Activities calendar

19 September 2015

21:27 - September 19, 2015

కర్నూలు : శ్రీశైలం డ్యాం నుంచి సాగర్‌కు నీటి విడుదలపై రాయలసీమ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన రైతులు డ్యాంపై నిరసన తెలియజేశారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 854 అడుగులకు చేరేంత వరకూ స్థిరీకరించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 854 అడుగుల చేరకుండానే తాగునీటి అవసరాల పేరుతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాగర్‌కు నీటిని తరలించడం వల్ల రాయలసీమ రైతులు నష్టపోతారని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

21:24 - September 19, 2015

హైదరాబాద్ : బెజవాడలో కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారు. నిన్న, నేడు వరుసగా రెండురోజులు ఏపీ సీఎం పరిపాలన లోటుపాట్లపై లోతుగా చర్చిస్తున్నారు. ఈ గవర్నెన్స్‌ అమలు చేసి ఈ-ప్రగతి ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. పేదరిక నిర్మూలనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ సిబ్బంది అత్యంత బాధ్యతాయుతంగా పని చేసేలా చూడాలని సూచించారు.

నల్గొండ జిల్లాలో మరో అన్నదాత ఆత్మహత్య...

నల్గొండ:జిల్లాలో హాలియా మండలం బోయగూడెం గ్రామంలో అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆంజనేయులు అనే కౌలు రైతు ఆరెకరాల భూమిని కౌలు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. దిగుబడి సరిగా రాకపోవడంతో పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక, అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లు ఎక్కువై ఆంజనేయులు మనోధైర్యాన్ని కోల్పోయాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో పత్తి చేనులో వేసే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై హాలియా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

లక్నో రోడ్డు పై సైకిల్ తొక్కిన యూపీ సీఎం....

హైదరాబాద్ : యూపీ సీఎం అఖిలేష్ సింగ్ యాదవ్ మాత్రం సైకిల్ తొక్కుకుంటూ లక్నో రోడ్డు మీద వెళ్లిపోయారు. అఖిలేష్ ను అలా రోడ్డు మీద చూసిన జనాలు నమ్మలేక పోయారు. మరోవిషయం ఏమిటంటే, ఆ సమయంలో ఆయన వెనుక పెద్ద సెక్యూరిటీ కూడా లేదు. మధ్యలో ఫొటోగ్రాఫర్ కు స్టిల్ కూడా ఇచ్చారు. 

20:09 - September 19, 2015

హైదరాబాద్ : సుదీర్ఘంగా సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న నష్టపరిహారం లక్షన్నర నుంచి ఆరు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించడం రైతులకు తీవ్ర నిరాశ కలిగించింది. దీని ప్రకారం నిన్నటి వరకు చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు ఈ పరిహారం వర్తించదు. మరోవైపు మెదక్‌లో ఫారెస్ట్ కాలేజీ, ఐపాస్ ప్రమోషన్ కోసం అధికారుల ఆధ్వర్యంలో ట్రస్టు కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

వర్షాభావ పరిస్థితులు, రైతు ఆత్మహత్యలపై....

తెలంగాణ మంత్రివర్గం సమావేశం ప్రధానంగా వర్షాభావ పరిస్థితులు, రైతు ఆత్మహత్యలపై చర్చించింది. అన్నదాతల బలవన్మరణాలపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్తప్తి చేసింది. ఆత్మహత్యల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం లక్షన్నర నుంచి ఆరు లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం కరవు మండలాలు....

మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం కరవు మండలాలు ప్రకటించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈనెల 30 వరకు జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం, పంటల విస్తీర్ణం, ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకని సెప్టెంబర్ 30 తర్వాత కరవు మండలాలు ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 11 వందలున్న అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫసీర్ల సంఖ్యను 12 వందలకు పెంచాలని తీర్మానించింది. అలాగే మెదక్ జిల్లా ములుగులో ఫారెస్ట్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే రబీలో ఏయే పంటలు వేసుకోవాలో రైతులకు గైడెన్స్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కడియం శ్రీహరి వెల్లడించారు.

నాలుగు ఇండియా రిజర్వ్ బెటాలియన్లు ఏర్పాటు.....

కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణలో నాలుగు ఇండియా రిజర్వ్ బెటాలియన్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ లో వీటిని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. వీటి ద్వారా దాదాపు 3,896 పోస్టులు ఏర్పడతాయని తెలిపింది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం అధికారులతో 3 ట్రస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ మంత్రివర్గం. 

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి నీటి మట్టం

ఖమ్మం : భద్రాచలం గోదావరి నీటిమట్టం నిలకడగా ఉంది. వాజేడు మండలంలో చీకుపల్లి కాజ్‌వే రెండవ రోజు కూడా నీట మునిగే ఉండటంతో వెంకటాపురం-వాజేడు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో 3 గేట్లు ఎత్తి 1100 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. 

ఏసీబీ వలలో మేడ్చల్ ఏఎంవీఐ

రంగారెడ్డి : రూ. 5 వేలు లంచం తీసుకుంటూ మేడ్చల్ ఏఎంవీఐ వెంకటేశ్వర్లు, ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు అతనిపై కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు.

19:39 - September 19, 2015

హైదరాబాద్ : త్వరలో ఏపీ సర్కార్ విద్యుత్ ఛార్జీలు మోపబోతోందా? ట్రూప్ ఆప్ పేరిట చెల్లించిన వారి పై భారాలు వేసేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమౌతోందా? ఒక వేళ అదే జరిగితే పరిణామాలు ఎలా వుండబోతున్నాయి? ఈఆర్సీసీ ఎదుట డిస్కంలు ప్రతిపాదనలు చేశాయా? వినియోగదారులపై రూ.7,209 కోట్ల అదనపు భారం పడనుందా! ఇదే అంశంపై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చాలో ఏపీ సీపీఎం నేత నర్శింగరావు, విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్, టిడిపి నేత మాల్యాద్రి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

గుజరాత్ లో మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం..

హైదరాబాద్ : గుజరాత్ లో ఏక్తా యాత్ర దృష్ట్యా ఆందోళన్ సమితి కన్వీనర్ హర్దిక్ పటేల్ ను సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం విధించినట్లు గుజరాత్ డీజీపీ పీసీ ఠాకూర్ తెలిపారు.

ఖైరతాబాద్ లో భారీ గా ట్రాఫిక్ జామ్....

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేశుని దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ జంక్షన్‌కు వచ్చే రహదారులతో పాటు నెక్లెస్ రోడ్, పంజాగుట్ట, లక్డీకాపూల్‌లో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. గంట నుంచి వాహనాలు కదలడం లేదు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అక్టోబర్ 11న సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష...

ఖమ్మం : సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష అక్టోబర్ 11న నిర్వహించనున్నట్లు సింగరేణి జీఎం (రిక్రూట్‌మెంట్, అధికార ప్రతినిధి) సి. మల్లయ్య పంతులు శనివారం ప్రకటించారు. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 విభాగంలో తొలుత 234 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ ఏడాది మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తరువాత ఈ పోస్టులను 471 ఖాళీలుగా గుర్తించారు. రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, మంచిర్యాల పట్టణాల్లో పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

శ్రీవారి ప్రసాదంలో ఇనుమ మేకులు...

తిరుమల : భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదం నాణ్యతపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. తాజాగా శ్రీవారి లడ్డూలో మేకులు ఉన్న ఘటన సంచలనం రేపుతోంది. సికింద్రాబాద్ కు చెందిన ఓ భక్తుడు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం లడ్డూలను కొన్నాడు. అనంతరం స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరిద్దామని లడ్డూను విరిస్తే ఇనుప మేకులు బయటపడ్డాయి. దీంతో, ఆయన షాక్ కు గురయ్యారు. వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. లడ్డూల్లో మేకులు రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

19:01 - September 19, 2015

శ్రీకాకుళం : జిల్లా పాతపట్నం మండలంలోని ఆంధ్రా-ఒడిషా సరిహద్దు ప్రాంతంలోని శివాలయం. క్రీస్తు శకం 1676లో నిర్మించిన పురాతన ఆలయమిది. కొండకోనల నడుమ ఉన్న ఈ ఆలయం ఇతర ఆలయాలకన్నా ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.

బద్రినాథ్‌ ఆలయానికి ఈ శివాలయానికి దగ్గరి సామీప్యం....

ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్‌ ఆలయానికి ఈ శివాలయానికి దగ్గరి సామీప్యం ఉండడం విశేషం. సంవత్సరంలో 6 నెలలు మంచుతో కప్పబడి, మిగిలిన ఆరు నెలలు దర్శనానికి అనువుగా ఉండడం బద్రినాథ్‌ విశిష్టత అయితే.. ఆరు నెలలు గుడి మొత్తం నీటిలో ఉండడం, మిగిలిన ఆరు నెలలు ఖాళీగా ఉండడం ఈ శివాలయం ప్రత్యేకత. కొండకోనల్లోంచి జాలువారే నీరు ఏకంగా గర్భగుడిలోకి సైతం చేరడం విశేషం.

జలకంఠస్వామి ఆలయంగా ప్రసిద్ధి.....

ఈ విధంగా చుట్టూ నీటి ప్రత్యేకత కలిగి ఉండడంతో ఈ నీలకంఠేశ్వర ఆలయం.. జలకంఠస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా.. ఎక్కడా కనిపించని విభూది చెట్లు సైతం ఇక్కడ ఉండడం గమనార్హం. ప్రకృతే స్వామివారికి జలాభిషేకం చేసే అద్భుత దృశ్యం ఇక్కడ తప్ప, మరెక్కడా కనిపించదని అర్చకులు చెబుతున్నారు.

పాలకుల నిర్లక్ష్యం కారణంగా....

ఇదిలాఉంటే.. అతిపురాతన క్షేత్రంగా ఉన్న ఈ శైవాలయం పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి నోచుకోవట్లేదని స్థానికులు అంటున్నారు. ఈ నీలకంఠేశ్వర స్వామికి వందెకరాల మాన్యం ఉన్నా.. ఎవరికివారు ఆక్రమించుకోవడంతో.. భూములన్నీ అన్యాక్రాంతమైపోయాయని చెబుతున్నారు. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, ఈ విషయంలో ప్రభుత్వం తగిన శ్రద్ధచూపాలని స్థానికులు కోరుతున్నారు.

18:58 - September 19, 2015

చిత్తూరు : తిరుపతిలోని అలిపిరి సమీపంలో టిటిడి నిర్మించిన శ్రీవారి నమూనా ఆలయం శిధిలావస్థకు చేరుకుంది. సుమారు కోటి రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ ఆలయ పునరుద్దరణ టిటిడికి పట్టడం లేదు. ఒకవైపు తిరుమల క్షేత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాలతో కాంతులీనుతుండగా, తిరుపతిలోని నమూనా ఆలయం మాత్రం చీకట్లో మగ్గుతోంది. టిటిడి నిర్లక్ష్యానికి సాక్ష్యంగా మారి, రేపోమాపో కూలడానికి సిద్దంగా ఉన్న శ్రీవారి నమూనా ఆలయంపై టెన్ టివి ప్రత్యేక కథనం.

95 లక్షలతో 2007లో శ్రీవారి నమూనా ఆలయం నిర్మాణం......

ఇది తిరుపతిలోని శ్రీవారి నమూనా ఆలయం. సుమారు 95 లక్షల వ్యయంతో 2007లో టిటిడి ఈ నమూనా ఆలయాన్ని నిర్మించింది. అచ్చంగా తిరుమల కొండపై వెలసిన శ్రీవారి ప్రధాన ఆలయ గర్బాలయం తరహాలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. తిరుమల ఆలయంలో శ్రీవారికి నిత్యం జరిగే పూజా కైంకర్యాల గురించి చాలా మంది సామాన్య భక్త జనంకు తెలియదు. వాటిని ఎలా నిర్వహిస్తోరో చూసి తీరాలన్న కోరిక కోట్లాది మంది హిందూ భక్తుల్లో నెలకొని ఉంది. సరిగ్గా భక్తుల ఈ కోరిక తీర్చడానికే టిటిడి ఈ నమూనా ఆలయంను నిర్మించింది.

వారం రోజుల పాటు సుప్రభాతం, ఏకాంత సేవలు.....

తిరుమల ఆలయం తరహాలోనే ఇక్కడి స్వామికి ప్రత్యేక పూజలు, కైంకర్యాలు నిర్వహించి వాటిని కెమెరాలలో బంధించి ఎస్వీ భక్తి ఛానెల్ ద్వారా భక్తులకు చూపాలన్నదే టిటిడి ఉద్దేశ్యం. వెండి వాకిలి నుంచి గర్బాలయం వరకు తిరుమల శ్రీవారి ఆలయం ఏ తరహాలో ఉంటుందో, కొలతలతో సహా అచ్చంగా అలాగే ఆలయాన్ని నిర్మించారు. ప్రధాన ఆలయం అర్చకులతో వారం రోజుల పాటు ఈ ఆలయంలో సుప్రభాతం మొదలు ఏకాంత సేవ వరకు అన్ని నిత్య పూజలు, వారపు సేవలు నిర్వహించి ఎస్వీ భక్తి ఛానెల్లో ప్రసారం కూడా చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ తర్వాతే ఈ నమూనా ఆలయంను టిటిడి పట్టించుకోవడం మానేసింది. దీంతో నమూనా ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. టీటీడీ తీరుకు నిరసనగా కొందరు భక్తులు ఆందోళన కూడా చేశారు.

అసాంఘిక శక్తులకు అడ్డాగా నమూనా ఆలయం.....

కొద్ది రోజుల కిందటి వరకు భక్తులు ఈ ఆలయ సందర్శనకు వచ్చేవారు. ఇప్పుడు టిటిడి దీనిని కూడా అనుమతించడం లేదు. ఆలయం అంతా బూజు పట్టిపోయింది. ఇక్కడ కనీసం ఓ సెక్యూరిటీ గార్డ్ కూడా లేరు.రాత్రులలో ఈ ఆలయ పరిసరాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి.

నమూనా ఆలయాన్ని పునరుద్దరించాలని భక్తుల డిమాండ్......

ఒకవైపు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సంబరం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుక కోసం టిటిడి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కనీసం ఇలాంటి ప్రత్యేక సందర్బాలలో అయినా తిరుపతిలో ఉన్న ఈ నమూనా ఆలయాన్ని తిరిగి పునరుద్దరిస్తే ఇక్కడకు వస్తున్న భక్తులు తిరుమల ఆలయాన్ని దగ్గర నుంచి చూసిన అనుభూతి పొందుతారు. టిటిడి ఆ దిశగా ఆలోచించి ఇప్పటికైనా ఈ ఆలయాన్ని బాగు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

18:56 - September 19, 2015

హైదరాబాద్ : మనుషులలో మానవత్వం మంటగలుస్తోంది. దేవతలుగా ఆరాధింపపడ్డ గోమాతలు దీనావస్థకు చేరాయి. తమ బతుకే భారం కావడంతో మేత పెట్టలేని పరిస్థితుల్లో కొంతమంది సామాన్యులు గోవులను వదిలించుకుంటున్నారు. రోడ్లపై దొరికే చిత్తు కాగితాలు తింటున్న గోవులు మృత్యువాతపడుతున్నాయి.

హిందూ ఇతిహాసాల్లో గోఆరాధనకు ఎంతో ప్రత్యేకత....

హిందూ ఇతిహాసాల్లో గోఆరాధన ప్రముఖమైంది. ఒకప్పుడు ప్రతి ఇళ్లు గోవులతో కళకళలాడేవి. ఎన్ని గోవులు ఉంటే అంత సంపన్నమని అర్థం. పండుగలకు గోవులను ప్రత్యేకంగా అలంకరించేవాళ్లు. కొన్ని పండుగల్లో గోవులకు ప్రత్యేక పీట వేసేవారు. అలాంటి పరిస్థితులు నేడు తారుమారయ్యాయి.

మేత కోసం అవస్థలు పడుతున్న గోవులు.....

ప్రతి ఇంట్లో ఉండాల్సిన గోవులు నేడు రోడ్డున పడ్డాయి. ఎంతో భక్తితో చూసుకోవాల్సిన గోవులను మానవత్వం మరిచిన మనుషులు వదలించుకుంటున్నారు. మరోపక్క కొతమంది ఆవులకు మేత పెట్టే లేక వాటిని దేవాలయాలకు అప్పగిస్తున్నారు. ఇలా రోడ్డున పడ్డ ఆవులు మేత దొరక్క నానా అవస్థలు పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో రోడ్లపై దొరుకుతున్న చిత్తుపేపర్లు, ప్లాస్టిక్‌ కవర్లు తింటున్నాయి. ఇలా దొరికిన ప్రతీది తినడమే వాటికి మరణశాసనంగా మారుతోంది.

