Activities calendar

24 August 2015

21:45 - August 24, 2015

కోస్తేనే కాదు... కొందామన్న కన్నీళ్లే వస్తున్నాయి. ఉల్లిపాయ చివరికి బాంబులా మారిపోయింది. ఒకనాడు రాజకీయాలను మలుపు తిప్పి... ప్రభుత్వాలనే తలకిందులు చేసిన ఘనమైన చరిత్ర ఉన్న ఉల్లి.. ఇప్పుడు మళ్లీ అదే ఉగ్రరూపాన్ని చూపుతుంది. ఇప్పుడా ఉల్లి ధర కిలో వందకు చేరనుందా..? ఉల్లిపాట్లు మరింత పెరగనున్నాయా..? ఘాటు ఆకాశానికి ఎందుకంటుంది..? ఈ ఉల్లి లొల్లి సంగతేంటీ..? ఈరోజు వైడ్ యాంగిల్ లో చూద్దాం... ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:17 - August 24, 2015

అనంతపురం: చెరువులో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి 5లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. చిన్నారుల అంత్యక్రియల్లో మంత్రి పాల్గొన్నారు. చిన్నారుల అంత్యక్రియలకు మంత్రి పల్లెతోపాటు టీడీపీ నేతలు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు పడి చనిపోయిన విషయం తెలిసిందే.

 

21:06 - August 24, 2015

అనంతపురం: పెనుకొండ రైలు ప్రమాద ఘటనపై విచారణ జరిపిస్తామని ఎపి మంత్రి పల్లె రఘునాధరెడ్డి తెలిపారు. పెనుకొండలో మంత్రి టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పెనుకొండ రైలు ప్రమాద ఘటనలో రాయచూరు జిల్లా దేవదుర్గ్‌ ఎమ్మెల్యే సహా మరో ఐదుగురు మృతి చెందినట్లు మంత్రి తెలిపారు. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన మంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామన్నారు. పెనుకొండలో తరచూ రైలు ప్రమాదాలు జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్‌లో జరగకుండా ఉండడం కోసం కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు. 

20:58 - August 24, 2015

రాజమండ్రి: ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. రాజమండ్రిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర లోటు బడ్జెట్‌ను భర్తీ చేసేందుకు ప్రత్యేక హోదా తప్పనిసరని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసినందుకు ప్రభుత్వం ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యం నేర సమాన నిర్లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తికాకపోతే మరో తరం పడుతుందన్నారు. అధికార వికేంద్రీకరణ విషయంలో గత పాలకులు చేసిన తప్పును సీఎం చంద్రబాబు చేయొద్దని కోరారు. 

20:51 - August 24, 2015

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తమకు ఏడు వేల కోట్ల ఆస్తులున్నయని హైకోర్టుకు అగ్రిగోల్డ్ యాజమాన్యం లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 14 చోట్ల ఉన్న ఆస్తుల వివరాలను ఈ అఫిడవిట్‌లో పొందుపరిచారు. గతంలో విచారణ సందర్భంగా ఆస్తుల వివరాలను సమర్పించాల్సిందిగా హైకోర్టు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అప్పులు చెల్లించడానికి ఆస్తులను అమ్మాల్సి వస్తే.... కోర్టు ద్వారనే ఈ ప్రక్రియ జరుగుతుందని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ప్రస్తుతం అగ్రిగోల్డ్ యాజమాన్యం సమర్పించిన అఫిడవిట్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందో...తరువాతి విచారణలో తేలనుంది. ఇక అగ్రిగోల్డ్‌ యాజమాన్యం ఇచ్చిన అఫిడవిట్‌ తప్పుల తడక అని అగ్రిగోల్డ్‌ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తుల విలువను అగ్రిగోల్డ్ యాజమాన్యం ఎక్కువ చేసి చూపించిందని ఆరోపిస్తున్నారు.

20:45 - August 24, 2015

నల్గొండ: నిర్భయం లాంటి ఎన్ని చట్టాలొచ్చినా అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అనునిత్యం మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ నిజామాబాద్ రైల్వేస్టేషన్ లో ఓ వివాహితపై జరిగిన అత్యాచార ఘటన మరువకముందే తాజాగా నల్గొండ జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు. కోదాడ మండలం కొమరబండలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న ఓ విద్యార్థిని రాజు అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు ట్యూషన్ కోసం తన ఇంటికి రమ్మన్నాడు. విద్యార్థిని అతని ఇంటికి వెళ్లింది. రాజు ఆ..విద్యార్థినిపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక తప్పించుకుని జరిగిన విషయం తల్లిదండ్రులకు వివరించింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కేసుకు సబంధించిన ఎలాంటి సమచారాన్ని పోలీసులు బయటకు రానివ్వడం లేదు.

 

విద్యార్థినిపై టీచర్ అత్యాచారయత్నం..

నల్గొండ: కొమరబండ ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. టెన్త్ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విద్యార్థిని తప్పించుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

20:17 - August 24, 2015

హైదరాబాద్ : తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్పీకర్‌ ఛాంబర్‌లో టీటీడీపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. తలసాని రాజీనామాను ఎప్పటిలోపు ఆమోదిస్తారో చెప్పాలని టీ టిడిపి ఎమ్మెల్యేలు 3గంటలుగా ఆందోళనలు చేసారు. ఎంతగా సర్ధిచెప్పినప్పటికి వినకపోవటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

 

20:13 - August 24, 2015

వరంగల్‌: జిల్లాలోని దేవరుప్పల మండలం కోలుకొండలో విషజ్వరాలపై 10 టీవీ వరుస కథనాలతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఇవాళ గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరపీడితులకు చికిత్స అందించారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి, జిల్లా కలెక్టర్‌ గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. జ్వరాల అదుపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. స్థానికులు సైతం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

 

19:57 - August 24, 2015

కృష్ణా: విజయవాడ లోక్‌సభ నియోజకవర్గంలోని 264 గ్రామాలను టాటా ట్రస్టు ఛైర్మన్‌ రతన్‌ టాటా దత్తత తీసుకున్నారు. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. రతన్‌టాటా రాష్ట్రానికి వస్తే పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని చంద్రబాబు అన్నారు. రతన్‌ టాటా చిత్తూరు, విశాఖ, ఇతర ప్రాంతాలకు కూడా రావాలని కోరారు. ఆక్వా, తయారీ రంగం, ఆటోమొబైల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో రతన్‌ టాటా ప్రోత్సాహం కావాలన్నారు. రాష్ర్టంలో వనరులకు లోటులేదని, పారిశ్రామిక వేత్తలే రావాల్సి ఉందని సీఎం తెలిపారు.

19:50 - August 24, 2015

కరీంనగర్: గ్రామంలోని ఆడబిడ్డలెవరూ.. నీటికోసం కష్టాలు పడొద్దని.. ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ముల్కనూరులో సీఎం కేసీఆర్ పర్యటించారు. అనంతరం అక్కడ నిర్వహించిన గ్రామ సభలో ప్రసంగించారు. గ్రామంలో వీధులు సరిగ్గా లేవన్నారు. ప్రతీ ఇంటి ముందు ఉపయోగపడే మొక్కలు నాటుకుందామని సూచించారు. స్థలం లేని పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. అంతకముందు గ్రామంలో సీఎం పర్యటించారు. గ్రామంలోని వార్డులన్నీ తిరిగి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులను కేసీఆర్ ప్రారంభించారు. స్థానిక చెరువులో శ్రమదానం చేశారు. ముల్కనూరు గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. వేగంగా పనులు పూర్తిచేయడంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. 

ఎల్ బీ నగర్ డీసీపీ పరిధిలో వాహనాల తనిఖీలు

హైదరాబాద్: ఎల్ బీ నగర్ డీసీపీ పరిధిలోని ఏడు పీఎస్ లలో పోలీసులు వాహనాల తనిఖీలను చేపట్టారు. నాలుగు వేలకు పైగా వాహనాలను తనిఖీ చేశారు. 500 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఆడబిడ్డలెవరూ.. నీటికోసం కష్టాలు పడొద్దు: సీఎం కేసీఆర్

కరీంనగర్: ముల్కనూరులో సీఎం కేసీఆర్ గ్రామ సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో వీధులు సరిగా లేవన్నారు. గ్రామంలోని ఆడబిడ్డలెవరూ.. నీటికోసం కష్టాలు పడొద్దని చెప్పారు. ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇస్తామని చెప్పారు. ప్రతీ ఇంటి ముందు ఉపయోగపడే మొక్కలు నాటుకుందామని సూచించారు.

 

తెలంగాణ స్పీకర్ ఛాంబర్ లో టిటిడిపి ఎమ్మెల్యేల బైఠాయింపు

హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ ఛాంబర్ లో టిటిడిపి ఎమ్మెల్యేల బైఠాయించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను ఎప్పుటి లోగా ఆమోదిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

19:19 - August 24, 2015

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ సందర్భం ప్రత్యేకం. అంతటి ప్రత్యేక సందర్భానికి వీలైనంత ఆడంబరంగా రెడీ అవటానికి అమ్మాయిలు ఇష్టం చూపుతారు. అలాంటి వారి కోసం వన్ గ్రాం గోల్డ్ లో బ్రైడల్ వేర్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చింది ఇవాళ్టి సొగసు.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:23 - August 24, 2015

రంగారెడ్డి: జీడిమెట్లలో సీపీఐ జాతీయనేత నారాయణ వినూత్న నిరసన తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకం, దళితులకు 3 ఎకరాల భూమి పథకం కోసం వచ్చిన అర్జీల మూటలను భుజంపై మోసుకెళ్లి ఎమ్మార్వోకు సమర్పించారు. ఎన్నికల వాద్ధానాలను టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అమలు చేయాలన్న డిమాండ్‌తో సీపీఐ నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేసి.. ఇప్పుడు మాట మార్చుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఆ విషయాన్ని నిరూపించకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని... నిరూపిస్తే కేసీఆర్‌ ఆత్మహత్య చేసుకుంటారా అని ప్రశ్నించారు.

 

18:11 - August 24, 2015

ఖమ్మం: భద్రాచలంలో విద్యార్థి లోకం కదం తొక్కింది. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్న డిమాండ్‌తో... ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. స్కాలర్‌షిప్‌, ఫీజ్‌ రియింబర్స్ మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు రెగ్యులర్‌ మెడికల్‌ చెకప్‌తో పాటు మెస్‌ఛార్జీలు పెంచాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని పెంచాలని డిమాండ్‌ చేశారు.

 

బీహార్ ఎన్నికల్లో ఐక్య వామపక్ష కూటమిగా పోటీ - ఏచూరి...

ఢిల్లీ : బీహార్ ఎన్నికల్లో ఐక్య వామపక్ష కూటమిగా పోటీ చేస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. నిత్యావసర ధరలు తగ్గించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. సెప్టెంబర్ 2న జాతీయ కార్మిక సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటిస్తోందని, అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత సమస్యలు, స్థితిగతులపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఏచూరి డిమాండ్ చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిర్వహించే బీజేపీ రహిత సీఎంల భేటీకి త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ హాజరవుతారని తెలిపారు.

ముగిసిన కృష్ణా బోర్డు వర్కింగ్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : కృష్ణా బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి 4.3 టీఎంసీల నీటి విడుదలకు కమిటీ నిర్ణయం తీసుకుంది. రోజుకు ఐదు వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు నీరు విడుదల చేయనున్నారు. తాగునీటికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చెరి సగం వినియోగించుకోవాలని కమిటీ సూచించింది. 

టాటా ట్రస్టుతో చారిత్రాత్మక ఒప్పందం - చంద్రబాబు..

విజయవాడ : టాటా ట్రస్టుతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంటున్నామని, టాటా ట్రస్టుకు పూర్తి సహకారం అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ దశలో టాటా రావడం సంతోషమని, పారిశ్రామిక వేత్తలకు రతన్ టాటా ఆదర్శమన్నారు. రతన్ టాటా లాంటి వ్యక్తుల సలహాలు, సూచనలు అవసరమన్నారు. పది లక్షల జనాభా వివరాలు సేకరించారని, విజయవాడ నియోజకవర్గం పరిధిలో 264 గ్రామాలని రతన్ టాటా దత్తత తీసుకున్నారన్నారు. వీటిని స్మార్ట్ విలేజ్ లుగా మార్చడానికి టాటా ముందుకొచ్చారని, విలువలతో కూడిన వ్యాపారానికి టాటా పెట్టింది పేరని కితాబిచ్చారు.

17:59 - August 24, 2015

హైదరాబాద్: కల్తీమద్యం తాగి ఎంతో మంచి చనిపోతున్నారని.. మంచి మద్యం పాలసీ తేవడమే తమ లక్ష్యమని మంత్రి పద్మారావు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. విష రసాయనాలతో గుడుంబా తయారు చేస్తున్నారని, అలాంటి సారా తాగి చాలామంది చనిపోతున్నారని మంత్రి పేర్కొన్నారు. గుడుంబాపై ప్రభుత్వం వార్ ప్రకటించిందని మంత్రి చెప్పారు. చీప్ లిక్కర్ తేవాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. కానీ చీప్ లిక్కర్ అంటూ ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. 

