Activities calendar

12 September 2015

రాజమండ్రిలో ఇంజనీరింగ్ విద్యార్థి కీచకపర్వం...

తూర్పుగోదావరి : రాజమండ్రిలో ఇంజనీరింగ్ విద్యార్థి కీచకపర్వం బయటపడింది. హరీష్ అనే విద్యార్థి ఎంబిఏ చదుతున్న లక్ష్మీదుర్గ అనే అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. గత కొతం కాలంగా ప్రేమిస్తున్నాని చెప్పి ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. లక్ష్మీదుర్గ పెళ్లి చేసుకోవాలని నిలదీయగా పెళ్లికి నిరాకరించి పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలావుంటే హరీష్ అమ్మాయిలను నగ్నంగా చిత్రీకరించి...వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నాడు. పదుల సంఖ్యలో అమ్మాయిలు మోసపోయారు.

హైదరాబాద్ ఎల్ బి నగర్ లో కిడ్నాప్ కలకలం...

హైదరాబాద్ : నగరంలోని ఎల్ బి నగర్ లో కిడ్నాప్ కలకలం రేపింది. ఎనిమిదేళ్ల యాషిస్ అనే బాలున్ని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. దుండగులు కోటి రూపాయలు డిమాండ్ చేశారు.

 

21:59 - September 12, 2015

ముంబై : మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి కేబుల్ ఆపరేటర్‌ పై కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. ఈ కాల్పుల ఘటన సిసి కెమెరాలో రికార్డ్‌ అయింది. ఇద్దరు వ్యక్తులు కేబుల్‌ ఆఫీస్‌లోకి తాపీగా నడచి వచ్చారు. అందులో ఒకరు తుపాకితో కేబుల్‌ ఆపరేటర్‌పై కాల్పులు జరిపి ధీమాగా వెళ్లిపోయాడు. బాధితుడికి ఒకే బుల్లెట్‌ తగిలింది. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సిసి ఫుటేజి ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. కాల్పులు ఎవరు జరిపారు...ఎందుకు జరిపారన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. పోలీసులు బాధితుడిని విచారిస్తున్నారు.

 

21:58 - September 12, 2015

భూపాల్ : మధ్యప్రదేశ్‌లో పేలుడు ఘటన తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఓ హోటల్‌లో పేలిన సిలిండర్ ధాటికి భవనం కుప్పకూలింది... ఈ బ్లాస్ట్‌లో ఒకరు కాదు... ఇద్దరు కాదు... 89 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.
89 మంది మృతి
మధ్యప్రదేశ్‌ జబువా జిల్లా కేంద్రంలోని సేఠియా రెస్టారెంటులో ఉదయం 8.30 గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో రెండు అంతస్థుల భవనం కుప్పకూలాయి. గ్రౌండ్ ఫ్లోర్లోని రెస్టారెంట్ వంటగదిలో జరిగిన పేలుడు ధాటికి మొదటి, రెండో అంతస్తు కూలిపోయింది. అంతే... హోటల్‌ ఉన్న మనుషుల హాహా కారాలు మిన్నంటాయి. క్షతగాత్రులను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 82 మంది మృతి చెందారు. మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
అగ్నికి ఆజ్యం పోసిన జిలెటిన్‌ స్టిక్స్‌
రెస్టారెంట్‌కు ఆనుకుని ఉన్న భవనంలో జిలెటిన్‌ స్టిక్స్‌ నిల్వ ఉంచడం అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది. పేలుడు ధాటికి హోటల్‌ చుట్టు పక్కల ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో భారీ స్థాయిలో పేలుడు జరిగి మృతుల సంఖ్య పెరగడానికి కారణమైందని అధికారులు చెబుతున్నారు. జిలెటిన్‌ స్టిక్స్‌ నిల్వ ఉంచడానకి తనకు పర్మిషన్‌ ఉన్నట్టు యజమాని రాజేంద్ర పేర్కొన్నారు.
శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, మోడీ తీవ్ర దిగ్భ్రాంతి
ఈ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ప్రధాని నరేంద్ర మోది తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి విచారణ జరుపుతామని శివా రాజ్‌సింగ్‌ చౌహాన్‌ చెప్పారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, బాధిత కుటుంబాలకు 50 వేల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సీనియర్ అధికారులు రిస్క్‌ ఆపరేషన్‌ పనులు చేపట్టారు. బుల్‌డోజర్లతో భవన శిథిలాలలను తొలగిస్తున్నారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.

 

21:50 - September 12, 2015

హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న... పేదల సొంతింటి కల నేరవేరనుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ ఏడాదిలో 60వేల ఇళ్లను పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంట్లో నియోజకవర్గానికి 400 చొప్పున 47వేల600 మిగతావి సీఎం విచక్షణ అధికారాలతో ఎక్కడైన మంజూరు చేయనున్నారు. ఈ 400 ఇళ్లలో ఆయా నియోజకవర్గంలోని మున్సిపాల్టీలకు 160, గ్రామాల్లో 240 ఇళ్లను నిర్మించనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇండిపెండెంట్ ఇళ్లు
గ్రామీణ ప్రాంతాల్లో ఇండిపెండెంట్ ఇండ్లను.. పట్టణాల్లో జీ ప్లస్ 2, 3లలో నిర్మించనుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఖాళీ స్థలాల సంబంధించిన నివేదిక కలెక్టర్లు ప్రభుత్వానికి అందించారు. వీటిని ఎక్కడెక్కడ నిర్మించాలన్న అంశాన్ని స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులకు అప్పగించింది ప్రభుత్వం. అయితే లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను గ్రామసభకు అప్పగించారు. గతంలో మాదిరిగా అవకతవకలు జరగకుండా... అర్హుల జాబితాను పంచాయతీ నోటిస్ బోర్డులో పెట్టి అభ్యంతరాలు స్వీకరించనుంది. గ్రామసభ ఎంపిక చేసిన జాబితాకు కలెక్టర్ అమోద ముద్ర వేసి... ఏడాదిలో ఇండ్లను నిర్మిస్తామని చెబుతున్నారు.
గ్రామీణ ఇళ్లకు 5లక్షల4వేలు
గ్రామీణ ఇళ్లకు 5లక్షల4వేలు, పట్టణాల్లో 5లక్షల 30వేలతో 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో... వీటిని నిర్మించనుంది సర్కార్. ఇక కాలనీలల్లో మౌలిక వసతులు కోసం కూడా నిధులు వేచ్చించనుంది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి కోసం కూడా ఒక్కో ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో.. లక్షా 25వేలు, పట్టణ ప్రాంతాల్లో 75 వేలు వేచ్చించనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. రెండు మూడు రోజుల్లో కలెక్టర్లను వీటికి సంబంధించిన గైడ్ లెన్స్ పంపిస్తామని... దసరా వరకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి. నియోజకవర్గానికి కేవలం 400 మందికే పరిమితం చేయకుండా... ఎన్నికల హామీ మేరకు పేదలందరికీ ఉచితంగా డబుల్ బెడ్ ఇళ్లను ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

 

21:46 - September 12, 2015

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ ఉగ్రవాది నిక్కీ జోసెఫ్‌కు ఐఎస్ ఐఎస్ తో సంబంధాలున్నట్లు తేలింది.. రెండురోజులుగా నిక్కీని విచారించిన పోలీసులు ఆమె పాస్‌పోర్టు, ల్యాప్‌టాప్, వీడియో కెమెరాతోపాటు సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు.. శంషాబాద్ జోన్ డిసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్ ఐఏ, ఐబితోపాటు సైబరాబాద్ కౌంటర్ ఇంటెలిజన్స్ సెల్ పోలీసులు ఈ మహిళా ఉగ్రవాదినుంచి వివరాలు సేకరించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్‌ విధించారు. దీంతో ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు.

 

21:42 - September 12, 2015

భారతదేశమంటేనే కులవృత్తుల సమాజం. సమస్త ఉత్పత్తులకు సహస్రకులవృత్తులే కారణం. అందులో సాలోళ్ల వృత్తి ఒకటి. చరఖా చక్రం ఆవిష్కించిన శాస్త్రజ్ఞులువాళ్ళు. సమస్తమానవాళికి బట్టలు అందించి చలి ఎండల నుంచి రక్షణ కల్పించిన శ్రజీవులు వాళ్ళు. అయితే వర్ణాధిక్య సమాజం సాలోళ్ళ శ్రమను గుర్తించలేదు. వారిని గౌరవించలేదు. పైగా వాళ్లను తక్కువ కులం వాళ్ళంటూ కించపరిచారు. సాలోళ్ల క్రమవికాసచరిత్రను, వారికి జరిగిన చారిత్రక విద్రోహాన్ని గురించి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త కంచె ఐలయ్య  'జనచరిత శ్రమైక జీవన విశ్లేషణ' కార్యక్రమంలో వివరించారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే చూద్దాం...
రాత్నం చక్రంతో చేనేత పరిశ్రమ అభివృద్ధి
'ఆదిమ దశలో మానవులు ఆకులు కప్పుకున్నారు. తదనంతరం నార బట్టలను శరీరానికి చుట్టుకుని తమ శరీర అవయవాలు కనపడ కుండా చేసుకున్నారు. క్రమంగా నేత ప్రారంభం అయింది. క్రీ.పూ.4000 సంవత్సరం నుంచి నూలు వడికారు. క్రీ.పూ.500 నాడు చక్రం కనిపెట్టారు. రెండు రకాలుగా నేశారు. వేళ్లతో బట్టలు అల్లేవాళ్ళు, చక్రాలతో బట్టలు నేసే వారు. మొదటగా సాలోళ్లు, మాల కులస్థులు ఇద్దరూ కూడా నేత నేశారు. బట్టలను అతి నాణ్యతాయుతంగా తయారు చేసేవారు. బ్రిటీష్ వారు ఇండియాను వదిలిపెట్టి పోయే సమయానికే అగ్గిపెట్టెలో 16 మీటర్ల పొడవు గల చీరను పెట్టగలిగే విధంగా నేసే నైపుణ్యం కలిగి ఉన్నారు. సాలె, మాల వారు బట్టలను నేశారు. రాత్నం చక్రంతో చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందింది. కాంచీపురం, పోచంపల్లి మంగళగిరి, బెనారస్, సంబల్ పూర్ చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి.
మానం కాపాడిన సాలోళ్ల త్యాగాలు వెలకట్టలేనివి 
సాలోళ్ళను శూద్రులుగా ముద్రవేశారు. తక్కువ కులం వారుగా పేర్కొన్నారు. తక్కువకులం వాళ్లుగా పిలువబడ్డారు. గుర్తింపు గౌరవం లేదు. అక్షరానికి దూరం..అన్నింటా అన్యాయం. ఇస్లాం వచ్చిన తర్వాత కుట్టు వచ్చింది. వర్ణవ్యవస్థ వల్లనే ఇస్లాంలోకి చాలా మంది జంప్ అయ్యారు. సాలోళ్లను ఉత్తరభారతంలో జూలా, తెలుగు రాష్ట్రాల్లో పద్మశాలి, తమిళంలో తెగుంతర్ అని అంటారు. దూదేకులుగా పిలవపడేవారు దూదిని ఏకేవారు దాంతో వారికి దూదేకులని పేరు వచ్చింది. మానం కాపాడిన సాలోళ్ల త్యాగాలు వెలకట్టలేనివి. కులం అనేది ఎంత నష్టం చేస్తుందో.. సాలెవారిని చూస్తే... తెలుస్తోంది. సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక సమానత్వం కావాలి. ఈ కులాలకు సాంఘిక, ఆధ్యాత్మిక, ప్రభుత్వం పరంగా గౌరవం రావాలంటే.. వారి చరిత్ర, వృత్తిని పాఠ్యాంశాలుగా చేర్చాలి. అంబేద్కర్ సమానత్వం కోరుకున్నారు. అని వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:00 - September 12, 2015

కృష్ణా : జిల్లాలోని బందరు మండలం కోన గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణలను కోన గ్రామస్తులు అడ్డుకున్నారు. బందరు పోర్టు భూసేకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. భూసేకరణ కోసం తమ గ్రామానికొస్తే తరిమికొడతామని హెచ్చరించారు. మంత్రి కొల్లు, ఎంపీ కొనకళ్ల, పోలీసులను గ్రామం నుంచి తరిమివేశారు. గ్రామస్తులు ఎదురు తిరగడంతో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ వెనుదిరిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా వుంటే బందరు పోర్టు నిర్మాణానికి 4 800 వేల ఎకరాలు అవసరముంటే దానికి విరుద్దంగా 30 వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. దీన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సెంట్ భూమి కూడా ఇచ్చేది లేదని ప్రజలు తేల్చి చెప్పారు. అధిక భూములను సేకరించడంపై గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రేపటి నుంచి అన్ని గ్రామాల్లోని ప్రజలు తిరగబడటానికి సిద్ధపడుతున్నారు. బందర్ మండలంలోని ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొంది. సీపీఎం బృందాలు గ్రామగ్రామాన తిరుగుతున్నారు. ప్రజలకు అండగా ఉంటామని చెబుతున్నారు. పోర్టు నిర్మాణానికి తాను వ్యతిరేకంగా కాదని.. కానీ 30 వేల ఎకరాలను సేకరించడానికి వ్యతిరేకమన్నారు. ఈనేపథ్యంలో పోలీసును భారీగా మొహరించే పనిలో ఉన్నారు.
సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు...
బందరు పోర్టుకు ప్రభుత్వం బలవంతగా భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. అది సరికాదు. పోలీసులను పెద్ద ఎత్తున దించడం, పోలీసుల నిర్బంధంతో భూములు లాక్కోవడం సాధ్యం కాదు. ప్రజలపై దౌర్జన్యం చేసే పనిని ఎవరు హర్షించరు. ప్రభుత్వం భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలి.

 

కృష్ణా జిల్లా బందరు మండలంలో ఉద్రిక్తత..

కృష్ణా : జిల్లాలోని బందరు మండలం కోన గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణలను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తుల ఆగ్రహంతో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ వెనుదిరిగారు. 

ముగిసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల సమావేశం

హైదరాబాద్ : టీఎస్ అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల సమావేశం ముగిసింది. పులులు, సింహాలు అంటూ బయట ఏ నేతలు చప్పుకోవద్దన్నారు. సీఎం, మంత్రులు ఎవరన్నది అధికారంలోకి వచ్చాక ఆలోచిద్దామని మోత్కుపల్లి అన్నారు.

