Activities calendar

25 August 2015

22:24 - August 25, 2015

ప్రపంచ మార్కెట్లన్ని ఒకే సారి ఫ్ల్యూ జ్వరం తెచ్చుకున్నాయి. సెంటిమెంట్ కు కేరాఫ్ అయిన స్టాక్ మార్కెట్.. నానా ఒడిదుడుకులకు లోనై... పాతాలానికి దిగజారింది. భారత్ మార్కెట్ కూడా ఇదే బాటలో ఉంది. ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి.. భారత్ స్టాక్ మార్కెట్ ఎందుకు క్ల్యాష్ అయింది. రూపాయి విలువ మరింత తగ్గబోతుందా..? ప్రపంచ దేశాల మధ్య కరెన్సీ యుద్ధాలు మొదలవుతున్నాయా...? వినాశకర ఆర్థిక విధానాల ఫలితం ఇలాగే ఉంటుందా..? ఈరోజు వైడ్ యాంగిల్ లో ఇదే అంశం చూద్దాం...

 

22:08 - August 25, 2015

కర్నాటక : ప్రజాస్వామ్య దేశంలో... స్వేచ్ఛా స్వాతంత్ర్యం... పౌరుల ప్రాథమిక హక్కు. దేశంలో ఎక్కడైనా తిరిగే, నివశించే హక్కుతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛ అందరి సొంతం. అలాంటి హక్కును అక్కడ కాలరాస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం రోజున యువతీ యువకులకు పెళ్లిల్లు చేసి సంచలనం రేపిన హిందుత్వ వాదులు... కర్నాటకలో మరోసారి రెచ్చిపోయారు. హిందుత్వ వాదులు రెచ్చిపోయారు. హిందూ అమ్మాయితో తిరుగుతున్నాడనే నెపంతో.. ఓ ముస్లిం యువకుడికి దేహశుద్ధి చేశారు. అంతా చూస్తుండగా... ఎడాపెడా కొట్టి... గంటసేపు స్తంభానికి కట్టివేశారు.
ముస్లిం యువకుడికి దాడి..
కర్నాటకలోని మంగళూరులో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ముస్లిం యువకుడు స్థానికంగా వున్న... ఓ సూపర్‌ మార్కెట్‌లో మేనేజర్. హిందూ అమ్మాయి అందులోనే పని చేస్తోంది. అత్యవసరంగా 2వేల రూపాయలు కావాలని అమ్మాయి కోరగా... ఇద్దరూ కలిసి.. అత్తావర్‌ సమీపంలోని బాబుగుడ్డే ప్రాంతంలోని ఏటీఎంకు వెళ్లారు. అక్కడ డబ్బులు తీసుకుంటుండగా... హిందూత్వ సంస్థలకు చెందిన వారిగా భావిస్తోన్న కొందరు అక్కడికి చేరుకొని... ముస్లిం యువకుడిని చితకబాదారు. ముస్లిం యువకుడికి అసలేం జరుగుతుందో తెలీని పరిస్థితి. వచ్చిన వారు ఎవరో? ఎందుకు దాడి చేస్తున్నారో? అందుబట్టలేదు. ఇంత జరుగుతుంటే... హిందూ అమ్మాయి మాత్రం మాటైనా మాట్లాడలేదు.
దృశ్యాలు మీడియాలో ప్రసారం..
ముస్లిం యువకుడిని దాడిచేస్తోన్న దశ్యాలు... మీడియాలో ప్రముఖంగా ప్రసారమయ్యాయి. వాటిని చూసి స్థానిక పోలీసులు అలర్ట్‌ అయ్యారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకొని... 13 మందిని అరెస్ట్ చేశారు. భజరంగ్‌దళ్‌ ప్రమేయంతోనే దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దాడి అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత బీజేపీ ప్రభుత్వం హిందుత్వ శక్తులకు అండగా నిలవటమే నేటి దుస్థితికి కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 12 కేసులు నమోదయ్యాయని... 2014లో 39... 2013లో 45 కేసులు నమోదైనట్లు గుర్తు చేసింది.

 

21:57 - August 25, 2015

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజీలు, రాయితీల ఆశలతో హస్తినలో అడుగుపెట్టిన చంద్రబాబు...సకల సమస్యలనూ మరోసారి ప్రధాని ముందుంచారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. అయితే చంద్రబాబు ఆకాంక్షలన్నింటికీ ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. జైట్లీ ప్రత్నామ్నాయ వ్యాఖ్యలు, ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని కాదన్న చంద్రబాబు మాటలే ఇందుకు నిదర్శనం.
ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడులను కలిశారు. తర్వాత ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో భేటి అయ్యారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగారియా కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని హామీలు, రాజధాని నిర్మాణం, పోలవరానికి నిధులు, వెనకబడిన జిల్లాల అభివృద్దితో సహా అనేక అంశాలపై దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. విభజన చట్టంలోని హామీలు, వాగ్ధానాలకు సంబంధించిన వివరాలతో కూడిన 13 పేజీల నివేదికను నరేంద్ర మోదీకి అందించారు. ఏపీ కొత్త రాజధానికి ఆర్థికసాయమందించాలని చట్టంలో ఉన్న అంశాన్ని ప్రస్తావించారు బాబు. ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు, ప్రతిపక్షాలు విమర్శలను ప్రధాని దృష్టికి తెచ్చారు. చంద్రబాబు చెప్పినవన్నీ ఆసాంతం విన్న నరేంద్ర మోదీ...విభజన హామీలన్నీ నెరవేరుస్తామన్నారని చంద్రబాబు చెప్పారు.
స్పెషల్ స్టేటస్ ఒక్కటే సంజీవని కాదు:బాబు
హిమాచల్‌ ప్రదేశ్‌ తరహాలో సీఆర్‌డీఏకు పన్ను రాయితీ కోరినట్లు చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా... పారిశ్రామిక రాయితీలు ఒకటి కాదన్న బాబు..రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు స్పెషల్‌ ఇన్సెంటివ్స్‌ ఇస్తామని బిల్లులో చెప్పారని తెలిపారు. కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌కు ఇచ్చినట్టే ప్యాకేజీ ఏపీకి ఇవ్వాలని కోరానని అన్నారు. ప్రత్యేక హోదా కింద 90 శాతం గ్రాంటు కోరానని, పరిశీలిస్తామని ప్రధాని చెప్పారని తెలిపారు చంద్రబాబు. స్పెషల్ స్టేటస్ ఒక్కటే సంజీవని కాదన్నారు.
కేంద్ర వైఖరితో బాబు రాజీపడ్డారా.?
మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో అంత ఆశాజనకంగా సాగలేదని విశ్లేషకుల అభిప్రాయం. ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న కేంద్రం వైఖరితో బాబు రాజీపడినట్టు ఆయన మాటలను బట్టి అర్థమవుతోందని చెబుతున్నారు. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ నేతృత్వంలో కమిటీ వేయడం, అది నివేదిక ఇచ్చిన తర్వాత ప్రధాని స్పందిస్తామనడం నిరాశ కలిగించే విషయని ఎక్స్ పర్ట్స్ వ్యాఖ్యానిస్తున్నారు. కమిటీలు, నివేదికల పేరుతో ఎన్డీయే కూడా కాలయాపన చేయాలనుకుంటోందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

 

21:52 - August 25, 2015

ఉత్తరప్రదేశ్: లక్నోలో ఈవ్ టీజర్ వీపు విమానం మోతం మోగించిందో యువతి.... అసభ్యంగా మాట్లాడుతూ వెంటపడ్డ పోకిరీని చితగ్గొట్టింది.. 'నీకు అక్కా చెల్లెల్లు లేరా? అంటూ చావబాదింది... మీ అమ్మే ఇలా రోడ్డు మీద నడిస్తే ఇలాగే ప్రవర్తిస్తావా' అంటూ నిలదీసింది.. పదిమంది చూస్తుండగా దుమ్ము దులిపేసింది.. తప్పయింది క్షమించమని కాళ్లా వేళ్లా పడ్డా ఊరుకోలేదు. అసహ్యమైన ప్రవర్తనను ఎట్టిపరిస్థితిలో క్షమించేదిలేదని తేల్చిచెప్పింది. అతని కళ్లు బైర్లు కమ్మేలా విశ్వరూపం చూపించింది. ఇకపై అమ్మాయిల వెంటపడనంటూ కాళ్లావేళ్లాపడ్డా ఊరుకోలేదు. అపరకాలిలా రెచ్చిపోయి ఆ యువకుడికి బుద్ధి చెప్పింది.. ఆ భద్రకాళి దెబ్బలతో ఆ పోకిరీకి పట్టపగలే చుక్కలు కనిపించాయి..

 

21:49 - August 25, 2015

రాజమండ్రి: ఇన్నాళ్లు ఉల్లిగడ్డల కోసం ఆందోళనలే జరిగాయి. ఇవాళ ఏకంగా గొడవలు జరిగాయి. రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజీ రైతు బజార్ వద్ద మహిళల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. వివాదం పెద్దదవుతుండటంతో... రైతు బజార్ సిబ్బంది ఉల్లిపాయల విక్రయాలను నిలిపివేశారు.

 

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల అభివృద్ధికి నిధుల సమీకరణ

హైదరాబాద్: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల అభివృద్ధి కోసం నిధులు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సినీ తారలతో బెనిఫిట్ టికెట్ షో నిర్వహించాలని నిర్ణయంచింది. 

చెరువుల పరిరక్షణకు ఎన్ ఫోర్స్ మెంట్ ఫోర్స్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పరిరక్షణ కోసం ఎన్ ఫోర్స్ మెంట్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను ప్రత్యేక ఎన్ ఫోర్స్ మెంట్ తొలగించనుంది.

 

రేపు ఎమ్మెల్యే కిష్టారెడ్డి అంత్యక్రియలు

హైదరాబాద్: ఎమ్మెల్యే కిష్టారెడ్డి అంత్యక్రియలు రేపు నారాయణఖేడ్ లో జరుగనున్నాయి. కృష్ణారెడ్డి అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.

 

21:13 - August 25, 2015

గుంటూరు: నవ్యాంధ్ర రాజధాని గ్రామాల్లో సీపీఎం బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉండవల్లి, పెనుమాక చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అటు ఈ గ్రామాల్లో సీపీఎం నేతలు పర్యటించారు. పేదలను తరిమేసి ఆ భూముల్ని బడా బాబులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీడీపీ బెదిరింపులకు లొంగేదిలేదని తేల్చిచెప్పారు.

 

21:09 - August 25, 2015

హైదరాబాద్: హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, భారతి ఎయిర్‌టెల్ సంస్థలు.. ఈ నెల 30న హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్‌కు సిద్ధమయ్యాయి. ఫుల్ మారథాన్... నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలివరకూ 42 కిలోమాటర్లు సాగనుంది. ఈ రన్ లో పాల్గొనేందుకు ఇప్పటికే 14వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ మారథాన్‌కు ప్రారంభసూచికగా ఈ నెల 29న పిల్లల కోసం 5కే, 10కే రన్ జరుపుతామని ప్రకటించారు.

 

21:02 - August 25, 2015

హైదరాబాద్: పోలీస్ శాఖలో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్ ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వాలువ్య శ్రీనివాసులు, చంద యాదగిరి, గుజ్జరి భాస్కర్ అనే ముగ్గురు స్నేహితులు ముఠాగా ఏర్పడ్డారు. నిరుద్యోగులతో పరిచయం పెంచుకొని ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించారు. సెక్రటేరియట్లో తమకు పెద్ద పెద్ద వారితో పరిచయాలున్నాయని చెప్పేవారు. ఇలా ఒక్కొక్కరిదగ్గరినుంచి 5లక్షలవరకూ వసూలు చేశారు. ఎస్‌ఐ ఉద్యోగాల ఫలితాల్లో తమ పేర్లు లేకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

 

20:57 - August 25, 2015

హైదరాబాద్: సంకల్పం ఉండాలే కాని సాధించలేనిది ఏది లేదు. గుండెనిండా ధైర్యం ఉండాలే కాని మరణాన్నయినా జయించొచ్చు. ఈ మాటలంటున్నది ఎవరో కాదు. అలనాటి అందాల తార గౌతమి. టెన్ టివితో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. క్యాన్సర్‌ మహమ్మారిని చిరునవ్వుతో ఎదుర్కొన్న గౌతమి క్యాన్సర్‌ ఎంత భయకరమైనదైనా, మనిషి ధైర్యం ముందు పిరికిపందే అంటున్నారు. అవగాహన ఉంటే క్యాన్సర్‌ను సులువుగా జయించవచ్చని చెప్పారు.

 

20:35 - August 25, 2015

కృష్ణా : జిల్లా మైలవరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా దనేకుల సాంబశివరావు మంత్రి దేవినేని సమక్షంలో ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. చిన్న నందిగామకు చెందిన సాంబశివరావు ఛైర్మన్‌గా.. వైస్‌ ఛైర్మన్‌గా ఏరికెల నాగేశ్వరరావుతో పాటు పాలకవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి దేవినేని.. బుడమేరు అభివృద్ధి పనులకు రూ. 2 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. 

20:27 - August 25, 2015

ఖమ్మం: పెండింగ్ స్కాలర్‌ షిప్‌లను విడుదల చేయాలని కోరుతూ ఖమ్మంలో ఎప్ ఎఫ్ ఐ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శిస్తున్న విద్యార్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అరెస్ట్ చేసే సమయంలో మహిళా పోలీసులను నియమించకుండా నిబంధనలను తుంగలో తొక్కారు.

 

20:21 - August 25, 2015

విజయవాడ: ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఆందోళనలు చేయకపోతే... చంద్రబాబుకు ప్రత్యేక హోదా అంశం గుర్తుకువచ్చేదా అని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లి ప్రధాని దృష్టికి తెచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ఇతర పార్టీ నేతలను కూడా తన వెంట తీసుకెళ్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.  