17:55 - August 24, 2015

పాట్నా : ప్రో కబడ్డీ లీగ్‌లో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన తెలుగు టైటాన్స్‌ జట్టు థర్డ్‌ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. పాట్నా పైరేట్స్‌తో ముగిసిన ఆఖరాటలో సునాయాస విజయం సాధించింది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరీ చెలరేగడంతో టైటాన్స్ జట్టుకు పోటీనే లేకుండాపోయింది. ప్రో కబడ్డీ లీగ్‌ రెండో సీజన్‌లో పటిష్టమైన తెలుగు టైటాన్స్‌ జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. మూడు, నాలుగు స్థానాల నిర్ణయాత్మక మ్యాచ్‌లోనూ టైటాన్స్‌ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. స్టార్‌ రైడర్ రాహుల్ చౌదరీ దూకుడు ముందు....పాట్నా పైరేట్స్ జట్టు మరోసారి తేలిపోయింది.

పోటీ ఇవ్వని పాట్నా జట్టు...
ప్రస్తుత సీజన్‌లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన టైటాన్స్‌ జట్టు తొలి సెమీఫైనల్‌లో బెంగళూర్‌ బుల్స్‌ జట్టు చేతిలో ఓడిపోవడంతో ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. మూడు, నాలుగు స్థానాల కోసం పాట్నా పైరేట్స్‌తో ముగిసిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టుకు అసలే మాత్రం పోటీనే లేకుండా పోయింది. పాట్నా జట్టు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడంతో మ్యాచ్‌ ఏకపక్షంగా ముగిసింది. ముంబైలోని నేషనల్‌ స్పోర్ట్స్ క్లబ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో...టైటాన్స్‌ జట్టు ఆట మొదటి నిమిషం నుంచే డామినేట్‌ చేసింది. రైడింగ్‌లో రాహుల్ చౌదరీ అంచనాలకు తగ్గట్టుగా అదరగొట్టడంతో...తెలుగు టైటాన్స్‌ జట్టు మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఆట తొలి భాగం ముగిసే సరికే 16 పాయింట్లు నమోదు చేసిన తెలుగు టీమ్‌...8 పాయింట్ల తేడాతో ఆధిక్యంలో నిలిచింది. సెకండ్‌ హాఫ్‌లోనూ తెలుగు టైటాన్స్ జట్టు షో కొనసాగింది.రాహుల్‌ చౌదరీ మరోసారి చెలరేగడంతో పాటు ప్రశాంత్‌ రాయ్ కూడా పాయింట్లు నమోదు చేయడంతో పాట్నా జట్టు ఏ దశలోనూ టైటాన్స్‌ జట్టుకు పోటీ ఇవ్వలేకపోయింది.

ఎనిమిది పాయింట్ల తేడాతో విజయం..
ఆట నిర్ణీత సమయం ముగిసే సరికి 34 పాయింట్లు నమోదు చేసిన తెలుగు టైటాన్స్‌ జట్టు....8 పాయింట్ల తేడాతో విజయం సాధించగా...పాట్నా జట్టు 26 పాయింట్లకే పరిమితమైంది.ఈ విజయంతో టైటాన్స్‌ జట్టు....ప్రో కబడ్డీ లీగ్‌ రెండో సీజన్‌ను మూడో స్థానంతో ముగించింది. తొలి సీజన్‌లో 5వ స్థానానికే పరిమితమైన తెలుగు టైటాన్స్‌ జట్టు....రెండో సీజన్‌లో మాత్రం అంచనాలకు మించి రాణించి మూడో స్థానంలో నిలవడం విశేషం.

17:51 - August 24, 2015

పాట్నా : ప్రో కబడ్డీ లీగ్ రెండో సీజన్‌ టైటిల్‌ను యూ ముంబా జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్‌లో పటిష్టమైన బెంగళూర్‌ బుల్స్‌ జట్టును చిత్తు చేసి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. గత సీజన్‌లో ఫైనల్‌ వరకూ వచ్చి చేతులెత్తేసిన ముంబై జట్టు.... రెండో సీజన్‌లో మాత్రం అంచనాలకు తగ్గట్టుగా అదరగొట్టి విజేతగా నిలిచింది.

లీగ్ దశలో 12 విజయాలు..
ధూమ్‌ ధామ్‌ లీగ్‌...ప్రో కబడ్డీ లీగ్ రెండో సీజన్‌ టైటిల్‌ను...పవర్‌ ప్యాకెడ్‌ యూ ముంబా జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్‌ ఫైట్‌లో పటిష్టమైన బెంగళూర్‌ బుల్స్‌ జట్టును చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచింది. గత సీజన్‌లో ఫైనల్‌ వరకూ వచ్చి చేతులెత్తేసిన ముంబై జట్టు రెండో సీజన్‌లో మాత్రం అంచనాలకు తగ్గట్టుగా అదరగొట్టి విజేతగా నిలిచింది. లీగ్‌ దశలో 12 విజయాలతో సంచలనం సృష్టించిన ముంబా జట్టుకు ఫైనల్స్‌లోనూ పోటీనే లేకుండాపోయింది.

ఆరంభం నుండే ఆధిపత్యం..
పోటీ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన ముంబై జట్టు - బెంగళూర్‌ జట్టుకు అవకాశమే ఇవ్వలేదు. మధ్యలో కాస్త తడబడినా కీలక సమయాల్లో పాయింట్లు సాధించి ముంబై జట్టు మ్యాచ్‌పై పట్టు బిగించింది. ముంబై రైడర్స్‌ షబ్బీర్‌ బాపు, కెప్టెన్‌ అనూప్‌ కుమార్‌ పోటీలు పడి మరీ పాయింట్లు నమోదు చేసి...జట్టును ఆధిక్యంలో నిలిపారు. దీంతో ఆట తొలి భాగం ముగిసే సరికే 16 పాయింట్లు నమోదు చేసిన ముంబై జట్టు...8 పాయింట్ల తేడాతో ఆధిక్యంలో నిలిచింది.

రెండో భాగంలోనూ ముంబై దూకుడు...
ఆట రెండో భాగంలోనూ ముంబై జట్టు దూకుడు కొనసాగింది. ఆఖరి 10 నిమిషాల్లో బెంగళూర్‌ బుల్స్‌ జట్టు ఆటగాళ్లు జోరు పెంచారు.రైడింగ్‌లో స్పీడ్‌ పెంచిన బుల్స్‌ కెప్టెన్‌ మంజీత్‌ చిల్లార్‌...పాయింట్లు సాధించి బెంగళూర్‌ జట్టును పోటీలో నిలిపాడు. కానీ ఆ తర్వాత ముంబై రైడర్స్‌ షబ్బీర్‌ బాపు, కెప్టెన్‌ అనూప్‌ కుమార్‌ ఆఖరి నిమిషంలో కీలక పాయింట్లు సాధించడంతో బెంగళూర్‌ జట్టుకు ఓటమి తప్పలేదు. ఆట నిర్ణీత సమయం ముగిసే సరికి 36 పాయింట్లు నమోదు చేసిన ముంబై జట్టు 6 పాయింట్ల తేడాతో బుల్స్‌ జట్టును చిత్తు చేసి విజేతగా నిలిచింది. 

17:50 - August 24, 2015

హైదరాబాద్: రాష్ట్ర సమస్యలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ 'ఆల్‌ ది బెస్ట్' చెప్పారు. మంచి ప్రకటనతో తిరిగిరావాలని కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే బీజేపీ ప్రభుత్వంపై ఉండవల్లి మండిపడ్డారు. అప్పుడు లోక్‌సభలో వాయిస్‌ వినిపించిన వెంకయ్య ఇప్పుడు కేవల ఆయన బొమ్మనే కనిపిస్తుందన్నారు. వెంకయ్యలేకపోతే ఏపీ ఏమయ్యేదోనని మోడీ అన్నారని..కానీ ఇప్పుడు వెంకయ్య వాయిస్‌ వినబడటం లేదని ఎద్దేవా చేశారు. ఏపీకి కాంగ్రెస్ పార్టీ అఘాయిత్యం చేస్తే...బీజేపీ ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. బీజేపీ మద్దతుతోనే విభజన బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేశారు. ప్రత్యేకహోదాను నేతలంతా అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.

17:48 - August 24, 2015

కొలంబో : శ్రీలంక కమ్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ...డబుల్ సెంచరీల స్పెషలిస్ట్ కుమార సంగక్కర శకం ముగిసింది. కొలంబో సారా ఓవల్ లో టీమిండియాతో జరిగిన రెండోటెస్ట్ నాలుగోరోజుఆటలో...సంగక్కర 18 పరుగులకు అవుట్ కావడంతో...రిటైర్మెంట్ పరిపూర్ణమయ్యింది. ఇప్పటివకే వన్డే, టీ20 ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగక్కర టెస్టుల్లో మరే ఇతర క్రికెటర్‌కూ సాధ్యం కాని అసాధారణ ఘనత, పలు అరుదైన ప్రపంచ రికార్డ్‌లు నమోదు చేసి ఆల్ టైమ్ గ్రేట్ గా నిలిచాడు. గత 15 ఏళ్లుగా టెస్ట్ క్రికెట్ కే వన్నె తెచ్చిన కుమార సంగక్కర్‌ టెస్ట్‌ కెరీర్‌పై టెన్‌ స్పోర్ట్స్‌ స్పెషల్‌ ఫోకస్‌.
కుమార సంగక్కర....టెస్ట్ క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ స్టార్ల ముందు వరుసలో ఉండే శ్రీలంక దిగ్గజం. గత 15 సంవత్సరాలుగా ప్రపంచ, శ్రీలంక క్రికెట్ కు అసాధారణ సేవలు అందించిన సంగక్కర కెరియర్ కు కొలంబో సారా ఓవల్ గ్రౌండ్స్ లో టీమిండియాతో ముగిసిన రెండోటెస్ట్ ద్వారా తెరపడింది. టెస్టుల్లో బ్యాట్స్‌మెన్‌గా మరే ఇతర క్రికెటర్‌కూ సాధ్యం కాని ఎన్నో అరుదైన రికార్డ్‌లు నెలకొల్పిన సంగక్కర ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. సొంత గడ్డపై కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్ట్‌ తో సంగక్కర 15 సంవత్సరాల క్రికెట్ జీవితం ముగిసింది.

అరుదైన రికార్డులు..
బ్యాట్స్‌మెన్‌గా టెస్టు ఫార్మాట్లో అరుదైన రికార్డులన్నీ సంగక్కర ఖాతాలోనే ఉన్నాయి. కొలంబో టెస్ట్ వరకూ 134 మ్యాచ్ లు ఆడిన కుమార సంగక్కర 38 సెంచరీలు,52 హాఫ్‌సెంచరీలతో 12400 పరుగులు నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో సంగక్కర నాలుగో స్థానంలో నిలిచాడు. అంతే కాదు టెస్టుల్లో అత్యధికంగా డబుల్‌ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లోనూ సంగక్కర రెండో స్థానంలో ఉన్నాడు. 12 డబుల్‌ సెంచరీలతో ఆల్‌ టైం గ్రేట్‌ బ్యాట్స్‌మెన్‌ సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా 11 డబుల్‌ సెంచరీలతో సంగక్కర ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు. టీమిండియాతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్ట్ మొదటి రెండు ఇన్నింగ్స్ తో పాటు కొలంబో టెస్ట్ లో సైతం టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కే సంగక్కర అవుట్ కావడం విశేషం. 

సచిన్ రికార్డు సైతం బద్దలు..
అంతేకాదు టెస్టుల్లో అత్యం వేగంగా 8,9,10,11,12వేల పరుగుల మైలురాయిని అధిగమించి బ్యాట్స్‌మెన్‌ కూడా రికార్డులు సంగక్కర పేరునే ఉన్నాయి. 224 ఇన్నింగ్స్‌ల్లోనే టెస్టుల్లో అత్యం వేగంగా 12వేల పరుగుల మైలురాయిని అధిగమించిన కుమార...ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. ఇక సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో అత్యధికంగా 190, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా కూడా సంగా రికార్డ్‌ సృష్టించాడు. ఈ వెటరన్ బ్యాట్స్‌మెన్‌ టెస్టుల్లో 14 సార్లు 190 పరుగులకు పైగా స్కోర్లు నమోదు చేశాడు.

చివరి టెస్టులో రాణించలేకపోయిన సంగ..
రిటైర్మెంట్‌ వయసు దగ్గర పడుతున్నా గత రెండేళ్లలోనే పలు అరుదైన ఇన్నింగ్స్‌ ఆడిన సంగక్కర తనలో స్టామినా ఏ మాత్రం తగ్గలేదని చాటి చెప్పాడు. క్రికెట్లో ఫామ్‌ ఈజ్‌ టెంపరరీ క్లాస్‌ ఈజ్‌ పర్మనెంట్‌ అని నిరూపించిన సంగక్కర కెరీర్‌లో ఆడుతున్న చివరి రెండు టెస్ట్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆఖరి నాలుగు ఇన్నింగ్స్ లో అత్యధికంగా 40 పరుగుల స్కోరు మాత్రమే నమోదు చేశాడు. క్రికెట్ కు సంగక్కర వీడ్కోలు చెప్పినా...క్రికెట్ చరిత్ర ఉన్నంతకాలం అతని రికార్డులు అభిమానులకు కలకాలం గుర్తుండిపోతాయి.

