Activities calendar

08 August 2015

దీక్ష చేస్తున్న మున్సిపల్ కార్మికులు - క్షీణించిన ఆరోగ్యం..

నల్గొండ : మున్సిపాల్టీ ఎదుట 4వ రోజు మున్సిపల్ కార్మికుల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షలో పాల్గొన్న ఐదుగురుమహిళల ఆరోగ్యం క్షీణించింది.

21:36 - August 8, 2015

తిరుపతి : కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు చిరంజీవి నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై కేంద్రప్రభుత్వాన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. బాబు తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రాన్నిహోదా కోరడం లేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా..ప్రత్యేకహోదా కల్పించి తీరాలన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ చిరంజీవి నినదించారు.

21:34 - August 8, 2015

హైదరాబాద్ : ఉద్యమం దిక్కుమాలినదట..! పోరాటం పనికిమాలినదట..! మున్సిపల్‌ కార్మికులు పొద్దుపోక సమ్మె చేస్తుంటే.. వాటికి నాయకత్వం వహిస్తున్న కార్మిక సంఘాలకు పనీపాటా లేదట..! ఇవీ.. తెలంగాణ ఉద్యమ రథసారధిగా చెప్పుకున్న నాటి నేత, నేటి ముఖ్యమంత్రి వ్యాఖ్యలివి. కాలుతున్న కడుపు నింపండంటూ సమ్మె చేస్తున్న కార్మికులు, నేతలపై పరుష పదజాలంతో విరుచుకుపడి, తీవ్రస్థాయిలో అవమానించారు సీఎం కేసీఆర్‌. ఉద్యమం దిక్కుమాలిందంటున్నారు ఒకనాటి ఉద్యమ నేత...కార్మిక సంఘాలకు పనీపాట లేని బాజీలంటున్నారు నేటీ ముఖ్యమంత్రి... జీహెచ్‌ఎంసీ కార్మికుల ఉద్యోగాలను కార్మిక నేతలే తొలగించారంటున్నారు సీఎం కేసీఆర్‌...

కరీంనగర్‌ జిల్లా పర్యటనలో ....

కరీంనగర్‌ జిల్లా పర్యటనలో మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై జనం సాక్షిగా రెచ్చిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. న్యాయబద్ధంగా కొనసాగుతున్న సమ్మెను దిక్కుమాలిన సమ్మెగా వర్ణించిన ముఖ్యమంత్రి.. దానికి నాయకత్వం వహిస్తున్న కార్మిక సంఘాలను పనీపాటలేని బాజీలుగా అభివర్ణించి, తీవ్రస్థాయిలో అవమానించారు.

రాష్ట్రవ్యాప్తంగా దుమారం.....

మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలతోపాటు, సామాన్యుల నుంచి సైతం తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నవారిది, పనిలేని పోరాటంగా భావించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.

అత్యంత దుర్భర పరిస్థితుల్లో .....

రాష్ట్రంలో అత్యంత దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు మున్సిపల్‌ కార్మికులు. రోడ్డుపక్కన ఉన్న చెత్త పక్క నుంచి నడవడానికే జనాలు జంకుతుంటారు. మూసిన ముక్కు చెత్తను దాటిపోయే వరకూ తెరవరు. అలాంటి చెత్తను ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా.. చేతులతో ఎత్తి శుభ్రం చేస్తుంటారు పారిశుధ్య కార్మికులు. అలాంటివారికి కనీసం మూడు పూటలా సరైన తిండి తినేందుకు సరిపోని విధంగా వేతనాలు ఇస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని, తమ నోట్లోకీ నాలుగు వేళ్లేలా చూడాలని కోరుతూ కార్మికులు చేపట్టిన సమ్మె దిక్కుమాలిందిగా తోచింది ముఖ్యమంత్రికి. దీనికి నాయకత్వం వహించిన కార్మిక సంఘాలు పనీపాట లేని బాజీలుగా కనిపించాయి సీఎం కేసీఆర్‌కు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కార్మిక పోరాటంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ముప్పేటా విమర్శల వర్షం కురుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగుతున్నా..

రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగుతున్నా.. కేవలం జీహెచ్‌ఎంసీలో, అదికూడా కొంత మందికే వేతనాలు పెంచారు సీఎం కేసీఆర్‌. ఇందులోనూ సగం మంది ఉద్యోగాలను నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. ఇది జరిగి పక్షం రోజులు దాటింది. తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కార్మికులు, వారికి న్యాయం చేయాలని విపక్షాలు ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాయి. అయినా.. కనికరించని ముఖ్యమంత్రి.. కనీసం వారి సమస్యలు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వట్లేదు. అపాయింట్‌ మెంట్‌ నిరాకరిస్తూ అవహేళన చేస్తున్నారని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అయినా.. అవేవీ పట్టని ముఖ్యమంత్రి.. కార్మికుల ఉద్యోగాలు పోవడానికి కార్మిక సంఘాలు, పార్టీలే కారణమంటూ బాధ్యతారాహిత్య ప్రకటన చేయడం పట్ల కార్మికలోకం భగ్గుమంటోంది.

అఖిలపక్ష నేతలపైనా వివాదాస్పద వ్యాఖ్యలు....

సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన అఖిలపక్ష నేతలపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. సమ్మె చేయించనవారితో మాట్లాడే పనే లేదన్నారు. తమకు అడ్డువస్తే అరెస్టులు తప్పవంటూ ప్రజల సాక్షిగా హెచ్చరికలు జారీచేశారు సీఎం కేసీఆర్‌. ప్రజల కష్టాలపై పోరాడడాన్ని బురద జల్లడంగా అభివర్ణించిన ముఖ్యమంత్రి.. తమకు వ్యతిరేకంగా పనిచేస్తే అణచివేస్తామంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్న ప్రజాస్వామికవాదులు

కరీంనగర్‌ సభలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రజల గొంతు నొక్కే చర్యే అంటున్నారు. ఉద్యమ నేతగా చెప్పుకున్న వ్యక్తి.. అధికారం చేపట్టిన తర్వాత నియంతృత్వ ధోరణిలో వ్యవహరించడం ఏమాత్రం సరికాదంటున్నారు. ఇకనైనా కేసీఆర్‌ తన వ్యవహార శైలిని మార్చుకోకపోతే మాత్రం ప్రజల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరిస్తున్నారు...

21:29 - August 8, 2015

హైదరాబాద్ : అన్యాయం జరిగిందని ఉపన్యాసాలు దంచారు. న్యాయం జరిగే వరకు కంటి మీద కునుకేయమన్నారు. పైనోడు మనోడే కాబట్టి అడిగింది లేదనకుండా కాదనుకుండా ఇస్తాడన్నారు. కాలయాపన చేస్తే పోరాటం చేసి మరీ సాధించుకొస్తామని కలరింగిచ్చారు. కానీ అవన్నీ ఉత్త మాటలేనని తేలిపోతున్నాయి. వాగ్ధానాల నుంచి చల్లగా జారుకుంటున్న వైనాన్ని బట్టబయలు చేస్తున్నాయి.

హోదా ఇచ్చి ఆదుకుంటామని వాగ్ధానాలు....

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కంకణ బద్దులై ఉన్నామని కమలనాధులు చెప్పని చోటు లేదు. ప్రత్యేక హోదా ఇచ్చి ఏపిని ఆదుకుంటామనే వాగ్ధానం లేని బిజెపి నేతల ప్రసంగం లేదు. విభజన జరిగిన నాటి నుంచి బిజెపీ నోట ప్రత్యేక హోదా వాగ్ధానం, సాధించి తీరుతామనే టిడిపి నేతల ప్రతిన వినని ఏ ఒక్క వ్యక్తి ఏపిలో లేడు. అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపీ, ఇటు రాష్ట్రంలో రాజ్యమేలుతున్న టిడిపి, ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామనే చెబుతూ వచ్చాయి. నిన్నటి వరకు చెప్పాయి కూడా.....

మండిపడుతున్న ప్రతిపక్షాలు....

ప్రత్యేక హోదా పై బిజెపీ, టిడిపి దాగుడుమూతలాడుతున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నిన్నటి వరకు ప్రత్యేక హోదా ఇస్తామన్న కమలనాధులు, నేడు హోదా మాటెత్తితే నీళ్లు నములుతున్నారని వారు విమర్శిస్తున్నారు. ప్రాణాలు అర్పించి అయినా ప్రత్యేక హోదా సాధిస్తామన్న తెలుగు తమ్ముళ్లు నేడు హోదా అవసరం లేదు ప్రత్యేక ప్యాకేజ్‌ సరిపోతుందంటూ సరికొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తున్నారు.

బిజెపి, టిడిపి పై మండిపడుతున్న వామపక్షాలు....

ప్రత్యేక హోదా ఇస్తాం, తెస్తామని కాలరేగరేసిన నేతలు చేతకాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రత్యేక హోదా కోసం దేశరాజధాని వేదికగా వైసిపీ ఆగష్టు 10న దీక్ష చేస్తోంటే, వామపక్షాలు 11న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికైనా కప్పదాటు వ్యవహారానికి స్వస్తి చెప్పి బిజెపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని, స్పెషల్ స్టేటస్‌ అంశాన్ని తొలి ప్రాధాన్యతగా గుర్తించి టిడిపి నేతలు మరింతగా కృషిచేయాలని లేదంటే ప్రత్యేకపోరు ఉధృతం చేస్తామని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

21:22 - August 8, 2015

హైదరాబాద్ : ప్రత్యేక హోదా సమరం వేడెక్కుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే డిమాండ్‌తో విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కప్పదాటు వ్యవహారాన్ని చాకిరేవు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంతలోనే ఓ అపశృతి, జరగకూడని ఓ సంఘటన అందరిని విషాదంలో నింపింది. తాత్సారం చేస్తే ప్రమాదం తప్పదనే హెచ్చరికను జారీ చేసింది.

తిరుపతిలో కాంగ్రెస్ పోరు సభ....

పరిస్ధితి వేడెక్కుతోందనుకునే లోపే తిరుపతిలో కాంగ్రెస్ పోరు సభ తలపెట్టింది. ఇంతలోనే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనంటూ తిరుపతికి చెందిన మునికోటి అనే కాంగ్రెస్ కార్యకర్త కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేననే నినాదంతో బలిదానం చేసుకునేందుకు ప్రయత్నించాడు.

80శాతం కాలిపోయిన మునికోటి శరీరం...

ఏం జరుగుతుందో తోటివారు తెలుసుకునేలోపే మునికోటి మంటల్లో చిక్కుకున్నాడు. పక్కన వారు తేరుకుని మంటలు ఆర్పేలోపే 80శాతానికి పైగా మునికోటి శరీరం కాలిపోయింది. హుటాహుటిన రుయా ఆస్పత్రికి మునికోటిని తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స చేస్తున్నంతలోపే మునికోటి పరిస్ధితి విషమంగా మారటంతో వేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి తరలించారు.

సమైక్య ఉద్యమంలో నిర్విరామ కృషి...

ఆత్మ బలిదానానికి ప్రయత్నించిన మునికోటి సమైక్య ఉద్యమంలో నిర్విరామంగా పాల్గొన్నాడు. విభజన వ్యతిరేక పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడని సన్నిహితులు చెప్తున్నారు. తీవ్రంగా గాయపడి మరణంతో పోరాటం చేస్తున్న మునికోటికి ఏపి పీసీసీ చీఫ్‌ రఘువీరా 2లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఇటు ఏపి సీఎం చంద్రబాబు కూడా ఘటనపై ఆరా తీసారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాలే కాని ప్రాణాలు తీసుకోవద్దని హితవు పలికారు.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజాసంఘాలు...

