Activities calendar

22 September 2015

వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ఎపి మంత్రులు

విజయనగరం : పట్టణంలో రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవ గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో మంత్రులు కె.అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథ్ రెడ్డిలు పాల్గొన్నారు.

22:11 - September 22, 2015

కులం పునాదుల మీద మీరు దేనినీ నిర్మించలేరు.. ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు... అన్నాడు అంబేద్కర్ మహాశయుడు. కానీ, అదే కులం పునాదులు ఏ మాత్రం కదల్లేదు సరికదా.. మరింత బలపడుతూ, నిరంతరం వివక్ష రూపం మార్చుకుంటూ భారత వ్యవస్థను అంతకంతకూ దిగజారుస్తోంది. అభివృద్ధి నిరోధకంగా మారుతోంది. దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే కుల వివక్షను రూపు మాపాల్సిందే.. దళితుల సమస్యలను పరిష్కరించాల్సిందే.. ఇదే ధ్యేయంతో దళిత్ పార్లమెంట్ కు డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అసలు దళిత్ పార్లమెంట్ అవసరం ఏంటి? ఎలాంటి ప్రయోజనాలకు అవకాశం ఉంది..? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..
కుల వివక్ష, వ్యవస్థపై పోరాటం..
కులవివక్ష రూపాలు, కులవ్యవస్థ వికృత ఫలితాలు ఈ దేశ ముఖచిత్రంగా కనిపిస్తున్నంత కాలం వాటిపై నిరంతర పోరాటం అవసరం. లేదంటే దేశాభివృద్ధి ఒకడుగు ముందుకు, మూడడుగులు వెనక్కు అనే విధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
సమాజంలో వేళ్లూనుకున్న కుల వివక్ష
తరతరాలుగా సమాజంలో వేళ్లూనుకున్న కుల వివక్షను అంతం చేయకుండా దేశాన్ని అభివృద్ధి బాట పట్టించగలరా? స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా అన్నింటా దళితులు అట్టడుగున ఉన్నారంటే దానికి పాలకుల వైఫల్యమే కారణం కాదా..? దళితుల ఓట్లతో గద్దెనెక్కుతున్న ప్రభుత్వాలు ఆ తర్వాత ఓడమల్లయ్య, బోడి మల్లయ్యలాగా , వారిని పూర్తిగా విస్మరిస్తున్నాయి.
న్యాయం జరగాలంటే అన్యాయాన్ని నిలదీయాలి
సమస్యను చాలా కన్వీనియెంట్ గా విస్మరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. న్యాయం జరగాలంటే అన్యాయాన్ని నిలదీయటమే మార్గం. సమస్యకు పరిష్కారం కావాలంటే చర్చించటం ఓ మార్గం. దానికి చట్టసభలు వేదికగా మారటం, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవటం అత్యవసరం. అందుకే దళిత్ పార్లమెంట్ సమావేశాలకు డిమాండ్ పెరుగుతోంది.
కుల వివక్ష లేనప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధి
మనిషి దేహంలో అన్ని అంగాలు సక్రమంగా పనిచేసినపుడే ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే దేశంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి బాటలో ఉండి, ఎలాంటి వివక్ష లేనప్పుడే దేశం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుంది. అదే నవభారత నిర్మాణానికి నాంది అవుతుంది. ఇందులో భాగంగానే దళిత్ పార్లమెంట్ నిర్వహణకు దళిత శోషన్ ముక్తిమంచ్ డిమాండ్ చేస్తోంది. కానీ, ప్రభుత్వం మాత్రం స్పందించటం లేదు.
అప్పుడే నూతన భారతం సాధ్యం 
దళితులపై సాగుతున్న సామాజిక, ఆర్థిక దోపిడీని నిర్మూలించకపోతే, ప్రధాని చెప్పే నవ భారతావని అసంపూర్ణమే అవుతుంది. ఈ రెండు దోపిడీలను నిర్మూలించి అభివృద్ధిలో దళితులను భాగస్వామ్యం చేసినప్పుడే నూతన భారతం వైపు పరుగు మొదలవుతుంది. దళితులకు ఆర్థికాధికారం కల్పించినప్పుడే సమాజంలో గూడుకట్టుకున్న సామాజిక, ఆర్థిక దోపిడీ నిర్మూలితం అవుతుంది. అందుకే దళితుల సమస్యలపై ప్రత్యేక పార్లమెంట్‌ అవసరం ఏర్పడింది. 

22:02 - September 22, 2015

హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలను సర్దుబాటు చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. స్థానిక కోటాలో తెలంగాణకు మూడు సీట్లను పెంచింది. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఒక్కో సీటు కేటాయిస్తూ గెజిట్ జారీచేసింది. 

22:00 - September 22, 2015

ఢిల్లీ : ఎన్డీఏ సర్కారు రైతులకు సంబంధించిన ఇంచు భూమిని ఆక్రమించినా సహించబోమని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. 'అసలు రాహుల్‌కు ఇంచు అంటే ఏంటో తెలుసా?' అని ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ పాలనలో సామాజిక అధ్యయనం, రైతుల అనుమతి లేకుండానే హర్యానాలో 80 వేల ఎకరాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షల 7 వేల ఎకరాల రైతుల భూమిని స్వాధీనం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అర్థంపర్థం లేకుండా కాంగ్రెస్ నేతలు భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

21:57 - September 22, 2015

యుపి : సిబిఐని దుర్వినియోగం చేస్తోందని ఎన్డీఏ సర్కారుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కుంభకోణంతో తనకెలాంటి సంబంధంలేదని తేల్చి చెప్పారు. నాలుగేళ్ల తర్వాత తనపై విచారణ జరిపించడాన్ని కక్ష పూరిత చర్యగా పేర్కొన్నారు. ఇంతకు ముందు 12 ఏళ్ల క్రితం 2003లో బిజెపి ప్రభుత్వం కూడా ఇదే తరహా విచారణకు ఆదేశించి సిబిఐని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. బీహార్ ఎన్నికల ముందు సీబీఐ విచారణ పేరుతో బీఎస్పీని బదనాం చేయాలనే కుట్రతోనే బిజెపి ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. సిబిఐని స్వార్థానికి వినియోగించుకుంటున్నారన్న వార్తలను సిబిఐ డైరెక్టర్‌ అనిల్‌ సిన్హా ఖండించారు.

 

21:53 - September 22, 2015

హైదరాబాద్ : రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సీఆర్డీఏ పరిధిని పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న 7వేల 68 చదరపు కిలోమీటర్ల పరిధిని 8వేల 352 చదరపు కిలోమీటర్లకు పెంచుతున్నట్టు తెలిపింది. సీఆర్డీఏ పరిధిలోకి కొత్తగా జగ్గయ్యపేట టౌన్ తో పాటు 123 గ్రామాలు చేరాయి. పరిధి పెంపునతో పాటు.. సీఆర్డీఏ పాలకమండలిని సైతం ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. 

21:36 - September 22, 2015

వ్యాపార అనుకూల రాష్ట్రాల పేరుతో వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక బోగస్ అని వక్తలు అభిప్రాయపడ్డారు. నివేదికలో దేశానికి, రాష్ట్రానికి, ప్రగతికి వ్యతిరేకమైన అంశాలున్నాయన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఐ ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖర్ రావు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, టిడిపి నేత విజయ్ కుమార్, ట్రేడ్ యూనియన్ నేత సతీష్ పాల్గొని, మాట్లాడారు. 'వ్యాపార అనుకూల రాష్ట్రాల పేరుతో వరల్డ్ బ్యాంక్ నివేదిక విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు నివేదిక దుమారం రేపుతోంది. నివేదికలో గుజరాత్ కు మొదటి స్థానం, రెండో స్థానంలో ఎపి ఉంది. మొదటి ఐదు స్థానాల్లో ఎన్ డియే పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. అయితే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రాష్ట్రాలకు అగ్రపీఠం దక్కింది. రాజకీయ జోక్యంతోనే నివేదిక తయారైందని విమర్శలు వస్తున్నాయి. మరోసారి చంద్రబాబు ప్రపంచ బ్యాంకు వైపు అడుగులు వేస్తున్నారు. వరల్డ్ బ్యాంకు విధానాల కారణంగానే గతంలో అధికారానికి చంద్రబాబు దూరమయ్యారు. మళ్లీ చంద్రబాబు వరల్డ్ బ్యాంకు వైపు అడుగులు వేస్తున్నారు'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ముగిసిన మద్యం టెండర్లు

హైదరాబాద్ : తెలంగాణలో మద్యం టెండర్లు ముగిశాయి. రేపు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించనున్నారు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు అందిన వైన్ షాపులకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించనున్నట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. 

అసంఘటితరంగ కార్మికులకు ఈఎస్ ఐ సుదుపాయం

ఢిల్లీ : అసంఘటిత రంగ కార్మికులకు ఈఎస్ ఐ సుదుపాయం కల్పించానున్నామని కేంద్రమంత్రి దత్తాత్రేయ డిసెంబర్ 31నుంచి మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లకు ఈఎస్ఐ సేవలు అందిస్తామని చెప్పారు. 

అక్టోబర్ 5న సవరించిన ఓటర్ల జాబితా విడుదల : భన్వర్ లాల్

హైదరాబాద్ : అక్టోబర్ 5న సవరించిన ఓటర్ల జాబితా విడుదల చేస్తామని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. జిల్లాల వారీగా జాబితాల్లో మార్పులు-చేర్పులు చేస్తున్నామని చెప్పారు. ఓటు నమోదుకు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో తొలగించిన ఓట్లను తిరిగి చేర్చేది లేదని.. పరిశీలించిన తర్వాతే తొలగించామని స్పష్టం చేశారు. 

ఆత్మహత్యలపై రైతు సంఘం ఆధ్వర్యంలో సదస్సు

విజయవాడ : ఆత్మహత్యలపై రైతు సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. పెట్టుబడులకు, ఆదాయానికి వ్యత్యాసమే రైతు ఆత్మహత్యలకు కారణమని వ్యవసాయ శాస్త్రవేత్త జయతీఘోష్ అన్నారు. పంటల కొనుగోళ్లలో సమూల మార్పులు చేస్తేనే రైతులకు గిట్టుబాటు లభిస్తుందన్నారు. బడ్జెట్ లో రైతులకు కనీసం 5 శాతం కేటాయించాలని సూచించారు. 

20:11 - September 22, 2015

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మార్కెట్ కమిటీల రిజర్వేషన్లను వెల్లడించారు. ప్రాజెక్టుల డిజైన్ లపై సభలో వెల్లడిస్తామన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్లే రైతు ఆత్మహత్యలని సమావేశంలో కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు ఏపీలో ఒకరకంగా, తెలంగాణలో ఒక రకంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. 

తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల పెంపు

ఢిల్లీ : తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను కేంద్రప్రభుత్వం పెంచింది. మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు పెంచుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఒక్కో ఎమ్మెల్సీ కేటాయించారు.

 

రేపటి నుంచి టీ.అసెంబ్లీ సమావేశాలు...

హైదరాబాద్ : ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతికి రెండు సభలు సంతాపం ప్రకటించనున్నాయి. సంతాపం తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. అసెంబ్లీ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. 

19:39 - September 22, 2015

చిత్తూరు : తిరుపతిలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. పద్మావతిపురంలో ఐడియేటర్ పేరిట ఈ సంస్థ ఏర్పాటైంది. వివిధ సాఫ్ట్ వేర్ కోర్సుల్లో శిక్షణ, ఉపాధి అంటూ విద్యార్థుల నుంచి భారీగా డబ్బు వసూలుచేశారు ఈ కంపెనీ సభ్యులు.. లక్షల్లో డబ్బు ముట్టాక ఆఫీసు ఖాళీ చేసి అర్ధరాత్రి పరారయ్యారు. విషయం తెలుసుకున్న దాదాపు 80మంది విద్యార్థులు తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

19:35 - September 22, 2015

ప్రకాశం : ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రుణమాఫీ అమలుకు కట్టుబడి ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న రైతు భరోసా యాత్రకు ఏలూరి హాజరయ్యారు. రుణమాఫీపైనే ఏపీ సీఎం చంద్రబాబు మొదటి సంతకం చేశారని గుర్తు చేశారు. రుణ విముక్తిని పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. కుటుంబరావుకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, రైతులు పాల్గొన్నారు.

 

19:29 - September 22, 2015

గుంటూరు : కవితకు కాదేది అనర్హం.. అన్నాడు శ్రీశ్రీ అనాడు... కానీ కల్తీకి కాదేది అనర్హం.. అంటున్నారు...నేడు దుర్మార్గులు. లాభాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. బియ్యం, పప్పు దినుసులు, నూనె, ఇలా పెద్దలు తినే తిండి మొదలుకొని.. చిన్నపిల్లలు తాగే పాల వరకు అన్నింటినీ కల్తీ చేస్తున్నారు దుండగులు. వ్యాపారమే, లాభాలు పరమావధిగా భావిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమంతో నిమిత్తం లేకుండా స్వంత ప్రయోజనాల కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో నకిలీ పాల తయారీ యధేచ్ఛగా సాగుతోంది. పోలీసులు, ఫుడ్ ఇన్స్‌పెక్టర్ల దాడుల్లో ఈ విషయం స్పష్టమైంది. చిత్తూరు జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్న కల్తీ పాల పొడిని నవత ట్రాన్స్‌పోర్టులో అధికారులు పట్టుకున్నారు. దాదాపు 40 బస్తాల పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో నవోదయ నగర్, రెడ్డి నగర్లోకూడా అధికారులు దాడులు జరిపారు.

 

19:11 - September 22, 2015

కృష్ణా : విజయవాడ స్టెల్లా కాలేజీ విద్యార్థిని భానుప్రీతి ఆత్మహత్యపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ ఎంవీ సత్యనారాయణను విచారణాధికారిగా నియమించింది. మరోవైపు భానుప్రీతి మృతదేహానికి మంత్రులు పీతల సుజాత, దేవినేని ఉమ నివాళులు అర్పించారు. అటు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో భానుప్రీతి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు.. ఈ సమయంలో పోలీసులు తప్పుడు నివేదిక తయారుచేస్తున్నారంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు..

 

19:05 - September 22, 2015

ప్రకాశం : పోలీసుల తీరువల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ మృతుని భార్య, బంధువులు పోలీసులపై దాడికి దిగారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ ఘటన జరిగింది. కనిగిరికి చెందిన కొండారెడ్డి అనే వ్యక్తిని ఓ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వేధింపులతో మనస్తాపం చెందిన అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో వివరాలు సేకరించేందుకు పోలీసులు మృతుని ఇంటికి వచ్చారు. వీరిని మృతుని కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. పోలీసుల వల్లే కొండారెడ్డి చనిపోయాడంటూ మృతుని భార్య, బంధువులు వారిని అడ్డుకున్నారు. పోలీసులపై చేయిచేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. డీఎస్పీ శ్రీనివాసరావు అక్కడికి చేరుకొని అందరికీ సర్ది చెప్పారు. సుసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

18:36 - September 22, 2015

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు కనీసం 15రోజులు ఉండాలని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సభ 15రోజులు జరిగితే.. ప్రజా సమస్యలన్నీ చర్చకు వస్తాయన్నారు. టీడీపీ తరఫున దాదాపు 21 సమస్యలను లేవనెత్తనున్నట్లు ఎర్రబెల్లి ప్రకటించారు. కనీసం ఈసారైనా.. ప్రతిపక్షాలను అసెంబ్లీ నుంచి గెంటివేయకుండా.. తమ వాణి వినిపించేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.

 

18:05 - September 22, 2015

హైదరాబాద్ : ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తో జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ భేటీ అయ్యారు. 'గ్రేటర్' లో ఓట్ల తొలగింపుపై చర్చ జరిగింది. ఏ ప్రాతిపదికన ఓట్లు తొలగించారని భన్వర్ లాల్ విరవణ కోరారు. కొంతకాలంగా ఓట్ల గల్లంతుపై వివిధ పార్టీలు భన్వర్ లాల్ కు ఫిర్యాదు చేస్తున్నాయి. గత కొంతకాలంగా కాంగ్రెస్, టిడిపిలు.. టీసర్కార్ ఓట్లను తొలగిస్తుందని ఆరోపించింది. సనత్ నియోజకవర్గంలో లక్షన్నర ఓట్లను తొలగించినట్లు కాంగ్రెస్, టిడిపి పార్టీలు ఆరోపించారు. ఈ విషయాన్ని భన్వర్ లాల్ దృష్టికి తీసుకెళ్లాయి. నిన్న తెలంగాణ కాంగ్రెస్ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి.. తెలంగాణ ప్రభుత్వంపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యలో ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తో జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ భేటీ అయ్యారు. 'గ్రేటర్' లో ఓట్ల తొలగింపుపై చర్చించారు.

