Activities calendar

07 September 2015

కోదాడలో సిరంజీ సైకో కలకలం...

నల్లగొండ : కోదాడలో సిరంజీ సైకో కలకలం సృష్టించాడు. బైక్ పై వెళ్తున్న వ్యక్తి కంటి కింది భాగంలో సూదితో గుచ్చి ముగ్గురు యువకులు ఆటోలో పరారయ్యారు. బాధితుడు వీరయ్యకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

 

మహిళ పట్ల కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన..

గుంటూరు : పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ లో మహిళ పట్ల ఏపీఎస్పీ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించారు. ప్రయాణికులు.. కానిస్టేబుల్ మోహన్ కు దేహశుద్ధి చేసి.. రైల్వే పోలీసులకు అప్పగించారు.

 

ఇద్దరు యువతుల అరెస్టు..

హైదరాబాద్ : ఇద్దరు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్ బుక్ లో నకిలీ ఫొటోలు పెట్టి యువకులను యువతులు మోసం చేస్తున్నారు. యూపీ, బెంగాల్ కు చెందిన యువతులుగా గుర్తించారు. 17 మంది యువకుల నుంచి కెమెరాలు, సెల్ ఫోన్లు, డబ్బులను యువతులు వసూలు చేశారు. 

డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ పరికరాలపై నిషేధం

హైదరాబాద్ : నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగరంలో డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ పరికరాలపై సీపీ మహేందర్ రెడ్డి నిషేధం విధించారు. 

కొండారెడ్డిపల్లెను దత్తత తీసుకున్న నటుడు ప్రకాశ్ రాజ్

మహబూబ్ నగర్ : జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లెను దత్తత తీసుకోవడానికి నటుడు ప్రకాశ్ రాజ్ ముందుకొచ్చాడు. గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 

 

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

రాజమండ్రి : వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిటిడిపికి సహకరించిన పోలీస్ ఉన్నతాధికారులపై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.

 

19:15 - September 7, 2015

పట్నా : బిజెపితో బీహార్‌కు ఒరిగేదేమీ లేదని... సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, నితీష్‌, లాలూ కూటములకు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు.. మరికొన్ని పార్టీలతో కలిసి బరిలో నిలుస్తున్నాయి. తాజాగా పాట్నాలో సీపీఎం, సీపీఐలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఎన్నికల ప్రచారంలో ఏచూరీ మాట్లాడుతూ ఓట్ల కోసం బిజెపి, జెడియు, ఆర్ జెడి ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయని ఏచూరి ఆరోపించారు. వామపక్షాలతోనే పారదర్శక పాలన, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.

 

కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతలతో రాహుల్ భేటీ..

ఢిల్లీ : కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ భేటీ అయ్యారు. వార్ రూంలో నిర్వహించిన ఈ సమావేశానికి జానారెడ్డి, షబ్బీర్ ఆలీ హాజరయ్యారు. 

స్టాక్ మార్కెట్లు భారీ పతనం..

ముంబై : భారతీయ స్టాక్ మార్కెట్లో సోమవారం పెద్ద ఎత్తున పతనం చవి చూశాయి. 25వేల పాయింట్ల దిగువన సెన్సెక్స్ ట్రేడయింది. 308 పాయింట్ల నష్టంతో 24,893 వద్ద సెన్సెక్స్ ముగిసింది. నిఫ్టీ 96 పాయింట్లు కోల్పోయి 7,559కి దిగజారింది. 

16:48 - September 7, 2015

భావ వ్యక్తీకరణకు అనేక మాధ్యమాలు. మాట కొందరిదైతే.. పాట మరి కొందరిది. వీరికి భిన్నంగా చిత్రాలతో తన భావాలను వ్యక్తీకరిస్తోంది ఒక అతివ. రంగుల ప్రపంచంలో తనదైన ప్రత్యేకత చాటుతోంది. ఆసక్తి, అభిరుచిలకు పదును పెడుతూ చిత్రకళలో రాణిస్తోంది.
చిత్రకళ..అద్భుత కళ
చిత్రకళ... కొందరికి మాత్రమే సాధ్యమయ్యే అద్భుత కళ. భావాలకు రంగులను జోడించి చిత్రాలకు రూపమిచ్చి ముచ్చెట గొలిపే ప్రత్యేకత ఈ కళది. మహిళలు అరుదుగా రాణించే ఈ కళలో అభిరుచికి మెరుగులు దిద్దుకుంటూ ముందుకెళ్తోంది వహీదా అహ్మద్. ఆమె పెయింటింగ్స్ తో ఈ వారం స్ఫూర్తి మీ ముందుకు వచ్చింది.
వహీదా చిత్రాలు ప్రత్యేకం
ప్రొఫెషన్ నే ప్యాషన్ గా భావిస్తున్న వహీదా చిత్రాలు ప్రత్యేకం. అభిరుచిని రంగులతో మేళవించి స్వయం కృషితో, కొత్త ఒరవడితో, తనదైన ప్రత్యేకతతో ముందుకు సాగుతున్న వహీదా అహ్మద్ కు మానవి అభినందనలు తెలియచేస్తోంది.


 

జనతా దర్బార్ నిర్వహించిన అమీత్ షా..

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా తన నివాసంలో జనతా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పలు వినతిపత్రాలు సమర్పించారు. 

ఇంద్రాణి ముఖర్జీకి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ..

ఢిల్లీ : షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీకి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. శ్యామ్ రాయికి కూడా కస్టడీ విధించింది. 

రఘువీరా అరెస్టు..

అనంతపురం : ప్రత్యేక హోదాపై కేసు పెట్టాలని మడకశిర పీఎస్ కు చేరుకున్న ఏపీ పీసీసీ రఘువీరాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా కోరుతూ ఈ రోజు నుండి ఏపీ పీఎస్ లలో ఏపీ కాంగ్రెస్ ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. 

రాజ్ నాథ్ నివాసానికి చేరుకున్న కేజ్రీవాల్..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసానికి ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేరుకున్నారు. 

రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి - ఉత్తమ్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో కరవు, మంచినీటి సమస్యలతో ప్రజలు బాధ పడుతున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటన వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం ఉండదని ఉత్తమ్ ఎద్దేవా చేశారు.

 

గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ..

హైదరాబాద్ : గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అక్షరాస్యత సాధించేలా చర్యలు తీసుకోవాలని, నైపుణ్యం పెంచుకుని వ్యాపార దక్షత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెట్టుబడి నిధి కింద డ్వాక్రా సంఘాలకు ఇప్పటికే రూ.3వేల కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ధాన్యం, మొక్కజొన్న సేకరణ ద్వారానే కాకుండా టెక్స్ టైల్, గొర్రెల పెంపకం, క్యాంటీన్ల నిర్వాహణ ద్వారా మహిళల ఆదాయాన్ని పెంచబోతున్నట్లు చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో మహిళల నెలసరి ఆదాయం రూ.10వేలకు పెరగాలని ఆకాంక్షించారు.

రేగడి వాగు ఉధృతికి కొట్టుకపోయిన పశువుల కాపర్లు..

విజయనగరం : జిల్లాలోని గరివిడి మండలంలో రేగడి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇద్దరు పశువుల కాపర్లు కొట్టుకపోయారు. వీరిద్దరూ మృతి చెందినట్లు తెలిసింది. మృతులు పైడితల్లి, త్రినాథలుగా గుర్తించారు. 

15:07 - September 7, 2015

తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ (2015-16)ను మంత్రి ఈటెల విడుదల చేశారు. లక్షా 15వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ ను రూపొందించారు. అందులో భారీ లక్ష్యాలు..భారీ ఆశయాలను నిర్ధేశించారు. అయితే ఈ ఆరు నెలల కాలంలో ఈ ప్రణాళికలు ఎంతవరకు అమలవుతున్నాయి ? బడ్జెట్ లో కేటాయించిన ప్రకారం నిధులు విడుదలవుతున్నాయా ? తదితర అంశాలపై తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలు, ఆర్థికశాఖ మంత్రి ఈటెల విశ్లేషించారు. 

బాంబు బెదిరింపు ఫోన్ చేసిన టెకీ అరెస్టు..

ఢిల్లీ : మూడు విమానాల్లో బాంబు ఉన్నాయంటూ తప్పుడు ఫోన్ కాల్ చేసిన బెంగళూరుకు చెందిన ఓ టెకీని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న మూడు విమానాల్లో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. 

 

సహజ విపత్తు జరిగితే కేంద్ర సహాయం - వెంకయ్య..

ఢిల్లీ : దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా సహజ విపత్తు జరిగితే కేంద్రం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలపై ఆయన పై విధంగా స్పందించారు. 

తెలంగాణ భాషా దినోత్సవం జీవో జారీ..

హైదరాబాద్: ఈ నెల 9న తెలంగాణ భాషాదినోత్సవం నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహించనున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

రంగారెడ్డి నేతలతో మంత్రి హరీష్ సమీక్ష..

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నేతలతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు.

కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కడం విడ్డూరం - బాల్క సుమన్..

కరీంనగర్ : అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రోడ్డు ఎక్కడం విడ్డూరంగా ఉందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. రైతులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని, పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు రైతులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

స్మిత సబర్వాల్ కు ప్రభుత్వ సాయంపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : స్మిత సబర్వాల్ కు ప్రభుత్వం సాయం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో ఇన్ కెమెరా విచారణ జరిగింది. తదుపరి విచారణనను కోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది. ఔట్ లుక్ మ్యాగజైన్ పై న్యాయపోరాటానికి స్మిత సబర్వాల్ కు రూ.16లక్షలను ప్రభుత్వం సహాయం చేసిన సంగతి తెలిసిందే.

ముంపు మండలాల ఉద్యోగులకు ఊరట..

ఖమ్మం : పోలవరం ముంపు మండలాల ఉద్యోగులకు ఊరట లభించింది. 233 మంది ఉద్యోగులకు తెలంగాణలో ఉద్యోగాలు లభించాయి. సూపర్ న్యూమరీ ఉద్యోగాల్లో భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

చిట్టీల పేరిట ప్రభుత్వ ఉద్యోగి మోసం..

నెల్లూరు : చిట్టీల పేరిట రూ.1.5 కోట్ల మేర వసూలు చేసి ప్రభుత్వ ఉద్యోగి చింతగింజల శ్రీధర్ ఉడాయించాడు. జిల్లా కలెక్టర్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. 

శేషాచలం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో పిల్..

హైదరాబాద్ : శేషాచలం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో పిల్ విచారణ జరిగింది. దర్యాప్తు సంస్థ సిట్ నూ విచారించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కనక మేడలను న్యాయవాదిగా సిట్ నియమించుకుంది. తదుపరి విచారణనను సోమవారానికి వాయిదా వేశారు. 

13:48 - September 7, 2015

నిజామాబాద్ : డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్శిటీతో అమెరికాలోని చికాగో స్టేట్ యూనివర్శిటీ ఎంవోయూ కుదుర్చుకుంది. ఇరు యూనివర్శిటీల విద్యార్థులు, ప్రొఫెసర్లు పరస్పరం బదిలీల కోసం అవగాహన ఒప్పందం కుదిరింది. సీఎం క్యాంప్ ఆఫీస్‌లో కేసీఆర్ సమక్షంలో తెలంగాణ యూనివర్శిటీ ఇన్‌చార్జీ వీసీ పార్థసారథి, చికాగో యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ కానిస్ ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం పత్రాలు మార్చుకున్నారు.

జీఆర్‌ఈ, టోఫెల్‌ అర్హత పరీక్ష లేకుండానే..

ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థులు జీఆర్‌ఈ, టోఫెల్‌ అర్హత పరీక్ష లేకుండానే నేరుగా చికాగో యూనివర్శిటీలో ఎంఎస్ చేయవచ్చు. ప్రతి ఏడాది 75 మంది విద్యార్థులకు ఈ అవకాశం లభించనుంది. మొదటి విడతగా కంప్యూటర్ సైన్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల విద్యార్థులకు బదిలీల ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత విడతల వారీగా ప్రభుత్వం అన్ని విభాగాల విద్యార్థులకు అవకాశం కల్పించనుంది. భవిష్యత్తులో ఫార్మా, నర్సింగ్, కెమికల్ టెక్నాలజీ, తదితర రంగాల విద్యార్థులకు అవకాశం లభించనుంది.