ప్రత్యేకహోదాకోసం కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో...కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, వివిధ పార్టీలు భగ్గుమంటున్నాయి. మునికోటి పరిస్ధితి విషమించటంతో రుయా నుంచి వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. మా ప్రతినిధి మురళీ మరిన్ని వివరాలు అందిస్తారు.

తిరుపతి ఘటనపై సోనియా విచారం

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఏఐసీసీ అధ్యక్షురాలు విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. ఎవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని సూచించారని ఏఐసీసీ నుంచి కోటి కుటుంబానికి, గాయపడ్డవారికి ఆర్థిక సాయం అందిస్తామని సోనియా హామీ ఇచ్చినట్లు రఘువీరా తెలిపారు.

రఘువీరారెడ్డి అసమర్థత వల్లే ఆత్మాహుతి : సోమిరెడ్డి

హైదరాబాద్ : తిరుపతిలో ఈరోజు ఓ కాంగ్రెస్ కార్యకర్త ఒంటికి నిప్పంటించుకుని ఆత్మాహుతికి యత్నించడంపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అసమర్థత వల్లే ఈ ఘటన జరిగిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఘటనకు రఘువీరాదే భాధ్యత అని స్పష్టం చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణమని మండిపడ్డారు. అటు, గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తిరుపతి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎంతో ఆవేదనతో ఉన్నారని తెలిపారు.

యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దు :చలసాని శ్రీనివాస్

విజయవాడ : యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆంధ్రా మేథావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదన్నారు. మోసం చేసిన నాయకులే ఆత్మహత్య చేసుకోవాలని ఆయన విమర్శించారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడుదామని చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. దీనిపై సోమవారం కార్యాచరణ ప్రకటిస్తామస్తారు. ఏపీ బంద్‌కు పిలుపునిచ్చే అంశంపైనా చర్చిస్తామని చలసాని శ్రీనివాస్‌ తెలిపారు.

తిరుపతి ఘటనపై చంద్రబాబు విచారం

హైదరాబాద్: ప్రత్యేక హోదా కోరుతూ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. యువత ఎవరూ ఉద్రేకాలకు గురికావొద్దని సూచించారు. ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

సాంకేతిక లోపంతో నిలిచిన ముంబై - చెన్నై ఎక్సప్రెస్ రైలు

అనంతపురం: గుర్తి శివారులో ముంబై నుంచి చెన్నై వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలు చక్రాల నుంచి పొగలు వచ్చాయి. దాన్ని గమనించిన రైల్వు అధికారులు గుత్తి రైల్వేస్టేషన్ లో రైలును నిలిపివేసి మరమ్మత్తులు చేస్తున్నారు.

19:29 - August 8, 2015

 హైదరాబాద్: : భారతదేశంలో వ్యవసాయం ఎప్పడు పుట్టింది? అనే అంశంపై 'జీవన చరిత విశ్లేషణ' కార్యక్రమంలో ప్రొ.కంచె ఐలయ్య మాట్లాడారు. ఆ .. వివరాలను ఆయన మాటాల్లోనే చూద్దాం... ఏ శ్రమజీవులు ఎద్దులను బర్రెలను మచ్చిక చేసుకుని వ్యవసాయానికి ఉపయోగించారు.గుర్రాలెక్కిన సైనికులను రథాలెక్కిన రాజులను గౌరవించిన సమాజం వ్యవసాయంచేసిన శ్రమజీవులను ఎందుకు గౌరవించలేదు.భూమిదున్నేవారిని శూద్రులుగా ఎవరు చిత్రించారు?ఇలాంటి సవాలక్షప్రశ్నలకు ప్రముఖ సామాజికశాస్త్రవేత్త కంచె ఐలయ్యగారి పరిశోధనలే సమాధానం చెబుతాయి.అసలు నిజమైన వ్యవసాయచరిత్ర ఏమిటో తెలుసుకోవాలని ఉందా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

చిన్నముల్కనూరు సర్పంచ్ పై కేసీఆర్ ఆగ్రహం

కరీంనగర్ : జిల్లాలోని చిన్నముల్కనూరులో సీఎం కేసీఆర్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. వీధుల్లో పారిశుద్ధ్యాన్ని చూసి సర్పంచ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించకుంటే పదవి నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.

కొత్త గవర్నర్ నియామకంపై బీహార్ సీఎం గుస్సా...

న్యూఢిల్లీ: బీహార్ నూతన గవర్నర్‌గా రాంనాథ్ కోవింద్‌ను నియమించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ విలేకరులతో మాట్లాడారు. కొత్త గవర్నర్ నియామకం విషయం తనకు మీడియా ద్వారానే తెలిసిందన్నారు. కేంద్రం తనను సంప్రదించకుండానే రాంనాథ్‌ను నియమించిందని వివరించారు. తనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు బీహార్‌కు నూతన గవర్నర్‌ను నియమించే విషయంలో కేంద్రం రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదిస్తూ వచ్చిందని పేర్కొన్నారు. కాగా, రాంనాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందినవారు.

బోనాలకు కట్టుదిట్ట భద్రత : సీపీ

హైదరాబాద్ : నగరంలో బోనాల ఊరేగింపు జరిగే ప్రాంతాలను సీపీ మహేందర్‌రెడ్డి పరిశీలించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లాల్‌ దర్వాజ బోనాలకు 3 వేల మందితో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు.

18:41 - August 8, 2015

హైదరాబాద్: సమ్మె చేయడం, సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేయడం ప్రజాస్వామ్య హక్కు అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో సీఎం కేసీర్ పెంచిన వేతనాన్ని ఇవ్వాలంటూ మున్సిపల్ కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె పై, వారికి మద్దతు తెలిపిన వామపక్షాలపై పరుష పదజాలంతో దుయ్యబట్టాడు. దీనిపై స్పందించిన వామపక్షాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. సీఎం స్థాయిలో వుండి దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలని తమ్మినేని ఫైర్ అయ్యాడు. గ్రామ పంచాయతీల, మున్సిపాలటీల ఆదాయాన్ని బట్టి కార్మికుల వేతనాలు పెంచుతారనడం సరికాదని స్పష్టం చేశారు. బుద్ధి మార్చుకోవాల్సింది మేము కాదని... కేసీఆరే తన బుద్ధి మార్చుకుని పాలన చేయాలని హితవు పలికారు.

ఈ నెల 15న పట్టిసీమ ఫేజ్-1ప్రారంభిస్తాం : పరకాల

హైదరాబాద్ : పట్టిసీమ ఫేజ్-1ను ఈ నెల 15న ప్రారంభిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. ఆ రోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభమవుతుందని తెలిపారు. ఇక 10వ తేదీన విశాఖపట్నంలో మీ భూమి- మీ ఇంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రే ప్రారంభిస్తారని చెప్పారు. అదే రోజున జియోమి ఫోన్ల కంపెనీ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారన్నారు. ఇక 15వ తేదీ తరువాత విజయవాడతో పాటు, కొన్ని జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తారని పరకాల వివరించారు.  

రూ.2లక్షల ఆర్థిక సాయం ప్రకటించన కాంగ్రెస్

హైదరాబాద్ : తిరుపతిలో కాంగ్రెస్ పోరు సభ జరుగుతున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడిన మునికోటి అనే యువకుడికి ఏపీ కాంగ్రెస్ ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.2 లక్షలు ఇవ్వనున్నట్టు పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ప్రకటించారు. ఆ యువకుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. 

పవన్ కల్యాణ్ ఎక్కడా? ఇకనైనా మేల్కొంటావా: శివాజీ

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కోసం తిరుపతి సభలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంపై ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ స్పందించారు. హోదా కోసం ఆత్మహత్యాయత్నం జరగడం అమానుషమన్నారు. ఇలాంటి ఘటనలకు ఎవరూ పాల్పొడద్దని కోరారు. హోదాను పోరాటం ద్వారా సాధించుకుందామన్నారు. రాబోయే తరలా కోసం ప్రత్యేక హోదా కావాలని శివాజీ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా చారిత్రక అవసరమని, నేతలు కళ్లు తెరవాలన్నారు. తమకు ప్రత్యేక ప్యాకేజీ వద్దని, హోదా మాత్రమే కావాలని తేల్చి చెప్పారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడికి ఏమైనా జరిగితే,పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

17:40 - August 8, 2015

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో ఈరోజు జరుగుతున్న కాంగ్రెస్ పోరు సభలో ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కోటి అనే యువకుడు అనూహ్యంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన అక్కడి పోలీసులు అతడిని రుయా ఆసుపత్రికి తరలించారు. 70 శాతం పైగా అతని ఒళ్లు కాలిందని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు రుయా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరో వైపు టిడిపి, బిజెపికి వ్యతిరేకంగా రుయా ఆసుపత్రి ఎదుట సీపీఎం,సీపీఐ, లోక్ సత్తా తదితర పార్టీలు ఆందోళన చేపట్టారు. కోటి పరిస్థితి విషమంగా ఉండడంతో తమిళనాడులోని రాయవెల్లూరు ఆసుపత్రికి తరలించి  మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.  కోటి ఆత్మహత్యాయత్నం చేసుకున్నా కాంగ్రెస్ సభ మాత్ర కొనసాగడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

చాలా సంతోషం : బీహార్ గవర్నర్..

ఢిల్లీ : బీహార్ గవర్నర్ గా నియమించడం పట్ల ఆనందంగా ఉందని రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కలిగిందని ఆయన ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు.

17:15 - August 8, 2015

టాలీవుడ్ యాక్టర్ బ్రహ్మాజీ పలుగు..పార పట్టాడు. చెట్లను నాటాడు. దీనికంతటికీ 'శ్రీమంతుడు' స్పూర్తితోనే ఇలా చేసి ఉండవచ్చునని టాక్. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. అందులో ఓ సన్నివేశంలో హీరో స్వయంగా పలుగు పట్టి చెరువు పూడిక తీసేందుకు చేయి కలుపుతాడు. ఊరిని బాగు చేయాలన్న కాన్సెప్ట్ తో 'శ్రీమంతుడు' చిత్రం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. దీనిని చూసి ముచ్చటపడ్డాడో..లేక స్పూర్తి పొందాడో గాని బ్రహ్మాజీ షార్ట్..టీషర్ట్ వేసుకుని గుంతలు తవ్వి చెట్లను నాటాడు. ఆయన ఫొటోలు ట్విట్టర్ లో దర్శనమిచ్చాయి.

ప్రత్యేక హోదా కావాలంటూ ఆత్మహత్యాయత్నం..

చిత్తూరు : ప్రత్యేక హోదా కావాలంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిరుపతిలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న పోరుసభలో మంచాల వీధికి చెందిన కాంగ్రెస్ యువ కార్యకర్త కోటి శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నాడు. సుమారు 50 శాతం మేర కాలినగాయాలయ్యాయి. వెంటనే కోటిని రుయా ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.

ఇద్దరు జవాన్లకు గాయాలు…

జమ్మూ కాశ్మీర్ : కుప్మారా సరిహద్దులోని తాంగ్దర్ సెక్టార్ లో భద్రతా దళాలకు..మిలిటెంట్లకు కాల్పులు ఇంకా జరుగుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.

16:50 - August 8, 2015

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపక్షాలపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. గ్రామపంచాయితీ కార్మికుల సమ్మె దిక్కుమాలిన సమ్మె అన్నారు. వీళ్లిష్టమొచ్చినట్లు సమ్మె చేసి వస్తే ఎవరు మాట్లాడతారని ఎదురు ప్రశ్నించారు. ఆఫీసు దగ్గరకొచ్చి అడ్డం కూర్చుంటే అరెస్ట్‌ చేయక ఏం చేస్తారని అడిగారు. జీహెచ్‌ఎంసీలో వెయ్యిమంది కార్మికుల ఉద్యోగాలు పోయింది కూడా వీరి పుణ్యమేనని ఎద్దేవా చేశారు.  కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన హుస్నాబాద్ మండలంలోని గండిపల్లి రిజర్వాయర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ ద్వారా 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

 

16:47 - August 8, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని ఆధ్వర్యంలో క్యాబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ జరిగింది. మంత్రి కేటీఆర్‌తో పాటు డిజీపీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో తీవ్రవాదుల దాడుల్లో నష్టపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం, పోలీసు ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంపు పై చర్చించారు.

