Activities calendar

14 September 2015

21:40 - September 14, 2015

హైదరాబాద్ : ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా మాల్కం టర్న్‌బుల్‌ పగ్గాలు చేపట్టనున్నారు. గత 8 ఏళ్లలో మాల్కం ఐదవ ప్రధాని. పార్టీ నాయకత్వ పోటీలో ఓడిపోయినందున ప్రస్తుత ప్రధాని టోని అబాట్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ 18న జరిగిన లిబరల్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో 54- 44 ఓట్ల తేడాతో అబాట్ పై మాల్కం విజయం సాధించారు. దీంతో అబాట్ పదవి నుంచి వైదొలగక తప్పలేదు. జాతికి ఆర్థిక నాయకత్వాన్ని అందించడంలో టోని అబాట్‌ విఫలమయ్యారని నూతన ప్రధాని టర్న్‌బుల్‌ విమర్శించారు. అత్యున్నత ప్రధాని పదవిని చేపట్టే వ్యక్తే పార్టీకి కూడా నాయకుడిగా ఉండాలనేది ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న రాజకీయ నియమం. 2013లో టోని అబాట్‌ నాయకత్వంలోని లిబరల్‌ పార్టీ లేబర్‌ పార్టీని ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

 

21:36 - September 14, 2015

ఢిల్లీ : ఆప్‌ ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్‌ భారతిపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. గృహ హింస కేసులో ఆయనకు ముందస్తు బెయిలు ఇవ్వడానికి ఢిల్లీ అదనపు సెషన్స్‌ కోర్టు నిరాకరించింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేయడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సోమనాథ్‌ భారతిపై ఆయన భార్య లిపిక గృహ హింస, హత్యాయత్నం కేసు పెట్టారు. సోమనాథ్‌ భారతిపై గతవారం కేసు నమోదైంది. విచారణకు సహకరించాలని పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీ చేసినా ఆయన పట్టించుకోవడం లేదు. సోమనాథ్‌ భారతిపై ఆయన భార్య లిపికా జూలై 10న మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

21:33 - September 14, 2015

హైదరాబాద్ : మతతత్వ శక్తుల కారణంగా భారత్‌ పెను ముప్పును ఎదుర్కొంటోందని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని అధికార బిజెపి హిందుత్వ వాదాన్ని నమ్మడం వల్ల సమాజంలో మత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భారత్‌లోకి హిందుత్వాన్ని స్పాన్సర్‌ చేయగా..బిజెపి ముందుండి నడిపిస్తోందని కరత్‌ విమర్శించారు. దేశంలోకి మత రాజకీయాలు ప్రవేశించడం ప్రమాదకరమని హెచ్చరించారు. త్రివేండ్రంలో కమ్యూనలిజంపై ఏర్పాటు చేసిన ఓ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

20:43 - September 14, 2015

హైదరాబాద్ : సెప్టెంబర్‌ 17న మాంసం విక్రయాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని, దీనిపై ఎలాంటి నిషేధం ఉండదని ముంబై హైకోర్టు స్పష్టం చేసింది. జైనులు పవిత్రంగా భావించే 'పర్యుషాన్' సందర్భంగా మాంసం విక్రయాలపై మహారాష్ట్ర ప్రభుత్వం నాలుగురోజుల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ మాంసం అమ్మకందారులు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు శివసేన తదితర విపక్షాలు కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం నిషేధాన్ని నాలుగు రోజుల నుంచి ఒకరోజుకు తగ్గించింది. ఇపుడు హైకోర్టు ఆదేశంతో ఆ ఒక్కరోజు కూడా నిషేధాన్ని ప్రభుత్వానికి సడలించక తప్పలేదు. 

20:40 - September 14, 2015

హైదరాబాద్ : ఆఫీసుకు టైమవుతోంది. కానీ పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్. లేటుగా వెళ్తే శాలరీ సగం కట్. బాస్‌ హూంకరింపులు అదనం. ఇంటికి బయల్దేరిన సమయంలోనూ ట్రాఫిక్ జంఝాటమే. వెరసి ఇటు ఉద్యోగంలోనూ, అటు వ్యక్తిగత జీవితంలోనూ ఒత్తిడి. అందుకే బడా కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు ఊహించని వెసులుబాటు కల్పించేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి.

ట్రాఫిక్ పద్మవ్యూహం దాటేసరికి ఆఫీసుకు ఆలస్యం .....

ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లో ట్రాఫిక్ జాం సర్వసాధారణమైపోయింది. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటుకుని ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లే సరికి ఆలస్యమవుతోంది. ఇలా బంపర్ టు బంపర్ ట్రాఫిక్‌తో ఇంటా బయటా ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవడం కంపెనీ ప్రొడక్టవిటీని తగ్గిస్తోందని మదనపడుతున్నాయి కార్పొరేట్ సంస్థలు. ఇటు కంపెనీకి, అటు ఉద్యోగికీ లాభదాయకంగా ఉండేలా సరికొత్త ప్రణాళికలు వేస్తున్నాయి. అందుకే ఉద్యోగులకు వెసులుబాటయ్యేలా సరికొత్త పనివేళలు, పని పద్ధతులకు శ్రీకారం చుడుతున్నాయి.

ఇంటి నుంచి వర్క్ చేయొచ్చని ఉద్యోగులకు ఆఫర్ .....

ముంబైలోని ఫ్యూచర్ గ్రూపు సంస్థ ఆఫీసు టైమింగ్స్ లో సడలింపులిచ్చింది. తమ ఉద్యోగులు ఉదయం 8.30 నుంచి 10.30 లోపు ఏ సమయంలోనైనా విధులకు హాజరు కావవచ్చని ప్రటించింది. అలాగే బెంగళూరులోని శాప్ ల్యాబ్స్ ఎంట్రీ, ఎగ్జిట్ టైమింగ్స్ మానిటర్ చేయడం మానేసింది. అంతేకాదు ఒకవేళ ట్రాఫిక్ లో చిక్కుకుంటే ఆఫీసుకు సెలవు పెట్టొచ్చని తెలిపింది. ఇంటి నుంచి వర్క్ చేయొచ్చని కూడా ఆఫరిచ్చింది.

ఇన్‌ అండ్ ఔట్ టైమింగ్స్ లో ఏడాది పాటు కార్లకు మినహాయింపు.......

ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ తమ ఉద్యోగులకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి రిలీఫ్‌ ఇచ్చింది. రద్దీ ప్రాంతాల మీదుగా వచ్చే కార్లను గుర్తించి ఇన్‌ అండ్ ఔట్ టైమింగ్స్ లో ఏడాది పాటు మినహాయింపునిచ్చింది. ప్రఖ్యాత కన్సల్టెన్సీ కంపెనీ ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ ఉద్యోగుల సౌకర్యార్థం ముంబైలో ఏకంగా మూడో బ్రాంచీని ఓపెన్ చేస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంటలోపు ఎప్పడైనా ఆఫీసుకు రావొచ్చు లేదంటే ఇంటి నుంచే వర్క్ చేయొచ్చని తమ ఎంప్లాయీస్‌కు ఆఫరిచ్చింది ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఫిలిప్. హైదరాబాద్‌లోనూ చాలా ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇలాంటి సౌలభ్యాలనే కల్పిస్తున్నాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రతి మంగళవారం కార్‌ ఫ్రీ డేగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

20:29 - September 14, 2015

హైదరాబాద్ : తానోకటి తలిస్తే విధి మరోకటి తలిచిందంటారు... బీహార్‌లో రాజకీయ పార్టీల పరిస్థితి చూస్తే ఇలానే ఉంది. రాష్ట్రంలో ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పొలిటికల్‌ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అటు నితీష్ వర్గం ఇటు బిజెపి వర్గం పావులు కదుపుతోంది. తొలుత లౌకిక కూటమంటూ హడావుడి చేసిన సమాజ్ వాదీ పార్టీ... ఆ తర్వాత ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పడంతో నితీష్ కూటమికి గట్టి షాక్‌ తగిలినట్లయింది. సమాజ్ వాదీ పార్టీకి బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల గెలుపును ఖరారు చేసేంతగా ఓటు బ్యాంకు ఉండటంతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇక నితీష్‌ మాత్రం ఆర్జేడీ అధినేత లాలూ, కాంగ్రెస్ తోడున్నాయనే ధైర్యంతో అడుగులేస్తున్నారు.

లాలు, నితీష్‌ దోస్తీపై సొంత పార్టీలో అసంతృప్తి రాగం.....

అయితే లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీష్ దోస్తీపై సొంత పార్టీలోనే అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి.. యాదవ్ సామాజికవర్గం వ్యక్తులపై దాడికి పాల్పడ్డ జేడీ యూ ఎమ్మెల్యేను పార్టీ నుంచి నితీష్ సస్పెండ్ చేయడమే ఇందుకు కారణం. మరోవైపు లాలూ చేరికతో రాష్ట్రంలో 14 శాతం ఉన్న భూమిహార్లు, రాజ్ పుత్‌ల ఓట్లు జేడీయూ నష్టపోయే ప్రమాదముందని విశ్లేషకులంటున్నారు. మాంఝీ ఎఫెక్ట్‌తో దళితుల ఓట్లు పడతాయో లేదోనన్న అనుమానం నితీష్ వర్గాన్ని వెంటాడుతోంది. ఇంతలోనే ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య చెదిరిన జాతీయ స్థాయి పొత్తు నితీష్‌కు సంకటంగా మారింది.

ఎంఐఎం పోటీతో ఓట్లు చీలిపోయే ప్రమాదం......

ముస్లిం ఓట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సీమాంచల్‌లోని 5 జిల్లాల్లో పోటీ చేయాలని మజ్లిస్‌ నిర్ణయించింది.. ఎంఐఎం పోటీతో కాంగ్రెస్, జేడీయూ కూటమికి పడాల్సిన ఓట్లు చీలిపోయే ప్రమాదముందని నేతలు సందేహిస్తున్నారు. ఇది ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్ కావోచ్చని హస్తం పార్టీ భయపడుతోంది. దీంతో దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలు ఎంఐఎంపై విరుచుకుపడుతున్నారు. ఆర్ఎస్‌ఎస్ సలహా మేరకే ఎంఐఎం పోటీ చేస్తోందన్న డిగ్గీ రాజా వ్యాఖ్యలపై అసదుద్దీన్ తీవ్రంగా స్పందించారు. మజ్లిస్‌ బీహార్‌లో పోటీ చేస్తే కాంగ్రెస్ సహా మిగతా రాజకీయ పార్టీల నేతలకు నిద్ర ఎందుకు కరువైందో తనకు అర్థం కావడం లేదని ఒవైసీ చురకలంటించారు. తమ పార్టీ ముస్లింలకు మాత్రమే ప్రాతినిథ్యం వహించడం లేదని, దళితులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.

కమలదళానికి శివసేన షాక్‌....

ఇక ఎంఐఎం పోటీతో నితీష్ కూటమికి కష్టాలు తప్పవని సంబరపడుతున్న కమల దళానికి శివసేన షాక్ ఇచ్చింది... బీహార్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే దీని ద్వారా హిందు ఓట్లలో చీలిక తప్పదని అది బిజెపికి నష్టం చేస్తుందని పొలిటికల్‌ పండిట్లు విశ్లేషిస్తున్నారు. ఇలా రెండు కూటములు గెలుపు కంటే ప్రస్తుతం ఎదురవుతున్న నష్టాలు కష్టాల నుంచి బయటపడే పరిష్కారాలు వెతుకుతున్నాయి. మరో వైపు వామపక్షాల కూటమి ఐక్యంగానే అడుగులు వేస్తోంది.

19:54 - September 14, 2015

హైదరాబాద్ : రాష్ర్ట వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల భూమిని ల్యాండ్ బ్యాంక్ పేరుతో ప్రభుత్వం అడ్డగోలుగా సేకరించేందుకు కుట్ర పన్నుతోందని వామపక్ష నేతలు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాలి మండలం భావనపాడు పోర్టు ప్రతిపాదిత ప్రాంతాలు, పోలాకి, కాకరాపల్లి థర్మల్ వ్యతరేక పోరాట గ్రామాల్లో పది వామపక్షాల నేతలు పర్యటించారు. రైతులకు ఇష్టం లేకుండా భూములను లాక్కుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

19:51 - September 14, 2015

విజయనగరం : జిల్లా భోగాపురం మండలంలో ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. గ్రామాల్లోకి వెళ్లే అధికారులను ఎయిర్ పోర్టు బాధిత గ్రామాల ప్రజలు అడ్డున్నారు. భూసేకరణ, ప్యాకేజీ వివరాలను రైతులకు తెలియజేసేందుకు మండలంలోని గూడెపువలసకు వెళ్లిన తహశీల్దార్ లక్షారెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. రిలే నిరాహార దీక్షలో ఉన్న మహిళలు ఆయన కారును చుట్టుముట్టి, వెనక్కి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితిలు తలెత్తాయి. చేసేది లేక తహశీల్దార్ అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు.

19:48 - September 14, 2015

హైదరాబాద్ : భారత్‌లో వ్యాపార అనుకూల రాష్ట్రాలను ప్రపంచ బ్యాంక్‌ ప్రకటించింది. ఇందులో 71.14 శాతంతో గుజరాత్‌ అగ్రస్థానంలో నిలిచింది. 70.12 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ ద్వితీయస్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం 13 వ స్థానంలో ఉంది. జార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్‌లు వరుసగా 3,4,5 స్థానాల్లో నిలిచాయి. వ్యాపార సంస్కరణలకు, పెట్టుబడులకు ఈ రాష్ట్రాలు అనుకూలమని వరల్డ్‌ బ్యాంక్‌ పేర్కొంది. ఇందులో నాలుగు బిజెపి పాలిత రాష్ట్రాలు కాగా...ఏపి ఎన్డీయే మిత్రపక్షం కావడం గమనార్హం. 1.23 శాతంతో అరుణాచల్‌ప్రదేశ్‌ అట్టడుగున ఉంది. ప్రపంచ బ్యాంక్‌ రిపోర్టులో 189 దేశాల్లో భారత్‌ 142వ స్థానంలో ఉంది.

రెండు గంటలుగా విమానంలోనే ప్రయాణీకులు

హైదరాబాద్ : ఢిల్లీ నుంచి వడోదర వెళ్లాల్సన ఎయిర్ ఇండియా విమానం రెండు గంటలుగా విమానాశ్రయంలోనే ఉంది. విమానంలో 125 మంది ప్రయాణికులున్నారు. ఏ కారణం చేత విమానం ఇంకా బయలుదేరలేదో ఇంకా తెలియరాలేదు. అయితే ప్రయాణికులు మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే కుమారుని పై హెచ్ ఆర్సీలో ఫిర్యాదు..

హైదరాబాద్ : తమను వేధిస్తున్నారంటూ గొర్రెల , మేకల వ్యాపారులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కుమారుడు అరుణ్‌కుమార్, గోదావరిఖని వన్‌టౌన్ సీఐ బెదిరిస్తున్నారని సోమవారం గొర్రెల,మేకల వ్యాపారుల సంఘం హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ నవంబర్ 5లోగా సమగ్రనివేదిక సమర్పించాలని కరీంనగర్ ఎస్పీకి హెచ్ఆర్సీ ఆదేశించింది.

హన్మకొండలో నర్సింగ్ విద్యార్థినుల ఆందోళన

వరంగల్ : హన్మకొండలోని జయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కళాశాల ఎదుట విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కళాశాలలో సరైన వసతులు లేవంటూ విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

సోమ్ నాథ్ భారతికి బెయిల్ తిరస్కరించిన కోర్టు...

