Activities calendar

27 July 2015

22:08 - July 27, 2015

నిన్న మొన్నటిదాక చుక్కలు చూపించిన బంగారం ధర ఇప్పుడు నేల మీదకు దిగుతోంది. ఇప్పుడు బంగారం గత ఐదేళ్లల్లో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి చేరింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

21:55 - July 27, 2015

హైదరాబాద్ : తెలంగాణలోనే అతిపెద్ద శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధిలో... తొలి ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తొలుత ధర్మగుండంలో పూజలు నిర్వహించి... ఆలయంలో పవిత్ర పూజలు చేశారు. రుద్రాభిషేకం, అఖండ భజనకు భారీగా భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మహబూబ్‌ నగర్‌
మహబూబ్‌ నగర్‌ జిల్లాలో తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం, అలంపూర్ లోని బాలబ్రహ్మేశ్వర ఆలయాల్లో ఏకాదశి సందర్భంగా పూజరాలు ప్రత్యేక పూజలు చేశారు. శివలింగానికి పాలభిషేకం చేసిన భక్తులు, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

21:52 - July 27, 2015

శ్రీకాకుళం: పట్టణంలో జేమ్స్ బాండ్‌ చిత్ర యూనిట్ సందడి చేసింది. హిరో నరేష్, హిరోయిన్ సాక్షి చౌదరితో చిత్ర బృందం పట్టణంలో పర్యటించారు. తొలుత అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి నుండి నేరుగా శ్రీకాకుళం పట్టణంలో చిత్రం ప్రదర్శించబడుతున్న మారుతీ థియేటర్‌కు రావడంతో.. అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సినిమాలో డైలాగులు చెబుతూ అల్లరి నరేష్‌ ప్రేక్షకులను అలరించారు.

 

21:49 - July 27, 2015

అనంతపురం: జిల్లాలోని జోడెడ్ల బండి రైతులు.. సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. వంద ఎడ్లబండ్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు. తమపై పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. చిన్న చిన్న అవసరాలకు ఎడ్ల బండ్ల మీద ఇసుకను తీసుకెళ్లే తమపై.. దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకను నిత్యం ట్రాక్టర్లు, లారీల్లో తరలిస్తున్న బడా బాబులకు కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు.

 

21:46 - July 27, 2015

విజయవాడ: 2014 మార్చి 15వ తేదీన అత్యంత దారుణంగా.. అత్యాచారానికి, హత్యకు గురైన హిమబిందు హత్య కేసులో తుది తీర్పును... రేపు విజయవాడ కోర్టు వెల్లడించనుంది. ఇప్పటికే విచారణ పూర్తిచేసుకోవడంతో నిందితులకు ఎలాంటి శిక్ష పడుతుందోననే ఉత్కంఠ.. సర్వత్రా నెలకొంది. కిరాతకంగా వ్యవహరించి పాశవికంగా హత్యచేసిన వారికి కఠిన శిక్షలే పడాలని స్థానికులు అంటున్నారు. వారికి పడే శిక్షలను చూసి ఇతరులెవరూ అటువంటి వాటికి ప్రేరేపితం కాకుండా శిక్షలుండాలని విజయవాడ ప్రజలు కోరుతున్నారు.

 

21:43 - July 27, 2015

గుంటూరు: జిల్లాలో వరకట్నానికి ఓ వివాహిత బలైంది. అదనపుకట్నం తీసుకురాలేదన్న అక్కసుతో.. భర్తే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన గుంటూరు శివారులోని అగవత్తరపాడులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శారదకు.. అదేగ్రామానికి చెందిన శివశంకర్‌తో 9ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లికి ముందునుంచే ఆర్మీలో టెక్నిషియన్‌గా పనిచేస్తున్న శివశంకర్‌.. అదనపు కట్నం తీసుకురావాలని శారదను వేధించేవాడు. దీంతో శారద తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదిరోజుల క్రితం ఊరునుంచి వచ్చిన శివశంకర్‌కు విషయం తెలిసింది. కత్తితో శారద ఇంటికి వెళ్లి...గొంతుకోసి హతమార్చాడు. అడ్డువచ్చిన శారద అక్కపై కూడా కత్తితోదాడి చేసి.. పెద్దకాకాని పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

21:17 - July 27, 2015

షిల్లాంగ్ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఇక లేరు.  షిల్లాంగ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అబ్దుల్ కలాం(84) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈరోజు సాయంత్రం ఆరున్నరకు షిల్లాంగ్‌లోని ఐఐఎం సెమినార్‌లో ప్రసంగిస్తూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కలాంను షిల్లాంగ్‌లోని బెతాని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఐసియూలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. డాక్టర్‌ అబ్దుల్‌ కలాం భారత దేశానికి 11వ రాష్ట్రపతిగా పనిచేశారు. 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతి పదవిలో ఉన్నారు.
1931 అక్టోబర్‌ 15న అబ్దుల్‌ కలాం జననం
అబ్దుల్‌ కలాం 1931 అక్టోబర్‌ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో కలాం విద్యాభ్యాసం చేశారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. డిఆర్ డివో మరియు ఐఎస్ ఆర్ వొలో ఏరోస్పేస్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తించారు. కలాంకు మిస్సైల్ మాన్ గా పేరుంది. బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కలాం కృషి చేశారు. 1998 లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కలాం కీలక పాత్ర పోషించారు. 2002 అధ్యక్ష ఎన్నికలలో కలాం పోటీ చేశారు. భారత 11వ రాష్ట్రపతిగా కలాం పని చేశారు. అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను కలాం అందుకున్నారు.
కలాం మృతి పట్ల పలువురి సంతాపం
అబ్దుల్ కాలం మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, ఆర్ జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, షార్ సైంటిస్టు శేషగిరిరావు, సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలు కలాంకు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

 

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్నుమూత..

షిల్లాంగ్ : భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె. అబ్దుల్ కలాం కన్నుమూశారు. షిల్లాంగ్ లోని ఐఐఎంలో విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగిస్తుండగా అబ్దుల్ కలాం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. 

కిలో రూ.20 కే ఉల్లిపాయలు అమ్మాలి: సీఎం చంద్రబాబు

హైదరాబాద్: రైతు బజార్ల అధికారులతో ఎపి సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్లుండి నుంచి అన్ని రైతు బజార్లలో కిలో రూ.20 కే ఉల్లిపాయలు అమ్మాలన్నారు. రేపటి కల్లా ఉల్లిపాయలను రైతు బజార్లకు చేర్చాలని తెలిపారు. 

20:36 - July 27, 2015

షిల్లాంగ్ : భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె. అబ్దుల్ కలాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. షిల్లాంగ్ లోని ఐఐఎంలో విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగిస్తుండగా అబ్దుల్ కలాం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు. 

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు తీవ్ర అస్వస్థత..

షిల్లాంగ్ : భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె. అబ్దుల్ కలాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. షిల్లాంగ్ లోని ఐఐఎంలో విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగిస్తుండగా అబ్దుల్ కలాం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు.

 

20:29 - July 27, 2015

యూకూబ్ మెమన్ కు ఉరిశిక్ష వేయడం సరికాదని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం కేంద్రకార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాస్ రావు, బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర మానవ హక్కుల వేదిక అధ్యక్షులు జీవన్ కుమార్, సామాజిక విశ్లేషకుడు ప్రొ.హరగోపాల్ పాల్గొని, మాట్లాడారు. ఉరిశిక్ష అమలు చేయడం అనాగరికమైన చర్యగా అభివర్ణించారు. యూకూబ్ కు ఉరిశిక్ష అమలు చేయడం సరికాదని.. జీవిత ఖైదు విధించాలని సూచించారు. ఉరిశిక్ష.. వల్ల టెర్రరిజం అంతం కాదని.. దాని మూలాలను కొనుక్కొని.. అంతమొందించాలన్నారు. న్యాయవ్యవస్థకు కట్టుబడి ఉండాలని చెప్పారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆంధ్ర-నాగార్జున-వెంకటేశ్వర వర్సిటీల్లో జపనీస్ భాష

హైదరాబాద్: ఆంధ్ర, నాగార్జున, వెంకటేశ్వర యూనివర్సిటీల్లో జపనీస్ భాషను ప్రవేశపెడుతూ.. ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

20:06 - July 27, 2015

రాజమండ్రి: మొన్నటివరకూ భక్తులతో కళకళలాడిన గోదావరి... ఇప్పుడు యువకులు, ఈతగాళ్లతో సందడిగా మారింది. భక్తులు వదిలేసిన చిల్లర నాణాలు.. ఇతర వస్తువులకోసం యువకులు నదిలో వెతుకుతున్నారు. పుష్కరాలు ముగిసిన అర్ధరాత్రి నుంచి రాజమండ్రి పుష్కరఘాట్... కోటిలింగాలరేవుతోపాటు.. ఇతర స్నానఘట్టాల దగ్గర కాసుల కోసం గాలిస్తున్నారు. గజ ఈతగాళ్లు లోతైనప్రాంతాల్లో... మామూలు యువకులు మోకాలిలోతు నీటిలో చిల్లరకోసం మునుగుతున్నారు.

 

20:02 - July 27, 2015

కర్నూలు: జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో ప్రిజం సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ప్లాంట్‌ నిర్మించి తమకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని భూములు తీసుకున్న యాజమాన్యం ఇప్పటివరకు ప్లాంట్‌ నిర్మించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అందుకే తాము ఇచ్చిన భూముల్లో తిరిగి సాగు చేసుకుంటామని రైతులంటున్నారు. ఇందుకోసం రైతులు పొలాల వద్దకు జేసీబీని తీసుకువచ్చారు. యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రైతులను పోలీసులు అడ్డుకున్నారు.

 

19:58 - July 27, 2015

శ్రీకాకుళం: జిల్లాలో నాటు తుపాకులు, నాటు బాంబులు బయటపడటంతో స్థానికంగా కలకలం రేగింది. పాలకొండ మండలం గోపాలపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కార్‌ ఆటోను ఢీకోట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆటోలో వెళ్తున్న ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు పరారయ్యారు. అయితే ఆటోలో మాత్రం ఎనిమిది నాటు తుపాకులు, నాటు బాంబులు బయటపడ్డాయి. ఆటో డ్రైవర్‌ పోలీసులకు లొంగిపోయి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేశాడు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

 

 

హైదరాబాద్ లో పోలీసులు అప్రమత్తం

హైదరాబాద్: పంజాబ్ లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో హైదరాబాద్ లోపోలీసులు అప్రమత్తం అయ్యారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ పీఎస్ ల పరిధిలోని బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 

19:45 - July 27, 2015

హైదరాబాద్: గోదావరి పుష్కరాలపై 1600 కోట్ల రూపాయలను ఎక్కడ ఖర్చుపెట్టారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఎపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన సమావేశంలో రఘువీరా మాట్లాడారు. గోదావరి పుష్కరాల దుర్ఘటనపై పార్టీ తరపున నిజనిర్ధారణ కమిటీ వేసినట్లు తెలిపారు. రాహుల్‌ గాంధీ పర్యటనతో ప్రజల్లో అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు.

 

19:36 - July 27, 2015

హైదరాబాద్: ఏపీ మున్సిపల్ శాఖ కార్యదర్శి గిరిధర్ బదిలీ అయ్యారు. ఆయనను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా నియామిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రి నారాయణతో విభేదాలే ఈ బదిలీకి కారణంగా తెలుస్తోంది. రాజధాని మాస్టర్ ప్లాన్ తయారీలో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడినట్టు సమచారం. ఇప్పటివరకు నారాయణ పేషీలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్లు బదిలీ అయ్యారు.

 

19:33 - July 27, 2015

విజయనగరం: జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు ఒక్కసారిగా కలెక్టరేట్ ముట్టడి చేశారు. విద్యార్థులంతా ఒక్కసారిగా కలెక్టరేట్ లోపలకు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కొంతమంది విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. మరికొంతమంది విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి.

 

19:30 - July 27, 2015

చిత్తూరు: తిరుమల గోగర్భం డ్యామ్ సమీపంలో వద్ద చిరుత పులులు హల్ చల్ చేస్తున్నాయి. రాత్రి సమయంల్లోనే చిరుత పులులు సంచరిస్తుండటంతో భక్తులు అటుగా వెళ్లాలంటేనే హడలి పోతున్నారు. చిరుత తిరుగుతున్న విజువల్స్ మఠాల్లోని సిసికెమెరాల్లో రికార్డ్ కూడా అయ్యాయి. గత కొన్ని రోజులుగా బాలాజీ నగర్, గంగమ్మ ఆలయం సమీపంలో చిరుత సంచరిస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకూ శేషాచలం అటవీ ప్రాంతంలో 50 చిరుత పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు పరిశీలనలో తేలింది.

 

19:27 - July 27, 2015

గుంటూరు: జిల్లాలోని మంగళగిరి వీఆర్వోపై జరిగిన దాడి ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, రేంజ్‌ ఐజీ సంజయ్‌ వివాదాస్పద భూమిని పరిశీలించారు. మరోవైపు దాడి ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ ఉద్యోగులు నిరసన గళం వినిపించారు. రెవెన్యూ ఉద్యోగుల ఆందోళనకు విపక్షాలు మద్దతు పలికాయి. 

19:23 - July 27, 2015

పంజాబ్: గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్‌లో ఉగ్రవాద ఆపరేషన్ ముగిసింది. దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో ఆరుగురి మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు పోలీసులు, ముగ్గురు పౌరులు ఉన్నారు. ఉగ్రవాదులు.. సైనిక దుస్తుల్లో వచ్చి దీనానగర్ పోలీస్ స్టేషన్, బస్సుపై దాడి చేశారు. 12 గంటలపాటు పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.

 

19:02 - July 27, 2015

హైదరాబాద్: భానుకిరణ్‌ బెయిల్‌ పిటిషన్‌ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. మద్దెలచెర్వు సూరి హత్యకేసులో భాను కిరణ్ నిందితుడుగా ఉన్నాడు. 

