Activities calendar

09 August 2015

సోమవారం మధ్యాహ్నాం మునికోటి అంత్యక్రియలు..

తిరుపతి : ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసి మృతి చెందిన మునికోటి అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నాం జరుగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ సోమవారం తిరుపతి బంద్ కు పిలుపునిచ్చింది.

20:55 - August 9, 2015

యనమల రామకృష్ణుడు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక సీనీయర్ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక, వాణిజ్యపన్నుల, శాసన వ్యవహారాల మంత్రిగా యనమల వ్యవహరిస్తున్నారు. టెన్ టివిలో 'ప్లెయిన్ స్పీక్ విత్ రవి తెలకపల్లి' కార్యక్రమంలో యనమల పలు అంశాలపై మాట్లాడారు. ఓటుకు నోటు కేసుపై యనమల మనస్సులో ఏముంది ? టీడీపీలో నెంబర్ -2 ఎవరు ? లాంటి ఇతర అంశాలపై ఆయన అభిప్రాయాలు తెలిపారు. 

స్వాతంత్ర్య సమర యోధుల పింఛన్ పెంపు - రాజ్ నాథ్..

ఢిల్లీ : స్వాతంత్ర్య సమర యోధుల పింఛన్ పెంచినట్లు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. 2014-15 సంవత్సరానికి డీఏను 218 శాతానికి పెంచినట్లు, సవరించిన పింఛన్ ను ఆగస్టు 1,2014 నుండి అందించనున్నట్లు పేర్కొన్నారు. 

దేశాభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకొంటోంది - జవదేకర్..

ఢిల్లీ : దేశాభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకొంటోందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు.

 

20:24 - August 9, 2015

కరీంనగర్ : మామా అల్లుల్లు కాసులకు కక్కుర్తి పడ్డారని టి.టిడిపి నాయకులు కేసీఆర్ సర్కార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో తోటపల్లి రిజర్వాయర్ ను టిటిడిపి బృందం పర్యటించింది. ఈసందర్భంగా ఎర్రబెల్లి, రమణ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో తోటపల్లి అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టం చేశారు. రిజర్వాయర్ కోసం రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, సీఎం కేసీఆర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తోటపల్లి రిజర్వాయర్ రద్దు కాకుండా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలన హిట్లర్ చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. కాసులకు ఆశపడి ప్రాజెక్టుల డిజైన్ మారుస్తున్నారని ఆరోపించారు.

20:14 - August 9, 2015

హైదరాబాద్ : జనం కోసమే జనసేన పుట్టిందన్నారు. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కానీ ప్రత్యేక హోదా కోసం... ఊరువాడా ఏకమైన వేళ ఆయన మాత్రం స్పందించడం లేదు. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్‌ మౌనరాగమే మేలంటున్నారు. ఇప్పట్లో స్పందించలేనంటూ స్పెషల్ కామెంట్లిచ్చారు. ప్రశ్నించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న జనసేనాని స్వరం మారుతోంది. ఒకవైపు ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం ప్రశ్నించలేనంటూ చేతులెత్తేస్తున్నారు.
మునికోటి మృతి బాధ కలిగించింది-పవన్..
ప్రత్యేక హోదా సాధన కోసం ప్రాణాలర్పించిన... మునికోటి మృతి పట్ల ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ స్పందిచారు. మునికోటి మృతి తనకు బాధను కలిగించిందంటూ కన్నీళ్లు కార్చుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ''నన్ను నేను నియంత్రించుకుంటున్నా ఈ సమయంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేను''...జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. సంయమనం పాటించాలంటూ శాంతిమంత్రం జపిస్తున్నారు. మరోవైపు పవన్ మౌనంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగాలు జరుగుతుంటే ప్రశ్నించకపోవటమేంటని జనాలు నిలదీస్తున్నారు.
మల్లగుల్లాలు పడుతున్న పవన్ ఫ్యాన్స్..
జనసేన పేరుతో పార్టీ పెట్టేసి, తానేం చేయాలనుకుంటున్నాడో..? స్పష్టంగా చెప్పకుండానే మోడీ మంత్రం జపించారు కళ్యాణ్‌ బాబు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమంటూ ఊదరగొట్టారు. తీరా అటు కేంద్రంలో ఎన్డీయే ఇటు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. కానీ ప్రత్యేక హోదాపై మాత్రం ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. దీంతో పవన్‌నే నమ్ముకున్న అభిమానులంతా మల్లగుల్లాలు పడుతున్నారు. ఏం చేయాలో తెలియక... అధినేత ఏం చెప్తే అదేనంటూ తలలూపారు.

20:07 - August 9, 2015

ఉత్తర్ ప్రదేశ్ : సాఫీగా సాగిపోతుందనుకున్న జీవితంలో ఓ అనుకోని కుదుపు. కన్నకలలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఒద్దికగా కట్టుకున్న ఆశల సౌధం నిలువునా కూలిపోయింది. సరస్వతి పుత్రుడుగా పేరు తెచ్చుకుందామనుకుంటే నేరస్ధుడిగా ముద్ర పడింది. పచ్చని పొదరింట్లో ఉండాల్సిన జీవితం ఏడు ఊచల వెనక్కు నెట్టేయబడింది. అయినా అతను కుంగిపోలేదు. అంత ఎత్తు నుంచి కుప్పకూలినా వాయువేగంతో కెరటమై తిరిగి లేచాడు.

అజిత్ దాడిలో ఒకరు మృతి..
అజిత్ కుమార్‌. వారణాసిలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ సాదా సీదా యువకుడు. ఇంటర్‌ చదువుతున్న సమయంలో ఓ రోజు తన కుటుంబం పై దాడి చేసేందుకు వచ్చిన బంధువులను నిలువరించే ప్రయత్నం చేశాడు. అయినా బంధువులు ఆగలేదు. పైగా ఓ ఇనుపరాడ్‌తో తన తండ్రిని గాయపరిచారు. తీవ్ర రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతున్న కన్నతండ్రిని చూసేసరికి అజిత్ రక్తం ఉడికి పోయింది. వెంటనే అదే ఇనుప రాడ్ అందుకుని ప్రతిదాడి చేశాడు. అజిత్ చేసిన దాడిలో బాబాయి వరుస అయ్యే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

సెంట్రల్‌ జైలుకు అజిత్ తరలింపు..
అనుకోకుండా జరిగిన ఈ సంఘటన అజిత్ జీవితాన్ని మార్చేసింది. ప్రేమానురాగాలకు నిలయమైన తన సొంతింటి నుంచి కేంద్ర కారాగారంలోకి, కలలో కూడా ఊహించని ఏడు ఊచల నరక కూపంలోకి తోసేయబడ్డాడు. అలా సంవత్సరం పాటు అజిత్‌ డిప్రెషన్‌తో కుంగిపోయాడు. ఇక జీవితానికి ముగింపు పలుకుదామనుకున్నాడు. కానీ చదువుకోవాలనే ఆకాంక్ష అజిత్‌ను లక్ష్యం వైపు పరుగులు పెట్టించింది. వెంటనే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో కరస్పాండెన్స్‌ కోర్స్ కు అప్లయి చేశాడు. ఓపిగ్గా చదువుకుని డిస్టింక్షన్‌లో పాసై గోల్డ్ మెడల్ సాధించాడు. వారణాసిలో జరిగిన ఇగ్నో స్నాతకోత్సవంలో అజిత్‌కు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ గోల్డ్ మెడల్ అందించారు.
ధైర్యంతో ముందడుగు వేసే వారికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. అవరోధాలు సైతం పేక మేడల్లా కూలిపోతాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచిన అజిత్‌, అన్ని సదుపాయాలు ఉండి కూడా ఏం సాధించలేకపోతున్న వారికి స్ఫూర్తి నింపాడని పలువురు కొనియాడుతున్నారు.

19:59 - August 9, 2015

బీహార్ : ప్రధాని నరేంద్ర మోడీపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సెటైర్స్ వేశారు. ఆయన మానసిక పరిస్థితి సరిగా వున్నట్లు లేదంటూ ఎద్దేవా చేశారు. గయ ఎన్నికల సభలో 'జంగిల్ రాజ్' అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై లాలూ తీవ్రంగా స్పందించారు. బీహార్‌కు ఎన్నికలు వచ్చాయి... ప్రధాని మానసిక పరిస్థితి దిగజారిందంటూ సెటైర్స్ వేశారు. ప్రధాని పదవికి వన్నె తేవాల్సింది పోయి దిగజార్చుతున్నారని ఎద్దేవా చేశారు. వ్యాపం, లలిత్‌ గేట్‌ ఆరోపణలపై సమాధానం చెప్పలేక మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ వెళ్లేందుకు భయపడుతున్నారని లాలూప్రసాద్ యాదవ్ విమర్శించారు. 