హైదరాబాద్ : గృహహింస, హత్యాయత్నం కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. సోమ్ నాథ్ భారతి బెయిల్ పిటిషన్ ను అడిషనల్ సెషన్స్ జడ్జి సంజయ్ గార్గ్ తిరస్కరించారు. కాగా, సోమ్ నాథ్ భారతి తన భార్యకు, పిల్లలకు అండగా ఉండాలని కోరుకుంటున్నారంటూ ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ న్యాయమూర్తికి విన్నవించారు. ‘సోమ్ నాథ్ ను దర్యాప్తునకు సహకరించమని కోరుతూ ఇప్పటికే రెండు నోటీసులు పోలీసులు ఆయనకు పంపించారు. కానీ, పోలీసులకు ఆయన సహకరించడం లేదు’ అంటూ ప్రాసిక్యూషన్ తన వాదనను వినిపించింది.  

స్వైన్ ఫ్లూపై బులెటిన్ విడుదల..

హైదరాబాద్ : రాష్ట్రంలో స్వైన్ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది.  ఈనెల 1 నుంచి 12 వరకు 158 కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారని పేర్కొంది. మరో 25 మందికి పాజిటివ్ అని తేలిందని వివరించింది. 

17:59 - September 14, 2015

బి.సుకుమార్‌ సమర్పణలో సుకుమార్‌ రైటింగ్స్‌, పి.ఎ.మోషన్‌ పిక్చర్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌ రూపొందుతున్న చిత్రం 'కుమారి 21ఎఫ్‌'. రాజ్‌తరుణ్‌, హేబా పటేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నోయల్‌ కీలక పాత్రధారి. పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకుడు. విజయప్రసాద్‌ బండ్రెడ్డి, థామస్‌ రెడ్డి ఆడూరి నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ,'సుకుమార్‌ స్టయిల్‌ ఆఫ్‌ సబ్జెక్ట్‌ కాబట్టి కొత్తగా ఉంటుంది. డైరెక్టర్‌ సూర్యప్రతాప్‌ సినిమాని బాగా డైరెక్ట్‌ చేశాడు. డిఫరెంట్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. అంతేకాకుండా చివర్లో ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తూ మంచి మెసేజ్‌ను కూడా ఇచ్చే చిత్రం. ఈ చిత్రంతో రాజ్‌తరుణ్‌, హేబాకి మంచి పేరు వస్తుంది. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు వన్‌ ఆఫ్‌ ది మెయిన్‌ పిల్లర్‌గా నిలిచాడు. సినిమాని చూశాను. సూపర్‌ విజువల్స్‌ ఇచ్చాడు. ఇప్పుడు రీరికార్డింగ్‌ వర్క్‌ జరుగుతుంది.త్వరలోనే ఒక సింగిల్‌ ట్రాక్‌ను విడుదల చేస్తున్నాం. సినిమాని అక్టోబర్‌ 30న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ అని అన్నారు.
'డిఫరెంట్‌ లవ్‌స్టోరీ. యూత్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. దేవిశ్రీప్రసాద్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు' అని సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు చెప్పారు. 'సినిమా దాదాపు పూర్తయింది. సుకుమార్‌ మంచి కథ, స్క్రీన్‌ప్లేతో స్క్రిప్ట్‌ను అందించారు.రాజ్‌ తరుణ్‌, హేబా మంచి పెర్‌ఫార్మెన్స్‌ చేశారు. యూత్‌కే కాదు అన్నీ వర్గాలకు నచ్చే సినిమా అవుతుంది. నిర్మాతలు విజయప్రసాద్‌ బండ్రెడ్డి, థామస్‌ రెడ్డి ఆడూరి మంచి సపోర్ట్‌ చేశారు' అని దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్‌ అన్నారు. 'సినిమా వైవిధ్యంగా ఉంటుంది. ఈ సినిమా కోసం సుకుమార్‌గారు ఒక సంవత్సరం పాటు కష్టపడి మంచి స్క్రిప్ట్‌ను అందించారు. సినిమాని అక్టోబర్‌ 30న విడుదల చేస్తాం' అని నిర్మాతలు విజయప్రసాద్‌ బండ్రెడ్డి, థామస్‌ రెడ్డి ఆడూరి చెప్పారు. సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు వంటి టాప్‌ టెక్నిషియన్స్‌ వర్క్‌ చేసిన చిత్రంలో చేయడం తన అదృష్టమని హీరో రాజ్‌ తరుణ్‌ చెప్పారు. ప్రతి నటుడు చేయాలని తపన పడే చాలా ఇంపార్టెంట్‌ రోల్ చేశానని నోయల్‌ అన్నారు. కెరీర్‌ ప్రారంభంలోనే సీనియర్‌ టెక్నిషియన్స్‌తో పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌ అని హీరోయిన్‌ హేబా పటేల్‌ చెప్పారు.

 

495 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి టీఎస్పీసీ నోటిఫికేషన్

హైదరాబాద్: మరో 495 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇరిగేషన్, సీఏడీ విభా గంలోని సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 226, ఇరిగేషన్ అండ్ సీఏడీ విభాగంలో మెకానికల్ అసి స్టెంట్ ఇంజనీర్ పోస్టులు 26, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ విభాగంలో సివిల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు 243 భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మరిన్ని వివరాల కోసం సంబంధిత వెబ్ సైట్ ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.  

వ్యాపారాలకు అనుకూలమైన ప్రాంతాల జాబితా విడుదల

ఢిలీ : వ్యాపారాలకు అనుకూల వాతావరణం ఉన్న ప్రాంతాల జాబితాను ప్రపంచబ్యాంకు ప్రకటించింది. మొదటిస్థానంలో గుజరాత్, రెండో స్థానంలో ఎపి, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్.., చివరి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ కు చోటు దక్కింది.

 

17:40 - September 14, 2015

హైదరాబాద్ : తెలంగాణలోని రెండో అతిపెద్ద గ్రానైట్ పరిశ్రమ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది.. లక్షలమందికి ఉపాది చూపిన కంపెనీలు మూసివేతదిశగా సాగుతున్నాయి.. ఒకప్పుడు వేలల్లో జీతాలు తీసుకుంటూ హాయిగా గడిపిన కార్మికులు ఇప్పుడు కుటుంబాలతోసహా రోడ్డునపడ్డారు.. సంక్షోభంలోపడి కొట్టుమిట్టాడుతున్న గ్రానైట్ కంపెనీలపై టెన్ టీవీ స్పెషల్ ఫోకస్..

రోడ్డున పడుతున్న కార్మికులు...

కంపెనీలు మూతబడుతున్నాయి...కార్మికులు రోడ్డున పడుతున్నారు...పట్టించుకున్ననాథులు మాత్రం కనిపించడం లేదు. తెలంగాణలోని గ్రానైట్‌ పరిశ్రమల పరిస్థితిది. సింగరేణి తరువాత రెండో అతిపెద్ద పరిశ్రమగా పేరొందిన... గ్రానైట్ ఇండస్ట్రీ ఇప్పుడు నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. రోజుకో సంక్షోభంతో కార్మికుల చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. అయినా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. లక్షలాది మందికి అన్నంపెట్టే పరిశ్రమపై చిన్నచూపు చూస్తూనే ఉన్నారు.

8 జిల్లాల్లో గ్రానైట్‌ పరిశ్రమ......

తెలంగాణ వ్యాప్తంగా 8 జిల్లాల్లో గ్రానైట్‌ పరిశ్రమ ఉంది. సింగరేణి కోల్‌బెల్ట్‌లోనే 75 శాతం కంపెనీలు ఉన్నాయి. అందులో సగం పరిశ్రమలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. టైల్స్‌, స్లాబ్‌, క్వారీలు కలిపి... సుమారు 800వరకూ నడుస్తున్నాయి. వీటిలో 5 వందలకు పైగా స్లాబులు, 300 వరకు టైల్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా... కొద్దిరోజులుగా పాలకుల నిర్లక్ష్యం, యాజమాన్యాల తీరుతో గ్రానైట్ పరిశ్రమ పరిస్థితి దారుణంగా తయారైంది. స్లాబు ఫ్యాక్టరీల్లో 300 సంస్థలు మూతబడ్డాయి. సుమారు రెండు లక్షల మంది కార్మికులు రోడ్డునపడ్డారు.

2012 నుంచి.....

2012 నుంచి గ్రానైట్ పరిశ్రమను కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. విద్యుత్ చార్జీలు 40శాతం పెరగడంతో విద్యుత్‌ కష్టాలొచ్చాయి. అలాగే 2013 నుంచి మార్కెట్‌ మందగించింది. మీటరు రాయి కొనుగోలుకు 10వేల రూపాయలు, దీనికి 14శాతం పన్ను 3 వేల 500, రవాణా 4 వేలు, మార్కింగ్‌ వెయ్యి కలిసి 18 వేల 5 వందల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. తయారయిన వస్తువులను మన రాష్ట్రంలో విక్రయిస్తే... అమ్మకపు పన్నులో 14శాతం వస్తుంది. కానీ మన దగ్గర ఆ స్థాయి మార్కెట్‌లేక ఇతర రాష్ట్రాల్లో ఈ వస్తువులు విక్రయిస్తున్నారు. అక్కడ పన్ను రెండు శాతం మాత్రమే ఉంది.దీంతో నష్టాలు తప్పడంలేదు.

అడుగు గ్రానైట్‌రాయి కొనుగోలు చేయాలంటే.....

ఇక అడుగు గ్రానైట్‌రాయి కొనుగోలు చేయాలంటే 43రూపాయలు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. దీనిని కటింగ్‌చేసి, పాలిష్ చేస్తే అది 32 రూపాయలకు చేరుతోంది. ఈ లెక్కన రాయి మంచి క్వాలిటీతోఉంటే పెట్టుబడి 75 రూపాయలు అవుతోంది.ప్రస్తుతం అడుగు రాయి ధర మార్కెట్లో 75 రూపాయలుగా ఉంది. అయితే ఆ స్థాయి నాణ్యత లేకపోతే ధర మరింత తగ్గిపోతుంది. రాయికి జాయింట్లు వచ్చినా, ఏమైనా తేడా జరిగినా అది వెనక్కితిరిగివస్తుంది. అటు దేశంలో నిర్మాణ రంగం పడిపోవడంతో ఈ మార్కెట్ నత్తనడకన సాగుతోంది.ఇదికూడా జిల్లాలోని పరిశ్రమలపై ప్రభావం చూపుతోంది. బయట మార్కెట్‌ లేకపోవడంతో తయారయిన రాళ్లు అలాగే ఉంటున్నాయి. పెట్టిన పెట్టుబడి వడ్డీలతోకలిసి మరింత పెరిగిపోతోంది. చివరకు కార్మికులకు జీతాలివ్వలేక కంపెనీలు మూసివేస్తున్నారు.

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు...

గ్రానైట్ పరిశ్రమ సరిగ్గా నడవకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పరిశ్రమ నడవాలంటే ముడిసరుకు చాలా అవసరం. కనీ కొత్తగా లీజులు మంజూరు చేయకపోవడంతో... ముడి సరుకు కొరత స్పష్టంగా ఏర్పడింది. ఉన్న కొద్ది క్వారీలపైనే ఆధారపడి ఫ్యాక్టరీలను నడపటం కష్టంగా మారింది. ఈ సమస్యలన్నింటినీ మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు కంపెనీల యజమానులు. అయినా సర్కార్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదు

కార్మికుల పరిస్థితి మరింత దారుణం....

మరోవైపు కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. ఈ కంపెనీల్లో తెలుగువాళ్లతో పాటు... ఒడిశా, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌, బీహార్‌, ఉత్తరాంచల్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా పని కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేక, ఇక్కడి నుంచి వెళ్లిపోలేక నానా కష్టాలు పడుతున్నారు. కంపెనీల మూసివేతతో ఒక్కసారిగా కార్మికుల జీవితాలు తలకిందులైపోయాయి.. ఒకప్పుడు తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చదివించిన వీరంతా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చారు.. ఇంటిల్లిపాది పనిచేస్తేనే తప్ప అందరి కడుపులు నిండని దీనస్థితిలోకి వెళ్లిపోయారు..

ఖమ్మం జిల్లా పై తీవ్ర ప్రభావం...

గ్రానైట్ రంగం సంక్షోభం ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అన్ని రంగాల్లో ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది.. మార్కెట్లో డబ్బు లావాదేవీలు తగ్గిపోయాయి. కొన్నేళ్ల క్రితం కోట్ల రూపాయల లావాదేవీలతో కళకళలాడిన ఖమ్మం మార్కెట్ ఇప్పుడు బావురుమంటోంది. ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తేనే ఈ రంగం పుంజుకునే అవకాశముంది.

 

ఇబ్రహీంపట్నం రెవెన్యూ ఆఫీస్ పై ఎసిబి దాడులు

కరీంనగర్ : ఇబ్రహీంపట్నం రెవెన్యూ కార్యాలయంపై ఎసిబి దాడులు నిర్వహించింది. వీఆర్ ఓ రమేష్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కాడు.  

17:35 - September 14, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంట చెరకు. రెండు మూడు దశాబ్దాల క్రితం వరకూ.. చెరకు రైతు.. రారాజుగా చెలామణి అయ్యేవాడు. కానీ రానురానూ చెరకు రైతు పరిస్థితి దయనీయంగా తయారవుతూ వస్తోంది. నానాటికీ పెట్టుబడుల వ్యయం పెరిగిపోతూ వస్తోంది. దీనికి తోడు అసమతుల్య వర్షపాతం రైతును ఏటికేడు వేధిస్తూనే ఉంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం.. చెరకు రైతును నిలువునా ముంచేసింది. దీంతో చెరకు సాగు విస్తీర్ణం సగానికి పడిపోయింది.

భూగర్భ జలాలు మరింత లోతుకు....

వర్షాభావం కారణంగా.. భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లాయి. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని జహీరాబాద్‌, కోహీర్‌, ఝరాసంగం, న్యాలకల్‌ మండలాల్లో గతంలో 40 వేల ఎకరాల్లో చెరకు సాగు చేసే వారు. నీటి లభ్యత లేకపోవడంతో.. ఈ ఏడాది చెరకు విస్తీర్ణం సగానికి పడిపోయింది. అరకొరగా వేసిన చెరకు పంటలనూ కాపాడుకోలేని దయనీయ స్థితిలో రైతులున్నారు. చేసేది లేక.. రైతులు నాలుగైదు మాసాల్లోనే నరికి.. శివారు ప్రాంతాల్లోని డైరీ ఫారాల్లోని పశువులకు మేతలుగా అమ్మేస్తున్నారు. కొనుగోలుదారులు చెప్పిన ధరలకే పంటను అమ్ముకోవాల్సిన దుర్గతి రైతులకు పట్టింది. అప్పులు తెచ్చి చేసిన సేద్యం నష్టాల్లోకి నెడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రకృతికి తోడు.. చెరకు ఫ్యాక్టరీ యాజమాన్యమూ....

ప్రకృతికి తోడు.. చెరకు ఫ్యాక్టరీ యాజమాన్యమూ రైతులను వేధిస్తోంది. స్థానికంగా ఉత్పత్తి అయ్యే సుమారు 8 లక్షల టన్నుల చెరకును స్థానిక ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారం తీసుకునేది. కానీ ఈ సంస్థ రైతులకు చెల్లించాల్సిన బిల్లల బకాయిలను పేర్చుకుంటూ వస్తోంది. నిరుడు క్రషింగ్ చేసిన చెరకుకు ఇప్పటి వరకూ బిల్లులు చెల్లించక పోవడం కూడా.. రైతుల్లో చెరకు సేద్యంపై ఆసక్తి తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు. చెరకు పంటకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు సుదీర్ఘ కాలంగా డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. ఇప్పటికైనా పాలకులు చెరకు రైతు కష్టాలు తీర్చాలని.. రైతు సంఘాలు కోరుతున్నారు. 

ఖమ్మం జిల్లాలో...