18:57 - July 27, 2015

వరంగల్: మున్సిపల్‌ కార్మికుల ఆందోళ‌న వ‌రంగ‌ల్ న‌గ‌రంలో తీవ్రరూపం దాల్చింది. గ‌త 23 రోజులుగా స‌మ్మె చేస్తున్న ప్రభుత్వం ప‌ట్టించుకొకపోవ‌డంతో కార్మికులు న‌గ‌ర‌పాల‌క సంస్థ కార్యాల‌యం ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. కార్మికులు చేస్తున్న స‌మ్మెపై ప్రభుత్వం దిగిరాక‌పోవ‌డంతో మన‌స్తాపం చెందిన ఓ కార్మికురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. ఆత్మహత్యాయ‌త్నాన్ని గ‌మ‌నించిన తోటి కార్మికులు ఆమెను అడ్డుకున్నారు.

 

కాసేపట్లో రాజ్ నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం..

ఢిల్లీ: పంజాబ్ ఉగ్రవాది దాడి ఘటనపై కాసేపట్లో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 

నెల్లూరులో పలు దుకాణాలపై విజిలెన్స్ దాడులు

నెల్లూరు: స్టోన్స్ హౌస్ పేటలోని పప్పులవీధిలో పలు దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన రూ.60 లక్షల విలువైన పప్పు ధాన్యాలను సీజ్ చేశారు.

ఎపి మున్సిపల్ శాఖ కార్యదర్శి గిరిధర్ బదిలీ...

హైదరాబాద్: ఎపి మున్సిపల్ శాఖ కార్యదర్శి గిరిధర్ బదిలీ అయ్యారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా గిరిధర్ ను నియమించారు. యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాళ వళవన్ పౌరసరఫరాల శాఖకు బదిలీ అయ్యారు. నెల్లూరు సబ్ కలెక్టర్ గా గిరీష నియామకమయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

గురుదాస్ పూర్ లో ముగిసిన ఉగ్రవాద ఆపరేషన్

పంజాబ్: గురుదాస్ పూర్ జిల్లాలో ఉగ్రవాద ఆపరేషన్ ముగిసింది. దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు పోలీసులు, ముగ్గురు పౌరులు ఉన్నారు. ఉగ్రవాదులు.. సైనిక దుస్తుల్లో వచ్చి దీనానగర్ పోలీస్ స్టేషన్, బస్సుపై దాడి చేశారు. ఉగ్రవాదులు, పోలీసుల మధ్య 12 గంటలపాటు కాల్పులు జరిగాయి.

 

 

17:51 - July 27, 2015

ఢిల్లీ: శ్రీవారు ఇక టీవీ రిమోట్‌ చేతిలో పట్టుకుని అలర్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఆ యాడ్‌ వస్తుంటే.. టక్కున చానెల్‌ మార్చేయాల్సిన పని లేదు. శ్రీమతికి కబుర్లు చెప్పి కనికట్టు చేయనక్కర్లేదు. పడతి ఆశగా చూస్తుంటే.. బెదురుచూపులు చూడక్కర్లేదు. కాలరెగరేసి ధైర్యంగా గర్వంగా.. ఏం కావాలి బంగారం అంటూ ప్రేమగా అడగొచ్చు.
బంగారం ధర 24,752
భారతీయులు డబ్బులు పోగేసుకునే పనిలో పడ్డారు. భారతీయ మహిళలైతే సెలెక్షన్‌ బిజీలో ఉన్నారు. బంగారం దివి నుంచి భువికి దిగొచ్చింది. పుత్తడి ధర బాగా పడిపోయింది. 24 వేల 7 వందలకు దిగొచ్చిన బంగారం ధర మరికొన్ని రోజుల్లో 23 వేలకు పడిపోవచ్చని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.
బంగారం పైనా విదేశీ ఇన్వెస్టర్ల ప్రభావం
కేంద్ర ప్రభుత్వం బంగారంపై బాండ్లు తెస్తామని చెప్పినప్పుడు మొదలైన డౌన్‌ ట్రెండ్‌.. అలా కొనసాగుతోంది. మధ్యలో మార్కెట్‌ ఎఫెక్ట్ తో రేట్లు పెరిగినా.. గోల్డ్‌ మళ్లీ బౌల్డ్‌ అయిపోయే పరిస్ధితి వచ్చింది. షేర్‌మార్కెట్‌తో పాటు బంగారం ధరలను కూడా విదేశీ ఇన్వెస్టర్లే కంట్రోల్‌ చేస్తున్నారనడానికి ప్రస్తుత పరిస్ధితి అద్దం పడుతోంది. అమెరికా ఫెడ్‌బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెంచే యోచనలో ఉందని వార్తలు రావడంతో.. పెట్టుబడులు తమ రూటు మార్చుకుంటున్నాయి. జూలై 29న జరిగే మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి తోడు చైనా తన బంగారపు నిల్వలను అమ్మేస్తుండటంతో పుత్తడి పరిస్ధితి ఇత్తడిలా మారింది. అక్టోబర్‌ నుంచి కేంద్రం బంగారం బాండ్లను కూడా మొదలుపెట్టనున్నది.
బంగారంపై పెట్టుబడికి మార్కెట్‌ అనాసక్తి
బంగారంపై మార్కెట్‌ నిపుణులు పెట్టుబడి పెట్టొద్దనుకుంటున్నారు. వచ్చే రెండు నెలల్లో దీని ధర మరింత పడిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే మన భారతీయుల మనస్తత్వం తెలిసిన బంగారం వ్యాపారులు మాత్రం ఆశాజనకంగా ఉన్నారు. రేటు తగ్గడంతో సేల్స్‌ విపరీతంగా పెరుగుతాయని.. తగ్గినప్పుడే భారీగా కొనే భారతీయుల ఎఫెక్ట్ తో తర్వాతి కాలంలో డిమాండ్‌ పెరిగి.. రేట్లు పెరుగుతాయని.. దీపావళి నాటికి మళ్లీ బంగారం మార్కెట్‌ పుంజుకుంటుందని వారు భావిస్తున్నారు.

 

17:29 - July 27, 2015

పాట్నా: పంజాబ్‌లో ఉగ్రదాడులపై ఆ... రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ కేంద్రాన్నే టార్గెట్‌ చేశారు. ఉగ్రవాదులు పంజాబ్‌లో నుంచి రాలేదని సరిహద్దు నుంచే వచ్చారని తెలిపారు. సరిహద్దును సీల్‌ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని బాదల్‌ స్పష్టం చేశారు. ఇది జాతీయ సమస్యగా పేర్కొన్నారు. సరిహద్దులో ఉన్న జవాన్లు, అధికారులు బాగా పోరాడుతున్నారని కితాబిచ్చారు.

17:23 - July 27, 2015

హైదరాబాద్‌: సమ్మె కారణంగా తొలగించిన మున్సిపల్‌ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో సమ్మె కారణంగా తొలగించిన మున్సిపల్‌ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ రోజు రోజుకూ నిరసనలు పెరిగిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా మున్సిపల్‌ కార్యాలయాల ముందు కార్మికులు దీక్షలు చేస్తున్నారు. ఖైరతాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ కార్యాలయం ముందు కార్మికులు చేస్తున్న దీక్షకు సీపీఎం శాసనసభాపక్షనేత సున్నం రాజయ్య మద్దతు తెలిపారు. న్యాయబద్దంగా సమ్మె చేస్తున్న కార్మికులను విధుల్లోంచి తొలగించడం దారుణమన్నారు. సమ్మెలో ఉన్న కార్మికులకు వేతనాలు పెంచాలని కోరారు. తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పెద్దఎత్తున పోరాటాలు చేపడుతామని హెచ్చరించారు.

 

ఉగ్రవాదుల దాడి అమానుషం:దత్తాత్రేయ

హైదరాబాద్‌ : పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడి అమానుషమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ ఘటన చూసైనా కుహనా లౌకికవాదులు తమ వైఖరి గురించి పునరాలోచించుకోవాలని అన్నారు. ముంబైలో వందలాదిమందిని చంపిన ఉగ్రవాది యాకూబ్‌ మెమెన్‌కు కోర్టు మరణ శిక్ష విధిస్తే కొంతమంది రాద్దాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉగ్రవాదుల దాడిలో తొమ్మిది మంది దుర్మరణం చెందడం చాలా బాధకరమైన విషయమని ఆయన అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు దత్తాత్యేయ పేర్కొన్నారు.

ఉగ్రవాదుల దాడి ప్రభుత్వ వైఫల్యమే: వీహెచ్

ఢిల్లీ: పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి ప్రభుత్వ వైఫల్యమేనని ఎంపి వి. హన్మంతరావు అన్నారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ప్రధాని మోదీ చర్చలు జరిపినా దాడులు ఆగడం లేదని.... అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కలంకిత మంత్రులు రాజీనామా చేసే వరకు సమావేశాలను అడ్డుకుంటామని వీహెచ్ స్పష్టం చేశారు.

దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు

ఢిల్లీ:పంజాబ్ గురుదాన్ పూర్ లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను భద్రతా దళాలు ముట్టుబెట్టాయి. దీంతో ఎదురు కాల్పులు ముగిసినట్లు సమాచారం.

 

ఉగ్రదాడి దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దు...

న్యూఢిల్లీ: పంజాబ్ లోని గురుదాస్ పూర్ ఉగ్రవాదుల దాడి దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ మేరకు టీవీ చానెళ్లకు సూచించింది. కొన్ని చానెళ్లు నిబంధనలను ఉల్లంఘించి లైవ్ కవరేజీ అందించాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుదాస్ పూర్ జిల్లాలోని దీనానగర్ లో ఈ రోజు ఉదయం నుంచి ఉగ్రవాదులు, భద్రత దళాల మధ్య కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2015 కేబుల్ నెట్ వర్క్ నిబంధనల ప్రకారం.. భద్రత దళాలు చేపట్టే ఉగ్రవాద నిర్మూలన చర్యలను టీవీ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయరాదని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ముస్లిం స్థితిగతులపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: తెలంగాణలో ముస్లిం స్థితిగతులపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం సమీక్ష జరిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కేంద్రం నియమించిని కుంద్ కమిటీ సభ్యులు ఈ సమీక్షకు  హాజరయ్యారు.  ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 'తెలంగాణలో ముస్లింలు ఎంతో వెనుకబడి ఉన్నారు. ముస్లిం జీవన స్థితిగతుల్లో మార్పు తెస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పాం. ఆ హామీని 100 శాతం నిలబెట్టుకుంటాం. జనాభా ప్రకారం పేద ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అధ్యయనం చేస్తున్నాం' అని అన్నారు.

 

రేపటికి వాయిదా పడ్డ లోక్ సభ

న్యూఢిల్లీ: వాయిదా అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన లోక్‌సభ వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ను అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు కాంగ్రెస్ సభ్యుడు అధీర్ రంజన్‌ను సస్పెండ్ చేయాలంటూ బీజేపీ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో సభలో కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అధీర్ రంజన్‌ను సస్పెండ్ చేసే తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. అధీర్ రంజన్‌ను ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. 

16:50 - July 27, 2015

హైదరాబాద్: లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ విద్యార్థి సంఘం డిమాండ్‌ చేసింది. హైదరాబాద్ లో ఓయూ లైబ్రరీ నుంచి విద్యార్థులు ర్యాలీగా ఆర్ట్స్ కళాశాల వరకూ చేరుకొని తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్‌... ఇప్పుడు 15వేల ఉద్యోగాలే ఇవ్వడం... సీఎం మోసానికి నిదర్శనమని విమర్శించారు.

 

టిటిడి సమావేశాల్లో పాల్గొనేందుకు సండ్రకు అనుమతి

హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో అరెస్టై అనంతరం విడుదలైన సండ్రకు టీటీడీ బోర్డు సమావేశాల్లో పాల్గొనేందుకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ఆయన టీటీడీ సభ్యుడు కావడంతో అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన కోర్టు సమావేశాలకు హాజరయ్యేందు అంగీకరించింది. 

భానుకిరణ్ బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టేసింది.

16:46 - July 27, 2015

గుంటూరు: రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఉందా లేదా నిరంకుశ పరిపాలన ఉందా అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన భూకబ్జాదారులు.. రెవెన్యూ ఉద్యోగులపై దాడులు చేయడం, అలాగే రిషితేశ్వరి ఆత్మహత్య లాంటి వరుస ఘటనలతో రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే సందేహం కలుగుతోందని విమర్శించారు. రెవెన్యూ ఉద్యోగులపై దాడులు జరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.

 

ప్లకార్డులు ప్రదర్శన సరికాదు:స్పీకర్

ఢిల్లీ:లోక్ సభలో ప్లకార్డుల ప్రదర్శన సరికాదని స్పీకర్ సుమిత్ర మహాజన్ గౌరవ సభ్యులకు సూచించారు. గురుదాన్ పూన్ ఘటనపై విపక్షాలు సభలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా ప్లకార్డులు ప్రదర్శన పై అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సభ్యుల ప్రవర్తనలో మార్పు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

16:43 - July 27, 2015

ఢిల్లీ: లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే హైకోర్టును విభజించాలని ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. 'వి వాంట్‌ హై కోర్టు ..వీ నీడ్‌ హై కోర్టు' అంటూ ఎంపీలు నినాదాలు చేశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవతున్నామని ఎంపీలు తెలిపారు. 

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ దగ్గర దారుణం

హైదరాబాద్: సికింద్రాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న స్వప్నలోక్ కాంప్లెక్స్ దగ్గర నడిరోడ్డుపై ఓ యువకుడిని కొందరు దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఆటోలో వచ్చిన దుండగులు యువకుడిపై కత్తులతో విరుచుకుపడ్డారు. దీంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. తీవ్ర గాయాలపాలై అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.  

