Activities calendar

06 August 2015

తెలంగాణలో బదిలీ అయిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముగ్గు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ కలెక్టర్ గా రాహుల్ బొజ్జా, నిజామాబాద్ కలెక్టర్ గా యోగితా రాణా, మెదక్ కలెక్టర్ గా రోనాల్డ్ రోజ్ ను నియమిస్తూ టీ.సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రిన్సిపాల్ పై రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయలేదు: పెదకాకాని పోలీసులు

గుంటూరు: ఏఎన్ యూ ప్రిన్సిపాల్ పై రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయలేదని పెదకాకాని పోలీసులు తెలిపారు. రిషితేశ్వరి మృతి ఘటనపై నిజనిర్ధారణ కమిటీ విచారణలో బాబూరావు పాత్ర ఉందని తేలిన విషయాన్ని మాత్రమే రిజిస్ట్రార్ మాకు తెలియజేశారు అని చెప్పారు. నిజనిర్ధారణ కమిటీ నివేదికను అందజేయాలని శుక్రవారం నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. నివేదికను అధ్యయనం చేసి ప్రిన్సిపాల్ బాబూరావును ముద్దాయిగా చేర్చే అంశాన్ని పరిశీలస్తామన్నారు.

21:08 - August 6, 2015

నల్గొండ: సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద కెఎ28ఎన్ 9119 నెంబర్ గల కారులో రూ.1.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం హుబ్లీ ఐసీఐసీ బ్యాంక్ లో దోపీడీకి గురైన సొత్తుగా పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ ఓ దొంగ ఇచ్చిన వివరాల ఆధారంగా సూర్యాపేట పోలీసులకు కర్నాటక పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పాలమూరు, డిండి ప్రాజెక్టులపై టీడీపీ లేఖల డ్రామా : హరీశ్ రావు

హైదరాబాద్: ప్రాజెక్టుల విషయమై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఏపీ ప్రభుత్వానికి ఘాటైన లేఖ రాశారు. తమ హక్కు ప్రకారమే ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని, ఏపీ ప్రజల దృష్టి మరల్చేందుకే పాలమూరు, డిండి ప్రాజెక్టులపై టీడీపీ లేఖల డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను తప్పుబడుతున్న ఏపీ సర్కారు పట్టిసీమ ప్రాజెక్టు ఎవరి అనుమతితో కడుతోందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా పాలమూరు ప్రాజెక్టుకు మొగ్గుచూపారని హరీశ్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధించని చంద్రబాబుపై ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహం పెరిగాయని అన్నారు.

ప్రభుత్వాసుపత్రిలో 6 రోజుల శిశువు మాయం

నిజామాబాద్: ప్రభుత్వాసుత్రిలో 6 రోజుల శిశువు మాయం అయ్యింది. దీంతో శిశువు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

సూర్యా పేట లో రూ.1.5 కోట్లు స్వాధీనం...

నల్గొండ: సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద కెఎ28ఎన్ 9119 నెంబర్ గల కారులో రూ.1.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న హుబ్లీ ఐసీఐసీ బ్యాంక్ లో దోపీడీకి గురైన సొత్తుగా పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ ఓ దొంగ ఇచ్చిన వివరాల ఆధారంగా సూర్యాపేట పోలీసులకు కర్నాటక పోలీసులు సమాచారం ఇచ్చారు.

వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనుల తీరుపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. వాటర్ గ్రిడ్ ను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందని...వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో లోపాలు తలెత్తకుండా అధికారులు శ్రద్ధగా పనిచేయాలని సూచించారు. పనులు పూర్తి కోసం మండలాల వారీగా ఏ రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తారన్న దానిపై ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు.

ఏఎన్ యూలో ముగ్గురు విద్యార్థుల సస్పెన్షన్

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో బుధవారం యూనివర్శిటీలోకి మద్యం బాటిళ్లు తీసుకున బీటెక్ ఫైనలియర్ విద్యార్థులను యాజమాన్యం సస్పెండ్ చేసింది.

విశాఖలో పాత డెయిరీ ఫామ్ వద్ద చిరుత పులులు

విశాఖ: పాత డెయిరీ ఫామ్ వద్ద చిరుత పులులు సంచరిస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఓ టెర్రరిస్టును కాల్చి చంపిన భద్రతా బలగాలు

హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల జిల్లాల్లో ఉగ్ర కలకలం నెలకొంది. ఉధంపూర్ జిల్లాలో బుధవారం ఓ టెర్రరిస్టును కాల్చి చంపిన భద్రతా బలగాలు, మరొకడిని సజీవంగా పట్టుకోవడం తెలిసిందే. గురువారం పుల్వామా జిల్లా ఆస్థాన్ మొహల్లా ప్రాంతంలోని కాకపోరాలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సైన్యం అక్కడికి చేరుకుంది. పోలీసులతో కలిసి ఆ ఇంటిని రౌండప్ చేసిన సైన్యం భారీ స్థాయిలో కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో ఓ టెర్రరిస్టు హతం కాగా, మరో ఇద్దరు ఇంట్లోనే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. దాంతో, కాల్పులు కొనసాగిస్తున్నారు.

హుస్నాబాద్ అభివృద్ధి కి నిధులు మంజూరు...

కరీంనగర్: జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 427 అభివృద్ధి పనుల నిర్వహణ కోసం రూ.13.70 కోట్లు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఏపీ జారీ చేసిన జీ.ఓ.నెం 38 చెల్లదు : హైకోర్టు...

హైదరాబాద్ : డీఎస్సీ 2014 కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 38 చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. టెట్‌, డీఎస్సీ ఒకేసారి నిర్వహిస్తూ ప్రభుత్వం జీవో 38ను జారీ చేసింది. దీనిపై అభ్యంతరం చెప్పిన పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. టెట్‌ డీఎస్సీ ఒకేసారి నిర్వహించడం వల్ల తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని వారు కోర్టుకు తెలిపారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం జీవో 38 చెల్లదని తీర్పు ఇచ్చింది.

19:52 - August 6, 2015

అవమానాలను పట్టించుకోలేదు. చీదరింపులను లెక్కలోకే తీసుకోలేదు. సూటి పోటి మాటలు, చీత్కారాలు సంకల్పానికి తూట్లు పొడుస్తున్నాఅదిరిపోలేదు, బెదిరిపోలేదు. లక్ష్య సాధనే సిసలైన లక్ష్యంగా దూసుకుపోయింది. అయినా అండగా నిలవాల్సిన వాళ్లు అవమానాలతో వేధిస్తూనే ఉన్నారు. అంతులేని గుండెకోతను మిగులుస్తూనే ఉన్నారు.
ఎస్‌.ఐ కావాలనేది ప్రీతిక ఆశయం....
100 మీటర్ల ట్రాక్‌ పై తోటివారితోనే కాదు, జీవితాశయం కోసం కాలంతోనూ పోటిపడుతున్న ఈమె పేరు ప్రీతిక యాసిన్‌. తమిళనాడుకు చెందిన ప్రీతిక ఓ హిజ్రా. అయితేనేం సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ కావాలనేది తన జీవిత లక్ష్యం. చిన్ననాటి నుంచే తన లక్ష్యాన్ని స్పష్ఠంగా నిర్దేశించుకున్న ప్రీతిక ఆశయం వైపే అడుగులు వేసింది. అవరోధాలు ఎన్ని ఎదురైనా మొక్కవోని దీక్షతో అధిగమించింది.
ఉద్యోగానికి పనికిరావంటూ ఛీత్కారం....
ఎస్ఐ ఉద్యోగం కోసం తొలిసారిగా సెలక్షన్‌కు వెళ్లిన ప్రీతికకు పోలీస్‌ అధికారులు నువ్వు ఈ ఉద్యోగానికి పనికి రావంటూ తెగేసి చెప్పారు. నువ్వు ఆడ కాదు, మగ కాదు, హిజ్రావు కనుక నీకు అర్హత లేదంటూ ఛీత్కరించుకున్నారు. దీంతో న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన ప్రీతిక కేసు గెలిచింది. ట్రాన్స్‌జెండర్ అనే కేటగిరిలో ప్రీతికకు ఉద్యోగం ఇవ్వొచ్చని కోర్టు తీర్పు చెప్పింది. మునుపటి కంటే రెట్టించిన ఉత్సాహంతో మరోసారి సెలక్షన్స్‌కు వచ్చింది ప్రీతిక. అన్ని ఈవెంట్స్‌లో సత్తా చాటాక యూ ఆర్‌ డిస్‌క్వాలిఫైడ్‌ ఇన్‌ 100 మీటర్స్‌ అంటూ పోలీస్ ఉన్నతాధికారులు మరోసారి ప్రీతికకు మొండి చెయ్యి చూపారు. ఇంతకీ ప్రీతిక డిస్‌క్వాలిఫై అయింది ఏ కోటాలో తెలుసా ట్రాన్స్‌ జెండర్‌ కోటాలో కాదు మహిళల కోటాలో.
మహిళలతో కలిపి ప్రీతికకు పరుగు పందెం....
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందంగా తమిళనాడు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్‌ కోటాలో ప్రీతికకు ఉద్యోగం ఇవ్వొచ్చని కోర్టు చెబితే తమిళనాడు పోలీసులు మాత్రం మహిళలతో కలిపి పరుగుపందెం నిర్వహించారు. చివరకు నువ్వు క్వాలిఫై కాలేదంటూ చెప్పారు. ఖాకీల తీరుతో కన్నీళ్లు పెట్టుకున్న ప్రీతిక ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా S.I ఉద్యోగం సాధించి తీరుతానని తెలిపింది. మరోసారి న్యాయపోరాటం చేసేందుకు తాను సిద్ధమంటోంది.
ధైర్యంతో ముందడుగు వేస్తే....
ధైర్యంతో ముందడుగు వేస్తే ప్రకృతి కూడా సహకరిస్తుందనేని ఓ నానుడి. అటు విధితోనే కాదు ఇటు సమాజంతో కూడా పోరాటం
చేస్తున్న ప్రీతికకు అండగా నిలబడేందుకు ప్రజాసంఘాలు సన్నద్ధమవుతున్నాయి. మానసిక దౌర్భల్యంతో కుంగిపోతున్న మరికొందరు ట్రాన్స్‌జెండర్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు హక్కుల సంఘాలు పోరాటానికి పురుడు పోస్తున్నాయి.

19:44 - August 6, 2015

ఉస్మానియా కూల్చేద్దాం..ఈ మాటను అన్నది మరెవరో కాదు. సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌. కొత్తరాష్ట్రానికి తొలి సీఎంగానూ, అంతకు మించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సారథిగా ఉస్మానియా ఆసుపత్రి చరిత్ర కేసీఆర్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఉస్మానియా లాంటి చారిత్రక కట్టడం పునర్వైభవం తేవడానికి ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయని నిపుణులు తేల్చుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సీఎం అయిన తొలినాళ్లలో మెట్రో డిజైన్‌ మార్చాలని కేసీఆర్‌ పట్టు...
సరిగ్గా ఏడాది క్రితం తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేసీఆర్‌ హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుపై దృష్టి సారించి దాని డిజైన్‌ మర్చాలని పట్టుబట్టారు. ముఖ్యంగా తెలంగాణ చారిత్రక సంపదగా నిలిచే అసెంబ్లీ, గన్‌పార్క్‌ స్థూపం నిర్మాణాలకు ముప్పు ఉందని గుర్తించి ఏకంగా మెట్రో దారిమళ్లించాలంటూ కేసీఆర్‌ హుకూం జారీ చేశారు. కానీ ఇప్పుడు కేసీఆర్‌ పాలనలో సరిగ్గా ఏడాది గడిచిపోయింది. ఉస్మానియా భవనాన్ని కూల్చేసి ఆ స్థానంలో టవర్లు నిర్మిస్తామన్నారు. ఈ నిర్ణయం సగటు తెలంగాణ ఉద్యమకారుడిని కూడా ఆలోచనలో పడేసింది.
నాటి నిజాం పాలనలోనే నిపుణుల కమిటీతో నిర్ణయం...
ఏ చారిత్రక పునర్వైభవాన్ని తెలంగాణ ప్రజలు కేసీఆర్‌నుంచి ఆశించారో అందుకు విరుద్ధమైన పరిణామం ఇది. 1908లో ఏడో నిజామ్‌ ఓ బోర్డును ఏర్పాటు నియమించి, నిపుణులు, సమాజ ప్రతినిధుల సూచనల మేరకు ఉస్మానియా ధర్మాసుపత్రి నిర్మించారు. నాటి రాచరిక వ్యవస్థలోనే నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఉస్మానియాను నిర్మిస్తే నేటి ప్రజాస్వామ్య పాలకులు మాత్రం ఇలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని మేధావులు అంటున్నారు.
ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేతపై...
ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేతపై ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు కూల్చివేత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలని సలహా ఇస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కూల్చకుండా.. మరోచోట ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. చారిత్రక వైభవాన్ని కాపాడుతూ ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని కాపాడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పడు చూద్దాం.
మొదటి విధానం కన్జర్వేషన్‌....
వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవడానికి ఏడు ముఖ్యమైన విధానాలు ఉన్నాయి. వీటిని యునెస్కో ప్రమాణాల ప్రకారం ఆమోదించారు. ఇందులో మొదటి విధానం కన్జర్వేషన్‌... ఈ విధానం ప్రకారం వారసత్వ కట్టడాలు పది కాలాల పాటు పదిలంగా ఉండాలంటే కన్జర్వేషన్‌ తప్పనిసరి. ఒకసారి వారసత్వ గుర్తింపు వచ్చిన తర్వాత దాని పరిరక్షణకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రీస్టోరేషన్‌, రీ కనస్ట్రక్షన్‌, ప్రిజర్వేషన్‌, రెట్రోఫిట్టింగ్‌ వంటి చర్యలన్నీ ఇందులో భాగమే.
రెండో విధానం రీ కన్‌స్ట్రక్షన్‌...
రెండో విధానం రీ కన్‌స్ట్రక్షన్‌..వారసత్వ కట్టడాల శిథిల స్థితిని బట్టి పునర్నిర్మాణం చేపడతారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ కట్టడాలు నామరూపాలు లేకుండా పోయినప్పుడు తిరిగి నిర్మిస్తారు. ఈ విధానంలో నేల మట్టం అయిన నిర్మాణాన్ని అక్కడితో వదిలేయకుండా అదే స్థానంలో మరో కట్టడాన్ని నిర్మిస్తారు. కూలిపోయిన కట్టడం నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రితోనే కొత్త నిర్మాణం చేపట్టాలి.
తవ్వకాల్లో బయటపడ్డ నిర్మాణాలను కాపాడటం....
స్టెబిలైజేషన్‌ ఈ విధానంలో పురావస్తుశాఖ తవ్వకాలు జరిపినప్పుడు ఆయా ప్రదేశాల్లో గానీ, కొండల్లో గానీ బయటపడిన నిర్మాణాలను చెక్కుచెదరకుండా కాపాడుకోవడం. ఇటువంటి కట్టడాలకు నష్టం వాటిల్లకుండా పరిరక్షించుకోవాలి. వీటికి ఎక్కడ ఎటువంటి మరమ్మతులు వచ్చినా ఆ కాలంలో ఏయే నిర్మాణ సామగ్రిని ఉపయోగించారో వాటితోనే సరిచేస్తారు.
రెట్రోఫిట్టింగ్‌ ఈవిధానంలో...
రెట్రోఫిట్టింగ్‌ ఈవిధానంలో ఒక భవనం ఎప్పటికైనా శిథిలావస్థకు చేరుకోవడం సహజం. ఇది వెంటనే జరగదు. గోడలకు బీటలు వేయడం, పైకప్పు పెచ్చులుగా ఊడిపోవడం, భవనంలో ఒక్కో భాగం కిందపడిపోతుండడం, ఇలా వివిధ దశలు దాటిన తర్వాత కూలిపోయే స్థితికి ఆ భవనం వస్తోంది. ఈ దశలను ఆరంభంలోనే గుర్తించి వాటికి మరమ్మతులు చేయించవచ్చు. అప్పుడు రిపేర్‌ అండ్‌ రెట్రోఫిట్టింగ్‌ పద్ధతిని పాటించాలి. ఉస్మానియా ఆసుపత్రిని రెట్రోఫిట్టింగ్‌ పద్ధతి ద్వారా కాపాడుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో చారిత్రక ఆనవాళ్లను వేరే ప్రాంతానికి మార్చడం....
ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఈ విధానంలో ఏదైనా భారీ కట్టడం గానీ, పెద్ద ప్రాజెక్టు గానీ నిర్మించాల నుకున్నప్పుడు ఈ విధానాన్ని ఎంచుకుంటారు. ఈ నిర్మాణాలు జరిగే ప్రదేశంలో ఎటువంటి చారిత్రక ఆనవాళ్లకు సంబంధించిన ఏ చిన్న గుర్తులు లభించినా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తప్పనిసరి. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును నిర్మించాలనుకున్నప్పుడు అక్కడ బౌద్ధమతానికి సంబంధించిన శకలాలను గుర్తించారు. వాటిని కాలగర్భంలో కలిపేయకుండా పక్కనే ఉన్న నాగార్జున కొండపైకి మార్పు చేశారు.
నిర్మాణాల్లో త్రీడి మ్యాపింగ్‌ లాంటి విధానాలతో...
నేడు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానే పెరిగింది. నిర్మాణాల్లో త్రీడి మ్యాపింగ్‌ లాంటి విధానాలతో సమూల మార్పులతో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి పునర్వైభవం తేవచ్చు. కానీ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే మాత్రం హైదరాబాద్‌ మరో చారిత్రక వారసత్వ సంపదను కోల్పోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

బీహార్ ఎన్నికల అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా: కామినేని

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఏపీకి ప్రత్యేక ఇస్తుందని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన బిల్లు సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో డిమాండ్‌ చేసింది బీజేపీయేనని కామినేని అన్నారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదాను ఎందుకు విభజన చట్టంలో చేర్చలేదని మంత్రి ప్రశ్నించారు. బీహార్‌ ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా వస్తుందని ఆశిస్తున్నాని ఆయన చెప్పారు. యాజమాన్య కోటా సీట్ల భర్తీలో మెడికల్ కాలేజీలు ఎక్కువ ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు ఈ సందర్భంగా మంత్రి కామినేని హెచ్చరించారు.

