Activities calendar

06 October 2015

పశ్చిమ బెంగాల్ ఈసీ ఉపాధ్యాయ్ రాజీనామా...

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ ఈసీ ఉపాధ్యాయ్ తన పదవికి రాజీనామా  చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. 

22:09 - October 6, 2015

మహానుభావులు ఎన్నో చెప్పారు. ఎంతో ఉపదేశించారు. కానీ రాజకీయమే పరమావధిగా భావించే వారికి ఈ మాటలు చెవికెక్కుతాయా..? అందలాలు అందుకోవడానికి రాజకీయమే నిచ్చెనగా తలచే వారికి ఆ ఉపదేశాలు రుచిస్తాయా..? దేశంలో తాజాగా చెలరేగుతున్న బీఫ్ రాజకీయాలు చూస్తే ఆలోచనాపరులకు ఆందోళన కలుగకమానదు. ఆఖరికి ఒక గోవు రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే వారికి ఆయుధంగా దొరికిందా...? దేశానికి తాజా ముప్పుగా పరిణమించిన బీఫ్ పాలిటిక్స్ పై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేకం కథనం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:52 - October 6, 2015

హైదరాబాద్ : అగ్రిగోల్డు ఆస్తులపై హైకోర్టులో విచారణ జరిగింది. సంస్థ ఎండీ, డైరెక్టర్లు, సీఐడీ చీఫ్ హాజరయ్యారు. అగ్రిగోల్డు ఎండీతోపాటు ఆరుగురు డైరెక్టర్ల ఆస్తుల వివరాలు అందచేయాలని ఆదేశించింది. అగ్రిగోల్డు సంస్థకు చెందిన ఆరుగురు డైరెక్టర్లు సంస్థ ఆస్తుల వివరాలను వివరించారు. సంస్థకు చెందిన 300 రకాల ఆస్తుల వివరాలను అగ్రిగోల్డు యాజమాన్యం అందించింది. అయితే ఐదు ఆస్తులను అమ్మడానికి హైకోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆస్తులను అమ్మి ఆ.. డబ్బును బాధితులకు అందించాలని సూచించింది. అగ్రిగోల్డు ఆస్తుల అమ్మకాలపై హైకోర్టు ఈనెల 9న ఉత్తర్వులు ఇవ్వనుంది.

అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యవర్గం ఏర్పాటు

ఢిల్లీ : అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. 11 మంది ప్రధాన కార్యదర్శులు, 9 మంది కార్యదర్శులను ప్రకటించారు. 

21:21 - October 6, 2015

ఉత్తరప్రదేశ్ : దాద్రీలో గోమాంసం తిన్నారన్న పుకార్లతో గ్రామస్తులు ఇఖ్లాక్‌ను కొట్టి చంపిన ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి రిపోర్టు పంపింది. అయితే ఈ రిపోర్టులో బీఫ్‌ పదాన్ని ఉపయోగించలేదు. ఘటనకు గల కారణాలను కూడా వివరించలేదు. బీఫ్‌ కు బదులు పశుమాంసం అని ప్రభుత్వం పేర్కొంది. దాద్రీని సందర్శించిన నేతల పేర్లు కూడా రిపోర్టులో ఉన్నాయి. దాద్రీపై విచారణ జరుగుతున్నందున ఇందులో నిజా నిజాలు త్వరలో వెలుగు చూస్తాయని అఖిలేష్‌ సర్కార్ కేంద్రానికి పంపిన నివేదికలో తెలిపింది.

 

 

21:07 - October 6, 2015

విజయవాడ : సీఎం చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులతో సమావేశమయ్యారు. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్ష జరుపుతున్నారు. ఇప్పటికే నియమించిన నాలుగు కమిటీలు ఎలా పని చేస్తున్నాయనేదానిపైనా ఏపీ సీఎం వాకబు చేశారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి నారాయణ, ఇతర అధికారులు హాజరయ్యారు.

21:02 - October 6, 2015

బెంగళూరు : నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా నిర్భయ ఘటనలు ఆగడం లేదు. తాజాగా బెంగళూరులో ఓ నిర్భయ అత్యాచారానికి గురైంది. 23 ఏళ్ల కాల్‌ సెంటర్‌ అమ్మాయిపై కత్తితో బెదిరించి బస్సులోనే అఘాయిత్యానికి పాల్పడిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉద్యోగినిపై గ్యాంగ్‌ రేప్
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సామూహిక లైంగిక దాడిని తలపించే మరో ఘటన బెంగలూరులో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన 23 ఏళ్ల యువతి బెంగళూరులోని ఓ కాల్ సెంటర్ సంస్థలో ఉద్యోగం చేస్తూ తన అక్కతో పాటు ఉంటోంది. ఎప్పటిలానే విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో రాత్రి 10 గంటలకు హోసూర్ ప్రధానమార్గంపై ఆటో కోసం కాల్‌సెంటర్‌ ఉద్యోగిని వేచి చూస్తోంది. ఇంతలో అటుగా వచ్చిన టెంపో ట్రావెలర్ యువతి వద్ద ఆగింది. మినీ బస్సులో డ్రైవర్‌, క్లీనర్‌ ఇద్దరే ఉన్నారు. టెంపో ఆమె వెళ్లాల్సిన పిజి అకాడమి మార్గంవైపే వెళ్తుందంటూ చెప్పి ఆ యువతిని నమ్మించారు. యువతి బస్సు ఎక్కి సీట్లో కూర్చున్న కొద్ది సేపటికే క్లీనర్ కత్తితో యువతిని బెదిరించాడు. దాదాపు మూడు గంటలపాటు ఆ యువతిని వ్యాన్‌లోనే తిప్పారు. బండి నడుపుతున్న డ్రైవర్ వాహనం మార్గం మార్చి డామ్‌లర్ ప్రాంతంవైపు పోనిచ్చి ఎవరూలేని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఈ మానవమృగాలు ఆ యువతిపై బస్సులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువతిని మదివాలా ప్రాంతంలో ఓ టెంపుల్‌ వద్ద వదిలి పారిపోయారు. బాధిత యువతి వెంటనే తన అక్కకు, స్నేహితులకు ఫోన్‌చేసి జరిగిన ఘటనను వివరించింది. వెంటనే వాళ్లొచ్చి చికిత్స నిమిత్తం ఆ యువతిని దగ్గరలోని సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
బాధితురాలి ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులపై సామూహిక అత్యాచారం 376డీ, లైంగిక వేధింపులు 354ఏ, బీ, గాయపరచడంపై 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

20:53 - October 6, 2015

హైదరాబాద్‌ : నరగంలో పట్టపగలే భారీ మోసం జరిగింది. తాను పోలీస్‌ అని చెప్పి .. ఓ వ్యక్తి వద్ద నుంచి 10 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లాడు దుండగుడు. ఈ ఘటన నాచారం పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. మల్లారెడ్డి అనే వ్యక్తి షామిర్‌పేటలోని బ్యాంక్‌లో డబ్బు డ్రా చేసుకుని.. తన స్నేహితుడికి డబ్బు ఇవ్వడానికి టూ వీలర్‌పై వెళ్తున్నాడు. హబ్సిగూడ పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా తన వాహనాన్ని ఆపుకోని ఫోన్‌ మాట్లాడుతున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి.. తాను పోలీస్‌ అని చెప్పి.. ఐడీ కార్డు చూపించి.. తన వాహనంలో ఉన్న కాగితాలను చూపించాలని చెప్పి.. కవర్‌లో ఉన్న డబ్బును ఎత్తుకెళ్లాడు. ఈ హఠాత్‌ పరిణామంతో బాధితుడు ఖంగుతిని.. తేరుకునేలోపే డబ్బు మాయమైంది. బాధితుడు లబోదిబోమంటూ స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

రాజధాని శంకుస్థాపనపై ముగిసిన చంద్రబాబు సమీక్ష

విజయవాడ : రాజధాని శంకుస్థాపనపై సమీక్ష ముగిసింది. నాలుగు కమిటీలతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు.

 

 

రైతులకు భరోసా ఇచ్చే వరకు పోరు : డీకే.అరుణ

మహబూబ్ నగర్ : జిల్లాలో  కాంగ్రెస్ రైతు భరోసా యాత్రం నిర్వహించింది. రైతులకు భరోసా ఇచ్చే వరకు పోరాడుతామని కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ అన్నారు.

 

ఒకేసారి రుణమాఫీ చేస్తే ఆత్మహత్యలు ఆగుతాయి: ఉత్తమ్

మహబూబ్ నగర్ : ఒకేసారి రుణమాఫీ చేస్తే ఆత్మహత్యలు ఆగుతాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వరి, పత్తి, మొక్కజొన్న రైతులకు బోనస్ ఇవ్వాలన్నారు.

 

20:29 - October 6, 2015

ఢిల్లీ : పరాన్నజీవుల ద్వారా వ్యాపించే వ్యాధులకు సమర్ధవంతమైన మందు కనిపెట్టిన ముగ్గురు శాస్త్రవేత్తలు నోబుల్ అవార్డు అందుకోబోతున్నారు.. ఐరిష్‌కు చెందిన అమెరికన్‌ విలియం సి కాంప్‌బెల్‌, జపాన్‌కు చెందిన సతోషి ఒమురా, చైనాకు చెందిన యుయుతు ఈసారి అవార్డుకు ఎంపికయ్యారు.. నోబుల్ పురస్కారం కింద దాదాపు 6కోట్ల రూపాయలను వీరు అందుకోనున్నారు.. ఈ డబ్బులో సగభాగం యుయుతు, మిగిలినదాన్ని క్యాంప్‌బెల్‌, ఒమురాలు పంచుకోనున్నారు.. డిసెంబరు 10న స్టాక్‌హామ్‌లో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు.
అవెర్‌మెక్టెన్‌ మందును కనుగొన్న శాస్త్రవేత్తలు
ఈ ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలు... ఏలికపాములు, వాటివల్ల సంక్రమించే వ్యాధులు, బోదకాలు తదితర పరాన్నజీవులపై ప్రయోగాలు చేశారు. ఈ పరాన్నజీవుల ప్రభావంతో రోగి చూపుకోల్పోయే రివర్‌ బ్లైండ్‌నెస్‌ వస్తుంది.. ఈ వ్యాధికి శాస్త్రవేత్తలు అవెర్‌మెక్టెన్‌ మందును కనుగొన్నారు.. ఈ కొత్త ఔషధం... రోగిలో వ్యాధి తీవ్రత తగ్గించి చూపు కోల్పోకుండా చేస్తుంది.
మలేరియాకు విరుగుడుగా ఆర్టెమైసినిన్‌ ఔషధం
చైనాకు చెందిన యుయుతు... మలేరియాపై చాలా ప్రయోగాలు చేశారు. మలేరియాకు విరుగుడుగా ఆర్టెమైసినిన్‌ అనే ఔషధాన్ని కనుగొన్నారు. ఈ సైంటిస్ట్ ప్రయోగాలన్నీ చైనాలో సంప్రదాయ బద్ధంగా వస్తున్న హెర్బల్‌ మెడిసిన్‌ ఆధారంగా జరిగాయి. ఈ లేడీ శాస్త్రవేత్త మరో రికార్డు కూడా సృష్టించారు.. వైద్య రంగంలో తొలిసారి అవార్డు అందుకోబోతున్న చైనా మహిళగా రికార్డుకెక్కారు.. ప్రస్తుతం యుయుతు చైనా అకాడమీ ఆఫ్‌ ట్రెడిషనల్‌ చైనీస్‌ మెడిసిన్‌లో చీఫ్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
మడిసన్‌లోని డ్ర్యూ యూనివర్సిటీలో కాంప్‌బెల్‌ పరిశోధకులు
మరో సైంటిస్ట్ కాంప్‌బెల్‌... మడిసన్‌లోని డ్ర్యూ యూనివర్సిటీలో పరిశోధకులు. 33 ఏళ్లపాటు మెర్క్‌లోని ఓ ఫార్మా కంపెనీలో శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. తనకు ఈ నోబెల్‌ పురస్కారం దక్కడం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు.. ఇక ఒమురా... జపాన్‌లోని కిటశాటో యూనివర్సిటీలో పరిశోధకులు.
ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో ఏటా పెరుగుతున్న బాధితులు
ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో ఏటా లక్షల సంఖ్యలో ప్రజలు ఏలికపాములు, రివర్‌ బ్లైండ్‌నెస్‌ జబ్బుల బారిన పడుతున్నారు.. ఈ వ్యాధులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. సైంటిస్టుల కృషితో ఈ వ్యాధులపై పోరుకు శక్తివంతమైన సాధనాలు సమకూరాయని నోబెల్ కమిటీ ప్రకటించింది.

 

రైతు సమస్యలపై నిర్ణయం తీసుకోకుంటే అసెంబ్లీ ముట్టడి : భట్టి

మహబూబ్ నగర్ : నగరంలో కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర నిర్వహించింది. ఈసందర్భంగా కాంగ్రెస్ నేత భట్టి మల్లువిక్రమార్క రైతు సమస్యలపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పారు. 9 లోగా నిర్ణయం రాకపోతే 10న తెలంగాణ బంద్ చేపడతామని తెలిపారు.

 

మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర..

మహబూబ్ నగర్ : నగరంలో కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర నిర్వహించింది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తుందని సీఎల్పీ నేత ఎమ్మెల్యే జానారెడ్డి అన్నారు. రైతు సమస్యలపై గళమెత్తిన విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. 

విశాఖ పోలీసులపై మంత్రి అయ్యన్న పాత్రుడు ఆగ్రహం

విశాఖ : విశాఖ పోలీసులపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో రౌడీ సంస్కృతి పెరుగుతోందన్నారు. 

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి పోచారం

హైదరాబాద్ : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతు రుణాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా..కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. 

శాసనసభ సమావేశాల తర్వాత జిల్లాల్లో సీఎం పర్యటన : మంత్రి హరీష్

హైదరాబాద్ : శాసనసభ సమావేశాలు తర్వాత సీఎం జిల్లాల్లో పర్యటిస్తారని మంత్రి హరీష్ రావు చెప్పారు. నామినేటెడ్, పార్టీ పదవులను దసరాలోపే భర్తీ చేస్తామన్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెడతామని పేర్కొన్నారు. 

19:47 - October 6, 2015

కర్నూలు : జిల్లాలోని ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఓ దళిత మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నల్లకాలువకు చెందిన లక్ష్మీదేవి గత కొద్దిరోజులుగా తన భర్త స్నేహితులు వేధిస్తున్నారని.. ఆత్మకూరు ఎస్సై మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. దీనిపై పలుమార్లు కలిసి గోడు వెల్లబోసుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా లక్ష్మీదేవిని అసభ్య పదజాలంతో ధూషిస్తూ.. మహేందర్‌రెడ్డి ఆమెను బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు.. పీఎస్‌ ముందే పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను హుటాహుటినా దగ్గరలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో లక్ష్మీదేవిని అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

 

19:43 - October 6, 2015

విజయవాడ : వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో జగన్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విమానాశ్రయానికి అవసరమైతే తన రిసార్ట్ కూడా ఇస్తానని మంత్రి అన్నారు. రాజధాని, పోలవరం ఎడమ కాలువ నిర్మాణాలను అడ్డుకుంటే.. జగన్‌ భూ స్థాపిపితం అవుతారని అన్నారు. 

19:39 - October 6, 2015

నెల్లూరు : పారిశ్రామిక వేత్త, వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఇంటిపై ఐటీ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. చెన్నై, హైదరాబాద్‌లోని ఆయన నివాసాలపై ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. వేమిరెడ్డికి సౌతాఫ్రికాలో కోల్‌మైన్స్ తో పాటు అంతర్జాతీయంగా నిర్మాణ సంస్థలున్నాయి. జార్ఖండ్‌తో పాటు రాష్ట్రంలోని పట్టిసీమ పనులు కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

 

19:35 - October 6, 2015

విజయనగరం : జిల్లాలో కలుషిత ఆహారం తిని 40మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎస్‌ కోటలోని పుణ్యగిరి జూనియర్‌ కళాశాల హాస్టళ్లో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన విద్యార్థి సంఘాలు, మీడియాను కళాశాల నిర్వాహకులు అడ్డుకున్నారు. అంబులెన్స్ కూడా లోపలికి రానివ్వలేదు.. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతికి ఇదే పరిస్థితి ఎదురైంది.. దీంతో ఆగ్రహించిన ప్రజాప్రతినిధులు కాలేజీలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. అటు విద్యార్థి సంఘాలు కాలేజీముందు ఆందోళనకు దిగాయి. ఈ విషయంపై విచారణ కోసం వచ్చిన ఆర్ ఐవో తూతూ మంత్రంగా తనపని పూర్తిచేసుకొని వెళ్లారు. బాధిత విద్యార్థులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

 

19:29 - October 6, 2015

కరీంనగర్ : జిల్లాలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. 10 తరగతి సాంఘిక శాస్త్రం మూడవ విభాగం ప్రశ్నా పత్రంలో వారి అలసత్వం బహిర్గతమైంది. భారతదేశం మ్యాప్‌లో అతి తక్కువ ఉష్ణోగ్రత గల రాష్ట్రాలను గుర్తించాలన్నారు. అన్ని రాష్ట్రాలను గుర్తించిన అధికారులు తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం విస్మరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పటం ఇవ్వడంతో...విషయాన్ని గుర్తించిన హుజురాబాద్‌ విద్యార్థులు టీచర్ల దృష్టికి తెచ్చారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

 

19:16 - October 6, 2015

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టిడిపి నేత రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు పట్టించుకోని సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లి తెగ ఎంజాయ్‌ చేశారని ఆయన ఆరోపించారు. ఇంతకంటే దౌర్భాగ్యపు ప్రభుత్వం ఏ రాష్ట్రంలోను ఉండదని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మకావోలో ఏం చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధిత రైతుల కుటుంబాలకు తక్షణం 6 లక్షల రూపాయలు చెల్లించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

 

19:12 - October 6, 2015

హైదరాబాద్ : వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్లు.. భవిష్యత్‌కు లైఫ్‌లైన్లని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. శాసనసభలో వాటర్‌గ్రిడ్‌పై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ ఆడబిడ్డ మంచినీటి కోసం బిందెపట్టుకొని రోడ్డెక్కకూడదని సీఎం కేసీఆర్ సంకల్పించి వాటర్‌గ్రిడ్‌కు శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. సిద్దిపేటలో కేసీఆర్ అమలుచేసిన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని చెప్పారు. గ్రావిటీ ద్వారా ఇంటింటికి నీటి సరఫరా చేస్తామని చెప్పారు. రాబోయే మూడేళ్లలో ఇంటింటికీ మంచి నీరందిస్తామని స్పష్టం చేశారు.

