Activities calendar

17 August 2015

ఉగ్రవాది నజీర్ కు సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్టు

హైదరాబాద్: హుజీ ఉగ్రవాది నజీర్ కు సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నజీర్ కు సహకరించిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుళ్లు బషీర్ అహ్మద్, షేక్ సలీంలను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ లేకుండానే పాస్ పోర్టులు జారీ చేశారని సిట్ తేల్చింది. 

 

22:03 - August 17, 2015

అద్భుత ఫలితాలు సాధించి చూపుతుంది. కానీ నిధులు వృధా అవుతున్నాయంటున్నారు.. పల్లె భారతాన్ని పేదరికం నుంచి కాపాడుతోంది. కానీ గ్రామీణ పేదలను సోమరులుగా తయారు చేస్తోందంటున్నారు.. కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కానీ నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారు. ఉపాధిహామీ పథకం అమలు తీరుపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం ... ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:54 - August 17, 2015

హైదరాబాద్: ఈనెల 20వ తేదీన ఢిల్లీలో ప్రధాని మోదీని చంద్రబాబు కలిసే సమయం ఖరారైంది. సాయంత్రం 4 గంటలకు ఏపీ సీఎం ప్రధానితో భేటీ అవుతారని అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేకహోదా, విభజన అంశాలపై చంద్రబాబు మోదీతో చర్చిస్తారని అధికార వర్గాలు తెలియచేస్తున్నాయి.

21:49 - August 17, 2015

హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి.. బాధితులకు చెల్లింపులు చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. దాదాపు నాలుగు రాష్ట్రాల్లో రోడ్డున పడ్డ 32 లక్షల మంది బాధితులకు హైకోర్టు ఆదేశం భరోసానిచ్చింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని వేసి.. అగ్రిగోల్డ్‌ ఆస్థులను అమ్మి బాధితులకు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఆ ప్రాసెస్‌ను ఆలస్యం చేస్తున్నారని.. రాజకీయ లాబీయింగ్‌ పని చేస్తుందని బాధితులు విమర్శిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఇక ఆ వ్యవహారం వేగవంతం అవుతుందని వారు భావిస్తున్నారు.

 

21:46 - August 17, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ ఫైల్‌ చేసిన ఛార్జిషీట్‌ కాపీ టెన్‌టీవీకి అందింది. ఈ కేసుతో ఎపి సీఎం చంద్రబాబుకు సంబంధం ఉందని అందులో ఏసీబీ స్పష్టంగా పేర్కొంది. సెబాస్టియన్‌తోనూ చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారని, స్టీఫెన్‌సన్‌తోనూ నేరుగా మాట్లాడారని ఛార్జిషీట్లో ఏసీబీ కోర్టుకు తెలియచేసింది. మత్తయ్య సెల్ స్విచ్ఛాఫ్ చేయాలని డిడిపి నేతలు చెప్పినట్లు ఎసిబి వెల్లడించింది. చంద్రబాబు పేరును ఎసిబి పలుమార్లు ప్రస్తావించింది. 

టెన్‌టీవీ చేతిలో 'ఓటుకు నోటు' ఛార్జిషీట్‌ కాపీ

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ ఫైల్‌ చేసిన ఛార్జిషీట్‌ కాపీ టెన్‌టీవీకి అందింది. ఈ కేసుతో ఎపి సీఎం చంద్రబాబుకు సంబంధం ఉందని అందులో ఏసీబీ స్పష్టంగా పేర్కొంది. 

21:29 - August 17, 2015

హైదరాబాద్: ఏపీ సచివాలయంలో మంత్రి యనమల రామకృష్ణుడు మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. రాజధానికి ఉద్యోగుల తరలింపు.. అక్కడి వసతులపై అనేక ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు మారే ఉద్యోగుల పిల్లల స్థానికతపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాల కోసం విజయవాడ, గుంటూరు, నూజివీడులలో స్థలాలను పరిశీలిస్తున్నామని యనమల తెలిపారు. ఇక విజయవాడ నుంచే పాలన కొనసాగిస్తే.. ఏపీలో ఆర్ధిక లావాదేవీలు పెరుగుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

21:21 - August 17, 2015

విజయవాడ: అగ్రిగోల్డ్ బాటలో మరో సంస్థ జనాలను మోసం చేసింది. విజయవాడలో పెరల్స్ అగ్రోటెక్‌ అనే సంస్థ సడెన్‌గా ఆఫీసు మూసేసింది. కోట్ల రూపాయల చెల్లింపులను వాయిదాలు వేస్తూ వచ్చిన సంస్థ యాజమాన్యం.. పరారైంది. దీంతో సంస్థ కార్యాలయంపై బాధితులు దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. సిబ్బందిని కూడా నిర్బంధించినట్లు తెలుస్తోంది.

20:54 - August 17, 2015

అందరూ మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ ట్రెండ్స్ నే ఫాలో అవుతున్నారు. ఎప్పటికప్పుడు ఫ్యాషన్, ట్రెండ్స్ ని అప్ డేట్ అవుతున్నారు. ఓన్లీ చీరలు.. డ్రెస్సులే కాదు.. ఇల్లు కూడా అంతే ట్రెండీగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే మీతో పాటు.. మీ ఇంటిని కూడా ట్రెండీగా మార్చుకునేందుకు మంచి డిజైన్స్ ఎక్కడ దొరుకుతాయో చూపిస్తోంది.. ఇవాళ్టి మీ సొగసు. ఆ.. వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:52 - August 17, 2015

సరికొత్త ట్రెండ్స్ తో పాటు, వైవిధ్యభరితమైన డిజైన్స్ ను పరిచయం చేస్తూ ఎప్పటికప్పుడు నూతనత్వంతో ముందుకు దూసుకుపోయే వ్యాపార రంగం వస్త్ర ప్రపంచం. అలాంటి ఈ రంగంలో ఎంత పోటీ ఉంటుందో అవకాశాలు అంతే ఎక్కువగా ఉంటాయి. సృజనాత్మకతతో, సరికొత్త ట్రెండ్స్ పై అవగాహనతో, స్వయం ఉపాధి పొందుతున్న ఓ అతివ వ్యాపార అనుభవాలను మీ ముందుకు తెచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి.
ఉపాధివైపు అడుగులు
ఒకరంగంలో విద్యాభ్యాసం చేసి, మరో రంగంలో స్థిరపడే వారు మనకు తరచుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు ప్రతిమ. సొంతంగా వ్యాపారం చేయాలనే తపన ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. నలుగురికి భిన్నంగా ఆలోచించే ఆమె తీరు స్వయం ఉపాధివైపు అడుగులు వేసేలా చేసింది.
ఎంచుకున్న రంగంపై ఆసక్తి
కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారు, వారు ఎంచుకున్న రంగంపై చక్కని ఆసక్తి కల్గి ఉండటంతో పాటు ముందు రాబోయే లాభనష్టాలను అంచనా వేసుకుంటూ నష్టాలు వస్తే కుంగి పోకుండా ధైర్యంగా నిలబడగలగాలి. అలాగే లాభాలను నిర్వహించుకోగలిగే సామర్థ్యం ఉంటే వ్యాపార నిర్వహణ మహిళలెవరికైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు ప్రతిమ.

 

20:45 - August 17, 2015

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఐటీ శాఖ తలనొప్పులు పట్టుకున్నాయి. తాజాగా హెచ్ఎండిఎ, కాకతీయ, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీతోపాటు మరికొన్ని కార్పొరేషన్లకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. వందల కోట్ల రూపాయల పన్నులు కట్టాల్సిందేనని.. లేకపోతే ఆస్తులను జప్తు చేస్తామని ఐటీ శాఖ హెచ్చరించింది. ఐటీ శాఖ నోటీసులతో తెలంగాణ ఆర్థికశాఖ ఆందోళనలో పడింది.

 

తెలంగాణ ప్రభుత్వానికి ఐటీ శాఖ తలనొప్పులు...

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఐటీ శాఖ తలనొప్పులు పట్టుకున్నాయి. తాజాగా హెచ్ఎండిఎ, కాకతీయ, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీతోపాటు మరికొన్ని కార్పొరేషన్లకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. వందల కోట్ల రూపాయల పన్నులు కట్టాల్సిందేనని.. లేకపోతే ఆస్తులను జప్తు చేస్తామని ఐటీ శాఖ హెచ్చరించింది. ఐటీ శాఖ నోటీసులతో తెలంగాణ ఆర్థికశాఖ ఆందోళనలో పడింది.

 

టీఎస్ వాటర్ గ్రిడ్ రెండో దశ టెండర్ నోటీసు జారీ

హైదరాబాద్: టీఎస్ వాటర్ గ్రిడ్ రెండో దశ టెండర్ నోటీసు జారీ అయింది. మొత్తం 9 సెగ్మెంట్లకు సంబంధించిన రూ.11, 992 కోట్ల పనులకు టీసర్కార్ టెండర్ నోటీస్ విడుదల చేసింది. ఈనెల 20 నుంచి ఆన్ లైన్ లో టెండర్లు నిర్వహించనున్నారు. మొదటి దశ టెండర్లకు సంబంధించిన ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న 42 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఆర్ డబ్ల్యుఎస్ అధికారులు.. కంపెనీల సందేహాలను నివృత్తి చేశారు.

 

విచారణకు హాజరు కాని కేటీఆర్ గన్ మెన్-డ్రైవర్

హైదరాబాద్: టీఎస్ మంత్రి కేటీఆర్ గన్ మెన్, డ్రైవర్ కు ఎపి ఎసిబి నోటీసులు జారీ చేసింది. టీఎస్ ఐఎస్ డబ్ల్యూ ఐజీ ద్వారా నోటీసులు అందజేశారు. ఈరోజు ఎపి సిఐడి విచారణకు కేటీఆర్ గన్ మెన్, డ్రైవర్ హాజరు కావాల్సివుంది. కానీ వారు హాజరు కాలేదు. 

20:10 - August 17, 2015

హైదరాబాద్: ముస్లింలకు రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని.. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి వెనుకాడబోమని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం టీ.ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముస్లింలకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తమ్మినేని ఆధ్వర్యంలో సీపీఎం కార్యకర్తలు, పలు ముస్లిం సంఘాల నాయకులు హైదరాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం స్థితిగతులపై సచార్ కమిటీ సమర్పించిన నివేదికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తమ్మినేని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా సీఎం కేసీఆర్ తప్పించుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. వెంటనే ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేసి, వారి కోసం సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

20:00 - August 17, 2015

ఢిల్లీ: నేషనల్ కన్జూమర్ డిష్పూట్స్ రెడ్రెస్సల్ కమిషన్‌(ఎన్ సిడిఆర్ సి).. నెస్ట్లే కంపెనీకి నోటీసులు పంపింది. అడ్వర్‌టైజ్‌మెంట్‌, లేబలింగ్ విషయంలో నిబంధనలు పాటించలేదని... 640 కోట్ల డ్యామేజెస్‌కు సంబంధించి... గతంలో కేంద్రం పిటిషన్‌ వేసింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల విభాగం... ఆగస్టు 11న ఎన్ సిడిఆర్ సిలో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఎన్ సిడిఆర్ సి వివరణ కోరుతూ తాఖీదులు పంపింది.

