Activities calendar

13 October 2015

21:32 - October 13, 2015

బీహార్ : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ పాల్గొనాల్సిన సభ హింసాత్మకంగా మారింది. ఎన్నికల ప్రచార సభకు అజయ్ వస్తారని బిజెపి ప్రచారం చేయడంతో భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన అజయ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాలేదు. దీంతో అసహనానికి గురైన అభిమానులు బారికేడ్లు దూకి వీరంగం సృష్టించారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేయగా.. అల్లరి మూకలు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో అభిమానులతో పాటు పోలీసులు, మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. జముయ్, లఖిసరాయ్, నవాడ జిల్లాల్లో జరిగిన ప్రచార సభల్లోఅజయ్ దేవగన్ పాల్గొన్నారు.

21:30 - October 13, 2015

చైనా : బ్రహ్మాపుత్ర నదిపై చైనా నిర్మించిన భారీ జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనిచేయడం ప్రారంభమైంది. టిబెట్ ప్రాంతంలో 1.5 బిలియన్ డాలర్లతో దీన్ని నిర్మించారు. ఈ డ్యామ్ కారణంగా దిగువ ప్రాంతాల్లో నివసించేవారి ప్రాణాలకు ముప్పు ఉందన్న భారత్‌ ఆందోళనను చైనా పెడచెవిన పెట్టింది. అతి పెద్ద హైడ్రోపవర్ చైనా గెఝౌబ గ్రూప్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన జల విద్యుత్‌ ప్రాజెక్టుగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాజెక్టులోని మొత్తం ఆరు యూనిట్లను పవర్ గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఈ ప్రాజెక్టు ఏడాదికి 2.5 బిలియన్ కిలోవాట్ హవర్స్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ జామ్ హైడ్రో పవర్ స్టేషన్ టిబెట్‌కు 140 కిలోమీటర్ల దూరంలో గ్యాకా కౌంటీలో ఉంది. 

21:29 - October 13, 2015

ఢిల్లీ : ఆన్‌లైన్ ఫార్మసీ విక్రయాలకు నిరసనగా అఖిల భారత ఔషధ విక్రేతల సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా 8 లక్షల 50 వేల మెడికల్‌ రిటేల్‌ షాపులు రేపు మూతపడనున్నాయి. ఆన్‌లైన్ విక్రయాల ద్వారా మెడికల్‌ షాపులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఏఐఓసిడి పేర్కొంది. ఆన్‌లైన్‌ మందుల అమ్మకాలపై నియంత్రణ విధించాలని ఏఐఓసిడి కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ రోజు రోజుకు విస్తరిస్తోంది. మొబైల్‌ ఫోన్లు, దుస్తులు, ఎలక్ట్రానిక్‌ తదితర వస్తువుల అమ్మకాలు ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటికే ఊపందుకున్నాయి. ఇపుడు ఆన్‌లైన్‌లో డ్రగ్స్ అమ్మకాలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ-ఫార్మసీ కారణంగా లక్షలాది చిన్న మెడికల్‌ షాపుల ఆదాయానికి గండి పడుతోంది. ఇందుకు నిరసనగా అక్టోబర్‌ 14, బుధవారం దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు అఖిల భారత ఔషధ విక్రేతల సంఘం-ఏఐఓసీడీ ప్రకటించింది.

కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్..
ఇంటర్నెట్‌ ద్వారా మందుల విక్రయాన్ని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నట్లు ఏఐఓసీడీ తెలిపింది. ఆన్‌లైన్‌ విక్రయాల ద్వారా మందులు వికటించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, తక్కువ నాణ్యత, నకిలీ ఉత్పత్తుల డ్రగ్స్ ప్రవేశించే అవకాశం ఉందని ఏఐఓసీడీ హెచ్చరించింది. కేంద్రం ఆన్‌లైన్ విక్రయాలను అనుమతిస్తే 8 లక్షల మంది ఔషధ విక్రేతలు, 80 లక్షల ఉద్యోగులు, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. ఇంటర్నెట్‌ ద్వారా అక్రమంగా మందులు విక్రయించడంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఏఐఓసీడీ డిమాండ్ చేసింది. ఒకవేళ కేంద్రం తగు చర్యలు చేపట్టకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. ఆసుపత్రుల్లోని మెడికల్‌ షాపులు, 24 గంటలు పనిచేసే మెడికల్‌ షాపులకు బంద్‌ నుంచి మినహాయింపు నిచ్చారు.

21:25 - October 13, 2015

హైదరాబాద్ : తెలంగాణలోని పది జిల్లాల కలెక్టర్లు, అధికారులకు సీఎం కేసీఆర్‌ వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు.. ప్రభుత్వ చేపట్టబోతున్న కార్యక్రమాలను వివరించారు.. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో సహించేదిలేదని హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిపారు.. 12 అంశాలను ఎజెండాగా చర్చించారు. వివిధ అంశాలపై అధికారులు సూచనలు చేశారు కేసీఆర్‌. గృహ నిర్మాణం పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు కీలకంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూడటంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు టీం స్పిరిట్‌తో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టబోతున్న మిగతా కార్యక్రమాలను అధికారులు వివరించారు టీ సీఎం. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 60వేల ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గంలో 4 వందల ఇళ్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ సంఖ్యను పెంచుకుంటూ పోతామని చెప్పారు. గృహ నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తామని టీసీఎం తెలిపారు. గృహ నిర్మాణంలో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా క్షమించబోమని హెచ్చరించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంకోసం భూ సేకరణలో కలెక్టర్లు చొరవచూపాలని సీఎం సూచించారు. భూసేకరణ నిధులు వెంటనే విడుదలచేస్తామని హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ప్రాజెక్టులకోసం భూసేకరణ జరగడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. 

