Activities calendar

18 August 2015

కిడ్నాప్ కు యత్నించిన ఆటో డ్రైవర్ కు దేహశుద్ధి...

కర్నూలు : జిల్లాలో రోజురోజుకు దొంగల బెడద పెరిగిపోతుంది. నంద్యాల సలీంనగర్‌లో ఓ మహిళను కిడ్నాప్ చేసేందుకు ఆటో డ్రైవర్ యత్నించాడు. ఆ మహిళ తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ పెనుగులాటలో ఆటో బోల్తా పడటంతో డ్రైవర్‌ను స్థానికులు పట్టుకున్నారు. అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోల్లో ప్రయాణించేటప్పుడు మహిళలు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. ఆటోల్లో ఎవరైనా మహిళలు ఉంటేనే ఆటో ఎక్కాలని చెప్పారు.

తెలంగాణ సీఎస్ దూషించారని ఏపీ డీఐజీ ఫిర్యాదు...

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తనను అవమానించారంటూ ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అధికారి డీఐజీ హోదాలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వ సచివాలయానికి తనను పిలిపించి అవమానించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

వెలుగొండ ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు మృతి

ప్రకాశం : జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మీతి చెందారు. మృతులు కొనకనమిట్ల మండలం పాతపాడుకు చెందిన మనోజ్ కుమార్, సాయికృష్ణలుగా గుర్తించారు.

21:32 - August 18, 2015

హైదరాబాద్ : ఎన్నికల వేళ...బీహార్‌కు ప్రధాని వరాల జల్లు కురిపించారు. ఒకటి కాదు... రెండు కాదు... లక్షా 25 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. నేతల అహంకారమే బీహార్‌ను సర్వ నాశనం చేసిందని ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నుద్దేశించి ప్రధాని నరేంద్రమోది ఘాటుగా విమర్శించారు. మోది ప్రకటించినవన్నీ పాత ప్రాజెక్టులేనని నితీష్‌ ఎదురుదాడికి దిగారు.

త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు...

బీహార్‌ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోది జనాలను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇప్పటికే రెండుసార్లు బీహార్‌ ఎన్నికల సభల్లో పాల్గొన్న మోది- ముచ్చటగా మూడోసారి పర్యటించారు. ఇందులో భాగంగా ప్రధాని ఆరాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. పాట్నా-బక్సర్‌ నాలుగు లైన్ల హైవే రహదారికి శిలా ఫలకం వేశారు. ఈసారి పర్యటనలో వివిధ అభివృద్ధి పనుల కింద బీహార్‌కు లక్షా 25 వేల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించారు. అంతేకాదు వివిధ ప్రాజెక్టుల కింద రాష్ట్రానికి మరో 40 వేల కోట్లు అదనంగా రానున్నాయని పేర్కొన్నారు.

లాలూ, నితీష్‌లను టార్గెట్‌ గా మోదీ ప్రసంగం...

అనంతరం సహర్‌సా ఎన్నికల సభలో మోది ప్రసంగిస్తూ లాలూ, నితీష్‌లను టార్గెట్‌ చేశారు. నేతల అహంకారమే బీహార్‌ను సర్వ నాశనం చేసిందని ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నుద్దేశించి ప్రధాని ఘాటుగా విమర్శించారు. కోసి వరదల సందర్భంగా గుజరాత్‌ నుంచి 5 కోట్ల చెక్‌ బీహార్‌కు పంపిస్తే నితీష్‌ దాన్నీ తిప్పి పంపడమే ఇందుకు నిదర్శమన్నారు.

తీవ్రంగా స్పందించిన నితీష్ కుమార్...

ప్రధాని వ్యాఖ్యలపై నితీష్‌ తీవ్రంగా స్పందించారు. స్పెషల్‌ ప్యాకేజీ బీహార్‌ హక్కుగా పేర్కొన్నారు. తనని యాచకుడిగా చెబుతుంటే అహంకారినెలా అవుతానని ప్రశ్నించారు. మోది ప్రకటించిన దాంట్లో కొత్త ప్రాజెక్టులేవి లేవని నితీష్‌ స్పష్టం చేశారు. ఒక్క కోడిని ఎన్నిసార్లు హలాల్‌ చేస్తారని ధ్వజమెత్తారు.

రాజకీయ అవినీతే అంటున్న సీపీఎం...

ఎన్నికల ముందు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం రాజకీయ అవినీతి కిందకే వస్తుందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. కేంద్రం స్కీములనే బీహార్‌కు ఇస్తున్నారా...లేక కొత్తగా ఏవైనా ప్రకటిస్తున్నారా అన్నది మోది స్పష్టం చేయాలన్నారు.ఎన్నికల సందర్భంగా ప్రధాని బీహార్‌కు ప్యాకేజీ ప్రకటించడం రాద్దాంతంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాలు కూడా స్పెషల్‌ ప్యాకేజీ కోసం డిమాండ్‌ చేయనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

21:24 - August 18, 2015

హైదరాబాద్ : ప్రత్యేక హోదా అంశం ఏపీలో మరోసారి చర్చనీయాంశమైంది. ఎన్నికల నేపథ్యంలో బీహార్‌ రాష్ట్రానికి లక్షా 65 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం... ఏపీని ఎందుకు విస్మరిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి.

ప్రత్యేక హోదా వచ్చే వరకు చంద్రబాబు ఢిల్లీలోనే ఉండాలన్న రఘువీరా..

స్పెషల్‌ స్టేటస్‌ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమైంది. ఎన్నికల నేపథ్యంలో బీహార్‌ రాష్ట్రానికి లక్షా 65 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఏపీ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. ప్రత్యేక హోదా వచ్చే వరకు చంద్రబాబు ఢిల్లీలోనే ఉండాలని హోదాతో పాటు ప్యాకేజీని సైతం సాధించాలని ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి కోరారు.

రాష్ట్ర ప్రభుత్వంపై పోరు తప్పదు : వైసీపీ

మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్‌ను వంచిస్తున్నాయని.. వైఎస్‌ఆర్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఆపార్టీ నేతలు విమర్శించారు. రాబోవు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై పోరు తప్పదని హెచ్చరించారు. లబ్ది చేకూరుతుందనుకుంటేనే కేంద్రం నిధులు విడుదల చేస్తుందని.. లేదంటే అటు వైపైనా చూడటం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఈనెల 29న ఏపీ బంద్‌ తలపెట్టినట్లు వైసీపీ నేతలు తెలిపారు.

బీజేపీని అపఖ్యాతిపాలు చేసేందుకే అంటున్న మంత్రి మాణిక్యాలరావు..

మరోవైపు స్పెషల్‌ స్టేటస్‌ విషయంలో బీజేపీని అపఖ్యాతిపాలు చేసేందుకు విష ప్రచారం చేస్తున్నారని ఏపీ రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు విమర్శించారు. విభజన విషయంలో బీజేపీ నేతలు తప్ప ఏ పార్టీ నేతలు సరైన సూచనలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్‌ వల్లే అడ్డగోలు విభజన జరిగిందని మాణిక్యాలరావు విమర్శించారు. మొత్తానికి అధికార విపక్ష నేతల మాటలతో స్పెషల్‌ స్టేటస్‌ అంశం ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌ టాఫిక్‌గా మారింది.

హల్ చల్ చేస్తోన్న త్రిష 'నాయకి' పోస్టర్

త్రిష ప్రధాన పాత్రలో నిర్మించనున్న హర్రర్ కామెడీ చిత్రం 'నాయకి' ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్రిష ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వెంటనే పోస్టర్ అద్భుతంగా ఉందంటూ నటులు రానా, ప్రియమణి, హన్సికలు త్రిషకు అభినందనలు తెలిపారు. గోవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు 20 న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తోంది.

20:36 - August 18, 2015

హైదరాబాద్ : అరుంధతిలో జేజెమ్మ, బిల్లాలో హాట్ హీరోయిన్, బాహుబలి, రుద్రమదేవి సినిమాలలో కత్తు యుద్దాలు, మాసిపోయిన పాత్రలు, సైజు జీరోలో తమిళ్ హీరో ఆర్యన్ కి జోడిగా బాగా లావుగా ఉన్న పాత్ర… ఈ చిత్రాలు చాలేమో… నటిగా అనుష్క చాలెంజింగ్ పాత్రలు చెయ్యడానికి ఎంతగా ఇష్టపడుతుందో చెప్పడానికి… సాటి హీరోయిన్ లు ఒకరికి మించి ఒకరు హాట్ గా ఉండడానికి ప్రయత్నాలు చేస్తుంటే, కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు తియ్యడానికి సిద్దమవుతుందంటే ఆమెను మనస్పూర్తిగా అభినందించాల్సిందే. సైజు జీరోలో ఆమెను చుసిన తరువాత సాటి హీరోయిన్ లు కూడా అనుష్కను అభినందించకుండా ఉండలేకున్నారు.

తెలంగాణ ఎడ్ సెట్ లో గోల్ మాల్

హైదరాబాద్ : తెలంగాణ ఎడ్ సెట్ లో గోల్ మాల్ అయ్యింది. ఒకరికి బదులు వేరొకరు పరీక్ష రాసినట్లు గుర్తించారు. ఎడ్ సెట్ లో ఇద్దరు విద్యార్థులకు 100 శాతం మార్కులు వచ్చాయి. ఇద్దరిలో ఒకరికి పరీక్ష రాయకుండానే 100 శాతం మార్కులు వచ్చాయి. అక్రమాలకు పాల్పడిన కృష్ణకాంత్, లింగస్వామి ర్యాంకుల గోల్ మాల్ పై పీసీఎస్ కు కన్వీనర్ ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను పోలీసులు అదపులోకి తీసుకున్నారు.

చిత్తూరు జిల్లాలో గర్భవతులకు చంద్రన్న సీమంతం..

చిత్తూరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లాలో డ్వాక్రా సంఘాల మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అనిమిగానిపల్లెలో పర్యటించిన ఆయన గర్భిణీ స్త్రీలకు సీమంతం నిర్వహించడం విశేషం. చీర, జాకెట్, అరటిపండ్లు అందించి, ఆపై బొట్టు పెట్టి, అక్షింతలు చల్లి సంప్రదాయబద్ధంగా సీమంతం చేశారు. అక్కడే ఉన్న చిన్నారులకు చాక్లెట్లు పంచి వారిని ఉత్సాహపరిచారు. గర్భవతులకు పౌష్టికాహారం కూడా అందించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా సీమంతం జరుపుకున్న ఆ గర్భవతులు ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. 

19:58 - August 18, 2015

హైదరాబాద్ : స్పెషల్‌ స్టేటస్‌ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమైంది. ఎన్నికల నేపథ్యంలో బీహార్‌ రాష్ట్రానికి లక్షా 65 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఏపీ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో టిడిపి ఉదాసీనంగా వ్యవహరిస్తోందా? చట్టం లో లేకుండా బీహార్ కు ప్యాకేజీ ప్రకటించారు...కానీ చట్టంలో పేర్కొన్న ఏపీ ప్రత్యేకప్యాకేజీ ఎందుకు ఇవ్వడంలేదు? బీహార్ ప్యాకేజీ కూడా ఎన్నికల స్టంటేనా? మోడీ తో చంద్రబాబు భేటీ ప్రత్యేక హోదా కోసం కాదా? ఓటుకు నోటు కేసులో తప్పించుకోవడానికేనా? ఇదే అంశాలపై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత తులసి రెడ్డి, వైసీపీ నేత బ్రహ్మానందరెడ్డి, బిజెవైఎం నేత విష్ణువర్థన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, టిడిపి నేత అనురాధ పాల్గొన్నారు. మరి మీరు కూడా ఆ చర్చను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

19:54 - August 18, 2015

హైదరాబాద్ : ఏసీబీ డీజీ ఎకె.ఖాన్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసు తాజా పరిణామాలపై వీరు చర్చించే అవకాశం ఉంది. కేసులో పట్టుబడిన 50 లక్షల గురించి ఎంక్వయిరీ చేస్తున్న అధికారులు టీటీడీ మాజీ ఛైర్మన్‌, దివంగత డికె ఆదికేశవులనాయుడు కుమారుడికి నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఉదయం విచారణకు హాజరైన శ్రీనివాసులనాయుడిని ఏసీబీ అధికారులు ఆరేడు గంటలుగా ప్రశ్నిస్తున్నారు.

19:51 - August 18, 2015

హైదరాబాద్ : అప్పుల ఊబిలో కూరుకుపోయామంటారు. విదేశీ టూర్లకు మాత్రం కోట్లు ఖర్చు చేస్తారు. పైగా నష్టాలకు...సిబ్బందినే బాధ్యులను చేస్తారు. అవే నష్టాలను సాకుగా చూపి..సిబ్బందిని కుందించేందుకు ఆర్టీసీ యోచిస్తోంది. కండక్టర్లను కనుమరుగు చేసేందుకు కుట్రలు చేస్తోంది. నష్టాల సాకుతో...స్మార్ట్‌ మంత్ర పేరుతో...కార్మికులకు పాతరేసేందుకు ప్రయత్నిస్తోంది.

కండక్టర్లను తొలగించే యోచనలో టీఎస్‌ఆర్టీసీ....

టీఎస్‌ఆర్టీసీ నుంచి కండక్టర్లను శాశ్వతంగా తొలగించే ప్రక్రియను ప్రారంభించింది ఆర్టీసి. నష్టాలను సాకుగా చూపి... సిబ్బందిని కుదించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే టిమ్స్‌ సర్వీసుల పేరుతో కండక్టర్లను కుదించిన ఆర్టీసీ...తాజాగా స్మార్ట్‌కార్డుల మంత్రాన్ని జపిస్తోంది.

టీఎస్‌ఆర్టీసీలో సిబ్బంది కొరత....

ఆర్టీసీలో ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అన్నిప్రాంతాల్లో టిమ్స్ సర్వీసు పేరుతో కండక్టర్‌లకు మంగళం పాడారు. యంత్రాల సాయంతో కండక్టర్‌లు లేకుండానే బస్సులను నడుపుతున్నారు. ఈ విధానంతో డ్రైవర్‌పై ఒత్తిడి పెరిగి....ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మి సంఘాలు ఆందోళన చేశాయి. కార్మిక చట్టాలను ఉల్లంఘింస్తున్నారని హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. కార్మికులు ఇష్టపడితేనే అమలు చేయాలని...లేకుంటే నిలిపివేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.

