Activities calendar

14 August 2015

22:16 - August 14, 2015

ఢిల్లీ: హస్తిన సీఎం కేజ్రీవాల్ తో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భేటీ అయ్యారు. ఆగస్టు 22న అరవింద్ కేజీవ్రాల్ ఢిల్లీలో అన్ని రాష్ట్రాల సీఎంల సమావేశం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఈ భేటీ జరిగింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు ఏర్పాటు కావడానికి ఈ సమావేశాలు దోహదపడతాయని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి సమావేశాలు జరిగాయని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఆహ్వానం మేరకే కలవడం జరిగిందని, అంతకుమించి ఆయనతో ఎలాంటి అవగాహన లేదన్నారు. 

22:06 - August 14, 2015

జకార్తా : ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ కు భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ తొలిసారిగా చేరి..కాంస్య పతకం ఖాయం చేసుకొంది. జకార్తా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ ఆఖరి క్వార్టర్ ఫైనల్లో ...రెండోసీడ్ సైనా మూడుగేమ్ ల హోరాహోరీ సమరం లో ఆరవ సీడ్ వాంగ్ ఈ హాన్ ను అధిగమించి...సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొంది. గంటా 12 నిముషాలపాటు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోటీలో సైనా...21-15, 19-21, 21-19తో వాంగ్ ను కంగు తినిపించింది. ప్రపంచ ఆరవ ర్యాంకర్ వాంగ్ తో ఇప్పటి వరకూ 12 సార్లు తలపడిన సైనాకు..ఇది మూడవ గెలుపు మాత్రమే. సెమీఫైనల్లో నెగ్గితే రజతం, ఫైనల్లో విజేతగా నిలిస్తే ప్రపంచ టైటిల్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సైనా సెమీస్ లో విఫలమైతే కనీసం కాంస్య పతకమైన దక్కుతుంది. ఆల్ ఇంగ్లండ్ సిల్వర్ మెడల్ సాధించిన సైనా..ఇప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్లో సైతం తానేమిటో నిరూపించుకొంది. విమల్ కుమార్ కోచ్ గా...బెంగళూరులో సైనా సాధన చేస్తున్న సంగతి తెలిసిందే.

 

22:01 - August 14, 2015

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కార్మికులకు జీతాలు పెరిగాయి. వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచినా.. విధులకు రాలేదన్న నెపంతో.. సమ్మెలో పాల్గొన్న వందలాది కార్మికులపై మాత్రం అధికారులు నోరు మెదపడం లేదు. ఉద్యోగం కోల్పోయి.. బాధితులు పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాల నుంచి డిమాండ్స్ ఊపందుకున్నాయి.
జూలై 6 నుంచి సమ్మె
తెలంగాణలో మున్సిపల్ కార్మికులు జూలై 6 నుంచి సమ్మె చేస్తున్నారు. కనీసం వేతనం 14 వేల 170 రూపాయలు ఇవ్వాలని, రెగ్యులరైజ్ చేయాలని ఆందోళన బాట పట్టారు. ఐతే జూలై 16న జీహెచ్‌ఎంసీ కార్మికులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ మినహా ఇతర మున్సిపల్ కార్మికులకు మాత్రం జీతాలు పెంచలేదు.
అధికారికంగా ఉత్తర్వులు జారీ
జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల వేతనాల పెంపునకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ పరిధిలోని శానిటేషన్ కార్మికులు, రవాణావిభాగంలో పనిచేస్తున్న హెల్పర్లు, వెటర్నరీ, ఎంటమాలజీ వర్కర్ల వేతనాన్ని 8 వేల 500 నుంచి 12 వేల 500 వరకు పెంచారు. శానిటరి, ఎంటమాలజీ ఫిల్డ్ అసిస్టెంట్ల వేతనాన్ని9 వేల 779 నుంచి13 వేలకు పెంచారు. ఇక ట్రాన్స్ పోర్టు విభాగంలో పనిచేస్తున్న డ్రైవర్ల వేతనం ఇకనుంచి 15వేలు. అంతకు ముందు వీరి వేతనం 10వేల 160 మాత్రమే.
శానిటరి రిసోర్స్ సిబ్బంది, కోఆర్డినేటర్లకు నిరాశ
మరోవైపు పారిశుద్ధ్య విభాగంలోనే పనిచేస్తున్న శానిటరి రిసోర్స్‌ సిబ్బంది, కోఆర్డినేటర్లకు మాత్రం వేతనాలు పెంచలేదు. జిహెచ్‌ఎంసి కార్యాలయాల్లో పనిచేస్తున్న హౌజ్ కీపింగ్, పార్కులలో పనిచేస్తున్న సిబ్బందికి మొండిచేయి చూపింది. వీరితో పాటు డేటా ఎంట్రీ అపరేటర్లు, ప్రోగ్రామర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్ల జీతాలు 8 వేల నుంచి 9 వేల 500 మాత్రమే. టెక్నికల్ సిబ్బందికి కూడా వేతనాలు పెంచకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులకంటే తక్కువ వేతనంతో పనిచేయ్యాల్సి వస్తుంది.
1300 కార్మికులను తొలగించిన జీహెచ్‌ఎంసీ
ఇక సమ్మెలో పాల్గొన్నందుకు దాదాపు 13 వందల మంది జీహెచ్‌ఎంసీ కార్మికులను ప్రభుత్వం విధులకు హాజరుకానివ్వటం లేదు. ఆరోగ్య, కుటుంబ సమస్యల కారణంగా విధులకు హాజరుకాని వారిని సైతం పనులకు రానివ్వడం లేదు. వారు గత నెల రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా గ్రేటర్ అధికారులు పట్టించుకోవటం లేదు.  జీహెచ్‌ఎంసీ కార్మికులకు పెంచినట్లుగానే ఇతర మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే వేతనాలు పెంచాలన్న డిమాండ్ ఊపందుకుంది. దీంతో పాటు విధులను నుంచి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

21:54 - August 14, 2015

ఎంత సౌకర్యంగా కనిపిస్తాయో... అంతకంటే ఎక్కువ ప్రమాదానికి కారణమవుతున్నాయి. చెప్పిన పని చేయటమే కాదు... చెప్పకుండానే నష్టాన్ని కలిగిస్తున్నాయి. అంతిమంగా మనిషి తన అవసరాలకోసం సృష్టించుకున్న ఈ యంత్రుడు.. మనిషికే శత్రువు కాబోతున్నాడా...? భస్మాసురా అస్త్రంతో మనిషిపై యుద్ధం సాగించే రోజు రాబోతుందా..? కృత్రిమ మేధపరిధి పెరిగే కొద్ది.. లాభాలతోపాటు ప్రశ్నలూ పెరుగుతున్నాయి. ఈ రోజు వైడ్ యాంగిల్ ఇదే అంశంపై కథనం చూద్దాం... మరిన్ని వివరాలను వీడియోలో చూడండి... 

21:25 - August 14, 2015

ఖమ్మం: బిడ్డలకు కన్నవాళ్లే భారమైపోతున్నారు. రోడ్డున పడేసి, చేతులు దులిపేసుకుంటున్నారు. వేలు పట్టి నడిపించిన వారి గుండెల మీద తన్ని వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. బతకడమెలాగో నేర్పిన తాము .. బతకగలమంటూ ధీమాగా చెబుతున్నారు కొందరు తండ్రులు. ముదిమి వయసులోనూ కష్టాలకు నెరవకుండా ముందుకుపోతున్నారు.
పలువురికి ఆదర్శంగా
కంటికి రెప్పలా సాకిన కన్నవారిని అవసాన దశలో మాత్రం బిడ్డలు సాకలేకపోతున్నారు. ముదిమి వయసులో చేయూత ఇవ్వలేకపోతున్నారు. కని, పెంచి, పెళ్లి చేసిన తర్వాత కన్నవాళ్లు.. కాస్తా పరాయివాళ్లైపోతున్నారు. పిల్లల ఆదరణ లేకపోయినా బతుకు బండిని లాగిస్తున్నారు. మనోధైర్యం విడవకుండా, తమ జీవన పోరాటాన్ని సాగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
గుండె బోయిన కన్నయ్య..
ఖమ్మం జిల్లా బయ్యారం మండలం సింగారం గ్రామానికి చెందిన గుండె బోయిన కన్నయ్యకు... ముగ్గురు కొడుకులు. కడు పేదరికంలో ఉన్నా...పున్నామ నరకం నుంచి తప్పిస్తారని కొడుకులను అల్లారుముద్దుగా పెంచి పెద్దచేశాడు. కానీ వారు పెళ్లి కాగానే ఎవరి దారి వారు చూసుకున్నారు. దీంతో కుటుంబ పోషణ భారం కావడంతో కన్నయ్య అధైర్య పడకుండా 90 ఏళ్ల వయసులో బతుకు జట్కా బండిని లాగిస్తున్నాడు. సొంతంగా మిఠాయిలు తయారు చేసి అమ్ముతున్నాడు. కావడిని భుజాన వేసుకుని కాలినడకన ఊరురా తిరిగి విక్రయిస్తున్నాడు.
కొడుకులకు ఆర్థిక సాయం
కొడుకులు తనను వదిలేసినా తాను మాత్రం వారికి ఆర్థికంగా సాయం చేస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు కన్నయ్య. ఇప్పటివరకూ ఏనాడు జబ్బు పడలేదంటున్నాడు. రోజూ జొన్న సంకటి తినడమే అందుకు కారణమంటున్నాడు.
కష్టానికి సిద్ధమంటున్న కన్నయ్య
చివరి శ్వాస వరకు కష్టానికి సిద్ధమేనంటున్నాడు కన్నయ్య. నిరాశ, నిస్పృహలను దరి చేరనీయకుండా, రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్నాడు. మరెందరికో ఆఖరి ఘడియల్లోనూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

 

21:20 - August 14, 2015

మెదక్: అహింసనే ఆయుధంగా చేసుకుని పోరాడిన యోధుడు. యావత్ ప్రపంచానికి ఆయనో దిక్సూచి. జాతిపితను కించపరిచేందుకు కొందరు కంకణం కట్టుకుంటే... మహాత్ముడు చనిపోయినా ఇంకా మా హృదయాల్లో బతికే ఉన్నాడని మరికొందరు చాటుతున్నారు. మహాత్మా మళ్లీ జన్మించు అంటూ కోరుకుంటూ గాంధీజీ బాటలోనే పయనిస్తున్నారు.
మహాత్ముడినే దేవుడిగా కొలుస్తూ
గాంధీగిరికి ఆయనో చిరునామా. మనసా వాచా కర్మనా అణువణువు గాంధీగిరిని పాటిస్తున్నడానికి ఆయనో అక్షర రూపం. మహాత్ముడినే దేవుడిగా కొలుస్తూ ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నాడు.
90 ఏళ్ల సంగి నాగయ్య..
మెదక్‌ జిల్లా రేగోడుకు చెందిన 90 ఏళ్ల సంగి నాగయ్యకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆ గ్రామంలో కోడి కూసినా... కూయకపోయినా...ఆయన మాత్రం గాంధీజీ విగ్రహానికి పూజలు చేయడం మానరు. కుండపోతగా వర్షం కురిసినా...నరాలు కొరికే చల్లని గాలులు వీచినా వెనక్కితగ్గరు. తెల్లవారుజామున 5 గంటలకే నిద్ర మేల్కొని గాంధీ విగ్రహం దగ్గర ప్రదక్షిణలు, పూజలు చేయడం ఆయన దినచర్యగా మారింది.
నాగయ్యకు చదువు రాదు
నాగయ్యకు చదువు రాదు. ఆయనకు తెలిసిందల్లా నిజాయితీగా, నిస్వార్థంగా గాంధీజీని నిండు మనస్సుతో పూజించడం. మహాత్ముడి అడుగుజాడల్లో నడవాలని పదిమందికి చెప్పడం. వృధ్యాప్యంలో తల్లిదండ్రులను బిడ్డలు భారంగా భావిస్తున్నారని.. వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని మహాత్ముడిని వేడుకుంటున్నట్లు నాగయ్య చెబుతాడు. గాంధీజీ తన కలలో కూడా వస్తారంటూ మురిసిపోతాడు.
నాగయ్యకు స్థానికుల ప్రశంసలు
ఏ పంద్రాగస్టుకో, చెబ్బీస్‌ జనవరికో గాంధీజీని స్మరించకుండా... నిత్యం గాంధీగిరిని పాటిస్తున్న నాగయ్యను స్థానికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సూక్తులు చెప్పడం వేరు. వాటిని పాటించడం వేరు. గాంధీగిరిని ఒంట్లోనూ, ఇంట్లోనూ నింపుకున్న నాగయ్య పలువురికి ఆదర్శంగా నిలుస్తూ దేశభక్తిని చాటుతున్నారు.

 

21:07 - August 14, 2015

కర్నూలు: డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ మహిళ చనిపోయిందంటూ కర్నూలులో బాధితులు ఆందోళనకు దిగారు. కర్నూలు విజయదుర్గ కార్డియాలిజీ ఆస్పత్రిలో రామేశ్వరమ్మ అనే మహిళ చికిత్స కోసం చేరింది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆమెను ఆరోగ్యశ్రీ కింద చేర్చుకున్నారు. అయితే 8వ తేదీ నుంచి చికిత్స అందిస్తుండగా ఆమె 13వ తేదీ రాత్రి చనిపోయింది. అయితే చనిపోయిన విషయం తమకు తర్వాతి రోజు ఉదయం 8 గంటలకు చెప్పారని బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే రామేశ్వరమ్మ చనిపోయిందని వారంతా మండిపడుతున్నారు.