భువనగిరి ఎంపీడీవో ఇంట్లో భారీ చోరీ

హైదరాబాద్: ఎల్బీ నగర్ పరిధిలోని నాగోల్ లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నాగోల్ నివాసం ఉంటున్న నల్గొండ భువనగిరి ఎంపీడీఓ ఇంట్లో 50 తులాల బంగారు ఆభరణాలను దోచేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సౌదీ అరేబియాలో ఆత్మాహుతి దాడి : 17 మంది మృతి

హైదరాబాద్: సౌదీ అరేబియాలో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. అభా ప్రాంతంలో ఉన్న ఓ మసీదులో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఆత్మాహుతి దాడిలో 17 మంది అధికారులు మృతిచెందారు. స్పెషల్ ఎమర్జెన్సీ ఫోర్స్‌కు చెందిన వారు ఈ మసీదులో ఉంటున్నారు. 

ఫూంచ్ సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులు

హైదరాబాద్: దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని పూంచ్ సెక్టార్‌లో ఉన్న భారత సైనిక శిబిరాలపై ఇవాళ కాల్పులకు తెగబడింది. ఈ నేపథ్యంలో భారత సైనికాధికారులు అప్రమత్తమయ్యారు. పాక్ బలగాల కాల్పులను తిప్పి కొట్టారు. తరచూ పాక్ సేనలు భారత సరిహద్దుల్లో మన సైన్యంపై కాల్పులు జరుపుతుండటం తెలిసిందే. 

18:50 - August 6, 2015

హైదరాబాద్: ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో సాండ్‌ మాఫీయా ఆగడాలు హద్దు దాటుతున్నాయి. ఆంధ్రాలో దర్జాగా ఇసుక తవ్వకాలు...అనుమతులు లేకుండానే తెలంగాణలో అమ్మకాలు. అయినా..ఇరురాష్ట్రాల సంబంధిత అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. తమ వాటాలు తీసుకొని ఇసుక మాఫీయాపై కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో...కోట్ల విలువైన ప్రజాసంపద అక్రమార్కుల పాలవుతోంది.
గిరిజన సోసైటీని చేజిక్కించుకున్న టీడీపీ నాయకులు....
తూర్పుగోదావరి జిల్లా నెల్లిపాక మండలం గొమ్ముకొత్తగూడెం ప్రాంతమిది. రాష్ట్ర విభజనలో భాగంగా ఆంధ్రా రాష్ట్రంలో కలిసింది. ఇక్కడ ఉన్న గిరిజన సోసైటీని ఆంధ్రా అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు చేజిక్కించుకుంది. ఆ సంఘంలో అధ్యక్ష కార్యదర్శులు అంతా అధికారపార్టీ టీడీపీవారే. దీంతో..ఇక్కడ వారు ఆడిందే ఆట పాడిందే పాటయిపోయింది.
గొమ్ముకొత్తగూడెం ప్రాంతంలో రాత్రివేళల్లో ఇసుక తవ్వకాలు....
గొమ్ముకొత్తగూడెం ప్రాంతంలో రాత్రివేళల్లో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఆంధ్రా అధికారుల అండతో..వందలాది లారీల ఇసుకను అక్రమంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. రూల్స్‌ప్రకారం అంధ్రా నుంచి తెలంగాణ మీదుగా వెళ్లే వాహనాలు అనుమతులు తప్పనిసరిగా పొందాలి. కాని పచ్చపార్టీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్నా దందా కాబట్టి వీరికి రూల్స్ పట్టడం లేదు. దీంతో ఎలాంటి అనుమతులు లేకుండా, వే బిల్లు లేకుండానే దర్జాగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. వందలాది లారీల్లో కోట్ల విలువైన ఇసుకను తెలంగాణలోని భద్రాచలం, ఖమ్మం, హైదరాబాద్‌తోపాటు పలు పట్టణాలకు తరలిస్తున్నారు.
తమ వాటాలు తీసుకొని తప్పుకుంటున్న ఆంధ్రాకారులు....
ఈ వ్యవహారంపై ఆంధ్రా రెవిన్యూ, పోలీస్‌, మైనింగ్‌ శాఖ అధికారులు తమ వాటాలు తీసుకొని పక్కకు తప్పుకుంటున్నారు. దీంతో..ఈ సాండ్‌ మాఫీయా ఆగడాలపై కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో..టీడీపీ నాయకుల ఆటలకు హద్దులేకుండా పోయింది. పగలు, రాత్రి అనకుండా వెళ్లే లారీలు రైలు బోగీలను తలపిస్తున్నాయి. అయినా...తెలంగాణ రెవెన్యూ, పోలీస్‌శాఖ, మైనింగ్‌శాఖ అధికారులు తమ మొద్దునిద్ర వీడటం లేదని విపక్షా పార్టీ నేతలు మండిపడుతున్నారు.అయితే ఇసుకమాఫీయాపై స్థానిక ఎమ్మార్వో చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు.ఇసుక మాఫియా పై స్థానిక ఎమ్మార్వో స్పందించినా...అది తూతూ మంత్రాంగానే ఉంది. ఇప్పటికైనా..ఉన్నతాధికారులు స్పందించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని..విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

18:47 - August 6, 2015

.గో: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐకమత్యంతో మెలిగారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఒక్కటై ముందుకు కదిలారు. ఇప్పుడు అధికారం చేతిలోకి వచ్చే సరికి నీదో దారి, నాదో దారి అంటున్నారు. పెత్తనం చెలాయించేందుకు పోటీలు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం నేతల వ్యవహారశైలి తెలుగు తమ్ముళ్లకు తలనొప్పి తెప్పిస్తోంది.

.గో జిల్లా జిల్లా టిడిపిలో ఆధిపత్య పోరు...

ప‌శ్చిమగోదావరి జిల్లా అధికార‌పార్టీలో ఆధిప‌త్య పోరు ముదురుతోంది. పార్టీపై పెత్తనం కోసం గ్రూపులు కట్టిన నేతలు విబేధాలతో కాపురం చేస్తున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన అధికార పార్టీ నేతలు అధికారం చెలాయించేందుకు సై అంటే సై అంటున్నారు. పెత్తనం సాగించేందుకు పార్టీ భవిష్యత్‌నే పక్కన పెడుతున్నారు.

జిల్లా అధ్యక్షురాలు తోట సీతామాల‌క్ష్మి ...

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో టీడిపికి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒకరు టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతామాల‌క్ష్మి కాగా మరొకరు ఏలూరు ఎంపీ మాగంటి బాబు. ఇక ఇదే జిల్లా నుంచి పీత‌ల‌ సుజాత మంత్రిగా ఉన్నారు. అయితే త్రిమూర్తుల్లా వ్యవహరించి పార్టీని కాపాడుకోవల్సిన వీరు ముగ్గురు విబేధాలతో దూరమయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం చేయి చేయి కలిపి ముందుకు సాగిన వారంతా నేడు అధికారం వచ్చేసరికి ఆధిపత్యం కోసం పోట్లాడుకుంటున్నారు.

మాగంటి వర్గానికి ప్రాధాన్యత ఇవ్వని సుజాత....

పశ్చిమగోదావరి జిల్లా టిడిపి నేతల మధ్య అలుముకున్న విబేధాలను ఓసారి చూస్తే మంత్రి పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు వర్గానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదనే ప్రచారం కొనసాగుతోంది. అందుకే ఇటీవల వీరవాసరంలోని పీతల సుజాత ఇంట్లో దొరికిన 10 లక్షల వ్యవహారంలో ఆమెను టార్గెట్ చేసేందుకు ఎంపీ వర్గం ప్రయత్నించిందని టాక్‌. ఇంతే కాక ప్రభుత్వ విప్‌ చింతమనేని వర్గంతో కూడా మంత్రికి పొసగటం లేదని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.

సీతామాలక్ష్మి వర్గానికి, మాగంటి వర్గానికి మాటల్లేవు...

ఇక జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న తోటపల్లి సీతామాలక్ష్మితో కూడా మాగంటి వర్గానికి పొసగటం లేదనే పుకార్లు విన్పిస్తున్నాయి. సీతామాలక్ష్మి పెత్తనాన్ని మాగంటి వర్గీయులు సహించలేకపోతున్నారని టిడిపి కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఏలూరు కేంద్రంగా చక్రం తిప్పుతున్నారనే గుసగుసలు విన్పిస్తున్నాయి. కానీ మాగంటి వర్గీయులు మాత్రం తామేమి వేరు కుంపటి పెట్టటం లేదని జిల్లా అధ్యక్షురాలే కావాలని తమను వేరు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

తెలుగు తమ్ముళ్లను కలవరం...

ఏది ఏమైనప్పటికి జిల్లాలోని అన్ని స్ధానాలను కైవసం చేసుకుని విజయపథంలో దూసుకుపోతున్న పశ్చిమ టిడిపి ఇలా విబేధాలతో రచ్చకెక్కడం తెలుగు తమ్ముళ్లను కలవరపరుస్తోంది. అధినేత కల్పించుకుని పరిస్ధితులను చక్కదిద్దకపోతే పార్టీకి గడ్డుకాలం ఎదురవటం ఖాయమని తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు.

18:44 - August 6, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. సీఎం చంద్రబాబు టర్కీ పర్యటన నుంచి తిరిగి రాగానే ఫైనల్ చేసి.. గవర్నర్‌కు ప్రతిపాదన పంపే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

18:42 - August 6, 2015

హైదరాబాద్: వరంగల్‌ రీజినల్‌ కంటి ఆస్పత్రిలో బుధవారం జరిగిన ఆపరేషన్లలో ఏడుగురికి ఫెయిలైనట్లు తెలుస్తోంది. వారిని హైదరాబాద్‌ సరోజినిదేవి కంటి ఆస్పత్రికి పంపించి చికిత్స చేయిస్తున్నారు. దీనికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ మెమోలు కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆస్పత్రి సూపరిండెంట్‌ ఈ వార్తలను ఖండిస్తున్నారు. తాము ఆపరేషన్లు చేసినవారిలో ఏడుగురికి రియాక్షన్‌ వచ్చిందని.. వారిని తామే ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌ సరోజినిదేవి కంటి ఆస్పత్రికి పంపామంటున్నారు. వారందరూ ఇప్పుడు క్షేమంగానే ఉన్నారని కూడా స్పష్టం చేస్తున్నారు. సిబ్బందికి ఎలాంటి మెమోలు ఇవ్వలేదని.. కేవలం మెసేజ్‌లు పెట్టామని ఆయన వివరణ ఇస్తున్నారు. మెమోలు ఇచ్చారని.. తాము నిలదీశాకే వెనక్కు తీసుకున్నారని.. జరిగిన ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం ఆస్పత్రి అధికారులు చేస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. 

నరసరావుపేట సీఐ శరత్ బాబు సస్పెన్షన్

గుంటూరు : మహిళా కానిస్టేబుల్‌ ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న నరసరావుపేట రూరల్‌ సీఐ శరత్‌బాబు సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళితే... గత రెండు మాసాలుగా అసభ్యకర ఎస్ ఎంసెస్ లు పంపుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళా కానిస్టేబుల్ శ్వేత మీడియాకు తెలిపింది. ఇదే అంశాన్ని ఎస్పీనారాయణ నాయక్ కు ఫిర్యాదు చేసిట్లు తెలిపింది. ఏఎస్సీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి సీఐ శరత్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

 

రాజ్ నాథ్ సింగ్ తో టీఆర్ ఎస్ ఎంపీలు, టీ.ఉద్యోగ సంఘాల భేటీ

ఢిల్లీ: కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో టీఆర్ ఎస్ ఎంపీలు, టీ.ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యారు. హైకోర్టు, ఉద్యోగుల విభజనపై చర్చిస్తున్నారు.  

18:18 - August 6, 2015

గుంటూరు : మహిళా కానిస్టేబుల్‌ ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న నరసరావుపేట రూరల్‌ సీఐ శరత్‌బాబు సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళితే... గత రెండు మాసాలుగా అసభ్యకర ఎస్ ఎంసెస్ లు పంపుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళా కానిస్టేబుల్ శ్వేత మీడియాకు తెలిపింది. ఇదే అంశాన్ని ఎస్పీనారాయణ నాయక్ కు ఫిర్యాదు చేసిట్లు తెలిపింది. ఏఎస్సీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి అధికారులు సీఐ శరత్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

రక్షణమంత్రితో ఎంపీ మల్లారెడ్డి, తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి భేటీ

ఢిల్లీ: కేంద్రరక్షణమంత్రితో టిడిపి ఎంపీ మల్లారెడ్డి, తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి సమావేశమయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యలపై చర్చిస్తున్నారు.

 

 

 

మసీదులో ఆత్మాహుతి దాడి...17 మంది మృతి

హైదరాబాద్: సౌదీ అరేబియాలోని అభా ప్రాంతంలోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. స్పెషల్ ఎమర్జెన్సీ ఫోర్స్ కు చెందిన వారు ఈ మసీదులో ఉంటున్నారు. దీంతో ఆత్మాహుతి దాడి వల్ల ఎస్ సీఎఫ్ కు చెందిన 17 మంది అధికారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. 

ఆ జాబితాలో బిల్ గేట్స్ దే మొదటిస్థానం..

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగానికి చెందిన తొలి 100 మంది జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మొదటిస్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ 79.6 బిలియన్ డాలర్లు. రెండో స్తానంలో ఒరాకిల్ సంస్థ వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్ ఉన్నారు.  

ఉధంపూర్ 'ఉగ్ర' దాడిపై ఎన్ ఐఎ విచారణ

ఢిల్లీ: ఉధంపూర్ ఉగ్రవాదుల దాడి ఘటనపై ఎన్ ఐఎ విచారణకు కేంద్రహోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. పట్టుబడిన ఉగ్రవాది నవేద్ ను ఎన్ ఐఎ అధికారులు విచారించనున్నారు. 

కుప్పకూలిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్....

యాషెస్ నాల్గో టెస్టు: ఇంగ్లండ్ బౌలర్లు ప్రతాపం చూపారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ కుప్పకూలారు. బ్రాడ్ బౌలింగ్ ధాటికి తొలి ఇన్నింగ్ లో 18.3 వోవర్లలో 60 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాకు ఇది ఏడో అత్యల్ప స్కోర్. క్లార్క్, జాన్సన్ మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. బ్రాడ్..15 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు.

