Activities calendar

28 July 2015

22:00 - July 28, 2015

భారత మాజీ రాష్ట్రపతి, ఎపిజె అబ్దుల్ కలాం నిన్న షిల్లాంగ్ లోని ఐఐఎం లో విద్యార్థులనుద్ధేశించి ప్రసంగిస్తూ.. కుప్పకూలిపోయి మరణించారు. రేపు ఆయన భౌతికకాయాన్ని తమిళనాడులోని ఆయన స్వస్థలం రామేశర్వం తరలించనున్నారు. గురువారం కలాం అంత్యక్రియలు రామేశ్వరంలో జరుగనున్నాయి. ఈనేపథ్యంలో కలాం జీవిత చరిత్రపై టెన్ టివి..వైడ్ యాంగిల్ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. కలాం జీవిత వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:55 - July 28, 2015

ఢిల్లీ: కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ, కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌లను టీఆర్‌ఎస్‌ ఎంపీల బృందం కలిసింది. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు సహా,.నల్గొండ జిల్లా భువనగిరిలో కేంద్రీయ విశ్వ విద్యాలయం, వరంగల్‌లో రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, సైనిక్‌ పాఠశాల ఏర్పాటు, ఖాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రులను కోరారు. అయితే ఐఐఎం ఏర్పాటు ఈ విద్యా సంవత్సరంలో కుదరదని...వచ్చే సంవత్సరంలో పరిశీలిస్తామని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. వరంగల్‌లో సైనిక్‌ స్కూలు ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని మంత్రి తెలిపారు.

 

21:52 - July 28, 2015

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో విభాగాల తరలింపునకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఆస్పత్రిలో కొన్ని డిపార్ట్ మెంట్లను ఇతర ఆస్పత్రులకు మార్చాలని అధికారులు నిర్ణయించారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో విభాగాలను... సుల్తాన్ బజార్లోని మెటర్నిటీ ఆస్పత్రికి.... ఆర్థోపెడిక్ విభాగాన్ని కింగ్ కోఠి ఆస్పత్రికి తరలిస్తున్నారు. మొత్తం 870 బెడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఆర్థొపెడిక్‌కు 120 బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

 

21:46 - July 28, 2015

ర్యాగింగ్ ను అరికట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. ఇదే అంశంపై నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో సైకాలజిస్టు.. ప్రొ.విరజారావు, అనురాగ్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ అకడమిక్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరావులు పాల్గొని, మాట్లాడారు. ర్యాగింగ్ కు పాల్పడే వారిపై యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అవినీతిమయం అయిందని వాపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

గుంటూరు ఇంచార్జ్ జేసీఎల్ గా వరహాలరెడ్డి

గుంటూరు: జిల్లా ఇంచార్జ్ జేసీఎల్ గా వరహాలరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. జిల్లా జేసీఎల్ ఎల్లారావు ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. 

21:23 - July 28, 2015

భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఎపిజె.అబ్దుల్ కాలం జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని వక్తలు ఆన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో డిజబుల్ ఫౌండేషన్ ఛైర్మెన్ డా.విజయభాస్కర్, సామాజిక విశ్లేషకుడు.. మల్లిఖార్జున్ రావులు పాల్గొని, మాట్లాడారు. కలాం.. గొప్ప మానవతా వాది అని పేర్కొన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:12 - July 28, 2015

ఖమ్మం: ముదిగొండ అమర వీరుల స్ఫూర్తితో భూపోరాటాలను మరింత ఉధృతం చేయాలని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ అన్నారు. ముదిగొండ అమర వీరుల ఎనిమిదో వర్ధంతిని పురస్కరించుకుని... సీపీఎం పతాకాన్ని సుదర్శన్ ఆవిష్కరించారు. అనంతరం అమర వీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. బంగారు తెలంగాణ నిర్మిస్తామన్న పాలకులు.. ఆ.. హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి నినాదంగానే మారిందని ఎద్దేవా చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ భూమిదక్కేంత వరకు పోరాటం ఆగదన్నారు.

21:08 - July 28, 2015

వరంగల్: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఏసిరెడ్డి నర్సింహారెడ్డి 24 వర్ధంతి సభను... జనగామ సీపీఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సీపీఎం శ్రేణులు పెద్ద ఎత్తున సభకు హాజరయ్యారు. సీపీఎం తెలంగాణ రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీరెడ్డి ప్రత్యేక సంచికను తమ్మినేని, సారంపల్లి వాసుదేవరెడ్డి, ఆముదాల మల్లారెడ్డి ఆవిష్కరించారు. పట్టణంలోని నెహ్రూ సెంటర్ దగ్గర.. ఏసిరెడ్డి భవన నిర్మాణానికి తమ్మినేని శంకుస్థాపన చేశారు.

 

 

21:02 - July 28, 2015

కర్నూలు: నగరంలో అత్యాచారానికి గురైన మైనర్ బాలికను మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పరామర్శించారు. బాలికకు రెండు లక్షలు రూపాయలు ఆర్ధికసాయం, అలాగే బాలిక చదువు, వివాహానికి అయ్యే ఖర్చును తామే భరిస్తామన్నారు. అంతేకాకుండా ఆ బాలికను పెళ్లిచేసుకునే భర్తకు కూడా.. టీజీవి గ్రూప్‌లో ఉద్యోగం కల్పించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునారవృతంకాకుండా... ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

20:59 - July 28, 2015

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లో అక్కాచెల్లెళ్లను అతి కిరాతంగా హత్య చేసిన ప్రేమోన్మాది అమిత్‌ సింగ్‌ను... పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న అమిత్‌ కోసం.. పోలీసులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. అమిత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

20:56 - July 28, 2015

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి తరలింపుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే కేసీఆర్ చెప్పినట్లు వారంరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందా? కేవలం రోగులను... ఎక్విప్‌మెంట్‌ను మాత్రమే తరలిస్తారా? మరి నర్సులు.. ఇతర సిబ్బందిని ఏంచేయబోతున్నారు? స్పెషల్ రిపోర్ట్...
1866లో ఆస్పత్రి ఏర్పాటు
మూసీనదితీరంలో ఏర్పాటైన ఉస్మానియా ఆస్పత్రికి చాలా పురాతన చరిత్ర ఉంది.. 1866లో రెండు అంతస్తుల్లో ఆస్పత్రి ఏర్పాటుచేశారు నాలుగవ నిజాం నవాబ్ నసీరుద్దౌలా.. అప్పట్లోనే విదేశాల్లో అందుబాటులోఉన్న వైద్య సేవలను ఇక్కడ అందించారు.. అప్పట్లో ఈ ఆస్పత్రిని అఫ్జల్ గంజ్ దవాఖానా అని పిలిచేవారు.. 1908లో మూసీనదికి వరదలు రావడంతో ఈ భవనాలు దెబ్బతిన్నాయి.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1925లో ప్రస్తుత ఆస్పత్రిని ప్రారంభించారు.. మూసీకి వరదలొచ్చినా ఎలాంటి ఇబ్బందిలేకుండా భవనాలు నిర్మించారు.. హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో కలిసినతర్వాత ఈ ఆస్పత్రి ప్రభుత్వ పరమైంది..
ఇండో పర్షియన్ శైలిలో ఉస్మానియాఆస్పత్రి
ఉస్మానియా ఆస్పత్రి ఇండో పర్షియన్ శైలిలో కనిపిస్తుంది.. మొత్తం నల్ల గ్రానైట్.. సున్నంకలిపి వాడారు.. దీనివల్లే ఇన్నేళ్లు నిలిచింది ఈ భవనం.. ఆస్పత్రిపైభాగంలోని గుండ్రని ఆకారాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.. 9లక్షల చదరపు అడుగులవిస్తీర్ణంలో చేపట్టిన ఈ భారీ ఆస్పత్రికి అప్పట్లో రూ. 50వేలు ఖర్చయింది.. యంత్రాల సాయంలేకుండా కేవలం కూలీలే ఈ భవనం నిర్మించారు..
మొదటిసారి మత్తుమందుతో ఆపరేషన్
వైద్య చికిత్సలోనూ ఈ ఆస్పత్రికి చాలా రికార్డులున్నాయి... ప్రపంచంలోనే మొదటిసారి మత్తుమందిచ్చి ఇక్కడే ఆపరేషన్ చేశారు డాక్టర్లు.. 1885లో డాక్టర్ ఎడ్వర్డ్ తొలిసారి క్లోరోఫాం ఉపయోగించి శస్త్రచికిత్స చేశారు.. అప్పటి ప్రపంచ ప్రఖ్యాత వైద్యులు ఉస్మానియాను సందర్శించి దీనిని అధ్యయనం చేశారు.
రోజుకు15వందలమంది పేషంట్ల రాక
ఈ ఆస్పత్రిలో రోజుకు దాదాపు 12వందలనుంచి 15వందలమంది పేషంట్లు చికిత్స తీసుకుంటారు. అలాగే రోజుకు 150నుంచి 2వందలవరకూ ఆపరేషన్లు జరుగుతాయి.. ఇలా ఇన్నేళ్ల ఘనచరిత్రగల ఈ ఆస్పత్రి ప్రస్తుతం శిధిలావస్తకు చేరింది.. ఎన్నోసార్లు పెచ్చులు, పైకప్పులు ఊడిపడి రోగులు, సిబ్బంది గాయపడ్డారు.. వర్షం వచ్చినప్పుడు మరిన్ని ఇబ్బందులు తప్పడంలేదు.. భవనంలోకి మొత్తం నీరు చేరుతోంది. దీంతో ఆస్పత్రి ఉద్యోగసంఘాలు కలిసి ఉస్మానియా పరిరక్షణ కమిటీని ఏర్పాటుచేసుకున్నారు... మంత్రి లక్ష్మారెడ్డిద్వారా సీఎం దృష్టికి సమస్యను తెచ్చారు.. ఆ తర్వాత ఆస్పత్రిని సందర్శించిన సీఎం కొత్త భవనం నిర్మాణానికి ఓకే చెప్పారు.. అటు ఉస్మానియాను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారుస్తామని ప్రకటించారు మంత్రి లక్ష్మారెడ్డి.. రోగుల తరలింపు.. కొత్త ఆస్పత్రి నిర్మాణంపై ఏర్పాట్లను స్వయంగా మంత్రి లక్ష్మారెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
ఆస్పత్రి తరలింపుపై భిన్నవాదనలు
అటు ఆస్పత్రిని తరలించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.. కొత్త టవర్స్ నిర్మించడానికి చారిత్రక భవనం కూల్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి... అటు ఆస్పత్రిలో పనిచేసేవారికి ఇక్కడే క్వార్టర్స్ కట్టించాలని వైద్యులు అంటున్నారు. ఉస్మానియా పాతభవనంలో అనేక విభాగాలున్నాయి. వీటిని ఎక్కడికి తరలించాలన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. జనరల్ మెడికల్ విభాగాన్నిమాత్రం ఫీవర్ ఆస్పత్రికి పంపాలని నిర్ణయించారు. ఆస్పత్రి మారాక రోగుల వివరాలకోసం ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటుచేయాలని కొందరు నిపుణులు అంటున్నారు. నర్సులు, ఇతర సిబ్బంది తరలింపు ఇప్పుడు పెద్దసమస్యగా మారింది. ఆస్పత్రికి సంబంధించి నిపుణులతో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు..

 

భజరంగ్ జూట్ మిల్లు యాజమాన్యాన్ని ప్రాసిక్యూషన్ చేయాలని ఆదేశం

గుంటూరు: భజరంగ్ జూట్ మిల్లు లాకౌట్ వ్యవహారంపై యాజమాన్యాన్ని ప్రాసిక్యూషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

20:31 - July 28, 2015

హైదరాబాద్: 'కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి' అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలనే యువత స్ఫూర్తిగా తీసుకోవాలని...అదే కలాంకు అర్పించే నిజమైన నివాళి అని టిడిపి నేత జూపూడి ప్రభాకర్‌ అన్నారు. గొప్ప శాస్త్రవేత్త అయిన డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మృతి దేశానికే తీరని లోటన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకున్న తాను...అబ్దుల్ కలాం చేపట్టిన అనేక ప్రాజెక్టుల్లో పనిచేశానని గుర్తుచేశారు. శ్యాటిలైట్‌ రంగంలో అగ్ర దేశాలుగా ఉన్న ఫ్రాన్స్, రష్యా, అమెరికా లాంటి దేశాలకు భారత్‌ సత్తా ఏంటో అబ్దుల్‌ కలాం నిరూపించారన్నారు. అలాంటి గొప్ప నేతకు ఈ తరం యువత ఆదర్శంగా నిలవాలని జూపూడి కోరారు. 