కుప్వారా జిల్లాలో కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. అనుమానిత తీవ్రవాదులు సంచరిస్తున్నట్లు భద్రతా దళాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

ప్రతిపక్ష పార్టీలపై కేసీఆర్ పరుష పదజాలం..

కరీంనగర్ : ప్రతిపక్ష పార్టీలపై సీఎం కేసీఆర్ పరుష పదజాలాన్ని ప్రయోగించారు. కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్ ఓ సభలో ప్రసంగించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె దిక్కుమాలని సమ్మె అంటూ అభివర్ణించారు. జీహెచ్ఎంసీలో వెయ్యి మందికి ఉద్యోగాలు పోయిన పుణ్యం వాళ్లదేననిన, ఇష్టమొచ్చినట్లు సమ్మెలు చేస్తే అపాయింట్ మెంట్లు ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు.

ఆస్ట్రేలియా ఘోర పరాజయం..

యాషెస్ : నాలుగో టెస్టులో ఆస్ట్రేలియో ఘోర పరాజయం చవి చూసింది. ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 60 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 253 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 391/9 డిక్లేర్డ్ చేసింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 3-1 ఆధిక్యంలో ఇంగ్లండ్ నిలిచింది.

16:16 - August 8, 2015

హైదరాబాద్: మల్కాజిగిరిలో ఓ బాల కార్మికురాలిని దొంగతనం నెపంతో పోలీసులు తీవ్రంగా హింసించారు. అసలు బాలకార్మికురాలితో పని చేయించుకోవటమే నేరం కాగా.. దొంగతనం కంప్లయింట్‌ ఇవ్వగానే పోలీసులు స్టేషన్‌కు తీసుకుపోవటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నడవలేని పరిస్ధితిలో ఉన్న ఆ బాలికను చూసినవారికి పోలీసులు ఎంతగా కొట్టారో అర్ధమైపోతుంది. ఫిర్యాదు చేసిన యజమానిపై, తీవ్రంగా కొట్టిన మల్కాజిగిరి ఎస్‌ఐపై కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

బాల కార్మికురాలిపై ఖాకీల దాష్టీకం..

హైదరాబాద్ : ఓ మైనర్ బాల కార్మికురాలిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. బంగారం దొంగతనం చేసిందన్న యజమానురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బాల కార్మికురాలిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన మల్కాజ్ గిరి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. బాల కార్మికులను పెట్టుకోవడం నేరమని తెలిసినా పోలీసులు యజమానులకు వత్తాసు పలికారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తాను మాటిస్తే తలతెగినా వెనకడుగు వేయను - కేసీఆర్..

కరీంనగర్ : తాను మాటిస్తే తలతెగినా వెనకడుగు వేయనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో గండిపల్లి, గౌరవెల్లి రిజర్వాయర్లు పూర్తి చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఆయన పర్యటించారు. మహా సముద్రం గండి రిజర్వాయర్ చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ రిజర్వాయర్ ను అభివృద్ధి చేస్తే హుస్నాబాద్ కు తాగునీటితో పాటు సాగునీరూ అందుతుందని హామీనిచ్చారు. మహాసముద్రం గండి రిజర్వాయర్ ను పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేయవచ్చని, ప్రజలే మాకు బాస్ లు అని కేసీఆర్ తెలిపారు. ప్రజలకు ఏది కావాలో అదే చేస్తామని మరోమారు స్పష్టం చేశారు.

తిరువనంతపురంలో యూత్ కాంగ్రెస్ నేతల అరెస్టు..

తిరువనంతపురం : ఎయిర్ పోర్టులో దిగిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి యూత్ కాంగ్రెస్ నేతలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. దీనితో పోలీసులు నిరసన కారులను అరెస్టు చేశారు.

15:27 - August 8, 2015

హైదరాబాద్ : ఆంధ్ర వర్శిటీ హాస్టళ్లలో బయటివ్యక్తుల రాజ్యం నడుస్తోంది... 2వేలమంది ఇక్కడ అక్రమంగా ఇక్కడ ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు.. పార్టీలు, సంఘాల సపోర్టుతోఉన్న వీరిని బయటకు పంపడంపైమాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు..
ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నా.....
ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తున్నా ఆచరణలో ముందుకు సాగలేకపోతోంది.. యూనివర్శిటీల్లో ఏర్పాటైన గ్రూపులపై చర్యలకు వెనకంజవేస్తున్నారు యూనివర్శిటీ పెద్దలు.. వివిధ పార్టీలు, సంఘాలకుచెందిన నేతల సహకారంతో చాలామంది వర్శిటీల్లో పాతుకుపోయారు.. అటు అనంతపురంలోని ఓ యూనివర్శిటీలో హాస్టల్ గదిలో ఓ వ్యక్తి అసాంఘిక కార్యక్రమాలు చేశాడని స్వయంగా మంత్రిగానే ప్రకటించారు.. ప్రక్షాళన చేస్తున్నామని చెప్పుకొచ్చారు..
ఆంధ్ర వర్శిటీలోకూడా ఇదే పరిస్థితి....
అటు రాష్ట్రంలో అతిపెద్ద విశ్వవిద్యాలయం ఆంధ్ర వర్శిటీలోకూడా ఇదే పరిస్థితి ఉంది.. ఇక్కడ 30 హాస్టళ్లలో 7వేలమంది విద్యార్థులున్నారని అధికారులు చెబుతున్నారు.. ఇందులో 2వేల మంది విద్యార్థినిల గదులున్నాయని స్పష్టం చేస్తున్నారు.. వీరుకాకుండా మరో 2వేలమంది ఇక్కడ తలదాచుకున్నారని తెలుస్తోంది.. కొందరు విద్యార్థులు తమ స్నేహితులకు ఆశ్రయమిచ్చినట్లు సమాచారం.. వీసీమాత్రం బయటి వ్యక్తులపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు...

ఏయూ లో ర్యాగింగ్ చాపకింద నీరులా.....

ఏయూ లో ర్యాగింగ్ చాపకింద నీరులా జరుగుతోందన్న వార్తలొస్తున్నాయి.. సీరియస్ గా మారితేనే ఆ విషయం బయటకొస్తోంది.. బయటి వ్యక్తులపై నిఘా పెట్టినప్పుడే వీటిని అరికట్టొచ్చని సూచిస్తున్నారు నిపుణులు..

కెప్టెన్ క్లార్క్ గుడ్ బై..

ఢిల్లీ : టెస్ట్ క్రికెట్ కు ఆస్ట్రేలియా కెప్టెన్ క్లార్క్ గుడ్ బై చెప్పనున్నాడు. యాషిస్ సిరీస్ తో క్లార్క్ వీడ్కోలు పలుకనున్నాడు. గత 12 ఇన్నింగ్స్ లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా క్లార్క్ నమోదు చేయకపోవడం గమనార్హం.

15:22 - August 8, 2015

హైదరాబాద్ : కమిటీ ఆన్‌ జనరల్‌ పర్పసెస్‌ సమావేశాన్ని ఈ నెల 11వ తేదీన నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దీన్ని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తీవ్రంగా తప్పుపట్టింది. 10వ తేదీన వైసీపీ ఢిల్లీలో ధర్నాకు దిగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీనాయకులందరూ ధర్నాలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో 11వ తేదీన కమిటీ ఆన్‌ జనరల్‌ పర్పసెస్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. వైసీపీ అధినేత జగన్‌ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావుకు ముఖ్యమంత్రికి బహిరంగలేఖ రాశారు. ప్రతిపక్షం నుంచి కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్పీకర్‌తో కలిపి మొత్తం 25 మందిని దీనికి పిలుస్తుండగా.. తనతో కలిపి కేవలం ముగ్గురికే ప్రతిపక్షం నుంచి అవకాశం ఇవ్వడమేంటని జగన్‌ లేఖలో ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాము ప్రస్తావించబోయే 19 ప్రధానాంశాలను కూడా ఆయన తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. కుటిల వ్యూహాలకు శాసనసభను వేదికగా మార్చొద్దని కోరారు. కమిటీ ఆన్‌ జనరల్‌ పర్పసెస్‌ సమావేశం ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారో..? చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్‌ఆర్‌ చిత్రపటాన్ని యథాతథంగా ఉంచాలని లేఖలో డిమాండ్‌ చేశారు. 

ఎమ్సీ చక్కెర కర్మాగారంలో కుల వివక్ష..

నెల్లూరు : నాయుడుపేట ఎమ్సీ చక్కెర కర్మాగారంలో అకారణంగా 11 మంది దళిత ఉద్యోగులను తొలగించారు. ఈమేరకు సీఈవో చంద్రశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. కర్మాగారం వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు.

వెస్ట్ బెంగాల్ లో విద్యార్థి హత్య కేసులో ముగ్గురు అరెస్టు..

పశ్చిమ బెంగాల్ : కోల్ కతాలో కాలేజీ విద్యార్థిని హత్యకు గురైన ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరికి నాలుగు రోజుల కస్టడీ విధించారు.

పశ్చిమబెంగాల్ లో యూత్ కాంగ్రెస్ ఆందోళన..

పశ్చిమబెంగాల్ : రాష్ట్రంలో విద్యార్థి మృతికి నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.

సబ్బుతో చేతులు కడుక్కొంటే రోగాలు నయం..

బ్రిటన్ : సబ్బుతో చేతులు కడుక్కొంటే రోగాలు రావని తేలింది. సౌంథాంప్టన్ వర్సిటీ మూడేళ్ల పాటు 20వేల మందిపై జరిపిన పరిశోధనలో మరోమారు వెల్లడైంది. చేతులు శుభ్రం చేసుకుంటే శ్వాస, జీర్ణకోశ వ్యాధుల నుండి రక్షణ ఏర్పడవచ్చని తేలింది.

క్రిడా కార్యశాలలో మంత్రి నారాయణ..

విజయవాడ : క్రిడా కార్యశాలలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. రాజధాని నిర్మాణంపై 15 మంది నిపుణలతో చర్చించడం జరిగిందని, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, పరిశ్రమలు, రవాణా, మూడు ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణపై చర్చించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నైపుణ్యాభివృద్దితో పాటు ఖాళీ స్థలాల నిర్వాహణ, పర్యావరణ భవన నిర్మాణాలపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.

గడింపల్లి రిజర్వాయర్ ను పూర్తి చేస్తాం - సీఎం కేసీఆర్..

కరీంనగర్ : గండిపల్లి రిజర్వాయర్ ను రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

14:47 - August 8, 2015

హైదారబాద్ : జమ్ముకాశ్మీర్‌లో పాకిస్తాన్‌ టెర్రరిస్టు కార్యకలాపాలకు నిరసనగా పాంథర్స్‌ పార్టీ ఆందోళనకు దిగింది. ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌ కార్యాలయం ముందు పాంథర్స్‌ పార్టీ ధర్నా చేశారు. కాశ్మీర్‌ సరిహద్దులో ఎడతెరిపి లేకుండా పాకిస్తాన్‌ కాల్పులు జరపుతోందని ఆరోపించింది. పాకిస్తాన్‌ మిలిటెంట్ల ద్వారా కాశ్మీర్‌లో దాడులు జరపడాన్ని తీవ్రంగా ఖండించింది.