కలెక్టర్లకు పలు సూచనలు..ఆదేశాలు..
ప్రతి ఇంటికి మంచినీల్లు అందించే వాటర్ గ్రిడ్ పథకంలోని నిర్మాణాలు, ఇతర పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కొందరు కుట్రతోనే తమ భూముల్లో పైపులైన్లు వేయవద్దని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని, పైపులైన్లు వేయడానికి రైట్ ఆఫ్ వే చట్టాన్ని వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పైపులైన్లను అడ్డుకొంటే కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలన్నారు. దళితులకు మూడెకరాల భూమి విషయంలో అధికారులు మరింత చొరవ చూపాలని, ఆసలే భూమిలేని వారికి మూడెకరాలు కొనివ్వాలని తెలిపారు. ఇప్పటికే కొంత భూమి ఉన్న వారికి మిగతా భూమిని కొనివ్వాలని, దళితులకు భూమి కొనిచ్చే విషయంలో ఇబ్బందికరంగా ఉన్న నిబంధనలు మార్చాలన్నారు. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధుల ద్వారా ఎస్టీలకూ వ్యవసాయ భూమి సమకూర్చాలని, జీవీ నెంబర్ 58, 59 ద్వారా ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. గ్రామ జ్యోతి కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, త్వరలో అన్ని గ్రామాలకు చెత్త సేకరణ కోసం రూ.25వేల ట్రై సేకిళ్ల పంపిణీ చేస్తామన్నారు. చేంజ్ ఏజెంట్లతో కలెక్టర్లు నిరంతంర సమావేశం కావాలని, శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు సామాజిక మార్పుకు కూడా పోలీసు శాఖ కృషి చేయాలన్నారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండేలా ఎమ్మెల్యేలు, మంత్రులు చొరవ చూపాలని పేర్కొన్నారు. ఈ ఏడాది మిషన్ కాకతీయ పనులను డిసెంబర్ 31లోగా ప్రారంభించాలని, చెరువులు కబ్జాకు గురి కాకుండా కఠిన చట్టాలు తెస్తామని, చెరువుల కింద ఆయుకట్టు నిర్ధారణకు సర్వేలు నిర్వహించాలన్నారు. అటవీ భూముల రక్షణకు, కబ్జాలకు గురైన భూములను స్వాధీనం చేసుకోవడానికి వ్యూహాలు రూపొందించాలన్నారు. నల్లమల అడవుల్లో షెడ్యూల్ తెగకు చెందిన కుటుంబాలకు పునరావసం కల్పించేందుకు కార్యాచరణ రూపొందించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. రాష్ట్రంలో కరువు మండలాల నివేదికను తయారు చేయాలని, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని కొన్ని మండలాలే కరువు ప్రాంతాల జాబితాలో స్థానం పొందే అవకాశం ఉందని సీఎంకు అధికారులు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న అంగన్ వాడీ భవనాలను ఉపాధి నిధులతో పూర్తి చేయాలని సూచించారు. అలాగే మేడారం జాతర పనులనను సకాలంలో పూర్తి చేయాలన్నారు.
హరితహారం ద్వారా విరివిగా చెట్లు పెంచాలని, ఫైరింజన్ల ద్వారా మొక్కలకు నీళ్లు పోయాలని ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్లతో సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో ఎంసీహెచ్ఆర్డీలో కలెక్టర్ల సమావేవం ముగిసింది. ప్రతి ఇంటికి మంచినీల్లు అందించే వాటర్ గ్రిడ్ పథకంలోని నిర్మాణాలు, ఇతర పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కొందరు కుట్రతోనే తమ భూముల్లో పైపులైన్లు వేయవద్దని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని, పైపులైన్లు వేయడానికి రైట్ ఆఫ్ వే చట్టాన్ని వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పైపులైన్లను అడ్డుకొంటే కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలన్నారు. దళితులకు మూడెకరాల భూమి విషయంలో అధికారులు మరింత చొరవ చూపాలని, ఆసలే భూమిలేని వారికి మూడెకరాలు కొనివ్వాలని తెలిపారు.

21:08 - October 13, 2015

బతుకుకు స్పూర్తినిచ్చిన సంబురం.. తీరొక్క పూలు..కోటొక్క పాటల కోలాహాలం..తెలంగాణ అస్థిత్వ వైభవం..ఆడపడుచుల ఆరాధ్య వైభోగం...ప్రకృతి రమణనీయత..శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక..తెలంగాణలో బతుకమ్మ సంబరం..మొదలైంది. ఎంగిలిపూల వేడుకలతో ఆరంభమైంది. అసలు బతుకమ్మ తెలంగాణకు ఎలా అస్థిత్వమైంది. ఆడపడుచలతో ఎలా మమేకమైంది. బతుకమ్మ ఇచ్చే బతుకు సందేశం ఏంటీ ? ఈ అంశంపై ప్రత్యేక కథనం.

అంబరాన్ని అంటుతున్న సంబురాలు..
బతుకమ్మ పూలతో చేసిన జాతర..అందాల హరివిల్లును నేల మీద పరిచే తిరునాళ్లు కంచెలు కంచెలుగా బీళ్లు బీళ్లుగా విస్తరించుకున్న నీళ్లు లేని తెలంగాణలో కన్నీటి చెలిమే బతుకమ్మ. ఊయాలలూపే పాటల పల్లవుల్లో ఆడపడుచుల ఆర్భాటం పండుగ. తెలంగాణ ఊరువాడలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. బతుకమ్మపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అన్నీ పక్కన పెడితే బతుకమ్మ అంటే ప్రకృతితో పెనవేసుకున్న ఆత్మీయ బంధం. సమతా..మమతల సారం. ఒక నవ్యనూతన సామాజిక చైతన్యం. ప్రకృతితో బతుకమ్మ ఎలా మమేకమైంది ? బతుకమ్మ అంటే మూర్తీభవించిన మహిళ. చెరువుల రక్షణ కోసం ప్రాణాలర్పనకు వెరువని మగువ. సామాజిక చైతన్య తెగువ. దశాబ్దాల బతుకమ్మ ఉత్సవం స్త్రీతో ఎలా పెనుకవేసుకుంది ?