 

17:38 - September 22, 2015

ఢిల్లీ : ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి ఆరెస్సెస్ మద్దతు ఉందా? ఎమర్జెన్సీ విధిస్తే జరిగే పరిణామాలపై ఆమెకు అవగాహన ఉందా? ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీని అప్పటి ఆరెస్సెస్ చీఫ్ కలవాలనుకున్నారా? ఈ ప్రశ్నలకు ఐబీ మాజీ చీఫ్ ఔననే సమాధానమిస్తున్నారు.
ఎమర్జెన్సీకి ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతిచ్చింది : రాజేశ్వర్
ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర నిఘా విభాగం మాజీ చీఫ్‌ టీవీ రాజేశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతిచ్చిందని కుండబద్ధలుకొట్టారు. అప్పట్లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌గా ఉన్న బాలా సాహెబ్‌ దియోరాస్ ఇందిరాగాంధీతో సత్సంబంధాల కోసం యత్నించారని తెలిపారు. ఎమర్జెన్సీ విధించడంపై జరిగే పరిణామాలపై ఇందిరకు అవగాహన ఉందని.. అయితే అది ప్రజలపై ఎంతటి పెను ప్రభావం చూపుతుందన్న సంగతిని ఆమె సరిగ్గా అంచనా వేయలేకపోయారని చెప్పారు. ఎమర్జెన్సీ విధించే ముందు ఐబీతో గాని, కేంద్ర హోంశాఖతో గాని సంప్రదించలేదన్నారు.
'ది క్రూషియల్‌ ఇయర్స్‌' పుస్తకంలో ఎమర్జెన్సీ విషయాలు
ఎమర్జెన్సీ సమయంలో ఐబీ విభాగానికి డిప్యూటీ చీఫ్‌గా రాజేశ్వర్‌ పనిచేశారు. తొలుత ఆరు నెలల తర్వాత ఎమర్జెన్సీని తీసివేయాలని ఇందిర భావించారని...ఆ ఆరు నెలల్లో జరిగిన పరిణామాలు ఆమెను మార్చి వేశాయన్నారు. ఇందిరతో పాటు సంజయ్‌ గాంధీతో సైతం బంధాన్ని బలపరుచుకునేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ యత్నించిందని...అయితే అందుకు ఇందిరా నిరాకరించారని పేర్కొన్నారు. ది క్రూషియల్‌ ఇయర్స్‌ పేరిట ఆయన రాసిన పుస్తకం ఎమర్జెన్సీ సమయంలో ఎవరికీ తెలియని కొత్త కోణాలను ప్రజల ముందు ఉంచింది. ఇందిరకు ఎమర్జెన్సీ విధించాలన్న ఆలోచనను కల్పించింది సిద్ధార్థ శంకరే అని, ఆయన చెప్పిన మరుసటి రోజే దేశంలో అత్యయక పరిస్థితిని ఇందిర విధించారని రాజేశ్వర్‌ తెలిపారు.
ఆపరేషన్‌ బ్లూస్టార్‌ను వెనక్కి తీసుకోవాలని చెప్పా : రాజేశ్వర్‌
ఇక 1984లో ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు ఒక వారం ముందు...నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇందిరాగాంధీకి గట్టిగా చెప్పినట్లు తెలిపారు. ఒకవేళ బ్లూస్టార్‌ ఆపరేషన్ చేపట్టినట్లయితే దేశంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని ముందే హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అయినా తన సూచనలేవి పట్టించుకోకుండా గోల్డెన్‌ టెంపుల్‌పై దాడికే మొగ్గుచూపినట్లు చెప్పారు.  

17:31 - September 22, 2015

ఖమ్మం : భద్రాచలం ఐటీడీఏలో పాలకమండలి సమావేశం హాట్‌ హాట్‌గా జరిగింది. గిరిజన ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలాయి. అభివృద్ధి, సంక్షేమాల అంశంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులకు దక్కాల్సిన నిధులను స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. నిర్మాణాలు జరగకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారని.. దీనిని తాను నిరూపించకపోతే పదవికి రాజీనామా చేస్తానని తాటి వెంకటేశ్వర్లు సవాల్ విసిరారు. సమావేశంలో గిరిజన మహిళతో మాట్లాడించారు. ఆమె కలెక్టర్‌కు స్వయంగా తన ఆవేదన వినిపించారు. అటు అటవీ అధికారులు గిరిపుత్రులపై కేసులుపెడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించారు.

 

17:27 - September 22, 2015

ముంబై : స్టాక్ మార్కెట్లో మళ్లీ కుదేలైంది. అన్ని విభాగాల్లో సెల్లింగ్ ప్రెషర్ తో.. సెన్సెక్స్ మళ్లీ 541 పాయింట్లు నష్టపోయింది. ఇవాళ సూచీ 25వేల 652 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టి 165 పాయింట్ల నష్టంతో 7812 వద్ద ముగిసింది. ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, మెటల్ షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. నిఫ్టీలో హిండాల్కో అత్యధికంగా 6.27శాతం నష్టపోయింది. వేదాంత, కోల్ ఇండియా, టాటా మోటార్స్, ఎన్టీపీసీ 5శాతం వరకు క్షీణించాయి. విప్రో, ఇన్ఫోసిస్, మహీంద్రా, సన్ ఫార్మా స్వల్ప లాభాల్లో ముగిశాయి.

 

17:12 - September 22, 2015

కృష్ణా : విజయవాడలోని మేరిస్టెల్లా కాలేజీ విద్యార్థిని భానుప్రీతి ఆత్మహత్యపై మంత్రి గంటా శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా ఇంటర్మీడియట్ విద్యాకమీషనర్ ఎంవీ సత్యనారాయణను నియమించారు. సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని కమీషనర్‌ను మంత్రి ఆదేశించారు. ఇదిలావుంటే తమ కూతురిది ఆత్మహత్య కాదని.. హత్య జరిగిందని విద్యార్థిని తల్లిదండ్రులు అంటున్నారు. విద్యార్థిని కుటుంభసభ్యులు, బంధువులు కూడా ప్రీతిది హత్య అని ఆరోపిస్తున్నారు. కాగా కాలేజీ యాజమాన్యం మాత్రం భానుది ఆత్మహత్యేనని అంటుంది. ఆమె మృతితో తమకు ఎలాంటి సబంధం లేదని కాలేజీ యాజమాన్యం అంటుంది. భాను ప్రీతి మృతదేహానికి ఇవాళా మధ్యాహ్నం పోస్టు మార్టం నిర్వహించారు. ఈనేపథ్యంలో పోస్టు మార్టం రిపోర్టు, విచారణ అధికారి ఎంవీ సత్యనారాయణ ఇచ్చి నివేదిక ఆధారంగా భానుది ఆత్మహత్యా, హత్య అనే విషయం తేటతెల్లం కానుంది.
భానుప్రీతి ఆత్మహత్య ఘటన వివరాలు...
విజయవాడలో మరో విద్యా కుసుమం నేలరాలింది. స్టెల్లా కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని భానుప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజ్ హాస్టల్‌లో భాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో..పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం హత్యేనని ఆరోపిస్తుండడంతో..కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు.
తీవ్ర కలకలం రేపుతున్న విద్యార్ధిని ఆత్మహత్య......
కృష్ణాజిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగెడిగూడెంకు చెందిన భానుప్రీతి కాలేజ్‌ హాస్టల్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం బెజవాడలో తీవ్ర కలకలం రేపుతోంది. స్టెల్లా కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న భానుప్రీతి..ఎప్పటిలాగే సోమవారంనాడు కాలేజీకి వెళ్లాల్సి ఉన్నా..అనారోగ్యం కారణంగా వెళ్లకుండా హాస్టల్‌ గదిలోనే ఉండిపోయింది. అయితే భానుప్రీతితో పాటు హాస్టల్‌లో ఉంటున్న మరో ముగ్గురు విద్యార్థినులు కాలేజీకి వెళ్లి తిరిగి హాస్టల్‌ గదికి చేరుకునే సరికి భాను ఉరేసుకొని కనిపించింది. వెంటనే కళాశాల సిబ్బందికి సమాచారం అందించడంతో..వారు హుటాహుటిన హాస్టల్‌ గదికి చేరుకున్నారు. మరోవైపు సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని భోరున విలపించారు. తమ కూతురును హత్యచేశారని ఆరోపిస్తూ హాస్టల్‌ ముందు ఆందోళన చేశారు.
అనారోగ్యంతో కాలేజికి వెళ్లని భానుప్రీతి ....
మరోవైపు భానుప్రీతి ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న.విద్యార్ధి సంఘాల నేతలు..అర్థరాత్రి హాస్టల్‌ ముందు ఆందోళనకు దిగారు. భానుప్రీతిది ఆత్మహత్యగా లేదని..వెంటనే పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు భానుప్రీతి హాత్మహత్య చేసుకున్న గదిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ ఎక్కడా సూసైడ్‌ నోట్‌ లభించలేదు. మరే ఇతర ఆధారాలు కూడా లభించకపోవడంతో.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో చోటుచేసుకున్న పరిణామాలు, లభించిన ఇతర ఆధారాలతో నిష్పక్షికపాతంగా విచారణ జరుపుతామని పోలీసులు చెప్తున్నారు. భానుప్రీతిది ఆత్మహత్యా లేక హత్యా అనేది మెజిస్ట్రీరియల్ విచారణలో తేలనుంది. మరోవైపు పోస్టుమార్టం రిపోర్టు కూడా కీలకం కానుంది. 

భూ సేకరణ చట్టం మార్పులపై రాష్ట్రాల అభిప్రాయాలు - గడ్కరి..

ఢిల్లీ : 2013 భూ సేకరణ చట్టంలో చేయాల్సిన మార్పులపై రాష్ట్రాల నుండి అభిప్రాయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులే మార్పులు చేయాలని చెప్పారని తెలిపారు. 

తెలంగాణకు ఛత్తీస్ గఢ్ విద్యుత్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి ఛత్తీస్ గఢ్ రాష్ట్రం విద్యుత్ ఇవ్వనుంది. సీఎం కేసీఆర్ సమక్షంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదిరింది. 12 ఏళ్ల పాటు 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అంగీకారం కుదిరింది. ఈనెలాఖరులోగా వార్ధా నుండి డిచ్ పల్లి వరకు విద్యుత్ లైన్ పూర్తి కానుంది. మరో వెయి మెగావాట్లు కావాలన్న సీఎం కోరికపై ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 

ముగిసిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. ఈసమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశ..నిర్ధేశం చేశారు. 

21 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం - ఎర్రబెల్లి..

హైదరాబాద్ : శాసనసభ సమావేశాల్లో 21 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని టిడిపి నేత ఎర్రబెల్లి పేర్కొన్నారు. సమస్యలు ఎక్కువగా ఉన్నందున కనీసం 15 రోజులైనా శాసనసభ సమావేశాలు నిర్వహించాలని కోరారు. 

చంద్రబాబుకు మధు లేఖ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు. జీవో నెంబర్ 269లో పేదల వ్యతిరేక అంశాలను సవరించాలని కోరారు. పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలకు పట్టాలివ్వాలని, తాత్కాలిక పట్టాలున్న పేదలకు క్రమబద్ధీకరణకు సంబంధించి నిబంధనలు మార్చాలని పేర్కొన్నారు. 150 చ.గ.ఉన్న పేదల ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని లేఖలో కోరారు. మండల కేంద్రాల్లోనూ క్రమబద్ధీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

16:57 - September 22, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌ ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌తో భేటీ అయ్యారు. అమరావతి శంకుస్థాపనకు రావాలని సింగపూర్‌ ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ అందించినందుకు సింగపూర్‌ ప్రధానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. నాలెడ్జ్‌ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావానికి, అంతర్జాతీయ స్థాయి ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ ఏర్పాటుకు సహకరించాలని బాబు కోరారు. ఏపీకి సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్‌ హబ్‌గా చేయాలనేది తన సంకల్పమంటూ.. అందుకు తగిన సహకారాన్ని అందజేయాలని చంద్రబాబు సింగపూర్‌ ప్రధానిని కోరారు.

 

16:56 - September 22, 2015

అనంతపురం: పార్టీ మనుగడ కోసమే జగన్‌ ఆందోళనలు చేస్తున్నాడని ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖామంత్రి పల్లె రఘునాధరెడ్డి విమర్శించారు. స్వలాభం కోసమే వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదా అంశాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్‌ రాజకీయం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. స్కాలర్‌షిప్‌ల విషయంలో నోరెత్తని జగన్‌ హోదా పేరుతో రాజకీయం చేస్తున్నాడని పేర్కొన్నారు.

 

16:52 - September 22, 2015

హైదరాబాద్ : తెలంగాణలో రుణమాఫీపై ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలే రైతు ఆత్మహత్యలకు కారణమని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈమేరకు ఆయన ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో మిషన్ కాకతీయ అవినీతిపై నిలదీస్తామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో.. అవసరమైతే.. స్పీకర్ పై అవిశ్వాసం పెడుతామని తెలిపారు.

 

 

16:32 - September 22, 2015

మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో కల్తీ కల్లు మృతుల సంఖ్య పెరుగుతోంది. నిత్యం కల్తీ బాధితులు బలవన్మరాలకు పాల్పడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు మృతుల సంఖ్య పెరుగుతూనేఉంది. గద్వాలలో కల్తీ కల్లు ప్రభావంతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో కాంతమ్మ అనే మహిళ మృతిచెందింది. మరో మహిళ బావిలోకి దూకి ప్రాణం తీసుకుంది. దేవరకద్ర మండలం పెద్ద రాజమూరులో వృద్ధుడు చనిపోయాడు. అటు జిల్లాల్లోని ఆస్పత్రులు కల్లు పేషంట్లతో నిండిపోయాయి. నాగర్ కర్నూల్ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు లేక రోగుల బంధువులు ఆందోళనకు దిగారు.. వెంటనే చికిత్స అందించి కల్తీ కల్లు బాధితుల వింత చేష్టలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అయినా ఎవ్వరూ స్పందిచకపోవడంతో పేషంట్లకు కల్లు తాగించారు.. ఈ కల్లు తాగాక రోగులు శాంతించారు..
కరీంనగర్..
కరీంనగర్ జిల్లాలో కూడా కల్లు దొరక్క ఒకరు మృతి చెందారు.. జగిత్యాల మహాలక్ష్మీనగర్ కుచెందిన మొయినొద్దీన్ రిక్షా కార్మికుడు... నాలుగు రోజులుగా కల్లు దొరక్కపోవడంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఇంటిదగ్గర పడిపోయారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.. అలాగే పెద్దపల్లిలో కల్తీకల్లుతో అస్వస్థతకు గురై మహిళ మృతి చెందింది.. మోతెలో దాదాపు 20మంది వింత చేష్టలు చేస్తున్నారు..

 

భన్వర్ లాల్ తో సోమేష్ కుమార్ భేటీ..

హైదరాబాద్ : ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఓట్ల తొలగింపుపై చర్చిస్తున్నారు. గత కొంతకాలంగా ఓట్లు తొలగిస్తున్నారంటూ వివిధ రాజకీయ పక్ష నేతలు భన్వర్ లాల్ కు ఫిర్యాదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సోమేష్ కుమార్..భన్వర్ లాల్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ ప్రాతిపదికన ఓట్లు తొలగించారని భన్వర్ లాల్ వివరణ కోరినట్లు సమాచారం. 

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలు చవి చూశాయి. సెన్సెక్స్ 541 పాయింట్లు నష్టపోయి 26,551 వద్ద ముగియగా నిఫ్టీ సైతం 165 పాయింట్లు నష్టపోయి 6,812 వద్ద ముగిసింది. ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు..అమెరికాలో వడ్డీరేట్ల పెంపు ప్రక్రియ వార్తలు మార్కెట్ సెంటిమెంట్ పై ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

16:01 - September 22, 2015

ప్రముఖ మలయాళ సినీ నటుడు 'మమ్ముట్టి'ని 'సోప్' కోర్టుకు ఈడ్చడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? అవును ఇది నిజం. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఏ వుడ్ లోనైనా సరే ప్రముఖ సినీ తారలు పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనీ ద్వారానే వారు ఎక్కువ సంపాదిస్తున్నారనే విమర్శలున్నాయి. తాజాగా 'మమ్ముట్టి' ఓ యాడ్ లో నటించి కష్టాల్లో పడ్డారు. తెల్లని ముఖం కోసం 'ఇందులేఖ' వైట్ సోప్ వాడండి..అంటూ ఆ కంపెకి తరపున 'మమ్ముట్టి' ప్రచారకర్తగా వ్యవహరించాడు. ఈ సోప్ ను కేరళకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. కానీ ఎంతకూ ప్రయోజనం లేకపోవడంతో అతనికి ఆగ్రహం కలిగించింది. వెంటనే సదరు కంపెనీపై..హీరో 'మమ్ముట్టి'పై కేసు వేశాడు. తమకు నోటీసులు అందలేదని కొంత సమయం కావాలని 'మమ్ముట్టి' తరపు లాయర్ కోరడంతో విచారణ అక్టోబర్ 12కి వాయిదా పడింది. ఈ యాడ్ విషయంలోనైనా ఇతర నటులు జాగ్రత్త పడుతారా చూడాలి.

16:01 - September 22, 2015

బాలల హక్కులను కాపాడాలని.. బాలల హక్కుల పట్ల సమాజంలో అవగాహన కల్పించే ప్రయత్నం జరగాలని వక్తలు పేర్కొన్నారు. 'ఇటీవలి కాలంలో రిజిస్ట్రేషన్ లేనటువంటి చిల్డ్రన్ హోమ్స్ మూసివేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి దీని ప్రభావం ఎలాం ఉండబోతుంది'. ఇదే అంశంపై మానవి నిర్వంచిన వేదిక చర్చా కార్యక్రమంలో గ్లోబల్ అర్గనైజేషన్ ఫర్ డెవలప్ మెంట్ ప్రతినిధి అరుణ్ రాజ్, ఎండి ఫౌండేషన్ ప్రతినిధి భాస్కర్, సాధన స్వచ్ఛంద సంస్థ మురళీమోహన్ లు పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను వారి మాటల్లోనే...
బాలలకు భద్రత కల్పించాలి...
'చిల్డ్రన్ హోమ్స్ రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ పరంగా, రెండు.. స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి. అమ్మానాన్నలకు దూరమైన చిన్నారులకు కులమతాలకతీతంగా రిజర్వేషన్లు కల్పించాలి. పిల్లల దత్తత చట్టాలను సరళీకరించాలి. దత్తతకు వెళ్లిన పిల్లల క్షేమ సమాచారాలను ప్రభుత్వం సేకరించాలి. బాలల కేంద్రాలన్నింటికీ రిజిష్ట్రేషన్ తప్పనిసరి. హోమ్స్ లో ఆశ్రయం పొందుతున్న బాలలకు భద్రత కల్పించాలని కోరారు. జువినైల్ యాక్ట్ ను పూర్తి స్థాయిలో అమలు పరచాలి' అని వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

తెలంగాణలో సీసీఎస్ లు ఇక పీఎస్ లు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లను పోలీసు స్టేషన్ లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కేశవరెడ్డికి ముగియనున్న కస్టడీ..ఏం తేలుతుందో ?

హైదరాబాద్ : కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి సీఐడీ కస్టడీ ఈ సాయంత్రంతో ముగియనుంది. నాలుగు రోజుల పాటు ఆయనను అధికారులు విచారించారు. ఈ సాయంత్రం కర్నూలు కోర్టులో పోలీసులు ప్రవేశ పెట్టనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అక్రమంగా సేకరించిన డిపాజిట్ల కేసులో కేశవరెడ్డి అరెస్టయిన సంగతి తెలిసిందే. 