 

'అనంత' జిల్లా రుద్రంపేటలో దారుణం

అనంతపురం : జిల్లాలో రుద్రంపేటలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేసి వెశ్లారు. వీధి కుక్కలు దాడి చేయడంతో శిశువు మృతి చెందింది.

 

19:59 - September 12, 2015

గుంటూరు : నగరంలో మెమరీస్ ఆఫ్ దళిత్ సివిల్ సర్వెంట్ పుస్తకంపై రివ్యూ కార్యక్రమం జరిగింది. ఏసీ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన ఈ రివ్యూకు గుంటూరు అర్బన్ మహిళా పోలీసు అధికారి శోభా మంజరి, పుస్తక రచయిత అప్పికట్ల భరత్ భూషణ్ తోపాటు... దళిత నేతలు హాజరయ్యారు. ఈ పుస్తకంలో ఎన్నో అంశాలు చర్చించారని ప్రశంసించారు.

 

19:55 - September 12, 2015

విశాఖ : లాటరీ తగిలిందంటూ జనాల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతాకు చెందిన ప్రబీర్‌ చక్రవర్తి, ఉదయ్‌ కుమార్‌ గుప్తాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరి ముఠాలోని మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

 

19:51 - September 12, 2015

నెల్లూరు : డాక్టర్ల నిర్లక్ష్యంతో తమ బిడ్డ చనిపోయాడంటూ నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిముందు మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. నువ్వురుపాడు అనే గ్రామంలో ఆటో అదుపు తప్పి రామకృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతని స్నేహితుడు సాధిక్‌ను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. రెండు గంటల తర్వాత అతను కూడా మృతి చెందాడు. అయితే వైద్యులు సకాలంలో స్పందించలేదని.. అందుకే సాధిక్ చనిపోయాడంటూ మృతుని తల్లిదండ్రులు, బంధువులు నిరసన చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన ఆస్పత్రి సూపరిండెంట్... విచారణ తర్వాత బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 

19:48 - September 12, 2015

విజయవాడ : నవ్యాంధ్ర రాజధానిలో తొలి మెట్రో ప్రాజెక్టుకు లైన్‌ క్లియర్‌ అయింది. మెట్రో రైల్‌ నిర్మాణానికి కేంద్రం అంగీకరించడంతో ఏపీ సర్కార్‌ వేగంగా అడుగులు వేస్తోంది. 6,769 కోట్లతో చేపట్టే విజయవాడ మెట్రో ప్రాజెక్టును డిఎంఆర్ సికే అప్పచెప్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. మొత్తం 26 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నిర్మాణం ఉంటుందని సీఎం ప్రకటించారు. 2018 డిసెంబర్‌ నాటికి తొలిదశ నిర్మాణం పూర్తికావాలని ఈ సందర్భంగా డిఎంఆర్ సిని ఆదేశించారు. ఢిల్లీ మెట్రోని నిర్మించిన శ్రీధరన్‌ ఆధ్వర్యంలోనే విజయవాడ మెట్రో నిర్మాణం అవుతుందని సీఎం ప్రకటించారు.

 

భవిష్యత్‌లో పాలనంతా మొబైల్ గవర్నెన్స్ ద్వారానే : మంత్రి కేటీఆర్

ఢిల్లీ : భవిష్యత్‌లో పాలనంతా మొబైల్ గవర్నెన్స్ ద్వారానే జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో 'సుపరిపాలన-సుస్థిర అభివృద్ధి-సోషల్ మీడియా పాత్ర'పై జరిగిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. సమగ్ర సర్వే ద్వారా సేకరించిన వివరాలను సంక్షేమ పథకాల అమలులో ఉపయోగిస్తామని చెప్పారు. భవిష్యత్ లో ప్రతి ఇంటికి బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇస్తామని పేర్కొన్నారు. 

విభజన చట్టం ప్రకారం విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులు : వెంకయ్య

విజయవాడ : విభజన చట్టం ప్రకారం విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులను కేంద్రం కేటాయించిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు రెండు దశల్లో పూర్తవుతుందని చెప్పారు.

 

18:46 - September 12, 2015

ఆదిలాబాద్‌ : అరుగాలం కష్టించి పనిచేసే రైతన్నలు.. సేద్యంలో చేదోడు వాదోడుగా ఉండే పశువుల పట్ల అవ్యాజమైన ప్రేమను చాటుకునే రోజు నేడు. రాఖీ పౌర్ణమి తరువాత వచ్చే పోలాల అమావాస్య రోజున పాడి పశువులను విశేషంగా అలంకరించి ఆనందాన్ని వ్యక్తీకరించే రోజు. ఆదిలాబాద్ జిల్లా రైతులు ఈ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారు.
రైతు కుటుంబాల్లో ఘనమైన వేడుక
శ్రావణ మాసం ముగిసే రోజున వచ్చే అమావాస్య నాడు.. పశువులపై తమకు గల ప్రేమను రైతులు చాటుకోవడం ఆనవాయితీ. పోలాల అమావాస్యగా పిలిచే ఈ రోజు రైతు కుటుంబాల్లో ఘనమైన వేడుక. సంతల్లో కొనుక్కొచ్చిన సరంజామాతో పశువులను అందంగా అలంకరిస్తారు. తామూ కొత్త బట్టలు ధరిస్తారు. ఈ ఉత్సవం కోసం బంధువులను, ఆడపడుచులను, స్నేహితులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఆడపడుచులకూ కానుకలూ అందిస్తారు. అందరూ కలిసి పశువులకు పసుపు కుంకుమలు పెట్టి హారతులిస్తారు. అనంతరం పశువులకు జూలు కడతారు. కొత్తగా తెచ్చిన ముకుతాడు కడతారు. కొమ్ములకు, కాళ్ల గిట్టలకు రంగురంగుల కాగితాలు అతికిస్తారు. గ్రామంలోని ప్రతి ఎద్దునూ అందంగా అలంకరించి గ్రామ చావిడి వద్దకు తీసుకు వస్తారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలతో గ్రామాలు హోరెత్తిపోతాయి.
ఎద్దులకు పరుగు పందేలు
ఎద్దులకు పరుగు పందేలు పెడతారు. ఈ పోటీని తిలకించేందుకు గ్రామస్థులందరూ చావిడి వద్దకు తరలివస్తారు. పందేల తర్వాత అలసిన ఎద్దులను ఇంటికి తీసుకు వెళ్లి తృప్తిగా ఆహారాన్ని అందిస్తారు. ఎద్దులకు ఈ ఆహారం పెట్టేవరకూ ఇంటిల్లిపాదీ ఉపవాసం ఉండి.. పశువులతో ముడివడిన తమ అనుబంధాన్ని చాటుకుంటారు.

 

 

18:36 - September 12, 2015

నల్లగొండ : జిల్లాలో మరో సూదిదాడి కలకలం సృష్టించింది. తనను ఇద్దరు దుండగులు సూదితో పొడిచారంటూ నరసింహరావు అనే వ్యక్తి హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రిలో చేరాడు. మేళ్లచెర్వు మండలం దొండపాడు సమీపంలోని రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర తనపై దాడి జరిగిందని చెబుతున్నాడు. అయితే వైద్యులు మాత్రం సూది దాడిని ఇంకా నిర్ధారించలేదు. 

18:18 - September 12, 2015

హైదరాబాద్‌ : పిల్లల హక్కుల పరిరక్షణకు సీపీఎం ఆధ్వర్యంలో... గ్రామస్థాయి నుంచి మహోద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. హైదరాబాద్ లోని ఎంబీ భవన్‌లో... 'బాలల హక్కులు, సామాజిక బాధ్యత' అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్‌ శాంతాసిన్హా, తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం శాంతాసిన్హా మాట్లాడుతూ పేదరికంతో పిల్లలు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

18:11 - September 12, 2015

హైదరాబాద్ : తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నిక‌ల్లో మాజీ ఎంపి అంజ‌న్‌కుమార్ యాద‌వ్ త‌నయుడు అనిల్ కుమార్ విజ‌యం సాధించారు. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా..అనిల్ వ‌ర్సెస్ మాజి ఎమ్మెల్యే భిక్షప‌తి యాద‌వ్ కుమారుడు ర‌వికుమార్ మ‌ధ్యే గట్టి పోటీ నెల‌కొంది. 8వేల ఓట్లున్న యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నిక‌ల్లో 4379 ఓట్లతో అనిల్ కుమార్‌ విజయం సాధించగా.. ర‌వికుమార్‌ యాద‌వ్‌కు 2,523 ఓట్లు వచ్చాయి. 1,857 ఓట్ల మెజారిటితో అనిల్ కుమార్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ర‌వికుమార్‌ యాద‌వ్ ఎన్నికకానున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత.. అధ్యక్షునిగా ఎన్నికైన అనిల్ కుమార్‌కు కాంగ్రెస్‌ నేతలు అభినందనలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. దీంతో కాంగ్రెస్‌ కార్యాలయం గాంధీభవన్‌లో సందడి వాతావరణం నెలకొంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో అంతా ఒక్కటిగా కలిసి పనిచేస్తామన్నారు కొత్త అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ అన్నారు. 

ఐఎస్ ఐఎస్ ఉగ్రవాది నిక్కీ జోసఫ్ విచారణ పూర్తి

హైదరాబాద్ : ఐఎస్ ఐఎస్ ఉగ్రవాది నిక్కీ జోసఫ్ విచారణ పూర్తి అయింది. ఎన్ ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, శంషాబాద్ పోలీసులు అతన్ని విచారించారు. శంషాబాద్ పోలీసులు నిక్కీని కాసేపట్లో కోర్టులో హాజరు పర్చనున్నారు.

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై నివేదికలు అందాయి : సీఎం చంద్రబాబు

విజయవాడ : విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై నివేదికలు అందాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈమేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 26 కి.మీ మేర విజయవాడ మెట్రో ప్రాజెక్టు ఉంటుందని పేర్కొన్నారు. రూ. 6, 769 కోట్ల వ్యయంతో విజయవాడ మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. పీఎన్ బీఎస్ నుంచి పెనమలూరు కారిడార్ వరకూ, పీఎస్ బీఎస్ నుంచి నిడమలూరు కారిడార్ వరకూ మెట్రో నిర్మాణం ఉంటుందని వివరించారు. 

ఈజిప్టు ప్రధాని ఇబ్రహీం రాజీనామా..

కైరో : ఈజిప్టు ప్రధాని ఇబ్రహీం రాజీనామా చేశారు. దేశ అధ్యక్షుడు అబ్దెల్ కు రాజీనామా పత్రాన్ని పంపారు. అవినీతి కేసులో వ్యవసాయ మంత్రి అరెస్టయిన కొద్ది రోజుల్లో ప్రభుత్వం రాజీనామా చేసింది. ఎన్నికల వరకు అపధర్మ ప్రధానిగా కొనసాగాలని అధ్యక్షుడు అబ్దెల్ ఇబ్రహీంకు సూంచిచారు. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 2 వరకు ఎన్నికలు జరుగనున్నాయి. 

17:23 - September 12, 2015

ఆదిలాబాద్ : ఆ ఊరి నిండా కల్తీ కల్లుకు బానిసలు.. వారి మత్తును వదిలించడానికి ఊరి వాళ్లంతా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఊరిలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఊళ్లో ఎవ్వరూ మద్యం తాగకుండా శపథం తీసుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. కిక్కు లేనిదే దిక్కు తోచని మందుబాబులు ఈ నిర్ణయంతో ఏమయ్యారో ఓసారి చూద్దాం..
ఒకప్పుడు ఊరంతా కల్తీ కల్లు
ఆదిలాబాద్‌ జిల్లా భైంసా మండలంలోని కామోల్‌ అనే ఓ కుగ్రామంలో ఒకప్పుడు ఊరంతా కల్తీ కల్లు, మద్యానికి బానిసలు. దీంతో ఊళ్లో మత్తు మహమ్మారితో కుటుంబాలన్నీ విషాద ఛాయలతో నిండిపోయాయి. ఎక్కడ చూసిన కుటుంబ కలహాలతో ఊరంతా గొడవలతో బతుకులు అతలాకుతలం అవుతున్నాయి.
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు
దీంతో ఊళ్లో మద్యం మహమ్మారిని వెళ్లగొట్టేందుకు గ్రామస్తులంతా ఈ కృష్ణాష్టమి నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకే ముంది మందు బాబులు బుద్ధిగా తాగుడు మానేసి ఓ రెండు రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత మత్తు కిక్కు లేక వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. కిక్కు లేక మత్తు బానిసలకు మూర్ఛ వచ్చి పడిపోవడం మొదలు పెట్టేశారు. వీరినందరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
130కి చేరిన కిక్కు బాధితుల సంఖ్య
ఇక కిక్కు బాధితుల సంఖ్య ఏకంగా 130కి చేరడంతో పడకలు లేక ఇలా నేల పడుకోబెట్టి మరీ చికిత్స ఇస్తున్నారు. ఇందుకోసం ఏకంగా ఓ వైద్య శిబిరం సైతం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఏది ఏమైనా తమ గ్రామంలో సంపూర్ణ మద్య పాన నిషేధం అమలు చేస్తామని గ్రామస్తులు మాత్రం సీసా బద్దలు కొట్టి మరీ శపథం చేయడం విశేషం.

 

17:11 - September 12, 2015

మహబూబ్ నగర్ : తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపరం కొనసాగుతూనే ఉంది. అనునిత్యం ఏదో ఒక చోట అన్నదాత ప్రాణాలు తీసుకుంటున్నాడు. దేశానికి వెన్నెముకైన అన్నదాత నడ్డి విరుగుతోంది. అందరికీ అన్నం పెట్టే రైతన్న తనువు చాలిస్తున్నాడు. గిట్టుబాటు ధర లేక, ఎరువుల ధరలు అధికమవ్వడం, వర్షాభావ పరిస్థితులు, పంట చేతికి రాక, పెట్టిన పెట్టుబడులు రాక, అప్పుల బాధలు తట్టుకోలేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రైతన్నను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వాలు.. ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పా.. ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో అప్పుల బాధతో మరోరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి తన ఐదెకరాల పొలంలో పత్తివేశాడు. అయితే వర్షాభావంతో చేను ఎదగలేదు. పెట్టుబడి అప్పుమాత్రం పెరిగిపోయింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ రెడ్డి తన పొలంలోనే పురుగులమందు తాగి ప్రాణాలు విడిచాడు.

