Activities calendar

25 July 2015

21:52 - July 25, 2015

మనం నిత్యం ఆకుకూరలు, దుంపలు, మాంసం తింటున్నాం. మరి ఈ ఆహార సంస్కృతి ఎలా అభివృద్ధి చెందింది.? దుంపలు,మొక్కలు,కందలు,పండ్లు మాంసాలను ఎవరు పరిచయం చేశారు.? ఏది తినొచ్చో, ఏది విషపూరితమైనదో ఎవరు గుర్తించారు.? వాళ్లెవరో కాదు మన ఆది గురువులు. కొండాకోనలే జీవితంగా బతికే ఆదివాసీలు. ప్రముఖ సామాజిక విశ్లేషకులు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య...సారె తిప్పు, సాలు దున్ను పుస్తకంలో ఆహార సంస్కృతి అభివృద్ధి క్రమాన్ని అక్షరీకరించారు. అందులో కొన్ని అంశాలను చూద్దాం.
ఆహార పదార్థాలను గుర్తించింది ఆదివాసీలే
ఇప్పుడు మనం తింటున్న చాలా పదార్థాలను గుర్తించిందీ, ఎంపిక చేసిందీ, ప్రామాణీకరించిందీ ఆదివాసీలే. ఈ ఉపఖండమంతా విస్తరించిన వీరు సంప్రదాయంగా మైదాన ప్రాంతాలకు దూరంగా ఉంటూ ఎక్కువగా కొండల మీద, అడవుల్లో, పొడిగా ఉండే పీఠభూమి ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
పుట్టతేనేను మొదటగా పట్టి తెచ్చింది ఆదివాసీలే
ఆదివాసీలు ఎన్నో రకాల పండ్లు తింటారు. వాటిలో కొన్ని బహుశా మన జీవితకాలంలో ఎప్పుడూ తినకపోవచ్చు. పెరుగన్నం, పిజ్జాలు కాదు..అనాస, పనస,దోస,మామిడి, సీతాఫలం, రకరకాల అరటిపండ్లు, ఇంకా ఎన్నో పండ్లను మొదటగా గుర్తించిందీ ఆదివాసీలే. నిమ్మ, నారింజ వంటి పండ్లలోని పుల్లదనాన్ని గుర్తించి, వాటిని రకరకాల పదార్ధాల్లో కలుపుకుని తినటమన్నది గుర్తించీ, తెలుసుకున్నదీ మూలవాసులే. ఎన్నో ఆరోగ్యపరమైన సుగుణాలున్న పుట్టతేనేను మొదటగా పట్టి తెచ్చిందీ వాళ్లే. ఇవాళ మనం పండిస్తున్న చాలా కూరగాయలు,పండ్లు,పూల గురించి మనకు తెలియజెప్పింది కూడా ఆదివాసీలే. అందుకే వాళ్లు మనకు ఆదిగురువులు.
వేల ఏళ్ల క్రితమే ప్రయోగాత్మకంగా పరిశీలించిన ఆదివాసీలు
తినటానికి వీలైన ఎన్నో దుంపలను, గడ్డలను తవ్వి తియ్యటం నేర్చుకున్నారు ఆదివాసీలు. కొన్నింటిని పచ్చిగా తింటే, మరికొన్నింటిని కాల్చుకుని, కొన్నింటిని ఉడికించుకుని తిన్నారు. అన్ని దుంపలూ ఒకే రుచితో ఉండవు. వాటిలో పోషక విలువలూ ఒకే రకంగా ఉండవు. కొన్ని చెట్ల పండ్లు మానవ శరీరానికి కావాల్సిన మంచి పోషకాలను ఇస్తాయి. కానీ వాటి ఆకులు అంత ఉపయోగకరమైనవి కావు. ఇందుకు టమోటాలే ఉదాహరణ. టమోటా పండ్లు మంచివే గాని దాని ఆకులు విషతుల్యమైనవి. అలాగే కొన్ని తినటానికి వీలైన, వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు గల పూలు కూడా ఉన్నాయి. వేల ఏళ్ల క్రితమే ఆదివాసీలు వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించి, మేలు చేస్తున్న పదార్థాలను తమ ఆహారంలో చేర్చుకుంటూ హానికరమైన వాటిని తిరస్కరించారు. అందుకే మన ఆహార సంస్కృతి, ఆహారపు అలవాట్లలో రుచి అన్న దాన్ని నిర్దేశించి, నిర్ధారించిన ప్రముఖమైన పాత్ర, శాస్త్రీయ జ్ఞానం వీరిదే.
ఏ జంతువు మాంసం మనుషులు తినటానికి అనువైనది.?
ఇక మాంసాహారం. ప్రపంచవ్యాప్తంగా కూడా అంతా ఇష్టంగా తినే ఆహారపదార్థం మాంసమే. ఆహారం కోసం జంతువులను వేటాడటమన్నది ఆది మానవుడికి అనివార్యమైంది. ఇప్పటి ఆదివాసీల పూర్వికులే ఏ జంతువు మాంసం మనుషులు తినటానికి అనువైనది, ఏది కాదన్న అవగాహన పెంచారు. ఎన్నింటినో పరిశీలించి చివరికి రుచికరమైన పక్షి,జంతు మాంసాలను ఎంపిక చేయటం ద్వారా వాళ్లే మన మాంసాహార సంస్కృతికి పునాది వేశారు. వాళ్లే దాన్ని అభివృద్ధి చేశారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఇష్టంగా తింటున్న పంది, పక్షి,చేప,పశు మాంసాల్ని మొదటగా కనుగొన్నది, ఆ విజ్ఞానాన్ని ఆవిష్కరించిందీ ఆదివాసీలే. మన మాంసాహార జాబితాలోకి కొత్తకొత్త వాటిని చేర్చే పనిని ఇప్పటికీ నిర్వర్తిస్తున్నది కూడా ఆదివాసీలే.
10 వేల రకాల వృక్ష జాతులను ఉపయోగించే ఆదివాసీలు
ఆదివాసీలు సుమారు 10 వేల రకాల వృక్ష జాతులను ఉపయోగిస్తారు. వీటిలో దాదాపు 8 వేల రకాలను వైద్యపరమైన అవసరాలకు, 325 రకాలను క్రిమీసంహారకాలుగాను, 425 రకాలను జిగురు,లక్క, రంగులకు వినియోగిస్తారు. అలాగే 550 రకాలను పీచు పదార్థాలకు, 3500 రకాలను ఆహారపరమైన అవసరాలకు ఉపయోగిస్తారు.
ఆదివాసీలే.. ఆదిగురువులు..
మన ఆహార సంస్కృతిని అభివృద్ధి పరచటం కోసం శరీరాలను, ప్రాణాలను పణంగా పెట్టటమే కాదు, ఆ విజ్ఞానాన్నంతా వాళ్లు ఇతరులతో పంచుకున్నారు. పాటలు, కథల రూపంలో ఆ జ్ఞానాన్ని మౌఖికంగా ఒక తరం నుంచి మరో తరానికి అందించారు. అందుకే ఆహార సంస్కృతి అభివృద్దిలో ఆదివాసీలు మనకు ఆదిగురువులు. చారిత్రకంగా మనం వాళ్లకు ఎంతో రుణపడి ఉన్నాం.

 

 

21:44 - July 25, 2015

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఢిల్లీలో హీరో ప్రభాస్‌, కృష్ణంరాజ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాహుబలి సినిమా చూడాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. అందుకు ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం.

 

21:41 - July 25, 2015

హైదరాబాద్: కోటి ఆశలతో కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణలో ఉద్యోగాల జాతరకు రంగం సిద్ధమైంది. కొద్దిరోజులుగా ఊరిస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. త్వరలో నోటిఫికేషన్లు రానున్నాయి. జాబ్స్ మేళాకు తెరలేపేందుకు కేసీఆర్ సర్కార్‌ సన్నద్ధమవుతోంది. ఉద్యోగాల భర్తీ ఉత్తర్వులపై కేసీఆర్ సంతకం చేశారు. మొత్తం 15 శాఖల్లో 15 వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేశారు. నియామకాల కోసం అభ్యర్థుల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44కు పెంచారు. పోలీస్, విద్యుత్ శాఖ మినహా అన్ని ఉద్యోగాలను టీఎస్ పీఎస్ సీ ద్వారా భర్తీ చేయనున్నారు. విద్యుత్‌ శాఖలో 2 వేల 681, పోలీస్‌, అగ్నిమాపక శాఖల్లో 8 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నాయి. పోలీస్‌ శాఖలోని ఖాళీలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, విద్యుత్‌శాఖలోని ఖాళీలను జెన్‌కో, ట్రాన్స్ కో ద్వారా భర్తీ చేస్తారు. మిగతా శాఖల్లో దాదాపు 4 వేల 300 ఉద్యోగాలకు టీఎస్ పీఎస్ సీ త్వరలోనే నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది.

 

హైదరాబాద్ లో కమాండ్ ఆండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు:కేసీఆర్

హైదరాబాద్: నగరంలో అంతర్జాతీయస్థాయిలో కమాండ్ ఆండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. బంజారాహిల్స్ లో సిటీ పోలీస్ కమిషనరేట్ కు ఇచ్చిన స్థలంలో కమాండ్ ఆండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు.

 

కాళేశ్వరంలో పుష్కరాల ముగింపు వేడుకలు...

కరీంనగర్: కాళేశ్వరంలో గోదావరి పుష్కరాల ముగింపు వేడుకలు ఘనం జరిగాయి. ఈ వేడుకలకు స్పీకర్ మధుసూదనాచారి హాజరయ్యారు.

 

21:20 - July 25, 2015

దేశంలో పట్టణాలు విషపూరితం అయ్యాయని హైదరాబాద్ జిందాబాద్ సమన్వయకర్త పాశం యాదగిరి అన్నారు. రేపు 'హైదరాబాద్ జిందాబాద్ పౌర వేదిక రేపు ఆవిర్భావం కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ జిందాబాద్ సమన్వయకర్త పాశం యాదగిరితో టెన్ టివి ప్రత్యేక చర్చ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ.. వివరాలను ఆయన మాటల్లోనే చూద్దాం....
'మనిషి, మనిషి మనుగడ వర్ధిల్లాలి. నీతి ఉంటే మనిషి ఉంటాడు... అవినీతి ఉంటే మనిషి ఉండలేడు. పట్టణాలలో కాలుష్యాన్ని పారదోలాలంటే.. రాజకీయేతర శక్తిగా ఎదగాలి. రాజకీయాలకతీతంగా మనిషిగా ఆలోచించాలి. ఉమ్మడి సమస్యలపై మాట్లాడడానికి వేదిక కావాలి. ప్రజలు ఏకం కావాలని చూస్తారు. ఉమ్మడి సమస్యల కోసం.. ఉమ్మడి వేదిక ఉండాలి. హైదరాబాద్.. జీవనానికి అనుకూలంగా ఉండాలి. ఒకే హృదయ.. ఒకే గొంతుక ఉండాలి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:01 - July 25, 2015

సమాజానికి మొట్టమొదటి మెట్టు ఆదివాసులని ప్రొ.కంచె ఐలయ్య అన్నారు. 'జన చరిత..శ్రమైక జీనవ విశ్లేషణ' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. సమాజంలో మనం తింటున్న ప్రతి వస్తువుతో ఆదివాసులకు పరిచయం ఉందన్నారు. ప్రకృతిలో లభించే పండ్లు, కాయలను పరీక్షించి.. ఆహారం రూపంలో అందించారని చెప్పారు. ప్రపంచ సమాజం.. ఆదివాసులకు రుణపడి ఉందన్నారు. వారి జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన అవసరముందని చెప్పారు. ఆదివాసులను నిర్లక్ష్యం చేయడంతో దేశం సాంస్కృతిక రంగాన్ని కోల్పోయిందని వాపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:50 - July 25, 2015

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె ముగిసింది. అయితే విధులకు హాజరవుతూనే సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాలు వెల్లడించాయి. సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సక్రమంగా లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.ఏ. గఫూర్ అన్నారు. కార్మిక సంఘాల నేతలతో రాజమండ్రిలో జరిగే చర్చలను అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. తోటి కార్మిక సంఘాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయన్న గఫూర్....విధులకు హాజరవుతూ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం పెంచిన 11 వేల జీతం ఏ మూలకు సరిపోదని.. బాధతోనే మున్సిపల్‌ కార్మికుల సమ్మెను విరమిస్తున్నట్లు గఫూర్‌ తెలిపారు. కొన్ని కార్మిక సంఘాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయన్నారు. తీవ్రమైన అభ్యంతరాలున్నానిరసనతోనే తామూ సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం తమకు సమ్మతం కాదన్నారు. ప్రస్తుతానికి సమ్మె విరమించినా భవిష్యత్‌లో తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

 

ఖాళీ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి విడతలో 15 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. ఫైల్ పై కేసీఆర్ సంతకం చేశారు. తొలివిడతలో వ్యవసాయ, వైద్యం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , పంచాయతీ రాజ్, విద్యుత్, పోలీస్ శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. అదేవిధంగా నిరుద్యోగుల వయోపరిమితి పదేళ్లకు పెంచారు. నిరుద్యోగుల వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచారు.

