Activities calendar

01 October 2015

ఏపీలో పెట్రోల్ బంక్ యజమానుల సమ్మె విరమణ

హైదరాబాద్ : ఏపీలో పెట్రోల్ బంక్ ల యజమానులు సమ్మె విరమించినట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టిన లారీ యజమానుల సంఘం మాత్రం తమ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసింది.

అదితి మృతదేహం కేజీహెచ్ కు తరలింపు...

హైదరాబాద్: అదితి మృతదేహం విశాఖ కేజీహెచ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయనగరం పోలీసులు పంచనామా పూర్తి చేసి విశాఖ పోలీసులకు అదితి మృతదేహాన్ని అప్పగించారు. శుక్రవారం ఉదయం అదితి మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించనున్నట్లు తెలిపారు.

నీటి సంపులో పడి ఆరేళ్ల చిన్నారి మృతి

నల్గొండ : శాలిగౌరారంలో విషాదం జరిగింది. నీటిసంపులో పడి ఆరేళ్ల చిన్నారి నవ్య మృతి చెందింది. నవ్య మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

21:14 - October 1, 2015

హైదరాబాద్ : ఏడు రోజులు.. లక్షలాది మంది ఎదురు చూపులు నిష్ఫలమైపోయాయి. కోట్లాదిమంది నిరీక్షణ విషాదాంతమైంది. చెంగు చెంగున తన చిట్టిపాదాలతో ఎగురుతున్న ఆ చిన్నారి వీడియోనే ఇక అందరికీ మిగిలింది. అమాయకమైన అందమైన మోముతో ఉన్న ఆ పసిపాప ఇక ఓ జ్ఞాపకం మాత్రమే.

ఆ పాప నవ్వులు ఇక లేవనే నిజాన్ని......

ముక్కుపచ్చలారని ఆ పాప నవ్వులు ఇక లేవనే నిజాన్ని ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. వారంరోజులుగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని ఆ పాప ఇక లేదని తెలిసి కంట కన్నీరు ఆగడం లేదు. గుండెలవిసేలా ఏడుస్తున్న ఆ పాప కుటుంబసభ్యులను చూసినవారు కూడా కన్నీరుమున్నీరవుతున్నారు.

అదితి దొరకాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు......

ఆరేళ్ల అదితి దొరకాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. మనసు ప్రమాదాన్నే శంకిస్తున్నా.. అందరిలోనూ ఏదో ఒక చిన్ని ఆశ. ఏమో దొరుకుతుందేమో.. అసలు నీళ్లలోనే పడలేదేమో.. లాంటి ఆలోచనలు ఆశలను పెంచాయి. ఆ ఆశలన్ని అడియాసలయ్యాయి. నవ్వుతూ తిరిగి రావాలని కోరుకున్నవారికి నిరాశే ఎదురైంది.

డ్రైనేజీ నాలా దగ్గర పడిపోయిందని భావిస్తున్న అదితి......

విశాఖపట్నంలో డ్రైనేజీ నాలా దగ్గర పడిపోయిందని భావిస్తున్న అదితి.. అక్కడ నుంచి సముద్రంలోకి కొట్టుకుపోయి.. భోగాపురం దగ్గర తేలిందా.. అది నిజమేనా.. అంతదూరం మృతదేహం కొట్టుకుపోతుందా.. అన్నీ అనుమానాలే.. లేదా ఎవరైనా కిడ్నాప్‌ చేసి హత్య చేసి ఇక్కడ పడవేశారా.. మరో సందేహం. ఏమైనా మరికొన్ని గంటల్లో ఆ అనుమానాలకు కూడా పోలీసులు సమాధానమిచ్చే అవకాశముంది.

చదువుకోవాలని వెళ్లిన అదితిని మరణం కబళించేసింది.....

ఏమైనా చదువుకోవాలని వెళ్లిన అదితిని మరణం కబళించేసింది. వర్షం రూపంలో ప్రకృతి దాడి చేసిందా.. నిర్లక్ష్యం రూపంలో డ్రైనేజీ నాలా మింగేసిందా.. లేక నరుల రూపంలోనే ప్రమాదం కాటేసిందా.. ఆరేళ్ల ప్రాయంలోనే వ్యవస్ధ నిర్లక్ష్యానికి బలైపోయిన ఆ అదితి ఎవరినీ క్షమించదేమో.

అంగన్ వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం...

తూ.గో : గొల్లప్రోలులో దారుణం జరిగింది. ఓ అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటకలక్ష్మి అనే అంగన్ వాడీ కార్యకర్త నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందుకు సూపర్‌వైజర్‌ వేధింపులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

20:47 - October 1, 2015

విశాఖ : విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బపాలెం బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహం అదితిదని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. విగత జీవిగా పడి ఉన్న కుమార్తెను చూసిన తండ్రి శ్రీనివాస్ కుప్పకూలిపోయారు. చెవికమ్మలు, మెడలో గొలుసును చూసి ఆ మృతదేహం అదితిదని ఆయన గుర్తించారు. సుమారు కుళ్లిపోయిన పరిస్థితుల్లో ఉన్న కుమార్తె మృతదేహం చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. దిబ్బపాలెంలో ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. ఆ మృతదేహం అదితిదేనని తేలడంతో అక్కడ విషాదం నెలకొంది. అదితి మృతదేహానికి రేపు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

 

20:38 - October 1, 2015

హైదరాబాద్ : మోదీ విదేశాలకు వెళ్లి సాధించుకొచ్చింది ఏమిటి? డిజిటల్ ఇండియా ఎవరి కోసం? ఇదే అంశం పై నేటి వైడాగింల్ లో విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణను చూడాలంటే ఈ వీడీయోను క్లిక్ చేయండి.

ఆ మృతదేహం అదితిదే

విశాఖ : విజయనగరం జిల్లా భోగాపురం మండంలోని దిబ్బలపాలెం బీచ్ కు గుర్తు తెలియని ఆరేళ్ల చిన్నారి మృతదేహం తన కుమార్తె అదితిదేనని తండ్రి శ్రీనివాసరావు ఖరారు చేశారు. మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఘటనా స్థలానికి అదితి తల్లిదండ్రులు...

విజయనగరం : అదితి తల్లిదండ్రులు ఘటనాస్థలికి బయలుదేరారని ఏపీ శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. గంటలోగా ఆచిన్నారి ఎవరో తెలుస్తుందని ఆయన తెలిపారు. పింక్‌ కలర్‌ లెగిన్‌లో పాప మృతదేహం ఉండడంతో అదితి తప్పిపోయినప్పుడు కూడా ఆ కలర్‌ డ్రస్ లో ఉండడంతో అది అదితి మృతదేహంగా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అదితి తాతతో పోలీసులు మాట్లాడారు. కనిపించకుండా పోయిన రోజు వేసుకున్న దుస్తులపై ఆరా తీశారు. మృతదేహంపై ఉన్న దుస్తులతో పోలీసులు పోల్చుకున్నారు. రెండూ ఒకే రకంగా ఉండటంతో అదితిగా ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది.

సమ్మె విరమించకుంటే ఎస్మా ప్రయోగిస్తాం : అచ్చెనాయుడు

విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలు బంకులు సమ్మె చేపట్టడంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, పెట్రోలు బంకులు నిబంధనలకు విరుద్ధంగా సమ్మె చేస్తున్నాయని మండిపడ్డారు. తక్షణం సమ్మె విరమించని పక్షంలో తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. పెట్రోలు బంకుల యాజమాన్యాలు, లారీ ఓనర్స్ కోర్కెలు తీర్చిన తరువాత కూడా సమ్మె చేపట్టడం సరికాదని ఆయన తెలిపారు. వ్యాట్ గురించి పెట్రోలు బంకుల యాజమాన్యాలు మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు వ్యాట్ కడుతున్నారు, దానినే పెట్రోలు బంకుల యజమానులు ప్రభుత్వానికి కడుతున్నారు.

19:22 - October 1, 2015

హైదరాబాద్ : విజయనగరం జిల్లా భోగాపురం మండంలోని దిబ్బలపాలెం బీచ్ కు గుర్తు తెలియని ఆరేళ్ల చిన్నారి మృతదేహం కొట్టుకొచ్చింది. చిన్నారి మృత దేహంపై పింక్ కలర్ డ్రెస్ ఉండడం, అదితి కుటుంబ సభ్యులు విడుదల చేసిన వీడియోల్లో పింక్ కలర్ డ్రెస్ వేసుకుని ఉండడంతో ఈ మృతదేహం అదితిది అయి ఉంటుందని భావించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లలో చిన్నపిల్లల అదృశ్యం కేసులు నమోదు కాకపోవడంతో, ఆ మృతదేహం అదితిదేమోనన్న అనుమానంతో విశాఖ అధికారులకు భోగాపురం పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో విశాఖ అధికారులు మృతదేహం అదితిదా? కాదా? అనేది తేల్చేందుకు, ఆమె కుటుంబ సభ్యులతో పాటు బయల్దేరారు.  

19:19 - October 1, 2015

హైదరాబాద్ : పరిశ్రమల్లో ట్రేడ్ యూనియన్లను నామరూపాలు లేకుండా చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమా?ట్రేడ్ యూనియన్లు లేకుండా చేసి తన గుత్తాధిపత్యాన్ని చాటుకోవాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పరివ్రమల్లో ట్రేడ్ యూనియన్లు లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అభివృధ్ధికి ట్రేడ్ యూనియన్లు అడ్డంకిగా మారాయని విశాఖ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఇదే అంశం పై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ తులసి రెడ్డి, సిఐటియు నేత గఫూర్, టిడిపి నేత పట్టాభిరామ్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

చైనా నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు : మంత్రి జూపల్లి

ఢిల్లీచైనా నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కేంద్రమంత్రి వీకే సిన్హా ఆధ్వర్యంలో మేకిన్ ఇండియా, మేకిన్ తెలంగాణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 30 దేశాల రాయబారులు పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చించామని మంత్రి తెలిపారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్‌మెంట్లు నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నడకదారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇవాళ శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లుగా తేలింది.

సర్వీస్ రివాల్వర్ పోగొట్టుకున్న ఎస్ఐ పై సస్పెన్షన్ వేటు

నల్గొండ : పెన్పహాడ్ ఎస్ఐ శంకర్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల కర్ణాటకలోని ఓ ఆలయాన్ని సందర్శించిన శంకర్ రెడ్డి అక్కడ తన సర్వీస్ రివాల్వర్ ను పోగొట్టుకున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆయన పై క్రశిక్షణ చర్యలు తీసుకున్నారు. శంకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నల్గొండ జిల్లా ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ ఉత్వర్వులు జారీ చేశారు.

ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్ : విజయవాడలో జరుగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు ఈ సమావేశం 8గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో రాజధాని శంకుస్థాపన, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్టీసీ ఛార్జీల పెంపు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

భోగాపురం తీరంలో ఆరేళ్ల బాలిక మృతదేహం లభ్యం

హైదరాబాద్ : విజయనగరం జిల్లా భోగాపురం తీరంలో ఆరేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. ఆరు రోజుల క్రితం విశాఖలో గల్లంతైన బాలిక అదితి మృతదేహంగా స్థానికులు అనుమానిస్తున్నారు.

బీహార్ లో భారీగా అమెరికన్ కరెన్సీ పట్టివేత...

హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇవాళ తనిఖీల్లో మిలియన్ డాలర్ల అమెరికన్ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీలో దాని విలువ సుమారు ఆరున్నర కోట్లు ఉంటుందంటున్నారు. పాట్నాకు 280 కిలోమీటర్ల దూరంలోని మాధేపురాలో బైకులపై వెళుతున్న ఇద్దరు వ్యక్తుల బ్యాగులను పోలీసులు సోదా చేశారు. వీరి వద్ద ఈ విదేశీ నగదు కనిపించింది. దానిపై వారిని ప్రశ్నించగా... అదొక చిట్ ఫండ్ కంపెనీ వారిదని, దేశీయ కరెన్సీలోకి మార్చేందుకు తీసుకెళుతున్నట్టు చెప్పారు. దానిపై విచారణ జరుపుతామని మాధేపురా ఎస్పీ కుమార్ ఆశిష్ తెలిపారు.

ఏపీ రాజధాని శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు.

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి భూమిపూజకు ముహూర్తం ఖారారు అుయింది. ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 12.45 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. సీఎం చంద్రబాబు వ్యక్తిగత సలహాలు, జ్యోతిష్యం చెప్పే గుంటూరు జిల్లా, రేపల్లేకు చెందిన ఓ పండితుడు ఈ మేరకు సలహా ఇస్తూ ముహూర్తం ఖరారు చేసినట్లుగా సమాచారం. ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చ జరుపుతున్నట్లుగా తెలియవచ్చింది. 

4న కిసాన్ బచావో దీక్ష : నాగం

మహబూబ్ నగర్ : తెలంగాణ రైతులకు ఒకేదఫాలో రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి, బచావో తెలంగాణ మిషన్ కన్వీనర్ నాగం జనార్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు రూ.6 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలా చేయని పక్షంలో ఈ నెల 4న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద కిసాన్ బచావో దీక్ష చేపడతామని నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు.

18:43 - October 1, 2015

హైదరాబాద్ : సిక్కోలు. ఈ పేరు వినగానే వెనకబడ్డ శ్రీకాకుళం జిల్లా పేరు గుర్తొస్తుంది. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఈ జిల్లాకు ఇప్పుడు మహర్థశ పట్టింది. రాజకీయ నేతలకు అచ్చొచ్చిన జిల్లాగా ముద్రపడింది. మారూమూల ప్రాంతం నుండి వెళ్లిన నేతలకు..మహర్ధశ పడుతుంది. ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర కేబినెట్‌లో నెంబర్‌ టూ అయ్యే అవకాశం దక్కించుకున్న నేతలు..ఈ సారి ఏకంగా రాష్ట్ర అధ్యక్ష పదవినే కైవసం చేసుకున్నారు.

రాష్ట్ర, కేంద్రస్థాయిలో అత్యున్నత పదవులు...

ఒక ఎర్రంనాయుడు, మరొక అచ్చెన్నాయుడు..తమ్మినేని సీతారం..కావలి ప్రతిభా భారతి, కళా వెంకటరావు, గౌతు శివాజీ..ఇలా ఒకరు కాదు..ఇద్దరు కాదు..అనేకమంది టిడిపిలో అత్యున్నత పదవులు అనుభవించిన నేతలు. మారుమూల శ్రీకాకుళం జిల్లా నుండి రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కీలక పదవులు చేపట్టారు. తాజాగా ఏపి టిడిపి అధ్యక్ష పదవి ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావుకు వరించింది.

కేంద్రంలో టిడిపి అధికార ప్రతినిధి .....

అదే విధంగా దివంగత ఎర్రన్నాయుడు తనయుడు శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడుకు కేంద్ర స్థాయిలో టిడిపి అధికార ప్రతినిధిగా,

ఎమ్మెల్సీ ప్రతిభాభారతికి ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా పార్టీలో అరుదైన గుర్తింపు లభించింది. ఇక అచ్చెన్నాయుడు ఇప్పటికే కేబినెట్‌ మంత్రిగా హవా కొనసాగిస్తున్నారు. ఇక తొలిసారిగా ఎమ్మెల్యే అయిన ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి ప్రభుత్వ విప్ పదవి దక్కింది. పలాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె శిరీషకు..శ్రీకాకుళం జిల్లా టిడిపి అధ్యక్షురాలి పదవి వరించింది.

నేతల మధ్య భగ్గుమంటున్న విభేదాలు....

అయితే జిల్లా నేతలకు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో అత్యున్నత పదవులు దక్కినా..వారి మధ్య ఉన్న విభేధాలు ఇప్పుడు పార్టీ పరువును బజారుకీడుస్తున్నాయి. ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకటరావుకు అచ్చెన్నాయుడుకు..కళాకు ప్రతిభాభారతికి మధ్య విభేదాలున్నాయి. ఇక కింజరాపు కుటుంబానికి ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఫ్యామిలీ అంటే గిట్టడంలేదు. మంత్రి అచ్చెన్నాయుడుకు ప్రభుత్వవిప్ కూన రవికుమార్‌కు,..గౌతు శివాజీకి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి గ్రూపు రాజకీయాల వల్ల కంచుకోటలా ఉన్న శ్రీకాకుళం జిల్లా టిడిపికి బీటలు వారుతున్నాయని జిల్లా నేతలు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద సిక్కోలు జిల్లాకు రాష్ట్రంలో పరపతి బాగానే పెరిగినా..జిల్లా నేతల మధ్య గ్రూపు తగాదాలు సద్దు మనగడం లేదు. అయితే ఇవన్నీ పక్కన పెడితే సిక్కోలు జిల్లాకు చెందిన టిడిపి నేతలకు కీలక పదవులు లభించడం పట్ల తెలుగు తమ్ముళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

18:38 - October 1, 2015

కర్నూలు : నిన్నమొన్నటి వరకు ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూశాయి. నిన్నటిమొన్నటి వరకు క్వింటాల్‌ ఉల్లిగడ్డలు 3 వేలు పలికింది. ఇవాళ ఒక్కసారిగా 14 వందలకు ధర పడిపోయింది. దీంతో..కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. తమకు గిట్టు బాటు ధర కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఉల్లిగడ్డలను రోడ్డుపై పోసీ నిరసన తెలిపారు. దీంతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

18:36 - October 1, 2015

విజయనగరం : భోగాపురం మండలంలో ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టు భూసేకరణకు అధికారులు రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు అధికారుల బృంధం భోగాపురం చేరుకొని పలు గ్రామాల్లో సర్వే చేశారు. అయితే స్థానికులు అడ్డుకుంటారే ముందస్తు జాగ్రత్తతో ఏ గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారనే విషయాన్ని మాత్రం అధికారులు ముందస్తుగా ఎవరికీ తెలియజేయడం లేదు. సర్వే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా ఉండేందుకు 300 మంది పోలీసులతో ఆయా గ్రామాల్లో భారీ బందోబస్తు నిర్వహించారు.

