Activities calendar

24 July 2015

అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్: తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. 1500 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. కనీస వేతనం చెల్లింపు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

21:56 - July 24, 2015

హైదరాబాద్: పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. వేలాది గొంతులు గళమెత్తుతున్నాయి. పోరుకు సై సై అంటూ చేతులు లేస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యంపై కార్మిక లోకం గర్జిస్తోంది. ఏపీలో మున్సిపల్ సమ్మె తీవ్ర రూపం దాల్చింది. 13 జిల్లాల్లోనూ పారిశుద్ధ్య కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఎక్కడికక్కడ కలెక్టర్ కార్యాలయాలను దిగ్బంధించారు.
విజయవాడ
విజయవాడలో మున్సిపల్ సమ్మెకు మద్దతుగా ఎర్రసైన్యం పోరుబాట పట్టింది. సబ్‌ కలెక్టరేట్‌లో సమర శంఖం పూరించింది. వేలాదిగా తరలివచ్చిన ఎర్రదండు కార్యాలయాన్ని అష్ట దిగ్బంధనం చేసింది. లెఫ్ట్‌ నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు స్పృహ తప్పి పడిపోయారు. కార్మికుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
ప్రకాశం
ప్రకాశం జిల్లాలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఒంగోలులో మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. కార్మికుల ఆందోళనకు వైసీపీ, ఉద్యోగసంఘాల నేతలు మద్దతు తెలిపారు.
విశాఖపట్టణం
విశాఖపట్టణం కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
నెల్లూరు
నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌ ముట్టడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముట్టడికి ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవటంతో టెన్షన్‌ మొదలైంది. తమ సమస్యలు చెప్పుకోవటానికే ముట్టడి అని ప్రకటించినా.. పోలీసులు అత్యుత్సాహం చూపించడంతో ఉద్రిక్తత చెలరేగింది. పోలీసులు, కార్మికుల మధ్య చాలాసేపు తోపులాట జరిగింది.
కర్నూలు
కర్నూలు కలెక్టరేట్‌ను మున్సిపల్ కార్మికులు ముట్టించారు. పాలకులు మానవత్వం లేకుండా పరిపాలిస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ అన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మిక నేతలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
శ్రీకాకుళం
శ్రీకాకుళంలో మున్సిపల్‌ కార్మికులు కదం తొక్కారు. కలెక్టరేట్‌ను ముట్టడించి కార్యాలయం ఎదుట బైఠాయించారు. మంత్రి అచ్చెన్నాయుడును అడ్డుకున్నారు. కార్మికుల సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
కడప
కడప జిల్లాలో కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కనీసం వినతి పత్రం తీసుకునేందుకు కూడా అధికారులు రాకపోవడంతో లోనికి దూసుకెళ్లారు కార్మికులు. అయితే అధికారుల ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు విచక్షణా రహితంగా లాఠీఛార్జ్ చేశారు. ఉభయగోదావరి, విజయనగరం, అనంతపురం జిల్లాల్లోనూ మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. కార్మికుల సమ్మెపై చంద్రబాబు వ్యవహరిస్తున్నతీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీలో 42 వేల మంది మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా... పాలకులు మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడ్డారు.

 

21:50 - July 24, 2015

ఢిల్లీ: నాలుగో రోజూ పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగింది. లలిత్‌ గేట్‌, వ్యాపం కుంభకోణం విషయంలో... సుష్మా స్వరాజ్, వసుంధరరాజే, శివరాజ్‌సింగ్ చౌహాన్‌ రాజీనామా కోరుతూ... ఉభయ సభల్లోనూ విపక్షాలు నిరసనలు తెలిపాయి. రిజైన్ చేసేదాకా చర్చల ప్రసక్తే లేదని నినదించాయి. కొందరు ప్లకార్డులు ప్రదర్శించారు. సభాపతి పలుమార్లు వారించినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అవినీతికి పాల్పడ్డ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని కోరుతూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.

 

21:45 - July 24, 2015

హైదరాబాద్: నటసామ్రాట్‌ అక్కినేని కుటుంబం నుంచి మరో సామ్రాట్‌ దూసుకొస్తున్నాడు. ఇప్పటికే తెరకు అతిథిగా పరిచయమైపోయిన అఖిల్‌.. వినాయక్‌ దర్శకత్వంలో మంచి యాక్షన్‌ మూవీతో గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు వినాయక్‌ .... దేశంలో రోడ్లపై భారీగా మంచి యాక్షన్‌ సీన్‌ చిత్రీకరించారు. ఇప్పుడీ విజువల్‌ యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. అక్కినేని అభిమానులు ఈ ఫైట్‌ను చూసి మురిసిపోయి చిత్రంపై అంచనాలు పెంచేసుకుంటున్నారు.

21:42 - July 24, 2015

యూనివర్సిటీల్లో ప్రభుత్వ పాలకులే విష సంస్కృతిని పెంచిపోశిస్తున్నారని వక్తలు విమర్శించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్.. రితికేశ్వరి ఆత్మహత్య, రేవ్ పార్టీలు, వెస్ట్రన్ కల్చర్ అనే అంశాలపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీ విద్యార్థిని రవళి, నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని వెన్నెల పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రస్తుతం.. యూనివర్సీటీల్లో గురు శిశ్య సంబంధం తగ్గిపోయిందన్నారు. విద్య వ్యాపారీకరణం అయిందని వాపయారు. వెస్ట్రన్ కల్చర్ ను యూనివర్సిటీలో ప్రవేశపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు అందరూ ఐక్యమై.... యూనివర్సిటీల్లో ప్రవేశిస్తున్న విష సంస్తృతిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలను వీడియోల చూద్దాం...

21:03 - July 24, 2015

అల్లరి నరేష్, సాక్షి చౌదరిలు నటీనటులుగా సాయి కిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జేమ్స్ బాండ్.. ఇవాళా విడుదలైంది. అరడజను ఫ్లాపుల తర్వాత జేమ్స్ బాండ్ అనే సినిమాతో ప్రేక్షకుముందుకొచ్చాడు సడెన్ స్టార్ అల్లరి నరేష్. నేను కాదు నా పెళ్లాం అనేది సబ్ టైటిల్. ఈ ఉపశీర్షికతోనే సినిమా చూడకముందే కథ ప్రేక్షకులకు అర్థమై పోతుంది. సినిమా థియేటర్లోకి వెళ్లిన తర్వాత కూడా...ఊహించినట్లే ఇంతకంటే పెద్ద కథేం కనిపించదు. మరి ఆ... చిత్రం ఎలా వుందో చూద్దాం....
కథ...
చిన్న ఫ్యామిలీ...చిన్న ఉద్యోగం...కొన్ని బాధ్యతలు...కామెడీ హీరో కాబట్టి సహజంగానే కొంత పిరికితనం...ఇవీ కథలో అల్లరి నరేష్ క్యారెక్టర్ తాలుకా లక్షణాలు. దీనికి భిన్నంగా హీరోయిన్ సాక్షి చౌదరి దుబాయ్ లో ఓ పెద్ద మాఫియా డాన్. హైదరాబాద్ లో ఉంటున్న తల్లి అనారోగ్యం విషయం తెల్సుకున్న సాక్షి...దుబాయ్ వదలి...ఇక్కడికొస్తుంది. తల్లి కోరిక మేరకు బకరా లాంటి నరేష్ ను పెళ్లి చేసుకుంటుంది. అందమైన అమ్మాయి భార్యగా దొరికిందని సంతోషపడిన నరేష్...తన భార్య పెద్ద డాన్ అన్న విషయం తెల్సుకుని కంగుతింటాడు. అయినా తప్పించుకోలేని పరిస్థితి. ఇంతలో దుబాయ్ నుంచి సాక్షి శత్రువులు ఆమెను వెతుక్కుంటూ వస్తారు. పెళ్లి తర్వాత నరేష్ పడ్డ అష్టకష్టాలేంటి...సాక్షి మనసు మారిందా...మాఫియా శత్రువుల నుంచి వీళ్లంతా ఎలా తప్పించుకున్నారన్నది మిగిలిన కథ.
విశ్లేషణ...
గతంలో నరేష్ చేసిన...బ్రదర్ ఆఫ్ బొమ్మాళీని పోలిన కథే ఇది...కాకపోతే అందులో సిస్టర్ రఫ్ అండ్ టఫ్ అయితే...ఇందులో హీరోయిన్...అంతే తేడా. నరేష్ తన ఇమేజ్ కు తగినట్లు డమ్మీ క్యారెక్టర్ చేయడాన్ని అంతా యాక్టెప్ట్ చేసినా...సినిమా అంతా హీరోయిన్ లీడ్ చేస్తుంటే మనోడు కీ ఇచ్చే బొమ్మలా తయారయ్యాడు. దుబాయ్ లో డాన్ లు అయినా...పక్కన పనికిమాలిన వాళ్లను అసిస్టెంటులుగా పెట్టుకోవడం మన తెలుగు సినిమా ఆనవాయితీ. జేమ్స్ బాండ్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యింది. నరేష్ నటనలో ఆకర్షణ లేదు. సాక్షి చౌదరి హైట్, పర్సనాలిటీ డాన్ క్యారెక్టర్ కు సెట్ అయ్యింది. ఆశిష్ విద్యార్థి విలనిజంలో పసలేదు. థర్టీ ఇయర్స్ ఫృథ్వితో అవసరం లేని కామెడీ చేయించారు. జయప్రకాష్ రెడ్డి, కారుమంచి రఘు, సప్తగిరి ...ఇలా జనాలకు తెల్సిన నటులు చాలా మందే ఉన్నా...అనాసక్తికరమైన కథలో తేలిపోయారు. సాయికార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు యావరేజ్ గా ఉన్నా...ఒకట్రెండు పాటలు బాగున్నాయి. శ్రీధర్ మాటలు కొన్ని సన్నివేశాల్లో నవ్వు తెప్పించాయి. దర్శకుడిగా సాయి కిషోర్ విఫలయత్నమే చేశాడు.
ఫ్లస్ పాయింట్స్
1.సాక్షి చౌదరి
2.కొన్ని కామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
1.అల్లరి నరేష్
2.బలహీనమైన కథ
3.దర్శకత్వం
4.అనవసరమైన సన్నివేశాలు
5.ప్రధాన పాత్రల చిత్రణ
టెన్ టివి రేటింగ్...1.5/5

 

20:59 - July 24, 2015

గుంటూరు: నాగార్జున వర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో విచారణ వేగవంతం అవుతోంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రిషితేశ్వరి కేసును లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సుమోటోగా స్వీకరించింది. ప్రత్యేక న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని, కేసును సుమోటోగా స్వీకరించాలంటూ మహిళా న్యాయవాదులు చేసిన అభ్యర్థనను అంగీకరించిన లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ.. ఈ మేరకు ప్రిన్సిపాల్‌, వార్డెన్‌కు నోటీసులు జారీచేసింది. ఆగస్టు ఒకటో తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
బయటపడుతున్న అరాచకాలు
ఇదిలా ఉంటే.. వర్సిటీలో సాగుతున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విద్యా బుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులు.. విద్యార్థులను పాశ్చాత్య సంస్కృతికి అలవాటు చేస్తున్న వైనం బట్టబయలైంది. క్లబ్బులు, పబ్బుల వెంట తిప్పుతూ, మద్యం అలవాట్లు నేర్పిస్తూ.. రేవ్‌ పార్టీలకు విద్యార్థును తరలించిన వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు
ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై జ్యుడీషియల్‌ విచారణ చేపట్టాలంటూ విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలో భారీ ప్రదర్శన నిర్వహించాయి. రిషితేశ్వరి ఘటనలో.. ముగ్గురు విద్యార్థులు అరెస్టుకాగా.. ప్రిన్సిపల్‌, వార్డెన్‌లను నామమాత్రంగా సస్పెండ్‌ చేయడమేంటని విద్యార్థులు మండిపడుతున్నారు. తక్షణమే ప్రిన్సిపల్‌, వార్డెన్ పై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి.. రిషితేశ్వరి ఆత్మహత్యతో నాగార్జున వర్సిటీలో రహస్యంగా సాగుతున్న వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు పొక్కుతున్నాయి. మరి, ఇంకా ఎలాంటి విషయాలు బయటపడతాయో..? ఈ కేసు విచారణ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

20:37 - July 24, 2015

ఆత్మీయులకు సందర్భానికి తగిన గిఫ్ట్స్ ఇవ్వటం సాధారణం. అలా ఇచ్చే బహుమతులు ప్రత్యేకంగా ఉండాలనుకోవటం అంతే సాధారణం. అలాంటి గిఫ్ట్స్ లో వెరైటీ కలెక్షన్ తో ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. ఆ.. వివరాలను వీడియోలో చూద్దాం....

20:35 - July 24, 2015

నలుగురిలో ప్రత్యేకంగా కన్పించాలనే తాపత్రయంతో యువత అనేక చికిత్సల వెంట పరుగులు తీస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు వారిని ప్రమాదాలలోకి నెడుతున్నాయి. మరి ఇలాంటి స్థితిని ఎదుర్కునే మార్గాలేమిటో ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం. ఆ.. వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:29 - July 24, 2015

కుటుంబ బాధ్యతల్లో మహిళలు ప్రత్యేకమే
కుటుంబ బాధ్యతలలో కూడా మహిళలు ప్రత్యేకమే అని మరోసారి తేలింది. మహిళల యాజమాన్యంలోనే కుటుంబాల నిర్వహణ చక్కగా కొనసాగుతోందని తాజా సర్వే లో వెల్లడయ్యింది.
నిబంధనలను పాటించని కంపెనీలపై వేటు
సంస్థల పాలకవర్గంలో మహిళల ప్రాతినిధ్యాన్యం కోసం సెబీ ఏర్పాటు చేసిన నిబంధనలను పాటించని కంపెనీలపై వేటు పడింది. ఈ మేరకు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు
ప్రభుత్వ రంగాల్లో పనిచేసే మహిళల కోసం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంది. పిల్లల పెంపకంలో కీలక పాత్ర వహించే అమ్మలకు వెసులుబాటునిచ్చేందుకు ప్రభుత్వం అదనపు సెలవులను ప్రకటించింది.


