Activities calendar

23 August 2015

ఏఎన్ యులో సంఘాలపై నిషేధం..?

గుంటూరు : నాగార్జున యూనివర్సిటీలో కుల సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. రిషితేశ్వరీ ఆత్మహత్య ఘటన అనంతరం ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకొంటోంది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలను నిషేధం విధిస్తున్నట్లు వర్సిటీ జారీ చేసిన సర్క్యూలర్ లో పేర్కొన్నట్లు సమాచారం. దీనిని విద్యార్థి సంఘాలు ఖండిస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడుతోంది. 

21:20 - August 23, 2015

హైదరాబాద్ : అధికార పార్టీ నేతలకు చీప్ లిక్కర్ వ్యవహారం చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చౌక మద్యం సరఫరా నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. చౌక మద్యంపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసేది లేదని గులాబి పార్టీ నేతలు చెబుతుండడం..రాష్ట్రంలో మరో పోరు పురుడుపోసుకునేలా కనిపిస్తోంది. బంగారు తెలంగాణ నినాదంతో అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్‌, వెలువరిస్తున్న నిర్ణయాలు ఆది నుంచి వివాదాస్పదమవుతున్నాయి. టీఎస్‌ సర్కార్‌ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఎలా స్పందించాలో తెలియక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా వారి పరిస్థితి మారింది. ఎటువైపు అడుగులు వెయ్యాలో తెలియక సతమతమవుతున్నారు. అధినేత నిర్ణయాలను అటు వ్యతిరేకించలేక.. ఇటు సమర్థించలేక మదనపడుతున్నారు.

సచివాలయం, ఉస్మానియా తరలింపుపై దుమారం..
ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో స్థానికత విషయంలో తీసుకున్న ప్రామాణికతపై గులాబి నేతలు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అండగా నిలిచారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో నేతల్లో అసంతృప్తి రగల్చింది. సచివాలయం తరలింపు విషయంలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఇలా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై పునరాలోచనలో పడటం ఆ తర్వాత ఉపసంహరించుకోవడం పార్టీ నేతలను ఇరకాటంలో పడేస్తోంది.

సర్వత్రా విమర్శల వెల్లువ..
తాజాగా చీప్‌ లిక్కర్‌ అమ్మకాల నిర్ణయం రాష్ట్రంలో అగ్గి రాజేస్తోంది. విపక్షాల నుంచి నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆరు నూరైనా వెనక్కి తగ్గమని చీప్ లిక్కర్ ప్రవేశపెడుతామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఏక పక్ష నిర్ణయాలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. యుద్ధభేరీ మోగించేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. చౌకమద్యం వ్యవహారంపై విమర్శల జడివాన కురుస్తున్న తరుణంలో.. కేసీఆర్‌ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.  

21:16 - August 23, 2015

హైదరాబాద్ : ఆసిఫ్‌నగర్ లాకప్‌డెత్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నక్కల పద్మ మృతికి పోలీసుల టార్చరే కారణమని భావించిన హైదరాబాద్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆసిఫ్‌నగర్ పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇన్స్ పెక్టర్‌ శ్రీకాంత్‌, ఎస్సై రిషికేష్‌, ఏఎస్సై చాంద్‌బాషా, హెడ్‌ కానిస్టేబుల్‌ మహ్మద్‌ నాదర్‌ అలీలను సి.పి మహేందర్‌ రెడ్డి సస్పెండ్ చేశారు.
భోజగుట్టలో జరిగిన ఓ దొంగతనం కేసులో పద్మ అనే మహిళతో పాటు మరో ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే రాత్రి పద్మను విచారిస్తున్న సమయంలో ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది పద్మను చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో ఆ మహిళను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పద్మ మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. పద్మకు లోబీపీ, ఇతర అనారోగ్య కారణాల వల్లే మృతి చెందిందని డిసిపి సత్యనారాయణ తెలిపారు. కస్టోడియల్ డెత్‌ కాదని ఆయన స్పష్టం చేశారు. మెజిస్ట్రేట్‌ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిసిపి సత్యనారాయణ తెలిపారు.

కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ లేఖ..

హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ కృష్ణారావు లేఖ రాశారు. విభజన చట్టంలోని ఆస్తుల పంపకం కంటే ముందే ఉద్యోగులను విభజించాలని సీఎస్ లేఖలో కోరారు. తెలంగాణలో వీధిన పడిన విద్యుత్ ఉద్యోగుల పరిస్థితి ఏ ఒక్క ఉద్యోగికి రాకూడదనే లేఖ రాసినట్లు తెలిపారు. 

మూడో స్థానంలో తెలుగు టైటాన్స్...

పాట్నా : ప్రొ.కబడ్డీ లీగ్ లో పాట్నా పెరేట్స్ పై 26-34 తేడాతో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ఈ విజయంతో తెలుగు టైటాన్స్ మూడో స్థానంలో నిలిచింది.

పటన్ చెరు జలమండలి కార్యాలయంలో విద్యుత్ షాక్..

మెదక్ : జిల్లా పటన్ చెరు జలమండలి డివిజన్ -8 కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. 

ఎంపీ మంత్రిని దోపిడి చేసిన ఘటనలో ఒకరి అరెస్టు..

మధ్యప్రదేశ్ : ఆర్థిక మంత్రి జయంత్ మలియా దోపిడి చేసిన ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. 

లంక పర్యటన నుండి వైదొలిగిన విజయ్, సాహా..

కొలంబో : టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. శ్రీలంక పర్యటన నుండి మురళీ విజయ్, సాహా వైదొలిగారు. విజయ్, సాహా స్థానంలో నమన్ ఓజా, కరణ్ నాయర్ లు ఎంపికయ్యారు.

యాషెస్ సిరీస్ ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్..

ఓవల్ : ఐదో టెస్టు మ్యాచ్ లో ఇంగ్లండ్ పై ఆసీస్ జట్టు విజయం సాధించింది. ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో గెలిచింది. యాషెస్ సిరీస్ ను 3-2 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. 

పద్మ లాకప్ డెత్ కేసులో ఏడుగురి పోలీసులపై వేటు..

హైదరాబాద్ : ఆసీఫ్ నగర్ పీఎస్ పరిధిలో పద్మ లాకప్ డెత్ కేసులో ఏడుగురు పోలీసులపై వేటు పడింది. సీఐ, ఎస్ఐ, ఏఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

20:19 - August 23, 2015

ముంబై : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఆయనకు ఎంతో మంది బహుమతులను పంపిస్తుంటారు. బహుమతులు వైవిధ్యభరితంగా ఉండేందుకు ఫ్యాన్స్ ప్రయత్నిస్తుంటారు. అందరిలాగే 'సచిన్ సంఘీ' అనే కళాకారుడు కూడా అభిమాని. ఇతను పెన్సిల్ ముక్కపై అమితాబ్ చిత్రాన్ని గీసి ట్విట్టర్ ద్వారా ఆయనకు పంపాడు. దీని వెనుక ఎనిమిది గంటల కృషి ఉందని, దీనిని ఇష్టపడుతారని ఆశిస్తున్నా అంటూ సంఘీ ట్వీట్ చేశాడు. దీనిని చూసిన బిగ్ బి ఆశ్చర్యానికి లోనయ్యాడంట. 'అరే బాప్ రే..దిస్ ఈస్ అమేజింగ్..థాంక్యూ సో మచ్' అంటూ ఆ అభిమానికి అమితాబ్ ధన్యవాదాలు తెలుపుతూ రీ ట్వీట్ చేశారు. 

పవన్ వెళ్లడం సంతోషంగా ఉంది - వీహెచ్..

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజల వద్దకు వెళ్లడం తనకు సంతోషం కలిగించిందని కాంగ్రెస్ నేత వీహెచ్ పేర్కొన్నారు. 

19:49 - August 23, 2015

హైదరాబాద్ : లక్షల కోట్ల ఆస్తులతో ఇండియా దేవుళ్ళు ఇలా వెలిగిపోతుంటే.. భారతదేశం పేద దేశమని చెప్పుకోవాల్సి రావడం విచిత్రమే. కోట్ల మంది నిరుపేదలున్న దేశంలో... దేవుళ్ల సంపద మాత్రం కోట్లల్లో పెరిగిపోతోంది. మరి దేవుళ్ళకున్న ఇంత భారీ ఆస్తులను ఎలా ఖర్చు పెడుతున్నారు. అంతటి సంపదను ఏ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు..? ఈ ప్రశ్నలకు జవాబులు కూడా ఆలయాల ఆడిట్ రిపోర్టులో ఉన్నాయి.

సిబ్బంది జీతా భత్యాలకు 33 శాతం వ్యయం..
రాజుల సొమ్ము రాళ్లపాలు అంటారు. ఇప్పుడు దేవుళ్ళ సొమ్ము ఆలయ సిబ్బంది జీతాలు పాలు అనాల్సి వస్తోంది. ఎందుకంటే.. దేవుడి ఆదాయంలో అత్యధికంగా 33 శాతం సిబ్బంది జీత భత్యాలకే ఖర్చవుతోంది. అంటే ఈ నాలుగు ఆలయాలూ దాదాపు 736 కోట్ల రూపాయలను సిబ్బంది జీతభత్యాల కోసం ఖర్చు చేస్తున్నాయి. ఆదాయంలో 29 శాతం అంటే 769 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నాయి.

ప్రభుత్వాలకు 2 శాతం నిధుల అందజేత..
భక్తులు ఇచ్చే సొమ్మును.. వారి శ్రేయస్సు కోసం ఖర్చు చేయడానికి ఆలయ కమిటీలకు మనసు రావడం లేదని వారి ఆడిట్ నివేదికలను బట్టి తేటతెల్లమవుతోంది. ప్రజా సంక్షేమ పథకాల కోసం తమ ఆదాయంలో కేవలం 2 శాతం మాత్రమే అంటే ఏటా 50 కోట్లు మాత్రమే ప్రభుత్వాలకు అందిస్తున్నాయి. సొంతంగా దాన ధర్మాలు చేసేందుకు తమ ఆదాయంలో 7 శాతం అంటే 187.7 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. పోనీ భక్తుల సొమ్ముతో ఆలయాల నిర్వహణ అయినా సవ్యంగా చేస్తున్నారా అంటే అదీ లేదు. అందుకోసం ఖర్చు చేస్తున్నది కేవలం 1.4 శాతమే. కార్పొరేట్ ఆడిట్ రిపోర్టులలో ఉన్నట్లే ఆలయాల పద్దుల్లో కూడా... ఇతరత్రా ఖర్చులు అన్న కాలమ్ ఉంటోంది. ఆ ఇతరత్రా ఖర్చులే 33 శాతం దాకా అంటే.. దాదాపు 900 కోట్ల దాకా ఉంటున్నాయి.

