Activities calendar

19 August 2015

21:34 - August 19, 2015

గుంటూరు : నాగార్జున వర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసు మరో మలుపు తిరిగింది. తాను అనుభవించిన చిత్రవధకు ప్రతిరూపంగా రెండో డైరీ బయటపడింది. కాలేజీలో మిత్రులకన్నా ముందే తనకు పరిచయమైన ర్యాగింగ్‌ రాక్షసాన్ని కళ్లకు కట్టింది ఆ డైరీ...

మిస్‌ పర్‌ ఫెక్ట్‌ కిరీటం తొడిగి..

మిస్‌ పర్‌ ఫెక్ట్‌ కిరీటం తొడిగి.. అడుగుడగునా తనపట్ల మిస్‌బిహేవ్‌ చేసిన సీనియర్ల వికృత చేష్టలను కళ్లకు కట్టినట్టుగా వివరించింది రిషితేశ్వరి రెండో డైరీ. యూనివర్సిటీలో అడుగు పెట్టింది మొదలు.. తాను అనుభవించి ఆవేదనను అక్షరాలుగా మార్చి.. కన్నీటినే ఇంకుగా మార్చి, డైరీలో రాసుకుంది.

దాన్ని చేతిలో పెడుతూనే అసభ్యంగా ప్రవర్తించాడు...

మిస్‌ పర్‌ ఫెక్ట్‌ అవార్డు అందించిన సీనియర్‌ శ్రీనివాస్‌.. దాన్ని చేతిలో పెడుతూనే అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. ఆ వికృతాన్ని దాటుకుని, స్టేజీ కిందకు రాగానే ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న జయచరణ్‌ అనే మరో విద్యార్థి అసభ్య ప్రవర్తనను కొనసాగించాడని డైరీలో వెల్లడించింది. శతవిధాలా ప్రయత్నించి ఆ పూటకు బయటపడినప్పటికీ.. సీనియర్ల వికృత చేష్టలు తనను వదల్లేదని పేర్కొంది.

సీనియర్‌ విద్యార్థిని అయిన హనీషా చేష్టలను సైతం.....

సహచర సీనియర్‌ విద్యార్థిని అయిన హనీషా చేష్టలను సైతం పూసగుచ్చింది రిషితేశ్వరి. సీనియర్లైన శ్రీనివాస్‌, జయచరణ్‌తో మాట్లాడాలని తనపై హనీషా ఎప్పుడూ ఒత్తిడి తెచ్చేదని, తిరస్కరించినందుకు నిత్యం ర్యాగింగ్‌ చేసేదని డైరీలో రాసుకుంది. ఇక తప్పని పరిస్థితుల్లో శ్రీనివాస్‌ను కలవగా... హీరోయిన్‌లా ఉన్నావంటూ అతడు సాగించిన వెకిలిచేష్టలు వెగటు పుట్టించాయని రిషితేశ్వరి పేర్కొంది.

వీళ్ల రాక్షసత్వం కొనసాగుతుండగానే..

వీళ్ల రాక్షసత్వం కొనసాగుతుండగానే.. అభిషేక్‌, ఆదిత్య అనే మరో ఇద్దరు పరిచయమైనట్టు రిషితేశ్వరి పేర్కొంది. వారిని సొంత అన్నదమ్ముల్లా భావించినప్పటికీ.. వాళ్లు కూడా ప్రేమ పేరుతో వేధించారని వెల్లడించింది. శ్రీనివాస్‌, జయచరణ్‌, ఆదిత్య, అభిషేక్‌.. అందరూ ప్రేమ పేరుతో చేసిన వేధింపులు తట్టుకోలేకపోయానని రిషితేశ్వరి పేర్కొంది.

ప్రతి ఒక్కరూ ప్రేమ పేరుతో వేధించడంతో......

ఇలా.. ప్రతి ఒక్కరూ ప్రేమ పేరుతో వేధించడంతో ఎంతో కుంగిపోయినట్టు రిషితేశ్వరి పేర్కొంది. అన్ని విషయాలు నాన్నతో చెప్పుకునే తాను.. ఇవి మాత్రం చెప్పుకోలేకపోయానని డైరీలో రాసింది. ఎన్నో ఆశలతో యూనివర్సిటీలో అడుగు పెట్టిన తనకు.. సీనియర్ల నుంచి ర్యాగింగ్‌ పేరుతో అడుగడుగునా ఎదురైన అడ్డంకులను వివరించింది. కొత్తగా యూనివర్సిటీలో అడుగు పెట్టిన రిషితేశ్వరికి సీనియర్ల నుంచి ఎదురైన వేధింపులను ఎదుర్కోలేక.. ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక తనలోనే కుమిలిపోయి ప్రాణాలు తీసుకున్నట్టు తెలుస్తోందని పలువురు అంటున్నారు.

21:27 - August 19, 2015

హైదరాబాద్ : చంద్రబాబుకు ఢిల్లీ తలుపులు తెరుచుకోవడం లేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ నాడు చిరునవ్వులు చిందించిన నరేంద్ర మోదీ దర్శన భాగ్యం కలగడం లేదు. తన ఆప్తమిత్రున్ని కలవడానికి మోదీ టైంలేదంటున్నారు. ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు..కనీసం బీహార్‌ రేంజ్‌లోనైనా ప్యాకేజీ రాబట్టుకోవాలనుకుంటున్నా మోదీ కటాక్షం లభించడం లేదు. ప్రధాని అపాయింట్ మెంట్ దొరక్క చంద్రబాబు ఢిల్లీ టూర్ వాయిదాలు పడుతోంది.

చంద్రబాబుకు కాలం కలిసిరావడం లేదా...

ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో నిరసనలు మిన్నంటుతుండటంతో కేంద్రం నుంచి సానుకూల ప్రకటన చేయించాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాలం కలిసిరావడం లేదు. ఎప్పుడెళ్లినా నరేంద్రమోదీతో సమావేశమయ్యే బాబుకు ఈమధ్య దర్శనభాగ్యం ప్రాప్తించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో బాబు ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాలతో 20వ తేదీ సమయం ఇవ్వలేకపోతున్నామని ప్రధాని కార్యాలయం నుంచి ఏపీ సీఎంవోకు లేఖ అందింది. ఈనెల 25 లేదా 28, 29,31 తేదీల్లో ఏ రోజు వీలైతే ఆరోజు అపాయింట్‌మెంట్‌ ఇస్తామని పీఎంవో తెలిపింది. ఈ నాలుగు రోజుల్లో ప్రధానితో అపాయింట్‌మెంట్‌కు సంబంధించి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

200 పేజీల డాక్యుమెంటరీ ప్రజెంటేషన్ .......

నిజానికి నరేంద్ర మోదీతో భేటి కోసం చంద్రబాబు చాలా హోంవర్క్ చేశారు. ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా డిమాండ్‌పై ప్రధానంగా చర్చించాలనుకున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల విమర్శలు, నిరసనలను ప్రధాని దృష్టికి తేవాలనుకున్నారు. అలాగే ఆర్థిక లోటు, పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై 200 పేజీల డాక్యుమెంటరీ రూపంలో ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అధికారులతో కసరత్తు చేశారు. ఏ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కావాలి..ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వంటి విషయాలను డాక్యుమెంటరీలో వివరించాలనుకున్నారు.

బీహార్‌కు భారీగా ప్రత్యేక ప్యాకేజీ నేపథ్యంలో ఏపీపై ఉత్కంఠ....

అంతేకాదు బీహార్‌కు ప్రధాని భారీగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో ఏపీ విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో పీఎంతో బాబు గురువారం భేటీపై అంచనాలు పెరిగాయి. కానీ నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంతో చంద్రబాబు కొంత నిరాశ చెందారని తెలుస్తోంది. మొత్తానికి ప్రధానితో భేటి అయిన తర్వాతే ఏపీ ప్రత్యేకహోదా, ప్యాకేజీలపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే ఇంతకుముందు పీఎంతో అపాయింట్‌మెంట్ ప్రాబ్లమ్ రాని చంద్రబాబుకు ఈమధ్య ఢిల్లీ సర్కారు వరుస షాక్‌లిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

20:56 - August 19, 2015

హైదరాబాద్ : కార్పొరేట్ కళాశాలల్లో మరణ మృదంగం మోగుతోంది. కార్పొరేట్ కళాశాల విధానాలు విద్యార్థులను బలితీసుకుంటున్నాయా? ఎందుకు విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? కారణం ఏమిటి? విద్యాలయాల్లో హింస ఎందుకు? ఇలాంటి అంశాలపై నేటి వైడాంగిల్. మరి మీరు కూడా ఈ విశ్లేషణను మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఫొటోగ్రాఫర్లకు బీమా సదుపాయం :చినరాజప్ప

తూ.గో : ప్రెస్‌ ఫొటోగ్రాఫర్లకు బీమా సదుపాయం కల్పిస్తామని హోమంత్రి చినరాజప్ప ప్రకటించారు. బుధవారం కాకినాడ సూర్యకళా మందిర్‌లో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రెస్‌ ఫొటోగ్రాఫర్లకు బీమా సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం త్వరలోనే విధివిధానాలను ఖరారు చేస్తుందన్నారు. ప్రభుత్వం 50 శాతం ప్రీమియం చెల్లిస్తున్నట్లు చినరాజప్ప తెలిపారు.

తాడేపల్లి గూడెంలో రేపు నిట్ కు శంకుస్థాపన

ప.గో : తాడేపల్లిగూడెంలో రేపు ఉదయం 9:30 నిమిషాలకు నిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు , కేంద్రమంత్రులు స్మృతిఇరానీ , వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి హాజరుకానున్నారు.

యనమలకుదరులో తెలుగు తమ్ముళ్లు చేతివాటం

విజయవాడ : కానూరు మండలం యనమలకుదరులో తెలుగు తమ్ముళ్లు చేతివాటం ప్రదర్శించారు. నీళ్ల కులాయిలు ఇప్పిస్తామంటూ గ్రామస్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి పరారయ్యారు. బాధితులు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ను ఆశ్రయించారు.

ఎస్వీయూ మెడికల్ విద్యార్థులకు ఊరట

హైదరాబాద్ : హైకోర్టులో ఎస్వీయూ మెడికల్ విద్యార్థులకు ఊరట లభించింది. స్థానికత ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని 42 మంది విద్యార్థుల పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఐరాస అంబాసిడర్ గా అనుపమ్ ఖేర్

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ ఐక్యరాజ్య సమితికి అంబాసిడర్‌గా నియమితులయ్యారు. అనుపమ్ ఐరాస చేపట్టిన హి ఫర్ షి (స్త్రీ,పురుషుల సమానత్వం) కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహించనున్నారు.

ఎమ్మిగనూరులో పిచ్చికుక్కస్వైర విహారం

కర్నూలు : ఎమ్మిగనూరులో బుధవారం పిచ్చిక్కు స్వైర విహారం చేసింది. రదహరి మీద కనపడిన వారిని భయబ్రాంతులకు గురి చేస్తూ పలువురుఇపై దాడికి పాల్పడింది.పిచ్చికుక్క దాడిలో 9 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నిరుద్యోగులకు ఏఆర్ కానిస్టేబుల్ టోకరా..అరెస్ట్

హైదరాబాద్: నిరుద్యోగులకు ఏఆర్ కానిస్టేబుల్ టోకరా పెట్టాడు. ఎస్సై ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.4లక్షలు వసూలు చేసి ఏఆర్ కానిస్టేబుల్ చెన్నారావు మోసం చేశాడు. దీంతో బాధితులు అంబర్ పేట పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

పోరాటాలతోనే ప్రత్యేక హోదా సాధ్యం: రామకృష్ణ

కర్నూలు : పోరాటాలతోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కరువును మభ్యపెట్టి అరచేతిలో వైకుంఠం చూపారని, రుణమాఫీ పేరుతో డ్వాక్రా సంఘాలను చంద్రబాబు మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు. నల్లధనం రప్పించడంలో మోదీ విఫలమయ్యారని, స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను కేంద్రం అమలు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

అత్యాచారం కేసులో మండేలా మనవడి అరెస్ట్

హైదరాబాద్ : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, దివంగత నెల్సన్ మండేలా మనవడు మబుసో మండేలా (24) పదేహేనేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 7వ తేదీన జోహన్నస్ బర్గ్ లోని ఓ రెస్టారెంటులో బాలికపై అతను అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దాంతో పోయిన శనివారం మబుసోను అరెస్టు చేశామని జోహన్నస్ బర్గ్ పోలీసులు తెలిపారు. 