 

 

20:33 - July 25, 2015

శ్రీకాకుళం: కేంద్ర పర్యావరణశాఖ ఉపసంఘం సభ్యుల పర్యటన పట్ల శ్రీకాకుళం జిల్లా వాసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి డివిజన్‌లోని కాకరపల్లి పవర్ ప్లాంట్ నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదులు, పర్యావరణ అనుమతులు, నిర్మాణ పనులు విషయంపై సబ్ కమిటీ పరిశీలించనుంది. అయితే.. ఈ బృందం పర్యటన వివరాలు అధికారులు గోప్యంగా ఉంచారు. ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, ఆర్ డివో వెంకటేశ్వరరావు ఇతర అధికారులు తొలుత టెక్కలి ఆర్ డివో కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా థర్మల్ వ్యతిరేఖ పోరాట కమిటీ ప్రతినిధులు కేంద్ర బృందానికి వినతి పత్రం సమర్పించారు. భావనపాడు వద్ద 14 కిలోమీటర్ల మేర తవ్విన కాలువను పరిశీలించాలని కోరారు. ఇటు సంతబొమ్మాలి మండలం వడ్డితాండ్ర వద్ద కేంద్ర బృందాన్ని స్థానికులు అడ్డుకున్నారు.

20:28 - July 25, 2015

అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా రొద్దంలో భరోసా యాత్ర నిర్వహిస్తున్న ఆయన...రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా చంద్రబాబు స్పందించడం లేదని మండిపడ్డారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా హంద్రినీవా చూపించి.. తానే నీళ్లు ఇచ్చినట్లు చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ అభివృద్ధిని చూపించి తన స్టాంప్‌ వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అంతకుముందు పి. కొత్తపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు లక్ష్మణ్‌ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

 

20:13 - July 25, 2015

కర్నూలు: ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబుకు అవమానం జరిగింది. కర్నూలులో తలపెట్టిన ఆత్మీయ సభకు విచ్చేసిన అశోక్‌బాబుకు వ్యతిరేకంగా రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్‌ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 'రాష్ట్ర విభజన ద్రోహి గో బ్యాక్‌' అంటూ నినాదాలు చేశారు. సభావేదిక వద్దకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాయలసీమ వెనుకబాటు తనంపై మాట్లాడేందుకు వెళ్లిన తమపై అశోక్‌బాబు దాడి చేయించారని విద్యార్థి నేతలు ఆరోపించారు. అశోక్‌బాబుపై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

 

20:10 - July 25, 2015

కర్నూలు: ఆదర్శంగా నిలవాల్సిన ఓ విద్యార్థి నాయకుడు.. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి చెప్పు దెబ్బలు తిన్నాడు. బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీవీపీ జిల్లా నాయకుడికి ప్రజలు బడితపూజ చేశారు. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం కటారుకొండ గ్రామానికి చెందిన భాస్కర్‌.. ఏబీవీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు. గ్రామ శివారులో భాస్కర్‌.. మరో ఇద్దరితో కలిసి మద్యం తాగుతూ అటు నుంచి వెళ్తున్న ఓ మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో.. బాధిత మహిళ ఈ విషయాన్ని స్థానికులకు తెలిపింది. వెంటనే స్పందించిన గ్రామస్తులు.. భాస్కర్‌, అతడి స్నేహితులకు దేహశుద్ధి చేశారు. చొక్కాలు విప్పించి మరీ చితకబాది, పోలీసులకు అప్పగించారు.

 

20:03 - July 25, 2015

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రంలో నిరంకుశ పాలనను నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చేపడుతున్న దీక్షా శిబిరానికి వచ్చిన కిషన్‌రెడ్డి.. ఆయనకు మద్దతు తెలిపారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం సమ్మె చేపడుతున్న మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు చేపడుతోందని ఆరోపించారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

20:00 - July 25, 2015

నల్గొండ: జిల్లాలోని పోచంపల్లిలో విషాదం నెలకొంది. వేతనాల పెంపు కోసం దీక్ష చేస్తూ...గ్రామపంచాయతీ కార్మికుడు చెంపాట యాదయ్య మృతి చెందాడు. దీక్షా శిబిరం దగ్గరే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. కార్మికుల వేతనాలు పెంచాలంటూ గ్రామంలో కొన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. యాదయ్య మృతదేహంతో సీఐటీయూ, టీడీపీ, ఎంఆర్ పిఎస్ నాయకులు...ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

 

19:54 - July 25, 2015

హైదరాబాద్: ప్రోవోగ్‌ మిస్టర్‌ ఇండియా-2015 టైటిల్‌ హైదరాబాద్‌ వాసికి దక్కింది. దేశవ్యాప్తంగా 10 వేల మంది పాల్గొన్న ఈ పోటీలో రోహిత్‌ కండేవాల్‌ మిస్టర్‌ ఇండియాగా నిలిచాడు. మొదటి రన్నరప్‌గా బెంగళూరుకు చెందిన రాహుల్‌ రాజశేఖరన్‌,.. సెకండ్‌ రన్నరప్‌గా ముంబైకు చెందిన ప్రతీక్‌ గుజ్రాల్‌ ఎంపికయ్యారు. విజేతలకు బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనాకపూర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్‌ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు.

 

19:50 - July 25, 2015

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ హయాంలో రైల్వేలకు దుర్దశ పట్టిందని ఆర్జేడి అధ్యక్షుడు, మాజీ రైల్వే మంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. యుపిఏ హయాంలో తాను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రూపొందించిన ప్రాజెక్టులే తప్ప కొత్తగా ఏవీ ప్రకటించలేదని విమర్శించారు. బీహార్‌లో తాము ప్రారంభించిన ప్రాజెక్టులకే అతీ గతీ లేకుండా పోయిందన్నారు. ఒక్క ఈంచ్‌ కూడా ముందుకు కదలలేదన్నారు.

 

బాసరలో సరస్వతీ అమ్మవారికి పల్లకి సేవ

ఆదిలాబాద్: బాసరలో సరస్వతీ అమ్మవారికి పల్లకి సేవ నిర్వహిస్తున్నారు. పుష్కర ఘాట్ వద్ద సరస్వతీ అమ్మవారికి తెప్పోత్సవం జరుగుతోంది.

కొవ్వూరులో ఘనంగా పుష్కరాల ముగింపు వేడుకలు

పశ్చిమగోదావరి: కొవ్వూరులో గోదావరి పుష్కరాల ముగింపు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు.. గోదావరి హారతి ఇచ్చి నదిలో దీపాలు వదిలారు. 

రాజమండ్రిలో ఘనంగా గోదావరి హారతి..

తూర్పుగోదావరి: రాజమండ్రిలో గోదావరి పుష్కరాల ముగింపు వేడుకల సందర్భంగా ఘనంగా గోదావరి హారతి ఇస్తున్నారు. గోదావరి హారతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు, బాబా రాందేవ్ హాజరయ్యారు.

 

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన గోదావరి పుష్కరాలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు ముగిశాయి. సాయంత్రం 6.38 గంటలకు పుష్కరాలు ముగిశాయి. 12 రోజులపాటు పుష్కరాలు కొనసాగాయి. 

రాజమండ్రిలో ఘనంగా పుస్కరాల ముగింపు వేడుకలు

తూర్పుగోదావరి: రాజమండ్రిలో పుస్కరాల ముగింపు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ చే గాత్ర కచేరి ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రులు హాజరయ్యారు. 

18:48 - July 25, 2015

గుంటూరు: రిషితేశ్వరి మృతికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కాంతీలాల్ దండే అన్నారు. నాగార్జున యూనివర్సిటీని జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే, అర్బన్‌ ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇతర వ్యక్తులు వర్సిటీలోకి ప్రవేశించకుండా నెలరోజుల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. విద్యార్థినుల హాస్టల్‌కు రక్షణ పెంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

 

18:40 - July 25, 2015

హైదరాబాద్: టిడిపి ప్రభుత్వంపై వైసీపీ నేత రోజా మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో ఆడపిల్లలు, మహిళా అధికారులపైనా.. దాడులు జరుగుతున్నా ఏపీ సీఎం పట్టించుకోవడం లేదన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఘటన జరిగి ఇన్నిరోజులైనా.. సంబంధితవారిపై చర్యలు తీసుకోవడం విమర్శించారు. రిషితేశ్వరి మృతికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.

 

18:31 - July 25, 2015

చంఢీఘర్: హర్యానా బుడతడు శుభమ్ జగ్లాన్ చరిత్ర సృష్టించాడు. కేవలం పదేళ్ళ చిరుప్రాయంలోనే ప్రపంచ జూనియర్ గోల్ఫ్ లో రెండు టైటిల్స్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. హర్యానాలోని ఓ పాలవ్యాపారి కుటుంబం నుంచి గోల్ఫ్ లోకి దూసుకొచ్చిన శుభమ్...అమెరికాలోని లాస్ వెగాస్ ఏంజెల్ పార్క్ లో ముగిసిన ప్రపంచ టైటిల్ సమరంలో అమెరికాకు చెందిన సిహాన్ సంధు, జస్టిన్ డాంగ్ లతో పాటు థాయ్ లాండ్ గోల్ఫర్ పోంగ్సాపక్ లావోపక్డీలను అధిగమించాడు. అంతేకాదు శఆన్ డియాగోలో ముగిసిన మరో టోర్నీలో సైతం శుభమ్ విజేతగా నిలిచాడు. వారంరోజుల వ్యవధిలో రెండు ప్రపంచ జూనియర్ టైటిల్స్ సాధించిన తొలిభారత గోల్ఫర్ గా నిలిచాడు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం, ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ అండదండలతోనే తాను ఈ విజయం సాధించానని శుభమ్ చెబుతున్నాడు. భారత గోల్ఫ్ చరిత్రలో ఈఘనత సాధించిన తొలి ఆటగాడు శుభమ్ మాత్రమే కావడం విశేషం.

 

18:28 - July 25, 2015

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ టాప్ సీడింగ్ జోడీ గుత్తా జ్వాల, అశ్వినీల కష్టాలు ఎట్టకేలకు తీరాయి. తమకు స్పెషలిస్ట్ కోచ్ లేరంటూ జ్వాల, అశ్వనీజోడీ పదేపదే మొరపెట్టుకొన్న సంగతి కూడా తెలిసిందే. అయితే మలేసియాకు చెందిన ప్రముఖ శిక్షకుడు కిమ్ టాన్ తో భారత బ్యాడ్మింటన్ సంఘం ఐదేళ్ల కాంట్రాక్టు కుదుర్చుకుంది. దీంతో భారత డబుల్స్ క్రీడాకారులకు ఈ స్పెషలిస్ట్ కోచ్ సేవలు అందనున్నాయి. అయితే జ్వాలాజోడీ..గోపీచంద్ అకాడమీలో మాత్రమే శిక్షణ పొందాలంటూ భారత బ్యాడ్మింటన్ సంఘం చెబుతోంది. దీనికి జ్వాలా జోడీ సానుకూలంగా స్పందిస్తారా?..లేక వ్యతిరేకిస్తారా ? అన్నదే ఇక్కడి అసలు పాయింట్.

18:25 - July 25, 2015

చిత్తూరు: తిరుపతిలో సైకో వీరంగం సృష్టించాడు. బ్లేడుతో గొంతుకోసుకొని నానా హంగామా చేశాడు. తిరుపతి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వచ్చి.. అందర్నీ చంపేస్తానంటూ కొద్ది సేపు హంగామా చేశాడు. సైకోను పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్ లో 10 వామపక్షపార్టీల సమావేశం..

హైదరాబాద్: సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 10 వామపక్ష పార్టీల సమావేశం జరుగుతోంది. భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, ఇతర వామపక్షపార్టీల నేతలు హాజరయ్యారు. 

17:47 - July 25, 2015

ఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో సంచలన తీర్పు వెలువడింది. స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు లేవని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. 16 మంది క్రికెటర్లనూ ఢిల్లీ హైకోర్టు నిర్ధోషులుగా తేల్చింది. రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లను నిర్ధోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. వారిపై నమోదైన అన్ని అభియోగాలనూ కోర్టు కొట్టివేసింది. దీంతో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాకు ఊరట లభించింది. అంతకముందు శ్రీశాంత్, చండీలా, చవాన్ లపై ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ముగ్గురు క్రికెటర్లూ మూడేళ్లు నిషేధం ఎదుర్కొన్నారు. అయితే కోర్టు తీర్పు అనంతరం శ్రీశాంత్ ఆనందంతో కన్నీటిపర్యంతమయ్యారు. మైదానంలో మళ్లీ అడుగుపెట్టాలనుకుంటున్నానని శ్రీశాంత్ తెలిపారు. ప్రాక్టీస్ మొదలు పెడతా.. సెలక్టర్లను మెప్పిస్తానని చెప్పారు.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో తీర్పు వెల్లడి..

ఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో తీర్పు వెలువడింది. 16 మంది క్రికెటర్లనూ ఢిల్లీ పాటియాల కోర్టు నిర్ధోషులుగా తేల్చింది. స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. వారిపై నమోదైన అన్ని అభియోగాలనూ కోర్టు కొట్టేసింది. దీంతో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాకు ఊరట లభించింది. కోర్టు తీర్పు అనంతరం ఆనందంతో శ్రీశాంత్ కన్నీటిపర్యంతమయ్యారు.

