Activities calendar

08 September 2015

21:19 - September 8, 2015

ఢిల్లీ : ఒరిస్సాలోని కందమల్‌ బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఆరోపించారు. 2007లో జరిగిన మత ఘర్షణల్లో క్రైస్తవులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి కేవలం రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకే నష్ట పరిహారం చెల్లించడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో అధికశాతం మారుమూల గ్రామాలకు చెందినవారేనని, వారిచ్చే డబ్బులు భవన నిర్మాణానికి కావల్సిన మెటీరియల్‌ రవాణా ఖర్చులకు కూడా సరిపోవని కరత్‌ ఎద్దేవా చేశారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. 2008లో కందమాల్‌ జిల్లాలో మతఘర్షణలు జరిగాయి. క్రైస్తవులు అధికంగా ఉన్న గ్రామాలపై దాడులు జరిగాయి.

 

ఆటో డ్రైవర్ ను విడుదల చేసిన మావోయిస్టులు

ఖమ్మం : కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ ను మావోయిస్టులు విడుదల చేశారు. గత ఆదివారం చర్లలో ఆటో డ్రైవర్ ను కిడ్నాప్ చేశారు. 

కారు బోల్తా...మాజీ ఎంపిటిసి మృతి

రంగారెడ్డి : పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టిడిపి మాజీ ఎంపిటిసి యాట కుమార్ మృతి చెందారు. మరో ఇద్దరు టిడిపి నేతలు తోటకూర జంగయ్య, మీసాల కృష్ణలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని కామనినే ఆస్పత్రికి తరలించారు.

 

నాగర్ కర్నూలులో దొంగ హల్ చల్...

మహబూబ్ నగర్ : నాగర్ కర్నూలులో దొంగ హల్ చల్ చేశాడు. మహమూద్ అనే దొంగ.. ఇంట్లో దాక్కుని.. పోలీసులు తనను అరెస్టు చేస్తే కత్తితో పొడుచుకుంటానని బెదిరించాడు. 2 గంటలుగా ఇంటి చుట్టూ పోలీసులు పడి గాపులు గాస్తున్నారు. 

20:47 - September 8, 2015

హైదరాబాద్ : గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహ్మారెడ్డి ప్రకటించారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై భాగ్యనగర గణేశ్ ఉత్సవ కమిటీతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం నాయిని మీడియాతో మాట్లాడారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని తెలిపారు. వినాయక చవితి, బక్రీద్ పండుగలు ఒకేసారి రావడంతో అన్నివర్గాల ప్రజలు సహకారంతో పనిచేయాలని కోరారు. డీజేలకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పారు. హుస్సేన్ సాగర్లో గణేశ్ నిమజ్జనం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, డీసీపీలు పాల్గొన్నారు. అయితే ప్రభుత్వం తీరుపై భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ సభ్యులు మండిపడుతున్నారు.

 

20:41 - September 8, 2015

మహబూబ్ నగర్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి ఎమ్మెల్యేపై దాడి చేసిన... గువ్వల బాలరాజును చైనా టూర్‌కు తీసుకెళ్లడం సిగ్గుచేటన్నారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలకు బుద్ధిచెబుతామని డీకే అరుణ హెచ్చరించారు.

 

20:30 - September 8, 2015

హైదరాబాద్ : వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరికీ తెలియదంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. అసలు పిడుగులు ఎందుకు పడుతాయి.? ఎలా పడతాయి.? పిడుగుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి.?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు ఏర్పడి పెద్దసంఖ్యలో పిడుగులు పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పగటి ఉష్ణోగ్రతలు పెరగడం.. ఆ వెంటనే వాతావరణం చల్లబడి వర్షాలు కురవడంతో పిడుగులు పడుతున్నాయి. ఏపీలో ఆదివారం ఒక్కరోజే పిడుగులు పడి 22 మంది మృతిచెందారు. ఈ నెలాఖరు వరకు దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పిడుగుల్లో రూ.2 లక్షల ఓల్టుల విద్యుత్‌ తీవ్రత
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 6, 7 డిగ్రీలు అధికంగా నమోదై భూవాతావరణం వేడెక్కింది. ఇదే తరుణంలో అల్పపీడన, ఉపరితల ద్రోణుల కారణంగా రుతుపవనాల్లో కదలిక పెరిగి వాతావరణం చల్లబడింది. దీంతో ఒకేచోట దట్టమైన క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడుతున్నాయి. అవి ఆ పరిసర ప్రాంతాల్లో కుంభ వృష్టిలా వర్షిస్తున్నాయి. ఈ మేఘాలు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉండటంతో విద్యుత్ ప్రవాహం అధికంగా ఉంటుంది. వర్షం కురుస్తున్నప్పుడు మేఘాల నుంచి భూమిపైకి ఉండే గాలిలో తేమ పెరుగుతుంది. దట్టమైన మేఘాల్లో నీటిబిందువులు, మంచు ముక్కల మధ్య ప్రసారమవుతున్న విద్యుత్ ఒకేసారి గాలిలో ఉండే తేమద్వారా భూమిపైకి ప్రవహిస్తుంది. ఈ ప్రక్రియలో ముందుగా మెరుపు కనపడి వెంటనే పెద్దశబ్దం వినిపిస్తుంది. ఇదే ఉరుము. మేఘాల నుంచి భూవాతావరణంలోకి ఇలా అత్యధిక ఉష్ణోగ్రతతో విద్యుత్ ప్రవహించడాన్నే పిడుగు అంటారు. ఈ పిడుగుల్లో రెండు లక్షల ఓల్టుల విద్యుత్‌ తీవ్రత ఉంటుంది. దీంతో అది ఎక్కడ పడితే అక్కడ మంటలు చెలరేగుతాయి.
పిడుగులు పడకుండా ఉండేందుకు.. రాగి కడ్డీల ఏర్పాటు
ఎత్తుగా ఉండే చెట్లు, టవర్ల వంటి వాటి ద్వారా ఈ విద్యుత్ ప్రవాహం భూమిలోపలికి వెళుతుంది. రైస్‌ మిల్లులు, ఎత్తైన కాంక్రీట్ భవనాలు నిర్మించేటప్పుడు వాటి పైకప్పులో పిడుగులు పడకుండా ఉండేందుకు.. రాగి కడ్డీలను ఏర్పాటు చేస్తారు. రాగి, ఇనుము లోహ మిశ్రమంతో ఉండే ఈ కడ్డీ పిడుగులను లాగేసి.. భూమిలోకి పంపుతుంది. దీనివల్ల పిడుగు పడినా కాంక్రీట్ భవనాలకు నష్టం జరగదు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కిందకు, టవర్ల కిందకు వెళ్ల కూడదు. పొలాల్లో పనిచేసే రైతులు త్వరగా ఇళ్లకు చేరుకోవాలి. ఎత్తైన ప్రదేశాల్లో ఉండకూడదు. వాహనాల్లో ప్రయాణించడం అంత సురక్షితం కాదు. ఎక్కువ నీరున్న చోట ఉండకూడదు. సెల్‌ఫోన్‌, కెమెరాలను, ఎఫ్‌ఎం రేడియోలను వినియోగించకూడదు. ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్ల విద్యుత్‌ వైర్లను తొలగించాలి. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాల పరిసరాల్లో ఉండకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిడుగుల బారిన పడకుండా ఉండొచ్చు.

 

20:19 - September 8, 2015

హైదరాబాద్ : సిరియా వలసలతో కంపుకొడుతూనే వుంది. అంతర్యుద్ధాలు పరాకాష్టకు చేరటంతో.. స్థానికులు.. బతుకు జీవుడా అంటూ.. వలసబాటపడుతున్నారు. నావలో పయనమై.. మృత్యువుతో పోరాడుతూ.. తీరాలకు శవంగానో.. ఊపిరితోనో.. చేరుకుంటున్నారు. ఐతే వారికి ఆశ్రయం కల్పించేదెవరు? సమాధానం దొరకని ప్రశ్నే అయినా... బతుకుమీది తీపి.. వారిని సముద్రంపై నడిపిస్తోంది. మూడేళ్ల బాలుడి మరణం తర్వాత.. ఎట్టకేలకూ సిరియా శరణార్థులకు ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి.
అంతర్యుద్ధాలతో నలిగిపోతోన్న సిరియా
అంతర్యుద్ధాలతో సిరియా నలిగిపోతోంది. మరుభూమిలా మారిన మాతృభూమిలో.. బతికిబట్టకట్టలేక.. తప్పని పరిస్థితుల్లో వలసబాటపట్టి.. ఆ పయనంలో.. మృత్యు తీరాలకు చేరుతున్నవారు ఎందరో. మూడేళ్ల బాలుడు అయలాన్‌ కుర్దీ విషాద మరణం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అయలాన్‌ మృతదేహం టర్కీ తీరానికి చేరి.. సిరియాలో.. క్షేత్రస్థాయి పరిస్థితులు ఏ స్థాయిలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయో కళ్లకు కట్టాయి. ఇక.. ఎవరికీ కనిపించకుండా.. సముద్రగర్భంలో కలసిపోతోన్న జీవితాలు.. ఇంకెన్నో.
సిరియా నుంచి వలసలు నిత్యకృత్యం
సిరియా నుంచి వలసలు నిత్యకృత్యం అవుతున్నాయి. మూడేళ్ల బాలుడి మరణం తర్వాత.. ఎట్టకేలకూ శరణార్థుల విషయంలో.. ప్రపంచ దేశాల దృక్పథం మారిపోతోంది. 15వేల మంది సిరియన్లకు ఆవాసం కల్పించేందుకు సిద్ధమని.. బ్రిటన్‌ సంకేతాలిచ్చింది. ముందు 4వేల మంది బాధ్యతలు తీసుకోవటానికి ముందుకొచ్చిన బ్రిటన్... తర్వాత ఆ సంఖ్యను 10వేలకు పెంచింది. తాజాగా అది 15వేలకు మారిపోయినట్లు సమాచారం.
సిరియా శరణార్థుల విషయంలో సానుకూలంగా జర్మనీ
జర్మనీ సైతం సిరియా శరణార్థుల విషయంలో సానుకూలంగా స్పందించింది. ఆస్ట్రియా మీదుగా.. జర్మనీకి వస్తోన్న వేలాది మందికి.. ఆశ్రయం కల్పించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇప్పటికే 8వేల మందికిపైగా శరణార్థులను... తాత్కాలిక శిబిరాలకు తరలించారు.
రెండేళ్లలో లక్షమందికి ఆవాసం
24వేల మందికి ఆశ్రయం కల్పించేందుకు ప్రాన్స్‌ ప్లాన్‌ చేస్తోంది. వచ్చే రెండేళ్లలో దాదాపు లక్షమందికి ఆవాసం కల్పించేందుకు.. ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరికొన్ని దేశాలు సైతం సిరియా శరణార్థులకు తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి.

 

20:12 - September 8, 2015

అనాథ అనే పదాన్ని వాడుక నుండి తొలగించాలని వక్తలు సూంచించారు. ఇదే అంశంపై మానవి నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో బాల తేజస్సు ప్రతినిధి నవీన్ రాజు, రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ, చైల్డ్ రైట్స్ యాక్టివిస్టు శ్యామలదేవి పాల్గొని, మాట్లాడారు. తల్లిదండ్రులు లేని చిన్నారులను ప్రభుత్వం పిల్లలుగా సంభోదించాలన్నారు. చిన్నారులు పూర్తి స్థాయిలో సాధికారత సాధించే వరకు ప్రభుత్వం చేయూతనివ్వాలని చెప్పారు. భద్రమైన బాల్యం ప్రతి చిన్నారి హక్కు అని అన్నారు. చిన్నారులందరికీ సమానమైన స్థాయిలో విద్యా సౌకర్యాలు కల్పించాలని కోరారు. తల్లిదండ్రులు లేని పిల్లల కోసం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల పూర్తి సంరక్షణా బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఉండాలని సూచించారు. పిల్లల సంపూర్ణ ఎదుగుదల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. నాణ్యతతో కూడిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని వివరించారు. 18 ఏళ్ల స్థానంలో 21 ఏళ్లు వచ్చే వరకు ప్రభుత్వం చిన్నారుల సంరక్షణను చేపట్టాలన్నారు. వక్తలు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...


 

19:07 - September 8, 2015

నల్లగొండ : జిల్లాలో భారీవర్షాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి.. వరద ఉప్పొంగడంతో వేములపల్లి పాలేరు వాగు వంతెన కొట్టుకుపోయింది.. వరదనీటి ఉధృతికి భీమవరం, సూర్యాపేట డైవర్షన్ రోడ్డుకూడా తెగిపోయింది... ఇతర గ్రామాల్లో కూడా వంతెనలు తెగిపోయాయి.. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి..

 

19:03 - September 8, 2015

వరంగల్ : జిల్లాలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో తాళ్లపూసల పల్లి, కేసముద్రం మధ్య రైలు నిలిచిపోయింది. సమస్యను చక్కదిద్దేందుకు... అధికారులు డోర్నకల్ నుంచి మరో ఇంజిన్ రప్పిస్తున్నారు. ఈ ఘటనతో కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. మహబూబాబాద్ లో కృష్ణా ఎక్స్ ప్రెస్, తాళ్లపూసల పల్లి వద్ద పెద్దపల్లి ప్యాసింజర్ రైలు ఆగిపోయాయి.

 

18:58 - September 8, 2015

హైదరాబాద్ : వరుణుడి కరుణ లేకపోవడంతో తెలంగాణలో జలశయాలు అడుగంటుతున్నాయి. దీంతో జల విద్యుత్ కేంద్రాలు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. మంగళవారం నాటికి తెలంగాణలో ఉన్న అన్ని జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో విద్యుత్ సంక్షోభం తీవ్రమవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి.
విద్యుత్ సంక్షోభం
తెలంగాణకు విద్యుత్ కష్టాలు అధికమయ్యాయి. అసలే విద్యుత్ కొరత రాష్ట్రం. ఆ పైనా విద్యుత్ ఉత్పత్తికి వెన్నెముక లాంటి జలశయాలు డెడ్ స్టోరేజికి చేరుకున్నాయి. దీంతో ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి నామ మాత్రమే కావడంతో విద్యుత్ సంక్షోభం తప్పేలా లేదు.
తెలంగాణ వ్యాప్తంగా 140 మిలియన్ యూనిట్ల డిమాండ్
వ్యవసాయం, పరిశ్రమలు, గృహ అవసరాల కోసం తెలంగాణ వ్యాప్తంగా 140 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా కేవలం 43.79 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఇదే విషయాన్ని జెన్ కో వెబ్ సైట్ సైతం స్పష్టం చేస్తోంది. దీంతో సరాసరి 96 మిలియన్ యూనిట్ల కొరత ఎదుర్కొంటోంది తెలంగాణ రాష్టం. అందుకే పొరుగు రాష్ట్రాలు, ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ కొరత లేకుండా చూడాలని చైనా పర్యటనకు వెళ్లేముందు విద్యుత్ అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నారు విద్యుత్ శాఖ అధికారులు.
బహిరంగ మార్కెట్లో అందుబాటులో లేని విద్యుత్
అయితే ఈ ప్రభావం గృహ వినియోగదారులపై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు అధికారులు. వేసవిలో కొనుగోలు చేసినట్టే ఇప్పుడు కూడా విద్యుత్ కొనుగోలు ప్రక్రియను మొదలు పెట్టారు. అయితే బహిరంగ మార్కెట్లోనూ అవసరమైన మేర విద్యుత్ అందుబాటులో లేదు. దీంతో థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారానే వీలైనంత ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. దాంతో పాటు మిగులు విద్యుత్ రాష్టాల నుంచి కొనేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని పట్టుదలగా ఉంది ప్రభుత్వం. ఆర్దిక భారాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ ను కొని కొరత లేకుండా చూడాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఎంత మేర ఫలిస్తాయో చూడాలి.

