Activities calendar

22 August 2015

వచ్చే నెలలో చైనా పర్యటనకు సీఎం కేసీఆర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ వచ్చే నెలలో చైనా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. చైనాలో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. పర్యటన సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.

21:42 - August 22, 2015

ఢిల్లీ : ప్రపంచ అద్భుత కట్టడం తాజ్‌మహల్‌లో 17వ శతాబ్దానికి చెందిన శాండిలయర్‌ కింద పడి ధ్వంసమైంది. బ్రిటీష్‌ కాలానికి చెందిన ఈ శాండిలయర్‌ రాగితో తయారు చేశారు. దీని బరువు 60 కిలోలు. అత్యంత ప్రాచీనమైన ఈ శాండిలయర్‌ ధ్వంసం కావడంపై ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా విచారణకు ఆదేశించింది. ఆరడుగుల ఎత్తు నాలుగు అడుగుల వెడల్పు ఉన్న ఈ శాండిలయర్‌ను బ్రిటీష్ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కర్జన్‌ బహుమతిగా ఇచ్చారు. 1905లో తాజ్‌మహల్‌లోని రాయల్‌ గేట్‌ ముందు దీన్ని ఏర్పాటు చేశారు.

21:40 - August 22, 2015

హైదరాబాద్ : భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య చర్చల వార్‌ కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఏ చర్చల్లో కాశ్మీర్‌ అంశం ఉండాల్సిందేనని పాకిస్తాన్‌ పట్టుబట్టింది. మరోవైపు ఉఫా ఒప్పందం ప్రకారం చర్చల్లో ఉగ్రవాదం తప్ప కాశ్మీర్‌ అంశం ప్రస్తావనే ఉండదని భారత్‌ స్పష్టం చేసింది. ఎవరి వాదానికి వారు కట్టుబడి ఉండడంతో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయా లేదా అన్నది సందిగ్ధంగా మారింది.

ఉఫా ఒప్పందం ప్రకారం ఉగ్రవాదంపైనే చర్చించాలన్న భారత్...

భారత్, పాకిస్థాన్‌ జాతీయ్ భద్రతా సలహాదారుల సమావేశంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కశ్మీర్‌ ఎజెండా లేకుండా చర్చలు జరపడం అసాధ్యమని పాకిస్థాన్ జాతీయ భధ్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ తమ వైఖరిని వెల్లడించారు. ఉఫా ఒప్పందం ప్రకారం భారతదేశంతో చర్చలకు తాము సిద్ధమేనని, ఉఫా ఒప్పందంలో ఉగ్రవాదంతో పాటు కశ్మీర్‌ అంశం కూడా ఉందని పేర్కొన్నారు.

పాకిస్తాన్ ప్రకటనపై తీవ్రంగా స్పందించిన భారత్‌ ....

పాకిస్తాన్ ప్రకటనపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో కేవలం ఉగ్రవాదంపైనే చర్చించాలని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు. రష్యాలోని ఉఫాలో ఇరు దేశాల మధ్య 3 అంశాలపై ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఇరుదేశాల మధ్య టెర్రరిజంపై ఎన్‌ఎస్‌ఏల మధ్య చర్చలు, డిజి బిఎస్‌ఎఫ్‌-పాక్‌ రేంజర్స్‌ మధ్య సరిహద్దులో శాంతి భద్రతలపై చర్చలు, కాల్పుల ఉల్లంఘనకు సంబంధించి డిజి ఎమ్‌వోస్‌ల మధ్య చర్చలు జరగాలన్న రాతపూర్వక ఒప్పందం కుదిరినట్టు సుష్మా ప్రకటించారు.

చర్చలే సరైన మార్గం -ఏచూరి

భారత్‌- పాకిస్తాన్‌లు మధ్య ఉద్రిక్తతలు తొలగించడానికి చర్చలే సరైన మార్గమని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.ఎవరి వాదానికి వారు కట్టుబడి ఉండడంతో ఇరుదేశాల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. భారత్‌ విధించిన షరతుకు ఒప్పుకుని పాకిస్తాన్‌ చర్చలకు వస్తుందా లేదా అన్నది మరికొన్ని గంటల్లోనే తేలనుంది. 

21:36 - August 22, 2015

హైదరాబాద్ : తెలంగాణ లో మ‌రో ఉద్యమ‌ వేదిక పురుడుపోసుకుంది. ఛీప్ లిక్కర్ పై పోరాటడేందుకు జాయింట్ యాక్షన్ క‌మీటి ఆవిర్భవించింది. అన్నీ రాజ‌కీయ పార్టీల భాగ‌స్వామ్యంతో ఏర్పాటైన ఈ ఉద్యమ క‌మిటీ. లిక్కర్ కు వ్యతిరేకంగా ఊరువాడా ఉద్యమించ‌నుంది. ఈ జేఏసీకి క‌న్విన‌ర్ గా ప్రొఫెస‌ర్ . పీఎల్ విశ్వేశ్వర్ రావ్ నాయ‌త్వం వ‌హించ‌నున్నారు.

చీప్ లిక్కర్ కు వ్యతిరేకంగా .....

తెలంగాణ ఆవిర్బావం త‌ర్వాత .. తొలిసారిగా మ‌రో ఉద్యమ క‌మిటీ ఆవిర్భవించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చీప్ లిక్కర్ కు వ్యతిరేకంగా ఈ క‌మిటీ ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. క‌లింగ భ‌వ‌న్ లో జ‌రిగిన మీటింగ్ లో అన్ని రాజ‌కీయ పార్టీలు ఏకగ్రీవంగా తెలంగాణ లిక్కర్‌ వ్యతిరేక పోరాట క‌మిటీకి పురుడు పోశాయి. క‌మీటి క‌న్వీన‌ర్ గా ప్రొఫెస‌ర్ పి ఎల్ విశ్వేశ్వర్‌ రావు నాయకత్వం వహించనున్నారు.

టిఆర్ఎస్ , ఎఐఎం మిన‌హా అన్ని రాజ‌కీయ పార్టీలు....

స‌మావేశంలో టిఆర్ఎస్ , ఎఐఎం మిన‌హా అన్ని రాజ‌కీయ పార్టీలు హాజ‌ర‌య్యాయి. ప్రభుత్వం అమలు చేయ‌నున్న మద్యంపాలసీపై పార్టీల‌ నేత‌లు మండిప‌డ్డారు . చీప్‌ లిక్కర్‌ తో తెలంగాణ స‌మాజానికి పెద్ద ముప్పని ఆరోపించారు టిడిపి, బిజేపీ నేత‌లు. రానున్న అసెంబ్లీ స‌మావేశంలో చీప్‌ లిక్కర్ పై ప్రభుత్వాన్ని ఎండ‌గ‌డ‌తామ‌ని హెచ్చరించారు. ఈ ఉద్యమాన్ని సీఎం స్వంత నియ‌మోజ‌క వ‌ర్గం గ‌జ్వేల్ నుంచి ఉధృతం చేస్తామన్నారు నేత‌లు.

లిక్కర్ వ్యతిరేక పోరాటానికి యాక్షన్ ప్లాన్.....

ఈ జాయింట్ యాక్షన్ కమిటి ప్రభుత్వ లిక్కర్ కు వ్యతిరేకంగా పోరును ఉధృతం చేయ‌నున్నారు. తెలంగాణలో పొలిటికల్‌ జేఏసీ త‌ర్వాత తొలిసారి ఏర్పాటు కావ‌డంతో ఇప్పుడు అంద‌రి చూపు ఈ ఐక్య కార్యాచ‌ర‌ణ క‌మీటీపై ప‌డింది.

21:26 - August 22, 2015

హైదరాబాద్ : రైతులపై భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానన్న పవన్‌ పర్యటన ఖరారైంది. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లనున్న పవన్‌.. అనంతరం పెనుమాక, బేతపూడి, ఉండవల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు. అక్కడి రైతులతో సుదీర్ఘంగా సమావేశమై వారి ఇబ్బందులు తెలుసుకోనున్నారు. ఆ తర్వాత రైతులను ఉద్దేశించిన ప్రసంగించనున్న పవన్‌ కల్యాణ్‌.. భూ సేకరణపై తన అభిప్రాయాన్ని నేరుగా ప్రజలకు తెలియజేస్తారని సమాచారం. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వచ్చి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీకానున్నట్టు సమాచారం. భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించడానికి గల కారణాలను చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌కు వివరిస్తారని తెలుస్తోంది. అయితే.. చంద్రబాబు వివరణకు పవన్‌ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

21:25 - August 22, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాలేదని మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కృష్ణాజిల్లా పామర్రులో జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదాపై గత కొంతకాలంగా జరుగుతున్న గందరగోళాలతో విసుగుచెందిన సామాజిక కార్యకర్త ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితిని గమనించిన స్థానికులు సుబ్బారావును ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారావును సీఎం చంద్రబాబు పరామర్శించారు. ప్రజలెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర అభివృద్ధి కోసం చట్టంలో పొందుపర్చిన హామీలన్నీ సాధించుకుందామని చంద్రబాబు అన్నారు. 

ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటన

ఆదిలాబాద్: మంత్రి లక్ష్మారెడ్డి జిల్లాలో పర్యటిస్తోన్నారు. ఈ సాయంత్రం ఆయన జిల్లా కేంద్రానికి చేరుకుని వైద్య, ఆరోగ్య శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేపు ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో ఆయన పర్యటించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష జరుపనున్నారు.

ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

హైదరాబాద్: హోటల్ పార్క్ హయత్ లో చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలి వచ్చారు.

ప్రజలు అధైర్యపడవద్దు : సీఎం చంద్రబాబు

కృష్ణా : ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని, రాష్ట్ర పరిస్థితులన్నీ ప్రధాని మోదీకి వివరిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలిపారు. ప్రత్యేక హోదా సాధించే వరకు ప్రజలు మనో ధైర్యాన్ని కోల్పోవద్దన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పామర్రులో సుబ్బారావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. విజయవాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారావును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సుబ్బారావు ఆత్మహత్యాయత్నం చాలా బాధాకరమన్నారు.

ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని పరామర్శించనున్న చంద్రబాబు

కృష్ణా : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పామర్రులో సుబ్బారావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు విజయవాడ ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సుబ్బారావును కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు.

సీఆర్పీఎఫ్ జవాన్ల పై తేనెటీగల దాడి

విశాఖ: సీఆర్పీఎఫ్ జవాన్లపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో 13 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం పాడేరు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఏపీలోని విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలం లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సీఎం కేసీఆర్ ను కలిసిన డీఎస్

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను టీఆర్‌ఎస్ నేత డి.శ్రీనివాస్(డీఎస్) సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. బంగారు తెలంగాణ సాధించే క్రమంలో సేవలందించేందుకు తనను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రాజకీయ, పరిపాలనా విషయాల్లో అపార అనుభవం ఉన్న డీఎస్ తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విజయం సాధిస్తారని నమ్మకం ఉందన్నారు.

19:16 - August 22, 2015

హైదరాబాద్ : కుండ సైన్స్ ముందు పుట్టిందా..? వేదం ముందు పుట్టిందా? భారతీయ చరిత్రకు కుండమూలం ఎందుకు అయ్యింది? అనే అంశంపై 'జన చరిత విశ్లేషణ' కార్యక్రమంలో ప్రొ.కంచె ఐలయ్య మాట్లాడారు. ఆ .. వివరాలను ఆయన మాటాల్లోనే చూద్దాం.. భారత దేశం కుల వృత్తుల సమాజం. సహస్ర వృత్తుల్లో కుమ్మరి వృత్తి ఒకటి. మట్టికి జీవం పోసిన కళాకారులు కుమ్మరోళ్లు. ప్రగతి చిహ్నమైన చక్రాన్ని కనుగొనకముందే కుమ్మరోళ్లు సారెను కనుగొన్నారు. కుమ్మరి చక్రం చరిత్ర గతినే మార్చివేసింది. మట్టి పాత్రలు తయారు చేసి నాగరికతకు మూల కళాకారులుగా నిలిచిన కుమ్మరోళ్లను సమాజం హీనంగా చూస్తూ తక్కువ కులమంటూ ముద్ర వేసింది. వారిని చదువు సంధ్యలకు దూరం చేసింది. వారి శ్రమ గౌరవించబడలేదు. అలాంటి కుమ్మరోళ్ల గురించి ప్రముఖ సామాజిక తత్వవేత్త ప్రొ.కంచె ఐలయ్య ఏమంటున్నారో వినాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

గుంటూరు జేసీ వెంటనే విధుల్లో చేరాలి: చంద్రబాబు ఆదేశం

విజయవాడ: గుంటూరు జేసీ చెరుకూరి శ్రీధర్ వెంటనే విధుల్లో చేరాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. శ్రీధర్ ముస్సోరిలోని ఐఏఎస్‌ల శిక్షణా కార్యక్రమంలో ఉన్నారు. రాజధానిలో సమస్యల పరిష్కారం కోసం శిక్షణను రద్దు చేసుకుని విధులకు హాజరుకావాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ముస్సోరి నుంచి బయల్దేరిన శ్రీధర్ సోమవారం విధుల్లో చేరే అవకాశముంది.

కుంటాల జలపాతంలో ఇద్దరు గల్లంతు

ఆదిలాబాద్:  నేరడిగొండ మండలం కుంటాల జలపాతంలో గల్లంతైన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతులు హైదరాబాద్ నగరానికి చెందిన వారుగా గుర్తింపు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

'డిల్' కు కేటాయించిన భూములను రద్దు చేసిన టి.సర్కార్

హైదరాబాద్: నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్(డిల్)కు కేటాయించిన భూములను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థకు కేటాయించిన భూములు నిరుపయోగంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. కాగా, గతంలో డిల్‌కు 4999.14 ఎకరాల భూమిని కేటాయించారు.

రెండు లక్షల ఇళ్లు మంజూరు : ఏపీ సర్కార్

విజయవాడ : ఏపీలో ఎన్టీఆర్ ఇళ్ల పథకం కింద 2015-16 సంవత్సరానికి గాను రెండు లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో అర్హులను ఎంపిక చేసే బాధ్యత గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. అలాగే పట్టణాల్లో అర్హులను ఎంపిక చేసే బాధ్యత మున్సిపల్ శాఖకు అప్పగించారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ.2.75 లక్షలు మంజూరు చేయనున్నారు. జన్మభూమి కమిటీలను భాగస్వామ్యం చేస్తూ లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు

ముగిసిన టీ.టీడీఎల్పీ సమావేశం...

హైదరాబాద్ : అసెంబ్లీ హాల్ లో టీ.టీడీఎల్పీ సమావేశం ముగిసింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. తలసాని వ్యవహారంపై 24న స్పీకర్, గవర్నర్ ను కలవాలని, ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పు, చీప్ లిక్కర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించారు.

కూలికి వచ్చిన దళిత మహిళపై అత్మాచారం...

నల్గొండ : తిప్పర్తి మండలం మామిడాలలో దారుణం జరిగింది. కూలికి వచ్చిన దళిత మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా ఎవరికి చెప్పొదంటూ బెదిరింపులకు దిగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు షేక్ ఉస్మాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలోనూ అనేక కేసులు ఉన్నాయని తెలుస్తోంది.

ప్రత్యేక హోదా కోరుతూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కృష్ణా : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పామ్రరులో సుబ్బారావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

నాగంబొట్ల వారి పాలెంలో విషాదం

ప్రకాశం : తాళ్లూరు మండలం నాగం బొట్ల వారి పాలెంలో విషాదం నెలకొంది. పొలాల్లో దొరికిన మద్యాన్ని ముగ్గురు యువకులు తాగారు. వారిలో ఇద్దరు మరణించగా మరో యువకిడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

పవన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడ వద్దు : చంద్రబాబు నాయుడు

విజయవాడ : పవన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడ వద్దని ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు, పార్టీ నేతలకు సూచించారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు. మిత్రపక్ష నేతగా పవన్ కల్యాణ్ రాజధాని రైతుల సమస్యలను ప్రస్తావించవచ్చన్నారు. అన్ని అంశాలపై ఆయన సందేహాలను నివృత్తి చేద్దామని పార్టీ నేతలతో చంద్రబాబు అన్నారు.

18:04 - August 22, 2015

వరంగల్ : ఆత్మకూరు మండలానికి చెందిన జిన్నా సతీష్‌రెడ్డి.. బయ్య స్వప్నలు చదువుకుంటుండగా ప్రేమలో పడ్డారు. నాలుగేళ్లు ప్రేమించిన సతీష్‌.. రెండు నెలల క్రితం స్వప్నను ఎవరికీ తెలియకుండా రహస్య వివాహం చేసుకున్నాడు.

మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం .....

ఆ తర్వాత స్వప్నను వదిలించుకోవాలనుకున్న సతీష్‌... మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. నిశ్చితార్ధం అయిన విషయం తెలుసుకున్న స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సతీష్‌ను విచారిస్తే స్వప్నను పెళ్లి చేసుకున్న విషయం అంగీకరించాడు. కానీ... తల్లిదండ్రుల వద్ద మాట మార్చాడు. పోలీసులు కూడా పట్టించుకోవడం మానేశారు. దీంతో స్వప్న పోరాటానికి దిగింది. తనకు న్యాయం జరిగేవరకు పోరాటం వీడేది లేదంటూ.. సతీష్‌రెడ్డి ఇంటిముందు ధర్నా చేపట్టింది. స్వప్న పోరాటానికి 10టీవీ అండగా నిలిచింది. స్వప్న పోరాటంపై ప్రత్యేక కథనం ప్రసారం చేయడంతో... స్వప్నను పెళ్లి చేసుకోవాలని పోలీసులు సతీష్‌పై ఒత్తిడి పెంచారు. ఇక సతీష్‌తో నిశ్చితార్ధం కుదుర్చుకున్న అమ్మాయి తరపు బంధువులు పెళ్లికి నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక స్వప్నను పెళ్లి చేసుకునేందుకు సతీష్‌ అంగీకరించాడు. శుక్రవారం రాత్రి పెద్దల సమక్షంలో స్వప్న-సతీష్‌ల వివాహం జరిగింది. ప్రేమించినవాడిని పోరాటం చేసి దక్కించుకున్నందుకు స్వప్న సంతోషం వ్యక్తం చేస్తోంది. అండగా నిలిచిన 10టీవీకి కృతజ్ఞతలు తెలిపింది. 

17:44 - August 22, 2015

హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ ఆర్భాటంగా ప్రారంభిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కొన్నిరోజులకే అభాసుపాలవుతున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం..వాటి విధివిధానాలనే ఇంకా ప్రకటించలేదు. ఆ తర్వాత మన ఊరు-మన ప్రణాళిక పేరుతో వేల కోట్ల ప్రతిపాదనలు రూపొందించింది. కాని ఇప్పటికీ ఏడాదైనా...ఆ పథాకానికి నిధులే కేటాయించలేదు. తాజాగా గ్రామజ్యోతి పథకం రావడంపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి సమావేశాలు.....

గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవసరమైన పనులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే మన ఊరు-మన ప్రణాళిక పథకాన్ని ప్రారంభించింది. ఏడాది క్రితం గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించి రానున్న ఐదేళ్ల కాలంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళిక రూపొందించింది. అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించిన ప్రజాప్రతినిధులు అవసరమైన పనులను రూపొందించారు. పనులకు సంబంధించి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ప్రత్యేక జడ్పీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కాని వేల కోట్లతో పనులను ఆమోదించినా ఇప్పటి వరకు వాటి ప్రస్తావనే రాలేదు.

8655 పనులకు గాను రూ.2,443 కోట్లు....