14:45 - August 8, 2015

హైదరాబాద్ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురు రాధే మాను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. రాధేమాపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రాధేమాను నాసిక్‌లోని షాహీస్నాన్‌కు అనుమతిరంచరాదని ధార్మిక సంస్థలు పిలుపునిచ్చాయి .మరోవైపు రాధేమాపై వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అదనపు కట్నం అడగమని తన అత్తను ప్రేరేపిస్తున్నారంటూ ఇప్పటికే రాధేమాపై నిక్కీ గుప్తా అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఇక రాధేమా పొట్టి డ్రెస్‌ ల భాగోతం మాత్రం గుర్తు పట్టండి ఎవరూ అంటూ రాహుల్‌ మహాజన్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి బహిర్గతం చేశారు. ఈ వరుస పరిణామాలపై తనకు దేవుడే న్యాయం చేస్తాడని రాధేమా ప్రకటించింది.  

యుమున నదికి మంచి రోజులు - ఉమా భారతి..

ఢిల్లీ : యుము నదికి మంచి రోజులు వచ్చాయని కేంద్ర మంత్రి ఉమా భారతి ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 45 రోజుల్లో నదిని శుద్ది చేస్తామని, దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను తయారు చేస్తామన్నారు.

రాష్ట్రపతి సతీమణి పరిస్థితి విషమం..

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు.

 

ముగిసిన టి.కేబినెట్ సబ్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. హోం మంత్రి నాయినీ అధ్యక్షతనలో ఈ సమావేశం జరిగింది. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే పరిహారంపై ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విధానంపై సబ్ కమిటీ చర్చించింది. మరోసారి జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

 

బీహార్, హిమాచల్ ప్రదేశ్ లకు కొత్త గవర్నర్ లు..

ఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు గవర్నర్ లను రాష్ట్రపతి నియమించారు. హిమాచల్ ప్రదేశ్ కు ఆచార్య దేవ్ ప్రత్, బీహార్ రాష్ట్రానికి రామ్ నాథ్ కోవింద్ లు నియమితులయ్యారు.

 

వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య..

అనంతపురం : వేధింపులతో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది.

13:40 - August 8, 2015

హైదరాబాద్: ఇప్పటికే పది ప్రపంచ రికార్డులు సాధించిన తెలుగు తేజం ఎస్ ఎల్. నారాయణకు విద్యారత్న అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును పద్మభూషన్‌, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహిత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి చేతులమీదుగా నారాయణ అందుకున్నారు. హైదరాబాద్‌లోని ఆంధ్రసరస్వత్‌ కళాపరిషత్‌లో గోల్డెన్‌స్టార్‌ యూత్‌ వారి ఆధ్వర్యంలో విద్యార్థులను పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నందుకుగానూ.. నారాయణకు విద్యారత్న అవార్డును ప్రదానం చేశారు. నారాయణ చిన్నవయసులోనే 17 డిగ్రీలు సాధించిన తొలివ్యక్తిగా రికార్డు సాధించారు. అంతేకాకుండా.. పది గిన్నీస్‌బుక్‌ రికార్డులు నారాయణపేరిట ఉన్నాయి. విద్యారత్న అవార్డు రావడం తనకెంతో సంతోషంగా ఉందని నారాయణ చెప్పారు.

 

13:37 - August 8, 2015

విజయవాడ: భవానీపురంలోని ఎస్.సి సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ లో మంత్రి రావెల కిషోర్ బాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్ లో వసతులు సరిగా లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధులకు మెరుగైన సౌకర్యాలు కల్పించమని పదే పదే చెప్పినప్పటికీ తీరు మార్చుకోకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే పద్ధతి కొనసాగిస్తే కొరడా ఝళిపించక తప్పదని హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి రావెల కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించారు.

13:32 - August 8, 2015

గుంటూరు: ర్యాగింగ్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి పత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈనేపథ్యంలో ర్యాగింగ్ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పూనుకుంది. ఈ సందర్భంగా ర్యాగింగ్ లాంటి వ్యతిరేక చర్యలపై గుంటూరు కలెక్టరేట్‌లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కాలేజీలో ర్యాగింగ్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌, ఐజీతోపాటు ఇతర ముఖ్య అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏపీ ప్రభుత్వానికి జగన్ ప్రశ్నలు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్, సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నేత జగన్ లేఖ రాశారు. అందులో పలు ప్రశ్నలు సంధించారు. ఈనెల 11న జరుగనున్న కమిటీ సమావేశం ఏ ఉద్ధేశ్యంతో నిర్వహిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. సమావేశానికి ఉన్న నిర్ధిష్ట ఏజెండా ఏమిటనీ, 25 మందితో ఉన్న కమిటీలో ప్రతిపక్షం నుండి కేవలం ముగ్గురికే స్థానం కల్పించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈనెల పదిన వైసీపీ ధర్నా తలపడితే 11వ తేదీన కమిటీ సమావేశం పెట్టడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని విమర్శించారు. 

13:23 - August 8, 2015

మెగస్టార్ చిరంజీవి మేకప్ వేసుకోక చాలా రోజులైంది. ఆయన రాజకీయ ప్రవేశంతో సినిమాల్లో నటించడం లేదు. చిరు 150వ సినిమా వస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్. ఇందుకు చిరు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు టాలీవుడ్ టాక్. తాజాగా మెగస్టార్ చిరంజీవికి సంబంధించిన చిత్రాలు సోషల్ నెట్ వర్క్ లలో సందడి చేస్తున్నాయి. బర్త్‌డే అయిన ఆగష్టు 22వ తేదీన తన 150 సినిమా గురించి చిరు అధికారికంగా ప్రకటన చేస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి. పూరి డైరెక్షన్‌లో చిరంజీవి 150వ సినిమా ఉంటుందని, తాను ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నట్లు రామ్ చరణ్ పేర్కొన్నా ఈ మధ్య కాలంలో మళ్ళీ దీనిపై అనుమానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఎలా ఉన్నా చిరంజీవి ఫొటోలు చూస్తూ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఆయన నటించే సినిమా ఎలా ఉండబోతోంది ? ఆయన నటిస్తారా ? లేదా ? అన్నది తెలియాలంటే ఆగస్టు 22 వరకు వేచి ఉండాల్సిందే..

13:20 - August 8, 2015

విజయవాడ: సబ్సిడీపై ఉల్లికి ఏపీలో మంచి స్పందన వస్తోంది. రైతు బజార్లలో కిలో 20 రూపాయలకు లభిస్తున్న ఉల్లిపాయలకోసం జనాలు క్యూ కడుతున్నారు. విజయవాడలో ఉదయం ఎనిమిదిన్నరనుంచి రాత్రి 8గంటలవరకూ కౌంటర్లు తెరిచిఉంచుతున్నామని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే ఈ టైం పెంచుతామని చెబుతున్నారు. ఒక్కొక్కరికి రెండు కిలోలచొప్పున 3వందల నుంచి 350 బస్తాల వరకూ స్వరాజ్య మైదానం రైతు బజార్లో సరఫరా చేస్తున్నారు.

 

13:15 - August 8, 2015

హైదరాబాద్: ఉల్లిపాయలు పెట్టించే కన్నీళ్లు తుడిచేందుకు.. తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. అయినా వినియోగదారుల కష్టాలు వర్ణనాతీతంగానే ఉన్నాయి. గంటల తరబడి క్యూలోనే నిలుచుండడంతో.. ఉల్లిపాయల కోసం నిలుచున్నా, వాటి రేటు చూసినా.. కన్నీళ్లు మాత్రం తప్పడం లేదంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఉల్లిగడ్డలను తీసుకునేందుకు... అంతా ఒక్కసారే ఎగబడడం పెనుసమస్యగా మారుతోంది. చూశారుగా వీరంతా దేవుడి దర్శనానిలో వచ్చారనుకుంటున్నారా..? కానే కాదు. కేవలం ఉల్లిగడ్డల కోసమే.. ఇలా గంటల తరబడి క్యూ లైన్లలో వేచిచూస్తున్నారు.
ఉల్లిగడ్డల కోసం క్యూ
ఉల్లిగడ్డ ధర చూస్తే.. దానిని కోయకుండానే కన్నీళ్లు పెడుతున్నారు సామాన్యులు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం అందిస్తోన్న సబ్సిడీ ధరకు ఉల్లిపాయలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. దీంతో తెలంగాణ జిల్లాల్లోని ఏ రైతు బజార్‌ చూసినా.. ఇదేవిధంగా ఉల్లిగడ్డల కోసం క్యూ కడుతున్నారు వినియోగదారులు.
నెలమొత్తానికి రెండుకిలోల ఉల్లిగడ్డలే
రెండు కిలోల ఉల్లి గడ్డ కోనేందుకు రెండు గంటల పైనే సమయం పడుతుంది. దీనికి తోడు గుర్తింపు కార్డులంటూ ఉల్లిగడ్డ విక్రయం దారులు గుర్రు మంటుండడంతో.. కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారులకు తగ్గట్టుగా రైతుబజార్లలో సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో... నానా అవస్థలు పడుతున్నారు. అందులోనూ ప్రభుత్వం ఇచ్చే రెండు కిలోల ఉల్లిగడ్డలను నెలమొత్తం సరిపుచ్చుకోవాలంటే ఇబ్బందిగానే ఉంటోందని అంటున్నారు.
ప్రభుత్వ కౌంటర్లలో చెడిపోయిన ఉల్లిగడ్డలు
ఈ కష్టాలకు తోడు.. కొన్ని కేంద్రాలల్లో ఇచ్చే ఉల్లిగడ్డల్లో నాణ్యత లేదని అంటున్నారు. సగానికి సగం చెడిపోయినవే ఇస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన వాటిని ఎరుకునే అవకాశం ఇవ్వడం లేదని.. వారికి ఇష్టం వచ్చిన వాటినే ఇస్తున్నారని అంటున్నారు. చెడిపోయినవి తీసివేసే అవకాశం కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ఈనేపథ్యంలో తెల్ల ఉల్లిపాయలు ఇచ్చి ప్రజలకు మేలుచేయాలని కోరుకుంటున్నారు.
ఆలస్యంగా ఆధార్‌ నమోదు ప్రక్రియ
కొన్ని కేంద్రాల్లో వినియోగాదారుల డిమాండ్‌ తగ్గట్లుగా... ఉల్లిపాయల సప్లయ్‌ ఉండడం లేదు. దీంతో గంటలతరబడి క్యూలో నిలుచున్నా ఉపయోగం ఉండడంలేదని అంటున్నారు వినియోగదారులు. కొన్నిచోట్ల గుర్తింపు కార్డులను నమోదు చేసుకునే ప్రక్రియ చాలా ఆలస్యం అవుతోందని అంటున్నారు. దీంతో ఎక్కువ స్టాళ్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఒకేసారి నాలుగు కేజీలు ఇచ్చి మేలు చేయాలంటున్నారు.
ప్రభుత్వ తీరుపై ప్రజల అసహనం 
మొత్తానికి ప్రభుత్వం అందిస్తోన్న సబ్సిడీ ఉల్లిగడ్డలు కూడా.. సామాన్యులను కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల ప్రభుత్వ కృషిపట్ల వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు కూడా స్టాళ్లను ప్రత్యేకంగా పరిశీలిస్తుండడం, అక్రమార్కులు గౌడాన్లను కొల్లగొట్టి ప్రజలకు ఉల్లిపాయలు పంచుతుమని చెబుతుండంతో సంతోషంగా ఉందంటున్నారు. అయితే ఎక్కడా కూడా ప్రభుత్వం దాడులు జరిపించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నేతలు చెప్పేమాటలకు కట్టుబడి.. కొండెక్కిన ఉల్లిధరను సామాన్యుల చెంతకు చేర్చాలని కోరుకుంటున్నారు.