19:57 - August 9, 2015

బీహార్ : రాష్ట్రంలో ఆటవిక పాలనకు చరమగీతం పాడాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం రెండోసారి వెళ్లిన మోడీ గయా ఎన్నికల ర్యాలీలో జేడీయూ, ఆర్జేడీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీల కూటమిని విషపూరితమైనదిగా అభివర్ణించారు. ఎన్నికల కోసం చేతులు కలిపిన లాలూ, నితీష్‌... ఎన్నికల అనంతరం విడిపోవటం ఖాయమన్నారు. వారి పాలనలో బీహార్‌ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని ప్రధాని మోడీ సూచించారు. 

రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోం కార్యక్రమం..

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, స్వాతంత్ర్య సమరయోధులు, పలువురు ప్రముఖులు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురు స్వాతంత్ర సమర యోధులను సన్మానించారు. 

అమర్ నాథ్ యాత్ర నిలిపివేత..

జమ్మూ కాశ్మీర్ : అమర్ నాథ్ యాత్రను రెండో రోజు కూడా నిలిపివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పడడంతో రాకపోకలను పూర్తిగా నిషేధించారు.  

ప్రజల జీవితాలతో కాంగ్రెస్ ఆటలాడుతోంది - అచ్చెన్నాయుడు..

హైదరాబాద్ : ప్రజల జీవితాలతో కాంగ్రెస్ ఆటలాడుతోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా సాధిస్తామని, ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడవద్దని కోరారు.

19:41 - August 9, 2015

హైదరాబాద్ : తిరుపతి మునికోటి ఆత్మహత్య.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ప్రజల ఆందోళనను ప్రస్ఫుటం చేస్తోంది. ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకునేంతటి భావోద్వేగం ఒక్క రోజులో వచ్చింది కాదన్నది విశ్లేషకుల భావన. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రానికి ఉన్న ఇబ్బందులు ఏంటి..? కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీ సర్కారుకు ఎదురవుతున్న అవరోధాలు ఏంటి..? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించేందుకు ప్రణాళికాసంఘం నిబంధనలే కాదు మరిన్ని రాష్ట్రాల డిమాండ్లూ అడ్డంకిగా మారతాయన్నది కేంద్రం భావనగా కనిపిస్తోంది. ఇప్పటికే బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. ఈపరిస్థితుల్లో ఏపీకి మాత్రమే ప్రత్యేక హోదా కల్పిస్తే సమస్య రావచ్చన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు భావిస్తున్నారు.

పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలు..
ఇతర రాష్ట్రాల డిమాండ్లకు తోడు.. ఏపీకి ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలు ఏపీకి స్పెషల్‌ కేటగిరీ ప్రతిపాదనపై మండిపడుతున్నాయి. కేంద్ర పన్ను మినహాయింపులు, కేంద్ర గ్రాంట్లు, పెట్టుబడులపై ప్రోత్సాహకాల వల్ల భారీ పరిశ్రమలన్నీ ఏపీలో కేంద్రీకృతమవుతాయన్నది జయలలిత సర్కారు వాదన. పైగా ప్రస్తుతానికి తమిళనాడులోనే మెజారిటీ పోర్టులున్నాయి. సముద్ర తీర వ్యాపారంలో ఆ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ప్రత్యేక హోదా ఇస్తే సముద్రతీర వ్యాపారంలో ఏపీ దూసుకు పోతుందని తమిళనాడు భావిస్తోంది. ఐటీ పరిశ్రమల హబ్‌గా ఉన్న కర్ణాటక కూడా తమ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం దెబ్బతింటుందన్న కారణంతో.. ఏపీకి హోదా అంశాన్ని వ్యతిరేకిస్తోంది. 

19:32 - August 9, 2015

హైదరాబాద్ : ఏలికల శుష్క వాగ్దానం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తిరుపతి మునికోటి ఆత్మహత్య.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ప్రజల ఆందోళనను ప్రస్ఫుటం చేస్తోంది. ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకునేంతటి భావోద్వేగం ఒక్క రోజులో వచ్చింది కాదన్నది విశ్లేషకుల భావన. కాంగ్రెస్‌ సంతకాల సేకరణ.. జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు..వామపక్షాల బస్సు యాత్ర.. ఇలా ఎన్నో కార్యక్రమాలు.. రాష్ట్రంలో కొన్ని నెలలుగా చాపకింద నీరులా విస్తరిస్తోన్న ప్రత్యేక హోదా ఆకాంక్షను వెల్లడించాయి. ప్రజలు వివిధ రూపాలలో తమ నిరసనను వ్యక్తీకరిస్తున్నారు. ఈ దశలో పాలకుల భిన్నమైన ప్రకటనలు వారి మదిలో ఆందోళనను.. అనంత కోటి ప్రశ్నలను రగిలిస్తున్నాయి.

ప్రజల సెంటిమెంట్..
ప్రత్యేక హోదా అంశం.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సెంటిమెంట్‌గా రూపాంతరం చెందుతోంది. ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసేందుకు ప్రజలు రోడ్లెక్కేందుకు సమాయత్తమవుతున్నారు. విపక్షాలు ఈసరికే హోదా అంశంపై ప్రజలను సమీకరిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధినేతల్లో మాత్రం ఈ అంశాన్ని గత పాలకుల మెడకు చుట్టి బయట పడదామన్న ప్రయత్నమే కనిపిస్తోంది. 2014 ఎన్నికలకు ముందు ఘనత వహించిన ఇద్దరు నేతలు ఎన్నో హామీలు గుప్పించారు. తమ మిత్రపక్షం తెలుగుదేశాన్ని ఎన్నికల్లో గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కట్టబెడతామని.. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తామని.. అసలు రాష్ట్రాన్నే స్వర్గలోకంలా మార్చేస్తామని అన్నారు. వీరి మాటలను విశ్వసించిన ఓటర్లు.. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో అధికార పీఠం ఎక్కించారు. అదే మాటలతో ఏడాది కాలం గడిపేశారు. మిగిలిన హామీల సంగతెలా ఉన్నా.. ప్రత్యేక హోదా విషయంలో మాత్రం కేంద్రం తడవకో మాట మారుస్తూ ప్రజలను అయోమయంలోకి నెట్టింది.

చాపకింద నీరులా ప్రత్యేక హోదా సాధన ఉద్యమం..
ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న కేంద్ర ప్రభుత్వ సంకేతాలతో రాష్ట్రంలో కొన్ని నెలలుగా ప్రత్యేక హోదా సాధనోద్యమం చాపకింద నీరులా విస్తరిస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో పరువు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. మే నెలలో ఈ అంశాన్ని తలకెత్తుకుంది. కోటి సంతకాల సేకరణతో ప్రజల్లోకి వెళ్లింది. అటు తర్వాత కూడా ఆంధ్రా మేధావులు, సినీనటుడు శివాజీ లాంటి వారు కూడా అడపాదడపా ఆందోళనలు చేపట్టారు. తాజాగా సీపీఐ బస్సు యాత్రను చేపట్టింది. సోమవారం వైసీపీ అధినేత జగన్‌ ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆందోళనలో మునికోటి ఆత్మహత్యకు పాల్పడడంతో ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్త మలుపు తీసుకుంది.
సర్కారుకు సామాన్యుడి ప్రశ్నలు..
మునికోటి మృతి సామాన్య పౌరుడిలో కోటి ప్రశ్నలను రేపుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. కేంద్రాన్ని నిలదీయడంలో ఏపీ సర్కారుకు ఉన్న ఇబ్బందులేంటి..? పార్లమెంటు సాక్షిగా యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రకటనకు విలువనేదే లేదా..? ఎన్నో అంశాలపై ఆర్డినెన్సులు తెచ్చి ఆనక చట్టాలు చేస్తున్న కేంద్రం హోదాపై ఎందుకలా స్పందించడం లేదు..? ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తోంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఇటీవల కేంద్రం ప్రకటించింది. పైగా దీనికి గత యూపీఏ ప్రభుత్వ తప్పుడు నిర్ణయమే కారణమని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది.