రెండేళ్ల పాటు ఉచిత భోజన వసతి..
దేశంలోని దేవుళ్ల దగ్గరున్న బంగారాన్ని కరెన్సీలోకి మార్చితే 60 లక్షల కోట్లు అవుతుంది. ఈ డబ్బుతో నిజానికి ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. మన దేశ ప్రజలు ప్రతి ఏడాది 10,200 కోట్ల రూపాయలు పెట్రోలు కోసం ఖర్చు చేస్తున్నారు. వెంకటేశ్వరుడి సొమ్ముతో దేశ ప్రజలందరికీ 500 ఏళ్ళ పాటు ఫ్రీగా పెట్రోలు ఇవ్వొచ్చు. లేదా వందేళ్ళ పాటు దేశ ప్రజలకు ఉచిత రైలు ప్రయాణ సేవలు అందించవచ్చు. ఇవన్నీ ఎందుకనుకుంటే, ఈ సొమ్ముతో భారతీయులందరికీ రెండేళ్ళ పాటు ఉచితంగా ముప్పూటలా భోజనాలు పెట్టేయొచ్చు.
ప్రపంచంలో ఎక్కడా లేని సంపన్న దేవుళ్ళున్న పుణ్యభూమి మనది. దేవుళ్ళ పేరుతో కోట్లకు కోట్లు హుండీలో వేసి ఆస్తిలా వాటాలను దేవుడితో సహా పంపకాలు వేసుకునే సంప్రదాయం మనది. అందుకే.. మన దేవుళ్ళు ఎప్పటికప్పుడు సంపదలో కొత్త శిఖరాలు అధిరోహిస్తున్నారు. బంగారు కొండలుగా ఎదిగిపోతున్నారు. ఈ పసిడి కాంతులు పేదల జీవితాల్లోకీ ప్రసరిస్తే ఎంత బాగుంటుందో కదా

19:47 - August 23, 2015

హైదరాబాద్ : దేవుడా.... తులాలు కాదు..కిలోలు కాదు... టన్నులు.. టన్నుల కొద్దీ బంగారం. కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే... లక్షల కోట్ల వ్యవహారం. ఏ గుడి తలుపు తట్టినా పసిడి రాసుల గలగలలే. ఏడాదికేడాది మన దేవుళ్ళ బంగారు పంట టన్నుల కొద్దీ పెరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత బంగారం మన దేవుళ్ళ దగ్గరే ఉంది. దేవుడు కరుణించాలే కానీ.. లెక్కలేనంత సంపద ఇచ్చేస్తాడన్నది భక్తుల నమ్మకం. కానీ, భక్తులు నమ్మితే దేవుడికి బంగారు పంట పండుతుందన్నది కంటికి కనిపిస్తున్న నిజం. భక్తులు పెరుగుతున్నారో... జనంలో భయాలు పెరుగుతున్నాయో తెలియదు కానీ... దేవుడా నువ్వే దిక్కంటూ కోట్లాది మంది ప్రజలు టన్నుల కొద్దీ బంగారాన్ని దేవుడి ఖాతాలో వేసేస్తున్నారు. పాపాలు పరిహరించు దేవా అంటూ పసిడి హారతులు పడుతున్నారు. ఫలితంగా.. దేవుళ్ళు పసిడి నిధులతో ధగ ధగ మెరిసిపోతున్నారు.

దేవుళ్ల దగ్గరున్న బంగారం 20 లక్షల టన్నులు..
భారతదేశంలోని ఆలయాల్లో ఉన్న మొత్తం బంగారం ఎంతో తెలుసా..? తాజా ఆడిట్ ప్రకారం దాదాపు 20 లక్షల టన్నులు. అగ్రరాజ్యమని గొప్పలు చెప్పుకునే అమెరికాలోని బంగారు నిల్వలు 8,133.5 (ఎనిమిది వేల నూట ముప్పై మూడు పాయింట్ ఐదు టన్నులు) మాత్రమే. భారతదేశంలోని లక్షల టన్నుల బంగారంలో ప్రభుత్వ ఖజానాకు చెందినది 557 టన్నులైతే... దేవుళ్ళ ఆస్తిగా భద్రంగా ఉన్న బంగారం 20 లక్షల టన్నులు. బంగారు దేవుళ్ళలో అందరికన్నా ముందున్నవాడు మన తిరుమల శ్రీనివాసుడే. భక్తుల కొంగుబంగారమైన శ్రీవేంకటేశ్వరస్వామి పసిడి విలువ అక్షరాలా 60 వేల కోట్ల రూపాయలు. 2012లో తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగలలో లభించిన స్వర్ణ సంపద విలువ లక్ష కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ, అసలు లెక్క ఎంతో ఇంకా అధికారికంగా తెలియదు. కాబట్టి ఇప్పటివరకు నంబర్ వన్ గోల్డెన్ గాడ్ తిరుపతి బాలాజీయే.

ఆ తరువాతి స్థానాల్లో షిర్డీ సాయి, కాశీ విశ్వేశ్వరుడు..
బంగారమే కాదు.. స్థిర, చరాస్తులన్నీ కలుపుకుంటే తిరుమల శ్రీనివాసుడి సంపద అత్యధికం. అనంత పద్మనాభుడు, షిరిడీ సాయినాథుడు, కాశీ విశ్వేశ్వరుడు, ముంబై సిద్ధి వినాయకుడు.. ఆ తరువాత స్థానాల్లో నిలిచారు. వెంకన్నాస్ గోల్డ్ అండ్ ప్రాపర్టీస్ వాల్యూ అక్షరాలా లక్షా 30వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల, మహారాష్ట్రలోని షిరిడీ, ముంబైలోని సిద్ది వినాయకుడి ఆలయం, ఉత్తరప్రదేశ్‌లోని కాశీ ఈ నాలుగు ఆలయాల ఆడిట్ నివేదికలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ నలుగురు దేవుళ్లకూ కలిపి 60వేల 115 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలున్నాయి. వీరందరి వద్దా ఉన్న భూమి విలువ సుమారు 43 వేల 508 కోట్లు. వీరి తరఫున బ్యాంకుల్లో ఉంచిన ఫిక్సెడ్ డిపాజిట్లు 9వేల873.55 కోట్లకు పైమాటే. తిరుమల తిరుపతి దేవస్థానం ఆడిట్ నివేదిక ప్రకారం.. శ్రీనివాసుడి వార్షికాదాయం రెండు వేల 262 కోట్ల రూపాయలు. షిరిడీ సాయినాథుడు సంవత్సరానికి 347.27 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ఉన్న ముంబై సిద్ది వినాయకుడి వార్షికాదాయం 70.28 కోట్లు. నాలుగో సంపన్న దేవుడైన కాశీ విశ్వనాథుడి వార్షికాదాయం 11.58 కోట్ల రూపాయలు.

అంబానీ ఆస్తి రూ.లక్షా 29 వేల కోట్లు..
ఇండియాస్ రిచెస్ట్ బిజినెస్ మాగ్నెట్ ముఖేశ్ అంబానీ ఆస్తి ప్రస్తుతం లక్షా 29 వేల కోట్ల రూపాయలు. ఆయనకన్నా మన తిరుపతి వెంకన్న ఆస్తి ఓ వేయి కోట్లు ఎక్కువే. ఒక్క మాటలో భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు తిరుమల శ్రీనివాసుడు. 

19:44 - August 23, 2015

ఇప్పుడు ఉగాది పద్యాలు రాసే కాలం పోయింది. అర్థం పర్థంలేని అవధానాలకు కాలం చెల్లింది. యువకులు రక్తం మరిగే శక్తులు మండే ఉద్రిక్త కవిత్వం రాస్తున్నారు. సమాజంలోనూ.. మనుషుల్లోనూ ఉన్న ద్వంద్వనీతిని ప్రశ్నిస్తూ కవితాస్త్రాలు సంధిస్తున్నారు. ఆ కోవకు చెందిన యువకవి కలిదిండి వర్మ. ఆయన ఇటీవల నేను మాత్రం ఇద్దరిని అన్న కవితా సంపుటిని వెలువరించాడు. కవి సంగమం నుండి ఎగసిపడిన సరికొత్త కవితా కెరటం కలిదిండి వర్మ పరిచయ కథనం.

19:41 - August 23, 2015

కథల్లోనూ, కవితల్లోనూ వర్ణించలేని భావావేశాలను పాటల్లో అభివ్యక్తీకరించే గేయకవులెందరో మనమధ్య ఉన్నారు. సాంఘిక దురాచారాలను దుర్భల జాతి జనుల ఈతి బాధలను మానవ సంబంధాల మాధుర్యాలను అద్బుతమైన గేయాలుగా ధ్వనింపజేశారు తెలంగాణాకు చెందిన రాం చందర్ భీంవంశీ. ఆయన రాసిన గేయాలు ప్రజల గుండె గాయాలు, శిధిల బతుకుల రుధిర శిల్పాలు. మానవసంబంధాల మధుసంతకాలు. తల్లి ప్రేమ గురించి రాసినా, చెల్లి వరకట్నపు బాధ గురించి రాసినా తన గుండెను చీల్చి రుధిరాశ్రువులను అక్షరాల్లో కరిగించి గుండెలు పిండేసే గేయాలు రాశాడాయన. ప్రముఖ గేయకవి రాంచందర్ భీంవంశీ పాటను ప్రముఖ గేయ రచయిత స్ఫూర్తి పరిచయం.