 

శరవేగంగా నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి: సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుకు కావాల్సిన మోటార్లు... పైప్ లైన్ లను ముందే గుర్తిస్తామన్నారు. భెల్ కు ఆర్డర్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మొత్తం ప్రాజెక్టును ఒకే ఎజెన్సీకి కాకుండా.. ఐదారు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేలు భూసేకరణ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు.

 

నష్ణనివారణ చర్యలకు నెస్లే ఇండియా శ్రీకారం...

ముంబై: భారత్ లో నష్ణ నివారణ చర్యటలకు నెస్లే ఇండియా శ్రీకారం చుట్టింది. మ్యాగీ న్యూడుల్స్ ను తిరిగి అమ్మేందుకు ఎత్తుగడలు వేస్తుంది. నెస్లే ఇండియా ఎండీగా భారతీయుడు సురేష్ నారాయణ్ నియమించారు. 

ప్రిన్సిపాల్ బాబూరావు అవినీతిపై మరిన్ని ఆధారాలు

గుంటూరు: ప్రిన్సిపాల్ బాబూరావు అవినీతిపై మరిన్ని ఆధారాలను ఎఎన్ యు విద్యార్థులు బయటపెట్టారు. బాబూరావు.. పెద్దమొత్తంలో మద్యం కొనగోలు చేసి..యూనివర్సిటీ నుంచి బిల్లులు చెల్లించారు. 

ప్రాజెక్టులను అడ్డుకునేందుకు టీడీపీ-కాంగ్రెస్ కుట్ర..

హైదరాబాద్: ప్రాజెక్టులను అడ్డుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నాయని మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. అధికారం కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ నేతలు.. ప్రాజెక్టుల బాట పట్టడం హాస్యాస్పదమన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి...ప్రాజెక్టుల వద్ద నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

 

గోదావరికి హారతి ఇస్తున్న విధానాన్ని తప్పుబట్టిన చిన్నజీయర్

రాజమండ్రి: గౌతమి పుష్కరఘాట్ లో చిన్నజీయర్ స్వామి పుష్కర స్నానం చేశారు. గోదావరికి హారతి ఇస్తున్న విధానాన్ని చిన్నజీయర్ తప్పుబట్టారు. నదీ ప్రవాహం ఎటువైపు ఉంటే ఆ.. దిశగా తిరిగి నమస్కరించాలి. నదిలో నుంచి ఎదురు హారతి ఇవ్వకూడదని తెలిపారు.  

19:31 - July 24, 2015

మెదక్: మాసాయిపేట.. ఏడాది క్రితం ఈ పేరు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద.. కాకతీయ టెక్నో స్కూల్ బస్ ట్రాక్ దాటుతుండగా... ఒక్కసారిగా రైలు మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. దీంతో ముక్కుపచ్చలారని పదహారు మంది చిన్నారులతో సహా డ్రైవర్, క్లీనర్ ల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఏడాది గడిచినా.. ఆ కుటుంబాల్లో ఇంకా విషాదం వీడలేదు. రెక్కాడితే కానీ.. డొక్కాడని వీరు.. తమ పిల్లల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని అప్పో సప్పో చేసి ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే.. చివరకి ఈ కుటుంబాల్లో చీకట్లే మిగిలాయి. ఏ కుటుంబాన్ని కదలించినా.. కన్నీటి ధారలే. ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకున్నా... పోయిన తమ పిల్లల ప్రాణాలు తిరిగిరావు కదా... అంటూ నాటి ఘటనను గుర్తు చేసుకొని భోరుమంటున్నారు బాధితులు.
16మంది చనిపోతే కానీ మేల్కొనని రైల్వేశాఖ
రైల్వే క్రాసింగ్ వద్ద గేటు కాపలాదారుడు లేకపోవడమే ఇంతటి విషాదానికి ప్రధాన కారణం. 16మంది చనిపోతే కానీ... రైల్వే శాఖ మేలుకోలేదు. దుర్ఘటన జరిగిన కొద్దిరోజుల్లో జిల్లా అంతటా రైల్వే క్రాసింగుల వద్ద కాపలాదారులను, గేట్లను ఏర్పాటు చేసింది. కానీ తమ పిల్లన్ని కోల్పోయిన తల్లిదండ్రులు మాత్రం.. ఇలాంటి గర్భశోకం మరొకరికి జరగొద్దని విలపిస్తున్నారు.
బాధితులంతా తుఫ్రాన్ మండలవాసులే
మృత్యువాత పడ్డ పిల్లలంతా తుఫ్రాన్ మండలంలోని కిష్టాపూర్, వెంకటాయ పల్లె, గుండ్రెడ్డి పల్లె, ఇస్లాంపూర్ కు చెందిన వారే. ఇంటి వద్ద చిట్టి చేతులతో ముద్దుముద్దుగా బైబై చెప్పిన ఆ చిన్నారులు అరగంటలోనే మృత్యువు చేరిన ఆ విషయం తలుచుకొని కుమిలిపోతున్నారు. ఈ విషాదాన్ని మర్చిపోయేందుకు కొందరు గ్రామం విడిచిపోతే... మరికొందరు తమ పిల్లల్ని తలచుకుంటు జీవచ్ఛవాలుగా అదే గ్రామంలో ఉంటున్నారు.
గాయపడ్డ చిన్నారుల పరిస్థితి దయనీయం
మాసాయిపేట ఘోరం జరిగి ఏడాది అవుతున్నా.. గాయపడ్డ చిన్నారుల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉంది. ఇక ఘటన జరిగిన చోట "స్మృతి వనం" ఏర్పాటు చేస్తామన్న నేతలు.. ఇంతవరకు ఆ.. ఊసే ఎత్తకపోవడంపై స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా "స్మృతి వనం" నిర్మించి... చిన్నారులకు నివాళి అర్పించాలని కోరుతున్నారు.

 

19:23 - July 24, 2015

హైదరాబాద్‌: చైతన్యపురిలో ప్రేమోన్మాది ఘాతుకానికి అక్కాచెల్లెళ్లు బలైపోయిన కేసులో పోలీసుల విచారణ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఈ నెల 14న పట్టపగలే శ్రీలేఖ, యామినిలను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చాడు అమిత్‌. ఆ తర్వాత తన తండ్రికి ఫోన్‌ చేసి అక్కాచెల్లెళ్లను అంతం చేసినట్లు ఫోన్‌ చేసి చెప్పి పారిపోయాడు.
నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్‌ బృందాల వేట
మహిళలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో... కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపారు. తెలంగాణ, ఏపీ సహా బీహార్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించారు.
అమిత్‌ బ్యాంక్‌ ట్రాన్జాక్షన్స్ పై పోలీసుల నిఘా
అమిత్‌ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడి స్వస్థలమైన బీహార్‌లో ముమ్మరంగా గాలించారు. అమిత్‌ గురించి ఎలాంటి క్లూ లభించలేదని తెలుస్తోంది. అతడి బ్యాంకు ఖాతా లావాదేవీలపై నిఘా పెట్టినా ప్రయోజనం దక్కలేదట. 10 రోజులవుతున్నా ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముందుకు ఎందుకు కదలడం లేదు...కుటుంబీకులను విచారించిన పోలీసులకు ఎలాంటి సమాచారం దొరకలేదా..? తెలిసినా లోతుగా శోధించడంలో వెనకడుగు వేస్తున్నారా..? ఇప్పటికైనా పోలీసులు స్పందించి నిందితుడి జాడ కనిపెట్టి కటకటాల్లోకి నెట్టాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

19:17 - July 24, 2015

అనంతపురం: ఎపి సీఎం చంద్రబాబు, వైసిపి అధినేత జగన్ లను ప్రధాని మోడీ కంట్రోల్ చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో పాల్గొని ఆయన ప్రసంగించారు. అన్ని పార్టీల ఏకగ్రీవ నిర్ణయంతోనే రాష్ట్ర విభజన జరిగిందని గుర్తు చేశారు. కానీ అనంతరం టీడీపీ, వైసీపీ మాట మార్చాయని స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీలు... ఎపికి ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. చంద్రబాబు, జగన్ లు నోరు మెదపకుండా మోడీ కట్టడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. సుష్మా, రాజే, చౌహాన్ లు దేశాన్ని లూటీ చేశారని ఆరోపించారు. తమ పాలనలో ఆరోపణలు వచ్చిన వెంటనే సీఎంలనూ, కేంద్ర మంత్రులనూ తొలగించామని గుర్తు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై చర్య తీసుకోకుండా... మోడీ మౌనంగా ఉంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బొత్స సత్యనారాయణ, డీ.శ్రీనివాస్, కే.కేశరావులు అవకాశవాదులని మండిపడ్డారు.

 

 

18:26 - July 24, 2015

హైదరాబాద్: మున్సిపల్‌ జేఏసీ నాయకులు మానవ హక్కుల సంఘానికి జీహెచ్‌ఎంసీపై ఫిర్యాదు చేశారు. తొలగించిన మున్సిపల్‌ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సమ్మెలో పాల్గొన్న కారణానికే వందల మంది కార్మికులను జీహెచ్‌ఎంసీ తొలగించిందని.. ఇది కేవలం కక్షసాధింపేనని వారు విమర్శించారు. దీనిపై పలుమార్లు ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ స్పందన లేకపోవడంతో హెచ్‌ఆర్‌సీని కలిసి ఫిర్యాదు చేశారు.

 

18:09 - July 24, 2015

కరీంనగర్‌: ప్రైవేట్ విద్యాసంస్థ నిర్లక్ష్యానికి మరో విద్యార్థి బలయ్యాడు. హుజూరాబాద్‌ లో విద్యార్థి మరణం మరిచిపోకముందే.. కరీంనగర్‌ జిల్లాలో మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కొడిమ్యాల మండలం శ్రీరాముల పల్లెకు చెందిన దోర్నాల మహిపాల్‌ అనే విద్యార్థి.. గంగాధర క్రాస్‌ రోడ్‌లోని ఎడ్జ్ కాన్వెంట్‌ పాఠశాలలో చదువుతున్నాడు. రోజూలాగే మహిపాల్‌ బస్సులో స్కూల్‌కు వెళ్తుండగా.. మార్గం మధ్యలో బస్సు మొరాయించింది. దీంతో.. విద్యార్థులను కిందకు దించి, వారితోనే బస్సును ముందుకు నెట్టించారు. ఈ క్రమంలో.. డ్రైవర్‌ రివర్స్ గేర్లో బస్సును స్టార్ట్ చేయడంతో, వెనక నుంచి నెడుతున్న మహిపాల్‌ మీదకు బస్సు దూసుకెళ్లింది. దీంతో.. విద్యార్థి మహిపాల్‌ బస్సు టైరులో ఇరుక్కుపోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ మహిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. స్కూల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని, యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 

17:50 - July 24, 2015

హైదరాబాద్: రెండు నెలల పాటు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడికి పోయారో.. ఇంతవరకు చెప్పలేదని ఎపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాహుల్ చేసిన విమర్శలపై యనమల స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాడ లేదని రామకృష్ణుడు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోలేదని పేర్కొన్నారు. ఎపిని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.... ఆయనపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు.

17:39 - July 24, 2015

ఖమ్మం: జిల్లాలోని మోతెలో ఎంపీ కవిత గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవిత రాకతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తుల సందడి నడుమ కవిత... గోదావరి తల్లికి హారతి ఇచ్చారు. వేదపండితులు మంత్రోచ్ఛరణలతో పూజాకార్యక్రమాన్ని ముగించారు. అనంతరం ప్రత్యేక బోట్‌లో కవిత ప్రయాణం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కవితతో పాటు.. పలువురు ప్రజాప్రతినిధులు పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు.

తీస్తా సెతల్వాద్ కు బాంబే హైకోర్టులో ఊరట

ముంబై: హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. తీస్తా మధ్యంతర బెయిల్ రెండు వారాల పాటు పొడిగించారు.

17:35 - July 24, 2015

నల్లగొండ: జిల్లాలోని ఆత్మకూరు (ఎస్) మండల తహశీల్దారు కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సంజీవరెడ్డి అనే రైతు పక్క పొలంలో.. రవీందర్‌రెడ్డి అనే మరో రైతు బోరు వేయడంతో సంజీవరెడ్డి పొలంలోని బోరు ఎండిపోయింది. దీనిపై సంజీవరెడ్డి వాల్టా చట్టం ప్రకారం అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురైన అతను తహశీల్దారు కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే సంజీవరెడ్డిని ఆస్పత్రికి తరలించారు.

 

చంద్రబాబు, జగన్ లు నోరు మెదపకుండా మోదీ కట్టడి చేశారు:రాహుల్

అనంతపురం: బొత్స, డీఎస్, కేకే అవకాశవాదులని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన అన్ని పార్టీల ఏకగ్రీవ నిర్ణయమన్నారు. టీడీపీ, వైసీపీ మాట మార్చాయని స్పష్టం చేశారు. టీడిపి, వైసీపీ ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, జగన్ లు నోరు మెదపకుండా మోదీ కట్టడి చేస్తున్నారని ఆరోపించారు.

'ఇండియన్ పోస్ట్ మ్యాన్' లో అందరూ తెలంగాణ వారేనట...