చట్టంలోని విషయాలన్నీ నేతలకు విదితం..
వెంకయ్య నాయుడు వాదనపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికలకు ముందే రాష్ట్రం విడిపోయింది. దీనికి సంబంధించిన చట్టమూ ముందుకొచ్చింది. అందులో ఏ ఏ అంశాలున్నాయో అన్ని పార్టీలకూ స్పష్టంగా తెలుసు. ఒకవేళ ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేనప్పుడు.. ఎన్నికల్లో ఆ హామీని ఎందుకు ఇచ్చారు ? ఒకవేళ ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేనంత మాత్రాన.. కేంద్రం తలచుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వడం అంత కష్టమా..? నిజంగానే కష్టమైతే.. చట్టంలో లేని తెలంగాణ ఏడు మండలాల విలీనానికి ఆర్డినెన్సు తెచ్చి.. తర్వాత సవరణ చేయలేదా..? ఎమ్మెల్సీ సీట్ల సంఖ్య పెంచడం కోసం సవరణ బిల్లు తేలేదా..? కేంద్రం చెబుతున్నట్లు ప్రస్తుత నీతిఆయోగ్‌ నిబంధనలే ప్రత్యేక హోదాకు అడ్డంకి అయితే.. ఆర్బీఐ గవర్నర్‌ నేతృత్వంలో ఓ కమిటీని వేసి... ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించేందుకు గల అవకాశాలు, అవసరాలను వివరించి.. సానుకూల నివేదిక పొందడం అసాధ్యమా..? అన్న ప్రశ్నా తలెత్తుతోంది.
భుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం అంత కష్టమైన పనేమీ కాదన్న వాదన ఉంది. 

19:25 - August 9, 2015

తిరుపతి : ప్రత్యేక హోదాకు ఓ ప్రాణం బలైంది. పార్టీల నేతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుమ్ములాటల్లో ఓ అమాయకజీవి మృత్యువాత పడ్డారు. తిరుపతిలో ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మునికోటి చెన్నైలో తుదిశ్వాస విడిచాడు. వైద్యులు మెరుగైన చికిత్సలకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. శరీరం పూర్తిగా కాలిపోవటంతో చికిత్స ఫలించక మృతి చెందినట్లు కెఎంసి వైద్యులు తెలిపారు. మునికోటి మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రేపు తిరుపతిలో అంత్యక్రియలు జరగనున్నాయి.
90 శాతం గాయాలు..
"సమైక్య ఉద్యమం చేసినా ఫలితం లేకపోయింది. కనీసం ప్రత్యేక హోదాతో కొన్ని కష్టాలైనా తొలగుతాయని ఆశపడ్డాను. కానీ సాధ్యం కాదని పార్లమెంటులో చెప్పినప్పటి నుంచి ఒకటే ఆలోచన. కేంద్రం కళ్లు తెరవాలనే ఉద్దేశ్యంతోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాను." ఇదీ ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతి చేసుకున్న మునికోటి చివరి మాటలు. ఐదు కోట్ల మంది ప్రజలను శోకసంద్రంలో ముంచుతూ మునికోటి తిరిగిరాని లోకాలకు తరలిపోయాడు. 90 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న కోటిని ముందుగా వేలూరులోని సిఎంసి ఆస్పత్రికి తరలించిన అధికారులు, అక్కడ చికిత్సకు నిరాకరించటంతో చెన్నైలోని కీల్పాక్ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక విభాగంలో చికిత్సలు జరిపినా అతని శరీరం స్పందించకపోవడంతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. అక్కడే మృతదేహానికి పంచనామా నిర్వహించారు.
సోమవారం బంద్..
మునికోటి పూర్తి పేరు బెంగళూరు మునికామ కోటి అలియాస్ బీఎంకే కోటి. వయస్సు 41 సంవత్సరాలు. తిరుపతి మంచాల వీధిలో నివాసం. కాంగ్రెస్‌ కార్యకర్త. తిరుపతిలో గతంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ కమిటీ సభ్యుడిగా పని చేశాడు. మునికోటి మృతిలో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆత్మహత్యకు ముందు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని మునికోటి చెప్పాడని కుటుంబ సభ్యులు చెప్పారు.
మొత్తానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఓ నిండు ప్రాణాన్ని పొట్టనపెట్టుకున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మునికోటి అంత్యక్రియలు సోమవారం తిరుపతిలో జరుగనున్నాయి. సోమవారం తిరుపతి బంద్‌కు పిలుపునిచ్చింది కాంగ్రెస్.

19:17 - August 9, 2015

తిరుపతి : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఆత్మహత్య చేసుకున్న మునికోటి మృతికి సంతాపంగా నగరంలో సీపీఎం నేతలు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమ నేత కృష్ణయ్య టెన్ టివితో మాట్లాడారు. మునికోటి మృతికి అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. ప్రజలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈనెల 11న నిర్వహించే బంద్ కు సీపీఎం సంఘీభావం తెలుపుతుందన్నారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడవద్దని ఎమ్మెల్సీ గేయానంద్ సూచించారు. ఏపీలో నిరాశకమైన పరిస్థితులు ఏర్పరిచారని విమర్శించారు. టిడిపి ఎంపీలు తలోరకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రత్యేక హోదా రాదని పార్లమెంట్ లో చెప్పారని గుర్తు చేశారు. 

మునికోటి మృతిపై వెంకయ్య సంతాపం..

ఢిల్లీ : మునికోటి మృతిపట్ల కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సంతాపం వెలిబుచ్చారు. కుటుంబసభ్యులకు వెంకయ్య ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

రైతుపై ఇసుక మాఫియా దాడి..

నల్గొండ : నార్కట్ పల్లి (మం) అమ్మనబోలులో రైతుపై ఇసుక మాఫియా దాడి చేసింది. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న రైతు రవీందర్ రెడ్డిపై సర్పంచ్ భర్త మధుసూధన్ రెడ్డి అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

18:41 - August 9, 2015

విశాఖపట్టణం : తాళాలు వేసే ఇళ్లే అతని టార్గెట్.. తాళాలు వేసే ఉన్న ఇళ్లలో పలు చోరీలకు పాల్పడున్న మహ్మద్ షకీల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాళం వేసి ఉన్న నివాసాల్లో ఉండే ల్యాప్ టాప్స్, మొబైల్స్ లను అపహరించే వాడు. ఈ క్రమంలో అధికంగా ఫిర్యాదులు అందడంతో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అనంతరం దొంగతనాలు చేస్తున్న షకీల్ ను పట్టుకున్నారు. 58 ల్యాప్ టాప్స్, ఓ ఐ పాడ్ ను స్వాధీనం చేసుకున్నారు. 

18:36 - August 9, 2015

శ్రీకాకుళం : బాల కార్మికులను తరలిస్తున్న ముఠా గుట్టును సిక్కోలు పోలీసులు రట్టు చేశారు. ఆముదాలవలసలో 23 మంది బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. రైల్వే స్టేషన్ నుండి బాలలను గుజరాత్ కు తరలించాలని ఓ ముఠా ప్రయత్నం చేసింది. పక్కా సమాచారంతో ఐసీడీఎస్, పోలీసులు, ఛైల్డ్ ప్రొటెక్షన్ సెల్ ప్రతినిధులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.
గుజరాత్ లో చేపల వేటకు కొంతమందిని..మరికొంతమందిని వంటకు..ఇతర పనులకు తరలించేందుకు బాలలను తరలిస్తున్నారు. ఏడాదికి రూ.50వేల చొప్పున ఇస్తామని బాలల తల్లిదండ్రులతో ముఠా ఒప్పందం చేసుకుంది. బాలలను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు. 

