Activities calendar

07 August 2015

కిడ్నాపైన వృద్ధ దంపతుల హత్య....

కర్నూలు: నంద్యాల జర్నలిస్టు కాలనీలో కిడ్నాపైన వృద్ధ దంపతుల హత్య గావించబడ్డారు. ఎస్ బీఐ కాలనీలో దుండగులు ఉరివేసి చంపివేశారు.

స్కైవేల నిర్మాణానికి టెండర్లు పిలిచిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నగరంలో బహుళ అంతస్తుల భవనాలు, స్కైవేలను నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈమేరకు జీహెచ్‌ఎంసీ జాతీయస్థాయిలో టెండర్లను ఆహ్వానించింది. రూ.2631 కోట్ల వ్యయంతో జీహెచ్‌ఎంసీ 20 ప్రాంతాల్లో స్కైవేలు, కూడళ్లు నిర్మించనుంది.

బీసీసీఐ సభ్యుడు రాజీవ్‌శుక్లా కు బెదిరింపు కాల్స్

నెల్లూరు : మోస్ట్ వాంటెడ్ మాఫీయా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులమంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు దుండగులు శుక్రవారం నెల్లూరులో శుక్రవారం పట్టుబడ్డారు. రూ.100కోట్లు ఇవ్వాలని బీసీసీఐ సభ్యుడు రాజీవ్‌శుక్లాను కరీం, ఫతే వాహీద్‌ అనే ఇద్దరు దుండగులు బెదిరించారు. ఈ విషయంపై రాజీవ్‌శుక్లా ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దుండగుల కోసం ఢిల్లీ పోలీసులు గాలింపు చేపట్టారు. అందులో భాగంగా ఢిల్లీ పోలీసులు దుండగులను నెల్లూరులో పట్టుకున్నారు. అనంతరం వారిని పాటియాలా కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు కోర్టు వారం రోజుల పోలీసు కస్టడీ విధించింది.

20:50 - August 7, 2015

హైదరాబాద్: జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు. పూంచ్‌లో స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. కాల్పుల ఘటనపై తీవ్రంగా స్పందించిన ఫరూక్‌ అబ్దుల్లా-జమ్ముకాశ్మీర్‌ ప్రజలు ఎన్నాళ్లీ బలిదానం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోది, భారతదేశ ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇరుదేశాలు చర్చలు జరిపి శాంతియుత పరిష్కారమార్గం కనుగొనాలన్నారు. కాశ్మీర్‌ లోయల్లో జరుగుతున్న కాల్పుల వల్ల ప్రజలు భయాందోళనతో బతుకెళ్లదీస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

20:48 - August 7, 2015

హైదరాబాద్ : సినిమా తారలు, యువ నేతలు చేనేత వస్త్రాలు ధరించాలని ప్రధాని నరేంద్రమోది పిలుపునిచ్చారు. ఐదు సినిమాలు తీస్తే ఒక చిత్రంలో సినీనటులు చేనేత, చేతి ఉత్పత్తులు వాడడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయన్నారు. ఫ్యాషన్‌కు ప్రాచూర్యం కల్పించడంలో సినీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఫలితంగా ఈ రంగానికి ప్రాచూర్యం కల్పించవచ్చని తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత చేనేత లోగోను మోది ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని ముఖ్యమంత్రి జయలలిత ఆహ్వానం మేరకు పోయస్‌గార్డెన్‌లోని ఆమె ఇంటికి వెళ్లారు. మోది జయలలితతో భేటి కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

20:45 - August 7, 2015

హైదరాబాద్: ఇస్లామాబాద్‌లో జరిగే కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్‌ను భారత్‌ బహిష్కరించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి జమ్ముకాశ్మీర్‌ స్పీకర్‌ను పాకిస్తాన్‌ ఆహ్వానించకపోవడమే ఇందుకు కారణమని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ తెలిపారు. జమ్ముకాశ్మీర్‌ స్పీకర్‌ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాల స్పీకర్లకు ఆహ్వానం అందిందని పేర్కొన్నారు. 61వ కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సమావేశం సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్‌ 8 వరకు పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగనుంది. జమ్ముకాశ్మీర్‌ స్పీకర్‌ను పాకిస్తాన్ ఆహ్వానించకుంటే కామన్‌వెల్త్ సమావేశాన్ని బహిష్కరిస్తామని సుమిత్రా మహాజన్‌ స్పష్టం చేశారు.

ఏపీ లో రూ.1200 కోట్ల సెక్యూరిటీ బాండ్ల వేలం

విజయవాడ : ఏపీ ప్రభుత్వం రూ.1200 కోట్ల సెక్యూరిటీ బాండ్లను వేలం వేయాలని నిర్ణయించింది. దాదాపు 10 సంవత్సరాల కాల పరిమితితో బాండ్లను వేయనున్నట్లు తెలిసింది. బాండ్లను ఈనెల 11న ముంబైలో  వేలం ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్‌రాజన్ వేలం వేస్తారని సమాచారం. ఆర్థిక లోటులో ఉన్న ప్రభుత్వం ఆర్థికంగా పుంజుకోవడానికి, రైతుల రుణమాఫీ చేయడానికి బాండ్లను వేలం వేస్తున్నట్లు తెలిసింది.

నెల్లూరు సీటీవో ఇంట్లో ఏసీబీ తనిఖీలు...

నెల్లూరు : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై నెల్లూరు వాణిజ్య పన్నుల శాఖ అధికారి(సీటీవో) సూర్యప్రకాశ్ ఇంటిపై అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులు శుక్రవారం సాయంత్రం దాడులు చేశారు. ఏసీబీ డీఎస్పీ రామ్స్‌డెన్ ఆధ్వర్యంలో అధికారులు రామమూర్తి నగర్‌లోని సూర్యప్రకాశ్ ఆస్తులపై సోదాలు చేశారు. మరో ఏడు చోట్ల కూడా తనిఖీలు సాగిస్తున్నారు. ఈ సందర్భంగా విలువైన ఆస్తులున్నట్లు నిరూపించే పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

హిమబిందు కేసులో అప్పీల్ కు జీవో జారీ

విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన బ్యాంకు మేనేజర్‌ భార్య హిమబిందు కేసులో హైకోర్టులో అప్పీలు చేసేందుకు జీవో ఆర్‌.టి.నంబర్‌ 911ను ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. హైకోర్టులో ఈ కేసుపై అప్పీల్‌ చేయాలంటూ అడ్వొకేట్‌ జనరల్‌ను ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టులో ఈ కేసును కొట్టివేయడంతో ఈ తీర్పు న్యాయశాస్త్ర విరుద్ధమని, హైకోర్టులో అప్పీలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కృష్ణాజిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ బైరా రామకోటేశ్వరరావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిని స్వీకరించిన ప్రభుత్వం జీవో ఆర్‌.టి.నంబర్‌.

దసరాకు కొత్త మద్యం పాలసీ : టి.సర్కార్ యోజన

హైదరాబాద్: దరసరా నాటికి కొత్త మద్యం పాలసీ తేవాలని టి. సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో 24 గంటల మద్యం సరఫరా పై కసరత్తు చేసి కొత్త మద్యం పాలసీ పై టీ సర్కార్ ఈ నెలాఖరున నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తక్కువ ధరకు మద్యం, వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయంచినట్లు సమాచారం.

20:04 - August 7, 2015

ముంబై : మంత్రాలకు చింతకాయలు రాలుతాయా..? ఏమో తెలియదు. కానీ, డబ్బులు మాత్రం రాలుతాయి..! అదికూడా అలా ఇలా కాదు. కోట్లకు కోట్లు వచ్చిపడతాయి..! చెట్టునుంచి ఆకులు రాలినట్టు, ఆకాశం నుంచి వర్షం కురిసినట్టుగా రాలిపడతాయి..! నమ్మకం కుదరట్లేదా..? అయితే.. ఈ కలియుగ దేవతను ఓ సారి దర్శించుకోండి. జ్ఞానోదయం అయి తీరుతుంది.
ముంబైలో బయట పడ్డ దైవదూత బండారం....
ఈమే.. మనం చెప్పుకుంటున్న కలియుగ దేవత..! అదేంటి..? మినిస్కర్ట్ వేసుకుని, మోడ్రన్‌గా ఉన్న అమ్మాయిని పట్టుకుని దేవత అంటారేంటి.. అనుకుంటున్నారా..?! అయితే.. ఈ ఫొటో చూడండి. ఇప్పుడు రెండు ఫొటోలనూ కలిపి చూడండి. ఈమే.. మనం చెప్పుకుంటున్న దేవత..
ఈమె అమ్మాయి కాదు. 50 ఏళ్ల బామ్మ
అన్నట్టూ.. ఈమె అమ్మాయి కాదు. 50 ఏళ్ల బామ్మ. దేవత వేషం వేసీ, వేసీ బోర్‌ కొట్టినప్పుడు, ఇలా మోడ్రన్‌ గెటప్‌లోకి మారిపోతుంది. ఇంతకీ ఈమె పేరు చెప్పలేదు కదూ. ఈ మోడ్రన్‌ దేవత పేరు రాధేమా. ముంబై మహానగరంలో వెలిసిన ఈ మాత.. అక్కడి భక్తులను తన ముక్తి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది.
దేవత వేషం నుంచి మోడ్రన్‌ గెటప్‌లోకి......
ఈ టాపిక్‌ ఇప్పుడెందుకు..? అనే డౌట్‌ రావచ్చు. దేవత వేషం నుంచి మోడ్రన్‌ గెటప్‌లోకి మారిపోయిన ఈమె.. తన అందచందాలను ఇలా ప్రదర్శించింది. ఈ ఫొటోలూ నేరుగా సోషల్‌ మీడియాలోకి రావడంతో.. ఈ కలియుగ దైవం బండారం బట్టబయలైంది. ఇన్నాళ్లూ దేవతగా జనాలను నమ్మించిన ఈమెగారి వ్యవహారాన్ని ఏకిపారేశారు నెటిజన్లు. గడిచిన రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ఇదే హాట్‌ టాపిక్‌.
అసలు పేరు సుఖేందర్‌ కౌర్‌....
ఈ క్రమంలోనే.. ఈ దేవత ఫ్లాష్‌ బ్యాక్‌ బయటకు వచ్చింది. ఈమె అసలు పేరు సుఖేందర్‌ కౌర్‌. 50 సంవత్సరాలపైన వయసున్న ఈమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. గతంలో ఈమె ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. వరకట్నం కోసం భర్త, అత్తమామలు వేధించారు. దీంతో.. వారిపై కేసు కూడా పెట్టింది ఈ సుఖేందర్‌ కౌర్‌. అయినా.. తన కష్టాలు తీరకపోవడంతో ఏం చేయాలా..? అని బాగా ఆలోచించింది. అప్పుడు వచ్చిందో ఐడియా. ఆర్థిక అవస్థల నుంచి బయటపడాలంటే దేవత వేషమే సరైందని భావించిన సుఖేందర్‌ కౌర్‌.. ఇలా రాధే మాగా మారిపోయింది. ఒక్క ఐడియా ఈమె జీవితాన్నే మార్చేసింది. సీన్‌ కట్‌ చేస్తే... గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఫుల్‌ ఫేమస్‌ అయిపోయింది. తండోపతండాలుగా క్యూకట్టిన జనాలు.. పరమభక్తులుగా మారిపోయారు. భక్తులు సమర్పించిన తృణమూ, ప్రణమూ వెనకేసుకున్న ఈ రాధేమా.. తన ఆర్థిక కష్టాల నుంచి బయటపడింది. అది కూడా ఎంతో కాదు.. జనాల నుంచి ఒక వెయ్యి కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకుంది ఈ కలియుగ దైవం. అయితే.. ఇన్నాళ్లూ ఈమెను దైవంగా భావించిన వారంతా అసలు విషయం బయటపడేసరికి దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.
దేశంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బాబాలు, స్వామీజీలు...
జీవితం పట్టు పాన్పులపై సేద తీరాలంటే ఏం చేయాలి..? రాజభోగాలు రాజమార్గంలో అనుభవించాలంటే ఏం చేయాలి..? అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలంటే.. బంగారు సింహాసనంపై కొలువుదీరాలంటే ఏ మార్గాన్ని అనుసరించాలి..? వేరే ఏదీ అవసరం లేదు.. భక్తిమార్గాన్ని ఎంచుకుంటే చాలు. అనుకున్న ముక్తిమార్గాన్ని రాత్రికి రాత్రే చేరుకోవచ్చు. కాకపోతే.. మాటలతో జనాన్ని మాయచేసే నేర్పుండాలి, కాషాయ వస్త్రాన్ని కప్పుకునే ఓర్పుండాలి...
ప్రజల అమాయకత్వమే మేలైన ఆదాయమార్గం...
ఇక రాబడికి అంతే ఉండదు. కోట్ల రాశులపై దర్జాగా కుర్చీ వేసుకుని కూర్చోవచ్చు. బాబా అంటే చాలు.. దాదా అంటూ వెంట తీసుకెళ్లే జనాల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఎంతోమంది దొంగ స్వాములు.. ప్రజల విశ్వాసాలతో ఆటలాడుతున్నారు. అందినకాడికి దోచుకుంటూ అందలాలు ఎక్కి కూర్చుంటున్నారు. ప్రజల మూఢ నమ్మకాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్న వారికి ఈ దేశంలో కొదవలేదు. ఆ లిస్టును బయటపెట్టాలంటే పేజీలు సరిపోవు. అయితే.. బాబాలు, స్వామీజీల పేరుతో సమాజంలో చెలామణి అవుతున్న వారి రెండో కోణాన్ని పరిశీలిస్తే.. ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తుండడం గమనార్హం. గతంలో తాము ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడేందుకు బాబాలు, స్వామీజీల అవతారం ఎత్తుతున్నారనే వాస్తవాలు నివ్వెర పరుస్తున్నాయి. ఇలాంటి వారిలో ఒకరు ఆశారాం బాపు. తనను తానే దైవంగా చెప్పుకున్న ఆశారాం చెంతకు భక్తులు తండోపతండాలుగా తరలివెళ్లేవారు. భక్తులకు అన్ని విధాలుగా స్వస్థత చేకూరుస్తానని చెప్పిన ఆశారాం.. చివరకు పదహారేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో జైలు పాలయ్యారు. ఇది అందరికీ తెలిసిన కోణం. కానీ.. ఆయన గత జీవితం మొత్తం వివాదాల మయమే. ఓ హత్య కేసుతోపాటు, పలు భూకబ్జాల కేసులో ఆశారాం నిందితుడిగా ఉన్నాడు.
నిత్యలోలుడు నిత్యానంద లీలల.....
ఇక, తమిళనాడుకు చెందిన నిత్యలోలుడు నిత్యానంద లీలల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆశ్రమాల మాటున ఆయన సాగించిన కార్యకలాపాలు అన్నీ ఇన్నీ కావు. నటి రంజితతో వ్యవహారం బయటపడిన తర్వాత.. నిత్యానంద గుట్టు రట్టయింది. పలు కేసులు, అరెస్టులతో వివాదాస్పద స్వామీజీగా మారిపోయాడు నిత్యానంద. ఈ జాబితాలోని మరో మహానుభావుడు రాంపాల్ బాబా. హర్యానాలో ఆశ్రమం మాటున సంఘ విద్రోహ కార్యకలాపాలకే తెరతీశాడు ఈ స్వామీజీ. ఈయన బండారం బయటపడ్డప్పటికీ.. అరెస్టు చేసేందుకు పోలీసులు చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. తుపాకులు, బాంబులతో అనుచరులను ఉసిగొల్పిన రాంపాల్‌ బాబా.. సుమారు 200 మంది ఆస్పత్రి పాలవడానికి కారకుడై, చివరకు జైలు పాలయ్యారు.
పిరమిడ్ ధ్యాన మహాసభల పేరుతో....
ఇక, పిరమిడ్ ధ్యాన మహాసభల పేరుతో ప్రచారం పొందిన పత్రీజి తన వ్యవహార శైలితో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నాడు. స్త్రీలతో లేనిపోని సపర్యలు చేయించుకుని వివాదాలకు కేంద్ర బిందువయ్యాడు. ఈయనతోపాటు.. బాలసాయి, కాళేశ్వర్, కల్కీ వంటి లెక్కకు మించిన స్వామీజీలు.. అమాయక జనాలతో ఆడుకున్నవారే. భక్తి మాయలో జనాన్ని ముంచేసి, తమ పబ్బం గడుపుకున్నవారే. బండారం బయటపడ్డ ప్రతి స్వామీజీ కథలోనూ భూ కబ్జాలు సర్వసాధారణంగా నమోదవడం గమనార్హం. ఇక భక్తి కేంద్రాలుగా చెప్పే ఆశ్రమాలను రక్తి కేంద్రాలుగా మార్చారు ఎంతో మంది బాబాలు, స్వామీజీలు.
మొదటిది కాదు.. చివరిది కూడా ...
దైవం పేరు చెప్పి జనాలను నయవంచన చేసిన జాబితాలో తాజాగా వెలుగులోకి వచ్చిన రాధేమా ఉదంతం మొదటిది కాదు.. చివరిది కూడా కాబోదు. దీన్ని అడ్డుకోవాలంటే ప్రజలు చైతన్యం కావడం మినహా మరో మార్గం లేదు. మూఢ నమ్మకాలతో.. గడ్డాలు, మీసాలు పెంచుకుని, కాషాయం ధరించిన ప్రతిఒక్కరినీ పూజించే విధానానికి స్వస్తి పలికినప్పుడే.. ఇలాంటి దొంగ బాబాలను కట్టడి చేయగలం. లేదంటే.. మారు వేషాలతో రెక్కలు కట్టుకుని వాలిపోయే దైవ ధూతలు, వాడవాడలా ప్రత్యక్షమవుతూనే ఉంటారు.

