Activities calendar

05 September 2015

21:30 - September 5, 2015

హైదరాబాద్ : ప్రపంచీకరణ పెనుభూతం భారతదేశంలోని కులృత్తులను ధ్వంసంచేసింది. మరో పక్క మన సమాజం కులవృత్తులవారిని నీచంగా చూసింది. వారి శ్రమను గుర్తించలేదు.వారిని సాటి మనుషులుగా గౌరవించలేదు. అలాంటి అణగారిన కులం వాళ్ళు మంగలోళ్లు. తొలివైద్యులుగా పిలువబడిన మంగళి కులంవాళ్ళు నేడు దుర్భరమైన బతుకులు వెళ్ళదీస్తున్నారు. మంగలోళ్ళ చారిత్రక నేపథ్యాన్ని, సమాజంలో వారి స్థానాన్ని గురించి జన చరిత్రలో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త కంచ ఐలయ్య విశ్లేషించారు. మరింత విశ్లేషణ ను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

21:26 - September 5, 2015

హైదరాబాద్ : బందరు తీరంలో ఉద్యమ కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఆవేదనతో, ఆవేశంతో పోటెత్తుతున్నాయి. పోర్టు నిర్మాణం పేరుతో భూములు లాగేసుకునే చర్యను అన్నదాతలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. అయినా.. రైతుల ఆందోళనను పూచిక పుల్లలా తీసిపారేసిన ప్రభుత్వం.. 14 వేల ఎకరాల భూములు సేకరించాల్సిందేనంటూ కేబినెట్‌ భేటీలో తీర్మానించింది...

ఏకంగా 14 వేల ఎకరాల భూములను సేకరించేందుకు నోటిఫికేషన్‌......

మచిలీపట్నం పోర్టు పేరుతో ఏకంగా 14 వేల ఎకరాల భూములను సేకరించేందుకు నోటిఫికేషన్‌ జారీచేసింది ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా ఉద్యమం సాగిస్తున్న రైతులు.. శనివారం ఉద్యమం మరింత ఉధృతం చేశారు. దీంతో.. మచిలీపట్నం టౌన్‌ హాలులో రైతులతో సమావేశమయ్యారు మంత్రులు. అయితే.. ప్రభుత్వ నిర్ణయాన్ని ఒక్కటిగా వ్యతిరేకించిన రైతులు.. భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

రైతుల ఆందోళన కొనసాగుతుండగానే.....

అయితే.. ఓ వైపు ఇక్కడ రైతుల ఆందోళన కొనసాగుతుండగానే మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ప్రభుత్వం.. మచిలీపట్నం పోర్టుకోసం 14 వేల ఎకరాల భూములను సేకరించాల్సిందేనని తీర్మానించింది. తమ బతుకుదెరువుపై ఆందోళనతో ఉద్యమిస్తున్న రైతుల గురించి కనీసంగానైనా పట్టించుకోని ప్రభుత్వం.. భూములు సేకరించాల్సిందేనని నిర్ణయించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి పోర్టు కోసం 4, 800 ఎకరాలు కావాల్సి ఉండగా....

వాస్తవానికి పోర్టు కోసం 4, 800 ఎకరాలు కావాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వ భూములు పోగా.. 2, 281 ఎకరాలను రైతుల నుంచి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములు ఇవ్వడానికే రైతులు నిరాకరిస్తున్నారు. అలాంటిది.. పరిశ్రమల కోసమంటూ మరో 12 వేల ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. మొత్తం 29 గ్రామాల్లో 14 వేల ఎకరాలను సేకరించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

భగ్గుమన్న రైతాంగం....

ఈ నిర్ణయంపై రైతాంగం భగ్గుమంది. రైతులకు మద్దతు పలికిన వామపక్షాలు.. నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి...

21:23 - September 5, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మచిలీపట్నం పోర్టుకు 14 వేల ఎకరాలు సేకరించడం.. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలన్నీ ఈ గవర్నెన్స్‌ పరంగా ఒకే గొడుకు కిందకు తేవడం వంటి నిర్ణయాలతోపాటు, పలు అంశాలకు ఆమోద ముద్రవేసింది...

మూడున్నర గంటలపాటు సాగిన సమావేశంలో....

మూడున్నర గంటలపాటు సాగిన సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. ఇందులో ప్రధానంగా.. మచిలీపట్నం పోర్టుకు భూకేటాయింపుపై చర్చ జరిగింది. రాష్ట్రంలో భూసేకరణపై ఆందోళన కొనసాగుతున్నా.. ఈ పోర్టుకు 14 వేల ఎకరాల భూమిని సేకరించాలని కేబినెట్‌ నిర్ణయించడం గమనార్హం.

ఏపీఐఐసీకి భూములను....

అదేవిధంగా.. ఏపీఐఐసీకి భూములను కేటాయించాలని కూడా కేబినెట్ తీర్మానించింది. హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, సర్కారు పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు నెలవారీగా ప్రజాభిప్రాయం సేకరించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇక, ప్రభుత్వ శాఖలన్నీ ఈ గవర్నెన్స్‌ పరంగా ఒకే గొడుగు కిందకు తేవాలని మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-ప్రగతి పేరుతో చేపట్టబోయే ఈ కార్యక్రమాన్ని పీపీపీ మోడల్ ద్వారా నిర్వహించాలని భావిస్తోంది. దీని ద్వారా.. శాఖల మధ్య సమన్వయం మెరుగవుతుందని ప్రభుత్వం చెబుతోంది.

వ్యవసాయానికి పగటిపూట 7 గంటల నిరంతరాయ విద్యుత్ ....

వ్యవసాయానికి పగటిపూట 7 గంటల నిరంతరాయ విద్యుత్ ఇవ్వాలని, విశాఖను మెగా సిటీగా అభివృద్ధి చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇక రెండంకెల వృద్ధి రేటు సాధనపై విస్తృతంగా చర్చించిన కేబినెట్‌... అందుబాటులో ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకోవాలని తీర్మానించింది.

21:19 - September 5, 2015

మహబూబ్‌ నగర్‌ : జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పై గువ్వల బాలరాజు దాడిని నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా బంద్ విజయవంతమైంది. రాస్తారోకోలు, ధర్నాలతో జిల్లాలోని పలు కేంద్రాలు కాంగ్రెస్‌ కార్యకర్తలతో నిండిపోయాయి. గువ్వల బాలరాజుపై సీఎం కేసీఆర్‌ చర్య తీసుకోవాల్సిందేనంటూ కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిపై చేయి చేసుకున్న టిఆర్ ఎస్ ఎమ్మెల్యే.....

అధికారి పార్టీకి చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిపై చేయి చేసుకోవటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని జిల్లా బంద్‌ పిలుపు విజయవంతం అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే.. పార్టీ కార్యకర్తలు బస్సుల రాక పోకలను అడ్డుకున్నారు. దీంతో పలు బస్ డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. జిల్లాలోని గద్వాల, అచ్చంపేట, షాద్ నగర్, వనపర్తి, మహబూబ్ నగర్ డిపోల ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించారు. దీంతో జిల్లాలోని 9 డిపోలకు చెందిన 894 బస్సులు రోడ్డెక్కలేదు.

బంద్‌ పిలుపు మేరకు.....

జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌ పట్టణంలో బంద్‌ పిలుపు మేరకు తెల్లవారు ఝాము నుంచే కాంగ్రెస్‌ కార్యకర్తలు బస్టాండ్‌ ఎదుట బైటాయించారు. బస్సుల రాకపోకల్ని అడ్డుకున్నారు. జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముత్యాల ప్రకాశ్, ఇతర కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి కోయిలకొండ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.జిల్లాలోని కల్వకుర్తి మండల కేంద్రంలో జరిగిన బంద్‌లో ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి పాల్గొన్నారు. రాస్తారోకో ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీసుల రంగ ప్రవేశంతో స్టేషన్‌కు తరలించారు.

వనపర్తిలోనూ బంద్‌ సంపూర్ణం .....

ఇక వనపర్తిలోనూ బంద్‌ సంపూర్ణం అయ్యింది. బస్టాండ్‌ల నుంచి బస్సులు బైటికి రాలేదు. ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి సొంతర నియోజక వర్గం మక్తల్‌ లో సైతం బంద్‌ విజయవంతం అయ్యింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

ఎమ్మెల్యే జి బాలరాజుపై చర్యలు తీసుకోవాలి.....

ఇదిలా ఉంటే తన సోదరుడు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డిపై దాడి చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే జి బాలరాజుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులతో బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారో ఆలోచించాలని కేసీఆర్ కు డీకే అరుణ హితవు పలికారు. మరోవైపు గువ్వల బాలరాజు వ్యవహార శైలిపై కాంగ్రెస్‌ సీఎల్పీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద కాంగ్రెస్‌ పిలుపు నిచ్చిన బంద్‌తో కార్యకర్తల్లో జోష్‌ నింపింది. అధికార పార్టీపై నిరసనగా జరిపిన బంద్‌కు అటు తెలుగు దేశం పార్టీ సైతం మద్దతు తెలిపింది. ఈ బంద్‌తో కాంగ్రెస్‌ క్యాడర్‌లో నూతనోత్తేజం నిండింది. 

21:14 - September 5, 2015

హైదరాబాద్: ప్రాణ‌హిత చేవెళ్ళపై రంగారెడ్డి జిల్లా ఒక్కటైంది. జెండాలు .. ఎజెండాలు ప‌క్కన‌పెట్టి సింగిల్ ఎజెండాతో ఒక్కటయ్యారు. డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ ఊరువాడ ఉద్యమాన్ని రాజేయాల‌ని పార్టీలు నిర్ణయించుకున్నాయి. కేసీఆర్‌ స‌ర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు రాజ్ భ‌వ‌న్ గ‌డ‌ప‌దొక్కాయి .

ప్రాణహిత - చేవెళ్ల డిజైన్‌ మార్పుతో రాజకీయాల్లో అలజడి

ప్రాణ‌హిత -చేవెళ్ళ డిజైన్ మార్పుకు తెలంగాణ స‌ర్కార్ జైకొట్టడంతో రేగిన వివాదం ఇప్పుడు రాజ‌కీయాల్లో సెగ‌పుట్టిస్తోంది. జాతీయ హోదా ద‌క్కాల్సిన ప్రాజెక్ట్ ను రాజ‌కీయ కార‌ణాల‌తో కేసీఆర్ ప్రభుత్వం అట‌కెక్కిస్తుంద‌ని ప్రతిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయమై గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ నేతలు అనంతరం సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్‌ కేసీఆర్‌ సర్కారుపై ప్రత్యక్ష కార్యాచరణకు దిగినట్లైంది.

ఒక్కటవుతున్న రంగారెడ్డి జిల్లా నేతలు.....

ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్పుతో మొత్తం గా న‌ష్టపోయేది రంగారెడ్డి జిల్లా కావ‌డంతో... ఇప్పుడు ఆ జిల్లాలో ప్రభుత్వం పై ఆగ్రహావేశాలు వ్యక్తమ‌వుతున్నాయి. అంతేకాదు జిల్లా మొత్తం ఏక‌మై ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకేందుకు రెడీ అయ్యింది.

ప్రాజెక్టు డిజైన్‌ మార్పుతో నష్టపోనున్న హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలు......

ప్రాణ‌హిత డిజైన్ మార్పుతో నిర్మిస్తే... రంగా రెడ్డి జిల్లాలోని రెండున్నర ల‌క్షల ఎక‌రాల‌కు సాగునీరుతో పాటు.. హైద్రాబాద్ కు త్రాగునీరుకు గండిప‌డ‌నుంది. దీంతో రంగారెడ్డి జిల్లాలోని పార్టీల‌న్ని జండాల‌న్ని ప‌క్కన‌బెట్టాయి. పాత డిజైన్ లో ప్రాణ‌హిత ను నిర్మించాల‌నే సింగిల్ ఎజెండాతో ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి.

ఇప్పటికే ప్రాజెక్టులను పర్యవేక్షించిన అఖిలపక్ష పార్టీలు

ఇప్పటికే టిఆర్ఎస్ మిన‌హా అన్ని పార్టీలతో కూడిన అఖిల‌ప‌క్ష క‌మిటీ ప్రాజెక్ట్ ప‌నుల‌ను ప‌రీశీలించాయి. ప్రభుత్వం తీరును ప్రజ‌ల్లోకి తీసుకువెళుతున్నాయి. దీనిలో భాగంగా గ‌వ‌ర్నర్‌ ను క‌లిసి స‌ర్కార్ తీరుపై పిర్యాదు చేశాయి. అంతేకాదు త్వర‌లో జ‌రుగ‌నున్నా అసెంబ్లీ స‌మావేశాల‌లో ప్రభుత్వాన్ని ఎండ‌గ‌ట్టేందుకు సిద్ధమ‌వుతున్నాయి అన్నీ పార్టీలు. అలాగు జిల్లాలో ప్రజ‌లను ఏకంచేసేందుకు సిద్ధమ‌వ‌తున్నాయి. దీనికోసం ప్రత్యేక కార్యచ‌ర‌ణ‌తో ప్రజా ఉద్యమానికి ప్రణాళిక‌ల‌ను రూపొందించుకుట‌న్నారు నేత‌లు.

ద‌క్షిణ తెలంగాణ పై కేసీఆర్ వివక్ష...

తెలంగాణ ఏర్పడి ఏడాదిన్నర‌కే .. మ‌ల్లీ కేసీఆర్ ద‌క్షిణ తెలంగాణ ను వివ‌క్ష చూపుతున్నార‌న్న వాదాన్ని ప్రాణ‌హిత‌తో .. తెర‌పైకి తెస్తున్నారు రంగారెడ్డి జిల్లానేతలు. ఇది మ‌రింత రాజుకోక‌ముందే స‌ర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

కృష్ణాష్టమి సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ

గుంటూరు: దుగ్గిరాల మండలం చింతలపూడిలో కృష్ణాష్టమి సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేస్తున్నాయి.

నర్సరావుపేట మార్కెట్ సెంటర్ లో అగ్ని ప్రమాదం

గుంటూరు: నర్సరావుపేట మార్కెట్ సెంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ గోదాములో మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి.

నలుగురు ఎర్రచందనం కూలీల అరెస్టు

చిత్తూరు : చంద్రగిరి కోట సమీపంలోని శేషాచలం కొండల్లో టాస్క్ పోర్స్ పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ కూబింగ్ లో నలుగురు ఎర్రచందనం కూలీలను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.3లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

సుద్దాలకు కాళోజీ స్మారక పురస్కారం...

హైదరాబాద్ : సినీగేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజను మహాకవి కాళోజీ స్మారక పురస్కారానికి ఎంపిక చేసినట్టు భారత్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దర్శక నిర్మాత నాగబాల సురేష్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని స్థానిక మధురానగర్‌కాలనీలోని తెలుగు టీవీ ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ఏటా మహాకవి కాళోజీ పురస్కారాన్ని వివిధ రంగాల్లో నిపుణులకు అందిస్తోందని చెప్పారు. అందులో భాగంగానే ఈ ఏడాది సుద్దాల అశోక్ తేజకు ఇవ్వనున్నామని తెలిపారు.

అప్పులబాధతో మరో అన్నదాత ఆత్మహత్య

హైదరాబాద్ : వరంగల్‌లో అప్పులబాధతో మరో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. గీసుకొండ మండలం ఎలుకుర్తి గ్రామానికి చెందిన శ్రీను రెండు ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. రెండేళ్లుగా పంట దిగుబడి రాక వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక పోవడంతో చేసిన అప్పులు తీరే దారిలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆప్ఘనిస్థాన్ లో 13 మందిన కాల్చి చంపిన దుండుగులు

హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్ ఉత్తర ప్రాంతంలోని బల్కా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రయాణీకులతో వెళ్తున్న రెండు వాహనాలను ఆపి 13 మందిని విచక్షణా రహితంగా కాల్చి చంపేశారు. వాహనాల్లో ఉన్న పురుషులను వరుసలో నిలబెట్టి కాల్చేశారు. ఈ ఘటనపై ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదని పోలీసులు వెల్లడించారు. 

16 పరిశ్రమలకు అనుమతి పత్రాలు: జూపల్లి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి పత్రాలు మంజూరు చేసింది. 16 పరిశ్రమలకు అనుమతులు అందజేసినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

పాతభవనం కూల్చుతుండగా ప్రమాదం: ఒకరి

హైదరాబాద్: పాత భవనం కూల్చుతుండగా దాని శిథిలాలు పడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. బోయిన్‌పల్లిలోని ఏడుగుళ్ల రహదారిలో ఉన్న ఓ పాతభవనాన్ని కూల్చుతున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న రజిత (23) అనే మహిళా కూలీపై మట్టి పెళ్లు పడి మృతిచెందింది. రజిత మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఎమ్మెల్యే చిట్టెం పై దాడి అప్రజాస్వామికం : జానారెడ్డి

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పైదాడి అప్రజాస్వామిక ఘటన అని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి విమర్శించారు. దాడి జరిగి 24 గంటలు అయినా సీఎం కేసీఆర్ స్పందిచకపోవడం దారుణం అని మండి పడ్డారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజా ప్రతినిధులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

కేసీఆర్ చిల్ల రాజకీయాలు చేస్తున్నారు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమారెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని అణచేయాలని చూస్తున్నారని మండి పడ్డారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు.

టీఎస్ వాటర్ గ్రిడ్ మూడో దశ టెండర్ నోటీస్ జారీ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి మరో అడుగు ముందుకు పడింది. ఇవాళ వాటర్‌గ్రిడ్ మూడో దశ కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆరు సెగ్మెంట్లకు రూ.6,589 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ నోటీసు జారీ చేసింది. ఈనెల 10 నుంచి ఈ-ప్రాక్యూర్‌మెంట్ వెబ్‌సైట్‌లో టెండర్లు దాఖలు చేయవచ్చని పేర్కొంది. రంగారెడ్డి సెగ్మెంట్‌కు రూ.1800 కోట్లు అంచనా వ్యయంతో టెండర్ నోటీసు జారీ చేసింది.