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి 'ఇండియన్ పోస్ట్ మ్యాన్' సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాదు ఫిలింనగర్ లో జరిగిన ఈ ఆడియో ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ... ఈ సినిమాలో అందరూ తెలంగాణ కళాకారులే ఉన్నారని, తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ నేపథ్యంలో సినిమా నిర్మించడం పట్ల దర్శకుడు రమేశ్ రెడ్డిని అభినందించారు. చిన్న సినిమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు.

కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకురాలు అనుమానాస్పద మృతి

విజయవాడ:గొల్లపూడిలోని ఓ కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకురాలు అనుమానాస్పద మృతి చెందిది.ఈమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె మరణానికి వ్యక్తిగత కారణామా? లేక కాలేజి యాజమాన్యం కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

17:16 - July 24, 2015

ఢిల్లీ: బిజెపి నేతలకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటైంది. గత కొంతకాలంగా వివిధ అంశాలపై నేతలు వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. లలిత్ గేట్, వ్యాపం కుంభకోణాలతో పీకల్లోతు ఇబ్బందుల్లో వున్న బీజేపీకి... ఆ పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు మరింత చేటు తెస్తున్నాయి. తాజాగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌... అన్నదాతల ఆత్మహత్యల లెక్కలకు తప్పుడు భాష్యం చెప్పారు. ఈ ఏడాది మరణించిన 1400 మంది రైతుల్లో కొందరు లవ్‌ ఎఫైర్స్, నపుంసకత్వం కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని కామెంట్‌ చేశారు. రైతుల బలవన్మరణాలకు కారణమేంటని... రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు... మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. నేషనల్ క్రైమ్‌ బ్యూరో రికార్డ్స్ ప్రకారం... అన్నదాతలు కుటుంబ కలహాలు, నిరక్షరాస్యత, డ్రగ్స్, డౌరీ, లవ్‌ ఎఫైర్స్, నపుంసకత్వం వల్ల చనిపోయినట్లు మంత్రి రాధామోహన్‌ చెప్పారు. మంత్రి సమాధానంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు మంత్రి వ్యాఖ్యలతో తీవ్రంగా విభేదిస్తున్నాయి.

 

నగరంలో మల్టీ లెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతులు...

హైదరాబాద్:నగరంలో మల్టీలెవల్ ఫ్లెఓవర్లు, జంక్షన్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇవాళ అనుమతులు మంజూరు చేసింది. మొదటి దశలో 20 చోట్ల మల్టీలెవల్ ైఫ్లెఓవర్ల నిర్మాణానికి అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2,630 కోట్లతో మల్టీలెవల్ ైఫ్లెవర్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈపీసీ టెండర్ల ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. రెండున్నర ఏళ్లలో ఈ నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

కూచిపూడికి పూర్వ వైభవం తెస్తాం: చంద్రబాబు..

రాజమండ్రి:చరిత్ర, సంప్రదాయాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్‌ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం రాజమండ్రి ఆనం కళాక్షేత్రంలో ''తెలుగువారి చరిత్ర సంస్కృతి''పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదకొండు రోజులుగా గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 11 ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కూచిపూడికి పూర్వవైభవం తెచ్చేందుకు రూ.వంద కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో తిరుగులేని శక్తిగా మారుతామని చంద్రబాబు పేర్కొన్నారు.

రాజమండ్రి ఖైదీలకు పుష్కర జల్లులు..

రాజమండ్రి :తెలుగు రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గోదావరి పుష్కరాలలో భాగంగా రాజమండ్రి జైలు ఖైదీలు పుష్కర జల్లులతో పునీతులయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు, ఆవరణలో కూడా గోదావరి నది నీటిని చల్లారు. వాస్తవానికి 144 ఏళ్లకొకసారి వచ్చే మహాపుష్కరాలలో భాగంగా తమకు పుష్కర స్నాన భాగ్యం కల్పించాలని 500 మంది మహిళలతో సహా మొత్తం 1,570 మంది ఖైదీలు సంబంధిత అధికారులతో విన్నవించుకున్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వం ఇందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో అహోబిల మఠం స్వాములు గోదావరి పవిత్ర జలాలను ఖైదీలపై చల్లి వారిని పునీతులను చేశారు.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 258 పాయింట్లు నష్టపోయి 28,112 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పాయింట్లు నష్టపోయి 8,521 వద్ద ముగిసింది. 

నగరంలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు...

హైదరాబాద్:నగరంలో ధనికుల నివాసాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ చిన్న ఎల్లయ్యను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు చిన్న ఎల్లయ్య నుంచి రూ. 1.5 లక్షలు, 14 తులాల బంగారం, టాటా సుమో, 2 ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్లయ్యను పోలీసులు విచారిస్తున్నారు.

 

పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ.300 కోట్లు విడుదల చేశాం: కేసీఆర్

హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ.300 కోట్లు విడుదల చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు భూనిర్వాసితులకు నష్టపరిహారం వెంటనే అందజేయాలని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌కు కేసీఆర్ ఆదేశించారు.  ప్రాజెక్టు ద్వారా ఉఫాది కొల్పోయిన కుటుంబాలకు 15 వేల ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు ఎంతముప్ప ఉంది, ఎన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి. వీటికి సంబధించిన నివేదికను అందజేయాలని సీఎం కలె క్టర్‌ను ఆదేశించారు.

 

ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ ఎందుకు పోరాడలేదు:యనమల

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా పైఎందుకు పోరాడ లేదని ఆర్థిక మంత్రి యనమ రామకృష్ణుడు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చేసిన విమర్శల పై ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఏపీ ఆరద్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్ర బాబు ప్రయత్నిస్తుంటే విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు

లబ్ధి పొందింది ఆయన కుటుంబ సభ్యులే:తమ్మినేని

హైదరాబాద్ :.కార్మికుల, పేదల కోసం కేసీఆర్ అన్నీ చెబుతున్నారు కానీ లబ్ధిపొందింది కేసీఆర్ కుటుంబ సభ్యులే ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఇందిరా పార్క్ వద్ద 10 వామపక్ష పార్టీల బస్సు యాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికైనా దొంగనాటకాలు కట్టిపెట్టాలని కేసీఆర్ కు సూచించారు. కార్మికులకూ, పేదలకూ ఎర్రజెండా అండగా ఉంటుందన్నారు. పోలీసులతో కార్మికుల సమ్మెను అణచాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, 10 వామపక్ష నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

16:59 - July 24, 2015

ప్రకాశం: జిల్లాలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఒంగోలులో మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. కార్మికుల ఆందోళనకు వైసీపీ, ఉద్యోగసంఘాల నేతలు మద్దతు తెలిపారు. పదిహేను రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై... వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు...సమ్మెను విరమించేదిలేదని తేల్చిచెప్పారు.

16:57 - July 24, 2015

శ్రీకాకుళం: మున్సిపల్‌ కార్మికులు కదం తొక్కారు. కార్మిక ట్రేడ్‌ యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించి.. కార్యాలయం ఎదుట బైటాయించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని మంత్రి అచ్చెన్నాయుడును అడ్డుకున్నారు. కార్మికుల సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. కార్మికులు విధుల్లోకి చేరితే.. ప్రభుత్వం స్పందించేందుకు సానుకూలంగా ఉందని ఆయన అన్నారు. మరోపక్క కార్మికులు మాత్రం తమ డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. స్పష్టమైన హామీ ఇవ్వాలని కార్మిక సంఘాల డిమాండ్‌ చేశాయి.

 

కేక్ కట్ చేసినంత ఈజీగా రాష్ట్రాన్ని ముక్కలు చేసింది:పయ్యావుల

అనంతపురం: జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలించిన 10 ఏళ్ల కాలంలో 24 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని... అలాంటి కాంగ్రెస్ నేతలు రైతు యాత్రలు చేపడతారా? అంటూ నిలదీశారు. కేక్ కట్ చేసినంత ఈజీగా రాష్ట్రాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీనే అని... విభజన చేసేటప్పుడు ప్రత్యేక హోదాను బిల్లులో పెట్టకుండా మోసం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.

16:53 - July 24, 2015

కడప: సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించిన మున్సిపల్‌ కార్మికులను చావబాదారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ విన్నవించేందుకు వెళ్లిన వారిపై పాలకులు... పోలీసులను ఉసిగొల్పారు. మున్సిపల్‌ కార్మికులు రెండు వారాలుగా సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో కడప జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి కార్మికులు పిలుపునిచ్చారు. అయితే.. కార్మికుల నుంచి కనీసం వినతి పత్రం తీసుకునేందుకు కూడా అధికారులు రాకపోవడంతో కార్మికులు కార్యాలయం లోనికి దూసుకెళ్లారు. అయితే.. అధికారుల ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు.. కార్మికులపై విచక్షణా రహితంగా లాఠీఛార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికనట్టు చావబాదారు. పోలీసుల దాడిలో ఇద్దరు కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ ఘటనపై వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలన్న వారిపై దాడి చేయడం అన్యాయమని మండిపడ్డారు.

 

16:49 - July 24, 2015

నెల్లూరు: జిల్లా కలెక్టరేట్‌ ముట్టడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముట్టడికి ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవటంతో టెన్షన్‌ మొదలైంది. తమ సమస్యలు చెప్పుకోవటానికే ముట్టడి అని ప్రకటించినా.. పోలీసులు అత్యుత్సాహం చూపించడంతో ఉద్రిక్తత చెలరేగింది. పోలీసులు, కార్మికుల మధ్య చాలాసేపు తోపులాట జరిగింది.

16:45 - July 24, 2015

హైదరాబాద్: కార్మికులకు, పేదలకూ ఎర్రజెండా అండగా ఉంటుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భరోసా ఇచ్చారు. పది వామపక్ష పార్టీల బస్సుయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కార్మికులు, పేదల కోసం సీఎం కేసీఆర్ అన్నీ చెబుతున్నారు కానీ...లబ్ధి పొందుతున్నది మాత్రం ఆయన కుటుంబ సభ్యులే అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ దొంగనాటకాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. పోలీసులతో కార్మికుల సమ్మెను అణచాలని చూస్తే.. ఊరుకోబోమని పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని తమ్మినేని హెచ్చరించారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితోపాటు పది వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. 

 

హైకోర్టు విభజనకు బీజేపీ అనుకూలం:దత్తాత్రేయ

న్యూఢిల్లీ : హైకోర్టు విభజనకు బీజేపీ అనుకూలంగా ఉందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. విభజనకు సంబంధించిన విధివిధానాలు రూపొందించడానికి ఆలస్యం జరుగుతోందని తెలిపారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రెండు రాష్ర్టాలు విడిపోయినప్పుడు రెండు హైకోర్టులు ఉండాల్సిందేనని పేర్కొన్నారు.

 

త్కాల్ రిజర్వేషన్ విధానంలో స్వల్ప మార్పులు

హైదరాబాద్:తత్కాల్ రిజర్వేషన్ విధానంలో స్వల్ప మార్పులు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయాలు ప్రకటించింది. ప్రస్తుతం తత్కాల్ టికెట్ ను బుక్ చేసుకోవాలంటే గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీ ఒకటి ఇవ్వాల్సి వుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే రిజర్వేషన్ సమయంలో ఇచ్చిన గుర్తింపు కార్డుతో పాటు మరే ఇతర కార్డ్ అయినా ప్రయాణ సమయంలో చూపించ వచ్చని తెలిపింది. ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, ఫోటో కలిగిన క్రెడిట్ కార్డులు, ఆధార్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన కార్డులు చూపవచ్చని స్పష్టం చేసింది.

రిషికేశ్వరి కేసును సుమోటోగా స్వీకరణ

గుంటూరు: ర్యాగింగ్ వికృత క్రీడలో నాగార్జున యూనివర్సిటి విద్యార్థి రిషికేశ్వరి మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె ర్యాగింగ్ వల్లే చనిపోలేదని, సహవిద్యార్థుల, లైంగిక వేధింపులు కూడా కారణమని తెలిసింది. ప్రిన్సిపల్ బాబురావు మద్యం సేవించి విద్యార్థులతో కలిసి చిందులేసిన దృశ్యాలు గురువారం బయటపడ్డాయి. వీటిని ఆధారంగా తీసుకుని ఈ కేసును సుమోటోగా జిల్లా లీగల్‌సెల్ అథారిటి స్వీకరించింది.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్ బాబూరావు, వార్డెన్ స్వరూపారాణికి నోటీసులిచ్చింది

 

ఖైదీ పరారీ

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జైలు నుంచి ఖైదీ పారిపోయాడు. జులై 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఖైదీ పారిపోయిన దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. హత్య కేసులో నిందితుడైన పంకజ్ పహాడే జైలులో ఉన్న పెద్ద పెద్ద గోడలను ఎక్కుతూ, దిగుతూ పారిపోయాడు. ఖైదీ పారిపోయిన అనంతరం చుట్టుపక్కల ఉన్న పొలాల్లో పోలీసులు గాలించారు. ఖైదీ దొరకలేదు. ఖైదీ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

శ్రీకాళహస్తిలో రెండు లారీలు ఢీ....

చిత్తూరు:శ్రీకాళహస్తిలోని బైపాస్ రోడ్డులో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిత్తూరు నుంచి టమటా లోడ్‌తో వస్తున్న లారీని మరో లారీ ఢీకొంది. దీంతో లోడ్‌తో ఉన్న లారీ బోల్తా కొట్టడంతో బైపాస్‌పై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు.