18:34 - October 1, 2015

హైదరాబాద్ : విశాఖపట్నంలో అదృశ్యమైన బాలిక ఆదితి కోసం వెతుకులాటను జీవీఎంసీ అధికారులు నిలిపివేశారు. వారంరోజులుగా డ్రైనేజీ నాలాలోను, సముద్రంలోను, వందలమందితో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. నేవీ సహకారం కూడా తీసుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాదాపు 5, 6 కిలోమీటర్ల మేర వెతికామని.. బాలిక నీటిలో పడి ఉండకపోవచ్చనే అనుమానాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

18:30 - October 1, 2015

గుంటూరు : నాగార్జునా యూనివర్శిటీలో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు అయింది. నిందితులైన శ్రీనివాస్‌, జయచరణ్‌, హనీషాకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు అయిది. ఈ ముగ్గురు నిందితులకు ఒకటో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. నిందితులకు 77 రోజుల తర్వాత బెయిల్ మంజూరు అయింది. 

చిలుకూరి బాలాజీ టెంపుల్ కోనేరులో పడి వ్యక్తి మృతి

హైదరాబాద్: చిలుకూరి బాలాజీ టెంపుల్‌ వద్ద ప్రమాదం జరిగింది. కోనేరులో పడి సికింద్రాబాద్‌కు చెందిన రఘునందన్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఆలయ ప్రధాన పూజారి గోపాలకృష్ణ బావగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

కడప సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ

కడపసెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఖైదీలు వీరాస్వామి, ఖాదర్ ఒకరినొకరు కొట్టుకున్నారు. వీరి ఘర్షణలో సెల్ ఫోన్ల వ్యవహారం యటపడడంతో నర్మదా బ్లాక్లో 18 సెల్ ఫోన్లను జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గత ప్రభుత్వాల వైఫల్యాల వల్లే రైతు ఆత్మహత్యలు:తుమ్మల

హైదరాబాద్: గత ప్రభుత్వాల వైఫల్యాల వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వెసులుబాటు తీసుకొని ఒకే సారి రుణమాఫీ చేస్తామని చెప్పినా ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆయన ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం ప్రతిపక్షాలు ఒక్క మంచి సలహా ఇవ్వలేదని తుమ్మల విమర్శించారు.

 

వైఎస్ జగన్ తో కవిత భేటీ

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఎంపీ కవిత భేటీ అయినట్టు తెలిసింది. అయితే జగన్, కవితల సమావేశ విషయాన్ని వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు రహస్యంగా ఉంచాయి. ఈ భేటీ రాజకీయవర్గాల్లో సర్వత్రా ఆసక్తి కలిగిస్తుందని చెప్పాలి. కాగా జగన్ సతీమణి భారతిని బతుకమ్మ సంబరాలకు కవిత ఆహ్వానించారట. 

నల్గొండ జిల్లాలో కిడ్నాప్ కలకలం

హైదరాబాద్ : నల్గొండ జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో శైలజ అనే యువతిని ఆటోలో కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఆటో నుంచి దూకి శైలజ తప్పించుకుంది. గమనించిన స్థానికులు ఆటో డ్రైవర్ మణికంఠకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ వోల నూతన కార్యవర్గం ఎన్నిక

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ వోల నూతన కార్యవర్గం ఎన్నికైంది. రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా ప్రభాకర్ రెడ్డి, అధ్యక్షుడిగా సీహెచ్ నర్సింగరావు, జనరల్ సెక్రటరీగా ప్రకాష్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, కోశాధికారిగా పల్లె శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ ఓలు శుభాకాంక్షలు తెలిపారు.

సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..

కరీంనగర్: జిల్లాలోని సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో భాగంగా ఒక వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ విజయ్ భాస్కర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మీసేవా కేంద్రం అనుమతి కోసం ఈ మొత్తాన్ని విజయ్ భాస్కర్ డిమాండ్ చేశాడని సమాచారం.

ఆసీస్ పర్యటన వాయిదా...

హైదరాబాద్ : ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ లో చేపట్టాల్సిన పర్యటన వాయిదా పడింది. భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లా టూర్ ను వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది. బంగ్లా పర్యటనలో భాగంగా ఈనెల 9 వ తేదీ నుంచి తొలి టెస్టు జరగాలి. అయితే ఆస్ట్రేలియా వాసులపై మిలిటెంట్లు దాడి చేసే అవకాశాలున్నాయని విదేశీ మంత్రిత్వ శాఖ హెచ్చరికలతో క్రికెట్ జట్టు పర్యటన వాయిదా పడక తప్పలేదు.

కాసేపట్లో గవర్నర్ తో భేటీ కానున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపట్లో గవర్నర్ నరసింహన్ తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం.

టీఎస్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 5న నామినేషన్లు వేయనుండగా, 6న ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్ నేత, ప్రస్తుతం డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్న నేతి విద్యాసాగర్ మళ్లీ ఎన్నికయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఆయన టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దాంతో గతంలో ఆయనకు ఉన్న డిప్యూటీ ఛైర్మన్ పదవినే సీఎం కేసీఆర్ కట్టబెట్టారు. ఇప్పుడు కూడా విద్యాసాగర్ డిప్యూటీ ఛైర్మన్ అవుతారని సమాచారం. 

కామారెడ్డి చైన్ స్నాచర్ల అరెస్ట్

నిజామాబాద్కామారెడ్డిలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి తులంన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పిస్తోల్‌, డీసీఎం, బైక్‌ స్వాధీనపరుచుకున్నారు. నిందితులు ఢిల్లీ వాసులని పోలీసులు తెలిపారు.

17:42 - October 1, 2015

హైదరాబాద్ : సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు మాయమాటలు చెబుతూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠాను సచివాలయ ఎస్ పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన విజయ్, నరేందర్, భాస్కర్‌ అనే ముగ్గురు యువకులు సీఎం క్యాంపు కార్యాలయంలో, సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అందినంత దోచుకుంటున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌ అనే నిరుద్యోగ యువకునికి హోంగార్డు ఉద్యోగం ఇప్పస్తామని చెప్పి మొదట నలభైవేలు వసూలు చేశారు. మరో లక్ష రూపాయలు కావాలని చంద్రశేఖర్‌కు తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన ఆ బాధితుడు సచివాలయ పోలీసులను ఆశ్రయించారు. దీంతో..ప్లాన్‌ ప్రకారం రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని ఇక్కడకు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

తెలంగాణ డీజీపీ రేసులో ఆ ముగ్గురు...

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి పూర్తిస్థాయి డీజీపీ నియామకంలో మూడు పేర్లను యూపీఎస్సీ సెలక్షన్ కమిటీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) సూచించినట్లు తెలుస్తోంది. . డీజీపీ నియామక నియమావళిని అనుసరించి ఆ పదవికి ముగ్గురు పోటీలో ఉన్నారు. తుది జాబితాలో అరుణా బహుగుణ, కోడె దుర్గాప్రసాద్, అనురాగ్ శర్మ చోటు దక్కింది. ఈ ముగ్గురిలో ఒకరిని తెలంగాణ ప్రభుత్వం నూతన డీజీపీగా ఎంపిక చేయనుంది.

రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్

గుంటూరుసంచలనం సృష్టించిన రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు అయ్యింది. నిందితులైన శ్రీనివాస్‌, జయచరణ్‌, హనీషాకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు అయ్యింది. ఈ బెయిల్ ను ఒకటో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు మంజూరు చేసింది. నిందితులకు ఎట్టకేలకు 77 రోజుల తర్వాత బెయిల్‌ మంజూరు అయ్యింది.

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: ఒకరి మృతి

కడప : మైదుకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. మైదుకూరు నుంచి పోరుమామిళ్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ఘటనలో 15 మందికి గాయాలవ్వగా ఒకరు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

16:55 - October 1, 2015

హైదరాబాద్ : రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి శాసనమండలిలో చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రలోని ప్రతి రైతుకు సర్కార్‌ అండగా ఉంటుందని భరోస ఇచ్చారు. ఎవరికైనా ఆర్థికపరమైన సమస్యలుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకురావాలని పోచారం కోరారు.

16:52 - October 1, 2015

వరంగల్ : జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రేగొండ మండలం తిరుమలగిరిలో పిట్టల కుమారస్వామి.. అప్పుల భారంతో పత్తిచేను వద్దే ఉరేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారస్వామి.. తనకున్న 2 ఎకరాలకు తోడు మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిసాగు చేస్తున్నాడు. వర్షాభావానికి తోడు.. కరెంట్‌ సరఫరా లేక పంట ఎండిపోయింది. పంట కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. దీనికి తోడు రుణమాఫీ కాక.. ప్రభుత్వం నుంచి చేయూత అందక తీవ్ర మనస్తాపానికి గురైన కుమారస్వామి.. చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

టీచర్ మందలించాడని..

వరంగల్: టీచర్ మందలించాడని ఓ విద్యార్థి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని తొర్రూర్ లో గురువారం చోటుచేసుకుంది. తొర్రూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వినయ్ అనే విద్యార్థి సరిగ్గా స్కూల్ కు వెళ్లడం లేదు. టీచర్ వినయ్ ని స్కూల్ కు ఎందుకు రావడం లేదంటూ గట్టిగా మందలించాడు. దాంతో మనస్తాపం చెందిన విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సోమవారానికి వాయిదా పడ్డ శాసనమండలి

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి సోమవారంకు వాయిదా పడింది. ఇవాళ మండలిలో రైతు సమస్యలు, ఆత్మహత్యలపై వాడీవేడి చర్చ జరిగింది. ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభకు సమాధానం చెప్పారు. అనంతరం మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ మండలిని సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం ఉదయం 10 గంటలకు సభ మొదలవుతుందని పేర్కొన్నారు.

ఢిల్లీ డిప్యూటీ సీఎం పై అవినీతి ఆరోపణలు..

హైదరాబాద్ : ఢిల్లీలోని అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కార్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. భార్యపై హత్యాయత్నం కేసులో మాజీ మంత్రి సోమనాథ్‌ భారతీ అరెస్టు కాగా... ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి సిసోడియాపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ప్రకటనల కాంట్రాక్ట్‌లను తన బంధువులకు ఇప్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఢిల్లీ అవినీతి నిరోధక శాఖకు ఆరోపణలు కూడా అందాయి. ఈ వ్యవహారంపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారప్రచారశాఖ డైరెక్టర్‌కు నోటీసులు కూడా జారీ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

16:35 - October 1, 2015

హైదరాబాద్ : దేవాదాయశాఖపై చంద్రబాబు సర్కార్‌ దృష్టిసారించింది. ఈ శాఖ‌లో కూడా త్వర‌లో ఈ-ప్రగ‌తి పోర్టల్ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ విధానం వ‌ల్ల అన్ని దేవాల‌యాల‌ను సాంకేతికంగా అనుసంధానం చేసే వీలు క‌లుగుతుందంటున్నారు నిపుణులు. దేవాల‌యాల ఆస్తుల వివ‌రాలు, ఆదాయం, భక్తుల‌కు కావాల్సిన సౌక‌ర్యాలన్నీ.. ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. వ‌చ్చే అక్టోబ‌ర్ నాటికి ఈ పోర్టల్ విధానాన్ని ఏర్పాటు చేసి.. న‌వంబ‌ర్ మొద‌టివారం నుంచి అనుసంధానం చేసే అలోచ‌న‌లో ఉంది ప్రభుత్వం.

దేవాలయాలకు 3లక్షల కోట్ల భూములు.....

రాష్ట్రంలోని దేవాలయాల‌కు మూడు ల‌క్షల కోట్లు భూములు ఉండ‌గా.. వాటిలో సుమారు 20 వేల ఎక‌రాల‌కు పైగా క‌బ్జా జ‌రిగింద‌ని అంచ‌నాకు వ‌చ్చింది దేవాదాయ శాఖ‌. దేవాల‌యాల‌కు ఉప‌యోగించుకునే క‌రెంట్‌ను కూడా స్వంతంగా ఉత్పత్తి చేసుకోవాల‌నే ఆలోన‌చ‌లో ఉంది దేవాదాయ శాఖ‌. దానిలో భాగంగానే అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో 10మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే అలోచ‌న‌లో ఉంది. దీని నుంచి ఉత్పత్తి అయిన క‌రెంట్‌ను రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల‌కు అందిచాల‌నే అలోచ‌న‌లో ఉంది. దీనితో పాటుగా విజ‌య‌వాడ క‌న‌క దుర్గ ఆల‌య పార్కింగ్ వ‌ద్ద కూడా.. సోలార్ ప్లాంట్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసే యోచనలో ఉంది ప్రభుత్వం.

దేవాలయ బోర్డుల్లో అక్రమార్కుల వివరాలు.....

ఎవరైతే అక్రమాల‌కు పాల్పడ్డారో వారి వివ‌రాల‌ను దేవాల‌యాల్లో బోర్డులు ఏర్పాటు చేసే ఆలోచ‌న‌లో ఉంది ప్రభుత్వం. అయితే కొన్ని దేవాల‌యాల ఆదాయం భారీగా పెరిగింద‌ని అంచ‌నా వేసింది దేవాదాయ శాఖ. దేవాల‌యాల అప్‌గ్రేడేష‌న్ జ‌రిగితే మ‌రింత అదాయం రావ‌డంతో పాటు.. భ‌క్తుల‌కు అన్ని సేవ‌లు క‌ల్పించ వ‌చ్చనే ఆలోచ‌న‌లో ఉంది. దేవాదాయ శాఖ‌లో ఈ-ప్రగ‌తి అమ‌లు చేస్తే.. అన్ని సౌక‌ర్యాలు సాంకేతికంగా భ‌క్తుల‌కు అందే అవ‌కాశం ఉంది.

16:33 - October 1, 2015

హైదరాబాద్ : సిరియా ప్రభుత్వానికి మద్దతుగా రష్యా రంగంలోకి దిగింది. ఐఎస్ఐఎస్‌ స్థావరాలపై వైమానిక దాడులు జరుపుతోంది. ఇందుకు ఇప్పటికే రష్యన్‌ పార్లమెంట్‌ కూడా పుతిన్‌కు మద్దతు తెలిపింది. రష్యా నిర్ణయాన్ని అమెరికా వ్యతిరేకిస్తోంది.

గత నాలుగేళ్లుగా సిరియాలో అంతర్యుద్ధం....

సిరియాలో గత నాలుగేళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఐఎస్‌ఐఎస్‌ పాటు పలు ఇస్లామిక్‌ సంస్థలు, సిరియా ప్రభుత్వానికి మధ్య దాడులు జరుగుతున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్‌-అల్‌-అసద్‌ను పదవి నుంచి తప్పుకోవాలని అమెరికా దాని మిత్రపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి. రష్యా మాత్రం సిరియా అధ్యక్షుడికి పూర్తి మద్దతు ప్రకటించింది.

రష్యాని సైనిక సహకారాన్ని సిరియా అధ్యక్షుడు......

సిరియాలో ఐఎస్‌ దాడులు పెరిగిపోతుండడంతో తమకు సైనిక సహకారాన్ని అందించాల్సిందిగా సిరియా అధ్యక్షుడు అసద్‌ రష్యాను కోరాడు. దీంతో అత్యవసరంగా సమావేశమైన రష్యా పార్లమెంట్‌ సిరియా సైనిక సహకారం అందించడానికి ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్ పుతిన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేవలం సిరియాలో వైమానిక దాడులకు మాత్రమే అంగీకరించింది.

సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్ స్థావరాలపై వైమానిక దాడులు....

రష్యా లడాకూ విమానాల ద్వారా ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై దాడులు చేసిందని అమెరికా మీడియా పేర్కొంది. సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్ స్థావరాలపై వైమానిక దాడులు చేయనున్నట్టు బగ్దాద్‌లోని రష్యన్‌ అధికారులు యుఎస్‌ ఎంబసికీ ఇదివరకే సమాచారం అందించినట్టు తెలిపింది. ఇప్పటికే ఇరాక్‌, సిరియాలోని ఐఎస్‌ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయాలని అమెరికా దాని మిత్రపక్షాలు నిర్ణయించాయి. గత ఏడాది కాలంగా వైమానిక దాడులు కూడా చేస్తున్నాయి. సిరియా, ఐక్యరాజ్యసమితి అనుమతి లేకుండా సిరియాలో అమెరికా ఫ్రాన్స్‌ చేస్తున్న వైమానిక దాడులు అంతర్జాతీయ నిబందనలకు విరుద్ధమని రష్యా చెబుతోంది. ఈ నేపథ్యంలో రష్యా ఐఎస్‌ స్థావరాలపై దాడులు చేయడాన్ని అమెరికా జీర్ణించుకోవడం లేదు. పైకి మాత్రం రష్యా నిర్మాణాత్మక పాత్ర చేపడుతున్నందుకు స్వాగతించింది. అంతర్యుద్ధం కారణంగా గత నాలుగున్నరేళ్లలో రెండున్నర లక్షల మంది సిరియన్లు మరణించారు. దీంతో ఉగ్రవాద గ్రూపులు పెరిగి సిరియా అల్లకల్లోలంగా మారింది.

...

16:30 - October 1, 2015

హైదరాబాద్ : 100 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లే స్పోర్ట్స్‌ బైక్, ప్రత్యర్ధుల భరతం పట్టేందుకు భారీ లెవల్లో బైక్‌ చేజింగ్‌, అమ్మాయిల మనసు దోచేందుకు మెరుపు వేగంతో బైక్‌ రేసింగ్‌. ఇవన్నీ సిల్వర్‌ స్క్రీన్‌పై హీరోగారు చేసే స్టంట్‌ షాట్స్. తమ ప్రతీ సినిమాలో ఇలా ఒకటైనా సీన్‌ ప్లాన్‌ చేసుకుంటారు. అయితే కాసులు కురిపించే ఈ సీన్లు ఇక ముందు కన్పించకపోవచ్చు. బైక్ రేసింగ్‌లు, చేజింగ్‌ సీన్లు మున్ముందు ఉండకపోవచ్చు.

ఫ్యాన్స్‌ ఈలలు వేసి గోలలు చేయాలంటే....