స్మార్ట్‌కార్డులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ యోచన....

ఇది చాలదన్నట్లు మరో పల్లవి అందుకున్నారు ఆర్టీసీ అధికారులు. విదేశాల్లో మాదిరి బస్సుల్లో స్మార్ట్‌కార్డ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఈ విధానంపై సమాలోచనలు చేస్తున్న ఆర్టీసీ...తాజాగా మరోసారి ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. ఈ నూతన విధానంతో ప్రతి ఒక్కరు ఓస్మార్ట్‌ కార్డు కొనుగోలు చేసి..రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కార్డును బస్సు ఎక్కాగానే...స్వైప్‌చేసి ప్రయాణం చేసుకోవచ్చు. మొదట ప్రయోగాత్మకంగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో ప్రారంభించి....ఆ తర్వాత రాష్ట్రమంతా విస్తరించాలని భావిస్తోంది.

స్మార్ట్‌కార్టుల విధానం సాధ్యపడుతుందా..

ఐతే హైదరాబాద్‌ల స్మార్ట్‌కార్టుల విధానం సాధ్యపడుతుందా..అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విదేశాల్లో విశాలమైన రోడ్లు ఉంటాయి. బస్సుల కోసం ప్రత్యేక దారి ఉంటుంది. బస్సులు కూడా సమయపాలన పాటిస్తాయి. ప్రయాణికులు తక్కువ సంఖ్యలో ఉంటారు. కాని ఇక్కడ మాత్రం ఆ పరిస్ధితి లేదు. నగర రోడ్లు, బస్సుల పరిస్థితేంటో అందరికీ తెలుసు. ఏ బస్సు చూసినా...ఫుట్‌బోర్డుపై సర్కస్‌ ఫీట్లు చేసే దృశ్యాలు కనపడతాయి. మరి ఆ తోపులాటలో కార్డును ఎలా స్వైప్‌ చేస్తారనేది...అందరి మదినీ తొలుస్తోంది.

బస్ పాసుల పరిస్థితేంటి?

ఇక సిటీలో ఆరులక్షల మంది హోల్డర్లు ఉన్నారు. నెలకోసారి పాస్‌ తీసుకుంటే ఎన్నిసార్లైనా...ఎక్కడికైనా...వెళ్లవచ్చు. కాని స్మార్ట్‌ కార్డులు వస్తే...పాసుల పరిస్థితేంటని ఉద్యోగస్తులు, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మరి ఇన్ని సవాళ్లను ఎదుర్కొని ఆర్టీసీ స్మార్ట్‌కార్డు వ్యవస్థను ప్రవేశపెడుతుందా.....ఒకవేళ చేసినా అది విజయవంతమవుతుందా...అనే దానిపై మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది.

19:48 - August 18, 2015

ఖమ్మం : పోడు భూముల రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేఖ వైఖరిపై భద్రాచలంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు, పోడు భూముల రైతుల సమితి నాయకులు పాల్గొన్నారు. హరితహారం పేరుతో ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం దారుణమని పలువురు ఆరోపించారు. గిరిజనుల పొట్టకూటి కార్పొరేట్‌ సంస్థలకు భూములు కట్టబెట్టేందుకు సర్కార్‌ యత్నిస్తుందని గిరిజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

19:46 - August 18, 2015

రంగారెడ్డి : హయత్‌నగర్‌ మండలం పెద్ద అంబర్‌పేట సమీపంలో షార్ట్‌సర్క్యూట్‌తో నానో కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో నానో కారు పూర్తిగా కాలిపోయింది. హైదరాబాద్‌కి చెందిన ఓ న్యాయవాది మరో వ్యక్తితో కలిసి ఖమ్మం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్‌పేట ఔటర్‌రింగ్‌ రోడ్డు వద్దకు రాగానే కారులో షార్ట్‌సర్క్యూట్‌ జరిగి ఇంజన్‌ నుంచి మంటలు వచ్చాయి. ఇది గమనించిన కారులో ఉన్న వ్యక్తులు వెంటనే కారును ఆపారు. ఆ తర్వాత మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే క్షణాల్లో కారు మంటల్లో కాలిపోయింది. విషయం తెలుసుకున్న హయత్‌నగర్‌ ఫైర్‌ సిబ్బంది మంటల్ని ఆదుపు చేశారు.    

19:41 - August 18, 2015

హైదరాబాద్ : ప్రత్యేక హోదా అంశం ఏపీలో మరోసారి చర్చనీయాంశమైంది. ఎన్నికల నేపథ్యంలో బీహార్‌ రాష్ట్రానికి లక్షా 65 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం... ఏపీని ఎందుకు విస్మరిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక హోదాను సాధించేవరకు సీఎం చంద్రబాబు ఢిల్లీలోనే పోరాడాలని ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి అన్నారు. టీడీపీ ఉదాసీనత వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదని వైసీపీ ఆరోపించింది. 

19:39 - August 18, 2015

చిత్తూరు : జిల్లా కలెక్టర్ కలెక్టర్ సిద్ధార్థ జైన్ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ రెవెన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. చిత్తూరు గ్రేంపేట్‌లోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రెవిన్యూ ఉద్యోగులు ర్యాలీ చేపట్టి..ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయం బయట ఆత్మగౌరవ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. జిల్లాలో తామంతా ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నా..తమల్ని అకారణంగా అవమాన పరుస్తున్నారంటూ ఉద్యోగులు విమర్శించారు. 

19:37 - August 18, 2015

కడప : జిల్లాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యను వైఎస్‌ జగన్‌ రాజకీయం చేస్తున్నారని ఏపీ హెచ్ ఆర్డీ మినిస్టర్‌ గంటా శ్రీనివాసరావు ఆక్షేపించారు. విద్యార్థుల మృతికి ఎవరు బాధ్యులైనా చర్యలు తప్పవన్నారు. ఆత్మహత్య ఘటనపై త్రిసభ్య కమిటీని వేసినట్లు గంటా చెప్పారు. ఈ కమిటీలో పద్మావతి యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ విజయ లక్ష్మి, ఇంటర్మీడియట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌ మాణిక్యం, కడప డీఆర్వో సభ్యులుగా ఉంటారన్నారు. మూడు రోజుల్లో కమిటీ రిపోర్ట్‌ ఇస్తుందని గంటా చెప్పారు.

19:34 - August 18, 2015

పశ్చిమగోదావరి : నిడదవోలులో మరో కీచక అధ్యాపకుడు వెలుగు చూశాడు. ఎస్ వి.ఆర్.కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోటనీ లెక్చరర్‌ సీహెచ్‌ జాన్‌శామ్యూల్‌ తమ పట్ల అశ్లీలంగా ప్రవర్తిస్తున్నాడని ఉన్నతాధికారులకు విద్యార్ధినులు ఫిర్యాదు చేశారు. తమను కామెంట్‌ చేయడమే కాకుండా... ప్రాక్టికల్స్‌లో 50 మార్కులు రావాలంటే లాడ్జీకి రావాలని బెదిరించాడని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించేవాడని విద్యార్ధులు వాపోతున్నారు. ఇక శామ్యూల్‌ వేధింపులు తట్టుకోలేక కాలేజీ మానుకోవాలని నిర్ణయించుకున్నామని వారు తెలిపారు. విద్యార్దినుల ఫిర్యాదుపై విచారణ జరిపిన విద్యాశాఖ కమిషనర్‌ ఉదయలక్ష్మి... జాన్‌శామ్యూల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క ఇలాంటి కీచక అధ్యాపకుడిని సస్పెన్షన్‌తో సరిపెట్టకుండా... కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధినులు డిమాండ్‌ చేస్తున్నారు. 

కట్నం అడిగినవారంతా దేశద్రోహులే : అక్కినేని అమల

హైదరాబాద్ : కట్నం అడిగిన వారంతా దేశ ద్రోహులు, మహిళా ద్రోహులని సినీ నటి, బ్లూక్రాస్ సోసైటీ చైర్ పర్సన్ అమల అక్కినేని అన్నారు. హైదరాబాదులోని ఎల్బీనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మహిళలు సామాజిక, ఆర్థిక స్వావలంబన సాధించి, దేశానికి గర్వకారణంగా నిలవాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు చేయమని మహిళల నుంచి ఆమె హామీ తీసుకున్నారు. బాలికా విద్య తప్పనిసరి అని చెప్పిన అమల, స్త్రీ, పురుషుల మధ్య తేడా చూపించవద్దని, బాలికలను తక్కువగా చూడవద్దని సూచించారు. మహిళలు కోడలుగా మరో మహిళను తెచ్చుకుంటున్నప్పుడు కట్నం అడగవద్దని చెప్పారు.

మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం..

ప.గో :కొవ్వూరు మండలం దొమ్మేరులో దారుణం జరిగింది. దొమ్మేరు గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులపై నిర్భయ కేసును నమోదు చేశారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

కృష్ణా జిల్లాలో భారీగా చమురు నిక్షేపాలు..

హైదరాబాద్ : ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ (ఓఎన్జీసీ) కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున చమురు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించింది. తీర ప్రాంతాలైన మల్లేశ్వరం, చిన్న ప్రాండ్రాక, నాగాయలంక, బంటుమిల్లి ప్రాంతాల్లో ఓఎన్జీసీ జరిపిన అన్వేషణలో భారీ చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. ఓఎన్జీసీ ఇప్పటికే బంటుమిల్లి ప్రాంతంలో డ్రిల్లింగ్ చేస్తోంది. 4 బావుల నుంచి రోజుకు 110 మెట్రిక్ టన్నుల చమురును వెలికితీస్తోంది. తాజాగా గుర్తించిన డ్రిల్లింగ్ పాయింట్ల నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నుల చమురు లభ్యమయ్యే అవకాశం ఉంది.  

కేసీఆర్ హిట్లర్ ను తలపిస్తున్నాడు: రావుల

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హిట్లర్‌ను తలపిస్తున్నారని టీ.టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులను వెనక్కి తీసుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. మంగళవారం రావుల మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు విచారణను ఏసీబీ చేస్తుందా...టీఆర్‌ఎస్‌ చేస్తుందా అని ప్రశ్నించారు. చార్జ్‌షీటును కోర్టు పరిగణలోకి తీసుకోకముందే మీడియాలో ఎలా వస్తుందని నిలదీశారు. ఏసీబీ కాకుండా మరో ప్రైవేటు ఏజెన్సీ పనిచేస్తోందని ముందు నుంచి చెబుతున్నామని ఆయన అన్నారు. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముద్దాయి కాదని, సాక్షి అని తెలిపారు.

ఆ ప్యాకేజీ భిక్ష కాదు.. హక్కు: నితీష్

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ట్విట్టర్లో స్పందించారు. ప్రత్యేక ప్యాకేజీ భిక్ష కాదని, బీహారీల హక్కని ఆయన స్పష్టం చేశారు. ఎవరి దయాదాక్షిణ్యాలు తమకు అక్కర్లేదని ఆయన తెలిపారు. ఆర్భాటంగా లక్షా పాతిక వేల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పిన మోదీ, దాని వివరాలేంటో వెల్లడించలేదని, వాటి కోసం ఎదురు చూద్దామని అన్నారు. బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎవరి దగ్గరకైనా వెళ్లి కలవాల్సి వస్తే అందుకు తాను సిద్ధమని, తనకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు.   

వర్షాల కోసం యాగాలు.. దేవాదాయ శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్: సకాలంలో వర్షాలను ఆకాంక్షిస్తూ వైదిక క్రతువులను చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ యజ్ఞయాగాదులు, అభిషేకాలునిర్వహించాలని సనాతన సంప్రదాయం ప్రకారం వీటిని పూర్తి చేసేందుకు అన్ని దేవాలయాలు నిర్వహణాధికారాలు చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో నిర్దేశించారు.

రేపు సుబ్రా ముఖర్జీ అంత్యక్రియలు

న్యూఢిల్లీ: భారత ప్రథమ పౌరురాలు సుబ్రా ముఖర్జీ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సతీమణి సుబ్రా ముఖర్జీ నేడు ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని నేటి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతిభవన్‌లో ఉంచారు. అనంతరం తల్కాటోరా రోడ్‌లో గల ప్రణబ్ దంపతుల కొడుకు, ఎంపీ అభిజిత్ ముఖర్జీ నివాసానికి ఆమె భౌతికకాయాన్ని తరలించారు. రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని లోధిరోడ్‌లో గల శ్మాసనవాటికలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

వుడా ఆఫీసు ఎదుట హరితా ప్రాజెక్టు బాధితుల ఆందోళన

విశాఖ :వుడా ఆఫీసు ఎదుట హరితా ప్రాజెక్టు బాధితులు ఆందోళనకు దిగారు. ఇళ్ల నిర్మాణంలో వుడా యంత్రాంగం తాత్సారం వహిస్తోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ నిర్మాణాల్లో చూపించడం లేదని బాధితులు మండిపడ్డారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. బాధితులను పోలీసులను అరెస్ట్ చేశారు.

రాష్ట్రపతి ఉత్తర్వులతోనే లోకల్ స్టేటస్ పరిష్కారం: కృష్ణారావు

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన ఉత్తర్వులతోనే లోకల్ స్టేటస్ పరిష్కారమవుతుందని ఎపి సీఎస్ కృష్ణారావు అన్నారు. బీహార్ తరహాలో ఎపికి ప్రత్యేక ప్యాకేజీ రావొచ్చన్నారు. ఉద్యోగుల తరలింపుకు లోకల్ స్టేటస్ సమస్య కాదని చెప్పారు. విపరీతంగా పెరిగిపోతున్న అద్దెలను కంట్రోల్ చేస్తామని సీఎస్ తెలిపారు. విజయవాడ, గుంటూరులలో రెంట్ కంట్రోల్ యాక్టును తెస్తామన్నారు. 

 

అవినీతి మంత్రులు రాజీనామా చేయాలి..