 

20:59 - August 14, 2015

ఢిల్లీ:  భారత టెన్నిస్ క్వీన్, హైదరాబాద్ షాన్ సానియా మీర్జా...భారత అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికయ్యింది. కేంద్రప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న అవార్డును సానియాకు ప్రకటించింది. అంతర్జాతీయ టెన్నిస్ లో గత ఏడాది కాలంగా అసాధారణ విజయాలు సాధించిన సానియాను గుర్తించిన కేంద్రక్రీడామంత్రిత్వశాఖ..ఖేల్ రత్న పురస్కారానికి సిఫారసు చేసింది. రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డ్‌ సాధించిన తొలి భారత మహిళా టెన్నిస్‌ ప్లేయర్‌గా సానియా చరిత్ర సృష్టించింది. మరో 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులను ప్రకటించింది. అర్జున అవార్డు గ్రహీతల్లో రోహిత్ శర్మ, కిదాంబి శ్రీకాంత్ లు ఉన్నారు.
ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారత ప్లేయర్
సానియా మీర్జా... భారత మహిళా టెన్నిస్ ఖ్యాతిని ఎవరెస్ట్ ఎత్తుకు తీసుకెళ్ళిన ఒకే ఒక్క ప్లేయర్. జాతీయసబ్ జూనియర్ ప్లేయర్ గా అడుగుపెట్టి..గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో పాటు..మహిళల డబుల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారత ప్లేయర్ సానియా. 28 ఏళ్ల తన ప్రొఫెషనల్ టెన్నిస్ జీవితంలో ఇప్పటికే ఎటిపి, డబ్ల్యుటిఎ సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ సాధించిన సానియా...అమెరికన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్, వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగాలలో సైతం గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గి చరిత్ర సృష్టించింది.
టెన్నిస్ కోర్టులోకి దిగిందంటే చాలు.
టెన్నిస్ కోర్టులోకి దిగిందంటే చాలు..భారీగ్రౌండ్ స్ట్రోక్ లతో దూకుడుగా ఆడటానికి పెట్టిందిపేరైన సానియా ...రాత్రి కి రాత్రే స్టార్‌ అవ్వలేదు. కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని....ఈ స్థాయికి చేరుకుంది. జూనియర్‌ విభాగంలో సంచలన విజయాలతో కెరీర్‌ ఆరంభించిన సానియా...2003లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌గా మారింది.కానీ సింగిల్స్‌లో కొన్ని అరుదైన విజయాలు నమోదు చేసిన సానియా....అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమైంది.
డబుల్స్‌కే పరిమితమైన సానియా 
గాయాల కారణంగా, ఫిట్‌నెస్‌ సమస్యలతో సింగిల్స్‌ కు గుడ్‌బై చెప్పడంతో... సానియా కెరీర్‌ ముగిసినట్లే అనుకున్నారంతా...ఆ తర్వాత నుంచి మిక్స్‌డ్‌ డబుల్స్‌,ఉమెన్స్‌ డబుల్స్‌కే పరిమితమైన సానియా మీర్జా....అరుదైన విజయాలతో పెద్ద సంచలనమే సృష్టించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గిన సానియా...ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మాత్రం క్వార్టర్‌ఫైనల్స్‌కే పరిమితమైంది. మిక్స్‌డ్ డబుల్స్‌ విభాగంలోనూ సత్తా చాటుతోంది. జింబాబ్వే డబుల్స్‌ స్టార్‌ కారా బ్లాక్‌ జోడీగా... డబ్ల్యుటిఎ ఫైనల్స్ టైటిల్‌ నెగ్గి సంచలనం సృష్టించింది. డబ్ల్యుటిఎ ఫైనల్స్ టైటిల్‌ నెగ్గిన తొలి భారత మహిళా టెన్నిస్‌ ప్లేయర్‌గా రికార్డ్‌ నెలకొల్పింది.
రాజీవ్ ఖేల్ రత్న కు ఎంపికైన మూడో హైదరాబాదీ
ఇక స్విస్‌ వెటరన్‌...మార్టినా హింగిస్‌ జోడీగా వింబుల్డన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ నెగ్గి మరోసారి తన స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. అంతేకాదు...ప్రపంచ మహిళా టెన్నిస్ డబుల్స్ విభాగంలో ..సానియా టాప్ ర్యాంక్ స్టార్ గా కొనసాగుతోంది. ఏడాదికాలంలో ఇన్ని అద్భుత విజయాలు సాధించిన కారణంగానే సానియాను ..దేశఅత్యున్నత క్రీడాపురస్కారం వరించింది.బ్యాడ్మింటన్ స్టార్లు పుల్లెల గోపిచంద్, సైనా నెహ్వాల్ ల తర్వాత...రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైన మూడో హైదరాబాదీగా సానియా చరిత్రలో నిలిచిపోతుంది.

 

సానియాకు రాజీవ్ ఖేల్ రత్న

ఢిల్లీ: టెన్నిస్ స్టార్ సానియామీర్జాకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఖరారు అయింది. ఈమేరకు కేంద్రప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న అవార్డును సానియాకు ప్రకటించింది. మరో 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులను ప్రకటించింది. అర్జున అవార్డు గ్రహీతల్లో రోహిత్ శర్మ, కిదాంబి శ్రీకాంత్ లు ఉన్నారు.

 

20:54 - August 14, 2015

హైదరాబాద్: ఎపిలో తెలుగు మీడియం స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధమైంది. తెలుగు మీడియం సెక్షన్ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. సగానికి సగం స్కూళ్లను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సక్సెస్ స్కూళ్ల పేరుతో తెలుగు మీడియాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1,647 స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసివేసే స్కూళ్ల విద్యార్థులను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లో చేర్పించాలని నిర్ణయించారు. తెలుగు మీడియం విద్యార్థులను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చేర్పించాలని నిర్ణయించారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వ నిర్ణయించింది.


 

ఎపిలో తెలుగు మీడియం స్కూళ్ల మూసివేత

హైదరాబాద్: ఎపిలో తెలుగు మీడియం స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధమైంది. సగానికి సగం స్కూళ్లను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సక్సెస్ స్కూళ్ల పేరుతో తెలుగు మీడియంను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

సెమీఫైనల్ లో సైనా

ఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సెమీఫైనల్ లో సైనా నెహ్వాల్ కాంస్య పతకం ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్ లో 21-15, 19-21, 21-19 తేడాతో చైనా షట్లర్ ఇహాన్ వాంగ్ పై సైనా గెలుపొందింది.

 

20:27 - August 14, 2015

కథ :
ఏ లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే ఓ మధ్య తరగతి కుర్రాడు ఈ సినిమాలోని హీరో... పేరు కత్తి. కానీ అనుకోకుండా ఒక రోజు పరిణీత అనే అమ్మాయిని చూసి తనని ప్రేమించడమే అసలు పని అని నిర్ణయించుకుంటాడు, ఆమె ప్రేమకోసం శతవిధాల ప్రయత్నిస్తాడు కుడా ...చివరకు తన ప్రేమను గెల్చుకుంటాడు. కానీ ప్రతి విషయంలో క్వాలిటీ బాగుండాలి అని తపన పడే పరిణీత తండ్రి సోమనాథ్ చటర్జీ కి తన కూతురు ఇంటర్ కూడా పాస్ కానీ ఓ పోకిరి ప్రేమలో పడింది అని తెలుసుకుని షాక్ అవతాడు.సోమనాథ్ ఎంత చెప్పినా కూతురు కానీ కత్తి కానీ తన మాట వినకపోవడంతో చివరకు తన కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరం ఒక పందెం వేసుకుందాం, దాంట్లో నువ్వు గెలిస్తే నా కూతురు ని ఇచ్చి పెళ్లి చేస్తా అనడంతో కత్తి ఆ పందానికి ఒప్పుకుంటాడు.సోమనాథ్ వేసిన ఆ పందెం లో అసలు మతలబు ఏంటి చివరకు హీరో ఆ పందెంలో గెలిచాడా లేదా అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ముందుగా ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా హీరో రాజ్ తరుణ్ గురించి మాట్లాడాలి. చాల ఎనేర్జితిక్ గా చాల నాచురల్ గా తను ఇచ్చిన పెర్ఫార్మన్స్ మాత్రం అధ్బుతం.మొదట్లో మాసీగా...తర్వాత లవర్ బాయ్ గా చివర్లో సెంటిమెంటల్ గా పలు రకాల ఎమోషన్స్ ని చాల చక్కగా పలికించాడు. హీరోఇన్ అవిక గొర్ కూడా బాగానే చేసినా తన ఆహార్యం మాత్రం ఈ సినిమాలో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఎప్పటిలానే రావు రమేష్ కి ఓ మాంచి పాత్ర దొరికింది. అలాగే రాజ్ తరుణ్ రావు రమేష్ తో పోటీ పడి ఈ సినిమాలో నటించాడు.అలాగే జబర్దస్త్ ద్వార పరిచయం అయిన నటీనటులందరూ తమ పరిధి మేరకు బాగా నటించారు,నవ్వించారు.ఇక టెక్నికల్ చూస్తే ప్రసన్న కుమార్ అందించిన మాటలు బాగున్నాయి.ఆ తర్వాత శేఖర్ చంద్ర అందించిన సంగీతం కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ చాల బాగుంది.కానీ సాంగ్స్ ప్లేస్ మెంట్స్ మాత్రం కరెక్ట్ గా లేవు.అలాగే చిన్న సినిమా అయినా సినిమాటోగ్రఫి గానీ ప్రొడక్షన్ వాల్యూస్ గానీ చాల బాగున్నాయి. ఇక కథ కథనాల గురించి మాట్లాడుకుంటే పాత కథను కాస్త తాజాగా చెప్పాడు దర్శకుడు త్రినాధ రావు నక్కిన. హీరో హీరోఇన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను బాగానే తీసినా కాస్త లాగులు కాస్త డ్రాగులు ఉన్నాయి అని ప్రేక్షకుల కంప్లైంట్స్. ఇక కథనం విషయానికి వస్తే దర్శకుడు పూర్తిగా ఈ బాధ్యతను మాటల రచయిత జబ్బర్దస్థ్ ఫేం ప్రసన్న కుమార్ కే వదిలేసినట్టు సినిమాలోని చాల సన్నివేశాలు మనకు తెలియ చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్కిట్లతో హిట్టు కొట్టిన సినిమా గా సినిమా చూపిస్తావా మామ గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత మాటల రచయితగా ప్రసన్న కుమార్ మాత్రం బిజీ అవతాడు అనడం లో ఎటువంటి సందేహం లేదు. అంతలా ఈ సినిమాలోని తన మాటలు ప్రేక్షకులను నవ్వించాయి. సినిమాని సినిమా గా మాత్రమే చూసే పని అయితే ఈ సినిమాలో మిస్ అయిన లాజిక్కులు గానీ, అర్ధం పర్ధం లేని క్లైమాక్స్ ని గానీ పాత చింతకాయ పచ్చడిలాంటి లాంటి కథను గానీ మీరు వదిలేసి... నటీనటుల అభినయాన్ని జబ్బర్దస్థ్ గా ఉండే నాలుగు కామెడి స్కిట్లను చూసి మాత్రం నవ్వుకుని వచ్చేయచ్చు. ఇక ఫైనల్ గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సాదారణ ప్రేక్షకులకు ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తే జబ్బర్దస్థ్ ఫాన్స కి మాత్రం ఈ సినిమా సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం జబ్బర్దస్థ్ మయం.
ప్లస్ పాయింట్స్
రాజ్ తరుణ్
సంగీతం
సినిమాటోగ్రఫి
కామెడీ స్కిట్స్
మాటలు
మైనస్ పాయింట్స్
కథ
కథనం
క్లైమాక్స్

టెన్ టివి రేటింగ్... 2/5


 

20:13 - August 14, 2015

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఉన్నా....దర్శకుడిగా, నటుడిగా ఉపేంద్ర టాలెంట్ మొత్తం దక్షిణాది ప్రేక్షకులకు తెలుసు. సుమారు పాతికేళ్లుగా ప్రయోగాత్మక చిత్రాలే అతని బ్రాండ్ ను కాపాడుతున్నాయి. ఉపేంద్ర 2 కూడా అతని ట్రేడ్ మార్కును కాపాడే సినిమానే...అయితే కథలో ట్విస్టులు ఎక్కువై...కన్ ఫ్యూజన్ కు గురి చేసింది. రెండో సారి చూస్తే గానీ...సినిమా అర్థమయ్యే పరిస్థితి సాధారణ ప్రేక్షకుడికి లేదు.
కథ...
నిలువెల్లా స్వార్థం నిండిన వ్యక్తి సమాజంలో ఎలా ప్రవర్తిస్తాడని చూపించే కథతో....పదిహేనేళ్ల కిందట ఈ నటుడు తెరకెక్కించిన సినిమా ఉపేంద్ర. ఇన్నేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిందే ఉపేంద్ర 2. అయితే కథ పూర్తిగా భిన్నం. నేను అంటే స్వార్థం నువ్వు అంటే నిస్వార్థం అనే భావాన్నిస్తూ...ఉపేంద్ర 2 సినిమా సాగుతుంది. నువ్వు అనే పేరుతో అంతా పిలిచే ఉపేంద్ర ఊళ్లో అందరికీ స్నేహితుడులా...పనివాడిలా ఉంటాడు. ప్రతిఫలం ఆశించకుండా అందరి పనులు చేస్తుంటాడు. ఈ పనులు చేయడం నాకు సంతోషం...సంతోషంగా ఉంటే డబ్బునట్లే అంటాడు. నిన్న ఏం జరిగిందో...రేపు ఏం జరగబోతోందో...అనవసరం...కేవలం ఇప్పుడు జరిగేదే ముఖ్యమంటాడు. ఇలాంటి వ్యక్తికి హ్యాపీ అనే ఓ యువతి పరిచయమవుతుంది. అతని పిలాసఫీ, ప్రవర్తన నచ్చి ఇష్టపడుతుంది. ఊళ్లో అందరికీ స్నేహితుడిలా నిస్వార్థంగా ఉంటున్న ఉపేంద్ర...కావాలనే అలా నటిస్తున్నాడనే విషయం ఇంటర్వెల్ ట్విస్టుతో తెలుస్తుంది. అసలు అతనెందుకు ఊళ్లోకి వచ్చాడు. వేల కోట్ల ఆస్తితో అతనికి ఉన్న సంబంధం ఏంటి అనేది మిగిలిన కథ..
విశ్లేషణ..
దర్శకుడిగా, నటుడిగా ఉపేంద్ర ప్రత్యేకత సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కనిపిస్తుంటుంది. హీరో ఇంట్రడక్షన్ సీన్స్ ముందు వచ్చే డ్రామా నుంచి...ఆ తర్వాత ఇంటర్వెల్ వరకు సాగే కథ...చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లైఫ్ గురించి ..మనిషి సంతోషంగా ఉండాలంటే ఎలా బతకాలనే దాని గురించి పస్టాఫ్ లో ఉపేంద్ర చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. పాటల చిత్రీకరణ వైవిధ్యంగా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరినా....సెకండాఫ్ లో కథలో ట్విస్టులు ఎక్కువై కన్ ఫ్యూజ్ చేస్తాయి. అప్పటిదాకా మంచివాడుగా ఉన్న ఉపేంద్ర డబ్బు కోసం గేమ్ ఆడుతున్నాడనేది స్టోరీ టర్నింగ్ పాయింట్. అతను పోలీస్ ఆఫీసర్ అనేది మరో మలుపు. ఇలా క్లైమాక్స్ కొంత గందరగోళానికి గురిచేస్తుంది. మిగతా దర్శకులు ఊహించలేని స్క్రీన్ ప్లే తో...ఉపేంద్ర మాత్రమే తీయగల సినిమా ఇది. పాటల ప్లేస్ మెంట్ సూపర్. తన ట్రేడ్ మార్క్ మూవీగా ఈ సినిమాను నిలబెట్టుకున్నాడు ఉపేంద్ర. అయితే సెకండాఫ్ క్లారిటీ గా తీసుంటే సక్సెస్ ఫుల్ సినిమా అయ్యేది..
ఫ్లస్ పాయింట్స్

  1. ఉపేంద్ర నటన

  2. సంభాషణలు

  3. ఫస్టాఫ్

మైనస్ పాయింట్స్

  1. స్క్రీన్ ప్లే

  2. సెకండాఫ్

  3. ఎక్కువైన ట్విస్టులు

  4. క్లైమాక్స్

టెన్ టివి రేటింగ్....2/5

19:55 - August 14, 2015

కృష్ణా: పార్లమెంట్ లో కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని కేంద్రమంత్రి సుజనాచౌదరి విమర్శించారు. విజయవాడలో సీఆర్ డీఏ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో పార్లమెంటరీ వ్యవస్థకు తలవంపులు తెచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదన్నారు.