చంద్రబాబు ప్రయాణిస్తున్న బోటుకు తప్పిన ప్రమాదం

రాజమండ్రి: సీఎం చంద్రబాబు ప్రయాణిస్తున్న బోటుకు ప్రమాదం తప్పింది. సీఎం ప్రయాణిస్తున్న బోటును మీడియాకు కేటాయించిన బోటు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. దీంతో సీఎం భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

గ్రామ స్వరాజ్యం మహిళలతోనే సాధ్యం: రాహుల్ గాంధీ

అనంతపురం:దబురవారిపల్లిలో డ్వాక్రా సంఘాలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. గ్రామ స్వరాజ్యం మహిళలతోనే సాధ్యం అని రాహుల్ పేర్కొన్నారు. ఏపీలో డ్వ్రాకా సంఘాలు నాకు స్ఫూర్తినిచ్చాయి. డ్వాక్రా సంఘాలు భారత్ కు గుర్తింపు తెచ్చి పుట్టాయన్నారు.

పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ బృందం పర్యటన

మహబూబ్ నగర్: జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను కాంగ్రెస్ నేతల బృందం పర్యటిస్తోంది. గుడిపల్లి వద్ద కేఎల్ఐ మూడో లిప్టును పరిశీలించింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టును వివాదాస్పంద చేసి కేసీఆర్ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయని... కేసీఆర్ కు చిత్త శుద్ధి ఉంటే పాలమూరు ఎత్తిపోతలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు పేరొస్తుందన్న దురుద్దేశంతో పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని అరుణ మండి పడ్డారు.

ఏపీలో కలెక్టరేట్ల ముట్టడి..తీవ్ర ఉద్రిక్తత

విజయవాడ:తమ సమస్యల పరిష్కారం కోరుతూ గత 15 రోజులుగా ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. వీరికి మద్దతుగా వామపక్ష పార్టీలు, వైసీపీ, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి యత్నించాయి. ఈ సందర్భంగా వామపక్ష నేతలను, కార్మికులను పోలీసులు అడ్డగించి లాఠీ చార్జి చేశారు. దీంతో విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నేతలు సొమ్మసిల్లి పడిపోయారు. అంతే కాకుండా వివిధ జిల్లా కలెక్టర్ల వద్ద తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొంది.

లాంచీలో పుష్కర ఘాట్ల పరిశీలిస్తున్న చంద్రబాబు

రాజమండ్రి: రేపటితో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో నేటి ఉదయం నుంచి పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. దీంతో పుష్కర ఘాట్లలో రద్దీపై ఓ కన్నేసేందుకు చంద్రబాబు ఏకంగా లాంచీ ఎక్కేశారు. చంద్ర బాబు తో పాటు మంత్రులు నారాయణ, దేవినేని, తదితరులున్నారు. 

మాసాయిపేట దుర్ఘనటకు ఏడాది పూర్తి...

మెదక్: మాసాయిపేట రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ దాటుతున్న ఓ స్కూలు బస్సును వేగంగా వెళ్లుతున్న రైళు ఢీకొనడంతో జరిగిన ఘోర ప్రమాదంలో 16 మంది చిన్నారులతో సహా మరో ఇద్దరు మృతి చెందారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యధోరణితో ఈ క్రాసింగ్ వద్ద కాపాలదారుడిని నియమించక పోవడం వల్లనే ఈ పెను ప్రమాదం జరిగింది. ఈ సంఘటన జరిగి సంవత్సరం పూర్తి అయినా ఇంకా రాష్ట్రప్రజలను కలిచివేస్తూనే ఉంది. చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు ఇంకా ఆ బాధనుంచి బయట పడలేదు .

12:34 - July 24, 2015

విజయవాడ : 'చాలీ చాలనీ జీతాలు..ఆపై పెరుగుతున్న ధరలు..తాము అర్ధాకలితో అలమటిస్తున్నాం..కడుపులు కాలిపోతున్నాయి..పచ్చడి మెతుకులు తింటున్నాం..కనీస వేతనాలు పెంచండి..అంటే తమపై పోలీసులు ప్రతాపం చూపుతారా ? ఎందుకు చూపుతున్నారు..మా ఉసురు తాకుతుంది'' అంటూ పారిశుధ్య కార్మికులు శాపనార్థాలు పెట్టారు.
సమస్యలు పరిష్కరించాలంటూ తమకు మద్దతుగా పోరాటం చేస్తున్న నాయకులను ఎందుకు కొట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం మొండి వైఖరి అవలింబిస్తుండడంతో వామపక్షాలు, వైసీపీ విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించింది. కానీ పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. గోదాట్ల ఏం చేస్తున్నారు..మా ఉసురు తాకుతుందని మండిపడ్డారు. ప్రజా స్వామ్యం అంటారు ఇదా ప్రజాస్వామ్యం అని చంద్రబాబును ఉద్ధేశించి సీపీఎం నేతలు విమర్శించారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కార్మికులు, నేతలు స్పష్టం చేశారు. 

ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు...

హైదరాబాద్ :రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో టీఆర్‌ఎస్ నేతలు, అభిమానుల మధ్య కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. పలువురు నేతలు, అభిమానులు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీనగర్‌లో మొబైల్ షోరూంపై గ్రెనేడ్ ల దాడి

శ్రీనగర్:జమ్ముకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో మొబైల్ షోరూంపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రెనేడ్‌లు విసిరారు. కరణ్ నగర్‌లో మొబైల్ షోరూంపై ఈ గ్రెనేడ్లు విసిరారు. ఈ దాడిలో అద్దాలు పగిలిపోయాయి. ఘటనా స్థలంలో భయానక పరిస్థితి నెలకొంది. పోలీసులు విచారణ ప్రారంభించారు. 

సెప్టెంబర్ 4న రుద్రమదేవి సినిమా విడుదల

హైదరాబాద్: అనుష్క, రానా, అల్లు అర్జున్ తదితరులు నటించగా, దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డీ చిత్రం 'రుద్రమదేవి' విడుదల తేదీని ప్రకటించారు. సప్టెంబర్ 4న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తామని గుణశేఖర్ ప్రకటించారు. ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయని, రుద్రమదేవి భర్తగా రానాను సరికొత్త రీతిలో ప్రేక్షకులు చూడనున్నారని అన్నారు. 

ఆర్టీసీ బస్సు బోల్తా:48 మందికి గాయాలు

మెదక్: రామాయం పేట సమీపంలోని మల్లన్న గుడి వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 48 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

ఢిల్లీ: పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీమెంటరీ పార్టీ సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

హెచ్ ఆర్సీని ఆశ్రయించిన మున్సిపల్ సంఘాల జేఏసీ

హైదరాబాద్:తమసమస్యల పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు. సమ్మె సందర్భంగా తొలగించిన జీహెచ్ ఎంసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ సంఘాల జేఏసీ హెచ్ ఆర్సీని ఆశ్రయించాయి.

ధర్మపురి పుష్కరఘాట్‌కు పోటెత్తిన భక్తులు...

కరీంనగర్‌:ధర్మపురి పుష్కరఘాట్‌కు భక్తులు పోటెత్తారు. పుష్కరాలకు ఒక్కరోజే మిగిలి ఉండటంతో భక్తుల తాకిడి పెరిగింది. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మరోవైపు పుష్కర ఘాట్లకు తరలివస్తున్న వాహనాలతో ఆయా మార్గాల్లో రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి.

పుష్కర విధులు నిర్వహించిన ఉద్యోగులకు 27,28 సెలవులు:కేసీఆర్

హైదరాబాద్:గోదావరి పుష్కరాల్లో విధులు నిర్వహించిన తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ సెలవులు ప్రకటించారు. ఈనెల 14 నుంచి 25వరకు పుష్కరాలు జరగనున్నాయి. రేపటితో పుష్కరాలు ముగియనున్నాయి. ఆ వెంటనే అంటే 27, 28 తేదీల్లో ఉద్యోగులకు సెలవు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి వచ్చిన గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు కలగకుండా చూసినందుక ఉద్యోగులందరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. 

రాహుల్ పర్యటనలో ఎంపి సుబ్బి రామిరెడ్డికి అస్వస్థత...

అనంతపురం: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన రైతు భరోసా యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. రాహుల్ పాదయాత్రలో నడవలేక ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను అంబులెన్సులో పడుకోబెట్టి... పుట్టపర్తిలోని ఆసుపత్రికి తరలించారు.

ఆగి వున్న లారీనీ ఢీకొన్న డీసీఎం

వరంగల్:రాయపర్తి వద్ద ఆగి వున్న లారీని వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మరిపెడ మండలం చిల్లమచ్చర్లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మున్సిపల్ జేఏసీ నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు

విజయవాడ: సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన మున్సిపల్ కార్మికులు, లెప్ట్ పార్టీ కార్యకర్తలు, నేతలను ఎక్కడిక్కడ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. మహిళా కార్మికులు, నేతలను కూడా పోలీసులు ఈడ్చి పోలీసు వ్యానుల్లోకి విసిరేస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ 31కి వాయిదా

విజయవాడ: ఏపీ సీఎం, మంత్రుల ఫోన్ ట్యాంగ్ కేసు విచారణ విజయవాడ చీఫ్ మెట్రో పాలిటన్ కోర్టులో జరిగింది. ఈనెల 31నాటికి కాల్ డేటా సమర్పించాలని సర్వీస్ ప్రొవైడర్లను కోర్టు ఆదేశించింది. మరింత సమయం కావాలని సర్వీస్ ప్రొవైడర్లు కోరారు. ఇరు పక్షాల వాదానలు విన్న కోర్టు... తదుపరి విచారణ ఈనెల 31కి వాయిదా వేసింది.

మ్యాగీ కన్నా ముందు మద్యం ఉత్పత్తులను నిషేధించాలి:ముంబై హైకోర్టు...

హైదరాబాద్: తమపై నిషేధం అక్రమమని నెస్లే వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తులు, మ్యాగీ కన్నా ముందు మద్యం ఉత్పత్తులను నిషేధించాల్సి వుందని అన్నారు. చిన్న పిల్లలు సైతం మద్యానికి బానిసలుగా మారుతుండడం అత్యంత ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. మద్యం వల్ల ఎంతో మంది ఆరోగ్యం దెబ్బతింటోందని హైకోర్టు జడ్జీలు వీఎం కరాడే, వీపీ కోలబావాలాలు వ్యాఖ్యానించారు. వరుసగా రెండు రోజుల పాటు నెస్లే పిటిషన్ పై వాదనలు జరుగగా, మ్యాగీతో ఎటువంటి అనారోగ్యమూ కలగదని నెస్లే కంపెనీ తరపు న్యాయవాదులు వాదించారు.

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆగస్టు 21కి వాయిదా

హైదరాబాద్ : సీబీఐ కోర్టులో ఇవాళ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, బీపీ ఆచార్య, శ్రీలక్ష్మీ హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 21కి వాయిదా వేసింది.

11:32 - July 24, 2015

విజయవాడ : సీఎం డౌన్ డౌన్..పోలీసు జులుం నశించాలనే నినాదాలు..పోలీసులు బలప్రయోగం..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఎం నేత బాబురావులకు తప్పిన సృహ..ఎక్కడ చూసినా సొమ్మ సిల్లిన కార్యకర్తలు..కొంతమంది కార్యకర్తలకు గాయాలు..తోటి కార్మికుల సపర్యలు..ఈ దృశ్యాలన్నీ విజయవాడ సబ్ కలెక్టర్ ఆవరణలో చోటు చేసుకున్నాయి. పోలీసులు జరిపిన బలప్రయోగాన్ని కార్మికులు తీవ్రంగా నిరసించారు.
కార్మికులు..నేతలపై బలప్రయోగం..
తమ సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరశిస్తూ సీపీఎం, వైసీపీ పార్టీలు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించాయి. భారీగా వచ్చిన కార్యకర్తలు..కార్మికులతో కలెక్టర్ కార్యాలయం అట్టుడికింది. సీఎం డౌన్..తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు తమ పోరాటం ఆపమని స్పష్టం చేశారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను..కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు పిడిగుద్దులు.. బలప్రయోగం చేయడంతో సీపీఎం నేత బాబురావు, ఇతర నేతలు సొమ్మసిల్లిపడిపోయారు. వెంటనే అక్కడున్న కార్మికులు, కార్యకర్తలు సపర్యలు చేపట్టారు. చాలా మంది కోలుకోకపోవడంతో అక్కడంతా టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు - మధు..
విజయవాడ పోలీసు నగర కమిషనర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. పోలీసులు అతి ద్ముర్మార్గంగా వ్యవహరిస్తున్నారని టెన్ టివితో పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలు అణిచి వేయలేరని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలు అణిచివేయాలంటే కార్మికులు బాబు గుండెల్లో నిద్రపోతారని వైసీపీ నేత గౌతంరెడ్డి పేర్కొన్నారు. పుష్కరాలకు పది లారీల టపాసులు కాలుస్తారా ? పేద వాడి ఆకలి గ్రహించలేని సర్కార్ అని తీవ్రంగా విమర్శించారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

రాజ్యసభ 12 గంటల వరకు వాయిదా

ఢిల్లీ: రాజ్యసభలో లలిత్ మోదా, వ్యాపం కుంభకోణంపై విపక్షాలు నాలుగో రోజు కూడా ఆందోళన చేపట్టడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు.

దేశవ్యాప్తంగా జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి:సుప్రీం కోర్టు...

హైదరాబాద్:దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్ధానం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలన్నింటికీ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ లాకప్పుల్లో కూడా కెమెరాలు ఏర్పాటుచేయాలని జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఆర్ బానుమతి నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు తీర్పు వెల్లడించింది. అయితే సంవత్సరంలోపు కెమెరాలు ఏర్పాటుకావాలని, అంతేగానీ రెండేళ్ల సమయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇక ప్రతి పోలీస్ స్టేషన్ లో కనీసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని నిర్దేశించింది. 