15:39 - September 22, 2015

అమెరికా : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..ఎక్కువగా విదేశాల్లో పర్యటించడానికి ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు, ఇతరులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఏ దేశంలో వెళ్లినా మోడీకి బ్రహ్మరథం పడుతున్నారని, ప్రపంచంలోనే నెంబర్ గా దేశం ముందుకు వెళుతోందని మోడీ భజన రాయుళ్లు పేర్కొంటుంటారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా తిరగబడింది. అమెరికాలో కొందరు ఎన్నారైలు 'మోడీ ఫెయిల్ డాట్ కాం' పేరిట కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈనెల 26వ తేదీ నుండి 'మోడీ' లో అమెరికాలో పర్యటించనున్న సందర్భంలో ఈ వెబ్ సైట్ ప్రారంభం కావడం గమనార్హం. దీనికి ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలు కూడా తోడు కావడంతో వెబ్ సైట్ వీక్షకుల సంఖ్య విపరీతంగా అధికమౌతోంది. మోడీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలు..దళితులు..మహిళలు..పై దాడులు పెరిగిపోయాని వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. పౌర హక్కులను మోడీ కాలరాస్తున్నారని, సాంస్కృతిక సంస్థల్లో మత ఛాందస రాజకీయాలు చొచ్చుకుపోతున్నాయని వారు పేర్కొంటున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఏమంటారో ? 
watch the website : http://modifail.com/

15:36 - September 22, 2015

ప్రకాశం : వైసిపి అధినేత జగన్ దొంగ దీక్షలు చేస్తున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన 'రైతు కోసం చంద్రన్నయాత్ర'లో పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అంశాన్ని మ్యానిపెస్టోలో పెట్టడటానికి కూడా జగన్ సాహసం చేయలేదన్నారు. అలాంటి వ్యక్తి రుణమాఫీపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ రాష్ట్రాన్ని లూటీ చేశారని మండిపడ్డారు. దోచుకున్న డబ్బును రాష్ట్ర ఖజానాలో వేయాలని...అప్పుడే ప్రజలు జగన్ ను హర్షిస్తారని తెలిపారు. ఒకవేల జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్ర పంపదను చీపురుతో ఊడ్చేవాడని ఎద్దేవా చేశారు.
లాభసాటిగా వ్యవసాయం..
వ్యవసాయం పవిత్రమైన వృత్తియని.. లాభసాటిగా మారాలన్నారు. రాష్ట్రం లోట్ బడ్జెట్ లో ఉన్నా టిడిపి ప్రభుత్వం 24 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంగా దేశంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. ప్రతిపక్షం అనవసరంగా రాద్ధాంతం చేస్తుందన్నారు.

 

బీహార్..బీజేపీ సీనియర్ నేత చంద్రమోహన్ రాజీనామా..

బీహార్ : ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీలకు సంబంధించి నేతలు రాజీనామాలు చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రమోహన్ పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. టికెట్ల కేటాయింపులో అసంతృప్తితోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 

చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం..

చెన్నై : ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు సింగపూర్ ప్రయాణీకుల నుండి రూ.1.80 కోట్ల విలువైన 6.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

'లష్కర ఎ తోయిబా సంస్థతో భారత్ కు ముప్పు'

ఢిల్లీ : లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాద సంస్థతో భారత్ కు భారీ ముప్పు పొంచి ఉందని లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా హెచ్చరించారు. 300 మందికి పైగా ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆక్రమిత కాశ్మీర్ లోని 17 క్యాంపుల్లో ఉగ్రవాదులకు శిక్షణనిస్తున్నారని, వెయ్యి నుండి 1150 మందికి లష్కర్ ఎ తోయిబా శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. భారత్ లో మరోసారి ముంబై 26/11 తరహా దాడులకు కుట్ర చేస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులకు ఐఎస్ఐ, పాకిస్తాన్ నేవీ సహకారం అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భారత్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

భానుప్రీతి ఆత్మహత్యపై విచారణ..

విజయవాడ : మేరిస్టెల్లా కాలేజీ విద్యార్థిని భానుప్రీతి ఆత్మహత్య ఘటనపై మంత్రి గంటా విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా ఇంటర్ విద్యా కమిషనర్ ఏంవీ వ్యవహరించనున్నారు. సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని గంటా ఆదేశాలు జారీ చేశారు. 

ప్రభుత్వ విధానాలే రైతు ఆత్మహత్యలకు కారణం - మల్లు..

హైదరాబాద్ : ప్రభుత్వ అస్త్యవస్థ విధానాలే రైతు ఆత్మహత్యలకు కారణమని టి.కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. రుణమాఫిపై ప్రభుత్వ విధానాలు కూడా కారణమన్నారు. తెలంగాణలో రాజ్యహింసకు వరంగల్ ఎన్ కౌంటర్ అద్దం పడుతోందన్నారు. ఫిరాయింపుల సభ్యుల అనర్హతపై అవసరమైతే స్పీకర్ పై అవిశ్వాసం పెడుతామని, మిషన్ కాకతీయలో జరుగుతున్న అవినీతి ఆరోపణలపై అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు.

15:17 - September 22, 2015

హైదరాబాద్ : బి-కేటగిరీ కింద సీట్లు పొందిన విద్యార్థులు.. ఈనెల 28 లోపు ఉపసంహరించుకోవాలని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. 28వ తేదీ తర్వాత సీట్లను వదులుకునే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. విద్యార్థుల సర్టిఫికేట్లను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. అలాగే ఈనెల 24, 25, 26 తేదీలలో భర్తీకాని 82 ఎంబిబిఎస్, 118 డెంటల్ ఏ-కేటగిరీ సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. వీటితో పాటు 28 నుంచి భర్తీ కాని బి-కేటగిరీ సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని మంత్రి కామినేని తెలిపారు.

 

15:14 - September 22, 2015

మహబూబ్‌నగర్‌ : రాష్ట్రంలో అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నల సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజు రైతన్న బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అడ్డాకుల మండలం దాసరిపల్లి గ్రామానికి చెందిన రైతు బోయ వెంకటేశ్‌ అప్పులు చేసి.. పంటను సాగు చేశాడు. వేసిన పంటలు ఎండిపోవడంతో, అప్పుల బాధతో తీవ్ర మనస్థాపానికి గురైన అతను ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్దదిక్కైన వెంకటేశ్‌ ఆత్మహత్యతో ఆ కుటుంబం రోడ్డున పడింది. అతని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

 

జాతీయ పార్టీగా టిడిపికి తొలి విజయం - చిన రాజప్ప..

హైదరాబాద్ : అండమాన్ లోని పోర్టుబ్లెయిర్ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడంపై ఏపీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హర్షం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన పార్టీకి తొలి విజయమని పేర్కొన్నారు. 

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : దేశీయ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో కొనసాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగాయి.

పోర్టుబ్లెయిర్ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి విజయం..

అండమాన్ : పోర్టుబ్లెయిర్ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఖాతా తెరిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అధిక్యంలో కొనసాగింది. మొత్తం 24 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాలు, కాంగ్రెస్ ఆరు, టిడిపి 2, డీఎంకే 1, ఎఐడీఎంకే 1, ఇతరులు 4 వార్డుల్లో విజయం సాధించారు.

 

15:02 - September 22, 2015

క్రికెట్..ఇరు జట్లు తలపడేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి ఇవి శృతి మించుతాయి కూడా. గతంలో పలువురు క్రికేటర్లు తలపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తాజాగా ఇద్దరు క్రికేటర్లు గల్లిలో మాదిరిగా కలయబడి కొట్టుకున్నారు. వీరు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బెర్మూడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్లీవ్ లాండి కౌంటీ క్రికెట్ క్లబ్ - విల్లో కట్స్ క్రికెట్ క్లబ్ ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. విల్లో బ్యాట్ మెన్ జార్జి ఓబ్రెయిన్, క్లీవ్ లాండ్ కీపర్ జాసన్ అండర్సన్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. చివరికి చిలికి చిలికి గాలి వానలా మారింది. ఓబ్రెయిన్ ను జాసన్ నెత్తిపై కొట్టేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఓబ్రయిన్ తన చేతిలోని బ్యాట్ తో కొట్టేందుకు ప్రయత్నించాడు. ఇద్దరూ కలియబడి తన్నుకున్నారు. అనంతరం ఇతరులు కలుగ చేసుకున్నారు. ఈ ఘర్షణ అనంతరం జాసన్ జీవిత కాల నిషేధాన్ని ఎదుర్కొనగా ఓబ్రెయిన్ మాత్రం ఆరు మ్యాచ్ ల నిషేధానికి గురయ్యాడు. 

Watch This Video : https://www.youtube.com/watch?v=lTR3MpkXHes

14:58 - September 22, 2015

కర్నూలు : సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు చితకబాదారు. తమ ప్రతాపాన్ని విద్యార్థులపై ప్రదర్శించారు. సమస్యలతో అనేక సంవత్సరాలుగా సతమవుతూ భరించలేని పరిస్థితిలో ఉద్యమానికి పూనుకున్నారు. ఈనేపథ్యంలో వారి హక్కులను కూడా హరిస్తూ.. పోలీసులు విద్యార్థులపై విరుచుకుపడ్డారు. పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. కర్నూలు కలెక్టరేట్‌ను ముట్టడించిన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. పోలీసుల లాఠీఛార్జీలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు కావడంతో వారు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని ఆస్పత్రికి తరలించారు. సంక్షేమ హాస్టళ్లలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీంతో విద్యార్థుల కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.

 

14:49 - September 22, 2015

అనంతపురం : ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల వేధింపులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రైవేటు పాఠశాల యాజమాన్యం కర్కశత్వానికి మరో విద్యార్థి బలయ్యాడు. తరగతి గదిలో టీచర్లు వేధించడం.. టీసీ ఇస్తామని పదేపదే బెదరించడంతో మనస్తాపం చెందిన విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటుచేసుకుంది. దినేష్‌రెడ్డి అనే విద్యార్థి స్థానిక మహర్షి దయానంద గురుకులంలో పదో తరగతి చదువుతున్నాడు. అయితే గుత్తి కోట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాసరచన, సాంస్కృతిక పోటీలలో పాల్గొనేందుకు స్కూల్ ప్రధానోపాధ్యాయుడిని అనుమతి కోరాడు. దీనికి ససేమిరా అన్న ప్రధానోపాధ్యాయుడు.. దినేష్‌రెడ్డికి తరగతి గదిలోనే విద్యార్థులందరి ముందు మరింత అవమానించాడు. దీంతో అవమానం భరించలేని విద్యార్థి దినేష్‌..రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలియని తల్లిదండ్రులు.. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కొడుకు కోసం రాత్రంతా గాలించారు. ఉదయం తమ కొడుకు ప్యాపిలీ రైల్వే గేటు వద్ద శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

14:40 - September 22, 2015

ఢిల్లీ : నేషనల్ ఎన్ క్రిప్షన్ పై కేంద్రం వెనుకగడుగు వేసింది. మంగళవారం కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాట్సప్, ఫేస్ బుక్ మేసెజ్ లను 90 రోజుల పాటు స్టోర్ చేయాల్సిన పని లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది.

అసలు ఏముంది ?
కేంద్ర ఐటీ శాఖ జాతీయ ఎన్‌క్రిప్షన్‌ విధానం ముసాయిదాను ప్రజల ముందుంచి... వారి అభిప్రాయాలు స్వీకరించింది. ఈ ముసాయిదాను యథాతథంగా అమలు చేస్తే... సామాన్య జనానికి అనేక తిప్పలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భారత్‌లో ఎన్‌క్రిప్షన్‌ సందేశాలు పంపించే, సేవలు అందించే సంస్థలు ఏవైనా సరే కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకోవాలని కొత్త విధానంలో ప్రతిపాదించారు. 'ఎన్‌క్రిప్టెడ్‌' సందేశాలన్నింటినీ కనీసం 90 రోజులు ఫోన్‌లో భద్రపరచుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి మినహాయింపులూ ఇవ్వకుండా... 'ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలన్నింటినీ' ఒకే గాటన కట్టేశారు. నిజానికి... వాట్సప్‌ సందేశాలన్నీ వాటంతటవే సంకేత- సంక్షిప్త సందేశాలుగా మారతాయి. అవి తిరిగి సాధారణ అక్షరాల రూపంలో అవతలి వ్యక్తికి చేరుతాయి. పిచ్చాపాటీగా పంపుకొనే వాట్సప్‌ సందేశాలు కూడా ఇకపై 'జాతీయ ఎన్‌క్రిప్షన్‌ పాలసీ' పరిధిలోకి వస్తాయి. అధికారుల ఆదేశాల మేరకు ఆ సందేశాలను వారికి చూపించక తప్పదు. ఇక... ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలకూ ఈ నిబంధన వర్తిస్తుంది. లావాదేవీ జరిపిన 90 రోజులపాటు సంబంధిత సందేశాలన్నీ ఆ సంస్థలు 'సేవ్‌' చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనతో దేశంలోని సుమారు 7 కోట్ల మంది వాట్సప్‌, ఐ-మెసేజ్‌ వినియోగదారులకు తిప్పలు తప్పవు. దీనిపై నెటిజన్లు ఇప్పటి నుంచే అప్రమత్తమయ్యారు. ఎన్‌క్రిప్షన్‌ విధానంలోని లోపాలను ఎత్తిచూపుతూ కేంద్ర ఐటీ శాఖకు ఫిర్యాదులు పంపించారు. చివరకు కేంద్రం వెనుకడగు వేసింది. 

విజయవాడలో లోక్ సత్తా జాతీయ నేత శ్రీవాస్తవ..

విజయవాడ : లోక్ సత్తా ముఖ్యనేతలతో లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు శ్రీవాస్తవ భేటీ అయ్యారు. 2019 ఎన్నికల్లో 30 శాసనసభ, రెండు ఎంపీ సీట్లు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు శ్రీవాస్తవ వెల్లడించారు. నవంబర్ 7,8 తేదీల్లో అనంతపురంలో లోక్ సత్తా రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

కృష్ణా నదిలో నిమజ్జనంపై కోర్టులో పిటిషన్..

విజయవాడ : కృష్ణా నదిలో వినాయక నిమజ్జనం చేయడంపై కోర్టులో న్యాయవాది అశోక్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసు, మున్సిపల్ కమిషనర్లను ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశారు. 31వ తేదీలోగా వివరణనివ్వాలని అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

విద్యార్థిని భానుప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి...

విజయవాడ : స్టెల్లా కాలేజీలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని భానుప్రీతి పోస్టుమార్టం పూర్తయ్యింది. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రత్యేక అంబులెన్స్ లో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. 

'మోటార్' పై అసత్య ప్రచారం - జూపూడి..

హైదరాబాద్ : హంద్రీనీవా ప్రాజెక్టునులో మోటార్ ను తీసుకెళ్లి పట్టిసీమలో వాడుతున్నారని వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని టిడిపి నేత జూపూడి ప్రభాకర్ పేర్కొన్నారు. జగన్ ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని, ప్రజలే జగన్ కు బుద్ధి చెబుతారని తెలిపారు. 

రైతు ఆత్మహత్యలపై చర్చకు సిద్ధం - భట్టి..

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై సభలో చర్చకు సిద్ధం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రాజెక్టుల డిజైన్ మార్పు వెనుక రూ.2.5 కోట్ల కుంభకోణం దాగుందని ఆరోపించారు. వరంగల్ ఎన్ కౌంటర్ అత్యంత పాశవికమని అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. ప్రభుత్వ తీర్పుతో ప్రజాస్వామిక వాదులెవరూ జీవించలేని పరిస్థితి తలెత్తిందని తెలిపారు.

 

ప్రత్యేక హోదాపై అనవసరం రాద్ధాంతం - గాలి..

హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు విమర్శించారు. ఢిల్లీలో ధర్నా చేయకుండా ఇక్కడి యువతను రెచ్చగొడుతున్నారని, ప్రత్యేక హోదా వల్ల కేంద్రం నుండి వచ్చేది సబ్సిడీలే కాని పారిశ్రామిక సబ్సిడీలు కావన్నారు. 

ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సోషల్ మీడియాపై వెనకడుగు వేసింది. వాట్సప్, ఫేస్ బుక్ మేసెజ్ లను 90 రోజుల పాటు స్టోర్ చేయాల్సిన పని లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది.

 

యూపీలో అచ్చే దిన్ రాలేదు - అఖిలేష్...

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో అచ్చే దిన్ రాలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. పాట్నాలో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

13:44 - September 22, 2015

'స్వామి రారా'..'కార్తికేయ'..'సూర్య వర్సెస్ సూర్య'.. ఇలా వరుసగా వైవిధ్య భరితమైన చిత్రాలు చేస్తూ, ముందుకు దూసుకెళుతున్న 'నిఖిల్' నటిస్తున్న తాజా చిత్రం 'శంకరాభరణం'. దీనికి సంబంధించిన న్యూ లుక్స్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో 'నందిత' హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ రచయిత 'కోన వెంకట్' సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. 'గీతాంజలి' వంటి విజయం తర్వాత ఎంవీవీ సినిమా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది. యుఎస్‌కి చెందిన అత్యంత సంపన్నుడి కొడుకు నిఖిల్. ప్రపంచంలో సుఖపడే వాళ్లు, కష్టపడి పని చేసేవాళ్లు ఈ రెండు జాతులు మాత్రమే ఉంటాయన్నది హీరో నమ్మకం. తాను సుఖపడటానికే పుట్టనన్నది అతని ఫీలింగ్. అలాంటి అతను ఓ పని మీద ఇండియాకి వచ్చి అనుకోకుండా కష్టాల్లో చిక్కుకోవడం, వాటి నుండి ఎలా తప్పించుకున్నాడనే కథాంశంతో 'శంకరాభరణం’ సినిమా సాగుతుందంటూ 'కోన' తెలిపాడు. ఇందులో హీరోయిన్ అంజలి స్పెషల్ క్యారెక్టర్ చేసిందని పేర్కొన్నారు. 

నేషనల్ ఎన్ క్రిప్షన్ పై కేంద్రం వెనుకగడుగు..

ఢిల్లీ : నేషనల్ ఎన్ క్రిప్షన్ పై కేంద్రం వెనుకగడుగు వేసింది. వాట్సప్, ఫేస్ బుక్ మేసెజ్ లను 90 రోజుల పాటు స్టోర్ చేయాల్సిన పని లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. 

చెన్నై ఐఐటీలో తెలుగు విద్యార్థి మృతి..

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై ఐఐటీ కళాశాలలో ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కడప జిల్లాకు చెందిన నాగేందర్ రెడ్డిగా గుర్తించారు. మద్రాసు ఐఐటిలో ఏడాది కాలంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

 

కోల్ స్కాం..ముద్దాయిగా సోనియాను చేర్చాలి - సోమిరెడ్డి..