19:39 - August 23, 2015

సాహిత్యం సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. సమాజపు పురోగమనానికి దోహదం చేస్తుంది. సృజనాత్మక రచయితల వల్లనే సమాజం ఒక అడుగు ముందుకెళుతుంది. అలాంటి కవులు రచయితలెందరో మన సమాజంలో నిబద్ధతతో రచనలు చేస్తున్నారు. వారిలో తన ధిక్కార స్వరంతో బహుజన జీవితాలను కథా శిల్పాలుగా మలుస్తున్న కథనశిల్పి తుమ్మల రామకృష్ణ. ఒకనాడు పచ్చగా కళకళలాడిన పల్లెలు నేడు బోసిపోయి వల్లకాడుల్లా కనిపిస్తున్నాయి. రైతులు అనాధలుగా, కులవృత్తులపై ఆధారపడ్డవారు అయోమయంలో బతుకుతున్నారు. ఆధిపత్య కుల భూస్వాములు అధికారాన్ని చేజిక్కించుకుని ప్రజాస్వామ్యంలో పెద్దలుగా నిలబడ్డారు. కానీ, ఈ నేలకు హక్కుదార్లైన మెజారిటీ ప్రజలు, ఈ వనరులకు, సంపదకు వారసులైన వాళ్లంతా చెదిరిన భవిషత్యుతో భయం భయంగా బతుకులు వెళ్ళదీస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ అభాగ్యుల దుర్భర బతుకు చిత్రాలను అద్భుత కథలుగా మలిచారు తుమ్మల రామకృష్ణ. తరతరాలుగా కులవృత్తులపై ఆధారపడి బతుకుతున్న నిమ్నకులాల బతుకులు ఎలా అణచివేయబడ్డాయో తనకథల్లో కళ్లకు కట్టినట్టు వర్ణించారాయన. రామకృష్ణ కథల దిక్కార స్వరాల్లోని ఆర్ధ్రతను ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య విశ్లేషించారు.

19:23 - August 23, 2015

చిత్తూరు : తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట హాకర్స్ మధ్య జరిగిన గొడవలో కూల్‌డ్రింక్‌ బాటిల్‌ తగలడంతో ఓ భక్తురాలు తీవ్రంగా గాయపడింది. కర్పూరం అమ్ముకునే విషయంలో కొందరు వ్యాపారుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ముగ్గురు వ్యక్తులు కూల్‌ డ్రింక్ బాటిళ్లతో దాడికి యత్నించారు. తమిళనాడుకు చెందిన భాగ్యలక్ష్మికి బాటిల్‌ తగలడంతో ఆమెకు తలకు గాయమైంది. వెంటనే ఆమెను తిరుమల అశ్వినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.  

గోదావరి నదిలో యువకుల గల్లంతు...

పశ్చిమగోదావరి : ఎర్రవల్లి మండలం పిప్పర్రు వద్ద విషాదం నెలకొంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. స్థానికులు గాలింపులు చేపట్టారు. యువకుల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ టైటిల్ ను చేజిక్కించుకున్న ఉసేన్..

బీజింగ్ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ టైటిల్ ను జమైకా స్రింటర్ ఉసేన్ బోల్ట్ నిలబెట్టుకున్నాడు. 100 మీట్లర పరుగు పందెంలో ఉసేన్ విజయం సాధించాడు. 9.79 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నాడు. 

19:17 - August 23, 2015

హైదరాబాద్ : పవన్ కల్యాణ్ పర్యటనతో భూ సేకరణం కొత్త మలుపు తిరిగింది. ఇంతకాలం మిత్రునిగా ఉంటూ వచ్చిన జన సేనాని ప్రభుత్వం ఇదే ధోరణితో ముందుకు వెళితే తన దారి తనదే నని కుండబద్దలు కొట్టేశారు. పోరుబాటలో రైతులకే తన మద్దతని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వానికి సెగ పుట్టింది. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కీలక పాత్ర పోషించిన పవన్..
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన సినీనటుడు పవన్ కల్యాణ్ రాజధాని భూసేకరణ అంశంపై తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే తెలుగుదేశం పార్టీకి టాటా చెప్పేసి పోరుబాట పట్టేందుకూ సమాయత్తమవుతున్నారు. ఆదివారం రాజధాని ప్రాంతంలో రైతుల భేటీలో నిస్సంకోచంగా ఇదే విషయాన్ని ప్రకటించారు పవన్. తెలుగుదేశం , భారతీయ జనతాపార్టీల మైత్రితో తనపై వస్తున్న విమర్శలకూ సమాధానం చెప్పేందుకు ఈ వేదికను చక్కగా వినియోగించుకున్నారు. భూసేకరణ, రాజధాని నిర్మాణం, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వంటి విషయాల్లో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ నిర్ణయాలకు, తనకు ఏమాత్రం సంబంధం లేదని సాధ్యమైనంత దూరం జరగడానికి ఒక ప్రాతిపదికను కూడా సిద్ధం చేసుకున్నారు.

టీడీపీ సర్కారుకు పవన్‌ హెచ్చరిక..
కొంతకాలంగా తెలుగుదేశం ప్రభుత్వ భూసేకరణ విధానంపై ట్విట్టర్ యుద్ధం సాగిస్తున్న పవన్ బహిరంగ సమరానికి శంఖం ఊదేశారు. భూ సేకరణకు తానెట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, అవసరమైతే ధర్నాల ద్వారా రైతులకు మద్దతు తెలుపుతానని ప్రకటించడం టీడీపీ ప్రభుత్వానికి హెచ్చరికే. తనపై వ్యక్తిగతంగా విమర్శలు గుప్పిస్తున్న మంత్రులను సైతం పవన్ విడిచిపెట్టలేదు. యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్ బాబు వంటి వారి వ్యాఖ్యలను తూర్పారబట్టారు. భూసేకరణ జరపాల్సిందేనంటున్న తెలుగుదేశం వారు హైదరాబాదులో అవుటర్ రింగ్ రోడ్డు భూసేకరణపై తమ ఎంపీ మురళీ మోహన్ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారో చెప్పాలని నిలదీశారు.

పవన్‌ డైలాగులను ఆస్వాదించిన రైతాంగం..
మొత్తమ్మీద పవన్ పర్యటన రెండు అంశాలను స్పష్టం చేసింది. తెలుగుదేశం తో కలిసి నడిస్తే రాజకీయంగా దెబ్బ తగులుతుందన్న వాస్తవాన్ని పవన్ కల్యాణ్ గ్రహించారు. తాను బానిసను కాదు అని చెప్పడం ద్వారా ఇక కాచుకోండి అని తెలుగుదేశం ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రైతులంతా పవన్‌ పవర్ పుల్ డైలాగులను ఆనందంగానే ఆలకించారు. అయితే ఆయన భరోసాలు కార్యరూపం దాల్చుతాయా? లేదా? అన్నది రానున్న రోజులే తేల్చాలి.   

తిరిగి వచ్చిన అదృశ్యమైన బాలుడు..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో రైసెన్ అటవీ ప్రాంతంలో తప్పిపోయిన నిషాంత్ (10) పది రోజుల అనంతరం తిరిగి క్షేమంగా చేరుకున్నాడు. ఈసందర్భంగా బాలుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. 

శ్రీలంక విజయం 341 పరుగులు..

కొలంబో : భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించాలంటే ఇంకా 341 పరుగులు చేయాల్సి ఉంది. రేపు చివరి రోజు. ఇండియా గెలవాలంటే ఎనిమిది వికెట్లు పడగొట్టాల్సి ఉంటుంది. 413 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లను కోల్పోయి 72 పరుగులు చేసింది. మాథ్యూస్ 23, కరుణారత్నే 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు సిల్లా (1) సంగక్కర (18) పెవిలియన్ చేరారు. ఈ రెండు వికెట్లు అశ్విన్ పడగొట్టాడు. 

18:17 - August 23, 2015

అనంతపురం : పుట్టపుర్తి మండలం వెంగలాంబచెరువు గ్రామంలో విషాదం నెలకొంది. ఆడుతూ..పాడుతూ ఉన్న ఆ ముగ్గురు చిన్నారులు మృత్యుఒడిలోకి వెళ్లారు. బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పొలంలో పనిచేస్తున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి గణేష్, జయంతి, జయశ్రీలు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉన్న ఓ బావి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ముగ్గురూ బావిలో పడిపోయారు. కొన్ని రోజుల నుండి పడుతున్న వర్షానికి బావిగట్టు వద్ద మెత్తబడడమే చిన్నారులు పడిపోవడానికి కారణమని తెలుస్తోంది. అందులో చిన్నారులు పడిపోయిన విషయం ఆలస్యంగా బయటకు తెలిసింది. ఈ హాఠాత్ పరిణామాంతో తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. చిన్నారులు మృతి చెందారన్న వార్త తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. చిన్నారుల మృతదేహాలను చూసిన వారందరూ కన్నీరు పెట్టారు.

18:09 - August 23, 2015

విజయవాడ : కొన్ని జీవితాలకు వెలుగునిచ్చేలా కొందరు మానవత్వం చూపిస్తున్నారు. తమ అవయవాలను దానం చేస్తున్నారు. ఇందుకు కన్నతల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటున్నారు. విజయవాడలో రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి సుధీర్ బ్రెయిన్ డెడ్ కు గురయ్యాడరు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుధీర్ బ్రెయిన్ డెడ్ అయ్యాడని, బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. దీనితో అవయవాలను దానం చేసేలా సుధీర్ తల్లిదండ్రులను వైద్యులు ఒప్పించారు. ఆంధ్ర ఆసుపత్రి వైద్యులు సుధీర్ గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, కళ్లు సేకరించారు. సుధీర్ గుండె, కాలేయాన్ని ఆంధ్రా ఆసుపత్రి నుండి గన్నవరం విమానాశ్రయానికి అంబులెన్స్ లో తరలించారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో చెన్నైకు తరలించనున్నారు. సుధీర్ అవయవాలను వీలైనంత త్వరగా తరలించేలా విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వరద బాధిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..

ఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ వరద బాధిత ప్రాంతాలకు ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 

పవన్ సూచనను స్వాగతిస్తున్నాం - జూపూడి..

హైదరాబాద్ : చర్చలతో సమస్యను పరిష్కరించాలన్న పవన్ కళ్యాణ్ చేసిన సూచనలను స్వాగతిస్తున్నట్లు టిడిపి నేత జూపూడి పేర్కొన్నారు. నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రానా భూములను లాక్కుంటామని కాదని, రైతులతో చర్చలకు ప్రభుత్వం ఎప్పుడు సిద్ధమేనన్నారు. 

ఉల్లిగడ్డలు బ్లాక్ మార్కెట్ కు తరలకుండా చర్యలు - హరీష్..