16:37 - July 27, 2015

మహిళల వస్త్రధారణలో ఎన్ని ఫ్యాషన్స్ వచ్చినా చుడీదార్ లది ఎప్పడూ ప్రత్యేక స్థానమే. కంఫర్ట్ తో పాటు హుందాగా కనిపించే ఈ చుడీదార్స్ లో లేటెస్ట్ వెరైటీస్ తో ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. ఆ.. వివరానలు వీడియోలో చూద్దాం....

 

16:35 - July 27, 2015

ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారానిదే మొదటి ప్రాధాన్యత. వారం మొత్తం ఎంత స్ట్రిక్ట్ గా హెల్దీ డైట్ ను ఫాలో అయ్యేవారైనా వారాంతంలో బయటి ఫుడ్ కే ప్రాధాన్యతనిస్తుంటారు. అలాంటి వారి కోసం హెల్దీ మెనూతో వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టింది ఒక వనిత.
సూప్స్ అండ్ సలాడ్స్
బిజీ షెడ్యూల్ లో వంటకు కేటాయించే సమయం తగ్గిపోతోంది. రెడీమేడ్ ఫుడ్, ఇన్ స్టంట్ ఫుడ్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులైన కుటుంబాలు వీకెండ్ లో రెస్టారెంట్ ఫుడ్ కే ఓటేస్తాయి. దీంతో ఒక రోజు ఇంట్లో శ్రమ తగ్గుతుంది, కాస్త టేస్టీ ఫుడ్ ను ఎంజాయ్ చేసామన్న తృప్తీ మిగులుతుంది. మరి ఈ టేస్ట్ కు ఓటేస్తే హెల్త్ సంగతి ఏం కావాలి? అలాంటి వారందరి కోసమే సూప్స్ అండ్ సలాడ్స్ ఉందంటోంది సౌజన్య.
మహిళా స్టార్టప్స్ కు సౌజన్య ఆదర్శనీయం
పోటీ ప్రపంచంలో నలుగురికి భిన్నంగా వ్యాపారంలోకి అడుగుపెట్టి సరికొత్త ఆలోచనలకు రూపమిస్తున్న సౌజన్య కృషి అభినందనీయం. ఫుడ్ అండ్ రెస్టారెంట్ రంగాలపై ఆసక్తి కలిగిన మహిళా స్టార్టప్స్ కు ఆదర్శనీయం.


 

 

బోనాల సంబురాలకు నిధులు విడుదల...

హైదరాబాద్:తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోన్న బోనాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.3.95 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ లో దేవాలయాల వారీగా జిల్లా కలెక్టర్ నిధులు ఇవ్వనున్నారు. 

బాలామృతం పెంచుతూ టీ.సర్కార్ ఉత్తర్వులు

హైదరాబాద్ : రాష్ర్ట వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే బాలామృతం ధర పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాలామృతం కిలో ధర రూ. 45.80 నుంచి రూ. 52.50కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

16:09 - July 27, 2015

పాట్నా: బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ తమ పదేళ్ల పాలనపై రిపోర్టు కార్డును విడుదల చేశారు. తమ పాలనలో బీహార్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళ్లిందని నితీష్‌ తెలిపారు. తమ హయాంలో బీహార్‌లో శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. ఒకప్పుడు బీహార్‌కు రావాలంటేనే భయపడేవారని, ఇప్పుడు ఇక్కడికి రావడానికి అందరూ ఉత్సాహం చూపుతున్నారని నితీష్‌కుమార్‌ తెలిపారు.

 

అమర్ నాథ్ యాత్రికుల లక్ష్యంగానే దాడి:వెంకయ్యనాయుడు...

న్యూఢిల్లీ:అమర్ నాథ్ యాత్రికుల లక్ష్యంగానే పంజాబ్ లోని గురుదాస్పూర్ లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని కేంద్ర పట్టణాభివృద్ధ్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. గురుదాస్ పూర్ ఘటనపై రాజకీయం చేయడం సరికాదన్నారు.కాగా, పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్ పై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడుల్లో ఇప్పటివరకు 13మంది మృతిచెందినట్టు సమాచారం.

అనంతపురం జిల్లాలో కరువు బృందం పర్యటన...

అనంతపురం: జిల్లా పెనుకొండలో కేంద్ర కరువు బృందం పర్యటించింది. ఆదివారం పెనుకొండలో కరువు పీడిత ప్రాంతాల్లో కరువు బృందం పర్యటించింది. పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నివేదికను కేంద్రానికి అందిస్తామని వారు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఇతర ప్రాంతాలను ప్రెజెంటేషన్‌ ద్వారా జిల్లాలో కరవు పరిస్థితిని కేంద్ర కరువు బృందానికి కలెక్టర్‌ వివరించారు.

16:02 - July 27, 2015

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి బాలసుబ్రమణ్యం, సింహపురి యూనివర్సిటీ వీసీ వీరయ్య, ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బాలకృష్ణమ నాయుడు, పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ విజయలక్ష్మిని నియమించారు. విచారణ అనంతరం రిషితేశ్వరి మృతికి కారణాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. వారు సమర్పించే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. 

15:56 - July 27, 2015

ఢిల్లీ: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2002 హిట్ అండ్ రన్‌ కేసులో.. సల్మాన్‌ఖాన్‌ ఇప్పటికే బెయిల్ మీద వున్నారు. ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్‌ ఉరిశిక్షపై తాజాగా వివాదాస్పద ట్వీట్లు చేసిన సల్మాన్‌ఖాన్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాకూబ్ మెమన్‌ బదులు ఆయన సోదరుడు టైగర్ మెమన్‌ను పట్టుకొచ్చి ఉరితీయాలని సల్మాన్‌ ట్విట్టర్‌లో తెలిపారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానాల తీర్పునకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సల్మాన్‌కు... హిట్‌ అండ్‌ రన్‌ కేసులో బెయిల్ రద్దు చేయాలని కోరింది. ఈమేరకు ముంబై బీజేపీ అధ్యక్షుడు అశిష్‌శేలర్‌... గవర్నర్‌ విద్యాసాగర్‌ రావును కలిసి... ఓ వినతి పత్రం అందజేశారు.

 

నాసిక్ రహదారిపై బాంబ్ గుర్తింపు...

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని నాసిక్ రహదారిపై పోలీసులు బాంబును గుర్తించారు. బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. రహదారిపై బాంబు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నాసిక్ రహదారిని పోలీసులు మూసివేశారు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతీ వాహనాన్ని విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. 

ఏపీ రాజధాని నిర్మాణంపై గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ

ఢిల్లీ: ఏపీ రాజధాని నిర్మాణంపై గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరుగుతోంది. పంట భూముల్లో రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని విజయవాడ వాసి గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశించారు. పిటిషనర్ తరుపున సంజయ్ పారిఖ్ వానదలు వినిపించగా.. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది గంగూలీ వాదనలు వినిపించారు. తదుపరి విచారణ ఆగస్ట్ 27వ తేదీకి వాయిదా వేశారు.

రిషితేశ్వరి మృతిపై విచారణ కమిటి నియామకం:

హైదరాబాద్: ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో మృతి చెందిన రిషితేశ్వరి మృతి పై విచారణ కమిటి వేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ కమిటిలో సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ బాలస్రుబమణ్యం, సింహపురి యూనిర్శిటీ వీసీ వీరయ్య, ఎస్వీ యూనివర్శిటీ ప్రొఫెసర్ బాలకృష్ణమనాయుడు, పద్మావతి మహిళా యూనివర్శిటీ ప్రొఫెసర్ విజయలక్ష్మి వున్నారు. ఈ కమిటి ఐదు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

15:44 - July 27, 2015

చిత్తూరు: యూనివర్సిటీల్లో సీసీ కెమెరాల అమరికతోపాటు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల అటెండెన్స్ 100 శాతంతోపాటు ఫర్మామెన్స్ కూడా ఉండాలన్నారు. విద్యార్థులు ప్రతి పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఫీజు రియంబర్స్ మెంట్ ఇచ్చే విషయంపై ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు. వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తునట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో వైఫై సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

 

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

హైదరాబాద్: నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా, నిఫ్టీ 146 పాయింట్లు నష్టపోయి ట్రేడ్ అవుతున్నాయి.

15:35 - July 27, 2015

గుజరాత్‌: 2002 అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్రమోడీకి క్రింది కోర్టు క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ గుజరాత్‌ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై నేడు తుది విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అల్లర్లలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులు గతేడాది హైకోర్టును ఆశ్రయించారు. అయితే గుజరాతీలో ఉన్న పత్రాలు ట్రాన్స్ లేట్‌ చేయడానికి సమయం పట్టడంతో.. దాదాపు ఏడాది పాటు ఈ విచారణ వాయిదా పడింది.

 

15:30 - July 27, 2015

హైదరాబాద్‌: నగరంలోని లాలాపేట శాంతినగర్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం సృష్టిస్తోంది. ఉదయం మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. దుండగులు యువతిని ఎక్కడో హత్య చేసి.. ఇక్కడ మృతదేహాన్ని వదిలేసి వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చూరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. 

శ్రీకాకుళం జిల్లాలో నాటుతుపాకుల కలకలం....

శ్రీకాకుళం:జిల్లాలో నాటు తుపాకుల కలకలం రేపింది. పాలకొండ మండలం గోపాలపురం దగ్గర ఆటోలో తరలిస్తున్న పది నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఆటోలు పరస్పరం ఢీకొనడంతో తుపాకులు బయటపడ్డాయి. వీటిని తరలిస్తున్న డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటో సీతంపేట మండలం ఈతమానుగూడ నుంచి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఒక్క ఓటు తొలగించినా పోరే:కిషన్ రెడ్డి...

హైదరాబాద్:జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో కేసీఆర్ ప్రభుత్వం ఓట్ల రద్దు ప్రక్రియకు తెరదీసింద తెలంగాణబీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. అర్హుడైన ఒక్క ఓటరును జాబితా నుంచి తొలగించినా వూరుకునేది లేదని హెచ్చరించారు. అవసరమైతే న్యాయపోరాటానికి కూడా వెనకాడమని స్పష్టం చేశారు. ఆధార్‌ లింక్‌ అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పిందని, ఓటర్ల పేర్లను తొలగిస్తే దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. యాకూబ్‌ ఉరిశిక్షను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఉగ్రవాదులకు, మతానికి సంబంధం లేదన్నారు.

లాలు ప్రసాద్ అరెస్ట్...

హైదరాబాద్:బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేశారు. కులాల ఆధారంగా జరిగిన జనాభా లెక్కలను బహిరంగ పరచడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఒకరోజు రాష్ట్రబంద్ నిర్వహించాలని లాలు పిలుపునిచ్చారు. ఈ బంద్ సందర్భంగానే లాలును అరెస్టుచేశారు. పట్నాలోని డాక్ బంగ్లా క్రాసింగ్ వద్ద లాలును అరెస్టు చేశామని, ఆయనతో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కొందరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మద్దతుదారులను కూడా అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

15:18 - July 27, 2015

హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష కేసును హైకోర్టు ఈనెల 29కు వాయిదా వేసింది. ప్రత్యూషను కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు మరో రెండు రోజులు గడువు కోరారు. దీంతో కోర్టు కేసును బుధవారానికి వాయిదా వేసింది.

 

వైఎస్ బాటలోనే టిఆర్ ఎస్ ప్రభుత్వం:కిషన్ రెడ్డి...

హైదరాబాద్:టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఎస్‌ బాటలోనే నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్‌కు బడ్జెట్‌లో రూ.4వేల కోట్లు కేటాయించి రూ.16 వేల కోట్లకు టెండర్లు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పనులు ప్రారంభించకుండానే పైప్‌లైన్ల కోసం టెండర్లు పిలవడం సరికాదన్నారు. రాష్ట్ర ఆదాయ వనరులు, పథకాల ప్రకటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి:రఘువీరా

హైదరాబాద్: రాజమండ్రిలోని గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఎపిసీసీ చీఫ్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ప్రచారం కోసం పాకులాడి బాబు 29 మందిని బలి చేశారని ఆరోపించారు. పుష్కరాల పనుల్లో రూ.1600 కోట్ల అక్రమాలు జరిగాయన్నారు. 

14:56 - July 27, 2015

హైదరాబాద్: అగ్రిగోల్డ్ మోసాలపై సీబీఐ విచారణకు హైకోర్టులో పిల్ దాఖలైంది. పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఏపీ, తెలంగాణ డీజీపీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. వారంలోగా నిదేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటివరకు ఎంతమందిని అరెస్టు చేశారని ఇరురాష్ట్రాలను హైకోర్టు ప్రశ్నించింది.

 

14:54 - July 27, 2015

శ్రీనగర్: పంజాబ్ లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. బస్సులు, కార్లను తనిఖీలు చేస్తున్నారు. సాంబ సరిహద్దు ప్రాంతం ఖాకీమయమైంది. పోలీసులు అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.

 

14:50 - July 27, 2015

పంజాబ్‌: ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కేంద్రహోంశాఖ అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పంజాబ్‌లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. లూథియాన రైల్వే స్టేషన్‌లో పోలీసులు అణువుణువునూ గాలిస్తున్నారు. రైల్వేట్రాకులపై బాంబుస్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.

14:44 - July 27, 2015

ఢిల్లీ: ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కేంద్రహోంశాఖ అప్రమత్తమైంది. పార్లమెంట్‌ దగ్గర పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. నార్త్‌బ్లాక్ దగ్గర అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.

 

14:42 - July 27, 2015

ఢిల్లీ: యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఈనెల 30న అమలు చేయాల్సిన ఉరిశిక్షను... నిలుపుదల చేయాలని కోరుతూ... ఆయన సుప్రీం కోర్టులో వేసిన క్యురేటివ్ పిటిషన్‌పై... విచారణ రేపటికి వాయిదా పడింది. పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సైతం ఉరిశిక్ష రద్దు చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ నెల 30న యాకూబ్ ఉరిశిక్ష అమలుకు నాగ్‌పూర్‌ జైలులో కసరత్తు జరుగుతోంది.