17:39 - August 24, 2015

చిత్తూరు: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా ఐనవెల్లిలో రూ.4 కోట్లతో యాత్రికుల వసతి సముదాయం నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాల కొనుగోళ్లకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. అలాగే రూ.17 లక్షల కిలోల ఆవు నెయ్యి కొనుగోలుకు రూ. 42 కోట్ల 92 లక్షలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అనధికారికంగా వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

నాణ్యమైన లిక్కర్ అందించడమే లక్ష్యం - పద్మారావు..

హైదరాబాద్ : నాణ్యమైన లిక్కర్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు వ్యాఖ్యానించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుడుంబా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, చీప్ లిక్కర్ ను కొత్తగా తయారు చేయడం లేదన్నారు. ధర తక్కువ మద్యమైనా గుడుంబా లాగా హానికరం కాదని చెప్పుకొచ్చారు. 

17:11 - August 24, 2015

ముంబై : ప్రేమకే కాదు పెళ్లికీ వయసుతో నిమిత్తం లేదంటున్నారు బాలీవుడ్‌ సెలబ్రిటీలు. అర్ధాంగి వయసులో కూసింతే కాదు చాలా గ్యాప్‌ ఉన్నా నో ప్రాబ్లమ్‌ అంటూ సంసార జీవితాన్ని సాఫీగా..హ్యాపీగా లాగించేస్తున్నారు. భర్త ఏజ్‌పాళ్లు తక్కువగా ఉంటేనేం లవ్వు పాళ్లు ఎక్కువగా ఉంటే చాలంటున్నారు. తమ ప్రేమకు, సంసార జీవితానికి ఏజ్‌గ్యాప్‌ ఆటంకం కాకపోగా మిగతా కపుల్స్‌ కంటే లైఫ్‌ బ్యూటీఫుల్‌గా ఉందంటున్నారు.

రాంపాల్ - మోహర్ల బంధం..
మోడలింగ్‌లో పరిచయమైన అర్జున్‌రాంపాల్‌, మెహర్ల బంధం ఏడడుగులు వేసేందుకు ఎంతో సమయం పట్టలేదు. తనకంటే వయసులో రెండేళ్లు పెద్దదైన మెహర్‌తో తన బంధం అద్భుతంగా ఉందని అర్జున్‌ చెప్పని సందర్భం లేదు. ఇద్దరు కూతుళ్లతో ఈ జంట హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.

రంగులమయం అంటున్న ఐష్, బచ్చన్..
అందానికే అందమైన ఐశ్వర్యరాయ్ అర్ధాంగికావడమే అదృష్టమనుకున్నాడు అభిషేక్‌బచ్చన్‌. అందుకే ఐష్‌ వయసులో తనకంటే రెండేళ్లు పెద్దదైనా ఓకే చెప్పేశాడు. వయసు తారతమ్యం సమస్య అవుతుందన్న వాదనను, జాతకాన్ని ఈ కపుల్ చెరిపేసింది. ఆరాధ్య రాకతో తమ జీవితం మరింత రంగులమయంగా మారిందంటోంది ఈ జంట.

లవ్లీ కపూల్ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా..
ఒకరు కింగ్ ఆఫ్‌ మనీ అయితే..మరొకరు క్వీన్ ఆఫ్‌ బ్యూటీ. సాగరకన్య శిల్పాశెట్టికి మొదటి నుంచి పిచ్చిఫ్యాన్‌ అయిన రాజ్‌కుంద్రా ఏమాత్రం ఆలస్యం చేయకుండా శిల్పాకూ ఓ ఫైన్‌ మార్నింగ్ ఐలవ్‌యు చెప్పేశాడు. కుంద్రా కంటే మూడు నెలల వయసు ఎక్కువున్న శిల్పా సెకను కూడా వేస్ట్‌ చేయకుండా ఓకే చెప్పేసింది. ఇప్పటికీ ఈ లవ్లీ కపుల్‌ ఏ రియాలిటీ షోలలో కనిపించినా తమ ప్రేమ మొదటి కంటే ఇప్పుడింకా రెట్టింపయ్యిందంటూ డ్యూయెట్లు పాడుతోంది.

రియల్ లైఫ్ లో ఫర్హాన్ భిన్నమే...
సింగర్‌గా, డైరెక్టర్‌గా, యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా విభిన్న పాత్రలు పోషిస్తున్న ఫర్హాన్‌ అక్తర్‌ రియల్ లైఫ్‌లోను అందరికంటే భిన్నమే అని ప్రూవ్‌ చేశాడు. బాలీవుడ్‌ కెరియర్‌ కంటే ముందే వయసులో తనకంటే ఆరేళ్లు పెద్దదైన అధునాను పెళ్లాడి మంచి భర్త అనిపించుకున్నాడు. తమిద్దరి జీవితంపై వయసు తేడా ప్రభావం లేదని చెప్తున్నాడు.

ఫరాఖాన్ కు ముగ్గురు పిల్లలు...
ప్రముఖ డైరెక్టర్‌ కం కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌ కూడా రియల్ లైఫ్‌లోను తన మార్క్‌ను చూపించింది. ఒకటి కాదు రెండు ఏకంగా ఎనిమిదేళ్లు చిన్నవాడైన శిరీష్‌ను పెళ్లాడి ఎలాంటి ఆటంకం లేకుండా జీవితాన్ని గడిపేస్తోంది. ఇప్పుడీ జంటకు ముగ్గురు పిల్లలు. సో..బీవీ బడీ హైతో క్యా హువా... ఇష్క్‌ ఇంటే చాలు అంటున్నాయి ఈ టాప్‌ ఐదు జంటలు.

16:51 - August 24, 2015

హైదరాబాద్ : ఆయన పేరు హ్యూమన్‌ కంప్యూటర్‌. అవును కంప్యూటర్‌ కంటే వేగంగా లెక్కలు చెప్పగలరు. ఎంత పెద్ద అంకెలిచ్చినా గుణించి ఆన్సర్‌ ఇచ్చేయగలరు. ఈ మేథస్సు పుట్టుకతో రాలేదు. పుట్టుకతో ఆయనకు అంధత్వం వచ్చింది. ఆయన నేత్రం గుడ్డిదైనా.. ఆయన మనోనేత్రం మాత్రం పవర్‌ఫుల్‌. ఈ ప్రతిభ వెనక ఎన్నో కష్టాలున్నాయి. మరెన్నో అవమానాలున్నాయి. ఒక్కో అవమానంలో ఆయనలోని ప్రతిభను రగిల్చితే.. ఎదురైనా ప్రతి కష్టం ఆయనలో పట్టుదల పెంచింది. తనకు అందనిదాన్ని కూడా అందుకోగల సామర్ధ్యాన్ని పెంచుకోగలిగారు. కర్ణాటక బెల్‌గాంలో పుట్టిన సిద్ధూ ఐఎఎస్‌ కావాలనుకుంటున్నారు. ఎన్నో అవార్డులు గెల్చుకున్న ఈయన ప్రస్తుతం ఓ కన్నడ ఛానెల్‌లో క్విజ్‌ ప్రోగ్రామ్‌ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తనను తాను అద్భుత ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దుకుని, హ్యుమన్‌ కంప్యూటర్‌గా బిరుదు పొందిన సిద్ధూ టెన్‌ టీవీతో మాట్లాడారు. జీవిత విశేషాల గురించి సిద్ధూ తెలియచేశారు.

16:50 - August 24, 2015

ముంబాయి: స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో భారీ పతనం చోటుచేసుకుంది. ఊహించని నష్టాలతో స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. మూడో అతిపెద్ద పతనంతో సోమవారం స్టాక్ మార్కెట్ పాలిట బ్లాక్ మండేగా పరిణమించింది.గ్లోబల్ మార్కెట్ దెబ్బకు బీఎస్ఈ సూచి సెన్సెక్స్ సుమారు 1624 పాయింట్లు పతనమై 25 వేల 742 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7809 పాయింట్ల కిందకు పతనమైంది. 490 పాయింట్లు పతనమైంది. నిఫ్టీలోని 50 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈలోని 500 షేర్లలో కేవలం 6 షేర్లు మాత్రమే నష్టాల బారిన పడకుండా ఉన్నాయి. బీఎస్ ఈ, ఎన్ ఎస్ లోని అన్ని సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు భారీగా పతనమయ్యాయి. నిఫ్టీలో ఎన్ ఎమ్డీసీ షేరుకు మాత్రమే లాభాలు వచ్చాయి. డాలర్ మారకపు విలువ 88 పైసలు తగ్గి రూ. 66.70 కు పెరిగింది. స్టాక్ మార్కెట్ కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు పైగా నష్టపోయినట్టు అంచనా. ఏడున్నరేళ్లలో ఇదే అతిపెద్ద నష్టం కాగా, స్టాక్ మార్కెట్ చరిత్రలో మూడోది. మార్కెట్ల పతనానికి చైనా ఆర్థిక వ్యవస్థ కారణమని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు. మార్కెట్ల పతనంపై ఆందోళన అనవసరమని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాల్సి ఉందన్నారు.

 

మార్కెట్ల పతనానికి ప్రపంచ సంక్షోభం కారణమంట..

ఢిల్లీ : స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్ల సంక్షోభం కారణంగానే మార్కెట్లు కుప్పకూలాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. 

ఏపీ ఉన్నత విద్యామండలికి హైకోర్టు నోటీసులు...

హైదరాబాద్ : ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టులో న్యాయవాది పిల్ దాఖలు చేశారు. కడపలో ఒత్తిడి వల్లే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పిల్ లో పేర్కొన్నారు. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ఉన్నత విద్యామండలికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

ముగిసిన టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం..

తిరుపతి : టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. నిత్యావసర కొనుగోళ్లకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా ఐనవెల్లిలో రూ.4కోట్లతో వసతి సముదాయం ఏర్పాటు చేయాలని, 17 లక్షల కిలోల ఆవునెయ్యి కొనుగోలుకు రూ.42.92కోట్లు, కందికప్పు కొనుగోలు కు రూ.4.13 కోట్లు కేటాయించింది. అనధికారికంగా వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సకాలంలో వర్షాలు కురవాలని విస్తృతంగా వరుణయాగాలు చేయాలని మండలి నిర్ణయం తీసుకుంది. టిటిడి శ్వేత డైరెక్టర్ గా తాళ్లూరు ఆంజనేయులు, టిటిడి శ్వేత హెచ్ఆర్డీగా చంద్రశేఖర్ లు నియమితులయ్యారు. 

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1625, నిఫ్టీ 490 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడయ్యాయి. ఆరు శాతం సెన్సెక్స్, నిఫ్టీలు పడిపోయాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 66.59గా ఉంది. రూ.3లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్లు నష్టపోయారు.

బాబుకు బెస్టాఫ్ లక్ చెప్పిన ఉండవల్లి...

హైదరాబాద్ : ఢిల్లీ వెళుతున్న బాబుకు కాంగ్రెస్ నేత ఉండవల్లి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. మంచి ప్రకటనతో బాబు తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ మద్దతుతోనే విభజన బిల్లు ఆమోదం పొందిందని, ఇప్పుడు మా ప్రమేయం లేదని వెంకయ్య పేర్కొంటున్నారని తెలిపారు. బీజేపీ మద్దతుతోనే ఏపీ గొంతు కోశారని, కాంగ్రెస్ కు ఏపీలో ఘోర అవమానం జరిగిందన్నారు. తాడేపల్లి గూడెం సభలో వేదికపై ఉన్న వారిని వెంకయ్య అవమానించారని ఆరోపించారు. పార్టీలు మారకూడదని చట్టంలో ఎక్కడా లేదని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాకు ఏ కమిటీకి ఒప్పుకోలేదనంటున్న వారు రాష్ట్ర విభజనకు ఏ కమిటీ సిఫార్సు చేసిందని ప్రశ్నించారు.

పోలవరం నిర్వాసితుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ...

హైదరాబాద్ : కొత్త భూ సేకరణ చట్టం ద్వారా పరిహారం ఇప్పించాలని పోలవరం నిర్వాసితులు వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథార్టీకి కేంద్ర జలసంఘం, గ్రామీణ ట్రిబ్యునల్ మినిస్టరీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణనను 4వారాలకు వాయిదా వేసింది. కాంట్రాక్టర్ల నుండి బెదిరింపులు వస్తున్నాయని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. పిటిషనర్ కు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది.

చీప్ లిక్కర్ పై ప్రతిపక్షాల రాద్ధాంతం - తలసాని..

నిజామాబాద్ : చీప్‌లిక్కర్‌పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. రాష్ట్రంలో సారా మహమ్మారిని పారద్రోలడానికే చీప్‌లిక్కర్‌ను తీసుకొస్తున్నామని చెప్పారు. 

ముండ్రాయి గ్రామాన్ని దత్తత తీసుకున్న హరీష్..

మెదక్ : నంగనూర్ మండలంలోని ముండ్రాయి గ్రామాన్ని మంత్రి హరీష్‌రావు గ్రామజ్యోతిలో భాగంగా దత్తత తీసుకున్నారు. సోమవారం ముండ్రాయిలో హరీష్‌రావు పర్యటించారు. ముండ్రాయిని గంగదేవిపల్లిలా ఆదర్శగ్రామంగా చేస్తానని వెల్లడించారు. 