న్యూఢిల్లీ - కేరళ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ

విజయవాడ : న్యూఢిల్లీ - కేరళ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణీకులకు మత్తుమందు ఇచ్చి ఆభరణాలు, విలువైన వస్తులు దోచుకెళ్లారు. నాగపూర్ సమీపంలో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. విజయవాడ రైల్వే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

నాగోబా ఆలయానికి పోటెత్తిన భక్తులు..

ఆదిలాబాద్ : జిల్లాలో నాగుల పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయమే ఆలయాలకు చేరుకుని నాగరాజుకు పూజలు చేశారు. కెస్లాపూర్ నాగోబా ఆలయానికి వేలాదిగా పోటెత్తారు. జిల్లా నలుమూలలతోపాటు మహరాష్ట్రలోని చంద్రపూర్, బల్లార్షా, జివితి, కిన్వట్ తదితర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలనీ, సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఇటు గిరిజన గ్రామాల్లో వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. చెట్లు, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కర్రలకు ఉయ్యాలలను కట్టుకుని చిన్నాపెద్ద తేడా లేకుండా ఊగారు.

18:37 - August 19, 2015

చిత్తూరు : కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు...కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో మెగా ఫుడ్‌పార్క్‌ రాబోతుందని..అంతేకాక మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు. కుప్పం ప్రజలు కూడా తనకు సహకరించాలని అప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. 

18:35 - August 19, 2015

చిత్తూరు: జిల్లా నగరిలో రాజకీయం వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడుల మధ్య నెలకొన్న విబేధాలు ఆధిపత్యపోరుగా మారినట్లు స్పష్టమవుతోంది. నగరిలో ఎమ్మెల్యే రోజా తలపెట్టిన నిరసన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. సినీ ఫక్కీలో జరిగిన నగరి నిరసన ఎపిసోడ్‌లో ఛేజింగ్‌లు సైతం చోటు చేసుకున్నాయి.

అధికార, ప్రతిపక్ష పార్టీల కుమ్ములాటలు...

అధికార, ప్రతిపక్ష పార్టీల కుమ్ములాటకు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వేదికయ్యింది. సీనియర్ టిడిపి నేత గాలి ముద్దుకృష్ణయ నాయుడు, ఎమ్మెల్యే రోజా మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

స్వాతంత్రదినోత్సవ వేడుకల నిర్వహణ ప్రాంతంపై వివాదం....

తాజాగా స్వాతంత్రదినోత్సవ వేడుకల నిర్వహణ ప్రాంతంపై ఇటీవల ఓ కొత్త వివాదం చోటుచేసుకుంది. మున్సిపల్‌ కమిషనర్‌, వైసిపి మహిళా నేత కెజె శాంతి కుమారుడు కమీషనరు నడుమ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక నిర్వహణపై గొడవ చోటుచేసుకుంది.

ఛైర్మెన్ కుమారుడు, కమీషనరు కు గాయాలు,,

దీంతో ఈ వివాదం ముదిరి ఛైర్మెన్ కుమారుడు, కమీషనరును తీవ్రంగా గాయపరిచాడు. కమీషనరు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది. కమీషనరు అధికార పార్టీ ఏజెంటులా మారాడని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా నగరిలో ఓ భారీ నిరసన ర్యాలీకి సిద్దపడ్డారు. జిల్లాలోని వైసిపి ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. అయితే ఈ నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుచెప్పారు.

నగరిలో 144 సెక్షన్.....

నగరిలో 144 సెక్షన్ విధించారు. దీంతో రోజా కొందరు ఎమ్మెల్యేలతో కలిసి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. నగరిలో ఆటవిక పాలన నడుతోందని మండిపడ్డారు. గాలి ముద్దు తనను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు తనను కూడా అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశ్యంతో రోజా పోలీసుల కన్నుగప్పి తమిళనాడు సరిహద్దు దాటి వెళ్లిపోయారు. ఆమె ఎలాగైనా నగరిలో నిరసన చేయాలని వ్యూహరచన చేస్తున్నారు. మరో వైపు నగరికి బయలుదేరిన జిల్లా వైసిపి ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. దీంతో టిడిపి తీరుపై రోజా, ఇతర వైసిపి నేతలు ఫైరయ్యారు.

రేపు విశాఖ, విజయనగరం జిల్లాలో నిర్మాలా సీతారమన్ పర్యటన

హైదరాబాద్ విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో రేపు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా గంగవరం పోర్టు దగ్గర వైజాగ్ ప్రొఫైల్స్ నిర్మించిన కంటైనర్ ప్రైజ్‌ స్టేషన్‌ను నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు. గంభీరంలో ఎక్స్‌పోర్టు ఇన్‌స్పెక్షన్ కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయం ప్రయోగశాలకు ఆమె శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ నుంచి విజయనగరం జిల్లాకు బయలుదేరి కొప్పెర్లలో విజయనగర్ బయోటెక్‌లో కాప్టివ్ పవర్‌ప్లాంట్‌ను నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు.

'ఉపహార్' బాధితులకు రూ.60కోట్ల పరిహారం

న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపహార్ సినిమా థియేటర్ అగ్నిప్రమాదం కేసులో దోషులైన అన్సల్ సోదరులకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. చెరి 30 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అన్సల్ సోదరులైన సుశీల్, గోపాల్‌లకు న్యాయస్థానం గతంలో చెరి ఏడాది జైలుశిక్ష విధించింది. చెరి 30 కోట్ల రూపాయల జరిమానా మూడు నెలల్లోగా చెల్లిస్తే వీరిద్దరూ ఇక జైలుశిక్ష అనుభవించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది. దక్షిణ ఢిల్లీలోని ఉపహార్ సినిమా హాలులో 1997 జూన్ 13న అగ్నిప్రమాదం జరిగి 59 మంది చనిపోయారు. వంద మంది గాయపడ్డారు.

బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్ : ముగ్గురు మృతి

 కృష్ణా: కంచికచర్ల మండలం పరిటాల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలిసింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

వీధికుక్కల దాడిలో 17 గ్రొరెల మృతి

ఆదిలాబాద్ : వీధి కుక్కల దాడిలో 17 గొర్రెలు మృతిచెందాయి. ముధోల్ మండల కేంద్రానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తికి చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడిచేశాయి. దీంతో వాటిలో 17 గొర్రెలు చనిపోయాయి. దాదాపు మొత్తం రూ. 70 వేల వరకు నష్టం వాటిల్లిందని యజమాని వాపోయాడు. 

 

770 ఉద్యోగాలను భర్తీ చేస్తాం: ఘంటా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది. టీఎస్‌పీఎస్సీ బుధవారం తొలి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 770ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఈఈ ఉద్యోగాలకు సంబంధిత ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అర్హులు అని చెప్పారు. 

అక్టోబర్ చివర్లో గ్రూప్ -2 నోటిఫికేషన్

హైదరాబాద్ : టీఎస్‌పీఎస్సీ ద్వారా నిర్వహించబోయే పరీక్షలకు ఆగస్టు నెలఖారులోగా సిలబస్‌ను పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని చైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. అక్టోబర్ చివర్లో గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. గ్రూప్-1 నిర్వహణలో కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఇక అక్టోబర్ నాటికి కమల్‌నాథన్ కమిటీ నివేదిక వస్తే మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కనుక అక్టోబర్ నెలలో గ్రూప్-2 నోటిఫికేషన్ వస్తుందన్నారు. డిసెంబర్‌లోగా దాదాపు 80 శాతం ఉద్యోగాల భర్తీ జరుగుతుందని వెల్లడించారు. ఇక వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించారు.

17:37 - August 19, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తొలి నోటిఫికేషన్‌ను వెలువరించింది. సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలోని అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ప్రకటించింది. ప్రభుత్వం నుంచి 3,783 పోస్టులకు అనుమతులు వచ్చాయని వాటిని దశల వారిగా భర్తీ చేస్తామని టీఎస్ పీఎస్ సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి చెప్పారు. ఇందులో గ్రూప్‌-1, గ్రూప్‌-2, ఇంజనీరింగ్‌ పోస్టులు ఉన్నాయన్నారు.

ఇంజనీరింగ్‌ నోటిఫికేషన్ ద్వారా 770 ఉద్యోగాలను భర్తీ...

ప్రస్తుతం ప్రకటించిన సివిల్‌ ఇంజనీరింగ్‌ నోటిఫికేషన్ ద్వారా 770 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ఘంటా చక్రపాణి తెలిపారు. ఏఈఈ ఉద్యోగాలకు బీటెక్‌ సివిల్‌ గ్రాడ్యుయేట్లు అర్హులన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 3 అని తెలిపారు. ఏఈఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ పద్ధతిలో సెప్టెంబర్ 20న పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఈ ఆన్‌లైన్ పరీక్షలు జరపనున్నట్లు చెప్పారు. మొత్తం 500 మార్కులకు పరీక్ష ఉంటుందని.. ఇందులో రాత పరీక్షకు 450 మార్కులు, ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయన్నారు. మరో వారం రోజుల్లో అసిస్టెంట్ ఇంజినీర్ల ఉద్యోగాల ప్రకటన వస్తుందన్నారు. అసిస్టెంట్, సివిల్, మెకానికల్ విభాగాల్లో ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్లు వస్తాయన్నారు. మరో వారంలో వచ్చే నోటిఫికేషన్ల ద్వారా 3,783 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. తదితర వివరాల కోసం www.tspsc.gov.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చని చెప్పారు.

ఆగస్టు నెలఖారులోగా సిలబస్‌ను పూర్తి స్థాయిలో....

టీఎస్‌పీఎస్సీ ద్వారా నిర్వహించబోయే గ్రూప్స్‌ పరీక్షలకు ఆగస్టు నెలఖారులోగా సిలబస్‌ను పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని చైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. అక్టోబర్ చివర్లో గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. గ్రూప్-1 నిర్వహణలో కొన్ని సమస్యలు ఉన్నాయని అన్నారు. ఇక అక్టోబర్ నాటికి కమల్‌నాథన్ కమిటీ నివేదిక వస్తే మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. డిసెంబర్‌లోగా దాదాపు 80 శాతం ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఘంటా చక్రపాణి తెలిపారు. ఇక వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ వస్తుందన్నారు. అనంతరం మిగతా శాఖల్లో ఖాళీ ఉద్యోగాలకు ప్రకటన ఉంటుందని చెప్పారు. 

అత్యాచారాల్లో ఢిల్లీయే టాప్...

హైదరాబాద్ : ఢిల్లీ దేశ రాజధానే కాదు అత్యాచారాల కేంద్రం కూడా అని నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అత్యాచారాల్లో ఢిల్లీయే టాప్ అని గణాంకాలు చెబుతున్నాయి. నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలోని మెట్రో నగరాల్లో మహిళల భద్రత విషయంలో కోల్ కతా మెరుగ్గా ఉందని తేలింది. అక్కడ అత్యాచారాలకు సంబంధించి 36 కేసులే నమోదయ్యాయని క్రైం రికార్డ్స్ బ్యూరో పేర్కొంది. ఢిల్లీలో అత్యాచార కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని వెల్లడించింది. 2013లో 1440 అత్యాచార కేసులు నమోదు కాగా, 2014లో 1800 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై : స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 100 పాయింట్ల లాభంతో 27,931 వద్ద సెన్సెక్స్ ముగియగా, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 8,495 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 65.14 వద్ద కొనసాగుతోంది. 

కాసేపట్లో తెలంగాణ లో తొలి ఉద్యోగ నోటిఫికేషన్

హైదరాబాద్ : ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తెలంగాణలో కొలువల జాతర మొదలు కాబోతుంది. మరికాసేపట్లో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ చక్రపాణి చేతుల మీదుగా తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌ రాబోతుంది. విద్యుత్‌శాఖలో ఎ.ఇ.ఇ. ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయబోతున్నారు.

16:42 - August 19, 2015

హైదరాబాద్ : భార్యాభర్తల మధ్య చిన్న తగాదా 14 వాహనాల అద్దాల ధ్వంసానికి కారణమైంది. హైదరాబాద్‌ సనత్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని అల్లావుద్దీన్‌కోటిలో ఉండే అయూబ్‌ఖాన్‌... మద్యం మత్తులో భార్యతో ఘర్షణకు దిగాడు. ఉద్రేకానికి లోనైన అయూబ్‌ఖాన్‌ రోడ్డుపై నిలిపివుంచిన వాహనాల అద్దాలను ధ్వంసం చేసినట్లు విచారణలో బయటపడింది. దీంతో అయూబ్‌ఖాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

16:40 - August 19, 2015

ఖమ్మం: జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నిరంతరం సాగునీరు అందేలా ప్రణాళికలు రూపొందించుతున్నట్లు మంత్రి హరీష్‌రావు ఖమ్మంలో తెలిపారు. ఎన్ ఎస్ పీ కాలువను ఆధునీకరించడమే కాకుండా... కాలువ పరిధిలోని ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు, కొత్త లిప్టులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గత పాలకులు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారని హరీష్‌రావు అన్నారు.