 

16:58 - September 12, 2015

కరీంనగర్ : తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపరం కొనసాగుతూనే ఉంది. అనునిత్యం ఏదో ఒక చోట అన్నదాత ప్రాణాలు తీసుకుంటున్నాడు. దేశానికి వెన్నెముకైన అన్నదాత నడ్డి విరుగుతోంది. అందరికీ అన్నం పెట్టే రైతన్న తనువు చాలిస్తున్నాడు. గిట్టుబాట ధర లేక, ఎరువుల ధరలు అధికమవ్వడం, వర్షాలు లేక, పంట చేతికి రాక, పెట్టుబడులు రాక, అప్పుల బాధలు తట్టుకోలేక రైతన్న రైతు బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. రైతన్నను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వాలు.. ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పా.. ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా కరీంనగర్ జిల్లాలో అప్పుల బాధతో మరోరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం రాజలింగంపేటలో నర్సయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంట కోసం చేసిన అప్పులు పెరగటం, వర్షాభావ పరిస్థితులతో ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు.

 

16:47 - September 12, 2015

విజయవాడ : గొలుసు కట్టు సంస్థలతో జనం జేబులు గుల్లచేశారు..! చీటీల పేరుతో ఛీటింగ్‌ కొనసాగుతూనే ఉంది..! చివరకు.. విద్యాలయాలు కూడా అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి..! నమ్మకాన్ని అమ్మకానికి పెడుతున్న మోసగాళ్లు కోట్లు కొల్లగొడుతుంటే.. జనం సొమ్ముకు కాపాలా కాయాల్సిన ప్రభుత్వాలు కేటుగాళ్లకే కొమ్ముకాస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. నిన్న అగ్రిగోల్డ్ మోసం... నేడు కేశవరెడ్డి వంచన.. నిన్న, నేడు, రేపు అంటూ కొనసాగుతున్న చీటీల ఛీటింగ్‌...
ఎక్కడ చూసినా మోసమే
ఎక్కడ చూసినా మోసమే. నిబంధనలతో పనేలేదు. చట్టమంటే భయమే లేదు. ప్రభుత్వాలను పాదాక్రాంతం చేసుకుంటున్న కేటుగాళ్లు.. కోట్లాది రూపాయల జనం సొమ్మును దర్జాగా దోచేస్తున్నారు. తమ ఖజానాల్లో దాచేస్తున్నారు. ఏళ్ల తరబడి అడ్డూ అదుపూ లేకుండా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే చర్చ మొదలైంది.
కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలు
గతంలో లేని విధంగా.. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలు జరుగుతున్నాయి. చీటీల పేరుతో ఒకరు జనానికి గాలం వేస్తే.. చైన్ సిస్టమ్ బిజినెస్‌తో వలేస్తున్నారు మరికొందరు. రియల్ ఎస్టేట్ పేరుతో ఒకరు బురిడీకొట్టిస్తే.. బడి పేరుతో నయవంచన చేస్తున్నారు ఇంకొందరు. ఆర్.బి.ఐ. రూల్స్ కు విరుద్ధంగా వ్యాపారాలు మొదలు పెడుతూ.. కోట్లాది రూపాయలు కూడబెడుతున్న అక్రమార్కులు.. సంచులు నిండగానే చెప్పా పెట్టకుండా చెక్కేస్తున్నారు.
ప్రభుత్వాల అండదండలు
అయితే.. ప్రభుత్వాల అండదండల కారణంగానే ఈవిధమైన దోపిడీలు పెచ్చరిల్లుతున్నాయనే విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. తమకు అనుకూలంగా ఉన్నవారు తప్పులు చేసినా పట్టించుకోని ప్రభుత్వాలు.. వ్యవహారం మరింత ముదిరితే తప్ప, అదికూడా తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అగ్రిగోల్డ్ సంస్థ మోసం..
తెలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ సంస్థ చేసిన మోసం అంతా ఇంతా కాదు. సుమారు 7 వేల కోట్ల రూపాయల మేర జనాన్ని ముంచేసింది. ప్రస్తుతం ఆ సంస్థ వద్ద ఉన్న ఆస్తులు మొత్తం అమ్మినా.. జనానికి డబ్బులు సరిపోవంటున్నారు. అయితే.. అగ్రిగోల్డ్‌కు అనుబంధంగా ఉన్న సంస్థల ఆస్తులు మాత్రం వందల రెట్లు అధికంగా ఉన్నట్టు సమాచారం. కానీ.. కేవలం అగ్రిగోల్డ్‌ చుట్టే తిరుగుతున్న వ్యవహారం.. అనుబంధ సంస్థల దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. ఈ విషయమై బాధితులు హైకోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చింది.
కేశవరెడ్డి విద్యాసంస్థల మోసం
ఇక, తాజా మోసంలో.. కేశవరెడ్డి విద్యాసంస్థలు 540 కోట్ల రూపాయల మేర జనాన్ని మోసం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల రూపంలో కాకుండా డిపాజిట్లు కూడా వసూలు చేశారు. అవి జనానికి తిరిగి ఇవ్వకపోవడంతో రెండు రోజుల క్రితం మోసం బయటపడింది. అయితే.. ఈ వ్యవహారం గత పదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. మరి, ఇంత కాలంగా ప్రభుత్వాలకు, అధికారులకు ఈ విషయం తెలియదా..? అంటూ జనం సూటిగా నిలదీస్తున్నారు. ప్రజలు మోసపోయిన తర్వాత.. తూతూ మంత్రంగా హడావిడి చేస్తున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రిపైనా ఆరోపణలు
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రిపైనా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఆయన.. జనానికి కుచ్చుటోపీ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా.. ఆర్‌బీఐ చట్టాలకు విరుద్ధంగా జనం నుంచి పలు సంస్థలు, వ్యక్తులు ఇప్పటికే కోటాను కోట్లు వసూలు చేశారు. ఈ మేడి పండు పొట్ట ఏ క్షణమైనా పగిలిపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం ఇకనైనా బాధ్యతతో వ్యవహరించి, ఇలాంటి మోసాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

16:39 - September 12, 2015

పశ్చిమగోదావరి : జిల్లాలో బీజేపీ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. తమకు పరిహారం ఇవ్వాలంటూ... బీజేపీ బృందాన్ని పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులు అడ్డుకున్నారు. పరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు పూర్తి చేయాలంటూ ఘెరావ్‌ చేశారు. దీంతో చేసేది లేక... పోలీసుల సాయంతో బీజేపీ బృందం బయటపడింది. నేతల హామీలపై అసంతృప్తి వ్యక్తం చేసిన నిర్వాసితులు... వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బీజేపీ నేతలకు చేదు అనుభవం..

పశ్చిమగోదావరి : జిల్లాలో పర్యటించిన బీజేపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు నేతలను అడ్డుకున్నారు.

పట్టాలు తప్పిన టాయ్ రైలు...

చంఢీఘర్ : హర్యానాలో టాయ్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. కల్కా-టస్కల్ మధ్య రెండు బోగీలు పట్టాలు తప్పాయి.

 

16:29 - September 12, 2015

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీకి.. టీఆర్ఎస్ కోవర్టుల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ కార్యక్రమాలపై అంతర్గతంగా నిర్వహించిన సమావేశం వివరాలు.. తమ్ముళ్లకంటే ముందుగా టీఆర్‌ఎస్‌ నాయకులకు చేరుతున్నట్లు అధిష్ఠానం గుర్తించింది. ఓటుకు నోటు వ్యవహారంలో.. ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో చర్చలు జరిపిన విషయం.. కోవర్టుల ద్వారానే టీఆర్ఎస్‌కు లీకైందని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. ఈ మధ్యకాలంలో పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడకే పరిమితం కావడంతో.. కోవర్టులకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని చెబుతున్నారు. పైగా కిందిస్థాయి వారే కాకుండా సీనియర్లూ కోవర్టులుగా మారి పార్టీని దెబ్బ తీస్తుండడంతో ఏమి చేయాలో అర్థం కాక అధిష్ఠానం మదనపడుతోంది.
సమాచారాన్ని చేరవేస్తున్న కోవర్టులు
కోవర్టుల్లో అత్యధికులు.. ఇటీవలే టీడీపీని వీడి.. టీఆర్ఎస్‌లో చేరి.. కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ నాయకుడితో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తుండడంతో దానికి అనుగుణంగా టీఆర్ఎస్‌ నేతలు ప్రతి వ్యూహాలను రచిస్తున్నట్లు భోగట్టా. మరోవైపు.. టీఆర్ఎస్‌లో చేరేందుకు తహతహలాడుతున్న కొందరు టీడీపీ నేతలను.. గులాబీ నేతలు వ్యూహాత్మకంగా ఆపుతున్నట్లు సమాచారం. కోవర్టులందరూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ అనుచరులకు టీడీపీ టిక్కెట్లు ఇప్పించి.. కార్పొరేటర్లుగా గెలిపించుకుని.. వారితోపాటే టీఆర్ఎస్‌లోకి చేరేలా గులాబీ దళపతి వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. టీడీపీని వీడాలనుకుంటున్న నేతలు.. టీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ నేతతో ఉన్న చనువును ఉపయోగించుకుని ప్రభుత్వ స్థాయిలో పనులు కూడా చక్కబెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
వైఎస్‌ హయాంలోనూ కోవర్టులుగా పార్టీ సీనియర్లు
నిజానికి తెలుగుదేశం పార్టీలో కోవర్టుల బెడద ఈ నాటిది కాదు. వై.ఎస్. ప్రభుత్వ హయాంలో కూడా చాలా మంది సీనియర్లు కోవర్టులుగా వ్యవహరించారని.... అయినా నిలదొక్కుకున్నామని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇప్పుడు కూడా వైరి పక్షాల వ్యూహాలను సమర్థంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

చంద్రబాబుతో వెంకయ్యనాయుడు-మెట్రో అధికారుల భేటీ

విజయవాడ : సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం చంద్రబాబుతో వెంకయ్యనాయుడుతో పాటు మెట్రో అధికారులు భేటీ అయ్యారు. మెట్రో రైలుపై చర్చిస్తున్నాను.

 

నల్గొండ జిల్లాలో సూది దాడి కలకలం...

నల్గొండ : మేళ్లచెరువు మండలం దొండపాడులో సూది దాడి కలకలం రేపింది. తనపై ఇద్దరు సూదితో దాడికి పాల్పడినట్లు నర్సింహారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అయితే వైద్యులు సూది దాడిగా నిర్ధారించలేదు. 

గ్యాస్ సిలిండర్ పేలుడు.. 83 కు చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్ : ఝబువాలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 83 కు చేరింది. సేథియా రెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ప్రమాదంలో మరో 150 మందికి గాయాలయ్యాయి. 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం... మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించింది. 

15:36 - September 12, 2015

ఖమ్మం : జిల్లాలోని మణుగూరులోని భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్‌ వద్ద రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తయి 9 నెలలు గడిచినా ఇప్పటివరకు తమకు పరిహారం ఇవ్వలేదని రైతులు ఆందోళన చేపట్టారు. విద్యుత్‌ ప్లాంట్‌ వద్ద పనులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమకు పరిహారం ఇచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

15:32 - September 12, 2015

కృష్ణా : డీఎస్సీకి సంబంధించి వారం రోజుల్లో స్పష్టమైన నివేదిక వస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడలో విద్యాశాఖ అధికారులతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్కూళ్లలో శుభ్రతకు ప్రత్యేక వారోత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఒకే రంగు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ, అమరావతి, విశాఖలో కొత్త యూనివర్సిటీను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అందుకోసం ప్రపంచస్థాయి యూనివర్సిటీలను సందర్శిస్తున్నామన్నారు.

 

15:16 - September 12, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై టిడిపి నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలుతుంటే... నేతలు విదేశీయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం తక్కువ చేసి...చూపిస్తోందన్నారు. చనిపోయిన కుటుంబాలను అపహాస్యం చేసి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కరవుపై ఇప్పటివరకూ కేంద్రానికి నివేదిక ఇవ్వలేదని ధ్వజమెత్తారు.

 

15:13 - September 12, 2015

మెదక్ : ఆశావర్కర్లపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్‌ లో హరీష్‌రావుకు వినతీపత్రం ఇచ్చేందుకు ఆశావర్కర్లు వెళ్లారు. తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు. ఐతే వారిపై హరీష్‌రావు కోపడ్డారు. 'ఎన్ని రోజులు సమ్మె చేసినా మాకు సంబంధం లేదు' అని స్పష్టం చేశారు. చివరకు వినతీ పత్రం తీసుకోకుండానే... మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

ఎన్ డిఎ భాగస్వామ్య పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం

పాట్నా : బీహార్ లో ఎన్ డిఎ భాగస్వామ్య పక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. బీజేపీ...157, ఎల్జేపీ (పాశ్వాన్)..41, మాంఝీ...15 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. 

ఝబువాలో గ్యాస్ సిలిండర్ పేలుడు.. 82 కు చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్ : ఝబువాలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 82 కు చేరింది. సేథియా రెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ప్రమాదంలో మరో 150 మందికి గాయాలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం... మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించింది.

మహిళా ఎస్పీపై దుండగుడి దాడి

నెల్లూరు : మహిళా ఎస్పీపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. సింహపురి ఎక్స్ ప్రెస్ లో ఎస్పీ రత్నపై దాడి చేశాడు. మనుబోలు-గూడూరు మధ్య ఘటన చోటుచేసుకుంది. సింహపురి ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ నుంచి గూడూరు వెళ్తోంది.

 

హరీష్ దిష్టి బొమ్మ దగ్ధం..

హైదరాబాద్ : ఆశావర్కర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆసిఫాబాద్‌లో సీఐటీయూ కార్యకర్తలు ఆందోళన చేసి హరీష్‌రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. 

బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం..

హైదరాబాద్ : బీహార్‌ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని ఎంపీ అసద్‌ ప్రకటించారు. సీమాంచల్‌ ప్రాంతంలోని 4 జిల్లాల్లో 24 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన తెలిపారు. సీమాంచల్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రాన్నికోరారు.

హరీష్ మాటలు దారుణం - రావుల..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మాటలు దారుణంగా ఉన్నాయని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం ఆపహాస్యం చేస్తోందని, మంత్రులు, ఎమ్మెల్యేలకు వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని ఎద్దేవా చేశారు. సీఎంను ప్రసన్నం చేసుకోవడానికే మంత్రులు కష్టపడుతున్నారని ఆరోపించారు.

ఏపీ, తెలంగాణలో రాగల 48గంటల్లో వర్షాలు..

హైదరాబాద్ : రాగాల 48గంటల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి సమీపాన ఉన్న వాయివ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు.