అద్దంలా మెరిసిపోయే సువిశాలమైన రోడ్లపై బైక్ రేసింగ్‌.....ఒళ్లు గగుర్పొడిచేలా బైక్‌ చేజింగ్.. ఆపై హీరో ఎంట్రీ ఇవన్నీ మన సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాల్లో కామనే. హీరోగారి హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్‌ చేయాలంటే, ధియేటర్‌ దద్దరిల్లేలా ఫ్యాన్స్‌ ఈలలు వేసి గోలలు చేయాలంటే బైక్‌,కార్ల చేజింగ్ సీన్‌ తప్పని సరి.

బైక్‌ రేసింగ్ సీన్లు ఇక బ్యాన్‌.....

అయితే ఇక ముందు నుంచి ఇవి మన తెలుగు సిన్మాల్లో కన్పించకపోవచ్చు. వెండితెరపై బైక్‌, కార్ రేసింగ్‌, చేజింగ్‌ సీన్లను బ్యాన్‌ చేయాలని తెలంగాణ రవాణా శాఖ ఆలోచిస్తోంది. రీల్ హీరోలు చేసే స్టంట్స్‌ను ఫ్యాన్స్ అనుసరిస్తున్నారు. అచ్చం అలానే గాల్లో తేలిపోవాలని ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా యువత హీరోలను ఇమిటేట్‌ చేసేందుకు తెగ పోటీలు పడుతున్నారు. ఇదే క్రమంలో విగత జీవులుగా మారుతున్నారు. నేషనల్‌ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలతో పాటు ఇదే వాస్తవాన్ని వెల్లడించింది.

ప్రమాదానికి ఇమిటేషనే కారణం.....

ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రమాదాలపై టీఎస్ రవాణా శాఖ ఓ సర్వే చేయించింది. ఇందులో సిల్వర్‌ స్క్రీన్‌ ఇమిటేషనే యాక్సిడెంట్స్‌కు కారణమని తేలిందట. దీంతో టీఎస్ రవాణా శాఖ ఇకపై బైక్‌ సీన్లను బ్యాన్‌ చేయాలని డిసైడయింది. ముందుగా సినిమా పెద్దలతో చర్చించి విధివిధానాలు ఖరారుచేసేందుకు యోచిస్తోంది. జీవో విడుదల చేయటమా లేక సెన్సార్‌ బోర్డ్‌కే కొన్ని మార్గదర్శకాలను సూచించాలా అనేదానిపై నేడో రేపో టీఎస్ రవాణాశాఖ నిర్ణయం తీసుకోనుంది. టీఎస్ రవాణాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం సబబుగానే ఉంది కానీ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను వదులుకునేందుకు ఏమాత్రం సిద్ధపడని మన సినిమా పెద్దలు, హీరోలు ఏ రేంజ్‌లో రియాక్ట్‌ అవుతారో చూడాలి.

సోమనాథ్ భారతికి బెయిల్ తిరస్కరణ

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కింది కోర్టు విచారణలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.ఈమేరకు ఇవాళ తీర్పు చెప్పింది. సోమ్‌నాథ్‌పై కేసు పెట్టిన ఆయన భార్య లిపికా మిత్రకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సోమవారం ధర్మాసనం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. 

16:18 - October 1, 2015

హైదరాబాద్ : సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత తెలుగు నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఒప్పుకోని శ్రీదేవి ఇప్పుడు కోన వెంకట్ చెప్పిన కథ కు ఓకే అని సినిమా చేయడానికి అంగీకరించిందట. హర్రర్ నేపధ్యంలో రూపొందబోయే ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్నట్లు  టాలీవుడ్ టాక్. కోన వెంకట్ తన భర్త బోనీకపూర్ కి ఉన్న పరిచయం రీత్యా శ్రీదేవి ఈ సినిమా ఒప్పుకొందనే వార్తలు కూడా చోటు చేసుకొన్నాయి. అంతేకాదు ఈ సినిమాను బోనీకపూర్ స్వయంగా నిర్మించనున్నాడని టాక్ వినిపిస్తుంది. -

 

తుకారాంగేట్ పీఎస్ పరిధిలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం...

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. బుద్దనగర్‌కు చెందిన నిఖిల్ (9), సందేశ్ (9) స్నేహితులు. ఇరువురు తుకారాంగేట్ సమీపంలోని శాంతినికేతన్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి ఇద్దరు కనిపించడంలేదు. తల్లిదండ్రులు ఆందోళనకు గురై వారిని వెతికారు. వారి స్నేహితులను అడగ్గా ఉప్పల్‌కు వెళ్తున్నామని చెప్పినట్టు పేర్కొన్నారు. దీంతో వారి తల్లిదండ్రులు ఉప్పల్ ప్రాంతంలోవెతికి చివరికి తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్లు లాభపడి 26,221 వద్ద ముగిసింది. నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 7,951 వద్ద ముగిసింది. 

హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తామని మోసం

హైదరాబాద్ : తమకు ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుసు అని కొందరు మాయగాళ్లు బురిడి కొడుతుంటారు. కానీ ఆ మాయగాళ్ల ఎవరూ తెలియరు.. తెలిసినట్లు నటించి మోసం చేస్తారు. హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు పాలమూరు జిల్లా వాసిని మోసగించారు. పాలమూరు జిల్లా వాసి చంద్రశేఖర్ ఈ ముగ్గురు వ్యక్తులకు రూ. 40 వేలు ఇచ్చి మోసపోయాడు.  హోంగార్డు ఉద్యోగం రాకపోవడంతో బాధితుడు చంద్రశేఖర్ సచివాలయ ఎస్పీఎఫ్ సిబ్బందికి విషయాన్ని చెప్పాడు.

ప్రాణహిత - చేవెళ్ల డిజైన్ ను మార్చిన సర్కార్

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అనుకున్నట్టుగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ ను మార్చింది. దాంతో మిడ్ మానేరు నుంచి నిజాంసాగర్ కు నీళ్లు ఎత్తిపోసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టు కొత్త నమూనా ద్వారా తడకపల్లి, పాములపర్తి జలాశయాల మీదుగా నిజాంసాగర్ ఎత్తిపోతలకు నీళ్లు మళ్లించనున్నారు. ఈ పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించేందుకు వ్యాప్ కోన్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

విజయవాడలో ఆర్టీసీ బస్సు బోల్తా:20 మందికి గాయాలు..

కృష్ణా : విజయవాడ వద్ద జక్కంపూడి దగ్గర గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు-ట్రాక్టర్ ఢీ కొనడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

15:57 - October 1, 2015

హైదరాబాద్ : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టోను బిజెపి విడుదల చేసింది. కాంగ్రెస్‌, ఆర్జేడి, జెడియు సుదీర్ఘ పాలనలో బీహార్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...బీహార్‌ వెనకబాటుతనానికి ఈ మూడు పార్టీలే కారణమని ఆరోపించారు. బిజెపికి అధికారమిస్తే బీహార్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తామని జైట్లీ పేర్కొన్నారు. రిజర్వేషన్లకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకం కాదని జైట్లీ స్పష్టం చేశారు. 

15:55 - October 1, 2015

హైదరాబాద్ : ఢిల్లీలోని ఏపీభవన్‌లో తుపాకీ మిస్‌ఫైర్ అయ్యింది. పలువురు ట్రైనీ డీఎస్పీలు పరీక్ష రాసేందుకై ఢిల్లీలోని ఏపీభవన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఓ అభ్యర్థి తన వద్ద ఉన్న తుపాకీని శుభ్రం చేస్తున్న సమయంలో తుపాకీ మిస్‌ఫైర్ అయి అతని కాలులో నుంచి తూటా దూసుకెళ్లింది. దీంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. తుపాకీ పేలుడిపై దర్యాప్తు కొనసాగుతోంది.

 

15:52 - October 1, 2015

హైదరాబాద్ : వాటర్‌గ్రిడ్‌ పథకం రాష్ట్రంలోనే పెద్ద కుంభకోణమని టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నేతల జేబులు నింపుకోవడం కోసమే వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని చేపట్టారని విమర్శించారు. 30వేల కోట్ల విలువైన వాటర్‌గ్రిడ్‌ పథకంలో ఒకే కంపెనీకి టెండర్లు కట్టబెడుతున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశంపై చర్చిస్తామని ఆయన అన్నారు. 

15:51 - October 1, 2015

హైదరాబాద్ : అంతర్జాతీయ స్థాయిలో పెట్రోల్‌ ధరలు తగ్గినా..దేశంలో మాత్రం నిత్యావసరాల ధరలు తగ్గడంలేదని సీపీఐ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు నారాయణ ఆరోపించారు. ధరల్ని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ...నేటి నుంచి 5వతేదీవరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కార్పొరేటీకరణకు అనుకూలంగా కేంద్రంలో ఉన్న మోడి ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నారాయణ తెలిపారు. 

15:49 - October 1, 2015

విజయవాడ : నగరంలో సిద్దార్థ అకాడమీలో 25వ ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా వికలాంగుల శాఖ, వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దేవినేని ఉమా హాజరయ్యారు. వృద్ధులకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి మందులు, కళ్ల జోళ్లను పంపిణీ చేశారు. అనంతరం పలువురు వృద్ధులను మంత్రి సన్మానించారు. సీఎం చంద్రబాబు ఎంతో డైనమిక్‌గా పనిచేస్తున్నారని దేవినేని ఉమా అన్నారు. 65 ఏళ్ల వయస్సు వచ్చినా 20 ఏళ్ల కుర్రాడిలా అలుపెరగకుండా శ్రమిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు తీసుకునే శాఖాహారం, అలవాట్లు, దినచర్యలో భాగంగా ఆయనకు అలుపనేది రావడం లేదని మంత్రి దేవినేని అన్నారు.

 

15:48 - October 1, 2015

హైదరాబాద్ : మెగాస్టార్‌ 150వ సినిమా ఫైనలైపోయినట్లే. వెండితెరపై మళ్లీ సిక్సర్‌ కొట్టడానికి చిరంజీవి సిద్ధమైపోతున్నారు. ఇప్పటివరకు కథ కోసం ఎదురు చూసిన చిరు.. చివరకు తమిళంలో విజయ్‌ నటించిన కత్తి సినిమా కథనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సినిమా రీమేక్‌ను వినాయక్‌ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. సామాజిక కథాంశంతో రూపొందిన కత్తిని తమిళంలో మురగదాస్‌ తీశారు. గతంలో చిరంజీవి ఠాగూర్‌కు కథ అందించిన మురుగదాసే ఇప్పుడు ఈ రీమేక్‌కు కూడా కథ కొన్ని మార్పులతో అందించబోతున్నారు. రేపు జరగనున్న రామ్‌చరణ్‌ బ్రూస్‌లీ సినిమా ఆడియో వేడుకలో ఈ విషయం ప్రకటించబోతున్నారు. 

15:22 - October 1, 2015

హైదరాబాద్ : అర్జెంటీనాలోని బ్యూనోస్ఏర్స్ ప్రాంతానికి చెందిన యువతీ యువకులు కరెన్ క్లెన్(22), లియాండ్రో అకోస్టాలు (25) వరుసకి అన్నాచెల్లెళ్ళ అనుబంధం. క్లెన్ తల్లి, అకోస్టా తండ్రి పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీరిద్దరికీ కవల పిల్లలు పుట్టారు. అయితే అన్నాచెల్లెళ్ళుగా వ్యవహరించాల్సిన క్లెన్, అకోస్టాల మధ్య ప్రేమ చిగురించింది. దానికి తోడు తమ కవల తోబుట్టువులను తల్లిదండ్రులు సరిగా చూడడం లేదని వారు భావించారు. ఆ కోపంతో తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో వారిని కాల్చి చంపారు. అనంతరం వారి మృతదేహాలను ముక్కలుగా కోసి, కుక్కలకు ఆహారంగా వేశారు. మిగిలిన శరీరావయవాలను కాల్చేశారు. తాము చేసిన పనికి ఏ మాత్రం బాధపడటంలేదని, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నామని చెబుతున్నారు క్లెన్,అకోస్టా.

15:20 - October 1, 2015

హైదరాబాద్: పూరి జగన్నాథ్ సినిమా టైటిల్స్ ఇడియట్, పోకిరి, దేశముదురు ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. వరుణ్, పూరిల తాజా సినిమా లోఫర్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న సంగతి విధితమే. కాగా ఈ సినిమా రష్ ను చూసిన రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా నేపద్యానికి టైటిల్ బాగోలేదని మార్చమని సూచించిన విషయం విధితమే. అందుకనే పూరి టైటిల్ మారుస్తానని ఆ టైటిల్ ఏమిటనేది త్వరలో ప్రకటిస్తానని తెలియజేశాడు. వరుణ్, పూరిల సినిమా టైటిల్ 'మా అమ్మ సీతామలక్ష్మి' అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా లో వరుణ్ జేబుదొంగ అని పూర్తిగా మదర్ సెంటిమెంట్ నేపద్యంతో రూపొందుతుందని సమాచారం. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి వంటి సాఫ్ట్ టైటిల్ తో హిట్ అందుకొన్న పూరి మళ్ళీ 'మా అమ్మ సీతామలక్ష్మి' తో కూడా హిట్ అందుకొంటాడు అని అంటున్నారు. కాగా కొంత మంది మాత్రం లోఫర్ టైటిల్ బాగా పాపులర్ అయ్యింది కనుక మళ్ళీ అదే అర్ధం వచ్చేలా పూరి టైటిల్ ఉంటుందని అంటున్నారు.

బ్లాక్ మార్కెట్ లో పప్పులు, పెట్రోల్...

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలు బంకులు గురువారం మూతపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా భావించిన పలువురు వ్యాపారులు పెట్రోల్ను బ్లాక్ మార్కెట్#కు తరలించారు. లీటర్ పెట్రోల్#పై అదనంగా రూ. 20 వసూలు చేస్తున్నారు. అలాగే సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా లారీలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దాంతో వ్యాపారులు నిత్యవసరల రేట్లు పెంచేశారు. పప్పులు ధరలు అసలు ధర కంటే రూ. 30 అధికంగా ఆ విక్రయిస్తున్నారు.

విపక్షాలు రాజకీయం చేయడం తగదు:కొప్పుల

హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలపై ప్రతిపోఆలు రాజకీయం చేయడం తప్ప చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు బాధాకరమని... నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ప్రభుత్వంతో పెట్రోల్ బంక్ యజమానుల చర్చలు విఫలం...

విజయవాడ : ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌కల్లాంతో ఏపీ పెట్రోల్ బంక్‌ యజమానుల చర్చలు విఫలమయ్యాయి. ఈరోజు సాయంత్రం 7గంటలకు సీఎం చంద్రబాబుతో నేతలు భేటీ కానున్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.4 వ్యాట్‌ తగ్గించాల్సిందే అని నేతలు పట్టుబట్టగా దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి అభిప్రాయం తెలియజేస్తామని అజయ్‌కల్లాం తెలిపారు. ఆర్థికమంత్రి యనమల విదేశీ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం పది రోజుల గడువు కోరింది. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.4 వ్యాట్‌ రద్దు చేస్తే ఏపీ ఖజానాపై రూ.437కోట్ల భారం పడుతుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

రేపటి నుంచి ఏపీలో శానిటేషన్ డ్రైవ్

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌‌లో రేపటి(శుక్రవారం) నుంచి శానిటేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇందులో ప్రజలందరూ పాల్గొనాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈనెల 3న స్వచ్ఛ గృహాలు, స్వచ్ఛ కార్యాలయాలు...4న స్వచ్ఛ రహదారులు, 5న ఉద్యానవనాల్లో పారిశుధ్య డ్రైవ్ నిర్వహించనున్నారు. అలాగే ఈనెల 6న మైసిటీ, మైటౌన్ క్లీన్ టాయిలెట్స్, 7న మురుగుకాల్వల శుభ్రత, 8న స్వచ్ఛ గ్రామం, పట్టణం, నగరం కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనుంది.

14:51 - October 1, 2015

హైదరాబాద్ : ఆరోగ్యవంతమైన జీవన విధానంలో దంతాల పాత్ర కీలకమైనది. తీసుకునే ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ దంతాల నుండే మొదలవుతుంది. అలాంటి కీలకమైన దంతాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో, ఆ సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలున్నాయో ఇవాళ్టి హెల్త్ కేర్ లో డాక్టర్ దిలీప్ వివరించారు. మరి ఆ వివరాలను మీరు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

చైనా తీరాన్నిముంచెత్తిన సైపర్ టైఫూన్

హైదరాబాద్ : సూపర్ టైఫూన్ దుజువాన్ చైనా తీరాన్ని ముంచెత్తింది. తీర ప్రాంతాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా జిజియాంగ్, ఫుజియాన్ ప్రాంతాలు ధ్వంసమయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఒకే ఏడాదిలో ఇది 21వ టైఫూన్. దీనివల్ల ప్రాణనష్టం తక్కువగానే(ఇద్దరు దుర్మరణం) జరిగినా గాయపడిన వారు మాత్రం అధికంగానే (324మంది) ఉన్నారు. 

14:38 - October 1, 2015

హైదరాబాద్ : 14 ఏళ్లలోపు బాలలందరూ పాఠశాలలోనే ఉండాలంటోంది చట్టం. బాల కార్మికులను పనిలోకి పెట్టుకుంటే నేరం అంటుంది న్యాయవ్యవస్థ. మరి ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేసే వ్యవస్థ ఉందా? లేదనే పెదవి విరుపే మనకు సమాధానంగా నిలుస్తుంది. అందుకే తన పరిధిలో బాలలకు ఉచిత విద్యను అందించేందుకు కృషి చేస్తోంది తులిషా రెడ్డి ఫౌండేషన్. ఉన్నత చదువులే చక్కటి భవిష్యత్ కు మార్గం అని నమ్మిన సంస్థ ఎంతో మంది విద్యార్థులకు చదువుకోవటానికి అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. వారికి ఉన్నత లక్ష్యాలను చేరువ చేస్తోంది. పోటీ ప్రపంచంలో గెలుపు మార్గాన్ని వారికి చేరువ చేస్తోంది. బంగారు భవిష్యత్ ను వారికందిస్తున్న తులీషారెడ్డి ఫౌండేషన్ సేవలు మరెంతో మంది విద్యార్థులకు చేరాలని మానవి ఆశిస్తోంది. పూర్తి వివరాలు చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

14:29 - October 1, 2015

హైదరాబాద్ : శాంతియుత పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తున్న విపక్ష ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయటం అప్రజస్వామికమని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. అసెంబ్లీ గేట్ వద్ద ధర్నా చేసినందుకు గాను, అరెస్టయ్యి నాంపల్లి పీఎస్‌లో ఉన్న విపక్ష ఎమ్మెల్యేలను కలుసుకున్న ఆయన సమధానం చెప్పే దమ్ము తెలంగాణ సర్కార్‌కు లేకపోవటం సిగ్గు చేటన్నారు.....