బడుగుల బతుకమ్మ కావాలి..
బతుకు కోసం..బతుకు భద్రత కోసం బతుకమ్మ కావాలి. గడీల బతుకమ్మ కాదు..బడుగుల బతుకమ్మ కావాలి. మహిళలపై హింస లేని తెలంగాణ కావాలి. ఇది తెలంగాణ బతుకమ్మల విన్నపం. విలాపం. అయితే బతుకమ్మ చుట్టూ రాజకీయం ఎందుకు ముసురుకొంటోంది ? బతుకమ్మ ఉత్సవం కొందరికే సొంతం అయినట్లు ప్రచారం ఎందుకు ? బతుకమ్మ అస్థిత్వమైన తెలంగాణలో బతుకమ్మలను ఎందుకు చిదిమేస్తున్నారు. మహిళా సంఘాలు సంధిస్తున్న ప్రశ్నలు. బతుకమ్మ పండుగలో మూడు ప్రధానమైన అంశాలు. 1.ఆడబిడ్డలు. 2.చెరువు. 3.పూలు. చెరువులో పూలను వదలడమనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకున్నా అన్నింటికీ మించి చెరువు కోసం ప్రాణత్యాగాలు చేసిన వారికి పూల నివాళి బతుకమ్మ. చారిత్రాత్మకత ఎలా ఉన్నా తెలంగాణకు సజీవ అస్థిత్వం బతుకమ్మ. కోటి రతనాల తెలంగాణ ఒక పూల తోరణం. 9 రోజుల పాటు ఈ పూలవనం ప్రతి ఇంటి ముంగిట అందంగా కనిపిస్తుంది. దసరా పండుగకు రెండు రోజుల ముందు జరిగే సద్దులు మొత్తం పండుగలో పతాక సన్నివేశం. 

ఆశా వర్కర్ల సమస్య కేంద్రం తీర్చాలి - ఎంపీ కవిత..

కరీంనగర్: ఆశా వర్కర్ల సమస్యను తీర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని, ఆశా వర్కర్లు వెంటనే ఆందోళనను విరమించుకోవాలని ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు.

19:59 - October 13, 2015

హైదరాబాద్ : వచ్చే ఏడాది జూలై లోపు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు టీఎస్‌పీఎస్సీలో పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలోనే ఇలా నమోదు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యల 3 లక్షలు దాటి పోయారు. ఇంతకీ యూత్‌లో సర్కారీ కొలువులపై ఎందుకింతటి క్రేజ్‌..? తెలంగాణ యువతలో ప్రభుత్వ ఉద్యోగాల పట్ల విపరీతమైన క్రేజ్‌ పెరిగిపోయింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక.. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగాయి. ఎంత కింది స్థాయి ఉద్యోగికైనా నెలకు కనీసం 25 వేల నుంచి 30 వేల రూపాయల వరకు జీతాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగాలకు ఏమాత్రం తీసిపోని రీతిలోనున్న వేతనాలు నిరుద్యోగుల్లో ఆశలను పెంచుతున్నాయి. పైగా ప్రైవేటు సంస్థల్లోని దోపిడి విధానం, ఉద్యోగాలకు భద్రత లేకపోవడం కూడా యువతను ప్రభుత్వ ఉద్యోగాల వైపు మళ్లిస్తోంది. కొద్దిగా కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చని.. జీవితం స్థిరపడుతుందన్న ఆశతో యువత కోచింగ్‌ సెంటర్ల వైపు పరుగులు పెడుతున్నారు.

పెరిగిన గిరాకీ..
ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనతో రాష్ట్ర రాజధాని చుట్టూ ఉన్న కోచింగ్‌ సెంటర్లకు గిరాకీ పెరిగిపోయింది. అన్ని కోచింగ్‌ కేంద్రాలూ అభ్యర్థులతో కిట కిటలాడుతున్నాయి. ఒక్కో కోచింగ్‌ సెంటర్లో రోజుకు 4000 మందికి పైగా అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారని అంచనా. ప్రస్తుతం జంటనగరాల్లో 500కు పైగా కోచింగ్‌ సెంటర్లు ఉన్నాయి. కొత్తగా.. ఆశోక్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, అమీర్‌పేట్‌ పరిధుల్లో 150 కోచింగ్‌ సెంటర్లు వెలిశాయి. సిలబస్‌లో తెలంగాణ చరిత్రనూ చేర్చడంతో.. ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులూ కొత్త కోచింగ్‌ సెంటర్లను ప్రారంభించేస్తున్నారు. అభ్యర్థుల అవసరాన్ని.. శిక్షణ కేంద్రాలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. 

19:55 - October 13, 2015

హైదరాబాద్ : పెద్ద పెద్ద జీతాలు.. కార్లు.. బంగళాలు.. వీకెండ్స్ పార్టీలు..! ఇవి పొందాలంటే పేరున్న ప్రైవేటు సంస్థలో ఉద్యోగం కొట్టేయాల్సిందే అన్న యువత మనోగతం మారింది. ఎంత జీతమొచ్చినా.. ఎన్ని సదుపాయాలున్నా.. సర్కారీ కొలువు ముందు దిగదుడుపే అన్న భావన యువతలో పెరిగిపోతోంది. అందుకే.. ఇప్పుడు చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలను వదులుకుని మరీ.. సర్కారీ కొలువు కోసం తపస్సు చేస్తున్నారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం... తెలంగాణలో సర్కారీ కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు యువతీయువకులు విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సర్కారీ కొలువును ఎలాగైనా సాధించాలన్న కసితో.. వేలాది రూపాయలు ఖర్చు చేసి పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నారు.