 

18:42 - October 6, 2015

హైదరాబాద్ : కేసీఆర్‌ తన కేబినెట్‌లో మార్పులు చేర్పులకు సిద్ధమయ్యారు. కొందరు సీనియర్లపై వేటు పడబోతుండగా.. కొత్తగా మరికొందరికి ఆహ్వానం పలకబోతున్నారు. కేబినెట్‌ నుంచి ఎవరిని తొలగించినా.. వారికి నామినేటెడ్‌ పదవులతో ఏ మాత్రం హోదా తగ్గకుండా కూడా ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు ఇన్‌..ఎవరు అవుట్‌ అదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌.
ఈ శనివారమే ముహూర్తం?
గత సంవత్సరం జూన్‌లో కొత్త మంత్రివర్గం కొలువుతీరాక.. జనవరిలో మార్పులు చేసిన కేసీఆర్‌.. మరోసారి తన కేబినెట్‌కు కొత్త కలర్‌ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ శనివారమే ఆ కార్యక్రమం జరగబోతుంది. అసెంబ్లీ త్వరగా వాయిదా పడితే ఇంకా ముందే జరిగినా ఆశ్చర్యం లేదు. రంగం మాత్రం మొత్తం సిద్ధమైపోయింది.
మంత్రి జగదీష్‌రెడ్డి అవుట్‌?
కొందరిపై అసంతృప్తి.. మరికొందరు సీనియర్లకు అనారోగ్యం.. మహిళలకు స్థానం లేదనే విమర్శలు.. వీటన్నిటికి కేసీఆర్‌ తనదైన పరిష్కారం చూపబోతున్నారు. మొదటగా హోంమంత్రిగా ఉన్న నాయినికి భద్రతా సలహాదారు పదవితో కేబినెట్‌ హోదా కొనసాగించి.. హోంశాఖా మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావుకు అవకాశమివ్వబోతున్నట్లు సమాచారం. అలాగే మంత్రి జగదీష్‌రెడ్డిని తప్పించి.. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి అవకాశమివ్వబోతున్నారు.
చందూలాల్‌ స్థానంలో కోవా లక్ష్మి?
అనారోగ్య కారణాలతో గిరిజన శాఖా మంత్రి చందూలాల్‌ను తప్పించనున్నారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్‌కే చెందిన కోవా లక్ష్మికి అవకాశమివ్వనున్నారు. మంత్రి జోగురామన్న స్థానంలో వరంగల్‌కు చెందిన దాస్యం వినయ్‌భాస్కర్‌కు ఛాన్సు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మంత్రి కేటీఆర్‌కు అదనంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి?
మంత్రి కేటీఆర్‌కు ఇప్పుడున్న శాఖలతో పాటు.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు కూడా అప్పచెప్పనున్నట్లు ప్రచారం. అయితే అన్ని విషయాలను కేసీఆర్‌ కొద్దిమంది సన్నిహితులతో తప్ప.. చాలా గుట్టుగా ఉంచుతున్నారు. చివరిక్షణంలో ఈ పేర్లలో మార్పులు చేర్పులు జరిగినా ఆశ్చర్యం లేదు.

 

18:13 - October 6, 2015

హైదరాబాద్ : 2016-17 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌పై ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సమీక్ష చేశారు. ప్రణాళికేతర, రెవెన్యూ వ్యయాలు తగ్గించుకుంటామని చెప్పారు. ప్రణాళిక, పెట్టుబడి వ్యయాలు పెంచుతామన్నారు. 7 మిషన్ల ప్రాతిపదికగా ఈ ఏడాది నిధుల కేటాయింపు ఉంటుందని చెప్పారు. 

18:02 - October 6, 2015

హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి విషపూరితం.. అభివృద్ధితో పాటే ‘వాయు కాలుష్యం’ తారస్థాయికి చేరుతోంది. వాయుకాలుష్యం అత్యంత తీవ్రంగా ఉన్న 381 నగరాల్లో ఢిల్లీ కూడా స్థానం సంపాదించింది. ఎయిర్ పొల్యూషన్ పై యూకేకి చెందిన మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ అనే సంస్థ చేసిన సర్వే మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు బయట పడ్డాయి. దక్షిణాసియాదేశాల్లోని నగరాల్లో టాప్‌గా నిలిచింది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక సారాంశం ఇది. వాయుకాలుష్యం తీవ్రంగా ఉన్న టాప్‌ 20 నగరాల్లో 19 నగరాలు దక్షిణాసియా దేశాలే కావడం గమనార్హం. బంగ్లాదేశ్‌, భారత్‌, నేపాల్‌, పాకిస్థాన్‌లలో గ్రామాల్లో కన్నా.. పట్టణాల్లోనే జీవిత కాలం తక్కువగా ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికను ప్రపంచ బ్యాంకు ఉటంకించింది. నగరాల విస్తరణతో వాహనాల నుంచి వెలువడుతున్న ఉద్గారాలు, పరిశ్రమల్లో శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వెలువడుతున్న కాలుష్య కారకాలతో వాయుకాలుష్యం పెరుగుతోందని నివేదికలో పేర్కొంది. తద్వారా ఊపిరితిత్తుల సమస్యలు పెరిగి.. శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, లంగ్‌ కేన్సర్‌, గుండె వ్యాధులు వస్తున్నాయని తెలిపింది.

ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు : తమ్మినేని

వరంగల్ : ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వరంగల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

17:56 - October 6, 2015

వరంగల్ : ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వరంగల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలంటే వామపక్షాల ఉమ్మడి వరంగల్‌ ఎంపీ అభ్యర్థి గాలి వినోద్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తమ్మినేని పిలుపునిచ్చారు. ఆశావర్కర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

 

17:49 - October 6, 2015

పిల్లల దత్తతలన్నీ చట్టపరంగా, నిబంధనలకనుగుణంగా జరగాలని వక్తలు సూచించారు. ఇదే అంశపై మానవి నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్యామ సుందరి, అడ్వకేట్ శ్రీశైలం, సీడబ్ల్యుసీ చైర్ పర్సన్ పద్మావతి పాల్గొని, మాట్లాడారు. దత్తత తీసుకున్న పిల్లల బాగోగుల పట్ల ప్రభుత్వం నుంచి మానిటరింగ్ ఉండాలని కోరారు. దత్తత స్వీకరించిన పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. దత్తతకు వెళ్లిన పిల్లలను మధ్యలో వదిలేసే స్థితి మారాలని చెప్పారు. పిల్లలు తప్పులు చేసినా క్షమించే తీరును దత్తత స్వీకరించిన తల్లిదండ్రులు అలవర్చుకోవాలన్నారు. దత్తత పట్ల సమాజంలో అవగాహన రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దత్తతకు తీసుకున్న పిల్లలను తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో ఆదరించాలన్నారు. దత్తత స్వీకరించే తల్లిదండ్రులు పిల్లల రంగు, రూపు వంటి విషయాలను విస్మరించాల్సిన అవసరముందని చెప్పారు. దత్తత కోసం అక్రమ పద్ధతులను అనుసరించే వారికి కఠిన శిక్షలు అమలులో ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రైతులకు న్యాయం జరిగే వరకు పోరు : లక్ష్మణ్

హైదరాబాద్ : రైతులకు న్యాయం జరిగే వరకు టీడీపీ, బీజేపీ కలిసి పోరాటం చేస్తాయని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ ఎన్నికల హామీలను ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు.

 

టీఆర్ ఎస్ కార్యకర్తలను రోడ్లపై తిరగనివ్వం : ఎర్రబెల్లి

హైదరాబాద్ : రైతుల సమస్యలు పరిష్కరించకపోతే టీఆర్ ఎస్ కార్యకర్తలను రోడ్లపై తిరగనివ్వమని టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ హెచ్చరించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

17:02 - October 6, 2015

హైదరాబాద్ :వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలలో ఉండే బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవులను సంరక్షించేందుకు మేం సదా సిద్ధంగా ఉంటామని ఆవును కాపాడుకోవడానికి తాము ఎవరినైనా చంపడానికైనా, చావడానికైనా సిద్ధమని ప్రకటించారు. గో మాతను ఎవరైనా చంపాలని చూస్తే తాము వూరుకోమని స్పష్టం చేశారు. గతంలో ఆయన గాంధీని చంపిన గాడ్సే ను గొప్ప దేశభక్తుడిగా కీర్తించారు. బీజేపీ కార్యక్రమం ఘర్ వాపసీ నేపథ్యంలోనూ ఆయన పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేదార్ నాథ్ ఆలయంలోకి రాహుల్ గాంధీ వెళ్లడం వల్లే నేపాల్ లో భూకంపం వచ్చిందని అని వివాదాస్పదుడయ్యారు. బీఫ్ తినే రాహుల్ కేదార్ నాథ్ ను సందర్శించడంతోనే ఇలాంటి ఉత్పాతం సంభవించిందని ఆయన అనడంతో అప్పట్లో కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. అలాగే కరెక్టుగా తొమ్మిది నెలల కిందట ఈ ఏడాది జనవరి 6న కూడా ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రతి హిందూ మహిళా కనీసం నలుగురు పిల్లలను కని దేశంలో హిందువుల సంఖ్య పెంచాలని ఆయన బహిరంగంగా పిలుపునిచ్చారు. దీంతో ఆయన కామెంట్లను పార్టీ మాటగానే అంతా భావిస్తున్నారు. మోడీ ప్రధాని పదవిలో ఉండగానే రామమందిరం నిర్మిస్తారని కూడా ఆయన ఓసారి అన్నారు. తాజాగా ఆయన చావడానికైనా చంపడానికైనా సిద్ధమేనని అనడంతో ఆయన అందరిలాంటి ఎంపీనా కిల్లర్ ఎంపీనా అన్న విమర్శలు వస్తున్నాయి.

16:41 - October 6, 2015

గుంటూరు : ప్రజా రాజధాని కావాలని.. కార్పొరేట్ రాజధాని కాదని సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి పి.మధు అన్నారు. రాజధాని ప్రజలకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. గుంటూరు జిల్లా కృష్ణానగర్‌లో సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడారు. కౌలు చెక్కులు, పింఛన్లు విడుదల చేయాలని కోరారు. కౌలు చెక్కులు రైతులందరికి ఇవ్వలేదని కేవలం 30 మందికి మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో నుంచి మురికి వాడల తొలగింపు నిర్ణయాన్ని విమరమించుకోవాలని బాబూరావు సూచించారు. కృష్ణానగర్‌లో ఇళ్లకు పట్టాలివ్వాలని కోరారు. పింఛన్లు ఇవ్వకుండా చీరా సారా ఇస్తే సరిపోదని... ప్రజల కడుపు నింపి రాజధాని శంకుస్థాపన చేయాలని పేర్కొన్నారు.

 

16:29 - October 6, 2015

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఇంద్రాణి ముఖర్జీయా కేసు కొత్త మలుపు తిరిగింది. కన్న కూతురు షీనా బారాను హత్య చేసిందనే ఆరోపణలపై అరెస్టయిన ఇంద్రాణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పేర్కొంటూ బైకుల్లా జైలు అధికారులు ఆమెను ముంబైలోని జేజే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స జరిపించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్యకు పాల్పడలేదని మహారాష్ట్ర ప్రభుత్వానికి అందిన నివేదిక పేర్కొంది. ఈమేరకు జేజే ఆస్పత్రి వైద్యాధికారులను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. షీనా బోరా హత్య కేసును మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ నిమిత్తం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఇంద్రాణి సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు నాటకమాడినట్టు భావిస్తున్నారు. పోలీసుల విచారణలో ఇంద్రాణి కూడా తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడలేదని తెలిపారు. కాగా, ఇంద్రాణిని విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

16:29 - October 6, 2015

చిత్తూరు : తిరుమల రెండవ ఘాట్‌లో విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్నట్లు జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. కేవలం ఒక గంటలోనే ట్రాఫిక్‌ను పునరుద్ధరించామని ఆయన అన్నారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న శ్రీనివాసరాజు.. పగుళ్లున్న ఇతర రాళ్లను కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. అంతకుముందు.. టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డి.సాంబశివరావు తదితరులు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.

 

భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురాస్కారం...

హైదరాబాద్ : భౌతికశాస్త్రంలో 2015 సంవత్సరానికిగానూ ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. తకాకి కజిత (జపాన్), ఆర్థర్ బి.మెక్ డొనాల్డ్ (కెనడా) లకు ఈ పురస్కారం ప్రకటించారు. న్యూట్రినోలు ఎలా పనిచేస్తాయన్న అంశంపై చేసిన పరిశోధనకు గానూ రాయల్ స్వీడిష్ అకాడమీ వారు ఈ పురస్కారం ప్రకటించారు.  

16:22 - October 6, 2015

హైదరాబాద్ : ఆవు మాంసం తిన్నారనే ఆరోపణలతో యూపీలోని దాద్రీలో ఇఖ్లాక్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన మరువక ముందే మహారాష్ట్రలో సుమారు 100 కేజీల బీఫ్‌ను తరలిస్తున్న వాహనానికి సుమారు 100 మంది నిప్పు పెట్టారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మహారాష్ట్రలో బీఫ్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో అక్రమంగా అమ్మేందుకు కొందరు యత్నించారు. అహ్మద్‌నగర్ నుంచి ఔరంగాబాద్‌కు బీఫ్‌ను తరలిస్తుండగా సావ్‌ఖేడా గ్రామం వద్ద వ్యాన్‌ను ఆపి డ్రైవర్‌తో గొడవకు దిగి నిప్పు పెట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వ్యాన్‌లో తరలిస్తున్నది బీఫ్ అని నిర్ధారించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఇక బీఫ్‌ను తరలిస్తున్న డ్రైవర్‌పై, నిప్పు పెట్టిన ఆందోళనకారులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

16:13 - October 6, 2015

హైదరాబాద్ : తాము ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించాక ఇక జీవితమంతా కూడా ఆర్టిస్ట్‌గానే ఉంటాం. తమ జీవితాలు అంతే అనే రీతిలో చెప్పుకొచ్చారు అందాల తార ఐశ్వర్యరాయ్. జజ్బా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఐష్ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాలో అనురాధ వర్మ పాత్ర ఐదేళ్ల క్రితం చేసుంటే ఎలా ఉండేదో తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం ఆ పాత్రను పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని నటించానని పేర్కొంది. ఇక వెండి తెరకు దూరంగా ఉన్నంత మాత్రాన ఆర్టిస్ట్ హోదా మారదు. వారు జీవితాంతం ఆర్టిస్ట్‌గానే కొనసాగుతారు. ఆర్టిస్టుల జీవితంలో విశ్రాంతి లభించడం, షూటింగ్‌లలో బిజీ అయిపోవడం సాధారణమే. ఎంత గొప్ప నటులైనా ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తారని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

16:08 - October 6, 2015

వరంగల్ : ఆశావర్కర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఉమ్మడి వామపక్షాల వరంగల్‌ ఎంపీ అభ్యర్థి గాలి వినోద్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో వామపక్షాల, సామాజిక శక్తుల సదస్సు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆశావర్కర్లు గాలి వినోద్‌కుమార్‌ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశావర్కర్లు దుర్భర జీవితాలను గడుపుతున్నా.. సర్కార్‌ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశావర్కర్ల సమస్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల వినోద్‌కుమార్‌ కన్నీరు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

9కి వాయిదా పడ్డ అగ్రిగోల్డ్ విచారణ

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ సంస్థ కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. దాంతో ఈ కేసులో ఆస్తుల వేలంపై ఏర్పాటు చేయాల్సిన పర్యవేక్షణ కమిటీపై నిర్ణయం కూడా వాయిదా పడింది. అగ్రిగోల్డ్ కు చెందిన మరో 300 ఆస్తులకు సంబంధించి మధ్యాహ్నం విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ కు చెందిన మూడు ఆస్తులమ్మేందుకు కోర్టు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఆస్తుల విక్రయంపై ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని అగ్రిగోల్డ్ ను ఆదేశించింది. ఆస్తుల వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ పేరుతో ప్రత్యేక ఖాతా తెరిచి అందులో జమ చేయాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

కేసీఆర్ దొర తనానికి నిదర్శనం :మధుయాష్కీ...