16:38 - August 19, 2015

కరీంనగర్ నిజామాబాద్‌ ఎంపీ కవిత నిర్వహిస్తున్న మన ఊరు - మన ఎంపీ కార్యక్రమం మూడో రోజుకు చేరుకుంది. కరీం నగర్‌ జిల్లా జగిత్యాల నియోజక వర్గం పెంబట్ల గ్రామంలో ఎంపీ కవిత పర్యటన కొనసాగుతోంది. స్థానికంగా ఉన్న దుబ్బ రాజేశ్వరస్వామిని దర్శించుకొని ఎంపీ కవిత నియోజక వర్గంలో పర్యటించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. మురుగు నీటి కాల్వలు, మంచినీటి వసతి తదితర సౌకర్యాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సభలో ఎంపీ కవిత పాల్గొన్నారు. 

16:37 - August 19, 2015

గుంటూరు : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ.. గుంటూరులో మేధావుల ఫోరం అధ్వర్యంలో.. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈనెల 20వ తేదీన సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోడి భేటి తరువాత... స్పెషల్ స్టేటస్‌పై నిర్ణయం ప్రకటించని పక్షంలో... నెలరోజుల పాటు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంకావాలని నిర్ణయించారు. అన్ని పక్షాలను కలుపుకుని ఉద్యమం చేయటంతోపాటు, అవసరమైతే రాష్ట్రపతి భవన్‌ను కూడా ముట్టడించేలా కార్యక్రమం రూపొందించనున్నట్లు ఉద్యమ నేతలు ప్రకటించారు. 

16:35 - August 19, 2015

హైదరాబాద్ : ఆదిలాబాద్‌ జిల్లా శ్రీరాంపూర్‌ ఏరియాలో ఎంపీ బాల్కాసుమన్‌ను, స్థానిక ఎమ్మెల్యే దివాకర్‌రావును సింగరేణి కార్మికులు అడ్డుకున్నారు. సీఎం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి.. సింగరేణి కార్మికులను నట్టేట ముంచారని ఎంపీని ఘెరావ్‌ చేశారు. వారసత్వ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వం నోరుమెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇన్‌కంటాక్స్‌ను కూడా రద్దు చేయలేదని మండిపడ్డారు. దీంతో అతి త్వరలోనే సింగరేణి కార్మికుల సమస్యలు తీర్చుతామని ఎంపీ హామీ ఇచ్చారు. కార్మికుల సమక్షేమే పార్టీ ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు.

16:33 - August 19, 2015

తిరుపతి: ఒకవైపు బంద్‌ నిర్వహిస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. మరోవైపు వారిని అదుపులోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తున్న పోలీసులు.. మొత్తం మీద చిత్తూరు జిల్లా నగరిలో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే కొందరు నేతలను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఎమ్మెల్యే రోజాను కూడా అరెస్ట్‌ చేయాలని ప్రయత్నించారు. సినీ ఫక్కీలో ఆమె వాహనాన్ని వెంబడించారు. అయితే సరిహద్దులు దాటి తమిళనాడులోకి తన వాహనంతో రోజా వెళ్లిపోయారు. తిరిగి నగరికి వచ్చి ఎలాగైనా ధర్నా చేసే పట్టుదలలో రోజా ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

16:31 - August 19, 2015

హైదరాబాద్ : రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టాన్ని అమలు చేయవద్దని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. సంవత్సరానికి 3 సార్లు కాపు నందించే పంట భూములను తీసుకోవడం సరికాదనన్నారు. బహుళ పంటలు పండే ఉండవల్లి, పెనుమాక, బేతపూడితో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ చట్టం అమలు వద్దన్నారు. ఒక ప్రాంతాన్ని, ఒక వర్గాన్ని అభివృద్ధి చేసే క్రమంలో వాతావరణ కాలుష్యంతో పాటు.. కొంతమంది నిర్వాసితులవడం సర్వ సాధారణంగా మారిందన్నారు. ఏదేశ పాలకులైనా వీలైనంత తక్కువ నష్టంతోనే అభివృద్ధి పరచాలన్నారు పవన్.

పవన్ కళ్యాణ్ పై యనమల సెటైర్లు....

పవన్ కళ్యాణ్ పై యనమల సెటైర్లు విసిరారు. రాజధానికి భూసేకరణ విషయంలో పవన్ ట్వీట్లపై యనమల ఘాటుగా స్పందించారు. భూసేకరణకు బదులు ఏం చేయాలో పవన్ ట్వీట్లలో చెబితే బాగుండేదని యనమల సూచించారు. 

16:28 - August 19, 2015

కరీంనగర్ : విద్యార్ధిని వేధిస్తున్న కాలేజీ బస్సు డ్రైవర్‌కు దేహశుద్ధి చేసిన ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. స్థానిక ఉమెన్స్‌ కాలేజీలో బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్న మునీంధర్‌.. తమ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని... ఆమె తరపు బంధువులు డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. అయితే దీన్ని అవమానంగా భావించిన మునీంధర్‌ బ్లేడ్‌తో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో మునీంధర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే తాను అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని మునీందర్‌ చెప్పడం కొసమెరుపు. 

16:27 - August 19, 2015

హైదరాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాపైన శిశువు కేసు మిస్టరీ వీడింది... ఈ పాపను నందిపేట్ మండలం కౌల్‌పూర్‌కుచెందిన సుజాత, అనిఫా అపహరించినట్లు పోలీసులు గుర్తించారు.. వీరిద్దరినీ అదుపులోకితీసుకున్న పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.. ఈ నెల 5న దుబ్బాకకుచెందిన అనిత, సుమన్ దంపతులు తమ పాపను చికిత్సకోసం ఆస్పత్రిలో చేర్చారు.. ఆ తర్వాత చిన్నారి కనిపించకుండాపోయింది... 

16:24 - August 19, 2015

హైదరాబాద్ : సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ సభలో ప్రసంగిస్తూ- అత్యాచారం ఒకేసారి నలుగురు చేయలేరని పేర్కొన్నారు. కుటుంబంలో ఒకరు రేప్ చేస్తే నలుగురూ సోదరులు అత్యాచారం చేసినట్లు కేసులు నమోదవుతున్నాయనిని ములాయం అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాలు చాలా తక్కువని కేవలం రెండు శాతమే ఉందని తెలిపారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోనే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. మీడియా కావాలనే ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాలు అధికంగా చూపుతోందని ఆయన మండిపడ్డారు. ములాయం వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమౌతున్నాయి

 

16:22 - August 19, 2015

హైదరాబాద్ : చైనా కరెన్సీ దెబ్బకు రూపీ పతనం కొనసాగుతూనే ఉంది. ఫోరెక్స్ మార్కెట్లో డాలర్ తో పోల్చితే.. .దేశీయ కరెన్సీ 12 పైసలు క్షీణించి 65 రూపాయల 43 పైసలకు పడిపోయింది. దీంతో రూపీ విలువ రెండేళ్ల కనిష్ఠస్థాయికి చేరింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా రూపాయి పరిస్థితి బలహీనంగా ఉంది. ఎగుమతులు తగ్గడం, చైనా కరెన్సీ విలువ తగ్గించుకోవడంతో.. ఇన్వెస్టర్లు డాలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వచ్చే నెల 16న జరిగే అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశం వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఫోరెక్స్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

రాజ్ థాకరే భార్యపై ఇంటి కుక్క దాడి...

ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ థాకరే భార్య షర్మిళపై ఇంటి కుక్కనే మంగళవారం దాడి చేసింది. షర్మిళ ముఖాన్ని కుక్క రక్కేసింది. షర్మిళ ముంబయిలోని హిందుజా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. షర్మిళ ముఖానికి డాక్టర్లు 65 కుట్లు వేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. షర్మిళ ముఖానికి శస్త్ర చికిత్స చేసే అవకాశం ఉంది. అయితే థాకరే కుటుంబం రెండు కుక్కలను కలిగి ఉంది. ఒకటి జేమ్స్ కాగా, మరొకటి బాండ్.

కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజాపై సీబీఐ కేసు నమోదు

హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ కేంద్ర మాజీ మంత్రి కె.ఎ.రాజాపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆధారాలు సేకరించేందుకు రాజాకు సంబంధించిన 15 చోట్ల సీబీఐ అధికారులు ఈ రోజు సోదాలు నిర్వహిస్తున్నారు.

విచ్ఛిన్నం చేయడమే కేసీఆర్ లక్ష్యం : పొన్నం...

హైదరాబాద్ ఇతర పార్టీలను విచ్చిన్నం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాలలో విఫలమైందని ఆయన విమర్శంచారు. బీహార్‌ ప్యాకేజిని మార్కెట్‌లో వేలం మాదిరిగా ప్రకటించడం దారుణమని, ఎన్నికల లబ్ధి కోసమే బీహార్‌కు ప్యాకేజి ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. చంటి పిల్లల్లాంటి తెలంగాణ, ఏపీకి నిధులు ఇవ్వడం లేదని, తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి నిధులు రావడం లేదని ఆయన పేర్కొన్నారు.

రోజా ముందస్తు అరెస్ట్ కు పోలీసుల విశ్వప్రయత్నం

తిరుపతి : నగరి ఎమ్మెల్యే రోజా ను అరెస్టు చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. రోజాను అదుపులోకి తీసుకునేందుకు ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు వెంబడించారు. ఆంధ్ర - తమిళనాడు సరిహద్దులోని పైడిపట్టు వద్ద రోజా, ఇతర ఎమ్మెల్యేల అరెస్టుకు యత్నించారు. స్థానికుల సహకారంతో తమిళనాడుకు రోజా వెళ్లిపోయింది. ఎలాగైనా నగరికి వచ్చి ధర్నా చేయాలని రోజా ప్రయత్నిస్తోన్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం నగరి మున్సిపల్ చైర్మన్ కుమారుడు..మున్సిపల్ కమిషనర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే . 

ఆత్మహత్యల వెనుక ఎంతటి వారున్నా వదలం : మంత్రి గంటా

కడప : జిల్లాలో నారాయణ కాలేజిలో జరిగిన విద్యార్థినుల ఆత్మహత్యల వెనుక ఎంతటి వారున్నా వదలబోమని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కడపలో విద్యార్థినుల ఆత్మహత్యలపై పై విచారణ చేయడానికి ముగ్గురితో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. జగన్‌కు కనీస అవగాహన లేకపోవడంతో శవరాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. సీఎం చంద్రబాబుకు నారాయణ కాలేజీలో వాటాలున్నాయని జగన్ విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి గంటా అన్నారు.

డీకే అరుణకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు : కర్నె ప్రభాకర్...

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడేవన్నీ అవాస్తవాలే అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇలాకాలో ప్రభుత్వ భూమి కబ్జా అయ్యిందనడం అవివేకమన్నారు. అరుణ ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తప్పు చేస్తే సొంత వాళ్లనైనా వదలిపెట్టనని సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. కేసీఆర్‌ను బద్నాం చేయాలనుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చెప్పారు.

విజయవాడలో ఏపీ డీజీపీ క్యాంపు కార్యాలయం

కృష్ణా : విజయవాడలో ఏర్పాటు చేసిన డీజీపీ క్యాంపు కార్యాలయానికి రాముడు మారారు. సీఎం క్యాంప్‌ ఆఫీసు సమీపంలోని ఆఫీసర్స్‌ క్లబ్‌లో డీజీపీ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. క్యాంపు కార్యాలయం పక్కనే నివాసం కూడా సిద్ధం చేశారు. దీంతో డీజీపీ రాముడు సతీసమేతంగా గృహప్రవేశం చేశారు.

14:48 - August 19, 2015

హైదరాబాద్ : వీలునామా అంటే ఏమిటి? వీలునామా ఏవిధంగా రాయాలి? వీలునామా రాసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై 'మై రైట్' కార్యక్రమం లో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. అంతే కాకుండా పలు అంశాలపై న్యాయ సలహాలు, సూచనలు అందించారు. పార్వతి ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:46 - August 19, 2015

హైదరాబాద్‌ : నగరంలోని బషీర్‌బాగ్ లో బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ బచావో మిషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు ..అధికారంలోకివచ్చి ఏడాది దాటిపోయినా టిఆర్ ఎస్ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు.. తెలంగాణ అభ్యున్నతికి తాము పాటుపడతామని ప్రకటించారు.. అటు నాగం ప్రారంభించిన తెలంగాణ బచావో మిషన్‌కు పార్టీ అనుమతిలేదని ప్రకటించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి... ఈ అంశంపై పార్టీ అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు..