16:09 - August 24, 2015

కొలంబో: క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరను అత్యున్నత పదవి వరించింది. బ్రిటన్‌లో శ్రీలంక హై కమీషనర్‌గా సంగక్కర నియమితులయ్యాడు. సారా ఓవల్ స్టేడియంలో జరిగిన సంగ వీడ్కోలు సభలో పాల్గొన్న లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ ప్రకటన చేశారు. 15 ఏళ్ళుగా క్రికెట్‌కు సంగ చేసిన సేవలు చిరస్మరణీయమని, అత్యుత్తమ క్రికెటర్లలో సంగ ఒకరని సిరిసేన కొనియాడారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సంగ ఐదవ వాడు. టెస్టు క్రికెట్‌లో 11 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ సంగక్కర.

నిజామాబాద్ స్మార్ట్ సిటీకి ప్రయత్నం - ఎంపీ కవిత..

నిజామాబాద్ : నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నిజామాబాద్ అభివృద్ధి కుంటుపడిందన్నారు. 

అసంఘటిత కార్మికులకు త్వరలో స్మార్ట్ కార్డులు..

నిజామాబాద్ : దేశంలోని అసంఘటిత కార్మికులకు త్వరలోనే స్మార్ట్‌ కార్డులు అందిస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. దేశంలో 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని, వీరికి సామాజిక భద్రత కల్పిస్తున్నామన్నారు.

ఈతకెళ్లి బాలుర దుర్మరణం..

ఆదిలాబాద్ : నిర్మల్‌లోని విశ్వనాథపేటలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న చెరువులో ఈతకెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులను అహ్మద్(14), సులేమాన్(15)గా పోలీసులు గుర్తించారు.

15:17 - August 24, 2015

చుట్టూ జరుగుతున్న అనేక ఘటనలు మనకు అనేక అనుభవాలను పంచుతాయి. ఆ అనుభవాలు కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. అలాంటి ఆలోచనలు కొత్త కార్యచరణకు శ్రీకారం చుడతాయి. అవే ఆలోచనలు నలుగురిలో భిన్నంగా నిలబెడతాయి. అలా నలుగురికీ భిన్నంగా ఆలోచిస్తూ మరో నలుగురికి చేయూతనందిస్తున్న అతివ కథనంతో ఇవాళ్టి స్ఫూర్తి మీ ముందుకు వచ్చింది.
వృద్ధుల కళ్లల్లో వెలుగులు
జీవితం చాలా చిన్నది. అలాంటి జీవితంలో ఎన్నో మలుపులు. కొన్ని మలుపులు ఆనందాన్నిస్తే మరికొన్ని విషాదాన్ని నింపుతాయి. అలాంటి విషాదం నుండి బయట పడి జీవిత చరమాంకం వరకూ ప్రతి ఒక్కరి జీవితం సాఫీగా సాగిపోవాలి. అలా సాఫీగా సాగిపోవటానికి, ఆనందంగా ఉండటానికి మలి సంధ్యలో ఉన్న వారందరికి తగిన ఆదరణ కావాలి. అలాంటి ఆదరణను చేరువ చేస్తూ వృద్ధుల కళ్లల్లో డాక్టర్ విజయలక్ష్మి వెలుగులు చూస్తున్నారు. 
వృద్ధాశ్రమాల ఏర్పాటు..
సంఘజీవి అయిన మనిషి ఎప్పుడూ నలుగురి మధ్యలో ఉండాలనుకుంటాడు. ఉద్యోగాల పేరుతో క్షణం తీరిక లేని ప్రస్తుత యువత తల్లిదండ్రులకు, ఇంట్లో పెద్ద వారికి సమయం కేటాయించడం అరుదు. ఈ నేపథ్యం వృద్ధాశ్రమాల సంఖ్యను పెంచుతోంది. తప్పనిసరి పరిస్థితులలో తల్లిదండ్రులను ఇక్కడ చేరుస్తున్నప్పటికీ సౌకర్యాల లేమి వారిని బాధిస్తుంటుంది. అలాంటి లోటు లేకుండా వృద్ధులకు చేయూతనిస్తున్న విజయలక్ష్మి సేవలు మరెంతో మందికి చేరాలని మానవి ఆశిస్తోంది.


 

కొత్త రాజధానికి వెళ్లేందుకు సిద్ధమన్న రెవెన్యూ సంఘాలు..

హైదరాబాద్ : కొత్త రాజధానికి వెళ్లేందుకు సిద్ధమని ఏపీ రెవెన్యూ సంఘాలు ప్రకటించాయి. నివాసవసతి కల్పిస్తే చెట్టు కిందైనా పనిచేస్తామన్నారు. 

జగన్ కు రాజధాని కట్టడం ఇష్టం లేదు - గాలి..

హైదరాబాద్ : జగన్ కు రాజధాని కట్టడం ఇష్టం లేదని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు పేర్కొన్నారు. భూమిలిచ్చేందుకు రైతులు స్వచ్చందంగా ముందుకొచ్చారని తెలిపారు. 

కొత్త రాజధానికి వెళ్లేందుకు సిద్ధమన్న రెవెన్యూ సంఘాలు..

హైదరాబాద్ : కొత్త రాజధానికి వెళ్లేందుకు సిద్ధమని ఏపీ రెవెన్యూ సంఘాలు ప్రకటించాయి. నివాసవసతి కల్పిస్తే చెట్టు కిందైనా పనిచేస్తామన్నారు. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 31వ తేదీన ఉదయం 9.30గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల అజెండా తేదీలను బీఏసీలో స్పీకర్ ఖరారు చేయనున్నారు. 

13:33 - August 24, 2015

హైదరాబాద్ : పోలవరం ముంపు మండలాల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లిన సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకొని ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎంపీ మిడియం బాబురావుతో సహా పలువురు నేతలను బలవంతంగా అరెస్ట్ చేశారు. విలీన మండలాల్లో టీచర్లు, డాక్టర్లు, ఉద్యోగులను నియమించాలని ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. వెంటనే గవర్నర్‌ జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు.

13:31 - August 24, 2015

హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరంలోపల డీఎస్సీని నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లల్లో ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు అందాయని...కానీ ఇప్పటికిప్పుడు డీఎస్సీ నిర్వహించలేని పరిస్థితి నెలకొందన్నారు. అయితే స్కూళ్లలో ఉన్న ఖాళీలను ఈ ఏడాది విద్యావాలంటీర్లతో తక్షణమే భర్తీ చేస్తామన్నారు. 

13:31 - August 24, 2015

హైదరాబాద్ : ఉల్లిగడ్డ కన్నీరు పెట్టిస్తోంది. ఎందుకంటే మార్కెట్ లో దీని రేటు భారీగా పెరుగుతోంది. ఒక్కసారిగా పెరిగిపోయిన ఉల్లిగడ్డలను చూసిన సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం 'సబ్సిడీ ఉల్లిగడ్డ 'లను అందచేయడానికి నిర్ణయం తీసుకుంది. ఏదైనా గుర్తింపు కార్డు చూపెట్టి రెండు కిలోల ఉల్లిగడ్డలను పొందవచ్చునని ప్రభుత్వం సూచించింది. రెండు కిలోలు ఏమి చేసుకోవాలె.. ఎప్పటి వరకు ఇవి వస్తాయి అంటూ ప్రశ్నించారు. అదే దక్కితే మేలని భావించిన వినియోగదారులు ఉల్లిగడ్డల కోసం భారీగా ఎగపడుతున్నారు. కొంతమంది ఒకసారి తీసుకున్న తరువాత మరొకసారి ఉల్లిగడ్డలను కొనుక్కుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. వినియోగదారుల రద్దీని అదుపు చేయడానికి, మళ్లీ మళ్లీ రాకుండా ఉండేందుకు ఎర్రగడ్డ రైతు బజార్ వాళ్లు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. సబ్సిడీ ఉల్లిని కొనాలంటే గుర్తింపు కార్డుతో పాటు వేలికి సిరా గుర్తు పెడుతున్నారు. మళ్లీ మళ్లీ రాకుండా, దళారుల బెడద రాకుండా ఉండేందుకు ఈ పద్ధతికి శ్రీకారం చుట్టారు. 

13:29 - August 24, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డైట్‌సెట్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఆగస్టు 9న డైట్‌సెట్‌లో పరీక్షలో మొత్తం 1లక్షా 5వేల 382 మంది అభ్యర్ధులు హాజరుకాగా..అందులో 71,315 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి ప్రకటించారు. ఇక ఉత్తీర్ణతా శాతం 67.67గా ఉందన్నారు. తెలుగులో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సుమన మొదటి ర్యాంకు సాధించారని..ఉర్దూ మీడియంలో నిజామాబాద్‌ చెందిన ఆశ్రాకు తొలి ర్యాంకు సాధించారని మంత్రి తెలిపారు. 

13:27 - August 24, 2015

హైదరాబాద్ : కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఏపి విద్యాశాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు అన్నారు. ఉదయం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఘంటా శ్రీనివాసరావులు వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ర్యాగింగ్‌పై స్పందిస్తూ..ఇకనుండి ఎవరైనా ర్యాగింగుకు పాల్పడితే వారు మరో దగ్గర చదవడానికి వీలులేకుండా చర్యలు తీసుకొవడంతో పాటు..వారిపై నిర్బయ,ర్యాగింగ్ యాక్టులు ప్రయోగిస్తామని హెచ్చరించారు. 

13:25 - August 24, 2015

హైదరాబాద్ : బంధుత్వం లేదు సరికదా కనీసం మహిళ అన్న విచక్షణ కూడా లేదు. కండబలం ఉందికదా అని తన గూండాయిజాన్ని ప్రదర్శించాడు. చిత్తూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. పొలం విషయంలో బావ, మరదలి మధ్య తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. పొలం వివాదంలో ప్రశ్నించినందుకు అహం దెబ్బతిన్న నాగభూషణం వరుసకు మరదలైన మహిళపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. జుట్టుపట్టుకొని మరీకొట్టాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు కన్నెర్ర..

మహబూబ్ నగర్ : జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక మాఫియా వెనుకనున్న నేతలపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆలంపూర్, దేవరకద్ర, కల్వకుర్తిలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని పిటిషన్ దాఖలైంది. రైతులను బెదిరిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. కేసులు నమోదు చేశామని మహబూబ్ నగర్ ఎస్పీ పేర్కొన్నారు. 

13:17 - August 24, 2015

హైదరాబాద్ : టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కుదిరింది. పవన్ కల్యాణ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. హిట్ సినిమాల నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పేరుగడించిన దిల్ రాజు.. పవన్ కల్యాణ్ తో సినిమా చేయడం ఇదే మొదటిసారి. 'పవర్ స్టార్ తో సినిమా ఓకే అయింది. మంచి స్క్రిప్ట్ తోపాటు సమర్ధుడైన దర్శకుడి కోసం అణ్వేషిస్తున్నా' అని నిర్మాత దిల్ రాజు సోమవారం ఓ జాతీయ మీడియా సంస్థకు చెప్పారు.

    ఎంతోకాలం నుంచి పవన్ తో సినిమా చేయాలనుకుంటున్నట్లు, ఇన్నాళ్టికి అది కార్యరూపం దాల్చడంతో ఆనందంగా ఉన్నట్లు రాజు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాను ప్రస్తావిస్తూ.. 'నిజానికి చిరంజీవిగారి 150 సినిమాను నేనే తీద్దామనుకున్నా. కానీ వాళ్లబ్బాయి రాంచరణ్ ఆ అవకాశాన్ని ఎవ్వరికీ ఇవ్వదల్చుకోలేదు.

    అయితే నిర్మాతగా కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా ఆ సినిమాలో నాదైన పాత్రను పోశిచాలనుకుంటున్నా. చిరంజీవి 150వ సినిమాను నైజాం ఏరియాలో నేనే పంపిణీ చేస్తా' అని పేర్కొన్నారు. స్క్రిప్ట్, దర్శకుడు ఓకే అయిన పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానన్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ (గబ్బర్ సింగ్- 2) షూటింగ్ లో పాల్గొంటున్నారు.

త్వరలో విద్యావాలంటీర్ల నియామకం..

హైదరాబాద్ : త్వరలో కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్యావాలంటీర్ల నియామకం చేపడుతామని మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. టీచర్ల క్రమబద్దీకరణ కొలిక్కి వచ్చిందన్నారు. 

విద్యార్థుల ఆత్మహత్యలపై గంటాకు కమిటీ నివేదిక..

కడప : విద్యార్థుల ఆత్మహత్యలపై మంత్రి గంటాకు కమిటీ నివేదిక అందచేసింది. నివేదిక పరిశీలించాక చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గంటా పేర్కొన్నారు. 

తాగి వాహనాలు నడుపవద్దు - బాబుమోహన్..

హైదరాబాద్ :మద్యం సేవించి వాహనాలను నడుపవద్దని ఎమ్మెల్యే బాబుమోహన్ సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి బాబు మోహన్ కౌన్సెలింగ్ ఇచ్చారు. కొడుకును గుర్తు చేసుకున్న బాబుమోహన్ కంటతడి పెట్టారు. 

కృష్ణాయపాలెంలో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పర్యటన..