ఢిల్లీ: అవినీతి మంత్రులు రాజీనామా చేయాలని సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు సీతారాం ఏచూరీ, సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంలో ఏచూరీ, సురవరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏచూరీ మాట్లాడుతూ అవినీతి మంత్రులపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని, నిందితులు మంత్రులుగా ఉండకూడదని సూంచించారు. ఏపీకి ఇచ్చిన వాగ్ధానాలను కేంద్రం నెరవేర్చాలని కోరారు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ఏపీకీ ద్రోహం చేశాయని విమర్శించారు. పార్లమెంట్ జరగపోవడానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. అనంతరం సురవరం మాట్లాడుతూ..

శ్రీనివాసనాయుడిని విచారించిన ఎసిబి

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో శ్రీనివాసనాయుడిని ఎసిబి అధికారులు 6 గంటల పాటు విచారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని పేర్కొన్నారు. విచారణ విషయాలను బయటికి చెప్పలేనని తెలిపారు. రెండు రోజుల్లో విష్ణుచైతన్యను విచారణకు తీసుకువస్తానని చెప్పినట్లు వివరించారు. తాను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని వెల్లడించారు.

 

17:19 - August 18, 2015

బాలీవుడ్‌లో 'ధూమ్‌' సిరీస్‌ మాదిరిగానే 'హౌస్‌ఫుల్‌' సీరిస్‌ కూడా మరింత ఊపందుకుంది. 'హౌస్‌ ఫుల్‌', దీని సీక్వెల్‌ 'హౌస్‌ఫుల్‌ 2' చిత్రాలు విశేష ప్రేక్షకాదరణతో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేశాయి. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ సీరిస్‌కి కొనసాగింపుగా మరో సీక్వెల్‌ 'హౌస్‌ఫుల్‌ 3' చిత్రాన్ని రూపొందించేందుకు దర్శక ద్వయం సాజిద్‌ సామ్‌జీ, ఫర్హాద్‌ సామ్‌జీ రంగం సిద్ధం చేస్తున్నారు. అక్షయ్ కుమార్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, అభిషేక్‌ బచ్చన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, నర్గీస్‌ఫక్రీ, లిసా హైడెన్‌లతో పాటు జాకీషరాఫ్‌ వంటి భారీ తారాగణంతో ఈచిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత సాజిద్‌ నడియడ్‌వాలా సన్నాహాలు చేస్తున్నారు. 'హౌస్‌ఫుల్‌', 'హౌస్‌ఫుల్‌2' చిత్రాల్లో అక్షయ్ కుమార్‌, రితేష్‌ నటించిన సంగతి తెలిసిందే. 'హౌస్‌ఫుల్‌ 3' చిత్రంలో వీరితోపాటు తాజాగా అభిషేక్‌బచ్చన్‌ నటిస్తున్నారు.

 

ఆ రిజర్వాయర్ నిర్మాణంతో పాలమూరుకు అన్యాయం: జితేందర్ రెడ్డి

మహబూబ్ నగర్: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న గిరిజాపూర్ రిజర్వాయర్ తో పాలమూరుకు అన్యాయం జరుగుతుందని మంత్రి జితేందర్ రెడ్డి తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న గిరిజాపూర్ రిజర్వాయర్ ను పరిశీలించామని చెప్పారు. కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కేంద్ర దృష్టికి తీసుకెళ్తామన్నారు. మంత్రి హరీష్ రావుతో సమీక్షించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

16:31 - August 18, 2015

'జంగిల్‌బుక్‌' చిత్రం మరోమారు త్రిడిలో రానుంది. అడవిలో రకరకాల జంతువుల మధ్య జరిగే ఆసక్తికర సంఘటనలతో ఆద్యంతం సాహసోపేతంగా, వినోదాత్మకంగా 1967లో వాల్ట్‌ డిస్నీ పిల్లల కోసం రూపొందించిన 'జంగిల్‌ బుక్‌' అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 3డిలో సరికొత్తగా మరోమారు 'జంగిల్‌బుక్‌'ను వాల్ట్‌ డిస్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఫస్ట్‌లుక్‌ని సోమవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి జోన్‌ ఫేవ్‌ర్యూ దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో విడుదలయ్యే ఈ 3డి 'జంగిల్‌ బుక్‌' సైతం విశేష ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకంతో వాల్ట్‌ డిస్నీ నిర్వాహకులున్నారు.

16:31 - August 18, 2015

చిత్తూరు : కుప్పం నియోజకవర్గంలో ఏసీ చంద్రబాబు పర్యటిస్తున్నారు. కుప్పంలో డ్వాక్రా మహిళా సంఘాలతో ఆయన చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటికి నేరుగా పెన్షన్ పంపిన ఘనత తమదేనని చంద్రబాబు అన్నారు. రేషన్ నిబంధనలను సవరించి...ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యాన్ని ఇస్తున్నామని చెప్పారు. 20 రూపాయలకే ఉల్లిగడ్డలు విక్రయించి...పేదలను ఆదుకున్నామని స్పష్టం చేశారు.

 

16:29 - August 18, 2015

కర్నూలు : సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా కార్మికులు చేపట్టనున్న సమ్మె ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామని సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ అన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర కర్నూలు జిల్లాకు చేరుకుంది. కార్మికుల జోలికి వస్తే టీడీపీ, బీజేపీకి గుణపాఠం తప్పదన్న గఫూర్‌.. ప్రభుత్వాలు వెంటనే పద్ధతి మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు.

16:27 - August 18, 2015

హైదరాబాద్ :నగర శివార్లలో కల్తీ డీజిల్ తయరుచేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్ ఓపీ పోలీసులు అరెస్ట్ చేశారు.. సుమారు 35 వేల లీటర్ల నకిలీ డీజిల్, బ్లూ కిరోసిన్‌ ఉన్న రెండు ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నారు.. మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హేమనగర్లో ఈ దందా జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది.. ఈ స్థావరంపై ఎస్ఐరాములు బృందం దాడిచేసింది.. ఈ డీజిల్‌ను నగరంలోని వివిధ పరిశ్రమలకు సరఫరా చేస్తున్నామని నిందితులు తెలిపారు.. ఈ డీజిల్‌తో ఇనుము, అల్యూమినియంను కరిగిస్తారని చెప్పారు.. 

16:25 - August 18, 2015

హైదరాబాద్ : నకిలీ పాన్‌కార్డులతో క్రెడిట్‌ కార్డులు పొంది మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. ఫేక్‌ పాన్‌కార్డులు, ఓటర్‌ ఐడీ కార్డులతో బ్యాంకులను బురిడీ కొట్టించి క్రెడిట్‌ కార్డులు పొంది 65 లక్షల రూపాయలు డ్రా చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. దీనికి సంబందించి జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తితో పాటు మరో 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 3 లక్షల నగదు, 200 నకిలీ పాన్‌కార్డులు, 200 నకిలీ ఓటర్‌ ఐడీ కార్డులు, 100 నకిలీ ఐటీ రిటర్స్ ఫామ్‌లు, 170 క్రెడిట్‌ కార్డులు, 100 సెల్‌ఫోన్‌లు, 150 సిమ్‌కార్డులు, 250 గుర్తుతెలియని వ్యక్తుల ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు.  

బీజేపీ-శివసేన హయాంలో 69 మంది రైతుల ఆత్మహత్య: పంకజ్ ముండే

మహారాష్ట్ర: రాష్ట్రంలోని మరట్వాడలో కరవు కరాళ నృత్యం చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి పంకజ్ ముండే పేర్కొన్నారు. ప్రతినెలా మరట్వాడలో 70 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఈ ఏడాది 50 శాతం లోపే వర్షం కురిసిందన్నారు. కాంగ్రెస్, ఎన్ డిఎ ప్రభుత్వ హయాంలలో నెలకు 47 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని... కానీ ప్రస్తుత బీజేపీ-శివసేన హయాంలో రైతుల బలవన్మరణాల సంఖ్య 69 మందికి చేరిందన్నారు. రైతు ఆత్మహత్యలను ఉన్న ఫళాన ఆపలేమన్నారు. 

16:22 - August 18, 2015

హైదరాబాద్ : కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతుంది. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని కూడా స్పష్టం చేసింది. అయితే ఎలా ఇస్తారు.. ఎంతమందికి ఇస్తారు అనే ప్రశ్నలకు సమాధానాలు ఇంకా దొరకలేదు. ఇంతలోనే గురుకులాలపై కొత్త విధానాన్ని ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు విడివిడిగా ఉన్న గురుకులాలన్నిటిని ఒకే డైరెక్టరేట్‌ కిందకు తెస్తామని ప్రకటించింది. అంతేకాకుండా గురుకులాల సంఖ్యను కూడా పెంచుతామంటోంది. అయితే ఈ కొత్త విధానంతో కేజీ టు పీజీ ఉచిత విద్యకు ముడిపెడతారా? ఈ గురుకులాలకే మాత్రమే ఉచిత విద్య అంటారా? ఇవే అనుమానాలు ఇప్పుడు విద్యార్ధి, ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపై టెన్ టివి చర్చను చేపట్టింది. ఈ చర్చలో రవిచంద్ర గురుకుల ఉపాధ్యాయ సమాఖ్య సంఘాల ఛైర్మన్, యాదయ్య... గురుకుల ఉపాధ్యాయుల సంఘం నేత, రమేష్, ఎస్ ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు. మరి మీరు కూడా ఆచర్చను వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి

15:55 - August 18, 2015

హైదరాబాద్: ప్రకృతి సహజంగా మహిళలు, పురుషుల్లో మార్పులు సహజం. పిల్లల కౌమార దశలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటూ వుంటాయి. అమ్మాయిలకు ఈ దశలో రుతుస్రావ ప్రక్రియ మొదలౌతుంది. అయితే ఈ దశలో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన శానిటరీ నాప్కిన్స్ ఎంతో అవసరం. కానీ పేదరికం, అవగాహనా లోపం కారణంగా చాలా మంది అపరిశుభ్రమైన పద్దతులను అవలంభిస్తున్నారు. ఇది అమ్మాయిల భవిష్యత్, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అనే అంశంపై 'వేదిక' చర్చిను చేపట్టింది. ఈ చర్చలో డాక్టర్ రమాదేవి గైనకాలజిస్టు, హిందూస్థాన్ లెటెక్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోషన్ ట్రస్ట్ రీజనల్ ఆఫీసర్ రమేష్ పాల్గొన్నారు. మరి అలాంటి చర్చను మీరు కూడా చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

విరిగిపడిన కొండచరియలు.. పదికి చేరిన మృతుల సంఖ్య

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలోని కుల్లు జిల్లాలో మణికరణ్ లో ఓ భవనపై పై కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. మరో 9మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద 50 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 

కొండచరియలు విరిగిపడి ఆరుగురి మృతి

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలోని కుల్లు జిల్లాలో మణికరన్ వద్ద కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. శిథిలాల కింద పలువురున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

15:25 - August 18, 2015

బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యబచ్చన్‌ తాజాగా నటించిన 'జజ్బా' చిత్రానికి సంబంధించి అధికార పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ సోమవారం విడుదల చేసింది. టైంకి వ్యతిరేకంగా ఓ లక్ష్యం కోసం పరిగెడుతున్న ఐశ్వర్య, ఇర్ఫాన్‌పటాన్‌లతో ఉన్న పోస్టర్‌ సినిమా నేపథ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు సంజరుగుప్తా మాట్లాడుతూ..'ఈ చిత్రంలో లాయర్‌గా నటిస్తున్న ఐశ్వర్య కూతుర్ని కొంతమంది కిడ్నాప్‌ చేస్తారు. కిడ్నాప్‌కు గురైన కూతుర్ని కాపాడుకోవడానికి ఓ లాయర్‌గా ఐశ్వర్య ఏం చేసిందనేదే అసలు కథ. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రంలో కూతురి కోసం పోరాడే తల్లిగా, లాయర్‌గా ఐశ్వర్య నటించిన తీరు అద్భుతం. సందర్భానుసారంగా ఇందులో కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లో సైతం ఐశ్వర్య నటించారు. అలాగే ఇందులో సస్పెండైన పోలీస్‌ అధికారిగా ఇర్ఫాన్‌ పటాన్‌ నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తయిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.

 

షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధం

రంగారెడ్డి: జిల్లాలోని హయత్ నగర్ మండలం పెద్దఅంబర్ పేట్ వద్ద షార్ట్ సర్క్యూట్ తో నానో కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 

సెప్టెంబర్ 16 నుంచి 24 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టిటిడి జేఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 16 నుంచి 24 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఏడాది అధిక మాసం రావడంతో రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల రోజుల్లో సుప్రభాతం, సహస్ర దీపాలాంకరణ మినహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. వీఐపీ దర్శనాలను కుదించారు. ఈ సమావేశంలో ఎస్పీ గోపీనాథ్, టిటిడి విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.

15:05 - August 18, 2015

విజయవాడ : అభయ గోల్డ్ బాధితులు విజయవాడ సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంముందు నిరసనకు దిగారు... అగ్రిగోల్డ్ బాధితులకు ఏ విధంగా న్యాయం చేశారో తమనూ అలాగే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.. ఈకేసులో సీఐడీ దర్యాప్తును వేగంగా పూర్తిచేసేలా ఆదేశించాలని కోరారు.. సీఎంను కలిసేందుకు వచ్చిన బాధితులకు చంద్రబాబు దర్శనం దక్కలేదు.. సీఎం వెళ్లిపోవడంతో అక్కడే ఆందోళనకు దిగారు బాధితులు.. 

15:03 - August 18, 2015

అనంతపురం: హిందూపురంలో జంట హత్యలు కలకలం రేపాయి. బేవినహళ్లి సమీపంలోని పంటపొలాల్లో ఓ మహిళతో పాటు మరో వ్యక్తిని దారుణంగా నరికిచంపారు. మృతుడిన హిందూపురం తాలూక బీసీ సంఘం అధ్యక్షుడు నారాయణస్వామిగా పోలీసులు గుర్తించారు. ఐతే చనిపోయిన మహిళ ఎవరనేది...ఇంకా స్పష్టం కాలేదు. వారిద్దరినీ దుండగులు కత్తులతో పొడిచి చంపినట్లుగా ఆనవాళ్ల ద్వారా తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని..దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థినులతో అసభ్యంగా వ్యవహరిస్తోన్న అధ్యాపకుడిపై వేటు..