ఖమ్మం జిల్లాలో 18 వేల ఎకరాల్లో చెరకు సాగవుతోంది. ప్రధానంగా పాలేరు, వైరా, తల్లాడ, సత్తుపల్లి, దమ్మపేట, కల్లూరు, ఏన్కూరుతోపాటు 16 మండలాల్లో రైతులు చెరుకును సాగు చేస్తున్నారు. జిల్లాలో ఏటా నాలుగు లక్షల టన్నుల వరకూ చెరకు దిగుబడి వస్తోంది. ముఖ్యంగా పాలేరు ప్రాంతంలో అత్యధికంగా చెరకు సాగు చేస్తారు. 20గ్రామాల పరిధిలోని 8వేల ఎకరాల్లో చెరుకు సాగవుతోంది. ప్రతి ఏడాదీ పాలేరు రిజర్వాయర్‌ నుండి చిన్న కాలువ ద్వారా చెరకు పంటకు నీరందిస్తారు. ఈ సారీ నీరు విడుదల చేస్తారనే ఆశతోనే రైతులు పూర్తిస్థాయి విస్తీర్ణంలో చెరకును సాగు చేశారు.

పాలేరు ప్రాంతంలో.....

ఖమ్మం జిల్లా పాలేరు ప్రాంతంలో రెండు రకాల చెరకు సాగవుతోంది. తీవ్ర వర్షాభావం ఫలితంగా.. పాలేరు జలాశయం నిండుకుంది. ప్రస్తుతం పాలేరులో నీటి మట్టం 16 అడుగులు ఉంది. రెండేళ్ల క్రితం ఇదే రిజర్వాయర్‌ లో 9అడుగుల నీరున్నా.. చెరకు పంటను కాపాడేందుకు సాగునీటిని అందించారు. అయితే.. ఈఏడాది 16 అడుగులున్నా.. నిల్వలు తాగునీటికి మాత్రమే సరిపోతాయని.. చెరకు సేద్యానికి నీరివ్వలేమని స్పష్టం చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

బోర్లలోనూ నీరు లేక వేల ఎకరాల్లో.....

బోర్లలోనూ నీరు లేక వేల ఎకరాల్లో చెరకు పంట ఎండిపోతోంది. దీంతో రైతులు వానల పైనే పూర్తి ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలలో సరిపడా వర్షం కురవక పోతే.. చెరకు దిగుబడులపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితేనని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి కాఠిన్యానికి తోడు.. ప్రభుత్వాల తీరూ.. చక్కెర కర్మాగారాల వైఖరీ రైతును ఉక్కిరి బిక్కి చేస్తోంది. ఖమ్మం జిల్లాలో మధుకాన్, కాకతీయ షుగర్ ఫ్యాక్టరీలున్నాయి. ఈ కర్మాగారాలకు ఖమ్మం జిల్లాతోపాటు సమీపంలోని నల్గొండ, కృష్ణ జిల్లాల నుంచీ చెరకు వస్తుంది. ఎకరాకు 80వేల రూపాయలు ఖర్చు చేసి చెరకును పండిస్తే.. కర్మాగారాలు కనీసపు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది టన్నుకు 2650 ధరను చెల్లించారు. ఇప్పుడు ఆ ధర వస్తుందో రాదోనన్న వేదన రైతుల్లో కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర ధర తగ్గటాన్ని సాకుగా చూపి తమకు మద్దతు ధరను తగ్గించేందుకు ఫ్యాక్టరీలు ప్రయత్నిస్తున్నాయన్నది రైతుల ఆరోపణ. ప్రభుత్వమే చొరవ చూపి.. చెరకుకు మద్దతు ధర కల్పించేందుకు నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాలని రైతులు కోరుతున్నారు. 

17:31 - September 14, 2015

హైదరాబాద్ : పెట్టుబడులే లక్ష్యంగా... తెలంగాణ సీఎం కేసీఆర్ చైనా పర్యటన సాగుతోంది. ఎనిమిదో రోజు షెంజాన్‌లో తెలంగాణ బృందం పర్యటించింది. ఇండస్ట్రియల్ పార్క్‌ను కేసీఆర్‌ పరిశీలించారు. అనంతరం చైనా కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షెంజాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు.

 

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే : మధుయాష్కీ

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ టీ.ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని మధుయాష్కీ విమర్శించారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను శ్మశానంగా మార్చారని తీవ్రంగా విమర్శించారు. సీఎం జిల్లాలోనే 67 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలు ఒక్కరైతు కుటుంబాన్నీ పరామర్శించలేదన్నారు. హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కవితల అండదండలతోనే నిజామాబాద్ లో ఇసుక మాఫియా ఆగడాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న కుటుంబసభ్యులపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

బీహార్‌లో ఎన్ డిఎ పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం

పాట్నా : బీహార్‌లో ఎన్ డిఎ పక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-160, ఎల్జేపీ-40, ఆర్ ఎస్ ఎల్ పీ-23, హెచ్ ఏఎం-20 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఫలితాల తర్వాతే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. 

17:07 - September 14, 2015

హైదరాబాద్ : తెలంగాణలో స్వైన్‌ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. నేడు ఇద్దరు మహిళలు స్వైన్‌ఫ్లూతో చనిపోయారు. మహబూబ్‌నగర్‌కు చెందిన 55 ఏళ్ల స్వరూప గాంధీ ఆస్పత్రిలో చనిపోగా.. మరొకరు ఎల్బీనగర్‌ యశోదాలో చికిత్స పొందుతూ మరణించారు. మారుతున్న వాతావరణ పరిస్ధితుల్లో స్వైన్‌ఫ్లూ మళ్లీ చెలరేగుతోంది. 

17:06 - September 14, 2015

హైదరాబాద్ : గుర్రంపోడు మండలం ఆములూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో.. ముగ్గురు చనిపోయారు. మృతులు నాగర్‌కర్నూలు, నల్గొండ వాసులుగా గుర్తించారు. వారి పేర్లు సైదులు, శంకరమ్మ, రాజూగౌడ్‌లుగా చెబుతున్నారు.నాగర్ కర్నూల్ నుండి నల్గొండ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

17:04 - September 14, 2015

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నూతన పర్యాటక విధానాన్ని ఆవిష్కరించారు. విజయవాడలో జరిగిన టూరిజం సదస్సులో బాబు ప్రభుత్వం టూరిజం పాలసీని విడుదల చేశారు. జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు అనేకమంది పారిశ్రామికవేత్తలు, టూరిజం పరిశ్రమాధిపతులతో పాటు డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు.

17:01 - September 14, 2015

హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ నేత వంగవీటి రాధా ఫైర్ అయ్యారు. ప్రత్యేకహోదా అంశం పైకిలేవనెత్తకుండా రాష్ట్ర యువతను చంద్రబాబు మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ....ఇప్పటికైనా..రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్‌లో భారీ ప్రజాఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు.

17:00 - September 14, 2015

హైదరాబాద్ : నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ...పొగాకు మద్ధతు ధర కోసం జులైలో టోబాకో బోర్డుతో చర్చించామన్నారు. సెప్టెంబర్‌ 30 లోపల 172 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలు చేయాలని చెప్పామన్నారు. సెప్టెంబర్‌ 11వ తేదీ వరకు 140.55 మిలియన్‌ కేజీల పొగాకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 30 వరకు ఎట్టిపరిస్థితిల్లోనూ మిగతా నిల్వలను కొనుగోలు అయ్యేలా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. 

సీఎస్ రాజీవ్ శర్మను కలిసిన డికె.అరుణ

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డికె.అరుణ సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు. గద్వాలను జిల్లాగా ప్రకటించాలని కోరారు.

 

16:22 - September 14, 2015

మాధవి... తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే అలనాటి హీరోయిన్స్‌లో ఒకరు. 17 సంవత్సరాల సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాళీ, ఓరియా భాషల్లో దాదాపు 300 చిత్రాల్లో నటించి మెప్పించిన మాధవి పుట్టినరోజు ఇవాళా. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మాధవి సినీ జీవిత గమనంలోని విశేషాలు..
బాల్యమంతా హైదరాబాద్‌లోనే..
మాధవి తల్లిదండ్రులు.. గోవిందస్వామి, శశిరేఖ. ఒక సోదరి, సోదరుడు కూడా ఉన్నారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన మాధవి బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. చిన్నప్పట్నుంచే భరతనాట్యం, ఫోక్‌ డాన్స్‌పై అమితాసక్తి చూపారు.
'తూర్పు పడమర' చిత్రంతో తెరంగేట్రం... 
దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'తూర్పు పడమర' చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా పెద్ద సక్సెస్‌ కావడంతో మంచి పేరు వచ్చింది. తమిళ దర్శకుడు కె.బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందిన 'మరో చరిత్ర'లో పోషించిన పాత్ర మాధవి కెరీర్‌నే మార్చేసింది. 'మరో చరిత్ర' హిందీ రీమేక్‌ 'ఏక్‌ తుఝే కేలియే' చిత్రంలో కూడా నటించి మెప్పించారు. మాధవి నటనతో ఇంప్రెస్‌ అయిన దర్శకుడు కె.బాలచందర్‌ 'తిళ్ళు మిళ్ళు' చిత్రంతో తమిళ చిత్రసీమకి పరిచయం చేశారు.
స్టార్స్ తో నటించిన మాధవి...
బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, తెలుగులో కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్‌ వంటి స్టార్స్‌తో పాటు తమిళంలో శివాజీ గణేషన్‌, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లతో కలిసి నటించింది. మలయాళంలో మోహన్‌లాల్‌, మమ్ముట్టి వంటి స్టార్స్‌ సరసన నటించి ప్రేక్షకుల్ని అలరించింది. అలాగే కన్నడలో కూడా విష్ణువర్ధన్‌, రాజ్‌కుమార్‌, అనంత్‌ నాగ్‌ వంటి స్టార్స్‌తో జత కట్టారు. హిందీలో విజయవంతమైన 'డాన్' చిత్రాన్ని మలయాళంలో 'శోభరాజ్‌'గా రీమేక్‌ చేసినప్పుడు హిందీలో జీనత్‌ అమన్‌ చేసిన పాత్రను పోషించారు.
'మాతృదేవోభవ'లో క్యాన్సర్‌ పెషేంట్‌గా..
తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ సగటు తెలుగు ప్రేక్షకుడికి మాత్రం ఆమె పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే తెలుగు చిత్రాలు రెండు. అందులో మొదటిది 'మాతృదేవోభవ' చిత్రంలో క్యాన్సర్‌ పెషేంట్‌గా తన పిల్లల కోసం తపన పడే తల్లిగా ఆమె నటన ప్రేక్షకులను కంటితడి పెట్టించింది. మరో సినిమా చిరంజీవి సరసన నటించిన 'ఖైదీ'. ఈ చిత్రంలో 'రగులుతుంది మొగళిపొద..' అనే పాటలో చిరంజీవితో మాధవి చేసిన నాగిని డ్యాన్స్‌ ఇప్పటికీ అభిమానులు మరచిపోలేరు. రాల్ఫ్‌ శర్మ అనే ఎన్నారైని వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. పెళ్ళైన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం న్యూజెర్సీలో స్థిరపడిపోయారు.

 

 

విద్యుత్ శాఖ ఉద్యోగుల బదలాయింపులపై వాదనలు పూర్తి

హైదరాబాద్ : విద్యుత్ శాఖ ఉద్యోగుల బదలాయింపులపై హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. కోర్టు... తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. 

15:53 - September 14, 2015

'ఓ పాటకు ఇంత శక్తి ఉంటుందా..? ఓ పాటపై ఇంతమంది వీక్షకులు అమితాసక్తి చూపించారా.. నమ్మలేకపోతున్నా.. ఈ పాటలో నటించడం వల్ల మంచి పేరొచ్చింది. అయితే ఆ క్రెడిట్‌ నాది కాదు.. ఆ క్రెడిట్‌ మొత్తం పాట మహిమదే' అని అంటోంది బాలీవుడ్‌ భామ సోనమ్‌కపూర్‌. బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'ఆషికీ'లో కుమార్‌ సాను ఆలపించిన 'ధీరే ధీరేసే మేరీ..' పాట అప్పట్లోనే ఓ సంచలనం సృష్టించింది. ఈపాటకు ఫిదా అవ్వని ప్రేక్షకులండరంటే అతిశయోక్తి లేదు. ఈ పాటను తాజాగా రీక్రియేట్‌ చేశారు. టీ సీరిస్‌ వ్యవస్థాపకుడు గుల్షన్‌కుమార్‌కు నివాళిగా ఆయన తనయుడు భూషణ్‌కుమార్‌ ఈ రీక్రియేట్‌ పాటకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ గాయకుడు యో యో హానీ సింగ్‌ ఈ రీక్రియేట్‌ పాటను ఆలపించగా అహ్మద్‌ఖాన్‌ సంగీత దర్శకత్వం వహించారు. హృతిక్‌రోషన్‌, సోనమ్‌కపూర్‌పై చిత్రీకరించిన ఈ పాటను ఈనెల 1వ తేదీన యూట్యూబ్‌లో విడుదల చేశారు. సామాజిక మీడియాలో ఈ పాటకు అపూర్వ స్పందన లభించింది. ఇప్పటివరకు
ఈ పాటను రెండు కోట్లమందికి పైగా వీక్షించడం విశేషం. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని సోనమ్‌కపూర్‌ పై విధంగా స్పందిస్తే, 'తండ్రి మీద ఓ కొడుకు ప్రేమకు ఈ విజయం ఓ నిదర్శనం' అంటూ భూషణ్‌ కుమార్‌ను ఉద్దేశిస్తూ హృతిక్‌రోషన్‌ ట్వీట్‌ చేశారు.

 

15:53 - September 14, 2015

హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసేందుకు ఈ నెల 16న ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రి గ్రామంలో ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం గోదావరి జలాలు గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నున్న వంతెన వద్దకు చేరుకోడంతో స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణ, ఇతర నాయకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వంతెన వద్ద నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. గోదావరి, కృష్ణానది నదులను అనుసంధానం చేస్తూ దేశ చరిత్రలో తొలిసారిగా చంద్రబాబు చేపట్టిన సాహసం తెలుగుజాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు నాయకులు కొనియాడారు. అంతకుముందు గ్రామస్తులు మేళతాళాలతో, డప్పువాయిద్యాలతో నేతలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఘనస్వాగతం పలికారు. 

15:51 - September 14, 2015

నల్గొండ : దామరచర్ల మండలం లావురితండాలో లావూరి రఘు అనే గిరిజన రైతు విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు. తెల్లవారు జామున పొలానికి నీళ్ళు పెట్టాలని వెళ్లిన రఘు.. విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. గతేడాది రఘు సోదరుడు శంకర్‌ కూడా ఇలానే కరెంట్‌ షాక్‌తో చనిపోయాడు. యేడాది వ్యవధిలోనే ఒకే కుటుంబంలో పెద్ద దిక్కు అయిన ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గిరజన రైతు మరణం విషయం తెలుసుకున్న సీపీఎం నల్గొండ జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 16న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని జూలకంటి రంగారెడ్డి వెల్లడించారు. 

15:49 - September 14, 2015

హైదరాబాద్ : మెడికల్‌ కాలేజీల్లో కళింగ రిజర్వేషన్లకు సంబంధించిన హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎంసీఐ ను ప్రతివాదిగా చేర్చింది. 

క్రేన్ కిందపడి ఆరుగురి మృతి....

పాట్నా : బీహార్ లో దారుణం జరిగింది. చాప్రాలో క్రేన్ ప్రమాదం చోటుచేసుకుంది. వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా క్రేన్ కూలింది. క్రేన్ కిందపడి ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. అధికారులు పరారయ్యారు.

 

15:47 - September 14, 2015

కడప: జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీని కేశవరెడ్డి బాధితులు కలిశారు. తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. కేశవరెడ్డి అధిక వడ్డీలను ఆశ చూపి... పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ డెవలప్‌మెంట్ కోసం ఏడు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే పది లక్షల రూపాయలు ఇస్తామని ఆశచూపడని అన్నారు. కూతురు పెళ్లికోసం దాచుకొన్న డబ్బుల్ని కూడా కేశవరెడ్డిపాలు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. 

