Activities calendar

23 July 2015

కొవ్వాడలో అణు విద్యుత్ రియాక్టర్ల కర్మగారం

 శ్రీకాకుళం: జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ రియాక్టర్ల కర్మగారం ఏర్పాటుకు సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపింది. అలాగే రష్యన్ టెక్నాలజీతో మరో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభలో ప్రకటించారు.

21:35 - July 23, 2015

హైదరాబాద్: ఇన్నాళ్లు చుక్కల్లో తిష్ఠవేసుకు కూర్చున్న పసిడి క్రమంగా దిగొస్తోంది. 10గ్రాముల బంగారం ధర నాలుగేళ్లలో కనిష్ఠస్ధాయికి పడిపోయిన తరుణంలో ప్రస్తుతం 10గ్రాముల బంగారం ధర 25వేలు ఉంది. ఆర్ధిక రాజధాని ముంబయి బులియన్‌ మార్కెట్లో 22క్యారెట్ల బంగారం ధర 24వేల 450గా ఉండగా అదే 24 క్యారెట్ల బంగారం ధర 25వేల454 రూపాయిలుగా నమోదయింది.ఇక హైదరాబాద్ విషయానికొస్తే 22 క్యారెట్ల బంగారం ధర 23వేల580గా ఉండగా 24క్యారెట్ల బంగారం ధర 25వేల219 రుపాయలుగా నమోదయింది.చైనాలో ఒకేరోజు 33 టన్నుల బంగారాన్ని విక్రయించటం వల్లే పసిడి నేలచూపులు చూసిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. ప్రస్తుత పరిస్ధితుల్లో బంగారాన్ని కొనుగోలు చేయటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

21:33 - July 23, 2015

ఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపి శశిథరూర్‌ నిన్న సోనియాగాంధీతో చీవాట్లు పడగా...ఇవాళ ప్రధాని మోదీ ఆయనను ప్రశంసలతో ముంచెత్తడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంట్‌లోని స్పీకర్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో శశిథరూర్‌ను ప్రధాని కొనియాడారు. ఇటీవల లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో జరిగిన ఓ చర్చలో పాల్గొన్న శశిథరూర్- 2 వందల ఏళ్లుగా పాలించిన ఇంగ్లాండ్ -భారత్‌కు నష్టపరిహారం చెల్లించాలని వాదించారని మోది కితాబిచ్చారు. మోది ప్రారంభించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో కూడా శశిథరూర్ పాల్గొన్నారు. శశిథరూర్‌ తీరు చూస్తుంటే బిజెపిలో చేరతారన్న సంకేతాలకు ఊతమిస్తోంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని సోనియాగాంధీ శశిథరూర్‌పై మండిపడ్డ విషయం తెలిసిందే.  

21:31 - July 23, 2015

ఢిల్లీ: మళ్లీ అవే ప్లకార్డులు. అవే నినాదాలు. అవే దృశ్యాలు. ప్రతిపక్ష పార్టీల ఎత్తులు... అధికార పక్షం పై ఎత్తులు. విమర్శలు-ప్రతి విమర్శలు కామనై పోయాయి. రాజీనామాల అంశంపై విపక్షాలు... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతిపై బీజేపీ... అటాకింగ్ మోడ్‌లో తలపడ్డాయి. ఇక అంతే... ముచ్చటగా మూడోరోజూ పార్లమెంట్‌ ఉభయ సభలు ... ఎలాంటి చర్చ లేకుండానే మరుసటి రోజుకు వాయిదా పడ్డాయి.
సభప్రారంభమైన ఐదు నిమిషాలకే...
మూడో రోజూ పార్లమెంట్‌ సమావేశాల తీరు మారలేదు. సభప్రారంభమైన ఐదు నిమిషాలకే లోక్‌ సభ వాయిదా పడింది. కళంకితులు రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. చర్చకు సిద్ధమంటూనే రాజీనామాల ప్రసక్తేలేదని అధికారపక్షం తేల్చిచెప్పింది. దీంతో ప్రతిపక్ష పార్టీ సభ్యుల నినాదాలతో సభ మార్మోగింది. కొందరు ప్లకార్డులు ప్రదర్శించిన నిరసన తెలిపారు. నినాదాలు చేస్తూ స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. స్పీకర్ ఎన్నిసార్లు వారించినా పరిస్థితిలో మార్పు రాకపోయేసరికి సభను 12గంటలకు వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి....
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు రాజీనామా చేయాల్సిందేనంటూ ప్రతిపక్ష పార్టీ సభ్యులు పట్టుబట్టారు. కాంగ్రెస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఏ విషయంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించినా... పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో సభ 12 గంటలకు వాయిదా పడింది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని కరప్షన్‌పై....
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని కరప్షన్‌పై ఉభయ సభల్లో బీజేపీ నోటీసులు ఇచ్చింది. కేరళ సోలార్ స్కామ్... హిమాచల్ ప్రదేశ్‌ వీరభద్ర స్కాం... అస్సాం, గోవాల్లోనీ కుంభకోణాలూ ఇందులో వున్నాయి. ఎదురుదాడి వ్యూహానికి కాంగ్రెస్... ఆత్మరక్షణ దోరణితో... తన సీఎంలను కాపాడుకోటానికి ప్రాధాన్యమిచ్చి... మెత్తబడుతుందని అధికార పక్షం అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌ మాత్రం వెనక్కు తగ్గే ప్రసక్తేలేదని పునరుద్ఘాటించింది. రాజీనామాలు చేసేవరకూ ఉభయ సభల్లో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
కాంగ్రెస్‌ ప్రయత్నానికి సమాజ్‌వాదీపార్టీ హ్యాండ్‌....
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తేవాలన్న కాంగ్రెస్‌ ప్రయత్నానికి సమాజ్‌వాదీపార్టీ హ్యాండ్‌ ఇచ్చింది. సభ వాయిదా పడిన సమయంలో వ్యూహ రచన కోసం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎస్పీ గైర్హాజరైంది. 12గంటలకు తిరిగి ఉభయ సభలు ప్రారంభమైనా అదే పరిస్థితి. అవే దృశ్యాలు. రాజ్యసభ 2గంటలకు వాయిదా పడింది. ప్రధాని సమాధానం చెప్పాల్సిందేనంటూ.. లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు నినదించారు. అపుడు బీజేపీ ప్రతిదాడి వ్యూహం అమలుపరిచింది. పార్లమెంట్‌ను, పార్లమెంట్ సభ్యులను రాబర్ట్‌ వాద్రా అవమానపరిచారని.. ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సిందేనని.. బీజేపీ చీఫ్‌ విప్ అర్జున్‌ మేగ్వాద్‌ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. గందరగోళ పరిస్థితుల నడుమ స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభమైనా... మళ్లీ గందరగోళమే కనిపించింది. సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు. 

21:21 - July 23, 2015

హైదరాబాద్: రాష్ట్ర ఖజానా ఖాళీ అని కొంత మంది చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మి అందోళన చెందోద్దని ..అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉండాలని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ భరోసా ఇచ్చారో...లేదో అదంతా ఒట్టిదేనని సీఎంవో వర్గాలు తేల్చి చెప్పాయి. రాష్ట్ర ఖజానకు గండి పడింది...రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ చెప్పకనే చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేతనాల కోసం డిమాండ్ చేస్తున్న కార్మికులే అర్ధం చేసుకుని...సమ్మె విరమించాలని విజ్ణప్తి చేస్తోంది ప్రభుత్వం.
ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ....
తెలంగాణ వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలలో కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింపజేయాలని ప్రయత్నిస్తున్న సర్కారు ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేసింది. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను సంప్రదించింది కమిటీ. అయితే కార్మికుల డిమాండ్లు నెరవేర్చడం తమవల్ల సాధ్యం కాదని తేల్చి చెప్పాయి కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు. ఇప్పటికిప్పడు ఒక్కసారి ప్రస్తుత వేతనాలు చెల్లించడం కూడా సాధ్యపడదని కమిటీకి తెలిపాయి.
ఆస్థిపన్ను పెంపులేక ఆర్థికంగా చితికిపోయాం-మున్సిపాల్టీలు
కార్మికుల వేతనాలు పెంచలేమని చెబుతున్న మున్సిపాల్టీలు...అందుకు అనేక కారణాలు ఏకరువు పెడుతున్నాయి. తమ ప్రధాన ఆదాయ వనరైన ఆస్థిపన్ను 2006 నుంచి పెంచలేదని దీంతో ఆర్ధికంగా చాలా చితిపోయామని చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆస్థి పన్ను పెంచకుండా, ఉద్యోగుల జీతాలు పెంచడం సాధ్యం కాదని మున్సిపాలిటీలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి.
మున్సిపల్ కార్మికుల సమ్మెను నీరు కార్చేందుకు కొత్త ఎత్తులా.?
ఈ నేపథ్యంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని మున్సిపాల్టీలకు నిధులు సమకూర్చి, కార్మికుల వేతనాలు పెంచుతుందని ఆశించిన వారికి కేసీఆర్ సర్కారు స్పందన తీవ్ర నిరాశ, ఆగ్రహం కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆలయాలకు కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం..రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికులకు పైసా కూడా విదల్చడానికి ఇష్టపడ్డం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ కార్మికుల సమ్మెను నీరు కార్చేందుకు ఖజానా నిండుకుందని, సహకరించాలని కొత్త ఎత్తులు వేస్తోందన్న ఆరోపణలొస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని సాక్షాత్తు విత్తమంత్రి చెప్పినా, సీఎం కార్యాలయం మాత్రం డబ్బుల్లేవని చేతులెత్తేయడం విడ్డూరంగా ఉందన్న విమర్శలొస్తున్నాయి. అటు సర్కారు ఎన్ని ఎత్తులు వేసినా సమ్మె విరమించేది లేదని మున్సిపల్ కార్మికులు స్పష్టం చేశారు.

21:17 - July 23, 2015

గుంటూరు: యూనివర్సిటీల్లో ర్యాగింగ్‌ రాజ్యమేలుతోంది...రిషితేశ్వరివంటి అమాయక విద్యార్ధులను బలితీసుకుంటోంది. అయినా గురుతర బాధ్యతకల్గిన వాళ్లకు చీమకుట్టినట్లయినా లేదు. గాడితప్పుతున్న విద్యావ్యవస్ధను, వక్రమార్గంలో పయనించే విద్యార్ధులను సరిచేయాల్సిన గురువులే దారితప్పుతున్నారు. విద్యాబుద్దులు చెప్పాల్సిన వాళ్లే గడ్డి తింటున్నారు.
చిందులేసిన యూనివర్సిటీ స్టూడెంట్స్....
లేట్ నైట్ పార్టీల్లో చిందులేస్తున్న వీళ్లందరూ గుంటూరు నాగార్జున యూనివర్సిటీ విద్యార్ధులు. మైమరిచి డ్యాన్సులేస్తున్న వారిని స్టెప్పులేస్తూ ఉత్సాహపరుస్తున్న ఇతనెవరో తెలుసా..? ఆర్కిటెక్చర్‌ కాలేజీ ప్రిన్సిపాల్ బాబురావు. విద్యార్ధులకు భయం చెప్పాల్సిన ప్రిన్సిపాలే ఏకంగా లేట్ నైట్ పార్టీలకు తీసుకొచ్చి జల్సా చేయిస్తున్నాడు. ప్రిన్సిపాల్ తీరు సరిగా లేదంటూ వస్తున్న ఆరోపణలను నిజం చేశాడు.
నిజనిర్ధారణ నిర్వహించిన విద్యార్ధిసంఘాలు....
రిషితేశ్వరి మృతిపై నాగార్జున యూనివర్సిటీలో విద్యార్ధిసంఘాలు బహిరంగ నిజ నిర్ధారణ నిర్వహించాయి. ఈ విచారణలో బాబురావు బాగోతం బయటికొచ్చింది. ర్యాగింగ్‌ పేరుతో సీనియర్లు, జూనియర్లను వేధించే తీరు, బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని బాధ్యుల ప్రవర్తనను విద్యార్ధులందరు ముక్త కంఠంతో ఖండించారు. సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.
దాడి చేసిన బాబురావు గ్రూప్ విద్యార్ధులు....
ప్రిన్సిపాల్ బాబురావు బాగోతాలను వ్యతిరేక వర్గం బయటపెడుతోంటే , ఆ బాబూరావు పంపించిన కొందరు విద్యార్ధులు దాడికి దిగారు. దీంతో కాసేపు ఆడిటోరియంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు ఎంటరవ్వడంతో పరిస్ధితి అదుపులోకి వచ్చినట్లు కన్పించినా నాగార్జున యూనివర్సిటీలో పరిస్ధితి మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉంది. ఆలస్యంగా స్పందించిన ఏపి ప్రభుత్వం ప్రిన్సిపాల్ బాబురావును సస్పెండ్ చేసింది. రిషితేశ్వరి మృతితో పాటు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ పీఠం టిడిపిదే:ఎర్రబెల్లి...

ఖమ్మం:త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకొని మేయర్ పదవిని కైవసం చేసుకుంటుందని టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్‌ తుగ్లక్‌ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, సర్వేలు టీడీపీకి అనుకూలంగా ఉండటంతో.. కేసీఆర్‌కు భయం పట్టకుందని ఆయన విమర్శించారు.

రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న యువకుడు..

కర్నూలు: ఆస్పరి సమీపంలో రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రూ.50.లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత...

 చిత్తూరుజిల్లాలోని శ్రీవారిమెట్టు సమీపంలోని గుర్రాలబావి దగ్గర రూ.50 లక్షలు విలువచేసే ఎర్రచందనాన్ని గురువారం పోలీసులు పట్టుకున్నారు.

బిడ్డను వాషింగ్‌ మిషన్‌లో వేసి ఫేస్‌బుక్‌లో ఫొటో

హైదరాబాద్‌ : సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు ఒక్కోరిది ఒక్కో స్టైల్‌. ఇటీవలే మనం ఎన్నో సంఘటనలు చూశాం. ప్రమాదకర సెల్ఫీలు, పిల్లలను వింతగా చూపిస్తూ ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం సరదాగా మారిపోయింది. తాజాగా ఓ తల్లి తనబిడ్డను వాషింగ్‌మిషన్‌లో వేసింది. అనంతరం ఆ ఫొటోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసింది. వివరాల్లోకెళ్తే... లండన్‌లో కర్టని సీవర్డ్ అనే మహిళ తన రెండున్నరేళ్ల వయస్సు గల కుమారుడిని వాషింగ్‌మిషన్‌లో వేసింది. ఆ ఫొటోను తీసి ఫేస్‌బుక్‌లో పెట్టింది. దీనిపై కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన తప్పున తెలుసుకున్న ఆ తల్లి చివరకు క్షమాపణలు చెప్పుకుంది.

20:36 - July 23, 2015

చరిత్రలో ఎన్నటికీ మరువ లేని దారుణం అది... ఆ ఘటనతో సంబంధం ఉన్న అసలు కుట్రదారులు తప్పించుకున్నారు... మిగిలిన ఏకైక సాక్షి ఉరికంబం ఎక్కుతున్నాడు... అతడితో మొదలు కాని నేరం.. అతనితో అంతమవుతుందా? ఒక ఉరితాడు.. అనేక చిక్కుముడులు... యాకూబ్ మెమన్ ఉరిశిక్షతో సమస్య పరిష్కారం అవుతోందా? ఇవాళ్లి వైడాగిల్ స్టోరీ....మీరూ చూడాలని అనుకుంటున్నారా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి..

'రిషికేశ్వరి' కేసు విచారణలో మరో హైడ్రామా....

గుంటూరు:ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ భూతానికి బలైపోయిన రిషికేశ్వరి మరణంపై విచారణలో హైడ్రామా చోటుచేసుకుంది. రిషికేశ్వరి మరణంపై వర్సిటీలో నిజనిర్ధారణ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం జరిగింది. ఈ సమయంలో ఆర్కిటెక్చర్ కాలేజి ప్రిన్సిపల్ గతంలో సాగించిన లీలలకు సంబంధించి సీడీల రూపంలో విద్యార్థులు కమిటీకి ఆధారాలు సమర్పించారు. కానీ ఆ సీడీలు చూస్తుండగా మధ్యలో రెండుసార్లు కరెంటు పోయింది. సరిగ్గా.. ఈ సమయంలోనే ప్రిన్సిపల్ అనుకూల వర్గానికి చెందిన విద్యార్థులు అక్కడకు ప్రవేశించారు. అక్కడే ఉన్న మీడియాపైన, విద్యార్థి సంఘాల నేతలపైన వాళ్లు దాడి చేశారు.