అర్హతకల్గిన నిరుపేద విద్యార్థులకు .....

మొత్తంగా నిరుపేద విద్యార్థులకు అమెరికాలో ఎంఎస్‌ చేయాలనుకునే వారికి ఇది చక్కని అవకాశం. అయితే అర్హతకల్గిన నిరుపేద విద్యార్థులకు పారదర్శకంగా అవకాశం కల్పించాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

 

13:46 - September 7, 2015

హైదరాబాద్ : షీనాబోరా మర్డర్‌ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. షీనాబోరాను హత్య చేసిన తర్వాత కాల్చి పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని దర్యాప్తు బృందం మరోసారి పరిశీలించింది. రాయ్‌గఢ్‌ సమీపంలోని అటవీ ప్రాంతానికి పోలీసులు ఇప్పటికే ఓసారి వెళ్లారు. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో మరోసారి పరిశీలించేందుకు వెళ్లారు. 

13:44 - September 7, 2015

హైదరాబాద్ : చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయేట్లు ప్రచారం చేశారు. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యేట్లు పబ్లిసిటీ చేశారు. ఇంకేముంది ఈ బృహత్కార్యంతో జంటనగరాలకు క్లీన్‌ అండ్ గ్రీన్‌గా మారుతాయనే భ్రమను కల్పించారు. ఎటు చూసినా, ఏ నోట విన్నా అంతా ఆ కార్యక్రమం గురించే. మరి ప్రభుత్వం ఆశయం నెరవేరిందా...? ఖర్చుపెట్టిన కోట్లకు అనుకున్న ఫలితం దక్కిందా...?

చెత్తను క్లీన్‌ చేసేందుకు శ్రమ......

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో గత మే 16నుండి 20వ తేది వరకు స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. గవర్నర్‌ మొదలుకొని ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర ప్రదానకార్యదర్శితో పాటు ఉన్నాతాధికారులందరూ గల్లీ గల్లీ తిరిగారు. చెత్తా చెదారాన్ని క్లీన్‌ చేయడానికి, గందగీని సాఫ్‌ చేసేందుకు, మట్టి కుప్పలను ఎత్తేందుకు ఒళ్లొంచారు. వీరు కాక మొత్తం 37వేల మంది స్వచ్ఛ్ హైదరాబాద్‌లో పాల్గొన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు.

హెచ్ ఐసీసీ లో 3సార్లు మీటింగ్‌ ఏర్పాటు....

నాలుగు రోజుల పాటు జరిగిన స్వచ్ఛ్ హైదరాబాద్‌ కోసం తెలంగాణ సర్కార్‌ చేసిన ఖర్చు, ప్రచారం అంతా ఇంతా కాదు. 33 మెట్రిక్‌ టన్నుల చెత్తను తొలగించామని చెబుతున్న జీహెచ్ ఎంసీ అధికారులు ఆ 4రోజుల కార్యక్రమానికి లెక్కల ఖర్చును విడుదల చేశారు. స్వచ్ఛ్ హైదరాబాద్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హెచ్ ఐసీసీ లో 3సార్లు మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ మూడు సమావేశాలకు అక్షరాలా ఒక కోటి 8లక్షలు ఖర్చు చేశారు. కేవలం వేదికను వినియోగించుకున్నందుకు 23 లక్షల 39వేలు, వేదిక అలంకరణ కోసం12లక్షల38వేలు, వేదిక చుట్టు పక్కల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల కోసం 28లక్షల 94వేలు, ఫ్లెక్సీల డిజైన్‌ కోసం 10లక్షల70వేలు, సౌండ్ సిస్టమ్‌, లైటింగ్ కోసం 7లక్షల 45వేల రూపాయలను వెచ్చించారు. ఇక ఈ మీటింగ్‌లను నిర్వహించినందుకు ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్ధకు 3లక్షల 32 వేలు, వచ్చిన అతిధులకు టీ, స్నాక్స్‌కు 11లక్షల 36వేలను జీహెచ్ ఎంసీ అధికారులు సమర్పించుకున్నారు.

193 ఫ్లెక్సీల కోసం 35లక్షలు.....

ఇక్కడితో అయిపోలేదు నగరవాసులకు స్వచ్ఛ్ హైదరాబాద్‌ పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన 193 ఫ్లెక్సీల కోసం 35లక్షలు, 12వేల పబ్లిసిటీ టీ షర్టుల కోసం 15లక్షలు, ఇక చీపుర్లు, గంపలు,పారలు, లైమ్ పౌడర్, బ్లీచింగ్ పౌడర్ తదితర పనిముట్ల కోసం 22లక్షలు, 400 స్వచ్ఛ్‌ టీంల కోసం 497 మిని ట్రక్కులు, 24 జేసిబీల అద్దె 5కోట్ల 87లక్షలు ఖర్చు చేసినట్లు జీహెచ్ ఎంసీ లెక్కలు చెప్పింది.

సర్కార్‌ పై మండిపడుతున్న మేధావులు, సామాన్యులు...

మేధావులు, బుద్దిజీవులే కాదు సామాన్యులు కూడా తెలంగాణ సర్కార్‌ పై మండిపడుతున్నారు. స్వచ్ఛ్ హైదరాబాద్‌ సన్నాహాక సమావేశాల కోసమే కోటికి పైగా ఖర్చు పెట్టడం కంటే అదే డబ్బును స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కోసం వినియోగించి ఉంటే హైదరాబాద్‌లో కనీసం కొన్ని ప్రాంతాలయినా క్లీన్‌గా అయ్యేవని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

13:41 - September 7, 2015

హైదరాబాద్ : హీరో మంచు విష్ణు సీబీఐ విచారణకు హాజరయ్యారు. సెన్సార్‌ బోర్డులో అక్రమాలు జరుగుతున్నాయంటూ విష్ణు గతంలో సీబీఐకు ఫిర్యాదు చేశారు. సెన్సార్‌ బోర్డులో శ్రీనివాస్‌ లంచాల వ్యవహారంపై విష్ణు వాగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.  

13:40 - September 7, 2015

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట టీ.కాంగ్రెస్‌ ఆందోళనకు దిగింది. రైతు సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య, సబిత ఇంద్రారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందని నేతలు మండిపడ్డారు.

13:38 - September 7, 2015

విశాఖ : కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉంది. మరోవైపు వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా మరో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. వీటికి తోడు నైరుతి రుతుపవనాల్లో కదలిక మొదలైంది. రానున్న 24 గంటల్లో ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణశాఖ అధికారి తెలిపారు.

ఉగ్రవాది షౌకత్ అహ్మద్ భట్ కు పాలిగ్రాఫి టెస్టు..

ఢిల్లీ : ఉధంపూర్ ఉగ్రదాడిలో పట్టుబడిన షాకత్ అహ్మద్ భట్ కు పాలిగ్రాఫి టెస్టు పరీక్షకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు అనుమతి తెలిపింది. 

సీబీఐ కార్యాలయానికి వచ్చిన మంచు విష్ణు..

హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు సీబీఐ కార్యాలయానికి వచ్చారు. సెన్సార్ బోర్డు సభ్యుడు శ్రీనివాసరావు కేసుకు సంబంధించి మంచు విష్ణు సీబీఐ అధికారుల ఎదుట సాక్షిగా ఆయన హాజరయ్యారు. ఇటీవల ఓ తెలుగు చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు శ్రీనివాసరావు నిర్మాతల నుండి రూ. 5లక్షలు డిమాండ్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న సీబీఐ గత నెలలో ఆయన్ను అరెస్టు చేసింది. ఈ కేసులో సాక్షిగా మంచు విష్ణు పేరును సీబీఐ అధికారులు పేర్కొన్నారు. కొద్దిసేపటి అనంతరం మంచు విష్ణు తిరిగి వెళ్లిపోయారు.

భోగాపురం విమానాశ్రయానికి భూ సేకరణపై ధర్నా..

విజయనగరం : జిల్లా భోగాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏడు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. భోగాపురం విమానాశ్రయానికి భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. 

మెదక్ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అనుమతులు..

మెదక్ : జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. ఎర్రవెల్లిలో 285 ఇళ్ల నిర్మాణానికి అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలను మంజూరు చేసింది. 

రంగారెడ్డిలో కరవును దూరం చేస్తాం - హరీష్..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో కరవును దూరం చేస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అదనపు ఆయకట్టు కోసమే ప్రయత్నిస్తున్నామని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం మీకు ఇష్టం లేదా ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో కాంగ్రెస్ రూ. 194 కోట్లు మాత్రమే కేటాయించిందని, రూ.26 కోట్లే ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ప్రాణహిత గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని, రంగారెడ్డి జిల్లాలో 2.70 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

హెల్మెట్ల వాడకంపై హైకోర్టులో పిల్..

హైదరాబాద్ : ద్విచక్రవాహనంతో హెల్మెట్ కొనాలన్న తెలంగాణ రవాణాశాఖ నిబంధనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. బైక్ తో పాటు హెల్మెట్ కొనుగోలు తప్పని సరి కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ముందస్తు చర్యలు తీసుకున్నారా అని కోర్టు ప్రశ్నించింది. 14 నెలల్లో 92వేల కేసులు నమోదయ్యాయని ఆర్టీఏ పేర్కొంది. 15 రోజుల పాటు వాహనదారులకు అవగాహన కల్పించి ఆ తరువాత అమలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణనను రెండు వారాల పాటు వాయిదా వేసింది. 

12:37 - September 7, 2015

హైదరాబాద్: ఏపీ సీఎం, మంత్రుల ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీకి విజయవాడ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన నోటీసులపై ఉమ్మడి హైకోర్టు స్టే ఇచ్చింది. దాంతో త్రివేదీకి ఊరట లభించింది. ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉందని, విజయవాడ కోర్టు ఎలా నోటీసులిస్తుందని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. అంతేగాక కాల్ డేటాను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలన్న ఏపీ ఏజీ అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోని కాల్ డేటాను భద్రపరచాలంటూ గత నెలలో విజయవాడ న్యాయస్థానం ఇచ్చిన నోటీసులను ఏపీ సీఐడీ అధికారులు రాజీవ్ త్రివేదీకి అందజేశారు. ఈ క్రమంలో ఆయన పిటిషన్ ద్వారా హైకోర్టుకు వెళ్లడంతో పైవిధంగా స్పందించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. 

ఏపీలో పిడుగుల వర్షంపై రాహుల్ కలత..

ఢిల్లీ : ఏపీలో పిడుగుల వర్షానికి పలువురు మృతి చెందడం పట్ల ఏపీఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కలత చెందారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని, పిడుగులకు ప్రజల ప్రాణాలు పోవడం కలిచివేసిందని ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

12:22 - September 7, 2015

ఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఏ క్షణంలోనైనా మట్టుబెట్టడం ఖాయమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సంచలన ప్రకటన చేశారు. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ను నిర్వీర్యం చేసేందుకు కోవర్ట్ ఆపరేషన్ లేదా స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తామని వెల్లడించారు. కోవర్టు ఆపరేషన్ నిర్వహిస్తే దానికి సంబంధించిన వివరాలు ప్రజలకు వెల్లడించడం కుదరదని అందుకే ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఈ పని జరుగుతుందని వెల్లడించారు. సామ..దాన..బేధ..దండోపాయాల్లో ఇప్పటికే కొన్నింటిని ప్రయోగించామని, మిగిలిన వాటిని త్వరలోనే ప్రయోగిస్తామని తెలిపారు. భారత్ తన శత్రువలు విషయంలో ఎన్నడూ నిర్లక్ష్యం చేయదని, దావూద్ పాక్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నా అతని కదలికలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రకంపనాలు సృష్టిస్తాయో వేచి చూడాలి.

12:16 - September 7, 2015

కృష్ణా : జిల్లాలో ఈ నెల 10వ తేదీన జరగనున్న విజయ పాల డెయిరీ ఎన్నికలు టిడిపిలో చిచ్చు రేపుతున్నాయి. టిడిపి పార్టీ తరపు పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. ఖాళీ అయిన మూడు డైరెక్టర్ పోస్టులకు అభ్యర్థులను జానకీ రామయ్య వర్గం నిలబెట్టింది. ఛైర్మన్ గా జానకి రామయ్యే ఉంటారని ఆయన వర్గం ప్రకటిస్తోంది. మరోసారి బాలవర్ధన్ రావుకు మొండి చేయి చూపిస్తారని తెలుస్తోంది. ఈనెల పదో తేదీన విజయ పాల డెయిరీ ఎన్నికలు జరుగనున్నాయి.