హైదరాబాద్ : ఉల్లిగడ్డలు బ్లాక్ మార్కెట్ కు తరలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మార్కెట్లో ఉల్లిగడ్డ కొరత లేకుండా చూస్తున్నామని, సబ్సిడీపై ఉల్లిగడ్డలు అందిరికీ అందిస్తామన్నారు. ఇప్పటి వరకు రైతు బజార్ల ద్వారా 15 లక్షల కిలోల ఉల్లిగడ్డలు ఇచ్చామన్నారు. 

వెంగలాంబ చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి..

అనంతపురం : పుట్టపర్తి (మం) వెంగలాంబ చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.

17:13 - August 23, 2015

హైదరాబాద్ : నగరంలో పేరొందిన ముషిరాబాద్ చేపల మార్కెట్ లో కొందరు వ్యాపారులు వినియోగదారులను మోసం చేస్తున్నారని అధికారులు గుర్తించారు. దీనితో ఆదివారం ఉదయం మార్కెట్ లో తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. చేపల మార్కెట్ లో కొన్ని దుకాణాల్లో రెండు కిలోల బరువుకు కేవలం కిలో మూడు వందల గ్రాములు చూపెట్టడంపై అధికారులు అవాక్కయ్యారు. అక్రమంగా నిర్వహిస్తున్న తూనికలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. 

17:07 - August 23, 2015

ఆదిలాబాద్ : జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దీనితో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల్లో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్య బృందాన్ని అప్రమత్తం చేశామని లక్ష్మారెడ్డి తెలిపారు. 

శ్రీలంక 45/2..

కొలంబో : భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ ఆటను ఆరంభించింది. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 45 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. సిల్వా (1), సంగక్కర (18) పరుగులకే పెవిలియన్ చేరారు. కరుణారత్నే 10, మాథ్యూస్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. 

16:56 - August 23, 2015

ఢిల్లీ : దేశ రాజధాని పోలీసులపై పలు విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ పోలీసు మద్యం మత్తులో మెట్రో రైలులో ప్రయాణించిన వీడియో సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తోంది. నిబంధనలు ప్రజలకు గాని..మనకు కాదని ఈ పోలీసు అనుకున్నాడో. 
ఢిల్లీ మెట్రో రైలులో ఓ పోలీసు ఫుల్ గా మందుకొట్టి ఎక్కాడు. నిలబడలేని స్థితిలో ఉన్నాడు. ఏదైనా పట్టుకుందామని అనుకున్నా వీలు కాలేదు. ఇతడిని ఇతర ప్రయాణికులు చూసినా ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. రైలు ఆగిందని భావించి తలుపు తీయబోయాడు. కానీ అది తలుపు కాదని ఎవరో చెప్పడంతో ఆ పోలీసు వెనక్కి తిరిగాడు. కానీ ఆ సమయంలో రైలు ఆగిపోయింది. మద్యం మత్తులో ఉన్న ఆ పోలీసు బాబు నిలబడలేపోయాడు. కిందపడిపోయాడు. అక్కడున్న వారు కొంతమంది అతడినిపైకి లేపారు. కానీ మద్యం సేవించి ప్రయాణించడం..మద్యం బాటిళ్లను తీసుకుని వెళ్లడం నేరం. కానీ సదరు పోలీసు మద్యం సేవించడం ఎవరూ గమనించలేరా ? ఎవరు ఎందుకు అభ్యంతరం చెప్పలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై మెట్రో అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 
 

16:44 - August 23, 2015

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీని మంత్రి గంటా అకస్మికంగా సందర్శించారు. అనంతరం అధికారులతో సమావేశమై ర్యాగింగ్ నిరోధక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మీడియాతో మాట్లాడారు. పనితీరు మార్చుకొని వీసీలను సైతం పదవుల నుండి తొలగించుకొనే విధంగా చట్టాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీల్లో తిష్ట వేస్తున్న బయటి వ్యక్తులను ఉపేక్షించేది లేదని, వారిని బయటకు పంపేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 

16:43 - August 23, 2015

కడప : బీజేపీపై ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ నిప్పులు చెరిగారు. జిల్లాలో మూడు రోజుల పాటు జరుగుతున్న 'రాయలసీమ అభివృద్ధి మహాసభ'ల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే వారు రాజకీయ నిరుద్యోగులని బీజేపీ మాట్లాడడంపై ఆయన ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా తనవల్లే వచ్చిందని పోస్టర్లు వేసి..పుస్తకాలు ప్రచురించుకుని తీరా అధికారంలోకి వచ్చాక వీలు కాదంటావా అంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై ఆయన విమర్శలు చేశారు. 

16:32 - August 23, 2015

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సేకరణపై జరుగుతున్న పోరాటలకు కేంద్ర కమిటీ మద్దతు తెలిపిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న సమావేశాలు ఈ రోజు ముగిశాయి. ఈసందర్భంగా టెన్ టివితో రాఘవులు మాట్లాడారు. దేశ, రాజకీయ పరిస్థితులు, కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కమిటీ సుదీర్ఘంగా చర్చించిందన్నారు. పాక్ - ఇండియా దేశాల మధ్య చర్చలు కొనసాగాలని, చర్చలకు విఘాతం కలగడం మంచిది కాదని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసిందన్నారు. ఈ విషయంలో పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరాలని పేర్కొనడం జరిగిందన్నారు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి తీవ్రం అవుతోందని, దీనికి ఒక రాజకీయ పరిష్కారమేనని సీపీఎం మొదటి నుండి చెబుతోందన్నారు. బీహార్ ఎన్నికల్లో వామపక్షాలు ఐక్యంగా పోటీ చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. రాబోయే కాలంలో వామపక్ష పార్టీలన్నీ ఒక వ్యూహాత్మంగా ముందుకెళ్లాలని కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. సెప్టెంబర్ 2న జరిగే దేశ వ్యాప్త సమ్మెకు కేంద్ర కమిటీ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించిందని రాఘవులు పేర్కొన్నారు. 

విజయవాడలో మరొకరి అవయవదానం..

విజయవాడ : మరొకరు అవయవదానం చేశారు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన సుధీర్ అవయవాలను చెన్నై, వైజాగ్ లకు వైద్యులు పంపించనున్నారు. 

 

16:20 - August 23, 2015

కొలంబో : రెండో టెస్టులో టీమ్ ఇండియా విజయం ముంగిట నిలిచింది. మూడు రోజుల పాటు తరువాత మ్యాచ్ పై తిరుగులేని పట్టు సాధించిన కోహ్లీ సేన అతిథ్య శ్రీలంక ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచింది. రెండో టెస్టు లో భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 325 పరుగులకు డిక్లెర్డ్ చేసింది. మొత్తం ఎనిమిది వికెట్లు కోల్పోయింది. దీనితో లంక విజయం సాధించాలంటే 413 పరుగులు చేయాల్సి ఉంటుంది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన లంక జట్టు కేవలం 72 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఐదో రోజున ఆట ఆరంభించిన లంక జట్టు ఏమి పరుగులు చేయకుండానే మాథ్యూస్ వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ కరుణారత్నే మాత్రం భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. అడపాదడప షాట్లు కొడుతూ స్కోరు వేగాన్ని పెంచేందుకు కృషి చేశాడు. కానీ మిగతా బ్యాట్స్ మెన్స్ అతడికి ఏమాత్రం సహకరించలేకపోయారు. అశ్విన్ బౌలింగ్ కు లంక ప్లేయర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చండిమాల్ (15), తిరుమన్నే (11), ముబరక్ (0), ప్రసాద్ (0), కౌశాల్ (5) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. జట్టు స్కోరు 130 పరుగులుండగా వర్షం పడింది. దీనితో మ్యాచ్ ను నిలిపివేశారు. అనంతరం లంచ్ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం హెరాత్ 4 చమీరా 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లు తీశాడు.
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ : 306 ఆలౌట్ : (మాథ్యూస్ 102, తిరుమన్నే 62, శిల్వా 51)
భారత్ బౌలింగ్  : మిశ్రా 43/4, శర్మ 68/2, అశ్విన్ 76/2, యాదవ్ 67/1, బిన్ని 44/1)
భారత్ రెండో ఇన్నింగ్స్ 325/8 ( రహానే 126, మురళి విజయ్ 82, శర్మ 34)
శ్రీలంక బౌలింగ్ : ప్రసాద్ 43/4, కౌశల్ 118/4

శ్రీలంక విజయలక్ష్యం 413 పరుగులు..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు లో భారత్ 325 పరుగులకు డిక్లర్డ్ చేసింది. మొత్తం ఎనిమిది వికెట్లు కోల్పోయింది. దీనితో లంక విజయం సాధించాలంటే 413 పరుగులు చేయాల్సి ఉంటుంది. 

భారత్ 320/8..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. 

15:24 - August 23, 2015

కరీంనగర్ : ప్రతిమా మెడికల్ కాలేజీలో నర్సింగ్ విద్యనభ్యసిస్తున్న భాగ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రెండో సంవత్సరం చదువుతున్న భాగ్యశ్రీ కళాశాల హాస్టల్ గదిలో ఉంటోంది. ఆదివారం భాగ్యశ్రీ అచేతనంగా పడిపోయి ఉంది. దీనిని గమనించిన తోటి విద్యార్థినిలు కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. కానీ వారు వచ్చేసరికి భాగ్యశ్రీ మృతి చెందిందని విద్యార్థినిలు పేర్కొన్నారు. తమ కూతురు పట్ల అనుమానాలున్నాయని, కళాశాల యాజమాన్యం సరియైన కారణాలు తెలుపడం లేదని భాగ్యశ్రీ తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. 

 

భారత్ 286/6..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. అశ్విన్ 2, మిశ్రా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికీ భారత్ 373 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

15:05 - August 23, 2015

వరంగల్ : జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. జనగామలోని దేవరుప్పల మండలం కోలుకొండలో డెంగ్యూ విజృంభిస్తోంది. వార్డు సభ్యుడు వేణు డెంగ్యూతో మృతి చెందడం కలకలం సృష్టించింది. 120 మంది గ్రామస్తులు మంచనాపడ్డారు. రోగాల బారిన పడిన వారికి జనగామ ఆసుపత్రిలో పలువురికి వైద్యం అందిస్తున్నారు. వీరిలో 10 మందికి హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు మూడు రోజుల క్రితం వైద్యులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అయినా జ్వరాలు అదుపులోకి రావడం లేదు. తమ గ్రామంపై ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. 