ప.గో: విద్యార్థినులతో అసభ్యంగా వ్యవహరిస్తోన్న ఓ అధ్యాపకుడిపై వేటు పడింది. నిడదవోలు ఎస్వీఆర్ కళాశాల అధ్యాపకుడు జాన్ శ్యామూల్ విద్యార్థినులతో అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మీ.. శ్యామూల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ప్రిన్సిపాల్ విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. విచారణా సంఘం నివేదికతో ప్రభుత్వం స్పందించింది.

 

15:00 - August 18, 2015

తూ.గో : 58 రోజుల క్రితం సముద్రంలోకి వేటకెళ్లి... ఆచూకీ లేకుండాపోయిన మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా సొంతూరికి చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ కార్యాలయానికి వారు చేరుకున్నారు. వారికి జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే కొండబాబు స్వాగతం పలికారు. తొండంగి మండలి హుకుంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు ....జూన్‌ 16న సముద్రంలోకి వేటకెళ్లారు. భారీ వర్షానికి తోడు అలల ఉధృతి పెరగటంతో...వారు సముద్రంలోనే చిక్కుకుపోయారు. వారు ఎప్పటికీ తిరిగిరాకపోవటంతో...వారిపై కుటుంబ సభ్యులు ఆశలు వదలుకున్నారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. ఐతే వారంతా బంగ్లాదేశ్‌ తీరానికి చేరుకున్నట్లు ఏపీ ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. వారిని సొంతూరుకు తీసుకురావటానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేశారు. ఎట్టకేలకు ఇవాళ వారు సురక్షితంగా ఇళ్లకు చేరుకోవటంతో...వారి కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది.

14:51 - August 18, 2015

హైదరాబాద్: తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. సాక్షాత్తు సచివాలయంలోనే ఉద్యోగుల పట్ల వివక్ష కొనసాగుతోంది. వేతనాలు పెంచకపోగా... సమస్యలు కూడా వినలేమంటోంది టీ-సర్కార్‌. రిక్రూట్ చేసుకున్న ఏజెన్సీలను... అడగండంటూ చేతులు దులుపుకుంటున్నారు అధికారులు.

385మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు....

తెలంగాణ సచివాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. పాలకుల తీరుపై 385 మంది ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డిటిపి, డేటా ప్రాసెసింగ్ ఆప‌రేట‌ర్లు, ఫైల్ మెసెంజర్లు, డ్రైవర్లు, లిఫ్టు ఆపరేటర్లు జీతాలందక నరకయాతన పడుతున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 8 వేల 140 రూపాయలు, లిఫ్ట్ ఆపరేటర్లకు 5 వేల 4 వందలు, డ్రైవర్లకు 6 వేల 4 వందల రూపాయలు జీతంగా చెల్లిస్తున్నారు. పైగా ఈ డబ్బు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. చాలీచాలని ఈ జీతాలతో కుటుంబాలను పోషించుకోలేక నానాకష్టాలు పడుతున్నారు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు.

దొరకని అపాయింట్‌మెంట్ ....

రాత్రింబవళ్లు గొడ్డు చాకిరీ చేస్తున్నా... తమ బాధలు వినేవారెవ్వరూలేరని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. వీళ్లు, వాళ్ల కాళ్లుపట్టుకొని చివరికి సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శిని వీరంతా కలిశారు. అక్కడా ఈ సిబ్బందికి నిరాశే ఎదురైంది. మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకున్న ఏజెన్సీలను అడగండంటూ సమాధానమిచ్చారు సదరు అధికారులు. మీకు జీతం పెంచమని అడిగే హక్కే లేదంటూ తేల్చిచెప్పారు. దీంతో ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగులు కన్నీళ్లతో వెనుదిరిగారు. గత ముఖ్యమంత్రులు వైఎస్, కిరణ్‌ కుమార్ రెడ్డిలు... తమకు కనీస వేతనాలు అమలు చేస్తూ... జీవోలు జారీచేశారని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు వాటిని అమలు చేయాలని కోరినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. తమను పురుగులకన్నా హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

బాసటగా నిలిచిన విపక్షాలు...

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దుస్థితిని చూసి చలించిపోయిన విపక్షాలు వారికి బాసటగా నిలిచాయి. ఈ సిబ్బంది పనిచేయకపోతే సచివాలయం అంధకారమవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఇంత శ్రమదోపిడీ జరుగుతున్నా సీఎం ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నిస్తున్నాయి. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వెంటనే కనీన వేతనాలు ఇవ్వాలని... లేకపోతే ఉద్యమం తప్పదని వామపక్షాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. మరి ఇప్పటికైనా తెలంగాణ సర్కార్‌లో చలనం కలుగుతుందో లేదో చూడాలి.

14:13 - August 18, 2015

హైదరాబాద్: భారత్ - పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో ఉన్న ప్రార్థనాలయాల వద్ద విధులు నిర్వహిస్తోన్న పోలీసులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ భారత జవాను మృతి చెందాగా.. మరోకరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ఉగ్రవాదలు పరారు కాగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రదాడులను బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ ఉగ్రవాదుల దాడులను తిప్పికొడుతున్నట్లు తెలుస్తోంది. గల 24 గంటల్లోనే దాదాపు 12 సార్లు కాల్పులకు తెగబడినట్లు అధికారులు తెలిపారు. దీంతో స్థానికులు ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని అధికారులు తెలిపారు.

 

జమ్మూలో ఉగ్రవాదుల కాల్పులు..పోలీస్ అధికారి మృతి

జమ్మూ: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. జమ్మూలోని సొపోర్ చెక్ పోస్టుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు, ఆర్మీ మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి మృతి చెందారు. ఉగ్రవాదులు పరారీలో ఉన్నారు. ఈ సంఘటనతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. 

పడిపోయిన ముడిచమురు ధర

ఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధర పడిపోయింది. క్రూడాయిల్ ధర బ్యారెల్ కు రూ.41.80 డాలర్లకు తగ్గింది. తగ్గిన ధర సెప్టెంబర్ నుంచి అమలు కానుంది. 2009 సంవత్సరం తర్వాత ఇదే తక్కువ ధర కావడం గమనార్హం. ముడిచమురు కొనుగోలును చైనా తగ్గించడంతో ధర పడిపోయినట్లు నిపుణలు విశ్లేషించారు.

 

గుత్తి-గుంతకల్ తహశీల్దార్ కార్యాలయాలపై సీబీఐ దాడులు

అనంతపురం: జిల్లాలోని గుత్తి, గుంతకల్ తహశీల్దార్ కార్యాలయాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. 201-13 సబ్బిడీ విత్తనాల పంపిణీలో అక్రమాలపై సోదాలు జరిపారు.

13:41 - August 18, 2015

గుంటూరు : గత 45 రోజులుగా జూట్ మిల్లు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. మిల్లును తెరిపించకపోవడం వల్ల కార్మికులు పస్తులతో అల్లాడుతున్నారు. అయినా యాజమాన్యం, ప్రభుత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. మిల్లును తెరిపించే ప్రయత్నం చేయడం లేదు. కార్మికులు ఏకంగా కార్మిక కార్యాలయం ముట్టడించారు. అక్కడే వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఉపయోగం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.

22వ తేదీ తుది పోరు..
ఈ సందర్భంగా టెన్ టివితో విపక్ష నేతలు మాట్లాడారు. కార్మికుల పక్షాన ఉన్నట్లు జీవో జారీ చేస్తోందని, యజమానులకు అనుకూలంగా చట్టం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్, యాజమాన్యాల పట్ల ఉంటోంది అందుకే ఆందోళన చేయడం జరుగుతోందన్నారు. చట్టాలను కార్మికులకు అనుకూలంగా మార్చుకోవాల్సివసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. యాజమాన్యంపై వత్తిడి తీసుకరావడానికి ప్రయత్నించడం జరుగుతోందని, ప్రభుత్వ ఉదాసీన వైఖరి ఉండడం వల్లే యాజమాన్యంలో ఎలాంటి స్పందన లేదన్నారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఇక్కడే వంటవార్పు చేస్తామని, ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామన్నారు. ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిపారని, జీవోలు కూడా ఇచ్చారని కానీ ఎలాంటి ఫలితం రాలేదన్నారు. 22వ తేదీ వరకు తుదిపోరు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

13:33 - August 18, 2015

మహబూబ్ నగర్ : కర్నాటక పోలీసులపై మంత్రి జూపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజాపూర్ ప్రాజెక్టును ఎలాగైనా చూసి తీరుతానని ఆయన పట్టుబట్టారు. అనుమతి లేదంటూ కర్నాటక పోలీసులు స్పష్టం చేశారు. దీనితో ఆ ప్రాంతంలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి జూపల్లితో వెళ్లిన ఎంపీ జితేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయచూర్ జిల్లా శక్తినగర్ వద్ద జూపల్లిని, జితేందర్ రెడ్డిని కర్నాటక పోలీసులు అడ్డుకున్నారు. ఎలాగైనా అనుమతినివ్వాల్సిందేనని జూపల్లి స్పష్టం చేశారు. చివరకు రాయచూర్ కలెక్టర్ తో మాట్లాడిన అనంతరం పరిమిత సంఖ్యలో వెళ్లవచ్చని అనుమతి వచ్చింది. చివరకు మంత్రి జూపల్లి, ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు మరికొందరు ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లారు.
రూ.150 కోట్లతో ప్యాకేజీ..
కృష్ణాపై మరో మినీ బ్యారేజీ నిర్మాణంతో వరద నీటిని ఒడిసిపట్టేందుకు కర్నాటక ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతోంది. రూ.150 కోట్లతో ఈ నిర్మాణం జరుగుతోంది. కేవలం రెండు సంవత్సరాల్లో దీని నిర్మాణం చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై టి. సర్కార్ అగ్గిలం మీద గుగ్గిలమయ్యింది. ఈ ప్రాజెక్టు వల్ల తీవ్ర సమస్యలు ఏర్పడుతాయని టి.ప్రభుత్వం భావించింది. దీనిపై అఖిలపక్షం వేయాలని విపక్ష నేతలు కూడా డిమాండ్ చేశారు.

13:29 - August 18, 2015

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 159 వ చిత్రానికి 'కబలి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. రజనీ 40 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసిన సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా రజనీ కూతురు సౌందర్యా ధనుష్‌ మాట్లాడుతూ... 'నేను రజనీకి పెద్ద అభిమానినే కాదు... గర్వపడే కూతురిని కూడా. ఆయన 40 ఏళ్ళ సినీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ చిత్రంలో నాన్న పాత్ర పేరు కబలీశ్వరన్‌. త్వరలోనే షూటింగ్‌ కార్యక్రమాల్ని ప్రారంభించబోతున్నాం' అని తెలిపారు. రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన రాధికా ఆప్టే నటిస్తున్న సంగతి తెలిసిందే.

13:19 - August 18, 2015

బీహార్ : రాష్ట్రంలో అతి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఎలాగైనా బీహార్ లో అడుగు పెట్టాలని కాషాయ దళం ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగా బీజేపీ ఇప్పటి నుండే ప్రచారం చేపట్టింది. ఏకంగా ప్రధాని మోడీ రంగంలోకి దిగి ప్రచారం చేపడుతున్నారు. యూఏఈ పర్యటన ముగించుకుని వచ్చిన మోడీ బీహార్ లో మంగళవారం నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల వరాల జల్లు కురిపించారు. రూ.1.65 కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులో రూ.45వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చేపట్టే పథకాలకు కేటాయించారు. ఈ ప్యాకేజ్ తో బీహార్ దశ..దిశ మార్చేస్తానని ఈ సందర్భంగా ప్రజలకు మోడీ హామీనిచ్చారు.
ఏపీపై కేంద్రం మీనమేషాలు..
బీహార్ లో మోడీ ప్యాకేజీ ప్రకటించడాన్ని అధికారపక్ష నేతలు పరిశీలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పార్టీలకతీతంగా ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నది తెలిసిందే. అధికారంలోకి వచ్చాక కూడా మోడీ ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. తాజాగా బీహార్ కు మోడీ ప్యాకేజీ ప్రకటింపుతో అధికారపక్ష నేతలపై విమర్శలు పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా..రాజధాని నిర్మాణానికి సహకారం..పోలవరం నిర్మాణం విషయంలో గతంలో బీజేపీ పలు హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రంలో ప్రకటించిన ఎన్నికల హామీలే ఇంకా నేరవేర్చలేదనే విమర్శలున్నాయి. తాజాగా ప్రకటించిన మోడీ ఎన్నికల హామీలు ఏ మేరకు ప్రభావితం చూపుతాయో ఎన్నికల అనంతరం చూడాలి. 

మెదక్ జిల్లాలో ఆదిమానవుడి సంచార జాడలు..

మెదక్: జిల్లాలో ఆదిమానవుడి సంచార జాడలు బయటపడ్డాయి. సిద్ధిపేట మండలం తుళ్లూరులో పురాతత్వశాఖ తవ్వకాలు జరిపింది. ఈ తవ్వకాల్లో ఆదిమానవ అస్తిపంజరం, మట్టి పాత్రలు బయటపడ్డాయి. గత కొన్ని రోజులుగా పురాతత్వశాఖ తవ్వకాలు కొనసాగుతున్నాయి. 

జూట్ మిల్లు పునరుద్ధరించాలంటూ కార్మికుల ఆందోళన

గుంటూరు: మూసివేసిన జూట్ మిల్లును పునరుద్ధరించాలంటూ... కార్మికశాఖ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. కార్యాలయం ముందు వంటావార్పు నిర్వహించారు. మిల్లును తెరిపించే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు.  

12:59 - August 18, 2015

శ్రీలంక : పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా పోటీచేసిన మహీంద్రా రాజపక్సే ఆశలు గల్లంతయ్యాయి. అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఓడిన రాజపక్సే ప్రధాని ఎన్నికల్లోను ఓటమి పాలయ్యారు. తన ఓటమిని అంగీకరించని రాజపక్సే.. యునైటెడ్ నేషనల్ ఫ్రీడం అలయన్స్ పార్టీ ఓడిపోవడం బాధకరంగా ఉందన్నారు. 225 స్థానాలున్న లంక పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఇవాళ పూర్తిస్థాయిలో వెలువడనున్నాయి.

