Activities calendar

11 September 2015

22:24 - September 11, 2015

చెప్పుకోవాటానికి చాలా జీవోలున్నాయి. కానీ అమలు కావు. కాగితాలపై చాలా నిబంధనలున్నాయి. అసలే అనుసరించరు. చాలా తేలిగ్గా చదవును వ్యాపారంగా మార్చేశారు. వందల కోట్లు దండుకుంటున్నారు. తల్లిదండ్రుల్ని దోచుకుంటున్నారు. ఓవరాల్ గా విద్యారంగాన్నే శాసిస్తున్నారు. చదువు పేరు చెప్పి వేల కోట్లల్లో కొన్ని విద్యా సంస్థలు సాగిస్తున్న దందాపై ఈరోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:12 - September 11, 2015

నల్లగొండ : జిల్లాలో విషాదం నెలకొంది. పశ్చిబెంగాల్ లో నల్లగొండ జిల్లా విద్యార్థి మృతి చెందాడు. నల్లగొండ జిల్లా మునగాల మండలం రామలింగబండ గ్రామానికి చెందిన ఎర్రశెట్టి వంశీ బెంగాల్ దుర్గాపూర్ లో నిట్ లో బిటెక్ మొదటి సంవత్సరం కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వంశీ బృందం.. దుర్గాపూర్ సమీపంలోని రిజర్వాయర్ చూడటానికి వెళ్లింది. వంశీ... ప్రమాదవశాత్తు డ్యాంలో పడి గల్లంతయ్యాడు. తోటి విద్యార్థులు తీవ్రంగా బాధపడ్డారు. సమాచారం తెలుసుకున్న వంశీ తల్లిండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహం కోసం తల్లిదండ్రులు బెంగాల్ వెళ్లారు.

 

22:02 - September 11, 2015

రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం నివారించాలని వక్తలు కోరారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రరెడ్డి, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ పాల్గొని, మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:40 - September 11, 2015

విజయవాడ : పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాజిల్లాకు అందించి రైతులకు ఆదుకుంటుంటే..అది చూసి ప్రతిపక్షం ఓర్వలేకపోతుందని మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం చేసే మంచిపనులను చూసి వైసిపి జీర్ణించుకోలేకపోతుందని...పట్టిసీమ ఎందుకని లేనిపోని ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. ఇప్పటికే ప్రజలు వైసిపికి బుద్ధి చెప్పినా ..వారి తీరు మారలేదని మంత్రి దేవినేని విమర్శించారు. 

21:35 - September 11, 2015

హైదరాబాద్ : సమస్యల సాలెగూడెలో అన్నదాత బంధీ అవుతున్నాడు..! కష్టాల పద్మవ్యూహంలో మరో అభిమన్యుడవుతున్నాడు..! కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని పాలకుల చేతిలో బహిరంగంగా రైతన్న మోసపోతున్నాడు. నిత్యం ఆవేదనతో కుమిలిపోతున్నాడు..! బతుకు భారమై, భవిష్యత్‌ శూన్యమై... తాను కన్నవారినీ, తనను కన్నవారినీ అనాథలను, అభాగ్యులను చేస్తూ తనువు చాలిస్తున్నాడు.
ఆకలి చావులకు దేశం నిలయం..
ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏం జరుగుతుంది..? అశ్రుతర్పణం చేస్తూ.. అన్నదాత ఆత్మార్పణం చేసుకుంటే ఏమవుతుంది..? ఒక కుటుంబం బతుకు ధ్వంసమవుతుంది..! ఈ దుస్థితి తదేకంగా కొనసాగితే..? వ్యవసాయమే విచ్ఛిన్నమవుతుంది..! కష్టమొచ్చిన రైతుకు కాష్టమే దిక్కైతే..? దేశ భవిష్యత్తే విధ్వంసమవుతుంది. అన్నపూర్ణ వంటి భారవతావని అన్నమో రామచంద్ర అనాల్సి వస్తుంది. పరాయి దేశాల ముందు దేహీ అనాల్సి వస్తుంది. ఆకలి కేకలకు, ఆకలి చావులకు దేశం నిలయమవుతుంది. ఇదీ.. రైతు ఆత్మహత్య చేసుకుంటే జరిగే విపరీతం. ఈ వైపరీత్యం.. ఈ దేశంలో ఏనాడో మొదలైంది. దశాబ్దాల తరబడి లక్షలాది మంది రైతులు బలవంతంగా ఉసురు తీసుకుంటున్నారు. అయినా.. అన్నదాత ఆత్మఘోష పాలకులకు వినిపించట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో రైతు ఇంట చావుడప్పు విరామం లేకుండా మోగుతూనే ఉంది. అయినా.. ప్రభుత్వాల కళ్లకు కనిపించట్లేదు. కర్షకునికి మాటలు.. కార్పొరేట్లకు మూటలు అందిస్తున్న ప్రభుత్వాలు.. అన్నదాత ఇంట దీపం ఆరిపోవడానికి కారణమవుతున్నాయనే విమర్శల జడివాన రెండు రాష్ట్రాల్లో కురుస్తోంది.
ఎంతో నష్టాన్ని చవిచూసిన అన్నదాతలు
మూడు నెలల్లో చేతికొచ్చే పంటకోసం ముప్పై గండాలు దాటాల్సి వస్తోంది రైతన్న. ప్రభుత్వాల మాదిరిగా.. రైతుపై జాలిచూపడం మానేసిన వర్షాలు.. అదును దాటి కురుస్తున్నాయి. దీంతో.. అన్నదాత జీవితమే అదుపు తప్పుతోంది. ఖరీఫ్‌ తొలినాళ్లలో వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు సరిగా వేయక, వేసినవి ఎండిపోయి.. తొలి గండంలోనే ఎంతో నష్టాన్ని చవిచూశారు అన్నదాతలు.
రాబందుల్లా మార్కెట్ వ్యవస్థ
రెండు ఎడ్లు, ఒక నాగలి తప్ప, చేతిలో చిల్లిగవ్వ లేని రైతు.. పెట్టుబడి కోసం పడుతున్నపాట్లు అన్నీ ఇన్నీకావు. లోన్ల పేరుతో ఎగనామం పెట్టేవారికి కోటాను కోట్లు అందించే బ్యాంకులకు.. అన్నదాతకు రుణమిచ్చేందుకు మాత్రం చేయి రావట్లేదు. దీంతో.. తప్పని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారమనే సాలెగూడులో ఇరుక్కుపోతున్నారు రైతన్నలు. అప్పటికే చేసిన అప్పులు తీరకపోవడంతోపాటు, రెట్టింపవుతున్న కొత్త అప్పులు.. అన్నదాత జీవితంలో కుంపటిగా మారుతున్నాయి. అయినా.. గుండె దిటవు చేసుకుని వ్యవసాయ సాగరాన్ని ఈదుతున్న రైతన్న.. ఎంత ప్రయత్నించినా ఒడ్డుకు చేరలేకపోతున్నాడు. చేనుకు పడుతున్న చీడల పీడను అధిగమించి ముందుకు సాగితే.. చేతికొచ్చే అరకొర పంటే దిక్కవుతోంది. ఇన్ని విధాలా అవస్థలు పడి.. పండిన కొద్దిపాటి పంటను అమ్మకానికి తీసుకెళ్తే.. రాబందుల్లా కాచుకుని కూర్చుంటున్న మార్కెట్ వ్యవస్థ.. రైతన్న రెక్కల కష్టాన్ని నిర్ధాక్షిణ్యంగా దోచేస్తోంది.
రైతుకు భరోసా ఇచ్చే చిత్తశుద్ధే కరువైంది
ఇక, రైతు జీవితాన్ని ఉద్ధరించేది తామేనంటూ ప్రభుత్వాలు ప్రకటించిన రుణమాఫీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు రుణమాఫీ పథకం ఎంత వరకు అమలైందో..? ఎంతమంది రైతులకు అందిందో పాలకులకే తెలియని దుస్థితి నెలకొంది రెండు రాష్ట్రాల్లో. ఎంత సేపూ.. బట్టీపట్టిన రుణమాఫీ లెక్కలను ఎక్కాల రూపంలో అప్పజెప్పడం మినహా.. రైతుకు నిజమైన భరోసా ఇచ్చే చిత్తశుద్ధే కరువైంది మన ప్రభుత్వాల్లో.
మాయమైపోతున్న రైతు
ఈ విధంగా పరిస్థితులన్నీ పగబట్టి తరుముతుండడంతో.. కష్టాల సాళ్లలో పరిగెత్తలేక మధ్యలోనే కుప్పకూలుతున్నాడు రైతన్న. చుట్టుముడుతున్న సమస్యల పద్మవ్యూహాన్ని ఛేదించలేక, భార్యా బిడ్డలను అనాథలను చేస్తూ.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తూ.. తనువు చాలిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోంచి రైతు మాయమైపోతున్నాడు.

 

21:26 - September 11, 2015

అనంతపురం : రాయలసీమకు ప్రత్యేకహోదా వస్తేనే సీమ బాగుపడుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా అనంతపురంలో సీపీఎం సామూహిక సత్యాగ్రహం కార్యక్రమం  నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలన్నారు. జిల్లాలో కరువు వల్ల జనం వలసలు పోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు.

కేశవరెడ్డి కేసు సీఐడీకి అప్పగింత

కర్నూలు : విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి కేసును సీఐడీకి అప్పగించామని ఎపి డిజిపి రాముడు తెలిపారు. కానిస్టేబుళ్ల నియామాకాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. 

20:43 - September 11, 2015

హైదరాబాద్ : తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా... పాలకులకు పట్టడం లేదన్నా వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి. రైతు ఆత్మహత్యలను అవహేళన చేస్తే... రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదంటూ ఆయన హెచ్చరించారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదన్నారు.

 

20:38 - September 11, 2015

హైదరాబాద్ : రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మొన్నటి బ్యాంకర్ల సమావేశంలోనే రుణమాఫీపై స్పష్టత ఇచ్చామన్నారు. మొదట్లో రుణమాఫీపై ఇబ్బందులు తలెత్తాయని.. ఇప్పుడా సమస్యలేదన్నారు.

 