 

13:02 - August 8, 2015

కడప: ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని సీపీఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బస్సుయాత్రలో భాగంగా కడపకు వచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. మంత్రి యనమల రామకృష్ణుడు, జేసీ దివాకర్ రెడ్డి పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. స్పెషల్ స్టేటస్ ఏపీకి ఇవ్వమని కేంద్రం చెప్పలేదని యనమల అంటుండగా... రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని తనకు ఎప్పుడో తెలుసని జేపీ స్పష్టం చేస్తున్నారని విమర్శించారు.

 

ప్రత్యేక హోదాపై పోరాడలేం - యనమల..

విశాఖపట్టణం : కేంద్రంలో తాము భాగస్వామి అయినందుకే ప్రత్యేక హోదాపై పోరాడలేమని మంత్రి యనమల స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా లోటుతో ఉందని, అప్పులు చేసేనా సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. 

12:58 - August 8, 2015

విజయవాడ: సిద్ధార్థ పూర్వ విద్యార్థులు, హీల్‌ అకాడమీ ఆధ్వర్యంలో మెగా మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. విజయవాడలో జరిగిన ఈ మెడికల్‌ క్యాంపును కేంద్ర మంత్రి సుజనాచౌదరీ ప్రారంభించారు. సంస్థ చేస్తున్నకృషిని ఆయన ప్రశంసించారు.

 

గీత వ్యవహారంపై సుష్మా ట్వీట్స్..

హైదరాబాద్ : పాకిస్థాన్ లో తప్పిపోయిన భారత యువతి గీత వ్యవహారంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో స్పందించారు. గీతను భారత్ తీసుకొచ్చేందుకు భారత విదేశాంగ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, గీత తమ కూతురేనంటూ నాలుగు కుటుంబాలు పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. పంజాబ్, యూపీ, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల వాసులు గీత తమ కూతురంటూ ముందుకు వచ్చారని తెలిపారు. గీత నిజమైన తల్లిదండ్రులు ఎవరో గుర్తించాలని నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సుష్మా సూచించారు. తనకు ఏడుగురు అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు ఉన్నట్లు గీత చెబుతోందని సుష్మా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

 

ఏపీ స్పీకర్, సీఎం బాబుకు జగన్ లేఖ..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ కొడెల శివప్రసాద్, సీఎం చంద్రబాబు నాయుడులకు ప్రతిపక్ష నేత జగన్ లేఖ రాశారు. వర్షాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చిద్దామని, ప్రజా సమస్యలపై కాకుండా కుఠిల రాజకీయాలకు అసెంబ్లీని వేదిక చేయొద్దని జగన్ లేఖలో కోరారు. 

12:56 - August 8, 2015

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా జమ్మూలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా 300 కి.మీ ఉన్న జమ్మూ - శ్రీనగర్‌ హైవేపై ఉధంపూర్‌ జిల్లాలో ఖేరీ వద్ద కొండ చరియలు విరిగిపడి రహదారి మూసుకుపోయినట్లు గుర్తించారు. దీంతో అమర్‌ నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. మరో వైపు ప్రభుత్వ యంత్రాంగం కొండ చరియలు తొలగించి రహదారిని పునరుద్ధరించే పనిలో నిమగ్నమైంది.

12:48 - August 8, 2015

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని  సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు ముందుకొస్తే వారిని అరెస్ట్‌ చేయించడంపై సీఎల్పీ నేత జానారెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్‌ ప్రతిపక్ష నేతలకు అపాయింట్‌ మెంట్‌ ఇవ్వకపోవడంపై ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షా భావపరిస్థితులతోపాటు పలు సమస్యలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు తమ బాధలు, కష్టాలను వ్యక్త పరుస్తున్నారని.. రైతుల ఆత్మహత్యలను నివారించాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని విలేకరులు అడిగిన ప్రశ్నలకు  ఆయన సమాధానమిస్తూ... మున్సిపల్ కార్మికుల పోరాటం, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల బకాయిలు వంటి పలు సమస్యలను చూస్తే ప్రభుత్వ పనితీరు అర్థమవుతుందన్నారు. 

12:40 - August 8, 2015

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన సబ్సిడీ ఉల్లిగడ్డల అమ్మకాల కౌంటర్లు మూతపడ్డాయి. రాష్ర్టంలో డిప్యూటీ సీఎంలతో పాటు మంత్రులంతా వారికి సమీపంలోని మార్కెట్లలో ఈ కౌంటర్లను మూడు రోజుల క్రితం ప్రారంభించారు. రెండు రోజులు మాత్రమే సక్రమంగా నడిచిన ఈ కౌంటర్లు ప్రస్తుతం నో స్టాక్‌ బోర్డు పెట్టి మూసివేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఎల్ బి నగర్, కొత్తపేట, మెహిదిపట్నంలోని షాపులతోపాటు 40 కౌంటర్లలో సగానికిపైగా మూతపడ్డాయి. కొన్ని కేంద్రాల్లో కేవలం గంట మాత్రమే కిలో 20 రూపాయలకు అమ్ముతున్నారు. ఉల్లిగడ్డలను కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు

 

 

హస్తిన పర్యటన విజయవంతం - ఓయూ జేఏసీ..

ఢిల్లీ : హస్తిన పర్యటన విజయవంతం అయిందని ఓయూ జేఏసీ ప్రకటించింది. రెండు రోజుల పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినట్లు జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఓయూలో నిర్వహించే సభకు రాహుల్ ను ఆహ్వానించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం చేసింది విద్యార్థులు అయితే ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం పెత్తనం చేస్తున్నారని, ఉన్నత విద్యను నిర్వీర్యం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బహిరంగ సభ ద్వారా పోరాటానికి సిద్ధమౌతామని జేఏసీ స్పష్టం చేసింది.

12:24 - August 8, 2015

ఢిల్లీ: హస్తినలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో గవర్నర్ భేటీ అయ్యారు. హైకోర్టు, ఉమ్మడి సంస్థలు, ఉద్యోగుల పంపకాలు, హెడ్యూల్ 9, 10 అంశాలు, విజయడైరీ, శాంతి భద్రతలు, సెక్షన్ 8 వంటి పలు అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై గవర్నర్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. నీటి పంపకాల విషయంపై రాజ్ నాథ్ సింగ్ ఆరా తీసినట్లు సమాచారం. దాదాపు 20 నిమిషాలపాటు సమావేశం కొనసాగుతోంది. అంతకముందు... గవర్నర్ హోంశాఖ సెక్రటరీ గోయెల్ తో 40 నిమిషాలపాటు భేటీ అయ్యారు.

 

విష్ణు థియేటర్ వద్ద ప్రిన్స్ అభిమానుల ఆందోళన..

హైదరాబాద్ : వనస్థలిపురంలోని విష్ణు థియేటర్ వద్ద మహేష్ అభిమానులు ఆందోళన నిర్వహించారు. ఆన్ లైన్ టికెట్ల జారీలో మోసం చేశారంటూ అభిమానులు ఆందోళన చేయడంతో చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు.

 

నగరంలో సబ్సిడీ ఉల్లిగడ్డల అమ్మకాల నిలిపివేత..

హైదరాబాద్ : నగరంలో సబ్సిడీ ఉల్లిగడ్డల అమ్మకాలను నిలపివేశారు. ఎల్బీ నగర్ లో నో స్టాక్ బోర్డును పెట్టారు.

ర్యాగింగ్ పై కఠినం - మంత్రి ప్రత్తిపాటి..

గుంటూరు : ర్యాగింగ్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి ప్రత్తిపాటి పేర్కొన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ర్యాగింగ్ నిరోధంపై సదస్సులు నిర్వహించాలని..ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రి ప్రత్తిపాటి సూచించారు.

 

టి.టిడిపి నేతల భేటీ..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టి.టిడిపి నేతలు భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేయాల్సిన కార్యక్రమాలపై నేతలు చర్చిస్తున్నారు.

రాంచీలో ఐదుగురు మహిళల దారుణ హత్య..

జార్ఖండ్ : రాంచీలో దారుణం చోటు చేసుకుంది. మందర్ గ్రామంలో మంత్ర పూజలు చేస్తున్నారనే అనుమానంతో ఐదుగురు మహిళలను దారుణంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో బట్టలను చంచి కత్తులు..లాఠీలతో ఒకరి తరువాత ఒకరిని చంపేశారని మృతురాలి కూతురు ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొంది. 

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో టి.సర్కార్ దిష్టి బొమ్మ దగ్ధం..

హైదరాబాద్ : వామపక్ష నేతల అరెస్టులను ఖండిస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను నేతలు దగ్ధం చేశారు. 

11:58 - August 8, 2015

హైదరాబాద్: విద్యుత్‌ రంగంలో ఏర్పడే సమస్యలు అధిగమించేందుకు విద్యుత్‌ రంగ నియత్రణ మండలి ఎట్టకేలకు కసరత్తు ముమ్మరం చేసింది. విద్యుత్‌రంగంలో సమస్యలు తలెత్తడానికి వివిధ విభాగాల పట్ల సమన్వయం లేకపోవడమే కారణమని విద్యుత్ నియంత్రణ మండలి గుర్తించింది. అనేపథ్యంలో రాష్ట్ర స్థాయి విద్యుత్ రంగ సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేసింది. విద్యుత్‌రంగంలో ప్రాథమిక సమస్యలపై చర్చించి ముందే పరిష్కరించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ విద్యుత్‌ సౌదాలో జరిగిన సమన్వయ సంఘం తొలి సమావేశానికి పలు ప్రజాసంఘాలు, రైతు సంఘాలతోపాటు విద్యుత్‌ వినియోగదారులకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమన్వయ సంఘంలో కేవలం ప్రభుత్వ రంగ నిపుణులే కాకుండా ప్రైవేట్‌రంగ నిపుణులు సైతం పాల్గొన్నారు.
సమస్యలపై సంఘానికి ఫిర్యాదు
రాష్ట్రంలోని అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు ఈ సమన్వయ సంఘంలో పాల్గొంటారని ఎపీఈఆర్‌సీ ఛైర్మన్‌ భవానీప్రసాద్‌ తెలిపారు. విద్యుత్‌రంగంలో ఏ సమస్య ఏర్పడిన ఈ సమన్వయ సంఘానికి ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. గత ఏడాది విద్యుత్‌ పొదుపు విషయంలో ఏపీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్‌రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యుత్‌రంగంలో అభివృద్ధిపరమైన నిర్ణయాలే తప్ప వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అధికారం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగురాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై కేంద్ర ప్రభుత్వం, కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయని అభిప్రాయపడ్డారు.

 

టి. కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. హోం మంత్రి నాయినీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, డీజీపీ, పోలీసు అధికారులు హాజరయ్యారు. ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు పరిహారం పెంపుపై చర్చిస్తున్నారు. 

సోనియాతో ముగిసిన టి.కాంగ్రెస్, ఓయూ విద్యార్థి జేఏసీ భేటీ..

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో టి.కాంగ్రెస్ నేతలు, ఓయూ విద్యార్థి జేఏసీ జరిపిన భేటీ ముగిసింది.

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం..

ముంబై : ఇండిగో విమానంలో సాంతిక లోపం ఏర్పడింది. ముంబై నుండి ఢిల్లీ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై ఎయిర్ పోర్టులో విమానాన్ని పైలట్ ల్యాండ్ చేశాడు.