బంగారు తెలంగాణ అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొట్టడమేనా:డీకే అరుణ

హైదరాబాద్ : బంగారు తెలంగాణ అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొట్టడమేనా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం తీరు చూస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెలను చంపండని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 24 గంటలు గడిచినా  మహబూబ్ నగర్ జడ్పీ సమావేశంలో జరిగిన ఘటనపై సీఎం కేసీఆర్ నోరు మెదపలేదని విమర్శించారు.

19:03 - September 5, 2015

గుంటూరు : కాన్వెంట్ చదువులు, కార్పొరేట్ హంగులు లేకున్నా వాటికంటే మెరుగైన రీతిలో చదువునందిస్తూ సత్తా చాటుతోంది ఓ ప్రభుత్వ పాఠశాల.. ఆహ్లాదకర వాతావరణంలో ఒత్తిడిలేని విద్యనందిస్తూ టాప్‌లో నిలుస్తోంది.. పదోతరగతిలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఆశ్చర్యపోయే రీతిలో గ్రేడ్‌లు తెచ్చుకుంటూ సర్కారీ స్కూళ్ల సత్తాచాటుతున్నారు ఇక్కడి విద్యార్థులు..

కార్పొరేట్ స్కూళ్లే పదో తరగతి ఫలితాలు.....

కార్పొరేట్ స్కూళ్లే పదో తరగతి ఫలితాల్లో కిందా మీదా పడుతున్న రోజులివి... ఉదయం నుంచి రాత్రివరకూ రుద్ది రుద్ది చదివించినా 90శాతం రిజల్ట్ సాధించడం ఎంతో కష్టం... అలాంటిది.. గుంటూరు జిల్లా పత్తిపాడులోని గొట్టిపాడు ప్రభుత్వ పాఠశాల ప్రతిసారీ 95శాతానికి తగ్గకుండా ఉత్తీర్ణత సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.. యాభై ఏళ్ల సుదీర్ఘ చరిత్రగల ఈ స్కూల్ ఎంతోమంది విద్యార్థులకు చదువు నేర్పింది.. విద్యార్థులు లేరంటూ స్కూళ్లు మూతబడుతున్న ఈ రోజుల్లో ఇక్కడమాత్రం రోజురోజుకూ విద్యార్థుల సంఖ్య పెరిగిపోతోంది..

ప్రస్తుతం 360మంది విద్యార్థులు...

ఈ స్కూల్లో ప్రస్తుతం 360మంది చదువుకుంటున్నారు.. ఉదయం ప్రార్థననుంచి సాయంత్రంవరకూ సరికొత్త పద్ధతిలో ఇక్కడ విద్య నేర్పుతున్నారు టీచర్లు.. పదోతరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటారు.. ఆదివారం, సెలవురోజుల్లోకూడా ఈ విద్యార్థులను చదివిస్తారు.. బలవంతంగా బట్టీ పట్టే విధానంలోకాకుండా పాఠాలన్నీ అర్థం అయ్యేలా వివరించడం ఈ స్కూల్ ప్రత్యేకత...

ఒక్క చదువేకాదు...

ఒక్క చదువేకాదు... ఆట పాటలు, క్విజ్‌లు, వ్యాసరచనలోకూడా ఇక్కడి విద్యార్థులు మంచి ప్రతిభ చూపుతున్నారు.. సౌకర్యాల్లోకూడా ఈ స్కూల్ టాప్‌లో నిలుస్తోంది.. చుట్టూ ప్రహారి గోడ, విశాలమైన ఆటస్థలం, చుట్టూ పచ్చని చెట్లు, విద్యార్థులకు టాయ్‌లెట్లు, మినరల్ వాటర్ అన్నీ ఏర్పాటు చేశారు.. అందరూ కలిసి స్కూల్ ఆవరణను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటారు.. లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబుల్లో విద్యార్థులతో ప్రయోగాత్మకంగా పాఠ్యబోధన చేస్తున్నారిక్కడి టీచర్లు. సాయంత్రం విద్యాభ్యాసానికి ఇబ్బంది రాకుండా.. ఈ పాఠశాల జనరేటర్‌ను కూడా సమకూర్చుకుంది. తల్లిదండ్రులు, ఊరి పెద్దలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇవన్నీ ఏర్పాటు చేయగలిగామని హెచ్‌ఎం చెబుతున్నారు..

తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధన....

ఈ స్కూల్‌లో తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధిస్తున్నారు. ఇక్కడి విద్యావిధానం చూసి ప్రైవేటు స్కూళ్లనుంచి పిల్లల్ని తీసుకువచ్చి ఈ స్కూల్లో చేర్పిస్తున్నారు తల్లిదండ్రులు.. ఒత్తిడిలేని విద్యనందిస్తూ విద్యార్థుల్లో ప్రతిభను మరింత మెరుగుపరుస్తున్న ఈ స్కూల్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.. 

18:58 - September 5, 2015

సంగారెడ్డి : గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం అంటే చాలు ఎవ్వరైనా ఎగిరి గంతేస్తారు.. బోలెడు సెలవులు, మంచి జీతం... లైఫ్ హాయిగా ఎంజాయ్ చేయొచ్చనుకుంటారు.. కానీ ఆ టీచర్ మాత్రం అలా భావించలేదు... క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. చిన్నారులకు సులువైన పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నారు.. తల్లిదండ్రులతోనేకాదు.. తోటి ఉపాధ్యాయులతోనూ శభాష్ అనిపించుకుంటున్నారు..

సుల్తాన్‌పురం జిల్లా పరిషత్‌ హైస్కూల్...

మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం సుల్తాన్‌పురం జిల్లా పరిషత్‌ హైస్కూలు పేరు చెప్పగానే చుట్టుపక్కలవారికి వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీనివాస్ మాస్టారు.. 26ఏళ్లుగా విద్యాబోధనలో నిష్ణాతుడిగా పేరు తెచ్చుకున్నారు.. ఎంతటి కఠినమైన పాఠమైనా చిన్నారులకు తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పడం శ్రీనివాస్ మాస్టారి ప్రత్యేకత...

ఏ ఒక్కరోజూ స్కూల్‌కు ఆలస్యంగా రాలేదు...

క్రమశిక్షణలోనూ ఈ ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలుస్తున్నారు.. హైదరాబాద్‌లో నివాసముంటున్నా.. ఇన్నేళ్లలో ఏ ఒక్కరోజూ స్కూల్‌కు ఆలస్యంగా రాలేదని తోటి టీచర్లు చెబుతున్నారు... అలాగే స్కూల్లో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తారు.. ఈ వయసులోకూడా ఉత్సాహంగా పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.. తాను ఏ స్కూల్‌లో ఉన్నా విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకుంటానని శ్రీనివాస్ చెబుతున్నారు.. వచ్చే ఏడాది రిటైర్ కాబోతున్నారు శ్రీనివాస్... ఈ సార్ వెళ్లిపోతే తమ స్కూల్ పరిస్థితి ఏంటని ఇప్పటినుంచే టెన్షన్ పడుతున్నారు తోటి టీచర్లు, విద్యార్థులు.. 

18:55 - September 5, 2015

ఖమ్మం: మణుగూరులోని జిల్లా పరిషత్‌ హైస్కూలు.. రాష్ట్రంలోనే అతిపెద్ద పాఠశాల. ఇక్కడ సుమారు 15వందల మంది చదువుకుంటున్నారు.. సర్కారీ బడులు సమస్యలకు నిలయాలన్నది ఈ స్కూల్‌కు కూడా వర్తిస్తుంది.. విద్యార్థులు కూర్చునేందుకు సరపడా బల్లలు లేవు.. తాగునీటికి కష్టాలు తప్పవు... గదులు సరిపోక ఆరుబయటే విద్యాబోధన చేస్తున్న గురువులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా సిద్ధమవుతుంది. పైగా ఉన్న అరకొర వస్తువులకూ ఇక్కడ రక్షణ కరువైంది.

జెడ్పీహైస్కూల్‌లో 42మంది టీచర్లు......

మణుగూరు జెడ్పీహైస్కూల్‌లో 42మంది టీచర్లు పనిచేస్తున్నారు.. స్కూల్‌లో ఎన్ని కష్టాలున్నా విద్యాబోధనలో తమకు తామే సాటి అని వీరంతా నిరూపిస్తున్నారు.. చిన్నారుల్లోని ప్రతిభను గుర్తిస్తూ.. దానికి సానపెడుతూ.. అద్భుతంగా తీర్చి దిద్దుతున్నారు.. ఈ టీచర్ల బోధనతో తృప్తి చెందిన తల్లిదండ్రులు క్రమంగా ప్రైవేటు స్కూళ్లపై మోజును వదులుకుంటున్నారు. తమ పిల్లల్ని ఎలాగైనా ఇక్కడే చేర్పించేలా ఒత్తిళ్లు తెస్తున్నారు. గదులు సరిపోవని చెబుతున్నాకూడా అడ్జస్టై పోతామంటూ పిల్లలను ఇక్కడ జాయిన్ చేయించి వెళుతున్నారు.

సౌకర్యాలు లేకున్నా చదువులో విద్యార్థుల ముందంజ.....

సౌకర్యాలేవీ లేకున్నా తమ పాఠశాలలో ఇంత అద్భుత ఫలితాలు వస్తున్నాయని .. మౌలిక వసతులు కల్పిస్తే మరింత మెరుగ్గా చదువు చెబుతామంటున్నారు ఇక్కడి టీచర్లు..

18:52 - September 5, 2015

మహబూబ్ నగర్ : అందరికీ చదువులమ్మ దారిచూపితే.. ఆ చదువుల తల్లికే నీడనిచ్చిందో మానవతామూర్తి. పరిస్థితులు ప్రతికూలమైన చోట.. ఎవరి అండా దొరకని వేళ.. ఒంటరిగా నడుం బిగించి నాలుగు దశాబ్దాల క్రితం ఆమె నాటిన చదువుల మొక్క.. నేడు మహావృక్షమైంది..! వందల మంది విద్యార్థులకు విద్యా ఫలాలను అందిస్తోంది..! ఆమె సేవాగుణాన్ని, త్యాగనిరతిని మెచ్చి ఎన్నో అవార్డులు నడిచిరాగా.. తాజాగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు సైతం వరించబోతోంది...

మరే చిన్నారి అనుభవించకూడదు.....

"నేను అనుభవించిన ఇబ్బందులు మరే చిన్నారి అనుభవించకూడదు. నా కంట్లోంచి వచ్చిన కన్నీళ్లు ఇంకెవరి కళ్లలోనూ చూడకూదు." ఇంతటి ఉన్నత లక్ష్యాన్ని తనకు తాను నిర్దేశించుకున్న ఈ మానవతామూర్తి పేరు నాగమ్మ. కనీసం ఇంటర్‌ మీడియట్‌ అయినా పూర్తికాకముందే ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన ఈమె.. చదువు ద్వారానే అజ్ఞానపు చీకట్లను తరిమికొట్టొచ్చని భావించింది. అలాంటి బలమైన సంకల్పంతో ఆమె వెలిగించిన అక్షర దీపం.. ఇవాళ ఎంతో మంది చిన్నారులకు వెలుగునిస్తోంది.

నారాయణ పేట గ్రామానికి చెందిన నాగమ్మ..

మహబూబ్‌ నగర్‌ జిల్లా, నారాయణ పేట గ్రామానికి చెందిన నాగమ్మ.. చిన్నతనంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది. ఇలాంటి కష్టాలు మరెవరికీ రావద్దనే ఆలోచనతో.. ఇంటర్‌ మీడియట్‌లో ఉండగానే.. నారాయణపేటలో ఓ పాఠశాల ఏర్పాటు చేయాలని భావించింది. ఆ దిశగా పనులు మొదలు పెట్టినప్పటికీ.. ఆ ప్రాంతానికొచ్చి పనిచేయడానికి ఉపాధ్యాయులెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో.. తానే ఉపాధ్యాయురాలైంది ఈ బాల నాగమ్మ. ఏకోపాధ్యాయురాలి అవతారమెత్తి.. 20 మంది పిల్లలతో 1978లో 'దయానంద విద్యామందిర్‌' పాఠశాలను ప్రారంభించింది.

ఓ వైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే..

ఓ వైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే.. ఆమె కూడా చదువు కొనసాగించారు. ఎంఏ బీఎడ్‌ పూర్తిచేశారు. ఉపాధ్యాయురాలిగా ఆమె సాధిస్తున్న ఫలితాలను చూసి.. ఏడేళ్లకే ప్రభుత్వం నుంచి ఎయిడెడ్‌ గుర్తింపు వచ్చిందీ పాఠశాలకు. అయితే.. 1984లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన నాగమ్మ... 87 వరకు ఊట్కూర్ మండలం వల్లంపల్లి, ధన్వాడ బాలికల ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు. అయితే.. పాత పాఠశాల విద్యార్థుల కోసం ఉద్యోగాన్ని వదిలేసి.. మళ్లీ దయానంద విద్యామందిర్‌కు వచ్చేశారు. ప్రస్తుతం సెకండరీగ్రేడ్ టీచర్ గా పాఠశాలలో కొనసాగుతున్నారు.

నాగమ్మకృషిని మెచ్చి ఎన్నో అవార్డులు.....

నాగమ్మకృషిని మెచ్చి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. 2009-10లో ఇంటర్ నేషనల్ లయన్స్ క్లబ్ నుంచి.. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు. 2011-12 విద్యాసంవత్సరానికి గానూ ప్రభుత్వం నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2012-13లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా.. 2013-14లో ఇందిరాగాంధీ సంయాత్ర సంస్థ వారి నుంచి.. గ్రాడ్యూయేటేడ్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. 2013లో సర్వేపల్లి రాధాకృష్ణ వాలంటీర్ ఆర్గనైజేషన్ వారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు అందించారు. ఇప్పుడు తాజాగా.. 2015-2016 విద్యా సంవత్సరానికి గానూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికయ్యారు నాగమ్మ. ఈ నెల 5న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోబోతున్నారు.

తమ టీచర్‌కు ఈ అవార్డు రావడం పట్ల విద్యార్థులు ఆనందం...

తమ టీచర్‌కు ఈ అవార్డు రావడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి మరెన్నో అవార్డులు రావాలని ఆకాంక్షిస్తున్నారు.విద్యా సుగంధాలను నలుగురికీ పంచేందుకు నాగమ్మ జీవితాన్నే ధారపోయడం ఎంతైనా ప్రశంసనీయం. వృత్తిపట్ల ఆమెకున్న నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆశిద్దాం..

మంత్రి హరీష్‌రావుపై మండిపడ్డ సీఐటీయూ నేతలు

మెదక్ : ఆశా వర్కర్లపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఐటీయూ మండిపడింది. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా.. మెదక్‌ జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దుబ్బాక, సంగారెడ్డి తదితర మండలాల్లో ఆశా వర్కర్లు.. హరీష్‌రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీనపై మరింత సమాచారాన్ని మా మెదక్ ప్రతినిధి పీవీ.రావు అందిస్తారు.

18:47 - September 5, 2015

మెదక్ : తెలంగాణ మంత్రి హరీష్‌రావు మెదక్‌ జిల్లా సిద్ధిపేటలోని పలు గ్రామాల్లో పర్యటించారు. సిద్ధిపేట, నారాయణరావుపేట, ఇబ్రహీంపూర్‌లో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తెలంగాణ తల్లి, ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ విగ్రహాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత గ్రామాల్లో ఇంకుడు గుంతలను పరిశీలించారు. సీఎం కేసీఆర్‌కు ముందుండి దారి చూపిన మహనీయుడు జయశంకర్ అని హరీష్‌రావు కొనియాడారు. రాబోయే రోజుల్లో కోటి ఎకరాలకు సాగునీరు, పగలు తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత కరెంటును ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

18:45 - September 5, 2015

పశ్చిమగోదావరి : ఏలూరులో నటుడు బాలకృష్ణ ప్లెక్సీ వివాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్, బాలకృష్ణ, తనయుడు మోక్షజ్ఞ ఫొటోలతో నగరంలో భారీ ఎత్తు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. ఆ ఫ్లెక్సీని చింపేశారు. సమాచారం తెలుసుకున్ననందమూరి అభిమానులు.. ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాలకృష్ణ అభిమానుల సంఘం నేతలు డిమాండ్ చేశారు.

18:44 - September 5, 2015

విశాఖ : ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న గురుపూజోత్సవంలో ప్రమాదం సంభవించింది. విశాఖలో ఏర్పాటు చేసిన ఈ సభలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది.. హుటాహుటిన సభా ప్రాంగణాన్ని చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఎలాంటి ప్రాణహాని జరగలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

18:42 - September 5, 2015

హైదరాబాద్ : గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలో విషాదం నెలకొంది. అందుకూరులో అట్లూరి లాజరు అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో కరెంటు పని చేస్తున్న లాజరు.. 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వరి పంట వేశాడు. అయితే సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. దీంతో పాటు పంట కోసం చేసిన అప్పులు, వడ్డీలు కొండంత పెరిగిపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. రాత్రి పొలం వద్దకు వెళ్లిన లాజరు.. పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

 

విద్యార్థులకు విలువలు నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే: రాష్ట్రపతి

హైదరాబాద్ : పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు విలువలు నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సిరియాలో ఘర్షణలు:47 మంది మృతి

హైదరాబాద్: ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు, సిరియా తిరుగుబాటు దారుల మధ్య ఈ రోజు చెలరేగిన ఘర్షణల్లో 47 మంది మృతి చెందారు. టర్కీ సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో సిరియాలోని మరేయా ప్రాంతంలో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

 

హార్లీ డేవిడ్ సన్ బైకు దొంగ భీమవరం వాసి....

హైదరాబాద్: నగరంలోని బంజారహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఓ షోరూమ్ నుంచి హార్లీ డేవిడ్ సన్ బైకును అపహరించుకుపోయిన దుండుగుడు ముంబైలో పోలీసుల వలకు చిక్కిన విషయం తెలిసిందే. ఈమేరకు నగర పోలీసులు ముంబై వెళ్లి నిందితున్ని నగరానికి తీసుకొచ్చారు. ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాసి అని తెలిపారు. అతడు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నాడని వివరించారు. నిందితుడు ఓఎన్‌జీసీలో ఉద్యోగి అని ఆయన తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అని తెలిపారు.