ఉద్యోగాలకు రాజీనామాలు చేసి కోచింగ్...
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కావడంతో ప్రైవేటు సంస్థల్లో వేలాది రూపాయలు సంపాదిస్తూ మంచి హోదాలో ఉన్న ఉద్యోగులు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. సుమారు లక్షా 18వేల మంది ప్రైవేటు ఉద్యోగులు సర్కారీ కొలువుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరిలో చాలామంది చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ కోచింగ్‌ తీసుకుంటున్నారు. ఫలితంగా చాలా ప్రైవేటు సంస్థల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయి. ప్రధానంగా మెట్రో రైల్‌, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, కాల్‌ సెంటర్స్, కార్పొరేట్‌ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, ఇంజనీర్‌లు, విద్యా శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు ఇలా లక్షలాది మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినట్టు సమాచారం.

ఇతర విభాగాలకు నోటిఫికేషన్లు...
ఇందులో కింది స్థాయి సిబ్బంది మొదలు... మేనేజర్‌ స్థాయి ఉద్యోగులూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం గ్రూప్‌1, గ్రూప్‌2 పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీరితో పోటీ పడుతూ ప్రైవేటు సంస్థల ఉద్యోగులూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్‌ విభాగంలో ఎఇల పోస్టులకు జరిగిన పరీక్షలకు సుమారు 30వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరికొద్ది నెలల్లో ఇతర విభాగాల్లోని ఖాళీల భర్తీకి సైతం నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. 

సీఎం బాబు ఢిల్లీ షెడ్యూల్..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నాం 12.30గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. స్వచ్చ భారత్ పై నీతి ఆయోగ్ ఉప సంఘం నివేదికను మధ్యాహ్నాం 03.45గంటలకు ప్రధాన మంత్రి మోడీకి అందచేయనున్నారు. రాజధాని శంకుస్థాపనకు మరోసారి ప్రధానిని బాబు ఆహ్వానించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని, సాయత్రం ఐదున్నరకు రాజ్ నాథ్ సింగ్ ను కలిసి రాజధాని శంకుస్థాపనను ఆహ్వానించనున్నారు. 

గూడ అంజయ్యకు సుద్దాల హనుమంతు - జానకమ్మ జాతీయ పురస్కారం..

హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత గూడ అంజయ్యకు సుద్దాల హనుమంతు - జానకమ్మ జాతీయ పురస్కార ప్రధానం చేయనున్నారు.

 

ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదు - ఎంపీ సీతారాం నాయక్..

ఢిల్లీ : తమ పాలనలో ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు జరిగాయన్నారు. ఆశాల, రైతుల సమస్యలపై పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని వెల్లడించారు. 

ఎండిన వరిని పరిశీలించిన జూలకంటి...

నల్గొండ : ఎండిన వరి పైరును సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు. మిర్యాలగూడ మండల పరిధిలో జూలకంటి పర్యటించారు. సాగర్ నుండి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే నీటిని విడుదల చేస్తే లక్ష ఎకరాల పంట చేతికందే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రేపు రైతులతో కలిసి కలెక్టర్ కు కరవు నివారణ చర్యలపై వినతిపత్రాలు అందిస్తామన్నారు. 

కేసీఆర్ మాట తప్పారు - గీతారెడ్డి..

మెదక్ : ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా తెలంగాణ ఇస్తే సీఎం కేసీఆర్ మాత్రం రైతులకు ఇచ్చిన మాట తప్పారని కాంగ్రెస్ నేత గీతారెడ్డి విమర్శించారు. 

ఐక్యంగా పోరాడాలి - కుంతియా..

మెదక్ : తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ నాయకులంతా ఐక్యంగా పోరాటం సాగించాలని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా పిలుపునిచ్చారు. పార్టీ వీడిన వారంతా తిరిగి వస్తారని జోస్యం చెప్పారు.  

 

బాడీ బిల్డింగ్ పోటీల్లో భారత మహిళ పతకం..

ఢిల్లీ : బాడీ బిల్డింగ్ పోటీల్లో తొలిసారిగా భారత మహిళకు పతకం లభించింది. ఉబ్జెకిస్తాన్ లో జరిగిన 49వ ఏషియన్ బాడీ బిల్డింగ్ పోటీల్లో శ్వేతా రాథోడ్ రజత పతకం సాధించింది. 

అదే బాటలో పద్మశ్రీలు..

ఢిల్లీ : సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతల బాటలో పద్మశ్రీలు పయనిస్తున్నారు. పద్మశ్రీ పురస్కారాన్ని పంజాబ్ రచయిత్రి వెనక్కి ఇచ్చేశారు. మతోన్మాదంపై నవాల రచయిత్రి దిలీప్ కౌర్ తివానా నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముస్లింలపై జరుగుతున్న దాడులు 1984 నాటి సిక్కుల ఊచకోతతో పోల్చారు. 

19:22 - October 13, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదాపై ప్రధాన మంత్రి మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణాల మీదకు తీసుకోవద్దని వైసీపీ అధ్యక్షుడు జగన్ కు సూచించారు. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన కుటుంబంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదని మండిపడ్డారు. శాసనసభలో ప్రతిపక్షాలన్నింటినీ సస్పెండ్ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈనెల 19వ తేదీన జరిగే రాజీవ్ సద్భావన యాత్రలో తాను పాల్గొంటానని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. 