గ్రామ పంచాయతీ స్థాయిలో 8655 పనులకు గాను 2443 కోట్లు, మండలస్థాయిలో అభివృద్ధి కోసం 6 వందల 43 పనులకు 1వెయ్యి 9 వందల 81కోట్లు, జిల్లా స్థాయిలో 50 పనులకు గాను 4 వేల 6 వందల 18 కోట్లతో అంచనాలు రూపొందించారు. గత ఏడాది ఆగస్టు నెలలో జడ్పీ సమావేశం ఏర్పాటు చేసి మొత్తం 9345 పనుల కోసం 9043 కోట్ల వ్యయం అంచనాతో పనులు ఆమోదించారు. కాని ఎలాంటి నిధులు విడుదల కాలేదు. పథకాల నిధులు రావడమే ఆలస్యమని మొదట సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలు ఆనందపడ్డారు. కానీ ఏడాది కావస్తున్నా మన ఊరు-మన ప్రణాళిక ఊసే లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు తాజాగా గ్రామజ్యోతి పేరుతో కొత్త కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. గతంలో ప్రతిపాదించిన పనులనే పట్టించుకోని ప్రభుత్వం..మరోసారి కొత్త కార్యక్రమాన్ని అమలు చేయడంపై పలు విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం మన ఊరు-మన ప్రణాళిక ప్రతిపాదనలను గ్రామజ్యోతి కార్యక్రమంలో కలిపి నిధులు విడుదల చేస్తుందా..? లేక ఈ ప్రతిపాదనలను గ్రామజ్యోతిలో కలిపేస్తుందా అనే క్లారిటీ లేదు. ఇప్పటికైనా ఈ ప్రణాళికకు బడ్జెట్ కేటాయించి పనులు ప్రారంభించాలని విపక్షాలు కోరుతున్నాయి.

17:42 - August 22, 2015

హైదరాబాద్ : వరంగల్‌ జిల్లా నల్లబెల్లిలో ఓ అంధుడు ఆందోళనకు దిగాడు. తనకు చెందిన ఆస్తులను ఇవ్వకుండా సోదరుడు శౌరెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అంధుడైన బాతురెడ్డి ఆరోపిస్తున్నాడు. పెద్ద మనుషులు చెప్పినా.. తన వాటా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాడని.. అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్నాడని 

17:39 - August 22, 2015

హైదరాబాద్ : అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి తమ్ముళ్లు బారులు తీరారు. పవన్‌కళ్యాణ్‌ కూడా చిరంజీవి ఇంటికి వచ్చి స్వయంగా శుభాకాంక్షలు చెప్పారు. దీంతో మెగా అభిమానుల ఆనందం రెట్టింపయింది. సాయంత్రం పార్క్‌హయత్‌లో పార్టీ జరగబోతుంది. దీనికి కూడా పవన్‌ కళ్యాణ్‌ హాజరవుతున్నారు. సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు, బిజినెస్‌ పర్సన్స్‌తో పార్టీ ఫుల్‌ రేంజ్‌లో జరగబోతుంది.

17:35 - August 22, 2015

 హైదరాబాద్ : జవహార్ లాల్ నెహ్రూ జూ పార్క్‌లో పులి కలకలం రేపింది. బోనులో ఉండాల్సిన పులి ఒక్కసారిగా బయటికి రావడంతో జూలోని సందర్శకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తీవ్ర భయంతో ప్రాణాలను అరచేతిలోపెట్టుకుని అక్కడి నుంచి పరగులు తీశారు. దీనిపై వెంటనే అప్రమత్తమైన జూ సిబ్బంది తీవ్రంగా శ్రమించి పులిని పట్టుకున్నారు. పులి కారణంగా ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో జూ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

యూపీఎస్సీ సివిల్‌ పరీక్షలకు అంతా సిద్ధం: కలెక్టర్

హైదరాబాద్ : రేపటి యూపీఎస్సీ సివిల్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు హైదరాబాద్ కలెక్టర్ సూచనలు. మొదటి పరీక్షకు ఉదయం 9.40 నిమిషాలకు, రెండో పరీక్ష మ. 2.40 నిమిషాలకు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ముందే హాజరుకావాలని కలెక్టర్‌ సూచించారు. సమయం దాటిన తర్వాత అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతించబోమని కలెక్టర్‌ తెలిపారు.

సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆ పార్టీలు బెంబేలెత్తుతున్నాయి :కేటీఆర్

మెదక్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్, టీడీపీ నేతలు బెంబేలెత్తుతున్నారని పంచాయతీ రాజ్ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. మెదక్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామీణ పేదరికాన్ని నిర్మూలిస్తామని తెలిపారు. సంక్షేమ పాథకాల ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తామన్నారు.

చర్చలకు పాక్ సిద్ధంగా లేదు : సుష్మా

ఢిల్లీ : చర్చలకు పాకిస్థాన్ సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. భారత్ - పాక్ ఎన్ఎస్ ఏ సమావేశం అంశంపై ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. పాక్ కేవలం కశ్మీర్ అంశంపైనే పట్టుబడుతోందని.. కేవలం పాక్ వైఖరి వల్లే ప్రతిష్ఠంభన నెలకొందని తెలిపారు.

చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, నటుడు చిరంజీవి నివాసానికి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవికి పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలం తర్వాత పవన్ చిరు నివాసానికి వెళ్లారు. చిరంజీవితో కలిసి పవన్ పార్క్‌హయత్ హోటల్‌కి వెళ్లనున్నట్లు సమాచారం. 

జూపార్క్ లో ఎన్ క్లోజర్ నుంచి బయటకు వచ్చిన పులి...

హైదరాబాద్: జూపార్క్ లో ఎన్ క్లోజర్ నుంచి పులి బయటకు వచ్చింది. దీంతో సందర్శకులు పరులుగు తీశారు. పులిని పట్టుకునేందుకు జూపార్క్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

సెప్టెంబర్ 2సమ్మెను విజయవంతం చేయండి : సీపీఎం

హైదరాబాద్ : ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటి పిలుపు ఇచ్చింది.

కరాచీలోనే దావూద్!

హైదరాబాద్ : ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నారని ఆయన భార్య మీడియాకు తెలిపింది. దావూద్ పాక్‌లోనే ఉన్నట్లు భారత్ పక్క ఆధారాలు సేకరించిన విషయం విదితమే. దావూద్ కరాచీలో నివాసమున్నట్లు టెలిఫోన్ బిల్లులు లభ్యమయ్యాయి. కరాచీ అడ్రస్‌తో ఉన్న దావూద్ పాస్‌పోర్టు జిరాక్స్‌ను భారత్ సంపాదించింది. ఈ ఆధారాలకు తోడు దావూద్ భార్య నోరు విప్పి.. మా ఆయన కరాచీలోనే ఉన్నాడని స్పష్టం చేసింది.

బండ్లగూడలో మహిళ దారుణ హత్య...

రంగారెడ్డి : జిల్లాలోని బండ్లగూడలో దారుణం జరిగింది. ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా మృతదేహాంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసిన పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

26న అమరావతిలో జగన్ ధర్నా

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నా చేయబోతున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా ఈ నెల 26న జగన్ ఈ ధర్నా చేయనున్నారు. ప్రస్తుతం 2వేల ఎకరాల కోసం ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో భూసేకరణ చేపట్టిన విషయం తెలిసిందే.

16:11 - August 22, 2015

హైదరాబాద్: విద్యా విధానంలో కేంద్ర నూతన విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. అందులో భాంగా నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసే ఆలోచనలో కేంద్రం ఉందా? అన్ని రాష్ట్రా అభిప్రాయాలు తీసుకునుందా? డిటెన్షన్ విధానం అంటే ఏమిటి? దాని వల్ల విద్యార్థులకు ఉపయోగమా? నష్టమా? దీనిపై టెన్ టివిలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ నేత శ్రీనివాసరెడ్డి, యుటిఎఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నర్శిరెడ్డి పాల్గొన్నారు. వారు భిన్న వాదనలు వినిపించారు. మరి ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

మజ్లిస్‌ చేతిలో కేసీఆర్‌ కీలుబొమ్మ : కిషన్ రెడ్డి

వరంగల్ ‌: మజ్లిస్‌ చేతిలో కేసీఆర్‌ కీలుబొమ్మగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీల డీవీడీలను ప్రతిఇంటికి పంచుతామని ఆయన తెలిపారు. చీప్‌లిక్కర్‌ విధానాన్ని ప్రభుత్వం ఆపాలన్నారు. విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణలో ‘పల్లె ప్రగతి’ పథకం ప్రారంభం...

మెదక్ : తెలంగాణలో ‘పల్లె ప్రగతి’ పథకం ప్రారంభమైంది. జిల్లాలోని కౌడిపల్లిలో ‘పల్లె ప్రగతి’ పైలాన్‌ను మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ పథకం కింద 150 మండలాలను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. గ్రామ పంచాయతీల్లో పల్లె సమగ్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్ మెళకువలు, పాడి పరిశ్రమ, వరి, తృణ ధాన్యాల ఉత్పత్తిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించనున్నారు.

పిచ్చి కుక్క దాడిలో దాదాపు 10 మంది గాయాలు...

ప్రకాశం : జిల్లాలోని సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. పిచ్చికుక్క దాడిలో దాదాపు 10 మంది గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో కశ్మీర్ వేర్పాటు వాద నేత నిర్బంధం

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత షబ్బీర్ షాను పోలీసులు ఢిల్లీలో నిర్బంధించారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న షబ్బీర్‌ షాతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్ జాతీయ భద్రతా సలహాదారుతో సమావేశమయ్యేందుకు షబ్బీర్ షా ఢిల్లీకి వచ్చారు. రేపు ఆదివారం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఎన్‌ఎస్‌ఏ స్థాయి సమావేశంపై సందిగ్దం నెలకొన్న పరిస్థితుల్లో షబ్బీర్‌ షాను అదుపులోకి తీసుకున్నారు.