14:44 - August 19, 2015

హైదరాబాద్‌ : నాంపల్లి సీబీఐ కోర్టుకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత హాజరయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో.. ఆమెకు కోర్టు సమన్లు జారీ చేసింది.

14:42 - August 19, 2015

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు జరగాల్సిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ వాయిదా పడింది. ఈనెల 25, 28, 29, 31 తేదీల్లో వీలైన రోజు చెప్పాలని సీఎంను ప్రధాని కార్యాలయం కోరినట్టు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న చంద్రబాబు... ఏపీకి ప్రత్యేక హోదాపై మోదీని కలవాల్సి ఉంది. 

బైకును ఢీకొన్న ఆటో : ఒకరి మృతి

శ్రీకాకుళం: జిల్లాలోని లావేరు మండలం పాలవలస దగ్గర జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

వచ్చే నెలలో నామినేటెడ్ పోస్టుల భర్తీ :మంత్రి మహేందర్‌రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ వచ్చే నెలలో చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ విషయమై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. బుధవారం ఆయన రంగారెడ్డి జిల్లా తాండూరులో విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు స్థానిక మార్కెట్ యార్డులో కిలో రూ.20కే ఉల్లిపాయల విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

డిజైన్‌ మారిస్తే జాతీయ హోదా ఎలా వస్తుంది: ఎర్రబెల్లి...

హైదరాబాద్ : ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ మారిస్తే జాతీయ హోదా ఎలా వస్తుందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ... ఒకవైపు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే సీఎం కేసీఆర్ ఏ ఫాంహౌస్‌లో నిద్రపోతున్నారంటూ ఆయన విమర్శించారు. పూర్తిగా కరువు కాటకాల్లో ఉండే వరంగల్ జిల్లా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌కు దేవాదుల ప్రాజెక్టు వల్లే నీరు వస్తున్నాయని, ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఇక మంత్రి జూపల్లి కృష్ణారావుకు మతి భ్రమించిందని, టీఆర్ఎప్ నేతలకు వారి వారి భార్యలు అన్నం పెట్టకపోయినా...

కాల్షియం కార్బైడ్ పై తీవ్రంగా స్పందించిన హైకోర్టు...

హైదరాబాద్: కాయలను పండ్లుగా మార్చేందుకు కాల్షియం కార్బైడ్ వాడకంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సహజంగా పక్వానికి వచ్చే వాటికి రసాయనాలు వాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. రసాయనాలతో పక్వానికి వచ్చిన ఏ పండు ఆరోగ్యానికి సురక్షితం కాదని తెలిపింది. నిషేధిత రసాయనాల వాడకాన్ని నిరోధించలేరా అని కోర్టు ప్రశ్నించింది. నాలుగు పండ్ల మార్కెట్లపై దాడులు చేసినట్లు, భారీగా కాల్షియం కార్బైడ్ సీజ్ చేసినట్లు హైకోర్టకు తెలంగాణ ప్రభుత్వం నివేదించింది.

ఒకేసారి నలుగురు రేప్ చేయడం అసాధ్యం :ములాయం సింగ్

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం ఒకేసారి నలుగురు చేయలేరన్నారు. అదసలు ప్రాక్టికలే కాదన్నారు. కుటుంబంలో ఒకరు రేప్ చేస్తే నలుగురూ అత్యాచారం చేసినట్లు చూపుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాలు చాలా తక్కువని చెప్పారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోనే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. మీడియా కావాలనే ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాలు అధికంగా చూపుతోందని ఆయన మండిపడ్డారు. ములాయం వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమౌతున్నాయి.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన వాయిదా

హైదరాబాద్ : చంద్రబాబు ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ కూడా వాయిదా పడింది. ప్రధానితో చంద్రబాబు భేటీని పీఎంఓ కూడా నిన్ననే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఈ భేటీ వాయిదా పడింది. ఈ నెల 25, 28, 29, 31 తేదీల్లో ఏదో ఒక రోజు ఈ భేటీ జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాని అపాయింట్ మెంట్ ఖరారైన తర్వాత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరనున్నట్లు సమాచారం.

ర్యాగింగ్ కు పాల్పడ్డ 7గురు సీనియర్ల సస్పెన్షన్

ఆదిలాబాద్:జిల్లాలోని మంచిర్యాల సీసీసీ నస్పూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడ్డ ఏడుగురు సీనియర్ విద్యార్ధులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఫస్టియర్ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు.దీంతో ర్యాగింగ్‌కు పాల్పడ్డ విద్యార్ధులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.

13:37 - August 19, 2015

హైదరాబాద్ : భూ సేకరణ అంశంపై సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ట్వీట్ చేశారు. ఈసారి రెండు, మూడు ముక్కల్లో కాకుండా సుదీర్ఘంగా ట్వీట్స్ చేయడం విశేషం. సౌరవంతమైన పలు రకాల పంటలు పండే ఉండవల్లి, పెనుమాక, బేతపూడి ప్రాంతాల్లో మూడు పంటలు పండే భూములు, సమతుల్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టాన్ని అమలు చేయవద్దని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. పాలకులు రైతుల పట్ల వివేచనతో మెలగాలని కోరారు. అభివృద్ధి కోసం జరిగే నష్టం ఎంత కనిష్టమైతే ఆ పాలకులు అంత వివేకవంతులని, వాతావరణ సమతుల్యత, పర్యావరణాన్ని కాపాడాలని పవన్‌ కోరారు. రాజధాని ప్రాంతంలో ఇష్టంలేని రైతుల భూములపై భూమి సేకరణ చట్టం ఉపయోగించవద్దని పవన్ కోరారు. దీనిపై ఏపీ మంత్రి యనమల స్పందించారు. రాజధాని ఎలా కట్టాలి. ఏ విధంగా కట్టాలో పవన్ చెబితే తాము అదే విధంగా నడుచుకుంటామని ఎద్దేవా చేసారు. భూ సేకరణకు ప్రత్యామ్నాయాలు సూచించాలని తెలిపారు.

13:33 - August 19, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పలు విమర్శలు చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 15 నెలల్లో ఎక్కడా ఇళ్లు నిర్మాణం చేపట్టలేదని ధ్వజమెత్తారు. దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో పాతిళ్లు కూలిపోతే కొన్ని ఇళ్లు శాంక్షన్ చేశారని, చీప్‌ లిక్కర్ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

13:31 - August 19, 2015

హైదరాబాద్ : గతేడాది ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో ఖర్చు చేయాల్సిన మొత్తంలో 7 వేల కోట్లు మిగిలిపోయాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్‌ అన్నారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎస్సీలకు కేటాయించిన 8 వేల 89 కోట్లలో కేవలం 2 వేల నూటా 59 కోట్ల నిధులు మాత్రమే ప్రభుత్వం కేటాయించగా.. 12 వందల 49 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. ఎస్టీలకు కేటాయించిన ఒక వెయ్యి 5 వందల 52 కోట్లలో కేవలం 766 కోట్లు ఖర్చు చేసినట్లు రామ్‌లక్ష్మణ్‌ అన్నారు.

 

13:28 - August 19, 2015

కడప : జిల్లా నారాయణ కాలేజీలో విద్యార్ధినుల ఆత్మహత్యలకు నిరసనగా విజయవాడలో ఎఐవైఎఫ్, ఎఐఎస్ఎఫ్ విద్యా సంస్ధల బంద్ ఉద్రిక్తతలకు దారి తీసింది. మాచవరంలోని నారాయణ, చైతన్య విద్యా సంస్ధల ఎదుట నేతలు ఆందోళనకు చేపట్టారు. స్కూలు బస్సు అద్దాలు పగులకొట్టిన నేతలు అనంతరం కాలేజీ ముందు బైటాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలని నేతలు అన్నారు. విద్యార్ధినుల ఆత్మహత్యలపై విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

13:27 - August 19, 2015

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడుతో భేటీ అయ్యారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. తన నియోజకవర్గంలోని సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. హిందూపురంలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు. స్టేడియం నమూనాను అచ్చెన్నాయుడుకు అందజేశారు. పీపీపీ పద్ధతిలో ఈ స్టేడియం నిర్మించాలని భావిస్తున్నట్లు బాలయ్య తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోననని, హిందూపురంతో సహా అనంతపురం అభివృద్ధికి కృషి చేస్తానని, త్వరలో హిందూపురానికి నీళ్లు తీసుకొస్తానని బాలకృష్ణ హామీనిచ్చారు. 

పులికాట్ సరస్సును సందర్శించిన ఏపీ స్పీకర్ బృందం..

నెల్లూరు : పులికాట్ సరస్సును స్పీకర్ కోడెల బృందం పరిశీలించింది. పులికాట్ ను అంతర్జాతీయంగా అభివృద్ధి చేస్తామని, పులికాట్ ముఖద్వారాన్ని తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని స్పీకర్ పేర్కొన్నారు.

 

చంద్రపడియలో ఉద్రిక్తత..

నెల్లూరు : వింజమూరు (మం) చంద్రపడియలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీని జిల్లా కలెక్టర్ జానకి సందర్శించారు. గ్రామంలోకి వచ్చిన కలెక్టర్ ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. కాలుష్యంపై విచారణ చేపట్టిన కమిటీ నివేదిక రాకముందే గ్రామస్తులు ఫ్యాక్టరీని ధ్వంసం చేయడం సరికాదని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామస్తులకు ప్రభుత్వ పథకాలను నిలిపివేసినట్లు తెలిపారు. 

నగరిలో కొనసాగుతున్న కొనసాగుతున్న 144 సెక్షన్..

చిత్తూరు : నగరిలో పట్టణంలో 144 వసెక్షన్ కొనసాగుతోంది. ధర్నాకు యత్నించిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు నారాయణస్వామి, అమరనాథ రెడ్డి, తిప్పారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు.

 

నాగం బీజేపీలోనే - కిషన్..

హైదరాబాద్ : నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీలో ఉన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నాగం ఉద్యమ వేదికకు పార్టీ అనుమతి లేదని, నాగం అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులపై నెలాఖరున ఉండి ఉద్యమం ప్రారంభిస్తామని వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

కిషన్ రెడ్డికి చెప్పే వేదిక ఏర్పాటు - నాగం..

హైదరాబాద్ : కిషన్ రెడ్డికి చెప్పే వేదిక ఏర్పాటు చేసినట్లు నాగం జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బషీర్ బాగ్ లో బచావో తెలంగాణ కార్యాలయం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణనను కాపాడాలనేదే తన సంకల్పమన్నారు. 

మంత్రి యనమలను కలిసిన ఏపీ ఉద్యోగ సంఘ నేతలు..

హైదరాబాద్ : ఏపీ మంత్రి యనమలను ఏపీ ఉద్యోగ సంఘ నేతలు కలిశారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. విజయవాడకు తరలింపుపై ఉద్యోగుల అభిప్రాయాలను ఈ సందర్భంగా యనమల అడిగి తెలుసుకున్నారు. 

ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోను - బాలకృష్ణ..

హైదరాబాద్ : ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోననని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం మంత్రి అచ్చెన్నాయుడితో బాలకృష్ణ భేటీ అయ్యారు. హిందూపురంతో సహా అనంతపురం అభివృద్ధికి కృషి చేస్తానని, త్వరలో హిందూపురానికి నీళ్లు తీసుకొస్తానని బాలకృష్ణ హామీనిచ్చారు. హిందూపురం స్టేడియాన్ని పీపీపీ పద్ధతిలో నిర్మిస్తామని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

పేదలకు ఇళ్లు కేటాయించాలి - ఉత్తమ్..

హైదరాబాద్ : బిల్లులు నిలిపివేయడంతో ఇళ్లు వృథా అవుతున్నాయని, ప్రభుత్వం దృష్టి పెట్టి పేదలకు ఇళ్లు కేటాయించాలని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ సూచించారు. ఇళ్ల బిల్లుల చెల్లింపులపై అసెంబ్లీలో నిలదీస్తామని, రుణం చెల్లించినా నిరుపేదలకు ఇళ్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. 

బంద్ ను మానుకోవాలి - సోమిరెడ్డి..

హైదరాబాద్ : ఈనెల 11న బంద్ నిర్వహించింనందున 29 నాటి బంద్ ను వైసీపీ మానుకోవాలని టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి పేర్కొన్నారు. బంద్ లతో రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు.