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల నుంచి ప్రతిపక్షాలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడం కేసీఆర్ దొరతనానికి నిదర్శనమని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంపై కేసీఆర్‌కు అవగాహనలేదని , ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. తమ బతకును బంగారుమయం చేస్తాడని ప్రజలు.. కేసీఆర్‌ చేతికి రాష్ట్రం అప్పగిస్తే రాంబదుల్లా దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఫీజులు కట్టలేక రైతుల బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. దొంగ ఎన్‌కౌంటర్లతో ఉద్యమాలు ఆగవని ప్రభుత్వాన్ని మధుయాష్కీ హెచ్చరించారు.` 

15:56 - October 6, 2015

హైదరాబాద్‌ : నరంలోని ఇందిరాపార్క్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గిరిజనులకు 10 రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ.. గిరిజన సంఘాల ఐక్య వేదిక చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా గిరిజన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అసెంబ్లీకి బయలుదేరుతుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గిరిజన నాయకులు రోడ్డుపైనే బైఠాయించి.. నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గిరిజన సంఘాల నాయకులను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. పోలీసుల ఓవరాక్షన్‌పై ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. తెలంగాణ గిరిజన సంఘం నేత శ్రీరాంనాయక్ మాట్లాడుతూ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ గిరిజన సంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. గిరిజనుల సమల్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

 

తమిళనాడు గవర్నర్ రోశయ్యకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్ : తమిళనాడు గవర్నర్ రోశయ్యకు హైకోర్టులో ఊరట లంభించింది. రోశయ్య స్క్వాష్ పిటిషన్ ను హైకోర్టు అనుమంతించింది. అమీర్ పేట లోని భూ వివాదం కేసును కొట్టివేయాలని రోశయ్య వేసిన స్క్వాస్ పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది. 

15:40 - October 6, 2015

కర్నూలు : జిల్లా రెవిన్యూ శాఖ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అవినీతిని అరికట్టేందుకు ఆన్‌లైన్‌ ద్వారా ఈ-పాస్‌ విధానం ప్రవేశపెడితే...అందులోనూ కొంత మంది అక్రమార్కులు మరింత దర్జాగా దోచుకుంటున్నారు. భూమి అమ్మకం, కొనుగోలు సమయంలోని పాత పాస్‌ పుస్తకాలను ఆధారంగా చేసుకొని జేబులు నింపుకుంటున్నారు.
అధికారుల చాకచక్యం
బలపనూరు గ్రామానికి చెందిన మహ్మద్ గౌస్ కు సర్వే నెంబరు 525లో 1.46 సెంట్ల భూమి అలాగే మరో సర్వే నెంబరులో 17 సెంట్ల భూమి ఉంది. తన అవసరాల నిమిత్తం ఇందులో 1.46 సెంట్ల భూమిని ఇతరులకు విక్రయించి అందుకు సంబంధించిన పాస్ పుస్తకాలను కొన్నవారికి ఇచ్చాడు. ఆ కొనుగోలుదారులు తమ పేరుపై మార్చాలని ఆ పాస్‌పుస్తకాలను అధికారులకు అందజేశారు. ఇక్కడే కొందరు అధికారులు తమ చాకచక్యాన్ని ప్రదర్శించారు. పాత పాస్ పుస్తకాలను కొట్టివేయకుండా అధికారులు తమ వద్దే ఉంచుకొన్నారు. ఆ పాస్‌ బుక్కులో మరో వ్యక్తి ఫోటోను అతికించారు. పుస్తకం పైన ఉన్న పేర్ల స్థానంలో తెల్ల కాగితం అంటించి కొత్తగా మరోకరి పేరు రాసి కొత్త పాస్ పుస్తకాలను సృష్టించారు. అయితే మహ్మద్ గౌస్ తన వద్ద ఉన్న మరి కొంత భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు దరఖాస్తూ చేయగా అసలు నిజం బయట పడింది.
ఆన్‌లైన్‌లో ఆక్రమాలు
తమ పాత పాస్ బుక్కులను, నంబర్లను, ఆధార్‌ను ఆసరాగా చేసుకొని ఆన్‌లైన్‌లో ఆక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు లబోదిబో మంటున్నారు. ఒక పాస్ బుక్కుకు ఇచ్చిన ఖాతా నంబరు మళ్లీ వినియోగించుకోకూడదన్న నిబంధనను తుంగలో తొక్కి, కొందరు అధికారులు గిమ్మిక్కులు చేస్తూ లక్షలు దండుకుంటున్నారు. మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు వీటి పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

15:32 - October 6, 2015

కృష్ణా : గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మార్కెట్లో సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. సోనామసూరి, బీపీటీ, సాంబమసూరి వంటి ఫైన్ రకాల ధరలు.. చూస్తుండగానే పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్ ప్రారంభంలో సోనామసూరి ఒకటో రకం కిలో ధర 36 రూపాయలు పలకగా.. ఇప్పుడు 41 రూపాయలకు చేరింది. సాంబరకం కిలో 34 నుంచి 38 రూపాయలకు చేరింది. నెలరోజుల వ్యవధిలో సోనా క్వింటాలుకు 500 రూపాయలు, సాంబలు 400 రూపాయల వరకు ధరల్లో తేడా రావడం గమనార్హం. సాక్షాత్తు బియ్యం ధరల పెరుగుదలను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, వ్యాపారులు ధృవీకరిస్తున్నారు.
10వేల హెక్టార్లలో పడని వరినాట్లు
కర్ణుడు చావుకు వందకారణాలు వెతికినట్లు.. ఇక్కడ బియ్యం ధరలు పెంచి.. పలు రకాల కారణాలు చెబుతున్నారు. కృష్ణాజిల్లాలో 2014తో పోలిస్తే.. ఈ ఏడాది 10 వేల హెక్టార్లలో వరి నాట్లు పడలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు వర్షాలు మొహం చాటేయటంతో కరవు రాబోతోందనే ప్రచారం పెంచి.. ధరలు విపరీతంగా పెంచుతున్నారు. ఇంతజరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాసంఘాలు ఆదోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు దించకపోతే.. అధికారం కూడా దిగిపోండని హెచ్చరిస్తున్నారు.
భారీగా బియ్యం నిల్వ
ఈ ఏడాది వర్షాభావం, కరువు పరిస్థితుల దృష్ట్యా మిల్లర్లు, వ్యాపారులు పెద్దఎత్తున బియ్యం నిల్వ పెడుతున్నారు. పరిస్థితి ఇలావుంటే.. విజిలెన్స్ దాడులు కూడా నామమాత్రంగానే జరుగుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి.. ప్రజలకు నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

టీ.అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈమేరకు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. 

14:57 - October 6, 2015

పశ్చిమగోదావరి : జిల్లాలోని తణుకులో ఐదేళ్ల బాలుడు హేమంత్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అక్కతో కలిసి స్కూల్‌కు వెళ్తుండగా.. ఓ యువకుడు బైక్‌పై వచ్చి చాక్లెట్‌ ఇస్తానని చెప్పి బాలుడిని ఎత్తుకెళ్లాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

14:57 - October 6, 2015

హైదరాబాద్ : హీరో నాగార్జున స్టార్ డ్రమ్ ను పక్కన పెట్టి అక్కినేని మన్మథుడు వెరయిటీ పాత్రకు ఓకే అన్నట్టు ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. తమిళంలో హిట్టయిన ‘తని వరువన్’ మూవీలో అరవింద్ స్వామి చేసిన విలన్ క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ‘బ్రూస్ లీ’ తర్వాత రామ్‌చరణ్ ఈ సినిమాను తెలుగులో తీసేందుకు రెడీ అవుతున్నాడట, అరవింద్ స్వామి చేసిన క్యారెక్టర్‌ని తెలుగులో పోషించాలని నాగ్‌ను చరణ్ రిక్వెస్ట్ చేశాడట. తమిళ్ వెర్షన్ చూసిన నాగార్జున వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్‌నగర్ టాక్. ఈ ప్రాజెక్టు కనుక పట్టాలెక్కితే ఇద్దరి స్టార్ల ఫ్యాన్స్‌‌కో కొత్త సంబరమే.

 

14:53 - October 6, 2015

చిత్తూరు : టిటిడిలో ఖాళీగాఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి నిరాహారదీక్షకు దిగారు. తిరుపతిలోని టిడిడి పరిపాలన భవనం దగ్గర ఆయన దీక్ష చేపట్టారు. 48గంటలపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ టిటిడిలో 607 ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగం అగ్నికనికలాగా వ్యాపిస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్సీ వి.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ వాస్తవానికి లక్షకు పైగా పోస్టలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. టిడిపి నిజస్వరూపం బయటపడేది దాకా ఆగాలనుకున్నానం. ఆగాం.... సమస్యలను పరిష్కారం కాకపోయే సరికి ఇప్పుడు ఆందోళన చేపట్టామని తెలిపారు. ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం మీన మేశాలు లెక్కపెడుతుందని విమర్శించారు. సమస్యల పరిష్కారానికి విశాలమైన ఉద్యమాన్ని చేస్తామని చెప్పారు.

 

మీ ఇంటికి మీ భూమి రెండో విడత - కేఈ..

హైదరాబాద్ : నవంబర్ 1 నుండి 15వ తేదీ వరకు మీ ఇంటికి మీ భూమి రెండో విడత కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి కేఈ వెల్లడించారు. తొలి విడత మీ ఇంటికి మీ భూమిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలపై త్వరలోనే టోల్ ప్రీ నెంబర్ ఏర్పాటు చేయనున్నామని, శాఖలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందచేస్తామన్నారు. 

చెంచుల సమస్యలను పరిష్కరిస్తాం - మంత్రి రావెల..

విజయవాడ : చెంచుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి రావెల కిశోర్ బాబు పేర్కొన్నారు. రేపు శ్రీశైలంలో చెంచులకు రుణాలు పంపిణీ చేయనున్నట్లు, చెంచుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రగతిని జగన్ అడ్డుకుంటున్నారని, దొంగ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 

సభలో టి.సర్కార్ వ్యవహార శైలి సరిగ్గా లేదన్న ఆర్. కృష్ణయ్య..

హైదరాబాద్ : సభలో ప్రభుత్వ వ్యవహార శైలి సరిగ్గా లేదని టిడిపి నేత ఆర్. కృష్ణయ్య మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతునొక్కడం అప్రజాస్వామికమని, సభ్యుల సస్పెన్షన్లు దుష్ట సంప్రదాయమన్నారు. సస్పెన్షన్ విషయంలో స్పీకర్ ఆలోచించాలని కోరారు. 

 

భవనం కబ్జాకు టిడిపి నేత యత్నం..అరెస్టు..

గుంటూరు : కొత్తపేటలోల భవనం కబ్జాకు టిడిపి నేత ప్రభాకర్ యత్నించారు. రూ. కోట్ల విలువైన భవనాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పెద్ద మొత్తంలో ప్రభాకర్ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

యనమలను కలిసిన ఏపీ ఎన్జీవో నేతలు..

హైదరాబాద్ : మంత్రి యనమలను ఏపీ ఎన్జీవో నేతలు కలిశారు. పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఔట్ సోర్సింగ్ వ్యవస్థను ప్రోత్సాహించడం మంచిది కాదని అభిప్రాయం తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగును పర్మినెంట్ చేయడంతో పాటు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 

13:42 - October 6, 2015

హైదరాబాద్ : పోరాటాల తోనే సమస్యలు పరిష్కారమవుతాయని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. హైదరాబాద్‌ ఇందిరా పార్క్ దగ్గర ఆశావర్కర్ల దీక్షలను ఆయన ప్రారంభించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఈ దీక్షలు చేస్తున్నారు.

13:40 - October 6, 2015

విజయవాడ : రాజధాని ప్రజలకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. గుంటూరు జిల్లా కృష్ణానగర్‌లో సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు ఈ పాదయాత్రను ప్రారంభించారు. ప్రజా రాజధాని కావాలని, కార్పొరేట్‌ రాజధాని కాదని మధు అన్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో మధు మాట్లాడారు. కౌలు వారికి చెక్కులు ఇవ్వాలని..కేవలం 30 మందికి మాత్రమే ఇచ్చారని అలాగే 28 వేల మందికి పెన్షన్ ఇస్తామని చెప్పి కొంతమంది మాత్రమే పెన్షన్ ఇచ్చారని తెలిపారు. రాజధాని మురికివాడలు ఉండ కూడదని సీఎం బాబు చెప్పారని, అలాగే ప్లాన్ లో కూడా పొందుపరిచినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో దళితులు, బలహీన వర్గాల వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వెంటనే దీనిని నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణ నగర్ ను రాజధాని ప్రాంతంలో చూపించడంతో ఉన్నటువంటి నివాసాలను ఎత్తేస్తారనే భయం ఉందన్నారు. పేద ప్రజలను తరిమేసే రాజధాని అవసరం లేదని డిమాండ్ చేశారు. అమరావతి నగరమైనటువంటి 29 గ్రామాల్లో పాదయాత్ర జరుగుతుందని బాబురావు పేర్కొన్నారు. అన్ని వర్గాల సమస్యలు తెలుసుకుంటామని, శంకుస్థాపనకు ఉత్సాహం చూపుతున్న ప్రభుత్వం పేద ప్రజల సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. రుణమాఫీ చేసిన వాగ్దానం అమలు చేయాలని, శంకుస్థాపన అమలు చేసే సమయంలోనే ఇవన్నీ అమలు చేయాలన్నారు. పాదయాత్ర ముగింపులో 13వ తేదీన తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపడుతామన్నారు. 

13:34 - October 6, 2015

హైదరాబాద్ : ఎట్టకేలకు గుణశేఖర్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’ శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. గ్రాఫిక్స్ వండర్‌తో ‘బాహుబలి’ హిట్ కాగా, ‘పులి’ డిజాస్టర్ అయ్యింది. దీంతో ‘రుద్రమదేవి’ ఎలా వుంటుందోనన్న టెన్షన్ సినీ లవర్స్‌ని వెంటాడుతోంది. .ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ దీన్ని రిలీజ్ చేస్తున్నాడు గుణ శేఖర్. ఇటీవల ఈ సినిమా టీమ్ ప్రెస్‌మీట్‌లో చిత్ర విశేషాలను మీడియాతో డైరెక్టర్ గుణశేఖర్ ఎపిక్ డ్రామాగా అభివర్ణించారు కూడా! భారీ హిస్టరీ బ్యాక్ డ్రాప్ స్టోరీని కేవలం రెండున్నర గంటల సేపు తనదైన శైలిలో తెరకెక్కించడంలో తాను పడిన శ్రమను డైరెక్టర్ గుర్తు చేసుకున్నాడు. మరోవైపు సినిమా హిట్టయితే మూడురోజుల్లోనే కలెక్షన్స్ రాబట్టవచ్చని బయ్యర్స్ అంచనా వేస్తున్నారు.

ఓ రేంజ్ లో ప్రమోషన్....

‘రుద్రమదేవి’ శుక్రవారం విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ప్రమోషన్ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఓ వైపు నటీనటులు, ఇంకోవైపు డైరెక్టర్ హడావుడి చేస్తున్నారు. అద్భుతమైన సెట్స్, కాస్ట్యూమ్స్, గ్రాఫిక్స్ ఇలా వెండితెరపై అనుష్క రుద్రమదేవి గెటప్‌లో అదుర్స్ అని అంటున్నారు. ఇదిలావుండగా శుక్రవారం ఉదయం 5 గంటలకు స్పెషల్ షోకు ఏర్పాట్లు చేసినట్టు టాక్. దీనికి సెలబ్రిటీస్ హాజరు కాబోతున్నారట. అంతేకాదు మేజర్ సిటీస్‌లో బెనిఫిట్ షోలకు ప్లాన్ చేసినట్లు ఇన్‌సైడ్ న్యూస్. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు సమాచారం. దాదాపు 80 కోట్ల పైచిలుకు బడ్జెట్ కావడంతో డైరెక్టర్ గుణశేఖర్ ఏ విషయంలోనూ రాజీ పడలేదని యూనిట్ చెబుతోంది. ఏది ఏమైనా మూవీ సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

13:33 - October 6, 2015

హైదరాబాద్ : సస్పెన్షన్‌ పేరుతో సభలో ప్రతిపక్షాల గొంతునొక్కడం సరికాదని, తనను సస్పెండ్ చేయకపోయినా సభకు వెళ్లడం లేదని టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా సభ జరగడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఒక తప్పుగా అవుతుందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, స్పీకర్‌ పునరాలోచించి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్నారు. సభ్యులందరిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

13:30 - October 6, 2015

హైదరాబాద్ : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పధకం అమలులో కాస్త ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవం అని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసెంబ్లీలో అంగీకరించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తారాల సమయంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కడియం సమాధానం చెప్పారు. ఈవిషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందని, కాల పరిమితి తగ్గించాలని సూచించడం జరిగిందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్దిదారులు తహశీల్దార్‌ కార్యాలయంలో లేదా.. పంచాయతీ రాజ్ శాఖ వారు పల్లె ప్రగతి సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వేయి గ్రామాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నట్లు పల్లెప్రగతి సేవా కేంద్రాల్లోనూ పేర్లు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. విచారణ అనంతరం చెక్కులు, డబ్బులు ఇక్కడి నుండే తీసుకోవచ్చని మంత్రి కడియం తెలిపారు. 

13:25 - October 6, 2015

హైదరాబాద్ : అంగన్ వాడీలకు నూతన భవనాలు నిర్మిస్తామని, అప్పటి వరకు ఖాళీగా ఉన్న పాఠశాలల భవనాలను ఉపయోగించుకోవాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు తుమ్మల సమాధానం చెప్పారు. అంగన్‌వాడీల పర్యవేక్షణను స్థానిక ప్రజాప్రతినిధులు చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అంగన్‌వాడీల అటెండెన్స్ కు త్వరలో బయోమెట్రిక్‌ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. అంగన్ వాడీల జీతాల పెంపు వల్ల ప్రభుత్వంపై రూ.205 కోట్ల భారం పడుతోందని, ఆరోగ్య లక్ష్మీ ద్వారా గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. 