14:27 - October 1, 2015

హైదరాబాద్ : టీచర్ల ప్రమోషన్లకు అడ్డంకి తొలగిపోయింది.. ఏకీకృత స‌ర్వీస్ రూల్స్ వివాదానికి సుప్రీంకోర్టు తెర దించింది... 2004నుంచి పెండింగ్‌లోఉన్న సర్వీస్ రూల్స్ విధానంపై తీర్పు ప్రకటించింది.. పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులను, ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పరిగణించాలని ఆదేశాలు జారీచేసింది..

పదోన్నతుల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు......

ఏపీ ఉపాధ్యాయుల పదోన్నతుల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.. 2004నుంచి పెండింగ్‌లోఉన్న సర్వీస్‌ రూల్స్ విధానంపై తీర్పు ప్రకటించింది.. పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులను, ప్రభుత్వ టీచర్లతో సమానంగా పరిగణించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది..

పదోన్నతుల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు .....

పంచాయతీరాజ్, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ ఏకీకృత సర్వీస్ రూల్స్ తీసుకొస్తూ గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.. అయితే ఏకీకృత రూల్స్ తగవని హైకోర్టు తీర్పునిచ్చింది.

డీఈవో, ఎంఈవో పోస్టుల నిలిచిపోయిన భర్తీ.....

హైకోర్టు తీర్పుపై ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.. అప్పటినుంచి సర్వీస్ రూల్స్ అమలు నిలిచిపోయింది.. ఈ వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో డీఈవో, ఎంఈవో పోస్టుల భర్తీ నిలిచిపోయింది.. ఈ సమస్యపై స్పందించిన ధర్మాసనం.. నియామకాలు, ప్రమోషన్లు, బదిలీలను పాత సర్వీస్ రూల్స్ ప్రకారం జరుపుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.. దాదాపు ఏడేళ్లపాటు సాగిన విచారణ తర్వాత హైకోర్టు తీర్పును ధర్మాసనం సమర్ధించింది.. ప్రభుత్వ ఉపాధ్యాయులతోసమానంగా పంచాయతీరాజ్ టీచర్లకు సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.. కోర్టు తీర్పును యూటీఎఫ్ స్వాగతించింది..సుప్రీంకోర్టు తీర్పుతో ల‌క్షా 87 వేల మంది ఉపాధ్యాయుల‌కు ల‌బ్ధి చెకూరనుంది.. 

14:23 - October 1, 2015

హైదరాబాద్ : ఎడ్వార్డ్‌ స్నోడెన్‌..! ట్విట్టర్‌లో ఇలా అకౌంట్‌ ఓపెన్‌ చేశాడో లేదో.. లక్షలాది మంది ఫాలో అయిపోయారు. గంటలోపే లక్షన్నర మంది ఫాలో అవగా.. తొమ్మిది గంటల్లో ఆ సంఖ్య 7 లక్షలు దాటి పోయింది. ఇంతకీ ఎవరీ ఎడ్వార్డ్‌.. ఇతనికి ఎందుకింత ఫాలోయింగ్..? వాచ్‌ దిస్‌ స్టోరీ..

అమెరికన్‌ భద్రతా విభాగం సీఐఏలో పనిచేసిన ఎడ్వార్డ్‌.....

ఎడ్వార్డ్‌ స్నోడెన్‌.. రెండేళ్ల క్రితం అమెరికాను గడగడ లాడించిన వ్యక్తి. అలాగని అతనేమీ ఉగ్రవాదో.. అమెరికా ద్వేషో కాదు. ఇంకా చెప్పాలంటే.. అమెరికన్‌ భద్రతా విభాగం సీఐఏ కోసం జెనీవాలో రహస్యంగా పనిచేసిన వేగు. అయితే.. ఎడ్వార్డ్‌ 2013లొ బయటపెట్టిన ఓ రహస్యం.. అతణ్ణి అమెరికాకు శత్రువుగా మార్చేసింది. మిలియన్ల కొద్దీ ఫోన్ల సంభాషణలను అమెరికా రికార్డు చేస్తోందంటూ ఎడ్వార్డ్‌... మీడియాకిచ్చిన సమాచారం.. కలకలం సృష్టించింది. అమెరికా ప్రభుత్వ అభియోగాలతో ఎడ్వార్డ్‌ దేశం వదిలి.. మాస్కోలో తలదాచుకుంటున్నాడు. ఎడ్వార్డ్‌ స్నోడెన్‌ను అమెరికా దేశం శత్రువులా పరిగణిస్తున్నా.. మిగిలిన ప్రపంచం అతణ్ణి.. పౌర స్వేచ్ఛను కాపాడిన చాంపియన్‌గా గుర్తిస్తోంది.

ట్విట్టర్‌లో అకౌంట్‌ ప్రారంభించిన ఎడ్వార్డ్‌ స్నోడెన్‌.....

ఇంతటి నేపథ్యం ఉన్న ఎడ్వార్డ్‌.. తాజాగా ట్విట్టర్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేశాడు. ఇప్పుడు మీరు వినగలుగుతున్నారా..? అన్న అర్థంతో... కెన్‌ యూ హియర్‌ మీ నౌ.. అంటూ తొలి ట్వీట్‌ చేశాడు. ఆ తర్వాత.. మార్స్‌పైన నీటిని కనుక్కున్నారంట.. అక్కడి సరిహద్దుల్లో పాస్‌పోర్టులను చెక్‌ చేస్తారంటారా..? అంటూ ఓ స్నేహితుడితో జోక్‌ చేశాడు.ఆయన ఇలా ట్విట్లర్‌లోకి అడుగు పెట్టాడో లేదో.. ఫాలోయర్ల సంఖ్య క్షణక్షణానికీ పెరిగిపోతూ వచ్చింది. కేవలం తొమ్మిది గంటల వ్యవధిలో.. అతడి ట్విట్టర్‌ అకౌంట్‌కు ఏడు లక్షల పది మంది ఫాలోయర్లు చేరారు. తనను ఇంత మంది ఫాలో అవుతున్నా.. ఎడ్వార్డ్‌ మాత్రం.. అమెరికా జాతీయ భద్రతా ఏజెన్సీ.. ఎన్‌ఎస్‌ఏని ఒక్కదాన్నే ఫాలో అవుతుండడం విశేషం. 

బీహార్ ఎన్నికలకు బిజెపి మేనిఫెస్టోను విడుదల

హైదరాబాద్: బీహార్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో విడుదల చేశారు. అధికారంలోకి వస్తే రైతు రుణాల పెంచుతామని, వ్యవసాయ అభివృద్దే లక్ష్యమని జైట్లీ తెలిపారు. మొత్తం ఐదు దశల్లో ఆ రాష్ట్ర ఎన్నికలు జరగనుండగా, తొలిదశ ఎన్నిక ఈ నెల 12న జరగనుంది. 

ఖమ్మంలో నిలిచిన పత్తి కొనుగోళ్లు...

ఖమ్మం: కమీషన్ వ్యాపారులకు, ఖరీదు దారులకు మధ్య ఒప్పందం కుదరక పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలోని మార్కెట్ యార్డులో గురువారం జరగాల్సిన జండా పాట జరగలేదు. మార్కెట్ కార్యదర్శి కలుగ జేసుకొని ఇరు వర్గాలను శాంతింప చేయడానికి ప్రయత్నించిన లాభం లేకపోవడంతో 3000 బస్తాల పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి.

గుజరాత్ అల్లర్లలో అమిత్ షా నరహంతకుడు : లాలూ

హైదరాబాద్ : గుజరాత్‌ అల్లర్లలో ప్రధాన భూమిక పోషించిన అమిత్‌ షా హత్యలతో నరహంతకుడిగా మారారని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోపించారు. అమిత్‌షా బీహార్‌లో ఏం చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీజేపీ నేతలు బీహార్‌లో అల్లర్లను ప్రొత్సహిస్తున్నారని లాలూ ఆరోపించారు. అమిత్‌ షా గురించి ప్రపంచం మొత్తానికి తెలుసునని, గుజరాత్‌ అల్లర్లలో ఆయన నరభక్షకుడిగా మారారని లాలూ విమర్శించారు. ఆయన బీహార్‌లో ఎందుకు తిరుగుతున్నారో తెలియాలని, దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బళ్లారి వెళ్లేందుకు తనకు అనుమతికి సుప్రీంకు గాలి

హైదరాబాద్ : బళ్లారి వెళ్లేందుకు తనకు అనుమతివ్వాలని కోరుతూ ఓబుళాపురం మైనింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని పరిశీలించిన కోర్టు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. మైనింగ్ కేసుల్లో కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్న గాలి, తరువాత బెయిల్ పై బయటికి వచ్చారు. అయితే కోర్టు ఆయనను బెంగళూరులోనే ఉండాలని షరతు విధించింది. ఈ క్రమంలో తాజాగా బళ్లారి వెళ్లేందుకు సుప్రీం అనుమతి కోరారు.   

స్పష్టమైన సమాధానం చెప్పాం: కేటీఆర్

హైదరాబాద్ : రైతు సమస్యలపై శాసనసభలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో రైతుల సమస్యలపై చర్చ సమయంలో విపక్షాలకు ఎక్కువ సమయం కేటాయించడం జరిగింది. విపక్షాలు 6 గంటల 23 నిమిషాలు మాట్లాడాయి. అధికార పక్షం గంట 50 నిమిషాలు మాత్రమే మాట్లాడింది. విపక్షాల ప్రసంగాలను ఓపిగ్గా విన్నాం. అనంతరం సీఎం కేసీఆర్ రైతుల సమస్యలపై స్పష్టంగా సమాధానం చెప్పారు. 15 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని వివరించాం. విపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి. రచ్చ చేయడమే పనిగా పెట్టుకున్నాయి.

తిరుమలకు పోటెత్తిన తమిళ భక్తులు

హైదరాబాద్: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. పెరటాసి మాసం కావడంతో తమిళ భక్తులు వేలాది సంఖ్యలో తిరుమలకు పోటెత్తుతున్నారు. దీంతో వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి వెలుపల రెండు కి.మీ మేర భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సోమవారం వరకు ప్రముఖల దర్శనాలు రద్దు చేసినట్లు టిటిడి అధికారులు తెలిపారు.

13:44 - October 1, 2015

న్యూఢిల్లీ : భారత గడ్డపై సఫారీ సిరీస్ వేటకు రంగం సిద్ధమయ్యింది. రేపటి నుండి జరిగే టీ-20, అక్టోబర్ 11 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ ల్లో పాల్గొనే జట్లను రెండుదేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే ఖరారు చేశాయి. ధర్మశాలలో ప్రారంభమయ్యే మూడుమ్యాచ్ ల టీ-20, కాన్పూర్ లో మొదలయ్యే ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ కార్యక్రమ వివరాలు..

74 రోజుల పర్యటన..
భారత్ లో సౌతాఫ్రికా జట్టు 74 రోజుల పర్యటనకు రంగం సిద్ధమయ్యింది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భాగంగా..సఫారీ టీమ్ మూడు మ్యాచ్ ల టీ-20, ఐదుమ్యాచ్ ల వన్డే, నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ల్లో టీమిండియాతో ఢీ కొనబోతోంది. ఇప్పటికే రెండు దేశాల క్రికెట్ బోర్డులు...టీ-20, వన్డే సిరీస్ ల కోసం వేర్వేరు జట్లను ప్రకటించడం ద్వారా నగారా మోగించాయి. టీ-20 సిరీస్ లో పాల్గొనే సౌతాఫ్రికా టీమ్ కు డూప్లెసిస్, టీమిండియాకు ధోనీ నాయకత్వం వహిస్తుంటే...వన్డే సిరీస్ లో పాల్గొనే సఫారీ టీమ్ కు ఏబీ డివిలియర్స్, టీ మిండియాకు ధోనీ నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ధోనీ నాయకత్వంలోని భారత జట్టు సభ్యులు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ శిబిరంలో సమాయత్తమవుతున్నారు.

ముందు టీ-20 మ్యాచ్ లు..
సిరీస్ లో భాగంగా ముందుగా మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ నిర్వహిస్తారు. అక్టోబర్ 2న జరిగే తొలి టీ-20 మ్యాచ్ కు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియం ఆతిథ్యమిస్తుంది. సిరీస్ లోని రెండో వన్డేను కటక్ బారాబటీ స్టేడియం వేదికగా అక్టోబర్ 5 న జరుగుతుంది. సిరీస్ లోని ఆఖరి టీ-20మ్యాచ్ ను కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో అక్టోబర్ 8న నిర్వహిస్తారు. ఐసీసీ వన్డే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం టీమిండియా రెండో ర్యాంక్ లో ఉంటే సౌతాఫ్రికా మూడో ర్యాంక్ లో కొనసాగుతోంది.

అక్టోబర్ లో తొలి వన్డే..
సిరీస్ లోని తొలి వన్డేను అక్టోబర్ 11న కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా నిర్వహిస్తారు. సిరీస్ లోని రెండో వన్డే...ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా అక్టోబర్ 14న నిర్వహిస్తారు. మూడో వన్డే అక్టోబర్ 18న రాజ్ కోట్, నాలుగో వన్డే చెన్నై చెపాక్ స్టేడియంలో అక్టోబర్ 22న, సిరీస్ లోని ఆఖరివన్డే అక్టోబర్ 25న బ్రబోర్న్ స్టేడియంలోనూ నిర్వహిస్తారు. నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ నవంబర్ లో ప్రారంభమవుతుంది. మొత్తం మీద మూడు మ్యాచ్ ల టీ-20, ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లతో దేశంలోని కోట్లాదిమంది క్రికెట్ అభిమానులకు పండుగే పండుగ.

13:38 - October 1, 2015

గుంటూరు : ఒక్క ఘటన అక్కడి పాలకులను కదలించింది. ఒకప్పుడు శుభ్రత లేని, ఎలుకల ఆవాసంగా మారిన ఆసుపత్రి ఇప్పుడిప్పుడే ప్రక్షాళన బాట పడుతోంది. గుంటూరు జిల్లాలో జీజీహెచ్‌ ఆసుపత్రిని ప్రభుత్వం ప్రక్షాళన మొదలు పెట్టింది. దీంతో తమకు ఇప్పటికైనా సరైన సదుపాయాలు అందుతాయని రోగులు ఆశిస్తున్నారు. ఆగస్ట్ 26..రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన రోజు ముక్కపచ్చలారిన పసికందును ఎలుకలు పొట్టన పెట్టుకున్న రోజు..ఎలుకల దాడిలో పసివాడు మృతి చెందడమా? ప్రభుత్వ ఆసుపత్రులు ఇంత ఘోరంగా ఉంటాయా? ఇలాంటి లక్షల ప్రశ్నలను సామాన్యులను వేధించాయి.

అధికారుల్లో చలనం..
రెండు నెలల క్రిందట వరకు వార్డుల్లో అపరిశుభ్రత, దుర్వాసన, ఎలుకలు సంచారం. ఇలా అనేక సమస్యలతో రోగులు ఇబ్బందులు పడేవారు. హాస్పిటల్ సూపరినిండెంట్ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ హాస్పిటల్ అనేక సమస్యలతో విలవిలాడింది. ఎలుకల దాడిలో పసి కందు మ్రుతి తర్వాత గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అధికారుల్లో చలనం మొదలైంది. జిల్లా కలెక్టర్ ప్రభుత్వ హాస్పిటల్ ప్రక్షాళన కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వారం రోజుల్లో సరికొత్త జీజీహెచ్ ను ఆవిష్కరించేలా చేశారు.

ఆపరేషన్ జీజీహెచ్..
మొదట ఆపరేషన్ జీజీహెచ్ 72 గంటల పేరుతో మూడు రోజుల పాటు నిర్విరామంగా ప్రక్షాళన చేయడాన్ని ప్రారంభించారు. దీని కోసం మొత్తం జిల్లా యత్రాంగాన్ని ప్రభుత్వ హాస్పిటల్ కు పర్యవేక్షకులుగా నియమించారు. అంతేకాదు ప్రత్యేక అధికారులను నియమించి, ప్రభుత్వ హాస్పిటల్ పూర్తిగా ప్రక్షాళన అయ్యే దాకా బాధ్యతలు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక్క రోజు వేతనం జీజీహెచ్ కోసం విరాళంగా ఇవ్వాలని చెప్పడంతో నిధులు కూడా భారీ స్థాయిలోనే అందాయి.

రోగుల సంతోషం..
గత వారం రోజలుగా ప్రభుత్వ హాస్పిటల్లో వాతావరణం మొత్తం మారిపోయింది..అన్ని వార్డుల్లో, అన్ని విభాగాల్లో ప్రతి చిన్న సమస్యను పరిష్కరిస్తున్నారు. త్రాగునీరు, మరుగుదొడ్ల, డ్రైనేజీ, ఎలుక నివారణకు కిటికీలకు ఫెన్సింగ్ లు వేయించడం, రంగులు వేయడం, ఫ్యాన్లు బిగించడం, కొత్త ఫ్లోరింగ్ వేయడంతో పాటు పటిష్ట బద్రతను ఏర్పాటు వంటి అనేక సమస్యలను పరిష్కరించారు. జీజీహెచ్ లో వచ్చిన మార్పుల పట్ల రోగులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

13:30 - October 1, 2015

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. తెలంగాణ భవన్‌లో బంగారు బతుకమ్మ వాల్‌పోస్టర్ విడుదల చేసిన ఆమె జాగృతి ఆధ్వర్యంలో వరుసగా 9వ సారి బతుకమ్మ వేడుకలను నిర్వహించబోతున్నామని చెప్పారు. మహిళలు ఉద్యమంలోకి రావడం తక్కువగా ఉండేదని, అటువంటి సందర్భంలో మహిళలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తే ఉద్యమం బలపడుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు చివరి రోజైన ఈనెల 20న హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై బతుకమ్మ వేడుకలను జరుపున్నట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఉన్న అన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎంపీ కవిత పేర్కొన్నారు. 