 

వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌సభ

న్యూఢిల్లీ:వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి ప్రారంభమైంది. సభలో పంజాబ్ ఉగ్ర దాడి ఘటనపై విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఉగ్రవాదుల దాడులపై కేంద్రం ప్రకటన చేయాలని, చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు పంజాబ్ ఉగ్ర దాడిపై ప్రకటన చేయనున్నారు. 

పంజాబ్ దాడికి సరైన సమాధానం ఇస్తాం:రాజ్ నాథ్

ఢిల్లీ: పంజాబ్ దాడికి సరైన సమాధానం ఇస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...పాకిస్థాన్ తో స్నేహాన్ని కోరుకుంటున్నామని .....స్నేహాన్ని కోరుకున్నప్పుడల్లా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

మెమన్ ఉరిశిక్ష పై విచారణ రేపటికి వాయిదా....

ఢిల్లీ:ఉరిశిక్షపై స్టే ఇవ్వాలన్న మెమన్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. యాకుబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏజీ రోహత్గీ వాదనలు వినిపించారు. రేపు మెమన్ తరపు న్యాయవాది వాదనలు కోర్టు విననుంది. రేపటి వాదనల తర్వాతే యాకుబ్ మెమన్ ఉరిపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.

మెమన్ ఉరిశిక్షపై కొనసాగుతున్న వాదనలు..

ఢిల్లీ:యాకుబ్ మెమెన్ ఉరిశిక్షపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఉరిపై స్టే ఇవ్వాలని మెమెన్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. యాకుబ్‌ను ఉరి తీయాల్సిందేనని మహారాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. మెమెన్‌కు క్షమాభిక్ష తిరస్కరించాలని సుప్రీంకోర్టును మహారాష్ట్ర సర్కార్ కోరింది. మరి కాసేపట్లో తీర్పు వెలువడనుంది.

 

13:22 - July 27, 2015

తిరుపతి : నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రిషితేశ్వరి ఆత్మహత్యపై రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారితో విచారణ జరిపించనున్నట్లు మంత్రి గంటా తిరుపతిలో తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత రిషితేశ్వరి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యూనివర్సిటీల్లో ర్యాగింగ్‌ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక భవిష్యత్‌లో యూనివర్సిటీలను వృత్తి, నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

 

13:17 - July 27, 2015

విశాఖపట్టణం : ఆంధ్ర యూనివర్సిటీలోని లేడీస్‌ హాస్టల్‌ విద్యార్థినులు కదం తొక్కారు. హాస్టల్‌లో కనీస సదుపాయాలు కల్పించాలని రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ వద్ద ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని కార్యాలయం ఎదుట బైటాయించారు. 1500 మంది ఉన్న హాస్టల్‌కు కేవలం మూడు గంటలు మాత్రమే నీళ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. మెస్‌లో కనీస శుభ్రత పాటించడం లేదని.. భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్ధినులు ఆరోపించారు. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని విద్యార్ధినులు హెచ్చరించారు. 

భూకంపాల జోన్-3లో ఏపీ రాజధాని...

హైదరాబాద్:నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి భూకంపాల జోన్-3లో ఉందని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ 'ఎర్త్ క్వేక్ ఇంజినీరింగ్ రీసర్చ్ సెంటర్' అధిపతి ప్రదీప్ కుమార్ తెలిపారు. కృష్ణా నది తీరంలోని విజయవాడ తీరప్రాంతాలన్నీ జోన్-3 కిందకే వస్తాయని చెప్పారు. అయితే జోన్-4, జోన్-5, జోన్-6 భూకంపాలతో పోలిస్తే జోన్-3 తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపారు. నేపాల్ సరిహద్దు ప్రాంతాలు, కాశ్మీర్ జోన్-5లో ఉన్నాయని చెప్పారు. టోక్యో, కాలిఫోర్నియా లాంటి నగరాలు జోన్-5 కన్నా అత్యధిక తీవ్రత కలిగి ఉన్నాయని... అయితే, భూకంపాలను తట్టుకుని నిలబడే విధంగా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు.

13:15 - July 27, 2015

పంజాబ్ : గురుదాస్‌పూర్‌లో కాల్పుల బీభత్సం కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం దీనానగర్‌ పీఎస్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. మృతుల్లో గురుదాస్‌పూర్ ఎస్పీ బల్జీత్ సింగ్ ఉన్నారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరోవైపు ఉదయం ఐదున్నర గంటల నుంచి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఆత్యాధునిక ఆయుధాలతో కాల్పులు...
మారుతి కారులో వచ్చిన టెర్రరిస్టులు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 12 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనానగర్‌ పీఎస్‌పై దాడికి ముందు ఓ బస్సుపై దాడి చేశారు. ఆ దుర్ఘటనలో ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం పోలీస్‌స్టేషన్ లక్ష్యంగా కాల్పులకు ఒడిగట్టారు. దీంతో కొద్దిసేపు పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇరువర్గాల కాల్పులతో దీనానగర్ ప్రాంతమంతా దద్దరిల్లింది. జమ్మూ కశ్మీర్‌లోని హీరానగర్‌ నుంచి టెర్రరిస్టులు వచ్చినట్లు తెలుస్తోంది. 

శావల్యాపురం మండలంలో భూ ప్రకంపనలు

గుంటూరు: శావల్యాపురం మండలంలో ఈ రోజు భూ ప్రకంపనలు సంభవించాయి. మండలోని కారుమంచి, కొత్తలూరు, మతుకుపల్లి, శానంపూడి, కనమర్లపూడి గ్రామాల్లో భూమికంపించింది. దీంతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు.

సుప్రీం కోర్టులో సల్మాన్ ఖాన్ కు ఊరట

ఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసులో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. హిట: అండ్ రన్ కేసులో బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ కోర్టు కొట్టివేసింది.

ఉగ్రవాదుల కాల్పుల్లో ఎస్పీ మృతి

హైదరాబాద్: పంజాబ్ రాష్ట్రంలో దీనా నగర్ లో పోలీసులకు, ఉగ్రవాదులకు జరుగుతున్న ఎదురు కాల్పుల్లో పంజాబ్ ఎస్పీ మృతి చెందారు. విధి నిర్వహణలో డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్ ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగారు. పంజాబ్ లో ఉగ్రదాడుల నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ ప్రకటించారు. సరిహద్దులు కూడా మూసివేయాలని, ఉగ్రవాదులను చొరబడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదని బాద్ పేర్కొన్నారు.

మరోసారి లోక్ సభ వాయిదా..

ఢిల్లీ:మరోసారి లోక్ సభ వాయిదా పడింది. పంజాబ్ లో ఉగ్రదాడులపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయాలని సభ్యులు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ వారించనా ఆందోళన కొనసాగుతుండడంతో మధాయహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

ఢిల్లీలో అలర్డ్

హైదరాబాద్: పంజాబ్ లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఢిల్లీలో అలర్ట్ ప్రకటించారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాలు, రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

భానుకిరణ్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి...

హైదరాబాద్: మద్దెల చెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటలకు తీర్పు ను నాంపల్లి కోర్టు వెలువరించనుంది.

జమ్మూ సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులు

హైదరాబాద్:కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘించింది. జమ్మూసెక్టార్ వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అప్రమత్తమైన భారత్ భద్రతా సిబ్బంది తిప్పి కొడుతున్నారు. కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

12:39 - July 27, 2015

ఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మించిన కేసులో కర్నాటక రాష్ట్ర అప్పీలుపై ఈ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా వివరణనివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో జయలలితను కర్నాటక హైకోర్టు పొరపాటుగా నిర్దోషిగా తేల్చిందని ఆరోపించిన కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఆమెను దోషిగా ప్రకటించాలని సుప్రీంకు కర్నాటక విన్నవించింది.

  • 1991-96 మధ్య జయలలిత సీఎంగా ఉన్న సమయంలో రూ.66 కోట్ల మేర అక్రమాస్తులు సంపాదించినట్లు 1997లో డీఎంకే కేసు పెట్టింది.
  • తదనంతరం జరిగిన పరిణామాల మధ్య ఈ కేసును కర్నాటక స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారు.
  • జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమాన విధించిన స్పెషల్ కోర్టు తీర్పును కర్నాటక హైకోర్టు కొట్టివేసింది.
  • దీనితో ఎనిమిది నెలల జైలు శిక్ష తరువాత జయలలిత నిర్దోషిగా బయటపడింది.
  • అనంతరం సీఎంగా జయలలిత బాధ్యతలు స్వీకరించింది.
  • తరువాత ఆర్కే నగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 

లోక్ సభలో పంజాబ్ ఎంపీల ఆందోళన

హైదరాబాద్: లోక్ సభలో దీనానగర్ లో ఉగ్రవాదుల కాల్పులపై పంజాబ్ ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. ఉగ్రవాదలు దాడిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని పట్టుపట్టారు. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ దినానగర్ లో ఎన్ కౌంటర్ కొనసాగుతోందని ఎన్ కౌంటర్ ముగియగానే కేంద్ర హోంమంత్రి సమాధానమిస్తారని తెలిపారు.

అగ్రిగోల్డ్ కేసులోపై నివేదికలివ్వండి: హైకోర్టు..

హైదరాబాద్:అగ్రిగోల్గ్ సంస్థ మోసాలపై నమోదైన కేసుపై ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలపాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల వద్ద ఉన్న నివేదికలు సమర్పించాలంటూ తన ఆదేశాలలో హైకోర్టు పేర్కొంది. అగ్రిగోల్డ్ మోసాలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషనర్ తన పిటిషన్ లో కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.

12:27 - July 27, 2015

ఢిల్లీ : పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ లో ఉగ్రవాదుల దాడి ఘటనపై లోక్ సభలో గందరగోళం చెలరేగింది. ఈ ఘటనపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు నినదించాయి. గురుదాస్ పూర్ లోని దీనానగర్ పీఎస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై ప్రధాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం నాడు ప్రారంభమైన సభలో ఈ అంశంపై రగడ చెలరేగింది. విపక్షాలు చేస్తున్న ఆందోళనను విరమించాలని స్పీకర్ సుమిత్రా మహజన్ సూచించారు. కానీ విపక్షసభ్యులు ఆందోళన విరమించలేదు. గందరగోళం మధ్యే ఇతర సభ్యులు మాట్లాడారు. ఎన్ కౌంటర్ ముగిసిన అనంతరం ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, శాంతి భధ్రతలకు సంబంధించిన అంశమని రాజకీయాలు చేయ వద్దని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సభ్యులకు సూచించారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేస్తారని సభ్యులు సంయమనం పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. 

ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం...

హైదరాబాద్: లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదల చేయాలంటూ ఓయూ ఆర్ట్స్‌ కళాశాల దగ్గర నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేపట్టింది. సీఎం వైఖరికి నిరసనగా కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

12:25 - July 27, 2015

పంజాబ్ : గురుదాస్ నగర్ లోని దీనానగర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడుల నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కేంద్రం చేసిన హెచ్చరికలతో పంజాబ్ రాష్ట్రం అప్రమత్తమైంది. భధ్రతను కట్టుదిట్టం చేశారు. రైళ్లు, బస్టాండులలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు ప్రారంభించారు. లూథియానా రైల్వే స్టేషన్ లో అణువణువు గాలిస్తున్నారు. రైల్వే ట్రాక్ ల వెంబడి డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. గురుదాస్ పూర్ లోని దీనానగర్ పీఎస్ పై సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. 
జమ్మూ కాశ్మీర్ లో...
పంజాబ్ లోని గురుదాస్ నగర్ లో దీనానగర్ పీఎస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రయాణీస్తున్న బస్సులు..కార్లను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సాంబా సెక్టార్ లో భారీగా పోలీసులు మోహరించారు. అణువణువు సోదాలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా అనుమానితులుగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. 

అనాధ పిల్లల సంక్షేమం పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

హైదరాబాద్: అనాధ పిల్లల సంక్షేమం పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, జోగురామన్న, సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

'ప్రేమమ్'పైరసీ కేసులో సెన్సార్ బోర్డు ఉద్యోగులు.. అరెస్టు

హైదరాబాద్:ఇటీవల మళయాలంలో విడుదలై భారీ విజయం సాధించిన 2ప్రేమమ్' సినిమా పైరసీ కేసు కీలక మలుపు తిరిగింది. సెన్సార్ బోర్డు నుంచే ఈ సినిమాను పైరసీ చేసినట్టు కేరళ పోలీసులు గుర్తించారు. పైరసీకి పాల్పడ్డారన్న ఆరోపణలతో ముగ్గురు సెన్సార్ బోర్డులో పనిచేస్తున్న ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా విడుదలైన రెండు రోజులకే ఆన్ లైన్ లో పైరసీ సినిమా ప్రత్యక్షమైంది. దీంతో సినిమా దర్శకుడు, నిర్మాత దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

డిగ్రీలో సెమిస్టర్ పరీక్షల విధానం వద్దు:ఏఐఎస్‌ఎఫ్

అనంతపురం: డిగ్రీలో సెమిస్టర్ పరీక్షల విధానం అమలు ఆలోచనను విరమించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పలువురు విద్యార్థులు ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... డిగ్రీలో సెమిస్టర్ పరీక్షల విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందన్నారు.

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్ సభ

ఢిల్లీ: వాయిదా అనంతరం తిరిగి లోక్ సభ సమావేశం ప్రారంభమయ్యింది. పంజాబ్ ఉగ్రవాదలు దాడి పై లోక్ సభలో గందరగోళం నెలకొంది.