సమాజంలో ఉపాధ్యాయుల స్థానం పవిత్రమైంది: చంద్రబాబు

విశాఖ: సమాజంలో ఉపాధ్యాయుల స్థానం పవిత్రమైందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా శనివారం విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో జరిగిన గురుపూజోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు విద్యను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. టీచర్ల కొరత లేకుండా పోస్టులన్నీ భర్తీ చేస్తాంని అదే విధంగా విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. 

సీఎం కేసీఆర్ మోనార్కా: షబ్బీర్ అలీ

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ మోనార్కా అని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జడ్పీ సమావేశ ఘటనకు నిరసనగా కాంగ్రెస్నేతలు ఆందోళన చేపట్టారు. శనివారం రాజ్ భవన్ గరవ్నర్ నరసింహన్ ను కలిసి జడ్పీ సమావేశంలో జరిగిన మొత్తాన్ని వివరించారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. క్యాంపు కార్యాలయానికి వస్తున్న నేతలను సోమాజి గూడ సర్కిల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

18:17 - September 5, 2015

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ మోనార్కా అని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జడ్పీ సమావేశ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. శనివారం రాజ్ భవన్ గరవ్నర్ నరసింహన్ ను కలిసి జడ్పీ సమావేశంలో జరిగిన మొత్తాన్ని వివరించారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. క్యాంపు కార్యాలయానికి వస్తున్న నేతలను సోమాజి గూడ సర్కిల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకు యత్నించిన కాంగ్రెస్నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ లో కరువు, అప్పుల బాధతో 4 గంటలకు ఒక రైతు చనిపోతున్నాడని... ఈ అంశాలను సీఎంతో మాట్లాడకుంటే ఎవరితో మాట్లాడతారని ఆవేదన వ్యక్తం చేశారు.

అస్సాంలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యం...

హైదరాబాద్ : అస్సాంలోని గోపాలపుర జిల్లాలో ఆర్మీ బలగాలు తీవ్రవాదుల కోసం ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్‌లో భాగంగా రెహ్మాన్ అనే వ్యక్తి నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను ఆర్మీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 8 కేజీల పేలుడు పదార్థాలతో పాటు 52 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రెహ్మాన్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయనను విచారిస్తున్నారు. పేలుడు పదార్థాలను రెహ్మాన్ తీవ్రవాదులకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.

గవర్నర్ తో ముగిసిన టి.కాంగ్రెస్ నేతల భేటీ

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ తో టి.కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పై దాడి చేసిన టిఆర్ ఎస్ ఎమ్మెల్యే బాలరాజు పై గరవ్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి టి.కాంగ్రెస్ నేతలు బయలు దేరారు

 

తెలంగాణ విద్యావ్యవస్థలో సమూల మార్పులు: కడియం

హైదరాబాద్ : తెలంగాణ విద్యావ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన మాట్లాడుతూ, అన్ని స్థాయిల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. అవి త్వరలోనే అమలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. సామాజిక రుగ్మతలు రూపు మాపాలన్నా, సమాజంలో జీవన స్థితిగతులు మారాలన్నా విద్య చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి దశలో కష్టపడి చదివితే జీవితం సాఫీగా సాగిపోతుందని ఆయన బోధించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు.  

ఆంధ్రా వర్శిటీలో గురుపూజోత్సవం

హైదరాబాద్ : వివాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో గురుపూజోత్సవం కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.

నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం...

హైదరాబాద్ : నగరంలో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హయత్‌నగర్, ఎల్బీనగర్, మన్సురాబాద్, వనస్థలిపురంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఇంద్రాణి ముఖర్జియా పోలీస్ రిమాండ్ పొడిగింపు...

హైదరాబాద్ : కుమార్తె షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియా పోలీస్ రిమాండ్ ను ముంబై స్థానిక కోర్టు ఈ నెల 7వరకు పొడిగించింది. ఆమెతో పాటు కేసులో నిందితులుగా ఉన్న ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ ల రిమాండ్ కూడా అదే తేదీ వరకు పొడిగించారు. నేటితో వారి రిమాండ్ ముగియనుండటంతో పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అయితే షీనా హత్య కేసులో విచారణకు ఇంద్రాణి సహకరించడం లేదని, కేసు విచారణ కోసం నిందితులకు రిమాండ్ పొడిగించాలని పోలీసులు కోర్టును కోరారు. దాంతో న్యాయస్థానం రిమాండ్ పొడిగింపుకు అనుమతి ఇచ్చింది. 

'పాలమూరు ఎత్తిపోతల' కు టిడిపి వ్యతిరేకం కాదు: రావుల

హైదరాబాద్ : పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు టీడీపీ వ్యతిరేకం కాదని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కెసీఆర్ వ్యవసాయాన్ని వెంటిలేటర్‌పైకి తెచ్చారని విమర్శించారు. టీఆర్‌ఎస్ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు రౌడీయిజంలో బీహార్‌ను మించి పోయారని రావుల ఎద్దేవాచేశారు.

కర్నూల్ లో అగ్ని ప్రమాదం:14గుడిసెలు దగ్ధం...

కర్నూలు : అ ధర్మాపేట కాలనీలో జరిగిన అగ్నిప్రమాదంలో 14 గుడిసెలు కాలి బూడిదయ్యాయి.షార్ట్ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు.అయితే దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

'భారత్ పై డ్రోన్ దాడులకు ఉగ్రవాదలు పథకం'

హైదరాబాద్ : భారత్ లోకి దొంగచాటుగా ప్రవేశించిన పాకిస్థాన్ ఉగ్రవాదులు దేశ వ్యాప్తంగా దాడులకు తెగబడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ దాడులకు ఉగ్రవాదులు ఏ తరహాలో పాల్పడతారనే దానిపై కూడా స్పష్టమైన సమాచారం ఉన్నట్టు తెలిసింది. అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఎవీలు), అన్ మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ (యూఎఎస్ లు), పారా గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు, రిమోట్ ద్వారా నియంత్రించే ఫ్లైయింగ్ ఆబ్జెక్టులు, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ లతో దాడులకు దిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

 

15:47 - September 5, 2015

కృష్ణా : విజయవాడలో అధికార పార్టీ నేతలు కబ్జాలకు తెగబడుతున్నారు. విద్యాధరపురంలో ఏకంగా స్మశాన వాటికను కబ్జా చేసేందుకు టిడిపి నేతలు యత్నించారు. అధికారులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్మశానాన్ని మట్టితో పూడ్చేశారు. దీంతో సీపీఐ, వైసీపీ నేతలు, కార్యకర్తలు సంఘటనా ప్రాంతంలో ఆందోళనకు దిగారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారిని ఆషాను అడ్డుకుని ఆమెను నిలదీశారు. కబ్జాపై సమాధానం చెప్పాలని ప్రశ్నించిన మీడియాపై ఆమె దుర్భాషలాడారు. స్మశానాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన ప్రతిఒక్కరిపై కేసులు నమోదు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

15:45 - September 5, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రజాసమస్యలపై చర్చ సంగతి ఎలాగున్నా.. డైలాగ్‌ వార్‌కు మాత్రం కొదవలేదు. మాట్లాడే వాడే మొనగాడండూ రెచ్చిపోయారు ప్రజాప్రతినిధుల్లో చాలామంది. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రతిపక్ష నేత జగన్‌, సీఎం చంద్రబాబు మధ్య సాగిన్‌ కౌంటర్‌ వార్‌తో సభలో నవ్వులు పూశాయి ఆ తర్వాత.. ఇదే అంశం ఇద్దరి మధ్యా నిప్పులు కురిపించింది.

పరస్పర దూషణలు....

ఇక, సభా నిర్వహణ విషయంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు చేసుకున్న పరస్పర దూషణలు.. సభాసంప్రదాయాలను మంటగలిపాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే.. ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు, జగన్‌ మధ్య వచ్చిన స్టడీ అంశం నవ్వుల పూలు పూయించింది. నోటుకు ఓటు కేసులో కీలకమైన స్టీఫెన్‌ సన్‌కు.. జగన్‌ చెబితేనే ఎమ్మెల్యే పదవికి కేసీఆర్‌ నామినేట్‌ చేశాడన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో పెద్ద దుమారమే చెలరేగింది. ఇక, ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి జగన్‌ కోట్‌ అంశాలపై, దానికి ఆధారమైన మెటీరియల్‌ విషయంలో.. పరస్పరం పంచ్‌లు విసురుకున్నారు అధికార, విపక్ష నేతలు...

పట్టిసీమ విషయంలోనూ.....

పట్టిసీమ విషయంలోనూ రూలింగ్‌, అపోజిషన్‌ మధ్య టామ్‌అండ్‌జెర్రీ వార్‌ నడిచింది. ఇక చివరి రోజు నోటుకు ఓటు అంశంపై చర్చ చేపట్టిన సందర్భంగా సైతం.. అచ్చెన్నాయుడు, జగన్‌ మధ్య చోటు చేసుకున్న వార్‌.. అసెంబ్లీని కుదిపేసింది.

15:41 - September 5, 2015

హైదరాబాద్ : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ సీఈవో రేసులో ఏపీలో విజయవాడనగరానికి చెందిన మహిళా పద్మశ్రీ వారియర్ ఎంపిక కావటం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పద్మశ్రీ వారియర్ విజయవాడ మాంటిస్సోరి పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటర్, డిగ్రీలను విజయవాడలోని మేరి స్టేల్లా కళాశాలలో చదివారు. దీనిపై ఆయా విద్యాసంస్థలకు చెందిన ఉపాధ్యాయులు పద్మశ్రీ వారియర్‌ ను గుర్తు చేసుకున్నారు. 

రక్షణ మంత్రి ప్రకటన స్పష్టంగా లేదు : మాజీ సైనికులు..

హైదరాబాద్ : రక్షణ మంత్రి ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నామని,అదే సమయంలో రక్షణ మంత్రి ప్రకటన స్పష్టంగా లేదని వారు తెలిపారు. సైనికులెవరూ ముందుగా రిటైర్మెంట్ తీసుకోవాలని భావించరని, ప్రమోషన్ లభించిన వారంతా పై స్థాయిల్లో సౌకర్యాలు అనుభవిస్తారని, అదే సమయంలో వారితో సమానమైన సామర్థ్యం కలిగి, అవకాశం లభించని వారు మాత్రమే రిటైర్మెంట్ తీసుకుంటారని వారు పేర్కొన్నారు. అలాంటప్పుడు వారితో పాటు సమానమైన పెన్షన్ సౌకర్యం పొందడం అసమంజసం కాదని వారు అభిప్రాయపడ్డారు. అలాగే పాత బకాయిల విషయంలో రక్షణ మంత్రి ప్రకటన సరికాదని వారు అన్నారు.

15:33 - September 5, 2015

హైదరాబాద్ : మాజీ సైనికులకు వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారీకర్‌ వెల్లడించారు. కేంద్రం ప్రకటనతో గత 42 ఏళ్లు పెండింగ్‌లో ఈ సమస్యకు తెరపడ్డట్టయ్యింది. గత ప్రభుత్వాలు ఓఆర్‌ఓపి అమలు చేయడం వల్ల పడే భారాన్ని 5 వందల కోట్లుగా అంచనా వేశాయని, అయితే ఈ భారం 8 వేల నుంచి 10 వేల కోట్ల భారం పడే అవకాశముందని తెలిపారు. 2014 జూలై నుంచి పాత బకాయిలు చెల్లింపులు జరుపుతామని మంత్రి వెల్లడించారు. ప్రధాని ఇచ్చిన హామీ మేరకు గత కొన్నిరోజులుగా విస్తృత సంప్రదింపులు జరిపాక ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పారీకర్‌ తెలిపారు. ఓఆర్‌ఓపిపై కేంద్రం ప్రకటనను స్వాగతించిన మాజీ సైనికులు- ఐదేళ్లకోసారి పించన్‌పై సమీక్షిస్తామన్న ప్రభుత్వ ప్రకటనను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

త్వరలో 12 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ :ఏపీ డీజీపీ

హైదరాబాద్ : త్వరలో 12 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ జరుగుతుందని ఏపీ డీజీపీ రాముడు తెలిపారు. హోంగార్డుల వేతనాలు కూడా పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని డీజీపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు మావోయిస్ట్ ల సమస్యలేదని డీజీపీ తెలిపారు.

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన హెచ్ ఆర్ సీ సెక్రటరీ

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని హ్యూమన్ రైట్స్ కమిషన్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం సందర్శించారు. చిన్న పిల్లల వార్డులో ఎలుకలు తిరుగుతున్నాయన్న సమాచారంతో పరిశీలనకు వచ్చానని ఆయన వెల్లడించారు. గుంటురు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కరిచి నాలుగు రోజులు పసికందు మృతి చెందిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో నియంత పాలన సాగుతోంది: జీవన్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణలో నియంత పాలన సాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై చేయిచేసుకున్న ఘటనతో రౌడీల పాలనకు తెరదీశారన్నారు. అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, రైతులకు రుణమాఫీ అమలు జరగడం లేదన్నారు. బ్యాంకర్లు వడ్డీలు వసూలు చేస్తూనే ఉన్నారని, వ్యవసాయశాఖా మంత్రి పంచె కట్టినంత మాత్రాన రైతు కాలేరని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

14:55 - September 5, 2015

తిరుపతి : వారాంతం కావడంతో.. తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం 15కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఏపీ స్పీకర్ కోడెల, డీజీపీ రాముడు శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో అనావృష్టి, దుర్బిక్షం తొలగిపోయి... అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు కోడెల తెలిపారు. ర్యాగింగ్ తో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. 

14:52 - September 5, 2015

హైదరాబాద్ : కేసీఆర్‌ ప్రభుత్వం తీరువల్లే తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీ. టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ...రాబోయే మూడేళ్లలో లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను.. ఎప్పుడు కటి ఇస్తారని ప్రశ్నించారు.ఆత్మహత్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని చెప్పారు. రుణమాఫీపై తూతూమంత్రంగా ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు. రుణమాఫీలో రూ.1000కోట్లు దుర్వినియోగమయ్యాయని మంత్రి ఈటెల ఒప్పుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణలోని అన్ని మండలాల్లో కరువు ఉందనీ, అన్ని మండలాల్లోనూ రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎర్రబెల్లి తెలిపారు.

14:50 - September 5, 2015

కృష్ణా : బందరు నౌకాశ్రయ పరిధి రైతులతో ఏపీ మంత్రులు మచిలీపట్నం టౌన్‌ హాలులో సమావేశమయ్యారు. బందర్ పోర్టుకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం భూసేకరణ నోటీసును జారీ చేసింది. దీంతో గత మూడు రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కొల్లు రవీంద్రారెడ్డి ఆరు గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. భూసేకరణలో రైతులకు అన్యాయం జరుగకుండా చూస్తామని రైతులకు నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈలోగా పలువురు రైతులు తాము భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. ముందుగా పోర్టు నిర్మాణం చేసిన తర్వాతే తమ వద్ద భూములు తీసుకోవాలన్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

14:46 - September 5, 2015

హైదరాబాద్ : కడప యోగి వేమన యూనివర్శిటీ వీసీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తాయి. పరిపాలనా భవనం మీది జాతీయ చిహ్నం నాలుగు సింహాలపై వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయించారు వీసీ శ్యాంసుందర్‌. జాతీయచిహ్నంపై ఎలాంటి ఇతర గుర్తులు, బొమ్మలు ఉండకూడదు. అయినా వీసీ నిర్ణయం తీసుకుని పెట్టించేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు వీసీ ఛాంబర్‌లో సైతం సంప్రదాయానికి విరుద్ధంగా జాతీయ నేతల ఫోటోల బదులు దేవుళ్ల ఫోటోలే దర్శనమిస్తాయని విద్యార్ధులు విమర్శిస్తున్నారు. 

14:44 - September 5, 2015

హైదరాబాద్ : ఏపి కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్స్‌ ఎంపిక, రాజధాని ప్రాంతానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై చర్చించారు. దీంతో పాటు రైతు కోసం చంద్రన్న యాత్ర, పరిశ్రమల కోసం భూ కేటాయింపులపై సమీక్షించారు. 29 నుండి ప్రారంభం కానున్న చంద్రన్న రైతు భరోసా యాత్ర ను సక్సెస్ చేసేందుకు కావల్సిన ప్రణాళికలను తయారు చేసినట్లు సమాచారం.

మహాబోధి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బీహార్‌ పర్యటనలో భాగంగా మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. బౌద్ధ బిక్షువులు మోదీకి సాదర స్వాగతం పలికారు. మోదీ అక్కడ కాసేపు ధ్యానం చేశారు. తరువాత ఆలయ పూజరులు ఆయనను తగిన రీతిలో సత్కరించారు. మూడు రోజుల అంతర్జాతీయ బౌద్ధ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని బుద్ధగయా వచ్చారు. మహాబోధి ఆలయ పరిసరాల్లోని విశేషాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కాసేపు ఆలయ పరిసరాల్లో తిరిగారు.

ఎస్వీయూ ఎదుట రాయలసీమ పోరాట సమితి నేతల ఆందోళన

హైదరాబాద్ : తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎదుట రాయలసీమ పోరాట సమితి నేతలు ఆందోళన నిర్వహించారు. నీరు, నిధులు, హక్కుల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ గళమెత్తారు. ఈ ఆందోళనలో పోరాట సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆందోళన సమయంలో ఎస్వీ యూనివర్శిటీలోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు యత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పద్మావతి మెడికల్ కాలేజీ కౌన్సిలింగ్ లో నిబంధనలు పాటించలేదని, రాయలసీమ వైద్య విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ విధానాలతోనే రైతుల ఆత్మహత్యలు : ఎర్రబెల్లి...