ఆర్మీ సమర్థవంతంగా సమాధానమిస్తుంది - గిరిరాజ్ సింగ్..

ఢిల్లీ : ఆర్మీ చేతులను కాంగ్రెస్ లాగా గట్టిగా పట్టుకోలేదని, ఫ్రీగా వదిలిపెట్టినట్లు బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సరిహద్దులో చోటు చేసుకుంటున్న కాల్పులపై ఆయన పై విధంగా స్పందించారు. సమర్థవంతంగా ఆర్మీ సమాధానమిస్తుందని పేర్కొన్నారు. 

మద్యం నిషేధించాలంటూ పీఎంకే ఆందోళన..

తమిళనాడు : మద్యాన్ని నిషేధించాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పీఎంకే ఆధ్వర్యంలో నేడు ఆందోళన జరిగింది. 

కృష్ణాలో విజయ పాల డెయిరీ ఎన్నికల చిచ్చు..

విజయవాడ : కృష్ణా జిల్లాలో టిడిపిలో విజయ పాల డెయిరీ ఎన్నికలు చిచ్చు రేపుతున్నాయి. టిడిపి పార్టీ తరపు పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. ఖాళీ అయిన మూడు డైరెక్టర్ పోస్టులకు అభ్యర్థులను జానకీ రామయ్య వర్గం నిలబెట్టింది. ఛైర్మన్ గా జానకి రామయ్యే ఉంటారని ఆయన వర్గం ప్రకటిస్తోంది. మరోసారి బాలవర్ధన్ రావుకు మొండి చేయి చూపిస్తారని తెలుస్తోంది. ఈనెల పదో తేదీన విజయ పాల డెయిరీ ఎన్నికలు జరుగనున్నాయి. 

రహదారి భద్రతపై ఏపీ సీఎం బాబు సమీక్ష..

విజయవాడ : సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రహదారి భద్రతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం బాబు పలు నిర్ణయాలు తీసుకున్నారు. రూ. పది కోట్లతో రహదారి భద్రత నిధి ఏర్పాటుకు బాబు సుముఖత వ్యక్తం చేశారు. జాతీయ రహదారులపై ప్రతి వంద కిలోమీటర్లకు డ్రైవర్లకు విశ్రాంతి కేంద్రాలు, పార్కింగ్ సదుపాయం కల్పించాలని..మద్యం దుకాణా లెక్కలు తీయాలని..ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సూచికలు ఏర్పాటు చేయాలని..రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహించాలని అధికారులకు సీఎం బాబు సూచించారు. 

ఏపీలో పీఎస్ లలో ఫిర్యాదుల వెల్లువ..

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ మలిదశ ఉద్యమం చేపట్టింది. అందులో భాగంగా నేటి ఉందయం ఆ పార్టీ నేతలు రాష్ట్రంలోని అన్ని పీఎస్ లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబులపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఏపీకి న్యాయంగా దక్కాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంటున్నారు. 

లలిత్ మోడీ..ఈడీకి చుక్కెదురు..

ఢిల్లీ : ఐపీఎల్ మాజీ ఛైర్మన్ ను ఇండియాను తిరిగి రపించాలని భావిస్తూ రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు చుక్కెదురైంది. ఎందుకు రెడ్ కార్నర్ నోటీసును జారీ చేశారో వెల్లడించాలని ఇంటర్ పోల్ కోరింది. 

రాజీవ్ త్రివేదికి హైకోర్టులో ఊరట..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదికి హైకోర్టులో ఊరట కలిగింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాజీవ్ త్రివేదికి విజయవాడ కోర్టు ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. 

ప.గో.ఇసుక క్వారీ మాఫియాపై హైకోర్టు ఆగ్రహం..

పశ్చిమగోదావరి : జిల్లాలో ఇసుక క్వారీల అనుమతులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్ పై హైకోర్టు మండిపడింది. రాష్ట్ర ఎన్విరాన్ మెంట్ కమిటీ నివేదికను పాటించడం లేదని పేర్కొంది. 

సన్నిలియోన్ దేశం విడిచి వెళ్లిపోవాలంటూ నిరసనలు..

ఢిల్లీ : బాలీవుడ్ నటి సన్నిలియోన్ దేశం విడిచిపెట్టి పోవాలంటూ జంతర్ మంతర్ వద్ద కొంతమంది నిరసనలు చేస్తున్నారు.

 

11:46 - September 7, 2015

కృష్ణా : బందరు తీరంలో ఉద్యమ కెరటాలు పోటెత్తుతున్నాయి. బందరు పోర్టు కోసం భూసమీకరణకు నిరసనగా కలెక్టరేట్‌ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌ దగ్గరకు రైతులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

11:42 - September 7, 2015

విజయనగరం : భోగాపురం మండలంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేయడంతో రైతులు భగ్గుమంటున్నారు. తొమ్మిది గ్రామాల పరిధిలో 5,311 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో బాధిత గ్రామాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈసారి భిన్నంగా పోరాడేందుకు సిద్ధమవుతున్న బాధిత రైతులు....

భూసేకరణకు వ్యతిరేకంగా ఈసారి భిన్నంగా పోరాడేందుకు గ్రామస్తులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. భూములు సేకరించే గ్రామాల్లో రోజుకో ప్రాంతంలో రిలే నిరాహారదీక్షలు చేయనున్నారు. అఖిలపక్ష ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉద్యమంలో... యువత, మహిళలు, రైతులను భాగస్వామ్యులను చేయాలని నిర్ణయించారు.

గడువులోగా భూసేకరణను పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు......

మరోపక్క గడువులోగా భూసేకరణ ప్రక్రియను ముగించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇచ్చిన గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు నిలిపివేశారు. ప్రస్తుతం అమలవుతున్న పోలీస్‌ సెక్షన్‌ 30తో పాటు.. ప్రజా పోరాటాలపై మరిన్ని ఆంక్షలు విధించేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఉద్యమాలు నడిపిస్తున్నవారిపై ఇప్పటికే నిఘా పెట్టిన పోలీసులు... ముందస్తు అరెస్టులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదిలావుంటే... ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా ఒక్క సెంటు భూమిని కూడా ఎయిర్‌పోర్ట్‌కు ఇచ్చే ప్రసక్తే లేదని ఉద్యమనేతలంటున్నారు. ఒకవైపు భూములు పోతున్నాయని రైతులు ఆందోళనలు చేస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం మాత్రం గడువులోగా భూములు సేకరించేందుకు పావులు కదుపుతోంది. ప్రభుత్వం, బాధిత రైతుల మధ్య కొనసాగుతున్న ఈ పోరు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. 

11:39 - September 7, 2015

హైదరాబాద్ : సాగు కోసం నిత్యం శ్రమిస్తున్నా.. రైతన్నను కష్టాలు వీడడం లేదు. ప్రకృతి ప్రకోపానికి.. పాలకుల నిర్లక్ష్యానికి బలవుతూనే ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయాన్ని మాత్రం వీడడం లేదు. రుణాల కోసం బ్యాంకుల చుట్టు తిరుగుతున్నా.. ఫలితం ఉండడం లేదు. వివిధ రకాల షరతులతో బ్యాంకులు కొర్రీలు పెడుతున్నాయి. మొండిచేయి చూపుతూ.. చుక్కలు చూపిస్తున్నాయి. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి.

రూ.7 వేల కోట్ల రుణాలు అందించిన బ్యాంకులు......

తెలంగాణ రాష్ర్టంలో రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకులు వెనకబడ్డాయి. ఈ ఏడాది మొత్తం 25 వేల కోట్ల రుణాలు అందించాలని బ్యాంకులు టార్గెట్‌ పెట్టుకున్నాయి. అయితే కేవలం 7 వేల కోట్లు మాత్రమే రైతులకు రుణాలు అందించాయి. ఖరీఫ్‌లో 18 వేల కోట్ల రుణాలను రైతులకు అందించాల్సి ఉండగా.. అందులో 30 శాతం కూడా అందించలేదు. మరో 20 రోజుల్లో ఖరీఫ్‌ ముగుస్తున్నందున అసలు రుణ మంజూరులో బ్యాంకులు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాయా..? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రుణ మంజూరు ఆలస్యం వేనక ఉన్న కారణాలను తెలంగాణ ఆర్థికశాఖ గుర్తించేపనిలో పడింది. తద్వారా జాప్యాన్ని అధిగమించేలా చర్యలు చేపట్టబోతోంది.

రుణ మంజూరులో సమస్యలను గుర్తించిన ఆర్థికశాఖ.....

ఆర్థికశాఖ.. రుణ మంజూరులో ప్రధానంగా 5 సమస్యలను గుర్తించింది. వర్షాభావ పరిస్థితుల్లో తెలంగాణ వ్యాప్తంగా కరువు నెలకొని ఉంది. వరుణుడి రాకకోసం ఎదురుచూస్తున్న రైతాంగం కొత్త రుణాల కోసం బ్యాంకులను అనుకున్నంత మేర ఆశ్రయించడం లేదు. దాంతో పాటు తెలంగాణలో పత్తిపంట వైపు రైతాంగం మొగ్గుచూపుతోంది. అయితే.. ఖరీఫ్‌లో పత్తి పంట బీమా కోసం అధికంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే రబీలో అయితే తక్కువ ప్రీమియంకే బీమా వర్తిస్తుంది. అందుకే రబీలో సాగుకు పంట రుణాలు తీసుకునేందుకు అధికంగా పత్తి రైతులు మొగ్గుచూపుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే బ్యాంకుల చుట్టు తిరిగే రైతుల సంఖ్య తక్కువగా ఉందంటున్నారు.

బ్యాంకుల షరతులతో రైతులకు కొత్త తలనొప్పులు.....

20 నుంచి 50 వేల వరకు రుణాలు తీసుకునే చిన్న, సన్నకారు రైతులు కూడా కొత్త రుణాల కోసం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం కేవలం 25 శాతం మేర రుణాలు మాఫీ చేస్తుండడం... అంతే మేర కొత్త రుణాలు బ్యాంకులు ఇస్తుండడంతో రైతులకు పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. పైగా పాత రుణాలను కొత్త రుణాలుగా మార్చి.. వారి చేతుల్లో పదివేల లోపే పెడుతున్నాయి. దీంతో పదివేల కోసం బ్యాంకుల చుట్టు తిరిగే బదులు.. ప్రైవేటు రుణాల వైపే రైతాంగం మొగ్గుచూపుతోంది. ఇక గత రబీలో తీసుకున్న రుణాలను చెల్లించని రైతాంగం ఈ ఖరీఫ్‌లో రుణ సహాయం కోసం ముందుకు రావడం లేదు. అయితే.. ఖరీఫ్‌ ముగిసేనాటికి తాము నిర్దేశించుకున్న 18 వేల కోట్ల రుణాలను అందించాలని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించింది. రుణ మంజూరు పర్యవేక్షణ కోసం ప్రభుత్వం.. బ్యాంకర్లతో ప్రతివారం సమీక్ష నిర్వహించనుంది. మొత్తంగా రుణ మంజూరులో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను గుర్తించిన ప్రభుత్వం.. వాటిని అధిగమించే దిశలో విజయం సాధించి.. రైతాంగాన్ని ఆదుకోవాలని ఆశిద్దాం..!

11:34 - September 7, 2015

కడప : జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రకాశ్ నగర్‌లో ఎస్ బీఐ ఏటీఎంలోని డబ్బులు దొంగలించేందుకు విఫల యత్నం చేశారు. మెషిన్‌లోని డబ్బులు తీసేందుకు ప్రయత్నించినా నోట్లు రాకపోవడంతో ఏటీఎంను ధ్వంసం చేశారు. శబ్ధం విన్న కాలనీలోని స్థానికులు రావడంతో.. దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్‌ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. నిందితుల వేలిముద్రలు, వారికి సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఏటీఎంల వద్ద భద్రతను ఏర్పాటు చేయకపోవడం వల్లే దొంగలు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

జంతర్ మంతర్ వద్ద గుర్తు తెలియని మృతదేహం..