15:45 - September 14, 2015

కరీంనగర్ : జగిత్యాల పట్టణంలో థర్మకోల్‌ వినాయకులు అందరిని ఆకట్టుకుంటున్నాయి. స్థానికంగా నివసిస్తున్న జయకృష్ణ అనే యవకుడు గత పదేళ్లుగా ఈ థర్మకోల్ వినాయకులను తయారు చేస్తున్నాడు. ఈ థర్మకోల్ వినాయకులకు స్థానికంగా బాగా డిమాండ్ కూడా ఉంది. ఒకవేళ థర్మకోల్ వినాయకులు కావాలంటే నెలరోజుల ముందే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. పర్యావరణానికి హాని జరగకుండా ఉండటానికే తాను ఈ థర్మకోల్ వినాయకులను డిజైన్ చేస్తున్నాని జయకృష్ణ చెబుతున్నాడు.

నూతన పర్యాటక విధానాన్ని ప్రకటించిన చంద్రబాబు

విజయవాడ : ఎపి సీఎం చంద్రబాబు నూతన పర్యాటక విధానాన్ని ప్రకటించారు. 5 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పర్యాటక విధానం ఉంటుందని తెలిపారు. పారిశ్రామిక సంస్థలతో పర్యాటకంపై ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు పేర్కొన్నారు.

15:43 - September 14, 2015

నెల్లూరు : వినయాక చవితి పండగ దగ్గర పడుతుండటంతో...ఒక్కొకక్కరు ఒక్కో విధంగా వినయాకులను తయారు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సిక్స్‌ప్యాక్‌తో ఉన్న బాహుబలి వినాయకులు అందరిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. బాహుబలి సినిమాలో మాదిరిగా...హీరో ప్రభాస్‌ శివలింగాన్ని ఎత్తినట్టు ఇక్కడ గణేశుడు తన తండ్రి శివలింగాన్ని ఎత్తుకున్నాడు. అంతేకాదు ఈ గణేశుడికి సిక్స్‌ ప్యాక్‌ కూడా డిజైన్ చేశారు. ఈ ఏడాది ఇవి వినూత్నంగా ఉండటంతో...స్థానికంగా వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. యువకులు వీటిని కొనేందుకు పోటీ పడుతున్నారు.

15:42 - September 14, 2015

హైదరాబాద్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సరైన సదుపాయాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఉదయం 6 గంటలన భారీ స్థాయిలో వచ్చిన యువకులను అదుపు చేయడం పోలీసుల తరం కాలేదు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్‌ జరిపారు. లాఠీ దెబ్బలకు తట్టుకోలేక యువకులు పరుగులు తీశారు. ఇక్కడ కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని, గాయపడ్డవారికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ సౌకర్యం కూడా కల్పించలేదని నిరుద్యోగ అభ్యర్థులు ఆరోపించారు. చాలామంది నిరుద్యోగులు రిక్రూట్‌మెంట్‌కు హాజరు కాకుండానే వెనుదిరిగారు.

15:40 - September 14, 2015

హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రజలకు వరాలు కురిపించారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌ కోసం ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌కు 3 వేల కోట్లు ఇవ్వనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. వెన్నెముక సమస్యతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతూ నడవలేకపోతున్నవారికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన వీల్‌ఛైర్లను 960 మందికి పంపిణీ చేస్తామన్నారు. మొదటి దశలో ప్రతి జిల్లాలో 30 మంది చొప్పున ఎంపిక చేసి వీల్‌ఛైర్లు ఇస్తామని చెప్పారు. పుదుకొట్టాయ్ లోని ఓ బధిర స్కూల్‌ సొంత భవనం నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేస్తున్న్టటు ప్రకటించారు. అంతేకాదు తమిళనాడులోని ప్రతి ఇంటికీ ఐపీటీవీ సౌకర్యం కల్పించబోతున్నట్టు తెలిపారు.

15:39 - September 14, 2015

హైదరాబాద్ : రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలబడదు. అన్నదాత లేకుంటే అసలు ప్రపంచమే ఉండదు. అందుకే రైతన్నకు బాసటగా నిలుస్తున్నాయి ఎద్దులు. మేమున్నాం..! అధైర్య పడొద్దంటూ... ధైర్యం చెబుతున్నాయి. "డియర్ మాస్టర్‌ మీ కోసం... మరింత కష్టపడుతాం." మీరు మాత్రం ఆత్మహత్య చేసుకోవద్దు. అని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. పూణె పెయింటింగ్ ఎగ్జిబిషన్‌లో మనకు కనిపిస్తున్న ఈ దృశ్యం ఫస్ట్ ఫ్రైజ్ గెల్చుకుంది. అందర్ని ఆకట్టుకున్న ఈ పెయింటింగ్ సోషల్‌ వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తోంది. 

15:35 - September 14, 2015

హైదరాబాద్ : టీం ఇండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బిజినెస్ టుడే మ్యాగజైన్ కవర్ పై ధోనిని మహావిష్ణువు రూపంలో చిత్రీకరించడంపై బెంగళూరు, అనంతపురంలో కేసు నమోదైంది. అయితే ఈ ఫోటోతో తనకు సంబంధం లేదని... కేవలం తనను ఇబ్బందిపెట్టేందుకే పిటిషన్ వేశారని ధోని సుప్రీంను ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు... ధోనిపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ స్టే విధించింది.  

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

నల్లగొండ : గుర్రంపోడు మండలం ఆములూరులో కారు, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కర్నూలు వాసులుగా గుర్తించారు. 

ముంబై పేలుళ్ల కేసులో దోషులకు కాసేపట్లో శిక్షలు ఖరారు

ముంబై : 2006 ముంబై పేలుళ్ల కేసులో దోషులకు కాసేపట్లో మోకా కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది. ఈ కేసులో కోర్టు 12 మందిని దోషులుగా తేల్చింది. 

మచిలీపట్నంలో దారుణం..

విజయవాడ : మచిలీపట్నంలోని ఆదర్శనగర్ లో దారుణం జరిగింది. ఓ యువకుడు ప్రియురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

స్వైన్ ఫ్లూతో ఇద్దరి మృతి

హైదరాబాద్ : హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ మరణాలు పెరుగుతున్నాయి. ఇవాళా స్వైన్ ఫ్లూతో ఇద్దరు మృతి చెందారు. ఎల్ బినగర్ గ్లోబల్ ఆస్పత్రిలో ఆసియాబగం (28) అనే మహిళ, గాంధీ ఆస్పత్రిలో మరోక మహిళ స్వైన్ ఫ్లూతో మృతి చెందారు.

 

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

హైదరాబాద్ : బీసీల జాబితా నుంచి కొన్ని కులాల తొలగింపుపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బీసీ కులాల జాబీతాలో కొన్ని కులాలను తొలగించాలని కోరుతూ మెడికల్‌ విద్యార్థి, కుల సంఘాలు సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై సోమవారం సుప్రీం కో్ర్టులో విచారణ జరిగింది. గతంలో బీసీ కులాల జాబీతాలో కొన్ని కులాల తొలగింపును సమర్థించిన హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. కేసులో ఇంప్లీడ్ కావాలని ఎంసీఐని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

సుప్రీం కోర్టులో ధోనికి ఊరట

హైదరాబాద్ : భారత్ వన్డే క్రికెట్జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ మ్యాగజైన్ ఫ్రెంట్ పేజీ పై విష్ణు మూర్తి అవతారంలో ధోనీ... తన చేతుల్లో పలు ఉత్పత్తులను పెట్టుకుని ప్రచురించిన చిత్రం గతంలో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. హిందువలు మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని.. ధోనీ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు నిర్ణయించింది. దీనిని సవాల్ చేస్తూ ధోని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన కోర్టు కర్ణాటక హైకోర్టు నిర్ణయం పై ఈ రోజు స్టూ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అరెస్ట్.....

వరంగల్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ విమోచనదినాన్ని సెప్టెంబర్‌ 17న అధికారికంగా నిర్వహించాలని సోమవారం వరంగల్ కలెక్టరేట్‌ ఎదుట ఆయన బీజేపీ కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. కిషన్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఉద్యమ పాటగానే ఉంటా : గద్దర్

హైదరాబాద్ : వరంగల్ ఉపఎన్నికలో తాను పోటీ చేయబోనని.. తెలంగాణ ఉద్యమ పాటగానే ఉంటానని ప్రజాగాయకుడు గద్దర్ వెల్లడించారు .వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రజాకవి గద్దర్ పోటీచేయబోతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు గద్దర్ తెరదించాడు. తాను ఉపఎన్నికలో పోటీ చేయడంలేదని సోమవారం ఆయన మీడియాతో చెప్పారు. ప్రస్తుతానికి ఉద్యమ పాటగానే ఉంటానన్నారు. ఎన్నికల్లో పోటీపై సిద్ధాంతపరమైన చర్చ జరగాల్సిఉందని గద్దర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామాతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరగనున్నది.

నేరాన్ని అంగీకరించిన నిక్కీ జోసెఫ్

హైదరాబాద్ : నాలుగు రోజుల కిందట హైదరాబాదు, శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టైన ఐఎస్ఐఎస్ ప్రచారకర్త అఫ్సా జబీన్ (37) అలియాస్ నిక్కీ జోసెఫ్ నేరాన్ని అంగీకరించింది. పోలీసులు, ఎన్ఐఏ నిఘా వర్గాల అధికారులు విచారించిన సమయంలో పలు అంశాలు వెల్లడించింది. ఐఎస్ఐఎస్ కార్యకలాపాల పట్ల తీవ్రంగా ప్రభావితమయ్యానని, సున్నీలు, షరియత్ చట్టం కోసం పోరాడుతున్న ఐఎస్ఐఎస్ సంస్థకు తాను మద్దతురాలినని తెలిపినట్టు నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు.

భద్రాచలం కోర్టులో విషాదం.....

ఖమ్మంజిల్లాలోని భద్రాచలం కోర్టులో విషాదం చోటుచేసుకుంది. సోమవారం విధి నిర్వహణలో ఉన్న సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ సంజీవరావు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంజీవరావు మృతితో కోర్టు ప్రాంగణం విషాదంతో నిండిపోయింది.

 

14:48 - September 14, 2015

హైదరాబాద్ : అతివల అలంకరణలో ఆభరణాలది ప్రత్యేక స్థానం. వీటిలో మారిపోయే లేటెస్ట్ ట్రెండ్స్ ను ఫాలో అయే వారికి వన్ గ్రాం ఆర్నమెంట్స్ బెస్ట్ ఛాయిస్. అలాంటి లేటెస్ట్ వన్ గ్రాం ఆభరణాలతో బేగంపేటలో ఉన్న ప్యాట్నీ జ్యువల్లెర్స్ తో మీ ముందుకు వచ్చింది ఇవాళ్టి సొగసు. ఆ కలెక్షన్స్ చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:43 - September 14, 2015

హైదరాబాద్ : వరంగల్ ఉపఎన్నికలో  ప్రస్తుతానికి ఉద్యమపాటగానే తాను ఉంటానని ప్రజాగాయకుడు గద్దర్ చెప్పారు. మొదట వామపక్ష పార్టీలు కోరాయి. ఆలోచిస్తామన్నారు. నేడు ప్రజాసంఘాలు కలిశాయి. విధానపరమైన స్పష్టత వచ్చాకే నిర్ణయమంటున్నారు. ప్రజాగాయకుడు గద్దర్‌ వరంగల్‌ ఉప ఎన్నిక పోరుపై ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. ప్రస్తుతానికి ఉద్యమ పాటగానే ఉంటానని, మరింత స్పష్టత వచ్చాకే వరంగల్‌ ఉప ఎన్నికపై నిర్ణయం తీసుకుంటానంటున్నారు. 

14:41 - September 14, 2015

హైదరాబాద్: బిజీ షెడ్యూల్ లో వంటకు కేటాయించే సమయం తగ్గిపోతోంది. రెడీమేడ్ ఫుడ్, ఇన్ స్టంట్ ఫుడ్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులైన కుటుంబాలు వీకెండ్ లో రెస్టారెంట్ ఫుడ్ కే ఓటేస్తాయి. దీంతో ఒక రోజు ఇంట్లో శ్రమ తగ్గుతుంది, కాస్త టేస్టీ ఫుడ్ ను ఎంజాయ్ చేసామన్న తృప్తి మిగులుతుంది. అలాంటి వారందరి కోసమే మా రెస్టారెంట్ అంటోంది సౌజన్య. పోటీ ప్రపంచంలో నలుగురికి భిన్నంగా వ్యాపారంలోకి అడుగుపెట్టి సరికొత్త ఆలోచనలకు రూపమిస్తున్న సౌజన్య కృషి అభినందనీయం. ఫుడ్ అండ్ రెస్టారెంట్ రంగాలపై ఆసక్తి కలిగిన మహిళా స్టార్టప్స్ కు ఆదర్శనీయం. ఇంకా పూర్తి వివవరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:26 - September 14, 2015

హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... అవసరం లేని ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం.. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు ప్రయత్నించడం లేదన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా ఒకేసారి రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

కాకినాడలో 'రైతు కోసం చంద్రన్న' కార్యక్రమం

తూర్పుగోదావరి : కాకినాడలో 'రైతు కోసం చంద్రన్న' కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమా, పల్లె రఘునాథరెడ్డి, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారీగా ప్రజలు హాజరయ్యారు. 

టీఆర్ ఎస్ పై కిషన్ రెడ్డి ఫైర్...

వరంగల్ : ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు కోసం టీఆర్ ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. అమరుల ఆత్మగౌరవాన్ని టీఆర్ ఎస్ తాకట్టు పెడుతుందని ఆయన విమర్శించారు.

 

కళింగ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

ఢిల్లీ : మెడికల్ కళాశాలల్లో కళింగ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. 

బీహార్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : అమిత్ షా

ఢిల్లీ : బీహార్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈమేరకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

13:35 - September 14, 2015

విజయనగరం : జిల్లా కొత్తవలసలో ఉన్న స్టెయిన్ లెస్ లిమిటెడ్ ఫెర్రోఅల్లాయీస్ పరిశ్రమ మూతపడింది. పరిశ్రమకు నష్టం వస్తున్నందున పరిశ్రమను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ముందస్తు నోటీసులు ఏవీ లేకుండా ఇలా ఉన్నపళంగా పరిశ్రమ మూసివేయడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తవలస సమీపంలోగల ఫెర్లో ఎల్లాయిస్ కంపెనీని లాకౌట్ చేశారు. దీంతో ఆ కంపెనీపై ఆధారపడ్డ దాదాపు 1300 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రత్యక్షంగా 1300 కుటుంబాలతోపాటు మరో కొన్ని కుటుంబాలు పరోక్షంగా ఆ కంపెనీపై ఆధారపడ్డాయి.

ఉత్పత్తులకు గిరాకీ లేకపోవడం..
అంతర్జాతీయంగా ఫెరోఅలాయిస్ ఉత్పత్తులకు గిరాకీ లేకపోవటం, రాష్ట్రంలో ఫెరో అలాయిస్ పరిశ్రమలకు ఏపీఈపీడీసీఎల్ ఇస్తున్న విద్యుత్తు ఛార్జీలు భారీగా పెంచటం, పరిశ్రమకు యాజమాన్యానికి నష్టం కలిగించే విధంగా కార్మికుల పనితీరు ఉన్నందున పరిశ్రమలు మూసి వేస్తున్నట్లు యాజమాన్యం నోటీసు బోర్డులో పొందుపరిచింది. ఆదివారం ఉదయం 5గంటల నుంచి పరిశ్రమలోని అన్ని విభాగాలను మూసివేస్త్నుట్లు ప్రకటించింది.

ఆందోళనలో కార్మికులు..
ఈ విషయం తెలుసుకున్న కార్మికులు యాజమాన్య చర్యపై ఆందోళనకు గురయ్యారు. కార్మికులపై నెపం నెట్టడాన్ని ఖండించారు. కార్మిక సంఘాలకు ముందుగా ఎటువంటి సమాచారం తెలియజేయకుండా పరిశ్రమను మూసివేయటంపై ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం నిర్ణయంతో ఈ పరిశ్రమలో పని చేస్తున్న వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ చర్యలను నిరసిస్తూ పరిశ్రమ ముందు రహదారిపై కార్మికులు రాస్తారోకో చేశారు. ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చొరవతీసుకోవాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. లాకౌట్ అయిన కంపెనీని తెరిపించి తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని దానిపై ఆధారపడ్డ కుటుంబాలు కోరుతున్నాయి.