20:11 - August 25, 2015

హన్మకొండ: ప్రజాక్షేత్రంలో కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హెచ్చరించారు. వరంగల్ ఉపఎన్నికను పది వామపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈమేరకు వామపక్ష నేతలు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. టీఎస్‌ సర్కార్‌ ప్రజా ఆకాంక్షలను ఎంత మేరకు నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ఈ విషయం వరంగల్‌ పార్లమెంట్ ఉప ఎన్నికలో స్పష్టంగా కన్పిస్తుందని చెప్పారు. అనంతరం సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ బూటకపు మాటలకు ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారని చెప్పారు.-

20:04 - August 25, 2015

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై భ్రమలు తొలగిపోయాయి. రేపు,మాపు అంటూ ఊరించిన ఊహలు తేలిపోయాయి. స్పెషల్ స్టేటస్ రాదని దాదాపు తేల్చేసింది కేంద్ర ప్రభుత్వం. విభజన చట్టంలోని హామీలన్ని నెరవేరుస్తామని చెబుతూనే...చట్టంలో లేని స్టేటస్‌ హామిపై ఆశలు వదులుకోవాలని అరుణ్‌ జైట్లీ పరోక్షంగా సెలవిచ్చారు.
స్వరం మారుస్తోన్న బీజేపీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పదేళ్లు ఇవ్వాల్సిందేనని పార్లమెంటులో గొంతు చించుకున్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక స్వరం మారుస్తోంది. స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి అనేక అడ్డంకులున్నాయిని పరోక్షంగా సెలవిస్తున్న కేంద్రం....చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాక్షిగా మరింత క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆశించిన దాన్ని కన్నా ఎక్కువ సాయం చేస్తామంటూనే...ముఖ్యమైన ఆశైనా ప్రత్యేక హోదాను గోదాలోకి నెట్టేసినట్టు పరోక్షంగా వ్యాఖ్యానించింది.
రోడ్ మ్యాప్ తయారీ
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాజధాని నిర్మాణం, పోలవరంకు నిధులు, విభజన చట్టంలోని హామీలుపై ప్రధానంగా చర్చించారు. తర్వాత జైట్లీ, చంద్రబాబు ఇద్దరూ రెండు సార్లు మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలన్ని నెరవేరుస్తామని ప్రధాని చెప్పారని జైట్లీ తెలిపారు. విభజన చట్టంలోని హామీల అమలుకు రోడ్ మ్యాప్ తయారు చేయాలని నీతి ఆయోగ్‌ అధికారులను ప్రధాని ఆదేశించారని జైట్లీ చెప్పారు.
జైట్లీ దాటవేత ధోరణి
ప్రత్యకే హోదాపై ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు హోరెత్తుతున్నా అరుణ్ జైట్లీ యధావిధిగా దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షపై నీళ్లు చల్లారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా ఆర్థిక సాయం అందిస్తామన్న జైట్లీ...దీన్ని స్పెషల్ స్టేటస్ అనుకోవచ్చు లేదంటే ఆర్థిక వెసులుబాటు అనుకున్నా పర్వాలేదన్నారు. ప్రత్యేక హోదా వలన లభించేవన్నీ ఏపీకి వస్తాయన్నారు. అలాగని ఏపీకి పదేళ్లు ప్రత్యక హోదా ఇస్తామన్న హామిపై వెనక్కితగ్గమన్నారు.
విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తామన్న జైట్లీ
విభజన చట్టంలోని 46,90,94లోని హామీలను జైట్లీ నెరవేరుస్తామన్నారు. సెక్షన్‌ 94లో ఉన్న హామీలు ఏంటంటే...తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఆర్థికవృద్దికి చర్యలు, ఇరు రాష్ట్రాలకూ పన్ను రాయితీలు, పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహకాలు, తెలుగు రాష్ట్రాల్లో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు, అమరావతి నిర్మాణం కోసం అటవీ భూముల డీనోటిఫై. ఇక సెక్షన్‌ 40లో ఇరు రాష్ట్రాల్లో హైకోర్టుల ఏర్పాటుకు సహకారం.
వెంకయ్య నాయుడి నర్మగర్భమైన వ్యాఖ్యలు
మరోవైపు ప్రత్యేక హోదా పేదళ్లు కావాలంటూ నాడూ పార్లమెంటులో ఆవేశంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు కూడా నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. స్పెషల్‌ స్టేటస్‌కు జాతీయ అభివృద్ధి మండలి, ప్రణాళికా సంఘం అనుమతిలేదని చెప్పారు. వీటి ఆమోదం కావాలంటే 9 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయని చెప్పారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌కు ఆశించిన దాని కన్నా ఎక్కువే చేస్తామంటున్న కేంద్రం...అభివృద్ధికి మూలమని ఆశిస్తున్న ప్రత్యేక హోదాపై మాత్రం దాటవేత దోరణి అవలంభిస్తోంది.

 

సెప్టెంబర్ 2న కార్మికుల సమ్మెకు మద్దతు: పి.మధు

హైదరాబాద్: సెప్టెంబర్ 2న కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. నగరంలోని ముఖ్దుం భవన్ లో నిర్వహించిన వామపక్షపార్టీల సమావేశం ముగిసింది. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పి.మధు మాట్లాడుతూ సెప్టెంబర్ 1న వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల నిరసన కార్యక్రమాలకు మద్దతిస్తామని చెప్పారు. ఈనెల 28న విజయవాడలో విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 11, 12 తేదీల్లో కరువు ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. కరువు సమస్యలపై ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

19:07 - August 25, 2015

రాజమండ్రి: రైతులను ఇబ్బంది పెట్టి భూములు తీసుకోవద్దని పవన్‌ కళ్యాణ్‌ చక్కగా చెప్పారని... ఆయన మాటలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ఎంపీ మురళీమోహన్‌ స్పష్టం చేశారు. ఈమేరకు రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూసేకరణపై పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం తప్పులేదన్నారు. తనకు అన్యాయం జరిగినందుకే గతంలో భూసేకరణపై కోర్టుకు వెళ్లానని మురళీమోహన్ తెలిపారు. అవసరమైతే పవన్‌తో కలిసి రాజధాని రైతులను ఒప్పించేందుకు తాను సిద్ధమే అన్నారు. 

ఈనెల 28 కి ఎపి కేబినెట్ సమావేశం వాయిదా

హైదరాబాద్: ఈనెల 27 న జరగాల్సిన ఎపి కేబినెట్ సమావేశం 28 వాయిదా పడింది. ఈమేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

 

18:30 - August 25, 2015

అహ్మదాబాద్‌: గుజరాత్‌ రాష్ట్రంలో పటేల్ సామాజిక వర్గం... భారీ ఆందోళనకు దిగింది. పటేదార్ అనామత్ ఆందోళన్‌ సమితి ఆధ్వర్యాన... అహ్మదాబాద్‌లో 10 లక్షల మందితో మెగా ర్యాలీ నిర్వహించారు. పటేల్ సామాజిక వర్గానికి ఓబీసీ కోటాలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించకుంటే... 2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించదని... పటేదార్ అనామత్ ఆందోళన్‌ సమితి కన్వీనర్ హార్డిక్ పటేల్ హెచ్చరించారు. 2 నెలలుగా చిన్న చిన్న పట్టణాలు, నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిన హార్డిక్ పటేల్... ఇవాళ అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు.

 

17:53 - August 25, 2015

గుంటూరు: జిల్లాలోని వినుకొండలో ప్రమాదం చోటుచేసుకుంది. కుమ్మరిబజార్ లో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అయితే శిథిలాల కింద కొందరున్నారని మొదటగా అనుమానం వ్యక్తం చేసినా.. చివరకు శిథిలాల కింద ఎవరూ లేరని నిర్ధారించుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్ణం జరగలేదు. దీంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు.

17:45 - August 25, 2015

మహిళల భద్రత కోసం, వారిని గౌరవంగా చూసేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ మహిళలకు రక్షణ దొరుకుతుందా అంటే లేదని చెప్పాలి. ప్రస్తుతం సమాజంంలో మహిళలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమాజం వారిని ఏ విధంగా చూస్తుంది. ఎటువంటి మార్పు రావాల్సి ఉంది అనే అంశంపై వేదిక చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ఉమెన్ కౌన్సిల్ మెంబర్ అండ్ కార్పొరేట్ మేనేజర్ చిత్ర రాజన్, వియ్ సపోర్టు షి... ఆర్గనైజేషన్ ప్రతినిధి ఆర్యన్ పాల్గొని, మాట్లాడారు. వక్తలు తెలిపిన వివరాలను వారి మాటల్లోనే... ''ప్రతి ఒక్కరూ స్వార్థం విడనాడాలి. ప్రజల్లోని ఆటిట్యూడ్ చేంజ్ కావాలి. ఇతరుల కష్టాల్లో పాలుపంచుకోవాలి. సమాజ హితాన్ని కోరాలి. మన చుట్టు ఉండే వారి బాగోగులు పట్టించుకోవాలి. ఎక్కడ, ఏం జరిగితే నా కేంటీ అనే భావనను విడనాడాలి. తోటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయాలి. నాకు ఎందుకు అన్న ఆలోచనను వదులుకోవాలి. మహిళలకు ధైర్యాన్ని క్రియేట్ చేయాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి''. అని వక్తలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

బాబుపై జగన్ విమర్శలు..

విజయవాడ : ఓటుకు నోటు కేసు నుండి బయటపడేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ లేదని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటన్నారు. 

ఇద్దరు మావోయిస్టు మద్దతు దారుల అరెస్టు..

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలోని పురిలియా జిల్లాలో ఇద్దరు మావోయిస్టు మద్దతు దారులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు మిడ్నాపూర్ జిల్లా బెల్ పహారి ప్రాంతానికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. 

17:37 - August 25, 2015

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టం అయ్యేంత వరకు కేంద్రం సాయం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా..ఇతర డిమాండ్లపై కేంద్రంతో చర్చించేందుకు చంద్రబాబు నాయుడు హస్తిన వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి మోడీ, ఇతర కేంద్ర మంత్రులతో ఆయన వరుస భేటీలు జరిపారు. అనంతరం సాయంత్రం మీడియా సమావేశంలో వివరాలను బాబు వెల్లడించారు.

ప్రత్యేక హోదా కంటే ఎక్కువ సాయం చేస్తానంటే..
ప్రత్యేక హోదా రాదనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ సాయం చేస్తానంటే వద్దననా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్ర పథకాలు ఇవ్వకపోతే లాభం లేదన్నారు. ప్రత్యేక హోదాపై తాను కోరిన దాన్నే పరిశీలిస్తామని హామీ ఇచ్చారని బాబు తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తే అది ఒక సంజీవని కాదని, 14వ ఆర్థిక సంఘం ప్రకారం ప్రత్యేక హోదా కాదంటే ఏం ఇస్తారో చెప్పమమని అడగడం జరిగిందన్నారు. ప్రత్యేక హోదాలో పారిశ్రామిక రాయితీలు లేవని, ప్రత్యేక హోదా, పారిశ్రామిక వెసులుబాటు అనేవి రెండు వేర్వేరు అని చంద్రబాబు పేర్కొన్నారు.

కేంద్రం సహాయం చేసింది..
చట్టంలో ఉన్న వాటిపై ఇప్పటికే కేంద్రం కొంత ఆర్థిక సాయం చేసిందని, రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చారని తెలిపారు. కేంద్రం నుండి రూ.2,300 కోట్లు లభించాయని, రూ.350 కోట్లు వెనుకబడిన జిల్లాలకు అందాయన్నారు. ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ఏడు జిల్లాలకు వాటిని పంచినట్లు చెప్పుకొచ్చారు. మూలధనం అలవెన్స్ కింద 15 శాతం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.250 కోట్లు వచ్చాయన్నారు. వీటితో పాటు ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటి, ఎన్ఐటి, కస్టమ్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ వంటి విద్యా సంస్థలు వచ్చాయన్నారు.

రాజధానిపై మోడీ హామీ..
2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.10,500 కోట్లు ఉందని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీని ఏడు జిల్లాలకు ఇస్తామని, అలాగే హైదరాబాద్ తో సమానంగా మరో రాజధానిని నిర్మిస్తామని అప్పుడు కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు. తిరుపతి సమావేశంలోనూ ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తామని మోడీ హామీనిచ్చారని పేర్కొన్నారు. మోడీ, తాను చెప్పిన హామీలన్నీ ప్రజలు నమ్మి గెలిపించారని తెలిపారు. ప్రస్తుతం కొన్ని విద్యా సంస్థలు వచ్చాయని, ఇంకా కొన్ని రావాల్సి ఉందని, కేంద్ర వర్సిటీ, గిరిజన వర్సిటీ, మైనింగ్ వర్సిటీలు రావాల్సి ఉందన్నారు. పోలవరం కింద 200 గిరిజన గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉందన్నారు. 

పదో షెడ్యూల్ పై అనేక వివాదాలు..
పదో షెడ్యూల్ ను సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల విద్యుత్ ఉద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. ఉమ్మడి రాజధానిలో అడుగడుగునా అవమానాలు జరిగాయని ప్రధానికి వివరించడం జరిగిందని తెలిపారు. ఏపీ అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. పదో షెడ్యూల్ లోని అనేక సంస్థలపై వివాదాలు నెలకొన్నాయన్నారు. సామరస్య పరిష్కారానికి తెలంగాణకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని, విభజనలో ఆస్తులు, అప్పులు, సంస్థల పంపిణీకి పాటించిన విధానాలు సక్రమంగా లేవన్నారు. ఉద్యోగులను హైదరాబాద్ నుండి రమ్మంటే ఇబ్బంది పడుతున్నారని, అమరావతిలో వసతి లేదని, పిల్లల చదువులకు ఇబ్బంది ఉందని చెబుతున్నారని తెలిపారు.