13:26 - October 1, 2015

హైదరాబాద్ : చర్చకాదు రచ్చ చేయడమేలక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కేటీఆర్‌.. రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం తాము చేస్తుంటే... అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు.. రైతుల సంక్షేమం కోసం తాము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం విపక్షాలు అసెంబ్లీ గేట్ వద్ద ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రైతు సమస్యలపై శాసనసభలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పిందని తెలిపారు. 15 నెలల కాలంలో జరిగిన అభివృధ్ధిని సీఎం కేసీఆర్ సావధానంగా వివరించారని పేర్కొన్నారు. స్వల్పకాలికం, మధ్యకాలికం, దీర్ఘకాలిక రాబోయే రోజుల్లో ఏం చేస్తామనే దానిపై సీఎం కేసీఆర్ చెప్పారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరుణంలో విద్యుత్ కోతలు అధికంగా ఉండేవని, అయినా కేవలం 6 నెలల కాలంలో ఎవరూ ఊహించిన విధంగా సమస్యను అధిగమించడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. విత్తనాలు..ఎరువుల కోసం పోరాటాలు చేసే పరిస్థితి నెలకొని ఉండేదని తెలిపారు. ముందే ప్రణాళికలు సిద్ధం చేసి విత్తనాలు..ఎరువులు సకాలంలో అందించడం జరిగిందన్నారు. 540 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఎలా చెల్లించారో కేసీఆర్ వెల్లడించారని పేర్కొన్నారు. 1.08 వేల ట్రాకర్టపై రవాణా పన్నును మినహాయించడం జరిగిందన్నారు. పండిన పంటలో 91 శాతాన్ని కొనుగోలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఇవన్నీ చేసినా రైతుల ఆత్మహత్యలు జరుగుతుండడంతో రూ.6లక్షల పరిహారం ఇవ్వడం జరుగుతోందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇది వర్తిస్తుందన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ తరువాతే కరవు మండలాలను ప్రకటించాలని ఒక నిబంధన ఉందని, ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొనడం జరిగిందన్నారు. వన్ టైం సెటిల్ మెంట్ విషయంలో ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తామని చెప్పినా విపక్షాలు నీచాతినీచంగా ప్రవర్తించారని విమర్శించారు. 

13:21 - October 1, 2015

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లిన జగన్, నరసింహన్ తో పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని పేర్కొన్నా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న రైతు ఆత్మహత్యలు, ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈనెల 7వ తేదీన జగన్ దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా గవర్నర్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఏపీకి ప్రత్యేక హోదాపై వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన దీక్షకు స్థలం ఖరారైంది. గుంటూరు నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్ష స్థలాన్ని నిర్ణయించారు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కావలసిన దీక్ష వాయిదా వేసుకున్న నేపథ్యంలో దాన్ని తిరిగి వచ్చే నెల 7వ తేదీ నుంచి కొనసాగించాలని నిర్ణయించిన విషయం విదితమే.

ప్రభుత్వం పారిపోయింది - టి.టిడిపి..

హైదరాబాద్ : రైతుల సమస్యలను పరిష్కరించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పారిపోయిందని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. వెంటనే మారిటోరియం విధించాలని, రైతు సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గొంతు నొక్కేలా ప్రయత్నం చేస్తోందన్నారు. 

మోడీ విదేశీ పర్యటనలు ఎక్కువయ్యాయి - సీపీఐ..

హైదరాబాద్ : మోడీ విదేశీ పర్యటనలు ఎక్కువయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు. మోడీకి తీసిపోనట్టు కేసీఆర్, చంద్రబాబులు కూడా కొత్త పెళ్లికొడుకుల్లా విహార యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వీరికి ప్రజా సమస్యలు పట్టవని, నేటి నుండి 5వ తేదీ వరకు సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో మాతృసంస్థ అని చెప్పి బీజేపీ నేతలు ఎందుకు ఓట్లు అడగ లేదని, మోడీతో సయోధ్య కోసమే కేసీఆర్, జగన్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారని ఆరోపించారు. 

గవర్నర్ ను కలిసిన జగన్.

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఈనెల 7వ తేదీన గుంటూరులో తలపెట్టిన నిరహార దీక్ష..రైతు ఆత్మహత్య అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. 

రేషన్ షాపు నిర్వాహణలో రాజకీయ జోక్యం తగ్గాలి - బాబు..

విజయవాడ : రేషన్ షాపుల నిర్వాహణలో కొందరు ప్రజాప్రతినిధుల జోక్యంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో రాజకీయ జోక్యం తగ్గాలని సూచించారు. ఈ పోస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. 

బాలయోగికి ప్రముఖుల నివాళులు..

ఢిల్లీ : లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 64వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో బాలయోగి చిత్ర పటం వద్ద బీజేపీ అగ్రనేత అద్వాని, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, అశోక్ గజపతి రాజు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. 

బచావో ఉస్మానియా పేరిట విద్యార్థుల ర్యాలీ..

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బచావో ఉస్మానియా పేరిట ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. 

12:42 - October 1, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏడు నిమిషాల్లోనే వాయిదా వేయడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పారిపోయిందని తీవ్రంగా విమర్శించారు. గురువారం ప్రారంభమైన సభ ఐదు నిమిషాలకే వాయిదా పడింది. దీనిపై ఆగ్రహించిన విపక్ష సభ్యులు అసెంబ్లీ గేట్ నెంబర్ 2 వద్ద ఆందోళన చేశాయి. పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు టెన్ టివితో మాట్లాడారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ పేర్కొన్నారు. విడతల వారీగా చేస్తుండడంతో ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని, వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని టిడిపి సభ్యుడు వివేక్ సూచించారు. ఎన్నికల్లో ఏదైతే హామీనిచ్చారో అది పూర్తి చేయాలని కోరడం జరిగితే సభను వాయిదా వేశారని విమర్శించారు. ఫ్లోర్ లీడర్ల సమాచారం తీసుకోకుండానే సభను ప్రభుత్వం వాయిదా వేసి వెళ్లిపోయిందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పూర్తిగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు వెళుతోందని, జవాబు చెప్పకుండా అరెస్టులకు పాల్పడుతోందని పేర్కొన్నారు.

12:36 - October 1, 2015

వరంగల్ : జిల్లాలో పసిపిల్లలపై కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత మూడు నెలల్లో పది హేను మందిపై కుక్కలు దాడి చేయడం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఎస్వీ కాలనీలో ఐదేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఆడుకుంటున్న చరణ్ పై ఒక్కసారిగా ఐదారు కుక్కలు దాడి చేశాయి. శరీరాన్ని పీకాయి. దీనితో చరణ్ తీవ్రగాయాలకు లోనయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు శాయంపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. పరిస్థితి కొంచెం విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. కుక్కల బాధ నుండి తప్పించాలని పలువురు కోరుతున్నారు. 

12:31 - October 1, 2015

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టులో ఊరట లభించింది. రెండు నెలల్లో డిపాజిట్స్ కి డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచనలు చేసింది. గురువారం అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. తమకు కేసు తీవ్రత ఎంతుందో తెలుసని వ్యాఖ్యానించింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు డబ్బులు చెల్లించాలని గతంలో హైకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. సంస్థ ఆస్తులను అమ్మడానికి ఓ సంస్థ ముందుకొచ్చింది. ప్రస్తుతానికి రెండు ఆస్తులు అమ్మాలని వచ్చిన డబ్బుతో ఎంత మందికి చెల్లించవచ్చో తెలుస్తుందని గతంలో కోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. సీబీఐ దర్యాప్తు సరిగ్గా చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని కోర్టు పేర్కొంది. ప్రస్తుతం అగ్రిగోల్డ్ కు 14 ఆస్తులన్నట్లు గుర్తించారు. ఈ ఆస్తులను అమ్మితే వచ్చే డబ్బు మొత్తం బాధితులకు సరిపోతుందా ? లేదా ? అనేది చూడాలని పేర్కొంది. రెండు నెలల్లో డిపాజిటర్స్ కు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచనలకు సంస్థ అంగీకారం తెలిపినట్లు సమాచారం. తుది తీర్పు సోమవారానికి వాయిదా వేసింది. 
అగ్రిగోల్డ్ సంస్థ మోసం..
తెలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ సంస్థ చేసిన మోసం అంతా ఇంతా కాదు. సుమారు 7 వేల కోట్ల రూపాయల మేర జనాన్ని ముంచేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆ సంస్థ వద్ద ఉన్న ఆస్తులు మొత్తం అమ్మినా.. జనానికి డబ్బులు సరిపోవంటున్నారు. అయితే.. అగ్రిగోల్డ్‌కు అనుబంధంగా ఉన్న సంస్థల ఆస్తులు మాత్రం వందల రెట్లు అధికంగా ఉన్నట్టు సమాచారం. కానీ.. కేవలం అగ్రిగోల్డ్‌ చుట్టే తిరుగుతున్న వ్యవహారం.. అనుబంధ సంస్థల దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. ఈ విషయమై బాధితులు హైకోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చింది.

12:24 - October 1, 2015

నల్గొండ : జిల్లాలో సుమన్ విద్యార్థి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మంగళవారం సాయంత్రం అపహరణకు గురైన ఆరేళ్ల విద్యార్థి ఆచూకి తెలియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మంగళవారం సాయంత్రం బాలుడు కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. బొమ్మలరామారం మండలం నాయకుని తండాకు చెందిన ధీరావతు సుమన్ తన ఇద్దరు స్నేహితులతో వస్తున్నాడు. వచ్చిన కారును లిఫ్ట్ అడిగారు. అనంతరం కారులో వారు ముగ్గురూ ఎక్కారు. గ్రామంలో ఇద్దరు విద్యార్థులు దిగినా సుమన్ దిగలేదు. దీనితో సదరు విద్యార్థులు గ్రామంలోకి వెళ్లి జరిగిన విషయాన్ని గ్రామస్తులు, సుమన్ తల్లిదండ్రులకు తెలిపారు. దీనితో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ తరుణంలో ఒంగోలులో గుర్తించారు. కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం స్కూల్ నుండి తన స్నేహితుడతో ఇంటికి వస్తున్నాడు. వెనుకనుండి వచ్చిన కారు లిఫ్ట్ అడిగారు. ఇద్దరు విద్యార్థులు దిగారు సుమన్ దిగలేదు. వెంటనే ఆ విద్యార్థులు గ్రామస్తులకు, సుమన్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ తరుణంలో తల్లిండ్రులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. బాలుడు బాగానే ఉన్నాడని సమాచారం ఇచ్చారు. అనంతరం రూ.2లక్షలు కావాలని, లేనిపక్షంలో బాలుడిని చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించారు. ఆందోళనకు గురైన సుమన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బాలుడు..నిందితులు ఒంగోలులోని ఓ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులు బాలుడిని క్షేమంగా తీసుకొచ్చారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమన్ క్షేమంగా రావడంతో తల్లిదండ్రులు..గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. 

అగ్రిగోల్డ్ కేసులో తుది తీర్పు వాయిదా..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసులో తుది తీర్పు సోమవారానికి వాయిదా పడింది. రెండు నెలల్లో డిపాజిట్స్ కు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కేసు తీవ్రత పూర్తిగా తెలుసని వ్యాఖ్యానించింది. 

12:08 - October 1, 2015

విజయవాడ : రాజధాని అమరావతి శంకుస్థాపన పండుగ వాతావరణంలో నిర్వహించబోతున్నట్లు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు లక్ష మంది హాజరౌతారని పేర్కొన్నారు. దసరా నవరాత్రుల తరహాలో రాజధాని శంకుస్థాపన వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 13వ తేదీ నుండి ప్రతి రోజు ఒక పండుగ వాతావరణంలో ఇదంతా జరుగుతుందన్నారు. అంతేగాకుండా భూములిచ్చిన రైతులకు బట్టలు..ఆహ్వానపత్రం అందచేయడం జరుగుతుందని తెలిపారు. 

హిమాచల్ ప్రదేశ్ సీఎం అరెస్టుపై స్టే..

హిమాచల్ ప్రదేశ్ : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కు ఊరట లభించింది. తన అరెస్టుకు సంబంధించి సీబీఐ అధికారులను నిలువరించాలని హైకోర్టులో వీరభద్ర సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేదాక అరెస్టు చేయవద్దని ధర్మాసనం సీబీఐకి సూచించింది. 

పెట్రోల్ బంక్, లారీ యజమానులతో ఏపీ ప్రిన్స్ పల్ సెక్రటరీ భేటీ..

హైదరాబాద్ : పెట్రోల్ బంక్, లారీ యజమానులతో ఏపీ ప్రిన్స్ పల్ సెక్రటరీ అజయ్ కల్లం భేటీ అయ్యారు. వారి డిమాండ్లపై చర్చిస్తున్నారు. 

భోగాపురం ఎయిర్ పోర్టు గ్రామాల్లో ఉద్రిక్తత..

విజయనగరం : భోగాపురం ఎయిర్ పోర్టు గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. భూ సర్వే కోసం పోలీసు బందోబస్తుతో రైడ్స్ సంస్థ ప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్లారు. వీరిని గ్రామస్తులు అడ్డుకున్నారు. 

కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ..

విజయవాడ : ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. రాజధాని భూమి పూజ, సీఆర్డీఏ, బందర్ పోర్టు, ఏపీ ఉద్యోగుల పిల్లల స్థానికత అంశాలపై చర్చ కొనసాగుతోంది.

స్మార్ట్ ఏపీ కార్యక్రమంపై బాబు టెలీకాన్ఫరెన్స్..

విజయవాడ : స్మార్ట్ ఏపీ కార్యక్రమంపై ఏపీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్మార్ట్ ఏపీ నిర్వాహణకు ఏర్పాట్లు చేస్తామని, అన్ని గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా మార్చుకుందామని బాబు పేర్కొన్నారు. వచ్చే సంకాంతి నుండి స్మార్ట్ ఏపీ అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 

రైతు ఆత్మహత్యలు బాధాకరం - కొప్పుల..

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలు బాధాకరమని ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలను రాజకీయం చేయొద్దని, వారి పట్ల ప్రభుత్వం బాధ్యాతాయుతంగా ఉందన్నారు. రైతు కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేసినట్లు చెప్పుకొచ్చారు.

శాసనమండలి నుండి బీజేపీ, కాంగ్రెస్ వాకౌట్..

హైదరాబాద్ : శాసనసమండలి నుండి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వాకౌట్ చేశాయి. రుణమాఫీ వన్ టైమ్ సెటిల్ మెంట్ కు ప్రభుత్వం అంగీకరించకపోవడం, అసెంబ్లీ ఎదుట విపక్ష సభ్యుల అరెస్టును నిరసిస్తూ వాకౌట్ చేశాయి.

 

నేరాలను అరికట్టేందుకు చర్యలు - నాయిని..

హైదరాబాద్ : నగరంలో నేరాలను నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తారాల్లో ఆయన పాల్గొన్నారు. ఇక గతేడాది పోలిస్తే ఈ ఏడాది గొలుసు దొంగతనాలు తక్కువనేని, గొలుసు దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. కరుడుగట్టిన నేరస్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. 

నేరాలను అరికట్టేందుకు చర్యలు - నాయిని..

హైదరాబాద్ : నగరంలో నేరాలను నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తారాల్లో ఆయన పాల్గొన్నారు. ఇక గతేడాది పోలిస్తే ఈ ఏడాది గొలుసు దొంగతనాలు తక్కువనేని, గొలుసు దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. కరుడుగట్టిన నేరస్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. 

పెట్రోల్ బంక్ యజమానులతో ఏపీ ప్రిన్స్ పల్ సెక్రటరీ భేటీ..

విజయవాడ : ఏపీ ప్రిన్స్ పల్ సెక్రటరీ పెట్రోల్ బంక్ యజమానులతో భేటీ కానున్నారు. పెట్రోల్ బంక్ యజమానుల డిమాండ్లపై చర్చించనున్నారు. 

11:11 - October 1, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది..ఏడు నిమిషాల లోపే సభను వాయిదా వేస్తారా ? ఇది అన్యాయం అంటూ విపక్ష సభ్యులు పేర్కొంటున్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. దీనితో విపక్ష సభ్యులు ఆందోలన చేపట్టారు. రైతు రుణమాఫీ..ఎన్ కౌంటర్ ఘటనపై సభలో చర్చించాలని నినాదాలు చేశారు. ఒక్కసారిగా సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించడంపై విపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద ఎంఐఎం మినహా విపక్ష, వామపక్ష నేతలు బైఠాయించారు. ప్రభుత్వ తీరును నిరసించారు. రోడ్డుపై ఎమ్మెల్యేలు కూర్చొవడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం డీసీపీ కమలహాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేసి నాంపల్లి పీఎస్ కు తరలించారు. 

అసెంబ్లీ గేట్ 1 దగ్గర ఎమ్మెల్యేల రాస్తారోకో..

హైదరాబాద్ : అసెంబ్లీ 1 గేట్ వద్ద ఎమ్మెల్యేలు రాస్తారోకో నిర్వహించారు. అసెంబ్లీ వాయిదాను నిరసిస్తూ ఈ ఆందోళన కొనసాగించారు. 

తొలగించిన జీహెచ్ఎంసీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి - లక్ష్మణ్..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో అక్రమంగా తొలగించిన కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 

ధైర్యం లేకే సభను వాయిదా వేశారు - సున్నం రాజయ్య..

హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలపై మాట్లాడే ధైర్యం లేకనే ప్రభుత్వం సభను వాయిదా వేసిందని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ మొత్తం రైతు ఖాతాల్లో జమ చేయాలని, రైతుల్లో ఆత్మస్థైర్యం నింపాలని సూచించారు. రుణమాపీ, వన్ టైమ్ సెటిల్ మెంట్, రైతు ఆత్మహత్యలపై గన్ పార్కు వద్ద ఆందోళన చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడుతోందని, ప్రజా హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. సభలో ఎన్ కౌంటర్ పై చర్చించాలని డిమాండ్ చేశారు. 