15:30 - August 22, 2015

రాజమండ్రి : ఏజెన్సీ ఏరియాలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. విలీన మండలాలు వివక్షకు గురవుతున్నాయని మొన్న సీపీఎం ఆధ్వర్యంలో బంద్‌ జరిగిన నేపథ్యంలో మంత్రి వివరణ ఇచ్చారు. రాజమండ్రిలో పీఎంపీ వైద్యుల సదస్సులో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. విలీన మండలాల్లోనూ ప్రజలకు వైద్యసౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

15:27 - August 22, 2015

విశాఖ : మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా విశాఖలో మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. బార్‌లు, నైట్‌ క్లబ్‌లలోకి 21 సంవత్సరాలలోపు యువతను అనుమతించకూడదని డిమాండ్‌ చేశారు. అర్థరాత్రి దాటిన తర్వాత బార్‌లు, నైట్‌క్లబ్‌లను మూసివేయాలని మహిళా సంఘాల ప్రతినిధులు పార్క్ హోటల్ ముందు అందోళన చేపట్టారు. 

15:26 - August 22, 2015

హైదరాబాద్ : ఎప్పుడూ శాంతంగా ఉండే నాగబాబుకు కోపమొచ్చింది. అది కూడా తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌, ఆయన ఫ్యాన్స్ మీద.. చిరు బర్త్‌డే వేడుకల్లో పవన్‌పై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్... పవన్‌ను అడగటంతో ఆయన కోప్పడ్డారు. ఎన్ని సార్లు పిలిచినా..రాకపోతే ఏం చేయాలని మండిపడ్డారు. దమ్ముంటే మీరే వెళ్లి పవన్‌ను అడగండని...కోపడ్డారు.

'చాలాసార్లు ఓపిక పట్టాం. ఓపిక పట్టీ.. పట్టీ..రాకపోతే ఏం చేస్తాం. ఎన్ని సార్లు పిలిచామో తెలుసా మీకు! ఎన్ని సార్లని పిలుస్తాం. పవర్‌స్టార్..పవర్‌స్టారని అరవటం కాదు. దమ్ముంటే పవన్‌ కళ్యాణ్‌ ఆఫీసుకు వెళ్లి అడగండి. ప్రతిసారీ అరవటం కాదు. మీరు వెళ్లి అడగండి ఎందుకు రావటం లేదో.! మేం ప్రతిసారీ పిలుస్తున్నాం. కావాలని మీరు ఓవర్ చేస్తున్నారు. మాకు తెలియదా... మా తమ్ముడు మాకు కావాలని..! పిలిచినా ఎందుకు రావటం లేదో మీరే వెళ్లి అడగండి' అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు.

15:01 - August 22, 2015

హైదరాబాద్ : దేశ ప్రయోజనాల కోసం నిలబడినంత కాలం ఒక పొలిటికల్‌ పార్టీకి తప్పనిసరిగా గౌరవం ఇవ్వాలి. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేసినప్పుడు కూడా ఆ పార్టీకి మద్దతిస్తే అది నేరంతో సమానం. ఇది రాంజెఠ్మలానీ కొటేషన్‌. దీన్ని పవన్‌కళ్యాణ్‌ ట్వీట్‌ చేశారు. భూసేకరణపై వరుస ట్వీట్లు ఇస్తున్న పవన్‌.... ఈ కొటేషన్‌ పెట్టడంతో.. కొత్త ఆలోచనలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ టీడీపీతో చెలిమికి గుడ్ బై చెప్పనున్నారా? అన్న ఊహాగానాలకు ఆయన తాజా ట్వీట్ బలం చేకూరుస్తోంది. షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాదు చేరుకున్న పవన్ ఓ ట్వీట్ తో తనలో పెల్లుబుకుతున్న ఆవేశాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. సొంత అభిప్రాయానికి బదులు విఖ్యాత న్యాయవాది రామ్ జెఠ్మలానీ కామెంట్లను ట్విట్టర్లో పోస్టు చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే పవన్ కల్యాణ్ ఏపీలో అధికార టీడీపీతో పోరాటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

14:58 - August 22, 2015

హైదరాబాద్ : ఉల్లి పేరు చెబితే యావత్భారతం ఉలిక్కిపడుతోంది. కిలో ఉల్లిగడ్డలు కొనాలన్నా... సామాన్యుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తున్నాడు. ఇక వంటింట్లోని ఇల్లాళ్ల పరిస్థితి చెప్పక్కరలేదు. తక్కువ ధరున్నప్పుడు... ఉల్లితో నాలుగు వెరైటీలు చేసే గృహిణులు... ఇప్పుడు ఉల్లిని బంగారంలా దాచుకుంటున్నారు.

ఉల్లిని కోయకుండానే...

ఉల్లి కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది. ఆనియన్‌ పేరు వింటేనే జనం ఉలిక్కిపడుతున్నారు. ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో సామాన్యుడికి కొనలేని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు పాలకుల్ని గడగడలాడించిన ఉల్లి ఘాటు నేటికీ ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది.

కేంద్రాన్ని ముప్పతిప్పలు పెడుతున్న ఉల్లి...

తాజాగా కేంద్రంలోని ఎన్ డి ఏ ప్రభుత్వాన్నీ ఉల్లి ముప్పతిప్పలు పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి 80 రూపాయలకు చేరుకుంది. అలాగే దేశంలోనే అతిపెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌ అయిన లాసల్‌గావ్‌లో క్వింటా 4 వేల 900 ధర పలికింది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా... రెండేళ్ల గరిష్ఠస్థాయికి ఉల్లి ధర చేరినట్లయింది.

వర్షాభావం వల్ల ఉల్లి సాగు గణనీయంగా తగ్గే అవకాశం....

మార్కెట్‌లోకి తగినంత ఉల్లి రాకపోవడంతోనే ధరలు పెరుగుతున్నాయని జాతీయ ఉద్యానవన పరిశోధన అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ ఆర్పీ గుప్తా తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో వర్షాభావం వల్ల ఉల్లి సాగు గణనీయంగా తగ్గే అవకాశముందన్నారు. అలాగే గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోనూ ఉల్లి సాగు ఆలస్యమవుతోందని చెప్పారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే... ఉల్లి ధర మున్ముందు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు రబీలో చేసిన నిల్వలు...

మరోవైపు రబీలో చేసిన నిల్వలు... జూలైలో 28 లక్షల టన్నుల నుంచి 14 లక్షలకు తగ్గిపోయాయి. దీంతో 10 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు అంతర్జాతీయ టెండర్లను పిలవాలని ప్రభుత్వరంగ MMTCని కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా 2013-14 పంటకాలంలో 194 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి కాగా, 2014-15 కాలంలో ఇది 189 లక్షల టన్నులకు తగ్గింది. మరోవైపు పలు రాష్ర్టాలు ఇప్పటికే సబ్సిడీపై ఉల్లిని ప్రజలకు అందిస్తున్నాయి. ఇక పంజాబ్‌లోని వ్యాపారులు ఉల్లి డిమాండ్‌ను తట్టుకునేందుకు అట్టారి-వాఘా సరిహద్దు మార్గం ద్వారా అఫ్ఘానిస్థాన్‌ నుంచి స్వల్పంగా దిగుమతి చేసుకుంటున్నారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం కిలో ఉల్లిపై 30 రూపాయల సబ్సిడీ ఇస్తోంది. మొత్తానికి చుక్కల్లో వేలాడుతోన్న ఉల్లి ధర ఎప్పులు నేలచూపులు చూస్తుందో..?

భారత్ తో చర్చలకు సిద్ధం అంటున్న పాక్...

హైదరాబాద్ : భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ స్పష్టం చేశారు. భారత్ చెబుతున్నట్లుగా కొత్త షరతులేమీ పాక్ పెట్టలేదన్నారు. చర్చలు కొనసాగించాలా వద్దా అనే నిర్ణయాన్ని భారత్‌కే వదిలేస్తున్నామని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు తగ్గించేందుకే ఎన్‌ఎస్‌ఏ సమావేశాలు అని చెప్పారు.

14:52 - August 22, 2015

కరీంనగర్ : తోటపల్లి ప్రాజెక్ట్ రద్దు చేయడం పట్ల కరీంనగర్‌ జిల్లాలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రైతుల ఆశలపై నీళ్లు చల్లి, నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు భూములను ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్న రైతులు..అడ్డుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

కేసీఆర్ తీరును నిరసిస్తున్న రైతులు, విపక్షాలు...

సచివాలయం తరలింపు నిర్ణయం మొదలు తెలంగాణ ప్రభుత్వం ఆఘామేఘాల మీద తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లోని తోటపల్లి ప్రాజెక్టును రద్దు చేయడం కొత్త పంచాయతీకి దారితీసింది. కేసీఆర్‌ సర్కార్‌ తీరుపై రైతులు, విపక్షాలు నిరసన గళమెత్తాయి. త్వరలో సమరభేరీ మోగించేందుకు సిద్ధమవుతున్నాయి.

వివాదాస్పదమవుతున్న కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయాలు....

తోటపల్లి ప్రాజెక్టును యథావిధిగా కొనసాగించాలని కాంగ్రెస్ నేతలు కదం తొక్కారు. తమ ఉద్యమాన్ని హుస్నాబాద్ నుంచే మొదలు పెడుతున్నట్లు కాంగ్రెస్, టీడిపి నేతలు ప్రకటించారు. 45 వేల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో తోటపల్లి ప్రాజెక్ట్ కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 4 గ్రామాల్లో 1400 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ప్రాజెక్ట్ పూర్తయితే సాగునీటి కష్టాలు తీరుతాయని ఇన్నాళ్లు రైతన్నలు ఆశగా ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం నిర్ణయం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది.

ప్రాజెక్టును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్....

ప్రాజెక్ట్ నిర్మిస్తే సుమారు 500 కోట్లు అదనపు వ్యయమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకాన్ని చేపడతామని చెప్పుకొస్తుంది. మరోవైపు భూములు కోల్పోయిన నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా మారింది. పరిహారం కోసం కార్యాలయాల చుట్టు తిరిగి అలసిపోయామంటున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు అఖిల పక్ష నేతలు సిద్ధమవుతున్నారు. హుస్నాబాద్‌లో ధర్నాలతో హోరెత్తించిన హస్తం లీడర్లు మున్ముందు మా తడఖా ఏంటో చూపిస్తామంటున్నారు. అటు టీడీపీ నాయకులు సీఎం తీరుపై ఫైరయ్యారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించి తోటపల్లి ప్రాజెక్టు రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైతులు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

14:49 - August 22, 2015

ఆదిలాబాద్ : ఎల్లంపల్లి సాగునీటి ప్రాజెక్టు. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, లక్సెట్టిపల్లి ఎగువ ప్రాంతాన నిర్మితమైంది. ఆ ప్రాజెక్టు ఎందుకు కట్టారో..తెలియదు. ఆ ప్రాజక్టు ఎవరిని ఉద్దరించడానికో అసలే తెలియదు. కాని ఆ ప్రాజెక్టు ముంపు బాధితులు మాత్రం ఇప్పుడు రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది. ఆ గ్రామాల్లో ఎటూ చూసినా...ఎవరిని పలకరించినా...ఇప్పుడు కన్నీళ్లే జవాబిస్తున్నాయి.