బీహార్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

పాట్నా: బీహార్ లో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల దృష్ట్యా మోడీ వరాల జల్లు కురిపిస్తున్నారు. బీహార్ అభివృద్ధికి రూ.1.65 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ప్యాకేజీతో బీహార్ కు దిశ, దశ మారుతోందని భావిస్తున్నట్లు చెప్పారు. రైతుల సంక్షేమంతోనే వ్యవసాయ అభివృద్ధి సాధ్యమన్నారు. 

12:56 - August 18, 2015

నిజామాబాద్ : నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డ కాసేపు కూడా తన ఒడిలో లేదు. పుట్టిన కాసేపటికే మాయదారి జ్వరం పండంటి బిడ్డను చుట్టేసింది. పెద్దాసుపత్రికి తీసుకెళ్తె నయమవుతుందని చెబితే పసిగుడ్డును చేతిలో పట్టుకుని నాందేవ్‌వాడకు చెందిన అనే బాలింత నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. పరీక్షలు చేసిన వైద్యులు కామెర్లు అయ్యాయని, ఇంక్యూబేటర్‌లో పెట్టాలని చెప్పారు. ఎన్ఎస్ సియు లో ఉంచితే నయమవుతుందని చెప్పుకొచ్చారు. కన్నబిడ్డకు నయమయితే చాలనుకున్న అనిత తన బిడ్డను ఆస్పత్రి యాజమాన్యానికి అప్పగించింది.
పొంతన లేని సమాధానాలిచ్చిన సిబ్బంది..
మరుసటి రోజు తెల్లవారుఝామున బిడ్డ ఆరోగ్యం గురించి ఆరా తీసిన అనితకు ఎన్ఎస్ సియు సిబ్బంది పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. కాసేపు ఎన్ఎస్ సియు వార్డుకు తాళం వేసి, సమాలోచనలు జరిపిన సిబ్బందినీ ఆడబిడ్డ కన్పించటం లేదంటూ చెప్పారు. మరి కాసేపటికి మాట మార్చి మీరే తీసుకవెళ్లారుగా అంటూ తప్పు అనిత కుటుంబ సభ్యుల మీదకు తోసేసేందుకు ప్రయత్నించారు. ముక్కుపచ్చలారని బిడ్డ కన్పించకపోయేటప్పటికి అనిత కన్నీరు మున్నీరుగా విలపించింది. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఘటన జరిగి 13 రోజులవుతున్నా నేటికి ఆడబిడ్డ ఆచూకీ కనిపెట్టలేకపోయారు.
విధుల నుంచి నర్సు తొలగింపు..
ఆడబిడ్డ అదృశ్యాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు విధుల్లో ఉన్న నర్సును తొలగించారు. ఇద్దరు వైద్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. కానీ పోలీసులు మాత్రం తొలిరోజు ప్రదర్శించిన ఆసక్తిని కొనసాగించలేదు. బిడ్డ అదృశ్యమైందని తెలిసిన రోజు చేసిన హడావుడిని, త్వరలోనే నిందితులను పట్టుకుని ముక్కుపచ్చలారని బిడ్డను నీ ఒడికి చేరుస్తామని అనితకు ఇచ్చిన వాగ్ధానాలను మరిచారు. ఇప్పటికైనా కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ మిస్టరీని చేధించాలని బాధితులు వేడుకుంటున్నారు.

12:49 - August 18, 2015

ఆదిలాబాద్ : రోగుల ప్రాణాలను కాపాడాల్సిన ఓ వైద్యుడు లంచగొండి అవతారమెత్తాడు. 6వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట్‌లో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వాస్పత్రి డాక్టర్‌ రవీందర్ నాయక్ మెడికల్ సర్టిఫికేట్ కోసం 30వేలు డిమాండ్ చేశాడు. తాము అంత ఇచ్చుకోలేమన్న బాధితులు చివరికి 6వేల రూపాయలకు అంగీకరించారు. వెంటనే ఏసీబీకి సమాచారం అందించారు. ఈ అవినీతి చేపను పట్టుకునేందుకు వల పన్నిన అధికారులు డాక్టర్‌కు డబ్బు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో కూడా ఇదే ఆస్పత్రి డాక్టర్ ఏసీబీకి చిక్కాడు. 

12:47 - August 18, 2015

మహబూబ్‌నగర్ : జిల్లా వనపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన వ్యాను అదపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఖాసీంనగర్‌ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. స్కూలు వ్యానులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. డ్రైవరు కల్లును సేవించి వ్యాను నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెప్తున్నారు. వ్యానులో కల్లు బాటిల్‌ ఉండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా డ్రైవర్ తన ప్రవర్తనను మార్చుకోలేదని ఓ విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. 

12:44 - August 18, 2015

గుంటూరు : నాగార్జున యూనివర్శిటీలో రితికేశ్వరి ఆత్మహత్య తర్వాత భద్రతను మరింత పెంచారు పోలీసులు. బైక్‌లపై వస్తున్న విద్యార్థులకు లైసెన్స్, ఆర్సీ బుక్ ఉంటేనే వర్శిటీలోకి అనుమతిస్తున్నారు. రాత్రిపూట లుంగీలతో హాస్టల్ బయట తిరగొద్దని ఆదేశాలు జారీచేశారు. దీంతో పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ వస్త్ర ధారణపై ఎందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు. విద్యార్థుల నిరసన విషయం తెలుసుకున్న డీఎస్పీ దీనికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు సర్దిచెప్పారు. డీఎస్పీ హామీతో విద్యార్థులు తమ రూముల్లోకి వెళ్లిపోయారు.

12:42 - August 18, 2015

కడప : ఆత్మహత్య చేసుకున్న కడప విద్యార్థినిల మృతదేహాలకు రిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు పోస్టుమార్టం చేశారు. ఆసుపత్రికి విద్యార్థినిల తల్లిదండ్రులు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతంలో మిన్నంటాయి. కళాశాల యాజమాన్యాన్ని ఆసుపత్రి వద్ద విద్యార్థులు అడ్డుకున్నారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 
విద్యార్థుల ఆందోళనలు..
కడపలోని నారాయణ బాలికల జూనియర్ కళాశాలలో నందిని, మనీషాలు ఆత్మహత్య చేసుకున్నారు.ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌ చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలు కలకలం రేపాయి. తమ పిల్లల ఆత్మహత్యలపై మృతుల తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు ఎక్కడికిక్కడ ఆందోళనలు నిర్వహించాయి. పలు చోట్ల మంత్రి నారాయణ దిష్టిబొమ్మలను దగ్ధం చేశాయి. వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఏపీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలంటూ కడప జిల్లా పొద్దుటూరు నారాయణ కళాశాలముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.. కాలేజీలోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాయి. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణ కాలేజీల్లో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని విద్యార్థులు ఆరోపించారు. పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నా విద్యార్థులు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. 'వి వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
జగన్ పరామార్శ..
కడప జిల్లా నారాయణ కాలేజ్‌లో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థినులకు రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తైంది. రిమ్స్ కు చేరుకున్న జగన్‌ విద్యార్థినుల కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతదేహాలను సందర్శించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థినిల హైదరాబాద్ లో రీపోస్టుమార్టం నిర్వహించాలని ఈ సందర్భంగా జగన్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, బుధవారం కడప జిల్లా బంద్ కు పిలుపునిస్తున్నట్లు జగన్ తెలిపారు.

12:36 - August 18, 2015

ఊరిని దత్తత తీసుకోవడమనే కాన్సెప్ట్‌తో విడుదలై విశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'శ్రీమంతుడు' చిత్రాన్ని కమల్‌హాసన్‌ ప్రత్యేకంగా చెన్నైలో వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 'సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. చూస్తు న్నంత సేపు చాలా బాగా ఎంజాయ్ చేశాను. శ్రుతి చాలా బాగా చేసింది. పాటల్లో సైతం అద్భుతంగా డాన్స్‌ చేసింది. మా అమ్మాయి కాబట్టి నేను ఈ మాటలు చెప్పడం లేదు. నిజంగానే చాలా బాగా చేసింది.
అక్కినేని నాగేశ్వరరావు నటించిన అలనాటి 'శ్రీమంతుడు' చిత్రానికి నేను వర్క్‌ చేశాను.
ఈ 'శ్రీమంతుడు' చిత్రంలో మా అమ్మాయి శ్రుతిహాసన్‌ నటించడం చాలా ఆనందంగా ఉంది' అని కమల్‌హాసన్‌ అన్నారు. సినిమా గురించి చెప్పాలంటే, 'ఒక మంచి పాయింట్‌ని తీసుకుని, దానికి అన్ని రకాల మసాలాలు జోడించి అందరికీ నచ్చేలా దర్శకుడు కొరటాల శివ సినిమాను రూపొందించారు. సబ్జెక్ట్‌ను డీల్‌ చేసిన విధానం అత్యద్భుతంగా ఉంది. ఇక మహేష్‌బాబు గురించి వేరే చెప్పక్కర్లేదు. మహేష్‌బాబు నటనలో అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్నాయి. వాటిని మహేష్‌ చాలా చక్కగా క్యారీ చేశాడు. ఈ చిత్ర నిర్మాతలకు ఇదే మొదటి సినిమా అని తెలిసింది. మొదటి సినిమాతోనే సూపర్‌హిట్‌ కొట్టిన నిర్మాతలకు కంగ్రాట్స్‌ తెలుపుతున్నాను' అని కమల్‌ స్పందించారు.

 

12:34 - August 18, 2015

మెగాస్టార్ 150వ సినిమా ఫైనల్ కాలేదు ట్రైలర్ ఏంటి అనుకుంటున్నారా..? ఇది నిజమే ట్రైల్ ట్రైలర్.. మరీ కన్య్పూజ్ అవ్వకండి.. ఈ స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది.
శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రంలో చిరంజీవి ఏకంగా ఓ పదినిమిషాల పాటు వెండితెరపై మెరవనున్నారట. ఈ పదినిమిషాల్లో చిరంజీవిని అద్భుతంగా చూపించడానికి వైట్ల చాలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి కోసం పదునైన పంచ్‌ డైలాగుల్ని రాసుకున్నాడట. అంతే కాకుండా అదిరిపోయే ఫైట్‌ కూడా పెడుతున్నట్లు సమాచారం. మరో పాటలో డ్యాన్స్ తో కూడా చిరు ప్రేక్షకులను అలరించనున్నాడట. అయితే ఈ పది నిమిషాల నిడివిలో డైలాగ్స్, ఫైట్, మరియు సాంగ్ పెట్టడం వెనుక ఆంతర్యమేమంటే.. చిరంజీవి 150 చిత్రానికి ఈ 10నిమిషాల సినిమాను ట్రైలర్ గా వినియోగించుకోనున్నారట. అంటే ఇక్కడ ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనను బట్టి చిరు 150వ చిత్రం స్క్రిప్ట్ పనులు జరపనున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే ఇక్కడ చిరంజీవి సాంగ్ లో హీరోయిన్ ఇలియానా ఆడిపాడనున్నట్లు సమాచారం. మరి ఈ ట్రైల్ ట్రైలర్ ఎలా ఉంటుందో.. చిరు 150వ చిత్రానికి ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.

12:26 - August 18, 2015

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభా ముఖర్జీ (57) కన్నుమూశారు. ఆమె మంగళవారం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. శుభ్రా ముఖర్జీ గత కొంతకాలంగా శ్వాస కోశ వ్యాధితో బాధ పడుతున్నారు. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శుభ్రా ఈ రోజు ఉదయం 10.51 గంటలకు ఆమె మృతి చెందారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ కార్యాలయ వర్గాలు అధికారికంగా ధృవీకరించారు. సెప్టెంబర్ 17, 1940లో జెస్సోర్ లో శుభ్రా జన్మించారు. ప్రణబ్ ను 13, 1957లో వివాహం చేసుకున్నారు. ఆమె మంచి గాయని అని, గీతాంజలి ట్రూప్ ను కూడా నెలకొల్పారని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

12:22 - August 18, 2015

ఢిల్లీ : ఉధంపూర్ దాడిలో పాల్గొని సజీవంగా దొరికిన ఉగ్రవాది నవేద్ కు ఎన్ఐఏ లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ పరీక్షల్లో నవేద్ వాస్తవాలు వెల్లడిస్తున్నట్లు సమాచారం. ఉధంపూర్ దాడిలో తనతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు తెలిపాడు. దాడి చేసిన ఉగ్రవాదుల ఉగ్రవాదుల ఊహా చిత్రాలను ఎన్ఐఏ విడుదల చేసింది. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు అబు ఒకాశా, మహ్మద్ భాయ్ హస్తం ఉన్నట్లు, ఘటన జరిగిన తరువాత వారు పారిపోయినట్లు ఎన్ఐఏ భావిస్తోంది. ఉగ్రవాది నవేద్ చేతి రాత, స్వరపరీక్ష, బ్లడ్ శాంపిల్స్ లను ల్యాబ్ కు పంపించారు. పాక్ జాతీయుడే అన్న ఆధారం కోసం ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది. అతడికి లైడిటెక్టర్ పరీక్షకు అనుమతినివ్వాలని ఎన్ఐఏ ఢిల్లీ కోర్టును అనుమతి కోరగా కోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.
ఈనెల 5న దాడి..
ఈ నెల 5న ఉధంపూర్‌లో బీఎస్‌ఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసిన ఇద్దరు ఉగ్రవాదులలో నవీద్ ఒకడు. మరో ఉగ్రవాదిని కాల్చి చంపిన బీఎస్‌ఎఫ్ దళాలు, గ్రామస్తుల సాయంతో నవీద్‌ను పట్టుకున్నాయి. తాను పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన వాడినని చెప్పిన నవీద్ గూగుల్ ఎర్త్ లో తన ఇంటిని కూడా గుర్తించాడు. అతని తండ్రి యాకూబ్ మొహమ్మద్ ఒక ఇంటర్వ్యూలో నవీద్ తన కొడుకేనని అంగీకరించాడు. అయితే పాకిస్థాన్ మాత్రం నవీద్ తమ దేశ పౌరుడు అనేందుకు శాస్త్రీయ ఆధారాలు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అతనికి నిర్వహించే లై డిటెక్టర్ పరీక్ష ద్వారా ఉధంపూర్ దాడి వెనుక కుట్రను కనుక్కోగలమని ఎన్‌ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. 