 

19:57 - August 17, 2015

పాట్నా: బీహార్ ఎన్నికలకు ముందు... ఆర్ జెడి చీఫ్‌ లాలూ ప్రసాద్ యాదవ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. పశువుల దాణా కుంభకోణంలో లాలూకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దుమ్కా ట్రెజరీ నుంచి... దాదాపు 4 కోట్ల రూపాయలను... పక్కదారి పట్టించారని లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై ఆరోపణలు వున్నాయి. 2013 సెప్టెంబర్ 30న కోర్టు లాలూను దోషిగా తేల్చింది. అక్టోబర్‌ మూడున ఐదేళ్ల శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. 

19:47 - August 17, 2015

ఢిల్లీ: దేశంలో బ్యాంకింగ్ రంగం మరింత విస్తరిస్తోంది... ఎక్కువ లావాదేవీలు బ్యాంకులద్వారా జరుగుతుండడంతో ఈ రంగంలో ఉద్యోగావకాశాలు మరింత పెరిగిపోతున్నాయి... పైగా దేశవ్యాప్తంగా వచ్చే రెండేళ్లలో పెద్ద ఎత్తున అధికారులు, సిబ్బంది పదవీవిరమణ చేయబోతున్నారు.. అంతేకాకుండా కొన్ని బ్యాంకులు కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేయబోతున్నాయి.. ఒక్క ఎస్ బిఐ మినహా మిగతా బ్యంకులన్నీ తక్కువ ప్రాంతాలకు పరిమితమైఉన్నాయి.. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎస్ బిహెచ్, ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులు కొత్త శాఖలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి..
రిటైర్ కాబోతున్న 78,800మంది
దేశవ్యాప్తంగా ఈ రెండేళ్లలో అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 80వేల పోస్టులవరకూ ఖాళీ కాబోతున్నాయి.. దాదాపు 78వేల 8వందలమంది రిటైర్ కాబోతున్నారు... ఈ ఏడాది 39వేల 756మంది... వచ్చే ఏడాది 39వేలమంది ఉద్యోగవిరమణ చేయబోతున్నారు..అందుకే ఈ స్థాయిలో నియాకాలు చేపట్టేలా బ్యాంకులకు కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.. అటు కాంట్రాక్టు పద్ధతిలో కూడా కొన్ని పోస్టులు భర్తీ చేసుకునే అవకాశముంది..
భారీసంఖ్యలో పోటీ..
మరోవైపు బ్యాంకు ఉద్యోగాలకు ఎంపికైనవారిలో సగానికి సగంమంది చేరడంలేదు.. చేరిన మరికొంతమంది రెండు, మూడేళ్లకే ఉద్యోగాలను వదిలి వెళ్లిపోతున్నారు.. దీంతో ఎప్పుడూ కొన్ని ఖాళీలు మిగిలిపోతున్నాయి.. అటు ఈ రంగంలో వేతనాలుకూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి... పదోన్నతులద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.. పీవోగా చేరినవారు పనితీరు, అనుభవం ఆధారంగా పదవీవిరమణలోపు చైర్మన్, వైస్ చైర్మన్ స్థాయికి చేరే ఛాన్స్ కూడా ఉంది.. అందుకే ఈ పోస్టులకు భారీసంఖ్యలో నిరుద్యోగులు పోటీ పడుతున్నారు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

 

 

19:42 - August 17, 2015

విశాఖ: జిందాల్‌ కంపెనీతో చేసుకున్న బాక్సైట్‌ ఒప్పందాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సీపీఎం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. బాక్సైట్‌ తవ్వకాల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించింది. గిరిజనులకు మాయమాటలు చెప్పి బాక్సైట్‌ తవ్వకాలు జరపాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందని త్రిపుర మాజీ మంత్రి, ఎంపీ జితేంద్రచౌదరి ఆరోపించారు. వైఎస్‌ ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

 

 

19:31 - August 17, 2015

ప్రకాశం: జిల్లాలోని ముండ్లమూరు మండలం ఉమాహేశ్వరపురం అగ్రహారంలో కొండచిలువ కలకలం సృష్టించింది. ఇంటి పరిసరాల్లో నాటు కోడిని మింగిన కొండ చిలువ మరో కోడిని చంపింది. కొండచిలువను చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే పాములను పట్టే వ్యక్తులను పిలిపించి దాన్ని బంధించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

19:23 - August 17, 2015

మహబూబ్‌నగర్: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఆందోళన చేపట్టారు. మక్తల్‌ మండల కేంద్రంలో గ్రామజ్యోతి సభను బహిష్కరించి.. అధికారులను గదిలో నిర్భిందించారు. ఎంపిడివో కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నెంబర్ 63, 64లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి నివేదిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు.. అధికారులను విడిచిపెట్టారు.

 

19:17 - August 17, 2015

రంగారెడ్డి: గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలనేదే గ్రామజ్యోతి పథకం లక్ష్యమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్‌లో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రజలే గ్రామసభలో నిర్ణయించాలని ఆయన అన్నారు. గ్రామాలలో సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత గ్రామసభలపైనే ఉంటుందన్నారు. గ్రామజ్యోతిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భాగస్వాములని కేటీఆర్‌ తెలిపారు. 

19:08 - August 17, 2015

థాయ్ లాండ్: బ్యాంకాక్ లోని ఓ ప్రార్ధనా మందిరం సమీపంలో రద్దీగా ఉన్న కమర్షియల్ హబ్ లో భారీ పేలుడు సంభవించింది. ఈఘటనలో 15 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులున్నారు. దుండగులు బైక్ లో బాంబు అమర్చారు. మొదటి బాంబు పేలిన తర్వాత.. రెండో బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇది ఉగ్రవాదుల చర్యగా అనుమానిస్తున్నారు. బాంబు పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

 

18:59 - August 17, 2015

పాట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోది మాటలే తప్ప చేతల్లో ఏమి చేయలేకపోతున్నారని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ విమర్శించారు. మాజీ సైనికులు ప్రధానిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌పై మోది ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమన్నారు. బ్లాక్‌ మనీ, యువతకు ఉపాధి, రైతుల విషయంలోనూ ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తెలిపారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని చెప్పగా...పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి చెప్పారని గుర్తు చేశారు. తన ప్రకటనల ద్వారా ప్రజలను మభ్య పెడుతున్నారని నితీష్‌ మండిపడ్డారు.

18:55 - August 17, 2015

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన తీవ్రతరం చేశాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరశిస్తూ... అసెంబ్లీ సాక్షిగా నినదించాయి. సభలో కాంగ్రెస్, బిఎస్ పి సహా ఇతర విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. కొందరు బ్యానర్లు పట్టుకొని నిరసన తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణఇంచాయని ఆందోళన వ్యక్తం చేశాయి. సభ వెలుపలా విపక్ష పార్టీల శ్రేణులు నిరసన కార్యక్రమాలు ఉద్ధృతం చేశాయి. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసి... ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.

 

18:53 - August 17, 2015

నల్గొండ: జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ధర్నారెడ్డి పల్లి, పిల్లాయిపల్లి కాల్వలను వెంటనే పూర్తిచేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్ర నిరసన తెలియచేయడంతో.. ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. దీంతో ఒక్కరోజు దీక్షకు పోలీసులు అనుమతించారు. 

బ్యాంకాక్ లో భారీ పేలుడు..12 మంది మృతి

తాయ్ లాండ్: బ్యాంకాక్ లోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులున్నారు. దుండుగలు బైక్ లో బాంబు అమర్చారు. 

18:39 - August 17, 2015

మెదక్‌: కాదేది కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. దీన్ని కాస్త మార్చి.. కాదేది నూతన ఆవిష్కరణకు అనర్హం అంటున్నాడు.. మెదక్‌ జిల్లాకు చెందిన ఓ యవకుడు. పనికిరాని పెన్నులు.. బ్లేడ్లు, సీడీ ప్లేయర్‌లోని మోటార్లు.. ఇలా ఒకటేమిటి మూలన పడేసిన ప్రతి వస్తువునూ నూతన ఆవిష్కరణకు ఉపయోగించుకున్నాడు.
మూలన పడేసిన వస్తువులతో..
మెదక్‌ జిల్లా హత్నూర్‌పుర మండలం బ్రాహ్మణగూడకు చెందిన సాయికిరణ్‌.. మూలన పడేసిన వస్తువులతో.. అద్భుత పరికరాన్ని తయారు చేసి.. సాటి వారిని అబ్బుర పరుస్తున్నాడు. వరికోత సమయంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు వ్యవసాయ కుటుంబానికి చెందిన సాయికిరణ్‌ మేధకు పదును పెట్టేలా చేశాయి. ఒకేసారి చాలామంది క్యూ కట్టడంతో వరికోత మిషన్‌కు డిమాండ్ మరింత పెరిగేది.. దీంతో సాగు పెట్టుబడి మొత్తమూ అనూహ్యంగా పెరిగేది. తన పేరంట్స్ ఇబ్బందులు చూసిన కిరణ్.. స్వయంగా వరికోత యంత్రాన్ని తయారు చేయాలని భావించాడు.
కేవలం వెయ్యి రూపాయలే ఖర్చు..
ఇంటర్‌మీడియట్‌ చదువుతున్న సాయికిరణ్‌.. వివిధ మార్గాల ద్వారా వరికోత యంత్రానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాడు.. సీడీ ప్లేయర్‌లోని మోటార్లను బయటకు తీశాడు.. బొమ్మ కార్‌లోని చక్రాలను బిగించాడు.. బ్లేడ్లు, చిన్న సైజు రంపం, పెన్సిళ్లు, పెన్నులు.. ఇలా అన్నింటినీ అవసరమైన రీతిలో బిగించాడు.. తర్వాత బ్యాటరీద్వారా దానికి పవర్‌ ఇచ్చాడు. ఇంకేముందీ.. ఈ బుల్లి హార్వెస్టర్‌ కిరణ్‌ అంచనాలకు అనుగుణంగా.. చకచకా కదులుతూ కలుపు మొక్కలను కత్తిరించడం మొదలు పెట్టింది. ఈ మిషన్ తయారీకి కేవలం వెయ్యి రూపాయలే ఖర్చయింది. డ్రైవర్ అవసరం లేకుండా రిమోట్ ద్వారా పనిచేయడం ఈ హార్వెస్టర్ ప్రత్యేకత.. తాను రూపొందించిన హార్వెస్టింగ్‌ యంత్రాన్ని కళాశాల ప్రిన్సిపల్‌తో పాటు.. స్నేహితులకు చూపించాడు.. దీనిని చూసిన వారంతా కిరణ్‌ను అభినందించారు.
ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆసక్తి..
సాయికిరణ్‌కి చిన్నప్పటినుండి ఎలక్ట్రానిక్ వస్తువులపై చాలా ఆసక్తని అధ్యాపకులు చెబుతున్నారు.. చదువులోకూడా ఎప్పుడూ టాపర్‌గానే ఉంటాడని ప్రశంసిస్తున్నారు. తనకు కాస్తంత పోత్సాహం ఇస్తే ఇదే నమూనాలో తక్కువ ఖర్చుతో వరికోత యంత్రాన్ని రూపొందిస్తానని కిరణ్ చెబుతున్నాడు.. ఇలాంటి ఔత్సాహికులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని పరికరాలు స్వల్ప ధరలకే అందుబాటులోకి వస్తాయి. తద్వారా సేద్యపు రంగపు పెట్టుబడులూ కొంతైనా తగ్గుతాయి. 