 

కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించింది..

కృష్ణా: పార్లమెంట్ లో కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని కేంద్రమంత్రి సుజనాచౌదరి విమర్శించారు. విజయవాడలో సీఆర్ డీఏ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో పార్లమెంటరీ వ్యవస్థకు తలవంపులు తెచ్చారని పేర్కొన్నారు. 

19:30 - August 14, 2015

ఢిల్లీ: 69 వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతినుద్దేంచి ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవం కోసం స్వాతంత్ర్య ఉద్యమాన్ని చేశారని గుర్తు చేశారు. 'మనకు పటిష్టమైన రాజ్యాంగం ఉంది' అని అన్నారు. నోబుల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థికి అభినందనలు తెలిపారు. భిన్న మతాలు, కులాలు, ఆచార వ్యవహారాలు వున్న దేశంలో.. ప్రజలంతా శాంతియుతంగా, స్నేహపూర్వకంగా మెలగాలని ఆకాంక్షించారు. వారసత్వంగా వస్తోన్న సంప్రదాయాలను... విద్యాసంస్థలు భవిష్యత్తు తరాలకు అందిస్తున్నాయన్నారు. అలాంటి విద్యాసంస్థల్లో మెరుగైన విద్య అందించేందుకు కృషిచేయాలన్నారు. మానవునికి... ప్రకృతికి మధ్య సంబంధాన్ని కాపాడుకోవాలన్నారు. భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా వుంటుందన్నారు. దేశరక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతోన్న భద్రతా సిబ్బందికి రాష్ట్రపతి ప్రణబ్ అభినందనలు తెలిపారు. 

జాతినుద్దేంచి ప్రసంగించిన రాష్ట్రపతి ప్రణబ్

ఢిల్లీ: 69 వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతినుద్దేంచి ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలిపారు. 

19:14 - August 14, 2015

హైదరాబాద్: రిషితేశ్వరి ఆత్మహత్యతో ఎపి సర్కార్ లో చలనం కలిగింది. ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టింది. బయటి వ్యక్తులను యూనివర్సిటీ క్యాంపస్ లోకి అనుమతించరాదని ఆదేశించింది. హాజరు, స్కాలర్ షిప్ లను బయోమెట్రిక్ కు అనుసంధానం చేశారు. అన్ని వర్సిటీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యూనివర్సిటీల ఉపకులపతులను ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 31 నుంచి అమలు చేయాలని వీసీలను ఆదేశించారు.


 

రిషితేశ్వరి ఆత్మహత్యతో ఎపి సర్కార్ లో చలనం

హైదరాబాద్: రిషితేశ్వరి ఆత్మహత్యతో ఎపి సర్కార్ లో చలనం కలిగింది. ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టింది. బయటి వ్యక్తులను క్యాంపస్ లోకి అనుమతించరాదని ఆదేశించింది. హాజరు, స్కాలర్ షిప్ లను బయోమెట్రిక్ కు అనుసంధానం, అన్ని వర్సిటీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యూనివర్సిటీల ఉపకులపతులను ప్రభుత్వం ఆదేశించింది.

 

ఉస్మానియా ఆస్పత్రిపై ఇంటాక్ సంస్థ నివేదిక

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిపై ఇంటాక్ సంస్థ నివేదిక సమర్పించింది. ఉస్మానియా ఆస్పత్రిపై మూడు రోజుల పాటు 14 మంది నిపుణులు అధ్యయనం చేశారు. ఆస్పత్రి భవనాన్ని ఇప్పట్లో కూల్చవద్దని సంస్థ సూచించింది. భవనాన్ని కూల్చడానికి అవసరమయ్యే డబ్బులతోనే మరమ్మత్తులు చేస్తే ఉస్మానియా ఆస్పత్రి మరో 100 ఏళ్లు మనగలుగుతుందని వివరించారు. కావాలంటే ఖాళీ స్థలంలో నూతన భవనం కట్టాలని సూచించారు.

తెలంగాణకు 11 పోలీసు పతకాలు- 2 రాష్ట్రపతి పతకాలు

ఢిల్లీ: కేంద్రప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. తెలంగాణకు 11 పోలీసు పతకాలు, రెండు రాష్ట్రపతి పతకాలు లభించాయి. 

 

18:13 - August 14, 2015

వాడ్రోబ్ లో ఎంత కలెక్షన్ ఉన్నప్పటికీ ఇంకా కొత్తగా ఏమోచ్చాయని వెతుక్కునే ప్రయత్నం చేసేందుకు అతివలు ఆసక్తి చూపుతారు. అంతే కాదు ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అవటంలో వారే ముందు వరుసలో ఉంటారు. అలాంటి వారి కోసం లేటెస్ట్ కలెక్షన్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

17:54 - August 14, 2015

పసితనానికి, యవ్వనానికి మధ్య దశ టీనేజ్. ఎన్నో భావోద్వేగాలు చుట్టు ముట్టే ఈ వయస్సులో ఎంతో మంది పిల్లలు హింసకు పాల్పడుతున్నారు. మరి ఈ ధోరణి ఎందుకు అలవడుతుంది? ఈ స్థితిని ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు సరియైన దిశలో మార్గదర్శకాన్నివ్వచ్చో ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...


 

17:52 - August 14, 2015

మహిళల రక్షణకు కొత్త వ్యూహం
రాష్ట్ర రాజధానిలో మహిళలపై వేధింపులను నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడిన షీ టీమ్స్ తమ పరిధిని విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ట్రైన్స్ లో కూడా మహిళల రక్షణ కోసం కొత్త వ్యూహంతో ముందుకొస్తోంది.
శ్రేయా గోషాల్ కు మరో పురస్కారం
యువ నేపథ్యగాయనిగా కొద్ది కాలంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రేయా గోషాల్ కు మరో పురస్కారాన్ని అందుకుంది. అనేక భాషలలో ప్రతిభ చాటుతున్న ఆమె కేరళ ప్రభుత్వ పురస్కారాన్ని అందుకుంది.
లైంగిక వేధింపుల నిరోధానికి కొత్త ప్రణాళిక
విశ్వవిద్యాలయాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. అన్ని విశ్వవిద్యాలయాల్లో లైంగిక వేధింపుల కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
టెస్సీ థామస్ కు గౌరవ డాక్టరేట్
మిస్సైల్ ప్రాజెక్ట్స్ కు సారథ్యం వహిస్తున్న మహిళా శాస్త్రవేత్తకు పద్మావతి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. మిస్సైల్ రంగంలో పనిచేస్తున్న అరుదైన మహిళగా టెస్సీ థామస్ ఈ ప్రత్యేకతను అందుకున్నారు.
సానియా అత్యున్నత పురస్కారం
టెన్నిస్ లో సుదీర్ఘకాలంగా విశిష్ట ప్రతిభ చాటుతున్న సానియా మీర్జా క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని సొంతం చేసుకోనున్నది. ఇటీవలి కాలంలో డబుల్స్ లో వరుస విజయాలను సొంతం చేసుకున్న సానియా ఈ పురస్కారాన్ని అందుకుని ప్రత్యేకత చాటనుంది.

 

17:41 - August 14, 2015

హైదరాబాద్: పంద్రాగష్టు నేపథ్యంలో పాతబస్తీలో అక్రమంగా నివసిస్తున్న ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ముందుగా పాతబస్తీకి చెందిన మహ్మద్ నజీర్, మసూర్ అలీ ఖాన్, సోహైల్ పర్వేజ్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించిన తర్వాత...ఫైజల్‌ మహమూద్‌, మహ్మద్ ఉస్మాన్, రియాబుల్ రెహ్మాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా నకిలీ ఆధార్‌కార్డులు, ఓటర్‌కార్డుల ఆధారంగా పాస్‌పోర్టులను పొంది గల్ఫ్ వెళ్లాలని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వీరిలో పాకిస్తాన్‌కు చెందిన మహ్మాద్ నజీర్‌కు...హుజి సంస్థ నేత జబ్బార్‌తో సంబంధాలు ఉన్నాయని ధృవీకరించారు. మహ్మాద్‌ నజీర్‌ 2010 నుంచి ఇండియాలో అక్రమంగా నివసిస్తున్నాడు. ముజఫర్‌నగర్, పానీపట్‌లో కొంత కాలం నివసించి.... ఆ తర్వాత 2015 మార్చి నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అప్పటినుంచి జల్‌పల్లిలోని ఓ యునానీ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఈ కేసులో మరో 15 మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

17:36 - August 14, 2015

హైదరాబాద్: గ్రామజ్యోతి పథకం విధివిధానాలను తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. విధివిధానాలపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 7 ప్రధాన అంశాలపై దృష్టి సారించనున్నారు. ఈ పథకం అమలులో భాగంగా ఈ ఏడు అంశాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక బృందాలు సభ్యులుగా ఉండనున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, పౌష్టికాహారం, వ్యవసాయం, మౌళిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పథకాన్ని

ప్రారంభించనున్నారు.

'గ్రామజ్యోతి' విధివిధానాలపై జీవో విడుదల...

హైదరాబాద్: గ్రామజ్యోతి పథకం విధివిధానాలను తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. విధి విధానాలపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 7 ప్రధాన అంశాలపై దృష్టి సారించనున్నారు. ఈ పథకం అమలులో భాగంగా ఈ ఏడు అంశాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. 

17:30 - August 14, 2015

హైదరాబాద్: గ్రేటర్‌లో పారిశుద్ధ్య, ఇతర కార్మికులకు... వేతనాలు పెంచుతూ టీ-సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు 12 వేల 500, శానిటరీ, ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్లకు 13 వేలు, డ్రైవర్లకు 15 వేలు జీతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన వేతనాలు జులై 15 నుంచి వర్తించనున్నాయి. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ విధానం ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపారు. 

జీహెచ్‌ఎంసీ కార్మికులకు వేతనాలు పెంపు...

హైదరాబాద్: గ్రేటర్‌లో పారిశుద్ధ్య, ఇతర కార్మికులకు... వేతనాలు పెంచుతూ టీ-సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు 12 వేల 500, శానిటరీ, ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్లకు 13 వేలు, డ్రైవర్లకు 15 వేలు జీతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 

17:23 - August 14, 2015

ఢిల్లీ: స్టాక్ మార్కెట్లో బుల్ రంకేసింది. రూపీ వాల్యూపై ఆర్బీఐ ప్రకటనతో సెంటిమెంట్ బలపడి... ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు దిగారు. దీంతో సెన్సెక్స్ 518 పాయింట్లు పెరిగి మరోసారి 28వేల మైలురాయి దాటింది. ఈసూచీ ఇవాళ 28వేల 67వద్ద ముగిసింది. నిఫ్టి 163 పాయింట్లు లాభపడి 8వేల 518 వద్ద క్లోజైంది. ఇవాళ్టి ట్రేడింగ్ లో ఆటో మోబైల్, బ్యాకింగ్, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల కౌంటర్లలో భారీగా కొనుగోళ్లు కనిపించాయి. 8.77 శాతం పెరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిఫ్టీలో టాప్ గెయినర్ గా నిలిచింది. జీ ఎంటర్ టైన్ మెంట్, యస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంకులు 4 నుంచి 5శాతం పెరిగాయి. ఇదే సూచీలో భారత్ పెట్రోలియం, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్ మాత్రమే నష్టపోయాయి.

 

17:21 - August 14, 2015

ఢిల్లీ: ఆధార్‌తో ఓటర్‌ కార్డు అనుసంధానం ప్రక్రియ నిలిపివేయబడింది. సుప్రీంకోర్టు తీర్పుతో... ఆధార్‌, ఓటరు కార్డుల అనుసంధానాన్ని నిలిపివేయాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు... ప్రక్రియ నిలిపివేయాలంటూ ఆదేశించింది.

 

16:58 - August 14, 2015

హైదరాబాద్: పాతబస్తీలో పట్టుబడ్డ ఆరుగురు వ్యక్తులకు తీవ్రవాద సంస్థ హుజీతో సంబంధమున్నట్టు పోలీసులు నిర్థారించారు. ఆరుగురిలో ఇద్దరు పాతబస్తీ వారు కాగా.. మిగతా వారు పాకిస్తాన్, బంగ్లాదేష్, మయన్మార్ దేశస్తులుగా గుర్తించారు. టాస్క్ ఫోర్స్ టీం అనుమానితులను సీసీఎస్‌ పోలీసులకు అందించించారు. సీసీఎస్ పోలీసులు వీరిని రహస్యప్రదేశంలో విచారిస్తున్నారు. హుజీ సంస్థ చీఫ్‌ అబ్దుల్ జబ్బార్‌తో నజీర్‌కు సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితులను నజీర్ దేశ సరిహద్దు ప్రాంతం నుంచి బయటికి పారిపోవడానికి నజీర్ సహకరించినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ చంచల్ గూడ ప్రాంతంలో నజీర్ మకాం వేసి ఉన్నాడు. ఈనేపథ్యంలో అతను పట్టుబడడంతో పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఇటీవలే మెమెన్ ఉరిదీసిన అనంతరం ఉగ్రవాదులు ప్రతికారం తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 వేడుకల సందర్భంగా దాడులకు పాల్పడతామని హెచ్చరికలు కూడా చేశారు. ఈనేపథ్యం ఎక్కడ ప్లాన్ చేశారు. ఏం ఏం చేయబోతున్నారు. అనే విషయాలను రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అరెస్టుల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. రేపు ఇండిపెండెండ్స్ డే నేపథ్యంలో... భద్రత కట్టుదిట్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీతో పాటు... దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని ఐబీ ఇప్పటికే హెచ్చరించింది.