హైదరాబాద్ : ప్రభుత్వ విధానాలతోనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఆత్మహత్యలన్నీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యలే నని ఆయన ఆరోపించారు. ఆత్మహత్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని చెప్పారు. రుణమాఫీపై తూతూమంత్రంగా ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు. రుణమాఫీలో రూ.1000కోట్లు దుర్వినియోగమయ్యాయని మంత్రి ఈటెల ఒప్పుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణలోని అన్ని మండలాల్లో కరువు ఉందనీ, అన్ని మండలాల్లోనూ రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎర్రబెల్లి తెలిపారు.

పద్మావతి వర్సిటీలో 85 శాతం స్థానికులకే కేటాయించాలి - రఘువీరా..

విజయవాడ : తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్య కాలేజీలో 85 శాతం సీట్లు నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు కేటాయించాలని ఏపీపీసీసీ నేత రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాలకు 15 సీట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు

 

ధర్మపేటలో భారీ అగ్నిప్రమాదం..

కర్నూలు : జిల్లా ధర్మపేటలోని ఓ ఇంట్లో శనివారం గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమీపంలోని 25 పూరిళ్లు దగ్ధమయ్యాయి. 

అన్ని మండలాల్లో కరవు - ఎర్రబెల్లి..

హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని మండలాల్లో కరవు తీవ్రంగా ఉందని టిటిడిపి నేత ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. రైతుల బతుకులతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. 

13:42 - September 5, 2015

విశాఖపట్టణం : ఆచార్యదేవోభవ అన్న సూక్తికి సరైన అర్థం చెబుతున్నారు ఇద్దరు మహిళా టీచర్లు... ఒక్క చదువు చెప్పడంతోనే తమ బాధ్యత పూర్తయిందని భావించలేదు.. సమాజంలో చైతన్యంకోసం అహర్నిషలు శ్రమించారు.. సేవేలక్ష్యంగా ముందుకు కదులుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50కిపైగా గిరిజన తెగలు నివసిస్తున్నాయి... ఇందులో చాలా తెగలకు మాతృభాషలున్నాయి.. ఇతర భాషల ప్రభావంతో ఈ గిరిజనుల భాషలన్నీ మెల్లగా కనుమరుగైపోతున్నాయి.. కొన్నేళ్లు గడిస్తే గిరిజనుల సంస్కృతిని తెలియజేసే ఈ భాషలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదముంది.

18 గిరిజనుల భాషలకు లిపి..
ఈ పరిస్థితి చూసిన ఓ ప్రొఫెసర్... లిపి రూపొందిస్తే ఆ భాషలు చాలాకాలం నిలిచిఉంటాయని భావించారు. ఏకంగా దాదాపు 18 గిరిజన భాషలకు లిపి రూపొందించారు. 18 గిరిజనుల భాషలకు లిపి అందించడమంటే మాటలు కాదు... ఆ భాషలు నేర్చుకోవాలి.. వాటికి కొత్త అక్షరాలు తయారు చేయాలి.. అయినా ముందుకే సాగారు ఏయూ ప్రొఫెసర్ ప్రసన్న శ్రీ.. ఒక్క అక్షరాలు రూపొందించడమే కాదు అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాల మీద పరిశోధన చేశారు. ఏపీలోని బగత, గదబ, కోయ, సుగాలి, ఎరుకల, సవర, గౌడు, గోండు, కొలమి, కొండదొర, కమ్మర, కుపియా, రానా, మల్లి, జాతాపు, పొర్జ, ముఖదొర, కొటియా భాషలకి లిపి అందించారు.. ఇలా ఆసియాలోనే అనేక భాషలకు అక్షరాలు అందించిన ఏకైక మహిళగా నిలిచారు.

ఎన్నో అవార్డులు...
ప్రసన్న శ్రీ చేసిన కృషికి ఎన్నో అవార్డులొచ్చాయి.. ప్రముఖులనుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు.. అయినా ఈ ప్రొఫెసర్‌కు సంతృప్తి అనిపించలేదు. గిరిజనులకోసం ఇంకా ఏదో చేయాలని తపన పడుతున్నారు. అడవి బిడ్డల కోసం ప్రభుత్వం వేలకోట్లు ఖర్చు చేస్తున్నా ఉపయోగం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవి బిడ్డల మాతృ భాషలో విద్యను ప్రోత్సహిస్తేనే వారి జీవితాల్లో మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

అవయవదానం కోసం మరో ఉపాధ్యాయురాలు ఉద్యమం..
గిరిజనులకోసం ఓ ప్రొఫెసర్ తన జీవితాన్నే ధార పోస్తుండగా అవయవదానంపై అవగాహనకోసం మరో ఉపాధ్యాయురాలు ఉద్యమం చేపట్టారు. అవయవాలు దొరక్క ఎంతో మంత్రి ప్రాణాలు పోవడంచూసి ఆమె చలించిపోయారు. 2009లో సావిత్రీభాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. విద్యా దానంతో పాటు శరీర దానంకోసం ఈ సంస్థద్వారా వివిధ సేవాకార్యక్రమాలు చేపట్టారు. వీరి చొరవతో మొదట కేవలం 35మంది పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోగా ప్రస్తుతం ఈ సంఖ్య 18 వేల మందికి చేరింది. ఒక దేహం 18మందికి జీవం అన్న ఈ టీచర్ నినాదానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది.

1983లో టీచర్ గా జీవితం..
1983లో టీచర్‌గా జీవితాన్ని మొదలుపెట్టిన సీతా మహాలక్ష్మి ప్రస్తుతం అనకాపల్లిలోని శంకరం ఎంపీయూపీ పాఠశాలలో పనిచేస్తున్నారు. చిన్నతనంనుంచి తోటివారికి సేవచేయడమే లక్ష్యంగా ఆమె ఎన్నో పనులు చేపట్టారు. కులాల అడ్డుగోడలు తొలగినప్పుడే సరైన అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి కులాంతర, మతాంతర వివాహాల కోసం ప్రయత్నించారు. స్వయంగా దళితున్ని వివాహం చేసుకున్నారు. రోడ్డు మీద అనాధ పిల్లలు కనిపిస్తే చాలు ఈ సీతమ్మ మనసు కరిగి కన్నీరైపోతుంది. వారిని చేరదీసి విద్యా బుద్దులు చెప్పిస్తారు. ఇలా ఇప్పటివరకూ 168మందికి ఉన్నత చదువులు చెప్పించారు.

ఆదాయంలో సగ భాగం ఇతర కార్యక్రమాలకు..
అటు తాను పనిచేస్తున్న 12 స్కూళ్లను కార్పొరేట్ స్కూల్లకు ధీటుగా తీర్చిదిద్దారు. తనకు వచ్చే ఆదాయంలో సగ భాగం ఇలాంటి కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు. సీతామహాలక్ష్మి కృషిని చూసిన అనేక మంది వివిధ రకాల అవార్డులు ప్రధానం చేశారు. ప్రభుత్వం మాత్రం ఇంతవరకూ ఈ అభ్యుదయ టీచర్ సేవను ఇంతవరకూ గుర్తించలేదు. ఎంతోమందికి ఆదర్శ టీచర్ అవార్డులు ఇస్తున్న అధికారులు. సేవకోసం జీవితాన్ని ధారపోసిన ఈ ఉపాధ్యాయురాల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అయితేనేం సీతామహాలక్ష్మిమాత్రం తనకు అవార్డులు ముఖ్యంకాదని సింపుల్‌గా చెప్పేస్తున్నారు. స్కూల్‌కు వెళ్లామా... ఇంటికి వచ్చామా... అన్న ఆలోచనతోకాకుండా సమాజంలో మార్పుకోసం కృషి చేస్తున్న ఈ మహిళలు అందరికీ రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నారు.

13:34 - September 5, 2015

విజయనగరం : ఆ మాస్టారుకు స్కూలే జీవితం... రాత్రింబవళ్లూ పాఠశాల అభివృద్ధికోసమే ఆలోచిస్తారు.. పిల్లలకు తేలిగ్గా అర్థమయ్యేలా పాఠాలు బోధించే విధానాలపై నిత్యం అధ్యయనం చేస్తూనే ఉంటారు. ఆ ఉపాధ్యాయుడి చలువతో ప్రస్తుతం ఆ స్కూల్‌ జిల్లా స్థాయిలోనే ప్రముఖ స్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లా గరివిడి మండలం శేరిపేట ప్రాథమికోన్నత పాఠశాల ఇది.. నారాయణమూర్తి ప్రధానోపాధ్యాయుడిగా రాకముందు ఇది ఒక పాఠశాల మాత్రమే.. ఈ హెచ్ ఎం రాకతో స్కూల్ రూపురేఖలే మారిపోయాయి... ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్‌లు ఇలా అన్నింటిలోనూ సత్తా చాటుతున్నారు ఇక్కడి విద్యార్థులు... ఇంగ్లీషులో చక్కగా మాట్లాడుతూ అందరినీ అబ్బురపరుస్తున్నారు.

అభివృద్ధిలో సర్పంచ్ భాగస్వామ్యం..
స్కూల్ ప్రధానోపాధ్యాయుడి తీరును బట్టే ఏ స్కూల్ అయినా నడుస్తుంది... తాను క్రమశిక్షణ పాటిస్తూ మిగతావాళ్లంతా అదే దారిలో నడిచేలా చేస్తారు. అందుకే ఉదయం ఏడున్నరకే పాఠశాలకు వచ్చేస్తారు నారాయణమూర్తి. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ చిన్నారులు అన్నిరంగాల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నారు.. సొంత నిధులను ఉపయోగించి సౌకర్యాలు కల్పిస్తున్నారు.. ఈ హెచ్‌ఎం అంకితభావాన్ని గమనించిన స్థానిక సర్పంచ్ కూడా పాఠశాల అభివృద్ధిలో తన వంతు భూమికను పోషిస్తున్నారు.

ముందుకు సాగుతున్న స్టూడెంట్స్..
పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలోనూ నవ్యరీతిలో ముందుకు సాగుతున్నారు ఇక్కడి స్టూడెంట్స్... ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ... మొక్కలు నాటేందుకు కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు.. వీరికి టీచర్లుకూడా సహాయం చేస్తున్నారు.. ఈ స్కూల్‌ను చూసిన చాలామంది తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లనుంచి తమ పిల్లలను తీసుకువచ్చి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు.

ఇతర పాఠశాలలకు భిన్నం..
పిల్లలకు చదువే కాదు సంస్కారం.. నైతిక విలువలు నేర్పినప్పుడు ఉత్తమ పౌరుడుగా తయారవుతారన్నది నారాయణ మూర్తి నిశ్చితాభిప్రాయం. గ్రామస్థుల భాగస్వామ్యంతో.. ఇతర పాఠశాలలకు భిన్నంగా ఈ స్కూల్‌ను తయారుచేస్తున్న నారాయణమూర్తి మాస్టారును అందరూ అభినందిస్తున్నారు.

13:30 - September 5, 2015

నెల్లూరు : చీకటిని తరిమి వెలుగును చూపేవాడు గురువు. విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యత ఉపాధ్యాయునిది. అలాంటి గురువులు కొందరు ఓ ప్రభుత్వ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నిలిపారు. చదువుల్లో, ఆటల్లో, విజ్ఞానంలో విద్యార్థులను మేటిగా తీర్చిదిద్దారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్న నెల్లూరు కేఎన్‌ఆర్ స్కూల్ ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం..

చిన్న పూరిపాకలో ఏర్పాటైన పాఠశాల..
నెల్లూరు కెఎన్ఆర్ పాఠశాల. కెయన్ ఆర్ అంటే కురిగంటి నాగిరెడ్డి. 1984లో భక్తవత్సల నగర్ లో ఓ చిన్న పూరిపాక లో ఏర్పాటైన ఈ స్కూల్ దినదినాభివృద్ధి చెంది ఈ రోజు 1300 మంది విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పిస్తోంది. 1995లో సుమారు 20 క్లాస్ రూములతో 4 లక్షల రూపాయలతో ఈ బిల్డింగ్ ను ఏర్పాటు చేశారు కురిగంటి నాగిరెడ్డి. ప్రస్తుతం 17 మంది రెగ్యులర్ టీచర్లతోపాటు అదనంగా మరో 10 మంది విద్యావాలంటీర్లు స్టూడెంట్స్ కు చదువులు చెబుతున్నారు. 6వ తరగతి నుంచి 10 వరకు అటు తెలుగు మీడియం ఇటు ఇంగ్లీష్ మీడియంలలో విద్యాబోధన చేస్తున్నారు. అన్ని అంశాల్లో విద్యార్థులను మేటిగా తీర్చిదిద్దుతున్నారు.

కార్పొరేట్ స్కూళ్లకు ధీటు..
ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దారు ఇక్కడి ఉపాధ్యాయులు. విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ వారి సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తున్నారు. కేవలం చదువులే కాదు ఆటలు పట్ల కూడా విద్యార్ధులకు ఆసక్తి పెంచుతున్నారు టీచర్లు. అందుకే ఈ విద్యార్ధులకు చదువుల్లో ర్యాంకులు సాధించడం, ఆటల్లో మెడల్స్ సంపాదించడం వెన్నతో పెట్టిన విద్య. ప్రతినెల స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేసి స్కూల్ ను ఎలా డెవలప్ చేయాలన్నవాటిపై చర్యలు చేపడతారు ఇక్కడి ఉపాధ్యాయులు. ఉదయం అసెంబ్లీ మొదలు క్లాసులన్నీ సక్రమంగా జరిగేలా చూస్తారు. సిలబస్ ను సకాలంలో పూర్తి చేసి విద్యార్ధులు మరింత బాగా చదువుకునేందుకు తోడ్పడతారు. అందుకే ప్రతి ఏడాది టెన్త్ ఫలితాల్లో ర్యాంకుల పంట పండిస్తోంది కెఎన్ఆర్ స్కూల్. ఇతర ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ లో చదివిన విద్యార్ధులు కూడా ఈ పాఠశాలలో చేరుతున్నారంటే...కెఎన్ఆర్ మున్సిపల్ స్కూల్ ను టీచర్లు ఎంతటి ఉన్నత ఆశయంతో నడిపిస్తున్నారో అర్థమవుతుంది.

2010లో ఈ స్కూల్ పదవ తరగతి విద్యార్ధి సుధీర్ స్టేట్ లెవల్ లో 4వ ర్యాంకు సాధించారు. అదీ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు. ఒక మున్సిపల్ స్కూల్ ర్యాంకు సాధించడంతో ఒక్కసారిగా స్టేట్ లెవల్ లో కెఎన్ఆర్ పాఠశాల పేరు మారుమోగింది. అప్పటి నుంచి మరింత పట్టుదలగా టీచర్స్ విద్యాబోధన చేస్తుంటే...అంతకన్నా పట్టుదలతో ర్యాంకు సాధించాలన్న ఉద్దేశ్యంతో ఇక్కడి స్టూడెంట్స్ చదువుతున్నారు. కొందరు విద్యార్ధులైతే కచ్చితంగా ఇక ప్రతీ ఏడాది కెఎన్ఆర్ ర్యాంకులు సాధిస్తుందని, నెల్లూరు జిల్లాలో తమ స్కూల్ కు ఏదీ సాటి రాదని బల్లగుద్ది చెపుతున్నారు. అయితే తమ స్కూల్‌ లో ఎన్నో సమస్యలున్నాయని టీచర్లు చెబుతున్నారు. వాటిని పరిష్కరించి వసతులు కల్పిస్తే...పాఠశాల మరింత అభివృద్ది చెందుతుందని అంటున్నారు.

రెట్టింపు అవుతున్న విద్యార్థులు...
ఒకపక్క ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్ధులు లేరని అనేక చోట్ల స్కూల్స్ ను మూసివేస్తుంటే కెఎన్ఆర్‌లో మాత్రం ఏడాదికేడాది విద్యార్ధులు రెట్టింపవుతున్నారు. ఈ స్కూల్ లో ఉపాధ్యాయులకున్న కసి , పట్టుదల విద్యార్ధులను నాణ్యమైన విద్యవైపు, ర్యాంకుల వైపు నడిపిస్తోంది. అందుకే కెఎన్ఆర్ స్కూల్ ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

13:26 - September 5, 2015

చిత్తూరు: జీవో నెంబర్ 120ని వెంటనే ఉపసంహరించాలని రాయలసీమ పరిరక్షణ వేదిక నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. పద్మావతి వైద్య కళాశాలలో అడ్మిషన్లపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా బైరెడ్డి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు, నీళ్లు తదితర దానిపై ఉద్యమం చెలరేగిందని, ప్రస్తుతం అదే పరిస్థితి రాయలసీమలో నెలకొంటోందన్నారు. రాయలసీమ చిన్నచూపుకు గురవుతోందని, 13 జిల్లాలకు త్రీ జోన్ గా చేసే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. 120 జీవో ఆత్మగౌరవానికి సంబంధించిందని, దీనిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించాలని సూచించారు. ఈ విషయంలో హైకోర్టు కూడా తప్పుబట్టిందని, కానీ ఖాతర్ చేయకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసలు మా పిల్లల సీట్లు వేరే వారికి ఎలా ఇస్తారు ? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం విడిపోవడం పట్ల విజయవాడ, గుంటూరు జిల్లాల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మెట్రో, రాజధాని అన్ని వారికి వస్తున్నాయని, దీనితో వారు చాలా సంతోష పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నారావారిపల్లెకు తాను ఉదయం వెళ్లానని పేర్కొన్నారు. 75 ఏళ్ల నుండి కరువు లేదని, మూడు, నాలుగు ఎకరాల కింద ఉన్న వారు ఉపాధి హామీ కింద పనులకు వెళుతున్నారని అక్కడి వారు పేర్కొన్నారని తెలిపారు. రాయలసీమ ఉద్యమానికి నాంది పలుకుతున్నామని, జలసాధన దీక్ష సమితి పేరిట ఢిల్లీలో ధర్నా చేయబోతున్నట్లు బైరెడ్డి చెప్పారు. 

అమిత్ షా నివాసానికి వెళ్లిన మనోహర్ పారికర్..

ఢిల్లీ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా నివాసానికి వెళ్లారు. 

కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు - లక్ష్మారెడ్డి..

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో కిమ్స్ బోన్ మ్యార్ ట్రాన్స్ ప్లాంటేషన్ ను యూనిట్ ను టి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామన్నారు. ఆరు నెలల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూలను ఏర్పాటు చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. 