 

 

17:11 - August 6, 2015

హైదరాబాద్: ప్రొఫెషనల్ కబడ్డీ లీగ్..హైదరాబాద్ లెగ్ మూడోరోజు పోటీల్లో..ఆతిథ్య తెలుగు టైటాన్స్ వరుసగా రెండో విజయానికి ఉరకలేస్తోంది. గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం వేదికగా రాత్రి 9 గంటలకు జరిగే 10వ రౌండ్ పోటీలో పాట్నా పైరేట్స్ తో టైటాన్స్ తలపడనుంది.....
అంచె పోటీలు నయాజోష్ తో.....
2015 ప్రొఫెషనల్ కబడ్డీలీగ్..హైదరాబాద్ అంచె పోటీలు నయాజోష్ తో సాగిపోతున్నాయి. గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం వేదికగా తొలిసారిగా జరుగుతున్న ఈ పోటీల్లో ఇప్పటికే రెండురౌండ్ల మ్యాచ్ లు ఆడి..ఓ గెలుపు, ఓ టై సాధించిన..హోమ్ టీమ్ తెలుగు టైటాన్స్..వరుసగా రెండో విజయానికి గురి పెట్టింది. బెంగాల్ వారియర్స్ తో ముగిసిన వన్ సైడెడ్ ఫైట్ లో ..తెలుగు టైటాన్స్ 44- 28 పాయింట్ల భారీఆధిక్యంతో విజయం సాధించడం ద్వారా...సెమీస్ కు మరింత చేరువయ్యింది.
తెలుగు టైటాన్స్ కు ఇది ఆరవ విజయం...
ఇప్పటి వరకూ ఆడిన మొత్తం తొమ్మిదిరౌండ్లలో తెలుగు టైటాన్స్ కు ఇది ఆరవ విజయం కాగా..34 పాయింట్లతో...ఎనిమిదిజట్ల లీగ్ టేబుల్ రెండోస్థానంలో కొనసాగుతోంది. రైడింగ్ మహాబలి రాహుల్ చౌదరి, ఆల్ రౌండర్ దీపక్ నివాస్ హుడా, కెప్టెన్ మిరాజ్ షేక్, సుకేశ్ హెగ్డే, సూపర్ డిఫెండర్లు సందీప్, రాజ్ గురులతో తెలుగు టైటాన్స్ అత్యంత పటిష్టమైన, సమతూకంతో కూడిన జట్టుగా కనిపిస్తోంది. అయితే..ప్రత్యర్థి పాట్నా పైరేట్స్ నుంచి తెలుగు టైటాన్స్ కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
నాలుగోస్థానంలో కొనసాగుతున్న పాట్నా పైరేట్స్....
ఏడు రౌండ్లలో మూడు విజయాలతో లీగ్ టేబుల్ నాలుగోస్థానంలో కొనసాగుతున్న పాట్నా పైరేట్స్ ను తక్కువగా అంచనా వేస్తే..తెలుగు టైటాన్స్ కు కష్టాలు తప్పవు. తొలిదశ పోటీల్లో పాట్నా పైరేట్స్ ను 34-22 పాయింట్ల తేడాతో చిత్తు చేసిన అనుభవం తెలుగు టైటాన్స్ కు ఉంది. రెండుజట్ల కూర్పు, ప్రస్తుత ఫామ్ ను బట్టి చూస్తే...ఈ పోటీలో తెలుగు టైటాన్స్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పోటీలో టైటాన్స్ నెగ్గితే..సెమీస్ బెర్త్ ఖాయమైనట్లే.

46 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

ఇంగ్లండ్: యాషెస్ నాల్గో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు ప్రతాపం చూపారు. 13 వోవర్లలో ఆస్ట్రేలియా 46 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఖాతా తెరవకుండానే ముగ్గురు బ్యాట్స్ మెన్లు పెవిలియన్ కు చేరారు. స్టువర్ట్ బ్రాడ్ ఆరు వికెట్లు తీశాడు.

 

మోడీపై సోనియా మండిపాటు...

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మండిపడ్డారు. ఎన్ ఎస్ సిఎన్(ఐఎం)తో శాంతి ఒప్పందంపై మోడీ అత్యుత్సాహం ప్రదర్శించారని ఎద్దేవా చేశారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదించకుండానే... ఎన్ ఎస్ సిఎన్(ఐఎం)తో ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు.

 

ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ పనులు ప్రారంభం: మహమూద్ అలీ

హైదరాబాద్: రిజిస్ట్రేషన్ పనులను ఆన్ లైన్ లో ప్రారంభించామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. రిజిస్ట్రేషన్ కు సమయం కోరుతూ... స్లాట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఇక నుంచి పోస్టాఫీసుల్లోనూ రిజిస్ట్రేషన్ స్టాంపులు లభ్యమవుతాయని చెప్పారు. రిజిస్ట్రేషన్ లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో ఆదివారం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

 

ఆ అణు విషాదానికి 70ఏళ్లు....

సరిగ్గా 70 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటన ఇప్పటికీ హిరోషిమా అంటే మానవాళిని వణికిస్తోంది. 1945 ఆగస్టు 6న ఉదయం 8.10 గంటలకు జపాన్ లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబు ప్రయోగించింది. ఈ దాడిలో లక్షా 40వేల మంది ప్రజలు మరణించగా 90శాతం ...శాతం నగరం ధ్వంసమైంది. భయంకరమైన ఈ విస్ఫోటనాన్ని తట్టుకొని జన్ బకూ డోమ్ అనే ఒకే ఒక్క భవనం మాత్రం నిలిచింది. 70 ఏళ్ల క్రితం అలా నిలిచిన భవనమే ఇప్పుడు హిరోషిమా శాంతి చిహ్నంగా గుర్తింపు పొందింది. సమాధి నుంచి పునర్జీవనం పొంది ప్రస్తుతం 12లక్షల జనాభాతో ఆకాశహర్మ్యాలతో అలరారుతూ జపాన్ లోనే అత్యంత ప్రత్యేక నగరంగా గుర్తింపు పొందింది హిరోషిమా.

16:41 - August 6, 2015

వరంగల్ : ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా నిమిషాల్లో ప్రత్యక్షమయ్యే 108 వాహనాలు.. సమస్యలతో సతమతమవుతున్నాయి. మరమ్మతులు లేక ఎక్కడికక్కడ మొరాయిస్తున్నాయి. వాటిలోని పరికరాలూ పాడై పోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నేళ్లలో ఒక్కవాహనంకూడా రోడ్డుపైకి రాలేని దుస్థితి.
వరంగల్‌ జిల్లాలో 42 అంబులెన్సులు...
ప్రమాదాల్లో గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స అందించి సత్వరమే ఆసుపత్రికి తరలించే 108 వాహనాలు సరైన నిర్వహణ లేక.. సకాలంలో మరమ్మతులు జరగక మూలన పడి పోతున్నాయి. వరంగల్ జిల్లాలో 42 అంబులెన్స్ లు ఉండగా.. ఇందులో కాలం చెల్లినవే ఎక్కువ.... కాస్త మెరుగ్గా ఉన్నవి రోడ్లపై తిరుగుతుంటే మిగతావన్నీ షెడ్లకే పరిమితమయ్యాయి.. మరికొన్ని మెకానిక్ గ్యారేజీల చుట్టూ తిరుగుతున్నాయి.. ఫిట్‌నెస్ లేక రోడ్లమీద పరుగు తీయలేక నానాకష్టాలు పడుతున్నాయి.. జిల్లాలోని 52 మండలాల్లో 108 వాహనాల సేవలు అందుతున్నాయి. వీటిలో 15 వాహనాలు పూర్తిగా పాడైపోయాయి. ఒక్కో అంబులెన్స్ ప్రతి రోజూ మూడు వందల కిలో మీటర్లు తిరుగుతుంది.. నెలలో 120 కేసులను పూర్తి చేయాల్సిఉంటుంది.. అనుకున్న టార్గెట్ చేరకపోతే మరికొన్ని ఏరియాలను ఈ అంబులెన్స్‌కు అప్పగిస్తున్నారు సూపరింటెండెంట్లు.. అయితే ప్రస్తుతం వాహనాలున్న కండిషన్‌లో ఇన్ని మండలాలకు వాటిని నడపడం చాలా కష్టమంటున్నారు అంబులెన్స్ పైలెట్స్...
3లక్షల 50వేల కి.మీ. తిరిగిన వాహనం....
జిల్లాలోని చాలా వాహనాలు పరిమితికి మించిన దూరం ప్రయాణించాయి. హన్మకొండలో నడిచే 108 ఇప్పటి వరకూ దాదాపు 3 లక్షల 50 వేల కిలోమీటర్లు తిరిగింది.. 5 లక్షల కిలో మీటర్లు తిరిగిన వాహనాలూ జిల్లాలో ఉన్నాయంటున్నారు. 2005లో కొన్న ఈ వాహనాలు పదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నాయి.. దీంతో మరమ్మతుల కోసం గ్యారేజీల్లోనే ఎక్కువ కాలం ఉండిపోతున్నాయి... ఇక వాహనాల పరిస్థితి ఇలా ఉంటే పరికరాల కొరత మరింత ఇబ్బందిగా మారింది.. బిపి ఆపరేటర్, థర్మామీటర్, ఇంజక్షన్లు కూడా సరిగాలేవు.. ముఖ్యమైన మందులు లేకపోవడంతో పేషంట్లకు సమస్యలు తప్పడంలేదు..
2005లో కేవలం 2 వాహనాలు మాత్రమే...
వరంగల్ జిల్లాలోని 108 లను ఇద్దరు సూపరింటెండెంట్స్ పర్యవేక్షిస్తున్నారు. 2005లో మొదట జిల్లాకు కేవలం రెండు అంబులెన్సులు మాత్రమే కేటాయించారు.. తర్వాత మండల కేంద్రాల్లో సేవల కోసం మరో 42వాహనాలు ఇచ్చింది ప్రభుత్వం.. హైదరాబాద్ తర్వాత ఎక్కువ వాహనాలు జిల్లాలోనే ఉన్నాయి.. అయితే మరమ్మత్తులు లేక పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. అటు మెకానిక్‌లుకూడా ఏదోఓపేరుచెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు.. ఈ రిపేర్లకు పెట్టే ఖర్చుతో కొత్త వాహనాన్ని కొనుగోలు చేయొచ్చంటున్నారు అధికారులు..
108 వాహనాల్లో పనిచేస్తున్న 200మంది...
అటు ఈ అంబులెన్సుల్లో పనిచేసే సిబ్బంది కూడా పనిఒత్తిడితో సతమతమవుతున్నారు.. జిల్లాలోని వాహనాల్లో 2వందలమంది పనిచేస్తున్నారు.. రోజుకు వీరు 12గంటలు పనిచేయాలి... ఒక్కోసారి 24గంటలు, మరికొన్ని సార్లు రెండు రోజులు కూడా విధుల్లోనే ఉండాల్సివస్తుంది.. పదేళ్ల క్రితం 108 సర్వీసులో మూడు వేల రూపాయలజీతంతో చేరిన ఈ సిబ్బందికి ఆశించిన స్థాయిలో జీతాలు పెరగలేదు.. పదేళ్ల సర్వీసులో వీరు 11 వేల రూపాయలు మాత్రమే అందుకుంటున్నారు... చాలీచాలని జీతం... పైగా విపరీతమైన ఒత్తిడిమధ్య పనిచేయడం కష్టంగా ఉందంటున్నారు వీరంతా...
11రోజులపాటు సమ్మెచేసిన సిబ్బంది...
తమ సమస్యలు పరిష్కరించాలంటూ కొన్ని నెలల క్రితం 11 రోజులపాటు 108 వర్కర్స్ సమ్మె చేశారు.. దీనిపై స్పందించిన ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటుచేసింది.. ఇందులో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, గాదరి కిషోర్ సభ్యులుగా ఉన్నారు.. ఇప్పటివరకూ ఈ సభ్యులు చేసిందేమీలేదు.. ఇప్పటికైనా కమిటీ స్పందించి తమ సమస్యలు తీర్చాలని సిబ్బంది కోరుతున్నారు..

16:36 - August 6, 2015

ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో... ఆగస్టు 10వ తేదీలోపు ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈనేపథ్యంలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన బస్‌యాత్ర ఒంగోలులో కొనసాగింది. ఈ యాత్రలో సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో పాటు ఇతర నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం నగరంలో భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు.

ఇంగ్లండ్ బౌలర్ల ప్రతాపం..

ఇంగ్లండ్: యాషెస్ నాల్గో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు ప్రతాపం చూపారు. ఆస్ట్రేలియా 33 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. బ్రాడ్ ఐదు వికెట్లు తీశాడు.

 

16:34 - August 6, 2015

హైదరాబాద్: ప్రత్యేకహోదా పార్లమెంట్‌ గతంలో ఇచ్చిన హామీయేనని.. త్వరగా అమలు చేయాలని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరామని సీపీఐ నేత నారాయణ చెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..స్పెషల్‌ స్టేటస్‌ విషయంలో బిజెపి, టీడీపీలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇచ్చేది లేదని నిర్ణయించుకుని..పైకి వేరే మాట్లాడుతున్నారని నారాయణ మండిపడ్డారు.

16:31 - August 6, 2015

విజయవాడ: రిషితేశ్వరి ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తోందని, అయినా.. వైసీపీ ఈ విషయాన్ని రాజకీయం చేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... యూనివర్సిటీలోకి వెళ్లేందుకు 20 మందికి పర్మిషన్‌ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా.. వందల మందితో వెళ్లి రాద్ధాంతం చేశారని చినరాజప్ప ఆరోపించారు.

16:06 - August 6, 2015

'ఉపేంద్ర' సీక్వెల్ గా 'ఉపేంద్ర2' సినిమా రానుంది. కన్నడ నటుడు ఉపేంద్ర దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించారు. ఈ చిత్రానికి నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మాత. ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత బుజ్జి మాట్లాడుతూ.. '14ఏళ్ల క్రితం ఉపేంద్ర నటించిన 'రా' సినిమాతో నేను నిర్మాతగా మారాను. మళ్ళీ ఇప్పుడు ఆయన సినిమాను నిర్మించడం ఆనందంగా ఉంది. గతంలో వచ్చిన 'ఉపేంద్ర' చిత్రానికి సీక్వెల్‌గా కన్నడ వెర్షన్‌లో 'ఉప్పి 2', తెలుగు వెర్షన్‌కి 'ఉపేంద్ర 2'గా టైటిల్స్‌ని ఫైనల్‌ చేశాం. ఈ చిత్రంలో క్రిస్టీనా అకీవా, పరుల్‌ యాదవ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉపేంద్రే ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. ఈ వారంలోనే ఆడియోను విడుదల చేసి, నెలాఖరులో సినిమాను రిలీజ్‌ చేయడానికి ఫ్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ : భవ్య, కెమెరా: అశోక్‌ కశ్యప్‌. గురు కిరణ్‌ సంగీతం అందిస్తున్నారు.

 

బీఆర్ కే కళాశాల ప్రిన్సిపాల్ పై పోలీసులకు ఫిర్యాదు

గుంటూరు: బీఆర్ కే కళాశాల ప్రిన్సిపాల్ బాబురావుపై చర్యలు తీసుకోవాలని నాగార్జున యూనిర్సిటీ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిషితేశ్వరి ఆత్మహత్యపై స్పందించాలని వీసీ.. రిజస్ట్రార్ ను ఆదేశించారు.

15:48 - August 6, 2015

చిత్తూరు : కుప్పంలో ఎర్ర బస్సు కూడా తిరగలేని చోట విమానాశ్రయం నిర్మిస్తాననటం సాగు భూములను లాక్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మండి పడ్డారు. జిల్లా సీపీఎం పార్టీ ఆధ్వర్యలో కుప్పంలో క్షేత్రస్థాయిలో పర్యటించి.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ పేరుతో సాగు భూములను ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటును అధికార పార్టీ నాయకులతో సహా అన్ని పార్టీల నాయకులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. 

ఈనెల 31 నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు..?

హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ఎపి సర్కార్ యోచిస్తోంది. ఈనెల 31 నుంచి వచ్చే నెల 4 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఇస్తాంబుల్ నుంచి వచ్చాక ప్రభుత్వం.. గవర్నర్ ఆమోదానికి ఫైల్ ను పంపనుంది.  