ఎన్నిసార్లు గోదావరిలో మునిగినా కేసీఆర్ కు పుణ్యం రాదు: తమ్మినేని

హైదరాబాద్:పారిశుధ్ధ్య కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. పుష్కర స్నానాలు చేస్తున్న కేసీఆర్ కు ఎన్నిసార్లు గోదావరిలో మునిగినా పుణ్యం రాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యాదగిరిగుట్టకు కోట్ల రూపాయలను ఇస్తున్న కేసీఆర్... కార్మికులను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కార్మికులను కాదని గుళ్లు గోపురాలకు కోట్లు ఖర్చు చేసినా దేవుడు సహించడని అన్నారు. రియలెస్టేట్ వ్యాపారం కోసమే యాదగిరిగుట్టకు కోట్ల రూపాయలు కేటాయించారని ఆరోపించారు. 

తాటి చెట్టును ఢీ కొట్టిన కారు: ముగ్గురి మృతి

ప.గో: తాడేపల్లి గూడెం సమీపంలో తాటి చెట్టును కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

సొమ్మసిల్లిన సీపీఎం నేత పి. మధు

విజయవాడ: మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా విజయవాడ సబ్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీన్ని నిరసిస్తూ సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న నేతలను పోలీసులు ఈడ్చి అవతల పడేశారు. దీంతో చాలా మంది కార్యకర్తలు సోమ్మసిల్లి పడిపోయారు. వీరిలో సీపీఎం నేత పి.మధు, బాబూరావు, తతదితర నేతలు ఉన్నారు. 

లోక్ సభ సోమవారానికి వాయిదా...

ఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు సోమవారానికి వాయిదాపడ్డాయి. విపక్షాల ఆందోళనతో సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంమైన మొదటిరోజు నుంచి ఉభయసభలు ఆందోళనలతో దద్దరిల్లుతున్నాయి. లలిత్‌గేట్, వ్యాపమ్ కుంభకోణంపై చర్యలకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. కళంకిత మంత్రుల రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఖబడ్దార్ విజయవాడ పోలీసులు:పి.మధు

విజయవాడ: మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా విజయవాడ కలెక్టరేట్ ను వామపక్షాలు ముట్టడిటికి యత్నించాయి. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం నేత పి. మధు మాట్లాడుతూ... పోలీసులతో కార్మికుల ఆందోళన ను ఆపలేరని మండి పడ్డారు. కార్మికుల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సబ్ కలెక్టరేట్ వద్ద బైఠాయించి ధర్నా చేస్తున్న నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

11:08 - July 24, 2015

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుతున్న పోలవరం..ప్రత్యేక హోదా హక్కులపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ రెండిటిపై అధికార పక్షం, ప్రతిపక్షం ఎందుకు పోరాటం చేయడం లేదని టిడిపి, వైసీపీ పార్టీలనుద్దేశించి ప్రశ్నించారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మృతి చెందిన రైతుల కుటుంబాల తరపున పోరాడుతామని, వాళ్లు ఎంత బాధ పడుతున్నారో తనకు తెలుసన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లాలో రాహుల్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మృతి చెందిన రైతుల కుటుంబాలకు పార్టీ తరపున రాహుల్ ఆర్థిక సహాయం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాహుల్ ప్రసంగించారు.
రైతులకు అండగా ఉంటుంది..
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, రైతులు ఆందోళన చెందాల్సినవసరం లేదన్నారు. పేదల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, రైతుల భూములను బలవంతంగా లాక్కుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. రైతు అనుమతి లేకుండా భూములు సేకరించకూడదని, రైతుతో పాటు రైతుల కూలీలు లబ్ది పొందేలా చట్టం తీసుకరావడం జరిగిందన్నారు. కానీ ఒక రహస్యమైన అజెండా తీసుకొచ్చారని, ఈ ఏజెండాతో భూ సేకరణ చట్టం మార్చాలని మోడీ చూస్తున్నారని విమర్శించారు. ఇందిరాగాంధీ ఇక్కడకు వచ్చినప్పుడు తాను చిల్లపిల్లవాడినని, ఇందిరమ్మ స్పూర్తి తనలో ఉందన్నారు.
వాళ్లు ఏం చేస్తున్నారు ?
పోలవరం, ఏపీ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయం తీసుకుందని, ప్రత్యేక హోదా విషయంలో వాళ్లు వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు, ప్రధాన ప్రతిపక్షం వాళ్లు ఏమి చేస్తున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, పోలవరంలపై ఎందుకు పోరాటం చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. టిడిపి, వైసీపీ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ రాజీపడదని స్పష్టం చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ నేతలు చిరంజీవి, టి.సుబ్బిరామిరెడ్డి, కేవీపీ, జేడీ శీలం, పల్లం రాజు తదితరులు పాల్గొన్నారు. 

విజయవాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

విజయవాడ:తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా లెప్ట్ పార్టీలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించాయి. దీంతో వారి పోలీసులు అడ్డగించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగడంతో పలువురు నేతలు వూపిరాడక కింద పడిపోయారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, బాబురావు, వైసీపీ నేత గౌతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంపర్క్ ఎక్స్ప్రెస్ రైలు పార్శిల్ బోగీలో పొగలు...

వరంగల్: ఢిల్లీ నుంచి యశ్వంతపూర్‌ వెళ్లే కర్నాటక సంపర్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పార్శిల్‌ బోగీలో శుక్రవారం ఉదయం పొగలు వ్యాపించాయి. దీన్ని గుర్తించిన ప్రయాణికులు డ్రైవర్‌కు సమాచారం అందించడంతో రైలును రఘునాథ్‌పల్లి రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. సమాచారం అందిన వెంటనే రైలు సిబ్బంది అక్కడకు చేరుకుని పొగలు వ్యాపించిన బోగీని రైలునుంచి వేరు చేశారు. ఉదయం 6:15కు నిలిచిన రైలు దాదాపు మూడున్నర గంటల తర్వాత సికంద్రాబాద్‌కు చేరుకుంది.

కష్టాల్లో ఉన్న రైతులకు భరోసా ఇచ్చేందుకే వచ్చా: రాహుల్

అనంతపురం: కష్టాల్లో ఉన్న రైతులకు భరోసా ఇచ్చేందుకే ఇక్కడకు వచ్చానని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన అనంతపురం జిల్లా పర్యటనలో బహిరంగ సభలో మాట్లాడుతూ.. పేదల అభ్యన్నతికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రైతులు, చేతన కార్మికులు ఆందోళన చెందవద్దని తెలిపారు. రైతుల అనుమతితోనే భూములు సేకరించాలని చట్టం తెచ్చామని... కానీ బీజేపీ ప్రభుత్వం ఆ చట్టానికి తూటుల్ పొడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చింది. కానీ బిజెపి ప్రత్యేక హోదాను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

నిధులు లేకుండా సంపూర్ణ అక్షరాస్యతను ఎలా సాధిస్తారు: వి. కృష్ణయ్య

విజయవాడ: ప్రణాళిక, నిధులు లేకుండా సంపూర్ణ అక్షరాస్యతను ఎలా సాధిస్తారో ప్రభుత్వం వెల్లడించాలని సీపీఎం ఏపీ విద్యా కమిటీ కన్వీనర్ వి. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బడ్జెట్ లో 25 శాతం నిధులు కేటాయిస్తేనే నూరు శాతం అక్షరాస్యత సాధ్యమని...టిడిపి ఎన్నికల హామీ మేరకు ఏటా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పేదలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందించలన్నారు. తెలుగులోనే ప్రాథమిక విద్యను బోధించాలని, ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా మాత్రమే చేర్చాలని సూచించారు.మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డును అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

10:28 - July 24, 2015

భూమి కంటే పెద్ద భూమి ఏమిటి అనుకుంటున్నారా..? మీరు విన్నది నిజమే ఈ విశ్వంలో సుదూరంగా అచ్చు భూమిలాగానే ఓ గ్రహం ఉందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది భూమికిమల్లే ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతోందని, దీనికి కెప్లర్-452బి అని పేరు కూడా పెట్టామని తెలిపింది. ఇది భూమికి 1,400 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని వివరించారు. మన సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహం భూపరిమాణంతో పోలిస్తే 60 శాతం పెద్దదని వెల్లడించారు. ఆ గ్రహంపై ఉన్న వాతావరణ వివరాల గురించి కచ్చితంగా తెలియక పోయినా, రాళ్లతో నిండి భూమి కంటే ఐదు రెట్ల ఎక్కువ ద్రవ్యరాశిని కలిగివుండవచ్చని అంచనా కట్టారు. ఈ గ్రహంపై ఒక సంవత్సరానికి 385 రోజులుంటాయని పేర్కొన్నారు. భూమికన్నా 1.5 బిలియన్ సంవత్సరాల ముందు నుంచి ఇది ఉండివుండవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహం మానవ నివాసానికి అనుకూలమా? కాదా? అన్నది ఇప్పుడే చెప్పలేమని దీనిపై మరిన్ని పరిశోధనలు జరుపుతున్నామని నాసా ప్రకటించింది. 

కాళేశ్వరం పుష్కర ఘాట్లో అపశృతి

కరీంనగర్:కాళేశ్వరం పుష్కర ఘాట్లో అపశృతి చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం పుష్కరా స్నానానికి వెళ్లి ఓ వక్తి మృతి చెందాడు. మృతుడు జిల్లాలోని కథలాపూర్ మండలం తాండ్రియాల సర్పంచ్ పొనుగంటి శంకర్ గా గుర్తించారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని స్తానికుల తెలిపారు.

పుష్కరస్నానమాచరించిన తానా అధ్యక్షుడు

ప.గో: నర్సాపురం పట్టణంలోని వలంధరరేవులో తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, ఎన్‌ఆర్‌ఐ విష్ణు దోనెపూడిలు పుష్కర స్నానం ఆచరించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు మండలం పాశర్లపూడి పుష్కరఘాట్‌లో విద్యానందభారతి పుష్కరస్నానం చేశారు.

ఉరుముతున్న ఉల్లి...

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లిలో కిలో ఉల్లి ధర రూ.40 లు పలుకుతోంది. ఉల్లి ధర పెరుగుదల ద్రవ్యోల్బణం పెరుగుదలకు సూచిక అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారీ వర్షాలతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి....

ఆదిలాబాద్:జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో తిర్యాని, రెబ్బెన మండలాల్లోని డోర్లి-1, డోర్లి-2, కైరిగూడ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచి పోయింది. సిర్పూర్- ఆసిఫాబాద్ మధ్య గురువారం రాత్రి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. శుక్రవారం ఉదయం నుంచి వర్షం తగ్గుముఖం పట్టటంతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

రెండో భూమి ఉంది : నాసా

హైదరాబాద్: ఈ విశ్వంలో సుదూరంగా అచ్చు భూమిలాగానే ఓ గ్రహం ఉందని నాసా ప్రకటించింది. ఇది భూమికిమల్లే ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతోందని, దీనికి కెప్లర్-452బి అని పేరు పెట్టామని తెలిపింది. ఇది భూమికి 1,400 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని వివరించారు. మన సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహం భూపరిమాణంతో పోలిస్తే 60 శాతం పెద్దదని, ఆ గ్రహంపై ఉన్న వాతావరణ వివరాల గురించి కచ్చితంగా తెలియక పోయినా, రాళ్లతో నిండి భూమి కంటే ఐదు రెట్ల ఎక్కువ ద్రవ్యరాశిని కలిగివుండవచ్చని, ఈ గ్రహంపై ఒక సంవత్సరానికి 385 రోజులుంటాయని నాసా పేర్కొంది.

ఓబుళదేవర చెరువు గ్రామంలో మొక్క నాటిన రాహుల్ గాంధీ

అనంతపురం:రైతు భరోసా యాత్రలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓబుళదేవర చెరువు గ్రామంలో మొక్క నాటారు. 1979లో ఇందిరా గాంధీ బహిరంగ సభ నిర్వహించిన ప్రాంతంలో రాహుల్ మొక్కా నాటారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏసీబీ విచారణకు తెలంగాణ టీడీఎల్పీ కార్యాలయ ఉద్యోగి

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణకు తెలంగాణ టీడీఎల్పీ కార్యాలయ ఉద్యోగి సైదులు హాజరయ్యారు.

ఓబులదేవర చెరువులో వైఎస్ విగ్రహానికి రాహుల్ నివాళి

అనంతపురం: ఓబుల దేవర చెరువులో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ విగ్రహానికి రాహుల్ పూలదండ వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ గో బ్యాక్ అంటూ విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలియజేశారు.అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు. ఆత్మహత్య చేసుకున్న 47రైతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మోదీ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు రాహుల్ పాతయాత్ర చేపట్టారని స్పష్టం చేశారు.

నాలుగేళ్ల చిన్నారిని హింసించిన మారుతండ్రి.. ఆసుపత్రి పాలు...

రంగారెడ్డి: జవహర్ బీజేఆర్ నగర్ లో దారుణం జరిగింది. సంధ్య అనే నాలుగేళ బాలికను మారు తండ్రి హింసించడంతో అస్వస్థతకు గురైన ఆసుపత్రి పాలైంది. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారి అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయండతో విషయం బయటకు పొక్కింది.

స్కూల్ బస్ బోల్తా:30 మందికి గాయాలు...

మహబూబ్ నగర్: ఫరూక్‌నగర్‌ మండలం ఎల్లంపల్లి శివార్లలోని నేతాజీ స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 30 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులకు చికిత్స చేయించారు.

లూసియానాలో కాల్పులు:ఇద్దరి మృతి

అమెరికా: లూసియానా రాష్ట్రంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. స్థానికంగా ఉన్న థియేటర్‌లో ఓ దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అనంతరం దుండగుడు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.