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినుల పోస్టుమార్టం పూర్తి

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలకు రిమ్స్ లో పోస్టుమార్టం పూర్తి చేశారు. కడప నారాయణ కాలేజీలో నిన్న ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

 

12:18 - August 18, 2015

ఇది మీకు తెలుసా..?! పవన్‌కళ్యాణ్‌ హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు తన స్వంత సంస్థలో నిర్మించే చిత్రాన్ని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రాసిన కథతో రూపొందిస్తున్నారట. రచయితగా, దర్శకుడిగా శతాధిక చిత్రాలతో తానేమిటో నిరూపించుకున్న దాసరి నారాయణరావు త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ కథతో సినిమా చేయడమేంటని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాసరి, పవన్‌కళ్యాణ్‌ కాంబినేషన్‌లో రూపొందే చిత్రం పవర్‌ఫుల్‌గా ఉండటమే కాకుండా సొసైటీకి చక్కని మెసేజ్‌ ఇచ్చేదిగా ఉండాలని భావిస్తున్నారట. కథ ఎలాగైతే ఉండాలని వీళ్ళు అనుకున్నారో అలాంటి కథ పక్కాగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దగ్గరుందని తెలియడంతో త్రివిక్రమ్‌ను పిలిపించి దాసరి చర్చించారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రంతోను, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నితిన్‌తో రూపొందించే చిత్రంతోనూ బిజీగా ఉన్న విషయం విదితమే. కాబట్టి ఈ చిత్రం తెరపైకి వచ్చే సరికి ఇంకెన్ని విశేషాలు వినాల్సి వస్తుందో చేచి చూద్దాం..

రేపు కడప బంద్ కు జగన్ పిలుపు..

కడప : ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థినుల కుటుంబాలను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. మంగళవారం కడప జిల్లా బంద్ కు జగన్ పిలుపునిచ్చారు.

9, 10 వ షెడ్యూల్ లోని సంస్థల విభజనపై సమావేశం...

హైదరాబాద్: 9, 10 వ షెడ్యూల్ లోని సంస్థల విభజనపై తెలంగాణ సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు.

 

కర్ణాటక నిర్మిస్తున్న గిరిజాపూర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత

మహబూబ్ నగర్: కర్ణాటక నిర్మిస్తున్న గిరిజాపూర్ ప్రాజెక్టును పరిశీలించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్ రెడ్డి యత్నించారు. అనుమతి లేదని కర్ణాటక పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రాజెక్టు పరిశీలనకు తమకు అనుమతివ్వాలని కర్ణాటక పోలీసులతో జూపల్లి, జితేందర్ రెడ్డిలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

 

ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసిన ఎన్ఐఏ..

ఢిల్లీ : ఉధంపూర్ లో దాడి చేసిన ఇద్దరు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను ఎన్ఐఏ విడుదల చేసింది. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు అబు ఒకాశా, మహ్మద్ భాయ్  హస్తం ఉన్నట్లు, ఘటన జరిగిన తరువాత వారు పారిపోయినట్లు ఎన్ఐఏ భావిస్తోంది. 

'అనంత'లో ఇద్దరి దారుణ హత్య..

అనంతపురం: జిల్లాలోని హిందూపురం మండలం దేవనహల్లిలో దారుణం జరిగింది. నారాయణస్వామి అనే వ్యక్తితోపాటు మరో మహిళను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

విద్యార్థినుల ఆత్మహత్యపై కమిటీ ఏర్పాటు...

కడప: జిల్లాలోని నారాయణ కాలేజీలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటనపై ఎపి ప్రభుత్వం సీరియస్ అయింది. ఘటనపై విచారణ జరిపేందుకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 

కోల్ కతాలో కాంగ్రెస్ ఆందోళన..

కోల్ కతా : రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఈ ఆందోళనలో ఎంపీ అదిర్ చౌదరి పాల్గొన్నారు. ఇటీవలే ఓ విద్యార్థి అక్కడ హత్య జరిగిన విషయం తెలిసిందే. 

రాష్ట్రపతి ప్రణబ్ కి సతీవియోగం..

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సతీవియోగం కలిగింది. ఇవాళ ప్రణబ్ సతీమణి శుభ్రాముఖర్జీ కన్నుముశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈనెల 7వ తేదీన ఆమెకు గుండె పోటు రావడంతో వెంటనే ఆసుపత్రిలో చేరిపించారు. అప్పటి నుండి ఐసీయూలో ఆమెకు చికిత్స అందించారు. సెప్టెంబర్ 17, 1940లో జెస్సోర్ లో శుభ్రా జన్మించారు. ప్రణబ్ ను జులై 13, 1957లో వివాహం చేసుకున్నారు. ఆమె మంచి గాయని అని గీతాంజలి ట్రూప్ ను కూడా నెలకొల్పారని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

బొగ్గు స్కాం కేసులో ఇద్దరికి బెయిల్...

ఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో ప్రత్యేక కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ గుప్తాతోపాటు విశ్రాంత అధికారి ఎల్ ఎల్ జానోటికి బెయిల్ మంజూరు చేశారు. 

టి.ఏసీబీ ఎదుట ఆదికేశవులు నాయుడు కుమారుడు..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ ఎదుట ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్ హాజరయ్యాడు. ఆయనతో పాటు విష్ణు, చైతన్యలు కూడా హాజరయ్యారు. 

టీఆర్ఎస్ ఎంపీ కేకేకు అస్వస్థత..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న కేకేను నిమ్స్ చేర్పించారు. 

సైబరాబాద్ లో బయటపడిన నకిలీ కార్డుల దందా..

హైదరాబాద్ : సైబరాబాద్ లో నకిలీ కార్డుల దందా బయటపడింది. నకిలీ కార్డులను తయారు చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పెద్దమొత్తంలో ఓటర్ ఐడీ, పాన్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ధృవపత్రాలతో బ్యాంకులను ముఠా బురిడి కొట్టించిందని, ఇప్పటి వరకు వందల సంఖ్యలో క్రెడిట్ కార్డులను ముఠా తీసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాకు సహకరించిన ప్రభుత్వ అధికారిపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. 

ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పర్యటన..

నెల్లూరు : జిల్లాలో ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నేడు, రేపు పర్యటించనున్నారు. శ్రీహరి కోట, కృష్ణపట్నం, పులికాట్, తిరుపతిలను నేతలు సందర్శించనున్నారు. 

కొనసాగుతున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ..

తిరుపతి : పట్టణంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ కొనసాగుతోంది. తొలి రోజు కర్నూలు, నెల్లూరు జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పించారు. 

రెండు నెలల కిత్రం గల్లంతైన మత్స్యకారులు క్షేమం..

తూర్పుగోదావరి :- రెండు నెలల క్రితం సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా బయటపడ్డారు. తొండంగి (మం) హుకుంపేటకు చెందిన ఆరుగురు కాకినాడకు చేరుకున్నారు. 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : మంగళవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 30 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. 

కొనసాగుతున్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం ఆందోళన..

ఢిల్లీ : వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు కోసం ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికోద్యుగులు నిరహార దీక్షలు కొనసాగిస్తున్నారు. తాజాగా మరో ముగ్గురు రిటైర్డ్ సైనికోద్యుగులు దీక్షలో పాల్గొన్నారు. 

ఉగ్రవాది నవేద్ తరలింపు..

ఢిల్లీ : ఉధంపూర్ లో ఘటనలో పట్టుబడిన ఉగ్రవాది నవేద్ ను లై డిటెక్టర్ పరీక్ష కొరకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

కడప విద్యార్థినుల ఆత్మహత్యపై మంత్రి గంటా ఆరా..

కడప : జిల్లాలో ఇద్దరు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్యలపై కలెక్టర్‌, ఎస్పీతో ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు మాట్లాడారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని గంటా ఆదేశించారు.

దూసుకుపోతోన్న ఉల్లి...

ఢిల్లీ: ఉల్లి ధర దూసుకుపోతోంది. లాసల్ గావ్ మార్కెట్ లో ఉల్లి కిలో టోకు ధర.. రూ.43 కు చేరింది. ఢిల్లీలో కిలో ఉల్లి రూ.80, హైదరాబాద్ లో రూ.50 లకు పెరిగింది. ఉల్లి నిల్వలు నల్లబజారుకు చేరటమే ధర పెరుగుదలకు కారణమని నిపుణులు అంటున్నారు. కేవలం 5 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి తగ్గినందునే ధర ఇంతగా పెరిగిందని విశ్లేషణ చేశారు.

10:22 - August 18, 2015

న్యూఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును పేల్చేస్తారా ? పేల్చేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అనంతరం లోనికి పంపిస్తున్నారు. కానీ ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అధికారులు ధృవీకరించడం లేదు. ఈ మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందో మాత్రం తెలియడం లేదు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఉగ్రవాదిన మెమన్ ఉరితీత అనంతరం అత్యున్నత న్యాయస్థానానికి, న్యాయమూర్తులకు హెచ్చరికలు అందుతున్నాయి. గత నెల 31న మెమన్ ను ఉరి తీసిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీనితో ప్రభుత్వం గట్టిబందోబస్తు ఏర్పాటు చేసింది.

వేయి లీటర్ల పెట్రోల్ స్వాధీనం..

రాజమండ్రి : కేశనపల్లిలోని ఓఎన్జీసీ నగర్ నుండి అక్రమంగా తరలిస్తున్న వేయి లీటర్ల పెట్రోల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 

ఆరోగ్య శ్రీ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా..

హైదరాబాద్ : కోఠి ఆరోగ్య శ్రీ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. వేతనాలు పెంచాలంటూ 25 రోజులుగా కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.  

రిమ్స్ లో విద్యార్థినిల మృతదేహాలకు పోస్టుమార్టం..

కడప : ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినులు నందిని, మనీషా మృతదేహాలకు రిమ్స్ లో పోస్టుమ్టారం జరుగుతోంది. రిమ్స్ వద్దకు విద్యార్థులు, బంధువులు భారీగా తరలివచ్చారు. కళాశాల యాజమాన్యాన్ని బంధువులు అడ్డుకున్నారు. కడపలోని నారాయణ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌ చదువుతున్న నందిని, మనిషాలు ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యలు కలకలం రేపాయి. 

సరిహద్దులో హింసకు తెరవేయండి - సీపీఎం..

జమ్మూ కాశ్మీర్ : సరిహద్దులో హింసకు తెరవేయాలని భారత్, పాక్ దేశాలకు సీపీఎం విజ్ఞప్తి చేసింది. ఇటీవలి హింసాకాండకు పలువురు చనిపోతున్నారని, పలు కుటుంబాలు నిర్వాసితులవుతుండడం పట్ల సీపీఎం నేత తరిగామి ఆవేదన వ్యక్తం చేశారు. 

వరంగల్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

వరంగల్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ములుగు మండలంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో అన్నంపల్లి వద్ద దాసురాంముట్టు చెరువు పొంగింది. నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సర్వాపూర్ వద్ద జోగుల వాగు..వెంకటాపురం మండలం బూర్గుపేటలో మారేడు కొండ చెరువు పొంగుతున్నాయి. దీనితో ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

సెప్టెంబర్ 1న రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల ఆందోళన..

విజయవాడ : సెప్టెంబర్ 1వ తేదీన రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆందోళన నిర్వహించనున్నాయి. రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళనలు కొనసాగనున్నాయి. సెప్టెంబర్ 2న దేశ వ్యాపిత కార్మిక సమ్మెకు మద్దతు ప్రకటించాయి. 

సుప్రీంకోర్టు వద్ద భద్రత పెంపు..

న్యూఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అనంతరం లోనికి పంపిస్తున్నారు. కానీ ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అధికారులు ధృవీకరించడం లేదు. 

గుజరాత్ లో తనిఖీలు..

గుజరాత్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 

09:22 - August 18, 2015

జమ్మూ కాశ్మీర్ : సరిహద్దులో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతోంది. గత వారం రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలపై తూటాల వర్షం కురిపిస్తోంది. దీనితో క్షణయొక యుగంలా బతుకుతున్నారు. తాజాగా ఆర్ఎస్ పురా, ఆర్నియా, బాలాకోట్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. పౌరులే లక్ష్యంగా పాక్ బలగాలు దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి.
తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని అక్కడి గ్రామాల ప్రజలు ఓ జాతీయ చానెల్ తో ఆవేదన వెలిబుచ్చారు. రాత్రి రెండు గంటల సమయంలో కాల్పులు ప్రారంభమయ్యాయని, ఇంకా కాల్పులు జరుగుతున్నాయన్నారు. కాల్పులతో తాము ఎక్కడకు వెళ్లాలో తెలియడం లేదని వాపోయారు. ఇదిలా ఉంటే ఇటీవలే కాల్పులు చోటు చేసుకుండడంపై భారత్ సీరియస్ గా పరిగణించింది. ఏకంగా పాక్ హై కమిషన్ కు నోటీసులు జారీ చేసింది. పాక్ జరుపుతున్న కాల్పులపై కేంద్ర హోం శాఖ కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. 24గంటల్లో పాక్ నాలుగు సార్లు కాల్పులకు తెగబడింది. మూడు రోజుల కిందట జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. దీనితో సరిహద్దు ప్రాంతాల వద్ద టెన్షన్..టెన్షన్..వాతవరణం నెలకొంది. 

పెట్రోల్, డీజిల్ కల్తీ ముఠాగుట్టు రట్టు..

హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ కల్తీకి పాల్పడుతున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. చర్లపల్లి హెచ్ పీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి వచ్చే ట్యాంకర్లను నాచారంలో తమ కార్ఖానాలకు ఆయిల్ గ్యాంగ్ మళ్లిస్తోందని..ట్యాంకర్ల నుండి 30 శాతం వరకు డీజిల్, పెట్రోల్ తీసి కిరోసిన్ కలుపుతున్నారని ఎస్ఓటి పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీనితో వారు దాడి చేసి ముగ్గురుని అరెస్టు చేశారు. రెండు ట్యాంకర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సీఎం బాబును కలిసిన అభయగోల్డ్ బాధితులు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబును అభయోగోల్డ్ బాధితులు కలిశారు. తమను ఆదుకోవాలని ఉభయగోదావరి జిల్లాల బాధితులు సీఎంను కోరారు. 