హోదా, ప్యాకేజీ కోరుతాం - యనమల..

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రాన్ని కోరుతామని మంత్రి యనమల పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పార్లమెంట్ లో ఇచ్చిన హామీ అని, ప్యాకేజీ చట్టంలో ఉందన్నారు. బీహార్ ప్యాకేజీలో ఏపీకి పోలిక అవసరం లేదని చెప్పారు. భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దని చెబుతున్న పవన్ ఏం చేయాలో చెబితే బాగుంటుందన్నారు.

అత్యాచారంపై ఖాప్ పంచాయతీ సంచలన నిర్ణయం..

యూపీ : అత్యాచారం ఘటనపై ఖాప్ పంచాయతీ సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యాచారం చేసిన వ్యక్తి సోదరిపై అత్యాచారం చేయాలని పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. 

12:41 - August 19, 2015

తిరుపతి : యూనివర్సిటీలో నీటి సమస్య పరిష్కరించాలని ఎస్వీ విద్యార్థులు కదం తొక్కారు. గత నాలుగు రోజులుగా సమస్య తీర్చాలని కోరుతున్నా అధికారుల మొండి వైఖరిని తప్పుబట్టారు. నీళ్లు లేకపోవడం వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటున్నామని తెలిపినా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా ఉన్నారని విద్యార్థులు పేర్కొన్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఏకంగా చిత్తూరు - తిరుపతి రహదారిపై భైఠాయించారు. వీరి ఆందోళనకు అనేక విద్యార్థి సంఘాలు మద్దతిచ్చాయి. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో వర్సిటీ వీసీ కారు వెళుతుండగా విద్యార్థులు అడ్డుకున్నారు. సమస్య తన దృష్టికి రాలేదని చెప్పి మెల్లిగా అక్కడి నుండి జారుకున్నారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న విద్యార్థులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ప్రధాన పరిపాలన విభాగం ఎదుట ఆందోళనకు దిగారు. నీళ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

12:37 - August 19, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సు చార్జీలు పెంచాలని ఏపీ ఆర్టీసీ యోచిస్తోంది. సంస్థపై భారాన్ని తగ్గించాలంటే చార్జీలు పెంచకతప్పదని ప్రభుత్వాన్ని విన్నవించుకుంది. చార్జీలు పెంచేందుకు అనుమతినివ్వాలని కోరింది. దీనికి పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీనిచ్చినట్లు తెలుస్తోంది.
భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన కొద్ది రోజుల తరువాత ఆర్టీసీ సంస్థ వేర్వేరుగా కార్యకలాపాలు ప్రారంభించాయి. దీనితో సంస్థకు నష్టాలు వస్తున్నాయని, దీనిని అధిగమించాలంటే చార్జీలు పెంచాల్సిందేనని సంస్థ యాజమాన్యం పేర్కొంటూ వస్తోంది. ప్రతి ఆరు నెలలకొకసారి కోరుతూ రావడం సర్వసాధారణం. గతంలో కోరినా సీఎం చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందన్న కారణంతో దీనిని వాయిదా వేసినట్లు సమాచారం. ఇటీవలే సంస్థ యాజమాన్యం సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి ఓ నివేదిక అందచేశారు. సంస్థపై భారం తగ్గించాలంటే చార్జీలు పెంచాల్సిందేనని నివేదికలో పొందుపరిచారు. ఇందులో తెలుగు వెలుగు బస్సులను మినహాయించినట్లు సమాచారం. సంస్థపై రూ.327 కోట్ల భారం పడుతోందని, ఇందుకు మూడు భాగాలుగా విభజించారు. పది శాతం పెంచడం వల్ల రూ.600 కోట్లు..12 శాతం పెంచితే రూ.800 కోట్లు..15 శాతం పెంచితే 940 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది. దీనిపై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోలేమని చంద్రబాబు స్పష్టం చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజల నుండి స్పందన ఎలా ఉందో తెలుసుకున్న తరువాత నిర్ణయం తీసుకుందామని, అలాగే దీనిపై నియమించబడిన ఉపసంఘంతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుందామని సీఎం బాబు చెప్పినట్లు సమాచారం. చార్జీలు పెంచుతారా ? లేదా ? అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది. 

బస్సు ఛార్జీలు పెంచే యోచనలో ఏపీ సర్కార్..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సు ఛార్జీలను పెంచేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. సంస్థపై భారాన్ని తగ్గించాలంటే  చార్జీలు పెంచక తప్పదని యాజమాన్యం పేర్కొంటోంది. ఛార్జీలు పెంచేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరింది. దీనిపై పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీనిచ్చారు. 

12:10 - August 19, 2015

ఉత్తర్ ప్రదేశ్ : టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పదివేల ఎత్తు నుండి కిందకు దూకాడు. బుధవారం ఈ ట్రైనింగ్ జరిగింది. టెస్టు నుండి రిటైర్ పొందిన ధోని ఇండియన్ ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదా పొందిన సంగతి తెలిసిందే. లెప్టినెంట్ కల్నల్ హోదా ధోని పలుమార్లు మిలిటరీ బేస్‌లను సందర్శించాడు. ధోని ఆగ్రాలోని పారా రెజిమెంట్‌లో రెండు వారాల పాటు మిలిటరీ ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడు. రెండు వారాల ట్రైనింగ్ అనంతరం ధోని ఏఎన్-32 యుద్ధ విమానంలో 10,000 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేయాల్సి ఉంటుంది. విజయంతంగా పూర్తి చేస్తే బ్యాడ్జిని ప్రధానం చేయనున్నారు.

12:01 - August 19, 2015

హీరోయిన్ గా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం అనుష్క. బాహుబలి, రుద్రమదేవి లాంటి భారీ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీబిజీగా ఉన్నప్పటికీ 10టీవీ ప్రేక్షకులకోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. రుద్రమదేవి సినిమా గురించి అడిగనప్పుడు ఒక హిస్టారిక్ సినిమా చేయడం కోసం పడ్డ కష్టాన్ని ఆనందంగా వివరించింది. బాహుబలి, రుద్రమ దేవి సీక్వెల్స్ ఒకేసారి వస్తే ఏ సినిమాలో నటిస్తారన్న ప్రశ్నకు అనుష్క చాలా తెలివిగా సమాదానం చెప్పింది. అంతే కాకుండా తన పర్సనల్ లైఫ్ మరియు బాహుబలి-2 కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాల్ని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పూర్తి ఇంటర్వ్యూ కోసం వీడియో చూడగలరు.
 

శుభ్రా ముఖర్జీ అంత్యక్రియలు పూర్తి..

ఢిల్లీ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ (74) అంత్యక్రియలు బుధవారం లోడి రోడ్డు శ్మశాన వాటికలో ముగిశాయి. ప్రణబ్ పిల్లలు షర్మిస్తా, అభిజిత్, ఇంద్రజిత్ లతో పాటు ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ అధ్యక్షుడు హమీద్, బంగ్లా ప్రధాని షేక్ హాసినా, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పలువురు అంత్యక్రియలకు హాజరయ్యారు. శుభ్రా ముఖర్జీ మంగళవారం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన..

చిత్తూరు : తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వసతి గృహాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ రహదారిపై భైఠాయించారు. వీసి కారును అడ్డుకున్నారు. నీటి సమస్య తన దృష్టికి రాలేదని వీసీ పేర్కొన్నారు.

11:54 - August 19, 2015

పూణే: చిలుక..కొంతమంది చిలుకను ప్రేమగా పెంచుకుంటుంటారు. కొన్ని మాటలను నేర్పిస్తుంటారు. చిలుక పలికే మాటలను వినాలని ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. కానీ ఓ చిలుక మాత్రం ఒకరిని చూసి మాత్రం బండబూతులు తిడుతోంది. చూసి చూసి ఓపిక నశించిన ఆ పెద్దావిడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకేముందు ఆ 'చిలుక'పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీని గురించి పూర్తిగా తెలియాలంటే ఇది చదవండి..
మహారాష్ట్రలోని చంద్రాపూర్ లోని రాజూరాలో జనాబాయి సకార్కర్ (85)వృద్దురాలు నివాసం ఉంటోంది. ఇదే ప్రాంతంలో జనాబాయి సవతి కుమారుడు సురేష్ నివాసం ఉంటున్నాడు. ఆస్తి విషయంలో వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ దగ్గరున్న ఓ చిలుక (హరియాల్) సకార్కర్ ఫొటో చూపించి బూతులు నేర్పించడం ఆరంభించాడు. అలా సకార్కర్ కనిపించినప్పుడల్లా తిట్లతో ఆమెను అవమానించేది హరియల్ చిలుక. కొన్ని నెలల పాటు సహనంతో ఉన్న జనాబాయి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని సురేష్, చిలుకకు సమన్లు జారీ చేశారు. అదే విధంగా సోమవారం జనాబాయిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. సురేష్ చిలుకను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అప్పటికే అక్కడ జనాబాయి ఉన్నారు. పోలీసులు చిలుకను టేబుల్ మీద పెట్టమని చెప్పారు. ఎదురుగా జనాబాయిని కూర్చోబెట్టారు. అయితే ఆమెను చూసిన 'చిలుక' గమ్మున కూర్చొంది. బిక్కముఖం వేసుకుని అటు ఇటు చూసింది. చివరికి పోలీసులు తాము విచారణ చేస్తామని చెప్పి సురేష్, జనాబాయిని పంపించారు. తరువాత సదరు చిలుకను అటవీ శాఖకు అప్పగించేసి సురేష్, జనాబాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు.

అచ్చెన్నాయుడితో బాలకృష్ణ భేటీ..

హైదరాబాద్ : మంత్రి అచ్చెన్నాయుడితో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ అయ్యారు. హిందూపూర్ లో స్టేడియం నిర్మాణంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

11:22 - August 19, 2015

చిత్తూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర ప్రజల దగ్గరి నుండి బాబు వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వెంటనే అక్కడున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. తాము బాబును కలుస్తామని, ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేశారు. పోలీసులు అనుమతించకపోవడంతో ఎమ్మార్పీఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి..బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తరువాత ఎమ్మార్పీఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల నుండి వినతిపత్రాలు తీసుకున్నారు.

11:13 - August 19, 2015

హైదరాబాద్ : ఛైన్ స్నాచింగ్ ఘటనలో తీవ్రంగా గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వర్ధనమ్మ మహిళకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు పేర్కొన్నారు. ద్విచక్రవాహనంపై కిందపడడంతో కుడి భుజం, ఛాతికి గాయాలయ్యాయని, ఆమె ప్రాణానికి ఎలాంటి హాని లేదన్నారు. ఆమె శరీరం చికిత్సకు సహకరిస్తోందని, బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలుండడం వల్ల అబ్జర్వేషన్ లో ఉంచినట్లు తెలిపారు.
మెహిదిపట్నంలో జరిగే ఫంక్షన్ కు హాజరై శ్రీనివాస్, వర్ధనమ్మ దంపతులు మలక్ పేట వైపుకు బైక్ పై తిరిగి వెళుతుండగా నల్గొండ క్రాస్ రోడ్డు పల్సర్ వాహనంపై వచ్చిన కొందరు గుర్తు తెలియని దుండగులు వర్ధనమ్మ మెడలో నుండి నాలుగు తులాల బంగారు గొలుసు తెంపేందుకు ప్రయత్నించారు. బైక్ అదుపు తప్పడంతో శ్రీనివాస్, వర్ధనమ్మలు రోడ్డుపై పడిపోయారు. గాయాల పాలైన వర్ధనమ్మను యశోద ఆసుపత్రికి తరలించారు. 

శంషాబాద్ - ధర్మగిరి రహదారిపై దారి దోపిడికి యత్నం..

రంగారెడ్డి : శంషాబాద్ - ధర్మగిరి రహదారిపై దారి దోపిడికి యత్నించారు. రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికేసి దోపిడికి యత్నించారు. పోలీసులు రావడంతో ఆగంతకులు పరారయ్యారు. 

టి.మంత్రులంతా డమ్మీలయ్యారు - నాగం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులంతా డమ్మీలయ్యారని నాగం జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బషీర్ బాగ్ లో బచావో తెలంగాణ కార్యాలయాన్ని నాగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం తప్పు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ కాపాడాలనేదే తన సంకల్పమని, అందరూ ఒక్కటై తెలంగాణనను కాపాడుకుందామన్నారు. 

సంక్షేమ పథలకాలపై రాద్ధాంతం వద్దు - తలసాని..