 • కర్నాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితి వచ్చేంత వరకు సహాయం చేయాలి.
 • హిమాచల్ ప్రదేశ్ కు ఇచ్చిన పన్నుల వెసులుబాటును సీఆర్డీఏ ప్రాంతానికి ఇవ్వాలి.
 • కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం భరించేలా పారిశ్రామిక వెసులుబాటు ఇవ్వాలి.
 • రాజధాని నిర్మాణం కోసం సహకారం కావాలి.
 • ఏపీలో పరిశ్రమలు లేవు. నిరుద్యోగు సంఖ్య అధికంగా ఉంది. ఈ లోటు భర్తీ చేయాలి.
 • రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి సహకరించాలి.
 • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి పథంలో వెళ్లేలా చూడాలి.
 • విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ అమలు చేయాలి. 
   

గుంటూరులో కుప్పకూలిన మూడంతస్తుల భవనం..

గుంటూరు : జిల్లాలోని వినుకొండ కుమ్మరి బజార్ లో ప్రమాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు చిక్కుక్కునట్లు తెలుస్తోంది. 

16:43 - August 25, 2015

హైదరాబాద్: రైలు ప్రయాణమంటే చాలు మనసు ఎగిరిగంతేసి అప్పుడే పట్టాలపై పరుగెడుతుంది. ఒక్క రోజైనా..రెండ్రోజులైనా ఆ అనుభూతిని ఆస్వాదించాలని ఉంటుంది. అలాంటిది రైలే ఇల్లయితే...? రైలే ప్రపంచమయితే..? ఇంకేముంది ప్రతీ రోజూ పండుగే...ప్రతీరోజూ కొత్తే. వినడానికి కొంత వింతగా ఉన్నాఇది నిజం. ఓ అందమైన అమ్మాయికి తట్టిన ఈ ఆలోచనను ఆచరణలో పెట్టేసింది. హ్యాపీగా రైలులోనే జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తోంది.
ఆ ఐడియా ఆమె జీవితాన్నే మార్చేసింది
లియోని ముల్లేర్‌ అనే అందమైన అమ్మాయిప ఉండేది జర్మనీలో. లియోనికి ఊరు...పేరైతే ఉందికాని ఉండేందుకు ఇల్లుమాత్రం లేదు. తాను గతంలో ఉండే అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ వివాదంలో ఉండటంతో విసుగెత్తి అక్కడి నుంచి సూట్‌కేస్ సర్దేసింది. ఆ తరువాత ఈమెకు వచ్చిన ఐడియా ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆ ఫ్లాటు..ఈ ఫ్లాటు మెట్లెక్కడం ఎందుకనుకుందో ఏమో ఏకంగా రైలు ఎక్కేసింది. రైలు ఎక్కింది కూడా సొంతూరుకు వెళ్లడానికి కాదు అందులోనే తన ఆవాసాన్ని ఏర్పర్చుకునేందుకు. ఇక అప్పటి నుంచి రైలే లియోని ఇల్లు అయింది.
దేశమంతా తిరిగే ట్రైన్‌పాస్‌
380 డాలర్లు పెట్టి దేశమంతా తిరిగే ట్రైన్‌ పాస్‌ కొనుక్కున్న లియోని రైలులోనే అన్ని పనులు చేసుకుంటోంది. రైలు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు తలను శుభ్రం చేసేసుకుంటుంది. తినేందుకు ట్రైన్‌ క్యాంటీన్‌ కామనే. రాసుకోవడం, ల్యాప్‌టాప్‌లో చదువుకోవడం...మెయిల్స్‌ పంపించుకోవడం ఇక అన్నీ ట్రైన్‌లోనే అని లియోని అంటోంది.
థ్రిల్లింగ్‌ గా రైలు జీవితం..
తన రైలు జీవితం చాలా థ్రిల్లింగ్‌ ఉందట లియోనికి. రోజూ కొత్తకొత్త వాళ్లతో పరిచయం..కొత్తగా మిత్రులు ఏర్పడటం...రోజుకో సిటీని చూడటం అంతా కొత్తగా ఉందంటోంది లియోని. ఆర్థికంగాను ఈ రైలు జీవితం లియోనికి లాభదాయకంగానే ఉంది. గతంలో ఫ్లాట్‌కు నెలకు 450 డాలర్లు చెల్లిస్తే ఇప్పుడు ట్రైన్‌పాస్‌కు 380 డాలర్లు చెల్లిస్తోంది. ఏదైతేనేం ఈ జర్మన్‌ సుందరికి వచ్చిన ఆలోచన మెచ్చుకోదగ్గదే.

 

16:34 - August 25, 2015

ఢిల్లీ: కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం రెండు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలిపినట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని మోడీతో కేజ్రీవాల్ భేటీ అయ్యారు. అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ పాలనలో కేంద్రం నుంచి తమకెదురవుతున్న సమస్యలను ప్రధానికి వివరించినట్లు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేస్తున్న ఉత్తర్వులను కేంద్రం అడ్డుకుంటున్న తీరును ప్రధానికి తెలిపినట్లు చెప్పారు. చక్కగా పనిచేస్తున్న ఎసిబికి కేంద్రం అవినీతి అధికారిని నియమించడం ద్వారా ఎవరికి ఉపయోగం ఉందని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీస్‌.. ప్రభుత్వంతోనే యుద్ధం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

16:23 - August 25, 2015

వరంగల్: సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వార్నింగ్ ఇవ్వాలంటే వరంగల్‌ ఉప ఎన్నికలో వామపక్షాల అభ్యర్థికి పట్టం కట్టాలని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. వరంగల్‌లో నిర్వహించిన పది వామపక్షాల సదస్సుకు ఆయన హాజరై, ప్రసంగించారు. ఇంకా ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయలేదని తెలిపారు. ప్రజాగాయకుడు గద్దర్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తమ్మినేని చెప్పారు. గద్దర్‌ను నిలబెట్టాలనుకుంటున్నా అంగీకారం కుదరాల్సి ఉందన్నారు. ప్రజల తరపున పోరాడే వారిని, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించి వారిని అభ్యర్థిగా నిలబెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థిగా నిలబెట్టేవారు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే వారుగా ఉండాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రజా తెలంగాణ రాలేదని...నియంతృత్వ తెలంగాణ వచ్చిందన్నారు. పెట్టుబడిదారులు, కార్పొరేట్లకు ఉపయోగపడే తెలంగాణగా ఉందని పేర్కొన్నారు. ప్రజా తెలంగాణ, సామాజిక తెలంగాణ రావాలన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు.

 

16:21 - August 25, 2015

ఢిల్లీ : ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత పాటే పాడారు. ఏపీ ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులతో ఆయన వరుస భేటీలు జరిపారు. అనంతరం సీఎం బాబుతో కలిసి జైట్లీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధానితో జరిగిన సమావేశంలో నీతి ఆయోగ్ ఛైర్మన్, తాను పాల్గొనడం జరిగిందని జైట్లీ తెలిపారు. గంటన్నర పాటు జరిగిన సమావేశంలో ఒక్కో అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందని, గతంలో ఇచ్చిన వినతిపత్రం..ఇప్పుడిచ్చిన వినతిపత్రంపై సమీక్షించడం జరిగిందన్నారు. అన్ని హామీలు అమలు చేసేందుకు నీతి ఆయోగ్ ఛైర్మన్ ను ప్రధాని ఆదేశించారు. నీతి ఆయోగ్ సిఫార్సులు వచ్చాక ప్రధాని ప్రత్యేక ప్రకటన చేస్తారని, రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసం ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామన్నారు. ఆయన ప్రసంగంలోని హైలెట్స్..

 • ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలకు కట్టుబడి ఉన్నాం.
 • తొలి ఏడాదిలో కొంతమేర ఆర్థిక సాయం చేయడం జరిగింది.
 • వెనుకబడిన ఏడు జిల్లాలకు పన్నుల్లో వెసులుబాటు కల్పించడం జరిగింది.
 • ఏపీలో ఇప్పటికే జాతీయ స్థాయి విద్యా సంస్థలు నెలకొల్పాం.
 • ఈ ఏడాది నుండి వచ్చే ఐదేళ్లు రెవెన్యూ లోటును ఫైనాన్స్ కమిషన్ లెక్కిస్తుంది. రాజధాని నిర్మాణానికి ప్రాథమిక నిధులు మంజూరు చేశాం.
 • విజయదశమి రోజు జరిగే శంకుస్థాపనకు ప్రధానిని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.
 • వివిధ మార్గాల్లో ఏపీ రాష్ట్రానికి ఆర్థిక సాయం కొనసాగుతూనే ఉంటుంది. 
 • ఏపీ ఆర్థిక హక్కులను రక్షించేందుకు సభా వేదికగా అప్పుడు పోరాడడం జరిగింది. 
 • అప్పటి ఆర్థిక పోరాటానికి కట్టుబడి ఉన్నాం.
 • ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది కాబట్టే ఈ కసరత్తు అంతా.
 • ఏపీ ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దడంపైనే ఆసక్తి.
 • ప్రత్యేక హోదా అయినా ప్రత్యేక ప్యాకేజీ అయినా ఆర్థిక సాయమేగా ?
 • ఏపీకి సాయం విషయంలో వెనకడుగు ప్రశ్నే లేదు. 


 

ముగ్దుంభవన్ లో కాసేపట్లో ఎపి వామపక్షపార్టీల సమావేశం

హైదరాబాద్: నగరంలోని ముగ్దుంభవన్ లో కాసేపట్లో ఎపి వామపక్ష పార్టీల సమావేశం జరుగనుంది.
 

అరుణ్ జైట్లీ - బాబు సంయుక్త మీడియా సమావేశం..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జైట్లీ మాట్లాడుతున్నారు. 

మంత్రి గంటాతో టీచర్ల సంఘాల చర్చలు..

హైదరాబాద్ : ఏపీ విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావుతో టీచర్ల సంఘాలు చర్చలు జరిపాయి. బదిలీలు, క్రమబద్ధీకరణ షెడ్యూలు త్వరలో విడుదలకు గంటా అంగీకారం తెలిపారు. ఏకీకృత సర్వీసు రూల్స్ పై వారంలోగా టీచర్లతో ప్రత్యేక సమావేశం ఉంటుందని ఈ సందర్భంగా గంటా పేర్కొన్నారు. 

కొలుకుని లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

ముంబై : కొలుకొన్న స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ముగిసింది. 291 పాయింట్ల లాభంతో 26,032 వద్ద సెన్సెక్స్ ముగియగా 72 పాయింట్ల లాభంతో 7,881 వద్ద నిఫ్టీ ముగిసింది. 

హవల్దార్ మేజర్ సింగ్ తరలించడానికి రంగం సిద్ధం..

ఢిల్లీ : జంతర్ మంతర్ వద్ద గత పది రోజులుగా దీక్ష చేస్తున్న హవల్దార్ మేజర్ సింగ్ ను ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దీక్ష చేపడుతున్న జంతర్ మంతర్ వద్ద అంబులెన్స్ చేరుకుంది. 

వాటర్ గ్రిడ్ పై కేసీఆర్ సమీక్ష..

కరీంనగర్ : వాటర్ గ్రిడ్ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంచినీటి కోసం అమలు చేసే పథకాలను వాటర్ గ్రిడ్ తో అనుసంధానించాలని సూచించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున వాటర్ గ్రిడ్ ప్లాంట్ నెలకొల్పుతామని, ఇంటేక్ వెల్స్ కడుతూనే అవసరమైన విద్యుత్ లైన్ లు వేసుకోవాలని పేర్కొన్నారు. పనులు పూర్తయిన చోట మంచినీటి సరఫరాను ప్రారంభించాలని కేసీఆర్ తెలిపారు. 

గద్దర్ పోటీ చేస్తే గెలుపు ఖాయం - తమ్మినేని..

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో గద్దర్ పోటీ చేస్తే గెలుపు ఖాయమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పేర్కొన్నారు. వామపక్షాలు, మేధావి వర్గాలు గద్దర్ ను ఒప్పించే పనిలో ఉన్నాయన్నారు.

 

15:40 - August 25, 2015

హైదరాబాద్: సెప్టెంబర్ 3 నాటికి విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని హైకోర్టు... కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో క్షణం కూడా సమయం వృధా చేయరాదని సూచించింది. తమను అకారణంగా రిలీవ్ చేయటంపై కొందరు ఏపీ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం... ఇరు రాష్ట్రాల అధికారులను పిలిచి.. సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 

పటేల్ ర్యాలీలో ఉద్రిక్తత..

అహ్మాదాబాద్ :పటేల్ ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులపై పోలీసులు బాష్పావాయువు ప్రయోగించారు. పటేల్ కులస్తులను ఓబీసీలో చేర్చాలని ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

కాసేపట్లో బాబు మీడియా సమావేశం..

ఢిల్లీ : కాసేపట్లో మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈసమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా పాల్గొనున్నారు.

15:37 - August 25, 2015

హైదరాబాద్: నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత జానారెడ్డి అన్నారు. కిష్టారెడ్డి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేపు కిష్టారెడ్డి అంతిమ యాత్రలో కాంగ్రెస్‌ శాసనసభ్యులు అంతా పాల్గొంటారని చెప్పారు. కిమ్స్‌ ఆస్పత్రిలో కిష్టారెడ్డి భౌతికకాయానికి కాంగ్రెస్‌ నేతలు నివాళులు అర్పించారు. 

సరిహద్దులో పాక్ కాల్పులు..జవాన్ మృతి..