13:29 - September 14, 2015

శ్రీకాకుళం : కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లలను సైతం వదలడం లేదు. వరుసకు బంధువులే ఈ ఘటనలకు పూనుకుంటున్నారు. తాజాగా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై వరుసకు బాబాయి అయిన ఓ ప్రబుద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పాలకొండ మండలం సింగన్నవలసలో ఆడుకుంటున్న చిన్నారికి మాయమాటలు చెప్పి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇతర పిల్లలు తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో గ్రామస్తులను వెంటబెట్టుకొని వచ్చేసరికి నిందితుడు పరారయ్యాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని పాలకొండలోని ఆస్పత్రికి తరలించారు. ఘటన జరడం పట్ల తల్లి కన్నీరుమున్నీరవుతోంది. 

13:24 - September 14, 2015

హైదరాబాద్ : ప్రస్తుతం పెద్ద ప్రమాదం పొంచి ఉందని, రిజర్వేషన్ వ్యవస్థకే ప్రమాదం పొంచి ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సదస్సుకు తమ్మినేని హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నేతలు, ప్రజాసంఘాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని ప్రసంగించారు. వేల ఏళ్లుగా దోపిడీకి, అన్యాయానికి గురవుతున్న అణగారిన వర్గాలకు అంబేద్కర్ పోరాటంతోనే రిజర్వేషన్లు వచ్చాయన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం ఉద్యమించడం ద్వారానే పటేళ్ల ఉద్యమాన్ని అడ్డుకోవాలని సూచించారు. పటేల్ కులస్తుల వెనుక సంఘ్ పరివార్ హస్తం ఉందని, ప్రస్తుతం ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ ఉద్యమం మహా ఉధృతంగా సాగాలని సూచించారు. 

13:19 - September 14, 2015

రాజమండ్రి : ట్రాన్స్ పోర్టు నిద్ర పోతోందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. గండేపల్లి వద్ద జరిగిన ఘోర దుర్ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై వాహనాల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని రఘువీరా డిమాండ్‌ చేశారు. 

ఆ బాధితులకు అండగా ఉంటాం : పి.మధు

శ్రీకాకుళం : జిల్లాలోని సంతబోమ్మాలి మండలం భావనపాడులో వామపక్షపార్టీల నేతల పర్యటించారు. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ బాధితులకు అండగా ఉంటామని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు భరోసా ఇచ్చారు. మత్స్యకారురల పొట్టకొట్టే ప్రాజెక్టులను అనుమతించేది లేదన్నారు. భూసమస్యలపై పోరాటం చేసే హక్కును ప్రభుత్వం హరిస్తోందని సీపీఐ పేర్కొంది.

 

గండేపల్లి ప్రమాద మృతుల కటుంబసభ్యులు ఆందోళన

తూ.గో : రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద గండేపల్లి ప్రమాద మృతుల కటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నష్ట పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. 

13:00 - September 14, 2015

అనంతపురం : జిలాల్లో ఓ యువకుడు సాహసం ప్రదర్శించాడు. ఛైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరు యువకులను పట్టుకున్నాడు. ఈఘటన సోమవారం మారుతీనగర్ లో చోటు చేసుకుంది. ఉదయం రోడ్డుపై ఓ మహిళ వెళుతోంది. ఇద్దరు దండగులు బైక్ వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారం గొలుసు తెంపుకుని పరారయ్యారు. అదే దారిలో వెళుతున్న ఓ యువకుడు చూశాడు. వెంటనే వారిని వెంబడించాడు. వారి బైకును తన బైక్ తో ఢీకొట్టి వారిని కిందపడేశాడు. ఇంతలో యువకుడి అరుపులు విన్న స్థానికులు బంగారం గొలుసును దొంగిలించిన వారిని పట్టుకుని బంధించారు. ఈ ఘటనలో ఛైన్ స్నాచర్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఛైన్ దొంగలను పట్టించిన ఆ యువకుడిని పలువురు అభినందించారు. 

12:51 - September 14, 2015

ఒంగోలు : జిల్లాలోని చీమకుర్తిలో బీటెక్ విద్యార్థిని అనూష ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. బీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కరెస్పాండెంట్ సుబ్బారావు, హెచ్‌వోడీ మాలకొండారెడ్డిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మాలకొండారెడ్డి అందరిముందు అనూషను వేధించేవాడని అందుకే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన చావుకు మాలకొండారెడ్డి కారణమని అనూష తన డైరీలో రాసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు సుబ్బారెడ్డి, మాలకొండారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థుల్లో కొంతమంది ఆందోళన చేపట్టారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందులో పనిచేసే ఓ వ్యక్తి ఏకంగా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించాడు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం వారికి రిమాండ్ విధిస్తారా ? బెయిల్ వస్తుందా ? అనేది ఉత్కంఠ నెలకొంది. ఈనెల 12న శనివారం అనూష తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 

12:44 - September 14, 2015

హైదరాబాద్ : ప్రజా గాయకుడు ఒక దిక్సూచీ అని ప్రజా సంఘ నేతలు పేర్కొన్నారు. సోమవారం ఉదయం గద్దర్ నివాసానికి సుమారు 18 ప్రజా సంఘాల నేతలు చేరుకున్నారు. వరంగల్ ఉప ఎన్నికపై వారు సుదీర్ఘంగా చర్చించారు. వరంగల్ ఎంపీ స్థానానికి కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అభ్యర్థిగా గద్దర్ ను నిలబెడుతామని వామపక్ష పార్టీలు ఇటీవలే ప్రకటించాయి. కానీ దీనిపై గద్దర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అక్కడ ఎలాగైనా పోటీ చేయాలని వత్తిడి తీసుకొచ్చేందుకు ప్రజా సంఘాలు ఆయన నివాసానికి చేరుకుని చర్చలు జరిపారు. అనేక సమీకరణాలపై వీరు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘ నేతలు టెన్ టివితో ముచ్చటించారు. గద్దర్ ఒక దిక్సూచీ అని ఓయూ జేఏసీ నేత దుర్గం భాస్కర్ చెప్పారు. పది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం కోసం ఎలాంటి పార్టీ సపోర్టు లేకుండా విద్యార్థి జేఏసీగా పోరాటం చేయడం జరిగిందని, అందులో భాగంగా గద్దర్ ను కలువడం జరిగిందని తెలిపారు. ఆరు దశాబ్ధాలుగా అనేక పోరాటాలు జరిగాయని, త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పనిచేయడం లేదని, దొరల పాలన కొనసాగుతోందని విమర్శించారు. 14 నెలల కాలంలో ప్రజల హక్కులకు వ్యతిరేకంగా నడుస్తోందన్నారు. దొరల బానిసత్వం కింద నలగడానికి సిద్ధం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం అవసరమన్నారు. అందుకనే వరంగల్ ఎంపీ ఎన్నికలో గద్దర్ ను పోటీ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిపారు. గద్దర్ తెలంగాణకు పెద్ద దిక్సూచీ అని అడ్వకేట్ జేఏసీ నేత శ్రీనివాస యాదవ్ అన్నారు. సమసమాజ నిర్మాణం కోసం, ప్రజల క్షేమం కోసం..అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకుడని కొనియాడారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో గద్దర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆయన నిర్ణయంపైనే ఆధార పడుతుందన్నారు. 

12:36 - September 14, 2015

ప్రకాశం : గండేపల్లి ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమే కనబడుతోందని ఏపీ మంత్రి శిద్ధా రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం గండేపల్లి వద్ద లారీ బోల్తా పడిన ఘటనలో 16 మంది కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాద వార్త తెలుసుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన ఐదు నిమిషాల్లో లారీని పైకి తీయడం జరిగిందన్నారు. దాని కింద నున్న వారిని రక్షించారని, డ్రైవర్ నిద్రపోవడం వల్లే ఇది జరిగిందన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదం జరగుకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.25వేలు అందచేయడం జరుగుతుందని మంత్రి శిద్ధా పేర్కొన్నారు. 

12:33 - September 14, 2015

కాకినాడ : ఏపీ రాష్ట్రంలో భూ సేకరణ న్యాయబద్ధంగానే జరుగుతుందని, కేవలం పది శాతం మంది రైతులు అడ్డుకుంటున్నారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ వచ్చిన సందర్భంగా ఆయన టెన్ టివితో ముచ్చటించారు. రాజధానికి 33వేల ఎకరాల భూముల సేకరణ చేయడం దేశంలో ఎక్కడ చేయలేదని, ఆదర్శవంతంగా చేయడం జరిగిందన్నారు. ఇష్టం లేని వారు వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాజధానిలో ఇంకా 16వందల ఎకరాలు సేకరించాల్సి ఉందని, ఇందులో సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని, భోగాపురం, మచిలీపట్నం ప్రజలతో చర్చిస్తామని స్పష్టం చేశారు. గండేపల్లి ప్రమాద ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలు, పేదలు లారీలలో ప్రయాణించడం సరికాదని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అలాగే వ్యవహరిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ప్రత్తిపాటి సూచించారు. 

గండేపల్లి మృతుల బాధితుల ఆందోళన..

రాజమండ్రి : మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని గండేపల్లి బాధితులు ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం గండేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరికి ఏపీ ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.25వేలు అందచేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

12:26 - September 14, 2015

రాజమండ్రి : గండేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై విచారణ జరిపిస్తామని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప వెల్లడించారు. సోమవారం ఉదయం గండేపల్లి వద్ద లారీ బోల్తా పడిన ఘటనలో 16 మంది కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాద వార్త తెలుసుకున్న చిన రాజప్ప హుటాహుటిన రాజమండ్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరగడం దురదృష్టకరమని, విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రెండు లక్షలు..క్షతగాత్రులకు రూ.25వేలు అందచేయడం జరుగుతుందన్నారు. వీరిని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన వారు ఏలూరు వద్ద లారీ ఆపి ఎక్కారని తెలిపారు. కానీ ప్రమాదంలో 16 మంది చనిపోగా 9 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మద్యం సేవించి నడిపాడా లేదా అన్నది విచారణలో తేలుతుందన్నారు. దీనిపై సుబ్రమణ్యం కమిటీని నియమించారని, నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని హోం మంత్రి చిన రాజప్ప స్పష్టం చేశారు. 

12:19 - September 14, 2015

ఎంపిక చేసుకునే చిత్రాల్లో, పాత్రల్లో ఎప్పటికప్పుడు తనదైన వైవిధ్యాన్ని చూపుతూ విశేష ప్రేక్షకాదరణ పొందిన నటిగా బాలీవుడ్‌లో విద్యాబాలన్‌కు మంచి గుర్తింపు ఉంది. ఐటెమ్‌ స్పెషలిస్ట్‌గా పేరొందిన శృంగార తార సిల్క్‌స్మిత జీవిత కథ ఆధారంగా రూపొందిన 'డర్టీ పిక్చర్‌'లో నటించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విద్యాబాలన్‌ తాజాగా మరో బయోపిక్‌లో నటిస్తున్నారు. సినీ పరిశ్రమలో స్వర్గయుగంగా చెప్పుకునే కాలంనాటి నటుడు, దర్శకుడు భగవాన్‌ దాదా జీవిత కథ ఆధారంగా మరాఠిలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో అలనాటి అందాల తార గీతాబాలిగా విద్యాబాలన్‌ ప్రేక్షకుల్ని అలరించనున్నారు. 1951లో గీతాబాలి నటించిన సంగీత ప్రధాన చిత్రం 'అల్‌బెలా' చిత్రానికి భగవాన్‌ దాదా దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా విడుదల కోసం భగవాన్‌ దాదా ఎదుర్కొన్న సమస్యలేమిటి? ఆ సినిమా విడుదల కోసం ఆయనెందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? అనే అంశాలతోపాటు భగవాన్‌ దాదా జీవితంలోని కొన్ని ముఖ్యఘట్టాలను ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'ఈ బయోపిక్‌లో గీతాబాలిగా అతిథి పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది కేవలం అతిథి పాత్రే అయినప్పటికీ పాత్ర తాలూకా ప్రాధాన్యత చాలా ఉంటుంది. అందుకే ఈ చిత్రంలో నటించేందుకు వెంటనే అంగీకరించాను' అని విద్యాబాలన్‌ చెప్పారు.

 

లారీల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు : పత్తిపాటి

కాకినాడ : గండేపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి పత్తిపాటి పుల్లారావు విచారం వ్యక్తం చేశారు. లారీల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొగాకుకు గిట్టుబాటు ధరపై రేపు సాయంత్రంలోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

 

ఇద్దరు కల్తీ కల్లు బాధితుల మృతి

నిజామాబాద్ : ఇద్దరు కల్తీ కల్లు బాధితులు మృతి చెందారు. కల్లు లేకపోవడంతో వినాయక్ నగర్ లో ఇద్దరు మతిస్థిమితం కోల్పోయి మృతి చెందారు. మృతులు శంకర్, నర్సయ్యలుగా గుర్తించారు. గతంలోనే ఒకరు మృతి చెందారు. 

11:57 - September 14, 2015

పశ్చిమ బెంగాల్ : జల్ఫాయ్ గురి జిల్లాలోని గొరుమార అడవి ప్రాంతం..31వ నెంబర్ జాతీయ రహదారి..ఆ రోడ్డుపై ఎక్కడి నుండో ఏనుగు వచ్చింది.. ఆ రహదారిపై వెళుతున్న వారందరూ ఆగిపోయారు..తరువాత అదే సమయంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు ఆ రోడ్డు గుండా వచ్చారు. ఏనుగును దాటి పోవాలని ప్రయత్నించారు. ఇంకేముంది వీరిని ఏనుగు చూసేసింది. వేగంగా అడుగులు వేస్తూ వారి సమీపానికి వచ్చింది. బైకును కిందపడేసింది. భయకంపితులైన ఆ వ్యక్తుల్లో ఒకరు పొదల్లోకి దూకాడు. ఇంకోతను పారిపోయే క్రమంలో కింద పడ్డాడు. కానీ ఏనుగు దృష్టి మాత్రం బైక్ పైనే పడింది. దీనిని గమనించిన పడిపోయిన వ్యక్తి కాళ్లకు పని చెప్పాడు. బైక్ ను ఏనుగు ధ్వంసం చేసింది. ఈ ఘటనంతా ఓ ప్రయాణీకుడు వీడియో తీసి సామాజిక సైట్ లో పెట్టాడు.

బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్టు..

హైదరాబాద్ : ఎల్ బి నగర్ లో బాలుడి కిడ్నాప్ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం బాలుడిని కిడ్నాప్ చేసి.. నలుగురు కిడ్నాపర్లు కోటి రూపాయలు డిమాండ్ చేశారు.

 

మలక్ పేట ఎన్ఆర్ఐ ఇంట్లో చోరీ..

మలక్ పేట : ఆస్మాన్ గఢ్ లో ఎన్ఆర్ఐ ఇంట్లో చోరీ జరిగింది. కిలోన్నర బంగారం, ఐదు వేల యూఎస్ డాలర్లు, రూ.2లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు. 

విద్యార్థి, యువత విభాగాల అధ్యక్షులతో జగన్ భేటీ..

హైదరాబాద్ : లోటస్ పాండ్ లో వైసీపీ విద్యార్థి, యువత విభాగాల అధ్యక్షులతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ భేటీ అయ్యారు. 

బీవీఎస్ఆర్ కాలేజీ ఛైర్మన్, హెచ్ వోడీ అరెస్టుకు నిరసనగా ఆందోళనలు..