రాహుల్‌ పాదయాత్ర ను అడ్డుకునేందుకు యత్నించిన టిడిపి

అనంతపురం:ఓబులదేవరచెరువు నుంచి రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో టిడిపి కార్యకర్తలు నిరసన తెలిపారు. పాదయాత్రలో భాగంగా రాహుల్‌ మామిళకుంటపల్లి, దేబురాపల్లి, కొండకమర్లలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. రాహుల్‌గాంధీ పర్యటనపై చంద్రదండు ఆందోళన చేసింది. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు దగ్గర చంద్రదండు కార్యకర్తలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. దీంతో చంద్రదండు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ప్రారంభమైన రాహుల్ పాద యాత్ర

అనంతపురం: రైతు భరోసా యాత్రలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యఓఉడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లా ఓబుళదేవర చెరువు గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించారు.

09:28 - July 24, 2015

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుష్కరాలు రేపటితో ముగియనున్నాయి. దీనితో శుక్రవారం భక్తులు భారీగ పోటెత్తుతున్నారు. పలు పుష్కర ఘాట్ లలో అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇదిలా ఉంటే శనివారం ముగియనున్న పుష్కర వేడుకలు నభూతో నభవిష్యత్ గా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. గురువు బాబా రాందేవ్ తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వందలాది ప్రముఖులు పాల్గొననున్నారు. ఇందుకు ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు ప్రధాన బాధ్యతలు అప్పచెప్పారు. గోదావరి తీరం, ఆర్ట్స్ కళాశాలలో జరిగే ముగింపు వేడుకలకు సభా వేదికల రూపకల్పన కార్యక్రమాల డిజైన్ అంతా దగ్గరుండి చూసుకుంటున్నారు. 25వ రాత్రి జరిగే నిత్యహారతి అత్యంత వైభవంగా నిర్వహించాలని తలపెట్టారు. ఇందుకు భారీ ఫోకస్ లైట్లను వినియోగించనున్నారు. నది జలాలు సప్తవర్ణ శోభితంగా కనిపించేలా తీర్చిదిద్దడంతో పాటు హరతి సమయంలో పొగలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాక పురోహితులు చదివే మంత్రాలకు భక్తులు తన్మయత్వం పొందేలా సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భారీతనం ఉట్టిపడే రీతిలో వేదికను తీర్చిదిద్దడంతో పాటు సినీ కళాకారులు, గాయకులతో సంగీత విభావరి, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. 

09:17 - July 24, 2015

అనంతపురం : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జిల్లాకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుండి విమానం ద్వారా బెంగళూరుకు చేరుకున్నారు. అనంతరం రోడ్డుమార్గాన జిల్లా కొడికొండ చెక్ పోస్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు చిరంజీవి, కేవీపీ, పల్లం రాజు, కొప్పుల రాజు తదితరులు స్వాగతం పలికారు. కార్యకర్తల హర్షధ్వానాల మధ్య కొడికొండ చెక్ పోస్టు నుండి ఆయన ఓబుళదేవర చెరువుకు బయలుదేరారు. ఓబులదేవరచెరువు నుండి రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది.
రాహుల్ పర్యటనపై టిడిపి నేతల నిరసన..
అనంతపురం జిల్లాలో రాహుల్ పర్యటను తాము వ్యతిరేకిస్తామని చెప్పిన టిడిపి నిరసనలను కొనసాగించింది. కర్నాటక - ఆంధ్రా సరిహద్దులోని కొడికొండలో టిడిపి ఆందోళన చేపట్టింది. రాహుల్ రాకను నిరసిస్తూ నల్లబ్యాడ్జీలతో నేతలు నిరసన నిర్వహించారు. కొడికొండలోని నివాసాలపై నల్ల జెండాలను ఎగురవేసింది.
ఈ సందర్భంగా పలువురు టిడిపి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
రాహుల్ షెడ్యూల్..

  • 09.00 గంటలకు ఓడీసీ మండలానికి చేరుకుంటారు. అక్కడ 1975 సంవత్సరంలో ఇందిరా గాంధీ బహిరంగ సభ నిర్వహించిన ప్రాంతంలో మొక్క నాటిన తరువాత పాదయ్రాత ప్రారంభం అవుతుంది.
  • 09.15గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తారు. అక్కడ సమీపంలో ఉన్న వైఎస్ విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులర్పిస్తారు. 
  • 09.30 నుండి 10.15 వరకు రైతులు, చేనేత కార్మికులతో రాహుల్ ముఖాముఖి నిర్వహించనున్నారు. అదే మండలంలో జీవనజ్యోతి పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతారు.
  • 11.10 నుండి 11.20 గంటల మధ్యన మామిళ్లకుంట పల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు హరనాథ్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.
  • మధ్యాహ్నాం 12.20 నుండి 1.00 గంట వరకు డబురవాండ్లపల్లిలో మహిళా సంఘాలతో మాట్లాడుతారు. తాళాలు వేసిన ఇళ్లను పరిశీలించనున్నారు.
  • మధ్యాహ్నాం 1.30 గంటలకు కొడంకమర్ల గ్రామంలో ఉపాధి హామీ పథకం, కూలీలు, వలస కుటుంబాలతో రాహుల్ మాట్లాడుతారు. ఇక్కడే పాదయాత్ర ముగియనుంది.
  • కొండకమర్ల గ్రామంలో ఎస్సీలతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. అనంతరం ఇక్కడి నుండి నేరుగా పుట్టపర్తికి చేరుకుంటారు.
  • సాయంత్రం 04.00 గంటలకు సత్యసాయి మహా సమాధిని దర్శించుకుంటారు.
  • 04.15 నుండి 5.15 గంటల వరకు విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతారు.
  • 05.15 నుండి 6.15 గంటల వరకు పార్టీ రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశం ఉంటుంది. అనంతరం రోడ్డు మార్గాన బెంగళూరు చేరుకుంటారు. 

కోచిలో ఎకో-ఫ్రెండ్లి బ్యాగులు..

కేరళ : కోచిలోని సెంట్ థెరిస్సా కళాశాలలో పర్యావరణకు అనుకూలమైన క్యారీ బ్యాగ్స్ ను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. 

అనంతకు చేరుకున్న రాహుల్..

అనంతపురం : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జిల్లాకు చేరుకున్నారు. రోడ్డు మార్గం మీదుగా కొడికొండ చెక్ పోస్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ పలువురు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. 

08:39 - July 24, 2015

1993 బాంబు పేలుళ్ల కేసులో యాకుబ్ మెమెన్ ఉరిశిక్ష విధించడంపై చర్చ జరుగుతోంది. ఉరిశిక్ష విధించడంపై పలు వాదనలు వస్తున్నాయని ది హాన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. యాకుబ్ మెమన్ ఉరిశిక్ష..అనంతపురంలో రాహుల్ పర్యటన తదితర అంశాలపై ఆయన టెన్ టివి గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో విశ్లేషణ చేశారు. ఆయన మాటల్లోనే..
ఎంతో మంది నిందితులు...
''1993 బాంబు పేలుళ్లలో ఎంతో మంది మృతి చెందారు. ఇందులో ఎంతో మంది నిందితులుగా ఉన్నారు. మెమన్ బాంబు పేలుళ్లలో సూత్రధారి. ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహిం. వీరంతా పాకిస్తాన్ కు పారిపోయారు. కానీ యాకూబ్ మెమన్ కుటుంబసభ్యుల దేశానికి వచ్చారు. ఇక్కడి కోర్టులకు..న్యాయ వ్యవస్థకు సహకారం ఇస్తూ వచ్చారు. 22 ఏళ్ల పాటు విచారణ ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అతడికి ఉరిశిక్ష విధించారు. ఇందులో పలు వాదనలు వస్తున్నాయి. ఉరిశిక్ష ఎందుకు అమలు చేయాలి ? యావజ్జీవ శిక్షగా మారిస్తే ఏంటనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతటి ఘోరం చేసిన వ్యక్తికి క్షణకాలంలో శిక్ష వేసి తప్పించాలా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. కానీ శిక్షలు తగ్గుతాయని భావించే ఇతర నేరస్తులు కూడా సహకరించే అవకాశం ఉంటుందనే ఇలా..అనేక వాదనలు వస్తున్నాయి. అసలు ఉరిశిక్ష ఎవరికి అమలు కావాలి ? పేదలు, అణగారిన వర్గాలు..ఇతరులు ఎక్కువ ఉన్నారని అధ్యయన సంస్థ పేర్కొంది. డబ్బున్న..పలుకుబడి ఉన్న వారికి ఉరిశిక్ష అమలు కావడం లేదు. ఉరిశిక్ష వల్ల ప్రయోజనం ఉంటుందా ? నేరాలు తగ్గుతాయా ? అత్యంత అరుదైన కేసులో ఉరిశిక్ష అమలు అవుతుంది. ఇది న్యాయమూర్తి నిర్ధారణకు వస్తే ఉరిశిక్ష పడుతుంది. లేకుంటే యావజ్జీవ శిక్ష పడుతుంది. యావజ్జీవ కారాగార శిక్ష ఒకవేళ అమలు చేస్తే తరువాత బయటకు వస్తాడు కదా ? ప్రజల సొమ్ముతో ఎందుకు మేపాలి ? అనేక వాదనలున్నాయి. నేరం చేయకపోయినా శిక్ష పడే అవకాశం ఉంది. ఉరిశిక్ష విధించడమే పరిష్కారమా ? దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. రాజకీయ ఏకాభిప్రాయం జరగాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ కు భరోసా యాత్ర..
ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తీరు పట్ల కాంగ్రెస్ పై ప్రజలు కోపంగా ఉన్నారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు నాటకాలాడాయి. రాష్ట్ర విభజన చిత్తశుద్ధితో చేసిందేమి కాదు. కాంగ్రెస్ కు రాజకీయ సమాధి కట్టారు. కానీ ఏ రాజకీయ పార్టీకి శాశ్వత సమాధి కట్టరు. కరువు యాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసా వస్తుందని రాహుల్ యాత్ర చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు జరుగుతుంటాయి. కానీ ప్రజలు వెళ్లలేదు. కానీ కరవు వల్ల వలస వెళ్లిపోతున్నారు. అనంతపురం జిల్లా కరవు ఆందోళన కలిగించేదే''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. అలాగే ఏపీ రాజధానికి ప్లాన్ ను ఇక్కడి ఇంజినీర్లు ఇవ్వరని అన్న సీఎం చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలపై నాగేశ్వర్ విశ్లేషించారు. 

08:14 - July 24, 2015

ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ పలు భాషా సినిమాల్లో నటిస్తూ దూసుకెళుతోంది. టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' త్వరలో విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజాగా 'శృతి'కి బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ లెటెస్ట్ మూవీ ''బాద్షాహో''లో 'శ్రుతి' హీరోయిన్ గా నటించనుందని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి డర్టీ పిక్చర్ దర్శకుడు మిలన్ లుత్రియా డైరక్షన్ వహిస్తున్నాడు. అజయ్ దేవగన్ సరసన శృతి నటించనుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగకతప్పదు. 

కార్గిల్ లో సైనికుల అప్రమత్తం..

జమ్మూ కాశ్మీర్ : కార్గీల్ సెక్టార్ లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందుకు జులై 26న విజయ్ దివస్ జరుపుకోనున్నారు. 

ట్రైన్ నుండి పడి జాతీయ ఆటగాడు మృతి..

ఉత్తర్ ప్రదేశ్ : ఓ జాతీయ ఆటగాడు రైలులో నుండి పడి మృతి చెందాడు. ఈ ఘటన మథురలో చోటు చేసుకుంది. గవర్నమెంట్ రైల్వే పోలీసులు తోసివేయడంతోనే అతను మృతి చెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అమెరికాలో కాల్పులు..ఇద్దరు మృతి..

అమెరికా : లూసియానాలోని ఓ సినిమా హాల్ లో దండుగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. కాల్పుల అనంతరం ఆగంతకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

08:01 - July 24, 2015

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. రుణాలు కోసం మహిళా సంఘాలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని అనంతపురం జిల్లా ప్రజలకు భరోసా కల్పించడానికి రాహుల్ ఈ పాదయాత్ర చేయనున్నారు. పర్యటనలో వైఎస్ విగ్రహానికి రాహుల్ పూలమాల వేయనున్నారు. దీనిపై వైసీపీ త్రీవస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాల్టీల్లో ఆస్తి పన్నును పెంచుతారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపిన తరువాతే ఇది అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఈ అంశాలపై టెన్ టివి లో జరిగిన చర్చా వేదికలో వేములపల్లి వెంకటరామయ్య (సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ), కొండా రాఘవరెడ్డి (వైసీపీ), డా.రాకేష్ (టీఆర్ఎస్), నాగూరావు నామాజి (బీజేపీ), గంగా భవాని (కాంగ్రెస్), సూర్యప్రకాశ్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.  

07:51 - July 24, 2015

'త్రిష'...ఈమె అగ్ర హీరోలందరితో స్టెప్పులేసింది. సినీ అభిమాన యువతరం గుండెల్లో గూడుకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చెన్నై చిన్నది కోలీవుడ్..టాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల ఈమె పలు సంచనాలకు కేంద్ర బిందువైంది. తాజాగా 'త్రిష' రాజకీయాల్లో ప్రవేశిస్తోందని టాక్ నడుస్తోంది. ఈమె అభిమానించే జయలలిత నేతృత్వంలో అన్నాడీఎంకేలో చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత అంటే త్రిషకు ఇష్టం. త్రిష తన ట్విట్టర్ లో సైతం జయతో దిగిన ఫొటోను పెట్టుకున్నారు. రాబోయే 2016 ఎన్నికల్లోగా అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకోవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ఈ వార్తలు నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.

రాహుల్ పర్యటనపై టీడీపీ నేతల నిరసన..