 

శంషాబాద్ లో బీజేపీ బైక్ ర్యాలీ..

రంగారెడ్డి : ఈనెల 17న తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నగర శివారులోని శంషాబాద్ బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలతో బీజేపీ కార్యకర్తలు శంషాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రదర్శన నిర్వహించారు.
 

పేస్ జోడికి మోడీ అభినందనలు..

ఢిల్లీ : యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న లియాండర్ పేస్ - మార్టినా హింగిస్ జోడికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. వీరు సాధించిన విజయం వల్ల ఆనందంగా ఉందంటూ ప్రధాని మోడీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

టిటిడి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు..

చిత్తూరు : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శనివారం రాయలసమీ ఐటీ వేణుగోపాల కృష్ణ, జీఈవో శ్రీనివాసరాజు పరిశీలించారు. తిరువీధుల్లో బ్యారీకేడ్ల నిర్మాణాన్ని అధికారులు పరిశీలించారు.

 

13:42 - September 12, 2015

ప్రతిష్టాత్మక గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీ అమెరికన్‌ ఓపెన్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఏడు సార్లు చాంపియన్‌...స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌ 18వ గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్స్ టైటిల్‌ పైన కన్నేశాడు. 5 సార్లు అమెరికన్‌ ఓపెన్‌ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ నెగ్గిన ఫెదరర్‌ మరోసారి ఎలాగైనా టైటిల్‌ నెగ్గాలని పట్టుదలతో ఉన్నాడు. స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌....17 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్ టైటిల్స్ సాధించిన ఒకే ఒక్కడు. మోడ్రన్‌ టెన్నిస్‌లో తిరుగులేని ఫెదరర్‌, ప్రస్తుతం 18వ గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్స్ టైటిల్‌ పై కన్నేశాడు. అమెరికన్‌ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ నెగ్గి మరోసారి చరిత్ర సృష్టించాలని తహతహలాడుతున్నాడు.

వింబుల్డన్ టోర్నీలో వెనుకంజ..
వరుసగా గత రెండు వింబుల్డన్‌ టోర్నీల్లో టైటిల్‌కు చేరువగా వచ్చిన ఫెడ్డీ ఆఖరాటలో మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు.కానీ ప్రస్తుతం ఫెదరర్‌ లేటు వయసులోనూ కుర్ర ఆటగాళ్లను సైతం వరుస సెట్లలో చిత్తు చేస్తూ ఓల్డ్ ఈజ్‌ గోల్డ్ అనిపిస్తున్నాడు. అమెరికన్‌ ఓపెన్‌లో స్విస్‌ ఏస్‌ ఆట చూసిన వారందరూ అవాక్కతున్నారు. తన పవర్‌ఫుల్‌ సెర్వ్, వోలీ గేమ్‌తో అదరగొడుతున్న ఫెదరర్‌...ట్రేడ్‌ మార్క్ షాట్లతో అలరిస్తున్నాడు. నేటి తరం ఆటగాళ్లు ఆడటానికే భయపడే ఫార్వర్డ్ నెట్‌ షాట్‌ను ఏ మాత్రం తడబడకుండా ఆడుతూ ఔరా అనిపిస్తున్నాడు. ముఖ్యంగా మెరుగైన బేస్‌లైన్‌ గేమ్‌, పవర్‌ఫుల్‌ వోలీలతో ప్రత్యర్ధులకు చిత్తు చేస్తున్నాడు.

హాట్ ఫెవరేట్ గా బరిలోకి...
34 ఏళ్ల వయసులోనూ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుత అమెరికన్‌ ఓపెన్‌లో ఇప్పటివరకూ ఒక్క సెట్‌ కూడా కోల్పోలేదంటే....ఫెదరర్‌ ఏస్థాయిలో రాణిస్తున్నాడో తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా 5 సార్లు అమెరికన్‌ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గి అరుదైన రికార్డ్‌ నమోదు చేసిన ఫెడ్డీ... 6వ సారి టైటిల్‌ నెగ్గి 18వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ తన ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతున్నాడు. సెమీఫైనల్‌లో తన దేశానికే చెందిన స్టానిలాస్‌ వావ్రింకాతో పోటీపడటానికి సిద్దమైన ఫెదరర్‌.....అదే స్థాయిలో రాణించాలని పట్టుదలతో ఉన్నాడు. వావ్రింకాపై ఘనమైన ట్రాక్‌ రికార్డ్ ఉన్న ఫెదరర్‌....సెమీఫైనల్లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ప్రస్తుతం ఫెదరర్‌ జోరు చూస్తుంటే....మెన్స్ సింగిల్స్‌ టైటిల్‌ ఖాయంగా కనిపిస్తోంది. స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌ 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలని టెన్నిస్‌ వీరాభిమానులు సైతం కోరుకుంటున్నారు. 

13:38 - September 12, 2015

హైదరాబాద్ : బీహార్‌ ఎన్నికల్లో ఎఐఎంఐఎం బరిలో నిలువనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ప్రకటించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు అసద్‌. ఇదిలా ఉంటే బీహార్‌లోని కేవలం సీమాంచల్‌ ప్రాంతంలోనే పోటీ చేస్తున్నట్లు ఓవైసీ తెలిపారు. బీహార్‌లోని గత పాలకులంతా సీమాంచల్‌ ప్రాంతాన్ని పట్టించుకోలేదని తెలిపారు. బీహార్‌ అసెంబ్లీలో సీమాంచల్‌ సమస్యలను ఎలుగెత్తుతామన్నారు. ఆర్టికల్‌ 371 క్రింద సీమాంచల్‌ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు ప్రధాన డిమాండ్ గా ఎంపీ అసద్‌ తెలిపారు.

13:35 - September 12, 2015

శ్రీకాకుళం : సోంపేట ప్రజల ఆనందం ఆవిరవుతోంది. ఆరేళ్ల పోరాటానికి ఫలితం దక్కిందని సంబరాలు జరుపుకున్నవారిని మరో భయం వెంటాడుతోంది. ప్రజలకు శుభవార్త చెప్పినట్లే చెప్పి..సర్కార్‌ కొత్త ప్రతిపాదనతో వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఆరేళ్లుగా సోంపేట ఉద్యమకారుల రిలే దీక్షలతో వెనక్కి తగ్గిన బాబు సర్కార్‌... ఇటీవలే పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఉద్దేశించిన జీవోను రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్‌ తీర్మానించింది. దీంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సోంపేటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సంబరాలు వెల్లివిరిసాయి. పట్టుమని పదిరోజులు గడవకముందే చంద్రబాబు సర్కార్‌ కొత్త పల్లవి వినిపిస్తోంది.

973 ఎకరాల భూముల అప్పగింత...
సోంపేట మండలం బీల గ్రామంలో రెండున్నర వేల మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2008లో అప్పటి వైఎస్‌ ప్రభుత్వం సంకల్పించింది. నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌ సంస్థకు ప్లాంట్‌ నిర్మాణ బాధ్యతలతో పాటు.. 973 ఎకరాల భూములను అప్పగించింది. మరో 1500 వందల ఎకరాలను రైతులనుంచి సేకరించేందుకు అనుమతినిస్తూ 1107 జీవోను విడుదల చేసింది. ఈ పవర్‌ ప్లాంట్‌ వల్ల వేల ఎకరాల్లో కొబ్బరితోటలు, పంటలు నాశనం అవుతాయని, 36 గ్రామాలకు చెందిన సుమారు 40వేల మంది నిర్వాసితులవుతారన్న ఆందోళనతో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు.

1107 జీవో రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేబినెట్‌..
సర్కారు తీరుకు నిరసనగా గడచిన రెండువేల 94 రోజులుగా ఆందోళనకారులు దీక్షలు చేస్తున్నారు. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ఇటీవలే 1107 జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతలోనే పారిశ్రామిక వాడ పేరుతో కొత్త ఎత్తుగడకు పావులు కదుపుతోంది. రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకున్న బీల భూములను తిరిగి నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌ సంస్థకు తిరిగి కట్టబెట్టేందుకు జీవో జారీ చేయడాన్ని పర్యావరణ పరిరక్షణ సమితి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాగార్జున కంపెనీకి భూములు అప్పగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని పోరాట కమిటీ సభ్యులు హెచ్చరిస్తున్నారు. బీల భూములను ఎన్‌సీసీకి కేటాయించేందుకు జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని సోంపేట ఉద్యమకారులు డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆరేళ్లుగా కొనసాగుతున్న ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామంటున్నారు.   

13:29 - September 12, 2015

విశాఖపట్టణం : విమ్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో విమ్స్‌ డైరెక్టర్‌ సుబ్బారావు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో నిందితుడు రామన్‌ బల్లా సమాచారంతో సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు విశాఖ పోలీసులు. ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కేసులో స్థానిక పోలీసులు దర్యాప్తు స్పీడ్‌ పెంచారు. ఇప్పటికే ఈ కేసులో అదుపులోకి తీసుకున్న రామన్‌ బల్లా నుంచి పలు కీలక అంశాలు సేకరించారు. ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బులో.. తన వాటా మినహాయించుకుని మిగతా సొమ్ము విమ్స్ డైరెక్టర్‌ సుబ్బారావుకు అందజేసేవాడినని బల్లా తెలిపాడు.

రామన్‌ బల్లా నుంచి కీలక సమాచారం..
ఇంతకీ రామన్‌ బల్లా ఎవరు? ఆయనకు సుబ్బారావుకు దోస్తీ ఎలా కుదిరింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఓసారి ప్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లాలి. రామన్‌ బల్లా.. గత ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నాడు. తనకు సాప్ట్ వేర్‌ కంపెనీలున్నాయని.. అందులో ఉద్యోగాలు ఇప్పిస్తానని కోతలు కోశాడు. ఈ విషయాన్నే అంతటా ప్రచారం చేసుకునేవాడు. ఈ క్రమంలోనే విమ్స్ డైరెక్టర్‌ సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆస్పత్రికి కావాల్సిన సాప్ట్‌వేర్‌ అందిస్తానని నమ్మబలికాడు. సుబ్బారావు సైతం డైరెక్టర్‌ కోటాలో విమ్స్ లో ఉద్యోగాలున్నాయని..నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకోవచ్చని ఐడియా ఇచ్చాడు. ముందుగా బల్లాకు చెందిన వ్యక్తిని విమ్స్ లో చేర్పించాడు. ఇక అతని ద్వారా అమాయకులకు గాలం వేశారు. దీంతో లక్ష నుంచి నాలుగున్నర లక్షల వరకు ఒక్కో వక్తి నుంచి బల్లా వసూలు చేశాడు. అంతేకాదు ఈ ఉద్యోగాల కోసం వేరే ఆస్పత్రుల్లో శిక్షణ సైతం ఇచ్చారు. ఎంతకీ అపాయింట్‌మెంట్‌ లేటర్లు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి డబ్బులు చెల్లించాలని బల్లాను నిలదీశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో మొత్తం గుట్టంతా రట్టయింది. మరోవైపు మంత్రి కామినేని సుబ్బారావును విమ్స్ డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించారు. బల్లా ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన వైజాగ్‌ పోలీసులు విమ్స్‌ డైరెక్టర్‌ సుబ్బారావును కటకటాల్లోకి నెట్టారు. అరెస్ట్ చేసిన అనంతరం వైద్య పరీక్షల కోసం ఆయన్ని కేజీహెచ్‌కు తరలించారు. 

13:21 - September 12, 2015

గుంటూరు : పాఠశాలల్లో శుభ్రతకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం డీఈవోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజుల్లో పాఠశాల్లో నెలకొన్న అపరిశుభ్రతను తొలగించాలని, పాఠశాలలు శుభ్రంగా లేకపోతే విద్యాధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఒకే రంగు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ, అమరావతి, విశాఖపట్టణంలో వర్సిటీల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అందుకోసం ప్రపంచస్థాయి యూనివర్సిటీలను సందర్శిస్తున్నామన్నారు. డీఎస్సీకి సంబంధించి వారం రోజుల్లో స్పష్టమైన నివేదిక వస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు.

13:18 - September 12, 2015

వరంగల్ : ప్రముఖ పేరొందిన ఎంజిఎంలో శనివారం ఉదయం కరెంటు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు మూడు నుండి నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా కాలేదు. దీనివల్ల ఎమర్జెన్సీ, చిన్న పిల్లలు, ఓపి, ఎక్స్ రే, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష..పలు వైద్య సేవలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న టెన్ టివి ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేసింది. అప్రమత్తమైన విద్యుత్ అధికారులు ఆసుపత్రికి విద్యుత్ ను సరఫరాను పునరుద్ధరించారు. కానీ మూడు నాలుగు గంటల పాటు రోగులు నరకయాతన పడ్డారు. చివరకు కరెంటు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన టెన్ టివికి పలువురు అభినందనలు తెలిపారు. 

13:13 - September 12, 2015

నెల్లూరు : రైలులో లేడీ ఐపిఎస్ ని కొట్టి నగలు దోచుకెళ్లిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ పోలీసు అకాడమీలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి రత్న చెన్నైకి వెళ్లడానికి మఫ్టీలో సింహపురి ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కింది. ఆమె ఎక్కిన ట్రైన్ గూడూరు వరకు వెళుతుంది. అనంతరం అక్కడి నుండి మరో ట్రైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. ఓ బోగీలో ఎవరూ లేకపోవడంతో ఆమె అందులోకి ఎక్కి ప్రయాణిస్తోంది. కొద్దిసేపు అనంతరం అకస్మాత్తుగా ఓ దుండగుడు ఆ బోగిలోకి ప్రవేశించాడు. డబ్బులు ఇవ్వాలని కత్తితో బెదిరించాడు. బంగారం ఇవ్వడానికి రత్న నిరాకరించడంతో ఆమె తలను డోరుకేసి బాదాడు. దీనితో రత్న ముఖం, తల, పెదవులపై గాయాలయ్యాయి. దెబ్బలను భరించలేని రత్న తన దగ్గరున్న ఐదు సవర్ల బంగారం, 2వేల నగదును దుండగుడికి ఇచ్చేసింది. అనంతరం గూడూరు రైల్వే స్టేషన్ కు చేరుకొనేలోపే దుండుగు ట్రైన్ దిగి పరారయ్యాడు. ఈ దొంగతనం విషయాన్ని రత్న గూడురు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. గాయాల పాలైన రత్నకు వైద్యులు చికిత్స అందించారు. 

ప్రారంభమైన భారత్‌-పాక్‌ డీజీ స్థాయి మీటింగ్‌..

ఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో ప్రారంభమైన భారత్‌-పాక్‌ డీజీ స్థాయి మీటింగ్ ప్రారంభమైంది. 

నిరహార దీక్ష వాయిదా వేసుకున్న అన్నా..

ఢిల్లీ : ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హాజారే తన నిరాహార దీక్షను వాయిదా వేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆయన అక్టోబర్ 2వ తేదీ నుండి దీక్ష చేపడుతున్నట్లు గతంలో అన్నా ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఎస్పీపై దుండగుడి దాడి..

నెల్లూరు : హైదరాబాద్ నుండి గూడురు వెళుతున్న సింహపూరి ఎక్స్ ప్రెస్ లో మహిళా ఎస్పీ రత్నపై దుండగుడు దాడికి దిగాడు. మునుబోలు - గూడూరు మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు నగలు దోచుకెళ్లాడు. గూడూరు లో ఎస్పీ ఫిర్యాదు చేశారు. ఎస్పీ రత్న హైదరాబాద్ పోలీసు అకాడమీలో ఎస్పీగా పనిచేస్తున్నారు.

12:46 - September 12, 2015

హైదరాబాద్ : ఏపీలో వైసీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు వైఎస్‌ జగన్‌. పార్టీ అనుబంధ కమిటీలన్నింటినీ పూర్తి స్థాయిలో నియమించేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారు. ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రజల్లోకి మరింత దగ్గరకు తీసుకెళ్లేందుకు పార్టీ అధినేత జగన్‌ కసరత్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా 2రోజులుగా లోట‌స్‌పాండ్ పార్టీ కార్యాల‌యంలో 13 జిల్లాల నేత‌ల‌తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అనుబంధ సంఘాల క‌మిటీలు, రాష్ట్ర, జిల్లా, నియోజ‌కవర్గ, మండ‌ల‌, గ్రామీణ స్థాయి పార్టీ క‌మిటీల‌న్నింటిని పూర్తి స్థాయిలో నియ‌మించేందుకు జగన్ క‌స‌ర‌త్తు మెద‌లు పెట్టారు.

టిడిపి హామీలపై ప్రజలకు వివరించాలన్న జగన్..
ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన కొన్ని క‌మిటీలే ఉండ‌డం వల్ల.. పార్టీ చేప‌ట్టే కార్యక్రమాలన్నీ గ్రామ స్ధాయికి చేర‌డం లేదని జగన్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఏపీలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెల‌లు గడుస్తున్నా..ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఇదే విష‌యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల‌ని జిల్లా నేత‌ల‌కు జగన్ సూచించారు.

ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే అపవాదు..
పార్టీలో జ‌గ‌న్ ఏక‌ప‌క్ష నిర్ణయాలు తీసుకుంటున్నార‌నే అప‌వాదు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు పార్టీ ముఖ్య నేత‌ల స‌ల‌హాలు. సూచ‌న‌ల‌ను జగన్ తెలుసునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇక‌పై త‌ర‌చుగా జిల్లాల‌ పర్యటనలు చేస్తూ..క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుంటూ..కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి. పార్టీ చేప‌ట్టే ప్రజా ఉద్యమాలకు, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలనుంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని జగన్ కోరినట్లు సమాచారం.

బాబుపై వత్తిడి తీసుకరావాలని వ్యూహం..
మొత్తానికి రానున్నరోజుల్లో జ‌గ‌న్ పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావాల‌ని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, రాజ‌దాని నిర్మాణం, రైతు ఆత్మహత్యలు, రుణాల రీషెడ్యూల్‌, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి అంశాల‌ను ప్రచారాస్త్రాలుగా చేసుకుని ప్రజల ముందుకెళ్లనున్నట్లు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

12:43 - September 12, 2015

ఉత్తర్ ప్రదేశ్ : న్యాయం అడిగినందుకు అన్యాయంగా కొట్టారు. మరో "నిర్భయ"కు అండగా నిలబడమని నినదించినందుకు రౌండప్‌ చేసి చితక్కొట్టారు. చేతిలో అధికారం ఉందనే పొగరుతో అమాయకులను అణిచేసందుకు ప్రయత్నించారు. అడిగేవారెవరున్నారులే అనే ధైర్యంతో వీర విహారం చేసారు. ఈ ఘన నిర్వాకం చేసింది రౌడీ మూకలు కాదు. సామాన్యులను కంటికి రెప్పలా కాపాడాల్సిన పోలీసులు. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీ నగర్‌లో చెలరేగిపోయిన పోలీసు బలగాలు స్ధానికులను కసితీరా కొట్టారు. సామాన్యులపై బలప్రయోగానికి దిగి లాఠీలు విరిగేలా తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. చేతికి దొరికిన వారిని, చేతికి అందని వారిని, దొరకపుచ్చుకుని మరీ చావ బాదుడు బాదారు.

మైనర్‌ బాలిక పై గ్యాంగ్‌ రేప్‌..
సరిగ్గా రెండు రోజుల క్రితం ఖుషీ నగర్‌లో నివాసముండే ఓ మైనర్‌ బాలికను కొందరు దుర్మార్గులు గ్యాంగ్ రేప్‌ చేశారు. నిర్భయ ఉదంతాన్ని తలపించే రీతిలో ఆ మైనర్ బాలిక పై పడి పశువాంఛను తీర్చుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కళ్లముందే విలయ తాండవం చేస్తున్న ఆ కాళరాత్రిని చూస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తోంది. అయినా పోలీసులు ఇప్పటి వరకు మీన మేషాలు లెక్కిస్తూనే ఉన్నారు.

పోలీసుల వైఖరిపై స్ధానికుల మండిపాటు..
ఆ అభాగ్యురాలిని దీనస్ధితిని చలించిపోయిన ఖుషీనగర్ వాసులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఘటన జరిగి రెండు రోజులవుతున్నా దర్యాప్తు చేయకపోవడం పై తీవ్ర ఆగ్రహం చేశారు. పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించేందుకు నిరసన ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు చుట్టుముట్టారు. దొరికిన వారిని దొరికినట్టు చావబాది తమ కసి తీర్చుకున్నారు. రోజుకో అత్యాచారం జరుగుతున్నా, ఒళ్లు గగుర్పొడిచే నిర్భయ ఉదంతాలు వెలుగులోకి వస్తున్నా ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ కనీసం నోరు మెదపడం లేదు. పోలీసులు సామాన్యులపై విరుచుకుపడుతున్నా మౌనం వీడటం లేదు. సర్కార్ అలసత్వాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు రెచ్చిపోతున్నారని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.

12:41 - September 12, 2015

భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ చరిత్ర సృష్టించాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను సాధించిన భారతీయుడిగా నిలిచాడు. 2015 అమెరికన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను స్విస్ వండర్ మార్టినా హింగిస్ జోడితో పేస్ గెలుచుకున్నాడు. ఫైనాల్లో అమెరికాకు చెందిన క్వెర్రీ - బెథానీల 6-4, 3-6, 10-7 పాయింట్ల తేడాతో వీరు గెలుపొందారు. ఈ విజయంతో లక్షా యాభై వేల డాలర్ల ఫ్రైజ్ మనీతో పాటు యూఎస్ ఓపెన్ ట్రోఫీ పేస్ - హింగిస్ జోడికి దక్కింది. 42ఏళ్ల పేస్ కెరీర్ లో ఇది 17వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. 2015 సీజన్ లో హింగిస్ జంటగా వింబుల్డన్ టైటిల్ ను నెగ్గిన పేస్ ఇది బ్యాక్ టు బ్యాక్ టైటిల్ కావడం గమనార్హం. 

గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై సోనియా దిగ్ర్భాంతి..

ఢిల్లీ : మధ్యప్రదేశ్ లోని గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె సంతాపం ప్రకటించారు. 

డియుఎస్ యు ఎన్నికలో ఏబీవీపీ విజయం..

ఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం సాధించింది. నాలుగు సీట్లను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఏబీవీపీ సంబరాలు జరుపుకుంది.

 

ఖమ్మంలో కాంగ్రెస్ ఆందోళన..

ఖమ్మం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఖమ్మం బస్టాండు వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఆందోళనలో ఎంపీ వీహెచ్, మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. 

12:23 - September 12, 2015

పశ్చిమగోదావరి : అమ్మే ఆ పసిపాపకు ప్రాణం. అమ్మే ఆ చిన్నారికి లోకం. ఆపాయ్యంగా ముద్దులతో అనురాగం కురిపిస్తోంది. చిట్టివేళ్లతో కన్నతల్లి కన్నీళ్లను తుడిచేస్తోంది. కానీ ఆమె తాళిని ఎగతాళి చేసింది. సరిదిద్దుకోవాల్సిన కాపురాన్ని చేజేతులా పాడు చేసుకుంది. మూడుముళ్ల బంధాన్ని అపహాస్యం చేసి కూతురుతో ఇంటినుంచి బయటికొచ్చేసింది. ఆ తర్వాతే ఆమెలో దారి తప్పిన పోకడలు బయటపడ్డాయి. చివరికి తన సుఖం కోసం కన్నబిడ్డనే కడతేర్చేందుకు యత్నించింది.

కుటుంబ కలహాలతో దంపతుల మధ్య పెరిగిన దూరం..
చిన్నారిది ఓ దీనగాధ. నవమాసాలు మోసిన కన్నతల్లే తనను దూరం చేసుకుంటుందని తెలియక ఆ అమ్మే కావాలని పరితపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో ఏడాదిన్నర కూతురుతో భవానీ నివాసం ఉంటోంది. కొన్నాళ్లు భర్త ఏసుతో ఈమె కాపురం సవ్యంగా సాగింది. అయితే కుటుంబ కలహాలు వీరిమధ్య దూరాన్ని పెంచాయి. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో కూతురుతో ఇంటినుంచి బయటికొచ్చి విడిగా ఉంటోంది. ఈ క్రమంలోనే మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

చిన్నారిని కాలువలోకి విసిరిన తల్లి..
తన వివాహేతర సంబంధానికి కూతురు అడ్డుగా ఉందని భావించిన భవానీ కన్నపేగునే అమ్మకానికి పెట్టింది. ఆ ప్రయత్నం విఫలం కావడంతో మరో ప్లాన్ చేసింది. శాశ్వతంగా వదిలించుకోవాలన్న కుట్రతో కూతురును కాలువలో విసిరేసింది. సమీపంలో ఉన్న స్థానికులు ఈ విషయాన్ని గమనించి చిన్నారిని కాపాడారు. అనంతరం భవానీ తీరుపై అనుమానంతో ఐసీడీఎస్‌ అధికారులకు చిన్నారిని అప్పగించారు. ఏ తల్లి చేయని ఘోరానికి యత్నించిన భవానీ ఇప్పుడు కొత్త కహానీలు చెబుతోంది. నా కూతురు నాకు కావాలంటోంది. అయితే స్థానికులు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. 
ఏదీ ఏమైనా ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. కానీ భవానీ సర్దుకుపోవాల్సిన కాపురాన్ని చేజేతులా పాడు చేసుకుని మరొకరితో వివాహేతర సంబంధం నెరపి చివరకి కన్నబిడ్డనే కడ తేర్చాలనుకోవడం క్షమించరాని నేరమని స్ధానికులంటున్నారు. 

12:13 - September 12, 2015

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వర్తించనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తనయుడు రవికుమార్ యాదవ్ పోటీ పడుతున్నారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. గాంధీ భవన్ లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రధాన కార్యదర్శి పదవికి 27మంది పోటీ పడ్డారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 5గురు అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు టిపిసిసి చర్యలు తీసుకుంది. గతంలో వంశీచందర్ రెడ్డి గెలిచిన సమయంలో గొడవలు జరిగిన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ లోనికి ఎవరినీ అనుమతించడం లేదు. ఐడీ కార్డు ఉంటేనే లోనికి అనుమతినిస్తున్నారు. మధ్యాహ్నాం రెండు గంటల అనంతరం ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

పాఠశాలల్లో శుభ్రతకు వారోత్సవాలు - గంటా..

విజయవాడ : పాఠశాలల్లో శుభ్రతకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం డీఈవోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజుల్లో పాఠశాల్లో నెలకొన్న అపరిశుభ్రతను తొలగించాలని, పాఠశాలలు శుభ్రంగా లేకపోతే విద్యాధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. విజయవాడ, అమరావతి, విశాఖపట్టణంలో వర్సిటీల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 

నేడు టిటిడిపి ఎమ్మెల్యేల భేటీ..

హైదరాబాద్ : అసెంబ్లీ కమిటీ హాల్ లో టిటిడిపి ఎమ్మెల్యేలు మధ్యాహ్నాం భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, 14, 15వ తేదీల్లో ఢిల్లీ పర్యటనపై చర్చించనున్నారు. 

యువజన కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల లెక్కింపు ప్రారంభం..

హైదరాబాద్ : యువజన కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల లెక్కింపు ప్రారంభమయ్యాయి. అధ్యక్ష బరిలో ఐదుగురు అభ్యర్థులు నిలవగా, ప్రధాన కార్యదర్శి పదవి కోసం 27 మంది పోటీ పడుతున్నారు. మధ్యాహ్నాం 2గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి. 

భద్రాది విద్యుత్ ప్లాంటు పనులను అడ్డుకున్న నిర్వాసిత రైతులు..

ఖమ్మం : జిల్లాలోని మణుగూరు మండలం భద్రాద్రి విద్యుత్ ప్లాంటు వద్ద నిర్వాసిత రైతులు ఆందోళనకు దిగారు. సర్వే పూర్తయి 9 మాసాలు గడిచినా పరిహారం ఇవ్వడం లేదంటూ విద్యుత్ ప్లాంట్ పనులను అడ్డుకున్నారు. 

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన బీజేపీ ప్రతినిధుల బృందం..

పశ్చిమగోదావరి : జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును శనివారం ఉదయం విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఆధ్వర్యంలో బీజేపీ ప్రతినిధుల బృందం సందర్శించింది. 

11:39 - September 12, 2015

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ బాటలోనే మంత్రులు, అధికారులు నడుస్తున్నారు. విదేశాల్లోని అభివృద్ధి, పన్నుల వసూళ్ల విధానాన్ని అధ్యయనం చేసేందుకు మంత్రులు అనేక దేశాల్లో పర్యటించబోతున్నారు. ఇప్పటికే కేసీఆర్‌ చైనాలో పర్యటిస్తుండగా.. ఈ నెలాఖరుకు ఆర్ధికమంత్రి ఈటెల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ టూర్‌కు సిద్ధమవుతున్నారు. ఇక అధికారులు కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విదేశాల బాట పట్టబోతున్నారు.