గుంటూరు : కృష్ణాయపాలెంలో గ్రామ కంఠాలను మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. 29వ తేదీలోగా గ్రామకంఠాల సమస్యలను పరిష్కరిస్తామని, ఇళ్ల మధ్యనున్న స్థలాలను గ్రామకంఠాల కింద వదిలేస్తామని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. రైతులు ప్రలోభాలకు లొంగకూడదని, అందరికీ నచ్చే విధంగా రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు. 

ఇందిరా భవన్ లో ఏపీ కాంగ్రెస్ సమావేశం..

హైదరాబాద్ : ఇందిరా భవన్ లో ఏపీ కాంగ్రెస్ విస్తృత సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, సి.రామచంద్రయ్యలు హాజరయ్యారు. పార్టీ బలోపేతం, ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చిస్తున్నారు. 

రతన్ టాటాతో బాబు భేటీ..

విజయవాడ : టాటా ట్రస్టు ఛైర్మన్ రతన్ టాటా విజయవాడకు చేరుకున్నారు. ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. పలు ప్రాజెక్టులపై వీరిద్దరూ చర్చిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయంలో రతన్ టాటాకు విజయవాడ ఎంపీ కేశినేని నాని, టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. 

12:50 - August 24, 2015

హైదరాబాద్ : అత్యాధునిక టెక్నాలజీతో కృత్రిమ అవయవాల తయారీ రోజు రోజుకి పెరిగిపోతుంది. 8ఏళ్ల బాలుడికి కృత్రిమ చెవిని విజయవంతంగా అమర్చిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వరుస శస్త్రచికిత్సల ద్వారా భారత సంతతికి చెందిన డాక్టర్‌ అనంతమూర్తి..8ఏళ్ల బాలుడిలో పక్కటెముకల మృధులాస్థి నుంచి బాహ్య చెవులను విజయవంతంగా అభివృద్ధి చేశారు. అమెరికాకు చెందిన ఎలిజాబెల్‌ అనే బాలుడు అరుదైన బైలాటరల్‌ అట్రేసియా మైక్రోషియా అనే లోపంతో జన్మించాడు. బాహ్య చెవులు అభివృద్ధి చెందకుండా ఉండడం దీని ప్రత్యేకత. మధ్య, లోపలి చెవులు అభివృద్ధి చెందినప్పటికి వాటిలోకి శబ్దాలు ప్రవేశించే మార్గాలు బెల్‌లో లేవు. భారత సంతతికి చెందిన డాక్టర్‌ అనంత్‌మూర్తి బెల్‌ పక్కటెముకల మృధులాస్థి నుంచి బాహ్య చెవులను అభివృద్ధి చేశారు. బెల్‌కు నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచి చికిత్స ప్రారంభించిన మూర్తి..ఈ ఏడాది జూలై 28న ఐదో శస్త్రచికిత్స ద్వారా బాహ్య చెవులను అభివృద్ధి చేశారు. 

12:48 - August 24, 2015

హైదరాబాద్ : బంధన్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. ఆదివారం కోల్‌కతాలో బంధన్‌ బ్యాంక్‌ను కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 501 శాఖలు, 2022 సేవా కేంద్రాలు, 50 ఏటీఎంలతో బ్యాకింగ్‌ సేవలకు శ్రీకారం చుట్టింది. పశ్చిమబంగలో పారిశ్రామికవేత్తల సంఖ్యను పెంచేందుకు బంధన్‌ బ్యాంక్‌ తోడ్పడుతుందని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. 

12:46 - August 24, 2015

విశాఖ : కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మోడికి గుణపాఠం చెప్పేందుకే సెప్టెంబర్2న అన్ని కార్మిక సంఘాలు సమ్మె చేపడుతన్నట్లు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎంఎ గఫూర్ తెలిపారు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని విశాఖలో కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఏ హయాంలో ప్రవేశ పెట్టిన నూతన ఆర్థిక విధానాలపై గతంలో 15 సార్లు కార్మికులు దేశ వ్యాప్త సమ్మెలు చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు వచ్చిన మోడీ ప్రభుత్వం అస్సలు ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా చేయాలని చూస్తోందని మండి పడ్డారు. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రప్రభుత్వంపై కార్మిక సంఘాలు సమరశంఖం పూరించాయని... సెప్టెంబర్‌ 2న జరుగుతున్న సమ్మెలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని తమ నిరసన తెలియజేసేందుకు సమాయత్తం అవుతున్నారని గఫూర్ తెలిపారు.

12:42 - August 24, 2015

మహబూబ్ నగర్ : ఏంటీ కోడిగుడ్డుపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటీ ? ఆయనకు గుడ్డు పెట్టలేదనా ? లేక ఇంకేమన్నా జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తడం సహజం కానీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసింది అధికారులపై. అవును మహబూబ్ నగర్ జిల్లాలోని కిషన్ బాగ్ లో 'గ్రామజ్యోతి' కార్యక్రమంలో నరసింహన్ పాల్గొన్నారు. ఆయనతో పాటు కేటీఆర్, జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక హాస్టల్ ను గవర్నర్ సార్ సందర్శించారు. అక్కడున్న విద్యార్థులతో మాట కలిపారు. వారానికి ఎన్నిసార్లు కోడిగుడ్డు పెడుతున్నారని గవర్నర్ ప్రశ్నించారు. ఒక్కరోజే పెడుతున్నారని విద్యార్థులు చెప్పడంతో నరసింహన్ ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. ఈ పరిస్థితి ఇక్కడే ఉందా ? లేదా జిల్లా మొత్తం ఉందా తెలుసుకోవాలంటూ అక్కడనే కలెక్టర్ కు హుకుం జారీ చేశారు. గవర్నర్ పర్యటనతో ఈ విషయం బయటకు తెలిసింది. మొత్తానికి గవర్నర్ మొత్తానికి గవర్నర్ గ్రామజ్యోతి పేద విద్యార్థులకు మేలు చేసిందని పలువురు పేర్కొన్నారు. 

12:40 - August 24, 2015

కొలంబో :  శ్రీలంకపై కోహ్లీ సేన ఘన విజయం సాధించింది. గెలవాల్సిన మొదటి టెస్టును తృటిలో చేజార్చుకున్న 'యువ భారత్' ఆ కసిని రెండో టెస్టులో చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ లంకతో ఓ ఆటాడుకుంది. ఈ టెస్టును గెలిచి సంగక్కరకు వీడ్కోలు బహుమతిగా ఇవ్వాలనుకున్న లంకేయుల ఆశలను కోహ్లీ సేన అడియాసలు చేసింది. 
రహానే స్పూర్తిదాయక శకతం, అశ్విన్ సూపర్ స్పెల్ తో రాణించడంతో టీమిండియా లంకపై ప్రతీకారం తీర్చుకుంది. అదిరే ఆరంభంతో మ్యాచ్ పై తిరుగులేని పట్టు సాధించిన భారత్ అదే ఆటతీను కనబరిచి లంకేయులపై 278 పరుగుల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఈ విజయంతో సిరీస్ ను 1-1తో సమం చేసింది. కెప్టెన్ గా కోహ్లీకి తొలి విజయం కాగా 13 నెలల్లో భారత్ కు తొలి విజయం సాధించినట్లైంది. 

అశ్విన్ మాయాజాలానికి కుప్పకూలిన లంక..
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ 72/2 స్కోరుతో ఆటను ఆరంభించింది. కానీ ఆరంభంలోనే మాథ్యూస్ 23 పరుగులకు పెవిలియన్ చేరాడు. ఓపెనర్ కరుణారత్నే మాత్రం భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. అడపాదడప షాట్లు కొడుతూ స్కోరు వేగాన్ని పెంచేందుకు కృషి చేశాడు. కానీ మిగతా బ్యాట్స్ మెన్స్ అతడికి ఏమాత్రం సహకరించలేకపోయారు. అశ్విన్ బౌలింగ్ కు లంక ప్లేయర్లు పేక మేడలా కూలిపోయారు. చండిమాల్ (15), తిరుమన్నే (11), ముబరక్ (0), ప్రసాద్ (0), హెరాత్ (4 బ్యాటింగ్), కౌశాల్ (5), చమీరా (4) పరుగులు చేశారు.

భారత్ తొలి ఇన్నింగ్స్ : 393 ఆలౌట్ (రాహుల్ 108, శర్మ 79, కోహ్లీ 78, సాహా 56)
శ్రీలంక బౌలింగ్ : హెరాత్ 81/4, ప్రసాద్ 84/2, మాథ్యూస్ 24/2, చమీరా 72/2.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 306 ఆలౌట్ ( మాథ్యూస్ 102, తిరుమన్నే 62, సిల్వా 51, సంగక్కర 32)
భారత్ బౌలింగ్ : మిశ్రా 43/4, శర్మ 68/2, అశ్విన్ 76/2, యాదవ్ 67/1, బిన్ని 44/1
భారత్ రెండో ఇన్నింగ్స్ : 325/8 డిక్లేర్డ్ (రహానే 126, విజయ్ 82, శర్మ 34)
శ్రీలంక బౌలింగ్ : కౌశాల్ 118/4, ప్రసాద్ 43/4
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ : 134 ఆలౌట్.. (కరుణారత్నే 46)
భారత్ బౌలింగ్ : అశ్విన్ 42/5, యాదవ్ 18/1, శర్మ 41/1, మిశ్రా 29/3.

12:39 - August 24, 2015

హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కిషన్‌నగర్‌ గ్రామంలో నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా.. లేదా.. అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహార వివరాలను సైతం తెలుసుకున్నారు. గ్రామస్తులకు ఉన్న పింఛన్‌, పౌరసరఫరాల సమస్యలను మంత్రి కేటీఆర్‌ పరిష్కరించారు. 

12:37 - August 24, 2015

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ మైనారిటీ నేత, మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీం బిన్‌ మస్కతి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మస్కతి ఈరోజు కన్నుమూశారు. మస్కతి మృతి పట్ల చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. అలేజాకోట్లలోని మస్కతి నివాసగృహానికి వెళ్లిన చంద్రబాబు.. కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయంత్రం కర్మన్‌ఘాట్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పాతబస్తీలోని మైనారిటీ వర్గాల్లో మంచిపట్టున్న మస్కతి... యాకత్‌పురా నియోజకవర్గంలో ఎంఐఎం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్‌ ఓవైసీతో మస్కతి సన్నిహితంగా మెలిగేవారు. 2002లో ఎంఐఎంను విభేదించి టీడీపీలో చేరారు. మస్కతి ఎమ్మెల్సీగా కూడా సేవలందించారు. అంతేకాకుండా మస్కతి డెయిరీ ఫామ్‌ను నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. 

12:35 - August 24, 2015

హైదరాబాద్ : చీప్‌లిక్కర్‌కు వ్యతిరేకంగా నాంపల్లి ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తెలుగు మహిళా కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ టీడీపీ అధ్యక్షుడు కృష్ణయాదవ్, ఎమ్మెల్యే గోపినాథ్‌ ఇతర నేతలు చీప్‌లిక్కర్‌ పాలసీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

12:33 - August 24, 2015

హైదరాబాద్ : అనంతపురంలో జరిగిన నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘటనలో ఐదుగురు మృతిచెందడం బాధాకరమని రాష్ట్ర మంత్రి పరిటాల సునీత అన్నారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతిచెందిన ఐదుగురిలో దేవదుర్గ్‌ ఎమ్మెల్యే వెంకటేశం ఉండడం మరింత దిగ్బాంత్రి కలిగించిందని మంత్రి అన్నారు. ఈఘటనలో లారీ డ్రైవర్‌ పరారయ్యాడని..క్లీనర్‌ మృతిచెందాడని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఐదుగురి మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ..పోస్టింగులు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసి కొత్త పోస్టింగ్ లు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కార్యాలయ జాయింట్ సెక్రటరీగా అడుసుమిల్లి రాజమౌళిని నియమించారు. 

డీఈఈ సెట్ ఫలితాల విడుదల..

హైదరాబాద్ : డీఈఈ సెట్ ఫలితాలను మంత్రి కడియం విడుదల చేశారు. ఉత్తీర్ణత శాతం 67.67. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విద్యార్థి సుమనకు మొదటి ర్యాంకు రాగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సుమలతకు రెండో ర్యాంకు సాధించింది. సెప్టెంబర్ మొదటి వారంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మంత్రి కడియం పేర్కొన్నారు. 

12:16 - August 24, 2015

హైదరాబాద్ / రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటి పిలుపు ఇచ్చింది. అందులో భాగంగా రంగారెడ్డి. హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించేందుకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు యత్నించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలు మాట్లాడుతూ...మద్యానికిచ్చే ప్రేయారిటీ ఫీజు రీయింబర్స్ ఇవ్వడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న నేతలను, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

రంగారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించిన ఎస్ఎఫ్ఐ..

రంగారెడ్డి : లకడీకపూల్ లో ఉన్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ఎస్ఎఫ్ఐ నేతలు ముట్టడించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ను విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. వెంటనే ఫీజు రీయిబర్స్ మెంట్ ను విడుదల చేయాలని, లేనిపక్షంలో ఆందోళలనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఎన్నోమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోందని, సమస్యను పరిష్కరించకపోతే నిరహార దీక్షలు చేపడుతామన్నారు. మద్యం, గ్రామ జ్యోతిలపై ఉన్న శ్రద్ధ ఫీజు రీయింబర్స్ మెంట్ పై లేదని మండిపడ్డారు. భారీగా వచ్చిన ఎస్ఎఫ్ఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

గ్రామజ్యోతిలో గవర్నర్..