13:20 - October 6, 2015

హైదరాబాద్ : శాసన మండలి డిఫ్యూటీ ఛైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌ ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. విద్యాసాగర్‌ను ఎన్నికున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతి విద్యాసాగర్‌ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహ్మద్ ఆలీ, మంత్రులు నాయినీ ఇతరులు అభినందనలు తెలిపారు. 

గజ్వేల్ ఎమ్మార్వో వద్ద టీడీపీ, బీజేపీ ధర్నా..

మెదక్ : గజ్వేల్ ఎమ్మార్వో ఆఫీసు వద్ద టీడీపీ, బీజేపీ ధర్నా నిర్వహించాయి. రైతు ఆత్మహత్యలప ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టింది. ఈ ధర్నాలో ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేపీ ఫ్లోర్ లీడర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.

 

 

హస్తినలో అగ్నిప్రమాదం..

న్యూఢిల్లీ : సీజీవో కాంప్లెక్సులో మంగళవారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎనిమిది ఫైర్ ఇంజన్ లతో సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

 

బాష్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన మోడీ..మెర్కెల్..

బెంగళూరు : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జర్మని ఛాన్సెలర్ ఏంజెల్ మెర్కెల్ లు బాష్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. పెట్టుబడులకు భారత్ ఎంతో అనుకూలమని పేర్కొన్నారు. తయారీ రంగాన్ని ప్రోత్సాహించాలనే మేక్ ఇన్ ఇండదియా చేపట్టామని, పరిశ్రమలకు వేగవంతంగా అనుమతులిస్తున్నట్లు చెప్పారు. 

ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించిన ఏపీ మంత్రి ఉమా..

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవ ఏర్పాట్లను ఏపీ మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు. 

టి. శాసనమండలి ఉపాధ్యక్షుడిగా నేతి..

హైదరాబాద్ : తెలంగాణ శాసనసమండలి ఉపాధ్యక్షుడిగా నేతి విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మండలిలో ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహ్మద్ ఆలీ, మంత్రులు నాయినీ ఇతరులు అభినందనలు తెలిపారు. 

12:33 - October 6, 2015

హైదరాబాద్ : కాంట్రాక్టు ఉద్యోగాలపై టి.సర్కార్ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో 25వేల 529 మంది కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తించినట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. వీరిని రెగ్యులరైజ్ చేసేందుకు విధి విధానాలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ఇప్పటికే ఇచ్చిన నివేదికలో న్యాయపరమైన అంశాలు చర్చించి రెగ్యులరైజ్ చేస్తామని హామీనిచ్చారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో తమకు సంబంధం లేదన్నారు.

12:26 - October 6, 2015

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ మోసం చేసిన కేసులో హైకోర్టు తీర్పు ఏం తీర్పు వెలువరిస్తుందోనన్న ఉత్కంఠ బాధితుల్లో నెలకొంది. మంగళవారం హైకోర్టుపై దీనిపై విచారణ జరిగింది. విచారణ ఈ మధ్యాహ్నాం 02.15 గంటలకు వాయిదా పడింది. అంతకుముందు జరిగిన విచారణకు అగ్రిగోల్డ్ ఛైర్మన్ వెంకట్రామయ్య, నలుగురు డైరెక్టర్లు, ఏపీ సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు ఇతర అధికారులు హాజరయ్యారు. ఈసందర్భంగా విజయవాడ, బెంగళూరులోని అగ్రిగోల్డ్ స్థిరాస్తులపై కోర్టు ఆరా తీసింది. ఆస్తులు విక్రయిస్తే ఎంత డబ్బు వస్తుందనే దానిపై న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపి తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ వ్యాఖ్యానాలు చేసింది. అగ్రిగోల్డ్ ఎండీతో పాటు ఆరుగురు డైరక్టర్ల ఆస్తుల వివరాలను లిఖిత పూర్వకంగా అందచేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
గత ఆరు నెలలుగా ఈ కేసు విచారణ సాగుతుందని... సాధ్యమైనంత త్వరగా ఈ విచారణ ముగించాలని బాధితుల తరపు న్యాయవాది హైకోర్టుకి విజ్ఞప్తి చేశారు.

12:25 - October 6, 2015

హైదరాబాద్ : బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ కు ఓ నలుగురు అమ్మాయిలు ఫ్యాన్స్ అని చెప్పి దారుణంగా మోసం చేశారట. ఆశ్చర్యంగా ఉంది కదా! ప్రస్తుతం ఈ అంశం బి-టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ వివరాలు ఏంటో ఓ సారి చూద్దాం...

      ముంబై బాంద్రాలో ఓ నైట్ క్లబ్ కి వెళ్లారు. అక్కడ తనకి ఓ నలుగురమ్మాయిలు పరిచయం అయ్యారు. మేం మీ వీరాభిమానులం అంటూ ఆ అమ్మాయిలే తమంతట తాముగా పరిచయం చేసుకున్నారు. ఆ టైమ్ లో సల్మాన్ కొద్దిసేపు వారితో ముచ్చట్లాడారు. ఆ ముచ్చట్లలోనే పక్కనే ఉన్న ఓ టేబుల్ పై తన వస్తువులన్నీ ఉంచి ఎటో వెళ్ళాడు సల్లూ భాయ్. అతడు ఓ నిమిషంలోగా పని పూర్తి చేసుకుని వచ్చేలోగానే ఆ టేబుల్ పై వస్తువులన్నీ మాయం. అంతేకాదు ఫ్యాన్స్ అని చెప్పుకున్న సదరు అమ్మాయిలంతా అక్కడ కనిపించలేదు. వస్తువులు మిస్సింగ్. అమ్మాయిలు మిస్సింగ్. దాంతో సల్మాన్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అయితే ఈ విషయాన్ని మింగలేక కక్కలేక అన్నట్టు ఎవరికి తెలియకూడదని అనుకున్నాడు సల్మాన్. సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ కి ఫిర్యాదు చేయమని చెప్పినా సల్మాన్ సున్నితంగా తిరస్కరించాడు. ఆ మరుసటిరోజు జుహూ ప్రాంతంలోని ఓ స్టార్ హోటల్ లో సినిమా ఫంక్షన్ కి అటెండ్ అయిన సల్మాన్ వేదికపై మాట్లాడుతూ.. ముంబై మరీ అంత సేఫ్ ప్లేస్ కాదు. ఎప్పుడు ఎక్కడ ఏం జరగడానికైనా ఆస్కారం ఉంది అంటూ బాధని వెల్లగక్కాడు. ప్చ్ సల్మాన్. పోగొట్టుకున్నవి ఎంతో విలువైన వస్తువులు. అందుకే అంత ఫీలయ్యాడట పాపం..

12:14 - October 6, 2015

విశాఖపట్టణం : జిల్లాలో మంగళవారం మధ్యాహ్నాం కిడ్నాప్ వార్త కలలకం సృష్టించింది. ముగ్గురు టిడిపి నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారన్న వార్త ప్రకంపనాలు సృష్టించింది. ఏజెన్సీలోని గూడెం కొత్త వీధి మండలానికి చెందిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులను మావోయిస్టులు మంగళవారం ఉదయం అపహరించారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు ఈ ఘటనకు పూనుకున్నట్లు సమాచారం. అపహరణకు గురైన వారిలో గూడెం కొత్త వీధి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మామిడి బాలయ్య పడాల్, టిడిపి జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్కలి మహేష్, జీకే వీధి మండలం సీనియర్ నాయకుడు వండలం బాలయ్యలున్నారు. వీరి కిడ్నాప్ తో ఆయా కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. తమ వారిని క్షేమంగా విడిచి పెట్టాలని కోరుతున్నారు.

12:09 - October 6, 2015

హైదరాబాద్ : వైద్య రంగంలో నోబెల్‌ పురస్కారం ఈ ఏడాది ముగ్గురు వైద్యులను వరించింది. పరాన్నజీవులపై జరిపిన బహుముఖ ప్రయోగాలే వారిని ఈ పురస్కారానికి ఎంపిక చేశాయని నోబెల్‌ జ్యూరీ సభ్యులు సోమవారం వెల్లడించారు. ఐరిష్‌కు చెందిన అమెరికన్‌ విలియం సి కాంప్‌బెల్‌(85), జపాన్‌కు చెందిన సతోషి ఒమురా(80), చైనాకు చెందిన యుయు తు(84)లు నోబెల్‌ పురస్కారాన్ని కౌవసం చేసుకున్నట్టు పేర్కొన్నారు. పురస్కారం కింద 6,19,88,530 రూపాయల్లో(9,50,000 అమెరికన్‌ డాలర్లు) సగ భాగం యుయు తు, మిగిలిన సగ భాగంలో సగం సగం కాంప్‌బెల్‌, ఒమురాలకు డిసెంబరు 10న స్టాక్‌హామ్‌లో జరగనున్న నోబెల్‌ పురస్కార సృష్టికర్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి సభలో ప్రదానం చేయనున్నారు.

పరాన్నజీవులపై ప్రయోగాలు  .......

వీరు సంయుక్తంగా ఏలికపా ములు, వాటివల్ల సంక్రమించే వ్యా ధులు, లింఫాటిక్‌ ఫైలేరియాసిస్‌(బోదకాలు తదితర) పరాన్నజీవులపై ప్రయోగాలు చేశారు. అదేవిధంగా పరాన్నజీవి వల్ల వ్యాపించే చర్మ వ్యాధి.. తదనంతర కాలంలో నేత్ర వ్యాధిగా మార్పుచెంది శాశ్వత అంధత్వానికి దారితీసే రివర్‌ బ్లైండ్‌నెస్‌కు సంబంధించి అవెర్‌మెక్టిన్‌ అనే ఔషధాన్ని కనుగొన్నారు. ఈ నూనత ఔషధం.. రోగిలో వ్యాధి తీవ్రత తగ్గించి, చూపు కోల్పోకుండా సాంత్వన చేకూర్చనుంది. ఇక, కాంప్‌బెల్‌ మడిసన్‌లోని డ్ర్యూ యూనివర్సిటీలో పరిశోధకులు. 33 ఏళ్లపాటు మెర్క్‌లోని ఓ ఫార్మా కంపెనీలో శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. తనకు ఈ నోబెల్‌ పురస్కారం లభించడం అత్యంత ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఒమురా జపాన్‌లోని కిటశాటో యూనివర్సిటీలో పరిశోధకులు. మాజీ ప్రొఫెసర్‌.

మలేరియాకు విరుగుడు...

చైనాకు చెందిన తు.. మలేరియాపై పలు ప్రయోగాలు చేశారు. మలేరియాకు విరుగుడుగా ఆర్టెమైసినిన్‌ అనే ఔషధాన్ని కనుగొన్నారు. తు ప్రయోగాలన్నీ చైనాలో సంప్రదాయ బద్ధంగా వస్తున్న హెర్బల్‌ మెడిసిన్‌(మూలికా వైద్యం) ఆధారంగానే జరిగాయి. ఇక, వైద్య రంగంలో తొలిసారి నోబెల్‌ పురస్కారానికి ఎంపికైన చైనా మహిళగా తు రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఈమె చైనా అకాడమీ ఆఫ్‌ ట్రెడిషనల్‌ చైనీస్‌ మెడిసిన్‌లో చీఫ్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు.

మరిన్ని విభాగాల్లో..

భౌతిక శాస్త్రంలో విశేష కృషి సల్పిన వారిని మంగళవారం, రసాయన శాస్త్రంలో బహుముఖ ప్రయోగాలు చేసిన వారిని బుధవారం, సాహిత్యంలో గురువారం, ప్రపంచ శాంతికి సంబంధించి శుక్రవారం, ఆర్థిక శాస్త్రంలో విశేష సేవలందించిన వారిని సోమవారం నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేయనున్నట్టు జ్యూరీ వెల్లడించింది. నార్వే, స్వీడన్‌లు ఉమ్మడిగా ఉన్న సమయంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌(1833-1896) తన పేరుతో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. నోబెల్‌ వర్ధంతి రోజైన డిసెంబర్‌ 10న స్టాక్‌హామ్‌లో దీనిని అందజేస్తారు.. నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ఓస్లోలో ప్రదానం చేస్తారు.

టిడిపి నేతలను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..

విశాఖపట్టణం : ఏజెన్సీలో ముగ్గురు టిడిపి నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. కిడ్నాప్ అయిన వారిలో జీకే వీధి మండలం టిడిపి ఇన్ ఛార్జీ మహేష్, బాలయ్య పడాల్, మామిడి బాలయ్యలున్నారు. 

అగ్రిగోల్డ్ కేసు మధ్యాహ్నానికి వాయిదా..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసుపై విచారణ కేసు మధ్యాహ్నాం 02.15 గంటలకు వాయిదా పడింది. అగ్రిగోల్డ్ ఎండీతో పాటు ఆరుగురు డైరక్టర్ల ఆస్తుల వివరాలను లిఖిత పూర్వకంగా అందచేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

బీసీలకు కళ్యాణ లక్ష్మి వర్తింపుపై ఆలోచన - డిప్యూటి సీఎం..

హైదరాబాద్ : బీసీలకు కళ్యాణ లక్ష్మి వర్తింప చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద 41,123 మంది లబ్ది పొందారని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి సభకు తెలిపారు. ఈ పథకం కింద ఎస్సీలకు రూ.157.4 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. షాదీ ముబారక్ కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు, వెయ్యి గ్రామాల్లో పల్లె ప్రగతి సేవా కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి సేవా కేంద్రాల ద్వారా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ పథకాన్ని బీసీలకు వర్తింప చేసే అంశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.

అంగన్ వాడీల జీతాల పెంపుతో ప్రభుత్వంపై భారం..

హైదరాబాద్ : అంగన్ వాడీల జీతాల పెంపు వల్ల ప్రభుత్వంపై రూ.205 కోట్ల భారం పడుతోందని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఆరోగ్య లక్ష్మీ ద్వారా గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. అంగన్ వాడీ కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అంగన్ వాడీ సమస్యలపై చర్చించారు. 

ఏలూరులో రైల్వే డీఆర్ఎం తనిఖీలు..

పశ్చిమగోదావరి : ఏలూరు రైల్వేస్టేషన్ లో రైల్వే డీఆర్ఎం అశోక్ తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నుండి దువ్వాడ వరకు కొత్త రైల్వే లైన్ కొరకు రూ.3వేల కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 

బెంగళూరులో కాల్ సెంటర్ పై ఉద్యోగినిపై అత్యాచారం..

బెంగళూరు : కాల్ సెంటర్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హోసూర్ లో డ్యూట ముగించుకురని ఇంటికి వెళుతుండగా మినీ బస్సులో అత్యాచారానికి ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. శనివారం రాత్రి పది గంటల సమయంలో ఈ ఘటన చేసుకుంది. అత్యాచారం అనంతరం యువతిని మదివాలా ప్రాంతంలో దుండగులు వదిలిపెట్టారు. వాహనాన్ని గుర్తించేందుకు నగరంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

గ్రామ జ్యోతితో పల్లెల్లో వెలుగులు నింపుతాం - కేటీఆర్..

హైదరాబాద్ : గ్రామజ్యోతితో పల్లెల్లో వెలుగులు నింపుతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వంద శాతం శానిటేషన్‌కు కృషి చేస్తున్నట్లు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గ్రామసభలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామ సభలను బలోపేతం చేయడం గ్రామజ్యోతి లక్ష్యమని, దీని ద్వారా పల్లెల రూపురేఖలు మారుస్తామన్నారు.

11:45 - October 6, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత.. జైళ్ల శాఖలో భారీగా మార్పులు తీసుకోచ్చారు. దీనిలో భాగంగా కొత్తగా మహాపరివర్తన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఖైదీలలో మానసిక ప్రవర్తనలో మార్పులు తీసుకోచ్చి... వారు మరోసారి నేరాల వైపు మళ్లకుండా ఉండాలనేది జైళ్ల శాఖ ముఖ్య ఉద్దేశం. జైళ్లల్లో ఖైదీలు విడుదల అయిన తర్వాత.. వారికి ఉపాధి కల్పించడానికి జాబ్ ఎన్‌రోల్ మెంట్ కార్యక్రమం చేపడుతున్నారు. వారికి అవసరమైనా స్కిల్స్ నేర్పించి.. ఉద్యోగం వచ్చే విధంగా తయారు చేసే విధానానికి జైళ్ల శాఖ శ్రీకారం చుట్టనుంది. ఖైదీలను సెమీస్కిల్డ్‌, నాన్ సెమి స్కిల్డ్‌గా విభజించి.. వారికి కావలసిన స్కిల్స్ అందించేవిధంగా జైళ్లశాఖ ముందుకు వెళ్లనుందని.. ఆ శాఖ డీఐజీ చెప్పారు.

ఓపెన్ ఎయిర్ జైళ్లు..
ఆదాయాన్వేషణలో జైళ్లశాఖ తగు మార్గాలను ఎంచుకుంది. ఇప్పటికే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. అయితే హైదరాబాద్ జైళ్లకే పరిమితమైన ఈ పెట్రోల్ బంకులను.. జిల్లాలకు విస్తరించే ఆలోచనలో ఉంది జైళ్లశాఖ. వీటితోపాటు.. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్‌ ద్వారా.. మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి ఖైదీలకు ఉపాధి కల్పించేవిధంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. గ్యాస్ డీలర్‌షిప్‌ను ఏర్పాటు చేసుకోబోతున్నట్టు చెప్పారు. ఇప్పటికే తెలంగాణలోని అన్ని జైళ్లల్లో.. లక్ష టేకు మెక్కలు నాటామని... వాటి ద్వారా రానున్న 15ఏళ్లలో 15వందల కోట్ల ఆదాయం వచ్చే విధంగా తగిన ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు తెలిపారు . తెలంగాణలో నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఓపెన్ ఎయిర్ జైళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. ఖాళీగా జైలు ప్రదేశాల్లో ఇండస్ట్రియల్ కారిడార్స్, స్కూల్స్ ను ఏర్పాటు చేస్తామంటున్నారు.