11:31 - August 8, 2015

ఢిల్లీ: తెలుగు రాష్ర్టాల మధ్య ఎలాంటి విబేధాలు లేవని గవర్నర్ నరిసింహన్ పేర్కొన్నారు. ఈరోజు జరిగింది సాధారణ సమావేశమని చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి ఎల్ సి గోయెల్ తో భేటీ అయ్యారు. ఉద్యోగుల విభజన, ఆస్తుల పంపకాలు, విద్యుత్ ఉద్యోగుల సమస్యలు వంటి పలు అంశాలపై చర్చించారు. ఇదిలావుంటే ఇరు రాష్ట్రాల మధ్య అనునిత్యం పలు అంశాలపై వివాదం నడుస్తోంది. ఆస్తుల పంపకాలు, హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన, నీటి పంపకాలు వంటి అనేక సమస్యలతో ప్రతిరోజు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు తగవులాడుకుంటున్నాయి. ఈనేపథ్యంలో గవర్నర్ ఎలాంటి విభేదాలు లేవనడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 11.45 గంటలకు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో గవర్నర్ భేటీ కానున్నారు. ఇటీవలే తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, ఎపి సీఎస్ ఐవైఆర్ కృష్ణారావులు కేంద్రహోంశాఖ కార్యదర్శితో భేటీ అయిన విషయం తెలిసిందే. గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. నేడు, రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు.  

11:30 - August 8, 2015

తమ అభిమాన నటుడి సినిమా విడుదలైతే చాలు..అభిమానుల ఆనందానికి అడ్డు ఉండదు. థియేటర్ల దగ్గర హడావుడి అంతా ఇంత ఉండదు. డప్పులు, రంగులు చల్లుకుంటూ తమ అభిమానం ఎలా ఉందో చూపిస్తుంటారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా విడుదలైంది. మహేష్ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. ఓ అభిమాని గెటప్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఓ అభిమాని 'శ్రీమంతుడు' అనే అక్షరాలను తలపై రాయించుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు. సోషల్ నెట్ వర్క్ లో ఈ ఫొటో హల్ చల్ చేస్తోంది. సమాజం కోసం గ్రామాలను దత్తత తీసుకునే కధాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. 

ఆగస్టు 15 వేడుకలపై ఏపీ మంత్రుల సమీక్ష..

హైదరాబాద్ : ఆగస్టు 15వేడుకలపై మంత్రులు యనమల, గంటా సమీక్ష జరిపారు. సుమారు 25వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అవసరాలకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

నకిలీ పాస్ పుస్తకాల స్కాంలో 18 మంది అరెస్టు..

అనంతపురం : నకిలీ పాస్ పుస్తకాల కుంభకోణంలో 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 256 నకిలీ పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కదిరి కేంద్రంగా ముఠా కార్యకలాపాలు సాగిస్తోందని, ఈ స్కామ్ లో వీఆర్ వోలు, మీ సేవ నిర్వాహకుల హస్తం ఉందని ఎస్పీ రాజశేఖర్ పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో ఓ మాజీ వీఆర్వో కూడా ఉన్నారని పేర్కొన్నారు. 

 

11:12 - August 8, 2015

హైదరాబాద్: రంగుల ప్రపంచంలో విహరించే ఓ చిలుకకు కష్టమొచ్చింది. తన పయనంలో కలిసొచ్చిన గోరింక మరో తోడు వెతుక్కుని రివ్వున ఎగిరిపోయింది. కడదాకా ఉంటానన్న తోడు, జీవితాన్ని మోడులా మార్చేయటంతో చిలుక కాస్తా గుబులు పట్టి గూటికే పరిమితమైంది. మనసుకు గాయమైనందుకుగాను భవిష్యత్తుకు అర్ధాంతరంగా ముగింపు పలకాలనుకుంది. ఇది గతం. కానీ ఇప్పుడు అదే చిలుక మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తానంటోంది.
చలాకీతనానికి చిరునామా దీపికా
చలాకీతనానికి చిరునామా దీపికా పదుకొనే.. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ ప్రకాష్‌ పదుకొనే గారాల పట్టి. ఇలా కంటే కుర్రకారుకు కునుకు దూరం చేసిన అందాల బొమ్మగానే యావత్‌ దేశానికి సుపరిచితురాలు. బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్న దీపికా సిల్వర్‌ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా చలాకీతనానికి కూడా కేరాఫ్‌ అడ్రస్‌.
డిప్రెషన్‌కు లోనైన దీపికా
అలాంటి దీపికా, రణబీర్‌ కపూర్‌తో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది. అది కాస్తా బ్రేక్‌ అప్‌ అవటంతో తర్వాత విజయ్‌ మాల్యా తనయుడు సిద్ధార్ధ మాల్యాతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగింది. కొన్నాళ్లకు ఈ లవ్‌ గాడీ కూడా గాడి తప్పింది. తోడుంటానన్న వాళ్లు కాస్తా హ్యాండ్ ఇవ్వటంతో ఈ ముద్దుగుమ్మ తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైంది. కొంతకాలం షూటింగ్‌లకు విరామం ఇచ్చి ఏకాంతాన్ని ఆశ్రయించింది.
తిరుగులేని హిట్స్ తో సత్తా చాటిన దీపికా
ఇది గతం. సీన్‌ కట్‌ చేస్తే డిప్రెషన్‌ నుంచి బయట పడిన మళ్లీ పుంజుకుంది. తిరుగులేని హిట్స్‌తో సత్తా చాటింది. సక్సెస్‌ రూట్లో దూసుకుపోతున్నా దీపిక గతం మర్చిపోలేదు. తన గతం వేరొకరికి భవిష్యత్తు ఇవ్వాలని సంకల్పించింది. అందుకే లివ్ లవ్‌ లాఫ్‌, ఫౌండేషన్‌ ఎగైన్ట్స్‌ డిప్రెషన్‌ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్ధను స్ధాపించి డిప్రెషన్‌ వల్ల కలిగే నష్టాలను, భవిష్యత్తుపై డిప్రెషన్‌ చూపే దుష్ప్రభవాన్ని క్యాంపెయిన్‌ చేస్తానంటోంది. ట్విట్టర్‌ వేదికగా తన లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌ లోగోను లాంఛ్‌ చేసింది దీపిక.
నేనూ ఓ డిప్రెషన్ బాధితురాలినే
యువత ఎదుర్కొంటున్న సమస్యల్లో డిప్రెషన్‌ ప్రధానమైనది.ఒకప్పుడు నేనూ డిప్రెషన్ బాధితురాలినే. డిప్రెషన్‌కు వ్యతిరేకంగా పోరాడటం నా బాధ్యత. అందుకే డిప్రెషన్‌కు గురైన బాధితుల్లో స్ఫూర్తి నింపేందుకే ఫౌండేషన్‌ ఎగైన్ట్స్‌ డిప్రెషన్‌ సంస్ధను స్ధాపించానని దీపిక చెబుతోంది. నీకు విజ్ఞానం కావాలంటే రోజూ కొంత నేర్చుకో.. అదే జ్ఞానం కావాలంటే మాత్రం పరాజయం నుంచి నేర్చుకో అన్నాడో తత్వవేత్త. దీపికకు ఇప్పుడు ఇది సరిగ్గా సరిపోతుంది. తనకు ఎదురైన కష్టం మరొకరికి ఎదురు కాకూడదు. ఒకవేళ ఎదురైతే కన్నీళ్లతో కాళ్లు కడిగి స్వాగతించకు అని చెప్పేందుకు సిద్ధమవుతున్న దీపికను చూసి మరికొందరు సెలబ్రిటీలు సమాజ హితం కోసం సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

రాష్ట్రాల మధ్య ఎలాంటి విబేధాలు లేవు -గవర్నర్..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు జరిగింది సాధారణ సమావేశమేనని తెలిపారు. ఇరు రాష్ట్రాల మద్య నెలకొన్న వివాదాలపై గవర్నర్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. 

గుంటూరు కలెక్టరేట్ లో ర్యాగింగ్ పై సమావేశం..

గుంటూరు : ర్యాగింగ్ పై కలెక్టరేట్ లో సమావేశం జరుగుతోంది. పోలీసు శాఖ, విద్యా శాఖల బాధ్యులపై కలెక్టర్ చర్చిస్తున్నారు. మంత్రి ప్రత్తిపాటి, గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ పాల్గొన్నారు. 

10:51 - August 8, 2015

స్టార్ లు చేయి చేసుకోవడం అక్కడక్కడ చూస్తుంటాం. ఫ్యాన్స్ ఇబ్బంది పెడుతుంటే ఓపిక నశించిన సదరు యాక్టర్లు చేయి చేసుకుంటూ ఉంటుంటారు. కానీ ఓ నటుడి పరిస్థితి మాత్రం విచిత్రంగా ఉంటుంది. ఎక్కువగా అతను సదరు యాక్టర్లపైనే చేయి చేసుకుంటుంటాడు. అతనే 'ఆదిత్య పంచోలి'. సెట్లో అనేక సార్లు ఇతర నటులపై పంచోలి చేయి చేసుకున్నాడనే విమర్శలు ఉన్నాయి. తాజాగా 'లాఖోం హై యహా దిల్ వాలే' షూటింగ్ సమయంలో సెట్లో పాల్గొంటున్న విజయ్ భాటియాను ఆదిత్య పంచోలి లాగి కొట్టాడంట. అక్కడనే ఉన్న డైరెక్టర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారనే టాక్. నెక్ట్స్ ఆదిత్య పంచోలి ఎవరిని కొడుతారో ? 

కేంద్ర హోం శాఖ కార్యదర్శితో గవర్నర్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర హోం శాఖ కార్యదర్శితో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితిపై నరసింహన్ చర్చిస్తున్నట్లు సమాచారం.

10:46 - August 8, 2015

హైదరాబాద్: దేశరాజధానితోపాటు ఉభయరాష్ట్రాల్లో డెంగీ విజృంభిస్తుంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన రోగులు పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో ఎనిమిది నెలల కాలంలోనే 57 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇక తెలుగు రాష్టాల విషయానికొస్తే... కేజీహెచ్ లో ఓ మహిళ డెంగీ వ్యాధితో మృతి చందిన వార్త కలకలం సృష్టించింది. హైదరాబాద్ లో డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. గాంధీ ఆస్పత్రిలో తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. మరో ఐదుమందికి డెంగీ సోకినట్లు అనుమానిస్తున్నారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో 13 మంది ఈ జ్వరాలతో బాధపడుతున్నారు. రోగులు తీవ్ర జ్వరం, ఒల్లు నొప్పులతో ఆస్పత్రుల్లోకి వస్తున్నారు. నగరంలో పారిశుద్ధ్యం లోపించడంతో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయని, వర్షాకాలం కావడంతో చిన్నపాటి వర్షానికి చెత్తంతా తడిసిపోయి దుర్భందభరితంగా మారిపోతోందని ప్రజలు పేర్కొంటున్నారు. మురికికాలువల్లో చెత్త చెదారం పేరుకపోవడంతో మురికినీరు ప్రవహిస్తోందని, ఇదే పరిస్థితి కొనసాగితే రోగాలు మరింత విజృంభించే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. వెంటనే ప్రభుత్వాలు మేల్కోని డెంగీ వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

10:24 - August 8, 2015

జైపూర్ : రోడ్డు మీద వెళుతుంటే కొన్ని కరెన్సీ నోట్లు కనబడితే ఏం చేస్తారు ? కొంతమంది ఎవరూ చూడకుండా ఠక్కున జేబులో వేసుకుంటారు. కొంతమంది మాత్రం నిజాయితీ చాటుకుంటుంటారు. అలాంటి వారిలో ఈ రిక్షా వోడు ఒకడు. తనకు దొరికిన నోట్ల కట్టలను నిజాయితీ పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఎవరా వ్యక్తి ? ఎక్కడ జరిగింది ? అనేది తెలుసుకోవాలంటే ఇది చదవండి..
మహ్మద్ అబిద్ ఖురేషి జైపూర్ లో రిక్షా తొక్కుతుంటాడు. ఇతనికి భార్య, ఓ పాప ఉంది. రోజాంతా కష్టపడితే సుమారు రూ.200-300 సంపాదిస్తాడు. అలాంటిది ఒక రోజు ఓ షాపులో సరుకు దింపి వస్తున్న క్రమంలో గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర ఓ ప్లాస్టిక్ బ్యాగ్ కనిపించింది. తెరిచి చూశాడు. ఒక్కసారిగా ఆశ్చర్యం. నోట్ల కట్టలు. సుమారు రూ.1.17వేల రూపాయలున్నాయి. బ్యాగును ఇంటికి తీసుకెళ్లి భార్యకు చెప్పాడు. వెంటనే ఖురేషి దంపతులు స్థానికంగా ఉండే సోషల్ వర్కర్ సాయంతో సమీప పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. కమిషనర్ ఖురేషిని అభినందించాడు. అందరికీ ఖరేషీ ఆదర్శం కావాలని, ఆగస్టు 15వ తేదీన ఇతడిని సన్మానిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. 

