Activities calendar

10 October 2015

హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూతో వ్యక్తి మృతి

హైదరాబాద్ : చాదర్ ఘాట్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉప్పగూడకు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి స్వైన్ ఫ్లూతో మృతి చెందాడు. 

సప్తగిరి ఎక్స్ ప్రెస్ రైలులో ఆకాతాయిల ఆగడాలు

తిరుపతి : సప్తగిరి ఎక్స్ ప్రెస్ రైలులో ఆకాతాయిలు ఆగడాలకు పాల్పడ్డారు. ప్రయాణికులను వేధించడంతోపాటు గొలుసు లాగి రైలును ఆపారు. అడ్డుకున్న ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించారు. 40 మంది లా విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

హౌరా-చైన్నై ఎక్స్ ప్రెస్ రైలులో దోపిడీ

శ్రీకాకుళం : హౌరా-చైన్నై ఎక్స్ ప్రెస్ రైలులో దోపిడీ జరిగింది. దంపతులకు మత్తు మందు ఇచ్చి దొంగలు నగలు చోరీ చేశారు. బాధితులు పలాస రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

21:59 - October 10, 2015

స్త్రీ, పురుషల మధ్య సమానత్వం ఉండాలని ప్రొ.కంచ ఐలయ్య అన్నారు. ఇదే అంశంపై నిర్వహించన జనచరిత.. శ్రమైక జీవన సౌందర్య విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. మహిళల శ్రమను గౌరవించాలన్నారు. శ్రమపై సమదృష్టి రావాలని పేర్కొన్నారు. ఆడ, మగ సమానమని మతాలు చెప్పాలని సూచించారు. తిండి, చూపులో మహిళలు, పురుషుల మధ్య సమానత్వం ఉండాలన్నారు. స్కూల్ లో శ్రమగౌరవ పాఠాలు ఉండాలని కోరారు. ఆడ, మగవారు చిన్నప్పటి నుంచే పనులు చేయాలని పాఠ్యాంశాలుగా చేర్చాలని అన్నారు. పునరుత్పత్తిలో మహిళలది కీలక పాత్ర అన్నారు. పని పట్ల గౌరవం ఉండాలని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:51 - October 10, 2015

విజయవాడ : ఏపి క్యాబినెట్ సమావేశం ముగిసింది. విజయవాడలో 8గంటల పాటు సుధీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో పూర్తిగా రాజధాని శంకుస్ధాపన, దాని నిర్వహణ పైనే ఏపి క్యాబినెట్ చర్చించింది. తొలుత రాజధాని శంకుస్ధాపన వేదిక నిర్మాణంపై విజ్‌ క్రాఫ్ట్ అనే సంస్ధ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. అనంతరం శంకుస్ధాపన మహోత్సవానికి ఎవరెవరిని ఆహ్వానించాలనే దానిపై మంత్రిమండలి చర్చించింది. ఈ క్రమంలోనే గవర్నర్‌, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌లకు స్వయంగా ఆహ్వాన పత్రికలు అందిస్తానని చంద్రబాబు చెప్పారు. ఇక ఈ నెల 18న స్వయంగా కేసీఆర్‌ను కలిసి రాజధాని శంకుస్ధాపనకు ఆహ్వానిస్తానని చంద్రబాబు మంత్రులకు తెలిపారు. ఇక తెలంగాణ మంత్రులందరిని కూడా ఆహ్వానించాలని ఏపి క్యాబినెట్ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల ప్రముఖులను ఆహ్వానించే భాధ్యతను మంత్రులకు అప్పగించారు ఏపి సీఎం.
రాజమహేంద్రవరంగా రాజమండ్రి పేరు మార్పు
ఇదిలా ఉంటే రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చుతూ ఏపి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇటు వైయస్సార్‌ జిల్లాగా ఉన్న పేరును తిరిగి "కడప"గా మార్చాలని మంత్రిమండలి చంద్రబాబుకు సూచించింది. అయితే ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు మంత్రులకు చెప్పారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంతో పాటు పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేయటంపై కూడా క్యాబినెట్లో చర్చ జరిగింది.ఇక గడువు ముగిసినందున జేగురుపాడులో జీవీకే పవర్‌ ప్లాంటును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంత్రిమండలి చంద్రబాబుకు సూచించింది. మొత్తంగా కేవలం రాజధాని శంకుస్ధాపన, వేడుక ఏర్పాట్లపైనే చర్చించిన మంత్రిమండలి శంకుస్ధాపన మహోత్సవాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.

 

21:46 - October 10, 2015

ఢిల్లీ : దేశంలో చెలరేగుతున్న మతవిద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్న రచయితలు, మేధావుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళకు చెందిన ప్రముఖ నవలా రచయిత్రి, కవి సారా జోసెఫ్ సాహిత్య అకాడమి అవార్డుతో పాటు 50 వేల నగదును తిప్పి పంపిస్తున్నట్టు ప్రకటించారు. రచయిత కల్బుర్గి, దాద్రీ హత్యలను ఖండించిన ఆమె ప్రజాస్వామ్య దేశంలో కనీస హక్కులు కరువవుతున్నాయన్నారు. రచయితలు హత్యకు గురవుతున్నారు... గజల్‌ గాయకుడి కచేరీకి అనుమతించడం లేదు..ఇపుడు తానున్న భారతదేశం ఇంతకు ముందున్న స్వతంత్ర భారత్‌ కాదని సారా జోసెఫ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సారా జోసెఫ్‌ రాసిన 'అలహాయుదే పెన్‌మక్కల్' నవలకు గాను 2003లో సాహిత్య అకాడమి అవార్డు అందుకున్నారు. ఇంతకుముందు నయనతార సెహగల్, అశోక్ వాజ్పేయి, కె.సచ్చిదానందన్ తమ నిరసన తెలియ జేశారు.  

21:43 - October 10, 2015

విజయవాడ : పోలవరం ప్రాజెక్టుపై క్షుణ్ణంగా చర్చించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎపి కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును రెండు సీజన్లలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. నిర్ణీత సమయంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకపోతే కొత్త కాంట్రాక్టుకు పనులు అప్పగిస్తామని చెప్పారు. పోలవరం ముంపు బాధితులను ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా వర్షపాతం తక్కువగా నమోదయిందని చెప్పారు. పోలవరం వరద ఉధృతి తీవ్రంగా ఉందని తెలిపారు. 50 లక్షల క్యూసెక్కులను దృష్టిలో పెట్టుకుని అనకట్ట కట్టాలన్నారు. పోలవరం నుంచి విశాఖకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలన్నారు. గోదావరి నుంచి 1500 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని చెప్పారు. ఇరిగేషన్, హైడ్రో పవర్, తాగునీటి కోసమే పోలవరం నిర్మాణాన్ని చేపడుతున్నామని వివరించారు. పోలవరం ద్వారా 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పోలవరం ముంపు బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్లే పోలవరం నిర్మాణం ఆలస్యమైందన్నారు.
అమరావతి శంకుస్థాపనకు జపాన్, సింగపూర్ ప్రతినిధులు
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి విస్తృతంగా నాయకులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అమరావతి శంకుస్థాపనకు జాతీయ, అంతర్జాతీయ నాయకులను ఆహ్వానించామని తెలిపారు. రాజధాని శంకుస్థాపననకు జపాన్, సింగపూర్ ప్రతినిధులు వస్తారని చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కృష్ణాపట్నం పోర్టుకు రైల్వే లైన్ కోసం 9ఎకరాలు
గ్రీన్ ట్రిబ్యునల్ నోటీస్ పై చర్చించినట్లు చెప్పారు. కృష్ణాపట్నం పోర్టుకు రైల్వే లైన్ కోసం తొమ్మిది ఎకరాలు కేటాయించినట్లు వివరించారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా రెండు నదులు అనుసంధానం అయిందన్నారు.
రాజమహేంద్రవరంగా రాజమండ్రి
రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్పుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.
 

టీఎంయూలో చీలిక

హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ ప్రధాన కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ లో చీలిక ఏర్పడింది. యూనియన్ కు పలువురు కీలక నేతలు రాజీనామా చేశారు. నలుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు రాష్ట్ర కార్యదర్శులు, ఇద్దరు జోనల్ చైర్మన్లు సహా 12 మంది రాజీనామా చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని యూనియన్ నాయకత్వంపై నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంయూ ప్రధాన కార్యదర్శి నిర్ణయంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

 

20:58 - October 10, 2015

కర్నూలు : జిల్లా పత్తికొండలో దారుణం జరిగింది. ఆదోని రోడ్డు సమీపంలోని హంద్రీనీవా కాల్వగట్టుపై క్షుద్రపూజలు నిర్వహించారు. దుండగులు పసికందును బలి ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలింపు చర్యల చేపట్టారు.  

క్షుద్రపూజలకు పసికందును బలిచ్చిన దుండగులు..

కర్నూలు : జిల్లా పత్తికొండలో దారుణం జరిగింది. ఆదోని రోడ్డు సమీపంలోని హంద్రీనీవా కాల్వగట్టుపై క్షుద్రపూజలు నిర్వహించారు. దుండగులు పసికందును బలి ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలింపు చర్యల చేపట్టారు.

 

20:30 - October 10, 2015

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. శంకుస్థాపన ఏర్పాట్లపై చర్చించిన కేబినెట్‌... తెలంగాణ మంత్రులందరినీ ఆహ్వానించాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ను 18న స్వయంగా చంద్రబాబు ఆహ్వానించబోతున్నారు. పోలవరం నిర్మాణ పనులు, అగ్రిగోల్డ్‌ వేలంపై కేబినెట్‌ చర్చించింది.

 

20:24 - October 10, 2015

తూర్పుగోదావరి : రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మారుస్తూ ఏపీ మంత్రి వర్గం అధికారికంగా ప్రకటించింది. దీంతో గోదావరి తీర ప్రాంతవాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పేరు మార్పుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు భాషాభిమానులు స్వాగతించారు. 

20:20 - October 10, 2015

విజయవాడ : ఒక వెయ్యి 240 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టులపై చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ కుదిరింది. విజయవాడ, అమరావతి, విశాఖలో ఎమ్యూజ్‌మెంట్‌, వాటర్‌ వరల్డ్‌ పార్కులు, డెస్టినేషన్‌ అండ్‌ ప్యాకేజీ టూర్లు, హోటల్స్‌, రిసార్టులు, బీచ్‌ రిసార్టులు, ఫైవ్‌, త్రిస్టార్‌ హోటళ్లు, కడపలో వేసైడ్‌ అమెనిటీస్‌ ఏర్పాటుపై ఎంవోయూ కుదిరింది. 85 కోట్ల పెట్టుబడితో రెండు ఎకరాల విస్తీర్ణంలో తిరుపతి తిరుచానూరులో గేట్‌ వే హోటల్‌ నిర్మాణానికి ఎంవోయూ కుదిరింది. ఎల్ ఈపిఎల్ వెంచర్స్‌, సాయిప్రియా బీచ్‌ రిసార్ట్స్‌, వీఎస్ ఎన్ ఎస్టేట్స్‌, పోలి సునీత, గేట్‌ వే హోటల్స్‌ సంస్థలతో టూరిజం శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. 

20:19 - October 10, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతవి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానపత్రికలు సిద్ధమయ్యాయి. ఆహ్వాన పత్రికను విజయవాడలోని సీఎం క్యాంప్‌ ఆఫీసులో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ సమావేశంలో ఆవిష్కరించారు. ఏపీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు, రాష్ట్రమంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చ
అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లను మంత్రివర్గం ప్రధానంగా చర్చించింది. ఈ నెల 22న మధ్యాహ్నాం 12గంటల 45 నిమిషాలకు శంకుస్థాపన జరుగుతుందని తెలియజేస్తూ అందంగా ఈ పత్రికను ముద్రించారు. ఒక వైపు సుముహూర్త వివరాలు, మరోవైపు అమరావతి స్థూపంపై ఉన్న బహుపత్ర తామరపుష్ప ముద్ర, ఇంకోవైపు నగర ప్రణాళిక ఉన్నాయి. ఆహ్వానితులంతా ఉదయం 10గంటల 30 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకోవాలని భద్రతా కారణాల రీత్యా ఆహ్వాన పత్రికను తమతో ఉంచుకోవాలని, కేవలం ఆహ్వానితులు మాత్రమే రావాలని అందులో స్పష్టం చేశారు. హ్యాండ్‌ బ్యాగులు, బ్రీఫ్‌ కేసులు, కెమెరాలు , మొబైల్‌ ఫోన్లు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మంచినీటి సీసాలు, కార్‌ సెంట్రల్‌ లాకింగ్‌ డివైజెస్‌ వంటి వాటిని సభా ప్రాంగణంలోకి తీసుకురావద్దని సూచించారు.
ఆహ్వానితుల లిస్ట్‌ తయారు
ఇప్పటికే ఆహ్వానితుల లిస్ట్‌ తయారయ్యింది. కేంద్రమంత్రులు, ఎంపీలు, సుప్రీంకోర్టు జడ్జీలు, ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు, విదేశీ రాయబారులు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులకు ఈ ఆహ్వాన పత్రాలను ప్రభుత్వం అందించనుంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాకు కూడా ఏపీ ప్రభుత్వం ఆహ్వాన పత్రం పంపనుంది. దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈవోలకు ఆహ్వానం పలకునుంది. రతన్‌టాటా, సైరస్ మిస్త్రీ, అజీజ్‌ ప్రేమ్‌జీ, ముఖేష్‌ అంబానీ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లకు ఆహ్వాన పత్రాలు ప్రభుత్వం పంపించనున్నట్లు తెలుస్తోంది. 