20 కోట్ల నిధులు..
ఖైదీల కోసం నూతనంగా కొత్త భవనాలను నిర్మించింది జైళ్ల శాఖ. ఉగ్రవాదులు, విఐపి ఖైదీల కోసం ఇప్పటికే భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే విఐపి ఖైదీల కోసం అత్యాధునిక హంగులతో భవనాలను నిర్మాణం చేశారు. ఇందుకు 20కోట్ల నిధులు ఖర్చు చేశారు. విఐపి ఖైదీల గదులు చాలా విలాసవంతంగా ఉండడంతోపాటు.. ప్రత్యేకంగా షటిల్ కోర్టును ఏర్పాటు చేశారు. అయితే సాధారణ ఖైదీలకు వసతులు నామమాత్రంగా ఉండడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో దశల వారీగా అందరు ఖైదీలకు అధునిక హంగులతో భవనాలను నిర్మించి వారి వేల్పేర్‌కు తగిన ప్రాధాన్యం ఇస్తామని జైళ్లశాఖ ప్రకటించింది.

11:43 - October 6, 2015

కర్నూలు : జిల్లా విద్యాశాఖ పరువు బజారునపడింది. ఓ అధికారి వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రవర్తన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సదరు అధికార రాసలీలల ఆడియో.. విద్యాశాఖలో కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో ఏ ఇద్దరు విద్యాశాఖ అధికారులు కలుసుకున్నా.. దీనిపైనే చర్చసాగుతోంది. ఈ ఆడియో ఒకరి నుంచి మరొకరి వైరస్‌లా జిల్లా వ్యాప్తంగా పాకుతోంది. గురుబ్రహ్మ.. గురువిష్ణు.. గురుదేవో మహేశ్వరః ఇది సమాజంలో గురువుకు ఉండే స్థానం. అలాంటి గురువులను పర్యవేక్షించాల్సిన ఓ ఉన్నతాధికారి ఉపాధ్యాయినీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన వ్యవహారశైలిపై కర్నూలు జిల్లా జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్యే ఆ అధికారి ఓ స్కూల్‌ టీచర్‌తో మాట్లాడిన రాసలీలల వ్యవహారం బయటపడింది. ఈ ఫోన్‌ సంభాషణలు జిల్లాలో ప్రకంపనలు రేపుతున్నాయి.

చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్..
ఆ అధికారి తనకు నచ్చిన ఉపాధ్యాయినీలను లోబర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఎంఈఓలను, ప్రధానోపాధ్యాయులను, కార్యాలయ సిబ్బందిని బ్రోకర్లుగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సదరు అధికారి కోరికలు తీర్చేందుకు ఆర్వీఎంలో పనిచేసే ఓ ఉద్యోగిని కూడా బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అధికారి రాసలీలల వ్యవహారంపై విచారణ కమిటీ వేసి.. నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌ పేర్కొన్నారు. గౌరవప్రదమైన వృతిలో ఉంటూ ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్న సదరు అధికారిపై చర్చలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరి ప్రభుత్వం ఆ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి..!

11:40 - October 6, 2015

విజయవాడ : గన్నవరం ఎయిర్ పోర్టులో విమానాలు, హెలీకాప్టర్లు, పెద్దఎత్తున భద్రత కాన్వాయ్‌లు మోహరించబోతున్నాయి. ఈ నెల 22న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అమరావతికి రోడ్డు మార్గాన పలువురు ప్రముఖులు వెళ్లనుండటంతో.. పెద్దఎత్తున భారీ పోలీస్ బలగాలు, కట్టదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి.. జిల్లాను జల్లెడ పడుతున్నారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సమయం ముంచుకురావడంతో.. అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రధాని మోడీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వీఐపీలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇలా ఎందరో.. గన్నవరం ఎయిర్ పోర్టుకు విచ్చేస్తుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా కృష్ణాజిల్లా అధికార యంత్రాంగం అప్రత్తమైంది. మఫ్టీలో అడుగడుగునా కృష్ణా జిల్లాను జల్లెడ పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌లు బెజవాడ, గుంటూరు నగరాలను తమ ఆధీనంలో తీసుకున్నాయి.

కాన్వాయ్‌పై ట్రయల్‌రన్‌ యోచన..
విజయవాడలోని స్టార్స్ హోటల్స్ అన్నీ అడ్వాన్స్ బుకింగ్‌లు అయిపోనట్లు తెలుస్తోంది. వీవీఐపీలు, కేంద్ర మంత్రులు, ప్రధాని పేషీ నుంచి వచ్చే అధికారులు, భద్రతా సిబ్బందికి ఈ హోటల్స్ ను కేటాయించనున్నారు. అంతే కాకుండా కేంద్ర, రాష్ట్ర మంత్రులకు అధిక సంఖ్యలో హోటల్స్ ను బుకింగ్ చేసేందుకు ఆయా శాఖల అధికారులు కసరత్తు చేపట్టారు. ఏఏ మార్గాల్లో ఎవరెవరి కాన్వాయ్‌లు వెళ్లాలి, అలాగే ముందస్తుగా కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించే యోచన చేస్తున్నారు. భారీగా వస్తున్న అతిథిలందరికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్నిశాఖలు దృష్టిసారించాయి. ఈ విషయమై విజయవాడ సీపీ గౌతం సవాంగ్, కలెక్టర్ బాబు, అధికారుల భద్రత విషయమై తీవ్ర కసరత్తు చేపట్టారు. రాజధాని నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు.

ఆరు హెలిప్యాడ్ లు..
మొత్తం ఆరు హెలీప్యాడ్‌లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విజయవాడ, గన్నవరంలలో హెలీప్యాడ్‌ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని విమానాశ్రయ, రోడ్లు భవనాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 21, 22వ తేదీల్లో ఎయిర్ పోర్టుకు అదనపు విమాన సర్వీసులు రానున్నందున.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. విజయవాడకు ప్రముఖుల రాక 21వ తేదీ నుంచే ఉంటుందని, విమానాశ్రయ ఆవరణలో అదనపు లాంజ్‌లను ఈనెల 15 నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే విమానాశ్రయానికి కావాల్సిన అవసరమైన తగిన ఏర్పాట్లతోపాటు తగిన హంగులతో రూపుదిద్దుకోవాలని ఆదేశించారు. 

11:38 - October 6, 2015

చిత్తూరు : జిల్లాలో ఎర్రచందనం తరలింపుపై పోలీసులు ఎంత నిఘా పెట్టినా అక్రమమార్గంలో వెళుతూనే ఉంది. పలు ఘటనల్లో భారీగా ఎర్రచందనాన్ని తరలిస్తున్నారు. తాజాగా తిరుపతిలో నాలుగు కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని అటవీ అధికారులు పట్టుకున్నారు. గొల్లపల్లి చెక్‌పోస్టు దగ్గర తనిఖీలు చేస్తున్న అధికారులకు ఓ లారీ అనుమానాస్పదంగా కనిపించింది.. ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు.. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ లారీని ముందుకు పోనిచ్చాడు.. ఈ వాహనాన్ని వెంబడించిన అధికారులు పున్నమి హొటల్‌ దగ్గర అడ్డుకున్నారు.. ఇంతలో నిందితులు వాహనం వదిలిపారిపోయారు.. ఈ లారీలో వందకుపైగా ఏ వన్‌ గ్రేడ్ ఎర్రచందనం దుంగలున్నాయని అధికారులు భావిస్తున్నారు.

11:22 - October 6, 2015

ఖమ్మం : భద్రాచలం కేంద్రంగా ప్రత్యేకంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గిరిజన సంక్షేమ పరిషత్, సేవ్ భద్రాద్రి కమిటీలు బంద్ కు పిలుపునిచ్చాయి. దీనితో భద్రాచలం డిపో పరిధిలోని బస్సులు నిలిచిపోయాయి. దుకాణాలు, కార్యాలయాలు, పాఠశాలలు మూతబడ్డాయి. భద్రాచలాన్ని జిల్లాగా ప్రకటించాలని గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేయడం జరిగిందని నేతలు తెలిపారు. భద్రాచలాన్ని ముక్కలు ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఆదివాసీ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా భద్రాచలం ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందన్నారు. దానిని పూడ్చడానికి భద్రాచలం జిల్లా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే ప్రకటన చేయాలన్నారు. రాష్ట్ర విభజన వల్ల భద్రాచలం మన్యం చిన్నాభిన్నమైందని, మన్యంలోని పలు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమయ్యాయని, భద్రాచలంకు పూర్వ వైభవం రావాలంటే భద్రాచలంను జిల్లా కేంద్రంగా చేయడమే సరైన మార్గమని పలువురు సూచిస్తున్నారు. భద్రాచలంకు ఉన్న చరిత్ర, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం, భౌగోళిక పరిస్థితులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఆదివాసీలు అధికంగా ఉండటం వల్ల ఆదివాసీ జిల్లాగా భద్రాచలంకు నామకరణం చేయాలని ఆదివాసీలు పట్టుబడుతున్నారు. అతిపెద్ద ఐటీడీఏ, ఖమ్మం కలెక్టరేట్‌తో పోలిస్తే పదింతలు విశాలమైన ప్రాంగణ ఉండటం కూడా భద్రాచలంను జిల్లాగా చేయడానికి అనువైనదని చెబుతున్నారు. భద్రాచలంను జిల్లాగా చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అంటున్నారు.

11:15 - October 6, 2015

హైదరాబాద్ : తొక్కే కదా అని తీసి పారేయకండి. అరటి పండుకంటే తొక్కలోనే ఎక్కువ బలముంటుందని అంటున్నారు శాస్ర్తవేత్తలు. అరటిపండు తొక్కలో అధిక శాతంలో విటమిన్లు, ఖనిజాలు, బి6 , ఏ, సి విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, అరిగే పీచు పదార్ధాలు, ప్రొటీన్లు, మెగ్నీషియం, తదితర ప్రోటీన్లు ఉన్నాయట. ఈ తొక్కతో వారానొకొకసారి పళ్ల మీద రుద్దితే పలువరుస నిగనిగలాడిపోతుందట. అంతే కాకుండా డెంటిస్ట్‌ను సంప్రదించాల్సిన అవసరం కూడా రాదట. తొక్కతో మొటిమల మీద రుద్దితే ఒక్క రాత్రిలో మటుమాయం అవుతాయట. అలాగే ఎగ్‌‌వైట్‌‌లో అరటిపండు తొక్కతో గుజ్జుగా చేసి ముఖానికి పట్టిస్తే ముడుతలు మటుమాయం అయి నిగనిగలాడటమే కాకుండా డ్రై‌స్కిన్ బాధ తప్పుతుందని అంటున్నారు. నొప్పులు, వాపులు ఉన్న చోట అరటిపండు తొక్క గుజ్జుగా చేసి దానికి వెజిటబుల్ ఆయిల్ కలిపి మసాజ్ చేస్తే అవి మాయం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అంతే కాదు సోరియాసిస్ వ్యాధితో వచ్చే దురదలతో బాధపడేవారు కూడా అరటిపండు తొక్క గుజ్జును దురదల ప్రాంతంలో పట్టిస్తే రిలీఫ్ ఉంటుందట. అలాగే దోమకాటువల్ల వచ్చే అలర్జీలు, దురదలు వచ్చేచోట అరటిపండు తొక్క గుజ్జును రాస్తే ఉపశమనం పొందవచ్చుననికూడా పరిశోధకులు చెబుతున్నారు. సో.. ఇవీ.. తొక్కలోని ఆరోగ్య రహస్యాలు.

 

11:05 - October 6, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు.. బార్లు.. మరో గంట పాటు తమ కార్యకలాపాలు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలన్న ఫైలు ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం కోసం ఎదురుచూస్తుంది. ఇప్పుడు అనుసరిస్తున్న విధానంలో ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు.. అదే సమయంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ బార్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే.. రెండింటికి గంట చొప్పున సమయం పెంచాలంటూ ఎక్సైజ్ శాఖ కోరుతుంది. దీంతో.. రాత్రి వేళ మరో గంట ఎక్కువగా వీటిని అందుబాటులోకి ఉంచేలా ముఖ్యమంత్రి ఓకే చెప్పాలని అధికారులు కోరుకుంటున్నారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు.. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాల్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించటంతో.. వివిధ రాష్ట్రాల్లో ఏయే సమయాల్లో వైన్.. బార్లు తెరిచి ఉంచుతున్నారన్న అంశంపై దృష్టి సారించిన అధికారులు.. మరో గంట అదనంగా అందుబాటులోకి తెచ్చిన పెద్ద ఇబ్బంది కాదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ గంటలే తెరిచి ఉంటున్నట్లుగా అధికారుల వాదన ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా నిర్ణయం తీసుకునే వీలుందని తెలుస్తోంది. అదే.. జరిగితే మరోసారి విమర్శలతో విరుచుకుపడేందుకు విపక్షాలు కాచుకొని ఉన్నాయి. మరి.. ముఖ్యమంత్రి సంతకం ఫైలు మీద ఎప్పుడు పడుతుందో..?

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో విపక్షాల ఆందోళన..

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్, ఎన్సీ సభ్యులు నిరసనకు దిగారు. ఆర్టికల్ 35 ఏ ఇతర అంశాలపై సభ్యులు ఆందోళనకు దిగారు.

లాలూపై రాందేవ్ చురకలు..

బీహార్ : ఆర్డేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పై యోగా గురు రాందేవ్ బాబా పలు విమర్శలు చేశారు. యాదవ్ వంశాన్ని లాలూ కళకింతం చేశారని, లాలూ కంశ్ వంశానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడని రాం దేవ్ బాబా పేర్కొన్నారు. 

10:51 - October 6, 2015

హైదరాబాద్ : అందాల సుందరి ఐశ్వర్యరాయ్ గురించి ఓ విషయం చక్కర్లు కొడుతోంది. ఈమె ప్రొడ్యూసర్‌గా మారినట్టు వార్తలొస్తున్నాయి. ‘జజ్బా’ ఫిల్మ్‌లో ఈమె ఓ పార్టనర్ అని టాక్. స్టోరీ బాగుండడంతో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిందని ముంబై ఫిల్మ్‌నగర్ సమాచారం. మరి ఇన్నాళ్లు ఈ విషయం ఎందుకు సీక్రెట్‌గా వుంచిందంటూ షోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి.ఈ విషయం ఐష్.. ఫ్యామిలీ మెంబర్స్‌కైనా తెలుసా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమా కోసం ఐష్ హార్డ్‌వర్క్ చేసిందని యూనిట్ సభ్యులే చెప్పుకొచ్చారు. రాబోయేరోజుల్లో ప్రొడ్యూసర్‌గా కంటిన్యూ అవుతుందా? లేక పార్టనర్‌షిప్‌కే పరిమితమవుతుందా? అనేది తెలియాల్సివుంది. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఐశ్వర్య రీ-ఎంట్రీ ఇస్తోంది. ఓ మహిళా లాయర్‌కి ఎదురయ్యే సమస్యల నేపథ్యమే ఈ సినిమా. అన్నీ పనులు ఫినిష్ కావడంతో ఈ నెల 9న ‘జజ్బా’ థియేటర్స్‌కి రానుంది. మరి ఐష్ రీ ఎంట్రీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

10:45 - October 6, 2015

హైదరాబాద్ : ఒకప్పటి హీరోయిన్ రేవతి త్వరలో ఓ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించనుంది. పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన రేవతి తెలుగులో కమర్షియల్ సినిమా చేయనుందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా ప్రారంభమయ్యాయన్న టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కథా స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ప్రస్తుతం రేవతి పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లోఫర్' (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సమయంలోనే తన స్టోరి ఐడియా వినిపించిన పూరి రేవతిని ఆ సినిమాను డైరెక్ట్ చేయాల్సిందిగా కోరాడట, అందుకు రేవతి కూడా అంగీకరించటంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కా ఛాన్స్ కనిపిస్తుందంటున్నారు. పూరి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్ చార్మీ సహనిర్మాతగా వ్యవహరించనుంది. గతంలో 'జ్యోతిలక్ష్మీ' సినిమాతో నిర్మాతగా మారిన ఈ బ్యూటి, మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది. 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మామ' లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో కనిపిస్తున్న రాజ్ తరుణ్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు. తెలుగులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రేవతి దర్శకురాలిగా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

10:41 - October 6, 2015

హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం కాలనీ 60 గజాల బస్తీలో యుద్ధ వాతావరణం నెలకొంది. వందలాది మంది పోలీసులు..అగ్నిమాపక సిబ్బంది..బాష్పవాయు ప్రయోగించే వాహనాలు మోహరించాయి. దీనితో ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం స్థలంలో అనర్హులు నివాసం ఉంటున్నారని..వెంటనే ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనితో బస్తీ వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాము ఖాళీ చేయాలని సూచించడం జరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. గత నాలుగు రోజులగా 60 గజాల బస్తీలో ఉద్రిక్తత నెలకొంది. తొలగింపులో అధికారుల మాటలు ఒక్కో రకంగా ఉంటున్నాయి.
ఎలాంటి మౌలిక సదుపాయలు లేకుండానే కొంతమంది గత 20 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. భూమికి బాగా రేట్ రావడంతో కొంతమంది కన్నేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 3000 పట్టాలు ఇచ్చినా స్థానికులకు అందలేదని, నేతలు కొంతమంది భూమలు విక్రయించారని ఆరోపణలున్నాయి. పట్టాలు లేకుండా వేరే వారు ఉంటున్నారని ప్రధాన ఆరోపణతో ఒకరు కోర్టుకు వెళ్లడంతో ఈ పరిస్థితి నెలకొంది. అధికారుల హెచ్చరికలతో తాము ఎక్కడకు వెళ్లాలని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బస్తీ వాసులు కోరుతున్నారు. 