జమ్మూ కాశ్మీర్ : భారత సరిహద్దులో పాక్ బలగాలు కాల్పులకు పాల్పడ్డాయి. కుప్వార ప్రాంతంలోని నౌగామ్ సెక్టార్ లో పాక్ జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందాడు. 

15:33 - August 25, 2015

కృష్ణా: సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణాజిల్లా కొత్తమాజేరులో విషజ్వరాల బారినపడి ప్రజలు చనిపోతున్నా..బాధిత కుటుంబాలను సర్కార్‌ పట్టించుకోక పోవడంపై ఆయన తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 'ఎవరూ బాధపడవద్దు...వచ్చేది మన ప్రభుత్వమే'.. అప్పుడు వారం రోజుల్లోనే బాధితులందరికి చెక్కులు అందిస్తామని' జగన్ హామీ ఇచ్చారు.

 

ప్రభుత్వమే బాధ్యత వహించాలి - హర్దిక్..

అహ్మాదాబాద్ : తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నా పోలీసులు లాఠీఛార్జీ చేస్తున్నారని హర్దిక్ పటేల్ పేర్కొన్నారు. ర్యాలీలో ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్‌ కోటా కోసం సాగుతున్న ఉద్యమానికి పటేల్ రథసారథి అయిన విషయం తెలిసిందే. మంగళవారం ఆయన అహ్మదాబాద్ లో భారీ బహిరంగసభ నిర్వహించారు. 

15:27 - August 25, 2015

కడప: ఎర్రచందన స్మగ్లింగ్‌పై పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా కడప జిల్లాలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు కోట్ల విలువ చేసే..రెండు టన్నుల ఎర్రచందనం దుంగలు, ఓ ఆయిల్‌ట్యాంకర్‌, నాలుగు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

జగన్ బంద్ పిలుపునివ్వడం అవివేకం - ప్రభాకర్ చౌదరి..

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29వ తేదీన రాష్ట్ర బంద్‌కు వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునివ్వడం అవివేకమని ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి పేర్కొన్నారు. 29వతేదీన రాఖీ పౌర్ణమి, అధికార భాషా దినోత్సవం ఉందని, ఆరోజు బంద్‌కు పిలుపునివ్వడం శోచనీయమన్నారు.

చెన్నా సన్యాసి రాజు అకస్మిక మృతి..

విశాఖపట్టణం : దళిత కవి, రెల్లి భాషకు లిపిని సమకూర్చిన చెన్నా సన్యాసిరాజు మంగళవారం ఆకస్మికంగా మృతిచెందారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. బుధవారం ఎంవీపీ కాలనీలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

అనంతపురంలో మంత్రి పల్లె పర్యటన..

అనంతపురం : జిల్లాలో నూతనంగా నిర్మించిన ఆయా అభివృద్ధి పనులను రాష్ట్ర సమాచార శాఖా మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. జిల్లాలోని ఆమడగూరు మండలం పూలుకుంటపల్లెలో నిర్మించిన పశు వైద్యశాలను..కొట్టువారిపల్లెలో నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను, అంగన్‌వాడీ కేంద్రాన్ని మంత్రి పల్లె ప్రారంభించారు.

బెంగళూరు కార్పొరేషన్ కమలం వశం..

బెంగళూరు : మహానగర పాలక సంస్థ (బీబీఎంపీ)కు జరిగిన ఎన్నికల్లో కమలం విజయం సాధించింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 100 స్థానాలు కైవసం చేసుకోగా కాంగ్రెస్ 47 స్థానాలతో సరిపెట్టుకుంది. 

14:58 - August 25, 2015

ముంబై : బాలీవుడ్ అందగత్తె 'ఐశ్వర్యరాయ్ సుదీర్ఘ విరామం తరువాత నటించిన 'జజ్బా' ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రంలో 'ఇర్ఫాన్ ఖాన్' మరో ప్రధాన పాత్ర పోషించాడు.
'జజ్బా'లో ఐష్ ఓ పాటను కూడా పాడిందని బాలీవుడ్ టాక్. యాక్షన్, డ్రామా అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ శక్తివంతమైన లాయర్ పాత్రలో కనిపించనుంది. మరణదండన పడిన ఓ నిరపరాధిని శిక్ష నుంచి కాపాడే క్రమంలో ఓ మహిళా న్యాయవాది సాగించిన పోరాటం నేపథ్యంలో చిత్ర కథ సాగుతుందని టాక్. ఈ చిత్రానికి సంజయ్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఇర్ఫాన్ ఖాన్ పోలీసు ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. షబానా ఆజ్మీ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఆక్టోబర్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

14:42 - August 25, 2015

కరీంనగర్ : ప్రజల భాగస్వామ్యంతో ఆరోగ్య తెలంగాణ సాధిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కరీంనగర్ గ్రామజ్యోతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లోని పలు సమస్యలను తెలుసుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో పక్కా ప్రణాళికతో గ్రామజ్యోతి కార్యక్రమం తీసుకెళుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో పరిశుభ్రత అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం రూ.200 కోట్లు కేటాయించినట్లు, 2500ఆటోలు, 40 లక్షల చెత్తబుట్టలకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. సర్పంచ్ లతో సమానంగా ఎంపీటీసీలకు బాధ్యతలు అప్పచెప్పినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు కష్టాలు ఎదుర్కొన్నామని, ప్రస్తుతం పక్కా ప్రణాళికతో కరెంటు కష్టాలను అధిగమించామన్నారు. 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయడం జరుగుతోందని, ఇందుకు భూ సేకరణ పని జరుగుతోందని తెలిపారు. ఇక్కడ పైసా అవినీతి లేకుండా చేస్తున్నామని, అలాగే ప్రైవేటు పరం చేయకుండా జెన్ కో ద్వారా చేయడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొన్ని పత్రికలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఇంటింటికి నల్లా కనెక్షన్ కల్పించడం ప్రభుత్వం లక్ష్యమని, పట్టణ జ్యోతి కార్యక్రమం కింద మున్సిపాల్టీల్లో అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరిస్తామని పేర్కొన్నారు. విభజన జరిగిన తరువాత ఎలాంటి రియాక్షన్, ఎంతటి ఆదాయం వస్తుందో తెలుసుకున్నామని, అనంతరం అంచనాలకు తగ్గట్టు బడ్జెట్ రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ఇక్కడ కొన్ని పత్రికలు, పార్టీలు పనిగట్టుకుని అమాయకత్వంగా వార్తలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదని, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ తెలంగాణ రాష్ట్రానికి 'ఏ' రేటింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఉమ్మడిగా ఉన్న సమయంలో ఇరిగేషన్ విషయంలో తెలంగాణ దగా పడిందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మహారాష్ట్ర ఒప్పుకోలేదని కానీ చేవెళ్ల దగ్గర కాలువలు తవ్వారని కేసీఆర్ విమర్శించారు. 

రాబోయే రోజుల్లో పక్కా ప్రణాళికతో గ్రామజ్యోతి - కేసీఆర్..

కరీంనగర్ : రాబోయే రోజుల్లో పక్కా ప్రణాళికతో గ్రామజ్యోతి కార్యక్రమం తీసుకెళుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో పరిశుభ్రత అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం రూ.200 కోట్లు కేటాయించినట్లు, 2500ఆటోలు, 40 లక్షల చెత్తబుట్టలకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. సర్పంచ్ లతో సమానంగా ఎంపీటీసీలకు బాధ్యతలు అప్పచెప్పినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు కష్టాలు ఎదుర్కొన్నామని, ప్రస్తుతం పక్కా ప్రణాళికతో కరెంటు కష్టాలను అధిగమించామన్నారు. 

విద్యుత్ ఉద్యోగు రిలీవ్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. సెప్టెంబర్ మూడు నాటికి సమస్య పరిష్కరించాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. ఇరు రాష్ట్రాల అధికారులను పిలిచి సమస్య పరిష్కరించాలని సూచించింది. 

బేతంచర్ల తహశీల్దార్ కు హైకోర్టు జరిమాన..

కర్నూలు : భూమి పట్టా ఇవ్వడానికి లంచం డిమాండు చేసిన ఓ తహసీల్దార్‌కు పదివేల రూపాయల జరిమానాను హైకోర్టు విధించింది. ముద్దవరం గ్రామానికి చెందిన రాజమ్మకు తన నాలుగు ఎకరాల భూమికి పట్టా ఇవ్వడానికి బేతంచర్ల తహసీల్దార్‌ రూ.50 వేలు డిమాండ్‌ చేశారు. దీనిపై హైకోర్టు తహసీల్దార్‌కు జరిమానాను విధించింది.

 

రాజనగరం పీహెచ్ సీని తనిఖీ చేసిన కలెక్టర్..

రాజమండ్రి : రాజానగరం పీహెచ్‌సీని కలెక్టర్ అరుణ్‌కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యాధికారి రామకృష్ణారావుపై కలెక్టర్ సస్పెన్షన్‌ వేటు వేశారు. 

కోల్ కతాలో విద్యార్థుల మౌన నిరసన..

కోల్ కతా : వీసీ అనురాధ్ లోహియా రాజీనామా చేయాలని కోరుతూ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు నోటికి బట్టలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు చేపట్టిన మౌన ప్రదర్శన బాధాకరమని, అయినా వారు తమ పిల్లలని వీసీ పేర్కొన్నారు.

12:52 - August 25, 2015

హైదరాబాద్ : స్టాక్‌ మార్కెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. చైనా దెబ్బకు నిన్న 1624 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ ఇవాళ కూడా నష్టాల బాటలోనే పయనిస్తోంది. సెన్సెక్స్‌ 410 పాయింట్లు నష్టపోయి... 25 వేల 331 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి.. 7 వేల 676 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

బిల్స్ పాస్ కు సహకరించాలి - వెంకయ్య..

ఢిల్లీ : ప్రపంచ ఆర్థిక సంక్షోభం దృష్ట్యా పెండింగ్ లో ఉన్న బిల్లులు పాస్ అయ్యే విధంగా సహకరించాలని అన్ని పార్టీలను కోరుతున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 

12:50 - August 25, 2015

ఢిల్లీ : నేను ఏదైనా చేస్తాను. నన్నెవరూ ఏమీ చేయలేరు అనుకునే ఆకతాయి ఆటకు కళ్లెం వేసింది ఓ యువతి. తనను వేధిస్తున్నాడని బాధపడకుండా తెలివిని ప్రదర్శించి ఆకతాయిను జైలు పంపించింది. అందరూ ఇలాగే చేస్తే ఆకతాయిల ఆట కట్టించండం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు పోలీసులు.

ఒక ఫొటోతో కటకటాల వెనక్కి..

ఓ యువతి తీసిన ఫొటో ఒక ఆకతాయి ఆట కట్టించింది. యువతిని ఈవ్‌టీజింగ్‌ చేసిన యువకుడిని 24 గంటల్లోనే పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్ధిని జస్లీన్‌ కౌర్‌ తిలక్‌నగర్‌లో రోడ్డు దాటుతోంది. ఇంతలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై స్పీడ్‌గా దూసుకొచ్చిన సరవ్‌జిత్‌సింగ్‌ కౌర్‌ను ఢీకొట్టేంత పని చేశాడు. దీంతో అవాక్కైన కౌర్‌... సరవ్‌జిత్‌ సింగ్‌ను ప్రశ్నించింది. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించవా.. అంటూ నిలదీసింది. దీంతో కోపోద్రోక్తుడైన సరవ్‌జిత్‌.. ఆమెను దూషించాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. అంతేగాక ఆ తర్వాత ఆమెను వెంబడించడం మొదలుపెట్టాడు. బైక్‌పై వెళ్తూ అసభ్యకరంగా మాట్లాడాడు. లిఫ్ట్‌ ఇస్తాను.. వస్తావా.. అంటూ కామెంట్స్‌ చేశాడు. ఇదంతా ఓపికగా భరించిన కౌర్.. తెలివిగా ఈ తతంగాన్ని తన స్మార్ట్‌ఫోన్‌లో బంధించింది. తనను వేధిస్తున్న ఫొటోను పోలీసులకు పంపింది. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫేస్‌బుక్‌లోనూ పోస్టింగ్‌ .....

రోడ్లపై బైక్స్‌పై వెళ్తూ ఈవ్‌టీజింగ్‌ చేసేవాళ్లకు బుద్ది చెప్పాలని.. ఆ ఫొటోను ఫేస్‌బుక్‌లోనూ పోస్ట్‌ చేసింది. ఆమెకు మద్దతు తెలుపుతూ 63 వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి. రోడ్లపై నిత్యం ఇలాంటివి జరుగుతున్నాయని అనేకమంది మహిళలు తెలిపారు. అయితే ఇలా చేసినవారికి శిక్షపడడం లేదని.. దీనికి ఎవరూ ఫిర్యాదు చేయకపోవడమే కారణంగా తెలుస్తోంది. ధైర్యం ప్రదర్శించడమే కాకుండా... వేధింపులను ఫోన్‌లో బంధించిన కౌర్‌ను బ్రేవ్‌ గర్ల్‌ అంటూ పోలీసులు మెచ్చుకున్నారు. అంతేగాక ఆమెకు ఐదు వేల రూపాయలు నజరానా ప్రకటించారు.

కౌర్‌ ప్రదర్శించిన తెలివిని మీరూ....

ఆకతాయిల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఇకపై మీలో మీరే బాధపడకండి. కౌర్‌ ప్రదర్శించిన తెలివిని మీరూ ప్రదర్శించండి. మీ స్మార్ట్‌ఫోన్లు తీయండి. మిమ్మల్ని వేధించేవారి ఫొటోలు తీయండి. పోలీసులకు ఫిర్యాదు చేయండి. అదేవిధంగా ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లోనూ పోస్ట్‌ చేయండి. అంతే ఇక ఆకతాయిల ఆటకు ముగింపు పడుతుంది. 