18:26 - August 17, 2015

నెల్లూరు: పుట్టం రాజువారి కండ్రిగ. ఈ పేరు ఎప్పుడో..ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా..? కాని సరిగ్గా ఏడాది కిందట విన్నారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ దత్తత తీసుకున్న పుట్టం రాజువారి కండ్రిగ ఇప్పుడెలా ఉంది. పరిస్ధితుల్లో ఏమయినా మార్పు వచ్చిందా..?
సచిన్ దత్తత గ్రామం
నెల్లూరు జిల్లాలోని గూడూరు మండలంలో పుట్టం రాజు వారి కండ్రిగ గ్రామం ఉంది. ఈ ఊరును క్రికెట్ దిగ్గజం సచిన్ రమేష్ టెండూల్కర్ దత్తత తీసుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం సచిన్ దత్తత తీసుకున్నప్పుడు ఎలా ఉందో..ఇప్పుడూ అలానే ఉంది.
నత్తనడకన అభివృద్ధి పనులు..
సరిగ్గా 3 నెలల్లోనే మోడల్ విలేజ్ అవుతుందనుకున్న ఈ ఊరు అందుకు ఆమడ దూరంలోకి వెళ్లిపోయింది. మూడు నెలలు కాదుకదా ఇక్కడి పరిస్థితిని చూస్తే...మరో మూడేళ్లయినా మోడల్‌ విలేజ్ కాదేమోననే సందేహం వ్యక్తమవుతుంది. ఈ గ్రామ అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నత్తనడకన సాగుతున్నాయి. ఆర్భాటంగా అభివృద్ధి పనులు ప్రారంభించి వెళ్లిన సచిన్..ఇప్పటి వరకు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. దత్తత తీసుకుని ఏడాదైనా కూడా కనీసం సచిన్‌కు సంబంధించిన గ్రాంట్‌లోంచి నయాపైసా కూడా రాలేదు. జిల్లా అధికారులు, సచిన్ పర్సనల్ అసిస్టెంట్లు అప్పడప్పుడు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. దీంతో ఈ గ్రామం అసలు ఆదర్శ గ్రామంగా మారుతుందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వర్ణనాతీతం..
ఊర్లో సుమారు 110 ఇళ్లు ఉండగా, 600 మంది ఇక్కడ జీవిస్తున్నారు. మంచినీటి సమస్య వర్ణనాతీతం. రోడ్లు సరిగాలేవు. పారిశుద్ధ్యం, విద్య, వైద్యం అధ్వాన్నం. ఒకటి రెండు చోట్ల సిమెంటు రోడ్లు, మిగతావన్నీ బురద రోడ్లే. చిన్నపాటి వర్షమొచ్చినా అడుగుతీసి అడుగువేయలేని దుస్థితి. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. రాత్రి వేళల్లో చీకటి రాజ్యమేలుతుంది. గ్రామంలో స్కూల్ ఉన్నా అది స్థానిక అవసరాలకు ఏ మాత్రం సరిపోదు.
మాటలకే పరిమితం..
గ్రామంలో సీసి రోడ్లు, సాంకేతిక పరిజ్ఞానంతో పాఠశాలలో విద్యాబోధనతోపాటు కిచెన్, డైనింగ్ హాల్, మంచి నీటి సౌకర్యాలు, ఓపెన్ క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే 24 గంటలు త్రాగు నీటి వసతి, మెరుగైన వీధి లైట్లు, ఆంతర్గత డ్రైనేజి, చెత్త నిర్మూలకు ప్రత్యేక వ్యవస్థ, శ్మశాన వాటిక, సెల్ ఫోన్ టవర్లతో పాటు వైఫై వ్యవస్థ ఇలా వీటన్నిటినీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. దేశంలోనే ఈ గ్రామాన్ని ఓ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారన్నారు. కాని అవి కేవలం మాటలకే పరిమితమయ్యాయి. ఇప్పటికైనా సరే సచిన్‌ తమ గ్రామాన్ని పట్టించుకోవాలని పుట్టంరాజు కండ్రిగ గ్రామస్ధులు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామాన్ని అభివృద్ధిపథంలో నడిపించాలని కోరుతున్నారు.

17:47 - August 17, 2015

ఢిల్లీ: టీమిండియాకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. గాయం కారణంగా శిఖర్ ధావన్ టెస్టు సీరీస్ కు దూరమయ్యాడు. తొలి టెస్టులో శిఖర్ సెంచరీ చేశాడు. అయినా భారత్ కు ఓటమి తప్పలేదు. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిపోయి టీమిండియా విమర్శలు ఎదుర్కొంటుంది. ఈనేపథ్యంలో శిఖర్ ధావన్ సీరీస్ కు దూరం కావడమంటే టీమ్ కు కష్టకాలమే అని చెప్పవచ్చు. దీంతో టీమిండియా పరిస్థితి.. మూలిగే నక్కపై తాటికాయపడ్డట్లు అయింది.

 

టీమిండియాకు దెబ్బమీద దెబ్బ..

ఢిల్లీ: టీమిండియాకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. గాయం కారణంగా శిఖర్ ధావన్ టెస్టు సీరీస్ కు దూరమయ్యాడు. తొలి టెస్టులో శిఖర్ సెంచరీ చేశాడు. అయినా భారత్ కు ఓటమి తప్పలేదు. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిపోయి టీమిండియా విమర్శలు ఎదుర్కొంటుంది. ఈనేపథ్యంలో శిఖర్ ధావన్ సీరీస్ దూరం కావడమంటే టీమ్ కు కష్టకాలమే అని చెప్పవచ్చు. దీంతో టీమిండియా పరిస్థితి.. మూలిగే నక్కపై తాటికాయపడ్డట్లు అయింది.

17:40 - August 17, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు రోజుకోమలుపు తిరుగుతుంది. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తెలంగాణ ఎసిబి దూకుడు పెంచింది. మూడు రోజుల క్రితం ముగ్గురు నిందితులకు నోటీసులు ఇచ్చింది. తాజాగా.. మాజీ ఎంపీ దివంగత ఆదికేశవులునాయుడు కుమారుడు శ్రీనివాస్ నాయుడుకు నోటీసులు ఇచ్చారు. ఆయనతోపాటు బెంగుళూరులో ఉన్న శ్రీనివాస్ స్నేహితులు.. చైతన్య, విష్ణులకు కూడా నోటీసుల జారీ అయ్యాయి. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. 

ఓటుకు నోటు కేసులో ఎసిబి దూకుడు..

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు రోజుకోమలుపు తిరుగుతుంది. ఈ కేసును చేధించడానికి తెలంగాణ ఎసిబి దూకుడు పెంచింది. తాజాగా ఆదికేశవులునాయుడు కుమారుడు శ్రీనివాస్ నాయుడుకు నోటీసులు జారీ చేసింది. ఆయనతోపాటు బెంగుళూరులో ఉన్న శ్రీనివాస్ స్నేహితులు.. చైతన్య, విష్ణులకు కూడా నోటీసుల జారీ అయ్యాయి. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

 

అగ్రిగోల్డు బాధితులకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: అగ్రిగోల్డు బాధితులకు హైకోర్టులో ఊరట లభించింది. అగ్రిగోల్డు సంస్థ ఆస్తులు అమ్మి ఖాతాదారులకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆస్తుల అమ్మకాలకు అగ్రిగోల్డు సంస్థ అంగీకరిస్తే.. అనుమతిస్తామని కోర్టు తెలిపింది. రూ.600 కోట్ల ఆస్తులు, రూ.500 కోట్ల అప్పులున్నాయని అగ్రిగోల్డు సంస్థ హైకోర్టుకు విన్నవించుకుంది.

 

ఉగ్రవాది నవేద్ కు 14 రోజుల రిమాండ్

ఢిల్లీ: ఉధంపూర్ ఘటనలో పట్టుబడ్డ ఉగ్రవాది మహ్మద్ నవేద్ కు పాటియాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నవేద్ కు లైడిటెక్టర్ పరీక్షల నిర్వహించేందుకు పాటియాలా కోర్టు అనుమతించింది. రేపు ఉదయం 11 గంటంలకు సీజీవో కాంప్లెక్స్ లో ఎన్ ఐఏ.. నవేద్ కు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించనుంది.

 

17:03 - August 17, 2015

హైదరాబాద్: సారాపై సమరశంఖంపై పూరించాలని ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. గ్రామజ్యోతి కార్యక్రమ వేదికలపై...ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సారా వ్యతిరేక పోరాట జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్‌, బలరాం నాయక్‌, శ్రావణ్‌తో పాటు ఇతర నేతల హాజరయ్యారు. తెలంగాణ సారా వ్యతిరేక పోరాట జేఏసీలో అన్ని ప్రజాసంఘాలు, పార్టీలను భాగస్వాములను చేస్తామని నేతలు స్పష్టం చేశారు. గ్రామీణ కుటుంబ వ్యవస్థను దెబ్బతీసే విధంగా..ప్రభుత్వం చీప్ లిక్కర్‌ను తీసుకొస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు గ్రామీణ వాతవారణాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

 

16:56 - August 17, 2015

హైదరాబాద్: ఏపీలో తెలుగుమీడియం స్కూళ్లను మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు యూటీఎఫ్ ఏపీ అధ్యక్షులు ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈమేరకు ఆ సంఘం నేతలు... పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని తెలిపారు. రెండు మీడియంలు సమాంతరంగా నడిపినప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని... వాళ్లకు ఇష్టం వచ్చిన మీడియంలో చదువుకుంటారని చెప్పారు.