రిషికేశ్వరి మృతిపై రిటైర్డ్ ఐపీఎస్ తో విచారణ:మంత్రి గంటా

హైదరాబాద్: ఆచార్య నాగార్జు యూనివర్శిటీ విద్యార్థిని రిషికేశ్వరి మృతి ఘటనపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ... విద్యార్థిని మృతికి కారణమైన ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

ఏయూ రిజిస్టార్‌ కార్యాలయంలో ఎదుట విద్యార్థినుల ఆందోళన

విశాఖ: లేడీస్‌ హాస్టల్‌కు బస్సుల సంఖ్య పెంచాలని నినాదాలు చేస్తూ ఏయూ రిజిస్టార్‌ కార్యాలయంలో ఎదుట విద్యార్థినులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. అంతేకాకుండా హాస్టల్‌లో మౌలికసదుపాయాలు కల్పించాలని విద్యార్థినులు డిమాండ్‌ చేస్తున్నారు..

జేఎన్ టీయూ హెచ్ తనిఖీలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్:ఇంజనీరింగ్ ప్రయివేటు కాలేజీల్లో జేఎన్ టీయూ హెచ్ తనిఖీలపై హైకోర్టులో విచారణ జరిగింది. తనిఖీలు పూర్తయ్యాయని హైకోర్టుకు ఏజీ తెలిపింది. 25 కాలేజీల్లో సౌకర్యాలు లేవని హైకోర్టు నివేదిక కూడా ఇచ్చింది. దీని పై తుది తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

 

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై:నేడు స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 290 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 80 పాయింట్ల నష్టాల్లో ట్రేడవుతోంది.

11:37 - July 27, 2015

ఢిల్లీ : ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హాజారే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ సుమారు 50 నిమిషాల పాటు కొనసాగడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను అన్నాకు కేజ్రీవాల్ వివరించినట్లు సమాచారం. ఆప్ నుండి బహిష్కరించిన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ బహిష్కరించకుండా ఉండాల్సిందని అన్నా వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఢిల్లీ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని అన్నా కితాబు ఇచ్చినట్లు సిసోడియా పేర్కొన్నారు. 

విషాహారం తిని 60మంది విద్యార్థులకు అస్వస్థత

విశాఖ: చింతపల్లిలో ఓ ప్రైవేటు స్కూల్‌లో విషాహారం తిని 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్కూలు యాజమాన్యం విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఆందోళనకు దిగిన ఆరోగ్య శ్రీ ఉద్యోగుల అరెస్టు...

హైదరాబాద్:తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆరోగ్యశ్రీ భవన్‌ ఎదుట ఆరోగ్యశ్రీ ఉద్యోగులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

11:32 - July 27, 2015

హైదరాబాద్ : చారిత్రాత్మకమైన కట్టడమైన ఉస్మానియా తరలింపు నేపథ్యంలో సోమవారం ఉన్నతాధికారుల భేటీ జరుగనుంది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సాయంత్రం చేపట్టనున్న రోగుల తరలింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఓపీ బ్లాక్ లోని జనరల్ మెడిసిన్, ఇతర విభాగాల నుండి సోమవారం కనీసం వంద మంది పేషెంట్లను ఫీవర్ ఆసుపత్రికి తరలించాలని మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొంటోంది. ఈ నేపథ్యంలో రోగులను ఉంచే గదుల్లో మరమ్మత్తులు, సౌకర్యాల ఏర్పాటు తదితర చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశంలో నిర్ణయం తీసుకున్న తరువాతే రోగులను తరలించనున్నట్లు తెలుస్తోంది. 

లోక్ సభ వాయిదా

ఢిల్లీ: ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్షాల ఆందోళనల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్ సభ వాయిదా పడింది. గురుదాన్ పూర్ లో ఉగ్రవాదుల దాడి ఘటనపై లోక్ సభలో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ ఘటన పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్ష సభ్యులు తమ ఆందోళనను విరమించకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

సీఎం జయలలితకు సుప్రీం నోటీసులు

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి ఏకంగా తమిళనాడు సీఎం పీఠాన్నే కోల్పోయిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, కర్ణాటక హైకోర్టు తీర్పుతో మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అయితే కర్ణాటక హైకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవించని విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సిద్ధరామయ్య ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయమూ తెలిసిందే. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, కొద్దిసేపటి క్రితం జయలలితకు నోటీసులు జారీ చేసింది.  

ఆపరేషన్ కొనసాగుతోంది: రాజ్ నాథ్

హైదరాబాద్:పంజాబ్ లోని గురుదాన్ పూర్ పీఎస్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల పట్టివేతకు ఆపరేషన్ కొనసాగుతున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ఉగ్రవాదల కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. పంజాబ్ సీఎం, హోంశాఖ అధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. మరో వైపుసరి హద్దుల్లో భద్రతలను కట్టుదిట్టం చేశామని స్పష్టం చేశారు.

ప్రత్యూష కేసు విచారణ 29కి వాయిదా

హైదరాబాద్:సవతి తల్లి, తండ్రి చేతిలో చిత్ర హింసలకు గురైన ప్రత్యూష కేసు విచారణ 29కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. అంతే కాకుండా ప్రత్యూషను కోర్టులో హాజరు పరచాలని ఎల్బీ నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

పోలీసుల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం!

హైదరాబాద్: పంజాబ్ లోని గురుదాన్ పూర్ పీఎస్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు-ఉగ్రవాదులు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

అరాచకాలు సృష్టించే విద్యార్థులను ఎక్కడా చదువుకోనివ్వం:మంత్రి గంటా

గుంటూరు: వర్సిటీల్లో అరాచకాలు సృష్టించే విద్యార్థులను ఎక్కడా చదువుకోని విధంగా నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తిరుపతిలో కొద్దిసేపటి క్రితం వర్సిటీ వీసీల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి వచ్చిన ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ...కులాల పేరిట విద్యార్థులను వేధించే వారిపైనా ఉక్కుపాదం మోపుతామని ఆయన ప్రకటించారు. అంతేకాక ఇకపై ప్రతి వర్సిటీలోనూ పోలీస్ ఔట్ పోస్టును ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.  

ఉత్తరాఖండ్ లో స్వల్ప భూకంపం

హైదరాబాద్: ఉత్తరాఖండ్ పిథోగడ్ జిల్లాలో ఈ రోజు ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.4గా నమోదైనట్లు అ
ధికారులు తెలిపారు.

విధులు బహిష్కరించి రెవన్యూ సిబ్బంది

గుంటూరు: భూకబ్జాదారుల దాడికి నిరసనగా మంగళగిరిలో రెవెన్యూ సిబ్బంది సోమవారం విధులను బహిష్కరించారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. మరోవైపు రెవెన్యూ సిబ్బందిపై దాడి ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను గుర్తించిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో చెరువు భూములను ఆక్రమించుకున్న వారిని అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. 

తెలుగు రాష్ట్రాల్లో హైల అలర్ట్..

హైదరాబాద్:పంజాబ్‌ రాష్ట్రంలోని దీనానగర్‌ వద్ద పోలీసుస్టేషనుపై ఉగ్రవాదులు దాడులు చేసిన నేపథ్యంలో తెలుగు రాష్ర్టాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. విమానాశ్రయాల భద్రతను కట్టుదిట్టం చేశారు. సైనిక, పోలీసు ప్రధాన కార్యాలయాలు, పోలీసు క్వార్టర్స్‌ దగ్గర అప్రమత్తంగా ఉండాలని నిఘావర్గాలు సూచించాయి. హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఉస్మానియా ఆసుపత్రి తరలింపుకు సన్నాహకాలు...

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి ని ఫీవర్ ఆస్పత్రి జనరల్ వైద్య విభాగానికి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై సాయంత్రం ఉన్నతాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వివిధ విభాగాల తరలింపు పై నిర్ణయం చేయనున్నట్లు సమాచారం.

కాసేపట్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు

ఢిల్లీ: కాసేపట్లో వర్షాకాలపు పార్లమెంట్ సామవేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో దీనానగర్ కాల్పుల ఘటనపై కేంద్రం హోశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఓ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

10:27 - July 27, 2015

కర్నూలు : ''ప్లాంట్ నిర్మిస్తామన్నారు..ఉద్యోగాలిస్తామన్నారు..కానీ ఎన్ని ఏళ్లు గడిచినా ప్లాంట్ లేదు..నమ్మిన తమను మోసం చేశారు''. అంటూ కర్నూలు జిల్లాకు చెందిన రైతులు లబోదిబోమంటున్నారు. కొలిమిగుండ్ల మండలంలోని కోటపాడు మండలంలో 'ప్రిజం' అనే సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూముల్లో సాగు చేసుకుందామని రైతులు వెళ్లారు. యాజమాన్యం ఫిర్యాదుతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ప్రత్యక్షంగా..పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని చెప్పి తమ భూములు తీసుకుందని రైతులు పేర్కొన్నారు. కానీ ఏళ్లు గడిచినా ప్లాంట్ ఏర్పాటు చేయలేదని వాపోయారు. భూములు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ప్లాంట్ నిర్మించలేదని, ఈ విషయంలో అధికారులకు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. వెంటనే యాజమాన్యం సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. 

ఉగ్ర దాడిలో 9కి చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్:పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూరన్ జిల్లా దీనా నగర్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు తమకు కనిపించిన బస్సుపై కాల్పులు జరిపి, పోలీస్ స్టేషన్ పై అటాక్ చేశారు. అనంతరం అక్కడికి సమీపంలో ఉన్న పోలీస్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లోకి ప్రవేశించారు. పోలీసు కుటుంబాలకు చెందిన కొందరిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదుల కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు పోలీసులు ఉండగా, ఇద్దరు సాధారణ పౌరులున్నట్లు సమాచారం. దీంతో ఎన్ఎస్ జీ కమాండోలను ప్రభుత్వం రంగంలోకి దించింది.

గోదావరిలో గల్లంతైన మృదేహాలు లభ్యం...

వరంగల్:గోదావరిలో పుష్కర స్నానానికి దిగి గల్లంతైన ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం కంతానపల్లి పడవరేవు వద్ద మహిళల మృతదేహాలను సోమవారం ఉదయం గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పార్వతి(35), కల్పన (21) కంతానపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో 25 న సాయంత్రం గోదావరిలో స్నానం చేసేందుకు దిగారు. ప్రవాహ ఉధృతికి కొట్టుకు పోయారు. వారి కోసం అప్పటి నుంచి గాలిస్తుండగా సోమవారం ఉదయం మృతదేహాలు బయటపడడంతో పోలీసులు నది వద్దకు చేరుకుని వాటికి వెలికి తీయించారు.

సీఎంఓ ప్రక్షాళన దిశగా చంద్రబాబు అడుగులు..!

హైదరాబాద్:ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన కార్యాలయ ప్రక్షాళనకు దాదాపుగా సిద్ధపడ్డట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)లో పనిచేస్తున్న అధికారుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు, త్వరలోనే మొత్తం కార్యాలయాన్నే సమూలంగా ప్రక్షాళన చేయనున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. 

10:14 - July 27, 2015

పంజాబ్ : రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది మంది దుర్మరణం చెందారు. వీరిలో ఆరుగురు సాధారణ పౌరులు ఉండగా ఇద్దరు పోలీసులున్నారు. మొత్తం పదిహేను మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పీఎంఓ కార్యాలయం దీనిపై దృష్టి సారించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానిని కలిసి దాడి వివరాలను వివరించారు. కేంద్ర హోం శాఖ కార్యాలయం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఐబీ, ఇంటిలెజిన్స్, ఆర్మీ వర్గాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దాడికి సంబంధించి దానిపై చర్చించనున్నారు. దాడికి పాల్పడింది ఉగ్రవాదులేనని కేంద్ర హోం శాఖ ధృవీకరించింది
పాక్ కు పది కిలోమీటర్ల దూరంలో..
భారత్ - పాక్ సరిహద్దు ప్రాంతమైన గురుదాస్ పూర్ లోని దీనానగర్ పీఎస్ పై సోమవారం ఉదయం ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మారుతీ ఆల్టో కారులో వచ్చిన నలుగురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మొదట ఓ బస్సుపై దాడి చేయడంతో ఓ ప్రయాణీకుడు కుప్పకూలిపోయాడు. అనంతరం పీఎస్ పై దాడికి దిగారు. ఒక్కసారిగా కాల్పులు వినిపించడంతో ప్రజలు భయకంపితులయ్యారు. ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. అప్రమత్తమైన పోలీసులు ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ముష్కరులు జరిపిన దాడుల్లో పీఎస్ లో ఉన్నవారు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న కేంద్ర హోం శాఖ అదనపు బలగాలను గురుదాస్ పూర్ కు పంపింది. పోలీసుల స్వాధీనంలో ఉన్న గురుదాస్ ప్రాంతాన్ని మిలట్రీ ఆధీనంలోకి తీసుకుంది. 

పీఎస్ పై దాడికి పాల్పడింది ఉగ్రవాదులే: కేంద్ర హోంశాఖ

హైదరాబాద్: పంజాబ్ లోని గురుదాన్ పూర్ జిల్లా దీనానగర్ పీఎస్ పై దాడికి పాల్పడింది ఉగ్రవాదులేనని కేంద్ర హోంశాఖ ధృవీకరించింది. దీంతో ఎన్ ఎస్ జీ కమెండోలు, సైనిక బలగాలను ఘటనా స్థలికి పంపింది. 

నేటి నుంచి కర్ణాటకలో రాష్ట్రపతి పర్యటన

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేటి నుంచి రెండు రోజుల పాటు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మైసూర్ విశ్వవిద్యాలం స్నాతకోత్సవంతో పాటు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

కారును ఢీకొట్టిన లారీ: దంపతుల మృతి

ప.గో: దేవరపల్లి మండలం కృష్ణంపాలెం దగ్గర వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొంది. ఈ సంఘటనలో దంపతులు మృతి చెందారు. మృతులు విజయవాడ వాసులని పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించి లారీని స్వాధీనం చేసుకున్నారు.