ఏపీ మంత్రివర్గ సమావేశానికి ఆరుగురు దూరం..

హైదరాబాద్ : ఏపీ మంత్రివర్గ సమావేశానికి ఆరుగురు మంత్రులు దూరంగా ఉన్నారు. వేరే కార్యక్రమాలు ఉన్నందున సమావేశానికి హాజరు కాలేదు. ఇందులో అయ్యన్న, గంటా, కొల్లు, కామినేనిలు అనుమతి తీసుకున్నారు. చిన రాజప్ప, శిద్ధా రాఘవరావులు విదేశీ పర్యటనలో ఉన్నారు. 

అమిత్ షా నివాసానికి చేరుకున్న అస్సాం రెబల్ ఎమ్మెల్యేలు..

ఢిల్లీ : అస్సాం రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమితా షాను కలుసుకోవడానికి ఆయన నివాసానికి చేరుకున్నారు. 

మచిలీపట్నంలో రైతుల సమావేశం రసాభాస..

విజయవాడ : మచిలీపట్నం పోర్టు భూసేకరణ ప్రాంత రైతులతో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా జరిగింది. శనివారం ఉదయం ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కొల్లు రవీంద్రారెడ్డి ఆరు గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. భూసేకరణలో రైతులకు అన్యాయం జరుగకుండా చూస్తామని రైతులకు నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈలోగా పలువురు రైతులు తాము భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు

 

రవీంద్ర భారతిలో గురుపూజోత్సవం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ ఆలీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

12:37 - September 5, 2015

తిరుపతి : మరోసారి పద్మావతి మహిళా విద్యాలయం వార్తల్లోకెక్కింది. శనివారం విద్యార్థులు ఆందోళన చేయడం..అనుతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల ఆందోళనకు రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి మద్దతు పలికి ఆందోళన నిర్వహించారు.మెడికల్ అడ్మిషన్ల విషయంలో రాయలసీమ విద్యార్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు పేర్కొంటున్నారు. రాష్టాన్ని మొత్తంగా యూనిట్ గా తీసుకుని అడ్మిషన్లు నిర్వహించారని, దీని ఫలితంగా రాయలసీమ విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందని తెలిపారు. జోన్ విధానాలను పరిగణలోకి తీసుకోకుండా అడ్మిషన్లు జరిపారని, తక్షణమే జీవో నెంబర్ 120ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. మరోసారి మెడికల్ అడ్మిషన్లు నిర్వహించాలని కోరారు. ఈనెల 7వ తేదీన సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణకు రానుందని, అప్పటి వరకు వేచి ఉండాలని యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు.

 

12:32 - September 5, 2015

హైదరాబాద్ : గోదావరి నది జలాలు రంగారెడ్డి జిల్లాకు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ ను రంగారెడ్డి జిల్లా అఖిలపక్ష నేతలు కలిశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు రీ డిజైన్ వ్యతిరేకించాలని, దానివల్ల తాగు, సాగునీరు అందక ఇబ్బందులు పడుతారని గవర్నర్ కు తెలిపారు. అనంతరం గవర్నర్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సబిత ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. అసలు డిజైన్ మార్చాల్సినవసరం ఏముందని ప్రశ్నించారు. డిజైన్ మార్పు విషయంలో టి.సర్కార్ పున:పరిశీలించాలని కోరారు. అంతకుముందు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద అఖిలపక్ష నేతలు నివాళులర్పించి ర్యాలీగా గవర్నర్ వద్దకు వెళ్లారు. గవర్నర్ ను కలిసిన వారిలో టిడిపి నేత ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్యే వివేక్, రామ్మోహన్ రెడ్డి, వైసీపీ, సీపీఐ, బీజేపీ నేతలున్నారు.
ప్రాణహిత-చేవెళ్ల రీజైన్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రాజెక్టు మార్పుపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ రంగారెడ్డి జిల్లా విపక్ష నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పుపై గత కొద్దిరోజులుగా రంగారెడ్డి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వారు తెలిపారు.

ఎస్వీ యూనివర్సిటీలో ఉదిక్రత..

తిరుపతి : ఎస్వీ యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పద్మావతి వైద్య కళాశాలలో అడ్మిషన్లపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

అమిత్ షాను కలువనున్న అస్సాం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - రామ్ మాధవ్..

ఢిల్లీ : అస్సాం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలువనున్నారని బీజేపీ నేత రామ్ మాధవ్ పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారిని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. 

వచ్చే వారంలో బీహార్ ఎలక్షన్స్ ప్రకటన ?

బీహార్ : వచ్చే వారంలో బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం నాలుగు లేదా ఐదు ఫేజ్ లలో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం.

 

మహాబౌద్ధ వృక్షం కింద మోడీ ధ్యానం..

బుద్ధగయ : మహాబౌద్ధ ఆలయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. మహాబౌద్ధ వృక్షం కింద 12 నిమిషాల పాటు మోడీ ధ్యానం చేశారు. హిందూ - బౌద్ధుల గ్లోబల్ సమ్మేళనంలో మోడీ పాల్గొనున్నారు. తొలి ప్రధాని జవహర్ లాల్ తరువాత బుద్ధగయాలో మోడీ పర్యటిస్తున్నారు. 

కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ..

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. శాసనసభ సమావేశాలు జరిగిన తీరు, రాజధాని నిర్మాణం, చంద్రన్న యాత్రలు, మెట్రో రైలు నిర్మాణంపై చర్చిస్తున్నారు.  

సచివాలయాన్ని ముట్టడించిన ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక..

హైదరాబాద్ : ఏపీ సచివాలయాన్ని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక ముట్టడించింది. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లడ్డూ కౌంటర్లలో టిటిటి ఈవో తనిఖీలు..

చిత్తూరు : తిరుమలలోని లడ్డూకౌంటర్లలో ఆలయ డిప్యూటీ ఈవో రమణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లడ్డూ బరువు తక్కువగా ఉంటోందని భక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ఈ తనిఖీలు చేపట్టారు.

 

ఆర్ఎస్ఎస్ తో చర్చలు రాజ్యాంగ విరుద్ధం కాదు - వెంకయ్య...

ఢిల్లీ : ఆర్ఎస్ఎస్, బిజెపి జరిపిన సమావేశాలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ఆర్ఎస్ఎస్ నేతలతో చర్చలపై అభ్యంతరాలు ఎందుకని అది రాజ్యాంగ విరుద్ధం కాదని పేర్కొన్నారు. 

11:33 - September 5, 2015

హైదరాబాద్ : మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపిన 'సూదిగాడు' ఆగడాలు తెలంగాణకు పాకాయి. నగరంలోని మల్కాజ్ గిరిలో లిల్లి మోడల్ స్కూల్ లో నాలుగో తరగతి చదువుతున్న రమ్య శనివారం స్కూల్ కు వెళుతుండగా ఆగంతకుడు సూదీపై దాడి చేశాడు. దీనితో ఆమె సృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు గమనించి రమ్యను ఆసుపత్రికి తరలించారు. ఏపీ రాష్ట్రంలో దాడులు చేస్తున్న వ్యక్తేనా ? లేక ఇతరులు ఉంటారా ? అనే కోణంపై పోలీసులు దృష్టి సారించారు.
ఇటీవల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విజయనగరం జిల్లాల్లో సిరంజితో ఓ వ్యక్తి దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పోలీసులు రంగప్రవేశం చేసి అతనిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఊహాచిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఇతడిని పట్టిచ్చిన వారికి బహుమతి కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. కానీ సూదితో దాడులు చేస్తున్న వ్యక్తిని మాత్రం పట్టుకోలేకపోయారు. ప్రస్తుతం తెలంగాణలో జరిగిన సంఘటనతో అతడికి సంబంధం ఉందా అనేది తెలియ రాలేదు. సిరంజి కుచ్చడంతో విద్యార్థిని సృహ కోల్పోయిందా ? లేక ఇతర కారణాలున్నాయా అనేది తెలియడం లేదు. 

మల్కాజ్ గిరిలో రమ్యపై సిరంజి దాడి..

హైదరాబాద్ : నగరంలో మల్కాజ్ గిరిలో విద్యార్థిని రమ్యపై సిరంజి దాడి చేశాడు. ఆగంతకుడు పరారయ్యాడు. రమ్యను ఆసుపత్రికి తరలించారు.

 

11:22 - September 5, 2015

మహబూబ్ నగర్ : జిల్లాలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిపై దాడికి నిరసనగా శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా బంద్‌ పాటిస్తున్న విషయం విదితమే. ఉదయం నుండే బస్సు డిపోల ఎదుట నేతలు భైఠాయించారు. దీనితో 9 డిపోల నుండి 900 బస్సులు బయటకు రాలేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేపై వెంటనే చర్య తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు ఓబెదుల్లా కోత్వాల్ డిమాండ్ చేశారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. గతంలో గన్ పూర్ మండలంలో చిన్నారెడ్డిపై చేయి చేసుకోవడం జరిగిందన్నారు. బాలరాజు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని, వెంటనే బాలరాజును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్, స్పీకర్ లు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేను పక్కన పెట్టుకోవాలని ఇతర నేతలు సూచించారు. ప్రభుత్వం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. 

గవర్నర్ ను కలిసిన రంగారెడ్డి జిల్లా అఖిలపక్ష నేతలు..

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ ను రంగారెడ్డి జిల్లాలోని అఖిలపక్ష నేతలు కలిశారు. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్పుపై ఫిర్యాదు చేశారు.

 

కాసేపట్లో పారికర్ తో మాజీ సైనికుల భేటీ..

ఢిల్లీ : కాసేపట్లో రక్షణ మంత్రి పారికర్ తో మాజీ సైనికులు భేటీ అయ్యారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్ పై చర్చించనున్నారు. 

యూఎస్ ఓపెన్ నుండి నాదల్ అవుట్..

యూఎస్ ఓపెన్ నుండి నాదల్ అవుట్ అయ్యాడు. మూడో రౌండ్ లో వోగ్ని చేతిలో నాదల్ ఓటమి చెందాడు. 6-3, 6-4, 4-6, 3-6, 4-6 తేడాతో నాదల్ పరాజయం చెందాడు. 

ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి అరెస్టు...

మహబూబ్‌నగర్ : జిల్లాలో కార్యకర్తలతోకలిసి ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిపై దాడికి నిరసనగా శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా బంద్‌ పాటిస్తున్న విషయం విదితమే. 

రిమ్స్ ఆవరణలో ఆయూష్ ఆసుపత్రి ప్రారంభం..

ఆదిలాబాద్ : రిమ్స్ ప్రాంగణంలోని ఆయుష్ ఆసుపత్రిని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. 

11:01 - September 5, 2015

మహబూబ్ నగర్ : అందరికీ చదువులమ్మ దారిచూపితే ఆ చదువుల తల్లికే నీడనిచ్చిందో మానవతామూర్తి. పరిస్థితులు ప్రతికూలమైన చోట.. ఎవరి అండా దొరకని వేళ.. ఒంటరిగా నడుం బిగించి నాలుగు దశాబ్దాల క్రితం ఆమె నాటిన చదువుల మొక్క.. నేడు మహావృక్షమైంది..! వందల మంది విద్యార్థులకు విద్యా ఫలాలను అందిస్తోంది..! ఆమె సేవాగుణాన్ని, త్యాగనిరతిని మెచ్చి ఎన్నో అవార్డులు నడిచిరాగా.. తాజాగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు సైతం వరించబోతోంది.

అక్షర దీపం..
"నేను అనుభవించిన ఇబ్బందులు మరే చిన్నారి అనుభవించకూడదు. నా కంట్లోంచి వచ్చిన కన్నీళ్లు ఇంకెవరి కళ్లలోనూ చూడకూదు." ఇంతటి ఉన్నత లక్ష్యాన్ని తనకు తాను నిర్దేశించుకున్న ఈ మానవతామూర్తి పేరు నాగమ్మ. కనీసం ఇంటర్‌ మీడియట్‌ అయినా పూర్తికాకముందే ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన ఈమె.. చదువు ద్వారానే అజ్ఞానపు చీకట్లను తరిమికొట్టొచ్చని భావించింది. అలాంటి బలమైన సంకల్పంతో ఆమె వెలిగించిన అక్షర దీపం.. ఇవాళ ఎంతో మంది చిన్నారులకు వెలుగునిస్తోంది.

ఏకోపాధ్యాయురాలి అవతారం..
మహబూబ్‌ నగర్‌ జిల్లా, నారాయణ పేట గ్రామానికి చెందిన నాగమ్మ.. చిన్నతనంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది. ఇలాంటి కష్టాలు మరెవరికీ రావద్దనే ఆలోచనతో.. ఇంటర్‌ మీడియట్‌లో ఉండగానేనారాయణపేటలో ఓ పాఠశాల ఏర్పాటు చేయాలని భావించింది. ఆ దిశగా పనులు మొదలు పెట్టినప్పటికీ.. ఆ ప్రాంతానికొచ్చి పనిచేయడానికి ఉపాధ్యాయులెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో.. తానే ఉపాధ్యాయురాలైంది ఈ బాల నాగమ్మ. ఏకోపాధ్యాయురాలి అవతారమెత్తి.. 20 మంది పిల్లలతో 1978లో 'దయానంద విద్యామందిర్‌' పాఠశాలను ప్రారంభించింది.

పాఠాలు చెబుతూనే చదువు..
ఓ వైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే.. ఆమె కూడా చదువు కొనసాగించారు. ఎంఏ బీఎడ్‌ పూర్తిచేశారు. ఉపాధ్యాయురాలిగా ఆమె సాధిస్తున్న ఫలితాలను చూసి.. ఏడేళ్లకే ప్రభుత్వం నుంచి ఎయిడెడ్‌ గుర్తింపు వచ్చిందీ పాఠశాలకు. అయితే.. 1984లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన నాగమ్మ... 87 వరకు ఊట్కూర్ మండలం వల్లంపల్లి, ధన్వాడ బాలికల ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు. అయితే.. పాత పాఠశాల విద్యార్థుల కోసం ఉద్యోగాన్ని వదిలేసి.. మళ్లీ దయానంద విద్యామందిర్‌కు వచ్చేశారు. ప్రస్తుతం సెకండరీగ్రేడ్ టీచర్ గా పాఠశాలలో కొనసాగుతున్నారు.

ఎన్నో అవార్డులు...
నాగమ్మకృషిని మెచ్చి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. 2009-10లో ఇంటర్ నేషనల్ లయన్స్ క్లబ్ నుంచి.. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు. 2011-12 విద్యాసంవత్సరానికి గానూ ప్రభుత్వం నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2012-13లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా.. 2013-14లో ఇందిరాగాంధీ సంయాత్ర సంస్థ వారి నుంచి.. గ్రాడ్యూయేటేడ్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. 2013లో సర్వేపల్లి రాధాకృష్ణ వాలంటీర్ ఆర్గనైజేషన్ వారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు అందించారు. ఇప్పుడు తాజాగా.. 2015-2016 విద్యా సంవత్సరానికి గానూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికయ్యారు నాగమ్మ. ఈ నెల 5న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోబోతున్నారు.

ప్రతొక్కరికీ ఆదర్శం..
తమ టీచర్‌కు ఈ అవార్డు రావడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి మరెన్నో అవార్డులు రావాలని ఆకాంక్షిస్తున్నారు. విద్యా సుగంధాలను నలుగురికీ పంచేందుకు నాగమ్మ జీవితాన్నే ధారపోయడం ఎంతైనా ప్రశంసనీయం. వృత్తిపట్ల ఆమెకున్న నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆశిద్దాం..

10:55 - September 5, 2015

తూర్పుగోదావరి : ఆయనో సర్కారీ బడిపంతులు. ఈ హైటెక్‌ యుగంలో సర్కార్ బడులంటే ఎక్కడో కొంత చిన్నచూపు ఉంటోంది. కాని అందుకు భిన్నంగా సర్కారీ బడుల్లో మార్పు తీసుకురావాలని ఆ పంతులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పేద విద్యార్థులకు పాఠ్యాంశాలే కాదు. కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకు ధీటుగా మలిచేందుకు తన వేతనాన్నేదారపోస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భగా ఆ మాస్టార్ షేక్ సాయిబాబ్జీ ప్రస్ధానంపై ప్రత్యేక కథనం..

కోరుకొండ మండలం నరసాపురం..
తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం నరసాపురం గ్రామమిది. జిల్లాలోనే అత్యంత వెనుకబడిన పల్లెల్లో ఈ నరసాపురం గ్రామం ఒకటి. ప్రభుత్వ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలనే కార్పొరేట్ స్కూల్ గా మార్చి వేశారు. ఎక్కడా లేని విధంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్కూల్ హంగు ఆర్బాటాలు కనిపిస్తాయి. సర్కారీ బడిలో ఇంత మార్పు రావడానికి కారణం ఇక్కడ ప్రధానోపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న ఈ షేక్ సాయిబాబ్జీ మాస్టారే.

పాతికేళ్లకు పైగా నిర్విరామంగా తన కృషి..
సర్కార్‌ బడులను ప్త్రెవేట్, కార్పొరేట్ బడులకు ధీటుగా తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో ఆయన పాతికేళ్లకు పైగా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన షేక్ సాయిబాబ్జీ 1986లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉపాధ్యాయవృత్తిలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి జిల్లాలో వివిధ గ్రామాల్లో విధులు నిర్వహించారు. 2009లో పదోన్నతిపై కోరుకొండ మండలం నరసాపురం మండల ప్రజాపరిషత్ ప్రాధమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టారు.

సర్కారు బడుల్లో విద్యాప్రమాణాలు పెంచేలా కృషి..
షేక్‌ సాయిబాబ్జీ మాస్టారు సర్కారు బడుల్లో మార్పులు తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెరిగేలా విద్యాబోధన జరగాలని తోటి ఉపాధ్యాయులతో కలిసి నిరంతరాయంగా పనిచేశారు. గ్రామాల్లోని పేద కుటుంబాల తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడి వారి పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించేలా చైతన్యం తీసుకొచ్చారు.