20:31 - September 11, 2015

'చిత్రం' తో సెన్సేషనల్ డైరెక్టర్ గా నువ్వు నేను, జయం సినిమాల తర్వాత ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ గా అనతికాలం లోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన తేజ, ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులతో అంతే తక్కువ టైం లో కిందకు వచ్చేశారు. మరి ఇన్ని రోజుల తర్వాత తేజా హోరా హోరీగా కస్టపడి తీసిన హోరా హోరీ చిత్రం హిట్టా ఫట్టా ఇప్పుడు చూద్దాం.
కథ:
పట్ట పగలు నడి రోడ్డుమీద అందరు చూస్తుండగా హత్య చేసిన బసవ అనే రౌడి కేసు మాఫీ నిమిత్తం ఏసిపి తో పాతిక లక్షలకు బేరం కుదుర్చుకుంటాడు. తన చెల్లెలికి కట్నం గా ఇవ్వడం కోసమే బసవతో బేరం కుదుర్చుకున్న ఏసిపి, డబ్బు ని పెళ్లి సమయంలో ఇవ్వమంటాడు. ఒప్పందం ప్రకారం డబ్బు తీసుకుని ఏసిపి ఇంటికి వెళ్ళిన బసవకి కాబోయే పెళ్ళికూతురు ఏసిపి చెల్లెలు అయిన మైథిలి ఎదురౌతుంది. దీంతో మీ చెల్లెలు నాకు నచ్చేసింది నాకిచ్చి పెళ్లి చెయ్యి లేదంటే ఎవరితోనూ పెళ్లి కాకుండా చేస్తాను అనడంతో ఏసిపి కి బసవకి గొడవ అవుతుంది.అన్నట్లుగానే మైథిలి కి పెళ్లి జరుగుతున్నప్పుడే బసవ మనుషులు పెళ్ళికొడుకుని చంపేస్తారు.ఆ తర్వాత మైథిలికి ఎవరికి సంబంధం కుదిర్చినా వారిని చంపేస్తుంటాడు బసవ. బసవను ఏమి చేయలేక పోయిన ఏసిపి మైథిలి ని తన ఫ్యామిలీతో పాటు రహస్య ప్రదేశానికి పంపిచ్చేస్తాడు. ఆ తర్వాత బసవ మైథిలి కోసం వెతకడం, మైథిలి స్కంద అనే కుర్రాడి ప్రేమలో పడడం, చివరకు స్కంద మైథిలి ని బసవ నుంచి ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ఈ మధ్య కాలంలో తేజ ఏ ఇంటర్వ్యూ లో చూసినా టాలీవుడ్ లో కొత్త కథలు రావడంలేదు, రెండే కథలు నడుస్తున్నాయి కావాలంటే మీరే చెక్ చేసుకోండి అని కాస్త ఘాటుగానే మాట్లాడాడు. దీంతో హోరా హోరీ చిత్రం మాములుగా ఉండదేమో, అదిరిపోద్దేమో, బ్లాక్ బస్టర్ హిట్టేమో అనుకున్న ప్రేక్షకులకు తేజ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. సూపర్ డూపర్ బ్లాక్ బస్తర్ ఫ్లాప్ తో ప్రేక్షకుల బుర్రలను బద్దలు కొట్టాడు. ఫ్లాపుల్లో అయన రికార్డులను ఆయనే బ్రేక్ చేసిపడేసాడు. దీంతో తేజ కెరీర్లోనే హోరా హోరీ చిత్రం బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిపోయే పరిస్థితులు వచ్చేసాయి. కొత్త కథలతో సినిమాలు తీయలేరా అని అందర్నీ విమర్శించిన తేజ తన పాత సినిమాలన్నింటిని కలిపేసి, తనకు అచ్చొచ్చిన తనకు మాత్రమే తెలిసిన తను మాత్రమే తీయగలిగిన ఓ పాత చింతకాయ పచ్చడి కథ తో హోరా హోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథ పాతదే అయినా కనీసం కథనం తో ఆకట్టుకునే ప్రయత్నం కాస్త కుడా చేయలేదు. కనీసం తన పాత సినిమాల్లో అయితే కాస్త ఎమోషన్లు, బలమైన పాత్రలు, ప్రేక్షకులను మెప్పించాయి. కానీ ఈ హోరా హోరీ చిత్రం లో మాత్రం కథ కథనాల దగ్గర్నుంచి పాత్రలు వాటి తీరు తెన్నుల వరకు ఒక గమ్యం లేకుండా బ్రేకులు ఫెయిల్ అయిన ఆయిల్ లారీలా ప్రేక్షకుల మీద సవారి చేసాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే ఒక్క హీరొయిన్ దీక్ష తప్ప మిగిలిన పాత్రలన్నీ తమ ఓవర్ యాక్షన్ తో ప్రేక్షకుల నెత్తిమీద సుత్తి తీసుకుని టపీ టపీ మని ఒకటే బాదుడు. ముఖ్యంగా హాస్యం పేరుతో జబర్దస్త్ గ్యాంగ్ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఆల్రెడీ పెనం మీద మాడిన కోడిని తీసుకెళ్ళి తండూరిలో వేసినట్టు వీళ్ళ పంచులు, కుళ్ళు కామెడీ తో ప్రేక్షకులకు చుక్కలు చూపించారు.ఇక హీరో దిలీప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ఏడుస్తూనే ఉంటాడు. ఇలా అయిన దానికి కానీ దానికి హీరో ఏడవడం అనేది దర్శకుడి సరికొత్త క్రియేటివిటీ అనుకోవాలో లేక హీరోకి అది మాత్రమే తెలుసనుకొవాలొ ప్రేక్షకులకే వదిలేస్తున్నాము. తేజ హీరోలందరిలో ఇతను మాత్రమే వీక్ అండ్ పూర్ పెర్ఫార్మన్స్ కలిగిన హీరో. ఒక్క హీరోయిన్ దక్ష మాత్రమే తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఇక మిగిలిన టెక్నికల్ అంశాల్లోకి వెళ్తే దీపక్ భగవంత్ అందించిన సినిమాటోగ్రఫి అధ్బుతం. సరికొత్త లొకేషన్లను వర్షం పడే సన్నివేశాలను దీపక్ చాల చక్కగా చూపించాడు. అలాగే కళ్యాణి కోడూరి అందించిన సంగీతం కానీ, దామోదర్ ప్రసాద్ నిర్మాణ విలువలు కానీ పర్వలేదనిపిస్తాయి. కానీ ఇవి ఎంత బాగున్నా సరైన కథ కథనం లేనప్పుడు హోరా హోరిన పడిన కష్టమంతా వృధా ప్రయాస అవుతుంది. తన పాత సినిమానే తీసుకుని రెండున్నర గంట సేపు నత్త నడకన సాగిస్తూ.. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్తూ.. తీసిందే మళ్లీ మళ్లీ చూపిస్తూ ఉంటె ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించండి.సో ఫైనల్ గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రోజుల తర్వాత తేజ హోరా హోరిన చాల కస్టపడి ఓ దిసాస్తర్ ఫ్లాప్ ని ప్రేక్షకులకు అందించాడు.
ప్లస్ పాయింట్స్
సినిమాటోగ్రఫి
లొకేషన్స్
మైనస్ పాయింట్స్
కథ
కథనం
దర్శకత్వం
హీరో
కామెడీ
ఎమోషన్స్
పాత్రల చిత్రీకరణ
టెన్ టివి రేటింగ్... 0.5/5

20:12 - September 11, 2015

మహబూబ్ నగర్ : జిల్లాలోని నాగర్ కర్నూల్ లో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు. వర్షం పడుతున్నప్పుడు పొలంలో పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈఘటనలో మరొకరికి గాయాలయ్యాయి.

 

19:52 - September 11, 2015

హైదరాబాద్ : నగరంలో మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. సుమారు గంటసేపటి నుంచి వర్షం కుండపోతగా కురుస్తోంది. కుషాయిగూడ, ఈసీఐఎల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సనత్ నగర్, సికింద్రాబాద్ లో భారీవర్షం పడింది. చాలాచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల రోడ్డుపై వర్షపునీరు నిలిచిపోయింది. దీనికి తోడు... మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్ని చిధ్రం కావడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో పనులు జరిగే ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఏపీ సచివాలయంలో కూలిన చెట్టు
ఏపీ సెక్రటేరియట్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. భారీవర్షంతో పాటు.. ఈదురుగాలుల ధాటికి L-బ్లాక్ ముందున్న... ఓ చెట్టు కూలిపోయింది. దీంతో ఓ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ... లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

 

హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ : నగరంలో మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. సుమారు గంటసేపటి నుంచి వర్షం కుండపోతగా కురుస్తోంది. కుషాయిగూడ, ఈసీఐఎల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సనత్ నగర్, సికింద్రాబాద్ లో భారీవర్షం పడింది. 

19:35 - September 11, 2015

వాడ్రోబ్ లో ఎంత కలెక్షన్ ఉన్నప్పటికీ ఇంకా కొత్తగా ఏమోచ్చాయని వెతుక్కునే ప్రయత్నం చేసేందుకు అతివలు ఆసక్తి చూపుతారు. అంతే కాదు ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అవటంలో వారే ముందు వరుసలో ఉంటారు. అలాంటి వారి కోసం లేటెస్ట్ కలెక్షన్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:34 - September 11, 2015

కీలక భద్రతా విభాగాలలో మహిళలకు ప్రవేశం 
మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో సమర్థత చాటుతున్నప్పటికీ వారికి ఇంకా కొన్ని రంగాలలో ప్రవేశం లేకపోవటం విచారకరం. ఇదే విషయాన్ని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా పరిగణించి మహిళలకు కీలక భద్రతా విభాగాలలో ప్రవేశం కల్పించాల్సిందిగా తీర్పు వెలువరించింది.
చిన్నారి అరుదైన ఘనత
ఒడిశాకు చెందిన చిన్నారి అరుదైన ఘనత సాధించింది. భారత్ లో సింగర్స్ ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ ఐడల్ లో విజేతగా నిలిచి ప్రత్యేకత చాటింది.
డీఆర్ డీవో కి తొలిసారి మహిళ ప్రాతినిధ్యం 
మహిళలు ఎలాంటి బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డీఆర్ డీవో కి తొలిసారి మహిళ ప్రాతినిధ్యంతో కృషి, పట్టుదలతో మహిళలు ఎంతటి పనులైనా విజయవంతంగా నిర్వహించగలరని మరోసారి రుజువైంది.
అక్షరాస్యత దిశగా మహిళలు అడుగు
ప్రపంచంలోని అనేక దేశాల్లో మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతూ, అన్ని రంగాల్లో ముందుంటున్నా, మన పక్కనే ఉన్న భూటాన్ లో మాత్రం మెజార్టీ ప్రజలు 5,6 దశాబ్దాల క్రితం వరకూ అక్షరాసత్యకు దూరంగానే ఉన్నారు. అలాంటి స్థితిలో మహిళలు అక్షరాస్యత దిశగా అడుగేయడమే కాదు, ఆంగ్ల సాహిత్యంలో సరికొత్త అడుగులు వేస్తున్నారు.
విద్యారంగంలో అమ్మాయిలు విజయబావుటా 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తే, అమ్మాయిలు విద్యారంగంలో విజయబావుటా ఎగరేయగలరని మరోసారి రుజువైంది. తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ విడుదల చేసిన నివేదిక ఆ విషయాన్ని మరోసారి తేటతెల్లం చేసింది.

 

19:29 - September 11, 2015

మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎంతో మంది జీవితాల్లో ఎన్నో మార్పులను తెస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి ఒంటరితనం, ముఖ్యంగా ఒంటరి మహిళలు సమాజంలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవటం మనం చూస్తుంటాం. మరి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలను ఎలా నివారించాలి? అంశాన్ని చర్చించేందుకు ఇవాళ్టి నిర్భయ సిద్ధంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
 

19:17 - September 11, 2015

ఒరిస్సా : ప్రజా ఆరోగ్యం, వైద్యంపై.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్ నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒడిశాలో పర్యటిస్తోన్న రాహుల్ గాంధీ.. కటక్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ హాస్పిటల్‌ను సందర్శించారు. చిన్న పిల్లల మరణాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత నెల 12రోజుల వ్యవధిలో.. 62మంది చిన్నారులు మృత్యువాతకు గురైనా... సీఎంకు చీమకుట్టినట్లయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భావిపౌరుల పట్ల సీఎం బాధ్యత రాహిత్యంతో వున్నారని విమర్శించారు. ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

19:08 - September 11, 2015

పాట్నా : ఒపీనియన్‌ పోల్స్‌పై తమకు నమ్మకం లేదని, ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తెలిపారు. ఇటీవల జరిపిన ఓ ఒపీనియన్‌ పోల్‌ సర్వేపై స్పందించడానికి నిరాకరించారు. పొలిటికల్‌ పార్టీలు కూడా ఇంటర్నల్‌ సర్వేలు జరుపుకుంటాయన్నారు. కేంద్రంలోని అధికార పార్టీ బిజెపి బీహార్‌ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుండంతో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైందన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ అధ్యయనం చేస్తున్నారని నితీష్‌ పేర్కొన్నారు. సర్వేలపై కామెంట్లు చేయడం తమకిష్టం లేదని, ప్రజల మధ్యకు వెళ్లి వారితోనే తమ అభిప్రాయాలు పంచుకుంటామన్నారు.

విమ్స్ ఓఎస్ డీ తొలగింపు..

విశాఖ :  విమ్స్ ఓఎస్ డీ సుబ్బారావును తొలగిచాంరు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారని  ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో నిమ్స్ ఓఎస్ డీ పదవి నుంచి సుబ్బారావును తొలగించారు.  

18:50 - September 11, 2015

ప్రకాశం : ఆంధ్రప్రదేశ్‌ లో కూడా రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అనునిత్యం రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పుల బాధ భరించలేక మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరుకు చెందిన కృష్ణారావు.. తన 18 ఎకరాల్లో పొగాకు పంట వేశాడు. ఇందుకోసం దాదాపు రూ.20 లక్షల వరకూ అప్పుచేశాడు. ఈసారి పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో నష్టాలపాలయ్యాడు. పంట అమ్మిన డబ్బు వడ్డీలకు కూడా సరిపోలేదు. దీంతో మనస్తాపం చెందిన రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహంతో పొగాకు బోర్డు రీజినల్ కార్యాలయం ఎదుట రైతులు, రైతు సంఘం నేతలు ఆందోళన చేపట్టారు.

 

18:38 - September 11, 2015

నల్గొండ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అనునిత్యం రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పుల బాధ భరించలేక తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం రేగట్టికిచెందిన లోయపల్లి అచ్చాలు పత్తి సాగు చేశాడు. తన సొంత భూమి ఐదెకరాలతోపాటు... మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పంట వేశారు. వర్షాభావంతో చేను ఎదగక అప్పులపాలయ్యాడు. తెచ్చిన రుణాలకు వడ్డీలు పెరిగిపోవడంతో ఆందోళన చెందాడు. తన చేనులోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఇద్దరు కొడుకులున్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోతుంటే... రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుంది. అన్నదాతకు ఏ ఆపదొచ్చినా ఆదుకుంటామన్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మారాయి. రైతన్న దేశానికి వెన్నెముక అని గర్వంగా చెప్పుకుంటున్నా.. వారి కష్టాలు తీర్చడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్న నడ్డి విరుస్తున్నారు. రైతులను ఆదుకోలేని ప్రభుత్వం ఎందుకని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి.. రైతు ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరముంది. 