 

 

18:53 - September 8, 2015

మహబూబ్ నగర్ : జిల్లాలోని కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న నటుడు ప్రకాశ్ రాజ్.. ఇవాళ ఆ గ్రామాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్ శ్రీదేవి, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రకాశ్ రాజ్ మొక్కలు నాటారు. రాబోయే రోజుల్లో వంద గ్రామాలను దత్తత తీసుకునే స్థాయికి కొండారెడ్డి పల్లిని తీర్చిదిద్దుతానని.. ప్రకాశ్ రాజ్ ప్రకటించారు.

 

18:43 - September 8, 2015

విజయవాడ : డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే వరకూ తెలుగుదేశం ప్రభుత్వం సహకరిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో శ్రీనిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్ మొదటివార్షికోత్సవ సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రతి మహిళా ఒక ఫైనాన్స్ మినిస్టర్ అని, మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి మంత్రి కిమిడి మృణాళిని, సర్ప్ అధికారులు పాల్గొన్నారు. 

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం..

హైదరాబాద్ : నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, నాంపల్లి, ఆడిడ్స్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్,లంగర్ హౌస్, జీడిమెట్ల, బోయిన్ పల్లి, ఆమీర్ పేటలో కుండపోతగా వర్షంగా కురిసింది.  

ఉత్సవాల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు : నాయిని

హైదరాబాద్ : ఉత్సవాల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. చవితి, బక్రీద్ పండుగలు ఒకేసారి వచ్చినందున అన్ని వర్గాలు సామరస్యం పాటించాలన్నారు. డీజేలను ఎలాంటి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ సారి కూడా గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే ఉంటుందని తెలిపారు.

 

18:16 - September 8, 2015

పశ్చిమగోదావరి : ఏలూరులో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు కదం తొక్కారు.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు.. కలెక్టర్ కార్యాలయంలోకి తోసుకువెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.. రెండువర్గాలమధ్య తోపులాటతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

 

18:11 - September 8, 2015

రంగారెడ్డి : బంగారం స్మగ్లర్లకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు అడ్డాగా మారుతోంది. బంగారం అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా...గోల్డ్‌ స్మగ్లింగ్‌ మాత్రం ఆగడంలేదు. తాజాగా దుబయ్‌ నుండి ఎయిర్‌ఇండియా విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి నుండి కేజీకిపైగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అధికారులు విచారిస్తున్నారు.

 

17:37 - September 8, 2015

ఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, గ్లోబల్‌ ప్రభావం లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఇటీవల ప్రధాని బ్యాంకర్స్‌, పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలతో సమావేశం జరిపి దేశ అభివృద్ధి కోసం పలు సూచనలు కోరినట్టు పేర్కొన్నారు. వ్యవసాయరంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరచనున్నట్టు జైట్లీ చెప్పారు. దేశంలో ప్రయివేట్‌ పెట్టుబడులు పెరగలేదన్నారు.

17:34 - September 8, 2015

ముంబయి : షీనా బోరా హత్య కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తుకు నేతృత్వం వహిస్తున్న ముంబయి పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు ప్రభుత్వం ఉన్నపళంగా పదోన్నతి కల్పించింది. మారియాను హోం గార్డ్స్ డీజీగా నియమిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మారియా పదవీ కాలం సెప్టెంబర్‌ 30తో ముగియ నున్న నేపథ్యంలో ఆయనకు ప్రమోషన్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హోంగార్డ్‌ డిజీగా పని చేస్తున్న అహ్మద్ జావేద్ ను.. మారియా స్థానంలో ముంబయి నగర నూతన కమిషనర్ గా నియమించింది. భారీ ఆర్థిక లావాదేవీలే షీనా హత్యకు కారణమని భావిస్తున్న నేపథ్యంలో మారియా బదిలీపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అవన్నీ ఊహాగానాలేనని, సాధారణ ప్రమోషన్లలో భాగంగానే మారియా డీజీగా నియమితులయ్యారని ముంబయి పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

 

17:30 - September 8, 2015

ముంబయి : స్టాక్ మార్కెట్ మరోసారి పుంజుకుంది. స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. దేశీయంగా సెంటిమెంట్ పెరగడంతో.. సెన్సెక్స్ మళ్లీ 25వేల ఎగువకు చేరింది. ఈ సూచీ ఇవాళ 424 పాయింట్ల లాభంతో 25వేల 318 వద్ద ముగిసింది. నిఫ్టి 129పాయింట్లు పెరిగి... 7వేల 688 వద్ద క్లోజైంది. మిడ్ సెషన్ వరకు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న మార్కెట్... యూరప్ మార్కెట్లు పాజిటివ్ గా ఓపెన్ కావడంతో.. సెంటిమెంట్ పెరిగింది. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు డిమాండ్ పెరిగింది. నిఫ్టిలో ఎస్ బ్యాంక్ అత్యధికంగా 7శాతం పెరిగింది. గెయిల్, టాటా స్టీల్, భెల్, యాక్సిస్ బ్యాంక్ 5శాతానికి పైగా లాభపడ్డాయి.

 

17:26 - September 8, 2015

ముంబై : 'బజరంగి భాయిజాన్' చిత్రం చూసే ఉంటారు కదా..చిత్రంలో 'మున్ని' పాత్రధారిగా 'హర్షాలి మల్హోత్ర' అందరీ మనస్సులోనూ స్థానం సంపాదించుకుంది. కేవలం హావాభావాలతో అందర్నీ ఆకట్టుకుంది. తన నటనకు గాను 15వ భారతీయ టెలివిజన్ అకాడమీ అవార్డును గెలుచుకుంది. ముంబైలో ఇటీవల జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో 'హర్షాలి' ఉత్తమ బాలనటి అవార్డును అందుకుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన 'కబీర్ ఖాన్'కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్ర దర్శకుడిగా అవార్డు లభించింది. 'సల్మాన్ ఖాన్', 'కరీనా కపూర్', 'నవాజుద్దీన్ సిద్ధిఖి', 'హర్షాలి మల్హోత్ర' ప్రధాన తారగణంగా 'బజరంగి భాయిజాన్' చిత్రం తెరకెక్కింది. విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. అక్టోబర్ 18న ఈ అవార్డుల కార్యక్రమం 'కలర్స్ ఛానెల్' లో ప్రసారం కానుంది. 

17:24 - September 8, 2015

ముంబయి : స్టాక్ మార్కెట్ మరోసారి పుంజుకుంది. దేశీయంగా సెంటిమెంట్ పెరగడంతో.. సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా పెరిగింది. యూరప్ మార్కెట్లు పాజిటివ్ గా ఓపెన్ కావడంతో.. దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. దీంతో మిడ్ సెషన్ నుంచి ట్రేడింగ్ పుంజుకుంది. సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా లాభంతో 25వేల మార్క్ దాటింది. అటు నిఫ్టి 180 పాయింట్లకు పైగా పెరిగింది. నిఫ్టిలో ఎస్ బ్యాంక్, గెయిల్, టాటా స్టీల్, భెల్, బ్యాంక్ ఆఫ్ బరోడా 5శాతానికి పైగా పెరిగాయి.

 

ఏపీ, తెలంగాణ సీఎస్ ల భేటీ..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కృష్ణారావు, రాజీవ్ శర్మలు భేటీ అయ్యారు. ఉద్యోగుల విభజన, 9,10 షెడ్యూల్ లో ఉన్న సంస్థల విభజన తదితర అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. 

పోలీస్ స్టేషన్ లో బెయిల్ విధానానికి స్వస్తి..

ఢిల్లీ : పోలీస్ స్టేషన్ లలో బెయిల్ ఇచ్చే విధానానికి కేంద్రం ముగింపు పలికింది. ఇందుకోసం సీఆర్ పీసీ 41 ఎకు కేంద్ర న్యాయశాఖ సవరణ చేసింది. ఇకపై బెయిల్ కావాలంటే నిందితులు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. 

17:11 - September 8, 2015

ఢిల్లీ : మోడీ పాలనలో ఆర్థిక ప్రగతి మందగించిందని సిడబ్ల్యుసి అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. ఢిల్లీలో జరగుతున్న సిడబ్ల్యుసి సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిందన్నారు. మరో వైపు సిడబ్ల్యుసి అధ్యక్షురాలిగా సోనియాగాంధీ గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తూ సిడబ్ల్యుసి తీర్మానం చేసింది.

 

17:07 - September 8, 2015

మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రాంచరణ్ తేజ' ఈయన నటించిన చిత్రాలు కొన్ని విజయవంతం కాగా మరికొన్ని ఆయనకు పేరు తెచ్చి పెట్టాయి. తండ్రి ఇమేజ్ ను ఏమాత్రం వాడుకోకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందాడు 'చెర్రీ'. శ్రీనువైట్ల దర్శకత్వంలో 'బ్రూస్ లీ' చిత్రంలో 'చెర్రీ' నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునలు ప్రత్యేక పాత్రలలో కనబడుతారని టాక్. 'పవర్ స్టార్' పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని టాక్స్ వినిపించాయి. తాజాగా సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ సీన్ కి ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని భావించాడట శ్రీనువైట్ల. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర ఈ విషయం చెప్పి, వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా కోరాడట. ఇందుకు ఎన్టీఆర్ ఏ మాత్రం వెనుకాడకుండా యస్ చెప్పేసాడని టాక్. ఎన్ని ప్రత్యేకతలున్నాయో సినిమా విడుదలయితే కాని తెలియదు.

16:55 - September 8, 2015

నెల్లూరు : జిల్లాలోని తడ మండలం మాంబట్టులో విషాదం నెలకొంది. ఇండస్ కాఫీ కంపెనీలో ప్రమాదవశాత్తు నలుగురు కార్మికులు బాయిలర్ లో పడ్డారు. వీరిలో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించరారు. మృతులు ఈశ్వర్, రవి, రవీంద్రలుగా గుర్తించారు. వీరు అవివాహితులు. వీరి కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

 

16:43 - September 8, 2015

విజయవాడ : రైతుల భూములను కార్పొరేట్లపరం చేసేందుకు చంద్రబాబు సర్కారు యత్నిస్తోందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు ఆరోపించారు. రాజధాని పేరుతో ఇప్పటికే అన్నదాతల నుంచి వేలాది ఎకరాలు సేకరించారని పేర్కొన్నారు. కాలం చెల్లుతోన్న ఆర్డినెన్స్ పేరుతో బందరు పోర్టు భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారని మండిపడ్డారు. ఏపీని కార్పొరేట్ల చేతుల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరులో పోర్టుకు తాము వ్యతిరేకం కాదని... రైతులను ఒప్పించి భూమి సేకరించాలని సూచించారు. బెదిరించి భూముల్ని లాక్కోవడం సరికాదని హితవుపలికారు. భూసేకరణ ఆర్డినెన్స్ కాలం చెల్లుతోందన్నారు. ఆర్డినెన్స్ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. తర్వాతి రోజు పూలింగ్ అమలు చేస్తామంటున్నారని చెప్పారు. ఫారెస్టు, ప్రభుత్వ భూములకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

16:37 - September 8, 2015

విజయవాడ : మచిలీపట్నం పోర్టు ద్వారా సుమారు లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని ఎంపీ కొనకళ్ల నారాయణ చెప్పారు. పోర్టు నిర్మాణం జరిగితేనే....ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని కొనకళ్ల ప్రతిపక్షాలను కోరారు. గతంలో పోర్టు పేరు చెప్పి ఓట్లు దండుకున్నారని కాంగ్రెస్‌ను విమర్శించారు.

 

16:33 - September 8, 2015

విజయవాడ : మచిలీపట్నం పోర్టుకు భూసేకరణ ద్వారా భూమి సేకరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. మెగాసిటీ నిర్మించి రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని చెప్పారు. పోర్టు నిర్మాణంపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు.

 

16:33 - September 8, 2015

వీడియో గేమ్..చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ గేమ్ లను ఆడుతుంటారు. సెల్ ఫోన్ లో కూడా గేమ్స్ ను డౌన్ లౌడ్ చేసుకుంటుంటారు. తీరికగా ఉన్న సమయంలో కొంతమంది వీటిని ఆడుతూ టైం పాస్ చేస్తుంటారు. మరికొంతమంది అయితే అదే పనిగా ఆడుతుంటారు. ఇలా ఆడుతున్న వారికి ఒక హెచ్చరిక. అవును. ఓ వ్యక్తి వీడియో గేమ్ ఆడి ప్రాణాలు కోల్పోయాడు. ఒకటి, రెండు కాదు ఏకంగా 22 రోజుల పాటు ఏకధాటిగా వీడియో గేమ్ ఆడి అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ ఘటనరష్యాలో చోటు చేసుకుంది.
బాష్కోరొస్తాన్ రిపబ్లిక్ లోని ఉల్చాయ్ కి చెందిన 23 ఏళ్ల రుస్తాం కాలు విరగడంతో గత నెల 8 నుంచి ఇంటికే పరిమితమయ్యాడు. అయితే బెడ్ రెస్ట్ తో అతడికి బాగా బోర్ కొట్టింది. ఈ క్రమంలో రుస్తా కన్ను ఆన్ లైన్ వీడియో గేమ్స్ పై పడింది. వెంటనే ఆన్ లైన్ లో డిఫెన్స్ ఆఫ్ ది ఏన్షియంట్స్ గేమ్ ను సెలెక్ట్ చేసుకుని విపరీతంగా ఆడేశాడు. చివరకు తిండి, నిద్ర తప్పిస్తే మిగతా సమయమంతా వీడియో ఆడే వాడు. ఈ విషయాన్ని రుస్తా పేరెంట్స్ వాళ్ల వాళ్ల జాబ్ టెన్షన్ లో పడిపోయి అస్సలు పట్టించుకోలేదు. అయితే గత నెల 30న రుస్తా గదిలోంచి కీ బోర్డు చప్పుడు వినిపించలేదు. డౌట్ వచ్చిన పేరెంట్స్ కు లోనికెళ్లి చూడగా అతడు స్పృహ తప్పి కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రక్తం గడ్డకట్టడం వల్ల రుస్తాం చనిపోయి ఉంటాడని వైద్యులు భావిస్తున్నారు. రుస్తాం మృతి తల్లిదండ్రులకు గట్టి హెచ్చరిక అని బాలల హక్కుల అధికారులు చెబుతున్నారు. ఇలా వీడియో గేమ్స్ ఆడుతూ మృతి చెందిన ఘటన ఈ ఏడాది ఇది రెండోది. మార్చిలో చైనాలో ఓ 23 ఏళ్ల యువకుడు ఇంటర్నెట్ కఫేలో 19 గంటలు ఏకధాటిగా వీడియో గేమ్ ఆడి చనిపోయిన సంగతి తెలిసిందే. 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

ముంబై : భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. 424 పాయింట్ల లాభంతో 25,318వద్ద సెన్సెక్స్ ముగియగా, నిఫ్టీ 129 పాయింట్లు లాభపడి 7,688 వద్ద ముగిసింది. నిప్టీలో ఏడు శాతం ఎస్ బ్యాంక్ పెరిగింది. బ్యాకింగ్ షేర్లు కళకళలాడాయి. 