12:47 - August 25, 2015

రంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది. ఓ గిరిజన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పూడూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సర్వే నెంబర్ 71, 72లో ఉన్న తమ 13 ఎకరాల భూమిని మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి అక్రమంగా రిజిస్ర్టేషన్ చేసుకున్నాడని ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా...ఉన్నతాధికారులు స్పందించి తమ భూమిని ఇప్పించాలని మృతురాలి కొడుకు కోరుతున్నాడు. అలాగే వివిధ పార్టీల నేతలు కూడా బాధితులకు అండగా నిలిచారు. 

12:44 - August 25, 2015

పశ్చిమగోదావరి : జిల్లాల్లో ఇంజక్షన్ల దుండగుడు కలకలం సృష్టిస్తున్నాడు. ఇవాళ ఉదయం పాలకోడేరు మండలం మోగల్లులో మహిళకు ఇంజక్షన్‌ ఇచ్చి కిడ్నాప్‌కు యత్నించాడు. అయితే మహిళ కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రెండ్రోజుల క్రితం ఇదే తరహాలో యండగండిలో దుండగుడు ఇద్దరు విద్యార్థినులకు ఇంజక్షన్‌ ఇచ్చాడు. పరారైన ఇంజక్షన్‌ దుండగుడిని మొగల్తూరులో స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. 

12:42 - August 25, 2015

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీతో దాదాపు గంటకు పైగా జరిగిన సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. అనంతరం చంద్రబాబుతో కలిసి బయటకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ చెప్పారని ఆయన తెలిపారు. ఏపీ అభివృద్ధి, విభజన చట్టంలోని హామీల అమలు కోసం ప్రత్యేక రోడ్ మ్యాప్ రూపొందించాలని నీతి ఆయోగ్ సీఈఓ అరవింద్ పనగారియాకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారని కూడా ఆయన చెప్పారు. విభజన చట్టంలోనే విభజన చట్టంలోని సెక్షన్‌ 46, 90, 94లో ఏపీకి సంబంధించిన అంశాలున్నాయని, విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తామని అరుణ్‌జైట్లి వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు స్పందించిన జైట్లీ అన్నీ వివరాలు చంద్రబాబు చెపుతారని తెలిపారు. దాని స్పందించిన చంద్రబాబు సాయంత్రం వివరిస్తానని పేర్కొన్నారు.

పీఎంఓ కార్యాలయానికి చేరుకున్న కేజ్రీవాల్..

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్, డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా లు పీఎంఓ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపట్లో వీరు ప్రధాన మంత్రితో భేటీ కానున్నారు. 

ఏపీకి అన్ని నెరవేరుస్తాం - అరుణ్ జైట్లీ..

ఢిల్లీ : విభజన చట్టంలోని అన్ని హామీలు నెరవేరుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈసమావేశంలో జైట్లీ పాల్గొన్నారు. అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు. ప్రధానితో జరిగిన భేటీలో విస్తృతంగా చర్చలు జరిగాయని, ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. సెక్షన్ 46,90, 94లోని ప్రధాన అంశాలపై సుదీర్ఘ మంతనాలు జరిగాయన్నారు. విభజన చట్టం అమలుకు రోడ్ మ్యాప్ చేయాల్సిందిగా నీతి ఆయోగ్ అధికారులను ప్రధాని ఆదేశించారని, చట్టం అమలుపై త్వరలో రోడ్ మ్యాప్ ప్రకటిస్తామన్నారు.

ప్రధాని మోడీతో ముగిసిన చంద్రబాబు భేటీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు జరిపిన భేటీ ముగిసింది. ఈసమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. 

కాసేపట్లో వివరాలు తెలియచేయనున్న బాబు..

ఢిల్లీ : దేశ రాజధానిలో ఏపీ భవిష్యత్ ఆధారపడి ఉంది. బీజేపీ ఎన్నికల వాగ్ధానాన్ని నిలుపుకుంటుందా ? ఏపీకి ప్రత్యేక హోదా దక్కుతుందా ? మోడీ - బాబు సమావేశంలో హోదాపై హామీ వస్తుందా ? ఈ విషయాలపై ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో వివరాలు తెలియచేయనున్నారు. 

కరీంనగర్ కలెక్టరేట్ లో సీఎం కేసీఆర్ సమీక్ష..

కరీంనగర్‌ : జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. 

పోలీసుల అదుపులో ఇంజక్షన్ నిందితుడు..

పశ్చిమగోదావరి : మహిళకు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ కు పాల్పడేందుకు ప్రయత్నించిన దుండగుడిని స్థానికులు మొగల్తూరులో పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. 

ఎమ్మెల్యే హఠాన్మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

హైదరాబాద్ : నారాయణఖేడ్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. 

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : మంగవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అనంతరం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 355 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 111 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

 

11:57 - August 25, 2015

హైదరాబాద్ : గుణశేఖర్ దర్శకంలో రూపొందించిన కాకతీయుల కాలం నాటి చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం రుద్రమదేవి సినిమా తేదీ విడుదల మళ్లీ వాయిదా పడినట్లు సమాచారం. తొలుత సెప్టెంబర్ 4న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పూర్తి కాలేదని, విడుదలకు మరి కొన్ని రోజులు ఆలస్యం కానున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ మూడో వారం నాటికి విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి అవుతాయని, అపుడే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

గుజరాత్ సర్కార్ కు హమీద్ పటేల్ హెచ్చరిక..

అహ్మదాబాద్ : తమ మెమోరాండంను రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోనంత వరకు నిరహార దీక్ష చేపట్టనున్నట్లు హార్దిక్ పటేల్ పేర్కొన్నారు. పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్‌ కోటా కోసం సాగుతున్న ఉద్యమానికి పటేల్ రథసారథి. మంగళవారం ఆయన అహ్మదాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. 

పంచాయతీ రాజ్ డీఈఈ నివాసంపై ఏసీబీ దాడులు..

విజయనగరం : పంచాయతీ రాజ్ డీఈఈ వెంకట్రావ్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లోని బంధువుల ఇళ్లలో ఆరు చోట సోదాలు నిర్వహించింది. 

ఎమ్మెల్యే హఠాన్మరణం పట్ల హరీష్, కాంగ్రెస్ నేతల సంతాపం..

హైదరాబాద్ : ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి హరీష్ రావు, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిలు సంతాపం తెలిపారు. 

జగన్ ధర్నా ప్రారంభం..

కృష్ణా : మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ధర్నా ప్రారంభమైంది. విష జ్వరాల బాధితులకు మద్దతుగా జగన్ ఈ ధర్నా చేపట్టారు. 

11:20 - August 25, 2015

హైదరాబాద్ : మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి ఈ ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) ఛైర్మన్‌ గా పటోళ్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి కూడా విజయం సాధించిన ఆయన, 2009 నుంచి నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత రెండు రోజులుగా గ్రామజ్యోతి కార్యక్రమంలో విశ్రాంతి లేకుండా పాల్గొన్నారు. అపస్మారకస్థితిలో ఉన్న ఆయన్ని గమనించిన కుటుంబ సభ్యులు కిమ్స్ కు తరలించేలోపే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. కిష్టారెడ్డి గౌరవార్థం కాసేపు గాంధీ భవన్ లో ఉంచి తదనంతరం తన స్వగ్రామానికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

11:17 - August 25, 2015

ఢిల్లీ : తెలుగువాడిగా రాష్ట్రానికి తన పూర్తి సహకారం అందిస్తానని, ఏపీ పునర్విభజన చట్టం సమగ్రంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వచ్చిన రాజ్ నాథ్ తో చంద్రబాబు సమావేశమై ఏపీ అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడారు. ఏపీలో సంస్థల ఏర్పాటు విషయంలో ముందుకు వెళుతున్నామన్నారు. ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని, విభజన వల్ల ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్న చేస్తున్నామని వివరించారు. దానిపై అధికారులతో సమావేశమై పరిష్కార మార్గాలు కనుక్కుంటామని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారని పేర్కొన్నారు. 

11:16 - August 25, 2015

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక, రాష్ట్ర అభివృద్ధి పై ప్రధాని నరేంద్ర మోదీ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పీఎంఓ కార్యాలయలంలో భేటీ అయ్యారు. ఢిల్లీలో కీలక భేటీ జరుగుతోంది. ఏపీ ఆర్ధిక అవసరాలు.. అందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమావేశం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చిస్తున్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఉన్నారు. ప్రత్యేకహోదా ప్రకటిస్తారా.. ప్యాకేజిలతో సరిపెడతారా.. లేక అవి కూడా క్లారిటీ ఇస్తారా ఇవ్వరా .. ఇలా అనేక ప్రశ్నలతో ఏపీ ప్రజానీకం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.  వీరి భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ, కేంద్ర సాయం, పారిశ్రామికాభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు సాయం చేయాలని చంద్రబాబు ప్రధానిని కోరనున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు వెంకయ్య నాయుడుతో భేటీ అయ్యారు. అనంతరం వెకంయ్యనాయుడు, చంద్రబాబు కలసి హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు.

శ్రీలంక నేవీ దాడిలో 12 మంది మృత్స్యకారులకు గాయాలు..

ఢిల్లీ : శ్రీలంక నేవీ జరిపిన దాడిలో 12 మంది మత్స్యకారులు గాయపడగా 20 బోట్లు దెబ్బతిన్నాయి. 

తెలుగు రాష్ట్రాల అపరిష్కృత సమస్యలు పరిష్కరిస్తాం - రాజ్ నాథ్..

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్యనున్న అపరిష్కృత సమస్యలు పరిష్కరిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం రాజ్ నాథ్ మీడియాతో మాట్లాడారు. విభజన సమస్యలు పరిష్కారమైతేనే అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు ముందుకెళుతాన్నారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కృష్ణారెడ్డి మృతి..

మెదక్ : నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కృష్ణారెడ్డి (67) గుండెపోటుతో మృతి చెందారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పటోళ్ల ప్రస్తుతం పీఏసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

 

10:52 - August 25, 2015

హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లాలో కాలువలోకి కాలేజీ బస్సు దూసుకెళ్లింది. తాడేపల్లిగూడెం మండలం ఉమ్మడివారిగూడెం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని యాజమాన్యం చెబుతుండగా... ఆర్టీఏ అధికారులు మాత్రం బస్సు కండీషన్ సరిగా లేదని చెపుతుండడం కొసమెరుపు.

10:49 - August 25, 2015

విజయవాడ : కోర్టులు చెప్పినా.. ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా అగ్రిగోల్డ్‌ బాధితులకు భరోసా దొరకడం లేదు. విజయవాడలో అగ్రిగోల్డ్‌ బాధితులైన ఇద్దరు వృద్ధ దంపతులు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు వెంకటనారాయణశర్మ, సుందరిగా గుర్తించారు. అగ్రిగోల్డ్‌ దెబ్బకు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ దంపతులు కేన్సర్‌కు గురైన తమ కుమారుడికి వైద్యం చేయించుకోలేసి స్ధితిలో ఉన్నారని తెలుస్తోంది. అందుకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

బీజీ జాబితాలో కాపుల కోసం త్వరలో కమిషన్ - చిన రాజప్ప..

తూర్పుగోదావరి : కాపులను బీసీ జాబితాలో చేర్చేందుకు త్వరలో కమిషన్ నియమిస్తామని ఏపీ మంత్రి చిన రాజప్ప పేర్కొన్నారు. పేద కాపు విద్యార్థులకు రూ. వంద కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ ను టిడిపి ఎప్పుడూ గౌరవిస్తోందని, పవన్ సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందన్నారు. 

విభజన చట్ట అమలయ్యేలా చూడాలని కోరాం- వెంకయ్య..

ఢిల్లీ : విభజన చట్టం అమలయ్యేలా చూడాలని హోం శాఖను కోరడం జరిగిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో భేటీ అయ్యారు. విభజన చట్టం అమలయ్యేలా చూడాలని హోం శాఖను కోరడం జరిగిందన్నారు. అధికారులతో సమావేశమై పరిష్కారమార్గాలు కనుక్కొంటామని రాజ్ నాథ్ సింగ్ చెప్పారని తెలిపారు. తెలుగు వాడిగా రాష్ట్రానికి సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి పోయిందని, దీనిని పరిష్కరించేలా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

10:36 - August 25, 2015

హైదరాబాద్ : బీహార్‌ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ ఎత్తుగడలు ఊపందుకున్నాయి. జెడియు ఆర్జేడిల సెక్యులర్‌ కూటమి ఎన్డీయే కూటమి మధ్య ప్రధాన పోరు నెలకొంది. మరోవైపు బిజెపి నుంచి స్పందన లేకుంటే ఎంఐఎంతో జత కడతామని పప్పూయాదవ్‌ కమల దళాన్ని హెచ్చరించారు.

లక్షా 25 వేల కోట్ల భారీ ప్యాకేజీతో బిజెపి ఓటర్లను ఆకర్షించే యత్నం.....

త్వరలో జరుగనున్న బీహార్‌ ఎన్నికల్లో లౌకిక వాదులు, మతతత్వ శక్తుల మధ్య హోరా హోరీ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. బీహార్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ లక్షా 25 వేల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజిని ప్రకటించడం ద్వారా ఒకింత బీజేపీకి లబ్ధి చేకూర్చే అవకాశాలున్నా.. ఆర్జేడీ, జేడీయూలకు దన్నుగా నిలిచిన వెనుకబడిన వర్గాల కులాల ఓటుబ్యాంక్‌ను బద్దలు చేయడం అంత తేలిక కూడా కాదని విశ్లేషకులు చెప్తున్నారు.