అనంతపురం : కర్నాటక - ఆంధ్రా సరిహద్దులోని కోడికొండలో టీడీపీ ఆందోళన చేపట్టింది. రాహుల్ రాకను నిరసిస్తూ నల్లబ్యాడ్జీలతో టీడీపీ నేతలు నిరసన నిర్వహించారు. కోడికొండలోని నివాసాలపై నల్ల జెండాలను ఎగురవేసింది. ఈ సందర్భంగా పలువురు టిడిపి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

 

07:48 - July 24, 2015

రెబల్ స్టార్ 'ప్రభాస్' నటించిన 'బాహుబలి' కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోలీవుడ్ నుంచి దర్శకుడు శంకర్ కూడా కితాబు ఇచ్చాడు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ ఇలా అన్ని వుడ్ లా సినీ ప్రముఖులు బాహుబలి కి జేజేలు పలుకుతున్నప్పటికీ తెలుగు టాప్ డైరెక్టర్స్ మాత్రం ఇంకా పెదవి విప్పలేదు. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, వినాయక్, శ్రీనువైట్ల 'బాహుబలి' గురించి కనీసం మాట కూడా ప్రస్తావించకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఈ దర్శకులు ఎందుకు సైలెంట్‌గా వున్నారు ? అనే చర్చ జరుగుతోంది. 'బాహుబలి'ని వీళ్లు చూడలేదా? రిలీజ్ రోజు శ్రీనువైట్ల మాత్రమే ప్రీమియర్ షో చూశారు. ఆయన కూడా పళ్లెత్తి మాట అనలేదని ప్రచారం జరుగుతోంది.

అనంతపురంకు బయలుదేరిన రాహుల్..

బెంగళూరు : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లా పర్యటనకు బయలుదేరారు. రాహుల్ కు స్వాగతం పలికేందుకు కోడికొండ చేక్ పోస్టుకు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా చేరుకున్నారు. ఆయనతో పాటు చిరంజీవి, కేవీపీ, పల్లం రాజు, కొప్పుల రాజు తదితరులు ఉన్నారు. ఓబులదేవరచెరువు నుండి రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. 

కరీంనగర్ లో ప్రైవేటు పాఠశాలల బంద్..

కరీంనగర్ : జిల్లా వ్యాప్తంగా నేడు ప్రైవేటు పాఠశాలల బంద్ పాటించనున్నాయి. తెలంగాణ విద్యార్థి హక్కుల సమాఖ్య బంద్ కు పిలుపునిచ్చింది. విద్యార్థిని అశ్విని మృతికి కారణమైన టీచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

పశ్చిమలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

పశ్చిమగోదావరి : పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జిల్లాలోని 97 ఘాట్లలో భక్తులు కిక్కిరిసిపోయాయి. ఒడిశా నుండి అత్యధికంగా పుష్కర భక్తులు తరలివస్తున్నారు.

 

తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు పుష్కరాలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలు 11వ రోజుకు చేరుకున్నాయి. గోదావరి తీరానికి భక్తులు పోటెత్తుతున్నారు. 

సిర్పూర్ - ఆసిఫాబాద్ ల మధ్య రాకపోకలు బంద్..

ఆదిలాబాద్ : సిర్పూర్ - ఆసిఫాబాద్ ల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. వర్షపునీరు కారణంగా 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 8 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5గంటలు..నడకదారి భక్తుల దర్శనానికి 4గంటల సమయం పడుతోంది.

విశాఖలో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి పర్యటన..

విశాఖపట్టణం : నేడు జిల్లాలో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి పర్యటించనున్నారు. నావికాదళం అధికారులతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ కానున్నారు. 

మహబూబ్ నగర్ లో కేశినేని బస్సు బోల్తా..

మహబూబ్ నగర్ : ఇటిక్యాల మండలం కొండేరు వద్ద కేశినేని ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. 

07:08 - July 24, 2015

సిటీ జీవితంలో నిద్రలేవగానే చాలామంది ఇల్లాల్లు వెళ్లేది గ్యాస్ పొయ్యి దగ్గరకే. ఏ ఒక్కపూట గ్యాస్ అయిపోయినా, ఇక ఆ పూట కుటుంబానికి పస్తే. అయితే, పంపిణీ విషయంలో ఏజెన్సీలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. గ్యాస్ బుక్ చేసిన ప్రతిసారీ ఏదో ఒక సందేశం వినిపించి కొత్త కొత్త కొర్రీలు పెడుతున్నాయి. వంటగ్యాస్. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అది జీవితావసరం. సబ్సిడీల భారం మోయలేమంటోంది ప్రభుత్వం. అందుకే స్వచ్ఛందంగా సబ్సిడీలు వదులుకోవాలంటూ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. మంత్రులకు ఎంపీలకూ తొలుత ఇలాంటి విన్నపాలు చేసిన కేంద్రం ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ వదులుకునే ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. స్వచ్ఛ భారత్ లాంటి పిలుపులకు స్పందించినట్టే ఇప్పుడూ కొంతమంది సెలబ్రిటీలూ, ప్రముఖులు గ్యాస్ వదులుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే స్వచ్ఛ భారత్ లో కనిపించిన సందడి, అక్కడ ప్రదర్శించిన ఉత్సాహం గ్యాస్ సబ్సిడీ వదులుకునే విషయంలో చూపడం లేదన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. సంపన్నవర్గాలు స్వచ్ఛందంగా గ్యాస్ రాయితీ వదులుకుంటే పేదలకు మరిన్ని సేవలందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సంపన్నవర్గాలు గ్యాస్ రాయితీ వదులుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తే ప్రభుత్వం చెబుతున్నట్టు పేదలకు ఎంత మేలు జరుగుతుందో చెప్పలేం కానీ, ఆ మేరకు సబ్సిడీ భారం తగ్గుతుందనడంలో సందేహం లేదు.
గ్యాస్..సెల్ ఫోన్ సందేశాలు...
అయితే, కొన్ని కోట్ల మంది గ్యాస్ వినియోగదారులతో వ్యవహరిస్తున్న తీరే అభ్యంతరకరంగా వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ బుకింగ్ కోసం ఏజెన్సీకి ఫోన్ చేసిన వెంటనే గ్యాస్ సబ్సిడీ వదులు కోవాలనుకుంటే జీరో నెంబర్ ప్రెస్ చేయండంటూ వస్తున్న సందేశాలపై విమర్శలొస్తున్నాయి. గ్యాస్ సబ్సిడీ అవసరమైన పేదలు తెలిసీ తెలియనితనంతో సెల్ ఫోన్ సందేశాలకు అనుగుణంగా నెంబర్లు ప్రెస్ చేస్తే వారికి సబ్సిడీ కట్టవ్వడం ఖాయం. తాము చేస్తున్న పొరపాటును ప్రభుత్వమూ, గ్యాస్ ఏజెన్సీలు సరిదిద్దుకుంటే ఎవరికీ అన్యాయం జరిగే అవకాశం వుండదు. గ్యాస్ వదులుకునేలా సంపన్నులను ఒప్పించడమే లక్ష్యమైతే అందుకు అవసరమైన ప్రచారం చేయడానికి ఇంకా అనేక మార్గాలున్నాయి.
లోపాలు..తీవ్ర జాప్యాలు..
ఇక గ్యాస్ పంపిణీలో లోపాలు, తీవ్ర జాప్యాలూ ఇప్పటికీ తీవ్రంగానే వెన్నాడుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో డోర్ లాక్ ప్రధాన సమస్యగా మారుతోంది. గ్యాస్ బండి వచ్చిన సమయంలో డోర్ లాక్ వుంటే మళ్లీ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. దీంతో సింగిల్ సిలెండర్ వున్నవారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. ఇక ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ బుకింగ్ లో అనేక సమస్యలొస్తున్నాయి. ఆన్ లైన్ నెంబర్ కి ఫోన్ చేస్తే, బుక్ చేయకుండా, మీ లోకల్ ఆఫీసు ఏజెన్సీని సంప్రదించడంటూ సందేశాలు వినిపిస్తున్నాయి. తీరా లోకల్ ఆఫీసుకు వెళ్తే అక్కడ సరియైన సమాధానం, పరిష్కారం లభించని దుస్థితి. ఆన్ లైన్ లో ఎందుకు బుక్ కావడంలేదో, తమను లోకల్ ఆఫీసులో ఎందుకు సంప్రదించమంటున్నారో జవాబు చెప్పేవారు లేరు. మొత్తానికి గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులతో చెడుగుడు ఆడుకుంటున్న తీరు తీవ్ర అభ్యంతరకరం. ఇప్పటికైనా గ్యాస్ ఏజెన్సీలు తాము చేస్తున్న తప్పులు సరిదిద్దుకోవాలి. వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

06:59 - July 24, 2015

గ్యాస్ వినియోగదారులను రోజుకో సమస్య వెన్నాడుతోంది. డోర్ లాక్ పేరుతో సిలిండర్ వెనక్కి వెళ్లిపోతోంది. మళ్లీ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ఆన్ లైన్ బుకింగ్ లూ తరచూ సమస్యాత్మకంగా మారుతున్నాయి. వీటికి తోడు గ్యాస్ సబ్సిడీ రద్దయ్యే ప్రమాదమూ పొంచి వుంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి ? గ్యాస్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి వున్న మార్గాలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో హైదరాబాద్ జిందాబాద్ నేత శ్రీనివాసరావు విశ్లేషించారు. 

06:39 - July 24, 2015

ఢిల్లీ : పార్లమెంటులో మోడీ సర్కారును ఇరుకున పెట్టాలని కాంగ్రెస్‌ జోరుగా దూసుకెళుతోంది. కానీ హస్తం పార్టీ జోరుకు బ్రేకులు వేసేందుకు బీజేపీ రోజుకో ఎత్తు వేస్తోంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల అవినీతి లీలలు ఒక్కోటి బయటపెడుతూ ప్రతిపక్షాన్ని ఇరుకు పెడుతోంది. మొన్న హరీష్‌ రావత్ అవినీతిని అడ్డం పెట్టుకొని ఎదురుదాడికి దిగిన బీజేపీ తాజాగా మరో కాంగ్రెస్‌ సీఎం అవినీతిని బయటపెట్టింది. వ్యాపం కుంభకోణం, లలిత్ గేట్ వ్యవహారాలపై అధికార బిజెపిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిద్దామని భావించిన కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అధికార బిజెపిని చిక్కుల్లో పడేయాలని భావించిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీఎంలు అవినీతి ఆరోపణలతో దొరికిపోతున్నారు. దీంతో బిజెపి కాంగ్రెసుపై ఎదురు దాడికి దిగుతోంది.
తెరపైకి సీఎం వీరభద్ర సింగ్‌ అవినీతి ఆరోపణలు..
పార్లమెంట్ సమావేశాల్లో బిజెపి ఆత్మరక్షణ కోసం ఎదురు దాడికి దిగూతూ కాంగ్రెస్ సీఎంల వ్యవహారాలను ముందుకు తెస్తూ కాంగ్రెసును చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేస్తోంది. నిన్న ఉత్తరాఖండ్ సిఎం హరీశ్ రావత్ అవినీతిని బయటపెట్టిన బిజెపి నేడు హిమాచల్ ప్రదేశ్ సిఎం వీరభద్రసింగ్ వ్యవహారాన్ని తవ్వి తీసింది. వీరభద్ర సింగ్ పన్ను ఎగవేతకు పాల్పడటమే కాకుండా లెక్కకు మించిన మొత్తాలను ఖాతాలో కలిగి ఉన్నారంటూ ఆధారాలు చూపింది బీజేపీ. దానికితోడు క్విడ్ ప్రో కో ద్వారా కంపెనీల నుంచి లబ్ది పొందారని తెలిపింది. ఓ విద్యుత్‌ కంపెనీ నుంచి హిమాచల్‌ సీఎం వీరభద్ర సింగ్‌ లంచం తీసుకున్నట్లుగా బీజేపీ ఆరోపిస్తోంది.
రాహుల్‌ వివరణ ఇవ్వాలి - బీజేపీ..
దీనిపై బీజేపీ ప్రతినిధి కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రద్దయిపోయిన ఓ విద్యుత్‌ సంస్థకు అనుమతిని పొడిగిస్తూ వీరభద్రసింగ్‌ ఎలా నిర్ణయం తీసుకున్నారో రాహుల్‌ తెలపాలన్నారు. వీరభద్ర ఖాతాలో ఒకకోటి ఇరవై లక్షల రూపాయలను ఓ ప్రైవేటు విద్యుత్‌ కంపెనీ జమ చేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. వెంచర్‌ ఎనర్జీ ప్రైవేటు అండ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ కంపెనీ కి చెందిన చంబా జిల్లాలోని హైడల్‌ ప్రాజెక్టు అనుమతిని 2013లో పొడిగిస్తూ వీరభద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. కాగా ఈ అనుమతుల వెనుక అవినీతి ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. అలాగే మెహ్రొలీ ప్రాంతంలో సీఎం వీరభద్ర 6 కోట్లు విలువైన ఫార్మ్‌ హౌస్‌ కొనుగోలు చేసారని, ఇది ఆదాయానికి మించిన ఆస్తికి సంబంధించింది అంటూ బీజేపీ ఆరోపణలు చేసింది.
వీలైతే సీబీఐ విచారణకు సిద్ధం - వీరభద్ర సింగ్‌..
మరో వైపు తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని వీరభద్రసింగ్ వాదిస్తున్నారు. బీజేపీ తమ నేతల తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దురుద్దేశ పూరిత రాజకీయాలకు దిగుతోందని వీరభద్ర మండిపడ్దారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐతో విచారణ చేయించినా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల దాడిని తిప్పి కొట్టేందుకు బీజేపీ ఎదురుదాడే శరణ్యంగా భావిస్తోంది. హరీష్‌ రావత్‌ ఉదంతరం తర్వాత వీరభద్రసింగ్‌ అవినీతిని తెరపైకి తెచ్చింది బీజేపీ. మరోవైపు ఇదంతా.. రాజకీయ లబ్ది కోసమే బిజెపి ప్రయత్నాలని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. మొత్తానికి రెండు ప్రధాన పార్టీలు ఒకరి అవినీతిని మరొకరు బయట పెట్టుకుంటుండటంతో అసలు విషయాలు బయటపడే అవకాశాలున్నాయని జనం అనుకుంటున్నారు.