ప్రకాశం : చీమకుర్తి బీవీఎస్ఆర్ కాలేజీ ఛైర్మన్, హెచ్ వోడిని అక్రమంగా అరెస్టు చేశారంటూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించేందుకు కాలేజీ డ్రైవర్ యత్నించాడు. 

11:15 - September 14, 2015

శ్రీకాకుళం : థర్మల్ ప్రభావిత ప్రాంతాల్లో వామపక్ష నేతలు పర్యటిస్తున్నారు. ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు వివిధ వామపక్ష సంతబొమ్మాళిలోని భావనపాడులో వామపక్ష పార్టీల నేతలు పర్యటించారు. ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనకు ప్రజల నుండి బాగానే స్పందన వస్తోంది. ఈ సందర్భంగా నేతలు ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. కాకరాపల్లి థర్మల్ పవర్ బాధితులకు అండగా ఉంటామని నేతలు స్పష్టం చేశారు. మత్స్యకారుల పొట్టే కొట్టే ప్రాజెక్టలకు అనుమతిచ్చేది లేదని మధు స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా పాలన - రామకృష్ణ..
భూ సమస్యలపై పోరాటం చేసే హక్కును ప్రభుత్వం హరిస్తోందని రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా ప్రభుత్వం హరిస్తోందని, ర్యాలీలు, బహిరంగసభలు పెట్టుకోకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జగన్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నా అనుమతినివ్వలేదని గుర్తు చేశారు. అప్రజాస్వామికంగా పరిపాలన చేయాలని అనుకుంటే ఎన్నో రోజులు పాలన కొనసాగదని ఆయన స్పష్టం చేశారు. 

ముంబై బయల్దేరిన టీ.కేబినెట్ సబ్ కమిటీ

ముంబై : తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ ముంబై బయలు దేరింది. గుజరాత్-మహారాష్ట్ర సరిహద్దులోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల నిర్వహణను సబ్ కమిటీ సభ్యులు అధ్యయనం చేయనున్నారు. కమిటీలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల రాజేందర్, ఎంపీ బాల్కసుమన్ లు ఉన్నారు. 

10:59 - September 14, 2015

న్యూయార్కు : మూడేళ్ల నిరీక్షణకు తెరపడలేదు..ఈసారి కూడా నిరాశ తప్పలేదు..విజయం దక్కుతుందని ఆశించాడు..కానీ నెరవేరలేదు..స్విస్ యోధుడు 'ఫెదరర్' గ్రాండ్ స్లామ్ కల చెదిరింది. యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్స్ ను సెర్బియో ఆటగాడు 'జకోవిచ్' ఎగురేసుకపోయాడు. ఫైనల్ మ్యాచ్ లో నాలుగు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో 'జకోవిచ్' దే పై చేయి అయ్యింది. 6-4, 5-7, 6-4, 5-4 తేడాతో 'జకోవిచ్' విన్ అయ్యాడు. ఈ ఏడాది తన ఖాతాలో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ వేసుకున్నాడు.
వరల్డ్ నెంబర్ 1, నెంబర్ 2 స్థానాల్లో ఉన్న జకోవిచ్, ఫెదరర్ ఆట అభిమానులను ఎంతగానో అలరించిందని చెప్పవచ్చు. నువ్వా..నేనా..అన్నట్లుగా మ్యాచ్ కొనసాగింది. తొలి రౌండ్ నుండి ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తూ ఫైనల్ కు చేరుకున్న ఫెదరర్ జకోవిచ్ ముందు తలవంచక తప్పలేదు. ఈ ఏడాది వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్లను కైవసం చేసుకున్న జకోవిచ్ యూఎస్ ఓపెన్ ను కూడా సొంతం చేసుకోవడం విశేషం. యూఎస్ ఓపెన్ లో జకోవిచ్ కిది రెండో టైటిల్ కాగా, ఓవరాల్ గా తన కెరీర్ లో పదో గ్రాండ్ స్లామ్ టైటిల్. 

10:56 - September 14, 2015

రామ్‌, రాశీఖన్నా హీరో హీరోయిన్స్‌గా కృష్ణ చైతన్య సమర్పణలో శీ స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం 'శివమ్‌'. నూతన దర్శకుడు శీనివాసరెడ్డి దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగింది. బిగ్‌ సీడీ, ఆడియో సీడీలను అల్లు అరవింద్‌ విడుదల చేశారు. తొలి సీడీని దేవిశ్రీప్రసాద్‌ అందుకున్నారు. థియేట్రికల్‌ ట్రైలర్‌ను దేవిశ్రీప్రసాద్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో రామ్‌ మాట్లాడుతూ..'స్రవంతి మూవీస్‌ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. పెద్దనాన్న నాకెప్పుడూ బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. ప్రతి హీరో, నిర్మాత డైరీలో తన పేరు ఉండేంతగా శ్రీనివాసరెడ్డి పెద్ద దర్శకుడవుతాడు. 'జగడం', 'రెడీ' తర్వాత నేను, దేవి 'శివమ్‌' సినిమాలో మళ్ళీ కలిసి చేస్తున్నాం. రసూల్‌ ఎల్లోర్‌గారు బ్యూటిఫుల్‌ సినిమాటోగ్రఫీని అందించారు. సినిమా మంచి ఎంటర్‌టైనింగ్‌గా ఉండి అందరికీ నచ్చుతుంది' అని అన్నారు. 'రవికిషోర్‌ సిన్సియర్‌ నిర్మాత. ప్యాషన్‌ ఉన్న నిర్మాతల్లో ఒకరు. రామ్‌, డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డికి ఇతర టీమ్‌ మెంబర్స్‌కి ఆల్‌ ది బెస్ట్‌' అని అల్లు అరవింద్‌ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ,'దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన హీరో రామ్‌, రవికిషోర్‌గారికి జీవితాంతం ఋణపడి ఉంటాను' అని అన్నారు. 'స్రవంతి వంటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌లో నేను కూడా ఓ భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి ఎంటర్‌టైనర్‌. కన్‌ఫర్మ్‌గా హిట్టవుతుంది' అని దేవిశ్రీప్రసాద్‌ చెప్పారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ ''నేను, రవికిషోర్‌ ఒకేసారి జర్నీని స్టార్ట్‌ చేశాం. చాలా మంది గొప్ప టెక్నిషియన్స్‌ పనిచేసిన ఈ సంస్థలో ఎనభై పాటలను రాయడం ఆనందంగా ఉంది' అని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా దిల్‌రాజు, ఎస్‌.వి.కృష్ణారెడ్డి, బ్రహ్మానందం, వంశీ, తనికెళ్ళ భరణి, హరి అనుమోలు, వేమూరి సత్యనారాయణ, కె.విజరుభాస్కర్‌, అశోక్‌ కుమార్‌, కొడాలి వెంకటేశ్వరరావు, ప్రతాని రామకృష్ణ గౌడ్‌, రసూల్‌, ఆర్డ్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌, ఎడిటర్‌ మధు తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు.

 

రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ లొంగుబాటు

విశాఖ : తూర్పుగోదావరి గండేపల్లిలో రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ నక్కపల్లి పీఎస్ లో లొంగిపోయారు. 

కాసేపట్లో గద్దర్ ను కలవనున్న ప్రజాసంఘాల నేతలు

హైదరాబాద్ : కాసేపట్లో దళిత, మైనారిటీ, గిరిజన ప్రజా సంఘాల నేతలు ప్రజా గాయకుడు గద్దర్ ను కలవనున్నారు. వరంగల్ పార్లమెంట్ లోకల్ బైపోల్ లో పోటీ చేయాలని కోరనున్నారు. 

సిలిండర్ పేలుడు బాధితులను కలువనున్న చౌహాన్..

మధ్యప్రదేశ్ : జబువా ప్రాంతంలోని రెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ పరామర్శించనున్నారు. శనివారం ఉదయం రెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో 104 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. 

గండేపల్లి ప్రమాద ఘటనపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

విజయవాడ : గండేపల్లి రోడ్డు ప్రమాదంపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి పరిహారం అందించే ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

తీగల కృష్ణారెడ్డి-అతని కుమారులపై మహిళ ఫిర్యాదు

హైదరాబాద్ : ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, అతని కుమారులపై మీర్ పేట పీఎస్ లో జయశ్రీ అనే మహిళ ఫిర్యాదు చేసింది. తన భూమిని కబ్జా చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు.

 

10:18 - September 14, 2015

అనంతపురం : కన్నతల్లిదండ్రులు కసాయిలుగా మారుతున్నారు. కొందరు వాతలు పెడుతూ..మరికొందరు చిత్ర హింసలకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ తండ్రి ఏకంగా నాలుగేళ్ల కుమారుడి గొంతు కోశాడు. ఈ ఘటన జిల్లాలోని తాడిపత్రిలో చోటు చేసుకుంది. అంబేద్కర్ నగర్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి శశాంక్ అనే నాలుగేళ్ల బాలుడున్నాడు. మద్యానికి బానిసైన అతడు భార్యపైనే ఆధారపడే వాడని స్థానికులు పేర్కొంటున్నారు. నిత్యం ఇంట్లో ఏవో గొడవలు జరుగుతుండేవని తెలిపారు. ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి చాలా సేపు ఏడ్చిన శశాంక్ పై తెల్లవారుజామున తన భర్త కత్తితో గొంతు కోశాడని సరస్వతి పేర్కొంది. వెంటనే అరుపులు..కేకలు వేయడం జరిగిందన్నారు. వెంటనే స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న తండ్రిని మధ్యాహ్నాం కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. 

నాలుగేళ్ల కుమారుడి గొంతు కోసిన తండ్రి..

అనంతపురం : తాడిపత్రిలో ఓ తండ్రి నాలుగేళ్ల కుమారుడిపై కత్తితో దాడి చేశాడు. గొంతుపై తీవ్ర గాయం కావడంతో బాలుడిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. దాడి చేసిన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

రాజమండ్రి సర్కార్ ఆసుపత్రికి 16 మృతదేహాలు..

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందిన 16 మంది మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరికి పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

గండేపల్లి ఘటనపై జగన్ దిగ్ర్భాంతి..

హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన 16 మంది మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

వనస్థలిపురంలో ఛైన్ స్నాచింగ్..

హైదరాబాద్ : వనస్థలిపురంలో ఇంటి ఎదుట పూలు కోస్తున్న వృద్ధురాలి మెడలో నుండి ఆరు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు తెంపుకపోయారు. ఈ ఘటనలో వృద్ధురాలికి గాయాలయ్యాయి.

తుంగభద్ర డ్యాముకు వరద నీరు..

కర్నూలు : తుంగభద్ర డ్యాముకు వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 1625.57 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 10వేల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 6వేల క్యూసెక్కులు. 

సుంకేశుల డ్యాముకు వరద ఉధృతి..

కర్నూలు : సుంకేశుల డ్యాముకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇన్ ఫ్లో 19, 500 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 16 వేల క్యూసెక్కులుగా ఉంది. కేసీ కెనాల్ కు 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం నీటి మట్టం 0.917 టీఎంసీలు ఉండగా పూర్తిస్థాయి నీటి మట్టం 1.2 టీఎంసీలు. 

విజయవాడ నుండి వైద్యుల రిజిస్ట్రేషన్లు..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పరిపాలన విభాగం ప్రారంభమైంది. మరో పది రోజుల్లో పనులు మొదలు కానున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 

పోలవరం కాలువ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం..

విజయవాడ : పోలవరం కాలువ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించింది. చిన్న పాటి వర్షానికే నున్న వద్ద చిన్న వంతెన కొట్టుకపోయింది. అధికారులు మర్మమత్తులు చేస్తున్నారు. 

09:38 - September 14, 2015

కర్నూలు : జిల్లాలోని కల్లూరులో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టి ఆయన్ను గృహ నిర్భందం చేశారు. పరిశ్రమల పేరిట రైతుల నుండి సౌరవంతమైన భూములు లాక్కోవడాన్ని నిరసిస్తూ ఓర్వకల్లు నుండి కలేక్టరేట్ వరకు ఎడ్లబండితో ర్యాలీ నిర్వహించాలని బైరెడ్డి తలచారు. అందులో భాగంగా ఆయన సోమవారం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ పోలీసులు ఆయన్ను గృహ నిర్భందం చేశారు. పోలీసుల వైఖరి పట్ల ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తీసుకుంటున్న భూములకు సరియైన విధంగా నష్టపరిహారం ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. తన నివాసం ఎదుటైనా సరై ఆందోళన చేస్తానని బైరెడ్డి స్పష్టం చేస్తున్నారు. 

09:34 - September 14, 2015

విశాఖపట్టణం : తూర్పుగోదావరి జిల్లాలోని గండేవల్లిలో జరిగిన ఘటన మరువకముందే విశాఖపట్టణంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈప్రమాదంలో ప్రాణనష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ కొంతమంది పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బ్రాండిక్ కంపెనీకి ఓ బస్సు ఉద్యోగులను షిఫ్టుల వారీగా తరలిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఉద్యోగులతో వెళ్లిన బస్సు కె.కోటపాడు (మం), భట్టివానిపాలెం వద్ద ఓ ద్విచక్రవాహానాన్ని తప్పించబోయి అదుపుతప్పింది. నేరుగా చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందుతున్న వారిలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని కొంతమందిని విశాఖపట్టణానికి తరలిస్తున్నట్లు సమాచారం.

09:28 - September 14, 2015

వరంగల్ : ప్రజా గాయకుడు గద్దర్ ను వివిధ ప్రజా సంఘాల నేతలు కాసేపట్లో కలువనున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని ఈ సందర్భంగా గద్దర్ పై ప్రజా సంఘాలు వత్తిడి తేనున్నట్లు సమాచారం. ఇటీవలే వరంగల్ ఎంపీ స్థానానికి కడియం శ్రీహరి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనితో తాము కూడా అభ్యర్థిని నిలబెడుతామని పది వామపక్ష పార్టీలు ప్రకటించాయి. అందులో భాగంగా అభ్యర్థి గద్దర్ సరియైన వ్యక్తి అని పార్టీలు భావించాయి. ఇందుకు సంబంధించిన తీర్మానం కూడా చేసి గద్దర్ తో చర్చలు ప్రారంభించాయి. కానీ చర్చల్లో ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ప్రజా సంఘాలు..ప్రజలు కోరితే తాను పోటీ చేస్తానని గద్దర్ పేర్కొన్నారని తెలుస్తోంది. ఈమేరకు సోమవారం 18 ప్రజా సంఘాల నేతలు గద్దర్ నివాసానికి భారీ ర్యాలీగా తరలివెళ్లనున్నారు. అనంతరం వరంగల్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని ఆయనపై వత్తిడి తేనున్నట్లు సమాచారం. ఇందులో దళిత, మైనార్టీ, గిరిజన, ఉద్యోగ, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఇతర సంఘాల నేతలు తరలిరానున్నారు. మరి గద్దర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కొద్దిసేపట్లో తేలనుంది. 

నేడు గుజరాత్ సీఎంతో హార్ధిక్ పటేల్ భేటీ..

గుజరాత్ : పటేళ్ల ఉద్యమ సారధి హార్దిక్ పటేల్ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ తో గాంధీ నగర్ లో భేటీ కానున్నారు. 

విద్యార్థి అనూష వేధింపుల కేసులో ఇద్దరు అరెస్టు..

ప్రకాశం : విద్యార్థిని అనుషను వేధించిన కేసులో బీవీఎస్ ఆర్ కాలేజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, హెచ్ఓడీ మాలకొండరెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. 

08:37 - September 14, 2015

నెల్లూరు : జిల్లాలోని వెంకటగిరిలో ఉన్న టెంకాయల దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పోలేరమ్మ గుడి దగ్గర ఓ వ్యక్తి టెంకాయల దుకాణం నిర్వహిస్తున్నాడు. వచ్చే నెల ఆలయ జాతర జరుగుతుండడంతో దుకాణ యజమాని టెంకాయలు, కర్పూరం, నెయ్యి ఇతర సామాగ్రీని తెప్పించి దుకాణంలో నిల్వ చేశాడు. ఆదివారం రాత్రి అకస్మాత్తుగా దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణంలో ఉన్న సామాగ్రీ అంతా అగ్నికి ఆహుతైంది. ఈ విషయం తెలుసుకున్న యజమాని కన్నీరుమున్నీరయ్యాడు. పెద్ద నష్టమే జరిగిందని వాపోయాడు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. 