ఆదిలాబాద్ లో గురుకుల విద్యార్థుల ఆందోళన..

మ సిర్పూర్ టి.సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. భోజనం సరిగ్గా పెట్టడం లేదని, టీచర్లు వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.

 

10:54 - October 1, 2015

శ్రీకాకుళం : అరసవెల్లిలో గురువారం అద్బుతం చోటు చేసుకుంది. సూర్యనారాయణుడి ఆలయంలో మూల విరాట్ పాదాలను సూర్యుడి కిరణాలు తాకాయి. ఈ అరుదైన అద్బుతం చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఈ దృశ్యం చూసిన అనంతరం భక్తులు పరవశించిపోయారు. దాదాపు ఆరు నిమిషాలు పాటు భానుడి కిరణాలు మూలవిరాట్ పై ప్రసరించాయి. ఈ ఏడాది అక్టోబర్ తొలి రోజుననే సూర్య కిరణాలు స్వామి వారి పాదాలకు తాకాయి. మరో రెండు రోజుల కూడా సూర్య కిరణాలు తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. కిరణ స్పర్శను చూసి పులకించి పోయినట్లు భక్తులు పేర్కొన్నారు. 

10:49 - October 1, 2015

హైదరాబాద్ : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు. సభ ప్రారంభం కాగానే ఐదు నిమిషాల తరువాత సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ వాయిదా అనంతరం ఆయన టెన్ టివితో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రుణమాఫీ విషయం..రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రశ్నిస్తే సభ ఇలా వాయిదా వేయడం చాలా అన్యాయమన్నారు. రుణమాఫీ మొత్తం రైతు ఖాతాల్లో జమ చేయాలని, రైతుల్లో ఆత్మస్థైర్యం నింపాలని సూచించారు. రుణమాఫీ, వన్ టైమ్ సెటిల్ మెంట్, రైతు ఆత్మహత్యలపై గన్ పార్కు వద్ద ఆందోళన చేస్తామని వెల్లడించారు. ఎన్ కౌంటర్ ఘటనపై జరిగిన ప్రదర్శనపై ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు. ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడుతోందని, ప్రజా హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. సభలో ఎన్ కౌంటర్ పై చర్చించాలని సున్నం రాజయ్య డిమాండ్ చేశారు.

సభ వాయిదా పడడం దారుణం - రామ్మోహన్ రెడ్డి.
సభను సోమవారానికి వాయిదా వేయడం దారుణమని కాంగ్రెస్ సభ్యుడు రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 20-25 రోజుల పాటు సభలు పెడుతామని సీఎం పేర్కొన్నారని గుర్తు చేశారు. రైతులు ఆత్మహత్యలు నివారించాలంటే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం చేయాలని అడిగితే నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ కు తరలించారని పేర్కొన్నారు. ప్రస్తుతం జానారెడ్డి సమక్షంలో విపక్షాలు భేటీ అయ్యాయని, ఏదైనా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 

10:37 - October 1, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ గురువారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రారంభమైన ఐదు నిమిషాల అనంతరం సభను సోమవారం వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించడంపై విపక్ష ఎమ్మెల్యేలు నోరెళ్లబెట్టారు. ఒక్కసారిగా సభ వాయిదా కావడంపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జానారెడ్డి సమక్షంలో విపక్ష ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.
గురువారం అసెంబ్లీ ప్రారంభమైంది. అంతకంటే ముందు విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ప్రోటోకాల్ వివాదంపై కాంగ్రెస్, టీడీపీలు వాయిదా తీర్మానాలు ఇవ్వగా, జీహెచ్‌ఎంసీలో తొలగించిన 12 వందల మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ బీజేపీ, వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్, ఛలో అసెంబ్లీ నేపథ్యంలో జరిగిన అరెస్టులపై సీపీఐ, సీపీఎంలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కానీ సభ ప్రారంభం కాగానే స్పీకర్ వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. దీనిపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వెంటనే రైతుల ఆత్మహత్యలు..ఎన్ కౌంటర్ పై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఈ ఆందోళన మధ్య స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సభ్యులను కూర్చొవాలని స్పీకర్ పలుమార్లు సూచనలు చేశారు. విపక్ష సభ్యులు శాంతించలేదు. అకస్మాత్తుగా స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కసారిగా జరిగిన పరిణామంతో విపక్ష సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. సభను..ఐదు లేదా పది నిమిషాల పాటు వాయిదా వేసే అవకాశం ఉంటుందని, కానీ ఏకంగా సోమవారానికి వాయిదా వేయడం పట్ల పలువురు ఎమ్మెల్యేలు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రభుత్వ వ్యవహారశైలిపై విపక్ష సభ్యులు గుర్రుగా ఉన్నారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పలాయన వాదం చేపట్టిందని పలువురు విమర్శలు గుప్పించారు. 

10:14 - October 1, 2015

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో ఓ పసికందును దుర్మార్గులు బావిలో పడేశారు. ఈ ఘటన భవానీనగర్ లో చోటు చేసుకుంది. 18 పోర్షన్ లో ఉన్న భవంతిలో ఓ ముగ్గురు సోదరులు నివాసం ఉంటున్నారు. సలీం కుటుంబానికి కుబ్రా అనే ఐదు నెలల చిన్నారి ఉంది. గురువారం తల్లిదండ్రులు పనుల్లో ఉండగా పడుకున్న కుబ్రా కనిపించలేదు. దీనిని గమనించి తల్లి చుట్టుపక్కల వెతికింది. అయినా ఫలితం కనబడలేదు. వెంటనే సలీంకు కబురు అందించింది. అక్కడే ఉన్న ఓ బావిలో పసికందు మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే భవానీనగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

టి. అసెంబ్లీ సోమవారానికి వాయిదా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. విపక్షాలు ఆందోళన చేయడంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తారాలను చేపట్టారు. దీనికి విపక్షాలు అడ్డు తగులుతున్నాయి. 

09:57 - October 1, 2015

ప్రపంచంలో ఎత్తైన వారందరూ ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది. అంతా సందడి సందడిగా ఉంటుంది కదా. అవును ప్రపంచంలోనే టాలెస్ట్ పీపుల్స్ గా గుర్తింపు పొందిన ఐదుగురు ఒకే చోట కలుసుకున్నారు. ఎందుకు ? అంటారా ? వీరందరికీ ఒక ప్రధాన సమస్యను ఎదుర్కొంటున్నారు. అదే 'పాదరక్షలు' మనలాగ ఎక్కడ పడితే షూస్ దొరకవు. అందుకే వీరంతా వెస్ట్ జర్మనీలోని ఓ పాదరక్షల దుకాణానికి వచ్చారు. వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన షూస్ కొనుక్కోవడానికి ఆ షాప్ కు వెళ్లారు. పాదరక్షలు కొనుక్కున్న అనంతరం వారు వెళ్లిపోయారు. ఒకరు 8 ఫీట్ 2.75 ఇంచెస్ ఉంటే మరొకరు 8 అడుగుల ఒక అంగుళం పొడవు ఉన్నారు. అంతా ఏడు అడుగుల పైనే పొడగుంటారు. వీరిని చూడటానికి జనం ఎగబడ్డారంట. 

9-10 తేదీల్లో కర్నాటకలో పర్యటించనున్న రాహుల్..

కర్నాటక : ఈనెల 9-10వ తేదీల్లో కర్నాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. హవేరీలో నిర్వహించనున్న పాదయాత్రలో చెరకు రైతులతో రాహుల్ మాట్లాడనున్నారు. 

దొరకని సుమన్ ఆచూకి..

నల్గొండ : విద్యార్థి సుమన్ ఆచూకి ఇంకా దొరకడం లేదు. మంగళవారం బొమ్మలరామారం (మం) మార్యాలలో ఆరో తరగతి చదువుతున్న సుమన్ కిడ్నాప్ కు గురయ్యాడు. రూ.2 లక్షలు ఇవ్వాలని తల్లిదండ్రులకు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

09:35 - October 1, 2015

హైదరాబాద్ : రైతు రుణమాఫీ ని వన్ టైం సెటిల్ మెంట్ చేయాలని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వద్ద ఆయన టెన్ టివితో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రధానమైన సమస్యగా ఉన్న వ్యవసాయ సంక్షోభం..రైతుల బలవన్మరణాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోందన్నారు. కానీ ఒక నిర్ధిష్ట ప్రకటన ప్రభుత్వం నుండి రాకపోవడం దురదృష్టకరమన్నారు. పెట్టుబడుల సమకూర్పు లేకపోవడం..బ్యాంకుల నుండి అప్పులు తీసుకోక..రుణమాఫీ ఇబ్బందులు ప్రధానంగా ఏర్పడుతున్నాయన్నారు. ఏకమొత్తంలో రుణమాఫీ చేస్తేనే సమస్య పరిష్కారమౌతుందన్నారు. అసెంబ్లీ నుండి సీఎం లేచి వెళ్లిపోవడం సబబు కాదన్నారు. వడ్డీకి సంబంధించిన మాఫీ విషయంలో దాటవేసే ధోరణి అవలింబిస్తోందని విమర్శించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో ప్రభుత్వం సరియైన విధంగా స్పందించాలని డిమాండ్ చేశారు. బకాయిలను చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని జీవన్ రెడ్డి విమర్శించారు.

తెలంగాణ అసెంబ్లీ..వాయిదా తీర్మానాలు..
తెలంగాణ అసెంబ్లీలో విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ప్రోటోకాల్ వివాదంపై కాంగ్రెస్, టీడీపీలు వాయిదా తీర్మానాలు ఇవ్వగా, జీహెచ్‌ఎంసీలో తొలగించిన 12 వందల మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ బీజేపీ, వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్, ఛలో అసెంబ్లీ నేపథ్యంలో జరిగిన అరెస్టులపై సీపీఐ, సీపీఎంలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. 

09:30 - October 1, 2015

విజయవాడ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేటిన ఉండి లారీ యజమానులు చేపట్టిన దేశవ్యాప్త నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఏపీ రాష్ట్రంలో పెట్రోల్ బంక్ లు బంద్ కాగా..లారీలు ఎక్కడికక్కడనే నిలిచిపోయాయి. దీనితో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. టీడీఎస్ పన్ను రద్దు, పాత వాహనాలకు వేగనియంత్రణ పరికరాల అమలు ఆదేశాల రద్దు, ఓవర్‌లోడ్ పేరిట చెక్‌పోస్టుల వద్ద అక్రమ వసూళ్లకు నిరసనగా సమ్మెను చేపట్టారు. సమ్మెకు తెలుగు రాష్ట్రాల లారీ యజమానుల సంఘాల మద్దతు తెలిపాయి.

విశాఖలో భిన్నమైన వాతావరణం..
విశాఖలో భిన్నమైన వాతావరణం నెలకొంది. జిల్లాలో 30 శాతం వరకు పెట్రోల్ బంక్ లు మూతపడ్డాయి. తెరిచిన పెట్రోల్ బంక్ ల వద్ద వాహనదారులతో రద్దీ నెలకొంది. సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని పెట్రోల్ యజమానులు పేర్కొంటున్నారు. రోజుకు 2లక్షలు డీజిల్..1.50 లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతుంటుంది. లారీల సమ్మె కారణంగా 13వేల రవాణా వాహనాలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నా సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

గుంటూరులో ...
గుంటూరు : జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంక్ లు మూతపడ్డాయి. ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభావం చూపించింది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్ లేకపోవడం వల్ల పలు సమస్యలు ఎదుర్కొన్నామని పలువురు వాహనదారులు పేర్కొంటున్నారు. లారీ యజమానులు మాత్రం రేపటి నుండి సమ్మెలోకి వెళ్లబోతున్నట్లు తెలిపాఇరు. దీనితో 30వేల లారీ ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి.

తిరుపతిలో భక్తుల ఇబ్బందులు...
చిత్తూరు : ప్రముఖ అధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన తిరుపతిలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. పెట్రోల్, డీజిల్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంధనం నింపుకోవడానికి అర్ధరాత్రి వరకు క్యూలు కట్టిన పరిస్థితి ఏర్పడింది. వివిధ రాష్ట్రాల నుండి వాహనాలతో వచ్చిన భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. దీనిని అదనుగా భావించిన ప్రైవేటు వాహనదారులు చార్జీలను అమాంతం పెంచేశారు.

విజయవాడలో..
విజయవాడ : బెంజ్ సర్కిల్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. సమ్మె కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. 

తెలంగాణ అసెంబ్లీ..వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ప్రోటోకాల్ వివాదంపై కాంగ్రెస్, టీడీపీలు వాయిదా తీర్మానాలు ఇవ్వగా, జీహెచ్‌ఎంసీలో తొలగించిన 12 వందల మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ బీజేపీ, వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్, ఛలో అసెంబ్లీ నేపథ్యంలో జరిగిన అరెస్టులపై సీపీఐ, సీపీఎంలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి

కుప్పంలో ఆర్టీసీ బస్సు బోల్తా..

చిత్తూరు : కుప్పం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నడుమూరు సమీపంలోని ఘాట్ వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. 

ఆత్మహత్యాయత్నం చేసిన రైతు మృతి..

మెదక్ : వెల్దుర్ది (మం) కలాం శెట్టిపల్లిలో అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన రైతు శంకర్ (30) కన్నుమూశాడు. మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. 

ఇసుక లారీ బోల్తా..ఇద్దరు మృతి..

రంగారెడ్డి : శంషాబాద్ (మం) చినగోల్కొండలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఇసుక లారీ బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు.

 

14-22 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

చిత్తూరు : ఈనెల 14 నుండి 22వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 22న స్వామి వారి చక్రస్నానం ఉంటుంది. 

08:40 - October 1, 2015

చలో అసెంబ్లీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత అణిచివేత చేసిందని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ ప్రశ్నించారు. ఉద్యమాన్ని అణిచివేస్తే ఉవ్వెత్తున ఎగిసి పడుతుందన్నారు. నగరంలో ప్రజా సంఘాలు నిర్వహించిన చలో అసెంబ్లీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం..టిడిపి జాతీయ పార్టీగా అవతరించడం..తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చ..తదితర అంశాలపై టెన్ టివి 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..

ఉద్యమాన్ని అణిచివేస్తే ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది..
''ఉద్యమ పార్టీ అర్థం చేసుకోవాలి. ఉద్యమాన్ని అణిచివేస్తే ఉవ్వెత్తున లేస్తుంది అని కేసీఆర్ అన్న మాటలన్నారు. ర్యాలీ చేస్తే ముఖ్యమంత్రి పీఠం కూలుతుందా? ప్రజాక్షేత్రంలో ఓడిపోతారా ? ఎందుకింత అణిచివేత. చుక్కా రామయ్య మావోయిస్టా ? విచక్షణారహితంగా నిర్భందం చేయడం ఏంటీ ? చివరకు ఏమీ చేయగలుగుతారు ? దీనికి శాంతిభద్రతల ఇష్యూగా చూడడం సరికాదు. మావోయిస్టులు చొరబడ్డారని అంటున్నారా ? పల్లెల్లోకి మావోయిస్టులు వస్తున్నారు. దీనిని ఆపగలుగుతారా ? అగ్రనేతలను పిలిచి మాట్లాడితే సరిపోతుంది కదా ? మావోయిజాన్ని అణిచివేయాలని అనుకుంటే అణిచివేయలేరు. పాలన వ్యవస్థల లోపం నుండి...సామాజిక అణిచివేత నుండి ఉద్యమం పుడుతుంది. సమస్యలపై చర్చించండి. అలాకాకపోతే తెలంగాణ అల్లకల్లోలమౌతుంది.

రూ.61 వేల కోట్లు అప్పు చేసింది.
నిర్ధిష్టంగా ప్రభుత్వం నుండి ఏమి వచ్చిందో కీలకంగా ఉంటుంది. ప్రభుత్వం ఆదుకుంటామని చెబుతూ ఎనిమిది వేల కోట్ల రూపాయలు కావాలని అంది. అధికారంలోకి వచ్చిన తరువాత రూ.61వేల కోట్లు అప్పు చేసింది. సమాచార హక్కు చట్టం కింద ఇది బయటకొచ్చింది. అప్పులు కావాలని రైతులు చెప్పలేదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండేవిధంగా చూడాలంటున్నారు. ఎన్నికలకు ముందు ఇవన్నీ చెప్పారా ? నాలుగు..ఐదు..వాయిదాల్లో మాఫీ చేస్తామని చెప్పలేదు. ఇప్పుడు చెప్పడంలో అర్థం ఏంటీ ? రాజకీయ మాటల వల్ల ప్రయోజనం ఉండదు. చర్చలు..ఉపన్యాసాలు..హామీలతో ఆత్మహత్యలు ఆగవు. నిర్ధిష్ట కార్యాచరణతోనే ఆత్మహత్యలు ఆగుతాయి. అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లండి. ఈ రోజు కూడా వన్ టైం సెటిల్ మెంట్ కు విపక్షాలు నిలదీస్తాయి. తెలంగాణది లక్ష కోట్ల బడ్జెట్. ఇక్కడ రైతుల ఆత్మహత్యల సమస్య ప్రధానంగా ముందుకొచ్చింది. బడ్జెట లో నుండి 8వేల కోట్ల రూపాయలు ఇవ్వవచ్చు కదా. అంత పెద్ద డబ్బేమీ కాదు కదా. ప్రభుత్వం దుబారా ఖర్చు తగ్గించుకుంటే బాగుంటుంది. అవకాశం ఉందో ఆ పనులను వాయిదా వేయండి.