తన తండ్రి షేక్ సూరాసాహెబ్ పేరు మీదుగా..
విద్యార్థులకు ప్రభుత్వపరంగా అందించే స్కూల్ యూనిఫారమ్‌కు అదనంగా టై, బెల్ట్, ఐడి కార్డులను తన తండ్రి షేక్ సూరాసాహెబ్ పేరు మీదుగా సమకూర్చారు. పాఠశాలలో విద్యార్ధులకు అరగంటపాటు శాస్త్రీయ సంగీతంపై అవగాహణ, ఆటలు, పాటలు పాడిస్తూ...పిల్లల్లో మానసిక ఉల్లాసాన్ని పెంచేందుకు తన వంతు కృషిని కొనసాగిస్తున్నారు. కార్పొరేట్‌ తరహలో సర్కార్ బడిని నడుపుతున్న హెడ్‌మాస్టార్‌ సాయిబాబ్జీ విద్యాశాఖ ఉన్నతాధికారులు, స్ధానిక ప్రజాప్రతినిధుల నుంచి మన్ననలు పొందారు. ఈ మాస్టారి ప్రతిభను, సేవా గుణాన్ని గుర్తించిన ప్రభుత్వం 2009లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన ఎచివర్స్ ఆర్గనైజేషన్ సంస్ధ లైఫ్ టైమ్ ఎచివ్‌మెంట్ అవార్డును ప్రధానం చేసింది. ఈ షేక్‌సాయి బాబ్జీ మాస్టారు స్ఫూర్తితో ఉపాధ్యాయలోకం ముందడుగేస్తే సర్కారీ బడుల స్థితిగతుల్లో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

10:48 - September 5, 2015

చెన్నై : భర్త యాసిడ్‌ దాడిలో గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జరీనాబేగం మృతి చెందింది. జులై 14న చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాలూరు క్రాస్‌ వద్ద మాజీ భర్త హుస్సేన్‌ యాసిడ్‌ దాడిలో జరీనా బేగం తీవ్రంగా గాయపడింది. యాసిడ్‌ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమె ఆస్పత్రిలో చేరింది. నెల రోజులుకు పైగా మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు తుదిశ్వాస విడించింది. జరీనాబేగం పీలేరు ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్‌. ఈ ఘటనపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

జరీనా బేగం మృతి..

చెన్నై : భర్త యాసిడ్‌ దాడిలో గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జరీనాబేగం మృతిచెందింది. జులై 14న చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాలూరు క్రాస్‌ వద్ద మాజీ భర్త హుస్సేన్‌ యాసిడ్‌ దాడిలో జరీనా బేగం తీవ్రంగా గాయపడింది. 

10:35 - September 5, 2015

అనంతపురం : చట్టాన్ని కాపాడాల్సిన రక్షక్ష భటులు వక్రబుద్దిని ప్రదర్శిస్తున్నారు. లైంగిక దాడిపై ఉక్కుపాదం మోపాల్సిన వారే తమ బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. ఓ కానిస్టేబుల్ ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కళ్యాణదుర్గం నియోజవకర్గంలో బ్రహ్మసముద్రంలో కస్తుర్బా పాఠశాలలో ఓ బాలిక 9వ తరగతి చదువుతోంది. ఈ పాఠశాలకు సమీపంలోనే పీఎస్ ఉంది. పాఠశాలలో ఉన్న ఒక మహిళతో ఓ కానిస్టేబుల్ కు పరిచయం ఉంది. ఈ పరిచయాన్ని ఆసరగా తీసుకుని ప్రతి రోజు పాఠశాలకు కానిస్టేబుల్ వచ్చేవాడని స్థానికులు పేర్కొంటున్నారు. 9వ తరగతి చదువుకుంటున్న ఓ బాలికకు ఉన్న ఆర్థిక సమస్యలను అవకాశంగా తీసుకుని ఆమెపై లైంగికంగా లొంగదీసుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం వాహనంపై ఎక్కించుకుని వెళ్లేవాడని పేర్కొంటున్నారు. తమ ఉద్యోగాలు పోతాయన్న భయంతో పాఠశాల యాజమాన్యం బాలిక తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించారు. హద్దులు మీరుతోందని బాలికపైనే ఆరోపణలు చేశారు. రాతపూర్వకంగా తల్లిదండ్రులతో ఓ లేఖ కూడా రాయించుకున్నారి సమాచారం. కానిస్టేబుల్ కావడంతో ఫిర్యాదు చేయడానికి బాలిక తల్లిదండ్రులు వెనుకంజ వేసినట్లు సమాచారం. చివరకు రాజకీయ నేతల సహాయంతో పీఎస్ లో కానిస్టేబుల్ పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అమాయకురాలైన తమ బిడ్డను కానిస్టేబుల్ లొంగ దీసుకున్నాడని, వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీస ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

10:25 - September 5, 2015

పశ్చిమగోదావరి : ఏలూరులో పేకాట రాయుళ్లపై పోలీసులు కొరఢా ఝులిపించారు. శుక్రవారం అర్ధరాత్రి నుండి శనివారం తెల్లవారుజాము వరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అధికారపక్షానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులున్నారు. గత కొన్ని రోజులుగా ఏలూరులో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారనే విమర్శలున్నాయి. దీనిపై పోలీసు శాఖ దృష్టి సారించింది. ఒక్కసారిగా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 31 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్దనుండి రూ.1.35 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులో తీసుకున్న వారిలో అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీలు, కార్పోరేటర్లు ఉన్నారు. వీరిని మాత్రం మీడియా ఎదుట హాజరుపరచలేదు. నేరుగా కోర్టుకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

10:21 - September 5, 2015

హైదరాబాద్ : ఏపీ మంత్రి మండలి సమావేశం కొద్దిసేపట్లో సమావేశం కానుంద. రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలప్ మెంట్ ఎంపిక, మచిలీపట్నం రేవుకు భూ సమీకరణ, విజయవాడకు మంత్రిత్వ శాఖల తరలింపు, రైతు కోసం యాత్ర తదితర అంశాలు కేబినెట్ లో చర్చించనున్నారు.  గతంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశాలు విజయవాడలో జరిగిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా పలు అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చింనుంది. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ చేసిన విధానంపై ప్రభుత్వం 'చంద్రన్న' పేరిట యాత్ర నిర్వహించనుంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమై అనంతపురంలో ముగియనుంది. ముగ్గురు మంత్రులు విడివిడిగా ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఈ యాత్ర వ్యవహారంపై కేబినెట్ చర్చించనుంది. అలాగే ఏపీలో నెలకొన్న కరువుపై చర్చించనుంది. కరువుపై మంత్రులకు సీఎం నిర్ధేశం చేయనున్నారు. పంట పొలాలకు నీరు, తాగునీరు ఎలా అందించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రాష్ట్రంలో పరిశ్రమలకు భూ కేటాయింపులు జరపాలని భావిస్తోంది. కడప, అనంతపురం, కర్నూలు, కాకినాడ, విశాఖలలో ఏపీఐఐసీకి భూ కేటాయింపులు జరపాలని యోచిస్తోంది. దీనిపై కేబినెట్ ఓ నిర్ణయం తీసుకోనుంది. అలాగే అక్టోబర్ లో రాజధాని భూమి ఏర్పాటుకు సమయం సమీపిస్తోంది. దీనితో మాస్టర్ డెవలపర్స్ ను పిలిచి రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయనున్నారు. అనంతరం భూమి పూజపై నిర్ణయం తీసుకోనున్నారు. రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలప్ మెంట్ ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు అమరావతి శాఖ కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకొంటోంది. ఈ నెల 9వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడకు తరలివెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో శాఖా తరలింపుపై కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకోనుంది. 

ఏలూరులో పేకటరాయుళ్ల అరెస్టు..

ఏలూరు : మండలం చుదిమెళ్లలో 31మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఎంతో చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. అరెస్టయినవారిలో పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

విద్యార్థినిపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులు..

అనంతపురం : బ్రహ్మసముద్రంలోని కస్తుర్బా పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రక్షణ శాఖ మంత్రి పారికర్ నగర పర్యటన రద్దు..

ఢిల్లీ : ఒకే ర్యాంకు ఒకే ఫించేను ఆందోళనకు నేడు తెరపడే అవకాశం ఉంది. కేంద్రం నుండి కీలక నిర్ణయం వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ హైదరాబాద్ పర్యటన రద్దైంది. మాజీ సైనికుల కోర్కెలలో 98 శాతం ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. 

వడోదరలో కృష్ణాష్టమి వేడుకలు..

గుజరాత్ : దేశ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వడోదరలో కృష్ణాష్టమి సందర్భంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

కరీంనగర్ లో బోల్తా పడిన ఆటో..

కరీంనగర్ : జగిత్యాల మండలం మోరపల్లి వద్ద శనివారం ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్ కోడెల..

చిత్తూరు : ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శన అనంతరం స్పీకర్ కోడెలకు ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, ఏపీ డీజీపీ రాముడు కూడా ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ నేతల అరెస్టు..

మహబూబ్ నగర్ : జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై దాడికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ బంద్ పాటిస్తోంది. డీసీసీ అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్ తో సహా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 

09:33 - September 5, 2015

ముంబై : బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు ఆదేశ్ శ్రీవాత్సవ(51) మృతి చెందారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అందేరిలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
2011లో మొదటిసారిగా ఆదేశ్ క్యాన్సర్ బారిన పడ్డారు. గడిచిన 40 రోజులుగా వ్యాధితో తీవ్రంగా పోరాడాడు. ఇతనికి భార్య విజేత, అనివేశ్, అవితేశ్ ఇద్దరు కొడుకులున్నారు. 'ఛల్తే ఛల్తే', 'బాగ్‌బన్', 'కబీ ఖుషీ కబీ గమ్' వంటి తదితర సూపర్‌హిట్ సినిమాలకు 'ఆదేశ్' సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఆదేశ్ చివరి ప్రాజెక్టు 'వెలకమ్ బ్యాక్' మూవీ. 

09:20 - September 5, 2015

ఢిల్లీ : బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ బలగలు, తనిఖీలు చేపట్టాయి. ఆరు విమానాల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలు సోదాలు కొనసాగించాయి. ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని కాలర్ ఐడీ ద్వారా ట్రేస్ చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు సమాచారం. ఒక్కసారిగా బాంబు బెదిరింపులు వచ్చాయన్న వార్తతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తనిఖీల నేపథ్యంలో సుమారు 1250 ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హాంకాంగ్ బయలుదేరిన విమానాలను వెనక్కి రప్పించి తనిఖీలు చేశారు. బాంబులు లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

09:13 - September 5, 2015

ముంబై : రైల్వే గ్యారేజీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాంద్రా - డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్, బాంద్రా - లేవంకాని ఎక్స్ ప్రెస్ బోగీలు 4 దగ్ధమయ్యాయి. కాండీవాలిలోని రైల్వే గ్యారేజ్ లో ఈ ప్రమాదం జరిగింది. మరమ్మత్తుల కోసం ఈ బోగీలను అక్కడకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే.. ఇతర బోగీలను వేరు చేయటంతో.. భారీ నష్టం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

09:11 - September 5, 2015

నెల్లూరు : షార్ మళ్లీ వార్తల్లోకెక్కింది. జీఎస్వీలో యాసిడ్ లీక్ కావడంతో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. గత నెలలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తరచూగా ప్రమాదాలు జరుగుతుండడంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు నుండి యాసిడ్ లోడ్ షార్ కు వచ్చింది. స్ర్కాబ్ కు విభాగంలో అన్ లోడ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కాంట్రాక్టు ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే షార్ ఆసుపత్రిలో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. మధ్యాహ్నాం నుండి సాయంత్రం వరకు ఆసుపత్రిలో ఉంచుకున్న అనంతరం ఇంటికి పంపించారు. ప్రమాద జరిగిన తీరును బయటకు పొక్కనీయకుండా షార్ సిబ్బంది జాగ్రత్త పడ్డారు. సీఐటీయూ నాయకులకు విషయం తెలిసింది. వెంటనే దీనిపై విచారణ చేయించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. 

08:57 - September 5, 2015

సిరియా : ఈ ఫొటో చూడండి. ఎంత ముద్దుగా ఉన్నాడు..హాయిగా బీచ్ లో పడుకున్నాడు అని అనుకుంటున్నారా ? కాదు. అతను విగతజీవి. అవును ఈ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్ష మైంది. ఎంతో మందిని కదిలించింది. ఈ చిన్నారి ఫొటో చూసి ఎంతో మంది కంటతడి పెట్టారు.

రోదించిన ప్రపంచం..
సిరియా బాలుడు అయలాన్‌ కుర్దీ విషాద మరణం చూసి ప్రపంచమే రోదిస్తోంది. ప్రాణాల్ని రక్షించుకోవడానికి చేస్తున్న సముద్ర ప్రయాణాల్లో ఎనలేని విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రాచ్యం శరణార్థుల్ని సముద్రం నిర్థాక్షణ్యంగా మింగేస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ సిరియాకు చెందిన అబ్దుల్లా జీవితం. అతని భార్య రేహన్‌, మూడేళ్ల బాలుడు అయలాన్‌ కుర్దీ, గాలిప్‌లతో అతను చేసిన సముద్ర ప్రయాణం తీరని విషాదం మిగిల్చింది. పడవ ప్రమాదంలో భార్య, ఇద్దరు పిల్లలు నీట మునిగి చనిపోయారు.

రోదించిన తండ్రి అబ్దుల్లా...
నా బిడ్డ నా చేతుల్లోనే సముద్రంలోకి జారిపోయాడు అంటూ అబ్దులా కన్నీరు మున్నీరయ్యారు. ఒక చేతితో భార్యను...మరో చేతితో ఇద్దరు పిల్లలను పట్టుకునే ప్రయత్నంలో విఫలమయ్యానని భోరున విలపించాడు. పడవ ప్రమాదం నుంచి బయటపడ్డ అనంతరం అబ్దుల్లా తన కుటుంబం బతికివుందన్న ఆశతో వెదికాడు. కానీ చివరికి హాస్పిటల్‌లో వారి మృతదేహాలే అతనికి కనపడ్డాయి.

పూర్తయిన అంత్యక్రియలు..
చిన్నారి అయలాన్ కుర్దీ అంత్యక్రియలు శుక్రవారం సిరియాలోని కోబాన్ పట్టణంలో పూర్తయ్యాయి. టర్కీ నుంచి సిరియా సరిహద్దుల వరకు ప్రత్యేక విమానంలో రేహన్, ఇద్దరు పిల్లల మృతదేహాలను తరలించారు. జర్నలిస్టులు, టర్కీ ఎంపీలు వెంటరాగా తండ్రి అబ్దుల్లా సొంతపట్టణానికి చేరుకొని బంధు, మిత్రుల సహకారంతో అంత్యక్రియలు పూర్తిచేశారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇద్దామనే మధ్యదరా సముద్రాన్ని దాటే సాహసం చేశానని... ఇప్పుడు నాకంటూ ఏమీ మిగల్లేదు గనక ఇక ఎక్కడికీ పోనని అబ్దుల్లా రోదిస్తూ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ నివసించే అవకాశం కల్పించినా నాకేమీ వద్దు.. అత్యంత విలువైనదే కోల్పోయాను అంటూ ఆవేదనతో అన్నారు. టర్కీ తీరంలో అయలాన్ మృతదేహం యూరోప్ దేశాధినేతలను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజానీకంలో సానుభూతి వెల్లువెత్తింది. ఏళ్లుగా నలుగుతున్న సిరియా శరణార్థుల సమస్యను ప్రపంచం దృష్టికి తెచ్చింది.

08:53 - September 5, 2015

విజయనగరం : ప్రజలు, విద్యార్థుల మనస్సులను దోచుకునే ఉత్తమ ఉపాధ్యాయులు ఎంతోమంది ఉంటారు. విద్యాదానంతో ఎంతోమంది జీవితాలను చక్కదిద్ది,.. తమ జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన ఉపాధ్యాయులు అరుదుగా ఉంటుంటారు. తన శేష జీవితం కూడా విద్యాబోధనలోనే గడుపుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఓ మాస్టారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అలాంటి విశిష్ట మాస్టారుపై ప్రత్యేక కథనం..

ఎంతో భక్తి..
విజయనగరం జిల్లా పార్వతీపురం అంటే కళాకారులు, సాహితీవేత్తలకు పుట్టినిల్లు. ఇలాంటి పార్వతీపురంలో విద్యాబోధనలో ప్రత్యేక శైలి, భాషపై పట్టు, విషయ పరిజ్ఞానం, విద్యార్ధుల పట్ల ప్రేమ, సామాజిక స్పృహతో పాటు తన జీవితాన్ని పిల్లల భవిష్యత్‌కు అంకితమిచ్చిన ఓ మహానుభావుడూ ఉన్నారు. ఆయనే నేరెళ్ల నారాయణమూర్తి మాస్టారు. నారాయణమూర్తి మాస్టారు అంటే పార్వతీపురం వివేకానంద కాలనీవాసులకు ఎంతో భక్తి. పదవీ విరమణ చేసినా కూడా బోధనపై ఉన్న మక్కువతో ఇంకా పిల్లలకు పాఠాలు బోధిస్తూనే ఉన్నారు నారాయణమూర్తి మాస్టారు. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇలాంటి వ్యక్తి మా మధ్య ఉండడం అదృష్టంగా భావిస్తున్నారు కాలనీవాసులు.

పలువురి జీవితాల్లో వెలుగులు..
సంస్కృత భాషా ఉపాధ్యాయుడిగా జిల్లాలో ఎన్నోచోట్ల పనిచేసిన నారాయణమూర్తి సార్‌.. అన్నిచోట్ల అందరి మన్ననలు పొందారు. సంస్కృత పండితుడే అయినప్పటికీ తెలుగు, హిందీతో పాటు లెక్కల్లో కూడా సిద్దహస్తులు కావడం ఆయన ప్రతిభకు నిదర్శనం. మాస్టారు చదువే కాకుండా.. ఆపదలోని వారికి అండగా ఉండేవారని ఎంతోమంది విద్యార్ధులు చెప్పుకుంటుంటారు. నారాయణమూర్తి మాస్టారు వల్లే మా జీవితాల్లో వెలుగులు నిండాయని వారు చెప్పుకోవడం ఆయన చేసిన సేవలకు నిదర్శనం.