కాసేపట్లో గద్దర్ తో ప్రజా సంఘాల భేటీ..

హైదరాబాద్ : ప్రముఖ కవి, గాయకుడు గద్దర్ తో ప్రజా సంఘాలు భేటీ కాబోతున్నాయి. వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని గద్దర్ పై ప్రజా సంఘాలు వత్తిడి చేస్తున్నాయి. 

08:23 - September 14, 2015

తూర్పుగోదావరి : గండేపల్లి వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన 16 మంది కూలీల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గండేపల్లి వద్ద ఎన్‌హెచ్‌ - 16పై సిమెంట్‌ లారీ బోల్తా పడడంతో 16 మంది మృతి చెందారు. మరో 16 మందిని పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. మరో ఇద్దరి ఆచూకి తెలియాల్సి ఉంది. మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడంతో రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రి, కాకినాడ, పెద్దాపురం ప్రాంతాల నుండి వైద్యులను రప్పిస్తున్నారు. బంధువులకు సమాచారం అందడంతో రాజమండ్రికి చేరుకుంటున్నారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అతి వేగంగా నడపడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గాయపడిన వారిని ఆదుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని మంత్రి యనమల స్పష్టం చేశారు.

08:17 - September 14, 2015

తూర్పుగోదావరి : జిల్లాలోని గండేపల్లి మండలం మురారి గ్రామ శివారున జరిగిన ప్రమాదంపై మంత్రి యనమల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి రెండు లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే సీఎంతో మాట్లాడి వీలైనంత వరకు ఆ కూలీల కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు. అలాగే చనిపోయిన కుటుంబాల్లో చదువుకున్న వారు ఉన్నట్లైతే ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.
గండేపల్లి వద్ద ఎన్‌హెచ్‌ - 16పై సిమెంట్‌ లారీ బోల్తా పడడంతో16 మంది మృతి చెందారు. మరో 16 మందిని పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. మరో ఇద్దరి ఆచూకి తెలియాల్సి ఉంది. ఘటన విషయం తెలుసుకున్న ఆర్థిక మంత్రి యనమల ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లారీలో 36 మంది కూలీలున్నట్లు తేలుతోందని, నూజీవూడు పనుల మీదకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి వచ్చారని పేర్కొన్నారు. స్పాట్ లోనే 16 మంది చనిపోయారని, 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఇద్దరు..ముగ్గురు కనబడడం లేదని తెలుస్తోందన్నారు. ప్రమాదాలపై ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది కానీ కొంతమంది డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఉంటున్నారని తెలిపారు. ప్రమాద ఘటనను కూడా రాజకీయం చేయడం మంచిది కాదని యనమల సూచించారు. 

గండేపల్లి ఘటనపై సీఎం బాబు దిగ్ర్భాంతి..

తూర్పుగోదావరి : జిల్లా గండేపల్లి వద్ద అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద జరిగిన తీరుపై ఫోన్ చేసి ఆరా తీశారు.

08:02 - September 14, 2015

ముంబై : స్టాక్ మార్కెట్లు ఒక రోజు పతనం..మరొక రోజు కొంత లాభాలు..భారీగా షేర్ల పతనం..లక్షల కోట్ల రూపాయల ఆవిరి..అయితేనేం తమకు ఏమీ కావడం లేదని నిరూపిస్తున్నారు దేశంలోని కుబేరులు..ఈ కుబేరులు భారీ మొత్తంలో భవనాలను కొనుగోళ్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే కుమార మంగళం బిర్లా ముంబైలోని మలబార్ హిల్స్ లో ఉన్న 'జాతీయ హౌజ్' ను రూ.425 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రికార్డును పుణెకు చెందిన పారిశ్రామిక వేత్త 'సైరస్ పూణావాలా' బద్ధలు కొట్టాడు. ఏకంగా రూ.750 కోట్లు పెట్టి ఓ భవనాన్ని కొనుగోలు చేశాడు. దక్షిణ ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ప్రాంతంలో ఉన్న లింకన్ హౌజ్.. కొన్ని దశాబ్దాల పాటు అమెరికా కాన్సులేట్ కార్యాలయంగా ఉండేది. రెండు ఎకరాల్లో, 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన లింకన్ హౌజ్‌ను గ్రేడ్-3 చారిత్రక భవనాల జాబితాలోకి చేర్చారు. అమెరికా ప్రభుత్వం 2011లో కాన్సులేట్‌ను బీకేసీకి మార్చింది. అప్పటి నుంచే ఈ భవానాన్ని అమ్మకానికి పెట్టారు. గ్రేడ్‌ 3 వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ భవనాన్ని కనీసం రూ.850 కోట్లకైనా అమ్మాలని అమెరికా భావించింది. అయితే మార్కెట్‌ అంత ఆశాజనకంగా లేకపోవడంత చివరికి రూ. 750 కోట్లతో తృప్తి పడాల్సి వచ్చింది. అయితే ఈ గ్రేడ్ బిల్డింగ్‌లను పునరుద్ధరించేందుకు అనుమతి ఉంది. లింకన్ హౌజ్‌ను కుటుంబ నివాసంగా మార్చుకోవాలని పూణావాలా భావిస్తున్నారట. 

07:59 - September 14, 2015

కేంద్రం పొగాకు రైతుల ఉసురు తీస్తోంది. కొనుగోళ్లలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పినా వారి గోడు వినే నాథుడే కరువయ్యారు. ప్రత్యామ్నాయాలను రైతు సంఘాలు సూచిస్తున్నా స్పందించడం లేదు. దీనితో నష్టాల ఊబిలో కూరుకపోయిన రైతులు అప్పులు తీర్చే మార్గం లేదక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యూనివర్సిటీలో విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ ప్రయత్నిస్తోందని సదస్సులు..సమావేశాలు పెట్టవద్దని మంత్రి గంటా ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో శ్రీరాములు (టిడిపి), తెలకపల్లి రవి (విశ్లేషకులు), గౌతమ్ రెడ్డి (వైసీపీ), గౌతమ్ (ఎపిసిసి ప్రధాన కార్యదర్శి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

గండేపల్లిలో 19 మంది మృతి..

తూర్పుగోదావరి : గండేపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది కూలీలు మృతి చెందారు. మృతులు తొండంగి, ప్రత్తిపాడు, తుని, రౌతులపూడి వాసులుగా గుర్తించారు. నిద్రమత్తు, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదమని తెలుస్తోంది.
మృతులు : త్రినాథ్, గాదె దొరబాబు, కొండబాబు, త్రిమూర్తులు, శివకృష్ణ, సురేష్, వెలుగుల సూరిబాబు, గొల్లపల్లి దొరబాబు, సత్యనారాయణ, వీరబాబు, దర్ల సూరిబాబు, వెంకన్న, నాగబాబు, రాంబాబు, బాబ్జీ.

దంపతులపై దుండగుల దాడి..

ప్రకాశం : కందుకూరు నియోజకవర్గంలోని సింగరబొట్లవారిపాలెంలో దంపతులపై దుండగులు దాడి చేశారు. ఈఘటనలో భర్త పుల్లారావు (45) మృతి చెందాడు. అనుమానంతో పోలీసులు భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

గండేపల్లి మృతుల కుటుంబాలను ఆదుకుంటాం - యనమల..

తూర్పుగోదావరి : జిల్లా గండేపల్లి వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో చనిపోయిన కూలీల కుటుంబాలను ఆదుకుంటామని ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల ప్రకటించారు. ఘటన జరిగిన తీరుపై ఆయన ఆరా తీశారు. సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు. చనిపోయిన వారికి రెండు లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు, సీఎంతో మాట్లాడి ఆ కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు.

 

గండేపల్లి ప్రమాద ఘటనను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

తూర్పుగోదావరి : గండేపల్లి ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్, వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూలు పరిశీలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ రవిప్రకాశ్ వెల్లడించారు. 

మెదక్ లో పర్యటించనున్న ఎస్టీ కమిషనర్..

మెదక్ : నేటి నుండి మూడు రోజుల పాటు జిల్లాలో ఎస్టీ కమిషనర్ పర్యటన జరుగనుంది. సంగారెడ్డి కలెక్టరేట్ లో ఎస్టీ సమస్యలపై సమీక్ష జరుపనున్నారు.

రేపే బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ..

చిత్తూరు : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రేపు అంకుర్పారణ జరుగనుంది. మంగళవారం సాయంత్రం శ్రీవారి సర్వ సేనాధిపతి విశ్వక్సేనుల వారి ఊరేగింపు జరుగనుంది.

 

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటలు..నడక దారి భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. 

గండేపల్లి ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం ?

తూర్పు గోదావరి : గండేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి డ్రైవన్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా 35 మందిని ఎక్కించుకోవడమే కాకుండా మితిమీరిన వేగంతో ప్రయాణించాడని తెలుస్తోంది. 

గండేపల్లికి బయలుదేరిన ఏపీ హోం మంత్రి..

హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాద వార్త తెలుసుకున్న ఏపీ హోం మంత్రి చినరాజప్ప సంఘటనా స్థలానికి బయలుదేరారు. 

విశాఖలో ప్రైవేటు బస్సు బోల్తా..

విశాఖ : కె.కోటపాడు (మం) భట్టివానిపాలెం వద్ద ఓ ప్రైవేటు కంపెనీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

06:48 - September 14, 2015

పాఠశాల విద్యార్థులకు డిటెన్షన్ భయం పట్టుకుంది. పాఠశాల స్థాయిలో డిటెన్షన్ విధానం తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అయితే, దీనిపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిటెన్షన్ విధానం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయం తెలంగాణ అఖిలపక్షంలో వ్యక్తమైంది. డిటెన్షన్ విధానంలోని మంచి చెడులపై టెన్ టివి 'జనపథం'ప్రముఖ విద్యావేత్త లక్ష్మణ్ రావు చర్చించారు.

06:46 - September 14, 2015

డిటెన్షన్ విధానం పాఠశాల విద్యార్థులకు మంచి చేస్తుందా ? కీడు చేస్తుందా ? విద్యా ప్రమాణాల పెంపుదలకు దోహదం చేస్తుందా ? పిల్లలను బాలకార్మికులుగా మార్చేస్తుందా? ఇదే అంశం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రాథమిక విద్యారంగంలో అలజడి మొదలైంది. చాలా మంది విద్యార్థుల ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పిల్లల అమ్మానాన్నల గుండెల్లో గుబులు రేగుతోంది. కనీసం పదో తరగతి వరకైనా తమ పిల్లలకు చదువుకునే అవకాశం వస్తుందో రాదోనన్న దిగులు అనేక మంది గ్రామీణ నిరుపేదల గుండెల్లో గూడుకట్టుకుంది. ఇంత భయానికి కారణం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలే. దేశ వ్యాప్తంగా డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టేందుకు చేస్తున్న కసరత్తు పెద్ద చర్చకే దారితీసింది. ఇప్పుడున్న విద్యావిధానంలో అటెండెన్స్ ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నారు. ఇక నుంచి పాసైన వారిని మాత్రమే పై తరగతికి అనుమతిస్తే ఎలా వుంటుందన్న అంశాన్ని కేంద్రం సీరియస్ గా పరిశీలిస్తోంది.

అనేక మంది బడి చూడని ఎంతో మంది..
పధ్నాలుగేళ్ల లోపు బాలబాలికలందరికీ ఉచితంగా విద్యనందించాలన్నది మన లక్ష్యం. ఆ ఆదర్శం ఇప్పటికీ వాస్తవ రూపం దాల్చలేదు. అనేక గ్రామాల్లో, పట్టణ మురికివాడల్లో అనేకమంది పిల్లలు బడి ముఖం చూడడం లేదన్నది కఠోర వాస్తవం. పశువుల కాపరులుగా, పని మనుషులుగా, పాలేర్లుగా కొన్ని లక్షల మంది పిల్లలు బతుకులీడుస్తున్నారు. కాఫీ హోటళ్లల్లో, మెకానిక్ షాపుల్లోనే అనేక ప్రమాదకర పనుల్లో బాలలతో చాకిరీ చేయించుకుంటున్న దౌర్భాగ్యం మనది. అసలు బడి ముఖమే చూడని బాల్యానికి మన దేశంలో కొదవలేదు. చదువు అబ్బకనే, చదువుకునే పరిస్థితిలేకనో అనేకమంది పిల్లలు బడిమానేస్తూనే వున్నారు. ఇలాంటి వారిని ఆకర్షించేందుకు, సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు మన దేశంలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. అది ఇంకా వంద శాతం ఫలితం ఇవ్వనే లేదు. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం, ఉన్న కొద్ది మంది ఉపాధ్యాయులను విభిన్న రకాల సర్వేలకు వినియోగించడం లాంటి కారణాలు పాఠశాల విద్యను కుంటుపరుస్తున్నాయన్నది ఎవరూ దాచలేని సత్యం.

ప్రభుత్వాల నిర్లక్ష్యాలు..
మన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల్లో చాలామందికి పదో తరగతికి వచ్చినా సరిగా అక్షరాలైనా రావడం లేదన్న విమర్శలూ వున్నాయి. అందులో కొంత వాస్తవమూ లేకపోలేదు. ఆ మాటకొస్తే ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో 60శాతం మందికి పైగా వృత్తి నైపుణ్యాలు అబ్బడం లేదంటూ పలు సర్వేలు కోడై కూస్తున్నాయి. విచిత్రంగా ప్రయివేట్ కాలేజీల్లో చదివేవారిలోనూ వ్రుత్తి నైపుణ్యాలు హీన స్థాయిలో వుంటున్నాయన్నది మరో సత్యం. ఇలాంటి నేపథ్యంలో డిటెన్షన్ విధానం తీసుకొచ్చి, పాసైన తర్వాత మాత్రమే పై తరగతుల్లోకి అనుమతిస్తే విద్యా ప్రమాణాలు పెరుగుతాయని వాదించడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి మన దేశంలో విద్యా ప్రమాణాలు అడుగంటడానికీ, వ్రుత్తి నైపుణ్యాలు లోపించడానికి ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాలే ప్రధాన కారణమన్నది వాస్తవం. అనేక ప్రభుత్వాలు తప్పనిసరి మొక్కుబడి తంతుగా పాఠశాలల ను నిర్వహిస్తున్నాయి తప్ప బోధనా ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన చర్యలేవీ తీసుకోవడం లేదు. పిల్లలందరి నాలెడ్జి లెవల్స్ ఒకేరకంగా వుండవన్నది వాస్తవం. వారు పెరిగే ఆర్థిక, సామాజిక పరిస్థితులు బడిలో ఉపాధ్యాయులు, ఇంట్లో కుటుంబ సభ్యులు పెట్టే శ్రద్ధ నాలెడ్జ్ లెవల్స్ ను నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు. చదువురాని అమ్మానాన్నలు, ఏ పూట రెక్కల కష్టంతో ఆ పూట జీవితాన్ని నెట్టుకొచ్చే అభాగ్యులు పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ తీసుకోలేరు. ఈ వాస్తవాన్ని విస్మరించి డిటెన్షన్ విధానం ప్రవేశపెడితే, అత్యధిక శాతం మంది పిల్లలు చదువులకు దూరం అవుతారన్న అభిప్రాయాన్ని ఏ ప్రభుత్వమూ పెడచెవిన పెట్టకూడదు. తమ పిల్లలు చదివిన క్లాసులే చదవాల్సి రావాల్సిన పరిస్థితి ఏ తల్లితండ్రులూ హర్షించరు. చదువు అబ్బడం లేదని తెలిసిన మరుక్షణం బడిమాన్పించి, పాలేరులుగానో, కూలీలుగానో మార్చేస్తారో తప్ప మళ్లీ మళ్లీ అదే క్లాసుకి పంపించరు. ఈ కఠోర వాస్తవం తెలిసి కూడా డిటెన్షన్ విధానం గురించి ఆలోచించడంలో అర్ధం వుంటుందా? ప్రభుత్వం తక్షణం చేయాల్సింది విద్యా ప్రమాణాల పెంపుదల గురించి ఆలోచించడం తప్ప రెక్కబొక్కలు ముదరని పిల్లలను బాలకార్మికులుగా మార్చే విధానాల గురించి కాదు. నిజంగా పిల్లల విద్యావికాసానికి తోడ్పడాలన్న ఆలోచన వుంటే చదువుల్లో వెనకబడుతున్న విద్యార్థులకు ప్రత్యేక ట్యూటర్లను నియమించడం, వారు చదువుకోవడానికి అవసరమైన వాతావరణం స్రుష్టించడం వల్ల మాత్రమే విద్యా ప్రమాణాలు పెంచగలమన్న వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఏవో కొన్ని సబ్జక్టుల్లో నిర్ణీత మార్కులు రాలేదన్న పేరుతో పై క్లాసులకు వెళ్లడాన్ని నిరాకరిస్తే ఆ పిల్లల మానసిక ప్రవర్తన మీద దాని ప్రభావం ఎలా వుంటుందోనన్న విషయాన్నీ విస్మరించడానికి వీలులేదు.