19:15 - October 13, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా మొదటి కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ చేపట్టిన మన మట్టి, మన నీరుకు టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రత్యేక పూజలమధ్య మట్టి, నీరు సేకరించారు. ఏపీలో మన మట్టి, మన నీరు కార్యక్రమం ఘనంగా మొదలైంది. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. పుట్టకు పూజలు చేసిన బాబు అక్కడి మన్ను సేకరించారు. అమరావతి శంకుస్థాపన విజయవంతం కావాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు చేశారు. గుంటూరు జిల్లా నాదెండ్ల గ్రామంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు మన నీరు మన మట్టిని ప్రారంభించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రైతులుకూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నెల్లూరు జిల్లాలో మన నీరు, మన మట్టిని సేకరించారు టీడీపీ నేతలు. గ్రామదేవత ఇరుకలళ పరమేశ్వరి ఆలయంలో ఈ సేకరించిన మట్టి, నీరును ఉంచి పూజలు చేశారు.

ఎమ్మెల్యే 60 కి.మీటర్ల పాదయాత్ర..
పశ్చిమగోదావరి జిల్లాలోనూ మన నీరు, మన మట్టి విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులోభాగంగా ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వీరాంజనేయులు 60 కిలో మీటర్ల పాటు పాదయాత్ర చేశారు. ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు చిత్తూరు జిల్లా పుత్తూరులో. మన మట్టి, మన నీరు కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, వార్డుల నుంచి కూడా మట్టి, నీరు సేకరిస్తున్నామని చెప్పారు. గుంటూరు జిల్లా తాటికొండలో మన మట్టి, మన నీరులో భాగంగా కలశపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబుతో పాటు దేవాదాయ అధికారులు పాల్గొన్నారు.

మండల కేంద్రాల్లో భద్రపరుస్తారు..
తూర్పుగోదావరి జిల్లా సర్పవరంలోని ఆలయం నుంచి మట్టి, నారదగుండం నుంచి నీటిని సేకరించారు. వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య ఈ కార్యక్రమం సాగింది. గుంటూరు జిల్లా నర్సీపట్నంలోనూ వరహనది సమీపంలో మట్టి, నీరు సేకరించారు. ముందుగా నదీమ తల్లికి పూజలు చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో పురపాలక కౌన్సిలర్స్ పాల్గొన్నారు. శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా ప్రతి గ్రామంనుంచి కిలో మట్టి, పావు లీటరు నీటిని సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.. మంగళవారంనుంచి మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి వస్త్రంలో మట్టి, కలశంలో నీటిని తీసుకోవాలని సూచించింది. ఇలా సేకరించినవాటిని ఈ నెల 16న ఆయా మండలకేంద్రాల్లో భద్రపరుస్తారు. ఆ తర్వాత అమరావతి శంకుస్థాపన ప్రదేశానికి తరలిస్తారు.

19:10 - October 13, 2015

గుంటూరు : ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు వైసిపీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. తమ అధినేత దీక్షను భగ్నం చేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదని వైసిపీ స్పష్ఠం చేసింది. అలుపెరగని పోరాటం చేసి కేంద్రం మెడలు వంచుతామని వైసిపీ నేతలు చెబుతున్నారు. చికిత్స పొందుతున్న అధినేతతో భేటీ అయిన అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైసిపీ అధినేత జగన్‌ గుంటూరు జిల్లా నల్లపాడులో చేసిన దీక్షను పోలీసులు భగ్నం చేసారు. జగన్ ఆరోగ్యం క్షీణించటంతో ఆయన్ను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. హోదా సాధనే లక్ష్యంగా చేపట్టిన దీక్ష భగ్నం కావటంతో జగన్‌ జీజీహెచ్ లో చికిత్స తీసుకుంటున్నారు.


21వ తేదీ వరకు ఆందోళనలు..
వైసిపి అధినేత అరెస్టుతో ఆ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. ప్రత్యేక హోదాపై నోరు మెదపని వారు, హోదా దీక్షను భగ్నం చేయడంపై మాటల తూటాలు పేల్చాయి. దీక్ష భగ్నాన్ని నిరసిస్తూ ఆందోళన బాట పట్టాయి. ఈ నేపథ్యంలో గుంటూరు వైసిపీ కార్యాలయంలో సమావేశమైన నేతలు ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై సమాలోచనలు జరిపి అధినేతను కలుసుకుని భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించారు. దీని ప్రకారం బుధవారం విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకూ నిరసన మార్చ్ జరుగుతుంది. అంతేకాక ఈనెల 17 నుంచి 21 వరకూ అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు,18న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు,19న నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు, 20వ తేదీ సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ, 21న బస్సు డిపోల ముందు ధర్నాలు నిర్వహిస్తామని వైసిపీ నేతలు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా సాధన దిశగానే నిరసన కార్యక్రమాలు చేపడతామంటున్న వైసిపీకి కౌంటర్‌ ఇచ్చేందుకు అధికార పక్షం రెడీ అవుతోంది. 