తొమ్మిది ఆవులు మృతి .....

ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటు చేసుకుంది. అరిగించుకోలేని చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌ వ్యర్ధాలు తిన్న తొమ్మిది ఆవులు ఒకేసారి మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన చూసి స్థానికులు చలించిపోతున్నారు. రోడ్లపై దొరికిన చెత్త చెదారం తినడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవతలుగా ఆరాధింపబడ్డ గోమాతలు నేడు దిక్కుతోచని స్థితిలో పడడం నిజంగా దారుణమంటున్నారు. 

18:53 - September 19, 2015

హైదరాబాద్ : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను త్వరితగతిన పట్టాలెక్కించేందుకు మరోసారి సింగపూర్‌ పర్యటనకు చంద్రబాబు బృందం సిద్ధమైంది. ఈనెల 20న మంత్రులు, సీఆర్డీఏ అధికారులతో చంద్రబాబు సింగపూర్‌ బయల్దేరతారు. ఆ దేశ ప్రధాని లీ శాన్‌లూంగ్‌ను రాజధాని శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించనున్నారు. 21న సింగపూర్ కన్సార్టియంతో సైన్స్ పార్క్‌లో జరిగే వాణిజ్య సమావేశంలో సీఎం నేతృత్వంలోని ప్రభుత్వ బృందం పాల్గొంటుంది. ఆ తరువాత మంత్రి ఈశ్వరన్‌తో జరిగే విందు సమావేశంలో...అమరావతి నగర అభివృద్ధిలో భాగంగా చేపట్టే స్విస్ ఛాలెంజ్ విధానంపై చర్చిస్తారు. సాయంత్రం సౌత్ ఆసియన్‌ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్‌లో చంద్రబాబు కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం సింగపూర్ కన్సార్టియం ఇచ్చే డిన్నర్‌కు హాజరవుతారు.

22న సింగపూర్ సిటీ గ్యాలరీ సందర్శన....

ఇక రెండో రోజున చంద్రబాబు బృందం సింగపూర్ సిటీ గ్యాలరీని సందర్శిస్తుంది. అక్కడి నివాస, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలు, ఎయిర్ బేస్‌లు, రిజర్వాయర్లు ఇతర ప్రాంతాలను పరిశీలిస్తారు. సివిక్ డిస్ట్రిక్ట్‌, మెరీనా బే ప్లానింగ్‌పై సమీక్షిస్తారు. కాన్సెప్ట్ ప్లాన్‌, మాస్టర్ ప్లాన్లను అధ్యయనం చేస్తారు. సింగపూర్ సిటీ గ్యాలరీ సందర్శనలో గ్రీన్‌ అండ్ బ్లూ స్పేసెస్, వినోద ప్రాంతాలు, ఐలాండ్ వైడ్ వాటర్ క్యాచ్ మెంట్, వ్యర్థాల నిర్వహణ, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నెట్‌వర్క్స్ తో భూముల సద్వినియోగంపై ప్రణాళికలను పరిశీలిస్తారు.

క్యాలింగ్ బెండమీర్ రీజియన్......

రెండు రోజుల పర్యటనలో 3 టౌన్‌షిప్‌లను చంద్రబాబు సందర్శిస్తారు. క్యాలింగ్ బెండమీర్ రీజియన్, ఛాంగి బిజినెస్ పార్క్ రీజియన్, వన్‌ నార్త్ రీజియన్ హబ్బులను పరిశీలిస్తారు. చంద్రబాబు బృందం 22న తిరుగు ప్రయాణమవుతుంది. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల, పి.నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ముఖ్య విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారు. దీంతో సీఆర్డీఏ విభాగాల డైరెక్టర్లు, ఇతర అధికారులు సింగపూర్ పర్యటనకు కావాల్సిన సమస్త సమాచారం సేకరించేపనిలో పడ్డారు. డ్రాప్ట్ మాస్టర్ ప్లాన్లలో చేయాల్సిన మార్పులు చేర్పులను సీఆర్డీఏ క్రోడీకరిస్తోంది. 

18:49 - September 19, 2015

కృష్ణా : కంచికచర్ల మండలం పరిటాలలో అమానుషం జరిగింది. మరియమ్మ అనే మహిళపై రవి అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులకు మరియమ్మ ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోలేదు. పైగా నిందితుడు మరియమ్మ ఇంటికి వెళ్లి బెదిరించాడు. దీంతో మరియమ్మ భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌ ముందు మృతదేహంతో బంధువులు ధర్నా చేస్తున్నారు.

సుంకేశుల జలాశయం రెండు గేట్లు ఎత్తివేత..

మహబూబ్‌నగర్: జిల్లాలోని సుంకేశుల జలాశయం నుంచి అధికారులు వరద నీటిని దిగువ ప్రాంతానికి వదిలివేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇవాళ డ్యాంకు ఉన్న రెండు గేట్లను తెరిచి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి సుంకేశులకు 12 వేల క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లో ఉంది. డ్యాంలో ప్రస్తుతం 1.10 టీఎంసీల నీటి నిలువ ఉంది.

 

మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్ : మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులపై మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ సమీక్ష సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎంపీ వినోద్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా ప్రాజెక్టు భూసేకరణ కోసం అదనంగా రూ. 200 కోట్లు కేటాయించారు. సిరిసిల్ల పరిధిలోని అర్బన్‌ భూములకు 123 జీవో ప్రకారం నష్టపరిహారం అందజేయాలని నిర్ణయించారు.

భావనపాడు బీచ్ లో ముగ్గురు విద్యార్థుల గల్లంతు

శ్రీకాకుళం : సంతబొమ్మాళి మండలం భావనపాడు బీచ్ లో ముగ్గురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు.

 

17:58 - September 19, 2015

హైదరాబాద్ : లక్ష అక్షరాలు పలికించలేని భావాన్ని ఒక్క దృశ్యం ప్రతిభింబిస్తుంది. భాషతో చెప్పలేని క్షిష్టమైన అనుభూతుల్ని ఒక్క ఛాయాచిత్రం చెప్పేస్తుంది. అలాంటి చిత్రాలను పదికాలాలపాటు పదిల పర్చుకోవటం కూడా ఒక కళే. ఆ కళను ఒడిసి పట్టుకున్న ఇద్దరు యువ ఇంజినీర్లు డిజిటల్ ప్రింట్లు తీసి వినియోగదారులకు ఉచితంగా అందిస్తూ కళపై తమ అభిమానాన్ని, తపనను చాటుతున్నారు.

లక్షల్లో జీతం...

ప్రతిష్టాత్మక యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగు పూర్తిచేసి, లక్షల జీతం వచ్చే ఉద్యోగంలో చేరినా ఏదో అసంతృప్తి. వినూత్నంగా ఏదో చేయాలన్న తపన. అదే సమయంలో వారికో అద్బుతమైన ఆలోచన తట్టింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల యుగం నడుస్తోంది. దీంతో ఫోటోలు దిగటం కూడా ఎక్కువయ్యింది. కానీ నేటి ఉరుకు పరుగుల జీవితాల్లో వాటిని ప్రింటు తీయటం సాధ్యంకాక చాలామంది అలాగే వదిలేస్తున్నారు. ఒకవేళ ఏదైనా జరిగి డైటా పోతే తీపిగుర్తులన్నీ చెరిగిపోతాయి. మధురజ్ఞాపకాలను పోగొట్టుకున్నామన్న ఆబాధను మాటల్లో వర్ణించలేం. అయితే అలాంటి తీపి గుర్తులను డిజిటల్ ప్రింటు తీసి ఉచితంగా అందిస్తున్నారు మనీష్ అగ్రవాల్, రాహుల్ అగ్రవాల్.

కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ త్రిపుల్ .....

హైదరాబాద్ ట్రిపుల్ ఐటిలో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ పొందిన మనీష్ అగ్రవాల్, రాహుల్ అగ్రవాల్‌కు పోటోలు ప్రింటు తీసి వినియోగదారులకు అందిచాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే వెబ్ సైటు ప్రారంబించారు. ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియాను ప్రచారానికి ఉపయోగించుకొన్నారు. ఆరు నెలల్లోనే ఈ సైట్‌కి మంచి గుర్తిపు లభించింది. జస్ట్ క్యాప్చర్.కామ్ లోకి వెళ్లి మన ఫోటోలను అప్‌లోడ్ చేస్తే చాలు..మూడు వారాల్లో డిజిటల్ చిత్రాలు ఇంటికి చేరతాయి.

వ్యాపార ప్రకటనలతోనే....

అయితే వినియోగదారులకు ఫోటోలను ఉచితంగా అందిస్తున్నా..వాటివెనుక వ్యాపార ప్రకటనలున్నాయి. ఇదే వీరికి ఆదాయం. వినియోగదారుల చెంతకే వ్యాపార ప్రకటనలు చేరడంతో..బడా కంపెనీలు ప్రకటనలు ఇవ్వటానికి క్యూకడుతున్నాయి. ఇదే వ్యాపార విజయ రహస్యమని నిర్వాహాకులు చెప్తున్నారు. 

17:47 - September 19, 2015

హైదరాబాద్ : అడవులకు బదులు పల్లెల్లో కూంబింగ్‌ చేస్తున్నారు పోలీసులు..! వరంగల్‌ ఎన్‌కౌంటర్‌లో కొత్త కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడంతో.. ఆవైపుగా దృష్టిసారించారు. తాజాగా మావోయిస్టు పార్టీలో ఎంత మంది చేరారు..? ఎవరిద్వారా ప్రభావితమయ్యారు..? అందుకుగల కారణాలేంటి..? అనే ప్రశ్నలకు సైలెంట్‌గా సమాధానాలు వెతుకుతున్నారు...

వరంగల్‌ ఎన్‌కౌంటర్‌ జరగడంతో .....

నక్సలిజం కూకటివేళ్లను పెకిలించామని చెప్పుకుంటున్న తరుణంలో.. వరంగల్‌ ఎన్‌కౌంటర్‌ జరగడంతో అటు ప్రభుత్వంలోనూ, ఇటు పోలీసు డిపార్ట్‌ మెంట్‌లోనూ కలవరం మొదలైంది. చనిపోయింది కొత్తవారు కావడంతో.. మావోయిస్టు పార్టీలో చేరికలు ప్రారంభమయ్యాయనే నిర్ధారణకు ప్రభుత్వం వచ్చింది. దీంతో.. ఆ వివరాలు సేకరించాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం.

గంలోకి దిగిన పోలీసులు రహస్యంగా వివరాలు....

దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు రహస్యంగా వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. గతంలో మావోయిస్టు పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలపై పోలీసులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. చదువులకోసం ఊళ్లో నుంచి పట్టణాలకు వెళ్లిన విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఛత్తీస్ గఢ్ లో చనిపోయిన వివేక్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదివాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు కూడా. ఇక వరంగల్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన శృతి ఎంటెక్‌ చదువుతోంది. దీంతో.. విద్యావంతుల కదలికలపై పోలీసులు దృష్టి సారించినట్టు సమాచారం. ఈ విచారణలో.. మొత్తం 36 మంది విద్యావంతులు ఇటీవల మావోయిస్టు పార్టీలో చేరారని పక్కా ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది.

మొబైల్ నంబర్‌ ఆధారంగా ఆయనతో టచ్‌లో......

వివేక్ ఎన్‌కౌంటర్ తర్వాత.. అతని మొబైల్ నంబర్‌ ఆధారంగా ఆయనతో టచ్‌లో ఉన్నవారు, సోషల్ నెట్ వర్క్ లో యాక్టివ్ గా ఉన్నవారిపై పోలీసులు రహస్యంగా విచారణ చేపడుతున్నట్టు సమాచారం. వరంగల్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన శృతి, విద్యాసాగర్ రెడ్డి ఇద్దరూ వివేక్‌ ద్వారానే మావోయిస్టు పార్టీలో చేరినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న నారాయణ అలియాస్ హరిభూషణ్‌ రిక్రూట్‌ మెంట్‌ బాధ్యత తీసుకున్నారని, ఇప్పటి వరకు 200 మందిని మావోయిస్టు పార్టీలో చేర్పించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

వరంగల్ ఎన్‌కౌంటర్‌ బూటకమే అంటున్న.....

ఇదిలా ఉంటే.. వరంగల్ ఎన్‌కౌంటర్‌ బూటకమే అంటున్న వారు.. పలు ఆధారాలను కూడా చూపుతున్నారు. సెంట్రీ డ్యూటీ చేస్తున్న మహిళా మావోయిస్టులు రౌండ్ నెక్ వేసుకుంటారు. షూస్ తప్పకుండా ధరిస్తారు. కానీ.. శృతి ఎన్ కౌంటర్‌ సమయంలో రౌండ్ నెక్ లేదు. షూస్ కూడా లేకపోగా.. కాళ్లకు గాయలయ్యాయి. శరీరంపై యాసిడ్ పోసిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఇక.. సాగర్ శరీరంలో లభించిన బులెట్లలో కొన్ని ముందు నుంచి, మరికొన్ని వెనుక నుంచి కాల్చినవి కావడం కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

తాడ్వాయి అడవుల్లో మావోయిస్టులను....

వరంగల్‌ జిల్లా తాడ్వాయి అడవుల్లో మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు.. దానికి ఒక్క రోజు ముందు మేడారంలో జరగాల్సిన రవాణా శాఖ రివ్యూ మీటింగ్ ను వాయిదా వేసుకోవాలని చెప్పినట్టు సమాచారం. ఆ మీటింగ్ ను వాయిదా వేసుకోవాలని ముందే ఎందుకు చెప్పారన్న అంశం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి.. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న అడవుల్లో తుపాకుల మోత మోగింది. ఇది ఎంత వరకు దారితీస్తుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

17:40 - September 19, 2015

హైదరాబాద్‌ : నగంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. వాతావరణం దానికి అనుకూలించడంతో రెచ్చిపోతోంది. రోజురోజుకు స్వైన్‌ఫ్లూ బారిన పడే వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఒక్కరోజే ఆరుగురికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మొత్తం 10 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు స్వైన్‌ఫ్లూ బారిన పడి ముగ్గురు చనిపోయారు.

అచ్చంపేటలో వంద పడకల ఆసుపత్రి...

మహబూబ్ నగర్ : జిల్లా అచ్చంపేటలోని 30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రికి పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

లైంగిక వేధింపులకు తాళలేక మహిళ ఆత్మహత్య..

కృష్ణా : కంచికచర్ల (మం) పరిటాలలో అమానుషం చోటు చేసుకుంది. లైంగిక వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది. మహిళపై రవి అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మహిళ ఇంటికి వెళ్లి రవి బెదిరించాడు. దీనితో భయంతో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు కంచికచెర్ల పీఎస్ ఎదుట మృతదేహంతో బైఠాయించి ధర్నా నిర్వహించారు. 

కొనసాగుతున్న టీ.ఎస్ మంత్రివర్గ సమావేశం..

హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో టీఎస్ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం పెంపు..వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, రైస్ మిల్లులు, కేబుల్ టివి నెట్ వర్క్ లపై వ్యాట్ విధింపు..తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

 

యుద్ధాలు..హింసతో ఏమి సాధించలేం - ఫరూక్..

కాశ్మీర్ : యుద్ధాలు..హింసతో ఏమి సాధించలేమని జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్ధుల్లా పేర్కొన్నారు. కాశ్మీర్ సమస్యపై జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాశ్మీర్ పాకిస్తాన్ లో ఎప్పటికీ భాగం కాలేదని స్పష్టం చేశారు. 

సుంకేశుల నుండి 8వేల క్యూసెక్కుల నీరు విడుదల..

మహబూబ్ నగర్ : రాజోలి శివారులో ఉన్న సుంకేశుల జలాశయం నుండి శనివారం 8వేల క్యూసెక్కుల నీటిని దిగువున ఉన్న శ్రీశైలం జలాశయానికి అధికారులు విడుదల చేశారు. 

బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కిన కార్మికులు..

నల్గొండ : నార్కట్ పల్లిలో ఓసీటీఎల్ పరిశ్రమ కార్మికులు ఆందోళన చేపటాటరు. పరిశ్రమలో అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కారు. 