10:20 - August 8, 2015

ఢిల్లీ: ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న సినిమా రిలీజైందని సినిమా చూసేందుకు వెళ్తున్నారా..? సోలోగా ఎందుకని ఫ్యామిలీని కూడా వెంట తీసుకెళ్తున్నారా..? హ్యాపీగా వెళ్లండి. ఎందుకంటే మున్ముందు ఫ్యామిలీతో కాదు సోలోగా సినిమా చూడాలంటేనే భయపడే పరిస్ధితి రావచ్చు. సినిమా పేరు తల్చుకోవాలంటేనే జేబులు తడుముకునే దుస్ధితి పట్టొచ్చు. జిఎస్ టి బిల్లు అందుకు రెడీగా ఉంది.
రాజ్యసభలో జిఎస్ టికి ఆమోదం..
జిఎస్ టి గూడ్స్ అండ్ సర్వీస్‌ టాక్స్ బిల్‌. ఇప్పుడు సినిమా పెద్దల్లో కలవరం పుట్టిస్తున్న బిల్లు. రాజ్యసభలో పాస్‌ అయి లోక్‌సభలో ఆమోదం పొందేందుకు సిద్ధంగా ఉన్న జిఎస్ టి బిల్‌ సినిమాకెళ్లకుండానే సినిమా చూపించేందుకు రెడీ అవుతోంది.
భారీగా పెరగనున్న టిక్కెట్ ధరలు
లోక్‌సభలో కనుక జిఎస్ టి బిల్లు ఆమోదం పొందితే ప్రాంతీయ సినిమాలపై పన్నుభారం పడుతుంది. 27శాతం పన్ను బాదుడుతో ప్రాంతీయ సినిమాలు భారీగా పన్ను కట్టాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఆ భారం వినియోగదారుడు అంటే ప్రేక్షకుడిపై పడుతుంది. ఇప్పటికే దడపుట్టిస్తున్న టిక్కెట్ ధరలు జిఎస్ టి దెబ్బతో మరింతగా పెరుగుతాయి.
ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా లేఖ
జిఎస్ టి బిల్లు దండయాత్ర చేస్తే ప్రాంతీయ సినిమాల మనుగడ కష్టమని ఇప్పటికే ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా కేంద్రానికి ఓ లేఖ రాసింది. అందుకు ఎలాంటి ప్రతిస్పందన లేకపోవటంతో అమీర్‌ఖాన్‌,హృతిక్‌ రోషన్‌ వంటి నటులు ప్రధానిని కలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కేవలం భజరంగీ భాయిజాన్‌, బాహుబలి వంటి హిట్లు చూసి కేంద్రం తప్పుగా ఆలోచిస్తోందని, 80శాతానికి పైగా సినిమాలు కనీస లాభాలను కూడా ఆర్జించలేక పోతున్న యధార్ధాన్ని కేంద్రం గమనించాలని ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వాదిస్తోంది. మరి బాలీవుడ్ పెద్దలు, ఎఫ్ ఎఫ్ ఐ బోర్డ్ చేస్తున్న ప్రయత్నం కేంద్రాన్ని ఎంతమేరకు ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉంది.

 

 

నీట మునిగిన ధరమ్ పూర్ బస్టాండు..

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధరమ్ పూర్ బస్టాండు వరదనీరు పోటెత్తింది. దీనితో నాలుగు బస్సులు నీట మునిగిపోయాయి. ప్రస్తుతం అక్కడ ఆరుగురు ప్రయాణీకులు చిక్కుకున్నట్లు సమాచారం. అదే గ్రామంలో రెండు ఇళ్లు కూలిపోయినట్లు తెలుస్తోంది. 

ఢిల్లీతో పాటు నగరంలో పెరుగుతున్న డెంగీ కేసులు..

హైదరాబాద్ : దేశ రాజధానితో సహా తెలుగు రాష్ట్రాల్లో డెంగీ విజృంభిస్తోంది. ఢిల్లీలో ఈ ఏడాది 57 డెంగీ కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో రెండు, ఫీవర్ ఆసుపత్రిలో 13 డెంగీ కేసులు నమోదయ్యాయి. 

ఉప్పరపల్లెలో రూ.105 కోట్ల ఎర్రచందనం దుంగలు స్వాధీనం..

కడప : రైల్వే కోడూరు (మ) ఎస్.ఉప్పరపల్లెలో రూ.105 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.

 

ఒంగోలు వాసికి అరుదైన ఘనత..

హైదరాబాద్ : ఒంగోలు వాసి కొండూరి రవీంద్ర బాబుకు ఉన్నత గౌరవం లభించింది. షాంఘైలో గాంధీతత్వ పరిశోధనాసంస్థను భారతీయ ప్రధాని మోడీ ప్రారంభించారు. షాంఘై గాంధీతత్వ సంస్థ ప్రతినిధిగా రవీంద్రను నియమించారు. తొలి భారతీయ ప్రతినిధిగా రవీంద్రబాబు చరిత్రకెక్కారు. చైనాలో తత్వశాస్త్ర ఆచార్యుడిగా రవీంద్రబాబు పనిచేస్తున్నారు. 

ఉచితంగా ఆలుగడ్డల పంపిణీ..

పంజాబ్ : జలంధర్ లో ప్రజలకు ఆలుగడ్డలను రైతులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆలుగడ్డల ధరలు మారెట్లో పతనావస్థలోకి దూసుకెళ్లడంమే ఇందుకు కారణం.

కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

తూ.గో: గొల్లప్రోలు మండలం మల్లవరం వద్ద భాష్యం స్కూల్ బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులు క్షేమంగా ఉన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 11 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు..సర్వ దర్శనానికి నాలుగు గంటలు..కాలినడకన వెళ్లే భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది.

09:26 - August 8, 2015

హైదరాబాద్: అక్రమ సారాను అరికట్టడమే లక్ష్యంగా.. తెలంగాణ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని రూపొందించింది. గుడుంబా స్థానంలో.. ప్రభుత్వమే ప్రాణహాని లేని చవక మద్యాన్ని అమ్మాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ సచివాలయంలో నూతన మద్యం పాలసీ విధానాలపై సమీక్షించిన సీఎం కేసీఆర్‌...బాటిళ్ల ద్వారా చీప్ లిక్కర్‌ సరఫరాను అక్టోబరు 1 నుంచి అమలు చేయాలని ఆదేశించారు.                                                               
గుడుంబా నివారణపై ప్రత్యేక ప్రణాళికలు
గుడుంబా నివారణపై టీ-సర్కార్‌ ప్రత్యేక ప్రణాళికలు సైతం రూపొందించింది. అక్రమ సారా తయారీదారులపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడంతో పాటు... సమాచారం అందించిన వారికి అవార్టులు ఇవ్వాలని నిర్ణయించింది. వీటితో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని గ్రామాల్లోను ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు కేసీఆర్‌ సూచించారు.
చీప్ లిక్కర్ అమ్మకానికి లైసెన్స్ జారీ 
మరోవైపు చీప్ లిక్కర్ అమ్మకానికి గ్రామీణ మండలం యూనిట్‌గా లైసెన్స్ జారీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. లాటరీ పద్ధతి ద్వారానే మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త ఎక్సైజ్ విధానానికి ఆగస్టు 15 తర్వాత నోటిఫికేషన్ జారీ చేయాలని తెలిపారు. బేవరేజెస్ కార్పొరేషన్‌ను డిపార్ట్‌మెంట్‌గా మార్చాలని డీఐజీ స్థాయి అధికారిని ఎక్సైజ్ శాఖలో నియమించాలని ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో అధికారులకు సూచించారు. మొత్తానికి బహుముఖ వ్యూహంతో... అక్రమ సారాను కట్టడి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం... ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.

 

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపిటిసి మృతి

మెదక్: జిల్లాలోని చేగుంట మండలం వడ్యారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపిటిసి సభ్యుడు అశోక్ రెడ్డి(51) మృతి చెందాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 

08:52 - August 8, 2015

ప్రభుత్వాలు అఖిలపక్షానికి విలువ ఇవ్వడం లేదని....ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని వక్తలు హితవు పలికారు. నిన్న ప్రజాసమస్యలను సీఎం కేసీఆర్ కు విన్నవించుకోవడానికి అఖిలపక్ష నేతలు సీఎంను కలవడానికి వెళ్లారు. కానీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. పైగా అక్రమంగా నేతలను అరెస్టు చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు నేతలు పిలుపునిచ్చారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆంధ్రామేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, బిజెపి నేత వేణుగోపాల్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, టీఆర్ ఎస్ నేత తాడూరు శ్రీనివాస్, కాంగ్రెస్ నేత సంపత్, టిడిపి ఎపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణప్రసాద్ లు పాల్గొని, మాట్లాడారు. విపక్షాలకు సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం అప్రజాస్వామికమన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నేటి నుంచి ఒడిషాలో రాష్ట్రపతి పర్యటన

భువనేశ్వర్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేటి నుంచి ఒడిషాలో పర్యటించనున్నారు. లా యూనిర్సిటీ స్నాతకోత్సవంలో ప్రణబ్ పాల్గొననున్నారు. 