18:18 - August 9, 2015

విశాఖపట్టణం : ఆచార్య నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరీ ఆత్మహత్యపై బాబు ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలకు ఉప్రకమించింది. విద్యార్థిని ఆత్మహత్య ఘటన అనంతరం విశ్రాంత ఐఏఎస్ అధికారి సుబ్రమణ్యంతో ఓ కమిటీని నియమించింది. విచారణ అనంతరం నివేదిక అందచేయాలని ప్రభుత్వం సూచించింది. అనంతరం కమిటీ విచారణ చేపట్టింది. ఈ నివేదికను ఆదివారం ప్రభుత్వానికి అందచేసింది. కానీ నివేదికలో ఎలాంటి అంశాలు పొందుపర్చారన్నది తెలియరాలేదు. నివేదికలో గోప్యత పాటించాలని ప్రభుత్వం భావనగా తెలుస్తోంది. కానీ మంత్రి గంటా శ్రీనివాస రావు చర్యలకు ఉపక్రమించారు. ప్రిన్సిపాల్ ను బాబురావును డిస్మిస్ చేస్తున్నామని ప్రకటించారుర. అలాగే వర్సిటీ ఇంచార్జ్ వీసీ సాంబశివరావు స్థానంలో ఐఏఎస్ అధికారిణి ఉదయలక్ష్మిని నియమించడం జరిగిందన్నారు. బాబురావును విచారించాలని.. క్యాంపస్ లో నిఘా పెంచాలని కమిటీ సూచనలు చేసిందని తెలిపారు. అన్ని వర్సిటీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, అవసరమైతే పోలీసు ఔట్ పోస్టులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తామని మరోమారు మంత్రి గంటా స్పష్టం చేశారు.
కలకలం సృష్టించిన రిషితేశ్వరీ ఆత్మహత్య..
ఇటీవలే నాగార్జున వర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరీ ఆత్మహత్య ఘటన కలకలం రేగింది. ర్యాగింగ్ నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని, ప్రిన్స్ పాల్ బాబురావు వ్యవహార శైలి కూడా ఒక కారణమని విమర్శలు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు బయటపడడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీనిపై విపక్షాలు ఆందోళన చేశాయి. అనంతరం ప్రభుత్వం బాల సుబ్రమణ్యం, మరో నలుగురితో కమిటీ వేసింది. ఈ నేపథ్యంలో వర్సిటీకి పది రోజుల పాటు సెలవులు ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తిరిగి కాలేజీ తెరిచిన అనంతరం కమితీ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అధికమయ్యాయి. ఇదే సందర్భంలో సీఎం చంద్రబాబు విదేశాల్లో పర్యటించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. శనివారం చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకోవడం..ఆదివారం కమిటీ నివేదికను అందచేయడం..ఆ తరువాత చర్యలు తీసుకోవడం విశేషం.

శస్త్ర చికిత్స చేసిన నర్సులు..మహిళ మృతి..

మహబూబ్ నగర్ : బాల్ నగర్ పీహెచ్ సీలో వైద్యురాలి గైర్హాజరీలో మహిళకు నర్సులు శస్త్ర చికిత్స నిర్వహించారు. మహిళ మృతి చెందడంతో ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. 

ఢిల్లీకి బయలుదేరిన జగన్..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీకి బయలుదేరారు. సోమవారం జంతర్ మంతర్ వద్ద ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ జగన్ దీక్ష చేయనున్న సంగతి తెలిసిందే.

మునికోటిది ఆత్మహత్య కాదు..హత్యే - చలసాని..

కర్నూలు : మునికోటిది ఆత్మహత్య కాదని హత్యేనని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆరోపించారు. మునికోటి వ్యవహారంలో మొదటి ముద్దాయి కేంద్రమైతే రెండో ముద్దాయి కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ పోరుసభలు ఇక్కడ చేయాల్సింది కాదని సోనియా ఇంటి ముందు చేయాలని సూచించారు. 

ప్రిన్సి పాల్ బాబురావు డిస్మిస్ చేశాం - గంటా..

విశాఖపట్టణం : ఏఎన్ యూలో విద్యార్థిని మృతి ఘటనలో సుబ్రమణ్యం కమిటీ ఇచ్చిన సూచనలపై మంత్రి గంటా స్పందించారు. ప్రిన్సిపాల్ ను బాబు రావును డిస్మిస్ చేస్తున్నామని, నాగార్జున వర్సిటీ ఇంచార్జ్ వీసీ సాంబశివరావు స్థానంలో ఐఏఎస్ అధికారిణి ఉదయలక్ష్మిని నియమించడం జరిగిందన్నారు. బాబురావును విచారించాలని.. క్యాంపస్ లో నిఘా పెంచాలని..అన్ని వర్సిటీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, అవసరమైతే పోలీసు ఔట్ పోస్టులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తామని గంటా స్పష్టం చేశారు. 

బీజేపీ సర్కార్ పై కేజ్రీవాల్ ఫైర్..

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. గతంలో సీఎంగా 49 రోజుల పాటు ఉండడం జరిగిందని, అనంతరం జూన్ 8వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పాలనలో అవినీతిని రూపుమాపినట్లు తెలిపారు. కానీ జూన్ 8వ తేదీన ప్రధాని మోడీ పంపించిన పార్లమెంటరీ ఫోర్స్ యాంటీ కరప్షన్ బ్రాంచీపై కబ్జా చేసిందని ఆరోపించారు. తాము 24గంటల పాటు దృష్టి సారించామని, కానీ బీజేపీ ప్రతికారం తీర్చేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.

16:24 - August 9, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలో శనివారం కాంగ్రెస్ నిర్వహించిన పోరు సభలో ఆత్మహత్యాయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్త మునుకోటి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దీనిపై బాబు స్పందించారు. మునికోటి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్వేగాలకు, భావోద్వేగాలకు లోను కావద్దని, ప్రత్యేక హోదా కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇలాంటి అఘాయిత్యాలకు ఎవరూ పాల్పడవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. 

సిద్ధిపేట మంచినీటి పథకానికి రూ.64 కోట్లు..

మెదక్ : సిద్ధిపేటలో మంచినీటి పథకానికి రూ.64 కోట్లు మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

మునికోటి మృతిపై సోనియా ఆరా..

ఢిల్లీ : కాంగ్రెస్ కార్యకర్త మునుకోటి మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఆరా తీశారు. తిరుపతిలో కాంగ్రెస్ నిర్వహించిన పోరు సభలో మునుకోటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ ఆదివారం కోటి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సోనియా, రాహుల్ లు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరాకు ఫోన్ చేసి మాట్లాడారు. కోటిని కాపాడే ప్రయత్నంలో గాయపడిన శేషాద్రి ఆరోగ్య పరిస్థితిపై వారు ఆరా తీశారు. 

మునికోటి అంత్యక్రియలకు కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య చేసుకున్న మునికోటి అంత్యక్రియలకు కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తదితరులు పాల్గొననున్నారు. 

16:10 - August 9, 2015

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీలో ఉద్యమాలు తీవ్రతరమవుతున్నాయి. హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకోడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. చంద్రబాబు సర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి. దీనికంతటికి కారణం బాబు సర్కారేనని విమర్శలు గుప్పిస్తున్నారు. తిరుపతిలో వైసీపీ పార్టీ రాస్తారోకో నిర్వహించింది. ఈ సందర్భంగా టెన్ టివితో నేతలు మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న టిడిపి, బిజెపి ప్రస్తుతం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మునికోటి మృతి చాలా బాధాకరమని, మోడీ, బాబు ఆడుతున్న నాటకం అని అభివర్ణించారు. మంత్రి పదవులకు రాజీనామా చేసి నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రజలు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. 

15:56 - August 9, 2015

కాజోల్..బాలీవుడ్ నటి. ప్రస్తుతం ఆమెకు వచ్చిన ఫోన్ కాల్ పై బాలీవుడ్ జనం తెగ చర్చించేసుకుంటున్నారు. ఆమెకు ఎవరు ఫోన్ చేశారు ? ఎందుకలా వెళ్లిపోయింది ? అనే టాక్స్ వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే ముంబైలోని ప్రముఖ నాటకక్షేత్రంలో 'ద జురి' అనే నాటకాన్ని తిలకించేందుకు వెళ్లింది. ఈ నాటకంలో కాజల్ సోదరి తనీషా ప్రధాన పోత్ర పోషించింది. ఈ నాటకాన్ని తిలకించిన అనంతరం మీడియాతో కాజల్ మాట్లాడింది. అప్పుడే కాజోల్ చేతిలో ఉన్న ఫోన్ రింగ్ ఆపకుండా రింగ్ అయ్యింది. చివరకు కాజోల్ రిసీవ్ చేసుకున్న అనంతరం 'సారీ' అంటూ విలేకరులతో చెప్పేసి హడావుడిగా వెళ్లిపోయింది. ఆ సమయంలో కాజోల్ ఒకింత ఆందోళనకు గురయ్యారని టాక్. అసలు ఏమి జరిగిందో ? తెలియాలంటే కాజోల్ చెబితేగాని బయటపడదు.

అసెంబ్లీలో తోటపల్లి అంశాన్ని లేవనెత్తుతాం - ఎర్రబెల్లి

కరీంనగర్ : తోటపల్లి రిజర్వాయర్ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి పేర్కొన్నారు. తోటపల్లి ప్రాజెక్టు రద్దు కాకుండా అడ్డుకుంటామని, కేసీఆర్ పాలన హిట్లర్ చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. కాసులకు ఆశపడి ప్రాజెక్టుల డిజైన్ మారుస్తున్నారని ఆరోపించారు. 

కోటి మృతి బాధ కలిగించింది - పవన్ కళ్యాణ్..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య చేసుకున్న మునుకోటి మృతి బాధ కలిగించిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక హోదాపై మాట్లాడలేనని, ఈ విషయంలో తాను నియంత్రించుకుంటున్నట్లు పవన్ ట్వీట్ చేశారు. 