నగరంలో ప్రబలుతున్న స్వైన్ ప్లూ..

హైదరాబాద్ : నగరంలో స్వైన్ ఫ్లూ ప్రబలుతోంది. మరో ఆరుగురికి స్వైన్ ఫ్లూ నిర్ధారణైంది. ప్రస్తుతం 10 మంది రోగులు గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఈనెలలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. 

 

16:59 - September 19, 2015

హైదరాబాద్ : దాతల అవయవాలను.. ముఖ్యంగా గుండెను ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కానీయరాదన్న తపన వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈక్రమంలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా.. చెన్నైకి చెందిన ఫోర్టిస్‌ మలర్‌ ఆసుపత్రి.. దాతల గుండెను తరలించేందుకు డ్రోన్‌ను వినియోగించాలని భావిస్తోంది. ఇప్పటికే విజయవంతంగా టెస్ట్‌ డ్రైవ్‌ కూడా చేసేసింది.

29మంది బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తుల అవయవాలను దానం....

ప్రజల్లో అవయవదానాల మీద అవగాహన క్రమంగా పెరుగుతోంది. 2015 నుంచి ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 29మంది బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తుల అవయవాలను దానం చేశారు. వచ్చే ఐదేళ్లలో కనీసం వెయ్యికి తక్కువ కాకుండా అవయవ దానాలు ఉంటాయని వైద్యులు అంచనా వేస్తున్నారు. దాతలు ఇచ్చే అవయవాలను.. మరో ఆసుపత్రికి తరలించేందుకు ప్రస్తుతం గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నారు. అంటే బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తి ఉన్న ఆసుపత్రి నుంచి.. సదరు ఆర్గాన్‌ అవసరమున్న వ్యక్తి ఉన్న ఆసుపత్రి వరకూ మార్గంలో ట్రాఫిక్‌ను స్తంభింప చేయడమే ఈ గ్రీన్‌ కారిడార్‌.

రెండు ఆసుపత్రుల మధ్య రాదారిని.....

రెండు ఆసుపత్రుల మధ్య రాదారిని స్తంభింప చేయడంలో చాలా సమస్యలున్నాయి. ఆసుపత్రి సిబ్బంది, పోలీసు, ట్రాఫిక్‌ సిబ్బంది పక్కా ప్రణాళికతో వ్యవహరించాలి. లేకుంటే, బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తి అవయవాలు ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గుండె తరలింపులో క్షణం కూడా అత్యంత విలువైందే. గుండెను వెలికి తీశాక నాలుగు గంటల్లోపు మరో వ్యక్తికి అమర్చకుంటే.. ప్రయత్నమంతా వృథా అవుతుంది. పైగా ప్రతిసారీ గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేయడం అంత సులువేమీ కాదు. అందుకే.. రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య దృష్ట్యా కొచ్చిన్‌లాంటి నగరాల్లో.. బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తి ఆర్గాన్స్‌ను తరలించేందుకు ఎయిర్‌క్రాఫ్ట్‌లనూ వినియోగించారు.

చెన్నైకి చెందిన ఫోర్టిస్‌ మలర్‌ ఆసుపత్రి యాజమాన్యం..

చెన్నైకి చెందిన ఫోర్టిస్‌ మలర్‌ ఆసుపత్రి యాజమాన్యం.. అవయవాల తరలింపులో జాప్యాన్నీ, సమస్యలను అధిగమించేందుకు డ్రోన్‌లను వినియోగించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఓ జాతీయ విధానాన్ని తీసుకు రావాలని కేంద్ర, రాష్ట్రాల వైద్య మంత్రిత్వ శాఖలను అభ్యర్థించింది. చెన్నైలో 20 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రుల మధ్య.. డమ్మీ ఆర్గాన్స్‌ను డ్రోన్‌ ద్వారా తరలించే ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కేంద్రం నుంచి అనుమతులు వస్తే.. ఇకపై గ్రీన్‌ కారిడార్‌ అవసరం లేకుండానే.. దాతల నుంచి సేకరించే ప్రతి అవయవాన్నీ సద్వినియోగం చేసే అవకాశం ఉందని మలర్‌ ఆసుపత్రి యాజమాన్యం నమ్ముతోంది. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

16:56 - September 19, 2015

హైదరాబాద్ : తెలంగాణ మంత్రుల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్‌ఐ మృతిపై మంత్రుల భిన్న ప్రకటనలు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఎస్‌ఐ మృతి వెనుక ఇసుక మాఫియా ఉండవచ్చుననే అనుమానాన్ని హోంమంత్రి వ్యక్తం చేయగా.. జిల్లా మంత్రి మాత్రం అలాంటిదేమీ లేదని.. ఎస్‌ఐ మృతిని రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది.

తెలంగాణ మంత్రుల మధ్య విభేదాలు....

రంగారెడ్డి జిల్లాలోని యాలాల ఎస్‌ఐ రమేష్‌ మృతి ఇప్పుడు తెలంగాణ మంత్రుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయి. రమేష్‌ ఆత్మహత్య చేసుకునేంత ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవని కుటుంబ సభ్యులు చెబుతుండడంతో.. ఈ మృతి వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంటోంది.

రమేష్‌ మృతిపై అనేక అనుమానాలు....

రమేష్‌ మృతదేహం చెట్టుకు వేలాడే విధానంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసు అధికారులు మాత్రం దీన్ని ఆత్మహత్యగానే చెబుతున్నారు. ఇదే విషయం పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా బయటపడింది. కానీ.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. గతంలో రమేష్‌ పని చేసిన పెద్దెముల్‌ మండలంలో ఓ నేతతో ఉన్న విభేదాలే ఆత్మహత్యకు కారణమనే అనుమానాన్ని పలువురు వ్యక్తపరుస్తున్నారు.

రమేష్‌ మృతిపై సీఐడీ విచారణ.....

ఇక రమేష్‌ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలన్న కుటుంబ సభ్యుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది. మృతిపై సీఐడీ విచారణకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదేశించారు. మరోపక్క ఇదే అంశంపై మంత్రులు స్పందించిన తీరు వివాదాస్పదమవుతోంది. రమేష్‌ మృతి వెనుక ఇసుక మాఫియా ఉన్నట్లు సమాచారం ఉందని నాయిని చెప్పడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయితే.. జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాత్రం తన నియోజకవర్గంలో ఇసుక మాఫియా లేదని తేల్చిచెబుతున్నారు. కొంతమంది కావాలని రమేష్‌ మృతిని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా మంత్రులు సమన్వయం లేకుండా భిన్న ప్రకటనలు చేయడంతో ఈ వ్యవహారం మరింత వివాదస్పదంగా మారుతోంది. 

16:52 - September 19, 2015

అనంతపురం : జిల్లా బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహళ్‌లో లారీకి కరెంట్‌ తీగలు తగలడంతో.. అందులో ప్రయాణిస్తున్న 14 మంది కూలీలకు కరెంట్‌ షాక్‌ తగిలింది. వారంతా తీవ్రంగా గాయపడగా.. ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉంది. వీరంతా తాడిచర్లకు చెందిన వారు గా తెలుస్తోంది.

 

16:50 - September 19, 2015

అనంతపురం / కర్నూలు : ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 120 GOను వ్యతిరేకిస్తూ.. అనంతపురంలో రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదిక ఇంటర్మీడియట్ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌ సందర్భంగా ఇంటర్‌ విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సప్తగిరి సర్కిల్‌లో మానవహారం నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. పద్మావతి మెడికల్ కాలేజీలో జోనల్ సిస్టమ్ ప్రాతిపదికన రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాకు రావాల్సిన 107 సీట్లకుగానూ, కేవలం 12 మెడికల్ సీట్లను మాత్రమే కేటాయించడం అన్యాయమని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

కర్నూలులో విద్యార్థులు భారీ ర్యాలీ.....

120 జీఓను వెంటనే రద్ద చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. కోట్ల సర్కిల్‌ నుంచి కోండారెడ్డి బురుజు వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. కర్నూలులో ప్రభుత్వ జూనియర్ కళాశాలు ఒక రోజు బంద్‌ నిర్వహించాయి. 120 జీఓను తీసుకొచ్చి.. రాయలసీమ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని రాయలసీమ ఉద్యమ కార్యచరణ ఐక్య వేదిక కన్వీనర్ శర్మ మండిపడ్డారు. తక్షణమే 120 జీఓను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

16:48 - September 19, 2015

కరీంనగర్‌ : రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. చెరువులో బట్టలు ఉతకడానికని వెళ్లిన ముగ్గురు బాలికలు గల్లంతయ్యారు. అల్లిపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు తారవ్వ(8), మీనా(5), గంగవ్వ(6) చెరువులో బట్టలు ఉతికేందుకని వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఏమైందో ఏమో గానీ, వారు ముగ్గురు చెరువులో పడిపోవడంతో మృతి చెందారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లిన వారు చెరువులో గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సంఘటనతో అల్లిపూర్ లో విషాధ ఛాయలు అలముకున్నాయి.  

రాహుల్ అవే పదాలు వాడుతున్నారు - చిరాగ్ పాశ్వాన్..

ఢిల్లీ : ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గత కొన్ని నెలలుగా 'సూట్ బూట్' అంటూ విమర్శలు చేస్తున్నారని ఎల్ జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. కొత్త పదాలు రాయాలని స్ర్కిప్ట్ రైటర్ కు రాహుల్ చెప్పాలని ఆయన ఎద్దేవా చేశారు. 

రేపు సింగపూర్ కు బాబు..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 8.45గంటలకు కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుండి ఆయన వెళ్లనున్నారు. 

16:08 - September 19, 2015

హైదరాబాద్ : గుంటూరు ప్రభుత్వాస్పత్రిని ఎలుకలు వదిలి పెట్టడం లేదు. పేషెంట్‌ కేశమ్మను ఓ ఎలుక స్వల్పంగా కొరికింది. ఆమె వెంటనే ఫిర్యాదు చేసింది. అయితే మీడియా రంగంలోకి దిగగానే ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సీన్‌ మార్చేశారు. బాధితురాలితో బలవంతంగా అలాంటిదేమీ లేదని చెప్పించేశారు. మరో వైపు శుక్రవారం రాత్రి పాముల పిల్ల కూడా కలకలం సృష్టించింది. మీడియాకు తెలియకుండా యాజమాన్యం కప్పి పుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారి పలువురు ఆరోపిస్తున్నారు.

అవినీతి కంటే అసమర్థత ఎంతో ప్రమాదకరం - చంద్రబాబు..

విజయవాడ : అవినీతి కంటే అసమర్థత ఎంతో ప్రమాదకరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడ : 13 జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సమావేశం కొనసాగుతోంది. వృద్ది..సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకోవడం కత్తిమీద సాములాంటిదన్నారు. నిధులు పక్కదారి పడుతాయో అక్కడ వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. ఇసుక క్వారీల నిర్వాహణలో అవినీతికి తావు ఉండవద్దని, పాలసీ ఎంత గొప్పదైనా పని చేసే యంత్రాంగం పటిష్టంగా ఉన్నప్పుడే ఫలితాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు.
బడ్జెట్ పై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ప్రజెంటేషన్..

16:04 - September 19, 2015

నల్గొండ : మరో మహాలక్ష్మి చనిపోయింది. ఓ ఇంటి ఆశాదీపం ఆరిపోయింది. మరో విద్యార్ధిని భరోసా కోల్పోయింది. మార్కులు రాలేదని.. పరీక్ష తప్పినందుకే ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులను తీరని శోకంలో ముంచేసింది. నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం కడపర్తిలో బీటెక్‌ విద్యార్ధిని భారతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పరీక్ష తప్పినందుకే చనిపోతున్నట్లు లేఖ రాసి.. చనిపోయింది.  ఆమె రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ఉన్న బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ 3వ సంవత్సర చదువుతోంది.

శ్రీవారికి స్వపన తిరుమంజన సేవ..

చిత్తూరు : తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు స్వామి వారికి వేద పండితులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వపన తిరుమంజన సేవ నిర్వహించారు. 

 

వివక్ష వల్ల వెనుకబడుతున్న దళితులు - సుఖదేవ్ థోరట్...

ఢిల్లీ : వివక్ష వల్ల ఆర్థిక..సామాజిక..రాజకీయ రంగాల్లో దళితులు వెనుకబడుతున్నారని యూజీసీ ఛైర్మన్, ఆర్థిక వేత్త సుఖదేవ్ థోరట్ వ్యాఖ్యానించారు. బీటీఆర్ భవన్ లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా దళిత శోషణ ముక్తి మంచ్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా థోరట్ మాట్లాడారు. సరళీకృత విధానాలతో దళితుల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. వ్యాపార రంగంలో దళితులకు ప్రోత్సాహం కరువైందని, ప్రస్తుతం 90 శాతం ఉపాధి ప్రైవేటు రంగంలోనే లభిస్తోందన్నారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లను అమలు చేయాలని సూచించారు.

చెరువులో ముగ్గురు విద్యార్థినిల గల్లంతు...

కరీంనగర్ : రాయకల్ మండలం అల్లీపూర్ లో విషాదం చోటు చేసుకుంది. చెరువులో దుస్తులు ఉతకడానికి చెరువుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థినిలు గల్లంతయ్యారు. విద్యార్థినిల కోసం గ్రామస్తులు గాలింపు చేపడుతున్నారు. 

15:44 - September 19, 2015

నదియా..'అత్తారింటికి దారేది', 'మిర్చి' సినిమాల్లో తన నటనతో అందర్నీ మెప్పించింది. 'అత్తారింటికి దారేది' చిత్రం తరువాత 'దృశ్యం'లో పవర్‌పుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించి అందర్నీ అలరించింది. ఆ తరువాత తెలుగులో ఆమె చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించలేదు. ఇదిలా ఉంటే మరోసారి 'త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌' ఆమెతో మ్యాజిక్‌ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. 'నితిన్' నటిస్తున్న తాజా మూవీ 'అ..ఆ..' లో 'నదియా'ను తీసకున్నారంట. అత్త పాత్రలో 'నదియా'ను చూపించనున్నారని టాక్. ఆమె కేరక్టర్‌పై ఇప్పటివరకు ఎవ్వరూ ఏమీ చెప్పకపోయినా 'అత్తారింటికి దారేది' అత్త తరహాలోనే 'నదియా' పాత్ర ఉంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

15:41 - September 19, 2015

కర్నూలు : వ్యవసాయ పెట్టుబడులు పెరగడంతో...రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెట్టుబడులకు డబ్బుల్లేక రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. విత్తు విత్తాలన్నా..నాటేయాలన్నా..దుక్కి దున్నాలన్నా వేలకు వేలు పెట్టుబడి పెట్టాలి. మరి అదే పేద రైతు అయితే..పరిస్థితి ఏంటి ? విత్తనాలు విత్తేందుకు ఎద్దుల్లేక..కుటుంబసభ్యులే కాడెద్దులుగా మారాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కర్నూలు జిల్లాలో ఓ రైతు పడుతున్న కష్టాలపై స్పెషల్‌ స్టోరీ.

రైతులకు పెను భారంగా వ్యవసాయం...

పెరిగిన ధరలతో వ్యవసాయం రైతులకు పెను భారంగా మారుతోంది. వేల రూపాయల పెట్టుబడులు పెట్టలేక రైతు అప్పులు పాలవుతున్నారు. తీరా చేసిన ఆ అప్పులు తీర్చలేక..దిక్కుతోచక..ఎటు వెళ్లాలో తెలియక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన ఓ రైతు..తన సొంతపొలంలో విత్తనాలు విత్తేందుకు ఎద్దుల్లేక కుటుంబసభ్యుల్నే కాడెద్దులుగా మార్చాడు.

గడ్డి కరువై ఎద్దులను అమ్ముకున్న రైతు....

గతేడాది పంటలు పండకపోవడంతో పశుగ్రాసం కొరత ఏర్పడింది. దీంతో తనకున్న రెండు ఎద్దులకు గడ్డి కరువైంది. అప్పటికే అప్పులు పెరిగిపోవడంతో..ఏం చేయాలో తెలియక..ఉన్న ఆ రెండు ఎద్దులను కాస్తా అమ్ముకున్నాడు. అయితే ఇప్పుడు నాలుగు చినుకులు పడడంతో..పొలం పనులు చేద్దామంటే తీరా ఎద్దులు లేకుండాపోయాయని వాపోతున్నాడు. కనీసం బయటి ఎద్దులను బాడుగకు తీసుకుందామనుకున్నా..బాడుగ ధరలు పెరిగిపోయాయి. దీంతో చేసేదేంలేక..కుటుంబసభ్యులే కాడెద్దులుగా మారి విత్తనాలను విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతుల ఆర్థిక కష్టాలను తీర్చడంలో సర్కార్ విఫలం......