18:20 - September 11, 2015

హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మను టీ.టీడీపీ బృందం కలిసింది. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. రైతు సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీ.టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా 1,300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు... 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలన్నారు. వ్యక్తిగత కారణాలతో ఎవరూ... ఆత్మహత్య చేసుకోరని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా రైతు సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

18:12 - September 11, 2015

వరంగల్ : జల్లాలోని జనగాం పట్టణంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారులు రైతులకు రుణాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. బ్రోకర్లను ఆశ్రయించిన వారికి మాత్రమే రుణాలిస్తూ మిగతా వారికి రుణాలివ్వడంలేదని రైతులు ఆందోళన చేశారు. అయితే రైతుల ఆందోళనపై స్పందించిన బ్యాంకు అధికారులు..తమ దగ్గర బ్రోకర్లు అసలు లేరని రైతులకు రుణాలిస్తున్నామని వారు అన్నారు. రైతుల ఆందోళనతో సూర్యాపేట-సిద్ధిపేట రహదారిపై ట్రాఫిక్‌ స్ధంభించింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్‌ను క్లీయర్ చేశారు.

 

18:08 - September 11, 2015

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు... 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మను టీ.టీడీపీ బృందం కలిసింది. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 1,300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

17:57 - September 11, 2015

ఢిల్లీ : పాకిస్థాన్‌తో డిజి స్థాయి చర్చలు.. పూర్తి సానుకూల వాతావరణంలో జరుగుతున్నాయని.. భారత బిఎస్ ఎఫ్ డిజి.. డికె. పాథక్‌ వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్లాన్‌ ప్రకారం.. సమావేశంలో.. అన్ని అంశాలనూ ప్రస్తావించినట్లు చెప్పారు. గురువారం మొదలైన చర్చలు.. శనివారంతో ముగియనున్నాయి. ఉదయం కేంద్రహోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయిన బిఎస్ ఎఫ్ డిజి డికె. పాథక్‌... చర్చల సారాంశాన్ని వివరించారు. అటు పాకిస్థాన్‌ ఆర్మీ అధికారులు సైతం రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు.

 

17:51 - September 11, 2015

ముంబై : 2006 ముంబై లోకల్ ట్రైన్‌ పేలుడు కేసులో ప్రత్యేక కోర్టు... 12 మందిని దోషులుగా తేల్చింది. వీరికి కోర్టు సోమవారం శిక్షలు ఖరారు చేయనుంది. కేసులో మొత్తం 13 మందిని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అరెస్ట్‌ చేసింది. కేసులో సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం... 12 మంది దోషులుగా తేల్చింది. అబ్దుల్ వహీష్‌ షేక్‌ను నిర్దోషిగా ప్రకటించింది. 2006, జులై 11న ముంబై లోకల్ ట్రైన్ పేలుడు ఘటనలో 189 మంది మరణించగా 700 మందికిపైగా గాయాలపాలయ్యారు. 11 నిమిషాల వ్యవధిలో 7సార్లు పేలుల్లు జరిగాయి. 

ఐఎస్ ఐఎస్ లో చేరేందుకు వెళ్తున్న యువతి అరెస్టు..

హైదరాబాద్ : ఐఎస్ ఐఎస్ లో చేరేందుకు వెళ్తున్న నిక్కీ అనే యువతిని శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో అరెస్టైన మొయినుద్దీన్ ఇచ్చిన సమాచారంతో నిక్కీని దుబాయ్ నుంచి రప్పించి పోలీసులు అరెస్టు చేశారు. గతంలో మొయినుద్దీన్, నిక్కీ కలిసి దుబాయ్ వెళ్లారు. 

నాగర్ కర్నూల్ లో పిడుగుపాటుకు ఇద్దరి మృతి..

మహబూబ్ నగర్ : జిల్లాలోని నాగర్ కర్నూల్ లో దారుణం జరిగింది. పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు.

 

16:36 - September 11, 2015

రాజమండ్రి : మేకిన్‌ ఇండియా పేరిట మోడీ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ అన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన ఎల్‌ఐసి ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ అఫ్‌ ఇండియా 4వ జాతీయ మహాసభల్లో తపన్‌ సేన్‌ పాల్గొని, మాట్లాడారు. కార్మికుల హక్కులను అణిచివేసే ఉద్ధేశ్యంతో కార్మిక చట్టాలకు ప్రభుత్వం సవరణలు చేస్తోందని విమర్శించారు. సెప్టెంబర్‌ 2 సార్వత్రిక సమ్మె విజయవంతమైందన్నారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక జరిగిన అతి పెద్ద సమ్మె సెప్టెంబర్‌ 2 సార్వత్రిక సమ్మె అని పేర్కొన్నారు. ఈ సమ్మెలో దేశంలోని సుమారు 15 కోట్ల మంది కార్మికులు ఐక్యంగా సమ్మెలో పాల్గొన్నారన్నారు. బీఎంఎస్‌ సంఘ కార్మికులు సైతం పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు.

 

16:26 - September 11, 2015

వరంగల్ : రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు వరంగల్ లో ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కేసీఆర్‌ది అసమర్థపాలన అని తమ్మినేని విమర్శించారు. టిఆర్ ఎస్ సర్కార్ వచ్చి 14 నెలలైనా.. ఏ హామీ అమలు కాలేదన్నారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపారు. రైతుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై తీవ్ర చర్చ జరుగుతోందన్నారు. ప్రభుత్వ విధానాల వల్లనే ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యల్లో టీడీపీ, కాంగ్రెస్‌లకూ భాగస్వామ్యముందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, గత ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాల మూలంగానే వ్యవసాయంరంగం సంక్షోభంలోకి నెట్టబడిందని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో వామపక్షాలే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్ ను ఎన్నికల బరిలో ఉంచే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.

 

15:59 - September 11, 2015

మెదక్ : జిల్లాలో దళితులను అవమానించిన ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎల్లారం దళితులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఇదిలావుంటే ఎల్లారం గ్రామంలోని పెత్తందార్లను అరెస్ట్ చేయాలంటూ కెవీపీఎస్‌ తలపెట్టిన ఎస్పీ కార్యాలయం ముట్టడి తాత్కాలికంగా వాయిదా పడింది.

 

15:55 - September 11, 2015

హైదరాబాద్ : నగరంలోని మల్కాజ్‌గిరిలో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మల్కాజ్‌గిరి బీ.జే.ఆర్. నగర్ కు చెందిన నవ్య అనే విద్యార్థిని ఈసీఐఎల్ లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతోంది. కొద్ది రోజులుగా మూడీగా ఉంటుంది. నిన్న రాత్రి నవ్య ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో కొద్దిగా ఘర్షణ జరిగింది. కుటుంబ సభ్యులు నవ్యను బాగా చదవడం లేదని మందలించినట్లు సమాచారం. దీంతో నవ్య ఇవాళా రైలు కింద పడి ఆత్మహత్యకు చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

15:41 - September 11, 2015

అనంతపురం : జిల్లాలోని చెన్నెకొత్తపల్లి పీఎస్ లో ఓ వ్యక్తి మృతి చెందాడు. గుప్తనిధుల కేసులో నిందితుడిని అరెస్ట్ చేయగా.. ఉదయం శవంగా మారాడు. గువ్వలగొంది వాసి సంజీవప్పను గుప్తనిధుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పిఎస్ లో ఉదయం సంజీవప్ప శవంగా మారాడు. పోలీసుల దెబ్బలకే మృతిచెందాడని సంజీవప్ప బంధువులు ఆరోపిస్తూ.. ఆందోళనకు దిగారు.

 

14:58 - September 11, 2015

విజయవాడ : తాత, నాన్న, మనవళ్లే కాదు.. ఇండస్ట్రీకి కొత్తవాళ్లు కావాలని సినీ దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ కనకదుర్గమ్మను తేజ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు కొత్తవారిని పరిచయం చేసిన ఘనత తనదేనన్నారు. దాదాపు వెయ్యిమంది తాను పరిచయం చేసినవాళ్లు ఇండస్ట్రీలో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 'హోరాహోరీ' చిత్రం వస్తుందన్న తేజ ఇందులోనూ అంతా కొత్త నటీనటులే ఉన్నారని పేర్కొన్నారు.

 

14:53 - September 11, 2015

నెల్లూరు : జిల్లాలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కాలేజీలో ర్యాగింగ్‌ బుసలు కొట్టింది. బీటెక్ ఫస్టియర్‌ విద్యార్థిని తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. దీంతో ఆగ్రహించిన పలువురు విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థిని బాత్‌రూమ్‌లో వేసి కొట్టారు. ఈ సంఘటనపై కాలేజీ ఎదుట విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి.

 

నెల్లూరు ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కాలేజీలో ర్యాగింగ్‌

నెల్లూరు : జిల్లాలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కాలేజీలో ర్యాగింగ్‌ బుసలు కొట్టింది. బీటెక్ ఫస్టియర్‌ విద్యార్థిని తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. 

ముంబై పేలుళ్ల కేసులో 12 మందిని దోషులుగా తేల్చిన మకోకా కోర్టు..

ముంబై : మకోకా కోర్టు.. ముంబై 2006, 7/11 పేలుళ్ల కేసులో 12 మందిని దోషులుగా తేల్చింది. అబ్దుల్ వాహిద్ ను నిర్దోషిగా తేల్చింది. మొత్తం పదమూడు మందిపైన అరోపణలున్నాయి. కోర్టు.. సోమవారం దోషులకు శిక్షలు ఖరారు చేయనుంది. అయితే ఈ పేలుళ్లలో 187 మంది మృతి చెందారు. 800మందికి గాయాలయ్యాయి. 

సైకోలుగా అనుమానిస్తున్న ఇద్దరి అరెస్టు

ప.గో : సైకోలుగా అనుమానిస్తున్న ఇద్దర్ని భీమవరం పోలీసులు మెంతవాడలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నెంబర్ ప్లేట్ లేని రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. 

గణేష్ ఉత్సవ కమిటీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు..

హైదరాబాద్ : గణేష్ ఉత్సవ కమిటీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. 19న ఎల్ బి స్టేడియంలో సభకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉత్సవ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. 

 

13:51 - September 11, 2015

అనంతపురం : జీవో 120 రాష్ట్ర సమైక్యతకు ఆటంకం అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు . తిరుపతి స్విమ్స్ మెడికల్‌ కాలేజీ అడ్మిషన్లలో రాయలసీమ ప్రాంత విద్యార్థులకు నష్టం జరిగిందని ఆయన అన్నారు. 150 సీట్లలో 15-16 శాతం సీట్లను మాత్రమే సీమ విద్యార్థులకు కేటాయించారన్నారు. అత్యంత రహస్యంగా తీసుకువచ్చిన 120 జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకుని.. జోనల్‌ విధానాన్ని అమలు చేయాలని రాఘవులు డిమాండ్‌ చేశారు.

13:49 - September 11, 2015

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో ముగిసిన టీటీడీపీ నేతల సమావేశం ముగిసింది. రైతు ఆత్మహత్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని టీటీడీపీ నిర్ణయించింది. 14, 15 తేదీల్లో ఢిల్లీవెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని, 16న హెచ్‌ఆర్సీని కలవాలని నిర్ణయించారు. 21,22 తేదీల్లో నల్లగొండ, మెదక్‌, కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ల దగ్గర ధర్నాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.

13:46 - September 11, 2015

హైదరాబాద్ : రాష్ర్ట డీజీపీ జేవీ రాముడు పర్యటన కర్నూలులో కొనసాగుతోంది. ఉన్నతాధికారులతో సమావేశమైన రాముడు కేశవరెడ్డి విద్యాసంస్థల డిపాజిట్ల వ్యవహారం, ఎర్రచందనం స్మగ్లింగ్‌ నివారణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

13:45 - September 11, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టాన్ని స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో మరో మహిళ మృతి చెందింది. మెదక్‌ జిల్లాకు చెందిన మహిళ స్వైన్‌ఫ్లూతో మృతి చెందింది. గత నెల 26వ తేదీన కాన్సు కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చింది. ఈ నెల 1వ తేదీన ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. కాన్సులో స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుండి ఆమెకు ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆమె పరిస్థితి విషమించి మరియమ్మ మృతిచెందింది. ఆమె మరణం కుటుంబ సభ్యులను కలచివేసింది. ఇదే ఆసుపత్రిలో మరో నలుగురు మహిళలకు చికిత్స అందిస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగానే హెచ్ 1 ఎన్ 1 వైరస్‌ విస్తరిస్తోందని వైద్యులంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బాధితులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. 