కుప్వారలో కొనసాగుతున్న తనిఖీలు.. జమ్మూ కాశ్మీర్ : తంగ్దార్ సెక్టార్ లోని కుప్వారాలో భద్రతా దళాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి.

జమ్మూ కాశ్మీర్ : తంగ్దార్ సెక్టార్ లోని కుప్వారాలో భద్రతా దళాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి.

15:26 - August 9, 2015

రంగారెడ్డి : జిల్లాలోని వికారాబాద్ లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సంగం లక్ష్మీభాయి గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో బెగ్గరి అనూష పదో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి ఎప్పటిలాగే నిద్ర పోయింది. కానీ ఆదివారం ఉదయం లేవలేదు. దీనిని గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి తెలియచేశారు. దీనితో సమీపంలో ఉన్న ఆసుపత్రికి అనూషను తరలించారు. కానీ అప్పటికే అనూష మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న అనూష తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే అనూష చనిపోయిందని వారు ఆరోపించారు. 

15:19 - August 9, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులు చేపడుతున్న సమ్మెపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దిక్కుమాలిన సంఘాలు..దిక్కుమాలిన సమ్మెలు చేయిస్తున్నాయి అంటూ సీఎం కేసీఆర్ కరీంనగర్ లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. మాట తీరు మార్చుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ ఎన్నో ఉద్యమాలు చేశారని, సఫాయి కార్మికులపై నీచంగా మాట్లాడడం తగదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను అవమానానికి గురి చేస్తున్నారని వీహెచ్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

15:13 - August 9, 2015

తిరుపతి : ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సినీ నటుడు శివాజీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. ఆదివారం తిరుపతిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నేతల వ్యవహార శైలిపై ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం మెడలు వంచి హోదాను సాధిద్దామని, గల్లా పట్టుకుని అడుగుదామని పేర్కొన్నారు. కానీ ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో పార్టీలు పలు కార్యక్రమాలు నిర్వహించాలి. నాపై కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయని, వారిని త్వరలోనే సమాధానం చెబుతానని, వాళ్లను కట్ చేస్తానని శివాజీ పేర్కొన్నారు. 

కోటి మృతిపై బాబు..జగన్ విచారం..

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో కాంగ్రెస్ కార్యకర్త మునుకోటి మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ విచారం వ్యక్తం చేశారు. 

ఏపీ రాజధాని సలహా సంఘం సమావేశం..

హైదరాబాద్ : ఏపీ రాజధాని సలహా సంఘం సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈసందర్భంగా రాజధాని సలహా సంఘం సభ్యులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ప్రపంచం మొత్తం ఆసక్తిని కనబరుస్తోందని తెలిపారు. అద్భుత నగరం ఒకటి రాబోతోందని, సింగపూర్ ప్లాన్ పై దేశం మొత్తం చర్చించుకొంటోందని వ్యాఖ్యానించారు. రాజధానిలో పరిశ్రమల స్థాపనకు ఆంధ్ర ఎంటర్ ప్రై న్యూర్స్ ను ప్రోత్సాహించాలని..విదేశీ కంపెనీలకు సహకరించాలని..మాస్టర్ ప్లాన్, సీడ్ క్యాపిటల్, క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్ ను అమూలాగ్రం అధ్యయనం చేయాలని బాబు సూచించారు. 

14:43 - August 9, 2015

కేరళ : రాష్ట్రంలో అలిపిలో స్నేక్ బోర్డ్ రేసులు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా అలిపిలో జరిగే ఈ పోటీలు చూసేందుకు దేశ విదేశాల నుండి పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ ఏడాది జరుగుతున్న ఈ పోటీలకు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. అధికంగా విదేశీయులు అలిపికి క్యూ కట్టారు. నిండు జలాశయాలను చీల్చుకుంటూ వాయు వేగంతో పోటీ పడుతూ సాగిపోయే స్నేక్ బోట్ రేస్ లను చూసేందుకు ఎనలేని ఆసక్తి కనబరుస్తున్నారు. అలిపి అందాలను, పడవ పోటీలను కెమెరాల్లో చిత్రీకరించేందుకు పోటీ పడ్డారు. 

14:38 - August 9, 2015

ఢిల్లీ : భారత దేశ రాజధాని ఢిల్లీని వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్థంభించింది. ఎక్కడికక్కడ రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. దీనితో ఢిల్లీ రోడ్లు జలాశయాలను తలపిస్తున్నాయి. పొంగి పొర్లుతున్న డ్రైనేజీతో రహదారులు కనిపించడం లేదు. ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరుచుకున్నాయనే భయంతో వాహనదారులు భయంగా భయంగా వాహనాలను నడిపిస్తున్నారు. భయం గుప్పిట్లో వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. 

గయలో బీజేపీ పరివర్తన ర్యాలీ..

బీహార్ : గయలో బీజేపీ పరివర్తన ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యారు. బీహార్ ను అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని, క్రేందం ప్రజలకు అండగా ఉంటుందని మోడీ పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో బీహార్ కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులున్నారని తెలిపారు. 

మునికోటి మృతిపై రఘువీరా..చిరంజీవి సంతాపం..

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్త మునుకోటి మృతి చెందడంపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. కోటి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రత్యేకహోదా కోసం బలిదానాలు చేసుకోవద్దని రఘువీరా సూచించారు. 

13:51 - August 9, 2015

చిత్తూరు: ప్రత్యేక హోదా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్త మునికోటి కన్నుమూశాడు. '' తెలుగుజాతి విడిపోయింది. సమైక్యఉద్యమం చేసినా..ఫలితం లేకపోయింది.. తెలుగు జాతి వర్థిల్లాలి... ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలి'' అంటూ కోటి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన తిరుపతిలో కాంగ్రెస్ నిర్వహించిన 'పోరుసభ'లో చోటుచేసుకుంది. కోటి మృతి చెందారని తెలుసుకున్న పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.
అసలలేం జరిగింది...?
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనంటూ తిరుపతికి చెందిన మునికోటి అనే కాంగ్రెస్ కార్యకర్త కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేననే నినాదంతో బలిదానం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఏం జరుగుతుందో తోటివారు తెలుసుకునేలోపే మునికోటి మంటల్లో చిక్కుకున్నాడు. పక్కన వారు తేరుకుని మంటలు ఆర్పేలోపే 80శాతానికి పైగా మునికోటి శరీరం కాలిపోయింది. హుటాహుటిన రుయా ఆస్పత్రికి మునికోటిని తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స చేస్తున్నంతలోపే మునికోటి పరిస్ధితి విషమంగా మారటంతో వేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ఆత్మ బలిదానానికి ప్రయత్నించిన మునికోటి సమైక్య ఉద్యమంలో నిర్విరామంగా పాల్గొన్నాడు. విభజన వ్యతిరేక పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడని సన్నిహితులు చెప్తున్నారు. తీవ్రంగా గాయపడి మరణంతో పోరాటం చేస్తున్న మునికోటికి ఏపి పిసిసి చీఫ్‌ రఘువీరా 2లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఇటు ఏపి సీఎం చంద్రబాబు కూడా ఘటనపై ఆరా తీసారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాలే కాని ప్రాణాలు తీసుకోవద్దని హితవు పలికారు.

మునికోటి మృతి

తిరుపతి : కాంగ్రెస్ కార్యకర్త మునికోటి మృతి చెందారు. ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం తిరుపతిలో కోటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని చెన్నైకి తరలించారు. ఆదివారం కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

 

 

సీపీఐ-వైసీపీ చేస్తున్న ఉద్యమానికి మద్దతు..

కాకినాడ: ఎపికి ప్రత్యేకహోదా కోసం సీపీఐ, వైసీపీ చేస్తున్న ఉద్యమానికి ఇప్పటికే మద్దతు ప్రకటించామని కారెం శివాజీ తెలిపారు. 

ఘనంగా లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు...

హైదరాబాద్: లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

 

13:06 - August 9, 2015

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం పడుతోంది. రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. పలు కాలనీలు జలమయమయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల ధాటికి నలుగురు మృతి చెందారు. కోస్టల్ ఏరియాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది.