ఈసీ నిబంధనల ప్రకారం టిడిపి జాతీయ పార్టీ కాదు..
ఎన్నికల కమిషన్ టిడిపి జాతీయ పార్టీ కాదు. కొన్ని కండీషన్స్ ఉన్నాయి. సమీప భవిష్యత్ లో అయ్యే అవకాశం లేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో చెప్పుకోదగిన ఓటింగ్ శాతం లేదు. జాతీయ పార్టీగా మార్చుకొనే అవకాశం ఉంది కానీ గుర్తింపు మాత్రం అంత సులభంగా రాదు. తెలంగాణలో రాజకీయ ప్రచారం చేయడం ఇబ్బందిగా ఉంటుంది. గ్రామ, మండలం, వార్డు..ఇలా ఏ స్థాయిలో లోకేష్ ఎక్కడా పనిచేయలేదు. దేశం భాషా ప్రాతిపదిక దేశం. తెలుగు దేశం పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఎలా రాజకీయం చేయగలుగుతుంది ? పేరులో మౌలిక సమస్య ఉంది. ఏపీ, తెలంగాణలు విడిపోయాయి. నీళ్లు, నిధులు, విద్యుత్, వనరులు ఇలా ప్రతి అంశం తెలంగాణకు ఏపీకి వివాదాలున్నాయి. ఈ వివాదాలు ఉంటాయి..ఉన్నాయి..పెంచుతారు..ఇదంతా రాజకీయ అవకాశాల కోసం చేస్తారు. వారసత్వ రాజకీయాలు అంటూ కాంగ్రెస్..టిడిపి విమర్శిస్తూ వచ్చింది. మరీ అదే ప్రశ్న మీకెందుకు వర్తించదు ? టిడిపిలో ఉన్న నేతలందరూ కార్మికులే. ప్రొపైటర్ ఎలా అవుతారు ? లోకేష్ ప్రజా క్షేత్రంలో ప్రజల ఆశీస్సులు పొందాల్సి ఉంటుంది''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

శ్రీలంక విదేశాంగ మంత్రితో సుష్మా భేటీ..

న్యూయార్కు : శ్రీలంక విదేశాంగ మంత్రి మంగల సమరవీరతో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భేటీ అయ్యారు. 

08:05 - October 1, 2015

తెలంగాణ రాష్ట్రంలో చలో అసెంబ్లీపై పోలీసులు ఉక్కుపాదం మోపడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. వన్ టైం సెటిల్ మెంట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కానీ సభ వాయిదా వేయడంతో విపక్ష సభ్యులు అక్కడే బైఠాయించారు. దాడ్రి జిల్లా బిసారా గ్రామంలో అక్లక్ గోవు మాంసం తిన్నాడని దారుణంగా హత్య చేశారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో విశ్వేశ్వరరావు (సామాజిక విశ్లేషకులు), మహేష్ గౌడ్ (టి.కాంగ్రెస్), సతీష్ మాదిగ (టి.టిడిపి), రాకేష్ (టీఆర్ఎస్), రాకేష్ రెడ్డి (బీజేపీ) విశ్లేషించారు. 

సమ్మెతో నిలిచిపోయిన లారీలు..

హైదరాబాద్ : జాతీయ స్థాయిలో చేపట్టిన సమ్మెకు తెలుగు రాష్ట్రాల లారీ యజమానుల సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. దేశంలోని అన్ని మార్గాలను టోల్ ప్లాజాల రహితంగా చేయాలంటూ సమ్మె చేపట్టారు. దీనితో ఆంధ్రప్రదేవ్, తెలంగాణలో దాదాపు 16లక్షలకు పైగా సరకు రవాణా చేసే లారీలు నిలిచిపోయాయి. 

07:24 - October 1, 2015

ఢిల్లీ : అక్రమంగా సంపాదించి కూడబెట్టిన లక్షల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని దేశవిదేశాల్లో దాచుకున్న వారి నుంచి తిరిగి స్వదేశానికి తీసుకువస్తామని పదేపదే కలల ప్రపంచం చూపించిన ఎన్‌డిఎ సర్కారు ఆలోచనలకు సెప్టెంబర్‌ 30 వ తేదీతో తెరపడుతోంది. గత మార్చిలో ఇలా అక్రమంగా సంపాదించి విదేశాల్లో దాచుకున్న సంపదను వెల్లడించి కొద్ది మాత్రం జరిమానాతో తెల్ల డబ్బుగా మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని ఎంత మంది ఉపయోగించుకున్నారో కాని, సెప్టెంబర్‌ మూడో వారం చివరికి అందిన సమాచారం ప్రకారం అలా ప్రభుత్వ లెక్కల్లోకి ఆదాయం రూపంలో జమ అయిన మొత్తం మాత్రం రూ. 6500 కోట్లకు మించలేదు. గడువు ముగిసిన తరువాత అధికారులకు పట్టుబడినట్టయితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.

రూ.28 లక్షల కోట్లు ?
2003-12 మధ్య కాలంలో విదేశాల్లో మన భారతీయులు దాచిపెట్టిన నల్ల ధనం - గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటెగ్రిటీ గ్రూప్‌ (వాషింగ్టన్‌) అంచనాల ప్రకారం - దాదాపు రూ. 28 లక్షల కోట్లు అని తెలుస్తోంది. ఈ అక్రమ సంపాదన మొత్తాన్ని స్వదేశానికి తరలించగలిగితే దేశంలోని ఒక్కో పౌరునికి రూ. 15 లక్షలు అందించవచ్చునని రెండేండ్ల క్రితం ఒక ఎన్నికల సభలో నరేంద్ర మోడీ గొప్పగా ప్రకటించారు. డబ్బు వ్యామోహం అత్యధికంగా ఉన్న మన దేశంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల కండ్లు కప్పడానికి, పన్ను భారం లేని స్విట్జర్లాండ్‌ లేదా సింగపూర్‌లకు తరలించడం లేదా నగలు నట్రా, పురాతన విలువైన పెయింటింగ్స్, ఇతర ఆస్తుల రూపంలోకి తమ అక్రమ సంపాదనను నిల్వచేయడం సర్వసాధారణం. మరి ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల ద్వారా గడువు పూర్తయే సరికి ఎంత నల్ల ధనం తెలుపు రంగులోకి మారుతుందో వేచి చూడాల్సిందే.

పాతబస్తీ భవానీనగర్ లో దారుణం..

హైదరాబాద్ : పాతబస్తీ భవానీనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఐదు నెలల పసికందు కుబ్రాను గుర్తు తెలియని ఆగంతకులు బావిలో పడేశారు. దీనితో కుబ్రా మృతి చెందింది. గత రాత్రి అందరూ నిద్రలో ఉండగా ఆగంతకులు ఈ ఘటనకు పూనుకున్నారు. భవానీనగర్ పీఎస్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

07:15 - October 1, 2015

విశాఖపట్టణం : కుమార్తె కోసం ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. నాలాలో పడి గల్లంతైన ఆ చిన్నారి ఆచూకీ కోసం ప్రభుత్వ యంత్రాంగమంతా ఏకమైనా ఇంకా నిరాశే కొనసాగుతోంది. మరోపక్క తమ పాప ప్రాణాలతోనే ఉంటుందనే ఆశలో తల్లిదండ్రులున్నారు. ఇక అదితి ఆచూకీ తెలిపిన వారికి ఐదు లక్షలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు తల్లిదండ్రులు. జీవీఎంసీ అధికారులు కాలువలో నీటిని తోడేసి వెదికినా ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. సముద్రంలో నేవీ ప్రత్యేక డైవర్లు స్పీడ్‌ బోట్లతో, హెలికాప్టర్లతో సెర్చ్‌ ఆపరేషన్‌ చేసినా అదితి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. ఇక ఇదే విషయంలో అదితి తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు. నగర పోలీసు కమిషనర్‌తో చర్చించిన బాబు.. అదితిని రక్షిస్తామని హామీ ఇచ్చారు.

పాప తెచ్చిస్తే బహుమానం..
మరోవైపు అదితి కిడ్నాప్‌ జరగలేదంటూనే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. డ్రైవర్‌ కాల్‌ డేటా కూపీ లాగుతున్నారు. అదితి కుటుంబాలకు ఏవైనా పాత గొడవలు ఉన్నాయా ? అనే వివరాలను ఆరా తీస్తున్నారు. డబ్బు కోసం ప్రొఫెషనల్‌ కిడ్నాపర్లు చిన్నారిని ఎత్తుకువెళ్లారా ? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఇక పాప ఆచూకీ తెలిపినవారికి నగదు బహుమతి ఇస్తామని అదితి తల్లిదండ్రులు ప్రకటించారు. ఇప్పటివరకు పాపకు సంబంధించిన వివరాలు తెలియలేదు కాబట్టి.. ఎక్కడో ఒకచోట బతికే ఉంటుందన్న నమ్మకం ఉందని.. తమకు ఎవరిపైనా అనుమానం లేదని అదితి తండ్రి శ్రీనివాసరావు అంటున్నారు. పాప ఆచూకీ తెలిపినవారికి ఐదు లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. పాప గురించి తెలిస్తే పోలీసులకు గానీ 9701 000 564 సెల్‌ నెంబర్‌కు సమాచారమివ్వాలని కోరారు.

మిస్టరీ వీడుతుందా ?
అదితి ఆచూకీ ఎప్పుడు తెలుస్తుందనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. విశాఖలో ఎక్కడ చూసినా పాప గురించే చర్చ కొనసాగుతోంది. ఇక సోషల్‌ మీడియాలో సర్కార్‌ నిర్లక్ష్యం, భద్రత లోపాలపై పోస్టుల వెల్లువ కొనసాగుతోంది. దీంతో అదితి మిస్టరీ ఎప్పుడు వీడుతుందా అనే టెన్షన్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని పట్టి పీడిస్తోంది. 

07:10 - October 1, 2015

గత కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రం ఎటు వైపు పోతోందన్న ఆవేదనను కలిగిస్తున్నాయి. శ్రుతి, సాగర్ ఎన్ కౌంటర్, దానికి నిరసనగా 371 ప్రజా సంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం పట్ల పోలీసులు అనుసరించిన తీరు తీవ్ర వివాదస్పదమవుతోంది. టెన్ టివి జనపథంలో టీఆర్ఎస్ తో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్ పాల్గొని విశ్లేషించారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు..నడక దారి వచ్చే భక్తులకు సుమారు 6గంటల సమయం పడుతోంది. 

అరసవెల్లిలో అద్భుతం..

శ్రీకాకుళం: అరసవెల్లి సూర్యనారాయణుడి ఆలయంలో మూల విరాట్ పాదాలను సూర్యుడి కిరణాలు తాకాయి. మునుపెన్నడూ లేని విధంగా ఎనిమిది నిమిషాల పాటు కిరణాలు తాకాయి. ఈ అరుదైన అద్భుతం చూడడం కోసం భక్తులు పోటెత్తారు. 

06:46 - October 1, 2015

తెలంగాణ ప్రజాస్వామిక పద్దతుల్లోనే పాలన సాగిస్తోందా? టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాస్వామిక విలువల పట్ల , ప్రజాస్వామిక హక్కుల పట్ల నిబద్ధత వున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నే ఉదయిస్తోంది. 2009లో కేసీఆర్ నిరాహార దీక్షకు దిగడం తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుగా చెబుతుంటారు. కానీ, ఆనాటి రోశయ్య ప్రభుత్వం కేసీఆర్ దీక్ష ప్రారంభించకముందే అరెస్టు చేసి, టీఆర్ ఎస్ నామమాత్రంగా వున్న ఖమ్మం తరలించింది. కానీ, ఆనాటి రోశయ్య ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసింది. కేసీఆర్ దీక్షను అడ్డుకోవడం అప్రజాస్వామ్యం అంటూ అనేకమంది ప్రజాస్వామికవాదులు వీధుల్లోకి వచ్చి, ఉద్యమించారు. ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు, ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరించిన్నప్పుడూ దానిని నిరసిస్తూ ఉద్యమాలు, ఆందోళనలు చేయడం ప్రజాస్వామిక సమాజంలో వుండే గొప్ప లక్షణం. ఆనాడు కేసీఆర్ రాజకీయ పోకడలను వ్యతిరేకించేవారు సైతం ఆయన అరెస్టును నిరసించారు. ఉద్యమించారు. అది ప్రజాస్వామిక భావజాలపు మహత్తర గుణం. మీరంతా అండగా నిలవకపోతే నేను క్షేమంగా బయటపడేవాడిని కాదంటూ ఆనాటి ఉద్యమకారులకు నమస్కరించి, కృతజ్ఞతలు చెప్పుకున్న సంఘటన కేసీఆర్ కి గుర్తుండే వుంటుంది. కానీ, అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండేళ్లు కూడా పూర్తి చేసుకోకుండానే తన వ్యవహార శైలితో ఆనాటి సహచర ఉద్యమకారుల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామం పూర్తిగా ఆయన స్వయంకృతాపరాధం.

ఎన్ కౌంటర్ పై నిరసన..
ఎన్ కౌంటర్లు, రక్తపు మరకలు లేని తెలంగాణను సాధించుకోవడమే మనందరి కర్తవ్యమంటూ ఉద్యమకాలంలో కేసీఆర్ పదేపదే చెబుతుండేవారు. ఆనాడు అంత ఉదాత్తమైన మాటలు చెప్పిన కేసీఆర్ పాలనలోనే ఎన్ కౌంటర్ల పర్వం మొదలవ్వడంతో తెలంగాణ గడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆవేదన చెందింది. వరంగల్ జిల్లాలో శృతి, సాగర్ ఎన్ కౌంటరైన తీరు ప్రతి ఒక్కరి హ్రుదయాన్ని కలచివేసింది. ప్రతి మానవతావాది గుండెల్లో అంతులేని వేదననీ బాధనీ రగిలించింది. మరీ ఇంత ఘోరంగా హింసించి, చంపేస్తారా? అంటూ ఎందరో ఘోషించారు. ఆనాడు కేసీఆర్ తో విబేధించేవారు సైతం ఆయన అరెస్టును వ్యతిరేకించినట్టే, ఇవాళ మావోయిస్టు పార్టీ పంథాను వ్యతిరేకించేవారు సైతం ఈ ఎన్ కౌంటర్ ను నిరసించారు.

ఏకమైన 371 సంఘాలు..
ఒక ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ 371 సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వడం సాధారణ విషయమేమీ కాదు. ఇన్ని సంఘాలు, ఇంతమంది ప్రజలు ఇన్ని రకాలుగా తమ ఆవేదననీ, ఆందోళననీ, నిరసననీ వ్యక్తం చేసిన సందర్భంలోనైనా ఈ ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసుల మీద చర్యలు తీసుకుని వుంటే తెలంగాణ సమాజంలో తమ తొలి ప్రభుత్వం పట్ల గౌరవం పెరిగి వుండేది. ఒక మంచి సంప్రదాయం పాదుకునేది. అది చేయకపోగా, చలో అసెంబ్లీ కార్యక్రమానికి ముందు రోజు నుంచే తెలంగాణ వ్యాప్తంగా ఇళ్లకు వెళ్లి ప్రజాసంఘాల కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేయడం, హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో ముళ్ల కంచెలు వేయడమూ, నిరసన ర్యాలీ ప్రారంభం కాకముందే అరెస్టులు చేయడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదు.

విధానాలు సమీక్షించుకోవాలి..
ఇవేవీ ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం చేయాల్సిన పనికాదు. చివరకు ఉస్మానియా యూనివర్సిటీ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న విద్యార్థులను సైతం అరెస్టు చేసేందుకు ప్రయత్నించడం నియంత్రుత్వ ధోరణికి పరాకాష్ట. ప్రజా బాహుళ్యంలో ఇంతటి తీవ్ర స్థాయి నిరసనను చవిచూసిన తర్వాతైనా కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం తన విధానాలు సమీక్షించుకోవాలి. ఇప్పుడు తెలంగాణ తొలి ప్రభుత్వం చేయాల్సిన పని అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నవారి మీద కన్నెర్ర చేయడం కాదు రాజ్యాంగ స్పూర్తికి, రాజ్యాంగ ధర్మానికి తూట్లు పొడుస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణగా అవతరిస్తుంది. 

06:39 - October 1, 2015

హైదరాబాద్ : పసుపు దళంలో పండగ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు జాతీయ కమిటీని టీడీపీ ప్రకటించింది. కేంద్రకమిటీ సహా తెలుగురాష్ట్రాల కమిటీలను... ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు. 17 మంది సభ్యులతో టిడిపి పొలిట్‌బ్యూరో ఏర్పాటు చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 10 మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి చోటు కల్పించారు. ఏపీకి చెందిన యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, నందమూరి హరికృష్ణ, చిన రాజప్ప, కాల్వ శ్రీనివాసులు, అశోక్‌గజపతిరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రతిభాభారతికి పొలిట్‌బ్యూరోలో స్థానం దక్కింది. ఇక తెలంగాణ నుంచి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మోత్కుపల్లి నర్సింహులు, దేవేందర్ గౌడ్‌, ఉమామాధవరెడ్డి, నామా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రమేశ్ రాథోడ్‌కు అవకాశం వచ్చింది.

లోకేశ్ కు పెరిగిన బాధ్యత..
మరోవైపు కేంద్ర కమిటీలో లోకేశ్‌ బాబుకు ప్రాధాన్యత పెరిగింది. ఇన్నాళ్లు పార్టీ వ్యవహారాల్ని... ఏ పదవి లేకుండానే చూసుకుంటున్న... చినబాబుకు పెద్దపీట వేశారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా లోకేశ్‌తో పాటు సుజనా చౌదరి, కళా వెంకట్రావు, ఎల్‌.రమణలను ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్‌, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొనకళ్ల నారాయణలను నియమించారు. కేంద్ర ఉపాధ్యక్షులుగా పి. రాములు, గరికపాటి మోహనరావు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, డీకే సత్యప్రభ ఉన్నారు. కేంద్రకమిటీ అధికార ప్రతినిధులుగా కింజారపు రామ్మోహన్ నాయుడు, అరవింద్ కుమార్ గౌడ్‌, బోండా ఉమా మహేశ్వరరావు, పయ్యావుల కేశవ్‌, పెద్దిరెడ్డి, అరికెల నర్సారెడ్డి ఎన్నికయ్యారు.