తొక్కిసలాటలో విద్రోహశక్తుల ప్రమేయం:అచ్చెన్నాయుడు!

శ్రీకాకుళం: పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో విద్రోహశక్తుల ప్రమేయం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. టెక్కలిలో ఆయన మాట్లాడుతూ, తొలిరోజు జరిగిన సంఘటన వెనుక విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్నట్టు సమాచారం అందిందని అన్నారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందోనన్న దుగ్ధతో పుష్కరాల ప్రారంభోత్సవానికి ముందే విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారనే పుకార్లు ప్రచారం చేశారని, దాని కారణంగానే తొక్కిసలాట జరిగిందని ఆయన తెలిపారు. దీనిపై న్యాయ విచారణ చేయిస్తామని అన్నారు.

తాలిపేరుకు భారీగా వరదనీరు...

ఖమ్మం: జిల్లాలోని చర్ల మండలం తాలిపేరు రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఇవాళ ప్రాజెక్టుకు ఉన్న 13 గేట్లను ఎత్తివేశారు. పదిహేను వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలివేశారు. ప్రస్తుతం స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కౌన్సెలింగ్ లో స్వల్ప మార్పులు..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కౌన్సెలింగ్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 17,18, 19 తేదీల్లో తెలంగాణ ప్రత్యేక కేటగిరీ... ఆగస్టు 20,221,22 తేదీల్లో ఏపీ ప్రత్యేక కేటగిరీ... అభ్యర్థు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఏపీలో 3,290 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ, తెలంగాణ లో 2,181 ఎంబీబెస్, బీడీఎస్ సీట్లు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 5 నుంచి 11 వరకు ఏపీలో, జులై 29 నుంచి ఆగస్ట్ 3వరకు తెలంగాణలో మెడికల్ కౌన్సెలింగ్ జరగనున్నాయి.

గోదావరిలోకి స్వల్పంగా వరద నీరు...

ఖమ్మం: గోదావరి నదికి గురువారం సాయంత్రం స్వల్పంగా వరద నీరు చేరింది. భద్రాచలంలోని గోదావరి ఎగువ ప్రాంతాలైన అశ్వాపురం, మణుగూరు, పినపాక ప్రాంతాలేగాక చత్తీస్ ఘడ్ లో కూడా భారీగా వర్షం పడడంతో గోదావరిలోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. అంతేగాక గోదావరికి ఉప నది అయిన తాలిపేరు నుంచి కూడా నీరు కలుస్తుండడంతో నదిలోకి స్వల్పంగా చేరుతోంది. కాగా... వరద నీరు వచ్చి చేరుతుండడంతో పుష్కరఘాట్ల వద్ద ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికారులు ఆయా ఏర్పాట్లను చేశారు.

సహజీవనం తప్పేమీ కాదు: సుప్రీం కోర్టు...

ఢిల్లీ:మన సమాజంలో ఇప్పుడు సహజీవనం కూడా ఆమోదం పొందిందని, అందువల్ల దాన్ని తప్పుగా చెప్పలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుత ఆధునిక సమాజంలో సహజీవనం అందరికీ ఆమోదయోగ్యం అయ్యిందని, అందువల్ల అది నేరం కాదని తెలిపింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

విశాఖకు రేపు కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి

విశాఖ:కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి జి.మోహన్‌కుమార్‌ రేపు విశాఖపట్నంకు వస్తున్నట్లు అధికార నర్గాలు తెలిపాయి. రెండురోజులపాటు ఆయన పర్యటన కొనసాగుతుందని పర్యటనలో భాగంగా తూర్పు నావికాదళం అధికారులతో సమావేశం అవుతారని అధికారులు తెలిపారు. తరువాత నావికాదళాల సౌకర్యాలు, కార్యకలాపాలపై చర్చిస్తారు.

19:50 - July 23, 2015

అమరావతీ నగర అపురూప శిల్పం ఆవిష్కృతమైంది. అంబరాన్నంటే ఆకాశహార్మ్యాలు ఓవైపు.. అద్వితీయ సుందరవనాలు మరోవైపు..! ఇటు స్వర్గానికి దారులు పరిచే రహదారులు.. అటు అభివృద్ధిని పరుగులు పెట్టించే పారిశ్రామిక పార్కులు..! ఆ వైపు హైవేలు.. ఈ వైపు స్కైవేలు.. ఒక్కటేమిటీ..! ఆంధ్రుల అక్షయపాత్రగా అవతరించబోతోంది భూలోక అమరావతి. మరి, ఇంతటి అసామాన్య నగరంలో సామాన్యుడికి స్థానం ఉంటుందా..? సగటు ఆంధ్రుడి స్వప్నం ఫలించనుందా..? చెదిరిపోనుందా..?? ఇదే.. ఆంధ్రుల ఆశల సౌధం..! నవ్యాంధ్ర అభివృద్ధి రథం..! ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆరోప్రాణం..
జనం ఎన్ని కలలు కన్నారో..?....
జనం ఎన్ని కలలు కన్నారో..? ఏ రూపాన్ని ఊహించుకున్నారో..? ఆ ఊహలకు ఏమాత్రం తీసిపోకుండా.. వారిని ఎంత మాత్రం నిరుత్సాహపర్చకుండా విడుదలైంది రాజధాని ఊహాచిత్రం. ఇక ఈ ఊహను నిజం చేసేందుకు, ఈ శిల్పానికి ప్రాణం పోసేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. అయితే.. ఇక్కడే తలెత్తుతోంది ఒక ధర్మసందేహం. ధగధగలాడబోతున్న ఈ అమరావతీ నగరిలో కాలుమోపడం సామాన్యుడికి ఎంత వరకు సాధ్యం..? ఇదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న.
అత్యంత భారీతనంతో అమరావతి...
అత్యంత భారీతనంతో రూపొందబోతోంది అమరావతి నగరం. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా రాజధాని రూపురేఖలు తీర్చిదిద్దుతామంటోంది ప్రభుత్వం. మొత్తం 16.9 చదరపు కిలో మీటర్ల వీస్తీర్ణంలో సీడ్‌ కేపిటల్‌ రూపుదిద్దుకోబోతోంది. దీనికి ఆకర్షణీయమైన లక్ష్యాలను సైతం నిర్దేశించారు. ఉపాధి-నివాసం, పచ్చదనం-పరిశుభ్రత, నాణ్యమైన జీవనం, అత్యాధునిక రవాణా వ్యవస్థ, వనరుల సమర్ధ వినియోగం, వారసత్వ సంపద-పర్యాటకం వంటి లక్ష్యాల ఆధారంగా నయా రాజధాని ఉండబోతోందంటున్నారు.
3 లక్షల వరకు జనాభా నివాసానికి...
ఈ ప్రాంతంలో 3 లక్షల వరకు జనాభా నివాసానికి అవకాశం కల్పించబోతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. పాలన మొత్తం ఒకే చోట కేంద్రీకృతం చేయాలని నిర్ణయించిన సర్కార్.. ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం, అసెంబ్లీ, మండలి, హైకోర్టు.. ఇలా పరిపాలన విభాగాల భవనాలన్నీ ఒకే చోట నిర్మించాలని నిర్ణయించింది. రెండున్నర వేల ఏకరాల్లో.. వేలాది కోట్ల ఖర్చుతో నభూతో నభవిష్యతి అనే విధంగా పాలనా కేంద్రాన్ని నిర్మిస్తామని ప్రకటించింది ప్రభుత్వం.
కృష్ణా నదీ తీరానికి ఆనుకుని...
కృష్ణా నదీ తీరానికి ఆనుకుని ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్‌ భవన్ నిర్మాణం. ఆ తరువాత మంత్రుల క్వార్టర్లు, వాటి కింద దేశంలో ఎక్కడా లేని విధంగా కాపిటేల్ కాంప్లెక్స్ కు రూపకల్పన చేసింది ప్రభుత్వం. దేశ రాజధానిలో సెంట్రల్ సెక్రటేరియట్ తరహాలో... ఏపీ కేపిటల్ కాంప్లెక్స్ ఉండబోతోంది. ఢిల్లీలోని రాజ్ పథ్ రోడ్డు నేరుగా సెంట్రల్ సెక్రటేరియట్ దారి తీసినట్టుగానే.. ఇక్కడ రహదారి నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇక పార్కులు, హోటళ్లు, టూరిజం స్పాట్లు, క్రీడా ప్రాంగణాలకు రాజధాని నగరంలో కొదవలేదు.
ఎన్నో హంగులు, ఆర్భాటాలతో....
ఇలా ఎన్నో హంగులు, ఆర్భాటాలతో రూపుదిద్దుకోబోతున్న రాజధాని నగరం కొందరికి ఆనందాన్ని కలిగిస్తుండగా.. ఎంతో మందికి ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి తమ జీవితాలనే పునాదులుగా మార్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌తోపాటు, సీడ్‌ కేపిటల్‌ ప్లాన్‌ కూడా ఇచ్చేసింది సింగపూర్‌. కానీ.. భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన స్థలాల గురించి మాత్రం ఈ ప్లాన్‌లో చెప్పలేదు. అసలు ఎక్కడ ఇస్తారు అన్నది కూడా ఇప్పటి వరకూ ఊసేలేదు. మరోవైపు.. మాస్టర్‌ ప్లాన్‌కు అడ్డం వస్తున్న గ్రామాలను కూడా అడ్డు తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం. దీంతో.. తమ అభివృద్ధికి బాటలు వేయాల్సిన రాజధాని, తమ జీవితాలను నాశనం చేస్తుందేమో అనే ఆందోళనలో ఉన్నారు రాజధాని ప్రాంతవాసులు.
సామాన్యులను వెంటాడుతున్న మరో రెండు అంశాలు ......
ఇవేకాకుండా.. మరో రెండు అంశాలు కూడా సామాన్యులను వెంటాడుతున్నాయి. అమరావతి అత్యంత ఖరీదైన రాజధానిగా నిర్మాణం కాబోతుండడం ఒక కారణమైతే.. పబ్లిక్‌ ప్రైవేటు పార్ట్‌నర్‌ షిప్‌తో ప్రాణం పోసుకుంటుండడం మరో కారణం. పీపీపీ ద్వారా రాజధాని నిర్మాణంలో భాగం పంచుకునే సంస్థలు.. లాభాల కోసమే పని చేస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాంటప్పుడు రాజధానిలో కల్పించే మౌలిక వసతుల నుంచి.. ఏ ఇతర సేవలనైనా ఆదాయ మార్గంగానే చూస్తాయి సదరు సంస్థలు. ఇక ప్రభుత్వం సైతం వీటితో దోస్తీ చేయబోతుండడంతో.. అన్ని సేవలకూ ప్రజల నుంచి ముక్కు పిండి మరీ డబ్బు వసూలు చేస్తారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు. పీపీపీ విధానంలో నిర్మితమైన రహదారులు, విమానశ్రయాల్లో ప్రజలపై పడుతున్న పెను భారాలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.
సామాన్యుడు ఎలా అడుగు పెట్టగలడనేదే....
అయితే.. దేశంలోనే ఖరీదైన నగరంగా రూపొందబోతున్న ఏపీ రాజధానిలో సామాన్యుడు ఎలా అడుగు పెట్టగలడనేదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న. రహదారుల వద్ద వసూలు చేసే టోల్‌ గేట్ల దగ్గర్నుంచి మొదలు.. అన్ని విధాలా యూజర్‌ ఛార్జీలు తడిసి మోపెడవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. జరిగే ప్రతి పనీ, పైసాతోనే ముడిపడి ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. రాజధాని ప్రాంతంలో సామాన్యుడు జీవించడం సాధ్యమేనా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరి, సగటు ఆంధ్రుడి కలల రాజధానిగా అమరావతి సామాన్యులందరికీ చేరువవుతుందా..? లేక స్వప్నంగానే మిగిలిపోనుందా..? అన్నది చూడాలి.

19:44 - July 23, 2015

హైదరాబాద్:కరువు జిల్లా అనంతపురంలో రేపు పర్యటించబోతున్నారు కాంగ్రెస్‌ యువరాజు రాహుల్. రైతు భరోసా పేరుతో పాదయాత్ర చేపట్టనున్న రాహుల్‌.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో.. కరువు కోరల్లో చిక్కుకుని నిత్యం అల్లాడుతున్న అనంతపురం జిల్లా పరిస్థితిపై ఓ రిపోర్ట్‌...
ఇక్కడ మాత్రం సంపూర్ణం..!
కరువు.. కొన్ని ప్రాంతాల్లో పాక్షికం. ఇక్కడ మాత్రం సంపూర్ణం..! ఆకలి కేకలు.. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికం. ఈ జిల్లాలో శాశ్వతం..!కరువు జిల్లాగా పేరు మార్చుకున్న అనంతపురం జిల్లా పరిస్థితి యేటికేడు మరింత దయనీయంగా తయారువుతోంది. శాశ్వతంగా తిష్టవేసిన కరువుతో.. పొట్ట చేబట్టుకొని వలసబాట పడుతున్నారు వేలాది మంది ప్రజానీకం. ఇక మట్టితల్లిని నమ్ముకున్న అన్నదాత పరిస్థితి మరింత దయనీయం. భూమి తల్లితో బంధాన్ని వదులుకోలేక.. నష్టాల సాళ్లలో ముందుకు సాగలేక ప్రాణాలు తీసుకుంటున్నారు ఎంతోమంది అన్నదాతలు.
తీవ్ర సంక్షోభంలో వ్యవసాయం...
ఈ ఏడాది కూడా జిల్లాలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి. 8 లక్షల పైచిలుకు హెక్టార్లలో సాగాల్సిన వ్యవసాయం.. 1 లక్షా 14 వేల హెక్టార్లకు పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక కుంగిపోతున్నారు అనంత రైతులు. తొలకరి వర్షాలకు సాగు చేసిన పంటలు వర్షాలు లేక ఎండిపోతున్నాయి. జులైలో 67.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 10.9 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దుర్భర పరిస్థితులను తట్టుకోలేక ఈ ఏడాది ఇప్పటికే.. సుమారు 4 లక్షల మందికిపైగా జిల్లావాసులు వలస వెళ్లినట్టు సమాచారం.
24న రైతు భరోసా యాత్ర....
ఈ సమయంలో జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ నెల 24న రైతు భరోసా యాత్ర పేరుతో రాహుల్‌.. పాదయాత్ర చేపట్టనున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబులదేవర చెరువు నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర.. కొండకమర్ల వరకూ సుమారు 10 కిలోమీటర్లు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత కార్మికుల కుటుంబాలను రాహుల్‌ పరామర్శించనున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు, దళితులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.ఇదిలా ఉంటే.. రాహుల్‌ టూర్‌పై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం అనుభవిస్తున్న బాధలకు కాంగ్రెస్‌ పార్టీయే కారణమని, ఈ ప్రాంతంలో పర్యటించే అర్హత రాహుల్‌కు లేదని మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. మొత్తానికి.. రైతు భరోసా యాత్ర పేరుతో అనంతపురంలో కాలుమోపుతున్నారు కాంగ్రెస్‌ యువనేత. మరి, ఈ పర్యటన ద్వారా ఆ ప్రాంత ప్రజలకు, రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో చూడాలి.