19:06 - October 13, 2015

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. స్ధానికత సమస్య పరిష్కారం కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాధ్ సింగ్ కు బాబు మంగళవారం లేఖ రాసారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కేంద్ర సాయం కోరుతూ ఈ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ కు తరలి వెళ్ళే ఉద్యోగులు.. ఇతర వర్గాల వారి స్ధానికత సమస్యను పరిష్కరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఈ విషయమై న్యాయసలహాలు తీసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని అంశాలతో కూడిన లేఖను కేంద్ర హోంశాఖమంత్రి రాజనాధ్ సింగ్ కు పంపారు. రాష్ట్రంలో స్ధానికత ఆవశ్యకత సమస్య పరిష్కారమార్గం తదితర అంశాలను లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారికి విద్య, ఉపాధి రంగాలలో సమాన అవకాశాలు కల్పించేందుకు 32 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371 డి,371ఈ లను రాజ్యాంగంలో చేర్చారు. వీటి ఫలితంగా విద్యార్ధి క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ నాటికి వరుసగా నాలుగేళ్లు ఏ ప్రాంతంలో చదువుకుంటే ఆ ప్రాంతానికి స్థానికునిగా నిర్ణయిస్తారు.

ఆందోళనలో ప్రభుత్వ ఉద్యోగులు...
మధ్యలో అవాంతరం వస్తే వరుసగా నాలుగేళ్లు ఆ ప్రాంతంలో నివాసం ఉన్నట్లుగా చూపినా అక్కడ స్థానికత వర్తిస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర విభజన అనంతరం పరిణామాలు కొత్త రాజధానికి తరలివచ్చే ఉద్యోగులకు, ఇతర వర్గాల వారి పిల్లలకు స్థానికత పొందేందుకు ఈ నిబంధన ప్రతి బంధకం అయ్యింది. తమ పిల్లలు విద్యా, ఉపాధి అవకాశాలను కోల్పేయే ప్రమాదం ఉందని ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాలవారు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకుగాను గతంలో ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలనీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలో కోరారు. ఇక రాష్ట్రానికి తరలివచ్చే వారికి స్ధానికత అందించే విషయాన్ని కూడా బాబు లేఖలో పేర్కొన్నారు. విభజన తేదీ నుంచి మూడేళ్లలోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలివచ్చేవారికి, స్థానికతను కల్పిస్తామన్నారు చంద్రబాబు. మొత్తంగా.. ఓ పక్క నూతన రాజధాని అమరావతి నగర శంఖుస్ధాపన జరుగుతున్న సమయంలో ఉద్యోగుల తరలింపుపై కూడా అంతే వేగంగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.

18:58 - October 13, 2015

శ్రీశైలం : మహాక్షేత్రంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. నవాహ్నిక దీక్ష, గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో సాగర్‌బాబు దంపతులు, జేఈవోతోపాటు ఇతర అధికారులు ఈ పూజలో పాల్గొన్నారు. తర్వాత వేదపండితులు శ్రీభమరాంబికాదేవికి ప్రత్యేకంగా ఉత్సవ సంకల్పం నిర్వహించారు. రుద్రయాగమండపంలో నవావరణ పూజలు, చండీయాగ పూజలకు అంకురార్పన చేశారు.

18:53 - October 13, 2015

విజయవాడ : పచ్చని పొలాల్లో రాజధాని నిర్మాణం చేపట్టవద్దని గ్రీన్‌ ట్రీబ్యునల్‌ ఆదేశించినా.. ఏపీ సర్కార్‌ పెడచెవిన పెడుతోందని విజయవాడకు చెందిన శ్రీమన్నారయణ ధ్వజమెత్తారు. వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపడితే పర్యావరణానికి హాని కలుగుతుందని గ్రీన్‌ ట్రీబ్యునల్‌ను ఆశ్రయించగా.. ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఈనెల 10న స్టే ఇచ్చింది. 22న అమరావతి శంకుస్థాపనకు సీఆర్డీఏ అధికారులు పనులు వేగవంతం చేయడంతో... క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోర్టులో పిటిషన్‌ వేస్తామంటున్నారు. 

18:52 - October 13, 2015

రాజమండ్రి : తమ బిడ్డలు మంచి చదువు చదివి ఉన్నతస్థానంలో నిలవాలని తల్లిదండ్రులు కలలు కంటుంటారు. లక్షలు పోసి కార్పొరేట్ కళాశాలలో చేరిపిస్తున్నారు. కానీ ఆ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుండడంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంటోంది. గత కొంతకొన్ని రోజులుగా నారాయణ కాలేజీకి చెందిన విద్యార్థులు..విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకుంటుండడంపై సర్వత్రా ఆందోళనలు నెలకొంటున్నాయి. చదువుల వత్తిడేనని..అధ్యాపకుల వేధింపులు..ఇతర కారణాలున్నాయనే విమర్శలు చెలరేగుతున్నాయి. వెంటనే సంబంధిత మంత్రి నారాయణ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజమండ్రి నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న నందిని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. షాడేగర్ల్స్ హైస్కూల్ హస్టల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈఘటనపై ఎస్ఎఫ్ఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ నేత డిమాండ్ చేశారు. కార్పొరేట్ కాలేజీల్లో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని పేర్కొన్నారు. దాసరి నందిని ఆత్మహత్య చేసుకుందని తెలిసిందని, వెంటనే ఇక్కడకు వచ్చి పరిస్థితిని పరిశీలించడం జరిగిందని పోలీసులు తెలిపారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

18:44 - October 13, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేప‌ట్టింది. హైద‌రాబాద్ ఐడీహెచ్ కాల‌నీలో నిర్మించిన‌ డ‌బుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు దసరాకు అందించనున్నారు. ఇప్పటికే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. కేవలం తొమ్మిది నెలల్లోనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఎలా నిర్మించారో తెలుసుకుందాం...!