20:19 - July 28, 2015

హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్‌ ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే ప్రభాకర్‌ చేపట్టిన నిరాహార దీక్ష వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వామపక్ష నేతలు ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ చాంబర్‌ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నేతలు, కార్మికులు, కార్యకర్తలు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తొలగించిన కార్మికులను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నేతలు హెచ్చరించారు.

20:11 - July 28, 2015

మెదక్: సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికురాలు అకస్మాత్తుగా మృతి చెందిన సంఘటన మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో చోటు చేసుకుంది. గజ్వేల్‌ మున్సిపల్ ఆఫీస్‌లో కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్న మల్లమ్మ ..మున్సిపల్ సమ్మెలో పాల్గొంది. సమ్మెలో లేచి బయటకు వెళ్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యం అందేలోపే ఆమె మృతి చెందింది. అయితే ఆమె మృతి చెందడంతో..తోటి కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

 

కర్నూలు జిల్లాలో వార్డన్ దాష్టీకం..

కర్నూలు: బనగానపల్లె ఎస్సీ బాలుర హాస్టల్ వార్డన్ దాష్టీకం బయపడింది. ప్లేటు కడగలేదని విద్యార్థిని చితకాబాదాడు. దీంతో విద్యార్థి తండ్రి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. 

విశాఖలో స్వైన్ ఫ్లూ కలకలం..

విశాఖ: జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. మద్దెలపాలెంలో గర్భిణీకి స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో మహిళకు చికిత్స అందిస్తున్నారు.

 

 

4,326 పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్ సీ కసరత్తు

హైదరాబాద్: టీ. ప్రభుత్వం ఆదేశాలతో 4,326 పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్ సీ కసరత్తు చేస్తోంది వన్ టైం రిజిస్ట్రేషన్ కోసం.. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టీఎస్ పీఎస్ సీ.జీవోవీ.ఇన్ లో వివరాలు నమోదు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

 

ఆంధ్రాలో సీసీఐ ఆధికారులపై సీబీఐ కేసు నమోదు..

హైదరాబాద్: ఎపిలో సీసీఐ ఆధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. గుంటూరు, కృష్ణా, ప.గో, ప్రకాశం జిల్లాల్లో 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గుంటూరు, క్రోసూరు, చింతలపూడి, పెదనందిపాడు, నందిగామ, మైలవరం మార్కెట్ కమిటీ అధికారులపై కేసులు నమోదు అయ్యాయి. పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని కేసులు నమోదు చేశారు. 

కొత్త రాష్ట్రానికి ఐఐఎం చాలా అవసరం: దత్తాత్రేయ...

ఢిల్లీ: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం చాలా అవసరమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించాల్సి ఉందన్నారు. ఐఐఎం గురించి అరుణ్ జైట్లీతో మాట్లాడుతానని దత్తాత్రేయ చెప్పారు. కాజీపేట రైల్వే కోక్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో మాట్లాడుతానని తెలిపారు.

 

19:27 - July 28, 2015

పాట్నా: పంజాబ్‌లో పంజా విసిరిన టెర్రరిస్టుల సిసి ఫుటేజీ లభ్యమైంది. గురుదాస్‌పూర్‌లో చొరబడ్డ ఉగ్రవాదులు మారుతీ కారును లాక్కొని ఆ తర్వాత బస్సుపై కాల్పులు జరిపారు. అనంతరం దీనానగర్‌ పోలీస్‌స్టేషన్‌లోకి చొరబడ్డారు. దీనానగర్‌లోకి చొరబడుతున్న సమయంలో ఓ షాపు ముందు ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో ఉగ్రవాదుల విజువల్స్ రికార్డయ్యాయి. సైనిక దుస్తుల్లో ఉన్న ముగ్గురు టెర్రరిస్టుల విజువల్స్ ఇక్కడ చూడవచ్చు. ఉగ్రవాది భుజంపై రాకెట్‌ లాంఛర్ వేలాడుతూ కనిపించింది. ఈ దృశ్యం ఉదయం 4 గంటల 55 నిముషాలకు సిసి కెమెరాలో రికార్డయింది.

 

 

19:24 - July 28, 2015

ఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి... ఐక్యరాజ్యసమతి ప్రగాఢ సంతాపం తెలిపింది. కలాం సేవలకు గుర్తుగా... ఆయన పుట్టిన రోజును.. అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవంగా గుర్తిస్తామని తెలిపింది.

 

19:19 - July 28, 2015

కృష్ణా: విజయవాడలో సంచలనం సృష్టించిన హిమబిందు హత్యకేసును సెషన్స్ కోర్టు కొట్టివేసింది. పోలీసులు సరైన ఆధారాలు చూపించలేకపోయారని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే నిందితుడు సుభానీతో పాటు మరో ఐదుగురిని కోర్టు విడుదల చేయాలని ఆదేశించింది. నగలు, డబ్బు కోసం నిందితులు.. గృహిణి హిమబిందును అత్యాచారం, హత్య చేసినట్లు కేసు నమోదైంది. కోర్టు తీర్పు పట్ల హిమబిందు బంధువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులంతా నిర్ధోషులైతే నేరం ఎవరు చేశారో పోలీసులు తెలపాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. పోలీసులు సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో వారి తీరు, నిర్లక్ష్యంపై హిమబిందు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమబిందు బంధువులు ఇచ్చిన సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టులో నిరూపించలేకపోయారు. దీంతో ఆమె బంధువులు తీవ్ర ఆవేదన, ఆవేశంతో ఉన్నారు. బెజవాడ పోలీసులు లంచాలకు అలవాటు పడ్డారని ఆరోపించారు. ఇది పోలీసుల అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. నిందితులకు శిక్షపడే వరకు వదిలిపెట్టమని చెబుతున్నారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్ఫష్టం చేశారు.

 

18:46 - July 28, 2015

ఢిల్లీ: విద్యార్థులను, యువతను ప్రభావితం చేసినవారిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు ఎవరూ సాటి రారని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అన్నారు. రాష్ట్రపతిగా కూడా ఆయన దేశానికి ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. వైజ్ఞానిక రంగంలో ఆయన చేసిన కృషికి ప్రభుత్వం ఆయనను భారతరత్న అవార్డుతో సత్కరించడం జరిగిందన్నారు. భారతరత్న అవార్డుకు గర్వించదగ్గ వ్యక్తి అబ్దుల్‌ కలాం అని పేర్కొన్నారు.

 

18:42 - July 28, 2015

ఢిల్లీ: డాక్టర్‌ అబ్దుల్ కలాం మృతి దేశానికి తీరని లోటని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. భారత భవిష్యత్తుకు బాటలు వేసేందుకు యువతకు దశా దిశను నిర్దేశించడం కోసం మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఎంతో కృషి చేశారని కొనియాడారు. రాజకీయాలతో సంబంధం లేకున్నా రాష్ట్రపతి విధులను చక్కగా నిర్వర్తించారని తెలిపారు. 2004లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభాన్ని ఆయన చాకచక్యంగా పరిష్కరించారన్నారు.

 

18:33 - July 28, 2015

తిరుముల: టిటిడి పాలక మండలి సమావేశం ముగిసింది. పాలకమండలి పలు కీల నిర్ణయాలు తీసుకుంది. కడప జిల్లా ఒంటిమిట్టలోని రామాలయాన్ని టిటిడి ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం తరహాలో ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నారాయణ గిరి ఉద్యానవనంలో వెయ్యికాళ్ల మండపం పునర్నిర్మాణం, విజయవాడ, రాజమండ్రిలలో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టాలని పాలకమండలి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే టిటిడి ఉద్యోగుల పిల్ గ్రిమ్ అలవెన్స్ ను రూ.1,500 నుండి రూ.2,500 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

18:01 - July 28, 2015

హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌కలాం మృతి పట్ల పలువురు ప్రముఖులు, నేతలు నివాళులర్పించారు. కలాంకు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
అబ్దుల్‌కలాంకు టి.టిడిపి నేతల నివాళి
మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌కలాం మరణం దేశానికి తీరని లోటని టి టిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణ అన్నారు. హైదరాబాద్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అబ్దుల్‌కలాంకు టి టిడిపి నేతలు నివాళులర్పించారు. యువతకు అబ్దుల్‌ కలాం మార్గదర్శీయుడిగా నిలవడం గొప్ప గర్వకారణమని...ఆయన సూచించిన మార్గంలో యువత పయనించాలని ఆయన టీ టీడిపి అధ్యక్షుడు రమణ అన్నారు.
గాంధీభవన్లో కలాంకు టీపీసీసీ ఘన నివాళి
మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మరణం దేశానికే తీరని లోటని టీ పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఏపీజే అబ్దుల్‌కలాం చిత్రపటానికి టీ పీసీసీ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొని కలాం చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. 

ఉద్యోగాలు ఇస్తేనే అంత్యక్రియలు అంటున్న ఎస్పీ బల్జీత్ సింగ్ కుటుంబం

హైదరాబాద్ :పంజాబ్ లోని దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రదాడి నేపథ్యంలో, డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్ అంత్యక్రియలను నిర్వహించేందుకు అతని కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. తన కుమారుడికి ఎస్పీ ర్యాంకు, ఇద్దరు కుమార్తెలకు తహశీల్దార్ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు అంత్యక్రియలు నిర్వహించమని ఎస్పీ భార్య కల్వంత్ కౌర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చిన తర్వాతే దహన సంస్కారాలు నిర్వహిస్తామని తెలిపారు. తన మామ అచ్చార్ సింగ్ చనిపోయిన తర్వాత తన భర్తకు ఉద్యోగం రావడానికి రెండేళ్లు వేచి చూడాల్సి వచ్చిందని... అందుకే తాము ఈ డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

17:49 - July 28, 2015

గుంటూరు: గుంటూరులోని భజరంగ్ జూట్ మిల్లు వద్ద ఉద్రిక్తత నెలకొంది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను కార్మికులు అడ్డుకున్నారు. మరోవైపు ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. కార్మికుల ఆందోళనలతో భయంతో ప్రభుత్వ అధికారులు పరుగులు తీశారు.

 

17:36 - July 28, 2015

కృష్ణా: జిల్లాలోని మైలవరంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూమిలో సాగుచేస్తున్న పేదలను తొలగించరాదని సీపీఎం ఆందోళన చేసింది. మైలవరం మార్కెట్‌యార్డు దగ్గర హైవేపై బైఠాయించి నేతలు ధర్నా చేశారు. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏపీ కార్యదర్శి మధుతో పాటు సీపీఎం నేతలు, వందలాది మంది చిన్న, సన్నకారు రైతులు పాల్గొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నేతలు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మధు మాట్లాడుతుండగా పోలీసులు మైక్‌ లాక్కొని...ఆయన్ను అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై సీపీఎం నేతలు, సాగుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీభూముల్లో సాగును అడ్డుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

 

ఏసీబి వలలో ట్రాన్స్ కో ఏడీఈ సంగమేశ్వర్

హైదరాబాద్:అమీర్ పేటలోని సితార హోటల్ లో లంచం తీసుకుంటూ ట్రాన్స్ కో ఏడీఈ సంగమేశ్వర్ ఏసీబికి పట్టుబడ్డాడు.

17:32 - July 28, 2015

హైదరాబాద్: మాజీ రాష్టపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మరణం.. దేశానికే కాదు.. ప్రపంచ మానవాళికే తీరని లోటని ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. అబ్దుల్‌కలాంతో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. కలాం ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చినా రాజ్‌భవన్‌లోనే బస చేసేవారని గుర్తుచేశారు. చిన్న పిల్లలతో ఎంతో అప్యాయతతో ఉండే అబ్దుల్‌ కలాం..మనమధ్య లేరంటే నమ్మశక్యంగా లేదన్నారు. నిరాడంబరంగా ఉండే కలాం ప్రపంచానికే మార్గదర్శకులని చెప్పారు. దేశ రక్షణకు టెక్నాలజీ ఏవిధంగా ఉపయోగపడుతుందని పదే పదే అడిగే వారని గుర్తు చేశారు. కలాం సూచించిన మార్గంలో యువత పయనించడమే ఆయనకు ఆర్పించే నిజమైన నివాళి అని నరసింహన్‌ అన్నారు.