19:40 - July 23, 2015

గ్రేటర్ పరిధిలో ఓటర్‌ కార్డు- ఆధార్‌ అనుసందానం ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటి వరకు 36 శాతం అనుసందానం చేశారు. ఈ నెల చివరి వరకు 50 శాతం చేరుకోవడానికి గ్రేటర్ అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు.
న‌గ‌రంలో మొత్తం 73 ల‌క్షల 69 వేల ఓట‌ర్లు...
హైదరాబాద్ న‌గ‌రంలో మొత్తం 73 ల‌క్షల 69 వేల ఓట‌ర్లు ఉన్నారు. ప్రతి సారి జరిగే ఎన్నికల్లో ఓటింగ్ 55 శాతానికి మించడం లేదు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడంలేదు. ఇటీవల ఎన్నికల కమిషన్ ఓటర్‌ కార్డును ఆధార్‌తో లింక్ చెయ్యాలని చెప్పడంతో.. గ్రేటర్‌లో ముందుగా ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారు . అయితే ఇప్పటి వరకు 25 ల‌క్షల 79వేల ఓట‌ర్లకు ఆధార్‌ అనుసంధానం చేశామ‌న్నారు గ్రేటర్ కమిషనర్ సోమేష్ కుమార్ . మొత్తం ఓట‌ర్లలో ఇది 36 శాతం.
గ్రేటర్‌ పరిధిలో ఎక్కువ మంది ఓటర్లు....
ఇక గ్రేటర్‌ పరిధిలో ఎక్కువ మంది ఓటర్లు ప్రస్తుతం ఇక్కడ లేరు. 28 శాతం మంది త‌మ నివాసాల‌ను మార్చార‌ు. 16 శాతం మంది ఇళ్లకు తాళాలు వేశారు. 17 శాతం మందికి ఆధార్ కార్డులు లేవు. 75 వేల మంది మరణించారు. ఇప్పటి వరకు నగరంలో ఉన్న 7,051 పోలింగ్ బూతుల్లో అధికారులు ఇంటింటికీవెళ్లి ప‌రిశీలించార‌ు. అయితే ఆధార్ కార్డులు లేని వారికోసం గ్రేటర్ ప‌రిధిలోని 18 స‌ర్కిల్ కార్యాల‌యాల్లో ప్రత్యేకంగా ఆధార్ న‌మోదు కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. డోర్‌లాక్ చేసిన ఇళ్లను, ఇళ్లు మార్చిన వారిని, ఆధార్‌ కార్డులు లేని కేసుల‌ను మ‌రోసారి ప‌రిశీలించాల‌ని ఆదేశించారు.
అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు.....
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేర‌కు చేప‌ట్టిన ఈ ఆధార్ అనుసంధానంపై ఈ నెల 25వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఎర్పాటు చేయనున్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని అన్ని స‌ర్కిల్ కార్యాల‌యాల్లో ఈ స‌మావేశాలు నిర్వహించనున్నారు. రాజకీయ పార్టీల నేతలు ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆన్ లైన్ ద్వారా....
ఆన్‌లైన్, ఫోన్ ద్వారా, ఎన్నికల అధికారుల ద్వారా తమ ఓటర్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. అయితే ఆధార్ కార్డు లేని కారణంగా ఎవ్వరి ఓట్లనూ తోలగించబోమని సోమేష్‌కుమార్‌ తెలిపారు. బోగస్ ఓట్లను నివారించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని చెప్పారు. 

19:36 - July 23, 2015

ప్రజాపక్షం టెన్‌ టీవీ చెప్పిందే నిజమైంది. టెన్‌ టీవీ ప్రసారం చేసిన కబ్జా కోరల్లో పార్కలు అనే వరుస కథనాలకు జీహెచ్ ఎంసీ లో కదిలిక వచ్చింది. నగరంలో పార్కుల కబ్జాపై ఇటీవల టెన్ టీవి ప్రత్యేక కథనాన్ని ప్రచారం చేసింది. దీంతో స్పందించిన జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, డిప్యూటీ కమిషనర్‌తో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులు.. ఎల్బీనగర్‌లోని పలు పార్కులను సందర్శించారు. లేఅవుట్స్‌లోని పార్కు స్థలాలను పరిశీలించిన అధికారులు.. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కబ్జాకోరల్లో ఉన్న పార్కులను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జీహెచ్ ఎంసీ అధికారులు తెలిపారు.
గ్రేటర్‌ పరిధిలోని పార్కులు.. అక్రమార్కుల చేతుల్లో....
ప్రజలకు ఉపయోగపడాల్సిన గ్రేటర్‌ పరిధిలోని పార్కులు.. అక్రమార్కుల చేతుల్లో చిక్కుకున్నాయి. జీహెచ్ ఎంసీ అధికారులు పార్క్ లాండ్‌ అంటూ ప్రకటనలు, బోర్డులు పెట్టినా.. బేఖాతరు చేస్తూ విలువైన పార్కు స్థలాలను కబ్జా చేసుకున్నారు. ఏకంగా రాజకీయ నేతల అండతో కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి పార్కు స్థలాలను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. దీంతో అధికారులు కూడా వారిపై చర్యలు తీసుకునేందుకు సాహసించలేకలేదు. అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కబ్జారాయుళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
కొందరు అధికారులు.. కుమ్మక్కు కావడంతో.....
జీహెచ్ ఎంసీ లోని కొందరు అధికారులు.. కుమ్మక్కు కావడంతో పార్కులు కబ్జాకు గురవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయిజ. కార్పొరేషన్ ఆస్తులు, పార్కులు అక్రమార్కులు తన్నుకుపోతుంటే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
సగానికిపైగా కబ్జాల్లో....
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నగంలోని పార్కుల్లో సగానికిపైగా కబ్జాల్లో చిక్కుకున్నాయి. ఏళ్ల తరబడి కోర్టుల్లో కేసులు మూలుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కిందిస్థాయి నుండి హైకోర్టు వరకు ప్రత్యేక న్యాయవాదులు ఉన్నా కేసులు సత్వర పరిష్కారానికి నోచుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నగర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఓపెన్ స్థలాలు, పార్కుల రక్షణ కోసం ఉన్నతస్థాయి అధికారిని నియమించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మరిన్ని ప్రభుత్వ స్థలాలు.. కబ్జారాయుళ్ల ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. 

19:08 - July 23, 2015

వాసింగ్టన్ డిసి: తెలుగు కవితా వినీలాకాశంలో సమాంతర ఛాయలు, సిక్త్స్ఎలిమెంట్స్ కావ్యాలతో మెరిసిన కవిత్వపు కాంతిపుంజం క్రాంతి శ్రీనివాస రావు. ఆయన మువ్వా శ్రీనివాస రావు పేరుతో కవితలు రాసి ప్రఖ్యాతి గడించారు. డా. ఆవంత్స సోమసుందర్ రాసిన కవితా విపంచి కాంతి గీతాలు పుస్తకావిష్కరణ వాసింగ్టన్ డి.సిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మువ్వా శ్రీనివాస రావు మాట్లాడారు. అమెరికాలో తాను నివసిస్తున్న ప్రదేశంలోని ప్రజల జీవన శైలిపై పుస్తకాలు రాసే అవకాశం దక్కిందన్నారు. తన పుస్తకాలు అక్కడ అవిష్కరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తానా మహాసభల్లో అతన్ని విశిష్ట సాహితి పురస్కారంతో సత్కరించారు. పద్మావతి రంగయ్య ఫౌండేషన్ తో శ్రీనివాసరావు అందిస్తున్న సేవలకుగాను ప్రముఖులు అతన్ని కొనియాడారు.

ఢిల్లీ మాజీ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ కు బెయిల్

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదనపు సెషన్స్ జడ్జి విమల్ కుమార్ యాదవ్ షరతులతో కూడిన బెయిల్ ను ఇచ్చారు. అంతేగాక రూ.5,000 స్యూరిటీగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ఢిల్లీ దాటి వెళ్లకూడదని, విచారణకు ఎప్పుడు పిలిచినా వెంటనే హాజరుకావాలని కోర్టు షరతులు విధించింది. బీహార్ లోని ఓ కళాశాల నుంచి నకిలీ డిగ్రీ పట్టా కలిగి ఉన్నారంటూ ఢిల్లీ బార్ కౌన్సిల్ ఫిర్యాదు చేయడంతో జూన్ 9న తోమర్ ను అరెస్టు చేశారు. ఆ తరువాత రెండుసార్లు ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

పార్టీ పిరాయింపు చట్టంలో ఎన్నో లోపాలు:డీఎస్

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు చట్టంలో ఎన్నో లోపాలున్నాయని ... దీనిపై విస్తృతంగా చర్చజరగాల్సినఅ వసరం ఉందని టిఆర్ ఎస్ నేత డి. శ్రీనివాస్ అన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజా ప్రతినిధులు మరో పార్టీలో చేరడం విచారకరమన్నారు. తలసాని రాజీనామా వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి డీఎస్ నిరాకరించారు. సీఎం కేసీఆర్ కు అన్ని రంగాలపై అవగాహన, ముందుచూపు ఉందని కొనియాడారు.

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

కరీంనగర్ :పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటలో అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గంట్ల సుదాకర్ రెడ్డి(52) అనే కౌలు రైతు 8 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేశాడు. 6 లక్షల మేర అప్పుల పాలయ్యాడు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాలమూరు జిల్లాలో వ్యవసాయ కళాశాల...

మహబూబ్‌నగర్‌:పాలెంలో రూ.107 కోట్లతో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. రాష్ట్ర్రంలో వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు. నేడు వ్యవసాయ రంగం నూతన టెక్నాలజీతో కొత్త ఒరువడికి శ్రీకారం చుడుతుందని అన్నారు. వ్యవసాయకోర్సులు చేసే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

సమస్యలపై చర్చించుకుంటేనే పరిష్కారం:ప్రధాని

న్యూఢిల్లీ: సభలో సమస్యలపై చర్చించుకుంటేనే పరిష్కారం లభిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచం మనల్ని నిశితంగా గమనిస్తోందని... ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. కొత్త విషయాలపట్ల మన ఆలోచలనలు విభిన్నంగా ఉండాలని, ఆలోచనలు స్వేచ్ఛగా పంచుకునే అవకాశం కూడా ఉండాలని నరేంద్రమోదీ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో కేవలం ప్రసంగాలే దేశానికి ప్రయోజనం కాదని ఆయన అన్నారు.

పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయితే వైసీపీకి పుట్టగతులుండవు:ప్రతిపాటి

విజయవాడ:టీడీపీ అభివృద్ధిని చూసి వైసీపీ,కాంగ్రెస్ నాయుకులు ఓర్వలేకపోతున్నారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వస్తే వైసీపీకి పుట్టగతులు ఉండవనే భయం పట్టుకుంది అందుకే ప్రాజెక్టు నిర్మాణ విషయంపై కూడా వైసీపీ రాజికీయం చేస్తుందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

టీఎస్ ఆర్టీసీ ఎం.డీ వి.వి.రమణారావు...

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా వి.వి.రమణారావు నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రమణారావు ఆర్టీసీ జేఎండీగా వ్యవహరిస్తున్నారు. ఎండీగా ఆగస్టు 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

నాగార్జున యూనివర్శిటీలో ఉద్రిక్తత

గుంటూరు: నాగార్జున వర్సిటీలో రెండు వర్గాల విద్యార్థుల మధ్య వివాదం, పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ తోపులాటలో గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పలువురి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున యూనివర్శిటీలో రిషికేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో ఆర్కిటెక్చర్‌ ప్రిన్స్‌పాల్‌ను సస్పెండ్‌ చేశారు. రేవ్ పార్టీలకు సంబంధించిన వీడియోలను బయట పెడుతున్న సమయంలో ప్రిన్సిపల్ వ్యతిరేకులు... అనుకూల విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో యూనివర్శిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

16:49 - July 23, 2015

ఢిల్లీ: లలిత్‌గేట్‌, వ్యాపం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి సుష్మస్వరాజ్, ముఖ్యమంత్రులు వసుంధరా, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లకు పదవిలో కొనసాగే అర్హత లేదని సిపిఎం పేర్కొంది. వారిపి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. విచారణ పూర్తయ్యేవరకు కేంద్ర మంత్రి విధులకు హాజరు కాకూడదని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్టే ఎంపీలకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. తనని తాను ప్రధాన సేవక్‌గా పేర్కొన్న నరేంద్రమోది ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ఏచూరి ప్రశ్నించారు. విచారణ పూర్తయ్యాక తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

16:46 - July 23, 2015

మెదక్:ముక్కు మూసుకుని గ్రామాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచే పంచాయితీ కార్మికులను తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తిరుపతి వెంకన్నకు, యాదాద్రికి, బెజవాడ కనక దుర్గమ్మకు మొక్కుల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్న తెలంగాణ ప్రభుత్వం..పారిశుద్ధ్య కార్మికుల చిన్నచిన్న కోర్కెలు తీర్చడంలో విఫలమైందన్నారు. మెదక్ జిల్లా నారాయణ ఖేడ్‌కు చేరుకున్న వామపక్షాల బస్సుయాత్ర సందర్భంగా...అక్కడి పంచాయితీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు తమ్మినేని. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఫిట్‌మెంట్ తరహాలోనే పంచాయితీ కార్మికుల సమస్యలను సైతం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

16:44 - July 23, 2015

కృష్ణా: విజయవాడ లో మున్సిపల్ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. సింగినగర్ లోని నగరపాలక సంస్ధ డిప్యూటీ మేయర్ గోగుల రమణ ఇంటిని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మున్సిపల్ కార్మికుల ఆందోళన తీవ్రతరం చేయడంతో ఇంటి నుంచి బయటకొచ్చిన డిప్యూటీ మేయర్ సిఐటియు నాయకులతో మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె సరైందేనని, త్వరలోనే మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు పేదల ఓట్ల తో గద్దెనెక్కిన టిడిపి ప్రభుత్వం వాళ్ల పొట్టలే కొట్టాలని సీపీఎం నేతలు విమర్శించారు. రాజధాని పేరుతో పేదల భూములను లాక్కొని చైనాకు కట్టబెడుతున్న ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టి రాష్ట్రాన్ని స్తంభింపచేస్తామని హెచ్చరించారు. 

16:41 - July 23, 2015

ప్రకాశం: మున్సిపల్‌ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. ఒంగోలులో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు చేతికి సంకేళ్లు వేసుకుని ర్యాలీ నిర్వహించారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని.. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

16:39 - July 23, 2015

 విజయవాడ: కనీస వేతనాలు చెల్లించకుండా..కార్మికుల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని మున్సిపల్ కార్మికుల జేఏసీ విమర్శించింది. నేటితో ఏపీ మున్సిపల్ కార్మికుల సమ్మె 14 రోజులకు చేరింది. సమ్మెలో భాగంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా మున్సిపల్ కార్మికులు విజయవాడ కృష్ణానదిలో జలదీక్ష చేపట్టారు. 14 రోజుల నుంచి ఏపీలో దాదాపు 42వేల మంది మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు జేఏసీ నాయకులు.

టీఆర్ఎస్ ఓ కమీషన్ల పార్టీ:దాసోజు శ్రవణ్

హైదరాబాద్:టీఆర్ఎస్ ఓ కమీషన్ల పార్టీ అని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఆ కమీషన్ల కోసమే ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులన్నీ తీసుకొస్తోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ కు కొత్త ప్రాజెక్టులపై ఉన్న ప్రేమ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై లేదని శ్రవణ్ ఆరోపించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పై ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చితే ఊరుకునేదిలేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

వారంలోగా ఉస్మానియా ఆస్పత్రిని తరలిస్తాం: సీఎం కేసీఆర్

హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిని తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఎంకేసీఆర్ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా ఆస్పత్రి భవనం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారంలోగా ఆస్పత్రిని వేరే ప్రాంతానికి తరలిస్తామన్నారు. ఇందు కోసం జీహెచ్‌ఎంసీతో చర్చిస్తామన్నారు. తాను ఆస్పత్రికి రావడమే ఆలస్యమైనట్టు భావిస్తున్నానని తెలిపారు. ఎప్పుడో ఆస్పత్రికి రావాల్సిందని అన్నారు. ఉస్మానియి ఆస్పత్రి భవనాన్ని చారిత్రక కట్టడాల జాబితా నుంచి తొలిగించేందుకు గవర్నర్‌ను కలుస్తానన్నారు.

ఈజిప్టులో పడవ ప్రమాదం:18మంది మృతి

కైరో:ఈజిప్టు నైలు నదిపై జరిగిన ఓ పడవ ప్రమాదంలో అందులో ఉన్న 18 మంది మృతి చెందారు. ఓ జంట నిశ్చితార్ధ వేడుకను పడవలో జరుపుకుంటుండగా కార్గో పడవ ఢీకొనడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు నలుగురు చిన్నారుల మృత దేహాలు లభ్యమయ్యాయి. చాలా మంది ప్రయాణికులు గల్లంతయినట్లు ఈజిప్టు అధికార వర్గాలు చెప్పాయి. ఐదుగురిని కాపాడారు. కార్గో పడవ కెప్టెన్‌ను అరెస్టు చేశారు. గాలింపు చర్యలకు ట్రాఫిక్ రద్ధీ విఘాతంగా మారింది. గల్లంతయిన వారిలో నిశ్చితార్ధపు జంట ఉన్నదీ లేనిదీ తెలియరాలేదు.

రాహుల్ గాంధీ ఆరోపణలను తప్పి కొట్టిన బిజెపి

ఢిల్లీ: రాహుల్‌గాంధీ ఆరోపణలను అధికార బీజేపీ తిప్పికొట్టింది. టీవీలు, పత్రికల్లో ప్రచారం కోసమే కాంగ్రెస్ ఆందోళన చేస్తుందని, లలిత్‌గేట్, వ్యాపం కుంభకోణంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ప్రతిపక్షాలు సిద్ధంగా లేవని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. ప్రధాని మోడీకి రాహుల్‌గాంధీ దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్ ఇంకా యూపీఏ ప్రభుత్వమే అధికారంలో ఉందన్న భ్రమలో ఉన్నారు. యూపీఏ కాలం ముగిసి ఏడాది దాటిందన్న విషయం తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.