20:09 - October 10, 2015

విజయనగరం : వారంతా విధి వంచితులు. పుట్టుకతోనే అంధులు. కానీ, ఆత్మస్థయిర్యంలోనూ, ప్రతిభాపాటవాల్లోనూ ఇతరులకు ఏ మాత్రం తీసిపోరు. పుట్టుకలో విధి చిన్న చూపు చూసినా, జీవితంలో మాత్రం ఎవరికీ తీసిపోని విధంగా తమ సత్తా చాటుతున్నారు. ఉత్తరాంధ్రలోనే ఏకైక ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న వీరు తమ వైకల్యానికే సవాల్ విసురుతున్నారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్న అంధ విద్యార్థులు
చూపు లేకున్నా వీరు మనోనేత్రంతో చూడగలరు. చీకటిలో వెలుతురును వీక్షించగలరు. అంధత్వం తమ లక్ష్యానికి అడ్డుకాదని నిరూపిస్తున్నారు. విధి తమని చిన్నచూపు చూసినా, తమ ప్రతిభకి అదేమీ అడ్డంకికాదంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకుళ్తున్నారు.
ఉత్తరాంధ్రలోనే ఏకైక ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల
వైకల్యం వీరి తపన ముందు తలవంచింది. శారీరక లోపం వారి ఆత్మవిశ్వాసానికి ఎదురునిలువలేకపోయింది. విజయనగరంలోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల ఎంతోమంది అంధ విద్యార్థులను తన అక్కున చేర్చుకుంటోంది. ఉత్తరాంధ్రలోనే ఏకైక ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల ఇదే కావడం విశేషం. సినిమా పాటలు, డ్యాన్సుల్లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నారు. ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌లో నిర్వహించిన పాటల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. ఈ స్కూల్లో 36 మంది చదువుకుంటున్నారు. ప్రస్తుతం స్కూల్లో ఉండి చదువుకుంటున్నవారు 23 మంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి కేవలం 36 మంది మాత్రమే అంధ విద్యార్థులు ఇక్కడ చదువుకోవడం చూస్తుంటే, డ్రాపౌట్లను గుర్తించడంలో పాఠశాల సిబ్బంది, వికలాంగ సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఇక ఈ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ డిప్యూటేషన్‌పై వచ్చిన వారే. దీంతో డ్రాపౌట్లను, కొత్త విద్యార్థులను చేర్చుకోవడంపై వీరు అంతగా శ్రద్ధ తీసుకోవడం లేదు.
అధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నించాలి
విశాలమైన ప్రాంగణం, మంచి వసతి సౌకర్యం వంటి సదుపాయాలున్నా, విద్యార్థుల సంఖ్య పరిమితంగానే ఉండటం అధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సి వస్తోంది. మొత్తంగా మనో నేత్రం, మానసిన నిబ్బరం, నేర్చుకోవాలన్న తపన, ఏదైనా సాధించాలన్న పట్టుదలముందు వీరి అంధత్వం ఓడిపోయింది. పుట్టుకతో వచ్చిన గుడ్డితనం వారికి తల వంచి సలాం చేస్తోంది. వాటే వండర్‌, ఇట్స్‌ మిరాకిల్‌ అంటూ అందరి నోళ్లు కొనియాడేలా చేస్తోంది.

 

19:59 - October 10, 2015

పాట్నా : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జెడియు-ఆర్జేడి-కాంగ్రెస్ మహాకూటమి, బిజెపి నేత్వత్వంలోని ఎన్డీయేల మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది. విజయం ఏ కూటమిని వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది. కొన్ని సర్వేలు ఎన్డీయేకు అనుకూలమంటే మరికొన్ని సర్వేలు మహాకూటమి వైపు మొగ్గు చూపుతున్నాయి. తాజాగా సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌, ఆక్సిస్‌ జరిపిన సర్వే మాత్రం- మహాకూటమికి మళ్లీ మహర్దశ పడుతుందని పేర్కొంది. ఢిల్లీ మాదిరి బీహార్‌లో కూడా మోది మంత్రం పనిచేయడం లేదా?
గెలుపోటములపై సర్వేలు
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో గెలుపోటములపై సర్వేలు ఊపందుకున్నాయి. తాజాగా సిఎన్‌ఎన్‌-ఐబిఎన్-యాక్సిస్‌ మై ఇండియా ప్రీపోల్‌ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో నితీష్‌ మహాకూటమి విజయం నల్లేరు మీద నడకలాంటిదేనని పేర్కొంది. ఎన్డీయే రెండోస్థానంతో సంతృప్తి పడాల్సి ఉంటుందని తెలిపింది.
మొత్తం 243 సీట్లు
బీహార్‌ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లున్నాయి. ఇందులో జెడియు-ఆర్జేడి-కాంగ్రెస్ మహాకూటమికి 129 నుంచి 145 సీట్లు రానున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మేజిక్‌ ఫిగర్‌ 122 కన్నా అధికం. బిజెపి నేతృత్వంలోని ఎల్‌జేపి-ఆర్ఎల్‌ఎస్పీ,హమ్‌ కూటమి 87 నుంచి 103 సీట్లు మాత్రమే కైవసం చేసుకోనుందని సర్వేలో తేలింది. ఇతర పార్టీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎస్పీ, బిఎస్పీ, ఎన్‌సిపి, ఎఐఎంఐఎం తదితర పార్టీలకు 8 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశముందని సిఎన్‌ఎన్‌ ఐబిఎన్‌ సర్వే చెప్పింది. ద టైమ్స్‌ నౌ- సి వోటర్‌ జరిపిన ప్రీపోల్‌ సర్వేలో మాత్రం మహాకూటమి, ఎన్డీయేల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది. ఎన్డీయేకు 119 సీట్లు, మహాకూటమికి 116 సీట్లు రానున్నాయని తెలిపింది. ఇతరులకు 8 సీట్లు రానున్నాయి. అంటే ఏ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 122 సీట్ల మేజిక్‌ ఫిగర్‌ రావడం లేదన్నమాట. ఇండియా టుడే ప్రీపోల్‌ సర్వేలో ఒక్క సీటు అటు ఇటు కాకుండా నితీష్‌ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ రానుంది. ఎన్డీయేకు 111 సీట్లు, మహాకూటమికి 122 సీట్లు, ఇతర పార్టీలు 10 సీట్లు గెల్చుకుంటాయని సర్వే తెలిపింది. ఎబిపి న్యూస్‌, నీల్సన్‌ జరిపిన ప్రీపోల్స్‌ సర్వే మాత్రం ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ రానుందని పేర్కొంది. ఎన్డీయేకు 128 సీట్లు, మహాకూటమికి 112, ఇతర పార్టీలకు 3 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
సిఎన్‌ఎన్‌-ఐబిఎన్-యాక్సిస్‌ మై ఇండియా సర్వే
సిఎన్‌ఎన్‌-ఐబిఎన్-యాక్సిస్‌ మై ఇండియా సర్వే ప్రకారం ముఖ్యమంత్రి రేసులో నితీష్‌ కుమార్‌ 43 శాతం ఓట్లతో అందరికన్నా ముందున్నాడు. బిజెపి నేత మాజీ డిప్యూటి సిఎం సుశీల్‌కుమార్‌ మోది 33 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. కేవలం 6 శాతం ఓటర్లే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వైపు మొగ్గు చూపారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అంశంగా ఓటర్లు పేర్కొన్నారు. ఏ సర్వేలో ఎంత నిజముందో అన్నది ఎన్నికల ఫలితాలు వచ్చాకే తెలుస్తుంది.

 

19:50 - October 10, 2015

శ్రీకాకుళం : జిల్లాలో ఎలుగుబంట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు దాడులు చేసిన భల్లూకాలు.. ఇవాళ వజ్రపుకొత్తూరు మండలం బంకులూరులో ఇద్దరు కూలీలపై విరుచుకుపడ్డాయి. తీవ్ర గాయాలు కావడంతో వీరిని.. దగ్గరలోని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

పోలవరం ప్రాజెక్టుపై క్షుణ్ణంగా చర్చించాం : చంద్రబాబు

విజయవాడ : పోలవరం ప్రాజెక్టుపై క్షుణ్ణంగా చర్చించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎపి కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రీన్ ట్రిబ్యునల్ పై చర్చినట్లు చెప్పారు. కృష్ణాపట్నం పోర్టుకు రైల్వే లైన్ కోసం తొమ్మిది ఎకరాలు కేటాయించినట్లు వివరించారు. పోలవరం ముంపు బాధితులను ఆదుకుంటామని పేర్కొన్నారు. అమరావతి శంకుస్థాపనకు జాతీయ, అంతర్జాతీయ నాయకులను ఆహ్వానించామని తెలిపారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా రెండు నదులు అనుసంధానం అయింది.

 

రాజమండ్రి.. రాజమహేంద్రవరంగా మార్పు

తూర్పుగోదావరి : రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్పు చేశారు. ఈమేరకు ఎపి కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది.   

సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ : తెలంగాణలోని జైళ్లలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల కోసం టీసర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది. 2 నెలల్లో ఖైదీల విడుదలకు మార్గమ సుగుమం చేసింది.  

18:55 - October 10, 2015

హైదరాబాద్‌ : నగరంలోని అంబర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. కూతురితో సహా తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కూతురు మృతి చెందింది. గోల్నాకకు చెందిన లక్ష్మీ అనే వివాహిత..తన ఐదేళ్ల కూతురు మాలతితో సహా మూసీ కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే అక్కడే ఉన్న స్థానికులు గమనించి పాప మాలతిని బయటకు తీసినా..చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి లక్ష్మీ ఆచూకీ మాత్రం దొరకలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు...లక్ష్మీ కోసం మూసీ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. అస్సాంకు చెందిన దీపక్‌కుమార్‌తో 9సంవత్సరాల క్రితం వివాహం అయిందని..ఆ తర్వాత వారు కాచిగూడ లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. అయితే కొంతకాలంగా లక్ష్మీ మానసిక పరిస్థితి బాగాలేదని భర్త చెప్పిన సమాచారం ప్రకారం తెలిసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు.

 

18:49 - October 10, 2015

మెదక్ : కట్నం వేధింపులకు ఓ మహిళ తన నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. పుల్కల్ మండలం మంతూరు గ్రామానికి చెందిన జ్యోతికి రెండేళ్ల క్రితం రాజుతో వివాహమైంది. పెళ్లి సమయంలో 15 లక్షల నగదు, ఒక బైకు కట్నంగా ఇచ్చుకున్నారు జ్యోతి తల్లిదండ్రులు. అయితే అదనపు కట్నం కోసం భర్త రాజు, అత్తమామలు ఆమెను అదనపు కట్నం కోసం రోజు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జ్యోతి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. తమ కూతురు మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

18:44 - October 10, 2015

హైదరాబాద్ : టీఎస్‌పీఎస్సీ సభ్యుల సంఖ్య పదికి చేరింది. కొత్తగా ఆరుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రతిపాదనపై గవర్నర్‌ సంతకం చేశారు. పి.వివేక్‌, డి.కృష్ణారెడ్డి, డా.కె.రామ్మోహన్‌రెడ్డి, మంగేరి రాజేందర్‌, సీహెచ్‌ విద్యాసాగర్‌, సీహెచ్‌ సాయిలు కొత్త సభ్యులుగా చేరబోతున్నారు.

పదికి చేరిన టీఎస్‌పీఎస్సీ సభ్యుల సంఖ్య

హైదరాబాద్ : టీఎస్‌పీఎస్సీ సభ్యుల సంఖ్య పదికి చేరింది. కొత్తగా ఆరుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

18:41 - October 10, 2015

వరంగల్‌ : జిల్లాలో తెలంగాణ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారికి చుక్కెదురైంది. తమ డిమాండ్లను పరిష్కరించకుండా.. ప్రభుత్వం ఎందుకు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆశావర్కర్లు శాయంపేట మండల కేంద్రంలో స్పీకర్‌ను నిలదీశారు. నెలరోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆశావర్కర్లు స్పీకర్‌ను నిలదీయడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కూడా ఆశావర్కర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా అక్కడ్నుంచి పంపించివేశారు.

 

18:37 - October 10, 2015

హైదరాబాద్ : ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాల మధ్య తెలంగాణలో అఖిలపక్షం బంద్‌ ప్రశాంతంగా జరిగింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేతలను తెల్లవారుజామునుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలా చోట్ల విపక్ష నాయకులు నిరసనలు, ర్యాలీలు, బైక్‌ ర్యాలీలు చేపట్టారు. రైతు రుణమాఫీ ఒకేసారి అమలు చేయాలని విపక్షాలు గట్టిగా డిమాండ్‌ చేశాయి.
హైదరాబాద్‌లో
ప్రతిపక్షాల ఆధ్వర్యంలో తెలంగాణలో బంద్‌ కొనసాగింది. హైదరాబాద్‌లో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎంబీ భవన్‌నుంచి ఇందిరాపార్క్ వరకూ నేతలు ర్యాలీగా బయలుదేరారు. వీరిని మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు.
రంగారెడ్డి జిల్లాలో
రంగారెడ్డి జిల్లాలో బంద్‌ విజయవంతమైంది. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం విధానాలే కారణమంటూ కాంగ్రెస్‌ నేతలు కుషాయిగూడ ఆర్టీసి బస్‌డిపో ముందు ధర్నా చేశారు.. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఇబ్రహీంపట్నం, కుతుబుల్లాపూర్‌లో నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు డిపోలముందు ధర్నాకు దిగారు. ఉప్పల్ డిపో ముందు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. వీరిని పోలీసులు చెదరగొట్టారు.
మెదక్‌ జిల్లాలో
మెదక్‌ జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది.. డిపోలముందు అఖిలపక్షం నేతల ఆందోళనతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దుకాణాలు, వ్యాపారసంస్థలు, పెట్రోల్‌ బంక్‌లను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. జహీరాబాద్‌లోని జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న గీతారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి గీతారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు..
నల్గొండ జిల్లాలో
నల్గొండ జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో పాటు కాంగ్రెస్‌, టిడిపి, బిజేపి నేతలు డిపోముందు ధర్నా నిర్వహించారు. ఆందోళన చేస్తున్న విపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
వరంగల్‌ జిల్లాలో
వరంగల్‌ జిల్లా నిరసనలు, ధర్నాలతో హోరెత్తిపోయింది. రైతు రుణమాఫీ, ఎన్‌కౌంటర్లకు నిరసనగా అఖిలపక్ష నేతలు ఐకమత్యంగా ముందుకు కదిలారు. బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. సిటీ బస్టాండ్‌ దగ్గర మాజీమంత్రి సారయ్య ధర్నాకు దిగారు.
నిజామాబాద్ జిల్లాలో
నిజామాబాద్ జిల్లాలోనూ ప్రతిపక్షాల బంద్‌ విజయవంతమైంది. ఉదయం నుంచే లెఫ్ట్‌నేతలు బస్టాండ్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన నైజాం పాలనను తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లాలో
కరీంనగర్ జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది.. వందలాది ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పెట్రోల్‌ బంకులు, వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయి. జిల్లా కేంద్రంతో పాటు జగిత్యాల, వేములవాడ, గోదావరిఖని, పెద్దపల్లి, హుజురాబాద్ డిపోల వద్ద కాంగ్రెస్, టిడిపి, బిజెపి, వామపక్ష నేతలు బస్సులను అడ్డుకున్నారు.
ఖమ్మం జిల్లాలో
ఖమ్మం జిల్లాలోకూడా బంద్‌ కొనసాగింది. ఖమ్మం, భద్రాచలం బస్ డిపోల ఎదుట వామపక్షాలతోపాటు, టిడిపి, కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేపట్టారు. ఆరు డిపోల్లో 780కిపైగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ మూతపడ్డాయి.
మహబూబ్‌నగర్‌ జిల్లాలో
మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ , సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు.. పాలమూరు జిల్లా కేంద్రంలో దాదాపు 5గంటలపాటు ధర్నా నిర్వహించిన విపక్ష నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జడ్చర్లలో బైక్‌ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీచేస్తున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు..
ఆదిలాబాద్ జిల్లాలో
ఆదిలాబాద్ జిల్లాలో బంద్ ఉద్రిక్తల మధ్యసాగింది. తెల్లవారుజామునే నేతలను అరెస్టు చేశారు పోలీసులు. అయినా అఖిలపక్ష నేతలు ఆందోళన కొనసాగించారు. బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. నిర్మల్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివేక్‌ చౌక్‌ వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు.