06:41 - September 14, 2015

న్యూయార్కు : యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా - మార్టినా హింగిస్ జోడీ కైవసం చేసుకుంది. వీరి జోడీ డెలాక్వా - ష్వెదోవాల పై విజయం సాధించింది. ఈ ఏడాది సానియా - హింగిస్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ మ్యాచ్‌లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సానియా జోడీ విజయం సాధించింది. ఈ విజయంతో సానియా కెరీర్‌లో 2015 మరిచిపోలేని విజయాలను నమోదు చేసింది.

హింగిస్‌ ఖాతాలో ఈ ఏడాది ఐదో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌..
డెలాక్వా-ష్వెదోవాల పై సానియా హింగిస్‌ జోడీ 6-3, 6-3 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సానియా జోడీ విజయం సాధించింది. ఈ ఏడాది సానియా-హింగిస్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇక ఈ సీజన్‌లో మార్టినా హింగిస్‌ ఇప్పటికే నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌ గెలిచింది. వీటిలో మూడు మిక్స్‌డ్‌ డబుల్స్‌ విజయాలు ఉన్నాయి. కాగా ఈ విజయంతో హింగిస్‌ ఖాతాలో ఐదో టైటిల్‌ వచ్చిపడింది.

మరిన్ని విజయాలు సాధించాలన్న కేసీఆర్..
హింగిస్‌తో భారత ఆటగాడు లియాండర్‌ పేస్‌ ఇప్పటికే మిక్స్‌డ్‌ ట్రోఫీ నెగ్గగా.. మహిళల డబుల్స్‌ టైటిల్‌ సాధించి భారత అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది సానియా - హింగిస్‌ ద్వయం. కాగా సానియాకు తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. 

06:37 - September 14, 2015

కృష్ణా : మక్కా మసీదులో జరిగిన ప్రమాదంలో చనిపోయిన భారతీయుల సంఖ్య 11కు పెరిగింది. వీరిలో ఇద్దరు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన దంపతులు ఉన్నట్లు తేలింది. దీంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే మృతుల్లో ఏపీకి చెందిన వారు నలుగురు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పవిత్ర హజ్‌ యాత్రకు వెళ్లిన వారు ఇలా విగత జీవులుగా మారినందుకు కుటుంబసభ్యులు భోరుమంటున్నారు.

నలుగురు ఏపీ వారే...
మక్కాలో జరిగిన దుర్ఘటనలో మరణించిన వారిలో నలుగురు ఏపీకి చెందిన వారే. ఇద్దరు కడపకు చెందిన షమీన్‌ బాను, ఖాదర్‌ బీ కాగా.. మరో ఇద్దరు అబ్దుల్‌ ఖాదర్‌, ఫాతిమా ఉన్నీసా దంపతులు. మక్కాలో వీరితోపాటు ఒకే హోటల్లో బస చేసిన విజయవాడ యువకుడి సాయంతో వీరు ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందినవారుగా గుర్తించారు. రెండు రోజులుగా వీరు హోటల్‌కు రాకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించిన ఆ యువకుడు వీరిని గుర్తించాడు. దీంతో, అధికారులు ఖాదర్‌, ఫాతిమాల మృతిని ధ్రువీకరించారు.

4వ తేదీన యాత్రకు పయనం..
మచిలీపట్నంలోని ఇంగ్లీషు పాలేనికి చెందిన ఖాదర్‌.. తమ ఇద్దరు పిల్లలను తన తల్లిదండ్రుల వద్ద వదిలి మరో ఏడుగురితో కలిసి ఈ నెల నాలుగో తేదీన భార్యతో సహా హజ్‌ యాత్రకు పయనమయ్యారు. ప్రమాదం జరిగే ముందే చివరిసారిగా ఖాదర్‌.. మచిలీపట్నంలోని తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ తరువాత.. తమకు ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. చివరకు ఖాదర్‌ దంపతుల మృతిని ధ్రువీకరించారు.

బాబు దిగ్ర్భాంతి..
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. కాగా.. ఈ దుర్ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు ఆ షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. గుంటూరు జిల్లా నుంచి 383 మంది.. కృష్ణా జిల్లా నుంచి 253 మంది మక్కా యాత్రలో ఉన్నారు. జరిగిన దుర్ఘటనతో వారంతా తీవ్రవిషాదంలో మునిగిపోయారు. హైదరాబాద్‌ నుంచి మక్కాయాత్రలో పాల్గొన్న 5438 మంది సహా.. మొత్తం 85 వేల 909 మంది భారతీయ యాత్రికులు ప్రస్తుతం మక్కాలో ఉన్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 11కు పెరిగింది. యాత్రకు వచ్చి ఆచూకీ గల్లంతయినవారి బంధువులు, ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్లతో మాట్లాడిన భారతీయ అధికారులు.. ఖాదర్‌, ఫాతిమా కాక మరో 9 మంది భారతీయులు మరణించినట్టు ధ్రువీకరించారని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తెలిపారు. మృతులకు మక్కాలోనే అంతిమ సంస్కారాలు చేయాలా లేదా స్వదేశానికి మృతదేహాలు తరలించాలా అనే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నారు.

06:32 - September 14, 2015

విజయనగరం : భోగాపురం ఎయిర్‌పోర్టు వ్యవహారం.. పరిసర గ్రామాల్లో హైటెన్షన్‌ను రేపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు లాక్కోవాలని ప్రభుత్వం.. చచ్చినా ఇచ్చేది లేదంటూ గ్రామస్థులు.. పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు, ఇప్పుడు నేరుగా రైతులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దశలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిసర గ్రామాల్లోని చిన్నా పెద్ద ఏకమవుతున్నారు. ఒక్క అధికారినీ తమ గ్రామంలోకి అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరిస్తున్నారు.

పది కోట్ల విడుదల..
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేసింది. సాధ్యమైనంత త్వరగా భూసేకరణ చేసి, విమానాశ్రయ పనులు ఆరంభించాలన్న దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే భూసేకరణకు ప్రభుత్వం పది కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆగస్టు 31న భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు, అభ్యంతరాలకు 60 రోజులు గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రైతులకు నేరుగా నోటీసులు జారీ చేసేందుకు రెడీ అవుతున్నారు. భూసేకరణ నిమిత్తం విజయనగరంలో ఒక ప్రత్యేక కార్యాలయాన్ని కూడా తెరిచారు. ముగ్గురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సహా, 45 మంది అధికారులను భూసేకరణ కోసం నియమించారు. భోగాపురం విమానాశ్రయానికి 5,311 ఎకరాల భూమిని సేకరించనున్నారు. భూసేకరణలో తొమ్మిది పంచాయితీలకు సంబంధించి 1,205 కుటుంబాల్లో 4,748 మంది ఇళ్లు ఖాళీ చేయాల్సి వుంటుంది. పునరావాసం కింద ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం, ఐఏవై పథకం కింద 2.5లక్షలు ఇంటి నిర్మాణ వ్యయం, ఐదు లక్షల భృతి ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకేసారి భృతి వద్దనుకున్న వారికి నెలకు 2వేల రూపాయల చొప్పున 20 ఏళ్లు ఇస్తారు.

భోగాపురంలో పెద్ద ఎత్తున పోరాటం..
అయితే ఈ ప్రాంత రైతులు అసలు ఎయిర్ పోర్టు వద్దంటే వద్దంటున్నారు. గడచిన ఆరు నెలలుగా ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా భోగాపురం మండలంలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉద్యమం మరింత ఊపందుకుంది. ఎయిర్ పోర్టు ప్రభావిత తొమ్మిది పంచాయితీల పరిధిలో గ్రామస్తులు ఎక్కడికక్కడ రిలే నిరాహార దీక్షలు చేపడుతూ ఎయిర్ పోర్టుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ బడా నేతల స్థలాలు తప్పించిన ప్రభుత్వం..
ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతానికి సంబంధించి అధికారులు విడుదల చేసిన రూటు మ్యాపుపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. టీడీపీ బడా నేతలు, వారి అనుచరులకు సంబంధించిన వ్యాపార, రియల్ ఎస్టేట్ భూములను తప్పించి, అమాయక రైతుల భూములను తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరకు భూసేకరణ ప్రక్రియ కాగితాల వరకే పరిమితమైంది. అధికారులు నేరుగా గ్రామాల్లోకి వెళ్లిన దాఖలాలు లేవు. రైతులకు నోటీసులు ఎలా అందించాలన్నదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. అధికారులు, సిబ్బంది గ్రామాల్లోకి నేరుగా వెళితే మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

06:29 - September 14, 2015

విజయవాడ : ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఎందుకూ పనికిరాని గుట్టలున్నాయి. కాని అవేవీ అవసరం లేదు. ఏ చిన్న ప్రాజెక్టు కట్టాలన్నా... రైతుల భూములే కావాలి. పచ్చని పంటపొలాలే కావాలి. రైతుల ఇష్టాఇష్టాలతో పనిలేదు. ఏం చేసైనా... సరే భూములను లాక్కోవాలి. కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలి. ఇదే విధానంతో ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. ప్రభుత్వ తీరుపై సీపీఎం మండిపడుతోంది. బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేస్తోంది.

ప్రతి చోట భూ సేకరణే..
ఏపీలో భూసేకరణపై రగడ కొనసాగుతోంది. ఏపీ రాజధానిలో భూసేకరణ... విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసేకరణ శ్రీకాకుళం జిల్లాలో భావనపాటు పోర్టుకు భూసేకరణ. ఇలా ప్రతి చోటా...భూసేకరణే అస్త్రంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అభివృద్ధి పేరుతో పచ్చని పంట పొలాలను లాక్కునే కుట్ర చేస్తోంది. రైతుల ఇష్టాఇష్టాలతో పని లేకుండా బలవంతపు భూసేరణకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ తీరుపై ఇటు బాధిత రైతు కుటుంబాలు, అటు ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. భూసేకరణ ఆలోచనను విరమించుకోవాలని ఒత్తిడి తెస్తున్నాయి.

బలవంతపు భూసేకరణ ఆపాలని బాబుకు మధు లేఖ..
ఏపీలో పలు ప్రాజెక్టులకు భూసేకరణపై సీపీఎం ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చింది. భూసేకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ఆందోళనలు చేసింది. తాజాగా బలవంతపు భూసేకరణ ఆపాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఎం ఏపీరాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు. రాష్ట్రంలో ల్యాండ్‌ బ్యాంక్‌ విధానానికి స్వస్తి చెప్పాలని లేఖలో పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో రైతుల పంటపొలాలను లాక్కోవద్దని కోరారు. రాజధాని పేరుతో సేకరించిన భూముల్ని... కార్పొరేట్లకు, రియల్టర్లకు కేటాయించవద్దన్నారు. సెజ్‌ల కోసం సేకరించిన భూములు ఐదేళ్ల పైగా నిరుపయోగంగా ఉంటే తిరిగి రైతులకు ఇవ్వాలి మధు డిమాండ్‌ చేశారు.

భూ సేకరణ ఆలోచన విరమించుకోవాలి..
భూసేకరణ ఆలోచన విరమించుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములు వదిలేసి పంటలు పండే భూములను ఎందుకు తీసుకుంటారని నిలదీస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా భూములను ఇచ్చేది లేదని తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం మనసు మార్చుకోకపోతే...పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచర్చరిస్తున్నారు.

06:25 - September 14, 2015

చైనా : బీజింగ్ అందాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. చైనా విప్లవ వీరుల స్మారక కట్టడాల నుంచి గ్రేట్ వాల్ ఆఫ్‌ చైనా వరకు అన్నింటినీ ఆయన సందర్శించారు. ఆయా ప్రాంతాల చారిత్రక నేపథ్యం నుంచి ప్రస్తుత ప్రాముఖ్యత వరకు అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. శభాష్‌ చైనా అంటు ఆ దేశ గొప్పదనాన్ని కొనియాడారు.

సెలవు కావడంతో చారిత్రక ప్రాంతాల సందర్శన..
శనివారం వరకు పారిశ్రామిక వేత్తలతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపిన కేసీఆర్ ఆదివారం రోజు చైనా రాజధాని బీజింగ్‌లో కలియతిరిగారు. ఆదివారం సెలవు కావడంతో చారిత్రక ప్రాంతాలను సందర్శించేందుకు సమయాన్ని వెచ్చించారు. 3 వేల ఏళ్ల చరిత్ర గల బీజింగ్‌.. పురాతన, ఆధునిక కట్టడాలకు నిలయం. అందుకే బీజింగ్‌లోని చారిత్రక కట్టడాలు, వివిధ ప్రాంతాలను సందర్శించారు. తియాన్మెన్ స్క్వేర్ ప్రాంతంతో పాటు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించారు. చైనా జాతీయ అసెంబ్లీతో పాటు, మ్యూజియమ్, ఛైర్మన్ మావో మోమిరియెల్ హాలు వంటి చారిత్రక కట్టడాలున్న ఆ ప్రాంతంలో సీఎం కలియతిరిగారు. అక్కడి చరిత్రను అడిగి తెలుసుకున్నారు. విప్లవ వీరుల త్యాగాలను కొనియాడారు. అనంతరం కేసీఆర్.. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సందర్శించారు. తన బృందంతో కలిసి చైనా రాతి గొడపై కాసేపు నడిచారు. ఫోటోలు దిగి సరదా తీర్చుకున్నారు. అనంతరం బీజింగ్ నుంచి షెంజన్‌ పట్టణాన్ని చేరుకున్నారు. అక్కడ పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. 

06:21 - September 14, 2015

తూర్పుగోదావరి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి వద్ద ఎన్‌హెచ్‌ - 16పై సిమెంట్‌ లారీ బోల్తా పడింది. 18 మంది మృతి చెందారు. మరో 16 మందిని పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. క్షతగాత్రులను రాజమండ్రి ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 35 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. విజయవాడ నుంచి విశాఖపట్నానికి...సిమెంట్‌ లోడుతో లారీ వెళ్తోంది. మృతులు తూర్పుగోదావరి జిల్లాలోని చింతలపూడిలో జామాయిల్‌ తోటలు నరకటానికి వెళ్లారు. పని పూర్తయ్యాక తిరిగి సొంతూళ్లకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు ప్రత్తిపాడు, కిర్లంపూడి, తొండంగి మండలాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. హోంమంత్రి చిన్నరాజప్ప ఘటనాస్థలానికి బయలుదేరారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం....

తూర్పుగోదావరి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి వద్ద ఎన్‌హెచ్‌-16పై సిమెంట్‌లారీ బోల్తాపడింది. 18 మంది మృతి చెందారు. మరో 16 మందిని పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. 

Don't Miss