అందరికీ ఆదర్శం..
ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు అందుకున్న నారాయణమూర్తి మాస్టారు... సామాన్యులను కూడా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. కూలీనాలి చేసుకునేవారు కూడా ఆయన ఆశీస్సులతో నేడు ఉన్నత స్థానంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. స్వామి వివేకానందుడి వ్యాఖ్యలను వంటబట్టించుకున్న నారాయణమూర్తి మాస్టారు జీవితం కూడా ఎంతోమందికి ఆదర్శనీయం కావాలని ఆశిద్దాం. 

08:48 - September 5, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం ఈ రోజు సమావేశం కానుంది. ఉదయం పదిన్నరకు జరిగే ఈ సమావేశంలో... రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్ ఎంపిక, మచిలీపట్నం రేవుకు భూ సమీకరణ, విజయవాడకు మంత్రిత్వ శాఖల తరలింపు, రైతు కోసం యాత్ర తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. మంత్రివర్గ సమావేశానంతరం ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొనేందుకు చంద్రబాబు విశాఖకు వెళ్తారు.

సానియా - సోర్స్ జోడి ఓటమి..

యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా - సోర్స్ జోడి ఓటమి చెందారు. అన్ సీడెడ్ ఆండ్రియా - లుకాజ్ జోడి చేతిలో 3-6, 3-6 తేడాతో సానియా జోడి పరాజయం చెందారు. 

08:24 - September 5, 2015

హైదరాబాద్ : ఏంటీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో 'జబర్దస్త్' వేణు దొరికిపోయాడా ? అని అనుకుంటున్నారా. అయితే మీరు తప్పులో కాలేసినట్లే. నగరంలో మద్యం సేవించి వాహనాలను నడుతుపున్న వారిని అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆబిడ్స్ లో శుక్రవారం రాత్రి పోలీసులు డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో 'జబర్దస్త్' వేణు, విజయ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ వాహనదారుడు తనిఖీకి నిరాకరించాడు. తాను మద్యం సేవించలేదని మొండికేశాడు. మద్యం తాగనప్పుడు తనిఖీ చేసుకుంటే అయిపోతుంది కదా..అందులో తేలుతుంది అని పోలీసులు పేర్కొన్నా అతడు నిరాకరించాడు. ఈ మధ్యలో వేణు కలుగచేసుకున్నాడు. తనిఖీకి సహకరించాలని సూచించాడు. ఈ సందర్భంగా వేణు టెన్ టివితో మాట్లాడారు. తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందువల్ల ఎవరూ తాగి వాహనాలు నడుపవద్దని వేణు సూచించారు. దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, మిమ్మల్ని నమ్ముకుని ఇంట్లో ఎదురు చూసే వారికి కన్నీళ్లు మిగల్చవద్దని, హైదరాబాద్ పోలీసులకు అందరూ సహకరించాలని వేణు విజ్ఞప్తి చేశారు. 

08:07 - September 5, 2015

మహబూబ్ నగర్ : జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై అధికారపక్షం ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టారు. మంత్రుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. కరువు జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిలదీయడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిండు సభలో దాడికి పాల్పడడంతో సమావేశం రణరంగమైంది. దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఈ రోజు జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. ఉదయమే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బస్ డిపోల ఎదుట బైఠాయించారు. వనపర్తి, మహబూబ్ నగర్, షాద్ నగర్, గద్వాల డిపోల ఎదుట నేతలు ఆందోళన చేపట్టారు. దీనితో 9 డిపోల్లో దాదాపు 900 బస్సులు నిలిచిపోయాయి. వెంటనే బాలరాజు సభ్యత్వాన్ని రద్దు చేయాలని, అరెస్టు చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించనుంది. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వనున్నారు. 

రెండో రోజు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు..

నిజామాబాద్ : రెండో రోజు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరు కానున్నారు. 

ఢిల్లీ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు..

ఢిల్లీ : ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేటి ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఎయిర్ పోర్టు అధికారులకు ఫోన్ కాల్ వచ్చింది. 

07:55 - September 5, 2015

మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై అధికారపక్షం ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టారు. మంత్రుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. కరువు జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిలదీయడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోయారు. దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఈ రోజు జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. మరోవైపు ఏపీ అసెంబ్లీలో ఓటుకు నోటు అంశంపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. ప్రజాసమస్యలు పక్కదారి పట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని టిడిపి నేతలు పేర్కొంటున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జీవన్ రెడ్డి (టీఆర్ఎస్), కొండా రాఘవరెడ్డి (వైసీపీ), రామ్మోహన్ రెడ్డి (కాంగ్రెస్), బాబు రాజేంద్రప్రసాద్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం..

హైదరాబాద్ : జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉదయం 10 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు ముఖ్యఅతిధిగా హాజరవుతున్నారు. సభాధ్యక్షులుగా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వ్యవహరించనున్నారు. ప్రత్యేక అతిధులుగా ఉపముఖ్యమం త్రి మహమూద్‌ అలీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరవుతున్నారు. గౌరవ అతిధులుగా మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. 

07:39 - September 5, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టిఎస్‌పిఎస్సీ) ద్వారా ఉద్యోగాల భర్తీకి సంబంధించి శనివారం నాలుగు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. వ్యవసాయ, సహకార రంగానికి సంబంధించిన వ్యవసాయ అధికారులు 120 పోస్టులు, ఉద్యాన అధికారులు 75 పోస్టులు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌) 16 పోస్టులు, మేనేజర్లు (ఇంజినీరింగ్‌)లో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సేవరేజ్‌ బోర్డు 146 పోస్టుల చొప్పున మొత్తం 357 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. శనివారం నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 25వ తేదీ అని నిర్ణయించినట్లు తెలిసింది.
ఉద్యాన అధికారుల పోస్టుల రాతపరీక్ష అక్టోబర్‌ 17న, వ్యవసాయ అధికారుల పోస్టుల రాతపరీక్ష అక్టోబర్‌ 17, 18 తేదీల్లో, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌) పోస్టుల రాతపరీక్ష కూడా అక్టోబర్‌ 17న, హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ వర్క్స్ పోస్టుల రాతపరీక్ష నవంబర్‌ ఒకటో తేదీన నిర్వహించాలని సూచన ప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. పూర్తి వివరాలను శనివారం విడుదల చేసే నోటిఫికేషన్లలో పొందుపరిచే అవకాశముంది. ఈనెలలోనే వ్యవసాయ ఎక్స్‌టెన్షన్‌ గ్రేడ్‌-2 అధికారులు 311 పోస్టులు, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ 45 పోస్టులు, ట్రాన్స్ పోర్టు కానిస్టేబుల్‌ 141 పోస్టులకు నోటిఫికేషన్‌లనూ జారీ చేయడానికి టిఎస్‌పిఎస్సీ కసరత్తు చేస్తోంది.

మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్..

మహబూబ్ నగర్ : జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఈ రోజు జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, అచ్చంపేట బస్ డిపోల ఎదుట ధర్నా చేపట్టారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనితో జిల్లాలోని తొమ్మిది డిపోల్లో 894 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 

హుస్సేన్ సాగర్ చుట్టూ పర్రికమ బైక్ ర్యాలీ..

హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం లోగా సాగర్ జలాలను శుద్ధి చేయాలని కోరుతూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఈ బైక్ ర్యాలీ జరుగనుంది. 

07:17 - September 5, 2015

విజయవాడ : దుర్గగుడి ఈవో నరసింగరావు మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఈవో.. తన అనుచరులతో రహస్యంగా విచారణ చేయించుకున్నారు. తనకు అనుకూలంగా నివేదిక కూడా తయారు చేసుకున్న నరసింగరావు..అదే నివేదికను ఉన్నతాధికారులకు అందించేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ దుర్గగుడి ఈవో అనుసరిస్తున్న విధానాలు అటు సిబ్బందికి ఇటు భక్తులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దుర్గగుడి పరిపాలనా వ్యవస్ధను మొత్తం తనకు అనుకూలంగా మార్చుకుంటూ భక్తుల ఆగ్రహానికి గురవుతున్నారు.

తనకు అనుకూలంగా నివేదిక..
ఇటీవల ఈవో నరసింగరావు అవినీతి తతంగంపై గంధం సత్యనారాయణ అనే భక్తుడు అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై వెంటనే విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దాంతో అడిగిందే తడవుగా తనపై వచ్చిన ఆరోపణలపై తానే విచారణ జరిపి తనకు అనుకూలంగా నివేదిక తయారు చేయించుకొని.. దానిని పై అధికారులకు పంపారు. ఈ విషయాన్ని 10టీవీ వెలుగులోకి తేవడంతో విచారణ వాయిదా పడినట్లు ఈవో చెప్పుకొచ్చారు. కానీ మళ్ళీ విచారణ ఎప్పుడు జరిపేది స్పష్టం చేయలేదు.

వెలుగులోకి తెచ్చిన 10టీవీ..
దుర్గగుడి ఈవో నర్సింగరావు పై అవినీతి ఆరోపణలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రోజుకో పద్ధతిని అనుసరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 3వ తేదీన తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై బహిరంగ విచారణ జరుపుతామని ముందుగా ప్రకటించి..ఆ తర్వాత విచారణను అర్ధాంతరంగా నిలిపివేశారు. కానీ ఉన్నతాధికారులు తనపై ఆగ్రహంతో ఉన్నారని సమాచారం అందడంతో హుటాహుటిన అప్పటికప్పుడు సోషల్ ఆడిట్ పేరుతో తనకు అనుకూలమైన నలుగురు ఉద్యోగులతో పాటు.. ముందుగా ఎంపిక చేసుకున్న ఇద్దరు సీనియర్ సిటిజన్లతో ఓ గదిలో విచారణ జరిపించారు. అయితే విచారణ జరుగుతుందని అక్కడికి వెళ్ళిన 10టీవీ ప్రతినిధులను ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు.

అర్ధాంతరంగా విచారణ వాయిదా..
సోషల్ ఆడిట్ అన్నా..అవినీతి ఆరోపణలపై విచారణ అన్నా అది బహిరంగంగా జరగాల్సిన అవసరం ఉందని ఫిర్యాదు చేసిన భక్తులు అంటున్నారు. కాని దుర్గగుడి ఈవో నర్సింగరావు మాత్రం పథకం ప్రకారం తనకు అనుకూలంగా నివేదికను తయారు చేయించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈవో ఆదేశాల మేరకే తాము సోషల్ ఆడిట్ పేరుతో విచారణ నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి ఏఈవో రెడ్డి చెప్తున్నారు. అలాగే విచారణకు హాజరైన సీనియర్ సిటిజన్లు సైతం తమకు సోషల్ ఆడిట్ అని ఫోన్ చేసి పిలిచారని ఆతర్వాత అవినీతి ఆరోపణల గురించి తమ అభిప్రాయం చెప్పాలని సిబ్బంది సూచించారన్నారు. మొత్తానికి దుర్గగుడి ఈవో అవినీతి లీలలు చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉన్నాయని భక్తులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈవోపై చర్యలు తీసుకొని ఆలయ ప్రతిష్టను కాపాడాలని కోరుతున్నారు. 

07:15 - September 5, 2015

ముంబై : ఆర్థిక సంబంధాలే పేగు బంధాన్ని తెంచేశాయి. సంచలనం సృష్టించిన షీనాబోరా క్రూరమైన హత్య కేసులో పోలీసులు తవ్వినకొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. పది రోజులుగా విచారణకు సహకరించని ఇంద్రాణి ముఖర్జి నోరు విప్పడంతో నమ్మలేని సత్యాలన్నీ వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పక్కాసాక్ష్యాల కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తరహాలో కొన్ని రోజులుగా నడుస్తున్న ముంబాయిలోని షీనాబోరా మర్డర్‌ కేసు క్లైమాక్స్ కు చేరుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో కీలకం ఇంద్రాణి స్టేట్‌మెంట్ దీంతో ఈకేసు ఇప్పుడిప్పుడే చిక్కుముడి వీడుతోంది. ఎట్టకేలకు నేరం తానే చేసినట్లు ఇంద్రాణి ముఖర్జీ అంగీకరించడంతో ఇక పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దర్యాప్తులో వేగం పెంచారు.

సాక్ష్యాలు సేకరించే పనిలో పోలీసులు..
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పక్కా సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు...ఇప్పటికే హత్యకు గురయిన షీనా బోరాను ఎక్కడ పాతిపెట్టారో గుర్తించిన అధికారులు ఆ ఎముకలకు పరీక్షలు నిర్వహించారు. పాతికేళ్ల యువతి ఎముకలుగా నిపుణులు నిర్థారించారు. మరింత ఖచ్చితత్వం కోసం ముంబై పోలీసులు వాటిని హైదారాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్ కు తరలించారు.

షీనాబోరాకు నాలుగు సీక్రెట్ బ్యాంక్ అకౌంట్లు..
మరోవైపు పోలీసులు షీనా మర్డర్‌కు దారి తీసిన వ్యవహారంపై దృష్టిని పెట్టారు. ఆమెను ఎందుకు చంపారు..? క్రూరంగా చంపి ఆ తర్వాత విదేశాల్లో బతికే ఉన్నట్లు ఎందుకు నమ్మించారు...ఈ కేసులో ఇంకా ఎవరి పాత్ర ఉంది..? అసలు షీనాను హత్య చేయడానికి కారణాలేంటన్న విషయాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇంద్రాణి ముఖర్జీ నేరం అంగీకరించడంతో హత్యకు గల కారణాలు బయటకు రప్పించే పనిలో పడ్డారు. ఇప్పటికే విచారిస్తున్న పోలీసులకు వివరంగా చెప్పినప్పటికీ క్లారిటీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఇంద్రాణి చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు షీనా బోరా నాలుగు సీక్రేట్ అకౌంట్లను గుర్తించారు. అందులో ఉన్న నగదు..లావాదేవీలపై దృష్టి పెట్టారు. ఆర్థిక సంబంధాలతోనే షీనాను అంతం చేసినట్లు ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ కోణంలో అన్ని రహస్యాలను బయటకు తీస్తున్నారు. ఎన్నో మలుపులు తిరుగుతున్న షీనా బోరా హత్య కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం లేదంటున్నారు పోలీసులు.

06:55 - September 5, 2015

ఆదిలాబాద్ : అక్షరం ముక్కరాని పిల్లలు కూడా సినిమా పాటలను ఈజీగా పాడేస్తుంటారు. పాటలు పాడినంత సులభంగా పాఠ్యాంశాలను గుర్తుంచుకోలేరు. కానీ అక్కడో టీచర్‌ విద్యార్థులు ఈజీగా గుర్తుంచుకునేలా పాఠ్యాంశాలను బోధిస్తోంది. ఏదో సాధించాలనే తపన ఆమెకు డాక్టరేట్‌ను సైతం తెచ్చి పెట్టింది. టీచర్స్‌ డే సందర్భంగా ఆ ఉపాధ్యాయురాలి కృషిపై ప్రత్యేక కథనం..

బెల్లంపల్లి బాలికల పాఠశాల..
స్కూల్‌కి వెళ్ళాలంటే పిల్లలు భయపడడం కామన్‌. టీచర్లు చెప్పిన పాఠాలు అర్ధంకాక పరీక్షల్లో విద్యార్థులు తప్పులు రాయడం సహజం. దాదాపుగా ఇది అన్ని పాఠశాలల్లో జరిగేదే. కానీ,.. ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లి బాలికల పాఠశాలల విద్యార్ధులు అలా కాదు.. స్కూల్‌కు వెళ్లాలంటే ఎంతో ఇష్టపడతారు. పాఠాలన్నీ పాటల రూపంలో చెప్పేస్తుంటారు. పిల్లలకు పాఠాలు ఈజీగా అర్ధమయ్యేందుకు ఇదే స్కూల్‌లో పనిచేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయురాలు కవిత ఐదేళ్లుగా శ్రమించారు. ఎంతో కష్టమైన పాఠాలను సైతం ఈజీగా అర్దమయ్యే విధంగా పాటల రూపంలో చెబుతున్నారు. ఇంగ్లీష్‌ ఒక్కటే కాదు.. అన్ని సబ్జెక్ట్‌లను ఇదేవిధంగా నేర్చుకుంటే పిల్లలకు ఎంతో ఈజీగా ఉంటుందంటున్నారు కవిత. ఇలా నేర్చుకున్న పాఠాలు విద్యార్ధులు జీవితాంతం గుర్తుకుపెట్టుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

సంబరపడుతున్న తల్లిదండ్రులు...
తమ పిల్లలు చదువుల పట్ల చూపిస్తున్న శ్రద్ధకు.. నేర్చుకుంటున్న విధానాన్ని చూస్తూ తల్లిదండ్రులు సంబరపడుతున్నారు. కవిత టీచర్‌ చెప్పే విధానం ఎంతో బాగుంటుందని తోటి ఉపాధ్యాయులు సైతం ప్రశంసిస్తున్నారు. విద్యార్ధులు కూడా అలవోకగా పాఠాలు నేర్చుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాఠాలను పాటల రూపంలో చెబుతూ కవిత ఎందరో ప్రశంసలు పొందారు.. ఆమె చేసిన పరిశోధనకు గాను ఎస్వీ యూనివర్సిటీ డాక్టరేట్‌ కూడా ప్రధానం చేసింది.

06:51 - September 5, 2015

నెల్లూరు : ఆర్డీవో కార్యాలయం ముందు మత్స్యకారులు ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అక్రమంగా అరెస్టు చేసిన నేలటూరు మత్స్యకారులను విడుదల చేయాలంటూ ఓ మత్స్యకారుడు వంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

06:45 - September 5, 2015

మెదక్ : సామాన్యులకు అండగా ఉండాల్సిన పాలకులు నోరుపారేసుకుంటున్నారు. ఆదుకోండి మహా ప్రభూ అని దీనంగా వేడుకుంటుంటే.. ఛీ పొమ్మంటూ చీదరించుకుంటున్నారు. సమస్యలు పరిష్కరించండి అంటూ వినతిపత్రం ఇస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులకు అండగా నిలిచిన నేతలపై ఆగ్రహం వెళ్లగక్కాడు మంత్రివర్యుడు. చిర్రుబుర్రులాడుతూ తన అసహనాన్ని ప్రదర్శించారు.