భూ సేకరణపై పెద్ద ఎత్తున ఉద్యమం - సీపీఎం..

ఢిల్లీ :ఏపీ ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని ఏపీ సీపీఎం కార్యదర్శి మధు పేర్కొన్నారు. బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కేంద్ర కమిటీ సూచించడం జరిగిందన్నారు. 25వ తేదీన వామపక్ష పార్టీలు సమావేశమై ఉద్యమకార్యాచరణను ప్రకటిస్తామన్నారు. భూ సేకరణకు వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలతో ఉద్యమం చేపడుతుమన్నారు. ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణ వల్ల రైతుల్లో ఆందోళన నెలకొని ఉందని, పవన్ కళ్యాణ్ బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకం అయితే ఆయన్ను సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 

ముగిసిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు..

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ లో చేపట్టబోయే ఉద్యమకార్యచరణపై చర్చించారు.

25న ప్రధానితో సీఎం బాబు సమావేశం..

హైదరాబాద్ : ఈనెల 25వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ జరుగనుంది. ప్రధానితో పాటు రక్షణ, హోం, వ్యవసాయ శాఖ మంత్రులనూ సీఎం చంద్రబాబు కలువనున్నారు.

 

14:49 - August 23, 2015

గుంటూరు : జిల్లాలో రాజధాని రైతుల సమస్యలు వినడానికి సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెనుమాక గ్రామానికి వచ్చారు. అక్కడ భారీగా వచ్చిన రైతులలో కొంతమందితో పవన్ మాట్లాడారు. రైతుల తమ బాధలను, ఆవేదనను వ్యక్తపరిచారు. అకస్మాత్తుగా కలకలం మొదలైంది. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఏకంగా ఆ రాయి పవన్ కళ్యాణ్ పక్కనే పడింది. వెంటనే అప్రపమత్తమైన పోలీసులు తగిన రక్షణ ఏర్పాట్లు చేశారు. 

14:44 - August 23, 2015

గుంటూరు : రైతుల నుండి ఎట్టిపరిస్థితుల్లో భూములు లాక్కొవద్దని..అలా చేస్తే తాను ధర్నా చేస్తానని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెంటనే భూ సేకరణ చేయడం ఆపేయాలని హెచ్చరించారు. తాను ఏ పార్టీ పక్షం కాదని.. తాను జనపక్షమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పెనుమాకలో పర్యటించిన పవన్ రైతుల సమస్యలను సావధానంగా విన్నారు. అనంతరం ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. రైతులకు అండగా ఉంటానని, తాను పారిపోవడం లేదని స్పష్టం చేశారు. తాను ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే టిడిపి, బిజెపిలకు మద్దతివ్వడం జరిగిందన్నారు. తండ్రిలాంటి అన్నయ్య మనస్సును గాయపరిచి తాను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. భూ సేకరణ విషయంలో చంద్రబాబు ఆలోచిస్తారని అనుకుంటున్నానని తెలిపారు. రాజధాని నిర్మాణంలో, భూ సేకరణలో అన్ని పార్టీలు, నిపుణులతో చర్చించి ఒక ప్యానెల్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన మాటల్లోనే..

అండగా ఉంటున్నా.. పారిపోవడం లేదు..
''మీకు అండగా ఉంటాను. పోరిపోవడం లేదు. మాటలు..చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. గొడవ పెట్టుకోవడానికి రాలేదు. పార్లమెంట్ హౌస్ ల తలుపులు మూసి అడ్డగోలుగా విభజించారు. విభజనే దీనికి నాంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చాను. శాంతి భద్రతలు..ఆడపిల్లల రక్షణ బాధ్యత లాంటి అంశాలే రాజకీయాల్లోకి వచ్చాను.

చావుకు కూడా వెనుకాడను..
విభజన అనంతరం చాలా సమస్యలు ఏర్పడ్డాయి. తెలంగాణలో నెలకొన్న సమస్యలు నాకు తెలుసు. ప్రత్యేక తెలంగాణలో యువకుల ఆత్మహత్యలు చేసుకోవడం బాధించింది. వైసీపీ శత్రుత్వం కాదు. వ్యక్తిగతంగా ఎవరూ శత్రువులు లేరు. ప్రజావ్యవస్థకు ఇబ్బంది వచ్చినప్పుడు వస్తాను. సమస్యను పరిష్కరించడానికి చావుకు కూడా వెనుకాడను. మీ పక్షమే ఉంటాను.

అన్నయ్య మనస్సు గాయపరిచా..
తండ్రిలాంటి అన్నయ్య మనస్సును గాయపరిచి టిడిపి, బిజెపిలకు మద్దతిచ్చాను. ఇప్పుడు మాత్రం అభివృద్ధికి ఆటంకం అని చాలా మంది అంటున్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే వాడిననైతే పార్టీకి ఎందుకు మద్దతిస్తాను ? ఇలాంటి వ్యాఖ్యలు చాలా బాధించాయి. తలూపే వాడిని మాత్రం కాను. నా చిత్తశుద్ధి శంకిస్తే వేరే వ్యక్తిని. మద్దతు సమయంలో ఏమన్నా పదవులు అడిగానా ? అధికారం కావాలని అడిగానా ? సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరిగింది ? అనుభవం ఉన్న నాయకుడు కావాలి అని పేర్కొన్నాను. జగన్..చంద్రబాబు లను చూస్తే బాబుకు అనుభవం ఉంది గ్రహించాను. ఈ విషయాన్ని ఇప్పటికీ నమ్ముతున్నాను.

మంత్రుల వ్యాఖ్యలు బాధించాయి..
తాను ఇటీవలే ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశాను. రాజధాని, భూ సేకరణ విషయంలో తాను ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేయడం జరిగింది. రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతావనిని చూడాలని కోరుకున్నా. స్పెషల్ ప్యాకేజీ ఇవ్వండి. కేపిటల్ ఎలా కడుతారు అని రెండు ప్రశ్నలు అడిగాను. మంత్రి యనమల వ్యాఖ్యలు తనను బాధించాయి. ఒక ఎకరంతో ఎన్నో కుటుంబాలు ముడి పడి ఉన్నాయి. 3,500 ఎకరాలను ఆఫ్ ట్రాల్ అని అంటే ఎలా ? ఎందుకింత రాద్ధాంతం అని మంత్రి రావెల అన్నారు. మంత్రి రావెల అవివేకంగా అనిపించింది. టిడిపి ఎంపీలు మురళీ మోహన్ అవుట్ రింగ్ రోడ్డులో ఆయనకు కోర్టుకు ఎందుకు వెళ్లారు ? ఆయనకు ఎంత ఆస్తి ఉందో తెలియదు.
ఇక్కడ అటవీ భూములున్నాయి. డీ నోటిఫై చేయాలన్నది మొదటి ఆలోచన. ఈ ఆలోచన ఎందుకు మారిందో తనకు తెలియదు. సీఎం పదవిని గౌరవిస్తాను. కించపరిచి మాట్లాడలేను.

ఎక్స్ పర్ట్ ప్యానెల్ వేయాలి..
ఆనందంతో కట్టే రాజధాని కావాలి కానీ కన్నీళ్లతో కాదు. బలవంతంగా భూ సేకరణ చేయవద్దు. ఇక్కడ మీ భయాలు అర్థం చేసుకున్నాను. లోపాలతో కూడుకున్నది కాబట్టే ఇక్కడున్నవంటి పలు గ్రామాల రైతుల్లో భయం నెలకొంది. అడగందే తన కొడుక్కు కూడా సహాయం చేయ. రాజధాని నిర్మాణం గురించి సలహాలు..సూచనలివ్వడానికి ఎంతో మంది ఉన్నారు. వీరందరితో ఎక్స్ పర్ట్ ప్యానల్ పెట్టండి. ఇష్టపడి ఇస్తే భూములు తీసుకోండి. చట్టపరమైన రక్షణ ఉంటే తాము భూములివ్వడానికి తాము సిద్ధమని చెబుతున్నారు. కుదిరితే తీసుకోండి. లేకపోతే లేదు. భూ సేకరణ చేస్తే మాత్రం ధర్నాకు దిగుతా.

కులం అంటకట్టకండి.
ఇక్కడ ఓ అంశం చెప్పాలి. వారంతపు సమీక్షపై ఓ పత్రికలో ఒకరు వార్త రాశారు. పవన్ కళ్యాణ్ ను రాజధాని పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన కులంతో ఉన్న వారు వెనుకెళ్లారని అని రాశారు. నిజ జీవితంలో తనకు అలాంటి లేవు. ఒక్క కులానికి మాత్రం తనను అంటకట్టకూడదు. చాలా అసహ్యంగా ఉంటుంది. ఆకాశహర్మ్యాలున్నా తినేది తిండి భూమిలోనే పండుతుంది.

ఎంపీలు ఇక్కడకు రండి..
తాను రాజధానికి వ్యతిరేకం కాదు. భూ సేకరణపై ఆనాడు టిడిపి పోరాటం చేసింది. మరి ఈనాడు ఎందుకు ఇలా. ప్రతిమాట ఆచితూచి మాట్లాడుతున్నా. ఎంపీ గల్లా జయదేవ్ ఇక్కడకు వచ్చి త్యాగాలు చేయాలని అన్నారు. చెప్పడం చాలా తేలిక. గల్లా జయదేవ్ ఇక్కడకు వచ్చి వీరి గోడు వినాలి. ఎంపీ మురళీ మోహన్ కూడా ఇక్కడకు వచ్చి ఈ సమస్యలు వినాలి.

నిరసనలు చేయాలని కాదు..
మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలను భూ సేకరణను ముందుండి నడిపించారు. మాస్టర్ ప్లాన్ పబ్లిక్ లో పెట్టండి. సమన్యాయం జరిగేలా చూడాలి. ఇక్కడ చంద్రబాబు సమన్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. అనేక వేల మంది రైతుల నమ్మకాన్ని, భవిష్యత్ ను తీసుకొచ్చి టిడిపిలో పెట్టారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి రాకపోతే ఎలా ? భూములు సేకరిస్తున్నప్పుడు, సమీకరిస్తున్నప్పుడు ప్రభుత్వం ఎంతంటి బాధ్యతగా ఉండాలి. ఈ విషయంలో నిరసనలు వ్యక్తం చేసి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలని కాదు. కానీ పరిస్థితులు రాకపోతే నిరసనకు సిద్ధం'' అని పవన్ పేర్కొన్నారు. 