19:54 - August 7, 2015

విజయవాడ : పేదలను కొట్టి.. గద్దలకు పంచడం అంటే ఇదేనేమో..! ఏళ్లుగా సాగు చేస్తున్న గిరిజన రైతు భూములను లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చట్టాలు, సెక్షన్ల పేరుతో గిరిపుత్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తమ భూముల్లోంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అభివృద్ధి పేరిట వినాశక చర్యలకు పాల్పడుతున్న ఫారెస్ట్‌ అధికారులపై బాధితులు పోరుబాట పట్టారు. రాజధాని పేరుతో సర్కార్‌ సాగిస్తున్న దమననీతిని తిప్పికొట్టడానికి రైతాంగం ఏకమై.. ఆందోళన బాట పట్టింది.

సాగుపై 60 కుటుంబాల జీవనాధారం.....

ఇది ఓ రైతు ఆవేదన. అటవీ అధికారుల చర్యలకు కడుపుమండి తన బాధను వెళ్లగక్కుతున్నాడు. ఇది ఈయనొక్కడి బాధే కాదు.. ఇక్కడున్న రైతులందరీ ఇదే బాధ. ఏపీ రాజధాని అటవీ ప్రాంత సమీపంలో కొన్నేళ్లుగా నిరుపేద రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. దాదాపు 60 కుటుంబాలు సాగుపైనే జీవనం సాగిస్తున్నాయి. కొందరు రైతులు తమ భూముల్లో మామిడి తోటలు పెంచుతున్నారు. కుటుంబమంతా రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేస్తున్నారు. ఉన్నదాంట్లోనే కడుపునింపుకుంటున్నారు. కొంతమంది రైతులకు పట్టాలు ఇచ్చారు. మరికొంత మందికి ఇవ్వలేదు. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు వీరికి పెద్ద కష్టమే వచ్చిపడింది. రక్షించాల్సిన అధికార యంత్రాంగమే.. వీరిన కుటుంబంతో సహా రోడ్డున పడేస్తోంది. ఇది తట్టుకోలేని అమాయక రైతులు పోరుకు సిద్ధమయ్యారు.

సాగు భూముల్లోంచి రైతులను తరిమికొట్టే ప్రయత్నాలు....

దాదాపు 50, 60 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న వీరిని తమ భూముల్లోంచి అటవీ అధికారులు తరిమికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నోటికాడికొచ్చిన కూడును చెదరగొట్టే ప్రయత్నాలకు వ్యూహారచన చేశారు. దాదాపు 60 నుంచి 70 ఏళ్ల క్రితమే మామిడి తోటలు వేసి.. వాటిని కంటికి రెప్పల్లా కాపాడుకుంటున్నారు. ఇప్పుడు మామిడి, ఇతర పంటలను ధ్వంసం చేసి.. ఆ ప్రాంతాల్లో కొత్త మొక్కులు నాటేందుకు అధికారులు చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు రైతులు ఏకమయ్యారు. చట్టాలను అడ్డుపెట్టుకుని ఫారెస్ట్‌ అధికారులు సాగిస్తున్న దుర్మార్గ చర్యలతో నిరక్ష్యరాస్యులైన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు సాగు చేసిన భూములను తమకప్పగించాలని అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు.

భూములను ఇవ్వమని తేగేసి చెబుతున్న రైతులు...

ఫారెస్ట్‌ అధికారులు తమ భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తే.. చావనైనా చస్తాంగాని.. భూములను ఇవ్వమని స్పష్టం చేస్తున్నారు. సాగు భూములపైనే ఆధారపడ్డ తాము ఈ భూములను ఇస్తే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాజధాని పేరుతో తమ బతుకులను నాశనం చేయొద్దని గుండెలోతుల్లోంచి వస్తున్న కన్నీళ్లతో వేడుకుంటున్నారు. గిరిజన రైతుల పట్ల ఫారెస్ట్‌ అధికారులు సాగిస్తున్న తీరుపై ప్రజాసౌమ్యవాదుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తప్పటగులు వేస్తున్న సర్కార్‌కు తగిన బుద్ది చెబుతాం

నవ్యాంధ్ర రాజధాని పేరుతో తప్పటగులు వేస్తున్న సర్కార్‌కు తగిన బుద్ది చెబుతామని భూ నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సాగు భూములను రాజధాని పేరుతో బలవంతంగా తీసుకోవద్దని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. పచ్చని సాగు భూములను రియల్‌ ఎస్టేట్‌ కబంధ హస్తాలకు అప్పచెప్పొద్దని డిమాండ్‌ చేస్తున్నారు. 

19:51 - August 7, 2015

హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ హైదరాబాద్‌లో సందడి చేశారు. ''ఆల్‌ ఈజ్‌ వెల్‌'' సినిమా ప్రమోషన్‌లో భాగంగా అభిషేక్‌ బచ్చన్‌ హైదరాబాద్‌కు వచ్చారు. డైరెక్టర్‌ శుక్లా కథ నచ్చి.. ''ఆల్‌ ఈజ్‌ వెల్‌'' సినిమా చేశానని అభిషేక్‌ చెప్పారు. ఈ మూవీ అందర్నీ ఆకట్టుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన బాహుబలి సినిమా బాగుందని అభిషేక్‌ కితాబునిచ్చారు. ఆ సినిమాల్లో నటించిన నటులపై ఆయన ప్రశంసలు కురించారు. మంచి కథ ఉంటే తన తండ్రి అమితాబ్‌, భార్య ఐశ్వర్యరాయ్‌తో మరోసారి నటించేందుకు తాను సిద్దమన్నారు. 

19:47 - August 7, 2015

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని జీఎంఆర్ ఎరీనాలో బీఎండబ్ల్యు కార్లు దుమ్మురేపాయి. బీఎండబ్ల్యు 1 నుంచి 7 సిరీస్‌, బీఎండబ్ల్యు-ఎం మోడల్‌ కార్లతో నిర్వహించిన డ్రైవింగ్‌ నగరవాసులను అబ్బురపర్చింది. బీఎండబ్ల్యుసంస్థ డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ టూర్‌ పేరిట కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు అనుభవజ్ఞులైన ట్రైయినర్ల ద్వారా ట్రాక్‌లో కార్ల పనితనాన్ని చూపించారు. కార్ల సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సవాలు విసిరే రహదారుల్లో దూసుకుపోయే సత్తాను వినియోగదారులకు వివరించారు. నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. 
అదరగొట్టే విన్యాసాలు.. అబ్బురపర్చే స్టంట్స్‌....
అదరగొట్టే విన్యాసాలు.. అబ్బురపర్చే స్టంట్స్‌.. కళ్లు మిరుమిట్లు గొలిపే రాష్‌ డ్రైవింగ్‌.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నోవోటెల్‌ హోటల్‌ జీఎంఆర్‌ ఎరీనా గ్రౌండ్‌లో బీఎండబ్ల్యూ ఎక్స్‌పీరియన్స్‌ టూర్‌ 2015 కన్నుల పండువగా జరిగింది. బీఎండబ్ల్యూ సంస్థ వినియోగదారుల కోసం నిర్వహించిన టెస్ట్‌ డ్రైవ్‌ ఆకట్టుకుంది. కార్లు అతివేగంగా చూట్టూ తిరుగుతుండడంతో పొగలు మబ్బులు కమ్ముకున్నాయి.
కంపెనీకి చెందిన పలు మోడళ్ల కార్లను...
కంపెనీకి చెందిన పలు మోడళ్ల కార్లను గతుకుల రోడ్లు, మైదానాల్లో నిపుణులైన డ్రైవర్లు కార్లను నడిపి.. తమ సత్తా చాటారు. బీఎండబ్ల్యూ ఇండియా ఉత్పత్తుల పోర్టు పోలియోను ప్రదర్శించేందుకు దేశంలోని 18 నగరాల్లో ఈ టూర్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బీఎండబ్ల్యూ ఇండియా డైనమిజం, బహుముఖ వైవిధ్యం, అత్యుత్తమ కార్యనిర్వహణను తమ సంస్థ పూర్తిస్థాయి ఉత్పత్తులను బీఎండబ్ల్యూ శ్రేణి ఎక్స్‌పీరియన్స్‌ టూర్‌ 2015ను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లగ్జరీ కార్లను ఔత్సాహికులు నడిపి మంచి అనుభూతిని పొందారు. నాలుగు రోజుల ప్రదర్శనలో భాగంగా ఎయిర్‌పోర్టు వద్ద నిర్వహించిన బీఎండబ్ల్యు ఎక్స్‌ డ్రైవ్‌ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. 

19:43 - August 7, 2015

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర ఐటి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఇబ్రహీంపట్నంతోపాటు, మంచాల, యాచారం మండలాల్లోని వివిధ గ్రామాల్లో 13కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాల్లో సిసి రోడ్డు పనులు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలోని మెటర్నరీ ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నల్లకంచెలో కోటి రూపాయాలతో నిర్మిచిన కస్తూర్బాగాంధీ హాస్టల్‌ భవనాన్ని ప్రారంభించారు.

19:41 - August 7, 2015

హైదరాబాద్  : నెలరోజులపై నుంచి సమ్మె చేస్తున్న మున్సిపల్‌, గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించరు. చర్చించడానికి అవకాశమివ్వరు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విన్నవిద్దామంటే అపాయింట్‌మెంట్‌ ఇవ్వరు. అధికారులు అసలే పట్టించుకోరు. వేచి చూసి విసిగిపోయిన వామపక్షాలు, టీడీపీ నేతలు నేరుగా సచివాలయానికే వెళ్లారు. సమతాబ్లాక్‌ వద్ద వీరిని పోలీసులు అడ్డుకోగా.. బైఠాయించారు. సీఎం కలవాలని పట్టుబట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తదితరులను బలవంతంగా ఎత్తుకుపోయి అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌లకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు చేయాలని అఖిలపక్షం పిలుపు ఇచ్చింది. 

ఘన్‌పూర్ క్వారీలో పేలుడు

మెదక్ : తుఫ్రాన్ మండలం ఘన్‌పూర్ క్వారీలో పేలుడు సంభవించింది. పేలుడు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఈనెల 27న ఉస్మానియా యూనివర్శిటీకి రాహుల్ గాంధీ...

హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 27న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రానున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన రాహుల్ గాంధీని కోరినట్టు సమాచారం. అదే విధంగా ఈనెల 28న వరంగల్ లో రాహుల్ సభ ఉంటుందన్నారు. దాంతో పాటు అదే జిల్లాలోని భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో ముఖాముఖి ఉంటుందని ఉత్తమ్ తెలిపారు. రాహుల్ గాంధీ ఓయూకు రావాలిన కోరిన వారిలో వర్సిటీ జేఏసీ నేతలు కూడా ఉన్నారు.