ముంపు బారిన పడుతున్న 9 గ్రామాలు....

ఈ ప్రాజెక్టు ముంపుగ్రామాల ప్రజలకు మృత్యుప్రాజెక్టుగా మారింది. దీని కింద ఉన్న మంచిర్యాల, లక్సెట్టిపల్లి మండలాల్లోని 9 గ్రామాలు మంపుబారినపడుతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే ఈ ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగి తొమ్మిది గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. ఇప్పటికే గ్రామాల అంచువరకు ప్రాజెక్టు నీరు చొచ్చకొచ్చింది. ఎప్పుడు ఈ ఊళ్లు మునిగిపోతాయో తెలియదు. దీంతో...ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇక్కడి గ్రామస్తులు బతుకుతున్నారు. అయినా....అధికారులు, పాలకు వీరి డిమాండ్‌లను మాత్రం పరిష్కరిచండం లేదు.

ముంపు బాధితుల డిమాండ్లను పరిష్కరించని అధికారులు.....

ఈ ముంపు గ్రామాలకు చెందిన వ్యవసాయ భూములకు, ఖాళీ, ఇంటి అడుగు స్థలాలకు పాత ధరల ప్రకారమే పరిహారం చెల్లించారు. కాని ఇక్కడి గ్రామాల ప్రజలు మాత్రం ప్రస్తుత ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరగనిదే ఖాళీ చేయమని తెగేసి చెబుతున్నారు. వీరిందరికి కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని మొదట అధికారులు తెలిపారు. కాని ఇప్పటికీ వీరికి కొత్త ఇళ్లు పూర్తిగా నిర్మించివ్వలేదు. దీంతో...ఇక్కడ ఉండలేక ...ఎటూ వెళ్లలేక బోరున విలపిస్తున్నారు.

ఇప్పటికైనా..న్యాయం చేయాలని ముంపు బాధితుల విజ్ఞప్తి.....

బాధితుల పరిస్థితి అలా ఉంటే....అధికారులు మాత్రం వెంటనే గ్రామాలను ఖాళీ చేయాలని..హెచ్చరిస్తున్నారు. ఒకవేళ భారీ వర్షాలు పడి గ్రామాలు ముంపు ప్రమాదానికి గురైతే ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత ఉండదని ప్రకటనలో హెచ్చరించారు. దీంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా...ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధితులు జోక్యం చేసుకొని తమ సమస్యను పరిష్కరించాలని ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపుబాధితులు కోరుతున్నారు.

14:41 - August 22, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి ఎలాంటి ఢోకా లేదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. బడ్జెట్‌లో ప్రకటించిన విధంగానే ఆదాయ వ్యయాలు ఉన్నాయన్నారు. భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని మినహాయిస్తే.. ఇప్పటికే దాదాపు 93 శాతానికి చేరుకున్నామన్నారు. సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్న మంత్రి.. గుడుంబా మహమ్మారిని తరిమికొట్టేందుకు చీప్ లిక్కర్‌ పాలసీని తెస్తున్నామని చెప్పారు.

14:40 - August 22, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చీప్ లిక్కర్ పాలసీపై అఖిలపక్షం సమావేశం జరిగింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో జరిగిన ఈ సదస్సులో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, టీటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, బిజెఎల్పీ నేత కె.లక్ష్మణ్‌తో పాటు పలు పార్టీల నాయకులు హాజరయ్యారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై ఎర్రబెల్లి మండిపడ్డారు. సారా కాంట్రాక్టులు కేసీఆర్ కుటుంబసభ్యులకే కట్టబెడతున్నారని ఆరోపించారు. గజ్వేల్ నుంచే సారా వ్యతిరేక ఉద్యమం చేపట్టాలని అందుకు టిడిపి మద్దతు ఇస్తుందని ఎర్రబెల్లి అన్నారు. 

ఇందిరా పార్క్ వద్ద ఎంపీటీసీల ఆందోళన...

హైదరాబాద్: ఎంపీటీసీల భాగస్వామ్యంతో బంగారు తెలంగాణకు బాటలు వేయాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. గ్రామజ్యోతి కార్యక్రమానికి తమను దూరం చేయటాన్ని నిరసిస్తూ శనివారం ఇందిరాపార్క్ వద్ద ఎంపీటీసీలు నిర్వహించారు. ఈ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొని వారికి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమానికి ఎంపీటీసీలను ఆహ్వానించకపోవటం తగదన్నారు దీక్షల్లో వివిధ జిల్లాల నుంచి దాదాపు 500 మంది ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

ఆదాయం, ఖర్చు సమానమే : మంత్రి ఈటెల

హైదరాబాద్: రాష్ట్రంలో ఆదాయం, ఖర్చు సమానంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ ఆయన అధికారులతో ఆర్థికశాఖపై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవనేది ఆవాస్తవమని స్పష్టం చేశారు. ఆదాయం, ఖర్చు సమానంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. బడ్జెట్‌లో చెప్పిన రీతిలోనే ఆదాయ, వ్యయాలు ఉన్నాయన్నారు. భూముల అమ్మకాల నుంచి అనుకన్న విధంగా ఆదాయం లభించడంలేదని తెలిపారు. పన్ను వసూళ్లు లక్ష్యానికి చేరే విధంగా ఉన్నాయన్నారు. సంక్షేమానికి, ప్రభుత్వం పథకాల అమలు కోసం నిధులకు కొరతలేదని వెల్లడించారు.

రేపు తుళ్లూరులో పవన్ కల్యాణ్ పర్యటన

విజయవాడ : ఏపీ రాజధాని ప్రాంతం తుళ్లూరులో జనసేన అధినేత పవన్ కల్యాన్ పర్యటించనున్నారు. భూములు కోల్పోయిన రైతులతో పవన్ సమావేశం కానున్నారు. ప్రకాశం బ్యారేజీ పై అఖిల పక్షం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాలో కూడా పవన్ పాల్గొననున్నట్లు సమాచారం.

చెరకు పంటను నాశనం చేస్తున్న అడవి పందులు...

నిజామాబాద్ : జిల్లాలో అడవి పందులు భీభత్సం సృష్టించాయి. జిల్లాలోని బిక్నూరు మండలం ఆరెపల్లి గ్రామ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి చెరకు పంటపై దాడిచేసి ధ్వంసం చేశాయి. గ్రామానికి సమీపంలో 9 ఎకరాల చెరకు పంటపై దాడికి దిగిన అడవి పందులు సుమారు రూ.3.50 లక్షల పంటను నాశనం చేశాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

సారా వ్యతిరేక ఉద్యమానికి టిడిపి మద్దతు: ఎర్రబెల్లి

హైదరాబాద్: సారా వ్యతిరేక ఉద్యమానికి టిడిపి మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ ప్రకటించారు. గజ్వేల్ నుండే సారా వ్యతిరేక ఉద్యమం చేపడతామని చెప్పారు. 

ఉండవల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం....

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధానికి ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా శనివారం తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని రెడ్ల బజార్ రామాలయం వద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాలతోపాటు అఖిలపక్షాల నేతలు హాజరయ్యారు. రాజధాని కోసం చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూ సేకరణపై సదరు సంఘాల నేతలు తమ అభిప్రాయాలను ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివరిస్తున్నారు.

చీప్ లిక్కర్ కు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్: చీప్ లిక్కర్ కు వ్యతిరేకంగా సారా వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

 

గ్రామకంఠాల ఖరారుపై ఎమ్మెల్యే శ్రవణ్‌ ఆగ్రహం

విజయవాడ: రాజధానిలోని గ్రామకంఠాల ఖరారుపై తాటికొండ ఎమ్మెల్యే శ్రవణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను సంప్రదించకుండా గ్రామ కంఠాలను ఎలా ఖరారు చేస్తారని ఆయన నిలదీశారు. గ్రామకంఠాలపై రైతుల వ్యతిరేకతను చంద్రబాబుకు ఎమ్మెల్యే వివరించారు. దీంతో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్న హర్భజన్ సింగ్...

హైదరాబాద్ : భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. తన గాళ్ ఫ్రెండ్. బాలీవుడ్ నటి గీతా బస్రాను వచ్చే అక్టోబర్ లో పెళ్లి చేసుకోబోతున్నాడు. పంజాబ్ లోని జలంధర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫగ్వారాలో ఇద్దరి పెళ్లి వేడుక అక్టోబర్ 29న జరగనుందని హిందూస్తాన్ టైమ్స్ పత్రిక ప్రచురించిన కథనంలో వెల్లడించింది. దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్ లకు భజ్జీ సెలక్ట్ అయితే పెళ్లి తేదీ మారే అవకాశం ఉందని తెలిపింది. బాలీవుడ్ నటి అయిన గీతా బస్రాతో గత కొన్ని సంవత్సరాల నుంచి హర్భజన్ ప్రేమాయణం నడుస్తోంది. ఇంతవరకు బహిరంగంగా ఎప్పుడూ తమ ప్రేమ బంధం గురించి వారిద్దరూ చెప్పలేదు.

13:54 - August 22, 2015

కరీంనగర్: ఉపరితల ఆవర్తణ ప్రభావంతో కరీంనగర్ జిల్లా తడిసి ముద్దవుతోంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో... పట్టణంలో రోడ్లపైకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరడంతో.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ద్రోణి ప్రభావంతో మరో 2 రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వరుస వర్షాలతో రైతుల్లో ఆనందం వెల్లివెరుస్తోంది.

