Activities calendar

22 July 2015

'ఎయిర్ కోస్తాకు తృటిలో తప్పిన ప్రమాదం...

హైదరాబాద్: ఎయిర్ కోస్తా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గన్నవరం విమానాశ్రయం నుంచి తమిళనాడు రాజధాని చెన్నైకి వెళ్తున్న ఎయిర్ కోస్తా విమానం రన్‌వేపై టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో గ్లాడర్‌లోకి ఓ పక్షి వచ్చింది. ఇది గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని రన్‌వేపైనే నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ విమానంలో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తప్పడంతో విమానంలోని ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు.

21:32 - July 22, 2015

ఢిల్లీ:కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కోపమొచ్చింది. మాజీ కేంద్రమంత్రి శశిథరూర్‌పై ఆమె నిప్పులు చెరిగారు. పార్టీలో చర్చించిన అంతర్గత విషయాలు సైతం బయటకు వెళ్తున్నాయని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. శశిథరూర్ తీరువల్లే ఇదంతా జరుగుతోందని ఆమె మండిపడ్డారు. బయటకు లీకులివ్వడం మంచిపద్దతి కాదంటూ క్లాస్ పీకారు. తీరు మార్చుకోవాలంటూ శశిథరూర్‌కు సూచించారు. 

రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి మోపిదేవికి స్వల్ప గాయాలు..

విజయవాడ:మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత మోపిదేవి వెంకటరమణ పుష్కరాల కోసం రాజమండ్రి వస్తూ ప్రమాదానికి గురయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓ వాహనంలో రాజమండ్రి బయల్దేరారు. అయితే, విజయవాడ సమీపంలో ఎనికేపాడు వద్ద వెంకటరమణ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. ఈ ఘటనలో వెంకటరమణ, ఆయన భార్య అరుణ, కుమార్తె జస్మిత, కుమారుడు రాజీవ్ స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు. వెంకటరమణ అర్ధాంగి అరుణకు నుదుటిపై గాయం కావడంతో సీటీ స్కాన్ చేశారు. ప్రమాదమేమీలేదని వైద్యులు తేల్చారు.  

21:19 - July 22, 2015


విజయవాడ: కార్పొరేట్ శక్తులకు పెద్దపీట... కార్మికుల మెడలపై కత్తిపీట... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరిది. కార్మికుల గొంతు నొక్కేందుకే చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. సమ్మెలు చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇస్తోంది. కార్మికులు మాత్రం పోరుబాట వీడమంటున్నారు. తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
మున్సిపల్ సమ్మెను ఉపేక్షించేది లేదు.....
మున్సిపల్ సమ్మెను ఉపేక్షించేది లేదు... విధుల్లో చేరితేనే కార్మికులతో చర్చలు... ఆంధ్రప్రదేశ్ సర్కార్ షరతులివి. చర్చలు జరపాల్సిన చంద్రబాబు ప్రభుత్వం... బెదిరింపులకు పాల్పడుతోంది. సమ్మెలను ఉపేక్షించేది లేదంటూ పంతాలకు పోతోంది. న్యాయపరమైన డిమాండ్ల కోసం పోరుబాట పట్టిన పారిశుద్ధ్య కార్మికులపై బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది.
సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని తీర్మానం....
మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. సమ్మెను బహిష్కరించి విధుల్లోకి చేరితేనే చర్చలంటూ మెలిక పెడుతోంది. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని నిర్ణయించింది. ఈ విషయాన్నే ఏపీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు.
తమ విధానాన్ని చెప్పకనే చెప్పిన ఏపీ....
కార్మికుల పట్ల తమ విధానం ఏంటనేది..? ఏపీ కేబినెట్ చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. పాలకులు మారినా... ప్రభుత్వాలు మారినా... కార్మిక వ్యతిరేక విధానాలు మాత్రం మారడం లేదు. ఎన్నికలప్పుడు కార్మికులకు అండగా ఉంటానన్న చంద్రబాబు హక్కుల కోసం గళమెత్తిన కార్మికులపై కన్నెర్ర చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోరాడితే పోయేదేమీ లేదంటూ...పోరుబాట పట్టిన కార్మికులపై బ్రహ్మాస్త్రాలేంటంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన పి.మధు
మున్సిపల్ కార్మికుల పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తప్పుబట్టారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యను పరిష్కరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. బెదిరింపులకు గురి చేస్తే... ఊరుకునేది లేదంటూ మధు హెచ్చరించారు. ఇకపై అన్ని రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష ఆందోళన చేపడుతామన్నారు.
ఏపీ సర్కార్ తీరుతో కార్మికవర్గం పిడికిళ్లు మరింతగా...
మొత్తానికి ఏపీ సర్కార్ తీరుతో కార్మికవర్గం పిడికిళ్లు మరింతగా బిగుసుకుంటున్నాయి. సర్కారు నిర్లక్ష్యంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి సమ్మె సాగుతున్నా... నిద్రపోతున్నట్లు నటిస్తున్న ప్రభుత్వ తీరుపై అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలంటున్నారు లేకుంటే మహోద్యమం తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.

 

గిన్నిస్ రికార్డుల కెక్కిన 'బాహుబలి' పోస్టర్...

హైదరాబాద్: 'బాహుబలి' బాక్సాఫీస్ రికార్డులనే కాకుండా గిన్నిస్ రికార్డులను కూడా సొంతం చేసుకుంటోంది. 'బాహుబలి' సినిమా విడుదలకు ముందు కేరళలోని కొచ్చిలో ఆడియో వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా గ్లోబల్ యునైటెడ్ మీడియా కంపెనీ ఓ పోస్టర్ ను రూపొందించింది. ఈ పోస్టర్ ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టర్ గా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ మేరకు గిన్నిస్ రికార్డుల సంస్థ ప్రకటన విడుదల చేసింది. 4,793.65 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఇంతకు ముందు ఉన్న పెద్ద పోస్టర్ రికార్డును 'బాహుబలి' తుడిచిపెట్టేసింది.

డీజీపీ సమక్షంలో మీడియా ప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యం

రాజమండ్రి: అగ్నిప్రమాద ఘటనా స్థలం వద్ద పోలీసులు దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారు. మీడియా ప్రతినిధులపై పోలీసులు దుర్భాషలు ఆడారు. పోలీసులు, మీడియా ప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డీజీపీ సమక్షంలోనే పోలీసుల దౌర్జన్యం చేస్తున్నారు.

ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం

హైదరాబాద్: బోనాల ఉత్సవాల్లో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు ఎల్లమ్మ రథోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పుష్కరాలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : పుష్కరాలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నది ఒడ్డున ఉన్న దేవాలయాల్లో పుష్కరాలు ముగిసే వరకు ఆలయాల్లో వీఐపీ, టికెట్ దర్శనాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజురోజుకూ పుష్కర రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భక్తులందరికీ ధర్మదర్శనాలే కల్పించాలని సమీక్షలో సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అగ్నిప్రమాదం పై ఉన్నతస్థాయి దర్యాప్తునకు సీఎం ఆదేశం...

రాజమండ్రి : కోటిలింగాల వద్ద జరిగిన అగ్ని ప్రమాదం పై ఉన్నతస్థాయి దర్యాప్తునకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ...హోటల్ లో గ్యాస్ సిలిండర్ లీక్ అయినందు వల్లే మంటలు చెలరేగినట్లు సమాచారం అందినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని.. ఇది చిన్న సంఘటన... సమయమనం పాటించాలని బాబు హితవు పలికారు. అగ్నిప్రమాదం పై ఉన్నతస్థాయి దర్యాప్తునకు సీఎం ఆదేశించారు.

సమ్మెపై కేబినెట్ నిర్ణయం దుర్మార్గం

విజయవాడ: సమ్మెపై కేబినెట్ నిర్ణయం దుర్మార్గం అని మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ ఉమామహేశ్వరరావు మండి పడ్డారు. ప్రజారోగ్యం, కార్మిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్చలకు రావాలని ఉమా డిమాండ్ చేశారు. ప్రజా సేవకు కట్టుబడి ఉన్నామని.. ప్రభుత్వమే మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

చెత్త బుట్టల కొనుగోలుకు రూ.41.48 కోట్లు మంజూరు

హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా ఇంటింటికీ చెత్త బుట్టల పంపిణీకి నిధులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 44,04,568 చెల్లబుట్టలు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ప్రతి ఇంటికి 12 లీటర్ల సామర్థ్యంతో రెండు చెత్త బుట్టల కొనుగోలుకు రూ.41.48 కోట్లు మంజూరు చేసింది.

అత్తాపూర్ లో పేలిన గ్యాస్ సిలిండర్...

హైదరాబాద్: ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలడంతో.. భారీగా మంటలు ఎగిసిపడ్డ సంఘటన బుధవారం సాయంత్రం నగరంలోని అత్తాపూర్‌లో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ సర్కిల్ సమీపంలోని ఇందిరాగాంధీ బొమ్మ పక్కన టీ దుకాణంలో సిలిండర్ ఆకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పేలింది.

19:44 - July 22, 2015

తూ.గో: రాజమండ్రి పుష్కరాల్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. గోకవరం బస్టాండ్‌ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతో భయంతో పుష్కర యాత్రికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. బస్సు, పోలీస్ వ్యాన్ సహా 6 వాహనాలు దహనమయ్యాయి. ఓ హోటల్‌లో గ్యాస్‌ లీక్‌ కావడంతోనే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సీఎం, మంత్రులు, అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంత్రి మాణిక్యాలరావు ఘటన పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. ఏమైనా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న ఒక ప్రత్యక్ష సాక్షిని అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. వదంతులు వ్యాపించకుండా సంయమనం పాటించాలని సిఎం విజ్ఞప్తి చేశారు. గ్యాస్‌ లీకై ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఉందన్న చంద్రబాబు, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. మరోవైపు పుష్కరఘాట్ పరిసరాల్లోని భక్తులను ఇతర మార్గాల్లో క్షేమంగా తరలించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. గాయపడినవారిని చికిత్స కోసం పంపేందుకు అంబులెన్స్‌లను రప్పించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో స్థానికులు కూడా తమ వంతు సహకారం అందించారు.

రాజమండ్రి పుష్కర ఘాట్ సమీపంలో అగ్ని ప్రమాదం

తూ.గో: రాజమండ్రి పుష్కర ఘాట్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అంబేద్కర్ విగ్రహం వద్ద మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పోలీస్ బస్సు, లారీ, ఆటో, జీపు తగలపడుతున్నాయి.

19:33 - July 22, 2015

నెల్లూరు: కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నాయి ఆస్పత్రులు.. ప్రాణాలు కాపాడాల్సిందిపోయి పేషంట్లను పీక్కుతింటున్నాయి.. దీంతో ఆస్పత్రుల పేరుచెబితేనే వణికిపోతున్నారు జనాలు..
నిరుపమ ఆస్పత్రి..
ఓ చిన్నారిని ట్రీట్ మెంట్ కోసం చేర్పించారు తల్లిదండ్రులు.. ఆ తర్వాత ఏమైందోకానీ.. ఆ బిడ్డ చనిపోయాడు.. ముందే ఈ విషయం చెప్పేస్తే బిల్లుకట్టరని భావించారు వైద్యులు.. అంతా సవ్యంగా ఉందని డబ్బు చెల్లించాలని సూచించారు.. ఆ తర్వాత అసలు సంగతి బయటపెట్టారు..
కార్పొరేట్ ఆస్పత్రులది మరో స్టయిల్..
ఇవన్నీ ఒక ఎత్తయితే కార్పొరేట్ ఆస్పత్రులది మరో స్టయిల్.. మేమూ ఏం తక్కువ తినలేదంటూ దోచుకుంటున్నాయి ఈ ఆస్పత్రులు.. ఏ ఆరోగ్యశ్రీయో... హెల్త్ కార్డుతోనే పేషంట్ చేరాడంటే వీళ్లకు పండగే.. ఏదో ఓ వంక చెప్పి భారీగా డబ్బు వసూలు చేసేవరకూ రోగిని బయటకు పంపవు ఈ ఆస్పత్రులు..
శ్రావణి హొటల్ యజమాని...
ప్రపంచస్థాయి ప్రమాణాలుగల ఆస్పత్రి అంటూ ప్రకటనలుచూసి మోసపోయాడు.. బ్యాక్ పెయిన్ ట్రీట్‌మెంట్‌ కోసం అపోలో ఆస్పత్రిలో చేరాడు.. నడుంనొప్పి తగ్గించాల్సిందిపోయి ఏకంగా ప్రాణాలు తీశారు వైద్యులు.. స్కానింగ్ కోసమంటూ మత్తుమందిచ్చారు.. ఆ తర్వాత అతను మళ్లీ కళ్లు తెరవలేదు.. చక్కగా నడుచుకుంటూ వెళ్లిన ఆ పేషంట్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. ఈ విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు.. వెంటనే సినీ హీరోలు... పొలిటీషియన్స్... చివరకు మాజీ మంత్రులు రంగంలోకిదిగి వారిని మేనేజ్ చేశారు.. మృతుడి ప్రాణాలకు ధరకట్టి వాళ్లను చల్లబరిచారు..
డబ్బుకోసం శవాలకు ట్రీట్ మెంట్....
దుర్గమిట్టలోని మరో ఆస్పత్రి బొల్లనేనిది మరో చరిత్ర... ఇక్కడ డబ్బుకోసం శవాలకు ట్రీట్ మెంట్ ఇస్తారు.. శివాచారి అనేవ్యక్తం కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరాడు.. పేగుపూతంటూ ఏవో టెస్టులు చేయించారు.. లక్ష రూపాయలు బిల్లు చేశారు.. జబ్బుమాత్రం తగ్గలేదు.. చివరికి చెన్నైవెళ్లిన అతనికి అసలు విషయం చెప్పారు అక్కడివైద్యులు.. జబ్బుకు టెస్టులకు సంబంధంలేదని తేల్చేశారు.. 15రోజుల్లో తక్కువ ఖర్చుతో అంతానయం చేసి ఇంటికిపంపారు.. ఇలా నగరంలో చట్టవిరుద్దంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోకుండా ఎన్నో ఆస్పత్రులు నడుస్తున్నాయి.. వీటిని తనిఖీచేయాల్సిన అధికారులు మామూళ్లమత్తులో మునిగితేలుతున్నారు.. 