ఢిల్లీ : జంతర్ మంతర్ వద్ద సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. 

11:32 - September 7, 2015

ప్రకాశం: ఒంగోలులో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై వరుసకు బాబాయ్ అని బంధువు లాడ్జికి తీసుకొచ్చి అత్యాచారం చేశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక పరిస్థితిని గమనించిన లాడ్జి సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. మర్రిపూడి మండలం అయ్యవారిపల్లెకు చెందిన 13 ఏళ్ల బాలిక కందుకూరులోని ఎస్సీ హాస్టల్‌లో చదువుతోంది. బాలికకు బాబాయి వరుస అయిన దత్తయ్య హాస్టల్‌కు వెళ్లాడు. కళ్లు సరిగ్గా కనిపించడం లేదని బాలిక చెప్పడంతో ఆస్పత్రిలో చూపిస్తానని ఒంగోలుకు తీసుకొచ్చాడు. ఒంగోలు బస్టాండ్‌ సెంటర్‌లో ఓ లాడ్జిలో ఆమెపై అత్యాచారం చేసి పరారయ్యాడు. పోలీసులు నిందితుడు దత్తయ్య కోసం గాలిస్తున్నారు.

11:30 - September 7, 2015

హైదరాబాద్ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్‌లో స్మార్ట్‌ సిటీల ప్రాంతీయ వర్క్‌ షాప్‌ సదస్సు ప్రారంభమైంది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర కార్మికశాఖమంత్రి బండారు దత్తాత్రేయ, ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ, 40 నగరాల నుంచి మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, కమిషనర్లు సదస్సుకు హాజరయ్యారు. వీరందరినీ కార్యసాధనగా ప్రోత్సహంచి, ప్రేరణ కల్పించే బృహత్ కార్యాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నిర్వర్తించనున్నారు. వారందరినీ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నగరాలను స్మార్ట్‌ సిటీలుగా మార్చడం కష్టమే కానీ అసాధ్యం కాదని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అన్నారు. 

రాజ్ నాథ్ తో భేటీ కానున్న కేజ్రీవాల్..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా భేటీ కానున్నారు. 

బిడ్డలకు తిండి పెట్టలేక..మహిళా రైతు ఆత్మహత్య...

మహారాష్ట్ర : ఒస్మానాబాద్ జిల్లా అంబీ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఐదుగురు బిడ్డలకు తిండి పెట్టలేక ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఒంటికి నిప్పంటించుకుని రైతు మనిషా గట్కల్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనఆ లస్యంగా వెలుగు చూసింది.

 

రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట టి.కాంగ్రెస్ ధర్నా...

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు.

 

11:22 - September 7, 2015

సెప్టెంబర్ 7 విలక్షణ గాయనీమణి...అద్భుత నటీమణి పద్మభూషణ్ భానుమతి జయంతి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.. భానుమతిగారి గొంతులో అదో రకం అందం వుంటుంది. ఆమె పాట వింటూ వుంటే మనసు స్వర్గ సీమలో పావురంలా ఎటో వెళ్ళిపోతుంది. ఎంత మంది సింగర్స్ వచ్చినా ఆమెలా పాడేవారు ఇంత వరకు ఎవరూ లేరంటే అది అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ వెండితెర అద్భుతంలా అనిపించే చిత్రం...'మల్లీశ్వరి'. ఆ చిత్రరాజంలో ప్రతీ పాటా మనసును దోచేస్తుంది. ముఖ్యంగా దేవులపల్లివారి కలం నుంచి జాలువారిన మనసున మల్లెల పాట కలకాలం గుర్తుండి పోతుంది. భానుమతి గారి గాత్రంలో తొణికిసలాడిన మాధుర్యం...అభినయంలో ఆమె ప్రదర్శించిన అద్వితీయ ప్రతిభ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

అజరామరం 'లైలా మజ్ను'ల ప్రేమకథ.
మనసు చేసే పెను మాయ పేరే ప్రేమ. ఒక్కసారి ప్రేమలో పడితే మనసు మరో ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ప్రేమకు సంబంధించి బోలెడు కథలున్నాయి. వాటిల్లో గుండెకు గాలం వేసే కథలు కొన్నే వున్నాయి. అలాంటి కథల్లో అజరామరంగా నిలిచిపోయిన ప్రేమకథ...'లైలా మజ్ను'ల ప్రేమకథ. ఈ కథను సినిమాగా కూడా తీశారు. అక్కినేని 'మజ్ను'గా, భానుమతి 'లైలా'గా అపూర్వ నట విన్యాసం ప్రదర్శించిన ఆ చిత్రంలో...పల్లవించే పాటలు ఎన్నో వున్నాయి. వాటిల్లోంచి ఏ పాటనైనా ప్రత్యేకంగా చేప్పుకోవాలంటే మనం ఈ పాటనే చెప్పుకోవాలి.

ప్రకాశం జిల్లాలో జననం..
భానుమతిగారు 1925న ప్రకాశం జిల్లా దొడ్డవరంలో జన్మించారు. సి. పుల్లయ్య రూపొందించిన వరవిక్రయం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 200కి పైగా చిత్రాలలో నటించి నటిగా, దర్శకురాలిగా, గాయనిగా తనదైన ముద్రను వేశారు. ఏ పాత్ర పోసించినా తనదైన విలక్షణత స్పష్టంగా కనిపించేలా చూసేవారు. పాటల సంగతైతే ఇక చెప్పనే అక్కర్లేదు. ఏ పాటసారి అయినా సరే ఆమె బాటసారి సినిమా పాటతో తన ప్రయాణం మొదలెట్టాల్సిందే. భానుమతిగారి గొంతులో ఓ కమాండ్ వుంటుంది. ఆమె ఏదైనా చెప్పాలనుకుంటే డొంక తిరుగుడు లేకుండా సూటిగా మాట్లాడేస్తారు. అందుకే ఆమె మాటలు తూటాల్లా పేలుతాయంటారు అందరూ. ఇక దుమ్ము రేపే పాట ఏదైనా పాడాల్సి వస్తే.. ఇక ఆ పాట రేపే దుమ్ము అంతా ఇంతా కాదు.

మళ్లీ మళ్లీ వినాలిపించే పాటలు...
భానుమతిగారి వాయిస్ కొన్ని పాటలకు వాల్కొనోలా వేడి సెగలు చిమ్మితే...మరి కొన్ని పాటలకు మల్లెపూల పరిమళం మనసుకు హత్తేస్తుంది. విప్రనారాయణ చిత్రంలో ఆమె ఆలపించిన సావిరహే పాట ఎన్ని సార్లు విన్నా ... మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. భానుమతిగారి వల్లే సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్నో వున్నాయి. అందులో 'మంగమ్మగారి మనవడు' చిత్రం ఒకటి. ఆ చిత్రంలో మంగమ్మ పాత్రలో భానుమతిగారు అద్భుతంగా నటించారు. ఆ పాత్ర పోషణలో తనదైన విశిష్టతను ప్రదర్శించిన ఆమె ఆ చిత్రంలో ఓ అందమైన పాటను కూడా పాడారు. శ్రీ సూర్య నారాయణణుడికి మేలుకొలుపు గీతంలా అనిపించే ఆ పాటలో భానుమతిగారి చమక్కులు ఎన్నో మనల్ని అలరిస్తాయి.

ఇంగ్లీష్ పాట పాడిన భానుమతి..
భానుమతిగారి పాటల్లో తెలుగు తెల్లవారి వెలుగులా దర్శనమిస్తుంది. ఎటువంటి ఉచ్ఛారణా దోషాలు లేకుండా పాటలు పాడి ఆమె తన ప్రత్యేకత చాటుకున్నారు. 'తోడు నీడా' చిత్రంలో భానుమతిగారు ఓ ఇంగ్లీష్ పాట పాడారు. తెలుగు పాటను ఎంత అందంగా పాడతారో...అంతే అందంగా ఆ ఆంగ్ల పాటను కూడా పాడి భానుమతిగారు తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. తెలుగు సినిమా ...తెలుగు పాట ఉన్నంత వరకు.. భానుమతి మన మనసుల్లో పదిలంగా వుంటారు.

అనంతపురంలో భారీ వర్షం..

అనంతపురం : జిల్లాలోని పలుచోట్ల సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. కల్యాణదుర్గం మండలం ఉల్లికల్లు చెరువుకు గండిపడడంతో నీరు వృధాగా పోతున్నట్లు తెలుస్తోంది. 

స్మార్ట్ సిటీలు చేయడం కష్టమే కానీ అసాధ్యం కాదన్న వెంకయ్య..

హైదరాబాద్ : స్మార్ట్ సిటీలు చేయడం కష్టమే కాని అసాధ్యమేమి కాదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నగరంలోని నోవాటెల్ లో స్మార్ట్ సిటీ కార్యశాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగించారు. స్మార్ట్ సిటీల రూపకల్పనకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాల్సినవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయా నగరాల మేయర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో 12 రాష్ట్రాలకు చెందిన 40 నగరాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. 

మాకు ఓఆర్పీ ఇవ్వాలి రైల్వే కార్మికులు..

ఢిల్లీ : మాజీ సైనికులకు వన్ ర్యాంకు వన్ పెన్షన్ ఇచ్చినట్లుగానే తమకు ఇవ్వాలని రైల్వే కార్మికులు కోరారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ (ఎన్ఎఫ్ఐఆర్) కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసింది.

10:31 - September 7, 2015

హైదరాబాద్ : అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు వారాల వ్యవధిలో 30 మంది మృత్యువాత పడ్డారు. జన జీవనం పూర్తిగా స్తంభించింది. బీఎస్‌ఎఫ్‌ జవాన్ల శిబిరాలు నీటమునగడంతో.. వారి విధులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

పొంగిపొర్లుతున్న నదులు, వాగులు .......

అస్సాంను వరదలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో అక్కడి నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. 20 జిల్లాల్లోని 16 లక్షల మంది ప్రజలపై వరద ప్రభావం పడింది. ఇప్పటి వరకు 30 మంది చనిపోగా..పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. రెస్క్యూ సిబ్బంది వరదల్లో చిక్కుకున్నవారిని రక్షిస్తున్నారు. అయితే ఎడతెగని వానలు, తెగిపోయిన రోడ్లు సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని శాఖలను అప్రమత్తం చేశామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎక్కడికక్కడ 300 రిలీఫ్‌ క్యాంపులు ఏర్పాటు చేశామని వెల్లడించింది.

నీట మునిగిన బీఎస్‌ఎఫ్‌ జవాన్ల శిబిరాలు .....

మరోవైపు బంగ్లాదేశ్‌ సరిహద్దు జిల్లా దుబ్రిలోని భారత జవాన్ల గస్తీ శిబిరం పూర్తిగా నీటమునిగిపోయింది. దీంతో బంగ్లా చొరబాటుదారులను కనిపెట్టడం కష్టమైపోయింది. చిన్న చిన్న బోట్ల ద్వారానే సరిహద్దులకు పహారా కాస్తున్నామని సైనికులు చెబుతున్నారు. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, ఖడ్గమృగం ఆవాసాలపై భారీ వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. కాజిరంగ జాతీయ పార్క్‌, పబితొర వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. 

హైదరాబాద్ లో సాఫ్ట్ సిటీల ప్రాంతీయ సదస్సు..

హైదరాబాద్ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెటెక్స్ లో సాఫ్ట్ సిటీల ప్రాంతీయ సదస్సు ప్రారంభమైంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తదితరులు హాజరయ్యారు. 

 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు ప్రారంభం..

ముంబై : స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 140 పాయింట్ల లాభంతో సెన్సెక్స్, 30 పాయింట్ల లాభంతో నిఫ్టీ కొనసాగుతున్నాయి.

 

10:23 - September 7, 2015

హైదరాబాద్ : పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య వివాదం రాష్ట్రస్థాయిలో రాజకీయ దుమారం రేపుతోంది. వ్యక్తిగత ఘర్షణ కాస్తా ఇప్పుడు రెండు పార్టీల మధ్య ప్రతిష్టగా మారింది. ఇరుపార్టీల నేతలూ ఆరోపణ ప్రత్యారోపణలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బహిరంగంగానే సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా టీఆర్ఎస్‌ నేతలు జూపల్లి, శ్రీనివాస్‌గౌడ్‌లు విపక్షాలపై దుమ్మెత్తి పోస్తే.. టీడీపీ నేత గులాబీదళాన్ని తూర్పారబట్టారు.