13:52 - August 22, 2015

నెల్లూరు: నగరంలో బీసీసంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర సుడిగాలి పర్యటన చేశారు. నగరంలోని బీసీ వసతి గృహాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని తిని చూశారు. వసతి గృహాల్లోని మౌలిక వసతులు, భోజన సదుపాయాలపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్త చేశారు. తీరు మార్చుకోపోతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా హాస్టల్‌ సమస్యలపై విద్యార్థులు...మంత్రికి విన్నవించారు. మరుగుదొడ్లు, మౌలిక వసతుల కల్పనలో అధికారులు విఫలమయ్యారంటూ... మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. వసతి గృహాలను నిత్యం పర్యవేక్షించాలని మంత్రి కొల్లు రవీంద్ర....అధికారులను ఆదేశించారు.

 

13:50 - August 22, 2015

హైదరాబాద్‌: నగరంలో వెట్టిచాకిరి నుంచి బాలకార్మికులకు విముక్తి లభించింది. నగరంలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న మొత్తం 511 మంది చిన్నారులను చైల్డ్ లేబర్‌ అధికారులు విడుదల చేయించారు. ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి పాట్నాకు ఎక్స్ ప్రెస్‌లో బాలల స్వస్థలాలకు తరలించారు. చిన్నారులను పనిలో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చైల్డ్ లేబర్ అధికారి రాజేందర్‌ చెప్పారు.

 

13:47 - August 22, 2015

వరంగల్: సంపూర్ణ మద్యపాన నిషేదానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. చీప్ లిక్కర్‌పై ఆలోచిస్తామని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికల్లో తన కూతురును కాదని మాదిగ సామాజిక వర్గానికి చెందినవారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరానన్నారు. ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ, టిడిపి నేత ఎర్రబెల్లి వ్యాఖ్యలపై కడియం శ్రీహరి మండిపడ్డారు. దళితులను మందకృష్ణమాదిగ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు.

 

 

13:43 - August 22, 2015

గుంటూరు: ఏపీ రాజధానిలో భూసేకరణకు వ్యతిరేకంగా పోడేందుకు అఖిల పక్షం సిద్ధమైంది. జిల్లాలోని తాడేపల్లి మండలం ఉండవల్లిలో రౌండ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సమావేశానికి రైతులు, ప్రజాసంఘాలుతో పాటు పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. భూసేకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష నేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీపై రైతులతో ధర్నా నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. ఈ నెల 24 నిడమర్రు సీఆర్డీఏ కార్యాలయ ముట్టడి, 25న రాజధాని ప్రాంతాల్లోని గ్రామాల బంద్‌కు నేతలు పిలుపునిచ్చారు.

13:38 - August 22, 2015

కృష్ణా : జిల్లాలోని గొడవర్రులో దారుణం జరిగింది. ఓ ట్యూషన్ టీచర్ రాక్షసత్వం బయటపడింది. సుధాకర్ అనే ట్యూషన్ టీచర్... అల్లరి చేస్తున్నాడని చింటు విద్యార్థి మెడపై కొట్టాడు. దీంతో మెడనరాలు దెబ్బతిని బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. 15 రోజులుగా బాలుడు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యం చేసియిస్తానని సుధాకర్ తప్పించుకుని పారిపాయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమ దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయని.. టీచరే తమ కొడుకు వైద్య ఖర్చులను బరించాలంటున్నారు. అయితే బాలుడి ఆరోగ్యం మెరుగుపడిందని.. తమను గుర్తుపడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. టీచర్ ను శిక్షించాలని చెబుతున్నారు. కంకిపాడు పోలీసులు టీచర్ సుధాకర్ పై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.

 

13:18 - August 22, 2015

        పబ్లిసిటీకి కేర్ ఆప్ అడ్రస్ రాంగోపాల్ వర్మ .. ఎప్పుడూ ఒక వివాదం లేదా సెన్సేన్ క్రియేట్ చేసే కామెంట్ చేసి వార్తల్లో ఉండటం ఈయన హాబీ. అది పండగ కావచ్చు, స్వాతంత్ర దినోత్సవం కావచ్చు.. ఒక మంచి సినిమా రిలీజ్ కావచ్చు.. ఒక బాంబ్ బ్లాస్ట్ కావచ్చు.. ఏదైనా సరే.. ఆ సంఘటనతో పాటు 'వర్మ' పేరు మారు మ్రోగాల్సిందే..
                 ఈ సారి ఇతగాడు చిరంజీవి బర్త్ డేను తన పబ్లిసిటీ స్టంట్ కోసం ఉపయోగించుకున్నాడు. ఎంత మంచి విషయాన్నయినా మెలికపెట్టి తిప్పి చెప్పడం దృష్టి తనవైపు లాక్కోవడం రామూకి 'ట్వీటు'తో పెట్టిన విద్య కాబట్టి.. ఈసారి కూడా చిరంజీవి బర్త్ డే విషెస్ వెరైటీగా ట్వీటాడు. ఇలా ప్రారంభిస్తూ.. 'చిరంజీవి గారూ నేనెవరికీ బర్త్ డే విషెస్ చెప్పను. కానీ మీ పుట్టుక మా జన్మలకు అద్భుతమైన ఆనందాన్నిచ్చింది. కాబట్టి మీ జన్మదినం సందర్భంగా మాకు ఈ జన్మ వచ్చినందుకుగానూ మాకు మేమే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం' అన్నాడు వర్మ. ఈ ట్వీటుకు కొనసాగింపుగా 'మీ చుట్టూ ఉన్నవారందరూ మీకు 60 ఏళ్లు వచ్చిందని ఎంతగానో అడ్వర్టైజ్ చేస్తున్నా సరే మీరు మాత్రం మాకెప్పటికీ 26 ఏళ్ల చిరంజీవే' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ షష్ఠి పూర్తిని చూస్తుంటే ఆయన కుటుంబ సభ్యులే ఆయన్ను రిటైర్ అయిపోండి అన్నట్లుందని చివరగా బాంబు పేల్చాడు. ఇదిలా ఉండగా ఎంత పబ్లిసిటీ స్టంట్ అని తెలిసినా ఈ ట్వీటాయనాన్ని చూసిన నెటీజన్లు మాత్రం చదవకుండా ఉండలేకపోతున్నారు. 

13:15 - August 22, 2015

కృష్ణా : గ్రామాల అభివృద్ధికి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీ కేశినేని ఎంపీ కేశినేని నాని తెలిపారు. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు టాటా ట్రస్ట్ సంస్థ ముందుకొచ్చింది. ఈనెల 24న టాటా ట్రస్ట్ తో ఏపీ సర్కార్‌ ఎంవోయూ చేసుకోబోతుంది. ఈ సందర్భంగా నాని టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒకేసారి గ్రామాలన్నీ అభివృద్ధి చేయడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయని పేర్కొన్నారు. గత ఐదు నెలలుగా టాటా ట్రస్ట్ సభ్యులు సర్వే చేశారని గుర్తు చేశారు.

 

12:56 - August 22, 2015

గుంటూరు: నగరంలో ప్రత్యేక హోదాపై పోస్టర్లు కలకలం రేపాయి. హోదాకు వ్యతిరేకంగా నగరంలో కొన్ని పోస్టర్లు వెలిశాయి. ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఊరుకోమని....గుర్తుతెలియని వ్యక్తుల పోస్టర్లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. పోస్టర్లను నిరసిస్తూ శంకర్ విలాస్ సెంటర్‌లో సీపీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు కలగజేసుకొని పోస్టర్లను తొలగించారు.

గుంటూరులో ప్రత్యేక హోదాపై పోస్టర్ల కలకలం

గుంటూరు: నగరంలో ప్రత్యేక హోదాపై పోస్టర్లు కలకలం రేపాయి. హోదాకు వ్యతిరేకంగా నగరంలో కొన్ని పోస్టర్లు వెలిశాయి. ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఊరుకోమని....గుర్తుతెలియని వ్యక్తుల పోస్టర్లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. పోస్టర్లను నిరసిస్తూ శంకర్ విలాస్ సెంటర్‌లో సీపీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు కలగజేసుకొని పోస్టర్లను తొలగించారు.

12:30 - August 22, 2015

కడప: జిల్లాలోని పొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్ లో.... విషాహారం తిని 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి నిరసనగా కాలేజీ ఎదుట విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ తలెత్తుతున్నాయని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

12:17 - August 22, 2015

హైదరాబాద్: రేపు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇరువురు భేటీ కానున్నారు. రాజధాని భూసేకరణ అంశంపైనే ఇరువురి మధ్య చర్చ సాగనుంది. రాజధాని నిర్మాణానికి సహకరించాలని బాబు పవన్‌ను కోరనున్నారు. రాజధాని నిర్మాణం కోసం సీఆర్ డీఏ పరిధిలో భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈనేపథ్యంలో భూసేకరణ చేయవద్దని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.  దానికి ప్రజల మంచి స్పందన వస్తుంది. దీంతో పవన్ ను ఒప్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు రేపు సమావేశం కానున్నారు. రాజధాని నిర్మాణానికి, భూసేకణకు సహకరించాలని పవన్ ను కోరనున్నారు.