 

16:39 - August 14, 2015

మెదక్‌: జిల్లాలోని సిద్ధిపేటలో ఆటోడ్రైవర్లు ఆందోళనకు దిగారు. తమపై దురుసుగా ప్రవర్తించిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద డ్రైవర్లు మానవహారం నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న తమపై.... ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి దర్భాషలాడినట్లు ఆరోపిస్తున్నారు. తమపై ఎస్‌ఐ నమోదుచేసిన అక్రమ కేసులను ఎత్తివేసి..ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆటోడ్రైవర్ల ఆందోళనకు బీజేపీ, టీడీపీ, సీఐటీయూ నేతలు మద్దతు తెలిపారు.

16:36 - August 14, 2015

అనంతపురం: హిందూపురం మున్సిపల్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ పలు అభివృద్ధికార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పలు వార్డుల్లో కోటి 20లక్షలతో సిసిరోడ్డు పనులు ప్రారంభించారు. అయితే స్థానిక సమస్యలు పరిష్కరించాలని పలువురు బాధిత మహిళలు బాలయ్యతో వాదనకు దిగారు. తమకు పింఛన్లు, రేషన్‌కార్డులు రావడం లేదని మండిపడ్డారు. దీంతో..కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న ఆయన ఈసారి వచ్చినప్పుడు రాకుంటే తనను నిలదీయాలన్నారు.

 

16:31 - August 14, 2015

నెల్లూరు: బలవంతపు భూ సేకరణను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టరేట్ దగ్గర సీపీఎం చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇళ్లస్థలాలు ఇస్తామని, ఇళ్లు కట్టిస్తామని వాగ్ధానం చేసిన బాబు.. ఇప్పటివరకు ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు. రైతుల రుణాలు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్‌కు సీపీఎం నేతలు వినతిపత్రం అందజేశారు.

15:48 - August 14, 2015

గుంటూరు: ఎపికి ప్రజా రాజధాని కావాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు డిమాండ్ చేశారు. పేద ప్రజలకు ఎర్రజెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలు చేసే పోరాటాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. విజయవాడలో జరుగుతున్న సీఆర్ డీఏ సమావేశాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా తుళ్లూరులో సీపీఎం ధర్నా నిర్వహిస్తోంది. తమకు న్యాయం చేయాలని అడుగుతున్న రైతు కూలీలపై, శ్రామికులకు అండగా నిలుస్తున్న వామపక్షాలపై ఏపీ ప్రభుత్వం నిర్ధాక్ష్యిణ్యంగా వ్యవరిస్తోందని నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ... రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం చేతకాని ప్రభుత్వం వారి భూములను ఎలా తీసుకుంటుందని మండిపడ్డారు. పేదల సమస్యలు తేల్చకపోతే... ప్రభుత్వం అక్టోబర్ 22 న తలపెట్టిన ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ, సింగపూర్ ప్రతినిధుల బృందం వస్తే.. వారిని అడ్డుకుని నిలదీస్తామని హెచ్చరించారు. రాజధాని పేరుతో పేదల పొలాలు గుంజుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. విజయవాడ సీఆర్డీఎ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యాక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

 

'గ్రామజ్యోతి' విధి విధానాలు విడుదల

హైదరాబాద్: గ్రామజ్యోతి పథకం విధి విధానాలను టీ.ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామజ్యోతి పథకం అమలుకు ఏడు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక బృందాలు, ఇతరులు సభ్యులుగా ఉంటారు. ప్రజా సమస్యలపై సమాచార సేకరణ నుంచి సమస్యల పరిష్కారం వరకూ కమిటీలదే బాధ్యత.

 

జపాలితీర్థం సమీప అడవిలో మంటలు..

తిరుమల: జపాలితీర్థం సమీపంలోని అడవిలో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. 

ఫైనల్లో సింధు ఓటమి..

హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్లో పివి.సింధూజా ఓటమి పాలయ్యారు. క్వార్టర్ ఫైనల్లో సింధు పోరాటం ముగిసింది. 17-21, 21-19, 16-21 తేడాతో కొరియా షట్లర్ సుంగ్ చేతిలో సింధు ఓడిపోయారు. 

15:15 - August 14, 2015

గుంటూరు: జిల్లాలోని తుళ్లూరులో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సీఆర్ డీఏ సమావేశానికి నిరసనగా వామపక్ష నేతలు ఆందోళన చేశారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.  

15:05 - August 14, 2015

ఢిల్లీ: మాజీ సైనికులు ఆందోళన బాటపట్టారు. వన్‌ ర్యాంక్.. వన్‌ పెన్షన్‌.. తక్షణం అమలు చేయాలని కోరుతూ... ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. ఈ డిమాండ్ కొన్నేళ్లుగా వినిపిస్తూనే వుంది. ప్రస్తుతం ఒకే హోదా కలిగిన వారికి ఒకే రకమైన పెన్షన్ అందని పరిస్థితి. ఒక్కోసారి సీనియర్ల కంటే జూనియర్లకే ఎక్కువ వస్తోంది. దేశం కోసం అహర్నిశలు కష్టపడిన సైనికుల కోసం... ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలని మాజీ సైనికాధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌... నిరసనకారులకు సంఘీభావం తెలిపారు. మొత్తానికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా... ప్రధాని నరేంద్రమోదీ... తన ప్రసంగంలో... సైనికుల కోసం వన్‌ ర్యాంక్‌... వన్‌ పెన్షన్‌... అంశంపై ప్రకటన చేసే అవకాశాలు వున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

14:58 - August 14, 2015

హైదరాబాద్: కంపెనీ పాలసీకి వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు గాను ఫేస్‌బుక్‌ యాజమాన్యం ఓ భారత సంతతి విద్యార్ధి ఇంటర్న్ షిప్‌ను రద్దు చేసింది. ఆరణ్‌ కన్నా అనే భారత సంతతికి చెందిన విద్యార్ధి హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఫేస్‌ బుక్‌ నిర్వహిస్తున్న ఓ ప్రాజెక్ట్ లో ఇంటర్న్ షిప్‌ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే మరాడర్‌ అనే యాప్‌ను రూపొందించిన ఆరణ్‌ కన్నా ముందస్తు అనుమతి తీసుకోకుండా ఫేస్‌బుక్‌ టూల్స్ లో ప్రవేశ పెట్టాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఫేస్‌బుక్‌ ఆరణ్‌ ఇంటర్న్ షిప్‌ను రద్దు చేసింది.

 

14:55 - August 14, 2015

ఝార్ఖండ్‌: జంషెడ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంషెడ్‌పూర్లో టాటా-రాంచి రహదారిపై ఓ బస్సు ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులు సివన్‌ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.

14:51 - August 14, 2015

హైదరాబాద్: స్మార్ట్ పోలీసింగ్‌ వ్యవస్థలో మరో ముందడుగు పడింది. ట్రాఫిక్‌ పోలీసులకు, స్టేషన్‌ సిబ్బందికి బాడీవోన్‌ కెమెరాను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా వంద బాడీవోన్‌ కెమెరాలను ట్రాఫిక్‌ సిబ్బందికి ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... స్మార్ట్ పోలీసింగ్‌ వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తేవడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రజలకు చేరువయ్యేందుకు.. పోలీసులు చాలా కృషిచేస్తున్నారని అన్నారు.

 

తుళ్లూరు సీఆర్ డీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

గుంటూరు: తుళ్లూరులోని సీఆర్ డీఏ కార్యాలయంలోకి వెళ్లేందుకు సీపీఎం కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

 

 

పంజాగుట్ట సెంట్రల్ మాల్ లో పోలీసులు తనిఖీలు

హైదరాబాద్: పంజాగుట్ట సెంట్రల్ మాల్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రివాల్వర్ తో లోపలికి వెళ్లినా సెక్యూరిటీ సిబ్బంది గుర్తించలేదని యాజమాన్యానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

రిషితేశ్వరి నిందితులకు రిమాండ్ పొడిగింపు...

గుంటూరు: నాగార్జున వర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు గుంటూరు స్థానిక కోర్టు రిమాండ్ పొడిగించింది. అంతకుముందు విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో ముగ్గురు నిందితులు దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ లను పోలీసులు ఈరోజు కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈనెల 28 వరకు కోర్టు వారి రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు తెలిపింది. కొన్ని రోజుల కిందట వారి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. 

పాతబస్తీ తలాబ్ కట్టలో బ్యాగ్ కలకలం...

హైదరాబాద్ : పాతబస్తీ తలాబ్‌కట్టలో బ్యాగ్ కలకలం సృష్టిస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో బ్యాగ్ ఉన్న ప్రాంతానికి పోలీసులు, డాగ్, బాంబ్ స్కాడ్ చేసుకుంది. డాగ్, బాంబ్ స్కాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. కొద్ది సేపటి క్రితమే 15 మంది ఉగ్రవాద సానుభూతిపరులను పాతబస్తీ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే.

తెలంగాణ వర్శిటీలో 24 గంటలూ వైఫై సేవలు..

నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ, వైఫై సేవలను టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. యూనివర్సిటీ విద్యార్థులు 24 గంటలు వైఫై సేవలు వినియోగించుకోవాలని సూచించారు. యూనివర్సిటీలకు 24 గంటలు త్రాగునీరు, కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీలో డిజిటల్ లైబ్రరీ బాధ్యత తనది అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి జీఆర్‌ఈ, టోఫెల్ లేకుండా 75 మంది విద్యార్థులు యూఎస్ వెళ్లొచ్చు అని చెప్పారు. ఇందుకు చికాగో యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు.

ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చొద్దు: గుండా మల్లేష్

హైదరాబాద్ : ప్రాణహిత-చేవెళ్ల విషయంలో సీఎం కేసీఆర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని గుండా మల్లేశ్‌ అన్నారు. డిజైన్‌ మార్చొద్దంటూ అఖిలపక్ష నేతలు కేసీఆర్‌ను కలవాలని ఆయన సూచించారు. డిజైన్‌ మార్చడం వల్ల రంగారెడ్డి, హైదరాబాద్‌కే కాదు ఆదిలాబాద్‌ జిల్లాకూ అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ వినకపోతే కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తామని గుండా మల్లేశ్‌ ప్రకటించారు.

గంజాయి కేసులో పట్టుబడ్డ పారిపోయిన నిందితులు

నెల్లూరు : దొరవారిసత్రంలో గత నెల 7వ తేదిన గంజాయి కేసులో పట్టుబడి తప్పించుకున్న ఇద్దరు నైజీరియన్లు, మరో స్మగ్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వీరిని సాహసోపేతంగా తమిళనాడులో అరెస్ట్ చేశారు.‌ వీరు నకిలీ వీసాలతో భారత్ లో ఉంటున్నట్లు తేల్చారు. గత రెండు సంవత్సరాలుగా వీరు ఈ వృత్తి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బృందాన్ని పట్టుకున్న పోలీసులను గూడూరు డీఎస్పీ అభినందించారు.

13:29 - August 14, 2015

విశాఖ : మువ్వన్నెల జెండా ఆవిష్కరించేందుకు విశాఖ నగరం ఉవ్విళూరుతోంది. ప్రభుత్వం అధికారికంగా సాగరతీరాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండటంతో నగరం కొత్త కళ సంతరించుకుంది. వేడుకల ఆరాంభానికి సూచికగా విద్యార్థులు 2500 మీటర్ల భారీ జాతీయ జెండాను నగరవీధుల్లో ప్రదర్శించి దేశభక్తి చాటారు. 

13:27 - August 14, 2015

గుంటూరు:తూళ్లూరు లోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట సీపీఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి సీపీఎం నేత బాబు రావు పాల్గొన్నారు. ఏపీ రాజధాని పేదల రాజధాని కాదని మండి పడ్డారు.

13:24 - August 14, 2015

ఢిల్లీ : ఇంగ్లీష్ తెలుసు, హిందీ తెలుసు. మరి హింద్లీష్ ఏమిటనేగా మీ డౌటు? కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ కొత్త భాషను కనిపెట్టారని ప్రస్తుతం ట్విట్టర్ లో ఓ పోస్ట్ హల్ చల్ చేస్తోంది. అసలు హింద్లీష్ అంటే ఏమిటంటే... హిందీలో మాట్లాడాలనుకున్న పదాలను ఇంగ్లీష్ లో పేపర్ పై రాసుకోవడమేనట! అయితే ఇదంతా హింద్లీష్ ప్రభావమేనని ఓ ట్విట్టర్ పోస్ట్ చెబుతోంది. తాను పార్ల మెంట్లో ప్రసంగించాల్సిన అంశాలకు సంబంధించిన హిందీ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఓ పేపర్ పై ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో రాసుకొచ్చారు. సదరు పేపర్లు కెమెరా కంటికి చిక్కాయి. ఈ చిత్రాలు ట్విట్టర్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. ‘‘లోగ్ పీఎం మోదీకో సున్నా చాహ్ తాహై, వో ఉస్ కీరాయ్ జాన్ నా చాహ్ తే హై’’ వంటి హిందీ వాక్యాలతో పాటు దాదాపుగా అన్ని వ్యాఖ్యలను కూడా ఆయన ఇంగ్లీష్ స్పెల్లింగ్ లోనే రాసుకొని తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ లో ఈ పోస్ట్ పై కొందరు చీటింగ్ అని ఆరోపిస్తున్నారు. మరికొందరు ఇందులో తప్పేముందని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా రాహుల్ గాంధీ ఇంద్లీష్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది.

13:24 - August 14, 2015

విజయవాడ: గుంటూరులోని ప్రభుత్వ అతిధి గృహాలను మంత్రుల తాత్కాలిక నివాసాలుగా మారుస్తామని ఏపి ఆర్ధిక మంత్రి యనమల తెలిపారు. ఇకపై స్టార్‌ హోటళ్లల్లో ఎవరూ ఉండాల్సిన అవసరం లేదన్న ఆయన గెస్ట్ హౌజ్‌లకు మరమ్మత్తులు చేయాలని ఆర్ అండ్‌ బీ శాఖను ఆదేశించారు. ఇక విజయవాడ నుంచి సీఎం,మంత్రులు పరిపాలన సాగిస్తారని యనమల చెప్పుకొచ్చారు.

సీఆర్డీఏ కార్యాలయం ఎదుట సీపీఎం ఆందోళన

గుంటూరు తూళ్లూరు లోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట సీపీఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

మంత్రుల నివాసాలుగా ప్రభుత్వ అతిథి గృహాలు : యనమల

విజయవాడ : గుంటూరు - విజయవాడ లోని ప్రభుత్వ అతిథిగృహాలను మంత్రులకు తాత్కాలిక నివాస కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని ఏపీ ఆర్థిక యనమ రామకృష్ణుడు తెలిపారు. గెస్ట్ హౌస్ లకు మరమ్మతులు చేయాలని ఆర్ అండ్ బీకి ఆదేశించామని స్పష్టం చేశారు. ఇక పై విజయవాడ నుంచే సీఎం, మంత్రులు పాలన కొనసాగిస్తారని తెలిపారు. ప్రభుత్వ అధికారులకు అద్దె భవనాలను చూస్తున్నామని పేర్కొన్నారు.