 

రేపు 'హైదరాబాద్ జిందాబాద్ పౌరవేదిక' ఆవిర్భావ సభ

హైదరాబాద్: రవీంద్రభారతిలో రేపు ఉదయం 10 గంటలకు 'హైదరాబాద్ జిందాబాద్ పౌరవేదిక' ఆవిర్భావ సభ జరుగనుంది. ఈ సభలో జస్టిస్ చంద్రకుమార్, మాడభూషి శ్రీధర్ తదితరులు పాల్గోనున్నారు.

 

మెదక్ జిల్లాలో విషాదం..

మెదక్: జిల్లాలో విషాదం నెలకొంది. జహారాబాద్ లో బైక్-లారీ ఢీ కొని దంపతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఇన్నోవా వాహనంలో తీసుకెళ్తుండగా.. దిగ్భాల్ వద్ద మరోసారి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

ఎపిలో మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ

రాజమండ్రి: మున్సిపల్ కార్మిక సంఘాల జెఎసితో ఎపి మంత్రులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి విధులకు హాజరుకానున్నట్లు తెలిపారు. 

బీహార్ లో మోడీ ఎన్నికల ప్రచారం..

బీహార్: ముజఫర్ పూర్ లో ప్రధాని నరంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ 'బీహార్ లో ఒకసారి బిజెపికి అధికారం ఇవ్వండి.. ఏడు నెలల్లో మీరు కోరుకున్న జీవితాన్ని అందిస్తాం' అని ప్రధాని అన్నారు. 

ఎఎన్ యూలో పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్-అర్బన్ ఎస్పీ

గుంటూరు: నాగార్జున యూనివర్సిటీలో పరిస్థితిని జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, అర్బన్ ఎస్పీ త్రిపాఠిలు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కొన్ని శక్తులు యూనివర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయనే సమాచారం తమ వద్ద ఉందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థిని మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నెల రోజుల్లో యూనివర్సిటీలో బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 

జమ్మూకాశ్మీర్ లో గ్రనేడ్ పేలుడు..

జమ్మూకాశ్మీర్: అనంతనాగ్ లో గ్రనేడ్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. 

16:40 - July 25, 2015

పాట్నా: బీహార్ అభివృద్ధికి 50 వేల కోట్ల ప్యాకేజ్ ప్రకటించాలనుందని... ఐతే అది రాష్ట్రానికి ఏమాత్రం సరిపోదని... అందువల్లే ఆ ప్యాకేజ్ ప్రకటించట్లేదని... ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఉదయం బీహార్‌ చేరుకున్న ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాట్నాలో దీన్‌ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్‌ జ్యోతి యోజన కార్యక్రమంతో పాటు... దనియవా-బిహార్‌షరిఫ్‌ రైల్వే లైన్‌, పాట్నా-ముంబై ఏసీ ఎక్స్ ప్రెస్‌ను ప్రారంభించారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ అన్నట్లు.. వాజ్‌పేయి హయాంలో ప్రారంభమైన రైల్వే ప్రాజెక్టులను.. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, రైల్వే మంత్రులు పట్టించుకోలేదని.. ప్రధాని మోడీ అంగీకరించారు. అభివృద్ధి పనుల్లో ఇలాంటి స్పర్థలు ఆమోదయోగ్యం కాదని హితువు పలికారు. 

16:32 - July 25, 2015

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో తెలుగు యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ములకలపల్లి నవీన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. కారులో ఇంటికివస్తుండగా మంచులో దారి కనిపించక కరెంటు స్తంభానికి ఢీకొట్టాడు. దీంతో నవీన్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 

16:24 - July 25, 2015

విజయవాడ: డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. 15 రోజులుగా నిరసనలు చేపడుతున్న మున్సిపల్ కార్మికులు.. ఇవాళ విజయవాడలో నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గపూర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేషు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్‌లు నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు గొడ్డు చాకిరి చేస్తున్నా.. ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదని విమర్శించారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెను అణిచివేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

 

16:20 - July 25, 2015

వరంగల్: చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న మున్సిపల్‌ కార్మికులను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఆయన సమ్మెకు మద్దతు తెలిపారు. తాను తలచుకుంటే మంత్రేకాదు మరే ఇతర పదవులైనా నడుచుకుంటూ వస్తాయని అన్నారు.

16:13 - July 25, 2015

హైదరాబాద్: మున్సిపల్ కార్మిక సంఘాలతో ఎపి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కార్మిక సంఘాల నేతలతో మంత్రి నారాయణ రెండో దఫా చర్చలు జరుపుతున్నారు. అంతకముందు మొదటి దఫా చర్చలు జరిగాయి. అయితే కనీస వేతనం రూ. 11 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కార్మిక సంఘాలు మాత్రం రూ. 15, 430 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. చర్చలకు సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాల నేతలు హాజరయ్యారు.

 

15:59 - July 25, 2015

విశాఖ: జిల్లాలోని పూడిమడకలో కొత్తగా నిర్మించబోయే ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌ను అడ్డుకుంటామని సీపీఎం హెచ్చరించింది. పర్యావరణాన్ని దెబ్బతీసే ఎన్టీపీసీ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం వద్దని ఆ పార్టీ సీనియర్ నేత నర్సింగరావు విజ్ఞప్తి చేశారు. పరవాడ ఎన్టీపీసీతో పడుతున్న కష్టాలు చాలనీ, మరో పవర్ ప్రాజెక్టుతో పచ్చని గ్రామాలను కాలుష్యమయం చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. అగస్టు 12న నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని నర్సింగరావు తెలిపారు.

15:53 - July 25, 2015

హైదరాబాద్: జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రజాసమస్యలపై పోరాడుతున్న రేవంత్‌రెడ్డిపై దాడులు చేసేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నట్లు అనుమానాలున్నాయని రేవంత్‌రెడ్డి సోదరుడు ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని.. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళనగా ఉందని ఆయన వాపోయారు.

15:49 - July 25, 2015

చిత్తూరు: టీటీడీలో ఖాళీగాఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీచేయాలంటూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. శాసనమండలి సభ్యుడు యండపల్లి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ పాలనా భవనం ముందు ధర్నా చేశారు. ఈ నిరసనకు డివైఎఫ్ఐ, ఎస్ ఎఫ్ ఐ సంఘాలు సంఘీభావం తెలిపాయి.

 

తిరుపతిలో సైకో వీరంగం...

చిత్తూరు: తిరుపతిలో సైకో వీరంగం సృష్టించాడు. బ్లేడుతో గొంతుకోసుకొని నానా హంగామా చేశాడు. తిరుపతి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వచ్చి.. అందర్నీ చంపేస్తానంటూ కొద్ది సేపు హంగామా చేశాడు. సైకోను పోలీసులు అరెస్టు చేశారు. 

మున్సిపల్ కార్మికులతో మంత్రి నారాయణ చర్చలు

రాజమండ్రి: మున్సిపల్ కార్మిక సంఘాల జెఎసితో మంత్రి నారాయణ తొలి దఫా చర్చలు ముగిశాయి. కాసేపట్లో మరోసారి భేటీ కానున్నారు.

 

మా అన్నకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే:రేవంత్‌ సోదరుడు

హైదరాబాద్:జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రజాసమస్యలపై పోరాడుతున్న రేవంత్‌రెడ్డిపై దాడులు చేసేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నట్లు అనుమానాలున్నాయని రేవంత్‌రెడ్డి సోదరుడు ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనఉందని ఆయన అన్నారు. తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఆందోళనగా ఉందని ఆయన అన్నారు. 

13:42 - July 25, 2015

రాజమండ్రి: రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజనరేంద్రుడికి సీఎం చంద్రబాబు ఘనమైన నివాళులర్పించారు. రాజరాజనరేంద్రుడు 40 ఏళ్లు సుపరిపాలన అందించారని చంద్రబాబు ఆయనను కీర్తించారు. ఆయన పాలనలో ప్రజలందరూ సుఖంగా గడిపారన్నారు. రాజరాజనరేంద్రుడి కాలం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిందని చంద్రబాబు అన్నారు. ప్రస్తుత పాలకులకు రాజరాజ నరేంద్రుడు మార్గదర్శి అని పొగిడారు. దేశానికి మంచి పనులు చేసిన వారిని గుర్తుంచుకొని.. భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు. 

13:41 - July 25, 2015

విశాఖ:తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. మున్సిపల్‌ కార్మికులు విశాఖలో బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇంటిని ముట్టడించారు. మహిళా కార్మికులు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కార్మికులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. 

13:39 - July 25, 2015

శ్రీకాకుళం:కేంద్ర పర్యావరణశాఖ ఉపసంఘం సభ్యుల పర్యటన పట్ల శ్రీకాకుళం జిల్లా వాసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి డివిజన్‌లోని కాకరపల్లి పవర్ ప్లాంట్ నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదులు, పర్యావరణ అనుమతులు, నిర్మాణ పనులు విషయంపై సబ్ కమిటీ పరిశీలించనుంది. అయితే.. ఈ బృందం పర్యటన వివరాలు అధికారులు గోప్యంగా ఉంచారు. ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, ఆర్డీఓ వెంకటేశ్వరరావు ఇతర అధికారులు తొలుత టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా థర్మల్ వ్యతిరేఖ పోరాట కమిటీ ప్రతినిధులు కేంద్ర బృందానికి వినతి పత్రం సమర్పించారు. భావనపాడు వద్ద 14 కిలోమీటర్ల మేర తవ్విన కాలువను పరిశీలించాలని కోరారు. ఇటు సంతబొమ్మాలి మండలం వడ్డితాండ్ర వద్ద కేంద్ర బృందాన్ని స్థానికులు అడ్డుకున్నారు.

13:37 - July 25, 2015

విశాఖం ప్రముఖ విరసం కవి చలసాని ప్రసాద్ గుండెపోటుతో చనిపోయారు. విశాఖలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో 1932 డిసెంబర్ 8న జన్మించిన ఈ విప్లవ రచయిత తెలుగు సాహిత్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. విరసం వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రసాద్ కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుశిక్ష అనుభవించారు. శ్రీశ్రీ, కొడవటిగంటి, రావిశాస్త్రి వంటి ప్రముఖలతో సాన్నిహిత్యం ఉంది. సాహిత్యం, సినిమాలపై లోతైన అవగాహనతో ఆయన రచనలు ఉంటాయి.

13:34 - July 25, 2015

గుంటూరు:నాగార్జున యూనివర్శిటీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు.. బెటాలియన్ పోలీసులు వర్శిటీలో కాపలా కాస్తున్నారు.. తమ గదులు ఖాళీచేయబోమంటున్న విద్యార్థులను బలవంతంగా బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.. అటు రితికేశ్వరి ఘటన తర్వాత రెండుగా విడిపోయాయి విద్యార్థి సంఘాలు.. కుల విద్యార్థి సంఘాలు ఒకవైపు... మిగతా సంఘాలు మరోవైపుకు చేరాయి.. యూనివర్శిటీలో కులాల బోర్డులు తొలగించొద్దంటూ కుల విద్యార్థి సంఘాలు వీసీ ఛాంబర్ ముందు ఆందోళనకు దిగాయి.. రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశాయి.. అటు రిజిస్ట్రార్ మాత్రం పదిరోజులతర్వాత యూనివర్శిటీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెబుతున్నాయి... ఐడీ కార్డుల జారీ తర్వాత నాన్ బోర్డర్ల హంగామా తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు.. అటు పోలీసులు ఎన్‌జీయూలో అంతా ప్రశాంతంగానే ఉందంటున్నారు..

ఏసీబీ వలలో సబ్ ట్రెజరీ ఆఫీసర్

పశ్చిమగోదావరి:పెనుగొండ సబ్ ట్రెజరీ అధికారి ముద్రగడ వెంకట శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శనివారం సబ్ ట్రెజరీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్నుంచి రూ.6,400 స్వాధీనం చేసుకున్నారు. 16 మంది టీచర్లకు రావాల్సిన బకాయిలను మంజూరు చేసేందుకు ఒక్కొక్కరు రూ.400 లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్టు సమాచారం. దాంతో టీచర్లు ఏసీబీకి సమాచారం అందించగా, శనివారం దాడులు నిర్వహించి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఆ ఒక్కడ్ని నేనే అంటున్న వైఎస్ జగన్...

అనంతపురం:రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించేది ఒక్క జగనేనన్న విషయం ప్రజలందరికీ తెలుసు అని వైఎస్ జగన్ అన్నారు. రైతు భరోసా యాత్ర పేరిట అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని, సుఖశాంతులతో ఉన్నారని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చెప్పడం సిగ్గుచేటని జగన్ నిప్పులు చెరిగారు.  

జెమినీ ఫిలిం సర్క్యూట్ పై కేసు నమోదు..

హైదరాబాద్:సినిమా నిర్మాణం కోసం తీసుకున్న అప్పును చెల్లించకపోవడంతో పాటు సినిమా హక్కులను మరో సంస్థకు విక్రయించిన జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని సాగర్ సొసైటీలో ఉన్న వెంకటేశ్వర ఫైనాన్షియర్స్ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వద్ద నుంచి జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణ సంస్థ తమిళంలో నిర్మిస్తున్న మజగజ రాజ అనే సినిమా కోసం రూ.7.5కోట్లను రుణంగా తీసుకుంది. ఈ మొత్తాన్ని వాయిదాల పద్ధ్దతిలో చెల్లిస్తామని ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.