08:18 - August 8, 2015

హైదరాబాద్: కేజీ టు పీజీ విద్యా విధానంపై కాస్త క్లారిటీ వచ్చింది. 2016-17 విద్యాసంవత్సరం నుంచి కేజీ టు పీజీ విద్యను అమలు చేస్తామని టీ-సర్కార్‌ స్పష్టం చేసింది. ఆలస్యమైనా ఎటువంటి తప్పిదాలు లేకుండా పకడ్బందీగా అమలు చేస్తామని స్పష్టం చేసింది. నిపుణులు, విద్యావేత్తల సలహాలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
మూడు భాగాలుగా కేజీ టు పీజీ విద్య
కేజీ టు పీజీ పథకాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. కేజీ నుంచి నాలుగో తరగతి, ఐదు నుంచి 12వ తరగతి, ఆ తర్వాత పై చదువులుగా విభజించి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తారు. ఐదో తరగతి నుంచి 12వ తరగతి వరకు గురుకుల పద్దతిలో ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్యను అందిస్తామని కడియం శ్రీహరి చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి పది రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 700ల దాకా రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయని అవికాక.....మొత్తం 119 నియోజకవర్గాల్లో మరో 1190 పాఠశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీటి ద్వారా 7 లక్షల 50 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విశ్వవిద్యాలయాల చట్టంలో మార్పులు
ఇక రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల చట్టానికి మార్పులు చేస్తామని కడియం అన్నారు. 4 నెలల్లో యూనవర్సిటీలకు వీసీలను నియమిస్తామని, ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్లను రైగ్యులరైజ్ చేశాకే...ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. విద్యాశాఖలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా....ఆన్‌లైన్ సేవలకు ప్రవేశపెట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇంటర్ బోర్డులో అన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని..త్వరలోనే సాంకేతిక, ఉన్నత విద్యామండలి సేవలను ఆన్‌లైన్ చేస్తామన్నారు. కార్పొరేట్ కాలేజీల ఆధిపత్యాన్ని తగ్గించటానికి....గ్రేడింగ్‌ విధానం అమలుకు యోచిస్తున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు.
ప్రజాసంఘాలు-విద్యార్థి సంఘాల అభ్యంతరాలు
ప్రభుత్వం ప్రకటించిన కేజీ టు పీజీ విద్యావిధానంపై ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కేజీ టూ విద్యను కేవలం రెసిడెన్షియల్‌ స్కూళ్లకే పరిమితం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అలా అయితే ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాల్లోనూ కేటీ టూ పీజీ విద్యా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

08:08 - August 8, 2015

హైదరాబాద్: పిడికిళ్లు బిగిస్తున్నారు... సమరభేరీ మోగిస్తున్నారు... మరో పోరాటానికి టీ-జేఏసీ లీడర్లు సన్నద్ధమవుతున్నారు. సంపూర్ణ తెలంగాణ దిశగా... జంగ్ సైరన్ మోగిస్తోంది. ప్రత్యేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీ-జేఏసీ... స్వరాష్ట్రంలో పోరుబాటకు రెడీ అవుతోంది.
పార్టీలను పరుగులు పెట్టించిన టీ-జేఏసీ
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పార్టీలను పరుగులు పెట్టించిన టీ-జేఏసీ నవ తెలంగాణలో మాత్రం సైలెంట్‌గానే ఉంది. నేతలంతా తలో పార్టీ గూటికి చేరుకోవడంతో టీ-జాక్ పనైపోయిందన్న విమర్శలు కూడా వినిపించాయి. తెలంగాణ ఉద్యమంలో టీ-జేఏసీ తరపున కీలక పాత్ర పోషించిన ముఖ్య నేతల్లో కోదండరామ్‌ మినహా నేతలు... తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజకీయ పార్టీల్లో చేరిపోయారు.
ఉద్యమ రూపకల్పన..
కొంతమందికి ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందే అవకాశం వచ్చినా... మరికొంత మంది ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో ఏడాది కాలంగా ఎలాంటి కీలక నిర్ణయాలను తీసుకోలేని ఉద్యమ నేతలు... మరోసారి జంగ్ సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన సంపూర్ణంగా జరుగలేదని... వాదిస్తోన్న టీ-జాక్ అందుకు అనుగుణంగా ఉద్యమ రూపకల్పన చేస్తోంది.
కరువు-రైతు సమస్యలపై అధ్యయనం
నేటికీ హైకోర్టుతో పాటు ఉద్యోగుల విభజన విషయంలో స్పష్టత రావడం లేదు. ప్రభుత్వరంగ సంస్థల విషయంలోనూ ఇదే పరిస్థితి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాన్ని తెలంగాణ పొలిటికల్ జేఏసీ తప్పుబడుతోంది. ఇప్పటికే ఉద్యోగ సంఘం నేతలు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలను చేస్తున్నారు. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతు సమస్యలను కూడా అధ్యయనం చేస్తోంది టీ-జాక్‌. రైతు ఆత్మహత్యలపై ప్రత్యేకంగా ఓ కమిటీ కసరత్తు చేస్తోంది.
పోరుకు సిద్ధమౌతున్న టీజేఏసీ..
తెలంగాణ ఉద్యమ సంఘాలతో పాటు కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాల మద్దతుతో ఉద్యమించేందుకు సిద్ధమవుతోంది టీ-జేఏసీ. మొత్తం మీద రాబోయే రోజుల్లో... మరో ఉద్యమం తప్పదంటూ సంకేతాలను కోదండరామ్ టీమ్‌ ఇస్తోంది.

 

నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పది వామపక్షపార్టీల పిలుపు

హైదరాబాద్: అఖిలపక్ష నేతల అక్రమ అరెస్టుకు నిరసనగా పది వామపక్ష పార్టీలు నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి. 

07:45 - August 8, 2015

హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మెపై కేసీఆర్‌ను కలిసి చర్చించేందుకు వెళ్లిన... విపక్షనేతలపై టీ-సర్కారు ఉక్కుపాదం మోపింది. సీఎం అపాయింట్‌మెంట్ కోసం వెళ్లిన నాయకులపై కర్కశంగా వ్యవహరించి వారిని పోలీసులతో అరెస్టులు చేయించింది.
సీఎం కేసీఆర్‌ తీరుపై ప్రజాసంఘాల ఖండన
విపక్ష నేతల పట్ల సీఎం కేసీఆర్‌ వ్యవహరించిన తీరును రాజకీయ పార్టీలతో పాటు అన్ని ప్రజాసంఘాలు ఖండించాయి. ఉద్యమ నాయకుడిగా చెప్పుకునే కేసీఆర్.. ప్రజల్ని ఇదేరకంగా నిరంకుశంగా పరిపాలిస్తారా అని ప్రశ్నించారు. ఇదేవిధంగా వ్యవహరిస్తే.. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మిగులు బడ్జెట్‌ అంటూ గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. మున్సిపల్ కార్మికుల జీతాలను ఎందుకు పెంచడం లేదని నేతలు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. వామపక్ష, టిడిపి, వైసీపీ నాయకులను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయించడాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ఖండించారు. తక్షణం కార్మికుల సమస్యలను పరిష్కరించి సీఎం కేసీఆర్ తన గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు.
నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
ప్రజాస్వామ్యబద్ధంగా కార్మికుల డిమాండ్లపై చర్చించేందుకు వెళ్లిన విపక్ష నేతలపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా అన్నీ రాజకీయ పార్టీలు నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి. జిల్లాల్లోని అన్ని మండల, గ్రామాల్లోను ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని నిర్ణయించాయి.

 

నేడు విశాఖ జిల్లాలో యనమల పర్యటన

విశాఖ: మంత్రి యనమల రామకృష్ణుడు నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఆగస్టు 15 వేడుకల నిర్వహణపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. 

07:33 - August 8, 2015

కోల్ కతా: తూర్పున కొమన్ తుపాన్ బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా కుండపోత వర్షాలు అతలాకుతలం చేశాయి. వరదల ధాటికి ఇప్పటి వరకు సుమారు 100 మందికిపైగా చనిపోయారు. వరదల ధాటికి నాలుగున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది ఇళ్లు, వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 590 పునరావాస కేంద్రాలతో పాటు 835 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఐతే ప్రస్తుతం బెంగాల్‌లో వరదలు తగ్గుముఖం పట్టాయని, పరిస్థితి అదుపులోనే ఉందని....సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

 

07:28 - August 8, 2015

కాబూల్: ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ పోలీస్‌ అకాడమీపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. కాబూల్‌లో పోలీస్ రిక్రూట్‌మెంట్‌ జరుగుతోంది. వరుసలో నిల్చున్న ఓ ఉగ్రవాది.. తన ఒంటినిండా బాంబులు ధరించుకొని అకడామీ గేటు సమీపంలోకి వచ్చి తనకు తాను పేల్చుకున్నాడు. క్షతగాత్రుల్లో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారని అక్కడి అధికారులు తెలిపారు.

 

07:23 - August 8, 2015

హైదరాబాద్: చంద్రబాబు సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు రుణ మాఫీ ప‌థకంలో వేగం పుంజుకుంది. మూడో విడ‌త అర్హుల జాబితా ప్రకటించింది. ఈ దఫాలో 5 ల‌క్షల 11,154 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా..4 లక్షల‌ 74 వేల మందిని అర్హులుగా గుర్తించింది. ఇందులో కొత్తగా 2 లక్షల 76 వేల 963 ఖాతాలు అర్హత పొంద‌గా..గ‌తంలో అభ్యంత‌రాల కార‌ణంగా నిలిచిపోయిన మ‌రో ల‌క్షా 97 వేల 266 ఖాతాల‌కు ఈ సారి అవకాశం క‌ల్పించారు.
మూడో విడ‌త‌లో మొత్తతం 890 కోట్లు
మూడ‌వ విడ‌త రుణమాఫీ చెల్లింపుల కోసం మొత్తంగా 890 కోట్లు అవ‌స‌రమవుతాయని సర్కార్‌ అంచ‌నా వేసింది. తొలి విడ‌త కింద మ‌రో రెండు, మూడు రోజుల్లో 380 కోట్లు విడుద‌ల చేయాల‌ని నిర్ణయించింది. మొత్తం మూడు విడ‌త‌ల్లో 83 లక్షల రైతు ఖాతాల‌కు గాను..54.22 ల‌క్షల అకౌంట్లు రుణ విముక్తికి అర్హత సాధించాయి. దీంతో రాష్ట్రంలోని 34 లక్షల 50 వేల రైతు కుటుంబాల‌కు ల‌బ్ది కలగనుంది. ఇప్పటికే 8 వేల కోట్లు చెల్లించిన ప్రభుత్వం...మరో 20 వేల ఖాతాల వ‌ర‌కూ అర్హత జాబితాలో చేరే అవ‌కాశం ఉంద‌ని అంచనా వేస్తోంది.
వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌గా రూ. 72 కోట్లు విడుదల
ఇక‌ రాజ‌ధాని ప్రాంతంలోని రైతుల‌కు ఇచ్చిన హామీ మేర‌కు ఒన్ టైం సెటిల్ మెంట్ కింద రుణ మాఫీ కోసం 72 కోట్లు విడుద‌ల చేసింది. 21,500 రైతుల ఖాతాలు అర్హత సాధించగా.. 1700 ఖాతాలపై మ‌రింత స‌మాచారం కోరింది. అవి క్లియ‌ర్ అయిన త‌రువాత రుణ మాఫీ కింద నిధులు విడుద‌ల చేయ‌నుంది. మరోవైపు ఉద్యాన‌వ‌న పంట‌లకు రుణ మాఫీ ప‌థకం అమలు కోసం ప్రభుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఎక‌రాకు ప‌ది వేలు చొప్పున‌..అయిదు ఎక‌రాల వ‌ర‌కు అమ‌లు చేయాల‌ని నిర్ణయించింది.
అన్నదాతలకు కొంత ఊరట
మూడో జాబితా తరువాత‌..ఇంకా అభ్యంత‌రాలు ఏవైనా ఉంటే రాష్ట్ర స్థాయి ఫిర్యాదుల విభాగం ద్వారా పరిష్కరించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో కరువుఛాయలు నెలకొన్న సందర్భంలో... రుణమాఫీ మూడో విడత అర్హుల జాబితా ప్రకటించడం...అన్నదాతలకు కొంత ఊరట కలిగిస్తోంది.

 

06:56 - August 8, 2015

కరీంనగర్ : తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం పదకొండున్నర గంటలకు హుస్నాబాద్ చేరుకుని, మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. ఉమ్మాపూర్‌ గుట్టల్లో ఉన్న మహాసముద్రం చెరువు గండిని పరిశీలించనున్నారు. అలాగే తాను దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన ముల్కనూరు గ్రామాన్ని సందర్శిస్తారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం
మరోవైపు ముఖ్యమంత్రి పర్యటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రత కట్టుదిట్టం చేసింది. హెలీప్యాడ్‌తో పాటు అన్ని ఏర్పాట్లను... కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, ఎస్ పి జోయల్ డేవిడ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి... మరోసారి తమ ప్రాంతానికి వస్తుండటంతో హుస్నాబాద్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక గులాబీ దళపతికి ఘనంగా స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.

 

నేడు కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

కరీంనగర్ : సీఎం కేసీఆర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

Don't Miss