 

 

 

18:33 - October 10, 2015

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాసౌమ్య విలువల్ని కాలరాస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హైదరాబాద్ టిడిఎఫ్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రతిపక్షాలు ఇచ్చిన రాష్ర్ట బంద్‌ విజయవంతమైందన్నారు.

 

ముగిసిన ఎపి కేబినెట్ సమావేశం...

విజయవాడ : ఎపి కేబినెట్ సమావేశం ముగిసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు రాష్ట్ర మంత్రులందరినీ ఆహ్వానించాలని నిర్ణయించారు. ఎపి సీఎం చంద్రబాబు స్వయంగా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించనున్నారు.

 

18:13 - October 10, 2015

హైదరాబాద్ : ఏ విషయంలోనూ ప్రతిపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఉనికిని కాపాడుకోవడానికే విపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయని ఆయన విమర్శించారు. విపక్షాలకు రాజకీయాలు, పదవులు తప్ప ప్రజల బాధలు తెలియవన్నారు. బంద్‌కు ప్రజలు, రైతులెవరూ స్పందించలేదన్న ఆయన.. ఇప్పటికైనా విపక్షాలు నిజాన్ని గ్రహించి ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు.

 

18:10 - October 10, 2015

హైదరాబాద్ : రాజకీయ లబ్ధికోసమే విపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల బంద్‌కు రైతుల నుంచి మద్దతు లేదన్నారు. ప్రతిపక్షాల బంద్‌లో రైతులు ఎవరూ పాల్గొనలేదని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ నేతల చరిత్ర తెలుసు కాబట్టే బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రజలను భయపెట్టేలా కాంగ్రెస్ నేతలు బ్లాక్‌మేయిల్ చేస్తూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతులను ఋణాలు చెల్లించవద్దని...వారి అప్పును వడ్డీతో సహా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసినా...విపక్షాలు బంద్‌కు వెళ్లడం దారుణమన్నారు.

 

17:47 - October 10, 2015

హైదరాబాద్ : కేంద్రంలో అధికార బీజేపీపై ఇంతకాలం పెద్దగా విమర్శలు ఎక్కుపెట్టని టీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీనే టార్గెట్‌ చేసుకుంటూ విమర్శలు మొదలుపెట్టింది. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని విమర్శిస్తూ పలుకుబడి ఉంటే.. కేంద్ర నుంచి లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకురావాలఅన్నారు. బీహార్ కు ప్రకటించినట్లే తెలంగాణకు కూడా ప్యాకేజీ ఎందుకు ఇవ్వరని, నరేంద్ర మోదీ కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ప్రధాన మంత్రా? అని ప్రధాని మోడీని టార్గెట్‌ చేస్తూ విమర్శించారు.
ఢిల్లీ నుంచి లభించని స్నేహ హస్తం
నిజామాబాద్‌ ఎంపీ కవిత సైతం ప్రధానిపై ప్రత్యక్ష విమర్శలకు దిగింది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో ఇంతకాలం టీఆర్‌ఎస్‌ పెద్దగా విమర్శలకు దిగలేదు. ఒకానొక దశలో ఎన్డీఏలో టీఆర్‌ఎస్‌ భాగస్వామిగా చేరి కేంద్ర మంత్రి పదవులు పొందబోతోంది అనే సంకేతాలు కూడా అందాయి. కానీ ఇంతలోనే సీన్‌ రివర్స్‌ అయ్యింది. బీజేపీతో మిత్రత్వం కలిసొస్తుందా లేదా అనే అంశంలో టీఆర్‌ఎస్‌ మల్లగుల్లాలు పడినా ఢిల్లీ వైపు నుంచి పెద్దగా ఆసక్తి కనబరచకపోవడంతో గులాబీ బాసుకు నిరాశ ఎదురయ్యింది.
మోడీని టార్గెట్‌ చేస్తూ ప్రత్యక్ష విమర్శలు
మరోవైపు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు సైతం కేవలం టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలతో కలిసి రాష్ట్ర బీజేపీ నేతలు కూడా పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు సైతం రైతు ఆత్మహత్యలకు సమాన బాధ్యత వహించాలంటూ ఎదురుదాడికి దిగింది. అయితే ఇంతకాలం బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలకు మాత్రమే పరిమితం అయిన విమర్శలు ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు టార్గెట్‌గా వినిపిస్తున్నాయి.
ఎన్డీఏలో చేరేందుకు అందని సిగ్నల్స్‌
మోడీ సర్కారుపై టీఆర్‌ఎస్‌ ప్రదర్శిస్తున్న అసహనం వెనుక మాత్రం పలు విశ్లేషణలు వినబడుతున్నాయి. ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో కేంద్రం ఏపీ సీఎం బాబును రక్షించిందనే విషయం ఒకటైతే, కేంద్రంలోని మోడీ సర్కారు టీఆర్‌ఎస్‌ను ఎన్డీఏలో చేర్చుకునేందుకు ఎలాంటి సిగ్నల్స్‌ పంపకపోవడం కూడా కారణంగా కనిపిస్తోంది.
గ్రేటర్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌
మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎంఐఎం మిత్రత్వం అత్యవసరం. గ్రేటర్‌ ఎన్నికలను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రేటర్‌లో ఎంఐఎం సహాయం లేకుండా కారు గట్టెక్కడం అసాధ్యమే అనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం సహజ శత్రువైన నరేంద్రమోడీపై టీఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యక్ష విమర్శలకు దిగుతున్నారని బలంగా వినిపిస్తోంది. ఏమైనా టీఆర్‌ఎస్‌ రాజకీయ వైఖరి సీజనల్‌గానే ఉంటుందని.. గ్రేటర్‌ ఎన్నికల తర్వాత పరిణామాలను బట్టి కమలానికి దగ్గరైనా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 

 

విపక్షాల బంద్ విఫలం : మంత్రి పోచారం

హైదరాబాద్ : విపక్షాల బంద్ విఫలమైందని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బంద్ లో రైతులు పాల్గొన లేదనని తెలిపారు. కాంగ్రెస్ నేతలను ద్రోహులుగా ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. 

గవర్నర్, సీఎం కేసీఆర్ లను ఆహ్వానించాలని ఎపి కేబినెట్ నిర్ణయం

విజయవాడ : ఎపి రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించాలని ఎపి కేబినెట్ నిర్ణయించింది. అయితే స్వయంగా సీఎం చంద్రబాబే వారిని ఆహ్వానించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల ప్రముఖులను ఆహ్వానించే బాధ్యత మంత్రులకు అప్పగిస్తూ.. కేబినెట్ నిర్ణయించింది.

16:42 - October 10, 2015

హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాదత్ వివాహం దర్శకుడు నాగ్ అశ్విన్ తో జరగనుంది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు నాగ్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. ఈ విషయాన్ని నాగ్ స్వయంగా వెల్లడించాడు. ప్రియాంకే తనకు ముందు ప్రపోజ్ చేసిందని, తాను సంతోషంగా అంగీకరించానని చెప్పాడు. సినీ కుటుంబం నుంచి వచ్చిన ప్రియ అమెరికాలో దర్శకత్వానికి సంబంధించిన శిక్షణ పొందింది. వీరి వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించారు. పెళ్లి ముహూర్తం ఇంకా నిర్ణయించలేదని నాగ్ చెప్పాడు. 

16:41 - October 10, 2015

గుంటూరు : జిల్లాలోని నాదెండ్ల మండలం చందవనంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలమధ్య ఘర్షణ జరిగింది. ఫ్లెక్సీలపై రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు. ఈ ఘటనలో గ్రామస్తులతోపాటు.. ఓ ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వీరిని చికిత్సకోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

16:35 - October 10, 2015

మెదక్‌ : జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని కాంగ్రెస్ నేతలు అన్నారు. రైతులకు న్యాయం చేయాలని అడిగినందుకు తమ గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. రైతు సమస్యల్లో ఉన్నారని సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల్లో రూ. లక్ష రుణమాఫీ చేస్తామన్నారని ఆమె తెలిపారు. ఆ హామీ నెరవేర్చాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. రుణమాపీ ఏకకాలంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని తమ కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడితే.. తమ గొంతు నొక్కేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమాన్ని తొక్కేయాలని చూస్తున్నారని విమర్శించారు.

 

16:25 - October 10, 2015

కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త, భార్యను చిత్రహింసలకు గురి చేసిన భర్త, ఏదో ఒక ఆయుధంతో భార్యను నరికి చంపిన భర్త...ఇలా నిత్యం ఇలాంటి వార్తలను వింటున్నాం.. చదువుతున్నాం... వారందరినీ మించిపోయాడో భర్త... భార్యను అత్యంత దారుణంగా చంపేసి ఆమె తలను చేత్తో పట్టుకుని నడివీధిలో దర్జాగా నడుచుకుంటూ వెళ్లాడా కసాయి. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఈ అమానుష జరిగింది. వివరాల్లోకి వెళితే... పుణెలోని కత్రాజ్ ప్రాంతానికి చెందిన రాము చవాన్(60) అనే వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అక్కడితో ఆగకుండా రక్తం కారుతున్న ఆ తలను చేత్తో పట్టుకుని వీధుల్లో తిరిగాడు. ఇది చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులకు కూడా అది చూసి భయపడిపోయారంటే చవాన్ ఎంత దారుణంగా వ్యవహరించాడో అర్థం చేసుకోవచ్చు. చివరకు పోలీసులు రాము చవాన్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై కేసు నమోదు చేశారు. 60 ఏళ్ల వృద్ధుడైన చవాన్ నిత్యం భార్యకు ఇతరులతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను గొడ్డలితో నరికి దారుణంగా చంపేశాడు. ఆ వెంటనే శరీరం నుంచి తలను వేరు చేశాడు. కుడిచేతిలో గొడ్డలి... ఎడమ చేతిలో తల పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు.

16:01 - October 10, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు మద్దతుగా తాము ధర్నాలు చేస్తే.. కేసీఆర్‌ ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధిస్తోందని తమ్మినేని అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణలో అప్రజాస్వామికంగా పరిపాలన సాగిస్తే సహించేది లేదని చెప్పడం కోసమే ఇవాళ తెలంగాణ బంద్‌ నిర్వహించామని ఆయన అన్నారు. రైతులందరికి రుణమాఫీ జరిగేంతవరకు కేసీఆర్‌ సర్కార్‌ను వదలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ప్రశాంతంగా బంద్ చేస్తున్న కార్యకర్తలపై పోలీసులు చాలా పాశవికంగా వ్యవహరించారని పేర్కొన్నారు. నిన్న జరిగిన ఆశా వర్కర్ల చలో అసెంబ్లీ కార్యక్రమంలో కూడా పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తూ... ఆడవారని చూడకుండా.. ఈడ్చుకెళ్లారని మండిపడ్డారు. కేసీఆర్ అప్రజాస్వామిక పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్... తీరు మార్చుకోవాలని హితవుపలికారు. విపక్షాలు రాజకీయాలు చేయడం లేదని... సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాయని పేర్కొన్నారు. కొత్త కోర్కెలు కోరడం లేదని...గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదని ఎద్దేవా చేశారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని.. కానీ ఇప్పుడు నిరుత్సాహపుడుతున్నారని చెప్పారు. ప్రజా తెలంగాణ రాలేదని.. దొరల తెలంగాణ వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. ఎన్ కౌంటర్లు, నిర్బంధాలు లేని, ప్రజా తెలంగాణ కావాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై నిర్బంధం ప్రయోగిస్తున్నారని వివరించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. ఇచ్చిన హామీలు అమలు అయ్యే దాకా పోరాటం కొనసాగిస్తామన్నారు. 

15:49 - October 10, 2015

గుంటూరు : చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని సీపీఎం ఏపి రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రంగా విమర్శించారు. గుంటూరులో జగన్ చేపట్టిన దీక్షా స్థలికి వెళ్లి ఆయన సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా మధు మాట్లాడుతూ ప్రజల దగ్గర నుంచి 16 లక్షల ఎకరాల భూములను లాక్కొని విదేశాలకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. దళితులకు, రైతులకు నష్ట పరిహారం ఇవ్వకుండానే దౌర్జన్యంగా భూముల్ని లాక్కుంటున్నారని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

15:45 - October 10, 2015

విజయవాడ : ఏపి రాజధాని అమరావతి ఆహ్వాన పత్రిక విడుదలైంది. విజయవాడలో జరుగుతున్న ఏపి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 22న జరగనున్న అమరావతి శంకుస్థాపనకు మొత్తం 15 వేల మందిని ఆహ్వానించనున్నారు. ఇవాళ ఉడయం 10.30 గంటకు సమావేశం ప్రారంభమైన సమావేశం కోనసాగుతోంది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంపైనే ప్రధానం చర్చ జరుగుతోంది. ఏర్పాట్లపై మంత్రి వర్గం చర్చిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీని.. ప్రధాన, ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక కవర్ పేజీపై ప్రధాని నరంద్రమోడీ పేరును ప్రచురించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కాగడాల జ్యోతులు, కళారూపాలు, ప్రదరక్శనలు నిర్వహించనున్నారు. విదేశీ, స్వదేశి ప్రతినిధులు రానున్నారు. ఏర్పాట్లకు నాలుగు కమిటీలు వేశారు. ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ శంకుస్థాపనను నిర్వహిస్తుంది. ఈ కార్యాక్రమ నిర్వహణకు రూ. 15 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తూ... ఎపి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏర్పాట్లుకు మంత్రి నారాయణ ఆధ్వర్వంలో, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు వేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి 1500 మంది వివిఐపిలను ఎంపిక చేశారు.