09:12 - August 18, 2015

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో విదేశీ మందుబాబులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఏకంగా పోలీసు వాహనాన్ని, మరో వాహనాన్ని ఢీకొట్టారు. వీకెండ్ లో దేశ రాజధానిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన విదేశీయులు కారులో ప్రయాణిస్తున్నారు. చాణక్యపురి వద్ద అతివేగంగా పోలీసు వాహనాన్ని, మరో ఇతర వాహనాన్ని విదేశీయులు ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వెంటనే పోలీసులు విదేశీయుల కారును సీజ్ చేశారు. విదేశీయులు ఎక్కడి నుండి వచ్చారు ? ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు ? మద్యం ఎక్కడ సేవించారనే దానిపై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. 

పోలీసుల అదుపులో 30 ఎర్రచందనం స్మగ్లర్స్..

చిత్తూరు : పుత్తూరులో జరిపిన తనిఖీల్లో 30 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కార్పియో (టిఎన్ 25ఆర్ 7272), మినీబస్ (టిఎన్ 99ఎ 8133) సీజ్ చేశారు. 

08:38 - August 18, 2015

రాజకీయ నేతలు భావోద్వేగాలను రెచ్చగొడుతూనే ఉంటారని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు చార్జిషీట్ లో చంద్రబాబు నాయుడి పేరును తెలంగాణ ఏసీబీ చేర్చింది. అంతేగాక గవర్నర్ పై బాబు పలు వ్యాఖ్యలు చేశారు. ఈఅంశాలపై టెన్ టివి 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ ' కార్యక్రమంలో ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..
బాబుపై కేసు ఉండబోతుందనేది సిగ్నల్...
''కొత్తగా తెలిసిందేమి కాదు. తాజా ఘటనతో బాబుపై కేసుపై ఉండబోతోంది అనే సిగ్నల్ వచ్చింది. గతంలో బయటపడిన ఆడియో టేపుల్లో నేను మాట్లాడింది కాదు అని బాబు పేర్కొనలేదు. ఈ అంశాలలో భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. నైతికత వేరు. చట్టబద్ధత వేరు. ప్రలోభాలు పెట్టడం చట్టవిరుద్ధం. పార్టీ మారడం వేరు. ఇక్కడ చార్జీషీట్ లో చెప్పడం ప్రత్యేకత. అభియోగపత్రంలో పేర్కొని నిందితుల జాబితాలో పేర్కొనకపోతే ? ఇందులో కోర్టు కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. చట్టరీత్యా కొన్ని ప్రశ్నలు అడుగవచ్చు. రాజకీయంగా టీఆర్ఎస్ పై పలు విమర్శలు రావచ్చు. సాక్షిగా పెడుతారా ? గతంలో నిందితుడు అన్నారు కదా అనే విమర్శలు వస్తాయి. చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఏసీబీ కేసును బలోపేతం చేస్తుందని బయటకు వాదనలు పంపిస్తోంది. ఏమి చేయకపోతే రాజకీయ విమర్శలు వస్తాయి.
విభజనపత్రాలు విడుదల..
శాంతి భధ్రతలకు..అవినీతి ఆరోపణలకు సంబంధం లేదు. అవినీతి ఆరోపణలు..చార్జీషీట్ లో పేరు నమోదు వస్తే సెక్షన్ 8 అంటున్నారు. శాంతి భద్రతలు అంటే టిడిపి కార్యకర్తలకు నోటీసులు ఇవ్వవద్దనా ? తెలంగాణ ఏసీబీని గవర్నర్ తీసుకుని కేసులు కొట్టేసి ఏమి జరుగలేదు అని నీరు గార్చిస్తే సెక్షన్ 8 అంటారు. కానీ ఇవన్నీ సెక్షన్ 8 లో పేర్కొన్నారా. శాంతిభధ్రతల సమస్య ఎక్కడైనా ఉందా ? సెక్షన్ 8 ఏం చెబుతోంది. గవర్నర్ కు సంపూర్ణ అధికారాలు ఇవ్వలేదు. ఇక్కడ బాబు విశ్వసనీయత ప్రశ్నార్థకమౌతోంది. బాబు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదు. టిడిపిని నిర్వీర్యం చేయడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందనది బహిరంగ రహస్యం. లేని సమస్యలు సృష్టించుకుని బాబు మాట్లాడడం అభ్యంతరకరం.
ఆస్తులు వారికి అప్పులు మాకు అని చంద్రబాబు అని అన్నారు కదా..ఇదే మాటను టి.టిడిపి నాయకుడు ఎర్రబెల్లితో అనిపియండి అంటే విశ్వసనీయత అంటారు. ఎక్కడెక్కడ తీసేసి ఏపీకి ఇవ్వాలని చెప్పండి. పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించండి అని చెప్పండి. ఇంకా భావోద్వేగాలను రెచ్చగొడుతూనే ఉంటారు'' అని నాగేశ్వర్ తెలిపారు. 

మాచవరపాలెంలో కూలిన కల్వర్టు..

విశాఖపట్టణం : మాచవరపాలెం మండలం వెంకన్నపాలెం దగ్గర కల్వర్టు కూలడంతో నర్సీపట్నం-విశాఖ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. 

స్థిరంగా అల్పపీడన ద్రోణి..

విశాఖపట్టణం : ఒడిశా నుండి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. 

08:01 - August 18, 2015

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు చార్జిషీట్ లో చంద్రబాబు నాయుడి పేరును తెలంగాణ ఏసీబీ చేర్చింది. దీనితో ఈ కేసు సంచలనమైన మలుపు తిరిగింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స్టన్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన సంభాషణ ట్రాన్స్ క్రిఫ్ట్ నుండి కొన్ని భాగాలను చార్జిషీట్ లో ఉటంకించారు. మరోవైపు తెలంగాణలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ అంశాలపై టెన్ టివి చర్చా వేదికలో రఘునాథ్ బాబు (బీజేపీ), కొండా రాఘవరెడ్డి (వైసీపీ), రాకేష్ (టీఆర్ఎస్), సతీష్ మాదిగ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

మారేడ్ పల్లి పీఎస్ దాడి నిందితుడు ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్ : మారేడ్ పల్లి పీఎస్ దాడి కేసులో నిందితుడు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లగా ఇంట్లో దశరథ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. 

సరిహద్దులో పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. తాజాగా ఆర్ఎస్ పోరా సెక్టార్ లో కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఓ పౌరుడు గాయపడ్డాడు.

నిజామాబాద్ లో దారి దోపిడి..

నిజామాబాద్ : బిచ్కుంద మండలం శాంతాపూర్ గండిలో సోమవారం రాత్రి కొందరు దుండగులు దారి దోపిడికి పాల్పడ్డారు. కారుపై దాడి చేసి 25 తులాల బంగారం, రూ.2లక్షల నగదును అపహరించుకపోయారు. 

నేడు ఫార్మా కంపెనీల యజమానులతో మంత్రి కామినేని భేటీ..

విశాఖపట్టణం : నేడు ఫార్మా కంపెనీల యజమానులతో మంత్రి కామినేని భేటీ కానున్నారు. కేజీవీపీలో ఉదయం 8గంటలకు ప్రత్యేక బ్లాక్ ను ఆయన ప్రారంభించనున్నారు. 

07:02 - August 18, 2015

హైదరాబాద్ లో చినుకు పడితే నరకం కనిపిస్తుంది. డ్రైనేజీలు పొంగి రోడ్ల మీద పోటెత్తుతాయి. కాలువల్లో, మ్యాన్ హోల్స్ పడి పిల్లలు మరణిస్తుంటారు. వర్షం పడ్డ ప్రతిసారీ హైదరాబాద్ లో ఏదో ఒక విషాదం జరుగుతూనే వుంది. ఈ దుస్థితికి కారణం ఏమిటి? హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ ఇంత ఘోరంగా ఎందుకు తయారైంది? భాగ్యనగరంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడాలంటే ఏం చేయాలి? ఈ అంశంపై జనపథంలో ఫాకా నాయకులు అంజయ్య విశ్లేషించారు. 

07:01 - August 18, 2015

హైదరాబాద్ ఓ చారిత్రక నగరం. భిన్న సంస్క్రుతుల సమ్మేళనం. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని. తెలుగు వారందరికీ ఏదో ఒక తియ్యటి అనుబంధం వున్న అపూర్వ నగరం. తన దగ్గరకు వస్తే ఏదో ఒక ఉపాధి లభిస్తుందన్న భరోసా ఇచ్చే మహానగరం. మన దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన నగరం. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలని అంబేద్కర్ సూచించినట్టు చెబుతుంటారు. ఇప్పుడు ఈ నగరం జనభా కోటి మైలురాయిని చేరింది. దేశ ఆర్థికాభివ్రుద్ధిలో హైదరాబాద్ నగరం పోషిస్తున్న పాత్ర అసమాన్యం. కానీ, ఇంతటి ప్రాముఖ్యతగల మన భాగ్యనగరం చినుకుపడితే వణికిపోతోంది. చిరు జల్లు కురిస్తే వీధుల్లో నడవలేని పరిస్థితి దాపురించింది. మురుగు కాలువల పొంగి పొర్లుతాయి. రోడ్లన్నీ చెరువుల్లా మారిపోతాయి. చిరు జల్లు కురిస్తే ఏది రోడ్డో, ఏది కాలువో, ఏది గుంతో అర్ధంకాన్నట్టుగా దృశ్యం మారిపోతోంది. సైడు కాలువల్లో పడి జనం చనిపోతుంటారు. వాహనాలు నడుపుతున్నవారు నడుపుతున్నట్టే కాలువల్లో, మ్యాన్ హోల్స్ లో నో పడి మరణిస్తారు. ఇలాంటి విషాదాలు ఏడాదికి పది పన్నెండు జరుగుతున్నాయి. ఎక్కడైనా ఏదైనా విషాదం జరిగితే జీహెచ్ఎంసీ అధికారులు ఆ కొద్దిసేపు హడావిడి చేయడం, ఆ తర్వాత సమస్య పరిష్కారం గురించి ఆలోచించకపోవడం మన కళ్లెదుటే కనిపిస్తున్న నిర్లక్ష్య దృశ్యం.
అస్తవ్యస్థంగా డ్రైనేజీ..
హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది. వీటి నిర్వహణలో ఒక పద్ధతి లేదు. నిర్వహణ లేదు. వీటి మరమ్మతుల కోసమంటూ ఏటేటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపిస్తున్నా ఏ యేటికాయేడు జనం కష్టాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గత ఇరవై ఏళ్లలో హైదరాబాద్ మహానగరం ఎంతగానో విస్తరించింది. కొన్ని రెట్ల ఆదాయం పెరిగింది. జనాభా పెరిగింది. అన్ని రకాల వ్యాపారాలు పెరిగాయి. రోడ్లు విస్తరించాయి. ఫ్లయ్ ఓవర్లొచ్చాయి. ఇప్పుడు స్కై ఓవర్లు వస్తాయంటున్నారు. కానీ, డ్రైనేజీ వ్యవస్థలో మాత్రం ఏ మార్పూ రాలేదు. ఎప్పుడో నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ మనుగుడలో వుంది. కనీసం దానినైనా పక్కాగా నిర్వహిస్తున్నారా? అంటే అదీ లేదు. వరద నీటికి ముకుతాడు వేసే నాళాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. కబ్జా చేస్తున్నారు. ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచిపోయినా జనం అవస్థపడుతున్నా, చిన్న వానకే మోకాళ్లోతు నీళ్లు వస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. డ్రైనేజీ వ్యవస్థను ఇంత తీవ్రంగా నిర్లక్ష్యం చేసి హైదరాబాద్ ను స్మార్ట్ సిటీగానో, స్వచ్ఛ నగరంగానో మారుస్తామంటూ ప్రకటనలు చేయడంలో అర్ధం వుంటుందా? 

06:42 - August 18, 2015

ఢిల్లీ : భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో కాల్పుల మోతకు ఫుల్‌స్టాప్‌ పడటం లేదు. ఎన్ని చీవాట్లు పెట్టినా పాకిస్థాన్‌ బలగాలు... కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే వున్నాయి. రెండు రోజులుగా నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరుగుతూనే వున్నాయి. ఆదివారం రాజౌరీలోని మంజకోట్ సెక్టార్‌లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపగా... ముగ్గురు పౌరులు గాయపడ్డారు. రాత్రి సైతం సుజియాన్, మాండీ సెక్టార్లలో కాల్పులు జరిపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాకిస్థాన్‌ ఆర్మీ పదేపదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని భారత రక్షణ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. నియంత్రణ రేఖ సమీప గ్రామాలపై 120 ఎంఎం, 80 ఎంఎంమోర్టార్‌ బాంబులు ప్రయోగిస్తున్నట్లు చెప్పింది. ఐతే వాటికి ఇండియన్ ఆర్మీ గట్టిగానే సమాధానం చెబుతున్నట్లు స్పష్టం చేసింది.
తమ తప్పేం లేదంటున్న పాక్..
ఆదివారం పాకిస్థాన్‌ రాయబారి అబ్దుల్ బాసిత్‌కు భారత్ సమన్లు జారిచేసింది. ఆయన విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులను కలిసి వివరణ ఇచ్చారు. ఐనప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. సరిహద్దులో హింస పెరుగుతుంటే... ప్రధాని మోదీ ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆయనకు విదేశీ పర్యటనలపై వున్న మోజు... ప్రజల కష్టసుఖాలపై వుండటం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్ ఓవైపు ఆందోళన వ్యక్తం చేస్తోంటే... పాకిస్థాన్ మాత్రం తనతప్పేం లేదని చెబుతోంది. భారత సైనికులే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తోంది. జూలై నుంచి ఇప్పటి వరకూ దాదాపు 70సార్లు కాల్పులకు దిగినట్లు లెక్కలు చెబుతోంది. ఇప్పటికైనా ఇరు దేశాల ప్రధానులు సమస్యను తీవ్రంగా పరిగణించి పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