హైదరాబాద్ : సంక్షేమ పథకాలపై రాద్దాంతం సరికాదని, పచ్చ కామెర్లున్న వారిలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తే ప్రజలు బహిష్కరిస్తారని తెలిపారు. 

ప్రభుత్వ వైద్యశాలలో ఏపీ మంత్రి కామినేని తనిఖీలు..

విజయనగరం : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించారు. 

ఎయిర్ పోర్టు ఆఫీసర్ పై ఛార్జీషీట్..

ఢిల్లీ : ఓ ఎయిర్ పోర్టు అధికారిపై ఢిల్లీ పోలీసులు ఛార్జీషీట్ నమోదు చేశారు. ఓ మహిళతో అధికారి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి.

ఢిల్లీలో విద్యా సలహా మండలి వార్షిక సమావేశం..

ఢిల్లీ : 63వ కేంద్రీయ విద్యా సలహా మండలి వార్షిక సమావేశం జరుగుతోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు హాజరయ్యారు. 

10:41 - August 19, 2015

ఏంటీ ? ముక్కుతో టైపింగా ? చేయితో సరిగ్గా టైప్ చేయలేం ఇంకా ముక్కుతోనా అని తీసి పారేయకండి. ఏకంగా ముక్కుతో టైప్ చేసి మనోడు గిన్నీస్ బుక్ లో పేరు సంపాదించుకున్నాడు. అతని రికార్డును అతనే బద్దలు కొట్టాడు. పాతబస్తీ ప్రాంతానికి చెందిన ఖుర్షీద్ హుస్సేన్ ఈ ఘతన సాధించాడు. ఏకంగా 43.83 సెకన్లలో 103 అక్షరాలు టైప్ చేశాడు. 2012 ఫిబ్రవరి మాసంలో 46.30 సెకన్లలో 103 అక్షరాలు రాసిన సంగతి తెలిసిందే. 

దిగంబర్ కామత్ కు ముందస్తు బెయిల్..

గోవా : మాజీ గోవా ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ కు కోర్టు షరతుతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచికత్తు సమర్పించాలని కోర్టు పేర్కొంది. లూయిస్ బర్గర్ కేసులో కామత్ ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. 

వరల్డ్ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు..

హైదరాబాద్ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో జర్నలిస్టులకు టీబ్ల్యూజేఎఫ్ కార్యదర్శి బి.బసవపున్నయ్య శుభాకాంక్షలు తెలిపారు. 

విద్యార్థినిల మృతిపై విచారణాధికారిణిగా డీఎస్పీ పూజిత..

కడప : ఇద్దరు విద్యార్థినలు మృతిపై విచారణాధికారిణిగా డీఎస్పీ పూజిత నియమితులైనట్లు డీఐజీ రమణకుమార్ పేర్కొన్నారు. 9440796935కు ఎవరైనా సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. విద్యార్థినిలు పోస్టుమార్టం నివేదిక వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవన్నారు. సూసైడ్ నోట్ లను పరీక్షలకు పంపడం జరిగిందని, రక్తంతో రాసిన లెటర్ ను డీఎన్ఏ టెస్టుకు పంపినట్లు పేర్కొన్నారు. 

వర్ధనమ్మ అవుటాఫ్ డేంజర్..

హైదరాబాద్ : ఛైన్ స్నాచర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన వర్ధనమ్మ పరిస్థితి అదుపులో ఉందని యశోద వైద్యులు పేర్కొన్నారు. తలకు తీవ్ర గాయమైందని, రేపు డిశ్జార్జీ చేసే అవకాశం ఉందన్నారు. కానీ 24గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు పేర్కొన్నారు.

 

వర్షాల కోసం యజ్ఞాలు..అభిషేకాలు చేయాలని ప్రభుత్వం ఆదేశం..

హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు దేవాలయాల్లో యజ్ఞాలు, అభిషేకాలు నిర్వహించాలంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రిన్స్ పల్ సెక్రటరీ జేఎస్ వి ప్రసాద్ పేరిట ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.

 

09:33 - August 19, 2015

కడప : జిల్లాలో అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కర్నూలు, చిత్తూరు జిల్లాల నుండి అదనపు బలగాలను మోహరించారు. ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్న అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల వైఖరిని నేతలు తప్పుబడుతున్నారు. కడప జిల్లా నారాయణ కాలేజీలో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నారాయణ కాలేజీలో వరుసగా జరుగుతున్న హత్యలపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం బంద్ కు పిలుపునిచ్చింది. వెంటనే మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఉందయం కోటరెడ్డి సర్కిల్ వద్ద సీపీఎం నేతలు బంద్ ను కొనసాగించారు. ఈసందర్భంగా సీపీఎం నేత టెన్ టివితో మాట్లాడారు. తాము మూడు డిమాండ్లు అడుగుతున్నామని కడప హత్యలపై న్యాయవిచారణ జరిపించాలని..న్యాయవిచారణకు ఆటంకంగా ఉన్న మంత్రి రాజీనామా చేయాలని.. మృతి చెందిన విద్యార్థుల కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. బంద్ కు పిలుపునిస్తే నిర్వీర్యం చేయడానికి పోలీసులను భారీగా మోహరించారని పేర్కొన్నారు. అనంతరం సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్ లలో తరలించారు. 

09:28 - August 19, 2015

నిజామాబాద్ : ప్రభుత్వం ఆసుపత్రిలో కిడ్నాప్ అయిన శిశువు మిస్టరీ వీడింది. నందిపేట మండలం కౌలుపురాకు చెందిన సుజాత, అనిఫాలు అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని శిశువును తల్లికి అప్పగించారు. నందిపేట మండలంలో సుజాత అనే మహిళ దగ్గర అనుమానస్పదంగా పాప ఉందని సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. దీనితో పోలీసులను పంపి మహిళను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈనెల ఐదో తేదీన దుబ్బాకకు చెందిన అనిత దంపతులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిపించారు. ఆ తరువాత చిన్నారి అదృశ్యమైంది. చిన్నారిని తమ దగ్గరికి చేరవేయాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. చివరకు శిశువు చేరడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రణబ్ ముఖర్జీని కలిసిన షేక్ హాసినా..

ఢిల్లీ : బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హాసినా ఢిల్లీకి చేరుకున్నారు. నేరుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ప్రణబ్ సతీమణి శుభ్రా ముఖర్జీ మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నేడు శుబ్రా అంత్యక్రియలు జరుగనున్నాయి. 

09:13 - August 19, 2015

సూపర్ స్టార్ 'రజనీకాంత్‌' 'కబలి' ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ అయింది. తెలుగులో ఈ సినిమా 'కపాలి' పేరుతో వస్తుంది. రజనీకాంత్ తదుపరి చిత్రం ఖరారైంది. ఇది రజనీకాంత్ నటిస్తున్న 159వ చిత్రం కావడం విశేషం. మద్రాసి, అత్త కత్తి లాంటి లాంటి భారీ హిట్‌ తర్వాత 'కబలి'ని రంజిత్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రజనీ పక్కన రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటిస్తోందని తెలుస్తోంది. 'కొచ్చడయాన్‌', 'లింగా' ప్లాప్‌లతో విసిగిపోయిన రజనీ చాలా కేర్ తీసుకొని మరీ ఈ సారి పక్కా స్క్రిప్ట్ తో వస్తున్నాడని టాక్. 'నరసింహ' తర్వాత రజనీ మళ్లీ తండ్రిగా నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

కుప్పంలో రెండో రోజు బాబు పర్యటన..

చిత్తూరు : జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన ప్రారంభమైంది. హంద్రీనీవా, ఎన్ హెచ్ 219 విస్తరణ పనులు, న్యాక్ కేంద్రానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 

ఢిల్లీకి చేరుకున్న షేక్ హాసినా..

ఢిల్లీ : బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హాసినా ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు జరిగే ప్రణబ్ సతీమణి శుభ్రా ముఖర్జీ అంత్యక్రియల్లో హాసీనా పాల్గొనున్నారు. 

అడుసుమిల్లి వెంకటేశ్వరరావు కన్నుమూత..

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత అడుసుమిల్లి వెంకటేశ్వరరావు (పసిబాబు) కన్నుమూశారు. విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నంబర్ వన్, శుభలగ్నంతో సహా పలు సినిమాలను ఆయన నిర్మించారు. 

08:39 - August 19, 2015

బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఏపీకి ఇవ్వకపోవడం సరికాదని ప్రొ. నాగేశ్వర్ పేర్కొన్నారు. బీహార్ కు రూ.1.25 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రధాన మంత్రి మోడీ ప్రకటించారు. దీనితో ఒక్కసారిగా చూపు ఏపీపై పడింది. ఈ అంశంపై టెన్ టివిలో 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ది హాన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

తక్కవ ఇస్తే తలదించుకోవాలి..
''ప్రత్యేక హోదా..ప్రత్యేక ప్యాకేజీ అడగడం రాజకీయ హక్కు. విభజన సమయంలో సీఎం బాబు ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. విభజన ఏపీకి నష్టాన్ని కలిగించింది. ఒక సమతుల్యత లోపించింది. ఖర్చు పెరిగింది. ఆదాయం తగ్గింది అని పేర్కొన్నారు. మరి ఒక అంచనా వేయవచ్చు కదా. బీహార్ లో ఆర్థిక పరిస్థితులు బాగా లేవు. వనరులు లేవు అని పేర్కొంటున్నారు. కానీ కేంద్రం చర్యల వల్ల అక్కడ అలా జరిగింది. ఇక్కడ కేంద్రం చర్యల వల్ల ఏపీ నష్టపోయింది. బీహార్ కన్నా తక్కువ ఇస్తే రాష్ట్రం తలదించుకోవాల్సి వస్తుంది. రాష్ట్ర అవసరాలు ఏంటీ ? విభజన అనతరం ఎలాంటి అవసరాలు వచ్చాయి. వీటన్నంటినీ అధ్యయనం చేయాలి.

పార్లమెంట్ లో హామీనిచ్చారు..
పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పార్లమెంట్ ఏపీకి ఇచ్చిన హామీ. ఎన్నికల్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో అనడానికి నిదర్శనం. ఓట్లు వేస్తే కేంద్రం నుండి నిధులు ఇస్తామని చెబుతున్నట్లుంది. ప్రస్తుతం ప్రత్యేక హోదా సాధ్యం కాదు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. మరి ఎందుకివ్వడం లేదు.

అఖిలపక్ష సమావేశాన్ని పెట్టాలి..
ఇక్కడ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండు అడిగే హక్కు ఉంది. రెండు రాష్ట్రాలకు ప్రత్యేక సాయం ఉంటుందని కేంద్రం చెప్పింది. చట్టంలో ఉన్న అంశం. ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి చేసినటువంటి హామీ. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వారు ఈ రోజు అధికారంలో ఉన్నారు. ఏడాది ముందే వాగ్ధానాలు చేశారు. కానీ ఇప్పటికీ అమలు చేయలేదని పాట్నాలో రెండు మూడు మీటింగ్ లు పెట్టి చెబితే పరిస్థితి ఎలా ఉంటుంది. ఈ విషయంలో ఏపీ శాసనసభ తీర్మానం చేయదు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని పెట్టాలి. రాష్ట్రానికి ఏం కావాలో ప్రభుత్వం చెప్పాలి. ఇది పూడ్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందనేది చెప్పాలి. కాంగ్రెస్ ఎంత బాధ్యత ఉందో బీజేపీకి కూడా అంతే బాధ్యత ఉంది. బీహార్ కు ఇచ్చి ఏపీకి ఇవ్వకపోవడం సరికాదు..అవరాలసకనుగుణంగా ఏపీకి నిధులు కేటాయించాలి''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

08:12 - August 19, 2015

హైదరాబాద్ : నగరంలో ఛైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. శుభకార్యాలయాలకు వెళ్లి వస్తున్న మహిళల మెడలో నుండి బంగారు గొలుసులు తెంపుకొనేందుకు స్నాచర్లు ప్రయత్నిస్తున్నారు. ఈఘటనలలో పలువురు మహిళలకు తీవ్ర గాయాలవుతున్నాయి. తాజాగా మలక్ పేటలో జరిగిన ఓ ఘటనలో మహిళ చావు బతుకుల మధ్య కొట్టుమట్టాడుతోంది.
మెహిదిపట్నంలో జరిగే ఫంక్షన్ కు హాజరై శ్రీనివాస్, వర్ధనమ్మ దంపతులు మలక్ పేట వైపుకు బైక్ పై తిరిగి వెళుతున్నారు. నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద వీరిని పల్సర్ వాహనంపై వెంబడించిన కొందరు గుర్తు తెలియని దుండగులు వర్ధనమ్మ మెడలో నుండి నాలుగు తులాల బంగారు గొలుసు తెంపేందుకు ప్రయత్నించారు. ఇరు వాహనాలు వేగంగా వెళుతుండడం..బైక్ అదుపు తప్పడంతో శ్రీనివాస్, వర్ధనమ్మలు రోడ్డుపై పడిపోయారు. వర్ధనమ్మ తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మార స్థితిలోకి వెళ్లిపోయింది. అర్ధరాత్రి 2.30-3.00గంటల సమయం కావడతో జనసంచారం తక్కువగా ఉంది. తేరుకున్న శ్రీనివాస్ వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. సమీపంలో ఉన్న యశోద ఆసుపత్రికి వర్ధనమ్మను తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 

వైసీపీ, వామపక్ష నేతల హౌస్ అరెస్టు..