 

12:58 - August 9, 2015

చెన్నై: తిరుపతిలో కాంగ్రెస్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నం ఘటనపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. చెన్నైలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేకహోదా అంశంపై ప్రజలు సంయమనం పాటించాలన్నారు. ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చిన కాంగ్రెస్‌.. బిల్లులో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పదేళ్లలో కాంగ్రెస్ చేయలేని పని... పదినెలల్లో చేయమంటే ఎలా అని నిలదీశారు. భూసేకరణ బిల్లు ఆమోదం పొందడం చాలా ముఖ్యమని.. బిల్లు సవరణకు ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తామన్నారు. దేశంలో అవినీతిని అరికట్టేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు.

12:52 - August 9, 2015

హైదరాబాద్‌: పాతబస్తీలో లాల్‌దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో... కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేలాది మంది భక్తులు బోనాలతో ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో..ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. బోనాల ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. 

 

12:41 - August 9, 2015

సీఎం కేసీఆర్ ప్రజాఉద్యమాలపై అహంభావంతో మాట్లాడుతూ... చులకన చేస్తున్నారని.. కేసీఆర్ తీరు మార్చుకోవాలని వక్తలు హితవు పలికారు. మున్సిపల్ కార్మికుల సమ్మె... కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు విశ్వేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) నేత వెంకటనర్సయ్య, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ లు పాల్గొని, మాట్లాడారు. కేసీఆర్ అహంపూరితంగా మాట్లాడుతున్నారని... ఆయన ఉపయోగించే భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ తీరు, వ్యవహారశైలి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తాం: వెంకయ్యనాయుడు

చెన్నై: భూసేకరణ బిల్లు ఆమోదం పొందడం చాలా ముఖ్యమని.. బిల్లు సవరణకు ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో అవినీతిని అరికట్టేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు.

 

నల్గొండ జిల్లాలో క్షుద్రపూజలు...

నల్గొండ: నూతనకల్ మండలం మిర్యాలలో క్షుద్రపూజలు కలకలకం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు మంగమ్మ అనే మహిళ ఇంటి ముందు పుర్రె, మట్టిబొమ్మ, నిమ్మకాయలు వదిలివెళ్లారు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

ఎయిరిండియా విమానం నిలిపివేత..

విజయవాడ: గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో విమానాన్ని నిలిపివేశారు. అయితే అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఎయిరిండియా అధికారులతో ప్రయాణికులు వాగ్వాదం చేశారు.

 

నారాయణపురం కో-ఆపరేటివ్ సొసైటీ ఆఫీస్ లో చోరీ

ప.గో: ఉంగుటూరు మండలం నారాయణపురం కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో చోరీ జరిగింది. రూ.3.75 లక్షల నగదును అపహరించారు.

 

11:47 - August 9, 2015

తెలంగాణలో జరుపుకునే పండుగల్లో చెప్పుకొదగ్గ పండుగ బోనాలు. తెలంగాంణ సంస్కృతీసంప్రదాయాలకు బోనాలు అద్దంపడుతాయి. అత్యంతఅంగరంగవైభవంగా జరుపుకుంటారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మహేష్ గౌడ్, ప్రవీణ్ కుమార్ గౌడ్, బాబూరావులు పాల్గొని, మాట్లాడారు. బోనాలకున్న ప్రాచుర్యాన్ని వివరించారు. బోనాలకు 400 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. బోనాలకు ప్రత్యేకుందన్నారు. బోనాలు... తెలంగాణకు సాంస్కృతిక సంపద అని అన్నారు. బోనం అంటే భోజనం...అని..అలంకరించిన కుండలో భోజనం పెట్టినప్పుడు బోనం అవుతుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:36 - August 9, 2015

హైదరాబాద్: భాగ్యనగరంలో ఇకపై నీటికి తంటాలు తప్పవా? జలాశయాలు.. అడుగంటుతున్న భూగర్భ జలాలతో నగరవాసులకు నీటికష్టాలు తప్పవా? అంటే అవుననే అంటోంది భూగర్భ జలశాఖ. హైదరాబాద్‌లో నీటి తగ్గుదలపై తాజా నివేదికలు రూపొందించిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మేల్కొని సరైన చర్యలు చేపట్టాలని హెచ్చరిస్తున్నారు.
ఇంకిపోతున్న భూగర్భ జలాలు
హైదరాబాద్‌లో రోజు రోజుకు జనాభా పెరుగుతుంది. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో దినదినంగా నీటి సమస్య కూడా తీవ్రమవుతోంది. నానాటికి భూగర్భ జలాలు ఇంకి పోతుండటంతో గత కొన్నేళ్లుగా జిహెచ్ ఎంసి పరిధిలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి మరింత కనిష్ఠస్థాయికీ భూగర్బజలాలు పడిపోయాయి.
పడిపోయిన నీటి మట్టం
నాంపల్లి ప్రాంతంలో 2014 జులైలో 8.77మీటర్ల లోతులో నీళ్లు ఉంటే ప్రస్తుతం 15.52 మీటర్లకు పడిపోయాయి. చార్మినార్ ఏరియాలో గతేడాది భూగర్బ జలాలు 11.37 మీటర్ల లోతులో ఉంటే.. ప్రస్తుతం 12.67 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఇదే విధంగా ఖైరతాబాద్‌లో ప్రస్తుతం7.05 మీటర్లలో నీళ్లున్నాయి. ఆసిఫ్‌నగర్‌లో గతేడాది 9.29 మీటర్ల లోతులో నీళ్లు ఉంటే.. ఇప్పుడు 13.66 మీటర్ల లోతుకు చేరాయి. వీటితో పాటు మారేడ్‌పల్లి, శేరిలింగంపల్లి, సైదాబాద్, బహధూర్ పురా, బాలానగర్‌, మల్కాజిగిరి, మేడ్చల్, కుత్బల్లాపూర్ తదితర ప్రాంతాల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది.
నిపుణుల ఆందోళన
గత కొన్నేళ్లుగా పడిపోయిన భూగర్భ జలాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు.. ఇందుకు సరైన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. నీటి కోసం పోటిపడుతున్న నగరవాసులు.. విరివిగా బోర్లు వేస్తున్నారని ఇది కూడా భూగర్భ జలాలు ఇంకిపోవడానికి ప్రధాన కారణమని చెప్తున్నారు. హైదరాబాద్‌ భూ అంతర్భాగంలో ఉండే స్వరూపాన్ని బట్టి 350 అడుగుల కంటే ఎక్కువ లోతు బోర్లు వేయరాదని హెచ్చరిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి.. ప్రమాదకరస్థాయిలో పాతాళానికి పడిపోయిన భూగర్భజలాలను పెంచేందుకు ప్రత్యే ప్రణాళికలు రూపొందించాలి. లేకుంటే హైదరాబాద్‌లో మరింత నీటికొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

 

11:28 - August 9, 2015

ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకహోదా మీద ఆశలు పెట్టుకుంది. అయితే కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్న ఆశల మీద పూర్తిగా నీళ్లు చల్లినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా దక్కే సూచనలు కనిపించడం లేదని అన్ని పార్టీల నాయకులు వాపోతున్నారు. నిజానికి ఈ పరిస్థితికి కారణాలేంటీ..? ఎందుకిలా జరుగుతోంది.... ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాకు ఎందుకు ప్రాధాన్యత ఉంది..? ప్రత్యేకహోదా లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు వచ్చే నష్టాలేంటీ..? ప్రత్యేకహోదాకు ఏమైనా ప్రత్యామ్నాయాలున్నాయా...? ఈ అంశాలపై టెన్ టివిలో 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు, ఉద్యమ నేత, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు విశ్లేషించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

నేడు కాకినాడలో సాహితీ స్రవంతి వార్షికోత్సవ సదస్సు

తూర్పుగోదావరి: నేడు కాకినాడలో సాహితీ స్రవంతి వార్షికోత్సవ సదస్సు జరుగునుంది. ఎమ్మెల్సీ సూర్యారావు, తెలకపల్లి రవి, అద్దేపల్లి, ద్వానా శాస్త్రిలు పాల్గొననున్నారు. 

నేటి నుంచి ఎన్ ఐటీ-ట్రిపుల్ ఐటీల్లో ప్రత్యేక ప్రవేశాలు..

హైదరాబాద్: నేటి నుంచి ఎన్ ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రత్యేక ప్రవేశాలు జరుగనున్నాయి. 

విశాఖ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

విశాఖ: నర్సీపట్నం సమీపంలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. రూ.80 లక్షల విలువైన 200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. 