మంత్రి కడియం ఇంటిని ముట్టడించిన కార్మికులు

వరంగల్: హన్మకొండలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంటిని గ్రామపంచాయితీ, మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసులు కార్మికులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

అశోక్ బాబుకు సన్మానం.... ఆందోళన...

కర్నూలు: జిల్లా కలెక్టరేట్ లోని సునైనా ఆడిటోరియంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా అడిటోరియం ఎదుట రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆందోళన చేపట్టింది.అశోక్ బాబు రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. అశోక్ బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన కారుల్ని అరెస్టు చేశారు.

కామాంధుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల ఆందోళన

కర్నూలు: మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు ఖాజాఖాన్‌ను కఠినంగా శిక్షించాలంటూ జిల్లాలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి కామాంధుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నూలు నగరంలోని రాజ్‌విహార్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు మహిళలు పలు స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మైనర్‌ బాలిక జీవితాన్ని నాశనం చేసిన రేపటిస్టు ఖాజాను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్‌ చేశారు.

పుష్కర స్నానం చేసిన డీజీపీ జేవీ రాముడు...

ప.గో : ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ జేవీరాముడు కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో పుష్కరస్నానం చేశారు. సతీసమేతంగా వచ్చిన డీజీపీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

12:49 - July 25, 2015

పశ్చిమగోదావరి:ఉంగుటూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో విశాఖ-విజయవాడ ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం తప్పింది. భోగి మధ్యలోకి విరిగిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే రైలును నిలిపివేసి ప్రయాణికులందరూ దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ప్రయాణికులను సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించి పంపించారు. ఘటనపై విచారణ జరిపిస్తామని అధికారులు తెలిపారు. 

12:47 - July 25, 2015

హైదరాబాద్:ఉస్మానియా వర్శిటీలో ఈ నెల 17వ తేదీన చెయిన్‌స్నాచర్ల దాడిలో తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతున్న మహిళ చనిపోయింది. వారం రోజుల క్రితం సునీత అనే మహిళ బైక్‌పై వెళ్తుండగా చెయిన్‌ స్నాచర్లు ఆమె మెడలోని బంగారు గోలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆమె బైక్‌పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. వారం నుంచి చికిత్స పొందుతున్న సునీత ఇవాళ తుదిశ్వాస విడిచింది. 

12:45 - July 25, 2015

హైదరాబాద్: తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఇవాళ నుంచి సమ్మెలోకి దిగుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేసే ఉద్యోగులను ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్టు ద్వారా నియమకాలు చేపట్టి.. ఉద్యోగ భద్రత, కనీస వేతనంతో పాటు మరో 10 డిమాండ్లతో 21 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మెలో దాదాపు 15 వందల మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. 

12:43 - July 25, 2015

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తొలగించిన మున్సిపల్‌ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ చేపట్టిన ఆందోళన రోజు రోజుకు చేరింది. రాత్రి జీహెచ్‌ఎంసీ ఆవరణలోనే నిద్రించిన ప్రభాకర్‌.. ఉదయం నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. అయినా ఇప్పటివరకు అధికారులెవరూ పట్టించుకోకపోవడం ఆందోళనలు ఉధృతం చేశారు. కార్మికుల ఆందోళనలో బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ కూడా పాల్గొంటారని ప్రభాకర్‌ తెలిపారు. కార్మికులు ఆందోళన ఉధృతం చేయడంతో ఉప్పల్‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. 

12:42 - July 25, 2015

చిత్తూరు: శ్రీకాళహస్తి సమీపంలోని తొట్టంబేడు మండలం పెద్దకన్నలి జడ్పీ హైస్కూల్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-వ్యాన్‌ ఢీకొన్న ఘటనలో గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన 14 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

12:40 - July 25, 2015

బాసర: గోదావరి పుష్కరాలు చివరి రోజులో అపశృతి చోటు చేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో పుష్కరాల స్నానానికి వచ్చిన వ్యక్తి గోదావరిలో స్నానం చేస్తూ ఫిట్స్‌తో మృతి చెందాడు. మృతుడు మెదక్‌ జిల్లా వెల్దూరి మండలం చెర్లపల్లికి చెందిన ప్రవీణ్‌గా గుర్తించారు. ఫిట్స్‌ వచ్చిన సమయంలో ఎవరూ గుర్తించకపోవడంతో ప్రవీణ్‌ నీటిలో మునిగి మృతిచెందాడు.

 

12:39 - July 25, 2015

రాజమండ్రి:గోదావరి పుష్కరాలకు చివరి రోజు కావడంతో పుష్కర స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. పుష్కర స్నానాలు చేసేందుకు ప్రముఖులు పుష్కర ఘాట్లకు చేరుకుంటున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పుష్కర స్నానం చేశారు. అనంతరం పెద్దలకు పిండ ప్రదానం నిర్వహించారు. 

రాజరాజనరేంద్రుడికి చంద్రబాబు నివాళి

రాజమండ్రి: రాజరాజనరేంద్రుడు ప్రజారంజక పాలన అందించారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. చరిత్రను గుర్తించుకుంటేనే ప్రగతి సాధ్యమన్నారు. శనివారం రాజమండ్రిలోని రాజరాజనరేంద్రుడి విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. పుష్కరాల ముగింపు సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీఎం తెలిపారు. ఏడాది పాటు పుష్కరుడు గోదావరిలో ఉంటాడని అందువల్ల భక్తులు ఎప్పుడైనా పుణ్యస్నానాలు ఆచరించవచ్చన్నారు. ఏడాది తర్వాత జరిగే ముగింపు పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు. గోదావరి హారతి శాశ్వతంగా ఉంటుందని చెప్పారు.

రేపటి నుంచి స్వచ్ఛ భద్రాచలం:మంత్రి తుమ్మల

ఖమ్మం : మూడు రోజుల పాటు స్వచ్ఛ భద్రాచలం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గోదావరి పుష్కరాలు నేడు అఖరి రోజు కావడంతో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని పుష్కర ఘాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం తుమ్మల విలేకర్లతో మాట్లాడుతూ.. రేపటి నుంచి మూడు రోజులపాటు పుష్కర ఘాట్లు మూసివేస్తున్నట్లు తెలిపారు.

విరసం నేత చలసాని ప్రసాద్ కన్నుమూత

విశాఖ: ప్రముఖ కవి, విప్లవ రచయితల సంఘం నేత, విమర్శకులు చలసాని ప్రసాద్(83) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు విశాఖలోని నివాసంలో కన్నుమూశారు. చలసాని మరణంపట్ల పలువురు సంతాపం ప్రకటించారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా భట్ల పెనమర్రు గ్రామం. సాంస్కృతిక, సాహిత్య ఉద్యమంలో చలసాని కీలక పాత్ర పోషించారు. ఎమర్జెనీ సమయంలో ఆయన అరెస్టయ్యారు. 

రిలేదీక్షకు దిగిన గెలాక్సీ గ్రానైట్ కార్మికులు...

ప్రకాశం:చీమకుర్తిలో గెలాక్సీ గ్రానైట్ కార్మికుల రిలేదీక్షలను ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వైవీ ప్రారంభించారు. వేతన ఒప్పందం కోరుతూ కార్మికులు గత ఐదు రోజుల నుంచి 5 వేల మంది కార్మికులు ఆందోళన చేపట్టారు. వామపక్ష పార్టీలు, కార్మికసంఘాలు నేతలు వీరికి మద్దతు తెలిపారు.

సీఆర్పీఎఫ్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం:ఒకరి మీతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న సీఆర్పీఎఫ్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో విధులు నిర్వహిస్తోన్న లింగమ్ గౌడ (42) అనే హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు. ఈరోజు తెల్లవారుజామున సీఆర్పీఎఫ్ కార్యాలయంలో ఉన్న రికార్డుల గదిలో నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాగా, ప్రమాదానికి గల కారణాలను అణ్వేషించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

రాజమండ్రిలో పుష్కరస్నానం చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ

రాజమండ్రి: ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజమండ్రిలో పుష్కరస్నానమాచరించారు. చివరిరోజున వీఐపీ ఘాట్‌లో బాలయ్య ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కర ఏర్పాట్లు బాగున్నాయన్నారు. కోట్లాది మంది భక్తులు పుష్కరస్నానాలు చేశారని బాలకృష్ణ తెలిపారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు సరికాదు:మోదీ..

పాట్నా: అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు సరికాదని ప్రధాని మోదీ అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ర్టాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. దేశాభివృద్ధి కోసం కేంద్రం, రాష్ర్టాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన పాట్నాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. అంతకు ముందు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 

కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె

విజయవాడ: మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. విజయవాడ సబ్ కలెక్టరేట్ వద్ద కార్మికులు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ, ఏఐటీయూసీ, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు నేత గఫూర్ మాట్లాడుతూ ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజల సొమ్మును చంద్రబాబు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. మున్సిపల్ కార్మికులు ఆకలి మంటలను పట్టించుకోవడం లేదని, అవసరమైతే అన్ని కార్మిక సంఘాలు ఉపడతాయని హెచ్చరించారు.

ముగిసిన శ్రీ వెంకటేశ్వరస్వామి చక్రస్నానం

రాజమండ్రి: విఐపీ ఘాట్ లో డాలర్ శేషాద్రి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరస్వామి చక్రస్నానం ముగిసింది. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, టిటిడి ఛైర్మన్ చదలవాడకృష్ణమూర్తి పాల్గొన్నారు.

11:32 - July 25, 2015

కడప: దొంగతనం నిందమోపరనే అవమానం తట్టుకోలేక కడప జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వేముల మండలం భూమయ్యగారిపల్లెలో ప్రతాప్‌, రాజేశ్వరి అనే ఇద్దరు దంపతులు కూలీ పనులకు వెళ్తుంటారు. గురువారం రాజేశ్వరి రామచంద్రారెడ్డి అనే రైతు పోలంలోకి పనికి వెళ్లింది. ఆరోజు రామచంద్రారెడ్డి సెల్‌ఫోన్‌ పొలంలో కనిపించకపోవడంతో.. ఆ సెల్‌ఫోన్‌ను రాజేశ్వరే దొంగతనం చేసిందనే ఉద్దేశంతో.. ఆమె లోదుస్తులను తనిఖీ చేశారు. తనతో పాటు పనికి వచ్చిన మిగతా మహిళలను తనిఖీ చేయకుండా.. తనపై దొంగతనం నిందమోపరనే అవమానం తట్టుకోలేక.. నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. తన భార్య ఎప్పుడు దొంగతనం చేయలేదని మృతురాలి భర్త ప్రతాప్‌ చెబుతున్నాడు. చేయని దొంగతనాన్ని తన భార్యపై మోపడంతో.. అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని ప్రతాప్‌ ఆరోపిస్తున్నాడు. 

'రిషికేశ్వరి ఆత్మహత్య కేసును నీరుగార్చేందుకే'

గుంటూరు: వరంగల్ కు చెందిన బీటెక్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనతో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గడచిన నాలుగైదు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేఫథ్యంలో వర్సిటీకి పది రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ వర్సిటీ ఇన్ చార్జి వీసీ సాంబశివరావు నిన్న నిర్ణయం తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా హాస్టల్ గదులను ఖాళీ చేసి పోవాలని ఆయన నిన్న విద్యార్థులకు ఆదేశాలు జారీ చేశారు. నాగార్జున యూనివర్శిటీ వీసీ నిర్ణయంపై విద్యార్థులు భగ్గుమన్నారు.

వడ్డితాండ్ర వద్ద కేంద్ర బృందాన్ని అడ్డుకున్న స్థానికులు

శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర వద్ద స్థానికులు కేంద్ర బృందాన్ని అడ్డుకున్నారు. కాకరపల్లి పవర్ ప్లాంట్ సందర్భనకు వెళ్తున్న కేంద్ర బృందాన్ని స్థానికులు అడ్డుకున్నారు.

టిటిడి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట ఆందోళన

తిరుపతి: టిటిడిలో ఖాలీగా ఉన్న 5300 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ టిటిడి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువజనులు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

రుద్రమదేవి పాత్రకు అనుష్క ప్రాణం పోసింది-గుణశేఖర్

హైదరాబాద్‌: రుద్రమదేవి చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని..చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. తొమ్మిదేళ్ల పాటు పరిశోధన చేసి....మూడేళ్ల పాటు శ్రమించి మూవీని తీసినట్లు దర్శకనిర్మాత గుణశేఖర్‌ చెప్పారు. సెట్ల కోసమో, గ్రాఫిక్స్‌ కోసమో రుద్రమదేవిని నిర్మించలేదని అన్నారు. కథను నమ్ముకునే ఇంతటి భారీ చిత్రాన్ని నిర్మించినట్లు స్పష్టం చేశారు. రుద్రమదేవి పాత్రకు అనుష్క..ప్రాణం పోసిందన్నారు. ఇక అల్లుఅర్జున్‌..గోనగన్నారెడ్డి పాత్ర మూవీకే హైలైట్‌గా నిలుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా...రుద్రమదేవీ ఆండ్రాయిడ్ యాప్‌ను అనుష్క ఆవిష్కరించారు.