10:37 - October 6, 2015

హైదరాబాద్ :ఏడు సంవత్సరాల తర్వాత బ్రూస్ లీ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తున్న చిరంజీవి వివి వినాయక్ దర్శకత్వంలో 150 సినిమాగా కత్తి రీమేక్ కు సిద్దమవుతుంది. కాగా చిరంజీవి 151 సినిమా కోసం నిర్మాత అల్లు అరవింద్ ముందే రిజర్వ్ చేసుకొన్నాడు. అంటే కత్తి సినిమా రీమేక్ తర్వాత చిరంజీవి తో సినిమా చేయడానికి అల్లు అరవింద్ సన్నాహాల్లో ఉన్నాడు. చిరు తనకు ఓ సినిమాలో చేస్తానని మాట ఇచ్చాడని.. అందువల్ల చిరు ఎప్పుడు రెడీ అంటే తాను రెండు వందల కోట్ల బడ్జెట్ తో సినిమా నిర్మించడానికి సిద్దమని అల్లు అరవింద్ ప్రకటించాడు. దీంతో రూ. 200 కోట్ల బడ్జెట్ సినిమా అంటే.. దక్షిణ చలన చిత్ర రికార్డ్ అవుతుంది. ఈ బడ్జెట్ ను మాటవరసకు ప్రకటించారా.. లేక నిజంగా ఖర్చు చేస్తా... ఒకవేళ రూ.200 కోట్ల బడ్జెట్ అంటే... ఆ స్థాయిలో కథ ఉండాలి కదా... అంటే.. ఆకథను అల్లు అరవింద్ సిద్దం చేసుకొనే ఈ విషయం పబ్లిక్ గా ప్రకటించారా.. ఇలా అనేక రకాలుగా సినీ ఇండస్ట్రీలో గుసగుసలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ మెగా అభిమానులు మాత్రం చిరు ఇక వరసగా సినిమాలు చేయబోతున్నాడని సంతోషపడిపోతున్నారు. 

10:30 - October 6, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచుతామని టి.టిడిపి పేర్కొంటోంది. రైతులకిచ్చే రుణమాఫీని వన్ టైం సెటిల్ మెంట్ చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. సోమవారం 29 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం పట్ల టి.టిడిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల వద్దకు వెళ్లాలని యోచించి 'బస్సు యాత్ర'ను చేపట్టింది. ఇందుకు బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుండి మెదక్ జిల్లాకు పయనమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మెడలు వంచైనా సరే రుణమాఫీ అమలు జరిపిస్తామని హామీనిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం పతనం ఈ రోజు నుండి ప్రారంభమైందని, సభ్యులను సస్పెన్షన్ చేయడం అప్రజాస్వామికమన్నారు. 

10:29 - October 6, 2015

హైదరాబాద్ : భజరంగీ భాయీజాన్ చిత్రం చూస్తుంటే అందులో షాహిదా పాత్ర పోషించిన క్యూటెస్ట్ గర్ల్ షాహిదా(మున్నీ)... అసలు పేరు హర్షాలీ మల్హోత్రా నటన ఆకట్టుకుంటుంది. ఈ చిన్నారి జూన్ 3, 2008లో జన్మించింది. 2014లో ఓ టెలీఫిలిమ్‌లో నటించింది. ఐతే కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కే భజరంగీ భాయిజాన్ చిత్రంలో మాటలు రాని మూగ వికలాంగురాలి పాత్రలో నటించేందుకు పోటీ జరిగింది. ఈ పోటీలో హర్షల్ మల్హోత్రా కూడా పాల్గొన్నది. భజరంగీ భాయిజాన్ చిత్రంలో కీలక పాత్ర అయిన ఈ పాత్రలో నటించేందుకు ఈ చిన్నారితో పాటు మొత్తం 5000 మంది పాల్గొన్నారు. ఐతే చిట్టచివరికి ఆడిషన్లో మల్హోత్రా నెగ్గింది. పాత్రలో నటించేందుకు ఎంపికైన ఈ చిన్నారి తన నటనలో కూడా నెంబర్ వన్ అనిపించుకుంది. భజరంగీ భాయిజాన్ చిత్రంలో ఆసాంతం ఒక్క మాట కూడా మాట్లాడకుండా నటిస్తూ కోట్లమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. పాకిస్తాన్ బాలిక పాత్రలో నటించిన మల్హోత్రాకు ఇప్పుడు చేతినిండా సనిమాలున్నాయి.  భజరంగీ భాయిజాన్ చిత్రం 90 కోట్ల రూపాయల బడ్జెట్టుతో తెరకెక్కగా ఇప్పటివరకూ రూ. 626 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి కథ తెలుగు దర్శక సంచలనం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించారు. ఈ చిత్రాన్ని నిర్మించింది సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్. ఈ చిత్రంతో సల్మాన్ ఖాన్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.

10:24 - October 6, 2015

హైదరాబాద్ : బీహార్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు పలు పార్టీలతో జట్టు కట్టిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఈ ఎన్నికల్లో వైశాలిలోని మహువా నియోజకవర్గం నుంచి పెద్ద కొడుకు తేజ్ బరిలోకి దిగుతుండగా, చిన్న కుమారుడు తేజస్వీ అదే జిల్లాలోని రఘోపూర్ అసెంబ్లీ బరిలోకి దూకేశాడు. తేజ్ ప్రతాప్ నిన్న తన తండ్రితో కలిసి నామినేషన్ దాఖలు చేయగా, చిన్న కుమారుడు గత శనివారమే నామినేషన్ వేశారు. లాలూ కొడుకులిద్దరూ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద చర్చకు తెరతీశాయి. పెద్ద కుమారుడు తేజ్ తన వయసును 25 ఏళ్లుగా పేర్కొన్నారు. అయితే అతడి కంటే చిన్నోడైన తేజస్వీ మాత్రం తన వయసును 26 ఏళ్లుగా పేర్కొంటూ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ అంశం ఆధారంగా నామినేషన్లను తిరస్కరించే అవకాశం లేదని బీహార్ అదనపు ఎన్నికల అధికారి లక్ష్మణన్ చెప్పారు. ఈ విషయంలో కోర్టులో తాము దాఖలు చేయనున్న పిటిషన్ల విచారణకు హాజరయ్యే అభ్యర్థులు తాము పొందుపరచిన వివరాలు వాస్తవమేనని నిరూపించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.  

10:22 - October 6, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలన్నీ రైతు జపం చేస్తున్నాయి. విపక్షాలన్నీ ఏకమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమం చేపట్టడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సోమవారం 29 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం పట్ల విపక్షాలు గుర్రుమన్నాయి. ఇందుకోసం టిడిపి - బిజెపి కార్యచరణ ప్రకటించింది. రైతు కోసం 'బస్సు యాత్ర' చేపట్టనుంది. సీఎం సొంత నియోజకవర్గమైన మెదక్ జిల్లా నుండి యాత్ర చేపట్టనున్నారు. ఇందు కోసం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ టి.టిడిపి నేత మాగంటి గోపినాథ్ టెన్ టివితో మాట్లాడారు. రైతుల సమస్యలపై తీసుకొచ్చినప్పుడల్లా బయటకు పంపిస్తున్నారని, గతంలతో కూడా తాము బస్సు యాత్ర చేపట్టి రైతులకు ఆర్థిక సాయం అందించడం జరిగిందని గుర్తు చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులు 700 మంది కాదు అంటూ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందని విమర్శించారు. ఆరు లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం పేర్కొందని, ఎంతమందికిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. నాలుగు, ఐదు రోజుల పాటు ఈ యాత్ర చేపట్టనున్నట్లు, ఆత్మహత్యలు ఎవరూ చేసుకోవద్దని ఆయన సూచించారు. మిత్రపక్షమైన బీజేపీతో కలిసే పోరాటం చేస్తామని, తాము పిలుపునిచ్చిన బంద్ సక్సెస్ అవుతుందని మాగంటి గోపినాథ్ స్పష్టం చేశారు. 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంకాగానే బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 126 పాయింట్లు లాభపడి 27,000 మార్క్ను అందుకుంది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 30 పాయింట్లతో 8,150 మార్క్ వద్ద ట్రేడ్ అవుతోంది. 

మక్కా తొక్కిసలాటలో పెరిగిన భారతీయ మృతుల సంఖ్య..

ఢిల్లీ : మక్కాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో భారతీయుల మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 64 మంది మృతి చెందారు. 

10 ఇసుక ర్యాంపులపై విజిలెన్స్ దాడులు..

పశ్చిమగోదావరి : నిడదవోలు మండలంలోని 10 ఇసుక ర్యాంపులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. భారీగా జరిమాన విధించారు. 

 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటలు, కాలినడకన భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మొదటి ఘాట్ రోడ్డు నుంచి తిరుమలకు వాహనాలు మళ్లించారు.

09:52 - October 6, 2015

హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందులు నలుగురి ప్రాణాలు బలిగొన్నాయి. అప్పుల కూరుకపోవడం..ఇళ్లు గడవలేని పరిస్థితిలో ఆ దంపతులు ప్రాణాలు తీసుకున్నారు. వారితో పాటు ఇద్దరు చిన్నారులను కూడా చంపేశారు. ఈ విషాదం ఘటన చింతల్ లో చోటు చేసుకుంది. కలకత్తా ప్రాంతానికి చెందిన కేశవరావు, వనజ దంపతులు నగరానికి వలస వచ్చారు. వీరు చింతల్ లో నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల బాబు..మూడేళ్ల పాప ఉంది. కేశవరావు ఫైనాన్స్ వ్యాపారం చేసే వాడు. గత కొద్ది రోజులుగా వ్యాపారం సరిగ్గా సాగకపోవడం...ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కనీసం ఇళ్లు గడవలేని పరిస్థితి నెలకొంది. దీనికి ఆత్మహత్యే శరణ్యమని దంపతులు భావించారు. తాము చనిపోతే పిల్లలను ఎవరు చూస్తారో అని భావించారో ఏమో కానీ వారిని కూడా చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం కేశవరావు, వనజలు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం ఈ వార్త తెలుసుకున్న వారు చలించిపోయారు. అభం..శుభం తెలియని పసిపాపలు మృతి చెందడం పలువురిని కంటతడి పెట్టించింది. 

భారీగా ఎర్రచందనం పట్టివేత

చిత్తూరు : పుత్తూరు చెక్ పోస్టు వద్ద ఈ రోజు ఉదయం పోలీసుల తనికీల్లో టిప్పర్ లో తరలిస్తున్న రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసిన స్మగ్లర్లు టిప్పర్ ను వదిలేసి పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

 

కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు వేళల్లో మార్పులు...

వరంగల్ : దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్‌లోని కాజీపేట జంక్షన్ మీదుగా నడిచే కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు వేళల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. జంక్షన్‌మీదుగా మణుగూరు-సికింద్రాబాద్‌ల మధ్యనడిచే కాకతీయ రైలు గతంలో ఉదయం 6.10నిముషాలకు కాజీపేట జంక్షన్ వచ్చి 6.25కు బయలుదేరేదని, ఈ నెల 1వ తేదీ నుంచి ఉదయం 4.30 వచ్చి, 4.50 నిమిషాలకు సికింద్రాబాద్‌కు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. సిర్‌పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్‌ల మధ్య నడిచే సిర్‌పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 02.50కు బదులు 02.55కు వచ్చి వెళుతుందని తెలిపారు.

09:33 - October 6, 2015

హైదరాబాద్ : విపక్షం లేకుండానే నేడు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రారంభం కానుంది. శాసనసభలో సోమవారం 29 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఒక రోజు కాదు..ఏకంగా ఈ సమావేశాలు ముగిసే వరకు అంటే ఈనెల 10వ తేదీ వరకు అడుగు పెట్టవద్దని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు పెరుగుతున్నాయి. నేడు ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ధర్నాకు దిగే అవకాశాలున్నాయి. పునరాలోచన చేయాలని సూచనలు అందుతున్నాయి.
సస్పెండ్ చేయలేదు కనుక ఎర్రబెల్లి..జానారెడ్డిలు స్పీకర్ ను కోరే అవకాశం ఉంది. స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నేడు పలు అంశాలపై చర్చ జరుగనుంది. గ్రామజ్యోతి, వాటర్ గ్రిడ్, వ్యాట్ బిల్లు తదితర అంశాలపై చర్చ జరుగనుంది. 26 గ్రిడ్ లకు 19 గ్రిడ్ లకు టెండర్లు పిలిచారు. వీటిపై నెలకొన్న సందేహాలకు ప్రభుత్వం సమాధానం చెప్పనుంది. వాటర్ గ్రిడ్ నిర్వాహణ ఎలా ఉండబోతోంది. తాగు..సాగు నీరు ఎలా ఉండనుంది తదితర విషయాలపై సర్కార్ క్లారిటీ ఇవ్వనుంది. మన ఊరు మన ప్రణాళికను గ్రామజ్యోతికి అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 50 లక్షల నుండి 2 కోట్ల వరకు నిధులు సమకూర్చనుంది. నిధులు ఎలా ఉన్నాయి ? ఎంత కేటాయించారు ? దీని ఉద్ధేశ్యం ఏంటనే దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పనుంది. 

09:27 - October 6, 2015

రంగారెడ్డి : నగర శివారులోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దూలపల్లికి చెందిన రుషికా కెమికల్స్ ఫ్యాక్టరీకి చెందిన గోదం పూర్తిగా మంటల్లో తగులబడిపోయింది. కెమికల్ ట్యాంకులు పేలడంతో ఈఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక శకటాలతో చేరుకున్నారు. ఐదు గంటలు శ్రమించిన అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం కలిగినట్లు సమాచారం. ఎవరైనా మృతి చెందారా ? లేదా ? అనేది తెలియరాలేదు.
అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో సమీప కాలనీ వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భారీగా మంటలు..పొగ అలుముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనావాసాల మధ్య ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తుండడం..పలు ప్రమాదాలు చేసుకుండడంపై ప్రజలు భయపడుతున్నారు. వెంటనే ఇలాంటి ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

09:21 - October 6, 2015

హైదరాబాద్ : గత ఏడాది నగరాన్ని వణికించిన ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ వ్యాధి కారణంగా పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఐదుగురికి స్వైన్ ఫ్లూ వ్యాధి ఉన్నట్లు గాంధీ వైద్యులు ధృవీకరించారు. ఈ విషయాన్ని నోడల్ అధికారి టెన్ టివికి తెలిపారు. ఇప్పటికే గాంధీలో 37 కేసులు నమోదు కావడం..ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 13 మంది రోగులు గాంధీలో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో ఐదుగురికి వ్యాధి సోకిన విషయం తెలియడంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తెలంగాణలో మారిన వాతావరణ పరిస్థితుల వల్ల వ్యాధి విస్తరిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా పెద్ద సంఖ్యలో రోగులు స్వైన్ ఫ్లూ లక్షణాలతో చేరుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది అనుభవాల నేపథ్యంలో స్వైన్ ఫ్లూ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు టి.ప్రభుత్వం పేర్కొంది. కానీ ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

చింతల్ లో విషాదం..

హైదరాబాద్ : జీడిమెట్లలోని చింతల్ లో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో దంపతులతో సహా ఇద్దరు పిల్లలున్నారు. 

 

మరో ఐదుగురికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ..

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో మరో ఐదుగురికి స్వైన్ ఫ్లూ నిర్ధారణైంది. గాంధీలో 13 మంది స్వైన్ ఫ్లై బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆగస్టు నుండి ఇప్పటి వరకు 37 మందికి స్వైన్ ఫ్లై నిర్ధారణ కాగా ఏడుగురు మృతి చెందారు. 

నేడు ప్రధానితో గవర్నర్ భేటీ ?

ఢిల్లీ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నేడు ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను కూడా గవర్నర్ కలువనున్నట్లు సమాచారం. 

నేడు బెంగళూరులో ప్రధాని మోడీ..జర్మనీ ఛాన్స్ లర్ పర్యటన..

ఢిల్లీ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జర్మనీ ఛాన్స్ లర్ మెర్కెల్ నేడు బెంగళూరులో పర్యటించనున్నారు. బాష్ ప్రధాన కార్యాలయాన్ని వీరు సందర్శించనున్నారు. అనంతరం నాన్ కామ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

08:50 - October 6, 2015

మధ్య యుగాల్లోకి భారతదేశాన్ని నెట్టవద్దని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ సూచించారు. దేశంలో గొడ్డు మాంసంపై జరుగుతున్న చర్చను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలో ఇంకేమి చర్చ లేదా అని ప్రశ్నించారు. టెన్ టివిలో 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో విపక్ష సభ్యుల సస్నెన్షన్..మతం..స్వేచ్ఛ అంశాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే

సస్పెన్షన్ లో పద్దతులుంటాయి..
''రుణమాఫీ..వన్ టైం సెటిల్ మెంట్ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర ఉన్నప్పుడు తెలంగాణ కోసం అడ్డుకున్న వారిని ప్రజలు ఆదరించారు. ఇప్పుడు కూడా విపక్షాలను ప్రజలు ఆదరిస్తారు. రైతుల క్షేమం కోసం అడ్డుకుంటే అప్రజాస్వామికం ఎలా అవుతుంది ? మొత్తం ప్రతిపక్షం సస్పెండ్ చేయడం వల్ల టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం అవుతుంది. సస్పెన్షన్ లో పద్దతులు కూడా ఉంటాయి. ప్రజాస్వామ్యంలో సభకు విలువ లేదు. ఈ విషయంలో పరిశీలన చేస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. అధికార పక్ష, విపక్ష సభ్యుల మధ్య పట్టు విడుపులు ఉండాలి.