16:43 - August 17, 2015

హైదరాబాద్: ఎపికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 20న ప్రధాని మోదీ భేటీలో సీఎం చంద్రబాబు.. ప్రత్యేక హోదాపై చర్చించనున్నారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం, బీహార్ తదితర రాష్ట్రాలతో ప్రత్యేకహోదహోదా అంశం ముడిపడి ఉందన్నారు. విపక్ష పార్టీలు కావాలనే ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

 

మేడిపల్లిలో 'గ్రామజ్యోతి'ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

వరంగల్: జిల్లాలోని మేడిపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు.

 

15:43 - August 17, 2015

కర్నూలు: జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎపి సీఎ చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాలోని తంగడంచలో ఫుడ్‌ పార్క్, ఓర్వకల్లులో ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం బాబు మాట్లాడారు. కర్నూలు జిల్లాకు రూ. 3 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తుందని సీఎం చెప్పారు.

14:54 - August 17, 2015

వరంగల్: గంగదేవిపల్లి గ్రామం రాష్ట్రానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ చెప్పారు. గంగదేవిపల్లిలో కేసీఆర్ గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఈ గ్రామం ఆదర్శ గ్రామాలకు చక్కటి ఉదాహరణ అన్నారు. గ్రామ అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఊరి ప్రజలు కొన్ని నియమాలు పెట్టుకుని.. వాటికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులపైనే ఆధారపడకుండా... అభివృద్ధిని సాధించుకున్నారని కొనియాడారు. కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. 

మొయినాబాద్ లో 'గ్రామజ్యోతి'ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి : జిల్లాలోని మొయినాబాద్ లో గ్రామజ్యోతి పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్థానిక సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామస్తులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

గంగదేవిపల్లిలో 'గ్రామజ్యోతి'ని ప్రారంభించిన కేసీఆర్

వరంగల్: గంగదేవిపల్లిలో సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. గంగదేవిపల్లి గ్రామం రాష్ట్రానికే ఆదర్శమని చెప్పారు. కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు.

ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా - బాబు.

కర్నూలు : ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జూపాడు బంగ్లా(మం) తంగడంచలో మెగా ఫుడ్ పార్కుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం బాబు ప్రసంగించారు. ఓ ప్రాసెసింగ్ యూనిట్ మెగా ఫుడ్ పార్కులో ఏర్పాటవుతుందని, ప్రాసెసింగ్ ఇక్కడే జరిగితే రైతులకు గిట్టుబాటు జరుగుతుందన్నారు. మూడు వేల కోట్ల పెట్టుబడులు ఈ ప్రాంతానికి రానున్నాయని, పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు. 17 మెగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తామని, కర్నూలు నుండి గుంటూరుకు 8లేన్ల రోడ్డు వేస్తామని హామీనిచ్చారు.

పిటిషన్ విచారణకు లక్ష డిపాజిట్ చేయాలన్న హైకోర్టు..

హైదరాబాద్ : ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అయితే పిల్ విచారణకు సరైనదో కాదో తేల్చడానికి రూ.లక్ష డిపాజిట్ చేయాలని కోర్టు పేర్కొంది. పిల్ విచారణకు తగినదైతే వడ్డీతో సహా రూ. లక్ష తిరిగి ఇస్తామని తెలిపింది. లేదంటే రూ.లక్ష వదిలేయాలని కోర్టు పేర్కొంది. రెండు వారాల్లో రూ. లక్ష డిపాజిట్ చేయాలని ఆదేశించింది. 

13:36 - August 17, 2015

కరీంనగర్ : నిజామాబాద్ ఎంపీ కవిత ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం చలిగల్‌ గ్రామంలో మన ఊరు-మన ఎంపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోను పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకుంటామని కవిత అన్నారు. ప్రజా జీవనంపై ప్రజలకు అవగాహన కల్పించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె అన్నారు.

13:33 - August 17, 2015

చిత్తూరు : ఎస్వీయూలో ర్యాగింగ్‌ ఘటనపై మంత్రి గంటాశ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లను ముగ్గురు ఎంసీఏ విద్యార్థులు వేధించారంటూ ఆరోపణలొచ్చాయి. దీంతో సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు వీసీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి. ఈ ఘటనపై విచారణకు రంగంలోకి దిగిన రిజిస్ట్రార్, రెక్టార్ ర్యాగింగ్ జరిగిందని ధృవీకరించారు. ర్యాగింగ్‌ ఘటనపై ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తామని ఎస్వీయూ రిజిస్ట్రార్‌ దేవరాజ్ స్పష్టం చేశారు. ఎస్వీయూలో ర్యాగింగ్ జరిగిన డీ-బ్లాక్‌ను ఆయన పరిశీలించారు. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పై ఉధృతమైన ఆందోళనలు..

ఢిల్లీ : వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పై ఆందోళనలు ఉధృతమయ్యాయి. జంతర్ మంతర్ వద్ద కల్నల్ పుష్పేంద్ర సింగ్, హవల్దార్ మేజర్ సింగ్ నిరహార దీక్షకు పూనుకున్నారు. 

13:23 - August 17, 2015

హైదరాబాద్ : మద్యం అమ్మకాలపై 'ఐద్వా' సమరశంఖం పూరించింది. విచ్చలవిడిగా కొనసాగుతున్న మద్యం అమ్మకాలను నియంత్రించాలని.. మహిళలపై జరుగుతున్న హింసలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా నేతలు బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి ప్రారంభం కానున్న జాతాను హైదరాబాద్ ప్రగతినగర్‌లో సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రారంభించారు. 12 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది. ఈనెల 28న హైదరాబాద్‌లో ముగింపు సభ నిర్వహించనున్నారు. ఈ జాతాలో మద్యం వల్ల కలిగే అనర్ధాలు మహిళలపై పెరుగుతున్న హింసపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కళాకారులు పాటలు, నాటికల రూపంలో వివరించనున్నారు. 
తమిళనాడులో..
అటు తమిళనాడులోనూ మద్యం అమ్మకాలు నిషేదించాలంటూ డీవైఎఫ్ఐ, ఐద్వా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.. తాగుడుకు బానిసై ఎంతోమంది తమ జీవితాలు, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారని ఆరోపించారు.. వెంటనే మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు.. వీరిని పోలీసులు అరెస్టు చేశారు..

13:21 - August 17, 2015

ఢిల్లీ : కాశ్మీర్‌లోని ఉదంపూర్‌లో పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది ఉస్మాన్‌ను కోర్టుకు తరలించారు. పటిష్ట బందోబస్తు మధ్య ఉస్మాన్‌లో ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 5న ఉదంపూర్‌లో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు, సైన్యం మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు, ఓ టెర్రరిస్టు చనిపోయారు. మరో ఉగ్రవాది ఉస్మాన్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టింది. విచారణలో పలు అంశాలను నవేద్ తెలియచేసినట్లు సమాచారం. ఎక్కడెక్కడ ఉగ్రవాది దాడులకు పాల్పడుతామో..ఎలాంటి శిక్షణ తీసుకున్నాడో ఎన్ఐఏ అధికారులకు నవేద్ పేర్కొనట్లు తెలుస్తోంది. అనంతరం అతడిని ఈనెల 13వ తేదీన హస్తినకు తరలించారు. ప్రస్తుతం కోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుంది ? ఉగ్రవాది నవేద్ కు ఎలాంటి శిక్ష విధిస్తారనేది ఉత్కంఠ నెలకొంది. 

కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్న తమ్మినేని..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్ల ఎదుట సీపీఎం ధర్నా చేపట్టింది. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. మైనార్టీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

13:16 - August 17, 2015

మహబూబ్ నగర్ : టీచర్లు ఎందుకు రావడం లేదు..తమకు ఎందుకు చదువు చెప్పడం లేదు..రోజు తాము పాఠశాలకు ఎందుకు వస్తున్నాం ? ఆడుకోవడానికా ? చదువుకోవడానికా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆ విద్యార్థుల మనస్సులో తలెత్తాయి. దీనికి వారు ఒక పరిష్కార మార్గం ఎంచుకున్నారు. ఏకంగా అందరికీ న్యాయం చెప్పే హైకోర్టుకు లేఖలు రాశారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుకున్నారు. దీనిపై హైకోర్టు తీవ్రంగానే పరిగణించింది. లేఖను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.
మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం చింతకుంట గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హైకోర్టుకు లేఖలు రాశారు. సుమారు 700-900 లేఖలు కోర్టుకు అందాయి. దీనిపై సోమవారం విచారణ చేపట్టింది. తమ పాఠశాలలో 300 విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉందని, 200 మంది విద్యార్థులుంటే ఒక టీచర్ కూడా లేదని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. తాము ఆడుకోవడానికి వస్తున్నామా ? చదువుకోవడానికి రావాలా ? అని లేఖలో ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థి తమ ఆవేదనను లేఖలో పొందుపరిచారు. ఇంత సీరియస్ గా ఉన్న ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. తమ దృష్టికి వచ్చిందని, విచారణ చేపడుతున్నట్లు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. డీఈఓను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలుపాలని పేర్కొంది. టీచర్లు ఉన్నా రాకుంటే తక్షణమే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణనను ఎల్లుండికి వాయిదా వేసింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యే అవకాశం ఉంది. నేడు లేదా రేపు రేపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని, కొంతమందిని సస్పెండ్ చేస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో రాని టీచర్లకు ఇది ఒక హెచ్చరికలాంటిదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. 

గంగదేవిపల్లికి చేరుకున్న కేసీఆర్..

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గంగదేవిపల్లికి చేరుకున్నారు. అక్కడ గ్రామ జ్యోతి పథకాన్ని ప్రారంభించనున్నారు. 

కాసేపట్లో మెగాఫుడ్ పార్కుకు బాబు శంకుస్థాపన..

కడప : జూపాడు బంగ్లా(మం) తంగడంచకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. మెగా ఫుడ్ పార్కుకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 

సోనియాతో జైపాల్ భేటీ..

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణతో సహా పార్టీ, జాతీయ వ్యవహారాలపై చర్చిస్తున్నారు. 

12:53 - August 17, 2015

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ మరోసారి వార్తల్లోకెక్కింది. వినాయక నిమజ్జనం సాగరంలో చేయవద్దని..దీనివల్ల కాలుష్యంగా మారిపోతోందని వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేపట్టింది. బెంగళూరు తరహాలో నిమజ్జనం చేయవచ్చని, 8-15 ఫీట్ల ఎత్తులో విగ్రహాలు తయారు చేయవచ్చని పిటిషనర్ పేర్కొన్నారు. కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని, విగ్రహాలు తయారవుతున్నాయని ప్రభుత్వ న్యాయవాదులు పేర్కొన్నారు. నిమజ్జనానికి లోతైన ప్రాంతం కావాలని కోర్టుకు తెలిపారు. సాగర్ లో నిమజ్జనం విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ట్రాఫిక్ పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖలతో ఎలాంటి సమన్వయం చేసుకుంటున్నారో తెలుపాలని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణనను గురువారానికి వాయిదా వేసింది. 