ఇరు పక్షాల మధ్య ఆగ్రహావేశాలు......

మహబూబ్‌నగర్‌ జడ్పీ సర్వసభ్య సమావేశంలో జరిగిన వివాదం పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య సమస్యగా రూపాంతరం చెందింది. ఇరు పక్షాల నేతల మధ్య ఆగ్రహావేశాలను రాజేస్తోంది. జడ్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిని.. అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై ఇరు పార్టీల నేతలు కౌంటర్లు, ఎన్‌కౌంటర్లు ఇచ్చుకుంటూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డే కారణమంటూ.....

జెడ్పీ సమావేశం సందర్భంగా జరిగిన ఘటనకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డే కారణమంటూ పాలక పక్షం ఎదురుదాడికి దిగింది. రామ్మోహన్‌రెడ్డి బూతుపురాణమే ఘటనకు కారణమని, ఇరు పార్టీల నేతలకు పాలమూరు జిల్లాపై మాట్లాడే హక్కు లేదని.. మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌ ప్రకటించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలకు ఇప్పట్లో సిగ్గు రాదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి జూపల్లి వ్యాఖ్యలను టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. కేసీఆర్‌ సర్కారు రైతు వ్యతిరేకమని టీడీపీ నేత ప్రతాప్‌ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు ఫాం హౌస్‌లోని వ్యవసాయం మీద ఉన్న దృష్టి తెలంగాణ రైతాంగం మీద లేదని ప్రతాప్‌ రెడ్డి విమర్శించారు.

ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డిపై బాలరాజు దాడి చేయలేదు-మందకృష్ణ......

మరోవైపు.. పాలమూరు ఘటనలో.. పాలకపక్షం ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఎమ్మార్పీఎస్‌ మద్దతుగా నిలిచింది. రామ్మోహన్‌రెడ్డే గువ్వల బాలరాజుపై దాడి చేశారని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఈ వివాదంలో టీకాంగ్రెస్‌, టీటీడీపీ నేతలు అనవసర యాగీ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. గతంలో దళిత మంత్రి శంకర్‌రావుపై సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ టమాట, రాళ్లతో దాడిచేస్తే ఎవ్వరు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. దళిత ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై హత్యాయత్నం చేసిన చిట్టెం రాంమోహన్‌రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోని, వెంటనే అరెస్ట్‌ చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో రకరకాల మలుపులు తిరుగుతూ వస్తోన్న ఈ వివాదం.. భవిష్యత్తులో ఇంకెన్ని కోణాల్లో ఆవిష్కృతమవుతుందో వేచి చూడాలి. 

హన్మకొండలో పిచ్చికుక్కల దాడి..

వరంగల్ : హన్మకొండ ప్రగతినగర్‌లో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. పిచ్చి కుక్కల దాడిలో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ చిన్నారులను చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు.

10:20 - September 7, 2015

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తరచుగా విదేశీ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు కూడా పలు విమర్శలు చేస్తున్నాయి. మరి మోడీ చేస్తున్న విదేశీ పర్యటనలకు ఖర్చు ఎంతవుతుంది ? ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ? అనే ఆలోచనలు అందరిలో కలుగక మానదు. ఓ వ్యక్తికి కూడా ఇలాగే సందేహాలు వచ్చాయి. దీనితో సమాచార హక్కు చట్టాన్ని వినియోగించాడు. 2014 జూన్ నుండి ఈ ఏడాది జూన్ మధ్య కాలంలో మోడీ చేసిన విదేశీ పర్యటనల మొత్తం ఖర్చులను తెలుపమన్నాడు. అక్షరాల రూ.37 కోట్లు ఖర్చయిందని తేలింది. అగ్రభాగం ఆస్ట్రేలియా పర్యటనకు ఖర్చు పెట్టారని పేర్కొంది. ఏడాది కాలంలో మోడీ మొత్తం 20 దేశాల్లో పర్యటించారని, మొత్తం రూ.37.22 కోట్లు ఖర్చయిందని పేర్కొంది. వీటిలో అత్యధికంగా ఆస్ట్రేలియా, యూఎస్, జర్మనీ, ఫిజీ, చైనా దేశాలకు కాగా భూటాన్ పర్యటనకు మాత్రం రూ.41.33 లక్షలు తక్కువగా ఖర్చయ్యాయని వివరించారు. హోటల్ లో బస ఖర్చు రూ.5.60 కోట్లు అని, అద్దె కార్లకు రూ.2.40 కోట్లు అని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. అదండి సంగతి..

చైనా పర్యటనకు సీఎం కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక విమానంలో కేసీఆర్ బృందం బయలుదేరి వెళ్లింది. 

 

09:53 - September 7, 2015

హైదరాబాద్ : అమెరికన్‌ ఓపెన్‌లో హాట్‌ ఫేవరెట్ల హవా కొనసాగుతోంది. మెన్స్‌ సింగిల్స్‌ ఆరో రోజు పోటీల్లో టాప్‌ సీడ్లకు తిరుగేలేకుండా పోయింది.స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌, బ్రిటన్‌ వండర్‌ యాండీ ముర్రే టైటిల్‌ వేటలో దూసుకుపోతున్నారు.

మూడో రౌండ్‌లో స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌.....

మెన్స్‌ సింగిల్స్‌లో మూడో రౌండ్‌లో స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌ జర్మనీకి చెందిన ఫిలిప్‌ కోల్‌ష్రీబర్‌ను చిత్తు చేశాడు.ఈ పోటీలో స్థాయికి తగ్గట్టుగా రాణించిన ఫెడ్డీ..ఎక్కడా తడబడలేదు.తన ట్రేడ్‌ మార్క్‌ పవర్‌ఫుల్‌ సెర్వ్‌, వోలీ గేమ్‌తో ఆకట్టుకున్నాడు.కోల్‌ష్రీబర్‌కు అసలే మాత్రం అవకాశమివ్వకుండా ధాటిగా ఆడాడు.

స్విస్‌ ఏస్‌ స్పీడ్ ముందు ఫిలిప్‌.....

స్విస్‌ ఏస్‌ స్పీడ్ ముందు ఫిలిప్‌ తేలిపోయాడు.6-3, 6-4తో తొలి రెండు సెట్లను దక్కించుకున్న రోజర్‌ మ్యాచ్‌పై పట్టు బిగించాడు. మూడో సెట్‌లో ఫిలిప్‌ కాస్త పోరాడినా ఆ తర్వాత ఫెదరర్‌ అంత చాన్స్‌ ఇవ్వలేదు.

కోర్ట్‌ షాట్లతో చెలరేగిన ఫెడ్డీ....

క్లాసిక్‌ ఫోర్‌ హ్యాండ్‌ క్రాస్‌ కోర్ట్‌ షాట్లతో చెలరేగిన ఫెడ్డీకి పోటీనే లేకుండా పోయింది. 6-4తో థర్డ్‌ సెట్‌ను సైతం దక్కించుకుని నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే తాను ఆధిపత్యం ప్రదర్శించగలిగానని....దీంతో గెలవడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం రాలేదని మ్యాచ్‌ అనంతరం రోజర్‌ ఫెదరర్‌ చెప్పాడు. బ్రిటన్‌ వండర్‌ యాండీ ముర్రే....సైతం సునాయాసంగా మూడో రౌండ్‌ను అధిగమించాడు. బ్రెజిల్‌కు చెందిన థామజ్‌ బెల్లూసీని వరుస సెట్లలో చిత్తు చేశాడు. తొలి సెట్‌ నుంచే ధాటిగా ఆడిన ముర్రే....పవర్‌ఫుల్‌ గ్రౌండ్‌ స్ట్రోక్‌లు, ఏస్‌లో బెల్లూసీసై విరుచుకుపడ్డాడు.

6-3,6-2తో తొలి రెండు సెట్లను దక్కించుకున్న ముర్రే.....

వరుసగా 6-3,6-2తో తొలి రెండు సెట్లను దక్కించుకున్న ముర్రేకు మూడో రౌండ్‌లో...థామజ్‌ నుండి గట్టి పోటీ ఎదురైంది. కానీ ఆఖర్లో తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడిన యాండీ....కీలక సమయాల్లో పై చేయి సాధించాడు. 7-5తో థర్డ్‌ సెట్‌ను సొంతం చేసుకుని..నాలుగో రౌండ్‌కు అర్హత సాధించాడు. ఈ టోర్నీలో టైటిల్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన స్విస్‌ ఏస్‌రోజర్‌ ఫెదరర్‌, బ్రిటన్‌ వండర్‌ యాండీ ముర్రే విజయవంతంగా నాలుగో రౌండ్‌లో ఎంటరవ్వగా ...స్పానిష్‌ బుల్‌ రఫాల్‌ నడాల్‌ మాత్రం మూడో రౌండ్‌తోనే నిష్క్రమించాడు.

09:48 - September 7, 2015

హైదరాబాద్ : అమెరికన్‌ ఓపెన్‌ ఉమెన్స్‌ డబుల్స్‌లో ఇండియన్‌ టెన్నిస్‌ క్వీన్‌ సానియామీర్జా-మార్టినా హింగిస్‌ జోడీ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రౌండ్‌లో తిమియా బాస్కింజ్కీ,చువాంగ్‌ జోడీతో తలపడ్డ సానియా జోడీకి పోటీనే లేకుండా పోయింది. ఈ టోర్నీలో టాప్‌ సీడ్‌గా, హాట్‌ఫేవరెట్లుగా బరిలోకి దిగిన హింగిస్‌-సానియా జోడీకి బాస్కింజ్కీ,చువాంగ్‌ అసలే మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. వరుసగా 6-1, 6-1తో రెండు సెట్లలో నెగ్గిన టాప్‌ సీడ్‌ జోడీ మూడో రౌండ్‌కు అర్హత సాధించారు.

09:46 - September 7, 2015

హైదరాబాద్ : చీప్‌ లిక్కర్‌ను ప్రవేశ పెట్టే ఆలోచనను తెలంగాణ సర్కారు తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో పాత ఎక్సైజ్‌ పాలసీనే మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించింది. చీప్‌ లిక్కర్‌ను తెచ్చేందుకు వీలుగా రూపొందించిన నయా విధానంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి వైన్‌ షాప్స్ సంఖ్య పెరిగే అవకాశం లేకున్నా....దరఖాస్తు, లైసెన్స్ ఫీజును గణనీయంగా పెంచే వీలుంది. రెండు మూడు రోజుల్లో ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి.

విపక్షాలు, ప్రజలు నిరసనతో .....

తెలంగాణ వ్యాప్తంగా అక్టోబర్ నుంచి నూతన మద్య విదానాన్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచనను రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకుంది. వివిధ రాష్ట్రాల్లోని మద్య విధానాలను అధ్యయనం చేసి రూపొందించిన సరికొత్త విధానంపై.. ప్రకటనకు ముందే విపక్షాలు, ప్రజా సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. చీప్‌ లిక్కర్‌ను ప్రవేశ పెట్టి సర్కారు ఖజానాను నింపుకోవాలని చూస్తోందని, ప్రజల ఆరోగ్యాలను పణంగా పెడుతోందన్న విమర్శలు వచ్చాయి. దీంతో....సర్కార్ నూతన మద్యం పాలసీపై వెనక్కు తగ్గింది.

రిటైల్ షాప్స్‌ దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ ....

సోమవారం చైనా టూర్‌కు వెళ్తున్న సీఎం కేసీఆర్ ఆదివారమే మద్యం విధానంపై తుది నిర్ణయం తీసుకున్నారు. క్యాంప్ ఆఫీస్‌లో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో.. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాన్నే మరో రెండేళ్ల పాటు..కొనసాగించాలని ఆదేశించారు. రిటైల్ షాప్స్ దరఖాస్తుల కోసం నోటిఫికేషన్‌ ఇవ్వాలని, పోటీ అధికంగా ఉంటే లాటరీ పద్ధతిన లైసెన్స్‌లు ఇవ్వాలని సూచించారు.