ఆర్ధిక సంస్కరణలు, పన్నుల వ్యవస్థ అధ్యయనం..
ఇక మంత్రులు, అధికారులు కూడా విదేశాల్లో పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెలాఖరులో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించబోతున్నారు. ఆయా దేశాల్లోని ఆర్ధికసంస్కరణలు, పన్నుల వ్యవస్థను ఆయన అధ్యయనం చేయనున్నారు. అక్కడ అమలవుతున్న అనేక పద్ధతులు రాష్ట్రంలో ప్రవేశపెట్టి ఆదాయాన్ని పెంచుకోవాలని తెలంగాణ సర్కార్‌ ఆలోచిస్తోంది. ఇందుకోసం వీటన్నింటిని అధ్యయనం చేసేందుకు ఈటెల విదేశీ టూర్‌కు పయనమవుతున్నారు.

అధికారులు కూడా...
అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు పాపారావు, మున్సిపల్‌శాఖ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి, జీఏడీ సెక్రటరీ వికాస్‌రాజ్‌ ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. ఇక బీజింగ్‌లో జరిగే మున్సిపాలిటీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర అధికారులు కూడా చైనా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాల్‌, హెచ్ఎండీఏ కమిషనర్‌ శాలినిమిశ్రా, జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వీరితోపాటు జీవ వైవిధ్యబోర్డు సభ్యురాలు డాక్టర్‌ సువర్ణ... వరల్డ్‌ ఫారెస్ట్‌ కాంగ్రెస్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలోని డర్బన్‌కు వెళ్లనున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా చైనా పర్యటన తర్వాత జపాన్‌, ఉత్తరకొరియా, తైవాన్‌ దేశాల్లో పర్యటించనున్నారు.

కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని ఆరోపణలు..
అయితే మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తున్నాయి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న తరుణంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ విదేశీ పర్యటనలు చేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో.. మంత్రులు విదేశీ పర్యటనలు మాని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాయి. 

11:36 - September 12, 2015

హైదరాబాద్ : మీకు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉందా..? అందులో మీ ఫోటోలు ఉన్నాయా..? అయితే జాగ్రత్తా...అందమైన అమ్మాయి..అందులో హైదరాబాద్‌ యువతులకు గాలం వేస్తున్నవారెందరో ఉన్నారు..రకరకాల పేర్లతో మాయ చేస్తూ ఫ్రెండ్ రెక్వెస్ట్‌లు పంపిస్తున్నారు..ఓకే అన్నారో అంతే..ఆ తర్వాత జరిగేది మోసమే... బీటెక్ కుర్రాడు 200 మంది యువతుల జీవితాలతో చెలగాటమాడాడు...సో...మీ అకౌంట్‌లో అపరిచితులు ఉంటే వెంటనే అన్‌ఫ్రెండ్ చేయండి.

బంజారాహిల్స్ లో నివాసం..
బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్న 21 ఏళ్ల అబ్దుల్‌ మాజిద్‌ కంప్యూటర్స్ లో బిటెక్‌ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న మాజిద్‌ ఆలోచనలు దారి తప్పాయి. ఎంజాయ్ చేయడానికి ఫేస్‌బుక్‌ను అవకాశంగా మల్చుకున్నాడు ఆ తర్వాత నేరాలు చేయడం మొదలుపెట్టాడు. టీనేజీ యువతుల వ్యక్తిగత వివరాలను సేకరించే మాజిద్‌ ఆ తరువాత వారి ఎఫ్‌బి ఐడిని తెలుసుకుంటాడు. దాంతో అతని గేమ్‌ మొదలవుతుంది. వారి ఐడీ తెలుసుకున్న మాజిద్‌ పర్సనల్ చాట్‌లో అసభ్యకర సందేశాలు..దృశ్యాలను పంపిస్తాడు.. దీంతో ఖంగుతిన్నవారు ఏం చేయాలాని ఆలోచించేలోపే మాజిద్‌ ప్లాన్ మారుతుంది.

పోలీసు ఆఫీసర్‌నంటూ హెచ్చరిక...

మాజిద్ నేరాలు అంతటితో ఆగలేదు... యువతులకు వీడియోలు పంపించి తాను పోలీసు ఆఫీసర్‌నంటూ ఫోన్లు చేసి బెదిరించేవాడు. ఆ తర్వాత వారిని నేరుగా కలిసి కేసు లేకుండా చేస్తానని నమ్మించేవాడు. ఇలా వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ దొరికినంత దోచుకునే మాజిద్ ఇక బెదిరింపులు ఉండవని వారిని లొంగదీసుకుంటాడు. ఇలా ఇప్పటికే 200 మందికి పైగా యువతులను బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు తేలింది.

సైబర్‌ క్రైమ్స్‌ పోలీసుల శోధనలో దొరికిన మాజిద్..
అబ్దుల్‌ మాజిద్‌ బ్లాక్‌మెయిల్‌కు లొంగిపోని ఓ యువతి పేరెంట్స్‌కు విషయం చెప్పి నేరుగా సైబర్ క్రైమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తే ఎన్నో ఆసక్తి కర విషయాలు వెల్లడయ్యాయి. అతని సెల్‌ఫోన్‌లో వందలాది మంది యువతుల ఫోటోలు దొరికాయి. ఇలాంటి సైబర్ నేరగాళ్లు ఎందరో ఉన్నారు..రకరకాల పద్దతుల్లో ఎంట్రీ ఇస్తూ మోసాలు చేస్తున్నారు..నేరాలకు పాల్పడుతున్నారు.. ఫేస్‌బుక్‌లో కొత్తవారి ఫ్రెండ్ రెక్వెస్ట్ ను అంగీకరిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది.

ఎంజీఎంలో నిలిచిన విద్యుత్ సరఫరా..

వరంగల్ : జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో రెండు గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎమర్జెన్సీ వార్డుల్లోనూ కరెంట్ లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా లేకపోవడంపై రోగుల బంధువులు ఆందోళనకు దిగారు.

11:24 - September 12, 2015

ఉత్తర్ ప్రదేశ్ : ''20గంటలు..బోరుబావిలో రెండేళ్ల చిన్నారి..ప్రాణాలతో బయటకు వస్తాడా ? రాడా ? అనే అందరిలో ఉత్కంఠ..సహాయక చర్యలు చేపడుతున్న అధికార గణంలో ఒకటే టెన్షన్..టెన్షన్...ఎట్టకేలకు 20 గంటల తరువాత బాలుడు బయటపడ్డాడు..ప్రాణాలతో ఉన్నాడని తెలుసుకున్న తల్లిదండ్రులు..స్థానికులు హర్షాతిరేకాలు''..
ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ సాయిపురిలో చోటు చేసుకుంది. ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. సుమారు 120 ఫీట్ల లోతులో ఉన్న బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యిని తవ్వారు. అంతవరకు పిల్లాడికి ఆక్సిజన్ అందించేందుకు సిలిండర్ లు ఏర్పాటు చేశారు. బాలుడున్న ప్రదేశానికి చేరుకోవడానికి అధికారులకు సుమారు 20గంటల సమయం పట్టింది. శనివారం ఉదయం 6గంటల ప్రాంతంలో బావిలో ఇరుక్కున్న చిన్నారిని బయటకు తీశారు. ప్రాణాలతో ఉన్నాడని తెలుసుకున్న సిబ్బంది అక్కడనే అంబులెన్స్ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా తాము ఆక్సిజన్ అందించినట్లు, తెల్లవారుజామున ఆరు గంటలకు బాలుడిని బయటకు తీసినట్లు వైద్యులు పేర్కొన్నారు. బాలుడిని బయటకు తీయడానికి సిబ్బంది చాలా శ్రమించారని తెలిపారు. బాలుడు ప్రాణాలతో బయటపడడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. 

11:16 - September 12, 2015

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లోని ఝాబువా ప్రాంతంలోని ఓ హోటల్ లో పేలిన సిలిండర్ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 35 మంది మృతి చెందగా మరో 50మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన 25 అంబులెన్స్ లలో సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా జరిగిన పేలుడు ధాటికి మధ్యప్రదేశ్ ఉలిక్కి పడింది. మృతి చెందిన కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల పరిహారం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాద వార్త తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు పరిస్థితిని సమీక్షించారు.

సేథియా రెస్టారెంట్ లో పేలుడు...
శనివారం ఉదయం పట్లవాద్ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న సేథియా రెస్టారెంట్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ సమయంలో టిఫిన్ చేయడానికి వచ్చిన వారిలో కొందరు మృత్యువాత పడగా మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు. రెస్టారెంట్ మూడంతస్తులు ఉన్నట్లు సమాచారం. రెస్టారెంట్ కు సమీపంలోని ఓ బాణాసంచా దుకాణం ఉండడంతో విస్పోటనం భారీగా జరిగిందని తెలుస్తోంది. పేలుడు ధాటికి హోటల్ పై కప్పు చెల్లాచెదరైంది. చెల్లచెదురుగా ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేపట్టారు. చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టని విధంగా కాలిపోయినట్లు సమాచారం. 

మక్కా ఘటనలో 15 భారతీయులకు గాయాలు - ఎంఈఏ...

ఢిల్లీ : మక్కా ఘటనలో 15 భారతీయులకు గాయాలైనట్లు భారత విదేశాంగ ప్రకటించింది. అందులో ఇద్దరు కేరళ రాష్ట్రానికి చెందిన వారని పేర్కొంది. 

హర్యానాలో కబేళాల మూసివేతకు ఉత్తర్వులు..

హర్యాన : రాష్ట్రంలో ఉన్న కబేళాల మూసివేయాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తొమ్మిది రోజుల పాటు మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. జైనుల పండుగ సందర్భంగా ఈ ఆంక్షలు విధించింది. ఇప్పటికే నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిషేధం విధించారు. హర్యాన ఐదో రాష్ట్రం.

మక్కా మృతులకు జగన్ సంతాపం..

హైదరాబాద్ : సౌదీలోని మక్కా మసీదు ప్రమాద బాధితులకు వైసీపీ అధ్యక్షుడు జగన్ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఘటనలో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన ఆకాక్షించారు. 

పేలుడు ఘటనపై విచారణ - ఎంపీ హోం మంత్రి..

మధ్యప్రదేశ్ : ఝాబువా ప్రాంతంలో ఓ హోటల్ లో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆ రాష్ట్ర హోం మంత్రి బాబులాల్ గౌర్ వెల్లడించారు. 

బీజింగ్ లో కేసీఆర్..

చైనా : తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు శనివారం బీజింగ్‌ నగరంలో షాంగ్‌క్వింగ్‌ ఇంటర్నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

 

సోమ్ నాథ్ భారతీకి మరో నోటీసు జారీ..

ఢిల్లీ : మాజీ న్యాయ శాఖ మంత్రి సోమ్ నాథ్ భారతికి ఢిల్లీ పోలీసులు మరో నోటీసు జారీ చేసింది. గృహ హింస కేసులో ఈ నోటీసులు జారీ చేశారు.

మధ్యప్రదేశ్ ఘటనపై ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం..

మధ్యప్రదేశ్ : ఝాబువా ప్రాంతంలో ఓ హోటల్ లో సిలిండర్ పేలుడు ఘటనలో మృతి చెందిన వారికి సీఎం ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల నష్టపరిహారాన్ని ప్రకటించారు. 

10:11 - September 12, 2015

మధ్యప్రదేశ్ : దేశంలో శనివారం పలు ఘోరాలు సంభవిస్తున్నాయి. ఉదయం కర్నాటక రైలు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే మధ్యప్రదేశ్ లో మరో ఘోరం చోటు చేసుకుంది. ఝాబువాలోని ఓ హోటల్ లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలడంతో 20 మంది అక్కడికక్కడనే దుర్మరణం చెందారు. మరో 80మందికి పైగా గాయాలయ్యాయి. హోటల్ పూర్తిగా దగ్ధమైంది. పేలుడు ధాటికి హోటల్ పై కప్పు చెల్లాచెదరైంది. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేపట్టారు. మృతదేహాలను బయటకు తీస్తున్నారు. గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ?
ఉదయం పూట కావడంతో అల్పాహార నిమిత్తం పలువురు హోటల్ వద్దకు ఉండడంతో బాధితుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టని విధంగా కాలిపోయినట్లు సమాచారం. ఆ హోటల్ పక్కనే బాణాసంచా దుకాణం ఉండడంతో భారీ విస్పోటనం జరిగినట్లు సమాచారం. ఈఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటన విచారణకు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 

మక్కా మృతులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు..

ఢిల్లీ : సౌదీలోని మక్కా మసీదు ప్రమాద బాధితులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ నివాళులర్పించారు. సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా మసీదులో క్రేన్ కూలిన ఘటనలో 107 మంది మృతి చ చెందిన సంగతి తెలిసిందే.

 

ఫిరోజాబాద్ లో బోరు బావిలో పడిన చిన్నారి..

ఉత్తర్ ప్రదేశ్ : ఫిరోజాబాద్ ప్రాంతంలో రెండు సంవత్సరాల చిన్నారి బోరు బావిలో పడిపోయాడు. రెస్క్యూ టీం ఆ చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

వారణాసిలో అగ్నిప్రమాదం..

వారణాసి : లుక్సా పట్టణంలోని ఓ చీరల గోదాంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

మధ్యప్రదేశ్ లో పేలిన సిలిండర్..20 మంది మృతి..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలోని జబువాలోని ఓ హోటల్ లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలడంతో 20 మంది మృతి చెందారు. మరో 80 మందికి గాయాలయ్యాయి. 

09:32 - September 12, 2015

విజయనగరం : జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. నేటి నుంచి అధికారులు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. 60 రోజుల్లో అభ్యంతరాలు తెలపాలని సూచించారు. రైతుల దగ్గరికి వెళ్లి నోటీసులను అధికారులు అందచేయనున్నారు. గ్రామాల్లోకి అధికారులను రానివ్వమని రైతులు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా రైతులు ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందచేయడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. 

09:30 - September 12, 2015

మహబూబ్ నగర్ : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. జూరాలకు భారీగా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో దిగువకు నీరు వదులుతున్నారు. జూరాలకు ఇన్‌ఫ్లో 24 వేల క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 29 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.50 మీటర్లా కాగా ప్రస్తుత నీటిమట్టం 318.15 మీటర్లకు చేరుకుంది. జూరాలలో 5 యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించారు.