దేశానికి రైతే వెన్నముక అంటున్న ప్రభుత్వం..ఇలాంటి రైతన్నల వ్యతలను తీర్చడంలో మాత్రం విఫలమవుతోంది. ఇలాంటి రైతన్నలను గుర్తించి వారికి కాస్తా ఆర్థిక తోడ్పాటును అందిస్తే..రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉంటారని ప్రతిపక్షాలు సర్కార్‌ను నిలదీస్తున్నాయి. 

15:38 - September 19, 2015

కడప : జిల్లాలోని యోగివేమన యూనివర్శిటీ అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదర్శంగా నిలుస్తోంది.. ఇక్కడ సీనియర్లు, జూనియర్లు, ఆడ, మగ అన్న తేడాలేకుండా విద్యార్థులంతా కలిసిమెలిసి ఉంటూ చక్కగా చదువుకుంటున్నారు.. మహిళలుకూడా ఎలాంటి భయం లేకుండా తోటివారి సహకారంతో తమ విద్యను కొనసాగిస్తున్నారు.. ఇంతవరకూ ఇక్కడ ఒక్క ర్యాగింగ్ కేసు కూడా నమోదు కాలేదు..

భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచిస్తున్నారు...

వీరు ఇలా కలివిడిగా ఉండటమే కాదు... ఎవ్వరూ ర్యాగింగ్‌కు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులకు సూచిస్తున్నారు.. సమస్యలొస్తే తమ స్నేహితులు, తల్లిదండ్రులు, ప్రొఫెసర్లకు తెలియజేయాలని కోరుతున్నారు..

యాంటి ర్యాగింగ్ కమిటీకూడా చురుగ్గా....

అటు వర్శిటీలో యాంటి ర్యాగింగ్ కమిటీకూడా చురుగ్గా పనిచేస్తోంది.. క్యాంపస్‌లో చాలాచోట్ల ర్యాగింగ్‌ వ్యతిరేక పోస్టర్లు వేశారు.. పోలీసులు, యాంటి ర్యాగింగ్ కమిటీ సభ్యుల ఫోన్ నెంబర్లను అందులో ప్రచురించారు.. కంప్లయింట్ బాక్సులుకూడా ఏర్పాటు చేశారు.. సీక్రట్ మానిటరింగ్ కమిటీనికూడా నియమించారు.. ఈ చర్యలతో ఇంతవరకూ తమ దృష్టికి ఒక్క ర్యాగింగ్ కేసు రాలేదని నోడల్ ఆఫీసర్ చెబుతున్నారు.. అంతేకాకుండా ప్రొఫెసర్ గంగయ్య, యాంటి ర్యాగింగ్ కమిటీ నోడల్ ఆఫీసర్, యోగివేమన యూనివర్శిటీ, కడప యూనివర్శిటీ ప్రొఫెసర్లుకూడా విద్యార్థులకు 24గంటలూ అందుబాటులో ఉంటున్నారు.. జీవితం విలువను తెలియజేస్తూ పాఠాలు బోధిస్తున్నారు.. ఇలా యోగివేమన విద్యార్థులు తమ యూనివర్శిటీకే కాదు.. జిల్లా మొత్తానికి తమ నడవడికద్వారా మంచి పేరు తెస్తున్నారు.. 

15:33 - September 19, 2015

హైదరాబాద్ : గుజరాత్ లో ఓ లోకల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు ఆమ్ రేలీలో బ్రిడ్జ్ కూలిపోయింది. విషయం తెలియని డ్రైవర్... బ్రిడ్జ్ పైకి రావడంతో... బస్ నదిలో పడిపోయే ప్రమాదం ఏర్పడింది. చివరి క్షణంలో అప్రమత్తంగా వ్యవహరించడంతో.. గాల్లో కాసేపు వేలాడింది. ఈఘటనలో ఓ ప్రయాణికుడు చనిపోగా... పదిమందికి గాయాలయ్యాయి. బస్ నదిలో పడిపోయి ఉంటే.. మృతుల సంఖ్య భారీగానే ఉండేది.  

బీజేపీ తీర్థం పుచ్చుకున్న జేడీయూ ఎమ్మెల్యే..

బీహార్ : రాష్ట్రంలో ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. శనివారం రాగోపూర్ జేడీయూ ఎమ్మెల్యే సతీష్ కుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

ఛత్తీస్ గఢ్ లో ఎంఎస్ జి -2 చిత్ర ప్రదర్శనపై నిషేధం..

ఛత్తీస్ గఢ్ : ఎంఎస్ జి -2 చిత్ర ప్రదర్శనపై పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిషేధం విధించింది. 

15:08 - September 19, 2015

విశాఖ : నగరంలోని ఆర్కే బీచ్‌లో నేవీ సిబ్బంది స్వఛ్చ్ భారత్ నిర్వహించారు.. బీచ్‌లో పేరుకుపోయిన చెత్త, చెదారాలను తొలగించారు.. ఈ కార్యక్రమంలో స్థానికులుకూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఫ్లీట్ రివ్యూకోసం బీచ్‌ను మరింత అందంగా తీర్చుదిద్దుతామని తెలిపారు.. 

ఎన్డీయే సర్కార్ పై రాహుల్ ఫైర్...

బీహార్ : ప్రస్తుతం కేంద్రంలో నడుస్తోంది పేద ప్రజల ప్రభుత్వం కాదని..సూట్ బూట్ ప్రభుత్వమని ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్డీయే ప్రభుత్వంపై మండిపడ్డారు. బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో శనివారం రాహుల్ ప్రచారం నిర్వహిచంఆరు. ఎన్నికల కోసం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు పొత్తు పెట్టుకుని మహా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. మోడీ తొలుత ఛాయ్ విక్రయించే వారని, కానీ ప్రస్తుతం 15 లక్షల సూట్స్ ధరించే స్థాయికి ఎదిగారని తెలిపారు. దేశంలో ఉపాధి తీసుకరావాలని అనుకుంటే ఉపాధి వాళ్లతో మాట్లాడాలని సూచించారు. ధరలు తగ్గాయా ? రోజ్ గార్ దొరికిందా అని సూటిగా ప్రశ్నించారు.

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..

నల్గొండ : జిల్లాలోని నకిరేకల్ మండలం కడపర్తిలో బీటెక్ చదువుతున్న భారతి ఆత్మహత్య చేసుకుంది. పరీక్ష తప్పినందుకేనని సూసైడ్ నోట్ లో పేర్కొంది. 

ఢిల్లీలో పెరుగుతున్న డెంగ్యూ మృతులు..

ఢిల్లీ : రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి కారణంగా పలువురు మృతి చెందుతున్నారు. శనివారం ఓ మహిళ ఈ వ్యాధితో మృతి చెందింది. దీనితో మృతుల సంఖ్య 21కి చేరింది. 

అస్సాంలో ఏకే 47 రైపిళ్ల స్వాధీనం..

అస్సాం : దుబ్రి ప్రాంతంలో పోలీసులు ఏకే 47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురరిని అదుపులోకి తీసుకున్నారు. 

14:57 - September 19, 2015

నెల్లూరు : అక్కడ ఉద్యోగం చేయాలంటే ఎవరికైనా హడల్. ఉన్నతాధికారుల దగ్గర నుంచి చిరుద్యోగి వరకు బెంబేలెత్తిపోతారు. పట్టుమని పది నెలలు కూడా ఉద్యోగం ఎవరూ చేయలేరక్కడ. రాజకీయాలకు పుట్టినిల్లు,..ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన నెల్లూరు జిల్లా రాజకీయ బదిలీలపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ.

రాజకీయాలకు పుట్టినిల్లయిన నెల్లూరు జిల్లా....

రాజకీయాలకు పుట్టినిల్లయిన నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు ఏ ఐఏఎస్ ఆఫీసరైనా, ఎస్పీ అయినా, గ్రూప్ వన్ , గ్రూప్ టు స్థాయి అధికారులైనా ఉద్యోగం చేయాలంటే ఎగిరి గంతేసేవారు. ఎందుకంటే నేరాలు, ఘోరాలు తక్కువగా ఉండడంతో..ఈ జిల్లాలో పని చేసేందుకు ఉద్యోగులు ఇష్టపడేవాళ్లు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. అధికారపార్టీ నాయకులు చెప్పిందే వేదం అన్నట్లుగా తయారైంది. వీరి మాట వినలేదో..ఐఏఎస్‌, ఐపీఎస్ అయినా సరే వెంటనే తోక కత్తిరించి ఏ మారుమూల గ్రామానికో,..లేక ప్రాధాన్యతలేని పోస్టుకి బదిలీ చేయించేస్తున్నారు. దీంతో జిల్లాకొచ్చిన అధికారులు పట్టుమని 10 నెలలు కూడా గడవక ముందే మూటాముల్లే సర్దుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు .......

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అనుకూలంగా లేరన్న సాకుతో జిల్లాలో ఇప్పటి వరకు నలుగురు అధికారులను బదిలీ చేశారు. కలెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్ , ఎస్పీ సెంథిల్ కుమార్ , జాయింట్ కలెక్టర్ రేఖారాణి, కార్పొరేషన్ కమిషనర్ చక్రధర్‌లు రాజకీయ నాయకుల రాజకీయ బదిలీలకు బలయ్యారు. ఇపుడు మరో వికెట్ బదిలీకి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ జానకి ఈ వరుసలో ఉన్నట్లు సమాచారం. మంత్రి నారాయణ తీరు, ఆయన అర్థరాత్రి పర్యటనలు ఆమెను మనస్థాపానికి గురిచేసినట్లు రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నలుగురు అధికారులు బదిలీ .....

ఈ జిల్లాలో అధికారులు నిజాయితీగా పనిచేసే పరిస్థితి కనపడడంలేదు. ఎవరైనా సరే అధికారపార్టీ నాయకులు కనుసన్నల్లో నడవాల్సిందే. లేదంటే అధికార పార్టీ నాయకులు ఆడే రాజకీయ చదరంగంలో పావులుగా మారాక తప్పదు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ..సీతయ్య ఎవడి మాటా వినడు అన్న విధంగా వ్యవహరిస్తే..హైకమాండ్‌ బదిలీవేటుకు బలవ్వాల్సిందే. ఇలా..వచ్చిన ప్రతి అధికారి తెలుగుతమ్ముళ్లు ఆగ్రహానికి గురై బదిలీ అవుతుండడంతో ఈ జిల్లాకు వచ్చేందుకు అధికారులెవరూ ముందుకు రావడం లేదు. వచ్చిన అధికారులకు కేవలం నెలల్లోనే తమ భవితవ్యం తేలనుండడంతో జిల్లాలో పోస్టింగ్ అంటేనే భయపడిపోతున్నారు.   

టి.టిడిపి అధ్యక్ష పదవి రేసులో లేను - ఎర్రబెల్లి..

హైదరాబాద్ : టిటిడిపి అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి పేర్కొన్నారు. తాను ఇప్పటికే శాసనసభాపక్ష నేతగా ఉన్నానని, అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేసినా తన సహకారం ఉంటుందన్నారు. 

14:53 - September 19, 2015

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో పని పడకేసింది.. ఫైళ్లు గుట్టలకొద్దీ పేరకుపోయాయి.. పాలనకు గుండెకాయలాంటి ఈ కార్యాలయంలో ఫైళ్లు ఎప్పుడు క్లియర్ అవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.. సాధారణంగా ఇక్కడికివచ్చే ఫైళ్లు చాలా ముఖ్యమైనవి అయిఉంటాయి.. ప్రస్తుతం ఇవన్నీ కింది స్థాయిలోనే ఆగిపోతున్నాయి.. కొన్నిసార్లు టప్పాలో వచ్చిన ఫైల్‌నుకూడా పక్కపెట్టేవారుకూడా లేరు...

ఫైళ్లు పేరుకుపోతున్నా పట్టించుకోని అధికారులు.....

ఉద్యోగుల నిర్లక్ష్యం... ఆయా శాఖల కార్యదర్శులు పట్టించుకోకపోవడంతో ఫైళ్ల దుమ్ము దులిపేవారు కరువయ్యారు.. ముఖ్యంగా మున్సిప‌ల్, పంచాయ‌తీరాజ్, విద్యాశాఖ‌, జీఏడీల్లో వంద‌లాది ఫైళ్లు సెక్షన్లలోనే మూలుగుతున్నాయి.. ఎవ్వరైనా వీటిగురించి అడిగితే ఏదో కారణంచెబుతూ సిబ్బంది తప్పించుకుంటున్నారు.. ఇక ఈ ఫైళ్ల ఏమయ్యాయంటూ వస్తున్న ఉద్యోగులనైతే రోజులకొద్దీ తిప్పుకుంటున్నారు..

వారంలో నాలుగు రోజులే ఫైల్స్‌పై సిబ్బంది దృష్టి....

వారంలో కేవలం నాలుగు రోజులే ఈ ఫైల్స్‌పై సిబ్బంది దృష్టిపెడుతున్నారు.. దీనికితోడు అధికారుల పర్యటనలతో ఈ పని మరింత ఆలస్యమవుతోంది.. ఇక్కడి ఉద్యోగులు రాజధానికి వెళ్లాలా? వద్దా? అన్న అంశంపై క్లారిటీ లేదు.. దీంతో మాకెందుకులే అన్న ధోరణిలో ఉద్యోగులున్నారు..

సచివాలయంలో వేధిస్తున్న సిబ్బంది కొరత.....

సచివాలయంలో సిబ్బంది కొరతకూడా వేధిస్తోంది.. పదేళ్లనుంచి ఇక్కడ రిక్రూట్‌మెంట్ జరగలేదు.. ఒక్కో సెక్షన్లో ఇద్దరు ASOలు ఉండాలి... ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారు.. దీనికితోడు రెండు, మూడు సెక్షన్లకు ఇన్స్‌పెక్షన్ అధికారికూడా ఒక్కరే కావడంతో వారిపై పనిభారం మరింత పెరుగుతోంది.. పైగా మంత్రులు, ముఖ్య శాఖాధికారులు తరచూ టూర్లు, సమావేశాలపేరుతో ఎక్కువగా విజయవాడలో గడుపుతున్నారు.. ఆయా ఫైల్స్‌ గురించి అడిగేవారే కరువయ్యారు.. ఏపీ సీఎంకు పనిరాక్షసుడిగా పేరుంది.. దీనికి భిన్నంగా ప్రస్తుతం సెక్రటేరియట్లో వర్క్ నడుస్తోంది.. ఇప్పటికైనా అధికారులు పాలనపై సీరియస్‌గా దృష్టి పెట్టాల్సిన అవసరముంది..

 

బొమ్మన హళ్ వద్ద ప్రమాదం..

అనంతపురం : బొమ్మనహళ్ (మం) ఉద్దేహళ్లు సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. లారీ క్యాబిన్ పై ప్రయాణీస్తున్న కూలీలకు విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. వీరిని బళ్లారీ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు పరిపస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

14:50 - September 19, 2015

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అట్రాసిటీ కేసును మరింత బలపర్చాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్ చేశారు. ఆయన ఢిల్లీలో 'టెన్ టివితో మాట్లాడుతూ... దళిత సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. అంబేద్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలని దళిత పోరాట సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఢిల్లీలో దళిత్‌ ముక్తి మంచ్‌ ఆధ్వర్యంలో దళిత సంఘాలు ప్రత్యేక సెమినార్‌ నిర్వహిస్తున్నారు. ఈ సెమినార్‌కు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పలువురు మేధావులు, కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. దళితుల హక్కుల సాధించుకునేందుకు ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరముందంటుందని రాఘవులు స్పష్టం చేశారు.

ఈనెల 23నుండి టి.శాసనసభ సమావేశాలు..

హైదరాబాద్ : ఈనెల 23వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర శాసనభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ అధికారుల నుండి సభ్యులకు సమాచారం అందింది. 

సీఎం కేసీఆర్ కు తమ్మినేని లేఖ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. సిర్పూర్ పేపర్ మిల్లును వెంటనే తెరిపించాలనికోరారు. ఏడు దశాబ్ధాల పాటు శ్రమించిన కార్మికులను తన స్వప్రయోజనం కోసం సంస్థ రోడ్డు పాలు చేసిందని విమర్శించారు. పది నెలలుగా జీతాలు లేక ఇద్దరు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడగా మరో పది మంది గుండెపోటుతో మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు. సిర్పూర్ కాగిత పరిశ్రమ తెరిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నించాలని లేఖలో కోరారు. 