13:41 - September 11, 2015

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరం మెతెవాడతోటలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరు సిరంజి సైకోలుగా అనుమానిస్తున్నారు. వీరి నుంచి నెంబర్‌ లేని రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఓ కాలేజీ వద్ద అమ్మాయిలకు ఇంజక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకున్నారు. నెంబర్ లేని బైక్ పై ముగ్గురు వ్యక్తు ముఖానికి గుడ్డలు కట్టుకుని ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి పారిపోయాడు. పారారయిన వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నారు. వారిని మరి కాసేపట్లో మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. వీరే సూది దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడులకు పాల్పడున్నది ఎంత మంది అన్నఅంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

చెన్నెకొత్తపల్లి పీఎస్ లో నిదింతుడు మృతి

అనంతపురం : గుప్త నిధుల కేసులో అరెస్టు అయిన నిదింతుడు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి పీఎస్ లో జరిగింది. మృతుడు గువ్వలగంధవంపల్లి వాసి. పోలీసుల దెబ్బలకే మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

సుప్రీం కోర్టులో వ్యాపం కేసు విచారణ

ఢిల్లీ : సుప్రీం కోర్టులో వ్యాపం కేసు విచారణ జరిగింది. 48 మంది న్యాయవాదులను నియమించుకునేందుకు సీబీఐ సుప్రీంకోర్టు అనుమతించింది. న్యాయవాదుల నియామకానికి మూడు వారాల గడువు ఇచ్చింది.

ఆసరా పింఛన్ కోసం వికలాంగుడు ఆత్మహత్య

వరంగల్ : నెక్కొండ మండలం దీక్ష కుంటలో వికలాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసరా పింఛన్ రాలేదన్న మనస్తాపంతో సాంబయ్య అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

స్వైన్ ఫ్లూ తో మరో మహిళ మృతి

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో బాధపడుతూ చికిత్స పొందుతున్న మెదక్ జిల్లా చెందిన మరియమ్మ(26) అనే మహిళ మృతి చెందింది. దీంతో స్వైన్ ఫ్లూతో మృతి చెందిన వారి సంఖ్య రెండు కు చేరింది. ఈ రోజు ఉదయం ముషీరాబాద్ కు చెందిన మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.

విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేస్తున్న మాజిద్ అరెస్ట్

హైదరాబాద్ : ఇంటర్, హైస్కూల్ విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేస్తున్న మాజిద్ ను పోలీసులు అరెస్టు చేశారు. 60 నుండి 70 మంది విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసుల విచారణ లో మాజీద్ వెల్లడించారు.

నీటి సంఘం ఎన్నికల్లో టిడిపి, వైసీపీ ఘర్షణ

తూ.గో : జిల్లాలోని అనపర్తి మండలం పొలమూరులో జరుగుతున్న నీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ బలంగా ఉండటంతో ఆ పార్టీ సభ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రైతులు బలపర్చారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ రైతులు, కార్యకర్తలు ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ , వైసీపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం ఒకరిపైఒకరు దాడి చేసుకుని, చొక్కాలు చింపుకున్నారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి అదుపు చేశారు. ఇరువర్గాల గొడవ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు నీటి సంఘం ఎన్నికలను వాయిదా వేశారు.

పెద్దవాగు ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత

ఖమ్మం: అశ్వరావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి లక్ష్మీసాయి మృతదేహాన్ని గంగారం తెస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వేలేరు మండలం రుద్రంకోట నుంచి గ్రామస్తులు బయలుదేరారు. నిన్న సత్తుపల్లి మండలం గంగారంలో బీటెక్ విద్యార్థి లక్ష్మీసాయి ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మీసాయి మృతదేహానికి తిరిగి శవపరీక్ష నిర్వహించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థిని మృతికి కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆందోళన చేస్తున్నారు.

జగన్‌ దీక్షతో రాష్ర్టానికి ఒరిగేదేమీ లేదు : ఎంపీ రాయపాటి

తిరుమల : జగన్‌ దీక్షతో రాష్ర్టానికి ఒరిగేదేమీ లేదని ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ రాయపాటి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై తాము ఒత్తిడి తెస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు.

గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పై డీసీపీ సమీక్ష

హైదరాబాద్: నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలను మధ్య మండల డీసీపీ కమలహాసన్‌రెడ్డి పరిశీలించారు. గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లను తనిఖీ చేశారు. అనంతరం ఉన్నతాధీకారులతో భద్రత ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రేన్ల ఏర్పాటు, భక్తులకు తాగునీటి వసతిపై సమీక్షలో చర్చించారు.

సైకోలను పట్టుకున్నారన్న ప్రచారం

పశ్చిమగోదావరి : జిల్లాలో పలువురికి సూదులు గుచ్చి సంచలనం సృష్టించిన సైకో సూదిగాళ్లను పోలీసులు పట్టుకున్నారని ప్రచారం జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో జనం భీమవరం పోలీసుస్టేషనుకు వచ్చారు. కాగా తాము జేబు దొంగలను పట్టుకున్నామని, సైకోలను పట్టుకోలేదని భీమవరం పోలీసులు చెబుతున్నారు. 

మాలేగావ్ పేలుళ్ల కేసు పై సుప్రీం లో విచారణ

ఢిల్లీ: మాలేగావ్ పేలుళ్ల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పేలుళ్ల కేసు నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

12:35 - September 11, 2015

హైదరాబాద్ : సంక్షేమ పథకాలను మెరుగుపర్చేందుకు తెలంగాణ సర్కార్‌ సిద్దమైంది. అమలు తీరును పర్యవేక్షించడంతో పాటు... లోటుపాట్లను సరిదిద్దేందుకు ఈస్ట్‌ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. ప్రతి పైసా అర్హులకు అందించడమే లక్ష్యంగా ఈ సంస్థ పని చేయనుంది.

పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ......

తెలంగాణలో పేదల కోసం సర్కార్‌ అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. ఆసరా పింఛన్ల నుంచి భారీ నీటి పారుదల ప్రాజెక్టుల వరకు అనేక కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. అయితే అక్కడక్కడ అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోపక్క పథకాల అమల్లో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నింటికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనకు బీజం వేసింది. సంక్షేమ పథకాల్లో పారదర్శకత పెంచేందుకు.. దాని పర్యవేక్షణకు ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని భావించింది. ఇందులో భాగంగానే ఎవాల్యుయేషన్‌ అథారిటీ స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ.. ఈస్ట్‌ పేరిట కొత్త సంస్థకు రూపకల్పన చేసింది.

ప్రభుత్వ పథకాలను మదింపు చేయనున్న ఈస్ట్‌.....

ప్రభుత్వ పథకాలన్నింటిని ఈ సంస్థ మదింపు చేయనుంది. పథకాల్లోని లోటుపాట్లను విశ్లేషించడంతో పాటు.. ఎంత మేరకు విజయం సాధించాయో కూడా పరిశీలించనుంది. ఇక పథకాలను ఏ విధంగా అమలుచేస్తే ప్రజలకు చేరుతాయో కూడా సలహాలు అందించనుంది. గతంలో ఈ పనులన్నీ సంబంధిత శాఖాధికారులే చూసేవారు. దీంతో పథకాల అమలులో లోపాలు బయటపడలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారాలన్ని స్వతంత్ర సంస్థకు అప్పగించడం వల్ల వీటన్నింటికి చెక్‌ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సంస్థకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. ప్రొఫెసర్లు, మేధావులతో పాటు ప్రభుత్వ అధికారులు ఈ సంస్థలో సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయిలో కూడా ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగించనుంది.

కర్నాటకలో కొనసాగుతున్న పద్ధతి.....

కర్నాటకలో ఇదే తరహా పద్థతిని అనుసరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడ మంచి ఫలితాలు సాధించడంతో దీనికి తెలంగాణ సర్కార్‌ శ్రీకారం చుట్టబోతుంది. దీనికి సంబంధించిన అన్ని విధానాలను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. ఇక సీఎం ఆమోదం పొందడమే తరువాయి. చైనా నుంచి కేసీఆర్‌ తిరిగి వచ్చిన వెంటనే దీనికి ఆమోదముద్ర పడనుందని ప్లానింగ్‌ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సంస్థ నిర్వహణ ఖర్చు కోసం 10 కోట్ల రూపాయలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పేదల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రతి పైసా అర్హులకు చేరడమే లక్ష్యంగా చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం ఎంతవరకు సత్ఫలితాలిస్తాయో వేచి చూడాలి. 

12:32 - September 11, 2015

హైదరాబాద్ : రాష్ర్టాభివృద్ధి కోసం భారీగా నిధులు కావాలి. డెవలప్‌మెంట్‌ చేద్దామంటే.. చేతిలో చిల్లిగవ్వ లేదు. అయితేనేం.. నిధుల వేట కోసం ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. తమను ఆదుకునే పెద్దన్న కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగానే ఏపి సర్కార్‌ ఇప్పుడొక సరికొత్త వ్యూహాన్ని రచించింది. రాజధాని ప్రాంత నిధులను సమీకరించేందుకు పన్ను రహిత బాండ్లను జారీ చేయాలని భావిస్తోంది.

అమరావతి బాండ్లపై సర్వత్రా ఆసక్తి.....

అమరావతి బాండ్లు అని ఏపీ ప్రభుత్వం ప్రకటించగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కానీ, ఇది సాధ్యపడదంటూ అధికారులు తేల్చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎం నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశంలో పలుమార్లు చర్చించారు. ఆ బాండ్లను అమరావతి మౌలిక వసతుల కల్పన పేరిట విడుదల చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రాతిపాదించింది. అయితే ఇప్పటికే రాష్ర్ట బాండ్లను ప్రభుత్వం ఆర్బీఐ వద్ద పెడుతూ వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. అయితే.. రాజధాని పేరుతో విడిగా బాండ్లు రూపొందించే అవకాశం ఉందంటూ ఆర్థికశాఖ అధికారులు చెప్పకనే చెప్తున్నారు. విడిగా బాండ్లు విడుదల చేయాలంటే కేంద్ర అనుమతితో పాటు, సెబీ, ఆర్బీఐ అనుమతి కూడా అవసరముందంటూ తేల్చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ బాండ్ల ద్వారా ఒకేసారి వేల కోట్ల రూపాయల అప్పును ప్రభుత్వం తీర్చగలదా అనే సందేహమూ వస్తోంది.

వచ్చే పదేళ్లలో రూ.53, 547 కోట్లు అవసరమని అంచనా.....

అమరావతి నిర్మాణం నిమిత్తం వచ్చే పదేళ్లలో 53, 547 కోట్లు అవసరముంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. నిజానికి అంచనా వేసిన దాంట్లో కొంతభాగం కేంద్రం నుంచి గ్రాంట్‌ రూపంలో కొంతమొత్తం అందుతుంది. కాబట్టి మిగిలిన మొత్తాన్ని సమీకరించాల్సి ఉంటుందని సీఆర్డీయే సమావేశంలో ఇటీవలే సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతిపై ప్రజల్లో సెంటిమెంట్‌ ఉంది కాబట్టి.. అదేపేరుతో పన్ను చెల్లించాల్సిన అవసరం లేని బాండ్లను జారీ చేయాలని సీఆర్డీయే నిర్ణయించింది. అయితే.. ఇందుకు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం సెబీ మాత్రమే కాదు.. కేంద్ర హామీతో పాటు రాష్ర్ట ఆర్బీఐ నుంచి కూడా అనుమతులు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. అయితే.. బాండ్ల జారీకి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయడానికి ఓ కన్సల్టెంట్‌ను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త బాండ్లకు ఎంత వరకూ కట్టుబడి ఉంటుందనేది ప్రశ్నార్థకం....

బాండ్లను కొనుగోలు చేసే ప్రజలకు, తమ పెట్టుబడులపై రాష్ర్ట ప్రభుత్వమే గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి.. అప్పుల ఊబిలో ఉన్న రాష్ర్టం కొత్త బాండ్లకు ఎంత వరకూ కట్టుబడి ఉంటుందనేది ప్రశ్నార్థకమే. వీటిని ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం పన్ను పరిధి నుంచి తొలగిస్తామని ప్రకటించారు. కానీ, పన్ను రాయితీలు కేవలం పెట్టుబడులపైనేనా..? లేక దానిపై వడ్డీలు తదితరాల రూపంలో వచ్చే ఆదాయంపై కూడానా..? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. 