12:50 - August 17, 2015

కడప : జిల్లాలో పట్టుబడిన ఎర్రచందనం స్మగర్స్ పట్టుబడ్డారు. వీరు అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డి అనుచరులేనని పోలీసులు నిర్ధారించారు. ఇటీవలే ఎర్రచందనం స్మగ్లింగ్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. స్మగ్లింగ్ చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అందులో పలువురు అంతర్జాతీయ స్మగ్లర్స్ కూడా ఉన్నారు. తాజాగా కడప జిల్లాలో రైల్వే కోడూరు మండలం మాధవరంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో మూడు కార్లలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీనితో సంబంధం ఉన్న సుదర్శన్, విశ్వనాథ్ రెడ్డి ప్రవీణ్ లను అరెస్టు చేశారు. వీటి విలువ సుమారు రూ.2.7 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. 

12:19 - August 17, 2015

వరంగల్ : గంగదేవిపల్లి..ఈ గ్రామం అందరికీ ఆదర్శ గ్రామం. అలాంటి ఈ గ్రామంలో పోలీసుల బూట్ల చప్పుడు వినిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే తుపాకి నీడలో ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో పథకం 'గ్రామ జ్యోతి'. ఈ పథకాన్ని గంగదేవిపల్లి నుండి ప్రారంభించాలిని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీలు నిర్వహించారు. మేడపల్లి, రాంపూర్ గ్రామాల్లో పర్యటించనున్నందున ఆయా ప్రాంతాల్లో పోలీస్ బలగాలు మోహరించాయి. సీఎం సందర్శించనున్న ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాలైన నల్లబెల్లి మండలం మేడపల్లి, రాంపూర్ గ్రామాలను ఆధీనంలోకి తీసుకున్న రూరల్ పోలీసులు ఆయా ప్రాంతాలను జల్లెడ పట్టారు.

జనగామను దిగ్భందించిన పోలీసులు..

వరంగల్ : సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా జనగామను పోలీసులు దిగ్భందించారు. ప్రతి వాహనాన్ని ఆపి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  

హుస్సేన్ సాగర్ వినాయకుడి నిమజ్జనంపై కోర్టులో విచారణ..

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ వినాయకుడి నిమజ్జనంపై కోర్టులో విచారణ జరిగింది. బెంగళూరు తరహాలో నిమజ్జనం చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 15 అడుగులలోపు విగ్రహాలు నిమజ్జన చేస్తే అభ్యంతరమేంటని పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. విచారణనను ఎల్లుండికి వాయిదా వేసింది. 

విద్యార్థుల లేఖపై హైకోర్టు లో విచారణ..

హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఇచ్చిన లేఖపై హైకోర్టు విచారణ చేపట్టింది. 200 మంది విద్యార్థులున్నా ఒక్క టీచర్ లేరని విద్యార్థులు ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని ఆత్మకూరు మండలం చింతలకుంట విద్యార్థులు కోరారు. లేఖను సుమోటోగా స్వీకరించి విచారణ జరిపింది. డీఈవోను ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. టీచర్లు ఉన్నా రాకుంటే తక్షణమే తొలగించాలని ఈసందర్భంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

 

పారిశ్రామిక వేత్తలతో మోడీ భేటీ..

యూఏఈ : మస్దర్ నగరంలో పారిశ్రామిక వేత్తలతో భారత ప్రధాని మోడీ భేటీ అయ్యారు. రైల్వేలో వంద శాతం పెట్టుబడులకు అనుమతినివ్వడం జరిగిందని, భారత్ లో అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయన్నారు.

అక్రమ లడ్డూ టోకెన్ల విక్రయ ముఠా అరెస్టు..

తిరుమల : వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో అక్రమంగా లడ్డూ టోకెన్లను విక్రయిస్తున్న 19 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సూపరిటెండెంట్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. లడ్డూ టోకెన్లు బ్లాక్ లో విక్రయాలు..జేబు దొంగతనాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో విజిలెన్స్ కు అప్పగించడం జరిగిందని తెలిపారు. 

చంద్రబాబుతో టిటిడిపి నేతల భేటీ..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుతో టిటిడిపి నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం. 

వరంగల్ కు సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాకు బయలుదేరి వెళ్లారు. గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిలో ఆయన ప్రారంభించనున్నారు.

 

కోల్ స్కాం..మధు కోడా పిటిషన్..

ఢిల్లీ : బొగ్గు స్కామ్ లో ప్రత్యేక కోర్టులో మధుకోడా పిటిషన్ దాఖలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సమన్లు జారీ చేయాలని ఆయన పిటిషన్ లో కోరారు. ప్రభుత్వ ప్రకటనల్లో ఉల్లంఘన జరిగిందని తెలిపారు. 

కడపలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు..

కడప : జిల్లాలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను రైల్వే కోడూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డి అనుచరులని పోలీసులు అనుమానిస్తున్నారు.

11:35 - August 17, 2015

కోల్ కతా : శ్రీలంకకు చెందిన వారిగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తులను కోల్ కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని సోమవారం కోర్టు ఎదుట ప్రవేశ పెట్టారు. నిందితులకు ఈనెల 24వ తేదీ వరకు కస్టడీ విధించింది. యువకులు అక్రమంగా పశ్చిమబెంగాల్ లోకి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

11:31 - August 17, 2015

జమ్మూ కాశ్మీర్ : సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుండి తూటా దూసుకొస్తుందో..ఎలాంటి మిస్సైల్స్ వస్తాయో..ఎవరి ప్రాణాలు పోతాయోనన్న భయంతో సరిహద్దు గ్రామాల ప్రజలు కాలం వెళ్ల దీస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని వారు పాలకులను వేడుకుంటున్నారు. గత వారం రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో బాంబుల మోత మోగుతోంది. పల్లెలు..ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. తాజా దాడిలో ఓ మహిళ మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ వారం రోజుల్లో ఆరుగురు మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 12 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. ఈ కాల్పుల ఘటనల వల్ల తమ వ్యాపారులు కూడా జరగడం లేదని, అందరూ ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని స్థానికుడు వాపోయాడు. 

11:23 - August 17, 2015

తిరుపతి : ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థిని బలి ఘటన మరిచిపోక ముందే మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఎస్వీ యూనివర్సిటీలో మంగళవారం జూనియర్లను ముగ్గురు ఎంసీఏ విద్యార్థులు వేధించినట్లు వార్తలు వచ్చాయి. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు వీసీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాయి. అనంతరం విసి, రిజిష్ట్రార్ లు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ర్యాగింగ్ జరిగిందని ధృవీకరించారు. దీనికి సంబంధం ఉన్న ముగ్గురు విద్యార్థులపై చర్యలు తీసుకొనేందుకు సిద్ధమయ్యారు.
ర్యాగింగ్ ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. వెంటనే ఎస్వీయూ అధికారులతో గంటా ఫోన్ లో మాట్లాడారు. ర్యాగింగ్ ను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గంటా పలు ఆదేశాలు జారీ చేశారు. 

11:15 - August 17, 2015

అబుదాబి : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యూఏఈలో పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా అబుదాబిలోని మస్టర్ నగరంలో గల సౌర విద్యుత్ కార్ల సంస్థను మోడీ పరిశీలించారు. ప్లాంట్ లో కార్ల తయారీ విధానాన్ని అక్కడి ఇంజినీర్లతో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం యూఈఏ రాజు షేక్ మహ్మద్ బిన్ జయాద్ తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశంతో పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. 

సాగర్ ఎడుమ కాల్వలో ట్రాక్టర్ బోల్తా..

నల్గొండ : సాగర్ ఎడుమ కాలువలో ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. గరిడేపల్లి మండలం కపూరియాతండా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఐ.పోలవరంలో అగ్నిప్రమాదం..

తూర్పుగోదావరి : ఐ.పోలవరం మండలం బాణాపురంలో కాకాహోటల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. 

ర్యాగింగ్ పై మంత్రి గంటా ఆరా..

చిత్తూరు : ఎస్వీయూలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై మంత్రి గంటా ఆరా తీశారు. వీసీ, రిజిష్ట్రార్ లకు మంత్రి గంటా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ర్యాగింగ్ ను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా వీసీ, రిజిష్ట్రార్ లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

ఎస్వీయూలో ర్యాగింగ్ పై విద్యార్థులు ఆందోళన..

చిత్తూరు : ఎస్వీయూలో ర్యాగింగ్ పై విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

 

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి..

విశాఖపట్టణం : అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఒడిశా నుండి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడా క్యుములోనింబస్ మేఘాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. 

కరీంనగర్ లో ఎంపీ కవిత పర్యటన..

కరీంనగర్ : జగిత్యాల మండలం చెల్గల్ లో 'మన ఊరు మన ఎంపీ' కార్యక్రమాన్ని కవిత ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ఎంపీ కవిత సమస్యలను తెలుసుకున్నారు. 

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన..

ఆదిలాబాద్ : బాసర ట్రిపుల్ ఐటీలోలోని బ్లాక్ -1 వద్ద విద్యార్థులు నిరసన నిర్వహించారు. ఉప కులపతి సత్యనారాయణనను విద్యార్థులు ఘెరావ్ చేశారు. 

నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం..

ముంబై : సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్లకు పైగా నష్టపోయాయి.