బట్టబయలైన రెవెన్యూ అధికారుల చేతివాటం

అనంతపురం:పాలసముద్రం రెవెన్యూ అధికారుల చేతివాటం బట్టబయలయ్యింది. పరిశ్రమ కోసం భూయజమానులకు ఇవ్వవలసిన పరిహారాన్ని రెవెన్యూ అధికారులు భోంచేశారు. బెల్ కంపెనీ భూసేకరణ పరిహారంలో రూ.కోటి రూపాయలను అధికారులు నొక్కేశారు. పోలీసులు కూడా ఈ వ్యవహారంలో స్పందించడంలేదని గమనించిన బాధితులు మీడియాను ఆశ్రయించారు.

15:56 - July 23, 2015

ఢిల్లీ:1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. టాడా కోర్టు ఇతనికి ఉరిశిక్ష విధించగా... దాన్ని సవాలు చేస్తూ ఆయన ఇప్పటికే ఓసారి సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను రెండ్రోజుల క్రితమే అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇక ఈనెల 30న యాకూబ్‌ మెమన్‌కు ఉరిశిక్ష వేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఐతే 30వ తారీఖున తన ఉరిశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ... యాకూబ్ మెమన్‌ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

15:55 - July 23, 2015

ఢిల్లీ:ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేయాల్సిందేనని... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పునరుద్ఘాటించారు. వారు రిజైన్‌ చేయకపోతే... పార్లమెంట్‌లో చర్చల ప్రసక్తే వుండదని స్పష్టం చేశారు. లలిత్ గేట్‌, వ్యాపం కుంభకోణాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైతే... ప్రధాని నరేంద్రమోదీ స్పందించకపోవటం శోచనీయమన్నారు. ఆయన బీజేపీ ప్రధాని కాదని... భారతదేశానికి ప్రధాని అన్న విషయం గుర్తుంచుకొని... ప్రజలకు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు.

15:53 - July 23, 2015

గుంటూరు: నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి వ్యవహారంపై కాసేపట్లో బహిరంగ విచారణ జరగనున్నది. రిషితేశ్వరి మృతిపై అనేక అనుమానాలను తల్లిదండ్రులు, తోటి విద్యార్ధినులు వ్యక్తం చేస్తున్నారు. 

15:49 - July 23, 2015

హైదరాబాద్: తెలంగాణ లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ మేరకు తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్నందున సమాచారాన్ని స్పీకర్ కు తెలియజేయాలి పేర్కొంది. స్పీకర్ కు నోటీసు ఇచ్చినట్లు ధ్రువపరిచే పత్రాన్ని కోర్టుకు నివేదించాలని ప్రతివాదుల తరపు న్యాయవాదిని హైకోర్టుఆ దేశించింది. 

15:45 - July 23, 2015

హైదరాబాద్:పుష్కరాల సందర్భంగా భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు మంత్రి కామినేని శ్రీనివాసరావు. 4 వందల టీములతో వైద్య విభాగాన్ని అలర్ట్‌ చేశామని తెలిపారు.

15:42 - July 23, 2015

కరీంనగర్‌:రాయకల్‌ మండలం అల్లీపూర్‌లో విద్యుత్‌ షాక్‌తో గంగారెడ్డి అనే రైతు మృతిచెందాడు. ఉదయం పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన గంగారెడ్డి.. విద్యుత్‌ వైర్లు తగిలి విద్యుత్‌షాక్‌ గురయ్యాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఇంటి పెద్ద విద్యుత్‌షాక్‌తో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

15:41 - July 23, 2015

హైదరాబాద్:ఫ్లెక్సీ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం రూరల్‌కు చెందిన భాస్కరరావు అనే వ్యక్తి ఏపి ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ అనుచరుడు. కూన రవికుమార్‌ విదేశీ పర్యటన ముగించుకుని వస్తున్న సంధర్భంలో కొత్తకోట జంక్షన్‌లో ఓ బిల్డింగ్‌ పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఫ్లెక్సీ జారి పక్కనే ఉన్న హైటెన్షన్‌ విద్యుత్ తీగలపై పడింది. షాక్‌ తీవ్ర స్ధాయిలో తగలడంతో భాస్కరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. నారాయణ రావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. భాస్కరరావు మృతితో దిగ్ర్భాంతికి గురైన కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

15:39 - July 23, 2015

విజయవాడ:సింగపూర్‌ ఇంజనీర్లు తయారుచేసిన రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీర్లు తయారు చేయలేరన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఇక్కడి ఇంజనీర్లను అవమానించారన్న మధు.. ఈ ముఖ్యమంత్రికన్నా సింగపూర్‌ మంత్రులే మేలన్న విషయాన్ని చంద్రబాబే పరోక్షంగా ప్రకటించినట్లు అయిందని ఎద్దేవా చేశారు.

15:37 - July 23, 2015

.గో: పట్టిసీమ ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఏరియల్‌ సర్వే ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు పనులకు అవసరమైన 75 పొక్లెయిన్‌లు, టిప్పర్లు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గడువులోపు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆగస్టు 2న మరోసారి పట్టిసీమ ప్రాజెక్టును పరిశీలించనున్నట్లు వెల్లడించారు. 2018 లోపు పోలవరం డ్యాం పూర్తి చేస్తామని ప్రకటించారు.

 

ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ :నగరంలోని ఉస్మానియా ఆసుపత్రిని సీఎంకేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కే. లక్ష్మారెడ్డి తదితరులు గురువారం పరిశీలించారు. ఉస్మానియా ఆసుపత్రికి చెందిన పాత భవనంతోపాటు కులికుతుబ్ షా భవనం, అలాగే ఓపీ భవనాలను వారు పరిశీలించారు. కాగా... పురాతన భవనాలైన వీటిని పడగొట్టి వీటి స్థానంలో నూతన భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆ భవనాలను సీఎంతోపాటు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి తదితరులు భవనాలను పరిశీలించారు.

తగతి గదిలోకి ప్రవేశించిన చిరుత పులి

కర్ణాకటక:చిక్ మగళూరులోని ఓ ప్రైవేటు స్కూల్ లో తగతి గదిలోకి చిరుత పులి ప్రవేశించింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది చిరితను బంధించేందుకు ఆపరేషన్ ప్రారంభించారు.

ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్

గుంటూరు: నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావును ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉన్న విద్యాశాఖాధికారి నుంచి వీసీకి ఆదేశాలు అందాయి.

డిప్యూటీ సీఎంను కలిసిన జేఏసీ నేతలు..

హైదరాబాద్‌:డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం నేతృత్వంలోని ఆయా యూనివర్సిటీలకు చెందిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు గురువారం కలిశారు. గత కొంతకాలంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు డిప్యూటీ సీఎంకు విన్నవించారు. ఈసందర్బంగా దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియపరిచి సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం.

 

15:11 - July 23, 2015

హైదరాబాద్: సంతానం కావాలనే బలమైన కోరిక ఒకవైపు .. అందుకు ప్రతిగా పేద మహిళలు అద్దె తల్లులుగా మారుతున్న స్థితి మరోవైపు.. ఇందుకు సంబంధించిన చట్టాలు, న్యాయ సూత్రాలు బలంగా లేని పరిస్థితి ఇంకోవైపు.. ఇలాంటి గందరగోళాల మధ్య అంతిమంగా బాధితులుగా మారేది.. మారుతున్నది మాత్రం పేద మహిళలే.. అందుకే ఇకనైనా ప్రభుత్వాలు తేరుకుని, సరొగసికి సంబంధించి నిర్దిష్ట చట్టాలను రూపొందించాలని మానవి కోరుకుంటోంది. పేద మహిళల ఆరోగ్యాలను వైద్యరంగంలోని ప్రయోగాలు ఫణంగా పెట్టొద్దని మానవి డిమాండ్ చేస్తోంది.. భారతదేశం సరొగసి వ్యవస్థకు ఎందుకు కేంద్రంగా మారుతోంది? దేశంలోని సరొగసి చట్టాలు ఏం చెప్తున్నాయి? మహిళల ఆరోగ్య భద్రతకు ఏ మేరకు అండగా నిలుస్తున్నాయి? ఇదే అంశాలపై మానవి 'ఫోకస్'లో చర్చించింది. ఈ అంశాలను మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

'పవన్ కల్యాణ్ నోరు మూయించడానికే'

ఢిల్లీ:టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద గురువారం టీడీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ధర్నాలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు చేసే ధర్నాలన్నీ ప్రజలను మభ్యపెట్టే కంటితుడుపు చర్యలన్నారు. పవన్ కల్యాణ్ లాంటి వాళ్ల నోర్లు మూపించడానికి ఇటువంటి ధర్నాలు పనికి వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా మంత్రాలకు చింతకాయలు రాలవంటూ ఎద్దేవా చేశారు.

రేపటికి వాయిదా పడ్డ రాజ్యసభ

హైదరాబాద్: రాజ్యసభలో వాయిదా పర్వం కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనలతో సభ జరిగే అవకాశం లేనందున సభను రేపటికి వాయిదా వేస్తున్న డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు.

 

బజరంగీ భాయిజాన్' చిత్ర బృందానికి సెల్యూట్ చేసిన ఎస్ ఎస్ రాజమౌళి...

హైదరాబాద్:సల్మాన్ ఖాన్ నటించిన 'బజరంగీ భాయిజాన్' చిత్రం ఇటీవలే విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాపై టాలీవుడ్ టాప్ డైరక్టర్ రాజమౌళి ట్విట్టర్లో స్పందించారు. సల్మాన్ తన స్టార్ ఇమేజ్ ను పక్కనబెట్టి కథకే ప్రాధాన్యం ఇచ్చాడన్న విషయం ఈ సినిమాలో ప్రస్ఫుటమైందని అన్నారు. చిన్నారి హర్షాలి అద్భుతమైన అభినయాన్ని కనబర్చిందని కొనియాడారు. ఆ బాలిక నటన అందరినీ అలరించిందని తెలిపారు. తారాగణం కన్నా కథనే పైమెట్టుపై నిలిపేందుకు యూనిట్ పడ్డ శ్రమ తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. ముఖ్యంగా, చిత్ర కథ హృదయానికి హత్తుకుందని అన్నారు.

ఉరిశిక్షపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మెమన్...

ఢిల్లీ: ఈనెల 30న ఉరిశిక్ష అమలుకాబోతున్న యాకుబ్ మెమన్ ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ నెల 30న తనకు అమలు చేయబోతున్న ఉరిశిక్షపై స్టే ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు మెమన్ న్యాయవాది పిటిషన్ దాఖలుచేశాడు. అంతేగాక తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావుకు కూడా అభ్యర్థన పిటిషన్ పెట్టుకున్నాడు. రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు తన పిటిషన్ కొట్టివేసిన వెంటనే మెమన్ గవర్నర్ కు పిటిషన్ పెట్టుకోవడం గమనార్హం. 

టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం..

ఢిల్లీ : తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్లమెంట్ లో పరిణామాలు, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. 

జంషెడ్ పూర్ లో ప్రశాంతత..

జంషెడ్ పూర్ : మూడు రోజుల అనంతరం జంషెడ్ పూర్ లో ప్రశాంతత నెలకొంది. రెండు సామాజిక వర్గాల మధ్య కలహాలతో పోలీసులు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఓ యువతిపై లైంగిక వేధింపులతో గొడవకు సామాజిక వర్గాలు మతం రంగు పులమడంతో గొడవలు చెలరేగాయి. 

మున్సిపల్ కార్మికుల సమ్మెపై స్పందించిన దత్తాత్రేయ...

చెన్నై : మున్సిపల్ కార్మికుల సమ్మె పరిష్కారానికి తెలుగు రాష్ట్రాలు కృషి చేయాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. లేదంటే కేంద్రం జోక్యం చేసుకుంటుందన్నారు.

13:18 - July 23, 2015

ఢిల్లీ : బీజేపీ ప్రభుత్వంపై ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గత మూడు రోజులుగా కాంగ్రెస్ సభ్యులు లోక్ సభలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. లలిత్ మోడీ అంశం, వ్యాపం కుంభకోణంపై సభ్యులు ఆందోళన చేస్తున్నారు. రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. దీనిపై గురువారం రాహుల్ మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసేదాక పార్లమెంట్ లో చర్చలుండవని రాహుల్ స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి మోడీ స్పందించకపోవడం శోచనీయమని, ఆయన బీజేపీకి ప్రధాన మంత్రి కాదని దేశానికి ప్రధాన మంత్రి అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ చెప్పిన అవినీతి రహిత పాలన ఇదేనా అని ప్రశ్నించారు. వ్యాపం, లలిత్ గేట్ స్కాముల్లో మోడీ సర్కార్ కూరుకపోయిందన్నారు. ప్రజా సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, ప్రతిపక్షాల గొంతు అణిచివేసేందుకు మోడీ యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. 

13:08 - July 23, 2015

ఢిల్లీ : విపక్షాల ఆందోళనతో లోక్ సభ అట్టుడికిపోయింది. వరుసగా మూడు రోజు కూడా అదే పరిస్థితులు కొనసాగాయి. గురువారం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఇచ్చిన తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహజన్ తిరస్కరించి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీనిని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. లలిత్ మోడీ అంశం, వ్యాపం కుంభకోణంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి..ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించ వద్దని స్పీకర్ పలుమార్లు సూచించారు. కేంద్ర మంత్రి...మధ్యప్రదేశ్ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబర్ట్ వాద్రాపై హక్కుల ఉల్లంఘన తీర్మానం కోసం బీజేపీ సభ్యుడు డిమాండ్ చేశారు. సభ్యుల ఆందోళన సద్దుమణగకపోవడంతో స్పీకర్ మధ్యాహ్నాం 12గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తరువాత సభలో ఎలాంటి పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్ష సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం ఏర్పడింది. చర్చను చేపట్టాలని స్పీకర్ పలుమార్లు సభ్యులకు సూచించారు. చివరకు సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు. 

అవినీతి రహిత పాలన ఇదేనా ? - రాహుల్..

ఢిల్లీ : అవినీతి రహిత పాలన ఇదేనా ?అంటూ ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. వ్యాపం, లలిత్ మోడీ కుంభకోణాల్లో బీజేపీ కూరుకపోయిందని, ప్రజా సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. 

తిలక్ చిత్రపటం వద్ద మోడీ నివాళులు..

ఢిల్లీ : పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఉన్న లోకమాన్య బాలా గంగాధర్ తిలక్ జయంతి చిత్రపటం వద్ద ప్రధాని మోడీ నివాళులర్పించారు. 

12:41 - July 23, 2015

ఢిల్లీ : శ్రీలంక టెస్టు సిరీస్ లో ఆడే మూడో స్పిన్నర్ ఎవరు ? టీంలో ఎవరెవరు ఉంటారు ? అనే ఉత్కంఠకు సెలక్టర్లు తెరదించారు. శ్రీలంకతో ఆగస్టు 12న మూడు టెస్టుల మ్యాచ్ ప్రారంభం కానుంది. సందీప్ పాటిల్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ గురువారం భేటీ అయ్యింది. మొత్తం 15 మందితో టీంను ప్రకటించారు. మూడో స్పిన్నర్ గా అమిత్ మిశ్రాను సెలక్ట్ చేశారు. కోహ్లీ (కెప్టెన్), ధావన్, విజయ్, కే ఎల్ రాహుల్, పుజారా, రహానే, రోహిత్, సాహ, హర్భజన్, అశ్విన్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్, వరుణ్ అరోన్ లున్నారు. మొత్తం ముగ్గురు ఆప్ స్పిన్నర్లకు స్థానం కల్పించినట్లైంది. శ్రీలంక జట్టుకు అనుగుణంగా టీంను సెలక్ట్ చేయాలని సెలక్ట్ కమిటీ భావించింది.
నలుగురు పేస్ బౌలర్లు..
పేస్ బెంచీలో మార్పులు ఏమీ చేయలేదు. ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ లను ఎంపిక చేశారు. నాలుగో పేసర్ గా జ్వరం నుండి కొలుకున్న వరుణ్ అరోన్ ఎంపిక అయ్యాడు.
భజ్జి ఉన్నాడు..
కొన్నాళ్లుగా స్పిన్ విభాగాన్ని మోస్తున్న ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు జతగా, బంగ్లా టూర్‌లో ఆకట్టుకున్న వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను ఎంపిక చేశారు. మూడో స్పిన్నర్‌గా ఎవర్ని ఎంపిక చేస్తారనేదే ఆసక్తికరంగా మారింది. ఇందుకు అక్షర్ పటేల్, వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాలు రేసులో ముందు వరుసలో ఉన్నారు. యువ లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ గాయం కారణంగా జింబాబ్వే సిరీస్ నుంచి తప్పుకోవడంతో అమిత్ మిశ్రా పేరు తెరపైకొచ్చింది. వీరితోపాటు దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న ప్రజ్ఞాన్ ఓఝా, కర్ణాటక యువ లెగ్‌స్పిన్నర్, ఏ జట్టు సభ్యుడు శ్రేయాస్ గోపాల్‌లపైనా సెలెక్టర్ల దృష్టి ఉంది. చివరకు అమిత్ మిశ్రాను ఎంపిక చేశారు. దీనితో స్పిన్ బౌలింగ్ లో ముగ్గురు (అశ్విన్, హర్భజన్, అమిత్ మిశ్రా) ఉన్నారు. 