 

కోర్టు తీర్పు పట్ల హిమబిందు బంధువుల ఆవేదన

విజయవాడ: కోర్టు తీర్పు పట్ల హిమబిందు బంధువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులంతా నిర్ధోషులైతే నేరం ఎవరు చేశారో పోలీసులు తెలపాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

ముగిసిన టిటిడి పాలకమండలి సమావేశం...

తిరుముల:టిటిడి పాలక మండలి సమావేశం ముగిసింది. నారాయణ గిరి ఉద్యానవనంలో వెయ్యికాళ్ల మండపం పునర్నిర్మాణం, టిటిడి ఆధీనంలోకి ఒంటిమిట్ట రామాయలం, భద్రాచలం తరహాలో ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. విజయవాడ, రాజమండ్రిలలో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టాలని, టిటిడి ఉద్యోగుల పిల్ గ్రిమ్ అలవెన్స్ ను రూ.1,500 నుండి రూ.2,500 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హిమబిందు హత్యకేసును కొట్టేసిన మహిళా సెషన్స్ కోర్టు

కృష్ణా: విజయవాడలోని ఓ బ్యాంకు మేనేజర్ భార్య హిమబిందు హత్యకేసును మహిళా సెషన్స్ కోర్టు జడ్జి కొట్టేశారు. గత ఏడాది మార్చి 15న సామూహిక హత్యాచారానికి గురైన హిమబిందు అరుగురిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలను చూపలేకపోయినందున నిందితులందరినీ విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

సమ్మె చేస్తూ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి

మెదక్: సమ్మె చేస్తూ గుండెపోటుతో పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా గజ్వేల్ లో జరిగింది. అయితే తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత కొద్ది రోజులుగా మున్సిపల్ సిబ్బంది సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తమ ఆందోళనలో భాగంగా మంగళవారం గజ్వేల్ లో ధర్నా నిర్వహిస్తుండగా అందులో ఓ కార్మికురాలికి హఠాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయి మృతిచెందింది. దీంతో ఆమె మృతదేహంతో కార్మికులు ఆందోళన నిర్వహించారు. మృతిచెందిన కార్మికురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా...

మద్యం మత్తులో కోర్టులో టిడిపి నేత హల్ చల్

నెల్లూరు: కావలి కోర్టు ఆవరణలో మద్యం మత్తులో టీడీపీ నేత హజ్రత్ లాయర్లనూ, పోలీసులనూ దుర్భాషలాడుతూ హల్ చల్ చేశాడు. అతనితో పాటు మరో అనుచరుడు సుమంత్ ను పోలీసులు అరెస్టు చేశారు.

16:59 - July 28, 2015

ఢిల్లీ: ప్రజల రాష్ట్రపతి ఏ.పీ.జే. అబ్డుల్ కలాంకు యావత్ భారత జాతి ఘనంగా నివాళులర్పించింది. పార్లమెంటు శ్రద్ధాంజలి ఘటించింది. దేశం గొప్ప శాస్త్రవేత్తను, మానవతావాదిని, మార్గదర్శిని కోల్పోయిందని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కలాం మృతికి సంతాపం వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి...ఆయన జయంతిని అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది.
కలాం మృతి పట్ల పార్లమెంటు సంతాపం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల పార్లమెంటు సంతాపం ప్రకటించింది. ఉభయసభలు ప్రారంభమైన వెంటనే కలాం మృతికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం లోక్‌సభను ఈనెల 30కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఛైర్మన్ హమీద్ అన్సారీ రాజ్యసభను కూడా రేపటికి వాయిదా వేశారు.
కలాం పార్థీవదేహానికి త్రివిధ దళాపతుల నివాళులు
ప్రత్యేక విమానంలో ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థీవదేహానికి త్రివిధ దళాపతులు మువ్వన్నెలా జెండాను కప్పి నివాళులు అర్పించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ... అబ్దుల్ కలాంకు నివాళులు అర్పించారు. అనంతరం ప్రజల సందర్శనార్ధం రాజాజీమార్గ్ కు అబ్దుల్ కలాం మృతదేహాన్ని తరలించారు.
పలువురు ప్రముఖుల సంతాపం...
రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ఎదిగిన అబ్దుల్ కలాం దేశంలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచారని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ అన్నారు. అబ్దుల్‌ కలాం లేని దేశానికి పూడ్చలేనిదని కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ అన్నారు. అబ్దుల్‌ కలాంకు కాంగ్రెస్ నివాళులర్పించింది. క్షిపణి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, లోక్‌సభలో ఆ పార్టీ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు.
కలాం మృతి పట్ల షార్ దిగ్భ్రాంతి
ఏపీజే అబ్దుల్‌ కలాం మృతి పట్ల షార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. షార్ సిబ్బంది నివాళులర్పించారు. కలాం చూపిన బాటలో అంతరిక్ష ప్రయోగాలతో దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తామని చెప్పారు. ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్‌ కలాం సేవలను స్మరించుకున్నారు.
కలాంకు ప్రముఖుల నివాళి
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సంతాపం వ్యక్తం చేశారు. అబ్దుల్ కలాం మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. కలాం మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఇవాళ సెలవు దినంగా ప్రకటించారు. దేశం గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని కొనియాడారు. అబ్దుల్ కలాంకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నివాళి అర్పించారు. ఆయన నిత్యచైతన్యశీలి అని కొనియాడారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎపి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు.
కలాం మృతితో దేశం కన్నీటిసంద్రం
కలాం మృతితో యావత్‌ దేశం కన్నీటిసంద్రమైంది. స్కూళ్లు, కాలేజీలు,ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయనకు ఘనంగా నివాళుల్పించారు. ఐక్యరాజ్య సమితి అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులర్పించింది. కలాం జయంతిని అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది.

 

ట్విట్టర్ లో నా అభిమానుల్ని పలకరిస్తూనే ఉంటా...

న్యూఢిల్లీ:మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాంకు ట్విటర్ ఫాలోయర్లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడాయన తుదిశ్వాస విడిచినప్పటికీ సోషల్ మీడియాలో ఆయన తన అభిమానుల్ని పలుకరిస్తూనే ఉంటారు.కలాం స్నేహితుడు శ్రీజన్‌పాల్ ఆ ట్విట్టర్ ఖాతాను కొనసాగించగనున్నారు.అంతేకాదు కలాం రచనలైన వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020, ఇగ్నైటెడ్‌ మైండ్స్‌ నుంచి ఆదర్శ వాక్యాలను ట్విట్టర్‌లో పొందుపరుస్తానని శ్రీజన్‌పాల్ చెప్పారు. కలాంను సోషల్ నెట్ వర్క్స్‌లో ఫాలో అయ్యేవారిలో ఎక్కువగా యువతే ఉండడం విశేషం.

16:45 - July 28, 2015

ఢిల్లీ: ''థ్యాంక్యూ బడ్డీ...అలసిపోయావా.. ఏమైనా తింటావా... ఐయామ్ సారీ... నా వల్లే నువ్వు అంతసేపు నిలబడి ఉండాల్సి వచ్చింది...'' ఇవీ అబ్దుల్ కలాం గుండెపోటుతో తూలిపోకముందు మాట్లాడిన ఆఖరి మాటలు. అదీ కూడా ఎవరితో తెలుసా. ఓ పోలీస్‌తో... తన భద్రత కోసం కొన్ని గంటల పాటు నిలబడి ఉన్న పోలీసుకు కలాం షేక్‌ హ్యాండిచ్చి అభినందించారు. ఈ ఫోటోను ఆ.. పోలీసు అధికారి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అబ్దుల్ కలాం తన గురించి మాట్లాడిన విషయాలను ఆ పోలీస్ అధికారి వెల్లడించాడు. కలాం కాన్వాయ్‌లో ముందున్న ఓపెన్ టాప్‌ జిప్సీలో భద్రతా సిబ్బంది సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా జిప్సీలో ఓ పోలీసాధికారి దాదాపు గంట పాటు నిలబడే ఉన్నాడు. దీంతో అబ్దుల్ కలాం....ఎందుకు అతను నిలబడి ఉన్నాడు..అతను అలసిపోతాడు..ఇది ఒక పనిష్మెంట్‌లా ఉంది...అతను కూర్చోమని వైర్‌లెస్‌ ద్వారా సందేశం ఇవ్వగలవా..?....అంటూ కలాం.. భద్రతా అధికారికి చెప్పాడు. అయితే సెక్యూరిటీలో భాగంగా నిలబడి ఉండటం తప్పదన్నాడట ఆఫీసర్. దీంతో తర్వాత ప్రత్యేకంగా ఆ.. పోలీసును పిలిపించుకుని...థ్యాంక్యూ బడ్డీ..అని కలాం అభినందించారు. ఆ తర్వాత కలాంకు గుండెపోటు వచ్చింది.

 

పక్కా ప్రణాళికతోనే దీనానగర్ పీఎస్ పై దాడి

హైదరాబాద్: పంజాబ్ గురుదాన్ పూర్ ఉగ్రదాడి ఘటనలో సీసీటీవీ ఫుటేజీని పోలీసు అధికారులు పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీలో కనిపించిన ముగ్గురు ఉగ్రవాదులు. పక్కా ప్రణాళికతోనే దీనానగర్ పీఎస్ పై దాడి చేసినట్లు జీపీఎస్ వివరాల ఆధారంగా పోలీసులు ధృవీకరించారు

16:33 - July 28, 2015

ఢిల్లీ: ఉరిశిక్ష అమలు నిలిపివేయాలని కోరుతూ... యాకూబ్ మెమన్ వేసిన పిటిషన్‌పై కాసేపట్లో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషన్‌పై సోమవారమే విచారణ ప్రారంభమైనా... ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్రం, అటార్నీ జనరల్ అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం తమ వైఖరి తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. ఇవాళ విచారణ తిరిగి ప్రారంభమైనా... ధర్మాసనంలో అవే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. యాకూబ్ మెమన్ డెత్‌ వారంట్‌కు సంబంధించి... సరైన మార్గదర్శకాలు పాటించట్లేదని... జస్టిస్‌ కురియన్‌ అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా ఆయన ఉరిశిక్ష నిలుపుదల చేయాలని చెప్పారు. ఐతే జస్టిస్‌ ఎఆర్ దవే మాత్రం ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. మొత్తానికి యాకూబ్ పిటిషన్‌పై... సాయంత్రం 4గంటలకు సుప్రీంకోర్టు తుది నిర్ణయం వెలువరించనుంది.

 

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 102 పాయింట్లు నష్టపోయి 27,459 వద్ద ముగియగా, నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 8,337 వద్ద ముగిసింది.

16:26 - July 28, 2015

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్‌ భత్కల్‌ను కోర్టుకు తరలించారు. భారీ బందోబస్తు నడుమ భత్కల్‌తో పాటు మరో ఐదుగురిని చర్లపల్లి జైలు నుంచి ఎల్బీ నగర్ కోర్టుకు పోలీసులు తీసుకెళ్లారు. అయితే భత్కల్ మరోసారి కోర్టు ఆవరణలో లేఖ విసిరే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తం అయ్యారు.

 

శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు భేటీ

హైదరాబాద్:రాజధాని ప్రాంతానికి కార్యాలయాల తరలింపు పై చర్చిందుకు అన్ని శాఖాధిపతులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి ఉద్యోగ సంఘాలతో పాటు మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, రావెల కూడా హాజరయ్యారు.

16:18 - July 28, 2015

ఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఎపిజె అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని రేపు రామేశ్వరానికి తరలించనున్నారు. గురువారం రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు జరుగనున్నాయి. షిల్లాంగ్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో నిన్న సాయంత్రం 6.30 గంటలకు ఉపన్యాసమిస్తూ కలాం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అనంతరం స్థానిక బెతాని ఆసుపత్రికి ఆయన్ను తరలించారు. కలాం అస్తమయం చెందారని 7.45 గంటలకు ధృవీకరించారు. అంత్యక్రియలు రామేశ్వరంలోనే నిర్వహించాలని కలాం కుటుంసభ్యులు కేంద్రాన్ని కోరారు. నేడు భేటీ అయిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి రామేశ్వరంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించారు. మంగళవారం ఉదయం షిల్లాంగ్ నుండి ప్రత్యేక విమానంలో కలాం పార్థివ దేహాన్ని గువాహటికి రక్షణ శాఖ తరలించింది. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. ప్రజల సందర్శనార్థం ప్రభుత్వ అధికారిక నివాసం టెన్ రాజాజీ మార్గ్ లో కలాం పార్థీవ దేహాన్ని ఉంచారు. పలువురు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి.. వివాళులర్పించారు.