కడప : జిల్లాలో పోలీసులు వైసీపీ, వామపక్ష నేతలను హౌస్ అరెస్టు చేశారు. కార్పొరేట్‌ కళాశాలలో విద్యార్థినుల ఆత్మహత్యను నిరసిస్తూ కడప నగర బంద్‌కు వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా వైసీపీ నేతలు, వామపక్షాల నేతలను హౌస్‌ అరెస్టు చేశారు.

08:01 - August 19, 2015

మరో రెండు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ బీహార్‌ రాష్ట్రానికి భారీ ప్యాకేజీ రూ 1.25లక్షల కోట్లు ప్రకటించారు. ఏపీకి అడుగుతున్న ప్రత్యేక హోదా, ప్యాకేజీ కేంద్రం ప్రకటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలను మభ్య పెట్టడానికే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు రేపు ప్రధాన మంత్రి మోడీతో భేటీ కానున్నారు. ఇందులో ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జూపూడి ప్రభాకర్ (టీడీపీ), అంబటి రాంబాబు (వైసీపీ), ద్రోణంరాజు సత్యనారాయణ (కాంగ్రెస్), సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్), నడింపల్లి సీతరామరాజు (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

శంషాబాద్ లో బుల్లెట్ కలకలం..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుధవారం ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ దొరకడం కలకలం సృష్టించింది. చికాగో వెళుతున్న ఓ ప్రయాణికుడు తనిఖీలు చేయగా బుల్లెట్ బయటపడింది. వెంటనే కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. .

స్థిరంగా అల్పపీడనం..

విశాఖపట్టణం : ఛత్తీస్ గఢ్ నుండి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఏడు కొండల వాడి సర్వదర్శనానికి నాలుగు గంటలు..కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటలు..పత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

 

 

07:29 - August 19, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కలలు నేరవేరనున్నాయి. నేడు ఇంజినీర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. సాయంత్రం 5గంటలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీష్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇంజినీరింగ్ ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది. వివిధ విభాగాల కింద మొత్తం 1700 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. ఇందుకు బీటెక్ విద్యార్హతగా విధించారు. పోస్టుల భర్తీలో పదేళ్ల గరిష్ట వయో పరిమితిని కమిషన్ అమలు చేయనుంది. ఇవే కాకుండా గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్ డబ్ల్యూఎస్)లో 756 పోస్టులను ఓట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేసేందుకు ఆ శాఖ ఇంజినీర్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఛైన్ స్నాచింగ్ ఘటనలో మహిళ పరిస్థితి విషమం...

హైదరాబాద్ : మలక్ పేటలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వర్ధనమ్మ అనే మహిళ పరిస్థితి విషమం చెందింది. మంగళవారం రాత్రి మలక్ పేట ఫ్లై ఓవర్ పై బైక్ పై వెళుతుండగా వర్ధనమ్మ మెడలో నుండి బంగారు గొలుసు లాక్కొనేందుకు దుండగులు ప్రయత్నించారు. దీనితో కిందపడిపోయిన వర్ధనమ్మకు తీవ్రంగా గాయాలయ్యాయి. 

తెలంగాణలో ఇంజీనీర్ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్..

హైదరాబాద్ : నేడు సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది. 

07:04 - August 19, 2015

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన పోలవరం ముంపు మండలాల్లో రేపు బంద్ పాటించబోతున్నారు. ఈ బంద్ కు కారణం ఏమిటి? విలీనం తర్వాత ఈ మండలాల ప్రజల పరిస్థితి ఏమైంది? వారి బాగోగులు ఎవరు చూస్తున్నారు? విలీన మండలాల ప్రజల గుండె చప్పుడేమిటి ? వివిధ సమస్యలను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన క్రిష్ణమూర్తి ఈ అంశంపై టెన్ టివి జనపథంలో విశ్లేషించారు.

 

07:01 - August 19, 2015

జనం భయపడ్డట్టే జరుగుతోంది. విలీన మండలాలను పట్టించుకునే దిక్కులేకుండా పోతోంది. అక్కడ నుంచి ప్రభుత్వ యంత్రాంగం మాయమైంది. ఆస్పత్రులు, స్కూళ్లు మూతపడ్డాయి. కూనవరం, చింతూరు, నెల్లిపాక, వి ఆర్ పురం, కుక్కునూరు, వేలేరుపాడు ఇవన్నీ ఒకప్పుడు తెలంగాణ భూభాగంలో వుండేవి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగమయ్యాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ కూడా చేశారు. అప్పటి నుంచి వీరి కష్టాలు తీవ్రమయ్యాయి.

పోలవరం నిర్మిస్తే మునిగిపోనున్న మండలాలు..
పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తే ఈ మండలాలు మునిగిపోతాయి. ఈ ముంపు ప్రాంతాలు తెలంగాణలో వుంటే ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకులు ఎదురవుతాయన్న ఉద్దేశ్యంతో వీటిని ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేశారు. విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతంలో తన సేవలను ఉపసంహరించుకుంది. ఆ బాధ్యతలు స్వీకరించాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఇప్పుడు విలీన మండలాల్లో ఎక్కడా స్కూళ్లు పనిచేయడం లేదు. ఎక్కడా టీచర్లు లేరు. ఆఫీసుల్లో ఉద్యోగులు లేరు. ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది లేరు. కనీసం అత్యవసర సేవలందించే 108 జాడ కూడా కనిపించడం లేదు. పరిస్థితులు ఇంత ఘోరంగా వుంటే జనం ఎలా బతకాలి? పిల్లలు ఎలా చదువుకోవాలి ? ఎక్కడ చదువుకోవాలి ? పేషెంట్లు ఎక్కడ వైద్యం చేయించుకోవాలి ? పసి పిల్లలకు, చిన్నారులకు టీకాలు వేసేదెవరు? ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ రకాల పనులున్నవారు తమ పనులు ఎవరితో చేయించుకోవాలి? ఈ సృహే ఇప్పుడు ప్రభుత్వంలో లోపించింది.

వీరి గురించి ఆలోచించని నేతలు..
తెలంగాణలోని ఈ ఆరు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయాలని పట్టుబట్టినవారెవ్వరూ ఇప్పుడు వీరి గురించి ఆలోచించడం లేదు. వీరి యోగక్షేమాలు పట్టించుకోవడం లేదు. కనీసం ఒక్కనాయకుడైనా ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు పర్యటించలేదు. మంత్రులు వెళ్లిన దాఖలాలు లేవు. కనీసం ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలకు వీరి సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశమైనా లేకుండా పోయింది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసలు ఇప్పుడు ఈ ఆరు మండలాలకు ఎమ్మెల్యేలు వున్నట్టా? లేనట్టా? తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కష్టసుఖాలు, వారి సమస్యల గురించి కనీసం అసెంబ్లీలోనైనా ప్రస్తావించలేని నిస్సహాయ స్థితి ఎమ్మెల్యేలది. ఎందుకంటే వీరు వెళ్లేది తెలంగాణ అసెంబ్లీకి. ఆ ప్రాంతం ఇప్పుడు వున్నది ఆంధ్రప్రదేశ్ లో. ఏపీ అసెంబ్లీలో వీరికి ప్రవేశం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా విలీన మండలాల ప్రజల యోగ క్షేమాల గురించి ఆలోచించాలి. వారికి ఎక్కడా ఏ ఇబ్బందీ రాకుండా చూడాలి. దేశమంటే మట్టికాదు. దేశమంటే మనుషులన్న వాస్తవాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి. 

నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన..

కరీంనగర్ : నేడు తెలంగాణ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో కూడా ఆయన పర్యటించనున్నారు. 

నేడు కరీంనగర్ లో ఎంపీ కవిత పర్యటన..

కరీంనగర్ : నేడు ఎంపీ కవిత కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జగిత్యాల నియోజవకర్గంలోని రేషన్ పల్లి, బీర్పూర్ గ్రామాల్లో మనపల్లె మన ఎంపీ కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొననున్నారు. 

నేడు ఖమ్మంలో హరీష్ రావు పర్యటన..

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు నేడు జిల్లాలో పర్యటించనున్నారు. సత్తుపల్లిలోని బేతుపల్లి వరద కాల్వను హరీష్ ప్రారంభించనున్నారు.

 

వికారాబాద్ లో కాంగ్రెస్ ధర్నా..

రంగారెడ్డి : జిల్లాలో నేడు కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించనున్నారు. వికరాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. 

06:38 - August 19, 2015

ఢిల్లీ : వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ అమలు చేయాలంటూ దీక్ష చేస్తున్న మాజీ సైనిక ఉద్యోగులకు ఢిల్లీ పోలీసులు క్షమాపణలు చెప్పారు. ఆగస్టు 14న దీక్ష చేస్తున్న మాజీ సైనిక ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించడంపై పోలీసు అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు భద్రత కారణాల దృష్ట్యా వీరిని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు ఢిల్లీ పోలీసులు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇబ్బందిపెట్టారు. ఈ ఘటనపై మాజీ సైనిక ఉద్యోగులు సీరియస్‌గా స్పందించారు. చేయి చేసుకున్న పోలీసులపై కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. జంతర్‌మంతర్‌ ఘటనపై ఢిల్లీ పోలీసు అధికారులు స్పందించారు. ఆగస్టు 14 చర్య పట్ల తమను క్షమించాలని ఢిల్లీ జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎంకే మీనా జంతర్‌మంతర్‌ వద్దకు వెళ్లి సైనిక ఉద్యోగులను కోరారు. మాజీ సైనిక ఉద్యోగుల పట్ల పోలీసులు ప్రదర్శించిన తీరును ఆయన ఖండించారు. సైనికులంటే తమకు ఎంతో గౌరవం ఉందని ఎంకే మీనా చెప్పారు. మాజీ సైనిక ఉద్యోగుల పట్ల ఢిల్లీ పోలీసులు అనుసరించిన తీరుపై కేంద్ర హోంశాఖ వివరణ కోరడంతోనే.. పోలీసు అధికారులు క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు క్షమాపణలు చెప్పడం పట్ల మాజీ సైనిక ఉద్యోగులు హర్షం ప్రకటించారు.  

06:32 - August 19, 2015

ఖమ్మం : ఒక్క ఆర్డినెన్సుతో తెలంగాణలోని ఆరు మండలాల ప్రజలను.. ఏపీ పౌరులుగా మార్చేశారు. ఆ తర్వాత వారెలా ఉన్నారో వారి వెతలేంటో తెలుసుకోవడాన్ని విస్మరించారు. పాత రాష్ట్రం పట్టించుకోక.. కొత్త రాష్ట్రం కష్టాలు తీర్చక అక్కడివారు నానా అగచాట్లూ పడుతున్నారు. ఇది.. తెలంగాణ నుంచి ఏపీలోకి కలిసిన పోలవరం ముంపు మండలాల ప్రజల వేదన. ఎన్నిసార్లు విన్నవించినా స్పందన రాకపోవడంతో.. ప్రభుత్వాన్ని కదిలించేందుకు ఈనెల 20న ముంపు మండలాల బంద్‌ను పాటించాలని నిర్ణయించారు.

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు..
పోలవరం ముంపు మండలాల ప్రజలు ఏపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు, దాని పరీవాహకంలోని ముంపు ప్రాంతాలూ ఒకే రాష్ట్రంలో ఉండాలన్న కారణంతో.. మోదీ సర్కారు ఏకంగా ఆరు మండలాలను ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి బదలాయించింది. ఒక్క ఆర్డినెన్సుతో.. అప్పటిదాకా తెలంగాణ పౌరులుగా ఉన్న కూనవరం, చింతూరు, నెల్లిపాక, వీఆర్‌పురం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు ఏపీ పౌరులుగా మారిపోయారు. అయితే.. అప్పటి నుంచే వారి కష్టాలూ మొదలయ్యాయి.