18:59 - August 7, 2015

నటీనటులు :
              మహేష్ బాబు - శ్రుతి హాసన్ - జగపతి బాబు - రాజేంద్ర పసాద్ - ముఖేష్ రుషి - సంపత్ - హరీష్ ఉత్తమన్- వెన్నెల కిషోర్- రాహుల్ రవీంద్రన్ -  ఆలీ - సుకన్య - తులసి -  ఏడిద శ్రీరామ్ -  సురేఖా వాణి - సుబ్బరాజు  తదితరులు..
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం - మధి
నిర్మాతలు - నవీన్ రవికిశోర్ - మోహన్
రచన, దర్శకత్వం - కొరటాల శివ
స్టోరీ....
జీవితంలో ఉన్నత స్థానానికి వచ్చిన వారు సొంతూరు బాగు కోసం పాటుపడాలన్న ఆలోచనతో తెరకెక్కిన సినిమా శ్రీమంతుడు. డబ్బున్నవాడు కాదు...మనసున్నోడే అసలైన శ్రీమంతుడనేది ఒక్క లైన్ లో ఈ సినిమా స్టోరీ. సామాజిక స్పృహ ను పెంచే కథతో మహేష్ లాంటి ఓ స్టార్ హీరో సినిమా చేయడం అభినందనీయం. అయితే కమర్షియల్ అంశాలు ఎంతగా కలిపినా....మూల కథ ప్రభావంతో ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయాడు.....
సంపన్నకుటుంబంలో పుట్టినా..
మహేష్ బాబు సంపన్నకుటుంబంలో పుట్టినా...అతని ఆలోచనలన్నీ చుట్టూన్న వారి కోసమే. ఓ సాధారణ వ్యక్తిలా మెలుగుతూ...కంపెనీలో పనిచేసే ఉద్యోగుల కష్టాల్లో తోడుగా ఉంటుంటాడు. కానీ ఎవరి హోదాలో వాళ్లుండాలి అనేది తండ్రి జగపతి బాబు పద్దతి. తనలాంటి ఆలోచనలతోనే ఉన్న అందమైన అమ్మాయి శృతిహాసన్ చూసి ప్రేమిస్తాడు మహేష్. రూరల్ డెవలప్ మెంట్ కోర్సులో చదువుకుంటున్న ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. మహేష్ బాబు కోటీశ్వరుడు జగపతి వారసుడని తెల్సుకున్న శృతిహాసన్ ...జగపతి సొంతూరును నిర్లక్ష్యం చేశాడని...డబ్బున్న వాళ్లతో ప్రేమ నిలవదనే కారణంతో మహేష్ కు దూరమవుతుంది. అయితే తండ్రి స్థానంలో తాను సొంతూరుకు అండగా నిలబడాలని అక్కడికి వెళ్తాడు మహేష్ బాబు. ఊరి కోసం మహేష్ చేస్తున్న పనులను చూసి శృతి అతని నిజాయితీ అర్థం చేసుకుంటుంది. హీరో చేసే మంచి పనులకు అడ్డొస్తుంటాడు విలన్ సంపత్ . ఊరిలోని వనరులను, ప్రజలను దోచేస్తున్న సంపత్ ను కథానాయకుడు ఎలా అంతం చేశాడన్నది మిగిలిన కథ....
సందేశాత్మక కథను ఇంత పెద్ద సినిమాగా...
ఊరిని దత్తత తీసుకోవడం అనే సందేశాత్మక కథను ఇంత పెద్ద సినిమాగా తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివ ప్రసంశనీయుడు. అయితే ఫైట్లు, పాటలు లాంటి ఎన్ని కమర్షియల్ అంశాలను జోడించినా...సినిమా రక్తి కట్టలేదు. శ్రీమంతుడు చూసి ఏ ఒక్క ధనవంతుడు మారినా...సినిమా లక్ష్యం నెరవేరినట్లే. హర్ష క్యారెక్టర్ లో మహేష్ బాబు ఎప్పటిలాగే ఒదిగిపోయాడు. చారుశీలగా శృతి హాసన్ ప్రతిభావంతంగా నటించింది. విలన్ గా సంపత్, నారాయణ రావు పాత్రలో రాజేంద్రప్రసాద్ సినిమాకు బలం చేకూర్చారు. ఇక జగపతి బాబు కోటీశ్వరుడిగా రిచ్ లుక్ లో ఉన్నా....ఫర్మార్మెన్స్ కు స్కోప్ లేని పాత్ర అతనిది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, మదీ సినిమాటోగ్రఫీ, అనిల్ అరసు స్టంట్స్ శ్రీమంతుడు స్టామినా పెంచాయి..
స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా ఆసక్తికరంగా...
సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా ఆసక్తికరంగా సాగిన శ్రీమంతుడు....సెకండాఫ్ లో బాగా స్లో అయ్యాడు. దీనికి కారణంగా మూల కథలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటనగా చేయాల్సిన స్టోరీ లైన్ ఇది. దీన్ని మహేష్ ఇమేజ్ కు తగిన సినిమాగా చేసేందుకు కొరటాల విశ్వప్రయత్నం చేశాడు. అయితే కథలోని అనేక లోటుపాట్లు...లాజిక్ కు అందని చాలా అంశాలు సినిమాలో ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోయాయి. కథానాయకుడు విలన్లను బాదడమే తప్ప...వాళ్లు తిరిగి కౌంటర్ ఇచ్చిందే లేదు. దీంతో ప్రతినాయకుల క్యారెక్టర్స్ బిల్డప్ కే సరిపోయాయి. స్లో స్క్రీన్ ప్లే, సెంటిమెంట్ తో క్లైమాక్స్ వచ్చేసరికి...సినిమాలో వెలితి ప్రేక్షకులకు తెలిసిపోతుంది..
ప్లస్ పాయింట్స్
సినిమాటో గ్రఫీ, యాక్షన్ సీన్స్, సందేశాన్నిచ్చే ప్రయత్నం
మైనస్ పాయింట్స్ ఊహాతీత కథనం, సాగతీత సన్నివేశాలు, వినోదం తగ్గడం, క్లైమాక్స్
రేటింగ్ 3/5

కడపలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

హైదరాబాద్: కడపజిల్లాలో ఎనిమిది మంది ఎర్రచందంనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి లో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితల నుంచి 1.5 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను, నాలుగు ద్విచక్రవాహనాలు, 6 సెల్ ఫోన్లు, ఓ మారుతి కారును స్వాధీనం చేసుకున్నారు.

18:01 - August 7, 2015

                   రవితేజ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోహీరోయిన్లుగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న చిత్రం 'కిక్‌2'. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాత కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ,'సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్ట్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. థమన్‌ సంగీతమందించిన పాటలు ఇప్పటికే హిట్‌ అయ్యాయి. ఈనెల 14న ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ను చాలా గ్రాండ్‌గా చేయబోతున్నాం. సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. నిర్మాతగా నేను పూర్తి స్థాయిలో సంతృప్తి పొందిన చిత్రమిది. అద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మా బేనర్‌లో కచ్చితంగా 'కిక్‌2' మరో సూపర్‌ హిట్‌ చిత్రమవుతుంది' అని అన్నారు. 'యన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌ బేనర్‌లో 'అతనొక్కడే' చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమైన నేను మళ్ళీ ఇదే బేనర్‌లో సినిమా చేయడం, రవితేజతో 'కిక్‌' తర్వాత మళ్ళీ 'కిక్‌2' చిత్రం చేయడం చాలా హ్యాపీగా వుంది. 'అతనొక్కడే' 'కిక్‌' చిత్రాల్లాగే ఈ సినిమా కూడా సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది' అని దర్శకుడు సురేందర్‌రెడ్డి తెలిపారు. 

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ: సీఈసీ

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది. ఏపీ, తెలంగాణల్లో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబర్ 5న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయనుంది. ఆ తర్వాత ఫిర్యాదుల స్వీకరణకు నెల రోజుల పాటు గడువు ఇవ్వనుంది. అనంతరం, 2016 జనవరి 11న తుది జాబితా విడుదల చేయనుంది.  

17:54 - August 7, 2015

               యాక్షన్‌ చిత్రాల 'ధూమ్‌' సిరీస్‌కి ఇంకా బ్రేక్‌ పడలేదు. ఇప్పటికే 'ధూమ్‌'కి సీక్వెల్‌గా 'ధూమ్‌2', దీనికి సీక్వెల్‌గా 'ధూమ్‌3'గా వచ్చి విశేష ప్రేక్షకాదరణతో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేశాయి. తాజాగా 'ధూమ్‌3'కి సీక్వెల్‌గా 'ధూమ్‌ 4' చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. అది కూడా ఓ డిఫరెంట్‌ కాంబినేషన్‌తో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు దర్శక, నిర్మాతలు సమాయత్తమవుతున్నారట. బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ఖాన్‌, బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌, సన్నీలియోన్‌ తదితరులతోపాటు 'ధూమ్‌'సిరీస్‌లో మొదట్నుంచి కొనసాగుతున్న అభిషేక్‌బచ్చన్‌, ఉదయ్  చోప్రాలు ప్రధాన తారాగణంగా త్వరలోనే 'ధూమ్‌4' సెట్స్‌పైకి వెళ్ళనుందట.
 
                 విజయకృష్ణ ఆచార్య రాసిన కథని 'ధూమ్‌'గా సంజయ్  గద్వి దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించారు. అభిషేక్‌ బచ్చన్‌, ఉదయ్  చోప్రా, జాన్‌ అబ్రహమ్‌, ఇషాడియోల్‌, రిమిసేన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2004లో విడుదలైన 'ధూమ్‌' వసూళ్ళలో ఇండియాలోనే టాప్‌ గ్రాసర్‌గా (290 మిలియన్‌ డాలర్లు) నిలిచింది. ఆ తర్వాత 2006లో హృతిక్‌రోషన్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్ , ఉదయ్  చోప్రా, బిపాషాబసు ప్రధాన తారాగణంగా 'ధూమ్‌2' చిత్రాన్ని యష్‌రాజ్‌ఫిల్మ్‌ పతాకంపై ఆదిత్యచోప్రా, యష్‌చోప్రా సంయుక్తంగా సంజయ్  గద్వి దర్శకత్వంలో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 1800 ప్రింట్లతో ఈ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. బాలీవుడ్‌ చరిత్రలోనే అత్యధిక ప్రింట్లతో విడులైన సినిమాగానే కాకుండా 1.5బిలియన్‌ డాలర్లని వసూలు చేసి బాలీవుడ్‌లోనే కాకుండా, ఓవర్‌సీస్‌లో సైతం ఆల్‌టైమ్‌ హయ్యస్ట్‌ గ్రాసర్‌గా చిత్రంగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.
       
          దీనికి సీక్వెల్‌గా అమీర్‌ఖాన్‌ ద్విపాత్రాభినయంతో 'ధూమ్‌3' చిత్రాన్ని రూపొందించారు. కథకుడే దర్శకుడిగా మారి రూపొందించిన ఈచిత్రంలో అమీర్‌ఖాన్‌ సరసన కత్రినాకైఫ్‌ నటించింది. రచయిత విజరుకృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన 'ధూమ్‌3' సైతం రికార్డుల్ని తిరగరాసింది. విడుదలైన రెండురోజుల్లోనే ఊహించని స్థాయిలో వసూళ్ళని కలెక్ట్‌ చేసి 2013లో బిగ్గెస్ట్‌ హిట్‌ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 4 బిలియన్‌ డాలర్లను వసూలు చేసి ఆల్‌టైమ్‌ రికార్డ్‌ని సృష్టించింది. తాజాగా రూపొందబోయే 'ధూమ్‌4' చిత్రం ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచిచూద్దాం.

ప్రభుత్వాసుపత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి...

నెల్లూరు: వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లాలోని పొదలకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ ఓ మహిళ ఆస్పత్రిలో చేరింది. అయితే డాక్టర్ ఇంజక్షన్ వేసిన పది నిమిషాలకే ఆమె మృతి చెందింది. వైద్యం వికటించే ఆమె మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఆమె మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ నరసింహన్

హైదరాబాద్: ఈ రోజు రాత్రికి గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవనున్నట్లు తెలుస్తోంది.

రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు 10 వామపక్ష పార్టీల పిలుపు...

హైదరాబాద్: అఖిలపక్ష నేతల అక్రమ అరెస్ట్ కు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు 10 వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. వారి ఆందోళనకు టీడిపి, వైసీపీ, లోక్ సత్తా మద్దతు తెలిపినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

'పాకిస్తాన్ లో జరిగే స్పీకర్ల సమావేశానికి వెళ్లకూడదని తీర్మానం'

ఢిల్లీ: శాసనసభ స్పీకర్లు, మండలి ఛైర్మన్లతో లోక్ సభ స్పీకర్ సుమితా మహాజన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పాకిస్తాన్ లో జరిగే స్పీకర్ల సమావేశానికి జమ్మూకాశ్మీర్ ను పిలవకపోవడంతో ఆ సమావేశానికి వెళ్లకూడదని తీర్మానించారు. పాకిస్థాన్ నిబంధనలు ఉల్లంఘిస్తోందని మండి పడ్డారు.

17:39 - August 7, 2015

హైదరాబాద్ : శిశువుకు తల్లిపాలను మించిన ఆహారం లేదని గుర్తించిన ప్రభుత్వాలు ప్రజలను ఆ దిశగా ప్రోత్సహించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా పాలిచ్చే తల్లుల కోసం తమిళనాడు ప్రభుత్వం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
మన దేశంలో శాస్త్ర పారిశ్రామిక మండలి నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. మొత్తం పరిశోధనల్లో మహిళల భాగస్వామ్యం నిరాశాజనకంగా ఉన్నట్లు నిర్ధారణ జరిగింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు పార్లమెంటరీ కమిటీ కొత్త సిఫారసులను సూచించింది. క్లరికల్ విభాగంలోనే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్న తీరును మారుస్తూ ఉన్నత పదవులలో వారి భాగస్వామ్యాన్ని పెంచాల్సింది ఈ కమిటీ అభిప్రాయపడింది.

 

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై : నేడు స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 62 పాయింట్లు నష్టపోయి 28,236 వద్ద ముగియగా, నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 8,564 వద్ద ముగిసింది. 

తెలంగాణలో వివిధ జిల్లాల రిజిస్ట్రార్లు బదిలీ

హైదరాబాద్ : రాష్ట్రంలో పలు జిల్లాల రిజిస్ట్రార్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. మరి కొంత మందికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి తూర్పు రిజిస్ట్రార్‌గా ఎన్. సైదిరెడ్డి, హైదరాబాద్ దక్షిణ రిజిస్ట్రార్‌గా ట్వింకిల్ జోన్, రంగారెడ్డి(ఎంవీ అండ్ ఏ) రిజిస్ట్రార్‌గా డి. విష్ణువర్ధన్‌రాజు, ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్‌గా కె. మోహన్, వరంగల్ జిల్లా రిజిస్ట్రార్‌గా కె. రఘుబాబు, మహబూబ్‌నగర్ జిల్లా రిజిస్ట్రార్‌గా కె. రమణారావు, కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్‌గా దినేష్‌దాతర్ అదనపు బాధ్యతలు, ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్‌గా కె.

లంచ్ బాక్స్ కోసం ఫైట్.. చూపు కోల్పోయిన చిన్నారి...

హైదరాబాద్: ముంబై చెంబూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో తరగతి గదిలో ఇద్దరు చిన్నారుల మధ్య జరిగిన ఫైట్‌లో ఒకటో తరగతి విద్యార్ధి ఓ కన్ను కోల్పోయాడు. లంచ్‌బాక్స్ కోసం ఇద్దరు విద్యార్ధుల మధ్య గొడవ జరిగింది. ఫైట్‌లో భాగంగా క్లాస్‌రూంలో ఉన్న కత్తెరతో బాలుడిని మరో చిన్నారి కంట్లో పొడిచాడు. రక్తం కారడంతో వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. చిన్నారి ఒక కన్ను కోల్పోయాడు. బాధిత విద్యార్ధి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యంపై లీగల్ నోటీసులు పంపారు.

ఎంపీల సస్పెండ్ కు గుండుతో నిరసన...

నల్లగొండ : పార్లమెంట్ సమావేశాలకు రాకుండా కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేయడంపై ఓ అభిమాని మనస్తాపానికి గురయ్యాడు. సస్పెండుపై స్పందిస్తూ.. గుండు చేయించుకుని వినూత్నంగా నిరసన తెలిపాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన రాహుల్ గాంధీ జన జాగృతి జాతీయ అధ్యక్షుడు రిక్షా చంద్రశేఖర్, తెలంగాణ తల్లి విగ్రహం ఎదుటు గుండు గీయించుకుని నిరసన తెలిపారు.

ఢిల్లీలో రైతు ఆత్మహత్యలపై ఏఐకెఎస్ ఆధ్వర్యంలో ధర్నా...

ఢిల్లీ: రైతు ఆత్మహత్యలపై ఆగస్టు 10,11 తేదీల్లో జంతర్ మంతర్ వద్ద అఖిల భారత కిసాన్ సభ ధర్నా చేపట్టనుంది. ఈ ధర్నాలో 300 మంది బాధిత రైతు కుటుంబాలు పాల్గొననున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 20 మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. ఈ ధర్నా కార్యక్రమానికి వామపక్షపార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ధరలు లేనందునే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కిసాన్ సభ జాతీయ కార్యదర్శి హన్షన్ మొల్లా, ఉపాధ్యక్షుడు విజు కృష్ణన్ తెలిపారు.

హర్యానాలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి12 మంది కూలీల మృతి

హైదరాబాద్ : హర్యానాలోని నార్నౌల్ జిల్లా డోలేరా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న గోడ కూలి 12 మంది కూలీలు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గోడ నిర్మాణంలో సుమారు 50 మంది కూలీలు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.

జంట హత్యల కేసులో నిందితులకు జీవిత ఖైదు

ప్రకాశం : జంట హత్యల కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మార్కాపురం మండలం అయ్యవారిపల్లెలో జరిగిన జంటహత్యల కేసులో 9 మంది నిందితులకు కోర్టు జీవితఖైదు విధించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ నిందితులు పై కోర్ట్ లో అప్పీల్ చేయనున్నట్లు తెలిసింది.

గ్రేటర్ పరిధిలో 34లక్షల ఓట్లు గల్లంతు :ఈసీ టి.టిడిపి ఫిర్యాదు..