15:42 - August 6, 2015

విశాఖ: గ్రామాల దత్తత .. సినిమాల్లోనూ.... రియల్ లైఫ్ లోనూ ఇప్పుడిదే హాట్ టాపిక్.... విశాఖ జిల్లా అరకును ఏపీసీఎం చంద్రబాబు దత్తత తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.. ఏజన్సీలో ఎన్నో గ్రామాలుండగా.. ఒక్క ఈ టూరిస్టు ప్లేస్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? బాక్సైట్ మీద ప్రేమతోనా? అరకుమీద అభిమానంతోనా? అని ప్రశ్నిస్తున్నారు గిరిజనులు..
ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ అరకు..
ఆంధ్రా ఊటీగా పేరొందిన ఈ ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు దత్తత నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. పెదలబుడు పంచాయితీలోని అరకు వ్యాలీ, అరకు, మరో 24 గ్రామాలను వేగంగా అభివృద్ధి చేయాలని సీఎం ఏడాదిక్రితం నిర్ణయించారు.. దత్తత స్వీకరణ ప్రకటించి 12 నెలలు గడచినా ఇంతవరకూ ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు..
చాలా గ్రామాలు కనీస వసతులు లేక...
అరకు పరిధిలోని చాలా గ్రామాలు కనీస వసతులు లేక అల్లాడుతున్నాయి.. ఏజెన్సీలోని 244 గ్రామ పంచాయితీల్లో 44 గ్రామాలకు మాత్రమే బస్సులు వెళ్తున్నాయి. చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు... విషజ్వరాలు, అనారోగ్యాలతో బాధ పడే ఈ ప్రాంత ఆస్పత్రుల్లో చాలా పోస్టులు ఖాళీగాఉన్నాయి.. వీటి పరిష్కారంకోసం ఇక్కడి ప్రజలతో ఒక్కసారికూడా సమావేశంకాలేదు చంద్రబాబు.. ఈ ప్రాంత అభివృద్ధికోసం ఏం చేయబోతున్నారు? ప్రణాలిక ఏమిటన్నదానిపైకూడా క్లారిటీలేదు.. కేవలం బాక్సైట్ కోసమే ఏపీ సీఎం దత్తత పేరు చెబుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు..
గాలికొండలో బాక్సైట్ నిక్షేపాలు...
అరకు ఏజెన్సీ గాలికొండలో బాక్సైట్ నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అటు టిడిపి ప్రభుత్వంకూడా బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఉంది. గిరిజనులనుంచి ఈ పనులకు వ్యతిరేకతరాకుండా చేసేందుకు సీఎం రంగంలోకిదిగారని విమర్శలొస్తున్నాయి.. దత్తత తీసుకుంటే ప్రజలనుంచి మద్దతు వస్తుందని... ఆ తర్వాత మెల్లగా తవ్వకాలు చేపట్టొచ్చని సీఎం ఆలోచిస్తున్నారని గిరిజనులు మండిపడుతున్నారు.. అభివృద్ధికి ఆమడదూరంలోఉన్న మారుమూల పంచాయితీలుకాకుండా.... బాక్సైట్ పరిధిలోని ఊళ్లను ఎందుకు దత్తత తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు.. ఈ గ్రామాలను చంద్రబాబు తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తారా? ప్రభుత్వ డబ్బుతోనా? అన్నదానిపైకూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. 

15:37 - August 6, 2015

గుంటూరు: నాగార్జునవర్సిటీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్‌, వైసీపీ కార్యకర్తలు ఒకేసారి రావడంతో అక్కడ గందరగోళం నెలకొది. యూనవర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌, వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ దశలో తోపులాటకు దిగారు. పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో కాంగ్రెస్‌, వైసీపీ కార్యకర్తలు వర్సిటీ ప్రధానద్వారం దగ్గర ఆందోళనకు దిగారు. అనంతరం వైసీపీ మహిళా నేతలను మాత్రం క్యాంపస్‌లోకి అనుమతించారు.

15:31 - August 6, 2015

హైదరాబాద్: నగరంలో నిజాం కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్ కలకలం రేపింది. కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రాజేశ్వరి, ఈ మధ్యాహ్నం పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి, తాను ర్యాగింగును తట్టుకోలేక పోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నాని, రాజశేఖర్ అనే విద్యార్థి తనను వేధిస్తున్నాడని రాజేశ్వరి ఆరోపించింది. కంట్రోల్ రూం సిబ్బంది ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రాజేశ్వరిని బాగ్ లింగం పల్లిలో నారాయణ గూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థర్డ్ ఇయర్ చదువుతున్న ఆమె ఫోన్ చేసిన కాసేపటికే, సమీపంలోని పోలీసులు రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని అబీడ్స్ పోలీసు స్టేషనుకు తరలించారు. పోలీసు అధికారులు రాజేశ్వరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో వైపు రాజశేఖర్ ను కూడా అబిడ్స్ పీఎస్ కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. అబిడ్స్ పీఎస్ కు విద్యార్థులు భారీఎత్తున చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పూంఛ్ సెక్టార్ లో పాక్ బలగాల కాల్పులు

జమ్మూకాశ్మీర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంఛ్ సెక్టార్ లో పాక్ బలగాలు కాల్పులకు పాల్పడ్డారు. పాక్ కాల్పులను భారత జవాన్లు తిప్పికొట్టారు.  

నిజాంకాలేజీలో ర్యాగింగ్ కలకలం

హైదరాబాద్: నిజాంకాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. విద్యార్థి రాజశేఖర్ అనే విద్యార్థి తనను ర్యాగింగ్ చేశాడని బీఎస్సీ విద్యార్థిని రాజేశ్వరి పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసింది. ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను హెచ్చరించింది. బాగ్ లింగంపల్లి వద్ద విద్యార్థినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినిని నారాయణగూడ పీఎస్ కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఆబిడ్స్ పోలీసులు రాజశేఖర్ ను అరెస్టు చేశారు.

 

15:12 - August 6, 2015

స్ఫూర్తిదాయక క్రీడాకారుల జీవితాల ఆధారంగా సినిమాల్ని రూపొందించడంలో బాలీవుడ్‌ ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంటుంది. ఇప్పటికే బాక్సర్‌ మేరీకోమ్‌, పరుగుల వీరుడు మిల్కాసింగ్‌ జీవిత కథల ఆధారంగా సినిమాలు రూపొంది బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేశాయి. తాజాగా మాజీ భారత కెప్టెన్‌ అజహరుద్దీన్‌, ప్రస్తుత భారత కెప్టెన్‌ ఎం.ఎస్‌.ధోనీల జీవిత కథలతోపాటు ప్రముఖ కుస్తీవీరుడు మహవీర్‌ ఫోగత్‌ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటితోపాటు మరో క్రీడాకారిణి జీవిత కథ ఆధారంగా ఓ సినిమాని రూపొందించేందుకు ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్‌ సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ నెంబర్‌ వన్‌ టెన్నీస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా జీవిత కథను ఆధారంగా చేసుకుని ఫరాఖాన్‌ తెరకెక్కించబోయే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు డిసెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. సానియా రాసిన ఆత్మకథకు ఫరాఖాన్‌ తెర రూపమివ్వబోతోందని సమాచారం. ఈ చిత్రం పూర్తిగా వాస్తవాల ఆధారంగా ఉండాలని అన్ని రకాలుగానూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సానియా రాసిన ఆత్మకథ పుస్తకం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో తన పాత్రలో సానియానే నటించనుందా అని ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూలో సానియాని అడిగితే, 'నటనకు నేను సరిపడను' అని సమాధానమిచ్చింది. 'మీ పాత్రలో ఎవరు నటించాలని కోరుకుంటున్నారు' అని అడిగితే, 'పరిణితి చోప్రా నటిస్తే బాగుంటుంది' అని చెప్పింది. అయితే సానియా పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. సానియా కూడా హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అందంగా ఉంటుంది కనుక సానియానే కథానాయికగా నటిస్తే బాగుంటుందని దర్శకురాలు ఫరాఖాన్‌ భావిస్తున్నట్టు తెలిసింది. ఏదిఏమైనా సానియా మీర్జా హీరోయిన్‌గా స్క్రీన్‌ మీద కనిపిస్తే క్రీడాభిమానులే కాదు.. సినీ ప్రేక్షకులకు సైతం సంతోషిస్తారనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
 

 

టిడిపి కేంద్రం వైపా..? ప్రజల వైపా..?

హైదరాబాద్: విభజన సమయంలో పదేళ్లు ప్రత్యేకహోదా కావాలన్న టిడిపి.. మోసం చేస్తున్న కేంద్రం వైపు ఉంటుందా.. లేక ప్రజల వైపు ఉంటుందో తేల్చుకోవాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. ప్రత్యేకహోదా కోసం పోరాడేవారి కోసం మద్దతిస్తామని చెప్పారు.

 

ఉధంపూర్ ఉగ్రదాడితో మాకు సంబంధం లేదు: పాక్

ఢిల్లీ: ఉధంపూర్ ఉగ్రదాడి ఘటనతో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పట్టుబడిన ఉగ్రవాది నవేద్ తమ దేశస్తుడు కాదని స్పష్టం చేశారు. 

14:47 - August 6, 2015

నామాల రవీంద్రసూరి దర్శకత్వంలో.. సుమన్‌ శెట్టి, ప్రమోదిని జంటగా.. మాస్టర్‌ భువనహర్ష సమర్పణలో ఆలూరి క్రియేషన్స్‌ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మిస్తోన్న చిత్రం 'చెంబు చిన సత్యం'. 'ఎల్‌.ఐ.సి ఏజెంట్‌' అనేది ఉపశీర్షిక. విజరు కురాకుల సంగీత మందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి ఆడియో సీడీలను ఆవిష్కరించారు. పాటలు ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఈ సందర్భంగా కె.వి.రమణ మాట్లాడుతూ, 'పాటలను బట్టే సినిమా సక్సెస్‌ శాతమెంతో తెలుస్తుంది. ఆకట్టుకునే పాటలున్న ఈ చిత్రం మంచి విజయం సాధించి దర్శకనిర్మాతలకు లాభాలు తేవాలి' అని అన్నారు. 'ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలకు భిన్నంగా ఆహ్లాదకరంగా సాగే చిత్రమిది' అని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు నామాల రవీంద్రసూరి, సంగీత దర్శకుడు విజరు కురాకుల, వీరశంకర్‌, వరా ముళ్లపూడి, విజరు భాస్కర్‌, శరత్‌చంద్ర, వెంకట్‌, తోట వి.రమణ, ప్రమోదిని తదితరులు పాల్గొన్నారు.

14:43 - August 6, 2015

హైదరాబాద్: మనదేశంలోనూ 1992 లో శిశు ఆహార చట్టానికి రూపకల్పన జరిగి, 1993 ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చింది. తల్లిపాల సంస్కృతి అంతరించడానికి ఆధునిక ఆసుపత్రులు కొంతవరకు దో్హదం చేశాయి. గ్రామాల్లో, ఇళ్లల్లో కాన్పులు అయ్యే స్త్రీలు ఎక్కువగా తల్లిపాలు పట్టడం, పట్టణాల్లో, ఆసుపత్రుల్లో కాన్పు అయ్యే స్త్రీలు ఎక్కువగా పోతపాలు పట్టడం జరుగుతోంది. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. దీని ఫలితమే 1992 లో ఆరంభమైన ప్రపంచ వ్యాప్త శిశు మైత్రీ ఆసుత్రుల ఉద్యమం.
ఆకస్మిక మరణాలకు గురయ్యే అవకాశం తక్కువ....
తల్లిపాలు తాగే పిల్లల్లో ఆకస్మిక మరణాలకు గురయ్యే అవకాశం తక్కువని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.తల్లిపాల వలన పోషకాహార లోపాలు తగ్గి 13 శాతం శిశు మరణాల రేటుతగ్గించవచ్చని అంచనా. తల్లిపాల వల్ల శిశువుకే కాదు, తల్లికికూడా లాభాలున్నాయి.
బిడ్డకు ఆయురారోగ్యాలను అందిస్తాయి....
ఏ మందులూ నయం చేయలేని ఆరోగ్యసమస్యలు, ఏ వైద్యుడూ బాగుచేయలేని వ్యాధులు అమ్మపాలకి తలొగ్గుతాయి. బిడ్డకు ఆయురారోగ్యాలను అందిస్తాయి. తల్లీబిడ్డల మధ్యల అనుబంధాన్ని పెంచుతాయి... విలువైన ఈ విషయాలను కాబోయే అమ్మలు కూడా తెలుసుకోవాలి. పుట్టబోయే బిడ్డకు వీలున్నన్ని రోజులు పాలిచ్చేందుకు సిద్ధపడాలి. పుట్టిన ప్రతి శిశువూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి.

14:32 - August 6, 2015

హైదరాబాద్: తెలంగాణలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటూ సీపీఎం బస్ యాత్ర చేపట్టింది. గోల్కొండ నుండి ప్రారంభం అయిన బస్సు యాత్రను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ... కేరళ, పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు రిజర్వేషన్లు అమలుచేశామని గుర్తుచేశారు.. తెలంగాణ సీఎం కేసీఆర్ పిట్టల దొరలా వ్యవహరిస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు.

14:28 - August 6, 2015

హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కూల్చి నూతనంగా నిర్మించి తీరుతామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ స్పష్టం చేశారు. ప్రతి పనికీ ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని.. వాళ్ల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్‌లో నీటికష్టాలు ఏర్పడ్డాయన్నారు.

హామీలను ఎన్ డిఎ అమలు పరచాలి: డి.రాజా

ఢిల్లీ: ప్రత్యేకహోదాపై గత ప్రభుత్వ హామీలను ఎన్ డిఎ ప్రభుత్వం అమలు పరచాలని సీపీఐ సీనియర్ నేత డి.రాజా డిమాండ్ చేశారు. ఎపికి ప్రత్యేకహోదా కల్పించాలని కోరారు. విభజన హామీలను కేంద్రం అమలు చేయానలి సూచించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలన్నారు.  

14:25 - August 6, 2015

అనంతపురం : బుక్కరాయసముద్రం ప్రభుత్వ పాఠశాలలో ఓ కీచక టీచర్‌ బాగోతం బయటపడింది. పాఠాలు చెప్పాల్సిన రామచంద్ర స్కూలు హెడ్‌మాస్టర్‌ ఓ విద్యార్థిని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దీంతో విషయం తల్లిదండ్రులు, స్థానికులకు తెలియడంతో..హెడ్‌మాస్టర్‌ను చితకబాదారు. కొద్ది రోజులుగా విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డా..ఉపాధ్యాయుడికి భయపడిన ఆ విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే ఉపాధ్యాయుడి పిచ్చిచేష్టలు మీతిమీరడంతో..ఎట్టకేలకు ఆ విద్యార్థిని జరిగిన దాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద ఎత్తున స్కూలు వద్దకు చేరుకొని హెడ్‌మాస్టర్‌ని చితకబాది ఆ తర్వాత పోలీసులకు అప్పచెప్పారు. 

ర్యాగింగ్ పై ఉక్కుపాదం: చినరాజప్ప

హైదరాబాద్: నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ పై ఉక్కుపాదం మోపుతామని ఎపి హోంమంత్రి చినరాజప్ప తేల్చి చెప్పారు. రిషితేశ్వరి ఘటన తర్వాత నాగార్జున వర్సిటీలో అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. వర్సిటీలోకి 20 మందికి అనుమతిస్తే.. రోజా వందల మందితో వెళ్లడం సరికాదన్నారు. రోజా రాజకీయాలు చేయడం మంచిదికాదని హితవుపలికారు. వర్సిటీలో అనధికారికంగా ఉన్నవారిని బయటకు పంపిస్తామని చెప్పారు. 

భత్కల్ తోపాటు మరో నలుగురు కోర్టులో హాజరు

హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల నిందితుడు భత్కల్, మరో నలుగురిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. భద్రత దృష్ట్యా భవిష్యత్ లో వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా భత్కల్, తదితరులను హాజరు పరిచేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. అందుకు కోర్టు అంగీకరించింది. 

ఈనెల 10 నుంచి గ్రామ సభలు: కేఈ

హైదరాబాద్: ఈనెల 10 నుంచి 31 వరకు 'మీ భూమి-మీ ఇంటికి' పేరిట గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఎపి ఉప ముఖ్యమంత్రి కేఈ.కృష్ణమూర్తి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల నకిలీ పాస్ బుక్ లు గుర్తించామన్నారు. సంస్కరణల ద్వారా రెవెన్యూ శాఖ పారదర్శకత పెంచామని చెప్పారు. రికార్డులను కంప్యూటరీకరణ ద్వారా ఆధునీకరించామని వెల్లడించారు. మీ సేవా కేంద్రాల ద్వారా 64 రకాల సేవలు అందిస్తామన్నారు.