10:10 - August 9, 2015

హైదరాబాద్: ఏపీ సర్కార్‌ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న అప్పులను కొనసాగిస్తూనే ఉంది. బాండ్లను తాకట్టు పెడుతూ రోజులు నెట్టుకొస్తోంది. మార్కెట్‌ బారోయింగ్‌ విధానంతో ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో చిక్కుకుంది. అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా.. అప్పులతోనే కాలం గడుపుతోంది. అప్పులే ఇంత ఘనంగా ఉంటే.. మరి వడ్డీల పరిస్థితి ఏంటో ?                                                                            
ప్రపంచ బ్యాంక్‌ నుంచి అప్పులు
ప్రభుత్వ పథకాలు సక్రమంగా కొనసాగేందుకు.. ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు లేనప్పుడు ప్రపంచ బ్యాంక్‌ నుంచి అప్పుల రూపంలో దేశానికి తీసుకువస్తుంటాయి. ఇలా ఇప్పటికే మన దేశం వరల్డ్‌ బ్యాంక్‌ నుంచి లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకువచ్చింది. అయితే వీటివల్ల ప్రజలకు ఎంత మేర ప్రయోజనం చేకూరిందో తెలియదు గానీ.. అప్పుల చిట్టా మాత్రం పెరుగుతూనే ఉంది.
అప్పుల చిట్టాను కొనసాగిస్తున్న ఏపీ సర్కార్‌
ఇక కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌.. ఆర్ధికంగా చితికిపోవడంతో ప్రపంచ బ్యాంక్‌ వద్ద అప్పుల చిట్టాను కొనసాగిస్తూనే ఉంది. అయితే గత పదేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దాదాపు లక్షా 26 వేల కోట్ల రుణాన్ని పొందింది. ఇందులో నవ్యాంధ్రప్రదేశ్‌ వాటా 73,856 కోట్లు కాగా.. తెలంగాణ వాటా 52,783 కోట్లుగా తేలింది. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం మరో 6 వేల కోట్లు ప్రపంచ బ్యాంక్‌ నుంచి తీసుకువచ్చింది. దీంతో ఆ అప్పు 80 వేల కోట్లకు చేరింది.
ఏపీ మొత్తం అప్పు రూ.144 వేల కోట్లు
మరోవైపు ప్రపంచ బ్యాంక్‌ నుంచి తీసుకున్న అప్పులు నిర్ణీత సమయంలో కొంత మొత్తంగా చెల్లించాలి. ఆర్బీఐ లెక్కల ప్రకారం.. అప్పుగా తీసుకున్న వెయ్యి కోట్లకు పదేళ్లలో 800 కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏపీ సర్కార్‌ తీసుకున్న అప్పుకు పదేళ్లలో 64 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ అప్పు మొత్తం 144 వేల కోట్లకు చేరుతుంది.
ఇప్పటికే రూ.6 వేల కోట్లు తీసుకున్న ఏపీ
ఇక ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏపీ ప్రభుత్వం ఏటా 13,500 కోట్లు మాత్రమే రుణం పొందే అవకాశం ఉంటుంది. కానీ.. ఏపీ ఇప్పటికే 6 వేల కోట్లు అప్పు తీసుకుంది. మరి రాబోయే కాలంలో ఆర్ధిక పరిస్థితులను ప్రభుత్వం ఎలా నెట్టుకొస్తుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలే ఆర్ధికంగా ఎంతో చితికిపోయిన రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పులను ఎలా తీరుస్తుందనేది ఆసక్తిగా మారింది. 

09:58 - August 9, 2015

విశాఖ: ఆగష్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏపి సర్కార్‌ సిద్ధమైంది. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న రెండో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బీచ్‌ రోడ్‌లో నిర్వహించాలని ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో బీచ్‌ రోడ్‌ను పూర్తిగా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతిరోజూ కవాతులు, మాక్‌ డ్రిల్‌లు నిర్వహిస్తున్నారు.                                                                                            
విశాఖలో సమీక్షా సమావేశం
ఇప్పటికే పలుసార్లు ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎలా జరపాలనే దానిపై విశాఖలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రజలను ఏం చేయాలనుకుంటుందో, అసలు ప్రభుత్వ విజన్‌ ఏంటో ప్రజలకు తెలిసేలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉండాలని మంత్రులు యనమల, గంటా అధికారులకు సూచించారు.
7వేలకు పైగా ప్రజలు హాజరు..
తొలిసారిగా విశాఖ బీచ్‌లో జరిగే ఆగష్టు 15 వేడుకలకు 7వేలకు పైగా ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఒకవేళ ఎక్కువమంది వచ్చినా నిలువరించే ప్రయత్నం చేయొద్దని పోలీస్‌ ఉన్నతాధికారులకు మంత్రులు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే బీచ్‌రోడ్డులో చెక్‌ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ఆగష్టు 13 నుంచి బీచ్‌ రోడ్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకోనున్నారు.

 

 

09:42 - August 9, 2015

చెన్నై: తిరుపతిలో నిన్న నిర్వహించిన కాంగ్రెస్ పోరు సభలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఎపికి ప్రత్యేకహోదా ప్రకటించాలంటూ... నిన్న తిరుపతిలో మునికోటి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతన్ని మొదటగా వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే మునికోటి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నూరు శాతం కాలిన గాయాలతో మునికోటి బాధపడుతున్నారు. కాసేపట్లో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. 

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మునికోటి పరిస్థితి విషమం...

చెన్నై: తిరుపతిలో నిన్న నిర్వహించిన కాంగ్రెస్ పోరు సభలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఎపికి ప్రత్యేకహోదా ప్రకటించాలంటూ... నిన్న తిరుపతిలో మునికోటి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతన్ని మొదటగా వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే మునికోటి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

నేటి నుంచి సీపీఎం ఆధ్వరంలో బస్సుయాత్ర

హైదరాబాద్: మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ.. నేటి నుంచి సీపీఎం ఆధ్వర్యంలో జిల్లాల్లో బస్సుయాత్ర చేయనుంది.

 

08:49 - August 9, 2015

హైదరాబాద్: మున్సిపల్‌ కార్మికుల పట్ల కేసీఆర్‌ వైఖరికి నిరసనగా వామపక్షాలు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. అన్ని జిల్లాల్లోనూ కేసీఆర్‌ దిష్టిబొమ్మలను వామపక్ష నాయకులు దహనం చేశారు. కార్మికులు, కార్మిక సంఘాల పట్ల సర్కార్‌ తన వైఖరి మార్చుకోవాలని నాయకులు హెచ్చరించారు. గ్రామ పంచాయితీ, మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకోసం వెళ్లిన వామపక్ష, టీడీపీ, వైసీపీ నాయకులను అరెస్టు చేయించటాన్ని ఖండిస్తూ.. వామపక్షాలు తెలంగాణలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. అన్ని జిల్లాల్లో ఆ పార్టీ నాయకులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
హైదరాబాద్, నల్గొండ
హైదరాబాద్‌లో వామపక్ష నేతలను అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ..నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేటలో కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వామపక్షాల నిరసన కార్యక్రమాలకు టీడీపీ, వైసీపీ నాయకులు మద్దతు తెలిపారు.
ఖమ్మం
ఖమ్మంలో పెవిలియన్ మైదానం నుంచి మున్సిపల్ కార్మికుల దీక్షాశిబిరం వరకూ వామపక్ష కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరపాలక సంస్థ ఎదుట కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కరీంనగర్‌
కరీంనగర్‌ పట్టణం తెలంగాణ చౌక్‌లో సీపీఎం, సీపీఐ, టీడీపీ, వైసీపీ నేతలు ఆందోళన చేశారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సీపీఐ కార్యకర్త రాజుకు గాయాలయ్యాయి. మరో కార్యకర్తకు కాలు విరగడంతో పోలీసులపై నేతలు మండిపడ్డారు. తర్వాత రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
వరంగల్‌
వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వామపక్ష నేతలు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. వరంగ‌ల్ న‌గ‌రం పోచమ్మ మైదాన్‌ సెంటర్‌ వద్ద మున్సిపల్‌ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. అనంత‌రం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జనగాంలోనూ సీపీఎం, సీపీఐ, టీడీపీ నేతలు కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మహబూబ్‌నగర్‌
మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలో వామపక్ష నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను ఊరేగించి.. దహనం చేశారు.
ఆదిలాబాద్‌, నిజామాబాద్‌
ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లా కేంద్రాల్లోనూ విపక్ష నాయకులు కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేసి.. నిరసన తెలిపారు.
ప్రతిపక్షాల మండిపాటు
ఊడ్చేవాళ్లే దేవుళ్లు అన్న సిఎం వారి జీతాలు పెంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. కార్మికులు, కార్మిక సంఘాలు, విపక్షాల పట్ల ముఖ్యమంత్రి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా ఉద్యమ నేత కేసీఆర్‌ తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు.

