Activities calendar

30 July 2015

కాసేపట్లో మెమన్ కు ఉరి శిక్ష..

ఢిల్లీ : యాకూబ్ మెమన్ వేసిన తాజా పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆయన వేసిన పిటిషన్ పై అర్ధరాత్రి నుండి వాదనలు కొనసాగాయి. 14 రోజుల పాటు గడువు ఇవ్వాలని అడ్వకేట్లు వాదించారు. కానీ దీనిని కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని స్పెషల్ బెంచ్ పేర్కొంది. కాసేపట్లో నాగ్ పూర్ జైల్లో యాకూబ్ కు ఉరిశిక్ష విధించనున్నారు. 

ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు...

ప్రకాశం: జిల్లాలోని మార్కాపురంలో ఎస్సీ హాస్టల్ విద్యార్థి చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అక్కచెరువు తండాకు చెందిన రామాంజునాయక్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. 

నాపై ఓ వర్గం మీడియా అసత్యప్రచారం: చినరాజప్ప

హైదరాబాద్: తనపై ఓ వర్గం మీడియా అసత్యప్రచారం చేస్తోందని ఎపి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. తాను అసంతృప్తిగా ఉన్నట్లు చేస్తోన్న ప్రచారం అవాస్తమన్నారు. తన శాఖను మార్చాలని సీఎం చంద్రబాబును తాను అడిగినట్లు వస్తోన్న ప్రచారం కేవలం కట్టుకథ అని కొట్టిపారేశారు.

 

21:49 - July 30, 2015

పదుల సంఖ్యలో చేతులు మారిన ఈ డైమండ్ ని ఎవరికి వారు తమదే అనుకున్నారు.. వారి వారసులు అంతే అనుకుంటున్నారు.. ఈక్రమంలో హోహినూర్ వజ్రానికి నిజమైన వారసులెవరూ..? ఈ అపరూప వజ్రం తమదంటేతమదని చెప్పుకుంటున్న వారెవరూ..? కొహినూర్ వజ్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

21:42 - July 30, 2015

ఢాకా: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో కేంద్రీకృతమైన కోమెన్‌ తుపాను కారణంగా వచ్చే 48 గంటల్లో పశ్చిమ బెంగాల్‌, ఒడిషా రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు కురియనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్‌, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా ఒడిషాలోని జజ్‌పూర్, మయూర్‌బంజ్, కియోన్‌ఝర్, భద్రక్, బాలాసోర్‌ జిల్లాలపై తుపాన్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయని తెలిపారు. ఒడిషా తీర ప్రాంతాల్లోని అన్ని ఓడరేవుల్లో ఇప్పటికే 5 వ నెంబర్‌ హెచ్చరికను జారీ చేశారు. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 26 వేల మంది తీరప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కాస్త తుపానుగా మారింది. ఈ తుపానుకు థాయిలాండ్‌ దేశం కోమెన్‌ అని పేరు పెట్టింది.

21:38 - July 30, 2015

భూపాల్: మధ్యప్రదేశ్‌లోని బిండ్‌లో గ్రామస్థులంతా ఓ చోటుకి చేరారు. చెట్టు చుట్టూ గుమికూడారు. పదేళ్లయినా నిండని అబ్బాయిని చెట్టుకు కట్టేసి... చితకబాదారు. పోలీసులు అక్కడే వున్నా... వారిది మాత్రం ప్రేక్షక పాత్రే. ఇంతకూ ఆ చిన్నారి చేసిన తప్పు ఏంటంటే... దొంగతనం చేయటమే.

 

21:35 - July 30, 2015

హైదరాబాద్: ప్రొ.కంచె ఐలయ్యపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లో వివిధ ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ట్యాంక్‌బండ్‌ నుంచి ర్యాలీ నిర్వహిస్తుండగా.. అనుమతి లేదంటూ పోలీసులు నేతలను అడ్డుకున్నారు. పోలీసుల చర్యకు నిరసనగా అంబేద్కర్‌ విగ్రహం ముందు ప్రజాసంఘాల నేతలు, పలు పార్టీల నేతలు బైఠాయించారు.

 

 

21:12 - July 30, 2015

బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌తో సినిమా చేయాలని ఎప్పట్నుంచో వెయిట్‌ చేస్తున్న దర్శక, నిర్మాత రాజ్‌కుమార్‌ హిరానీకి ఆ.. అరుదైన అవకాశం దక్కబోతోంది. పక్కా కమర్షియల్‌ ఫార్మెట్‌లో రాజ్‌కుమార్‌ హిరానీ తయారు చేసిన స్క్రిప్ట్ అమితాబ్‌కి తెగ నచ్చేసి, సినిమా చేసేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారు. అంతేకాదు ఈ చిత్రంలో అమితాబ్‌ సరసన బాలీవుడ్‌ 'క్వీన్‌' కంగనా రనౌత్‌ నటిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించి గత ఆదివారం రాజ్‌కుమార్‌ హిరానీ సంస్థ కార్యాలయంలో బిగ్‌బి, కంగనాలకు హిరానీ కథ నెరేట్‌ చేయడం జరిగింది. కథ విన్న తర్వాత ఈ ఇద్దరూ నటించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కంగనాని ఎంపిక చేసే విషయాన్ని బిగ్‌బితో హిరానీ చర్చించారు. 'కంగనా నటించిన 'క్వీన్‌', 'తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రాలు చూశాను. ఆమె అద్భుతంగా నటించారు. ఈ కథలోని పాత్రకు ఆమె నూటికి నూరుపాళ్ళు న్యాయం చేయగలదు' అని బిగ్ బి కంగనాకు కితాబిచ్చారట. రాజ్‌కుమార్‌ హిరానీ దీంతోపాటు నటుడు సంజరుదత్‌ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

 

21:00 - July 30, 2015

బాలీవుడ్‌ బ్యూటీ శ్రీదేవి నటించిన 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' చిత్రానికి దర్శకత్వం వహించిన గౌరీషిండే తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలియాభట్‌ ప్రధాన పాత్రలో నటించే ఈ చిత్రంలో మరో ముగ్గురు నూతన కథానాయికలు కూడా నటించనున్నారు. కరణ్‌జోహార్‌ ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ వచ్చే ఏడాది నుంచి ప్రారంభంకానుంది. మహిళా ప్రధానమైన ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో గౌరీషిండే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిసింది. అలియా భట్‌ ప్రస్తుతం 'షాందార్‌', 'కపూర్‌ అండ్‌ సన్స్', 'ఉడ్తా పంజాబ్‌', 'శుద్ధి' తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 'చీనీకమ్‌', 'పా', 'షమితాబ్‌' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆర్‌.బల్కీ సతీమణిగా గౌరీషిండే అందరికీ సుపరిచితురాలే. బల్కీ రూపొందించిన చిత్రాలకు క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన గౌరీ దాదాపు 100కి పైగా లఘు చిత్రాలు, వ్యాపార ప్రకటనలు రూపొందించారు. అందులో భాగంగా 2001లో దర్శకత్వం వహించిన 'ఓ మ్యాన్‌' షార్ట్ ఫిల్మ్ ఉత్తమ లఘుచిత్రంగా బెర్లీన్‌ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ఆ తర్వాత 2012లో శ్రీదేవితో 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' చిత్రానికి దర్శకత్వం వహించి, తొలిచిత్రంతోనే గౌరీ మంచి గుర్తింపు పొందారు.

20:13 - July 30, 2015

'బాహుబలి' విజువల్ ఎఫెక్ట్స్ మాంత్రికుడు శ్రీనివాస మోహన్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా బాహుబలి చిత్రానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ గురించి మోహన్ వివరించారు. చిత్రంలో చూపించిన గ్రాఫిక్స్, సెట్టింగ్ సన్నివేశాలపై మాట్లాడారు. బాహుబలి చిత్రం మేకింగ్ సమయంలో కలిగిన అనుభవాలు, అనుభూతులు, చిత్రం విశేషాలను తెలిపారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

సికింద్రాబాద్ బోనాలకు దానంకు ఆహ్వానం

హైదరాబాద్: కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఇంటికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లాడు. సికింద్రాబాద్ బోనాలకు దానంను ఆహ్వానించారు.
 

రోడ్డు భద్రతపై ముగిసిన సీఎస్ కృష్ణారావు సమీక్ష

హైదరాబాద్: ఎపిలో రోడ్డు భద్రతపై నిర్వహించిన సీఎస్ కృష్ణారావు సమీక్ష సమావేశం ముగిసింది.
 

జీడిమెట్లలో డీఆర్ ఐ అధికారుల సోదాలు..

రంగారెడ్డి: జీడిమెట్లలోని ఓ కంపెనీలో డీఆర్ ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. 121 కిలోల ఆల్ఫాజులం మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. 

తుపాకులతో తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు.. ఒకరి అరెస్టు

మెదక్: శివంపేట మండలం రూప్ సింగ్ తండాలో ముగ్గురు వ్యక్తులు తుపాకులతో తిరుగుతున్నారు. వీరిలో ఒకర్ని పోలీసులు అరెస్టు చేశారు. అతన్నుంచి తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు.
 

ఆగస్టు 17 నుంచి గ్రామజ్యోతి వారోత్సవాలు: సీఎం కేసీఆర్

హైదరాబాద్: ఆగస్టు 17 నుంచి 24 వరకు గ్రామాల్లో గ్రామజ్యోతి వారోత్సవాలను నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. వరంగల్ జిల్లా గంగదేవపల్లిలో గ్రామజ్యోతిని ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం.. ప్రతి అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్నారు. 

18:37 - July 30, 2015

మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న కాలుష్యం ఎంతో మంది దంపతులలో సంతానలేమి సమస్యకు కారణమవుతోంది. మరి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కార మార్గాలున్నాయో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. ఆ.. వివరాలను వీడియోలో చూద్దాం...


 

18:35 - July 30, 2015

ఆషాఢమాసం వచ్చిందంటే పల్లెలు, పట్టణాలు కొత్త శోభను సంతరించుకుంటాయి. గుళ్లు, గోపురాలు కన్నుల పండువగా ముస్తాబవుతాయి. పిల్లాపాప సందడి చేసేందుకు సిద్ధమవుతారు. బోనం ఎత్తుకున్న ఆడపడుచుల హడావిడి ప్రత్యేకం. ఊరూవాడా సర్వం వేడుకకు సన్నద్ధమవుతుంది. బోనం ఎత్తడం, ఘటాల ఊరేగింపు, పోతురాజు విన్యాసాలు, రంగం ఎక్కడం...ఇలా అనేక ఘట్టాలతో నిర్వహించే పండుగ బోనాలు. తెలంగాణ ప్రాంతంలో విశిష్ట గుర్తింపు పొంది, ప్రజల జీవన విధానంగా మారిన బోనాల వెనుక ఉన్న సామాజిక కోణాన్ని, మహిళలకు బోనాలకు మధ్య ఉన్న బంధాన్ని స్పృశించేందుకు ఇవాళ్టి ఫోకస్ సిద్ధంగా ఉంది.
ప్రతి ప్రాంతానికీ ఒక అస్తిత్వం
ప్రతి ప్రాంతానికీ ఒక అస్తిత్వముంటుంది. అలాంటి ఒక సజీవ అస్తిత్వం బోనాలు. కోటి రతనాల తెలంగాణాకు బోనాలు ఒక అట్టహాసమైన వేడుక. నెల రోజుల పాటు బంధువులంతా ఒక్క చోట చేరి ఆనందంగా జరుపుకునే కన్నుల పండువ. అయితే ఈ వేడుకలో జోగిని ప్రమేయం, పోతురాజు విన్యాసాలు లేని సమ సమాజం భాగస్వాములవ్వాలని మానవి కోరుకుంటోంది.


 

18:25 - July 30, 2015

కరీంనగర్: పచ్చని పల్లెటూరు. కల్మషం ఎరుగని గ్రామం. చక్కటి వాతావరణం మధ్య అమ్మ ఒడిలాంటి చదువుల బడి. లక్షలు పోస్తే గానీ అక్షరాలు పలింకించని కార్పొరేట్ స్కూళ్లనే తలదన్నింది. చుక్కానిలా మారి ఆదర్శంగా నిలుస్తోంది. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా సకల సౌకర్యాలతో విద్యనందిస్తున్న కరీంనగర్‌ జిల్లాలోని సర్కారీ బడిపై ప్రత్యేక కథనం...
సర్కారు బడులంటే అలుసు
సర్కారు బడులంటే అలుసు. ప్రభుత్వ పాఠశాలలో చదువు అంటే మనసొప్పదు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేక కొన్ని సర్కారు బడులు చతికిలపడుతుంటే.. నిత్య సమస్యలతో మరికొన్ని కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రభుత్వ బడి అంటే అలా వచ్చి ఇలా వెళ్లటం. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వెరసి సర్కారీ బడులు వెలవెలబోవడం సర్వసాధారణం.
ఆదర్శంగా నిలిచిన జయ్యారం ప్రభుత్వ పాఠశాల
కరీంనగర్‌ జిల్లా రామగుండం మండలం జయ్యారంలోని ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు ఉన్నాయి. ఈ సరస్వతి నిలయం.. నేడు రాష్ట్రంలోనే అత్యుత్తమంగా నిలిచి పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. పచ్చని చెట్ల మధ్య.. పచ్చదనం-పరిశుభ్రత నిండిన ఈ సర్కారు బడి.. గ్రామంలోనే చదువుల గుడిగా మారింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో తరగతి గదులు కొలువుదీరి ఉన్నాయి. ఇక్కడి ఉపాధ్యాయులు.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యనందిస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేక యూనిఫాం, అత్యాధునిక విధానంతో లైబ్రరీ, ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్న భోజనం తయారీ పద్దతినే మార్చిన ఇక్కడి గురువులు.. విద్యార్థులకు కడుపు నిండా చక్కని భోజనాన్ని అందిస్తున్నారు. కంప్యూటర్‌ శిక్షణతో పాటు తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని విద్యార్థులు అంటున్నారు.
పదోతరగతిలో 95 శాతానికి పైగా ఉత్తీర్ణత
అంతేకాదు.. గత పదేళ్ల నుంచి పదోతరగతిలో 95 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధిస్తోంది జయ్యారంలోని ఈ ప్రభుత్వ పాఠశాల. విద్యార్థులు 9.7 శాతం మార్కులతో రాష్ట్రంలోనే టాపర్స్‌గా నిలుస్తూ.. బాసర త్రిపుల్ ఐటీలో సీట్లు సాధిస్తుండటం విశేషం. విద్యార్ధుల్లో శారీరక మానసికోల్లాసాన్ని పెంపొందించేకు వివిధ రకాల వ్యాయామ విద్యతో కూడిన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోను తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడి పాఠశాలలో విద్యా బోధన చేయటం తమకెంతో గర్వంగా ఉందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. గ్రామసీమల్లో వెల్లివిరిసిన ఈ చదువుల కొలువు.. పాఠశాల అంటే ఇలా ఉండాలి అనేస్థాయికి ఎదిగిన ఈ సర్కారీ బడిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుంటారని ఆశిద్దాం.

 

18:12 - July 30, 2015

ఖమ్మం: జిల్లాలో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వర్షాకాలం కావటంతో సహజంగానే జ్వరాలు విజృంభిస్తాయి. అయితే ఈ ఏడాది జ్వరలతో ఇబ్బంది పడే వారి సంఖ్య రెట్టింపయింది. మరోవైపు జిల్లాలో విషజ్వరాల బారిన పడి మరణించే వారి సంఖ్య అధికమైంది. ఇప్పటికే డెంగ్యూ మరణాలు సంభవించాయి. కాని వాటిని అధికారులు నిర్థారించడం లేదు. ఏ పల్లె, పట్నం చూస్తున్నా జ్వరంతో బాధ పడుతున్న రోగులే కనిపిస్తున్నారు.
గ్రామాల్లో తీవ్ర పారిశుద్ధ్యం సమస్య
గ్రామాల్లో పారిశుద్ధ్యం సమస్య తీవ్రంగా ఉంది. వర్షకాలం కావటంతో బురద రహదారులు, నిల్వ నీరు, కాల్వలు సమస్యగా మారాయి. దోమల బెదడ తీవ్రంగా పెరిగింది. ఫలితంగా జ్వరాల బాధితులు అంతకంతకు పెరుగుతున్నారు. బురద నీటితో తాగునీటి వనరులు కలుషితమవుతుండటం సమస్యకు ప్రధాన కారణమవుతోంది. భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, అశ్వరావుపేట, ఇల్లందు ఏజెన్సీ ప్రాంతంలో ఇంటికొకరు చొప్పున జ్వరంతో బాధపడుతున్నారు. స్థానికంగా నీరు కలుషితమవటమే సమస్యకు కారణమని గ్రామస్తులు చెపుతున్నారు.
పలు గ్రామాల్లో జ్వరాలు
రోజు కూలీలను ఈ జ్వరాలు మరింత కుంగదీస్తున్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా బాధితులు మంచం పట్టారు. పాల్వంచ మండలంలోని కేశవాపురం, దంతెలబోరు, గొల్లగూడెం, జగన్నాథపురం, సోములగూడెం, సీతారాంపురం, ఉల్వనూరు గ్రామాల్లో జ్వరాలు అధికంగా ఉన్నాయి. పాల్వంచలో డెంగ్యూ జ్వరంతో ఇప్పటికే ఇద్దరు మహిళలు చనిపోయారు. మరోవైపు కూసుమంచి, దమ్మపేట, గుండాల, భద్రాచలంలోనూ పరిస్థితి దయనీయంగా ఉంది.
ఖరీదు వైద్యం వైపే పేదలు మొగ్గు
ప్రభుత్వ ఆస్పపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవటంతో...కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు క్యాష్ చేసుకొంటున్నాయి. ఇప్పుడు ఏజెన్సీ జ్వరాలు ప్రైవేటు ఆస్పత్రులకు వరంగా మారింది. పేదలు సైతం ప్రైవేటు వైద్యం వైపే మొగ్గు చూపుతున్నారు. అప్పులు చేసి మరీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు డబ్బులు పోయినా రోగం ఎప్పుడు నయమవుతుందో అంతుచిక్కడం లేదని రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య అధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వసతులు కల్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు. అలాగే జ్వర పీడితులు అధికంగా ఉన్న గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

18:04 - July 30, 2015

ఖమ్మం: జిల్లాలోని కొత్తగూడెంలో కొందరు మున్సిపల్ కార్మికులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. మున్సిపల్ భవనం ఎక్కి.. దూకుతామంటూ హడావుడి చేశారు. 'సీఎం కేసీఆర్ డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కార్మికులు మండిపడ్డారు. అధికారులు హామీ ఇచ్చేవరకూ భవనం దిగేదిలేదని హెచ్చరించారు. అంతకుముందు చెత్త ఊడ్చేందుకు ప్రయత్నించిన ఓ ప్రైవేటు కార్మికుడిని వారంతా అడ్డుకున్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గొడవకు దిగారు.

 

18:00 - July 30, 2015

నిజామాబాద్‌: జిల్లాలో ఆక్రమించుకున్న దళితుల భూములను తిరిగి వారికే ఇవ్వాలని సదస్సు నిర్వహించేందుకు వెళ్తున్న అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్లారెడ్డి శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూకబ్జాలకు పాల్పడుతున్నారని అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. తాడ్వాయి మండలం ఎర్రపహడ్ గ్రామంలో దళితుల భూములను ఆక్రమించుకొని అన్యాయం చేసాడని.. తిరిగి ఆ భూములను దళితులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిలో వామపక్షాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించేందుకు వస్తుండగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

కంచె ఐలయ్యపై అక్రమ కేసులు ఎత్తివేయాలి:తమ్మినేని

హైదరాబాద్: ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ వ్రిగహం నుంచి ప్రజా సంఘాలు ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీకి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నేతలను అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. కంచె ఐలయ్యపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని తమ్మినేని హెచ్చరించారు.

17:14 - July 30, 2015

పంజాబ్: గురుదాస్‌పూర్‌ ప్రజలను ఉగ్రవాద భయం ఇంకా వీడడం లేదు. తాజాగా బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఓ కాలనీలో అనుమానస్పద బ్యాగ్‌ కలకలం సృష్టించింది. ఇళ్లల్లోంచి జనాలు బయటకు వచ్చారు. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిన్నపాటి పేలుడు పదార్థమై ఉంటుందని, భయపడాల్సిన పని లేదని పోలీసులు తెలిపారు.

 

ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం ప్రారంభం

ఢిల్లీ:స్పీకర్ సుమిత్ర మహాజన్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం ప్రారంభం అయ్యింది. లోక్ సభ సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్చలనపై చర్చిస్తున్నట్లు సమాచారం.

16:59 - July 30, 2015

ఢిల్లీ: గురుదాస్‌పూర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడులపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పందించారు. పాకిస్తాన్‌ నుంచి రావి నది మీదుగా గురుదాస్‌పూర్‌లోకి ప్రవేశించారని రాజ్యసభలో సభ్యుల తీవ్ర గందరగోళం నడుమ హోంమంత్రి ప్రకటన చేశారు. సరిహద్దులో టెర్రరిస్టులు చొరబడే అవకాశమే లేదని రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా సభ్యులు నినాదాలు చేయడంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.

ఐబీ హెచ్చరికలతో ఆ జడ్జిలకు భద్రత పెంపు

ఢిల్లీ: యాకుబ్ మెమన్ ఉరిశిక్ష వేస్తూ తీర్పు ఇచ్చిన ముగ్గురు సుప్రీం కోర్టు జడ్జీలకు ఐబీ హెచ్చరికలతో భద్రత పెంచారు.

16:54 - July 30, 2015

ఢిల్లీ: భారతదేశంలో మరణశిక్షను రద్దు చేయాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. ప్రపంచంలో వందకు పైగా దేశాలు మరణశిక్షను రద్దు చేశాయని... ఆ.. దేశాల సరసన భారత్‌ కూడా చేరాలన్నారు. ఇందుకోసం చట్టంలో మార్పు తీసుకు రావలసిన అవసరం ఉందన్నారు. యాకుబ్‌ మెమెన్‌ మరణశిక్షను రద్దు చేయాలని రాష్ట్రపతికి మెర్సి పిటిషన్‌ దాఖలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుదే తుది నిర్ణయమన్నారు. జాతీయ ఐక్యత, భద్రత విషయంలో సిపిఎం రాజీపడదని ఏచూరి స్పష్టం చేశారు. అందరికీ ఒకే న్యాయం ఉండాలని ఇందులో తారతమ్యం చూపొదన్నారు. టెర్రరిజంకు మతాలతో సంబంధం లేదని ఏచూరి పేర్కొన్నారు.

 

16:50 - July 30, 2015

వరంగల్: భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి... ఇవాళ అమ్మవారు ముద్రాక్రమంలో దర్శనమిచ్చారు.. దుర్గాదేవిని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు... దుర్గమ్మను దర్శించుకొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు..

16:49 - July 30, 2015

కృష్ణా: విజయవాడ పటమట రైతు బజార్లో ఉల్లిపాయలకోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటైంది. ఇక్కడ కిలో ఉల్లిపాయల్ని కేవలం 20 రూపాయలకే అందుబాటులోకితెచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఈ కౌంటర్‌ను ప్రారంభించారు. ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా ఉల్లిగడ్డల్ని కొనుగోలుచేసి ఇక్కడ తక్కువ ధరకు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు..

 

 

కాల్ డేటాను విజయవాడ కోర్టుకు సమర్పించాలి:హైకోర్టు...

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ లో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కాల్ డేటాను విజయవాడ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అదే సీల్డు కవర్ ను హైకోర్టు రిజిస్ట్రార్ కు అందజేయాలని తెలిపింది. తదుపరి విచారణ నాలుగు వారాల పాటు వాయిదా వేస్తున్న పేర్కొంది.

శనివారం చంద్రన్న చేయూత పథకం ప్రారంభం..

విజయవాడ:చంద్రన్న చేయూత పథకాన్ని రాష్ట్రప్రభుత్వం ఎల్లుండి(శనివారం) ప్రారంభించనుంది. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ, ఉపాధి కల్పన ఈ పథకం ముఖ్వ ఉద్దేశ్యమని ప్రభుత్వం చెప్తోంది. ఎస్సీ కార్పోరేషన్‌ నుంచి రూ. 20కోట్లు ఈ పథకానికి కేటాయించారు. ఈ కార్యక్రమంపై ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

16:47 - July 30, 2015

విశాఖ: విద్యార్ధిని రిషితేశ్వరి మృతికి కారణమైన వారెవరిని వదిలిపెట్టబోమని మంత్రి గంటాశ్రీనివాస్ స్పష్టం చేసారు. విచారణ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు. సెలవులకు వెళ్ళిన విద్యార్ధులందరిని పిలిపించి విచారణ చేస్తామని వివరించారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణాలు చాలా ఉన్నాయన్న దానిపై వస్తున్న కథనాలపై మంత్రి స్పందించారు. తనకు గాని, ముఖ్యమంత్రికి గాని నిందితులను కాపాడాలన్న ఆలోచనలేదని తేల్చి చెప్పారు.

 

16:39 - July 30, 2015

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెండోవిడత రైతు రుణమాఫీ నిధులను టీసర్కార్ విడుదల చేసింది. రెండోవిడత రైతు రుణమాఫీకి రూ.2043 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం సీఎం కేసీఆర్‌ గ్రామజ్యోతి పథకంపై కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామజ్యోతి రీతిలోనే పట్టణజ్యోతి పథకాన్ని చేపడుతామని కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామీణుల సంక్షేమం, అభివృద్ధే ప్రధాన ఉద్ధేశంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు సీఎం చెప్పారు. 

విజయవాడలో సీఎం క్యాప్ ఆఫీస్ ఓఎస్డీగా కృష్ణ మోహన్

హైదరాబాద్: ఇక నుంచి విజయవాడ నుంచే ఏపీ పరిపాలనంతా కొనసాగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందుకే రేపు కేబినెట్ భేటీ కూడా అక్కడే నిర్వహించబోతోంది. మరోవైపు త్వరలో విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్ ను ఏర్పాటు చేయబోతున్నారు. దానికి ముందుగానే ఓఎస్డీగా కృష్ణమోహన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.   

త్వరలో పట్టణాల్లో పట్టణ జ్యోతి:సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గ్రామాల సమగ్ర అభివృద్ధికోసమే గ్రామజ్యోతి పథకం ప్రవేశపెట్టనున్నట్టు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి ప్రజలే సారథులుగా ఉండాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామజ్యోతి పథకం విజయవంతమవుతుందని, ప్రభుత్వ కార్యక్రమంగా జరిగితే ఫలితం రాదని చెప్పారు. నిర్లక్ష్యానికి గురైన దళితవాడలు, గిరిజన తండాల నుంచి మార్పుకు శ్రీకారం చుట్టాలన్నారు. గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమంలాగానే.. పట్టణాల్లో త్వరలో పట్టణ జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కేసీఆర్ తెలిపారు.

భార్యను కత్తితో పొడిచిన భర్త...

విజయవాడ:పకీరుగూడెంలో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో భార్యను కత్తితో పొడిచాడు భర్త. వెంటనే స్థానికులు అప్రమత్తమై బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మెమన్ ఉరికి వ్యతిరేకంగా కశ్మీర్ లో ర్యాలీ...

కాశ్మీర్: యాకూబ్ ఉరిని వ్యతిరేకిస్తూ జమ్మూకశ్మీర్‌కి చెందిన ఓ ఎమ్మెల్యే ర్యాలీ తీశాడు.యాకూబ్ మెమెన్‌కు ఉరి శిక్షను వేయడాన్ని నిరసిస్తూ స్వతంత్ర ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ తన అనుచరులతో కలిసి ర్యాలీ చేపట్టాడు. ఉరి శిక్షకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులను ఎందుకు ఉరి తీయరంటు మీడియాతో అన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.  

ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం మరింత విస్తరించే యోచన!

విజయవాడ:సీఎం క్యాంపు కార్యాలయం మరింత విస్తరించే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంవో కార్యాలయంలోని పలువురు ఐఏఎస్ లను విజయవాడకు తరలించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశాలపై రేపు, ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షంచనున్నట్ల తెలుస్తోంది.

15:54 - July 30, 2015

కడప: జిల్లాలో పోలీసులు, అటవీశాఖ అధికారులు భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. కాశినాయన మండలం కొత్తదాసరిపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్ లో పోలీసుల కూంబింగ్‌ నిర్వహిస్తుండగా.. 19 మంది కూలీలు 111 ఎర్రచందనం దుంగలను మినీ లారీలో తరలిస్తుండగా పట్టుకున్నారు. మరో ఏడుగురు అడవిలోకి పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎర్రచందనం విలువ రూ. 6 కోట్ల 60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

 

15:49 - July 30, 2015

ఢిల్లీ : కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ బీజేపీలో చేరి తన జీవితంలో పెద్ద పొరపాటు చేశానన్నారు. బీజేపీలో ఇమడలేకే తిరిగి కాంగ్రెస్‌లో చేరినట్లు జగ్గారెడ్డి చెప్పారు. జగ్గారెడ్డి చేరికను దిగ్విజయ్‌ స్వాగతించారు.

 

15:45 - July 30, 2015

తూర్పుగోదావరి: ఏజెన్సీలో పోలీసులు భారీ మావోయిస్ట్ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. భారీ రాకెట్ ల్యాంచర్స్ తో పాటు , జిలిటెన్ స్టిక్స్ ,తుపాకులు స్వాదీనం చేసుకున్నారు. తూర్పు ఏజెన్సీలో మావోల కదలికలు పెరగటంతో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నారు.

 

15:42 - July 30, 2015

హైదరాబాద్: ఫోన్‌ ట్యాపింగ్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలాని వాదనలు వినిపించారు. కాల్‌డేటా ఇవ్వాలని అడిగే అధికారం విజయవాడ కోర్టుకు లేదని అన్నారు. ప్రభుత్వపు అంతర్గత భద్రత కోసం ఇంటర్‌సెక్షన్‌ కాల్స్ గురించి సెల్లార్‌ కంపెనీలకు లేఖ ఇచ్చామని కోర్టుకు తెలిపారు. కోర్టు సాయంత్రం 4 గంటలకు తీర్పు ఇవ్వనుంది. 

గురుదాస్ పూర్ బస్టాండ్ లో బ్యాగు కలకలం..

హైదరాబాద్: ఉగ్రవాదుల దాడి నుంచి కోలుకోకముందే పంజాబ్ లో గురుదాస్ పూర్ లో బస్టాండ్ లో అనుమానిత బ్యాగ్ కనపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు బస్టాండ్ ను తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రయాణికులను బయటకు పంపించారు. బ్యాగ్ లో ఏముందో తెలుసుకునేందుకు బాంబు నిర్వీర్య బృందం రంగంలోకి దిగి సోదాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ లో రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది. గత సంవత్సరం రైతులకు 25 శాతం రుణమాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంకు గాను 20 రోజుల క్రితం రూ. 2వేల 43 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, ఈ రోజు మరో రూ.2వేల 43 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు 50 శాతం రైతు రుణమాఫీ జరిగింది. మిగితా 50 శాతం రుణమాఫీ ప్రభుత్వంరాబోయే రెండేళ్లలో పూర్తి చేయనుంది. 

డీకే స్నిగ్థారెడ్డి 11 కోట్లుకట్టాల్సిందే:హైకోర్టు...

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ కుమార్తె డీకే స్నిగ్ధారెడ్డి అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు తీర్సు ఇచ్చింది. లీజ్‌ను ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన తరువాత కేసు నడపాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. రూ.11 కోట్లు కట్టాలన్న ప్రభుత్వ వాదనను సమర్ధిస్తూ డీకే స్నిగ్ధారెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డీకే అరుణ మేనల్లుడు కృష్ణమోహన్‌రెడ్డి అక్రమ మైనింగ్‌పై కేసు వేసిన సంగతి తెలిసిందే. 

15:17 - July 30, 2015

హైదరాబాద్: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మరో 70 మంది బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. ఇతర రాష్ట్రాల నుంచి బాలకార్మికులను తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఫలక్‌నామా ఎక్స్ ప్రెస్‌లో బాలకార్మికులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు విచారణ జరుపుతున్నారు. రైళ్లలో తరలిస్తున్న బాల కార్మికులను గుర్తించడం ఈ వారంలో ఇది రెండోసారి కావడం విశేషం. 

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ:గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ రోజు రాజ్యసభలో ప్రకటన చేశారు. రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటనపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. విపక్షాల ఆందోళన మధ్యనే రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటన చేశారు. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి రావి నది గుండా భారత్‌లోకి ప్రవేశించారని తెలిపారు. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ప్రవేశాలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నామని, ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అనంతరం చైర్మన్ రాజ్యసభను వాయిదా రేపటికి వాయిదా వేశారు. 

15:11 - July 30, 2015

నల్గొండ: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు నిండు ప్రాణాన్ని బలికొంది. విద్యుత్ఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. పెద్దగూడెం గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి.. రెండ్రోజుల క్రితం పంటకు నీళ్లు పెట్టడానికి పొలం వద్దకు వెళ్లాడు. అందరి మోటార్లు పనిచేస్తున్నా.. ఆయన మోటారు మాత్రం పనిచేయకపోవడంతో విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించారు. అయితే విద్యుత్‌ అధికారులు పట్టించుకోలేదు. పొలం ఎండిపోయే పరిస్థితికి రావడంతో నిన్న తానే స్వయంగా ఫీజు వేసేందుకు ట్రాన్స్ ఫార్మర్ స్తంభం మీదకు ఎక్కాడు. జంపర్ హ్యాండిల్‌ బంద్‌ అయిందనకుని సుధాకర్‌రెడ్డి ఫీజు పెడుతుండగా విద్యుత్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సుధాకర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు.

 

రేపు విజయవాడలో ఏపీ కేబినెట్‌

హైదరాబాద్:విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ...ఈ సమావేశంలో ప్రధానంగా రాజధాని నిర్మాణంపైనే చర్చిస్తామని తెలిపారు. కృష్ణా పుష్కరాల నాటికి విజయవాడ దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేస్తాని స్పష్టం చేశారు. తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

'పట్టిసీమ గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు'

నెల్లూరు: పట్టిసీమ గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మంత్రులు దేవినేని ఉమా, నారాయణలు విమర్శించారు. నెల్లూరులో నీటిపారుదల శాఖ అధికారులతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టిసీమ పనులను జగన్‌ ఓసారి పరిశీలించి అవినీతి జరుగుతుందో, లేదో పరిశీలించవచ్చని మంత్రులు సూచించారు. లక్షలకోట్లు దిగమింగినవారిప్పుడు మాపై ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పట్టిసీమ మొదటిదశ పనులు పూర్తయ్యేందుకు కృషి చేస్తున్నామని వారు తెలిపారు. నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ స్థిరీకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు మంత్రులు తెలిపారు.

విశాఖ లోని సెంట్రల్‌ పార్క్‌కు అబ్దుల్‌ కలాం పేరు:గంటా...

హైదరాబాద్: విశాఖ లోని సెంట్రల్‌ పార్క్‌కు అబ్దుల్‌ కలాం పేరు పెడతామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. దీనిపై కేబినెట్‌లో చర్చిస్తామని తెలిపారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని ఆయన తెలిపారు. నిందితులు ఎంతటివారైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో ప్రక్షాళన మొదలుపెట్టామని గంటా ఈ సందర్భంగా తెలియచేశారు. వర్సిటీల్లో కులసంఘాలను నిషేధిస్తామని ఆయన తెలిపారు.

నా జీవితంలో ఇది మహర్ధశ:అనుష్క శర్మ

హైదరాబాద్: ప్రస్తుతం తన కెరీర్ హాయిగా గడిచిపోతుందని...తన జీవితంలో ఇది మహర్దశ అని మీడియా వర్గాల వద్ద ఆనందం వ్యక్తం చేసిందట అనుష్క శర్మ.. బాలీవుడ్ లో 'రబ్ నే బనాదీ జోడీ' సినిమాతో తెరంగ్రేట్రం చేసిన అనుష్క తర్వాత బ్యాండ్ బాజా బారత్, పీకే, దిల్ ధడక్ నేదో సినిమాలతో తనకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. జీవితంలో నిజాయితీకే ప్రాధాన్యమిస్తానని, అదే ఎంతో బలాన్నిస్తుందని, నిజాయితీతో పాటు స్వేచ్ఛ కూడా ఉండాలని అంటోంది. ప్రస్తుతం అనుష్క రణ్ బీర్ కపూర్ తో జంటగా 'యే దిల్ హై ముష్కిల్ 'లో నటించనుంది. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ ఓ ముక్య ప్రాతలో నటిస్తోంది.

14:59 - July 30, 2015

విజయనగరం: జిల్లాకేంద్రంలోని దాసన్నపేట డబుల్ కాలనీలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. కస్తూరీభా గాంధీ బాలికల పాఠశాలలో...ఫుడ్ పాయిజన్‌తో 20 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. బాలికలకు వాంతులు, విరేచనాలు రావటంతో...పాఠశాల సిబ్బంది వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యులు చికిత్స అందించడంతో.. పిల్లలంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఐతే ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే విషయం మాత్రం సిబ్బందికి తెలియటం లేదు. ఈ రోజు ఉదయం పెరుగన్నం తిన్న తర్వాత అస్వస్థకు గురైనట్లు విద్యార్థులు చెబుతున్నారు. అంతకుముందు రోజు తిన్న ఆహారమే కలుషితమై ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

14:54 - July 30, 2015

పశ్చిమగోదావరి : నడిపించాల్సిన ఓ 'నమ్మకం' వావి వరసలు మరిచిపోయింది. కాపాడాల్సిన కనురెప్పే కాటేసింది. కన్నతండ్రి రూపంలో కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ పైచాచిక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఏలూరు సత్రంపాడులో జరిగిన ఈ ఘోరం.. స్థానికుల చొరవతో పోలీసుల వద్దకు చేరింది. ఈ దారుణానికి పాల్పడిన మృగం బయ్యనరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'ప్రాణంగా చూసుకునే తన కన్న తల్లి చనిపోయిందని. ఆమె మృతి చెందిన తర్వాత.. నాలుగేళ్లుగా తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు బాధితురాలు తెలిపింది. ఇప్పటికే పలుమార్లు అబార్షన్లు కూడా జరిపించినట్లు వాపోయింది. మరోపక్క పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

 

ఎంఐఎంతోనే మా పోటీ: ఎమ్మెల్యే లక్ష్మణ్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు ప్రధాన పోటీ ఎంఐఎం అని బిజెపి శాసనసభ పక్ష నేత డా.కె.లక్ష్మణ్ అన్నారు.ఈ బీజేపీ ఎలక్షన్ కమిటీ గురువారం హైదరాబాద్ లో భేటీ అయింది. ఈ సందర్భంగా ఆ పార్టీ శాసన సభ పక్ష నేత డా. కె. లక్ష్మణ్ మాట్లాడుతూ... బల్దియా మేయర్ పీఠాన్ని తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటానికి వ్యూహాన్ని ఖరారు చేస్తున్నామని... అందు కోసం ఆగస్టు మొదటి వారం నుంచి ప్రజాక్షేత్రంలోకి దిగుతామన్నారు.

14:47 - July 30, 2015

గుంటూరు: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి గాలిగోపురాన్ని కూల్చేందుకు అధికారులు సిద్ధయ్యారు. పాత గోపురాన్ని కూల్చేసి...కొత్త గోపురాన్ని నిర్మించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాణానికి కోటి 54 లక్షల రూపాయలను వెచ్చిస్తున్నారు. ఓ భక్తుడు మరో 50 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. దీంతో రేపు ఉదయం 11 గంటల 50 నిమిషాలకు గోపురాన్ని కూల్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం హోమం, యజ్ఞం నిర్వహించి గాలిగోపురాన్ని తొలగిస్తారు.

14:43 - July 30, 2015

విశాఖ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విశాఖ ముస్తాబవుతోంది. విశాఖ సముద్రతీరంలో ఆర్‌కే బీచ్‌లో సాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఏర్పాట్లను మంత్రి గంటాశ్రీనివాసరావు పర్యవేక్షించారు. సభా వేదిక, పతాకావిష్కరణ, పరేడ్, శకటాల ప్రదర్శన ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై...కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో చర్చించారు. ఈ నేపథ్యంలో ఆర్‌కే బీచ్‌ అత్యంత సుందరంగా ముస్తాబవుతోంది. మరోవైపు తాజా పరిస్థితుల కారణంగా విశాఖలో పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేయనున్నారు. హైదరాబాద్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా వేడుకలు నిర్వహిస్తామని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

 

రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు పూర్తి

తమిళనాడు: రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి డా.ఎపిజె అబ్దుల్ కలాం అంత్యక్రియలు పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు నిర్వహించారు. కలాం అంత్యక్రియలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

 

రాజ్యసభ రేపటికి వాయిదా..

ఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో కాల్పుల ఘటనపై రాజ్యసభలో కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెబుతుండగా.. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. స్పీకర్ ఎంత వారించినా... సభ్యులు వినిపించుకోకుండా... ఆందోళన కొనసాగించారు. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

 

రాజ్యసభలో గందరగోళం

ఢిల్లీ:గురుదాస్ పూర్ లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై రాజ్యసభలో హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమాధానం చెప్తున్న సందర్భంగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.

బిజెపిలో చేరి చారిత్రక తప్పుచేశా: జగ్గారెడ్డి

హైదరాబాద్: జగ్గారెడ్డి అభ్యర్థనను సోనియా దృష్టికి తీసుకెళ్తానని దిగ్విజయ్ సింగ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. దిగ్విజయ్ సింగ్ భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో దిగ్విజయ్ మాట్లాడుతూ...జగ్గారెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరడాన్ని జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు ఆమోదించాయన్నారు. ఆస్తులు కాపాడుకునేందుకే కొందరు పార్టీని వీడుతున్నారని మండి పడ్డారు. తెలంగాణ లో కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ... బిజెపిలో చేరి చారిత్రక తప్పు చేశానని, బిజెపిలో ఉండలేకనే కాంగ్రెస్ లో చేరుతున్నాని స్పష్టం చేశారు.

కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టివేత

కడప: జిల్లాలోని పోరుమామిళ్లలో భారీగా ఎర్రచందనం దుంగల ను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ.5కోట్ల ధర పలుకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా 19 మంది వలసకూలీలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

లోక్ సభ రేపటికి వాయిదా

ఢిల్లీ: మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం గౌరవార్థం లోక్ సభ రేపటికి వాయిదా పడింది. రెండు రోజుల విరామం అనంతరం ప్రారంభమైన సభలో కలాం మృతికి సభ్యులంతా సంతాపం ప్రకటించారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

13:37 - July 30, 2015

మహబూబ్ నగర్ : జిల్లాలో మరో ప్రత్యూష ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా గుట్టులో సవతితల్లి చిత్రహింసలు బయటపడ్డాయి. గట్టులో మల్లేశ్, శంకరమ్మలకు ఇద్దరు వీరేశ్, లక్ష్మి సంతానం ఉన్నారు. అనారోగ్య సమస్యలతో వారి తల్లి శంకరమ్మ చనిపోయింది. ఆ తర్వాత తండ్రి సుజాత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఐతే సుజాత.. ఇద్దరు చిన్నారులపై కర్కశంగా ప్రవర్తించేది. ఇద్దరినీ ఎప్పుడూ కొడుతూ, వాతలు పెట్టేది. అంగన్‌వాడీ టీచర్లు...గాయాలపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. సవతితల్లి బాగోతం బయపటింది. ఘటనపై అంగన్‌వాడీ టీచర్లు...పోలీసులుకు ఫిర్యాదు చేశారు. చిన్నారులను గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బంగాళాఖాతంలో కొమెన్ తుపాన్...

హైదరాబాద్:బంగాళాఖాతంలో కొమెన్ తుపాన్ ఏర్పడింది. కోల్‌కొత ఆగ్నేయంగా 300 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమైంది. పశ్చిమ బంగ, ఒడిశా, త్రిపుర, మిజోరాం, బంగ్లాదేశ్‌లలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో 60 నుంచి 80 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 

13:35 - July 30, 2015

విశాఖపట్టణం : భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై రెండ్రోజుల్లో జీవో విడుదలవుతున్నట్టు ఏపి మంత్రి గంటాశ్రీనివాస్‌ చెప్పారు. నిర్మాణ స్థలం అనుకూలమని నిపుణులు గుర్తిస్తే అది మంత్రి అయ్యన్న పాత్రుడుదైనా, గంటాదైనా తీసుకోకతప్పదని అన్నారు. ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండే చోట సమీకరించాలన్నది సర్కారు ఆలోచనన్నారు.

'కస్తూరిభా' లో కులుషితాహారం:25మందికి అవస్వస్థత

విజయనగరం:జిల్లా కేంద్రంలోని బాబామెట్టలో ఉన్న కస్తూరిభా ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిన్న 25 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యా. ఉదయం పూట పెరుగన్నం తిన్న విద్యార్థులు కొద్దిసేపటికే బాలికలంతా తీవ్ర కడుపునొప్పి, విరేచనాలతో బాధపడ్డారు. నిర్వాహకులు వారందరినీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం వైద్యులు తెలిపారు.

13:31 - July 30, 2015

ముంబై : అపారమైన మేధాసంపత్తి. అత్యున్నతస్థాయి ఉద్యోగం. కాని యాకుబ్ తప్పటడుగులు వేశాడు. అన్నతో కలిసి నరమేధానికి కుట్ర చేశాడు. ఉగ్రవాదులకు సహాయం చేసి క్షమించరాని నేరం చేశాడు. 1993 ముంబై మారణహోమానికి తానూ ఒక బాధ్యుడయ్యాడు. ఇవే ఆరోపణలను నిర్ధారించిన కోర్టు...అతనికి ఉరి శిక్షను అమలు చేసింది. వృత్తి రీత్యా చార్డర్డ్ అకౌంటెంట్‌గా ఉద్యోగం చేసేవాడు. ఇతని సోదరుడు టైగర్‌ మెమన్‌..అండర్‌ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు. ఇదీ అతని కుటుంబ నేపథ్యం.
దావూద్, టైగర్ ఆర్ధిక వ్యవహారాలు..
1993 ముంబై వరుస పేలుళ్లలో యాకుబ్ పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించారు. సోదరుడు టైగర్ మెమన్‌తో పాటు దావూద్‌ ఆర్ధిక వ్యవహారాలను చూసేవాడు. టైగర్‌ దాదాపు 15 మంది యువకులకు పాకిస్తాన్‌లో ఉగ్ర శిక్షణ ఇచ్చాడు. వారి ఆర్ధిక వ్యవహారలను సైతం యాకుబే చూసుకునేవాడు. అంతేగాక ముంబై పేలుళ్ల కోసం యాకుబే...వాహనాలు, సామాగ్రి సమకూర్చాడన్నది ప్రధాన ఆరోపణ.
1993 మార్చి 12న ముంబైలో పేలుళ్లు..
1993 మార్చి 12న ముంబైలో నిమిషాల వ్యవధిలో 13 పేలుళ్లు జరిగాయి. 257 మందిచనిపోగా, 7 వందల మందికిపైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లకు దావూద్ ఇబ్రహీం, టైగర్‌ మెమన్‌లే ప్రధాన సూత్రధారులు. ఇక పేలుళ్ల కుట్రలో పాలు పంచుకున్నాడని యాకుబ్‌పైనా కేసు నమోదైంది. 1994లో యాకుబ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అభియోగాలు రుజువు కావటంతో 2006 సెప్టెంబర్‌ 12న టైగర్‌, యాకుబ్‌సహా 12 మందికి టాడా కోర్టు ఉరిశిక్షను విధించింది. మరో 20 మందికి యావజ్జీవశిక్షను ఖరారు చేసింది.
2013 మార్చి 21 ఉరిశిక్షను నిర్ధారించిన సుప్రీం..
ఆ తర్వాత 2013 మార్చి 21న యాకుబ్‌, టైగర్‌ మెమెన్‌ల ఉరిశిక్షను సుప్రీంకోర్టు ధృవీకరించింది. పది మందికి ఉరిశిక్షను యావజ్జీవంగా మార్పు చేసింది. 2014లో యాకుబ్ క్షమాభిక్ష పటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ తోసిపుచ్చారు. 2014 జూన్‌ 2న క్షమాభిక్ష పిటిషన్లను ఓపెన్‌ కోర్టులోనే విచారణ జరపాలన్న నిబంధన మేరకు, సుప్రీంకోర్టు ఉరిశిక్షను నిలిపివేసింది. ఇక 2015 ఏప్రిల్ 9న..యాకుబ్ వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2015 జులై 21 క్యురిటివ్ పటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టవేసింది. చివరకు జులై 30న యాకుబ్‌ ఉరిశిక్ష అమలు చేయాలని తీర్పు నిచ్చింది. ఆ తర్వాత జులై 29న కూడా యాకుబ్‌ పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. ఉరిశిక్షను అమలు చేయాలని తుదితీర్పు నిచ్చింది. అటు మహారాష్ట్ర గవర్నర్, ఇటు రాష్ట్రపతి కూడా...క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించారు. దీంతో నాగ్‌పూర్‌ జైలులో జులై 30న ఉదయం ఆరున్నర గంటలకు యాకుబ్‌ను ఉరితీశారు.

13:28 - July 30, 2015

మహారాష్ట్ర : బుధవారం అర్థరాత్రంతా హైడ్రామా నడిచింది. ఆఖరి క్షణం వరకు ఉత్కంఠ కొనసాగింది. కాని చివరకు ప్రభుత్వ పట్టుదలే గెలిచింది. యాకుబ్ సుదీర్ఘ పోరాటం ఓడిపోయింది. చివరి ఘడియ వరకు ప్రయత్నించినా...యాకుబ్‌కు ఫలితం లేకపోయింది. చివరకు ఉదయం ఆరున్నర గంటలకు....పుట్టినరోజు నాడే....యాకుబ్ ఉరికొయ్యకు వేలాడాడు. ఈ నెల 29 ఉదయం నుంచి...మెమెన్‌ ఉరిశిక్ష అమలుపై హైడ్రామా కొనసాగింది. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు యాకుబ్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం పన్నెండున్నరకు యాకుబ్‌కు క్షమాభిక్షపెట్టవద్దని.. అటార్నీజనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సాయత్రం నాలుగు గంటలకు మహారాష్ట్ర గవర్నర్ యాకుబ్ క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించారు. నాలుగున్నర గంటలకు యాకుబ్‌కు ఉరిశిక్ష విధిస్తూ సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి..
క్షమాభిక్ష పెట్టాలని యాకుబ్‌ రాష్ట్రపతిని కూడా కోరాడు. దీంతో 29న సాయంత్రం ఐదున్నరకు ...రాష్ట్రపతి క్షమాభిక్ష విజ్ఞప్తిని హోంశాఖకు పంపారు. దీనిపై ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు రాజ్‌నాథ్‌ స్వయంగా రాష్ట్రపతిని కలిసి...క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించాలని అభిప్రాయాన్నిచెప్పారు. దీంతో రాత్రి 10.47నిమిషాలకు రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించారు.
మరోసారి సుప్రీం తలుపు తట్టిన మెమన్..
రాత్రి 10:37కు సుప్రీంలో మరోసారి యాకుబ్ లాయర్ పిటిషన్ వేశారు. రాత్రి 11 :16కి ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని చీఫ్‌ జస్టిస్‌ను కోరారు. క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించిన తర్వాత..ఉరితీత అమలుకు కనీసం 14 రోజుల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు నిబంధనలు చెబుతున్నాయని లాయర్లు పిటిషన్ వేశారు. శిక్షను 14 రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. అర్ధరాత్రి 02: 30కి సుప్రీం కోర్టులో త్రిసభ్య ధర్మాసనం ఎదుట వాదనలు ప్రారంభమయ్యాయి. హోరాహోరీ వాదనల తర్వాత..ఉదయం 04 :30కి సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఉదయం 04 :30 ఉరిశిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. దీంతో ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో యాకుబ్‌ను నాగ్‌పూర్ జైలు అధికారులు ఉరితీశారు. ఉదయం 7 గంటలకు యాకుబ్ మృతి చెందినట్లు జైలు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
రాత్రి భోజనం చేయని మెమన్..
యాకుబ్ మెమన్‌ 29న మధ్యాహ్నం రెండు చపాతీలు తిన్నాడు. రాత్రి భోజనం తినేందుకు నిరాకరించాడు. నిబంధనల ప్రకారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు యాకుబ్‌ను జైలు అధికారులు నిద్రలేపారు. ఆ తర్వాత స్నానం చేసి అధికారులు ఇచ్చిన కొత్త దుస్తులు ధరించాడు మెమన్‌. చివరిసారిగా తనకు ఇష్టమైన కిచిడీని అల్పాహారంగా తీసుకున్నాడు. రేపు అతని కూతురు పుట్టినరోజు కావటంతో...ఆమెతో మాట్లాడాలని చివరి కోరిక కోరాడు. కాని అందుకు జైలు అధికారులు నిరాకరించారు.
యాకుబ్‌ ఉరి నేపథ్యంలో నాగపూర్ సెంట్రల్ జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ముంబైతో పాటు దేశవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

పొలాలు దున్ని నిరసన తెలిపిన ఏపీ రాజధాని రైతులు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో అసైన్డ్, సీలింగ్ భూముల సేకరణ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటిపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు పొలాలను దున్ని తమ నిరసన తెలిపారు.

గ్రామ జ్యోతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: గ్రామజ్యోతి కార్యక్రమం రూపకల్పన పై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగింది. గ్రామీణ ప్రాంతాల రూపు రేఖలు మార్చే లక్ష్యంతో ఆగస్టు 15 నుంచి తెలంగాణ ప్రభుత్వం గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.

ఉరిశిక్షలు ఉగ్రవాదాన్ని ఆపలేవు:శశిథరూర్...

హైదరాబాద్: ఉరిశిక్షల అమలు ఎక్కడా ఉగ్రవాదాన్ని నిలువరించలేకపోయాయని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. మెమన్ ఉరిపై ఆయన తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... సుప్రీం తీర్పుపై నేను వ్యాఖ్యానించటం లేదన్నారు. ఉరిశిక్ష అమలు, అందుకు అనుసరిస్తున్న విధానాలపైనే నా సందేహాలని... ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దు. కానీ ఉరిశిక్షల అమలు అనేది ఎక్కడా ఉగ్రవాదాన్ని నిలువరించినట్లుగా లేదు. ప్రభుత్వ ప్రోత్సహక హత్యలు జరుగుతున్నాయి. కేంద్రం ఓ మానవతావాదిని ఉరితీసిందని పేర్కొన్నాడు. 

ఆగస్టు 10న జంతర్ మంతర్ వద్ద జగన్ ధర్నా

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 10న దీక్ష చేయనున్నారు. గురవారం జరిగిన వైసీపీ పొలిటికల్‌ ఎఫ్ఫైర్స్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

ఆస్ట్రేలియాలో భూకంపం...

హైదరాబాద్:ఆస్ట్రేలియా ఈశాన్య ప్రాంతంలోని క్వీన్ లాండ్స్ లో గురువారం భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదయింది. ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించ లేదని బ్యూరో ఆఫ్ మెట్రాలజీ వెల్లడించింది. అయితే తూర్పు తీరంలో సునామీ వచ్చే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయని జియో సైన్స్ ఆస్ట్రేలియా తెలిపింది. భూకంప కేంద్రాన్ని కూడా కనుగొన్నట్లు పేర్కొంది.

ఎన్నికల బరిలో అంగ్ సాన్ సూకీ

హైదరాబాద్: మయన్మార్ ప్రతిపక్ష నాయకురాలు అంగ్‌సాన్ సూకీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఎన్నికల్లో పోటి చేయడానికి పేరు నమోదు చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ తరపున సూకీ నే మొదటి అభ్యర్థి. నవంబరులో జరగనున్న సాధారణ ఎన్నికల్లో అంగ్ సాన్ సూకీ పార్టీ అఖండ విజయం సాధించనుందనే అంచనాలు వెలువడ్తున్నాయి. కవ్‌హ్మూ గ్రామీణ నియోజక వర్గం నుంచి సూకీ పోటీ చేస్తున్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు పై హైకోర్టులో ముగిసిన వాదనలు...

హైదరాబాద్‌ : ఫోన్‌ ట్యాపింగ్‌ రికార్డులు ఏపీ ప్రభుత్వానికి ఇవ్వవద్దని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ ముగిసింది. ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ వాదనలు వినిపించారు. కాల్‌డేటా ఇవ్వాలని ఆదేశించే అధికారం విజయవాడ కోర్టుకు లేదని న్యాయవాది రాంజెఠ్మలాని వాదించారు. దీనిపై కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ నటరాజన్‌ వాదనలు వినిపించారు.దీనిపై వాదనలు విన్న హైకోర్టు తన నిర్ణయాన్ని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.

ముంబై చేరుకున్న మెమన్ మృతదేహం

హైదరాబాద్: ముంబై బాంబు పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ మృతదేహాం ముంబై చేరుకుంది. నగరంలోని మెరైన్ లైన్ ప్రాంతంలో అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెమన్ మృతదేహాన్ని తీసుకువస్తున్న క్రమంలో మహీం ప్రాంతంలోని దుకాణాలన్నింటినీ పోలీసులు మూసివేయించారు. 

12:39 - July 30, 2015

ముంబై : 1993 బాంబు పేలుళ్ల కేసులో దోషియైన యాకూబ్ మెమన్ ను గురువారం తెల్లవారుజామున నాగపూర్ జైల్లో ఉరి తీశారు. 

 • 1993 మార్చి 12: ముంబైలో వరుసగా 13 చోట్ల పేలుళ్లు జరిగాయి. 257 మంది మరణించగా, 700 మందికి పైగా గాయాలు.
 • 1993, ఏప్రిల్ 19 : సినీ నటుడు సంజయ్‌దత్ అరెస్ట్.
 • 1993, నవంబర్ 4: 189 మంది నిందితులపై పది వేల పేజీల తొలి చార్జిషీట్.
 • 1993, నవంబర్ 19: కేసు సీబీఐకి అప్పగింత.
 • 1995 ఏప్రిల్ 10 : 26 మంది నిందితులను విడుదల చేసిన టాడా కోర్టు.
 • 1995, ఏప్రిల్ 19: కేసుపై విచారణ ప్రారంభం.
 • 1995, అక్టోబర్ 14: సంజయ్‌దత్‌కు సుప్రీంకోర్టు బెయిల్.
 • 1996 మార్చి 23 : జడ్జి జేఎన్ పటేల్‌కు హైకోర్టు జడ్జిగా పదోన్నతి, బదిలీ.
 • 1996 మార్చి 29: టాడా ప్రత్యేక జడ్జిగా పీడీ కోడే నియామకం.
 • 2000 అక్టోబర్ : ప్రాసిక్యూషన్ తరఫు సాక్షులు 684 మంది విచారణ పూర్తి.
 • 2001 మార్చి 9 : నిందితుల వాంగ్మూలం నమోదు.
 • 2001, ఆగస్టు 9 : ప్రాసిక్యూషన్ వాదనలు ప్రారంభం.
 • 2003 సెప్టెంబర్ : ముగిసిన విచారణ. తీర్పును రిజర్వులో ఉంచిన కోర్టు.
 • 2006 జూన్ 13 : గ్యాంగ్‌స్టర్ అబూసలేంపై వేరుగా విచారణ.
 • 2006 సెప్టెంబర్ 12 : మెమన్ కుటుంబంలో నలుగురు దోషులని కోర్టు ప్రకటన. 12 మందికి మరణశిక్ష, 20 మందికి యావజ్జీవం. ముగ్గురి విడుదల.
 • 2013 మార్చి 21 : యాకుబ్ మెమన్‌కు మరణశిక్షను ధ్రువీకరించిన సుప్రీం, మిగిలిన 10 మందికి మరణశిక్ష.. యావజ్జీవ శిక్షగా మార్పు.
 • 2013 జూలై 30: యాకుబ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం.
 • 2014 ఏప్రిల్ 11: యాకుబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి.
 • 2014 జూన్ 2: మెమన్ మరణశిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్టు.
 • 2015 ఏప్రిల్ 9 : మెమన్ రెండో రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం.
 • 2015 జులై 21: మెమన్ క్యురేటివ్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం.
 • 2015 జులై 23: మరణశిక్షపై స్టే కోరుతూ సుప్రీంలో మెమన్ పిటిషన్.
 • 2015 జులై 27: క్యురేటివ్ పిటిషన్‌పై ఇద్దరు జడ్జీల భిన్నమైన తీర్పు.
 • 2015 జులై 29: మరణశిక్షపై స్టే విధించాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం.
 • 2015 జులై 30 : నాగ్ పూర్ జైల్లో మెమన్ కు ఉరి.

'రిషితేశ్వరి' కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా..

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ విచారణ ఆగస్టు 6కు వాయిదా పడింది.

రామేశ్వరంలో కలాం స్మారక మందిరం...

రామేశ్వరం: భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం స్మారక మందిరాన్ని రామేశ్వరంలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబసభ్యుల సూచన మేరకు పేక్కరుంబులోని 1.32 ఎకరాల స్థలంలో స్మారక మందిర నిర్మాణం జరుగనుంది.

కాంగ్రెస్ గూటికి జగ్గారెడ్డి

హైదరాబాద్: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయినట్లు సమాచారం. కాసేపట్లో దిగ్విజయ్ సింగ్ ను కలవనున్నట్లు సమాచారం. మెదక్ ఉప ఎన్నికల్లో బిజెపి తరుపున పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఫోన్‌ ట్యాపింగ్‌ పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌ : ఫోన్‌ ట్యాపింగ్‌ రికార్డులు ఏపీ ప్రభుత్వానికి ఇవ్వవద్దని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ వాదనలు వినిపించారు. కాల్‌డేటా ఇవ్వాలని ఆదేశించే అధికారం విజయవాడ కోర్టుకు లేదని న్యాయవాది రాంజెఠ్మలాని వాదించారు. దీనిపై కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ నటరాజన్‌ వాదనలు వినిపించారు.

అధికారిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు పూర్తి...

తమిళనాడు:రామేశ్వరంలో సైనిక అధికారిక లాంఛనాలతో అబ్దుల్ కలాం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముస్లిం మత సంప్రదాయాల ప్రకారం కలాం పార్థివదేహాన్ని ఖననం చేశారు. అంతకు ముందు కలాం నివాసం నుంచి అంత్యక్రియలు నిర్వహించే మైదానం వరకు కలాం అంతిమయాత్ర నిర్వహించారు. కలాం పార్థివ దేహానికి రక్షణ శాఖ అధికారులు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి, తివ్రధ దళాల అధిపతులు, కేంద్ర మంత్రులు, రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్, పలు రాష్ట్రాల సీఎంలు, తమిళనాడు గవర్నర్ రోశయ్య తదితరులు పాల్గొన్నారు. కలాంను కడసారి చూసేందుకు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ఆయన అభిమానులు రామేశ్వరం తరలి వచ్చారు.

పోలీసుల అదుపులో 70మంది బాల కార్మికులు

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జీఆర్ పీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో 70 మంది బాలకార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మెరైన్ లైన్ మెమన్ ప్రాంతంలో అంత్యక్రియలు..

హైదరాబాద్: ముంబై బాంబు పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ మృతదేహాన్ని మహారాష్ట్ర పోలీసులు ముంబైకి చేరుకోనుంది. మహిం ప్రాంతంలోని యాకుబ్ ఇంటికి చేరుకోనున్న అతడి మృతదేహానికి నేడే అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. నగరంలోని మెరైన్ లైన్ ప్రాంతంలో అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెమన్ మృతదేహాన్ని తీసుకువస్తున్న క్రమంలో మహీం ప్రాంతంలోని దుకాణాలన్నింటినీ పోలీసులు మూసివేయించారు. 

కాసేపట్లో కలాం అంత్యక్రియలు

తమిళనాడు: కాసేపట్లో సైనిక లాంఛనాలతో అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని, కేంద్ర మంత్రులు, రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్, పలు రాష్ట్రాల సీఎంలు, తమిళనాడు గవర్నర్ రోశయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై హైకోర్టు కెళ్లిన టీ.సర్కార్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై విజయవాడ కోర్టు తీర్పు పై తెలంగాణ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున రాం జెఠ్మలానీ వాదనలు వినిపించనున్నారు.

సాంకేతికంగా సాధ్యమైతేనే ఎయిర్ పోర్టు:మంత్రి గంటా

విశాఖ: బీచ్ రోడ్డు ప్రాంతంలో ఆగస్టు 15 వేడుకులను జరపాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. మరో ఈ వేడుకల సందర్భంగా ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందన్న ఐబీ హెచ్చరికలతో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు మంత్రి గంటా తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టు పై మాట్లాడుతూ సాంకేతికంగా సాధ్యమైతేనే ఎయిర్ పోర్టును ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరి భూములైనా తీసుకోక తప్పదన్నారు.

 

11:07 - July 30, 2015

తమిళనాడు :    నిరుపేదగా పుట్టావు..నింగికెగరాలని కలలు కన్నావు..నిప్పులు చిమ్మె రాకెట్లను చేశావు..నిగర్విగా పెరిగావు..నిరాడంబరునిగా మసలావు..ఆచార్యునిగా..శాస్త్రవేత్తగా గణుతికెక్కావు..రక్షణ రంగనిపునిగా ఎంత ఖ్యాతి గడించావో..రాష్ట్రపతిగా అంతే రాణించావు..ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంతో ఒదిగి ఉన్నావు..ప్రకృతి అన్నా..పసి బాలలన్నా..విద్యార్థులున్నా..విజ్ఞానమన్నా ఎంతో ప్రేమించావు..సాంకేతిక రంగాన్ని ఎంత అధ్యయనం చేశావో..సంగీతాన్ని అంతే ఇదిగా సాధన చేశావు..చివరిక్షణం దాక పాఠాలు చెబుతూనే ఉన్నావు..మరలిరాని లోకాలకు నువ్వేగినా..కలాం నిర్మలనమైన నీ నవ్వును..నీవు చూసిన బాటనూ మరిస్తే కదా ఈ దేశం..
అశ్రనయనాల మధ్య వీడ్కోలు..
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం అంత్యక్రియలు ముగిశాయి. వేలాది వచ్చిన ప్రజల అశ్రునయనాల మధ్య కలాం అంతిమయాత్ర కొనసాగింది. కలాం..అమర్ రహే అనే నినాదాలు మిన్నంటాయి. కలాంను కడసారి చూడేందుకు అశేష జనవాహిని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంకు పోటెత్తారు. ఈ అంతిమ క్రియలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్ర మంత్రులు, తమిళనాడు మంత్రులు, ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రుల వెంకయ్య నాయుడు, పారికర్ లు కలాం పార్థివ దేహంతో చేరుకుని దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రామేశ్వరంలో సైనిక లాంఛనాలు నిర్వహించాయి. అనంతరం ముస్లిం సంప్రదాయ ప్రకారం అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరిగాయి.
షిల్లాంగ్ లో..

 • సోమవారం షిల్లాంగ్ లో ప్రసంగిస్తూ అబ్దుల్ కలాం కన్నుమూశారు..
 • మంగళవారం ఉదయం షిల్లాంగ్ నుండి రక్షణ శాఖ ప్రత్యేక విమానంలో గువాహటికి ఇక్కడి నుండి పాలం విమానాశ్రయానికి కలాం పౌర్థివ దేహాన్ని తీసుకు వచ్చారు.
 • పాలం ఎయిర్ పోర్టులో త్రివిద దళాధిపతులు గౌరవ వందనం సమర్పించారు.
 • భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కలాం, ప్రధాన మంత్రి మోడీ ఇతరులు కలాం పార్థీవ దేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
 • అనంతరం కలాం అధికారిక నివాసం టెన్ రాజాజీ మార్గ్ లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు.
 • బుధవారం ఉదయం అధికారిక నివాసం రాజాజీ మార్గ్ నుండి కలాం భౌతికకాయాన్ని పాలం విమానాశ్రయానికి తీసుకొచ్చారు.
 • అక్కడ సైనికులు గౌరవవందనం చేసిన అనంతరం ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో కలాం పార్థివ దేహాన్ని మధురైకి తరలించారు.
 • కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, మనోహర్ పారికర్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీరిద్దరూ కలాం భౌతికకాయంతో తమిళనాడు వెళ్లారు.
 • రామేశ్వరంలో బుధవారం సాయంత్రం ఏడు గంటల వరకు ప్రజల సందర్శనార్థం కలాం భౌతికకాయాన్ని ఉంచారు.
 • గురువారం ఉదయం కలాం స్వగృహం నుండి అంత్యక్రియల ప్రాంతానికి అంతిమయాత్ర నిర్వహించారు.
 • సైనిక లాంఛనాలు..ముస్లిం సంప్రదాయం ప్రకారం కలాం అంత్యక్రియలు జరిగాయి.
   

రామేశ్వరం చేరుకున్న ప్రముఖులు..

తమిళనాడు: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంతిమయాత్రలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రామేశ్వరం చేరుకున్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరైయ్యారు. మరికాసేపట్లో కలాం అంతమక్రియలు సైనిక లాంఛనాలతో రామేశ్వరం రైల్వేస్టేషన్ సమీపంలో జరగనున్నాయి. అశేష ప్రజలు శోకతప్త హృదయాలతో అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. 

మాజీ హోమంత్రి మాధవరెడ్డి విగ్రహం దహనం..

నల్గొండ: చిట్యాల మండలం వెలిమినేడులో మాజీ హోంశాఖమంత్రి మాధవరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. ఈ సంఘటనపై తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. మాధవరెడ్డి విగ్రహాన్ని ఎవరు దహనం చేశారన్నది తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. 

యాకూబ్ మెమన్ మృతదేహం ముంబై తరలింపు

హైదరాబాద్:ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్‌ మృతదేహాన్ని ముంబై తరలించారు. ఈరోజు మధ్యాహ్నం మెమన్ అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. 

10:34 - July 30, 2015

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ విదేశీ పర్యటనలకు సిద్ధమౌతున్నారు. ఈసారి మాత్రం మంత్రివర్గంతో కాకుండా కుటుంబసభ్యులతో వెళ్లనున్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత బాబు పలు విదేశీ పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే నేపథ్యంలో బాబు ఈ విదేశీ పర్యటనలు చేశారు. బాబు విదేశీ పర్యటనలపై విపక్షాలు పలు విమర్శలు చేశాయి కూడా. తాజాగా బాబు సకుటుంబ సమేతంగా టర్కీ వెళ్లబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఏటా వారం రోజుల పాటు కుటుంబసభ్యులతో బాబు విదేశీ టూర్ కు వెళుతుంటారు. ఈ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత రాష్ట్రంలో పెట్టుబడల ఆకర్షణ కోసం ఆస్ట్రేలియాలో బాబు పర్యటించనున్నారంట. ఆస్ట్రేలియా పర్యటనపై విపక్షాలు ఇంకా ఎన్ని విమర్శలు గుప్పిస్తాయో చూడాలి. 

సోషల్ మీడియా పై పోలీసుల నిఘా...

హైదరాబాద్: సోషల్ మీడియాపై పోలీసులు నిఘాను పెంచారు. యాకుబ్ మెమన్‌ను ఉరి తీసిన నేపథ్యంలో పోలీసులు ఈ నిఘాను పటిష్టం చేశారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ను నిశితంగా గమనిస్తున్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్‌చేసిన, తప్పుడు ప్రచారం చేసిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

స్కూల్ వ్యాన్ ను ఢీకొన్న రైలు: ఇద్దరు చిన్నారుల మృతి

హైదరాబాద్:ఓ స్కూల్ వ్యాన్ ను రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మీతి చెందగా... మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జార్ఖండ్ లోహర్ డాగా జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.

10:17 - July 30, 2015

తమిళనాడు : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం అంతిమ యాత్ర ప్రారంభమైంది. రామేశ్వరంలో జరుగుతున్న ఈ అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. కన్నీటితో కలాంకు వీడ్కోలు పలుకుతున్నారు. కలాం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తమిళనాడు రాష్ట్ర మంత్రులు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జు ఖర్గే, తదితరులు పాల్గొననున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రామేశ్వరంకు చేరుకున్నారు. ఉదయం 11గంటల ప్రాంతంలో సైనిక లాంఛనలతో కలాం అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. తమ ప్రియతమ కలాంను కడసారి చూసుకొనేందుకు వేలాది జనం కిలోమీటర్ల మేరబారులు తీరారు. కలాం అమర్ రహే అనే నినాదాలతో రామేశ్వరం దీవి హోరెత్తిపోయింది. సదూర ప్రాంతాల నుండి కూడా వేల సంఖ్యలో జనం రామేశ్వరంకు చేరుకుని ప్రియతమ నేతకు అంజలిఘటించారు.​
జయలలిత గైర్హాజర్..
అబ్దుల్ కలాం అంత్యక్రియలకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రావడం లేదు. అనారోగ్య కారణాల దృష్ట్యా తాను కలాం అంత్యక్రియల్లో పాల్గొనలేకపోతున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం తో సహా ఏడుగురు మంత్రులు అంత్యక్రియలకు హాజరౌతారని ఆమె పేర్కొన్నారు.
1.32 ఎకరాల్లో కలాం స్మారక మందిరం..
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మారక మందిరాన్ని రామేశ్వరంలో 1.32 ఏకరాలలో ఏర్పాటు చేయనున్నారు. తొలుత గాంధీ సమాధి పక్కన దీనిని నిర్మించాలని కేంద్రం యోచించింది. కానీ రామేశ్వరంలోనే నిర్మించాలని కుటుంబసభ్యులు కోరడంతో తగిన స్థలాన్ని పరిశీలించాలంటూ కలెక్టర్ కు ఆదేశాలు అందాయి. ఈ మేరకు పేక్కరుంబులో ప్రభుత్వానికి చెందిన 1.32 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. రామేశ్వరం బస్టాండు నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది.
సోమవారం షిల్లాంగ్ లో కలాం మృతి..
సోమవారం షిల్లాంగ్ లో ప్రసంగిస్తూ అబ్దుల్ కలాం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనంతరం మంగళవారం ఉదయం షిల్లాంగ్ నుండి రక్షణ శాఖ ప్రత్యేక విమానంలో గువాహటికి కలాం పార్థీవ దేహాన్ని తీసుకొచ్చారు. మధ్యాహ్నాం పాలం విమానాశ్రయానికి కలాం పౌర్థివ దేహాన్ని తీసుకు వచ్చారు. ఎయిర్ పోర్టులో త్రివిద దళాధిపతులు గౌరవ వందనం సమర్పించారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కలాం, ప్రధాన మంత్రి మోడీ ఇతరులు కలాం పార్థీవ దేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం కలాం అధికారిక నివాసం టెన్ రాజాజీ మార్గ్ లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు.
రామేశ్వరంకు తరలింపు..
బుధవారం ఉదయం అధికారిక నివాసం రాజాజీ మార్గ్ నుండి కలాం భౌతికకాయాన్ని పాలం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడ సైనికులు గౌరవవందనం చేసిన అనంతరం ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో కలాం పార్థివ దేహాన్ని మధురైకి తరలించారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, మనోహర్ పారికర్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీరిద్దరూ కలాం భౌతికకాయంతో తమిళనాడు వెళ్లారు. రామేశ్వరంలో బుధవారం సాయంత్రం ఏడు గంటల వరకు ప్రజల సందర్శనార్థం కలాం భౌతికకాయాన్ని ఉంచారు. వేలాదిగా ప్రజలు అంజలి ఘటించారు. 

కలాం అంతిమయాత్ర ప్రారంభం..

హైదరాబాద్: భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అంతిమ యాత్ర ప్రారంభమైంది. రామేశ్వరం లోని ఆయన నివాసం నుంచి యాత్ర ప్రారంభమైంది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఆయన భౌతికకాయంపై ఆకుపచ్చ వస్త్రం కప్పి భుజాల మీద మోసుకుంటూ సైనికులు తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, సైనికాధికారులు రామేశ్వరం చేరుకున్నారు. 11 గంటలకు కలాంకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. కలాం అంత్యక్రియల నేపథ్యంలో, రామేశ్వరానికి ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. మహోన్నత మనిషికి కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు. 

దేశవ్యాప్తంగా హై అలర్ట్

హైదరాబాద్:ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నాగపూర్, ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితులపై సమీక్షించారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

ఫూంచ్ సెక్టార్ లో కాల్పులు: జవాను మృతి

హైదరాబాద్: జమ్మూకాశ్మీర్ లోని ఫూంచ్ సెక్టార్ లో గురువారం ఉదయం భారత శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ మృతి చెందాడు.

రుషికేశ్వరి మృతిపై రెండో రోజు కొనసాగుతున్న విచారణ....

గుంటూరు:ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రుషికేశ్వరి మృతిపై రెండో రోజు బాలసుబ్రమణ్యం కమిటీ విచారణ జరుపుతోంది. తోటి విద్యార్థులు, రుషికేశ్వరి తల్లిదండ్రులును కమిటీ సభ్యులు విచారిస్తారు. వర్శిటీలోకి మీడియా అనుమతిని నిరాకరించారు. వర్శిటీ అధ్యాపకులు, హాస్టల్‌ వార్డెన్‌లను విచారించనుంది. ఈమెయిల్‌ ద్వారా విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి, అయిదు రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తాని బాలసుబ్రమణ్యం చెప్పారు.

జైలుకు బర్త్ డే కేక్ పంపిన కుటుంబ సభ్యులు...

హైదరాబాద్: ముంబై పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న యాకూబ్ మెమన్ పుట్టిన రోజు సందర్భంగా అతని కుటుంబసభ్యులు జైలు అధికారులకు బుధవారం రాత్రి బర్త్ డే కేక్ పంపించారు. మెమన్ పుట్టినరోజు వేడుక జరపాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. క్షమాబిక్ష పిటిషన్ పై వారు అప్పటివరకూ ఎన్నో అశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతేడాది మెమన్ తొలి పిటిషన్ ను తిరస్కరణను గురైన విషయం తెలిసిందే. మరోవైపు తెల్లవారితే తన 54వ పుట్టిన రోజు.. తెల్లవారితే ఉరి.. ఇలాంటి పరిస్థితుల మధ్య యాకూబ్ మెమన్ ఉద్వేగానికి లోనయ్యాడు. బుధవారం నాడు జైలు అధికారులు పెట్టిన ఆహారాన్ని కూడా అతడు తీసుకోలేదు.

కుటుంబ సభ్యులకు మెమన్ డెడ్ బాడీ

హైరదాబాద్: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ డెడ్ బాడీని అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. యాకూబ్ సోదరులు నాగ్ పూర్ జైలుకు వచ్చి డెడ్ బాడీని అంబులెన్స్ లో పోలీస్ ఎస్కార్ తో నాగ్ పూర్ ఎయిర్ పోర్టుకు తరలించారు. అక్కడి నుండి ముంబై తరలించనున్నట్లు సమాచారం.

నేడు ఎంపీలతో సమావేశం కానున్న సోనియా..

ఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

రామేశ్వరం చేరుకున్న సీఎం చంద్రబాబు

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కొద్ది సేపటి క్రితం రామేశ్వరం చేరుకున్నారు.

09:44 - July 30, 2015

హైదరాబాద్ : పోటీ పరీక్షల విధి, విధానాలు, సిలబస్‌ను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. మొదటి నుంచి చెబుతున్నట్లుగానే తెలంగాణ ఉద్యమ చరిత్రను పోటీపరీక్షల సిలబస్‌లో చేర్చింది. గ్రూప్-1, గ్రూప్- 2 పరీక్షల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రకు 150 మార్కులను కేటాయించింది. తొలి దశ ఉద్యమం మొదలుకుని రాష్ట్ర ఆవిర్భావం వరకు ప్రశ్నలుండేలా సిలబస్‌ను రూపొందించింది.                                                                         
15వేల పోస్టులు..
పోటీ పరీక్షల సిలబస్‌ను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేసింది. దాంతో పాటు వయో పరిమితిని సైతం10 ఏళ్లు పొడగించిన ప్రభుత్వం..తాజాగా పోటీపరీక్షల సిలబస్‌ను ఖరారు చేసింది. గ్రూపుల వారిగా పోస్టులను సైతం విభజించింది. సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ సహ 20 రకాల పోస్టులను గ్రూప్-1లో చేర్చింది. గ్రుప్-2లో మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ తహసీల్దార్లు సహా 12 రకాల పోస్టులను చేర్చింది. కొత్తగా గ్రూప్-3 పోస్టులను తీసుకొచ్చింది. అందులో సీనియర్ ఎకౌంటెంట్, ఆడిటర్ సహ 17 రకాల పోస్టులను చేర్చింది.
గ్రూప్‌-1లో ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ పరీక్షలు..
ఇక ఉద్యోగాల కేటగిరీల వారిగా పరీక్షా విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. గ్రూప్-1 పరీక్షలో ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ కాగా మెయిన్స్‌లో ఎస్సేలు రాయాల్సి ఉంటుంది. ఇక చివరిగా ఇంటర్యూ ఉంటుంది. మొత్తం వేయి మార్కులకుగాను పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ లో మొత్తం ఆరు పేపర్లుండగా.. ప్రతి పేపర్‌కు 150 మార్కులను కేటాయించారు. మొదటి పేపర్‌ జనరల్‌ ఎస్సే రైటింగ్‌, రెండో పేపర్‌ చరిత్ర, కల్చర్, జియోగ్రఫి, పేపర్‌ మూడులో సమాజం, రాజ్యాంగం, పాలన, నాలుగో పేపర్‌లో ఆర్థికం, అభివృద్ది, ఐదో పేపర్‌లో శాస్త్ర, సాంకేతిక అంశాలపై ప్రశ్నలుంటాయి. కొత్తగా ప్రవేశపెడుతున్న ఆరో పేపర్లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్బావం వంటి అంశాలను చేర్చారు. తొలి దశ ఉద్యమం 1948 నుంచి మొదలుకొని మలి దశ ఉద్యమం 2014 వరకు జరిగిన చరిత్ర మొత్తం సిలబస్‌లో ఉండనుంది. తెలంగాణ చరిత్ర, ఉద్యమం, రాష్ట ఏర్పాటు ఇలా ఉద్యమంతో ముడి పడి ఉన్న అంశాలపై ప్రశ్నలు ఉండనున్నాయి.
గ్రూప్‌-2లో మొత్తం నాలుగు పేపర్లు, 675 మార్కులు..
ఇక గ్రూప్-2 విషయానికొస్తే మొత్తం నాలుగు పేపర్లు..675 మార్కులు. మొదటి మూడు పేపర్లు చరిత్ర, ఆర్ధికం, అభివృద్ది, సమాజం, పాలన, రాజ్యాంగం వంటి అంశాలపై ప్రశ్నలు ఉండనున్నాయి. ఇక చివరి పేపర్లో మాత్రం గ్రూప్-1 పరీక్షల తీరులోనే ప్రత్యేక రాష్ట ఉద్యమ చరిత్రలను సిలబస్‌గా చేర్చారు. ఇందులో విజయం సాధించిన అభ్యర్ధులు..ఇంటర్యూ పరీక్షకు హాజరుకావాలి. అలాగే గ్రూప్-3 పరీక్ష 450 మార్కులుగా ఉంటుంది. దీంట్లో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీ, పేపర్‌-2లో చరిత్ర-పాలిటిక్స్‌, సొసైటీ పేపర్లు ఉంటాయి. పేపర్‌-3లో ఆర్థికశాస్త్రం అభివద్ధిని సెలబస్‌లో పెట్టారు. ఇక గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్‌తో పాటు దాదాపు ఆరు రకాల పోస్టులను చేర్చారు. మొత్తం 300 మార్కులకు ఉండే ఈ పరీక్షలో పేపర్‌-1 జనరల్ నాలెడ్జ్, పేపర్‌-2లో సెక్రెటేరియల్ ఎబిలిటీస్‌ను పరీక్షంచనున్నారు. 

09:26 - July 30, 2015

హైదరాబాద్ : నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్స్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. సర్కారీ కొలువుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఆనందోత్సాహం వెల్లివిరిస్తోంది. ఒక్కసారిగా వారి దృష్టి మళ్లీ చదువులపైకి మళ్లింది. లైబ్రరీలు, పార్కులు, ఖాళీ ప్రదేశాలు ఇలా ఎక్కడ చూసినా పోటీపరీక్షలకు కసరత్తు చేసే నిరుద్యోగులే కన్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ సర్కారీ కొలువుల జాతర మొదలైంది. పోటీపరీక్షలకు నోటిఫికేషన్స్‌ ఎప్పుడెప్పుడు పడతాయా అని ఇన్నాళ్లూ ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. దీంతో నిరుద్యోగులు మళ్లీ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇన్నాళ్లు పుస్తకాలను అటకెక్కించిన విద్యార్థులు మళ్లీ పుస్తకాల బూజు దులుపుతూ చదువుల్లో మునిగితేలున్నారు.
ఆగస్టు తొలివారంలో నొటిఫకేషన్..
ఆగస్టు తొలివారంలో మొదటి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశముంది. మొత్తం 15,522 పోస్టులను మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందులో పోలీసు, అగ్నిమాపక శాఖల్లో 8 వేల పోస్టులు, విద్యుత్‌ శాఖలో 2,681 పోస్టులు, పంచాయతీరాజ్‌, ఇతర శాఖల్లో కలిపి 4,841 వరకు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వెలువడే తొలి నోటిఫికేషన్‌ కోసం నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
మొత్తం పోస్టులు 15,522...
మరో వారం పదిరోజుల్లో ఉద్యోగాల నోటిఫికేషన్స్ వెలువడనుండడంతో నిరుద్యోగులంతా ఇప్పుడు కోచింగ్‌ సెంటర్లలో చేరుతున్నారు. హైదరాబాద్‌ సహా జిల్లా కేంద్రాల్లోని కోచింగ్‌ సెంటర్లకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. దీంతో కోచింగ్ సెంటర్లన్నీ విద్యార్థులతో కిటకిటటలాడుతున్నాయి. పుస్తకాలు, కుర్చీలు పట్టుకొని చెట్టునీడ కోసం పరుగెడుతున్నారు. ఈ సంవత్సరం జరిగే పోటీపరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో..అభ్యర్దులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది అభ్యర్థులు మాత్రం..వయో పరిమితి పెంపుపట్ల నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఇదే అదనుగా భావించి అభ్యర్థుల నుంచి వేలల్లో ఫీజుల్ని వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడిగినా...మీ ఇష్టం అయితే చేరండి లేకపోతే వేరే కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లండి అంటూ సమాధానం చెప్తున్నారు. దీంతో నిరుపేద అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. 

ముంబైలో మెమన్ అంత్యక్రియలు..

ముంబై : 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ అంత్యక్రియలు నేటి మధ్యాహ్నాం జరుగనున్నాయి. నేడు ఉదయం మెమన్ ను ఉరి తీసిన సంగతి తెలిసిందే. 

యాకూబ్ ఉరిపై సీఎం ఫడ్నవీస్ ప్రకటన..

మహారాష్ట్ర : ముంబై బాంబు పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఓ ప్రకటన చేయనున్నారు. 

08:31 - July 30, 2015

1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ కు విధించిన ఉరిశిక్షపై ఒకే అభిప్రాయం లేదని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. మెమన్ ఉరిశిక్ష, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొలువుల భర్తీలో కీలకమైన సిలబస్, పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియపై స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ అంశాలపై టెన్ టివి 'గుడ్ మార్నింగ్' కార్యక్రమంలో ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..
ఇక్కడి చట్టానికి..న్యాయవ్యవస్థకు సహకరించాడు..
1993లో ముంబైలో జరిగిన పేలుళ్ల ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోగా వందలాదికి గాయాలయై వికలాంగులగా మారారు. దీనికి సూత్రధారి, పాత్రధారి మెమన్. ఈ కేసులో టైగర్ మెమన్, దావూద్ ఇబ్రహింలు పాక్ కు పారిపోయారు. కానీ మెమన్ మాత్రం భారతదేశానికి వచ్చాడు. ఇక్కడి న్యాయవ్యవస్థకు..చట్టానికి సహకరించాడు. 22 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించాడు. కానీ ఇతనికి ఉరిశిక్ష విధించడంతో భిన్నమైన వాదనలు వచ్చాయి. ప్రపంచంలో కొన్ని దేశాలు మరణశిక్షను విధించడం లేదు. కొన్ని దేశాలు విధిస్తున్నాయి. అతి క్రూరమైన వాటికి ఉరిశిక్ష విధిస్తారు. దీనిని యావజ్జీవ శిక్షగా మార్చాలని, అందువల్ల దేశ చట్టాలకు సహకరిస్తే కొంత ఉపశమనం ఉంటుందని అభిప్రాయం పంపవచ్చనే వాదనలు వినిపిస్తున్నారు. నేరానికి ఎంత శిక్ష ఉండాలి. బాధితురాలి ఆవేదన దృష్టిలో పెట్టుకునే విధంగా ఉండాలి..ఘోరాతి ఘోరమైన నేరానికి భయపడే విధంగా శిక్ష ఉండాలి అనే వాదనలున్నాయి. అఫ్జల్ గురుకు ఉరి శిక్ష విధించారు. కానీ ఉగ్రవాదుల దాడులు ఆగాయా ? రాజకీయంగా పలుకుబడిన ఉన్న వారు తక్కువ..అల్పాదాయ, అణగారిన వర్గాలు, మైనార్టీలు ఎక్కువగా ఉరిశిక్ష విధించిన వారిలో ఉన్నారని ఓ సంస్థ అధ్యయనంలో తేలింది. రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష పెట్టారు. ఈ ఘటనలో రాజీవ్ గాంధీ ఒక్కడే చనిపోలేదు. ఆయనతో పాటు మరికొంతమంది చనిపోయారు. ఉరిశిక్ష అమలుకాకపోతే బాధితులు ఎప్పుడు భయపడుతుంటారు. అమలు చేయాలి..వద్దు అనే దానిపై చర్చ జరగాలి.'' అని నాగేశ్వర్ పేర్కొన్నారు. పోటీ విధి విధానాలు, సిలబస్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్తగా గ్రూప్ 3 పోస్టుల భర్తీ అంశాలపై ఆయన విశ్లేషించారు. 

జైలుకు చేరుకున్న మెమన్ కుటుంబసభ్యులు..

నాగపూర్ : 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషియైన మెమన్ ను ఉరి తీశారు. ఆయన కుటుంసభ్యులు నాగపూర్ సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. 

07:54 - July 30, 2015

రెండు దశాబ్దాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న యాకూబ్ మెమన్ కు రాష్ట్రపతి నుండి కూడా ఊరట లభించలేదు. నాగాపూర్ జైలులో మెమన్ ను ఉరి తీశారు. మరోవైపు భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. తమిళనాడులోని రామేశ్వరంలో జరిగే అంత్యక్రియలకు ప్రధాని మోడీ, ఇతరులు హాజరు కానున్నారు. రామచందర్ రావు (బీజేపీ), కరణం ధర్మశ్రీ (వైసీపీ), వకుళా భరణం కృష్ణమోహన్ (కాంగ్రెస్), రమాదేవి (ఐద్వా) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

యాకూబ్ మృతదేహానికి పోస్టుమార్టం..

మహారాష్ట్ర : 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది. అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించడంపై ఉదయం 8.15గంటల తరువాత నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. జైలు సూపరింటెండెంట్, సీఎంవో అధికారి, డీఐజీ, జ్యూడిషయల్ మెజిస్ట్రేట్, వైద్యుడి సమక్షంలో యాకూబ్ ను గురువారం ఉదయం ఉరి తీశారు. 

07:36 - July 30, 2015

ప్రిన్స్ 'మహేష్ బాబు' నటించిన 'శ్రీమంతుడు'లో నయనతారా ? మరి శృతి హాసన్ ? ఇద్దరు హీరోయిన్లా ? అని అంటున్నారా ? అదేం కాదండి..దీని గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి.
'శ్రీమంతుడు' చిత్రం రిలీజ్ కు దర్శక నిర్మాతలు సిద్ధమౌతున్నారు. దీనికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఏడు పాత్రలు మహేష్ వేస్తున్నట్లు..ఇలా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. 'శ్రీమంతుడు' చిత్రం మధ్యలో 'నయనతార' నటించిన 'మయూరి' సినిమా ట్రైలర్ ప్రదర్శించబోతున్నారు. అశ్విన్ శరవణన్ దర్శకుడిగా తమిళంలో 'మాయ' అనే చిత్రం తెరకెక్కింది. అదే చిత్రం తెలుగులో మయూరిగా రాబోతోంది. ఇందులో నయనతార దెయ్యంగా కనిపించబోతోందంట. ఆగస్టు రెండు..లేదా మూడో వారంలో మయూరిని విడుదల చేయనున్నారని సమాచారం. ఇదండి సంగతి..

07:13 - July 30, 2015

మహారాష్ట్ర : మరణశిక్ష నుండి తప్పించుకోవాలని చూసిన 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ పోరాటం విఫలమైంది. నాగ్ పూర్ జైలులో గురువారం ఉదయం 6.30గంటలకు ఉరి తీశారు. బుధవారం రాత్రి రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించారు. అనంతరం 14 రోజుల పాటు శిక్షను వాయిదా వేయాలని యాకూబ్ మరోసారి సుప్రీంను ఆశ్రయించాడు. దీనితో ధర్మాసనం ఈ పిటిషన్ పై గురువారం తెల్లవారుజాము వరకు వాదనలు కొనసాగాయి. యాకూబ్ తరపున ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపించారు. తక్కువ సమయంలో క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ఎలా తిరస్కరించారని ప్రశ్నించారు. ఈ వాదనను అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తోసిపుచ్చారు. మెమన్ పిటిషన్ న్యాయవ్యవస్థను కించపరిచేదిగా ఉందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు యాకూబ్ పిటిషన్ ను తిరస్కరించింది. దీనితో నేటి ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నాగ్ పూర్ జైలులో మెమన్ ను ఉరి తీశారు. అతని మృతదేహాన్ని ముంబైకు తరలించనున్నట్లు తెలుస్తోంది. 
1993లో..
1993లో ముంబైలో నిమిషాల వ్యవధిలో 13 పేలుళ్లు జరిగాయి. ఈ వరుస పేలుళ్లలో దాదాపు 257 మంది చనిపోయారు. 7 వందల మంది వరకు గాయపడ్డారు.. ఈ కేసులో టైగర్‌ మెమన్‌ (యాకూబ్‌ సోదరుడు), దావూద్‌ ఇబ్రహీం పేలుళ్లలో ప్రధాన సూత్రధారులు. చార్టర్డ్ అకౌంట్‌ అయిన మెమన్‌ స్వయంగా ముంబై పేలుళ్ల కుట్రలో పాలు పంచుకున్నాడని అభియోగాలు రుజువయ్యాయి. దీంతో 2007లో ముంబైలోని టాడా కోర్టు మెమన్‌తో సహా 11 మందికి ఉరిశిక్ష విధించింది. యాకుబ్ మెమన్ ఉరిశిక్షపై రాష్ట్రపతి కూడా క్షమాభిక్షకు నిరాకరించారు.
257 మంది మృతి......

 • 1993 మార్చి 12: ముంబైలోని 13 ప్రాంతాల్లో వరుస పేలుళ్లు.. 257 మంది మృతి.. 713 మందికి గాయాలు.
 • 1993 నవంబర్ 4: 189 మంది నిందితులపై 10 వేల పేజీల చార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ.
 • 1995 ఏప్రిల్ 10: 26 మంది నిందితులను విడుదల చేసిన టాడా కోర్టు.
 • 2001 జులై 18: 684 మంది సాక్షుల స్టేట్‌మెంట్ల రికార్డు పూర్తి.
 • 2003 సెప్టెంబర్: పూర్తైన విచారణ.. రిజర్వ్ లో తీర్పు.
 • 2006 సెప్టెంబర్‌ 12: తీర్పును వెల్లడించిన ముంబైలోని టాడా కోర్టు. 12 మందికి ఉరిశిక్ష, 20 మందికి యావజ్జీవ ఖైదు ఖరారు.
 • 2013 మార్చి 21: యాకూబ్‌ మెమన్‌, టైగర్‌ మెమన్‌ల ఉరిశిక్షలను ధ్రువీకరించిన సుప్రీంకోర్టు. పది మందికి శిక్షలను యావజ్జీవంగా మార్పు.
 • 2014 మే: యాకుబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌.
 • 2014 జూన్‌ 2: క్షమాభిక్ష పిటిషన్లను ఓపెన్‌ కోర్టులోనే విచారణ జరపాలన్న నిబంధన మేరకు, ఉరిశిక్షను నిలిపివేసిన అత్యున్నత న్యాయస్ధానం.
 • 2015 ఏప్రిల్‌ 9: మరణశిక్షపై యాకూబ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.
 • 2015 జులై 21: క్యూరిటివ్‌ పిటిషన్‌ తొసిపుచ్చిన సుప్రీం కోర్టు.
 • 2015 జులై 29 : మెమన్ దాఖలు చేసిన మరో పిటిషన్ సుప్రీం తోసిపుచ్చింది.
 • 2015 జులై 29 : క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతికి మెమన్ విజ్ఞప్తి..తిరస్కరించిన రాష్ట్రపతి.
 • 2015 జులై 29: రాత్రి సుప్రీంలో మరోసారి మెమన్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.
 • 2015 జులై 29 : బుధవారం అర్ధరాత్రి వరకు వాదనలు జరిగాయి.
 • 2015 జులై 29 : చివరకు దీనిని సుప్రీం తిరస్కరించింది.
 • 2015 జులై 30 : గురువారం ఉదయం యాకూబ్ ను ఉరి తీశారు. 
06:55 - July 30, 2015

కర్నాటక : భావి భారత నిర్మాతలకు విజ్ఞానాన్ని పంచే మహాయజ్ఞంలో నిమగ్నమై ప్రాణాలు వదిలిన భారత రాష్ట్రపతి, భారత రత్న కలాంకు యావత్‌ భారతం కన్నీటి వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమైంది. కాదు, కుదరదు అనుకున్నా తుది వీడ్కోలు చెప్పాల్సిందేనన్న నిజాన్ని అవగతం చేసుకున్న అభిమానలోకం పీపుల్స్ ప్రెసిడెంట్‌కు భాష్పాంజలి ఘటిస్తోంది. కానీ ఒక్కరు మాత్రం కలాం లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నారు. అబ్దుల్ కలాంకు చావే లేదంటున్నారు.
కలాం ఆశయసాధనకు కృషి..
అశోక్‌. కర్ణాటకలోని గుల్బర్గాలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేసే అశోక్‌కు కలాం అంటే అంతులేని అభిమానం. అందుకే వేషధారణలో కలాంను అనుసరిస్తూ జూనియర్‌ కలాంగా పేరు తెచ్చుకున్నాడు. అబ్దుల్‌ కలాం లక్ష్యాలను, ఆశయాన్ని తెలుసుకుని స్ఫూర్తి పొందిన అశోక్‌, కలాం ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు.
అశోక్‌ను చూసి ఆశ్చర్యపోయిన కలాం..
జూనియర్ కలాంగా పేరు తెచ్చుకున్న అశోక్‌ పలు మార్లు అబ్దుల్‌ కలాంను కలుసుకున్నారు. తొలిసారిగా తనను చూసి అబ్దుల్ కలాం ఆశ్చర్యపోయారని, డ్రెస్సింగ్‌ స్టైల్‌, హెయిర్‌ స్టైల్‌ను అనుకరించిన మాత్రం సరిపోదని తన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కలాం సూచించినట్లు అశోక్‌ చెప్పారు. తను ఇంతగా ఆరాధించే కలాం హఠాన్మరణం తనను కలిచివేసిందని, కలాం ఇక లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నానని అశోక్‌ అలియాస్‌ జూనియర్ కలాం కన్నీటి పర్యంతమవుతున్నారు. కలాం లేకున్నా ఆయన ఆశయసాధన కోసం కృషిచేస్తానని అశోక్ చెప్తున్నారు. కలాం కలలు కన్న ప్రపంచాన్ని నిర్మించే మహాయజ్ఞాన్ని మరింత బాధ్యతగా నిర్వర్తిస్తానని వాగ్ధానం చేస్తున్నారు.

06:36 - July 30, 2015

తమిళనాడు : మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్‌ కలాం అంత్యక్రియలు నేడు రామేశ్వరంలో జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదితో పాటు పలువురు కేంద్రమంత్రులు అంత్యక్రియల్లో పాల్గోనున్నారు. ఆయన భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి రామేశ్వరానికి తీసుకెళ్లారు. ఉదయం ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి కలాం భౌతికకాయాన్ని మధురైకి, అక్కడి నుంచి ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్‌ హెలిక్యాప్టర్‌లో రామేశ్వరానికి తీసుకొచ్చారు. కలాం భౌతికకాయం వెంట కేంద్ర మంత్రులు మనోహర్‌ పారీకర్, వెంకయ్యనాయుడు వచ్చారు.
ప్రజల సందర్శన..
ప్రజల సందర్శనార్థం కలాం భౌతిక కాయాన్ని రామేశ్వరం బస్టాండ్ సెంటర్‌ వద్ద రాత్రి 8 గంటల వరకు ఉంచారు. భారీగా తరలివచ్చిన ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. ఆ తర్వాత కలాం భౌతికకాయాన్ని ఇంటికి తరలించారు. గురువారం ఉదయం పదిన్నరకు కలాం అంత్యక్రియలు జరగనున్నాయి. కలాం అంత్యక్రియలకు ప్రధాని నరేంద్రమోదితో పాటు పలువురు కేంద్రమంత్రులు పాల్గోనున్నారు.
షిల్లాంగ్ లో కలాం మృతి..
అనారోగ్యం కారణంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కలాం అంత్యక్రియలకు హాజరు కావడం లేదు. ప్రభుత్వం తరపున ఏడుగురు మంత్రులు అంత్యక్రియలకు హాజరు కానున్నారు. తమిళనాడు ప్రభుత్వం గురువారం సెలవు ప్రకటించింది. దేశం గర్వించదగ్గ విజ్ఞానవేత్త, మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్‌ కలాం సోమవారంనాడు షిల్లాంగ్‌లో గుండెపోటుతో మరణించారు.

నాగ్ పూర్ వద్ద భారీ బందోబస్తు..

మహారాష్ట్ర : రాష్ట్రంలోని నాగ్ పూర్ జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 500 మీటర్ల పరిధిలో సాయంత్రం వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఇదిలా ఉంటే ఉరి శిక్ష అమలు నేపథ్యంలో ముంబైలో హై అలర్ట్ ప్రకటించింది. ముంబైలో పోలీసులకు సెలవులు రద్దు చేసింది. 

06:25 - July 30, 2015

మహారాష్ట్ర : యాకూబ్ మెమన్ ఉరి నేపథ్యంలో మహారాష్ట్రలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రధాన నగరాలతో పాటు అన్ని చోట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. సున్నిత ప్రాంతాల్లో భారీగా దళాలను మోహరించారు. అనుమానమున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు నుంచి యాకూబ్ మెమన్‌ ఉరిశిక్షకు క్లియరెన్స్ రావటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు కారణంగా... రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుంగా ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది.
డీజీపీతో సీఎం ఫడ్నవీస్ భేటీ..
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, డీజీపీ, పోలీస్‌ కమిషనర్లతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. అలసత్యం వద్దని, విద్రోహ చర్యలకు అవకాశం ఇవ్వొద్దని హెచ్చరించారు. నాగ్‌పూర్‌ జైలు వద్ద భద్రత మరింత పెంచాలని ఆదేశించారు.
ఉగ్రదాడులపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక..
ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం వున్నట్లుగా ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముంబై, నాగ్‌పూర్‌ సహా మహారాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షణ్ణంగా తనికీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
నాగ్‌పూర్‌లో భద్రత కట్టుదిట్టం..
ముందు జాగ్రత్త చర్యగా నాగ్‌పూర్‌ భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే వున్న భద్రతకు అదనంగా బలగాలను తరలించి మోహరించారు. మొత్తం నగరాన్ని జల్లెడపట్టి... పూర్తిగా తమ అధీనంలోకి తీసుకొచ్చారు. జైలు చుట్టూ భారీగా బలగాలు మోహరించారు. నాగ్‌పూర్‌కు వచ్చే రోడ్డు, రైలు మార్గాలపై నిఘా పెట్టారు. 

06:14 - July 30, 2015

మహారాష్ట్ర : 1993 బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ కు కాసేపట్లో ఉరిశిక్ష విధించనున్నారు. ఉరిశిక్షను అమలును నిలిపివేయాలంటూ మెమన్ వేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి యాకూబ్ రెండోసారి విజ్ఞప్తి చేశాడు. దీనితో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాష్ట్రపతితో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగిన తరువాత రాత్రి దాదాపు 11 గంటల సమయంలో క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించినట్లు రాష్ట్రపతి భవన్ నుండి వెలువడింది. అయితే బుధవారం రాత్రి 11.30గంటల సమయంలో యాకూబ్ న్యాయవాదులు సుప్రీకోర్టును మరోసారి ఆశ్రయించారు. క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించిన తరువాత ఉరితీత అమలుకు కనీసం 14 రోజుల సమయం ఇవ్వాలని కోర్టు నిబంధనలున్నాయని, కాబట్టి శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని వారు తమ పిటిషన్ లో కోరారు. తెల్లవారుజాము వరకు ఈ వాదనలు కొనసాగాయి. చివరకు కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని స్పెషల్ బెంచ్ పేర్కొంది. కాసేపట్లో నాగ్ పూర్ జైల్లో యాకూబ్ కు ఉరిశిక్ష విధించనున్నారు. యాకూబ్ మెమన్ ఉరితీతకు మహారాష్ట్రలోని నాగ్ పూర్ కేంద్ర కారాగారంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భధ్రత ఏర్పాట్లు చేపట్టారు.
మరణదండన అమలుకు సర్వం సిద్ధం.
ఉరి తీసేందుకు నిబంధనల ప్రకారం అధికారులు ప్రత్యేకంగా మూడు తాళ్లను తయారు చేయించారు. ఎంపిక చేసిన ముగ్గురు కానిస్టేబుల్స్ కు నమూనా బొమ్మతో ఉరితీతపై శిక్షణనిచ్చినట్లు తెలుస్తోంది. మెమన్ ను గురువారం వేకువజామున మూడున్నరకు జైలు సిబ్బంది లేపుతారు. అనంతరం స్నానం చేసి ధరించేందుకు కొత్త దుస్తులు ఇస్తారు. నాలుగు గంటలకు మతపరమైన ప్రార్థనలు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. 4.20 గంటలకు ప్రభుత్వ వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించి యాకూబ్ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించారు. 4.30గంటలకు టీ, అల్పాహారంతో పాటు యాకూబ్ కు ఇష్టమైన ఆహారం ఇస్తారు. ఐదింటికి అధ్యాత్మిక పుస్తకాలను అందుబాటులో ఉంచుతారు. ఆరు గంటలకు ఉరి తీసే చోటుకు వెళుతారు. 6.10కి చేసిన నేరాలు, ఏయే సెక్షన్ల కింద శిక్ష విధిస్తున్నది మెజిస్ట్రేట్ చదివి వినిపిస్తారు. 6.30 నుండి 7గంటల మధ్య చేతులు వెనక్కి కట్టి, ముఖానికి నల్లముసుగు కప్పి మెడకకు తాడు బిగిస్తారు. అనంతరం న్యాయమూర్తి సైగ చేయగానే తలారీ ఉరి తీస్తారు. అరగంట పాటు మృతదేహాన్ని అలాగే ఉండనిస్తారు. అనంతరం వైద్యాధికారి వచ్చి మరణించినట్లు నిర్ధారిస్తారు.

నేడు పార్లమెంట్ లో స్మోకింగ్ రూం ప్రారంభం.

ఢిల్లీ : ధూమపాన ప్రియులైన ఎంపీలు పార్లమెంట్ భవనంలోనూ పొగ పీల్చేందుకు మళ్లీ వీలు కానుంది. భవనంలోని చరిత్రాత్మకమైన సెంట్రల్ హాల్ కు పక్కన పునరుద్ధరించిన స్మోకింగ్ రూంను నేడు ప్రాంరభించనున్నారు. 

నేడు అఖిలపక్ష సమావేశం..

ఢిల్లీ : స్పీకర్ సుమిత్రా మహజన్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. విపక్ష సభ్యులు అడ్డుకుంటుండడంతో ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇప్పటి వరకు సజావుగా సాగని విషయం తెలిసిందే. 

నేటి నుండి జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల పంపిణీ..

హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు గురువారం నుండి అక్రెడిటేషన్లు జారీ చేయనున్నారు. 

నేడు కలాం అంత్యక్రియలు..

తమిళనాడు : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. ఆయన భౌతికకాయాన్ని బుధవారం ఢిల్లీ నుండి రామేశ్వరంకు తరలించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం గురువారం ఉదయం 11గంటలకు స్వస్థలం తమిళనాడులోని రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు జరుగనున్నాయి. 

నేడు కలెక్టర్లు, ఎస్పీలతో కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : గ్రామ జ్యోతిపై గురువారం సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ఉదయం 10.30గంటలకు ఈ సమావేశం జరుగనుంది. 

Don't Miss