 

15:34 - October 10, 2015

విశాఖపట్నం : కేవలం ఆరంటే ఆరు వాచ్ మెన్ పోస్టులకు ఏకగా 25 వేల దరఖాస్తులు వచ్చాయి.  దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో పెరిగిపోతోందో చెప్పేందుకు ఇదో ప్రత్యక్ష సాక్ష్యం. ఎంబీఏలు, బీటెక్‌లు చదివితేనేం.. చివరికి వాచ్‌మన్‌ ఉద్యోగం వచ్చినా చాలు.. అని ఆశగా ఎదురుచూసే యువత ఉందనడానికి విశాఖపట్నంలో జరిగిన ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. వాచ్‌మన్‌ ఉద్యోగం కోసం నోటిఫికేషన్‌ ఇచ్చిన ఈస్ట్రన్‌ పవర్‌ డిసి్ట్రబ్యూషన్‌ కంపెనీ(ఏపీఈపీడీసీఎల్‌) అధికారులకు దిమ్మదిరిగిపోయింది. తెలుగు చదవడం, రాయడం వచ్చిన 35 సంవత్సరాలకు మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, నెలకు జీతం 25 వేల రూపాయలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో వచ్చిన దరఖాస్తులను తెరిచి చూసిన అధికారులు నిర్ఘాంతపోయారు. అందులో సగం కంటే ఎక్కువమంది బీఎస్సీ, బీకామ్‌, బీబీఎమ్‌, బీటెక్‌, ఎంబీయే చదివినవారే కావడంతో అధికారులు షాకయ్యారు. ఎటువంటి అర్హతలు అక్కర్లేని వాచ్‌మన్‌ పోస్టుకోసం బీటెక్‌ చదివిన వారు కూడా దరఖాస్తు చేయడంతో నిర్ఘాంతపోయామన్నారు ఈపీడీసీఎస్‌ విశాఖపట్నం సర్కిల్‌ అధికారి ఎం.సత్యనారాయణ. అయితే వచ్చిన దరఖాస్తుల నుంచి 317 మందిని ఎంపిక చేసి వారికి హాల్‌టికెట్లు పంపించామని, వీరిలో 148మంది రన్నింగ్‌ టెస్ట్‌లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. అభ్యర్థుల ఎంపిక కోసం శుక్రవారం 13 నిమిషాల్లో 2.5 కిలోమీటర్ల పరుగు నిర్వహించామని, అందులో 35మంది సెలక్టయ్యారని వివరించారు. తదుపరి పరీక్షల అనంతరం కావాల్సిన అభ్యర్థులను ఎంపిక చేస్తామని సత్యనారాయణ పేర్కొన్నారు.

అమరావతి శంకుస్థాపనకు ఆహ్వాన పత్రిక విడుదల

విజయవాడ : ఎపి రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వాన పత్రిక విడుదల అయింది. విజయవాడలో జరుగుతున్న ఎపి కేబినెట్ సమావేశంలో ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈనెల 22న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి 15 వేల మందిని ఆహ్వానించారు. 

13:53 - October 10, 2015

హైదరాబాద్‌ : 'ఎకడా...' అంటూ ముద్దు ముద్దు మాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్వేతబసు ప్రసాద్ అంతలోనే అవకాశాలు కరువై వ్యభిచారకూపంలో పడి మళ్లీ తేరుకుని కొత్త జీవితాన్ని ఆరంభించింది. గడ్డు సమయంలో గుండె ధైర్యంతో పలువురి ప్రశంసలు పొందిన శ్వేత... తాజాగా అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చింది. సుమారు ఐదు నిమిషాల నిడివి ఉన్న ఓ కవ్వాలి పాటలో శ్వేత అదరగొట్టింది. ఫేస్ బుక్ చాటింగ్ పై సెటైరికల్ పాటకు ఈ చిన్నది మంచి కలర్ అద్దింది. పాట ఆసాంతం ఉత్సాహంగా అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. ఫేస్ బుక్ చాటింగ్ లో అబ్బాయిలు అమ్మాయిలను ఎలా ట్రాప్ చేయాలని చూస్తారనే అనే కాన్సెప్ట్ తో ఉన్న ఈ సాంగ్ రెండు రోజుల్లోనే మూడున్నర లక్షలకు పైగా యూట్యూబ్ హిట్స్ సాధించింది.  అధిరాజ్ బోస్ దర్శకత్వంలో రూపొందించిన ఈ పాట శ్వేతబసుకు మంచి మైలేజీనిచ్చిందనడంలో సందేహంలేదు. యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న ఈ పాటను సోషల్ మీడియాలో షేరింగ్ చేస్తూ శ్వేత అభిమానులు తమ అభిమాన తార రీ ఎంట్రీకి సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా శ్వేతా బసు ప్రసాద్ కెరీర్ మళ్లీ గాడిలో పడాలని మనస్పూర్తిగా ఆల్ ది బెస్ట్ చెబుదాం..

ఆన్‌లైన్ సంస్థలకు టోపీ పెట్టిన ముఠా అరెస్ట్...

హైదరాబాద్ : ఆన్‌లైన్ సంస్థలకు టోపీ పెట్టిన ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో ఎల్బీనగర్ డీసీపీ ఇక్బాల్ వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కుతకలూరు గ్రామానికి చెందిన పులగం వీరరాఘవరెడ్డి(25) నగరంలోని చింతల్ దుర్గానగర్ కాలనీలో నివాసముంటూ కంప్యూటర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఆన్‌లైన్ వ్యాపార సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమేజాన్‌లో ఉన్న లోపాలను గమనించి కొత్త మోసానికి తెరతీశాడు. కుటుంబ సభ్యులను ఇందులో భాగస్వాములుగా చేశాడు. 

 

13:46 - October 10, 2015

హైదరాబాద్ : భారతస్టార్ బాక్సర్ విజేందర్ సింగ్...ప్రోబాక్సింగ్ కెరియర్ ప్రారంభానికి రంగం సిద్ధమయ్యింది. మాంచెస్టర్ వేదికగా ఈరోజు జరిగే పోటీలో ఇంగ్లండ్ కు చెందిన సోనీ విటింగ్ తో తలపడతాడు. ఈ బౌట్ ను శనివారం రాత్రి 10 గంటల 20 నిముషాల నుంచి...సోనీసిక్స్ చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఒలింపిక్స్ లో భారత్ కు పతకం సాధించిపెట్టిన విజేందర్...ప్రొఫెషనల్ బాక్సర్ గా మారాలని గతంలోనే నిర్ణయం తీసుకొన్నాడు. విజేందర్ ప్రత్యర్థి విటింగ్ కు ప్రోబాక్సర్ గా 2-1 రికార్డు ఉంది..

ఫ్యాషన్‌వీక్‌లో పాల్గొన్న సినీనటి మీరా చోప్రా

హైదరాబాద్ : కింగ్‌ ఫిషర్‌ అల్ట్రా ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌ వీక్‌ హైదరాబాద్‌లో పార్క్‌ హోటల్‌లో ప్రారంభమైంది. ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన డ్రెస్సులతో సినీ నటీ మీరాచోప్రాతో పాటు మోడల్స్‌ అనేక హొయలు కురిపించారు. విభిన్న రకాల వస్త్రాలంకరణలతో మోడల్స్‌ ర్యాంపుపై క్యాట్‌ వాక్‌ చేస్తూ వీక్షకుల మతిపోగొట్టారు. 

13:43 - October 10, 2015

హైదరాబాద్ : చైనాలో నేషనల్ డే వరుస సెలవులతో హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరాల్లో ఉన్న వారంతా ఓకేసారి ఊళ్లకు బయలుదేరడంతో.. రద్దీ విపరీతంగా పెరిగింది. జిజియాంగ్ ఫ్రావిన్స్ లో.. 50వరుసల హైవేపై కూడా.. ఇదే పరిస్థితి. వేలాది కార్లు టోల్ గేట్ వద్ద ఆగడంతో.. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. డ్రోన్ ద్వారా ఈ దృశ్యాలను చిత్రీకరించాల్సి వచ్చింది. 

13:41 - October 10, 2015

హైదరాబాద్ : ప్రముఖ రచయిత శశిదేశ్ పాండే సాహిత్య అకాడమీ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. హేతువాదులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, వెనక్కి వస్తున్న పురస్కారాల నేపథ్యంలో సాహిత్య అకాడమీ నోరు మెదపకపోవడాన్ని నిరసిస్తూ.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ముఖ్యంగా కన్నడ సాహితీవేత్త కల్బుర్గీ హత్య ఘటనలో అకాడమీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేకపోయిందని శశిదేశ్ పాండే మండిపడ్డారు. 

13:39 - October 10, 2015

విజయవాడ: నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఏపీ సర్కారుకు షాకిచ్చింది. అమరావతి నిర్మాణానికి సంబంధించి తుళ్లూరు పరిధిలో జరుగుతున్న భూమి చదును పనులను పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ కార్యక్రమాలు నిలిపివేయాని, రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో తోటలను తొలగించవద్దు అని ఎన్జీటీఆదేశించింది. తోటలను తొలగిస్తున్న వైనాన్ని సాక్ష్యాలతో ట్రిబ్యునల్ ముందు పిటిషనర్ పెట్టారు. వరద ముంపు ప్రాంతాలను రాజధాని మాస్టర్ ప్లాన్ నుంచి డీమార్క్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ముంపు మెట్ట ప్రాంతాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వాస్తవానికి రాజధాని ప్రాంతంలో తొలుత గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేసిన తర్వాతే పనులు మొదలుపెట్టాల్సి ఉంది. ఈ మేరకు పర్యావరణ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని ఏపీ సర్కారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కు హామీ ఇచ్చింది. శంకుస్థాపనను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించిన సీఎం నారా చంద్రబాబునాయుడు, తమ కేబినెట్ సహచరులతో కలిసి ఏర్పాట్లను రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు.

13:35 - October 10, 2015

హైదరాబాద్ : తెలంగాణవ్యాప్తంగా అఖిలపక్షం బంద్‌ ఉధృతంగా సాగుతోంది.. దుకాణాలు, వ్యాపారసంస్థలు మూతబడ్డాయి.. బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి.. బయటకు వచ్చిన బస్సుల నిరసనకారులు అడ్డుకున్నారు.కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, దానం, పొన్నాల, సీపీఐ నేత నారాయణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లాలోను బంద్‌ ఉధృతంగా సాగుతోంది.

సీపీఎం నేతల అరెస్ట్...

తెలంగాణా బంద్‌లో భాగంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ దగ్గర ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం నేతలను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురు రాష్ర్ట నేతలను బలవంతంగా అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారని, ప్రశాంతంగా సాగుతున్న బంద్‌పై పోలీసులు జులుం చేస్తున్నారని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. అరెస్టులకు నిరసనగా జిల్లాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో కొనసాగుతున్న బంద్

రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అఖిలపక్షం చేపట్టిన బంద్‌ కొనసాగుతోంది.. ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో నేతలు అందోళనకు దిగారు.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ అరెస్టులను అఖిలపక్ష నేతలు ఖండిచారు..

వరంగల్ జిల్లాలో...

వరంగల్‌లో ఆందోళనకు దిగిన అఖిలపక్ష మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు.. ఈ అరెస్టులను నేతలు ఖండించారు.. ప్రతిపక్షాల పోరాటంవల్లే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం పెంచిందని గుర్తు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో...

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోకూడా బంద్‌ ప్రశాంతంగా జరుగుతోంది.. బస్సులు బయటకురాకుండా డిపో ఎదుట అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. దీంతో బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయి.. ఆ తర్వాత సాగర్‌ రహదారిపై నేతలు రాస్తారోకో నిర్వహించారు..

మెదక్ జిల్లాలో...

మెదక్‌ జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు.. రైతులకు న్యాయం చేయాలని అడిగినందుకు తమ గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు.. గజ్వెల్‌లో బంద్‌ సంపూర్ణంగా కొనసాగుతోంది.. ఉదయంనుంచే వామపక్ష నేతలు ప్రజ్ఞాపూర్‌ బస్‌ డిపోముందు బైఠాయించారు.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.. మరోవైపు సిరిసిల్ల డిపోకుచెందిన బస్‌పై ఆందోళనకారులు రాళ్లతో దాడిచేశారు.. 

ఉద్దేశపూర్వకంగానే బంద్‌కు పిలుపు: కేటీఆర్‌

హైదరాబాద్ : అఖిలపక్షం బంద్‌పై తీవ్రస్థాయిలో స్పందించారు మంత్రి కేటీఆర్‌.. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేందుకే జెండాలన్నీ పక్కనబెట్టి పార్టీలు పోరాడుతున్నాయని మండిపడ్డారు.. ఇప్పుడు పోరాడుతున్నవారంతా తెలంగాణ ఉద్యమం సమయంలో ఎందుకు కలిసిరాలేదని ప్రశ్నించారు..

మొబైల్ రంగంలోకి శిల్పా శెట్టి...

హైదరాబాద్ : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ రంగంలోకి అడుగిడబోతున్నారు. తమ కొడుకు వియాన్ పేరుతో మార్కెట్లోకి సరికొత్త మొబైల్ ఫోన్లను విడుదల చేయనున్నారు. ఐపీఎల్ రాజస్థాన్ సహాభాగస్వాములైన ఈ జంట బీఎస్‌ఈ, కోల్‌కతా స్టాక్ ఎక్సేంజీ ద్వారా తమ కంపెనీ కార్యకలాపాలను ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే. నవంబర్ 25న మొబైల్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. అదేవిధంగా వియాన్ పేరుతో వియాన్ మొబైల్, వి-ట్యాబ్, వి-పవర్, వి-టీవి వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

బిజెపి కార్యకర్తలపై దాడి...

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష పార్టీలు చేస్తున్న బంద్ లో భాగంగా నగరంలోని ఎన్టీఆర్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికంగా బంద్ లో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలపై ఓ షాపు యజమాని కత్తితో దాడి చేశాడు. బంద్ సందర్భంగా షాపులు మూయిస్తున్న కార్యకర్తలపై ఒక్కసారిగా దాడిచేశాడు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. దీంతో ఆగ్రహంతో యజమానిని కార్యకర్తలు చితకబాదారు. 

సమస్యల పరిష్కారం కోసం జైళ్లకు వెళ్లడానికైనా సిద్థమే:జానా

హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం జైళ్లకు వెళ్లడానికైనా తాము వెనుకాడమని టి.సీఎల్పీనేత జానారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ బంద్ నేపథ్యంలో హైదరాబాద్ లోని గోషా మహల్ వద్ద అరెస్టైన తమ పార్టీల నేతలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం అన్ని పక్షాలు ఒకటి కావటం శుభపరిణామమన్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి ఇక ముందు కూడా విపక్షాలు ఐక్యత చాటుకోవాలని జానా కోరారు.బంద్ ను విఫలం చేసేందుకు భయపెట్టి, బలవంతం చేసి దుకాణాలను మళ్లీ తెరిపిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.

ఏపీ సర్కార్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ షాక్..

విజయవాడ: నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఏపీ సర్కారుకు షాకిచ్చింది. అమరావతి నిర్మాణానికి సంబంధించి తుళ్లూరు పరిధిలో జరుగుతున్న భూమి చదును పనులను నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి రాజధాని ప్రాంతంలో తొలుత గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేసిన తర్వాతే పనులు మొదలుపెట్టాల్సి ఉంది. ఈ మేరకు పర్యావరణ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని ఏపీ సర్కారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కు హామీ ఇచ్చింది. శంకుస్థాపనను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించిన సీఎం నారా చంద్రబాబునాయుడు, తమ కేబినెట్ సహచరులతో కలిసి ఏర్పాట్లను రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు. 

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్...

విశాఖ: పోలీసులమంటూ బెదిరింపులకు దిగి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఏడుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు తుపాకలు, రూ. 2 లక్షల నగదుతో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా పెద్దవాల్తేరు ప్రధాని రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తాడ్చాడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం తెలిసింది. వీరు 5 జిల్లాల పరిధిలో మొత్తం 19 చోట్ల నేరాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

వైట్ నర్ దుకాణాలపై పోలీసుల దాడి...