సమ్మె చేశారన్న కక్షతో కార్మికులపై వేటు

ప్రకాశం: జిల్లాలో సమ్మె చేశారన్న కక్షతో మున్సిపల్ ఇంజనీరింగు కాంట్రాక్టు కార్మికులను పాలకపక్షం తొలగించింది. 73 మంది కార్మికులను తొలగించిన పాలకపక్షం టీడీపీ కౌన్సిలర్ల అనుయాయులకు కొత్తగా నిధులు అప్పగించారు.

ఉగ్రదాడి ఘటనపై సమీక్షిస్తున్న హోంశాఖ

హైదరాబాద్: పంజాబ్, ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై కేంద్ర హోంశాఖ సమీక్షిస్తున్నది. ఘటనా స్థలికి ఎన్ ఎస్ జీ కమాండలోలను, అదనపు బలగాలనూ కేంద్రం రంగంలోకి దింపింది. పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. దీనానగర్ లో ఉగ్రవాదుల కాల్పులపై ప్రధానికి హోంశాఖ పరిస్థితిని వివరించింది. కాసేపట్లో దీనానగర్ ఘటన పై కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. అంతే కాక అన్ని రాష్ట్రాల పోలీసులను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి.

09:58 - July 27, 2015

ముంబై : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన 'భజ్ రంగీ భాయ్ జాన్' కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది. విదేశాల్లో సైతం ఈ చిత్రంపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా పాక్ ఫిదా అయిపోయింది. అక్కడ ఈ చిత్రంపై చర్చ జరుగుతోంది. ఇరు దేశాల్లో శాంతి నెలకొల్పడమే కాకుండా సత్సంబంధాలు పెంచేలా చిత్రం ఉందని అభినందిస్తున్నారు. రంజాన్ సమయంలో భజ్ రంగీ భాయ్ జాన్ సినిమాతో పాటు రెండు స్వదేశీ మూవీలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలను వెనక్కి నెట్టిన సల్మాన్ సినిమా పాక్ ప్రజల హృదయాలను గెలుచుకుంది. మూవీలోని సెంటిమెంట్ సీన్ లు వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొదటి వారంలో ఇస్లామాబాద్ కరాచీలో రూ.35 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. అక్కడి యాక్టర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. సల్మాన్ చిత్రంతో పాటు తమ చిత్రం కూడా రిలీజ్ కావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఛత్తీస్ గఢ్ లో 'ఉగ్ర' పంజా:ఆరుగురు పోలీసులు మృతి

హైదరాబాద్: పంజాబ్ లోని దీనా నగర్ పోలీస్ స్టేషన్ పై దాడి జరిగిన సమయంలోనే ఛత్తీస్ గఢ్ లోనూ ఉగ్రవాదులు పంజా విసిరారు. రాష్ట్రంలోని పత్రంగిపూర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ అధికారుల నివాస సముదాయంపై దాడికి దిగిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు పోలీసులు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. కాల్పులతో సరిపెట్టని ఉగ్రవాదులు పోలీసు అధికారుల కుటుంబ సభ్యులను బందీలుగా పట్టుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్ఎస్ జీ కమాండోలు రంగంలోకి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  

తూ.గో జిల్లాలో మావోల కలకలం...

తూ.గో: ఏటపాక, చింతూరు మండలాల్లో మావోయిస్టులు కలకలం సృష్టించారు. భద్రాచలం - కుంట మధ్య జాతీయ రహదారిపై మావోయిస్టులు బ్యానర్లు కట్టి, కరపత్రాలు పంచారు. అమరవీరుల వారోత్సవాన్ని విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. 

అమర్ నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన తెలుగువారు...

హైదరాబాద్:శ్రీనగర్‌లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో అమరనాథ్‌ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. భారీ వర్షాలకు సోన్‌మార్గ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీనివల్ల రవాణ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఆహారం లేక తెలుగు యాత్రికులు అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్‌, మెదక్‌ జిల్లావాసులు 23 న యాత్రకు బయలుదేరి వెళ్లారు. ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా యాత్రికులు చిక్కుకుపోయారని సమాచారం. 

రామగుండం ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అంతరాయం

కరీంనగర్: రామగుండం ఎన్టీపీసీ 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ కావడంతో విద్యుదుత్పత్తి నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

 

రామగుండం ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అంతరాయం

కరీంనగర్: రామగుండం ఎన్టీపీసీ 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ కావడంతో విద్యుదుత్పత్తి నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు మూడు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. 

లాలాపేటలో యువతి దారుణ హత్య

హైదరాబాద్:ఉస్మానియా వర్సిటీ పరిధిలోని లాలాపేట లో దాదాపు 20 ఏళ్ల వయస్సు ఉన్న యువతి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాందీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. యువతిని అత్యాచారం చేసి హతచేసినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

09:26 - July 27, 2015

అనంతపురం : పాము కాటుకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలయ్యారు. ఈ ఘటన ఉరవకొండలో చోటు చేసుకుంది. మల్లేశ్వర ఆలయం సమీపంలో మల్లిఖార్జున దంపతులు నివాసం ఉంటున్నాడు. ఇతనికి ముగుర్గు సంతానం ఉన్నారు. ఎప్పటిలాగానే ఆదివారం రాత్రి భోజనాలు చేసి పడుకున్నారు. అర్థరాత్రి సమయంలో హర్షిత (7) ఒక్కసారిగా ఏడ్చింది. వెంటనే మల్లిఖార్జున మేల్కోన్నాడు. కడుపునొప్పి వేస్తుందని హర్షిత చెప్పడంతో మందు తాగించడానికి ప్రయత్నించారు. అప్పుడే ఓ పాము అక్కడి నుండి వెళ్లడం గమనించాడు. పాము కాటేసిందని గ్రహించిన మల్లిఖార్జున ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో గిరీష్ (5) కూడా ఏడుపులంకించుకున్నాడు. పాము ముగ్గురునీ కాటేసిందని గ్రహించిన మల్లిఖార్జున్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ మార్గమధ్యంలోనే హర్షిత, గిరీష్ మృతి చెందారు. దీనితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 

పంజాబ్ లో దాడి..ఉగ్రవాదులదే - కేంద్ర హోం శాఖ..

పంజాబ్ : గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పీఎస్ పై దాడికి పాల్పడింది ఉగ్రవాదులేనని కేంద్ర హోం శాఖ ధృవీకరించింది.

09:15 - July 27, 2015

పంజాబ్ : గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పీఎస్ పై దాడికి పాల్పడింది ఉగ్రవాదులేనని కేంద్ర హోం శాఖ ధృవీకరించింది. సోమవారం ఉదయం గురుదాస్ నగర్ ప్రాంతంలోని దీనానగర్ పీఎస్ పై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. దీనితో ఆ ప్రాంతం కాల్పులతో మారుమోగింది. పాక్ కు పది కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయకంపితులయ్యారు.
మారుతీ ఆల్టో కారులో వచ్చిన నలుగురు ముష్కరులు ఓ బస్సుపై దాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీనితో ఓ ప్రయాణీకుడుతో పాటు ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వెంటనే భారత సైన్యం అప్రమత్తమైంది. కేంద్ర హోం శాఖ పరిస్థితిని సమీక్షిస్తోంది. సీఎం..అడిషనల్ డీజీ హోం శాఖతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. ఆర్మీ, ఇతర బలగాలను దీనానగర్ కు పంపించారు. 

గురుదాస్ పూర్ లో మూతపడిన విద్యా సంస్థలు..

పంజాబ్ : గురుదాస్ పూర్ లో ఉన్న స్కూల్స్, కాలేజీలు మూతపడ్డాయి. ఈ రోజు ఉదయం గురుదాస్ పూర్ ప్రాంతంలోని దీనానగర్ పీఎస్ పై ఉగ్రవాదులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 

గురుదాస్ పూర్ కు బలగాలు - రాజ్ నాథ్..

ఢిల్లీ : పంజాబ్ లోని గురుదాస్ ప్రాంతానికి బలగాలను తరలిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఉదయం గురుదాస్ పూర్ ప్రాంతంలోని దీనానగర్ పీఎస్ పై ఉగ్రవాదులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. దీనిపై రాజ్ నాథ్ సింగ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ తో మాట్లాడారు. 

కోటగిరి ఈశ్వరయ్య కన్నుమూత..

నల్గొండ: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కోటగిరి ఈశ్వరయ్య (95) కన్నుమూశారు. ఈశ్వరయ్య మృతి పట్ల సీపీంఎ జిల్లా కమిటీ సంతాపం తెలిపింది. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి నాలుగు గంటలు..కాలినడకన వచ్చే వారికి మూడు గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది..

 

08:36 - July 27, 2015

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి సిద్ధమౌతోంది. ఆగస్టు 15 నుండి గ్రామ జ్యోతి పథకానికి శ్రీకారం చుట్టింది. ఐదేండ్లలో రూ.25వేల కోట్లు కేటాయిస్తామని పేర్కొంది. బడ్జెట్ లో చాలా వాటికి నిధులు కేటాయించారని, ముందు గ్రామాల్లో సౌకర్యాలు కల్పించాలని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. గ్రామ జ్యోతి, యాకూబ్ మెమన్ ఉరిశిక్ష, ఏపీలో పీసీసీ అధ్యక్ష మార్పు తదితర అంశాలపై టెన్ టివి 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ఆయన విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..
అదనంగా కేటాయిస్తున్నారా ?
''ఇలాంటి పథకాలు దేశంలో, రాష్ట్రంలో చాలానే వచ్చాయి. పథకాలు వస్తే స్వాగతించాలి. పథకాలు భారీగా ప్రకటిస్తారు. ఈ పథకం ఏమైందన్న ప్రశ్న తరువాత ఉత్పన్నం కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో రూ.25వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. అంటే ఏడాదికి రూ. ఐదు కోట్లు అన్నమాట. కానీ బడ్జెట్ లో గ్రామీభావృద్ధికి చాలానే కేటాయించారు. దీనికి అదనంగా రూ.ఐదు వేల కోట్లు ఇస్తే కొంత బెటర్. పథకాలు ప్రకటించి అటు ఇటు సర్దుతారు. గ్రామీణ ప్రాంతాలలో 75 శాతం జనాభా రూ.5వేల లోపు ఆదాయం ఉన్నవారు ఉన్నారని..భూమి లేని ఉన్నవారు 30 శాతం ఉన్నవారు ఉన్నారని ఓ అధ్యయనంలో తేలింది. దళితులకు భూములు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు నిధులు కూడా కేటాయించింది. 3 లక్షల దళిత కుటుంబాలకు భూములు లేవు. ఎకరానికి ఎంత ఖర్చైనా సరే భూములు కొంటామని పేర్కొంది. కానీ ప్రస్తుతం కలెక్టర్ల వద్ద రూ.19వేల కోట్ల నిధులు ఉన్నాయని తేలింది. ప్రతి గ్రామంలో ఒకరికి భూమి లేదా ఇతర వాటిని కల్పించండి. సాగునీటి సదుపాయం కల్పించండి. మౌలిక సదుపాయాలు కల్పించండి. విద్య, వైద్యం కల్పించండి. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన విద్య, నైపుణ్యం ఉన్న వారు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. నాణ్యత కలిగిన ఉపాధి కల్పించండి.
యాకూబ్ మెమన్ ఉరిశిక్ష..
యాకూబ్ మెమన్ కు విధించిన ఉరిశిక్ష న్యాయం కాదు అనే వాదనలు వస్తున్నాయి. బాంబు పేలుళ్ల ఘటనలో కుటుంబం జీవితాంతం ఆవేదనతో బతకాలి. కానీ యాకూబ్ ఉరిశిక్ష వేస్తే ఒక్క నిమిషంలో పైకి వెళుతాడు. జీవితాంతం జైలులో ఉండి కఠిన కారాగార శిక్షలో అతను బాధ పడాలనే వాదనలు వస్తున్నాయి. ఈ ఘటనలో ఎంతో మంది ఉన్నారు. వారంతా పాక్ కు వెళ్లారు. కానీ యాకూబ్ భారత దేశానికి వచ్చి న్యాయవ్యవస్థ ఎదుట విచారణ ఎదుర్కొన్నాడు. భద్రతా దళాలకు, న్యాయవ్యవస్థకు సహాకారం అందించాడు. కీలక సమాచారం అందించాడు. న్యాయవ్యవస్థకు సహకరించిన వారికి రిలీఫ్ ఉంటుందని యాకూబ్ మెమన్ విషయంలో క్షమాభిక్ష పెట్టి యావజ్జీవ శిక్ష విధించాలి అనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇక్కడ మరో అంశం నేరానికి మతం లేదనేది గుర్తుంచుకోవాలి'' అని నాగేశ్వర్ పేర్కొన్నారు. అలాగే ఏపీలో పీసీసీ అధ్యక్ష మార్పు..తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిపై ఆయన విశ్లేషణ చేశారు. 

నేడు తిరిగి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు..

ఢిల్లీ : రెండు రోజుల వాయిదా తరువాత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ రోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. 

08:03 - July 27, 2015

ముంబై లో 1993 నాటి వరుస పేలుళ్ల కేసులో టాడా కోర్టు ఉత్తర్వుల ప్రకారం జులై 31వ తేదీన ఉరికంబం ఎక్కనున్న యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ పలువురు మాజీ న్యాయమూర్తులు, పార్లమెంట్ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, మేధావులు, ఇంకా వివిధ రంగాల వారు, సామాజిక సేవా కార్యకర్తలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి పత్రం అందచేశారు. మరోవైపు కృష్ణా జిల్లాలో తహశీల్దారు వనజాక్షిపై దాడి ఘటన మరువక ముందే.. గుంటూరు జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులపై భూబకాసురులు దాడులు చేశారు. అక్రమ నిర్మాణాలు అడ్డుకున్నందుకు చావబాదారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో సూర్యప్రకాశ్ (టిడిపి), గోవర్ధన్ (సీపీఐఎంఎల్), జమ్ముల శ్యాంకిశోర్ (బీజేపీ), కొండా రాఘవరెడ్డి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

08:00 - July 27, 2015

పంజాబ్ : రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఏడుగురు పౌరులు, ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు బాంబులతో దాడులు చేశారు. బాంబు పేలుళ్లతో స్థానికులు తీవ్రభయాందోళనలతో ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. అప్రమత్తమైన పోలీసులు ఉగ్రవాదులపై ఎదురు దాడికి దిగారు. భారీగా ఆయుధ సంపత్తితో ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. దాడికి పాల్పడింది తామేనని ఏ ఉగ్రవాది సంస్థ ప్రకటించలేదు. మరోవైపు పఠాన్ కోట్ - అమృత్ సర్ రైల్వే ట్రాక్ వద్ద ఐదు బాంబులున్నట్లు గుర్తించారు. 