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో ఒక్కసారిగా 34 లక్షల ఓట్లు గల్లంతయ్యాయట. అది కూడా టీడీపీ, బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లోని ఓట్లే కనిపించకుండాపోయాయట. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం టీ టీడీపీ ఎమ్మెల్యేలు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఎలక్షన్ కమిషనర్ భన్వర్ లాల్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదులో జనం ఒక్కసారిగా ఈ మేర తగ్గిపోయిందా? అని కూడా వారు భన్వర్ లాల్ ను ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ సర్కారు ఓట్లను తొలగిస్తోందని వారు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

మొహం చాటేసిన సీఎం కేసీఆర్ :అఖిలపక్షం నేతల అరెస్ట్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వచ్చిన అఖిల పక్షం నేతలను సీఎం కేసీఆర్ అరెస్టు చేయించి మొహం చాటేశారు. అరెస్టు చేసిన వారిలో సీపీఎం నేత తమ్మినేని, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, టిడిపి నేతల ఎర్రబెల్లి తదితరులు ఉన్నారు. వీరందరినీ సైఫాబాద్ పీఎస్ కు తరలించారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తదితరాలపై సీఎంతో చర్చించేందుకు గత కొన్ని రోజులుగా సీఎం అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అఖిలపక్ష నేతలు నేరుగా సచివాలయానికి తరలి వెళ్లారు. అడ్డగించిన పోలీసులు వారిని అరెస్టు చేసి సైఫాబాద్ పీఎస్ కు తరలించారు.

సమతా బ్లాక్ వద్ద కేసీఆర్ ను కలిసేందుకు నిరీక్షిస్తున్న అఖిలపక్షం

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వివిధ పార్టీల నేతలు సచివాలయానికి క్యూ కట్టారు. సచివాలయంలోని సీఎం కార్యాలయం ఉన్న సమతా బ్లాకు ముందు వారంతా కేసీఆర్ పిలుపు కోసం పడిగాపులు గాస్తున్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తదితరాలపై సీఎంతో చర్చించేందుకు టీ టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, వామపక్షాలకు చెందిన నేతలు కొద్దిసేపటి క్రితం సచివాలయానికి చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా సీఎం అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అఖిలపక్ష నేతలు నేరుగాసచివాలయానికి తరలి వెళ్లారు.

ఆన్‌లైన్‌లో ఏపీ మూడోవిడత రుణమాఫీ జాబితా

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఏపీ మూడోవిడత రుణమాఫీ జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. 4.74 లక్షల మంది రైతులు రుణ అర్హత సాధించారు. రూ.890 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. రుణమాఫీ వల్ల 34.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఏపీ అధికారి కుటుంబరావు తెలిపారు. పది శాతం వడ్డీతో మొత్తం రూ.24 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని ఆయన తెలిపారు. త్వరలో మిగిలిన రుణమాఫీకి టెంపర్‌ప్రూఫ్‌ కూపన్ పేపర్‌తో బాండ్లు జారీ చేయనున్నట్లు కుటుంబరావు తెలిపారు. బాండ్ల రూపకల్పనపై ప్రభుత్వం న్యాయసలహా కోరింది. డెత్ కేసులు, నో డేటా అకౌంట్ల వారు ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

16:47 - August 7, 2015

శ్రీకాకుళం : జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అతి వేగంగా వచ్చిన బస్సు మలుపు వద్దకు రాగానే అదుపుతప్పింది. కంచిలి మండలం కొత్త అంపురం చెరువు వద్ద ఈ ప్రమాదం సంభించింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సోంపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోంపేట నుంచి ఘాటి ప్రాంతానికి వెళ్తున్న ఈ బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు.

16:45 - August 7, 2015

చిత్తూరు : రేణిగుంట మండలం గాజులమండ్యం చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అధికారులు పట్టుకున్నారు. దాదాపు 2 వందల కిలోలు బరువుంటుదని అధికారులు అంచనా వేశారు. దీని ఖరీదు 40 లక్షల వరకు ఉంటుందన్నారు. రాజమండ్రి నుంచి చెన్నైకి తరలిస్తుండగా ఈ గంజాయి పట్టుబడింది. అయితే చెక్‌పోస్టు అధికారుల కన్నుగప్పి పారిపోతున్న కారు డ్రైవరును సిబ్బంది సినీఫక్కీలో వెంబడించి పట్టుకున్నారు. డ్రైవరు మలయ్‌రాజ్‌గా పోలీసులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.

16:43 - August 7, 2015

అనంతపురం: జిల్లాలో నెలకొన్న దుర్భరమైన కరువు పరిస్థితి గురించి సీపీఎం నేతలు హోంమంత్రి దృష్టికి తెచ్చారు. పంటలు ఎండిపోయి ఆవేదనతో ఉన్న రైతులను ఆదుకోవాలని చినరాజప్పకు వినతిపత్రం అందజేశారు. ప్రత్యామ్నాయ పంటల కోసం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలని హోంమంత్రిని కోరారు. వెంటనే హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేయడానికి అవసరమైన నిధులను విడుదల చేయాలని విన్నవించారు. 

16:41 - August 7, 2015

హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద సవాల్‌గా మారుతోంది. రాజధానిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని చెబుతున్న లీడర్లు... ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి తరలించే విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదే అంశంపై ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగినా స్పష్టత మాత్రం రావడం లేదు.
తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేస్తామన్నఏపీ సర్కార్‌...
ప్రజలకు దగ్గరగా ఉన్న శాఖలను త్వరగా తరలించేందుకు... తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేస్తామని ఏపీ సర్కార్‌ ప్రకటించింది. ఇందుకోసం విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో అనువైన స్థలాలను కూడా గుర్తించింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో..? ఆ ప్రతిపాదనను అటకెక్కించింది. తాజాగా మరోసారి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై దృష్టి సారించింది. వీలైనంత త్వరగా కార్యాలయాలను తరలించేందుకు సిద్ధమైంది.
ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టిన ఉద్యోగులు....
మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగినా పెద్దగా ఫలితం లేదు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం చెట్ల కిందైనా కూర్చుని పనిచేస్తామన్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచారు. ఇప్పటికిప్పుడు కార్యాలయాలను విజయవాడకు తరలిస్తే తాము సమస్యలు ఎదుర్కొంటామంటున్నారు.
కార్యాలయాలన్నీ ఒకేసారి తరలించాలన్న సీఎస్‌....
ఇక కార్యాలయాల తరలింపు అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు కార్యాలయాలన్నింటిని ఒకేసారి తరలించాలన్నారు. కానీ ఏమైందో తెలియదు.. మీటింగ్‌ జరిగి 24 గంటలు ముగియక ముందే... ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కృష్ణారావు ప్రకటించారు. మొత్తానికి అమరావతి పిలుస్తోంది..! కార్యాలయాలన్నీ ఒకేసారి తరలిస్తామని చెప్పిన ప్రభుత్వం... తాజాగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అసలు కార్యాలయాలను ఎప్పుడు తరలిస్తారు...? ప్రభుత్వమెలాంటి నిర్ణయం తీసుకుంటదనే సందేహం ఏపీ ఉద్యోగుల్ని వెంటాడుతోంది. 

అక్రమ గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు..

నెల్లూరు : పోలీసులు మాటువేసి గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. దొరవారిసత్రంలో 50 కేజీల గంజాయిని తరలిస్తున్న వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారిలో ఒకరిని పట్టుకోగా, ఇద్దరు పరారయ్యారు. వారి నుంచి కారు స్వాధీనం చేసుకున్నారు. పరారైనవారు విదేశీయులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

'లవ్ యు ఆల్' : మహేశ్ బాబు..

హైదరాబాద్: కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఉదయం ఆటనుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ‘శ్రీమంతుడు’పై మహేశ్ స్పందించాడు. తనకు అత్యంత సంతోషాన్నిచ్చిన రోజుల్లో ఇదోక రోజు అంటూ ట్విట్ చేశాడు. శ్రీమంతుడు చిత్రానికి అంచనాలకు మించిన స్పందన వస్తోందంటూ అభిమానులను ఉద్దేశించి లవ్ యు ఆల్ అని తన ప్రేమను వ్యక్తం చేశాడు..

వచ్చే బడ్జెట్ సమావేశాలు ఏపీలోనే:యనమల

హైదరాబాద్: వచ్చే బడ్జెట్‌ సమావేశాలను స్వరాష్ట్రంలోనే నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం విశాఖలో ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేయాలన్నారు. బీహార్‌ ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదాపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని యనమల తెలిపారు.

కాల్ డేటా ఇవ్వండి.. రెండు టెలికాం సంస్థలకు హైకోర్టు ఆదేశం...

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో కాల్ డేటా ఇవ్వాలంటూ టాటా, వొడాఫోన్ టెలికాం సంస్థలకు ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డేటాను విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఇవ్వాలని తెలిపింది. కోర్టుకు డేటా ఇచ్చాక ఆ సీల్డ్ కవర్లను హైకోర్టు రిజిస్ట్రార్ కు పంపాలని మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ పై విజయవాడ సత్యనారాయణపురం పీఎస్ లో నమోదైన క్రిమినల్ కేసులో తెలంగాణ ప్రభుత్వం నేడు మరో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజే దానిపై విచారణ జరగనుంది. 

సీమకు తక్షణమే రూ.1000కోట్లు ఇవ్వాలి : టీజీ

కర్నూలు : ఈ నెల 11న జరిగే ఏపీ బంద్‌కు రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్యవేదిక సంపూర్ణ మద్దతిస్తుందని మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌ అన్నారు. రాయలసీమ కరువు నివారణకు తక్షణమే రూ.1000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాలపై తప్పుడు లెక్కలు చూపిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోరా? అని టీజీ ప్రశ్నించారు.

'కాంట్రాక్టు' రెగ్యులరైజేషన్ అయిన తర్వాతే ఉద్యోగాల భర్తీ:కడియం

హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే, కొద్దిసేపటి క్రితం ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కొత్త మెలిక పెడుతూ ఓ ప్రకటన చేశారు. వివిధ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే కొత్త ఉద్యోగాల భర్తీని చేపడతామని ఆయన పేర్కొన్నారు. దీంతో నేడో, రేపో వస్తుందనుకుంటున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ పై అయోమయం నెలకొంది.  

నూతన మద్యం పాలసీ పై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : నూతన మద్యం విధానంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుతో పాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. నూతన మద్యం విధానంపై ఇవాళ తుది నిర్ణయం తీసుకోనున్నారు. కొద్ది రోజుల క్రితమే నూతన మద్యం పాలసీపై సంబంధిత అధికారులతో సీఎం చర్చించిన విషయం తెలిసిందే.

15:55 - August 7, 2015

హైదరాబాద్ : ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఐటీ కంపెనీలు వణికిపోతున్నాయి... ఎప్పుడు ఏ ఉగ్రవాది దాడి చేస్తారో తెలియక టెన్షన్ పడిపోతున్నాయి.. ఈ కంపెనీ యాజమాన్యానికి మేమున్నామంటూ బరోసా ఇస్తున్నారు పోలీసులు... టెర్రరిస్టుల ఆటకట్టించేందుకు స్పెషల్ ప్లాన్లు సిద్ధం చేశారు..
జాగ్రత్తగా ఉండాలంటూ ఐబీ హెచ్చరికలు....
దేశంలో అలజడికి వ్యూహాలు రచిస్తున్న ఉగ్రవాదులు తాజాగా ఐటీ జోన్‌ను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది... ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఇంటెలిజన్స్ జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు పంపింది.. దీంతో కంపెనీల్లో కంగారు మొదలైంది.. భయపడాల్సిన అవసరంలేదని ఈ సంస్థల యాజమాన్యానికి హామీ ఇస్తున్నారు పోలీసులు... ఈ ముప్పునుంచి బయటపడే ప్రతిపాదనల్ని రెడీ చేశారు..
ఉగ్రవాదుల దాడుల్ని ఎదుర్కోవడంపై అవగాహనలేదు....
హైదరాబాద్ గచ్చిబౌలిలో 500లకు పైగా సాప్ట్ వేర్ కంపెనీలున్నాయి... వీటిలో సీ.సీ. కెమెరాలు.. చుట్టు పహారాతో భద్రత పటిష్టంగానే ఉంది. ఒకవేళ అత్యాధునిక గన్స్ తో ఉగ్రవాదులు సడన్‌గా అటాక్ చేస్తే ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ఇందులో ఎవ్వరికీ అవగాహనలేదు.. అందుకే ఆయా కంపెనీలకు గన్ లైసెన్స్ ఇచ్చేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు... ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఇచ్చేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.. కంపెనీ భద్రతను చూస్తున్న రిటైర్డ్ పారామిలటరీ సిబ్బంది, రిటైర్ పోలీసులకు వెంటనే గన్ లైసెన్స్ మంజూరు చేయనున్నారు పోలీసులు...
ఆగస్టు 15లోగా దేశంలోపు....
ఆగస్టు 15లోగా దేశంలోని సాంకేతిక నిపుణులుండే ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నారని ఐబీ హెచ్చరికలు పంపింది... దీంతో అప్రమత్తమైన పోలీసులు బందోబస్తు పెంపుపైకూడా పోలీసులు దృష్టిపెట్టారు..

15:52 - August 7, 2015

హైదరాబాద్ : యూనివర్శిటీల్లో ఖాళీగాఉన్న వీసీ పోస్టులపై హైకోర్టు సీరియస్ అయింది... నాలుగు నెలల్లోగా వీసీలను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించింది...
హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిటిషన్...
తెలంగాణలోని యూనివర్శిటీల్లో ఉపకులపతులను నాలుగు నెలల్లోగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు... ఆరు నెలల గడువు కావాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించలేదు... రాష్ట్రంలోని పది వర్శిటీల్లో వీసీల భర్తీకి చర్యలు చేపట్టేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టును ఆశ్రయించింది.. ఏడాదిన్నరగా యూనివర్శిటీల్లో ఇంఛార్జుల పాలన నడుస్తోందని.
పిటిషన్లో పేర్కొన్నారు.. ఇంఛార్జులుగా కొన్ని వర్శిటీలకు ఐఏఎస్ అధికారులను... మరికొన్నింటికి సీనియర్ అధికారులను నియమించారని తెలిపారు.. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు..
ఆరు నెలల గడువు కోరిన తెలంగాణ అడ్వకేట్ జనరల్.....
అటు ఉపకులపతుల భర్తీకి ఆరు నెలల గడువు కావాలని తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్.. కోర్టును కోరారు.. సెర్చ్ కమిటీ సిఫారసుల ప్రకారం ఈ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.. గత నిబంధనలను సవరించాలని సర్కారు భావిస్తోందని వివరించారు.... రెండువైపుల వాదనలు విన్న కోర్టు... మూడునుంచి 4 నెలల్లో వీసీలను నియమించాలని ప్రభుత్వాన్నిఆదేశించింది.. తర్వాత విచారణను వాయిదావేసింది..

15:49 - August 7, 2015

కర్నూలు : ఈనెల 4 న ఆదోనిలో ఓ భర్త తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పింటించిన ఘటనలో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. రంగమ్మ, తాయన్న దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. తన భర్త మద్యానికి బానిస కావడంతో..రంగమ్మ ఓ రోజు తన భర్తను నిలదీసింది. కుటుంబ పోషణలో తనకు సహకరించాలని అడిగింది. దీంతో..ఆగ్రహం చెందిన భర్త కిరోసిన్‌పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలైన బాధితురాలు రంగమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇవాళ నిందితుడు తాయన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు తల్లి మృతి, తండ్రి జైలుపాలు కావడంతో..ముగ్గురు పిల్లలు ఆనాథలయ్యారు.