దసరాకు కొత్త ఇళ్లల్లోకి..
దేశంలోనే మొట్టమొదటిసారిగా నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను నిర్మించి అందిస్తోంది. ఈ దసరాకు లబ్ధిదారులకు కొత్త ఇళ్లల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఐడిహెచ్ కాలనీలో నిరుపేదల ఇల్లులు శిథిలావస్థకు చేరడంతో వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది ద‌స‌రా రోజు ఐడీహెచ్‌ కాలనీలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలకు కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ ఇళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆధునాతన పద్ధతుల్లో ఒక్కో యూనిట్‌కు 7లక్షల 90 వేలు ఖర్చు చేసి ఇళ్లనిర్మాణం చేపట్టారు. మొత్తం 33 బ్లాకుల్లో నిర్మించిన 396 గృహాల‌కు 36 కోట్ల 54 ల‌క్షల రూపాయ‌లు ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను జీహెచ్‌ఎంసీ పర్యవేక్షిస్తోంది. త్వరలోనే తెలంగాణ రాష్ర్టంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా నిర్దేశించుకున్న సమయం ప్రకారమే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అధికారులు నిర్మించారు. 

భోగాపురం విమానాశ్రయ భూ సేకరణపై హైకోర్టులో పిటిషన్..

విజయనగరం : భోగాపురంలో విమానాశ్రయానికి భూ సేకరణనను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను ఉప్పాడ సత్యనారాయణ, కాకర్లపూడి సత్యనారాయణ రాజు దాఖలు చేశారు. హైకోర్టు విచారణనకు స్వీకరించింది. ఈనెల చివరిలోగా సమాధానం దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

ఎన్టీఆర్ స్వగ్రామంలో నారా లోకేష్..

కృష్ణా : తాత ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మన మట్టి - మన నీరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ నివాసం నుండి మట్టిని, నీటిని లోకేష్ సేకరించారు. 

ముగిసిన ఎమ్మెల్సీ శర్మ మౌన దీక్ష..

విశాఖపట్టణం : ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మౌన దీక్ష ముగిసింది. గ్రంథాలయ భవన నిర్మాణం కోసం ఆయన ఈ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. 

రవాణాశాఖపై మంత్రి శిద్ధా సమీక్ష..

హైదరాబాద్ : రవాణా శాఖపై మంత్రి శిద్ధా రాఘవరావు సమీక్షించారు. రవాణా శాఖను విజయవాడకు మార్చాలని శిద్ధా ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీఏ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రవాణా శాఖ కార్యలయాన్ని ఏర్పాటు చేయాలని, హై సెక్యూర్టీ నంబర్ ప్లేట్లపై ఈనెల 27న సమావేశం కావాలని నిర్ణయించారు. 

రాష్ట్రంలో 60వేల ఇళ్లు నిర్మించాలి - కేసీఆర్..

హైదరాబాద్ : రాష్ట్రంలో 60వేల ఇళ్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 30 వేల గ్రామీణ ప్రాంతాల్లో ..24వేల ఇళ్లు పట్టణ ప్రాంతాల్లో నిర్మించాలని సూచరించారు. ప్రాజెక్టులకు భూ సేకరణ బాధ్యత కలెక్టర్లేదనని ఆయన స్పష్టం చేశారు.

 

గవర్నర్ ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. రాష్ట్ర వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ వైఖరిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. 

17:31 - October 13, 2015

ఖమ్మం : పోలవరం ముంపు ప్రాంతంలో గృహ నిర్మాణ శాఖకు సంబంధించి బిల్లులు మంజూరు చేయక పోవటం ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో ఖమ్మం జిల్లాలో ఉన్న వి.ఆర్.పురం మండలం రేఖపల్లికి చెందిన వెంకటేశ్వర్లు స్థానికంగా మండలంలో హౌజింగ్ శాఖ మంజూరు చేసిన ఇళ్లకు ఇటుకలను సరఫరా చేస్తుండే వాడు. ప్రభుత్వం అధికారికంగా వెంకటేశ్వర్లును సరఫరాదారుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లుకు హౌజింగ్ శాఖ 6 లక్షలమేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. రెండేళ్లకుపైగా చెల్లింపులు నిలిచిపోయాయి. ఈలోగా రాష్ట్ర విభజన జరగటం వి.ఆర్.పురం మండలం ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లిపోవటం మరింత సమస్యగా మారింది. కొంతకాలంగా బిల్లుల కోసం ఖమ్మంలోని హౌజింగ్ కార్యాలయం చుట్టూ తిరిగిన వెంకటేశ్వర్లు విసిగిపోయి తాను, తన భార్య, కుమారునితో కలిసి ఖమ్మంలోని హౌజింగ్ కార్యాలయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆందోళనకు దిగాడు. దీంతో పోలీసులు, అధికారులు అతనికి నచ్చచెప్పి ఆందోళన విరమింప చేశారు. 

17:28 - October 13, 2015

వరంగల్ : తెలంగాణ ప్రభుత్వానికి వామపక్షాల, సామాజిక సంఘాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్ కుమార్ ఆల్టిమేటం జారీ చేశారు. రాష్ట్రంలోని ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇందుకు 48 గంటల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. గడువు లోపుగా సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో 15వ తేదీ నుండి నిరవధిక నిరహార దీక్ష చేపడుతానని తెలిపారు. ఆశా వర్కర్ల సమస్యలపై కేసీఆర్ సర్కార్ వెంటనే స్పందించాలని కోరారు. 

17:19 - October 13, 2015

హైదరాబాద్ : సీనియర్‌ నటి మనోరమ (78) చెన్నైలో శనివారం రాత్రి కన్నుమూశారు. తెలుగు, తమిళం ఇతర భాషల్లో వెయ్యికిపైగా చలన చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై పలు సీరియళ్లలోనూ నటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. . ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా గుండెపోటు రావడంతో శనివారం అర్థరాత్రి మనోరమ తుదిశ్వాస విడిచారు. నటి మనోరమ సినీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నటుడు కమల్‌ హాసన్‌ ఓ వీడియోను విడుదల చేశారు. సినీ ప్రస్థానంలో వివిధ దశల్లో ఆమెతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ.. ఆమెకు నివాళిగా ఈ వీడియోను కమల్‌ తన నిర్మాణ సంస్థ యూట్యూబ్‌ ఖాతాలో విడుదల చేశారు.