10:44 - July 25, 2015

ఢిల్లీ :రాష్ట్రపతిగా మూడేళ్లు పూర్తిచేస్తున్న ప్రణబ్ ఇవాళ కేంద్రమంత్రులకు విందు ఏర్పాటుచేశారు... రాష్ట్రపతిభవన్‌లో ఈ విందు జరగబోతోంది... దీనికి ముందు... రాష్ట్రపతిగా ప్రణబ్ చేసిన 154 ప్రసంగాలతోకూడిన రెండు పుస్తకాలు... రాష్ట్రపతి భవన్‌ విశిష్టతను వివరించే మరో రెండు బుక్స్‌ ఆవిష్కరణ జరగనుంది.. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ... హోంమంత్రి రాజ్‌నాథ్ ఈ పుస్తకాలను ఆవిష్కరిస్తారు.. 2012 జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు ప్రణబ్ ముఖర్జీ...

10:42 - July 25, 2015

ప్రకాశం: గెలాక్సీ గ్రానైట్‌ అంటే ప్రపంచంలో ఎంతో పేరుంది. నల్లని అద్దంలా మెరవడమే కాకుండా.. బంగారు వర్ణంతో నింగిలో నక్షత్ర సమూహాన్ని తలపించేలా ఉండే ఈ గ్రానైట్‌తో వ్యాపారులు కోట్లు సంపాదిస్తున్నారు. అయితే రాయిని అందంగా తీర్చుదిద్దుతున్న కార్మికుల బతుకులు మాత్రం చీకట్లోనే మగ్గుతున్నాయి. యాజమాన్యాలకు తమ మొర ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టించుకోకపోవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు.
చీమకుర్తి 1976కు పూర్వం ఓ కుగ్రామం.......
ప్రకాశం జిల్లా చీమకుర్తి 1976కు పూర్వం ఓ కుగ్రామం. ఒకప్పుడు ఇక్కడి భూముల్లో పంటలు పండక తొండలు గుడ్లు పెట్టేవని టాక్‌ ఉండేది. ఈ ప్రాంతంలో గెలాక్సీ గ్రానైట్‌ ఖనిజ నిక్షేపాలున్నాయని గుర్తించడంతో ఇక్కడ సీనే మారిపోయింది.
430 ఎకరాల్లో గెలాక్సీ గ్రానైట్‌...
చీమకుర్తితో పాటు పలు ప్రాంతాల్లో దాదాపు 430 ఎకరాల్లో గెలాక్సీ గ్రానైట్‌ ఖనిజంగా పుష్కలంగా లభించడంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకుంది. సుమారు 155 క్వారీలలో గ్రానైట్‌ మైనింగ్‌ జరుగుతోంది. ఇందుకోసం రాష్ట్రంలోని బడా పారిశ్రామికవేత్తలతో పాటు రాజకీయ నాయకులు ఈ మైనింగ్‌ను కొనసాగిస్తున్నారు.
ప్రపంచంలో భారీ డిమాండ్‌.....
ఎక్కడా లభించని గెలాక్సీ గ్రానైట్స్‌కు ప్రపంచంలో భారీ డిమాండ్‌ ఉంది. దీంతో ఈ గ్రానైట్‌ను వ్యాపారులు విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు గడిస్తున్నారు. కానీ.. రాయిని తొలిచి అందంగా మలిచే కార్మికుల జీవితాల్లో వెలుగులు లేకుండాపోయాయి. క్వారీ యాజమాన్యాలు కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడంతో అరకొర జీతాలతోనే బతుకులు వెళ్లదీస్తున్నారు.
కార్మికులకు ఎలాంటి చట్టాలు లేవు...
ఇక్కడ క్వారీలలో పని చేసే కార్మికులకు ఎలాంటి చట్టాలు ఉపయోగపడడం లేదు. యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయాల్లో కూడా కార్మికుల చేత పని చేయిస్తున్నారు. ఇక కార్మికులు ఇరుకు గదుల్లో ఉండాల్సిన దుస్థితి ఉంది. వీరు నిత్యం దుమ్ముదూళిలో పనిచేస్తూ రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు క్వారీలలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో కార్మికులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో అనేక ప్రమాదాలు జరిగి.. ఎంతోమంది కార్మికులు మృత్యువాతపడ్డారు. వీరిలో కొంతమంది ఎక్కడివారో కూడా తెలియని పరిస్థితి. క్వారీల యజమానులు కనీసం కార్మికుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోయినా.. కనీసం ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం దారుణమని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. తమకు కనీసం ఇఎస్ఐ వసతి కూడా కల్పించడం లేదని కార్మికులంటున్నారు. ప్రమాణాలు పాటించకుండా కార్మికులతో పనులు చేయించుకుంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని వారు కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కార్మికులకు సౌకర్యాలు కల్పించాలంటూ యాజమాన్యాలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని కార్మికులంటున్నారు. దీంతో తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు సమ్మె బాట పట్టారు. వేలాదిమంది కార్మికులు రోడ్డెక్కారు. దీంతో క్వారీలన్నీ మూతపడ్డాయి. గ్రానైట్‌ యాజమాన్యాలు కోట్ల రూపాయలు లాభాలు ఆర్జిస్తున్నా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని కార్మికులంటున్నారు. ఇప్పటికైనా యాజమాన్యాలు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. 

10:38 - July 25, 2015

రాజమండ్రి: గోదావరి మహా పుష్కరాలు నేటితో ముగియనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కరాల ముగింపునకు టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామికి చక్రస్నానం కార్యక్రమం చేపడుతున్నారు. సాయంత్రం గోదావరి హారతి కార్యక్రమంతో పుష్కరాలు ముగుస్తాయి. 

10:36 - July 25, 2015

హైదరాబాద్:గోదావరి పుష్కరాల ముగింపును... కనీవినీ ఎరుగని రీతిలో కన్నుల పండువగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాల మొదటి రోజు నుంచే.. హంగు ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం... ముగింపు వేడుల బాధ్యతను డైరెక్టర్‌ బోయపాటికి ఇచ్చింది. ఖర్చుకు కూడా ప్రభుత్వం వెనుకాడకపోవడంతో... భారీతనం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఓ తరం పాటు చెప్పుకునే విధంగా...
గోదావరి పుష్కరాల ముగింపు ఉత్సవాన్ని ఓ తరం పాటు చెప్పుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సర్కార్‌. ఇప్పటికే దేశంలోని ప్రముఖులందరికీ.. ఆహ్వానాలు అందించిన చంద్రబాబు సర్కార్‌... చివరిగా చేయాల్సిన వైభవం గురించి లెక్కకు మించి ఖర్చు పెడుతోంది. ఇక ఈ ముగింపు కార్యక్రమాన్ని.. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పజెప్పింది టీడీపీ ప్రభుత్వం. లెక్క ఎక్కువైనా పర్వాలేదు.. ఉత్సవం మాత్రం అంగరంగ వైభవంగా జరగాలన్నదే సర్కార్‌ టార్గెట్‌.

గోదావరి తీరం, ఆర్ట్స్‌ కాలేజ్‌లో వేడుకలు....
దీంతో గోదావరి తీరం, ఆర్ట్స్‌ కాలేజ్‌లలో జరిగే ముగింపువేడుకలను బోయపాటి శ్రీను పరిశీలించారు. సభావేదికల రూపకల్పన, కార్యక్రమాల డిజైన్‌ అంతా దగ్గరుండిమరీ చూసుకుంటున్నారు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై... రాష్ట్ర డీజీపీ, ఇతర అధికారులతో సమాలోచనలు జరిపారు బోయపాటి. ఈనెల 25 రాత్రి జరిగే నిత్యహారతి నభూతో నభవిష్యతి అనే రీతిలో నిర్వహించాలని సీఎం ఆదేశారు జారీ చేశారు.

ఖర్చుకు వెనకాడొద్దన్న సీఎం చంద్రబాబు.....
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు... సీఎం ఖర్చుకు వెనకాడొద్దని ఆదేశించిందే తడవుగా... ఇరు వంతెనలపై భారీ ఫోకస్‌లైట్లను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఆ వెలుగులతో నదీ జలాలు సప్తవర్ణ శోభితంగా కన్పించేలా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా హారతి సమయంలో.. కృత్రిమపొగ పంట్ల చుట్టూ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హారతి సమయంలో... భక్తులు తన్మయం పొందేలా.. శ్రావ్యమైన సంగీతం వినిపించేలా స్టీరియో ఫోనిక్‌ సౌండ్‌సిస్టమ్‌ను సిద్ధం చేస్తున్నారు.

సినీ సెట్టింగ్‌లతో వేదికల ఏర్పాటు.....
ఆర్ట్స్‌ కాలేజ్‌లో భారీ తనం ఉట్టిపడేలా.. సినిమా సెట్టింగ్‌లతో వేదికలను సిద్ధం చేస్తున్నారు. వీటిల్లో సినీకళాకారుల సందడి, సంగీత విభావరి, పలు నృత్యప్రదర్శనలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా వెయ్యిమంది కూచిపూడి నృత్య కళాకారులు ఒకేసారి నృత్యప్రదర్శన ఇచ్చేలా వేదికను, సౌండ్‌ సిస్టమ్‌ను తీర్చిదిద్దేపనిలో పడ్డారు బోయపాటి. ఇదంతా ఇలావున్నా.. మొదటి దుర్ఘటనకు బోయపాటి డాక్యుమెంటరీయే కారణమని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ముగింపు ఉత్సవాలను కూడా బోయపాటికే ఇవ్వడంపై పలు విమర్శలు వస్తున్నాయి.

కెమికల్ దుర్వాసనతో గ్రామస్థుల ఆందోళన...

కర్నూలు: ప్యాపిలి మండలం చండ్రపల్లి దగ్గర పొలాల్లో 150 డ్రమ్ముల కెమికల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఈ కెమికల్‌ నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

కోటపాడు వద్ద రైతుల ఆందోళన

కర్నూలు: కొలిమిగుండ్ల మండలం కోటపాడులో ఉన్న సిమెంట్‌ కంపెనీ యజమాన్యం, గ్రామస్తుల మధ్య తీవ్రమైన వివాదం జరిగింది. సిమెంటు కంపెనీ ఏర్పాటు సమయంలో వీరి నుంచి స్వాధీనం చేసుకున్న భూములు తిరిగి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూములు మావి... మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని సిమెంటు కంపెనీ ముందు గ్రామస్తుల బైఠాయించి ఆందోళన చేపట్టారు.

సిమి ఉగ్రవాదులపై రూ.40 లక్షల రివార్డు

హైదరాబాద్: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నలుగురు సిమి ఉగ్రవాదులపై రూ.40 లక్షల రివార్డు ప్రకటించింది. నలుగురు సిమి ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉండవచ్చన్న ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. కాగా నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన కాల్పుల్లో మృతి చెందిన అస్లాం, జకీర్ లను సిమి ఉగ్రవాదులుగా భావిస్తున్న విషయం తెలిసిందే. గతంలో మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుంచి పలువురు సిమి ఉగ్రవాదులు తప్పించుకున్నారు. వారిలో మరణించిన అస్లాం, జకీర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మిగతావారి కోసం ఎన్ఐఏ వేట ప్రారంభించింది.

జార్ఖండ్ లో 30 వాహనాలను తగలబెట్టిన మావోయిస్టులు..

రాంచీ : జార్ఖండ్ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బోకారో జిల్లా బెర్మో ప్రాంతంలో సెంట్రల్ కోల్ ఫిల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) ప్రాజెక్టు వద్ద నిలిపి ఉన్న ఆ సంస్థకు చెందిన 30 వాహనాలపై మావోయిస్టులు దాడి చేసి తగలబెట్టారు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీఎల్ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

 

రిషికేశ్వరి మరణ వాంగ్మూలం తన గుండెను పిండేసింది:మంత్రి గంటా..

గుంటూరు:ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఆమె తల్లిదండ్రులు, తోటి విద్యార్థులనే కాక ఏపీ ప్రభుత్వాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నేటి ఉదయం ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. రిషికేశ్వరి మరణ వాంగ్మూలం తన గుండెను పిండేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె ఆత్మహత్యకు కారకులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని ఆయన ప్రకటించారు. ఈ జాబితాలో కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు పేరు ఉంటే తక్షణమే ఆయనను అరెస్ట్ చేసేందుకు కూడా వెనుకాడబోమని మంత్రి వెల్లడించారు.  

'ఈస్టు కోస్టు' పనులను పర్యవేక్షించనున్న పర్యావరణ శాఖ ఉపసంఘం...

శ్రీకాకుళం: నేడు ఈస్టు కోస్టు థర్మల్ ఎనర్జీస్ పనులను పర్యావరణ శాఖ ఉపసంఘం పరిశీలించనుంది. ఈస్టుకోస్టుకు అనుమతి ఇవ్వటంపై విశ్రాంత ఐఏఎస్ శర్మ కోర్టును ఆశ్రయించారు. 14 కి.మీ మేర తవ్విన కాలువ చట్టవిరుద్ధమని శర్మ వాదిస్తున్నారు. వేలాది ఎకరాలు ముంపునకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యకారులూ, ఉప్పు రైతులు నష్టపోనున్నారని హెచ్చరించారు. ఈస్టు కోస్టుకు అనుమతిని రద్దు చేయాలని థర్మల్ వ్యతిరేక కమిటి కోరుతోంది.