 

13:14 - August 6, 2015

వరంగల్ : జిల్లాలో సినిమా ఫక్కీలో దుండగులు..పోలీసుల మధ్య ఛేజింగ్ జరిగింది. ఎక్కడక్కడ కాపు కాసినా దుండగులు పరారీ అయ్యారు. అసలు దుండగులు ఎవరు ? అనేది తెలియరావడం లేదు. వరంగల్ జిల్లాలో నలుగురు అనుమానితులు క్వాలీస్ వాహనంలో వెళుతున్నారన్న సమాచారంతో పోలీసులు వారి వాహనాన్ని వెంబడించారు. పోలీసులు వెంబడిస్తున్నారని గ్రహించిన దుండగులు వాహనాన్ని ముందుకు వేగంగా కదిలించారు. పోలీసులు పలుమార్లు వాహనాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించారు. ఏమాత్రం బెదరని దుండగులు ఏకంగా పోలీసులపైకి వాహనాన్ని నడిపించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. వెంటనే ఇతర పోలీసులను అప్రమత్తం చేశారు. మేడారం జాతరకు వెళ్లే మార్గంలో ములుగు పోలీసులు కాపు కాశారు. వీరిని కూడా అడ్డుకున్న దుండగులు ముందుకు దూసుకెళ్లారు. ఈ సమాచారాన్ని సీఆర్పీఎఫ్ జవాన్లకు పోలీసులు అందించారు. మార్గంలో సీఆర్పీఎఫ్ జవాన్లు అడ్డంగా కాపు కాశారు. కాల్పులకు దిగుతారోమోనని భావించిన దుండగులు ఇన్నోవా వాహనాన్ని వదిలి పరారయ్యారు. పోలీసులు ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేసి వరంగల్ జిల్లాకు తరలించారు. 

వరంగల్ జిల్లాలో కాల్పుల కలకలం...

వరంగల్: ఆత్మకూరు, ములుగు అటవీప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇన్నోవా వాహనంలో అనుమానితులు హల్ చల్ చేశారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు నుంచి పసరా వరకు అనుమానితులను పోలీసులు వెంబడించారు. 70 కిమీ మేర పోలీసు వాహనాలు పరుగులు తీశాయి. ములుగు-ఆత్మకూరు చెక్ పోస్టు వద్ద పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పసరా జాతీయ రహదారి సమీపంలో ఖాళీ ఇన్నోవాను సీఆర్ పీఎఫ్ బలగాలు పట్టుకున్నాయి. మావోయిస్టు నేతలు పోలీసులు అనుమానిస్తున్నారు. 

12:49 - August 6, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్ వాడీ వేతనాలు పెంచేందుకు ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. కానీ సీఎం బాబు విదేశీ పర్యటనలో ఉండడం..ఆయన వచ్చిన తరువాత నిర్ణయాన్ని తెలియచేయడం..కేబినెట్ ఆమోదం తరువాతే వీరికి వేతనాలు పెరుగనున్నాయి. గురువారం ఉదయం యనమల నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం భేటీ జరిగింది. మూడు కేటగిరీలుగా ఉన్న అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచాలని సంఘం నిర్ణయించింది. అంగన్ వాడీ కార్యకర్తలకు రూ.4,200 వేల నుంచి రూ.7,100 వరకు, హెల్పర్ల వేతనం రూ. 2,200 నుంచి రూ.4,600 వరకు, మినీ అంగన్ వాడీల వేతనం రూ.2,950 నుంచి రూ. 4,600 కు పెంచాలని సబ్ కమిటీ నిర్ణయించింది. అంగన్ వాడీల వేతనాల పెంపుతో ప్రభుత్వంపై రూ.315 కోట్ల భారం పడనుంది. గత కొంతకాలంగా వేతనాలు పెంచాలని అంగన్ వాడీలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీరి వేతనాల పెంపుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ? కేబినెట్ ఆమోదం పొందుతుందా ? లేదా అన్నది కొద్ది రోజుల్లో తెలిసిపోనుంది. 

12:42 - August 6, 2015

ఢిల్లీ : లలిత్ మోడీ అంశంలో తానేమి చేశానని లోక్ సభలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. లలిత్ మోడీ అంశంపై ఆమె మాట్లాడారు. లలిత్ మోడీ కోసం సిఫార్సు చేయలేదని, దీనిపై కాంగ్రెస్ తో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు సభకు తెలిపారు. చర్చిస్తేనే తాను సమాధానాలు చెబుతానని స్పష్టం చేశారు. ఆమె మాటల్లోనే...

''రెండు నెలలుగా మీడియాలో దుష్ర్పచారం జరగుతోంది. ఆరోపణకు సంబంధించి చర్చలకు సిద్ధంగా ఉన్నా. మోడీకి సంబంధించి నిర్ణయాన్ని బ్రిటన్ ప్రభుత్వానికి వదిలేశా. మోడికి ఎలాంటి సిఫార్సులు చేయలేదు. ఒక్క ఆధారం ఉంటే బయటపెట్టాలి. లలిత్ మోడీని బయటకు పంపించానా ? అతనికి సహాయపడ్డానా ? ఆయన కోసం పదవిని వాడుకున్నానా ? ఐపీఎల్ విషయంలో నా పాత్ర ఉందా ? బ్రిటీష్ ప్రభుత్వంపై నిర్ణయం వదిలేయడం జరిగింది. యాత్ర దస్తావేజులపై నిర్ణయం తీసుకోవాల్సింది అక్కడి ప్రభుత్వం. కానీ ఇందులో మాత్రం మానవీయ కోణంలో స్పందించాను. మోడీ సతీమణి క్యాన్సర్ తో బాధ పడుతోంది. ఈమె చికిత్స తీసుకొంటోంది. ఈసారి ప్రమాదకరంగా వ్యాధి మారిందని, చికిత్స చేసే తరుణంలో మృతి చెందడం లేదా రెండు కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని బ్రిటన్ వైద్యులు పేర్కొన్నారు. దీనికి సబంధించి మోడీ సతీమణి ఓ లేఖ రాయడం జరిగింది. చికిత్స సమయంలో భర్త రావాల్సి ఉంటుంది. అందుకే తాను ప్రయాణ ఏర్పాట్ల కోసం చేశాను. నా స్థానంలో మీరు (స్పీకర్) ఉంటే ఏం చేస్తారు ? సోనియా గాంధీ ఉంటే ఏం చేస్తారు ? చనిపోయేందుకు అవకాశం ఇస్తారా ? మోడీకి ఇక్కడ సహాయం చేయలేదు. ఆమె భార్యకు సహాయం చేయడం జరిగింది. ఇలాంటి మహిళకు సహాయం చేయడం నేరమైతే అలాగే అనుకోండి'. అంటూ సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు.
లలిత్ మోడీ వ్యవహారంలో సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలని గత కొంతకాలంగా విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ

హైదరాబాద్: సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ అయ్యారు. ఉద్యోగుల విభజనపై చర్చిస్తున్నారు. తెలంగాణ, ఎపి సీఎస్ లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

మహిళలకు రక్షణ లేకుండా పోయింది: రోజా..

గుంటూరు: నాగార్జున యూనివర్సిటీ వీసీతో వైసీపీ ఎమ్మెల్యే బృందం సమావేశమైంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసిపి ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, విద్యార్థినిలపై కూడా దాడులు జరుగుతున్నాయని వాపోయారు.  

12:33 - August 6, 2015

గుంటూరు : విద్యార్థిని రిషితేశ్వరి మృతితో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన ఆచార్య నాగార్జున వర్సిటీలో ప్రశాంత వాతావరణం వెలువడుతున్న దశలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. వర్సిటీలోకి వెళ్లేందుకు కాంగ్రెస్, వైసీపీ ప్రతినిధులు ప్రయత్నించడం..పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై వర్సిటీలో పర్యటించేందుకు కాంగ్రెస్, వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రతినిధుల బృందం సిద్ధమైంది. వీరందరూ గురువారం ఉదయం వర్సిటీకి చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. తాము లోనికి వెళుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ నేతలు ప్రశ్నించారు. అనుమతిచ్చేది లేదని పోలీసులు ఖరాఖండిగా చెప్పారు. దీనితో నేతలు అక్కడే బైఠాయించారు. అక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. తదనంతరం మహిళా నేతలను మాత్రమే లోనికి పంపించారు. లోనికి వెళ్లిన వైసీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడున్న విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఇతర మగ నేతలు వీసీని కలువడానికి వెళ్లారు.

నీరు గార్చేందుకు ప్రయత్నం - రోజా..
రిషితేశ్వరీ మృతి అనంతరం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడం వల్ల కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఇంతమంది పోలీసులు అవసరమా అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితి రావద్దని, ప్రిన్స్ పల్ బాబురావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. యాంటీ ర్యాంగింగ్ కమిటీలు పెట్టింది లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు వెళుతామని రోజా విద్యార్థులతో పేర్కొన్నారు.

సీబీఐ విచారణ చేయించాలి - ఉమ్మారెడ్డి..
రిషితేశ్వరి ఘటనపై సీబీఐచే విచారణ చేయించాలని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. చనిపోయిన తరువాత ఆమె రాసిన సూసైడ్ నోట్ ఎంత ఆవేదన తెలియచేస్తుందో అర్థమౌతుందన్నారు. బాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఎక్స్ గ్రేషియా ఇస్తామని రిషితేశ్వరి తల్లిదండ్రులతో బాబు పేర్కొన్నారని విమర్శించారు.

ప్రిన్స్ పల్ ను అరెస్టు చేయాలి - అంబటి..
రిషితేశ్వరి ఘటనపై ప్రిన్స్ పల్ బాబురావును అరెస్టు చేయాలని వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల బలగాలతో చేయాలని అనుకోవడం సరైంది కాదన్నారు. సరైన యాక్షన్ లేకపోవడం వల్ల ఇతర ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉందన్నారు. టిడిపి అధికారంలో వచ్చిన తరువాత మహిళలపై అత్యాచారాలు బలపడుతున్నాయని, జరిగిన ఘోరాలపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రిన్స్ పల్ అరెస్టు చేయకుండా తాత్సారం చేస్తున్నారని అంబటి విమర్శించారు. 

లలిత్ మోడీకి ఎలాంటి మద్దతు ఇవ్వలేదు: సుష్మా

ఢిల్లీ: లలిత్ మోడీకి ఎలాంటి మద్దతు ఇవ్వలేదని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. రెండు వారాల నుంచి లోక్ సభలో ఎలాంటి చర్చ జరగడం లేదన్నారు. తనపై ఆరోపణలకు సంబంధించిన అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఒక వర్గం మీడియాలో రెండు నెలలుగా తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వాపోయారు.

కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటును అంగీకరించబోం:మధు

చిత్తూరు: కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటును అంగీకరించబోమని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. భూములు లాక్కొని విమానాశ్రయం నిర్మించాల్సిన అవసరం లేదన్నారు. గంట ప్రయాణ వ్యవధిలో బెంగళూరు ఉండగా కుప్పంలో విమానాశ్రయ అవసరం ఏముందని ప్రశ్నించారు. అవసరమైతే రైతులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.  

ఎపిలో పెరుగనున్న అంగన్ వాడీల జీతాలు

హైదరాబాద్: ఎపిలో అంగన్ వాడీల జీతాలు పెరుగనున్నాయి. వేతనాలను పెంచుతూ ఎపి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అంగన్ వాడీల వేతనం రూ.4,200 వేల నుంచి 7,100వరకు, హెల్పర్ల వేతనం రూ. 2,200 నుంచి 4,600వరకు, మినీ అంగన్ వాడీల వేతనం రూ.2,950 నుంచి రూ. 4,600 కు పెంచాలని సబ్ కమిటీ నిర్ణయించింది. అంగన్ వాడీల వేతనాల పెంపుతో ప్రభుత్వంపై రూ.315 కోట్ల భారం పడనుంది.  

డీఎస్సీ-2014 పిటిషన్ కొట్టివేత..

హైదరాబాద్: డీఎస్సీ-2014 పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎపిలో టెట్, డీఎస్సీ ఒకేసారి నిర్వహించాలన్న ఎపి ప్రభుత్వ నిర్ణయం సబబేనని తెలిపింది.  

11:34 - August 6, 2015


ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ జరిగిన ఘటనపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. ''ఈ దాడిలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఉగ్రవాదిని స్థానికుల సహకారంతో పట్టుకున్నారు. వీరిని జమ్మూకు తీసుకొచ్చారు. విచారణలో అతని పేరు వెల్లడించాడు. నావెద్ అలియాస్ ఉస్మాన్ అని తెలిపాడు. పాకిస్తాన్ లోని ఫైసలబాద్ ప్రాంతమన్నాడు. మృతి చెందిన ఉగ్రవాది పాక్ లోని భవల్ పూర్ ప్రాంతానికి చెందిన వాడని తెలిపాడు. ఉగ్రవాదుల నుండి 2 ఏకే 47, గ్రైనైడ్ లు, ఇతర మందు సామాగ్రీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీర మరణం పొందిన జవాన్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాం. వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎక్స్ గ్రేషియాతో పాటు ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో బీఎస్ ఎఫ్ జవాన్లు పోరాడారు. ఉగ్రవాదిని పట్టుకోవడంలో గ్రామస్తుల ధైర్యాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది'' అని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాజ్ నాథ్ వెల్లడించిన విషయాల్లో ఎలాంటి కొత్త వివరాలు లేవని విపక్షాలు పెదవి విరిచాయి.
ఉదంపూర్ లో భారత జవాన్ల క్యాంప్ పై ఉగ్రవాదులు మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరికొంతమంది జవాన్లు గాయపడ్డారు. భారత దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా స్థానికుల సమాచారంతో మరో ఉగ్రవాదిని పట్టుకున్నారు. 

నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

గుంటూరు: నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, వైసిపి కార్యకర్తలు వర్సిటీకి చేరుకున్నారు. వర్సిటీలోకి అనుమతించాలని ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కాంగ్రెస్, వైసిపి కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.  

11:24 - August 6, 2015

ఢిల్లీ : ఎంపీల సస్పెన్షన్ పై కాంగ్రెస్ వరుసగా మూడో రోజు కదం తొక్కింది. 25 మంది ఎంపీలను ఐదు రోజుల పాటు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. వెంటనే సస్పెండ్ ఎత్తివేయాలని, మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. గురువారం పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాండ్లు ధరించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళన చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి, సీఎంలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మోడీపై సోనియా ఫైర్..
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. అప్రజాస్వామికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నాగాలాండ్ శాంతి ఒప్పందాన్ని సోనియా వ్యతిరేకించారు. ఈ ఒప్పందం ఏకపక్షంగా ఉందని, నాగా శాంతి ఒప్పందంలో ఈశాన్య రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోలేదని తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోడీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ప్రజల గొంతుకు నొక్కేస్తున్నారు..
మోడీ ప్రభుత్వం వ్యవహార శైలిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గొంతును నొక్కేస్తున్నారని విమర్శించారు. నాగా శాంతి ఒప్పందంలో ఈశాన్య రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోలేదని, అక్కడి ప్రజలను అవమానపరిచారని విమర్శించారు. పార్లమెంట్ లో సైతం తమ వాణిని నొక్కేస్తున్నారని విమర్శించారు. 

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బిఎస్ ఎఫ్ జవాన్ల మృతి

రాజ్యసభ: ఉదంపూర్ ఘటనపై కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన వెల్లడించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బిఎస్ ఎఫ్ జవాన్లు మృతి చెందారని తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతాదళాలు మట్టుపెట్టాయని పేర్కొన్నారు. వీరమణం పొందిన బిఎస్ ఎఫ్ జవాన్లకు సంతాపం తెలిపారు.

 

నాగాలాండ్ తో ఒప్పందాన్ని వ్యతిరేకించిన సోనియా..

ఢిల్లీ: నాగాలాండ్ తో కేంద్రప్రభుత్వం కదుర్చుకున్న ఒప్పందాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యతిరేకించారు. నాగాలాండ్ తో శాంతి ఒప్పదం సమ్మతం కాదన్నారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించకుండా..నాగాలాండ్ తో ఒప్పందం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.  

కలెక్టర్లతో ఎపి సీఎస్ వీడియో కాన్ఫరెన్స్...

హైదరాబాద్: అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎపి సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్భాభావ పరిస్థితులు, మంచినీటి సరఫరా ఏర్పాట్లపై ఆరా తీశారు. 

గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆందోళన..