అన్ని సమస్యలే..
భద్రాచలం మినహా ముంపు మండలాలను ఏపీలో కలిపేయడంతో.. ఈ ప్రాంత ప్రజలకు ఆర్డీఓ కార్యాలయం, ఆర్టీసీ డిపో, న్యాయస్థానం, ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కాలేజీతో పాటు డివిజన్‌ ఆఫీసులు లేకుండా పోయాయి. ఈ మండలాలు తమ ప్రాంతానికి చెందనివి అంటూ తెలంగాణ ఉద్యోగులంతా ఇక్కడి నుంచి తరలిపోయారు. వీరి స్థానంలో ఏపీ నుంచి ఏ ఒక్కరూ రాలేదు. దీంతో ఇప్పుడు విలీన ప్రాంతంలోని కాలేజీల్లో అధ్యాపకులు లేరు.. స్కూళ్లకు ఉపాధ్యాయులు రారు.. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కనిపించరు. గడచిన 15 నెలలుగా ముంపు మండలాలన్నింటా ఇదే పరిస్థితి.

పలు డిమాండ్లు..
తమను ఏపీలో కలిపేసుకున్నాక.. ఒక్క నాయకుడూ మంపు మండలాలను సందర్శించ లేదంటూ ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. వారం వారం సింగపూరు, మలేసియా, జపాన్‌ అంటూ విదేశాలు తిరిగే ముఖ్యమంత్రికి తమను పరామర్శించాలన్న ధ్యాసే లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమ వెతలు తీర్చాలంటూ ప్రభుత్వాన్ని కదిలించేందుకు ఈనెల 20న ముంపు మండలాల ప్రజలు బంద్‌ పాటించాలని నిర్ణయించారు. సీపీఎం మద్దతుతో వీరీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందిని తక్షణమే నియమించాలని, చింతూరు, కుక్కునూరులలో ఆర్డీఓ, ఐటీడీఏ తదితర డివిజన్‌ కార్యాలయాలు, కోర్టులు, వంద పడకల ఆసుపత్రులు, ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

06:27 - August 19, 2015

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమావేశం రాజకీయంగా అత్యంత కీలకం కాబోతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, ఆర్థిక సహాయం వంటి అధికారిక అంశాలతో పాటు చంద్రబాబు అనధికారిక అజెండా పైనా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. సంక్లిష్ట పరిస్థితుల్లో సాగుతున్న వీరిద్దరి భేటీ ఏయే పరిణామాలకు దారితీస్తుందోనని చర్చోపచర్చలు మొదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కేంద్రం చేతులెత్తేసింది. మరోవైపు ఓటుకు నోటు కేసు ఛార్జి షీటులో స్వయంగా చంద్రబాబు పేరే పలుమార్లు ప్రస్తావనీయాంశమై కూర్చుంది.

ఉద్యమానికి శ్రీకారం చుడుతున్న విపక్షాలు..
చట్టపరంగా కేసు ముడి బిగుస్తోంది. ఇంకో వైపు ప్రత్యేక హోదా విషయాన్ని రాజకీయాస్త్రంగా మారుస్తూ విపక్షాలు ఉద్యమాని కి శ్రీకారం చుడుతున్నాయి. ఈ ముప్పేట దాడికి తోడు... తాజాగా బీహార్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భారీ ప్యాకేజీ చంద్రబాబుకు గోరు చుట్టు మీద రోకలి పోటులాగా మారింది. ఈ నేపథ్యంలో మోడీతో భేటీ ఏ కోణంలో జరగబోతోందన్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. లోటు బడ్జెట్తో రోజు వారీ వ్యవహారాలను నెట్టుకొస్తున్న ఆంధ్రా సర్కారు ఆర్థిక పరిస్థితి దినదినగండంగా మారింది. రాజకీయంగా ప్రత్యేక హోదా గండాన్ని దాటడం తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలకు విషమ పరీక్షగా తయారైంది. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆలోచన లేదని కేంద్రప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టేస్తుంటే బీజేపీ, తెలుగు దేశం నాయకులు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. హోదా ప్యాకేజీల మధ్య కుప్పిగంతులు వేస్తున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఇది చంద్రబాబు నాయుడి సామర్ధ్యానికే గీటురాయిగా రూపు దాల్చుతోంది.

ప్రత్యేక హోదాపై అమీతుమీ..
రాజకీయ బేరసారాల్లో రాటు తేలిన చంద్రబాబు ప్రధానితో కలిసినప్పుడు రాష్ర్ట ప్రజానీకం డిమాండ్లను ఎంతవరకూ రాబట్టు కోగలుతారు? లేదా తెలంగాణ ప్రభుత్వం నుంచి తనకు వ్యక్తిగతంగా ఎదురవుతున్న ఇబ్బందులనుంచి బయటపడేసేందుకు కేంద్రం సాయం అర్థించి సరిపుచ్చుకుంటారా? అన్న కోణంలో కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రాన్ని నిలబెట్టి రాష్ట్రం అవసరాలను రాబట్టే నైతిక స్థైర్యానికి ఓటుకు నోటు కేసు గండి కొట్టేసిందనేది విమర్శకుల భావన. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించమని చంద్రబాబు కోరనున్నారా? లేక రాజకీయంగా తనకు ఇబ్బందిగా మారిన ప్రత్యేక హోదా అంశాన్ని అమీతుమీ తేల్చుకోనున్నారా? అన్నదే ఇప్పుడు ఆంధ్రా ప్రజలను వెంటాడుతున్న ప్రశ్న.

ఆశగా ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రజానీకం..
తెగేదాకా లాగితే ఇద్దరికీ ఇబ్బందే అన్న విషయం మోడీ, చంద్రబాబు లిద్దరికీ తెలుసు. అలాగని ఎటువంటి ఫలితం లేని చర్చలు జరిపితే రాష్ట్రంలో పర్యవసానాలు తీవ్రంగా ఉండే వాతావరణం కనిపిస్తోంది. దీనినుంచి ఈ నాయక ద్వయం ఎలా బయటపడతారో వేచి చూడాల్సి ఉంది. తాజాగా బీహార్ కు ప్రకటించిన భారీ ప్యాకేజీ కూడా చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఇప్పుడు బాబు..మోడీల వన్ టూ వన్ మీటింగ్ అజెండా ఏం సాధిస్తుందోనని ఆంధ్ర ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తోంది.

06:24 - August 19, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణ మరింత వేగవంతం చేస్తోంది. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న 50 లక్షల రూపాయలపై దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. తాజాగా వ్యాపారవేత్త డీకే శ్రీనివాస్‌నాయుడిని ఏసీబీ విచారించింది. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ కలవడంతో ఇంకా ఎవరెవరికి నోటీసులు జారీ అవుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొంతమంది రాజ్యసభ సభ్యులు డబ్బులు సమకూర్చారని వార్తలు వచ్చినా తాజాగా మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు కుమారుడు,.. కర్నాటక బేవరేజస్‌ ఎండీ శ్రీనివాస్‌నాయుడును ఏసీబీ అధికారులు దాదాపు 6 గంటలపాటు విచారించారు.

రేవంత్‌రెడ్డి మంచి స్నేహితుడు..
రేవంత్‌రెడ్డి డ్రైవర్‌, సెక్యూరిటీ సిబ్బంది నుంచి సేకరించిన సమాచారం మేరకు శ్రీనివాస్‌నాయుడిని ఏసీబీ విచారించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన 50 లక్షల రూపాయలపై ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయితే శ్రీనివాస్‌నాయుడు మాత్రం తనకు రేవంత్‌రెడ్డి మంచి స్నేహితుడు మాత్రమేనని.. తన కార్యాలయం నుంచి ఎవరికీ డబ్బులు సమకూర్చలేదని ఆయన స్పష్టం చేశారు. తన కార్యాలయంలో పని చేస్తున్న విష్ణుచైతన్య మరో రెండు రోజుల్లో ఏసీబీ విచారణకు హాజరవుతారని తెలిపారు.

కేసీఆర్‌తో ఏకే ఖాన్‌ భేటీ..
ఇక ఈ నగదు వ్యవహారంపై మరిన్ని సాక్ష్యాధారాలు లభిస్తే మరికొంతమందిని విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఈ విషయాలపై బుధవారం నాడు మరింత స్పష్టత వచ్చేటట్లు తెలుస్తోంది. మరోపక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ కలవడం ఉత్కంఠ రేపుతోంది. మత్తయ్యను ఆంధ్రప్రదేశ్‌కు పంపించిన పోలీసు అధికారులకు నోటీసులు ఇచ్చే అంశంపై కేసీఆర్‌, ఏకే ఖాన్‌లు చర్చించినట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసు దర్యాప్తు తీరు... చార్జిషీట్‌లోని పలు అంశాలను కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి..? విచారణకు హాజరుకాని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలు కూడా కేసీఆర్‌ వద్ద ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్ని చూస్తుంటే త్వరలోనే మరికొంత మందికి నోటీసులు జారీ అయ్యేటట్లు కనిపిస్తోంది. 

06:21 - August 19, 2015

కడప : నారాయణ కాలేజీలో నందిని, మనీషా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి సంఘాలతో సహా విపక్షాలు మంత్రి నారాయణను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేడు కడప జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.

కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన..
కడప జిల్లాలోని నారాయణ విద్యా సంస్థలో ఇద్దరు ఇంటర్‌ విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల మృతిపై తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుంటే.. ఈ దారుణానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి సంఘాలు, విపక్షాలు ఆందోళన చేపట్టాయి. నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలని, మంత్రి నారాయణపై చర్యలు తీసుకోవాలని కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు.. వారిని చెదరగొట్టారు.

మృతదేహాలను సందర్శించిన జగన్..
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల మృతదేహాలను ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ సందర్శించారు. వరుసగా తొమ్మిది మంది విద్యార్థులు నారాయణ విద్యాసంస్థల్లో ఆత్మహత్య చేసుకున్నా.. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. విద్యార్థుల మృతిపట్ల ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్న జగన్‌.. నారాయణ విద్యాసంస్థల్లో వాటా ఉన్నందువల్లే బాబు సైలెంట్‌గా ఉంటున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు నిరసనగా రేపు కడప బంద్ కు జగన్‌ పిలుపునిచ్చారు.

జగన్ పై సిఎం రమేష్ మండిపాటు..
విద్యార్థినుల మృతదేహాలను సందర్శించిన సిఎం రమేష్.. జగన్‌ పై మండిపడ్డారు. ఈ అంశాన్ని జగన్ రాజకీయం చేస్తున్నారని రమేష్‌ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న నందిని, మనీషా మృతదేహాలకు కడప రిమ్స్ ఆస్పత్రిలో పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. ఈ సమయంలో ఆస్పత్రి ఎదుట మృతుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తన ఆందోళనకు దిగారు. నారాయణ కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి సైతం మృతదేహాలను సందర్శించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు..
విద్యార్థుల మృతికి నిరసనగా కడపలో వామపక్షాల ఆధ్వర్యంలో మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దహనం చేశారు. నారాయణను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన నారాయణపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, పోలీసులే.. ఆయనకు రక్షణగా నిలబడ్డాయని విమర్శించారు. గుంటూరులో రిషితేశ్వరి ఆత్మహత్య మరువకముందే.. కడపలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం పట్ల సర్వత్రా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

నేడు కడప జిల్లా బంద్ కు వైసీపీ పిలుపు..

కడప : నేడు జిల్లా బంద్ కు వైసీపీ పిలుపునిచ్చింది. నారాయణ కాలేజీ హాస్టల్ విద్యార్థినుల ఆత్మహత్యకు నిరసనగా బంద్ పాటించనున్నారు. 

నేడు ఢిల్లీల్లో ప్రణబ్ సతీమణి అంత్యక్రియలు..

ఢిల్లీ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుబ్రా ముఖర్జీ అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి.

 

నేడు, రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం..

హైదరాబాద్ : రామగుండం - చంద్రపూర్ వద్ద 400 కేవీ విద్యుత్ లైన్ నిర్మిస్తుండడంతో తెలంగాణ రాష్ట్రానికి ఈనెల 19,20వ తేదీల్లో సుమారు 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. 

మలక్ పేట ఫ్లై ఓవర్ పై ఛైన్ స్నాచింగ్..

హైదరాబాద్ : మలక్ పేట ఫ్లై ఓవర్ పై గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళలపై దాడి చేసి ఛైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళను యశోద ఆసుపత్రికి తరలించారు. 

Don't Miss