హైదరాబాద్ : స్టేషనరీ సామగ్రిలో భాగమైన వైట్‌నర్ అనే రసాయనం మత్తు పదార్ధంగా దుర్వినియోగం అవుతోందనే ఆరోపణలపై పోలీసులు దృష్టి సారించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ సౌత్‌ జోన్ డీసీపీ పార్టీ పోలీసులు పాతబస్తీలో వైట్‌నర్ హోల్‌సేల్‌గా విక్రయించే ఏడుగురు వ్యాపారులను అదుపులోకి తీసుకుని 1600 వైట్‌నర్ ట్యూబులను సీజ్ చేశారు. వ్యాపారులను విచారిస్తున్నారు.

సిటీ బస్సు లపై రాళ్ల వర్షం...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిలపక్షాలు చేపట్టిన బంద్‌లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అన్ని డిపోల ఎదుట శాంతీయుతంగా నిరసనలు తెలుపుతున్న విపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి, దగ్గర్లో ఉన్న పీఎస్లకు తరలించారు. కాగా.. నగరంలోని ఆబిడ్స్ జీపీఓ వద్ద రెండు సిటీ బస్సులపై కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రెండు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తూ బస్సుల్లో ఉన్న ఎవరికీ గాయాలు కాలేదు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 12 మంది కేసు

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో గడిచిన రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు ద్విచక్ర వాహనాలను, కార్లు, ఆటోలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

కాంగ్రెస్ నేతలకు చీమూ నెత్తురు లేదు : షరీష్

మెదక్: కాంగ్రెస్ నేతలకు చీమూ నెత్తురు లేదని మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విపక్షాలు సెలవు రోజు బంద్‌కు పిలుపు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ కోసం కలిసి రాని విపక్షాలు రాష్ట్రాన్ని బదనాం చేయడానికే ఏకమయ్యాయని హరీష్ ఆరోపించారు.

12:35 - October 10, 2015

హైదరాబాద్ : అంబర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. గోల్నాకకు చెందిన లక్ష్మీ అనే వివాహిత..తన ఐదేళ్ల కూతురు మాలతితో సహా మూసీ కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే అక్కడే ఉన్న స్థానికులు గమనించి పాప మాలతిని బయటకు తీసినా చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి లక్ష్మీ ఆచూకీ మాత్రం దొరకలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు...లక్ష్మీ కోసం మూసీ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. అస్సాంకు చెందిన దీపక్‌ కుమార్‌తో 9సంవత్సరాల క్రితం వివాహం అయిందని..ఆ తర్వాత వారు కాచిగూడ లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. అయితే కొంతకాలంగా లక్ష్మీ మానసిక పరిస్థితి బాగాలేదని భర్త చెప్పిన సమాచారం ప్రకారం తెలిసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు. 

12:33 - October 10, 2015

విశాఖపట్టణం : మావోయిస్టుల చెరలో ఉన్న ముగ్గురు టీడీపీ నేతలను రక్షించేందుకు... పోలీసులు అమాయక గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారు. మావోయిస్టుల ఆచూకీ చెప్పాలంటూ.. ఏజెన్సీలోని తడ్డపల్లి, జెల్లిబంద గ్రామాలకు చెందిన 34మంది గిరిజనులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మావోయిస్టులు ఇచ్చిన గడువు ఎల్లుండికి ముగియనుంది.

కుటుంబాల్లో ఆందోళన...
విశాఖ ఏజెన్సీలో కిడ్నాప్‌నకు గురైన టీడీపీ నేతల కుటుంబసభ్యుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. బాక్సైట్‌ తవ్వకాలను నిలిపివేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టులు హెచ్చరించిన నేపథ్యంలో.. మహేష్‌, బాలయ్య పడాల్‌, వంగల బాలయ్యల కుటుంబ సభ్యులు ఏ క్షణాన ఏం జరుగుతోందనని భయపడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ వారిని విడిపించేందుకు చర్యలు చేపట్టాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. మరోవైపు గిరిజన సంఘాల నేతలు మావోయిస్టులతో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని విశాఖ రూరల్‌ ఎస్పీ ప్రవీణ్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే ఏజెన్సీలోకి 10 కిలోమీటర్ల మేర ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు వెళ్లినా మావోయిస్టులు కనిపించకపోవడంతో.. టీడీపీ నేతల కిడ్నాప్‌పై ఆందోళన కొనసాగుతూనే ఉంది.

12:32 - October 10, 2015

గుంటూరు : నల్లపాడులో నిరవధిక దీక్ష చేపట్టిన వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన దీక్ష ప్రాంగణానికి సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు చేరుకున్నారు. జగన్ చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా ఆయన ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. చంద్రబాబు.. రోజు వారి ఉపన్యాసాలు వింటుంటే నిజాయితీ నశించిందని అనిపిస్తోందన్నారు. ప్రత్యేక హోదా కాదు...ప్యాకేజీలున్నాయని ఇప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. కనీస నిజాయితీ లేదని, ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో నిజాయితీ లేదని విమర్శించారు. పీఆర్సీ 2013 అమలు జరగాల్సి ఉంటే 2014 నుండి అమలు చేస్తామని తెలిపారు. హెల్త్ కార్డులు..అంగన్ వాడీలు..మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాలు అమల్లోకి రాలేదని గుర్తు చేశారు. 43 శాతం ఫిట్ మెంట్ అమలు చేస్తానని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని, చంద్రబాబు ను ఎలా నమ్మేది అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే రుణమాఫీ జరుగుతుందని రైతులు ఆశించారని, కానీ ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. సగం బ్యాంకులు రైతులకు అప్పులివ్వలేదని తెలిపారు.

శంకుస్థాపన కార్యక్రమానికి రూ.400 కోట్లా ?
రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఈవెంట్ మేనేజ్ మెంట్ కు పది కోట్లు..అతిథిల కోసం రూ.25 కోట్లు ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. ఎవడమ్మ మొగుడు సొత్తు అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాజమండ్రి మరలా ఇక్కడ రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. నదుల అనుసంధానం పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ప్రజల డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తుంటే అడ్డుకుంటున్నారని, చంద్రబాబు..రాజ్యంలో రైతులకు..కూలీలకు. కనీస పౌర హక్కులు లేకుండా చేస్తున్నారని తెలిపారు. ఎన్పీ కుంటలో పదివేల ఎకరాలు తీసుకుని సొలార్ హబ్ నిర్మాణం చేస్తున్నారని, రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే నిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్రాన్ని విదేశాలకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రకు.. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ..విద్యా సంస్థలు..రైల్వే జోన్ ఏర్పాటు కృషి చేయకుండా రాజకీయ స్వలాభం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. 

11:57 - October 10, 2015

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనిషి సాగించే ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాల్లో వేగం పెంచాడు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తప్ప అన్నింటిలో దూసుకుపోతున్నారు. ఈ బిజీ బిజీ లైఫ్స లో ఒత్తిళ్ళతో సత మతమవుతున్నారు. ఈ ఒత్తిడే మనిషిపాలిట శాపంగా మారుతోంది. తాజా సర్వేలు దాదాపు 70 శాతం ఆరోగ్య సమస్యలు కేవలం ఒత్తిడి వల్లే వస్తున్నాయని తేల్చాయి. ఒత్తిడి తగ్గించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మహిళలు ఖచ్చితంగా ఉద్యోగాలు చేయాల్సిన అవసరాలు ఏర్పడ్డాయి. ఇంటి పనులు, ఆఫీసు పనులతో సతమతమౌతున్నారు. దీంతో చేసేది ఏమీ లేక సహాయకులను నియమించుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఓపిక చేసుకుని గిన్నెలు తోమి చూడండి. చటుక్కున ఒత్తిడి హుష్‌పటాక్ అవుతుందట. ఇది మేం చెప్పింది కాదు.. ఒక పరిశోధన ద్వారా తేలింది. పాత్రలు తోమేటప్పుడు జిడ్డు లేకుండా ఉండాలని శ్రద్ధగా తోముతారు. దానివల్ల మెల్లగా ఒత్తిడి తగ్గుతుందన్నమాట. ఇదే అని కాదు.. ఇంటి పనులు ఏవైనా మన ఒత్తిడిని తగ్గించేస్తాయని ఈ పరిశోధనలో తేల్చారు. మరింకెందుకాలస్యం.. పనిలో పడండి మరి!

సాహిత్య అకడమీకి సారా గుడ్ బై..

ఢిల్లీ : ప్రముఖ మలయాళం రచయిత సారా జోసఫ్ కేంద్ర సాహిత్య అకడమీని తిరిగి ప్రభుత్వానికి పంపారు. దేశంలో మత హింసలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వెలుబుచ్చారు.

11:43 - October 10, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ భేటీ కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చే అంశంపై చర్చిస్తున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం, కేశవరెడ్డి పాఠశాలల నిర్వాహణ తదితర అంశాలపై చర్చించనున్నారు. రాజధాని శంకుస్థాపన విషయంపై ప్రధానంగా చర్చ జరుగనున్నది. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు అమరావతికి విచ్చేయనుండడంతో ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

11:36 - October 10, 2015

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఏపీ ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఆయన నిరవధిక నిరహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. నల్లపాడులో జరుగుతున్న దీక్ష ప్రాంగణానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. శనివారం మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. ఇదిలా ఉంటే జగన్ తల్లి వైస్ విజయమ్మ పరామర్శించారు. మరోవైపు జగన్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. వైద్యులు పరీక్షలు జరిపారు.
నల్లపాడులో వైసీపీ అధినేత జగన్‌ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, వైసీపీ నేతలు దీక్షా శిబిరానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నేతలు అభిప్రాయపడ్డారు. మూడు రోజుల నుంచి దీక్ష చేస్తున్న సందర్భంగా జగన్ నీరసించారని వైద్యులు శుక్రవారం పేర్కొన్నారు. జగన్ కొంచెం నీరసంగా కనిపిస్తున్నారని, కాకపోతే బిపి, షుగర్ నార్మల్‌గానే ఉందని చెప్పారు. బరువు కూడా తగ్గలేదన్నారు. కొంతవరకు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
గుంటూరు నల్లపాడు రోడ్డులో ఈ నెల ఏడో తేదీ మధ్యాహ్నాం 2గంటల 15 నిమిషాలకు వైఎస్‌ జగన్‌ దీక్ష ప్రారంభించారు. అప్పటి నుంచి జగన్‌కు పరామర్శలు వెల్లువలా వస్తున్నాయి. మద్దతు తెలిపేందుకు దీక్షవేదిక వద్దకు వచ్చిన ప్రతిఒక్కరికి అభివాదం చేస్తూ పలకరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని పలువురు నేతలు అన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి కచ్చితంగా సంజీవనేనని.. పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా, ప్రత్యేక హోదా రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకపోతే ప్రజాకోర్టులో మొదటి ముద్దాయిగా నిలబడాల్సి ఉంటుందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. జగన్‌ దీక్ష నాలుగో రోజుకు చేరుకున్నప్పటికీ ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం కనిపించడం లేదు. టీడీపీ నేతలు మాత్రం వైసీపీ నేతల విమర్శలకు దీటుగా ఎదురుదాడి చేస్తున్నారు. 

11:30 - October 10, 2015

హైదరాబాద్ : స్వరాష్ట్రం వచ్చినందుకు సంతోషించాలా ? బంగారు తెలంగాణ అంటే ఇదేనా అంటూ వామపక్షాలు ప్రభుత్వంపై గళమెత్తాయి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సర్కార్‌ అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పలు పార్టీలు, ప్రజాస్వామిక సంఘాలు నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పది వామపక్ష పార్టీల నేతలు ఏంబీ భవన్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు ప్రదర్శనను అడ్డుకున్నారు. కనీసం నిరసన తెలిపే హక్కు లేదా అని వామపక్ష నేతలు ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడనీయకుండా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనిని నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడారు. పోలీసుల సాగిస్తున్న చర్య హేయమైందని, ప్రజాస్వామిక వేదిక ఇచ్చిన పిలుపుకు భారీ స్పందన వచ్చిందన్నారు. ప్రశాంత ఉద్యమాన్ని అణిచివేస్తున్నారని, టి.సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఉద్యమ పార్టీ ఉక్కుపాదం మోపడం వింతల్లో వింతగా ఉందన్నారు. అప్రజాస్వామిక ధోరణిని ఖండించాలని పిలుపునిచ్చారు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు. దీనితో పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. 

11:24 - October 10, 2015

మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిహాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం. రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లోనాలతో కూడిన ఒక రుగ్మత. ఈ వ్యాధి ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారతదేశం, చైనా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అత్యధికంగా ఉంది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకోడమే.

ఆక్రోట్ తో చెక్....

ఆక్రోట్ తీసుకోవడం ద్వారా మధుమేహానికి చెక్ పెట్టవచ్చునని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. ఆక్రోటులో ఆల్ఫాలినోలెనిక్‌ యాసిడ్‌, గామా టోకో ఫెరాల్‌, ఫైటోస్టెరాల్స్‌ ఉంటాయి. గుండె మరింత స్ట్రాంగుగా ఉండడానికి, మెరుగ్గా పనిచేయడానికి ఇవి ఎంతో మేలు చేస్తాయిట. అంతే కాకుండా గుండెను కూడా పదిలం చేసుకోచ్చు. రక్త శుద్ధి పరంగా శరీరానికి రకరకాల ఉపయోగాలున్నాయి. కొలెస్ట్రాల్ మోతాదు కూడా తగ్గించే గుణం కలిగి ఉంది. సో ఆక్రోటును రోజుకు రెండేసైనా తీసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండేవాళ్లు జీడిపప్పు వంటి వాటి జోలికి వెళ్లకుండా.. బాదం, పిస్తా వంటివి తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్ తీసుకునే అలవాటున్నవారు.. ఇకపై వాల్ నట్స్ అనే ఆక్రోటును కూడా డైట్ లిస్టులో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

బోస్టన్ పరిశోధనల ద్వారా వెల్లడి....

వారానికి రెండు మూడుసార్లు ఆక్రోటు తినే వారికి మధుమేహం సోకే అవకాశాలు తగ్గుతాయని బోస్టన్ పరిశోధనల ద్వారా వెల్లడైంది. దాదాపు లక్షన్నర మంది నర్సుల మీద పరిశోధనలు చేస్తే.. మధుమేహం ఫేజ్‌2కు వెళ్లే ప్రమాదం 24 శాతం తగ్గినట్టు గుర్తించారట. మగవాళ్లమీద కూడా ఆక్రోటు ప్రభావం ఇలాగే ఉంటుందని వారంటున్నారు.

రోజు వారి ఖర్చుల కోసం ఏపీ అప్పుల బాట..