06:37 - July 24, 2015

విశాఖపట్టణం : టీడీపీ సర్కారు మరో ప్రజావ్యతిరేక నిర్ణయానికి సిద్ధమవుతోంది. విశాఖలోని నలభై ఏళ్ళనాటి ఇందిరా జూలాజికల్‌ పార్క్ ను వేరే చోటుకు తరలించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై వామపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేటు సంస్ధలకు కట్టబెట్టాలనే ఆలోచనలో భాగంగానే సింగపూర్ సంస్ధలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. నగరానికి చేరువలో ఉన్న జూ పార్కును 1971లో 625 ఎకరాల్లో ఏర్పాటు చేసారు. రాష్ట్రంలోనే ఇది పెద్ద పార్క్. ప్రకృతి అందాల మధ్య సహజసిద్దంగా ఉన్న మూడు కొండల నడుమ జూపార్క్ ఏర్పాటైంది. అలాంటి జూ పార్కును తొలగించి కాసినో క్లబ్, నైట్ సఫారీ, ఇతర వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి ఏర్పాటును సింగపూర్ సంస్ధలకు అప్పగించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సిపిఎం ఆరోపిస్తోంది. ఈ తతంగం వెనుక టీడీపీ సర్కారు క్విడ్ ప్రోకోకు పాల్పడుతుందని సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అన్ని ప్రజాసంఘాలను కలుపుకుని ఆందోళన చేస్తామని సీపీఎం నేతలు హెచ్చరించారు.
జనాన్ని ఆలోచించప చేస్తున్న యువత..
అటు ఇండియన్ యూత్ సొసైటీ సైతం జూ పార్కును తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. కాసినో క్లబ్‌లు ఎవరికి కావాలని యువత ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఇండియన్‌ యూత్‌ సొసైటీ విశాఖలో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోంది. పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా యువత నగరంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. జనాన్ని ఆలోచింపజేస్తున్నారు.
తరలింపు నిర్ణయం తప్పు..
విశాఖ నగరానికి దగ్గర్లో ఉండే జంతుప్రదర్శనశాలను లక్షల మంది సందర్శిస్తుంటారు. జంతువులు, పక్షులు, ఇతర వన్యప్రాణులకు అనుకూలమైన, ప్రకృతి సిద్దమైన ప్రాంతంగా ఈ జూపార్కు ఉంది. ఇక్కడి నుంచి జూ పార్కును వేరే ప్రాంతానికి తరలిస్తే.. అక్కడ జంతువులు ఇమడటానికి ఏళ్లు పడుతుంది. జూపార్కు తరలింపు నిర్ణయం తప్పు అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి కార్పొరేట్ జపం చేస్తున్న చంద్రబాబు సర్కారు మనసులో ఏముందో తేలాల్సి ఉంది.

06:30 - July 24, 2015

రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు ఇప్పటికే కోట్లాది మంది భక్తులు తూర్పుతీరం చేరుకుని పవిత్ర స్నానాలు చేశారు. అయితే వీరిలో లక్షలాది మంది భక్తులు అనారోగ్యానికి గురయ్యారు. రాజమండ్రి కేంద్రంగా ఈనెల 14 నుంచి పుష్కరాలు ప్రారంభమైన నాటినుంచి అసాధారణ వాతావరణ పరిస్థితులకు తోడు, నదీజలాలు కలుషితం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వారం రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకోవడం, ఆపై మూడురోజుల నుంచి ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు పడటంతో భిన్నవాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ భిన్న వాతావరణం భక్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. గత పదిరోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో చికిత్స పొందిన భక్తుల సంఖ్యే ఇందుకు ఉదాహారణ. పలు అనారోగ్యసమస్యలతో 3 లక్షల12వేల మంది పుష్కరఘాట్ల వద్ద చికిత్స పొందారు. ఇక ఘాట్ల వద్ద కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసరంగా చికిత్స పొందిన వారిసంఖ్య 650 మందిగా ఉంది. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఎందరో చికిత్స పొందారు.
అనేక కారణాలు..
ఐతే ఈ పరిస్థితికి కారణాలను విశ్లేషిస్తే చారిత్రక నగరం రాజమండ్రికి పుష్కరస్నానం చేయడానికి సుదూరప్రాంతాల నుంచి రైళ్ళలో, రోడ్డు మార్గాల్లో రోజుల తరబడి భక్తులు ప్రయాణించడంతో, పుష్కరస్నానాలకు ముందే తీవ్ర అలసటకు గురయ్యారు. ప్రయాణాల మార్గ మధ్యలో గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో సురక్షిత మంచినీటితో పాటు, సమయానికి సరైన ఆహారం దొరక్కపోవడంతో నీరసించిపోయారు. పుణ్యస్నానాలకు క్యూలైన్లలో వేచి ఉండటంతో ఘాట్ల వద్దే రోజుకు వేలసంఖ్యలో భక్తులు కూలబడిపోయారు. అక్కడ ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో ప్రాధమిక చికిత్స చేయించుకుని భారంగానే తిరుగు ప్రయాణాలు చేసారు.
అంతంత మాత్రంగా వైద్య సేవలు...
అయితే లక్షల్లో వచ్చే రోగులకు ప్రభుత్వం అందించే వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు 10రోజుల్లో కోట్లాది మంది భక్తులు నదిలో స్నానమాచరించడంతో నదీ జలాలు కలుషితం అయినట్లు జలవనరులపై పరిశోధనలు చేసిన నిపుణులు హెచ్చరించారు. నీటి కలుషితం వల్ల వేలాది మంది భక్తులు స్నానం చేసిన తర్వాత దురదలు, అలర్జీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీర్థప్రసాదంగా నదీజలాన్ని స్వీకరించినవారు డయేరియాబారిన పడ్డారు. దీనికి తోడు పుష్కర నగరాల్లో, బయట హోటళ్ళలో సురక్షిత తాగునీరు అందుబాటులో లేకపోవడంతోనూ డయేరియా బారిన పడినట్లు తెలుస్తోంది.
వైద్యం కోసం క్యూ..
రోజు వారీగా రాజమండ్రి నగరానికి లక్షల్లో భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు రావడంతో ప్రజాసంఘాలు ప్రభుత్వ అనుమతితో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసారు. ఆ వైద్య శిబిరాలతోనూ వేలాది మంది భక్తులు వైద్యం కోసం క్యూ కడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం సరైన ప్రమాణాలతో వైద్య శిబిరాలను నిర్వహించకపోవడం, ఆపై మందులు శిబిరాల్లో లేకపోవడంతో ప్రజాసంఘాల వైద్యశిబిరాలకు ఆదరణ పెరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంకా పుష్కరాలకు నేటితోపాటు మరొక్కరోజే సమయం ఉంది. అప్రమత్తతతో వ్యవహరించకపోతే వ్యాధులు తీవ్రస్థాయిలో పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

06:28 - July 24, 2015

మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థే ఉండదంటూ పదే పదే చెప్పిన సీఎం కేసిఆర్‍ మున్సిపల్‍ కార్మికులకు కనీస వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. మహబూబ్‍నగర్‍ జిల్లా కేంద్రంలోని మున్సిపల్‍ కార్యాలయ ఆవరణలో తొమ్మిది వామపక్ష పార్టీల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న తమ్మినేని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మున్సిపల్‍ కార్మికులది న్యాయమైన కోరిక కాదా ? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. 

06:28 - July 24, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది. వేతనాలు పెంచేవరకు సమ్మె విరమించేదే లేదని కార్మికులు స్పష్టం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మెకు లెప్ట్ పార్టీలతో పాటు వైసీపీ మద్దతు తెలపడంతో సమ్మె మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు మున్సిపల్‌ సమ్మెపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ..మున్సిపల్ కార్యాలయాల ముట్టడిని చేపట్టారు.
15 రోజులుగా సమ్మె..
కనీస వేతనాలు చెల్లించకుండా..కార్మికుల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని మున్సిపల్ కార్మికుల జేఏసీ మండిపడింది. 15రోజులుగా సమ్మె చేస్తున్నా...ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మున్సిపల్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో దాదాపు 42వేల మంది మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోందని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు. సమ్మెలో భాగంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విజయవాడ కృష్ణానదిలో మున్సిపల్ కార్మికులు జలదీక్ష చేపట్టారు. అనంతరం డిప్యూటీ మేయర్ ఇంటిని మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. అయితే పోలీసులు కార్మికులను అడ్డుకోవడంతో...పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సర్కార్ పై జ'గన్' 
మరోవైపు తెలుగుదేశం ప్రభుత్వ వైఖరిపై వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. సింగపూర్ బృందానికి రెడ్‌ కార్పెట్ పరుస్తున్న సీఎం చంద్రబాబు..మున్సిపల్ కార్మికులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులను రోడ్లపైకి ఈడుస్తున్నారని ఆరోపించారు. నాలుగురోజుల్లో సమస్యలను పరిష్కరిస్తూ..కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని జగన్ డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు లెఫ్ట్‌పార్టీలు, విపక్ష పార్టీ వైసీపీ మద్దతు తెలపడంతో సమ్మె మరింత ఉధృతంగా కొనసాగే అవకాశం కన్పిస్తోంది. 

06:26 - July 24, 2015

హైదరాబాద్ : పురాతన కట్టడమైన ఉస్మానియా ఆసుపత్రి రూపురేఖలు మారిపోనున్నాయి. నిజం చెప్పాలంటే ఇక అసలు మనకు కనిపించదు. ఎందుకంటే ఉస్మానియా ఆస్పత్రిని కూల్చాలని టీఎస్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఉస్మానియాను నేలమట్టం చేసి దాని స్ధానంలో సరికొత్త ఆస్పత్రిని నిర్మించేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన అనంతరం కేసీఆర్‌ ఉస్మానియా కూల్చివేత నిర్ణయాన్ని వెల్లడించారు.
దశల వారీగా వేరే ప్రాంతానికి...
ముందుగా ఉస్మానియాను వారం రోజుల్లో దశల వారీగా వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తామన్నారు కేసీఆర్‌. హెరిటేజ్ చట్టాన్ని మార్చి అయినా సరే పాత ఉస్మానియా స్థానంలో కొత్త భవంతి నిర్మిస్తామన్నారు. ఉస్మానియా ఆస్పత్రి దుస్ధితిని స్వయంగా పరిశీలించిన ఆయన అధికారుల నుంచి పూర్తి వివరాలు తీసుకున్నారు. మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశంతో ఉస్మానియాను పరిశీలించిన అధికారులు మరమ్మత్తులు చేసినా ఉస్మానియా దుస్ధితి బాగుపడే పరిస్ధితి లేదని ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టును చూసిన టీఎస్‌ సీఎం స్వయంగా పరిశీలించారు.
ప్రభుత్వ నిర్ణయంపట్ల హర్షం..
ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేత నిర్ణయాన్ని గవర్నర్, చీఫ్‌ జస్టిస్‌ దృష్టికి తీసుకెళ్తామన్న టీఎస్ సీఎం మెడికల్ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా సహకారం తీసుకుంటామని చెప్పుకొస్తున్నారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఉస్మానియా ఆస్పత్రి స్ధానంలో కొత్త భవనాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో హర్షం వ్యక్తమవుతోంది.

ప్రొ.కబడ్డీ లీగ్ లో నేడు..

హైదరాబాద్ : ప్రొ.కబడ్డీ లీగ్ లో నేడు దబాంగ్ ఢిల్లీతో పుణెరి పల్టాన్ జట్టు ఢీకొననుంది. రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్ తో యు ముంబా జట్టు ఢీకొననుంది. రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేటి అర్థరాత్రి నుండి ఆరోగ్యమిత్రల సమ్మె..

హైదరాబాద్ : దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆరోగ్యమిత్ర కార్యకర్తలు, టీమ్ లీడర్లు నేటి అర్థరాత్రి నుండి సమ్మెలో పాల్గొననున్నారు. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి నుండి సమ్మెలో పాల్గొననున్నట్లు ఆరోగ్య శ్రీ సీఈవోకు నోటీసులు అందచేశారు. 

నేడు ఏపీలో వామపక్షాల కలెక్టరేట్ల దిగ్భందం..

విజయవాడ : మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై నేడు వామపక్షాల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దిగ్భందన కార్యక్రమం జరుగనుంది.

 

నేడు ఇందిరాపార్కు వద్ద వామపక్షాల యాత్ర ముగింపు సభ..

హైదరాబాద్ : నేడు మధ్యాహ్నాం 3.30గంటలకు ఇందిరాపార్కు వద్ద పది వామపక్షాల పార్టీల బస్సు యాత్ర ముగింపు సభ జరుగనుంది.

 

నేడు అనంతపురంలో రాహుల్ పర్యటన..

అనంతపురం : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాకు రానున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ఓబులదేవరచెరువు నుండి కొండకమర్ల వరకు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.

 

ఏనుగుమర్రి వద్ద బస్సు బోల్తా..

కర్నూలు : ఏనుగుమర్రి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బస్సు బోల్తా పడింది. 

ఆరేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం..

హైదరాబాద్ : నారాయణగూడ ముత్యాలబాగ్ లో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

Don't Miss