19:29 - July 22, 2015

హైదరాబాద్‌: చిక్కడపల్లిలో నూతనంగా ఈశ్వరప్ప హోమియోకేర్‌ ప్రారంభమైంది. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్‌ ఈ క్లినిక్‌ను ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవల అందించేందుకు చిక్కడపల్లిలో హోమియోకేర్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేశామని ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బస్వానందం అన్నారు. హోమియోపతి ద్వారా సకల రోగాలను నివారించవచ్చని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 

19:27 - July 22, 2015

హైదరాబాద్:జర్నలిస్టుల హెల్త్‌కార్డులకు సంబంధించిన జీఓను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఎలాంటి రుసుము లేకుండా.. పరిమితి లేకుండా వైద్యం చేసుకునేలా జీవో రూపొందించారు. అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా వర్కింగ్‌ జర్నలిస్టులు, రిటైర్డ్‌ జర్నలిస్టులందరికీ వర్తిస్తుందని ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ స్పష్టం చేశారు. ఇలాంటి జీవో దేశంలోనే తెలంగాణలో మాత్రమే సాధ్యమైందని సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు.

19:24 - July 22, 2015

విజయవాడ: మున్సిపల్ కార్మికుల పట్ల... ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తప్పుబట్టారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యను పరిష్కరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. బెదిరింపులకు గురి చేస్తే... ఊరుకునేది లేదంటూ మధు హెచ్చరించారు. రేపటి నుంచి అన్ని రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష ఆందోళన చేపడుతామన్నారు. తన విధానం మార్చుకోలేకపోతే... తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని మధు హెచ్చరించారు.

19:22 - July 22, 2015

హైదరాబాద్: ఇస్తే ఇక్కడ కేసు.. ఇవ్వకపోతే అక్కడ కేసు. ఎటైనా కేసు తప్పదు. ఏం చేయాలి. ఇదే ఇప్పుడు మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను వేధిస్తున్న సమస్య. ఫోన్‌ ట్యాపింగ్‌ వివరాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.. ఇవ్వటానికి వీలు లేదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిస్తుంది..రెండు ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్నారు మొబైల్‌ ఆపరేటర్లు. సుప్రీంకోర్టు మెట్లెక్కిన ఆపరేటర్లు..కోర్టుకు ఇదే విన్నివించుకున్నారు.
24లోగా కాల్‌డేటా ఇవ్వాలని విజయవాడ కోర్టు ఆదేశం.....
ఈ నెల 24లోపు కాల్‌డేటాతో పాటు.. ట్యాపింగ్‌కు సంబంధించి వచ్చిన అప్లికేషన్ల వివరాలు అందించండి. ఇదే విజయవాడ కోర్టు మొబైల్‌ ఆపరేటర్లకు ఇచ్చిన ఆదేశం. ఇప్పటివరకు ఇప్పుడిస్తాం.. అప్పుడిస్తాం అంటూ టైమ్‌ పొడిగించుకుంటూ వెళ్లిన సర్వీస్‌ ప్రొవైడర్లకు ఈ ఆదేశాలు ఈటెల్లా గుచ్చుకున్నాయి.
కాల్‌డేటా ఇవ్వాలంటూ ఏపీ సర్కార్‌ ఒత్తిడి ....
కాల్‌డేటా ఇవ్వాలని ఎప్పటి నుంచో ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్‌ బృందం ఇదే పనిలో ఉంది. అయినా సర్వీస్‌ ప్రొవైడర్లు విచారణకు హాజరయ్యారు తప్ప.. డేటా ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో కోర్టు ద్వారా ప్రొసీడ్‌ అయ్యారు అధికారులు. కోర్టుకు సైతం తమ నిబంధనలు వివరించారే తప్ప.. వివరాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు రాలేదు ఆపరేటర్లు. ఇక కోర్టు ఫైనల్‌ ఆదేశాలచ్చాక దిక్కు తోచక సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టుకు వెళ్లడానికి కారణం..
మొబైల్‌ ఆపరేటర్లు సుప్రీంకోర్టుకు వెళ్లడానికి కారణం.. ఇరు రాష్ట్రాల మధ్య పేచీయేనని తెలుస్తోంది. ఇటు వివరాలివ్వడానికి వీలు లేదని తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు.. ఇవ్వాల్సిందేనని ఏపీ ప్రభుత్వ ఆదేశాల మధ్య నలిగిపోతున్నవారికి కోర్టే అడగటంతో ఇక తప్పక సుప్రీం దగ్గరికి పోయారు. ఇక సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలనిస్తుందో.. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ ఎంతవరకు పోతుందనేది ఆసక్తికరంగా మారింది.

19:19 - July 22, 2015

తూ.గో:రాజమండ్రిలో ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలులో డీఆర్‌డీవోకు రెండు వేల 297 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణాన్ని ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని నిర్ణయించడంతో.. ప్రధాని సలహా మేరకు చిన్న, అందమైన రాజధానులను పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

19:18 - July 22, 2015

హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్రానికి లేని వనరులు... ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఏపీని ఈస్ట్ కోస్ట్ గేట్‌వేగా మారుస్తామన్నారు. అయినప్పటికీ కొత్త రాష్ట్రంలో సవాలక్ష సమస్యలు, సవాళ్లు ఉన్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. రాజమండ్రిలో జరిగిన ప్రాంతీయ విద్యా సదస్సులో ఏపీ సీఎం పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి... రాష్ట్రంలో కరువును నియంత్రిస్తామన్నారు చంద్రబాబు. 

19:15 - July 22, 2015

హైదరాబాద్:తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ టీఎస్ ఐపాస్ ద్వారా 19 కంపెనీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అనుమతి పత్రాలనుకంపెనీ ప్రతినిధులు అందుకున్నారు. తాజాగా వచ్చిన కంపెనీలతో తెలంగాణలో వెయ్యి 87 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 6 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

'తెలంగాణ లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పై టాస్క్ ఫోర్స్'

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలో నిర్ణయించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్టాపు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం తెలిపింది. ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ లాభదాయకం కాదని సెయిల్ నిర్ధారించినట్లు కేంద్రం తెలిపింది. 

కార్టూనిస్ట్ టామ్ మూరే ఇక లేరు...

వాషింగ్టన్ : అమెరికాలో ప్రముఖ కార్టూనిస్ట్, ఆర్కీ కార్టూన్ సృష్టికర్త టామ్‌మూరే ఇవాళ కన్నుమూశారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న 86 ఏళ్ల మూరే టెక్సాస్‌లోని ఓ ఆస్పత్రిలో చనిపోయారని ఆయన కుమారుడు తెలిపారు. మూరే గీసిన ఆర్కీ ఆండ్రూన్, అతని స్నేహితుల కార్టూన్లు గీసిన కామిక్‌బుక్స్ అమెరికాలో చాలా ప్రసిద్ది చెందాయి.

వ్యక్తిగత కార్యదర్శిని సస్పెండ్ చేసిన ఉత్తరాఖండ్ సీఎం

హైదరాబాద్: ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ వ్యక్తిగత కార్యదర్శి మహ్మద్ షాహిద్ ను సస్పెండ్ చేశారు. ఓ వార్తా పత్రిక చేసిన స్టింగ్ ఆపరేషన్ లో మద్యం లైసెన్సుల కేటాయింపులో లంచాల వాటాల పంపకాలపై మాట్లాడుతూ, ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంగతి సంగతి తెలిసిందే. ఈ వీడియోను విడుదల చేసిన బీజేపీ, కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టింది. సీఎం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. దీనిపై స్పందించిన సీఎం హరీష్ రావత్ వ్యక్తిగత కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలను రావత్ ఖండించారు.  

ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.డీకే అరుణ

మహబూబ్ నగర్: జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణంపై టిఆర్ ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ.కే అరుణ ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు 24,25 తేదీల్లో పాలమూరు ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలపై ఎదురుదాడి తగ్గించి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. పాలమూరు ఎత్తిపోతలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులనూ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఒంగోలు లో తగలబడుతున్న విద్యుత్ సబ్ స్టేషన్

ప్రకాశం: ఒంగోలు లంబాడీ డొంకలో విద్యుత్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. దీంతో మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

బజరంగి భాయ్ జాన్' లాభాలు రైతులకు

హైదరాబాద్:బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన 'బజరంగి భాయ్ జాన్' చిత్ర నిర్మాతలు తమవంతుగా రైతులకు సాయం చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా ద్వారా వచ్చే లాభాల నుంచి కొంత మొత్తాన్ని రైతులకు ఇవ్వాలనుకుంటున్నారని మహారాష్ట్ర బీజేపీ మహిళా నేత ఎన్ సీ షైనా వెల్లడించారు. దర్శకుడు కబీర్ ఖాన్, సల్మాన్ సోదరి అల్విరా ఖాన్, షైనాలు మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సేను కలసి ఈ సినిమా వీక్షించాలని కోరారు. అనంతరం షైనా పైవిషయాన్ని మీడియాకు తెలిపారు. కాగా ఐదు రోజుల్లో ఈ చిత్రం రూ.151.05 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. 

18:16 - July 22, 2015

ముంబై:సమాజంలో అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తండ్రిని కూడా అనుమానించాల్సిన దౌర్భాగ్యస్థితిలోకి సమాజం దిగజారిపోతోంది. తనపై జరుగుతున్న దాష్టీకంపై 13 ఏళ్ల బాలిక టీచర్ కు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే, ముంబైలో ఈ మధ్య కాలంలో ఓ స్వచ్ఛంద సంస్థ పలు స్కూళ్లలో 'ఛైల్డ్ అబ్యూజ్'పై అవగాహన తరగతులు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆడపిల్లలపై జరిగే దాష్టీకాలు ఎలా ఉంటాయో వివరిస్తున్నారు. అభ్యంతరకర ప్రవర్తన కనిపించినప్పుడు టీచర్ కి ఫిర్యాదు చేయాలని ఆ స్వచ్ఛంద సంస్థ సూచించింది. ఈ స్వచ్ఛంద సంస్థ నేర్పిన పాఠాలు ఓ స్కూలులో ఏడవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికలో చైతన్యం తెచ్చాయి. 
ఏళ్ల తరబడి జరుగుతున్న దారుణాన్ని....
తనపై ఏళ్ల తరబడి జరుగుతున్న దారుణాన్ని వివరిస్తూ టీచర్ కి లేఖ రాసిందో బాలిక. సెలవు చీటీగా భావించి లేఖ తెరచిన టీచర్, దానిని చదివి షాక్ తిన్నారు. క్షణం ఆలస్యం చేయకుండా ఓ స్వచ్ఛంద సంస్థను కలిసి, బాలిక గాథను వివరించారు. దీంతో స్వచ్ఛంద సంస్థ కలుగజేసుకుని బాలిక తండ్రిపై ఫిర్యాదు చేసింది. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాలిక ఏడేళ్ల వయసు నుంచి తండ్రి ఈ దాష్టీకానికి పాల్పడుతున్నట్టు తేల్చారు. అత్యాచారానికి గురైన అనంతరం బాలికకు తల్లి మందు అందజేసేదని, ఈ మందు గర్భనిరోధానికా? లేక ఇంకేదైనా? అనేది నిర్ధారించిన తరువాత బాలిక తల్లిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, తండ్రి తన 17 ఏళ్ల మరో కుమార్తెపై కూడా దారుణానికి తెగబడినట్టు పోలీసులు వెల్లడించారు.  

గుడ్ గవర్నెన్స్ అంటే సెల్ఫీలు, యోగా చేయించడం కాదు: నేహా ధూపియా.....

ముంబై:ఆర్థిక రాజధాని ముంబైలో కురిసిన కుండపోత వర్షం అక్కడి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోగా, పలు కార్యాలయాలు, స్కూళ్లు మూతపడ్డాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాను కూడా వర్షం కారణంగా అసౌకర్యానికి గురయ్యానంటోంది బాలీవుడ్ భామ నేహా ధుపియా. అంతటితో ఆగకుండా, ఏకంగా ప్రధాని మోదీ పాలనపై ఓ ట్వీట్ సంధించింది. "ఏకధాటిగా కురిసిన వర్షంతో ముంబయి తడిసిముద్దయింది. గుడ్ గవర్నెన్స్ అంటే సెల్ఫీలు, యోగా చేయించడం కాదు... భద్రతపై ప్రజలకు భరోసా ఇవ్వాలి" అని ట్విట్టర్లో పేర్కొంది. ఈ ట్వీట్ కు విశేష స్పందన లభించింది. 

'బాణ సంచా' పేలుడు ఘటనపై విచారణకు ఆదేశం..

తూ.గో: కొత్తకోట బాణ సంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై హోంమంత్రి చినరాజప్ప విచారణకు ఆదేశించారు. బాణా సంచా తయారీకి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.

రేపు శ్రీలంక పర్యటనకు భారత్ జట్టు ఎంపిక....

ముంబై: శ్రీలంకలో వచ్చే నెల భారత జట్టు పర్యటించనుంది. శ్రీలంక పర్యటించే భారత జట్టు సభ్యులను బీసీసీఐ రేపు ఎంపిక చేయనుంది. చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ జట్టును గురువారం ఎంపిక చేస్తుంది. శ్రీలంక పర్యటనలో భారత జట్టు మూడు టెస్టు మ్యాచులు ఆడుతుంది. శ్రీలంక పర్యటనలో ఒక సన్నాహక మ్యాచ్‌తో పాటు భారత జట్టు మూడు టెస్టు మ్యాచులు ఆడుతుంది. ఆగస్టు 12న గాలే వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. సెప్టెంబరు 2న టీమిండియా స్వదేశానికి పయనమవుతుంది.