12:30 - September 11, 2015

విజయవాడ : వంశధార ట్రిబ్యునల్‌ బృందం ప్రకాశం బ్యారేజీని పరిశీలిస్తోంది. బృందం వెంట మంత్రి దేవినేని కూడా ఉన్నారు. దీంతో బ్యారేజీపై భారీగా ట్రాఫిక్‌జాం అయింది. అయితే ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో అంబులెన్స్‌లో ఉన్న గర్భిణీ పురిటినొప్పులతో బాధపడుతోంది. అంబులెన్స్‌కు కూడా దారివ్వకపోవడంపై వాహనదారులు మండిపడుతున్నారు.

12:23 - September 11, 2015

చిత్తూరు : ఈ సంవత్సరం అధికమాసం ఉన్నందున రెండు బ్రహ్మోత్సవాలు వస్తున్నాయని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఈ నెల 16 నుంచి 24 వరకు, వచ్చేనెల 14 నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఆర్జిత సేవలను రద్దు చేస్తామని సాంబశివరావు చెప్పారు.

12:21 - September 11, 2015

కర్నూలు : డిపాజిటర్లను నిండా ముంచిన కేశవరెడ్డి విద్యా సంస్థల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కర్నూలు కేశవరెడ్డి విద్యాసంస్థల్లోని రికార్డులను సీసీఎస్‌ పోలీసులు పరిశీలిస్తున్నారు.

12:20 - September 11, 2015

హైదరాబాద్ : ముడుపుల కోసమే పట్టిసీమను నిర్మిస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆరోపించారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ....పట్టిసీమతో గోదావరి నీళ్లు వస్తున్నట్లు సంబరాలు చేసుకుంటున్నారని, కానీ తాడిపూడి నుంచి గోదావరి జలాలను మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వానికి పోలవరం నిర్మించే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. ఎక్కడైనా తాత్కాలిక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారా అని ఆయన అన్నారు. పట్టిసీమకు, రాయలసీమకు సంబందమేమిటని ఉండవల్లి ప్రశ్నించారు. తాడిపూడి ఎత్తిపోతలపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

12:18 - September 11, 2015

హైదరాబాద్ : ఈ నెల 16న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. మొదటి మోటారును వినియోగంలోకి తెచ్చి పోలవరం కాల్వలోకి కృష్ణా నీటిని విడుదల చేయనున్నారు. కేంద్రమంత్రులు ఉమాభారతి, వెంకయ్యను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు సాయంత్రం సతీసమేతంగా చంద్రబాబునాయుడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్లనున్నారు.

మోదీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు..

హైదరాబాద్ : మోదీ సర్కారు మాలేగావ్ పేలుళ్ల కేసులో తలదూర్చి, విచారణను ప్రభావితం చేస్తోందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలపడంతో, ఈ విషయమై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రానికి నోటీసులు పంపింది. మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత కేసు విచారణలో ఉదాసీనంగా ఉండాలంటూ, జాతీయ దర్యాప్తు అధికారుల (ఎన్ఐఏ) నుంచి తనపై ఒత్తిడి పెరిగిందని స్పెషల్ పీపీ రోహిణి ఆరోపించడంతో సుప్రీంకోర్టు మండిపడింది. ఎన్ఐఏ తీరును తప్పుబట్టింది. మోదీ ప్రభుత్వాన్ని, జాతీయ సంస్థల తీరును గర్హిస్తూ, వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.  

చంచల్ గూడ సూపరింటెండ్ పై మానవతారాయ్ ఫిర్యాదు

హైదరాబాద్: చంచల్ గూడ సూపరింటెండ్ పై ఉస్మానియా విశ్వవిద్యాలయం నేత మానవతారాయ్ ఫిర్యాదు చేశారు. ఓయూలో ప్రిన్సిపల్ పై దాడి ఘటనకు సంబంధించి తమను జైలుకు తీసుకెళ్లినప్పుడు ఆయన తొమ్మిదిమంది విద్యార్థులపై దాడి చేశారని ఆరోపించారు. ఈ మేరకు జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ కు ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు.

స్విమ్స్ వైద్య విద్య ప్రవేశాల్లో జోనల్ విధానం పాటించాలి: రాఘవులు...

అనంతపురం : తిరుపతి స్విమ్స్ వైద్య విద్య ప్రవేశాల్లో జోనల్ విధానం పాటించాలని సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. రాయలసీమ విద్యార్థులకు ఇప్పటికే ఈ ప్రవేశాల్లో అన్యాయం జరిగిందని, కేవలం వారికి 16 శాతం మాత్రమే సీట్లే లభించాయని చెప్పారు. అనంతపురం లో ఈ రోజు పలు సమస్యలపై సీపీఎం పార్టీ తలపెట్టిన సామూహిక సత్యాగ్రహంలో పాల్గొన్న రాఘవులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కేంద్రానికి సమర్పించిన నివేదికలో రాజధానికి మేలు జరుగుతుందనే విషయాన్ని ప్రస్తావించారని, రాయలసీమ ప్రయోజనాలను మరచిపోయారని ఆరోపించారు.

జపాన్ ఓపెన్ లో ముగిసిన భారత్ పోరు...

హైదరాబాద్ : జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ పోరు ముగిసింది. శుక్రవారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఎనిమిదో సీడ్ పారుపల్లి కశ్యప్.. ఆరో సీడ్ తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) చేతిలో 14- 21, 18- 21 తేడాతో ఓటమిచెందాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ కశ్యప్ కు అవకాశం దక్కనీయకుండా చెన్ ధాటిగా ఆడాడు. ఈ పరాజయంతో భారత జట్టులోని ఏ ఒక్కరు కూడా కనీసం సెమీస్ కు చేరుకోకుండానే ఇంటిదారిపట్టినట్లయింది. 

సంగారెడ్డిలో మందకృష్ణ ను నిర్బంధించిన పోలీసులు

మెదక్ : సంగారెడ్డిలో ఎస్పీ కార్యాలయం ముట్టడికి వచ్చిన ఎమ్మార్పీఎస్ వ్యవసాయ అధ్యక్షుడు మందకృష్ణను పోలీసులు నిర్బంధించి అనంతరం వదిలేశారు. సదాశివపేట మండలం ఎల్లారంలో దళితులకు అవమానం జరిగిందని దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ వెంకన్న వినతిప్రతం సమర్పించారు. వారం రోజుల్లో నిందితులను అరెస్టు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని మందకృష్ణ హెచ్చరించారు.

ప్రజలను మభ్య పట్టడానికే పట్టిసీమ : ఉండవల్లి

హైదరాబాద్ : ప్రజలను మభ్య పెట్టడానికే పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ... రాయలసీమకు, పట్టిసీమ ప్రాజెక్టుకు మధ్య సంబంధం ఏమిటో తనకు అర్థం కావడం లేదని ప్రజలను మభ్యపెట్టడానికే ఏపీ సర్కార్ పట్టిసీమకు తెరలేపిందని ఆరోపించారు. వాస్తవానికి పట్టిసీమకు, రాయలసీమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. జేబులు నింపుకోవడానికే పట్టిసీమను ప్రారంభించారని ఆయన ఆరోపించారు. అయినా తాత్కాలిక ప్రాతిపదికగా చేపట్టిన ప్రాజెక్టును చంద్రబాబు జాతికి అంకితమివ్వడం విడ్డూరంగా ఉందన్నారు.

కేశవరెడ్డి స్కూల్లో పోలీసుల తనిఖీలు..

కర్నూలు : వెంటకరమణ కాలనీలోని కేశవరెడ్డి స్కూల్లో సీసీఎస్ పోలీసులు తనిఖీలు, రికార్డు పరిశీలన చేస్తున్నారు.

నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు జగన్

హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు వచ్చారు. అక్రమాస్తుల కేసు విచారణకు సంబంధించి ఆయన కోర్టులో హాజరయ్యారు. జగన్ తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తదితరులు కూడా కోర్టుకు వచ్చారు. 

కరెంట్ షాక్ తో లైన్ మెన్ మృతి

రంగారెడ్డి : వికారాబాద్ శివారు పుట్టగడి వద్ద కరెంట్ షాక్ తగిలి లైన్ మెన్ మృతి చెందాడు. విద్యుత్ నియంత్రిక మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ కు గురై లైన్ మెన్ బుచ్చి రెడ్డి మృతి చెందాడు.

చంద్రబాబువి రైతులను మోసం చేసే యాత్రలు : రాఘవులు

హైదరాబాద్ : చంద్రబాబువి రైతులను మోసం చేసే యాత్రలు అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు విమర్శించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ...ఆయన అభివృద్ధి పేరుతో ఒకే ప్రాంతానికి పరిమితం చేస్తున్నారని ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా, గాలేరు, నగరి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో అర్థం లేదన్నారు. ప్రత్యేక హోదాలో భాగంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువ శాతం పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. 

ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికలు

హైదరాబాద్ : నేడు ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్ ఎస్ యూఐ, ఏబీవీపీ మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. సీవైఎస్ ఎస్ పేరిట ఆప్ విద్యార్థి విభాగం పేరిట ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వర్శిటీ పరిధిలోని 42 కాలేజీలకు సంబంధించిన 1.35 లక్షల మంది విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

ఐదుగురు ఎర్రచందనం కూలీల అరెస్ట్‌

కడప : ఖాజీపేట మండలం కొండపేట వద్ద అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా లారీలో అక్రమంగా తరలిస్తున్న 90 ఎర్రచందనం దుంగలనుస్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా తమిళనాడుకు చెందిన ఐదుగురు కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

జీపు-లారీ ఢీ: ఇద్దరు పోలీసులకు గాయాలు

తూ.గో: కాకినాడ బీచ్ రోడ్డులో జీఎస్ పీసీకి చెందిన జీవు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రత్యేక పోలీసు ఫోర్సుకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ పై భారీగా ట్రాఫిక్ జామ్

విజయవాడ : ప్రకాశం బ్యారేజీ ని వంశధార ట్రిబ్యూనల్ బృందం పరిశీలిస్తోంది. వీరితో పాటు మంత్రి దేవినేని ఉమా కూడా పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ లో అంబులెన్స్ చిక్కుకుంది. అంబులెన్స్ లో పురటినొప్పులతో గర్భిణి బాధపడుతోంది.

సుప్రియ హత్య కేసులో మరో నిందితుడు అరెస్ట్

హైదరాబాద్: ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ స్నేహితుడు ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రామకృష్ణ భార్య సుప్రియను హత్య చేసిన అనంతరం శవాన్ని వికారాబాద్ అటవీప్రాంతానికి తరలించడానికి, పాతిపెట్టడానికి ప్రదీప్ సహాయం చేశాడు. కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుందని నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని స్థానిక పోలీసులు తెలిపారు.

రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు అందరూ కృషి చేయాలి: హరీష్ రావ్

ఆదిలాబాద్: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తరలించడం లేదని, ప్రాజెక్టును రీడిజైనింగ్ మాత్రమే చేస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టి సరైన కరెంట్ ఇచ్చి ఉంటే ఇప్పుడు రైతులకు ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే రైతుల కోసం, ప్రాజెక్టులు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు అందరూ కృషి చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు గత ప్రభుత్వాలు కనీసం అనుమతులు తీసుకోలేకపోయారని మండి పడ్డారు. పెన్ గంగా ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయి.

వాటర్ బాటిల్ లో పాము..అదిరిపడ్డ కేంద్ర ఆరోగ్య మంత్రి

హైదరాబాద్ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా నిన్న ఛత్తీస్ గఢ్ లో పర్యటించారు. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తో భేటీ అయ్యారు. 'ప్రధాన మంత్రి మౌద్రిక్ యోజన'పై ఛత్తీస్ గఢ్ బీజేపీ ప్రధాన కార్యాలయం ఏకాత్మ పరిసర్ లో జరిగిన వీరి భేటీకి ఆ రాష్ట్ర బీజేపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ అలీ అమన్ కుమారుడు సయ్యద్ షఫీఖ్ అమన్ కు చెందిన ‘అమన్ ఆక్వా’ వాటర్ ప్లాంట్ నుంచి వాటర్ బాటిళ్లు సరఫరా అయ్యాయి. భేటీలో నిమగ్నమైన రమణ్ సింగ్, జేపీ నద్దాలు తమ టేబుల్ పై ఉన్న ‘అమన్ ఆక్వా’ బాటిల్ ను చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే, అక్కడ పెట్టిన ఓ బాటిల్ లో ఏకంగా ఓ పాము ఉందట!  

09:36 - September 11, 2015

హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. పాక్ నుంచి భారత్ లోకి ప్రవేశించినట్లుగా భావిస్తున్న ఉగ్రమూక.. కుప్వారా జిల్లాలోని హడ్వారాలో తెల్లవారుజామున కాల్పులకు తెగబడింది. దీంతో రంగంలోకి దిగిన భారత సైన్యం ఉగ్రవాదులకు గట్టి సమాధానం చెప్పేపనిలోఉంది. ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు జవాన్లు చనిపోగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతున్నదని, ఆపరేషన్ పూర్తయిన తర్వాత పూర్తివివరాలు వెల్లడవుతాయిని పేర్కొన్నాయి.