మహబూబ్ నగర్ : షాద్ నగర్ (మం) కిషన్ నగర్ లో గ్రామజ్యోతి కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జూపల్లి, ఎమ్మెల్యే అంజయ్యలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సమస్యలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. 

సీపీఎం ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు..

హైదరాబాద్ : పోలవరం ముంపు మండలాల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం నేతలు నిర్వహించ ప్రదర్శననను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రాజయ్య, మాజీ ఎంపీ బాబురావుతో సహా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంపు మండలాల సమస్యలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. 

చినముల్కనూరులో సీఎం కేసీఆర్ పర్యటన..

కరీంనగర్ : చినముల్కనూరులో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ముల్కనూరులో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరంజరిపిన పాదయాత్రలో కేసీఆర్ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 

పోలవరం ముంపు మండలాల సమస్యలపై సీపీఎం ప్రదర్శన..

హైదరాబాద్ : పోలవరం ముంపు మండలాల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ప్రదర్శన నిర్వహించింది. ఖైరతాబాద్ చౌరస్తా నుండి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించింది. ఎమ్మెల్యే రాజయ్య, మాజీ ఎంపీ బాబురావు పాల్గొన్నారు. ఏజెన్సీలో మలేరియా, డెంగీ మరణాలను అరికట్టాలని, విలీన మండలాల్లో టీచర్లు, డాక్టర్లు, ఉద్యోగులను నియమించాలని, ఏజెన్సీని స్వయం పాలిత జిల్లాగా ప్రకటించాలని నేతలు డిమాండ్ చేశారు. 

జమ్మూలో ఆర్మీ హెలికాప్టర్ కు ప్రమాదం ?

జమ్మూ: బుడ్ గాం ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందనే వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కొలంబో టెస్టుకు వర్షం అడ్డంకి..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే ఒక వికెట్ సాధించాల్సి ఉంది. లంక రెండో ఇన్నింగ్స్ లో 130 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో వర్షం పడడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. 

టి.ఎక్సైజ్ ఆఫీసు ఎదుట టిడిపి ధర్నా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న చీప్ లిక్కర్ పై టిడిపి పోరుబాట పట్టింది. సోమవారం టిడిపి మహిళా విభాగం కార్యకర్తలు నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. 

లంక..128/9...

కొలంబో : భారత్ జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో శ్రీలంక పరాజయం ఖరారైంది. 128 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. 

మాజీ ఎమ్మెల్యే మస్కతి కన్నుమూత..

హైదరాబాద్ : చార్మినార్ మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి సోమవారం ఉదయం కన్నుమూశౄరరు. అనారోగ్యంతో బాధ పడుతున్న మస్కతి బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం తీవ్ర అస్వస్థతకు లోనై తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు కంచన్ బాగ్ లోనలి కబరిస్తాన్ లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గతంలో ఆయన టిడిపి మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. మస్కతి పేరిట పాల డెయిరీ కూడా స్థాపించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. 

శ్రీలంక 123/8...

కొలంబో : భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో శ్రీలంక జట్టు ఓటమి దిశగా పయనిస్తోంది. లంక 123 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లు తీశాడు. హెరాత్ 2, కౌశాల్ 0 పరుగులతో ఆడుతున్నారు. 

సీబీఐ కోర్టులో ఓఎంసీ కేసు విచారణ..

హైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసుపై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. విచారణ నిమిత్తం గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కోర్టుకు హాజరయ్యారు. 

ఓటమి దిశగా లంక..

కొలంబో : భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో శ్రీలంక జట్టు ఓటమి దిశగా పయనిస్తోంది. 72/2 నైట్ స్కోరుతో ఆటను ఆరంభించిన లంక 115 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీశాడు. కరుణరత్నే 41, హెరాత్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

నాందేడ్ ఘటనపై బాబు దర్యాప్తుకు ఆదేశం..

హైదరాబాద్ : అనంతపురం మడకశిరలో జరిగిన నాందేడ్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి వెంటనే నివేదిక అందించాలని అనంత కలెక్టర్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మృత్యువాత పడగా పలువురికి గాయాలైన సంగతి తెలిసిందే. 

11:20 - August 24, 2015

చెన్నై : ప్రముఖ కన్నడ సినీ నటి రాగిణి ద్వివేదీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 'నానే నెక్ట్స్ సీఎం' అనే సినిమా షూటింగ్ మైసూరు సమీపంలో షూటింగ్ జరుగుతోంది. ఫైటర్ విసిరిన హాకీ స్టిక్ ను ఆమె తప్పించుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో రాగిణి ఏమరపాటుగా ఉండటంతో హాకీ స్టిక్ నేరుగా ఆమె తలకు బలంగా తగిలింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ హాస్పిటల్ కు ఆమెను తరలించారు. ప్రస్తుతం రాగిణికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. 

నాంపల్లి కోర్టులో జగన్..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ నాంపల్లి ఈడీ ప్రత్యేక కోర్టుకు చేరుకున్నారు. ఈడీ కేసు విచారణకు హాజరయ్యేందుకు ఆయన వచ్చారు. జగన్ తో పాటు రెండో ముద్దాయిగా ఉన్న జగన్ సంస్థల ఆడిటర్ విజయసాయిరెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణనను న్యాయమూర్తి సెప్టెంబర్ 14కు వాయిదా వేశారు. 

శ్రీలంక 111/6..

కొలంబో : భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక జట్టు 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కరుణారత్నే 37 క్రీజులో ఉన్నారు. భారత్ బౌలర్లలో అశ్విన్ మూడు, యాదవ్, శర్మ, మిశ్రా తలో వికెట్ తీశారు. 

అలెమావో బెయిల్ ను తిరస్కరించిన ప్రత్యేక కోర్టు..

గోవా : లూయిస్ బెర్గర్ అవినీతి కేసులో అరెస్టయిన గోవా ప్రజా పనుల శాఖ మాజీ మంత్రి చర్చిల్ అలెమావో దాఖలు చేసిన బెయిల్ ను ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. 

శ్రీలంక 106/4..

కొలంబో : భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ ఆటను ప్రారంభించింది. 72/2 నైట్ స్కోరుతో ఆటను ఆరంభించిన లంక మరో వికెట్ ను కోల్పోయింది. మాథ్యూస్ (23) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన చండిమాల్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం కరుణరత్నే 32, తిరుమన్నే 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

టిడిపి నేత ఇబ్రహీంబీన్ అబ్దుల్లా కన్నుమూత..

హైదరాబాద్ : టిడిపి నేత ఇబ్రహీంబీన్ అబ్దుల్లా కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

 

చైనా ప్రభావంతోనే పతనం - ఆర్బీఐ..

ఢిల్లీ : చైనా ఆర్థిక వ్యవస్థ కారణంగానే స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ల పతనంపై ఆయన ఓ ప్రకటన చేశారు. పతనం ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు

మహబూబ్ నగర్ జిల్లాలో గవర్నర్ పర్యటన..

మహబూబ్ నగర్ : గవర్నర్ నరసింహన్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఫరూక్ మండలం చేరుకుని అక్కడ గ్రామ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 

టి.మంత్రుల నివాసాల ముట్టడికి ఏబీవీపీ యత్నం..

హైదరాబాద్ : బోధనా రుసుములు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బంజారాహిల్స్ లోని తెలంగాణ మంత్రుల నివాస సముదాయం వద్ద ఏబీవీపీ సోమవారం ధర్నా చేపట్టింది. 

10:49 - August 24, 2015

హైదరాబాద్ : పరారీలో ఉన్న ఇద్దరు హుజీ ఉగ్రవాదులను ఢిల్లీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జహిరాబాద్‌కు చెందిన షేక్‌నూర్‌, ఢిల్లీకి చెందిన హకీంను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో పట్టుపడ్డ ఉగ్రవాది నజీర్‌ గ్యాంగ్‌ సభ్యులుగా వీరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. వీరిని విచారణ నిమిత్తం సిట్‌ పోలీసులకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అప్పచెప్పారు. 

10:47 - August 24, 2015

హైదరాబాద్ : ముంబై స్టాక్‌మార్కెట్‌ కుప్పకూలింది. దాదాపు 9 వందల పాయింట్లు దిగజారి ఇన్వెస్టర్లను దెబ్బ తీసింది. నిఫ్టీ సైతం 3 వందల పాయింట్లు పడిపోయింది. రూపాయి విలువ దారుణంగా పడిపోయి డాలర్‌ మారకం విలువ 66కు చేరింది. చైనా కరెన్సీ వాల్యూ తగ్గించడంతో ఆ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పై పడుతోంది. చైనా స్టాక్స్‌లో భారీ అమ్మకాలు జరగడంతో.. అది ఆసియా మార్కెట్‌పై ప్రభావం చూపడంతోనే.. ఈ పరిణామాలు జరిగాయని ప్రాథమికంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

10:45 - August 24, 2015

హైదరాబాద్ : పేరు ఏదైనా... కంపెనీ వేరైనా... రెండూ ఒక్కటే. కథ-స్క్రీన్‌ ప్లే-సేమ్‌ టు సేమ్‌. ఈ డేంజర్ ఫుడ్స్‌ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నెస్లే మ్యాగీ నూడిల్స్‌ కథ మరవక ముందే దాన్ని పోలిన కథే మరొకటి మొదలైంది. దేశీయ కార్పొరేట్ సంస్థ ఐటీసీ బ్రాండ్‌... ఇప్పీ శాంపిల్స్‌లోనూ పరిమితికి మించి "సీసం"ఉందని తేలింది.

జనాల గుండెల్లో డేంజర్ బెల్స్ ....

ఉత్తరప్రదేశ్‌లో ఇప్పీ నూడిల్స్ కలకలం రేపుతున్నాయి. జనాల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మ్యాగీ మాదిరిగానే ఇప్పీలోనూ పరిమితికి మించి నిషేధిత పదార్థాలు ఉన్నట్లు తేలింది. జూన్ 21న షాపింగ్ మాల్‌ నుంచి స్వాధీనం చేసుకున్న 8 రకాల ఆహార ఉత్పత్తులను... లక్నో, మీరట్‌లోని ప్రభుత్వ ల్యాబోరేటరీల్లో పరీక్షించారు అధికారులు. సీసం పరిమితి 1పిపిఎం పీపీఎం లోపు ఉండాల్సి ఉండగా... ఇప్పీలో 1.057పీపీఎం గా ఉందని అలీగఢ్‌ డివిజన్ ఎఫ్ డీఏ చీఫ్‌ చందన్ పాండే తెలిపారు.

ఇప్పీ న్యూడిల్స్‌పై చర్యలకు సిద్ధమైంది యూపీ సర్కార్....

మరోవైపు ఇప్పీ న్యూడిల్స్‌పై చర్యలకు సిద్ధమైంది యూపీ సర్కార్. ఇప్పటికే ఐటీసీ పై కేసు నమోదు చేసేందుకు... అనుమతి కోరుతూ చీఫ్ కమిషనర్‌కు లేఖరాశారు ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ అధికారులు. కేసు నమోదు ప్రక్రియ కొన్నివారాల పాటు సాగుతుందన్నారు. గతంలో మ్యాగీ నూడిల్స్‌ వ్యవహారాన్ని సైతం ఉత్తరప్రదేశ్‌లోనే వెల్లడికావడం విశేషం. ఇక పిల్లలు ఇష్టంగా తినే నూడిల్స్‌లో... విషపూరిత రసాయనాలు కన్నవారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని ఇప్పీ ఉత్పత్తులపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీలు నిర్వహించాలని స్థానిక ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. 

పానకాలస్వామి ఆలంయలో అగ్ని ప్రమాదం

గుంటూరు : మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీనర్శింహ స్వామి దేవాలంయలో అగ్ని ప్రమాదం సంభవించింది. దేవాలయంలో ఒక ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఏపీ పూర్తి కాలిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై : భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ట్రేడవుతున్నాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 800 పాయిట్లు, నిఫ్టీ 250 పాయింట్లకు పై నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకపు విలువ రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం రూపాయి మారకుపు విలువ 66.49 వద్ద కొనసాగుతోంది.

నీలోఫర్ ఆసుపత్రి వద్ద గొలుసు చోరీ

హైదరాబాద్: నిలోఫర్ ఆసుపత్రి సమీపంలో గొలుసు దొంగతనం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటు వెళుతున్న మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన దుండగులు గొలుసు లాక్కెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సమీపంలోని సీసీ కెమోరాలను పరిశీలిస్తున్నారు.

ఇద్దరు హుజి ఉగ్రవాదుల అరెస్ట్.....

హైదరాబాద్: పరారీలో ఉన్న ఇద్దరు హుజి ఉగ్రవాదులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. షేక్‌ నూర్‌ (జహీరాబాద్‌), అఖీం (ఢిల్లీ)లను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారిని సిట్‌ పోలీసులకు అప్పగించారు.

గల్లంతైన విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యం...