యాదవ్ సామాజిక వర్గానికి చెందిన 16 శాతం ఓట్లు.....

ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా నితీశ్‌కుమార్‌తో జత కట్టిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన 16 శాతం ఓట్లు, 18 శాతం ఓటర్లు గల ముస్లింలు బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. జెడియు, ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలు బీహార్‌లో సెక్యులర్‌ మహాకూటమిగా ఏర్పడడంతో ముస్లిం ఓట్లు ఈ కూటమివైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.

25 స్థానాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటన....

అయితే తాజాగా ఎంఐఎం బీహార్‌ ఎన్నికల బరిలోకి దిగడమే కాకుండా 25 స్థానాల్లో పోటీ చేస్తామని అసదుద్దీన్‌ ఓవైసీ ప్రకటించడంతో రాజకీయ సమీకరణలు మారే అవకాశం కనిపిస్తోంది.

ముస్లిం, యాదవ్‌ వర్గాల సమీకరణ చీలిపోయే అవకాశం ....

ఎంఐఎం పోటీచేస్తే ఎన్డీయేకు లబ్ది చేకూరుతుందని కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు. ముస్లిం, యాదవ్‌ వర్గాల సమీకరణ చీలిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఎంఐఎంతో జతకడతానని బిజెపికి పప్పూయాదవ్ హెచ్చరిక....

ఇటీవల ఆర్జేడి నుంచి బయటకొచ్చి 'జన్‌ అధికారి మోర్చ్‌' పేరిట పార్టీ స్థాపించిన ఎంపీ పప్పూ యాదవ్‌- బిజెపిని సవాల్‌ చేస్తున్నారు. కూటమికి సంబంధించి బిజెపి స్పష్టమైన ప్రకటన చేయకుంటే తాను ఎంఐఎం, బిఎస్‌పి, ఎన్సీపితో జత కడతామని హెచ్చరించారు.

బిజెపికి ఇబ్బందిగా మారిన మోది డిఎన్‌ఏ వ్యాఖ్య....

మరోవైపు బీహార్ సీఎం నితీశ్‌కుమార్ డీఎన్‌ఏపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్య బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చి పెడుతుందన్న అభిప్రాయం నెలకొంది. పైగా ప్రత్యేక ప్యాకేజీ- బీహార్‌ హక్కని నితీష్‌ నినదిస్తున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటు చేసుకుని నితీష్‌ మహాకూటమి దూకుడుపై ఉండగా... ఎన్డియే పక్షాల మధ్య ఇంతవరకు సీట్ల పంపకాల ఒప్పందం పూర్తి కాకపోవడం గమనార్హం. మొత్తానికి బీహార్‌ ఎన్నికల సమీకరణలు ఎవరికి ఎంతవరకు లాభం చేకూరూస్తాయన్నది ఆసక్తిగా మారింది.

10:35 - August 25, 2015

గుజరాత్ : ఓ స్టూడెంట్‌ పేరు వింటేనే ఇప్పుడు గుజరాత్‌ గవర్నమెంట్‌ హడలిపోతోంది. అతను నిద్రలో కనిపించినా షేక్‌అవుతోంది. అలా అని అతనేం బలమైన రాజకీయ ప్రత్యర్థి కానేకాదు. ఆయుధాలు పట్టుకుని పోరాడుతున్న సాయుధుడు అంతకన్నా కాదు. ఓ సాధారణ స్టూడెంట్‌. ఇప్పుడు తన సామాజిక వర్గానికి లక్షగొంతులై ఊపిరిలూదుతున్నాడు. తన ప్రసంగాలతో బీజేపీ గవర్నమెంట్‌కు చెమటలు పట్టిస్తున్న యువకెరటం అతను.

22 ఏళ్ల యువకుడు..
హార్దిక్‌ పటేల్‌.. 22 ఏళ్ల యువకుడు. రెండు నెలల కిందటిదాకా ఇతనెవరో ఎవరికీ తెలియదు. కానీ.. ఇతని పేరు ఇప్పుడు గుజరాత్‌ అంతటా మార్మోగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే 1998 నుంచి గుజరాత్‌ను అప్రతిహతంగా ఏలుతున్న బీజేపీకి హార్దిక్‌ పటేల్‌ ఓ వార్నింగ్‌బెల్‌. పటేల్‌ సామాజికవర్గాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ ఎలుగెత్తిన యువ సంచలనం. పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్‌ కోటా కోసం సాగుతున్న ఉద్యమానికి రథసారథి. రాష్ట్ర పటేల్‌ వర్గ యువతకు అతడో ఫైర్‌బ్రాండ్‌.

పటేళ్లను నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీ సర్కార్‌..
ఇక అసలు విషయానికొస్తే.. గుజరాత్‌లో బలమైన సామాజిక వర్గం పటేళ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే భావన ఆ సామాజిక వర్గం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. వీరి ద్వారా ఎన్నికల వేళ నాయకులు గద్దెనెక్కి.. ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారనే బాధ, కసి వీరిలో పెరిగిపోయింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్ల కారణంగా అభివృద్ధి పరుగు పందెంలో పటీదార్‌ సమాజం తీవ్రంగా నష్టపోతోందనే ఆవేదన వీరిలో కసిని పెంచింది. ఈ తరుణంలోనే హార్దిక్‌ పటేల్‌ తమ సామాజిక వర్గానికి ఉద్యమ సారథిగా మారాడు. ఇప్పుడు రిజర్వేషన్ల సాధన కోసం అలుపెరగకుండా ప్రభుత్వంపై పోరాడుతున్నాడీ యువకెరటం.

''పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి''కి కన్వీనర్‌..
''పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి''కి కన్వీనర్‌గా వ్యవహారిస్తున్న హార్దిక్‌ పటేల్‌ ఈ నెల 17న సూరత్‌లో బహిరంగ సభ నిర్వహించాడు. ఈ సభకు సుమారు 5 లక్షల మంది పటీదార్లు తరలివచ్చి హార్దిక్‌తో గళం కలిపారు. ఎవరికీ తెలియని ఓ బీకాం పట్టభద్రుడు ఇంతతక్కువ వ్యవధిలో ఇంత మందిని ప్రభావితం చేసే స్థాయికి ఎదగడం.. సర్కార్‌ వెన్నులో ఇప్పుడు నిజంగానే వణుకు పుడుతోంది. హార్దిక్‌ పటేల్‌ ప్రసంగాలకు సర్కార్‌ దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతోంది.

హార్దిక్‌ దెబ్బకు వణుకుతున్న బీజేపీలోని 'పటేల్‌' నేతలు...
తమకు విశ్వసనీయమైన ఓటు బ్యాంకుగా భావించే పటేళ్లతో ప్రభుత్వం కొన్నాళ్లుగా చర్చలు సాగిస్తూనే ఉన్నా తాజా పరిణామాల నేపథ్యంలో నేరుగా హార్దిక్‌ పటేల్‌తో మాట్లాడటానికి సిద్ధమైంది. కానీ, తమ డిమాండ్‌కు అంగీకరిస్తేనే చర్చలకు వస్తానని హార్దిక్‌ తెగేసి చెబుతున్నాడు. హార్దిక్‌ దెబ్బకు.. బీజేపీలోని 'పటేల్‌' నేతలు వణుకుతున్నారు. అతణ్ని సమర్థించకపోతే తమ సామాజిక వర్గమే తమను నమ్మని దుస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళనపడుతున్నారు. ''గుజరాత్‌ సీఎం ఆనందీబెన్‌ కూడా పటేల్‌, మరో ఆరుగురు మంత్రులూ పటేల్‌ సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం.

హార్దిక్‌ తండ్రి భరత్‌భాయ్‌ విరాంగామ్‌ వాసి..
హార్దిక్‌ తండ్రి భరత్‌భాయ్‌ విరాంగామ్‌ వాసి. సబ్‌మెర్సిబుల్‌ పంపుల వ్యాపారి. సాధారణ మధ్యతరగతి కుటుంబం. హార్దిక్‌ 50 శాతంకన్నా తక్కువ మార్కులతోనే బీకాం పూర్తిచేశాడు. కానీ.. ప్రసంగ పటిమతో రాజకీయ యవనికపై తళుక్కున మెరుస్తున్నాడు. మొత్తంగా హార్ధిక్‌ పటేల్‌ బీజేపీ సర్కార్‌ను వణికిస్తున్నాడు. పటేళ్లకు రిజర్వేషన్లు అమలు చేయాలని గట్టిగా పోరాడుతున్నాడు.

10:32 - August 25, 2015

హైదరాబాద్ : త్రిపుర రాజధాని అగర్తలలో ఓ ఆటో డ్రైవర్‌ కాలేజీ విద్యార్థిని వేధించాడు. నడి రోడ్డుపై ఆ యువతితో గొడవపడ్డాడు. జనం గుమిగూడటంతో.. అక్కడి నుంచి జారుకున్నాడు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. 

పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్ కోసం ఆందోళన..

అహ్మదాబాద్ : పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్‌ కోటా కోసం ఆందోళన కొనసాగుతోంది. ఉద్యమ సారథి హర్దిక్ పటేల్ మంగళవారం మహా క్రాంతి ర్యాలీ నిర్వహించారు. 

2015 ద్రోణాచార్య, ధ్యాన్ చంద్ అవార్డులు..

ఢిల్లీ : 2015 ద్రోణాచార్య, ధ్యాన్ చంద్ అవార్డుల పేర్లను ప్రకటించారు.
ద్రోణాచార్య : నావెల్ సింగ్ (అథ్లెటిక్స్ పారా స్పోర్ట్స్), అనూప్ సింగ్ (రెజ్లింగ్), హర్బజన్స్ సింగ్ (అథ్లెటిక్స్), స్వతంతర్ రాజ్ సింగ్ (బాక్సింగ్), నిహార్ అమీన్ (స్విమ్మింగ్).

ధ్యాన్ చంద్ : టిపిపి నాయర్ (వాలిబాల్), శివ్ ప్రకాష్ మిశ్రా (టెన్నిస్), రోమియో జేమ్స్ (హాకీ). 

2015 ధ్యాన్ చంద్ అవార్డులు..

ఢిల్లీ : 2015 ధ్యాన్ చంద్ అవార్డు ముగ్గురిని వరించింది. టిపిపి నాయర్ (వాలిబాల్), శివ్ ప్రకాష్ మిశ్రా (టెన్నిస్), రోమియో జేమ్స్ (హాకీ) పేర్లు ఉన్నాయి. 

కలెక్టర్ ను ఆశ్రయించిన తహశీల్దార్..

తిరుపతి : అర్బన్ తహశీల్దార్ వెంకటేశ్వర్లు కలెక్టర్ ను ఆశ్రయించారు. ఆక్రమణలు తొలగించేందుకు తనపై కేసు నమోదు చేశారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. 

రాజ్ నాథ్ తో వెంకయ్య భేటీ..

ఢిల్లీ : పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ తో భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు..

పశ్చిమగోదావరి : జిల్లాలో ఓ కాలేజీ బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. తాడేపల్లి గూడెం (మం) ఉమ్మడివారిగూడెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనో పది మంది విద్యార్థులకు గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 

నేడు పోలీస్ కమిషనర్ బాసితో మలివాల్ భేటీ..

ఢిల్లీ : డిసిడబ్ల్యూ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ నేడు పోలీస్ కమిషనర్ బిఎస్ బాసితో భేటీ కానున్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై చర్చించనున్నారు.

మల్లిఖార్జున ఖర్గేతో నేడు వెంకయ్య భేటీ ?

ఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారని తెలుస్తోంది. స్పెషల్ పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లుపై వెంకయ్య చర్చించనున్నట్లు సమాచారం. గత వర్షాకాల సమావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందలేదనేది తెలిసిందే. 

వెంకయ్యతో బాబు భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపీ రాష్ట్ర ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా..ఆర్థిక సాయాన్ని సీఎం కోరనున్నారు.

ఆలయాల్లో పూజలు నిలిపివేత..

హైదరాబాద్ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా అర్చకులు, ఉద్యోగులు సమ్మె చేపట్టారు. దేవాదాయ శాఖలో ఉన్న దాదాపు 650 ఆలయాల్లో పూజారులు పూజలు, అర్చనలు నిలిపివేశారు.

 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 300 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా నిఫ్టీ 100 పాయింట్లకు పైగా ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి బలపడింది. డాలర్ పై 25 పైసలు బలపడి రూపాయి మారకం విలువ రూ.66.39 గా నమోదైంది. 

మహిళకు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ కు యత్నం

.గో : పాలకోడేరు మండలం మోగల్లులో కలకలం రేగింది. మహిళకు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ కు యత్నించడంతో మహిళ కేలలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. గతం వారంలో కూడా యండగండిలో ఇద్దరు విద్యార్థినులకు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ యత్నించిన విషయం తెలిసిందే...

కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్ బాధితులు..