 

11:58 - August 22, 2015

హైదరాబాద్: ఇప్పుడు పవన్‌ దారెటు..? నిలదీస్తాడా..? ఇంకా నీళ్లు నములుతాడా..?! ఆంధ్రప్రదేశ్‌లో అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఇది. భూ సేకరణ చట్టం ప్రయోగించొద్దంటూ పవన్‌ కళ్యాణ్‌ చేసిన వరుస ట్వీట్లను, డిలెట్‌ చేసి పారేసిన ప్రభుత్వం.. భూ సేకరణకు వరుస నోటిఫికేషన్లు జారీచేసింది. దీంతో.. తన మాట లెక్కచేయని టీడీపీ సర్కారుపై పవన్‌ ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
ఎపిలో టిడిపి అధికారానికి పునాదులు వేసింది ఎవరు..?
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారానికి పునాదులు వేసింది ఎవరు..? అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాల్లో పవన్‌ కళ్యాణ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. టీడీపీ అధికార పీఠానికి ఉన్న నాలుగు కాళ్లలో ఒకటి పవన్‌ ఇచ్చిందేనని మెజారిటీ ప్రజల అభిప్రాయం. అయితే.. రాజధాని భూముల విషయంలో ప్రభుత్వానికీ, పవన్‌కు మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాలన్న సర్కారు నిర్ణయంపై ఒకింత తీవ్రంగానే స్పందించిన పవన్‌, బలవంతంగా భూములు తీసుకోవద్దంటూ విజ్ఞప్తి కూడా చేశాడు.
భూ సేకరణ చట్టం ప్రయోగం
పవన్‌ ట్వీట్లకు టీడీపీ మంత్రులు కౌంటర్‌ ఇవ్వడం.. వాటిని పవన్‌ ఎన్‌కౌంటర్‌ చేయడం కూడా జరిగిపోయాయి. అయితే.. పవన్‌ అభిప్రాయాన్ని, సూచనలను బేఖాతరు చేస్తూ.. భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించింది ఏపీ సర్కారు. గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం.. పది గ్రామాల్లో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించబోతున్నామంటూ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది.
అందరి చూపూ పవన్‌ వైపే
పలుమార్లు పవన్‌ చేసిన విన్నపాలను తేలిగ్గా తీసిపారేసిన ప్రభుత్వం.. భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇవ్వడంతో ఇప్పుడు అందరి చూపూ పవన్‌ వైపే మళ్లింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్రపోషించిన పవన్‌ సూచనకు భిన్నంగా ప్రభుత్వం వెళ్లకపోవచ్చని ఆశించిన రైతులంతా.. తాజా పరిణామంతో అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ చర్యపై జనసేనాని స్పందన ఎలా ఉంటుందన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మౌనాన్నే ఆశ్రయించిన పవన్‌
ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్‌.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సరైన రీతిలో స్పందించట్లేదన్నది చాలా మంది వాదన. ప్రత్యేక హోదా విషయంలోనూ మౌనాన్నే ఆశ్రయించిన పవన్‌.. ఈ భూసేకరణ విషయంలో ఎలా వ్యవహరిస్తారని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి, ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించి తన పార్టీ ట్యాగ్‌లైన్‌ సరైందేనని నిరూపించుకుంటాడా..? లేక ఎప్పటిలాగానే సర్దుకుపోతారా..? అన్నది చూడాలి.

 

11:50 - August 22, 2015

విజయవాడ: రాజధాని గ్రామకంఠ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నారాయణ అన్నారు. 2014 డిసెంబర్ 8 శాటిలైట్ ప్రకారం.. గ్రామ కంఠకం ఉన్నా భూములను తీసుకోబోమని తేల్చి చెప్పారు. భూసేకరణకు 5 గ్రామాలకు నోటిఫికేషన్ ఇచ్చామని.. మిగిలిన గ్రామాలకూ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. 29 గ్రామాల్లో 3 గ్రామాలను మినిహాయించడం కుదరదని పేర్కొన్నారు. అందరికీ సమన్యాయం చేస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి లెఫ్టు పార్టీలు సహకరించాలని కోరారు. ప్రతిపక్షం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.

గ్రామకంఠ రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి నారాయణ

విజయవాడ: రాజధాని గ్రామకంఠ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నారాయణ అన్నారు. 2014 డిసెంబర్ 8 శాటిలైట్ ప్రకారం.. గ్రామ కంఠకం ఉన్నా భూములను తీసుకోబోమని తేల్చి చెప్పారు. భూసేకరణకు 5 గ్రామాలకు నోటిఫికేషన్ ఇచ్చామని.. మిగిలిన గ్రామాలకూ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. 

10:51 - August 22, 2015

హైదరాబాద్: ఇవాళ చిరంజీవి పుట్టినరోజు. సినీ రంగంలో మెగాస్టార్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి.. రాజకీయాల్లో మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారు. ప్రజారాజ్యంతో ప్రజల్లో ఊపుకనిపించనా...అధికారానికి చాలా దూరంలోనే ఉండిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ లో యాక్టివ్ గా మారుతున్నారు. విభజన అనంతరం... అంపశయ్య మీద పార్టీలో చిరునే కీలక నేతగా మారనున్నారా...? సమర్థ నాయకత్వం కొరవడి, శ్రేణులు డీలాపడి చుక్కాని లేని నావలా తయారైన కాంగ్రెసుకు చిరంజీవి దిక్సూచిగా మారబోతున్నారా? అన్న చర్చ కాంగ్రెసు వర్గాల్లో నడుస్తోంది.
కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం
బాక్సులు బద్దలు కొట్టేద్దామని ఏడేళ్ల క్రితం రాజకీయ అరంగేట్రం చేసిన చిరంజీవి బహుశా ఊహించని ఫ్లాప్ నే చవి చూడాల్సి వచ్చింది. ఎత్తుగడలు, వ్యూహప్రతివ్యూహాలు కొత్త కావడం, నమ్ముకున్న వాళ్లు చివరి వరకూ అండగా నిలవకపోవడంతో అడుగడుగునా ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి భారం దించుకున్నారు. కాంగ్రెసు అందించిన సహాయమంత్రి పదవితో సరిపుచ్చుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసు అధిష్టానానికి ఎన్ని సూచనలు చేసినా సోనియా చెవి కెక్కించుకోలేదు. దీంతో ఇటు రాష్ట్రంలోనూ,అటు కేంద్రంలోనూ ఇమేజ్ ఖరాబై మౌనాన్నిఆశ్రయించారు. రాష్ట్ర కాంగ్రెసు ప్రచార బాధ్యతలు అప్పగించినా పోషించిన పాత్ర అంతంత మాత్రమే. ఎన్నికల్లో కాంగ్రెసు ఘోరపరాజయంతో ఇక ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరమూ లేదన్నట్లుగా చిరంజీవి దాదాపు ఏడాది కాలం పాటు తెర వెనుకకే పరిమితమయ్యారు.
మెగాస్టార్‌ ప్రాముఖ్యాన్ని పెంచాలనే ఆలోచన
తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలు, వై ఎస్ ఆర్ పార్టీకి ఎదురవుతున్న ప్రతిబంధకాల నేపథ్యంలో మరో సారి కాంగ్రెసుకు అవకాశం దక్కకపోతుందా? అన్న ఆశలు ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంటున్నాయి. ఈ పూర్వరంగంలోనే చిరంజీవి మరోసారి తన కరిష్మాను ఫ్రయోగించి కాంగ్రెసు పార్టీకి పునరుత్తేజం కలిగించేందుకు పూనుకుంటున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటనలోనూ, తిరుపతిలో ప్రత్యేక హోదాపై సాగిన సభలోనూ చిరంజీవి చురుకైన పాత్ర పోషించడమే ఇందుకు నిదర్శనమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెసు పార్టీకి ఒక క్రౌడ్ పుల్లర్ అవసరం ఉంది. అందుకు చిరంజీవిని మించిన అస్త్రం మరొకటి లేదు. పార్టీ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక సాధనంగా మెగాస్టార్ తోడ్పడతాడనే భావన పార్టీ వర్గాల్లో ప్రబలంగా ఉంది. అధిష్ఠానం కూడా అదే ఉద్దేశంతో చిరంజీవికి పార్టీలో ప్రాముఖ్యాన్ని పెంచాలని యోచిస్తున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. 
రాజకీయరంగంలో పరాభవాలు-అవమానాలు
సినీరంగంలో చక్రం తిప్పిన చిరంజీవికి రాజకీయరంగంలో ఎదురైన పరాభవాలు, అవమానాలు అన్నీ ఇన్నీ కావు. అయినా ఇక్కడ నిలదొక్కుకోవాలంటే ఎంతో సహనంతో ఓపికగా ఎదురుచూడాల్సి ఉంటుంది. ఈ తత్వం చిరంజీవికి ఇప్పటికే బోధ పడింది. అందుకే ఎదురు వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారు. సినీ ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన మెగాస్టార్ రాజకీయ రంగంలో మాత్రం తన అస్తిత్వాన్ని నిలుపుకొని కొత్త ముద్ర వేసే దిశలో ప్రస్తానిస్తున్నారు. అందుకు ఇదే మంచి తరుణం.

 

10:37 - August 22, 2015

ఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ కరాచీలోనే ఉన్నారనేందుకు భారత్ కీలక ఆధారాలు సంపాదించింది. కరాచీలో ఆయన నివాసం పేరన ఉన్న టెలిఫోన్ బిల్, పాస్ పోర్ట్ కాపీని రా అధికారులు సంపాదించారు. కరాచీలోని క్లిఫ్టన్ స్ట్రీట్ బ్లాక్ 4లో ఉన్న దావూద్ భార్య మెహజబీన్ పేరిట ఉన్న టెలిఫోన్ కనెక్షన్ వివరాలు సంపాదించింది. దీంతో పాటు 1996లో పాకిస్తాన్ దావూద్ కు ఇచ్చిన పాస్ పార్ట్ నెంబర్ సీ-267185 కాపీని కూడా భారత్ సంపాదించింది. వచ్చేవారం జరిగే భారత్ పాక్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ లో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.