కారు-లారీ ఢీ:ఒకరి మృతి

ప్రకాశం:మార్టూరు రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ-కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

17:41 - July 22, 2015

చుక్క నీటికోసం సాగు భూములు నోళ్లు తెరిచి ఎదురుచూస్తున్నాయి.. ఒకప్పుడు జలకళతో సిరులు కురిపించిన ప్రాజెక్టులు.. ఇప్పుడు వట్టిపోయి వెక్కిరిస్తున్నాయి..! అడుగంటిన భూగర్భ జలాలు డెంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి.. తీవ్ర నిరాశలో కూరుకుపోయిన రైతాంగంపై.. ప్రకృతి విపత్తులు పంజా విసురుతున్నాయి. కరువు చాయలు రైతులను దొంగ దెబ్బతీస్తున్నాయి. బక్కచిక్కన రైతన్నను అదేపనిగా వెంటాడుతున్నాయి. ఏమిటీ విపత్కర పరిస్థితులు..! ఎందుకిలా కరువు అదేపనిగా ఊరుముతోంది..!
తాగునీటి కోసం అల్లాడుతున్న పశువులు.....
అవును పల్లె కన్నీరు పెడుతోంది. గత వైభవాన్ని గుర్తుచేసుకుని.. వెక్కి వెక్కి ఏడుస్తోంది.. చినుకుల అలికిడి కోసం నేల.. నేలంతా నోళ్లు తెరుచుకుని.. ఎదురుచూస్తోంది. బక్కచిక్కిన పశువులు తాగునీరు లేక ఎడారిలోని ఒంటెల్లా అల్లాడుతున్నాయి. నాగలి మట్టిని మురిపెంగా ముద్దాడాలని.. విత్తనం కొత్త అందంతో ఊరకలేయాలని ఆశగా, ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఆకు పచ్చని సంతకం కోసం భూమి ఉవ్విళ్లూరుతోంది. ప్రాజెక్టులు జలకళతో రైతులకు సిరులు కురిపించాలని మురిసిపోతున్నాయి. కానీ, కొన్నేళ్లుగా ప్రకృతి విపత్తులు రైతాంగంపై కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. వర్షాభావం కారణంగా సాగునీటి ప్రాజెక్టులు క్రమక్రమంగా అడుగంటిపోతున్నాయి.
అడుగంటిన జలాశయాల నీటిమట్టాలు....
ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోని ప్రధాన రిజర్వాయర్లు వరదనీటి కోసం పడిగాపులు కాస్తున్నాయి. తెలంగాణ రాష్ర్టానికి జీవనరేఖలైన కృష్ణ, గోదావరి నదులు పరవళ్ల కోసం ఎదురుచూస్తున్నాయి. సాధారణంగా జులై రెండో వారానికే ప్రాజెక్టులు నీటితో కళకళలాడాలి. కానీ, వర్షాలు పడక జలశయాలు అడుగంటిపోయి కనిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువనున్న నారాయణపూర్, ఆల్మట్టి నుంచి ఎలాంటి ఇన్ ఫ్లో లేక పోవడంతో.. గరిష్ట నీటమట్టం 1045 అడుగులకు పడిపోయింది. ఇక తాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో నీటినిల్వ మరింతగా తగ్గనుంది.
గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు .....
ఇటు శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 802 అడుగుల స్థాయిలో 30 టీఎంసీల నీటి నిల్వ ఉంది. క్రమక్రమంగా ప్రాజెక్టులోని నీరు అడుగంటుతుండడంతో రైతులు ఆందోళనలో పడిపోయారు. వేల ఎకరాలకు సాగునీరందుస్తున్న ఈ ప్రాజెక్టు.. ఇప్పుడు నీరు అడుగంటి.. రైతుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.
సుంకేశులకు 280 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో .....
సుంకేశులకు కూడా స్వల్పంగా 280 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. కర్నూలు జిల్లా ప్రజల తాగునీటికి 238 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో వదులుతున్నారు. ఇటు గోదావరి ఈసారి ముందుగానే ఉరకలేసింది. నాలుగైదు రోజుల కిందటి వరకు భద్రాచలం వద్ద వరద ప్రవాహం ఎక్కువగానే కనిపించింది. ఒక్కరోజులో 31 అడుగుల నుంచి 41 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. వరద తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం గోదావరి సాధారణ స్థాయిలోనే ప్రవహిస్తున్నది. ఇటు ఎస్సారెస్పీకి ఎలాంటి వరద ప్రవాహం లేకపోవడంతో ప్రస్తుతం కేవలం 11 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. తెలంగాణలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పైనే ఆధారపడి రైతులు పంటలు సాగుచేస్తున్నారు. అయితే ప్రాజెక్టుల్లో నీరు ఇప్పటి వరకు చేరక పోవడంతో వారంతా ఆందోళనకు గురువుతున్నారు. ప్రాజెక్టులకు నీరు చేరకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం కనిపిస్తోంది. 

17:38 - July 22, 2015

హైదరాబాద్:గోదావరి పుష్కరాల్లో మకరం హల్‌చల్ చేసింది. కరీంనగర్‌ జిల్లా మల్లాపూర్ మండలం పాతదాంరాజుపల్లి పుష్కర ఘాట్‌ వద్ద మొసలి దర్శనమిచ్చింది. దీంతో పుణ్యస్నానాల కోసం వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. పిల్లలు, పెద్దలు, మహిళలు మొసలిని చూసి పరుగులు పెట్టారు. పుష్కరాలు ప్రారంభమైన నాటి నుంచి గ్రామంలో మొసలి రావడం ఇది రెండోసారని స్థానికులు చెప్తున్నారు.

17:34 - July 22, 2015

హైదరాబాద్:తలసాని శ్రీనివాస్‌ను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. రాజీనామా చేశానని తలసాని చెబుతున్నారు... రాజీనామా లేఖ అందలేదని స్పీకర్ కార్యాలయం చెబుతోంది... ఇప్పటికైనా గవర్నర్ జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని తమ్మినేని అన్నారు. 

17:32 - July 22, 2015

హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై వేసిన పిటిషన్‌ను పిటిషనర్ ఉపసంహరించుకున్నారు. 31వ తేదీతో వారి గడువు ముగియనుండటంతో.. పిటిషన్‌ ఉపసంహరించుకున్నట్లు వారు తెలియచేశారు. మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీలు ఫిరాయించినదానిపై ఈ పిటిషన్‌ వేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. 

17:30 - July 22, 2015

హైదరాబాద్:తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. పద్యమే పదునైన ఆయుధంగా తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన సాహిత్య ఝరి. సామాన్య ప్రజల హృదయాల్లోని ఆకాంక్షల్ని అక్షరాగ్నులుగా సంధించిన విప్లవ ధీశాలి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఎలుగెత్తిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. ఈ రోజు ఆ అక్షర విప్లవకారుడి జయంతి.
పీడిత ప్రజల గొంతుగా నినదించిన మహాకవి.....
నా పేరు ప్రజాకోటి...నా ఊరు ప్రజావాటి అంటూ తెలంగాణ ప్రజల హృదయతంత్రులను మీటి ,వారిని జాగృతం చేసిన ప్రళయకవితామూర్తి దాశరథి కృష్ణమాచార్య. నిజాం నిరంకుశ పాలనలో రకరకాల హింసలు అనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించి..పీడిత ప్రజల గొంతుగా మారి నినదించిన మహాకవి.
1925 జూలై 22న వరంగల్ జిల్లా గూడూరులో జననం......
1925 జూలై 22న వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించారు దాశరథి కృష్ణమాచార్య. ఖమ్మం జిల్లా మధిరలో బాల్యం గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషన్‌, భోపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీషు సాహిత్యంలో బీఏ చదివారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మహాపండితుడు దాశరథి. చిన్నతనంలోనే పద్యాలు అల్లారు. హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో అక్షరాలను నిప్పు రవ్వలుగా వెదజల్లారు దాశరథి.
నా తెలంగాణ కోటి రత్నాల వీణ ......
నిజాం నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన దాశరథి..ఓ నిజాము పిశాచమా కానరాడు..నిన్నుబోలినరాజు మాకెన్నడేని...తీగెలను తెంపి అగ్నిలో దింపినావు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఎలుగెత్తి ఎంతోమందిని ఉద్యమం వైపు ఉరకలెత్తించారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులను తీర్చిదిద్దారు. పంచాయితీ ఇన్‌స్పెక్టర్‌, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేశారు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసారు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాశారు. సినిమాల్లో ఆయన కలం నుంచి జాలువారిన పాటలు ఇప్పటికీ అజరామరమే.
దాశరథి రచించిన తొలి కవితా సంపుటి అగ్నిధార(1949).....
1949లో దాశరథి రచించిన తొలి కవితా సంపుటి అగ్నిధార. విశాలాంధ్ర ఆవిర్భవించాలని కోరుతూ రచించిన కావ్యం మహాంధ్రోదయం 1956లో ప్రచురితమైంది. 1961 గాలిబ్‌ గీతాలు అనువాద కావ్యమైనా విశేష ప్రశంసలు అందుకుంది. విప్లవవాది అయిన దాశరథి..ఆలోచనా లోచనాలు...కూడా దాశరథి కవితాఝరితో సాగిపోయింది. తిమిరంతో సమరం కావ్యానికి 1975లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇంకా ఎన్నో పురస్కారాలు దాశరథిని వరించాయి. 1977 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆస్థానకవిగా బాధ్యతలు నిర్వహించారు దాశరథి.
1987 నవంబర్‌ 5న మరణం....
తెలుగు సాహిత్య క్షేత్రంలో విరాజిల్లుతున్న దాశరథి 1987 నవంబర్‌ 5న భౌతికంగా మరణించారు. దాశరథి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 

స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయిన సీఎం కార్యదర్శి

ఉత్తరాఖండ్: ఓ పత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఉత్తరాఖండ్ సీఎం కార్యదర్శి మహ్మద్ షాహిద్ దొరికిపోయాడు. మద్యం దుకాణాలు కేటాయింపునకు ముడుపుల బేరం పెట్టారు. మహ్మద్ మద్యం దుకాణాల కేటాయింపుల్లో అన్ని అవకతవకలకు పాల్పడినట్లు బిజెపి ఆరోపించింది. ఈ ఘటనపై సీఎం వెంటనే రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.

తలసానిని వెంటనే భర్తరఫ్ చేయాలి: తమ్మినేని

హైదరాబాద్:తలసానిని మంత్రి వర్గం నుండి వెంటనే భర్తరఫ్ చేయాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. తలసాని రాజీనామ విషయంలో స్పీకర్, సీఎం మౌనం వహించడం కొత్త నాటకాలకు తెరలేపడే అని ఆరోపించారు. కేసీఆర్ తీరుతో ప్రజలకు చట్టసభలపై గౌరవం సన్నగిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈస్ట్ కోస్ట్ లో గేట్ వేగా ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు...

రాజమండ్రి :ఏపీ అభివృద్ధికి అనేక రకాలుగా ఆలోచిస్తున్నాం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త రాష్ట్రంలో సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నాం అని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని వనరులు ఏపీకి ఉన్నాయన్నారు. ఈస్ట్ కోస్ట్ లో గేట్ వేగా తయారయ్యే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయడం కష్టం కాదన్నారు. ఏడాదికి 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయన్నారు. పోర్టులన్నీ అభివృద్ధి చేసుకుంటే చాలా లాభాలున్నాయన్నారు.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా...

హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ తమ పరిధిలోకి వస్తుందా... రాదా... అనే అంశంపై మరింత కసరత్తు చేయాలని పిటిషనర్ కు హైకోర్టు సూచించింది. ఎమ్మెల్యేల అనర్హతపై గతంలో వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులు స్పీకర్ నిర్ణయం తరువాతే వెలువడ్డాయని కోర్టు తెలిపింది. మంత్రిగా తలసాని అర్హుడా... అనర్హుడా అనేది మొదట తేలాల్సి వుందని కోర్టు స్పష్టం చేసింది. మరో వైపు ఎమ్మెల్సీ ల అనర్హత పిటిషన్ పిటిషనర్ ఉపసంహరించుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్సీ పదవీ కాలం ఈ నెల 31న ముగియనుండడంతో పటిషన్ ఉపసంహరించినట్లు తెలిపారు.

టిఎస్ రాష్ట్ర ఆదాయంపై విష ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి ఈటెల

హైదరాబాద్:ప్రభుత్వ ఆశయాల మేరకే ఆదాయం పెరుగుతోందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ఆదాయంపై విష ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సేల్స్ ట్యాక్స్ వసూలు భారీగా పెరిగిందన్నారు. గత జూన్ లో రూ.2,265 కోట్లు వసూలయితే ఈ ఏడాది రూ.2,425 కోట్లు వసూలయ్యాయన్నారు. అన్ని రంగాల్లో వృద్ధి రేటు సాధిస్తున్నామని తెలిపారు. ఏశాఖకూ డబ్బుల కొరత లేదన్నారు. తెలంగాణ దేశంలోనే అగ్రగామి రాష్ట్రం అని స్పష్టం చేశారు.

26న తెలంగాణ సీఎల్పీ సమావేశం...

హైదరాబాద్: ఈ నెల 26న అసెంబ్లీ కమిటీ హాల్ లో తెలంగాణ సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు, ఓటుకు కోట్లు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేయనున్నట్లు సమాచారం.

'ఆత్మహత్య చేసుకున్న 12 మంది రైతు కుటుంబాలకు పరిహారం'

మెదక్:గజ్వేల్‌లో ఆత్మహత్య చేసుకున్న 12 మంది రైతు కుటుంబాలకు రూ. లక్షన్నర చొప్పున నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చెక్కులు అందజేశారు. అనంతరం రైతు కుటుంబాలతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. ప్రభుత్వం తరపున రైతు కుటుంబాలను ఆదుకుంటామని హామీనిచ్చారు.

టీఎస్ ఐపాస్ కింద 19 కంపెనీలకు అనుమతి

హైదరాబాద్:నూతన పారిశ్రామిక విధానం అనుసరించి మరో 19 కంపెనీలకు అనుమతి పత్రాలను సీఎం కేసీఆర్ జారీ చేశారు. ఈ 19 కంపెనీల ద్వారా తెలంగాణకు రూ. 1,087 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సుమారు 6 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

గోదారమ్మ తల్లికి సారె సమర్పించిన మహిళలు..

రాజమండ్రి:పుష్కరాల సందర్భంగా పలువురు మహిళలు గోదారమ్మ తల్లికి సారె సమర్పించారు. పుష్కరాలకు ఇంకా మూడు రోజులే ఉండటంతో పుష్కర స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 323 పాయింట్ల వద్ద లాబపడి 28,505 వద్ద ముగిసింది. నిఫ్టీ 104 పాయింట్లు లాభపడి 8634 వద్ద ముగిసింది.

ఆగ్రాలో మదర్ డెయిరీ పై కేసు నమోదు

హైదరాబాద్: మదర్ డెయిరీ పాల బ్రాండ్ పై ఆగ్రాలోని జిల్లా కోర్టులో కేసు నమోదైంది. ఈ పాలల్లో డిటర్జెంట్లు కలిపినట్లు ఆహార భద్రత అధికారులు తేల్చారు. దీని పై స్థానిక జిల్లా కోర్టు లో ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఆహార పదార్ధాలల్లో హానికర రసాయనాలు కలుపుతున్నారంటూ సెక్షన్ 26(2)9ఐ) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మరో వైపు మదర్ డెయిరీ పాలు సరిగా లేవంటూ వినియోగదారులు ఆందోళన చేపట్టారు.

16:16 - July 22, 2015

హైదరాబాద్: కన్నందుకు కన్నవారి రుణం తీర్చుకోవాలంటారు. కాని తన రుణాలను కూడా కన్నవారి నెత్తిన పెట్టి పారిపోయాడో కొడుకు. వయోభారం మీద పడుతున్నా ఆ ఆర్ధికభారాన్ని మోయటానికి ప్రయత్నించారా అభాగ్య తల్లిదండ్రులు. వారి వల్ల కాలేదు. కన్నకొడుకు కంటిచూపుకు కూడా అందకుండా వెళ్లిపోయాడు. ఓపిక లేని వయసులో ఓపిక తెచ్చుకుని మరీ చావు దగ్గరికి వెళ్లిపోయారు. ఇవి ఆత్మహత్యలేనా.. లేక వదిలేసి పారిపోయిన కొడుకు చేసిన హత్యలా లేక అంతులేని ఆర్ధిక కష్టాల హత్యలా... ఇదే అంశం టెన్ టివి చర్చను చేపట్టింది.ఈ చర్చలో సామాజిక విశ్లేషకులు దేవి, డాక్టర్ రమణ(గుంటూరు) పాల్గొన్నారు. మరి ఆ విశ్లేషణాత్మకమైన చర్చను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

ఏసీబీ వలలో ప్రొద్దుటూరు డ్రగ్ ఇన్సెపెక్టర్

కడప: ప్రొద్దుటూరు డ్రగ్స్ ఇన్స్ పెక్టర్ రమేష్ రెడ్డి ఏసీబీకి చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.13 వేలు లంచం తీసుకుంటుండగా రమేష్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

మెదక్ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ స్పీకర్

హైదరాబాద్: మెదక్ ఏరియా ఆస్పత్రిని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తనిఖీ చేశారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడాతూ చేగుంట-మెదక్‌ రహదారి నిర్మాణానికి రూ. 30 కోట్లు, మెదక్‌లో డ్రైనేజీ నిర్వహణకు రూ. 30 లక్షలు విడుదల చేశామని పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు

ఆగివున్న లారీనీ భీకొట్టిన కారు: ఇద్దరు మృతి

నిజామాబాద్ :డిచ్పల్లి మండలం సాంపల్లి 44వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు రాజేష్ కుమార్ (32), డ్రైవర్ గోపి (35) అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.

15:35 - July 22, 2015

రాజమండ్రి: పుష్కరాల ముగింపు రోజైన 25న ప్రతీ ఇంట్లో దీపారాధాన చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ నిర్ణయించింది. బుధవారం రాజమండ్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో కేబినెట్‌ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పుష్కరాల కోసం పనిచేసిన వివిధ విభాగాలకు ఈనెల 26న అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధురవాడలో ఐటీ కంపెనీకి 300 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కర్నూలులో డీఆర్‌డీవో ఏర్పాటుకు 2000 ఎకారాలు ఇచ్చేందుకు ఏపీ కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ముసునూరు తహశీల్దార్‌ వనజాక్షిపై దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే చింతమనేనికి ఏపీ కేబినెట్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. తహశీల్దార్‌ వనజాక్షిదే తప్పని కేబినెట్‌ తేల్చింది. కాలిశస్త్ర చికిత్స కారణంగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ సమావేశానికి హాజరుకాలేదు.

డీఎస్ తో భేటీ అయిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: ఇటీవలే టిఆర్ ఎస్ లో చేరిన సీనియర్ రాజకీయ నేత డి.శ్రీనివాస్ ను ఆయన నివాసంలో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరివురు మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

రాజమండ్రి: నాలుగున్నర గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కర్నూలు జిల్లాలో రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు 2,200 ఎకరాలు కేటాయింపు, 25న గోదావరి తీరంలో ప్రతి ఇంట్లో పుష్కర జ్యోతి పేరిట హారతులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు సమాచారం. విశాఖ మధురవాడలో ఐటీ పరిశ్రమకు 300 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పుష్కరాల్లో పనిచేసిన వివిధ విభాగాల్లోని సభ్యులకు  ఈ నెల 26న అవార్ఢులివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ సీడ్ క్యాపిటల్‌పై కూడా చర్చ జరిగినట్టు సమాచారం.

మచిలీపట్నంలో మున్సిపల్ కార్మికుల ఆందోళన...

కృష్ణా:మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డగించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కార్మికుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు గాయలయ్యాయి.

14:45 - July 22, 2015

హైదరాబాద్: నేటి సమాజంలో వయో వృద్ధులు, తల్లిదండ్రులు నిరాదరణకు గురౌతున్నారు. పేరెంట్స్ కు పిల్లలు మోరల్ సపోర్టు కూడా ఇవ్వడం లేదు... నిరాదరణకు గురైన తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నింటినీ నిరోధించడానికి 2007 సంవత్సరంలో ప్రభుత్వం వయో వృద్ధులు, తల్లిదండ్రుల సంరక్షణ చట్టం తీసుకు వచ్చింది. మరి ఆ చట్టంలో ఏఏ అంశాలు పొందు పరిచారో 'మై రైట్' కార్యక్రమంలో న్యాయవాది పార్వతి వివరించారు. మరి ఎలాంటి వివరణ ఇచ్చారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

14:37 - July 22, 2015

హైదరాబాద్:దాశరథి జయంతి ఉత్సవాల్లో ఏపీ సీఎంపై సెటైర్లేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికీ కొందరు ఆంధ్ర నేతలు పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఏపీ రాజధానిని హైదరాబాద్‌తో పోల్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు.. హైదరాబాద్ వాళ్లకు నిద్రలేవడంతెలియదని... ఎన్టీఆర్ వచ్చాకే ఇది నేర్పారనడం సరికాదని విమర్శించారు..

14:31 - July 22, 2015

ఢిల్లీ:లలిత్‌మోదీ వివాదం రాజ్యసభను కుదిపేసింది. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న కొందరి వాదనను సీతారాం ఏచూరి వ్యతిరేకించారు. వీసాగేట్ వివాదంలో కేంద్రం జోక్యం కాదు పారదర్శక విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేంద్రం సుష్మా స్వరాజ్‌ను వెనకేసుకొస్తుందని మండిపడ్డారు. అయితే తాముఎవరిని వెనకేసుకురావటం లేదంటూనే అరుణ్ జైట్లీ సుష్మా రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.

14:29 - July 22, 2015

తూ.గో: రాజమండ్రి కొత్త పేటలో బాణ సంచా కేంద్రలో పేలుడు సంభవించి ముగ్గురు సజీవద హనం అయ్యారు. మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పంట పొలాల మధ్య ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే... కోన సీమ ముఖ ద్వారం కొత్త పేటలో దూలం కోటేశ్వరరావుకు చెందిన బాణ సంచా కేంద్రంలో జరిగిన పేలుడు లో ముగ్గురు సజీవ దహనం అవగా..మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా.. మరో కార్మికుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. దూలం కోటేశ్వరరావు అనధికారికంగా పెద్ద ఎత్తున బాణసంచా తయారు చేస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో మొత్తం 7 మంది కార్మికులు పని చేస్తున్నారు. క్షతగాత్రులను కొత్త పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సూచించినట్లు తెలుస్తోంది.

 

కాచిగూడ పీఎస్ పరిధిలో ఏడాదిన్నర పాప కిడ్నాప్....

హైదరాబాద్:కాచిగూడ పీఎస్ పరిధిలో ఏడాదిన్నర పాప కిడ్నాప్ కావడం కలకలం రేపుతోంది. బుదవారం మధ్యాహ్నం గుర్తుతెలియని ఓ మహిళ, తల్లి దృష్టి మరల్చి పాపను తీసుకుని మాయమైంది. తల్లి తేరుకునే లోపలే మాయలేడి పరారైంది. దీంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్థన్ రెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ కేసు..

హైదరాబాద్:కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్థన్ రెడ్డిపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. దొమలగూడలోని తన 798 స్క్వేర్ యార్డ్ ప్లాట్ కు చెందిన అగ్రిమెంట్ పత్రాలను ఫోర్జరీ చేసి, ప్లాట్ ను మాజీ ఎమ్మెల్యే, అతని ఇద్దరి సహచరులు ఆక్రమించుకున్నారంటూ అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ కార్వడే పోస్టు ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడట. దాని ఆధారంగానే కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా....

ఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడింది. అవినీతి మంత్రులు రాజీనామా చేయాలని విపక్షాల నిరసనల మధ్య సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

దమ్ముంటే తలసాని తన బండారం బయట పెట్టాలి: షబ్బీర్ అలీ

హైదరాబాద్: దమ్ముంటే తన బండారం బటయపెట్టాలని ఆయన తలసానికి సవాల్ విసిరారు. ‘‘అయినా రాజకీయాల్లో ఆలుగడ్డ శీను కంటే నేనే సీనియర్ ని’’ అని షబ్బీర్ తనదైన శైలిలో తలసానిపై ఎదురు దాడి చేశారు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తలసాని నానా యాగీ చేస్తున్నారని ఆరోపించారు. తలసాని సంగతేంటో ప్రజలకు తెలుసని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీ మారిన తలసాని తక్షణమే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని అటు టీ టీడీపీ, కాంగ్రెస్ నేతలు వరుస దాడులు చేస్తున్నారు. వీటిపై నిన్న తలసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్చీర్ అలీపై తలసాని నిప్పులు చెరిగారు.

మధురైలో బాహుబలి థియేటర్ పై పెట్రోలు బాంబు దాడి...

తమిళనాడు:సూపర్ హిట్ చిత్రం 'బహుబలి'లో గిరిజనులను కించపరిచేలా డైలాగులున్నాయని ఆరోపిస్తూ, తమిళనాడులోని మధురైలో చిత్ర ప్రదర్శన జరుగుతున్న థియేటరుపై నిరసనకారులు దాడి చేశారు. 'తమిళ పులి' సంస్థకు చెందిన కార్యకర్తలు థియేటరుపై పెట్రోలు బాంబును విసిరారు. గిరిజనులను కించపరిచేలా ఉన్న డైలాగులను తక్షణం తొలగించాలని వారు డిమాండు చేశారు. ఈ ఘటనలో ప్రేక్షకులెవరికైనా గాయాలు అయినట్టు సమాచారం అందలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు థియేటరు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు:ఒకరి మృతి

తూ.గో: కొత్తపేటలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

డీపీవో ఆర్మ్ డ్ విభాగంలో మిస్ ఫైర్..

కర్నూలు : డీపీవో ఆర్మ్ డ్ విభాగంలో కానిస్టేబుల్ చేతిలో ఉన్న తుపాకి ప్రమాదవశాత్తు పేలింది. ముగ్గురు కానిస్టేబుళ్లు తృటిలో తప్పించుకున్నారు.

 

ఇంటర్ విద్యార్థిపై లైంగిక దాడి..విద్యార్థి ఆత్మహత్య..

అనంతపురం : కనగాపల్లి (మం) ముత్తువకుంట్లలో ఇంటర్ విద్యార్థినిపై కాలేజీ ప్రిన్స్ పాల్ లైంగిక దాడి చేశాడు. తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 

13:34 - July 22, 2015

హైదరాబాద్ :నగరంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరాల గుట్టు రట్టైంది. బుధవారం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బెట్టింగ్ కు పాల్పడుతున్న 13 మందిని అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితుల దగ్గర రూ.26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సీపీ మహేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. రాజస్థానంలో మేన్ బుకీ ఆషు..ఇక్కడ మరో బుకీ నిక్కు అనే వ్యక్తులుంటారని పేర్కొన్నారు. బుకీల కింద సబ్ బుకీలు..ఫంటర్స్ ఉంటారని, గేమ్ జరుగుతున్నప్పుడు బెట్టింగ్ జరుగుతుందన్నారు. సూట్ కేస్ లో సుమారు 20 సెల్ ఫోన్స్ ఉంటాయని, వీటికి ఒక మైక్, స్పీకర్ అనుసంధానిస్తారని తెలిపారు. గేమ్ ప్రారంభమైన తరువాత ఒక బుకీ నేరుగా 20 మందితో మాట్లాడడం జరుగుతుందని, బెట్టింగ్ శాతం ఎంతనో ఆషు డిక్లేర్డ్ చేస్తాడని, బెట్టింగ్ చేసే వాయిస్ రికార్డు చేసేందుకు ల్యాప్ టాప్ ఉపయోగిస్తారని తెలిపారు. కేవలం మాట మీద నమ్మకంతో బెట్టింగ్ జరుగుతుందని, తరువాత లావాదేవీలు జరుగుతాయన్నారు. 50 ఓవర్ల మ్యాచ్ లో రెండు ఇన్సింగ్స్ లు కలిపి బెట్టింగ్ చేస్తారని, ప్రతి పది ఓవర్లకు బెట్టింగ్ నిర్వహిస్తారని తెలిపారు. అదే ట్వంటీ -20 మ్యాచ్ లో మాత్రం ప్రతి పది ఓవర్లకు బెట్టింగ్ నిర్వహిస్తారని, అవతలి టీం బ్యాటింగ్ సమయంలో ప్రతి ఆరు ఓవర్లకు బెట్టింగ్ చేస్తారని తెలిపారు. ఇందులో చాలా మంది ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. 

సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ..

హైదరాబాద్: సచివాలయం జే - బ్లాక్ లో కమల్ నాథన్ కమిటీతో తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. హైదరాబాద్: సచివాలయం జే - బ్లాక్ లో కమల్ నాథన్ కమిటీతో తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. 

సుప్రీంలో వేణుగోపాలచారి పిటిషన్..

ఢిల్లీ : సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి పిటిషన్ దాఖలు చేశారు. విభజన చట్టాన్ని అమలు చేయడం లేదని వేణుగోపాల చారి పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని, హైకోర్టును విభజించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.

 

13:12 - July 22, 2015

ఢిల్లీ : వ్యాపం స్కాంపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం ప్రారంభమైన రాజ్యసభలో ఆమె నిరసన వ్యక్తం చేశారు. లలిత్ మోడీ వివాదంతో పాటు వ్యాపం స్కాంపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఇవి చాలా కొన్ని విషయాలంటూ కేంద్ర కొట్టిపారేస్తోందని కానీ ఇది అతి పెద్ద కుంభకోణాలని పేర్కొన్నారు. 

13:09 - July 22, 2015

ఢిల్లీ : లలిత్ మోడీ వ్యవహారం రాజ్యసభ ను కుదిపేసింది. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాలన్న కొందరి వాదనను సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి వ్యతిరేకించారు. వీసా గేట్ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవడం కాదు..పారదర్శక విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేంద్రం మంత్రి సుష్మాను వెనకేసుకొస్తుందని ఏచూరి పేర్కొన్నారు. కానీ తాము ఎవరిని వెనకేసుకరావడం లేదని, సుష్మా రాజీనామా చేయాల్సినవసరం లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. 

రవీంద్రభారతిలో దాశరథి 91వ జయంతి ఉత్సవాలు..

హైదరాబాద్ : రవీంద్రభారతిలో డా.దాశరథి కృష్ణమాచార్య 91వ జయంతి ఉత్సవాలు జరిగాయి. సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూధనాచారి, మంత్రి నాయినీ నర్సింహారెడ్డిలు దాశరథి చిత్రపటానికి పూలమాలవు వేసి నివాళులర్పించారు. 

జీఎస్టీ బిల్లు రైతులకు వ్యతిరేకం - మాయావతి..

ఢిల్లీ : జీఎస్టీ బిల్లు విషయంలో తమ వైఖరి వెల్లడించామని, రైతులకు వ్యతిరేకమని మాయావతి పేర్కొన్నారు. 

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్ అరెస్టు..

కోల్ కతా : మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

12:52 - July 22, 2015

జార్ఖండ్ : జంషెడ్‌పూర్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది. రెండు గ్రూపుల మధ్య తగాదా ఇక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. ఈవ్ టీజింగ్ ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. రెండుగా విడిపోయిన కొందరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడ కర్ఫ్యూ విదించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా ముఖ్యమైనప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

అసోంలో కొండచరియలు విరిగి పడి ఐదుగురు మృతి..

అసోం : దక్షిన అసోంను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. స్థానిక సిల్చార్ లోని లాహిపూర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపడడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. 

12:44 - July 22, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంత చెరువుల పునరుద్ధరణ చేపట్టింది. ఇక ఇప్పుడు రాష్ట్ర రాజధానిపై దృష్టిపెట్టింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా చెరువుల వివరాలు సేకరించాలని ఇరిగేషన్‌శాఖ అధికారులకు సూచించింది. మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా వచ్చే మూడు, నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 46 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని టీసర్కార్ నిర్ణయించింది. ఈ ఏడాది 9 వేల 6 వందల చెరువులను టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే వర్షాల రాకతో అనుకున్న లక్ష్యాన్ని చేరలేదు. సుమారు 6 వేల 9వందల వరకు చెరువులను పునరుద్ధరించింది. ఇంకా కొన్ని చెరువుల పూడిక తీత పనులు కొనసాగుతుండగా వర్షాలు కురిశాయి. మిగతా చెరువులను వచ్చే జనవరిలో పూడిక తీత పనులు చేపట్టాలని ఇరిగేషన్‌శాఖ నిర్ణయించింది.
చెరువుల వివరాలు, కబ్జా చేసినవారి వివరాల సేకరణ..
గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల పునరుద్ధణ చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి మొత్తం 26 చెరువులను ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్‌లోని నాచారం, కాప్రా చెరువు, ఉప్పల్‌లోని నల్లచెరువు, మన్సూరాబాద్‌లోని పెద్ద చెరువు వంటి చెరువులను ఆధునీకరణ చేయనున్నారు. ఈ చెరువుల వివరాలు, కభ్జా చేసిన వారి వివరాలతో పాటు వాటిని తిరిగి స్వాధీనం చేసుకొనే సందర్భంలో ఎదురయ్యే టెక్నికల్ సమస్యలను సైతం పరిశీలించాలని సర్కార్ అధికారులకు అదేశాలు జారీ చేసింది. అయితే హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే చాలా చెరువులు కబ్జాలకు గురైనట్లుగా ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. కబ్జాలకు గురైన చెరువుల శిఖం భూమిని వెనక్కుతీసుకుంటుందా..? లేక ఉన్న చెరువులనే పునరుద్ధరణ చేస్తుందా..?అనేది చూడాలి.

రాజ్యసభ మళ్లీ వాయిదా..

ఢిల్లీ : కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాల్సిందేనంటూ విపక్షాలు రాజ్యసభలో పట్టుబడుతున్నాయి. బుధవారం ప్రారంభమైన కొద్దిసేపటికే పలుమార్లు వాయిదా పడింది. సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు ఆందోళన చేశాయి. దీనితో స్పీకర్ సభను మధ్యాహ్నాం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

12:32 - July 22, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్పీకర్ మధుసూధానాచారి నివాసం వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సభాపతిని కలిసేందుకు పెద్ద ఎత్తున్న టిడిపి శ్రేణులు తరలి వచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు..కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. లోనికి అనుమతించకపోవడంతో నేతలు..కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్యవహారంపై టి.టిడిపి నేతలు పోరు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పీకర్ ను కలువాలని టి.టిడిపి నేతలు నిర్ణయించారు. సనత్ నగర్ ప్రాంతానికి చెందిన టిడిపి నేతలు కూడా స్పీకర్ నివాసానికి చేరుకున్నారు. తమకు కూడా స్పీకర్ ను కలిసే అనుమతినివ్వాలని కోరారు. కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే అనుమతినిస్తామని చెప్పడంతో ఎర్రబెల్లి నేతృత్వంలో స్పీకర్ ను కలిశారు. అనంతరం స్పీకర్ తో భేటీ సంతృప్తికరంగా జరిగిందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఇప్పటికే తాము ఈ విషయంపై ఆరు సార్లు స్పీకర్ ను కలువడం జరిగిందని గుర్తు చేశారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా తలసాని రాజీనామా లేఖ చేయలేదని దృష్టికి రావడం జరిగిందని స్పీకర్ కు తెలుపడం జరిగిందన్నారు. ఈ రోజు జరిగిన భేటీలో స్పీకర్ సానుకూలంగా స్పందించారని, తలసాని రాజీనామా వ్యవహారంలో రెండు రోజుల్లో స్పందిస్తానని స్పీకర్ చెప్పడం జరిగిందన్నారు. 

12:19 - July 22, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. పుష్కరాలకు వెళ్తున్న భక్తులు కరీంనగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌ వద్ద తుఫాన్‌ వాహనం చెట్టును బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు చనిపోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు. మృతులు మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి వాసులు. పుష్కరాలకు కాళేశ్వరం వెళ్తుండగా అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.
ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం ఇంక్లైన్‌-3 వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. బాధితులు ఒంగోలు వాసులుగా గుర్తించారు. భద్రాచలం పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
విజయనగరంలో..
విజయనగరం జిల్లా భోగాపురం టోల్ గేట్ వద్ద పుష్కర యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదానానికి గురైంది. రోడ్డు పక్కన ఆగివున్న ఓ కంటైనర్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 39 మందికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో.. విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. స్వల్ప గాయాలైన వారికి స్థానికంగా ఉన్న సుందరపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, మరికొంతమందిని విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన వీరంతా గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తున్నారు.

లోక్ సభ వాయిదా..

ఢిల్లీ : లోక్ సభ విపక్ష ఆందోళనలతో అట్టుడుకుతోంది. సభ ప్రారంభం కాగానే మధ్యాహ్నాం 12గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహజన్ మధ్యాహ్నాం రెండు గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ ఆందోళన..

ఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనితో నిరసనకారులపై పోలీసులు వాటర్ కెనాన్ లను ప్రయోగించారు. 

12:05 - July 22, 2015

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విభజన కోరుతూ టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా నిర్వహించారు. పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసిన టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణకు వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారుర. ప్ల కార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. హైకోర్టు రాకుండా కొంతమంది కేంద్ర మంత్రులు అడ్డుకుంటున్నారని ఎంపీ కవిత ఆరోపించారు. ఓ జాతీయ ఛానెల్ తో ఆమె మాట్లాడారు. హైకోర్టు విభజనలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కల్పించుకోవాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించేంత వరకు తాము ఆందోళన చేస్తామని ఎంపీ కవిత స్పష్టం చేశారు. 

మోతే ఘాట్ వద్ద బురదలో ఇరుక్కపోయిన వాహనాలు...

ఖమ్మం : మోతే ఘాట్ వద్ద బురదలో వాహనాలు ఇరుక్కపోయాయి. దీనితో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

 

ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీల ధర్నా...

ఢిల్లీ :పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా నిర్వహించారు. తెలంగాణకు వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. హైకోర్టు రాకుండా కొంతమంది కేంద్ర మంత్రులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 

స్పీకర్ ను కలిసిన టి.టిడిపి ఎమ్మెల్యేలు..

హైదరాబాద్ : స్పీకర్ మధుసూధానాచారిని టి.టిడిపి ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రి తలసాని రాజీనామా వ్యవహారంపై వివరణ కోరడం జరిగిందని, గతంలో తలసానిని సిద్ధిపేటలో విద్యార్థులు కొట్టారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. తలసానికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని, ఆయన గెలిస్తే తాము రాజకీయ సన్యాసం చేస్తామని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ స్పీకర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.

సుష్మా ఏ చట్టం ఉల్లంఘించలేదు - జైట్లీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో స్పష్టం చేశారు.

 

మధ్యప్రదేశ్ శాంతిభద్రతల బాధ్యత ప్రభుత్వానిదే - ఏచూరి..

ఢిల్లీ : మధ్యప్రదేశ్ లో శాంతి భద్రతల బాధ్యత ప్రభుత్వానిదేనని సీపీఎం రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి పేర్కొన్నారు.

సుష్మా..వసుంధరలపై చర్యలు తీసుకోవాలి - మాయావతి..

ఢిల్లీ : కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజేపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాయావతి డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఆమె మాట్లాడారు. వ్యాపం మరణాలతో ఎంపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, వ్యాపం కుంభకోణంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. 

11:27 - July 22, 2015

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. రాజమండ్రిలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో ఈ సమావేశం జరుగుతోంది. సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు రాజమండ్రికి చేరుకున్నారు. సమావేశం ప్రారంభం కాగానే పుష్కరాల్లో తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశ పెట్టింది. రెండు నిమిషా పాటు మంత్రివర్గం మౌనం పాటించింది. అనంతరం కేబినెట్ ముందుగా రెండు నిమిషాల మౌనం పాటించింది. ఈ ఘ‌ట‌న పై న్యాయ విచార‌ణ‌కు సీఎం ఆదేశించడంతో...విచార‌ణ బాధ్యతలు ఎవ‌రికి అప్పగించాలనే దానిపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారులపై చ‌ర్యలు తీసుకోవాల‌నే డిమాండ్ గ‌ట్టిగా వినిపిస్తున్నా..ప్రస్తుతం పుష్కరాలు కొన‌సాగుతున్నందున ఈ స‌మ‌యంలో.. చ‌ర్యలు తీసుకోవాలా వ‌ద్దా అనే దానిపై చ‌ర్చించ‌నున్నారు.
రాజధానిపై చర్చ..
ఇక ఏపీ రాజ‌ధాని అమరావతి సీడ్ క్యాపిట‌ల్ మాస్టర్‌ ప్లాన్‌పై చ‌ర్చించ‌నున్నారు. మాస్టర్‌ డెవ‌ల‌ప‌ర్ స్ధానంలో కొత్తగా అమ‌రావ‌తి డెవ‌ల‌ప్‌మెంట్ పార్టనర్‌ విధానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయ‌నుంది. చేనేత కార్మికుల 125 కోట్ల రుణ మాఫీపైనా ఓ నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంది. అనంతపురంలో మున్సిపల్ వర్కర్ మృతి చెందిన దానిపై మున్సిపల్ వర్కర్లు చేస్తున్న సమ్మెపై కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక‌ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల తేదీలు నిర్వహణ పైనా కేబినెట్‌ ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఎక్కడ నిర్వహించాలి అన్న దానిపై చర్చించనున్నారు. 

రాజ్యసభ వాయిదా..

ఢిల్లీ : బుధవారం ప్రారంభమైన రాజ్యసభ కొద్దిసేపటికే వాయిదా పడింది. 15 నిమిషాల సేపు సభను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ వెల్లడించారు. అవినీతి కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 

లోక్ సభ ప్రారంభం..వాయిదా..

ఢిల్లీ : ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్ సభ వాయిదా పడింది. కాంగ్రెస్ సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేయడం పట్ల స్పీకర్ సుమిత్రా మహజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

11:15 - July 22, 2015

హైదరాబాద్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు లోక్ సభలో గందరగోళం చెలరేగింది. మంగళవారం ప్రారంభమైన లోక్ సభ ఇటీవలే మృతి చెందిన ఎంపీలకు నివాళులర్పించింది. బుధవారం ప్రారంభమైన లోక్ సభలో ప్రకృతి వైపరీత్యాలకు మృతి చెందిన వారికి..గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో మృతి చెందిన వారికి లోక్ సభ నివాళులర్పించింది. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తారాలను చేపట్టారు. కాంగ్రెస్ సభ్యులు నల్లటి బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. దీనికి స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్లబ్యాడ్జీలు..ప్ల కార్డులు పట్టుకుని ఆందోళన చేయవద్దని సూచించారు. కానీ కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోకుండా ఆందోళన చేశారు. దీనితో సభను మధ్యాహ్నాం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. లలిత్ గేట్ స్కాంపై కేంద్ర మంత్రి సుష్మా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీ : లోక్ సభ..రాజ్యసభ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన మొదటి రోజు రాజ్యసభలో లలిత్ మోడీ గేట్ స్కాంపై విపక్షాలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.

పార్లమెంట్ లోనే మాట్లాడుదాం - రాహుల్..