విజయవాడ : భవానీ పురం వద్ద కృష్ణా నదిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అగ్రి గోల్డ్ రూ.6లక్షల డిపాజిట్ చేసిన వీరు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతులు వెంకటనారాయణ శర్మ, సుందరిలుగా పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడికి వైద్యం చేయించలేక మనస్థాపంతో వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

09:14 - August 25, 2015

కర్నూలు: ఆళ్లగడ్డ సమీపంలోని చింతకొమ్మదిన్నె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల నుంచి వరిపొట్టుతో వెళ్తున్న లారీ చింతకొమ్మదిన్నె వద్ద టైర్ పంక్చర్ కావడంతో వాహనాన్ని డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపి మరమ్మత్తులు చేపట్టాడు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన లారీ వెనుక నుంచి వచ్చి ఈ వాహానాన్ని ఢీ కొట్టింది. ఈ ఘగనలో మృతి చెందిన వారు పెద్దకొట్టాల గ్రామానికి చెందిన కిషోర్, రాముడు కాగా మరొకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

 

09:10 - August 25, 2015

హైదరాబాద్ : అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం వృద్ధ దంపతులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పింఛను, ఇంటి స్థలం రద్దు చేశారనే మనస్తాపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అప్రమత్తమైన స్థానికులు గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలోన్నర బంగారం పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. ఈ రోజు ఉదయం తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 1.4 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

 

08:36 - August 25, 2015

హైదరాబాద్ : బ్లాక్ మండే లో షాకిచ్చిన స్టాక్ మార్కెట్లు,7 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి అయ్యింది. స్టాక్ మార్కెట్లకు సంపదకు, రియల్ సంపదకు చాలా తేడా వుంటుందా? స్టాక్ మార్కెట్ల చరిత్రలో ఎప్పుడూ ఇంత పతనం కాలేదు. పతనానికి చైనా యూరో ను కుదించడమే కారణమా? స్టాక్ మార్కెట్ల పతనానికి గల కారణాలను 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. మరి మీరు కూడా ఆ విశ్లేషణను వినాలకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

నేటినుంచి తెలంగాణలో అర్చకులు సమ్మె

హైదరాబాద్‌ : తమకు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని డిమాండు చేస్తూ నేటినుంచి తెలంగాణలో అర్చకులు సమ్మెకు దిగారు. నిత్యపూజల అనంతరం ఆలయాలను మూసివేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం తాము ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోమని ఆలయ ఉద్యోగులు, అర్చకులు హెచ్చరించారు. 

పెన్షన్‌ ఇవ్వడంలేదని వృద్ధదంపతుల ఆత్మహత్యాయత్నం...

అనంతపురం :తమకు అధికారులు పెన్షన్‌ ఇవ్వడం లేదని మనస్థాపంతో గుంతకల్‌ మున్సిపల్‌ ఆఫీసు ఎదుట వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారి పరిస్థితి విషమంగా మారడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన అనంతరం అధికారులు ఆ వృద్ధ దంపతుల పెన్షన్‌ విషయం ఆరా తీస్తున్నారు.

 

07:59 - August 25, 2015

హైదరాబాద్ : ఏపీ కి ప్రత్యేక హోదా పై సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోడీ తో భేటీ కానున్నారు. వీరి భేటీ పై ఏపీ ప్రజలు చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రధాని ఏపీ కి హ్యాపీ కబురు ఇస్తారా? లేక ఏదో ఒక ప్యాకేజీ ఇచ్చి సరిపెట్టుకుంటారా? ప్రత్యేక హోదా పై ఇప్పటి వరకు ఏపీ సర్కార్ అఖిలపక్షం ఎందుకు వెయ్యడంలేదు? రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కూడా అందిరినీ కలుపుకుపోవడం లేదు ఎందుకు? ఇలాంటి అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ఆంధ్రా మేధావుల ఫోరం నేత శ్రీనివసరావు, బిజెపి నేత రఘునాధ బాబు, వైసీపీ నేత అంబటి రాంబాబు, టిడిపి నేత అనురాధ పాల్గొన్నారు. వారు ఏఏఅంశాలను చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

నేడు ‘‘ముజఫర్‌నగర్‌ బాకీ హై’’చిత్ర ప్రదర్శన...

హైదరాబాద్ : 2013, సెప్టెంబర్‌ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ ప్రాంతంలో జరిగిన మత అల్లర్ల నేపథ్యంగా దర్శకుడు నకుల్‌సింగ్‌ సహనీ ‘‘ముజఫర్‌నగర్‌ బాకీ హై’’ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. ఆగస్టు 25వ తేదీనాడు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, 44 పట్టణాలు, 50 ప్రదేశాల్లో ఈ డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన జరగనుంది. అందులో భాగంగా బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో ఈ రోజు సాయంత్రం 4గంటలకు డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రం నిడివి 136 నిమిషాలు. ప్రవేశం ఉచితం. చిత్ర ప్రదర్శన అనంతరం దర్శకుడు, నటీనటులతో స్కైప్‌ ద్వారా చర్చాగోష్ఠి జరుగుతుంది.

ఏపీడబ్ల్యూఎస్ ఐపీలో ఉద్యోగావకాశాలు...

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్‌ జల వనరుల రంగ అభివృద్ధి పథకంలో ప్రాజెక్టు ప్రోగ్రాం ప్రమోటర్లుగా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పని చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆత్మ పీడీ పద్మావతి ఒక ప్రకటనలో కోరారు. డిప్లొమో ఇన్‌ అగ్రికల్చర్‌ లేదా అగ్రికల్చరల్‌ బీఎస్సీ చదివిన అభ్యర్థులు దరఖాస్తులను ఆత్మ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఎంపికైనవారికి నెలకు రూ.7500 ఇవ్వనున్నట్లు తెలిపారు.

చీప్ లిక్కర్‌ను మరింత చీప్‌గా అందిస్తాం...

హైదరాబాద్ : చీప్ లిక్కర్‌ను మరింత చీప్‌గా అందిస్తామని ప్రకటించింది టీ ప్రభుత్వం.. గుడుంబా బారి నుంచి ప్రజలను రక్షించేందుకే చీప్‌ లిక్కర్‌ను ప్రవేశ పెడుతున్నట్లు తెలిపింది. మద్య విధానం ప్రకటించకముందే విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడింది.

ఏపీ సర్కారుపై పోరుకు సిద్ధమవుతున్న వైసీపీ

హైదరాబాద్ : భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉద్ధృతం చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. రాజధాని ప్రాంతంలో రేప‌టి నుంచి వరుస ధర్నాలతో హోరెత్తించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సమాయత్తమైంది. కొత్త మాజేరు విషజ్వరాలపైనా నిలదీసేందుకు అడుగులు వేస్తోంది.  

తలసాని టార్గెట్‌గానే టీ-టీడీపీ వ్యూహాలు

హైదరాబాద్ : కారుతో పోటీ పడేందుకు సైకిల్ స్పీడ్ పెంచుతోంది. తెలంగాణ సర్కార్‌పై పోరుబాటకు టీ-టీడీపీ సిద్ధమైంది. తలసాని టార్గెట్‌గానే తమ్ముళ్లు అడుగులు వేస్తున్నారు. తక్షణమే శ్రీనివాస్ యాదవ్‌పై వేటేయాలని టీ-టీడీపీ లీడర్లు పోరుబాట పట్టారు. 

ఏపీలో జోరు పెంచిన కాంగ్రెస్

హైదరాబాద్ : ఏపీలో కాంగ్రెస్ జోరు పెంచుతోంది. ఇప్పటికే ప్రధాన ప్రతిప‌క్షం వైసీపీని మించి దూకుడు ప్రద‌ర్శిస్తున్న హ‌స్తం పార్టీ.. ఇప్పుడు రాష్ట్రంలో రాజుకున్న ప్రత్యేక హోదా సెగ‌ను అస్త్రంగా చేసుకుని మ‌రింత స్పీడ్‌తో దూసుకెళుతోంది. పూర్వ వైభ‌వాన్ని స్వంతం చేసుకోవాల‌ని రఘువీరా అండ్‌ టీం త‌హ త‌హ‌లాడుతోంది. 

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌పై సర్కార్ సంతృప్తి

హైదరాబాద్ : షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాల అమలుపై తెలంగాణ ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు 277 కోట్లు ఖర్చు చేసి 54 వేల మంది మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వధువులకు ఆర్ధిక సహాయం అందించింది. దరఖాస్తు చేసుకున్న వారిలో 70 శాతం మందికి నిధులు మంజూరు చేసింది. 

పెనుగొండ రైలు దుర్ఘటనలో మరో మలుపు

హైదరాబాద్ : పెనుగొండ రైలు దుర్ఘటనలో మరో మలుపు తెరపైకొచ్చింది. లారీ డ్రైవర్‌ను మార్చేందుకు లారీ యాజమాన్యం యత్నిస్తోంది. గ్రానైట్ లారీని నడిపింది ఒకరైతే.. మరొకరిని కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారు. లారీ నడిపినట్లు ఒప్పుకోవాలని లారీ యాజమానుల ఒత్తిడి చేస్తున్నారని డ్రైవర్‌ భాషా పోలీసులను ఆశ్రయించాడు. 

ఫీ రీయింబర్స్‌మెంట్‌కు ఆధార్‌ లింకుతో తలనొప్పులు

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ కు ఆధార్ కార్డు లింకు తప్పనిసరి అనడంతో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇప్పటికీ రాష్ట్రంలో దాదాపుగా లక్షా 60వేల మంది విద్యార్ధులు ఆధార్ కార్డులు సమర్పించకుండానే స్కాలర్ షిప్ లకు, ఫీజు రియంబర్స్‌మెంట్ లకు దరాఖాస్తులు చేసుకున్నారు. దీంతో అధికారులు తలపట్టుకుని కూర్చున్నారు. ఏం చేయాలో తోచని స్థితిలో అధికారులు వున్నారు. 

బైక్- వ్యాన్ ఢీ : ఒకరి మృతి

ఆదిలాబాద్ : ముథోల్ మండలం సరస్వతి నగర్ వద్ద వ్యాను- బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని భైంసా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు మూడు కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.

06:42 - August 25, 2015

హైదరాబాద్ : బ్యాంకింగ్‌ రంగంలో కొత్త కొత్త సంస్కరణలు వస్తున్నాయి. 11 పేమెంట్ బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి ఇవ్వడంతో తాజా పరిణామం. అయితే అర్‌బీఐ గవర్నర్‌ చెబుతున్నట్టుగా ఇవి బ్యాంకింగ్‌ రంగ విస్తరణకు సహాయపడతాయా ? అయితే ఆర్‌బీఐ గవర్నర్‌ చెబుతున్నట్లుగా ఇవి బ్యాంకింగ్‌ విస్తరణకు సహాయ పడతాయా ? లేకపోతే ఫిట్చ్‌ సంస్థ హెచ్చరిస్తున్నట్టుగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల వినాశనానికి బాటలు వేస్తాయా ? అన్నది ఆసక్తికర అంశంగా మారుతోంది. ఈ అంశంపై జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలోబ్యాంకింగ్ రంగ నిపుణులు మురళి పాల్గొన్నారు. మరి వారు ఏ అంశాలపై మాట్లాడారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:38 - August 25, 2015

హైదరాబాద్ : ఇంటర్నెట్‌ సెర్చింగ్‌లో తిరుగులేని గూగుల్‌కు గుబులు పుట్టిస్తున్నాడు ఓ నూనూగు మీసాల భారతీయ సంతతి కుర్రాడు. గూగుల్‌ను మించిన సెర్చ్ ఇంజిన్ ఆవిష్కరిస్తున్నానంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. స్కూలింగ్ కూడా పూర్తి కాని అన్మోల్ టుర్కెల్‌ రూపొందించిన సరికొత్త సెర్చ్ ఇంజిన్...గూగుల్‌ను వెనక్కినెడుతుందా..? రాబోయే కాలంలో గూగుల్‌నే వెతికిపట్టే సెర్చ్ ఇంజిన్ గా అవతరిస్తుందా..?

రోజుకు కోట్ల మంది గూగుల్‌లో సెర్చింగ్....

గూగుల్‌. ప్రపంచంలో నెటిజన్లందరి ఫేవరెట్ సెర్చింజన్. రెప్పపాటులో దాదాపు ఏడు మంది గూగుల్‌లో సెర్చ్ చేస్తారట. రోజుకు కొన్ని కోట్లమంది సమాచారం కోసం గూగుల్‌లోనే వెతుకుతారట. వాల్డ్ వైడ్ వెబ్‌లో ఇప్పటి వరకు ఎన్ని సెర్చింజన్లు వచ్చినా ఎదురులేకుండా దూసుకుపోతోంది గూగుల్. కానీ ఓ కుర్రాడు గూగుల్‌కు సవాల్ విసురుతున్నాడు. అతడే భారత సంతతి యువకెరటం అన్మోల్ టుర్కెల్.

కెనడా ఎన్‌ఆర్‌ఐ అన్మోల్ టుర్కెల్.....

కెనడాలో నివసిస్తున్న 16 ఏళ్ల ఎన్ఆర్‌ఐ యంగ్‌ డైమండ్ అన్మోల్ టుర్కెల్. గూగుల్ కంటే మెరుగైన, గూగుల్ కంటే 47 శాతం నిర్దిష్టమైన, 21 శాతం కచ్చితమైన సరికొత్త సెర్చ్ ఇంజన్‌ను రూపొందించాడు. ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న అన్మోల్ ఆవిష్కరణ ఆధారాలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్నాయి.

ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా కొత్త సెర్చ్ ఇంజిన్ డిజైన్....

ఇంకా హైస్కూల్ కూడా పూర్తిచేయని అన్మోల్...ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా కొత్త సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించాడు. ఆ మోడల్‌ను గూగుల్ సైన్స్ ఫెయిర్‌లోనూ ప్రదర్శించాడు. ఏదైనా ఒక అంశానికి సంబంధించిన చరిత్రను సెర్చ్ చేయడం సాధారణమంటున్న అన్మోల్...తాను కనిపెట్టిన సెర్చ్ఇంజన్ ఇందుకు కాస్త భిన్నంగా ఉంటుందని చెబుతున్నాడు. వినియోగదారుడి అవసరాన్ని బట్టి ఉపయోగపడటమేకాక సామీప్యతను కూడా పెంచుతుందంటున్నాడు. కేవలం ఒక కంప్యూటర్ సహాయంతో పైథాన్ లాంగ్వేజిని అభివృద్ధి చేయడం ద్వారా అన్మోల్ ఈ కొత్త సెర్చ్ఇంజన్ రూపొందించాడు.