విజయవాడ : రోజు వారి ఖర్చుల కోసం ఏపీ అప్పుల బాటలో పయనిస్తోంది. రూ.88 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఏపీ వాడుకుంది. ఈనెల రూ.950 కోట్ల రాబడి ఉండగా ఖర్చు రూ.3373 కోట్లు ఉంది. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రూ.400 కోట్లు ఖర్చు చేస్తోంది. అతిథుల విమానాలు, హెలికాప్టర్ల ఖర్చే రూ.25 కోట్లుగా ఉంది. ఈవెంట్ మేనేజ్ మెంట్ ఖర్చు రూ.10 కోట్లుగా ఉంది.

జగన్ ను పరామర్శించిన వైఎస్ విజయలక్ష్మి..

గుంటూరు : నిరవధిక నిరహార దీక్ష చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ను ఆయన తల్లి విజయలక్ష్మి పరామర్శించారు. ఆయన చేపడుతున్న దీక్ష శనివారానికి నాలుగో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం స్వల్పంగా క్షీణించింది. జగన్ దీక్షకు ఏపీ డబ్ల్యూజే సంఘీభావం తెలిపింది. 

సాహిత్య అకాడమీకి శశి గుడ్ బై..

ఢిల్లీ : సాహిత్య అకాడమీకి ప్రముఖ రచయిత్రి శశి గుడ్ చెప్పారు. పెరుగుతున్న మతోన్మాదాన్ని శశి ఖండించారు. రచయిత హత్యలపై అకాడమీ స్పందించనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం..

విజయవాడ : ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై చర్చించారు.

 

ప్రకాశంలో ఇద్దరు రైతుల బలవన్మరణం..

ప్రకాశం : జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాచర్ల (మం) అకివీడులో రైతు రంగారెడ్డి, మద్దిపాడు (మం) ఇనమనమెళ్లూరులో పొగాకు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

నల్లధనం మోడీ ప్రచార ప్రహసనం..

ఢిల్లీ : నల్లధనం కేవలం మోడీ ప్రచార ప్రహసనమని పీపుల్స్ డెమోక్రసీ తాజా సంపాదీయంలో పేర్కొంది. రూ.15 లక్షల చొప్పున పంచుతామంటూ మోడీ ప్రచారం చేశారని గుర్తు చేసింది. రప్పించిన నల్లధనం ఒక్కశాతంలోపేనని, వెల్లడించిన నల్లధనాన్ని పంచితే ఒకొక్కక్కరికి రూ.19 మాత్రమే వస్తుందని పేర్కొంది. నల్లధనం దేశంలోనే ఉందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట మార్చారని విమర్శించింది. 

తమ్మినేని అరెస్టు..

హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎంబీ భవన్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు పది వామపక్ష పార్టీల నేతలు భారీ ప్రదర్శన నిర్వహించారు. 

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వామపక్షాల భారీ ధర్నా..

హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పది వామపక్షాల పార్టీలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. ఎంబీ భవన్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు ప్రదర్శన కొనసాగింది. 

10:52 - October 10, 2015

వరంగల్ : రాష్ట్రంలో రైతన్నలు మృతి చెందుతుంటే టి.సర్కార్ కు సిగ్గు..శరం లేదా టి.కాంగ్రెస్ ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సర్కార్‌ అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పలు పార్టీలు, ప్రజాస్వామిక సంఘాలు నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. పార్టీ నేతలు గండ్ర వెంకటరమణతో పాటు టిడిపి, ఇతర నేతలను హన్మకొండ పీఎస్ లో నిర్భందించారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణ టెన్ టివితో మాట్లాడారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, బంద్ ను విఫలం చేయాలని అనుకోవడం అనాలోచిత చర్య కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణ పేర్కొన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి బంద్ లు కొనసాగుతాయని, దీనిని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. విద్యుత్ బకాయిలు, రుణమాఫీ, వంద రోజుల పని దినాలతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ చేసిందని గుర్తు చేశారు. బంగారు తెలంగాణకు నిర్వచనం రైతులు చనిపోవడమా ? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యపద్ధతిలో మహిళలను అరెస్టు చేసి జైల్లో పెట్టిన ఘనత కేసీఆర్ దని మరొక నేత తెలిపారు. వినాయక చవితికి డీజే కు అనుమతినివ్వలేదని, బతుకమ్మకు డీజే అనుమతినిచ్చారని విమర్శించారు. రైతులు చనిపోతుంటే చూసుకుంటూ కూర్చొంటారా ? సిగ్గు..శరం ఉండాలి అంటూ తీవ్రంగా విమర్శించారు. రైతులు చనిపోతుంటే ఆందోళనలు చేస్తుంటే కాంగ్రెస్ నేతలను నిర్భంధించడం దారుణమన్నారు. 

10:28 - October 10, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఏక మొత్తంలో రుణమాఫీ అమలు చేయాలని టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సర్కార్‌ అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పలు పార్టీలు, ప్రజాస్వామిక సంఘాలు నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. టి.పిసిసి ఆధ్వర్యంలో నేతలు పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేశారు. ఆందోళన చేసిన మల్లు భట్టి విక్రమార్క, శశిధర్ రెడ్డి, ఇతర నేతలను అరెస్టు చేసి నాంపల్లి పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా మల్లు టెన్ టివితో మాట్లాడారు. స్పష్టత లేని ప్రభుత్వ నిర్ణయాల వల్లే ఇది జరుగుతోందన్నారు. నాలుగు సార్లు రుణమాఫీ అనేది భారంగా ఉంటోందని, ప్రైవేటు వడ్డీల భారం ఎక్కువై పోతోందని విమర్శించారు. భారం మోయలేని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జైలు భరో కార్యక్రమంలా మారిపోయిందని, ప్రజల పక్షాన పోరాటం చేసే ఆలోచనలను ఆపలేరని తెలిపారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాల వల్ల జీవితాలు బాగుపడుతాయని ఆశించిన ప్రజలకు మోసం చేశారని, రైతుల రుణమాఫీ నీరు కార్చారని విమర్శించారు. ఇంతకన్నా దురదృష్టకరం ఏదీ లేదు అని, ఇదా బంగారు తెలంగాణ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కూతుళ్లను ప్రమోటు చేసేందుకు బతుకమ్మపై పెద్ద ఇంట్రస్ట్ చూపిస్తున్నారని, నాట్లు వేసేటప్పటి నుండి పంట కోసే వరకు మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తారని మహిళా కాంగ్రెస్ నేత తెలిపారు. ఉద్యమ పార్టీ నాయకుడు కేసీఆర్ ప్రస్తుతం ఉద్యమాన్ని అణిచివేసే ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. 

10:24 - October 10, 2015

ఇంటి ముంగిట్లో, నాలుగు మొక్కలుంటే పచ్చగా కళకళ్లాడుతుంది. అదే అపార్ట్ మెంట్ అయితే కుండీల్లో ఒదిగిన మొక్కలు వచ్చిపోయే వారికి స్వాగతం పలుగకుతాయి. చిన్నమొక్కలే కదా అనుకుంటే పొరపాటే మనస్సు పెట్టి ఎంచుకుంటే అలంకరణకు ఉపయోగపడతాయి. ఆరోగ్యాన్నీ అందిస్తాయి. ముఖ్యంగా ఇంటిల్లిపాదికి ఉపయోగపడే ఔషదమొక్కలు పెంచుకుంటే చాలు ఇంట్లో ఉండే చిన్న..పెద్ద..ముసలి అన్నివయస్సుల వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. తులసిలో 5 రకాలు ఉన్నాయి. తులసి మొక్కలు 5 జాతులు ఉన్నప్పటికీ ప్రధానంగా కృష్ణ తులసి, రామతులసీ నే ఎక్కువగా వాడుతుంటారు. ల్యూకోడెర్లాలో ప్రకృతి వైద్యులు తులసికి మొదటి ప్రాధాన్యతనిస్తారు. అలాంటి తులసి గురించి మీ కోసం...

కొన్ని ఉపయోగాలు....

~ తులసి మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. నోటిపూత, నోట్లో అల్సర్స్, ఇతర ఇన్‌ఫెక్షన్ల నివారణకు తులసి ఎంతో ఉపకరిస్తుంది.

~ ప్రధానంగా చిన్నపిల్లల్లో తరచూ దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులకు ఉపయోగకారిణి.

~ తులసి ఆకులను డికాషన్‌గా తీసుకుంటే తలనొప్పిని దూరం చేయవచ్చు.

~ తులసి ఆకులను ఎండబెట్టి, వాటిని పొడి చేసి, దాంతో పళ్ళు తోముకుంటే దంతాలకు చాలా మంచిది. దీన్ని ఆవనూనెలో కలిపి టూత్‌పేస్ట్‌లా       వాడుకుంటే దంతక్షయంతో పాటు నోటిదుర్వాసన పోయి, పళ్ళను అందంగా మార్చ గలిగే గుణం కలదు.

~ తులసి ఆకులు నాడులకు టానిక్‌లాగా,జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి.

~ వర్షాకాలంలోమలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ ఎక్కువగా ఉంటే తులసి ఆకులనూ, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయం తయారు చేయాలి.అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకుని రెండుమూడు గంటలకోసారి తాగొచ్చు.

~ బ్రాంకైటిస్‌,ఆస్థమాల్లోకఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు,ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.

~ ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి.

~ ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - కీటకాలనుదూరంగా ఉంచడం కోసం. ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు,హెర్బల్ టీ, నేతిలో మరగ పెట్టడం - ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును.

~ తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి ఉండటంతో డయాబెటిస్ వారికి చక్కగా పనికొస్తుంది.

~ రక్తంలో కోలెస్టరాల్ను తగ్గించడానికీ, 'యాంటీ ఆక్సిడెంట్' గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికీ కూడా పనికొచ్చే పదార్ధాలు తులసిలో ఉన్నాయని మరి కొన్ని పరిశోధనలలో తేలింది.

~ 'రేడియేషన్' కు గురైనందువలన కలిగే విషమ పరిస్థితి నుండి రక్షణకు కూడా తులసి ఉపయోగ పడవచ్చునని కొన్ని అధ్యయనాలు సూచించాయి.

~ రెండు స్పూనుల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది.

~ మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆరసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుంది.

~ తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.

ఇలా అనేక రకాలుగా మన ముగింట్లో తులసి ఉపయోగపడుతుంది. ఇంటి గుమ్మం ముందు కుండీల్లో కూడా ఈ మొక్క సులువుగా పెరుగుతుంది.


 

09:56 - October 10, 2015

ఢిల్లీ : ఆసియాలో సంపన్నుల జాబితాలో భారతీయులు సత్తా చాటారు. ఫోర్బ్స్ పత్రిక తొలిసారిగా విడుదల చేసిన ఈ జాబితా టాప్ టెన్ లో మూడు భారతీయ కుటుంబాలకు స్థానం దక్కింది. ఓవరాల్ గా 50మంది ఉన్న జాబితాలో 25మందితో చైనా నెంబర్ వన్ గా నిలిచింది. ఫోర్బ్స్‌ మేగజైన్‌ తొలిసారిగా ఆసియాలోని 50 సంపన్న కుటుంబాలతో విడుదల చేసిన జాబితాలో 14 భారతీయ కుటుంబాలకు స్థానం లభించింది. ఈ జాబితాలో అంబానీ కుటుంబానికి మూడో స్థానం లభించింది. అంబానీ సోదరుల కుటుంబ ఆస్తుల 2వేల 150 కోట్ల డాలర్లుగా ప్రకటించింది. దేశీయ కరెన్సీలో ఈ విలువ లక్షా 39వేల 750కోట్లు. విప్రో గ్రూప్ ఛైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ ఏడో స్థానంలో నిలిచారు. ప్రేమ్‌జీ ఫ్యామిలీ ఆస్తులు 1,700 కోట్ల డాలర్లు, 1,500 కోట్ల డాలర్లతో 9వ స్థానంలో లండన్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న హిందుజా కుటుంబం నిలిచింది. పదో స్థానంలో మిస్ర్తీ గ్రూప్ చోటు దక్కించుకుంది. వీరి ఆస్తుల విలువ 1,490 కోట్ల డాలర్లు. ఇంకా జాబితాలో 15వ స్థానంలో గోద్రెజ్ ఫ్యామిలీ, మిట్టల్ గ్రూప్ 19వ స్థానంలో నిలిచాయి. జాబితాలో బిర్లాలు 22, బజాజ్ గ్రూప్ 29, డాబర్ ఇండియా 30, క్యాడిలా హెల్త్ కేర్ 33, ఐషర్ గ్రూప్ 40, శ్రీ సిమెంట్ 42, ముంజాల్ ఫ్యామిలీ 46, సిప్లా గ్రూప్ ఫ్యామిలీ 50వ స్థానంలో నిలిచాయి.
బిర్లా ఫ్యామిలీ 22వ స్థానం (780 కోట్ల డాలర్లు )
బజాజ్‌లు 29వ స్థానం ( 560 కోట్ల డాలర్లు )
డాబర్‌ ఇండియా 30వ స్థానం ( 550 కోట్ల డాలర్లు )
క్యాడిలా హెల్త్‌కేర్స్‌ 33వ స్థానం ( 480 కోట్ల డాలర్లు )
ఐషర్‌ గ్రూప్స్‌ 40వ స్థానం ( 400 కోట్ల డాలర్లు )
శ్రీ సిమెంట్స్‌ 42వ స్థానం ( 390 కోట్ల డాలర్లు )
జిందాల్‌ కుటుంబం 43వ స్థానం ( 380 కోట్ల డాలర్లు )
ముంజాల్‌ కుటుంబం 46వ స్థానం ( 320 కోట్ల డాలర్లు )
సిప్లా 50వ స్థానం ( 290 కోట్ల డాలర్లు )
50మంది ఉన్న ఈ జాబితాలో 14 మంది భారతీయ కుటుంబాలు ఉండటం విశేషం. అయితే నివేదికలో చైనా అత్యధికంగా 25స్థానాల్లో నిలిచింది. జాబితాలోని మొదటి స్థానంలో సామ్‌సంగ్‌ గ్రూప్‌నకు చెందిన లీస్‌ కుటుంబం మొదటి స్థానంలో ఉంది. 2014 సంవత్సరంలో ఈ కుటుంబ రాబడి దక్షిణ కొరియా జిడిపిలో 22 శాతానికి సమానం. హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న హెండర్ సన్ గ్రూప్ ఫ్యామిలీ రెండో స్థానం దక్కించుకుంది. మూడో స్థానంలో అంబానీ సోదరులది. సెప్టెంబర్ 25నాటికి వీరి కంపెనీల షేర్ల ధరల ఆధారంగా ఆస్తులను లెక్కించినట్టు ఫోర్బ్స్ తెలిపింది.

కేసీఆర్ నిరంకుశంలా వ్యవహరిస్తున్నారు - సీపీఐ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నిరంకుశంలా వ్యవహరిస్తున్నారని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్నా అరెస్టు చేస్తున్నారని, ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడుతారని తెలిపారు. 

తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం..

హైదరాబాద్ : తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద రెండు బస్సు అద్దాలను విపక్ష కార్యకర్తలు ధ్వంసం చేశారు. మెహిదీపట్నం, చాదర్ ఘాట్ లలో ఈ ఘటన చోటు చేసుకుంది.

09:32 - October 10, 2015

నిజామాబాద్ : జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. లెఫ్ట్ పార్టీల నేతలు ఉదయమే ఆర్టీసీ బస్సు డిపోల ఎదుట బైఠాయించారు. దీనితో ఆరు బస్సు డిపోల్లో 646 బస్సులు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా లెఫ్ట్ నేతలు పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా టెన్ టివితో వామపక్ష నేతలు మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వరంగల్ ఎన్ కౌంటర్ దుర్మార్గమని తెలిపారు. ఎన్ కౌంటర్ లేని తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజానీకం కొరుకొంటోందన్నారు. తెలంగాణలో ప్రభుత్వం పాలన నైజాం పాలన తలపిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా పాలన కొనసాగాలని, కేసీఆర్ ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు. 

09:31 - October 10, 2015

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ ఒకేసారి అమలు చేయాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సర్కార్‌ అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పలు పార్టీలు, ప్రజాస్వామిక సంఘాలు నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. తెల్లవారుజామునే సీపీఎంతో పాటు ఇతర పార్టీల నేతలు బస్సు డిపోల ఎదుట బైఠాయించారు. దీనితో 850 బస్సులు నిలిచిపోయాయి. జూలకంటి రంగారెడ్డితో పాటు టిడిపి, బిజెపి, వామపక్ష కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.  ఈ సందర్భంగా జూలకంటి టెన్ టివితో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం 16 మాసాలు అవుతున్నా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందిందని, ఆత్మహత్యలు జరుగుతున్నా వారికి ఎక్స్ గ్రేషియా..వారి సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందిందని విమర్శించారు. సమ్మెలను నిరంకుశంగా ఆపుతున్నారని, ఆత్మహత్యల తెలంగాణగా ఉన్న పరిస్థితి నెలకొందన్నారు. వైద్యం అందక..కల్తీ కల్లుకు పలువురు మృతి చెందుతున్నారని తెలిపారు. ఆశా వర్కర్లు, బూటకపు ఎన్ కౌంటర్లను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, పోలీసుల రాజ్యమా..ప్రజా రాజ్యమా అని జూలకంటి ప్రశ్నించారు.  

09:29 - October 10, 2015

కరీంనగర్ : జిల్లాలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సర్కార్‌ అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పలు పార్టీలు, ప్రజాస్వామిక సంఘాలు నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. 11 డిపోలలో 850 బస్సులు నిలిచిపోయాయి. బస్సులకు డిపోలు పరిమితం కావడంతో ప్రయాణీకులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు టెన్ టివితో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్క జిల్లాలోనే 115 మంది రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. శుక్రవారం రోజు ముగ్గురు రైతులు బలవన్మరణం చేసుకున్నారని, వెంటనే రైతుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని, రైతు రుణమాఫీని ఒకేసారి చెల్లిస్తే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని తెలిపారు.

రేపు నేపాల్ ప్రధాని ఎన్నిక..

నేపాల్ : అసెంబ్లీ నూతన ప్రధాన మంత్రిని రేపు ఎన్నుకోనుంది.ఏడేళ్ల సుదీర్ఘ కసరత్తు తర్వాత సాకారమైన చరిత్రాత్మక రాజ్యాంగాన్ని నేపాల్ ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ట్యాంకర్ ను ఢీకొని పారిశుధ్య కార్మికుడి మృతి..

హైదరాబాద్ : నగరం - శ్రీశైలం జాతీయ రహదారిపై తక్కుగూడ పెట్రోల్ బంక్ వద్ద పారిశుధ్య కార్మికుడిని ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కార్మికుడు అక్కడికక్కడనే మృతి చెందాడు.

 

 

మహబూబ్ నగర్ డిపో ఎదుట విపక్ష నేతల ధర్నా..

మహబూబ్ నగర్ : జిల్లా ఆర్టీసీ బస్సు డిపో ఎదుట విపక్ష నేతలు బైఠాయించారు. నారాయణ పేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో ఆపటు టిడిపి అధ్యక్షుడు బక్కని నర్సింహులు తదితరులు బైఠాయించారు. 

ముషీరాబాద్ లో ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం..

హైదరాబాద్ : సికింద్రాబాద్ నుండి శంషాబాద్ వైపు వెళుతున్న రాణిగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. 

కరీంనగర్ లో కొనసాగుతున్న బంద్..

కరీంనగర్ : జిల్లాలో బంద్ కొనసాగుతోంది. రైతు ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కరీంనగర్ బస్టాండు వద్ద చేపట్టిన ధర్నాలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొని బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు.

 

వరంగల్ లో బస్సులను అడ్డుకున్న ప్రతిపక్ష నేతలు..

వరంగల్ : జిల్లాలో ఆర్టీసీ బస్సులను ప్రతిపక్ష నేతలు అడ్డుకున్నారు. హన్మకొండ వద్ద బంద్ లో పాల్గొన్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ, బీజేపీ నేతలను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. 

08:25 - October 10, 2015

వరంగల్ : జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పది వామపక్షాలు, ఇతర విపక్షాలు పిలుపు మేరకు బంద్ కొనసాగుతోంది. హన్మకొండ పీఎస్ కు తరలించి నిర్భందించారు. ఈ సందర్భంగా టెన్ టివితో నేతలు మాట్లాడారు. బంద్ ఐఛ్చికంగా జయప్రదం అవుతోందని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టు చేస్తున్నారని సీపీఎం నేత విమర్శించారు. రైతులను ఆదుకుంటాం..ఆత్మగౌరవంతో తిరుగతాం..ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తా..కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇచ్చిన హామీలను మరిచిపోయిందని, ప్రశ్నించే వారిని ఎన్ కౌంటర్ చేయడానికి సిద్ధపడుతున్నారని తెలిపారు. ప్రజలు చరమగీతం పాడుతారని తెలిపారు. ముఖ్యమంత్రి ఒక నియంతల..హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నారని, ఎంతో ఆశతో ఓటు వేసిన వారిని అణిచివేసే ధోరణి చేస్తున్నారని టిడిపి, బిజెపి, కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రైతుల కోర్కెలు తీర్చకుండా అరెస్టు చేస్తున్నారని, పాలన ఎలా సాగించాలో తెలియడం లేదని, బంద్ ను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

 

08:18 - October 10, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సర్కార్‌ అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పలు పార్టీలు, ప్రజాస్వామిక సంఘాలు నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా టి.కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. ఉదయమే టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర నేతలు ఇమ్లీబన్ బస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పీఎస్ కు తరలించారు. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా తాము నిరసనలు తెలియచేస్తే అరెస్టు చేస్తారా అంటూ ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ టెన్ టివితో మాట్లాడారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, త్వరలో బుద్ది చెప్పడానికి సిద్ధమౌతున్నారన్నారు. బంద్ ద్వారా రైతులకు సంఘీభావం తెలియచేస్తున్నామని, ప్రజాస్వామ్యపద్ధతిలో ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం సంక్షోభంలో ఉందని, దుర్భర పరిస్థితిలో రైతులున్నారని టి.కాంగ్రెస్ నేత పొన్నాల పేర్కొన్నారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని, ఉపశమనం పొందే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఇదంతా చేస్తున్నారని ప్రజలు తిరుగబడుతారని తనదైన శైలిలో పొన్నాల తెలిపారు. మహబూబ్ నగర్ లో 900, నిజామాబాద్ 646, నల్గొండ 850, మెదక్ లో 600, ఖమ్మం 779 బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. 

08:13 - October 10, 2015

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సర్కార్‌ అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పలు పార్టీలు, ప్రజాస్వామిక సంఘాలు నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. రుణమాఫీని ఏకమొత్తంలో విడుదల చేయాలన్న డిమాండ్‌తో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. మరోవైపు కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ఆంధ్రా కలిపేస్తాం కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో మల్లారెడ్డి (సీపీఎం), రాకేష్ (టీఆర్ఎస్), ప్రకాష్ రెడ్డి (బిజెపి), అనీల్ (మాజీ విప్) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటలు..కాలి నడకన వచ్చే భక్తులకు మూడు గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్వనానికి రెండు గంటల సమయం పడుతోంది. 

మద్యం సేవించిన వారిపై కేసులు నమోదు..

హైదరాబాద్ : బంజారాహిల్స్ శుక్రవారం అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించిన వాహనాలను నడిపిన 12 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 

నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం..

విజయవాడ : నేడు జిల్లాలో ఏపీ మంత్రివర్గ భేటీ కానుంది. రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లే ప్రధానంగా చర్చ జరుగనుంది.న కార్యక్రమం స్వరూపం ఎలా ఉండాలి ? ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలి ? తదితర అంశాలపై సీఎం దిశానిర్ధేశం చేయనున్నారు. 

07:48 - October 10, 2015

రేఖ.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రని వేసుకున్న ఎవర్‌గ్రీన్‌ అందాల తార. బాలీవుడ్‌లో అగ్ర నటులందరితో ఆడిపాడి తిరుగులేని కథానాయికగా పేరొందారు. లేడీ ఓరియెంటెడ్‌ పాత్రల్లోనూ తనదైన శైలిలో నటించి మెప్పించారు. ఓ వైపు శృంగార భరిత పాత్రలు, మరోవైపు నటిగా ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూనే నిజజీవితంలో వచ్చే ఒడిదుడుకులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటూ నిలబడిన బాలీవుడ్‌ అగ్ర తార రేఖ పుట్టిన రోజు నేడు(శనివారం). ఈ సందర్భంగా ఆమె జీవితంలోని పలు ఆసక్తికర అంశాలు..
1954లో చెన్నైలో జన్మించిన రేఖ, తండ్రి తమిళ్‌ లెజెండరీ నటుడు జెమినీ గణేషన్‌, తల్లి తెలుగు నటి పుష్పవల్లీ. రేఖ జన్మించే నాటికి జెమినీ గణేషన్‌, పుష్పవల్లీ పెళ్ళి చేసుకోకపోవడం గమనార్హం. తండ్రి ఆమెను పట్టించు కోకపోవడంతో ద్వేషం పెంచుకుంది. కుటుంబానికి దూరంగా పెరిగింది. రేఖకు నటనంటే ఇష్టలేకపోయినా ఆర్థిక ఇబ్బందులు నటిగా మారడానికి పురికొల్పాయి. భాష రాక పోయినా నేర్చుకునేలా చేశాయి. బాల నటీగా కెరీర్‌ను ప్రారంభించిన రేఖ నటించిన తొలి చిత్రం తెలుగులో కావడం విశేషం. 1966లో బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో చంద్రమోహన్‌, వాణిశ్రీ, అంజలి దేవి నటించిన 'రంగుల రాట్నం' చిత్రంలో బాల నటిగా నటించారు. హీరోయిన్‌గా తొలిసారి కన్నడంలో రాజ్‌కుమార్‌ హీరోగా 1969లో తెరకెక్కిన 'ఆపరేషన్‌ జాక్‌పాట్‌ నల్లీ సిఐడి 999' చిత్రంలో నటించారు. హిందీలో నటించిన మొదటి సినిమా 'అంజానా సఫర్‌'లో నటుడు బిస్వజిత్‌తో బలవంతంగా ముద్దు సన్నివేశం చేయించారని ఆరోపించారు. ఇదొక ఆంగ్ల పత్రికలో ప్రచురితం కావడంతో అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. ఆ సన్నివేశం సెన్సార్‌ ఇబ్బందులు తెచ్చి పెట్టడంతో సినిమా విడుదలే నిలిచిపోయింది.

ఘర్ చిత్రానికి ఫిల్మ్ ఫేర్..
'ఘర్‌' చిత్రంలోని నటనకు ఉత్తమ నటిగా తొలిసారి ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డును దక్కించుకున్నారు. 'ముకద్దర్‌ కా సికందర్‌'తో మరో ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు వరించింది. 1981లోనే వేశ్యపాత్రలో నటించిన 'ఉమ్రావ్‌ జాన్‌' అనే ఉర్దూ చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇండియన్‌ సినిమాకు ఆమె చేసిన సేవలకు గానూ 2010లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. జీవితం నేర్పిన పాఠాల్ని బాగా ఒంటబట్టించుకుని, రీల్‌ లైఫ్‌లో, రియల్‌లైఫ్‌లోనూ ఎదురైన ఎన్నో సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగుతున్న రేఖ ఎవర్‌గ్రీన్‌ గ్లామర్‌ క్వీన్‌గా నిలవాలని ఆశిద్దాం.

07:43 - October 10, 2015

కాలుకు గజ్జెకట్టి..భుజాన గొంగడి వేసుకుని...తన గొంతును పాటల తూటాగా మలిచి ప్రజల్ని ఉద్యమ బాట పట్టించిన గొప్పవ్యక్తి సుద్దాల హన్మంతు. తన ఆలోచనలకు పదునుపెట్టి, వాటికి సామాజిక స్పృహను జోడించి, దానికి తన గొంతుకలోని ఆవేశాన్ని కలిపి సాయుధ రైతాంగ పోరాటాన్ని పల్లెపల్లెకూ విస్తరింపజేసిన మహనీయుడు హన్మంతన్న. తెలంగాణలో సాంస్కృతికోద్యమానికి ఊపిరిలూదిన మహనీయుడు. 'పల్లెటూరి పిల్లగాడ...పశులగాసే మొనగాడ...పాలు మరిసి ఎన్నాళ్లయిందో..' అంటూ తన పాట ద్వారా ప్రజల హృదయాలను నిమిరిన మహోన్నత వ్యక్తి. నేటికీ ఆ పాట సజీవంగానే ఉంది.

నల్గొండ జిల్లాలో జననం..
సుద్దాల హన్మంతు నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పాలడుగులో 1908 డిసెంబర్‌లో జన్మించాడు. ఆ తర్వాత ఆయన కుటుంబం గుండాల మండలం సుద్దాలకు వెళ్లింది. ఆ ఊరు పేరే హన్మంతు ఇంటిపేరుగా చరిత్రలో నిలిచిపోయింది. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో ఆయనను స్మరించుకోవడమంటే సాంస్కృతికద్యోమాన్ని మరోమారు గుర్తు చేసుకోవడమే. హన్మంతన్న పాట నిజాం నిరంకుశ పాలనపైనా, దోపిడీ గుండెలపైనా తూటా అయింది. ఆయన అక్షరం ఆయుధమైంది. పీడిత, తాడిత అణిచివేయబడ్డ ప్రజలకు అండై నిజాం అల్లరి మూకల రజాకార్లను తరిమితరిమి కొట్టడంలో ఆయన పాటలు, ఆటలు, మాటలు ఎంతో దోహదపడ్డాయి. హన్మంతన్న పాటలు ప్రజల్లో ఆలోచనల్ని రేకెత్తించినవి. పోరుబాట పట్టించినవి. పోరాట స్ఫూర్తి రగిలించినవి. యాదగిరి రాసిన 'బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లె పోతావు కొడుకో నైజాం సర్కారోడ' అనే పాట అనే ఉద్యమాలకు ఉర్రూతలూగించింది. నాటి నిజాం అల్లరిమూకలు రజాకార్లు, జమీందార్లు, ముక్తేదార్లు, విసునూరు దొర భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం మహౌజ్వలం అయినది. బాంచన్‌ దొరా కాలుమొక్కుతా అన్నవారితో బందూకులను పట్టించినటువంటి మహా విప్లవమది. విసునూరు గడీలలో యేండ్లకేండ్లు వెట్టి చాకిరిలో మగ్గిపోతున్నటువంటి అభాగ్యులకు విముక్తి కల్పించినటువంటి పోరాటం.