నెల్లూరు విషాద ఘటనపై మంత్రి నారాయణ విచారం..

నెల్లూరు : తడ మండలం మాంబట్టు పారిశ్రామిక వాడలో జరిగిన దుర్గటనపై ఏపీ మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. ఇండన్ కాఫీ పరిశ్రమలో ఈ రోజు జరిగిన దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

 

కాశ్మీర్ అంశం ఉంటేనే భారత్ తో చర్చలు - సర్తాజ్..

పాకిస్తాన్ : కాశ్మీర్ అంశం అజెండాలో ఉంటేనే భారత్ తో సమావేశాలు జరుపుతామని పాకిస్తాన్ జాతీయ భద్రత సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. 

టీచర్ కొట్టిందని విద్యార్థి ఆత్మహత్య..

ముంబై : బాంద్రాలో విషాదం చోటు చేసుకుంది. అందరి ముందు టీచర్ కొట్టిందన్న బాధతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

సోనియాపై బీజేపీ నేతల ఫిర్యాదు..

కడప : పీఎస్ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దశ, దిశ లేకుండా ఆంధ్రపదేశ్ ను అడ్డగోలుగా విభజించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

15:32 - September 8, 2015

కరీంనగర్ : అన్నయ్యను స్కూల్‌కు పంపేందుకు తల్లితో కలిసి వచ్చిన చిన్నారి అదే బస్సు కిందపడి మృతి చెందింది. ఈ విషాధ ఘటన కరీంనగర్ జిల్లా ఓదెలలో జరిగింది. సరస్వతి..అనే మహిళ తన కొడుకును స్కూల్ బస్ ఎక్కించేందుకు కూతురు హాసినితో కలిసి బస్టాండ్‌కు వచ్చింది. బాబును బస్ ఎక్కించాక తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పాపపై నుంచి బస్సు వెనక టైరు దూసుకెళ్లింది. దీంతో రెండేళ్ల ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు మృతితో తల్లి గుండెలవిసేలా విలపించింది. చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

10న నల్గొండలో భారీ ర్యాలీ - టీఎన్ఎస్ఎఫ్..

నల్గొండ : విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల విడుదల కోసం ఈనెల 10న నల్గొండలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు టీఎన్ఎస్ఎఫ్ వెల్లడించింది.

అక్రమ నల్లా కనెక్షన్లు క్రమబద్ధీకరించుకోవాలి - తలసాని..

హైదరాబాద్ : నగరంలో 15 రోజుల్లోగా అక్రమ నల్లా కనెక్షన్లు క్రమబద్దీకరించుకోవాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం జలమండలి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాగునీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటామని తలసాని తెలిపారు. 

ప్రాణహిత ప్రాజెక్టు నుండి రంగారెడ్డిని ఎందుకు తప్పిస్తున్నారు - సబిత..

హైదరాబాద్ : ప్రాణహిత ప్రాజెక్టు నుండి రంగారెడ్డిని ఎందుకు తప్పిస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. గజ్వేల్ వరకు 620 కిలోమీటర్లు వస్తున్న ప్రాణహితను 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డికి ఎందుకివ్వరని నిలదీశారు. ప్రాజెక్టు డిజైన్ ను మార్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, సబిత, సిద్ధిపేట, గజ్వేల్ చెరువులను నింపుకోవడానికే రంగారెడ్డి జిల్లాను బలి చేస్తున్నారని మండిపడ్డారు. 

రూ.150కి ఇంటర్నెట్..కేబుల్ కనెక్షన్లు - చంద్రబాబు..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో ఇంటింటికి కేబుల్, ఇంటర్నెట్ కనెక్షన్లను నెలకు రూ.150కే అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో స్త్రీ నిధి మొదటి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 13 జిల్లాల డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు తరలివచ్చారు. సెకనకు 15 మెగాబైట్ల వేగంతో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందని, టెలిఫోన్ కనెక్షన్ కూడా ఇందులో లభిస్తుందని చెప్పారు.

 

వెస్ట్ బెంగాల్ లో కాంగ్రెస్ నిరసనలు..

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. 

ట్రాయ్ ఛైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం..

ఢిల్లీ : కాంగ్రెస్ ప్రతినిధి బృందం ట్రాయ్ ఛైర్మన్ తో సమావేశమయ్యారు. ఓవర్ కాల్ డ్రాప్ ఇష్యూపై చర్చించారు. 

మోడీ సర్కార్ పై సోనియా ఫైర్..

ఢిల్లీ : మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడారు. మోడీ ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ నియంత్రిస్తోందని, ఆర్ఎస్ఎస్ అజెండా ఏమిటో అందరికీ తెలిసిందేనన్నారు. 

విజయవాడలో స్త్రీ నిధి సర్వసభ్య సమావేశం..

విజయవాడ : స్త్రీ నిధి మొదటి సర్వసభ్య సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాణ్యమైన వస్తువులు తయారు చేస్తే వాటిని ఎక్కడైఆన అమ్ముకోవచ్చని, మార్కెట్ లో బ్రాండెడ్ వస్తువులు చాలా పెరిగాయన్నారు. వాటిని తట్టుకుని నిలబడేలా డ్వాక్రా మహిళలు వస్తువులు తయారు చేయాలని సూచించారు. 

కేంద్రం మోసం చేసింది - మధు..

విజయవాడ : ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. నగరంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. విద్య, వైద్యం, భూములను కార్పొరేట్ల పరం చేస్తున్న విధానాలపై నిరంతర పోరాటం చేస్తామని మధు పేర్కొన్నారు. దుర్భిక్ష పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం ఘోరమన్నారు. నిత్యావసర ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని, ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 

14:18 - September 8, 2015

కర్నూలు : కామాంధులు రెచ్చిపోతునే ఉన్నారు. ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. బాలికలని చూడకుండా మృగాళ్లు రెచ్చిపోతున్నారు. జిల్లాలో కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు మైనర్ బాలికలపై ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతపురానికి చెందిన వినోద్, తిరుమలేష్ లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చికిత్స నిమిత్తం బాలికలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

14:14 - September 8, 2015

విజయవాడ : కృష్ణా జిల్లాలోని చాట్రాయి మండలం జ్వరాలతో మూలుగుతోంది. విష జ్వరాలు ప్రబలడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికార గణం మొద్దు నిద్ర పోతోంది. జనార్ధనవనం ఎస్సీ కాలనీలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ప్రబలాయి. దీనితో కాలనీలో ఉన్న ప్రతి ఇంట్లో ఒకరు మంచాన పడుతున్నారు. దీనితో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలుతున్నారు. కానీ అక్కడ ఎలాంటి వైద్య చికిత్స అందడం లేదని సమాచారం. దీనితో కాలనీ వాసులు ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. దీనిని సాకుగా తీసుకున్న పలు ప్రైవేటు ఆసుపత్రులు అందినకాడికి దోచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే అధికారులు స్పందించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. 

ఇద్దరు విద్యార్థులపై అత్యాచారం..

కర్నూలు : జిల్లాలోకల్లూరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

చాట్రాయి మండలంలో విష జ్వరాలు..

విజయవాడ : కృష్ణా జిల్లాలోని చాట్రాయి మండలం జనార్ధనవనం ఎస్సీ కాలనీలో విష జ్వరాలు ప్రబలినాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో కాలనీ వాసులు బాధ పడుతున్నారు. చికిత్స కోసం పలువురు ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. 

బాయిలర్ లో పడిన ఆరుగురు కార్మికులు..

నెల్లూరు : తడ (మం) మాంబట్టులో విషాదం చోటు చేసుకుంది. ఇండస్ కాఫీ కంపెనీలో ప్రమాదవశాత్తు బాయిలర్ లో ఆరుగురు కార్మికులు పడిపోయారు. ముగ్గురు కార్మికులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

సోనియా పదవి కాలం పొడిగింపు..

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పదవి కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. నేడు సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఇందులో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలను కూడా ఏడాది పాటు వాయిదా వేశారు. పార్టీ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు 50 శాతం రిజర్వు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 

13:47 - September 8, 2015

హైదరాబాద్ : వరంగల్‌ లోక్‌సభ, నారాయణ్‌ఖేడ్‌ అసెంబ్లీ స్థానాల్లో వామపక్ష అభ్యర్థిని పోటీలో నిలబెడుతున్నామని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థిగా గద్దర్‌ పేరును ఖరారు చేశామని, ఆ దిశగా గద్ధర్‌తో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఈనెల 10న పాలకుర్తిలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించనున్నామన్నారు.

13:46 - September 8, 2015

హైద్రాబాద్ : రాంనగర్‌లో దారుణం జరిగింది. భర్త కళ్లెదుటే..భార్య ఆత్మహత్య చేసుకుంది. 2004లో రాంనగర్‌కు చెందిన వినోద్‌తో... రాజమండ్రికి చెందిన శ్రీలక్ష్మికి పెళ్లి జరిగింది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. వినోద్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఏడాది క్రితం కిడ్నీ చెడిపోయి...అతని కాళ్లు, చేతులు పడిపోయాయి. దీంతో కుటుంబ భారమంతా...భార్యపై పడింది. ఇళ్లల్లో పాచి పని చేస్తున్నా...ఆర్థిక సమస్య తప్పలేదు. భర్త, ఇద్దరు పిల్లలను పోషించలేక...చివరకు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. భర్త కళ్లెదుటే...కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. పక్షవాతంతో వినోద్‌ ఎటూ కదలకుండా ఉండిపోయాడు. రాంనగర్‌లో జరిగిన ఈ ఘటన అందర్నీ కలిచివేసింది.

 

13:44 - September 8, 2015

హైదరాబాద్‌ : మల్కాజ్‌గిరిలో దారుణ హత్య జరిగింది. పీవీఎన్‌ కాలనీలో నివసించే శామ్యూల్‌ను అతని స్నేహితుడు చంద్రశేఖర్‌ కత్తితో పొడిచి చంపాడు. వీరిద్దరూ తాగిన మైకంలో గొడవపడ్డట్లు తెలుస్తోంది. నిందితుడు చంద్రశేఖర్‌ మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

13:43 - September 8, 2015

విజయనగరం : భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమైంది. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. 12 గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పంచాయతీ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నారు.

13:42 - September 8, 2015

కడప/ చిత్తూరు : కనీస వేతనం 15 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చిత్తూరు కలెక్టరేట్ ఎదుట వీఆర్‌ఏలు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ పోరును మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కడపలో...

010 పద్దు కింద జీతాలు ఇవ్వాలని, కనీస వేతనం 15వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... గ్రామసేవకులు పెద్ద ఎత్తున కడప కలెక్టరేట్‌ను ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ... కలెక్టరేట్‌లోకి దూసుకువెళ్లే యత్నం చేశారు. అయితే పోలీసులు జాయింట్ కలెక్టర్‌ను కలిసేందుకు అంగీకరించడంతో...ఆయకు వినతిపత్రం అందించారు. సమస్యల పరిష్కారానికి ఎన్నో పోరాటాలు చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించటంలేదని గ్రామసేవకులు ఆవేదన వ్యక్తం చేశారు. 

13:40 - September 8, 2015

హైదరాబాద్ : హత్యలు..అత్యాచారాలు...కిడ్నాపులు..మోసాలు...ఇవి చాలవన్నట్టు తెలుగు రాష్ర్టాల్లో మరో నేరం పుట్టుకొచ్చింది. పుట్టిందే తడువు అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. కొత్తగా వచ్చిన ఫ్యాషన్‌ను ఫాలో అయినట్టు సిరంజి దాడులను ఒంటపట్టించుకుంటున్నారు సైకోగాళ్లు. బైకుపై ఇద్దరు వ్యక్తులు వెళ్తే చాలు రోడ్డున పోయే జనం భయపడేంతలా హడలెత్తిస్తున్నారు.

గుండు సూదిని చూసినా ఇప్పుడు భయమే....

కత్తులు...కటారాలు..తుపాకులు కాదు గుండు సూదిని చూసినా ఇప్పుడు భయమే. అంతలా సిరింజి దాడులు జనాన్ని వణికిస్తున్నాయి. ఎప్పుడు..ఎవరు..ఏ క్షణాన ఏ సూదితో పొడిచి వెళ్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ రోడ్డుపై నడుస్తున్నారు. బైక్‌ రయ్‌మని దూసుకొస్తే చాలు మహిళలు, పిల్లలు పరుగులు పెడుతున్నారు.

ఇరు రాష్ర్టాలను వణికిస్తున్న సైకో దాడులు......

మూడు రోజుల క్రితం వరకు ఉభయగోదావరి జిల్లాలను వణికించిన సిరంజి దాడులు ఇప్పుడు ఇరు రాష్ర్టాలను వణికిస్తున్నాయి. ఇప్పటి వరకు సూదిగాడు ఒక్కడే అనుకున్నారంతా. వరుస దాడులను బట్టి తెలుగు రాష్ర్టాల్లో సైకో సూదిగాళ్లు పుట్టుకొస్తుండటం ఇటు ప్రజలను, అటు పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది.

పోలీసులకు చిక్కని సైకో సూదిగాడు.....

ఏలూరులో మొదలైన సిరంజి దాడులు ఇప్పుడు ఇరు రాష్ర్టాలకు పాకాయి. సిరంజి సైకోను పట్టుకునేందుకు ఉభయగోదావరి జిల్లాల పోలీసులు వేసిన వలలు, గీసిన ఊహాచిత్రాలు తూచ్‌మని తుడుచుపెట్టుకుపోయాయి. కొత్త క్రైంకు నాంధిపలికిన సైకో దొరకకపోగా కొత్త సైకోలు పుట్టుకొచ్చారు. సైకో వారసత్వాన్ని అందిపుచ్చుకొని క్షణక్షణం చెలరేగిపోతున్నారు సూదిగాళ్లు. ఇదిగో సిరంజి...అదిగో సైకో అన్నట్టుగా మారిపోయింది క్రైం.

మూడు వారాలుగా ఇరు రాష్ర్టాల్లో సిరంజి దాడులు

మూడు వారాలుగా సిరంజి ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ఏలూరు, హైదరాబాద్‌, కోదాడ, నల్లగొండ ఇలా రోజుకో చోట రోజుకో సూదిగాడు పుట్టుకొస్తున్నాడు. మెరుపు వేగంతో బైక్‌పై వస్తూ.. కరెంటు షాక్‌ ఇచ్చినట్లు సూది గుచ్చి పారిపోతున్నారు. ఇప్పటి వరకు సిరంజి దాడి బాధితుల సంఖ్య 30కి చేరుకుంది. తొలుత మహిళలపై జరిగిన ఈ దాడులు ఆ తరువాత పిల్లలపై, ఆ తరువాత యువకులపై కూడా జరిగాయి. సైకో తీరుతో జనం బయటకు అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు.

ఏ ఒక్క సైకోను పట్టుకోని పోలీసులు....

ఇంత వరకు జరిగిన సిరంజి దాడుల్లో ఏ ఒక్క సైకోను పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోలేదు. తొలుత మహిళలనే టార్గెట్ చేసిన సైకో ఆ తరువాత కనిపించిన వాళ్లందరిపై దాడి చేయడానికి గల కారణాలేంటో కూడా పోలీసులకు అంతుచిక్కడం లేదు. సైకో సంగతి పక్కకు పెడితే కొత్తగా పుట్టిన సిరంజి దాడుల కల్చర్‌కు ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు.