నెల్లూరు : బొగ్గు కుంభకోణంలో ముద్దాయిని చేయాల్సింది సోనియాగాంధీని అని ఎమ్మెల్సీ సోమిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు రాకుండా జగన్ కుట్ర చేస్తున్నారని, సీబీఐ పట్టుకోవాల్సింది చిన్న చేపలను కాదని సొర చేపలంటూ పేర్కొన్నారు.

 

కర్నూలులో ఎస్ఎఫ్ఐ ఆందోళన...

కర్నూలు : సాంఘీక సంక్షేమ విద్యార్థి వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నం చేసింది. కలెక్టరేట్ లోకి దూసుకెళ్లేందుకు విద్యార్థులు యత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు జరిపిన లాఠీఛార్జీలో పలువురికి గాయాలయ్యాయి.

 

ఆపరేషన్ 'జీజీహెచ్'

గుంటూరు : ఆపరేషన్ జీజీహెచ్ పేరిట 72 గంటల ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ కాంతిలాల్ దండే పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో ముచ్చటించారు. జిల్లాకు చెందిన 50 మంది ఉన్నతాధికారులు..50 మంది శానిటేషన్ సిబ్బందితో ఆసుపత్రిలో పారిశుధ్య సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. 'గుంటూరు హృదయ్' పేరిట ఆసుపత్రి అభివృద్ధికి నిధుల సేకరిస్తామన్నారు. తమ వంతుగా ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తామని, విరాళాలిచ్చే దాతలకు ఆదాయపను పన్ను రాయితీ కల్పించనున్నట్లు చెప్పారు. 

13:24 - September 22, 2015

హైదరాబాద్ : నూతన ఎక్సైజ్ పాలసీలో మద్యాన్ని నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ ఆరు మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆదివారంతో సహా సెలవు దినాల్లో మద్యం షాపులను మూసివేయించాలని డిమాండ్ చేశారు. మహిళా వ్యతిరేకతను చవి చూసిన తెలంగాణ ప్రభుత్వం చీప్‌ లిక్కర్‌ను వెనక్కి తీసుకుందని, ఇంతలోనే నూతన ఎక్సైజ్‌ పాలసీని ప్రవేశపెట్టి ఊరికో మద్యం షాపులకు అనుమతినిస్తోందని మహిళా సంఘం నేతలు విమర్శించారు. మద్యం వేలం పాటలను నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. 

13:22 - September 22, 2015

చిత్తూరు : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ లతీఫ్‌ను చిత్తూరు టాస్క్ ఫోర్స్ సీఐ సాదిక్ అలీ కేరళలో అదుపులో తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో స్మగ్లర్‌ లతీఫ్‌ తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేశాడు. పోలీసులపై దాడి చేసే పరారయ్యేందుకు యత్నించాడు. కానీ పోలీసులు ఆ ప్రయత్నాలను విఫలం చేశారు. లతీఫ్‌కు కేరళలో మంచి రాజకీయం పలుకుపడి ఉంది. లతీఫ్‌పై కేరళలో 12 కేసులు, చిత్తూరు జిల్లాలో 13 కేసులు ఉన్నాయి. ఇతను మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్‌ జాబితాలో ఉన్నాడు. కేరళలోని పల్లకడు మేజిస్ర్టేట్‌ ఎదుట లతీఫ్‌ను హాజరుపర్చిన తర్వాత.. చిత్తూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 

గుంటూరు ప్రభుత్వాసుపత్రికి ప్రత్యేక అధికారి నియామకం..

గుంటూరు : ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అధికారిగా పులిచింతల డిప్యూటి కలెక్టర్ రఘునాథ్ నియమితులయ్యారు. ఆరు నెలల పాటు ప్రత్యేకాధికారిగా ఆయన కొనసాగనున్నారు. 

ఢిల్లీలో 41వ స్కాచ్ సదస్సు...

ఢిల్లీ : రాజధానిలో 41వ స్కాచ్ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. పాలనలో వచ్చిన మార్పులపై రెండు రోజుల పాటు ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో స్కాచ్ సదస్సు జరుగనుంది. ఈ గవర్నెనెన్స్ ద్వారా పొందుతున్న ప్రయోజనాలను వివిధ రాష్ట్రాల ప్రతినిధులు వివరించారు. స్కాచ్ స్మార్ట్ అవార్డులకు తెలుగు రాష్ట్రాలు ఎంపికయ్యాయి. సాయంత్రం అవార్డుల ప్రధానం చేయనున్నారు. 

మహబూబ్ నగర్ లో కల్తీ కల్లు బాధితురాలి ఆత్మహత్య..

మహబూబ్ నగర్ : షాద్ నగర్ ఇందిరానగర్ కాలనీలో కల్తీ కల్లు బాధితురాలు బీమమ్మ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

స్కూల్ కు ఆలస్యంగా వచ్చారంటూ టీచర్ ఉగ్రరూపం..

హైదరాబాద్ : స్కూల్ కు ఆలస్యంగా వచ్చారంటూ విద్యార్థులపై ఓ టీచర్ ఉగ్రరూపం దాల్చింది. నలుగురు విద్యార్థులను చితకబాదింది. ఈ ఘటన మీర్ పేటలోని గౌతమి టాలెంట్ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక విద్యార్థి చేయి విరగగా మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సంఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

వచ్చే సమావేశాల్లో రియల్ ఎస్టేట్ బిల్లు - మోడీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో అనేక మార్పులు తెచ్చిందని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రియల్ ఎస్టేట్ బిల్లును ప్రవేశ పెడుతామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో మూడు లక్షల ఎకరాల భూమిని కాంగ్రెస్ సేకరించిందని ఆ విషయాలను బయటపెడుతామన్నారు. రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని, ఆ పార్టీ మోడీని అడుకోవడం లేదని దేశాభివృద్ధిని అడ్డుకొంటోందని విమర్శించారు.

 

12:49 - September 22, 2015

ఖమ్మం:  నోట్లో జామకాయ ఇరుక్కుని.. ఎనిమిది నెలల పాప చనిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పాల్వంచ మండలం నాగారం గ్రామపంచాయితీలోని నారాయణరావు పేటలో ఈ ఘటన జరిగింది. కేసుపాక రవి, సుజాతల రెండవ సంతానం సాయి మదూష. నిన్న మధ్యాహ్నం ఆటబొమ్మలతో సాయి మదూష ఆటుకుంటుండగా.. నోట్లో జామకాయ పెట్టుకుంది. దీంతో ఊపిరడాక పసిపాప గొంతు మూగబోయింది. ఇది గమనించిన పాప తల్లి వెంటనే పాల్వంచ ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి కొత్తగూడెం సింగరేణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పాప నోట్లో ఇరుక్కున జామకాయను బయటకు తీసి.. ఆక్సిజన్‌ ఏర్పాటు చేస్తుండగా.. అప్పటికే పరిస్థితి విషమించి పాప చనిపోయింది. మదూష మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

12:48 - September 22, 2015

హైదరాబాద్ : అవినీతి నిరోధక శాఖకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది.ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉన్నాడనే నెపంతో రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీధర్‌ ఇంటిపై ఏసిబీ అధికారులు దాడులు నిర్వహించారు. బల్కంపేటలోని శ్రీధర్‌ ఇంట్లో జరిగిన ఈ రైడ్‌లో 60తులాల బంగారు ఆభరణాలు,15లక్షల నగదును ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో ఖరీదైన భవనాలు ఉన్నట్లు ఏసిబి దాడుల్లో వెల్లడైంది.

12:46 - September 22, 2015

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు హైదరాబాద్‌ అబిడ్స్‌లోని జనరల్‌ పోస్టు ఆఫీస్‌ ఎదుట ధర్నాకు దిగారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ స్టాంపుల తొలగింపుపై కాంగ్రెస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మల్లు భట్టివిక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్‌, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. 

12:45 - September 22, 2015

కడప : పలకా, బలపం పట్టి.. బడికి పరుగు తీయాల్సిన వయస్సులో.. పని కోసం తిరుగుతున్నారు. పట్టెడు మెతుకుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కడపలో అర్థాకలితో అలమటిస్తూ ఎందరో వీధుల్లో.. బస్టాండ్‌లలో.. రైల్వే స్టేషన్‌లో కన్పిస్తారు..ఎవరి పనుల్లో వారుండి పట్టించుకోరు..కాని ఆ బాల్యం మాత్రం ఆకలికి అలమటించి రోదిస్తుంది...కన్నీటిని తాగుతూ కాలం వెళ్లదీస్తోంది...ఇలాంటి చిట్టి చిన్నారులు ఎందరో ఉన్నారు... కళ్ల ముందు కన్పించినా ఎవరూ పట్టించుకోవడం లేదు...ఈ బాలల్లో కొందరు కన్నవారి దుర్మార్గానికి వీధిన పడగా... మరికొందరు దారి తప్పినవారున్నారు.

భరించరాని దుర్గంధం వెదజల్లె చెత్తకుండీల్లో....

భరించరాని దుర్గంధం వెదజల్లె చెత్తకుండీల్లో చిన్నారులు చిత్తుకాగితాలు ఏరుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. పందులు, కుక్కల మధ్య సహవాసం చేస్తున్నారు. జోలెపట్టి బిక్షమెత్తుకుంటున్నారు. తెల్లారింది మొదలు... పొద్దుపోయేవరకు మురికికూపాల మధ్యే కాలం వెల్లదీస్తున్నారు. బతుకు జట్కాబండీని లాగేందుకు నానా పాట్లు పడుతున్నారు.

నిర్బంధ విద్య బుట్టదాఖలు....

వీధి బాలలను కాపాడేందుకు చట్టాలు లేవా, అధికారాలు లేవా అని ప్రశ్నిస్తే...రాజ్యాంగం ప్రకారం బాలల బంగారు భవిష్యత్తుకు ఎన్నో హక్కులు కల్పించారు. బడీడు పిల్లలకు కచ్చితంగా నిర్బంధ విద్య కల్పించాలి. కాని కడప నగరంలో మాత్రం అది కాగితాలకే పరిమితమవుతుందన్న ఆరోపణలున్నాయి. పాలకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక్క కడప జిల్లాలోనే కాదు... రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసిన వీధి బాలలది ఇదే దుస్థితి. వీధి బాలల కోసం చేసేది గోరంతైతే... కొండంత ప్రచారం కల్పించుకుంటున్నారే తప్ప.. వారిని అక్కున చేర్చుకుని వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసే వారే కరువయ్యారు.

స్ట్రీట్‌ చైల్డ్‌ విద్య కోసం అన్ని సదుపాయాలున్నా..

స్ట్రీట్‌ చైల్డ్‌ విద్య కోసం అన్ని సదుపాయాలున్నా..వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడం లేదని మరికొందరు అంటున్నారు. రకరకాల కారణాలతో వీధిన పడే పసివాళ్లు అలమటిస్తున్నారు..కన్నవారు ఎక్కడున్నారో కూడా తెలియని అర్థాకలితో బతుకులీడుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి.. వీధి బాలలను బడిబాట పట్టించాలని పలువురు కోరుతున్నారు. 

12:42 - September 22, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రజావాణి అలంకారప్రాయంగా మారింది. సమస్యలను క‌మిష‌న‌ర్ ప‌ట్టించుకోరు. రెగ్యులర్‌గా ఉన్నాతాధికారులు హాజ‌రుకారు. ఒకప్పుడు బల్దియాలో ఎంతో క్రేజ్‌ ఉన్న ప్రజావాణి ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వెలవెలబోతోంది. స‌మ‌స్యలు పరిష్కారమవుతాయని ఎంతో దూరం నుంచి వచ్చే గ్రేటర్‌ వాసులకే ప్రతిసారి నిరాశే ఎదురవుతోంది.

ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం.....

బల్దియాలో ప్రతి సోమవారం ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 స‌ర్కిళ్లలో నిర్వహించే ప్రజావాణిలో తమ సమస్యలను చెప్పుకోవడానికి నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అయితే ఒకప్పుడు ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేస్తే.. సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేవి. అధికారులు కూడా త్వరగా స్పందించేవారు. కానీ, ప్రస్తుతం సీన్‌ మారింది.

అధికారులకు టైంపాస్‌గా మారిన ప్రజావాణి కార్యక్రమం.....

కొద్ది నెల‌లుగా ప్రజావాణి కార్యక్రమం జ‌నాల‌కు ఎలా ఉప‌యోగప‌డుతుందో ఏమో కాని అధికారుల‌కు 4 గంటలు టైంపాస్‌ కార్యక్రమంగా మారింది. దీనికి తోడు క‌మిష‌న‌ర్ సోమేష్‌కుమార్‌ కొన్నాళ్లుగా ప్రజావాణి కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. దీంతో అధికారులు బాధితుల నుంచి ధరఖాస్తులు తీసుకుంటున్నారు గానీ, సమస్యల పరిష్కారానికి పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శ ఉంది. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధిలైట్ల సమస్య, కుక్కుల బెడద, అక్రమ నిర్మాణాలు తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినా సమస్యలు పరిష్కారం కావడం లేదని గ్రేటర్‌ వాసులు వాపోతున్నారు. ఓవైపు పాల‌క‌వ‌ర్గం లేక‌పోవ‌డం, మ‌రోవైపు క‌మిష‌న‌ర్ ప్రజావాణిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో గ్రేట‌ర్ వాసుల స‌మ‌స్యలు ప‌రిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా బల్దియా బాస్‌ ప్రజావాణి కార్యక్రమంపై సీరియస్‌గా ఫోకస్‌ చేసి.. సమస్యలను త్వరగా పరిష్కరించాలని గ్రేటర్‌ వాసులు మొరపెట్టుకుంటున్నారు.

12:38 - September 22, 2015

హైదరాబాద్ : తమిళపీఠంపై రెండోసారి ఏఐఏడీఎంకె విజయకేతనం ఎగురవేయటంతో ఖంగుతిన్న డిఎంకె వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గద్దెనెక్కాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ టఫ్‌ టాస్క్‌ను కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ తన భుజస్కందాలపై వేసుకున్నారు. ఇందుకోసం స్పెషల్ స్లోగన్‌కు పురుడు పోసాడు. కరుణానిధి ఆశలదీపమైన స్టాలిన్‌ ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌తో ఓ యాడ్‌ ఫిల్మ్‌ షూట్ చేయించాడు. అంతేకాదు 20ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చి డిఎంకె శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసారు. నమకు నామే వీడియోను ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తే గంటలోనే లక్షకు పైగా లైక్‌లు వచ్చాయట.

ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్‌గా ....

ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్‌గా ....మిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈసారి అధికారపీఠాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని డిసైడ్ అయిన స్టాలిన్‌ జయలలిత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. నమకు నామే అంటే మనకు మనమే అనే ట్యాగ్‌ లైన్‌తో ప్రజల్లోకి వెళ్తున్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన నమకు నామే యాత్ర రెండు విడతలుగా జరగనుంది. నవంబర్‌ 8న ఈ యాత్ర ముగియనుంది. తొలివిడత నమకు నామే యాత్రను ఓ టీ స్టాల్‌ నుంచి ప్రారంభించిన స్టాలిన్‌ విద్యార్ధులు, వ్యాపారులు, సామాన్యులతో పాటు అన్ని వర్గాలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.

నమకు నామే యాత్రను.....

స్టాలిన్‌ నమకు నామే యాత్రను జయ సర్కార్‌ లైట్‌గా తీసుకున్నట్లు కనిపించినా, పోటీగా ఏదో ఓ కార్యక్రమం ప్రారంభించాలని డిసైడయినట్లు తెలుస్తోంది. మరి ఈ పవర్‌ గేమ్‌లో ఎవరు విజేతగా నిలుస్తారో తెలుసుకోవాలంటే మరో ఏడాది ఆగక తప్పదు.

కంచికచర్లలో పప్పుల మిల్లులపై దాడులు...

కృష్ణా : కంచికచర్ల (మం) పరిటాలలో పప్పుల మిల్లులపై నిఘా అధికారులు దాడులు జరిపారు. 1612 క్వింటాళ్ల పప్పును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.93.97 లక్షలుగా ఉంటుందని తెలుస్తోంది. శ్రీ లక్ష్మీ శ్రీనివాస, కార్తికేయ మిల్లులపై కేసులు నమోదు చేశారు. 

ఉభయ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆత్మహత్యలు..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల్లో అన్నదాతలు ఆత్మహత్యలు ఆగడం లేదు. మంగళవారం ఒక్కరోజే తెలంగాణలో ముగ్గురు..ఏపీలో ఒకరు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

 

ఎన్ఆర్ హెచ్ఎం స్కాంతో సంబంధం లేదు - మాయావతి..

ఉత్తర్ ప్రదేశ్ : ఎన్ఆర్ హెచ్ఎం (జాతీయ గ్రామీణ ఆరోగ్యం) స్కాంతో సంబంధం లేదని బీఎస్పీ అధినేత మాయావతి స్పష్టం చేశారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ స్కాంపై ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్ఆర్ హెచ్ఎం స్కాంపై సీబీఐ అధికారులు తనను కలిసిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రశ్నించాల్సి ఉందని అధికారులు పేర్కొనడం జరిగిందన్నారు. ఇందులో కేబినెట్ నిర్ణయం తీసుకుందని, సీఎం కాదని తెలిపినట్లు పేర్కొన్నారు. స్కాంపై ఏదైనా తనను ప్రశ్నించుకోవచ్చని సీబీఐ అధికారులకు తెలియచేసినట్లు తెలిపారు.

12:22 - September 22, 2015

విశాఖపట్నం: ఏపీకి ప్రత్యేక హోదా తమ హక్కు అని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులతో సోమవారం ప్రత్యేక హోదాపై ఏర్పాటు చేసిన యువభేరి సభలో పాల్గొని ప్రసంగించారు. పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ సమావేశానికి జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆపార్టీ నేతలు, కార్యకర్తలు, యువతీయువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని జగన్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా మన హక్కు అని.. హోదా వస్తేనే రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇప్పటికైనా మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు ఎన్నికల నాటి హామీలను అమలు పర్చాలని జగన్‌ డిమాండ్ చేశారు. హోదా ఎంత అవసరమో తెలిసినా సీఎం చంద్రబాబు మభ్య పెట్టే కార్యక్రమంలో చేస్తున్నాడని మండి పడ్డారు. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని హామీ ఇచ్చారని, ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బిజెపి 5ఏళ్లు కాదు 10ఏళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన వాగ్థానాలను విస్మరించారని ఆరోపించారు.

12:20 - September 22, 2015

హైదరాబాద్ : 1200 మంది విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో వూరట లభించింది. విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ లోనే కొనసాగించాలని హైకోర్తు మధ్యంతర ఉత్తర్వులుజారీ చేసింది. 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో జీతభత్యాల బకాయిలు చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.