స్వేచ్ఛగోరా ఐ బ్యాంక్ కు లవణం నేత్రాలు..

విజయవాడ : ప్రముఖ నాస్తికవాది లవణం (85) కళ్లను స్వేచ్ఛగోరా ఐ బ్యాంక్ కు కుటుంబ సభ్యులు దానం చేస్తున్నారు. లవణం భౌతికకాయాన్ని చెన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి తరలించారు. రేపు సాయంత్రం 4 గంటలకు కుటంబ సభ్యులకు లవణం మృతదేహాన్ని అప్పగించనున్నారు.

12:51 - August 14, 2015

యంత్రుడు చంపేస్తున్నాడు. మర మనిషి మనుషుల ప్రాణం తీస్తున్నాడు. సాయానికొస్తుందిలే అనుకున్న రోబో సమాధి చేసేస్తోంది. అవును. బుద్దిజీవి ఆలోచనలోంచి రూపుదిద్దుకున్న రోబోల చేతుల్లో మనిషి బలవుతున్నాడు. హత్య అనాలో, ప్రమాదనాలో కానీ...మొత్తానికి రోబోకు మరో కార్మికుడు బలయ్యాడు.
ఏపనైనా ఇట్లే...
రోబోలు శరవేగంగా పని చేస్తాయి....బరువైన పనులైనా చకచకా చేసేస్తాయి..యుద్దరంగంలో బాంబులేస్తాయి...డ్యాన్స్ చేస్తాయి.. హెల్ప్ చేస్తాయి.. మనిషితో మమేకమవుతాయి.. అంతేకాదు రోబోలు చంపేస్తాయి.. తనను తయారు చేసిన మనిషి ప్రాణాలనే తీస్తాయి...
హాలీవుడ్ లో ఐ రోబోట్‌ మూవీతో...
కొన్ని సంత్సవరాల కిందట ఐ రోబోట్‌ మూవీ హాలీవుడ్‌ లో సంచలనం. రోబోలపై ప్రపంచానికి క్రేజ్ కలిగించిన చిత్రమది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోబోలు రూపొందిస్తారు ఆ సినిమాలో. అన్ని పనుల్లోనూ అది సాయపడుతుంది. కానీ చివరికి తనను క్రియేట్ చేసిన క్రియేటర్‌ నే చంపాలనుకుంటుంది. తనలాంటి ఎన్నో రోబోలను తయారు చేసి విధ్వంసానికి కాలుదువ్వతుంది. డైరెక్టర్ శంకర్ తీసిన రోబో మూవీ కూడా మనదేశంలో ఒక సెన్సేషన్. దేశ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని తయారు చేసిన ఆ రోబో...చిప్ మార్చడంతో భయానకంగా విరుచుకుపడుతుంది.
కేవలం సినిమాల్లోనే కాదు.. 
రోబో వినాశకారిగా మారడం మనం కేవలం సినిమాల్లోనే చూశాం. కానీ ఇప్పుడది నిజంగా అనుభవంలోకి వస్తోంది. పెద్దపెద్ద ఫ్యాక్టరీలలో పని చేయడానికి రూపొందించిన రోబోలు కార్మికులను చంపేస్తున్నాయి. ఎందుకిలా జరుగుతోంది.. మరమనిసి మనిషి ప్రాణాలు ఎందుకు తీస్తోంది.. సహాయకారిగా ఉండాల్సింది ఎందుకు చంపేస్తోంది..ఓ సినిమాలో చెప్పినట్టు ప్రపంచానికి ఈ రోబోలు వినాశకారిగా మారితే పరిస్థితేంటి..?
మొదటి ఘటన..
రోబో చేతిలో మనిషి ప్రాణాలు కోల్పోవడం మనదేశంలో ఇదే మొదటి ఘటన. అసలు ఈ ఘటన ఎలా జరిగిందన్నదానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. గుర్గావ్ మానేసర్ ఎస్ కె హెచ్ మెటల్స్ లో కొంతకాలంగా పని చేస్తున్నాడు 24 ఏళ్ల రామ్ జీ లాల్. ఈ ఫ్యాక్టరీలో 63 మంది కార్మికులు, 34 రోబోలు వర్క్ చేస్తున్నాయి. అయితే వీటిలో ఓ రోబో చేతిలో నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు రామ్ లాల్.
స్పాట్‌ లోనే..
ఫ్యాక్టరీలో అనేక రకాల పనులు చేసేందుకు ముందే ప్రోగామ్ చేసిన రోబో అది. బరువైన మెటల్‌ షీట్లను లిఫ్ట్ చేస్తుంది. రోబో ఎత్తిన షీట్ ఒకవైపు ఒరిగిపోయి ఉండటాన్ని గమనించాడు రామ్ జీ లాల్. అది కిందపడితే డ్యామేజీ జరుగుతుందని భావించి దాన్ని అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే క్షణంలోనే రోబో చేతిలోని మెటల్‌ షీట్లు రామ్‌ కడుపులోకి దిగబడ్డాయి. ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండాపోయింది. స్పాట్‌ లోనే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.
రోబోలకు అతి దగ్గరగా..
పోలీసుల ప్రాథమిక విచారణ వివరాలు మరోలా ఉన్నాయి. రామ్ జీ లాల్ రోబోలకు అతి దగ్గరగా వెళ్లాడట. పక్కకు జరగడానిక్కూడా వీల్లేకుండా రోబోల మధ్య ఇరుక్కుపోయాడట. దీంతో ఓ రోబో చేతిలోని మెటల్ షీట్ రామ్ కడుపులోకి దూసుకుపోయాయని పోలీసులు అంచనాకొచ్చారు. దీంతో అక్కడికక్కడే కార్మికుడు చనిపోయాడని అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ చూసిన తర్వాత అసలు విషయాలు తెలుస్తాయంటున్నారు. ఇదే ఏడాది జూన్ 29న జర్మనీలోని వోక్స్ ఫ్యాక్టరీలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కార్మికుడిని రోబో ఓ లోహపు ప్లేట్‌కు అదిమిపట్టి, గుండెలపై గట్టిగా నొక్కి చంపింది.
ప్రమాదమనాలా.? హత్యగా భావించాలా.?
గతంలోనూ రోబోలు మనుషుల ప్రాణాలు తీసిన ఘటనలున్నాయి. 1979లో మిచిగాన్ ఫోర్ట్‌ కర్మాగారంలో లైన్‌ వర్కర్‌ను పొట్టనపెట్టుకుంది రోబో. ఇదే తొలి ఘటనగా నిపుణులు చెబుతున్నారు. తర్వాత 1984లో జపనీస్ ఇంజనీర్ కెంజి ఉరాడాను మరో రోబో యంత్రం చంపేసింది. దీన్ని ప్రమాదమనాలా.? హత్యగా భావించాలా.? రోబోపై కేసు పెట్టాలా.? యాజమాన్యంపై కేసు ఫైల్ చేయాలా.? ఈ ప్రశ్నలకు సమాధానం శంకర్ తీసిన రోబోలో ఉంది.
చట్టం ప్రకారం ప్రమాద ఘటన...
హింసకు పాల్పడేలా వీటికేమైనా ప్రోగ్రామింగ్‌ ఇన్ స్టాల్ చేశారా.? అలాంటి సాఫ్ట్‌వేర్ నిజంగానే ఉందా.? ప్రమాదవశాత్తు ఇలా జరిగిందని సరిపెట్టుకోవాలా.? ఇలాంటి ఘటనలు పెరుగుతూపోతే పరిస్థితి ఏంటి.? ఇలాంటి ఘటనల్లో ఎవరిపై కేసు నమోదు చేయాలో అంతుచిక్కడం లేదు. రోబోలు యంత్రాలు కాబట్టి చట్టం ప్రకారం ప్రమాదం కిందకు వస్తాయి. అయితే హింసకు పాల్పడేలా వీటికేమైనా ప్రోగ్రామింగ్‌ ఇన్ స్టాల్ చేశారా..అలాంటి సాఫ్ట్‌వేర్ నిజంగానే ఉందా.? లేదంటే ప్రమాదవశాత్తు ఇలా జరిగిందని సరిపెట్టుకోవాలా..? ఇలాంటి ఘటనలు పెరుగుతూపోతే పరిస్థితి ఏంటి.?
రోబోలపై ఆందోళన.....
ఫ్యాక్టరీల్లో రోబోలుండటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంటి పని నుంచి యుద్ధాల వరకు రోబోలు చేయని పని లేదు. భవిష్యత్తు మొత్తం మర మనుషులదే. కానీ మనిషి తనకు సాయపడుతుందని తయారుచేసుకున్న రోబోలు చివరికి మనిషికే ప్రాణసంకటమవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోబోలను ప్రమాదరహితంగా ఎలా రూపొందాలన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించాలి. ముఖ్యంగా పరిశ్రమలు, హోటల్స్ తో పాటు జనం మధ్యలో ఉండే యంత్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కంపెనీల్లో రోబోల సర్క్యూట్‌ ప్రత్యేకంగా ఉంచాలి. అక్కడికి నరమాత్రులు ఎవరూ వెళ్లకుండా బయటి నుంచే మానిటరింగ్ చేయాలి. లేదంటే మరమనిషికి మనిషి ప్రాణాలు బలైపోతూనే ఉంటాయి. 

12:39 - August 14, 2015

విజయవాడ : పవన్‌కళ్యాణ్‌ రైతులను ఇబ్బంది పెట్టొద్దంటున్నారని.. తాము కూడా అందుకే ఇన్ని నెలలపాటు భూసమీకరణకు సమయమిచ్చామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి భూసేకరణకు వెళ్లాలని నిర్ణయించామని అయితే వీలయినంతవరకు రైతులను ఒప్పించాలనే చూస్తున్నామని ఆయన చెప్పారు. 2019 కల్లా ఎలాంటి నిర్మాణాలు రాజధానిలో పూర్తి చేయాలనే దానిపై కేపిటల్‌ అడ్వయిజరీ కమిటీ నేడు భేటీ అవుతుందని మంత్రి వివరించారు.

విజయవాడ కోర్టుకు కాల్ డేటా సమర్పించిన డొకొమో, వొఢాఫోన్

విజయవాడ : ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కు టాటా డొకొమో, వొడాఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డేటాను సీల్డ్ కవర్ లో అందజేశారు. ఈ కేసు హైకోర్టులో ఉన్నందున విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. అయితే హైకోర్టు రిజిస్ట్రార్ కు కూడా ప్రొవైడర్లు డేటా మెసేజ్ ను పెట్టాల్సి ఉంది. ఇప్పటికే ఐడియా, ఎయిర్ టెల్ సర్వీస్ ప్రొవైడర్లు 29 నెంబర్ల కాల్ డేటాను కోర్టుకు ఇచ్చారు. 

12:31 - August 14, 2015

హైదరాబాద్ :పాతబస్తీలో ఉగ్రవాద సంస్థ హుజితో సంబంధం వున్న ఆరుగుర్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరుగుర్ని సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. అనుమానితుల్లో ఇద్దరు పాతబస్తీకి చెందిన వారు కాగా నలుగురిలో ఇద్దరు పాకిస్తానీలు, బంగ్లాదేశ్, మయన్మార్ లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

సీఎం చంద్రబాబుతో మైక్రోసాఫ్ట్ ఎండీ భేటీ

హైదరాబాద్ : విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ ఎండీ అనిల్ బన్సారీ మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ఏపీలో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాల విస్తరణ, తదితర అంశాలపై ఆయన సీఎంతో చర్చించినట్లు సమాచారం.

టాస్క ఫోర్స్ అదుపులో నలుగురు అనుమానితులు..

హైదరాబాద్ : పాతబస్తీలో నలుగురు అనుమానితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద సంస్థ హుజితో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్నవారిని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

ముంబై పోలీస్ స్టేషన్ లో రాధేమా..

హైదరాబాద్ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఆధ్యాత్మికత ముసుగులో రాధేమా అశ్లీలానికి తెర లేపారని పలువురు భక్తులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్న వేధింపులపైనా ఆమెపై నమోదైన కేసు నేపథ్యంలో విచారణకు హాజరుకావాలంటూ రాధేమాకు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాధేమా కొద్దిసేపటి క్రితం ముంబైలోని ఖండేవాలి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా రాధే మాపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

లవణం మృతి రాష్ట్రానికి తీరని లోటు : చంద్రబాబు

విజయవాడ : లవణం మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడిన వ్యక్తి, ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటన సీఎం తన సంతాప సందేశంలో తెలిపారు.

పంచాయతీరాజ్ డీఈఈ ఇళ్లపై ఏసీబీ దాడులు..

విజయనగరం : పంచాయతీరాజ్ డీఈఈ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విజయనగరం డీఈఈ వెంకటరావు, శ్రీకాకుళం డీఈఈ ఎంవీ కృష్ణాజీ ఇళ్లలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు.

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ 24కు వాయిదా

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది. నాంపల్లి కోర్టులో విచారణఖు జగన్, విజయసాయిరెడ్డి హాజరయ్యారు.

ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఉదయ్‌సింహ, సెబాస్టియన్ కూడా హాజరయ్యారు. ఏసీబీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సమన్లు జారీ చేస్తామని కోర్టు తెలిపింది. సమన్లు అందుకున్న తర్వాత కోర్టుకు రావాలని ఆదేశించింది. అంతకుముందు కోర్టు బయట టీడీపీ నేతలు, కార్యకర్తలు రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు. 

11:48 - August 14, 2015

విజయవాడ : ఏపీ రాజధాని గ్రామాల్లో ఎక్కడ చూసినా పెద్దసంఖ్యలో గొర్రెలు దర్శనమిస్తున్నాయి... ... కొంచెం ఇష్టం..చాలా కష్టం.. ఎపీ రాజధాని ప్రాంత రైతుల పరిస్థితి ఇలాగేఉంది.... రాజధాని కోసం 29 గ్రామాల్లో దాదాపు 33 వేల ఎకరాలను అధికారులు సేకరించారు. ఈ గ్రామాల్లో పంటలు వేయొద్దని నాలుగు నెలల క్రితమే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.. దీంతో ఎప్పుడూ పంటలతో కళకళలాడే ఈ ప్రాంతాలు ఇప్పుడు ఖాళీగా మారిపోయాయి...
భారీవర్షాలతో ఈ భూముల్లో పాత పంటల తాలూకు మొక్కలొస్తున్నాయి.. మరికొన్ని పొలాల్లో పచ్చగడ్డి విస్తారంగా ప..

మూగజీవులకు ఆహారాన్నిస్తున్నాయి...

