని పరిష్కరించేందుకు తీవ్రంగా పోరు చేస్తామని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు...

10:15 - July 20, 2015

భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పాడ్డాయి. తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ప్రభుత్వం ఏర్పాడ్డాయి. వీరి పాలన జరిగి ఏడాది దాటిపోయింది. ఆయా రాష్ట్రాల పరిపాలన ఎలా ఉంది ? ఉభయ రాష్ట్రాల్లో సామాజిక, ఆర్థిక విధానాలు..అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాలు ఏ విధంగా ఉన్నాయి. ? రెండు రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు సమగ్ర అభివృద్ధి నమూనా ఏ విధంగా ఉండాలి ? రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు..ప్రత్యామ్నాయ విధానాలపై టెన్ టివిలో 'టాక్ షో విత్ రాఘవులు' లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విశ్లేషించారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియోలో చూడండి..

లారీ ఢీకొన్ని బీటెక్ విద్యార్థి మృతి

హైదరాబాద్: లారీ ఢీకొని ఓ బీటెక్ విద్యార్థి మృతిచెందాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ నగరం కుషాయిగూడలో గల ఎ.ఎస్.రావు నగర్‌లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రాజమండ్రికి చేరుకున్న సింగపూర్ బృందం

హైదరాబాద్: బేగం పేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం రాజమండ్రికి చేరుకుంది. ఓ ప్రైవేటు హోటల్ లో సీఎం చంద్రబాబుతో సింగపూర్ బృందం భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీడ్ కేపిటల్ బృహత్తర ప్రణాళికను చంద్రబాబుకు ఈశ్వరన్ అందజేయనున్నారు.

తోట్లవల్లూరులో గోడకూలి ఓ వ్యక్తి మృతి

కృష్ణా: తోట్లవల్లూరులో మండల కేంద్రంలో ఓ పాత భవనాన్ని కూలుస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కటారి వెంకటేశ్వరరావు(55) అనే వ్యక్తిపై పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

09:43 - July 20, 2015

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో రహదారులు రక్తమోడాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు.నెల్లూరు జిల్లాలో ఆగి ఉన్న బస్సును లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చిత్తూరు నుంచి పుష్కరాలకు వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది.
గుంటూరు రూరలో మండలం చోడవరంలో...
గుంటూరు రూరలో మండలం చోడవరం 16వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ముగ్గురు చనిపోయారు. వీళ్లంతా గోదావరి పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరి, దర్శి ప్రాంతానికి చెందిన 10 మంది టాటా ఏస్‌ వాహనంలో పుష్కరాలకు రాజమండ్రికి వెళ్లి తిరిగివస్తున్నారు. చోడవరం ప్రాంతంలో ఆగి ఉన్న లారీని టాటా ఏస్‌ వాహనం ఢీకొట్టింది. దీంతో డ్రైవరుతో సహా వెనుక ఉన్న మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

09:39 - July 20, 2015

మెదక్‌:సిద్దిపేటలో ఘోర ప్రమాదం జరిగింది. కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఏపీ15జడ్ 0012 బైక్‌ సిద్దిపేట వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో బైక్‌ పెట్రోల్ ట్యాంక్‌ పేలి మంటలు అంటుకున్నాయి. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకులు ఇమ్రాన్‌, సోహైల్‌ సజీవదహనమయ్యారు. ఇమ్రాన్‌ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రగాయాలపాలైన సోహైల్‌ స్థానిక ఏరియాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

ప్రత్యూషకు మరో వారం పాటు విశ్రాంతి అవసరం:వైద్యులు...

హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై ఎల్బీనగర్ పోలీసులకు గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు నివేదిక అందించారు. ప్రత్యూషకు మరో వారం పాటు విశ్రాంతి అవసరం అని ఆ నివేదికలో వైద్యులు తెలిపారు.

కాసేపట్లో వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ

హైదరాబాద్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి విధానాలకు నిరసనగా సుందరయ్య విజ్ఞాన కేంద్ర నుండి ఇందిరా పార్క్ వరకు వామపక్షాలు ర్యాలీ నిర్వహించనున్నాయి.

రాజమండ్రి లో పుష్కర స్నానం చేసిన గవర్నర్ దంపతలులు

తూ.గో:తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తన సతీమణితో కలసి వచ్చి రాజమండ్రిలోని సరస్వతీ విఐపీ ఘాట్ లో పుష్కరస్నానం చేశారు. నడుములోతు ఉన్న నీటిలో దిగి సంకల్పం చెప్పుకుని, మూడుసార్లు గోదావరి నీటిలో మునిగిన ఆయన, సూర్యనమస్కారాలూ చేశారు. ఆయనకు స్వాగతం పలికిన అధికారులు గవర్నర్ దంపతుల స్నానం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

రోడ్ కం రైల్ వంతెనపై వ్యాన్ బోల్తా

ప.గో: కొవ్వూరు- రాజమండ్రి రోడ్ కం రైల్ వంతెనపై ఈ రోజు ఉదయం వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా పుష్కర స్నానాలు చేసేందుకు వచ్చినట్లు సమాచారం.

కేసీఆర్ నియంతృత్వం రోజు రోజుకు పెరిగిపోతోంది:తమ్మినేని

హైదరాబాద్: కేసీఆర్ నియంతృత్వం రోజు రోజుకు పెరిగిపోతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.. పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, ఉపాధి హామీ సిబ్బంది సమ్మెకు మద్దతుగా 10 వామపక్ష పార్టీలు చేపట్టిన బస్సు యాత్ర సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ... విభజించు.. పాలించు విధానాన్ని కేసీఆర్ అవలంభిస్తున్నారని మండి పడ్డారు. కార్మికులకు వామపక్షాలు అండగా ఉంటాయని స్పష్టం చేశారు.

భూ బిల్లు పై సందిగ్ధంలో కేంద్రం!

ఢిల్లీ: కీలకమైన భూసేకరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. బీహార్, పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపథ్యంలో భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టే అంశంపై వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాసేపట్లో ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం

ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు అఖిల పక్ష సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి వెంకయ్య అధ్యక్షత వహించే ఈ సమావేశంలో సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని, బిల్లుల ఆమోదంపై చర్చలకు సహకరించాలని ప్రతిపక్ష నేతలను వెంకయ్య కోరనున్నారు.

ఎమ్మెల్యే భర్త అరెస్ట్...రెండు వారాల రిమాండ్...

విశాఖ:పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుతో భర్త శివప్రసాద్ ను విశాఖ మూడో పట్టణ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. శివప్రసాద్ కు న్యాయమూర్తి రెండు వారాల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు జైలుకు తరలించారు. తాను ఇంటిలో లేని సమయంలో వచ్చి విలువైన డాక్యుమెంట్లతో పాటు తన కొడుకును కూడా అపహరించుకుని వెళ్లేందుకు శివప్రసాద్ యత్నించాడని ఎమ్మెల్యే అనిత పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె భర్త శివప్రసాద్ ను నిన్న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

08:39 - July 20, 2015

పార్లమెంట్ సమావేశాల్లో వివాదాస్పద భూబిల్లు ను మోడీ ప్రభుత్వం నాలుగోసారి ఆర్డినెన్స్ రూపంలో తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ది హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ అన్నారు. రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. లలిత్ మోడీ, సుష్మాస్వరాజ్, వ్యాపం కుంభకోణం ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదు? కీలకమైన బొగ్గు కేటాయింపు, స్పెక్ట్రమ్ కేటాయింపులో అవినీతి సంపూర్ణ చర్చ జరగకుండా గతంలో నిత్యం ఎన్డీయే పార్లమెంట్ ను స్తంభింప చేసిందా? భయంకరమైన వ్యాపం కుంభకోణంపై మోదీ ఎందుకు నోరు ఎత్తడంలేదు. సుప్రీం కోర్టు ఆదేశించే వరకు సిబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదు? మంత్రి తలసాని రాజీనామా విషయంలో గవర్నర్, మీడియాను తప్పుదోవ పట్టించారా? ఒక పార్టీకి చెందిన వ్యక్తి మరో పార్టీలో మంత్రిగా ఎలా కొనసాగుతున్నారు? స్పీకర్ వ్యవస్థపై కూడా చర్చించాలి? స్వచ్ఛందంగా పదవికి రాజానామా చేయడం అంటే? భారత దేశంలో పాపభీతి పెరుగతోందా? పుష్కరాలపై ప్రభుత్వాలు బాగా మార్కెటింగ్ చేశాయా? ఇత్యాది విషయాలపై నాగేశ్వర్ విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు. మరి ఆ విశ్లేషణాత్మక చర్చను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

కాసేపట్లో రాజమండ్రికి సింగపూర్ బృందం

హైదరాబాద్:నవ్యాంధ్ర రాజధాని ప్రణాళికను రూపొందించిన సింగపూర్ ప్రతినిధి బృందం ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలో నేటి తెల్లవారుజామున హైదరాబాదు చేరుకుంది. మరికాసేపట్లో సదరు బృందం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ప్రత్యేక విమానంలో బయలుదేరనుంది. అక్కడ పవిత్ర గోదావరిలో పుష్కర స్నానం చేసిన అనంతరం రాజధాని ప్రణాళికను చంద్రబాబు చేతిలో పెట్టనుంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమ ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.  

07:58 - July 20, 2015

హైదరాబాద్: కేంద్ర కార్మిక సంఘాలతో ప్రధాని మోదీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మె నోటీసు ఇవ్వకుండా కార్మిక సంఘాలు సమ్మెను చేపట్టాయా? కార్మిక సమస్యల పరిష్కారానికై 12 ట్రేడ్‌ యూనియన్లు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయా? మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదా!? చేసినా దానిని స్పీకర్‌ కార్యాలయానికి పంపలేదా!? పంపినా అది అసెంబ్లీ సచివాలయానికి చేరలేదా!? తలసాని వెనుక సీఎం కేసీఆర్ హస్తముందా? ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా కలకలం సృష్టిస్తున్న ప్రశ్నలివి! ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో బిజెపి నేత ప్రదీప్ కుమార్, మల్లు రవి కాంగ్రెస్ నేత, టిడిపి నేత సాంబశివరావు, టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, సీపీఎం నేత గఫూర్ పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

ఏడో రోజు కొనసాగుతున్న పుష్కరా స్నానాలు..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు పుష్కర స్నానాలు కొనసాగుతున్నాయి. రాజమండ్రిలోని కోటిలింగాల, కోటిపల్లిరేవు, మురమళ్ల, ముక్తేశ్వరం, రావులపాలెం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భక్తులు పుష్కర స్నానాలు చేస్తున్నారు.ప.గో జిల్లాలోని కొవ్వూరు, నర్సాపురం, సిద్ధాంతం, పట్టిసీమ లో అదే పరస్థితి కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీలో పాఠశాలలకు నేడు రేపు శెలవులు ప్రకటించారు. తెలంగాణలోని భద్రాచలం, పర్ణశాల, మోత, ధర్మపురి, కాశేశ్వరం, బాసర, పోచంపాడ తదితర పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. పుణ్య స్నానాల అనంతరం దైవదర్శనానికి బారులు తీరడంతో ఆలయాలన్నీ క్రిక్కిరిసిపోతున్నాయి.

పూంఛ్ సెక్టార్ లో పాక్ కాల్పులు

హైదరాబాద్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ రోజు ఉదయం జమ్మూకాశ్మీర్ లోని పూంఛ్ సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది.

సెప్టెంబర్‌ 2న సమ్మె యథాతధం......

ఢిల్లీ: కేంద్ర కార్మిక సంఘాలతో ప్రధాని మోదీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మిక సంస్కరణలపై మంత్రుల కమిటీతో సమావేశంలో కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినా, ప్రధానితో భేటీలో మాత్రం ఎటువంటి నిర్ణయా లూ వెలువడలేదు. దాంతో, సెప్టెంబర్‌ 2న తాము తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె నిర్ణయంలో మార్పులేదని సంఘాల నేతలు స్పష్టం చేశారు. కార్మిక సమస్యల పరిష్కారానికై 12 ట్రేడ్‌ యూనియన్లు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిని పరిష్కరించకపోతే సెప్టెంబర్‌లో సమ్మెకు దిగుతామని ప్రకటించాయి. 

రెండు బస్సులు ఢీ:45 మందికి గాయాలు...

విశాఖ: కశింకోట దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా ఎస్‌ కోట మండలం చెట్టుపల్లి వాసులని పోలీసులు చెప్పారు. గోదావరి పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

విశాఖలో హైవోల్టేజ్ తో అగ్ని ప్రమాదం...

విశాఖ:వన్‌టౌన్‌ సోల్జర్‌పేటలో హైవోల్టేజీతో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో వస్తువులు దగ్ధమయ్యాయి. చుట్టుపక్కల ఇళ్లల్లోని వస్తువులు కాలి బూడిదయ్యాయి. రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

07:21 - July 20, 2015

హైదరాబాద్:పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి కేవలం ఒక రోజు మాత్రమే మిగిలిఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో వ్యూహకర్తలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వెంకయ్య నాయుడు, సీనియర్ నేతలు హాజరయ్యారు.
నేడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ప్రధాని నరేంద్రమోడీ సమావేశం....
మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ప్రధాని నరేంద్రమోడీ నేడు సమావేశం నిర్వహించనున్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తర్వాత...ఎన్డీయే పక్షాలతో ప్రధాని మోడీ తొలిసారి సమావేశం నిర్వహిస్తుండడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో విపక్షాలను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై ఎన్డీయే పక్షాలతో చర్చించనున్నారు.
మరో 11 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది....
ఈ సమావేశాల్లో పెండింగ్‌ బిల్లుల ఆమోదమే కాకుండా నూతనంగా మరో 11 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 35 అంశాలతో వర్షాకాల సమావేశాల అజెండాను రూపొందిచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ వైఫల్యాలపై, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతిపై అధికార పక్షాన్ని పార్లమెంటులో నిలదీసేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్‌ అధినేత లలిత్‌ మోడీ వివాదంలో నిండా మునిగిన సుష్మాస్వరాజ్‌తో పాటు నకిలి విద్యార్హత వివాదంలో చిక్కుకున్న స్మృతి ఇరానీ రాజీనామా కోసం ప్రతిపక్షాలు పట్టుబడతాయి. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి బురద అంటించుకున్న ముఖ్యమంత్రులు, మంత్రులు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టే ఆలోచనలో ఉన్నాయి.
లలిత్‌ గేట్‌ కుంభకోణంలో వసుంధరా రాజే ఆరోపణలు....
ముఖ్యంగా లలిత్‌ గేట్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వసుంధర రాజేతోపాటు వ్యాపం కుంభకోణంలో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, అదనపు ఆస్తుల కేసులో ఛత్తీస్‌గడ్‌ సీఎం రమణ్‌ సింగ్‌ ల రాజీనామాలు చేయాలని ప్రతిపక్షాలు ఈ సమావేశాల్లో డిమాండ్‌ చేయనున్నాయి.
రాజ్యసభ ఎదుట తొమ్మిది, లోక్‌ సభలో నాలుగు బిల్లులు పెండింగ్‌....
ఇక బిల్లుల పాస్‌ చేయించుకునే విషయంలో రాజ్యసభలో చతికిలా పడుతోంది మోడీ సర్కారు. ప్రస్తుతం రాజ్యసభ ఎదుట తొమ్మిది, లోక్‌ సభలో నాలుగు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, జీఎస్‌టీ లాంటి ముఖ్యమైన బిల్లులను ఈ సమావేశాల్లోగా ఆమోదింపచేసుకోవాలని మోడీ సర్కారు భావిస్తోంది.  

07:16 - July 20, 2015


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని గ్రామాల్లో ఎసైన్డ్ భూములకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. దీంతో..అసైన్డ్ భూములకు ఎటువంటి ప్యాకేజీ ఇవ్వకుండానే స్వాధీనం చేసుకునేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందనే అనుమానాలు వస్తున్నాయి.
జరీబు భూములకు రూ.50వేలు....
జరీబు భూములకు 50వేలు, మెట్ట భూములకు 30 వేల రూపాయలు కౌలు చెల్లిస్తామని చెప్పడంతోపాటు.. ఎసైన్డ్ భూములకు సైతం ఎకరానికి 30వేల రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసింది. కానీ..ఇప్పటివరకు ఎసైన్డ్ భూములు సాగుచేసుకుంటున్న వారికి మాత్రం పరిహారం చెల్లించలేదు. రాజధాని గ్రామాల పరిధిలో దాదాపు 1500 ఎకరాలు ఎసైన్డ్ భూములు ఉన్నాయి. వేలాదిమంది వాటిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి నుంచి భూములను స్వాధీనం చేసుకుని, పరిహారం మాత్రం చెల్లించేందుకు ప్రభుత్వం వెనుకాడుతోంది.
పట్టాదారు భూములతో సమానంగా పరిహారం .....
దళితులు, గిరిజనులు ఎక్కువగా సాగుచేసుకునే ఎసైన్డ్ భూములే ..వారికి జీవనాధారం. ఐతే ఆ భూములు ప్రభుత్వానికి ఇచ్చేయడంతో వారికి కుటుంబం గడవడమే కష్టంగా మారుతోందని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎసైన్డ్ భూములకు పట్టాదారు భూములతో సమానంగా పరిహారం చెల్లించాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా.. రాజధాని ప్రక్రియలో మాత్రం దళితుల నుంచి తీసుకున్న భూములకు పరిహారం చెల్లించడంలేదని రైతు కూలీ సంఘం నేతలు భగ్గుమంటున్నారు.
మొత్తం రాజధాని ప్రాంతంలో.....
రాజధాని ప్రాంతంలో 2,200 ఎకరాలు ఎసైన్డ్ భూములు ఉన్నాయి. వాటిని సాగుచేసుకుంటున్న దళితులు, గిరిజనులకు ఒక్కో ఎకరానికి 800 చదరపుగజాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉంది. అంతేకాక ఎసైన్డ్ భూములకు 30వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పినా.. ఇప్పటివరకు వారికి ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దళితుల నుంచి భూములు ఇతరులకు చేతులు మారాయనే వంకతో అధికారులు జాప్యం చేస్తున్నారని సీపీఎం నేతలు విమర్శిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం బృహత్తర ప్రణాళిక రచిస్తోన్న ప్రభుత్వం , రాజధాని కోసం భూములిచ్చిన వారిని మాత్రం పట్టిచుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా....బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

07:14 - July 20, 2015

హైదరాబాద్: అంబేద్కర్ ఆలోచనలను ఆర్‌ఎస్‌ఎస్‌ వక్రీకరిస్తుందా? దళితుల ముద్దుబిడ్డగా...రాజ్యాంగ నిర్మాతగా పేరొందిన డాక్టర్‌ అంబేద్కర్‌...దళిత వ్యతిరేకి అన్న ముద్రను ఆర్‌ఎస్‌ఎస్‌ వేస్తోందా అంటే అవుననే అంటున్నారు అంబేద్కర్‌ మనవడు,.పలువురు ప్రొఫెసర్లు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధికార పత్రిక ఆర్గనైజర్‌లో అంబేద్కర్‌ను విమర్శిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ తన వక్రబుద్దిని మరోసారి ప్రదర్శించింది. బీజేపీ అండదండలతోనే ఆర్‌ఎస్‌ఎస్‌ ఇదంతా చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక అయిన ఆర్గనైజర్‌ ప్రత్యేక సంచికలో..
ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక అయిన ఆర్గనైజర్‌ ప్రత్యేక సంచిక అంబేద్కర్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌ బురదచల్లే ప్రయత్నం చేస్తోంది. ఆర్గనైజర్‌ సంచికలో అంబేద్కర్‌పై రాసిన కథనాలపై ఆయన మనవడు ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కమ్యూనిస్టులకు, ముస్లీంలకు వ్యతిరేకంగా ఉన్నారని ఆరెస్సెస్ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కావాలనే అంబేద్కర్‌పై విషప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో పర్యటనకు వచ్చిన ఆనంద్‌...హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో పాల్గొని..ఆర్గనైజర్‌ పత్రికలోని అవాస్థవాలను ప్రశ్నిస్తూ తయారుచేసిన పుస్తకాన్ని ఆనంద్ ఆవిష్కరించారు.
డాక్టర్‌ అంబేద్కర్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌ విషప్రచారం.....
ఆర్గనైజర్ పత్రికలోని అవాస్తవాలను ప్రశ్నిస్తూ తాము లేవనెత్తిన అంశాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పటివరకు స్పందించలేదన్నారు సీనియర్ న్యాయవాది బొజ్జాతారకం. తాము మొదటినుంచి ఆర్గనైజర్‌ పత్రిక రాసే కథనాలపై అనేక అనుమానాలు వ్యక్తం చేశామని..ఆ అనుమానాలన్నీ ఇప్పుడు నిజం అయ్యాయని పలువురు ప్రొఫెసర్లు అన్నారు. అంబేద్కర్‌పై కావాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ విధంగా బురదచల్లే ప్రయత్నం చేస్తోందని..ఇప్పటికైనా దీన్ని మానుకోవాలని వారు సూచించారు. అంబేద్కర్‌కు జరిగిన ఈ అవమానాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్తామని...అసత్య కథనాలపై రూపొందించిన ఈ పుస్తకాన్ని దేశంలోని మరో నాలుగు నగరాల్లో ఆవిష్కరించి ఆరెస్సెస్ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళతామన్నారు.
అంబేద్కర్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌ బురదచల్లే ప్రయత్నం....
మొత్తానికి ఆర్‌ఎస్‌ఎస్‌ తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని పలువురు వేధావులు అంటున్నారు. తన పత్రిక ద్వారా అవాస్తవాలను ప్రచురిస్తూ...అంబేద్కర్‌పై బురదచల్లే ప్రయత్నం చేస్తుందని...ఇప్పటికైనా అలాంటిదాన్ని మానుకోవాలని ప్రొఫెసర్లు సూచిస్తున్నారు. లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ను హెచ్చరిస్తున్నారు. 

07:10 - July 20, 2015

హైదరాబాద్‌ :నగర శివార్లలో బైక్‌ రేసర్లు మళ్లీ రెచ్చిపోయారు. నగరశివార్లలో పోలీసుల కళ్లుగప్పి బైక్‌రేసింగ్ నిర్వహించారు. గతంలో వారికి పోలీసుల తమదైన స్టైల్‌లో కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అయినా వారు మరోసారి రెచ్చిపోయి బైక్‌ రేస్‌లు నిర్వహించడంతో...బైక్‌రేస్‌లో పాల్గొన్న 21 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజధాని నగరం ఎన్నో దుర్మార్గాలకు అడ్డాగా....
రాజధాని నగరం ఎన్నో దుర్మార్గాలకు అడ్డాగా మారుతోంది. అందులో ఒకటి ఒకటి బైక్ రేసింగ్...ప్రాణాలతో చెలగాటమాడే ఈ వికృత క్రీడలో నగరయువత మునిగి తేలుతున్నారు. ఈ డేంజర్ గేమ్‌లో ఇప్పటికే ఎందరో గాయాలపాలయ్యారు. మరెందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరి ఆగడాలపై దృష్టిపెట్టిన నగర పోలీసులు గతంలోనే వీరి స్పీడ్‌కు బ్రేకులు వేశారు. అయినా..యువకులు పట్టించుకోలేదు. తాజాగా మళ్లీ నగరశివారులో కుర్రకారు బైక్‌ రేసింగ్ నిర్వహించారు.
దాదాపు 21 మంది బైక్‌ రేసర్ల అరెస్ట్....
నార్సింగి సమీపంలోని గండిపేట్‌ వద్ద బైక్‌రేసింగ్ నిర్వహించిన దాదాపు 21 మంది బైక్‌ రేస్లరను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 15 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌ రేసర్లలో మైనర్లు కూడా ఉన్నారు. వీరికి గతంలో పోలీసులు వీరికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. అయినా..ఈ యువకులు ఏ మాత్రం పట్టించుకున్న దాఖాలు లేవు. వీకెండ్స్‌లో కుర్రకారు జోరుకు పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయి. సూపర్ బైక్‌లపై రయ్ మంటూ దూసుకెళ్తున్నారు. బైక్ స్పీడ్ ఎంతన్నది ముఖ్యం కాదు...మెరుపు వేగంతో దూసుకెళ్లామా లేదా అన్నదే వీరి లెక్క. ఎవరు ముందు వస్తే వారికే డబ్బులు. ఇక స్టంట్స్ వేయడంలో వీరికి వీరే సాటి. రౌండుగా ఎక్కువ సేపు ఏవరు తిప్పితే వారే గ్రేట్. వారిపై బెట్టింగ్‌లు నడుస్తాయి. కొన్ని రోజులుగా వీకెండ్‌లో ఇదే తంతు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. బైక్‌ రేసింగ్‌కు పాల్పడ్డ వారి వివరాలను వారి తల్లిదండ్రులకు తెలిపి పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని నగర పోలీసులు తెలిపారు. 

07:08 - July 20, 2015

నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోగోలు మండలం కడనూతల వద్ద ఆగి వున్న రాఘవేంద్ర ట్రావెల్స్ కు చెందిన బస్సును వేగాంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా... 15 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నుండి పుష్కరాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

07:07 - July 20, 2015

హైదరాబాద్:ప్రభుత్వ విధానాలపై నిరసనగళం వినిపించేందుకు వామపక్షాలు సిద్ధమయ్యాయి. కార్మిక వ్యతిరేక వైఖరిని ఎండగట్టేందుకు సమరశంఖం పూరించాయి. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న కార్మికలోకానికి మద్దతు ప్రకటించేందుకు, సర్కారు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ప్రజలకు వివరించేందుకు లెఫ్ట్‌ పార్టీలు బస్సు యాత్ర చేపడుతున్నాయి.
కార్మిక పోరాటానికి వెన్నుదన్నుగా బస్సు యాత్ర...
ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ... జిల్లాల్లో కొనసాగుతున్న కార్మిక పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచేందుకు వామపక్ష పార్టీలు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాయి. పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ యాత్ర.. అన్ని జిల్లాలను కలుపుతూ కొనసాగనుంది.
20న నల్గొండ జిల్లాలో....
ఈ నెల 20న నల్గొండ జిల్లాలో ప్రారంభం కానున్న యాత్ర.. అదే రోజు సాయంత్రం ఖమ్మం జిల్లాకు చేరుకుంటుంది. మర్నాడు 21వ తేదీన వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో.. 22న ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో.. 23న మెదక్‌ జిల్లా సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో, 24న రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో యాత్ర కొనసాగుతుంది. అదే రోజు సాయత్రం హైదరాబాద్‌లో ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించే బహిరంగ సభతో యాత్ర ముగుస్తుంది.
సమ్మె విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై....
ఇదిలా ఉంటే... సమ్మె విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వామపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. కార్మికుల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. కేవలం జీహెచ్‌ఎంసీ కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచడమేంటని ప్రశ్నిస్తున్నాయి. కేసీఆర్‌.. రాష్ట్రానికి ముఖ్యమంత్రా..? లేక జీహెచ్‌ఎంసీకి మాత్రమేనా..? అన్నది స్పష్టం చేయాలన్న లెఫ్ట్‌ నేతలు.. ప్రశ్నించిన వారిపై ఇష్టారీతిన మాట్లాడ్డం తగదని హితవు పలుకుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే.. భవిష్యత్‌ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నేతలు హెచ్చరిస్తున్నారు.

07:04 - July 20, 2015

హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీకి మంత్రి తలసాని నుంచి తిప్పలు తప్పడం లేదు. మంత్రి వర్గంలో కొనసాగుతుండడంపై విపక్షాలు... పార్టీలో సీనియర్ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొక తప్పడం లేదు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు పార్టీకి కొత్త చిక్కులు సృష్టిస్తున్నాయి.
బల్దియాలో బలమైన లీడర్లకు గాలం....
జీహెచ్‌ఎంసీలో గులాబీ జెండా రెపరెపలాడించేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రారంభించారు కేసీఆర్‌. బల్దియాలో బలమైన నేతలకు గాలం వేశారు. గ్రేటర్‌లో మాస్‌ లీడర్‌గా పేరున్న తలసానికి కారెక్కేందుకు చోటిచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించినా... టీఆర్ఎస్ మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇదే ఇప్పుడు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
రాజీనామా వ్యవహారంపై అసలు రంగు.....
తలసాని రాజీనామా వ్యవహారంలో గులాబీ పార్టీ అసలు రంగును హస్తం పార్టీ బయటపెట్టింది. రాజీనామా లేఖ అందలేదని తెలంగాణ శాసనసభా కార్యాలయ అధికారులు వెల్లడించడం రాజకీయంగా దూమారం రేపుతోంది. ఇదే అదనుగా అన్ని రాజకీయ పార్టీలు.... అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడుతున్నాయి. పార్టీ మారిన నేతల శాసనసభ్యత్వాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. స్పీకర్‌, గవర్నర్‌ టార్గెట్‌గానే విపక్షాలు అస్త్రాలు సంధిస్తున్నాయి.
టీఆర్ఎస్‌లో హీటెక్కిస్తున్న ఇంటిపోరు....
మరోవైపు టీఆర్ఎస్‌లో ఇంటిపోరు హీటెక్కిస్తోంది. కేబినెట్‌లో బెర్త్ దక్కినప్పటి నుంచి... గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో శ్రీనివాస్ యాదవ్ వర్గం దూకుడు పెంచుతోంది. దీంతో తలసాని వర్గీయులపై టీఆర్ఎస్ సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. తమకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ వాపోతున్నారట. తలసాని వ్యవహార శైలి సైతం సీనియర్ నేతలకు రుచించడం లేదట.రాజకీయంగా బలోపేతం అయ్యేందుకు కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు... తలసాని విషయంలో కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఇటు సొంతపార్టీలో... ఇటు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారి తీస్తుండడం చర్చనీయంశంగా మారుతోంది. అయితే గ్రేటర్ ఎన్నికల వరకు... తలసానికి పూర్తిస్థాయిలో అధినేత నుంచి మద్దతు ఉంటుందనే ప్రచారం కూడా పార్టీలో జరుగుతోంది.

07:00 - July 20, 2015

అమరావతిఏపీ నూతన రాజధాని అమరావతి ఓ కొత్త జిల్లాగా ఆవిర్భవించబోతుందా? నూతన రాజధాని ప్రాంతాన్ని ప్ర్యత్యేక జిల్లాగా మార్చబోతున్నారా? ఆ దిశగా ప్రభుత్వం అడుగుల వేస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది..కృష్ణా , గుంటూరు జిల్లాలోని దాదాపు 59 మండలాలను కలిపి రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మొత్తం కలిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..దానికి సంబంధించి కసరత్తులు కూడా ఎపీ ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం..
కృష్ణా గుంటూరు జిల్లాల్లోని ప్రాంతాలను కలిపి సీఆర్‌డీఏ ఏర్పాటు....
ఏపీ నూతన రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నూతన ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే 50 సంవత్సరాల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఏపీ రాజధాని నిర్మిస్తామని మొదటి నుండి ఏపీ ప్రభుత్వం చెబుతుంది. అందుకోసం కృష్ణా , గుంటూరు ప్రాంతాల్లోని చాలా భాగాన్ని సీఆర్ డిఏ పేరుతో పరిధులు నిర్ణియించింది. గతంలో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలను కలిపి ఒక అథారిటీ ఉండేది.
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, సీఆర్‌డీఏ ఏర్పాటు...
రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించిన తర్వాత పాత అథారిటీని తొలగించి, దాని స్థానంలో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, సీఆర్‌డీఏ ను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం సీఆర్డీఏ ప్రాంతం మొత్తాన్ని కలిపి ఓ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం..రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేపట్టి అమరావతి కేంద్రంగా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు తొలిదశలో రాజధాని పరిధిలోని తొమ్మిది శాఖల జిల్లా స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి కసరత్తులు చేస్తుంది. కార్మిక, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, రిజిష్ట్రేషన్, నైపుణ్య కార్పోరేషన్, మెప్మా, పోలీస్ శాఖ, లీడ్ బ్యాంక్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నుండి గతంలో ఉత్తర్వులను జారీ అయ్యాయి. రాజధాని నిర్మాణంలో ఈ శాఖలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ శాఖలకు సంబంధించిన అధికారులను, సిబ్బందిని సత్వరమే నియమించాలని నిర్ణయించారు. వీరంతా గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధీనంలో పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 59 మండలాలు, రెండు కార్పోరేషన్లు, 10 మున్సిపాలిటీలు కలపి అమరావతి జిల్లా అమరావతి కేంద్రంగా జిల్లా రిజిష్ట్రార్ కార్యాలయం ఏర్పాటు పై సిఎం సమీక్ష నిర్వహించారు.
కేంద్రం అంగీకరిస్తే రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగవచ్చు....
జిల్లాల పునర్విభజనకు కేంద్రం అంగీకరిస్తే రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగవచ్చు. ఇందులో భాగంగా 59 మండలాలు, రెండు కార్పోరేషన్లు, 10 మున్సిపాలిటీలు కలపి అమరావతి జిల్లాగా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే అమరావతి కేంద్రంగా జిల్లా రిజిష్ట్రార్ కార్యాలయం ఏర్పాటు పై సియం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రభుత్వ కార్యాలయాల తరలింపు జరిగాకే జిల్లా ఏర్పాటుపై ఆలోచించాలి
ప్రభుత్వ ఆలోచన పై భిన్న అభిప్రాయాలు....
మరోవైపు రాజధాని అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆలోచన పై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, ఏడాది కాలంగా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు చేస్తామని చెబుతున్న మంత్రులు, వాటిని ముందు అమలు చేసి, తర్వాత జిల్లా ప్రతిపాదనలు తీసుకోస్తే బాగుంటుందని అంటున్నారు. మరోవైపు అమరావతి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని అలోచన మంచిదైనప్పటకీ , ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలంటే అనేక శాఖలను అనుసంధానం చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం మంత్రుల కార్యాలయాల తరలింపు సాధ్యం కానప్పుడు , ఇప్పుడు ప్రత్యేక జిల్లా అవసరం ఉండబోదని విశ్లేషకులు అంటున్నారు.

06:52 - July 20, 2015

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అమరావతి సీడ్ క్యాపిటల్ బృహత్తర ప్రణాళిక నేడు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి రానుంది. సింగపూర్ ప్రతినిధులు నేడు రాజమండ్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారు. గోదావరి పుష్కరాల పర్యవేక్షణలో భాగంగా రాజమండ్రిలో ఉన్న చంద్రబాబుతో సింగపూర్ ప్రతినిధులు సమావేశమై సీడ్‌ కేపిటల్‌ డిజైన్లను సీఎంకు అందిస్తారు.
మూడుదశల్లో అమరావతి బృహత్తర ప్రణాళిక
సింగపూర్ ప్రభుత్వం సీఎం చంద్రబాబుకు సీడ్ క్యాపిటల్ ప్రణాళిక అందజేస్తే నూతన రాజధానికి సంబంధించిన మూడుదశల బృహత్తర ప్రణాళిక పూర్తవుతుంది. 2014 డిసెంబర్‌లో బృహత్తర ప్రణాళిక తయారీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్ ప్రభుత్వం, ఇదివరకు రాజధాని ప్రాంత కాన్సెప్ట్ మాస్టర్‌ప్లాన్, రాజధాని నగర మాస్టర్‌ప్లాన్లను అందించింది.
ఇప్పటికే మాస్టర్‌ ప్లాన్‌ అందించిన సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రతినిధి బృందం...
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఈ ఏడాది మే 25వ తేదీన 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగర నిర్మాణానికి అవసరమైన మాస్టర్‌ప్లాన్‌ను అందించింది. ఇప్పుడు ప్రభుత్వ, వాణిజ్య కార్యాలయాలకు సంబంధించిన సీడ్‌క్యాపిటల్ ప్రణాళిక అందిస్తోంది. దీని తర్వాత స్విస్‌ఛాలెంజ్ పద్ధతిలో మాస్టర్ డెవలపర్ ఎంపిక, డిజైన్ల రూపకల్పన జరుగుతుంది. ఈశ్వరన్‌ పర్యటన నేపథ్యంలో, రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ వ్యూతోపాటు సీడ్‌ కేపిటల్‌ డిజైన్‌కు సంబంధించి నాలుగు ఊహా చిత్రాలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్‌ 22 నాటికి రాజధాని శంకుస్థాపన సమయానికి సింగపూర్‌ ప్రభుత్వ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు.

06:48 - July 20, 2015

ర్యాగింగ్‌ తట్టుకోలేక నాగార్జున యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నతీరు ఆందోళన కలిగిస్తోంది. ర్యాగింగ్‌ వ్యతిరేకంగా కఠిన చట్టాలున్నా ఈ జాఢ్యం ఆగడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక కాలేజీ ర్యాగింగ్‌ వికృతంగా వికటాట్టహాసం చేస్తోంది. మన విద్యాలయాల్లో ఈ అమానవీయ సంస్కృతి ఎందుకు ప్రబలుతోంది? ర్యాగింగ్‌ విషయంలో మన చట్టాలు, కోర్టులు ఏం చెబుతున్నాయి? ర్యాగింగ్‌ ను నిరోధించాలంటే విద్యాలయాల యాజమాన్యాలు ఏం చేయాలి? పౌర సమాజం బాధ్యత ఏమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథం చర్చను చేపట్టింది.ఈ చర్చలో ప్రముఖ న్యాయవాది మంజులగారు గుంటూరు నుంచి లైవ్ షో లో పాల్గొన్నారు. మరి మీరు కూడా ఈ చర్చను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి. 

06:45 - July 20, 2015

ఇది కొందరికి సరదా. మరికొందరికి నరకం. ర్యాగింగ్‌ను కొంతమంది చాలా తేలిగా తీసుకుంటారు. మరికొందరు ఆ పదం వింటేనే గజగజ వణికిపోతారు. డైనమిక్‌ క్రికెటర్‌ సురేష్‌ రైనా, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, అనురాగ్‌ కాశ్యప్‌, అర్జున్‌ రాంపాల్‌, ఇంతియాజ్‌ ఆలీ, మనీష్‌ గుప్తా లాంటి సినీ ప్రముఖులు కూడా ర్యాగింగ్‌ దుఃఖాన్ని అనుభవించినవారే. తన సోదరుడు తనకు ధైర్యం చెప్పి వుండకపోతే సురేష్‌ రైనా లాంటి బ్యాట్స్‌మెన్‌ టీమ్‌ ఇండియాకు దక్కేవాడు కాదు. స్పోర్ట్స్‌ కాలేజీలో అతనికి ఎదురైన అనుభవం అంత భయంకరమైనది. అక్కడ చేరిన తొలి రోజుల్లో సీనియర్లు పెట్టిన ర్యాగింగ్‌ హింస నుంచి కోలుకోవడానికి సురేష్‌ రైనా కు ఆరు నెలలు పట్టింది. అన్ని రోజులూ అతడు కాలేజీ ముఖమే చూడలేదు. కాలేజీ డేస్‌లో ఎదురైన అనుభవాలను బయటకు చెప్పుకోలేనంతగా అమితాబ్‌ బచ్చన్‌ మనస్సు గాయపడిందంటే 1960లనాటికే ర్యాగింగ్‌ ఎంత వికృత క్రీడగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.
తెల్లదొరలు మనకు అంటించిన జాఢ్యమే ర్యాగింగ్‌. ....
మన దేశ సిరిసంపదలను కొల్లగొట్టిన తెల్లదొరలు మనకు అంటించిన జాఢ్యమే ర్యాగింగ్‌. ఇంగ్లీష్‌ మీడియం కాలేజీలు, యూనివర్సిటీలలో బ్రిటీషోళ్లు నాటిన ఈ కలుపు మొక్క కొద్ది రోజుల్లో అదో మహా విషవృక్షమై దేశమంతా వేళ్లూనుకుంది. దాని విషపు గాట్లకు ఏటా పది మందికి పైగా విద్యార్థులు బలైపోతున్నారు. ఆ వికృత క్రీడలో కొన్ని వందల మంది తీవ్రంగా గాయపడుతున్నారు. కాలేజీలో చేరిన తొలినాళ్లల్లో సీనియర్లు చేసే ర్యాగింగ్‌ భరించలేక, ఆ టార్చర్‌కు తట్టుకోలేక, మనస్థిమితం కోల్పోయి, మెంటల్‌ హాస్పటల్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థుల సంఖ్యా తక్కువేమీ లేదు. ఇక అనేకమంది కాలేజీకీ, హాస్టల్‌కి దండం పెట్టి ఇళ్లకు పారిపోతున్నారు. చదువు మానేస్తారు. ఆ పిల్లలు అనుభవించే వేదనను అర్ధం చేసుకోలేని తల్లిదండ్రులు బలవంతంగా కాలేజీకి పంపిస్తే అక్కడ ఇమడలేక ఆత్మహత్య చేసుకుంటున్నవారు మరికొందరు.
చాలా చోట్ల ర్యాగింగ్‌ వ్యవహారాలు బయటకు రావు...
చాలా కాలేజీలు, యూనివర్సిటీలలో జరిగే ర్యాగింగ్‌ వ్యవహారాలు బయటకు రావు. కానీ మనదేశంలో ప్రతి నిమిషానికో విద్యార్థి ర్యాగింగ్‌ నరకాన్ని అనుభవిస్తున్నారు. ఎవరికీ చెప్పుకోలేనంత బాధను తన గుండెల్లోనే దాచుకుంటున్నారు. ఎన్నో ఆశలతో, ఊహలతో ఎంతో హుషారుగా కాలేజీలో అడుగుపెట్టినవారి బట్టలు విప్పించి అర్ధనగ్నంగానో, నగ్నంగానో గోడల మీద నడిపిస్తే అంతకు మించిన క్రూరత్వం ఇంకొకటి వుంటుందా? ఇలాంటివాటిని కూడా స్నేహం కోసం, సరదాగా చేసే అల్లరి పనులుగా సమర్ధించవచ్చా? కానీ, మనదేశంలోని చాలా పేరొందిన యూనివర్సిటీలు, కాలేజీలలో ఇలాంటి అమానవీయ, హేయమైన ఘోరాలు జరుగుతున్నాయి. ఎయిమ్స్,  క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ, ఢిల్లీ ఐఐటీ , నేషనల్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఇలాంటి పేరొందిన అనేక విద్యా సంస్థలను ర్యాగింగ్‌ భూతం మహాపిశాచమై పీడిస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ ర్యాగింగ్‌ రక్కసి వికృతంగా నాట్యం చేయనది ఎక్కడ? మెడికల్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలలోనే ర్యాగింగ్‌
బాధితులు, బాధించేవారూ ఇద్దరూ విద్యార్థులే....
అదేమి చిత్రమో కానీ, ర్యాగింగ్ లో బాధితులు, బాధించేవారూ ఇద్దరూ విద్యార్థులే. ఒకరు జూనియర్‌. మరొకరు సీనియర్‌. ఒకరికి ఏడ్చిఏడ్చి కన్నీళ్లు ఇంకిపోతాయి. మరొకరికి హృదయం బండబారి పోతుంది. ఫస్ట్‌ ఇయర్‌లో ర్యాగింగ్‌ బాధను అనుభవించినవారు కూడా సెకండియర్‌లో అంతకంటే వికృతంగా వ్యవహరించడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే, ర్యాగింగ్‌ పేరుతో తాను అనుభవించిన ఆ భయంకర నరకం ప్రతికారేచ్ఛను రగిలిస్తుంది. అదొక జ్వాలగా మారి మనిషిలోని మానవీయతను దహించివేస్తోంది. ఈ వికృత కల్చర్‌ మనిషిని శాడిస్ట్‌గా మార్చేస్తోంది. యూనివర్సిటీలలో ఎన్నెన్నో కొత్త కొత్త ఆవిష్కరణలకు, పరిశోధనలకు మూలస్తంభాలుగా నిలవాల్సిన విద్యార్థుల జీవితాలు ఇలా ర్యాగింగ్‌ విషవృక్షానికి బలైపోవాల్సిందేనా? ఈ వికృత మనస్తత్వం నుంచి మన పిల్లలను బయటపడేసే మార్గమే లేదా?
కఠినమైన చట్టాలే చేశాయి.....
ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా చాలా రాష్ట్రాలు కఠినమైన చట్టాలే చేశాయి. 1997లోనే తమిళనాడు ప్రభుత్వం తొలి చట్టం చేసింది. 2001లోనే సుప్రీంకోర్టు ర్యాగింగ్‌ను సీరియస్‌గా తీసుకుంది. శిక్షార్హమైన నేరంగా పరిగణించింది. యూజీసీ ప్రతి ఉన్నత విద్యాసంస్థకు మార్గదర్శకాలు, కచ్చితంగా పాటించాల్సిన విధివిధానాలు నిర్దేశించింది. 2009లోనే హెల్ప్‌లైన్‌లు ప్రారంభించారు. ర్యాగింగ్‌ ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ ఐ ఆర్‌ నమోదు చేయాలనీ, ఫిర్యాదుల విషయంలో వెంటనే సీరియస్‌గా స్పందించని ప్రిన్సిపాల్స్‌ మీద కూడా కేసులు నమోదుచేస్తామన్న హెచ్చరికలూ వున్నాయి. ఇన్ని కఠిన చట్టాలూ, కఠిన నిబంధనలు వున్నా ర్యాగింగ్‌ ఆగడం లేదు? ఎందుకని? లోపం ఎక్కడుంది? నిన్న బాధితులుగా వున్న విద్యార్థులే, ఇవాళ బాధించేవారిగా మారి వికటాట్టహాసం చేస్తున్నారెందుకు? బెరుకు బెరుకుగా తమ కాలేజీలో కొత్తగా అడుగుపెట్టినవారి హృదయాలను ఆలింగనం చేసుకుని, వారిలోని భయాన్ని పోగొట్టాల్సిన సీనియర్లు ర్యాగింగ్‌ పేరుతో రెచ్చిపోతున్నారెందుకు? లోపం ఎక్కడుంది? విద్యార్థుల్లోనా? మనం విద్యా వ్యవస్థలను నడుపుతున్న తీరులోనా? విద్యావలయాల్లో మానవీయ విలువలను విధ్వంసం చేస్తున్న ర్యాగింగ్‌ కల్చర్‌ను తుదముట్టించాలంటే మనం ఏం చేయాలి? ఈ విషయం గురించి సీరియస్‌గా ఆలోచించకపోతే మన విద్యార్థులు భవిష్యత్‌నే కాదు వర్తమానాన్నీ కోల్పోతారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్ళే భక్తులకు 6 గంటల సమయం పడుతుంది.

నేడు రాజమండ్రి, భద్రాచలంలో గవర్నర్ పర్యటన

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నేడు రాజమండ్రి, భద్రాచలంలో పర్యటించనున్నారు. మొదట హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్లి తరువాత భద్రాచలం వెళ్లనున్నారు. భద్రాచలంలో పుష్కర స్నానం చేసి సీతారామస్వామిని దర్శించుకోనున్నారు.

లారీ -కారు ఢీ:ముగ్గురు మృతి

హైదరాబాద్:గుంటూరు రూరల్ మండలం చౌడవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ -కారు ఢీ కొని ముగ్గురు మృతి చెందగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

 

ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన లారీ:నలుగురు మృతి

నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోగోలు మండలం కడనూతల వద్ద ఆగి వున్న రాఘవేంద్ర ట్రావెల్స్ కు చెందిన బస్సును వేగాంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా... 15 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నుండి పుష్కరాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఆర్టీసీ బస్సు-బైక్ ఢీ:ఇద్దరు మృతి

మెదక్: సిద్ధిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-బైక్ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Don't Miss