 

10:36 - August 17, 2015

ఢిల్లీ : విద్యా వ్యవస్థల్లో హిందుత్వ భావాలు జొప్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీవ్ర జోక్యం చేసుకుంటోందని ప్రఖ్యాత ఆర్థిక వేత్త అమర్త్యసేన్‌ వాపోయారు. విద్యా సంబంధిత విషయాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న రాజకీయ జోక్యానికి ఇది పరాకాష్టని అన్నారు. గతంలో యూపిఎ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకున్నప్పటికీ పరిధి దాటలేదని ఎన్‌డిఎ ప్రభుత్వం మాత్రం పదేపదే తలదూరుస్తూ బిజెపి విధానాల్ని విద్యావ్యవస్థలోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. తన తాజా పుస్తకం 'ది కంట్రీ ఆఫ్‌ ఫస్ట్ బార్సు'లో అమర్త్యసేన్‌ ఈ అంశాలను పేర్కొన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలన్నింటిలోనూ హిందుత్వవాద భావాలను చొప్పించేందుకు ఏన్డీయే సర్కార్‌ విశ్వ ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే దేశంలో ప్రఖ్యాత విద్యా, పరిశోధన సంస్థల్లో హిందుత్వ వ్యక్తులను నియమిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసిహెచ్‌ఆర్‌) ఛైర్మన్‌గా యల్లాప్రగడ సుదర్శనరావు నియమించారని, 'అయనకు చరిత్ర పరిశోధన కంటే హిందుత్వ భావాలు ఎలా జొప్పించాలో బాగా తెలుసని' అమర్త్యసేన్‌ అన్నారు. అలాగే ఇటీవల భారత సాంస్కృతిక సంప్రదింపుల మండలి (ఐసిసిఆర్‌) కొత్త అధిపతిగా నియమితులైన లోకేష్‌ చంద్ర కూడా 'ప్రధాని మోడీ భగవంతుని అవతారం' అని చెబుతున్నారని ఆయన వాపోయారు. హిందుత్వ భావాలు జొప్పించేందుకు కేంద్ర సర్కార్‌ ప్రయత్నిస్తోందనడానికి వీరి నియామకాలే ఉదాహరణ వివరించారు. నలందా విశ్వవిద్యాలయంలో ఉపకులపతి నియామక విషయంలో ప్రభుత్వం తనను అవమానపరిచిందని అమర్త్యసేన్‌ ఆరోపించారు. తాను నామినేషన్‌ వేసిన రెండు నెలల తర్వాత సింగపూర్‌కు చెందిన జార్జ్ యేని విసిగా నియమించిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ నాయకులతో తనకు అంతగా సాన్నిహిత్యం లేకపోవడమే దీనికి కారణమై ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వతంత్రంగా వ్యవహరించే వెసులుబాటు కల్పిస్తే, జార్జ్ కూడా పరిస్థితులను చక్కదిద్దగలరన్నారు. నలందా లాంటి విశ్వవిఖ్యాత విద్యాసంస్థల్లోనే ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంటే సామాన్య విద్యాలయాల పరిస్థితి ఏమిటని అమర్త్యసేన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్సీపీ ఎమ్మెల్యే రమేష్ కదమ్ అరెస్టు..

పూణే : ఎన్సీపీ ఎమ్మెల్యే రమేష్ కదమ్ ను మహారాష్ట్ర సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ను అరెస్టు చేసినట్లు సమాచారం. 

10:16 - August 17, 2015

చిత్తురు : జిల్లాలో మళ్లీ గజరాజులు పంట పొలాలపై దాడులు చేశాయి. ఎన్నో రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎర్రవారిపాలెంలోని అనే ప్రాంతాల్లో ఆదివారం రాత్రి పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేశాయి. దీనితో టమాటతో పాటు ఇతర పంటలు ధ్వంసమయ్యాయి. తమ పంటలను కాపాడేందుకు రైతులు విశ్వప్రయత్నాలు చేశారు. గత 15 రోజులుగా రామకుప్పం, కుప్పం, కాంచీపురం ప్రాంతాల్లో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో నీటి కొరత కారణంగానే గ్రామల్లోకి ఏనుగులు ప్రవేశిస్తున్నాయని తెలుస్తోంది. వీటికి ఇటీవల అధికారులు సాగునీటి సదుపాయం కల్పించినా అందులో లోపాలు ఉండడంతో మళ్లీ ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. 

కేంద్ర హోం శాఖ కార్యదర్శితో రాజ్ నాథ్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర హోం శాఖ కార్యదర్శితో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ కానున్నారు. 11గంటలకు జరిగే ఈ సమావేశంలో సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్ చర్యలపై సమీక్షించనున్నట్లు సమాచారం.

వేముల వాడ రాజన్న సన్నిధిలో శ్రావణమాసం..

కరీంనగర్ : జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణ మాస సందడి నెలకొంది. శ్రావణ సోమవారం కావడంతో వేలాది మంది భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 

బీజేపీ పాలన..విద్యారంగంపై అమర్థ్యసేన్ ఆందోళన..

ఢిల్లీ : విద్యారంగంలో కేంద్రం మితిమీరి జోక్యం చేసుకొంటోందని ప్రఖ్యాత ఆర్థిక వేత్త అమర్థ్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందుత్వ భావాలు చొప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని తన తాజా పుస్తకం 'ది కంట్రీ ఆఫ్ ఫస్ట్ బాయ్స్'లో వెల్లడించారు. యూపీఏ హాయంలోనూ జోక్యం ఉన్నా పరిధి దాటలేదని పుస్తకంలో పేర్కొన్నారు. పరిశోధనా సంస్థలకు అధిపతులుగా హిందుత్వ వాదుల నియమించారని తెలిపారు. మోడీ భగవంతుడి అవతారం అంటూ ప్రచారం చేసే లోకేష్ చంద్రకు ఐసీసీ ఆర్ ఛైర్మన్ పదవి..హిందూత్వ ప్రచారం తప్ప చరిత్ర అంతగా తెలియని యల్లాప్రగడ సుదర్శన రావుకు ఐసీహెచ్ఆర్ ఛైర్మన్ పదవులు ఇచ్చారని పేర్కొన్నారు.

అనకాపల్లిలో నారాయణ అకస్మిక తనిఖీలు..

విశాఖ : వీవీఎంసీ అనకాపల్లి జోనల్ కార్యాలయంలో మంత్రి నారాయణ అకస్మిక తనిఖీలు నిర్వహించారు. రహదారుల నిర్మాణం, తాగునీటి సమస్యలపై నారాయణ ఆరా తీశారు. 

09:20 - August 17, 2015

నెల్లూరు : మా ఊరిలో మీ ఫ్యాక్టరీని తరలించాలి..ఫ్యాక్టరీ వల్ల మా పొలాలు..శరీరాలు నాశనమౌతున్నాయని ఆ గ్రామస్తులు వేడుకున్నారు. కానీ ఫ్యాకర్టీ యాజమాన్యం..అధికారులు ఎవరూ స్పందించలేదు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ గ్రామస్తులు ఏకంగా ప్యాక్టరీపైకి దాడికి దిగారు. ఈఘటన నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చంద్రపడియలో చోటు చేసుకుంది. నూట్రాసిటీ పేరిట ఫ్యాక్టరీ పెడుతామని, దీని ద్వారా ఉపాధి దొరుకుతుందని గ్రామస్తులకు నమ్మబలికించారు. అనంతరం ఆ ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. కొద్దికాలం తరువాత గ్రామస్తుల శరీరంలో మార్పులు చోటు చేసుకోవడం ప్రారంభమైంది. పొలాలు పాడైపోవడం గ్రహించారు. దీనికంతటికి కారణం కెమికల్ ఫ్యాక్టరీయేనని గ్రహించారు. ఫ్యాక్టరీ నుండి వెలువడే రసాయనాల వల్ల చర్మంపై బొబ్బలు రావడం..పొలాలు నాశనమౌతున్నాయని ఫ్యాక్టరీ యాజమాన్యానికి, ఇతర అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఇక్కడి నుండి ఫ్యాక్టరీని తరలించాలని వారు కోరారు. ఎలాంటి స్పందన రాకపోయేసరికి ఆందోళన బాట ఎంచుకున్నారు. దీనికి కూడా అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయం తీసుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా గ్రామస్తులు ఫ్యాక్టరీపై దాడికి యత్నించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి గ్రామస్తులను అడ్డుకుని లాఠీఛార్జీ చేశారు. ఇందులో కొంతమంది గాయపడినట్లు సమాచారం. వెంటనే ఇక్కడి నుండి ఫ్యాక్టరీని తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 

09:10 - August 17, 2015

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టు బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా మారుతోంది. గత కొన్ని రోజులుగా కస్టమ్స్ అధికారులు చేస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం బయటపడుతోంది. అధికంగా సంపాదించవచ్చనే ఆశతో కొంతమంది దొడ్డిదారిన తరలించాలని శంషాబాద్ ఎయిర్ పోర్టును అడ్డాగా ఎంచుకున్నారు. తాజాగా సోమవారం ఉదయం కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో రెండు కిలోల బంగారం బయపడింది. దోహా నుండి వచ్చిన ప్రయాణికుడి సూట్ కేసు అడుగు భాగంలో బయటపెట్టిన బంగారం స్కానర్ లో బయపడింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే షూలో మూడు కిలోల బంగారం పెట్టుకుని తనిఖీ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం బయటపడుతుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో అధికారుల హస్తం కూడా ఉండవచ్చుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2కిలోల బంగారం..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు చేసిన తనిఖీల్లో రెండులో కిలోల బంగారం బయపడింది. దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ఎస్వీయూలో ర్యాగింగ్ కలకలం..

తిరుపతి : ఎస్వీయూలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చాయి. 

08:36 - August 17, 2015

ప్రత్యేక హోదా అంశంపై ఏపీ శాసనసభలో తీర్మానం చేశారా ? ఎందుకు చేయడం లేదని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా..తెలంగాణ రాష్ట్రంలో గ్రామజ్యోతి..ప్రభుత్వ భూముల విక్రయం తదితర అంశాలపై టెన్ టివిలో 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..
ప్రత్యేక హోదా..రాజకీయ అవకాశ వాదమే..
''అధికారంలో ఉన్న వారు తమను తాము సమర్థించుకోవడానికి బీహార్ ను చూపిస్తుంటారు. ప్రత్యేక హోదా విషయంలో ఒడిశా శాసనసభ తీర్మానం చేసింది. రాష్ట్ర రాజకీయ నాయకత్వం ఏపీ ప్రజలను వెర్రివాళ్లను అనుకొంటోంది. ఇంతవరకు ఏపీ శాసనసభ తీర్మానం చేయలేదు. సరైన సమయంలో చూద్దామని సీఎం పేర్కొంటున్నారు. శాసనసభ తీర్మానం ప్రకారం చేస్తామని కేంద్రం అంటే ఏపీది అంతే సంగతి. తీర్మానం చేయాలనడం ఒక బేసిక్ డిమాండ్. చేయకపోవడం ఒక విధంగా రాజకీయ అవకాశ వాదమే దీనికి కారణం. 175 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరూ కూడా ఎందుకు మాట్లాడడం లేదు. టివిలు..కెమెరాల ఎదుట మాట్లాడుతున్నారు. కేంద్రం ఇస్తే ఇస్తుంది. లేకపోతే లేదు. తీర్మానం చేస్తే కేంద్రం వత్తిడి వచ్చే అవకాశం ఉంది. భారత పార్లమెంట్ అంగీకరించింది. ప్రభుత్వాలు మారినా ఈ చట్టాలకు విలువ ఉంటుంది. రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే పన్నుల రాయితీలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు ఆందోళన చెందే అవకాశం ఉంది. ఇక్కడ ఇతర రాష్ట్రాల పరిస్థితి వేరు. ఏపీది వేరు.
గ్రామజ్యోతిపై విమర్శలు..
ప్రభుత్వాలు ప్రణాళికలపై కొన్ని వాగ్ధానాలు చేస్తున్నాయి. తరువాత ఏమి ఉండడం లేదు. ఇటీవలే ఇంటింటి సర్వే నిర్వహించారు. ఆ విషయాలను వెల్లడించడం లేదు. అంత పెద్ద సర్వే ఎందుకు జరిపారు ? మన ఊరు ప్రణాళిక అన్నారు. ఇది మధ్యలో ఆగిపోయింది. అందుకనే విమర్శలు వస్తున్నాయి. గ్రామీణాభివృద్ధికి అదనంగా నిధులు కేటాయిస్తున్నారా ? అదనంగా నిధులు సేకరిస్తేనే ప్రయోజనం ఉంటుంది. కార్యకర్తలకు పంపిణీ కార్యక్రమంగా ఉంటుందా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గతంలో ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అనుమానాలను ప్రభుత్వం సీరియస్ గా పరిగణించాలి.
ప్రభుత్వ భూముల వేలం..
ప్రభుత్వ అవసరాలు రోజు రోజుకు పెరుగుతాయి. గతంలో ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం భూములు అమ్మితే టీఆర్ఎస్ తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వం అవసరాలు ఏంటనేది అంచనా వేశారా ? రంగారెడ్డి జిల్లాలో తాను ఎమ్మెల్సీ ఉన్న హాయాంలో రూ.3300 కోట్ల భూములు అమ్మారు. కొట్లాడితే ఒక డిగ్రీ కాలేజీ ఇచ్చారు. అవసరాలకు మించి భూమి ఉంటే ఆలోచించవచ్చు. ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేసి కమర్షియల్ గా ఆలోచించాలి'' అని నాగేశ్వర్ తెలిపారు.