ఏపీ, తెలంగాణలకు అధ్యక్షులు..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా L. రమణను నియమించినట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే ఇక అధ్యక్ష రేసులో ఉన్న రేవంత్‌ రెడ్డికి వర్కింట్ ప్రెసిడెంట్ పదవి వరించింది. నిజానికి తెలంగాణ సారథిగా రేవంత్‌కే పగ్గాలివ్వాలంటూ తమ్ముళ్లు విజ్ఞప్తులు చేశారు. కానీ ఓటుకు నోటు కేసు వ్యవహారం ఉండటంతో చంద్రబాబు ఆ సాహసం చేయలేదు. కానీ రేవంత్‌కు బాసటగా ఉన్నట్లు చెప్పకనే చెప్పుకొచ్చారు బాబు. అందుకే ప్రత్యేకంగా తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పార్టీ బాధ్యతలను భుజాన వేసుకోనున్న లోకేశ్..
ఇక టిడిపి కార్యకర్తల సంక్షేమనిధికి సమన్వయకర్తగా ఉన్న లోకేశ్‌కు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ, ఎక్స్‌అఫిషియో సభ్యుడిగాను నియమించారు. గతంలో చంద్రబాబు టిడిపి ప్రధాన కార్యదర్శిగానే పనిచేశారు. తాజాగా ఆయన కుమారుడు సైతం అదే పదవి చేపట్టడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పాలనలో చంద్రబాబు బిజీబిజీగా ఉండటంతో... పార్టీ బాధ్యతల్ని తన భుజాన వేసుకోనున్నారు లోకేశ్‌బాబు. ఏపీలో ప్రభుత్వ సంక్షేమపథకాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టనున్నారు. ఏదేమైనా చినబాబు సారథ్యంలోనే సైకిల్ పార్టీ సవారీ చేయనుంది. అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణ రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలపైనా టిడిపి దృష్టిసారించింది. మరి జాతీయ పార్టీగా పసుపుదళం ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి.

06:31 - October 1, 2015

అనంతపురం : జిల్లా కొత్తచెరువులో 'రైతు కోసం చంద్రన్న యాత్ర' ముగింపు సభ ఘనంగా జరిగింది. ఈనెల 9 నుంచి మొదలైన యాత్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తూ అనేక అంశాల పట్ల రైతులకు అవగాహన కల్పించారు. రైతుల సంక్షేమం కోసమే నదుల అనుసంధానం చేపట్టామని చంద్రబాబు తెలిపారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు చేపడుతున్నారని దివాకర్‌రెడ్డి అన్నారు. గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు రైతుల కోసం అది చేశాం.. ఇది చేశామని చెప్పారే కానీ.. చంద్రబాబు చేసి చూపిస్తున్నారని ఆయన అన్నారు.

పాల్గొన్న కేంద్ర మంత్రులు..
రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకే నదుల అనుసంధానం చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. రైతుల కోసం సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతన్నల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే తన లక్ష్యమన్నారు చంద్రబాబు. అనంతరం గోరంట్ల మండలం పాలసముద్రంలో బెల్‌ పరిశ్రమకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంతులు మనోహర్‌ పారికర్‌, వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

త్వరలో సొలార్ ప్లాంట్..
రాష్ట్రానికి ఎన్నో సంస్థలు, ప్రాజెక్టులు వస్తున్నాయని.. త్వరలో సొలార్‌ ప్లాంట్‌ కూడా రాబోతుందని చంద్రబాబు తెలిపారు. విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పటికే ట్రిపుల్‌ ఐటీ, ఐఐటీలు ఇచ్చామని.. త్వరలో మరిన్ని ప్రాజెక్టులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో చంద్రబాబు 'చంద్రన్న విజయాలు' కరదీపికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రైతులు, టీడీపీ కార్యకర్తలు భారీస్థాయిలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పలు కంపెనీలు వ్యవసాయంలో ఉపయోగించే పరికరాలు, ట్రాక్టర్లతో ఎగ్జిబిషన్‌ను నిర్వహించాయి. 

06:29 - October 1, 2015

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలిలో రెండవ రోజు కూడా రైతు సమస్యలపై చర్చ జరిగింది. అధికార పార్టీ తీరుపై... ప్రతిపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ అసమర్థ పాలనతోనే... రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అన్నదాతల్ని ఆదుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనమండలిలోనూ రైతు, ప్రజా సమస్యలపై వాడీవేడీ చర్చ జరిగింది. బుధవారం సభ ప్రారంభంకాగానే కాంగ్రెస్ సభ్యులు... వరంగల్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై న్యాయ విచారణ జరపాలని పట్టుబట్టారు. వామపక్ష నేతలు, కార్యకర్తల అరెస్టులపై చర్చించాలంటూ పట్టుబట్టారు. దీంతో సభలో కొంత గందరగోళం నెలకొంది.

చర్చల్లో పాల్గొన్న 14 మంది..
రైతుల సమస్యలపై చర్చించిన తరువాత వరంగల్ ఘటనపై పరిశీలిద్దామని మండలి ఛైర్మన్‌ చెప్పడంతో సభ్యులు వెనక్కితగ్గారు. అనంతరం రైతు సమస్యలపైనే సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. అప్పుల బాధలు తాళలేక, రైతులు ఆత్మహత్యలు చేసుకోక ముందే వారిని అన్ని విధాలా ఆదుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి డిమాండ్ చేశారు. రైతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న కేసీఆర్ సర్కార్‌పై మరో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ ఫైర్ అయ్యారు. "ఎద్దు ఏడ్చిన చోట ఎవుసం సాగదు. రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదని" చెప్పిన కేసీఆర్‌ పాలనలోనే ఇప్పుడు రైతులు ఏడుస్తున్నారని ఆయన అన్నారు. రైతుల కోసం ఎస్ఎల్ బిసి సమావేశంలో పాల్గొనేందుకు కేసీఆర్‌కు తీరిక లేదా..? అని ప్రభాకర్‌ ప్రశ్నించారు. తెలంగాణ మండలిలో రైతు సమస్యలపై 14 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తే కొంత ఉపశమనం కలుగుతుందని అధికార పార్టీ సభ్యులు సమాధానమిచ్చారు.

06:26 - October 1, 2015

హైదరాబాద్ : ఛలో అసెంబ్లీ నేపథ్యంలో ఓయూ విద్యార్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వర్సిటీకి చెందిన విద్యార్థి మహేష్‌ను పోలీసులు ఛలో అసెంబ్లీ ముందురోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మిగతా విద్యార్థులను వదిలేసినప్పటికీ మహేష్‌ను మాత్రం విడుదల చేయలేదు. మహేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని ముందుగా అఫ్జల్ గంజ్‌ పోలీసుస్టేషన్‌ తరలించి, అక్కడి నుంచి సుల్తాన్‌ బజార్‌, మళ్లీ అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్‌లోని స్టేషన్లన్నీ మొత్తం తిప్పుతూ వచ్చారు. చివరకు అంతా సద్దుమణిగాక మహేష్‌ ను వర్సిటీ సమీపంలోని అడిక్‌మెట్‌లో వదిలిపెట్టారు. ఇదిలా ఉంటే పోలీసుల తీరుపై విద్యార్థి లోకం మండిపడుతోంది. 

06:20 - October 1, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి నుంచి పెట్రోల్‌ బంక్‌లు మూతపడ్డాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ.. లారీ యజమానులు సమ్మెబాట పట్టారు. అయితే.. ప్రభుత్వం కొన్ని డిమాండ్లను అంగీకరిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అయినా.. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదంటున్నారు. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై విధించిన 4 రూపాయల వ్యాట్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ పెట్రోల్‌బంకు డీలర్లు, లారీలు, ఆయిల్‌ ట్యాంకర్స్‌ అసోసియేషన్లు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. పిలుపునందుకున్న వారంతా అర్ధరాత్రి నుంచే పెట్రోల్ బంకులు బంద్‌లో పాల్గొంటున్నాయి. అయితే స‌మ్మెకు కొద్ది గంట‌ల‌ ముందు ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ట్యాంక‌ర్ల య‌జ‌మానుల డిమాండ్లపై మంత్రివ‌ర్గ ఉప‌సంఘం సూచించిన సిఫార్సుల‌ను ఆమోదిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సిఫార్సుల్లో ప్రధానంగా య‌జ‌మానులు డిమాండ్ చేస్తున్న వ్యాట్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది.

11 డిమాండ్లు..
ఆయిల్‌ ట్యాంక‌ర్ల య‌జ‌మానులు మొత్తం 11 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఇందులో భాగంగా 2011 న‌వంబ‌ర్ 8 నుంచి లీజ్ ట్యాక్స్‌ను ఎత్తివేస్తూ స‌ర్కార్ నిర్ణయం తీసుకుంది. భ‌విష్యత్తులో ఆయిల్ కంపెనీల నుంచే ఈ ట్యాక్స్‌ను వ‌సూలు చేస్తామ‌ని కూడా ప్రకటించింది. పెట్రోల్ ట్యాంక‌ర్లను అత్యవ‌స‌ర వ‌స్తువుల ప‌రిధిలో తీసుకువ‌చ్చింది. ఫైర్ అధికారుల నుంచి ఇచ్చిన కోర్టు నోటీసులు వెన‌క్కి తీసుకోవ‌డానికి అంగీక‌రించింది. మున్సిపాల్టీలలో లారీ య‌జ‌మానుల నుంచి ఎలాంటి ప‌న్నులు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని నిర్ణయించింది. ఇక యాక్సిడెంట్లు చేసిన లారీ డ్రైవ‌ర్ల విషయంలో కేసు రుజువు అయితే గానీ లైసెన్స్ ర‌ద్దు చేయ‌కూడ‌ద‌ని నిర్ణయించింది.

ప్రజా రవాణా సౌకర్యానికి ఇబ్బందులు..
ప్రభుత్వం విడుద‌ల చేసిన జీవోలో లారీ య‌జ‌మాల‌ డిమాండ్లు చాలా వ‌ర‌కూ ప‌రిష్కారం అయిన‌ట్లేన‌ని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇదే స‌మ‌యంలో తాము స‌మ్మెను కొన‌సాగిస్తున్నట్లు అయిల్ ట్యాంక్ యాజ‌మాన్యాలు ప్రక‌టించాయి. దీంతో ప్రభుత్వం ఇంధన శాఖ రెవెన్యూ కమర్షియల్‌ ట్యాక్స్‌ కార్యదర్శి అజయ్‌ కల్లాంతో ఈ ఉదయం సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశం అనంతరం ఆయిల్ ట్యాంక‌ర్స్‌ య‌జ‌మానులు ఒక నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు పెట్రోల్ బంకుల బంద్‌ నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్‌ కోసం బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ఇటు లారీల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ చర్యలు చేపట్టింది. బస్సుల్లో కూరగాయలు, పండ్లు రవాణా చేసేందుకు చర్యలు చేపట్టింది. మొత్తంగా లారీల బంద్‌, పెట్రోల్‌ బంకుల బంద్‌ నేపథ్యంలో ప్రజారవాణా సౌకర్యానికి ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. 

06:18 - October 1, 2015

విజయవాడ : రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లే ప్రధాన చర్చనీయాంశంగా రాష్ట్ర మంత్రివర్గం విజయవాడలో ఇవాళ కీలక భేటీ నిర్వహించనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.2శాతం డీఏ పెంపునకు ఆమోందంతో పాటు వారి పిల్లల స్థానికత అంశంపైనా ఓ నిర్ణయం తీసుకోనుంది. రైతు ఆత్మహత్యలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై క్యాబినెట్ చర్చించనుంది. హైదరాబాద్ నుంచి స్వరాష్ట్రానికి తరలివెళ్లే ఉద్యోగుల పిల్లలకు స్థానికత కల్పించే అంశంపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. ఉద్యోగుల పిల్లలకు ఎన్నేళ్ల వరకూ స్థానికత కల్పించాలనే అంశంపై అడ్వకేట్ జనరల్ రెండు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన నాలుగేళ్లలోపు ఏపీకి తరలివచ్చే వారికి స్థానికత ఇవ్వాలా లేక ఈ పరిమితిని ఏడేళ్ల వరకూ పెంచాలా అన్న రెండు ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. కొత్త రాష్ట్రానికి తరలివచ్చే ఉద్యోగుల పిల్లలు ఏ జిల్లా వారు అనేదానితో సంబంధం లేకుండా వారు ఏ జిల్లాను ఎంచుకుంటే ఆ జిల్లాకు స్థానికులుగా పరిగణించాలన్నది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. విద్య, ఉద్యోగ అవకాశాలకు ఇది వర్తించేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనుంది. అలాగే ఉద్యోగులకు 3.2శాతం డీఏ పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

వివిధ అంశాలపై చర్చలు..
తాజాగా కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన వెయ్యికోట్ల రూపాయలు, వివిధ ప్రాజెక్టులపైనా మంత్రులు చర్చించే అవకాశముంది. ఇటు ప్రత్యేక హోదా సాధనకు తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రధానంగా చర్చించనున్నారు. అక్టోబర్‌ 22న జరగనున్న అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాజధానికి భూమిలిచ్చిన రైతులకు ఆహ్వాన పత్రాల పంపిణీతో పాటు వారికి ఇతరత్రా బహుమతులు ప్రభుత్వం తరఫున ఏమైనా పంపాలా అన్నదానిపైనా అమాత్యులు చర్చించే అవకాశం ఉంది. ఇటీవల విజయవంతంగా చేపట్టిన గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ప్రక్రియపైనా మంత్రివర్గం ప్రభుత్వానికి అభినందనలు తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటు రైతు ఆత్మహత్యలపై హైకోర్టు ఆదేశాలను కూడా అమాత్యులు చర్చించే అవకాశం ఉంది. 

06:16 - October 1, 2015

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో రైతు సమస్యలపై వాడివేడి చర్చ సాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదని నిరసిస్తూ.. ప్రతిపక్ష సభ్యులు సభలోనే రాత్రివరకూ బైఠాయించారు. సభ వాయిదా పడ్డా.. సభ్యలు అసెంబ్లీలోనే ఉండడంతో మార్షల్స్‌ వారిని బలవంగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించారు. రైతు రుణమాఫీపై స్పష్టత ఇచ్చేంత వరకూ ప్రభుత్వంపై తమ పోరు సాగుతుందంటున్నారు విపక్ష సభ్యులు.

ప్రభుత్వాన్ని నిలదీసిన విపక్ష సభ్యులు..
రైతు రుణమాఫీ, ఆత్మహత్యలు, కరువు మండలాలు వంటి అంశాలపై బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని విపక్ష సభ్యలు నిలదీశారు. మాఫీ సొమ్మును ఒకేసారి కట్టి.. రైతు సమస్యలను తీర్చాలని డిమాండ్‌ చేశారు. రెండురోజులపాటు చర్చ జరిగినా రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా రాలేదని, రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలన్న తమ డిమాండ్‌పై స్పష్టత ఇవ్వలేదంటూ శాసనసభ వాయిదాపడిన తర్వాత కూడా విపక్ష పార్టీల ఎమ్మెల్యేలందరూ సభలోనే బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు మంత్రి హరీశ్‌రావు ఛాంబర్‌లో కొందరు మంత్రులు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. చివరకు మార్షల్స్ రంగప్రవేశం చేసి వారిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు వారిని ప్రత్యేక వాహనాల్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ కు తరలించారు. 

ముగింపు దశలో ఆరోపణలు..
వ్యవసాయం, రైతు సంక్షేమంపై మంగళవారం ఉదయం ప్రారంభమైన చర్చ బుధవారం రాత్రి 9గంటల వరకు జరిగింది. ముగింపు దశలో అధికార, విపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలకు దిగడంతో పలు అంశాలపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అంతకుముందు రైతు ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్‌ సభలో సుదీర్ఘ సమాధానమిచ్చారు. రెండు గంటలపాటు ఆయన ప్రసంగం కొనసాగింది. వివిధ మార్గాల ద్వారా నిధులన్నీ సమకూరితే రుణమాఫీ అమలకు తొలి ప్రాధాన్యమిస్తాన్నారు కేసీఆర్‌. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం సంక్షోభం నుంచి బయటపడాలంటే దీర్ఘకాలిక చర్యలు అవసరమన్నారు. రైతును తప్పకుండా ఆదుకోవాల్సిందేనని, ఈ విషయంలో భేషజాలకు పోబోమన్నారు. రైతు ఆత్మహత్యలపై.. సమస్య మూలాల్లోకి వెళ్లాలి అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. తన ప్రసంగం మధ్యలో అడ్డు తగిలిన టీడీపీ సభ్యులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సంబంధించి చేపట్టిన చర్చ 13గంటలకు పైగా సాగింది. గురువారం ఇదే అంశంపై సభలో పట్టుబడతామని విపక్షాలు తెలిపాయి. మొత్తంగా సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాద ప్రతివాదాలు జరిగాయి. 

టి.ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ తొలి మహాసభలు..

నల్గొండ : నేడు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు జరుగనున్నాయి. 

నేటి నుండి ఏపీలో పెట్రోల్ బంక్ ల బంద్..

విజయవాడ : నేటి నుండి ఏపీ రాష్ట్రంలో పెట్రోల్ బంక్ లు బంద్ కానున్నాయి. డీజిల్, పెట్రోల్ పై రూ.4 వ్యాట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఏపీలో రేపటి నుండి స్వచ్ఛ వారోత్సవాలు..

గుంటూరు : ఏపీలో రేపటి నుండి స్వచ్ఛ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 8వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గుంటూరులో ఏపీ సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 

నేటి నుండి లారీ యజమానుల సమ్మె..

ఢిల్లీ : నేటి నుండి దేశ వ్యాప్తంగా లారీ యజమానులు సమ్మెలో పాల్గొననున్నారు. టోల్ గేట్స్ ఎత్తివేయాలి, టీడీఎస్ రద్దు, ఓవర్ లోడ్ సమస్యలు, స్పీడ్ కంట్రోల్ మీటర్ బిగింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిత్యావసరాలు, సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. 

గుప్త నిధుల కోసం భార్య గొంతు కోసిన భర్త..

కరీంనగర్ : రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీలో దారుణం చోటు చేసుకుంది. గుప్త నిధుల కోసం ఓ భర్త భార్య గొంతు కోశాడు. వెంటనే ఆమెను గోదావరి ఖని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

 

నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు..

హైదరాబాద్ : నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టులను నిరసిస్తూ ఈ పిలుపునిచ్చింది. 

Don't Miss