ఢిల్లీ : ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా కాంగ్రెస్ వరుసగా మూడో రోజు ఆందోళన చేపట్టింది. గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాండ్లు కట్టుకుని సోనియా, మన్మోహన్, రాహుల్ గాంధీ ఇతర నేతలు ఆందోళన చేశారు. 

టిడిపి నియోజకరవర్గ ఇన్ చార్జీలతో మంత్రి రావెల భేటీ

ప్రకాశం: టిడిపి నియోజకరవర్గ ఇన్ చార్జీలతో మంత్రి రావెల కిషోర్ బాబు భేటీ అయ్యారు. మంత్రి శిద్ధా రాఘవరావు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

10:51 - August 6, 2015

విజయ్, సమంత కాంబినేషన్..మురుగుదాస్ దర్శకత్వం లో తెరకెక్కిన 'కత్తి' కోలీవుడ్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో రీమేక్ చేయాలని చాలామంది భావించారు. ఈ సినిమాకు 'జూనియర్ ఎన్టీఆర్' గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ టాక్. రీమెక్ హక్కులను ఠాగూర్ మధు సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నాడని టాక్. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు..కార్పొరేట్ కంపెనీల ఆగడాలను చూపిస్తూ రైతుల కోసం పోరాడే పవర్ ఫుల్ పాత్రను విజయ్ పోషించాడు. 

 

ఢిల్లీలోని తెలంగాణభవన్ లో జయశంకర్ జయంతి వేడుకలు

ఢిల్లీ: తెలంగాణభవన్ లో జయశంకర్ 81 జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు టీఆర్ ఎస్, కాంగ్రెస్ ఎంపీలు, ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యారు. 

ఉదంపూర్ ఘటనపై మ.12 గంటలకు రాజ్ నాథ్ ప్రకటన

ఢిల్లీ: ఉదంపూర్ ఘటనపై మధ్యాహ్నం 12 గంటలకు కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో ప్రకటన చేయనున్నారు.

 

స్కూల్ బస్సు చక్రాల కిందపడి బాలుడి మృతి

శ్రీకాకుళం: పలాసలోని మెయిన్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండేళ్ల బాలుడు.. స్కూల్ బస్సు చక్రాల కిందపడి మృతి చెందాడు.  

10:20 - August 6, 2015

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో కాన్పూర్ లో ఉన్న ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఆరు గంటలకు ఈప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం పది ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. కానీ ప్రమాదం ఎలా జరిగిందో తెలియదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదంపై విచారణ చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. జనవాసాల మధ్యనున్న ఈ రసాయన పరిశ్రమను తరలిస్తామని పేర్కొన్నారు. 

10:14 - August 6, 2015

ఢిల్లీ : ప్రొ.జయశంకర్ కన్న కలలను సాకారం చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. హస్తినలో ప్రొ.జయశంకర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జయశంకర్ కు ఎంపీలు నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడారు. సాధించిన తెలంగాణను జయశంకర్ చూడలేకపోయారని, వారి ఆశలు అమలు చేయాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని తెలిపారు. ఇతరులు అందరూ భాగస్వాములు కావాలని, జయశంకర్ కన్న కలలను సాకారం చేయాలని పేర్కొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా జయశంకర్ కృషి చేశారని ఎంపీ వినోద్ కొనియాడారు. 

  • ప్రొఫెసర్‌ జయశంకర్‌. 1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు. 
  • 1975 నుంచి 1979 వరకు వరంగల్ సీకేఎం ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.
  • 1979 నుంచి 1981 వరకు కేయూ రిజిస్ట్రార్‌గా, ఆ తర్వాత 1982 నుంచి 1991 సీఫెల్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహించారు. 
  • 1952లో జరిగిన నాన్‌-ముల్కీ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారు.
  • 1954లో తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ... ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక అందించారు.
  • 1969లో ఎగసిన తెలంగాణ ఉద్యమంతో పాటు మలివిడత ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ పాల్గొన్నారు. 
  • 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయ వైస్‌-ఛాన్సలర్‌ వరకు ఉన్నత పదవులు పొందారు. 
  • 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు మార్గదర్శిగా నిలిచారు.
  • 2011 జూన్ 21న మృత్యులోకాలకు వెళ్లిపోయారు. 

ఉగ్రవాది నవేద్ ను విచారించనున్న ఎన్ఐఏ..

జమ్మూ : ఉదంపూర్ లో భద్రతా దళాలకు పట్టుబడిన ఉగ్రవాది నవేద్ ను ఎన్ఐఏ విచారించనుంది. పాకిస్తాన్ లో తయారైన జీపీఎస్, రెడియో సెట్ తో నవేద్ అడవీ మార్గం గుండా భారత భూభాగంలోకి వచ్చాడు. అమర్ నాథ్ యాత్ర, సైనిక క్యాంప్ లపై దాడి చేయాలని నవేద్ ను లష్కరే తోయిబా అగ్రనేతలు ఆదేశించారు. ఈనెల మూడో తేదీన తోయిబా అగ్రనేతలను నవేద్ కలిశారు. పాకిస్తాన్ లో రెండుసార్లు ఉగ్రవాద శిక్షణ కూడా తీసుకున్నాడు. మురీదకెలో 21 రోజులు, ముజుఫరాబాద్ లో మూడు నెలల పాటు నవేద్ ఉగ్రవాద శిక్షణ పొందాడు. 

ఉదంపూర్ వీర జవాన్లకు నివాళులు..

జమ్మూ కాశ్మీర్ : ఉదంపూర్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన ఇద్దరు జవాన్లకు పోలీసులు, భద్రతా అధికారులు నివాళులర్పించారు. 

09:30 - August 6, 2015

మహరాష్ట్ర : తమ కుమారుడు క్షేమంగా రావాలని తల్లిదండ్రుల ఆశలు..ఆ చిన్నారి ప్రాణాలతో బయటకు రావాలని ప్రతొక్కరి కోరికలు..చిన్నారి క్షేమంగా బయటకు తీయాలని రెస్క్యూటీం ప్రయత్నాలు..వీరందరి ఆశయలు ఫలించాయి. బోరు బావిలో పడిన 18 నెలల చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు.
పూణే సమీపంలోని ఓ వ్యవసాయక్షేత్రంలోని మంగళవారం 18 నెలల చిన్నారి బోరు బావిలో పడి పోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూటీం చర్యలు చేపట్టింది. లోనికి ఆక్సిజన్ అందించారు. కానీ బుధవారం చిన్నారి బయటకు రాలేదు. దీనితో ప్రాణాలతో ఉంటాడా ? అనే అనుమానాలు కలిగాయి. చివరకు గురువారం ఉదయం రెస్క్యూ టీమ్ లు చిన్నారిని రక్షించాయి. వెంటనే ఆక్సిజన్ అందించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు

09:19 - August 6, 2015

ఏంటీ ? గాడిదలు స్మగ్లింగ్ చేయడం ఏంటీ ? అంతేగాక వాటిని అరెస్టు కూడా చేశారా ? అని నోరెళ్ల బెడుతున్నారా ? కానీ ఇది నిజం. వాస్తవం. అక్రమాలకు పాల్పడుతున్నాయంటూ మహారాష్ట్ర పోలీసులు ఏకంగా 56 గాడిదలను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. ఇటీవలే ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్ నాథ్ గాడ్సే స్వయంగా అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. పందార్ పూర్ లోని టెంపుల్ టౌన్ సమీపంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఇసుక బస్తాలు మోసుకపోతున్న గాడిదదలు కనిపించాయంట. వెంటనే ఆ ఖాకీలు వాటిని అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లారంట. గాడిదలను మాత్రం స్టేట్ హోం కు తరలించినట్లు, వాటికి మంచి ఆహారం పెడుతున్నామని సదరు మంత్రి వెల్లడించారు. అదండి సంగతి..

09:19 - August 6, 2015

వెంకన్న లడ్డూ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం ప్రతొక్కరూ 'లడ్డూ'ను తమతో తీసుకెళుతుంటారు. తమ కుటుంబసభ్యులకు..ఇతరులకు ఈ లడ్డూను పంచి పెడుతుంటారు. ఎన్నో ప్రసాదాలు అందుబాటులో పెట్టినా అధిక శాతం మంది లడ్డూనే ఇష్ట పడుతుంటారు. లడ్డూ ప్రసాదం విక్రయం ఆలయానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తోంది. తిరుపతి లడ్డూకు పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్ట్రార్ 2014లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) స్టేటస్ ను ఇచ్చింది. అలాంటి లడ్డూకు 300 ఏళ్లు నిండాయి. 1715 ఆగస్టు 2 లడ్డూను ఇవ్వడం ప్రారంభమైందని టిటిడి పేర్కొంటోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోంది. ఈ లడ్డూలను తయారు చేయాడానికి కిచెన్ ను అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేశారు. నియమనిష్టలతో నిపుణులు ఈ లడ్డూలను తయారు చేస్తుంటారు. 

కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటి కమిషనర్ పై ఏసీబీ దాడులు..

నల్గొండ : కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటి కమిషనర్ నల్లా సాయికిషోర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించారు. నల్గొండ, హైదరాబాద్ లో సోదాలు కొనసాగుతున్నాయి. 

పాట్నాలో బీజేపీ నేత కాల్చివేత..

బీహార్ : పాట్నాలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో బీజేపీ నేత అవినాష్ మృతి చెందారు. సాలిమ్ పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

కాన్పూర్ కెమికల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం..

ఉత్తర్ ప్రదేశ్ : కాన్పూర్ లోని ఓ కెమికల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. పది ఫైరింజన్ల సహాయంతో సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

బోరుబావిలో పడిన చిన్నారి వెలికి తీత..

పుణే : మంగళవారం బోరు బావిలో పడిపోయిన 18 నెలల చిన్నారిని రెస్క్యూటీం వెలికి తీశారు. చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

08:32 - August 6, 2015

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వ్యవసాయ సంక్షోభం నెలకొనే అవకాశం ఉందని, ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ప్రొ.నాగేశ్వర్ సూచించారు. వ్యవసాయ సంక్షోభం..కేజీ టు పీజీ విద్య..ప్రత్యేక హోదాలాంటి అంశాలపై టెన్ టివి 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే...

వర్షాలు లేవు..
''ప్రకటనలే తప్ప ప్రత్యామ్నాయ చర్యలు ఏమీ తీసుకోవడం లేదు. జూన్ లో రుతుపవనాలు వస్తాయి. కానీ ఇప్పటి వరకు వర్షాలు పడలేదు. జలాశయాలు ఎండిపోతున్నాయి. మొత్తం 24 జలాశయాలు ఎండిపోయాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, వెలిగోడు..ప్రధాన రిజర్వాయర్ లో వాటర్ లేదు. ఎగువ భాగాన కూడా వర్షాలు లేవు.

60 లక్షల ఎకరాల్లో పంటలు..
తెలంగాణలో కోటి ఎకరాల్లో పంటలు వేస్తారు. 60 లక్షల ఎకరాల్లోనే మాత్రం పంటలు వేశారు. ప్రస్తుతం 15 లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయి. ఈ రోజు వర్షం పడినా మరో 15 లక్షల ఎకరాల పంటలు ఎండిపోతాయి. 5.5 వృద్ధి రేటు పడిపోయింది. 11 శాతం వరకు మాత్రమే వరి నాట్లు వేశారు. వాటర్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ పంట వేశారు. వరికి ఇప్పటికప్పుడు ప్రమాదం లేదు. పత్తి, మొక్క జొన్నలపై తీవ్ర ప్రభావం నెలకొంది. ప్రపంచ మార్కెట్ లో పత్తికి డిమాండ్ ఉంది. పత్తికి ఉత్పత్తి ఖర్చు ఎక్కువ. రైతులు దివాళ తీసే దుస్థితికి తీసుకొచ్చారు. తెలంగాణలో కూడా కౌలు దారులున్నారు. రుణమాఫీ పూర్తిగా జరగకపోవడం వల్ల అదనంగా రుణం తీసుకొచ్చే అవకాశం లేదు. వ్యవసాయ సంక్షోభం వస్తోంది. తక్షణమే ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన వ్యవసాయమైన సంక్షోభం ఉంది. పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరిగే అవకాశం ఉంది. 2014 సంవత్సరంలో రోజుకు 16 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అధ్యయనంలో తేలింది. అటవీ హక్కుల చట్టం ఎక్కడా అమలు కావడం లేదు. వెంటనే ప్రభుత్వం మేల్కొనాలి.

పాఠశాలలో కనీస ప్రమాణాలు పాటించాలి..
కేజీ టు పీజీ విద్యపై ఓ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతోందని..దీనికి రావాలని తనతో సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇది 9-10 నెలల క్రితం చెప్పారు. కానీ ఇంతవరకు ఆహ్వానం రాలేదు. అంటే మీటింగ్ జరగలేదనే కదా. విద్య ప్రమాణాలు లేవు. యూనివర్సిటీలకు నాయకత్వం లేదు. జయశంకర్ ఆశించిన తెలంగాణలో ఇలా జరుగవచ్చా ? మంచి స్కూల్స్ పెట్టండి. ప్రతి పాఠశాలలో కనీస ప్రమాణాలు పెట్టండి. మంచి అద్బుతాలు సాధించవచ్చు. చేయాలనే సంకల్పం ఉంటే చేయవచ్చు. విద్యపరమైన అసమానతలు తొలగించాలి. విద్య లేకపోతే వినాశనమే ఉంటుంది''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. అలాగే ఏపీ ప్రత్యేక హోదాపై కూడా నాగేశ్వర్ విశ్లేషించారు. 

08:09 - August 6, 2015

ఢిల్లీ : లిబియాలో ఉగ్రవాదుల చెరలో ఉన్న వారిని విడుదల చేశారన్న ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి చేసిన వ్యాఖ్యలు గందరగోళం సృష్టించాయి. బలరాం కిషన్, గోపికృష్ణల కుటుంబసభ్యుల సంతోషం క్షణాల్లోనే ఆవిరైపోయింది. బందీలుగా ఉన్న ప్రొపెసర్లు బలరాం, గోపికృష్ణలను ఉగ్రవాదులు విడుదల చేశారని, వారిని భారత రాయబార కార్యాలయానికి తరలించారని బుధవారం కంభంపాటి మీడయాకు తెలియచేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ వార్తను విదేశాంగ ధృవీకరించలేదు. వారు ఇంకా ఐఎస్ చెరలోనే ఉన్నారని, వారిని విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు లిబియాలోని భారత రాయబారం తేల్చిచెప్పడంతో బలరాం, గోపికృష్ణ కుటుంబాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వారిని క్షేమంగా విడుదల చేయాలని కుటుంసభ్యులు కోరుతున్నారు. 

07:56 - August 6, 2015

ఉమ్మడి హైకోర్టు విభజన అంశం రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. లోక్ సభ సాక్షిగా టీఆర్ఎస్ ఎంపీలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. హైకోర్టు విభజనకు కేంద్రం కట్టుబడి ఉందని, అయితే ప్రస్తుతం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైనందున న్యాయ పరిధిలో ఉన్న అంశంపై నిర్ణయం తీసుకోలేమని న్యాయశాఖ మంత్రి సదానందగౌడ పేర్కొన్నారు. మరోవైపు ప్రత్యేక హోదా కల్పించాలంటూ టిడిపి ఎంపీలు కేంద్రాన్ని కోరారు. మధ్యప్రదేశ్ రైలు దుర్ఘటన..తదితర అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో కె.ఎస్. లక్ష్మణ్ రావు (మాజీ ఎమ్మెల్సీ), మహేష్ గౌడ్ (కాంగ్రెస్), సతీష్ మాదిగ (టిడిపి), లక్ష్మీ నారాయణ (బీజేపీ), ఎర్రోళ్ల శ్రీనివాస రావు (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

హస్తినలో యువతిపై గ్యాంగ్ రేప్..

ఢిల్లీ  :  బాదలిలో ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువతిని తీసుకొచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

గోవా మాజీ సీఎం అలేమావో అరెస్టు..

గోవా : లూయిస్, బర్జర్ కేసులో గోవా మాజీ ముఖ్యమంత్రి చర్చిల్ అలేమావో అరెస్టు అయ్యారు. నేను నిర్ధోషిని అని, ఎలాంటి తప్పు చేయలేదని అలేమావో పేర్కొన్నారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వారి సర్వదర్శనానికి నాలుగు గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు..కాలినడకన వెళ్లే భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది.

శ్రీలంక బోర్డు ఎలెవన్ - భారత్ ప్రాక్టీస్ మ్యాచ్..