13:34 - September 8, 2015

హైదరాబాద్ : తెలంగాణలో వందలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క... బాధిత రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు..

13:31 - September 8, 2015

హైదరాబాద్ : ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. విజయవాడలోని ఎ1 కన్వెన్షన్ సెంటర్‌లో...6వ దశ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. విద్యతోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తమ తొమ్మిదేళ్ల పాలనలో ఏపీ అక్షరాస్యతను 17శాతం పెంచినట్లు చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ హయాంలో అక్షరాస్యతా శాతంలో పెరుగుదల తగ్గిందని విమర్శించారు.

 

13:29 - September 8, 2015

హైదరాబాద్ : తెలంగాణలో కరెంట్‌ కష్టాలు మరింతగా పెరగనున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీళ్లు అడుగంటడంతో విద్యుత్‌ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం థర్మల్‌ విద్యుత్‌పైనే ఆధారపడుతున్నారు. రోజుకు 140 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉండగా.. 43 మిలియన్‌ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 97 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరత ఉంది. పొరుగు రాష్ట్రాలు, ప్రైవేటు కంపెనీల నుంచి విద్యుత్‌ కొనుగోలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి జలవిద్యుత్‌ కేంద్రాల ద్వారా 1800 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా.. ఈసారి నీళ్లు లేకపోవడంతో పూర్తిగా ఉత్పత్తిని నిలిపివేశారు.

 

అధికారులతో సమీక్ష నిర్వహించిన టి.మంత్రులు..

కరీంనగర్ : జిల్లాలోని కలెక్టరేట్‌లో రైతుల ఆత్మహత్యలపై మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. 

రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కడియం..

వరంగల్ : సంగెం మండలం కాట్రపల్లిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నిరంతర విద్యుత్ అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు.

ముగిసిన సీబడ్ల్యూసీ సమావేశం..

ఢిల్లీ : సోనియా అధ్యక్షతలో జరిగిన సీబడ్ల్యూసీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి కార్యచరణనను రూపొందించినట్లు తెలుస్తోంది. 

జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత..

హైదరాబాద్ : శ్రీశైలం, నాగార్జున సాగర్ లో నీళ్లు అడుగండడంతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని నిలిపివేశారు. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపైనే భారం పడనుంది. రోజుకు 140 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా 43 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 97 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడింది. పొరుగు రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది జల విద్యుత్ కేంద్రంలో 1800 మి.యూ. ఉత్పత్తి అయ్యింది. 

12:50 - September 8, 2015

హైదరాబాద్ : స్వాతంత్ర్యం వచ్చి అరవై ఏళ్లయింది. ఇంకా... మూఢనమ్మకాలు తాండవం చేస్తున్నాయి. దారిద్యరేఖలు దేశమంతటా విస్తరిస్తున్నాయి. పేదరికం వెక్కిరిస్తోంది. అభివృద్ధి అడుగంటింది. వీటన్నిటికి అనేక కారణాలున్నాయి. ప్రధాన కారణల్లో ఒకటి నిరక్షరాస్యత. అక్షరాస్యతలో ఇంకా మనం వెనకంజలోనే ఉన్నాం. ప్రపంచ దేశాలతో పోటీపడలేక పోతున్నాం. ప్రపంచ అక్షరాసత్య దినోత్సవ సందర్భంగా... దేశంలో అక్షరాస్యత పరిస్థితిపై టెన్‌టీవీ స్పెషల్ రిపోర్ట్.

విద్య...అందని ద్రాక్షగానే....

ఏటా స్వాతంత్ర్య సంబరాలు చేసుకుంటున్నాం. కాని ఇప్పటికీ అందరికీ విద్య...అందని ద్రాక్షగానే మిగిలింది. పేదరికంతో కొందరు. ప్రభుత్వ ఫలాలు అందక మరికొందరు. బడిఈడు పిల్లలు బడికి వెళ్లటం లేదు. బాలకార్మికులుగా మారి....అతిభారంగా బతుకుబండిని లాగుతున్నారు. ఫలితంగా అక్షరాసత్యలో ఏటేటా వెనకడుతూనే ఉన్నాం. నాటి నిరక్షరాస్యత.. తరతరాలకు వారసత్వంగా వస్తోంది.

ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం......

ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. యువతకు ప్రాథమిక నైపుణ్యాలు అందించి..వారిలో జ్ఞానాన్ని పెంచి.... జీవితంలో నిలదొక్కుకునే సామర్థ్యాన్ని ఇవ్వాలన్నది యునెస్కో భావన. కానీ మన దేశంలో మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు... అక్షరాస్యత సాధనలో చాలా వెనుకబడి ఉన్నాయి.

అగ్రస్థానంలో కేరళ, లక్షద్వీప్, మిజోరాం.....

2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యతలో కేరళ, లక్షద్వీప్, మిజోరాం అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీ 30వ స్థానంలో ఉంటే, తెలంగాణ 32వ స్థానంలో ఉన్నాయి. జార్ఖండ్, రాజస్థాన్‌, అరుణాచలప్రదేశ్‌, బిహార్ మాత్రమే మనకంటే వెనకంజలో ఉన్నాయి. ముఖ్యంగా 7 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లలందరూ పాఠశాలల్లో ఉంటే...అధిక అక్షరాస్యత సాధ్యమవుతుంది. ఇక 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్నవారు...దేశాభివృద్ధికి కీలకమైన మానవ వనరులు. వీరి విషయంలోనూ తెలుగు రాష్ట్రాలు 80 శాతం అక్షరాస్యత సాధించలేక పోయాయి.

ఏపీలో విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం లాస్ట్....

ఇక ఏపీలో చూస్తే విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాలు అక్షరాస్యతలో వెనకబడిఉన్నాయి. తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలు... రాష్ట్ర అక్షరాస్యత స్థాయి కంటే ఎక్కువ అక్షరాస్యతను సాధించాయి. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు జాతీయస్థాయి కంటే ఎక్కువ అక్షరాస్యతను సాధించాయి. మిగిలిన జిల్లాల్లో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు చదివే పిల్లల్లో నైపుణ్యాల స్థాయి దారుణంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.

పాఠశాల విద్యను తప్పనిసరి చేస్తేనే...

పాలకులు చిత్తశుద్ధితో పాఠశాల విద్యను తప్పనిసరి చేయకపోవటం లేదు. విద్యకు కనీసం 6 శాతం నిధులు కేటాయించటం లేదు. ప్రభుత్వాలు విద్యవ్యవస్థపై దృష్టిపెట్టి...పాఠశాల విద్యను తప్పనిసరి చేస్తే అక్షరాస్యత శాతం పెరుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

12:46 - September 8, 2015

హైదరాబాద్ : ధనికుల కోసమే స్మార్ట్ సిటీస్‌ను కేంద్రం నిర్మించాలనుకుంటోందని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆయన మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ...స్మార్ట్‌ సిటీలు సామాన్యులకు అందనంత దూరంలో ఉంటాయని, పేదలను పట్టణ, నగర జీవనానికి దూరం చేసేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. స్మార్ట్‌ సిటీల కోసం విడుదలైన నిధులు కూడా కేంద్రం నుంచి రాలేదని, ప్రపంచబ్యాంకు నుంచి వచ్చాయని చెప్పారు. బ్యాంకు షరతులకు తలొగ్గి స్మార్ట్‌ సిటీల్లో ఛార్జీల మోత మోగబోతోందని అన్నారు. ఈ పరిణామం పేదలను నగర జీవనానికి దూరం చేయబోతోందని, దీన్నిసీపీఎం ఖండిస్తోందని చెప్పారు.

12:45 - September 8, 2015

హైదరాబాద్ : చైనాలో కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. పెట్టుబడులే లక్ష్యంగా చైనాలో పర్యటిస్తున్న కేసీఆర్ డేనియల్‌ నగరంలో భారత రాయబారి అశోక్‌ కాంతాతో సమావేశమయ్యారు. ఈ భేటీలో నూతన పారిశ్రామిక విధానంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేసీఆర్‌తో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ కేశవరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.  

12:43 - September 8, 2015

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్‌శర్మ, ఐవైఆర్‌ కృష్ణారావు సమావేశమయ్యారు. ఉద్యోగుల విభజన అంశాలతోపాటు విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని అంశాలపై చర్చించారు. ఇక కమల్‌నాథన్‌ కమిటీ ఉద్యోగుల విభజనపై చేసిన కసరత్తు దాదాపు 70 శాతం పూర్తైన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో సూపర్‌ న్యూమరీ పోస్టుల క్రియేషన్‌ చేసుకునే అంశంపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విద్యుత్‌ సంస్థలో రిలీవైన ఉద్యోగుల అంశంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయ వివక్ష – తమ్మినేని..

హైదరాబాద్ : స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయ వివక్ష ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. స్మార్ట్ సిటీల్లో ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అమలవుతాయని, రైతు ఆత్మహత్యలు నానాటికి పెరుగుతున్నా స్పందన లేదన్నారు. తెలంగాణలో 1300 మంది రైతులు చనిపోయారని, రైతు సమస్యలపై స్పందించకుంటే ప్రత్యక్ష ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు విధి విధానాలు రూపొందించాలని, బీసీ ఉప ప్రణాళిక అమలుకు చట్టం చేయాలని సూచించారు. ముస్లింలకు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యతో జ్ఞానం..ఆత్మవిశ్వాసం పెరుగుతుంది - బాబు..

విజయవాడ : విద్యతో ప్రపంచం జ్ఞానం వస్తుందని, ఆత్మ విశ్వాసం పెరుగుతుందని బాబు తెలిపారు. ప్రపంచంలో చదువుకోని వారి సంఖ్యలో 50 శాతం మంది మన దేశంలో ఉన్నారని పేర్కొన్నారు. గతంలో టిడిపి పాలనలో 17 శాతం అక్షరాస్యత సాధించడం జరిగిందని, అక్షరాస్యతలో 31వ స్థానంలో ఉన్నామని తెలిపారు. 

అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమంలో సీఎం బాబు..

విజయవాడ : ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. విజయవాలోని ఏ 1 కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.

12:02 - September 8, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్‌ పథకం ప్రతిష్టకు బీటలు వారాయి.నిండా 3నెలలు కూడా కాక ముందే వాటర్‌ ఫైలాన్‌ కుంగిపోయింది. కోటి 95 లక్షల ఖర్చుతో మునుగోడులో ఏర్పాటు చేసిన పైలాన్‌కు పగుళ్లు వచ్చాయి. తరతరాలకు చిహ్నంగా ఉండాల్సిన పైలాన్‌ ప్రారంభ దశలోనే ఇలా అయిపోవడం పట్ల అనేక విమర్శలొస్తున్నాయి.

కుంగిపోయిన వాటర్‌ గ్రిడ్‌ ఫైలాన్‌.....

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వాటర్‌గ్రిడ్‌కు సంబంధించిన ఫైలాన్‌ ఇది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించిన ఫైలాన్‌ కుంగిపోయింది. ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించే పథకం ఫైలాన్‌కు ఆదిలోనే పగుళ్లు ఏర్పడ్డాయి.

ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించడం కోసం వాటర్‌ గ్రిడ్‌ ......

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ఆర్భాటంగా ఫైలాన్‌ను ప్రారంభించారు. తొమ్మిది జిల్లాల్లో 25 వేల ఆవాసప్రాంతాలకు, 69 పట్టణాలకు నల్లాల ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించడం కోసం వాటర్‌ గ్రిడ్‌ పథకం ప్రవేశపెట్టారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టేందుకు చౌటుప్పల్‌లో ఫైలాన్‌ను ఆవిష్కరించారు. కానీ, అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం కారణంగా ఫైలాన్‌కు మొదట్లోనే పగుళ్లు ఏర్పడ్డాయి.

కోటి 95 లక్షల ఖర్చుతో ఫైలాన్‌ నిర్మాణం....

కోటి 95 లక్షల ఖర్చుతో నిర్మించిన ఫైలాన్‌ కుంగిపోయింది. ఫైలాన్‌కు పగుళ్లు ఏర్పడడానికి.. దీని నిర్మాణంలో లోపమా..? లేక కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమా..? అనేదే అర్థం కావడం లేదు. అంత డబ్బు ఖర్చుపెట్టి కూడా నిర్మాణం సరిగా చేయక పోవడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. భావితరాలకు చిహ్నంగా ఉండాల్సిన ఫైలాన్‌ ప్రారంభ దశలోనే ఇలా అయిపోవడం పట్ల విపక్షాలు అధికార పార్టీపై దాడికి దిగుతున్నాయి. దీనిపై అధికార పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

రక్షణ బలగాల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలి - రాజ్ నాథ్..

హైదరాబాద్ : రక్షణ బలగాల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ పేర్కొన్నారు. హకీంపేటలో జరుగుతున్న నీసా పాసింగ్ ఔట్ పరేడ్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. సైబర్ క్రైమ్ ను ఎదుర్కొనేందుకు రక్షణ బలగాలను ఆధునీకరించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ విద్రోహ శక్తులను ఎదుర్కొనేందుకు రక్షణ బలగాలు సిద్థంగా ఉండాలని, ఎప్పటికప్పుడు టెక్నాలజీని మెరుగుపరచుకోవాలని సూచించారు. 

11:57 - September 8, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టి.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ పై ఉన్న ఆంక్షలను సడలించింది. నియోజకవర్గం కొడంగల్ దాటి ఎక్కడికైనా వెళ్లేందుకు కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. అయితే ప్రతి సోమవారం ఏసీబీ కార్యాలయంలో హాజరవ్వాలని రేవంత్ ను ఈ సందర్భంగా ఆదేశించింది. తాను ప్రజాప్రతినిధి అయినందున తరచూ రాజధాని హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంటుందని, త్వరలో తన కుమార్తె వివాహం ఉన్నందున పనులపై ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లాల్సి ఉంటుందని తెలుపుతూ రేవంత్ కోర్టులో పిటిషన్ వేశారు. దానిని విచారించిన కోర్టు బెయిల్ పై ఆంక్షలు సడలించింది.

కొనసాగుతున్న సిడబ్ల్యూసి సమావేశం..

ఢిల్లీ : సోనియా అధ్యక్షతనలో సిడబ్ల్యూసి సమావేశం కొనసాగుతోంది. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని..20న ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 

11:53 - September 8, 2015

హైదరాబాద్ : టూ వీలర్‌తోపాటు హెల్మెట్ తప్పనిసరిగా కొనాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.. ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆ తర్వాతే తప్పనిసరన్న నిబంధన పెట్టాలని ఆదేశించింది. ఇప్పటికిప్పుడు ఎందుకు ఆదేశాలిచ్చారని ప్రశ్నించిన హైకోర్టు

జీవోను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు లో పిటిషన్...