చెయిన్‌స్నాచర్ల దాడిలో గాయపడ్డ మహిళ మృతి...

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన చెయిన్‌స్నాచర్ల దాడిలో గాయపడ్డ మహిళ సునీత మృతిచెందింది. కారం కిందట బైక్‌పై వెళ్తున్న మహిళ మెడలోంచి గొలుసు దొంగలు బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనలో బైక్‌పై నుంచి పడిన మహిళ తీవ్ర గాయాలపాలైయింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మహిళ మృతిచెందింది. 

భూమయ్యగారి పల్లెలో దారుణం

కడప: వేముల మండలం భూమయ్యగారి పల్లెలో దారుణం జరిగింది. బలహీన వర్గానికి చెందిన రాజేశ్వరిపై సెల్ దొంగతనం అభియోగం మోపారు. పొలం వద్ద తన సెల్ ఫోనును దొంగిలించిందంటూ రాజేశ్వరి దుస్తులను అందరి ముందే విప్పించి రైతు రామచంద్రారెడ్డి వెతికించాడు. అవమానంగా భావించి రాజేశ్వరి ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకుంది.

నేటి తెల్లవారుజమున పాకిస్తాన్ లో భూకంపం

హైదరాబాద్: ఈ రోజు తెల్లవారు జామున పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.1గా నమోదలైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్ కు 15.కి.మీ దూరంలో మార్గల్లా పర్వతాల్లో 26 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, అబ్బొట్టాబాద్, ఖైబర్ తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. 

09:50 - July 25, 2015

ప్రపంచ వ్యాప్తంగా 109 దేశాలలోని క్రీడాభిమానులను ఓలలాడిస్తున్న ఇండియన్ ప్రోకబడ్డీలీగ్ కు...దేశంలోని సినీస్టార్లు, సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. బిగ్ బీ అమితాబ్ ..కబడ్డీలీగ్ ప్రచారగీతం ఆలపిస్తే...సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్, సౌరవ్ గంగూలీ, అల్లు అర్జున్‌..పోటీల వివిధ దశల్లో సందడిసందడి చేస్తున్నారు. కబడ్డీలీగ్ లో సెలబ్రిటీ షో పై...10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్......కబడ్డీ వేదిక మీదకు వచ్చి...చల్ కబడ్డీ అంటారో...వేచిచూడాల్సిందే. చెడుగుడు కమ్ కబడ్డీ...ఫక్తు గ్రామీణ క్రీడ. ప్రొఫెషనల్ లీగ్ పుణ్యమా అంటూ అంతర్జాతీయస్థాయికి ఎదిగిపోయిన పల్లెప్రజల ఆట.
2014 సీజన్లో తొలిసారిగా...
2014 సీజన్లో తొలిసారిగా ప్రారంభమైన ప్రోకబడ్డీలీగ్...తొలిఏడాదే 43 కోట్ల 50 లక్షల మంది అభిమానులను సంపాదించుకొందంటే..ఆశ్చర్యపోవాల్సిందే మరి. ఐపీఎల్ తర్వాత ..అత్యధిక జనాదరణ పొందుతున్న ప్రొఫెషనల్ లీగ్ గా గుర్తింపు తెచ్చుకొంది.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుమారుడు యజమానిగా...
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుమారుడు యజమానిగా ఉన్న జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ..తొలిసీజన్ చాంపియన్ గా నిలిచి వారేవా అనిపించుకొంది. ప్రారంభసీజన్ పోటీల్లో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ , అమీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ సెలెబ్రిటీలు సందడిసందడి చేస్తే...ప్రస్తుత 2015 సీజన్లో సల్మాన్ ఖాన్, సౌరవ్ గంగూలీ, వివేక్ ఒబెరాయ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు..చల్ చల్రే కబడ్డీ అంటూ ఊగిపోతున్నారు. కబడ్డీలీగ్ రెండోసీజన్ కు...బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆలపించిన ప్రచారం గీతం...ప్రస్తుతం దేశవ్యాప్తంగా హోరెత్తి పోతోంది.
ప్రపంచవ్యాప్తంగా 109 దేశాలకు ప్రత్యక్ష ప్రసారం.....
పోటీలను నిర్వహిస్తున్న స్టార్ నెట్ వర్క్..ప్రపంచవ్యాప్తంగా 109 దేశాలకు ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ముంబై వేదికగా ముగిసిన సీజన్ తొలి అంచెపోటీల్లో బాలీవుడ్ హీరోలు వివేక్ ఒబెరాయ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నాడు.తనకు కబడ్డీ అంటే ప్రాణమని..తాను కబడ్డీఆటకు ఫిదా అయిపోయానంటూ పొంగిపోతున్నాడు. ఇక..ముంబై లెగ్ ఆఖరిరోజు పోటీలకు కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తన తాజా సినిమా బజరంగీ బాయిజాన్ కు...కబడ్డీలీగ్ వేదికగా చేసుకొని ప్రచారం చేసుకొన్నాడు.
కోల్ కతా నేతాజీ సుబాస్ ఇండోర్‌ స్టేడియంలో....
కోల్ కతా నేతాజీ సుబాస్ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న పోటీలను...బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలసి..భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రారంభించాడు. కోల్ కతా లెగ్ పోటీలకు ప్రారంభ సూచకంగా...జాతీయగీతాన్ని దాదా ఆలపించడం విశేషం. ఆగస్టు 4 నుంచి 7 వరకూ.. హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియం వేదికగా జరిగే తెలుగు టైటాన్స్ మ్యాచ్ లకు....టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడు. పాఠశాలస్థాయిలో తాను కబడ్డీ ఆటగాడినేనని...సినిమా తర్వాత తనకు ఆటలంటేనే ఇష్టమంటూ అల్లు అర్జున్ చెబుతున్నాడు. తొడగొట్టి మరీ కబడ్డీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తానని చెప్పాడు. మరి..కబడ్డీ లీగ్ లోని బెంగళూరు, పూణే, ఢిల్లీ, జైపూర్, పాట్నా, హైదరాబాద్ లెగ్ పోటీల ద్వారా మరెంతమంది సెలబ్రిటీలు..కబడ్డీ వేదిక మీదకు వచ్చి...చల్ కబడ్డీ అంటారో...వేచిచూడాల్సిందే.

ఉప్పల్ లో ఎమ్మెల్యే ప్రభాకర్ ఆందోళన

హైదరాబాద్: తొలగించిన మున్సిపల్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ జీహెచ్ ఎంసీ కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ నిన్నటి నుంచి ఆందోలన కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే తో పాటు సిఐటియు నేతలు కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. 

నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన

గుంటూరు:రితికేశ్వరి మృతి కేసు నాగార్జున యూనివర్శిటీ అట్టుకుడుతుంది. దీనిని ఆసరా తీసుకున్న యాజమాన్యం నేటి నుండి 10రోజులు సెలవులు ప్రకటించింది. దీనిని వ్యతిరేకిస్తూ  ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అమరావతి హాస్టల్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. 10 రోజులు సెలవులు ప్రకటించి హాస్టల్ ను ఖాళీ చేయమంటే ఎలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు అందరూ క్యాంపస్ విడిచి వెళ్లాలని యాజమాన్యం చెప్తోంది. ఈ నేపథ్యంలో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

గోదావరి పుష్కరాలకు 45 ఉచిత బస్సులు: కేశినేని నాని

విజయవాడ: నేడు గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎంపీ కేశినేని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి 45 ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. భక్తులందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. తొలిరోజు ఘటన మినహా పుష్కరాలను ఘనంగా నిర్వహించామని ఆయన తెలిపారు. ప్రజలకు సేవ చేయలేని వైసీపీకి చంద్రబాబును విమర్శించే అర్హత లేదని కేశినేని నాని అన్నారు.

ఉగ్రవాది యాసిన్ భత్కల్ ను అప్పగించలేం:ఎన్ఐఏ

హైదరాబాద్:దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు, ఉగ్రవాది యాసిన్ భత్కల్ ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలన్న రాజస్థాన్ పోలీసుల వినతిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) న్యాయస్థానం తిరస్కరించింది. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు చివరి దశకు వచ్చేదాకా భత్కల్ పై పీటీ వారెంట్ జారీ చేయలేమని కూడా కోర్టు రాజస్ధాన్ పోలీసులకు స్పష్టం చేసింది. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డ భత్కల్ ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ పోలీసులు హైదరాబాదులోని చర్లపల్లి జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.  

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 14 మంది పై కేసు నమోదు...

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్-45లో ట్రాఫిక్ పోలీసులు గడిచిన రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 14 మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో 6 కార్లు, 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటి మట్టం

ఖమ్మం: ఎగువ నుంచి వస్తున్న నీటి తో భద్రాచలం వద్ద గోదారిలో నీటి మట్టం పెరిగింది. గోదావరి ప్రవాహం పెరగడంతో పుష్కర ఘాట్ల వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. బారికేడ్ల లోపే పుష్కరస్నానం చేయాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

08:09 - July 25, 2015

హైదరాబాద్: అందాల రాముడు సునీల్ సరసన ప్రియాంక చోప్రా చెల్లెలు ఆడిపాడబోతోంది. బార్బీ హండా పేరుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఈ భామ.  ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామచంద్ర సరసన  `ప్రేమ గీమా జాన్తా నయ్` చిత్రంలో నటించింది. కానీ ఆ చిత్రం హిట్టు కాలేదు. దీంతో బార్బీ టాలెంటు వెలుగులోకి రాలేకపోయింది. ఇప్పుడు పేరు మార్చుకొని సునీల్ సరసన ఆడిపాడేందుకు సిద్ధమైంది. సునీల్ కథానాయకుడిగా ఆర్.పి.ఎ క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కబోతోంది. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

08:02 - July 25, 2015

హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మె న్యాయమైనదని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు అ భిప్రాయ పడ్డారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రా సీఎం చంద్రబాబు వైఖరుల్లో ఎలాంటి తేడాలేదని నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబు ను విదేశీ బాబు అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిజమేనా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా నిష్పక్షపాతికంగా ఉండాల్సిన అవసరం లేదా? బిజేపీ మంత్రులు అనేక సందర్భాల్లో అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా? రైతు ఆత్మహత్యలపై కిచంపరిచే వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రాధామోహన్ పై కేంద్రం చర్యలు తీసుకుంటుందా? రాష్ట్ర విభజన తరువాత కూడా హైకోర్టును విభజించకపోవడం ఎంత వరకు సబబు? ఇలాంటి అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చలో చర్చను చేపట్టింది. ఈ చర్చను మీరూ చూడాలంటనుకుంటున్నారా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి....

టీచర్.. స్టూడెంట్ ప్రేమ పెళ్లి..

హైదరాబాద్: ప్రేమకు కులంతో సంబందం లేదు మతంతో సంబందం లేదు ప్రాంతంతోనూ సంబందంలేదు ఈ మధ్యకాలంలో లింగబేదంతోనూ సంబందం లేదు! దానికి విద్యార్థి - టీచర్ అనే సంబందం కూడా లేకుండా పోయింది! అన్నింటికంటే ముందు వయసు గురించిన ఆలోచన కూడా లేదు! సరే ప్రేమకు వయసులేదేమో కానీ... పెళ్లి కి మాత్రం అవసరం అన్న విషయం మరిచిపోయారు ఈ జంట! పాఠాలు నేర్చుకోమని స్కూలుకి పంపితే ప్రేమపాఠాలు నేర్చుకున్నాడు. వీడి ట్యాలెంట్ తో పంతులమ్మను పడగొట్టాడో లేక పంతులమ్మే సుందరాకాండ సినిమాను రివర్స్ లో ఊహించుకున్నారో తెలియదు కానీ... ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇతడి పేరు అజిత్... టీచర్ పేరు వైష్ణవి!

పట్టాలు తప్పిన విజయవాడ- విశాఖ ప్యాసింజర్‌ రైలు

.గో: ఉంగుటూరు దగ్గర తప్పిన పెను ప్రమాదం. విజయవాడ- విశాఖ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాని రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం జరగడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల: తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తుల రద్దీ అతిసాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. 

బైక్ ను ఢీ కొట్టిన తుఫాన్ వాహనం :ముగ్గురు మృతి

ఖమ్మం: జూలూరుపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బైక్ ను తుఫాన్ వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పుష్కరాల కోసం బైక్ పై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

డ్రంకెన్‌డ్రైవ్‌ లో మంచు లక్ష్మి క్యాంపెయిన్...