.గో : పెరవలి మండలం తీపర్రు దగ్గర గోదావరి నదిలో తణుకు అమృత పబ్లిక్‌స్కూలుకు చెందిన నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థుల్లో ఆశిష్‌, షఫీక్‌, మణికంఠ, ఇందర్‌లున్నారు. కాగా ఆశిష్‌, ఇందర్‌ల మృతదేహాలను గోదావరిలో లభ్యమయ్యాయి. మరో ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

09:28 - August 24, 2015

హైదరాబాద్ : జగనన్న బాణం ఓరుగల్లుపై గురిపెట్టింది. నేటి నుంచి వరంగల్ జిల్లాలో షర్మిల తొలి విడత ప‌రామ‌ర్శ యాత్ర సాగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో అసువులు బాసిన వారి కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. మొదటి విడతగా ఐదురోజుల పాటు సాగే ఈ పరామర్శ యాత్రలో మొత్తం 32 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు.

లోటస్‌పాండ్ నుంచి శామీర్‌పేట్, ప్రజ్ఞాపూర్ మీదుగా ....

లోటస్‌పాండ్ నుంచి శామీర్‌పేట్, ప్రజ్ఞాపూర్ మీదుగా చేర్యాల చేరుకొని అక్కడ బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శిస్తారు షర్మిల. అనంతరం బచ్చన్నపేట, మద్దూరు గ్రామంలోని మరో ఆరుగురు కుటుంబాలను పరామర్శిస్తారు. మొదటి రోజు 154 కిలోమీటర్లు ప్రయాణించి ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని తెలంగాణ వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు.

ఒక్కోరోజు 7 కుటుంబాలను....

వరుసగా నాలుగు రోజుల్లో ఒక్కోరోజు 7 కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల.. చివరిరోజు 28వ తేదీన 4 కుటుంబాలను పరామర్శించనున్నారు. పరకాల, పాలకుర్తి నియోజకవర్గాల్లో పరామర్శ యాత్రను పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతారు. అయితే జిల్లాలోని మ‌హ‌బూబాబాద్‌లో జ‌గ‌న్ గత ఓదార్పు యాత్ర ఓ సంచ‌ల‌నానికి దారి తీసింది. ఇప్పుడు షర్మిల పరామర్శ యాత్ర సందర్భంగా ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా జిల్లా నేత‌లు అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 

09:26 - August 24, 2015

హైదరాబాద్ :  సైన్యంలో అత్యున్నత శిఖరాల్ని అధిరోహించిన వీకే సింగ్‌... తోటి మాజీ సైనికోద్యోగుల్ని మర్చిపోయినా... ఆయన కూతురు మాత్రం జై జవాన్ అంటూ గళమెత్తారు. "వన్‌ ర్యాంక్‌-వన్ పెన్షన్‌" అంటూ నినదించారు.

"వన్ ర్యాంక్‌-వన్ పెన్షన్‌" పథకాన్ని అమలు చేయాలి....

తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం... జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న... మాజీ సైనికోద్యోగులకు బాసటగా వీకే సింగ్ కూతురు నిలిచారు. మోదీ సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు మాజీ జవాన్లకు మద్దతు పలికారు. సాధ్యమైనంత త్వరగా "వన్ ర్యాంక్‌-వన్ పెన్షన్‌" పథకాన్ని అమలు చేయాలని మృణాళిని కేంద్రాన్ని కోరారు.

మాజీ సైనికోద్యోగి కుమార్తెగా..

మాజీ సైనికోద్యోగి కుమార్తెగా... తాను ఆందోళనకు మద్దతు పలుకుతున్నానని ఆమె స్పష్టం చేశారు. ఒకప్పుడు ప్రాణాలను ఫణంగా పెట్టి దేశాన్ని రక్షించినవారు. నేడు హక్కుల కోసం ఆందోళన చేయాల్సి వస్తుందన్నారు. తన తండ్రిని కూడా ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాల్సిందిగా కోరుతానని మృణాళిని తెలిపారు. అంతేకాకుండా తన భర్త... ప్రస్తుతం ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారని, కొన్నాళ్ల తరువాత తాను కూడా మాజీ సైనికుడి భార్యను అవుతాను గనుక ఓఆర్ ఓపి డిమాండ్‌కు మద్దతు పలకడం తన బాధ్యతని ఆమె గుర్తుచేశారు. ఇలా తమకోసం ముందుకొచ్చిన మృణాళినిపై...మాజీ సైనికోద్యోగులు శభాష్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

09:22 - August 24, 2015

కరీంనగర్ : మొన్నటిదాకా అభివృద్ధికి ఆమడదూరంలో విసిరిపారేసిన ఊరు అది. ఆ ఊరి వారికీ..చుట్టు పక్కలవారికి మాత్రమే తెలిసిన కుగ్రామం అది. కానీ...సీఎం కేసీఆర్ స్వయంగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ఆ ఊరి రూపు రేఖలే మారిపోబోతున్నాయి. అందరి దృష్టి ఆకర్షిస్తున్న కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూరుపై ప్రత్యేక కథనం.

ఓ మారుమూల గ్రామం...

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఓ మారుమూల గ్రామం చిన్న ముల్కనూరు. ఓ వైపు పెద్దముల్కనూరు అభివృద్దిలో దూసుకుపోతుండగా..చిన్న ముల్కనూరు వెలవెలబోయింది. అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేది. పారిశుధ్య లేమితో కొట్టుమిట్టాడుతుండేది. గ్రామంలో ఎటు చూసినా మట్టి రోడ్లే దర్శనమిచ్చేవి.

జులై 4న చిన్న ముల్కనూరును దత్తత తీసుకున్న కేసీఆర్‌..

సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే జులై 4న హుస్నాబాద్ నియోజకవర్గంలో హరితహారం కోసం వచ్చారు సీఎం కేసీఆర్. చిన్న ముల్కనూరులో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసిన ఆయన ఊరి గురించి వాకబు చేశారు. అక్కడి దయనీయ పరిస్థితులు విని చలించిపోయిన ఆయన..వెంటనే అదే వేదికగా చిన్నముల్కనూరును దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 50 లక్షలను అభివృద్ధి కోసం ప్రకటించారు. అప్పుడే మళ్లీ వస్తానని చెప్పిన కేసీఆర్‌ ఆగస్ట్ 8న చిన్నముల్కనూరుకు వచ్చారు. గ్రామజ్యోతి పథకం కింద మొత్తం 2 కోట్ల 50 లక్షలు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో ఊపందుకున్న పనులు ....

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో గ్రామంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. మొదటి విడతగా రోడ్ల మరమ్మతులు, తాగునీటి వసతులు, పారిశుధ్య పనులు, రెండు పడకల ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. రోడ్డు విస్తరణ పనులు చకచక జరిగిపోతున్నాయి. గ్రామానికి కేసీఆర్‌ ప్రకటించిన 250 నివాస గృహాలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశారు. సోలార్‌ విద్యుత్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ గ్రామ అభివృద్ధి పనుల్లో లీనమయ్యారు. చెరువును దత్తత తీసుకున్న ఎస్పీ జోయల్‌ డెవిస్‌ మరమ్మతు పనులు చేపట్టారు.

చిన్న ముల్కనూరుకు సీఎం కేసీఆర్‌....

చిన్న ముల్కనూరుకు సీఎం కేసీఆర్‌ సోమవారం రానున్న నేపథ్యంలో... తొలి విడత పనులు అధికారులు వేగవంతం చేశారు. సీఎం చొరవతో తమ గ్రామ రూపురేఖలు మారుతున్నందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో ఐదుగురు మృతి-రైల్వే పీఆర్వో

హైదరాబాద్ : నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందినట్లు రైల్వే పీఆర్వో అనిల్‌ సక్సేనా అధికారికంగా ప్రకటించారు. వీరిలో ముగ్గురు ప్రయాణికులు కాగా..ఒకరు రైల్వే స్టాప్‌, లారీ డ్రైవర్‌అని అయన తెలిపారు. బెంగళూరు నుంచి నాందేడ్‌ వెళ్తున్న నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ అర్థరాత్రి 2.23 నిమిషాలకు గ్రానైట్ లారీ రైలు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అనిల్ సక్సేనా తెలిపారు. ప్రమాదానికి గురైన బోగీలు థర్డ్‌ ఏసీ -బి1, ఫస్ట్‌ ఏసీ హెచ్-1, స్లీపర్‌ క్లాస్‌లోని S-1, S-2లని తెలిపారు. ఈ ప్రమాదంపై రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 

లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం : డీఆర్ ఎం

అనంతపురం : పెనుకొండ మండలం మడకశిరవ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. లారీ బ్రేకులు ఫెయిలైనట్లు నిర్ధారణ అయ్యిందని... అయినప్పటికీ డ్రైవర్ వేగంగా లారీని నడపడంతో అదుపు చేయలేకపోయాడని బెంగళూరు డీఆర్ ఎం తెలిపారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల : ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

08:47 - August 24, 2015

హైదరాబాద్ : హోదానా...? ప్యాకేజీనా..? కొంతకాలంగా ఏపీని కలవరపెడున్న ఈ అంశాలపై మంగళవారం క్లారిటీ రానుంది. ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని మోడీ, చంద్రబాబు మధ్య కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి రాజనాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కూడా హాజరవుతారు. దీంతో ప్రత్యేక హోదాపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు.

ఉదయం 10:30కు మోడీతో భేటీ....

మంగళవారం ఉదయం పదిన్నరగంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీ సమస్యలు, విభజన చట్టంలోని హామీల అమలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. అన్ని విషయాలను కూలంకషంగా చర్చించాలనే ఉద్దేశ్యంతో...రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ కూడా భేటీలో పాల్గొననున్నారు. హోదాపై ఎలా ముందుకెళ్లాలి? ప్రత్యేక ప్యాకేజీ ఎంత ఉండాలి? ఎలా ఉండాలి? అనే అంశాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తిచేసింది. దీనిపై ముందుగానే కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో మాట్లాడేందుకు..రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌ ఢిల్లీ వెళ్లారు.

ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామిక రాయితీలు....

స్పష్టమైన ప్రతిపాదనలతో మోడీ ముందుకు వెళ్లాని బాబు భావిస్తున్నారు. విభజనచట్టంలోని హామీలు, పార్లమెంట్‌లో చేసిన ప్రకటనలు, ఎన్నికల ముందు రాష్ట్రంలో మోడీ చేసిన వాగ్థానాలపైనే ప్రధాన చర్చ జరగనుంది. ఇదే సమయంలో ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామిక రాయితీలు, రెవిన్యూలోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి నిధులు, వెనకబడిన ప్రాంతాల అభివద్ధికి మరిన్ని నిధులు వంటి అంశాలపైనా చర్చించనున్నారు.

ఫోన్‌ట్యాపింగ్‌పై రాజ్‌నాథ్‌కు మరోసారి ఫిర్యాదు.....

రాష్ట్ర అభివృద్ధిపై చర్చ తర్వాత...ప్రధాని మోదీ, చంద్రబాబు కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడుకుంటారని సమాచారం. అంతేగాక ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని మరోసారి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోపాటు రక్షణమంత్రితోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులపై వారితో చర్చించనున్నారు.

నిజామాబాద్ లో దారుణం...

హైదరాబాద్ : నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో ఓ మహిళపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. భర్తతో కలిసి నిజామాబాద్‌కు వచ్చిన మహిళపై దుండగులు దాడి చేశారు. భర్తను కత్తితో బెదిరించి ఆ వివాహితను అత్యాచారం చేశారు. బాధితురాలు హైదరాబాద్‌కు చెందిన మహిళ. ప్రస్తుతం బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

08:40 - August 24, 2015

హైదరాబాద్ : నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో లో దారుణం జరిగింది. వివాహిత పై నలుగురు యువకులు భర్తను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసునమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బాధితురాలు రంగారెడ్డి జిల్లా ఉప్పల్ వాసిగా తెలుస్తోంది.

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి..

కరీంనగర్ : హుస్నాబాద్‌ మండలం ధర్మారం పంచాయతీలోని మసిరెడ్డి తండాలో ఓ రైతు విద్యుత్‌షాక్‌తో మరణించాడు. తండాలో రైతు మృతి ఘటనతో విషాదం అలముకుంది. 

నేడు రతన్ టాటాతో భేటీ కానున్న చంద్రబాబు

హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా నేడు సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ కానున్నరు. ఈ రోజు మధ్యాహ్నాం విజయవాడలో ఆయన చంద్రబాబుతో భోజన సమావేశంలో పాల్గొంటారు. ఈ వీరి భేటీ కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం, పెట్టు అవకాశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఇద్దరూ కలిసి రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థల అధినేతలతో మాట్లాడనున్నారు. సాయంత్రం గ్రామాభివృద్ధి ప్రణాళికలను ఆవిష్కరించనున్నారు.

ఆగి వున్న లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు

.గో : ఏలూరు నగరానికి సమీపంలోని సుదిమళ్ల జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని శ్రీనివాసా ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ నుంచి గుంటూరు వస్తున్న ఈ స్లీపర్‌ బస్సు అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. గాయపడిన ప్రయాణికులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. 