హైదరాబాద్‌లో హెల్మెట్ తప్పనిసరి జీవోను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగాయి.. హెల్మెట్ కంపల్సరీ అంటూ ఇప్పటికిప్పుడు ఎందుకు ఆదేశాలిచ్చారని కోర్టు తెలంగాణ రవాణా శాఖను ప్రశ్నించింది.. ఇన్నాళ్లు ఏం చేశారని అడిగింది.. దీనికి సమాధానమిచ్చిన రవాణాశాఖ... సుప్రింకోర్టు ఆదేశాల తర్వాత 14 నెలల్లో 92వేల 14వందల కేసులు నమోదు చేశామని తెలిపింది.. అయితే ఇంత సడన్‌గా హెల్మెట్ వాడాలంటే ఇబ్బందులుంటాయని... ఈ అంశంపై 15రోజులపాటు అవగాహన కల్పించిన ఆ తర్వాత అమలు చేయాలని ఆదేశించింది.. విచారణను 15రోజులపాటు వాయిదావేసింది..

11:50 - September 8, 2015

హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. హకీంపేటలోని నేషనల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకాడమీలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న 41వ బ్యాచ్‌కు చెందిన 459 మంది ఎస్‌ఐల గౌరవవందనం రాజ్‌నాథ్‌సింగ్‌ స్వీకరించారు.

చైనా రాయబారితో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చైనాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. మంగళవారం డేలియన్ నగరంలో పర్యటించిన కేసీఆర్ భారత రాయబారి అశోక్ కాంతాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక విధానంపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ఈసందర్భంగా కేసీఆర్ వివరించారు. 

మరిన్ని గ్రామాల దత్తత తీసుకుంటా - ప్రకాష్ రాజ్..

మహబూబ్ నగర్ : మరిన్ని పల్లెలను దత్తత తీసుకుంటానని సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. మంగళవారం జిల్లాలోని కొండారెడ్డి పల్లెలో పర్యటించారు. కొండారెడ్డి పల్లిని ఆయన దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవడం తనకు ఆనందాన్ని ఇచ్చారు. 

11:47 - September 8, 2015

హైదరాబాద్ : మళ్లీ స్వైన్‌ ఫ్లూ పంజా విసురుతోంది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలకు స్వైన్‌ ఫ్లూ ఉన్నట్లు డాక్టర్లు ధృవీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా స్వైన్‌ఫ్లూ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వాతావరణం చల్లబడటంతో మళ్లీ హెచ్ 1 ఎన్ 1 వైరస్‌ వ్యాపిస్తోంది. ఈ ఏడాది మొదట్లో స్వైన్‌ ప్లూ వ్యాపించడంతో తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో జనం మృత్యువాతపడ్డారు. 

రచయిత అమ్మంగి వేణుగోపాల్ కు కాళోజి తొలి స్మారక పురస్కారం..

హైదరాబాద్ : కాళోజి జయంతిని పురస్కరించుకుని ప్రధానం చేసే స్మారక పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. ప్రముఖ రచయిత, సాహితీ విమర్శకుడు అమ్మంగి వేణుగోపాల్ ను ఎంపిక చేశారు. ఈనెల 9వ తేదీన కాళోజి జయంతి నాడు నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కరాన్ని అందచేయనున్నారు. 

11:45 - September 8, 2015

విజయవాడ : ఏపీ రాజధాని బెజవాడలో గణేష్ ఉత్సవాలను భారీస్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలకు ధీటుగా బెజవాడ గణనాథుని ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 63 అడుగుల నాట్య మహాగణపతి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 11 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

డూండి గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో భారీ విగ్రహం.....

విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల ప్రాంగణంలో భారీ గణనాథుడు కొలువుదీరనున్నాడు. బెజవాడ డూండి గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో భారీ విగ్రహం తయారీకి శ్రీకారం చుట్టారు. అష్టలక్ష్మి, నాట్య మహాగణపతి భారీ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఖైరతాబాద్‌లో విగ్రహాన్ని తయారు చేసిన చెన్నైకు చెందిన శిల్పులే దీనిని తీర్చిదిద్దడం గమనార్హం.

30 టన్నుల కలప, 20 టన్నుల ఐరన్, 70 టన్నుల బంకమట్టి......

30 టన్నుల కలప, 20 టన్నుల ఐరన్, 70 టన్నుల బంకమట్టి, 20 టన్నుల కొబ్బరిపీచులతో 63 అడుగుల భారీ లంబోదరుడుని తయారు చేస్తున్నారు. కేవలం ప్రకృతిసిద్ధ రంగులతో 'ఎకో ఫ్రెండ్లీ'గా రూపొందిస్తున్నారు. శివలింగం నేపథ్యంతో నర్తించే భంగిమలో ఉన్న పార్వతీపుత్రుడి విగ్రహానికి అనుబంధంగా గోమాత, మృగరాజులతోపాటు ప్రధాన ప్రతిమలకు ఇరువైపులా ఒక్కొక్కవైపు నలుగురు చొప్పున అష్టలక్ష్మీలను ఏర్పాటు చేస్తున్నారు. 63 అడుగుల భారీ గణపతి చేతిలో 6,300 కేజీల మహాలడ్డూను ఏర్పాటు చేస్తుండటం మరో విశేషం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా బంక మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. విగ్రహం ప్రతిష్టించిన ప్రాంతంలోనే నిమజ్జనానికి చర్యలు తీసుకుంటున్నారు. నవాభిషేకాలతో అభిషేకించిన అనంతరం శుద్ధమైన మంచినీటితో మట్టి విగ్రహం కరిగిపోయేలా చేస్తారు.

దాదాపు 10 లక్షల మందికిపైగా .....

దాదాపు 10 లక్షల మందికిపైగా భక్తులు వస్తారనే అంచనాతో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్మేలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున గణేష్‌ ఉత్సవాల్లో పాల్గొననున్నారు.

 

11:41 - September 8, 2015

హైదరాబాద్ : అక్కడి అధ్యాపకులు పాఠశాల అభివృద్ధికి నడుం బిగించారు. సకల సదుపాయాలున్నప్పుడే మెరికల్లాంటి విద్యార్థులను తయారుచేయగలమని భావించారు. అందుకే దాతల సాయంతో సర్కారీ బడిని డిజిటల్ స్కూల్‌గా మార్చారు. ప్రయోగాల ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తూ విద్యార్థులను కరదీపికలుగా తయారుచేస్తున్నారు.

దాతాల విరాళాలతో స్కూల్‌ అభివృద్ధికి టీచర్ల కృషి ....

సమస్యల సుడిగుండంలో సతమతమయ్యే సర్కారీ స్కూళ్లకు భిన్నంగా నిలుస్తోంది వరంగల్ జిల్లాలోని కూనూరు ప్రభుత్వ పాఠశాల. 2009లో హెచ్‌ఎం శోభారాణి చొరవతో పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. గ్రామంలోని ఎన్‌ఆర్‌ఐతో పాటు దాతాల విరాళాలను స్కూల్ అభివృద్ధికి వెచ్చించారు. పాఠశాలలో ప్రొజెక్టర్, ప్రయోగ శాలలు ఏర్పాటు చేసి డిజిటల్‌ స్కూల్‌గా తీర్చిదిద్దారు.

ప్రొజెక్టర్‌ ద్వారా పాఠ్యాంశాల బోధన.....

సబ్జెక్ట్ ఏదైనా సరే ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు చెప్పడంతో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చేశారు. అప్పటి వరకు చదువుల్లో రాణించని విద్యార్థులు కూడా... డిజిటల్‌ పాఠాల ద్వారా ప్రతిభ కనబరచడం గమనించారు. దీంతో అన్ని తరగతుల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. తమ ఎదుగుదలకు ఉపాధ్యాయుల కృషి అనిర్వచనీయమైనదని విద్యార్థులు ప్రశంసిస్తున్నారు.

సైన్స్‌ పాఠాలు ప్రయోగాలతో వివరణ ....

కూనూరు ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ పాఠాలు పూర్తిగా ప్రయోగశాలల ద్వారానే బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులు కొత్త ప్రయోగాలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. చదువుతో పాటు మాక్ అంసెబ్లీ, స్కూల్ డే, లంచ్ టైంలో ఎఫ్ఎం రేడియో పిల్లలకు వినిపిస్తున్నారు. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లో డిజిటల్‌ పాఠాలు బోధించే అవకాశం తమకు దక్కినందుకు టీచర్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్‌ ....

దాతాల విరాళాలతో లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. వచ్చిన వడ్డీతో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందిస్తున్నారు. అటు అధ్యాపకుల కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

11:38 - September 8, 2015

హైదరాబాద్ : స్టాక్‌మార్కెట్‌ 14 నెలల కనిష్టానికి పడిపోయింది. 25 వేలకు దిగువకు జారిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో రూపాయి విలువ కూడా దారుణంగా తగ్గిపోయింది. దీంతో ఆందోళన చెందుతున్న పారిశ్రామికవర్గాలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా నేడు భేటీ కాబోతున్నారు. ఏం జరుగుతోంది.. భారత్‌ ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపైనే చర్చ జరగబోతుంది.

11:23 - September 8, 2015

హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లో మూడేళ్ల క్రితం బ్రిడ్జి కూలిన ఘటనలో.. ఐఐటీ రూర్కీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్ అయ్యారు. తెహ్రీ జిల్లా చౌరాస్‌లోని అలకానంద నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జికి...విపుల్ ప్రకాశ్, విజయ్‌కుమార్ గుప్తా అనే ప్రొఫెసర్లు డిజైన్ చేశారు. 2012లో ఆ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే.. కూలిపోయింది. ఆ ఘటనలో ఓ జూనియర్ ఇంజినీర్ సహా ఎనిమిది మంది చనిపోయారు. గతంలో విచారణ కోసం నోటీసులు పంపినా.. ప్రొఫెసర్లు కోర్టుకు హాజరుకాలేదు. దీంతోవారికి నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. ఐనా స్పందించకపోవడంతో ... రూర్కీలోని వారి నివాసంలో అరెస్ట్ చేశారు. మరోవైపు బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన కంపెనీ యజమానులను కూడా పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

11:21 - September 8, 2015

హైదరాబాద్ : తమను తెలంగాణ ఉద్యోగులుగా గుర్తించాలని, తెలంగాణలోనే పోస్టింగ్‌ ఇవ్వాలంటూ కొన్నాళ్లుగా ముంపు ప్రాంతాల ఉద్యోగులు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. వారందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.

తెలంగాణకు చెందిన పలు ముంపు మండలాలు ఏపీలో...

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు చెందిన బూర్గంపాడు, వేలేరుపాడు, కుక్కునూరు, కూనవరం, చింతూరు, వీఆర్‌పురం, భద్రాచలం రూరల్‌ మండలాలు ఏపీలో కలిశాయి. అయితే.. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం ఏపీలో భాగమయ్యేందుకు సిద్ధం కాలేదు. తాము తెలంగాణ ప్రాంతానికి చెందినవారమేనని, తెలంగాణలోనే తమకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆందోళనలు కొనసాగించారు. పలుమార్లు సీఎం కేసీఆర్‌కు విన్నవించుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా వారికి బాసటగా నిలిచారు.

ముంపు మండలాల్లో మొత్తం 477 మంది ప్రభుత్వ ఉద్యోగులు....

ముంపు మండలాల్లో మొత్తం 477 మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఇందులో 304 మంది ఉద్యోగులు ఏపీ ప్రభుత్వం కింద పనిచేసేందుకు అంగీకరించలేదు. తాము తెలంగాణకే వెళ్తామంటూ భీష్మించారు. ఉద్యోగులతోపాటు, ప్రజాప్రతినిధులు సైతం ఆందోళన చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వం.. ముంపు మండలాల ఉద్యోగులకు తెలంగాణలో పోస్టింగ్‌ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. చైనా పర్యటనకు వెళ్లే ముందే సంబంధిత ఫైల్‌ పై సంతకం చేశారు సీఎం కేసీఆర్‌.

తొలి దఫాలో 233 మంది టీచర్లకు ఉద్యోగాలు.....

అయితే.. వీరందరికీ తెలంగాణలో పోస్టింగ్‌ ఇచ్చేందుకు ఖాళీలు లేకపోవడంతో.. సూపర్‌ న్యూమరి పోస్టులను క్రియేట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోనూ.. అందరికీ ఒకేసారి పోస్టింగ్‌ ఇచ్చే అవకాశం లేదంటూ.. మొదటి దఫాలో 233 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో ముంపు మండలాల ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ముంపు మండలాల్లోని ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా.....

ఇదిలాఉంటే.. ముంపు మండలాల్లోని ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అక్కడి ప్రజలను ఏపీ ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదనే విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కడి ఉద్యోగులు తెలంగాణకు వస్తుండడంతో.. అక్కడివారికి విద్య అందే అవకాశం లేకుండాపోయే ప్రమాదం దాపురించింది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది..? అక్కడ ఉపాధ్యాయుల నియామకం చేపడుతుందా..? లేదా..? అన్నది చూడాలి.

సచివాలయంలో ముగిసిన ముఖ్య కార్యదర్శుల భేటీ..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శుల భేటీ ముగిసింది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో ఉమ్మడి విద్యా సంస్థలు, ఉద్యోగుల విభజనపై చర్చించారు. 

మోడీ నివాసంలో పారిశ్రామిక దిగ్గజ్జాలు.

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసానికి పారిశ్రామిక దిగ్గజ్జాలు చేరుకున్నారు. వారు మోడీతో సమావేశమయ్యారు. ఈసమావేశానికి ఆర్బీఐ గవర్నర్ రాజన్ కూడా హాజరయ్యారు. స్టాక్ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

11:17 - September 8, 2015

ముంబై : ఈ భవనం ఖరీదు రూ.425 కోట్లా అని నోరెళ్ల వెళ్లబెడుతున్నారా ? అవును ఇది నిజం. ఇంత డబ్బు పెట్టి ఎవరు కొంటారా ? అని ఆశ్చర్యపడుతున్నారు. మన దేశంలో కుబేరులకు తక్కువా చెప్పండి. ఈ భవంతిని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ 'కుమార మంగళం బిర్లా' కొనుక్కున్నాడు. ఇంతకు ఈ బిల్డింగ్ ఎక్కడుంది అంటారా ? దేశంలోని ప్రముఖ వాణిజ్యనగరంగా పేరొందిన 'ముంబై' లో ఈ భవంతి ఉంది. వివరాల్లోకి వెళితే...ముంబైలోని 'మలబార్ హిల్' పై 'జాతీయ హౌస్' అనే భవంతి ఉంది. దాదాపు 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవంతి ఉంది. ఈ భవనం విక్రయించడానికి వేలం పెట్టారు. ఈ వేలంలో భవంతిని దక్కించుకోవడానికి చాలా మందే పోటీ పడ్డారు. చివరకు కుమార మంగళం బిర్లా రూ.425 కోట్లు పెట్టి ఈ భవంతిని దక్కించుకున్నారు. ముందు చేసుకున్న ఒప్పందంలో భాగంగా పది శాతం మొత్తాన్ని బిర్లా చెల్లించారని, మిగతాది త్వరలోనే ఇవ్వనున్నారని వేలం పాట నిర్వహించిన ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ పేర్కొంది. ఇదే ప్రాంతంలోని మహేశ్వరీ హౌస్ 2011లో రూ. 400 కోట్లకు అమ్ముడు పోగా జాతీయ హౌస్ కు సమీపంలోని హోమీ హౌస్ రూ372 కోట్లకు అమ్ముడుపోయింది. అంటే ఈ రికార్డులను బిర్లా బద్దలు కొట్టారన్నమాట. 

కేసీఆర్ పర్యటనపై పొన్నం విసుర్లు..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శలు చేశారు. ఆయన పర్యటన రాచరికాన్ని గుర్తు చేస్తోందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చైనాకు వెళ్లడమేంటి ? అని ఆయన ప్రశ్నించారు. అక్కడి మార్కెట్‌ కుదేలైన నేపథ్యంలో పెట్టుబడులు తెస్తామనడం మూర్ఖత్వం అని ఆయన ఆరోపించారు.