శ్రీశైలం డ్యామ్ కు పెరుగుతున్న ఉధృతి..
జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండి దిగువకు నీరు వదలటంతో...శ్రీశైలం డ్యామ్‌కు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 818.5 అడుగులకు చేరింది. డ్యామ్ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.... ప్రస్తుతం 40 టీఎంసీల నీరు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 56 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. తుంగభద్ర నుంచి 26 వేల క్యూసెక్కులు, జూరాల నుంచి 28 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.

09:25 - September 12, 2015

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై ఇప్పటివరకు మౌనంగా ఉన్న తెలంగాణ సర్కార్‌ ఎట్టకేలకు స్పందించింది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు వాస్తవమేనని.. ఇకపై రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా తగు చర్యలు తీసుకుంటామని పాలకులు ప్రకటించారు. అయితే రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం చెప్పిన లెక్కలను విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఎంతో కాలంగా రైతుల ఆత్మహత్యలపై ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటున్నారు. తెలంగాణలో రైతులను కరవు కాటేసింది. భూగర్భజలాలు అడుగంటిపోయి పంట పొలాలన్నీ బీడుగా మారిపోయాయి. మరోపక్క వర్షాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఇక ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో వర్షాలు ఊరించడంతో రైతులు అప్పులు చేసి మరీ పంటలు వేశారు. ఇక ఆ తర్వాత ఏర్పడిన కరవుతో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

రైతు సమస్యలను ఎన్నికలకు వాడుకుంటున్న నేతలు..
ఇక బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఇచ్చే రుణాలు రైతు అవసరాలను ఏ మాత్రం తీర్చలేకపోతున్నాయి. దీంతో రైతన్నలు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇక వీళ్ల దోపిడికి గురైన రైతన్నలు... చేసిన అప్పులు తీర్చలేక, వ్యవసాయం చేయలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదే విషయాన్ని జాతీయ నేర సమాచార విభాగం కూడా ధృవీకరించింది. మరోపక్క ఎన్నికల వేళ రైతుల సమస్యలపై నేతలు ఇచ్చిన హామీలు.. ఓట్ల గాలంగానే మిగిలిపోతున్నాయి. ఇక రైతుల ఆత్మహత్యలపై పాలకులు హడావుడిగా విచారం వ్యక్తం చేయడమే తప్ప సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే.

రైతులకు భరోసా అందించని ప్రభుత్వాలు..
దేశంలో వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు కరవు విలయతాండవానికి కుదేలైపోతున్నాయి. వీరిలో భరోసా నింపేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం రైతన్నకు సాగు భారమై నానా కష్టాలు పడుతూ దిక్కుతోచని స్థితిలో బలవన్మరణాలకు సిద్ధపడుతున్నారు. ఇలాంటి సమయాల్లో రైతన్నకు అండగా నిలబడి భరోసా నింపాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అంతా అయిపోయాక ఆత్మహత్యలు బాధాకరమంటూ టీ సర్కార్ మొసలి కన్నీరు కారుస్తోంది.

రైతుల ఆత్మహత్య సంఖ్యపై టిడిపి విమర్శలు..
రాష్ట్రంలో 1300 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం కేవలం 141 మంది మాత్రమే చనిపోయారని పేర్కొనడం దారుణమని ప్రతిపక్ష నేతలంటున్నారు. రాష్ట్రంలో 898 మంది మృతి చెందారని నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రిపోర్ట్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రైతుల ఆత్మహత్యలలో మహారాష్ట్ర తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉన్నట్లు సమాచారం. జిల్లాలవారీగా చూస్తే ఆత్మహత్యల్లో మెదక్‌ జిల్లా మొదటిస్థానంలో ఉండగా మహబూబ్‌నగర్‌ చివరిస్థానంలో ఉంది. కమిటీ నిర్ధారణ మేరకు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని సర్కార్‌ చెబుతోంది. 

మక్కా ప్రమాదంలో ఇద్దరు భారతీయుల మృతి..

సౌదీ అరేబియా : మక్కాలో చోటు చేసుకున్న ఘోర దుర్ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఎంఈఎ అధికారికంగా ప్రకటించింది. అంతేగాకుండా మరో 15 మంది గాయపడిన భారతీయులను వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు ఎంఈఎ వెల్లడించింది. 

మక్కా దుర్ఘటనపై అధికారిక ప్రకటన విడుదల..

సౌదీ అరేబియా : మక్కాలో జరిగిన ఘోర దుర్ఘటనపై అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంపై సునిశితంగా మానిటరింగ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రమాదంలో 15 మందికి గాయాలైన భారతీయులను ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపింది. ఈప్రమదంలో ఇద్దరు భారతీయులు మృతి చెందారని పేర్కొంది. ఘటనకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లు కేటాయించినట్లు తెలిపింది. (00966 12545 8000/ 00966 12549 6000, యాత్రికుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 8002 4777 86)

08:54 - September 12, 2015

తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఈ అంశంపై శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రైతు ఆత్మహత్యలు ఇప్పుడు కొత్తగా జరుగుతున్నవి కాదని అన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పాపాల వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రైతు ఆత్మహత్యల విషయంలో ఆందోళన చెందాల్సింది లేదన్నారు. అంతా మీడియా సృష్టేనని చెప్పారు. దీనిపై పలు విమర్శలు రేగాయి. మరోవైపు యూనివర్సిటీల్లో వైస్ చాన్స్ లర్ నియామకాన్ని తెలంగాణ ప్రభుత్వమే నియమించనుంది. ఇందుకు యూనివర్సిటీ చట్టాల్లో మార్పు తేనుంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ఆచారి (బీజేపీ), నర్సింగరావు (సీపీఎం), రామకృష్ణ ప్రసాద్ (టీడీపీ), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), మల్లు రవి (కాంగ్రెస్) పాల్గొని విశ్లేషించారు.

ప్రారంభమైన డియుఎస్ యు ఎన్నికలు..

ఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియుఎస్ యు) ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ రోజే ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. 

మక్కా ప్రమాదంలో 107 మంది మృతి..

సౌదీ అరేబియా : మక్కా మసీదులో జరిగిన ప్రమాదంలో 107 మంది మృతి చెందగా 238 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై అధికారులు హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటించారు. 00966 12545 8000, 00966 12549 6000, యాత్రికుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నెంబర్ 8002 477 86. 

08:32 - September 12, 2015

మహారాష్ట్ర : వివాదస్పద మాంసం విక్రయాల నిషేధంపై ముంబై హైకోర్టు స్పందించింది. అహింస గురించి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించడంపై స్పందిస్తూ చేపలు, గుడ్లు, సీ ఫుడ్‌ మాంసాహారం కాదా? వీటిని ఎందుకు నిషేధించలేదంటూ ప్రశ్నించింది. కంగుతిన్న ప్రభుత్వ న్యాయవాది చేపలు నీటి నుంచి బయటకు రాగానే ప్రాణం కోల్పోతాయని వివరణ ఇచ్చారు. జైనుల సెంటిమెంట్‌ సంబంధించి కోర్టుకు వివరించారు. ఇదిలా ఉంటే నాలుగురోజుల పాటు మాంసం అమ్మకాలను నిషేధించడంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సెప్టెంబర్‌ 10, 17 తేదీల్లో మాత్రమే నిషేధం విధించాలని నిర్ణయించింది. జైనులు పవిత్రంగా భావించే 'పర్యుషాన్' సందర్భంగా మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై శివసేనతో పాటు విపక్షాలు వ్యతిరేకించాయి. 

08:25 - September 12, 2015

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం 'సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . 'బాహుబలి' వంటి విజువల్ వండర్ లో 'దేవసేన' పాత్రలో అలరించిన స్టార్ హీరోయిన్ 'అనుష్క' త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'సైజ్ జీరో'తో మన ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ టీజర్ విడుదలైంది. అనుష్క ఈ సాంగ్ ను తమిళ వెర్షన్ లో తన ఫేస్ బుక్ ద్వారా విడుదల చేశారు. ఇందులో 'అనుష్క' గత సినిమాల కంటే భిన్నంగా లావుగా కనిపించబోతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఇందులో 'అనుష్క'ను చూసిన అభిమానులు ఆమె భారీ కాయంతో ఉండటాన్ని చూసి షాకయ్యారు. అయితే తాజాగా విడుదలైన మూడో పోస్టర్లో అనుష్క లుక్ వేరేగా ఉండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ లో విడుదలయ్యే 'సైజ్ జీరో' చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ప్రకాష్ కోవెలమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రసాద్. వి పొట్లూరి నిర్మాత. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. 'అనుష్క' జోడిగా 'ఆర్య' నటించారు. సోనాల్ చౌహాన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.

బీఎస్ఎఫ్ సిబ్బందికి రాందేవ్ బాబా యోగా పాఠాలు..

రాజస్థాన్ : ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ బీఎస్ఎఫ్ సిబ్బందికి యోగా పాఠాలు నేర్పుతున్నారు. జైస్లామెర్ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 

రైలు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి - ఏకే మిఠల్..

ఢిల్లీ : కర్నాటక రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే బోర్డు ఛైర్మన్ ఏకే మిఠల్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. ఘటనా ప్రాంతానికి తమ అధికారులు, రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారని పేర్కొన్నారు. దురంతో ఎక్స్ ప్రెస్ 9 బోగీలు పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. 

జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికోద్యుగుల ర్యాలీ..

ఢిల్లీ : జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికోద్యుగుల ర్యాలీ కొనసాగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.

07:54 - September 12, 2015

ముంబై : మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు అదే సంగీతంతో వివాదాలకు కారణమయ్యాడు. ఇరాన్లో రూపొందించిన ఓ చిత్రానికి సంగీతం అందించిన రెహమాన్ ముస్లిం మతపెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. ఏఆర్ రెహమాన్ మత వ్యతిరేఖి అంటూ ముంబై కేంద్రంగా పని చేస్తున్న సున్ని ముస్లిం గ్రూపు రజా అకాడమీ ఫత్వా జారీ చేసింది. ఇరానీయన్ దర్శకుడు మాజీద్ మజిదీ దర్శకత్వంలో విడుదలైన మొహమ్మద్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మహమ్మద్ ప్రవక్త జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన వివాదాస్పద చిత్రానికి సంగీతం అందించినందుకు గాను ముంబై కేంద్రంగా ఉన్న ఓ సున్నీ ముస్లిం సంస్థ రెహమాన్ కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది. 

బాలల హక్కులు - సామాజిక బాధ్యత అంశంపై వర్క్ షాప్..

హైదరాబాద్ : బాలల హక్కులు - సామాజిక బాధ్యత అంశంపై శనివారం, ఆదివారం ఎంబీభవన్ లో సీపీఎం ఆధ్వర్యంలో వర్క్ షాపు జరుగనుంది. ఈ వర్క్ షాపుకు ప్రొ.శాంతా సిన్హా, తమ్మినేని వీరభద్రం హాజరు కానున్నారు. 

సాదువెల్లిలో ఉత్తమ్ బృందం పర్యటన..

నల్గొండ : యాదగిరిగుట్ట (మం) సాదువెల్లిలో టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ నేతృత్వంలోని బృందం పర్యటించనుంది. ఇటీవల రైతు కరుణాకర్ కుటుంబాన్ని పరామర్శించనుంది. 

ధవళేశ్వరం బ్యారేజీని పరిశీలించనున్న వంశధార ట్రైబ్యునల్ బృందం..

హైదరాబాద్ : నేడు ధవళేశ్వరం బ్యారేజీని వంశధార ట్రైబ్యునల్ బృందం పరిశీలించనుంది.

ర్యాగింగ్ చేస్తున్నారంటూ శ్రీ చైతన్య జూ.కాలేజీ విద్యార్థి ఫిర్యాదు..

రంగారెడ్డి : సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని దుండిగల్ శ్రీ చైతన్య జూ.కాలేజీ విద్యార్థి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

07:13 - September 12, 2015

ఢిల్లీ : భారత స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు సంబంధించిన సీక్రేట్‌ త్వరలో బయటపడనున్నాయి. ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచిన నేతాజీకి సంబంధించిన 64 ఫైళ్లను బయట పెట్టాలని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు నేతాజీ ఫైళ్లను సార్వజనీనం చేసే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ 18న కోల్‌కతాలోని మ్యూజియంలో ప్రజల మధ్య నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయనున్నట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. నేతాజీ ఫైళ్లకు సంబంధించిన వ్యవహారం మమతా - మోడీ సర్కార్‌ ల మధ్య చిచ్చు పెట్టనుందా?

ఆయన మృతి ఇప్పటికీ రహస్యం..
నేతాజీ ఎప్పుడు జన్మించారో అందరికీ తెలుసు. కానీ ఆయన మరణం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఆయన చివరి రోజులకు సంబంధించిన సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకుందని మమత అన్నారు. నేతాజీ రహస్యాలను సార్వజనీనం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం స్పష్టం చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్ణయాన్ని నేతాజీ కుటుంబం స్వాగతించింది. వీటి కోసం పరిశోధకులు, చరిత్రకారులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారని నేతాజీ మనవడు చంద్రకుమార్‌ బోస్‌ హర్షం వ్యక్తం చేశారు. నేతాజీకి చెందిన వందకు పైగా ఫైళ్లను సార్వజనీనం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. నేతాజీకి సంబంధించిన ఫైళ్లను బయట పెట్టేందుకు ఇంగ్లాండ్‌, రష్యా ప్రభుత్వాలను ఒప్పించాలని ప్రధాని నరేంద్రమోదికి విజ్ఞప్తి చేసినట్టు చంద్రబోస్‌ తెలిపారు.

64 ఫైళ్లు డిజిటలైజేషన్..
తాము అధికారంలోకి వస్తే 2014 ఎన్నికల్లో నేతాజీ ఫైళ్లను సార్వజనీనం చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది. నేతాజీ 117వ జయంతి సందర్భంగా ఆయన జన్మస్థలం కటక్‌లో జరిగిన బహిరంగ సభలో- స్వాతంత్ర సేనాని మరణ రహస్యం తెలుసుకోవాల్సిన హక్కు ప్రతి ఒక్కరికి ఉందని బిజెపి నేత రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. అధికారంలోకి వచ్చాక మోడీ సర్కార్‌ దీనిపై యూ టర్న్ తీసుకుంది. 1937-47 కాలానికి చెందిన నేతాజీకి చెందిన 64 ఫైళ్లను డిజిటలైజేషన్‌ చేయాలని మమతా సర్కార్‌ సంకల్పించింది. నేతాజీ రహస్యాలను బహిర్గతం చేస్తామన్న మమత ప్రకటన కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టనుందా...? దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

అద్దంకిలో లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు...