ప్రత్యేక హోదా అంటే మంత్రులకు తెలియదు - జగన్..

విశాఖపట్టణం : ప్రత్యేక హోదా అంటే ఏపీ మంత్రులకు తెలియదని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్ధేశించి ఆయన ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్ర విభజన అడ్డగోలుగా చేశారని విమర్శించారు. 70 శాతం పరిశ్రమలు, ఉద్యోగం కోసం ఎదురు చూసే ప్రాంతం హైదరాబాద్ అని, ఈ ప్రాంతాన్ని విడదీస్తున్నారని అందుకోసం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్ కు హామీనిచ్చారని గుర్తు చేశారు.

ఆబిడ్స్ జీపీఓ కార్యాలయం ఎదుట టి.కాంగ్రెస్ ధర్నా..

హైదరాబాద్ : నగరంలోని ఆబిడ్స్ జీపీఓ కార్యాలయం ఎదుట టి.కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఇందిరా, రాజీవ్ స్టాంప్ ల తొలగింపుపై చేపట్టిన ఈ ధర్నాలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అనంతరం చీఫ్ పోస్టుమార్టర్ కు వినతిపత్రం అందచేశారు. మోడీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సబితలు విమర్శించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిర, రాజీవ్ స్టాంప్ లను ఉపసంహరించడం దారుణమన్నారు. తక్షణమే ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

సోమ్ నాథ్ భారతి నివాసానికి చేరుకున్న పోలీసులు..

ఢిల్లీ : మాజీ న్యాయ శాఖ మంత్రి సోమ్ నాథ్ భారతి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ ను కొద్దిసేపటి క్రితం హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఆయన్ను అరెస్టు చేస్తారని వదంతులు వ్యాపిస్తున్నాయి.

2019 నాటికి వైసీపీ అడ్రస్ గల్లంతు - ప్రత్తిపాటి..

ప్రకాశం : 2019 నాటికి వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని టెన్ టివికి తెలిపారు. ఒంగోలులో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని, రైతులకు భరోసా కల్పించేందుకు భరోసా యాత్ర నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 

 

ప్రభుత్వ కార్పొరేట్ కంపెనీగా సీఆర్డీఏ - సీపీఎం..

విజయవాడ : సీఆర్డీఏ ప్రభుత్వ కార్పొరేట్ కంపెనీగా మారిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు విమర్శించారు. రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రభుత్వ కార్యక్రమంగా జరగాలని, ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం సరైంది కాదని, రాజధానిలో ప్రజా ధనాన్ని అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.

 

 

కేరళలో ఎర్రచందనం స్మగ్లర్ లతీఫ్ అరెస్టు..

చిత్తూరు : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ లతీఫ్ ను చిత్తూరు పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. లతీఫ్ పై చిత్తూరులో 13, కేరళలో 12 కేసులు నమోదయ్యాయి. 

11:48 - September 22, 2015

కరీంనగర్‌  : జిల్లాలోదారుణం వెలుగుచూసింది. ఏడడుగులు నడిచిన భర్తే కట్టుకున్న భార్యను అమ్మకానికి పెట్టాడు. 3 లక్షల రూపాయలకు భార్యను అమ్మకానికి పెట్టిన వ్యక్తిని, కొనుగోలు చేసిన ప్రబుద్ధుడిని స్థానికులు చితకబాదారు. జమ్మికుంట మండలం మల్యాల గ్రామానికి చెందిన యాకుబ్‌, భాగ్య దంపతులు. వీరికి పెళ్లి జరిగి ఐదేళ్లు అవుతున్నా.. సంతానం లేదు. దీంతో యాకుబ్‌ తన భార్యను అమ్మి.. మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వరంగల్‌ జిల్లా పరకాలకు చెందిన సుధాకర్‌ అనే వ్యక్తికి 3 లక్షల రూపాయలకు యాకుబ్‌ తన భార్యను అమ్మేశాడు. సుధాకర్‌ అనే వ్యక్తి క్షుద్రపూజలు చేస్తుంటాడు. అయితే.. నిన్న మల్యాల గ్రామానికి సుధాకర్‌ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సుధాకర్‌ను చెట్టుకు కట్టేసి.. చితకబాదారు. ఇటు భాగ్య భర్త యాకుబ్‌ను కూడా చితకబాది జమ్మికుంట పోలీసులకు అప్పగించారు. 

11:46 - September 22, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. సింగపూర్‌ ప్రధాన మంత్రి లీ సీన్‌ లూంగ్‌తో సమావేశం అయ్యారు. రాజధాని శంకుస్థాపనకు హాజరు కావాల్సిందిగా ఆయన్ను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఇక అమరావతి అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ముందుకు రావాలని సింగపూర్‌ పారిశ్రామికవేత్తలకు బాబు పిలుపునిచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని పారిశ్రామిక వేత్తలకు బాబు వివరించారు. పెట్టుబడులకు అనుకూల రాష్ర్టాల్లో నవ్యాంధ్ర దేశంలోనే రెండో స్థానంలో ఉందంటూ ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికను చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. ఇక నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన మాస్టర్‌ డెవలపర్‌ ఎంపికపై చంద్రబాబు బృందం సింగపూర్‌ ప్రభుత్వంతో ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించింది. మాస్టర్‌ డెవలపర్‌ ఎంపికతోపాటు రాజధాని నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో సీఎం చంద్రబాబు సమావేశమై వివిధ అంశాలపై రెండు ప్రభుత్వాలు కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా వ్యాపార సరళీకృత విధానాలు, ఆకర్షణీయ నగరాలు, శిక్షణ, సామర్థ్యం పెంపు వంటి అంశాలపై కలిసి పని చేస్తే మంచి ఫలితాలను సాధించవచ్చని భావించారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాల్సిందిగా ఈశ్వరన్‌ను చంద్రబాబు కోరారు. అనంతరం పలువురు ఆర్థికవేత్తలు, విద్యావేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు.

 

11:44 - September 22, 2015

మెదక్ : కలలు కల్లలయ్యాయి. బతుకులు మోడువారిపోయాయి. ఒక్క గ్రామంలోనే 34 మంది ప్రాణాలు కడతేరిపోయాయి. ఎదిగొచ్చిన బిడ్డలతో పాటు ఆసరా కూడా కోల్పోయిన ముసలి తల్లిదండ్రలు, అమ్మానాన్నలను పోగొట్టుకుని అనాథలైన పసికందులు, పెళ్లీడు కొచ్చినా పెద్ద దిక్కు లేక బెంబేలెత్తుతున్న యువతీ యువకులు, పొట్ట కూటి కోసం వలసలు, కూలీ కూడా దొరక్క జీవచ్ఛవంలా సాగుతున్న బతుకులు. ఎందుకిలా? ఏం జరుగుతోందిక్కడ? వ్యవసాయం పేరు చెబితే వణికిపోతున్న మెదక్ జిల్లా ఎలకల్ గ్రామం వ్యథార్థ , యథార్ధ చిత్రంపై 10టీవీ స్పెషల్ రిపోర్టు....

 హమారా హైదరాబాద్...హమేశా జిందాబాద్...

ఇదిగిదిగో ఉరుకులు, పరుగుల జీవితం.. ఆకాశానికి ఎగిసే ఘన కీర్తి పతాకం. విశ్వనగర రేసులో ముందు వరస. తెలంగాణ రాష్ట్రానికే మణిమకుటం. సగర్వంగా చాటి చెప్పుకునే సంకేతం... సాధించిన విజయాలకుప్రతీక భవిష్యత్అవకాశాలకు భాగ్యనగరం. హమారా హైదరాబాద్...హమేశా జిందాబాద్...

బతుకు పోరాటం చేస్తున్న పల్లె....

నాణానికి మరో కోణం... సరిగ్గా ఇక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో వాడిపోయిన ఒక పల్లె...బతుకు పోరాటం చేస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని చేర్చి ఉన్న దౌలతాబాద్ మండలం ఎలకల్ గ్రామం ఇది. ఇక్కడ బంగారు కలలు లేవు. బతకాలనే ఆశా లేదు. ఎప్పుడు ఎవరు పురుగు మందుకు బలి అవుతారో తెలియదు. ఎవరి ప్రాణం ఉరి కొయ్యకు హారంగా మారిపోతుందో అంతుచిక్కదు. నిశ్శబ్దం. నిగూఢమైననిశ్శబ్దం. ఎవరిని పలకరించినా సాయం కోసం అర్థింపులు. సర్కారు ఆదుకొంటుందేమోనని గుంపులు గుంపులు. పొట్ట చేత పట్టుకుని వలసకూలికిపోతున్న గ్రామస్థులు, అమ్మకానికి తరలిపోతున్న పశువులు. వేలాడదీసిన తాళాలతో ఊరు సగం ఖాళీ..నీడ కోల్పోయి అక్కడక్కడ జనం జాడ కనిపిస్తున్నఇళ్లల్లో ముసలి ముతక, పిల్లా జెల్లా బిక్కుబిక్కు మంటున్నారు. ఈ ఊరులో భోరులు పడవు, నీళ్లు మృగ్యం. కూలీ దొరకదు. అప్పు పుట్టదు. మరింకేం మిగిలిందిక్కడ? అంటే వచ్చే సమాధానం పురుగుల మందుల చావులు. చేసిన అప్పులు తీరక ..పెళ్లాం బిడ్డలను ఎలా సాకాలో తెలియక ప్రాణాలిక్కడ తృణప్రాయంగా మారిపోయాయి. అందుకే ఇక్కడ … ఈ ఒక్క గ్రామంలోనే 34 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రతి కుటుంబంలోనూ చావు కేక వినిపిస్తోంది.

వ్యవసాయ సంక్షోభం....

రాష్ట్రంలోని వందల గ్రామాల్లో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, తదనంతర పర్యవసానాలకు నిదర్శనంగా నిలుస్తోందిఎలకల్ గ్రామం. ఈ ఊరు పేరు చెబితే సర్కారు సైతం ఉలికి పడుతోంది. అందుకే ఇక్కడ పర్యటించే మంత్రులూ లేరు. సాయం అందించే ప్రతినిధీ కానరాడు. నిన్నామొన్నటి సాగు కోసం అప్పు చేసి నీళ్ల కోసం బోరులు వేస్తే బతుకు బోర్లా పడిపోయిన కుటుంబాలే ఈ గ్రామంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ అప్పులు పెరిగి ఇల్లూ వాకిలీ, పొలమూ, గొడ్డూ అమ్మినా తీరక... రుణదాతల ఒత్తిడితో భవిష్యత్తుపై నమ్మకం సడలి ప్రాణాలు తీసుకుంటున్నారు. సేద్యం చేయడానికి పుస్తెలు తాకట్టు పెట్టి కొన్న పురుగుల మందులే ఆ ఇంటి యజమానుల ఆయువు తీస్తున్నాయి.

తండ్రీకొడుకులు వ్యవసాయ నష్టాలతో .....

ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు వ్యవసాయ నష్టాలతో , అప్పుల భారంతో చనిపోతే కుటుంబంలోనిఆడవా ళ్లందరూ వితంతువులుగా మిగిలిపోయి కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు ఈ గ్రామంలో సర్వసాధారణంగా మారాయి. సింగరాతి కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటన... ఈ ఊరిని పలకరించిన , పరామర్శించిన ప్రతి ఒక్కరి గుండెనూ మెలిపెట్టే విషాదం. అన్నాదమ్ములు,తండ్రీకొడుకులు అయిదుగురుఆత్మహత్యకు పాల్పడ్డారు. సింగరాతి నర్సయ్య, అతని కొడుకు స్వామి ...ఒకరి తర్వాత ఒకరు బలవంతంగా జీవితం చాలించేశారు. తమ్ముళ్లు కిష్టయ్య, మల్లయ్యలూ చావు బాటనేఎంచుకున్నారు. భవిష్యత్తు అంధకారబంధురంగా భావిస్తున్న ఈ అత్తాకొడళ్లు ...తమ బతుకుకు దిక్కెవరు? అంటూ రోదిస్తున్నారు....

కనకావతి పేరులోనే బంగారం....

కనకావతి పేరులోనే బంగారం. బ్రతుకు మాత్రం భయానకం. పెళ్లాడిన పెనిమిటి వదిలేస్తే ...తండ్రి చాటు బిడ్డలా నెట్టుకువస్తున్న ఈమెకు తండ్రిచావు శాపమై పోయింది.... కొత్తగా పెళ్లైన రేనా ...అత్తారింటికి ఇంకా వెళ్లనే లేదు. ఇంటి తోరణాలు తీయనే లేదు. అప్పులబాధతో పొలంగట్టున అమ్మ మృత్యువాత పడిపోయింది. నాన్న ఒంటరై పోయాడు. అవ్వకు ఆసరా పోయింది. చెల్లెళ్లు తల్లిలేని బిడ్డలైపోయారు...పట్టు వదలని విక్రమార్కుడు ఈ సత్తెయ్య . ఏదో మూలన నీళ్లు పడతాయేమోనన్నఆశ. ఇప్పటికిఏడుసార్లు బోర్లు వేశాడు. అప్పులు పెరుగుతున్నాయే తప్ప ఆశ తీరడం లేదు. చేతి కొచ్చిన కొడుకు చనిపోయాడు. వికలాంగు రాలైన భార్య నర్సమ్మతో బతుకు భారాన్ని ఈదుతున్నాడు బర్కం సత్తెయ్య. అతని జీవితమే నిత్య పోరాటం. బ్రతుకుపై ఆరాటం. ఇంత జరుగుతున్నా ఈ ఊరివైపుఎవరైనా పెద్దలు తొంగిచూస్తున్నారా? చేతల్లో ఆర్థికసాయం అందుతుందా? అంటే లేదులేదంటున్నారు ముక్త కంఠంతో గ్రామప్రజలు.... ప్రభుత్వఉదాసీనతపై విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి...తక్షణసాయం కోసం డిమాండ్లు వినిపిస్తున్నాయి.

చావుకు చిన్నా పెద్దా తేడా లేదు......

చావుకు చిన్నా పెద్దా తేడా లేదు. అప్పుకు తన, పర భేదం కానరాదు. ఈ గ్రామానికే ఒకనాడు పెద్దగా, సర్పంచ్ గా పనిచేసిన గాలా ఎల్లం సైతం అప్పులభారంతోనే అసువులు బాశాడని కన్నీరుమున్నీరవుతోంది భార్య నాగమణి. ప్రముఖులతో పరిచయాలు ఫొటోలకే పరిమితమయ్యాయని... తమ వంక కన్నెత్తి చూసే నాథుడే లేడనేది ఆమె ఆవేదన. ముడుతలు పడిన దేహాలతో ముగ్గుబుట్ట లాంటి పండు వయసులో ...నిర్జీవమైన గాజుకళ్లల్లో ఆశల వత్తులతో కొడిగడుతున్నఈ గ్రామాన్ని ఆదుకోవాల్సిన అవసరం లేదంటారా? అసలు ఈ ఊళ్లో ఏం జరుగుతుందో ...ఎందుకు జరుగుతుందో అధ్యయనం చేయించాల్సిన బాధ్యతను కాదంటారా?....

గుంటూరు సర్కారీ ఆసుపత్రి పరిస్థితిపై కలెక్టర్ సమీక్ష..

గుంటూరు : ప్రభుత్వాసుపత్రిని త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు సందర్శిస్తారని అప్పటి వరకు పేరుకపోయిన సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో పాములు, ఎలుకల సంచారంపై చర్చించారు. 500 మంది శానిటేషన్ సిబ్బంది ఆసుపత్రిని పరిశుభ్రంగా మార్చాలని సూచించారు. వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. 

సింగపూర్ ప్రధానితో ముగిసిన బాబు భేటీ..

సింగపూర్ : ప్రధాని లీ సీన్ లూంగ్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అమరావతి శంకుస్థాపనకు రావాలని ప్రధానిని ఆహ్వానించారు. అంతర్జాతీయ స్థాయి ప్రాథమిక వసతుల కల్పనకు నాలెడ్జ్ అకాడమీగా ఏపీ ఆవిర్భావానికి సహకరించాలని బాబు కోరారు. అమారవతికి మాస్టర్ ప్లాన్ అందించిందినందుకు సింగపూర్ ప్రధానికి బాబు కృతజ్ఞతలు తెలిపారు. పెట్టుబడులకు అనుకూల ప్రాంతాల్లో రెండవ స్థానం సాధించడం సీఎంను ప్రధాని లీ సీన్ లూంగ్ ప్రశంసించారు.

 

భానుప్రీతి కుటుంబాన్ని ఆదుకుంటాం - మంత్రి దేవినేని

విజయవాడ : స్టెల్లా కాలేజీ విద్యార్థిని భానుప్రీతి కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. భానుప్రీతి ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీనిచ్చారు.

 

విజయవాడ ఆసుపత్రి వద్దకు చేరుకున్న మంత్రి పీతల సుజాత..

విజయవాడ : ప్రభుత్వాసుపత్రికి మంత్రి పీతల సుజాత చేరుకున్నారు. స్టెల్లా కాలేజీ ఇంటర్ విద్యార్థిని భానుప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది. పోలీసుల విచారణపై భానుప్రీతి బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని భానుప్రీతి కుటుంబానికి మంత్రి పీతల హామీనిచ్చారు.

 

ఏపీ విద్యుత్ ఉద్యోగులకు ఊరట..

హైదరాబాద్ : ఏపీ విద్యుత్ ఉద్యోగులకు ఊరట లభించింది. ఏపికి బదలాయించిన ఉద్యోగులను తెలంగాణలో కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీతాల బకాయిలను 52:48 శాథాల ప్రకారం చెల్లించాలని ఉభయ రాష్ట్రాలకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నెలలో బకాయిలను చెల్లించాలని సూచించింది.

 

నిలిచిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్..

మెదక్: తూప్రాన్ మండలం మనోహరాబాద్ రైల్వేస్టేషన్‌లో ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. ఇంజిన్‌లో సాంకేతికలోపంతో రైలు గత రెండు గంటలుగా నిలిచిపోయింది.

 

రైతు బ్రాండ్ అంబాసిడర్లుగా గుత్తా..ఓజా..

హైదరాబాద్ : ఫామ్(రైతు) అంబాసిడర్లుగా క్రీడాకారులు సానియా మీర్జా, గుత్తా జ్వాల, ప్రజ్ఞాన్ ఓజాలను ప్రభుత్వం నియమించింది. పంట నష్టం, అప్పుల బాధ తో ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోడానికి వీరు అంగీకరించారు.