ఎవరికీ ఉపయోగపడకుండా ఉండిపోయిన ఈ భూములు ఇప్పుడు మూగజీవులకు ఆహారాన్నిస్తున్నాయి... ఈ పొలాల్లో ఎప్పుడు చూసినా గొర్రెలు దర్శనమిస్తున్నాయి.. ఎప్పుడూ లేని విధంగా వేలసంఖ్యలో మేత మేస్తున్నాయి.. సాధారణంగా ఎక్కడ గడ్డి ఉంటే అక్కడికి గొర్రెల కాపరులు ఈ మూగ జీవులను తీసుకువెళుతుంటారు.. అక్కడ మొక్కలు అయిపోయాక వేరే ప్రాంతానికి వెళ్లిపోతారు.. రాజధాని గ్రామాల్లో పుష్కలంగా గడ్డి ఉందన్న వార్తలతో అందరూ ఇక్కడికి క్యూ కట్టారు.. రైతుల అనుమతితో తమ గొర్రెలను మేపుకుంటున్నారు.. ఇప్పటికే దాదాపు 50 వేలకు పైగా గొర్రెలు ఈ ప్రాంతంలోకి వచ్చాయి.. కృష్ణా జిల్లా ఘంటశాల, నూజివీడు, రాజమండ్రి, పల్నాడు, ఒంగోలు నుంచి ఎక్కువ జీవాలు ఇక్కడికి వస్తున్నాయి.. లారీల్లో వీటిని ఈ గ్రామాలకు తరలిస్తున్నారు గొర్రెల కాపరులు...
ఈ గ్రామాలకు రావాలంటే భయపడిపోయేవాళ్లం....

గతంలో ఈ గ్రామాలకు రావాలంటే భయపడిపోయేవాళ్లమని కొందరు గొర్రెల కాపరులు చెబుతున్నారు.. ఎన్నో ప్రాంతాలు తిరిగామని ఈ స్థాయిలో గొర్రెలకు ఆహారం ఎక్కడా కనిపించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. మొన్నటి దాకా రైతుల కడుపునింపిన ఈ భూములు ఇప్పుడు మూగజీవాల ఆకలి తీరుస్తున్నాయి.. 

11:43 - August 14, 2015

విజయవాడ : ప్రముఖ నాస్తిక వాది డాక్టర్‌ గోపరాజు లవణం కన్నుమూశారు. తీవ్రస్ధాయిలో గుండెపోటు రావటంతో విజయవాడలో లవణం మృతి చెందారు. గోపరాజు లవణం నాస్తికవాదే కాదు గొప్ప సంఘ సంస్కర్త కూడా. సంస్కార్‌ అనే స్వచ్చంధ సంస్ధను స్ధాపించిన లవణం జోగిని వ్యవస్ధపై అలుపెరగని పోరు చేశారు. ఇటు స్టూవర్ట్ పురం దొంగల మనసు మార్చేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఉప్పుసత్యాగ్రహం చేస్తున్న సమయంలో పుట్టినందుకు గాను తల్లితండ్రులు ఆయనకు లవణం అనే పేరు పెట్టారు. విశ్వనరుడు గుర్రం జాషువా కుమార్తె హేమలతను వివాహం చేసుకున్నారు.

11:42 - August 14, 2015

హైదరాబాద్ : స్వాతంత్ర్య వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది... అంగరంగవైభవంగా ఉత్సవాలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. కోటను అందంగా అలంకరించారు.. అలాగే భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టారు.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా పటిష్ట భద్రతకు ప్లాన్ చేస్తున్నారు.. కోట చుట్టూ 144 సెక్షన్ విధించారు.. ఇప్పటికే ఈ ప్రాంతంలో గ్రేహౌండ్స్ దళాలు తనిఖీలు చేశాయి.. గత ఏడాది పొరపాట్లు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టారు.. ఈ ఏర్పాట్లను తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్వయంగా పరిశీలిస్తున్నారు..

సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్శణగా .....

తెలంగాణలో రెండోసారి నిర్వహించబోతున్న ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్శణగా నిలవబోతున్నాయి... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే కార్యక్రమాలను కళాకారులు ప్రదర్శించబోతున్నారు.. గిరిజన సంప్రదాయ నృత్యాలతో అందరినీ అలరించేందుకు కళాకారులు సిద్ధమయ్యారు.. గోల్కొండలో రిహార్సల్స్ కూడా చేస్తున్నారు..

జెండావందనం ప్రారంభానికిముందే.....

జెండావందనం ప్రారంభానికిముందే అందరూ కోటలోపలికి చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.. అలాగే కార్యక్రమం పూర్తయ్యాక ఒక్కో సెక్టార్‌నుంచి అతిధులు బయటకుపంపుతామని చెబుతున్నారు.. గతఏడాదికంటే ఈసారి మరింత ఘనంగా ఉత్సవాల నిర్వహణకు అంతా సిద్ధం చేశామంటున్నారు.. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు పోలీసులు.

11:39 - August 14, 2015

విశాఖ : ఆగష్టు 15వ తేదిన జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి విశాఖలో నిర్వహించనుంది. దీంతో పంద్రాగష్టు వేడుకలకు సాగర తీరం అత్యంత ఆకట్టుకునేలా ముస్తాబు చేస్తున్నారు.
జెండా పండుగ తొలిసారి జరగనుండటంతో..
సాగర తీరం చేరువన జెండా పండుగ తొలిసారి జరగనుండటంతో.. ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వేడుకల ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు.. ముందుగానే భద్రతా చర్యలు చేపట్టారు. విశాఖ బీచ్‌లో వేడుకల సందర్భంగా నిర్వహించే ప్రదర్సనకు ముందు ఫైనల్ రిహార్సల్స్ నిర్వహించారు. పోలీసు కవాతు, గౌరవవందనం, విద్యార్ధుల విన్యాసాలు, శకటాల ప్రదర్సనను నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన డీజీపీ రాముడు.. తీరం నుంచి ఎలాంటి దాడులు జరగకుండా మెరైన్, కోస్ట్ గార్డ్ పోలీసులను అప్రమత్తం చేసారు.
చారిత్రక గొప్పతనమని మంత్రి గంటా.....
విశాఖలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం చారిత్రక గొప్పతనమని మంత్రి గంటా శ్రీనివాస్‌రావు అన్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు తరలివచ్చే ప్రజలు ఉదయం 8 గంటలకే బీచ్‌కు చేరుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు....
మరోవైపు.. పంద్రాగస్టు వేడుకలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిరిపురం, బీచ్ రోడ్‌కు వెళ్ళే వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇదేవిధంగా ఆంధ్రా యూనివర్శిటీ, పాండురంగపురం రహదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తానికి పంద్రాగష్టు వేడుకలతో విశాఖ నగరం దాదాపు సగభాగం పోలీసుల ఆధీనంలోకి వెళ్ళింది. ప్రతిచోట పోలీసులు డేగ కన్నేసి ఉంచారు.

ఇల్లందులో పురాతన భవనం కూల్చివేత -ఉద్రిక్తత

ఖమ్మం: జిల్లాలోని ఇల్లందు చేపల మార్కెట్లోని పురాతనభవనం కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. భవనంలో వ్యాపారం చేస్తున్న వ్యాపారులు భవనం కూల్చివేతను అడ్డుకున్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా కూల్చివేత మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా కొందరు వ్యాపారులు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఏపీ రాజధాని సలహా మండలి భేటీ

విజయవాడ : నగరంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాజధాని సలహా మండలి భేటీ అయ్యింది. ఈ భేటీలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, అధికారులు హాజరయ్యారు. సమీకరణలో భూములివ్వని రైతుల నుంచి ఈనెల 20 తర్వాత భూ సేకరణ చేపడతామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కోసం మరో 2 వేల ఎకరాల భూమి తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు.

మహిళల డబుల్స్ లో గుత్తాజ్వాల జోడి ఓటమి

హైదరాబాద్ : జకార్తాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ నుంచి గుత్తాజ్వాల జోడి నిష్ర్కమించింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్ లో అన్సీడెడ్ జపనీస్ జోడీ చేతిలో 23-25,14-21 తేడాతో గుత్వాజ్వాలా, అశ్విని జోడి ఓటమిపాలైంది.

10:44 - August 14, 2015

హైదరాబాద్ : రాధేమా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ముంబై కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. మరో వైపు రాధేమాపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆమె అరెస్టుకు రంగం సిద్ధమౌతోంది. ఇప్పటి వరకు కేసుల మీద కేసుల నమోదైనా సరైన ఆధారాలు లేవంటూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోలేదు. మరో వైపు తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని రాధేమా కొట్టిపారేస్తున్నారు.

10:43 - August 14, 2015

మహబూబ్‌ నగర్‌ : జిల్లా పాతపల్లిలో దళితులపై జరుగుతున్న దాడులు అమానవీయమని, ఆరు దశాబ్దాల స్వంతంత్ర భారతంలో ఇలాంటి ఘటనలు ఇంకా చోటు చేసుకోవడం హేయమని ఆఫీసర్స్‌ ఫోరం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతపల్లి గ్రామాన్ని సందర్శించిన ఫోరం ప్రతినిధులు.. దీనివెనకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు...
రాజ్యమేలుతున్న కుల రక్కసి.....
మహబూబ్‌ నగర్‌ జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో రెండు కులాల మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. సుమారు వంద మంది ఆఫీసర్స్‌ ఫోరం ప్రతినిధులు పాతపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ వివాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న ప్రతినిధులు.. ఇప్పటికీ ఈ గ్రామంలో కుల వివక్ష రాజ్యమేలుతోందని అన్నారు.
ఓట్ల కోసం వెంపర్లాడుతున్న రాజకీయ పార్టీలు..
పాతపల్లిలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా ఓట్ల కోసం వెంపర్లాడుతున్న రాజకీయ పార్టీలు.. కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో కుల వివక్ష ఈ స్థాయిలో పెరిగిపోవడానికి ఇక్కడి పోలీసు, రెవెన్యూ సిబ్బందే కారణమని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫోరం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.
స్థానిక పూజారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి...
అదేవిధంగా దళితులను ఆలయంలోకి రానివ్వకుండా.. కుల వివక్షకు పాల్పడుతున్న స్థానిక పూజారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దళితుల నుంచి లాక్కోవాలని చూస్తున్న అసైన్డ్‌ భూములను తిరిగి వారికి ఇవ్వాలని.. వారిపై దాడిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి దళితులకు న్యాయం చేయాలని, లేకపోతే.. పరిస్థితి మరింత విషమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

10:40 - August 14, 2015

హైదరాబాద్ : గ్రామజ్యోతిని జయప్రదం చేయాలని సీఎం కేసీఆర్‌ పట్టుదల మీదుంటే.. అమాత్యులు మాత్రం అవగాహన రాహిత్యంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో తెలియక సతమతమవుతున్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిచేందుకు కూడా ముందుకు కదలడం లేదు మంత్రులు. దీంతో గ్రామజ్యోతి ఎలా వెలుగుతుందో అనే సందేహం అప్పుడే ప్రజల్లో కలుగుతోంది.
ఆగష్టు 15న గ్రామజ్యోతి పథకం ప్రారంభం.....
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న సరికొత్త పథకం గ్రామజ్యోతి. గ్రామాలను అభివృద్ధి బాట పట్టించేందుకు సీఎం కేసీఆర్ గోల్కొండ వేదికగా.. ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రకటించనున్నారు. వచ్చే నాలుగేళ్లలో గ్రామాల స్వరూపాన్ని మార్చేందుకు కనీసం 25 వేల కోట్ల నిధులు ఖర్చు చేయాలన్న లక్షాన్ని పెట్టుకున్న ప్రభుత్వం.. ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. దీనిలో భాగంగా ఈనెల 17 నుంచి 24 వరకు అన్ని గ్రామాల్లో గ్రామజ్యోతి వారోత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే గ్రామజ్యోతి కార్యక్రమానికి సమయం దగ్గర పడుతుండటంతో అమాత్యులకు టెన్షన్ పట్టుకుంది. అసలు గ్రామజ్యోతిలో భాగంగా ఏం చేయాలన్న దానిపై క్లారిటీ లేక మంత్రులు, ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు.
అందని ప్రభుత్వ మార్గదర్శకాలు...
గ్రామాల్లో సమస్యలు పేరుకపోయిన తరుణంలో ప్రాధాన్యత పరంగా వేటితో మొదలు పెట్టాలన్న దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలు అందించలేదు. పచ్చదనం, పరిశుభ్రత, తాగునీరు, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, టాయిలెట్ల నిర్మాణం వంటి తదితర కార్యక్రమాలను గ్రామజ్యోతిలో చేపట్టాలని సీఎం సూచించారు. వీటితో పాటు స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారించాలని వివరించారు. అయితే ఇన్ని సమస్యల వలయంలో అసలు దేనిపై దృష్టి కేంద్రీకరించాలి.. గ్రామజ్యోతిలో ప్రజలను ఎలా భాగస్వామ్యం చేయాలో తెలియటం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
మొక్కుబడిగా సమావేశాలు...
గ్రామజ్యోతి నిర్వహణ సరిగా లేకపోతే సీఎంతో ఎక్కడ చివాట్లు తప్పవన్న భావనతో మంత్రులు, ఎమ్మెల్యేలు.. మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రి ఈటెల కరీంనగర్ జిల్లాలో సమీక్ష నిర్వహించగా.. డివిజన్ల వారిగా ఎమ్మెల్యేలు శని, ఆదివారాల్లో సన్నాహాక సమావేశాలు ఏర్పాట్లు చేసారు. అయితే ఇంత హడావుడి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తే.. మొదటి విడత గ్రామజ్యోతి లక్ష్యాలు నేరవేరుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

10:36 - August 14, 2015

కృష్ణా : జిల్లా నందిగామ మండలం తోటచర్లలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ భర్త తన భార్య గొంతుకోశాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తీవ్రగాయాలపాలైన అతనిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ర్యాగింగ్ అరికట్టడానికి కఠిన చర్యలు : చినరాజప్ప

గుంటూరు : రాష్ట్రంలో ర్యాగింగ్‌ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప వె ల్లడించారు. హోంశాఖ, డీజీపీ కార్యాలయాలను విజయవాడకు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు. అమరావతి పోలీసు కమిషనరేట్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. 

ప్రముఖ నాస్తికవాది లవణం మృతి

విజయవాడ : ప్రముఖ నాస్తికవాది లవణం(86) మృతి చెకందారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న లవణం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

పాకిస్థాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

హైదరాబాద్ : నేడు పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 

అసోంలో ఉగ్రవాదుల కుట్రను భగ్నం

హైదరాబాద్ : అసోంలో ఉగ్రవాదుల కుట్రను సైనికాధికారులు భగ్నం చేశారు. కొక్రఝుర్ - గౌహతి మధ్య రైల్వే ట్రాక్ పేల్చివేసేందుకు కుట్ర పన్నారు. సైనికాధికారుల తనిఖీల్లో రైల్వేట్రాక్ వద్ద ఏడు కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

'హింద్లీష్ ' అంటే ఏంటో తెలుసా... అయితే రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్లాల్సిందే...