మిషన్ కాకతీయతో సత్ఫలితాలు - హరీష్..

హైదరాబాద్ : మిషన్ కాకతీయ వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని చెరువులన్నీ నిండాయన్నారు. మిషన్ కాకతీయలో చెరువుల అభివృద్ధి వల్ల ఒక్క ఖమ్మంలోనే 2.5 లక్షల ఎకరాలకు నీరు అందుతోందన్నారు. 

14:46 - September 19, 2015

తిరుపతి : తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు అన్నప్రసాదం బఫే పద్దతిలో అందజేయడానికి టిటిడి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. నిత్యాన్నదాన సత్రంలోనే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకూ తిరుమల తిరుపతి హోటల్ యజమానుల సంఘం బఫే విధానాన్ని పర్యవేక్షిస్తుంది. తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాదం వితరణ కేంద్రం ద్వారా నిత్యం టిటిడి లక్షమందికి అన్నదానం చేస్తుంది. అయితే టేబుల్‌ విధానం ద్వారా అన్నం ఇతర పదార్థాలు వృధా అవుతున్నాయని గుర్తించిన టిటిడి కొత్తగా బఫే విధానాన్ని అమలు చేస్తోంది. గతంలో కూడా బఫే విధానం ఉన్నా..కొత్తగా అధునాతనంగా కౌంటర్లను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.

14:43 - September 19, 2015

హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు.. అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు.. జడ్చర్ల ఆస్పత్రిలో 25మంది... కొడంగల్‌లో 15మంది, గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో 20మంది చికిత్స పొందుతున్నారు.. 

14:26 - September 19, 2015

హైదరాబాద్ : ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని మల్కన్ గిరి జిల్లా ధరాగూడ వద్ద మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు మావోయిస్టు పరారైనట్లు సమాచారం. పరారై మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.కాంఘర్‌ వ్యాలీ ఏరియా కార్యదర్శి సునాధర్‌తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరిద్దరిలో ఒకరు లచ్చంగా గుర్తించగా.. మరొకరిని ఇంకా గుర్తించలేదు. ఘటనాస్థలంలో 3 పిస్టల్స్‌, వాకీటాకీలు, కత్తులు, విప్లవ సాహిత్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం..

హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది.అసెంబ్లీ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. 

ట్యాంక్ బండ్ పై నిమజ్జనాన్ని ప్రారంభించిన హరీష్..

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనాన్ని మంత్రి హరీష్ రావు అధికారికంగా ప్రారంభించారు. ట్యాంక్ బండ్ పై 13, ఎన్టీఆర్ మార్గంలో 10 క్రేన్లు మొత్తంగా నగరంలో 21 చోట్ల క్రేన్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 

జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ మొదటి లిస్టు..

బీహార్ : శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ రోజు సాయంత్రం విడుదల చేయనున్నట్లు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించాయి. 

బీసీ సబ్ ప్లాన్ సాధనకై నిరవధిక దీక్షలు - సీపీఎం..

హైదరాబాద్ : బీసీ సబ్ ప్లాన్ సాధనకై ఈనెల 20 నుండి నిరవధిక దీక్షలు చేయనున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అసెంబ్లీ లోపల, బటయ ఆందోళన చేస్తామని, ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళికలకు నిబంధనలు రూపొందించాలని డిమాండ్ చేశారు. వివాదస్పద నిర్ణయాలపై ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో కేసీఆర్ ఉపసంహరించుకున్నారని, బీసీ సబ్ ప్లాన్ సాధన ఉద్యమానికి మంచి ఆదరణ వస్తోందన్నారు.

 

మల్కన్ గిరిలో ఎన్ కౌంటర్..

ఒడిశా : మల్కన్ గిరి జిల్లాలో బీజాగూడలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. కాంఘర్ వ్యాలీ ఏరియా కార్యదర్శి సోనోధర్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

సీఐడీ కస్టడీలో కేశవరెడ్డి...

కర్నూలు : కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డిని ఐదు రోజుల కస్టడీకి సీఐడీ తీసుకుంది. విద్యార్థుల నుండి సేకరించిన డిపాజిట్లను తిరిగి చెల్లించని కేసులో కేశవరెడ్డి నిందితుడన్న విషయం తెలిసిందే. 

గుంటూరు సర్కారీ ఆసుపత్రిలో ఎలుకల దాడి..

గుంటూరు : ప్రభుత్వాసుపత్రిలో మరో రోగిపై ఎలుకలు దాడి చేశాయి. గత నెల 26న ఎలుకల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. 

బీసీ ఉప ప్రణాళికపై అఖిలపక్షం రౌండ్ టేబుల్..

హైదరాబాద్ : బీసీ ఉప ప్రణాళికపై అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. బీసీ సాధికారిత భవన్ లో జరుగుతున్న సమావేశానికి సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, చాడ లు హాజరయ్యారు. వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే షబ్బీర్ ఆలీ, టీడీపీ నేతలు ఎర్రబెల్లి, ఎల్. రమణ లు హజరయ్యారు. 

రాహుల్ ర్యాలీలో ఆర్జేడీ, జేడీయూ నేతలు..

బీహార్ : ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన ర్యాలీలో ఆర్జేడీ నేత తేజశ్వీ యాదవ్, జేడీయూ నేత కేసీ త్యాగీ పాల్గొన్నారు. 

కల్తీ కల్లు దొరక్క ఆసుపత్రి పాలవుతున్న బాధితులు...

మహబూబ్ నగర్ : జిల్లాలో పలు ఆసుపత్రుల్లో కల్తీ కల్లు బాధితులు చేరుతున్నారు. జడ్చర్ల ఆస్పత్రిలో 25 మంది..కొడంగల్ ఆస్పత్రిలో 15 మందికి..గద్వాల ఆసుపత్రిలో 20 మంది కల్లు బాధితులకు చికిత్స అందిస్తున్నారు.

 

మంత్రి జోగు రామన్న వీడియో కాన్ఫరెన్స్..

హైదరాబాద్ : బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి జోగు రామన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖలో అమలవుతున్న పథకాలపై చర్చించారు. దోబి ఘాట్ నిర్మాణ పనులపై జోగు రామన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. శాఖ లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు మంత్రి జోగు రామన్న ఆదేశాలు జారీ చేశారు. 

మిడ్ మానేరుపై హరీష్..కేటీఆర్ ల సమీక్ష..

హైదరాబాద్ : సచివాలయంలో మిడ్ మానేరుపై ఇరిగేషన్ అధికారులతో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆర్ అండ్ బి శాఖపై బాబు సమీక్ష..

విజయవాడ : జిల్లాల కలెక్టర్లతో జరుగుతున్న సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆర్ అండ్ బి శాఖపై సమీక్ష నిర్వహించారు. రహదారులపై పూర్తిగా దృష్టి పెట్టాలని, ఎక్కడా గుంతలు కనిపించకూడదని సూచించారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయాలని, వాహనదారులెవరూ ఇబ్బందులు పడవద్దని ఆయన తెలిపారు. జాతీయ రహదారులను నిరంతరం పర్యవేక్షించాలని, రహదారుల నిర్వహణకు నిధుల కొరత లేదని, క్వాలిటీ లేని రోడ్లు కనిపిస్తే కాంట్రాక్టర్ల పేర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రెవెన్యూ శాఖలో 113 సర్టిఫికేట్ల కోసం ఈ గవర్నెన్స్ ను ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు.

కాసేపట్లో టి. రాష్ట్ర కేబినెట్ భేటీ

హైదరాబాద్: కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్అధ్యక్షతన సమావేశం కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.

 

13:47 - September 19, 2015

హైదరాబాద్ : రాయలసీమ ప్రజలను ఎపి ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని వైసిపి నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లారు. రాయలసీమ ప్రజలను మభ్యపెట్టి.. దోపిడీ చేయడానికే ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును తీసుకొస్తుందన్నారు. ప్రాజెక్టుకు ఇంజనీర్లు కాకుండా...కాంట్రాక్టర్లు డిజైన్ చేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు, అధికారులు, కాంట్రాక్టర్లు అందరూ కలిసి దోపిడీకి కార్యాచరణ రూపొందించుకున్నారని ఎద్దేవా చేశారు. ఈనెల 25 వ తేదీ లోపు ఎపికి ప్రత్యేకహోదా ప్రకటించాలని లేని ఎడల 26 నుంచి గుంటూరులో నిరధిక నిరాహార దీక్ష చేయనున్నట్లు పేర్కొన్నారు.

 

13:41 - September 19, 2015

విశాఖ : నగరంలో ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయి తరలిస్తూ దొరికిపోయాయి. దుంబ్రిగూడ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా... నలుగురు విద్యార్థులు పట్టుబడ్డారు. వీరి వద్ద 3కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ విద్యార్థులు పైడా, అవంతి, తిరుపతి ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన వారుగా గుర్తించారు. దుంబ్రిగూడ పిఎస్ లో వారిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు పిఎస్ కు వచ్చారు.

 

13:36 - September 19, 2015

నల్లగొండ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు కీచకుల్లా మారిపోతున్నారు. తాజాగా ఓ వ్యాయామ టీచర్ విద్యార్థినిలను లైంగికంగా వేధించాడు. నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న మల్లయ్య అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని విద్యార్థినిలు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో విద్యార్థినిలు వారి తల్లిదండ్రులు స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. ఆ ఉపాధ్యయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

13:15 - September 19, 2015

ఢిల్లీ : నేషనల్ టూరిజం అవార్డులను... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి అవార్డులు అందజేశారు. 2013-14 సంవత్సరానికిగాను... బెస్ట్ టూరిజం అవార్డును సదరన్ ట్రావెల్స్ అందుకుంది. బెస్ట్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్‌గా... ఎనిమిదోసారి అవార్డు అందుకున్నట్లు సదరన్ ట్రావెల్స్ ఛైర్మన్ కృష్ణ మోహన్ తెలిపారు.

 

దసరాకు డబుల్ బెడ్ రూం ఇళ్లు - తలసాని..

హైదరాబాద్ : దసరా పండుగ నాడు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. సనత్ నగర్ ఐడీహెచ్ కాలనీలో మంత్రి తలసాని పర్యటించారు. ఈసందర్భంగా అక్కడ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. 

13:11 - September 19, 2015

హైదరాబాద్ : హెల్మెట్‌ ధారణ.. మీ ప్రాణానికి రక్షణ అంటూ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ వినూత్న ప్రచారాన్ని నిర్వహిస్తోంది. తరచూ జరిగే రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్‌ లేకపోవడం వల్లే దాదాపు 24 శాతం మంది మృత్యువాత పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్లు ధరించాలని అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినా.. ప్రాణాలతో బయటపడవచ్చునని అధికారులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించేలా ప్రచారం చేస్తూ.. హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించారు.

 

నిలకగడగా జగన్ మోహన్ ఆరోగ్యం..

ఢిల్లీ : బీసీసీఐ చీఫ్ జగన్ మోహన్ దాల్మియా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉంచామని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటనలో పేర్కొంది. 

రాహుల్ తో నితీష్ భేటీ ?

బీహార్ : ఏఐసీసీ కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీతో బీహార్ సీఎం నితీష్ కుమార్ పాట్నా ఎయిర్ పోర్టులో కలుసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. శనివారం రాహుల్ ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

 

గూడూరులో 13 మంది ఎర్రచందనం కూలీల అరెస్టు..

నెల్లూరు : జిల్లాలోని 13 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్టు చేశారు. కూలీల నుండి 11 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

 

'తెలంగాణ రాష్ట్ర సాధన - ఉద్యమ డైరీ' ఆవిష్కరణ..

హైదరాబాద్ : సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమ డైరీ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొ.కొదండరాం, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎన్ కౌంటర్లపై చర్చ జరుగుతూనే ఉంటుంది - అల్లం నారాయణ..
ఎన్ కౌంటర్లపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉందని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రాజెక్టు రూపంలో ప్రజలకు అందుబాటులో తేవాలన్నారు.
తెలంగాణ ఉద్యమంపై చరిత్ర అవసరం - ప్రొ.కొదండరాం..

12:49 - September 19, 2015

విశాఖ : నిన్న కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మరువకముందే విశాఖలో మరో ఘటన జరిగింది. మరోసారి కుక్కలు ప్రతాపం చూపాయి. అగనంపూడి ఫార్మాసిటీ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం చేశాయి. ఐదు కుక్కలు ఎనిమిదిమందిపై దాడి చేశాయి. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా వుంటే నిన్న విశాఖలో శివకేశవ్ అనే రెండేళ్ల బాలుడి పై కుక్కలు దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీశాయి. ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయగా పొట్టలోని పేగులన్నీ బయటకు వచ్చాయి. ఆ బాలుడ్ని కేజీహెచ్ మార్చురికి ఆ బాలుడ్ని తరలించారు. ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రెటర్ విశాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని స్థానికులు మండిపడుతున్నారు.

 

12:43 - September 19, 2015

ఆదిలాబాద్ : గత మూడురోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. సిర్పూర్ మండలంలో తాడిచెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కౌటాల, బెజ్జూరు మండలంలోని 50 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు కుశ్నేపల్లి, కకుడ వాగులు కూడా పొంగిపొర్లుతుండటంతో... 15 గ్రామాలతో సంబంధాలు నిలిచిపోయాయి. అటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాలకు పెన్ గంగా, ప్రాణహిత నదులు భారీగా ప్రవహిస్తున్నాయి.

 

12:41 - September 19, 2015

మెదక్ : చదువులు చెప్పాల్సిన గురువులు యమకింకరులుగా మారుతున్నారు. క్రమశిక్షణ పేరుతో చిన్నారులను చితకబాదుతున్నారు. మెదక్‌ జిల్లాలో ఆగ్రహానికి గురైన టీచర్‌ ఓ చిన్నారిని త్రీవంగా చితకబాదింది. పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి యోక్షితశ్రీని హోంవర్క్‌ సరిగ్గా చేయలేదని టీచర్‌ కర్రతో చితకబాదింది. దెబ్బలకు తాళలేక చిన్నారికి తీవ్ర జ్వరం వచ్చింది. ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్‌ ముందు ఆందోళనకు దిగారు.

 

సెజ్ బాధిత రైలు సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు..

కాకినాడ : కొత్తపల్లి (మం) ముమ్మడివారి కోన సెజ్ బాధిత రైతుల సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సెజ్ భూములు తిరిగిఇస్తామన్న చంద్రబాబు హామీని నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులకు వైసీపీ మద్దతు తెలిపింది. 

12:36 - September 19, 2015

హైదరాబాద్ : భారీ వర్షాలకు హైదరాబాద్ ఫలక్‌నుమా రైల్వే జంక్షన్లో గూడ్స్ ఇంజన్ పట్టాలు తప్పింది. దీంతో మిగతా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఇంజన్‌ను పక్కకు జరిపిన అధికారులు నిజాముద్దీన్‌కు లైన్ క్లియర్ చేసి పంపారు. మిగిలిన రైళ్లనుకూడా అలాగే పంపించివేశారు.

 

కొల్లేరును ఆదర్శ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి - బాబు..

విజయవాడ : కొల్లేరును కాలుష్యం లేకుండా దేశంలోనే ఆదర్శ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. రెండో రోజు జరుగుతున్న కలెక్టర్ల ససమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక రంగంలో రూ.1814 కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయని, పట్టణ ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో టూరిజమే ప్రధాన ఆదాయ వనరుగా మారనుందని తెలిపారు. కొత్త రాష్ట్రానికి ఐటీ లీడర్స్ వచ్చే వరకు ఆగకుండా చిన్న కంపెనీలను ప్రమోట్ చేయాలని బాబు సూచించారు. ఐటీ పరిశ్రమ విస్తరణకు ఏపీలో అధిక అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 

పీఈటీ లైంగిక వేధింపులు..

నల్గొండ : పెన్ పహాడ్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై పీఈటీ మల్లయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రధానోపాధ్యాయుడికి ఐదుగురు విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు.

 

ఏపీ ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా..

హైదరాబాద్ : ఏపీ ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా పడింది. పూర్తి సమాచారంతో డిస్కంలు రావాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 

దళిత శోషణ ముక్తి మంచ్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు..