12:22 - July 23, 2015

కరీంనగర్ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ల గతి తప్పుతోంది..ఇటీవలే పలువురు విద్యార్థుల ప్రాణాలు తీసిన టీచర్లలో మార్పులు రావడం లేదు. ఎక్కడో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. హోం వర్క్ చేసుకరాలేదని ఓ విద్యార్థి ప్రాణాన్ని టీచర్ బలి తీసుకున్నారు. జిల్లాలోని హుజూరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
హుజూరాబాద్ లోని ఓ ప్రైవేటు స్కూల్ లో అశ్విత అనే విద్యార్థి ఐదో తరగతి చదువుతోంది. గణితం హోం వర్క్ చేయలేదని ఆగ్రహించిన టీచర్ అశ్వితను బుధవారం గోడ కుర్చీ వేయించాడు. సుమారు 45 నిమిషాల పాటు వేయించడంతో అశ్విత సృహతప్పి పడిపోయింది. సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. వెంటనే అశ్వితను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం వరంగల్ జిల్లా ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అశ్విత మృతి చెందింది. తీవ్ర ఆగ్రహానికి గురైన బంధువులు..స్థానికులు ప్రైవేటు స్కూల్ పై దాడికి దిగారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్కూల్ ఛైర్మన్, గణితం టీచర్ స్కూల్ కు డుమ్మా కొట్టారు. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసును నమోదు చేశారు. అశ్విత మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగాల విలపించారు. 

పుష్కరాలకు వెళ్లేందుకు సండ్రకు కోర్టు గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్ : ఓటుకు నోటుకు కేసులో అరెస్టయి షరతులతో కూడిన బెయిల్ పై విడుదలైన టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. గోదావరి పుష్కరాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఈనెల 26 వరకు అనుమతినిచ్చింది.

రాజ్యసభ రెండు గంటల వరకు వాయిదా..

ఢిల్లీ : రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. మధ్యాహ్నాం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ వెల్లడించారు.

శ్రీలంకకు టెస్ట్ సిరీస్ కు భారత టీం..

ఢిల్లీ : శ్రీలంక జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు భారత టీంను బీసీసీఐ ప్రకటించింది. మూడో స్పిన్నర్ గా అమిత్ మిశ్రా సెలక్ట్ చేశారు. కోహ్లీ (కెప్టెన్), ధావన్, విజయ్, కే ఎల్ రాహుల్, పుజారా, రహానే, రోహిత్, సాహ, హర్భజన్, అశ్విన్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్, వరుణ్ అరోన్ లున్నారు. 

సండ్ర పిటిషన్ పై కాసేపట్లో తీర్పు...

హైదరాబాద్ : పుష్కరాలకు వెళ్లాలన్న ఓటుకు నోటు కేసు నిందితుడు సండ్ర పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏసీబీ కోర్టుకు తెలిపింది. కాసేపటల్లో కోర్టు తీర్పు వెలువరించనుంది. 

కాల్ డేటా సమర్పణకు సుప్రీం వారం గడువు..

ఢిల్లీ : కాల్ డేటా సమర్ఫణకు సర్వీస్ ప్రోవైడర్లకు సుప్రీంకోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది. ఓటుకు నోటుకు కేసులో కాల్ డేటాను విజయవాడ కోర్టు కోరిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వీస్ ప్రోవైడర్లు సుప్రీంను ఆశ్రయించారు. కాల్ డేటా బహిర్గతం చేసేందుకు మూడు వారాల సమయాన్ని సుప్రీం నిర్ధేశించింది. నెల తరువాత విచారణ చేపట్టాలని విజయవాడ కోర్టుకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 

ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన ఉమ్మారెడ్డి..

హైదరాబాద్ : ఏపీ శాసనమండలి సభ్యుడిగా వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి ప్రమాణం చేయించారు. 

11:52 - July 23, 2015

ఢిల్లీ : మూడో రోజు రాజ్యసభ లో గందరగోళం నెలకొంది. లలిత్ మోడీ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామాకు విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. సభలో విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీనితో డిప్యూటి ఛైర్మన్ విపక్ష సభ్యులు శాంతించాలని పలుమార్లు కోరినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. రాజీనామా చేసే పరిస్థితి లేదని, చర్చకు సిద్ధం కావాలని అధికారపక్షం స్పష్టం చేసింది. ఈ తరుణంలో స్పీకర్ సభను ఉద్దేశించి మాట్లాడారు. చర్చకు అనుమతినిచ్చే అంశం తన పరిధిలో ఉంటుందని, రాజీనామా అంశం తన పరిధిలో ఉండదని విపక్ష సభ్యులకు స్పష్టం చేశారు. ఈ మధ్యలో అధికార పక్షం జోక్యం చేసుకుంది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను లేవనెత్తారు. స్పీకర్ మాట్లాడే సమయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదని డిప్యూటి ఛైర్మన్ తెలిపారు. మాట్లాడిన అనంతరం పాయింట్ ఆఫ్ ఆర్డర్ కు డిప్యూటి ఛైర్మన్ అనుమతినిచ్చారు. దీనిపై సీపీఎం సభ్యుడు సీతారం ఏచూరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎలా తీసుకున్నారు ? ప్రశ్నించారు. సభ్యుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీర్మానం చేసే హక్కు ఉందని మంత్రి జైట్లీ పేర్కొన్నారు. కానీ మధ్యలో ఎలాంటి తీర్మానం చేయకుండా పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను ఎలా లేవనెత్తుతారని ఏచూరి ప్రశ్నించారు. కాంగ్రెస్ నోటీసులో మంత్రి రాజీనామా చేయాలని లేదని జైట్లీ పేర్కొనగా చర్యలు తీసుకున్న తరువాతే లలిత్ మోడీ వ్యవహారంపై చర్చ జరపాలని సీపీఎం సభ్యుడు ఏచూరి డిమాండ్ చేశారు. 

రాజ్యసభలో ఆందోళన..

ఢిల్లీ : రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. లలిత్ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి. కేంద్ర మంత్రి రాజీనామా అంశం తన పరిధిలో లేదని డిప్యూటి ఛైర్మన్ కురియన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నోటీసులో మంత్రి రాజీనామా చేయాలని లేదని జైట్లీ పేర్కొనగా చర్యలు తీసుకున్న తరువాతే లలిత్ మోడీ వ్యవహారంపై చర్చ జరపాలని సీపీఎం సభ్యుడు ఏచూరి డిమాండ్ చేశారు.

 

విశాఖపట్టణంలో ఏడు కిలోల బంగారం చోరీ..

విశాఖపట్టణం : తగరపువలసలో ఏడు కిలోల బంగారం చోరీకి గురైంది. సాయిపద్మ జ్యువెలరి యజమాని చేతిలో ఉన్న బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు.

 

11:19 - July 23, 2015

ఢిల్లీ : లోక్ సభ..మూడో రోజు సేమ్ సీన్ లు రిపీట్ అయ్యాయి. గురువారం ప్రారంభమైన సభలో స్పీకర్ సుమిత్రా మహజన్ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దీనితో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనితో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ప్లకార్డులు పట్టుకోవద్దని సూచించారు. సుష్మ స్వరాజ్, వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ లు రాజీనామా చేసి తీరాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీనితో సభా కార్యాకలాపాలు స్తంభించాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీనితో సభను మధ్యాహ్నాం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ వెల్లడించారు.

 

ఉత్తరాఖండ్ లో విరిగిపడిన కొండచరియలు..ఒకరు మృతి..

ఉత్తరాఖండ్ : గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. టెహ్రి జిల్లాలోని జాస్పూర్ గ్రామంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రారంభమైన ఉభయసభలు..

ఢిల్లీ : లోక్ సభ, రాజ్యసభ సభలు ప్రారంభమయ్యాయి. సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ పేర్కొన్నారు. దీనితో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. 

అమరావతి నిర్మాణంపై లోకాయుక్తలో ఫిర్యాదు..

హైదరాబాద్ : అమరావతి నిర్మాణంపై ప్రై'వేటు'పై లోకాయుక్తలో ఓ న్యాయవాది భార్య సీతాలక్ష్మి ఫిర్యాదు చేశారు. కేపిటల్ డెవలప్ మెంట్ లిమిటెడ్ పేరిట విదేశీయులకు అమరావతి నిర్మాణ షేర్లు చేస్తున్నారని, విదేశీ సంస్థలకు వాటాలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. షేర్లు కొనుక్కున్న వారికే పన్ను వసూలు హక్కు ఇవ్వడం అంటే విదేశీయులు పన్ను వసూలు చేసుకోవడం అవుతుందని ఇది దేశ సౌర్వ భౌమత్వాన్ని ధిక్కరించడమేనని వాదించారు. 

కార్గిల్ యుద్ధంలో వీరజవాన్లకు నివాళులు..

జమ్మూ కాశ్మీర్ : కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులకు వారి కుటుంబసభ్యులు నివాళులర్పించారు. 

కొనసాగుతున్న బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం..

ఢిల్లీ : బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. నేడు శ్రీలంక టెస్టు సిరీస్ కు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ సమావేశంలో విరాట్ కోహ్లీ పాల్గొన్నారు. 

దొండపాడు - పట్టిసీమ రహదారిలో ట్రాఫిక్ జాం..

పశ్చిమగోదావరి : దొండపాడు - పట్టిసీమ రహదారిలో రెండు గంటలుగా వాహనాలు నిలిచిపోయాయి. సీఎం పర్యటన సందర్భంగా వాహనాలను పోలీసులు వాహనాలను నిలిపివేశారు. 

పుష్కరాల అధికారులతో మాట్లాడిన సీఎం బాబు..

రాజమండ్రి : పుష్కరాల విధుల్లో ఉన్న అధికారులతో సీఎం చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. చివరి రెండు రోజులు అత్యంత కీలకమని, జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. 

కిడ్నాప్ కు గురైన పాప సురక్షితం..

హైదరాబాద్ : నింబోలి అడ్డాలో కిడ్నాపైన పాప సురక్షితంగా ఉంది. బుధవారం తల్లిని మోసం చేసి 16 నెలల పాప అక్షయను ఓ మహిళ ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. కాచిగూడ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా మహిళను గుర్తించి అరెస్టు చేశారు. 

10:21 - July 23, 2015

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో కబ్జాలకు గురైన పార్కులపై టెన్ టివిలో వచ్చిన కథనాలకు జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. గురువారం ఉదయం ఎల్ బినగర్ పరిసర ప్రాంతాల్లో డిప్యూటి కమీషనర్, జోనల్ కమిషనర్ రఘు ప్రసాద్ లు పర్యటించారు. కబ్జాలకు గురైన పార్కులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు టెన్ టివితో మాట్లాడారు. గ్రామ పంచాయతీ లే అవుట్ లలో న్యాయపరమైన సమస్యలున్నాయన్నారు. ప్రతి పార్కుకు కాంపౌండ్ వాల్ కట్టి చర్యలు తీసుకుంటామని, అధికారుల్లో అలసత్వం లేకుండా చూస్తామన్నారు. 1999లో ఎల్ బినగర్ మున్సిపాల్టీకి చెందినవని గతంలో పేర్కొన్నారని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక కాలనీ వాసులు పేర్కొన్నారు. తప్పుడు పత్రాలు సమర్పిస్తే ఎల్ ఓసి ఇస్తున్నారని ఆరోపించారు. స్థానిక పాలక సంస్థ అభివృద్ధి చేయాలని కోర్టు పేర్కొనడం జరిగిందని, వెంటనే కబ్జాలకు గురైన పార్కులపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కబ్జాలకు గురైన పార్కులపై టెన్ టివి కథనాలు ప్రసారం చేయడం అభినందనీయమన్నారు. 

10:13 - July 23, 2015

హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో హైకోర్టు ఎలా తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నాం 02.15 గంటలకు తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. బుధవారం కోర్టులో వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో తెలంగాణ శాసనసభాపతి నిర్ణయం తీసుకోకముందే ఆయనకు తాము ఆదేశాలు జారీ చేయవచ్చో..లేదోనని హైకోర్టు సందేహం వెలిబుచ్చింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు గతంలో తీర్పులేమైనా ఉంటే వాటిని సమర్పించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదికి సూచించింది.
తెలంగాణలో తమ పార్టీని ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలపై చర్యలు తీసుకోనేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ టిడిపి శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇలాగే కాంగ్రెస్ పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలు డి.ఎస్.రెడ్యానాయక్, కాలె యాదయ్య, కోరం కనకయ్య, జి.విఠల్ రెడ్డిలపై చర్యలు తీసుకొనేలా సభాపతిని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విప్ ఎన్.ఎ.సంపత్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. 

రాజ్ నాథ్ తో భేటీ కానున్న ఆప్ నేతలు..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఆప్ నేత సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్ తో పాటు పలువురు ఆప్ నేతలు భేటీ కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నాం 12.15 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. 

జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలనకు మొగ్గుచూపుతా - సుబ్రమణ్యస్వామి..

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలనకు తాను మొగ్గు చూపుతానని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. అలాగే రెండు సంవత్సరాల పాటు మిలట్రీ ఆధీనంలో ఉండాలని పేర్కొన్నారు. 

నాగ్ పూర్ కు చేరుకున్న యాకూబ్ మెమన్ కుటుంబసభ్యులు...

మహారాష్ట్ర : 1993 బాంబు పేలుళ్ల కేసులో జైలులో ఉన్న యాకూబ్ మెమన్ ను చూడటానికి అతని కుటుంబసభ్యులు నాగ్ పూర్ కు చేరుకున్నారు. ఇతనికి ఈనెల 30వ తేదీన ఉరిశిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే.

 

బాణాసంచా పేలుడు ఘటనలో ముగ్గురు మృతి..

తూర్పుగోదావరి : జిల్లాలోని కొత్తపేట మండలం పెలివెల బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు మృతి చెందారు. 

వరంగల్ ఏజెన్సీలో భారీ వర్షం..

వరంగల్ : ఏజెన్సీ ప్రాంతంలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. పుష్కరాలకు వెళ్లే రహదారులన్నీ జలమయమయ్యాయి. దీనితో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 

నైలూ నదిలో పడవ ప్రమాదం..

ఈజిప్టు : నైలూ నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. ఆ సమయంలో పడవలో 30 మంది ప్రయాణీకులున్నారు. మరొక పడవను ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. 

09:33 - July 23, 2015

నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పలు విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమ్మెలో ఉన్న పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. జిల్లాలో పది వామపక్షాలు చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా వామపక్ష పార్టీలు బస్సు యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమ్మినేని మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్టు, ఔట్ సోరింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని కేసీఆర్ పేర్కొన్నారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. 