07:49 - July 27, 2015

మహారాష్ట్ర : 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన యాకూబ్ మెమన్ ఉరి శిక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఉరిశిక్ష అమలు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.22 లక్షలు విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 30వ తేదీన మెమెన్ ను ఉరి తీయాలంటూ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ మెమెన్ మరోసారి దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరుగనుంది. సుప్రీంకోర్టు పిటిషన్ ను కొట్టివేస్తే మెమన్‌ను ఉరి తీయడం దాదాపుగా ఖాయమైనట్టే అవుతుంది. అలాంటప్పుడు ఎక్కడ ఉరి తీస్తారు ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహారాష్ట్రలో ఉరి తీసే జైళ్లు రెండే ఉన్నాయి. ఒకటి ఎరవాడ జైలు. రెండోది నాగపూర్ సెంట్రల్ జైలు. ఇదిలా ఉంటే యాకూబ్ ను ఉరి శిక్ష తీసేది ఎవరు అనేది చర్చ జరుగుతోంది. గతంలో కసబ్‌ను ఉరి తీసిన తలారీయే ఉరి తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉరి కోసం వాడనున్న తాడును కూడా నాగపూర్ సెంట్రల్ జైలులోనే తయారు చేస్తారని తెలుస్తోంది. యాకూబ్ కు ఉరి పడుతుందా ? లేదా ? అన్నది కొద్ది గంటల్లో తేలిపోనుంది. 

07:48 - July 27, 2015

ఉత్తర్ ప్రదేశ్ : బ్యాంకు అకౌంట్ లో కోట్ల రూపాయలు జమ అయ్యాయని మీకు తెలిస్తే ఎలా ఉంటుంది ? ఏముంది ఆనందంతో గంతేస్తాం ? ఎవరు వేశారు ? ఎలా వచ్చింది ? కనుక్కుంటాం అంటారు కదా. ఎవరి ఆలోచన వారు ప్రవరిస్తారు అంటారు..కానీ ఒక్కసారిగా ఆ డబ్బు మాయం అయిపోతే ఎలా ఉంటుంది ? ఇదే సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాంపూర్ లో ఊర్మిల అనే పేద మహిళ జన్ ధన్ యోజన పథకం కింద రూ.2వేలతో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసింది. కొద్ది రోజుల తరువాత బ్యాంకు అకౌంట్ లో రూ.999999 జమ అయ్యాయని ఆమె ఫోన్ కు మెసేజ్ వచ్చింది. మరోసారి వచ్చిన మెసేజ్ లో రూ.9.7 లక్షలు డెబిట్ కావడం వల్ల రూ.2వేలు ఉన్నాయని వచ్చింది. దీనిపై కనుక్కుందామని బ్యాంకుకు వెళ్లింది. ఆమె అకౌంట్ ను పరిశీలించిన బ్యాంకు సిబ్బంది ఒక్కసారిగా నోరెళ్ల వెళ్లబెట్టారు. ఊర్మిళ అకౌంట్ లో రూ.95వేల కోట్లు ఉన్నాయని తేలింది. ఇది తెలిసిన సదరు మహిళ షాక్ తింది. కానీ ఇదంతా బ్యాంకు సిబ్బంది చేసిన తప్పే కారణమని తెలుస్తోంది. రూ.95వేల కోట్లను ఖాతా నుండి తీసేవేసి ఆమెకు నచ్చచెప్పి ఇంటికి పంపిచేశారంట.

పంజాబ్ లో ఉగ్రవాదులు దాడి..

పంజాబ్ : గుర్ దాస్ పూర్ జిల్లాలోని దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడికి దిగాడు. సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఒకరు మృతి చెందగా ఏడుగురు పౌరులకు, ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. 

నేడు దేవెగౌడ నిరాహార దీక్ష..

ఢిల్లీ : నేడు హస్తినలోని జంతర్ మంతర్ వద్ద దేవెగౌడ నిరహార దీక్ష చేయనున్నారు. రైతుల ఆత్మహత్యలపై లోక్ సభలో చర్చ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టనున్నారు. 

07:05 - July 27, 2015

ప్రొకబడ్డీ సీజన్‌-2లో ముంబై జట్టు.. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తిరుగులేని జట్టుగా సత్తా చాటుతున్న యు-ముంబా.. ఆరో విజయాన్ని సాధించి ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. ఆదివారం జైపూర్‌ వేదికగా హోరాహోరిగా సాగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ పై ముంబై జట్టు 26-27 తేడాతో గెలుపొందింది.

06:48 - July 27, 2015

గెలాక్సీ గ్రానైట్‌ అంటే ప్రపంచంలో ఎంతో పేరుంది. నల్లని అద్దంలా మెరవడమే కాకుండా.. బంగారు వర్ణంతో నింగిలో నక్షత్ర సమూహాన్ని తలపించేలా ఉండే ఈ గ్రానైట్‌తో వ్యాపారులు కోట్లు సంపాదిస్తున్నారు. అయితే రాయిని అందంగా తీర్చుదిద్దుతున్న కార్మికుల బతుకులు మాత్రం చీకట్లోనే మగ్గుతున్నాయి. యాజమాన్యాలకు తమ మొర ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టించుకోకపోవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు.
చీమకుర్తిలో గ్రానైట్ ఖనిజ నిక్షేపాలు..
ప్రకాశం జిల్లా చీమకుర్తి 1976కు పూర్వం ఓ కుగ్రామం. ఒకప్పుడు ఇక్కడి భూముల్లో పంటలు పండక తొండలు గుడ్లు పెట్టేవని టాక్‌ ఉండేది. ఈ ప్రాంతంలో గెలాక్సీ గ్రానైట్‌ ఖనిజ నిక్షేపాలున్నాయని గుర్తించడంతో ఇక్కడ సీనే మారిపోయింది. చీమకుర్తితో పాటు పలు ప్రాంతాల్లో దాదాపు 430 ఎకరాల్లో గెలాక్సీ గ్రానైట్‌ ఖనిజంగా పుష్కలంగా లభించడంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకుంది. సుమారు 155 క్వారీలలో గ్రానైట్‌ మైనింగ్‌ జరుగుతోంది. ఇందుకోసం రాష్ట్రంలోని బడా పారిశ్రామికవేత్తలతో పాటు రాజకీయ నాయకులు ఈ మైనింగ్‌ను కొనసాగిస్తున్నారు.
గ్రానైట్స్ కు భారీ డిమాండ్...
ఎక్కడా లభించని గెలాక్సీ గ్రానైట్స్ కు ప్రపంచంలో భారీ డిమాండ్‌ ఉంది. దీంతో ఈ గ్రానైట్‌ను వ్యాపారులు విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు గడిస్తున్నారు. కానీ.. రాయిని తొలిచి అందంగా మలిచే కార్మికుల జీవితాల్లో వెలుగులు లేకుండాపోయాయి. క్వారీ యాజమాన్యాలు కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడంతో అరకొర జీతాలతోనే బతుకులు వెళ్లదీస్తున్నారు.
ఎలాంటి చట్టాలు లేవు..
ఇక్కడ క్వారీలలో పని చేసే కార్మికులకు ఎలాంటి చట్టాలు ఉపయోగపడడం లేదు. యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయాల్లో కూడా కార్మికుల చేత పని చేయిస్తున్నారు. ఇక కార్మికులు ఇరుకు గదుల్లో ఉండాల్సిన దుస్థితి ఉంది. వీరు నిత్యం దుమ్ముదూళిలో పనిచేస్తూ రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు క్వారీలలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో కార్మికులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో అనేక ప్రమాదాలు జరిగి.. ఎంతోమంది కార్మికులు మృత్యువాతపడ్డారు. వీరిలో కొంతమంది ఎక్కడివారో కూడా తెలియని పరిస్థితి. క్వారీల యజమానులు కనీసం కార్మికుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోయినా.. కనీసం ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం దారుణమని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. తమకు కనీసం ఈఎస్ఐ వసతి కూడా కల్పించడం లేదని కార్మికులంటున్నారు.
కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి..
ప్రమాణాలు పాటించకుండా కార్మికులతో పనులు చేయించుకుంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని వారు కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కార్మికులకు సౌకర్యాలు కల్పించాలంటూ యాజమాన్యాలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని కార్మికులంటున్నారు. దీంతో తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు సమ్మె బాట పట్టారు. వేలాదిమంది కార్మికులు రోడ్డెక్కారు. దీంతో క్వారీలన్నీ మూతపడ్డాయి. గ్రానైట్‌ యాజమాన్యాలు కోట్ల రూపాయలు లాభాలు ఆర్జిస్తున్నా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని కార్మికులంటున్నారు. ఇప్పటికైనా యాజమాన్యాలు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. 

06:43 - July 27, 2015

ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు కారణం ఏమిటి ? కార్మికులు కోరుతున్నదేమిటి ? గ్రానైట్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి ? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో సీఐటీయూ నేత కె.శ్రీనివాసరావు మాట్లాడారు. 

06:41 - July 27, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత గురించి పట్టించుకోవడం లేదని తెలంగాణ విద్యావంతుల వేదిక అభిప్రాయపడింది. రాష్ర్టంలో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉంటే.. కేవలం 15 వేల ఉద్యోగాల నియామాకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. సమంజసం కాదని పేర్కొంది. లక్ష ఉద్యోగాలకు పైగా భర్తీ చేయాల్సిన అవసరం ఉందని టీవీవీ సూచించింది. ఇందుకోసం త్వరలో ప్రత్యక్ష కార్యాచరణకు శ్రీకారం చుట్టి సర్కార్‌పై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది.
టీవీవీ ఆధ్వర్యంలో సదస్సు..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తెలంగాణ విద్యావంతుల వేదిక తీవ్రంగా తప్పుపట్టింది. ప్రభుత్వ పరంగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలపై ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే నిర్ణయానికి వేదిక వచ్చింది. సర్కార్‌పై ఒత్తిడి తెచ్చే విధంగా ఎలా వ్యవహరించాలనే అంశంపై విద్యావంతుల వేదిక సుదీర్ఘంగా చర్చించింది. టీవీవీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
సర్కార్‌పై ఒత్తిడి పెంచే అంశంపై సుదీర్ఘంగా చర్చ..
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమ కార్యాచరణతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని టీ జాక్ ఛైర్మన్ కోదండరాం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించిన నోటిఫికేషన్ల ద్వారా కేవలం 20 శాతం యువతకు మాత్రమే అర్హత ఉంటుందని, అందరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో జిల్లాలోనూ సదస్సులు నిర్వహించి, నవంబర్ రెండో వారంలో చలో హైదరాబాద్ నిర్వహిస్తామని మల్లేపల్లి లక్ష్మయ్య వెల్లడించారు. మిషన్ కాకతీయ తరహాలో నిరుద్యోగ యువతకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వేదిక అభిప్రాయపడింది.

06:37 - July 27, 2015

ముంబై : బాంబు పేలుళ్ల కేసు నిందితుడు యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష పడుతుందా? లేక క్షమాభిక్ష పెడుతారా? యాకూబ్‌ మెమన్‌ మెర్సీ పిటిషన్‌ విచారణకు రానున్న నేపథ్యంలో... సుప్రీం తీర్పు ఎలా ఉండబోతున్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మరికొన్ని గంటల్లో యాకూబ్‌ భవితవ్యం ఏంటో తేలిపోనుంది? 1993 ముంబై పేలుళ్ల కేసులో తనకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలంటూ యాకూబ్‌ మెమన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు విచారించనుంది.
257 మంది మృతి..700 మందికి గాయాలు..
ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో 257 మంది మృతికి, దాదాపు 700 మంది తీవ్రంగా గాయపడడానికి యాకూబ్‌ కారణమని నిర్ధారించిన టాడా కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పుపై యాకూబ్‌ హైకోర్టును ఆశ్రయించగా టాడా కోర్టు తీర్పును ముంబై ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. టాడా కోర్టు విధించిన ఉరి శిక్షను ఈనెల 30న అమలు చేయాల్సిందిగా తీర్పునిచ్చింది. అయితే తన మరణశిక్ష రద్దును కోరుతూ తాను అన్ని చట్టపరమైన అవకాశాలూ ఉపయోగించుకోకముందే తనను ఉరి తీస్తున్నారనేది యాకూబ్‌ మెమన్‌ ప్రధాన వాదన. యాకూబ్‌ మెమన్‌ మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి 2014 మేలో తిరస్కరించగా.. ఇటీవల సుప్రీంకోర్టు కూడా అతని అప్పీలును తిరస్కరించింది.
మెమన్ కు భారీ భద్రత..
మరోవైపు నాగ్‌పూర్‌ జైలులో మెమన్‌కు భారీ భద్రత కల్పించారు. ఉరిశిక్ష ప్రదేశం భద్రత ఏర్పాట్ల కోసం 23 లక్షలను మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. జైలు అధికారులు డమ్మి ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. యాకూబ్ క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించాలని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుకు దేవేంద్ర ఫడ్నవిస్ సర్కార్‌ సూచించింది.
మరణశిక్షలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం..
ఇంకో వైపు మెమన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ పలువురు మాజీ న్యాయమూర్తులు, పార్లమెంట్‌ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, మేధావులు, సామాజిక సేవా కార్యకర్తలు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి విజ్ఞప్తి పత్రం అందజేశారు. అంతర్జాతీయంగా, సర్వత్రా మరణశిక్షలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రస్తావించి.. భారత్‌లో ఇలాంటి దారుణమైన ఉరి తీతలను నిషేధించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. విజ్ఞప్తి పత్రంపై సంతకాలు చేసిన వారిలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్‌, బృందాకారత్, సీపీఐ ఎంపీ డి. రాజా తదితరులు ఉన్నారు.
దుమారం రేపిన సల్మాన్ ట్వీట్స్..
యాకూబ్ మెమన్ అమాయకుడని, అతన్ని ఉరితీయడం మానవత్వాన్ని ఉరితీయడమేనన్న సల్మాన్ ఖాన్ ట్వీట్లు పెద్ద దుమారమే రేపాయి. సల్మాన్ ట్వీట్లపై ఆయన తండ్రి నుంచే కాక సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో..తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. తనవల్ల ఎదైనా తప్పు జరిగితే క్షమించాలని కోరారు సల్లూభాయ్‌. ఏదీ ఏమైనా యాకూబ్‌ మెర్సీ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. 