ప్రజల కోసం జీవితం ధారాదత్తం..
కష్ట జీవుల కోసం కడ వరకు తన జీవితాన్ని అంకితమిచ్చినటువంటి సుద్దాల హనుమంతు తన జీవితాన్ని ప్రజల కోసం ధారబోశాడు. వేలాది మంది కవులు, కళాకారులు, రచయితలు ఆ నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యానిస్టు విప్లవాలకు వెన్నుదన్నుగా నిలిచారు. పాటలు, రచనలు ఆ నాడు తెలంగాణ ప్రజల్లో ఉత్తేజపరచాయి. ఆంధ్ర మహాసభలో చేరి కమ్యూనిస్టు పార్టీలో పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేశాడు. వరినాట్లు వేసేటప్పుడు వరి మోతలు మోసేటప్పుడు నాగలితో పొలాన్ని దున్ని అలసిపోయి..సొలసిపోయి ఒడ్డుమీదికి వచ్చి శ్రమ నుంచి విముక్తి పొందడానికి హన్మంతు పాటలు ఉయ్యాలలవుతాయి. ఒక పాట ఎంతో మందిలో చైతన్యాన్ని రగిలిస్తుంది. ఉద్యమాల వైపు నడిపిస్తుంది. పాటలో ఎంతో ఆకర్షణ ఉంటుంది. పాటకు ఉన్న విలువే వేరు. హనుమంతు అద్భుతమైన పాటలను అల్లినాడు. ప్రజలను విశేషంగా ఆకర్షించే యక్షగానాన్ని వీర తెలంగాణ పేరుతో కొత్తగారాసి వేలాది గ్రామాలలో కళా ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఏయే దొర కబంధహస్తాల్లో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో వివరాలను సేకరించి దొరల ఆగడాలను పల్లెసుద్దుల రూపంలో చెబుతూ ప్రజల్ని చైతన్యపరిచాడు. పల్లెపల్లె తిరుగుతూ గ్రామ సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. రాజపేట మండలం రేణుకుంటలో కమ్యూనిస్టుల గ్రామసభలో మాభూమి నాటకం, గొల్ల సుద్దుల ప్రదర్శనలు చేస్తున్నారు. అక్కడ సుద్దాల హనుమంతుతో పాటు ఆరుట్ల రాంచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, కురారం రాంరెడ్డి, రేణుకుంట రాంరెడ్డి, ఎలుకపల్లి యాదగిరిలు ఉన్నారు. గ్రామసభను చెదరగొట్టేందుకు నిజాం మూకలు వస్తున్నాయని బాల కళాకారులు సమాచారాన్ని చేరవేశారు. దీంతో సభలో ఉన్న వారు చెట్టుకొక్కరు...పుట్టకొక్కరు పారిపోతున్న క్రమంలో ఓ ముసలామె చేతిలో ఉన్న కర్రను హన్మంతు అందుకుని భూమిపై కర్రను కొడుతూ 'వెరు.. దెబ్బ దెబ్బకు దెబ్బ...' అంటూ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపారు. దీంతో అంతా కలిసి నిజాం సైన్యాన్ని ఊరి పొలిమేర వరకూ తరిమికొట్టారు. పాటకు నిలయమైన పోరాటానికి స్నేహమై తెలంగాణ సాహితీ లోకంలో తెలంగాణ సాయుధ పోరాటంలో చెరగని ముద్ర వేశారు. క్యాన్సర్‌తో చనిపోయే వరకూ పేదల కష్ట సుఖాల గురించే ఆలోచించారు.

07:39 - October 10, 2015

అంధత్వాన్ని జయించి ట్రెండ్‌కి అనుగుణంగా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సంగీతంతో ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు రవీంద్రజైన్‌(71) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. సంగీత దర్శకుడిగా ఆయన సినీ ప్రస్థానం అందరికీ మార్గదర్శకం. హార్మోనియం వాయించడంలో స్పెషలిస్ట్‌గా పేరొందిన రవీంద్రన్‌ జైన్‌ తొలుత సంగీత దర్శకత్వం వహించిన 'చోర్‌ మచాయే షోర్‌' (1974) సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత 'గీత్‌ గాతా ఛల్‌' (1975), 'చిచ్చోర్‌' (1976) చిత్రాలు సైతం ఘనవిజయం సాధించాయి. దీంతో రవీంద్రజైన్‌కు బాలీవుడ్‌లో మరింత గుర్తింపు లభించింది. సంగీత దర్శకత్వంతోపాటు పాటలు రాయడం, పాడటం ఆయన ప్రత్యేకత. రాజ్‌కపూర్‌ నటించిన 'రామ్‌ తేరీ గంగా మెయిలీ' చిత్రంతో రవీంద్ర జైన్‌ యావత్‌ భారతీయ ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. ఆ తర్వాత హిందీతోపాటు పంజాబీ, వరియా, భోజ్‌పురి, తెలుగు, మలయాళం, బెంగాలీ, గుజరాతీ తదితర భాషా చిత్రాలకు కూడా ఆయన సంగీతమందించి ప్రత్యేకతను చాటుకున్నారు. వీటితోపాటు భక్తిపాటలకు సంబంధించి లెక్కలేనన్ని ఆల్బమ్స్‌కు సంగీత దర్శకత్వం వహించారు. తెలుగులో 'బ్రహ్మశ్రీ విశ్వామిత్ర', 'దాసి' చిత్రాలకు కూడా ఆయన సంగీతమందించారు.
జేసుదాసుని బాలీవుడ్‌కి పరిచయం ఘనత
ప్రముఖ నేపథ్య గాయకుడు జేసుదాసుని బాలీవుడ్‌కి పరిచయం చేసిన ఘనత కూడా రవీంద్రజైన్‌దే. 1970 నుంచి 80 మధ్యకాలంలో రవీంద్రజైన్‌ సంగీత దర్శకత్వం వహించిన చాలా చిత్రాల్లో జేసుదాసు పాటలు పాడారు. వీరిద్దరి కాంబినేషన్‌లో 'ఓ గోరియా రే..', 'బీత్‌ హుయి రాత్‌ కి', 'గోరీ తేరా గావ్‌..' వంటి పాటలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. అంతేకాదు కె.జె.జేసుదాసు స్థాపించిన 'తరంగిణి ఆడియో' కంపెనీ ద్వారా మలయాళంలో ఎన్నో ప్రైవేట్‌ ఆల్బమ్స్‌కు రవీంద్రజైన్‌ సంగీతాన్ని సమకూర్చారు. ముఖ్యంగా వీరి కాంబినేషన్‌లో వచ్చిన భజన్స్‌ అందరిని విశేషంగా అలరించాయి. వీటితోపాటు గజల్స్‌తో కూడా ఆల్బమ్స్‌ రూపొందించారు.
అంధత్వాన్ని జయించిన ఘనుడు..
లక్ష్యాన్ని సాధించడంలో అంధత్వం అడ్డుకాదని నిరూపించిన ఘనుడు రవీంద్రజైన్‌. సినిమాకే పరిమితం కాకుండా లెక్కలేనన్ని టీవీ సీరియల్స్‌కి కూడా ఆయన సంగీతాన్ని సమకూర్చారు. 'రామాయణం' సీరియల్‌తో మరింత గుర్తింపు వచ్చింది. 1985లో 'రామ్‌ తేరీ గంగా మెయిలీ' చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డును, అలాగే 1976 'చిచ్చోర్‌' చిత్రానికి, 1991లో 'హెన్నా' చిత్రానికి సైతం ఆయన ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను గెల్చుకున్నారు. సంగీత ప్రపంచంలో ఆయన చేసిన విశేష సేవల్ని గుర్తించి ఈ ఏడాది కేంద్రప్రభుత్వం 'పద్మశ్రీ' అవార్డ్‌తో సముచితంగా గౌరవించింది.

07:37 - October 10, 2015

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సుల్తాన్‌' ఫస్ట్‌లుక్‌ని చిత్రయూనిట్‌ శుక్రవారం విడుదల చేసింది. షార్ట్‌కట్‌ హెయిర్‌ స్టయిల్‌తో, పౌరుషానికి ప్రతీకగా నిలిచే మీసాలతో, బలమైన కండలతో కూడిన సల్మాన్‌ పోస్టర్‌ చూపరులను ఆకట్టుకుంటోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.

నాలుగో రోజుకు చేరిన జగన్ దీక్ష..

గుంటూరు : నల్లపాడులో వైసీపీ అధినేత జగన్‌ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, వైసీపీ నేతలు దీక్షా శిబిరానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నేతలు అభిప్రాయపడ్డారు. 

గోషామహల్ పీఎస్ కు నేతల తరలింపు..

హైదరాబాద్ : ఏంజీబీఎస్ ఎదుట అరెస్టయిన నేతలను గోషామహల్ పీఎస్ కు తరలించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ విపక్షాలు నేడు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామునుండే బస్సు డిపోల ఎదుట విపక్ష నేతలు బైఠాయించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం డిపోల ఎదుట ఆందోళనలు చేశారు. ధర్నాకు దిగిన పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఆందోళనకు దిగిన ఎర్రబెల్లి, ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, మాగంటి గోపినాథ్, పొంగులేటి సుధాకర్, చింతల రామచంద్రారెడ్డి, షబ్బీర్ ఆలీలను పోలీసులు అరెస్టు చేశారు. 

రుణాలు మాఫీ చేయాల్సిందే - ఉత్తమ్..

హైదరాబాద్ : రైతులకు ఏకమొత్తంలో రుణాలు మాఫీ చేయాల్సిందేనని టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇమ్లిబన్ బస్ స్టేషన్ ఎదుట ఆయన బైఠాయించారు. వెంటనే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. రుణాలు మొత్తం మాఫీ చేసేంత వరకు ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. 

06:56 - October 10, 2015

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని అర్ధరాత్రి భూకంపం వణికించింది. సరిగ్గా అర్ధరాత్రి 1.45 నిముషాల ప్రాంతంలో నేషనల్ క్యాపిటల్‌ రీజియన్‌లో స్వల్పంగా భూమి కంపించింది. హఠాత్తుగా పెద్దగా వచ్చిన శబ్దంతో హడలిపోయిన ఢిల్లీ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 3.0గా తీవ్రత నమోదయింది. అయితే ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం లేకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

06:39 - October 10, 2015

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌ అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పలు పార్టీలు, ప్రజాస్వామిక సంఘాలు నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. రుణమాఫీని ఏకమొత్తంలో విడుదల చేయాలన్న డిమాండ్‌తో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. తెలంగాణలో జరుగుతున్న ఎన్‌కౌంటర్లు,రైతు ఆత్మహత్యలతో పాటు పలు అంశాలకు నిరసనగా నేడు విపక్షాలు బంద్‌ను నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే తెల్లవారుఝామునుంచే డిపోల వద్దకు చేరిన నేతలు బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సర్కారు వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో పోలీసులు నేతలను, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు. అయినా నేటి బంద్‌ను సక్సెస్‌ చేసి తీరుతామని విపక్షనేతలు చెబుతున్నారు. నగరంలోని ప్రధాన బస్టాండ్ అయిన ఇమ్లిబన్ బస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను అడ్డగోలుగా దోచుకుంటుందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉప ఎన్నికలు, పదవుల పంపకాలపై చర్చలు జరపడం దుర్మార్గమన్నారు. కుటుంబం, అధికారం తప్ప కేసీఆర్‌కు మరోటి కనిపించడం లేదన్నారు. రంగారెడ్డి
జిల్లాలోని ఇబ్రహింపట్నంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు కార్యకర్తలు బైఠాయించారు. దీనితో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దిల్ సుఖ్ నగర్ డిపో ఎదుట బైఠాయించిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బైఠాయించారు. పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. కూకట్ పల్లి ఆర్టీసీ బస్సు డిపో ఎదుట మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బైఠాయించారు. దీనితో డిపోల నుండి బస్సులు కదలలేదు. ముషిరాబాద్ డిపో ఎదుట కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. వినయ్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సంగారెడ్డి, సిద్ధిపేట ఆర్టీసీ బస్సు డిపోల ఎదుట కాంగ్రెస్, టిడిపి, వామపక్షాలు నేతలు బైఠాయించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజయ్యను పోలీసులు అరెస్టు చేశారు. 

సీఐటీయు కార్యదర్శి రాజయ్య అరెస్టు..

మెదక్ : సంగారెడ్డి, సిద్ధిపేట ఆర్టీసీ బస్సు డిపోల ఎదుట కాంగ్రెస్, టిడిపి, వామపక్షాలు నేతలు బైఠాయించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజయ్యను పోలీసులు అరెస్టు చేశారు.

 

కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం..

హైదరాబాద్ : ముషిరాబాద్ డిపో ఎదుట కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. వినయ్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

 

కూకట్ పల్లి ఆర్టీసీ బస్సు డిపో ఎదుట విష్ణువర్ధన్ రెడ్డి బైఠాయింపు..

హైదరాబాద్ : కూకట్ పల్లి ఆర్టీసీ బస్సు డిపో ఎదుట మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బైఠాయించారు. దీనితో డిపోల నుండి బస్సులు కదలలేదు. 

ఇబ్రహీంపట్నంలో సీపీఎం నేతల బైఠాయింపు..

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహింపట్నంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు కార్యకర్తలు బైఠాయించారు. దీనితో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

 

ఆర్టీసీ డిపోల ఎదుట నేతలు, కార్యకర్తల బైఠాయింపు..

హైదరాబాద్ : తెలంగాణ బంద్ నేపథ్యంలో పలు ఆర్టీసీ డిపోల ఎదుట కాంగ్రెస్, బిజెపి, వామపక్షాల నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. దీనితో ఆర్టీసీ బస్సులు డిపోల నుండి బయటకు రాలేదు. 

 

నేడు తెలంగాణ బంద్..

హైదరాబాద్ : నేడు తెలంగాణ బంద్ కొనసాగుతోంది. రైతు రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ టిడిపి, కాంగ్రెస్, బిజెపి వామపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. 

Don't Miss