08:01 - August 17, 2015

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్రం ఇస్తుందా ? లేదా ? అన్నది ఇంకా తేలడం లేదు. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే వైసీపీ పోరుబాట పట్టింది. ఇక బీహార్ కూడా తమకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు హోదా అంశంపై అధికార పక్షానికి చెందిన నేతలు తలోమాట మాట్లాడుతున్నారు. ఈ అంశంపై కేంద్రంతో మాట్లాడేందుకు సీఎం చంద్రబాబు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగి చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), బి.శ్రీరాములు (టిడిపి), మల్లాది విష్ణు (కాంగ్రెస్), మేరుగు నాగార్జున (వైసీపీ), విష్ణువర్ధన్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

మళ్లీ సరిహద్దులో కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ మరో మారు కాల్పులకు దిగింది. సౌజియాన్ సెక్టార్ లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడింది. భద్రతా దళాలు కాల్పులను తిప్పికొడుతున్నాయి. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.

07:21 - August 17, 2015

కాలిఫోర్నియా : బాలీవుడ్ సినీ నటి రవీనా టాండన్ కు లాస్ ఎంజిల్స్ లో చేదు అనుభవం ఎదురైందంట. అది భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున. తనకు జరిగిన అనుభవం గురించి 'రవీనా' ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. లాస్ ఎంజిల్స్ లో జరిగిన ఇండిపెండెన్స్ వేడుకల్లో తాను పాల్గొనడం జరిగిందని తెలిపింది. కానీ స్టేజిపై ఉన్న వ్యక్తి తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడాని ఆరోపించింది. ఆ సమయంలో ఆ వ్యక్తి ఫుల్ గా మందు కొట్టి ఉన్నాడని, ఆ వ్యక్తికి చెందిన పిల్లలను తన కారులో తీసుకరాకపోవడమే కారణమని పేర్కొంది. తన కారులో తెచ్చేందుకు సెక్యూర్టీ, ప్రొటోకాల్ సహకరించలేదని, దీనిపై స్టేజిపై ఉన్న ఇతరులకు చెప్పడం జరిగిందని తెలిపింది. ఆ వ్యక్తిని దూరంగా తీసుకెళ్లిన అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగినా మూడ్ ఆఫ్ అయ్యిందని 'రవీనా' ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. 

నేటి నుండి ఎంబీబీఎస్ ప్రత్యేక కోటా ధృవపత్రాల పరిశీలన..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రత్యేక కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం సోమవారం నుండి ధృవపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. 

మెదక్ లో హరీష్ రావు పర్యటన..

మెదక్ : జిల్లాలో తెలంగాణ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. సిద్ధిపేట మండలంలోని ఇబ్రహీంపూర్, మాదిండ్లలో గ్రామజ్యోతి కార్యక్రమంలో హరీష్ పాల్గొనున్నారు. 

కరీంనగర్ లో ఎంపీ కవిత పర్యటన..

కరీంనగర్ : జిల్లాలో ఎంపీ కవిత పర్యటించనున్నారు. జగిత్యాల మండలం చెల్గల్ లో 'మన ఊరు మన ఎంపీ' కార్యక్రమాన్ని కవిత ప్రారంభించనున్నారు. 

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 11గంటల సమయం పడుతుండగా నడకదారిన వచ్చే భక్తులకు ఐదు గంటల సమయం పడుతోంది. 

నేడు శ్రీకాకుళంలో కామినేని పర్యటన..

శ్రీకాకుళం : ఏపీ మంత్రి కామినేని జిల్లాలో పర్యటించనున్నారు. నర్సన్నపేట, టెక్కలి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కామినేని పాల్గొననున్నారు.

 

06:42 - August 17, 2015

ప్రయివేట్ స్కూళ్ల ఫీజులు దడపుట్టిస్తున్నాయి. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా స్కూల్ ఫీజుల భారం రోజురోజుకి పెరుగుతోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? స్కూల్ ఫీజులను నియంత్రించే శక్తి మన ప్రభుత్వాలకు లేదా? స్కూల్ ఫీజుల వల్ల మధ్యతరగతి అనుభవిస్తున్న కష్టాలేమిటి? అమ్మానాన్నల మీద స్కూల్ ఫీజుల భారం తగ్గాలంటే ప్రభుత్వం తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ అంశంపై టెన్ టివి 'జనపథం'లో మాట్లాడేందుకు హెచ్ఎస్పీఏ అధ్యక్షులు ఆశిష్ విశ్లేషించారు.

 

06:41 - August 17, 2015

ఒకప్పుడు బడికి వెళ్లాలంటే పిల్లలు భయపడేవారు. కానీ ఇప్పుడు పిల్లలను స్కూళ్లకు పంపించాలంటే అమ్మానాన్నలు భయపడే రోజులు వచ్చాయి. ఒకరికి మించి పిల్లలను కనాలన్నాఇవాళ నవదంపతులు భయపడుతున్నారు. దీనికి ఏకైక కారణం రోజురోజుకీ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న స్కూల్ ఫీజులు.
కిలోల కొద్ది పుస్తకాల బ్యాగులు..
కాలం మారింది. చదువు సంధ్యల ఆవశ్యకత పెరిగింది. ఈ పోటీ యుగంలో కేవలం నాలుగు అక్షరాలు చదువుకుంటేనే సరిపోదు. పాస్ సర్టిఫికెట్లు సాధిస్తేనే సరిపోదు. పోటీ యుగానికి తగ్గట్టుగా నాలెడ్జ్ లెవల్స్ పెంచుకోవాలి. ర్యాంక్ ల సాధనలో దూసుకెళ్లాలి. ఇప్పటి అవసరాలకు, వాతావరణాన్ని తగ్గట్టుగానే పిల్లలు కష్టపడుతున్నారు. నిద్రహారాలు మాని పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. ఎముక బొక్కలు ముదరకముందే కిలోల కొద్ది పుస్తకాల బ్యాగులు మోస్తున్నారు.
ప్రయివేటు స్కూళ్లపై తల్లిదండ్రుల మొగ్గు..
పిల్లలను బాగా చదివించాలన్న కాంక్ష, పట్టుదల అమ్మానానల్లో పెరుగుతోంది. అప్పు చేసి మరీ పిల్లలను చదివిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. రెక్కాడితేనే డొక్కాడని పేదలు సైతం తమ పిల్లలను మంచి స్కూళ్లలో చదివించేందుకు ఆరాటపడుతున్నారు. కానీ, దురదృష్టవశాత్తు చాలా ప్రభుత్వ స్కూళ్లు పిల్లల, అమ్మానాన్నల కోరికలకు, అంచనాలకు తగ్గట్టుగా పని చేయలేక పోతున్నాయి. దీంతో తమ పిల్లలను ప్రయివేట్ స్కూళ్లల్లో చేర్పించాల్సిన అనివార్య పరిస్థితుల్లో అనేకమంది పేరెంట్స్ చిక్కుకున్నారు.
విపరీతంగా పెరిగిన ఫీజులు..
అయితే, గత నాలుగైదేళ్ల కాలంలో ప్రయివేట్ స్కూళ్లలో ఫీజులు విపరీతంగా పెరిగాయి. తమ పిల్లలను ఒక మోస్తరు స్కూళ్లో చదివించాలన్నా ఒక్కొక్కరికి నెలకు కనీసం అయిదు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన స్థితిలో మధ్యతరగతి విలవిలాడుతోంది. కొన్ని స్కూళ్లు ఏడాదికి లక్ష, లక్షన్నర దాకా వసూలు చేస్తున్నాయంటే ఈ వ్యాపారం ఏ స్థాయికి చేరిందో ఊహించుకోవచ్చు.