ప్రకాశం : జిల్లాలో అద్దంకి మండలం గోవాడలంక వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. 

యూఎస్ లో పేస్ జోడి విజయం..

యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో లియాండర్ పేస్ జోడీ విజయం సాధించింది. యూఎస్ ఓపెన్ 6-4, 3-6, 10-07 తేడాతో మాటెక్-సాండ్స్ జోడీపై ఫేస్-హింగీస్ జోడీ విజయం సాధించారు. 

రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశాలు..

కర్నాటక: రాష్ట్రంలోని గుల్బర్గా సమీపంలో మార్టూరు స్టేషన్ వద్ద జరిగిన దూరంతో రైలు ప్రమాద ఘటనపై రైల్వేశాఖ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. రైళ్ల రాకపోకల సమాచారం తెలిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్-04027700868, హైదరాబాద్ - 04023200865, వికారాబాద్-08416252013, తాండూరు-08411-272010లకు ఫోన్ చేయాలని సూచించారు. 

06:44 - September 12, 2015

హైదరాబాద్ : స్వైన్ ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది.. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. మరో ఆరుగురు ఈ జబ్బుకు చికిత్స పొందుతున్నారు.. దీంతో ఇప్పుడు చిన్న జలుబు వచ్చినా ప్రజలు వణికి పోతున్నారు. వాతావరణం చల్లబడటంతో తెలంగాణలో స్వైన్ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.. ఈ జబ్బు సోకి తాజాగా ఓ బాలింత మృతిచెందింది.. మూడు రోజుల క్రితం కూడా ఓ బాధితురాలు కన్నుమూసింది.. మరో ఆరుగురికి ఈ వ్యాధి నిర్ధారణ అయింది.. ఇందులో ముగ్గురు హైదరాబాద్‌కు.... మరో ముగ్గురు వివిధ జిల్లాలకు చెందినవారు.. తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్న వీరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

గాంధీలో మరియమ్మ మృతి..
సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో పదిహేను రోజుల క్రితం చేరిన మరియమ్మ.. ఈనెల ఒకటిన కవలలకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత దగ్గు, జలుబుతో తీవ్రంగా బాధపడింది. మరియమ్మకు వివిధరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు స్వైన్ వైరస్ సోకిందని నిర్ధారించారు. బాలింత కావడంతో ఈ జబ్బునుంచి ఆమె కోలుకోలేపోయింది. ఆమె శరీరం సహకరించకపోవడంతో చికిత్స కష్టమైపోయింది. తుదకు మరియమ్మ స్వైన్‌ ఫ్లూతో ప్రాణాలు విడిచింది. కానీ, తమ బిడ్డకు ఈ వ్యాధిసోకిందని తమకు చెప్పలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

నిర్లక్ష్యం వద్దంటున్న వైద్యులు...
మూడు రోజుల క్రితం కూడా ఓ మహిళ ఈ వ్యాధితో చనిపోయింది. హైదరాబాద్ ముషీరాబాద్ కి చెందిన అక్తర్ బేగం వారం క్రితంనుంచి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్సకోసం చేరింది.. ఆమె రక్త నమూనాలను స్వైన్ ఫ్లూ పరీక్ష కోసం పంపారు వైద్యులు. ఆ రిపోర్టులు రాకముందే పరిస్థితి విషమించి ఆమె కన్నుమూసింది. ఆ తర్వాత అందిన రిపోర్టుల ప్రకారం ఆమెకు స్వైన్ సోకిందని తేలింది. ఏ మాత్రం జలుబు, దగ్గు, జ్వరం ఉన్నా నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు.. జబ్బు ముదరకముందే చికిత్స చేస్తే స్వైన్‌ ఫ్లూ తొందరగా తగ్గిపోయే అవకాశముందని సూచిస్తున్నారు.

06:41 - September 12, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తాయి.. భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులో వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయంలో 18 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 18వేల 800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి పెడుతున్నారు. ప్రాజెక్టులోని 4 యూనిట్ల ద్వారా 156 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. అటు శ్రీశైలం డ్యాం కూడా నీటితో కళకళాడుతోంది. జూరాల జలాశయం నుంచి వచ్చి చేరుతున్న నీటితో శ్రీశైలం జలకళను సంతరించుకుంది. మూడు రోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 58,280 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 885 అడుగులుకాగా ప్రస్తుతం జలాశయంలో 812.30 అడుగుల మేర నీరుంది. సుంకేశుల బ్యారేజీ వద్ద కూడా వరద పోటెత్తుతోంది.. ఇక్కడ 43వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంటే.. దిగువకు 40,280 క్యూసెక్కుల నీటిని వదిలి పెడుతున్నారు. ప్రస్తుతం పదిగేట్లను ఒక మీటర్‌ మేర ఎత్తి నీటిని వదిలిపెడుతున్నారు.

రహదారులన్నీ జలమయం..
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటితో నిండిన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ లో భారీవర్షం కుషాయిగూడ, ఈసీఐఎల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సనత్‌ నగర్, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్ లో రోడ్లన్నీ నీట మునిగాయి.. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌ అయి.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు.. భారీ వర్షాలతో ఏపీ సెక్రటేరియట్లో చెట్టు విరిగి ఓ వాహనంపై పడింది.. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంకోవైపు పిడుగులూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ లో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందారు. వర్షం పడుతున్నప్పుడు పొలంలో పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈఘటనలో మరొకరికి గాయాలయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.. ఈ ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు.

06:36 - September 12, 2015

పశ్చిమగోదావరి : తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న 'సూది సైకో' ఎట్టకేలకు సీసీ కెమెరాకు చిక్కాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇంజెక్షన్‌ సైకోను బంధించాయి. బ్లూ షర్ట్ వేసుకుని, నల్లటి టోపి పెట్టుకున్న ఓ వ్యక్తి హోండా షైన్‌ బండిపై అనుమానాస్పదంగా తిరుగుతున్న సైకోను పోలీసులు గుర్తించారు. మొదటి దాడి జరిగిన ఆగస్టు 22న ఈ సైకో పసుపు రంగు షర్టు ధరించాడు. ఇక అనంతర దాడుల్లో బ్లూ షర్ట్, జీన్స్‌ వేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైకో ఛాయాచిత్రం దొరకటంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఉన్మాది సమాచారం తెలిసిన వెంటనే నరసాపురం, డీఎస్పీ, భీమవరం రూరల్ సీఐకు తెలియ జేయాలని కోరుతున్నారు.

06:33 - September 12, 2015

హైదరాబాద్ : కొత్త మ‌ద్యం పాల‌సీని టీ-సర్కార్ ప్రక‌టించింది. రెండేళ్ల కాలానికి లైసెన్సులకు... అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదండోయ్‌..! మ‌ద్యం ఫీజును భారీగా పెంచుతూ స‌వ‌ర‌ణ‌లు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి కొత్త మ‌ద్యం విధానం అమ‌ల్లోకి రానుంది. కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా ఉంది తెలంగాణలో మద్యం పాలసీ. కొద్దిరోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలతో హీటెక్కించిన టీ-సర్కార్‌ ఎట్టకేలకు లిక్కర్ పాలసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపించే... మద్యం విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

లైసెన్స్ రుసుములు అధికం..
నూతన విధానంలో లైసెన్స్‌ రుసుముల్ని 20 శాతం పెంచింది టీ-సర్కార్‌. అలాగే గతంలో ఏడాదికొకసారి... రెన్యువ‌ల్ చేసుకునే విధానానికి స్వస్తి పలికింది. రెండేళ్ల కాలానికి ఒకేసారి అనుమతులు జారీ చేయాలని నిర్ణయించింది. కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం ప‌దివేల జ‌నాభా ఉన్న ప్రాంతాల్లో ఏడాదికి 39 లక్షల రూపాయల్ని లైసెన్స్ ఫీజుగా నిర్ణయించింది. ప‌దివేల నుంచి 50 వేల లోపు జ‌నాభా ఉన్న ప్రాంతాల్లో 40 లక్షల 80 వేలు... 50 వేల నుంచి 3 లక్షల లోపు జ‌నాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షల 40వేలను కేటాయించింది. అలాగే 3 లక్షల నుంచి 5 లక్షల లోపు జ‌నాభా ఉన్న ప్రాంతాల్లో ఫీజును 60 లక్షలుగా నిర్ణయించింది. 5 నుంచి 20 ల‌క్షల లోపు జ‌నాభా ఉన్న ప్రాంతాల్లో ఫీజును 81 లక్షల 60 వేలను, 20 లక్షలకు పైగా ఉన్న చోట కోటి 8 వేల రూపాయల్ని ఫీజులగా నిర్ణయించారు.

ఖజానాను నింపుకొనేందుకే.. 
మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో 2,216 రిటైల్ దుకాణాలున్నాయి. ఈ దుకాణాల స్థానంలో కొత్తగా ద‌ర‌ఖాస్తులు ఒక‌టి కంటే ఎక్కువ వ‌స్తే...లాట‌రీ ప‌ద్దతిలో ఎంపిక చేయ‌నున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా గుడుంబాను అరిక‌ట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్సు టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కొన్నాళ్లుగా ప్రతిప‌క్షాల‌కు, ప్రజా సంఘాల‌కు నిద్ర లేకుండా చేసిన... నూత‌న మ‌ద్యం విధానాన్ని ..ఎట్టకేల‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రక‌టించింది. అయితే కొన్ని నిర్ణయాల‌ను ఉప‌సంహ‌రించుకున్నా ఫీజుల‌ను పెంచుతూ ఖ‌జానా నింపుకునేందుకు ఈ మద్యం విధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది.  

06:30 - September 12, 2015

చైనా : తెలంగాణ సీఎం కేసీఆర్‌ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. శుక్రవారం ఆయన వాండా కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. బీజింగ్‌లో వాండా కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు... వాండా గ్రూప్ ఆఫ్ కంపెనీ అంగీకరించింది. దేశంలోనే అత్యంత అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న... విశ్వనగరంగా హైదరాబాద్‌ రూపొందుతోందని కేసీఆర్ అన్నారు. అనంతరం షాంఘై మున్సిపల్ కార్పొరేషన్‌ను తెలంగాణ బృందం సందర్శించింది. షాంఘై నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, పార్కులు, ప్లే గ్రౌండ్ల నిర్వహణ తదితర అంశాలను కేసీఆర్ టీమ్ పరిశీలించింది.

06:28 - September 12, 2015

హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌ లేఖ రాసారు. నవ్యాంధ్ర రాజధాని బృహత్‌ ప్రణాళికపై సింగపూర్ ఎంతో గర్వపడుతోందన్న లీ సీన్ లూంగ్‌ రాజధాని నిర్మాణంలో మరిన్ని విజయాలు వరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌తోనూ, భారత్‌తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తామని సింగపూర్ ప్రధాని చంద్రబాబుకు రాసిన లేఖలో తెలిపారు.

06:27 - September 12, 2015

సౌదీ అరేబియా : పవిత్ర స్ధలంలోనే మృత్యువు స్వైరవిహారం చేసింది. ప్రార్ధనలో ఉండగానే మరణ రాకాసి మింగేసింది. ఇసుక తుఫాన్‌ రూపంలో వచ్చిన మహమ్మారి భారీ క్రేన్‌ను కూలదోసింది. 65మంది ప్రాణాలను బలితీసుకుని, మరికొందరిని చావు బతుకుల మధ్యకు నెట్టేసింది. ప్రశాంతతకు చిహ్నామైన మక్కాను రుధిరక్షేత్రంగా మార్చేసింది. ముస్లిం సోదరులంతా అతి పవిత్రమైనదిగా భావించేది హజ్‌ యాత్ర. అతి త్వరలోనే హజ్‌ యాత్ర ప్రారంభమవుతుండటంతో మక్కాలోని ప్రధాన మసీదులో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో జరిగిన సంఘటనలను, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకున్న మతపెద్దలు మసీదు ఆవరణను వెడల్పు చేస్తున్నారు. దీంతో పాటు భారీ క్రేన్ల సహాయంతో మసీద్‌ పై భాగంలో మరికొన్ని పనులు చేస్తున్నారు.

విజృంభించిన ఇసుక తుఫాన్‌లు..
ఇంతలోనే మృత్యువు పంజా విసిరింది. 4రోజులుగా సౌదీని అతలాకుతలం చేస్తున్న ఇసుక తుఫాన్‌లు మరింతగా విజృంభించాయి. పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ఓ భారీ క్రేన్‌ కుప్ప కూలడంతో మసీదు ఆవరణలో నమాజ్‌ చేసుకుంటున్న 87 మంది మాంసపు ముద్దలయ్యారు. మరో 80మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 50 మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

హాహాకారాలు..
మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక చింతనను ఇచ్చే హజా స్ధానంలో హాహాకారాలు విన్పించటంతో మక్కాలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. 2006లో జరిగిన తొక్కిసలాట ఇంకా కళ్లముందు మెదులుతుండగానే జరిగిన ఈ ఘోర ప్రమాదం మరోసారి మక్కాను భయానక వాతావరణంలోకి నెట్టేసింది.

06:20 - September 12, 2015

అనంతపురం : జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోడూరు తోపు వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిని బాగేపల్లి ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు బెంగళూరుకు వెళుతోంది. ప్రమాదానికి ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. 

06:18 - September 12, 2015

కర్నాటక : సికింద్రాబాద్‌ నుంచి ముంబై వెళ్తున్న 'దురంతో ఎక్స్ ప్రెస్' కర్ణాటకలోని మార్టూరు వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 9మందికి తీవ్ర గాయాలయ్యాయి. బోగిల్లో చిక్కుకున్నవారిని సహాయక సిబ్బంది బయటకు తీస్తున్నారు. ముంబై వెళ్తున్న ఈ దురంతో ఎక్స్‌ ప్రెస్‌ శుక్రవారం రాత్రి 11గంటల 5 నిముషాలకు సికింద్రాబాద్‌ నుంచి బయలు దేరింది. శనివారం తెల్లవారుజామున మార్టూరు వద్ద పట్టాలు తప్పడంతో రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. ఘటనా స్ధలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి గుంతకల్లు నుంచి ఓ ప్రత్యేక రైలు బయలుదేరింది.

అనంతలో రోడ్డు ప్రమాదం..

అనంతపురం : జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోడూరు తోపు వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిని బాగేపల్లి ఆసుపత్రికి తరలించారు. 

Don't Miss