భూమి లాక్కోవద్దు - పవన్..

గుంటూరు : రైతుల నుండి భూములు లాక్కోవద్దని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భూ సేకరణ చేస్తే మాత్రం ధర్నాకు దిగుతానని ఆయన హెచ్చరించారు. 

మీకు అండగా ఉన్నా పారిపోవడం లేదు - పవన్..

గుంటూరు : రైతులకు తాను అండగా ఉంటానని, పారిపోవడం లేదని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పెనుమాకలో రైతుల సమస్యల విన్న పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే టిడిపి, బిజెపిలకు మద్దతివ్వడం జరిగిందన్నారు. 

హురియత్ నేతల గృహనిర్బంధంపై ఆందోళన

జమ్మూకాశ్మీర్: హురియత్ నేతల గృహనిర్బంధంపై ఆందోళన చేపట్టారు. గిలానీ ఇంటి ముందు మద్దతుదారులు ఆందోళన చేపట్టారు.

 

ఎస్వీ యూనివర్సిటీ అధికారులతో మంత్రి గంటా భేటీ

తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీ అధికారులతో మంత్రి గంటా శ్రీనివాస్ భేటీ అయ్యారు. ర్యాగింగ్ నిరోధక చర్యలపై మంత్రి గంటా ఆరా తీస్తున్నారు. క్యాంపస్ నుంచి నాన్ బోర్డర్స్ ను బయటికి పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

రైతుల సమస్యలడిగి తెలుసుకుంటున్న పవన్..

గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా పెనుమాకలో ఏర్పాటు చేసిన సభలో పెనుమాకలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. మూడు పంటలు పండే భూములను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. భూ సేకరణ చేస్తే ఆత్మహత్యే శరణ్యమని రైతులు అంటున్నారు.

పవన్ సభపై రాయి విసిరిన గుర్తు తెలియని వ్యక్తి

గుంటూరు: పెనుమాకలో పవన్ కళ్యాణ్ సభలోకి గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. రైతులు తమ సమస్యలను పవన్ కు విన్నవించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పైకి రాయి విసిరాడు. 

12:53 - August 23, 2015

నెల్లూరు : ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో షోరూమ్‌లోని రిఫ్రిజిరేటర్లు, ఎల్‌ఈడీలు, పలు ఎలక్ట్రానిక్‌ వస్తువులు దగ్ధమయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలార్పారు. ప్రమాదంలో రూ.లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు షోరూమ్‌ నిర్వాహకులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. 

12:49 - August 23, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని షాద్‌నగర్‌ పేలుడు విషాదంలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. తెల్లవారుజామున జరిగిన ప్రమాదంతో.. షాద్‌నగర్‌ ఉలిక్కిపడింది. కేశంపేట మండలం, కొండారెడ్డిపల్లికి చెందిన గోపాల్‌నాయక్‌ కుటుంబం.. పటేల్‌రోడ్డులో ఓ అపార్ట్ మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఏదో ప్రమాదకర వస్తువు పేలిపోవడంతో... భార్య జయమ్మ, కొడుకు చరణ్‌, కూతురు మళ్లికలు మంటల్లో కాలిపోయారు. నిహారిక, భరత్‌లకు తీవ్రగాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగానే నిహారిక చనిపోయింది. పెద్ద కొడుకు భాస్కర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. పేలుడు ధాటికి మృతదేహాలు చిందరవందరగా పడిపోయాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు యజమాని గోపాల్‌నాయక్‌ ఇంట్లో లేడు. వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌ అయిన నాయక్‌... నాలుగు రోజుల క్రితం బెంగళూరు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే మొదట గ్యాస్‌ సిలిండర్‌ పెలినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తర్వాత సిలిండర్‌ పేలుడు కాదని పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదానికి కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయోమోనని అనుమానిస్తున్నారు. భాస్కర్‌ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.

 

12:30 - August 23, 2015

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుతో పలువురు టీడీపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఎల్లుండి ప్రధాని మోడీతో సమావేశం కానున్న నేపథ్యంలో ఏయే అంశాలను చర్చించాలనే అంశంపై మంతనాలు కొనసాగుతున్నాయి. ప్రజాభిప్రాయం పేరిట రాష్ట్రంలోని పరిస్థితులపై 200 పేజీల డాక్యుమెంట్‌ను.. చంద్రబాబు మోడీకి ఇవ్వనున్నట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే బీహార్ కు రూ. లక్షా 65 వేల కోట్లను ఇచ్చిన నేపథ్యంలో ఎపికి రూ. 2 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కోరనున్నారు. మోడీతో సమావేశం నేపథ్యంలో చంద్రబాబు రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు, ఆర్థికశాఖ అధికారులు పాల్గొన్నారు. 

సీఎం చంద్రబాబుతో టీడీపీ ముఖ్య నేతల సమావేశం

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుతో పలువురు టీడీపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఎల్లుండి ప్రధాని మోదీతో సమావేశం కానున్న నేపథ్యంలో ఏయే అంశాలను చర్చించాలనే అంశంపై మంతనాలు కొనసాగుతున్నాయి.

12:04 - August 23, 2015

పవన్‌కళ్యాణ్‌ హీరోగా నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా కె.ఎస్‌.రవీంద్రనాథ్‌ (బాబీ) దర్శకత్వంలో శరత్‌మరార్‌ నిర్మిస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్‌ సరసన కాజల్‌ నటిస్తున్నట్టు నిర్మాత శరత్‌ మరార్‌ తెలిపారు. సెప్టెంబర్‌ మొదటివారం నుండి మూడో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌, ఎడిటింగ్‌ : గౌతంరాజు,
కెమెరా : జయనన్‌ విన్సెంట్‌.

కాసేపట్లో పెనుమాకలో పవన్‌ పర్యటన

గుంటూరు: కాసేపట్లో గుంటూరు జిల్లా పెనుమాకలో పవన్‌కళ్యాణ్‌ పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులతో పవన్‌కళ్యాణ్‌ భేటీ కానున్నారు. 

11:45 - August 23, 2015

విజయవాడ: బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద సీపీఎం రాస్తారోకోకు దిగింది. ఈ రాస్తారోకోలో రైతు, వ్యవసాయ కార్మిక, రైతు కూలీల సంఘాల కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రాస్తారోకో చేస్తున్న పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
బాబురావు...
''రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు. కానీ రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం అన్యాయం. రాజధాని నిర్మాణానికి, ప్రస్తుతం సేకరిస్తున్న భూమికి ఎలాంటి సంబంధం లేదు.రాజధాని పేరుతో ప్రభుత్వం రియిల్ ఎస్టేట్ చేస్తోంది. రైతుల భూములను బడా పెట్టుబడి దారులు, విదేశీ కంపెనీలు, విలాసాలకు దారాధత్తం చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. భూసేకరణను వ్యతిరేకిస్తున్నాం. పంట పోలాల లాక్కొని రైతుల పొట్టకొట్టవద్దు.
రైతులు..
రాజధానికి భూములు ఇవ్వడానికి మాక ఇష్టం లేదు. మమల్ని బెదరించి భూములు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి భయపడి మేము భూములను ఇచ్చాం. చంద్రబాబును చూసి భయపడి ఇచ్చాం. మా భూముల్లో 20 అడగుల్లో నీరు ఉంది. ఈ భూములే మాకు జీవనాధారం. మూడు పంటలు పండే భూములు ఉన్నాయి. ఈ భూములుపైనే మేము బతుకుతున్నాం. మా పిలల్ని చదివించుకుంటున్నాం. భూములను తీసుకుంటే రాష్ట్రం మొత్తానికి దారిద్ర్యం పట్టుకుంటుంది.
పెనుమాక రైతులు...
మేము పెనుమాకలో పుట్టిపెరిగాము. ఈ పోలాలతో మాకు అవినాభావ సంబంధం ఉంది. ఈ భూములే ఆదెరువు. వీటితోటే జీవనం సాగిస్తున్నాం. గతంలో తెలుగుదేశం కార్యకర్తలే పొలాల్లోని పాకలను తగలబెట్టారు. రైతులపై రివర్స్ కేసులు పెట్టారు. ఆహర పంటలు పండే భూములను రాజధాని పేరుతో నాశనం చేశారు. రాజధాని పేరుతో భూములు లాక్కొని.. లక్ష ఎకరాలను విదేశాలకు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది సరికాదు. రైతులు భయపడి భూములిచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బినామీల పేరుతో భూములు తీసుకుని పూలింగ్ కు ఇచ్చారు. ఇది అన్యాయమైన చర్య, పవన్ కళ్యాణ్ కు మా బాధలు, సమస్యలను వివరిస్తాము. బలవంతంగా భూసేకరణకు పూనుకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు''. అని హెచ్చరిస్తున్నారు.

 

11:24 - August 23, 2015

ఢిల్లీ: రక్షాబంధన్‌ నేపథ్యంలో ప్రజల కోసం దేశవ్యాప్తంగా పోస్టల్‌ డిపార్ట్ మెంట్‌ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఒకపక్క ప్రైవేట్‌ కొరియర్స్ నుంచి తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త దారులను వెతుకుతోంది. రాఖీలు పంపేందుకు ప్రజలకు ప్రత్యేక కవర్లను అందిస్తున్నారు. ఈ కవర్లను ప్రత్యేకంగా విభజించి... రాఖీ పండుగ రోజు అందించే విధంగా ఏర్పాట్లు చేశామని పోస్టల్‌ అధికారులు తెలుపుతున్నారు. పోస్టల్‌ డిపార్ట్ మెంట్‌ ఏర్పాట్లపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

11:21 - August 23, 2015

ఉత్తరాఖండ్‌: రాష్ట్రంలోని అల్మోర పట్టణంలో ఓ చిరుత కలకలం సృష్టించింది. ఏకంగా జనావాసంలోకి వచ్చి ప్రజలను భయపెట్టింది. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో చిరుత పులి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే వారు రాత్రి శబ్దాలు చేయడంతో చిరుత ఓ భవనంలోకి చొరబడింది. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో.. వారు తెల్లవారుజామున చిరుతను పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

 

11:19 - August 23, 2015

చిత్తూరు: జిల్లాలోని రామకుప్పంలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి. రాపకుప్పం మండలం వీర్నమల పంచాయతీ పరిధిలోని చిక్కపల్లి తండా వ్యవసాయ బావిలో గున్న ఏనుగు పడింది. సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు.. శనివారం రాత్రివేళ మేతకు పంటపొలాల వైపు వచ్చాయి. పంటలను ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో ఓ గున్న ఏనుగు వ్యవసాయబావిలో పడింది. దీంతో ఆగ్రహించిన ఏనుగుల గుంపు... సమీపంలోని విద్యుత్‌ స్తంభాలను ధ్వంసం చేశాయి. స్థానికులు భయంలో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం వారు బావిలోని గున్న ఏనుగును బయట తీశారు.