09:31 - September 11, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాల్లో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు తెలంగాణలో ఒకరు, ఏపీలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం రేగట్లలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణాజిల్లా వత్సవాయిలో ఒక రైతు, ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులో ఒక రైతు, గుంటూరు జిల్లా మాచవరం మండలం మల్లవోలులో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో కౌలు రైతు విజయ్‌బాబు తనువు చాలించాడు. 

09:29 - September 11, 2015

హైదరాబాద్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన బాలినేని మాధవి చౌదరి మృతిచెందారు. బాపట్ల వివేకానందకాలనీకి చెందిన ఆమె భర్త చేబ్రోలు తివిక్రమ్ చౌదరితో కలిసి ఫ్లోరిడాలో నివసిస్తున్నారు. దంపతులిద్దరూ ఫార్మసిస్టులే. 2004 నుంచి వారు అమెరికాలో నివసిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఒకాలా పట్టణం సమీపంలో రెండు కార్లు ఢీకొనడంతో.. మాధవి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కుమార్తె మృతిచెందిన విషయం తెలిసుకున్న బాపట్లలోని తల్లిదండ్రులు సీతాదేవి, సాంబశివరావు కన్నీరుమున్నీరయ్యారు. నిడుబ్రోలుకు చెందిన మాధవి తండ్రి బాలినేని సాంబశివరావు సబ్ రిజిస్ట్రారుగా పని చేసి ఉద్యోగ విరమణ చేశాక బాపట్లలో స్థిరపడ్డారు. బాపట్ల ఫార్మసీ కళాశాలలో బీ ఫార్మసీ చదివిన మాధవి కొంతకాలం అదే కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేశారు. మాధవి దుర్మరణంతో బాపట్లలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. 

09:27 - September 11, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టాన్ని స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో మరో మహిళ మృతిచెందింది. మృతురాలు అత్తార్‌బేగం ముషీరాబాద్‌ వాసి. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న మరో నలుగురు మహిళలకు చికిత్స అందిస్తున్నారు. వాతావరణ పరిస్థితులతో విస్తరిస్తున్న హెచ్ 1 ఎన్1 వైరస్‌ విస్తరిస్తోందని వైద్యులంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బాధితులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. 

తుంగభద్ర జలాశయానికి భారీగా వరదనీరు

హైదరాబాద్ : తుంగభద్ర జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. తుంగభద్ర జలాశాయంపూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాదా, ప్రస్తుత నీటిమట్టం 1625.32 అడుగులకు చేరింది. తుంగభద్ర ఇన్ ఫ్లో 11,357 క్యూసెక్కులు, ఔట్ ప్లో6,900 క్యూసెక్కులుగా ఉంది.

జార్ఖండ్ సీఎం సహా 155 మందికి తప్పిన పెను ప్రమాదం...

హైదరాబాద్ : జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్ సహా 155 మందికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి రాంచీ బయలుదేరిన గో ఎయిర్ వేస్ విమానం రాంచీలో దిగుతున్న సమయంలో విమానం టైర్ పేలింది. రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో ఈ ఘటన జరుగగా, సీఎం సహా ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. విమానం టైర్ పేలిన తరువాత, విషయం తెలుసుకున్న పైలట్ చాకచక్యంగా వ్యవహరించి బ్రేకులు వేశారని, లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి వుండేదని తెలిపారు. ఈ ఘటన తరువాత రాంచీ నుంచి బయలుదేరాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి.  

09:15 - September 11, 2015

హైదరాబాద్ : ప్రతిపక్షాలకు ప్రలజ తరపున మాట్లాడే హక్కు ఉంటుందని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ తెలిపారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని నిరోధకులుగా మారారు అని, మీడియాకు నెగిటివ్ ఆలోచనలు తప్ప పాజిటివ్ ఆలోచనలు ఉండవు అని ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు. అభివృద్ధి పైనా అందరికీ ఒకే దక్పధం ఉంటుందా? ప్రతిపక్షాలకు ప్రలజ తరపున మాట్లాడే హక్కు ఉంటుంది. రాబోయే ఉపద్రవం మీద మీడియా కథనాల ద్వారా తెలియజేస్తాయి. ప్రభుత్వానికి పాలించే హక్కు ఉన్నట్లు... ప్రతిపక్షాలకు ప్రజల తరుపున మాట్లాడే హక్కు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరానికి అధ్యక్షుడిని నియమించలేదు. దీని వల్ల 2000 కేసులకు పైగా పెండింగ్ లో ఉన్నాయి. వినియోగదారుల చట్టాన్ని వినియోగించుకోలని సూచించారు. ప్రభుత్వం రామాయణం, భారతాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని చూస్తోంది. దాని వల్ల లాభాలు, నష్టాలు ఏమిటి? వినాయక చవితి ఉత్సవాలు పవిత్రతను కోల్పోతున్నాయా? ప్రకృతిలో అంశాలనే వాడమని వినాయకతత్వమే చెప్తోంది. అందుకునే మట్టి వినాయకులనే వాడలని నాగేశ్వర్ సూచించారు. ఈ అంశాలపై మరింత విశ్లేషణాత్మకమైన వివరణ చూడాలంటే ఈవీడియోను క్లిక్ చేయండి.

08:08 - September 11, 2015

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరో కొత్త జంటతో.. కొత్త టైటిల్ తో మన ముందుకు రాబోతున్నాడు. నితిన్‌, సమంత హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న తాజా చిత్రానికి 'అ ఆ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి' అనేది ఉప శీర్షిక. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, ' త్రివిక్రమ్‌, హీరో నితిన్‌ తొలిసారి కాంబినేషన్‌లో, అలాగే నితిన్‌, సమంత మొదటిసారి జోడిగా రూపొందిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో మరో కథానాయికగా మలయాళ 'ఫ్రేమమ్‌' ఫేం అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపిక చేశాం. 'జులాయి', 'సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి' వంటి హిట్‌ చిత్రాల తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే మా బ్యానర్‌లో రూపొందిస్తున్న మూడవ చిత్రమిది. ఈ చిత్రాన్ని ఈ నెల మూడవ వారంలో ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌, కెమెరా: నటరాజ్‌ సుబ్రమణియన్‌, ఆర్ట్‌: రాజీవన్‌, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ డిజైనర్‌: విష్ణు గోవింద్‌, శ్రీశంకర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పి.డి.వి.ప్రసాద్‌.

08:07 - September 11, 2015

హైదరాబాద్ : విద్యావ్యాపారం మాఫియాలా మార్చేశారని 'న్యూష్ మార్నింగ్' చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. విద్యార్థులదరికీ విద్య అందుతోందా? కార్పొరేట్ కళాశాలలపై ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందా? విద్యం చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు అన్న సీఎం చంద్రబాబు మాటలను ఏవిధంగా చూడాలి? విద్య చెప్పే బాధ్యత కార్పొరేట్ సంస్థలదేనా? కేశవరెడ్డి స్కూల్స్ యాజమాన్యం చేసిన దోపిడి ఏమి సూచిస్తోంది? కేశవరెడ్డి బాధితులకు న్యాయం జరుగుతుందా? విద్యను వ్యాపారం చేసిన నేతలు ఆగకుండా, రాజకీయం, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారుతున్నారు? విద్యావ్యవస్థ చట్టంలోనే మార్పులు రావాల్సిన అవసరం వుందా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేత రవి చందర్ రెడ్డి, టిబిజెపి నేత వేణుగోపాల్ రెడ్డి, ఏపీ ఎస్ ఎఫ్ ఐ నేత నూర్ మహ్మద్, టిడిపి నేత సూర్య ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత...

కృష్ణా : పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు చిక్కింది. ఖమ్మం జిల్లా మధిర నుంచి 18 టన్నుల రేషన్ బియ్యంతో వెళుతున్న లారీని శుక్రవారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా నూడివీడులో పోలీసులు అడ్డుకున్నారు.

07:51 - September 11, 2015

సూపర్ స్టార్ రజినీ కాంత్ మరో చారిత్రాత్మక చిత్రంలో నటించనున్నారా..? వెండి తెరపై సుల్తాన్ గా మెరవనున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. మైసూర్‌ టైగర్‌గా యావత్‌ ప్రపంచంలో తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్న భారతీయ రారాజు టిప్పు సుల్తాన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందే భారీ బడ్జెట్‌ చిత్రంలో రజనీకాంత్‌ నటిస్తున్నట్టు సమాచారం. బెంగుళూరుకి చెందిన ప్రముఖ కన్నడ నిర్మాత అశోక్‌ కీనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఓ కన్నడ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత అశోక్‌కీన్‌ ఈ విషయాన్ని తెలియజేశారు. ''టిప్పు సుల్తాన్‌, హాలీవుడ్‌లో రూపొందిన మరో బయోపిక్‌ 'గాంధీ' చిత్రాలను చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అయితే 'టిప్పుసుల్తాన్‌' చిత్రంలో రజనీకాంత్‌ నటించేందుకు సుముఖంగా ఉన్నారు. భారతీయ భాషల్లో రూపొందిన చిత్రాలతో పోలిస్తే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్‌ విషయమై ఇప్పటికే రజనీకాంత్‌తో పలుమార్లు కలవడం జరిగింది. అలాగే జాతిపిత గాంధీజీ జీవితం ఆధారంగా హాలీవుడ్‌లోనిర్మితమైన చిత్రాన్ని ఓ ప్రముఖ నటుడితో భారతీయ భాషలన్నింటిలోనూ రీమేక్‌ చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నాను'' అని నిర్మాత అశోక్‌కెన్నీ చెప్పారు. అయితే ఈ వార్త రావడంతో టిప్పు సుల్తాన్ గెటప్ లో డిజైన్ చేసిన రజినీ ఫొటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసి హల్ చల్ చేస్తున్నారు. 

జూరాలలో విద్యుదుత్పత్తి ప్రారంభం...

హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇందిరా ప్రియదర్శిని' జూరాల ప్రాజెక్టు నీటితో పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 అడుగులు కాగా, ప్రస్తుతం 318.45 అడుగులదాకా నీరు చేరింది. ఇంకా ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 13,580 క్యూసెక్కులు ఇన్ ఫ్లోగా చేరుతుండగా, కిందకు 24,850 క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లోగా కిందకు వెళుతోంది. భారీ ఎత్తున నీటిని కిందకు వదులుతున్న అధికారులు ప్రాజెక్టులోని మూడు గేట్లను ఎత్తేసి మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తిని ప్రారంభించారు.  

బంగ్లాదేశ్ లో అధ్యక్షుడి అనుమతితోనే విదేశీయుల్ని వివాహమాడాలి...

హైదరాబాద్ : బంగ్లాదేశ్ లో కొత్త చట్టానికి రూపకల్పన జరుగుతోంది. ఈ చట్టం ప్రకారం బంగ్లదేశ్ లో ఎవరైనా విదేశీయులను వివాహం చేసుకోవాలని భావిస్తే ముందుగా అధ్యక్షుడి అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు పార్లమెంటులో ఓ చట్టం ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందితే విదేశీయులు బంగ్లాదేశీయులను వివాహం చేసుకోవాలన్నా, బంగ్లాదేశీయులు విదేశీయులను వివాహం చేసుకోవాలన్నా అధ్యక్షుడి అనుమతి తప్పనిసరి. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రభుత్వోద్యోగి విదేశీయులను పెళ్లి చేసుకుంటే వారు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. ఈ బిల్లును స్పీకర్ స్టాండింగ్ కమిటీకి పంపారు.

ఆమెరికాలో రోడ్డు ప్రమాదం: బాపట్ల మహిళ మృతి

హైదరాబాద్ : అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఒకాలాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన బాలినేని మాధవి చౌదరి (39) దుర్మరణం పాలయ్యారు.

ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ హంద్వారాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులతో సహా ఇద్దరు భారత జవాన్లు మృతి చెందారు.

సుప్రీం కోర్టును ఆశ్రయించిన ధోనీ

హైదరాబాద్ : టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 'బిజినెస్ టుడే' పత్రికలో తన ఫోటోను విష్ణుమూర్తిగా చిత్రీకరిస్తూ ప్రచురించిన కథనంపై తలెత్తిన వివాదంలో తనను కోర్టుకు లాగడాన్ని ధోనీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. 2013లో జరిగిన ఈ ఘటనపై అప్పట్లోనే ధోనీ స్పందించాడు. అది సరికాదని బిజినెస్ టుడేకు హితవు పలికాడు. అలాగే బెంగళూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయస్థానంలో తనపై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు చేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించడంపై మరో ఎస్ఎల్ పీ దాఖలు చేశాడు. ఈ కేసును ఈ నెల 14న సుప్రీంకోర్టు విచారించనుంది.  