ఢిల్లీ : ఇంగ్లీష్ తెలుసు, హిందీ తెలుసు. మరి హింద్లీష్ ఏమిటనేగా మీ డౌటు? కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ కొత్త భాషను కనిపెట్టారని ప్రస్తుతం ట్విట్టర్ లో ఓ పోస్ట్ హల్ చల్ చేస్తోంది. అసలు హింద్లీష్ అంటే ఏమిటంటే... హిందీలో మాట్లాడాలనుకున్న పదాలను ఇంగ్లీష్ లో పేపర్ పై రాసుకోవడమేనట! అయితే ఇదంతా హింద్లీష్ ప్రభావమేనని ఓ ట్విట్టర్ పోస్ట్ చెబుతోంది. తాను పార్ల మెంట్లో ప్రసంగించాల్సిన అంశాలకు సంబంధించిన హిందీ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఓ పేపర్ పై ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో రాసుకొచ్చారు. సదరు పేపర్లు కెమెరా కంటికి చిక్కాయి. ఈ చిత్రాలు ట్విట్టర్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి.

జంషెడ్ పూర్ లో ట్రక్కు ఢీకొన్ని బస్సు : 13 మంది మృతి

హైదరాబాద్ : జంషెడ్ పూర్ లో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జంషెడ్ పూర్ లోని టాటా -రాంచి రహదారిపై ఓ బస్సు ట్రక్కుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రికలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురి పరస్థితి విషయంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు....

ఆదిలాబాద్‌: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. బెజ్జూరు మండలంలోని కుష్ణుపల్లి, కుక్కుడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, కడెం ప్రాజెక్టుల్లోకి వరదనీరు చేరింది. కడెం ప్రాజెక్టు నీటిమట్టం 693 అడుగులకు చేరింది.

భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం...

కృష్ణా :చందర్లపాడు మండలం మునగాలపల్లిలో భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. 

09:35 - August 14, 2015

హైదరాబాద్ : తన కామెంట్లతో తెలుగు సినీ ఇండస్ట్రీని ఒకింత కలవరానికే గురిచేసింది అన్నపూర్ణ సుంకర. దర్శకులు, హీరోలనే తేడాలేకుండా.. తెలుగు సినిమా తీరును సోషల్‌ మీడియా సాక్షిగా ప్రశ్నించింది. అయితే.. ఇది జరిగి వారం గడిచినా దాని తాలూకు వేడి మాత్రం తగ్గలేదు. తాజాగా.. అన్నపూర్ణ కామెంట్లపై తనదైన శైలిలో స్పందించారు తెలుగు సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఇంతకీ.. సుంకర ఇచ్చిన కౌంటర్ ఏంటి? తమ్మారెడ్డి ఎన్‌కౌంటర్ ఏంటీ? మీరే చూడండి...
సినిమాలు తీస్తున్న విధానాన్ని సూటిగా....
తెలుగు సినీ ఇండస్ట్రీ పోకడను, సినిమాలు తీస్తున్న విధానాన్ని సూటిగా ప్రశ్నించిందో తెలుగు యువతి. సినిమాల్లో పెరుగుతున్న అశ్లీలాన్ని, స్త్రీలను కించపరుస్తున్న విధానాన్ని ప్రశ్నిస్తూ ఓ వీడియోను అన్నపూర్ణ సుంకర అనే యువతి పోస్ట్‌ చేసింది . ఈ వ్యాఖ్యలను ఖండించిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. తెలుగు సినిమాను విమర్శించడం ఫ్యాషనైపోయిందన్నారు. తెలుగు సినిమాలో పక్కవారిని అవమానించడమే కామెడీగా చెలామణి అవుతోందన్న అన్నపూర్ణ.. అన్ని సినిమాల్లోనూ ఇదే ఒరవడి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా.. చూసే విధానం మీద అభిప్రాయాలు ఆధారపడి ఉంటాయన్న తమ్మారెడ్డి.. నటులు, దర్శకులపై వ్యక్తిగత విమర్శలు సరికాదన్నారు. సినిమా చూసి జనం స్ఫూర్తి పొందుతారన్న అన్నపూర్ణ.. ఇలాంటి సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయంది. ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదన్నారు భరద్వాజ. అయితే.. అందులోని చెడును వదిలేసి, మంచిని స్వీకరించాలని చెప్పారు. తెలుగు సినిమా ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కుపోయిందని అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేసింది. అందులోంచి బయటపడాలన్న ఆమె.. మంచి సినిమాలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని చెప్పింది. దీనికి సమాధానమిచ్చిన భరద్వాజ.. సినిమాను సినిమాగా చూడాలన్నారు. అనవసరమైన విషయాలను వేలెత్తి చూపడం వల్ల ఉపయోగం లేదని అన్నారు. మొత్తానికి.. అన్నపూర్ణ చేసిన కామెంట్లు తెలుగు సినిమా నడవడికపై చిన్నపాటి చర్చకు వేదికయ్యాయి. తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్లు స్పందించడమే దీనికి తార్కాణం. సోషల్‌ మీడియాలో ఆమె పోస్ట్‌ చేసిన కామెంట్లతో కొందరు ఏకీభవిస్తే.. మరికొందరు విమర్శలు గుప్పించారు.

09:30 - August 14, 2015

హైదరాబాద్ : పంద్రాగస్టు వేడుకలకు భారత్‌ సిద్ధమవుతోంది. మరోవైపు ఉగ్రముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్‌ హెచ్చరిస్తోంది. షాపింగ్‌మాల్స్‌, రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేసే అవకాశముందని ఐబీ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దీంతో భద్రతా ఏర్పాట్లను భారీగా పెంచుతున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఐబీ హెచ్చరించింది. దీంతో నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

 

నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో డీసీఎం బోల్తా...

హైదరాబాద్ :నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో డీసీఎం బోల్తాడింది. ఈ ఘటనలో డ్రైవర్,తో సహా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రులను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

 

రాజ్ భవన్, అసెంబ్లీ నిర్మాణానికి 500కోట్లు !

అమరావతి : నవ్యాంధ్ర రాజధానిలో రాజ్‌భవన్‌, శాసనసభ తదితర భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా వచ్చినట్లు సమాచారం. ఆ భవనాల డిజైన్లు, ఇతర వివరాలతో పూర్తిస్థాయి నివేదిక పంపితే వాటిని పరిశీలించి, రూ.500 కోట్లు విడుదల చేస్తామని ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ జాబితాలో రాజ్‌భవన్‌, అసెంబ్లీతోపాటు మరో ఒకటి రెండు భవనాలు ఉండే అవకాశముంది.

గ్యాస్ లారీ బోల్తా : తప్పిన పెను ప్రమాదం...

సికింద్రాబాద్: నగరంలోని కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలో గల సికింద్రాబాద్ క్లబ్ వద్ద ప్రమాదవశాత్తు ఓ గ్యాస్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ నుంచి గ్యాస్ లీకైంది. సహాయక సిబ్బంది తక్షణం స్పందించటంతో ప్రమాదం తప్పింది. లారీని సురక్షితంగా తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

08:34 - August 14, 2015

హైదరాబాద్ : రేపు స్వాతంత్ర్య దినోత్సవం సంద్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ...భారత దేశం స్వాతంత్ర్య తెచ్చుకుని ఏం సాధించున్నాం? స్వాతంత్ర్యం కు ముందు ఏం ఆశించాం? అనే అంశం 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో దహన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె. నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. మరి ఎలాంటి విశ్లేషణ చేశారో చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి....

08:21 - August 14, 2015

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా డి. పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌.ఎల్‌.పి పతాకంపై దానయ్య డి.వి.వి నిర్మిస్తోన్న చిత్రం ఇటీవలే బ్యాంకాక్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'గత నెల 27 నుంచి బ్యాంకాక్‌ నిర్వహించిన భారీ షెడ్యూల్‌లో పతాక సన్నివేశాలతోపాటు టాకీపార్ట్‌కి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. బ్యాంకాక్‌లో చిత్రీకరించిన సన్నివేశాలన్ని అద్భుతంగా వచ్చాయి. ఈ గురువారం నుంచి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పలు ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. 'నాయక్‌' తర్వాత రామ్‌ చరణ్‌ హీరోగా ఈ సినిమా మా బ్యానర్‌లో నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. వినోదమే ప్రధానంగా యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సాగే ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. 'యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం' అని దర్శకుడు శ్రీనువైట్ల తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వి.వై.ప్రవీణ్‌ కుమార్‌, లైన్‌ప్రొడ్యూసర్‌ : కృష్ణ.

08:07 - August 14, 2015

హైదరాబాద్ : తిరుపతిలో బాజాజీ బస్టాండ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. బస్టాండ్ లో ఈ రోజుతెల్లవారు జామున 3 గంటల సమయంలో ఆగి వున్న బస్ లో ఒక్కసారిగా మంటలుచెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అధికారులు, స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. అగ్నిమాపకసిబ్బంది రావడం ఆలస్యం కావడంతో 80 -90శాతం వరకు బస్సుపూర్తి గా దగ్ధం అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణీకులు ఎవరూ బస్సులో లేకపోవడం పెనుప్రమాదంలో తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందా... లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

08:00 - August 14, 2015

హైదరాబాద్ : పార్లమెంట్ సమావేశాల్లో ఆరోపణలపై గతంలో కాంగ్రెస్ లా - ఇప్పుడే బిజెపి స్పందించింది అని 'న్యూస్ మార్నింగ్' ప్రజాశక్తి మాజీ ఎడిటర్ ఎస్.వినయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నియోజకవర్గాల్లో 40 రోజుల పాటు ఆందోళనలు జరపండి అంటూ మోదీ పిలుపు ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ఏవిధమైన చర్చ జరగకుండా ముగియడం దురదృష్టకరం. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ప్రధాని దాటవేత ధోరణి ప్రభుత్వం అవలంభించిందా? బిజెపి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు వుందా? పార్లమెంట్ లో సుష్మా రాజకీయ ప్రసంగం చేసిందా? పార్లమెంట్ ను రాజకీయ ప్రసంగాలకు వాడుకోవచ్చా? ఒక్క రోజు కూడా ప్రధాని మోడీ పార్లమెంట్ సమావేశాలకు ఎందుకు హాజరు కాలేదు? ఆరోపణలపై బిజెపి, కాంగ్రెస్ ఒకే తానులో ముక్కలేనా? ప్రత్యేక హోదా పై బిజెపి, కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదు? గ్రామ పంచాయతీ కార్మికులు కొంత మేరకు విజయం సాధించారు. మున్సిపల్ కార్మికుల విషయంలో కొంత క్లారిటీ రావాల్సి వుంది. ఇలాంటి వుంది. ఇలాంటి అంశాలపై నేతలు విశ్లేషణ చేశారు. వారి పూర్తి విశ్లేషణను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

లారీ - అబులెన్స్ ఢీ : ఇద్దరి మృతి

విశాఖ : కశింకోట మండలం పడమటిపాలెం వద్ద లారీ -అంబులెన్స్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా వారిని కేజీహెచ్ కు తరలించారు.

తిరులలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి 7 కంపార్ట్‌మెంట్లలలో వేచిఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.

గిద్దలూరు లో ఆర్మీ మాజీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

ప్రకాశం : గిద్దలూరులోని శ్రీనివాస సెంటర్‌లో కుటుంబ కలహాలతో ఆర్మీ మాజీ ఉద్యోగి వెంకటేశ్వర్లు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

నగరంలో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు...

హైదరాబాద్ : పంద్రాగస్టు సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరికల నేపథ్యంలో నగరంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. షాపింగ్ మాల్స్లలో డాగ్ స్క్వాడ్ లతో సోదాలు నిర్వహిస్తున్నారు.

రాజధాని ప్రాంతంలో మ్యాపింగ్ కు సర్వే

అమరావతి : రాజధాని పరిసర ప్రాంతాలు, నదీతీరం, కొండ ప్రాంతాల వద్ద ప్రైవేటు కన్సల్టెన్సీ ప్రతినిధులు గురువారం సర్వే నిర్వహించారు. సముద్రమట్టం నుంచి ఏయే ప్రాంతాలు ఎంతెంత ఎత్తులో ఉన్నాయి, నదీతీరం ఏవిధంగా విస్తరించి ఉంది, ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గాల కొలతల పరిస్థితి అంశాలపై సర్వే కొనసాగుతోంది. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలపై స్పష్టమైన మ్యాపును రూపొందించడానికి సర్వే నిర్వహిస్తున్నట్టు కన్సల్టెన్సీ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఐఐసీ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు.

నగరంలో 16న క్రికెట్‌ కార్నివాల్‌

హైదరాబాద్ : హైదరాబాద్ స్టేట్ వెటరన్స్ క్రికెట్ సంఘంహైదరాబాద్‌ స్టేట్‌ వెటరన్స్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌ఎన్వీసీ) ఆధ్వర్యంలో రాషా్ట్రనికి చెందిన టెస్టు, రంజీ ఆటగాళ్లతో సికింద్రాబాద్‌లోని తాపర్‌ స్టేడియం వేదికగా ఈ నెల 16న క్రికెట్‌ కార్నివాల్‌ జరగనుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్‌ అయూబ్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 

07:11 - August 14, 2015

హైదరాబాద్ : జనసేనాని అధినేత పవన్‌కళ్యాణ్‌ రాజధాని భూసేకరణపై మరోసారి ట్విట్టర్‌లో స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూ సేకరణకు వెళ్ళరాదంటూ ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భూ సేకరణ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తారని తాను ఆశిస్తున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
మిత్రపక్షమే అయినా...
తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌.. ఇలా అమావాస్యకీ, పున్నమికీ.. అన్న చందాన అడపా దడపా ట్విట్టర్‌లో స్పందిస్తున్నారని పలువురు కామెంట్‌ చేస్తున్నారు. మొన్నీమధ్యనే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలంటూ కాంగ్రెస్‌ కార్యకర్త మునికోటి ఆత్మాహుతికి పాల్పడితే, ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తంచేశారు జనసేనాని. మళ్ళీ ఇన్నాళ్ళకి పవన్‌ నుంచి ట్విట్టర్‌లో 'కామెంట్‌' వచ్చింది. ఈసారి భూ సేకరణపై పవన్‌ స్పందించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిలదీయడంగానీ, కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తున్న.. టీడీపీ నేతల తీరును గానీ ఎందుకు ప్రశ్నించడం లేదని పలువురు అడుగుతున్నారు. ఇప్పటికైనా పవన్‌ కళ్యాణ్‌ ఏపీ భూ సేకరణ, ప్రత్యేక హోదా అంశాలతో ప్రజల్లోకి వచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం చేయాలని కోరుతున్నారు.