హైదరాబాద్:డ్రంకెన్‌డ్రైవ్‌ మద్యం తాగి వాహనాలు నడపొద్దంటూ సినీ నటి మంచు లక్ష్మీ క్యాంపెయిన్‌ నిర్వహించారు. వీకెండ్‌ సందర్భంగా జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రోడ్డు నెంబరు 45లో వాహనాల తనిఖీ చేపట్టారు. అదేదారిలో వచ్చిన మంచు లక్ష్మీ బ్రీత్‌ ఎనలైజర్‌పరీక్షలకు హాజరయ్యారు. అనంతరం మద్యం తాగి వాహనం నడపటం ప్రాణసంకటం అంటూ వాహన దారులకు అవగాహన కలిగించారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

07:09 - July 25, 2015

హైదరాబాద్: కస్టమర్‌లకు ఇక బంగారు రోజులు రాబోతున్నాయి. కొండెక్కిన పసిడి పరిగెత్తుకొంటూ దిగొస్తోంది. ఒకప్పుడు బంగారం ధర వింటేనే బెదిరిపోయే సామాన్యులను ఇప్పుడు పసిడి ఊరిస్తోంది.
అయిదేళ్ల కనిష్ట స్థాయికి....
బంగారం ధరలు దేశీయంగా అయిదేళ్ల కనిష్ట స్థాయికి దిగి వచ్చాయి. గురువారం స్వల్పంగా ధర పెరిగినా, నిలబడలేదు. శుక్రవారం మళ్లీ ధరలు తగ్గాయి. కొన్ని నగరాల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.25వేల కంటే దిగువకు చేరింది. ఫలితంగా ఆర్నమెంట్‌ గోల్డ్‌ ధర గ్రాము రూ.2 వేల3 వందలకు చేరింది. ఇదేవిధంగా వెండి కూడా కిలో 34వేల రూపాయల కంటే దిగువకు వచ్చింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు మరింత తగ్గడంతో పాటు దేశీయంగా ఆభరణాల తయారీ సంస్థలు, విక్రేతల నుంచి డిమాండ్ లేకపోవడమే ధరల పతనానికి కారణంగా చెబుతున్నారు.
25వేల దిగువకు బంగారం ధర....
బంగారం ధర మళ్లీ 25 వేల రూపాయల దిగువకు పడిపోయింది. గురువారం ఓ మోస్తరుగా పెరిగినా.. మళ్లీ బంగారం ధరలు శుక్రవారం స్టాకిస్టులు స్పెక్యులేషన్‌ వార్తలతో అమ్మకాలకు పాల్పడటంతో ధరలు మరింత క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఒడిదుడుకులు, అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచనుందన్న వార్తలు ఇందుకు తోడవటంతో ముంబై బులియన్‌ మార్కెట్లో బంగారం ధర 445 రూపాయలు పడిపోయింది. శుక్రవారం పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర 445 రూపాయలు క్షీణించి 24 వేల590 రూపాయలకు చేరుకోగా స్వచ్ఛమైన బంగారం ధర కూడా అదే స్థాయిలో పతనమై 24,740 రూపాయల వద్ద క్లోజైంది.
కిలో వెండి ధర రూ.620....
మరోవైపు వెండి ధరలు కూడా అదేబాటలో సాగాయి. కిలో వెండి ధర ఏకంగా 620 రూపాయలు పతనమైన 34,215 రూపాయల వద్ద స్థిరపడింది. చైనాలో ఒకేరోజు 33 టన్నుల బంగారాన్ని విక్రయించటం వల్లే పసిడి నేలచూపులు చూసిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో 10రోజులుగా తగ్గుతున్న పసిడి ధరలు కూడా ఈ పరిణామానికి కారణమంటున్నారు. 

07:06 - July 25, 2015

హైదరాబాద్: గుజరాత్‌ నరమేథంలో బాధితుల పక్షాన పోరాడుతున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ దంపతులకు బొంబాయి హైకోర్టులో ఊరట లభించింది. శుక్రవారం ఉదయం సిబిఐ కోర్టు సెతల్వాద్‌ దంపతుల ముందస్తు బెయిల్‌ దరఖాస్తును తిరస్కరించడంతో సెతల్వాద్‌ దీనిని బొంబాయి హైకోర్టులో సవాల్‌ చేశారు. వీరికి రెండు వారాలపాటు అంటే ఆగస్టు 10 వరకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ హైకోర్టు వెంటనే ఉత్తుర్వు లిచ్చింది. దర్యాప్తునకు తాను సహకరిస్తున్నానని సెతల్వాద్‌ చెప్పినా సిబిఐ కోర్టు ఆమె పిటిషన్‌ను తిరస్క రించింది. సిబిఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో తీస్తా సెత ల్వాద్‌ వాదిస్తూ బెయిల్‌ తిరస్కరణకు గురవ్వడం తనను ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు, బాధ కలిగించిందని అన్నారు. తాను ఈ తీర్పును మనసు చంపుకుని అంగీకరిద్దామనే అనుకున్నా. కానీ, మద్దతుదారులు, నా అంతరాత్మ దీనిని గనుక అంగీకరిస్తే అధికారంలో వున్నవారు తమను అంత మొందించేందుకు సాగుతున్న యత్నాలకు తలొగ్గినట్టే అవుతుందని భావించి హైకోర్టు తలుపు తట్టానని ఆమె చెప్పారు.
జూలై 27,30, ఆగస్టు 3,6 తేదీలలో హాజరుకావాలి....
తీస్తా సెతల్వాద్‌ దంపతులు సీబీఐ ఆర్థిక నేరాల విభాగం ఎదుట ఇరువురు జూలై 27,30 ఇంకా ఆగస్టు 3,6 తేదీలలో హాజరుకావాలని ఆదేశించింది. ప్రతీ రోజు సీబీఐ ఎదుట తీస్తా సెతల్వాద్‌ దంపతులు హాజరు కావాలని సీబీఐ తరపు న్యాయవాది చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రతి రోజు హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొంది.
వ్యాపం కుంభకోణం కేసు దర్యాప్తు పక్కన పెట్టి....
అయితే వ్యాపం కుంభకోణం కేసు దర్యాప్తు పక్కన పెట్టి 16 మంది సీబీఐ అధికారులు తన ఇల్లు, కార్యాలయాలలో సోదాలు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఆర్టీఐ కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ గతంలో మండిపడ్డారు. సుమారు ఒక కోటి రూపాయల విరాళాలు ఈమె దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

07:03 - July 25, 2015

హైదరాబాద్: ఉల్లిపాయ కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది. ఉల్లి పేరు వింటేనే సామాన్యులు ఉలిక్కిపడుతున్నారు. ఉల్లి ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో సామాన్యుడికి కొనలేని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ఉల్లి ధర కేంద్ర సర్కారును సైతం గడగడలాడించింది. అంతేకాదు..కిలో ఉల్లిపాయల కోసం హత్యలు, చోరీలు కూడా జరిగిన సందర్భాలున్నాయి. మళ్లీ ఇప్పుడు ఉల్లి ఘాటెక్కి, హీటెక్కిస్తోంది.
వంటింటికి, ఉల్లిపాయకు విడదీయరాని బంధం....
వంటింటికి, ఉల్లిపాయకు విడదీయరాని బంధముంది. నిత్యావసరాల్లో ఒకటిగా మారిపోయిన ఉల్లిపాయ ధర మళ్లీ ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. రోజురోజుకు పెరగడమే తప్ప తగ్గుతున్న అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో గృహిణులు వీటిని కోయకుండానే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పుడుతోంది.
మండుతున్న నిత్యావసరాల ధరలు...
ఉల్లితోపాటు నిత్యావసరాల ధరలన్నీ భగభగా మండిపోతున్నాయి. ఇప్పుడు సామాన్యుడు ఉల్లిని కొనుగోలు చేయాలంటేనే జేబులు తడుముకోవాల్సి వస్తోంది. ఉల్లిపాయల ధర రోజురోజుకు తారస్థాయికి చేరుతూ, అందరికీ భారమై కూర్చుంది. సామాన్యుడి నుంచి ఎగువ మధ్యతరగతి ప్రజానీకం వరకు ఉల్లిని కొసరికొసరి వాడుకోవాల్సిన గడ్డు పరిస్థితి ఏర్పడుతోంది. జూన్ నెలాఖరు నుంచి ఉల్లి ధర పైకి ఎగబాకుతూ వస్తోంది. జూన్ నెలలో కిలో 20 నుంచి 25 రూపాయల మధ్య ఉంది. ఇది జులై మొదటి వారంలో బయట మార్కెట్లో 45 నుంచి 50 రూపాయల వరకు అమ్ముతున్నారు. దీంతో..సామాన్యులు బెంబెలెత్తుతున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ధరలు తగ్గేలా చొరవతీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
.స్థానిక మార్కెట్లతో పాటు రైతు బజార్లలోనూ......
స్థానిక మార్కెట్లతో పాటు రైతు బజార్లలోనూ..ఉల్లి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఉల్లి ధర సామాన్యుడికి అందుబాటులో లేనప్పుడు ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా రాయితీపై ఉల్లిపాయలు సరఫరా చేసేది. ప్రస్తుతం ధర రెట్టింపైనా రైతుబజార్లలో ఎక్కడా కూడా రాయితీ ఉల్లి సరఫరా చేయడంలేదనే ఆరోపణలున్నాయి.
గతఏడాది క్వింటల్ ఉల్లి ధర 4,500.....
కర్నూలు జిల్లా ఉల్లిసాగుకు ప్రత్యేక స్థానం ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈసారి పంట దిగుబడి తక్కువగా వచ్చింది. అయినా మధ్య దళారులు రైతులకు అంతంతమాత్రమే ఇచ్చి కొనుగోలు చేశారు. గతఏడాది క్వింటాల్ ఉల్లి ధర 4 వేల నుంచి 4 వేల 5వందల వరకు పలికింది. కాని ఈ సంవత్సరం గ్రేడ్‌లను బట్టి క్వింటాల్ ఉల్లి ధర 2వేల 3 వందల రూపాయలు పలుకుతోంది. రైతన్న ఆరుగాలం శ్రమించి వేలకు వేల రూపాయలు పెట్టుబడులుగా పెట్టి పండించిన పంటను మార్కెట్ కు తీసుకు వస్తే.... అక్కడ దళారులు తమ వ్యాపార నైజాన్ని చూపిస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు.
రైతుల రూ.2,300లకు కొనుగోలు....
వ్యాపారులు రైతుల వద్ద క్వింటాల్‌కు 2వేల 3 వందలకు కొనుగోలు చేసి వినియోగదారులు కిలో ధర 35 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. దీంతో వ్యాపారస్తుడు కిలోపై 12 రూపాయల చొప్పున లాభం గడిస్తున్నాడు. ఉల్లి విషయంలో అటు పండించిన రైతు...ఇటు వినియోగదారుడు మోసపోతూనే ఉన్నారు. మధ్య దళారులు, వ్యాపారులు మాత్రం లాభాలను గడిస్తున్నారు. 

06:57 - July 25, 2015

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో కనీస వేతనాలు రాకా వందల సంఖ్యలో ఉద్యోగులు జీవితాలను వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సరిసమానంగా ఉద్యోగం చేస్తున్నా..వీరి కొచ్చేది మాత్రం అంతంతే. స్వరాష్ర్టంలో తమ బతుకులు బాగుపడతాయనుకున్న వీరికి నిరాశే ఏదురైంది.
సచివాలయంలో 380 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు....
తెలంగాణ వ్యాప్తంగా 2 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుండగా..సచివాలయంలో 380 మంది పనిచేస్తున్నారు. భవిష్యత్తులో జీతాలు పెరుగుతాయన్న ఆశతో వారంతా ఔట్ సోర్సింగ్ కింద పలు శాఖల్లో పనిచేస్తున్నారు. అందులో దాదాపు 200 మంది వరకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. వీరి ప్రమేయం లేనిది ఫైల్ డిపార్ట్ మెంట్ దాటే అవకాశం లేదు. అయితే ఇంత చేస్తున్నా వీరు శ్రమదోపిడికి గురవుతున్నారు.
డీటీపీ ఆపరేటర్ల చేతికి అందేది రూ.8,140 మాత్రమే....
ప్రభుత్వ ఉద్యోగులతో సరిసమానంగా పని చేస్తున్న ఆపరేటర్లకు నెలకు తొమ్మిదిన్నర వేల జీతమే వస్తుంది. పీఎఫ్, ఈఎస్ఐ తదితర కటింగ్ లు పోను చేతి కందేదీ కేవలం 8 వేల 140 రూపాయలు మాత్రమే. ఇక లిఫ్ట్ ఆపరేటర్లు, అటెండర్లు, డైవర్లు కలుపుకుని మొత్తం 180 మంది వరకు సచివాలయంలో పనిచేస్తున్నారు. అధికారులకు, ఉన్నత స్థాయి ఉద్యోగుల కింద వీరు పనిచేస్తున్నారు.
లిఫ్ట్ బాయ్‌లకు నెలకు ఇస్తుంది కేవలం రూ. 6,700 మాత్రమే....
అటెండర్లకు, రోజంతా సందర్శకులను పైకి కిందకి చేర్చే లిఫ్ట్ బాయ్ లకు నెలకు ఇస్తుంది కేవలం ఆరు వేల 700 మాత్రమే. వీరికి కటింగ్‌లు పోను దక్కేది 5 వేల నాలుగు వందలు మాత్రమే. డ్రైవర్ల జీతాలు కూడా చాలా తక్కువే. నెలకు ఏడు వేల ఏడువందల జీతం వస్తున్నా..చేతికి వచ్చేది మాత్రం కేవలం 6 వేల నాలుగు వందలే. సచివాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే ..ఇక జిల్లాలు, దూర ప్రాంతాల్లో పనిచేసే వారి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల పెంపుదలకు సర్కార్‌ విముఖత.....
తమలాగే ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న జీహెచ్ఎంసీ స్వీపర్లు, డ్రైవర్లకు జీతాలు పెరిగినప్పుడు...తమకూ పెరుగుతాయని ఆశించారు. కానీ ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అయినవారికి జీతాలు పెంచాల్సిన అవసరం లేదనే భావనలో సర్కార్ ఉంది. ఇంత తక్కువ జీతాలతో కుటుంబ పోషణ గగనమని ఉద్యోగులు వాపోతున్నారు.
పోరాడితే ఉద్యోగం పోతుందనే భయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు....
సీఎం చొరవ తీసుకొని జీతం పెంచితే తప్ప తామేం చేయలేమని వారితో పనిచేయించుకుంటున్న అధికారులు అంటున్నారు. అయితే కనీస వేతనం కోసం పోరాడితే..ఉన్న ఉద్యోగం పోతుందన్న భయంతో సంఘటితం కాలేకపోతున్నారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అయి ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారి వేతనాల సంగతి తమ పరిధిలోకి రాదని చెబుతున్న కేసీఆర్ సర్కార్..తమ బాధ్యతను విస్మరిస్తోంది. కనీస వేతనాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన పాలకులే ఇలా బాధ్యతను గాలికొదిలేయడం సరికాదు.