కొండారెడ్డి గ్రామంలో ప్రకాష్ రాజ్..

మహబూబ్ నగర్ : జిల్లాలోని కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లిలో మంగళవారం సినీ నటుడు ప్రకాష్ రాజ్ పర్యటించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఆయన కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. 

ఉగ్రవాదం ప్రపంచమంతా ఉంది - రాజ్ నాథ్ సింగ్..

హైదరాబాద్ : ఉగ్రవాదం భారతదేశంలోనే కాక ప్రపంచం అంతా ఉందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. హకీంపేటలో జరుగుతున్న నీసా పాసింగ్ ఔట్ పరేడ్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదులు జరిపిన దాడుల ప్రభావం చాలాకాలం పాటు ఉంటుందని, ఎంతో మంది జీవితాలపై ఇది ప్రభావం చూపుతుందన్నారు. అది 9/11, 26/11 దాడుల్లో ఏది అయినా ఆ ప్రభావం మనుషుల్లో కనిపిస్తుందన్నారు. 

10:56 - September 8, 2015

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' కు తీవ్ర గాయాలయ్యాయి..ఆసుపత్రిలో చేరాడని..విషయం తెలుసుకున్న బన్నీ కుటుంబం మొత్తం ఆసుపత్రికి చేరుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఇదంతా వట్టిదేనని అల్లు అరవింద్ పేర్కొన్నారు. దీనితో 'బన్నీ' అభిమానులు ఊరట చెందారు. వివరాల్లోకి వెళితే సికిందరాబాద్ యశోదా ఆసుపత్రిలో 'అల్లు అర్జున్' చేరాడనే వార్తలు కలకలం సృష్టించాయి.ఇతడిని చూడటానికి అల్లు అరవింద్ ఇతర కుటుంబసభ్యులు చేరుకున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై అల్లు అరవింద్ స్పందించారు. 'బన్నీ'కి ఎలాంటి గాయాలు కాలేదని, చికిత్స కోసం ఆసుపత్రికి రాలేదని స్పష్టం చేశారు. 'అల్లు అర్జున్' భార్య స్నేహలతారెడ్డికి చిన్నపాటి శస్త్ర చికిత్స చేయించేందుకు ఆసుపత్రికి రావడం జరిగిందని తెలిపారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 'స్నేహలతారెడ్డి'కి ఆపరేషన్ చేయించేందుకు తాము వచ్చినట్లు, ఆపరేషన్ అనంతరం వైద్యులు సాయంత్రం డిశ్చార్జీ చేయనున్నట్లు 'అల్లు అరవింద్' పేర్కొన్నారు. 

గృహ నిర్మాణంపై సీఎం బాబు సమీక్ష..

విజయవాడ : సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి మృణాళిని, ఇతర అధికారులు హాజరయ్యారు. 

సెప్టెంబర్ 20న కాంగ్రెస్ భారీ ర్యాలీ..?

ఢిల్లీ : మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న ల్యాండ్ బిల్లుపై సెప్టెంబర్ 20వ తేదీన కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. 

సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం..

ఢిల్లీ : ఎఐసీసీ హెడ్ క్వార్టర్ లో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, గులాబ్ నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ ఇతర సీనియర్ నేతలు హాజరు కానున్నారు. సంస్థాగత ఎన్నికలు, రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా పదవిని ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఏఐసీసీ హెడ్ క్వార్టర్ కు చేరుకున్న రాహుల్..

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏఐసీసీ హెడ్ క్వార్టర్ కు చేరుకున్నారు. కొద్దిసేపట్లో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది.

 

టీఎంసీ నేత వద్ద తుపాకులు స్వాధీనం..

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలో మల్దా ప్రాంతంలో ఓ టీఎంసీ నేత నివాసంలో నాలుగు తుపాకులు, 200 బల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

తమిళనాడు సర్కార్ కు ఎన్ హెచ్ఆర్సీ నోటీసులు..

చెన్నై : తమిళనాడు ప్రభుత్వానికి ఎన్ హెచ్ ఆర్సీ నోటీసులు జారీ చేసింది. చెన్నెలో పోలీసు కస్టడీలో శ్రీలంక శరణార్థి మృతి చెందడంపై ఈ నోటీసులు జారీ చేసింది. 

స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో ప్రారంభం..

ముంబై : స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 40, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా నష్టపోయాయి. తరువాత సూచీలు పుంజుకుని లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 24973 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 7581 వద్ద ట్రేడవుతోంది. 

హకింపేటలో కేంద్ర హోం మంత్రి..

హైదరాబాద్ : హకీంపేటలో జరుగుతున్న నీసా పాసింగ్ ఔట్ పరేడ్ లో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. 66 మంది అసిస్టెంట్ కమాండెంట్ లు ట్రైనింగ్ పూర్తి చేశారు. 459 మంది ఎస్సైల గౌరవ వందనాన్ని రాజ్ నాథ్ స్వీకరించారు. 

 

తెలంగాణలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు మహిళలకు స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది. వీరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కాసేపట్లో సీడబ్ల్యుసీ సమావేశం

హైదరాబాద్ : కాసేపట్లో డబ్య్లుసీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పదవీ కాలం దాదాపుగా ముగియవస్తోంది. అదే సమయంలో ఏఐసీసీని సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు సోనియా స్థానంలో రాహుల్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని పలువురు నేతలు బహిరంగంగానే గళమెత్తుతున్నారు. ఈ క్రమంలో నేటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగించాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేయనుందని విశ్వసనీయ సమాచారం.

మున్సిపల్ ఛైర్మన్ ఇంటిని ముట్టడించిన మహిళలు.

మహబూబ్‌నగర్: తాగునీటి సమస్య తీర్చాలంటూ నారాయణపేట పురపాలక ఛైర్మన్ ఇంటిని కొందరు మహిళలు ముట్టడించారు. ఖాళీ బిందెలతో 5, 6 వార్డులకు చెందిన మహిళలు ఛైర్మన్ ఇంటి ఎదుట నిరసనకు దిగారు.

సుంకేశుల జలాశయానికి జలకళ

హైదరాబాద్ : ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద నీటితో మహబూబ్ నగర్ జిల్లా రాజోలిలోని సుంకేశుల జలాశయం జలకళను సంతరించుకుంది. వరద నీటి ప్రవాహం పెరగడంతో జలాశయం 5 గేట్లు ఎత్తేసి 25 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశాయం వద్ద ఔట్ ప్లో 85 వేల క్యూసెక్కులు, ఇన్ ఫ్లో 75 వేల క్యూసెక్కులుగా ఉంది.

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు...

అనంతపురం : జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పదేళ్ల తర్వాత పండ మేరులో వరద ప్రవాహం కనిపించింది. ధర్మవరం, మడకశిరలో కుండపోత వర్షాలు కురిశాయి. జిల్లాలో చెరువులన్నీ పూర్తిస్థాయిలో నిండాయి.

 

09:32 - September 8, 2015

హైదరాబాద్ : ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చూపిస్తే అది గారడీ. ఎన్నటికి సాధ్యం కాని దాన్ని కళ్లకు కడితే,ఆచరణ సాధ్యంకాని హామీలను సైతం 70MM తెరపై ఆవిష్కరిస్తే అది రాజకీయం అవుతుంది. ఈ రాజకీయాన్ని నరనరాన ఒంట పట్టించుకున్న మన నేతలంతా మాటలతో కోటలు కడతారు. అవతార్‌ సినిమాను తలదన్నే ఊహా లోకంలోకి సామాన్యులను తీసుకెళ్లి పబ్బం గడుపుతుంటారు.

కలకలం రేపుతున్న కామెంట్లు....

అలా అరచేతిలో స్వర్గం చూపించే ప్రజా ప్రతినిధుల గాలి తీసే నేత ఎవరయినా ఉన్నారంటే అది నిస్సందేహంగా అనంతపురం టిడిపి ఎంపీ జేసి దివాకర్‌ రెడ్డే. కుండబద్దలు కొట్టినట్లు మాటల డైనమైట్లు పేల్చే జేసీ ప్రత్యేక హోదా విషయంలో చేసే కామెంట్లు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కోతల రాయుళ్ల మొహం మీద కొట్టినట్లుండే జేసీ వ్యాఖ్యలు ఏప్రిల్ 1 విడుదల సినిమాను వద్దన్నా గుర్తుకు తెస్తాయి.

విభజన ఖాయమని చెప్పిన జేసి....

విభజన నాటి నుంచే జేసీ కామెంట్లు హైడ్రోజన్‌ బాంబుల్లా పేలుతున్నాయి. రాష్ట్రం విడిపోదంటూ వేదికలెక్కి అగ్రనేతలంతా మైకులు విరగ్గొడుతుంటే అంత సీన్‌ లేదు.. విభజన ఖాయమంటూ తేల్చి చెప్పారు. తెలంగాణవాదుల్లో ఉన్నంత ఐక్యత సమైక్యవాదుల్లో లేదన్న జేసీ ప్రత్యేక హోదా అనుకున్నంత ఈజీ కాదన్నారు. ఇది తెలిసే చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కాకుండా స్పెషల్‌ ప్యాకేజి కోసం ప్రయత్నిస్తున్నారని అధినేతను ఇరుకున పెట్టారు. దీక్షలు కాదు జగన్‌ పెట్రోల్‌ పోసుకుని ఆత్మార్పణం చేసుకున్నా ప్రత్యేక హోదా రావటం అసాధ్యం అంటూ మరో బాంబు పేల్చారు.

జేసీ స్పీడ్‌కు బ్రేక్ వేయాల్సిందే అంటున్న టిడిపి నేతలు....

జేసి కాంట్రవర్సీ కామెంట్లు ప్రజలకు మొహం చూపించుకోలేని సంకట స్ధితికి టిడిపి నేతలను నెట్టేశాయి. జేసీ నోటికి తాళం వేయకుంటే మున్ముందు ప్రజల్లోకి వెళ్లటం కష్టమేనని భావించిన ఏపి మంత్రులు అధినేతకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన యనమల పార్టీ క్రమశిక్షణ తప్పితే ఎవరినైనా సహించేది లేదని, క్రమశిక్షణా చర్యలు తప్పవనే సంకేతాలు పంపారు. ఈ ఇన్‌డైరెక్ట్‌ వార్నింగ్‌కు తన స్పీడ్‌ను తగ్గించకపోగా తన హాట్‌ కామెంట్ల దూకుడును మరింతగా పెంచారు జేసీ. రాష్ట్రానికి వస్తే,గిస్తే స్పెషల్ ప్యాకేజ్‌ వస్తుంది కానీ స్పెషల్‌ స్టేటస్‌ రానే రాదని స్పష్ఠం చేసిన జేసి వ్యాఖ్యలు నిజమవుతాయో లేక హోదా తప్పక వచ్చి తీరుతుందంటున్న నేతల హామీలు నిజమవుతాయో చూడాల్సిందే...

09:28 - September 8, 2015

హైదరాబాద్ : ఐదేళ్ల వరకూ అడ్డే లేదనే ధీమానో..? లేక ఏం చేసినా అడిగేవారు ఎవరూ లేరనే అతివిశ్వాసమో..? కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. రైతుల భూములపై కన్నేసిన ప్రభుత్వం.. లెక్కా పత్రం లేకుండా స్వాధీనం చేసుకునే పనిలో పడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 లక్షల ఎకరాలు సేకరించాలని చూస్తున్న ప్రభుత్వం.. పాతిక వేల ఎకరాల సేకరణకు నోటిఫికేషన్‌ జారీచేయడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది...

8 వేల ఎకరాలతో నిర్మితమయ్యే రాజధానికి....

8 వేల ఎకరాలతో నిర్మితమయ్యే రాజధానికి.. 33 వేల ఎకరాలు సేకరించారు. ఇంకా సేకరిస్తూనే ఉన్నారు...4 వేల ఎకరాలతో పూర్తయ్యే బందరు పోర్టు నిర్మాణానికి 30 వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారు...కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాడని, తమ కన్నీళ్లు తుడుస్తాడని ప్రజలు ఓట్లేస్తే... బతుకుల్నే బలిచేస్తున్నాడనే విమర్శలు సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.

బతుకుదెరువును పణంగా పెట్టి భూములిచ్చిన రైతులు...

రాష్ట్రానికి రాజధాని లేదు. కాబట్టి ఏపీకి రాజధాని కావాల్సిందే అన్న ఒకే ఒక కారణంతో బతుకుదెరువును పణంగా పెట్టి కేపిటల్‌కు భూములిచ్చారు ఎంతో మంది రైతులు. అయితే.. ఇక్కడే లెక్కకు మిక్కిలి భూములు తీసుకుందనే విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వం.. ఇప్పుడు అక్కడా ఇక్కడా అనే తేడాలేకుండా భూములు లాగేసుకునే పనిలో పడింది.

ల్యాండ్‌ బ్యాంక్‌ అనే ఓ పేరుతో...

ల్యాండ్‌ బ్యాంక్‌ అనే ఓ పేరు తగిలించిన ప్రభుత్వం.. రేపటి అవసరాల పేరుతో ఏకంగా 15 లక్షల ఎకరాల భూములు స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయించిందన్న వార్తలు.. యావత్‌ రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే.. వీరి భయాన్ని నిజం చేస్తూ.. అప్పుడే బలవంతపు భూ సేకరణకు నోటిఫికేషన్‌ జారీచేసింది ప్రభుత్వం. బందరు పోర్టు నిర్మాణం కోసమంటూ 14 వేల ఎకరాలు, శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు నిర్మాణానికి 5 వేల 500 ఎకరాలు, విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టుకోసమంటూ 5 వేల 300 ఎకరాలు సేకరించేందుకు భూసేకరణ నోటిఫికేషన్‌ జారీచేసింది.

హద్దూ పద్దూ లేకుండా భూములు కాజేస్తున్న .....

అవసరం కొంతే అయినా.. హద్దూ పద్దూ లేకుండా భూములు కాజేస్తున్న వైనాన్ని వామపక్షాలతో సహా, ఇతర పార్టీలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. పరిశ్రమల పేరుతో కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం వేలాది ఎకరాలు సేకరిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దేశానికి అన్నం పెట్టే అన్నదాత బతుకును ఎండబెట్టి.. బడాబాబులకు భూములు ధారాదత్తం చేయడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే....

కేవలం 8 వేల ఎకరాల్లోనే అద్భుతమైన రాజధాని నిర్మించొచ్చని సాక్ష్యం చెబుతున్నాయి విదేశాల్లోని ఎన్నో రాజధానులు. కేవలం 2 ఎకరాల్లోనే అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌ పోర్టులు కట్టొచ్చని దేశంలోని ఎన్నో విమానాశ్రయాలు నిరూపిస్తున్నాయి. అయినా.. ఇవేవీ పట్టని ప్రభుత్వం.. ఇష్టారాజ్యంగా భూములు లాగేసుకుంటోంది. ఇలా.. వేలాది ఎకరాలు తీసుకుంటున్నది కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కాక, ఇంకెందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు.

భూమి లేకుంటే.. బువ్వ లేనట్టేనన్నది పెద్దల మాట.......