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,545 మంది భక్తులు దర్శించుకున్నారు. 

కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి

విశాఖ : ఛత్తీస్ గడ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు గురువారం అల్పపీడనం ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవరం కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చెదురు మదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

గ్రామాన్ని దత్తత తీసుకున్న గల్లా పద్మావతి....

హైదరాబాద్ : : గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ భార్య పద్మావతి తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ మేరకు ఆమె గురువారం ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇందుకు గ్రామాభివృద్ధి కమిటీ ఆమోదం తెలిపింది. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

విజయనగరం : సీతానగరం మండలం కాసీపేట వద్ద శుక్రవారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని మాదేన రాము (45) అనే మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నల్గొండ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య

నల్గొండ : జిల్లాలోని కనగల్‌ మండలం రేగెట్టెలో అప్పుల బాధతో అచ్చాలు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. అన్నదాతల వరుస ఆత్మహత్యలతో రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

07:12 - September 11, 2015

హైదరాబాద్ : ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకు, అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో ఎదుర్కోవాలనేది లోకోక్తి. కోల్‌కతాలో ఓ మైనర్‌ దీన్ని అక్షరాలా పాటించింది. ఎదురొచ్చిన అపాయాన్ని చావుదెబ్బలు కొట్టి పంపించింది. కాటేసేందుకు వచ్చిన విషనాగుల భరతం పట్టింది. ఆడదంటే అబల కాదు, మాతో పెట్టుకుంటే తబలా వాయింపులు తప్పవంటూ బతికినంత కాలం గుర్తుండి పోయేలా కరాటే కిక్‌లతో చెప్పింది.

మున్నా ఓ ఎలక్ట్రీషియన్‌ కుమార్తె.....

కరాటే సాధనలో మునిగిపోయిన ఈ మైనర్‌ బాలిక పేరు మున్నా దాస్‌ . నార్త్‌ కోల్‌కతాలో నివాసముండే ఓ సాదా సీదా ఎలక్ట్రీషియన్‌ కుమార్తె మున్నా దాస్‌. ఆర్ధిక పరిస్ధితుల రీత్యా 8వ తరగతి వరకే చదువుకున్న మున్నా చదువుకు ఫుల్ స్టాప్‌ పెట్టేసింది. అయినా మార్షల్‌ ఆర్ట్స్‌ పై ఉన్న మక్కువతో రెండేళ్ల నుంచి అత్యంత శ్రద్ధగా కరాటే నేర్చుకుంటోంది మున్నాదాస్‌. అంతే కాదు అత్యంత ప్రతిభ కనబరిచి 2గోల్డ్ మెడల్స్‌ను సాధించింది.

మున్నాను చెరబట్టాలనే ప్రయత్నం....

ఇది ఇలా ఉంటే రోజూలానే కరాటే క్లాస్‌ ముగించుకుని వెళ్తున్న మున్నాను ఇద్దరు కామాంధులు చెరబట్టాలని చూశారు. మోటార్‌ బైక్‌ పై వచ్చిన ఓవ్యక్తి ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. అంతే వెంటనే ఏ మాత్రం తడుముకోకుండా అపర కాళిక అవతారం ఎత్తి ఓ కిక్‌తో వాడి మొహం పగలగొట్టింది. కిందపడిన వాడు తేరుకునేలోపే పక్కటెముకల్లో ముష్ఠిఘాతాలు కురిపించింది. ఇంతలోనే వెనుకనుంచి మరొకడు మున్నాను గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశాడు. వాడిని కూడా గాల్లో గిరాటేసింది. కింద పడేసి పంచ్‌లు, కిక్‌లతో ఒళ్ళు హూనం చేసింది. ఇక చేసేది లేక మృగాళ్లు కాళ్లకు పని చెప్పారు.

వేనోళ్ల పొగుడుతున్న స్ధానికులు....

కీచకులకు మున్నా చేసిన దేహశుద్ధి కోల్‌కతా అంతటా పాకింది. అందరూ మున్నా ధైర్య సాహసాలను వేనోళ్ల పొగుడుతున్నారు. మైనర్‌ అయినప్పటికి మున్నా ప్రదర్శించిన ధైర్య సాహసాలు అసామాన్యమని కీర్తిస్తున్నారు. అయితే మున్నా మాత్రం జరిగిన సంఘటన కన్నా, నడిరోడ్డులో తనను చెరపట్టాలని ప్రయత్నించినప్పుడు తోటి వారు సహాయం చేసేందుకు రాకపోవడం తనను బాధించిందని చెప్తోంది. అమ్మాయి అయితేనేం సివంగి అవతారమెత్తిందని పొగిడే వారంతా నిస్సహాయురాలైన ఆడపిల్ల అపాయంలో ఉన్నప్పుడు సహాయం చేయాలని కోరుకుందాం.

07:09 - September 11, 2015

విజయవాడ : నగరంలోని బెగ్గింగ్‌ ముఠాలపై చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు మెరుపుదాడి చేశారు. సినిమా హాళ్లు, బస్టాండ్లు, ట్రాఫిక్‌ కూడళ్లలో భిక్షాటన చేస్తున్న పలువురు పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. పసి పిల్లలను పావులుగా ఉపయోగించుకుని భిక్షాటన చేస్తున్న తల్లిదండ్రులను విచారిస్తున్నారు. మరోపక్క ఈ పిల్లలందరూ వారి సొంత పిల్లలా ? లేక ఎక్కడినుంచైనా ఎత్తుకొచ్చారా అనే అంశాలను అధికారులు ఆరా తీస్తున్నారు. అమ్మ ఒడిలో పాలుతాగుతూ హాయిగా ఆడుకోవాల్సిన పిల్లలు. కానీ.. నగరంలో పలు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారుల దాడిలో పట్టుబడ్డారు.

బెగ్గింగ్‌ ముఠాపై దృష్టి సారించిన అధికారులు .......

విజయవాడ నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న బెగ్గింగ్‌ ముఠాపై దృష్టి సారించిన అధికారులు ఒక్కసారిగా అనేకప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న పలువురు పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని గాంధీనగర్‌ చైల్డ్‌హోంకు తరలించారు. ఇక ఈ పిల్లలంతా తమ పిల్లలే అని తల్లులు అక్కడకు చేరుకున్నారు. సినిమా హాళ్లు వద్ద కూర్చుంటే అకారణంగా తమ పిల్లలను తీసుకువచ్చారని చిన్నారులు తల్లులు ఆరోపిస్తున్నారు.

సినిమాహాళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ట్రాఫిక్‌ కూడళ్లలో భిక్షాటన.....

నగరంలోని సినిమాహాళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ట్రాఫిక్‌ కూడళ్లలో పిల్లలతో భిక్షాటన నిత్యకృత్యంగా మారిందని చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో 25 మంది పిల్లలను అదుపులోకి తీసుకున్నామంటున్నారు. ఇక ఈ పిల్లలంతా వీరి సొంత సంతానమా ? లేక ఎక్కడి నుంచైనా తీసుకువచ్చారా ? అనే అంశాలన్నీ విచారణలో తేలుతాయని వారంటున్నారు. వారి పిల్లలని ఏవైనా ఆధారాలుంటే విడిచిపెడతామని.. లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఏది ఏమైనా రోజురోజుకు పెరిగిపోతున్న ఈ తరహా బెగ్గింగ్‌పై ఇప్పటికైనా దృష్టి సారించడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు నిజంగా వారి సొంత పిల్లలా ? లేక ఎక్కడినుంచైనా ఎత్తుకొచ్చారా ? అనే అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు.

07:02 - September 11, 2015

హైదరాబాద్ : అధికార మదమెక్కిన దొరలను ఎదిరించి ధీరవనిత. గడీల పాలనకు గండికొట్టే పోరాటంలో భాగమైన ధీశాలి. సివంగి అవతారమెత్తి దొరతనాన్ని మట్టి కరిపించిన అరుణతార. అందుకే ఆమె స్ఫూర్తిని నింపుకున్న వామపక్షాలు నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించాయి. ఆ కాంస్య విగ్రహం సాక్షికంగా దమననీతిపై దండెత్తాయి.

చిట్యాల ఐలమ్మ 30వ వర్ధంతిని పాలకుర్తిలో......

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ 30వ వర్ధంతిని పాలకుర్తిలో వామపక్షాలు నిర్వహించాయి. దొరల భరతం పట్టిన చాకలి ఐలమ్మ స్ఫూర్తిని భవిష్యత్‌ తరాలకు అందించాలనే లక్ష్యం ఆమె కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాయి.

వీరనారి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మల్లు స్వరాజ్యం...

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం వీరనారి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసమే సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ పాలకుర్తికి వచ్చారు. సీనియర్‌ జర్నలిస్ట్ పాశం యాదగిరి అధ్యక్షతన జరిగిన సభలో ఆమె ప్రసంగిస్తూ పోరుగడ్డ తెలంగాణకు రావడం సంతోషంగా ఉందని, ధీశాలి ఐలమ్మ విగ్రహావిష్కరణలో పాలు పంచుకోవడం మరింత సంతోషంగా ఉందన్నారు. సాయుధ పోరాటం మిగిల్చిన భూ పంపిణీని ఐలమ్మ స్ఫూర్తితోనే ముందుకు తీసుకుపోవాలని బృందాకారత్ పిలుపునిచ్చారు.

ద్వంద్వ విధానాలతో పేదోళ్ల పొట్టకొడతున్న.....

ఇక ద్వంద్వ విధానాలతో పేదోళ్ల పొట్టకొడతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విరుచుకుపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నైజాం అడుగుజాడల్లోనే నడుస్తున్నారని, తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు.

చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే భూ పోరాటం......

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్‌తో పాటు పలువురు సాయుధ పోరాట యోధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బడుగు,బలహీన వర్గాలకు అన్యాయం చేసే ఏ ప్రభుత్వాన్నయినా గద్దె దించుతామని నేతలు హెచ్చరించారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే భూ పోరాటం నిర్వహిస్తామని స్పష్ఠం చేశారు.

06:59 - September 11, 2015

హైదరాబాద్ : ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. సాగు,తాగునీటి కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. విజయనగరం జిల్లా ఉల్లిభద్ర గ్రామంలో ప్రతిష్టాత్మక తోటపల్లి రిజర్వాయర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. ప్రాజెక్ట్ పైలాన్‌ను ఆవిష్కరించి తర్వాత కుడికాలువ ద్వారా 50వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు తరలివచ్చారు.

ప్రతి ఎకరానికి నీరు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని.....

రాష్ట్రంలో సాగులో ఉన్న ప్రతి ఎకరానికి నీరు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు చంద్రబాబు. ఉత్తరాంధ్ర ప్రజల కలను సాకారం చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. పదేళ్ల క్రితమే పూర్తి కావాల్సిన ఈ రిజర్వాయర్.. కాంగ్రెస్‌ పాలకుల నిర్లక్ష్యం వల్లే పుష్కర కాలం పట్టిందన్నారు. 2003లో తానే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని ఇప్పుడు తన చేతులమీదనే రిజర్వాయర్‌ ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు.

నదుల అనుసంధానాన్ని తొలిసారిగా....

దేశంలో ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న నదుల అనుసంధానాన్ని తొలిసారిగా తమ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు బాబు. గోదావరి జలాలను కృష్ణానదిలోకి మళ్లించి చరిత్ర సృష్టించామన్నారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంతో త్వరలోనే రాష్ట్రం నుంచి కరవును తరిమి కొడతామన్నారు.

సర్దార్ గౌతు లచ్చన్న ప్రాజెక్ట్‌గా నామకరణం......

తోటపల్లి ప్రాజెక్ట్‌కు సర్దార్ గౌతు లచ్చన్న ప్రాజెక్ట్‌గా నామకరణం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గౌతు లచ్చన్న జీవితం అందరికీ ఆదర్శమని.. జీవితాంతం ఉన్నతమైన విలువల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి లచ్చన్న అని ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు.

06:56 - September 11, 2015

హైదరాబాద్ : చైనాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. బుధవారం డలియన్‌ సిటీలో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న కేసీఆర్‌.. గురువారం షాంఘై నగరానికి చేరుకున్నారు. అభివృద్ధితోపాటు, అందాలకూ కేంద్రబిందువైన నగరంలో కలియతిరిగారు. షాంఘైని తిలకించేందుకు గంటకు 3 వందల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే హైస్పీడ్‌ ట్రైన్‌లో కేసీఆర్‌ ప్రయాణించారు.