 

08:38 - August 9, 2015

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి దీక్ష చేపట్టబోతున్నారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో రేపు చేపట్టనున్న ఒకరోజు దీక్షకు వైసీపీ శ్రేణులు తరలివెళ్లాయి. తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి స్పెషల్‌ స్టేటస్‌ దక్కట్లేదంటున్న జగన్.. హోదా వచ్చే వరకూ ఉద్యమం కొనసాగుతుందని చెప్తున్నారు.
ప్రభుత్వానికి బహిరంగ లేఖ
మరోవైపు.. రాష్ట్రంలో నెలకొన్న 19 సమస్యలను వివరిస్తూ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వీటికి సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఓటుకు నోటు వ్యవహారంతోపాటు, పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట, ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడి, విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతాలను ప్రస్తావించిన జగన్‌.. వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
జగన్‌ ఆగ్రహం
అదేవిధంగా అసెంబ్లీ లాంజ్‌లో ఉన్న వైఎస్‌ ఫొటో తొలగింపు అంశంపైనా జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ మరణం తర్వాత అప్పటి అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాతే లాంజ్‌లో చిత్రపటాన్ని ఏర్పాటు చేశారని, ఇప్పుడు దాన్ని తొలగించడం సరికాదని పేర్కొన్నారు. మరోవైపు.. అసెంబ్లీ జనరల్‌ పర్పస్‌ కమిటీ పేరుతో 25 మందితో వేసిన కమిటీలో కేవలం ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకే స్థానం కల్పించడంపైనా జగన్ మండిపడ్డారు. ఇదెక్కడి సాంప్రదాయమని వైసీపీ నేతలు ప్రశ్నించారు. మొత్తం మీద.. జగన్ రాసిన బహిరంగ లేఖతో రాబోయే అసెంబ్లీ సమావేశాలు ఎంత హాట్‌ హాట్‌గా జరుగనున్నాయో తేటతెల్లం చేస్తోంది.

 

08:28 - August 9, 2015

తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రం వేదికగా ప్రతిపక్షం గర్జించింది. ఇచ్చిన మాట తప్పితే ఊరుకునేది లేదని ఓ రేంజ్‌లో హెచ్చరించింది. మాట ఇచ్చి మర్చిపోతే ఎలా అంటూ హైపిచ్‌లో ప్రశ్నించింది. ప్రత్యేక హోదాతో ఇన్నాళ్లు మభ్యపెట్టి ఇప్పుడు ప్యాకేజ్‌ అంటే పోరుకు తప్పదు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
బిజెపి, టిడిపిలపై కాంగ్రెస్ ఆగ్రహం
ప్రత్యేక హోదాపై కప్పగెంతులు వేస్తున్న బిజెపి, టిడిపిలను తిరుపతి వేదికగా కాంగ్రెస్‌ కడిగిపారేసింది. విభజన అనంతరం ఇచ్చిన హామీలను మరిచి కాలం గడిపేస్తున్నారంటూ తూర్పార పట్టింది. విభజనను సపోర్ట్ చేసి ప్రత్యేక హోదా తెస్తామన్న వారంతా నేడు ప్యాకేజి పేరుతో మరో మోసానికి తెరతీస్తున్నారని మండిపడింది. తిరుపతిలో కాంగ్రెస్‌ నిర్వహించిన పోరుసభలో ప్రత్యేహోదాపై సీఎం చంద్రబాబు కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ఏపీ పిసిసి చీఫ్‌ రఘువీరా దుయ్యబట్టారు. ఒకవేళ ప్రశ్నిస్తే తన ఎంపీలను కేంద్ర క్యాబినెట్‌ నుంచి తొలిగిస్తారనే భయంతోనే ఆ పని చేయడం లేదని రఘువీరా మండిపడ్డారు.
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై చిరంజీవి ఫైర్
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు చిరంజీవి నిప్పులు చెరిగారు. బాబు తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రాన్నిహోదా కోరడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ చిరంజీవి నినదించారు. మొత్తానికి కాంగ్రెస్, టిడిపిలను టార్గెట్ చేసేందుకు సరైన టైం కోసం వేచి చూస్తున్న కాంగ్రెస్‌ ప్రత్యేక హోదా అంశాన్ని అందిపుచ్చుకుంది. 11న వామపక్షాలు తలపెట్టిన బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చి పోరును ఉధృతం చేసేందుకు రెడీ అవుతోంది.

 

08:23 - August 9, 2015

హైదరాబాద్: పాతబస్తీలోని లాల్ దర్వాజలో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లాల్ దర్వాజ సింహవాహిని ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. భారీగా భక్తులు క్యూలైన్ లో నిల్చున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా వద్ద 3 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 

హైదరాబాద్ పాతబస్తీలో బోనాల ఉత్సవాలు

హైదరాబాద్: పాతబస్తీలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. లాల్ దర్వాజలో తెల్లవారుజామున నుంచి భక్తులు బారులు తీరారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా వద్ద 3 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

 

07:20 - August 9, 2015

హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్‌దర్వాజ బోనాలకు సర్వం సిద్ధమైంది. శాంతి భద్రతలపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతంగా ఉన్న పాతబస్తీలో జరిగే బోనాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా సిసి కెమెరాలను ఏర్పాటుచేశారు. బోనాల సందర్భంగా..నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు, బార్లను మూసివేయనున్నారు.
283 అమ్మవారి దేవాలయాల్లో బోనాలు
పాతబస్తీలో బోనాల సందడి మొదలైంది. 283 అమ్మవారి దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు జరగుతున్నాయి. వీటిలో లాల్‌దర్వాజ సింహవాహిని మహాంకాళి, అక్కన్న మాదన్న అమ్మవారి ఆలయాలు ప్రధానమైన ఆలయాలు కాగా గౌలీపుర, సుల్తాన్‌షాహి, ఛత్రినాక ప్రాంతాల్లోని మరో 19 ఆలయాల్లో కూడా బోనాలు అట్టహాసంగా జరుగుతాయి. ఆదివారం బోనాల ఉత్సవాలు జరగ్గా సోమవారం ఏనుగు అంబారీ ఊరేగింపు, అమ్మవారిని పుట్టింటికి పంపే కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహిస్తారు. పాతబస్తీలో జరిగే ఈ బోనాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటుచేశారు.
బందోబస్తును సమీక్షించిన సిపి మహేందర్‌రెడ్డి
నగరపోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి పాతబస్తీలో బోనాల బందోబస్తును సమీక్షించారు. బోనాల సమయంలో చార్మినార్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఆయన ఎప్పటికప్పుడు బందోబస్తున్న పర్యవేక్షించనున్నారు. రెండు రోజల పాటు మద్యం షాపులు, బార్లు, కల్లు కాంపౌండ్లు మూసివేస్తున్నారు. రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, క్విక్‌ రెస్పాన్స్ టీమ్స్, టాస్క్ ఫోర్స్ తో పాటు మఫ్టీలో కూడా పోలీసులను భారీగా నియమిస్తున్నారు. దక్షిణ మండలం డిసిపి సత్యనారాయణతో పాటు ఆరుగరు అదనపు డిసిపిలు, 15 మంది ఎసిపిలు, 40 మంది సిఐలు, వంద మంది ఎస్‌ఐలు, ఏడు వందల మంది కానిస్టేబుల్స్‌, మరో 300 మంది మహిళా కానిస్టేబుల్స్ బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, అనుమానితులు సంచరించినా వారిని గుర్తించేందుకు అడుగడుగున సిసి కెమెరాలు కూడా ఏర్పాటుచేశారు.
ఊరేగింపు ముగిసే వరకు బందోబస్తు
ఆదివారం తెల్లవారుజామున బోనాలు ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం రాత్రి ఊరేగింపు కార్యక్రమం ముగిసే వరకు బందోబస్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. అలాగే డిజేల వాడకాన్ని నిషేదించామని, ఎక్కడైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్మికుల అమరణనిరాహార దీక్ష భగ్నం..

నల్గొండ: మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేస్తున్న కార్మికులను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. తమకు కనీస వేతనం అమలు చేయాలని గత ఐదు రోజులుగా కార్మికులు దీక్ష చేస్తున్నారు.  

తెలంగాణలో నేడు డీఈఈ సెట్ పరీక్ష

హైదరాబాద్: తెలంగాణలో నేడు డీఈఈ సెట్ పరీక్ష జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 473 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో వీడియో కెమెరాలతో చిత్రీకరణ చేయనున్నారు. 1.17 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 

Don't Miss