 

గురువారం ఉదయం కలాం అంత్యక్రియలు

హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు గురువారం ఉదయం 10 గంటలకు తమిళనాడులోని కలాం స్వంత గ్రామం రామేశ్వరంలో జరగనున్నాయి. రేపు మధ్యాహ్నానానికి రామేశ్వరానికి కలాం భౌతికకాయాన్ని తరలించానున్నారు. రేపు రాత్రి 7గంటల వరకు ప్రజల సందర్శనార్థం కలాం భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. పార్లమెంట్ ఉభయ సభలకు రేపు సెలవు ప్రకటించారు.

నకిలీ పాస్ పుస్తకాలను అరికట్టడానికి చర్యలు: పరకాల ప్రభాకర్

హైదరాబాద్ :నకిలీ పాస్ పుస్తకాలను అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ భూములు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని, ఇక పై ఆన్ లైన్ లో వివరాలతోనే వ్యవసాయ రుణాలు మంజూరు చేస్తామని... భూ రికార్డులపై ఫిర్యాదులను గ్రామ సభల్లో స్వీకరిస్తామన్నారు. మీ భూమి వెబ్ సైట్ ను రోజూ 75 వేల మంది వీక్షిస్తున్నారని స్పష్టం చేశారు.

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 8 ట్రాక్టర్లు సీజ్

కర్నూలు: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బొడబండలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించారు. అనంతరం ట్రాక్టర్ యాజమానులపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.

కోర్టులో యాసిన్ భత్కల్ హల్ చల్

హైదరాబాద్:ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ మరోసారి కోర్టులో హల్ చల్ సృష్టించాడు. మంగళవారం అతడిని రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టులో ఓ లెటర్ విసిరేశాడు. ఆ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

కలాంకు తెలుగు రాష్ట్రాల ఎంపీల నివాళి

ఢిల్లీ:మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. నివాళులర్పించిన వారిలో దేవెగౌడ, సీఎం రమేష్, మేకపాటి, వీహెచ్ తదితరులు ఉన్నారు.

కలాంకు నివాళులర్పించిన లోక్ సభ స్పీకర్

ఢిల్లీ: టెన్ రాజాజీ మార్గ్ లోని కలాం అధికారిక నివాసంలో ఉంచిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివ దేహానికి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నివాళులర్పించారు. 

ఏఎన్ యూ సమన్వయ కమిటీతో జిల్లా కలెక్టర్, అర్బన్ ఎస్పీ భేటీ

గుంటూరు:నాగార్జున వర్సిటీ సమన్వయ కమిటీతో జిల్లా కలెక్టర్ కాంతిలాల్, అర్బన్ ఎస్పీ త్రిపాఠి భేటీ అయ్యారు. రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన ప్రిన్సిపాల్, సీనియర్ విద్యార్థుల గురించి వారు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కళాశాలల్లో ఇంలాంటి సంఘటనలు మరెప్పుడు జరగకూడదని, ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండేదుకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై కలెక్టర్,ఎస్పీ చర్చించినట్లు తెలుస్తోంది.

 

అబ్దుల్ కలాం ప్రజల మనిషి:రాహుల్ గాంధీ

ఢిల్లీ:మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు ప్రజల మనిషి అని రాహుల్‌గాంధీ కొనియాడారు. కలాం విజన్‌ను, ఆయన ఆలోచనలను కోల్పోయామని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరి క్షణం వరకు దేశం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అబ్దుల్‌ కలాం అని రాహుల్ అన్నారు. యువతలో ఆలోచనలను తట్టిలేపిన గొప్ప వ్యక్తి కలాం అని చెప్పారు. రాష్ట్రపతిగా దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని అన్నారు. దేశం మొత్తం ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన చెప్పారు. కలాం ఆశయ సాధనకు యువత పాటుపడాలని రాహుల్ గాంధీ సూచించారు.

ఏపీ ఉద్యోగులు అదనంగా పనిచేయాలి:సీఎస్ కృష్ణారావు

హైదరాబాద్:కలాం మ‌ృతికి ఏపీ ప్రభుత్వం ఎటువంటి సెలవుదినం ప్రకటించలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు తెలిపారు. కలాం మృతికి సంతాప సూచికంగా ప్రభుత్వ పాఠశాలలు యథాతథంగా జరుగుతాయని చెప్పారు. ఉద్యోగులు అదనంగా పనిచేసి కలాంకు నిజమైన నివాళ అర్పించాలని ఆయన సూచించారు.

భజరంగ్ జూట్ మిల్లు ఎదుట కార్మికుల ఆందోళన

గుంటూరు:జిల్లాలోని భజరంగ్‌ జూట్‌మిల్లు ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. లాకౌట్‌ను ఎత్తివేయాలంటూ వారు డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన సబ్‌రిజిస్టార్‌పై కార్మికులు దాడికి యత్నించారు.

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటిని ముట్టడించిన గ్రామ పంచాయితీ కార్మికులు..

రంగారెడ్డి:మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటిని మంగళవారం గ్రామపంచాయతీ కార్మికులు ముట్టడించారు. గ్రామపంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా పారిశుద్ద్య కార్మికులు సమ్మె చేస్తున్న విషయం విదితమే. అయితే... సీపీఐ, సీపీఎం పార్టీల నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటిని ముట్టడించి తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

నేడు ఏపీలో పాఠశాలల సమయం గంట పెంపు

హైదరాబాద్: ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పనివేళలను నేడు గంట పాటు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కొద్దిసేపటి క్రితం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదనంగా పెంచిన సమయంలో ఆయా పాఠశాలల్లో కలాంకు నివాళి అర్పించడంతో పాటు విద్యార్థులకు కలాం జీవిత చరిత్రపై ప్రత్యేక క్లాసులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సుధారాణి పేర్కొన్నారు. 

గుంటూరు జిల్లాలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్..

గుంటూరు:పొన్నూరులో కరీముల్లా అనే ఐదేళ్ల బాలుడిని గుర్తతెలియని వారు  కిడ్నాప్‌ చేశారు. రూ.10 లక్షలు ఇవ్వాలంటూ బాలుడి తల్లిదండ్రులను డిమాండ్‌ చేసిన కిడ్నాపర్లు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.  తన ఇంటి నిర్మాణ పనులు చేసేందుకు వచ్చిన వారే తమ బాలుడిని కిడ్నాప్‌ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రామేశ్వరంలో కలాం అంత్యక్రియల ఏర్పాట్లు

హైదరాబాద్ :భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భౌతిక కాయానికి రేపు మధ్యాహ్నం ఆయన సొంతూరు రామేశ్వరంలో అంత్యక్రియలు జరగనున్నాయి. నేటి ఉదయం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రామనాథపురం జిల్లా కలెక్టర్ కొద్దిసేపటి క్రితం రామేశ్వరానికి వెళ్లి కలాం బంధువులతో భేటీ అయ్యారు. కలాం అంత్యక్రియలకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులతో కలెక్టర్ చర్చిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో రామేశ్వరంలో కలాం అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 

కలాం పార్థివ దేహం రాజాజీమార్గ్ లోని నివాసానికి తరలింపు

ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివ దేహాన్ని ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి టెన్ రాజాజీమార్గ్ లోని అధికారిక నివాసానికి తరలించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు....

టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో అమర్పోఫాలస్ టైటనమ్ వృక్షానికి ఐదు సంవత్సరాల తరువాత పువ్వు  పూసింది. ఈ పువ్వు  ప్రపంచంలో అతిపెద్దది. దీనిని జపానీస్ వింతగా చూస్తున్నారు. జపాన్‌లో ఈ పువ్వు పూయడం మొదట సారని జపాన్ ప్రజలు చెప్పుతున్నారు. పువ్వును చూడటానికి జపాన్ ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

 

రాబర్ట్ వాద్రాకు లోక్ సభ నోటీసులు జారీ..

హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు లోక్ సభ నోటీసులు జారీ చేసింది. ఫేస్ బుక్ లో పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగం మీద ఆయనకు ఈ నోటీసులు జారీ చేశారు. రాబర్ట్ వాద్రా పోస్ట్ నేపథ్యంలో బీజేపీ సభ్యులు పార్లమెంట్ లో ఆందోళన చేశారు. హక్కుల నోటీసును స్పీకర్ కు ఇచ్చారు.ఈ నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం నుండి రాబర్ట్ వాద్రాకు నోటీసు జారీ అయింది. వాద్రా ఈ నోటీసుకు ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నోటీసు అందిన తరువాత దానిన బట్టి వాద్రా స్పందిస్తారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

13:03 - July 28, 2015

ఢిల్లీ : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం పార్థివ దేహం పాలెం విమానాశ్రయానికి చేరుకుంది. సోమవారం షిల్లాంగ్ లో ప్రసంగిస్తూ అబ్దుల్ కలాం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనంతరం మంగళవారం ఉదయం షిల్లాంగ్ నుండి రక్షణ శాఖ ప్రత్యేక విమానంలో గువాహటికి కలాం పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. అనంతరం మధ్యాహ్నం పాలం విమానాశ్రయానికి కలాం భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. ఎయిర్ పోర్టులో త్రివిద దళాధిపతులు గౌరవ వందనం సమర్పించారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కలాం పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోడీ, త్రివిధ దళాధిపతి నేతలు నివాళులర్పించారు. రక్షణ శాఖ మంత్రి పారేకర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటి సీఎం సిసోడియా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ బాసి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. త్రివిద దళాధిపతులతో పాటు రక్షణ శాఖకు చెందిన పలువురు అధికారులు కలాం పార్థివదేహం వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు.
రామేశ్వరంలో అంత్యక్రియలు..
కలాం అంత్యక్రియలు రామేశ్వరంలోనే నిర్వహించాలని ఆయన కుటుంసభ్యులు కేంద్రాన్ని కోరారు. నేడు భేటీ అయిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి రామేశ్వరంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజల సందర్శనార్థం ప్రభుత్వ అధికారిక నివాసం టెన్ రాజాజీ మార్గ్ లో కలాం పార్థీవ దేహాన్ని ఉంచనున్నారు. 

కలాంకు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

ఢిల్లీ:పాలం ఎయిర్ పోర్టులో కలాం పార్థివ దేహానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. వీరితో పాటు కేంద్ర మంత్రి పారికర్, లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియా, త్రివిధ దళాల అధికారులు నివాళులు అర్పించారు.

ఓటుకు నోటు కేసులో ఏసీబీ చార్జిషీటు దాఖలు

హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ కోర్టుకు చార్జీషీటును అందజేశారు. కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి, సహ నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ, జెరూసలెం మత్తయ్య ల పేర్లను ప్రస్తావించిన ఏసీబీ అధికారులు, కేసులో ఇప్పటిదాకా 39 మంది సాక్షులను విచారించినట్లు పేర్కొన్నారు. సండ్రకు సంబంధించిన వ్యవహారంలో ప్రత్యేక చార్జీషీటు దాఖలు చేయనున్నట్లు సమాచారం.

 

మెమన్ కేసు విచారణను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ

ఢిల్లీ: మెమన్ కేసు విచారణను త్రిసభ్య ధర్మాసనానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. యాకుబ్ మెమన్ ఉరిపై జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ కురియన్ జోసఫ్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీంతో విచారణను త్రిసభ్య ధర్మాసనానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది.

కలాం పార్థివదేహానికి త్రివిధ దళాల గౌరవ వందనం

ఢిల్లీ:పాలం ఎయిర్ పోర్టులో కలాం పార్థివ దేహానికి త్రివిధ దళాల గౌరవ వందనం సమర్పించారు. పాలం ఎయిర్ పోర్టు కు రక్షణ మంత్రి పారికర్ చేరుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, గవర్నర్ నజీబ్ సింగ్ కూడా పాలం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

పాలం ఎయిర్ పోర్టుకు చేరిన కలాం పార్థివ దేహం

ఢిల్లీ: పాలం ఎయిర్ పోర్టుకు అబ్దుల్ కలాం పార్థివ దేహం చేరింది. రేపు రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు జరగనున్నాయి. పాలం విమానాశ్రయం నుంచి కలాం భౌతికకాయాన్ని ఢిల్లీలోని సేనా భవన్ కు తరలించిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రజల సందర్శనార్థం టెన్ రాజాజీమార్గ్ లోని అధికారిక నివాసానికి తరలిస్తారు.

12:16 - July 28, 2015

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహిపట్నం మండలంలో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న గుడిసె వాసులపై రెవెన్యూ అధికారులు జులుం ప్రదర్శించారు. లాఠీలు..కర్రలతో పోలీసులు విరుచుకపడ్డారు. దీనితో కొందరు తలలు పగిలాయి. ఈ ఘటన మంగళ్ పల్లి రెవెన్యూ పరిధిలోని కొమరం భీం కాలనీలో చోటు చేసుకుంది. సుమారు మూడు వేల మంది కొమరం భీంలో పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. వీరిని బలవంతంగా వెళ్లగొట్టేందుకు మంగళవారం తెల్లవారుజామున పోలీసులతో రెవెన్యూ అధికారులు కొమరం భీం ప్రాంతానికి వచ్చారు. వెళ్లేందుకు గుడిసె వాసులు ససేమిరా అనడంతో పోలీసులు తమ ప్రతాపాన్ని చూపెట్టారు. లాఠీలు..కర్రలతో బాదారు. గుడిసెలకు నిప్పుపెట్టడంతో పాటు వాటర్ కెనాన్ లను ప్రయోగించారు. మహిళలు..వృద్ధులు అని చూడకుండా విచక్షణారహితంగా వ్యవహరించారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఏపీ రాజధానికి కార్యాలయాల తరలింపునకు కమిటి

హైదరాబాద్ : ఏపీ రాజధాని ప్రాంతానికి కార్యాలయాల తరలింపునకు ఐదుగురు ఐఏఎస్‌లతో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా ఐఏఎస్‌ అధికారులు జవహర్‌రెడ్డి, లవ్‌ అగర్వాల్‌, శ్యాంబాబు, జయలక్ష్మీ, హేమ మునివెంకటప్పలను కమిటీ సభ్యులుగా నియమించారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. సీఎం చంద్రబాబుతో మంత్రులు, అధికారులు భేటీ అయి హెచ్‌వోడీల తరలింపు, రుణమాఫీలపై చర్చించారు.

12:06 - July 28, 2015

హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం హఠాన్మరణం పట్ల దేశం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయనతో తమకున్న బంధాన్ని నెమరువేసుకుంటున్నారు. ఆయన రాష్ట్రపతి హోదాలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. అప్పటి టిడిపి ప్రభుత్వ హాయాంలో ప్రైమరీ సెక్టార్ ను కలాం ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి ఎన్నో విలువలు..సూచనలు అందచేశారు. ప్రతి విద్యాలయాల్లో సరైన శిక్షణ ఇచ్చి యువత వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టేలా ప్రభుత్వాలు కృషి చేయాలని కలాం సూచించారు. ఆయన ప్రసంగం వీడియోలో చూడండి..

12:04 - July 28, 2015

విజయవాడ : భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణం లౌకిక ప్రజాస్వామ్యానికి తీరని లోటని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ లౌకికతత్వం కాపాడిన వ్యక్తులు కలాం ఒకరని తెలిపారు.
షిల్లాంగ్ లో కలాం కన్నుమూత..
షిల్లాంగ్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఉపన్యాసమిస్తూ కలాం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన అస్తమయం చెందారని 7.45 గంటలకు ధృవీకరించారు. అంత్యక్రియలు రామేశ్వరంలోనే నిర్వహించాలని కలాం కుటుంసభ్యులు కేంద్రాన్ని కోరారు. నేడు భేటీ అయిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి రామేశ్వరంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.
 

ప్రేమోన్మాది అమిత్ సింగ్ ఆచూకీ లభ్యం....

హైదరాబాద్:ఎల్బీనగర్‌లో జరిగిన ఇద్దరు అక్కాచెళ్లెల్ల జంట హత్యల కేసులో నిందితుడు అమిత్‌సింగ్ ఆచూకీ లభ్యమైంది. ప్రేమోన్మాది అమిత్‌సింగ్ గుజరాత్‌లో తలదాచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. తనను ప్రేమించేందుకు నిరాకరించిన యువతిని, ఆమె సోదరిని అమిత్‌సింగ్ కత్తితో నరికి దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. 

గ్రామజ్యోతి పథకంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

హైదరాబాద్: గ్రామజ్యోతి పథకంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావు, కేటీఆర్, జోగు రామన్న, తుమ్మల నాగేశ్వర్‌రావు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామజ్యోతి పథకం విధివిధానాలను రూపొందించే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. కాగా, మొన్నటి గ్రామీణాభివృద్ధిపై సీఎం కేసీఆర్‌పై జరిపిన సమావేశంలో ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

కలాం కు బాలీవుడ్ ఘన నివాళి...

ముంబై:భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఆకస్మిక మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్ఫూర్తిమంతమైన దార్శనికత, శాస్త్ర రంగంలో ఆమోఘమైన ప్రతిభ పాటవాలు, రాజకీయాలు తెలియని వ్యక్తి రాష్ట్రపతిగా ఆ పదవిని చేపట్టి వన్నె తెచ్చిన తీరుతో అబ్దుల్ కలాం ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ప్రేమకు పాత్రులయ్యారని వారు ఘనంగా నివాళులర్పించారు. కలాంతో తమకు గల అనుబంధాన్ని బాలీవుడ్ ప్రముఖులు మంగళవారం ట్విట్టర్#లో ఇలా వివరించారు.

మాజీ ఎంపీ హర్షకుమార్ కు బెయిల్...

హైదరాబాద్: మాజీ ఎంపీ హర్షకుమార్ కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీక్షా సమయంలో గాల్లోకి కాల్పులు జరిపిన ఘటనలో ఆయన కోర్టు బెయిల్ ఇచ్చింది. క్రైస్తవులకు శ్మశాన వాటికకోసం స్థలం కేటాయించాలంటూ కొన్ని రోజుల కిందట రాజమండ్రిలో హర్షకుమార్ ఆమరణ దీక్ష చేపట్టారు. అక్కడే అకస్మాత్తుగా గాల్లోకి కాల్పులు జరపడంతో వెంటనే పోలీసులు ఆయన చేతిలోని తుపాకీని లాక్కొని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం అరెస్టు చేశారు. తరువాత స్థానిక కోర్టులో ప్రవేశపెట్టడంతో మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. 

11:28 - July 28, 2015

ఢిల్లీ : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలా అంత్యక్రియలు తమిళనాడులోని రామేశ్వరంలో బుధవారం జరుగనున్నాయి. నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. షిల్లాంగ్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఉపన్యాసమిస్తూ కలాం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన అస్తమయం చెందారని 7.45 గంటలకు ధృవీకరించారు. అంత్యక్రియలు రామేశ్వరంలోనే నిర్వహించాలని కలాం కుటుంసభ్యులు కేంద్రాన్ని కోరారు. నేడు భేటీ అయిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి రామేశ్వరంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. మంగళవారం ఉదయం షిల్లాంగ్ నుండి ప్రత్యేక విమానంలో కలాం పార్థివ దేహాన్ని గువాహటికి రక్షణ శాఖ తరలించింది. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకరానున్నారు. ప్రజల సందర్శనార్థం ప్రభుత్వ అధికారిక నివాసం టెన్ రాజాజీ మార్గ్ లో కలాం పార్థీవ దేహాన్ని ఉంచనున్నారు. 

కలాం అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు తమిళనాడులోని రామేశ్వరానికి వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారని తెలిసింది. బాబుతో పాటు కొంతమంది మంత్రులు వెళ్లే అవకాశం ఉంది. రామేశ్వరం కలాం స్వగ్రామం కాబట్టి కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఇక్కడ జరగనున్నాయి. 

కలాంకు అద్వానీ, టెండూల్కర్ సంతాపం....

ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మృతి పట్ల బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే ఆద్వానీ, మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సంతాపం తెలిపారు. దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన వారిలో కలామే గొప్పవాడు ఆడ్వాణీ కొనియాడారు. దేశానికి ఆదర్శప్రాయుడు, అద్భుతమైన వ్యక్తి కలాం అని సచిన్‌ అన్నారు. 

కలాంకు ఘన నివాళులు అర్పించిన పార్లమెంట్ ఉభయ సభలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు అర్పించాయి. ఇవాళ ఉభయ సభలు ప్రారంభంకాగానే లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభలో ఛైర్మన్ హమీద్ అన్సారీ కలాం మృతిపట్ల సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. కలాం దేశానికి చేసిన సేవలను ఉభయ సభలు కొనియాడాయి. తీర్మానంను ఆమోదించిన అనంతరం ఉభయ సభల్లో కలాం మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం లోక్‌సభను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. రేపు జరిగే కలాం అంత్యక్రియల్లో సభ్యులు పాల్గొనాలని స్పీకర్ కోరారు. రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తోన్నట్టు ఛైర్మన్ ప్రకటించారు. 

11:18 - July 28, 2015

ఢిల్లీ : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం హఠాన్మరణం పట్ల పార్లమెంట్ ఉభయసభలు నివాళులర్పించాయి. అనంతరం లోక్ సభను గురువారం వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు. రాజ్యసభను మంగళవారం వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. షిల్లాంగ్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఉపన్యాసమిస్తూ కలాం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన అస్తమయం చెందారని 7.45 గంటలకు ధృవీకరించారు.
రేపు అంత్యక్రియలు..
అబ్దుల్ కలాం అంత్యక్రియలు రేపు ఆయన స్వస్థలమైన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జరుగనున్నాయి. ఈ మేరకు ప్రధాని అధ్యక్షతన నేడు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రామేశ్వరంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కలాం కుటుంబసభ్యులు కోరిన విషయం తెలిసిందే. ప్రజల సందర్శనార్థం ప్రభుత్వ అధికార నివాసం టెన్ రాజాజీ మార్గ్ లో కలాం పార్థీవ దేహాన్ని ఉంచనున్నారు. 

పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం

ఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. అబ్దుల్ కలాం మృతికి ఉభయసభలు సంతాపం ప్రకటించాయి. అనంతరం ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.

రాష్ట్రీయ ఆవిష్కార్ అభిమాన్ పేరు మార్పు

ఢిల్లీ: రాష్ట్రీయ ఆవిష్కార్ అభిమాన్ పేరు మార్పు జరిగింది. డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ గా మార్పు చేశారు.

సవతి తల్లి వేధింపుల నుంచి బాలికకు విముక్తి

హైదరాబాద్: చర్లపల్లిలోని రైల్వే క్వార్టర్స్ లో సవతి తల్లి వేధింపుల నుంచి బాలికకు విముక్తి లభిచింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో బాలికను బాలల హక్కుల కమిషన్ రక్షించి కుషాయిగూడ పోలీసులకు అప్పగించింది. బాలిక తండ్రి బెనర్జీ రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నారు.

11:07 - July 28, 2015

భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం కన్నుమూయడం పట్ల దేశం శోక సంద్రంలో మునిగిపోయింది. సైన్స్ రంగంలో భారతదేశ కీర్తిప్రతిష్టల్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రికార్డులకెక్కారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం పలు పురస్కారాలు ప్రకటించింది. 40 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. భారతీయుల అమ్ములపొదిలో దూరశ్రేణి క్షిపణులతో పాటు పలు రకాల క్షిపణులకు రూపకల్పన చేసి రక్షణరంగంలో భారత ప్రతిభను రెపరెపలాడించిన అనితర దేశ భక్తుడు అబ్దుల్‌కలాం. ఫోక్రాన్‌ 2 అణుపరీక్షల్లో కీలకపాత్ర పోషించి మిస్సైల్‌ మ్యాన్‌గా ప్రసిద్ధి పొందారు. ఈసందర్భంగా టెన్ నిర్వహించిన ప్రత్యేక చర్చా వేదికలో గోపాల్ రావు (డీఆర్డ్ఓ సైంటిస్టు), కృష్ణ మోహన్ (డీఆర్డీఓ సైంటిస్ట్) పాల్గొని కలాంతో అనుభవాలను..ఆయన విశిష్టతలను తెలియచేశారు. 

టిటిడి పాలక మండలి సమావేశం ప్రారంభం

హైదరాబాద్: టిటిడి పాలక మండలి సమావేశం ప్రారంభమయ్యింది. ఈ పాలకమండి సభ్యుడు సండ్ర వెంకట వీరయ్యతో మిగతా సభ్యులు హాజరయ్యారు.

10:49 - July 28, 2015

హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో అబ్దుల్ కలాం సంతాప సభ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం బాబు మాట్లాడారు. గొప్ప శాస్త్రవేత్తను కొల్పోయామన్నారు. కలాం భారత దేశ కీర్తి ప్రతిష్టలను రెపరెపలాడించారని కొనియాడారు. ఇస్రోలో పనిచేయడం పెద్ద విజయాల్లో ఒకటి అని కలాం పేర్కొనడం జరిగిందన్నారు. కలాంతో తనకు దగ్గరి సంబంధం ఉందని, విజన్ -2020 అంశంపై కలాంతో చర్చించడం జరగిందన్నారు. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం నియమితులైతే యువతకు స్పూర్తిదాయకమే కాకుండా దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేస్తారని ప్రధాని వాజ్ పాయికు తాను సలహా ఇవ్వడం జరిగిందన్నారు. అలిపిరిలో దాడి జరిగిన అనంతరం ప్రొటోకాల్ పక్కన పెట్టి తనను కలాం పరామర్శించడం మరిచిపోనని చంద్రబాబు తెలిపారు. 

అబ్దుల్‌ కలాం గొప్ప మార్గదర్శకుడు: ప్రధాని మోదీ

హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం గొప్ప మార్గదర్శకుడు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కలాం మృతి పట్ల మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కలాం గొప్ప మేధావి అని....ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. రాష్ట్రపతి భవన్‌కు ప్రజలను చేరువ చేసేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. కలాం చివరిక్షణం వరకు విద్యార్థులతోనే గడిపారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

దేశం ఓ గొప్ప శాస్త్ర వేత్తను కోల్పోయింది: చంద్రబాబు

హైదరాబాద్: దేశం ఓ గొప్ప శాస్త్ర వేత్తను కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో అబ్ధుల్ కలాం సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కలాం మరణంపై విచార వ్యక్తం చేసిన చంద్రబాబు కలాంతో నాకు దగ్గరి సంబంధముందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.

రామేశ్వరంలోనే అబ్ధుల్ కలాం అంత్యక్రియలు

ఢిల్లీ:మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం మృతికి కేంద్ర కేబినెట్ సంతాపం తెలిపింది. కుటుంబ సభ్యుల కోరిక మేరకు కలా స్వగ్రామం రామేశ్వరలోనే అంత్యక్రియలు జరపనున్నట్లు రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. ఈ రోజు ఉదయం 11.45 గంటలకు కలాం పార్థివదేహం ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్, రక్షణ మంత్రి పారికర్, మిలటరీ ఉన్నతాధికారలు పాలం విమానాశ్రయానికి వెళ్లనున్నారు. రాజాజీ మార్గ్ లోని అబ్దుల్ కలాం నివాసానికి కలాం పార్థీవ దేహాన్ని తరలించనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నివాళులర్పించనున్నారు.

కలాం మృతికి సంతాపం ప్రకటించనున్న చంద్రబాబు

హైదరాబాద్: కాసేపట్లో సచివాలయం ఎల్ బ్లాక్ ఎదుట ఉద్యోగులతో కలిసి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సీఎం చంద్రబాబు నివాళులర్పించనున్నారు.

10:33 - July 28, 2015

చెన్నై : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం మృతితో రామేశ్వరం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అబ్దుల్ కలాం మరణించారన్న వార్త తెలిసి ఆ పట్టణమంతా ఘొల్లుమంది. అబ్దుల్ కలాం రామేశ్వరంలో జన్మించిన సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు ముత్తమీర లెబ్బాయ్ మరైకర్ రామేశ్వరంలో జీవిస్తున్నారు. కలాంతో అనుబంధమున్న ఎంతో మంది రామేశ్వరం వాసులు చలించిపోయారు. కలాం పార్థివ దేహాన్ని రామేశ్వరం రప్పించి ఇక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కుటుంబసభ్యులు, స్థానికులు కోరుతున్నారు. కలాం అంత్యక్రియలు తమ సొంతూళ్లోనే నిర్వహించాలని ఆయన మనువడు సలీం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన అభ్యర్థనను కేంద్ర కేబినెట్ పరిగణలోకి తీసుకోనుంది. నేడు జరిగే కేబినెట్ భేటీలో కలాం అంత్యక్రియల నిర్వాహణపై చర్చించనుంది. 

పాలం విమానాశ్రయానికి కలాం పార్థివ దేహం

హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివదేహాన్ని గువాహటి నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. ఈ రోజు ఉదయం 11.45 గంటలకు కలాం పార్థివదేహం ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ తదితరులు పాలం విమానాశ్రయానికి వెళ్లనున్నారు.

కారు-ఆటో ఢీ: ఇద్దరు మృతి

మెదక్:సదాశివపేటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు-ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను ప్రభుత్వాస్పతికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

కలాం జన్మదినాన్ని విద్యార్థుల దినోత్సవంగా :ఐక్యరాజ్యసమితి

హైదరాబాద్:మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జన్మదినాన్ని(అక్టోబర్‌ 15) విద్యార్థుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 1931 అక్టోబర్‌ 15న కలాం రామేశ్వరంలో జన్మించారు. నిన్న(సోమవారం) సాయంత్రం షిల్లాంగ్‌ ఐఐఎంలో ప్రసంగిసిస్తూ కుప్పకూలిన కలాంను వెంటనే ఆస్పత్రికి తరలించగా కాసేపటికే తుదిశ్వాస విడిచారు.

బావిలో ఆరేళ్ల బాలిక మృతదేహం

హైదరాబాద్: విజయనగరం పట్టణంలోని కొత్తపేట గొల్లవీధి సమీపంలో ఉన్న బావిలో ఆరేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గుర్తు తెలియని బాలిక అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇండోనేసియాలో భారీ భూకంపం

జకార్తా: ఇండోనేసియాలోని పశ్చిమ ప్రాంతంలో గల పపువా ప్రావిన్స్‌లో ఈరోజు తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతం రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదు అయింది. పవువాకు 75 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. కాగా ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

156 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత...

అనంతపురం:గుంతకల్లు పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. పట్టణంలోని మహబూబ్‌నగర్ కాలనీలో జయన్న అనే వ్యక్తికి చెందిన గోదాముపై సోమవారం అర్థరాత్రి విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల నుంచి కొనుగోలు చేసి నిల్వ ఉంచిన 156 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్లు సురేష్‌బాబు, అనిల్ పాల్గొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకే వ్యవహరిస్తాం:వెంకయ్యనాయుడు

హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలను కుటుంబ సభ్యుల అభిప్రాయాల మేరకే వ్యవహరిస్తామనం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కలాం మృతికి కేబినెట్ సంతాపం ప్రకటిస్తుందని..పార్లమెంట్ ఉభయ సభలు కూడా కలాంకు సంతాపం ప్రకటించాక వాయిదా పడతాయి అని తెలిపారు. అబ్దుల్ కలాం మృతితో స్వగ్రామం తమిళనాడులోని రామేశ్వరంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆగస్టు 2 వరకు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది.

నేడు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాపంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ

హైదరాబాద్: ఈ రోజు ఉదయం 10 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలపై నిర్ణయం తీసుకోనుంది. షిల్లాంగ్ నుండి ఈ రోజు ఉదయం కలాం పార్ర్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో గువాహటికి తరలించారు. అక్కడ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తరలిస్తున్నారు.

నేడు జాతీయ సెలవు దినం కాదు: కేంద్రం

న్యూఢిల్లీ: నేడు జాతీయ సెలవు దినం కాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు తెరిచే ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాపంగా ఇవాళ జాతీయ సెలవు దినంగా కేంద్రం ప్రకటించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈమేరకు స్పష్టం చేసింది. 

గురుదాస్ కాల్పుల విచారణలో పురోగతి..

పంజాబ్ : గురుదాస్ కాల్పుల విచారణలో పురోగతి లభించింది. ఉగ్రవాదులు పాక్ లోని షఖర్ గఢ్ నుండి వచ్చినట్లు నిర్ధారించినట్లు సమాచారం. ఆదివారం రాత్రి షఖర్ గఢ్ నుండి ఉగ్రవాదులు వచ్చినట్లు భద్రతా దళాలు నిర్ధారించినట్లు తెలుస్తోంది. 

08:30 - July 28, 2015

మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం ప్రజల రాష్ట్రపతి అని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. అబ్దుల్ కలాం సోమవారం హఠాన్మరణం చెందారు. కలా సేవలు..దేశ యువత ఏవిధంగా ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్లాలనే దానిపై టెన్ టివిలో 'గుడ్ మార్నింగ్' నాగేశ్వర్ కార్యక్రమంలో ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు.
''కలాం..భయంకరమైన పేదరికం నుండి వచ్చారు. రాష్ట్రపతి అనే వ్యవస్థను ప్రజలకు చేరువదీశారు. గొప్ప విజయాన్ని సాధించారు. అందుకే ప్రజల రాష్ట్రపతి అంటారు. అబ్దుల్ కలాం అత్యున్నత పదవి అధిష్టించాక 2007లో పదవీ విరమణ పొందారు. మరోసారి పోటీ చేస్తారా ?అని ఓ టివి ఛానల్ లో కలాంను ఇంటర్వ్యూ చేస్తే టీచింగ్ చేస్తానని కలాం చెప్పారు. తుదిశ్వాస వరకు టీచింగ్ చెప్పారు. అతి సాధారణమైన..సరళమైన భాషలో కలాం మాట్లాడడం ఆశ్చర్యపరుస్తుంటుంది. కలాం ఉపన్యాసం ఒక వ్యక్తిత్వమైన వికాస పాఠంగా ఉంటుంది. సమస్యలను నిన్ను నడిపించకూడదు..సమస్యలపై మీరే సవారీ చేయాలని అంటుంటారు. కలలు కనండి..ఆలోచనలు వస్తాయి. ఆలోచనల నుండి కార్యాచరణగా మారాలి అంటారు. మరిన్ని విశేషాల కోసం వీడియోలో చూడండి.

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

గుంటూరు : తాడేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. 8మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

 

కలాం అంత్యక్రియలను రామేశ్వరంలో నిర్వహించాలన్న మనువడు..

తమిళనాడు : అబ్దుల్ కలాం అంత్యక్రియలను స్వస్థలం రామేశ్వరంలోనే నిర్వహించాలని కేంద్రానికి కలాం మనువడు సలీం విజ్ఞప్తి చేశారు. తమిళనాడులోని రామేశ్వరంలోనే కలాం బంధువర్గం ఉంటోంది. 

08:00 - July 28, 2015

మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం హఠాన్మరణం చెందారు. రాష్ట్రపతి, ప్రధాని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కేంద్రం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపడుతానని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నగేష్ (టిడిపి), నల్లా సూర్యప్రకాశ్ రావు (వైసీపీ), అనురాధా (టిడిపి), లక్ష్మీనారాయణ (బిజెపి) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

07:54 - July 28, 2015

'చిత్రం', 'నువ్వు నేను', 'జయం' అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు రూప కల్పన చేసిన దర్శకుడు 'తేజ' మరో ప్రేమ కథా చిత్రంతో ముందుకొస్తున్నాడు. 'అలా మొదలైంది', 'అంతకుముందు ఆ తరువాత' చిత్రాలు హిట్ సాధించిన నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్' ఈసినిమాను రూపొందిస్తోంది. సినిమా టైటిల్ 'హోరా హోరీ'గా నిర్ణయించారు. ఈ చిత్రంలో కూడా తేజ నూతన, నటీ నటులతో రూపొందిస్తున్నారు. దిలీప్ - దీక్షలు హీరో హీరోయిన్స్ నటించనున్నారు. జులై 29వ తేదీన ఈ సినిమా ఆడియోను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కొత్త హీరోలతో సూపర్ హిట్ కొట్టిన తేజ 'హోరా హోరీ' సినిమాతో ప్రేక్షక్షులను ఆకట్టుకుంటాడా ?లేదా ? అనేది చూడాలి. 

కొమరంభీంనగర్ లో భాష్పావాయువును ప్రయోగించిన పోలీసులు...

రంగారెడ్డి : ఇబ్రహింపట్నం (మం) కొమరంభీంనగర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాల తొలగింపును స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు..స్థానికులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనితో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు బాష్పావాయువు ప్రయోగించడంతో ఆగ్రహంతో స్థానికులు గుడిసె వాసులు నిప్పంటించుకున్నారు. పది గుడిసెలు తగులబడుతున్నాయి. 

కాసేపట్లో ఢిల్లీ విమానాశ్రయానికి కలాం పార్థివ దేహం..

ఢిల్లీ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివ దేహాన్ని కాసేపట్లో గువాహటి నుండి ఢిల్లీ విమానాశ్రయానికి తరలించనున్నారు. అక్కడ ప్రధాని మోడీ నివాళులర్పించనున్నారు.

07:36 - July 28, 2015

పంజాబ్ : రాష్ట్రంలోని గురుదాస్ నగర్ లోని దీనానగర్ ప్రాంతం..ఒక్కసారిగా కాల్పులు..ఏమవుతుందో తెలియని పరిస్థితి..ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పులకు ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు..అదే సమయంలో ఓ బస్సు వెళుతోంది..ఉగ్రవాదులు ఫైరింగ్ చేస్తున్నా ఆ డ్రైవర్ ప్రాణాలకు తెగించి ముందుకుపోనిచ్చాడు..దాదాపు 75 మంది ప్రయాణీకులను కాపాడి శెభాష్ అనిపించుకున్నాడు.
పంజాబ్ రాష్ట్ర రవాణాకు చెందిన ఓ బస్సు సోమవారం ఉదయం 5.30గంటల ప్రాంతంలో 75 మంది ప్రయాణీకులతో దీనానగర్ ప్రాంతం గుండా వెళుతోంది. ఉగ్రవాదులు ఈ బస్సును ఆపేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ నానక్ చంద్ బస్సును ముందుకు పోనిచ్చాడు. ఉగ్రవాదులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. ప్రయాణీకుల హాహాకారాలు మిన్నంటాయి. ఏమాత్రం బెదరకుండా స్పీడ్ గా బస్సును పరుగెత్తించాడు. విచక్షణారహితంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు ప్రయాణీకులు ఎవరైనా గాయపడ్డారని అనుకున్న నానక్ చంద్ నేరుగా బస్సును ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డ్రైవర్ నానక్ చంద్ చూపిన తెగువను అందరూ ప్రశంసించారు. 

07:34 - July 28, 2015

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న 'లోఫర్' చిత్రంలో విలన్ ఎంపికయ్యాడు. కళ్యాణ్ రామ్ నటించిన 'పటాస్', ఇటీవలే విడుదలైన విజయ్ 'జిల్లా' చిత్రంలో ప్రతి నాయకుడిగా అందర్నీ అలరించిన 'చరణ్ దీప్' విలన్ గా ఎంపికైనట్లు సమాచారం. ఈ సినిమాలో తాను విలన్ గా నటించనున్నట్లు చరణ్ దీప్ పేర్కొన్నాడు. పూరితో కలిసి పనిచేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నాడు. మాస్ సినిమా తెరకెక్కుతున్న 'లోఫర్' కోసం పూరి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ముంబై మోడల్ దిశా పతాని ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అక్టోబర్ మూడో వారంలో ఈ చిత్రం రిలీజ్ చేసేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం..

ఢిల్లీ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాపంగా మంగళవారం పార్లమెంట్ కేబినెట్ సమావేశం కానున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఉదయం పది గంటలకు ఈ సమావేశం జరుగనుంది. 

కలాం పార్థివ దేహం గువహాటికి తరలింపు..

షిల్లాంగ్ : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పార్థివ దేహాన్ని షిల్లాంగ్ నుండి గువహాటికి తరలించారు. షిల్లాంగ్ నుండి రక్షణ శాఖ ప్రత్యేక విమానంలో కలాం పార్థీవ దేహాన్ని తీసుకొచ్చారు. రక్షణ దళాల అధికారులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.

06:42 - July 28, 2015

ఢిల్లీ : పిల్లలంటే అబ్దుల్‌ కలాంకు ఎంతో ప్రీతి. ఎక్కడకెళ్లినా కాసేపు వారితో గడిపి మురిసిపోయేవారు. ''ఎప్పుడూ కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడాలి'' అని చెప్పే కలాం.. చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఏ నగరానికి, ఏ కార్యక్రమం కోసం వెళ్లినా..అక్కడ ఏదో ఒక విద్యాసంస్థలో తప్పనిసరిగా ఒక కార్యక్రమం పెట్టుకునేవారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ అనంతరం కూడా కలాం విద్యారంగానికి విశిష్ట సేవలందించారు. చివరి నిమిషం వరకూ విద్యాభివృద్ధికే సమయం కేటాయించారు. 
ఎన్నో వేదికలపై ప్రసంగాలు..
చదువు.. సమాజాభివృద్ధికి ఉపయోపడేలా అబ్దుల్‌ కలాం ఎన్నో వేదికలపై విద్యార్థులకు ఉపన్యాసాలు ఇచ్చారు. తన ప్రసంగాలతో యువతలో కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. నిరాశ నిస్రృహలో ఉన్న యువతలో ఆత్మ స్తైర్థ్యం నింపుతూ. ఒక మార్గదర్శకంగా నిలిచారు. ఆత్మన్యూనత భావంతో ఉన్న వారిని ఆయన ప్రసంగాలు తట్టిలేపుతాయి. అబ్దుల్‌ ప్రేరణతో ఉన్నత శిఖరాలకు ఎదగినవారేందరో ఉన్నారు. రాష్ట్రపతి పదవిని అధిష్టించి ప్రజల రాష్ట్రపతిగా పేరు గడించిన కలాం పదవి విరమణ అనంతరం విద్యాభివృద్ధికే ఎక్కువ సమయం కేటాయించారు.
చివరి క్షణాల్లోనూ పిల్లలతో గడిపిన అబ్దుల్‌ కలాం..
చివరి నిమిషం వరకూ కలాం వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శిస్తూ.. విద్యార్థులకు సైన్స్ పాఠాలతో పాటు దేశభక్తిని పెంపొందించే సందేశాలిచ్చారు. కలాంకు పిల్లలంటే ఎంతో ఇష్టం. చివరి నిమిషాం కూడా పిల్లలతోనే గడిపారు. షిల్లాంగ్‌ ఐఐఎంలో విద్యార్థుల కోసం ''లివబుల్‌ ప్లానెట్‌ ఎర్త్‌' అనే అంశంపై సెమినార్‌లో పాల్గొన్నారు. అలా పిల్లలతో కలిసిపోయి వాళ్లలో ఒక పిల్లాడిలా ఆయన ఆనందించేవారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించే సమయంలో అక్కడి విద్యార్థులతో సమావేశమయ్యేవారు. సైన్స్, టెక్నాలజీపై వారికి ఉపన్యాసమిచ్చేవారు. వారి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చేవారు. అంతేకాదు.. చిన్నారులకు ఓపిగ్గా ఆటోగ్రాఫ్‌లు ఇచ్చేవారు. ఆ సేతు హిమాచలం వేలాది మంది విద్యార్థులతో ఆయన చర్చల్లో పాల్గొన్నారు.
కలాంకు అధ్యాపక గురువులంటే అమిత గౌరవం..
కలాంకు అధ్యాపక గురువులంటే అమిత గౌరవం. తనకు ఎంతో తృప్తినిచ్చిన వృత్తి అధ్యాపక వృత్తి అని ఆయన అంటుండేవారు. రాష్ర్టపతిగా పదవీవిరమణ అనంతరం చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయంలో ఉండాలని ఆయని నిర్ణయించడం అధ్యాపక వృత్తిపై ఉన్న ఆసక్తిని వెల్లడించింది. ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత విశేషాలను తెలియపర్చడం ఆయన మేధాస్సుకు తార్కాణం. సామాన్య కుటుంబంలో పుట్టిన కలాం..కష్టపడి ఉన్నత చదువులు అభ్యసించారు. సైంటిస్టుగా కెరీర్‌ ఆరంభించి దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారు. దేశానికి వెలకట్టలేని సేవలు అందించారు. విద్యార్థులకు పాఠాలు బోధించడమంటే కలాంకు ఎంతో ఇష్టం. తన జీవితానుభవాలనే యువతకు సందేశమిచ్చేలా ''వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌'' పేరుతో ఆత్మకథను కూడా రాశారు. భారతదేశంలో ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా ఇంతటి అభిమానాన్ని పొందిన ఏకైక రాష్ర్టపతి కూడా అబ్దుల్‌ కలామే అనడంతో ఏ మాత్రం సందేహం లేదు. ఈ నిత్యకృషీవలుని ప్రతిభాపాటవాలకు ఎన్నో పురస్కారాలు, అవార్డులు వరించాయి. 40 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. కళాశాల కమిటీల్లో సభ్యత్వం కల్పించాయి. రామేశ్వరం నుంచి రాష్ర్టపతి అయినా అబ్దుల్‌ కలాం నిరాండబరతకు నిలువెత్తు నిదర్శనమని చెప్పొచ్చు. అబ్దుల్‌ కలాం.. రామేశ్వరం నుంచి రాష్ర్టపతి అయినా నిరాండబరతకు ఆయన నిలువెత్తు నిదర్శనమని ప్రముఖులు కొనియాడారు. కలాం మృతితో దేశం గొప్ప నాయకుడ్ని కోల్పోయిందని సంతాపం ప్రకటించారు. ప్రజల రాష్ర్టపతిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. శాస్ర్త సాంకేతిక రంగంలో కలాం అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.  

06:38 - July 28, 2015

ఢిల్లీ : దేశ ప్రజలంతా ప్రజల రాష్ట్రపతి అంటూ ఆయనకు జేజేలు పలికారు. రాష్ట్రపతిగా నిరాడంబరంగా జీవించిన కలామ్‌..అధ్యక్షుడిగా కొత్త ఒరవడికి నాంది పలికారు. రాష్ట్రపతి భవన్‌ను ప్రజల చెంతకు తీసుకెళ్లి తనదైన ముద్ర వేసుకున్నారు. పదవిలో ఉన్నా లేకున్నా చెరగని చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అందరివాడు అయ్యారు. పేపర్‌ బాయ్‌ నుంచి భారత అత్యున్నత అధికార పీఠమైన రాష్ట్రపతిగా పగ్గాలు చేపట్టడం వెనక అబ్దుల్‌ కలామ్‌ కృషి ఎంతో వుంది. తొలిసారిగా ఒక శాస్త్రవేత్త భారతదేశ ప్రధమ పౌరునిగా ఎన్నికవడం అబ్దుల్‌కలామ్‌కు లభించిన విశిష్ట గౌరవం. ఓ వైపు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు తనకిష్టమైన శాస్త్ర,సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తలకు సూచనలిస్తూ బిజీగా గడిపేవారు.
2002లో రాష్ట్రపతి అభ్యర్థి..
2002లో వాజ్‌పేయి సర్కార్‌ కలామ్‌ను రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించింది. ఎన్నికలు నామమాత్రంగా జరిగి అబ్దుల్‌ కలామ్‌ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత 11వ రాష్ట్రపతిగా 2002 జులై 25 నుంచి 2007 జులై 25 వరకు పనిచేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో 9,22,884 ఓట్లు సాధించి 1,07,366 తేడాతో లక్ష్మీ సెహగల్‌పై గెలిచారు.
భారత రత్న పురస్కారం..
సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్ తర్వాత భారతరత్న పురస్కారం పొందిన మూడో రాష్ట్రపతిగా కలాం నిలిచారు. యావత్‌ దేశమంతా పీపుల్స్ ప్రెసిడెంట్ అంటూ కలాంను కొనియాడారు. రాష్ట్రపతి భవన్‌ను ప్రజల చెంతకు తీసుకెళ్లింది కలామేనని అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. రాష్ట్రపతి భవన్‌ను శాస్త్రవేత్తలకు ఒక ప్రయోగశాలగా.. కళాకారులకు కళాభవన్‌గా.. విద్యార్థులకు విద్యాలయంగా.. ప్రకృతి ప్రేమికులకు పూలవనంగా తీర్చిదిద్దిన ఘనత కలామ్‌కే దక్కుతుంది.
21 క్షమాభిక్ష విన్నపాలు..
రాష్ట్రపతిగా ఉన్న సమయంలో 21 క్షమాభిక్ష విన్నపాలు వచ్చాయి. అందులో ముఖ్యమైనది అఫ్జల్‌గురూది. రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత అబ్దుల్‌ కలాం ఆచార్యుడిగా పనిచేశారు. దేశంలోని ప్రఖ్యాత షిల్లాంగ్, అహ్మదాబాద్, ఇండోర్ ఐఐఎంలలో, బెంగళూరులోని ఐఐఎస్, స్పేస్ ఇన్‌స్టిట్యూట్‌ల, అన్నా యూనివర్సిటీ, జేఎస్ఎస్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఐఐటీ హైద్రాబాద్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సాంకేతిక అంశాలు బోధించారు. నెహ్రూ తర్వాత పిల్లలను అంతగా ప్రేమించే కలాం చివరి నిమిషం వరకూ ఆ పిల్లలతోనే గడిపారు. షిల్లాంగ్‌లో ఐఐఏంలో విద్యార్థుల కోసం నిర్వహించిన లివబుల్‌ ప్లానెట్‌ ఎర్త్ అంశంపై సెమినార్‌ ఇస్తూ కుప్పకూలిపోయారు. 