ఆంధ్రా యూనివర్సిటీకి చేరుకున్న జగన్..

విశాఖపట్టణం : వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆంధ్రా యూనివర్సిటీకి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రత్యేక హోదాపై ఆయన విద్యార్థులతో ముఖాముఖి జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీ ఎత్తున హాజరయ్యారు. 

టి. అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు జరపాలి - సీపీఎం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను పదిహేను రోజులు జరపాలని సీపీఎం శాసనసభ్యుడు సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. కరువు, రైతు ఆత్మహత్యలపై ప్రత్యేక చర్చ జరగాలని కోరారు. కాంట్రాక్టు..ఔట్ సోర్సింగ్..ఉద్యోగులను క్రమబద్దీకరించాలని..రెగ్యులరైజ్ వేతనాలను పెంచాలని కోరారు. అలాగే మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు..ఆశా వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని కోరారు. బీసీ, మైనార్టీలకు కూడా ఉప ప్రణాళికలను రూపొందించాలని, గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సున్నం రాజయ్య పేర్కొన్నారు.

10:46 - September 22, 2015

హైదరాబాద్ : భారత క్రికెట్ బోర్డ్ సరికొత్త అధ్యక్షుడి ఎన్నికకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. గత ఏడాదిన్నర కాలంగా అధ్యక్షుడుగా ఉన్న జగ్ మోహన్ దాల్మియా...గుండెపోటుతో మృతి చెందడంతో..కొత్త అధ్యక్షుడు ఎవరో తేల్చుకోడానికి..మరో రెండువారాల్లో ప్రత్యేక కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని...బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నిర్ణయించారు. జగ్ మోహాన్ దాల్మియా మృతితో భారత్ గొప్ప క్రికెట్ కార్యనిర్వాహకుడిని కోల్పోయిందని.. ప్రపంచ క్రికెట్ కు సైతం తీరని లోటని...బోర్డ్ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఐసీసీ సైతం...దాల్మియా మృతికి సంతాపం తెలిపింది. క్రికెట్ ను అంతర్జాతీయంగా విస్తరించడంతో పాటు ఖ్యాతి తీసుకురావడంలో దాల్మియా పాత్ర మరువలేనిదని...ఐసీసీ ప్రధాన కార్యనిర్వహణాధికారి డేవ్ రిచర్డ్ సన్ గుర్తు చేసుకొన్నారు.

బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం...

బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం...దాల్మియా మృతి వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. భారత క్రికెట్ ఓ గొప్ప కార్యశీలిని కోల్పోయిందంటూ నివాళులు అర్పించారు. మరోవైపు...దాల్మియా స్థానంలో మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ లేదా బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలలో ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని బోర్డు సభ్యులు భావిస్తున్నారు.ఒకవేళ సుప్రీంకోర్టు...బోర్డు సమావేశానికి మాజీఅధ్యక్షుడు శ్రీనివాసన్ ను హాజరయ్యేలా అనుమితిస్తే...ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి సైతం ఉంది. దాల్మియా స్థానాన్ని భర్తీ చేయగల ఆ వ్యక్తి ఎవరన్నది..ఇప్పుడు బోర్డు వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

సోమ్ నాథ్ ముందస్తు బెయిల్ ను తోసిపుచ్చిన కోర్టు..

ఢిల్లీ : మాజీ న్యాయ శాఖ మంత్రి సోమ్ నాథ్ భారతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. భర్త సోమ్ నాథ్ వేధిస్తున్నారంటూ లిపిక పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

10:43 - September 22, 2015

హైదరాబాద్ : భాగ్యనగరంలో అక్రమకట్టడాలు మరోసారి సక్రమం కానునున్నాయి. ఆదాయమే లక్ష్యంగా జీహెచ్‌ఎమ్‌సీ అడుగులు వేస్తుంటే, కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధిపొందెందుకు సర్కార్ ప్రయత్నిస్తోంది. దీంతో...ఒక క్రమపద్ధతిలో ఉండాల్సిన టౌన్‌ప్లానింగ్ అస్తవ్యస్థంగా తయారవుతోంది.

అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాలకు రాజముద్ర....

రాజకీయ పదవుల కోసం గులాబీ సర్కార్ హైదరాబాద్‌ నగర ప్లానింగ్‌ను అడ్డదిడ్డండా వాడుకుంటోంది. త్వరలోనే సిటీలోని అక్రమ లే అవుట్లను , నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ఒక స్పెషల్‌ ప్రోగ్రామ్‌ పేరుతో సర్కారు రెడీ అవుతోంది. ఈ ప్లాన్‌తో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు, ఇతర మున్సిపాలిటీ పంచాయతీల పరిధిల్లోనూ అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాలకు సర్కార్ రాజముద్ర వేసేందుకు ప్లాన్ చేస్తోంది. అందుకోసం ఇప్పటికే రెగ్యూలరైజేషన్ విషయాలు స్టడీ చేయడం కోసం కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. నగరంలోని గ్రేటర్‌ పరిధిలో ఇప్పటికే అక్రమ నిర్మాణదారులు ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే వారికి కొందరు అధికారులు తోడవడంతో...ఒకఫ్లోర్‌ పర్మిషన్‌ తీసుకొని మూడు నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నారు.

2007లోనే ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ చేపట్టబోమన్న సర్కార్......

2007లోనే ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ చేపట్టబోమని సర్కార్ హైకోర్టుకు తెలిపింది. దీంతో అప్పుడు అక్రమ నిర్మాణాలు తుగ్గుముఖం పట్టాయి. కాని ఇప్పుడు సర్కార్ తన ఖజానా నింపుకోవాలని చూస్తోంది. దీంతో....అక్రమ నిర్మాణాలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఇప్పటికే ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, కుత్భుల్లాపూర్, ఉప్పల్‌తోపాటు సర్కిల్ 9 పరిధిలో యదేచ్ఛగా నిర్మాణాలు కొనసాగుతున్నా అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలున్నాయి. అక్రమ నిర్మాణాలపై కేంద్ర మంత్రి నేరుగా అధికారులకే ఫిర్యాదు చేశారంటే అక్రమంగా వెలుస్తున్న నిర్మాణాల తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది. అక్రమ నిర్మాణాలకు ఫైన్ వేసి వాటిని సక్రమం అనడం ఎంతవరకు సమంజమని నగర టౌన్‌ప్లానింగ్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యలు పట్టణ ప్రణాళికను పూర్తిగా దెబ్బతీస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.

10:41 - September 22, 2015

చిత్తూరు : అరుదైన ఔషధ మొక్కలు..వెలకట్టలేని వృక్షసంపద..పక్షులు కూత పెట్టినా గోవిందనామస్మరణగానే వినిపించే స్వరాలు...కనీవినీ ఎరుగని రకరకాల పూలసరాగాలు...ఇవన్నీ కలబోసిన ప్రకృతి గని శేషాచల అడవులు. ఆధ్యాత్మికతకు...వృక్ష అందాలకు నిలయమైన శేషాచల అడవుల సోయగాలను తిలకించాలనే భక్తుల తీరని కోరిక నెరవేరబోతోంది. అదీ ఆకాశమార్గంలో.

శేషాచల కొండల మీదుగా హెలికాప్టర్‌ రైడ్‌.....

వృక్ష సంపదకు, ప్రకృతి సోయగాలను నెలవు శేషాచల అడువులు. కలియుగ దైవం వేంకటేశ్వరుడి నిలయంగా భక్తులు బావించే ఈ శేషాచల అడవుల్లోని ప్రతీ చెట్టూ..పుట్టను పరమ పవిత్రంగా కొలుస్తారు. ఈ అడవులను తిలకించాలనే భక్తుల కోరిక ఇన్నేళ్లు కలగానే మిగిలిపోయింది. ఇప్పుడా కోరిను ఏపీ ప్రభుత్వం నెరవేర్చుతోంది. గోదావరి పుష్కరాల్లో హెలికాప్టర్‌ రైడ్‌కు పర్యాటకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ సదుపాయాన్ని మరింత విస్తరించాలని ఏపి పర్యాటక శాఖ భావించింది. ఇందులో భాగంగానే తిరుపతిలో హెలీ జాయ్‌ రైడ్స్‌ పేరిట హెలికాప్టర్‌లో చక్కర్లు కొట్టే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

మనిషికి రూ.2000 ఛార్జ్‌.....

ఐదు మంది కూర్చోడానికి అవకాశం ఉన్న ఈ మినీ చాపర్‌ను జిల్లా కలెక్టర్‌ సిద్దార్థ జైన్‌ ప్రారంభించారు. మనిషికి రెండు వేల రూపాయల చొప్పున ఛార్జ్‌ వసూలు చేస్తారు. పది నిమిషాల పాటు ఈ రైడ్ ఉంటుంది. శేషాచల కొండల మీదుగా తిరుపతి నగరమంతా ఈ హెలికాప్టర్‌ ఓ చుట్టుచుట్టి వస్తుంది. ఈ రైడ్ కనుక విజయవంతమైతే ఇక్కడ నుంచి జిల్లాలోని మిగిలిన పర్యాటకు ప్రాంతాలకు అలాగే చెన్నైకు కూడా హెలికాప్టర్‌ సర్వీస్‌ను నడిపే అంశాన్ని ఏపి టూరిజం శాఖ పరిశీలిస్తోంది.

10:41 - September 22, 2015

ఇటీవల పలు గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు పలువురు క్రీడా, సినీ, రాజకీయ నేతలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ వార్తల్లో నిలిచే 'రాం గోపాల్ వర్మ' 'దత్తత'లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశారు. పలు గ్రామాల్లోని ప్రజల కన్నా..అమీర్ పేట వెనుకననున్న బస్తీల్లో దుర్భర జీవితం గడుపుతున్న ఎంతో మంది ఉన్నారని..సెలబ్రిటీలు వాటిని దత్తత తీసుకుంటారా అని ప్రశ్నించారు. అసలు గ్రామాలను దత్తత తీసుకోవడం అంటే అక్కడున్న వారిని అవమానించడమే అవుతుందని ట్వీట్స్ చేశారు. గ్రామస్తులు ఆత్మాభిమానులని..వారి ఈ చర్యలను వ్యతరేకించాలని ఆయన ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. దత్తత వల్ల రాజకీయ వ్యవస్థ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసేంత మంచి హృదయం మన నటీ నటులకు ఉందని తాను కోవడం లేదంటూ ఘాటైన విమర్శ చేశాడు. రాం గోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ పై ఎవరైనా స్పందిస్తారా ? లైట్ గా తీసుకుంటారా ? వేచి చూడాలి. 

10:39 - September 22, 2015

హైదరాబాద్ : నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టనున్నారా..? దీనికోసం ప్రభుత్వం టెండర్లను కూడా ఆహ్వానించిందా..? దీనికి అవుననే సమాధానమే వస్తోంది. దేశ విదేశాల నేతలు శంకుస్థాపనకు వస్తారని భావిస్తున్న ప్రభుత్వం.. ఏర్పాట్లలో లోటుపాట్లు రాకుండా.. కార్యక్రమ నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నట్లు సమాచారం.

అమరావతి శంకుస్థాపన ప్రైవేట్‌ కంపెనీలకే.....

రాజధాని నిర్మాణాన్ని విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. దాని శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణనూ ప్రైవేట్ ఏజెన్సీలకే అప్పగించనుంది. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఈవెంట్ ఏజెన్సీల కోసం టెండర్లు పిలిచింది. శంకుస్థాపన కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహిస్తే.. సాదాసీదాగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని అంతర్జాతీయస్థాయి ఈవెంట్‌గా నిర్వహించే ఉద్దేశంతో ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెల 22న రాజధాని శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ప్రధాని నరేంద్రమోదీతో పాటు సింగపూర్ ప్రధాని, జపాన్ వాణిజ్య శాఖ మంత్రి ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, కేంద్రమంత్రులు, బడా పారిశ్రామికవేత్తలనూ రప్పించేందుకు సర్కారు యత్నిస్తోంది.

వెంకటపాలెంలో 50 ఎకరాల స్థలంలో ఏర్పాటు......

ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం.. శంకుస్థాపన దశలోనే తన అభిరుచిని చాటాలని యోచిస్తోంది. ఇందుకోసం ఆహ్వాన పత్రికల నుంచి ఆతిథ్యం, ప్రచారం, వేదిక నిర్వహణ వంటివన్నీ భారీగా ఉండేలా చూస్తోంది. సీడ్ క్యాపిటల్ ప్రాంతంలోని వెంకటపాలెంలో సుమారు 50 ఎకరాలను ఈ కార్యక్రమం కోసం సిద్ధం చేస్తున్నారు. వందమంది కూర్చునే వేదిక, వెయ్యి మంది విశిష్ట అతిథులు, 50 వేల మంది ప్రజలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు. వేదిక ఎలా ఉండాలనే దానిపై పలు డిజైన్లు రూపొందిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథులను ఎయిర్ పోర్టు నుంచి కార్యక్రమానికి తీసుకొచ్చేందుకు అన్ని భాషల్లో మాట్లాడే సహాయకులను నియమిస్తున్నారు.

అంతర్జాతీయ, జాతీయ మీడియా కోసం ప్రత్యేకంగా ......

అంతర్జాతీయ, జాతీయ మీడియా కోసం ప్రత్యేకంగా మీడియా డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సభను నిర్వహించేందుకు ఇద్దరు ప్రముఖ వ్యాఖ్యాతలను నియమించనున్నారు. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు, వీడియో షోలు, ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తారు. అమరావతి నిర్మాణ ప్రమోషనల్ వీడియోలను ప్రదర్శించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ప్రచారాన్ని అక్టోబర్ ఒకటి నుంచే మొదలు పెట్టనున్నారు.

విస్తృతస్థాయిలో ప్రచారం.....

పత్రికలు, టీవీలతోపాటు సోషల్ మీడియాలోను దీనిపై విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రమోషనల్ ఆడియో, వీడియోలను ప్రదర్శించాలని నిర్ణయించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం నెలరోజులపాటు ఈ ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఇందుకోసం 50 కోట్లుపైగా ఖర్చు చేయనున్నారు. వీటన్నింటిపై ఇప్పటికే సీఆర్డీఏ ఉన్నతాధికారులు పలు అంతర్జాతీయ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈవెంట్‌ నిర్వహణ ఎవరికి దక్కనుందో మరో వారం రోజుల్లో తేలిపోనుంది. 

గోదావరికి తగ్గుముఖం పట్టిన వరద నీరు...

తూర్పుగోదావరి : గోదావరికి వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 8.7 అడుగులుగా ఉంది. 5.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

నేడు ఆర్జేడీ, జేడీయూ కాంగ్రెస్ మొదటి జాబితా

బీహార్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ విడుదల చేయనుంది. 

సింగపూర్ ప్రధానితో బాబు భేటీ..

సింగపూర్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ లో మంగళవారం ఉదయం సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ తో భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణానికి బృహత్తర ప్రణాళిక అందించినందుకు బాబు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరు కావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 

10:22 - September 22, 2015

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోదరుని తనయుడు కల్వకుంట్ల తేజేశ్వర్‌రావ్‌ (కన్నారావ్‌) చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తొలి ప్రయత్నంగా '999' చిత్రానికి దర్శకత్వం వహించిన పర్స రమేష్‌ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌పై 'షీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'షీ' అనే టైటిల్‌తో రూపొందున్న ఈ చిత్రకథ అద్భుతంగా వచ్చిందని, తేజేశ్వర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ మలయాళ నటి ఈ చిత్రంలో నటిస్తున్నారని, మిగిలిన నటీనటుల ఎంపిక జరగుతుందని పేర్కొన్నారు. దసరా నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం అని పర్స రమేష్ తెలిపారు. 

పెరుగుతున్న కల్తీ కల్లు బాధితుల సంఖ్య..

మహబూబ్ నగర్ : వనపర్తి ఏరియా ఆసుపత్రిలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతోంది. వింత ప్రవర్తనతో ఆసుపత్రిలో వంద మంది చేరారు. 

కాసేపట్లో విద్యార్థిని భానుప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం..

విజయవాడ: ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. స్టెల్లా కళాశాల ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని భానుప్రీతి మృతదేహానికి కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోలీసుల విచారణ సక్రమంగా లేదంటూ భానుప్రీతి కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. 

10:14 - September 22, 2015

ప్రముఖ దర్శకుడు 'మణిరత్నం' సినిమాలో నటించాలని ఎంతో మంది ఉత్సాహం చూపుతుంటారు. కానీ అలాంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. తాజాగా 'కార్తీ', 'దుల్కర్‌ సల్మాన్‌' హీరోలుగా రివేంజ్‌ డ్రామా నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తమిళంలో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే ఓ కథానాయికగా 'కీర్తి సురేష్‌'ను మణిరత్నం ఎంపిక చేశారు. తాజాగా మరో కథానాయికగా 'నిత్య మీనన్‌'ను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'దుల్కర్‌ సల్మాన్‌', 'నిత్యమీనన్‌' జంటగా ఇటీవల విడుదలైన 'ఓకే బంగారం' చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించిన సంగతి విదితమే. డిసెంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించుకునే ఈచిత్రానికి ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతమందిస్తుండగా, రవి వర్మ ఫొటోగ్రఫీని అందిస్తున్నారు.