ఆశించిన ప్రమాణాలు ఎక్కడ ?
ఇంతగా ఫీజులు ధారపోస్తున్నా చాలా ప్రయివేట్ స్కూళ్లల్లో పేరెంట్స్ ఆశించిన ప్రమాణాలు కనిపించడం లేదు. అనేక స్కూళ్లలో కనీస ట్రయినింగ్ లేని వారితోనే పాఠాలు చెప్పిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి కనీసం ఆటస్థలాలుండవు. క్రీడా పరికరాలుండవు. పిల్లల వయస్సుకి మించిన హోం వర్క్ లు, అసైన్ మెంట్లు ఇవ్వడంలో ప్రయివేట్ స్కూళ్లు పోటీపడుతున్నాయి. అసలు అసైన్ మెంట్లు పిల్లలకు ఇస్తున్నారో, పేరెంట్స్ కి ఇస్తున్నారో అర్ధంకాని పరిస్థితి ఇవాళ అనేక ప్రయివేట్ నెలకొంది. పిల్లలు టిఫిన్స్, లంచ్ సరిగా చేస్తున్నారో లేదో పట్టించుకోరు. మంచినీళ్లు తాగుతున్నారో లేరో పట్టించుకోరు. అనేక ప్రయివేట్ స్కూళ్లల్లో టాయ్ లెట్స్ ని వినియోగించుకోవాలంటే పిల్లలు భయపడుతున్నారు. వేలకు వేలు ఫీజులు తీసుకునే యాజమాన్యాలు కనీసం టాయ్ లెట్స్ నిర్వహణ మీద కూడా శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో పిల్లలు తరచూ కడుపునొప్పి బారిన పడుతున్నారు. మొత్తానికి ప్రయివేట్ స్కూళ్లలో ఫీజులు భారం పెరగడమే కాకుండా, వాటి పోకడలు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాలను కూడా నాశనం చేస్తున్న పరిస్థితే కనిపిస్తోంది.ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి..
ప్రయివేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజుల వసూళ్ల విషయంలోనూ, పుస్తకాల మోత విషయంలోనూ, ఆట పాటల విషయంలోనూ, క్లాసుల నిర్వహణ, టైమింగ్స్ విషయంలోనూ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నా వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు ఏమాత్రం ప్రయత్నించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ప్రయివేట్ స్కూళ్ల ఫీజుల దందాకు కళ్లెం వేయాలి. ప్రయివేట్ స్కూల్ యాజమాన్యాలు తమ చిత్తమొచ్చినట్టు ప్రవర్తించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. 

06:33 - August 17, 2015

ఢిల్లీ : వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ కోసం.. మాజీ సైనికుల ఆందోళన కొనసాగుతోంది. జూన్‌15 నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఒకే హోదాలో రిటైర్‌ అయిన వారికి సమానమైన పెన్షన్లు అందటం లేదని కొందరు సీనియర్ల కంటే జూనియర్లకే ఎక్కువ పెన్షన్‌ వస్తోందని విశ్రాంత ఆర్మీ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కరించమని కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్‌ ర్యాంక్ వన్‌ పెన్షన్‌ అమలు చేసేంత వరకూ రిలేదీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

06:32 - August 17, 2015

దుబాయి : మరో చారిత్రక పర్యటనకు భారత ప్రధాని నరేంద్రమోడీ వెళ్లారు. 34 ఏళ్ల తర్వాత యూఏఈకి వెళ్లిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పర్యటించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం సంబంధాలు బలోపేతం చేయటమే లక్ష్యంగా... మళ్లీ ఇన్నాళ్లకు మోడీ యూఏఈ కు వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు.
ఘన స్వాగతం..
రెండ్రోజుల పర్యటనకు వెళ్లిన మోడీకి... అబుదాబి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. యూఈఏ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్ బిన్ జాయెద్‌... మోడీని ఆత్మీయంగా పలకరించారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. 6గంటల 30 నిమిషాలకు మోడీ... షేక్ జాయెద్ మసీదును సందర్శించారు. 7 గంటలకు ఇండియన్ లేబర్‌ క్యాంపునకు వెళ్లారు.
తీవ్రవాదం సహా ఒకేరకమైన సమస్యలు..
తీవ్రవాదం సహా పలు విషయాల్లో ఒకే రకమైన సమస్యలను భారత్‌, యూఈఏ ఎదుర్కొంటున్నాయి. ఈ అంశాలే ఇరు దేశాల మధ్య చర్చల్లో ప్రధాన అజెండాగా వుంటాయని ఇండియా నుంచి బయల్దేరే ముందు మోడీ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పెట్టుబడులకు యూఏఈ నమ్మకమైన దేశంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కోటానికి రెండు దేశాలు రెగ్యులర్‌గా సహకరించుకుంటున్నట్లు మోదీ తెలిపారు.
నేడు దుబాయ్ కు ప్రధాని..
ప్రధాని మోదీ సోమవారం దుబాయ్ వెళ్తారు. యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్ బిన్ జాయెద్‌ తో చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక సంబంధాలు మరో ఎత్తుకు తీసుకెళ్లటమే లక్ష్యంగా చర్చలు వుంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఐఎస్ఐఎస్ అంశమూ ప్రస్తావనకు రావొచ్చని తెలుస్తోంది. ఈ సమావేశానికి యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని సైతం హాజరవుతారు.
భారతీయులతో ప్రత్యేక సమావేశం..
యూఈఏలో 2.6 మిలియన్ ఇండియన్లు వున్నారు. అందుకే ఇది మినీ ఇండియాలా తనకు అనిపిస్తుంటుందని మోడీ వ్యాఖ్యానించారు. ఇక అక్కడ వుంటోన్న భారతీయులతో ప్రధాని మోడీ సోమవారం ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

06:28 - August 17, 2015

హైదరాబాద్ : గ్రామజ్యోతి కార్యక్రమంపై టీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. నామినేటెడ్‌ పదవులు పొందేందుకు ఇది ఎంట్రెన్స్‌ లాంటిదన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. అందుకే బాస్‌ నుంచి మంచి మార్కులు కొట్టేందుకు ఆయనకు ఇష్టమైన గ్రామజ్యోతిని వేదికగా చేసుకోవాలని టీఆర్ఎస్‌ నాయకులు తపన పడుతున్నారు. అయితే వారి దూకుడుకు క్షేత్రస్థాయిలోని సమస్యలు స్పీడ్‌ బ్రేకర్స్ లా మారుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు.. పార్టీ శ్రేణులూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని గులాబీ దళపతి పిలుపునిచ్చారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు.. గ్రామజ్యోతిలో మమేకమయ్యేందుకు సన్నద్ధమవుతున్నారు.
త్వరలోనే నామినేటెడ్‌ పదవుల భర్తీ..
త్వరలోనే నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటినా నామినేటెడ్‌ పదవుల ఊసెత్తని సీఎం.. ఈ ప్రకటన ద్వారా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు. పైగా పార్టీ శ్రేణులందరూ గ్రామజ్యోతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న నేతలతో పాటు.. నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న నేతలకు సీఎం ప్రకటన నిజంగానే కొత్త ఆశలు చిగురింప చేసింది. దీంతో ఇలాంటి వారంతా గ్రామజ్యోతిలో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించారు.
వారం రోజుల పాటు కార్యక్రమాలు..
వారం రోజుల పాటు నిర్వహించే గ్రామజ్యోతి పథకం గ్రామసభలు గ్రామాల రూపు రేఖలు మారుస్తాయో లేదో గాని పార్టీ నేతలను మాత్రం ఒక్కత్రాటిపై తెచ్చుకునేందుకు అధికార పార్టీ వ్యూహం ఫలిస్తున్నట్లుగానే ఉంది. గ్రామసభల ద్వారా వచ్చే ప్రతిపాదనల్లో అధికార పార్టీకి చెందిన నేతలు సూచించిన వాటికే ఎక్కువ ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయి. అయితే నామినేటెడ్‌ పదవులపై ఆశలతో.. గ్రామజ్యోతి బరిలోకి దిగుతున్న నేతలకు.. పెన్షన్లు, రేషన్ కార్డుల పంపిణీపై ప్రజల్లోని అసంతృప్తి ఇబ్బందికరంగా మారుతుందన్న ఆందోళన వేధిస్తోంది. 

06:25 - August 17, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ప్రజలు సూచించిన మేరకు గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశంగా చెబుతోంది. దీని ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయని కేసీఆర్‌ సర్కారు ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ప్రజల దృష్టిని మళ్లించేందుకు సర్కారు ఎత్తుగడగా విపక్షాలు గ్రామజ్యోతిని అభిర్ణిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గ్రామజ్యోతిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లిలో ప్రారంభించనున్నారు. పంచాయతీని అన్ని విధాలుగా పటిష్ట పరచడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. గ్రామంలో రహదారులు, మురుగు కాలువలు, వీధిదీపాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, కూలీల ఉపాధి, హరితహారం తదితర మౌలిక వసతులను మెరుగు పరుస్తారు. గ్రామజ్యోతిలో భాగంగా పంచాయతీల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న సేవలను మరింత మెరుగు పరచాలని నిర్ణయించారు.
సమస్యలు వంద శాతం నిర్మూలించాలన్నదే లక్ష్యం..
పంచాయతీల్లో పారిశుద్ధ్యం, వైద్యం, విద్య, పౌష్టికాహారం, పేదరిక నిర్మూలనలు వంద శాతం నిర్మూలించాలన్నది సర్కారు యోచన. అందుకే మెరుగైన ఫలితాలు సాధించేలా గ్రామాల మధ్య పోటీ పెట్టాలనీ ప్రభుత్వం యోచిస్తోంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామాలకు అదనపు నిధులు ఇస్తామని ప్రకటించింది.
విపక్షాల పెదవి విరుపు..
పంచాయతీల్లో వంద శాతం పన్నుల వసూళ్లు, ఇంటింటి సర్వే నిర్వహణలతో పాటు.. చెరువుల మరమ్మతులు, సుందరీకరణ అంశాలనూ గ్రామజ్యోతిలో పొందుపరిచారు. అయితే గ్రామజ్యోతి కార్యక్రమంపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. మన ఊరు మన ప్రణాళిక రూపొందించి ఏడాది దాటినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మొత్తానికి గ్రామజ్యోతి ద్వారా.. మంత్రులు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు.. వచ్చే పది రోజులూ.. గ్రామాల చుట్టూ ప్రదక్షిణలు చేయనున్నారు. 

యూఏఈలో ప్రధాని మోడీ రెండో రోజు పర్యటన..

దుబాయి : భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండో రోజు యూఏఈలో పర్యటించనున్నారు. దుబాయిల్ లో మోడీ ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో మోడీ ప్రసంగం కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు 50 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. 

నూట్రాసిటీ కెమికల్ ఫ్యాక్టరీపై గ్రామస్తుల దాడి..

నెల్లూరు : వింజమూరు మండలం చంద్రపడియలో నూట్రాసిటీ కెమికల్ ఫ్యాక్టరీపై గ్రామస్తులు దాడికి యత్నించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి గ్రామస్తులను అడ్డుకుని లాఠీఛార్జీ చేశారు. ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న విషవాయువుల వల్ల రోగాల బారిన పడుతున్నామని, దీనిని మూసివేయాలని కొన్నేళ్లుగా గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు.

నేడే గ్రామజ్యోతి పథకం ప్రారంభం...

హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో గంగదేవునిపల్లిలో సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 11.45గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. 

కర్నూలులో నేడు బాబు పర్యటన..

కర్నూలు : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్ తో పాటు మెగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు శంకుస్థాపన చేయనున్నారు. 

మైనార్టీల సమస్యలపై సీపీఎం పోరాటం..

హైదరాబాద్ : మైనార్టీల సమస్యలపై నేడు అన్ని జిల్లాల కలెక్టరేట్ ల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ లు కల్పించాలని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని, వక్ఫ్ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. 

Don't Miss