ఢిల్లీ : కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన విమర్శలపై ఏఐసిసి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంట్ లోనే మాట్లాడుతామని పేర్కొన్నారు. బొగ్గు స్కాంలో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సంతోష్ బర్గోడియాకు డిప్లమాటిక్ పాస్ పోర్టును ఇప్పించాలంటూ ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత తనపై ఒత్తిడి తెచ్చారని సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పార్లమెంట్ వేదికగా ఈ విషయాన్ని బట్టబయలు చేస్తానని ట్వీట్ చేశారు. 

ఢిల్లీ పోలీసులు చంపేందుకు ప్రయత్నించారు - దిలీప్ పాండే..

ఢిల్లీ : రాష్ట్ర పోలీసులు - ఆప్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. తాను మీడియాతో మాట్లాడుతుండగా ఒక పోలీసు బస్సు తన మీదుకు దూసుకొచ్చిందని, ఎవరో తనను లాగేసి రక్షించారని ఆప్ నేత దిలీప్ పాండే ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

లలిత్ గేట్ స్కాంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం..

ఢిల్లీ : లలిత్ గేట్ స్కాంపై పార్లమెంట్ లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆ పార్టీ నేతలు మల్లిఖార్జున ఖర్గే, వీరప్ప మొయిలీలు తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు.

 

10:38 - July 22, 2015

గుంటూరు : జిల్లాలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ కనీస వేతనాలు పెంచాలని..తదితర సమస్యలు పరిష్కరించాలని గత 13 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంతో కార్మికులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, నేతలు ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం సంబంధం లేని విధంగా వ్యవహరిస్తోందన్నారు. సింగపూర్ నుండి వచ్చే ప్రతినిధులతో మాట్లాడటానికి టైం ఉంటుంది కాని మాతో మాట్లాడానికి టైం దొరకదా అని ప్రశ్నించారు. ఆరు నెలల నుండి వినతిపత్రాలు సమర్పిస్తూనే ఉన్నామని, కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజధాని మీద దోచుకోవాలి ? అనే ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజలకు అవసరమైన పారిశుధ్య సమస్యపై ఆలోచించడం లేదన్నారు. పారిశుధ్యం..ప్రజలు, కార్మిక అవసరాలపై మంత్రి నారాయణకు పూర్తిగా అవగాహన లేదన్నారు. పారిశుధ్య కార్మికులు చేపడుతున్న సమ్మెపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

మంత్రి కొల్లు రవీంద్రకు చేదు అనుభవం..

రాజమండ్రి : ఏపీ మంత్రి కొల్లు రవీంద్రకు చేదు అనుభవం ఎదురైంది. కేబినెట్ సమావేశానికి వచ్చిన మంత్రిని గుర్తించలేని అక్కడున్న పోలీసులు లోనికి అనుమతించలేదు. తరువాత తెలుసుకున్నాక మంత్రి కొల్లు రవీంద్రను లోనికి పంపించారు. 

ధర్నాను ఉపసంహరించుకున్న కాంగ్రెస్..

ఢిల్లీ : పార్లమెంట్ లో నిర్వహించతలపెట్టిన ధర్నాను కాంగ్రెస్ ఉపసంహరించుకుంది. ఒంటిరిగా కాకుండా అన్ని పక్షాలను కలుపుకుని ధర్నా చేయాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ..

రాజమండ్రి : ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఉద్యోగుల వేతన సవరణ బకాయిలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అమరావతి నిర్మాణం, పుష్కరాలు, గృహ నిర్మాణంపై చర్చ జరుగనుంది. 

అవినీతి మంత్రులు రాజీనామా చేయాలి - వీహెచ్..

ఢిల్లీ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని ఎంపీ వీహెచ్ పేర్కొన్నారు. వ్యాపం కుంభకోణంపై పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుందని, అవినీతికి పాల్పడిన మంత్రులకు కేంద్రం మద్దతిస్తోందని విమర్శించారు. అవినీతికి దూరంగా ఉంటానన్న ప్రధాని మోడీ లలిత్ మోడీని కాపాడాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

 

10:20 - July 22, 2015

హైదరాబాద్ : ఏసీబీ దాడుల్లో ఎంతమంది పట్టుబడినా అధికారుల తీరుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ కోట్లకు పడుగలెత్తుతున్నారు. ఏసీబీ అధికారులు జరుపుతున్న దాడుల్లో వారి అక్రమాస్తులు బయట పడుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా పంచాయతీ రాజ్ ఈఈ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మెదక్, హైదరాబాద్ ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున నల్గొండ, హైదరాబాద్, జహీరాబాద్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నగరంలోని కవాడీగూడ, రాజేంద్రనగర్, గాంధీనగర్ లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారు నాలుగు కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. గాంధీనగర్ లో రెండు ప్లాట్లు, బీబీనగర్ లో మూడు ప్లాట్లు, శంషాబాద్ లో ఓ స్థలం, కారు, 40 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇతడు జహీరాబాద్, మెదక్, సిద్ధిపేట ప్రాంతాల్లో పని చేశారు. కాంట్టాక్టర్లకు అగ్రిమెంట్లు ఇచ్చే సమయంలో భారీగా ముడుపులు తీసుకుంటున్నట్లు ఇతనిపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం జరుపుతున్న తనిఖీల్లో రెండు బ్యాంకర్ల లాక్ లు లభ్యమైనట్లు తెలుస్తోంది. లాకర్లు తెరిచిన తరువాత ఎంత అక్రమాస్తులు కలిగి ఉన్నారనేది తెలుస్తుందని ఏసీబీ అధికారులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసులు..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏసీబీ మరో ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది. టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ అనుచరులు సైదులు, నారాయణ రాజులకు నోటీసులు జారీ చేసింది. 

గురువారం నగరానికి టాటా గ్రూప్ ఛైర్మన్..

హైదరాబాద్ : టాటా గ్రూప్ ఛైర్మన్ సైరన్ మిస్త్రీ గురువారం నగరానికి రానున్నారు. గచ్చిబౌలి ఐఐఐటి ప్రాంగణంలో కోహ్లి పరిశోధన కేంద్రానికి మిస్త్రీ, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లు శంకుస్థాపన చేయనున్నారు. 

మంథని రోడ్డు ప్రమాదంపై ఈటెల ఆరా..

కరీంనగర్ : జిల్లా మంథని వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రి ఈటెల ఆరా తీశారు. ఈఘటనలో ఆరుగురు మృతి చెందగా, పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

 

సుష్మా సంచలన వ్యాఖ్యలు..

ఢిల్లీ : కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొగ్గు స్కాంలో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సంతోష్ బర్గోడియాకు డిప్లమాటిక్ పాస్ పోర్టును ఇప్పించాలంటూ ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత తనపై ఒత్తిడి తెచ్చారని సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పార్లమెంట్ వేదికగా ఈ విషయాన్ని బట్టబయలు చేస్తానని ట్వీట్ చేశారు. 2008-2009 మధ్యకాలంలో సంతోష్ బర్గోడియా కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. 

కొనసాగుతున్న బీజేపీ పార్లమెంటరీ సమావేశం..

ఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా, సీనియర్ నేత అద్వానీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. 

జమ్మూలో భారీ వర్షాలు..

జమ్మూ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజోరీ ప్రాంతంలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. 

జంప్షెండ్ పూర్ లో కర్ఫ్యూ..

జార్ఖండ్ : జంప్షెండ్ పూర్ లో కర్ఫ్యూ విధించారు. ఓ బాలికను అల్లరి పెట్టిన నేపథ్యంలో గొడవలు మొదలయ్యాయి. గత సోమవారం రాత్రి రెండు ముఠాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. విద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. వందమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండో - టిబెటిన్ సరిహద్దు భద్రతా దళాలు జార్ఖండ్ ను అదుపులోకి తీసుకున్నాయి. 

09:26 - July 22, 2015

గుంటూరు : గత 13 రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తుండడంతో గుంటూరు జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ చెత్త పేరుపోయి దుర్వాసన వెదజల్లుతుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎక్కడ అంటు వ్యాధులు ప్రబులుతాయోనన్న భయం వారిలో పట్టుకుంది. ఆరాండల్ పేటలో రోడ్డు మొత్తం చెత్తతో నిండిపోయింది. గత రాత్రి భారీగా వర్షం కురవడంతో చెత్త మొత్తం తడిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దీనిపై స్థానిక నేతలు, స్థానికులు ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు. ఏ మాత్రం అవగాహన లేని కళాశాల కార్పొరేట్ రంగానికి చెందిన మంత్రిని నియమించడం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. వారు నెల రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం..మంత్రి స్పందించలేదన్నారు. గత కొన్ని రోజులుగా వీరు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకుండా పుష్కర పాలన చేస్తున్నారని విమర్శించారు. వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించి పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

09:21 - July 22, 2015

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పుష్కరాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. పుష్కరస్నానం ఆచరించేందుకు భారీగా భక్తులు రాజమండ్రికి చేరుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఎండలతో అలమటించిన రాజమండ్రి వాసులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందుతున్నారు. కానీ పుష్కరాలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ట్రాక్ కు సమీపంలో ఘాట్ లు ఉండడంతో ఇక్కడ స్నానాలు ఆచరించేందుకు భక్తులు వస్తున్నారు. బస్సులు దిగి 5 కిలోమీటర్లు నడిచి రావాల్సి ఉండడంతో తడిసి ముద్దవుతున్నారు. రైల్వే ట్రాక్ నుండి వెళ్లాల్సి ఉండడం..ఆ మార్గం మొత్త బురదమయం కావడంతో భక్తులు పలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులు రాజమండ్రికి రానున్నారు. దీనితో వీరు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తారని అంచనాలున్నాయి. దీనితో వీఐపీ ఘాట్ కు రద్దీ పెరిగే అవకాశం ఉంది. 

09:12 - July 22, 2015

విజయనగరం : జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పుష్కరాల నుండి తిరిగి వెళుతున్న ప్రైవేటు బస్సు ఆగి ఉన్న కంటేనర్ ను ఢీకొంది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన భోగాపురం ఎన్ హెచ్ 5 టోల్ గేట్ వద్ద చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన కొంతమంది బస్సులో రాజమండ్రి పుష్కరాలకు వెళ్లారు. వీరు స్వస్థలానికి తిరిగి వెళుతుండగా నిలిచి ఉన్న కంటెనర్ ను బస్సు ఢీకొంది. దీనితో బస్సులో ఉన్న 39 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ తో పాటు మరో ఇద్దరిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

విశాఖ..ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షం..

హైదరాబాద్ : అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో బుధవారం ఉదయం జల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. 

నెల రోజుల తరువాత సచివాలయానికి కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపుగా నెల రోజుల తరువాత సచివాలయానికి రానున్నారు. గతనెల 23న ఆయన సెక్రటేరియట్ కు వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సచివాలయ ముఖం చూడలేదు. 

08:39 - July 22, 2015

తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో సౌకర్యాలు కల్పించి ఒక స్పూర్తినింపే విధంగా తయారు చేయాలని ది హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధం కావడం..పార్లమెంట్ లో తెలుగు రాష్ట్రాల సమస్యల ప్రస్తావన..లాంటి అంశాలపై టెన్ టివిలో గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఆయన మాటల్లోనే..
విశ్వ విద్యాలయాలకు స్వయంప్రతిపత్తి..
యూనివర్సిటీల ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం సిద్ధం కావడం సమంజసమే. కానీ వైస్ ఛాన్స్ లర్ ల నియామకం అధికారం ప్రభుత్వానికి ఉండడం సరికాదు. వ్యవస్థలను దెబ్బ తీస్తే వ్యవస్థే ప్రమాదంలో పడుతాయి. విశ్వ విద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. ప్రపంచంలోని విశ్వవిద్యాలయాలు ప్రభుత్వం సంస్థలుగా ఉండవు. స్వేచ్ఛగా పనిచేస్తాయి. సమాజాన్ని ఆలోచింప చేసే కేంద్రాలు యూనివర్సిటీలు అని సుప్రీం పేర్కొంది. ప్రభుత్వాధినేత ఉంటే అది ప్రభుత్వ సంస్థ అవుతుంది. యూనివర్సిటీల్లో నిధుల కొరత తీవ్రంగా ఉంది. జీతాలు ఇచ్చుకొనే పరిస్థితి లేదు. 50 శాతం ఖాళీలున్నాయి. ల్యాబ్స్ లో సౌకర్యాలు లేవు. కొన్ని పోస్టులకు పైరవీలు జరుగుతుంటాయి. పైరవీలకు తావివ్వకుండా నియామకాలు చేపట్టాలి. వైస్ చాన్స్ లర్ లను నిపుణులను నియమించాలి. ఎందుకంటే ఒక మేధావికి ఒక యూనివర్సిటీలో ఉద్యోగం అవసరం లేదు. ఎక్కడైనా అతడికి ఉద్యోగం వస్తుంది. అతడు భయాపడాల్సినవసరం లేదు. యూనివర్సిటీలో స్పూర్తిని నింపే విధంగా చర్యలు తీసుకోవాలి''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. అలాగే పార్లమెంట్ లో తెలుగు రాష్ట్రాల సమస్యల ప్రస్తావనపై కూడా ఆయన మాట్లాడారు. 