09:27 - July 23, 2015

సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ స్టేటస్ అందుకున్న రజనీ.. ప్రజెంట్ ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.. భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్నా.. కొంత కాలంగా రికార్డ్ సృష్టించే హిట్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు. అందుకే 35 ఏళ్ల నాటి పాత పేరుతో ఓ కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు రజనీ.
'లింగా' తరువాత రజనీకాంత్ 'మద్రాసు' దర్శకుడు రంజిత్ తో చేసే చిత్రానికి 'కాళీ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ ను 1978లో జె.మహేంద్రన్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన 'ముల్లుమ్ మలరుమ్' చిత్రంలోని రజనీ పాత్ర పేరు నుంచి తీసుకుంటున్నట్లు కోలీవుడ్ టాక్. మరి రజనీకాంత్ తాజా సినిమా టైటిల్ 'కాళీ'నే అవుతుందా ? లేక మారుతుందా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

09:26 - July 23, 2015

'బ్రహ్మానందం'..ఆయన ఉంటే సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని సినీ జనాల నమ్మకం. బ్రహ్మీ కేరెక్ట‌ర్‌ హిట్ అయితే సినిమా సూపర్ హిట్టని, కలక్షన్లు కొల్లగొట్టడం ఖాయం అని కొంతమంది నమ్ముతుంటారు. కానీ టాలీవుడ్ లో 'బ్రహ్మీ' పై పలు వార్తలు వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ సినిమా 'డిక్టేటర్' మూవీ సినిమా నుండి తప్పించారని టాక్.
ఈ సినిమా కోసం కోన వెంకట్ బ్రహ్మానందం కోసం ఓ కేరెక్ట‌ర్‌ను డిజైన్ చేశారు. అయితే ఆ పాత్రలో నటించడానికి బ్రహ్మానందం భారీ పారితోషికాన్ని డిమాండ్ చేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 30 రోజుల కాల్షీట్ల కోసం దాదాపు కోటి రూపాయలు టాలీవుడ్ టాక్. దీనితో ఆయన్ని సినిమా నుంచి తప్పించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాలో బ్రహ్మానందం ఉన్నారా ? లేదా ? అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. 

09:26 - July 23, 2015

ప్రధాని నరేంద్ర మోడీపై బాలీవుడ్‌ భామ నేహా ధూపియా సెటైర్లు గుప్పించింది. 'పరిపాలన అంటే సెల్ఫీలు, యోగాలు కాదు..' అంటూ ట్విట్టర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించింది. దీనికి కారణమంటూ ఉందంట. గడిచిన రెండు రోజులుగా కుండపోత వర్షంతో ముంబై అతలాకుతలం అయింది. వర్షాల దాటికి రవాణా వ్యవస్థ కూడా స్తంభించడంతోపాటు కార్యాలయాలు, పాఠశాలలు మూతబడ్డాయి. ప్రజలు బాగానే ఇబ్బందులుపడ్డారు. వర్షం కారణంగా తను అసౌకర్యానికి గురయ్యానని హీరోయిన్ నేహా‌ధుపియా ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పాలన‌పై 'గుడ్ గవర్నెన్స్ అంటే సెల్ఫీలు, యోగాలు కాదని ప్రజలకు భద్రతపై భరోసా ఇవ్వాలని' ట్వీట్ చేసింది. ప్రధానిని ప్రశ్నించిన తీరు బాగుందని కొందరంటే, పబ్లిసిటీ కోసం ఇలా చేసిందని మరికొందరు కామెంట్స్ చేశారు. 

09:25 - July 23, 2015

ప్రజెంట్ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే ముందు వరుసలో వినిపించే పేరు మహేష్ బాబు.. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న ఈ సూపర్ స్టార్ ఇప్పుడు వంద కోట్ల సినిమా మీద కన్నేశాడు. అంతేకాదు మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న ఓ స్టార్ డైరెక్టర్ మహేష్ తో వందకోట్ల సినిమా చేస్తానంటూ ప్రకంటించేశాడు కూడా. కాకపోతే ఇది వినాయక్ ప్రపోజల్ మాత్రమే. 'శ్రీమంతుడు' ఆడియో వేడుకకు హాజరయిన ఈ డాషింగ్ డైరెక్టర్ తన కోరికను బయట పెట్టాడు. వంద కోట్లతో మహేష్‌తో తీయాలనుకొన్న సినిమా కోసం గట్టి కథనే తయారు చేస్తున్నాను అని చెప్పాడు. శ్రీమంతుడు ఆడియో వేడుకకు వినాయక్ హాజరయ్యాడంటేనే మహేష్‌తో సినిమా చర్చల్లో ఉందన్నట్లు అంటూ ఫిలింనగర్ టాక్.

09:24 - July 23, 2015

రాజమండ్రి : ఉభయగోదావరి జిల్లాల్లో పుష్కరాల సందడి నెలకొంది. పదో రోజున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి జిల్లాలకు భారీగా తరలివెళుతున్నారు. పుష్కరాలు మరో రెండు రోజులు పాటు కొనసాగనున్నాయి. దీనితో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రిలో ఉన్న పలు పుష్కర ఘాట్ ల వద్ద భక్తులు కిటకిటలాడుతున్నారు. గోదావరి దారులన్నీ జనసంద్రంగా మారాయి. దీనితో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలోకి ప్రైవేటు వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. దీనితో భక్తులు వాహనాలు అక్కడే వదిలి స్నానఘట్టాలకు చేరుకుంటున్నారు. రాజమండ్రిలోని కోటిలింగాల రేవు, పుష్కర ఘాట్, సరస్వతీ ఘాట్ లలో భక్తులు తెల్లవారుజాము నుండే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఎలాంటి సంఘటను తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

09:18 - July 23, 2015

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాలు పదో రోజుకు చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో పుష్కరాలు ముగుస్తుండడంతో భద్రాచలానికి భక్తులు పోటెత్తారు. గోదావరి తీరం లక్షలాది భక్తులతో నిండిపోయింది. గురువారం తెల్లవారుజామునుండే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో ప్రతి రోజు 7-8 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలంలో ఏర్పాటు చేసిన ఆరు పార్కింగ్ ప్లేస్ లలో వాహనాలు నిండిపోయాయి. ఈ స్థలంలో 25వేల వాహనాలు పార్కింగ్ చేయవచ్చు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటి మట్టం పెరిగింది. దీనితో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం నీటి మట్టం ఆరు అడుగులకు పెరిగింది. దీనితో బారికేడ్లను ఒడ్డుకు కొంత ముందుకు జరిపారు. ప్రస్తుతం ఉన్న 260 మంది గజ ఈతగాళ్ల సంఖ్యను పెంచారు. అలాగే బోట్ల సంఖ్యను పెంచారు. అనధికారిక ఘాట్ల వద్ద భద్రతను పెంచారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భద్రాచలంఆ లయంలో వీఐపీ దర్శనాలను నిలిపివేశారు. అందరికీ ఉచిత దర్శన ప్రవేశాన్ని కల్పించారు. 

ధవళేశ్వరం 13.64 మీటర్లకు చేరిన గోదావరి..

తూర్పుగోదావరి : ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.64 మీటర్లకు చేరింది. 

బీజేపీ నేతల ఫొటోలతో నోట్ బుక్స్..

గుజరాత్ : సూరత్ లోని ఓ పాఠశాలలో బీజేపీ ఎంపీ పాటిల్ విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఆ నోట్స్ బుక్స్ పై ప్రధాన మంత్రి మోడీ, సీఎం ఆనంది బెన్ పటేల్ ల ఫొటోలున్నాయి. 

08:42 - July 23, 2015

ఏపీ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులపై కఠినంగా ఉంటామన్న ప్రభుత్వ వ్యవహార తీరుపై ప్రొ.నాగేశ్వర్ ఆక్షేపించారు. లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు హైకోర్టు విభజన డిమాండ్ చేస్తున్నారు. ఏపీ మున్సిపల్ కార్మికుల సమ్మె..ఎన్టీఆర్ వచ్చాకే హైదరాబాద్ ప్రజలు వేకువజామున నిద్ర లేవడం నేర్చుకున్నారన్న బాబు వ్యాఖ్యలు..ఏపీ కేబినెట్..తదితర అంశాలపై ది హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే...
హైకోర్టుకు స్థలం చూపెట్టాలి..
రాష్ట్రం విడిపోయింది. విభజన అయినప్పుడు అన్ని విభజన కావాల్సిందే. రెండు అసెంబ్లీలు..రెండు శాసనసమండలిలు..రెండు పోలీసు వ్యవస్థలు ఉన్నప్పుడు రెండు హైకోర్టులు ఉండాల్సిందే. హైకోర్టు ప్రాంగణంలో ఉంటే బాగానే ఉంటుంది కదా ? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయ్యేంతవరకు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుందని, అప్పట్లోగా ఏపీ రాష్ట్రం హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలని..తరువాత తెలంగాణకు హైకోర్టు చెందుతుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. దానికి ఏపీ సర్కార్ భూభాగం చూపెట్టాలి. అనంతరం కేంద్రం చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉంది. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందా అనేది తెలియదు. మరి ఎందుకు తాత్సారం చేస్తోంది ? అమరావతి రాజధాని నిర్మాణం కాలేదని అనవచ్చు. ఇలా అనడం కూడా కరెక్టు కాదు. హైకోర్టు విభజన కావాలని ఇరు రాష్ట్రాల న్యాయవాదులు కోరుతున్నారు. కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయని, న్యాయవ్యవస్థ కాబట్టి చెప్పలేమని కేసీఆర్ గతంలో పేర్కొన్నారు. మరి ఏ శక్తులు అడ్డుపడుతున్నాయి ? ఈ పని చేయాల్సింది కేంద్రమే. కేంద్రం ఎందుకు పనిచేయడం లేదు ? కేంద్రంపై ఏ శక్తులు వత్తిడి చేస్తున్నాయి ?  హైకోర్టు ఉన్నప్పుడు కొన్ని నియామకాలు జరుగుతుంటాయి. ఉద్యోగాలన్నీ కూడా తెలంగాణ వారికి రావాలనే డిమాండ్ ఉంది. ఉమ్మడి హైకోర్టులో ఏ ప్రాంతమైన వారిని నియమించాలి ? విడిపోయిన తరువాత నియమించిన వారు ఎక్కడెళ్లాలి ? అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. రాష్ట్రం విడగొట్టే అధికారం..అవసరమైన చర్యలు తీసుకొనే అధికారం..విభజన చట్టాల హామీల అమలు చేసే బాధ్యత పార్లమెంట్ కు ఉంది.
ఏపీ మున్సిపల్ సమ్మె..
విధుల్లో ఉన్నప్పుడు కార్మికులు డిమాండ్లను చాలా సార్లు అడిగారు. చర్చలు చేయకపోయేసరికి విధులు బహిష్కరించారు. సమ్మె చేస్తే తప్ప మార్గం లేదని అనుకున్న తరువాతే కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో చేరిన తరువాత ప్రభుత్వం వారితో ఏం చర్చిస్తుంది ? చర్చలు జరుపడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు. కఠినంగా ఉంటామని ప్రభుత్వం చెబుతోంది. ఎవరిపైన కఠినంగా ఉంటారు ? ఇసుక మాఫియా..మద్యం మాఫియా..ఎర్రచందనం స్మగ్లింగ్ పై కఠినంగా ఉండండి. ప్రజలు కూడా కఠినంగా ఉంటారు. తెలంగాణలో మున్సిపల్ కార్మికులు చేసే సమ్మెకు టిడిపి మద్దతిచ్చింది. అక్కడ కఠినత్వం అవలింబిస్తానంటోంది. ఇదెక్కడి రాజకీయం ? సమ్మె పై గతంలో సుప్రీంకోర్టు ఓ తీర్పు చెప్పింది. శ్రామికవర్గం విడదీయరాని హక్కు అని పేర్కొంది. చట్టవిరుద్ధమైన సమ్మె న్యాయసమ్మతమే అవుతుందని పేర్కొంది.
రాజమండ్రిలో ఏపీ కేబినెట్..
రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో కుట్ర దాగి ఉందని ఓ మంత్రి కేబినెట్ లో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. కేబినెట్ లో మాట్లాడుకున్నది బయటకు ఎలా పొక్కిందో ఆయనే చెప్పాలి. కేబినెట్ లో జరిగిన వ్యాఖ్యలు నిజం అయితే ఇంతకన్నా దుర్మార్గం లేదు. ఈ కుట్రను ఎందుకు చేధించలేదు ? ఇంటిలెజెన్స్ ఉంది కదా. రాజమండ్రిలో జరిగిన దుర్ఘటన జరిగిన కుట్ర ఎంటో ప్రజలకు తెలియాలి. కుట్రదారులను శిక్షించాలి. రైల్వే స్టేషన్ కు దగ్గరిలో ఈ ఘాట్ ఉంది. వీఐపీ ఘాట్ లో స్నానం చేయాల్సిన సీఎం ప్రజలకు చెందిన ఘాట్ లో స్నానం చేశారు. ఓ సినిమా తీయడానికి జనాన్ని ఆపారు. వీఐపీ రావడంతో ఆటోమెటిక్ గా జనం ఆగిపోయారు. తరువాత ఒక్కసారిగా గేటు తెరవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఎన్టీఆర్ వచ్చాకే హైదరాబాద్ వాసులు నిద్ర లేవడం అలవాటు..
ప్రతి జిల్లాకు..రాష్ట్రానికి ఓ చరిత్ర అంటూ ఉంటుంది. ప్రతి సంస్కృతికి ప్రత్యేకత ఉంటుంది. ఎన్టీరామారావు లాగా టిడిపి నేతలు లేచారా ? హైదరాబాద్ సంస్కృతిపై విమర్శలు చేయడం సరికాదు. సందోర్భోచితంగా మాట్లాడాలి''. అని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. అలాగే అనంతపురంలో రాహుల్ పర్యటనపై వైసీపీ విమర్శలు..ఉభయసభల్లో జరుగుతున్న రగడపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. 

తిరుమలలో భక్తుల రద్దీ అతి సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ అతి సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు..కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. 

ఖమ్మంలో పుష్కరస్నానాలు చేస్తున్న భక్తులు...

ఖమ్మం: జిల్లా గోదావరి పుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివెళ్తున్నారు. అశేష భక్తులు పుష్కరస్నానాలు ఆచరిస్తున్నారు. భద్రాచలం, పర్ణశాల, మోతె, చిన్నరావిగూడెం, కొండాయిగూడెం పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. 

ధర్మపురి..కాళేశ్వరంలకు పోటెత్తిన భక్తులు...

కరీంనగర్ : ధర్మపురిలో పుష్కరస్నానాలకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. రాత్రి నుంచి ధర్మపురిలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా గోదావరిలో నీటిమట్టం పెరిగింది. వర్షంలో సైతం యాత్రికులు పుష్కరస్నానాలను కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కాళేశ్వరం పుణ్యస్నానాలకు భక్తుల రద్దీ పెరిగింది.