10:10 - September 22, 2015

గ్రహశకలాన్ని (ఉల్క) రోదసిలోనే ముక్కలు చేసే షాట్‌గన్‌ను రూపొందించే కార్యక్రమాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టింది. భూమికి సమీపం గా రోదసిలో ప్రయాణించే గ్రహశకలంలోని కొద్ది భాగాన్ని ముక్కలు చేసి వాటిలో కొన్నింటిని భూమికి చేర్చి పరిశోధించాలనేది నాసా ప్రణాళిక. 'హానీబీ రోబోటిక్స్' అనే సంస్థతో కలిసి ఆస్టరాయిడ్‌ రీ డైరెక్ట్ మిషన్‌ (ఏఆర్‌ఎం) పేరుతో నాసా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టింది. మానవ రహిత ఏఆర్‌ఎంను 2020లో రోదసిలోకి పంపించాలని నాసా భావిస్తోంది. ఏఆర్‌ఎం రోదసీ నౌకలో గ్రహశకలాన్ని పగులగొట్టే షాట్‌గన్‌తోపాటు ఓ అత్యాధునిక రోబోను పంపిస్తారు. గ్రహ శకలాన్ని పగులగొట్టినపుడు విడిపోయిన ముక్కల్లో కొన్నింటిని రోబో తనకు అమర్చిన రెక్కలతో ఒడిసి పట్టుకొని వాటిని రోదసీ నౌకలోకి చేర్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. సేకరించిన ముక్కలతో కూడిన రోదసీ నౌకను చంద్రుడి స్థిర కక్ష్యలోకి ప్రవేశింపజేస్తారు. అనంతరం భూమి నుంచి వ్యోమగాములతో కూడిన మరో రోదసీ నౌకను చంద్రుడి కక్ష్యలోకి పంపి గ్రహ శకలపు ముక్కల్ని భూమికి చేరుస్తారు. తమ ప్రయోగం కోసం నాసా ఇప్పటికే ఇటోకావా, బెన్నూ, 2008 ఈవి-5 అనే మూడు ఉల్కల్ని గుర్తించింది. మరో రెండు, మూడు ఉల్కల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది.
సూర్యుని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలతోపాటు ఉల్కలు, తోకచుక్కలు తిరుగుతున్నాయని తెలిసిందే. ఉల్కలు అప్పుడప్పుడు భూమికి సమీపం నుంచి వెళ్తాయి. కాస్త పెద్దసైజ్‌ ఉల్క ఎప్పుడైనా కక్ష్య మారిపోయి భూమిని ఢకొీంటే మానవ సమాజపు ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్‌లో భూమివైపు దూసుకువచ్చే ఉల్కల్ని ముందే గుర్తించి వాటిని రోదసిలోనే పేల్చి వేసేందుకు అవకాశముంటుంది. దీంతోపాటు అంగారక గ్రహంపైకి తాము భవిష్యత్‌లో చేపట్టే రోదసీ యాత్రలకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

15 మంది మత్స్యకారులను నిర్భందించిన శ్రీలంక నేవీ..

శ్రీలంక : 15 మంది మత్స్యకారులను, వారి బోట్లను శ్రీలంక నేవీ నిర్భందించింది. వీరిని విచారిస్తున్నట్లు సమాచారం.

 

09:55 - September 22, 2015

మెగస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్‌ చరణ్' కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్రూస్‌ లీ' అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'శ్రీను వైట్ల' దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్‌ఎల్‌పీ పతాకాలపై దానయ్య డి.వి.వి.నిర్మిస్తున్నారు. 'చెర్రీ' సరసన 'రకుల్‌ ప్రీత్‌సింగ్' నటించారు. ఈ చిత్రంలో 'చిరంజీవి' అతిథి పాత్రను పోషిస్తున్నారని టాక్. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్స్, మేకింగ్ సాంగ్ వీడియో, మొదటి పోస్టర్ లు విడుదైలన సంగతి తెలిసిందే. 'బ్రూస్ లీ' ఆడియోను అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో 'రామ్‌ చరణ్' స్టంట్‌మాస్టర్ పాత్రలో కనిపిస్తారు. యాక్షన్ అంశాలు మేళవించిన కుటుంబ కథా చిత్రమిదని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కథ కోన వెంకట్, గోపీమోహన్ రాయగా మాటలు కోన వెంకట్ అందించారు. 

సైకిల్ తొక్కిన గుర్ గావ్ పోలీసు కమిషనర్..

హర్యానా : గుర్ గావ్ పోలీసు కమిషనర్ మంగళవారం సైకిల్ తొక్కారు. 'కార్ ఫ్రీ డే' కార్యక్రమంలో భాగంగా ఆయన సైకిల్ తొక్కారు.

అమర వీరులకు నివాళులర్పించిన మోడీ..

ఢిల్లీ : అమర్ జవాన్ జ్యోతి వద్ద అమరవీరులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. 1965 యుద్ధంలో అమరులైన జవానులకు ప్రధాని నివాలులర్పించారు. ఈ కార్యక్రమంలో త్రివిద దళాల అధిపతులు, సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

నేడు ఏయూ విద్యార్థులతో జగన్ భేటీ..

విశాఖపట్టణం : ఉదయం పది గంటలకు ప్రత్యేక హోదా అంశంపై పోర్టు కళావాణి స్టేడియంలో ఏయూ విద్యార్థులతో వైసీపీ అధ్యక్షుడు జగన్ భేటీ కానున్నారు.

 

హజీదా దర్గాను పేల్చేస్తామంటూ ఫోన్ కాల్!

నెల్లూరు : ఉత్తరప్రదేశ్‌లోని హజీదా దర్గాను పేల్చేస్తామంటూ డక్కిలి మండలం మార్లగుంట నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌కాల్‌ చేశారు. దీంతో ఇంటలిజెన్స్‌, కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ అధికారులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఎవరైనా తీవ్రవాదులున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారని సమాచారం.

మేడ్చల్ ఎలక్ట్రిసిటీ డీఈ ఆదాయానికి మించిన ఆస్తులు...

హైదరాబాద్ : బల్కంపేటలో నివాసం ఉంటున్న మేడ్చల్ ఎలక్ట్రిసిటీ డీఈ శ్రీధర్ నివాసంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో 60 తులాల బంగారు ఆభరణాలు, 15 లక్షల నగదును గుర్తించారు. బల్కంపేట, కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో మూడు భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నేడు భోగాపురం ఎయిర్ పోర్టు ప్రాంతాల్లో పర్యటించనున్న రఘువీరా..

విజయనగరం : నేడు భోగాపురం ఎయిర్ పోర్టు బాధిత గ్రామాల్లో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పర్యటించనున్నారు. 

జేఎన్టీయూ కళాశాలల అనుబంధ గుర్తింపు రద్దుపై నేడు విచారణ..

హైదరాబాద్ : నేడు హైకోర్టు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు రద్దుపై విచారణ జరుగనుంది.

నేడు ఏపీలో ఎస్ఎఫ్ఐల కలెక్టరేట్ల ముట్టడి..

విజయవాడ : ప్రభుత్వ హాస్టల్ లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరుగనుంది. 

 

ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ కు యత్నించిన ఆటో డ్రైవర్

నెల్లూరు : జిల్లాలోని వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లెలో ఇద్దరు టెన్త్‌ విద్యార్థులను కిడ్నాప్‌ చేసేందుకు ఓ ఆటో డ్రైవరు యత్నించాడు. ఆటోలో నుంచి విద్యార్థులు కిందకు దూకటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. స్థానికులు వారిని గమనించి కేకలు వే యడంతో ఆటోడ్రైవరు పరారయ్యాడు.

టి.పోస్టాపీస్ ల వద్ద నేడు కాంగ్రెస్ నిరసనలు..

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్రంలోని పోస్టాపీస్ ల వద్ద టి.కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందిరా, రాజీవ్ స్టాంపుల తొలగింపుపై ఆందోళనలు చేయనుంది. 

09:33 - September 22, 2015

నల్గొండ :అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లారు. ఈ ఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలోని సుందరయ్యనగర్‌లో చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన స్థానిక మహిళలకు చెట్ల పొదల్లో ఉన్న ఆడ శిశువు ఏడుపు వినిపించింది. దీంతో వారు అక్కడకు వెళ్లి చూడగా..పాపను చీమలు, పురుగులు పట్టి ఉండడంతో వెంటనే వారు 108 కు ఫోన్‌ చేశారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది.. పాపను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఆడపిల్ల పుట్టడం వల్లే పాపను వదిలేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. 

09:28 - September 22, 2015

హైదరాబాద్: నగరంలోని బోరబండలో ఫైనాన్స్ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వ్యాపారి సోమసుందర్‌ను దుండగులు కత్తులతో పొడిచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు సందర్శించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

09:21 - September 22, 2015

హైదరాబాద్ : ఏపీ నవ్యాంధ్ర రాజధాని తొలి ఘట్టానికి సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ.. ఇంకా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఐదు కోట్ల మంది ప్రజల అభిరుచికి అనుగుణంగా రాజధానిని నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. స్థానిక సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదు. అయితే రాజధాని శంకుస్థాపనలోగా ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయా ? లేదా? అనేది ఇప్పుడు ప్రశార్ధకంగా మారింది.

అక్టోబర్‌ 22న అమరావతికి శంకుస్థాపన .......

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కల సాకారం కాబోతుంది. అక్టోబర్‌ 22న నూతన రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా రాజధానిని నిర్మించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని మోదీతో పాటు సింగపూర్‌, జపాన్‌ దేశాల ప్రధానులను కూడా ఆహ్వానించనున్నారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ.. రాజధాని ప్రాంతంలో సమస్యల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రైతులకు ప్రతి ఏడాది కౌలు........

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ ప్రక్రియ గత ఆరు నెలలుగా కొనసాగుతోంది. రాజధానిగా తుళ్లూరు పరిసర ప్రాంతాలను ప్రకటించినప్పటి నుండి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రతి ఏడాది కౌలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరి కూలీల పరిస్థితి ఏంటి ? ఇప్పుడు ఇదే ప్రశ్నార్ధకంగా మారింది. ఉపాధి కల్పించేవరకు ప్రతి నెల 2500 రూపాయలు జీవనభృతి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. అది ఎక్కడా ఆచరించడం లేదు. అక్కడక్కడ కొందరికి మాత్రమే జీవనభృతి ఇస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకోవడంపై కూలీలు లబోదిబోమంటున్నారు.

డిసెంబర్‌ 8, 2014 నాటి చాయాచిత్రం ద్వారా గ్రామకంఠాల గుర్తింపు ......

ఇక మరో ప్రధాన సమస్య గ్రామకంఠాలు. 2014 డిసెంబర్‌ 8 నాటి చాయా చిత్రం ద్వారా గ్రామ కంఠాలను నిర్ణయిస్తామని చెప్పిన ప్రభుత్వానికి... ఇప్పుడు వాటిని నిర్ధారించడం కష్టంగా మారింది. గ్రామ కంఠాల సమస్యలపై ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. గ్రామకంఠాల సమస్యను పరిష్కరించామని ప్రభుత్వం చెబుతున్నా.. ఇంకా అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మరోపక్క భూసేకరణ సమస్య కూడా ఇంకా వెంటాడుతూనే ఉంది. రాజధానికి భూములు ఇచ్చేందుకు ఉండవల్లి, పెనమాక, భేతపూడి, నిడమర్రు గ్రామాల ప్రజలు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భూములివ్వని రైతుల నుంచి భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం నోటిఫికేషన్లు కూడా విడుదల చేసింది. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఊహించని పరిణామాలు ఎదురుకావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే మంత్రులు మాత్రం ఆ గ్రామాలను మినహాయించేది లేదంటూ అప్పుడప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. మరోపక్క ప్రభుత్వం ఆ నాలుగు గ్రామాలను ఎందుకు హోల్డ్‌లో పెట్టిందనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.

కొనసాగుతున్న వివాదాలు .......

ఇక వీటితో పాటు లంక భూముల వివాదాలు, అసైన్డ్‌ భూముల వివాదాలు, సీడ్‌ క్యాపిటల్‌ నిర్మాణమయ్యే గ్రామాల తరలింపు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ పరిష్కారం కాకుండా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన ఎలా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపనలో అందరూ సంతోషంగా పాలుపంచుకోవాలి గానీ.. తమ బతుకులు నాశనమవుతున్నాయనే బాధతో కాదని ప్రజాసంఘాల నేతలంటున్నారు. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేలోగా ప్రభుత్వం ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తుందా ? లేదా అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. 

కిలోన్నర బంగారం పట్టివేత...

హైదరాబాద్: శంసాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో దుబాయ్ నుంచి వచ్చిన దంపతుల నుంచి కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారు హైదరాబాద్ వాసులుగా గుర్తించినట్లు సమాచారం.

మిర్యాల గూడలో చేపల చెరువులో విషప్రయోగం

నల్గొండ: మిర్యాల గూడలోని చేపల చెరువులో విషయప్రయోగం జరిగింది. ఈ ఘటనలో రూ.30 లక్షల విలువైన చేపలు మృతి చెందినట్లు సమాచారం.

సూర్యాపేటలో ముళ్లపొదల్లో ఆడ శిశువు

నల్గొండ : సూర్యాపేట పట్టణంలోని సుందరయ్యనగర్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును ముళ్లపొదల్లో వదిలి వెళ్లారు. ఆడశిశువును గుర్తించిన స్థానికులు శిశువును ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో శిశువుకు చికిత్స అందిస్తున్నారు. ఆడశిశువు ఎవరిదనే విషయంపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు

డెంగీ తో 8వ తరగతి విద్యార్థి మృతి

చిత్తూరు : వెదురుకుప్పం మండలం చల్లగుండ్లపల్లిలో డెంగీ వ్యాధితో 8 వతరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటనతో విద్యార్థి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. చిత్తూరు జిల్లాలో డెంగీ వ్యాధి ప్రబలుతున్నా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదని జనం ఆరోపిస్తున్నారు.

తగ్గుముఖం పట్టిన గోదావరి

ఖమ్మం: భద్రాద్రి వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. మొదటి ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తుందని ప్రచారం జరిగినప్పటికీ అది కాస్తా శాంతించడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చింతూరు మండలంలో శబరి కూడా కొంత తగ్గుముఖం పట్టింది. వాజేడు మండలం చీకుపల్లి కాజ్‌వే నాలుగో రోజు కూడా నీటమునిగే ఉంది.

08:48 - September 22, 2015

హైదరాబాద్ : రిజర్వేషన్ అనేది స్టాటిక్ పాయింట్ పాలసీగా మారిపోయింది అని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో దహన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె. నాగేశ్వర్ అన్నారు. దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ నడుస్తోంది. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆర్ ఎస్ ఎస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజ్వేషన్లు సమీక్షించాలని చెప్పారు. అస్సలు ఈ దేశంలో రిజర్వేషన్ల అవసరం ఎంత ఎంత ఉంది? క్యాష్ అండ్ క్యాస్ట్ ఓవర్ ల్యాప్ అయ్యిందా? ఇలాంటి అంశాలపై నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఈ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఏపీలో మరో పొగాకు రైతు ఆత్మహత్య

పశ్చిమగోదావరి : దేవరపల్లి మండలం యర్నగూడెంలో పొగాకు రైతు సింహాద్రి అనే రైతు పురుగురు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దురంతో ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ

హైదరాబాద్ : సికింద్రాబాదు-విశాఖ దురంతో ఎక్స్ ప్రెస్ లో రాత్రి భారీ చోరీ జరిగింది. ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న ఓ వైద్యుడికి చెందిన సూట్ కేసును గుర్తు తెలియని వ్యక్తులు చాకచక్యంగా అపహరించారు. సూట్ కేసులో రూ.15 లక్షల విలువ చేసే బంగారం, నగదు ఉన్నట్లు సమాచారం. ఏసీ బోగీలో ఎక్కిన వైద్యుడు రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా దొంగలు అందులోకి ప్రవేశించి సూట్ కేసుతో ఉడాయించినట్లు తెలుస్తోంది. నేటి ఉదయం నిద్ర లేచిన వైద్యుడు తన సూట్ కేసు మాయమైన విషయాన్ని గమనించారు. రైలు విశాఖ చేరుకున్న వెంటనే ఆయన అక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

విద్యుత్ శాఖ డీఈ నివాసంలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్ : బల్కంపేటలోని విద్యుత్ శాఖ డీఈ శ్రీధర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీధర్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ విద్యుత్ శాఖ డీఈగా పనిచేస్తున్నారు. ఆదాయానికి మంచి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

08:01 - September 22, 2015

హైదరాబాద్ : స్పెషల్ స్టేటస్‌పై పోరును వైసీపీ ఉధృతం చేస్తోంది. ప్రత్యేక హోదా సాధన కోసం ఇప్పటికే ఎస్వీ యూనివర్సిటీలో యువభేరి నిర్వహించిన వైఎస్‌ జగన్‌.. తాజాగా నేడు విశాఖపట్టణంలో ఆంధ్రా వర్సిటీ విద్యార్ధులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే భవిష్యత్‌లో విద్యార్ధులు ఎదుర్కొనే సమస్యలను వివరించనున్నారు. ఈనెల 26న జగన్‌ నేతృత్వంలో నిరాహార దీక్షకు సన్నద్ధమవుతోంది. ప్రత్యేక హోదా పై జగన్ దీక్ష లో చిత్త శుద్ధి ఎంత? అనే అంశం పై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్, వైసీపీ నేత అంబటి రాంబాబు, బిజెపి నేత రఘునాథ్ బాబు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడీయోను క్లిక్ చేయండి..

డీసీఎం ట్రాక్టర్‌లు ఢీ : ఒకరి మృతి

మహబూబ్‌నగర్‌ : కొత్తకోట మండలం మిరాజ్‌పల్లి స్టేజి దగ్గర డీసీఎం ట్రాక్టర్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు...

కరీంనగర్‌ :కుటుంబ కలహాలతో కన్న తండ్రినే చంపిన తనయుడి ఉదంతం కరీంనగర్‌ జిల్లాలో జరిగింది. కూనరావుపేట మండలం మర్రిమర్లలో తండ్రి రాజిరెడ్డిని అతని కుమారుడు విక్కీ గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు రంగప్రవేశం చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

ప్రత్యేక హోదాపై పోరుకు సిద్ధమైన వైసీపీ

హైదరాబాద్ : స్పెషల్ స్టేటస్‌పై పోరును వైసీపీ ఉధృతం చేస్తోంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అనే నినాదంతో ఊరు వాడా ఏక‌మ‌య్యేలా కదం తొక్కుతోంది. అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే క్యాంపస్‌లో సమరశంఖం పూరించిన జగన్‌.. యువభేరీతో విద్యార్థుల్లో కాకపుట్టిస్తున్నారు. మోదీ, చంద్రబాబులే టార్గెట్‌గానే అస్త్రాలు సంధిస్తున్నారు.

తెలంగాణలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు

హైదరాబాద్ : ఒకపక్క అతివృష్టి, అనావృష్టి. మరోపక్క అప్పుల కుంపట్లు అన్నదాతల ప్రాణాలను బలిగొంటూనే ఉన్నాయి. ఆపన్న హస్తం అందించాల్సిన ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించడంతో రైతన్నల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో సోమవారం నలుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడగా.. మరో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. 

రాజమండ్రిలో మరో కీచక పర్వం

తూ.గో : రాజమండ్రిలో మరో కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు దుండగులు... ఆమెను వ్యభిచార గృహానికి అమ్మేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు.. మైనర్ బాలికను..అంగట్లో సరుకులాగా వీధి వీధినా తిప్పారు. దీంతో పోలీసులు రంగ ఆప్రవేశం చేసి దుండగులను అరెస్ట్‌ చేశారు. 