ఏడాది కాలానికి లైసెన్స్ ఫీజు కూడా పెంచే అవకాశం......

కేసీఆర్‌ ఆమోదించిన మద్యం పాలసీతో రాష్ట్రంలో ఉన్న షాప్స్ సంఖ్య పెరగక పోయినా.. ఆదాయం పెరిగేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతమున్న 25 వేల రూపాయల దరఖాస్తు ఫీజును భారీగా పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏడాది కాలానికి లైసెన్స్ ఫీజు కూడా పెంచే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన 6 స్లాబ్‌లుగా విభజించి..లైసెన్స్ ఫీజు వసూల్ చేస్తున్నారు. ఈ లైసెన్స్ ద్వారా కూడా ప్రభుత్వం సుమారు 12 వేల నుంచి 15 కోట్ల ఆదాయం రాబట్టాలని ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో వెలువడనున్నాయి. పాత మద్యం విధానాన్ని కొనసాగిస్తూనే గుడుంబా నిర్మూలనకు కార్యాచరణ రూపొందించాలని సర్కారు యోచిస్తోంది. 

09:43 - September 7, 2015

హైదరాబాద్‌ : లంగర్‌ హౌస్‌ పీఎస్‌ పరిధిలోని మందుల బస్తీలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఆసిఫ్‌ నగర్‌ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలను నిర్వహించినట్లు సమాచారం. కార్డన్‌ సెర్చ్‌ లో భాగంగా 31 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు, 13 బైక్‌ లు, రెండు ఆటోలను సీజ్‌ చేశారు. మరో వైపు కొంత మంది పాత నేరస్తులు, మరి కొంత మంది కొత్త నేరస్తులని పట్టుకున్నారు.

09:39 - September 7, 2015

హైదరాబాద్ : కడప జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వర్షబీభత్సానికి రైల్వే కోడూరు కొయ్యల మిషన్‌ వీధిలో గోడకూలి బాలిక మృతి చెందింది. బాలికను చికిత్స నిమిత్తం తిరుపతికి తరలిస్తుండగా బాలిక మృతి చెందినట్లు సమాచారం. ఇదిలా ఉంటే జిల్లాలోని మాసాపేట ప్రాంతంలో విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై మాసాపేటలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. 

యాదాద్రికి ‘రాజు వేగేశ్న ఫౌండేషన్’ భూరి విరాళా

హైదరాబాద్ : తెలంగాణ తిరుమలగా వినుతికెక్కుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ‘రాజు వేగేశ్న ఫౌండేషన్’ భూరి విరాళాన్ని ప్రకటించింది. రూ.5 కోట్లతో ఆలయంలో అన్నదాన సత్రం, వాటర్ ప్లాంట్ ను నిర్మించేందుకు ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో ఫౌండేషన్ చైర్మన్ అనంతకోటి రాజు వేగేశ్న, ఆనంద్ రాజు, రాజేశ్ తిరుమల రాజులు నిన్న కలిసిన సందర్భంగా ఈ భూరి విరాళాన్ని ప్రకటించారు.

కడపలో ఏటీఎంను ధ్వసం చేసిన దుండగులు

కడప : జిల్లా కేంద్రం కడప నగరంలోని ప్రకాశ్‌నగర్‌లో ఆదివారం రాత్రి దొంగలు ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం సెంటర్ లోకి ప్రవేశించిన దొంగలు మొదట దానిని తెరిచేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అది ఎంతకూ తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషన్ ను ధ్వసం చేశారు. అదికూడా సాధ్యపడకపోవడంతో పలాయనం చిత్తగించారు. స్థానికులు సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం రప్పించి వివరాలు సేకరిస్తున్నారు.

ఆటో డ్రైవర్ ను ఆపహరించిన మావోయిస్టులు

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా చర్ల మండలం గీసరెల్లి అటవీ ప్రాంతంలో ఆటో డ్రైవర్ ను మావోయిస్టులు అపహరించారు. ఆదివారం రాత్రి ఆటో డ్రైవర్ సత్యనారాయనను మావోయిస్టులు అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఏపీ, కర్ణాటకల మధ్య నిలిచిన రాకపోకలు...

హైదరాబాద్: నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో హాలహర్వి మండలం గుళ్యం, హోళగుంద దగ్గర ఉన్న వేదవతి వాగు పొంగిపొర్లుతోంది. దీంతో ఏపీ, కర్ణాటక రాష్ర్టాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.

ఒంగోలులో మైనర్ బాలికపై అత్యాచారం...

ప్రకాశం: జిల్లా కేంద్రం ఒంగోలులో దారుణం జరిగింది. వరసకు చిన్నాన అయిన ఓ కీచకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి బాలికను ఒంగోలులోని ఒక ప్రైవేటు లాడ్జీకి తీసుకొచ్చిన నిందితుడు.. బాలికపై అఘాయిత్యం జరిపాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలికను లాడ్జి యాజమన్యం ప్రభుత్వాసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

మళ్లీ బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి నుంచి 1.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

08:25 - September 7, 2015

హైదరాబాద్: పరిశ్రమల నష్టాలకు యాజమాన్యమే కారణం అని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద. హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.కె. నాగేశ్వర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సిరూపర్ కాగజ్ నగర్ లో పేపర్ మిల్లు మూతపడింది. ఆ మిల్లు మూత పడటానికి కారణం ఏమిటి? తెలంగాణ లో ప్రతిపక్షాలన్నీ ఏకమై కేసీఆర్ ను ఎదుర్కోవాలి అని, ఒకే సామాజిక వర్గంపై దాడి జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దాన్ని ఎలా చూడాలి? విశాఖ కు రైల్వే జోన్ రావాలంటే రాజ్యాంగ సవరణ అవసరం అని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడారు? అస్సలు రైల్వే జోన్ కు రాజ్యాంగ సవరణకు సంబంధం ఉందా? వంటి అంశాలపై నాగేశ్వర్ విశ్వేషణ చేశారు. ఆ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

మద్యం మత్తులో భార్య కొట్టి చంపేశాడు...

నెల్లూరు : పీకల దాకా మద్యం తాగి భార్యను కొట్టి చంపిన భర్త ఉదంతం నెల్లూరు జిల్లాలో జరిగింది. కోట మండలం రాఘవాపురంలో అంకయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో భార్య ఆదిలక్ష్మమ్మను కొట్టి చంపాడు. భార్యను హతమార్చిన భర్త అంకయ్య పరారయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

 

రైల్వే కోడూరులో గోడకూలి బాలిక మృతి

కడప: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి తడిసి ముద్దయిన గోడ కూలిపోవడంతో ఓ బాలిక మృతి చెందింది. జిల్లాలోని రైల్వేకోడూరులో సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. మృతిచెందిన బాలికను ఆరో తరగతి చదువుతున్న దేవిగా గుర్తించారు.

మాసాపేటలో విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

హైదరాబాద్: కడప నగరంలోని మాసాయిపేటలో విద్యుత్ దాఘతంతో ఇద్దరు మృతి చెందారు. రాత్రి కురిసిన వర్షానికి నీళ్లలో విద్యుత్ తీగ తెగిపడటంతో ప్రమాదం జరిగింది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

వేములవాడ లో కాంగ్రెస్ మహాధర్నా

కరీంనగర్ : జిల్లాలో నిర్మితమవుతున్న నీటి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వేములవాడలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పలువురు టీపీసీసీ పెద్దలు హాజరుకానున్నారు.

కృష్ణాపశ్చిమడెల్టాకు 516 క్యూసెక్కుల నీరు విడుదల

అమరావతి : కృష్ణాపశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి 516 క్యూసెక్కుల నీటిని ఆదివారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజివద్ద నీటిమట్టం 10.8 అడుగులున్నట్లు తెలిపారు. దుగ్గిరాల సబ్‌డివిజన్‌ నుంచి కొమ్మమూరు కాల్వకు 315 క్యూసెక్కులనీరు, రేపల్లె కాల్వకు 130 క్యూసెక్కులనీరు, తూర్పుకాల్వకు 181 క్యూసెక్కులనీరు, పశ్చిమకాల్వకు 132 క్యూసెక్కులనీరు, నిజాంపట్నంకాల్వకు 62 క్యూసెక్కులనీరు విడుదల చేస్తున్నారు.

07:03 - September 7, 2015

హైదరాబాద్ : చుట్టుపక్కల నాలుగు జిల్లాలకు ఆ ఒక్కటే పెద్దాసుపత్రి. పేదవాడికి ఏ చిన్న జబ్బు వచ్చి అక్కడికే వస్తాడు. .అక్కడ అన్ని వసతులు ఉన్నా నిర్లక్ష్యం మాటున అవన్నీ కనుమరుగైపోతున్నాయి .ఏన్నో సంవత్సరాల సధీర్ఘ చరిత్ర కలిగిన ఆ హాస్పిటల్ ఇప్పుడు అనేక ఇబ్బందులతో కొట్టుమిడుతోంది . కోస్తా జిల్లాలోనే అతి పెద్దది అయిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికే సుస్తీ చేసింది.

కార్పొరేట్‌ వైద్యం ఖరీదెక్కువ......

నేటి ఆధునిక సమాజంలో జ్వరం వస్తే ఓ హాస్పిటల్ కి, గుండెకు ఇబ్బంది వస్తే ఓ హాస్పిటల్ కి, ఊపిరితిత్తులకు, కిడ్నీ, ఎముకలు..ఇలా శరీరంలోని ప్రతి భాగానికి ప్రత్యేకంగా కార్పోరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి . అక్కడికి వెళితే జబ్బు తగ్గుతుందో లేదో కాని జేబులోని డబ్బు మాత్రం ఖాళీ అయిపోతుంది..శరీరంలో ప్రతి అవయవానికి వైద్యం చేయించుకోవాలంటే డబ్బు ఉన్నవాడికే అది సాధ్యం , మరి పేద వాడి పరిస్థితి ఏమిటి? కోస్తాలోని అలాంటి పేదలకు గుంటూరు ప్రభుత్వాసుపత్రే పెద్ద దిక్కు. ఈ హాస్పిటల్ కి ఉన్న చరిత్ర ఇప్పటిది కాదు.. ఎన్నో సంవత్సరాలుగా చుట్టు పక్కల జిల్లా వాసులకు ఇది సంజీవని. శరీరంలోని ఏ భాగానికి ఇబ్బంది వచ్చినా ఇక్కడి వస్తే కి చాలు, నయం అయిపోతుంది అనే నమ్మకం ఉండేది...అయితే ఇది గతం..

దయనీయ స్థితిలో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్....

ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ అత్యంత దయనీయ స్థితిలో ఉంది..నిధులు లేకో అధికారుల లేకో కాదు..అవినీతి ,అలసత్వం అనే మహమ్మారి కారణంగా ఇప్పుడు ఈ హాస్పిటల్ కు రావాలంటే రోగులు భయపడుతున్నారు..డబ్బులు లేక ప్రవేటు హాస్పిటల్స్ కు వెళ్లలేక ఇక్కడి కి వస్తున్నారు..

మొత్తం 1500 దాకా బెడ్స్......

గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో మొత్తం 1500 దాకా బెడ్స్ ఉన్నాయి.,.అయితే ప్రస్తుతం వీటిలో కేవలం 1200 మాత్రం రోగులు అందుబాటులో ఉన్నాయి..ప్రతి రోజు ఈ హాస్పిటల్ కు షుమారుగా 1500 నుండి 2000 మంది వరకు రోగుల వస్తారని అంచనా..ఈ హాస్పిటల్ అధికంగా కాన్పుల కోసం వస్తూ ఉంటారు..పిల్లలకు సంబంధించి రోగుల కూడా నిత్యం వస్తూ ఉంటారు..పిల్లలకు, కాన్పలకు ప్రత్యేక విభాగాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి..అంతేకాదు పిల్లలకు కోసం ఐసియు, ఇంక్యూబెటర్ బాక్సులు ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్నాయి..వీటితో పాటు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో గుండెకు సంబంధించి హార్ట్ ఆపరేషన్లు గత కొంత కాలంగా ఇక్కడ చేస్తున్నారు..గతంలో కూడా హార్ట్ కు సంబంధించి ప్రత్యేక విభాగం ఉన్నప్పటికీ, ఈ మద్య కాలం నుండే హార్ట్ ఆపరేన్లు నిర్వహణ సాగుతుంది.