07:08 - August 14, 2015

హైదరాబాద్ : దేవాదాయ శాఖ పరిదిలోని దేవాలయ ఉద్యోగులకు పదవ వేతన సవరణ అమలు కానుంది. ప్రభుత్వోద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ అందనుంది. దీనికి సంబందించిన ఫైలుపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల మంది ఉద్యోగులకు ఇది వర్తించనుంది. రీజినల్ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కేడర్ సహా ఇతర అన్ని ప్రధాన దేవాలయాలకు ఇది వర్తించనుంది.
ట్రెజరీ నుంచి వేతనాలు చెల్లించే వెసులుబాటు లేనందున....
అయితే దేవాదాయశాఖ ఉద్యోగులకు ప్రభుత్వోద్యోగుల తరహాలో ట్రెజరీ నుంచి వేతనాలు చెల్లించే వెసులుబాటు లేనందున ఆయా ఆలయాల్లోని ఆదాయంలో వేతనాల మొత్తం 30 శాతానికి మించకూడదే నిబంధన అమలులో ఉంది. ఇప్పుడు అంతకంటే తక్కువ వేతనాలు చెల్లిస్తున్న ఆలయాలకు మాత్రమే తాజా వేతన సవరణ అమలవుతుంది. ఇప్పటికే 30 శాతానికి మించి వేతన ఖర్చులు ఉన్న ఆలయాల్లో నిబంధనల ప్రకారం వేతన సవరణ అమలు కాదు. కానీ ఆర్‌జేసీ కేడర్‌లో ఉన్న యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ ఆలయాల్లో 30 శాతం నిబంధనను సడలిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. వేతన సవరణతో దాదాపు రూ.5 కోట్ల వరకు దేవాదాయ శాఖపై అదనపు భారం పడనున్నట్లు సమాచారం. తమ డిమాండ్ మేరకు వేతన సవరణ చేసినందుకు దేవాలయ అర్చక, ఉద్యోగుల సంఘం సీఎం కేసీఆర్‌కు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది.

07:06 - August 14, 2015

హైదరాబాద్ : ఇన్నాళ్లూ పంతానికి పోయిన సర్కారు.. ఎట్టకేలకు దిగివచ్చింది. మున్సిపల్‌ కార్మికులతో మంత్రి కేటీఆర్‌ జరిపిన చర్చలు పాక్షింగా ఫలించాయి. కార్మికుల సమస్యలు తెలుసుకున్న ప్రభుత్వం.. వాటి పరిష్కారానికి ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. నివేదిక రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చింది.

43 రోజులపాటు కొనసాగిన మున్సిపల్‌ కార్మికులు సమ్మె.....

43 రోజులపాటు మున్సిపల్‌ కార్మికులు సాగించిన పోరాటం ఎట్టకేలకు ముగిసింది. ఇవాళ కార్మిక సంఘాలతో సమావేశమై, పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ జరిపిన చర్చలు పాక్షికంగా ఫలప్రదమయ్యాయి. కార్మికుల సమస్యలను, వారి డిమాండ్లను పరిశీలించిన మంత్రి.. వీటి పరిష్కారానికి ఓ కమిటీని నియమిస్తున్నట్టు ప్రకటించారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ రేమండ్‌ పీటర్‌ నేతృత్వంలో కొనసాగనున్న ఈ కమిటీ రెండు నెలల్లో నివేదిక సమర్పిస్తుందని, నివేదిక రాగానే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ప్రకటనను స్వాగతించిన కార్మిక సంఘాలు ....

ప్రభుత్వ ప్రకటనను కార్మిక సంఘాలు స్వాగతించాయి. అయితే.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు నెలల తర్వాత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరాయి. గౌరవ వేతనాలతోపాటు, హెల్త్‌, ఐడీకార్డులు, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని నేతలు కోరారు. ఇన్నాళ్లూ సమ్మెలో పాల్గొన్న కార్మికులకు, సహకరించిన మీడియాకు నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

ముగిసిన సుదీర్ఘ పోరాటాం .....

మొత్తానికి.. సుదీర్ఘంగా సాగిన మున్సిపల్‌ కార్మికుల పోరాటం ముగిసింది. అయితే.. ప్రభుత్వం మీద నమ్మకంతోనే సమ్మె విరమిస్తున్నామని చెప్పిన నేతలు.. ఆడిన మాట తప్పితే మాత్రం మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు.

జగద్గిరి గుట్టలో తల్లీ కూతురు ఆత్మహత్య

హైదరాబాద్‌ : జగద్గిరిగుట్టలో విషాదం చోటుచేసుకుంది. తల్లీ కూతురు ఆత్మహత్య చేసకున్నారు. జగద్గిరిగుట్టలోని శివ నగర్‌లో శ్రీనివాస్‌ కుమార్‌ గృహంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తన కూతురుతో సహా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

శంషాబాద్‌ బృందావన్‌ కాలనీలో కిడ్నాపైన బాలిక హత్య

హైదరాబాద్: నల్గొండ జిల్లా ఆత్మకూరు శివారులో దారుణం జరిగింది. ఈనెల 6న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ బృందావన్‌ కాలనీలో కిడ్నాపైన శివలీల అనే 15ఏళ్ల బాలిక..నల్గొండ జిల్లా ఆత్మకూరు శివారులో శవమై కనిపించింది. రాజు అనే మెకానిక్‌ శివలీలను హత్యచేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  

ఎర్రచందనం అక్రమ రవణా ముఠా అరెస్ట్

చిత్తూరు : జిల్లాలో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తిరుపతి అటవీ ప్రాంతాల్లో నిర్వహించిన దాడులలో మొత్తం 15 మందిని అరెస్టు చేసి వారిని రహస్యంగా చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. వీరంతా గతంలో పీడీయాక్ట్‌ కింద అరెస్టైన ఖైదీ వాసంత్ నాయుడుకు అనుకూలంగా పనిచేస్తున్నారని సమాచారం. 15 మందిలో కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నట్లు సమాచారం.  

తిరుపతిలో తగలబడ్డ ఆర్టీసీ బస్సు

తిరుపతి : ఆర్టీసి బస్టాండ్ లో బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రమాదం జరిగే సమయంలో బస్సులు ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

నెల్లూరు నక్కలోల సెంటర్ లో దారుణం

నెల్లూరు : నక్కలోల సెంటర్ లో దారుణం జరిగింది. బాలికకు మత్తుమందిచ్చి 5 నెలలుగా మేనమామ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీన్ని గమనించి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

06:53 - August 14, 2015

హైదరాబాద్ : కళంకిత మంత్రులు రాజీనామా చేసేవరకు పోరు ఆపేది లేదన్న కాంగ్రెస్‌... అన్నట్లుగానే పార్లమెంట్‌ ఉభయసభల్లో దూకుడును ప్రదర్శించింది. చివరి రోజు వరకూ ఉభయసభలూ ఆ పార్టీ సభ్యుల నిరసనలతో దద్దరిల్లాయి. మూడు వారాల్లో ఒక్క బిల్లు కూడా చర్చకు రాలేదు. చివరకు జీఎస్ టీ బిల్లుపై రాజ్యసభలో చర్చించడానికి ప్రభుత్వం ప్రయత్నించినా అదీ వీలు కాలేదు. కాంగ్రెస్ సభ్యుల నిరసనలతో చర్చకు అవకాశం లేకుండా పోయింది.
విపక్షాల నిరసనలు, నినాదాలు, ఆందోళనలతోనే.....
సమావేశాల చివరిరోజు సైతం ఉభయ సభలు విపక్షాల నిరసనలు, నినాదాలు, ఆందోళనలతోనే ప్రారంభం అయ్యాయి. ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన కొనసాగింది. లోక్ సభలో ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలోనే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ ఎన్డీయే ఎంపీలు ర్యాలీకి దిగడం ఆశ్చర్యానికి గురిచేసింది.
తీవ్రంగా నిరసన తెలిపిన ఎన్డీఏ.....
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను విపక్షాలు అడ్డుకోవడాన్ని అధికార ఎన్డీఏ తీవ్రంగా నిరసించింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఎన్డీఏ ఎంపీలు ఢిల్లీ విధుల్లో నినదించారు. విజయ చౌక్ నుంచి రాష్టపతి భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసిన విపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ సహా.....
బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ సహా సీనియర్ కేంద్ర మంత్రులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, రాంవిలాస్ పాశ్వాన్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కాగా అంతకుముందు ఎన్డీఏ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
పార్లమెంట్‌ బయట కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన....
మరోవైపు ఎన్డీఏ ర్యాలీకి వ్యతిరేకంగా పార్లమెంట్‌ బయట కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. వ్యాపం కుంభకోణంలో ప్రధాని మౌనం వీడాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. 48 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ కేసులో నిజాల నిగ్గుతేల్చి న్యాయం జరిగేలా చూడలన్నారు.
లలిత్ మోడీని భారత్‌కు రప్పించే దమ్ము ప్రధానికి ఉందా?
ఆర్థిక నేరాలకు పాల్పడి లండన్‌లో తలదాచుకున్న ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీని భారత్‌కు రప్పించే దమ్ము ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఉందా? అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. వ్యాపం స్కామ్‌లోని నిందితులను కూడా బీజేపీ సర్కారు కాపాడుతోందని రాహుల్ విమర్శించారు.
సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుని ఏం సాధించిందని.....
ఇదిలా ఉంటే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుని ఏం సాధించిందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. ముఖ్యంగా.. ప్రధాన పార్టీ అధ్యక్షురాలిగా సోనియా ఆమె సభ వెల్‌లోకి రావడం చాలా బాధించిందని, ఈ సమావేశాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.34 కోట్లను ఖర్చు చేసిందని అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. మొత్తానికి వర్షాకాల సమావేశాలు సభను సజావుగా నడిపే ప్రభుత్వమే పోటాపోటీగా ధర్నాలు, ర్యాలీలు చేపట్టే విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. ఈ సారి ఒక్కబిల్లుకూడా పాస్‌ కాకుండానే పార్లమెంటు సమావేశాలు ముగిసిపోయాయి. 

నెస్ట్లే ఇండియా కంపెనీకి ఊరట....

హైదరాబాద్ : నెస్ట్లే ఇండియా కంపెనీకి ఊరట లభించింది. నెస్ట్లే మ్యాగీపై విధించిన నిషేదం సరైంది కాదని... ఈ విషయంలో సహజ న్యాయసూత్రాలు పాటించలేదని... బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. మ్యాగీ శాంపిల్స్‌ను పరీక్షించిన లాబొరేటరీలపై సందేహాలు వ్యక్తం చేసిన కోర్టు... గుర్తింపు పొందిన ల్యాబొరేటరీల్లో మరోసారి టెస్టింగ్స్‌ నిర్వహించాలని ఆదేశించింది. 

06:46 - August 14, 2015

హైదరాబాద్ : పారిశ్రామిక రంగ అభివ్రుద్ధి గురించి ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా గడ్డు రోజులు మాత్రం పోలేదు. కొత్త పరిశ్రమలు రావడం ఏమోగానీ వున్న పరిశ్రమలే మూతపడుతున్న దురావస్థ. జూట్ పరిశ్రమకు పేరొందిన ఉత్తరాంధ్ర అనేక పరిశ్రమలు లాకౌట్ అయ్యాయి. ఇప్పటికే విజయనగరం జిల్లాలో అయిదు, శ్రీకాకుళం జిల్లాలో నాలుగు జూట్ పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో వీటి మీద ఆధారపడ్డ కార్మికుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి. కొన్ని వేల కుటుంబాలు వీధినపడ్డాయి.
జూట్ పరిశ్రమకు సంక్షోభానికి ప్రభుత్వ విధానాలు...
జూట్‌ పరిశ్రమ సంక్షోభానికి ప్రభుత్వ విధానాలు పెను శాపంగా మారుతున్నాయి. జ్యూట్ ఉత్పత్తిలో మన భారత్ దే ప్రథమ స్థానం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 36 లక్షల టన్నుల జ్యూట్ ఉత్పత్తులు ఉత్పత్తి అవుతుంటే, ఒక్క మన దేశంలోనే 19 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతోంది. అయితే గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు జ్యూ ట్ పరిశ్రమ మీద శీతకన్నేశాయి. జ్యూట్ పరిశ్రమకు ప్రాణాధారమైన గోంగుపంటను ప్రోత్సహించకపోవడంతో యాజమాన్యాలు నేపాల్; బంగ్లాదేశ్ ల మీద ఆధారపడాల్సి వస్తోంది. దిగుమతి ఖర్చులు పెరుగుతున్నాయి. దీనికి తోడు విద్యుత్ ఛార్జీలు, కరెంట్ కోతలు మరింత భారమై వెక్కిరిస్తున్నాయి. మరోవైపు జ్యూట్ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఆఖరికీ ప్రజా పంపిణీ వ్యవస్థలోనూ వీటి వినియోగం తగ్గింది. ప్లాస్టిక్ వాడకం పెరుగుతోంది. ప్లాస్టిక్ నిషేధం వట్టి మాటగా మిగులుతోంది. ఇలాంటి అనేక పరిణామాలు జ్యూట్ పరిశ్రమకు శాపంగా మారుతున్నాయి. నష్టాలొస్తున్నాయన్న పేరుతో యాజమాన్యాలు లాకౌట్లు ప్రకటిస్తున్నాయి. పరిశ్రమ సంక్షోభంపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన్నప్పటికీ, అది పరిశ్రమలున్న ప్రాంతాల్లో పర్యటించలేదన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా జ్యూట్ పరిశ్రమ సంక్షోభం మీద ద్రుష్టి సారించాలి. మూతపడ్డ మిల్లులను తెరిపించేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలి. ఉపాధి లేక అవస్థ పడుతున్న కార్మికుల సంక్షేమానికి గట్టి చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, గన్నీ బ్యాగ్ ల వినియోగాన్ని పెంచడం జ్యూట్ పరిశ్రమకు మంచి రోజులొస్తాయనడంలో సందేహం లేదు. జూట్‌ పరిశ్రమను కష్టాలు చుట్టుముట్టాయి. ఉత్తరాంధ్రలో అనేక పరిశ్రమలు మూతపడడంతో వేలాది కార్మికులు వీధినపడ్డారు. 

06:43 - August 14, 2015

హైదరాబాద్ : జ్యూట్ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. ఉత్తరాంధ్రలో మిల్లులు మూతపడుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? దీనికి బాధ్యులెవరు? మన దేశంలో జ్యూట్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీఐటీయూ నేత రమణ విశాఖపట్టణం నుండి పాల్గొన్నారు. మీరు కూడా ఆచర్చను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss