Activities calendar

29 July 2015

21:26 - July 29, 2015

హైదరాబాద్: తనకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టుకు చెందిన జడ్జీలు సైతం యాకుబ్‌మెమెన్‌కు ఉరిశిక్ష తగదని సూచించారని గుర్తు చేశారు. బాబ్రీమసీద్‌ కూల్చివేసిన వారికి కూడా ఉరిశిక్ష విధించాలని ఓవైసీ డిమాండ్‌ చేశారు. 

21:23 - July 29, 2015

హైదరాబాద్: యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలుకు నాగ్‌పూర్‌ జైలులో సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. నాగ్‌పూర్‌ జైలులో ఉరితీసేందుకు ఏర్పాట్లు చేశారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో... యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖాయమైంది. గురువారం ఉదయం 7గంటలకు నాగ్‌పూర్ జైలులో ఉరితీసేందుకు సర్వం సిద్ధం చేశారు.                                                                                 
శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా వున్న యాకూబ్‌....
యాకూబ్‌ ఉరిశిక్ష అమలుకు ముందు చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ... జైలు సిబ్బంది పూర్తి చేసింది. ఆరోగ్య పరీక్షలనూ కంప్లీట్‌ చేశారు. యాకూబ్‌ మెమన్‌ శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా వున్నట్లు జైలర్ వెల్లడించారు. గురువారం ఉరిశిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లన్నీ పూర్తిచేసినట్లు వివరించారు.
3గంటలకు నిద్రలేపనున్న జైలు సిబ్బంది....
అర్దరాత్రి తర్వాత 3 గంటలకు యాకూబ్‌ మెమన్‌ను జైలు సిబ్బంది నిద్ర లేపుతుంది. 10 నిమిషాల తర్వాత స్నానం చేయమని చెబుతారు. ఒకవేళ యాకూబ్ స్నానానికి వేడి నీళ్లు కోరితే సిద్ధం చేస్తారు. 3గంటల 20 నిమిషాలకు అల్పాహారం ఇస్తారు. ముందుగా నిర్ణయించిన మెనూ ప్రకారమే టిఫిన్ ఇస్తారు. ఒకవేళ అతను కోరిన టిఫిన్‌ క్యాంటీన్‌లో దొరకకపోతే... బయటి నుంచి తెప్పిస్తారు. టిఫిన్ తిన్నాక మతగ్రంథం, లేక ఇష్టమైన పుస్తకం ఏదైనా చదవుతాడేమో అడుగుతారు. దానికి సానుకూలంగా స్పందిస్తే ఆయన కోరిన పుస్తకం అందజేస్తారు.
నిర్ణయించిన సమయం ప్రకారం ఉరి....
పుస్తక పఠనం పూర్తయ్యాక యాకూబ్‌ చేతులు వెనక్కు తీసుకొని... తాడుతో గట్టిగా కట్టేస్తారు. ముఖాన్ని ఒక గుడ్డతో కప్పివేస్తారు. ఉరికంబం వద్దకు తీసుకెళ్తారు. ఉరితీసే ముందు చివరి కోరిక ఏదైనా వుందా అడుగుతారు. తర్వాత ముందు నిర్ణయించిన సమయం ప్రకారం ఉరితీస్తారు. చనిపోయినట్లు వైద్యులు నిర్దారణ చేయగానే... హోంశాఖ, కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తారు.
75 కేజీలు... 7 అడుగులు....
ఖైదీ బరువును బట్టి ఉరి ఏర్పాట్లు చేస్తారు. 45కేజీల బరువుంటే 8 అడుగుల ఎత్తునుంచి ఉరితీస్తారు. 45నుంచి 60కేజీల మధ్య వుంటే 7ఎడుగులు 8 ఇంచులు... 75 కేజీల వరకూ 7 అడుగులు... 91 కేజీల వరకూ 6అడుగుల 6ఇంచుల ఎత్తు నుంచి ఉరితీస్తారు. యాకూబ్ 75 కేజీలకు పైగా బరువున్నట్లు తెలుస్తోంది. కాబట్టి 7 అడుగుల ఎత్తునుంచి ఆయన్ను ఉరితీస్తారని అంచనా. 

రాష్ట్రపతి నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ

ఢిల్లీ: మెమన్‌ క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతి ప్రణబ్‌ కాసేపట్లో ప్రకటించనున్న నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరో వైపు  కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ముంబై పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్‌‌పై చర్చించారు.మెమన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కోరినట్లు సమాచారం.  కాగా మెమన్ ఉరిశిక్షపై పెట్టుకున్న పున:సమీక్ష పిటీషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. 

ఆగస్టు 20 తర్వాత భూసేకరణ :మంత్రినారాయణ...

విజయవాడ: ఇప్పటి వరకు 34,979 ఎకరాల భూసేకరణ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇంకా 2,530 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని..దేవాదాయ శాఖకు చెందిన 1,135 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని స్పష్టం చేశారు. కోర్టు అనుమతి కోసం వేచి చూస్తున్నామని... ఆగస్టు 20 తర్వాత భూసేకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వుడా ధృవీకరణ ఉన్న లేఔట్లకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

కాసేపట్లో క్షమాభిక్షపై రాష్ట్రపతి నిర్ణయం

హైదరాబాద్: యాకూబ్ మెమన్ ఉరిశిక్ష రద్దు చేయాలంటూ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పై కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఉరిశిక్ష పడిన వ్యక్తి క్షమాభిక్ష కోసం పిటిషన్ పెట్టుకుంటే, రాష్ట్రపతి దానిని పరిశీలించిన తరువాత కేంద్ర హోం శాఖకు పంపి అభిప్రాయం తెలుసుకుంటారు. అనంతరం విచక్షణాధికారాల ప్రకారం ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపధ్యంలో గురువారం ఉదయం యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు నేపథ్యంలో మెమన్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్దకు చేరింది. దీంతో ఆయన కేంద్ర హోం శాఖకు ఆ ఫైలును పంపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నివాసానికి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెళ్లారు.

20:40 - July 29, 2015

ఆకాశం అంచులు.. గ్రహాల తీరాలను దాటుతున్న నాసా సంచలనాత్మక పరిశోధనలు.. జీవం ఉండే అకాశం ఉందంటున్న సైటిస్టులు... ఫ్లూటో గుట్టును న్యూహ్పరైజన్ ఇప్పుతోందా? అంతరిక్ష నౌక ఫ్లూటో ఫోటోలను విడుదల చేస్తోంది. ఫ్లూటో గ్రహంపై పరిశోధకుల కన్ను పడిందా? ఈ సృష్టిలో భూమి కాకుండా ఎక్కడైనా జీవం ఉందా? గ్రహాంతర వాసులపై స్టీఫెన్ హకింగ్ బృందం పరిశోధనలు చేస్తోందా? ఇలాంటి ఆసక్తి కరమైన అంశాలను ఈ రోజు వైడాంగిల్ లో వివరించారు. మరి మీరు కూడా వినాలనుకుంటున్నారా అయితే ఈవీడియోను క్లిక్ చేయండి.

హెచ్‌బీఎల్‌లో ప్రమాదవశాత్తూ కార్మికుడి మృతి...

హైదరాబాద్: ప్రమాదవశాత్తూ ఐరన్ రాడ్డు మీదపడి తాత్కాలిక కార్మికుడు మృతిచెందిన సంఘటన విజయనగరం జిల్లా పూసపాటిరాగ మండంలోని హెచ్‌బీఎల్‌లో కార్మాగారంలో బుధవారం జరిగింది. వివరాలు.. నెల్లిమర్ల మండలం గుస్ని గ్రామానికి చెందిన జమ్ము రమణ(43) హెచ్‌బీఎల్‌లో తాత్కాలిక కార్మికునిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు కార్మాగారంలో ఐరన్ పోల్స్‌ను తరలించే క్రేన్ బెల్ట్ పక్కన విధులు నిర్వర్తిస్తున్న రమణపై ఐరన్ రాడ్డు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

మరి కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీ: మెమన్ క్షమాబిక్ష పిటిషన్ ను తిరస్కరించాలని రాష్ట్రపతికి హోంశాఖ సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు నాగ్ పూర్జైలుకు 500 మీటర్ల పరిధిలో రేపు సాయంత్రం వరకూ 144 సెక్షన్ విధించారు.

ఉరిశిక్షపై మరోసారి ఆలోచించండి :పశ్చిమబెంగాల్ గవర్నర్

హైదరాబాద్ :1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై మరోసారి ఆలోచించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పశ్చిమబెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ సూచించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఉరిశిక్ష అంటే ఇష్టం ఉండదని, అందుకోసమైనా యాకూబ్ మెమన్ పెట్టుకున్న ఉరిశిక్షను సమీక్షించాలని అన్నారు. యాకూబ్ మెమన్ ఉరిశిక్షను రద్దు చేస్తే, కలాంకు ఘనమైన నివాళి అర్పించినట్టవుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా, రేపు ఉదయం నాగ్ పూర్ జైలులో మెమన్ కు ఉరిశిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే.  

గద్వాలలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య....

మహబూబ్‌నగర్ : గద్వాలలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు అనారోగ్యంతో, మరొకరు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతులను వడ్డెగిరికి చెందిన రాజు, నర్సింహగా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

కోర్టులో రుషికేశ్వరి రిమాండ్ రిపోర్టు

గుంటూరు: ఏఎన్ యూలో విద్యార్థిని ఆత్మహత్య కేసులో కోర్టులో రిమాండ్ రిపోర్టును పోలీసులు సమర్పించారు. రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రేమించమని రిషికేశ్వరి ని నిందితులు బలవంతం పెట్టారని, అంగీకరించకపోవడంతో బెదిరింపు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రెషర్స్ పార్టీలో రిషికేశ్వరి పట్ల నిందితులు అసభ్యంగా ప్రవర్తించడమే కాక.. పలుమార్లు రుషికేశ్వరిని ర్యాగింగ్ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. వేధింపులు భరించలేకక మనస్తాంతో రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

19:30 - July 29, 2015

హైదరాబాద్:ఆఫ్గనిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ తాలిబన్‌ చీఫ్‌ ముల్లా ఉమర్‌ మృతి చెందాడు. ముల్లా ఉమర్‌ మృతిని ఆఫ్గన్‌ ప్రభుత్వ వర్గాలు ఎట్టకేలకు ధృవీకరించాయి. 2013లోనే ముల్లా ఉమర్‌ మరణించినట్టు ఆఫ్గనిస్తాన్‌ అధ్యక్ష భవనానికి చెందిన అధికారులు ప్రకటించారు. ముల్లా ఉమర్‌ ఐసి-814 హైజాక్‌లో కీలక పాత్ర పోషించాడు. ముల్లా ఉమర్‌ తాలిబన్‌కు అత్యంత పవర్‌ఫుల్‌ నేత.

19:27 - July 29, 2015

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి డెత్‌ మిస్టరీ వీడనుందా? ప్రభుత్వం నియమించిన నిజనిర్థారణ కమిటీ విచారణను ప్రారంభించడంతో..త్వరలోనే రిషితేశ్వరి డెత్‌ మిస్టరీ వీడే అవకాశం కన్పిస్తోంది. మరోవైపు యూనివర్శిటీ నియమించిన విచారణ కమిటీ 13 రోజుల విచారణను పూర్తిచేసి..రిపోర్టును వీసికి అందచేసింది. దీంతో వర్శిటీ విచారణ కమిటీ అందచేసిన రిపోర్టుపై ఉత్కంఠ నెలకొంది.
ఈనెల 14న ఆత్మహత్యకు....
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున వర్సిటీలో ఈనెల 14న ఆత్మహత్యకు పాల్పడిన ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి మృతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ విచారణను ప్రారంభించింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బాలసుబ్రమణ్యం ఆధ్యర్యంలోని నలుగురు సభ్యుల బృందం ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఇన్‌చార్జ్‌ వీసీ సాంబశివరావుతో సమావేశమైంది. రిషితేశ్వరి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను వీసీ సాంబశివరావును అడిగి తెలుసుకుంది. ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, వర్శిటీలో చోటుచేసుకున్న ఘటనల వివరాలను కూడా విచారణ కమిటీ అడిగి తెలుసుకుంది.
తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులతో భేటీ..!
రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించడంతో పాటు..తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపాల్, వార్డెన్లను విచారణ కమిటీ విచారించనుంది. వీరితో పాటు వర్శిటీ నియమించిన విచారణ కమిటీతోను భేటీ అయి వారి నివేదికను తెలుసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా..పోలీసులు, రెవెన్యూ అధికారులతోనూ విచారణ కమిటీ సమావేశాలను ఏర్పాటుచేసి వారి దగ్గరనుంచి వివరాల్ని సేకరించనుంది. భవిష్యత్‌లో కూడా ఇలాంటి ఘటనలు జరుగకుండా వర్శిటీ వీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశాలపై విచారణ కమిటీ వివరాల్ని సేకరిస్తోంది. ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బాల సుబ్రమణ్యంతో పాటు..నెల్లూరు సింహపురి వీసి ఆచార్య వీరయ్య, ఎస్‌వీ యూనివర్శిటీ నుంచి బాలకృష్ణం నాయుడు, పద్మావతి మహిళా వర్శిటీ రిజిస్ట్రార్‌ విజయ లక్ష్యంలు సభ్యులుగా ఉన్నారు. మొత్తం ఐదు రోజుల్లో విచారణను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామని బాలసుబ్రమణ్యం తెలిపారు.
రిషితేశ్వరి మృతి ఘటనపై వర్శిటీ విచారణ పూర్తి...
ఇదిలా ఉంటే..మరోవైపు యూనివర్శిటీ నియమించిన విచారణ కమిటీ 13 రోజుల విచారణను పూర్తి చేసింది. యూనివర్శిటీ ఇన్‌చార్జ్‌ వైస్ ఛాన్సలర్‌ సాంబశివరావుకు రిషితేశ్వరి డెత్‌ మిస్టరీ రిపోర్టును అందజేసింది. ఆచార్య రాంబాబు నేతృత్వంలోని విచారణ కమిటీ..అసలు ఘటనకు కారణాలపై అన్ని కోణాల్లోను క్షుణ్ణంగా పరిశీలించింది. విద్యార్థులు మొదలుకొని తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాల వరకు అందరి అభిప్రాయాలు, వాదనలను రికార్డు చేసింది. ర్యాగింగ్ కారణంగానే రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిందా లేక..ఆమె మృతికి వేరే కారణాలేమైనా ఉన్నాయన్న కోణంలో కమిటీ 13 రోజుల పాటు విచారణ పూర్తి చేసింది. అయితే కమిటీ అందించిన నివేదికను ప్రభుత్వానికి అందజేయాలా లేక తానే వెల్లడించాలన్న దానిపై వీసీ డైలమాలో పడ్డారు. 

వనజాక్షి ఘటనపై విచారణకు ఆదేశించిన ఏపీ సర్కార్

కృష్ణా: ముసునూరు తహసీల్దార్ వనజాక్షి మీద దాడి ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం విదితమే. ఈ ఘటన విచారణాధికారిగా రెవెన్యూ ముఖ్యకార్యదర్శి జేసీ శర్మను ప్రభుత్వం నియమించింది. నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని శర్మను ప్రభుత్వం ఆదేశించింది.

పేలుళ్ల సూత్రధారి మెమన్ కాదు: ఒవైసీ.....

హైదరాబాద్: యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష ఖరారు చేయడం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి యాకూబ్ మెమన్ కాదని, అందువల్ల అతనికి ఉరిశిక్షే సరైనదని భావించలేమని గతంలో న్యాయమూర్తులు వ్యాఖ్యానించారని తెలిపారు. వాటిని ఇతర న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.   

18:34 - July 29, 2015

హైదరాబాద్: సుప్రీంకోర్టు నుంచి క్లియరెన్స్ రావటంతో... మహారాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు కారణంగా... రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుంగా ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికతో ఇప్పటికే పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్‌... డీజీపీ, పోలీస్‌ కమిషనర్లతో భేటీ అయ్యారు. అలసత్యం వద్దని, విద్రోహ చర్యలకు అవకాశం ఇవ్వొద్దని హెచ్చరించారు. నాగ్‌పూర్‌ జైలు వద్ద భద్రత మరింత పెంచాలని ఆదేశించారు. 

18:33 - July 29, 2015

హైదరాబాద్ : యాకూబ్‌ మెమన్‌ క్షమాభిక్షపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కేంద్ర హోంశాఖ సలహా కోరారు. రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి తన నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం. రాష్ట్రపతి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు యాకూబ్‌ మెమన్‌కు రేపు ఉరిశిక్ష అమలు చేసేందుకు నాగ్‌పూర్‌ జైలులో ఏర్పాట్లు చేస్తున్నారు. నాగ్‌పూర్‌ జైలు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మెమన్‌ డెత్‌ వారెంట్‌ పిటిషన్‌పై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

రేపు సెలవు దినంగా ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

హైదరాబాద్: తమిళనాడు రాష్ట్రం రామేశ్వంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియల నేపథ్యంలో ఆయన గౌరవార్థం రేపు రాష్ట్ర ఉద్యోగులకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

ఆర్కేబీచ్ లో పంద్రాగస్టు వేడుకలు...

హైదరాబాద్: విశాఖపట్నంలో ఆగష్టు 15 వేడుకలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కలెక్టర్ యువరాజ్, అధికారులతో ఏర్పాట్లపై సీఎస్ కృష్ణారావు సమీక్ష నిర్వహించారు.

నాగ్ పూర్ సెంట్రల్ జైల్ వద్ద భద్రత కట్టుదిట్టం

హైదరాబాద్: 1993లో ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ రేపు ఉదయం 7గంటలకు ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం నాగ్ పూర్ జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. 

కలాంకు అంత సీను లేదు:పాక్ అణుపితామహుడు

హైదరాబాద్: అబ్దుల్ కలాం ఓ సాధారణ మామూలు స్థాయి సైంటిస్ట్ అని, ఆయనకు అంత సీన్ లేదని పాకిస్థాన్ అణుపితామహుడు ఏ.క్యూ ఖాన్ అక్కసు వెళ్లగక్కారు. భారత క్షిపణి కార్యక్రమమంతటినీ రష్యా అభివృద్ధి చేసిందని, ఇందులో కలాం చేసిందేమీలేదని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఉపగ్రహ సాంకేతికత, క్షిపణి సాంకేతికత, ఆస్ట్రో ఫిజిక్స్‌లో కలాంకు ఎలాంటి ప్రతిభా లేదని ఖాన్ ఆరోపించారు. 2002లో కలాంకు అర్హత లేకపోయినా రాష్ట్రపతి పదవి ఇచ్చారని తనలో ఉన్న కుళ్లునంతా ఖాన్ బయటపెట్టుకున్నారు. ముస్లిం ఓట్లను ఆకర్షించేందుకు కలాంను రాష్ట్రపతిని చేశారని ఖాన్ చెప్పారు.

'సోమందేపల్లి' కుంభకోణంపై విచారణ

అనంతపురం: సోమందేపల్లి భూ పరిహార కుంభకోణంపై నిగ్గు తేల్చేందుకు జిల్లా యంత్రాంగం సంయుక్త కలెక్టర్ లక్ష్మీకాంతం పర్యవేక్షణలో విచారణ కొనసాగిస్తోంది. 24 గంటల్లో కలెక్టర్ కు నివేదిక సమర్పించే సిద్ధమవుతున్నారు.

'గ్రామజ్యోతి' పనులను సమీక్షించిన కేబినెట్ సబ్ కమిటి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆగష్టు 15న ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న గ్రామజ్యోతి పథకం రూపకల్పన పనులను కేబినెట్ సబ్‌కమిటీ వేగవంతం చేసింది. బుధవారం జిల్లా కలెక్టర్లు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలతో గ్రామజ్యోతిపై కేబినెట్ సబ్ కమిటీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా కేబినెట్ సబ్‌కమిటీ సభ్యులు మాట్లాడారు. స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను గ్రామజ్యోతి కార్యక్రమంలో పొందుపరుస్తామని వెల్లడించారు.

సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట వీఆర్ ఏల ధర్నా

మెదక్:తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... వీఆర్ఏలు బుధవారం ధర్నాను నిర్వహించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నాను నిర్వహించారు.

హుదూద్ బాధితులకు 10వేల ఇళ్లు...

హైదరాబాద్: ఎన్టీఆర్ ప్రత్యేక గృహ నిర్మాణ పథకం కింద హుదూద్ బాధితులకు 10 వేల ఇళ్లు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జీ ప్లస్ మోడల్ లో ఇళ్లు నిర్మాణాలు చేపట్టనున్నట్టు తెలిపింది. అదే విధంగా దాతల విరాళాలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

సీఎం కేసీఆర్ తో కలసి భోజనం చేసిన ప్రత్యూష

హైదరాబాద్: సవతి తల్లి, తండ్రి చేతిలో తీవ్ర హింసకు గురై బయటపడి కోలుకున్న ప్రత్యూష హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంది. ఇంటికి వచ్చిన ఆమెను సీఎం ఆప్యాయంగా పలకరించి ఆహ్వానం పలికారు. తన ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ తో కలసి ప్రత్యూష భోజనం చేసింది. సీఎంతో పాటు మంత్రులు కోడెల శివప్రసాద్, నాయిని నర్సింహరెడ్డి, సీపీ ఆనంద్, తదితరులు కూడా భోజనం చేశారు. తరువాత కేసీఆర్ సతీమణి శోభతో ప్రత్యూష కాసేపు ముచ్చటించింది. 

16:58 - July 29, 2015

కృష్ణా: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎస్‌కేసీవీ ట్రస్ట్‌లో విద్యార్థి మోజెస్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో.. విద్యార్థి బంధువులు ఎస్‌కేసీవీ ట్రస్ట్‌ వాహనాన్ని ధ్వంసం చేశారు. ట్రస్ట్‌ నిర్వాహకులే మోజెన్‌ను చంపారని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు.

 

16:43 - July 29, 2015

న్యూఢిల్లీ : హైదరాబాద్: :ముంబై పేలుళ్ల దోషి యాకూబ్‌ మెమెన్‌ క్షమాభిక్షను సుప్రీం కోర్టు ఉరి శిక్షను ఖరారు చేసింది. మెమన్ పుట్టిన రోజు అయిన గురువారం నాగపూర్ సెంట్రల్ జైల్లో రేపు ఉదయం 7గంటలకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. విచారణ సరైన పద్ధతిలోనే జరిగిందని, మరోసారి విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. బుధవారం సుదీర్ఘ విచారణ అనంతరం మెమెన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. యాకుబ్ మెమెన్ క్యూరేటివ్ పిటిషన్‌ను రెండోసారి విచారించే ప్రశ్నే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్‌లో ఎలాంటి లోపాలు లేవు అని పేర్కొంది.  ఇది ఇలా ఉండగా యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా తిరస్కరించారు. దీంతో అధికారులు ఉరిశిక్ష అమలుకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో శాంతి భద్రతలపై చర్చించేందుకు సీఎం దేవేంద్రఫడ్నవిజ్ తో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రాష్ట్ర డీజీపీ, ముంబై పోలీస్ కమిషనర్ లు సీఎంతో శాంతి భద్రతలపై చర్చిస్తున్నారు.
అసలు ఏం జరిగింది ? 
1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ సుప్రీం కోర్టు మరణ శిక్ష అమలును మరోమారు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. క్షమాభిక్ష కోసం పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో జులై 30వ తేదీన యాకుబ్ మెమన్‌కు ఉరి శిక్షను అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విశేషం ఏమిటంటే అదే రోజున యాకుబ్ మెమన్ (53) పుట్టినరోజు కావడం గమనార్హం. ఉరిశిక్ష అమలుతో దేశవ్యాప్త చర్చకు యాకుబ్ మెమన్ తెరలేపాడు. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడైన టైగర్ మెమన్ సోదరుడే యాకుబ్ మెమన్. ఉన్నత చదువును అభ్యసించిన యాకుబ్ వృత్తిరీత్యా చార్టర్డ్ ఆకౌంట్. దావుద్ ఇబ్రహీం, అన్న టైగర్ మెమన్‌లకు డబ్బులు సమకూర్చేవాడు. దీంతో పాటు 1993 ముంబై వరుస పేలుళ్ల కోసం సొంత వాహనాలను వారికి ఇచ్చాడు. ముంబైలో వరుస పేలుళ్లు జరిగిన తర్వాత యాకుబ్ మెమన్ భారతదేశం వదిలి వెల్లిపోయాడు. పాకిస్ధాన్‌లో తలదాచుకున్నాడు. మెమన్‌ను సీబీఐ అధికారులు 1994లో అరెస్టు చేశారు. అయితే యాకుబ్ మెమన్ అరెస్టులో అప్పట్లో భిన్నవాదనలు వినిపించాయి. 1994లో అతడిని నేపాల్‌లో అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు చెబుతుండగా అతనే లొంగిపోయాడని అతని తరపున్యాయవాదులు వాదించారు.
నిమిషాల వ్యవధిలో 13 పేలుళ్లు...
1993లో ముంబైలో నిమిషాల వ్యవధిలో 13 పేలుళ్లు జరిగాయి. ఈ వరుస పేలుళ్లలో దాదాపు 257 మంది చనిపోయారు. 7 వందల మంది వరకు గాయపడ్డారు.. ఈ కేసులో టైగర్‌ మెమన్‌ (యాకూబ్‌ సోదరుడు), దావూద్‌ ఇబ్రహీం పేలుళ్లలో ప్రధాన సూత్రధారులు. చార్టర్డ్ అకౌంట్‌ అయిన మెమన్‌ స్వయంగా ముంబై పేలుళ్ల కుట్రలో పాలు పంచుకున్నాడని అభియోగాలు రుజువయ్యాయి. దీంతో 2007లో ముంబైలోని టాడా కోర్టు మెమన్‌తో సహా 11 మందికి ఉరిశిక్ష విధించింది. యాకుబ్ మెమన్ ఉరిశిక్షపై రాష్ట్రపతి కూడా క్షమాభిక్షకు నిరాకరించారు.
257 మంది మృతి......
వ్యవధిలోనే ముంబైలో 13 వరుస పేలుళ్లు. 257 మంది మృతిచెందారు.
2006 సెప్టెంబర్‌ 12: తీర్పును వెల్లడించిన ముంబైలోని టాడా కోర్టు. 12 మందికి ఉరిశిక్ష, 20 మందికి యావజ్జీవ ఖైదు ఖరారు.
2013 మార్చి 21: యాకూబ్‌ మెమన్‌, టైగర్‌ మెమన్‌ల ఉరిశిక్షలను ధ్రువీకరించిన సుప్రీంకోర్టు. పది మందికి శిక్షలను యావజ్జీవంగా మార్పు.
2014 మే: యాకుబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌.
2014 జూన్‌ 2: క్షమాభిక్ష పిటిషన్లను ఓపెన్‌ కోర్టులోనే విచారణ జరపాలన్న నిబంధన మేరకు, ఉరిశిక్షను నిలిపివేసిన అత్యున్నత న్యాయస్ధానం.
2015 ఏప్రిల్‌ 9: మరణశిక్షపై యాకూబ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.
2015 జులై 21: క్యూరిటివ్‌ పిటిషన్‌ తొసిపుచ్చిన సుప్రీం కోర్టు. 
2015 జులై 29 : మెమన్ దాఖలు చేసిన మరో పిటిషన్ సుప్రీం తోసిపుచ్చింది. రేపు(గురువారం) ఉరి తీయాలని ఆదేశించింది. 

మెమన్ కు ఉరిశిక్ష ఖరారు..

న్యూఢిల్లీ : ముంబై పేలుళ్ల దోషి యాకూబ్‌ మెమెన్‌ క్షమాభిక్షను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు ఉరి శిక్షను ఖరారు చేసింది. మెమన్ పుట్టిన రోజు అయిన గురువారం(రేపు) ఉదయం 7గంటలకు నాగపూర్ సెంట్రల్ జైల్లో  ఉరిశిక్ష అమలు చేయనున్నారు. విచారణ సరైన పద్ధతిలోనే జరిగిందని, మరోసారి విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. బుధవారం సుదీర్ఘ విచారణ అనంతరం మెమెన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. యాకుబ్ మెమెన్ క్యూరేటివ్ పిటిషన్‌ను రెండోసారి విచారించే ప్రశ్నే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్‌లో ఎలాంటి లోపాలు లేవు అని పేర్కొంది.

ఏసీబీ వలలో పెద్దపల్లి సహాయ కార్మిక అధికారి

కరీంనగర్ : పెద్దపల్లి సహాయ కార్మిక అధికారి వెంకటేశ్వరరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. అనిల్ అనే కూలీ వద్ద రూ. 4 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు వెంకటేశ్వరరావును పట్టుకున్నారు. కార్మిక ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి వెంకటేశ్వరరావు లంచం డిమాండ్ చేశారు.

 

ఇద్దరు భారతీయులకు రామన్ మెగాసెసే అవార్డు...

హైదరాబాద్:ఈ ఏడాది ప్రతిష్టాత్మక రామన్‌ మెగాసెసే అవార్డు ఇద్దరు భారతీయులను వరించింది. మెగాసెసే అవార్డు ఐదుగురికి ప్రకటించగా వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఎయిమ్స్‌ డిప్యూటీ సెక్రటరీ సంజీవ్‌ చతుర్వేది, గూన్జ్‌ స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు అన్షూ గుప్తా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఎయిమ్స్‌ కుంభకోణాలను సంజీవ్‌ చతుర్వేది బయటపెట్టారు. ఆయన ధైర్యాన్ని మెగాసెసే ఫౌండేషన్‌ మెచ్చుకుంది. సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు చూసి అన్షూ గుప్తాకు అవార్డు ప్రకటించినట్లు మెగాసెసే ఫౌండేషన్‌ తెలిపింది. పేదల అభ్యున్నత కోసం అన్షూ గుప్తా కృషి చేస్తున్నారు. 

 

మెమన్ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : ముంబై పేలుళ్ల దోషి యాకూబ్‌ మెమెన్‌ క్షమాభిక్షను సుప్రీం కోర్టు కొట్టివేసింది. విచారణ సరైన పద్ధతిలోనే జరిగిందని, మరోసారి విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. బుధవారం సుదీర్ఘ విచారణ అనంతరం మెమెన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. యాకుబ్ మెమెన్ క్యూరేటివ్ పిటిషన్‌ను రెండోసారి విచారించే ప్రశ్నే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్‌లో ఎలాంటి లోపాలు లేవు అని పేర్కొంది.  ఇది ఇలా ఉండగా యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా తిరస్కరించారు.

భారత్ పై దాడులకు ఐఎస్ ఎస్ సన్నాహాలు...!

హైదరాబాద్:భారత్‌పై దాడులు చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సన్నాహాలు చేస్తోన్నారని యూఎస్‌ఏ టుడే ఓ కథనాన్ని వెలువరించింది. పాకిస్థాన్ పౌరుడి నుంచి లభించిన 32 పేజీల దస్త్రం ఆధారంగా ఈ కథనాన్ని యూఎస్‌ఏ టుడే ప్రచురించింది. భారత్‌పై దాడులు చేసేందుకు పాక్,ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఏకం కావాలని ఐసీస్ కోరినట్లు ప్రచురించింది యూఎస్‌ఏ టుడే. ఉర్దూ భాషలో ఉన్న 32 పేజీలను హార్వార్డ్ స్కాలర్ ఇంగ్లీష్‌లోకి తర్జూమా చేశారు. 

15:59 - July 29, 2015

హైదరాబాద్:ఉస్మానియా ఆసుపత్రి తరలింపులో భాగంగా బుధవారం 24 మంది ఆర్థో రోగులను కింగ్‌కోఠిలోని ప్రసూతి ఆసుపత్రికి తరలించారు. శిథిలావస్థకు చేరిన ఉస్మానియా భవనాలను తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

15:58 - July 29, 2015

విజయవాడ:గ్రామీణ బ్యాంక్ మేనేజర్ భార్య హిమబిందు కేసులో సాక్ష్యాధారాలు సేకరించకపోవటంమపై ఏపీ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులు నిర్ధోషులుగా తేలటంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును తిరిగి మళ్లీ దర్యాప్తు చేయించాలని, అప్పటి పోలీసుల వైఫల్యంపై తగిన చర్యలు తీసుకుని తక్షణం వారిని విధుల నుంచి తొలగించాలన్నారు. విజయవాడ ఇన్చార్జ్ పోలీస్ కమిషనర్ గా ఉన్న సూర్యప్రకాశరావును ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కలసి హిమబిందు కేసును తిరిగి విచారణ చేపట్టాలని కోరుతూ సూర్యప్రకాశరావుకు వినతిపత్రం సమర్పించారు.

15:56 - July 29, 2015

ఱమ్మం:బలహీనంగా ఉన్న చోటే బల ప్రదర్శనకు దిగాలి. ఓడిన చోటే గెలవాలి. పడిన చోటే లేచి పరుగెత్తాలి. ప్రత్యర్థులపై సత్తా చాటాలి ఇది గులాబీ పార్టీ వైఖరీ. కాని ఆ జిల్లాలో గులాబీ పార్టీ ప్రవర్తన అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా..గులాబీబాస్‌ ఒక్కసారైనా..ఆ జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు. మరి అందుకు కారణం ఏమైఉంటుంది....?
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయంశంగా...
ఖమ్మం జిల్లా. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ జిల్లాలో సీఎం కేసీఆర్ ఒకే ఒక్కసారి పర్యటించారు. అదీకూడా గత మార్చిలో శ్రీరామనవమి సందర్భంగా ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చారు. రోడ్డు మార్గంలో భధ్రాచలం చేరుకున్న ఆయన రామయ్య కళ్యాణం ముగియగానే తిరిగి వెళ్లిపోయారు. వెళ్తూవెళ్తూ..మణుగూరు వద్ద భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సమయంలో తిరిగి ఆరు రోజుల్లో జిల్లాకు వస్తానని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రస్తావనే మళ్లీ రావడం లేదు.
ఈనెల 9 తేదీన సీఎం రావాల్సి ఉంది...
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం పర్యటన వాయిదా పడుతూనే ఉంది. తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీగా టిడిపి శ్రేణులు టిఆర్ఎస్‌లో చేరాక సీఎం జిల్లాకు వస్తారని ప్రచారం జరిగింది. కాని అలా జరగలేదు. ఇప్పటి వరకు ఆరుసార్లు సీఎం జిల్లా పర్యటన రద్దయింది. ఈ నెల 9వ తేదీన హరితహారం కోసం జిల్లాకు కేసీఆర్ రావాల్సి ఉంది. కాని ఆఖరు క్షణంలో అకస్మాత్తుగా పర్యటనను రద్దు చేసుకున్నారు.
వేలాది మంది పేదలకు ఇళ్ల పట్టాలివ్వడం లేదు.....
సీఎం పర్యటన రద్దుకు ప్రధానంగా జిల్లాలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన సమస్యలేనని తెలుస్తోంది. ప్రధానంగా నగరంలో వేలాది మంది పేదలకు గత కొన్నేళ్లుగా ఇళ్ల పట్టాలు ఇవ్వటం లేదు. రహదారుల విస్తరణ, ఇతర సమస్యలకు నిధుల కొరత వేధిస్తోంది. దుమ్ముగూడెం, ఎస్పారెస్పీ, సాగర్ ఆధునికీకరణ, సింగరేణి గనుల విస్తరణ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ప్రతిపాదనలతోపాటు, ప్రధానంగా జిల్లాలో పోడుభూముల సమస్య తీవ్రంగా ఉంది. సీఎం పర్యటన జరిగితే కొన్ని సమస్యలకైనా పరిష్కారం లభిస్తుందన్న ఆశ జిల్లావాసుల్లో ఉంది. సీఎం కేసీఆర్ కావాలనే తన పర్యటనను రద్దు చేసుకుంటున్నారని విపక్షాలు భగ్గుమంటున్నాయి
సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించాలి...
ఇప్పటికైనా...సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించాలని విపక్షాలు కోరుతున్నాయి. సీఎం జిల్లాలో పర్యటించినప్పుడు మాత్రమే పెండింగ్‌ సమస్యలు పరిష్కారమవుతాయని విపక్ష నేతలు, జిల్లావాసులు కోరుతున్నారు. మరీ ఇప్పటికైనా... సీఎం కేసీఆర్ సారు జిల్లాలో పర్యటిస్తారో..కార్పొరేషన్‌ ఎన్నికలు సమీపించే వరకు ఉంటారో చూడాలి.

15:52 - July 29, 2015

హైదరాబాద్: ఇప్పటికే రహస్యాలను....బట్టబయలు చేశారు. టాప్‌ టూ బాటమ్ స్కాన్ చేసి..ప్రైవసీకి పాతరేశారు. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాశారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు మరో కుట్రకు తెరలేపుతున్నారు. అత్యంత ప్రమాదకర చట్టానికి శ్రీకారం చుడుతున్నారు. డీఎన్‌ఏ సేకరించి...అమాయకులపై బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు వ్యూహం రచిస్తున్నారు. దీంతో సామాన్యుల వైపు మరో వైరస్ వేగంగా దూసుకొస్తోంది.
ప్రభుత్వానికి వంత పాడిన అటార్ని జనరల్....
ఆధార్ పేరుతో పౌరుల ప్రైవసీని ప్రభుత్వాలు తాకట్టుపెట్టాయి. పౌరుల వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాలతో పాటు వేలి, కంటి నమూనాలను కూడా సేకరించాయి. ప్రజల రహస్య వివరాల సేకరణపై గతంలో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. తాజాగా అటార్నిజనరల్ కూడా ప్రభుత్వానికే వంతపాడారు. పౌరుల వ్యక్తిగత గోపత్యకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక హక్కులు లేవని తేల్చిచెప్పారు. ఇది చాలదన్నట్లు మరో వివాదాస్పద పథకానికి ప్రభుత్వం తెరదీస్తోంది.
డీఎన్‌ఏ వివారాల సేకరణ బిల్లు, 2015.....
నిరసనల హోరుతో అస్తవ్యస్తంగా సాగుతున్న పార్లమెంటు సమావేశాల్లో.... ఎవరి కంటా పడకుండా.... చాపకింద నీరులా మరో బిల్లు దూసుకువస్తోంది. అదే మానవ జన్యుక్రమానికి సంబంధించిన డిఎన్‌ఎ వివరాల సేకరణ బిల్లు, 2015 . పౌరుల నుంచి డీఎన్‌ఏ వివరాలను సేకరించి జాతీయస్థాయిలో డీఎన్‌ఏ డేటా బ్యాంకు ఏర్పాటుకు వ్యూహం రచిస్తున్నారు. నేర స్థలాల నుంచి డీఎన్‌ఏ నుంచి సేకరించి,...దాన్ని డేటా బ్యాంకులోని డీఎన్‌ఏలో పోల్చి నేరస్తులను పసిగడతారు.
ఆరోగ్యం, జన్యుపరమైన సంబంధాలు బహిర్గతం.....
ఈ బిల్లు పాసైతే...పౌరుల అత్యంత గోప్యమైన రహస్యాలు సైతం బట్టబయలయ్యే ప్రమాదముంది. డిఎన్‌ఎలో వ్యక్తి ఆరోగ్యం, జన్యుపరమైన సంబంధాలు తేటతెల్లంగా తెలిసిపోతాయి. ఫలితంగా ప్రజల ఉపాధి , బీమా అవకాశాల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అంతేగాక ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయి. కుతంత్రంతో అమాయకులపై నేరాలు మోపే ప్రమాదమంది.
బిల్లుపై నిపుణుల కమిటీ అభ్యంతరం....
ఇప్పటికే బిల్లులోని విషయాలను అధ్యయమనం చేసేందుకు కేంద్రం నిపుణుల కమిటీని నియమించింది. ఐతే బిల్లుపై చట్టాలు, పేదరికం వ్యవహారాల నిపుణురాలు ఉషారామనాథన్, సెంటర్ ఫర్ ఇంర్నెట్ అండ్ సొసైటీ ఎండీ సునీల్ అబ్రహం తీవ్ర అభ్యంతం వ్యక్తం చేశారు. బిల్లులో వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి రక్షణ లేదని, డీఎన్‌ఏ డేటా బ్యాంకుకే సర్వాధికారాలు కట్టబెట్టటం సరికాదని అభిప్రాయపడ్డారు.
డీఎన్‌ఏ తిరుగులేని సాక్ష్యమేమీ కాదు......
ప్రభుత్వం మదిలో ఉన్న ఈబిల్లుపై నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. క్రైం షోలు, మూవీల్లో చూపించినట్లు... నేర నిరూపణలో డీఎన్‌ఏ తిరుగులేని సాక్ష్యమేమీ కాదని స్పష్టం చేస్తున్నారు. అదే డీఎన్‌ఏ క్రమం ఉన్న వేరే వ్యక్తులపై నిందలు పడే ప్రమాదముందని వాపోతున్నారు. దీంతో నేరం చేయని అమాయకులకు సైతం శిక్ష పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

15:47 - July 29, 2015

హైదరాబాద్: పంజాబ్ గురుదాస్‌పూర్‌ జిల్లాలో ఉగ్రవాద దాడులకు బలైన డిటెక్టివ్‌ ఎస్పీ బల్జీత్‌సింగ్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు కపుర్తాలలో నిర్వహించారు. బల్జీత్‌సింగ్‌ కుమారుడు ఆయన చితికి నిప్పు పెట్టారు. ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, మతగురువులు అంతిమయాత్రలో పాల్గొని బల్జీత్‌సింగ్‌కు నివాళులర్పించారు. దేశంకోసం ప్రాణాలర్పించిన బల్జీత్‌సింగ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కాంగ్రెస్‌ అభిప్రాయపడింది. బల్జీత్‌సింగ్ కుమారుడికి ఎస్పీ హోదా కల ఉద్యోగం, ఇద్దరు కుమార్తెలకు తహశీల్దార్‌ ఉద్యోగాలు ఇవ్వాలని మృతుడి భార్య డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. 

15:46 - July 29, 2015

హైదరాబాద్: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అమర్‌నాథ్‌ యాత్రా మార్గంలో దాడికి తెగబడ్డారు. అనంత్‌నాగ్‌-పహల్గాం మార్గంలో భద్రతా సిబ్బందే లక్ష్యంగా గ్రెనేడ్లతో దాడి చేశారు. ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ఇద్దరు పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ముష్కరుల దాడి నేపథ్యంలో అనంత్‌నాగ్‌లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

15:45 - July 29, 2015

హైదరాబాద్:రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేంద్ర వేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హంతకులకు ఉరిశిక్ష వేయాలని కేంద్రం పటిషన్ వేసింది. రాజీవ్‌ హంతకులపై దయచూపొద్దని విన్నవించింది. కేంద్రం పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించింది. దీంతో రాజీవ్‌గాంధీ హంతకులు శంతన్‌, మురుగన్‌, పెరరివళన్‌లకు ఊరట లభించింది. వారికి యావజ్జీవ శిక్షను అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

15:43 - July 29, 2015

ప్రపంచీకరణతో భారత ఆర్ధికవ్యవస్థమాత్రమే కాదు...క్రీడారంగంలో సైతం అనూహ్యమైన మార్పులు చోటు చేసుకొన్నాయి. క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్,.. జాతీయక్రీడ హాకీ, బ్యాడ్మింటన్, ఫుట్ బాల్, వాలీబాల్, టెన్నిస్ లాంటి క్రీడల్లో ప్రొఫెషనల్ లీగ్ లు ఓ వైపు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే... లేటుగా అయినా..లేటెస్టుగా అన్నట్లు...పురాతనక్రీడ కుస్తీలో సైతం...ప్రొఫెషనల్ లీగ్ కు రంగం సిద్ధమయ్యింది.
ఆరు నగరాలకు చెందిన ఫ్రాంచైజీల జట్లతో....
దేశంలోని ఆరు నగరాలకు చెందిన ఫ్రాంచైజీల జట్లతో ఈ లీగ్ ను నవంబర్ 8 నుంచి 29 వరకూ నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 15న కుస్తీ లీగ్ వేలం నిర్వహిస్తారు. వేలం కోసం ఒక్కో ఫ్రాంచైజీకి 3 కోట్ల రూపాయలు కేటాయించారు. ఐదుగురు విదేశీ వస్తాదులతో సహా.. ఒక్కోజట్టులో 11 మంది రెజ్లర్లు ఉండేలా నిబంధనలు రూపొందించారు. మొత్తం 11 మంది వస్తాదుల జట్టులో ఐదుగురు మహిళా రెజ్లర్లు ఉండేలా చర్యలు తీసుకొన్నారు.
మొదటి 60 మంది అత్యుత్తమ ర్యాంక్....
ప్రపంచంలోని మొదటి 60 మంది అత్యుత్తమ ర్యాంక్ మల్లయోధులకు మాత్రమే వేలంలో ప్రాధాన్యమిస్తారు. 21 రోజులపాటు జరిగే ఈ పోటీల్లో 15 లీగ్ మ్యాచ్ లు, రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్స్ ఉంటాయి. భారత స్టార్ రెజ్లర్లు సుషీల్ కుమార్,యోగశ్వర్ దత్, గీతా పోగట్, బబితా కుమారితో సహా ప్రముఖ వస్తాదులంతా లీగ్ లో పాల్గొంటారు. దేశంలోని ఆరు నగరాలలో జరిగే ఈ కుస్తీమే సవాల్ పోటీలు..అభిమానులను ఎంతగా అలరిస్తాయన్నదే ఇక్కడి అసలు పాయింట్.

తెలంగాణ లో గ్రూప్స్ వారీగా పోస్టుల విభజన

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 వేల ఉద్యోగాల భర్తీకి విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూపుల వారీగా ప్రభుత్వం పోస్టులను విభజించింది. గ్రూప్-1 కింద డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవో, ఎంపీడీవో సహా 20 రకాల పోస్టులను చేర్చారు. గ్రూప్ -2 కింద పురపాలక కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ సహా 12 రకాల పోస్టులను చేర్చారు. గ్రూప్ -3 కింద 17 రకాల పోస్టులను చేర్చారు. గ్రూప్-1లో ఆరోపేపర్‌గా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం చేర్చారు. గ్రూప్-1కు 1000 మార్కులు, గ్రూప్-2కు 675 మార్కులు కేటాయించడం జరిగింది. 

అమిత్ సింగ్ ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు..

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొత్తపేట జంట హత్యల కేసులో కీలక నిందితుడు అమిత్‌సింగ్‌ను సైబరాబాద్‌ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. మంగళవారం అమిత్ సింగ్‌ను రాజస్థాన్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిరాతకంగా చంపిన అమిత్‌కు కఠిన శిక్ష వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తాలిబన్ నేత ముల్లా మహ్మద్ ఒమర్ హతం...

హైదరాబాద్: ఆఫ్ఘాన్ తాలిబన్ నాయకుడు ముల్లా మహ్మద్ ఒమర్ హతమయ్యాడు. ఈ విషయాన్ని అఫ్ఘానిస్థాన్ అధికారవర్గాలు తెలిపాయి. అయితే, దీని గురించి తాలిబన్ వర్గాలు మాత్రం ఏమీ వ్యాఖ్యానించలేదు. అయితే.. ఒమర్ రెండు మూడేళ్ల క్రితమే చనిపోయాడని అఫ్ఘాన్ ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి.

ముగిసిన పీఏసీ సమావేశం...

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో పీఏసీ సమావేశం ముగిసింది. ఈ సందర్బంగా ఆగస్టు 5వతేదీన హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఆస్పత్రిని పరిశీలించాలని నిర్ణయించారు. అలాగే ఖైదీలకు ప్రత్యేక వార్డు కోసం రూ. 1.50 కోట్లు కేటాయించి ఏడు సంవత్సరాలు పూర్తవతున్నా నేటికీ నిర్మాణం చేపట్టకపోవడంతో పీఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రవాదుల దాడి...

హైదరాబాద్:అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తులపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. బుధవారం అనంతనాగ్‌ - పహల్గాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు, మరో ఇద్దరు సాధారణ పౌరులు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేసినట్లుగా సమాచారం. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

రామేశ్వరం సమీపంలోని మంటపంలో కలాం పార్థివ దేహం

హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివ దేహం తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలోని మంటపంలో ఉంచారు. మంటపంలో కలాం పార్థివ దేహానికి త్రివిధదళాధిపతులు గౌరవ వందంనం సమర్పించారు. అనంతరం రామేశ్వరంలోని బస్టాండ్ వద్ద మైదానంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కలాం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు.

రోగుల తరలింపు ప్రక్రియ ప్రారంభం...

హైదరాబాద్:ఉస్మానియా ఆసుపత్రి తరలింపులో భాగంగా బుధవారం 24 మంది ఆర్థో రోగులను కింగ్‌కోఠిలోని ప్రసూతి ఆసుపత్రికి తరలించారు. శిథిలావస్థకు చేరిన ఉస్మానియా భవనాలను తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

 

14:58 - July 29, 2015

హైదరాబాద్ : పిల్లలు అనేక విధాలుగా దాడులు జరుగుతున్నాయి. వీరికి సంబంధించి ఎలాంటి చట్టాలు వున్నాయి. రాజ్యాంగాలు కల్పించిన చట్టాలు ఏమిటి? వీటిని అమలు పరిచే రైట్ మాత్రం విద్యాశాఖ అధికారులకు మాత్రమే వుంటుందా? అనే అంశాలను మై రైట్ ప్రొగ్రాంలో న్యాయవాది పార్వతి గారు వివరించారు. ఆ వివరాలను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

ఆ క్రికెటర్లపై నిషేధాన్ని తొలగించం:బీసీసీఐ

న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిర్దోషులుగా బయటపడిన క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్ పునరాగమన ఆశలపై బీసీసీఐ నీళ్ల చల్లింది. వీరిపై అమల్లో ఉన్న నిషేధాన్ని తొలగించబోమని బోర్డు స్పష్టం చేసింది. ఈ విషయంలో రెండో ఆలోచనే లేదని వెల్లడించింది.

14:38 - July 29, 2015

హైదరాబాద్: రోగులకు ఆపరేషన్ చేయాల్సిన ఆస్పత్రులు...రోగుల కంటే ముందే పడకేశాయి. ఇప్పుడు వాటికే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అనారోగ్యం రోగులకు కాదు ప్రభుత్వ ఆస్పత్రులకే పట్టింది. నగరంలోని చాలా ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు లేక సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మందులను భద్ర పరచడానికి కూడా రిఫ్రిజిరేటర్లు లేవు. దీంతో టీకాలు, ఔషదాలు ఏరోజుకారోజు మాత్రమే ఉపయోగించాల్సి వస్తోంది. ఎక్కువ మంది రోగులు వస్తే వారిని వెనక్కి పంపాల్సిన అవసరం ఏర్పడుతోంది.
నగరంలో మొత్తం 85 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు.....
నగరంలో మొత్తం 85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో అనేక భవనాలు శిథిలావాస్తకు చెరుకున్నాయి. ఎప్పుడు ఏ భవనం కూలుతుందో తెలియని పరిస్థితి. వైద్యశాఖ అధికారులు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారో ఎప్పుడు ఉండరో తెలియడం లేదు. నగరంలో ఉన్న ఆరోగ్య కేంద్రాలు కొన్ని శిథిలావాస్తకు చేరుకున్నాయి. వర్షం పడిందంటే చాలు వరద నీరు లోపలికి వస్తుంది. దీంతో..మందులు, ఇతర సామగ్రిని దాచడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది కొరత....
​గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. 17 కేంద్రాల్లో డాక్టర్లు లేరు. మరో కేంద్రంలో ఉన్న డాక్టర్ ఇన్‌ఛార్జీగా వ్యవహారిస్తున్నారు. 145 నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ల్యాబ్ టెక్నిషియన్స్ 16, సీనియర్, జూనియర్ అసిస్టెన్స్‌ కలిపి 17 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఆయాలు, స్వీపర్స్, చౌకీదార్లు కలిపి 60 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికైనా....ఉన్నతాధికారులు స్పందించి అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో కనీస సదుపాయాలు కల్పించాలని ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నేతలు కోరుతున్నారు. అలాగే సిబ్బంది కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

14:35 - July 29, 2015

అనంతపురం: బ్యాంకు పంపిన వేలం పాట నోటీసుకు మరో రైతు గుండె చెదిరింది. అప్పుల బాధలు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ రైతు. అనంతపురం జిల్లా యర్రగుంట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి తనకున్న ఐదు ఎకరాల పొలంలో అప్పు చేసి పది బోర్లు వేశాడు. అప్పులు తీరకపోగా వడ్డి మరింత రెట్టింపయింది. దీనికి తోడు బ్యాంకులో ఉన్న బంగారాన్ని వేలం వేస్తామని అధికారులు నోటీసులు పంపడంతో మనస్తాపానికి గురైన నారాయణరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం అపస్మారకస్థితిలో ఉన్న రైతు నారాయణరెడ్డికి అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సఅందిస్తారు.

14:30 - July 29, 2015

హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్మికురాలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గాంధీనగర్‌ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా ఉన్న టి.లక్ష్మమ్మ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగం నుంచి ప్రభుత్వం తొలగించినందుకు లక్ష్మమ్మ తీవ్ర మనస్తాపం చెందిందని కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపారు.

ప్రత్యూషను సీఎం కేసీఆర్ నివాసానికి తరలించండి...

హైదరాబాద్ : సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడిన ప్రత్యూష గ్లోబల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి.. నేరుగా ప్రత్యూషను హైకోర్టుకు తరలించారు పోలీసులు. ప్రత్యూషను న్యాయస్థానం ఎదుట పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ప్రత్యూషతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 25 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రత్యూషకు అండగా ఉంటానన్న సీఎం కేసీఆర్‌ను ప్రధాన న్యాయమూర్తి అభినందించారు. ప్రత్యూషను సీఎం కేసీఆర్ నివాసానికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ నివాసానికి ప్రత్యూష వెళ్లనుంది. 

తూ.గో జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం...

తూర్పు గోదావరి:జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన డొంకరాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం భారీ డంప్ బయటపడింది. అటవీప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న యాంటీ నక్సల్ స్క్వాడ్ దళాలకు డంప్ లభ్యమైనట్లు సమాచారం. అందులో పేలుడు పదార్ధాల తయారీలో వాడే అమోనియం నైట్రేట్, రాకెట్ లాంచర్ల తయారీలో వాడే సామగ్రి పెద్ద ఎత్తున ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డంప్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాకినాడ హెడ్‌క్వార్టర్‌కు తరలించనట్టు తెలుస్తోంది

గొప్ప మానవతామూర్తి అబ్దుల్ కలాం:ఒబామా

హైదరాబాద్ :మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం తెలియచేశారు. కోట్లాది మంది భారతీయులతో పాటు ప్రపంచంలో ఎంతో మందికి అబ్దుల్ కలాం స్ఫూర్తి నింపారని ఆయన అన్నారు. అమెరికా ప్రజల తరపున భారతీయులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. అమెరికా- భారత్‌ల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి కలాం చేసిన కృషిని ఒబామా ప్రశంసించారు. ప్రజా సేవ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతామూర్తి అబ్దుల్ కలాం అని ఒబామా అన్నారు. అందుకే ఆయన ప్రజా రాష్ట్రపతిగా  పేరుపోందారన్నారు.

రైల్వే గేటును ఢీ కొన్న ఆర్టీసీ బస్సు

మహబూబ్‌నగర్:దేవరకద్ర వద్ద రైల్వేగేటును వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జాతీయ దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

జీహెచ్ ఎంసీలో కార్మికురాలి ఆత్మహత్యాయత్నం...

హైదరాబాద్: రాజేంద్రనగర్‌ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ ఆఫీసు ఎదుట విషయం తాగి పారిశుధ్య కార్మికురాలు లక్ష్మమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. విధుల నుంచి తొలగించారనే మనస్థాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. డిమాండ్లను పరిష్కరించాలంటూ 12 రోజులు మున్సిపల్‌ కార్మికులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ సమ్మెలో పాల్గొన్న చాలా మందిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు తెలంగాణ ప్రభత్వం సుమారు 2000 మందిని తొలగించిన విషయం తెలిసిందే..

13:30 - July 29, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చిత్రంపటం తొలగించడంపై స్పీకర్ కోడెల శివప్రసాద్ కు రాజ్యసభ ఎంపీ కేవీపీ లేఖ రాశారు. స్పీకర్ అనుమతి లేకుండా సభా ప్రాంగణంలో చిత్రపటాన్ని ఎవరూ తాకలేరని, ప్రభుత్వాలు మారినా ఫొటోలు, విగ్రహాలు తొలగించడం మంచి పద్ధతి కాదని తెలిపారు. మంత్రిగా, ఎంపీగా, సీఎంగా వైఎస్ ఎనలేని సేవలు చేశారని, ఆయన చిత్రపటాన్ని యథాస్థానంలో ఉంచే విధంగా అధికారులను ఆదేశించాలని కేవీపీ లేఖలో కోరారు. 

దంపతుల ఆత్మహత్య..

రంగారెడ్డి : పూడు మండలం ఉమంతాల్ లో విషాదం చోటు చేసుకుంది. తిరుపతయ్య, రమాదేవి దంపతుల మధ్య గొడవ జరిగింది. వేర్వేరు బావులో పడి వారు ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

 

అట్లాంటలో ప్రకాశం వాసి మృతి..

అమెరికా : అట్లాంట నదిలో ఈతకు వెళ్లి ప్రకాశం జిల్లా యువకుడు మృతి చెందాడు. మృతుడు ప్రకాశం జిల్లాలోని పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంనకు చెందిన వాడు. అమెరికాలో సాఫ్ట్ వేర్ సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్నాడు. రెండు రోజులు ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. 

13:16 - July 29, 2015

గుంటూరు : జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఆర్క్ విద్యార్థిని రితికేశ్వరి ఆత్మహత్యపై ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ విచారణను ప్రారంభించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రమణ్యం నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ కొద్దిసేపటి క్రితం వర్సిటీకి చేరుకుంది. మూడు రోజుల పాటు వర్సిటీలోనే ఉండి విచారణనను కొనసాగించనున్నారు. అధికారులు, పోలీసు సిబ్బందిని విచారిస్తున్నారు. ప్రస్తుతం అర్బన్ ఎస్పీ త్రిపాఠితో కమిటీ భేటీ అయ్యింది. భేటీ అయ్యారు. కానీ విచారణ జరుగుతున్న ప్రాంతం వద్దకు మీడియాను, విద్యార్థి సంఘం నేతలను అనుమతించడం లేదు. వీరిని ప్రయివేటు సెక్యూర్టీ ప్రధాన ద్వారం వద్దే నిలువరించారు. దీనితో సెక్యూర్టీ వారితో విద్యార్థి సంఘ నేతలు వాదించారు. తమ వాదనలు వినిపిస్తామని సంఘం నేతలు పేర్కొంటున్నారు.

12:53 - July 29, 2015

వరంగల్ : తొలి తెలంగాణ సర్కారులో డిప్యూటీ సీఎం ఆయన. ఆయన అధికారాన్ని వివాదాలు దూరం చేశాయి. ఆ తర్వాత ఏకాంత రాజకీయ జీవితాన్ని గడపుతున్న మాజీ మంత్రి.. మళ్లీ తెరపైకి వచ్చారు. ఓరుగల్లు ఉపపోరు బరిలో దిగేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం చక్కర్లు కొడుతున్నాయి.
రంగం సిద్ధం చేసుకుంటున్న అధికార పార్టీ..
వరంగల్ ఉప ఎన్నికల బరిలో దిగేందుకు ఓవైపు అధికార పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు.. విపక్షాలు అన్ని అస్త్రాలతోను.. వ్యూహప్రతివ్యూహాలతోను సమాయత్తమవుతున్నారు. ఇపుడు ఉపపోరు కోటలో రాజయ్యపై వస్తున్న తాజా వివాదం మరింత వేడెక్కిస్తున్నాయి. వరంగల్ పార్లమెంట్ బరిలో దిగేందుకు రాజయ్య ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం అధికార పార్టీలో హాట్ టాపిక్ మారింది. కాంగ్రెస్‌ తరపున రాజయ్య పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
తీవ్ర నిరాశలో రాజయ్య ?
వివాదాలతో రాజయ్య ఉప ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారు. ఇదే సమయంలో.. పార్టీలోను ప్రాధాన్యత తగ్గిందని రాజయ్య తీవ్ర నిరాశలో ఉన్నట్లు సమాచారం. పదవి కోల్పోయిన నాటి నుంచి ఎక్కువగా సొంత నియోజకవర్గంలోనే గడుపుతున్న రాజయ్య.. త్వరలో గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. అయితే దీనిని రాజయ్య ఖండించారు. కొంతమంది కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాను టీఆర్ఎస్‌ పార్టీలోనే కొనసాగుతానని వివరణ ఇచ్చుకున్నారు.
రాజయ్యకు కాంగ్రెస్ గాలం..
ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌ జోరుగా ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం ఊపందుకున్నాయి. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి రాజయ్యను దింపేందుకు పీసీసీ వర్గాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయని రాష్ట్ర రాజకీయాల్లో గుప్పుమంటున్నాయి. ఇందులో వాస్తవం ఎంతనేది పక్కనబెడితే.. పదవిలో ఉన్నప్పుడు వివాదాల్లో ఇరుకున్న రాజయ్యకు.. పదవి కోల్పోయినా.. వివాదాలు మాత్రం వీడటం లేదనేది సుస్పష్టం. 

12:47 - July 29, 2015

పశ్చిమగోదావరి : భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎక్కడా ఉండాలో ప్రభుత్వం టాస్ వేస్తోంది. బొమ్మ పడితే ఒక మంత్రి గెలుస్తాడు. బొరుసు పడితే మరో మంత్రి గెలుస్తాడు. కాని ఏది పడినా ఓడిపోయేది మాత్రం రైతులే. ట్రాఫిక్‌ని బట్టో.. వాతావరణాన్నో బట్టో ఎయిర్‌పోర్ట్ కట్టే ప్రాంతాన్ని నిర్ణయించటం లేదు. అమాత్యుల అభ్యంతరాలకు సర్కార్‌ గుండె స్పందిస్తుంది కాని అన్నదాతల ఆక్రందనను వినలేని, కనలేని బధిరుడిలా వ్యవహరిస్తోంది బాబు ప్రభుత్వం.

ఎయిర్‌పోర్టుపై ఇద్దరు మంత్రుల మధ్య రగడ..
ఏ ప్రాజెక్ట్‌ అయినా సరే.. ఎక్కడ అవసరమనేది ముఖ్యం కాదు. ఎక్కడ కడితే తాము బాగుపడతామనేదే ప్రభుత్వాధినేతల ఆలోచిస్తారనేది భోగాపురం ఎయిర్‌పోర్టు వ్యవహారంలో మరోసారి క్లారిటీ వచ్చేస్తోంది. మ్యాప్‌ తీసుకుని పెద్దలు తమకు నచ్చిన చోట చుక్క పెడితే అక్కడే ప్రాజెక్ట్ అన్నట్లు అయిపోయింది పరిస్ధితి. అక్కడ రైతులున్నారా.. ప్రజలున్నారా ? పచ్చటి పొలాలున్నాయా ? ఎంత మంది బతుకులు అక్కడ ముడిపడిపున్నాయి ఇవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కట్టొద్దని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా ఏ మాత్రం చలించని ప్రభుత్వం.. ఇద్దరు మంత్రుల మధ్య గొడవ రేగటంతో .. ప్లేస్‌ మార్చాలని చూస్తోంది.

ఎయిర్‌పోర్టుకు 1ఏ, 2ఏ ప్రాంతాల పరిశీలన..
గంటా, అయ్యన్నపాత్రుడు ఇద్దరూ టీడీపీ మంత్రులే. అయినా మొదటి నుంచి వీరిద్దరి మధ్య గొడవలే. పైకి చిరునవ్వులు చిందించుకున్నా.. లోపల మాత్రం ఆగ్రహావేశాలు రేగుతూనే ఉంటాయి. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టు ఇద్దరి మధ్య గొడవకి ఆజ్యం పోస్తోంది. నిపుణుల కమిటీ ఎయిర్‌పోర్టుకు గాలి ఎంత వేగంగా వీస్తుందనే ప్రాతిపదికన రెండు ప్రాంతాలను సూచించింది. 1ఏ, 2ఏ అనేవి ఈ రెండు ప్రాంతాలు. 2ఏ నే బెటరని కమిటీ చెప్పింది. స్థానికుల ఆందోళన చేస్తున్నారని అక్కడి నుంచి మార్చాలని గంటా ప్రభుత్వానికి విన్నవించారు. అందుకే 1ఏ కి మార్చమన్నారట. అయితే రైతుల ఆందోళనను చూసి కాకుండా 1 ఏలో అయ్యన్నపాత్రుడికి చెందిన గోల్ఫ్‌కోర్ట్, రిసార్ట్స్ తదితర ఆస్తులున్నందుకేనని సమాచారం.

1ఏ నుంచి 2ఏకి మార్పించే పనిలో అయ్యన్నపాత్రుడు..
చంద్రబాబు సైతం కలెక్టర్‌ని పిలిచి 2ఏ బదులు 1 ఏలో ప్రొసీడ్‌ కావాలని చెప్పారని సమాచారం. అయితే 1ఏలో కూడా స్థానికులు ఆందోళన మొదలెట్టారు. ఇప్పుడు ఏరియా మార్చే పనిలో అయ్యన్నపాత్రుడు పడ్డారు. దీంతో భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణకు రెడీ అయిన సమయంలో ప్రభుత్వం సందిగ్ధంలో పడిపోయింది.

ఏ ప్రాంతమైనా నష్టపోయేది రైతులే..
1ఏ అయినా 2 ఏ అయినా నష్టపోయేది మాత్రం రైతులే అన్నది వాస్తవం. కాస్త అటు ఇటూగా నిర్వాసితులు అయ్యేవారు కూడా ఎక్కువే. కాని అక్కడ బెటర్‌ ఇక్కడ బెటర్‌ అంటూ మంత్రివర్యులు ఇద్దరూ తమకు అనుకూలంగా వార్తలు రాయించుకుంటున్నట్లు టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం సాంకేతికంగా చూసుకుంటూనే.. ప్రజలకు తక్కువ నష్టం జరిగే ప్రాంతాన్ని ఎంచుకోవాలని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

12:40 - July 29, 2015

తిరుపతి : చిక్కడు-దొరకడుగా మారి పోలీసులకు ముప్పతిప్పలు పెట్టిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ ఎట్టకేలకు దొరికాడు. తప్పించుకు తిరుగుతూ.. సవాల్‌గా మారిన కందస్వామి వెంకటేష్‌ను రేణిగుంట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దుబాయ్‌ వెళ్తుండగా అతడిని చెన్నైలో పట్టుకున్నారు. గంగిరెడ్డి, సాహుల్‌కు ప్రధాన అనుచరుడుగా ఉన్న కందస్వామిపై చిత్తూరు, కడప జిల్లాల్లో 16కు పైగా కేసుల నమోదై ఉన్నాయి.

12:30 - July 29, 2015

హైదరాబాద్ : సవతి తల్లి హింసను భరించలేక చావు దగ్గరకు వెళ్లి వచ్చిన ప్రత్యూష కొలుకొంది. ఆమెను వైద్యులు డిశ్చార్జీ చేశారు. హైకోర్టు ఆదేశాలతో ప్రత్యూషను కోర్టుకు తీసుకెళ్లారు. ప్రత్యూష స్థితిపై చలించిన న్యాయస్థానం యువతితో స్వయంగా మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రత్యేక ఛాంబర్ లో ప్రత్యూషతో మాట్లాడనున్నారు. ప్రత్యూషతో మాట్లాడిన అనంతరం బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే దానిపై ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికే ఓ స్వచ్చంద సంస్థ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వమే ప్రత్యూష బాధ్యత తీసుకుంటుందని సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి విదితమే. సీఎం కేసీఆర్ దంపతులు స్వయంగా ప్రత్యూషను పరామర్శించారు.
చిత్ర హింసలు...
ప్రత్యూష తల్లి చాముండేశ్వరీ శ్యామల, తండ్రి రమేష్ లు నానా రకాలుగా హింసించారు. నోట్లో ఫినాయిల్ పోసి తాగమని చెప్పడం, ముఖం పై యాసిడ్ పోయడం, తాము తినగా మిగిలిన అన్నం రెండో రోజు తినాలని వేధించడం ప్రత్యూష సవతి తల్లి శ్యామల చేసేది. చెప్పింది చేయక పోతే రాడ్ తో కాళ్లు విరగకొట్టడం, బంధువులు వస్తే గదిలో బంధించి లేదని చెప్పడం వంటి విషయాలను హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. అందుకే ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తోంది. ఇప్పటికే సవతి తల్లి శ్యామల, తండ్రి రమేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూషకు తండ్రి వేతనంలో కొంత భాగం కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యూష సంరక్షణపై హైకోర్టు దృష్టి సారించింది. కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందో కొద్దిసేపట్లో తేలనుంది. 

మెడికల్ కౌన్సెలింగ్ ను పరిశీలించిన కామినేని..

విజయవాడ : ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంలో మెడికల్ కౌన్సెలింగ్ ను మంత్రి కామినేని పరిశీలించారు. పరిస్థితులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 

రితికేశ్వరి మృతిపై విచారణ ప్రారంభం..

గుంటూరు : నాగార్జున వర్సిటీలో జరిగిన విద్యార్థిని రిషితేశ్వరీ మృతిపై నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు నియమితమైన బాలసుబ్రమణ్యం కమిటీ విచారణను చేపట్టింది. కమిటీ మూడు రోజుల పాటు వర్సిటీలోనే ఉండి అధికారులు, సిబ్బంది, పోలీసులను విచారించనుంది. విద్యార్థులతో రేపు బహిరంగ విచారణ చేయనుంది. ఐదు రోజుల్లోగా ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇదిలా ఉంటే వర్సిటీ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. విద్యార్థులను లోనికి అనుమతించలేదు. 

డిశ్చార్జి అయిన ప్రత్యూష..

హైదరాబాద్ : అవేర్ గ్లోబర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష డిశ్చార్జీ అయ్యింది. ప్రత్యూషను హైకోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. 

రామన్ మెగససే అవార్డుల ప్రకటన..

న్యూఢిల్లీ : ఈ సంవత్సరపు రామన్ మెగససే అవార్డులను ప్రకటించారు. భారత్ నుండి ఇద్దరు వ్యక్తులు అవార్డులు పొందిన వారిలో ఉన్నారు. సంజీవ్ చతుర్వేది, అన్షు గుప్తాలకు, కొమ్మాలి చంతావాంగ్ (లావోస్), లిగయా ఫెర్నాండో (ఫిలిప్పీన్స్), క్యాప్ తూ (మయన్మార్)లను ఎంపిక చేసింది. 

ముత్తప్ప రాయ్ తనయుడు నటించడం లేదు - వర్మ..

ముంబై : ముత్తప్ప రాయ్ తనయుడు 'అప్పా'లో నటించడం లేదంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఇంకా పాత్రధారులు ఖరారు కాలేదని, స్రిప్ట్ పనులు ఇంకా కొనసాగుతున్నాయని ట్వీట్ చేశారు. ఒక‌ప్పుడు అండ‌ర్‌వాల్డ్ డాన్‌గా ఇప్పుడు పారిశ్రామిక‌వేత్తగా, ప్రజాటీవి ప్రారంభించడం ద్వారా మీడియా బిజినెస్ లో సెటిలైన ముత్త‌ప్ప రాయ్ క‌థ‌ని సినిమా తీయ‌బోతున్నాడ‌ని టాక్.
11:27 - July 29, 2015

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో వామపక్షాలు భూ పోరాటాన్ని ఉధృతం చేశాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలంలో సీపీఐ భూ పోరాటం చేపట్టింది. చిర్లవంచలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ట్రాక్టర్ తో భూమిని దున్ని భూ పోరాటాన్ని ప్రారంభించారు. అంతకుముందు మండలం కేంద్రంలో నేతలు, కార్యకర్తలు మహా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి టెన్ టివితో మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ దొరల పాలన కొనసాగిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. పేదలకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ ఏడాది గడిచినా దానిని అమలు చేయడం లేదని విమర్శించారు. నిరుపేదలకు భూములు పంచాలని, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలని చాడ డిమాండ్ చేశారు. 

11:19 - July 29, 2015

హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న రోగులను తరలించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మధ్యాహ్నా సమయంలో రోగులను ఇతర ఆసుపత్రులకు షిఫ్ట్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఉస్మానియాలో ఓపీ విభాగం కొనసాగుతుందని పర్యవేక్షక కమిటీ చైర్మన్ వెల్లడించారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. శిథిలావస్థకు చేరుకోవడంతో సీఎం కేసీఆర్ ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నాలుగు డిపార్ట్ మెంట్ లకు చెందిన ఇన్ పేషెంట్ కు చెందిన రోగులను షిఫ్ట్ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. కానీ ప్రజల్లో కొన్ని సందేహాలు నెలకొన్నాయని ఉస్మానియాను తరలించడం లేదని స్పష్టం చేశారు. ప్రతి రోజు ఉస్మానియాలోనే ఓపి కొనసాగుతుందని రోగులను పరీక్షించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకవేళ ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తే ఇతర ఆసుపత్రికి తరలిస్తామన్నారు.
నాలుగైదు రోజులు..
కింగ్‌కోఠీ దవాఖానలోకి ఉస్మానియా అర్థోపెడిక్స్ పేషంట్లను, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ హాస్పిటల్ పేషెంట్లను పేట్లబుర్జు మెటర్నిటీ వైద్యశాలకు తరలించాలని నిర్ణయించారు. పేట్లబుర్జు దవాఖానలో రెండు ఫ్లోర్లు ఖాళీగా ఉండగా సుల్తాన్‌బజార్ పేషెంట్లను మార్చునున్నారు. దీంతో సుల్తాన్‌బజార్ దవాఖాన ఖాళీ అవుతుంది. ఇందులోకి ఉస్మానియా జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, మెడికల్ గ్రాస్ట్రోఎంట్రాలజీ విభాగాలను పూర్తిగా తరలించనున్నారు. బుధవారం పేషెంట్ల తరలింపు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

10:59 - July 29, 2015

ఢిల్లీ : ప్రపంచ ఆర్చరీ ఫైనల్ కు దీపికా బృందం చేరుకుంది. రియో ఒలింపిక్స్ లో భారత మహిళలు అదరగొట్టారు. మహిళల రికవరీ విభాగంలో దీపికా బృందం అడుగు పెట్టింది. ఫ్రీ క్వార్టర్స్ పోరులో 5-3 తేడాతో జర్మనీపై విజయం సాధించింది. ఓదశలో 1-3 తేడాతో వెనక్కి పడిన భారత్ బృందం పుంజుకుని ఆడింది. ఇదే క్రమంలో రియో ఒలింపిక్స్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఆదివారం నాడు జరిగే ఫైనల్ పోరులో రష్యాతో భారత్ ఢీకొననుంది. 

పోలీసులు - మావోయిస్టుల మధ్య కాల్పులు..

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లా కోయిలిబెడ వద్ద పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు గాయపడినట్లు తెలుస్తోంది. 

మెమన్ విచారణ ప్రారంభం..

ఢిల్లీ : మెమన్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఉరిశిక్షపై స్టే విధించాలని మెమన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

సచివాలయంలో టిడిపి నేతలతో సీఎం బాబు భేటీ..

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నాం 2గంటలకు తెలంగాణ టిడిపి నేతలతో సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.

 

10:49 - July 29, 2015

ఢిల్లీ : సాంకేతికరంగంలో మరో విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ బాట పట్టిన కొత్త తరానికి మైక్రో సాప్ట్ సరికొత్త సాఫ్ట్ వేర్ ను ప్రవేశ పెట్టింది. మార్కెట్ లో సరికొత్త సాఫ్ట్ వేర్ 'విండోస్ -10'ను విడుదల చేసింది. ఫోన్లు, గేమ్స్, హాలో గ్రాఫిక్, హెడ్ సెట్టింగ్ లలో వినియోగించేలా విండోస్ 10ను రూపొందించారు. విండోస్ 10 అప్ గ్రేడ్ కోసం నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుందని మైక్రో సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నారు. విడుదలైన రోజే సుమారు 50 లక్షల మంది నమోదు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో కోట్ల మంది వినియోగదారులు ఉచితంగా ఈ ఓఎస్ ను డౌన్ లోడ్ చేసుకుంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో విండోస్ 10ను ఉచితంగా ఇచ్చే అవకాశం ఉన్నట్లు, రాబోయే రోజుల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేస్తామన్నారు. వంద కోట్ల కంప్యూటర్ లలో తమ విండోస్ 10 ఉండాలనే లక్ష్యమని తెలిపారు. 

10:40 - July 29, 2015

గుజరాత్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్థమైంది. ఈ భారీ వర్షాల కారణంగా 27 మంది మృత్యువాత పడ్డారు. అహ్మదాబాద్ తో సహా ఇతర నగరాల రోడ్లను భారీగా వరద నీరు ముంచెత్తింది. దీనితో వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ఉత్తర గుజరాత్ లోని నాలుగు జిల్లాలు ప్రధానంగా దెబ్బ తిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనాలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. 

లోక్ సభ స్పీకర్ అధ్యక్షతనలో రేపు అఖిలపక్ష సమావేశం..

ఢిల్లీ : లోక్ సభ స్పీకర్ అధ్యక్షతన గురువారం అఖిలపక్ష సమావేశం జరుగనుంది. పార్లమెంట్ సమావేశాల సక్రమ నిర్వాహణపై చర్చ జరుగనుంది.

 

ఇబ్బందులు లేకుండా రోగులను తరలిస్తాం - సూపరింటెండెంట్..

హైదరాబాద్ : ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగులను తరలిస్తామని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘురాం పేర్కొన్నారు. తరలింపుపై రోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, నేడు ఆర్థో పెడిక్ రోగులను కింగ్ కోఠి ఆసుపత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రిలోనే ఓపీ సేవలు కొనసాగుతాయని రఘురాం తెలిపారు. 

కలాం అంత్యక్రియలు జయలలిత గైర్హాజర్..

తమిళనాడు : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం అంత్యక్రియలు రామేశ్వరంలో గురువారం జరుగనున్నాయి. ఈ అంత్యక్రియలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత హాజరు కావడం లేదు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, తన తరపున పన్నీర్ సెల్వం సహా ఇతర మంత్రులు హాజరవుతారని జయ పేర్కొన్నారు. 

10:22 - July 29, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2015-16 వైద్య విద్య సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సహకారంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ నిర్వహణకు నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 85 శాతం సీట్లను స్థానికులతో, 15 శాతం సీట్లను అన్‌రిజర్వడ్ కోటాలో భర్తీ చేయనున్నారు. జెన్టీయూ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్ఎఫ్ఐఎ, ఏబీవీపీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కౌన్సెలింగ్ ప్రక్రియను అడ్డుకొనేందుకు యత్నం చేశాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి సంఘం నేతలను అడ్డుకున్నారు. తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మెడికల్ ఫీజులు తగ్గించాల్సిందే..
ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు టెన్ టివితో మాట్లాడారు. రాష్ట్రంలో పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు మెడికల్‌ విద్యకు దూరమయ్యే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఫీజులు పెంచుతూ గతంకంటే 10 శాతం బి కేటగిరీ సీట్లనూ యాజమాన్య కోటా కింద మారుస్తూ ఉత్తర్వులిచ్చిందని తెలిపారు. ఎ కేటగిరీ సీట్లకు రూ.60 వేలు అలాగే ఉంచి సి1 కేటగిరీకి రూ.9 లక్షలు, సి2 కేటగిరీకి రూ.11 లక్షల చొప్పున ఫీజులు పెంచుతూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని పేర్కొన్నారు. బి కేటగిరీ సీట్ల ఫీజులను రూ.2.40 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పేదొకమాట, చేసేదొకతీరుగా కనబడుతోందని తెలిపారు. పేదలకు ఉన్నత విద్యనందిస్తామన్న ప్రభుత్వం వారిని ఉన్నత విద్యకు తెచ్చే విధానాలు అవలంబించడం లేదని పేర్కొన్నారు. పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని వారు డిమాండ్‌ చేశారు.

మృతి చెందిన ఎస్పీ కుటుంబాన్ని పరామర్శించిన బాదల్..

పంజాబ్ : రాష్ట్రంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన ఎస్పీ బల్జీత్ సింగ్ కుటుంబసభ్యులను సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ పరామర్శించారు. 

ఆగస్టు 1న ప్రజాశక్తి 35వ ఏడాది వేడుకలు..

విజయవాడ : ఆగస్టు 1వ తేదీన ప్రజాశక్తి 35వ ఏడాది వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం 5.30గంటలకు వర్తమాన పరిస్థితులపై మీడియా సదస్సు జరుగనుంది. బెంజి సర్కిల్ లోని వేదిక ఫంక్షన్ హాల్ లో ఈ సదస్సు ఏర్పాటు చేయనున్నారు. పీపుల్స్ డెమోక్రసీ సంపాదకుడు ప్రకాశ్ కరత్, నవ తెలంగాణ సంపాదకుడు ఎస్. వీరయ్య, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే. రామచంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే.శ్రీనివాస్, విశాలాంధ్ర సంపాదకవర్గ ఛైర్మన్ష ఈడ్పుగంటి నాగేశ్వరరావు, విశాలాంధ్ర పూర్వ సంపాదకులు రాఘవాచారి, ప్రజాశక్తి దినపత్రిక పూర్వ సంపాదకులు తెలకపల్లి రవి, ప్రజాశక్తి సాహితీ సంస్థ ఛైర్మన్ వి.కృష్ణయ్య ప్రసంగించనున్నారు. 

తెలంగాణలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మెడికల్ ఫీజులు తగ్గించాలంటూ జేఎన్టీయూ వద్ద ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ ధర్నాలు నిర్వహించాయి. కౌన్సెలింగ్ ను అడ్డుకొనేందుకు యత్నించడంతో సంఘాల నేతలను పోలీసులు నిలువరించారు. దీనితో ఇరువర్గా మధ్య తోపులాట చోటు చేసుకుంది. 

పేదల జీవన ప్రమాణాల పెంపుదలకు త్రిపుర సర్కార్ పథకాలు..

త్రిపుర : రాష్ట్రంలోని సామాన్యుల సేవలో వామపక్ష ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. పేదల జీవన ప్రమాణాల పెంపుదలకు కొత్తగా మూడు ప్రారంభించింది. ఇంటి పనివారికి ఫించన్ పథకం ప్రారంభించారు. నెలకు రూ.350 చొప్పున అందచేయనున్నారు. హిజ్రాలు, ఎయిడ్స్, కుష్టు రోగులకు రూ.500 చొప్పున అందచేయనుంది. అలాగే అంగన్ వాడీ కార్యకర్తలకు నెలకు రూ.500 సహాయకులకు రూ.350 అందచేయనుంది. త్రిపురలో మొత్తం 20 రకాల ఫించను పథకాల అమలు కానున్నాయి. 

థానే భవంతి కూలిన ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య..

మహారాష్ట్ర : థానేలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

09:31 - July 29, 2015

జార్ఖండ్ : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం హఠాన్మరణం తనను శోక సంద్రంలో ముంచివేసిందని మంత్రి నీరా యాదవ్ తెలిపారు. కలాం లాంటి మేధావిని కోల్పోవడం భారత్ కు తీరని లోటని పేర్కొన్నారు. వారం క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో కలాం చిత్రపటానికి మంత్రి నీరా యాదవ్ దండు..తిలకం దిద్దడంపై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. 

09:28 - July 29, 2015

గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరీ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై యూనివర్సిటీ కమిటీ తుది నివేదికను వైస్ ఛాన్స్ లర్ కు అందచేసింది. ఈ రిపోర్టులో ఏముంది అన్న దానిపై అటు విద్యార్థులు..ఇటు అధ్యాపకుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వర్సిటీకి ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ రానుండడంతో మరింత టెన్షన్ నెలకొంది. వైస్ ఛాన్స్ లర్ తన దగ్గరున్న నివేదికను యథాతథంగా నిజనిర్ధారణ కమిటీకి అందచేయనున్నట్లు తెలుస్తోంది. విచారణ కమిటీ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు విచారించనుంది. నివేదికలో వివరాలు బహిర్గతం చేస్తే దాని ప్రభావం కమిటీపై పడే అవకాశం ఉందని తెలుస్తోంది. విచారణ పూర్తయిన తరువాతే రెండు వివరాలను బహిర్గతం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

థానేలో కొనసాగుతున్న సహాయక చర్యలు..

మహారాష్ట్ర : థానేలో కూలిపోయిన భవంతి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందగా పది మంది వరకు గాయపడ్డారు. 

కలాం మృతికి మమత సంతాపం..

లండన్ : భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న అబ్దుల్ కలాం హఠాన్మరణం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంతాపం తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. 

ప్రారంభమైన ఇంద్రకీలాద్రి శాంకాంబరీ ఉత్సవాలు..

విజయవాడ : బెజవాడ ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి మూలవిరాట్ తో పాటు ఆలయం మొత్తాన్ని పండ్లు..కూరగాయాలతో శోభయమానంగా అలంకరించారు. నేటి నుండి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. 

09:12 - July 29, 2015

ఢిల్లీ : భారత రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం పార్థివ దేహాన్ని రామేశ్వరంకు రక్షణశాఖ అధికారులు తరలించారు. బుధవారం ఉదయం అధికారిక నివాసం రాజాజీ మార్గ్ నుండి కలాం భౌతికకాయాన్ని పాలం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడ సైనికులు గౌరవవందనం చేసిన అనంతరం ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో కలాం పార్థివ దేహాన్ని మధురైకి తరలించారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, మనోహర్ పారికర్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీరిద్దరూ కలాం భౌతికకాయంతో తమిళనాడు వెళ్లారు. రామేశ్వరంలో బుధవారం సాయంత్రం ఏడు గంటల వరకు ప్రజల సందర్శనార్థం కలాం భౌతికకాయాన్ని ఉంచుతారు. గురువారం ఉదయం 11గంటలకు రామేశ్వరంలోని ఆయన స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
షిల్లాంగ్ లో కలాం మృతి..
సోమవారం షిల్లాంగ్ లో ప్రసంగిస్తూ అబ్దుల్ కలాం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనంతరం మంగళవారం ఉదయం షిల్లాంగ్ నుండి రక్షణ శాఖ ప్రత్యేక విమానంలో గువాహటికి కలాం పార్థీవ దేహాన్ని తీసుకొచ్చారు. అనంతరం మధ్యాహ్నాం పాలం విమానాశ్రయానికి కలాం పౌర్థివ దేహాన్ని తీసుకు వచ్చారు. ఎయిర్ పోర్టులో త్రివిద దళాధిపతులు గౌరవ వందనం సమర్పించారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కలాం, ప్రధాన మంత్రి మోడీ ఇతరులు కలాం పార్థీవ దేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం కలాం అధికారిక నివాసం టెన్ రాజాజీ మార్గ్ లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు.
రామేశ్వరంలో అంత్యక్రియలు..
అంత్యక్రియలు రామేశ్వరంలోనే నిర్వహించాలని కలాం కుటుంసభ్యులు కేంద్రాన్ని కోరారు. మంగళవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి రామేశ్వరంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. 

గుజరాత్ లో భారీ వర్షాలు..8మంది మృతి..

గుజరాత్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుండి కురుస్తున్న వర్షాలకు బనస్కాంతా జిల్లాలో నలుగురు, రాజ్ కోట్, పాటాన్ జిల్లాలో ముగ్గురు, సబర్ కంటా జిల్లాలో ఒకరు మృతి చెందారు. 

కనుపర్తిపాడు వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..

నెల్లూరు: జిల్లా కనుపర్తిపాడు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని సుమో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో పది మందికి గాయాలయ్యాయి. 

08:36 - July 29, 2015

ఏపీ ప్రభుత్వం కార్యాలయాల తరలింపు రాజకీయ చర్య అని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. రాజధాని ప్రాంతం నుంచి పాలన సాగించేదిశగా ఏపీ సర్కార్‌ అడుగులు వేస్తోంది. పలు శాఖల కార్యాల‌యాల త‌ర‌లింపున‌కు కసరత్తు ముమ్మరం చేస్తోంది. పలు శాఖల తరలింపునకు వీలుగా ప్రభుత్వం తాజాగా ఓ కమిటీని ఏర్పాటు చెసింది. హైకోర్టు విభజనపై తెలంగాణ ఎంపీల పోరాటం..ఏజెన్సీలో అంటు వ్యాధుల ప్రబలడం..ఈ అంశాలపై టెన్ టివి ''గుడ్ మార్నింగ్ నాగేశ్వర్'' కార్యక్రమంలో ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..
రాజకీయ ప్రతిబింబం..
''ఏపీ కార్యాలయాల తరలింపు అనే అంశం టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి చర్చ మొదలు పెట్టారు. మా రాష్ట్రం వచ్చింది.. మా రాజధాని కావాలి..అనే భావన ప్రజల్లో ఉంటుంది. పాలనాపరంగా సౌలభ్యం కొరకా, రాజకీయం కోసమా అర్థం కానట్టు ఉంది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఎలా అంటూ తెలంగాణ వాదుల నుండి రకరకాల వాదనలు వచ్చాయి. రాజధాని లేకుండా కట్టుబట్టలతో పంపుతున్నారు..20ఏళ్లు ఉమ్మడి రాజధాని ఉండాలని ఏపీ నేతలు పేర్కొన్నారు. తరువాత వెళుతాం..అంటారు అని ఆనాడు చెప్పాను. ఇదంతా రాజకీయ ప్రతిబింబమే. ఒక విధంగా రాజకీయ చర్య.
రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు..అంటూ సెంటిమెంట్ ను ప్రొజెక్టు చేశారు. ఇదే టిడిపిని అధికారంలోకి తెచ్చిపెట్టింది. కారణం..కార్యమే సీఎంగా చంద్రబాబును చేసింది. రాజధాని చుట్టే కలలు..రాజకీయాలు..ఆకాంక్షలు..అభివృద్ధి జరుగుతుంటాయి. 2024 వరకు ఇదే జరుగుతుంటాయి. రాబోయే ఎన్నికల్లో కూడా రాజధాని చుట్టే తిరుగుతుంటాయి. సెంటిమెంట్ ను ఇంకా వాడుతుంటారు. విభజన చేయాల్సింది అంటే నాలుగు బోర్డులు మార్చడం కాదు. ఉద్యోగస్తులకు రవాణా, వారి పిల్లలకు సౌకర్యాలు, మంత్రులు..అధికారుల మధ్య సమన్వయం ఉండాలి. శాఖల మధ్య సమన్వయం ఉండాలి. ఇలా అనేక అంశాలు చూడాల్సి ఉంటుంది. అన్ని హంగులు కుదుర్చుకొని వెళ్లడం ఒక అంశం..కొన్ని శాఖలను తరలిస్తారంటే వారి ఇష్టం.
హైకోర్టు విభజన..
హైకోర్టు తరలించమంటే గతంలో అంగీకరించ లేదు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైకోర్టును సపరేట్ గా చేయాలి. ఎక్కడ ఏర్పాటు చేయాలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించాలి. కావాల్సిన ఆర్థిక సదుపాయాలు వనరులు కేంద్రం కల్పించాలి.. హైకోర్టు ఏర్పడిన తరువాత హైదరాబాద్ లో ఉన్న హైకోర్టు తెలంగాణకు చెందుతుంది. ఎక్కడ పెట్టాలి అనేది ఏపీ సర్కార్ నిర్ణయించాలని చట్టంలో పేర్కొంది. హైకోర్టును రెండుగా వాడుకుందాం లేదా గచ్చిబౌలిలో ఏర్పాటు చేసుకుంటామని తెలంగాణ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర భూభాగంలో ఏపీ హైకోర్టు పెట్టకూడదని హైకోర్టు భావించింది.
గిరిజనుల్లో అంటు వ్యాధులు..
గిరిజనుల్లో అంటు వ్యాధులు ప్రబలుతుండడం వాస్తవం. మలేరియా మందులు సమర్ధవంతంగా పనిచేయాలంటే పౌష్టికాహారం ఉండాలి. ఆదాయం..ఉపాధి ఉండదు.. నెలకు ఆహారధాన్యాలు ఇస్తే తినగలుగుతారు. ఆహారం తింటే మందులు పనిచేస్తాయి. అనేక సార్లు శాసనమండలిలో అడిగాం. కానీ చర్యలు లేదు'' అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

పాలం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కలాం పార్థివ దేహం..

ఢిల్లీ : భారత రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం పార్థివ దేహం పాలం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఇక్కడి నుండి మధురైకి తరలించనున్నారు. అనంతరం హెలికాప్టర్ లో రామేశ్వరానికి కలాం భౌతికకాయాన్ని తరలించనున్నారు. కలాం భౌతికకాయం వెంట మంత్రులు వెంకయ్య నాయుడు, పారికర్ వెళ్లనున్నారు.  

08:06 - July 29, 2015

మెగా కాంపౌండ్ త్వరలో భారీ వేడుక జరుపబోతోందా ? అది సొంత ఊరులో గ్రాండ్ ఫంక్షన్ జరుపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వేడుకకు మెగా అభిమానులను కూడా పిలువనున్నట్లు టాక్. అసలు విషయం ఏంటా అని ఆలోచిస్తున్నారా ?
ఆగస్టు..22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. 60 ఏళ్లు పూర్తి చేసుకుని 61 పడిలోకి అడుగు పెట్టనున్నారు. దీనితో చిరంజీవి జన్మదిన వేడుకలు..చిరంజీవి దంపతుల షష్టిపూర్తి వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారంట. చిరంజీవి సొంత ఊరైన మొగల్తూరు ఈ వేడుకను నిర్వహించాలని మెగస్టార్ బంధువులు..ఇతరులు భావించారని టాక్. ఇందుకు చిరు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించిన దానిపై ఓ నిర్ణయం కూడ వెలువడనున్నట్లు టాలీవుడ్ టాక్. ఇవన్నీ నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే ఆగస్టు 22 వరకు ఓపిక పట్టాల్సిందే. 

08:05 - July 29, 2015

'ప్రిన్స్' మహేష్ బాబు తాజాగా నటించిన 'శ్రీమంతుడు' త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్నారై గా, స్టూడెంట్ మాత్రమే ప్రిన్స్ కనిపిస్తాడనే ప్రచారం జరిగింది. తాజాగా ఏడు డిఫరెంట్ గెటప్ లో 'ప్రిన్స్' కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. కథను బట్టి ఎన్నారైగా, క్లాస్, మాస్, యాక్షన్ ఇలా అన్ని కోణాల్లో మహేష్ ను దర్శకుడు కొరటాల శివ ప్రజెంట్ చేయబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ సాంగ్ లోనే ఈ పాత్రలు ఉంటాయని మరో ప్రచారం జరుగుతోంది. సినిమా విదేశాల్లో మొదలై పల్లెటూరికి చేరుతుంది కాబట్టి కథ రీత్యా ఆ లుక్కులు అవసరమయ్యాని టాక్. సినిమా గురించి లీక్ లు ఇస్తూ నిర్మాతలే ఈ విధంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి మహేష్ ఎన్ని అవతరాలు పోషించారనేది తెలియాలంటే ఆగస్టు 7 వరకు ఓపిక పట్టాల్సిందే. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ఐదు గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు..కాలినడనక వెళ్లే భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోంది. 

పెనుమళ్లంలో వైసీపీ, టిడిపి కార్యకర్తల ఘర్షణ..

చిత్తూరు: ఏర్పేడు మండలం పెనుమళ్లంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. తమ పొలాల వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టారని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనితో వైసీపీ కార్యకర్తల నివాసాలను టిడిపి కార్యకర్తలు ధ్వంసం చేశారు. 

నేడు రాయలసీమలో బాబు పర్యటన..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నేడు రాయలసీమలో పర్యటించనున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనితీరును బాబు పరిశీలించనున్నారు.

 

07:57 - July 29, 2015

రాజధాని ప్రాంతం నుంచి పాలన సాగించేదిశగా ఏపీ సర్కార్‌ అడుగులు వేస్తోంది. పలు శాఖల కార్యాల‌యాల త‌ర‌లింపున‌కు కసరత్తు ముమ్మరం చేస్తోంది. పలు శాఖల తరలింపునకు వీలుగా ప్రభుత్వం తాజాగా ఓ కమిటీని ఏర్పాటు చెసింది. మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మెపై ఉభయ రాష్ట్రాలు సరియైన విధంగా స్పందించడం లేదనే విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఎపిజె అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం లభించింది. ఆయన పుట్టినరోజైన అక్టోబర్ 15వ తేదీన అంతర్జాతీయ దినోత్సవంగా పరిగణించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో గఫూర్ (సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు), నడింపల్లి సీతరామరాజు (విశ్లేషకులు), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి), ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

పాలం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రులు..

ఢిల్లీ : పాలం ఎయిర్ పోర్టుకు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, పారికర్ లు చేరుకున్నారు. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం పార్థివ దేహాన్ని రామేశ్వరానికి తరలిస్తున్నారు. కలాం భౌతికకాయం వెంట మంత్రులు వెళ్లనున్నారు. 

07:23 - July 29, 2015

ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా గ్రూపులు ఆందోళనబాట పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు సమాయత్తమవుతున్నారు. వీరి ఆందోళనకు కారణమేంటి ? వీరు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి ? వీరికి ప్రభుత్వం చేసిన వాగ్ధానాలేమిటి ? డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్ లు అప్పగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయం క్షేత్ర స్థాయిలో ఎలా అమలవుతోంది ? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో డ్వాక్రా సంఘాల నేత స్వరూప మాట్లాడారు. 

07:22 - July 29, 2015

ఓ వైపు ఇష్టమొచ్చినట్టు ఇసుక తవ్వేస్తున్నారు. మరోవైపు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకక మధ్య తరగతి అవస్థపడుతోంది. ఇసుక రీచ్ ల నిర్వహణ అమ్మకాల బాధ్యతలు డ్వాక్రా సంఘాలకు అప్పగించాలన్న ప్రభుత్వ విధానాన్ని మాఫియా వెక్కిరిస్తోంది. ఇసుక బంగారమైంది. ఇసుక దిబ్బల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఇసుక వ్యాపారాన్ని మాఫియా శాసిస్తోంది. అది పడగవిప్పి నర్తిస్తోంది. రాజకీయాలను ఇసుక మాఫియా శాసిస్తున్నదా? ఇసుక మాఫియాను రాజకీయ నేతలే పెంచిపోషిస్తున్నారా? అర్ధంకాని రీతిలో ఇప్పుడు వ్యవహారం సాగుతోంది. రెండూ నిజమే. ఏరియాను బట్టి పాత్రల స్వభావాలు మారుతుంటాయి. ఒక చోట ఇసుక మాఫియా చెప్పినట్టు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు తలూపితే, మరికొన్ని చోట్ల ఇసుక వ్యాపారం రాజకీయ నేతల కనుసన్నల్లోనే సాగుతోంది. ఎన్నికల సమయంలో చాలామంది అభ్యర్థులకు ఇసుక మాఫియానే భారీగా నిధులు సమకూర్చి పెడుతోందన్న విమర్శలున్నాయి.
ప్రజాప్రతినిధులకు ఆదాయ వనరు..
చాలామంది ఎమ్మెల్యేకు ఇసుక ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. ఇసుకను సొమ్ము చేసుకునే విద్యలో ఆరితేరిన నేతలు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇసుకను బ్లాక్ చేస్తున్నారు. క్రుత్రిమ కొరత స్రుష్టిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ ఇష్టమొచ్చినట్టు ఇసుకను తవ్వేస్తున్నారు. అన్ని రూల్స్ ని పాతరేస్తున్నారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు. సామాన్యుడికి ఎక్కడా తట్టెడు ఇసుక దొరకని పరిస్థితిని స్రుష్టిస్తున్నారు. తమ ఇంటి అవసరాల కోసం ఎవరైనా ఎడ్లబండితో ఇసుకకు వెళ్తే వారిని అరెస్టులు చేస్తున్నారు. విచ్చలవిడిగా సాగే తమ అక్రమ ఇసుక వ్యాపారాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద దాడులు చేస్తున్నారు.
మరో రకంగా ఉన్న వాస్తవాలు...
సరిగ్గా ఇలాంటి నేపథ్యంలో డ్వాక్రా మహిళలకు ఇసుక ర్యాంప్ లు కేటాయిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట ఇచ్చింది. కానీ, అది ఎక్కడా సరిగ్గా అమలుకావడం లేదు. కొన్ని చోట్ల పేరుకి డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్ లు అప్పగించినట్టు ప్రభుత్వం లెక్కలు చూపిస్తున్నా క్షేత్రస్థాయి వాస్తవాలు మరోరకంగా వున్నాయి. ఇప్పటికీ రాజకీయ నేతల, మాఫియాల గుత్తాధిపత్యమే నడుస్తోంది. అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేల, వారి అనుచరుల ఆగడాలే సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాలను ఇసుక రీచ్ ల్లో అడుగుపెట్టనీయని పరిస్థితి వుందంటే ఇసుక దిన్నెల్లో మాఫియా ఊడలు ఎంతబలంగా పాతుకుపోయాయో అర్ధమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా గట్టి చర్యలు తీసుకోవాలి. 

కలాం పార్థివ దేహం తరలింపు..

ఢిల్లీ : మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం పార్థివ దేహం తరలింపు కొనసాగుతోంది. ఆయన నివాసమైన రాజాజీ మార్గ్ నుండి పాలం ఎయిర్ పోర్టుకు ఆయన భౌతికకాయాన్ని అధికారులు తరలిస్తున్నారు. 7.45 గంటకలు ప్రత్యేక విమానంలో కలాం భౌతికకాయం మధురైకి తరలించనున్నారు. అక్కడి నుండి హెలికాప్టర్ లో రామేశ్వరానికి కలాం పార్థివ దేహం తరలించనున్నారు. 

06:47 - July 29, 2015

ఢిల్లీ : యాకూబ్ మెమన్ పిటిషన్‌పై రెండో రోజూ సుప్రీం కోర్టు ఎటూ తేల్చుకోలేకపోయింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం... సున్నితమైన అంశంపై.. భిన్న స్వరాలు వినిపించింది. దీంతో విచారణ బాధ్యత ద్విసభ్య ధర్మాసనం నుంచి విస్తృత ధర్మాసనం పరిధిలోకి వెళ్లిపోయింది. ఇక బుధవారం లాంగ్ బెంచ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఈనెల 30న ఉరిశిక్ష అమలు నిలిపివేయాలని కోరుతూ యాకూబ్ మెమన్ వేసిన పిటిషన్‌పై... విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఏకాభిప్రాయం సాధించలేకపోయింది.
విస్తృత ధర్మాసనం ఏర్పాటుకు నిర్ణయం..
యాకూబ్ పిటిషన్‌ విషయంపై... సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ కురియన్‌ భిన్న స్వరాలు వినిపించారు. యాకూబ్‌కు ఉరిశిక్ష అమలు చేయాల్సిందేనని... జస్టిస్‌ ఏఆర్ దవే చెప్పగా జస్టిస్‌ కురియన్ విభేదించారు. యాకూబ్ డెత్ వారంట్ విషయంలో సరైన మార్గదర్శకాలు పాటించట్లేదని చెప్పారు. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవటంతో వారు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చీఫ్‌ జస్టిస్‌ హెచ్ఎల్ దత్తు విస్తృత ధర్మాసనం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ లాంగ్‌ బెంచ్‌ బుధవారం విచారణ చేపట్టనుంది. యాకూబ్ క్యురేటివ్ పిటిషన్‌ను గతవారమే సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఉరిశిక్ష అమలు నిలిపివేయాలని కోరుతూ యాకూబ్ సుప్రీంకోర్టులో మరోసారి పిటిషన్ వేశారు.
సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ..
డెత్ వారెంట్ న్యాయబద్దంగా జరగట్లేదని... లీగల్ ఆప్షన్లు మొత్తం దారులు మూసుకుపోయాకే నిర్ణయం తీసుకోవాలని యాకూబ్ వాధిస్తున్నారు. జస్టిస్ జోషెప్‌ సైతం యాకూబ్ క్యురేటివ్ పిటిషన్‌పై నిర్ణయాన్ని తప్పుపట్టారు. పిటిషన్‌పై మరోసారి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మొత్తానికి చర్చనీయాంశమైన యాకూబ్ పిటిషన్‌పై... సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. 

06:39 - July 29, 2015

హైదరాబాద్ : ఉమ్మడి రాజధానిలో కాకుండా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం నుంచే పాలన సాగించే ప్రక్రియలో వేగం పెంచేందుకు ఏపీ సర్కార్‌ ప్రణాళికలు రచిస్తోంది. రాజధాని ప్రాంతం నుంచి పాలన సాగించేదిశగా ఏపీ సర్కార్‌ అడుగులు వేస్తోంది. పలు శాఖల కార్యాల‌యాల త‌ర‌లింపున‌కు కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే వారానికి 3 రోజులు రాజ‌ధాని నుంచి పాలిస్తున్న సీఎం పూర్తిస్థాయిలో అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయ‌డానికి అనువైన ప్రైవేట్ భవనాలను ప‌రిశీలించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే విజయవాడలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్న బాబు.. ఇరిగేషన్‌కు సంబంధించిన 9 కార్యాలయాల‌ను తరలించటానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇరిగేషన్‌ 9 కార్యాలయాలు తరలించాలని నిర్ణయం..
మరో వైపు మంత్రులు పత్తిపాటి, గంటా, దేవినేని ఉమా మహేశ్వర్రావులు బెజవాడ నుంచే పాల‌న సాగిస్తున్నారు. నూత‌న రాజ‌ధానికి అతి స‌మీపంలోనే మంత్రి పీత‌ల సుజాత కూడా కార్యాల‌యం ఏర్పాటు చేసుకున్నారు. మరో మంత్రి రావేల కిశోర్ బాబు కూడా అదే పనిలో ఉన్నారు. దేవినేని ఉమా జ‌న‌వ‌న‌రుల శాఖను వెంట‌నే విజ‌య‌వాడ‌కు త‌ర‌లించేందుకు ఏపి ఇరిగేష‌న్ ఇంజ‌నీరింగ్ ఇన్ ఛీఫ్ ఉత్తర్వులు జారీ చేసారు. తొమ్మిది కార్యాల‌యాలు, సిబ్బంది, ఫైళ్లు,ఫ‌ర్నీచ‌ర్ త‌ర‌లింపునకు అవ‌ర‌స‌ర‌మైన వివ‌రాలు ఇవ్వాల‌ని ఆదేశించారు.
తరలింపుకు ఓ కమిటీ..
పలు శాఖల తరలింపునకు వీలుగా ప్రభుత్వం తాజాగా ఓ కమిటీని ఏర్పాటు చెసింది....ఈ కమిటీలో పంచాయ‌తీరాజ్ కార్యదర్శి జవహర్ రెడ్డితోపాటు, ఐఏఎస్ అధికారి హౌసింగ్ సెక్రటరీ లవ్ అగర్వాల్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమా మునివెంకటప్ప, మరో ఇద్దరు అధికారులతో కమిటీ వేశారు. ప్రైవేట్‌ భవనాలు, ఉద్యోగుల నివాసాలు వంటి సదుపాయాల గురించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు కమిటీ సభ్యులు.
వేరేగా ఉన్న ఉద్యోగుల వాదన..
మరోవైపు ఉద్యోగుల వాదన వేరుగా ఉంది. తమకు వసతి సదుపాయాలతో పాటు తమ పిల్లల భవిష్యత్ గురించి కూడా ప్రభుత్వం అలోచించాల‌ని కోరుతున్నారు. తాము విజ‌య‌వాడ‌కు వెళ్లేందుకు వ్యతిరేకం కాద‌ని..అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేకుండా ఉద్యోగుల‌ను వెళ్లమనడం స‌రి కాదంటున్నారు. 

06:37 - July 29, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఇప్పటికే 39 మంది సాక్షులను విచారించిన ఏసీబీ..25 పేజీలతో కూడిన ఛార్జీషీట్‌ను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. అయితే ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులుండగా నలుగురిపైనే ఏసీబీ అభియోగాలు మోపింది. ఛార్జీషీట్‌తో పాటు 316 పేజీల అనుబంధ డాక్యుమెంట్లను కూడా కోర్టుకు సమర్పించింది. ఐపీసీలోని సెక్షన్‌ 120బి, 34తో పాటు అవినీతి చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం అభియోగాలను నమోదు చేసింది. ఏ1 గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఏ2 సెబాస్టియన్, ఏ3 ఉదయ్ సింహా, ఏ4గా జేరుసలెం మత్తయ్యను నిందితులుగా చేర్చారు. ఎఫ్ఐఆర్‌లో ఏ5గా ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను మాత్రం ఈ చార్జీషీట్లో చేర్చలేదు. మరో చార్జీషీట్ దాఖలుచేసేటప్పుడు సండ్రతో పాటు మరి కొంత మందిని నిందితులుగా చేర్చే అవకాశాలు ఉన్నాయని ఏసిబి అధికారులు చెప్తున్నారు. అయితే ఎఫ్ఎస్ఎల్ పూర్తి రిపోర్టును తెప్పించుకున్న ఏసిబి..ఎవరెవరితో సంబంధం ఉందనే అంశాలను చార్జీషీట్లలో కీలకంగా పొందుపర్చినట్లు తెలుస్తోంది.
చార్జీషీట్లలో కీలక అంశాలను పొందుపర్చిన ఏసీబీ..
ఓటుకు నోటు కేసులో..ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసిన వేం నరేదర్‌రెడ్డితో పాటు పలువురికి 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీచేసిన ఏసీబీ ఇప్పటివరకు 39 మంది సాక్షులను విచారించింది. వీరికి సంబంధించిన సంబంధిత డాక్యుమెంట్లను కూడా ఏసీబీ సమకూర్చింది. అయితే ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఇంతకీ బాస్ ఎవరు? బాస్‌ పాత్రపై ఏసీబీ దాఖలు చేసిన చార్జీషీట్లో పేర్కొన్నారా లేదా అనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
బాస్‌ ఎవరు ?
ఓటుకు నోటు కేసు నమోదై ఇప్పటికే 60 రోజులు పూర్తి కావొస్తుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఏసిబి కేసుల్లో 60 రోజులలోపు చార్జీషీట్ దాఖలు చేసే సంప్రదాయం కొనసాగుతోంది. అందుకే ఏసిబి ఓటుకు నోటు కేసులో రెండు నెలలు పూర్తికాక ముందే చార్జీషీట్ దాఖలు చేసింది. అయితే ఫోరెన్సిక్ తుది రిపోర్టుపై ఏసిబి ఇంకా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని ఆధారంగా ఎవరిపాత్ర ఎలా ఉందో తెలుసుకొని సండ్రతో పాటు మరికొంత మంది నేతల పేర్లను సప్లమెంటరీ చార్జీషీట్లలో చేర్చనున్నట్లు సమచారం. మొత్తానికి ఈ కేసులో ఇంకా ఎలాంటి అరెస్టులు, సంచలనాలు ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఏసీబీ దాఖలు చేసిన చార్జీషీట్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరిస్తే త్వరగా విచారణ పూర్తి చేసేందుకు ఏసిబి అడుగులు వేస్తుంది. 

06:35 - July 29, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2015-16 వైద్య విద్య సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సహకారంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ నిర్వహణకు నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 85 శాతం సీట్లను స్థానికులతో, 15 శాతం సీట్లను అన్‌రిజర్వ్‌డ్ కోటాలో భర్తీ చేయనున్నారు.
ప్రైవేటు వైద్య కళాశాలల్లో 725 సీట్లు..
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి కన్వీనర్ కోటాలో మొత్తం 1,575 ఎంబీబీఎస్, 606 దంతవైద్య సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్లలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 725 సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉండగా.. బీడీఎస్ సీట్లలో 100 సీట్లు ప్రభుత్వ దంత వైద్య కళాశాలల్లో, మిగిలినవి ప్రైవేటులో ఉన్నాయి. జులై 29 నుంచి ఒకటి నుంచి 1000 ర్యాంకుల వరకు కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు. 30న 1001 నుంచి 3000 ర్యాంకుల వరకూ, 31న 3001 నుంచి 6000 ర్యాంకుల వారికి కౌన్సిలింగ్‌ జరగనుంది. ఆగస్టు 1 నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ ఉంటుంది. ఆగస్టు 1న ఒకటో ర్యాంకు నుంచి 4000 వరకు, ఆగస్టు 2న 4001 నుంచి 9000 వరకు, ఆగస్టు 3న 9001 నుంచి 16,000 ర్యాంకుల వరకు కౌన్సిలింగ్‌ జరగనుంది.
9 రోజుల పాటు కౌన్సెలింగ్..
ఈ నెల 29 నుంచి వరుసగా 9 రోజులపాటు కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి ఒక విడత.. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. నిర్దేశిత సమయాల్లో కేటాయించిన ర్యాంకుల ఆధారంగా విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది.

 

06:33 - July 29, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పట్టాదారు పాసు పుస్తకాలు రద్దు కానున్నాయి. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు కుంభకోణాలకు తెరతీస్తుండడంతో ప్రభుత్వం ఈ సమస్యకు సరికొత్త పరిష్కారాన్ని అన్వేషిస్తోంది. నకిలీ పాస్ పుస్తకాల స్కాంలు పునరావృతం కాకుండా సరికొత్తగా ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రెవెన్యూ విభాగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం.... ఇప్పటికే మీ భూమి పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించిన సర్కారు... ఇందులో అన్ని భూముల వివరాలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 3లక్షల 42వేల ఎకౌంట్ల డిజిటలైజేషన్ తోపాటు... 82శాతం భూములను ఆధార్‌తో అనుసంధానం చేస్తోంది.. దీంతో పాటే రైతులు రుణాలకోసం ఇబ్బందులు పడకుండా మీ భూమి పోర్టల్‌ లో ప్రింట్ సదుపాయాన్నీ కల్పిస్తోంది.. ఈ చర్యల కారణంగా పట్టాదారు పాసు పుస్తకాలు..ఈ-పాస్ బుక్‌లు రద్దు కాబోతున్నాయి.
త్వరలో 225 సర్వేయర్ పోస్టుల భర్తీ..
భూమి డిజిటలైజేషన్‌పై అభ్యంతరాలుంటే ఆగస్టు 10నుంచి 31వరకూ గ్రామసభలో ఫిర్యాదులివ్వాలని ప్రభుత్వం సూచించింది. మీ భూమి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయకుండా అన్ని చర్యలు చేపట్టింది. వీటితోపాటు విద్యార్థులు ఇబ్బందిపడకుండా ఆదాయ ధ్రువీకరణ పత్రం నాలుగేళ్లపాటు చెల్లుబాటయ్యేలా నిర్ణయం తీసుకుంది. అనంతపురంలో నకిలీ పాస్ పుస్తకాల స్కాంలు మళ్లీ జరగకుండా పకడ్బందీగా వ్యవహరిస్తోంది. వెబ్‌సైట్లో భూముల వివరాలతోపాటు ఆ భూమిపై తీసుకున్న రుణాల వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. ఇలా చేయడం వల్ల బ్యాంకర్లకు రుణ వితరణ సులువవుతుందని సర్కారు భావిస్తోంది. ఈ ఆన్‌లైన్ విధానంద్వారా అక్రమాలు అరికట్టడంతోపాటు. అందరి భూములకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి రానుంది. అలాగే రెవెన్యూ విభాగంలో ఖాళీగాఉన్న 225 సర్వేయర్ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని సర్కారు ప్రకటించింది.

06:32 - July 29, 2015

హైదరాబాద్ : హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రి తరలింపు ఖరారైంది. బుధవారం నుంచి పరికరాల తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటిరోజు ఆర్థోపెడిక్‌ విభాగానికి చెందిన పరికరాలను కింగ్‌కోఠి ఆస్పత్రిలోకి.. నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలోకి జనరల్‌ మెడిసిన్‌ పడకలను సర్దుబాటు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి విడతలో ఆర్థోపెడిక్‌, జనరల్‌ మెడిసిన్‌ విభాగాలను తరలించాలని నిర్ణయించారు.
పేట్లబూర్జు ప్రసూతి ఆస్పత్రిలోకి సుల్తాన్‌ బజార్‌ ఆస్పత్రి..
ఉస్మానియా ఆస్పత్రిలో విభాగాల తరలింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు. శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా భవనంలో మొత్తం 857 పడకలు ఉన్నాయి. వీటిలో జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, మెడికల్‌ గ్యాస్ట్రో ఎంటమాలజీ, సర్జరీ గ్యాస్ట్రో ఎంటమాలజీ, జైలు వార్డు, ఆరోగ్యశ్రీకి 580 పడకలు ఉన్నాయి. నాలుగు విభాగాలను సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రికి తరలించనున్నారు. ఆర్థోపెడిక్‌ విభాగానికి చెందిన 120 పడకలను కింగ్‌కోఠి ఆస్పత్రిలో సర్దుబాటు చేయనున్నారు. మిగిలిన 157 పడకలను ఉస్మానియా కొత్తభవనంలోనే సర్దుబాటు చేయనున్నారు. సుల్తాన్‌ బజార్‌ ప్రసూతి ఆస్పత్రిలో ప్రస్తుతం 150 పడకలు ఉన్నాయి. వీటిని పేట్లబూర్జు ప్రసూతి ఆస్పత్రిలోకి తరలించనున్నారు. పరికరాలను సాధ్యమైనంత తొందరగా తరలించాలని మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌ తరాల కోసమే సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని లక్ష్మారెడ్డి తెలిపారు. ఉస్మానియా ఖులీకుతుబ్‌షా భవనంలోనే ఎమర్జెన్సీ, ఓపీ సేవలు కొనసాగనున్నాయి. ఇక్కడికి వచ్చే రోగులను ఆయా ఆస్పత్రులకు తరలించేందుకు ప్రభుత్వం రెండు మినీ బస్సులు, పది అంబులెన్స్ లను ఏర్పాటు చేసింది.

06:13 - July 29, 2015

థానే : మహారాష్ట్రలో కుప్పకూలుతున్న భవనాల సంఖ్య పెరిగిపోతోంది. థానే జిల్లాలో కుప్పకూలిన సంఘటనలు మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. థానే జిల్లాలోని థాకూర్లిలో మాతృఛాయ పేరుతో ఉన్న మూడంతస్తుల భవనం మంగళవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. భవనం శిథిలాల కింద 20 మంది చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సుమారు పది ఫైరింజన్ ల సహాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. 

నేడు ఐఏబీ సమావేశం..

హైదరాబాద్ : ఖరీఫ్ సీజన్ లో ఏ ప్రాజెక్టు పరిధిలో ఏ మేరకు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలో ప్రాజెక్టుల పరిస్థితిపై చర్చించి ఆయకట్టును ఖరారు చేసేందుకు బుధవారం సాయంత్రం మూడు గంటలకు జిల్లా కేంద్రంలో ఐఏబీ (ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు) సమావేశం కానుంది. 

ధానేలో కూలిన భవనం..ఇద్దరు మృతి..

మహారాష్ట్ర : థానేలో మంగళవారం రాత్రి ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. థానే జిల్లాలోని థాకూర్లిలో మాతృఛాయ పేరుతో ఉన్న మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. 

నేడు రామేశ్వరానికి కలాం పార్థివ దేహం..

ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం పార్థివ దేహాన్ని నేడు రామేశ్వరానికి తరలించనున్నారు. కలాం భౌతికకాయంతో సైనిక వాహనం బుధవారం ఉదయం ఏడు గంటలకు ఆయన నివాసం 10 రాజాజీ మార్గ్ నుండి పాలం బయలుదేరనుంది. అక్కడి నుండి ఉదయం 7.45గంటలకు ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, మనోహర్ పారికర్ లు కలాం పార్థివ దేహాన్ని తీసుకుని తమిళనాడులోని మధురై చేరుకుంటారు. అక్కడి నుండి వైమానిక దళ హెలికాప్టర్ లో కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం తీసుకెళుతారు. అక్కడ బుధవారం సాయంత్రం ఏడు గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు.

మెమన్ ఉరి..నేడు విచారణ జరుపున్న త్రిసభ్య బెంచ్..

ఢిల్లీ : ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ఉరి తీసేందుకు నాగ్ పూర్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తన మరణశిక్షను ఆపేందుకు మెమన్ చేసిన చివరి ప్రయత్నంపై సుప్రీం ఇంకా ఎటూ తేల్చలేకపోయింది. ఓ వైపు జైలులో కౌంట్ డౌన్ ప్రాంరభం కాగా అతడు పెట్టుకున్న క్యురేటివ్ పిటిషన్ పై నిర్ణయం తీసుకొనేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులు ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం ధర్మాసనం తీసుకునే నిర్ణయంపైనే గురువారం యాకూబ్ కు మరణ శిక్ష అమలు చేస్తారా ? లేదా ? అన్న అంశం ఆధార పడి ఉంటుంది. 

భారత్ ఏ, ఆస్ట్రేలియా ఏ మధ్య రెండో అనధికారిక టెస్టు..

చెన్నై : ఎమ్ ఏ చిదంబరం స్టేడియం వేదికగా భారత్ - ఏ, ఆస్ట్రేలియా - ఏ మధ్య రెండోది, చివరిది అయిన అనధికారిక టెస్టు మ్యాచ్ నేడు జరుగనుంది. 

ఉస్మానియా తరలింపు ఓ కొలిక్కి..

హైదరాబాద్ : ఉస్మానియా తరలింపు ఓ కొలిక్కి వచ్చింది. కింగ్ కోఠీ దవఖానాలోకి ఉస్మానియా ఆర్థోపెడిక్స్ రోగులను, సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్ పేషెంట్లను పేట్లబుర్జు మెటర్నిటీ వైద్య శాలకు , పేట్లబుర్జు దవాఖానాలో ఖాళీగా ఉన్న రెండు ఫ్లోర్లలో సుల్తాన్ బజార్ పెషెంట్లను మార్చనున్నారు. దీనితో సుల్తాన్ బజార్ దవాఖానా ఖాళీ అవుతుంది. ఇందులోకి ఉస్మానియా జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, మెడికల్ గ్రాస్ట్రో ఎంట్రాలజీ విభాగాలను పూర్తిగా తరలించనున్నారు. బుధవారం పెషెంట్ల తరలింపు ప్రారంభం కానుంది. 

నేటి నుండి తుదివిడత వెబ్ కౌన్సెలింగ్..

హైదరాబాద్ : ఈ ఏడాది ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం బుధవారం నుండి రెండు రోజుల పాటు తుది విడత వెబ్ కౌన్సెలింగ్ జరుగనుంది. ఈనెల 31న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. ఆగస్టు 1వ తేదీ నుండి ఇంజినీరింగ్ కాలేజీలలో తరగతులు ప్రారంభించనున్నారు. 

నేటి నుండి మెడికల్ కౌన్సెలింగ్..

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ బుధవారం నుండి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా తెలంగాణలోని కన్వీనర్ కోటా కింద ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ చేపట్టనున్నారు.

Don't Miss