భూమి లేకుంటే.. బువ్వ లేనట్టేనన్నది పెద్దల మాట. అలాంటి భూములను లాక్కుంటున్న ప్రభుత్వం తమ నోటికాడి ముద్ద లాగేసుకుంటోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే.. ఊహించని ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

09:17 - September 8, 2015

హైదరాబాద్ : తెలంగాణాలోని పలు చెక్‌పోస్టుల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు శాఖల చెక్‌పోస్టుల్లో అక్రమంగా ఉన్న డబ్బును అధికారులు స్వాధీనం చేసుకొని, ఏసీబీ కేసులు నమోదు చేశారు. మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ చెక్‌పోస్టులో రూ.30 వేలు, నల్గొండ జిల్లా రామాపురం చెక్‌పోస్టులో రూ.21వేలు, నిజామాబాద్‌ జిల్లా మద్నూరు చెక్‌పోస్టులో రూ.44,200లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉన్న నల్గొండ జిల్లా కోదాడ మండలం పరిధిలోని దోరకుంట వద్ద ఏసీబీ డీఎస్పీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెల్లవారు జాము నుంచి సోదాలు చేశారు. వాహనదారు లనుంచి రూ.17 వేలు అదనంగా వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. చెక్‌పోస్టుల్లో అక్రమ వసూళ్లు జోరుగా చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు దాడులకు శ్రీకారం చుట్టారు.

08:37 - September 8, 2015

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ చైనా పర్యటనలో ఆదేశం మార్కెట్ మేనేజ్ మెంట్ ను తెచ్చుకోవాలని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో దహన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ సూచించారు. చైనా ఆర్థిక వ్యవస్థ తిరుగోమనంలో ఉందా? మార్కెట్ వ్యవస్థను పెంచుకోవడానికే డాలర్ విలువ తగ్గించుకుంటోందా? అయినా ప్రపంచంలో చైనా ఎలా ఎగుమతులు చేయగలుతోంది? దేశీయ మార్కెట్ ను ఆధారంగా చేసుకుని ఎగుమతి చేయాలన్న సూత్రంతో చైనా పనిచేస్తోందా? చైనా అనుసరిస్తున్న ఆర్థిక వ్యవస్థే ఆదేశాన్ని కాపాడుతోందా? చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోతే భారత్ సుఖంగా ఉండలేదా? ప్రపంచ వృద్ధిలో 30 శాతం చైనా నుండే ఉన్నాయా? చైనా ఆర్థిక వ్యవస్థను అన్ని దేశాలు ఆదర్శంగా చూస్తున్నాయా? వస్తు తయారీ రంగాన్ని తెలంగాణలో అభివృద్ధి చేసుకోవాలి? సామాజికి, ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా ఉండటం వల్లే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. చైనా నుంచి మార్కెట్ మేనేజ్ మెంట్ ను తెచ్చుకోవాలి. తన విశ్లేషణలో తెలిపారు. మరింత విశ్లేషణను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

వాహనం ఢీకొని దంపతులు మృతి

మహబూబ్‌నగర్: జిల్లాలోని బాలానగర్‌లో ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొని దంపతులు మృతిచెందారు. మృతులు మహారాష్ట్ర నాందేడ్ వాసులుగా గుర్తింపు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు.

లారీ బోల్తా ..డ్రైవర్ మృతి

కృష్ణా : నందివాడ మండలం కొత్తగుంట వద్ద పొడమేరులో లారీ బోల్తా పడిన సంఘటనలో డ్రైవరు మృతి చెందాడు. లారీ వేగంగా నడపడం వల్లే బోల్తా పడిందని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. లారీని రోడ్డుపై నుంచి తొలగించేందుకు పోలీసులు యత్నాలు ఆరంభించారు.

07:59 - September 8, 2015

హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యల పై గత ప్రభుత్వాల ఎలా వ్యవహరిస్తున్నాయో టిఆర్ ఎస్ ప్రభుత్వం అదే విధానాలను అవలంభిస్తోందని 'న్యూస్ మార్నింగ్' చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. రైతు ఆత్మహత్యలు నివారించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టింది. ప్రభుత్వ చర్యలు రైతులకు ఊరటనిస్తోందా? రైతు ఆత్మహత్యలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొర చూపడం లేదు? స్మార్ట్ సిటీల పేరుతో ప్రజలపై భారాలు మోపబోతున్నారా? బలవంతంగా పన్నులు వసూలు చేస్తున్నారా? స్మార్ట్ సిటీల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో టి.పీసీసీ మహేష్ గౌడ్, టి.టిడిపి విద్యాసాగర్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్ బిజెపి అధికార పాదూరి కరుణ, టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. మరి ఈ చర్చను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

జహీరాబాద్ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు..

హైదరాబాద్ : మెదక్ జిల్లా జహీరాబాద్ చెక్‌పోస్టుపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు చేపట్టారు. తనిఖీల సందర్భంగా అధికారులు చెక్‌పోస్టు సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న నుంచి రూ. 30 వేలు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని మద్నూరు ఆర్టీవో చెక్‌పోస్టులో ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు.

గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు మహిళలకు స్వైన్ ఫ్లూ కలకలకం

హైదరాబాద్‌ : గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలు స్వై న్‌ ఫ్లూతో చేరారు. మెదకు జిల్లాకు చెంది న ఓ గర్భిణీ(32)కి తీవ్ర జ్వరం, జలు బు, దగ్గుతో పరిస్థితి ఆందోళనాకరంగా మారడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించా రు. ఖమ్మం జిల్లాకు చెందిన మరో మ హిళ(37) కూడా ఫ్లూతో ఇదే ఆస్పత్రి లో చేరి చికిత్స పొందుతున్నారు.

రెండు కార్లు ఢీ : ముగ్గురి మృతి

మెదక్‌ : కొండపాక మండలం కుకునూరుపల్లి దగ్గర జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. రెండు కార్లు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.మృతుల్లో భరత్‌కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌, విజ్జిలున్నారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

07:18 - September 8, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటీఫికేషన్ వెలువరించింది విద్యార్థులంతా ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. అయితే వారిని ఓ సమస్య వెంటాడుతోంది. అవే ఉద్యమ కాలం కేసులు ..అయితే కేసులు ఎత్తివేశామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా.. విద్యార్ధులకు ఇంకా నోటీసులు వస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఎన్ని కేసులను ఎత్తి వేసింది ఇంకా ఎన్ని కేసులకు జీ.వో. రావాల్సి ఉంది..

తెలంగాణ సాధించుకోవడంలో విద్యార్ధులు....

తెలంగాణ సాధించుకోవడంలో విద్యార్ధులు చేయని పోరాటం లేదు. ఆందోళన చేయడం నేరమని అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. కొంత మందిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క కేసు లేకుండా ఎత్తి వేస్తామని టీ.ఆర్.ఎస్. ప్రభుత్వం మాట ఇచ్చింది. కాని ఇప్పుడు ఎన్నికేసులు ఎత్తి వేశారో ఇంకా ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయో విద్యార్ధులకు చేరలేదు.

తెలంగాణ ఉద్యమంలో మొత్తం 3 వేల 152 కేసులు ......

2009 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో మొత్తం 3 వేల 152 కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు దాఫాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు ఎత్తి వేసింది. మొదట 984 కేసులను ఎత్తివేయగా.. 348 రెండో దఫా ఏత్తివేశారు. అయితే 2014 జూన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికల్లా.. 1100 కేసులు అలానే ఉండగా రైల్వే కేసులు 250 పెండింగ్ లో ఉన్నాయి.

ఎలాంటి న్యాయపరమయిన చిక్కులు లేకుండా....

మొదటి అసంబ్లీ సమావేశంలోనే ఎలాంటి న్యాయపరమయిన చిక్కులు లేకుండా కేసులు ఎత్తి వేస్తామని అన్నారు. అక్టోబర్ లో నాయిని నర్సింహారెడ్డి 698 కేసులకు సంతాలు పెట్టారు. న్యాయపరమయిన చిక్కులు రాకుండా ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క జీ.వో. జారీ చేసినట్లు సమాచారం. అయితే మొత్తం కేసులకు గాను జీ.వోలు జారీ కాలేదు. ఒక వేళ అయినా.. ఎక్కువ కేసులు ఉన్నా పోలీస్ స్టేషన్ లో మాత్రమే తీసివేశారు. ఓ.యూ పోలీస్ స్టేషన్ లో కేసులన్నింటిని పూర్తిగా ఎత్తివేశారు. అయితే అదే విద్యార్ధులు సికింద్రాబాద్ లో ధర్నాలు చేస్తే.. వాటిని ఎత్తివేయలేదు.

ఒక్క సెక్షన్ తేడాగా ఉన్నా..

కొన్ని పోలీస్ స్టేషన్ లో నమోదయిన కేసుల్లో ఒక్క సెక్షన్ తేడాగా ఉన్నా.. కేసును ఎత్తివేయలేదు. కొన్ని జిల్లాల్లో పోలీసు అధికారుల నిర్లక్ష్యం.. కక్షపూరిత దోరణిలో ఇంకా కొంత మంది పై కేసులు అలానే ఉంచారనే అరోపణలు వస్తున్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్‌ నేపథ్యంలో ఉద్యోగం వచ్చిన తర్వాత అందులో కేసులు ఉన్నాయనే రీమార్క్ తో ఉద్యోగం ఇవ్వకుంటే సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

07:14 - September 8, 2015

హైదరాబాద్ : ఓ వైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు తెలంగాణ నిరుద్యోగులను ఊరిస్తున్నాయి. మరోవైపు, ఉద్యమ కాలం నాటి కేసులు వెన్నాడుతున్నాయి. అనేక మంది విద్యార్థులకు, యువకులకు ఇప్పటికీ నోటీసులొస్తున్నాయి. దీనివల్ల పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఉద్యమకాలం నాటి కేసులు ఎత్తివేయకపోవడం ధర్మమేనా? కేసుల విషయంలో విద్యార్థులకు ఎదురవుతున్న తాజా అనుభవాలేమిటి? ఈ కేసుల వల్ల విద్యార్థులు పడుతున్న అవస్థలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ఓయూ జేఏసీ నేత క్రిషాంక్‌ పాల్గొన్నారు. ఆ చర్చను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

07:09 - September 8, 2015

హైదరాబాద్ : బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గోకుల్‌కు అనూరాధతో పెళ్లి జరిగింది. భార్యతో చక్కగా కాపురం చేయాల్సింది పోయి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన ప్రియురాలితో కలిసి జీవించాలని కలలు కన్న గోకుల్‌ చాలా పెద్ద పథకమే వేశాడు. ఇందులో భాగంగా తన ప్రియురాలి భర్త పాస్పోర్టు దొంగిలించి, దాని ఆధారంగా అతడి పేరు మీద గోకుల్‌ సిమ్ కార్డు కొనుగోలు చేశాడు. అలాగే, ఫేస్బుక్లో అతడి పేరిట ఓ పేజీ క్రియేట్ చేశాడు. అందులో అతడిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిగా చూపించాడు. సైబర్‌ క్రైం పోలీసులకు అతడు చిక్కితే తన ప్రియురాలితో సుఖంగా ఉండొచ్చని ప్లాన్‌ చేశాడు. కానీ అలా జరగకపోగా కథ అడ్డం తిరిగింది.

తన ప్రియురాలి భర్తను అడ్డుతొలిగించాలనుకున్న గోకుల్‌-....

ఎలాగైనా తన ప్రియురాలి భర్తను అడ్డు తొలిగించాలనుకున్న గోకుల్‌- బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లే మూడు అంతర్జాతీయ విమానాల్లో బాంబులున్నట్టు బెదిరింపు కాల్స్ చేశాడు. వాట్సప్ మెసేజి కూడా పెట్టాడు. ఈ కారణంతోనైనా అతడిని పోలీసులు అరెస్ట్‌ చేస్తారని భావించిన గోకుల్‌ తన ఉచ్చులో తానే పడ్డాడు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గోకుల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోకుల్‌ కారణంగా 3 విమానాలను రద్దు చేసినట్టు, దీంతో 10 లక్షల నష్టం వాటిల్లినట్టు పోలీసులు పేర్కొన్నారు.

సిమ్ కార్డు వివరాల ఆధారంగా అతడి ప్రియురాలి భర్తనే అనుమానం....

పోలీసులు కూడా మొదట సిమ్ కార్డు వివరాల ఆధారంగా అతడి ప్రియురాలి భర్తనే అనుమానించారు. కానీ, తర్వాత విషయం తెలిసి గోకుల్ను అరెస్టు చేశారు. ఇందులో ఉగ్రవాద కోణం ఏమీ లేదని, నిందితుడి భార్య అనూరాధ జూన్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో ఆ కేసును దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడిందని బెంగళూరు పోలీసు కమిషనర్ తెలిపారు. తన భార్య అనురాధ తలపై గణేష్‌ విగ్రహంతో దాడి చేయడంతో మృతి చెందినట్టు విచారణలో గోకుల్‌ ఒప్పుకున్నాడు. ప్రియురాలి మోజులో గోకుల్‌ తన జీవితాన్ని నాశనం చేసుకుని చివరకు కటకటాల పాలయ్యాడు. 

07:05 - September 8, 2015

హైదరాబాద్ : షీనాబోరా మర్డర్ కేసు మిస్టరీ వీడుతోంది. రక్తం పంచుకు పుట్టిన బిడ్డను... కన్నతల్లే చంపుకున్న దురాగతం.. ఈ క్రమంలో తెరచాటున జరిగిన నాటకీయ పరిణామాలు.. విస్తుగొలుపుతున్నాయి. ఈ కేసులో ఇంద్రాణి, ఆమె కారు డ్రైవర్‌కు బాంద్రాకోర్టు రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

పోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వెల్లడి.....

సంచలనం రేపిన షీనాబోరా మర్డర్‌ కేసులో... ఒక్కొక్కటిగా చిక్కుముడులు వీడుతున్నాయి. షీనాబోరా ఎముకలు, ఇతర అవశేషాలను పరీక్షించిన ఫోరెన్సిక్ ల్యాబ్.. తన నివేదికను వెల్లడించింది. షీనాబోరా శాంపిల్స్‌... ఆమె తల్లి ఇంద్రాణి DNAతో వందశాతం సరిపోలినట్లు అధికారులు తెలిపారు. షీనాబోరా సోదరుడు మిఖైల్ బోరా శాంపిల్స్‌ సైతం ఇంద్రాణి డీఎన్ ఏ తో మ్యాచ్‌ అయినట్లు చెప్పారు. దీంతో ఇన్నాళ్లు... రాయ్‌గఢ్ అటవీ ప్రాంతంలో దొరికిన అవశేషాలు... షీనాబోరా మృతదేహానివా? కాదా? అన్న సందేహాలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లయింది.

ఇవాళ్టితో ముగిసిన పోలీసు కస్టడీ.......

షీనాబోరా హత్యకేసులో ఇప్పటికే అరెస్టై.. పోలీసుల కస్టడీలో వున్న తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్‌ఖన్నా, కారుడ్రైవర్‌ శ్యాంమనోహర్‌రాయ్‌లను ముంబై పోలీసులు.. బాంద్రా కోర్టులో ప్రవేశపెట్టారు. ఇవాళ్టితో ముగ్గురికి పోలీసు కస్టడీ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం... ఇంద్రాణి, ఆమె కారు డ్రైవర్‌కు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. మూడో నిందితుడు సంజీవ్‌ ఖన్నాను.. విచారణ నిమిత్తం పోలీసులు.. కోల్‌కతా తరలించే అవకాశం వుంది.