ఢిల్లీ : బీటీఆర్ భవన్ లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా దళిత శోషణ ముక్తి మంచ్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు డీఎస్ఎంఎం జాతీయ నేతలు రాధాకృష్ణన్, వి.శ్రీనివాసరావు, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, సుభాషిణీ ఆలీ, ప్రొ.కంచె ఐలయ్య, సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్యతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కేవీపీఎస్ నాయకులు పాల్గొన్నారు. 

12:28 - September 19, 2015

హైదరాబాద్ : కార్టూన్ సీరియల్ గా ప్రపంచవ్యాప్తంగా చిన్నారులను అలరించిన జంగిల్ బుక్ .. ఇప్పుడు మూవీగా వస్తోంది. ఐరన్ మ్యాన్ మూవీ డైరెక్టర్ ఫేవ్ ర్యూ దర్శకత్వంలో... డిస్నీ రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు కోటి హిట్లు సాధించింది. నీల్ సేథీ మోగ్లీగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 16న విడుదల కానుంది.

 

12:25 - September 19, 2015

గుజరాత్ : సూరత్‌లో పటేళ్ల నాయకుడు హార్దిక్ పటేల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఏక్తా యాత్రకుముందే పటేల్ ను అదుపులోకి తీసుకున్నారు. అటు ఈ యాత్రకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. పటేల్‌ను అరెస్టును మిగతా కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. సూరత్‌లో సర్దాల్ పటేల్‌ విగ్రహానికి పూల మాలలు వేసి యాత్ర ప్రారంభించాలని పటేళ్లంతా భావించారు. దీనికిముందే హార్దిక్ పటేల్ అరెస్టయ్యారు.

 

ఎంఎస్ జి 2 చిత్ర విడుదల కోసం రైల్ రోకో..

పంజాబ్ : ఎంఎస్ జి - 2 (మెసెంజర్ ఆఫ్ గాడ్ -2) చిత్ర విడుదల కోరుతూ డేరా సచ్చ సౌదా శ్రేణులు మోగా ప్రాంతంలో రైల్ రోకో నిర్వహించారు. 

రాష్ట్ర శాంతి భద్రతలపై అఖిల్ సమీక్ష..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. 

12:15 - September 19, 2015

కృష్ణా : విజయవాడలో ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్‌శివాజీకి అవమానం జరిగింది. కలెక్టర్ల సమావేశానికి హాజరైన గౌతు శ్యాంసుందర్‌శివాజీని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డు చూపించినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో అక్కడికి చేరుకున్న మంత్రి అచ్చెన్నాయుడు.. పోలీసులకు సర్దిచెప్పడంతో ఎమ్మెల్యేను లోపలికి అనుమతించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

సూరత్ లో ఇంటర్నెట్ సర్వీసుల తొలగింపు..

గుజరాత్ : సూరత్ లో స్థానిక పరిపాలన యంత్రాంగం ఇంటర్నెట్ సర్వీసులను 24గంటల పాటు తొలగించింది. శనివారం ఉదయం పటేళ్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

ఐడీహెచ్ కాలనీలో మంత్రి తలసాని పర్యటన..

సికింద్రాబాద్: బోయిగూడలోని ఐడీహెచ్ కాలనీలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పర్యటించారు. ఐడీహెచ్ కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

12:12 - September 19, 2015

ఖమ్మం : ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 35 అడగులకు చేరుకుంది. ఖమ్మం జిల్లా వాజేడు మండలంలో చీకుపల్లివాగు పొంగిపొర్లడంతో 25 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి.

 

విశాఖలో కుక్కల దాడి..

విశాఖపట్టణం : ఆగనంపూడి ఫార్మాసిటీ కాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. శనివారం ఉదయం ఎనిమిది మందిపై కుక్కలు దాడి చేశాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

11:53 - September 19, 2015

హైదరాబాద్ : ఎల్బీనగర్ సమీపంలోని అల్కపురిలో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కోసం కారును ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులను కారుతో ఢీకొట్టారు. శుక్రవారం రాత్రి అల్కపురి ప్రధాన రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎల్బీనగర్ నుంచి ఇద్దరు యువకులు వేగంగా కారు నడుపుతూ వచ్చారు. వారిని ఆపేందుకు పోలీసులు బారీ కేడ్లు అడ్డుపెట్టారు. ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో యువకులు కారు వేగం పెంచి... బారీకేడ్లను బలంగా ఢీకొట్టారు. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డు యాదగిరిరెడ్డిపై కారు దూసుకెళ్లింది. యువకులు పారిపోయేందుకు ప్రయత్నించగా... రోడ్డుపై ఓ గుంతలో కారు ఇరుక్కుపోవడంతో ఎటూ వెళ్లలేకపోయారు. ఈ ఘటనలో హోంగార్డు యాదగిరిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కాలు పూర్తిగా విరిగిపోయింది. యాదగిరిరెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు కారణమైన యువకులను పోలీసులు అదుపులోకి తీసకున్నారు.

 

ఎంఎంటీఎస్ రైళ్ల పునరుద్ధరణ..

హైదరాబాద్ : నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించారు. ఫలక్ నుమా రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన రైలింజన్ ను తొలగించిన రైల్వే సిబ్బంది మరమ్మత్తులు పూర్తి చేశారు. 

గుజరాత్ లో కూలిన బ్రిడ్జి..ఒకరు మృతి..

గుజరాత్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు అమ్రెల్లీ వద్ద ఓ బ్రిడ్జి కూలిపోయింది. ఈఘటనలో ఒకరు మృతి చెందగా పది మందికి గాయాలయ్యాయి. 

గంజాయితో పట్టుబడిన ఇంజినీరింగ్ విద్యార్థులు..

విశాఖపట్టణం : దుంబ్రిగూడ వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయితో పట్టుబడ్డారు. గణేష్, రత్నం, రాజు, దిలీప్ లను అదుపులోకి తీసుకుని మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు పైడా, అవంతి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు. 

కలెక్టర్ల సమావేశంలో పర్యాటక శాఖపై బాబు సమీక్ష..

విజయవాడ : జిల్లాల కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటక శాఖపై సమీక్ష నిర్వహించారు. పర్యాటకం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని, సంవత్సరానికి 93 మిలియన్ల మంది పర్యాటకులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఏపీలో మరోసారి విద్యుత్ భారం..

విజయవాడ : మరోసారి ప్రజలపై ఏపీ ప్రభుత్వ విద్యుత్ భారం మోపనుంది. రూ.7,200 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. కరెంటు ఛార్జీల పెంపుతో గత ఎప్రిల్లో ప్రజలపై రూ.3వేల కోట్ల భారం పడిన సంగతి తెలిసిందే. 2009-2014 వరకు అదనపు ధరలతో విద్యుత్ ను ప్రభుత్వం కొనుగోలు చేసింది. లోటును పూడ్చుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీ ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది.

నేతాజీ జీవిత విశేషాలు ప్రజలకు తెలియాలి - వెంకయ్య..

హైదరాబాద్ : నేతాజీ జీవిత విశేషాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కేంద్రం వద్దనున్న నేతాజీ దస్త్రాలను విడుదల చేస్తామని, దస్త్రాల్లో ఏముందో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నేతాజీ మరణం వెనుక నిజాలు అందరికీ తెలియాలని, భూ సేకరణ చట్టానికి కాంగ్రెస్ అడ్డుపడడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పులు కప్పిపుచ్చుకొనేందుకు రేపటి ధర్నా నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు.

 

రెండో రోజు జిల్లాల కలెక్టర్ల సదస్సు..

విజయవాడ : కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు జరుపుతున్న సదస్సులో రెండో రోజు పారిశ్రామిక మిషనర్ పరిశ్రమల శాఖ ప్రజేంటేషన్ ఇచ్చింది. లీజ్ బిజినెన్ ఆఫ్ డూయింగ్ లో వరల్డ్ బ్యాంకు రాష్ట్రానికి రెండో ర్యాంకు ఇవ్వడం..పట్టిసీమను అతి తక్కువ సమయంలో పూర్తి చేసి రెండు నదులను కలపడం..తదితర అంశాలు అధికారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఏకగవాక్ష విధానం, విదేశీ టూర్లు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. టీమ్ వర్క్ బాగున్న శాఖలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని కితాబిచ్చారు. కొత్తగా వచ్చే పరిశ్రమల్లో భాగస్వామ్యం అవుతూ ఏపిఐసీ పటిష్టమైన సంస్థగా ఎదగాలని సూచించారు.

 

ఆస్తుల వెల్లడిలో అధినేతల బాటలో ఐఏఎస్ లు..

హైదరాబాద్ : ఆస్తుల వెల్లడిలో లో అధినేతల బాటలో ఐఏఎస్ లు వెళుతున్నారు. 2014 కు సంబంధించే ఆస్తులను ఐఏఎస్ లు ప్రకటించలేదు. తెలంగాణలో ఆస్తులు ప్రకటించని ఐఏఎస్ లు 28 మంది ఉండగా ఆంధ్రలో ఆస్తులు ప్రకటించని ఐఏఎస్ లు 47 మంది ఉన్నారు. తెలంగాణలో ఆస్తులు లేని వారి సంఖ్య 22 ఉండగా ఆంధ్రలో 19గా ఉంది. తెలంగాణలో 118 మంది ఆస్తులు లేని వారి శాతం 22. 

11:00 - September 19, 2015

కంగనా రనౌత్..బాలీవుడ్ నటి..ప్రస్తుతం ఆమె ఓ నటుడి విషయంలో చాలా ఎక్సైట్ అవుతోందంట. ఆయనతో నటించడం అంటే గొప్ప విషయమని పేర్కొంటోంది. ఆయనే బాలీవుడ్ బిగ్ బి 'అమితాబ్ బచ్చన్' వీరిద్దరూ కలిసి సినిమాలో నటిస్తున్నారా ? అని ఆశ్చర్యపోకండి. 'అమితాబ్', 'కంగనా' లు కలిసి ఓ యాడ్ లో నటించనున్నారు. కంగన బిగ్ బీ తో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. సినిమా అయినా టీవీ యాడ్ అయినా అమితాబ్ తో కలిసి నటించడం అంటే గొప్ప విషయం కదా. దీంతో ఆమె చాలా ఎక్సైట్ అవుతోందట. వీళ్ళిద్దరూ కలిసి 'బోరో ప్లస్ క్రీం' యాడ్ లో కనిపించనున్నారు. 'పీకే' వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన రాజ్ కుమార్ హీరాని సూపర్ విజన్ లో జరుగుతోందంట. కరణ్ నార్వేకర్ ఈ యాడ్ కు డైరెక్టర్ అంట. 

10:49 - September 19, 2015

మెగాస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రాంచరణ్ తేజ' నటిస్తున్న 'బ్రూస్ లీ' చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన రకరకాలైన వార్తలు బయటకొస్తున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ 'చిరంజీవి', టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున'లు కీలక పాత్రలు పోషిస్తున్నారని..వపర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' వాయిస్ ఓవర్ ఇచ్చాడని..ఇలా ఎన్నో వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా 'చెర్రీ'..'చిరంజీవి'తో టాలీవుడ్ మిల్క్ బ్యూటీ 'తమన్నా' స్టెప్పులేయనుందని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే బాలీవుడ్ చిత్రంలో 'అమితాబ్', 'అభిషేక్ బచ్చన్' లు 'ఐశ్వర్యరాయ్'తో స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ తరహాలోనే 'తమన్నా' చరణ్, చిరులతో స్టెప్పులేసిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాపై వస్తున్న వార్తలు నిజమో..కాదో తెలుసుకోవాలంటే చిత్రం విడుదలయ్యేంత వరకు ఓపిక పట్టాల్సిందే.

రాహుల్ ర్యాలీలో కలకలం..

బీహార్ : ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ర్యాలీలో కలకలం రేగింది. ఓ వ్యక్తి ఎయిర్ గన్ తో సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

10:31 - September 19, 2015

చిన్న పిల్లలు ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తారు ? ఆ ఏం చేస్తారు..బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు..లేదా టీవీల్లో వచ్చే పోగో, కార్టూన్స్ సీరియల్స్ చూస్తే సమయాన్ని గడిపేస్తుంటారు అని అంటారు కదా. కానీ కొంతమంది చిన్నారులు మాత్రం తమ ప్రతిభను చాటుతుంటారు. రేండేళ్ల వయస్సున్న చిన్నారి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ కొట్టేశాడు. ఇరాన్ లోని బబోల్ టౌన్ లో 'ఆరాత్ హోస్సైనీ' అనే చిన్నారి ఉంటున్నాడు. ఇతను చేసే విన్యాసాలను ఎందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇంట్లో ఉన్న ఏ ప్లేస్ లోనైనా స్టంట్స్ చేస్తున్నారు. బెడ్ రూం..కిచెన్..చివరకు టివిపైనా కూడా స్టంట్స్ చేస్తున్నాడు. ఇతను చేసే స్టంట్స్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న వారు సైతం ఇతను చేసే జిమ్నాస్టిక్స్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు. శరీరాన్ని వంచడంలో ఆరాత్ కి మరెవరు సాటీ రారు అనే విధంగా జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు. 9నెలల వయస్సులోనే స్టంట్స్ చేయడం మొదలు పెట్టాడని, మేడపై..మెట్లపై తన విన్యాసాలు ప్రదర్శస్తున్నాడని తండ్రి మహ్మద్ పేర్కొంటున్నాడు. ఏదో ఒక రోజు ప్రపంచ జిమ్నాస్టిక్స్ ను శాసించే స్థాయికి ఆరాత్ చేరుకుంటాడని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

కలెకర్ట సమావేశానికి ఎమ్మెల్యేకు నో ఎంట్రీ...

విజయవాడ : కలెక్టర సమావేశం జరుగుతున్న ప్రాంగణానికి ఎమ్మెల్యే గౌతు శ్యాసుందర్ శివాజీ వచ్చారు. ఆయన్ను పోలీసులు లోనికి అనుమతించలేదు. తాను ఎమ్మెల్యేనని, ఐడీ కార్డు చూపించినా పోలీసులు అనుమతించలేదు. చివరకు మంత్రి అచ్చెన్నాయుడి చొరవతో ఎమ్మెల్యే శివాజీని లోనికి అనుమతించారు. 

విజయవాడలో జిల్లాల కలెక్టర్ల సమావేశం..

విజయవాడ : జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని లిబియాలో కిడ్నాపైన రామ్మూర్తి కుటుంబసభ్యులు కలిశారు. కిడ్నాపర్ల చెర నుండి రామ్మూర్తిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని సీఎం హామీనిచ్చారు. 

శ్రీశైలం జలాశయం నీటి మట్టం 840.20 అడుగులు..

కర్నూలు : శ్రీశైలం జలాశయం నీటి మట్టం ప్రస్తుతం 840.20 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఇన్ ఫ్లో 19,048 క్యూ సెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 10, 448 అడుగులుగా ఉంది. 

రాష్ట్రంలో అశాంతి కలుగ చేయడానికి ప్రయత్నం - హార్దిక్ పటేల్..

సూరత్ : రాష్ట్రంలో అశాంతి కలుగ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం..పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని పటేళ్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ ఆరోపించారు. శనివారం ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రారంభించ తలపెట్టిన ఏక్తాయాత్రకు పోలీసులు అనుమతినివ్వలేదు. 

హర్దిక్ పటేల్ అరెస్టు..

సూరత్ : పటేళ్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఏక్తాయాత్రకు ముందే పటేల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ప్రారంభించ తలపెట్టిన ఏక్తాయాత్రకు పోలీసులు అనుమతినివ్వలేదు. 

ఉధృతంగా ప్రవహిస్తున్న తాటిచెట్టు వాగు..

ఆదిలాబాద్ : టోంకిని వద్ద తాటి చెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీని ప్రభావం వల్ల రెండు మండలాలకు రాకపోకలకు నిలిచిపోయాయి.

 

ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్ గంగ..

ఆదిలాబాద్ : సిర్పూర్ (మం) వెంకట్రావు పేట తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు వంతెన వద్ద 38 అడుగుల ఎత్తులో పెన్ గంగ ప్రవహిస్తోంది. 

'విద్యా భారతి దక్షిణ భారత ఖేల్ ఖూద్' పోటీలు ప్రారంభం..

హైదరాబాద్ : బండ్లగూడలోని శారదాధామంలో 'విద్యా భారతి దక్షిణ భారత ఖేల్ ఖూద్' పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి హాజరయ్యారు. 