11:17 - August 23, 2015

హైదరాబాద్‌ : ఆసీఫ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. భోజగుట్టలో జరిగిన ఓ దొంగతనం కేసులో పద్మ అనే మహిళతో పాటు..మరో ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే రాత్రి పద్మను విచారిస్తున్న సమయంలో ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది పద్మను చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో ఆ మహిళను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పద్మ మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. పద్మకు లోబీపీ, ఇతర అనారోగ్య కారణాల వల్లే మృతి చెందిందని డిసిపి సత్యనారాయణ తెలిపారు. కస్టోడియల్ డెత్‌ కాదని ఆయన స్పష్టం చేశారు. మెజిస్ట్రేట్‌ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిసిపి సత్యనారాయణ తెలిపారు.    

10:59 - August 23, 2015

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలల రాజధాని రూపుదిద్దుకుంటుంది. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అత్యాధునిక నగరంగా, అద్భుత నగరంగా, స్మార్ట్ సిటీ నగరంగా దీన్ని నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అందుకు తగినట్లుగానే ప్రణాళికలు రూపొందించామని అంటోంది. అయితే రాష్ట్ర రాజధాని నిర్మాణం ఏ విధంగా ముందుకు వెళ్తోంది...? ఈ ప్రణాళికలోని ప్రధాన అంశాలేమిటీ..? అది ప్రజల రాజధానిగా ముందుకు వెళ్లాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వంటి అంశాలపై టెన్ టివి నిర్వహించిన 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు, ఉద్యమ నేత, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పాల్గొని, విశ్లేషించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.

 

భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన..సీపీఎం నేతల అరెస్టు..

విజయవాడ: భూసేకరణకు వ్యతిరేకంగా ప్రకాశం బ్యారేజీ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. సీపీఎం నేతలు సీహెచ్ బాబురావు, శిశశంకర్, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. 

ప.గో జిల్లాలో దారి దోపిడీ

ప.గో: చేబ్రోలు సమీపంలోని బాదంపూడి వద్ద దారి దోపిడీ జరిగింది. దుండగులు లిఫ్టు అడిగి కారు ఎక్కారు. అనంతరం కారులోని దంపతులను బెదిరించి రూ. 8 లక్షలు అపహరించుకుపోయారు. దంపతులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

నేడు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష

విజయవాడ: నేడు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. ఉదయం 9.30 కు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఎపిలో విజయవాడ, తిరుపతి, విశాఖలో సెంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడలో 34 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను విధించారు.

 

అందరికీ అందుబాటులోకి చీప్ లిక్కర్: నాయిని

హైదరాబాద్: పేద, మధ్య తరగతి ప్రజలకు చీప్ లిక్కర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి తెలిపారు. నెక్లెస్ రోడ్డులో 5కే రన్ ను మంత్రి ప్రారంభించారు. గుడుంబా వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టే చీప్ లిక్కర్ ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఆరోగ్యకరమైన మద్యాన్ని ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

 

09:50 - August 23, 2015

బ్రిటన్: లండన్‌లో హైవేపై జెట్‌ విమానం కూలింది. బ్రిటన్‌లో నిర్వహిస్తున్న షోరామ్‌ ఎయిర్‌షోలో ఈ ప్రమాదం జరిగింది. పైలట్‌ పట్టు కోల్పోవడంతో.. విమానం రోడ్డుపై దూసుకెళ్లి పలు వాహనాలను ఢీకొట్టింది. అనంతరం భారీ మంటలు చెలరేగి విమానం దగ్ధమైంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా... 14 మందికి గాయాలయ్యాయి.

 

09:45 - August 23, 2015

హైదరాబాద్: పోలీస్‌స్టేషన్‌ అనగానే కళ్ల ముందు కనిపించే దృశ్యాలు పోలీసుల బూట్ల చప్పుళ్లు, లాకప్‌లలో నేరగాళ్లు, అపరిశుభ్రత వాతావరణం. నిన్నటి వరకు పోలీస్‌స్టేషన్‌ అంటే ఇదే. కానీ, ప్రస్తుతం పోలీసుల సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్ల రూపు రేఖలు మారుతున్నాయి. ఒక్కో పోలీసు స్టేషన్‌ నిర్మాణానికి కోటి నుంచి రెండు కోట్లు కేటాయిస్తున్నారు. ఇప్పటికే నిర్మించి ఉన్న స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లినవారికి ఆహ్లాదకర వాతావరణం, తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగించేందుకు కావల్సిన వాతావరణాన్ని కల్పిస్తున్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌
బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం కల్పించడం కోసం.. వారికి ప్రశాంతతను కల్పించేందుకు పోలీస్‌స్టేషన్లు సుందరంగా నిర్మిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితుల నుంచి మార్పులు తీసుకురావాలని సర్కార్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాజేంద్రనగర్‌ పీఎస్‌ను కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించారు. ఆదిభట్ల స్టేషన్‌కు ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన వారితో సీఐ, ఎస్‌ఐలు మాట్లాడానికి వీలుగా వారికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నారు. లాకప్‌ గదులు బయటకు కనిపించకుండా నిర్మిస్తున్నారు. స్టేషన్‌ ఎదుట పూలమొక్కలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు ఫేస్‌బుక్‌ ఏర్పాటు
హైదరాబాద్‌, సైబరాబాద్‌లలో దశల వారీగా 40 ఠాణాలను ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఇప్పటికే పెట్రోలింగ్‌కు ఇన్నోవా వాహనాలు సమకూర్చి.. వాటికి జీపీఎస్‌ విధానంతో కమాండ్‌ కంట్రోల్‌తో అనుసంధానం చేశారు. వీటికి తోడు పోలీసు స్టేషన్లను కూడా పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేస్తున్నారు. ప్రతి స్టేషన్‌కు ఫేస్‌బుక్‌ ఏర్పాటుచేసి స్థానికులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపించి ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు పరుస్తున్నారు.

 

09:34 - August 23, 2015

ఢిల్లీ: దావూద్‌పై పాక్‌ది ఎప్పుడూ దాటవేత ధోరణే. ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చింది. తమకు సంబంధమే లేదని వాదించింది. పైగా పాక్‌లో లేడంటూ భారత్‌పై ఎదురుదాడికి దిగేది. కాని ఇప్పుడేం చెబుతుంది? దావూద్‌ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని...ఇండియా బలమైన ఆధారాలు సంపాదించింది. దావూద్ ఫొటో, పాస్‌పోర్టులు, టెలిఫోన్‌ బిల్లు, ఇంటి అడ్రస్‌ వివరాలను సంపాదించి...పాక్‌ వక్ర బుద్ధిని మరోసారి బయటపెట్టింది. దీనికి పాకిస్తాన్ ఏం సమాధానం చెబుతుంది?
ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం
1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే తలదాచుకున్నట్లు మరోసారి బట్టబయలైంది. కరాచీలోనే నివాసముంటున్నట్లు భారత నిఘా వర్గాలు నిర్ధారించాయి. పక్కా ఆధారాలతో పాక్‌ నోరును మూయించేందుకు భారత్ సిద్ధమవుతోంది.
కరాచీలోని క్లిఫ్టన్‌ రోడ్‌లో దావూద్ నివాసం
దావూద్‌ ప్రస్తుతం కరాచీలోని క్లిఫ్టన్‌ రోడ్డులో నివాసముంటున్నాడని నిఘావర్గాల సమాచారం. అతడు ఇపుడు ఎలా ఉంటున్నాడో తెలిపే ఫొటోతో పాటు...అతని కుటుంబ సభ్యుల వివరాలను భారత్ సంపాదించింది. ప్రస్తుతం దావూద్‌ క్లీన్ షేవ్‌తో కనిపిస్తున్నాడు. గతంలో ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. ఐతే అతడు ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీ చేసుకోలేదని తెలుస్తోంది.
ఇంటి అడ్రస్, టెలిఫోన్ బిల్లు సంపాదించిన నిఘావర్గాలు
ఇక దావూడ్ నివాసముంటున్న ఇంటి చిరునామా, ఆయన భార్య పేరుతో ఉన్న టెలిఫోన్‌ బిల్లు కూడా అధికారులకు లభించింది. దావూద్ చిరునామా చూస్తే..డీ-13, బ్లాక్-4, కరాచీ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఎస్‌సీహెచ్‌-5, క్లిఫ్టన్‌ పేరుతో ఉంది. అంతేగాకా దావూద్‌కు మూడు పాకిస్తానీ పాస్‌పోర్టులు ఉన్నట్లు సమాచారం. పాస్‌పోర్టులలో మరో రెండు చిరునామాలు కూడా ఉన్నాయి. 6A, ఖయబన్ తాన్‌జీమ్, ఫేస్‌-5, డిఫెన్స్ హౌజింగ్ ఏరియాతో పాటు మొయిన్ ప్యాలెస్‌, రెండో అంతస్థు, అబ్దుల్లా షా ఘాజీ దర్గా దగ్గర, క్లిఫ్టన్‌, కరాచీ అనే చిరునామాలు పాస్‌పోర్టుల్లో ఉన్నాయి.
కరాచీ నుంచి దుబాయ్‌కు దావూద్ రాకపోకలు
దావూద్ ప్రస్తుతం.... భార్య మెహజబీన్‌ షేక్‌, కొడుకు మొయీన్‌ నవాజ్, కూతుళ్లు మహరుక్‌, మెహ్రీన్‌, మాజీయాతో పాటు కలిసి ఉంటున్నాడు. అతడి కొడుకు మొయీన్‌కు సానియా అనే అమ్మాయితో పెళ్లైంది. ఇక కూతుళ్లలో మహరూక్‌కు..పాకిస్తాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్‌ జావెద్ మియాందాద్‌ కొడుకు జునాయిద్‌తో పెళ్లైంది. అంతేగాక దావూద్‌ కరాచీ నుంచి దుబాయ్‌కు పలుమార్లు రాకపోకలు జరిపినట్లు భారత్ నిఘా వర్గాలు ధృవీకరిస్తున్నాయి. పాస్‌పోర్టు నంబర్లతో పాటు ఎవరెవరు వెళ్లారు. ఏ ఫ్లైట్‌లో వెళ్లారు..అనే వివరాలన్నింటినీ సేకరించాయి. దావూద్‌కు పాకిస్తానే ఆశ్రయమిస్తున్నట్లు భారత్ చాలాకాలంగా వాదిస్తోంది. కాని భారత్‌ వాదనలను పాక్ కొట్టిపారేస్తూ.. వస్తోంది. కాని తాజా ఆధారాలతో పాక్ ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి పాక్ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

గర్భిణీపై సామూహిక అత్యాచారం...