06:54 - July 25, 2015

గుంటూరు: నాగార్జున వర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయగా..తాజాగా ఈ కేసును లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సుమోటోగా స్వీకరించి.. ప్రిన్సిపల్‌, వార్డెన్‌కు నోటీసులు జారీచేసింది. మరోవైపు యూనివర్శిటీకి 10రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ వీసీ ఆదేశాలు జారీచేశారు. దీనిపై వర్శిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
సుమోటోగా స్వీకరించిన లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ.....
గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో విచారణ వేగవంతం అవుతోంది. ఆత్మహత్యకు పాల్పడిన రిషితేశ్వరి కేసును లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సుమోటోగా స్వీకరించింది. ప్రత్యేక న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని, కేసును సుమోటోగా స్వీకరించాలంటూ మహిళా న్యాయవాదులు చేసిన అభ్యర్థనను లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అంగీకరించింది. నాగార్జునా యూనివర్శిటీ ప్రిన్సిపాల్‌ బాబూరావు, వార్డెన్‌కు నోటీసులు జారీచేస్తూ.. ఆగస్టు ఒకటో తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
వెలుగు చూస్తున్న అరాచకాలు...
ఇదిలా ఉంటే..నాగార్జునా వర్సిటీలో సాగుతున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విద్యా బుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులు.. విద్యార్థులను పాశ్చాత్య సంస్కృతికి అలవాటు చేస్తున్న వైనం బట్టబయలైంది. క్లబ్బులు, పబ్బుల వెంట తిప్పుతూ, మద్యం అలవాట్లు నేర్పిస్తూ..రేవ్‌ పార్టీలకు విద్యార్థును తరలించిన వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రిన్సిపాల్‌, వార్డెన్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్....
ఈ వ్యవహారంపై యూనివర్శిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై జ్యుడీషియల్‌ విచారణ చేపట్టాలంటూ విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలో భారీ ప్రదర్శన నిర్వహించాయి. రిషితేశ్వరి ఘటనలో..ముగ్గురు విద్యార్థులు అరెస్టుకాగా.. ప్రిన్సిపల్‌, వార్డెన్‌లను నామమాత్రంగా సస్పెండ్‌ చేయడమేంటని విద్యార్థులు మండిపడుతున్నారు. తక్షణమే ప్రిన్సిపల్‌, వార్డెన్‌పై కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. అప్పటివరకు ఆందోళనలను ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
సీఎంతో చర్చించిన మంత్రి గంటా....
మరోవైపు నాగార్జున యూనివర్శిటీ ఘటనపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు. యూనివర్శిటీలో రోజు రోజుకు ఆందోళనలు ఉద్రృతం అవ్వడానికి కులసంఘాలే కారణమయి ఉంటాయని మంత్రి సీఎంకు వివరించారు. దీంతో కులసంఘాల బోర్డులను వెంటనే తొలగించాలని..వర్శిటీలో అదనపు పోలీసు బలగాలను పెట్టాలని..అక్రమంగా క్యాంపస్‌లో ఉంటున్నవారిని బయటకు పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. దీంతో నాగార్జున యూనివర్శిటీకి 10 రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ ఇన్‌ఛార్జ్‌ వీసీ సాంబశివరావు సర్క్యూలర్ జారీచేశారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో వర్శిటీలోకి కొంతమంది బయటి వ్యక్తులు ప్రవేశించి అనవసరమైన ఉద్యమాలు నడిపిస్తున్నారన్న సమాచారంతో 10 రోజుల సెలవులను ప్రకటిస్తూ వీసీ ఆదేశాలు జారీచేశారు. మధ్యాహ్నంలోగా విద్యార్థులందరిని పోలీసుల సహకారంతో ఖాళీచేయించేందుకు వర్శిటీ అథారిటీ చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ త్రిపాఠి, ఆర్డీవోలతో వర్శిటీ వీసీ 3గంటలకుపైగా చర్చలు జరిపి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. 10 రోజుల సెలవుల తర్వాత పూర్తిస్థాయిలో గుర్తింపు కార్డుల ద్వారా తిరిగి వర్శిటీ, హాస్టల్‌లోకి అనుమతిస్తామని వర్శిటీ అథారిటీ చెప్తోంది.
10 రోజుల సెలవులను ప్రకటించడాన్ని తప్పు పడుతున్న విద్యార్థి సంఘాలు....
అయితే 10 రోజుల సెలవులను ప్రకటిస్తూ వీసీ జారీ చేసిన ఆదేశాలను విద్యార్ధులు, విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. రిషికేశ్వరి ఆత్మహత్య కేసును పక్కదారి పట్టించేందుకే వర్శిటీకి అర్ధంతరంగా సెలవులను ప్రకటించారని విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిగ్గుతేల్చాలని అడిగితే..విద్యార్థులకు సెలవులు ఇవ్వడం సరైంది కాదని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఖండిస్తున్నారు. మొత్తానికి.. రిషితేశ్వరి ఆత్మహత్యతో నాగార్జున వర్సిటీలో రహస్యంగా సాగుతున్న వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు పొక్కుతున్నాయి. మరి..ఇంకా ఎలాంటి విషయాలు బయటపడతాయో..? ఈ కేసు విచారణ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

06:48 - July 25, 2015

హైదరాబాద్‌: నగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు వేగవంతమయ్యాయి. నగరంలోని పలు జంక్షన్ల వద్ద నిత్యం గంటల కొద్ది ట్రాఫిక్ జాం అవుతోంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు స్కైఓవర్లు... ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది GHMC. ఆ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి దశలో 20 ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు.
కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ చుట్టూ.....
మొదటి కారిడార్‌లో బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ చుట్టూ మల్టీలెవల్ ఫ్లై ఓవర్ నిర్మించడంతో పాటు.. పార్క్ ఎట్రెన్స్‌ , క్యాన్సర్ ఆసుపత్రి, ఫిల్మ్ నగర్, రోడ్డునంబర్ 45, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, గ్రేడ్ సఫరేటర్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 586కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు.
రెండవ కారిడార్‌లోఎల్బీనగర్ జంక్షన్.....
ఇక రెండవ కారిడార్‌లోఎల్బీనగర్ జంక్షన్, బైరామాల్ గూడ, కామినేని హస్పిటల్, చింతల్ కుంటా చెక్ పోస్ట్, రసూల్ పూరా, ఉప్పల్, ఓవైసీ ఆసుపత్రి వద్దగల జంక్షన్లను డెవలప్‌ చేయనున్నారు. వీటి కోసం 822 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక మేజర్ కారిడార్‌గా ఉన్న గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుండి కూకట్‌పల్లి జంక్షన్ వరకు మైండ్ స్పేస్, సైబర్ టవర్స్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్ గాంధీ జంక్షన్, అబిడ్స్ నుండి ఛాదర్ ఘాట్- మలక్ పేట్ వరకు, బహదూర్ పూర వరకు అన్నింటినీ కలిపి మొదటి దశలోనే పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు 2631 కోట్లు ఖర్చుచేయనున్నారు. ఈ నిర్మాణాల కోసం సుమారు 80 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. ఇందులో 581 ఆస్తులకు సంబంధించి 30 ఎకరాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
గ్రేటర్ పరిధిలో రోడ్డు సమగ్రాభివృద్ది పథకంలో.....
ఇక గ్రేటర్ పరిధిలో రోడ్డు సమగ్రాభివృద్ది పథకంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపడుతోంది. ఈ రోడ్డు నిర్మాణపనులకు 30రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. రెండున్నర సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అయిన ఖర్చను జీహెచ్ఎంసీ ఇరవై సంవత్సరాల పాటు వాయిదాల పద్దతిలో చెల్లిస్తుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ష్యూరిటీగా ఉంటుంది.
నగరంలో ఇంటర్నల్ రోడ్లు డెవలప్ చెయ్యకుండా....
అయితే నగరంలో ఇంటర్నల్ రోడ్లు డెవలప్ చెయ్యకుండా ప్రధానమైన రోడ్లను మాత్రమే అభివృద్ధి చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ప్రజా సంఘాలు అంటున్నాయి. అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలని.. అప్పుడే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని వారు అంటున్నారు. 

06:44 - July 25, 2015

హైదరాబాద్:పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. త్వరలో మొదటి దశ పనులకు టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు,.ప్రాజెక్టు పనులను ఐదు ప్యాకేజీలుగా విడగొట్టాలని సూచించారు. పాలమూరు ప్రాజెక్టు పనులను సమాంతరంగా జరిపించి వెనకబడ్డ పాలమూరు జిల్లాను సస్య శ్యామలం చేస్తామన్నారు.
ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు కసరత్తు...
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.35 వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్ నగర్, రంగా రెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీటిని అందిచడంతో పాటు హైదరాబాద్‌ ప్రజల దాహర్తిని తీర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని అడ్డంకులెదురైనా ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే శంకుస్థాపన పూర్తి చేసుకున్న..పాలమూరు ఎత్తిపోతల పనుల్లో వేగం పెంచేందుకు..మంత్రులు, అధికారులు, ఇంజనీర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.
భూ నిర్వాసితులకు మార్కెట్‌ రేటు.....
భూ సేకరణలో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు భూ నిర్వాసితులకు మార్కెట్ రేటును కట్టించడంతో పాటు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం చొప్పున మొత్తం 15వేల ఉద్యోగాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనుల ప్రారంభానికి ముందే నష్టపరిహరాన్ని చెల్లించేందుకు జిల్లా కలెక్టర్‌కు ఇప్పటికే 300 కోట్ల రూపాయల నిధుల్ని అందచేసింది. ఎత్తిపోతల ప్రాజెక్టు భూ సేకరణ బాధ్యతను స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వం అప్పగించింది. దాంతో పాటు ప్రాజెక్టు పనులను ఒక్క కంపెనీకే అప్పగించకుండా..పలు కంపెనీలతో పనులు చేయించి అనుకున్న సమయంలోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు ప్రాజెక్టు పనులను 5 ప్యాకేజీలుగా విడగొట్టి టెండర్లను పిలవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మొదటి దశ పనుల కోసం త్వరలో టెండర్లను పిలవాలని ఆదేశించారు. ప్యాకేజీల వారిగా సమాంతరంగా పనులను చేయించడం ద్వారా అనుకున్న సమయానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఏర్పాట్లపై సైతం ప్రభుత్వం దృష్టి.....
ఇక ఎత్తిపోతల పథకం కావడంతో..అవసరమైన మోటర్లు, పైపు లైన్ల ఏర్పాట్లపై సైతం ప్రభుత్వం దృష్టి సారించింది. మోటర్లు, పైపు లైన్ల సంఖ్యను గుర్తించి ప్రభుత్వ రంగ సంస్థ భెల్ కు సరఫరా బాధ్యతలను అప్పగించనుంది. అందుకోసం భెల్‌కు అడ్వాన్స్ ను చెల్లించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. దీంతో పాటు ఈ ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు, రంగారెడ్డి జిల్లా లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులను సమాంతరంగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా...ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.  

భక్తులతో కిటకిటలాడుతున్న పుష్కర ఘాట్లు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు ఆఖరి రోజు చేరడంతో ఈ రోజు వేకువ జామునుంచి పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పట్టిసీమ, కొవ్వూరు, సిద్ధాంతం, నర్సాపురం పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం పుష్కర ఘాట్ కు భక్తులు పోటెత్తారు. 

ఘనంగా గోదావరి పుష్కరాల ముగింపు వేడుకలు...

రాజమండ్రి: గోదావరి పుష్కరాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించిందుకు ఏపీ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6 గంటలకు రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో వెయ్యి మందితో నృత్య ప్రదర్శనతో పాటు మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత కచేరిని చేపట్టింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.

నేటితో ముగియనున్న గోదావరి మహాపుష్కరాలు

హైదరాబాద్: నేటితో గోదావరి మహా పుష్కరాలు ముగియనుండడంతో వేకువాజము నుంచే పుష్కర ఘాట్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ముగింపు ఉత్సవాల రద్దీ తట్టుకునేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.

Don't Miss