ప్రత్యేకంగా బర్నింగ్ వార్డు.....

అంతేకాకుండా గుంటూరు ప్రభుత్వ హాస్పటల్లో ప్రత్యేకంగా బర్నింగ్ వార్డు ఉంది...వీటితో పాటు మిగతా విభాగాలకు సంబంధించిన సేవలు కూడా ఉన్నాయి..అయితే ఇవన్నీ ప్రస్తుతం పేదలకు అందడం లేదు...గత కొంత కాలంగా సూపరినిండెంట్ అవనీతి, నిర్లక్ష్యం కారణంగా అనేక వివాదాలు ఈ హాస్పిటల్ ను చుట్టుముట్టాయి..కాన్పుల కోసం వచ్చే వారి దగ్గర నుండి నర్సులు బహిరంగంగానే 1000 లంచాలు ఆడుగుతారు..ఇవ్వని వారిని ఎదో రకంగా ఇబ్బందులు పెడతారు..రెండు నెలల ముందు ఇలా లంచం ఇవ్వలేదని , మగ పిల్లలను తారుమారు చేసిన ఘటన సంచలనం రేపింది..వాటితో పాటు వార్డల్లో రోగుల పట్ల, వాళ్ల బంధువుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు..10 రోజుల క్రిందట జరిగిన ఎలుక దాడిలో పసి వాడు మ్రుతి చెందిన ఘటనలో వార్డు సిబ్బంది, డాక్టర్ నిర్లక్ష్యమేనని నిర్ధారించారు..ఇలా అన్నీ వసతుల అందుబాటులో ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారు..హాస్పిటల్ మొత్తానికి పెద్దగా ఉండాల్సిన సూపరింటెండెంట్ అవినీతి రోగులకు సౌకర్యాలు అందడం లేదు..ప్రభుత్వం పెద్దల నుండి కూడా సూపరింటెండ్‌్ కు మద్దుతు ఉండడంతో ఆయన రెచ్చిపోయాడు..అయితే ఎలుకల దాడి ఘటనలో ఆయన బదిలీ అయ్యారు..

ప్రభుత్వ ఆస్పత్రుల మీద ప్రభుత్వాల పర్యవేక్షణ లోపం.....

ప్రభుత్వ ఆస్పత్రుల మీద ప్రభుత్వాల పర్యవేక్షణ లోపిస్తోంది. ఏదైనా విషాద సంఘటన జరిగిన తర్వాత కమిటీలు, విచారణలంటూ హడావిడి చేయడం, ఆ విషాదాలను వంకగా పెట్టి, కొన్ని కొన్ని విభాగాలను ప్రయివేట్‌ వ్యక్తులకు, సంస్థలకు అప్పగించడం లాంటి వ్యవహారం సాగుతోంది. ఇప్పుడు గుంటూరు ఆస్పత్రిలోనూ ఇదే జరుగుతోంది. అసలు ఆస్పత్రుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. అక్కడ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనీ, కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, ఆమ్యామ్యాల కోసం పేషెంట్లను వేధిస్తున్నారన్న వార్తలు తరచూ వస్తున్నా ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు? నిరంతరం తనిఖీలు చేసి, లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదు? వారి సొంతింట్లో ఎలుకలు తిరుగుతుంటే ప్రభుత్వాధినేతలు ఇలాగే వ్యవహరిస్తారా? 

07:01 - September 7, 2015

హైదరాబాద్ : గుంటూరు ఆస్పత్రిలో చిన్నారిని ఎలుక కరిచిందన్న వార్త విని మనమంతా కలత చెందాం. ఆ తర్వాత మరికొన్ని ఆస్పత్రుల్లోనూ ఎలుకలు, పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. అనేక ప్రభుత్వ దవాఖానాల్లో పారిశుద్ధ్యం ఘోరంగా వుంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? ప్రభుత్వ ఆస్పత్రులు ఇంత అధ్వాన్నంగా ఎందుకు తయారవుతున్నాయి? ఆస్పత్రులు బాగుపడాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత డాక్టర్‌ సేవా కుమార్‌ పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:56 - September 7, 2015

హైదరాబాద్ : మోడీ సర్కార్‌ టార్గెట్‌గా విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కమలనాథులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమ ప్రభుత్వానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కేవలం సలహాలు మాత్రమే ఇస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తేల్చిచెప్పారు. మంచి పాలనకు సలహాలివ్వడం తప్పు కాదన్న ఆయన... సంఘ్‌ పరివార్‌ ప్రభుత్వాన్ని శాసించడం లేదని చెప్పారు. 15 నెలల ప్రభుత్వ పనితీరును అర్‌ఎస్‌ఎస్‌ సమీక్షించిదన్న ఆరోపణలను రాజ్‌నాథ్‌ తోసిపుచ్చారు. ఆ సంస్థతో ప్రభుత్వ పనితీరుపై చర్చలేవి జరగలేదన్నారు. తాము కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌తో దేశంలోని ఆర్థిక, విద్య, సంస్కృతి, జాతీయ భద్రత, సామాజిక సామరస్యం తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

ఆరెస్సెస్‌ రిమోట్‌ కంట్రోల్‌తో నియంత్రిస్తోంది-మాయావతి.....

ఇదిలా ఉంటే మోడీ సర్కార్‌ను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ రిమోట్‌ కంట్రోల్‌తో నియంత్రిస్తుందని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆరోపించారు. లక్నోలో విడుదల చేసిన ఓ ప్రకటనలో.. రాజ్యాంగ బద్ధంగా ఎంపికైన ప్రభుత్వం ఒక మతతత్వ ఫాసిస్టు సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరుకావడం సమంజసం కాదన్నారు. సంఘ్‌ పరివార్‌ నాయకులు తమ కనుసన్నలలో కేంద్రాన్ని నడుపుతున్నారని విమర్శించారు.

అభివృద్ధి రికార్డులను ఆర్‌ఎస్‌ఎస్‌కు సమర్పించడమా...

మాయావతి మాత్రమే కాదు యావత్ విపక్షాలన్నీమంత్రులు తమ అభివృద్ధి రికార్డులను ఆర్‌ఎస్‌ఎస్‌కు సమర్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామం ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదన్నారు. మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని నిప్పులు చెరిగారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు దిశా నిర్దేశం చేస్తున్నారని ఆరోపించారు. 

06:53 - September 7, 2015

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో పిడుగుపాటుకు 20 మంది మృత్యువాతపడగా.. పలువురికి గాయాలయ్యాయి. మరో రెండు రోజులు ఇదేవిధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది.

ఏపీలో కురుస్తున్న వర్షాలు .....

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఒక్కసారిగా వర్షాలు కురవడంతో అనేక జిల్లాలో పంటలు ధ్వంసమయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా పడిన పిడుగుల దాటికి 20 మంది మృత్యువాత పడగా.. పలువురికి గాయాలయ్యాయి.

తీవ్రంగా నష్టపోయిన అరటి పంట......

కడప జిల్లాలో కురిసిన వర్షాలకు పలు గ్రామాల్లో అరటి పంట తీవ్రంగా నష్టపోయింది. అప్పులు చేసి మరి పంట పండిస్తే... కాపు చేతికొచ్చే సమయానికి వర్షాలు పడడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో నలుగురు మృతి ......

ప్రకాశం జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృత్యువాత పడ్డారు. తర్లుపాడు మండలం గానుగపెంటలో పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపడి అత్తాకోడళ్లు మృతి చెందారు. మార్కాపురం మండలం వేములకోటలో ఒకరు, మర్రిపాడు మండలం శిద్దారెడ్డిపల్లిలో రైతు, వలేటివారిపాలెం మండలం సామెరపాలెంలో ఒక మహిళ పిడుగుపాటుకు మృతిచెందారు.

నెల్లూరు జిల్లాలో ఏడుగురిని బలి తీసుకున్న పిడుగులు....

ఇక నెల్లూరు జిల్లాలో పడిన పిడుగులు ఏడుగురిని బలి తీసుకున్నాయి. నెల్లూరులో అయ్యప్పగుడి సెంటర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం సైడ్‌వాల్‌ కూలి పక్కనే ఉన్న వాచ్‌మెన్‌ పెంచలయ్యపై పడగా అక్కడికక్కడే మృతిచెందగా.. మరొ ముగ్గురికి గాయాలయ్యాయి. అలాగే వెంకటాచలం మండలం పూడిపర్తిలో రొయ్యల చెరువు వద్ద కాపలా కాస్తున్న తండ్రి, కుమారుడిపై పిడుగుపడడంతో మృతిచెందారు. అదేవిధంగా బోగోలు మండలం కొండబిట్రగుంటలో ఒకరు, వరికుంటపాడు మండలం నార్తుకొండాయపాలెంలో మరొకరు పిడుగుపాటుకు మృతిచెందారు. ఇక కొడవలూరు మండలం పలమంచిలో ఒకరు, చిల్లకూరు మండం కోవూరువారిపాలెంలో ఒకరు పిడుగుపడి చనిపోయారు.

తూర్పుగోదావరి జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి.....

మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో పొలం పనులు చేస్తుండగా ఓ కౌలురైతు మృత్యువాతపడ్డాడు. కునుకుపేటలో ఒకరు, కొత్తూరు మండలం మహాదేవిపురంలో శివాలయంపై పిడుగుపడడంతో పూజారికి తీవ్రగాయాలయ్యాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు పాడి గేదెలు మృత్యువాతపడ్డాయి. కృష్ణాజిల్లాలో పిడుగులు నలుగురిని బలి తీసుకోగా... ఒకరికి గాయాలయ్యాయి. రెడ్డిగూడెం మండలం కూనపురాజుపర్వలో పిడుగుపాటుతో ఇద్దరు మృతిచెందగా... పిల్లగొల్లపాలెంలో ఒక మహిళ మృతిచెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా డి.హీరేహాల్‌ మండలం కడలూరులో పిడుగుపడి ఒక మహిళ మృతిచెందింది. ఇక గుంటూరు జిల్లాలో పేరేచర్ల క్రికెట్‌ మైదానంలో పిడుగుపడింది. గ్రౌండ్‌లోని ఓ చెట్టుపై పిడుగుపడి దగ్ధమైంది. దీంతో ఆంధ్ర-త్రిపుర మహిళా క్రికెట్‌ జట్టుకు పెను ప్రమాదం తప్పింది. మరోవైపు తిరుపతి పెద్దకాపు వీధిలోని ఓ భవనంపై పిడుగుపడింది. దీంతో పరిసరాల్లోని ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలన్నీ పాడయ్యాయి.

భారీ వర్షాలపై కలెక్టర్లతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌.....

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పిడుగుపాటుకు మృతిచెందిన కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి.......

ఇక ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుండగా.. మరోవైపు అసోం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. క్యుములోనింబస్‌ మేఘాల వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడడానికి దోహదపడుతున్నాయన్నారు. ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

06:46 - September 7, 2015

హైదరాబాద్ : మొన్న హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలో స్ట్రీట్‌ ఫైట్‌ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. నిన్న కింగ్‌కోఠి సెయింట్‌ జోసఫ్స్‌ స్కూల్‌లో టెన్త్‌ క్లాస్‌ విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ ఓ విద్యార్థి చావుకు కారణమైంది. నేడు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విద్యార్థి వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్‌ వార్‌ ఇద్దరు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది.

పాత గొడవ రాజీ కుదుర్చుకునేందుకు ఇరు వర్గాల సమావేశం...

ఓ గొడవకు సంబంధించి రాజీ కుదుర్చుకునేందుకు రెండు గ్రూపులు చర్చి రోడ్డులో మీట్‌ అయ్యాయి. అయితే మాటామాట పెరగడంతో... ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పక్కనే ఉన్న కొబ్బరి బోండాల కత్తితో ఓ వర్గం మరో వర్గంపై అటాక్‌ చేసింది. ఈ దాడిలో ఇమేష్‌, ఉపేందర్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. దాడికి పాల్పడిన బ్యాచ్‌లో విష్ణు అనే యువకుడికి కూడా గాయాలు కావడంతో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.

యువకులు బ్యాచ్‌లుగా ఏర్పడి...