07:59 - July 22, 2015

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఢిల్లీలో మంగళవారం వాడి వేడిగా ప్రారంభమయ్యాయి. లలిత్ మోడీ గేట్ కుంభకోణం తొలి రోజే పార్లమెంట్ ను కదిపేసింది. చర్చకు సిద్ధమని మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. కానీ సుష్మా మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. సుప్రీం పర్యవేక్షణలో విచారించాలని సీపీఎం రాజ్యసభా పక్ష నేత సీతారం ఏచూరి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు ఏపీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ను విడుదల చేశారు. రాజధాని నిర్మాణం వల్ల మూడు గ్రామాలు గల్లంతు కావాల్సి వస్తోందన్న వార్తలతో ఆ గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ అంశాలపై మల్లారెడ్డి (సీపీఎం), మహేష్ గౌడ్ (కాంగ్రెస్), రాజారాం యాదవ్ (టిడిపి), భాను ప్రకాశ్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:53 - July 22, 2015

పేరుకే ప్రజాప్రతినిధులు. కానీ, ఫిరాయింపుల్లో అతిరథులు.. ఎందుకీ గెంతులాట..? ఒక సిద్ధాంతం లేదు. ఒక నిబద్ధత లేదు.. ఓటేసిన ప్రజలపై గౌరవం అసలే లేదు.. ఎక్కడ పదవులు దొరికితే, అటు జంప్.. విలువల వలువలూడదీసి రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్న ఇదీ నేటి రాజకీయాలపై ప్రత్యేక కథనం..
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం..
సామెత పాతదే.. కానీ, నేటి రాజకీయాలకు మారిన నిర్వచనం సరిగ్గా ఇదే.. కుర్చీ చుట్టూ తిరగటమే పాలిటిక్స్ అంతరార్ధంగా మారుతోంది. గద్దెనెక్కడం, అందినకాడికి వెనకేసుకోవటం మాత్రమే పరమార్ధంగా మిగులుతోంది. దీనికోసం ఎన్ని వక్ర మార్గాల్లో తిరగటానికైనా నేటి నేతలు వెనకాడ్డం లేదు. ఫలితమే ఈ ఫిరాయింపుల ప్రహసనాలు. ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. టికెట్ ఇచ్చి అండగా నిలిచి గెలిపించిన వారు కండువా వదిలేసి జెండా ఎత్తేయడం కామన్ అయిపోతోంది. మనం గెలిచామా లేదా అన్నది కాదు మేటర్ అధికార పార్టీలో ఉన్నామా లేదా అన్నదే పాయింట్ ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు లీడర్లు. మాస్ అయినా.. క్లాస్ అయినా.. మంత్రం ఒక్కటే కండువా మార్చెయ్ కలిసొచ్చే కాలాన్ని క్యాష్ చేసుకో ఇదే ఫార్మూలాను ఫాలో అవుతున్నారు పొలిటికల్ లీడర్లు.
పొలిటికల్ హీట్ పెంచుతున్న తలసాని రాజీనామా..
తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా ఎపిసోడ్ పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. అసలు అతను ఎమ్మెల్యే పదవికి రిజైనా చేశారా ? లేదా ? అనేది తేల్చే పనిలో పడ్డాయి విపక్షాలు. ఫిరాయింపుల అంశంపై చర్యలు తీసుకోవాలంటూ గొంతెత్తినా గోడు పట్టకపోవడంతో సామాన్యుడి తరహాలో పోరుబాట పట్టారు. సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా ప్రయోగించారు. దీనిపై వచ్చిన సమాచారం ఆధారంగా అధికారపక్షాన్ని ఇరుకున పెట్టే దిశగా అడుగులేస్తున్నారు తెలంగాణ విపక్ష నేతలు.
పార్టీ ఫిరాయింపుల చట్టం నవ్వుల పాలవుతోంది...
ఓ పార్టీ టికెట్టుతో గెలిచి, మరో పార్టీ మంత్రివర్గంలో సభ్యులవుతున్నారు.. చట్ట సభలకు ఎన్నికైన సభ్యులు నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు. రాజకీయాలను వ్యాపారంగా మార్చుకొని, స్వప్రయోజనాలే లక్ష్యంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు.. అంతిమంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు.. పిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తోంది?
ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?..
పార్టీల పాలసీల చుట్టూ కాకుండా చట్ట సభ సభ్యుల చుట్టూ తిరిగే రాజకీయాలకు అంతం ఎక్కడ? ఎన్నికల సంస్కరణలతో దీనికి తెరపడే అవకాశముందా? సీజన్ కో పార్టీ మార్చే వారికి, నోట్ల కట్టలకు నిర్ణయాలు మార్చుకునే వారికి సిద్ధాంతాలూ, సూత్రాలూ అనవసరం... వలస పక్షులు ఒక నిర్ణీత రుతువులో మాత్రమే ఒక చోటికి వస్తుంటాయి. కానీ స్వార్థ ప్రయోజనాలే ధ్యేయంగా సాగే రాజకీయ వలస పక్షులు మాత్రం ఎలాటి నీతి, రీతి లేకుండా ఎటైనా ఎగిరి, ఎక్కడైనా వాలుతుంటాయి. ఈ నీతి మాలిన నేతలకు కర్రుగాల్చి వాతపెట్టేది సామాన్యుడు మాత్రమే.. అదుపులో పెట్టేది దామాషా వ్యవస్థ మాత్రమే.

ఓల్డ్ సిటీలో 158 మంది ఆకతాయిలు..

హైదరాబాద్ : ఓల్డ్ సిటీలో అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న 158 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 9.30గంటలకు యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.

 

నేడు కాంగ్రెస్ మౌన ప్రదర్శన..

ఢిల్లీ : వ్యాపం వ్యవహారంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ మౌన ప్రదర్శన నిర్వహించనుంది. గాంధీ విగ్రహం ఎదుట సోనియా, రాహుల్ తో పాటు ఇతర ఎంపీలు మౌన ప్రదర్శన చేయనున్నారు.

 

మోపిదేవి కారుకు ప్రమాదం..

కృష్ణా : జిల్లా కానూరు వద్ద వైసిపి నేత మోపిదేవి కారు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మోపిదేవి సతీమణి, కుమార్తెలకు స్వల్పగాయాలయ్యాయి. మోపిదేవికి ఎలాంటి గాయాలు కాలేదు.

తొమ్మిదో రోజు..పుష్కరాలు..

హైదరాబాద్ : గోదావరి మహా పుష్కరాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. పలు పుష్కరఘాట్ల వద్ద తెల్లవారుజామునుండే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం పెరిగింది. 

నేడు ఎల్లమ్మ రథోత్సవం...

హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం జరుగనుంది. నిన్న జరిగిన కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు..కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

గాజులవండి వద్ద వాహనం బోల్తా..

కరీంనగర్: మంథని మండలం గాజులగండి వద్ద ప్రమాదవశాత్తు ఓ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. 

07:04 - July 22, 2015

అమరావతి సీడ్ క్యాపిటల్ ప్లాన్ వచ్చింది. అయితే సింగపూర్ సమర్పించిన ఈ ప్లాన్ పై అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్ ఇచ్చిన సీడ్ క్యాపిటల్ ప్లాన్ పై మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు టెన్ టివి జనపథంలో విశ్లేషించారు. 

07:03 - July 22, 2015

సింగపూర్ చూడముచ్చటైన ప్లానిచ్చింది. ఓ అద్భుత సౌందర్యాన్ని మన కళ్లెదుట నిలిపింది. అయితే, అనేక మంది అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. చక్కటి రాజధాని. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక. తెలుగు తటాకంలో సింగపూర్ ను స్రుష్టించాలన్నది చంద్రబాబు స్వప్నం. కానీ డబ్బుల్లేవు. కేంద్రం ఇస్తుందన్న ఆశ లేదు. చంద్రబాబు మాత్రమే తమకో చక్కటి రాజధాని నిర్మించి ఇవ్వగలడన్న నమ్మకం వల్లనో, భ్రమవల్లనో ఓట్లేసి గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటే చంద్రబాబు చరిత్రలో గట్టి మనిషిగా నిలిచిపోతారు. ప్రజల భ్రమలు తొలగిపోతే... 2019 తీర్పు భయంకరంగా వుంటుంది. ఈ విషయం చంద్రబాబుకి తెలియదనుకోలేం.
విదేశీ పర్యటనలు చేసిన బాబు..
అద్భుత రాజధాని నిర్మాణమే ఏకైక ఎజెండాగా ఆయన సాగుతున్నారు. అనేక దేశాలు తిరిగొచ్చారు. పెట్టుబడులు పెట్టండంటూ రెడ్ కార్పెట్ పరిచారు. సింగపూర్ కి రాజధాని నిర్మాణ బాధ్యతలు అప్పగించాలనుకున్నారు. సింగపూర్ ఇప్పటికే ప్లాన్ కూడా ఇచ్చేసింది. అది చూసిన వెంటనే కొన్ని గ్రామాల ప్రజల గుండెల్లో రాయిపడింది. తమను, తమ ఊరునీ తరలిస్తారన్న వేదన, ఆవేదన ఐదు ఊళ్లను వెన్నాడుతోంది. వీరందరినీ ఎక్కడికి పంపిస్తారో తెలియదు. వీరికి ఎక్కడ ఎలాంటి పునరావాసం కల్పిస్తారో తెలియదు. అంతపెద్ద రాజధాని నిర్మిస్తున్నప్పుడు ఆ ఊళ్ల వారిది ఒక సమస్యేనా? అనుకునేవారూ మనలో వుండడంలో ఆశ్చర్యం లేదు. బహుశా దుర్యోధనుడు పాండవులకు అయిదూళ్లు ఇచ్చి వుంటే, మహాభారత యుద్ధం జరిగేది కాదన్నది చాలామంది నమ్మకం. మరి ఇప్పుడు ప్రజలు చరిత్రను ఏ మలుపుతిప్పుతారో ఊహించలేం. వారిని నొప్పించకుండా ఒప్పించడానికి ప్రభుత్వం ఏం చేయబోతుందన్నదీ ఆసక్తికర పరిణామమే.
అనేక ప్రశ్నలు..
అయితే, ఈ రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ఎంత ఖర్చు పెట్టబోతున్నది? రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది? కేంద్రం ఎంత సహాయం చేయబోతున్నది? ఈ ప్రశ్నలకు ఇప్పుడు జవాబుల్లేవు. రాజధాని నిర్మాణంలో పాల్గొనే సంస్థలు ప్రతిఫలంగా ఏమి ఆశిస్తున్నాయి? వారు ఏ స్థాయిలో లాభాలు ఆశిస్తున్నారు? లాభం లేనిదే వ్యాపారి వరద వైపు పోడన్నది సామెత. మరి ఇప్పుడు సింగపూర్ తో పాటు రాజధాని నిర్మాణ భాగస్వాములు ఎలాంటి లాభాలు జుర్రుకోవాలనుకుంటున్నారు? అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి త్యాగాలు చేయాల్సి వుంటుంది? అసలు సీడ్ క్యాపిటల్ లో నివసించే, సంచరించే, కళ్లారా ఒక్కసారైనా చూసే భాగ్యమైనా సామాన్యుడికి వస్తుందా? ఇప్పుడు అమరావతి నిర్మాణం కోసం తమ ఇళ్లు, పొలాలు రాసిస్తున్నవారి భవిష్యత్ ఏమిటి? ఊహిస్తున్న స్థాయిలో రియల్ జోరు కనిపించకపోతే, భూమిలిచ్చినవారి పరిస్థితేమిటి? ఎన్నేళ్ల తర్వాత రైతులకు ఫలాలు అందివస్తాయి? అసలు ఇప్పుడు భూములిచ్చిన తరం తాము కలలుకంటున్న నూతన నగరాన్ని, కొత్త జీవితాన్ని చూడగలుగుతుందా? ఇవన్నీ ప్రశ్నలే. 

06:38 - July 22, 2015

హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రంలో సుఖ సంతోషాలతో గడుపుదామనుకున్న ఉద్యోగులు..ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ఉద్యోగులే ఇప్పుడు ఆయన పై గుర్రుమీదున్నారు. ఒకప్పుడు మెచ్చుకున్న వీరు ఇప్పుడు విమర్శలవర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రమొస్తే అందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయని కలలుగన్న ప్రభుత్వ ఉద్యోగుల కల కలగానే మిగులుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. సర్కార్ తీరుపై హైదరాబాద్‌లోని యూటిఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో యుటీఎఫ్, పీఆర్‌టీయు సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తి చేశారు.
పదో పీఆర్సీపై సర్కార్ నిర్లక్ష్యం..
పదో పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంకా తమకు పరీక్షలు పెడుతోందని ఉద్యోగులు మండిపడ్డారు. ఉద్యోగులకు 43శాతం పిఆర్సీ ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకోవడమే తప్ప తమకు దక్కిందేమి లేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణ పూర్తిగా మారలేదని కేవలం భౌగోళికంగానే మార్పులు వచ్చాయి తప్ప సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేత దేవిప్రసాద్ విమర్శించారు.
ఇంకా జరగని ఉద్యోగుల విభజన..
రాష్ట్ర విభజన జరిగి ఏడాదిగడిచినా ఇంకా ఉద్యోగుల విభజన జరగకపోవడం దారుణమని ఉద్యోగులు మండిపడ్డారు. హెల్త్‌కార్డులు ఇచ్చినా..లాభం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్త్‌కార్డుల ద్వారా చికిత్స అందేటట్లు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పీఆర్‌సీ ఏరియర్స్ చెల్లించి, పెండింగ్‌ జీవోలు విడుదల చేయాలన్నారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేసి వేతనాలు పెంచాలని వీరు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగులంతా..పోరాటాలకు సిద్ధమవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. 

06:37 - July 22, 2015

అనంతపురం : కాంగ్రెస్‌కు "అనంత" సెంటిమెంట్ గా మారిందా.. ? అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా హస్తం పెద్దలు అనంతబాట పడుతున్నారా..? అంటే అవునంటున్నాయి పార్టీ వర్గాలు. విభజన సెగతో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్‌ పార్టీకి.. రాహుల్ అనంతపురం పర్యటనతో మంచిరోజులు వస్తాయంటున్నారు హస్తం నేతలు. ఇంతగా కాంగ్రెస్ నేతలు రాహుల్ టూర్ పై ఆశలు పెట్టుకోవడానికి ఓ లెక్కుందంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతిసారీ అనంతపూర్ తమను గట్టెక్కించిందని నమ్ముతున్నారు హస్తం నేతలు. దీనికి వారు సాక్షాలు కూడా చూపుతున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీచి జనతాపార్టీ అధికారంలో ఉండగా.. 1978లో ఇందిరాగాంధీ అనంతపూర్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏకంగా 175 స్థానాలు గెలిచి విక్టరీ కొట్టింది.
2003లో సోనియా పర్యటన..
ఇక 2003లో ప్రతిపక్షంలో ఉండి సోనియా గాంధీ అనంతపూర్‌లో పర్యటించారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి మొన్నటి వరకూ అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత యూపీఏ ప్రతిస్టాత్మక ప్రాజెక్ట్ అయిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సోనియా ఇక్కడి నుంచే ప్రారంభించారు.
సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా ? 
సరిగ్గా ఇప్పుడు ఆలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటుంది కాంగ్రెస్ అంతేకాదు గతంలో ఇందిరా, సోనియా మాదిరే ప్రతిపక్ష స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ శుక్రవారం అనంతపూర్‌లో పాదయాత్ర చేయబోతున్నారు. ఇది ఖచ్చితంగా పార్టీకి గత ఫలితాలను అందిస్తుందని నమ్ముతున్నారు ఆ పార్టీ నేతలు. ఐతే మొదట రాజధాని రైతుల పక్షాన రాహుల్ యాత్ర చేయించాలని కొందరు నేతలు భావించినప్పటికీ ఈ సెంటిమెంట్ కారణంగానే రాహుల్‌ అనంత పర్యటనను ఎంచుకున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో ఇందిర, సోనియాకు కలిసొచ్చినట్లే రాహుల్‌ యాత్రకు సెంటిమెంట్ కలిసివచ్చి ప్రధాని అవతారో లేదో చూడాలి. 