09:08 - September 19, 2015

తిరుమల : సప్తగిరులు వెలిగిపోతున్నాయి. గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. తిరుమాడ వీధులన్నీ భక్త జనసంద్రంగా మారితే.. హృదయాలన్నీ ఆధ్యాత్మిక చింతనలో ఓలలాడుతున్నాయి. బ్రహ్మోత్సవాల సంధర్భంగా పలు రూపాల్లో దర్మనమిస్తున్న శ్రీవారిని చూసి తరించిపోతున్నాయి.
తిరుమల బ్రహ్మోత్సవాలు
శేషాచలం దేదీప్యమానమై వెలిగిపోతోంది. ఏడు కొండలు హరినామస్మరణతో పులకించిపోతున్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చి భక్తులతో సప్తగిరులు పోటెత్తుతున్నాయి. సాధారణ రోజుల్లో కంటే బ్రహ్మోత్సవాల్లో స్వామి వారిని దర్శించుకోవటం భక్తులంతా పుణ్యఫలంగా భావిస్తారు. దీంతో గతంతో పోలిస్తే ఈ సారి భక్తులు తిరుమలకు పోటెత్తారు.
కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు
తిరుమలలో 3వరోజు బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. 3వరోజు రాత్రి స్వామి వారిని ముత్యపు పందిరిపై ఊరేగించారు. అత్యంత వైభవంగా జరిగే ముత్యపు వాహన సేవలో భాగమయ్యేందుకు, ముత్యపు పందిరిపై ఊరేగే శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వచ్చారు. భారీగా వర్షం కురుస్తున్నప్పటికి లెక్కచేయని భక్తజనం గోవిందుడి దర్శన భాగ్యాన్ని పొందారు.
సాంస్కృతిక బృందాల సందడి
స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన సాంస్కృతిక బృందాలు తిరుమలలో సందడి చేస్తున్నాయి. అన్నమాచార్య కీర్తనలతో వాహన సేవకు మరింత శోభ తెస్తున్నారు.
పోలీసులు భారీ బందోబస్తు
బ్రహ్మోత్సవాల సంధర్భంగా తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జేబు దొంగలు, మాయగాళ్లు చెలరేగే ప్రమాదం ఉండటంతో నిరంతర నిఘాను ఏర్పాటు చేశారు

 

నేడు రెండోరోజు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సదస్సు

విజయవాడ : నేడు రెండో రోజు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సదస్సు జరుగనుంది. పలు కీలక అంశాలపై సమీక్షించనున్నారు. 

నేడు ''తెలంగాణ రాష్ట్ర సాధన-ఉద్యమడైరీ'' ఆవిష్కరణ

హైదరాబాద్ : నేడు ''తెలంగాణ రాష్ట్ర సాధన-ఉద్యమడైరీ'' ఆవిష్కరణ జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ, కోదండరాం పాల్గొననున్నారు. 

నేడు కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనం

చిత్తూరు : నేడు తిరుమల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనంపై స్వామివారి దర్శనం ఇవ్వనున్నారు. మళయప్పస్వామి రాత్రి 9 గంటలకు సర్వభూపాల వాహనంపై మాడ వీధుల్లో విహరించనున్నారు. 

08:43 - September 19, 2015

హైదరాబాద్ : 'మీరు మాట్లాడే చిలుకను చూసుంటారు. పాటలు పాడే మైనాను చూసుంటారు. చిలిపి చేష్ఠలు చేసే కోతులను, అచ్చుగుద్దినట్లు మనుషులను అనుకరించే చింపాజీలను, చూసుంటారు. మరీ సారీ చెప్పే కుక్కను ఎప్పుడైనా చూశారా..?' కాపలా కాసే కుక్కను, అపరిచితులపై విరుచుకుపడే కుక్కలను చూసాం కానీ సారీ అడిగే కుక్క ఏంట్రా అనుకుంటున్నారా..? అయితే ఈ వైరల్‌ వీడియో పై ఓ లుక్కేయండి...
విశ్వాసానికి ప్రతిరూపం.. కుక్క 
ఓ పెట్‌ డాగ్‌ ఉదయాన్నే న్యూస్‌ పేప
ర్‌ తెచ్చి ఇస్తుంది. మరొకరి పెట్ ఇంటి పనులన్నింటిని చేస్తుంది. కుక్క అంటే విశ్వాసానికి ప్రతిరూపం. నమ్మకానికి కేరాఫ్‌ అడ్రస్‌. అందుకే కుక్కలను పెంచుకునే వారు, ప్రాణం కంటే మిన్నగా చూసుకునే వారు లెక్కకు అందనంత మంది. యజమానులు ఎంత ప్రేమగా చూసుకుంటారో శునకాలు అంతే ప్రేమగా ఉంటాయి. ప్రాణంగా చూసుకుంటున్నందుకు ప్రాణాన్ని ఇచ్చేందుకు వెనుకాడవు.
యజమాని ఆంటోని అంటే ఎట్టోర్‌కు ప్రేమ
ఇటలీకి చెందిన ఆంటోని కూడా ఎట్టోర్‌ అనే లాబ్రడార్‌ బ్రీడ్‌కు చెందిన ఓ కుక్కను కొంతకాలంగా పెంచుకుంటున్నాడు. ఎట్టోర్ అంటే ఆంటోనికి ఎంత ప్రేమో... తన యజమాని ఆంటోని అంటే ఎట్టోర్‌కు అంతకంటే ఎక్కువ ప్రేమ. అందుకే తన యజమాని కన్పిస్తే చాలు వల్లమాలిన ప్రేమ కనబరుస్తుంది.
పశ్చాత్తాప వదనంతో వేడుకున్న క్యూట్‌ డాగ్‌ ఎట్టోర్‌
అయితే ఓరోజు ఎట్టోర్‌ ఎందుకో యజమాని ఆంటోని మనసు నొచ్చుకునేలా ప్రవర్తించింది. అంతే కోపమొచ్చిన ఆంటోని, ఎట్టోర్‌ను కాసేపు పలుకరించలేదు. అసలు పట్టించుకోనే లేదు. దీంతో దీనంగా మొహం పెట్టిన క్యూట్ డాగ్‌ ఎట్టోర్‌ యజమాని ముందుకు వచ్చింది. ఎందుకలా చేశావని యజమాని నిలదీస్తుంటే, పశ్చాత్తాప వదనంతో ఆంటోనిని క్షమించమని వేడుకుంది.
4రోజుల్లో 2కోట్ల మంది వీక్షకులు
క్యూట్ డాగ్ ఎట్టోర్‌ సారీ అడుగుతున్న తీరును ఆంటోని తన కెమెరాలో బంధించాడు. అంతేకాదు ప్లీజ్‌ ఫర్ గివ్‌ మీ తన ఫేస్‌బుక్‌లో అప్‌ లోడ్ చేశాడు. ఇక చూస్కోండి.. వైరల్‌ అయి అప్‌లోడ్‌ చేసిన 4 రోజుల్లోనే 2కోట్లమంది వీక్షకులను సంపాదించుకుంది. ఇక లక్షల కొద్దీ లైకులు, వేలల్లో షేరింగ్‌లతో ఎట్టోర్‌ వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.
అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న ప్లీజ్‌ ఫర్‌ గివ్‌ మీ వీడియో
ప్లీజ్‌ ఫర్‌ గివ్‌ మీ వీడియో ఈ రేంజ్‌లో వైరల్ అవుతోంటే ఆంటోని సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. ప్లీజ్‌ ఎట్టోర్‌తో ఓ సెల్ఫీ తీసుకుంటామని ఫేస్‌బుక్‌ మెసేజ్‌, అదేపనిగా వస్తున్న ఫ్రెండ్ రిక్వెస్టులతో ఆంటోని తెగ పొంగిపోతున్నాడు.

 

08:32 - September 19, 2015

నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో పొట్లూరి వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రానికి 'ఊపిరి' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని శుక్రవారం విడుదల చేశారు. 
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 'తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'ఊపిరి' ఎక్స్‌ట్రార్డినరీగా వస్తోంది. వంశీ పైడిపల్లి చెప్పిన సబ్జెక్ట్‌కి 'ఊపిరి' అనే టైటిల్‌ పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌. ఈ చిత్రాన్ని పివిపిగారు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా రిచ్‌గా నిర్మిస్తున్నారు' అని చెప్పారు. 'తెలుగులో నేను చేస్తున్న స్ట్రయిట్‌ మూవీ ఇది. నాగార్జునగారిలాంటి స్టార్‌తో కలిసి ఈ సినిమా చేయడం ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌' అని కార్తీ అన్నారు. నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ, 'ఊపిరి' చిత్రం స్నేహానికి అర్థం చెప్పే ఇద్దరు స్నేహితుల కథ. 
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశాం. సినిమా చాలా బాగా వస్తోంది. వంశీ పైడిపల్లి సినిమాని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తెరకెక్కిస్తున్నారు. ప్యారిస్‌, లియోన్‌, బెల్‌గ్రేడ్‌ వంటి రేర్‌ లొకేషన్స్‌లో షూటింగ్‌ చేశాం. 
ఈ నెలాఖరులో జరిపే చివరి షెడ్యూల్‌తో సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది' అని అన్నారు. 'తెలుగు, తమిళ భాషల్లో నాగార్జునగారు, కార్తీలతో రూపొందిస్తున్న 
ఈ మల్టీస్టారర్‌ని పివిపిగారు భారీ లెవల్‌లో నిర్మిస్తున్నారు. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కమర్షియల్‌ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది' అని దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌, ఫొటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్‌, ఎడిటింగ్‌: శ్రీకరప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, నిర్మాత: ప్రసాద్‌ వి. పొట్లూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

08:31 - September 19, 2015

పూనే : ప్రసిద్ధిగాంచిన పూనే గణేష్‌ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్య అతిధిగా హాజరై పూనే ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ సంధర్భంగా బాలీవుడ్‌ తారాలోకం పూనేకు తరలి వచ్చింది. దాదా జాకీష్రాఫ్‌, శేఖర్ సుమన్‌తో పాటు అనిల్ కపూర్‌ తరలివచ్చారు. ఇక బాలీవుడ్‌ డ్రీమ్‌ గర్ల్‌ హేమామాలిని ప్రదర్శించిన నృత్య రూపకం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది.

 

08:29 - September 19, 2015

పవన్ కళ్యాణ్ 'పంజా' సినిమాకు సీక్వెల్ రానుందా..? అంటే సినీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. పవన్‌కళ్యాణ్‌, తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ కాంబినేషన్‌లో గతంలో 'పంజా' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా అభిమానులను ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. పవన్‌లుక్‌, స్టయిల్‌ పరంగా 'పంజా'లో కొత్తగా కనపడినా కథలో మైనస్‌ పాయింట్స్‌ ఎక్కువగా ఉండటంతో సినిమా సరిగ్గా ఆడలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ అదే కాంబినేషన్‌లో 'పంజా' చిత్రానికి సీక్వెల్‌ రూపొందబోతుందని వినిపిస్తోంది. గత సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి పక్కా స్క్రిప్ట్‌తో విష్ణువర్థన్‌ సిద్ధమయ్యాడట. మరి ఈ కథ పట్టాలమీదికెక్కుతుందో లేదో వచిచూడాలి. 

 

08:25 - September 19, 2015

                 వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో నితిన్‌ నిర్మిస్తున్న చిత్రం 'అఖిల్‌'. ఈ చిత్రంలోని ఓ పాటను ఆస్ట్రియాలో, మరో పాటను స్పెయిన్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని అఖిల్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం నుంచి చిత్రీకరిస్తున్నారు. వీటి గురించి నితిన్‌ మాట్లాడుతూ ''ఆస్ట్రియా, స్పెయిన్‌లో రెండు పాటలను చిత్రీకరించాం. ఈ రోజు నుంచి అఖిల్‌ ఇంట్ర డక్షన్‌ సాంగ్‌ చిత్రీ కరణ జరుగు తోంది. అన్నపూర్ణ స్టూడియోలో ఐదు భారీ సెట్లలో జానీ మాస్టర్‌ నేతృత్వం లో చిత్రీకరిస్తున్నాం. ఈ చిత్రం ఆడియోను అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఈనెల 20న హైదరాబాద్‌ గచ్చిబౌలిలో చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం'' అన్నారు. అఖిల్‌ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, మహేష్‌ మంజ్రేకర్‌, సప్తగిరి, హేమలతోపాటు లండన్‌కు చెందిన లెబాగా జీన్‌, లూయిస్‌ పాస్కల్‌, ముతినే కెల్లున్‌ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్‌ బైరన్‌ జేమ్స్‌ విలన్స్‌గా నటిస్తున్నారు.

08:25 - September 19, 2015

 

ప్రకాశం : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు పొగాకు రైతుల సెగ తాకింది. పంట గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్రంలో కనీస కదలిక లేదంటూ...ప్రకాశం జిల్లాలో అన్నదాతలు ఆమె పర్యటనను అడ్డుకున్నారు. పొగాకు రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని మంత్రి పిలుపునిచ్చారు. అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో అన్నదాతలు శాంతించారు.

కేంద్రమంత్రి కారును అడ్డుకున్న రైతులు

ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రకాశం జిల్లాలో పర్యటించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రమంత్రి పత్తిపాటి పుల్లారావు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి పొగాకు వేలం కేంద్రంలో రైతుల‌తో సమావేశం నిర్వహించారు. తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల‌ ప‌రామ‌ర్శకు వెళుతుండ‌గా రైతు సంఘం నాయ‌కులు, పొగాకు రైతులు కేంద్రమంత్రి కారును అడ్డగించి ఆందోళన చేశారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టి కేంద్రమంత్రి కాన్వాయ్‌ ను ముందుకు పోనిచ్చారు.

పొగాకు బోర్డు అధికారులతో సమావేశం

ఇదిలా ఉంటే పొందూరులో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు కుటుంబాన్ని నిర్మలా సీతారామ‌న్ ప‌రామ‌ర్శించారు. దాదాపు పది నిముషా పాటు వారితో మాట్లాడిన సీతారామన్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆత్మహత్యలు వద్దని భరోసా ఇచ్చారు. అలాగే కందుకూరులో బలవన్మరణానికి పాల్పడిన వెంకటరావు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. తర్వాత విజయవాడుకు వెళ్లిన సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పొగాకు బోర్డు అధికారులతోనూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పొగాకు రైతులు సమస్యలు, తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. లోకేటగిరి పొగాకును కొనాలని అధికారులను ఆదేశించామన్న కేంద్రమంత్రి, కేంద్రం నుంచి కేజీకి అదనంగా 15 రూపాయలు చెల్లిస్తామన్నారు.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై రైతుసంఘాల విమర్శలు

పొగాకు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

 

08:23 - September 19, 2015

         యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, 'ఆర్య' సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాతగా, భోగవల్లి బాపినీడు, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోప్రొడ్యూసర్స్‌గా ఈ చిత్రం నిర్మాణం జరుగుతోంది. ఈచిత్రానికి 'నాన్నకు ప్రేమతో' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని ఎన్టీఆర్‌ తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రం ఎన్టీఆర్‌కు 25వది.
ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ ''గెటప్‌లోనూ, క్యారెక్టరైజేషన్‌లోనూ, కథలోనూ, స్క్రీన్‌ప్లేలోనూ అన్ని విధాలా కొత్తగా ఉండే ఈ 'నాన్నకు ప్రేమతో..'లో ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు. ఎన్టీఆర్‌ ఇమేజ్‌కి తగినట్టుగా అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటూనే సినిమా కొత్త స్టైల్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎన్టీఆర్‌తో ఫస్ట్‌ టైమ్‌ చేస్తున్న 'నాన్నకు ప్రేమతో..' నా కెరీర్‌లోనూ, ఎన్టీఆర్‌ కెరీర్‌లోనూ చాలా మంచి సినిమా అవుతుంది'' అన్నారు.
నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ''80 రోజుల పాటు లండన్‌లో తొలి షెడ్యూల్‌ చేస్తున్నాం. ఈ నెల 24తో లండన్‌ షెడ్యూల్‌ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్‌లోనే పీటర్‌ హెయిన్స్‌ సారధ్యంలో మూడు థ్రిల్లింగ్‌ ఫైట్స్‌, రాజు సుందరం, శేఖర్‌ మాస్టర్‌ల సారధ్యంలో రెండు పాటలు, వాటితో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొన్న ఇంపార్టెంట్‌ సీన్స్‌ చిత్రీరించాం. అక్టోబర్‌లో 20 రోజుల పాటు స్పెయిన్‌లో చేసే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. విజయదశమికి ఫస్ట్‌ టీజర్‌ విడుదల చేస్తాం. జనవరి 8న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు. 
ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ : విజరు చక్రవర్తి, ఆర్ట్‌ : రవీందర్‌, ఫైట్స్‌ : పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌ : నవీన్‌ నూలి, పాటలు : చంద్రబోస్‌, డాన్స్‌ : రాజు సుందర కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుకుమార్‌.