దౌల్తాబాద్ కు వచ్చిన హరీష్..
మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌లో ఆశావర్కర్లపై మంత్రి హరీష్‌రావు నోరు పారేసుకున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు వచ్చిన ఆయనకు తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చేందుకు ఆశా వర్కర్లు ప్రయత్నించారు. ఇది చూసిన హరీష్‌రావు.. 'మీరు ఆశావర్కర్లు అని తెలుసు.. మీ ఆశలు నిరాశలే. సక్కగా పని చేసుకోక ఎందుకొచ్చారు. మిమ్మల్ని మోదీ తొలగించారు... మాకేం సంబంధం లేదు' అంటూ ఎద్దేవా చేశారు.

సీఐటీయూ నాయకుడివి.. రాజకీయం చేస్తున్నావా ?
అయితే ఆశా వర్కర్లతో వచ్చిన సీఐటీయూ మండల కార్యదర్శి బొల్లం యాదగిరి ఆశావర్కర్ల సమస్యలు చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్న హరీష్‌రావు... నువ్వెవరంటూ ప్రశ్నించారు. తాను సీఐటీయూ నాయకుడినని చెప్పగా... సీఐటీయూ నాయకుడివి.. రాజకీయం చేస్తున్నావా అంటూనే... వీడ్ని లోపలేయండి అంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు. వెంటనే పోలీసులు యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు.

హరీష్ వైఖరిపై కార్మిక సంఘాల ఆగ్రహం..
కార్మిక నేతలపై జులుం ప్రదర్శించిన హరీష్‌రావు వైఖరిని కార్మిక సంఘాలు ఖండించాయి. గోడు విన్నవించుకునేందుకు వచ్చిన తమను చిన్నచూపు చూశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరీష్‌రావు వ్యవహారశైలిని నిరసిస్తూ అనేకచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి ఇలా ప్రవర్తించడం దారుణమని ఆరోపిస్తున్నారు. 

06:42 - September 5, 2015

గుంటూరు : రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు తీసుకున్నారు. అది చాలదన్నట్లు మరో 3వేల ఎకరాల భూమిని సేకరించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అయినా...సర్కార్‌ మాత్రం భూసేకరణ ప్రయత్నాల్ని మానలేదు. తాజాగా రాజధాని భూసేకరణ గ్రామాల్లో కోళ్లఫారాల భూములను తీసుకోనున్నట్లు అధికారులు చెప్పడంతో..ఫారాల యాజమానులు ఆందోళనలో పడ్డారు. పరిహారం తేలేవరకు భూములిచ్చేది లేదని తేల్చిచెప్పడంతో ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త సమస్యగా తయారైంది. రాజధాని భూసేకరణలో చిన్నచిన్న సమస్యలు అటు రైతులకు, ఇటు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక సమస్య పరిష్కరమయ్యేలోపే మరికొన్ని సమస్యలు పుట్టుకొస్తున్నాయి. రాజధాని గ్రామాల్లో కోళ్ల ఫారాల సమస్య ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. గ్రామాల వెలుపల కోళ్ల ఫారాలు నిర్మించిన స్థలాలను భూ సమీకరణలో ఇవ్వాలని అధికారులు కోరుతుండటంతో పరిహారం విషయాన్ని తేల్చకుండా ఇచ్చేదిలేదని ఫారాల యజమానులు తెగేసిచెప్తున్నారు.

పరిహారం విషయంలో గందరగోళం..
తుళ్లూరు మండలం అనంతవరం, లింగాయపాలెం, ఉద్ధండ్రాయునిపాలెం, రాయపూడి, ఎర్రబాలెంతోపాటు అనేక గ్రామాల్లో సుమారు 70 ఎకరాల్లో కోళ్ల ఫారాలు విస్తరించి ఉన్నాయి. కోళ్ల ఫారాల నిర్మాణాల కోసం రైతులు పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. లక్షలు పెట్టుబడి పెట్టి, ఫారాలు నిర్మించటంతోపాటు, కోళ్ల దాణా యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. కోళ్ల ఫారాల భూములను తీసుకుంటామన్న ప్రభుత్వం..నష్ట పరిహారంపై తేల్చటంతోపాటు, బ్యాంకు రుణాలు రద్దు పై కూడా నిర్ణయం తీసుకోవాలని యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే పరిహారం, బ్యాంకు రుణాల రద్దుపై ఎటూ తేల్చకుండా సమస్యను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఈవ్యవహారం ఇప్పుడు రాజధాని ప్రాంతంలో కొత్త సమస్యగా తయారైంది.

నష్టపరిహారం తేల్చాలంటున్న రైతులు..
తీవ్ర నష్టాలతో కోళ్లఫారాలను ఎత్తేసే ఉద్ధేశం ఉన్న కొంతమంది రైతులు,..సమీకరణలో భూములిచ్చేందుకు ముందుకొచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన మాత్రం కరువైంది. తాజాగా గ్రామ కంఠాల సమస్య తలెత్తినందున కోళ్లఫారాల విషయంలోనూ అధికారులు రైతులతో చర్చించి పరిష్కార మార్గం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ ఫారం భూములను భూ సమీకరణకింద తీసుకుని కౌలు చెక్కులు ఇస్తే..ఫారాలకోసం బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు తీర్చటం భారంగా మారే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ప్రభుత్వమే ఈవిషయంలో కొంత వెసులుబాటు కల్పించి తమకు న్యాయం చేయాలని కోళ్లఫారాల యజమానులు కోరుతున్నారు. 

06:37 - September 5, 2015

హైదరాబాద్ : బ్యాంకర్ల పనితీరుపై తెలంగాణ సర్కారు.. అసహనం వెళ్లగక్కింది. బ్యాంకులు.. రుణమాఫీని లైట్‌గా తీసుకున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖరీఫ్ ముగుస్తున్నా సగం మంది రైతులకు రుణాలు అందించలేదని ఆగ్రహించింది. రైతుల నుంచి వడ్డీని వసూలు చేయడాన్ని మంత్రులు తప్పుబట్టారు. ఇక నుంచైనా బ్యాంకర్లు తీరు మార్చుకుని రైతులకు మేలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ అనుకున్నంత సజావుగా సాగటం లేదని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. రైతులకు రుణాలను చేరవేయడంలో బ్యాంకర్ల పనితీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. రుణమాఫీ అమలు, కొత్త రుణాల మంజూరు తదితర అంశాలపై ప్రభుత్వం ఎస్ఎల్ బిసి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలు బ్యాంకులకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

రుణమాఫీ అక్రమాలపై విచారణ..
రుణమాఫీ అమల్లో జాప్యం జరగటం పట్ల బ్యాంకర్లను ప్రశ్నించిన మంత్రులు.. కొన్ని చోట్ల వడ్డీలు కూడా వసూలు చేయడాన్ని తప్పుబట్టారు. ఖరీఫ్ మరో 20 రోజుల్లో ముగుస్తుందని.. అప్పటిలోగా రుణాలన్నీ మాఫీ చేసి అర్హులందరికీ కొత్త రుణాలు అందించాలని మంత్రులు బ్యాంకర్లను ఆదేశించారు. ఇదే సమయంలో రుణమాఫీలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించిన మంత్రులు.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

కొత్త రుణాల లక్ష్యాన్ని నిర్ధేశించిన టి.సర్కారు..
ఇదిలా ఉంటే.. పాత రుణాల మాఫీ ఎంత మేర జరిగిందన్న అంశాలతో పాటు.. కొత్త రుణాల లక్ష్యాన్ని ప్రభుత్వం బ్యాంకర్లను నిర్ధేశించింది. ఈ ఏడాదికి అన్ని రంగాలకు కలిపి 78 వేల 776 కోట్ల రుణాలు అందించేందుకు బ్యాంకర్లు అంగీకరించాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి ఖరీఫ్, రబీకి కలిపి మొత్తం 25 వేల కొత్త రుణాలు అందిస్తామని బ్యాంకర్లు హమీ ఇచ్చాయి. రుణ మాఫీని పూర్తి స్థాయిలో అమలు పరచాలని పట్టుదలగా ఉన్న తెలంగాణ సర్కారు.. రుణమాఫీ విషయంలో వస్తున్న విమర్శలను అధిగమించేందుకు ప్రతివారం బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ప్రయత్నాలను బ్యాంకర్లు ఎంత మేర నేరవేరుస్తారో చూడాలి. 

06:34 - September 5, 2015

హైదరాబాద్ : ఐదు రోజులు.. 20 గంటలు.. ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరిది. అయితే ఈ సమావేశాలు మొత్తం తెలంగాణ చుట్టే తిరిగాయి. ఐదు రోజుల్లో తెలంగాణ ప్రస్తావన లేకుండా సభ జరిగిందే లేదు. అధికార, విపక్షాలు టీఆర్‌ఎస్‌ కేంద్రంగానే తమ అస్త్రాలను సంధించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సమస్యల కంటే రాజకీయాలపై జరిగిన చర్చలే ఉత్కంఠను రేపాయి. ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో కూడా గులాబీ పార్టీ తన ప్రత్యేకతను చాటుకుంది. ఏపీలోని అధికార, విపక్ష పార్టీలు టీఆర్‌ఎస్‌ పార్టీ చుట్టే తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు రాష్ట్ర సమస్యలను తెరపైకి తెచ్చిన అధికార పార్టీ.. రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం కలిసి రావడం లేదని చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు.

టీడీపీని ఇరుకున పెట్టేలా ఓటుకు నోటు కేసు వ్యవహారం..
ఇక టీడీపీని ఇరుకున పెట్టేందుకు వైసీపీ నేతలు ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని సమావేశాల్లో ప్రస్తావనకు తీసుకువచ్చారు. అయితే జగన్‌ లేఖ ఇవ్వడం వల్లే స్టీఫెన్‌సన్‌కు అవకాశం దక్కిందని టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేయడంతో సభలో వేడి రగిలింది. అసలు స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడింది చంద్రబాబు అవునా ? కాదా ? స్పష్టం చేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌కు వైసీపీ తోక పార్టీ..
ఇక రాజకీయంగా విమర్శలు ఎక్కువ కావడంతో... వైసీపీపై చేయి సాధించేందుకు టీడీపీ కొత్త ఎత్తుగడ వేసింది. టీఆర్‌ఎస్‌కు వైసీపీ తోకపార్టీ అనే వాదనను తెరపైకి తెచ్చారు. మండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎందుకు మద్దతు ఇచ్చారో తెలపాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌, హరీష్‌రావుల సూచనలతోనే జగన్‌ రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ కొత్త అస్త్రాన్ని ప్రయోగించింది.

చంద్రబాబుకు సవాల్‌..
ఈ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఆరోపణలను రుజువు చేస్తే రాజీనామా చేస్తా.. లేదంటే చంద్రబాబు రాజీనామా చేస్తారా ? అని జగన్‌ సవాల్‌ విసిరారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్ష పార్టీలు చేసుకున్న ఆరోపణలపై గులాబీ నేతలు కూడా తీవ్రంగానే స్పందించారు. తమకు ఎవరితోనూ రాజీపడే అవసరమే లేదంటూ ప్రకటించారు. ఏది ఏమైనా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన ఐదు రోజులు తెలంగాణ రాజకీయాల చుట్టే తిరిగి అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం గమనార్హం. 

06:31 - September 5, 2015

మహబూబ్ నగర్ : బల్లలు విరిగాయి.. చెంపలు ఛెళ్లుమన్నాయి.. ఒకరినొకరు తోసేసుకున్నారు.. రక్కేసుకున్నారు.. తన్నుకున్నారు. ఇవన్నీ ఏ వీధిరౌడీల గొడవలోనో ఆకతాయి కుర్రాళ్ల ఫైట్‌ లోనో చోటుచేసుకున్న సంఘటనలు కాదు . సాక్షాత్తూ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులందరి మధ్య జరిగిన సీన్‌ ఇది. ఈ సంఘటనలన్నింటికీ మహబూబ్‌ నగర్‌ జడ్పీ సమావేశం వేదికయ్యింది. ప్రజా ప్రతినిధులమన్న సంగతి మరిచిపోయి మరీ రెచ్చిపోయారు. ఇక్కడ చెంప ఛెళ్లు మనిపించింది మరెవరో కాదు సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఆగ్రహంతో ఊగిపోతూ ఎక్కడ ఉన్నామన్న సంగతి సైతం మరిచిపోయి రెచ్చిపోయారు.

మంత్రుల ఎదుటే...
ఈ సంఘటన జరిగింది మరెక్కడో కాదు మహబూబ్‌నగర్‌ జడ్పీ సర్వసభ్య సమావేశంలో. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల ముష్టిఘాతాలు, వాగ్వాదాలతో అట్టుడికింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిండు సభలో దాడికి పాల్పడడంతో సమావేశం రణరంగమైంది. తన ప్రసంగానికి అడ్డు తగులుతున్నారంటూ ఆవేశంతో ఊగిపోతూ, ఇద్దరు మంత్రుల ఎదుటే చిట్టెంను చెంపదెబ్బ కొట్టారు.

తీవ్ర గందరగోళం..
ఎమ్మెల్యేల ఆవేశకావేశాలతో సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాంమోహన్‌రెడ్డే తనపై దాడి చేశారని, పరుష పదజాలంతో దూషించారని బాలరాజు ఆరోపించారు. చివరికి ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తమ ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా కాంగ్రెస్ నేడు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. శుక్రవారం ఉదయం 11.30కు జెడ్పీ సమావేశం ప్రారంభంకాగానే జిల్లాలో కరువుపై చర్చకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు పట్టుపట్టారు. పాలమూరును కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించిన జెడ్పీ చైర్మన్ భాస్కర్, మంత్రి జూపల్లి తొలుత చర్చించి, తర్వాత తీర్మానం చేద్దామన్నారు. నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడబోతుండగా టీఆర్‌ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

ఖండించిన జానా..
విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని డీకే అరుణ మండిపడ్డారు. బంగారు తెలంగాణ సాధిస్తామంటూ అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్..దొరల పాలన నడుపుతున్నారని ఆమె మండిపడ్డారు. జిల్లా పరిషత్ సమావేశానికి ఆహ్వానించి, ఎమ్మెల్యేలు మాట్లాడొద్దంటూ నియంత్రించడం ఏం సంప్రదాయమని ప్రశ్నించారు. అటు ప్రతిపక్షనేత జానారెడ్డి తమ పార్టీ నేతలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. తమ నేతలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. మరోవైపు తాను ఎస్సీనైనందునే తనను దూషించారని.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తనపై లేనిపోని నిందారోపణలు చేస్తున్నారని బాలరాజు మండిపడ్డారు. మొత్తానికి అధికార, ప్రతిపక్ష నేతల మధ్య జరిగిన ఘర్షణతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.  

నేడు ఏపీ కేబినెట్ భేటీ..

హైదరాబాద్ : ఉదయం 10.30గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. శాసనసభ సమావేశాలు జరిగిన తీరు, రాజధాని నిర్మాణం, రైతు కోసం చంద్రన్న యాత్రలు, మెట్రో రైలు నిర్మాణంపై కేబినెట్ చర్చించనుంది. గత సమావేశంలోని పెండింగ్ అంశాలపై చర్చించనుంది. 

నేడు సీఎల్పీ అత్యవసర సమావేశం..

హైదరాబాద్ : మధ్యాహ్నాం రెండు గంటలకు సీఎల్పీ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఎమ్మెల్యే చిట్టెంపై దాడిని సీఎల్పీ ఖండించనుంది. సాయంత్రం టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుపై గవర్నర్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. 

ఆబిడ్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్..

హైదరాబాద్ : ఆబిడ్స్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో నటులు వేణు, విజయ్ పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న సంభవించే అనర్థాలను వాహనదారులకు నటులు వివరించారు. 

విశాఖలో నేడు జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు..

విశాఖపట్టణం : విశాఖలో నేడు జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. పోర్టు డైమండ్ జూబ్లి మైదానంలో 7వ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి. 3200 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 

నేడు రాష్ట్రానికి కేంద్ర జలవనరుల అదనపు కార్యదర్శి..

హైదరాబాద్ : నేడు రాష్ట్రానికి కేంద్ర జలవనరుల అదనపు కార్యదర్శి అమర్ జీత్ సింగ్ రానున్నారు. దేవాదుల, మిషణ్ కాకతీయ పనుల పరిశీలించనున్నారు. పీఎంకేఎస్ వైఫై ప్రభుత్వంతో చర్చించనున్నారు. 

నేటి నుండి ఏపీ హాజ్ యాత్రికుల పయనం..

హైదరాబాద్ : నేటి నుండి ఏపీ హజ్ యాత్రికుల పయనం కానున్నారు. నేడు, రేపు ఐదు విమానాల్లో యాత్రికులు హజ్ కు వెళ్లనున్నారు. 

నేటి నుండి స్పీకర్ కోడెల బ్రిటన్ పర్యటన..

హైదరాబాద్ : నేటి నుండి స్పీకర్ కోడెల బ్రిటన్ లో పర్యటన చేయనున్నారు. ఆరు రోజుల పాటు ఆయన బ్రిటన్ లో పర్యటించనున్నారు. యూకే ప్రభుత్వ ఇంధన, వాతావరణ మార్పుల శాఖ, 'వాతావరణ మార్పులు - పర్యావరణ సమస్యల'లపై రౌండ్ టేబుల్ సమావేశంలో స్పీకర్ పాల్గొననున్నారు. 

నేడు మొబైల్ చిల్లర వర్తకుల సంఘం బంద్..

కర్నూలు : నేడు తెలుగు రాష్ట్రాల్లో బంద్ కు మొబైల్ చిల్లర వర్తకుల సంఘం పిలుపునిచ్చింది. సెల్ ప్రోవైడర్ల అనైతిక వ్యాపారుల పద్ధతుల ద్వారా నష్టపోతున్నామని బంద్ కు పిలుపునిచ్చింది. 

Don't Miss