నిలదీయడమే ప్రతిపక్షాల పని..
కానీ ప్రతిపక్షం పాత్ర ఏంటీ ? అనే దానిపై అత్యున్నత న్యాయస్థానం ఓ తీర్పులో పలు విషయాలు వెల్లడించింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష వాయిస్ వినాలని సుప్రీం పేర్కొంది. 50 శాతం ఓట్లు వచ్చి విజయం సాధించింది చాలా తక్కువ. ప్రజలందరిదీ బాధ్యత వహించాల్సిన అధికారపక్షం చేయడం లేదు. సభను నడిపించడానికి ప్రయత్నం చేయాలి. ప్రజల పక్షాన నిలదీయడమే ప్రతిపక్షాల పని. అంతకుముందే చేస్తే అధికారంలో ఉండే వారు. ప్రతిపక్షం మొండిపక్షంగా ఉందని అధికారపక్షం వాదిస్తోంది. ప్రతిపక్షం కూడా మొండిపక్షంగా ఉండకూడదు. ప్రజాక్షేత్రంలో వెళ్లాలి.

మతం..స్వేచ్ఛ చర్చ..
భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. అక్కడ ఆయన భారత దేశాన్ని డిజిటల్ ఇండియాగా మారుస్తా..నైపుణ్యాన్ని పెంపొందిస్తా..సిలికాన్ వ్యాలీలు సృష్టిస్తా..మేక్ ఇన్ ఇండియ సృష్టిస్తా..అని ఏజెండా పేర్కొంటున్నారు. కానీ మాంసం తినాలా వద్దా అనే ఎజెండా ఎలా ఉంది. ఎప్పుడు తినాలి ? ఏం తినాలి ? ఇదేం చర్చ. నీవెం తినాలో ఎలా చెప్పగలవు ? ఈ చర్చల వల్ల దేశం ఎలా డెవలప్ అవుతుంది. దేశంలో 1618 భాషలు మాట్లాడే ఉన్నారు. ఒక్క హిందీ మాట్లాడాలంటే ఒప్పుకుంటారా ? దేశంలో 6400 కులాలున్నారు. ఒక్క కులమే పాలించాలి అంటే ఎలాం ఉంటుంది . దేశంలో ఆరు మతాలున్నాయి. ఇక్కడ లౌకికత్వం విలాసం కాదు..అవసరం. దేశంలో అధిపత్యం చెలాయించాలని చూస్తే దేశం కకావికలమౌతుంది. కులం..మతం..భాష పేరిట..ఎంతకాలం కొట్టుకుంటాం. ఇతర దేశాల్లో ఇలాగే జరుగుతుందా? చెప్పేదేమో అద్భుతం..దేశంలో విజ్ఞానం..సాంకేతిక ఆలోచన పెంచే విధంగా చర్చ జరగాలి. మధ్యయుగంలోకి దేశాన్ని నెట్టివేయకండి'' అని నాగేశ్వర్ సూచించారు. 

08:38 - October 6, 2015

చిత్తూరు : తిరుమలలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీనితో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రెండో కనుమ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుమలలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో కొండచరియలు నానిపోయాయి. మంగళవారం ఉదయం లింక్ రోడ్డు సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న టిటిడి అధికారులు కొండ చరియలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో మూడు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. టిటిడి అధికారులు లింక్ రోడ్డు ద్వారా ట్రాఫిక్ ను మళ్లించారు. 

08:35 - October 6, 2015

హైదరాబాద్ : సూరారం కాలనీలో మంగళవారం ఉదయం పోలీసుల బూట్ల చప్పుడుతో బస్తీ వాసులు ఉలిక్కిపడ్డారు. భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వీరితో పాటు రెవెన్యూ అధికారులు కూడా వచ్చారు. అక్రమంగా నివాసం ఉంటున్న వారందరూ ఖాళీ చేయాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు హుకుం జారీ చేశారు. దీనిని కొంతమంది స్థానికులు వ్యతిరేకించారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. సూరారం కాలనీలో ఉంటున్న వారు అక్రమంగా నివాసం ఉంటున్నారని వీరిని ఖాళీ చేయాలని హైకోర్టు ఉత్వర్వులతో మంగళవారం ఉదయం ఆ బస్తీకి చేరుకున్నారు. 1400 ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు పేర్కొన్నారు. వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని వారికి సూచించారు. కబ్జా చేయడం..ఇతరులకు అమ్ముకున్నారుని, ఉన్నత న్యాయస్థానం దశల వారీగా తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. రెవెన్యూ సిబ్బందికి సహకరిస్తున్నట్లు, 200 మంది స్వచ్చందంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 

08:03 - October 6, 2015

ఎలాంటి కవ్వింపులు..అరుపులు లేవు..సభ జరగనీయకుండా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి అడ్డుకున్న సందర్భమూ లేదు. కుర్చీలు..మైకులు విరిగిన దాఖలాలు లేవు. ఒకరినొకరు దూషించుకున్నది లేదు. ఇవేమీ లేకుండానే తెలంగాణ రాష్ట్ర అసెబ్లీలో సోమవారం నివ్వెరపోయే ఘటన చోటు చేసుకుంది. విపక్ష సభ్యులను సభ నుండి బయటకు గెంటివేసింది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి పేర్కొన్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), పున్న కైలాశ్ (టి.కాంగ్రెస్), శ్రీధర్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

నేడు ద్వారకా కోర్టులో సోమ్ నాథ్ బెయిల్ అప్లికేషన్..

న్యూఢిల్లీ : ఢిల్లీ న్యాయ శాఖ మాజీ మంత్రి సోమ్ నాథ్ భారతి దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తుపై ద్వారకా కోర్టులో విచారణ జరగనుంది. గృహ హింస, హత్యాయత్నానికి యత్నించినట్లు సోమ్ నాథ్ సతీమణి లిపిక ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

సూరారం కాలనీలో ఉద్రిక్తత..

హైదరాబాద్ : సూరారం కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైకోర్టు ఉత్వర్వులతో అక్రమ నిర్మాణం కూల్చివేతకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు. బస్తీని ఖాళీ చేయించాడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనితో స్థానికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

నేడు భద్రాచలం బంద్..

ఖమ్మం : ఏవీఎస్పీ ఆధ్వర్యంలో భద్రాచలం బంద్ జరుగనుంది. భద్రాచలాన్ని ఆదివాసీ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. బస్టాండు ఎదుట ఆదివారీ సంఘం నేతలు ధర్నా చేపట్టారు. 

ఫొటో కాంటెస్టు విజేతలకు నేడు బహుమతుల ప్రధానం..

హైదరాబాద్ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటో కాంటెస్ట్ విజేతలకు నేడు బహుమతుల ప్రధానం జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బహుమతులను ప్రధానం చేయనున్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో, సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార శాఖ కమిషనర్ బీపీ ఆచార్య ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. 

నేడు జూ పార్కులో ప్రత్యేక కార్యక్రమాలు..

హైదరాబాద్ : జూ దినోత్సవం సందర్బంగా జూ పార్కులో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా టి. మంత్రి జోగురామన్న హాజరు కానున్నారు. 

నేడు ద లార్జెస్ట్ స్టేషనరీ కార్ ప్రారంభం..

హైదరాబాద్ : బహదూర్‌పురాలోని సుధా కార్స్ మ్యూజియంలో సాయంత్రం 4గంటలకు అక్బరుద్దీన్ ఓవైసీ 'ద లార్జెస్ట్ స్టేషనరీ కార్' ప్రారంభం చేయనున్నారు.

 

నేడు ఆశా వర్కర్ల నిరహార దీక్ష..

హైదరాబాద్ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న ఆశా వర్కర్లు నేటి నుండి నిరహార దీక్షలు చేయనున్నారు. ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10.30కు సీఐటీయూ ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభం కానున్నాయి. 

నేడు కోర్టులో విచారణకు రానున్న అగ్రిగోల్డ్ కేసు..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలని హైకోర్టు నిర్ణయించింది. సభ్యుల పేర్లు సూచించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. కేసు విచారణ నేటికి వాయిదా వేసింది.

 

నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రితో గవర్నర్ భేటీ..

ఢిల్లీ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తో భేటీ కానున్నారు.

నగరానికి చేరుకున్న ఈటెల..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల నగరానికి చేరుకున్నారు. జీఎస్టీ పన్ను విధానంపై అధ్యయనం చేసేందుకు గత నెల 27న ఈటెల ఆస్ట్రేలియా వెళ్లిన సంగతి తెలిసిందే. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మూడు కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం..నడకదారి భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. 

తిరుమల ఘాట్ రోడ్డుపై విరిగిపడిన కొండ చరియలు..

చిత్తూరు : తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న టిటిడి సిబ్బంది కొండ చరియలను తొలగిస్తోంది. ప్రస్తుతం వాహనాలు భారీగా నిలిచిపోయాయి. లింక్ రోడ్డులో నుండి ఒకటో కనుమ రహదారికి వాహనాలను మళ్లిస్తున్నారు. 

07:18 - October 6, 2015

న్యూఢిల్లీ: విదేశాలలో దాచిన నల్లధనం ఆస్తుల విలువ మరింతగా పెరిగింది. సెప్టెంబరు 30తో ముగిసిన '90 రోజుల నల్లధనం వెల్లడి పథకం'లో దాదాపు 638 మంది తమ నల్లధన ఆస్తుల విలువను వెల్లడించినట్లుగా రెవెన్యూ కార్యదర్శి హష్ముక్‌ ఆధియా సోమవారం తెలిపారు. వారు వెల్లడించిన మొత్తం అక్రమాస్తుల విలువ రూ.4,417 కోట్లకు చేరినట్లు ఆయన వివరించారు. ఈ విధానం ద్వారా వెల్లడించిన ఆస్తులపై ప్రభుత్వానికి రూ.2,488.20 కోట్ల పన్ను ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ విధానంలో దాదాపు రూ.3770 కోట్ల మేర నల్లధనం వివరాలు మాత్రమే వెలుగులోకి వచ్చినట్లుగా గతంలో ప్రభుత్వం ప్రాథమిక అంచనాలను వెల్లడించింది. ఎన్వలప్స్ రూపంలో వెల్లడించిన ఆస్తుల విలువను కూడా లెక్కిస్తే ఆ విలువ మరింతగా పెరిగినట్లు తెలిపారు. అమెరికా - భారత్‌ల మధ్య కుదిరిన 'ఫారిన్‌ అకౌంట్‌ ట్యాక్స్ కాంప్లియన్స్ యాక్ట్' (ఎఫ్‌ఏటీసీఏ) ఒప్పందం వల్ల అగ్రరాజ్యం నుంచి ఆస్తుల వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారం భారత్‌ ప్రభుత్వానికి చేరినట్లు ఆయన తెలిపారు.

07:16 - October 6, 2015

ఈ ఏడాది 'భజరంగీ భారుజాన్‌' చిత్రంతో బాక్సాఫీస్‌ హిట్‌ కొట్టిన 'సల్మాన్‌ఖాన్‌' ప్రస్తుతం సూరజ్‌ భట్టాచార్య దర్శకత్వంలో రూపొందుతోన్న 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రంలో నటిస్తున్నారు. సల్మాన్‌ సరసన సోనమ్‌ కపూర్‌ జంటగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే 'సల్మాన్‌' తదుపరి చిత్రం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తమిళంలో ఘనవిజయాన్ని సాధించిన 'తనీ ఒరువన్‌' చిత్రాన్ని సల్మాన్‌ హిందీలోకి రీమేక్‌ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. మోహన్‌రాజా దర్శకత్వంలో గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో తమిళ చిత్రాన్ని ఇటీవల సల్మాన్‌ చూసి ఇష్టపడ్డాడంట. దాంతో మంచి ఫ్యాన్సీ ఆఫర్‌తో హిందీ రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది. గతంలో 'దబాంగ్‌', 'దబాంగ్‌ 2' వంటి పవర్‌ ప్యాక్డ్ పోలీస్‌ స్టోరీస్‌తో మంచి విజయాలను సొంతం చేసుకున్న 'సల్మాన్‌' మరోసారి పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో ఎలా అలరిస్తాడోనని బాలీవుడ్‌ ప్రేక్షకకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళంలో విలన్‌ పాత్రలో నటించిన అరవింద్‌స్వామి పాత్రను హిందీలో ఎవరు చేస్తారో వేచి చూడాల్సిందే.

06:47 - October 6, 2015

సిరియా : ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై వైమానిక దాడులను రష్యా ఉధృతం చేసింది. మరోవైపు ఉక్రెయిన్‌లో యుద్ధ విద్య నేర్చుకున్న రష్యా వాలంటీర్లను సిరియాకు తరలించే అవకాశం ఉన్నట్లు రష్యా పార్లమెంట్స్‌ రక్షణ కమిటీ పేర్కొంది. సిరియన్‌ ఆర్మీతో పాటు పోరాడేందుకు వీరిని పంపనున్నట్లు తెలిపింది. ఇప్పటికే సిరియాలోని హమేయిమ్ ఎయిర్ బేస్ నుంచి రష్యా వైమానిక దాడులను నిర్వహిస్తోంది.

06:45 - October 6, 2015

చైనా : చైనాకు దక్షిణ తీరప్రాంతంలో ముజిగే టైఫూన్‌ బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తుఫాను ధాటికి ఏడుగురు మంది మృతి చెందారు. వందల మంది నిరాశ్రయులు అయ్యారు. దక్షిణ చైనాలో రవాణా వ్యవస్థ అస్తవ్యవస్థమైంది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. తుఫాను ధాటికి ఏడుగురు మృతి చెందగా.. 250 మందికి పైగా గాయాలయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. దాదాపు 60 వేలకు పైగా నిరాశ్రయులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పొంగుతున్న వాగులు..వంకలు..
జాన్‌జియంగ్‌ ప్రాంతంలో ఆదివారం నుంచి తుఫాను ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. దీంతో అక్కడి ఇళ్లు, రోడ్లు నీట మునిగాయి. పలు చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాలు వరదలతో అతలాకుతలమయ్యాయి. కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ గాలులు వీస్తున్న నేపథ్యంలో దక్షిణ చైనా తీర ప్రాంతం పూర్తిగా దెబ్బతింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

రవాణా వ్యవస్థపై పెను ప్రభావం..
చైనా వాతావరణ ప్రతికూలత రవాణా వ్యవస్థపై ప్రభావం చూపింది. రహదారులు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మరోవైపు తీవ్ర గాలులుకు చెట్లు విద్యుత్‌ తీగలపై తెగిపడడం.. స్థానిక విద్యుత్‌ కేంద్రాలు నీట మునగడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ పునరుద్ధరణకు మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో చైనాలోని దక్షిణ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొనడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలు..
ఇక చైనా అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ వర్షాలకు ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. నిరాశ్రయులైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు రవాణా వ్యవస్థను పునరుద్ధరించడం కోసం సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. దక్షిణ చైనాలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. భీకర తుఫాన్‌తో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. 

06:42 - October 6, 2015

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితులకు బాధితులందరికీ డబ్బు చెల్లించేలా ఉమ్మడి హైకోర్టు ముందడుగు వేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలని హైకోర్టు నిర్ణయించింది. సభ్యుల పేర్లు సూచించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. కేసు విచారణ నేటికి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ కుంభకోణం.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ స్కామ్. ఈ కుంభకోణంతో ఎంతోమంది రోడ్డునపడ్డారు. పెట్టుబడులు పెట్టుకున్నవారంతా లబోదిబోమంటూ బ్రాంచీలముందు గోడు వెళ్లబోసుకున్నారు. భవిష్యత్ కోసం తమ కష్టార్జితాన్ని ఎంతో నమ్మకంగా అందులో డబ్బులు జమచేస్తే.. ఆ ఆశలు నీరుగారాయంటూ లబోదిబోమన్నారు. ఈ కుంభకోణంతో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇలా ఎంతోమంది ఈ కుంభకోణం బారినపడ్డ బాధితులకు ఇప్పుడో శుభవార్త.

హైకోర్టు పలు ఆదేశాలు..
అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల విక్రయానికి కమిటీ ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అగ్రిగోల్డ్ మోసాలపై ఈరోజు జరిగిన విచారణలో భాగంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యులు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలో సభ్యుడి స్థానం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడుగురి పేర్లతో కూడిన జాబితాను హైకోర్టుకు సమర్పించింది. తెలంగాణ నుంచి సభ్యుడి కోసం ఐదు పేర్లతో కూడిన జాబితా సమర్పించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

బాధితులకు ఊరట..
గత ఆరు నెలలుగా ఈ కేసు విచారణ సాగుతుందని... సాధ్యమైనంత త్వరగా ఈ విచారణ ముగించాలని బాధితుల తరపు న్యాయవాది హైకోర్టుకి విజ్ఞప్తి చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి పైవిధంగా స్పందించారు. దాదాపు 40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు నిర్ణయంతో ఊరట లభించింది.