నల్గొండ: డిండి మండలం కేంద్రంలో దారుణం జరిగింది. ఈనెల 20 న ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

పోలీసుల అదుపులో 100 మంది యువకులు

హైదరాబాద్: పాతబస్తీలో అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న 100 మంది యువకులను ;పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 9 గంటలకు యువకులకు సౌత్ జోన్ డిసిపి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. 

వ్యవసాయి బావిలో పడిన ఏనుగు

చిత్తూరు: రామకుప్పం మండలం ఆరిమానపెంట సమీపంలో ఏనుగు వ్యవసాయి బావిలో పడింది. ఏనుగును బయటికి తీసేందుకు ఫారెస్టు సిబ్బంది యత్నిస్తున్నారు. 

జమ్మూకాశ్మీర్ హంద్వారాలో ఎన్ కౌంటర్

జమ్మూకాశ్మీర్: హంద్వారాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాదళాలు ముగ్గురు మిలిటెంట్లను కాల్చి చంపారు. ఓ జవానుకు గాయాలయ్యాయి. 

08:29 - August 23, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని గద్వాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో ముగ్గురు ఎస్సైలు గాయపడ్డారు. గద్వాల టౌన్‌ ఎస్సై సైదాబు ప్రయాణిస్తున్న వాహనం గద్వాల మండలం అనంతపురం గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తాపడి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఎస్సై సైదాబుతోపాటు మల్దకల్‌ ఎస్సై శ్రీనివాసరావు, అయిజ ఎస్సై వెంకటేశ్వర్లకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స కోసం గద్వాల ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో మల్దకల్‌ ఎస్సై శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండడంతో..మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గద్వాలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెప్తున్నారు. 

నేడు విశాఖ ఏజెన్సీలో మంత్రి రావెల పర్యటన

విశాఖ: నేడు ఏజెన్సీలో మంత్రి రావెల కిషోర్ బాబు పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. 

నేడు చొర్లగొండిలో సీపీఎం కృష్ణా జిల్లా కమిటీ పర్యటన

కృష్ణా: నాగాయలంక మండలం చొర్లగొండిలో సీపీఎం జిల్లా కమిటీ పర్యటించనుంది. విషజ్వరాల బాధితులను ఆ పార్టీ బృందం పరామర్శించనున్నారు. 

నాగలాపురం చెక్ పోస్టుపై ఎసిబి దాడులు

చిత్తూరు: నాగలాపురం చెక్ పోస్టుపై ఎసిబి దాడులు నిర్వహించారు. అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురి నుంచి రూ.40 వేలు స్వాధీనం చేసుకున్నారు. చెక్ పోస్టు సిబ్బందిపై కేసు నమోదు చేశారు.  

ఆసిఫ్ నగర్ పోలీసుల అదుపులో ఉన్న మహిళ మృతి

హైదరాబాద్: ఆసిఫ్ నగర్ పోలీసుల అదుపులో ఉన్న మహిళ మృతి చెందింది. దొంగతనం కేసులో మహిళ విచారిస్తుండగా అస్వస్థతకు గురైంది. ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది.

 

07:52 - August 23, 2015

హైదరాబాద్: సంధి కుదురుతుందా..? సమరమే జరుగుతుందా..? అన్న సందేహాల నడుమ పవన్‌-బాబు భేటీ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో ఏం తేలుతుందన్నది ఒకెత్తయితే.. అసలు ఈ భేటీ ఎందుకోసం అన్నది ప్రధాన అంశంగా మారింది. అయితే.. పవన్‌ కల్యాణ్‌ను బుజ్జగించేందుకే బాబు రంగంలోకి దిగుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి పవన్‌ ఏం చేస్తారు..? తల అడ్డంగా ఊపుతారా..? నిలువుగానా..??
చంద్రబాబును తాకిన పవన్‌ ట్వీట్లసెగ
పవన్‌ కల్యాణ్ ట్వీట్లసెగ టీడీపీ మంత్రులను దాటుకుని, అధినేత చంద్రబాబును తాకింది. దీంతో.. ఆమేఘాల మీద రంగంలోకి దిగిన చంద్రబాబు.. పవన్‌ తో భేటీకి రంగం సిద్ధం చేశారు. స్వయంగా పవన్‌కు ఫోన్‌ చేసిన చంద్రబాబు.. సమావేశ ప్రతిపాదన చేసినట్టు సమాచారం. దీనికి అంగీకరించిన పవన్‌.. "సర్దార్" చిత్రం షూటింగుకు ప్యాకప్ చెప్పి హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. అయితే.. ఈ సమావేశంలో ఏం మాట్లాడబోతున్నారు అన్నదానికంటే, ఈ భేటీ ఎందుకు..? అన్నదే ఆసక్తికరంగా మారింది.
పవన్‌ను నొప్పించకుండా.. భూసేకరణ
రాజధాని భూముల కోసం భూ సేకరణ చట్టాన్ని ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందో పవన్‌కు చంద్రబాబు అర్థం చేయిస్తారని పైకి చెబుతున్నా.. పవన్‌ను బుజ్జగించడానికే ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. వీలైనంత వరకూ పవన్‌ను నొప్పించకుండా.. భూసేకరణకు ఒప్పించాలని బాబు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఒకవేళ పవన్‌ వినకపోతే.. తమ కార్యాచరణను రంగం సిద్ధం చేసుకునేందుకూ ఈ భేటీ ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
టీడీపీకి దూరం జరగాలని పవన్‌ యోచన..?
ఇదిలా ఉంచితే.. పవన్‌ ఆలోచనల్లో చాలా తేడా వచ్చిందని పరిశీలకులు అంటున్నారు . రాజధాని భూ సమీకరణ మొదలు చాలా విషయాల్లోనూ పవన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో.. టీడీపీకి దూరం జరగాలని భావించినప్పటికీ కుదరలేదు. ఇప్పుడు భూ సేకరణ అంశాన్ని కారణంగా చూపుతూ పవన్‌ దూరం జరగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పవన్‌ను బుజ్జగించేందుకు బాబు యత్నం..
అయితే.. సరైన కారణం చూపుతూ దూరం జరిగితే.. మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకూ ప్రతి అంశంలోనూ పవన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఇదే జరిగితే టీడీపీకి ఇబ్బందులు తప్పవు. కనుక, ఈ విషయంలో పవన్‌ను బుజ్జగించి, బజ్జోపెడితే.. మరికొంత కాలం ఇబ్బంది ఉండదనే యోచనలో బాబు ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ భేటీ బాబు కన్నా, పవన్‌కే ప్రధానమంటున్నారు పరిశీలకులు. బాబు మాటలకు తలొగ్గి, తన మాట నుంచి వెనక్కు వెళ్తే మాత్రం పవన్‌కే ఇబ్బందని అంటున్నారు. దీనివల్ల టీడీపీకి లైన్‌ క్లియర్‌ అవడంతోపాటు, పవన్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుందంటున్నారు. మరి, ఈ నేపథ్యంలో పవన్‌ ఎలాంటి స్టెప్‌ తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

 

07:39 - August 23, 2015

గుంటూరు: రైతులపై భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇవాళ పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి పవన్‌ కళ్యాణ్‌ గుంటూరు వెళ్తారు. అనంతరం పెనుమాక, బేతపూడి, ఉండవల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు. అక్కడి రైతులతో సుదీర్ఘంగా సమావేశమై వారి ఇబ్బందులు తెలుసుకోనున్నారు. ఆ తర్వాత రైతులను ఉద్దేశించిన ప్రసంగించనున్న పవన్‌ కల్యాణ్‌.. భూ సేకరణపై తన అభిప్రాయాన్ని నేరుగా ప్రజలకు తెలియజేస్తారని సమాచారం. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వచ్చి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీకానున్నట్టు సమాచారం. భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించడానికి గల కారణాలను చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌కు వివరిస్తారని తెలుస్తోంది. అయితే.. చంద్రబాబు వివరణకు పవన్‌ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

 

కారు బోల్తా... ఇద్దరు ఎస్సైలకు గాయాలు

మహబూబ్ నగర్: జిల్లాలోని గద్వాల సమీపంలోని అనంతపురం వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఎస్సైలకు గాయాలయ్యాయి. గాయపడిన గద్వాల ఎస్సై సైదులు, మల్దకల్ ఎస్సై శ్రీనివాసరావును కర్నూలు ఆస్పత్రికి తరలించారు. 

07:06 - August 23, 2015

మహబూబ్ నగర్: షాద్ నగర్ పటేల్ రోడ్డులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందారు. భరత్, నిహారిక, భాస్కర్ లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. భరత్ పరిస్థితి విషమంగా ఉంది. షాద్ నగర్ ప్రభుత్వాస్పత్రిలో భరత్ కు చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో తల్లి జయమ్మ, కొడుకు చరణ్, కూతురు మళ్లికలు ఉన్నారు. 

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురి మృతి

మహబూబ్ నగర్: షాద్ నగర్ పటేల్ రోడ్డులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందారు. భరత్, నిహారిక భాస్కర్ ల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Don't Miss