కాల్చి పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని..

షీనాబోరాను హత్య చేసిన తర్వాత.. కాల్చి పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని.. పోలీసులు మరోసారి పరిశీలించింది. రాయ్‌గఢ్‌ సమీపంలోని అటవీ ప్రాంతానికి.. పోలీసులు ఇప్పటికే ఓసారి వెళ్లారు. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో మరోసారి పరిశీలించేందుకు వెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది.

హత్యకేసు నేరాన్ని అంగీకరించిన ఇంద్రాణి......

షీనాబోరా హత్యకేసులో ఇప్పటికే ఇంద్రాణి నేరాన్ని అంగీకరిచింది. ఆర్థిక వ్యవహారాల కారణంగానే ఈ మర్డర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు... ఇంద్రాణి ముఖర్జీ బ్యాంకు ఖాతాలను పరిశీలించినట్లు సమాచారం. ఈ క్రమంలో వారికి కీలక సమాచారం లభ్యమైనట్లుగా తెలుస్తోంది. 

07:02 - September 8, 2015

హైదరాబాద్ : బిజెపి తో బీహార్‌కు ఒరిగేదేమీ లేదని... సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, నితీష్‌-లాలూ కూటములకు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు.. మరికొన్ని పార్టీలతో కలిసి బరిలో నిలుస్తున్నాయి. తాజాగా పాట్నాలో సీపీఎం-సీపీఐ భారీ ర్యాలీ నిర్వహించాయి. ఓట్ల కోసం బిజెపి, జెడీయూ, ఆర్జీడీ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయని ఏచూరి ఆరోపించారు. వామపక్షాలతోనే పారదర్శక పాలన, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. 

06:59 - September 8, 2015

విజయవాడ : ఏపీలో ఇసుక మాఫియాపై హైకోర్టు కన్నెర్రజేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో సాండ్‌ మిషన్స్‌కు..కలెక్టర్‌ భాస్కర్ అనుమతి ఇవ్వడంపై తీవ్రంగా తప్పుపట్టింది. సహజ వనరులు భవిష్యత్ తరాలకూ ఉండాల్సిన అవసరముందని వాఖ్యానించింది. దోపిడికి పాల్పడుతున్న ఇసుక మాఫియా...కనీసం పర్యావరణ నిబంధనలు పాటిస్తోందా..? అని ప్రశ్నించింది.

మహిళా గ్రూపులు సాండ్‌ మిషన్స్‌తో .....

పశ్చిమ గోదావరి జిల్లాలో ఇష్టానుసారంగా మహిళా గ్రూపులు సాండ్‌ మిషన్స్‌తో తవ్వకాలు చేపట్టడంపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లాలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి. బోసలే ఇసుక మాఫియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మిషన్స్‌తో ఇసుక తీయడానికి ఎలా అనుమతిస్తారు?-జడ్జి.....

జిల్లా కలెక్టర్ భాస్కర్ అక్కడ ఎన్నాళ్లుగా పని చేస్తున్నారు.? పని చేసే పద్దతి ఇదేనా..అంటూ జడ్జి మండిపడ్డారు. నీటి పరిరక్షణ కూడా అయన పరిధిలోకే వస్తుంది. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని మండిపడ్డారు. ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చి, మిషన్స్‌తో ఇసుక తీయడానికి ఎలా అనుమతిస్తారని అసహనం వ్యక్తం చేశారు. ఒక విధంగా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు. ఏపీలో ఇసుక తవ్వకాల్లో ఏం జరిగిందో..వారంలోపల తుది నివేదికను కోర్టుకు సమర్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్‌లకు అదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో ఇసుక మాఫియా పై హైకోర్టు సీరియస్‌ .....

గతంలోనూ...తెలంగాణలో ఇసుక మాఫియా పై హైకోర్టు సీరియస్‌ అయింది. ఎవరెవరు మాఫియా వెనుక ఉన్నారో వారి పై కేసులు నమోదు చేయాలని అదేశించింది. ప్రజాప్రతినిధులను సైతం వదల వద్దని హెచ్చరించింది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుకను మిషన్స్‌తో తవ్వడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 

06:56 - September 8, 2015

హైదరాబాద్ : తెలంగాణలోని పార్టీలన్నీ వరంగల్‌పైనే దృష్టిసారించాయి. కడియం రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని కాపాడుకోవడం ద్వారా.. ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపించుకోవాలని టీఆర్‌ఎస్‌ ఆరాటపడుతుంటే.. ఉప ఎన్నికలో విజయం ద్వారా.. తమ పట్టు పెంచుకోవడంతోపాటు ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను చాటిచెప్పాలని ప్రయత్నిస్తున్నాయి విపక్షాలు.

ఆశతో ఉన్న అధికార పార్టీ.....

వరంగల్‌ ఉప ఎన్నికలో విజయం తమనే వరిస్తుందనే ఆశతో ఉంది అధికార పార్టీ. తాము అధికారంలో ఉండడంతోపాటు, తెలంగాణ సెంటిమెంట్‌ అంశాలు కలిసివస్తాయని, తద్వారా తమదే విజయమంటున్నాయి గులాబీవర్గాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు తమదే అంటున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు.. మెజార్టీ పెంచుకోవడం మీదనే తమ దృష్టి అంటున్నాయి.

అధికార పార్టీ ప్రకటనలను కొట్టిపారేస్తున్న విపక్షాలు...

విపక్షాలు మాత్రం అధికార పార్టీ ప్రకటనలను కొట్టిపారేస్తున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలే.. టీఆర్‌ఎస్‌ను మట్టికరిపిస్తాయని ధీమాగా చెబుతున్నాయి. వరంగల్‌ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా.. ఎలాగైనా ఫామ్‌ లోకి రావాలని ఆరాటపడుతోంది కాంగ్రెస్‌ పార్టీ. ఇప్పటికే స్థానికంగా సర్వే చేసిన హస్తం పార్టీ.. తన హస్తవాసీ ఎలా ఉందోనని ఆరాతీసింది. కిష్టారెడ్డి మరణంతో ఖాళీ అయిన నారాయణ్‌ ఖేడ్‌ స్థానం.. గత సంప్రదాయాలకు అనుగుణంగా ఏకగ్రీవం అవుతుందని యోచిస్తున్న కాంగ్రెస్‌, తమ పూర్తి ఫోకస్‌ వరంగల్ పైన కేంద్రీకరించింది.

విజయం తమదేనంటున్న మిత్రపక్షాలు...

ఇక మరోవైపు.. ఈ పోటీకోసం తహతహలాడుతున్నాయి టీడీపీ-బీజేపీలు. ఓరుగల్లు గండం గట్టెక్కితే.. తెలంగాణలో మంచిరోజులు వచ్చినట్టేనని భావిస్తున్నాయి రెండు పార్టీలు. కిందిస్థాయి కేడర్‌లో పట్టుబాగానే ఉందని భావిస్తున్న ఈ మిత్రపక్షాలు.. విజయం తమదేనంటున్నాయి.

ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు......

ఇక, ఇతర పార్టీలకు ఏమాత్రం తగ్గని విధంగా జోరుపెంచాయి వామపక్షాలు. ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్మిస్తున్న లెఫ్ట్‌ పార్టీలు.. ప్రజాగాయకుడు గద్దర్‌ను బరిలో నిలిపేందుకు కృషి చేస్తున్నాయి. పోరాటాల గడ్డపై చెక్కుచెదరని తమ క్యాడర్‌కు తోడు.. గద్దర్‌ చరిష్మా అదనపు బలమవుతుందని భావిస్తున్న వామపక్షాలు.. విజయం కోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ విధంగా ఎవరికి వారు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకునే పనిలో పడిపోవడంతో.. నోటిఫికేషన్‌కు ముందే ఆసక్తిని రేకెత్తిస్తోంది వరంగల్‌ ఉప ఎన్నిక పోరు.

06:49 - September 8, 2015

హైదరాబాద్ : నవ్యాంధ్రలో స్మార్ట్‌ సిటీగా రూపుదిద్దుకోబోతున్న నగరమేది ఏది..? అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. మొదట్నుంచీ కాపిటల్‌ సిటీ విజయవాడనే స్మార్ట్‌ సిటీ అంటూ ప్రచారం సాగింది. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. స్మార్ట్‌ సిటీస్‌గా ఇప్పటికే మూడు నగరాల పేర్లు ఖారారయ్యాయి.

నగరాలకు సాయం చేసేందుకు బృందాల ఏర్పాటు......

ఇప్పుడు ఎక్కడ విన్నా అంతా స్మార్ట్‌ పదమే వినిపిస్తోంది. పట్టణాలను స్మార్ట్‌ సీటీస్‌గా తీర్చిద్దిద్దేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. స్మార్ట్‌ సిటీ ప్రణాళికల రూపకల్పన నిమిత్తం నగరాలకు సాయం చేసేందుకు ప్రముఖ సంస్థలతో ప్రాంతాల వారీ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలు ఇప్పటికే ఆయా ప్రాంతాలలో సర్వేలతో పాటు స్మార్ట్‌ సిటీ ప్లాన్‌ కూడా తయారు చేస్తున్నాయి. స్మార్ట్‌ సిటీల ఎంపికను దశల వారీగా పోటీలు పెడుతూ ఫైనల్‌ చేస్తున్నారు. మొదటి దశలో రానున్న ఐదేళ్లలో 500 కోట్ల మేరకు కేంద్ర నిధులు ఇచ్చేందుకు 20 నగరాలను ఎంపిక చేస్తారు. మొదటి లాట్‌ను ఈ సంవత్సరంలోగా ఎంపిక చేసేందుకు అధికారులు సీరియస్‌గా కసరత్తు చేస్తున్నారు.

ప్రతి ఏటా దేశంలో 40 నగరాల ఎంపిక.....

రానున్న రెండేళ్లలో.. ఒక్కొక్క సంవత్సరంలో 40 నగరాల ఎంపిక జరగనుంది. 20 నగరాల ఎంపిక నిమిత్తం, సిటీ లక్ష్యం, వ్యూహాం, వ్యయ సామర్థ్యం, అమలు విశ్వసనీయత, వినూత్న ఆలోచన ప్రధాన అర్హతలవుతాయి. మొదటి రౌండ్‌లో ఎంపిక కాని నగరాలను తమ ప్రదర్శన మెరుగుదల ద్వారా.. రెండవ, మూడవ రౌండ్‌లలో ఎంపిక చేయనున్నారు. నవ్యాంధ్రలో స్మార్ట్‌ సిటీ రేస్‌లో విశాఖ, తిరుపతి, కాకినాడ నగరాలు పోటీ పడుతున్నాయి. తొలి 20 నగరాల్లో చోటు సంపాదించేందుకు నూతన టెక్నాలజీతో విదేశీ పరిజ్ఞానంతో పోటీ పడుతున్నాయి. ఈ నెల 7న హైదరాబాద్‌లోని నోవెటల్‌లో సదరన్‌ స్టేట్స్‌ ఆఫ్‌ స్మార్ట్‌ సిటీస్ కాన్ఫరెన్స్‌ జరగనుంది. ఇందులో రాష్ర్టంలోని స్మార్ట్‌ సిటీ మోడళ్లను ఆవిష్కరించనున్నారు. విశాఖపట్నంకు ఏకామ్‌ అమెరికన్‌ సంస్థ, తిరుపతికి లీ కంపెనీ ఇప్పటికే మోడల్స్‌ రెడీ చేశాయి. కాకినాడకు ఈ నెల 7న జరగనున్న కాన్ఫరెన్స్‌లో ఖరారు చేయనున్నారు.మొత్తంగా స్మార్ట్‌ సిటీస్‌ ద్వారా పట్టణాల రూపురేఖలు మారనున్నాయి. అయితే నగరాల్లోనే కాకుండా.. గ్రామాల్లోనూ అభివృద్ధిని వికేంద్రీకరించాలని ప్రజలు కోరుతున్నారు.

06:45 - September 8, 2015

హైదరాబాద్ : తన భార్య శవాన్ని భుజాన వేసుకుని, అప్పుడే పుట్టిన పసికందును చంకన పెట్టుకుని యాచించుకుంటూ తిరిగిన షఫీకి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయనకు నారాయణపేటలోని మార్కెట్‌యార్డులో వాచ్‌మెన్ ఉద్యోగం ఇచ్చింది. మంత్రులు మహమూద్‌ అలీ, హరీశ్ రావు చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు షఫీ.

06:38 - September 8, 2015

హైదరాబాద్ : రుణమాఫీతో రైతులకు చేరువవుదామనుకున్న టిడిపి సర్కార్‌ ప్రయత్నం బెడిసి కొట్టింది. రుణమాఫీ ప్రభుత్వానికి అనుకున్న మేలు చేయకపోగా రైతుల్లో వ్యతిరేకతను పెంచింది. ఒక స్పష్ఠమైన విధి విధానాలను ఖరారు చేయకపోవడంతో రైతాంగంలోనే కాదు ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ రుణమాఫీపై క్లారిటీ మిస్‌ అయింది.

సంక్షేమ పథకాలపై విసృత ప్రచారం......

రుణమాఫీతో వచ్చిన వ్యతిరేకతను ఎలాగైనా దూరం చేయాలని భావించిన ఏపి ప్రభుత్వం ఇప్పుడు అన్నదాతల వద్దకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పేరుతో రైతులను కలుసుకునే బాధ్యతను ఏపి మంత్రులు తీసుకున్నారు. రైతు కోసం చంద్రన్న యాత్ర పేరుతో సెప్టెంబర్‌ 9 నుంచి 29 వరకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. శ్రీకాకుళం నుంచి ప్రారంభం కాబోయే ఈ యాత్రలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాధ్ రెడ్డి, మృణాళిని పాల్గొంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడంతో పాటు సబ్సిడీపై వెయ్యి కోట్ల విలువైన సామాగ్రిని అమాత్యులు పంపిణీ చేయనున్నారు.

రుణమాఫీ పై విస్తృత ప్రచారం....

సెప్టెంబర్‌ 9 బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ బస్సు యాత్రలో రుణమాఫీ పై విస్తృత ప్రచారం కల్పించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ పొందిన రైతుల జాబితాతో పాటు ఎంత మేరకు లాభపడ్డారనే దానిపై గ్రామాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రుణమాఫీ లబ్దిదారుల విషయానికొస్తే గుంటూరు జిల్లా మొదటి స్ధానంలో ఉండగా రెండో స్ధానంలో అనంతపురం జిల్లాలు ఉన్నాయి. ఇక ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం అమలు చేయనున్న లక్షన్నర రూపాయల రుణమాఫీ పథకం పై కూడా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఇక 10వ తేది విజయనగరంలో, చివరి రోజు అనంతపురంలో జరగబోయే యాత్రలో సీఎం చంద్రబాబు రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

బడి పిలుస్తోంది....

సెలవు దినాల్లో తప్పితే మిగిలిన రోజుల్లో, రోజుకో జిల్లా చొప్పున ఈ బస్సు యాత్రలో బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, డ్వాక్రా రుణ ఉపశమనంతో పాటు 24గంటల విద్యుత్‌ పై ఏపి సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేయనుంది. రైతు శ్రేయస్సే లక్ష్యంగా ఏపి సర్కార్‌ చేపట్టిన రైతు కోసం చంద్రన్న బస్సు యాత్ర ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో చూడాలి.

Don't Miss