ఆదర్శపాఠశాలల విధివిధానాలను ఖరారు చేసిన ఏపీ సర్కార్

హైదరాబాద్: పాఠశాలల హేతుబద్దీకరణ ప్రక్రియకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. 13 జిల్లాల్లో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు విధివిధానాల ఉత్తర్వులను విడుదల చేసింది. గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీలు ఒక యూనిట్ గా ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కిలోమీరు పరిధిలో 30 కంటే తక్కువ మంది విద్యార్థులున్న పాటశాలలను ఏకీకృతం చేసి ఆదర్శ పాఠశాల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆదర్శ పాఠశాలలో కనీసం 100 మంది విద్యార్థులు ఉండాలని... ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వులో పేర్కొంది.

తమిళనాడు సీఎం జయతో ప్రధాని మోడీ సుదీర్ఘ భేటీ

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ప్రధాని నరేంద్రమోడీ సుదీర్ఘ భేటీ అయ్యారు.. ఆమె నివాసంలో జయతో సమావేశమైన మోడీ సుమారు 50 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. తమిళనాడుకు కర్ణాటక, కేరళతో వస్తున్న జల వివాదాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ల్యాండ్ బిల్లుకు జయ మద్ధతును ప్రధాని కోరినట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని మోడీ నేరుగా ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. జయతో భేటీ కంటే ముందు మద్రాసు యూనివర్సిటీలో మోడీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు.

15:14 - August 7, 2015

గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్శిటిలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి ఘటనపై గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ ముందు వాదనలు ముగిశాయి.. ఆ కేసును సుమొటోగా తీసుకున్న కోర్టు... మాజీ ప్రిన్సిపల్ బాబూరావు, వార్డెన్ స్వరూపారాణిని విచారించింది.. కోర్టుముందు హాజరైన బాబూరావుపై న్యాయస్థానం సీరియస్ అయింది.. విద్యార్థులకు మంచి ప్రవర్తన నేర్పకపోవడంవల్లే ర్యాగింగ్ పెరుగుతోందని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు.. అటు బాబూరావును ఈ కేసులో ముద్దాయిగా చేర్చాలంటూ మహిళా న్యాయవాదులు... బాధితుల పక్షాన కేసు వేసేందుకు సిద్ధమయ్యారు.. మానవహక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు..

15:01 - August 7, 2015

నల్గొండ : జిల్లాలో మూఢనమ్మకాలు జడలు విప్పుతున్నాయి. సమాధుల్లోని శవాలను బయటకు తీసి మళ్లీ పూడ్చి పెడుతున్నారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని జనం నమ్ముతున్నారు. నల్గొండ జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామంలో వర్షాలు కురవకపోవడానికి గతంలో చనిపోయిన శవాలను సరిగ్గా పూడ్చకపోవడమే కారణమని కొందరు నమ్ముతున్నారు. దీంతో ఆ శవాలను సమాధుల నుంచి బయటకు వెలికి తీసి మళ్లీ పూడ్చిపెట్టారు. ఇదే గ్రామానికి చెందిన ఆలకుంట చిననర్సయ్య, ఉప్పుల స్రవంతి మృతదేహాలను సరిగ్గా అంత్యక్రియలు జరపలేదని భావించిన గ్రామస్తులు ఏడాది తర్వాత వారి సమాధుల నుంచి అస్తిపంజరాలు వెలికితీసి తిరిగి పూడ్చిపెట్టారు. ఈ అనాగరిక చర్య పట్ల పలువురు విమర్శిస్తున్నారు. 

14:57 - August 7, 2015

హైదరాబాద్: ఇంటి అలంకరణ విషయంలో మారుతున్న ట్రెండ్స్ కర్టెన్స్ ప్రాధాన్యతను పెంచుతున్నాయి. ఇంటీరియర్ లో కర్టెన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. అలాంటి లేటెస్ట్ కర్టెన్ వెరైటీస్ తో కొత్తపేట పివి మార్కెట్లో ఉన్న జ్యోతి హ్యాండ్ లూమ్స్ సొగసు వచ్చింది. మరి మీరు కూడా చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

14:48 - August 7, 2015

హైదరాబాద్ :మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎంతో మంది జీవితాల్లో ఎన్నో మార్పులను తెస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి ఒంటరితనం, ముఖ్యంగా ఒంటరి మహిళలు సమాజంలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవటం మనం చూస్తుంటాం. మరి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలను ఎలా నివారించాలి?  పెద్ద వయసు మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి ఎందుకిలా? ఎలాంటి స్థితిలో మహిళలు వివిధ రకాల ప్రమాదాలకు బలవుతున్నారు? ఒంటరి మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వంటి అంశాలపై 'నిర్భయ' కార్యక్రమంలో డాక్టర్ పూర్ణిమా నాగరాజు వివరించారు. మరి మీరూ వినాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త అనుచిత వ్యాఖ్యల పై ఆశా వర్కర్ల ఆందోళన

తూ.గో: కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పిల్లిఅనంతలక్ష్మి భర్త పిల్లిసత్తిబాబు తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాకినాడ కలెక్టరేట్‌ ఆఫీసు ఎదుట ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. కాకినాడ రూరల్‌ పండూరు పీహెచ్‌సీలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆశావర్కర్లు పీహెచ్‌సీలో ఉన్న సమస్యలను తీర్చాలని ఎమ్మెల్యేను కోరారు. ఆ వెంటనే ఎమ్మెల్యే భర్త పిల్లి సత్తిబాబు మీరెవరో తెలియదని, మీ సమస్యలు తెలియాలంటే మీతో కాపురం చేయాలా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎమ్మెల్యే భర్త సత్తిబాబు వ్యాఖ్యలపై ఆశావర్కర్లు మండిపడ్డారు. ఎమ్మెల్యే భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

డీకే అరుణకు సుప్రీం కోర్టులో చుక్కెదురు....

ఢిల్లీ: కేబినెట్ లో మహిళల స్థానంపై మాజీ మంత్రి డీకే అరుణ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తెలంగాణ రాష్ట్రం సహా మరో 7 రాష్ట్రాల్లో కేబినెట్ లో మహిళలకు స్థానం కల్పించలేదని డీకే అరుణ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు ఈ అంశం ముఖ్యమంత్రుల పరిధిలోనిదని పిటిషన్ ను తిరస్కరించింది. కేబినెట్ లో మహిళలకు స్వచ్ఛందంగా స్థానం కల్పించి ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాగా సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలోనైనా సీఎం కేసీఆర్ కేబినెట్ లో మహిళలకు స్థానం కల్పించాలని డికే అరుణ సూచించారు.

తుపాకీతో హల్ చల్ చేస్తున్న యువకుడి అరెస్ట్

కర్నూలు: కల్లూరులో తుపాకీతో హల్‌చల్ చేస్తున్న ఒక యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇషాక్ అనే వ్యక్తి తుపాకీతో తిరుగుతూ పలువురు యువకులను బెదిరించాడు. ఇది గమనించిన పోలీసులు ఇషాక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనినుంచి ఐదు ఎయిర్‌గన్‌లు, 3 బుల్లెట్లు ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మాజీ మంత్రి శంకర్రావు పై హెచ్ ఆర్సీలో ఫిర్యాదు..

హైదరాబాద్ : మాజీ మంత్రి శంకర్రావుపై మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్సీ)లో ఫిర్యాదు నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో తన 40 ఎకరాల భూమి ఆక్రమించుకుని వేధిస్తున్నారని శ్రీనివాసరావు అనే వ్యక్తి హెచ్‌ఆర్సీని ఆశ్రయించాడు. తనను వేధింపులకు గురి చేస్తున్న శంకర్రావుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రెండు బైకులు ఢీ: ఇద్దరి మృతి..

మెదక్ : ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు శుక్రవారం ప్రమాదవశాత్తూ ఢీ కొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.. ఈ ప్రమాదం కోహిర్ మండలం కవేలి కూడలి వద్ద జరిగింది. ఈ సకనయాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

టిటిడి వెబ్ సైట్ కు యూజర్స్ తాకిడి

తిరుమల: ఆన్ లైన్ లో ఆగస్టు22 అక్టోబర్ 2 వరకు ఉన్న 25.577ఆర్జిత సేవా టికెట్ల కొనుగోలుకు విశేష స్పందన వచ్చింది. వెబ్ సైట్ కు యూజర్ల తాకిడి ఎక్కువ కావడంతో టిటిడి వెబ్ సైట్ హ్యాంగ్ అయ్యింది. ఆన్ లైన్ ద్వారా ఇప్పటి వరకు 400 టికెట్లు విక్రయించారు.

14:08 - August 7, 2015

ఢిల్లీ: ఎపికి ప్యత్యేకహోదా ఇవ్వాలని ఎంపీ మురళీమోహన్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్ర విభజన చేశారని మండిపడ్డారు. నడిరోడ్డుపై నిలబడి ఉన్నామని వాపోయారు. విభజన డాక్యుమెంట్లలో ఎపికి ప్రత్యేక హోదా కల్పిండం మరిచిపోయారని పేర్కొన్నారు. ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన అవవరసరముందని తెలిపారు. చేద్దాం... చూద్దాం.. అంటున్నారు..కానీ చేయడం లేదని విమర్శించారు. ఎపిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందన్నారు. ఇతర రాష్ట్రాలతో ఎపిని పోల్చడం సరికాదన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలది వేరే పరిస్థితి, ఎపి పరిస్థితి వేరన్నారు. ప్రత్యేకప్రత్తిపత్తి లేకపోతే.. ఎపి అభివృద్ధి కాలేదని చెప్పారు. పరిశ్రమలన్ని హైదరాబాద్ చుట్టే.. ఉన్నాయన్నారు.

 

14:00 - August 7, 2015

విశాఖ: అసెంబ్లీ వచ్చే బడ్జెట్‌ సమావేశాలను విశాఖలో నిర్వహించాలని ప్రభత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. స్పీకర్‌తో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 4వరకు అసెంబ్లీ వర్షకాల సమావేశాలు జరగనున్నాయి.

13:59 - August 7, 2015

పశ్చిమగోదావరి: ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం నెలకొంది. ముగ్గురు జూనియర్లను ఇద్దరు సీనియర్లు ర్యాగింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

13:56 - August 7, 2015

ఢిల్లీ : లలిత్‌ మోడీ వ్యవహారంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై లెఫ్ట్ పార్టీలు మండిపడ్డాయి. లలిత్‌మోడికి సహాయం చేసిన సుస్మాస్వరాజ్‌పై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సుష్మస్వరాజ్‌పై వచ్చిన ఆరోపణలపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందో దేశప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఏచూరి అన్నారు. దేశానికి ప్రధానిని కాదు...ప్రజాసేవకుడిని అని చెప్పుకుంటున్న మోడీ..లలిత్‌మోడీ విషయంలో సుష్మా స్వరాజ్ వ్యవహరించిన తీరుపై కేంద్రం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

 

13:53 - August 7, 2015

ఢిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా కావాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా తెస్తామని ప్రగల్బాలు పలికిన నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని తెలిపారు. ప్రణాళిక సంఘం చెప్పే మాటలు ప్రభుత్వం వినదని.. ప్రభుత్వం మాటే ఆ సంఘం విటుందని చెప్పారు. తెలుగు ప్రజలు భిక్షాటనకు రాలేదని..రాజకీయ హక్కు కోసం వచ్చామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా తల్లిపాల లాంటిది అభివర్ణించారు. ప్రత్యేకహోదా ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు.

 

13:46 - August 7, 2015

విజయవాడ: విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఏపీలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. అన్ని స్కూళ్లకు బంద్‌ ప్రకటించిన ఎస్‌ఎఫ్‌ఐ పలు చోట్ల ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. 'చంద్రబాబు కార్పొరేట్ విద్యకు ఏజెంట్ గా మారాడు. హాస్టళ్ల మూసితేకు ప్రభుత్వం పూనుకుంది. విదేశీ యూనిర్సిటీలను వ్యతిరేకిస్తున్నాం. డిగ్రీలో సెమిస్టర్ విధానాన్ని ఉపసంహరించురోవాలి. రిషితేశ్వరి ఘటన నిందితులును ప్రభుత్వం కాపాడుతోంది. నిబంధనలకు విరుద్దంగా ఉన్న ప్రయివేట్, కార్పొరేట్ సంస్థల రద్దు చేయాలి. రిషితేశ్వరి ఘటనను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది. ప్రభుత్వం ఫీజు రియింబర్స్ మెంట్ లో అనేక నిబంధనలు ప్రవేశపెట్టింది. సమస్యలను పరిష్కరించకుంటే.. పెద్ద ఎత్తున ఆందోళన, కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు.

 

'అనంత' జిల్లాలో చినరాజప్ప పర్యటన

అనంతపురం: గంగులకుంటలో డిప్యూటీ సీఎం చినరాజప్ప పర్యటించారు. ఎండిపోయిన వేరుశనగ పైర్లను పరిశీలించారు. 15.5 లక్షల ఎకరాల సాధారణ సాగుకు గానూ.. ఈ ఏడాది 5.75 లక్షల ఎకరాల్లోనే వేరుశనగ విత్తు పడిందన్నారు.

 

సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్....

పశ్చిమగోదావరి: ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ముగ్గురు జూనియరు విద్యార్థులను ఇద్దరు సీనియరు విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశార. పోలీసులు కేసు నమోదు చేశారు.

 

13:25 - August 7, 2015

ఢిల్లీ: ఉధంపూర్‌లో జరిగిన టెర్రరిస్టు దాడిని నేషనల్‌ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనుంది. బుధవారం ఉధంపూర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు బిఎస్‌ఎఫ్‌ జవాన్లతో పాటు ఓ టెర్రరిస్టు మృతి చెందాడు. మరో ఉగ్రవాది నావేద్‌ సజీవంగా పట్టుబడ్డాడు. మహ్మద్‌ నావేద్‌ యాకూబ్‌పై వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బిఎస్‌ఎఫ్‌ సిబ్బందిని కూడా విచారించే అవకాశం ఉంది. అలాగే సాయుధ ఉగ్రవాదిని ధైర్యంగా పట్టుకున్న ఇద్దరు గ్రామస్తులను కూడా ఎన్‌ఐఏ విచారించనుంది.
ఆసక్తికరమైన విషయాలు వెల్లడి
ఎన్‌ఐఏ బుధవారం రాత్రంతా జరిపిన దర్యాప్తులో నావేద్‌ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. తనతోపాటు చాలామందికి పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ శిక్షణ ఇచ్చిందని పేర్కొన్నాడు. లష్కరే తోయిబా ఉగ్రవాదులకు రెండు రకాలుగా శిక్షణనిస్తోంది. మొదటి దశలో శారీరక సామర్థ్యం పెంచుకోవడం, కొండలు ఎక్కడం, చిన్నపాటి ఆయుధాల తయారీలో శిక్షణ ఇవ్వగా... రెండో దశలో భారీ ఆయుధాల వినియోగం, పేలుడు పదార్థాల తయారీలో శిక్షణ పొందినట్టు నావేద్‌ తెలిపాడు.
కట్ చేసి భారత్‌లోకి
పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఉత్తరకశ్మీర్‌లోని బారాముల్లా సరిహద్దులో ఉన్న కంచెను కట్ చేసి భారత్‌లోకి చొరబడ్డారు. మొదట తంగ్‌మార్గ్, బాబారేపి ప్రాంతంలో స్థావరం ఏర్పరచుకున్న ఉగ్రవాదులు ఆ తర్వాత అవంతిపుర, పుల్వామా ప్రాంతాలకు మార్చారు. అనంతరం రెండు బృందాలుగా విడిపోయి ట్రక్కులో ఉధంపూర్‌ చేరుకున్నట్టు నావేద్‌ చెప్పాడు. నావేద్‌ వెల్లడించిన ప్రాంతాల్లోను అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు పుల్‌వామా జిల్లాలోని కాకాపోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్‌-ఎ-తోయిబాకు చెందిన ఉగ్రవాది మృతి చెందాడు. ఈ ప్రాంతంలో ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి.