కొంతకాలంగా మిర్యాలగూడలో యువకులు బ్యాచ్‌లుగా ఏర్పడి... సెటిల్‌మెంట్లు, పంచాయితీలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లేస్‌ ఏదైనా విద్యార్థుల మధ్య గొడవలు మాత్రం కామన్‌ అవుతున్నాయి. బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు..కిరాతకంగా దాడులు చేసుకోవడం ఆందోళన రేపుతోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి వీరి ఆగడాలకు కళ్లెం వేయాల్సి ఉంది.

06:42 - September 7, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరోసారి తెలంగాణ హోంశాఖ హైకోర్టును ఆశ్రయించింది. తనకు నోటీసులు ఇవ్వడంపై హోంశాఖ ఉన్నత కార్యదర్శి రాజీవ్‌ త్రివేది హైకోర్టును ఆశ్రయించారు.

డేటాను భద్రపరచాలని ఆదేశించిన మెజిస్ట్రేట్‌ కోర్టు.....

ఇదే కేసులో విజయవాడ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు డేటాను భద్రపర్చాలని ఆదేశించిందని.. ఆ ఉత్తర్వులపైన తదుపరి చర్యలన్నింటిని నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని రాజీవ్‌ త్రివేది కోర్టును వేడుకున్నారు. తనకు నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్దమైనవిగా ప్రకటించాలని కోరారు. మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి నోటీసులు జారీ చేయకుండా మెజిస్ట్రేట్‌ కోర్టును ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

సర్వీస్‌ ప్రొవైడర్లు మెజిస్ట్రేట్‌ కోర్టుకు అందజేసిన కాల్‌డేటా.....

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే సర్వీస్‌ ప్రొవైడర్లు మెజిస్ట్రేట్‌ కోర్టుకు సీల్డ్‌ కవర్‌లో కాల్‌డేటాను అందజేశాయని రాజీవ్‌ త్రివేది పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతున్నందున తనకు మళ్లీ నోటీసులు జారీ చేయడం న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పేర్కొన్నారు. కేవలం తనను వేధింపులకు గురి చేసేందుకే నోటీసులు జారీ చేసినట్లుగా ఉందన్నారు రాజీవ్‌ త్రివేది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో వాదనలు వినిపించేందుకు రాంజెఠ్మలాని లాంటి సీనియర్‌ న్యాయవాదిని నియమించుకుంది. అదేవిధంగా నేటి విచారణకు కూడా ఢిల్లీ నుంచి పేరున్న న్యాయవాదులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య కీలకంగా మారిన ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసకుంటాయో వేచి చూడాలి. 

నేటి నుంచి షర్మిళ రెండో విడత పరామర్శ యాత్ర

హైదరాబాద్: వ‌రంగల్ జిల్లాలో ష‌ర్మిళ రెండో విడత ప‌రామర్శ యాత్రకి ఆ పార్టీ నేత‌లు ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి ఈ నెల 11వ తేదీవరకు ష‌ర్మిళ యాత్ర కొనసాగ‌నుంది. రెండో విడత‌లో 31 రైతు కుటుంబాల‌ను ష‌ర్మిళ ప‌రామ‌ర్శించ‌నున్నారు. 

06:39 - September 7, 2015

హైదరాబాద్ : తెలంగాణ భాషా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని టీఎస్‌ సర్కార్‌ నిర్ణయించింది. ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతినే తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ వేడుకల్లో సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కాళోజి పురస్కారం అందించేందుకు టీఎస్‌ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

జిల్లా కేంద్రాల్లో కూడా వేడుకలు......

తెలంగాణ భాషా దినోత్సవాన్ని రాష్ట్ర రాజధానితో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా వేడుకలకు అధికార భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి అయిన సెప్టెంబర్‌ 9న తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సెప్టెంబర్‌ 9న హైదరాబాద్‌లో ఘనంగా భాషా దినోత్సవ వేడుకలు నిర్వహించటంతో పాటు అన్ని జిల్లాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

అన్ని పాఠశాలల్లో వేడుకలు.....

కాళోజీ జయంతి నాడు నిర్వహించబోయే భాషా దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వేడుకలు చేయాలని కేసీఆర్‌ సూచించారు. ఆరోజు పాఠశాలల్లో తెలంగాణ భాష,మాండలికాలపై చర్చా గోష్టి, వ్యాస రచన, ఉపన్యాస, కవితా పోటీలు నిర్వహించాలని డిఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఆరోజు భాషా, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి కాళోజీ స్మారక పురస్కారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు . ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణకు నోచుకోని, అవహేళనకు గురయిన తెలంగాణ భాష,యాస నేడు అధికారిక ఉత్సవాల్లో ప్రధాన వస్తువుగా ఉండటం పై పలువురు తెలంగాణవాదులు, కవులు, కళాకారులు,భాషా ప్రేమికులు అంబరాన్నంటే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

06:35 - September 7, 2015

విశాఖ : ఉక్కునగరంలో ఉక్కుసంకల్పం. వైజాగ్‌ సిటీని వరల్డ్ క్లాస్ సిటీగా చేస్తానన్నారు ఏపీ సీఎం. విశాఖ వీధుల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేశారు. ఆకస్మిక తనిఖీలు, సమీక్షలు-సమావేశాలతో అధికారుల్ని పరుగులు పెట్టించారు. వైజాగ్‌ సుందరీకణపైనే చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టిసారించారు. పర్యాటక, విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

మత్స్యకారులతో మాట ముచ్చట్లు...

మత్స్యకారులతో మాట ముచ్చట్లు... అడుగడుగునా ఆకస్మిక తనిఖీలు... అధికారులతో సమీక్షలు, రివ్యూలు... విశాఖలో చంద్రబాబు పర్యటనలోని దృశ్యాలివి. ఆకస్మిక తనిఖీలతో సీఎం అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు

వైఎస్సార్ పార్క్‌కు.....

ఆదివారం విశాఖను చుట్టేశారు చంద్రబాబు. ఉదయాన్నే వైఎస్సార్ పార్క్‌కు చేరుకుని ప్రజలతో కాసేపు మాట్లాడారు. ఆ పక్కనే ఉన్న ఫిష్‌ మార్కెట్‌ను సందర్శించి మత్స్యకారుల సమస్యల్ని తెల్సుకున్నారు. అలాగే అల్లీపురం డ్రైనేజీ వ్యవస్థను సీఎం పరిశీలించారు . చెత్తచెదారం పేరుకుపోవడంతో జీవీఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖ పోర్టుకు....

అనంతరం విశాఖ పోర్టును ఏపీ ముఖ్యమంత్రి పరిశీలించారు. పోర్టుకాలుష్య నియంత్రణకు కనీస జాగ్రత్తలు చేపట్టడం లేదంటూ మండిపడ్డారు. ఆ తర్వాత షీలానగర్‌ వాసులతో ముచ్చటించారు.అలాగే సింహచల భూముల్ని పరిశీలించారు. పంచగ్రామలు సమస్యలను త్వరలోనే పరిష్కారిస్తామని బాబు హామీ ఇచ్చారు. రాజీవ్ స్మృతి భవన్‌, ఎన్‌కన్వెన్షన్ సెంటర్ పనులపై ఆయన ఆరా తీశారు. విశాఖను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు బాబు. వైజాగ్ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన చెప్పారు.

విశాఖ సుందరీకణపై ప్రత్యేక దృష్టి.....

విశాఖ సుందరీకణపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామన్నారు బాబు. వైజాగ్‌లో టూరిజం, విద్యాభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు... అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయని సీఎం చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో విశాఖలో జరిగే కార్యక్రమాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మొత్తానికి వైజాగ్‌లో చంద్రబాబు హల్‌చల్ చేశారు. మూడు రివ్యూలు, ఆరు తనిఖీలతో అధికారులకు చుక్కలు చూపించారు. జనంతో మమేకమై పలు సమస్యల్ని తెలుసుకున్నారు. 

06:31 - September 7, 2015

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. చైనాలోని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రత్యేక విమానంలో చైనాకు వెళ్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌..చైనాలోని బడా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. సుమారు 10రోజుల పాటు కేసీఆర్‌ బృందం చైనాలో పర్యటించనుంది.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు.....

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం చైనా వెళ్తున్నారు. న్యూ ఛాంపియన్స్ 2015 పేరిట డాలియన్ నగరంలో ఈ నెల 9నుంచి 11వ తేదీ వరకు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు..పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి కొంత మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్లనున్నారు. వీరితో పాటు..సీఎంఓ అధికారులు, పరిశ్రమలశాఖ కార్యదర్శి, టీఎస్ఐఐసీ ఎండీ, ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా సీఎంతో పాటు చైనాలో పర్యటించనున్నారు.

ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఎట్‌క్రాస్‌రోడ్స్‌ అంశంపై చర్చ ......

ఈనెల 9వ తేదీన ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్ రోడ్స్ అనే అంశంపై జరిగే చర్చలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. చౌక ధరలు, విదేశీ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొత్త ఎమర్జింగ్ మార్కెట్స్ అభివృద్ధికి ఉన్న అవకాశాలపై ఇందులో చర్చిస్తారు. ఈ దిశగా ఉన్న ఆటంకాలు, విధానపరమైన లోపాలు, దక్షిణాసియాలో వాణిజ్యం - పెట్టుబడుల భాగస్వామ్యం తదితర అంశాలపై దృష్టి సారిస్తారు.

పారిశ్రామిక ప్రాంతాల సందర్శన......

చైనా పర్యటనలో భాగంగా అక్కడి పలు పారిశ్రామిక ప్రాంతాలను ముఖ్యమంత్రి, ఆయన బృందం సందర్శించనుంది. షాంఘై, బీజింగ్, షెంగ్‌వాన్ నగరాల్లోని పారిశ్రామిక వాడలను సీఎం కేసీఆర్‌ బృందం పరిశీలిస్తుంది. షెంగ్‌వాన్‌లో పారిశ్రామిక ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్న ముఖ్యమంత్రి,..రాష్ట్ర పారిశ్రామిక విధానం, పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరిస్తారు. చెంగ్డూ నగరంలోని డాంగ్‌ఫెంగ్ ఎలెక్ట్రిక్ కార్పొరేషన్ యూనిట్‌ను కూడా కేసీఆర్ సందర్శిస్తారు. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న కొన్ని సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి.

అత్యాధునిక వసతులున్న ఓ ప్రత్యేక విమానాన్నే ....

సీఎం చైనా పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులున్న ఓ ప్రత్యేక విమానాన్నే బుక్ చేసింది. ఇందుకోసం రెండున్నర కోట్ల రూపాయలను అడ్వాన్స్‌గా చెల్లించారు. అత్యంత అధునాతన సౌకర్యాలు ఉన్న విమానంలో కేసీఆర్‌ బృందం తిరిగి 16న మధ్యాహ్నం హైద్రాబాద్‌కు చేరుకోనుంది. 

కొత్త బైక్ సరదాతో ఓ యువకుడు మృతి...

రంగారెడ్డి : కొత్త బైక్ పై ఓ సారి ట్రయల్ వేద్దామన్న సరదా యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఆదివారం సాయంత్రం ఓ బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో దానిపై ప్రయాణిస్తున్న సయ్యద్ హఫీజ్ (23) డివైడర్‌కు బలంగా ఢీకొని గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలోగా మరణించాడు. సయ్యద్ హఫీజ్ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

ఏపీలో పిడుల వర్షం:పలువురు మృతి

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు, పలు పట్టణాలు జలమయ్యాయి. చాలా విరామం తరువాత సరైన సమయంలో వర్షాలు పడటంతో రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్షంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పిడుగులు పడటంతో అనేకమంది మృత్యువాత పడ్డారు.

నేడు చైనాకు సీఎం కేసీఆర్

హైదరాబాద్ : భారీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు విదేశీ బాటపడుతున్నారు. పది రోజుల పర్యటనకోసం ఆయన చైనాకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయంప్రారంభమయ్యే సీఎం చైనా పర్యటన..ఈ నెల 16 వతేదీ వరకు కొనసాగనుంది. విదేశాలనుంచి రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా సీఎం ఈ పర్యటనకు రూపకల్పన చేశారు.

Don't Miss