06:39 - October 6, 2015

తెలంగాణలో గిరిజనులు పోరుబాట పట్టారు. నేడు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. వీరి ఆందోళనకు కారణం ఏమిటి ? తెలంగాణలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి ? విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో గిరిజనుల సమగ్రాభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి ? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో గిరిజన సంఘం నేత శ్రీరాంనాయక్‌ విశ్లేషించారు. 

06:35 - October 6, 2015

ఓ వైపు అడవులు మాయమవుతున్నాయి. ఆధునికాభివృద్ధి అడవి బిడ్డలుగా పేరొందిన గిరజనులను తల్లి ఒడి నుంచే తరిమేస్తోంది. అటు అడవిలో బతికే అవకాశం లేక, ఇటు మైదాన ప్రాంతాల్లో ఉపాధి పొందలేక సతమతమవుతున్న గిరిజనులెందరో. ఇంతకాలమూ అడవులను సంరక్షిస్తూ వచ్చినవారే గిరిజనం. వీరి కష్టాలు వర్ణణాతీతం. గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తామంటూ ఎన్నికల ముందు ప్రతి రాజకీయ పార్టీ వాగ్ధానం చేస్తూ వుంటుంది. కానీ ఆచరణలో ఏం జరుగుతున్నదో గణాంకాలే కళ్లకు కడుతున్నాయి. గిరిజనులకు చదువు చెప్పే దిక్కువుండదు. గిరిజనులు మాట్లాడే భాషలకు లిపిలేకపోవడం, ఇతర భాషల్లో సాగే బోధన వారికి అర్ధంకాకపోవడం పెద్ద సమస్యై వెక్కిరిస్తోంది. టీచర్స్ లో గిరిజనుల సంఖ్య అతి తక్కువగా వుండడం మరో శాపం. గిరిజనుల్లో పదో తరగతి పాసైన వారు 27శాతం మంది కూడా లేరు. ఇక ఇంటర్‌ స్థాయికి చేరుకోగలిగింది 14శాతం మందే. ఇక ఉన్నత విద్యలో గిరిజనుల పరిస్థితి మరీ ఘోరం. గిరిజనుల్లో 47శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువున అష్టకష్టాలు పడుతున్నట్టు ప్రభుత్వాల గణాంకాలే చెబుతున్నాయి.

వైద్యం చేసే వారేరి ?
ఇక గిరిజనులకు వైద్యం చేసే నాధుడుండడు. ప్రతి ఏటా సీజన్‌ మారిన్నప్పుడల్లా రకరకాల అంటువ్యాధులతో ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నది గిరిజనులే. ఇప్పటికీ రవాణా, విద్యుత్‌ సదుపాయాలకు నోచుకోని గిరిజన తండాలెన్నో. ఓ వైపు పరుగులు తీస్తున్న ఆధునికాభివృద్ధీ గిరిజనులకు నిలువనీడ దొరకని పరిస్థితిని సృష్టిస్తోంది. భారీ ప్రాజెక్టులు కట్టిన ప్రతి చోటా ముందుగా నిర్వాసితులవుతున్నదీ గిరిజనులే. ప్రాజెక్టులు, పరిశ్రమలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, రిసార్ట్స్, బాక్సైట్‌ తవ్వకాలు ఇలా ఎన్నో రూపాలు గిరిజనులకీ అడవికీ వున్న బంధాన్ని తెంపేస్తున్నాయి.

చెరబడుతున్న స్మగ్లర్లు..
ఓ వైపు స్మగ్లర్లు అడవితల్లిని చెరబడుతున్నారు. మరోవైపు అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు అడవిని ధ్వంసం చేస్తున్నాయి. భారీ ప్రాజెక్ట్ ల నిర్మాణమంటూ, బాక్సెట్ తవ్వకాలంటూ, ఖనిజ నిక్షేపాల వెలికితీత అంటూ, రకరకాల పేర్లతో అడవుల నుంచి గిరిజనులను తరిమివేస్తున్న దృశ్యాలే దేశమంతా కనిపిస్తున్నాయి. దీంతో అడవిబిడ్డలు నిలువనీడ కోల్పోతున్నారు. అడవులు తరిగిపోతున్నా కొద్ది గిరిజన కష్టాలూ పెరుగుతున్నాయి. అటవీ ఉత్పత్తుల సేకరణ వారికి మరింత భారంగా మారుతోంది.

అటవీ హక్కుల చట్టం ఎక్కడ ?
పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ ఇవి రెండూ గిరిజనుల ప్రధాన వ్యాపకాలు. ఇంతకాలమూ అడవినే అంటిపెట్టుకున్న గిరిజనుల చేతుల్లో భూముల్లేకుండా పోతున్నాయి. చాలా చోట్ల కౌలు పేరుతో గిరిజనేతురులే పాగా వేస్తున్నారు. 2006లో యూపీఏ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం చేసినా అది ఆచరణలో ముందుకు సాగడం లేదు. 2006కు పూర్వం సాగు చేసుకుంటున్నవారికి పది ఎకరాల చొప్పున హక్కు పత్రాలు ఇవ్వాలంటూ చేసిన చట్టం గిరిజనుల జీవితాలను మార్చలేకపోయింది. దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మందికి కూడా హక్కు పత్రాలు ఇవ్వకపోగా, అటవీ అధికారుల వేధింపులు పెరిగాయి.

పోరుబాట పట్టిన గిరిజనులు..
దళితులతో పాటు గిరిజనులకూ భూములిస్తామని టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ, ఇంతవరకూ అది ఆచరణ రూపం దాల్చలేదు. పైగా హరితహారం పేరుతో ఇప్పటికే గిరిజనుల సాగులో వున్న భూములను కూడా లాక్కుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు పెంచుతామన్న వాగ్ధానమూ అమలుకు నోచుకోవడం లేదు. అటు అడవిలో బతకనీయక, ఇటు విద్యా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించకపోతే గిరిజనులు ఎక్కడ బతకాలి? ఎలా బతకాలి? ఈ ప్రశ్నే ఇప్పుడు గిరిజనులను పోరుబాట పట్టిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు గిరిజనుల సమగ్రాభివృద్ధికి నడుం బిగించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

06:30 - October 6, 2015

కటక్ : టీ-20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. రెండో టీ-20 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీ-20 సిరీస్‌ను సఫారీలు కైవసం చేసుకున్నారు. తొలి రెండు టీ-20 మ్యాచ్‌ల్లో సఫారీలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా బౌలర్లు అల్బీ మోర్కెల్‌, ఇమ్రాన్‌ తాహిర్‌లు చెలరేగడంతో తొలుత భారత్‌ను 92 పరుగులకే కుప్పకూల్చారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు అలవోకగా విజయాన్ని సాధించారు.

రోహిత్..ధావన్ ల ఆరంభం..
ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ల ఆరంభం ఆశాజనకంగానే ఉండడంతో ధర్మశాల జోరు కొనసాగుతుందని అందరూ ఆశించారు. కానీ.. ఉత్సాహంలో ఉన్న ధావన్‌ను మోరీస్‌ ఎల్బీగా వెనక్కి పంపడంతో.. తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాతి ఓవర్‌లో కోహ్లి రనౌట్‌ మ్యాచ్‌ను మలుపుతిప్పింది. ఆ తర్వాత నిలకడగా ఆడుతున్న రోహిత్‌శర్మ కూడా రనౌట్‌ కావడంతో భారత్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఇక బ్యాటింగ్‌కు వచ్చిన అంబటి రాయుడు పరుగులేమీ చేయకుండానే వికెట్‌ కోల్పోయాడు. వికెట్లు కోల్పోయి ఒత్తిడి ఉన్న సమయంలో ధోనీ.. కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత రైనా, హర్భజన్‌లు వెంటవెంటనే అవుటయ్యారు. ఆ తర్వాత అక్షర్‌ పటేల్‌ 9 పరుగులకు.. కుమార్‌ డకౌట్‌ అయ్యాడు. ఇక అశ్విన్‌ 11 పరుగులు చేసి.. మోరిస్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్ కావడంతో.. భారత్‌ 17.2 ఓవర్లలో 92 పరుగులు చేసి ఆలౌటయ్యింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్కెల్‌ మూడు, తాహీర్‌, మోరిస్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

అభిమానుల ఆగ్రహం..
భారత్ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా చేధించే క్రమంలో భారత్ ఫ్లాప్ షోతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సౌతాఫ్రికా స్కోర్‌ 63 వద్ద ఉన్నపుడు గ్రౌండులోకి బాటిళ్లు విసరడంతో కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్‌ 70 పరుగుల వద్ద ఉన్నప్పుడు మరోసారి అభిమానులు ఆగ్రహించారు. గ్రౌండ్‌లోకి బాటిళ్లు విసరడంతో అరగంట సేపు మ్యాచ్‌ను నిలిపివేశారు. అనంతరం దక్షిణాఫ్రికా తిరిగి బ్యాటింగ్ ప్రారంభించిన కొద్ది సేపటికే బెహర్దీన్ 11 పరుగులకు అవుటయ్యాడు. ఆ తర్వాత డుమినీ, మిల్లర్లు బాధ్యతాయుతంగా ఆడటంతో సఫారీలు సునాయాసంగా గెలిచారు. ఆరంభం నుంచే దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్‌లు ధాటిగా ఆడటానికి ప్రయత్నించారు. మరో వైపు అశ్విన్ మూడు వికెట్లు తీసి రాణించినా ఫలితం లేకుండా పోయింది.

పరువు నిలబెట్టుకోవాలని భారత్ ఆరాటం..
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మూడో టీ-20 గురువారంనాడు జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను గెలిచిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు.. మూడో మ్యాచ్‌ను కూడా గెలవాలని ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే అభిమానుల ఆగ్రహానికి గురైన టీమిండియా.. ఎలాగైనా మూడో మ్యాచ్‌ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆశపడుతోంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. 

06:24 - October 6, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పట్టణ ప్రజలకు మరో పిడుగులాంటి వార్త. పట్టణ ప్రజలపై మరోసారి పన్నుభారం మోపేందుకు.. చంద్రబాబు సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సెస్‌ పేరుతో కొత్త పన్ను వసూలుకు రంగం సిద్ధం చేసింది. పచ్చదనం, సుందరీకరణ కోసం అర్బన్‌ ఏరియాలలో గ్రీన్‌సెస్‌ వసూలుకు ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ ఛైర్మన్‌గా నలుగురు సభ్యులతో కమిటీని వేసింది. నవంబర్‌ 1 కల్లా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచి.. ప్రజల నుంచే ఆ డబ్బులు వసూలు చేసేందుకు యత్నిస్తోంది.

కరికాలవలవన్ ఉత్తర్వులు..
పట్టణాల్లో ఏపీ అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చేపడుతున్న పచ్చదనం, సుందరీకరణ కోసం నిధులు సమీకరించేందుకు సెస్‌ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ తయారుచేసిన ప్రతిపాదన పరిశీలించేందుకు మున్సిపల్‌శాఖ డైరెక్టర్‌ను చైర్మన్‌గా, అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటీఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మెంబర్‌ను కన్వీనర్‌గాను, టౌన్‌అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్ట్‌, రెవెన్యూ ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీలను సభ్యులుగా కమిటీని నియమిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి కరికాలవలవన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

బెంగళూరులో అమలు..
ఈ కమిటీని ఏర్పాటు ప్రజల నుంచి ఎంత పన్ను వసూలు చేయాలి. ఎప్పుడు చేయాలనేది త్వరలోనే నిర్ణయిస్తుంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాల్లో ఎంతమేరకు పచ్చదనం పెంచాలి, అందుకు ఏ విధమైన చర్యలు చేపట్టాలని సమాలోచనలు చేయనుంది. ఈ విధానాన్ని ప్రస్తుతం కర్ణాకటలోని బెంగళూరులో అమలు చేస్తున్నారు. ఈ గ్రీన్‌సెస్‌ విధానం అమలైతే.. పట్టణప్రజల్లో ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడుపై ఈ పన్ను భారం పడే అవకాశం ఉంది. 

06:20 - October 6, 2015

హైదరాబాద్ : కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి కిరాతకంగా వ్యవహరించాడు. చంపేదుకు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన షామిర్ పేటలో చోటు చేసుకుంది. ఎల్ బినగర్ హస్తినాపురానికి చెందిన కిరణ్..దీప్తికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తరపు వారికి ఈ వివాహం నచ్చలేదు. ఎలాగైనా కిరణ్ ను అంతం చేయాలని దీప్తి తండ్రి నిశ్చయించుకున్నాడు. తమపై దాడి చేసేందుకు సమయం కోసం నిరీక్షిస్తున్నాడని, ఇప్పటికే పలుమార్లు తన భర్తను చంపేందుకు ప్రయత్నించాడని బాధితురాలు వాపోయింది. ఈ క్రమంలోనే హోటల్ మేనేజ్ మెంట్ లో ఉద్యోగం కల్పిస్తానని తన తండ్రి కిరణ్ ను తీసుకెళ్లాడని దీప్తి పేర్కొంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కిరణ్ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.

వారణాసిలో ఆందోళనలు..

ఉత్తర్ ప్రదేశ్ : గత నెల 22వ తేదీన గణేష్ విగ్రహాల నిమజ్జన సమయంలో పోలీసుల చర్యలను నిరసిస్తూ సోమవారం వారణాసిలో పలువురు ఆందోళనకు దిగారు. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీనితో దశాశ్వమేథ్, కొట్వాలి, చౌక్, లుక్సా తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

నేడు నగరానికి రానున్న ఈటెల..

హైదరాబాద్ : ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆయన గత నెల 27న ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు.

నేటి నుండి టి.టిడిపి ఆందోళన..

హైదరాబాద్ : రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేటి నుండి టి.టిడిపి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ సోమవారం వెల్లడించారు. మిత్రపక్షంతో కలిసి ధర్నాలు చేస్తామని, గజ్వేల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. 7,8,9 తేదీల్లో హన్మకొండ, నిజామాబాద్, రంగారెడ్డి, కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహిస్తామన్నారు. రూ. లక్షలోపు రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయాలని అలాగే కరవు మండలాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

నేటి నుండి ఏపీ రాజధానిలో సీపీఎం పాదయాత్రలు...

విజయవాడ : రాజధాని ప్రాంత సమస్యలు పరిష్కరించాలని నేటి నుండి సీపీఎం పాదయాత్రలు చేపట్టనుంది. ఈ విషయాన్ని రాజధాని ప్రాంత సీపీఎం కమిటీ కన్వీనర్ బాబురావు సోమవారం వెల్లడించారు. 11వ తేదీ వరకు 29 గ్రామాల్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు, ప్రభుత్వ వైఫల్యాలను పాదయాత్రలో ప్రజలకు వివరిస్తామన్నారు. సమస్యలు పరిష్కరించకుండా రాజధాని శంకుస్థాపన చేయడం సరైంది కాదన్నారు. శంకుస్థాపన లోపే రాజధాని ప్రాంతంలో సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

8 నుండి సీపీఎం పాదయాత్రలు..

విజయవాడ : టిడిపి, బీజేపీ ఎన్నికల హామీలను నెరవేర్చాలని 8వ తేదీ నుండి సీపీఎం పాదయాత్రలు చేపట్టనుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ..రైల్వే జోన్ ల విషయంలో కేంద్రం మాట తప్పిందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్య పెడుతున్నాయని తెలిపారు.

 

నేటి నుండి కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర..

హైదరాబాద్ : నేటి నుండి నాలుగు రోజుల పాటు కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర నిర్వహించనుంది. 6 మహబూబ్ నగర్, 7 మెదక్, 8 ఖమ్మం, 9 వరంగల్ లో యాత్ర కొనసాగనుంది. 9వ తేదీలోపు ప్రభుత్వం దిగి రాకపోతే 10వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తామని కాంగ్రెస్ పేర్కొంది.

నేడు ఎస్టీ రిజర్వేషన్ సాధన సమితి అసెంబ్లీ ముట్టడి..

హైదరాబాద్ : నేడు ఎస్టీ రిజర్వేషన్ సాధన జేఏసీ అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చింది. ఎస్టీ రిజర్వేషన్లు 6 నుండి 10 శాతానికి పెంచాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది.  

షామిర్ పేటలో యువకుడిపై దాడి..

రంగారెడ్డి : షామిర్ పేటలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కిరణ్ పై అమ్మాయి బంధువులు దాడికి యత్నించారు. కత్తులతో దాడి చేయడంతో కిరణ్ తీవ్రగాయాలకు పాలయ్యాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. కిరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

రిమ్స్ వైద్య సిబ్బందితో ప్రభుత్వ విప్ వాగ్వాదం..

శ్రీకాకుళం : రిమ్స్ వైద్య సిబ్బందితో ప్రభుత్వ విప్ రవికుమార్ వాగ్వాదానికి దిగారు. పొందూరుకు చెందిన రోడ్డుప్రమాద బాధితుడు సింహాచలానికి సకాలంలో వైద్యం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం..

రంగారెడ్డి : జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. కెమికల్ ట్యాంకులు పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. 

టీ-20 సిరీస్ సఫారీలదే..

కటక్ : దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ-20 మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం చవి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 17.2 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లక్ష్య చేధనలో ధాటిగా ఆడిన సౌతాఫ్రికా టీం 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. దీనితో మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ ను దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు తీయగా అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మోర్కెల్ మూడు, తాహిర్, మోరీన్ తలా రెండు, రబాడ ఒక వికెట్ తీశారు. 

Don't Miss