బ్రిక్స్‌ న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ను సందర్శించిన కేసీఆర్....

అంతకు ముందు షాంఘైలో నెలకొల్పిన బ్రిక్స్‌ న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ను కేసీఆర్‌ సందర్శించారు. బ్యాంకు అధ్యక్షుడు కేవీ కామత్‌, ఉపాధ్యక్షుడు గ్జీయాన్‌ జూ తో సమావేశమయ్యారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేసేందుకే న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంకును ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. తెలంగాణలో చేపట్టబోయే పలు ప్రాజెక్టులకు ఆర్థికంగా సహకారం అందించాలని కేసీఆర్‌ కోరారు.

విద్యుత్‌ తయారీ, సాగు, తాగునీరు ప్రాజెక్టులపై వివరణ....

చెత్త నుంచి విద్యుత్‌ తయారీ, సాగు, తాగునీరు ప్రాజెక్టులను వారికి వివరించిన సీఎం.. వాటికి అప్పు ఇవ్వాల్సిందిగా కోరారు. సీఎం విజ్ఞప్తికి బ్రిక్స్‌ బ్యాంకు అధ్యక్షుడు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. మొత్తానికి.. పెట్టుబడులే లక్ష్యంగా చైనాలో పర్యటిస్తున్న కేసీఆర్‌.. ఆ దిశగా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 16 వరకు సాగనున్న పర్యటనలో.. వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో కేసీఆర్‌ ఉన్నారు.

06:53 - September 11, 2015

హైదరాబాద్ : రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి అత్యధిక విదేశీ మారకద్రవ్యం మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా లభిస్తోంది. ఆక్వా రంగం ప్రస్తుతం ప్రతికూల పరిస్థితుల నడుమ కొనసాగుతోంది. అస్సలు ఆక్వారంగం నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలి? ఆక్వా రైతుల కష్టాలకు కారణం ఏమిటి? రొయ్యల మేత ధరలు విపరీతంగా పెరగటమేనా? వైరస్‌ కారణంగా ఆక్వా ఉత్పత్తుల ధరలుపడిపోతున్నాయా? వంటి అంశాలపై జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఏపీ మత్స్యకారుల సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ రావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:48 - September 11, 2015

హైదరాబాద్ : రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి అత్యధిక విదేశీ మారకద్రవ్యం మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా లభిస్తోంది. ఆక్వా రంగం ప్రస్తుతం ప్రతికూల పరిస్థితుల నడుమ కొనసాగుతోంది. జలాశయాల్లోకి నీరు చేరకపోవడం, కాలువలు, చెరువులు నీరులేక అడుగంటాయి. దీంతో ఆక్వా సాగుచేసే చెరువులకు నీటికొరత ఏర్పడింది. మరోవైపు రొయ్యల మేత ధరలు విపరీతంగా పెరిగాయి. నాణ్యమైన మేత లభ్యత తగ్గిపోయి మేత ఖర్చు పెరిగిపోతోంది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగి సాగుదారులకు కష్టాలు మొదలయ్యాయి.

రొయ్య పిల్లలు అందుబాటులో లేకపోవడంతో....

నాణ్యమైన రొయ్య పిల్లలు అందుబాటులో లేకపోవడంతో వ్యాధులు రైతులను భయపెడుతున్నాయి. అష్టకష్టాలుపడి రొయ్యలు సాగుచేస్తే మార్కెట్లో ధరలు రోజురోజుకు తగ్గిపోవడం సాగుదారులను కష్టాలకు గురిచేస్తోంది. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు సాగుదారులకు అందడానికి అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రొయ్యల మేతల ధరలు తగ్గించాలని రైతులు కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ వినియోగంలో యూనిట్ కు రూ.3.75 వేలు రాయితీ అందిస్తోంది. అయితే ఇది ఎల్.టి.లైను ఉన్న రైతులకు మాత్రమే వర్తింపజేశారు. రొయ్య సాగుదారులు ఎక్కువమంది హెచ్.టి.లైన్లు కింద విద్యుత్ వినియోగిస్తుండటంతో రాయితీకి అనర్హులయ్యారు. హెచ్.టి.సర్వీసు కింద విద్యుత్ వినియోగించే రైతులకు కూడా రాయితీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు విద్యుత్ సరఫరాకు అవసరమయ్యే ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటులో జాప్యాన్ని నివారించాలని కోరుతున్నారు.

ప్రోత్సాహం లేక, నాణ్యత గల సీడ్ అందక.....

ఆక్వా రైతులకు ప్రోత్సాహం లేక, నాణ్యత గల సీడ్ అందక ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క ఏళ్ల తరబడి కొత్త చెరువులకు అనుమతులు ఇవ్వకపోవడం, ఉన్నవాటిని రెన్యువల్ చేయకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. దీనికితోడు మార్కెటింగ్, ఎగుమతులకు మౌలిక సదుపాయాలు లోపించడంతో ఏపీలోని 9 జిల్లాల్లో చేపలు, రొయ్యలసాగు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ కు 974 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. దీనికి ఆనుకుని 6.2 లక్షల ఎకరాల్లో ఆక్వాసాగు జరుగుతోంది. ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల్లో 60 శాతంగా ఉన్న ఆక్వా సాగు రాష్ట్ర ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే రెండేళ్లుగా అనుమతుల్లేక, రుణాలు రాక 9 జిల్లాల్లోనూ మత్స్య సాగు రైతులు ఇబ్బందులెదుర్కొంటున్నారు.

కొత్త చెరువులకు ప్రభుత్వం అనుమతులు....

కొత్త చెరువులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో వేలాది మంది ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికారులకు వేలకువేలు ముట్టజెప్పినా.. అనుమతులు మాత్రం రావడంలేదని రైతులు వాపోతున్నారు. ఒక్కో ఎకరాకు రూ.5 వేల వరకూ అధికారులు మామూళ్లు అందుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఒక్కో ఎకరాకు రూ.5 వేల వరకూ అధికారులు మామూళ్లు అందుకున్నారనేది తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కూడా రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఇక రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల పరిస్థితీ అంతే. అధికారుల చుట్టూ నెలల తరబడి రైతులు తిరుగుతున్నా రెన్యువల్స్ కావడం లేదు. ఈ సమస్యలన్నీ తీరితే రాష్ట్రంలో మరో 2 లక్షల ఎకరాల్లో సాగు పెరిగే వీలుంది. ఒకపక్క చెరువుల లీజులు పెరిగిపోతుంటే మరోపక్క వైరస్ కారణంగా చేపల ధరలు గణనీయంగా పడిపోతున్నాయి. వైరస్ వల్ల వనామీ రొయ్యలసాగు కూడా కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటేనే ఆక్వాసాగు నిలదొక్కుకుంటుందని రైతులు చెబుతున్నారు. 

06:46 - September 11, 2015

హైదరాబాద్ : సెప్టెంబర్ లెవన్. 2001. అగ్రరాజ్యంలో ఉగ్రవాదం విధ్వంసం సృష్టించిన రోజు. ఆ క్షణాలు తలచుకుంటే అమెరికాతో పాటు మొత్తం ప్రపంచానికి వెన్నులో వణుకుపుడుతుంది. అయినవారిని కోల్పోయిన బాధితుల గుండె బరువెక్కుతుంది. సెప్టెంబర్ లెవన్ దాడికి 14 ఏళ్లయిన సందర్భంగా టెన్‌ టీవీ స్పెషల్ స్టోరి.

సెప్టెంబర్ 11, 2001.....

వరల్ట్ ట్రేడ్ సెంటర్, న్యూయార్క్ సిటీ... ఉదయం 8.46 నిమిషాలు... అమెరికా ఎయిర్‌లైన్స్ విమానం ట్రేడ్ భవనాన్ని బద్దలు కొట్టింది... ఉదయం 9.03 నిమిషాలు... మరో విమానం మరో భవనాన్ని పేల్చింది... ఉదయం 9.37 నిమిషాలు...పెంటగాన్‌పై మరో విమానం దాడి

అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అమెరికాలో .....

అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అమెరికాలో సృష్టించిన విధ్వంస దృశ్యాలివి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలు కుప్పకూలిన ఘటనలో దాదాపు మూడు వేల మంది చనిపోయారు. వేలమంది క్షతగాత్రులయ్యారు. అమెరికానే మొత్తం కాదు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసిన భీకర దాడులివి. మృతులకు నివాళిగా మెమోరియల్‌ ఏర్పాటు

దాడికి 14 ఏళ్లు......

సెప్టెంబర్ లెవన్ దాడికి 14 ఏళ్లు. విధ్వంసం జరిగిన ప్రదేశంలోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను కొత్తగా నిర్మించింది అమెరికా. అక్కడే మృతులకు నివాళిగా మెమోరియల్‌ను ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది అధికారికంగా మృతులకు నివాళులు అర్పించే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వందలాదిమంది ప్రజలు కూడా తమ ఆత్మీయులకు అంజలిఘటిస్తున్నారు.

ఉగ్రవాద వ్యతిరేక పోరు పేరిట ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో విధ్వంసం......

ఈ ఘటన తర్వాత ఉగ్రవాద వ్యతిరేక పోరు పేరిట ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌ లపై విరుచుకుపడింది అమెరికా. బిన్‌ లాడెన్‌ కోసం వేట అంటూ లక్షలాది మంది అమాయక ప్రజలను చంపేసింది. సామూహిక జన హనన ఆయుధాలున్నాయంటూ ఇరాక్‌పై యుద్ధం చేసింది. ఆ దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను ఉరితీశారు.

టెర్రరిజం సాకుతో ......

టెర్రరిజం సాకుతో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లో చమురు నిల్వలు, విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టిందన్న ఆరోపణలకు లెక్కేలేదు. సెప్టెంబర్ లెవన్ అటాక్‌ జరిగిన ఏళ్ల తర్వాత బిన్‌లాడెన్‌ను పాక్‌లో చంపేశామని ప్రకటించుకుంది. కానీ ఉగ్రవాదం మాత్రం అంతం కాలేదు. కొత్త పేర్లతో, కొత్త రూపాలతో మరింత విధ్వంసకరంగా జడలు విప్పుతోంది. ఐఎస్ఐఎస్, లష్కరే తొయిబా, తాలిబన్ల మారణకాండే అందుకు నిదర్శనం. 

కృష్ణా పశ్చిమడెల్టాకు1016 క్యూసెక్కుల నీరు విడుదల

విజయవాడ : కృష్ణా పశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి 1016 క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజివద్ద నీటిమట్టం 10.7 అడుగులున్నట్లు తెలిపారు. దుగ్గిరాల సబ్‌డివిజన్‌ నుంచి కొమ్మమూరు కాల్వకు 397 క్యూసెక్కులనీరు, రేపల్లెకాల్వకు 120 క్యూసెక్కులనీరు, తూర్పుకాల్వకు 72 క్యూసెక్కులనీరు, పశ్చిమకాల్వకు 79 క్యూసెక్కులనీరు, నిజాంపట్నం కాల్వకు 60 క్యూసెక్కులనీరు విడుదల చేస్తున్నారు.

జలమండలి లబ్ధిదారులకు కొత్త యాప్

హైదరాబాద్ : జలమండలి లబ్ధిదారుల కోసం కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. వెబ్‌సైట్‌లోనే కాకుండా స్మార్ట్ ఫోన్‌లల్లో కస్టమర్ సర్వీస్‌ను ఐటీ విభాగం తీసుకొచ్చింది. నగరంలో క్యాన్ నెంబర్ కలిగిన ప్రతి ఒక్కరికి ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీంతో నగర వాసులకు నీటి సరఫరాతో పాటు మురుగు నీటి వ్యవస్థపై సమాచారం సులభతరం కానుంది.

 

లింబయ్య కుమారుడి వైద్య ఖర్చులను భరిస్తాం: షబ్బీర్ అలీ

నిజామాబాద్ : జిల్లాలోని సదాశివనగర్ మండలం రామారెడ్డిలో రైతు లింబయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు గురువారం పరామర్శించారు. వారికి రూ.లక్ష సాయం అందజేయడంతో పాటు లింబయ్య కుమారుడి వైద్య ఖర్చులను భరిస్తామని కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ తెలిపారు. అప్పుల బాధ, కుమారుడి అనారోగ్యం కారణంగా లింబయ్య నిన్న హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రకాశం జిల్లాలో పొగాకు రైతు ఆత్మహత్యల

ప్రకాశం : టంగుటూరు మండలంలోని పొందూరు పంచాయతి పరిధిలోని పొదవారిపాలెం గ్రామానికి చెందిన పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు (40) పురుగు మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. 

Don't Miss