ఐస్‌క్రీమ్ ల్యాబ్స్ లో ఇంటర్న్ షిప్ .....

అన్మోల్ కొన్ని రోజుల క్రితం ఇంటర్న్ షిప్ కోసం బెంగళూరు వచ్చాడు. ఐస్‌క్రీమ్ ల్యాబ్స్ లో ఇంటర్న్ షిప్ చేస్తున్నాడు. అదే సమయంలో గూగుల్ గురించి లోతుగా అధ్యయనం చేస్తూనే వ్యక్తిగత సెర్చ్ ఇంజిన్‌ను డిజైన్ చేశాడు. సెర్చ్ ఇంజిన్ రూపకల్పన కోసం దాదాపు 60 గంటల కోడ్ తీసుకున్నాడు అన్మోల్. 13 నుంచి 18 ఏళ్ల విద్యార్థుల కోసం నిర్వహించిన గూగుల్ సైన్స్ ఫెయిర్ సబ్ మిషన్ పోటీలో భాగంగా కొత్త సెర్చింజిన్ రూపొందించి చివరికి గూగుల్‌కే గుబులు రేపుతున్నాడు.

న్యూయార్క్ టైమ్స్ మేటి ఆవిష్కరణ పరిశీలనలో అన్మోల్‌ ప్రాజెక్టు ......

ఇంకా నెట్టింట్లో అడుగుపెట్టని అన్మోల్ కొత్త ప్రాజెక్టుపై వాల్డ్ వైడ్ గా ఇంట్రెస్ట్ క్రియేటవుతోంది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ప్రతి ఏటా ప్రచురించే...ఈ ఏటి మేటి ఆవిష్కరణ కోసం అన్మోల్‌ ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. ఈ పురస్కారానికి అన్మోల్‌ ప్రాజెక్టు ఎంపికైతే ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం అన్మోల్ సెర్చింజన్ కోసం గూగుల్‌ లో ఆసక్తిగా వెతుకుతున్నా...రాబోయే కాలంలో గూగుల్ గురించి అన్మోల్‌ కొత్త సెర్చింజన్లో వెతికే రోజులొస్తాయేమో చూడాలి. మైక్రోసాఫ్ట్‌,గూగుల్, యాహూ వంటి సాఫ్ట్‌వేర్ సంస్థల్లో భారతీయులు సత్తా చూపుతున్న తరుణంలో...అన్మోల్ టుర్కెల్ సెర్చ్‌ ఇంజిన్‌ మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

06:32 - August 25, 2015

హైదరాబాద్ : టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు 43 కోట్లతో 17 లక్షల కిలోల ఆవునెయ్యి కొనుగోలు చేయాలని నిశ్చయించింది. తూర్పు గోదావరి జిల్లా ఐనవెల్లిలో 4 కోట్లతో యాత్రికులకు వసతి సముదాయం నిర్మించాలని నిర్ణయించింది. మరోవైపు తమ సమస్యలపై చర్చిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూసిన స్థానికులు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు.. సమావేశంలో వారి ప్రస్తావనే చేయకపోవడంపై గుర్రుగా ఉన్నారు.

కీలక నిర్ణయాలకు ఆమోదం....

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. నిత్యావసరాలు ఒకేసారి భారీ మొత్తంలో కొనుగోలు చేయాలని సమావేశం తీర్మానించింది. ప్రసాదాల తయారీ వినియోగించేందుకు 17 లక్షల కిలోల ఆవునెయ్యి కొనుగోలుకు 46 కోట్ల 92 లక్షలు కేటాయించారు. అలాగే మూడున్నర లక్షల కేజీల కందిపప్పు సేకరణకు 4.13 కోట్లు కేటాయించారు. 2 లక్షల కిలోల ఎండు ద్రాక్షలు ఆరు నెలలకు సరిపడా కొనాలని నిర్ణయించారు.

వేయికాళ్ల మండపం పునర్‌ నిర్మాణానికి ప్రణాళికలు.......

శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అందరి సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు బోర్డ్‌ తెలిపింది. తిరుమలలో గతంలో తొలగించిన వేయి కాళ్ల మండపాన్ని పునర్‌ నిర్మించాలని...7 వేల మంది భక్తులకు సరిపోయే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తుట్లు వెల్లడించారు. టీటీడీ ఉద్యోగుల శిక్షణా కేంద్రం శ్వేతా డైరెక్టర్‌గా ఆంజనేయులు, హెచ్‌ఆర్డీగా చంద్రశేఖర్‌ నియమిస్తున్నట్లు చెప్పారు. సకాలంలో వర్షాలు కురవాలని ఆశిస్తూ విస్తృతంగా వరుణయాగాలు చేయాలని వేదపండితులకు సూచించారు. కొండపై అనధికార వ్యాపారులను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీకి సూచించింది.

పాలకమండలి తీరుపై కాంట్రాక్టు కార్మికుల ఆగ్రహం....

మరోవైపు టీటీడీ పాలకమండలి తీరుపై ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు భగ్గుమంటున్నారు. తమ విన్నపాలను గాలికొదిలేశారని మండిపడుతున్నారు. సమావేశం ప్రారంభానికి ముందు ఛైర్మన్‌ను కలిసిన కార్మిక సంఘనేతలు..టీటీడీలో పనిచేస్తున్న సుమారు 12 వేల మంది కార్మికులకు టైం స్కేల్‌ వర్తింపజేయాలని వినతి పత్రాలు సమర్పించారు. ఇక టీటీడీ ఉద్యోగుల జేఏసీ నేతలు ఇళ్ల స్థలాలు, నగదు రహిత చికిత్స, ఉద్యోగ సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్థన పత్రం అందజేశారు.

దుకాణాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విన్నపాలు ....

స్థానికులు సైతం తమ దుకాణాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విన్నపాలు చేశారు. అయితే పాలకమండలి సమావేశం వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోకపోవడం.. వారిని నిరాశపరిచింది. తమ సమస్యలు పక్కనబెట్టి కేవలం కొనుగొళ్లు, ఆదాయం రాబట్టుకునే విషయాలపైనే చర్చించారని ఆరోపిస్తున్నారు.  

నేడు శ్రీశైలం నుంచి నీటిని విడుదల

హైదరాబాద్ :తెలంగాణ, ఏపీ రాష్ర్టాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కృష్ణా బోర్డు మంగళవారం నుంచి శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయనుంది. తాగునీటి అవసరాలను తీర్చాలంటూ రెండు రాష్ర్టాలు చేసిన విజ్ఞప్తి మేరకు శ్రీశైలంలో అందుబాటులో ఉన్న నీటినిల్వను పరిగణనలోకి తీసుకుని 10రోజులపాటు 5వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది.

06:25 - August 25, 2015

హైదరాబాద్ :అదో పీడకల. ఆనాటి చేదు జ్ఞాపకాలను నగర ప్రజలు ఇంకా మరిచిపోలేదు. హైదరాబాద్‌లో ఉగ్రవాదులు గోకుల్‌చాట్, లుంబినీ పార్కుల్లో పేలుళ్లు జరిపి నేటికి సరిగ్గా ఎనిమిదేళ్లు. ఆ రెండు ఘటనల్లో 42 మంది చనిపోగా..వందలాది మంది గాయపడ్డారు. ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి.. దిక్కుతోచని స్థితికి చేరుకున్నాయి. గాయపడ్డవారిలో కొందరు ఇప్పటికీ జీవశ్చవాలుగా బతుకీడుస్తున్నారు. వారికి నేటికీ ప్రభుత్వ సాయం అందలేదు.

2007వ సంవత్సరం, ఆగస్టు 25వ తేదీ.......

ప్రశాంతంగా ఉండే భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే హైదరాబాద్ -బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఉగ్రవాదులు విసిరిన పంజా ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలైన లుంబినీ పార్క్, గోకుల్- చాట్-లో పేలుళ్లు జరిగాయి. లుంబినీ పార్క్-లో రాత్రి ఏడున్నరకు లేజర్-షో మొదలైంది. 500 మంది వరకు టూరిస్టులు లేజర్ షో ను చూస్తూన్నారు. వందేమాతర గీతాలాపన అప్పుడే పూర్తయి, గుడ్ -ఈవినింగ్- హైదరాబాద్ అంటూ స్వాగత వచనం పలుకుతున్న సమయంలో భారీ విస్పోటం తో బాంబులు పేలాయి. సీట్ల మధ్యలో ఉగ్రవాదులు అమర్చిన బాంబు పేలడంతో అ ప్రదేశంలో కూర్చున్నవాళ్ల శరీర అవయవాలు గాల్లోకి ఎగిరి పడ్డాయి.

ఏం జరిగిందో తెలుసుకునే లోపే ....

ఏం జరిగిందో తెలుసుకునే లోపే అనేక మంది రక్తపు మడుగులో పడిఉన్నారు. తెగిపడ్డ అవయవాలు, రక్తమోడుతున్న శరీరాలు, కాల్వలు కట్టిన రక్తపు ధారలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ప్రాణాలతో బయటపడ్డ సందర్శకులంతా భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలోనూ కొందరికి కాళ్లు, చేతులు విరిగాయి. పేలుడు ధాటికి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరి కొందరు మృతి చెందారు.

సాయంత్రం 7 గంటల 40 నిమిషాల సమయం....

లుంబిని పార్క్ లో పేలుడు జరిగిన కొద్ది క్షణాల్లోనే గోకుల్ చాట్ లో మరో పేలుడు జరిగింది. 7 గంటల 40 నిమిషాల సమయంలో జరిగిన ఈ పేలుడుతో మొత్తం 42 మంది మృతి చెందారు. 72 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ఘటన నుంచి తృటిలో తప్పించుకున్న వారు ఇప్పటికీ.. ఆ చేదు జ్ఞాపకాన్ని తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. ఏ చిన్న శబ్ధం వినిపించినా భయంతో వణికిపోతున్నారు. ఇక ఆ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు, గాయపడ్డ బాధితులకు ఇప్పటికీ ప్రభుత్వ సాయం పూర్తిగా అందలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

06:20 - August 25, 2015

హైదరాబాద్ : నిరీక్షణకు తెరపడనుంది. ఉత్కంఠ వీడనుంది. ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. బాబుగారికి అపాయింట్‌మెంట్ దొరికింది. ఇవాళ ప్రధాని మోదీతో ఏపీ సీఎం సమావేశం కాబోతున్నారు. దీంతో అందరి దృష్టి చంద్రబాబుపైనే పడింది. రాష్ట్ర సమస్యలపై ఎలా గళమెత్తుతారు.? ప్రత్యేక హోదా కోసం పట్టుబడతారా..? లేదా ప్యాకేజీతోనే సరిపెట్టుకుంటారా..? అన్న ప్రశ్నలే వినిపిస్తున్నాయి.

ప్రత్యేక హోదానా..? ప్రత్యేక ప్యాకేజీనా..?

ప్రత్యేక హోదానా..? ప్రత్యేక ప్యాకేజీనా..? కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌ను కలవరపెడున్న అంశాలపై ఇవాళ క్లారిటీ రానుంది. ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ అవుతారు. దీంతో ప్రత్యేక హోదాపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్ పారికర్‌ సహా నీతిఆయోగ్‌ సీఈఓ సింధుశ్రీ కుల్లార్‌తో ఏపీ సీఎం సమావేశమవుతారు.

ఉదయం 10:30కు మోదీతో భేటీ....

ఇప్పటికే ఢిల్లీలో చంద్రబాబు మకాం వేశారు. మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు సౌత్‌బ్లాక్‌లో... ప్రధానితో ఏపీ సీఎం భేటీ అవుతారు. రాష్ట్ర సమస్యలు, విభజన చట్టంలోని హామీల అమలు వంటి కీలక అంశాలపై మాట్లాడుతారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై ఎలా ముందుకెళ్లాలి..? ఒకవేళ ప్రత్యేక ప్యాకేజీ అయితే ఎంత ఉండాలి..? ఎలా ఉండాలి..? అనే అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామిక రాయితీలు..

స్పష్టమైన ప్రతిపాదనలతో మోదీ ముందుకు బాబు వెళ్తారని తమ్ముళ్లు అంటున్నారు. విభజనచట్టంలోని హామీలు, పార్లమెంట్‌లో చేసిన ప్రకటనలు, ఎన్నికల ముందు రాష్ట్రంలో మోడీ చేసిన వాగ్ధానాలపైనే ప్రధాన చర్చ జరగనుంది. ఇదే సమయంలో ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామిక రాయితీలు, రెవిన్యూలోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి నిధులు, వెనకబడిన ప్రాంతాల అభివద్ధికి మరిన్ని నిధులు వంటి అంశాలపైనా చర్చించనున్నారు.

మధ్యాహ్నం 12-30కు రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ.....

ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రితో బాబు భేటీ అవుతారు. నార్త్‌ బ్లాక్‌లో మధ్యాహ్నం పన్నెండున్నరకు రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్‌మెంట్ కలుస్తారు. ముఖ్యంగా ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్‌తో చంద్రబాబు భేటీ అవుతారు. అలాగే సాయంత్రం 4 గంటలకు నీతిఆయోగ్ సీఈవోతో సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా ఢిల్లీలో బిజీబిజీగా ఉండనున్నారు ఏపీ సీఎం. హస్తిన పెద్దలతో మంతనాలు చేయనున్నారు. మరి చంద్రబాబు ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. 

రెండు లారీలు ఢీ: ముగ్గురు మృతి

కర్నూలు : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆళ్లగడ్డ మండలం చింత కొమ్మదిన్నె వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఆగివున్న పొట్టులారీని వెనకవైపు నుంచి కర్ణాటకకు చెందిన ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరోవ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రడిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Don't Miss