 

08:01 - July 23, 2015

ఎన్టీఆర్ వచ్చాకే హైదరాబాద్ ప్రజలు వేకువజామున నిద్రలేవడం నేర్చుకున్నారన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ తన బతుకేదో బతుకుందని కానీ ఇప్పటికీ కొంతమంది ఆంధ్రా నేతలు, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ మీద అక్కసు వెళ్లగక్కుతున్నారని పేర్కొన్నారు. ఎవరు తెలంగాణను కించపరిచినా దాశరథి మాదిరి వాడివేడి సమాధానం చెబుతామని కేసీఆర్ తెలిపారు. మరోవైపు ఉభయసభలో రగడ కొనసాగుతోంది. వ్యాపం కుంభకోణం, లలిత్ మోడీ వ్యవహారాంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయసభలు వాయిదా పడ్డాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బి.వెంకట్ (సీపీఎం), ఆచారి (బీజేపీ), జనక్ ప్రసాద్ (కాంగ్రెస్), నర్సింహ (టీఆర్ఎస్), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

07:54 - July 23, 2015

ఈ సువిశాల విశ్వంలో మరో గ్రహంలో కూడా జీవులున్నాయా? భూ గ్రహంపై జీవజాతులు ఒంటరివి కావా? ఆ గ్రహాంతర వాసులతో ఏదైనా ప్రమాదం ఉంటుందా? సినిమాలు, సాహిత్యం, ఇంటర్నెట్ ఇలా ప్రతిచోటా గ్రహాంతర వాసుల గురించి భిన్నవాదనలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సందేహాలకు తెరదించుతామంటూ పరిశోధనలు మొదలవుతున్నాయి. ప్రఖ్యాత సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ నేతృత్వంలో జరిగే ఈ రీసెర్చ్ గ్రహాంతర వాసుల ఉనికిని తేల్చనుంది. భూమి ఒక్కటే కాదు. ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో గెలాక్సీలు. బిలియన్ల నక్షత్రాలున్నాయి. వాటిలో ఓ చిన్న గ్రహం భూమి. దానిపై ఈ కోట్లాది జీవ జాతులు. వాటిపై ఆధిపత్యాన్ని సాధించిన మానవుడు. మరి భూమిపై మాత్రమే జీవం ఉందా? ఇతర గ్రహాలపై లేదా? ఉంటే ఆ గ్రహాంతర వాసుల గుట్టేంటి?
ఎక్కడుంటుంది ?
ఇంతకీ మరో గ్రహంలో జీవి ఉంటే ఎక్కడుంటుంది? అదే ఔత్సాహికుల నుంచి శాస్త్రవేత్తల వరకు తరుముతున్న ప్రశ్న. ఆ అన్వేషణలో ముఖ్యమైన మలుపు పడబోతోంది. గతంలో ఈ విశ్వాంతరాళంలో గ్రహాంతర జీవులున్నాయంటూ వాటితో జాగ్రత్తగా ఉండాలని ప్రకటించిన ప్రఖ్యాత సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ నేతృత్వంలో ఈ పరిశోధనకు అడుగులు పడనున్నాయి.
ఉండే అవకాశం ఉందన్న హాకింగ్..
చిన్నా చితకా పరిశోధకులైతే వేరే విషయం. కానీ, ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఈ కాలపు మహామేధస్సు ప్రఖ్యాత సైంటిస్ట్.. స్టీఫెన్ హాకింగ్. గతంలోనే ఈయన గ్రహాంతరవాసులు ఉండే అవకాశం ఉందని చెప్పాడు. ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగాడు.. దీంతో ఈ ప్రాజెక్టుపై ఎక్కడలేని ఆసక్తి వచ్చింది. స్నేహమా... శతృత్వమా? కత్తి దూస్తాయా..? లేక చేయి చాస్తాయా? గ్రహాంతర వాసులతో మనుషులకు ప్రమాదం పొంచి ఉందా? అప్పుడప్పుడు కనిపించి మాయమయ్యే యూఎఫ్ వోలే గ్రహాంతర వాసుల నౌకలా..? ఏలియన్స్ ఉనికి చుట్టూ ఉన్న వాదనలేంటి?
ఆచి తూచి అడుగెయ్యటం క్షేమం..
అనంతాకాశంలో మిణుక్కుమనే నక్షత్రాలు, గ్రహ గోళాలు మనిషిని ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. మానవ మేధను సవాల్ చేస్తూ ఆసక్తిని రేకెత్తిస్తూ నిత్యం తమ గుట్టును కనిపెట్టమంటూనే ఉన్నాయి. అదే సమయంలో వాటిలో జీవజాలం ఉందా అనే ఆసక్తి వెంటాడుతూనే ఉంది. అయితే పరిశోధనలు ఏ దిశగా సాగుతున్నా, స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించినట్టు ఆచితూచి అడుగెయ్యటం అన్ని విధాలా క్షేమకరం.

07:18 - July 23, 2015

ఓ వైపు కరువు రక్కసి కోరలు చాస్తున్నా పాలకులు తమ కేమి పట్టనట్టున్నారు. మరో వైపు మందుగా మురిపించిన వర్షాలు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు అడుగంటుతుండగా మరో వైపు సాగునీరే కాదు తాగునీటికీ ఎద్దడి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేయాల్సిందేంటి? చేస్తుందేంటి? రైతాంగం కోరుతున్నదేంటి?
పడిపోయిన భూగర్భ జలాలు..
తెలంగాణలో ఖరీప్ సీజన్ ప్రారంభంలో ఎడతెరిపి లేని వర్షాల కురవడంతో రైతులు సంబరపడ్డారు. రోహిణి కార్తె వెళ్లక ముందే తొలకరి పలకరించడంతో ఏరువాక జోరందుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలపి దాదాపు 54 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. ఇది ఖరీఫ్ సీజన్ లో సాగయ్యే మొత్తం విస్తీర్ణంలో 53 శాతంగా పేర్కొంది తెలంగాణ వ్యవసాయ శాఖ. వేసిన పంటల్లో మెట్ట పంటలే అత్యధికంగా ఉన్నాయి. ఇందులో సగానికి పైగా పత్తి పంటనే సాగు చేశారు. మిగతా స్థానాల్లో మొక్కజొన్న, సోయా, పప్పు ధాన్యాలు ఆక్రమించాయి. అయితే మొక్కలు ఎదిగే దశలో 25రోజులుగా వర్షాలు పడకపోవడం, పైగా ఎండలు విపరీతంగా నమోదు కావడంతో పంటలకు తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. పంటలను రక్షించుకునేందుకు అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు.
35 మండలాల్లో తక్కువ వర్షపాతం..
తెలంగాణలో 35 శాతం మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాపాతం నమోదయింది. జూన్ లో కురవాల్సిన వర్షం కంటే సాధారణం లేదా ఎక్కువ వర్షపాతం వరంగల్ ఖమ్మం జిల్లాల్లో నమోదయింది. వరంగల్ జిల్లా వ్యాప్త సగటు చూస్తే వర్షాలు సగటు కంటే ఎక్కువే కురిశాయని లెక్కలు చెబుతున్నాయి. కానీ ఏజెన్సీలో కురిసిన వర్షం వల్ల జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ అనిపిస్తుంది. జిల్లాలోని మైదాన ప్రాంతంలో సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. కానీ దాదాపు రెండు వారాలుగా వర్షాలు లేక పోవడంతో ముందు ఎంత వర్షపాతం నమోదయినప్పటికీ ఇప్పుడు వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో సాధారణం కంటే 43 మిల్లిమీటర్ల తక్కువ వర్షపాతం నమోదయింది. ఈ జిల్లాలో 48 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 39 మిల్లీమీటర్ల తక్కువ వర్షపాతం నమోదయింది. మెదక్ జిల్లాలోనూ సాధారణం కంటే 36 మిల్లీమీటర్ల తక్కువ వర్షపాతం నమోదయినట్టు అధికారులు ప్రకటించారు. అయితే జూన్ నెలలో కురిసిన వర్షాలే తప్ప జూలై నెలలో చినుకు పలకరింపు లేక చేలు నోరు తెరిచిచూస్తున్నాయి.
దారుణంగా పడిపోయిన భూగర్భ జలాలు..
అయితే గత సంవత్సరమూ తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. గత రబీ సీజన్ లో కూడా ఆశించిన మేర దిగుబడులు రాలేదు. అసలే భూగర్భ జలాలు అడుగంటి ఉన్న నేపథ్యంలో ఈ ఖరీఫ్ లోనూ ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో సాగునీటికి తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వర్షాభావ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరముంది. సాధారణం కంటే తక్కువ వర్షం నమోదయితే కరువు పొంచి వుండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కరువు వస్తుందని శాస్ర్తవేత్తలు ముందుగానే హెచ్చరించారు. అయినా ప్రభుత్వం ఎటు వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. ఇప్పుడు వర్షాలు కురిసినా దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశముంది. వర్షాలు ఇంకో వారం పాటు కురవక పోతే ప్రస్తుతం మొలకెత్తిన పంటలు తమ దిగుబడి సామర్థ్యాన్ని కోల్పోతాయి. కరువు నివారణ కోసం ప్రభుత్వం ఒక కాంటిజెన్సీ ప్రణాళికను సిద్దం చేయాల్సిన అవసరముంది. 

07:14 - July 23, 2015

తెలుగు నేల మీద కరువు పడగవిప్పుతోంది. ఆగస్టు వస్తున్నా వానలు లేకపోవడంతో అన్నదాత అల్లాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేయాలి? రైతులను, వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు తక్షణం చేయాల్సిన పనులేమిటి? కరువు కాటేస్తున్న వేళ రైతుల ముందున్న ప్రత్యామ్నాయాలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో అరిబండి ప్రసాదరావు విశ్లేషించారు.

టాటా ఏస్ - డీసీఎం ఢీ..ఇద్దరు మృతి..

ఖమ్మం : కొత్తగూడెం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ - డీసీఎం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మహబూబాబాద్ నుండి పుష్కరాలకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

పిచ్చికుక్క స్వైర విహారం..

మహబూబ్ నగర్ : తాడూరు (మం) పాల్మూరులో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. 13 మందికి గాయాలయ్యాయి. వీరిని నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

07:02 - July 23, 2015

ఢిల్లీ : బీజేపీకి సొంతపార్టీ నేతలే షాక్‌ల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే లలిత్‌ గేట్‌, వ్యాపం తదితర కేసులపై విపక్షాల దాడిని ఎదుర్కొనేందుకు నానాతంటాలు పడుతున్న బిజెపికి ఊహించని విధంగా సొంత పార్టీ నేత నుండే మరో గట్టి షాక్‌ తగిలింది. పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగేలా కుంభకోణాలు బయటపడడం పార్టీకి సిగ్గుచేటని ఓ బీజేపీ ఎంపీ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాశారు. నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా ఉన్నాయని, మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం బీజేపీ సిగ్గుతో తలదించుకునేలా చేసిందని ఆయన ఘాటుగా విమర్శించారు. పార్టీలో, ప్రభుత్వంలో అవినీతిని నిర్మూలించేందుకు లోక్‌పాల్‌ లాంటి 'విలువల కమిటీ'ని ఏర్పాటు చేయాలని శాంతకుమార్‌ సూచించారు. పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో కూడా అవినీతి పేరుకుపోయిందని పేర్కొన్నారు. లలిత్‌ గేట్‌ వ్యక్తులు వసుంధర రాజే, మహారాష్ట్ర మంత్రి పంకజముండే పేర్లు ప్రస్తావించకుండానే వారిపై విమర్శలు గుప్పించారు. పార్టీకి మచ్చ తెచ్చిన లలిత్‌ గేట్‌, వ్యాపం తనకు విచారం కల్గించిందని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు రెండు పేజీల లేఖను ఆయన తన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ పేజీల్లో పోస్ట్ చేశారు. అయితే లేఖ విషయాన్ని తాను మీడియాకు చెప్పాలనుకోలేదని, కానీ అందులోని ప్రతీ పదానికి తాను కట్టుబడి ఉన్నానని తెలపడానికే మీడియా ముందుకు వచ్చానని శాంతకుమార్‌ అన్నారు. పార్టీలో జరుగుతున్న అవినీతిపైనే అధ్యక్షునికి లేఖ రాశానని వివరణ ఇచ్చారు.
ఆ లేఖను వ్యతిరేకిస్తున్నామన్న రూడీ..
అయితే శాంతకుమార్‌ పార్టీ గీతను దాటి బహిరంగంగా విమర్శలు సంధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన కాంగ్రెస్‌ దుష్ప్రచారంతో ప్రభావితమయ్యారని కేంద్ర మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ అన్నారు. పార్టీలో ఆయన పరిణతి చెందిన నాయకుడని, కానీ కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ప్రచారం వెల్లువలో కొట్టుకుపోయారని ఆరోపించారు. శాంతకుమార్‌ రాసిన లేఖను తాము వ్యతిరేకిస్తున్నామని రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ తెలిపారు. మొత్తానికి ఓవైపు లలిత్‌ గేట్‌, వ్యాపం కుంభకోణాలపై పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే మరోవైపు సొంతపార్టీ నేతలే ఇలా బహిరంగ విమర్శలకు దిగడం ఇప్పుడు పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే సొంతపార్టీపైనే విమర్శలు చేసిన శాంతకుమార్‌పై పార్టీ చర్యలు తీసుకుంటుందా లేక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తుందా అన్నది చూడాలి.   

07:00 - July 23, 2015

జార్ఖండ్ : ఆయన గొప్ప శాస్త్రవేత్త..మాజీ రాష్ట్రపతి..ఆయన చిత్ర పటానికి పూలమాల..చిత్రపటం ఎదుట కొబ్బరియ..ఇదంతా చూస్తున్న వారికి నోటి మాట రాలేదు. ఓ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆయన చిత్రపటానికి తిలకం దిద్ది దండం పెట్టడంతో అక్కడున్న వారు విస్తుపోయారు. ఆయన ఎవరో కాదు. బతికే ఉన్న గొప్ప శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చిత్రపటానికి దండేసి దండం పెట్టిన ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘనకార్యం చేసింది మరెవరో కాదు సాక్షాత్తూ జార్ఖండ్‌ విద్యాశాఖ మంత్రి నీరా యాదవ్‌.
తాను చేసింది తప్పేమి కాదన్న మంత్రి..
నీరా యాదవ్‌ జార్ఖండ్‌ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జార్ఖండ్‌లోని కొడెర్మాలో ఓ స్కూల్‌లో స్మార్ట్ తరగతుల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నీరా యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరుసగా దేశ నాయకుల చిత్ర పటాలకు దండలు వేస్తూ, పనిలోపనిగా అబ్దుల్‌ కలాం చిత్ర పటానికీ..బొట్టుపెట్టి దండేసింది. ఈ చర్యతో అవాక్కవ్వడం టీచర్లు, విద్యార్థుల వంతయ్యింది. విషయాన్ని గమనించిన మంత్రి గారు తాను చేసింది తప్పేమీ కాదని బుకాయించారు. అంతేకాదు పెద్దలను ఎలాగైనా గౌరవించవచ్చంటూ సెలవిస్తున్నారు. మరోవైపు సజీవంగా ఉండి, దేశసేవ చేస్తున్న గొప్ప వ్యక్తికి ఇలా చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరా యాదవ్‌ చర్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలివితక్కువ చర్య అంటూ పలువురు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో కామెంట్లను ఫోస్ట్‌ చేశారు.  

06:41 - July 23, 2015

హైదరాబాద్ : చాలీ చాలనీ జీతాలతో అర్థాకలితో అలమటించే వాళ్లు కొందరైతే...మరోవైపు లక్షల వేతనాలను అందుకుంటూ..జీవితాలను ఎంజాయ్‌ చేస్తున్న వాళ్లు మరికొందరు. దీంతో ప్రగతి రథ చక్రాలు కాస్తా..ఒక అడుగు ముందుకు..వంద అడుగులు వెనక్కి వెళ్తున్నాయి. ఆర్టీసీ సంస్థ పీకల్లోతు కష్టాల్లో ఉన్నా..ఇరు రాష్ట్రాల్లోని ఆర్టీసి ఉన్నతాధికారులు మాత్రం తమ వేతనాలను భారీ ఎత్తున పెంచుకున్నారు. ఆర్టీసి ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ...ఈ పేరు వినగానే..తొలుత సంస్థ కష్టాలే గుర్తుకొస్తాయి. డొక్కు బస్సులు..చాలీ చాలని వేతనాలతో జీవితాలను నెట్టుకొస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు గుర్తుకొస్తారు. వేతనాలు పెంచమని ఎప్పుడు అడిగినా సంస్థ పీకల్లోతు నష్టాల్లో ఉంది ఇప్పుడు పెంచలేం అనే మాటలే ఇప్పటివరకు విన్నాం. కానీ..కొద్ది రోజుల క్రితం..ఇరు రాష్ట్రాల్లోని ఆర్టీసీ కార్మికులు..8రోజుల పాటు చేసిన సమ్మెతో ప్రభుత్వాలు దిగొచ్చాయి. ఆర్టీసి ఉద్యోగుల వేతనాలను భారీ ఎత్తున పెంచుతూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. తెలంగాణలో 44 శాతం, ఏపీలో 43శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడానికి ఓకే చెప్పాయి. ఇంతవరకు బాగానే ఉన్నా..కార్మికుల వేతనాలు పెరిగాయి. కాబట్టి అధికారుల వేతనాలు పెంచాల్సిందే అని వేతన ఒప్పందం చేసుకున్నారు.
భారీ ఎత్తున వేతనాలను పెంచిన ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు..
అయితే ఆర్టీసీ అధికారుల వేతన సవరణ అంశం మామూలుగా జరిగితే ఎవరికీ ఇబ్బంది లేదు. వేతన సవరణ అనంతరం అధికారుల జీతాలు భారీగా పెరిగాయి. గతంలో వేతన సవరణ జరిగినప్పుడు కార్మికులకు 24 శాతం ఫిట్ మెంట్ ఇవ్వగా అధికారులు 63 శాతం వేతన సవరణ చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న వారి వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులకంటే భారీగా ఉన్నాయి. ఎంతగా అంటే సంస్థకు వీసీ అండ్ ఎండి క్యాడర్ పోస్టులో ఉన్న అధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. వారి వేతనం కంటే సంస్థలో ఉన్నతాధికారులైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతనాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని సంస్థకు ఎండీలుగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్‌లే పలుమార్లు ప్రస్తావించారు.
గతంలో కార్మికులకు 24 శాతం ఫిట్‌మెంట్‌..
కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని కార్మికులకు 44 శాతం, ఏపీలోని 43 శాతం వేతన సవరణ జరిగింది. ఇప్పుడు అధికారులు కూడా అదే పద్దతిలో వేతన సవరణ చేసుకున్నారు. దీని ప్రకారం తెలంగాణలో ఏకంగా 1 లక్షా 35వేల రూపాయలు కేవలం బేసిక్‌గా నిర్ణయించుకున్నారు. ఏపీ వారు 98 వేలు గరిష్ట బేసిక్‌గా 35 వేలు గ్రేడ్ పేగా నిర్ణయించారు. అలవెన్సులు అన్నీ కలుపుకుంటే 2లక్షల వరకు వేతనం పొందుతారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన గరిష్ట వేతనం కంటే చాలా ఎక్కువ. అయినా ఆర్టీసి అధికారులు తమకు ఉన్న వెసులుబాటుతో భారీగా తమ వేతనాలను పెంచుకున్నారు. అయితే ఆర్టీసి అధికారులు చేస్తున్న పని ఒకటి..తీసుకుంటున్న వేతనం ఒకటిగా ఉందనే విమర్శలూ ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి ఈడీలు 10 మంది ఉన్నా..ఈడి ర్యాంకు వేతనం పొందుతున్న వారు మాత్రం 44 మంది వరకు ఉన్నారు.
తెలంగాణలో రూ. 1.35 లక్షల బేసిక్‌..
ఆర్టీసీ సంస్థకున్న నష్టాలను అధిగమించేందుకు కార్మికులు అంతర్గత సామర్థ్యం పెంచుకోవాలని పదే పదే చెప్తున్న ప్రభుత్వ పెద్దలు..ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కంటే ఎక్కువ వేతనం తీసుకుంటున్న అధికారులకు ఎంత సామర్థ్యం ఉందో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