 

10:31 - August 22, 2015

విజయవాడ: పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టిన టిడిపి అధినేత చంద్రబాబు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. కేంద్ర కమిటీతో పాటు రాష్ట్రస్ధాయి కమిటీల ఏర్పాటును పరిశీలిస్తున్న ఏపి సీఎం అదే ఎజెండాతో నేడు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశారు. నెలకోసారి బెజవాడ వేదికగా సమావేశం అవుతున్నప్పటికి టిడిపి నేతలు మాత్రం నేడు కేంద్ర కమిటీ, రాష్ట్ర స్ధాయి కమిటీలపైనే కీలక చర్చ జరగనుంది.
కమిటీలు, పర్యవేక్షణపైనే చర్చ
పార్టీలో క్రియాశీలకంగా,కీలకంగా ఉండే 96మంది నేతలకు చంద్రబాబు ఈ సమావేశానికి ఆహ్వానం పంపారు. తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా కమిటీలు వేయటంతో పాటు, పర్యవేక్షణపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఈ భేటీలో సుధీర్ఘ చర్చ జరగనుంది. పార్టీ పొలిట్‌ బ్యూరోనే రెండు కమిటీలను పర్యవేక్షించాలా, లేక కేంద్ర కమిటీగా మరో కీలక కమిటీగా నియమించాలా అనేది నేటి బెజవాడ సమావేశంలో టిడిపి అధినేత నిర్ణయించనున్నారు. అంతేకాక ఈ కమిటీల్లో ఉండబోయే సభ్యుల ఖరారుతో పాటు పార్టీ కీలక నేతల పనితీరుపై కూడా నేటి సమావేశంలో చర్చించనున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
ఇక ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చ జరగనుంది. ఈనెల 25న ప్రధానిని కలిసేందుకు చంద్రబాబు వెళ్లనున్న నేపధ్యంలో ప్రత్యేక హోదా సాధించేందుకు ఎలాంటి వ్యూహం రచించాలనే దానిపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు టిడిపి వర్గాలు తెలిపాయి.

 

09:52 - August 22, 2015

ఆదిలాబాద్ : సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య గొడవ ఓ కుటుంబం ప్రాణం మీదికి తెచ్చింది. జిల్లాలోని శ్రీరాంపూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో సాయి భార్గవ అనే విద్యార్థి సెకండియర్ చదువుతున్నాడు. విద్యార్థుల మధ్య గొడవలో భార్గవ్ ప్రమేయముందని... తమను ర్యాగింగ్ పేరుతో వేధించాడంటూ... కొందరు స్టుడెంట్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ర్యాగింగ్ నేరంతో జీవితం నాశనమవుతుందని సాయి భార్గవ్ తో పాటు కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం సెంటినరీ కాలనీలోని తమ ఇంట్లో అందరూ కలిసి హెయిర్ డై తాగారు. వీరిని స్థానికులు గోదావరిఖని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. అందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

 

09:34 - August 22, 2015

విశాఖ : విమ్స్ లో భారీ స్కాం బయటపడింది. క్లర్క్ పోస్టు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.2కోట్లకుపైగా వసూలు చేశారు. దాదాపు 60మందికి నాలుగు నెలలపాటు శిక్షణకూడా ఇప్పించారు. ఇందులో డైరెక్టర్‌ సుబ్బారావుతోపాటు రామన్ బిల్లా అనే వ్యక్తి హస్తం ఉందంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కలుషిత ఆహారం తిని 25 మందికి అస్వస్థత

కడప: ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాలురు వసతిగృహంలో రాత్రి భోజనం చేశాక 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

పటాన్ చెరు టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆందోళన

మెదక్: పటాన్ చెరు టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆందోళన చేపట్టారు. సౌకర్యాలు కల్పించకుండా టోల్ ఫ్రీ వసూలు చేయడంపై ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 

09:16 - August 22, 2015

సీఎం కేసీఆర్ చేస్తున్న హామీలు ఆచరణకచు నోచుకోవడం లేదని వక్తలు తెలిపారు. టీసర్కార్ పనితీరుపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీకాంగ్రెస్ నేత మహేష్ గౌడ్, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, బిజెపి రఘునందన్ రావు, టిపిపి నేత రాజారాంయాదవ్ పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

మంత్రుల క్వార్టర్స్ ను ముట్టడించిన టీఎన్ ఎస్ ఎఫ్

హైదరాబాద్: టీఎన్ ఎస్ ఎఫ్ కార్యకర్తలు మంత్రుల క్వార్టర్స్ ను ముట్టడించారు. స్కాలర్ పిష్ లు, ఫీజురియింబర్స్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

నేడు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ మూడోరోజు పర్యటన

మెదక్ : నేడు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ మూడో రోజు పర్యటన కొనసాగనుంది. ఎర్రవెల్లిలో మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. 

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

మెదక్: మంత్రి కేటీఆర్ నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. కౌడిపల్లిలో పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.  

38 మంది సర్పంచ్ లను సన్మానించనున్న ఎపి ప్రభుత్వం

విశాఖ: నేడు 'నిర్మలా పురస్కార్' పేరిట ఎపిలో 38 మంది సర్పంచ్ లు ప్రభుత్వం సన్మానించనుంది. 

బెంగుళూరు కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

కర్నాటక: బెంగుళూరు కార్పొరేషన్ లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. కేంద్రకమిటీ వెంకయ్యనాయుడు బెంగుళూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

08:06 - August 22, 2015

గుంటూరు: ఏపీ రాజధాని అమరావతిలో భూసేకరణ అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ప్రభుత్వ తీరును రైతు సంఘాలు, వామపక్షాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. రైతుల మెడపై కత్తి పెట్టి భూములను సేకరిస్తారా అని ప్రశ్నిస్తున్నాయి.
అగ్గిరాజేసిన భూసేకరణ నోటిఫికేషన్‌
రాజధాని నిర్మాణానికి తొలి భూసేకరణ నోటిఫికేషన్‌ విడుదల చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. మొత్తం 29 గ్రామాల పరిధిలో 3 వేల 892 ఎకరాలను భూ సేకరణ చట్టం ద్వారా వశం చేసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం.. మొదట విడతగా 10 గ్రామాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న అఖిలపక్షనేతలు
ప్రభుత్వ చర్యపై అఖిలపక్ష నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో రోడ్డెక్కిన అన్నదాతలు.. రైతు సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయకపోతే గ్రామాల్లో ప్రజాప్రతినిధులను తిరగనివ్వబోమని హెచ్చరించారు. ప్రభుత్వ చర్యపై వామపక్ష నేతలు నిప్పులు చెరిగారు. రైతుల భూములు తీసుకుని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూ సమీకరణ చేపడతారని ఊహాగానాలు
ఆందోళనలు ఉద్ధృతం కావడంతో ఓ దశలో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కన్పిస్తోంది. తిరిగి భూ సమీకరణే చేపట్టే అవకాశం కన్పిస్తోంది. అయితే భూసేకరణ కొనసాగించాల్సిందేనని సీఎం చంద్రబాబు సీఆర్‌డీఏ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. భూసమీకరణే ఉత్తమమని స్థానిక టీడీపీ నేతలు బాబుతో అన్నారని సమాచారం. రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలనూ అధికారులు సీఎంకు వివరించారు. ఇవేవి పట్టించుకోని చంద్రబాబు నిర్దేశిత గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించినట్లు టాక్‌.
రెండో నోటిఫికేషన్ వాయిదా...?
తుళ్లూరు ప్రాంతానికి నోటిఫికేషన్‌ విడుదల చేసిన అధికారులు.. మరో నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయాల్సి ఉంది. ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని ప్రచారం జరుగుతుండగా... శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో భూసేకరణే ఖాయమనే వార్తలు బలపడుతున్నాయి. శనివారం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

 

నేడు ఎమ్మెల్యేలు-ఎంపీలతో చంద్రబాబు భేటీ

విజయవాడ: ఇవాళ ఉదయం 10 గంటలకు టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహం, టీడీపీ కేంద్ర, ఏపీ కమిటీల ఎంపికై చర్చించనున్నారు.

07:42 - August 22, 2015

కృష్ణా: జిల్లాలో చేపల వర్షం కురిసింది. చందర్లపాడు మండలం కోనాయపాలెంలో నిన్న రాత్రి వర్షం పడింది. వాన కురవటం ప్రారంభమైన కాసేపటికే చేపలు పడుతుంటడాన్ని గ్రామస్తులు గమనించారు. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఎప్పుడూ చేపల వర్షం కురవలేదు. ఇప్పుడు ఒక్కసారిగా కుప్పలు తెప్పలుగా..వర్షం ద్వారా చేపలు పడటంతో చూస్తూ ఉండిపోవడం గ్రామస్తుల పనైంది.

 

07:39 - August 22, 2015

హైదరాబాద్‌: నగరంలో బైక్‌ రైడర్లు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించి ఇద్దరు యువకులు గాయపడ్డారు. వెంకటగిరికి చెందిన ఇద్దరు యువకులు డ్రంక్ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. తప్పించుకునే క్రమంలో కిందజారి పడటంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. దీంతో వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ లో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 9 కార్లు, 6 బైకులు సీజ్‌ చేయగా.. 16 మందిపై కేసులు నమోదయ్యాయి. 

07:30 - August 22, 2015

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఒకరు మృతి చెందారు. ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మీర్‌చంద్‌ పార్క్ హయత్‌ హోటల్లో జరగనున్న చిరంజీవి బర్త్ డే వేడుకలను ఆర్గనైజ్‌ చేస్తున్నాడు. ఏర్పాట్లు పూర్తి కావడంతో స్పోర్ట్స్ బైక్‌ పై అతివేగంతో ఇంటికి వెళ్తున్నాడు. మార్గంమధ్యలో బంజారాహిల్స్ లోని ఎల్ వి. ప్రసాద్‌ ఆస్పత్రి వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళను బైక్ ఢీకొట్టింది. దీంతో మీర్‌ చంద్‌ అక్కడికక్కడే మరణించాడు. 

బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని ఎల్ వి. ప్రసాద్‌ ఆస్పత్రి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ స్పోర్ట్స్ బైక్‌ రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళను ఢీకొట్టడంతో మీర్‌ చంద్‌ అనే బైక్‌ రైడర్‌ అక్కడికక్కడే మరణించాడు. 

డ్రంక్ అండ్ డ్రైవ్...తప్పించుకునేందుకు యత్నించిన యువకుడికి గాయాలు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ వెంకటగిరిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి ద్విచక్రవాహనం నడుపుతున్న మేఘాలయకు చెందిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. యువకుడు తప్పించుకునేందుకు యత్నించాడు. అయితే ప్రమాదవశాత్తు కిందజారి పడడంతో యువకుడికి గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 9 కార్లు, ఏడు బైకులను సీజ్ చేశారు. 16 మందిపై కేసు నమోదు చేశారు. 

Don't Miss