06:36 - July 22, 2015

హైదరాబాద్ : రిటైరైన ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ పెంపు, డెత్‌ రిలీఫ్‌ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, అర్థ వేతన సెలవును నగదుగా మార్చుకునే సిఫారసులకు తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న 8లక్షల గ్రాట్యుటీ 12లక్షలకు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే..అందించే అంత్యక్రియల ఖర్చును పెంచాలని పీఆర్‌సీ కమిషన్ చేసిన సిపారసుకు సర్కార్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 10వేలుగా ఉన్న అలవెన్స్ ను 20వేలకు పెంచింది.

06:35 - July 22, 2015

హైదరాబాద్‌ : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్‌ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం బస్తీలో పర్యటించిన కేసీఆర్‌ పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న ఎల్లమ్మ కల్యాణ మహోత్సవానికి వేలమంది భక్తులు తరలివచ్చారు. భక్తుల జయజయ ధ్వానాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కళ్యాణోత్సవానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ దంపతులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, దేవాలయ ఈవో వినోద్‌రెడ్డితోపాటు ఆలయ అర్చకులు సీఎంకు స్వాగతం పలికారు. సతీసమేతంగా వచ్చిన కేసీఆర్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేసీఆర్ కు సన్మానం..
ఆలయ అర్చకులు కేసీఆర్ దంపతులను ఘనంగా సన్మానించి ప్రసాదాన్ని అందజేశారు. సీఎం దాదాపు అరగంటపాటు అమ్మవారి సన్నిధిలో గడిపారు. నగర పోలీస్ కమిషన్ మహేందర్‌రెడ్డి స్వయంగా బందోబస్తును పర్యవేక్షించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ స్థానిక ఇందిరాగాంధీపురం బస్తీని సందర్శించి స్థానికులపై వరాల జల్లు కురిపించారు. బస్తీలోని పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు.

06:34 - July 22, 2015

హైదరాబాద్ : నగరంలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలు పెట్టింది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ అధికారులను వెంట బెట్టుకుని హైదరాబాద్‌ను చుట్టివచ్చారు. హరిత హారం కోసం రూపొందించిన ప్రత్యేక బస్సులో ప్రయాణం సాగించారు. హైదరాబాద్‌లోని అటవీ ప్రాంతాన్ని సందర్శించడంతో పాటు..ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కలియతిరిగారు. కండ్లకోయ నుంచి గచ్చిబౌలి, శంషాబాద్, నాగార్జునసాగర్ రోడ్, విజయవాడ రోడ్, ఘట్ కేసర్ రోడ్ వరకు పర్యటించారు. కండ్లకోయ, మేడ్చల్, మజీద్ గడ్డ, నాదర్ గూల్, గండిగూడ, మాదన్నగూడ, తుర్కయాంజాల్, బాచారం, నారాపల్లి ప్రాంతాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ లను పరిశీలించారు. హరిత హరం కోసం మొక్కలు పెంచుతున్న ఘట్ కేసర్ లోని నర్సరీని సందర్శించారు. హైద్రాబాద్‌కు అందాన్ని తెచ్చి పెట్టే పూల మొక్కలను పెంచాలని సూచించారు.
ఖాళీ జాగాల్లో మొక్కలు..
రిజర్వ్ ఫారెస్ట్ ల పరిరక్షణ కోసం చుట్టూ ప్రహరీలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రిజర్వ్ ఫారెస్టులో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని మొక్కలు పెంచాలన్నారు. ఔటర్ రింగ్‌రోడ్‌కు ఇరు వైపులా విరివిగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ చుట్టూ గల ప్రాంతాల్లోనూ విరివిరిగా చెట్లను నాటాలన్నారు. హైదరాబాద్ జనాభా ఇప్పటికే కోటికి చేరుకుందని.. ప్రతి సంవత్సరం 10 శాతం జనాభా పెరుగుతుందన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా పచ్చదనం కూడా పెంచాలన్నారు. తన పర్యటన సందర్భంగా పనిలో పనిగా ఔటర్ రింగ్ రోడ్డు పనులను సైతం కేసీఆర్‌ పరిశీలించారు. ఘట్ కేసర్ నుంచి షామీర్ పేట్ వరకు గల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 

06:32 - July 22, 2015

గుంటూరు : అరచేతిలో వైకుంఠం చూపించారు. ఆహా..ఓహో అనేవిధంగా గ్రాఫిక్స్ మాయచేసి..ఏపీ సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాన్‌ను విడుదల చేశారు. ప్రపంచంలోనే సూపర్‌ డూపర్‌ క్యాపిటల్‌ ఇదే అన్నట్లుగా అట్టహాసంగా చూపించారు. హైటెక్‌ రేంజ్‌లో.. అత్యాధునిక టెక్నాలజీతో..రాజధానిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా...అసలు విషయాన్ని మాత్రం బయటపెట్టడంలేదు. రాజధానికి భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటి ? వాళ్లు ఎక్కడుంటారు? వాళ్లు నివాసం ఉండేందుకు ఇళ్లను ఎక్కడ నిర్మిస్తున్నారు అనేది చెప్పలేదు. దీంతో భూములిచ్చిన రైతుల్లో ఆందోళన మొదలైంది. రాజధాని నిర్మాణంలో మేము సైతం అంటూ ముందుకొచ్చి...తమ జీవనాధారమైన భూముల్ని, ఇల్లు, వాకిలిని ఇచ్చిన అనేక గ్రామాల ప్రజల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన ఏపీ సీడ్‌ క్యాపిటల్‌ ప్రణాళికలో...భూములిచ్చిన రైతుల ప్రస్తావన కానీ..వాళ్లు ఎక్కడుంటారనేది ఎక్కడా చూపించలేదు. దీంతో భూములిచ్చిన రైతుల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది.
భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటి ?
ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతి తుళ్లూరు కేంద్రంగానే ఉంటుందని ప్రభుత్వం ఎప్పటినుంచో చెప్తోంది. తుళ్లూరు కేంద్రంగానే ప్రభుత్వం సుమారు 29 గ్రామాల్లో 30వేల ఎకరాలను సేకరించింది. అయితే ప్రస్తుతం సింగపూర్‌ ప్రభుత్వం అందించిన సీడ్‌ క్యాపిటల్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతి ప్రభుత్వ కోర్‌ ప్రాంతం మొత్తం లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, తుళ్లూరులలో ఉంటుందనేది స్పష్టమైంది. సీడ్‌ క్యాపిటల్‌ ప్రణాళికలో అమరావతి గేట్‌వే, అమరావతి వాటర్‌ ఫ్రంట్‌, అమరావతి డౌన్‌టౌన్‌, అమరావతి గవర్నమెంట్‌ కోర్‌ పేరుతో నాలుగు విభాగాలుగా విభజించారు. అయితే సింగపూర్‌ రూపొందించిన మాస్టార్‌ప్లాన్‌ ప్రకారం ఐదు గ్రామాలు ఖచ్చితంగా ఖాళీ చేయకతప్పదనేది తెలుస్తోంది. గ్రామాల వెలుపలి నుంచి మాత్రమే ప్రణాళిక రూపొందుతుందని ఏపీ మంత్రి నారాయణ చెప్పినా అందుకు భిన్నంగా కీలక నిర్మాణాలన్నీ ఈ ఐదు గ్రామాల పరిధిలోనే ఉన్నాయి. దీంతో ఎంతో చరిత్ర ఉన్న కృష్ణా పరివాహక గ్రామాలన్నీ ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడనుంది. అంతేకాదు ఈ ఐదు గ్రామాల ప్రజలు ఖాళీచేస్తే వారికి ఎక్కడ ఇళ్లు ఇస్తారనేది ప్రభుత్వం చెప్పడంలేదు. తొలుత ఇళ్లను ఖాళీచేయాల్సిన అవసరం లేదని చెప్పిన ప్రభుత్వం..ఇప్పుడు తాజా మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఇళ్లు ఖాళీచేయక తప్పదు. రాజధాని పేరుతో ఏపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూములిచ్చిన గ్రామాల ప్రజలకు నివాస ప్రాంతం ఎక్కడనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

06:31 - July 22, 2015

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గం నేడు రాజమండ్రిలో సమావేశం కానుంది. రాజధాని నిర్మాణంలో మాస్టర్‌ డెవలపర్‌ సహా...పుష్కరాల నిర్వహణ, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు, ఆగస్టు 15 స్వాతంత్ర్య వేడుకలు వంటి పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. పుష్కరాలు జరుగుతున్న రాజమండ్రిలో క్యాబినెట్‌ సమావేశం కావడం ఇదే తొలిసారి. ఉద‌యం 10 గంట‌ల‌కు జరిగే ఈ స‌మావేశంలో పుష్కరాల నిర్వహణపై ప్రధానంగా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. పుష్కరాల తొలి రోజు జ‌రిగిన ఘ‌ట‌నపై క్యాబినెట్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ఇప్పటికే ఈ ఘ‌ట‌న పై న్యాయ విచార‌ణ‌కు సీఎం ఆదేశించడంతో...విచార‌ణ బాధ్యతలు ఎవ‌రికి అప్పగించాలనే దానిపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారులపై చ‌ర్యలు తీసుకోవాల‌నే డిమాండ్ గ‌ట్టిగా వినిపిస్తున్నా..ప్రస్తుతం పుష్కరాలు కొన‌సాగుతున్నందున ఈ స‌మ‌యంలో.. చ‌ర్యలు తీసుకోవాలా వ‌ద్దా అనే దానిపై చ‌ర్చించ‌నున్నారు. ఇక పుష్కరాలకు నాలుగు రోజులే మిగిలి ఉండడంతో..పుష్కరాల నిర్వహ‌ణపైనా క్యాబినెట్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది.
రాజధాని మాస్టర్ ప్లాన్ పై చర్చ..
ఇక ఏపీ రాజ‌ధాని అమరావతి సీడ్ క్యాపిట‌ల్ మాస్టర్‌ ప్లాన్‌పై క్యాబినెట్‌లో చ‌ర్చించ‌నున్నారు. సింగపూర్‌ ప్రభుత్వం అందించిన మాస్టర్‌ప్లాన్‌కు లాంఛ‌నంగా ఆమోదం తెల‌పటంతో పాటు..రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం స్విస్ ఛాలెంజ‌ర్ విధానంలో డెవ‌ల‌ప‌ర్‌ను ఎంపిక చేయనుంది. అయితే మాస్టర్‌ డెవ‌ల‌ప‌ర్ స్ధానంలో కొత్తగా అమ‌రావ‌తి డెవ‌ల‌ప్‌మెంట్ పార్టనర్‌ విధానానికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేయ‌నుంది. దీని ద్వారా సింగ‌పూర్‌-జ‌పాన్‌తో పాటు ముందుకు వ‌చ్చిన వారిని భాగ‌స్వాములుగా చేసుకొనే అవ‌కాశం ఉంది. ఇక చేనేత కార్మికుల 125 కోట్ల రుణ మాఫీ పైనా క్యాబినెట్ ఓ నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంది. ఆగ‌స్టు 7న ఈ రుణ మాఫీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించ‌నుంది. దాంతో పాటు అనంతపురంలో మున్సిపల్ వర్కర్ మృతి చెందిన దానిపై మున్సిపల్ వర్కర్లు చేస్తున్న సమ్మెపై క్యాబినేట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక‌..అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల తేదీలు.. నిర్వహణపైనా క్యాబినెట్‌ ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఎక్కడ నిర్వహించాలి అన్న దానిపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు. రాజమండ్రిలో క్యాబినెట్‌ సమావేశం జరగనున్నందున ఇప్పటికే క్యాబినెట్‌ మంత్రులంతా రాజమండ్రికి చేరుకున్నారు. రాజమండ్రిలో క్యాబినెట్‌ సమావేశం జరగడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

నేడు వెబ్ ఆఫ్షన్ల మార్పు..

హైదరాబాద్ : తెలంగాణ ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా (సింగిల్ విండో-1)లో సుమారు 24వేల సీట్లు మిగిలిపోతున్నాయి. మంగళవారంతో వెబ్ ఆఫ్షన్ల ప్రక్రియ ముగిసింది. బుధవారం వీటిలో మార్పులు చేర్పులకు చివరి అవకాశం ఇస్తున్నారు. 

నేడు టి.ఆర్థిక మంత్రి సమీక్ష..

హైదరాబాద్ : తెలంగాణ రాబడులను ఇంకా పెంచుకోవడంపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా బుధవారం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆయా ఆదాయార్జన శాఖల అధికారులతో భేటీ కానున్నారు.

 

ఉద్యోగుల విభజనపై నేడు కీలక భేటీ..

ఢిల్లీ : ఉద్యోగుల విభజనలో కమల్ నాథన్ కమిటీ వేగం పెంచింది. బుధవారం 14 శాఖలకు సంబంధించి కీలకమైన సమావేశాలను నిర్వహించనున్నారు. కమల్ నాథన్ సారధ్యంలో ఈ కీలక సమావేశం జరుగనున్నది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.

నేడు ఆస్ట్రేలియా - ఎ వర్సెస్ భారత్ - ఎ టెస్టు సిరీస్..

చెన్నై : రెండు మ్యాచ్ ల అనధికార టెస్టు సిరీస్ లో భాగంగా తొలి నాలుగు రోజుల మ్యాచ్ చెన్నై వేదికగా జరుగనుంది. 

నేడు కోర్టుకు ఎఫ్ఎస్ఎల్ తుది నివేదిక...

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ తుది నివేదిక బుధవారం ఎసీబీ ప్రత్యేక కోర్టుకు చేరనుంది.

 

Don't Miss