06:35 - July 28, 2015

ఢిల్లీ : ఆయన మాటల మాంత్రికుడు. అలా అని మాటలతో కోటలు కట్టడు. నిజానికి మసిపూసి అబద్దాన్ని చేయడు. సత్యాన్ని అవాస్తవాలతో సమాధి కట్టడు. అరచేతిలో వైకుంఠం అసలే చూపడు. ఆయనకు మోసం చేయటం రాదు. మభ్యపెట్టడం అసలే తెలియదు. తెలిసిందల్లా నిరాశా నిస్పృహలు నిండిన జీవితానికి అంతులేని ఆత్మవిశ్వాసాన్ని కానుకగా ఇవ్వటమే. 'అబ్దుల్ కలాం' మాటకారి కాదు. తిమ్మిని బమ్మి చేయగల వ్యక్తి అసలే కాదు. కానీ ప్రసంగం ప్రారంభించిన క్షణం నుంచి, ధన్యవాదాలు తెలిపే చివరి క్షణం వరకు నిశ్శబ్ధం రాజ్యమేలుతుంది. స్పీచ్‌ ముగిసాక నిశ్శబ్దాన్ని అందనంత దూరం తరిమేసే కరతాళ ధ్వనులు మిన్నంటుతాయి. అబ్దుల్‌ కలాం ప్రసంగం వెయ్యి వోల్టుల శక్తిని శరీరంలో నింపుతుంది. నిసత్తువతో ఉన్న జీవితం అక్కడికక్కడే రీఛార్జ్ అవుతుంది. అబ్దుల్ కలాం ఓ మాటల మాంత్రికుడు. అపజయాన్ని ఎలా ఎదుర్కోవాలో, విజయాన్ని ఎలా మేనేజ్‌ చేయాలనే కొరకరాని అంశాలను ఈజీగా చెప్పగల దిట్ట.
కలాంకు విద్యార్ధులంటే ప్రాణం...
కలాంకు విద్యార్ధులంటే ప్రాణం. భావి భారత భవిష్యత్తుకు నిర్మాతలు విద్యార్ధులేనని ఆయన ప్రతిచోటా చెబుతుంటారు. అందుకే మహనీయుల జీవితాల్లోని ముఖ్య ఘట్టాలతో పాటు తాను ఎదుర్కొన్న సంక్లిష్ట సమయాలను స్టూడెంట్స్ కు విడమరిచి చెప్పేవారు. టైమ్‌ మేనేజ్‌మెంట్‌, ఫేసింగ్‌ ఆఫ్ ఫెయిల్యూర్, మేనేజింగ్‌ ఆఫ్‌ సక్సెస్‌ వంటి అంశాలపై అనర్గళంగా ప్రసంగాలు ఇచ్చేవారు. జీవితం అంటే సాధించాల్సిన పజిల్‌ అని చెప్పే అబ్దుల్‌ కలాం ప్రసంగాలకు వినేందుకు వయో బేధం లేకుండా పోటీలు పడేవారు. ఇసుకేస్తే రాలనంతంగా ఆడిటోరియాల్లో ఆడియన్స్ నిండిపోయేవారు.
కలాంను ఆకాశానికెత్తేసిన యూరోపియన్‌ పార్లమెంట్..
భారత రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలాం యూరోపియన్‌ పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌. అప్పటి వరకు కలాం ప్రసంగాల గురించి ఆ నోటా ఈ నోటా మాత్రమే విన్న అతిరధ మహారధులు ఆనాడు ప్రత్యక్షంగా విన్నారు. స్పీచ్‌ను అయిన తర్వాత కలాంను యూరోపియన్‌ పార్లమెంట్‌ ఆకాశానికెత్తేసింది. స్ఫూర్తినిచ్చే అతికొద్ది ప్రసంగాల్లో ఇది ఒకటి అంటూ యావత్‌ యూరోపియన్‌ పార్లమెంట్ కొనియాడింది. ఇలా భారత దేశ కీర్తిని దశదిశలా వ్యాప్తి చేసి, అంతర్జాతీయ వేదికపైనే కాదు అంతరిక్షంలోనూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన కలాం, ఇక లేరనే నిజం తెలుసుకున్న విద్యార్ధిలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. మాటల మాంత్రికుడికి కన్నీళి నివాళి అర్పిస్తోంది.

06:31 - July 28, 2015

ఢిల్లీ : అత్యాధునిక టెక్నాలజీతో అమెరికా, రష్యా... తదితర దేశాలు ముందుకు దూసుకుపోతున్న తరుణమది. భారతీయుల అమ్ములపొదిలో దూరశ్రేణి క్షిపణులతో పాటు పలు రకాల క్షిపణులకు రూపకల్పన చేసి రక్షణరంగంలో భారత ప్రతిభను రెపరెపలాడించిన అనితర దేశ భక్తుడు అబ్దుల్‌కలాం. ఫోక్రాన్‌ 2 అణుపరీక్షల్లో కీలకపాత్ర పోషించి మిస్సైల్‌ మ్యాన్‌గా ప్రసిద్ధి పొందారు.
మధ్య తరగతిలో కుటుంబం..
మధ్య తరగతి ముస్లిం కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం ప్రస్థానం పేపర్‌ బాయ్‌ నుంచి రాష్ట్రపతి వరకు కొనసాగింది. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో తన స్కూల్‌ విద్య పూర్తి చేశాక... తిరుచిరాపల్లిలోని సెయింట్‌ జోసెఫ్‌ కళాశాలలో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. చెన్నైలోని మద్రాస్‌ ఇనిస్ట్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ పట్టా అందుకున్నారు. డీఆర్డీఓతో పాటూ ఇస్రోలో ఏరోస్పేస్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. మిసైల్‌ మాన్‌ అనే బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగానికి కృషి చేశారు. 1998లో భారతదేశ ఫోఖ్రాన్‌ 2 అణు పరీక్షల్లో కీలకమైన సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు.
ఎస్‌ఎల్వీ-3కి డైరెక్టర్‌..
మద్రాస్‌ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టా పొందిన తర్వాత 1960లో డీఆర్డీఓ, ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు కలాం. భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారయన. 1969లో ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహన ఎస్‌ఎల్వీ-3కి డైరెక్టర్‌గా పనిచేశారు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. 1970-1990మధ్య కాలంలో కలాం పోలార్ ఎస్ఎల్ వి మరియు ఎస్ఎల్ వి -III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్టులు విజయవంతమయ్యాయి.
1992-99 మధ్య డీఆర్‌డీఓ సెక్రటరీగా బాధ్యతలు..
జూలై 1992 నుంచి డిసెంబర్ 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా... డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. 1998లో కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమ రాజుతో కలిసి తక్కువ ధర కలిగిన కొరోనరీ స్టెంట్‌ను అభివృద్ధి చేశారు. 2012లో ఇద్దరూ కలిసి... గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం కలాం -రాజు టాబ్లెట్ పీసీ రూపొందించారు. 

06:28 - July 28, 2015

ఢిల్లీ : సైన్స్ రంగంలో భారతదేశ కీర్తిప్రతిష్టల్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రికార్డులకెక్కారు. శాస్త్రవేత్తగా ఆయన చేసిన సేవలకు అవార్డులు కూడా తలవంచాయి. ఒకటి తరువాత ఒకటి క్యూ కట్టాయి. పదుల సంఖ్యలో అవార్డులు ఆయన ఖాతాలో చేరాయి. ఒక్క స్వదేశంలోనే కాదు.... విదేశాల నుంచి కూడా అవార్డులు కలాంను వరించాయి. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం పలు పురస్కారాలు ప్రకటించింది. 40 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. కలాం 79వ జన్మదినాన్ని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా గుర్తిస్తున్నట్లు ఐరాస ప్రకటించింది.
కలాంకు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేసిన 40 వర్సిటీలు..
1981లో పద్మభూషణ్‌... 1990లో పద్మ విభూషణ్‌. 1997లో భారతరత్న అవార్డు కలాంను వరించింది. 1998లో వీర్‌ సావర్కర్‌, 2000లో రామానుజన్‌ అవార్డులను అందుకున్నారు. 2014లో సైన్స్ డాక్టరేట్‌ను ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీ నుంచి అందుకున్నారు. 1994లో గౌరవ ఫెలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అవార్డు అందుకున్నారు. 1997లో నేషనల్ ఇంటిగ్రేషన్ ఇందిరా మహాత్మా గాంధీ పురస్కారం ఆయనను వరించింది. ఇక 2007లో రాయల్ సొసైటీ, యుకె... కింగ్ చార్లెస్ II పతకంతో సత్కరించింది. అదే ఏడాది సైన్సు రంగంలో వోల్వర్‌థాంప్టన్ వర్సిటీ, యుకె..గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2008లో సింగపూర్ నాణ్యంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ డాక్టర్ అవార్డ్ అందుకున్నారు. 2009లో ఓక్లాండ్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అదే ఏడాది ఎఎస్ఎంఈ ఫౌండేషన్, అమెరికా హూవర్ పతకంతో పాటు కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా నుంచి ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డు అందుకున్నారు. 2010లో వాటర్లూ వర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డాక్టర్...2011లో ఐఈఈఈ గౌరవ సభ్యత్వం అవార్డులు కలాంను వరించాయి. 2012లో సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా.. 2014లో ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ సైన్స్ డాక్టరేట్‌తో సత్కరించింది. 

కొమరంభీం నగర్ లో ఉద్రిక్తత..

రంగారెడ్డి : ఇబ్రహింపట్నం (మం) కోహెడ శివారులోని కొమరం భీం నగర్ లో ఉద్రికత నెలకొంది. ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న నాలుగు వేల గృహాలను కూల్చేందుకు రంగం సిద్ధం చేశారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. కూల్చివేతలను అడ్డుకొనేందుకు స్థానికులు సిద్ధమయ్యారు. 

నేడు పార్లమెంట్ లో రాజ్ నాథ్ ప్రకటన..

ఢిల్లీ : పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదులు జరిపిన దాడులపై పార్లమెంట్ లో నేడు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు.

 

నేడు అసెంబ్లీ వద్ద వేసీపీ నేతల ధర్నా..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ లాంజ్ లో వైఎస్ ఫొటో తొలగింపుకు నిరసనగా నేడు ఉదయం 11గంటలకు అసెంబ్లీ వద్ద వైసీపీ నేతలు ధర్నా నిర్వహించనున్నారు. 

మెమన్ ఉరిశిక్షపై తుది విచారణ..

ఢిల్లీ : ఉరిశిక్షపై స్టే ఇవ్వాలన్న మెమెన్ పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో తుది విచారణ జరుగనుంది. మెమన్ తరపు న్యాయవాది వాదనలు కోర్టు విననుంది. 

25 ఇంజినీరింగ్ ప్రైవేటు కాలేజీలపై హైకోర్టు తుది తీర్పు..

హైదరాబాద్ : 25 ఇంజినీరింగ్ ప్రైవేటు కాలేజీల్లో సౌకర్యాలు లేవని హైకోర్టుకు జేఎన్టీయూ హెచ్ నివేదికపై కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. 

నేడు తమిళనాడులో విద్యాసంస్థలకు సెలవు..

చెన్నై : అబ్దుల్ కలాం మృతికి సంతాపంగా నేడు తమిళనాడు రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

 

Don't Miss