06:40 - August 18, 2015

యూఏఈ : ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు భారత్‌లో అవకాశమున్నట్లు మోదీ అన్నారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని దుబాయ్‌లో స్థిరపడ్డ ఎన్‌ఆర్‌ఐలని కోరారు. భారత్‌ కేవలం మార్కెట్‌ మాత్రమే కాదని.. ఒక శక్తి అని పేర్కొన్నారు. 34 ఏళ్ళుగా భారత ప్రధాని యూఏఈని సందర్శించకపోవడంపై తనకు అవమానకరంగా అనిపిస్తుందన్నారు. భారత్‌ యూఏఈ మధ్య ఈవేళ నమ్మకమనే వంతెన నిర్మించామని అభివర్ణించారు. 
బిజీబిజీగా గడిపిన మోడీ..
రెండు రోజుల పర్యటనలో భాగంగా యూఏఈలో ప్రధాని మోడీ బిజీబిజీగా గడిపారు. జీరో కార్బన్ స్మార్ట్ సిటీ మస్దర్ నగరాన్ని సందర్శించారు. సౌరవిద్యుత్‌ కార్ల సంస్థను సందర్శించారు. ప్లాంట్‌లో కార్ల తయారీ విధానాన్ని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ అవసరం లేని, సౌరశక్తి, లిథియం బ్యాటరీతో నడిచే కారులో ప్రయాణించారు. డిజిటల్ విజిటర్స్ బుక్‌లో సైన్స్ ఈజ్ లైఫ్ అని రాసి డిజిటల్ సంతకం చేశారు. మస్దర్‌ నగర వాస్తు శిల్పులను కూడా కలిసి మాట్లాడారు. అనంతరం అబుదాబిలో యూఏఈ ప్రవాస భారత పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు మోడీ. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయని చెప్పారు. ఒక ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు అవకాశమున్నట్లు తెలిపారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను కోరారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రియల్‌ ఎస్టేట్‌, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టుబలకు అధికంగా అవకాశాలున్నట్లు చెప్పారు.
ఆసియా ముఖచిత్రం మారనుందన్న మోడీ..
ఇండియా శక్తి, యూఏఈ సామర్థంతో భవిష్యత్‌లో ఆసియా ముఖ చిత్రం మారనుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ కేవలం మార్కెట్‌ మాత్రమే కాదని.. ఒక శక్తి అని పేర్కొన్నారు. 21వ శతాబ్దాన్ని ఆసియా శతాబ్దంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. 34 ఏళ్లుగా భారత ప్రధానులెవరూ యూఏఈలో పర్యటించకపోవడం అవమానకరంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య రోజూ 700 విమానాలు తిరుగుతున్నా... భారత ప్రధాని అబుదాబిలో పర్యటించడానికి 34 ఏళ్లు పట్టిందన్నారు.
ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు...
దుబాయ్‌లోని క్రికెట్‌ మైదానంలో ప్రవాస భారతీయులు మోడీకి ఘనంగా స్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి మోడీ సుదీర్ఘంగా ప్రసంగించారు. భారత్‌ యూఏఈ మధ్య ఈవేళ నమ్మకమనే వంతెన నిర్మించామని అభివర్ణించారు. భారత్‌పై ఆగ్రహంతో కొందరు ఆంక్షలు విధించి దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌కు సాయం చేయాలన్న వాజ్‌పేయీ పిలుపుతో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు ఖజానా నింపడంలో సాయం చేశారని గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ భారత్‌, యూఏఈ ఉమ్మడి ప్రకటనను దుబాయ్‌లో వెలువరించాయి. తీవ్రవాదానికి మతాన్ని వాడుకునే ప్రయత్నాలను ఇరు దేశాలు ఖండించాయి. ఉగ్రవాద నిర్మూలనలో ద్వైపాక్షిక సహకారం మరింత పెంపొందించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి.

06:36 - August 18, 2015

హైదరాబాద్ : తెలంగాణలో గుడుంబాను తరిమికొడతానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. గుడుంబా తాగి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని అనేకసార్లు ప్రకటించారు. దీంతో బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. అయితే ఇంతలోనే సర్కార్‌ మదిలో మరో కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. గుడుంబాను నిరోధించి చీప్‌ లిక్కర్‌ను తెస్తే ఎలా ఉంటుందా అని పరిశీలించింది. సర్కార్‌ ఆలోచనకు ఎక్సైజ్‌శాఖ వంత పాడింది. దీంతో నాణ్యమైన చీప్‌ లిక్కర్‌ను విక్రయించేందుకు సర్కార్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోపక్క అర్ధరాత్రి వరకు వైన్‌షాపులు తెరిచే ఉంచడంతో పాటు.. విదేశీ మద్యాన్ని మాల్స్‌లో సైతం విక్రయించేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
ఐద్వా ఆధ్వర్యంలో బస్సు జాతా..
మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించాలని చూస్తున్న తెలంగాణ సర్కార్‌ తీరుపై మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామన్న సర్కార్‌... సారా తెలంగాణగా మారుస్తోందని మండిపడుతున్నారు. మద్యం విక్రయాలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో బస్సు జాతాను ప్రారంభించారు. మద్యం వల్ల జరిగే అనర్ధాలను ప్రజలకు వివరించి.. పోరాటాలు ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుందో ?
ఇక మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి సారా వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్సైజ్‌ పాలసీపై ప్రభుత్వం పునరాలోచించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం మద్యం విక్రయాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ నిర్ణయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

06:30 - August 18, 2015

విజయవాడ : గవర్నర్‌ నరసింహన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం తన మనస్సులో బాధను బయటకు వెళ్లగక్కారు. విభజన చట్టం లోపాలను ఎత్తిచూపుతూ.. నరసింహన్‌ తీరుపై పలు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాజధాని శాంతిభద్రతలను గవర్నర్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ నిట్టూర్చారు.
రాష్ర్ట విభజన బిల్లు-లోపాలు' పేరిట మూడో వివరణ పత్రం..
విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు రాష్ట్ర విభజన వలన తలెత్తిన సమస్యలను వివరించారు. విభజన తీరు సరిగా ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావని ఎప్పటిలానే బాబు చెప్పుకొచ్చారు. 'రాష్ర్ట విభజన బిల్లు-లోపాలు' పేరుతో మూడో వివరణ పత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం గవర్నర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రజలకు.. రక్షణ లేదు.. చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన గవర్నర్‌ ఆ దిశగా పట్టించుకోవడం లేదన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల ఆస్తుల రక్షణ కోసమే విభజన చట్టంలో సెక్షన్-8 పొందుపరిచారని, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్‌దేనని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యులకే ఇబ్బందులు ఉన్నప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 

06:27 - August 18, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జీషీట్‌ను టెన్ టీవి సంపాదించింది. చంద్రబాబు మెడకు ఉచ్చు బిగుసుకుంటుందనే ఉహాగానాలతో ఈ చార్జీషీట్ ఎంతో కీలకంగా మారింది. రేవంత్ ఇటీవల కోర్టుకు హాజరవుతూ అభియోగపత్రంలో అంశాలను చూసిన తర్వాత కేసీఆర్‌ సర్కార్‌ కుట్రను తాను బట్టబయలు చేస్తానన్నారు. అయితే కోర్టు ఇంకా ఈ అభియోగపత్రాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అటు నిందితులకూ కాఫీ అందలేదు. ఈ నేపథ్యంలో మీడియాకు లీకైన చార్జీషీట్‌లో చంద్రబాబు పేరు ఉండటం టీడీపీ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తోంది.
చార్జీషీట్ లో పలు అంశాలు..
చార్జీషీట్‌లో ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయించే పనిని చంద్రబాబు తనకు అప్పగించారని రేవంత్ చెప్పడాన్ని పేర్కొన్నారు. చంద్రబాబు తరుపున తానే బేరాసారాలు చేస్తున్నానన్న అంశాన్ని హైలైట్ చేశారు. నేరుగా స్టిఫెన్ సన్‌తో చంద్రబాబు మాట్లాడారని ఏసిబి వెల్లడించింది. దే బ్రీఫుడ్ మీ అంటూ మొత్తం సంభాషణను చార్జీషీట్‌లో పొందుపరిచింది. ఇక జూన్ 2న సెల్‌ఫోన్‌ స్వీచాఫ్ చేయాలంటూ టీడీపీ నేతలు మత్తయ్యకు చెప్పారని...ఇదే విషయాన్ని మత్తయ్య ఎస్ఎంఎస్ చేశారంటూ ఆధారాలు సమర్పించింది. ఎస్.ఎం.ఎస్. వాట్స్ ఆఫ్ ల ద్వారా ఓటుకు నోటు పతక రచన అని ఏసీబీ స్పష్టం చేసింది.
ఇక ఎఫ్.ఎస్.ఎల్ రిపోర్టును కోర్టు ముందు ఉంచినట్లు దాని సంభాషణను సంక్షిప్తంగా చార్జీషీట్లలో పేర్కొంది. అయితే ఇంకా ఏసిబి నోటీసుల పేరుతో దూకుడు పెంచుతున్నందునా.. నిందితుడిగా చంద్రబాబు పేరును చేర్చేందుకు బలమైన ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. 

06:24 - August 18, 2015

కడప : మొన్న రిషితేశ్వరీ.. నేడు నందిని, మనీషా.. ఇలా అర్ధాంతరంగా సరస్వతీ పుత్రులు ప్రాణాలు తీసుకుంటున్నారు. కడపలోని నారాయణ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ఈయర్‌ చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలు కలకలం రేపాయి. నారాయణ కాలేజీ హాస్టల్‌ గదిలో ఇద్దరు విద్యార్థినులు ఫ్యాన్‌లకు ఉరివేసుకున్నారు. వారి ఆత్మహత్యతో విద్యార్థి సంఘాలు కాలేజీపై దాడికి దిగాయి. ఆందోళన కారులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటు తమ పిల్లల ఆత్మహత్యలపై మృతుల తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మహత్యలపై అనేక అనుమానాలు..
సాయంత్రం తరగతులు ముగిసిన తర్వాత హాస్టల్ గదిలోకి వెళ్లిన విద్యార్థులు చున్నీలకు వెలాడుతున్న నందిని, మనీషా మృతదేహాలను చూసి షాక్‌ తిన్నారు. వెంటనే ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యానికి చెప్పారు. విషయం తెలిసిన విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు హాస్టల్‌కు చేరుకున్నారు. విగతజీవులుగా ఉన్న తమ బిడ్డలను చూసి బోరున విలపించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై నందిని, మనీషా తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ పిల్లల ఆత్మహత్యలకు కళాశాల యాజమాన్యమే కారణమని ఆరోపించారు.
విద్యార్థి సంఘాల ఆందోళన..
నందిని, మనీషా ఆత్మహత్యల పట్ల విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. సమాచారం తెలిసిన వెంటనే విద్యార్థి సంఘాల నేతలు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేశారు. విద్యార్థి సంఘాల నేతలు, మృతుల బంధువులు కాలేజీపై దాడికి దిగారు. ఫర్నిచర్‌, అద్దాలు ధ్వంసం చేశారు. ఒక దశలో నారాయణ కాలేజ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీని కూడా బాధితులు చుట్టు ముట్టారు. దీంతో పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందిని దింపి పరిస్థితిని అదుపు చేశారు. హాస్టల్‌ ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు లాఠీచార్జ్‌ చేసి తరిమివేయడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రాష్ర్ట పురపాలక శాఖ మంత్రి నారాయణకు వ్యతిరేఖంగా విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భయాందోళనలు...
నందిని, మనీషాల ఆత్మహత్యలు జరిగిన తీరును పరిశీలిస్తే వందలమంది విద్యార్థినులు ఉన్న హస్టల్‌లో ఆత్మహత్య చేసుకోవడం వీలు కాదన్నది కొందరి వాదన. విద్యార్థినుల సుసైడ్ నోట్‌ను కాలేజీ యాజమాన్యం మాయం చేశారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసు విచారణను జిల్లా ఎస్పీ నవీన్‌ గులాఠీ పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనలతో కాలేజీ విద్యార్థినులు భయంతో వణికిపోతున్నారు. విద్యార్థునుల సూసైడ్‌తో కాలేజీ ఆవరణ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

కేంద్ర మంత్రి సుష్మాను కలువనున్న ఇంజినీర్ల కుటుంబసభ్యులు...

ఢిల్లీ : నైజీరియాలో చిక్కుకున్న 11 మంది భారతీయ ఇంజనీర్లను విడిపించాలని కేంద్ర మంత్రి సుష్మాను కుటుంబసభ్యులు కలువనున్నారు. 

నేడు ఉగ్రవాది నవేద్ కు లై డిటెక్టర్ పరీక్షలు..

ఢిల్లీ : ఉదయం 11గంటలకు సీజీవో కాంప్లెక్సులో ఉగ్రవాది మహ్మద్ నవేద్ కు లైడిటెక్టర్ పరీక్షలు ఎన్ఐఏ నిర్వహించనుంది. ఉదంపూర్ లో ఘటనలో ఉగ్రవాది నవేద్ పట్టుబడిన సంగతి తెలిసిందే. 

నేడు టి.సీఎస్ సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. కేబినెట్ నిర్ణయాలు, అమలు, సంక్షేమ పథకాలు పనితీరు పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చ జరుగనుంది. 

నేడు కలెక్టర్లతో గంటా వీడియో కాన్ఫరెన్స్..

హైదరాబాద్ : ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లోని మరుగుదొడ్ల నిర్మాణంపై చర్చించనున్నారు. 

20న నిట్ కు బాబు శంకుస్థాపన..

హైదరాబాద్ : ఈనెల 20వ తేదీన తాడేపల్లి గూడెంలో నిట్ కు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీలు పాల్గొననున్నారు.

 

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీల ఖరారు..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీల ఖరారయ్యాయి. ఈనెల 31వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు సమావేశాలు జరుగనున్నాయి.

20న ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు..

హైదరాబాద్ : ఈనెల 20వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సైనా..

హైదరాబాద్ : ప్రముఖ భారత స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఇటీవలే వరల్డ్ బ్యాడ్మింటెన్ లో స్పెయిన్‌ క్రీడాకారిణి, డిఫెండింగ్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. 

Don't Miss