 

13:11 - August 7, 2015

హైదరాబాద్‌: నిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం దూకుడు పెంచింది. తనకు అనుకూలంగా ఉన్న విధానాలను వైద్యులపై బలవంతంగా రుద్దుతోంది. ఆ విధానాలే ఇప్పుడు సీనియర్ వైద్యులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. గతంలో ప్రమోషన్లలో గోల్‌మాల్ జరిగడంతో..ఎయిమ్స్ లాంటి నిబంధనలు తీసుకురావాలని నిమ్స్ డాక్టర్లంతా డిమాండ్ చేశారు. ఏడాది క్రితం రాష్ట్రపతి పాలన సమయంలో నిమ్స్‌లోని చట్టాల మార్పుకు త్రిసభ్య కమిటీ వేశారు. నిమ్స్‌లో త్రీ-టైర్ విధానాన్ని అమలు చేయాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో గత ఏప్రిల్ నెల నుంచి త్రీ-టైర్ విధానం అమలు చేస్తున్నట్లు నిమ్స్ యజమాన్యం ప్రకటించింది.
ప్రొఫెసర్ల నియామకాల్లో నాలుగంచెల వ్యవస్థ
నిమ్స్ లో ఇప్పటి వరకు ప్రొఫెసర్స్ నియామకాల్లో నాలుగంచెల వ్యవస్థ ఉండేది. అసిస్టెంట్ ప్రొ ఫెసర్‌, అసొసియేట్‌ ఫ్రొఫెసర్‌, అడిషనల్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ లాంటి పోస్టులు ఉన్నాయి. కాని ఇప్పుడు వచ్చిన కొత్త విధానం త్రీ-టైర్‌ ప్రకారం అడిషనల్ ప్రొఫెసర్ అనే పోస్ట్ ఉండదు. అసొసియేట్‌ ప్రొఫెసర్ తర్వాత డైరెక్టుగా ప్రొఫెసర్ అయిపోతారు. అయితే తక్కువ కాలంలోనే అనుభవం లేకుండా నేరుగా ప్రొఫెసర్‌ను చేస్తే నిమ్స్‌కే తీరని నష్టమని సీనియర్ వైద్యులు వాదిస్తున్నారు. నిమ్స్ ప్రాధాన్యతను దిగజార్చడానికి కుట్రలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. కొందరి వ్యక్తిగత లబ్ధికోసం తెలంగాణ సర్కార్‌ను, అధికారులను , మంత్రులను తప్పుదోవపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
త్రీ-టైర్‌ విధానం అమలు చేయాలని ఎంసీఐ సూచన
నిమ్స్ సీనియర్ వైద్యులు చేస్తున్న ఆరోపణలను యాజమాన్యం కొట్టిపారేస్తోంది. తమకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాల మేరకు త్రీ-టైర్ విధానాన్ని అమలు చేస్తున్నామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్.నరేంద్రనాధ్ స్పష్టం చేస్తున్నారు. గత నెల 13న ఎంసిఐ అన్ని రాష్ట్రాలకు నిబంధనలపై లేఖలు పంపిందంటున్నారు. వైద్యుల ప్రమోషన్ల విషయంలో త్రీ-టైర్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆ లేఖలో సూచించినట్లు ఆయన తేల్చిచెబుతున్నారు.
ఆగస్టు14న నిమ్స్ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశం
నిమ్స్ వైద్యలు పోరుబాట పట్టిన నేపథ్యంలో ఈ నెల 14 న నిమ్స్ ఎగ్జిక్యూటీవ్‌ బోర్డు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరి ఆ బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

 

13:00 - August 7, 2015

హైదరాబాద్: రాయలసీమలో ప్రాజెక్టుల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఒకపక్క పాలకులు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నప్పటికీ.. అక్కడి పరిస్థితులను చూస్తుంటే అది సాధ్యమయ్యే పనిగా కన్పించడం లేదు. మరోపక్క పెరిగిన అంచనాలకు అనుగుణంగా రేట్లు పెంచితే గానీ పనులు చేసేదీ లేదని కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్నారు. దీంతో హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయి.
కాంట్రాక్టర్లను బుజ్జగిస్తున్న పాలకులు
2004లో ఈ ప్రాజెక్టులను డిజైన్‌ చేయడంతో.. అప్పటి అంచనాల మేరకే పనులు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అవసరమైతే కొద్దిమేర పెంచాలని యోచిస్తుంది. దీనికిగాను ప్రభుత్వం జీవో 23ను విడుదల చేసింది. కానీ.. కాంట్రాక్టర్లు మాత్రం ఈ నిర్ణయాన్ని అంగీకరించడం లేదు. కాంట్రాక్టర్లు కోరిన విధంగా చెల్లించాలంటే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని భావిస్తున్న పాలకులు కాంట్రాక్టర్లను బుజ్జగించే పనిలో పడ్డారు. కాంట్రాక్టర్లను ఒప్పించే బాధ్యతలను చీఫ్‌ ఇంజనీర్లకు అందించారు. వారిని ఎలాగైనా ఒప్పంచి పనులు చేసేలా చూడాలని అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.
మరో సమస్యగా భూసేకరణ
మరోవైపు కాంట్రాక్టర్ల వైఖరితో ప్రాజెక్టుల పనులు నిలిచిపోగా.. భూసేకరణ కూడా మరో సమస్యగా తయారైంది. ఇక ఇన్ని సమస్యలతో ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి చేయడం సాధ్యమా అనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులు పూర్తికాకుండా పట్టిసీమ ప్రాజెక్ట్‌ ప్రారంభించి ఏం ఉపయోగం అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని సమస్యలను అధిగమించి ప్రభుత్వం ఏ విధంగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తుందో చూడాలి.

 

 

12:56 - August 7, 2015

హైదరాబాద్: స్వరాష్ట్రంలో గులాబీ లీడర్లకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందు... అన్ని అంశాలపై ధారళంగా ప్రసంగించే నేతలంతా ఇప్పుడు మౌనవ్రతం పాటిస్తున్నారు. ఏ విషయంపై ఎలా స్పందిస్తే..? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో..? కారు పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. పార్టీ సీనియర్ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు.
టీఆర్ఎస్ శ్రేణుల్లో అసంతృప్తి
అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేయాల్సిన అధినేత పార్టీపై పెద్దగా దృష్టి పెట్టలేదనే అసంతృప్తి టీఆర్ఎస్ శ్రేణుల్లో కలుగుతోంది. కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ పైనే దృష్టి పెట్టారని, మిగతా జిల్లాల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ క్యాడర్ వాపోతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్‌ జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం తర్వాత... కార్యవర్గాల నియామకం ఇప్పటి వరకు జరగకపోవడం గులాబీదళంలో చర్చనీయంశంగా మారుతోంది.
ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు
మరోవైపు పార్టీని బలమైన రాజకీయ శక్తిగా తీర్చి దిద్దేందుకు నేతలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించిన కేసీఆర్‌ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే గుసగుసలు తెలంగాణభవన్‌లో వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఉన్నా... ఆదిశగా ప్రచారం దక్కడం లేదంటున్నాయి. ఇక తమపై విమర్శలు వస్తే క్షణాల్లో స్పందించే గులాబీ లీడర్లు... విపక్షాలు దూకుడుగా వ్యవహరిస్తున్నా... ఆ స్థాయిలో స్పందించకపోవడం టీఆర్‌ఎస్‌లో చర్చనీయంశంగా మారింది. పార్టీలో పరిస్థితి ఇదే విధంగా ఉంటే... రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి మరిన్ని ఇబ్బందులు తప్పదనే ఆందోళన నేతల్లో కనిపిస్తోంది.

 

12:43 - August 7, 2015

హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద సవాల్‌గా మారుతోంది. రాజధానిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని చెబుతున్న లీడర్లు... ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి తరలించే విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదే అంశంపై ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగినా స్పష్టత మాత్రం రావడం లేదు.                                                                                 
అటకెక్కిన ఏపీ సర్కార్ ప్రతిపాదన 
ప్రజలకు దగ్గరగా ఉన్న శాఖలను త్వరగా తరలించేందుకు... తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేస్తామని ఏపీ సర్కార్‌ ప్రకటించింది. ఇందుకోసం విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో అనువైన స్థలాలను కూడా గుర్తించింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో..? ఆ ప్రతిపాదనను అటకెక్కించింది. తాజాగా మరోసారి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై దృష్టి సారించింది. వీలైనంత త్వరగా కార్యాలయాలను తరలించేందుకు సిద్ధమైంది.
ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టిన ఉద్యోగులు
మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగినా పెద్దగా ఫలితం లేదు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం చెట్ల కిందైనా కూర్చుని పనిచేస్తామన్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచారు. ఇప్పటికిప్పుడు కార్యాలయాలను విజయవాడకు తరలిస్తే తాము సమస్యలు ఎదుర్కొంటామంటున్నారు.
కార్యాలయాలన్నీ ఒకేసారి తరలించాలన్న సీఎస్‌
ఇక కార్యాలయాల తరలింపు అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు కార్యాలయాలన్నింటిని ఒకేసారి తరలించాలన్నారు. కానీ ఏమైందో తెలియదు.. మీటింగ్‌ జరిగి 24 గంటలు ముగియక ముందే... ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కృష్ణారావు ప్రకటించారు. మొత్తానికి అమరావతి పిలుస్తోంది..! కార్యాలయాలన్నీ ఒకేసారి తరలిస్తామని చెప్పిన ప్రభుత్వం... తాజాగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అసలు కార్యాలయాలను ఎప్పుడు తరలిస్తారు...? ప్రభుత్వమెలాంటి నిర్ణయం తీసుకుంటదనే సందేహం ఏపీ ఉద్యోగుల్ని వెంటాడుతోంది.

 

12:37 - August 7, 2015

ఢిల్లీ: కేంద్ర మంత్రి సుస్మాస్వరాజ్‌పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సుష్మస్వరాజ్‌ తన శాఖలో ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా లలిత్‌మోడికి సహాయం చేశారని విమర్శించారు. లలిత్‌మోడీకి ఈ సహాయం చేసినందుకు సుష్మాస్వరాజ్‌ భర్తకు, ఇతర కుటుంబసభ్యులకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయని రాహుల్‌ విమర్శించారు. వీటన్నంటికి సుష్మస్వరాజ్‌ సమాధానం చెప్పాలన్నారు.

 

12:32 - August 7, 2015

ఢిల్లీ: పసుపు రైతులను ఆదుకోవాల్సిన అవసరం కేంద్రప్రభుత్వానికి ఉందని టిఆర్ ఎస్ ఎంపీ కవిత అన్నారు. కాఫీ, పసుపు, చింతపండు పంటలకు కనీస మద్దతు ధరను పెంచాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణలో పసుపు పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతుందని...అందుకు పసుపుబోర్డును ఏర్పాటు చేయాలని కవిత కోరారు. తెలంగాణలో స్పైస్‌ పార్క్ ను ఏర్పాటు చేయాలని కోరారు. అయితే దీనిపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ...పసుపుకు కనీస మద్దతు ధరను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. దాంతో పాటు తెలంగాణలో స్పైస్‌ పార్క్ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందన్నారు.

 

12:25 - August 7, 2015

ఢిల్లీ: విపక్ష సభ్యుల ఆందోళనలతో రాజ్యసభ అట్టుడికింది. కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఆ పార్టీ ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది.

 

12:19 - August 7, 2015

ఢిల్లీ: రాజ్యసభ రెండో సారి వాయిదా పిడింది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేస్నున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మొదటి సారి సభ మధ్యాహం 12 గంటలకు వాయిదా పడింది. వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభమైంది. విపక్షాలు సభలో ఆందోళన చేపట్టాయి. స్పీకర్ ఎంత చెప్పిన వినలేదు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటల వరకు సభను మరోసారి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

రాజ్యసభ మ.2.30 గంటల వరకు వాయిదా...

ఢిల్లీ: రాజ్యసభ రెండో సారి వాయిదా పిడింది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేస్నున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మొదటి సారి సభ మధ్యాహం 12 గంటలకు వాయిదా పడింది. వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభమైంది. విపక్షాలు సభలో ఆందోళన చేపట్టాయి. స్పీకర్ ఎంత చెప్పిన వినలేదు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటల వరకు సభను మరోసారి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

 

వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ

ఢిల్లీ: వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభమైంది. అంతకముందు స్పీకర్ మధ్యాహ్నం 12 గంటలకు వరకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

 

12:00 - August 7, 2015

ఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ వరుసగా నాలుగో రోజు పార్లమెంటు ముందు ఆందోళనలకు దిగింది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ ముందున్న గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీల సస్పెన్షను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 

11:55 - August 7, 2015

ఉత్తరాఖండ్‌: దేశంలో ఆకతాయిలు, చిల్లర మూకల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. వారి వికృత చేష్టలు విలయతాండవం చేస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో పోకిరీలు రెచ్చిపోయారు. రామ్‌నగర్‌లో నది ఒడ్డుకు వెళ్లిన ఓ యువ జంటను ఆరుగురు యువకులు చితక్కొట్టారు. పోకిరీల నుంచి తప్పించుకున్న యువ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరుగురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

11:42 - August 7, 2015

విశాఖ: జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఓ యువకుడ్ని గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా కత్తితో పొడిచి చంపి పెట్రోల్‌ పోసి నింప్పంటించారు. కాలి బూడిదైన యువకుని శవం ఆనవాళ్ళు రాంబిల్లి మండలం కొత్త కోడూరు తోటల్లో గుర్తించారు. కత్తితో నరికి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించారా..లేదంటే కత్తులతో దాడిచేసి కొన ఊపిరితో ఉంటే సజీవ దహనం చేసారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకుని శవంపైనే అతని బైక్‌ను కూడా దహనం చేశారు. రాంబిల్లి మండలం కొత్త కోడూరు శివార్లలో రాత్రి 10 గంటల తరువాత ఈ హత్య జరిగినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అయితే..హత్యకు గురైన ఆ యువకుడు ఎవరు, హత్యకు కారణాలు ఏమై ఉంటాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

11:33 - August 7, 2015

ఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్‌మిశ్రాకు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. దీపక్‌మిశ్రాను వదలిపెట్టే ప్రసక్తే లేదని..మిశ్రాను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. ముంబై పేలుళ్ల ఉగ్రవాది యాకూబ్‌ మెమన్‌ పిటీషన్‌ను దీపక్‌ మిశ్రా విచారించారు. యాకూబ్‌ పెట్టుకున్న పిటీషన్‌ను కొట్టివేస్తూ అతనికి ఉరిశిక్షను ఖరారు చేశారు. దీంతో దీపక్‌ మిశ్రాను చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు వస్తున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బెదిరింపు లేఖ ఎక్కడి నుంచి వచ్చింది ? ఎవరు పంపించారు అనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు దీపక్‌ మిశ్రాకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 

పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట సోనియాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. లలిత్ గేట్ వ్యవహారంలో ఎన్ డిఎ ఉదాసీనతపై నిరసన వ్యక్తం చేశారు. మాటల గారడీలో సుష్మాస్వరాజ్ నిష్ణాతురాలని సోనియా ఎద్దేవా చేశారు.