08:02 - August 24, 2015

హైదరాబాద్ : ఏపీ రాజధాని ప్రాంత ప్రజల సమస్యలకు పవన్ బాధ్యత వహిస్తారా? చంద్రబాబు పవన్ ను కరివేపాకులా చూస్తున్నారా? పవన్ ట్వీట్స్ కు ప్రజాప్రతినిధులు ఎందుకు స్పదింస్తున్నారు? పవన్ రాజకీయంగా విమర్శనాత్మక వైఖరి తీసుకున్నాడా? పవన్ చంద్రబాబు పై ఆచితూచి వ్యహరించారా? ప్రతిస్పందనను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళుతోందా?రాజధానికి అంత భూమి అవసరమా? బిజెపి- పవన్ మధ్య ప్రత్యేక సంబంధాలు కొనసాగుతాయా? ఇలాంటి అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చించారు. ఈ చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, టిడిపి నేత సూర్యప్రకాష్, వైసీపీ నేత కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. మరి మీరు కూడా ఆ చర్చను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం : మంత్రుల ఆదేశం...

హైదరాబాద్ : అనంతపురం జిల్లా మడకశిర రైలు ప్రమాద ఘటనలో గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం చినరాజప్ప, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై నివేదిక అందించాలని చినరాజప్ప రైల్వే అధికారులను కోరారు. 

నేటి నుండి షర్మిల మలి విడత పరామర్శ యాత్ర

హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నేడు తెలంగాణలో మలి విడత పరామర్శ యాత్రను చేపట్టనున్నారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో నేడు షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభం కానుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను షర్మిల పరార్శించనున్నారు. మరికాసేపట్లో హైదరాబాదులోని పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరనున్న షర్మిల నేరుగా వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం చేరుకుంటారు. షర్మిల యాత్రలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు.  

పశ్చిమడెల్టాకు 1516 క్యూసెక్కులనీటి విడుదల

విజయవాడ: కృష్ణా పశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి 1516 క్యూసెక్కులనీటిని ఆదివారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. బ్యారేజివద్ద 11.9 అడుగుల నీటిమట్టం ఉంది. దుగ్గిరాల సబ్‌డివిజన్‌ నుంచి కొమ్మమూరుకాల్వకు 350 క్యూసెక్కులనీరు, రేపల్లెకాల్వకు 301 క్యూసెక్కులనీరు, తూర్పుకాల్వకు 169 క్యూసెక్కులనీరు, పశ్చిమకాల్వకు 170 క్యూసెక్కులనీరు, నిజాంపట్నం కాల్వకు 204 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.

అమరావతి రాజగోపురం కనుమరుగు...

అమరావతి: చారిత్రక ప్రసిద్ధి చెందిన అమరేశ్వరుని ఆల య రాజగోపురం కనుమరుగువుతుంది. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన అమరేశ్వరాలయ ప్రధాన రాజగోపురం శిథిలావస్థకు చేరడంతో తన చారిత్రక ప్రాధాన్యతను కోల్పోనుంది. గాలిగోపురం లోపలి భాగం శిథిలావస్థకు చేరడంతో దానిని తొ లగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ రాజగోపురాన్ని పునర్నిర్మించేందుకు దేవాదాయశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం టెండర్లు కూడా పిలిచారు. ప్రస్తుతం గాలిగోపురం తొలగించి దసరా నాటికి మంచి ముహూర్తం చూసుకుని నూతన గాలిగోపురం నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు.

రైలు ప్రమాదం పై ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు

హైదరాబాద్ : నాందేడ్ ఎక్స్ ప్రెస్ ప్రమాద బాధితులను ఆదుకునేందుకు, కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేసేందుకు అధికారులు ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.

పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం హెల్ప లైన్ నెంబరు 08555- 220228

ఘటనాస్థలిలో హెల్ప్ లైన్ నెంబర్ - 97013 74062

ధర్మవరం హెల్ప్ లైన్ నెంబర్ 08559 222555

అనంతపురం రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 08554 236444

06:42 - August 24, 2015

హైదరాబాద్ : జ్వరం ... ఈ పదం ఇప్పుడు భయపెడుతోంది. డెంగ్యూ జ్వరం తెలుగు నేలను వణికిస్తోంది. డెంగ్యూ భారిన పడి ఇప్పటికే చాలామంది చనిపోయిన్నట్టు ప్రతిరోజూ వార్తలొస్తున్నాయి. మీడియాలో డెంగ్యూ మరణాలు బాగా హైలెట్ అవుతున్నాయి. ఎక్కడ ఎవరికి ఏ కారణంతో జ్వరం వచ్చినా అది డెంగ్యూ భూతమేమోనని జనం హడలిపోతున్నారు. ఎవరి శక్తికి తగ్గట్టు వారు ప్రభుత్వ, ప్రయివేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.

మందుల కొరత, సిరంజీల కొరత, వైద్యుల కొరత....

ఒకవైపు డెంగ్యూ భూతం భయపెడుతుంటే, మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత, సిరంజీల కొరత, వైద్యుల కొరత, వ్యాధి నిర్ధారణ పరికరాల కొరత లాంటి సమస్యలు వెక్కిరిస్తున్నాయి. దీంతో పేషెంట్లు ప్రయివేట్ ఆస్పత్రులను ఆశ్రయించక తప్పడం లేదు.

ప్రయివేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు మరింత హడావిడి....

ఇప్పటికే డెంగ్యూ ఫీవర్ తెలుగు నేలను ఆవహించడంతో ప్రయివేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు మరింత హడావిడి చేస్తున్నాయి. జ్వరంతో వచ్చిన ప్రతి ఒక్కరినీ వివిధ రకాల టెస్టులకు పంపిస్తున్నారు. ఇప్పుడు ప్రయివేట్ ఆస్పత్రులతో పాటు డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రయివేట్ ఆస్పత్రులకు డయాగ్నస్టిక్ సెంటర్లకీ మధ్య వున్న అనుబంధం కారణంగానే అవసరమున్నా లేక పోయినా డాక్టర్లు టెస్టులు రాస్తారన్న విమర్శలు ఎప్పటి నుంచో వున్నాయి. ఇప్పుడు అలాంటి అనుమానం మరింత బలపడుతోంది.

తీవ్రమైన జబ్బేమీ కాదు....

నిజానికి డెంగ్యూ చాలామంది భయపడుతున్నంత తీవ్రమైన జబ్బేమీ కాదు. కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఇది రాకుండా కాపాడుకోవచ్చు. స్వైర విహారం చేస్తున్న వ్యాధికి ముకుతాడు వేయొచ్చు. ఈ సీజన్ లో ముఖ్యంగా చేయాల్సింది దోమలను నివారించడం, దోమ తెరలు వాడడం. కానీ ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, వైద్య ఆరోగ్య శాఖ ఈ విషయంలోనే అశ్రద్ధ చేస్తున్నాయి. చాలాచోట్ల దోమల నివారణ చర్యలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. సమాజంలో డెంగ్యూ పట్ల ఇంత తీవ్రస్థాయిలో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నించడం లేదు. దీంతో వాస్తవాల కంటే భయాలు వేగంగా హల్ చల్ చేస్తున్నాయి. అందుకే, ప్రభుత్వం ఇప్పటికైనా డెంగ్యూ విషయంలో వాస్తవాలు చెప్పేందుకు ముందుకు రావాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. అక్కడ డాక్టర్ల కొరత, మందుల కొరత లేకుండా చూడాలి. ప్రాణాంతక వ్యాధుల భయం సమాజంలో విస్త్రుతంగా వ్యాపించిన నేపథ్యంలో ప్రయివేట్ ఆస్పత్రలు పేషెంట్ల జేబులు లూటీ చేయకుండా సకల జాగ్రత్తలు తీసుకోవాలి. 

06:40 - August 24, 2015

హైదరాబాద్ : డెంగ్యూ జ్వరాలు భయపెడుతున్నాయి. ప్రతి జిల్లాలోనూ పదుల సంఖ్యలో పేషెంట్లు చనిపోతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో డెంగ్యూ పేరు వింటేనే జనం భయపడుతున్నారు. దీన్ని అవకాశం గా తీసుకున్న ప్రయివేట్ కార్పొరేట్ ఆస్పత్రులు మాయదారి జ్వరాన్ని చేతి నిండా క్యాష్ చేసుకుంటున్నాయి. ఇంతకీ డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? దీని నివారణ మార్గాలేమిటి? దీనికి చికిత్స ఏమిటి? ఇలాంటి ఆసక్తికర అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రమాదేవి మాట్లాడారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఆ వివరాలను మీరు కూడా చూడాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

రైలు ప్రమాదంలో దేవదుర్గ్ ఎమ్మెల్యే మృతి

హైదరాబాద్: నాందేడ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ్ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ మృతి చెందారు. ఆయనకు కేటాయించిన ఎన్ 1 బోగీని గ్రానైట్ లారీ ఢీ కొనడంతో మృతి చెందారు.

 

06:31 - August 24, 2015

అనంతపురం : మడకశిర వద్ద జరిగిన రైలు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో నలుగరు చనిపోయారని, మరో ముగ్గురు గాయపడినట్లు తెలిపారు. ఆయన అనంతపురం నుండి హైదరాబాద్ కు మరో రైల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమాచారం అందడంతో గుంతకల్లు రైల్వే స్టేషన్ వద్ద ఆగిపోయారు. అక్కడ నుండి కాసేపట్లో పెనుకొండకు వెళ్తున్నట్లు తెలిపారు. గ్రానైట్ లారీ బ్రేక్ ఫెయిల్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగిన ట్లు ప్రాథమిక సమాచారంగా తెలుస్తోంది. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా పెనుకొండ రైల్వే జోన్ లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని... వీటి పై కేంద్రానికి ఓ లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి, క్షతగాత్రులను ఆదుకుంటామని పేర్కొన్నారు.

 

 

రైలు ప్రమాదం పై చంద్రబాబు దిగ్ర్భాంతి

హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. మంత్రి పరిటాల సునీత, కలెక్టర్ తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు.

అనంతపురం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం:6గురి మృతి

అనంతపురం : మడకశిర రైల్వే క్రాసింగ్ వద్ద బెంగళరూ నుండి నాందేడ్ వెళుతున్న నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందగా.. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 5గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో కర్నాటక రాష్ట్ర రాయచూర్ జిల్లా దేవదుర్గ్ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ వున్నారు.దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెనుకొండ నుండి తాడిపత్రి వైపు వెళ్తున్న గ్రానైట్ లారీ రైలు ను ఢీ కొట్టడంతో ఈప్రమాదం చోటు చేసుకుంది.

06:14 - August 24, 2015

అనంతపురం: పెనుకొండ మండలం మడకశిర రైల్వేగేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో 5గురు మరణించారు. గ్రానైట్‌తో వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి మడకశిర లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ హెచ్‌1 బోగిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గ్రానైట్‌ రాయి రైలు బోగిపై పడిపోయి దెబ్బతింది. ఈ సంఘటనలో మరో మూడు బోగీలు పక్కకు పడిపోయాయి. లారీ డ్రైవరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు అని మొదట వార్తలు వచ్చాయి. కానీ లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో హెచ్‌1 బోగి ఏసీ టెక్నిషియన్‌ అహ్మద్‌, కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా దేవదుర్గ్‌ ఎమ్మెల్యే వెంకటేష్‌నాయక్‌, ఇండోఫిల్ ఇండ్రస్టీస్ జనరల్ మేనేజర్ రాజు, రాయ్ చూర్ కు చెందిన పుల్లారావు, ఉన్నారు. ఈ ప్రమాదంలో జగదీశ్(రాయచూర్), ఆయన భార్య శాంత, సురేష్(దారణగిరి, కర్ణాటక) తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బెంగళూరులోని రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పలు రైళ్లు దారి మళ్లింపు...

పెనుగొండ సమీపంలో బెంగళూరు నుంచి నాందేడ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురవ్వడంతో పలు ఎక్స్ ప్రెస్ రైల్లను దారి మళ్లించారు. బెంగుళూరు నుంచి గుంతకల్లు వెళ్తున్న రైళ్లను వయా కాడ్పాడి, జోలార్ పేట, పాకాల, ధర్మవరం జంక్షన్ మీదుగా నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. తెల్లవారు జామున 2 గంటల నుంచి అనంతపురంలో ఆగిన నిజాముద్దీన్ - బెంగళూరు సిటీ రాజధాని ఎక్స్ ప్రెస్ ను పాకాల మీదుగా నడుపుతున్నారు.

సహాయక చర్యలు ముమ్మరం....

రైలు ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ట్రాక్ క్లియర్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో బాగున్న బోగీలను తరలిస్తున్నారు. ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

రైలు ప్రమాదం పై ప్రత్యేక హెల్ప్  లైన్ ఏర్పాటు....

బాధితులను ఆదుకునేందుకు, కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేసేందుకు అధికారులు ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.

పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం హెల్ప లైన్ నెంబరు 08555- 220228

ఘటనాస్థలిలో హెల్ప్ లైన్ నెంబర్ - 97013 74062

ధర్మవరం హెల్ప్ లైన్ నెంబర్ 08559 222555

అనంతపురం రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 08554 236444

Don't Miss