08:19 - September 19, 2015

                వరుణ్‌ తేజ్‌, ప్రగ్యా జైశ్వాల్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'కంచె'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. బిగ్‌ సీడీని రామ్‌ చరణ్‌, ఆడియో సిడిని సిరివెన్నెల సీతారామ శాస్త్రి విడుదల చేసి నిర్మాత అల్లు అరవింద్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ''ఈ చిత్రం టైలర్‌ చూశాక వరుణ్‌లో ఇంటెన్సిటీ తెరపై ట్రైలర్‌లో కనిపించింది. దర్శకుల్లో ప్రేక్షకుల అభిరుచిని ఆధారంగా చేసుకుని పైకొచ్చేవారు కొందరుంటారు. ప్రేక్షకుల అభిరుచి స్థాయిని పెంచాలనుకునేవారు కొందరుంటారు. ఆ రెండో కోవకు చెందిన వ్యక్తి క్రిష్‌'' అన్నారు. సంగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ ''ప్రపంచ సినిమాలో ఎవరెన్ని సినిమాలు చేసినా వారి బ్యాక్‌డ్రాప్‌తో లవ్‌ స్టోరీ మిక్స్‌ అయి ఉంటే ఆ సినిమా హిట్టవుతుంది. నేను చేయాలనుకున్న కథని క్రిష్‌ చేసేశాడు. ఈ సినిమాలో నేను చేసిన రోల్‌ ఎలా ఉంటుందనేది నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అన్నారు.
రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ '' ఈ రోజు 'కంచె' ఆడియో వేదికలా కాకుండా సీతారామశాస్త్రి గారిని గౌరవించుకునేలా ఈ వేదిక ఉంది. ఇలాళ ఉన్న పెద్ద, రాబోయే దర్శకులు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడూ సినిమాలు చేయాలని నేను అడగలేదు. నేను ఐదేళ్లుగా సినిమా చేద్దామని క్రిష్‌ని అడుగుతున్నా. నేను ప్రకాష్‌, రానా, క్రిష్‌ అందరం ఒక బ్యాచ్‌. ఒక రోజు క్రిష్‌ కథ ఉందని చెబితే ఇంటికి రమ్మన్నా. వచ్చి కథ చెప్పాడు. సెకండాఫ్‌ కథ చెప్పడానికి రాలేదు. ఆ సబ్జెక్ట్‌కి నేను సెట్‌ కానని అనుకున్నాడా? లేక ఆ కథనే వరుణ్‌తో తీశాడా? అని అనుకున్నాను. ఒక వేళ అదే కథని వరుణ్‌తో తీసుంటే క్రిష్‌ అయిపోతాడు.(నవ్వుతూ..). వరుణ్‌ హైట్‌ చూస్తుంటే నాకు అన్నయ్యలాగా ఉన్నాడు. మా ఫ్యామిలీ మంచి అందగానే కాదు, మంచి గట్స్‌ ఉన్న హీరోగా పేరు తెచ్చుకుంటాడు'' అని అన్నారు.
వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా యుద్ధ నేపథ్యంలో జరిగే సినిమా అయినా అవుటండ్‌ అవుట్‌ ఫ్యూర్‌ లవ్‌స్టోరీ. ఈ కథను రియాల్టీలో పెట్టి సినిమాగా చేయడమనేది చాలా కష్టం. కాని క్రిష్‌ సులభంగా చేశారు. 1940లోని ప్రతి సీన్‌ను సినిమాటో గ్రాఫర్‌ బాబా చాలా అందంగా చూపించారు. ఆయన విజన్‌ చూసి చాలా ఆనందించాను. మా పెద నాన్న చిరంజీవి గారికి బిగ్గెస్ట్‌ ఫ్యాన్‌ నేను. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకి థాంక్స్‌ తప్ప ఏమీ చెప్పుకోలేను. డాడీ మంచి సినిమా చేస్తున్నా. మీ పరువు నిలబెడతా అని చెబుతున్నా. మా బాబారుకి కూడా ఈ సినిమా విడుదలైన తర్వాత పక్కాగా తీసుకెళ్లి చూపిస్తా. సినిమా ఎలా ఉందని అడుగుతా'' అని చెప్పారు.
చిత్ర దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ ''70 ఏళ్ల తర్వాత రెండో ప్రపంచ యుద్ధం మీద సినిమా తీశాను. సినిమాలో వరల్డ్‌ వార్‌ పార్టును జార్జియాలో చిత్రీకరించాం. అందుకోసం జార్జియా ప్రభుత్వం అనుమతి తీసుకుని ఆ బ్యాక్‌డ్రాప్‌కి తగిన విధంగా గన్స్‌, ట్యాంకర్స్‌, టీ కప్స్‌ ఇలా అన్ని ఉపయోగించాం. ఆర్ట్‌ డైరెక్టర్‌ సాహి సురేష్‌, సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌ చాలా అద్భుతమైన ఎఫెక్ట్‌ పెట్టి పనిచేశారు'' అని అన్నారు. నాగబాబు మాట్లాడుతూ '' ఈ సినిమా కోసం చాలా మందిగానే నేనూ నిరీక్షిస్తున్నాను. 'కంచె' కథ చెప్పినప్పుడు 20 నిమిషాలు మాట్లాడలేకపోయాను. దర్శకుడు క్రిష్‌ అంత స్ట్రాంగ్‌ ఇంపాక్ట్‌ని క్రియేట్‌ చేశారు'' అని చెప్పారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మాట్లాడుతూ'' వరుణ్‌ చూస్తుంటే బాలీవుడ్‌ నటుడిని చూసినట్టు ఉంది. ఈ చిత్రంలో ఇటు ఇటు ఇటు.. అనే పాట నాకు చాలా ఇష్టం. ఎంత వరకు ఎందుకొరకు... అనే పాట రాయడానికి ఎనిమిది మాసాలు పట్టింది. ఈ చిత్రంలో చివరి పాట పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుందో నాకే తెలియదు. అలాంటప్పుడు శాస్త్రిగారు పాట ఇచ్చేదాకా సినిమా విడుదల ఆపుకుందాం అని దర్శక నిర్మాతల అనుకున్న తీరు నాపై బాధ్యతను పెంచింది.'' అన్నారు.

 

08:16 - September 19, 2015

రైతులకు భరోసా కల్పించాలని వక్తలు పేర్కొన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రజాశక్తి మాజీ ఎడిటర్ వినయ్ కుమార్, సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు, బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి వకుళాభరణం, టిడిపి నేత పట్టాబీరామ్, టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించాలన్నారు. రుణమాఫీ ఇంకా పూర్తిగా కాలేదు, రైతులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. వారిని ఆదుకుంటే ఆత్మహత్యలు నివారించవచ్చనన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

మధ్యాహ్నం 2 గంటలకు టీకేబినెట్ భేటీ...

హైదరాబాద్ : ఇవాళా మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలు, చైనా పర్యటన వంటి పలు అంశాలపై చర్చించన్నారు. 

07:44 - September 19, 2015

ముంబై : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ చిందేసాడు. తీన్మార్‌ స్టెప్పులతో అదరగొట్టేశాడు. ఒక్క సల్మాన్‌ ఏంటీ ఆయన సోదరులు సోహయిల్‌ ఖాన్‌, అర్భాజ్‌ ఖాన్‌, సోదరి అర్పితాఖాన్‌తో పాటు దాదాపు ఫ్యామిలీ అంతా డ్రమ్స్‌ వాయిద్యాలకు అనుగుణంగా రెచ్చిపోయి డాన్స్‌ చేశారు. వినాయక చవితి సంధర్భంగా సల్మాన్‌ తన ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించుకున్నాడు. ఇక ఆ వినాయకుడి నిమజ్ఙనం సంధర్భంగా సల్లూభాయ్‌తో పాటు టోటల్ ఫ్యామిలీ గణపతి బప్పా మోరియా అంటూ చిందేసింది.

 

07:39 - September 19, 2015

పశ్చిమగోదావరి : సైకో సూదిగాడి బాధితులు మళ్లీ ఆస్పత్రి పాలవుతున్నారు. గత నెల పశ్చిమగోదావరి జిల్లాలో తాను సైకో దాడికి గురయినట్లు ఆరోపించిన మహిళ ఇప్పుడు ఆస్పత్రి పాలయింది. తీవ్రంగా రక్తపు వాంతులు చేసుకుంటోంది. గత నాలుగు రోజుల నుంచి తన ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తోంది.
సైకో సూదిగాడు తీవ్ర బీభత్సం 
రక్తపు వాంతులు చేసుకుంటున్న జ్యోతి అనే మహిళ గత నెలలో పశ్చిమగోదావరి జిల్లాలో సైకో సూదిగాడు తీవ్ర బీభత్సం సృష్టించాడు. మూడు రోజుల్లోనే తొమ్మిది మందికి ఇంజెక్షన్ ఇచ్చాడు. అప్పుడు అందరు ఆస్పత్రి పాలయ్యారు. బాధితులందరికి వెంటనే స్థానిక ఆస్పత్రుల్లో వైద్యం అందించారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. అనంతరం ఆ ఇంజెక్షన్‌ను పరీక్షలకోసం హైదరాబాద్‌ కూడా పంపారు. అందులో ఏమి లేదని నిర్ధారించారు. కానీ అదే నెల 30న జరిగిన దాడిలో ఒకరైన..పంపన జ్యోతి అనే మహిళ ఇప్పుడు తీవ్ర ఆనారోగ్యానికి గురయింది. రక్తపు వాంతులు చేసుకుంటోంది. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తీసుకొస్తుండగా తనకు ఎవరో సూదిగుచ్చారని బాధితురాలు జ్యోతి అప్పుడు వాపోయింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించిన అధికారులు వైద్యం అందించారు. వైద్యులు మాత్రం ఈమెపై ఇంజెక్షన్‌ దాడి జరగలేదని నిర్ధారించారు. జ్యోతి భ్రమ పడుతోందంటూ ఆమె ఆరోపణలు వాస్తవం కాదని కొట్టిపారేశారు.
ఆరోగ్యపరిస్థితిపై జ్యోతి తీవ్ర ఆందోళన
ఇప్పుడు తన ఆరోగ్యపరిస్థితిపై జ్యోతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అప్పుడు తాను చెప్పింది నిజమైనా..ఎవరూ పట్టించుకోలేదని బోరున విలపిస్తోంది. తన ఈ దుస్థితికి ఎవరు బాధ్యత వహిస్తారని జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా....బాధితురాలికి మెరుగైన వైద్య చికిత్స అందిచాల్సిన అవసరం ఎంతైన ఉంది. సైకో సూదిగాడు బీభత్సం సృష్టించి నెల కావస్తున్నా...పోలీస్ యంత్రాంగం ఆ సైకోను పట్టుకోలేకపోయిది. పరిస్థితి ఇలాగే ఉంటే సైకో మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉందని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

07:31 - September 19, 2015

ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును మహారాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి బదిలీ చేసింది. ఈ కేసులో కేవలం హత్యే కాకుండా ఆర్థికపరమైన అంశాలు కూడా ఉన్నందున విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్టు మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖలోని ముఖ్య అధికారి తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసును ముంబై పోలీసులు విచారించారు. ఈ కేసును విచారిస్తూ వచ్చిన ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాను ఇటీవల అనూహ్యంగా బదిలీ చేశారు. ఆ స్థానంలో అహ్మద్ జావేద్ నియమితులయ్యారు. అయితే ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పీటర్ ముఖర్జియా, జావెద్‌లు సన్నిహితులని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ జావేద్‌ అంగీకరించారు. దీంతో కేసును రాష్ట్ర పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
2012 ఏప్రిల్ 24న షీనా బోరా హత్య
ప్రస్తుతం ఈ కేసులో షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్‌లు రిమాండ్‌లో ఉన్నారు. 2012 ఏప్రిల్ 24న షీనా బోరా హత్య జరిగింది. మూడేళ్ల తర్వాత ఇది వెలుగు చూసింది. తల్లి ఇంద్రాణియే ఆమెను చంపినట్లు తేలింది. పోలీసులు తల్లి ఇంద్రాణి, ఆమెకు సహకరించిన డ్రైవర్ శ్యాం, ఆమె మొదటి భర్త సంజీవ్‌ను అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

 

నేడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఢిల్లీ పయనం...

హైదరాబాద్ : నేడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ సభ్యత్వనమోదు నివేదికను సోనియాకు ఇవ్వనున్నారు. 

07:16 - September 19, 2015

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలే లక్ష్యంగా గులాబీ దళం అడుగులు వేస్తోంది. విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టేందుకు వ్యూహాలకు పదునుపెడుతోంది. రైతు ఆత్మహత్యలు, ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌, చైనా పర్యటన ఫలితాలే ఎజెండాగా... శనివారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది.
అన్నదాతల మరణమృదంగం
తెలంగాణలో అన్నదాతల మరణమృదంగం మోగుతోంది. దీంతో రైతుల ఆత్మహత్యల నివారణపైనే తెలంగాణ మంత్రివర్గం చర్చించనుంది. ఒకవైపు జెండాలకు అతీతంగా... రైతుసమస్యలే ఎజెండా... ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు రోజురోజుకు ప్రభుత్వంపై అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ సమయంలో నష్టనివారణ చర్యలపై దృష్టిసారించింది టీ-సర్కార్‌. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు... నష్టపరిహారాన్ని పెంచేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
కాగితాలకే పరిమితమైన సర్కార్ సాయం
421 జీవో ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రెండున్నర లక్షల్ని పరిహారంగా ఇవ్వాలి. అయితే రెండేళ్లుగా కేంద్రం తన కోటాను నిలిపివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే లక్షా 50 వేల రూపాయల్ని ఇస్తోంది. అయినప్పటికీ సర్కార్ సాయం కేవలం కాగితాలకే పరిమితం అవుతోంది. నష్టపరిహారాన్ని పెంచాల్సిందేనంటూ రైతుసంఘాలు పోరుబాట పట్టాయి. 11 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని... తెలంగాణ వ్యవసాయమంత్రికి అందజేశాయి. పొరుగు రాష్ట్రంలో నష్టపరిహారాన్ని 5 లక్షలకు పెంచారని గుర్తుచేశాయి. దీంతో బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల్ని ఇచ్చేందుకే టీ-సర్కార్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
సర్కార్ తీరుపై రైతు సంఘాల ఆగ్రహం
ఇక ఆత్మహత్య చేసుకున్న రైతుల లెక్క తేలడం లేదు. ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి 409 మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కానీ అందులో 141 మందికి మాత్రమే పరిహారం చెల్లించారు. అందులో 60 మంది ఒక్క మెదక్ జిల్లాకు చెందిన వారే. అంతేకాకుండా నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి రైతులెవరూ ఆత్మహత్య చేసుకోలేదంటూ చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటే... తెలంగాణలో 73 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారించింది. అందులో 35 మందికి నష్టపరిహారం ఇవ్వాలంటూ లెక్కలు రెడీ చేసింది. దీంతో సర్కార్ తీరుపై రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టుల రీ డిజైన్లపై ప్లానింగ్
మరోవైపు ప్రాజెక్టుల రీ డిజైన్లకు సంబంధించి ఇప్పటికే ప్లానింగ్ జరుగుతోంది. దీనిపై అసెంబ్లీలో తమ ప్రభుత్వం ఏం చేయనుందో..? అనే అంశంపై టి-సర్కార్ వివరించే అవకాశం ఉంది. సమగ్ర జల విధానాన్ని అసెంబ్లీ వేదికగా సిఎం ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నట్లు సీఎం మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. మొత్తానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో లేదో చూడాలి.

 

నేడు హైదరాబాద్ లో 'విద్యాభారతి దక్షిణ భారత ఖేల్ ఖూద్'

హైదరాబాద్ : నేడు బండ్లగూడలోని శారదాధామంలో 'విద్యాభారతి దక్షిణ భారత ఖేల్ ఖూద్' కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. 

Don't Miss