 

11:03 - August 7, 2015

వర్షాభావ పరిస్థితుల్లో కరువు నుంచి ప్రజల్ని ప్రభుత్వం రక్షించాలని దిహన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ. నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. నీరు, పశుగ్రాసం అందుబాటులో ఉండేలా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
మరిన్ని వివరాలను ఆయన మాటాల్లోనే...
' తెలుగు రాష్ట్రాలో తీవ్రమైన కరువు ఉంది. తెలంగాణలోని చాలా జిల్లాలో కరువు ఉంది. యాగాల ద్వారా వర్షాలు వస్తాయంటున్నారు.. అది తప్పు. యాగాలు చేస్తేనే వర్షాలు వచ్చేటట్టైతే అందరం యాగాలు చేసేవాళ్లం. కానీ యాగాల ద్వారా వర్షాలు రావు. వర్షాభావ పరిస్థితుల్లో కరువు వచ్చిన నేపథ్యంలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు ప్రభుత్వాలు దగ్గర ఉన్నాయా..? దేశంలో, రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉంది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి...భారత దేశానికి 4 ఏళ్లు కరువు ఉంటుంది. వాతారణ మార్పు వల్ల వర్షాలు రాక తీవ్ర ఏర్పడుతుంది. రాబోయే కాలంలో తీవ్రమైన వర్షాభావపరిస్థితులు వస్తాయి.
నాలుగు భద్రతాంశాలపై దృష్టి...
వర్షాభావ పరిస్థితుల్లో కరువు ఎదుర్కొనేందుకు వాటర్, ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ, లైవ్ లీ వుడ్ వంటి నాలుగు భద్రత అంశాలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను వేసుకోవాలి. భారతదేశంలో 100 కోట్ల ఫామ్ ఎనిమల్స్ ఉన్నాయి. వాటికి నీరు, పశుగ్రాసం అందించాలి. మూడు అంచెలలో ఆహారధాన్యాలను నిల్వఉంచుకొని.. పద్ధతులు కల్పించాలి. క్రాప్ సెక్యూరిటీకి సీడ్ బ్యాంకులు అవసరం. ప్రభుత్వాలు వ్యవసాయేతర పనులను పెద్ద ఎత్తున కల్పించాలి. ఆగ్రోవ్యవసాయం చేయాలి. భూ సారాన్ని పెంచే చెట్లను పెంచాలి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

దోషులను రక్షిస్తున్న మోడీ: కరత్

ఢిల్లీ: దోషులను రక్షించి మోడీ తప్పు చేస్తున్నారని పీపుల్స్ డెమోక్రసి సంపాదకుడు ప్రకాశ్ కరత్ విమర్శించారు. పార్లమెంట్ ప్రతిష్టంభనకు ప్రభుత్వ మొండి వైఖరే కారణమన్నారు. పార్లమెంట్ కు ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు. నాగా ఒప్పందం చారిత్రాత్మకమని చెప్పడం తొండరపాటని పేర్కొన్నారు.

 

హైదరాబాద్ పాతబస్తీలో రూ.10 లక్షలు స్వాధీనం

హైదరాబాద్: అలియాబాద్ లో ఛత్రినాక పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

10:31 - August 7, 2015

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఉధంపూర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగి 48 గంటలు అయినా గడవక ముందే మరోసారి ఉగ్రవాదులు పోలీసు ఔట్‌పోస్ట్‌పై దాడికి దిగారు. ఉగ్రవాదులు చేసిన మెరుపుదాడిలో ఇద్దరు స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ దాడి జరిగిన ప్రాంతం బసంత్‌గడ్‌గా భద్రతాబలగాలు గుర్తించాయి. ఇదిలా ఉంటే ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పరిస్థితిని అదుపులో తేవడానికి అదనపు బలగాలు పంపుతున్నామని బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదులు వాస్తవాధీన రేఖ దాటి ఉజ్‌ నది గుండా సుమారు 4 నుంచి 6 గురు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడినట్లు సమాచారం.

 

10:25 - August 7, 2015

విశాఖ: నగరంలో రైతు బజార్ల పనితీరుపై మంత్రి గంటా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతమ్మధార రైతు బజార్ ఎస్టేట్ అధికారి నారాయణను సస్పెండ్ చేశారు. రైతు బజార్లలో ఆకస్మికంగా మంత్రి గంటా తనిఖీలు చేశారు.. టాయ్‌లెట్లు పరిశుభ్రంగా లేవంటూ మండిపడ్డారు. 20 రూపాయలకు కిలో ఉల్లి అమ్మకాలను కూడా గంటా పరిశీలించారు. కౌంటర్లు పెంచాలని ఆదేశించారు. ఉల్లి కొలతల్లో తేడాలున్నాయని అక్కడి జనాలు మంత్రికి ఫిర్యాదు చేశారు.

 

10:14 - August 7, 2015

గుంటూరు: విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ఆందోళనల్ని ఉదృతం చేశారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు బంద్‌ ప్రకటించిన ఎస్‌ఎఫ్‌ఐ..స్కూళ్లకు వస్తున్న బస్సులను అడ్డుకుంటున్నారు. గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌లో స్కూళ్లకు వస్తున్న వివిధ విద్యాసంస్థల్ని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో పోలీసులకు విద్యార్థి సంఘాలకు మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. బస్సులను అడ్డుకోవద్దని పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులకు నచ్చచెప్పినా ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం వినకుండా ఎక్కడికక్కడ బస్సులను ఆపేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కేజీ టు పీజీ పథకాన్ని అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్ నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

09:51 - August 7, 2015

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని వక్తలు విమర్శించారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, బిజెపి అధికార ప్రతినిధి ఉప్పాల శారద, టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిర, టిడిపి ఎపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టాభీరామ్, టీఆర్ ఎస్ నేత రాకేశ్ పాల్గొని, మాట్లాడారు. సమస్యలను పరిష్కరించకుండా.. ఇరు రాష్ట్ర ప్రభుత్వ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని చర్చించుకోవడం మంచిదని హితవుపలికారు. సామరస్యపూర్వక చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:40 - August 7, 2015

ఇవాళ ఆగస్టు 7. ఇవాళ్టి రోజుకి చారిత్రక ప్రాధాన్యత వుంది. 1905 లో సరిగ్గా ఇదే రోజు విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఈ రోజుకు మరో ప్రాధాన్యత కూడా వుంది. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవంగా పాటిస్తున్నారు. మనదేశంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించాలనీ, హ్యాండ్‌ లూమ్‌ పాలసీ ప్రకటించాలనీ గత కొన్నేళ్లుగా చేనేత కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చేనేత రంగం స్థితిగతులపై జనపథంలో చేనేత కార్మిక సంఘం నేత రమేష్‌ మాట్లాడారు. ప్రభుత్వ విధానాల వల్లే చేనేత రంగం కుదేలయిందని విమర్శించారు. చేనేత కార్మికులు దివాళా తీయడానికి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని మండిపడ్డారు. చేనేత రంగాన్ని రక్షించాలని కోరారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

సుప్రీంకోర్టు జడ్డి దీపక్ మిశ్రాకు బెదిరింపు లేఖ..

ఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్డి దీపక్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చింది. మిశ్రాను వదిలిపెట్టబోమని దుండగులు లేఖలో హెచ్చరించారు. దీంతో దీపక్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీపక్ మిశ్రా యాకుబ్ మెమన్ పిటిషన్లను విచారించారు.  

ఉధంపూర్ లో మరోసారి 'ఉగ్ర'దాడి

జమ్మూకాశ్మీర్: ఉధంపూర్ లో మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసు పోస్టు లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

 

19 మంది చిన్నారులకు విముక్తి

శ్రీకాకుళం: ఆముదాలవలస రైల్వే స్టేషన్ లో ఐసిడిఎస్ అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. గుజరాత్ కు అక్రమంగా తరలిస్తున్న 19 మంది చిన్నారులకు విముక్తి కలిగించారు.

 

 

08:46 - August 7, 2015

విశాఖ: సింహాచలం కొండపై అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 షాపులు దగ్ధమయ్యాయి. మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

08:40 - August 7, 2015

నల్గొండ: జిల్లాలోని సూర్యపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. మేఘనా ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు నిన్న ఉదయం 6.30 గంటలకు విజయనగరం నుంచి హైదరాబాద్ బయలుదేరింది. బస్సులో 38 మంది ప్రయాణికులున్నారు. మార్గంమధ్యలో నల్గొండ జిల్లా సూర్యపేట మండలం టేకుమట్ల వద్ద ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడింది. దీంతో 20 మందికి గాయాలయ్యాయి. 16 మంది క్షతగాత్రులను సూర్యపేట ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హైదరాబాద్ తరలించే అవకాశముంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

 

08:02 - August 7, 2015

మన దేశంలో వ్యవసాయం తర్వాత టెక్స్‌టైల్‌ రంగమే ఎక్కువ మందికి జీవనోపాధి చూపిస్తోంది. మనదేశంలోని కొన్ని వేల గ్రామాల్లో చేనేత మగ్గాలున్నాయి. వీరి ప్రతిభాపాటవాలు, నైపుణ్యమూ అగ్రరాజ్యాలను సైతం ఆకర్షిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ లాంటి దేశాల్లోనూ మన చేనేత వస్త్రాలకు చక్కటి గిరాకీ వుంది. అయినా, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితిలో చేనేత కార్మికులు చిక్కుకోవడానికి కారణం ఏమిటి?
ఆకలి కేకల్లో చేనేత కార్మికులు
అగ్గిపెట్టెలో ఒదిగేపోయే పట్టు చీరలను నేసే నైపుణ్యం ఉన్నా, ఏ రోజూ నాలుగు మెతుకులకు నోచుకోని అభాగ్యులు వారు. కంటికి ఇంపైన రంగులతో, చూడముచ్చటైన వస్త్రాలను నేసే ఆ కుటుంబాలలో పసిపిల్లలు ఊగే ఉయ్యాలలు కనిపించవు. వారి ఇళ్లలో ఎప్పుడూ ఉరితాళ్లే వేలాడుతుంటాయి. ఇదేదో మాట వరుసకు అంటున్నమాట కాదు. వర్తమాన భయానక వాస్తవం.
అప్పుల ఊబిలో చేనేత రంగం
అవును. ఇప్పుడు చేనేత బతుకులు ఉరికంభం మీద తలవాలుస్తున్నాయి. సిరిసిల్ల, గద్వాల, ధర్మవరం, మాధవరం, పోచంపల్లి, పొన్నూరు, చీరాల, మంగళగిరి, ఎమ్మిగనూరుఇలా ఎక్కడికెళ్లినా చేనేత కార్మికుల ఇళ్లలో ఉరితాళ్లు తప్ప మరేమీ కనిపించవు. ఆకలి కేకలు తప్ప మరేమీ వినిపించవు. మన దేశంలో చేనేత కార్మికుల్లో 57శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువున నివసిస్తున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. ఏకంగా 80శాతం మంది అప్పుల ఊబిలో కూరుకుపోవడం చేనేత రంగం ఎదుర్కొంటున్న దీనస్థితికి నిదర్శనం. పోషకాహారలోపం వీరి ఆరోగ్యాలను కుళ్లబొడుస్తోంది. పిల్లలకు మంచి స్కూళ్లల్లో చదువు చెప్పించలేని దైన్యం వీరిది.
చేనేత కార్మికుల్లో అత్యధికులు బలహీనవర్గాలవారే
మన దేశంలో వ్యవసాయ తర్వాత ఎక్కువ మందికి జీవనోపాధిని కల్పిస్తున్నది చేనేతరంగమే. మనదేశంలో తయారవుతున్న వస్త్రాల్లో దాదాపు 20శాతం వాటా చేనేతరంగానిదే. ఆరున్నర బిలియన్‌ చదరపు మీటర్ల వస్త్రాన్ని నేత కార్మికులు మనకు అందిస్తున్నారు. దేశం మొత్తం మీద దాదాపు 40లక్షల మగ్గాలున్నాయి. ఒక్క తెలుగునేల మీదే మూడున్నర లక్షల కుటుంబాలకు చేనేత రంగం బతుకుదెరువు చూపిస్తోంది. చేనేత కార్మికుల్లో అత్యధికులు బలహీనవర్గాలవారే. వీరిలో 40శాతం మంది మహిళలే.
చేనేత వస్త్రాలంటే విదేశీల్లో క్రేజ్‌
ఒకప్పుడు ఎందరెందరో మహారాజులను, మహారాణులను ఆకర్షించిన మన చేనేత వస్త్రాలంటే ఇప్పటికీ విదేశీల్లో తరగని క్రేజ్‌ వుంది. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీల దేశీయులకు మన చేనేత వస్త్రాలంటే మహా ఇష్టం. ఫ్రాన్స్‌, బెల్జియం, నెదర్లాండ్స్‌, కెనడాలలోనూ చక్కటి గిరాకీ వుంది. ఇన్ని దేశాల్లో తమకంటూ ఓ మార్కెట్‌ను సృష్టించుకున్న మన చేనేత కార్మికులు ఏటా దేశానికి 467 మిలియన్‌ డాలర్లు సంపాదించిపెడుతున్నారు. దేశానికి భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యం ఆర్జించిపెడుతున్న చేనేత కార్మికులెవరూ ప్రభుత్వ సాయంతోనో, కార్పొరేట్‌ ప్రభువుల దయాదాక్షిణ్యాలతోనో శిక్షణ పొందినవారు కాదు. ఇది ప్రతి ఒక్కరూ తమ పెద్దల నుంచి స్వయంగా నేర్చుకున్న బతుకుపాఠం. పర్యావరణానికి ఏ మాత్రం హాని చేయకపోవడం చేనేతరంగానికున్న మరో సుగుణం.
చేనేత రంగం పట్ల ప్రభుత్వాల వివక్ష
ప్రభుత్వం వైపు నుంచి తగిన ప్రోత్సాహం లేకపోవడం, మార్కెట్‌ సౌకర్యాలు కల్పించకపోవడం, ఇన్‌పుట్‌ సబ్సిడీలు అందించకపోవడం, ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరగడం చేనేత కార్మికుల పాలిట శాపంగా మారింది. దీంతో లక్షలాది చేనేత కుటుంబాలు అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్నాయి. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోతోంది. ఆధునిక పరిశ్రమలకు, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు భారీగా రాయితీలూ, నజరానాలు సమర్పించుకునే ప్రభుత్వాలు చేనేతరంగం పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లయినా మనకంటూ ఒక చేనేత విధానం లేకపోవడం పెద్దలోపం. విదేశీ వస్తువుల బహిష్కరణ, విదేశీ వస్త్రాల దహనం లాంటి కార్యక్రమాలు ఆనాటి జాతీయోద్యమానికి పెద్ద ఊపుతెచ్చాయి. 1905 ఆగస్టు 7న కలకత్తాలో విదేశీ వస్త్ర దహనం కార్యక్రమం నిర్వహించారు. ఆనాటి స్ఫూర్తి మరోసారి వెల్లువెత్తాలి.