అక్టోబర్‌ 22న నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన

అమరావతి : ఏపీ నవ్యాంధ్ర రాజధాని తొలి ఘట్టానికి సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ.. ఇంకా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఐదు కోట్ల మంది ప్రజల అభిరుచికి అనుగుణంగా రాజధానిని నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. స్థానిక సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదు. అయితే రాజధాని శంకుస్థాపనలోగా ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయా ? లేదా? అనేది ఇప్పుడు ప్రశార్ధకంగా మారింది. 

07:06 - September 22, 2015

హైదరాబాద్ : కోల్‌ స్కాంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హస్తముందా? లేదా తమని తాము స్కాం నుంచి బయటపడడానికి మాజీ ప్రధాని పేరు చెబుతున్నారా? మొన్న మధుకోడా...ఇవాళ దాసరి నారాయణరావు... బొగ్గు కుంభకోణంలో మన్మోహన్‌సింగ్‌ను నిందితుడిగా చేర్చాలని సిబిఐ కోర్టు ముందు డిమాండ్‌ చేస్తున్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌ చుట్టే ....

కోల్‌గేట్‌ స్కాం మాజీ ప్రధాని మన్మోహన్‌ చుట్టే తిరుగుతోంది. మన్మోహన్‌ సింగ్‌ను నిందితుడిగా చేర్చాలని సిబిఐ ముందు జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా చేసిన వాదనను ఇపుడు మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు కూడా సమర్థించారు. కోల్ గేట్‌కు సంబంధించి సీబీఐ కోర్టులో లిఖితపూర్వకంగా దాసరి అఫిడవిట్ దాఖలు చేశారు. బొగ్గు గనుల కేటాయింపులపై మన్మోహనే తుది నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కోల్‌ స్కాంతో తనకెలాంటి సంబంధం లేదని, జిందాల్‌ గ్రూప్‌లకు బొగ్గు క్షేత్రాలు కేటాయించింది మన్మోహన్‌సింగేనని దాసరి తెలిపారు.. మన్మోహన్‌ను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.

జిందాల్ తప్పుడు సమాచారం ఇచ్చి....

రాజ్యసభ మాజీ ఎంపీ దాసరి నారాయణరావు 2006-09 మధ్యకాలంలో మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో బొగ్గు శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే జిందాల్ తప్పుడు సమాచారం ఇచ్చి గనులు దక్కించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.

మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు.....

బొగ్గు కుంభకోణంలో దాసరి నారాయణరావుతో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్ పై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. దాసరితో పాటు 14 మందికి బెయిల్ మంజూరు అయింది.

07:03 - September 22, 2015

హైదరాబాద్ : స్మార్ట్‌ఫోన్‌ యూజర్స్‌కు వాట్సప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇకపై వాట్సప్‌ వినియోగం గురించి పూర్తిగా తెలుసుకోవల్సిన అవసరం ఏర్పడింది. గతంలో వాట్సప్‌లో వచ్చిన మెసేజ్‌లు నచ్చకపోతే వెంటనే డిలీట్‌ చేసేవాళ్లు. అయితే... ఇప్పుడు వాట్సప్‌ మెసేజ్‌ను డిలిట్‌ చేయడం అక్రమం, చట్ట విరుద్ధం, నేరం కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'జాతీయ ఎన్‌క్రిప్షన్‌ విధానం' అమలులోకి వస్తే వాట్సప్‌పై సరికొత్త నిబంధనలు అమలవుతాయి. వాట్సప్‌ మాత్రమే కాదు... గూగుల్‌ హ్యాంగౌట్‌, యాపిల్‌ ఐమెసేజ్‌ ద్వారా వచ్చే సందేశమేదైనా సరే... కనీసం 90 రోజులపాటు ఫోన్‌లో భద్రపరచుకోవాల్సిందే. ఈలోపు మెసేజ్‌ను తొలగించడం చట్ట విరుద్ధమే అని ఈ ముసాయిదా చెబుతోంది.

ఎన్‌క్రిప్షన్‌ విధానం ముసాయిదాను ప్రజల ముందుంకు....

కేంద్ర ఐటీ శాఖ జాతీయ ఎన్‌క్రిప్షన్‌ విధానం ముసాయిదాను ప్రజల ముందుంచి... వారి అభిప్రాయాలు స్వీకరిస్తోంది. ఈ ముసాయిదాను యథాతథంగా అమలు చేస్తే... సామాన్య జనానికి అనేక తిప్పలు తప్పవు. భారత్‌లో ఎన్‌క్రిప్షన్‌ సందేశాలు పంపించే, సేవలు అందించే సంస్థలు ఏవైనాసరే కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకోవాలని కొత్త విధానంలో ప్రతిపాదించారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే... 'ఎన్‌క్రిప్టెడ్‌' సందేశాలన్నింటినీ కనీసం 90 రోజులు ఫోన్‌లో భద్రపరచుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి మినహాయింపులూ ఇవ్వకుండా... 'ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలన్నింటినీ' ఒకే గాటన కట్టేశారు. నిజానికి... వాట్సప్‌ సందేశాలన్నీ వాటంతటవే సంకేత- సంక్షిప్త సందేశాలుగా మారతాయి. అవి తిరిగి సాధారణ అక్షరాల రూపంలో అవతలి వ్యక్తికి చేరుతాయి. పిచ్చాపాటీగా పంపుకొనే వాట్సప్‌ సందేశాలు కూడా ఇకపై 'జాతీయ ఎన్‌క్రిప్షన్‌ పాలసీ' పరిధిలోకి వస్తాయి. అధికారుల ఆదేశాల మేరకు ఆ సందేశాలను వారికి చూపించక తప్పదు. ఇక... ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలకూ ఈ నిబంధన వర్తిస్తుంది. లావాదేవీ జరిపిన 90 రోజులపాటు సంబంధిత సందేశాలన్నీ ఆ సంస్థలు 'సేవ్‌' చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనతో దేశంలోని సుమారు 7 కోట్ల మంది వాట్సప్‌, ఐ-మెసేజ్‌ వినియోగదారులకు తిప్పలు తప్పవు. దీనిపై నెటిజన్లు ఇప్పటి నుంచే అప్రమత్తమయ్యారు. ఎన్‌క్రిప్షన్‌ విధానంలోని లోపాలను ఎత్తిచూపుతూ కేంద్ర ఐటీ శాఖకు ఫిర్యాదులు పంపిస్తున్నారు.

07:00 - September 22, 2015

హైదరాబాద్ : డెహ్రాడూన్‌లో ఓ మహిళ మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. పీకల్లోతు మద్యం సేవించిన మహిళ రోడ్డుపైన ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించింది. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. మహిళతో పాటు ఓ బాలుడు కూడా ఉన్నాడు. పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చిన తర్వాత కూడా మద్యం మత్తులో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించింది. పోలీసులు ఆమెను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

06:57 - September 22, 2015

హైదరాబాద్ : ఏపీని లాజిస్టిక్స్‌ హబ్‌గా మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి అని తెలిపారు. సింగపూర్‌లో బిజీబిజీగా పర్యటిస్తున్న చంద్రబాబు బృందం.. వివిధ మంత్రిత్వ శాఖలతో పాటు ఉన్నతాధికారులతో సమావేశమైంది. పలు ఒప్పందాల్లో భాగంగా రాజధాని నిర్మాణం లాంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

సుదీర్ఘ కోస్తా తీరం వంటి సహజ వనరులు....

సుదీర్ఘ కోస్తా తీరం వంటి సహజ వనరులు ఆంధ్రప్రదేశ్ సొంతమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఉపన్యసించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జలవనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన సమస్యలతో పాటు అవకాశాలూ కల్పించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

బాబు బృందం కీలక సమావేశాలు.....

సింగపూర్‌ పర్యటనలో ఉన్న బాబు బృందం కీలక సమావేశాలు జరుపుతోంది. సింగపూర్ పర్యటన లో ఉన్న సీఎం చంద్రబాబు మంత్రి ఈశ్వరన్ తో సమావేశమయ్యారు. రాజధానికి సంబంధించిన కీలక విషయాలు వీరి మద్య చర్చకొచ్చాయి. కొత్త రాజధానికి మాస్టర్ డవలపర్ అంశంలో ఏ విధానాలు పాటించాలనే దానిపై ప్రధానంగా చర్చించారు.

అధికారులకు శిక్షణ, కెపాసిటీ బిల్డింగ్, స్మార్ట్ సిటీలపై.....

అధికారులకు శిక్షణ, కెపాసిటీ బిల్డింగ్, స్మార్ట్ సిటీలపై ప్రధానంగా చర్చించారు. స్మార్ట్ సిటీస్ నిర్మాణానికి సంబంధించి కొంత మంది అధికారులకు ఎలాంటి మెళకువలు ఉండాలి ఏఏ పద్దతులు పాటించాలి అనే అంశాలు ప్రదానంగా చర్చించారు. కొత్త రాజధాని నిర్మాణంలో క్షేత్ర స్థాయిలో ఎలాంటి విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై చర్చ జరిగింది.

కొత్త రాజధానికి సంబంధించి....

సింగపూర్ పర్యటనలో ఉన్న బాబు బిజిబిజీగా ఉన్నారు. సింగపూర్ పర్యటన మొత్తం కొత్త రాజధానికి సంబంధించి జరుగుతోంది. రేపు కూడా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్న బాబు టీం డిల్లీ చేరుకునే అవకాశం ఉంది. వీలయితే ఒకరోజు బాబు డిల్లీలో కొంత మంది కేంద్రమంత్రుల్ని కలిసే అవకాశం ఉంది.

06:53 - September 22, 2015

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది... రైతు ఆత్మహత్యలు సహా.. పలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు విపక్షాలు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టి సమావేశాలను తమకు అనుకూలంగా ముగించాలని సర్కారు పట్టుదలగా ఉంది..

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.....

ఈ నెల 23నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి... ఇటీవలే మరణించిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సంతాపం తెలిపాక తొలిరోజు సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బిఏసీ సమావేశం జరగనుంది... ఇందులో అసెంబ్లీ సమావేశాల ఎజెండాపై చర్చించనున్నారు..

రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైన ప్రతిపక్షాలు......

రైతు ఆత్మహత్యలపై ఇప్పటికే ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది.. ప్రతిపక్షాలు టీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి... ఈ అంశంపై సభలో నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి.. అయితే ప్రభుత్వం విపక్షాలను కట్టడి చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకిచ్చే పరిహారాన్ని ఆరు లక్షలకు పెంచిన ప్రభుత్వం.. బలవన్మరణాలకు పాల్పడ్డ రైతుల వివరాలను, వారి ఆత్మహత్యలకు కారణాలను సేకరిస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన ఆత్మహత్యల వివరాలనూ సభ ముందుంచే ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సభలో ప్రకటన చేసే అవకాశమూ ఉంది.

చర్చకు రానున్న పెండింగ్‌ ప్రాజెక్టుల అంశం.....

ప్రాజెక్టుల డిజైన్ మార్పు అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షం సన్నద్ధమైంది. నిర్మాణంలోని ప్రాజెక్టుల వివరాలు, రైతులకు జరిగే మేళ్ల గురించిన వివరాలతో విపక్షాన్ని నిలువరించాలని సర్కారు యోచిస్తోంది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు హామీలు సర్కారుకు తలనొప్పులు తెచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల క్రమబద్దీకరణపై ఇప్పటివరకూ అడుకుకూడా ముందుకుపడలేదు.. ఇక ఫీజు బకాయిలు, ఉస్మానియా యూనివర్శిటీ దుస్థితి, నకిలీ విత్తనాలు, మైనారిటీ, ఎస్టీల రిజర్వేషన్లు, ఎన్‌కౌంటర్, ఇండ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాలపై సభలో వాడివేడిగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.. అధికార, ప్రతిపక్షాల ప్రత్యేక వ్యూహాలతో ఈ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..

06:50 - September 22, 2015

విజయవాడ : మరో విద్యా కుసుమం నేలరాలింది. స్టెల్లా కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని భానుప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజ్ హాస్టల్‌లో భాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో..పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం హత్యేనని ఆరోపిస్తుండడంతో..కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు.

తీవ్ర కలకలం రేపుతున్న విద్యార్ధిని ఆత్మహత్య......

కృష్ణాజిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగెడిగూడెంకు చెందిన భానుప్రీతి కాలేజ్‌ హాస్టల్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం బెజవాడలో తీవ్ర కలకలం రేపుతోంది. స్టెల్లా కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న భానుప్రీతి..ఎప్పటిలాగే సోమవారంనాడు కాలేజీకి వెళ్లాల్సి ఉన్నా..అనారోగ్యం కారణంగా వెళ్లకుండా హాస్టల్‌ గదిలోనే ఉండిపోయింది. అయితే భానుప్రీతితో పాటు హాస్టల్‌లో ఉంటున్న మరో ముగ్గురు విద్యార్థినులు కాలేజీకి వెళ్లి తిరిగి హాస్టల్‌ గదికి చేరుకునే సరికి భాను ఉరేసుకొని కనిపించింది. వెంటనే కళాశాల సిబ్బందికి సమాచారం అందించడంతో..వారు హుటాహుటిన హాస్టల్‌ గదికి చేరుకున్నారు. మరోవైపు సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని భోరున విలపించారు. తమ కూతురును హత్యచేశారని ఆరోపిస్తూ హాస్టల్‌ ముందు ఆందోళన చేశారు.

అనారోగ్యంతో కాలేజికి వెళ్లని భానుప్రీతి ....

మరోవైపు భానుప్రీతి ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న.విద్యార్ధి సంఘాల నేతలు..అర్థరాత్రి హాస్టల్‌ ముందు ఆందోళనకు దిగారు. భానుప్రీతిది ఆత్మహత్యగా లేదని..వెంటనే పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు భానుప్రీతి హాత్మహత్య చేసుకున్న గదిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ ఎక్కడా సూసైడ్‌ నోట్‌ లభించలేదు. మరే ఇతర ఆధారాలు కూడా లభించకపోవడంతో.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో చోటుచేసుకున్న పరిణామాలు, లభించిన ఇతర ఆధారాలతో నిష్పక్షికపాతంగా విచారణ జరుపుతామని పోలీసులు చెప్తున్నారు. భానుప్రీతిది ఆత్మహత్యా లేక హత్యా అనేది మెజిస్ట్రీరియల్ విచారణలో తేలనుంది. మరోవైపు పోస్టుమార్టం రిపోర్టు కూడా కీలకం కానుంది. 

06:46 - September 22, 2015

హైదరాబాద్‌ : గోల్కొండ పరిధిలోని రాందేవ్‌గూడ చెక్‌పోస్టు వద్ద రెడీమిక్స్ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన లారీ చెక్‌పోస్టుపైకి దూసుకెళ్లడంతో కానిస్టేబుల్ రాహుల్ మృతిచెందాడు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు వీరేందర్‌, పవన్‌, సైదులుకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే చికిత్స కోసం జూబ్లీహిల్స్ అపోలో అసుపత్రికి తరలించారు.

 

06:43 - September 22, 2015

హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ప్రతి రోజూ ప్రతి జిల్లాలలో ఏదో ఒక గ్రామంలో రైతులు చనిపోతూనే వున్నారు. ఆయా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి గుండెలవిసేలా రోదిస్తున్నాయి. అసలే అప్పుల్లో వున్న కుటుంబాలు కుటుంబ పెద్దను కూడా కోల్పోవడంతో మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇస్తున్న ఎక్స్ గ్రేషియాను ఆరు లక్షల రూపాయలకు పెంచిన ప్రభుత్వం ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు వర్తింపచేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఎక్స్ గ్రేషియా విధానం సహేతుకంగా వుందా? అసలు ఆత్మహత్యలు ఆగాలంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలేమిటి? దీర్ఘకాలిక వ్యూహాలేమిటి? తెలంగాణలో ఇంత పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు జరగడానికి కారణం ఏమిటి? రైతులు ఏయే రూపాలల్లో ఎక్కడెక్కడ నష్టపోతున్నారు? వ్యవసాయరంగం అభివ్రుద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఎలా వున్నాయి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది ఈ అంశాలపై మాట్లాడేందుకు రైతు సంఘం నేత నంద్యాల నర్సింహారెడ్డి విశ్లేషణ చేవారు. మరి మీరు కూడా ఆ విశ్లేషణను వినాలకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

ఎమ్మెల్యే సండ్ర పై ఆంక్షలు సడలింపు

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి హైకోర్టు అనుమతిచ్చింది. ఆయనకు బెయిల్ ఇచ్చినప్పుడు విధించిన షరతులను సోమవారం సడలించింది. సొంత నియోజకవర్గం పరిధి నుంచి బయటకు రావద్దంటూ గతంలో విధించిన ఆంక్షలను సవరిస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి అనుమతిచ్చింది.

 

బోరబండలో వడ్డీ వ్యాపారి దారుణ హత్య

హైదరాబాద్ : నగరంలోని బోర బండ వద్ద రహదారిపై సోమసుందర్ అనే వడ్డీ వ్యాపారిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ముగిసిన మద్యం షాపుల లైసెన్స్ గడువు

హైదరాబాద్: తెలంగాణలో రిటైల్ మద్యం షాపుల లైసెన్స్ ల కోసం గడువు ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే కొన్ని జిల్లాల్లోని షాపుల కోసం మాత్రం దరఖాస్తులు రాలేదు. ఈ నేపధ్యంలో దరఖాస్తులు రానీ షాపులకోసం రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పోలీసు చెక్‌పోస్టుపైకి దూసుకెళ్లిన లారీ :కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దేవ్‌గూడలో సోమవారం అర్ధరాత్రి పోలీసు చెక్‌పోస్టుపైకి లారీ దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో రాహుల్ యాదవ్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందారు. కానిస్టేబుళ్లు సైదులు, పవన్, వీరేంద్రలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పవన్, వీరేంద్రల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వీరిని చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా సైదులుకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ లతీఫ్ అరెస్ట్

చిత్తూరుఅంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ లతీఫ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లతీఫ్‌ను కేరళలో అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని పలువురు ఎర్రచందనం స్మగ్లర్లతో లతీఫ్‌కు సంబంధాలు ఉన్నట్టు సమాచారం. చిత్తూరు జిల్లాలో లతీఫ్‌పై 13 కేసులకు పైగా నమోదయ్యాయి. ఏపీలోని అనేక మంది బడానేతలతో కూడా లతీఫ్‌కు సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Don't Miss