కొలంబో : నేటి నుండి శ్రీలంక బోర్డు ఎలెవన్ తో భారత్ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. 

నేడు డీఎస్సీ - 2014పై కోర్టు తీర్పు..

హైదరాబాద్ : నేడు డీఎస్సీ -2014పై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. జీవో 38ని సవాల్ చేస్తూ కోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. 

07:07 - August 6, 2015

హైదరాబాద్ లో ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. ఫ్లయ్ ఓవర్లు, ఎక్స్ ప్రెస్ హై వేలు, రింగ్ రిడ్డులు, మెట్రో రైళ్లు ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం దక్కడం లేదు. ఇప్పుడు స్కై ఓవర్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరి ఇవైనా ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాయా? హైదరాబాదీల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తాయా? హైదరాబాద్ లో డ్రైవింగ్ లో చేయాలంటే ఎంతో సహనం ఓపిక వుండాలి. పద్మవ్యూహాన్ని ఛేదించే నైపుణ్యం వుండాలి. ఇక్కడ రోడ్లు ఎంత దరిద్రంగా వుంటాయో, ట్రాఫిక్ కష్టాలు అంతకన్నా ఘోరంగా వుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే హైదరాబాద్ రోడ్ల మీద ప్రయాణిచడమంటే నరకాన్ని చూసి రావడమే. హైదరాబాద్ లో వాహనాల సగటు వేగం పది కిలోమీటర్లంటే పరిస్థితి ఎంత భయంకరంగా వున్నదో, నగర పౌరులకు ఎంత సమయం వ్రుధా అవుతున్నదో వూహించుకోవచ్చు.

35 లక్షల వాహనాలు..
కోటి జనాభాను తనలో గుండెల్లో దాచుకున్న హైదరాబాద్ లో 35 లక్షలకు పైగా వాహనాలున్నాయి. ప్రతి ఏటా మరో రెండు లక్షలకు పైగా వాహనాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి. సొంత వాహనం లేనిదే భాగ్యనగరంలో పనులు చక్కదిద్దుకోవడం కష్టం. సిటీ బస్సులు ఎప్పుడొస్తాయో తెలవదు. సిటీ బస్సులో సీటు దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి వుండదు. రాత్రి తొమ్మిది దాటితే చాలా ప్రాంతాలకు సిటీ బస్సులు వెళ్లవు. సిటీ బస్సు కష్టాలు పడలేక, అప్పు చేసైనా ప్రతి ఒక్కరూ సొంత వెహికిల్స్ కొనుక్కుంటున్నారు. గతంలో ఇంటికో వెహికిల్ వుంటే అదే గొప్ప. కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన సందర్భాలలోనే చాలామంది వెహికిల్ తీసేవారు. కానీ, ఇప్పుడు ప్రతి ఇంటిలో ప్రతి మనిషికీ ఒక వెహికిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అపార్ట్ మెంట్లలోనూ, ఇళ్లలోనూ కారు పార్కింగ్ స్థలం దొరక్క, రోడ్ల మీదనే వాటిని నిలిపివుంచుతున్న ద్రుశ్యాలు హైదరాబాద్ లో సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

రోడ్ల విస్తరణ ఎక్కడ ?
హైదరాబాద్ లో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా రోడ్ల విస్తరణ చేపట్టలేదు. హైదరాబాద్ మొత్తం విస్తీర్ణంలో రోడ్ల వాటా కేవలం పది శాతమే. ఇప్పుడున్న వాహనాల రద్దీని తట్టుకోవాలంటే రోడ్ల విస్తీర్ణం మరో పది శాతం పెరగాలి. వాహనాల సంఖ్యతో పోటీ పడుతూ రోడ్ల విస్తీర్ణం పెంచుకుంటూ పోవడం సాధ్యమయ్యే పనికాదు. హైదరాబాద్ లో కార్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కానీ, హైదరాబాద్ లో ప్రయాణిస్తున్నవారిలో కార్లలో తిరగుతున్నవారి సంఖ్య పది శాతం మించదు. కానీ ఈ కార్లు 70శాతం వైశాల్యాన్ని ఆక్రమిస్తున్నాయి. సిటీ బస్సులు, లోకల్ ట్రయిన్ సౌకర్యాలు విస్తరించకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనమో, కారో సొంతంగా సమకూర్చుకుంటున్నారు. ఒకేసారి ఎక్కువ మందిని సురక్షితంగా తీసుకెళ్లగలిగే ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించకుండా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం సాధ్య మవుతుందా? ఈ ప్రశ్నను ఎంత మంది ఎన్నిసార్లు వేసినా ప్రభుత్వాలు స్పందించడం లేదు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచకపోగా, దానిని మరింత నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొత్త కొత్త ప్రయోగాలు..
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం కోసం ఫ్లయ్ ఓవర్లు, ఔటరు రింగ్ రోడ్లు, ఎక్స్ ప్రెస్ హైవేలు , మెట్రో రైళ్లంటూ చాలా ప్రయోగాలు చేశారు. కానీ, అవి ఎలాంటి ఫలితమిచ్చాయో, ఎంత ట్రాఫిక్ తగ్గిందో మన కళ్లెదుటే కనిపిస్తోంది. ఇప్పుడు స్కై ఓవర్లంటూ మరో కొత్త పాట మొదలైంది. రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ స్కై ఓవర్లు, ప్లయ్ ఓవర్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇందుకు అవసరమైన భూ సేకరణ కోసం మరో 14వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఇంత చేసినా ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరచకుండా, అన్ని కాలనీలకు, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సిటీ బస్సులు నడపకుండా స్కై ఓవర్లు, ఫ్లయ్ ఓవర్లు నిర్మిస్తే లాభముంటుందా? 

07:04 - August 6, 2015

రూ.2600 కోట్లలతో హైదరాబాద్ లో నిర్మించబోతున్న స్కై ఓవర్లు ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాయా? ఇది కూడా మరో మెట్రో ప్రయోగం మాదిరిగానే మిగులుతుందా? అసలు హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీకి కారణం ఏమిటి? ఈ సమస్య పరిష్కారానికి వున్న ప్రత్యామ్నాయాలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో శ్రీనివాస్ విశ్లేషణ చేశారు. 

07:02 - August 6, 2015

ముంబై : సినీ తారలకు హిట్ పడే కొద్దీ ఆదాయం కొండలా పెరిగిపోతోంది. రెమ్యూనరేషన్లు, సినిమా లాభాల్లో వాటాలు, యాడ్స్ లలో తారల ఆదాయం భారీగా ఉంటోంది. ఇలా ఏడాదిలో అత్యధికంగా సంపాదించిన తారాలోకపు శ్రీమంతులను ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగ్‌జైన్ పత్రిక ప్రకటించింది. ఈసారి తొలి పదిమంది సినీ ధనవంతుల జాబితాలో బాలీవుడ్ త్రయం.. చోటు దక్కించుకుంది. బాలీవుడ్‌ నటులు హాలీవుడ్‌ లెజెండ్స్ లనే మించిపోయారు. కేవలం నటనలోనే కాదు.. రెమ్యూనరేషన్లలోనూ బాలీవుడ్‌ యాక్టర్లు టాప్‌గా నిలిచారు. ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్‌ పత్రిక తాజాగా ప్రపంచ హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్ 2015 ర్యాంకులను విడుదల చేసింది.

టాప్ టెన్ లో బచ్చన్..అక్షయ్ కుమార్..
ఈ ఫోర్బ్స్ ర్యాంకుల జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లు టాప్ టెన్‌గా నిలిచారని తెలిపింది. ఈ బాలీవుడ్ త్రయం సంపాదన హాలీవుడ్ లెజెండ్స్ ద రాక్ జాన్సన్, జానీ డెప్‌లను మించిపోయిందని పేర్కొంది. ఫోర్బ్స్ జాబితా రూపొందించిన 34 మంది గ్లోబల్ యాక్టర్స్‌లో షారూక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ కూడా ఉన్నారు. బిగ్‌బి అమితాబ్, సల్మాన్ 33.5 మిలియన్ డాలర్లు సంపాదించి ఏడో స్థానంలో ఉండగా.. అక్షయ్ కుమార్ 32.5 మిలియన్ డాలర్లతో 9వ స్థానంలో నిలిచారు.

18 స్థానంలో షారుఖ్..
షారుక్ ఖాన్ 26 మిలియన్ డాలర్లతో 18వ స్థానంలోను, రణ్‌బీర్ కపూర్ 15 మిలియన్ డాలర్లు సంపాదించి 30వ స్థానంలో ఉన్నారు. దాదాపు 80 మిలియన్‌ డాలర్ల ఆదాయంతో హాలీవుడ్‌ నటుడు రాబర్ట్‌ డౌనీ మొదటి స్థానం దక్కించుకోగా.. రెండో స్థానంలో జాకీ చాన్‌ నిలిచారు. ఈ జాబితాలోని మొత్తం 34 మందిలో 12 మంది కొత్త యాక్టర్స్ ఉండడం విశేషం. 

07:00 - August 6, 2015

ఢిల్లీ : మ్యాగీపై మళ్లీ మంటలు రాజుకున్నాయి. నెస్లే కంపెనీకి పలు ల్యాబ్‌లు వత్తాసు పలికాయి. మ్యాగీ సురక్షితమేనంటూ సర్టిఫికెట్ ఇస్తున్నాయి. ఐతే ఆ ల్యాబ్‌ల నివేదికలను భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కొట్టిపారేసింది. మ్యాగీకి తాము క్లీన్ చిట్ ఇవ్వలేని నిషేదం అమల్లోనే ఉందని తేల్చిచెప్పింది.  మ్యాగీకి పలు ల్యాబ్‌లు బాసటగా నిలిచాయి. మ్యాగీ నూడుల్స్ సురక్షితమేనని కర్నాటక, గోవాలోని పలు ల్యాబ్‌లు సర్టిఫికెట్ ఇచ్చాయి. గోవాలోని ఎఫ్ డీఎల్,, మైసూర్‌లోని సీఎఫ్ టీఆర్ఐలు మ్యాగీలో హానికరమైన రసాయనాలేవీ లేవని స్పష్టం చేశాయి. నూడుల్స్ ను ఎలాంటి అనుమానం లేకుండా తినొచ్చని ప్రకటించాయి.

ప్రమాదరకర స్థాయిలో లెడ్ ఉందని క్లారిటీ..
ఐతే ఆయా ల్యాబ్‌ల రిపోర్టులను భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ తప్పుబట్టింది. మ్యాగీలో ప్రమాదరకరస్థాయిలో హానికర రసాయనాలు ఉన్నాయని మరోసారి స్పష్టం చేసింది. 2.5 పీపీఎమ్ యూనిట్ల కంటే తక్కువ ఉండాల్సిన లెడ్‌....10 యూనిట్ల మేర ఉందని తేల్చిచెప్పింది. ఇంత మోతాదులో ఉన్న లెడ్‌....అత్యంత ప్రమాదకరమని చెప్పుకొచ్చింది. మ్యాగీకి తాము క్లీన్ చిట్ ఇవ్వలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. జూన్‌ 5న విధించిన నిషేధం...ఇప్పటికీ అమలులోనే ఉన్నట్లు తెలిపింది. అంతేగాక మ్యాగీకి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చిన ల్యాబ్‌లు నెస్లే కంపెనీకి సంబంధించివని చెప్పింది.

విదేశాల్లోని పరీక్షల వివరాలు, నివేదికలు ఇవ్వలేదు..
మరోవైపు విదేశాల్లోనూ మ్యాగీకి క్లీన్ సర్టిఫికెట్ వచ్చిందని నెస్లే వాదిస్తోంది. యూకే, సింగపూర్ చేసిన పరీక్షల్లో మ్యాగీ నూడుల్స్ సురక్షితమేనని తేలినట్లు నెస్లే చెబుతోంది. ఐతే ఈ వాదనలనూ భారత ఆహార భద్రత నియంత్రణ సంస్థ తప్పుబడుతోంది. ఆయా దేశాలు చేసిన పరీక్షల వివరాలు, నివేదికలను తమకు ఇంత వరకూ ఇవ్వలేదని చెప్పింది. వారికి వారే మ్యాగీ సురక్షితమని ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ల్యాబ్‌ ఏ నివేదిక ఇచ్చినా...అంతిమంగా తమదే తుది నిర్ణయమని భారత ఆహార భద్రత నియంత్రణ సంస్థ తేల్చిచెప్పింది. మ్యాగీలో ప్రమాదకరస్థాయిలో హానికారక పదార్థాలు ఉన్నాయని నిషేధం అమల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది.

06:57 - August 6, 2015

జమ్మూ కాశ్మీర్ : భారత సైన్యానికి మరో కసబ్‌ చిక్కాడు. ఉధంపూర్‌లో సజీవంగా పట్టుబడ్డ ఇతడి పేరు నావెద్‌ అలియాస్‌ ఉస్మాన్‌ఖాన్‌. ఉగ్రవాద దాడులు చేయడమంటే భలే సరదా అని చెప్పిన ఈ ఉగ్రవాది అమర్‌నాథ్‌ యాత్రికులను చంపడానికే ఇక్కడికి వచ్చానన్నాడు. ఉగ్రవాద దాడులు చేయడమంటే తనకిష్టమని హిందువులను చంపడానికే ఇక్కడికి వచ్చానంటూ జమ్ముకాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జిల్లాలో సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాది ఉస్మాన్‌ఖాన్ వ్యాఖ్యలు చేశాడు. అంతే కాదు అమర్‌నాథ్‌ యాత్రికులతో పాటు సరిహద్దులో కాపలా కాస్తున్న భారత జవాన్లే తమ టార్గెట్‌ అని నావెద్‌ అలియాస్‌ ఉస్మాన్‌ఖాన్ నిర్భయంగా చెప్పాడు. ఒకవేళ తాను కూడా సైన్యం చేతిలో చనిపోతే అల్లా దయ వల్లే జరిగిందని అనుకునేవాడినని స్పష్టం చేశాడు.

ఇద్దరు జవాన్ల మృతి..
ఉధంపూర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో బిఎస్‌ఎఫ్‌ దళానికి చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని హతమార్చిన భారత దళాలు నావెద్‌ అలియాస్‌ ఉస్మాన్‌ఖాన్‌ను సజీవంగా పట్టుకున్నారు. లష్కర్‌-ఎ-తోయిబాకు చెందిన నావెద్‌ వయసు 20 ఏళ్లు. డార్క్‌బ్లూ షర్ట్, బ్రౌన్‌ కలర్ ప్యాంటు వేసుకొచ్చిన నావెద్‌ చాలా ఉల్లాసంగా కనిపించాడు. తాను పాకిస్తాన్‌లో ఫైసలాబాద్‌కు చెందిన వాడినని మీడియా ముందు వెల్లడించాడు. తన సహచరుడు మోమిన్‌ ఖాన్‌తో కలిసి గత 12 రోజులుగా జమ్ము పరిసరాల్లో సంచరిస్తున్నానని వెల్లడించాడు. మోమిన్ ఖాన్ భారత సైన్యం కాల్పుల్లో మృతి చెందాడు. మోమిన్‌ ఖాన్‌ది భగల్పూర్‌ ప్రాంతం. అజ్మల్‌ కసబ్‌ తర్వాత సజీవంగా పట్టుబడ్డ పాకిస్తాన్‌కు చెందిన మరో ఉగ్రవాది నావెద్‌ అలియాస్‌ ఉస్మాన్‌ఖాన్.

06:41 - August 6, 2015

విజయవాడ : ఇప్పటి వరకు భూసమీకరణ పేరుతో భూములను సేకరించారు. కొందరు రైతులు రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చారు. ఇంకా చాలా చోట్ల రైతులు భూములివ్వలేదు. దీంతో భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఈ నెల 20న భూసేకరణ ప్రకటన జారీచేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికీ భూములివ్వని రైతుల నుంచి ప్రభుత్వమే చట్టపరంగా తీసుకునేందుకు అడుగులు వేస్తోంది.

ఈ నెల 20న భూసేకరణ ప్రకటన జారీ..
గుంటూరులో సీఆర్డీఏ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈనెల 20న రాజధాని భూసేకరణ ప్రకటన జారీ చేయనున్నట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అప్పటిలోగా భూములిచ్చేందుకు ఆసక్తిగా ఉన్న రైతులు పంటలను వేయొద్దని కోరారు.

ఈ నెల 19లోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశం..
రాజధాని ప్రాంతంలో భూముల వివాదాలను ఈ నెల 19లోగా పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అసైన్డ్ భూముల విషయంలో కొంత గందరగోళం నెలకొందన్నారు. ఎలాంటి వివాదాల్లేని అసైన్డ్ భూములకు ఈ నెల 6 నుంచి చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పారు. వివాదాలు ఉన్న అసైన్డ్, ఆర్మీ, లంక భూములపై 10 రోజుల్లో సర్వే చేయించి, నిర్ధారణ అయ్యాక చెక్కులను పంపిణీ చేస్తామని తెలిపారు.

16వేల మంది కూలీలు..
రాజధాని ప్రాంతంలో 16 వేల మంది కూలీలను గుర్తించామని, వారిలో 8 వేల మందికి పెన్షన్ ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పేదలు, రైతులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం చేయమని చెప్పుకొచ్చారు. ఈ నెల 20 నాటికి రైతు కూలీలు, భూమిలేని పేదలకు పింఛన్లు ఇస్తామన్నారు. రాజధాని కోసం గ్రామాలను తరలిస్తామనే ప్రచారం అవాస్తమని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు.

06:36 - August 6, 2015

హైదరాబాద్ : టీ- సర్కార్ మరో వినూత్న పథకానికి సన్నద్ధమవుతోంది. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అన్న నినాదాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేస్తోంది. గ్రామీణ భారతంలో వెలుగులు నింపేందుకు "గ్రామ జ్యోతి" పథకానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 17నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి, వచ్చే నాలుగేళ్ల కోసం ప్రణాళికలు తయారు చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా గ్రామాల ప్రణాళికల ఆధారంగా నిధులు మంజూరు చేస్తామన్నారు. ఇందు కోసం 25 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్యంతో పాటు తాగునీరు, విద్య, సామాజిక భద్రత, వ్యవసాయం, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు కేసీఆర్.

తొలిదశలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత..
"గ్రామజ్యోతి" పథకం మొదటి దశలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పరిసరాల పరిశుభ్రతతో రోగాలను నివారించడంతో పాటు.. సురక్షితమైన మంచినీటిని అందించవచ్చని అంచనా వేస్తోంది. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. అందుకోసం 25 వేల రిక్షాలను కొనాలని టీ-సర్కార్‌ నిర్ణయించింది.

రాష్ట్ర మ్యాచింగ్‌ గ్రాంట్‌ రూ.5 వేల కోట్లు..
మరోవైపు గ్రామజ్యోతికి కావాల్సిన 25 వేల కోట్లను సేకరించేందుకు టీ-సర్కార్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నాలుగేళ్లలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద... కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్న 11 వేల కోట్ల రూపాయలను, అలాగే ఉపాధి హామీ పథకానికి ఖర్చు చేయాల్సిన రాష్ట్ర మ్యాచింగ్‌ గ్రాంట్‌ 5 వేల కోట్ల రూపాయలను కూడా గ్రామజ్యోతి పథకానికి వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 14వ ఆర్ధిక సంఘం ద్వారా రాష్ట్రానికి రానున్న 5,400 కోట్లు, పేదరిక నిర్మూలనకు సంబంధించిన 650 కోట్లను గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం వాడుకోనున్నట్లు సమాచారం. 

06:35 - August 6, 2015

హైదరాబాద్ : పాలన సక్రమంగా సాగాలంటే ప్రజల మధ్యే ఉండాలి.. సమస్యలు సత్వరం పరిష్కారం కావాలంటే.. కీలక శాఖలైన హెచ్‌ఓడీలు రాజధానిలోనే ఉండాలి. అందుకే ఉద్యోగులు శీఘ్రంగా రాజధాని అమరావతికి తరలివెళ్లాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట. అన్నట్టుగానే తాత్కాలిక రాజధానికి సచివాలయ తరలింపుపై ప్రభుత్వం.. ఉద్యోగులకు స్పష్టత ఇచ్చింది. ఏపీ రాజధానికి హెచ్‌ఓడీ కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు ఉద్యోగులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీఎన్జీవో, ఏపీజీవో నేతలతో పాటు అన్ని శాఖల సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు. కార్యాలయాల తరలింపుపై ప్రధానంగా చర్చించిన సీఎస్‌.. ప్రభుత్వ నిర్ణయాలను ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో నిర్ణయించిన విడతల వారీగా కాకుండా ఈసారి సచివాలయం మొత్తాన్ని ఒకేసారి తరలిస్తామని కృష్ణారావు ఉద్యోగులకు స్పష్టం చేశారు. దీనిపై అన్ని శాఖలకు చెందిన ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు..
తాజా ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల్లో కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికిప్పుడు తరలిస్తే.. అమరావతిలో ఎదురయ్యే సమస్యలను సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. తరలింపు కంటే ముందే తమ పిల్లల స్థానికత అంశంపై తేల్చాలన్న ఉద్యోగులు రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని కోరారు. అలాగే తాత్కాలిక రాజధానిలో 25 వేల మంది ఉద్యోగులకు మౌలిక వసతులు, పిల్లల విద్యవైద్య సదుపాయాలు వంటి అంశాలపై మరింత స్పష్టత ఇవ్వాలని చెప్పారు. వీటితో పాటు ప్రధానంగా అమరావతికి కార్యాలయాల తరలింపుపై రోడ్‌మ్యాప్‌ ప్రకటించాలని, 30 శాతం హెచ్‌ఆర్‌ఏ కావాలని కోరారు.

వర్కవుట్ అవుతుందా ?
ఉద్యోగుల అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే రాజధాని ప్రాంతానికి ఉద్యోగులను తరలించాలని ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న సీఎస్ కృష్ణారావు.. స్థానికతపై త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు 25 లక్షల చదరపు అడుగుల స్థలం ప్రభుత్వం గుర్తించిందని వివరించారు. ఉద్యోగుల అంగీకారంతోనే కార్యాలయాలు తరలిస్తామని చెప్పారు. 25 వేల మంది వరకు ఉద్యోగులు తరలింపు ఉన్న నేపథ్యంలో ఇండ్ల నిర్మాణం ఖర్చు తదితర అంశాలపై త్వరలో స్పష్టత ఇస్తామని.. ఇందుకు పలుమార్లు భేటీ అవ్వాలని సూచించినట్లు సమాచారం. ఏది ఏమైనా.. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సచివాలయం అంతా తరలించాలని చూస్తున్న ఏపీ ప్రభుత్వ ప్యాకప్ ప్యాకేజ్‌.. ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

06:32 - August 6, 2015

హైదరాబాద్ : కేజీ టూ పీజీ విద్యా విధానంపై క్లారిటీ కరువైంది. కేవలం రెసిడెన్షియల్‌ స్కూళ్లకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. కామన్ రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని అమలుచేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఐతే సర్కారు నిర్ణయంపై విద్యాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని సర్కారు బడుల్లోనూ కేజీ టూ పీజీ విద్యను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సచివాలయంలో సీఎం కేసీఆర్ కేజీ టూ పీజీ విద్య విధానంపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మెన్ గంటా చక్రపాణి, ప్రభుత్వ సలహాదారు పాపారావు, పలు విశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో వివిధ శాఖల కింద పనిచేస్తున్న రెసిడెన్షియల్ విద్యాసంస్థలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తేవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ 668 రెసిడెన్షియల్ స్కూళ్లు..
ప్రస్తుతం తెలంగాణలో 668 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయి. అదనంగా మరో 552 స్కూళ్లను ఏర్పాటు చేసి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందించాలని సీఎం ఆదేశించారు. పాఠశాల విద్య పూర్తయ్యాక విద్యార్థులు ఎంచుకునే కోర్సులు, వసతి సౌకర్యాల వంటి అంశాలపై సమగ్ర విధానాన్ని రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు వంటి కేటగిరిలో రెసిడెన్షియల్ స్కూళ్లు నడుస్తున్నాయి. ఒక్కో పాఠశాలలో ఒక్కో విద్యా విధానం, మెనూ, మెస్ చార్జీల కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. అలాకాకుండా అందరికీ ఒకే రకమైన విద్య, వసతి, భోజన సదుపాయం కల్పించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

పేదలందరికీ నాణ్యమైన విద్య-కేసీఆర్‌..
కుల మతాలతో సంబంధం లేకుండా పేదలందరికీ నాణ్యమైన విద్యను అందించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. నియోజవకవర్గానికి సగటున పది రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో దళిత అమ్మాయిల కోసం ప్రత్యేక హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాలుగో తరగతి వరకు తల్లిదండ్రుల సమక్షంలోనే పిల్లలు చదువుకోవాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దానికనుగుణంగా గ్రామస్థాయిలోనే విద్యాబోధన జరగాలన్నారు. ఆ తర్వాత ఇంగ్లీష్‌ మీడియంలో నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. చదువంటే మెడిసిన్, ఇంజినీరింగే కాదని....డిగ్రీ కోర్సులతోనూ మంచి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. డిగ్రీ కోర్సుల్లో ఉపాధి అవకాశాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

విద్యార్థి సంఘాల ఆందోళన..
ఐతే ప్రభుత్వ నిర్ణయంపై పలు విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేజీ టూ విద్యను కేవలం రెసిడెన్షియల్‌ స్కూళ్లకే పరిమితం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అలా అయితే ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాల్లోనూ కేటీ టూ పీజీ విద్యా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

06:30 - August 6, 2015

హైదరాబాద్ : పార్లమెంట్‌లో ప్రత్యేక రాష్ట్ర హోదా సెగలు ఆరటం లేదు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ప్రకటించి ఆర్థిక సమస్యల్లో వున్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలని... టీడీపీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అటు ఏపీకి సాయం అందించే విషయం కేంద్రం అజెండాలో వుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలపై... ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. హైదరాబాద్‌ లాంటి నగరాన్ని కోల్పోవటం వల్ల ఏపీకి ఆదాయం తగ్గిపోయిందన్నారు. అందుకే రాష్ట్ర ఆర్థిక లోటు భర్తీ, రాజధాని నిర్మాణం సహా అభివృద్ధి కోసం కేంద్రం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులోనూ ఆర్థిక తోడ్పాటు అందించటం కేంద్రం అజెండాలో వున్నట్లు చెప్పారు. టీడీపీ సభ్యుడు జేసీ దివాకర్‌ రెడ్డి మాత్రం ప్రత్యేక హోదా అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం స్పెషల్ స్టేటస్ ప్రకటిస్తుందన్న నమ్మకం లేదన్నారు. వైసీపీ సభ్యులు సైతం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వారు సభలో నినదిస్తున్నారు. 

06:29 - August 6, 2015

హైదరాబాద్ : పుట్టుక మాత్రమే ఆయనది. బతుకంతా తెలంగాణదే. ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి కరదీపికయ్యాడు. తెలంగాణ మహోద్యమానికి ఎవరెస్టు శిఖరంలా నిలిచాడు. ఆయనే ప్రొఫెసర్ జయశంకర్‌. అందుకే యావత్ తెలంగాణ... ఆయన ముందు ప్రణమిల్లుతోంది. మహానీయుడు పుట్టిన రోజు నాడు... జోహార్‌ జయశంకర్ మాస్టారంటూ... ప్రతి గుండె నివాళులర్పిస్తోంది. జబ్‌ తక్‌ సూరజ్‌ చాంద్‌ రహేగా... తబ్‌ తక్‌ జయశంకర్‌ నామ్‌ రహేగా అంటూ నినదిస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్... తెలంగాణ సిద్ధాంత కర్త. నవ తెలంగాణకు స్ఫూర్తిప్రదాత. చీకట్లు కమ్మిన ప్రాంతంలో వెలుగుల్ని నింపిన మహోజ్వల జ్వాల. ఐదు దశాబ్దాలుగా ప్రత్యేక ఉద్యమానికి ప్రాణంపోసిన ధ్రువతార. నేడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడి పుట్టిన రోజు.

సమ సమాజం కోసం పోరాటాలు..
తెలంగాణే శ్వాసగా... తెలంగాణే లక్ష్యంగా... తెలంగాణే జీవితంగా బతికిన... ప్రొఫెసర్‌ జయశంకర్‌. 1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ప్రతిభావంతుడైన ఆయన పట్టుదలగా చదువుకున్నారు. ఆర్థికశాస్త్రంలో అపార జ్ఞానం కలిగి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే విప్లవ భావాలు కలిగిన జయశంకర్‌ సామాజిక, రాజకీయ అంశాలపై స్పందించేవారు. ఒకవైపు విద్యార్థులకు తరగతి గదిలో పాఠాలు చెబుతూనే మరోవైపు సమ సమాజం కోసం వామపక్ష, మానవ హక్కుల పోరాటాల్లో మమేకమయ్యారు జయశంకర్ సార్‌.

1991-94 వరకు కేయూ ఉపకులపతిగా బాధ్యతలు..
జయశంకర్ మాస్టారు అంచెలంచెలుగా ఎదిగారు. 1975 నుంచి 1979 వరకు వరంగల్ సీకేఎం ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 1979 నుంచి 1981 వరకు కేయూ రిజిస్ట్రార్‌గా, ఆ తర్వాత 1982 నుంచి 1991 సీఫెల్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయ వైస్‌-ఛాన్సలర్‌ వరకు ఉన్నత పదవులు పొందారు.

1969 తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర..
"ఇడ్లీ-సాంబార్‌" గో బ్యాక్ అంటూ నినదించారు. 1952లో జరిగిన నాన్‌-ముల్కీ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారు. 1954లో తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ... ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక అందించారు. 1969లో ఎగసిన తెలంగాణ ఉద్యమంతో పాటు మలివిడత ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాల్సిందేనంటూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముందు పిడికిలెత్తి గర్జించిన ధీశాలి. ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపిస్తూ, తెలంగాణ మహోద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.

మలిదశ తెలంగాణ పోరాటానికి ఊపిరి..
వ్యూహాలు రచించడంలో జయశంకర్ మాస్టారు దిట్ట. మూడు తరాల తెలంగాణ ఉద్యమాన్ని చవిచూసిన ఆయన మలి దశ తెలంగాణ పోరాటానికి ఊపిరినిచ్చారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు మార్గదర్శిగా నిలిచారు. తెలంగాణ కోసం కాలికి బలపం కట్టుకుని ఊరూరా తిరిగారు. జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో ప్రత్యేకరాష్ట్ర ఆకాంక్షను వినిపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకతను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించి చెప్పారు. ప్రజాసంఘాలను, రాజకీయ పార్టీలను తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

2011 జూన్ 21న కన్నుమూసిన జయశంకర్..
ఒక తరం నుంచి మరో తరానికి ప్రవహించిన జీవ చైతన్యమే ప్రొఫెసర్ జయశంకర్. ఆయన దృష్టిలో తెలంగాణ హద్దుల పోరాటమే కాదు హక్కుల పోరాటం. స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరుతున్న సమయంలోనే...జయశంకర్‌ సార్‌ను క్యాన్సర్‌ మహమ్మారి కబళించింది. ఇక సెలవంటూ 2011 జూన్ 21న మృత్యులోకాలకు వెళ్లిపోయారు. ఆయన భౌతికంగా లేనప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరంజీవే. మహానీయుడిగా మరుపురాని మనిషిగా నిలిచిన... కొత్తపల్లి మాస్టార్‌కు... యావత్ తెలంగాణం సలాం చేస్తోంది. ఆయన ఆశయ సాధన కోసం నవ తెలంగాణ అడుగులు వేయాలని ఆకాంక్షిస్తోంది.

నేడు ఏపీ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్...

హైదరాబాద్ : నేడు జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎస్ ఐవైఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వర్షాభావ పరిస్థితుల వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

రిషితేశ్వరి నిందితుల బెయిల్ పిటిషన్ లపై నేడు విచారణ..

గుంటూరు : రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులు అనీషా, చరణ్, శ్రీనివాసరావుల బెయిల్ పిటిషన్ లపై గురువారం విచారణ జరుగనుంది. 

నేడు జైపూర్ రెండో యూనిట్ బాయిలర్ లైటప్..

ఆదిలాబాద్ : జిల్లా జైపూర్ లోని పెగడపల్లి విద్యుత్ కేంద్రంలోని రెండో యూనిట్ బాయిలర్ లైటప్ ను సీఎండీ శ్రీధర్ గురువారం ప్రారంభించనున్నారు. 

నేడు జయశంకర్ జయంతి..

హైదరాబాద్ : నేడు మహోపాధ్యాయ జయశంకర్ జయంతిని గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. టీజేఏసీ సారథ్యంలో సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష చేపట్టనున్నారు. 

Don't Miss