 

07:53 - August 7, 2015

హైదరాబాద్: తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖపై సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఆ శాఖ అధికారులతో రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్త విధానాలకు తెరలేపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్‌ శాఖ ద్వారా 3 వేల 7 వందల కోట్ల రూపాయాల ఆదాయం వస్తుందని సర్కార్ అంచనావేసింది. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖ పోస్టల్ శాఖతో ప్రజా సేవల విషయంలో ఎంఓయు కుదుర్చుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 141 సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాడే నాటికి కేవలం 7 కార్యాలయాలు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. మిగతావన్నీ అద్దె భవనాలేనని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ వాపోయారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకొచ్చే రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. 86 సొంత భవనాల నిర్మాణాలకు కావాల్సిన 53 కోట్ల నిధులను కూడా మంజూరు చేశామని మహమూద్ అలీ తెలిపారు.
ఆగస్టు 17 నుంచి అందుబాటులోకి సేవలు
ప్రస్తుత ఉరుకుల పరుగల జీవితంలో..ప్రజల సమయాన్ని ఆదా చేయడంతోపాటు, కొనుగోళ్లు , అమ్మకం రిజిస్ర్టేషన్లను సులువు చేయడానికి ఆన్‌లైన్‌లో వివరాలను పొందుపర్చే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి వినోద్ కుమార్ఆగర్వాల్ తెలిపారు. ఈ విధానం ఆగస్టు 17 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. లావాదేవీల వివరాలను మొబైల్‌ఫోన్‌లో ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా వచ్చేలా..సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీస్‌ల ద్వారా ప్రజలకు సేవలు అందించేందుకు పోస్టల్ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

 

వోల్వో బస్సు బోల్తా..20 మందికి గాయాలు

నల్గొండ: సూర్యపేట మండలం టేకుమట్ల వద్ద మేఘనా ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు బోల్తా పడింది. ఈప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు.. విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తోంది. బస్సులో మొత్తం 38 మంది ప్రయాణికులు ఉన్నారు. 

తెలంగాణలో విద్యాసంస్థల బంద్ కు పిడిఎస్ యు పిలుపు

హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థల బంద్ కు పిడిఎస్ యు పిలుపునిచ్చింది. కేజీ టూ పీజీ విద్యను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

నేడు ఎపిలో విద్యాసంస్థల బంద్ కు ఎస్ ఎఫ్ ఐ పిలుపు

హైదరాబాద్: ఎపిలో నేడు విద్యాసంస్థల బంద్ కు ఎస్ ఎఫ్ ఐ పిలుపునిచ్చింది. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

07:31 - August 7, 2015

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో టెర్రర్ టెన్షన్ నెలకొంది. ఉదంపూర్‌ జిల్లాలో ఉగ్రవాదులు కలకలం సృష్టిస్తున్నారు. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాయి. బసంత్‌గఢ్‌ చెక్‌పోస్ట్ వద్ద ఘటన చోటుచేసుకుంది. ఉగ్రదాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

07:21 - August 7, 2015

హైదరాబాద్: ర్యాగింగ్‌ భూతం బుసలు కొడుతోంది. మొన్న నాగార్జు యూనివర్సిటీ. నిన్న మలినేని ఇంజినీరింగ్ కాలేజీ. కారణాలు వేరైనా... ర్యాగింగ్‌ రక్కసికి ఇద్దరు అమ్మాయిలు బలయ్యారు. ఈ వరుస ఘటనలను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ర్యాగింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని.....అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.                                                                               
రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన కలకలం
నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు విద్యార్ధులు అరెస్టవగా... కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. విద్యార్ధి, ప్రజాసంఘాలతోపాటు, రాజకీయ పార్టీలు ఘటనపై తీవ్రస్ధాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఇదిలా ఉండగానే జిల్లాలో మరో ఘటన చోటుచేసుకోవటంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు.
సెల్‌ఫోన్‌లో ర్యాగింగ్ చిత్రీకరణ
గుంటూరులో మలినేని పెరుమాళ్లు ఇంజినీరింగ్‌ కాలేజీలో సునీత అనే విద్యార్థిని....బిటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఆమె తరచుగా జూనియర్లను ర్యాగింగ్‌ చేస్తూ...ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో షూట్‌చేసేంది. ఆ విషయాన్ని జూనియర్లు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రిన్సిపాల్ వార్నింగ్ ఇచ్చినా...సునీత పట్టించుకోలేదు. పదే పదే జూనియర్లు ర్యాగింగ్ చేసి..సెల్‌ఫోన్‌లో చిత్రీకరించటంతో....ప్రిన్సిపాల్‌ సీరియస్‌ అయ్యారు. ర్యాగింగ్‌ కింద కేసు నమోదు చేస్తామని ఈసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో భయంతో...సునీత కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
వరుస ఘటనలపై ఏపీ సర్కార్ సీరియస్
గుంటూరులో ర్యాగింగ్‌ కారణంగా ఇద్దరు విద్యార్ధినిలు చనిపోవటంతో...ఏసీ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని....జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను ఆదేశించింది. దీంతో కలెక్టర్ దండే తోపాటు, అర్బన్ ఎస్పీ త్రిపాఠీలు మలినేని కాలేజీని సందర్శించారు. ఘటన జరిగిన వివరాలను కళాశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఆయన పూర్తిస్ధాయి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. మరోవైపు మృతురాలు సునీత బంధువులు పెద్ద సంఖ్యలో కళాశాలకు చేరుకొని సునీత మృతికి యాజమాన్యం, సిబ్బందే కారణమంటూ ఆందోళన చేశారు.
ర్యాగింగ్ నిరోధానికి చర్యలు
ఈ రెండు ఘటనలను సీరియస్‌గా తీసుకున్న ..ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, యూనివర్శిటీల అధికారులు, పోలీసులతో తక్షణమే సమావేశాలు నిర్వహించి ర్యాగింగ్ నిరోధానికి చర్యలను తీసుకోవాలని స్పష్టం చేసింది. పోలీస్ ఇంటిలిజెన్స్ వర్గాలను రంగంలోకి దింపి... ర్యాంగింగ్ అధికంగా ఉన్న కళాశాలల వివరాలను సేకరించాలని ఆదేశించింది. అవసరమైతే విద్యార్థులకు మానసిక వైద్యులతో కౌన్సిలింగ్‌ ఇప్పించాలని ప్రభుత్వం కలెక్టర్లకు దిశానిర్దేశం చేసింది.
ర్యాంగింగ్‌ చేస్తే నాన్‌బెయిలబుల్ కేసులు
ర్యాగింగ్ చేసేవారిపై కఠినమైన నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా భవిష్యత్‌లో చదువులు కొనసాగించకుండా...జీవితకాలపు నిషేధం విధించాలని దిశానిర్దేశం చేసింది. ర్యాగింగ్‌ను ప్రోత్సహించే లెక్చరర్లు, ప్రొఫెసర్లపై కూడా కేసులు నమోదు చేయాలని, భవిష్యత్తులో ఏ విద్యాసంస్ధలోనూ పనిచేయకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది.
పునరావృతమైతే కళాశాల గుర్తింపు రద్దు
ప్రభుత్వ అదేశాలతో అటు కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. త్వరలోనే అన్ని కళాశాలల యాజమాన్యాలలతో సమావేశాలు నిర్వహించి... ప్రభుత్వ ఆదేశాలను తెలియజేయనున్నారు. ర్యాగింగ్ ఘటనలు పునరావృతమైతే కళాశాల గుర్తింపులు రద్దు చేస్తామన్న హెచ్చరికలను కూడా పంపబోతున్నారు.

 

 

 

07:06 - August 7, 2015

హైదరాబాద్: టీ-సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "వాటర్ గ్రిడ్" పై తొలి అడుగు పడనుంది. నేటి నుంచి ఆన్‌లైన్లలో టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌... జలహారం పనులపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి లోపాలు తలెత్తకుండా, శ్రద్ధగా పనిచేయాలంటూ అధికారుల్ని ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మంచినీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. జలహారంపై దేశమంతా చూస్తోందన్నారు కేసీఆర్.
శరవేగంగా వాటర్ గ్రిడ్‌ పనులు
మరోవైపు వాటర్ గ్రిడ్‌ పనులు శరవేగంగా జరుతున్నాయి. ఆర్ డబ్ల్యుఎస్ శాఖ సుమారు 15 వేల 887 కోట్ల పనులకు టెండర్లు స్వీకరించనుంది. జలహారంలో మొత్తం 26 సెగ్మెంట్లను రెండు విడతలుగా విభజించింది. ఆగస్టు 7 నుంచి తొలి విడతలో 11 సెగ్మెంట్లకు ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానించనుంది. మిగిలిన 15 సెగ్మెంట్లను రెండో విడతగా ఆగస్టు 30 నాటికి పూర్తిచేయనుంది.
టెండర్ల అంచనా వ్యయం ప్రకటన
ఇక తొలి విడతలో వివిధ జిల్లాల్లో ఏ మేరకు టెండర్ల అంచనా వ్యయం ఉంటుందో కూడా సర్కార్‌ ప్రకటించింది. అందులో మహబూబ్‌నగర్‌ జిల్లాకు అగ్రభాగం దక్కింది. పాలమూరు-శ్రీశైలంకు 5 వేల 953 కోట్లు, జూరాలకు 700 కోట్లు కేటాయించింది. అలాగే మేడ్చల్‌కు 160 కోట్లు, పాలేరుకు 1700 కోట్లు, నల్లగొండకు 2,106 కోట్లు, నల్లగొండ టెయిల్ పాండ్‌కు 14 వందల 85 కోట్లు దక్కే అవకాశం ఉంది. ఇక సంగారెడ్డికి 680 కోట్లు, గజ్వేల్‌కు రూ.600 కోట్లు వరంగల్ జిల్లాకు 840 కోట్లు, ఆదిలాబాద్‌-ఎల్లంపల్లి-కడెంకు 670 కోట్లు, ఖమ్మం-పాలేరు-వైరాకు 993 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తోంది. మొత్తానికి ప్రజలందరికీ తాగునీరందించేందుకు నడుంబిగించిన టీ-సర్కార్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

 

07:00 - August 7, 2015

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల మధ్య వాటర్ వార్... డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. పాలమూరు ఎత్తిపోతలపై రెండు ప్రభుత్వాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ...కేంద్ర జలసంఘానికి లేఖ రాసింది. ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు లేవని స్పష్టం చేసింది. ఏపీ లేఖకు కౌంటర్‌గా తెలంగాణ మంత్రి హరీష్‌రావు మరో లేఖను సంధించారు.                                                                                         
పాలమూరు పాత ప్రాజెక్టే- హరీశ్‌రావు
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం అనవసర రాద్దాంతం చేస్తోందనిప మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు పథకం కొత్త ప్రాజెక్టు కాదని...పాతదేనని....ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు.... పాలమూరు ప్రాజెక్టు నిర్మిద్దామని చంద్రబాబే అన్నారని గుర్తు చేశారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ ప్రకారమే ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని క్లారిటీ ఇచ్చారు. పాలమూరు, డిండికి నీటి కేటాయింపులపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనూ... గ్రీన్‌సిగ్నల్
అంతేగాక కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనూ... ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. 2014 ఎన్నికల ప్రచారంలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామని.. స్వయంగా మోడీ హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అదే ఎన్నికల్లో రాహల్‌గాంధీ కూడా...ప్రాజెక్టుని కడతామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. యూపీఏ-ఎన్డీఏ రెండు కూటములు...ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకున్నాయని చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం దిగువ రాష్ట్రాలు నదీజలాలను మళ్లించుకుంటే..ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి. ఏపీ.. 80 టీఎంసీల నీటితో పట్టిసీమను కట్టుకొని..గోదావరి జలలాను మళ్లించుకుంటున్నారని హరీష్‌రావు లేఖలో పేర్కొన్నారు. దాని ప్రకారం కృష్ణా నీటిలో తెలంగాణకు 45 టీఎంసీల వాటా వస్తుందని తెలిపారు. కృష్ణాబేసిన్‌లో ఉన్న హైదరాబాద్‌కు తాగునీటి కోసం 60 టీఎంసీల నీరు కావాలి. తాగు నీటిని తీసుకునే హక్కు కూడా తెలంగాణకు లేదా...అని ప్రశ్నించారు.
ఏపీ వ్యాఖ్యలపై హరీష్‌రావు కౌంటర్
పాలమూరు, డిండి ప్రాజెక్టులకు అనుమతులు లేవన్న ఏపీ వ్యాఖ్యలపై హరీష్‌రావు కౌంటరిచ్చారు. ఎవరి అనుమతితో పట్టిసీమను కడుతున్నారని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు, హంద్రినీవా, గాలేరు-నగరి, పులిచింతల ప్రాజెక్టులను ఎవరి అనుమతి తీసుకొని కట్టాలరో చెప్పాలని డిమాండ్ చేశారు. జలాల వాటా ప్రకారం ప్రాజెక్టులను కట్టుకునే హక్కు రాష్ట్రాలకుంటుందని...దానికి ఎవరి అనుమతీ అవసరం లేదని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 300 టీఎంసీల నీరును వాడుకునే హక్కుందని...కాని ప్రస్తుత ప్రాజెక్టుల ద్వారా 100 టీఎంసీలు కూడా తెలంగాణలో పారడం లేదన్నారు. వాటా ప్రకారం...మరో ఐదారు ప్రాజెక్టులను కట్టుకునే అవకాశం కూడా ఉందని తేల్చిచెప్పారు.
చంద్రబాబుపై హరీష్‌రావు ఆగ్రహం
ఏపీ సీఎం చంద్రబాబుపై హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఖలు రాసి ప్రాజెక్టులను అడ్డుకోలేరని ధ్వజమెత్తారు. ప్రజలను మభ్య పెట్టేందుకే చౌకబారు విమర్శలు చేస్తున్నారనని మండిపడ్డారు. ఆరునూరైనా...పాలమూరు, డిండి ప్రాజెక్టులను పూర్తిచేస్తామని తేల్చిచెప్పారు.

 

06:53 - August 7, 2015

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌ ఢిల్లీ బాట పట్టనున్నారు. నేటి నుంచి మూడ్రోజుల పాటు హస్తినలోనే గడపనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రుల్ని ఆయన కలువనున్నారు. ఇరురాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై నివేదిక అందజేస్తున్నారు. దీంతో గవర్నర్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏయే అంశాలపై నివేదిక ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇరురాష్ట్రాల మధ్య జలజగడం
ఒకవైపు ఇరురాష్ట్రాల మధ్య జలజగడం మంటలు పుట్టిస్తోంది. ఢీ అంటే ఢీ అంటూ లేఖాస్త్రాలు సంధిస్తున్నారు పాలకులు. అలాగే తొమ్మిది, పదో షెడ్యూల్ అంశాలపై రోడ్డెక్కుతున్నారు. న్యాయం చేయాల్సిందేనంటూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. హైకోర్టు కోసం టీఎస్ నేతలు పట్టుబడుతుంటే... విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలపై ఏపీ లీడర్లు తగ్గేది లేదంటున్నారు.
గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్‌
ఇటీవల గవర్నర్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిశారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలు చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా యూనివర్సిటీల్లో పాలన మెరుగు పడాలంటే కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరముందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఉస్మానియా ఆస్పత్రి తరలింపుపై... ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు.
గవర్నర్‌ కు ఎపి ప్రభుత్వం సమస్యల ఏకరువు
మరోవైపు ఆంధ్రప్రదేశ్ పెద్దలు సైతం గవర్నర్‌ ముందు సమస్యల్ని ఏకరువు పెట్టారు. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి సంబంధించిన నిధులపై దృష్టిపెట్టారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లు... తొమ్మిది, పదో షెడ్యూల్ సక్రమంగా అమలయ్యేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలపై గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. అలాగే గుంటూరు ర్యాగింగ్ ఘటనపై నివేదిక సమర్పించినట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో అనేక సమస్యలు
ఇలా తెలుగు రాష్ట్రాల్లో అనేక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు రాష్ట్రాల పాలకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు. మరి నరసింహన్ ఢిల్లీ పర్యటనతోనైనా ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందో..? లేదో..? వేచి చూడాలి.

సింహాచలం కొండపై అగ్నిప్రమాదం

విశాఖ: సింహాచలం కొండపై అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 షాపులు దగ్ధమయ్యాయి. మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.  

అల్లం నారాయణకు పితృవియోగం...

హైదరాబాద్: తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తండ్రి అల్లం నర్సయ్య (95) కన్నుమూశారు. అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా గాజులపల్లిలో నేడు నర్సయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి.

Don't Miss