06:31 - July 27, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలో మరింత వెలుగులు నింపేందుకు టీ.సర్కారు అడుగులు వేస్తోంది. కరెంటు కోతలు లేని తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఇక నుంచి వ్యవసాయానికి చాలినంత విద్యుత్‌ అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
400 కిలోవాట్ల విద్యుత్ లైన్లు అవసరం..
రాష్ట్రంలో నిర్మించబోయే ప్రాజెక్టులకు విద్యుత్‌ సమస్య లేకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రణాళిక‌లు సిద్దం చేస్తోంది. పాల‌మూరు ఎత్తిపోత‌ల ప్రాజెక్టుకు 400 కిలోవాట్ల విద్యుత్ లైన్లు అవ‌స‌ర‌మ‌ని అంచనా వేసింది. దీనికి త‌గ్గట్లుగా డిండి లేదా మ‌హేశ్వరం నుంచి కొత్తగా లైన్లు వేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు సీఎం. గోదావ‌రి న‌దిపై మేడిగ‌డ్డ వ‌ద్ద నిర్మించే ప్రాజెక్టు కోసం భూపాలప‌ల్లి లేదా జైపూర్ విద్యుత్ ప్రాజెక్టుల‌ నుంచి విద్యుత్ లైన్లను వేయాల‌న్నారు. భ‌విష్యత్తులో నీటి ప్రాజెక్టుల‌ కోసం ఎంత విద్యుత్ అవ‌స‌మ‌ర‌మ‌వుతుందో ముందే కార్యచ‌రణ రూపొందించాలని సూచించారు.
2018 నాటికి 25వేల మెగావాట్లు..
2018 నాటికి 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి.. ఇందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం చేపట్టాలన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో వ‌ర్షాభావ ప‌రిస్థితులు ఉన్న నేప‌థ్యంలో.. విద్యుత్ డిమాండ్ పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. వ్యవ‌సాయ రంగానికి చాలినంత విద్యుత్ అదించడంతో పాటు గృహ, ప‌రిశ్రమ, వ్యాపార కేంద్రాల‌కు 24 గంట‌ల పాటు నిరంతర విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాలన్నారు. వ‌చ్చే ఏడాది నుంచి ప‌గ‌టి పూటే వ్యవ‌సాయానికి 9గంట‌ల విద్యుత్ ఇచ్చేందుకు చ‌ర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

06:29 - July 27, 2015

హైదరాబాద్ : గ్రామాభివృద్ధి కోసం ఆగ‌స్ట్ 15 నుంచి తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి ప‌థ‌కంను ప్రారంభించ‌నుంది. ప్రతి గ్రామం దేనికవే.. తమ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్ధేశ్యం. ఇందుకోసం 25వేల కోట్లను ఖర్చు చేయాలని నిర్ణయించిన సర్కార్... ఈ స్కీమ్ విధి విధానాలు ఖరారు చేసేందుకు కేటిఆర్ నేతృత్వంలో స‌బ్ క‌మిటీని రూపొందించింది. జ‌నాభాను బ‌ట్టి ఆయా గ్రామాల‌కు నిధుల కేటాయింపు ఉంటుంద‌ని.. గరిష్ఠంగా 6 కోట్ల వ‌ర‌కు నిధుల కేటాయింపు చేయ‌నున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పంచాయితీ రాజ్ శాఖపై ఆదివారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. పంచాయితీ రాజ్ వ్యవస్థను బ‌లోపేతం చేసి... గ్రామ పంచాయితీల‌ను ప‌టిష్టం చేయ‌డం, గ్రామ స్ధాయిలోనే ఆ అభివృద్దికి ప్రణాళికలు రూపోందించుకోవ‌డం గ్రామజ్యోతి ద్వారా జ‌రుగుతుంద‌ని ప్రభుత్వం తెలిపింది.
కేటీఆర్ నేతృత్వంలో సబ్ కమిటీ..
ఇందులో స్ధానిక అవ‌స‌రాలు, ఆవశ్యకతను బ‌ట్టి నిధుల కేటాయింపు ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ ప‌థ‌కం అమ‌లు కోసం కావాల్సిన విధి విధానాల‌ను రూపొందించేందుకు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు ఈటెల రాజేంద‌ర్, తుమ్మల నాగేశ్వర్, పోచారం శ్రీనివాసరెడ్డి, హ‌రీష్ రావు, జోగు రామ‌న్నల‌తో క్యాబినేట్ స‌బ్ క‌మిటీని నియ‌మించారు సీఎం. వారం లోపు నివేదిక ఇవ్వాల‌ని అదేశించారు.
30న సమావేశం..
మరోవైపు ఈ ప‌థ‌కంపై పూర్తి స్ధాయి అవ‌గాహాన కోసం ఈ నెల 30 ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో కేటిఆర్ తో పాటు ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు నిరంజ‌న్ రెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు, జిల్లా క‌లెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సీఎం భేటీ కానున్నారు. ఇప్పటికే మున్సిపల్ పారిశుద్ద్య కార్మికుల వేతనాల‌ కోసం స‌ర్కార్ ఖ‌జానా ఖాళీ అంటూ త‌ప్పించుకున్న ప్రభుత్వం తాజాగా రాబోయే గ్రామ‌జ్యోతికి మాత్రం 25వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు చెప్పడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలిది ఇది ఎంత వ‌ర‌కు అమ‌లౌతుందోన‌న్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

06:27 - July 27, 2015

గుంటూరు : పోలీసులంటే భయం లేదు. అధికారులంటే లెక్క లేదు. చట్టాన్ని చుట్టంలా మార్చుకుంటున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. జెండా పాతేస్తున్నారు. సర్కారీ భూములపై గద్దల్లా వాలిపోతున్నారు. అడ్డొస్తే రెవెన్యూ అధికారులపైనే దాడులు చేస్తున్నారు. నోట్ల కట్టల కోసం ప్రాణం తీసేందుకు సైతం కబ్జారాయుళ్లు వెనకంజ వేయడం లేదు. కృష్ణా జిల్లాలో తహశీల్దారు వనజాక్షిపై దాడి ఘటన మరువక ముందే.. గుంటూరు జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులపై భూబకాసురులు దాడులు చేశారు. అక్రమ నిర్మాణాలు అడ్డుకున్నందుకు చావబాదారు. గుంటూరులోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న వీఆర్వో, వీఆర్ఏ లపై భూబకాసురులు దాడులు చేశారు. ఈ రెండు ఘటనల్లోనూ ప్రభుత్వ అధికారులు.. ఇసుక మాఫియా, రియల్‌ మాఫియా చేతుల్లో చావుదెబ్బలు తిన్నారు.
ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు..
విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిని అనుకుని ఉన్న మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో పోరంబోకు భూమిపై కన్నేసిన కొందరు తమ పరపతితో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు స్వాధీన పర్చుకుని.. ఆక్రమణ దారులను వెళ్లగొట్టారు. ఇప్పుడు భూమి విలువ పెరగడంతో కబ్జారాయళ్లు అధికార పార్టీ నేతల అండదండలతో స్వాధీనం చేసుకోవడానికి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీంతో స్థానిక తహశీల్దార్‌... వీఆర్వో శ్రీనివాస్‌రావును పరిశీలనకు పంపారు. వీఆర్ఏ చలపతిరావుతో కలిసి స్థలం వద్దకు వెళ్లిన వీఆర్వో .. నిర్మాణాలు ఆపాలని వారికి సూచించారు. దీంతో రెచ్చిపోయిన కబ్జాదారులు రెవెన్యూ సిబ్బందిపై కిరాతకంగా దాడి చేశారు. భూ మాఫియా దెబ్బలను తట్టుకోలేని అధికారులు కాళ్లావేళ్లా బతిమాలినా కనికరించలేదు. తరిమి తరిమి కొడుతుండగా.. రోడ్డు పక్కనే ఉన్న తూముల్లో దాక్కుని ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసుల ముందు కూడా కబ్జారాయుళ్లు రెవెన్యూ సిబ్బందిపై చిందులేశారు.
జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరణ..
ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా వీఆర్‌ఏ, వీఆర్‌వోలు విధులు బహిష్కరిస్తున్నట్లు సంఘం నేతలు ప్రకటించారు. వరుస ఘటనలతో రెవెన్యూ ఉద్యోగులు భయాందోళనచెందుతున్నారు. సీన్సియర్‌గా పనిచేస్తుంటే.. రియల్‌ మాఫియా, ఇసుక మాఫియా ఆగడాలకు తాము బలవ్వాల్సి వస్తుందని వణికిపోతున్నారు. 

06:25 - July 27, 2015

రాజమండ్రి : గోదావరి మహా పుష్కరాలు ముగియడంతో రాజమండ్రిలో ఉద్యోగుల అభినందన సభ ఏర్పాటు చేశారు. పుష్కరాల్లో భక్తులకు అందించిన ఉద్యోగుల సేవలపై చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. అందరూ కష్టపడి పుష్కరాలను విజయవంతం చేశారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మీడియా ప్రతినిధులకూ ముఖ్యమంత్రి జ్ఞాపికలను అందించారు.
ఇదే స్పూర్తితో పనిచేయాలన్న బాబు..
పుష్కరాలను సమిష్టి కృషితో విజయవంతం చేయగలిగమన్నారు. దీన్ని ఒక నమూనా ప్రాజెక్టుగా తీసుకుని.. ఇదే విధానాన్ని రాష్ర్టం మొత్తానికి అమలు చేస్తామన్నారు. అప్పుడు అదర్శ, అభివృద్ధి చెందిన రాష్ర్టంగా, విదేశాలతో పోటీపడేలా అభివృద్ధి చేయగలమని సీఎం అభిప్రాయపడ్డారు. అందరూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తే.. రాష్ర్టం అనుకున్న సమయం కంటే ముందే అభివృద్ధి చెందిన రాష్ర్టంగా ఒకటో స్థానంలో నిలుస్తుందన్నారు.
సేవలకు మార్కులు..
గోదావరి పుష్కరాలకు ఊహించినదానికంటే భక్తులు ఎక్కువే వచ్చారని చంద్రబాబు అన్నారు. పుష్కరాల్లో వివిధ సేవలకు ప్రతిరోజు మార్కులు వేశారు. ఎవరికి సగటు మార్కులు ఎన్ని వచ్చాయో సీఎం చదవి వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మీడియా ప్రతినిధులకూ ముఖ్యమంత్రి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట మంత్రులు, సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పుష్కరాల తొలిరోజు జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన 27 మంది ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. 

నేడు, రేపూ వర్ష సూచన..

హైదరాబాద్ : ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడదిన అల్పపీడనం ఆదివారం ఉయదం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం నిలకడగా అదే ప్రాంతంలో కొనసాగుతోంది. మరో 24గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా నుండి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనివల్ల సోమవారం కోస్తాంధ్రలో చెదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. 

కర్నూలులో ప్రైవేటు బస్సు బోల్తా..

కర్నూలు : బండి ఆత్మకూరు (మం) సొంతజూటురు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

సండ్ర పిటిషన్ పై నేడు ఏసీబీ కౌంటర్..

హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ అధికారులు సోమవారం కౌంటర్ దాఖలు చేయనున్నారు. 

మెమెన్ ఉరిశిక్షపై నేడు క్లైమాక్స్..

ముంబై : బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన యాకూబ్ మెమన్ వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది. ఈనెల 30వ తేదీన మెమెన్ ను ఉరి తీయాలంటూ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ మెమెన్ మరోసారి దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరుగనుంది. 

నేటి నుండి పీఎం ఆవాస్ యోజనపై వర్క్ షాప్..

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంపై ఢిల్లీలో సోమవారం నుండి రెండు రోజుల పాటు జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహించనున్నారు. 

వాటర్ సప్లై ప్రాజెక్టు పనులకు ఆన్ లైన్ టెండర్లు..

హైదరాబాద్ : తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు పనులకు సోమవారం నుండి ఆన్ లైన్ ఈ - ప్రొక్యూర్ మెంట్ టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 

నేడు కొత్త ఛాంబర్ లోకి జేఎండీ రమణారావు..

హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ చీఫ్ గా నియమితులైన జేఎండీ రమణారావు సోమవారం కొత్త ఛాంబర్ లోకి అడుగుపెట్టనున్నారు. ఆర్టీసీ తాత్కాలిక విభజనలో భాగంగా ఖాళీ అయిన ఎండీ ఛాంబర్ నుండి ఆయన బాధ్యతులు నిర్వహించనున్నారు. 

ఉస్మానియా తరలింపుపై నేడు సమావేశం..

హైదరాబాద్ : ఉస్మానియా ఓపి బ్లాక్ తరలింపు నేపథ్యంలో సోమవారం ఉన్నతాధికారుల సమావేశం జరుగనుంది. పేషెంట్ల తరలింపుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి తుమ్మల..

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర మంత్రి నితీన్ గడ్కరిని కలువనున్నారు.

Don't Miss