06:34 - July 23, 2015

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్‌ కార్డు- ఆధార్‌ అనుసంధానం ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటి వరకు 36 శాతం అనుసందానం చేశారు. ఈ నెల చివరి వరకు 50 శాతం చేరుకోవడానికి గ్రేటర్ అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. హైదరాబాద్ న‌గ‌రంలో మొత్తం 73 ల‌క్షల 69 వేల ఓట‌ర్లు ఉన్నారు. ప్రతి సారి జరిగే ఎన్నికల్లో ఓటింగ్ 55 శాతానికి మించడం లేదు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడంలేదు. ఇటీవల ఎన్నికల కమిషన్ ఓటర్‌ కార్డును ఆధార్‌తో లింక్ చెయ్యాలని చెప్పడంతో.. గ్రేటర్‌లో ముందుగా ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారు . అయితే ఇప్పటి వరకు 25 ల‌క్షల 79వేల ఓట‌ర్లకు ఆధార్‌ అనుసంధానం చేశామ‌న్నారు గ్రేటర్ కమిషనర్ సోమేష్ కుమార్. మొత్తం ఓట‌ర్లలో ఇది 36 శాతం.
గ్రేటర్ లో లేని ఓటర్లు..
ఇక గ్రేటర్‌ పరిధిలో ఎక్కువ మంది ఓటర్లు ప్రస్తుతం ఇక్కడ లేరు. 28 శాతం మంది త‌మ నివాసాల‌ను మార్చారు. 16 శాతం మంది ఇళ్లకు తాళాలు వేశారు. 17 శాతం మందికి ఆధార్ కార్డులు లేవు. 75 వేల మంది మరణించారు. ఇప్పటి వరకు నగరంలో ఉన్న 7,051 పోలింగ్ బూతుల్లో అధికారులు ఇంటింటికీ వెళ్లి ప‌రిశీలించారు. అయితే ఆధార్ కార్డులు లేని వారి కోసం జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 18 స‌ర్కిల్ కార్యాల‌యాల్లో ప్రత్యేకంగా ఆధార్ న‌మోదు కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. డోర్‌లాక్ చేసిన ఇళ్లను, ఇళ్లు మార్చిన వారిని, ఆధార్‌ కార్డులు లేని కేసుల‌ను మ‌రోసారి ప‌రిశీలించాల‌ని ఆదేశించారు.
రాజకీయ నేతలతో సమావేశం..
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేర‌కు చేప‌ట్టిన ఈ ఆధార్ అనుసంధానంపై ఈ నెల 25వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఎర్పాటు చేయనున్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని అన్ని స‌ర్కిల్ కార్యాల‌యాల్లో ఈ స‌మావేశాలు నిర్వహించనున్నారు. రాజకీయ పార్టీల నేతలు ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆన్ లైన్..ఫోన్ ద్వారా..
ఆన్‌లైన్, ఫోన్ ద్వారా, ఎన్నికల అధికారుల ద్వారా తమ ఓటర్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. అయితే ఆధార్ కార్డు లేని కారణంగా ఎవ్వరి ఓట్లనూ తోలగించబోమని సోమేష్‌కుమార్‌ తెలిపారు. బోగస్ ఓట్లను నివారించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని చెప్పారు. 

06:33 - July 23, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు, రాజమండ్రి తొక్కిసలాటతో బాబు సర్కారు ఇమేజీ జాతీయ స్థాయిలో డ్యామేజీ అయ్యింది. ఈ ఘటనలపై జాతీయ స్థాయి మీడియా సైతం విసృతంగా చర్చలు నడిపింది. ఈ చర్చల్లో తెలుగు దేశం తరపున ఏపీ మంత్రులు కొందరు పాల్గొన్నారు. రాజమండ్రి తొక్కిసలాట సందర్భంగా ఓ ప్రముఖ జాతీయ ఛానెల్‌ నిర్వహించిన టెలివిజన్‌ చర్చలో ఏపీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ చర్చలో మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి తనకున్న ఆంగ్ల ప్రావీణ్యంతో ప్రభుత్వ వాదన వినిపించారు. కానీ ప్రభుత్వాన్ని వెనుకేసుకు రావడంలో పల్లె ఫెయిల్‌ అయినట్లు సీఎం భావించారు. అలాగే ఇదే చర్చలో పాల్గొన్న మరో మంత్రి నారాయణ సైతం ప్రభుత్వ వాదనను బలంగా వినిపించడంలో విఫలమైనట్లు బాబుగారి భావన.
ఎంపీ గల్లా జయదేవ్‌ మాత్రమే మాట్లాడాలని బాబు గారి ఆదేశం..
ఇదిలా ఉంటే ప్రభుత్వ వాదనను మంత్రులు జాతీయ మీడియా చర్చా వేదికల్లో బలంగా వినిపించ లేదని.. వీరికి ఇంగ్లీష్‌ భాషలో ప్రావీణ్యం లేదని బాబు గారు తేల్చేశారు. అలాగే చంద్రబాబు కుడిభుజంగా పిలువబడే సీఎం రమేష్‌ సైతం బాబుగారి దృష్టిలో ఆంగ్లభాషలో ఫెయిల్‌ అయినట్లుగానే భావిస్తున్నారు. అందుకే ఇకపై జాతీయ మీడియాలో పార్టీ తరపున గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ మాత్రమే మాట్లాడాలని బాబుగారు ఆదేశించినట్లు సమాచారం.
విషయ పరిజ్ఞానం ఉంటే భాష అడ్డంకి కాదు..
సాధారణంగా ఎంత మేధావులైనా మాతృభాష మినహాయిస్తే మిగితా భాషల్లో ఎంత ప్రావీణ్యం ఉన్నా అనర్గళంగా మాట్లాడటంలో కాస్త తటపటాయిస్తారు. అది సహజం. విషయ పరిజ్ఞానం ఉన్నవారికి భాష పెద్ద అడ్డంకి కాదు. అనర్గళంగా ఇంగ్లీష్‌ మాట్లాడినంత మాత్రాన వాదనలో విషయం లేకుంటే మిగిలేవి గాలి మూటలేనని బాబు గారికి అనుభవంలోకి వచ్చేందుకు పెద్ద సమయం పట్టకపోవచ్చని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. 

06:28 - July 23, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఖజానాలో ఎటువంటి లోటు లేదని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. అంచనాలకు అనుగుణంగా ఆదాయం వస్తోందని ఆయన తెలిపారు. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవడం ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఈటెల వ్యాఖ్యానించారు. ఇటీవల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర అర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెరతీశారు. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ముగిసిన నేపథ్యంలో ఆదాయ, అర్జిత శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, గనులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులు పాల్గొన్నారు. వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
లక్ష్యాలు, ఆదాయం వివరాలను తెలుసుకున్న మంత్రి..
ఆయా శాఖల పరంగా ఆదాయానికి సంబంధించి నిర్ధేశించుకున్న లక్ష్యాలు, వచ్చిన ఆదాయానికి సంబంధించిన వివరాలను మంత్రి తెలుసుకున్నారు. ఆశించిన మేరకు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తోందని మంత్రి తెలిపారు. అంచనాలు, వచ్చిన ఆదాయ వివరాలను సమీక్షించారు. రాబడి విషయంలో 90 నుంచి 95 శాతం వరకు లక్ష్యాన్ని చేరుకుంటున్నామన్నారు. అయితే ఒక్క భూముల అమ్మకాల ద్వారా మాత్రమే పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాలేదని ఈటెల తెలిపారు.
ఏ శాఖలోనూ నిధుల కొరతలేదు-మంత్రి ఈటెల..
ఆదాయ, వ్యయాలకు సంబంధించి గత మూడు నెలల వివరాలను మంత్రి ఈటెల రాజేందర్‌ తెలియజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని వస్తోన్న కథనాలను ఆయన తోసిపుచ్చారు. అవన్నీ కట్టుకథలేనన్నారు. ఏ శాఖలోనూ డబ్బుల కొరత లేదని తేల్చిచెప్పారు. తమ ఆశయాలు, అంచనాలకు అనుగుణంగానే ఆదాయం వస్తోందని మంత్రి తెలిపారు. అయతే రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకోవడం సర్వసాధారణమేనని ఈటెల అన్నారు. మొత్తానికి తమ ప్రభుత్వం ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తోందని మంత్రి తెలిపారు. కేటాయింపుల్లో ఏ శాఖకు ఎటువంటి ఆంక్షలు విధించలేదన్నారు. అలాగే ఉద్యోగుల నోటిఫికేషన్‌కు కూడా ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ ఇచ్చిందని మంత్రి ఈటెల స్పష్టం చేశారు.

06:27 - July 23, 2015

హైదరాబాద్ : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు బహుళజాతి కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం ద్వారా పలువురు పారిశ్రామిక వేత్తలు ఇక్కడ తమ సంస్థలను నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా మరో 19 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయి. వీటికి సీఎం కేసీఆర్‌ అనుమతులు మంజూరు చేశారు. ఈ కంపెనీల ద్వారా ఆరు వేల మందికి ఉపాధి లభించనుంది. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా కంపెనీలకు అనుమతులిస్తామంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐ- పాస్‌ విధానానికి అనూహ్య స్పందన వస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు బహుళజాతి కంపెనీలు అసక్తిని కనబరుస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం మౌళిక సదుపాలు కల్పిస్తామని ప్రకటించింది. జూన్ 12 న తేదీన ప్రభుత్వం ప్రకటించిన నూతన ఇండస్ట్రీయల్ పాలసీ విధానంలో తొలి విడుతగా 17 కంపెనీలు ముందుకొచ్చాయి. రెండవ విడతలో మరో 19 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అసక్తి కనపరిచాయి. వీటికి సీఎం కేసీఆర్‌ సచివాలయంలో అనుమతి పత్రాలు అందజేశారు.
5321 ఉపాధి అవకాశాలు..
1087.37 కోట్ల పెట్టుడులతో స్థాపించే కంపెనీల ద్వారా 5321 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఫార్మా, హెలికాప్టర్ క్యాబిన్ విడి భాగాల తయారీ, ఫుట్ వేర్, సెల్ ఫోన్, ఇనుము ఉక్కు పరిశ్రమలు రానున్నాయి. ఇందులో ప్రముఖ స్పానిష్‌ కంపెనీ షీమో గ్లోబల్ ఫార్మా కూడా ఉంది. ఈ కంపెనీలను రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం సత్వర అనుమతులు ఇస్తుందని... సీఎం కేసీఆర్ కంపెనీ ప్రతినిధులకు హమీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున, భూమి, 24 గంటల విద్యుత్, భద్రత వంటి అంశాలు కల్పిస్తామన్నారు. మొత్తానికి నూతన పరిశ్రమల రాకతో తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయనడంలో సందేహం లేదు.  

06:25 - July 23, 2015

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80 చ.గజాల్లోపు ఉన్న ఆక్రమణలను క్రమబద్దీకరించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రాజమండ్రిలో నిర్వహించిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ స్థలాల్లో 80 గజాల్లో నిర్మించుకున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించారని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా రైతుల ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం 690 కోట్ల రూపాయలు కేటాయించేందుకు సర్కార్‌ నిర్ణయించింది. ఇక కర్నూలు జిల్లాలో రక్షణరంగ పరిశ్రమల ఏర్పాటుకు 2,200 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. విజయనగరంలో గోల్ఫ్‌క్లబ్‌కు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ భూముల వ్యవహారాన్ని కూడా కేబినెట్‌లో చర్చించారు.
మాస్టర్‌ ప్లాన్‌కు కేబినెట్‌ ఆమోదం..
ఇక రాజధాని కోసం సింగపూర్‌ అందించిన మాస్టర్‌ ప్లాన్‌ను కేబినెట్‌ ఆమోదించింది. రాజధాని నిర్మాణానికి స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలో పాలు పంచుకునేందుకు జపాన్‌, సింగపూర్‌ ప్రభుత్వాలను ఆహ్వానించాలని నిర్ణయించారు. మరోపక్క ప్రపంచంలోనే అందమైన రాజధానిగా ఏపీని తీర్చిదిద్దాలని.. ఇందుకోసం ప్రపంచంలోని చిన్న, అందమైన రాజధానులను పరిశీలించేందుకు ఐదుగురు నిపుణులను పంపించాలని కేబినెట్‌లో నిర్ణయించారు.
మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం..
మరోపక్క నకిలీ పాస్‌ పుస్తకాల కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. కృష్ణా జిల్లాలో సంచలనం రేపిన ఇసుక క్వారీ వివాదంపై చర్చించారు. రాష్ట్రంలోకి ఇసుక అక్రమ క్వారీలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ముసునూరు తహశీల్దార్‌పై జరిగిన దాడి ఘటనను చర్చించిన మంత్రివర్గం.. నివేదిక వచ్చాక నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇక మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఇక మీదట అకారణంగా చేసే సమ్మెలపై కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.
పుష్కరాల్లో మృతి చెందిన భక్తులకు సంతాపం..
ఇక గోదావరి పుష్కరాల్లో మృతిచెందిన భక్తులకు కేబినెట్‌ సంతాపం తెలిపింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాలను అంతే ఘనంగా ముగింపు పలకాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 25న రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో దీపారాధన చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి 'పుష్కరజ్యోతి'గా నామకరణం చేశారు. పుష్కరాల్లో బాగా పనిచేసిన వారికి ఈనెల 26న పురస్కారాలు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

నేటి నుండి డిపార్ట్ మెంటల్ ఇంటర్వ్యూలు..

హైదరాబాద్ : డిపార్ట్ మెంట్ టెస్టు - నవంబర్ 2014లో అర్హత సాధించిన వారికి గురువారం నుండి శనివారం వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. 

పదో రోజు పుష్కరాలు..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల్లో పుష్కరాలు పదో రోజుకు చేరుకున్నాయి. మరో రెండు రోజులే ఉండడంతో భక్తుల తాకిడి అధికమైంది. తెల్లవారుజామునే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

నేడు హైదరాబాద్ కు టాటా గ్రూఫ్ ఛైర్మన్..

హైదరాబాద్ : టాటా గ్రూఫ్ ఛైర్మన్ సైరన్ మిస్త్రీ హైదరాబాద్ కు రానున్నారు. గచ్చిబౌలి ఐఐఐటి ప్రాంగణంలో కోహ్లీ పరిశోధన కేంద్రానికి మిస్త్రీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొనున్నారు. 

వర్సిటీల బలోపేతంపై నేడు కీలక భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ యూనివర్సిటీ చట్టం ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. యూనివర్సిటీలకు చాన్స్ లర్ లనునియమించే అంశంపై మరింత స్పష్టత తీసుకరావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ అంశంపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 

ఇంజినీరింగ్ కాలేజీల్లో మొదలైన తనిఖీలు..

హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాల మేరకు 88 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో బుధవారం నుండి తనిఖీలు మొదలయ్యాయి. ఈ తనిఖీలు ఈనెల 25వరకు కొనసాగనున్నాయి. 

Don't Miss