17:14 - October 13, 2015

చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వేయి కాళ్ల మండపం పుణఃనిర్మాణ అంశం మళ్లీతెరపైకి వచ్చింది. 2002లో అప్పటి టీడీపీ ప్రభుత్వం..చారిత్రాత్మక వేయికాళ్లమండపం తొలగించారు. ఈవ్యవహారంపై మఠాధిపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మళ్లీ వేయికాళ్లమండపాన్ని నిర్మించాలని టిడిపి ప్రభుత్వమే పట్టుబడుతుండటం ఆసక్తికరంగా మారింది. తిరుమల శ్రీవారి ఆలయంకు ఎదురుగా ఉండే అత్యంత పురాతనమైన వేయికాళ్లమండపాన్ని టిటిడి 2002లో తొలగించింది. మండపం శిథిలావస్థకు చేరుకోవడం, అందులోనూ..తిరుమల మాస్టర్‌ప్లాన్ అమలులో భాగంగా..శ్రీవారి ఆలయం ముందు విశాలమైన స్థలం అందుబాటులోకి తీసుకురావడం కోసం ఎదురుగా ఉన్న వేయికాళ్లమండపాన్ని కూల్చివేశారు.

అద్భుతమైన కట్టడం..
తిరుమల శ్రీవారి ఆలయం ముందున్న వేయికాళ్ల మండపం..ఓ అద్భుతమైన కట్టడం. సుమారు 600 సంవత్సరాల చరిత్రకలిగిన మండపంగా టిటిడి రికార్డుల ద్వారా తెలుస్తోంది. తిరుమలలో ఎలాంటి నిర్మాణాలు లేని రోజుల్లో భక్తులు ఈమండపంలోనే తలదాచుకునే వారు. అయితే ఆతర్వాత..కొండపై ఎన్నో కాటేజీలు, సత్రాలు అందుబాటులోకి రావడంతో టిటిడి ఈమండపంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఓసదస్సును ఏర్పాటు చేసింది. అయితే అంతటి చరిత్ర కలిగిన మండపాన్ని కూల్చివేసినప్పుడే తిరిగి నిర్మించాలని టిటిడి సంకల్పించింది. కూల్చివేసిన మండపంలోని స్థంభాలను గోగర్బం డ్యాము వద్దకు తరలించి భద్రపరిచారు. 2002లో టిటిడి మండపాన్ని కూల్చివేయగా ఆ తర్వాత అనుకోని పరిణామాలు జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిపిరి వద్ద మావోయిస్టులు బాంబులు పేల్చి హత్యాయత్నం చేయడం, ఆతరవాత ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోవడం...ఇవన్నీ కూడా పురాతన వేయి కాళ్ల మండపం తొలగించిన కారణంగానే జరిగాయని అప్పట్లో ప్రజల్లో తీవ్రంగా చర్చజరిగింది. అప్పటినుంచి వేయికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలని అటు టిడిపి, ఇటు కాంగ్రెస్ తిరిగి నిర్మించాలని అనేక ప్రయత్నాలు చేశాయి. తొలగించిన చోటే మహామణిమండపం పేరిట మండపం నిర్మించాలని పనులు ప్రారంభించారు. అయితే మండపం నిర్మాణం చేయకూడదని కొందరు కోర్టుకు వెళ్లడంతో మండపం నిర్మాణం పునాదులకే పరిమితం అయింది. అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు..తిరుమలలో వేయి కాళ్ల మండపం పుణఃనిర్మాణపై దృష్టిసారించారు. బాంబు పేలుళ్లలో తనతోపాటు కారులో ఉన్న చదలవాడ క్రిష్ణ మూర్తిని టిటిడి చైర్మెన్‌గా నియమించారు. చదలవాడ టిటిడికీ వచ్చీరాగానే వేయికాళ్ల మండపం పుణః నిర్మానం చేసి తీరుతామని ప్రకటించారు. స్థానిక నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతి పరిణయోత్సవాలు జరిగే ప్రాంతంలో భక్తులకు ఉపయోగపడేవిధంగా మండపం నిర్మాణం ఉంటుందని కృష్ణమూర్తి ప్రకటించారు. మండపం నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ నమూనాలను పలువురు ఆర్కిటెక్ట్ లు కూడా ఇచ్చారు. టిటిడి పాలక మండలి సైతం ప్రత్యేకంగా దీనికోసం కమిటీని నియమించింది. మండపం నిర్మాణానికి ఇప్పటివరకూ టెండర్లు పిలవక పోయినా కచ్చితంగా నిర్మించాలన్న పట్టదల మాత్రం టిటిడి పాలక మండలి పెద్దల్లో కనపడుతోంది. అయితే వేయికాళ్ల మండపం నిర్మాణం చేయడం చంద్రబాబు కోరిక తీర్చడానికా..లేక భక్తులకు వసతులు పెంచడానికా అన్న చర్చకూడా జరుగుతోంది.

నవంబర్ 14న విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు - గంటా...

విజయవాడ : నవంబర్ 14న 6,558 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందచేస్తామని ఏపీ మంత్రి గంటా ప్రకటించారు. ప్రతిభా పురస్కారం కోసం రూ.15 కోట్లు కేటాయించినట్లు, విద్యారంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కష్టపడే విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. 

వైసీపీ ఆందోళన నిర్ణయాలు ఇవే..

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదాపై ఆందోళన కార్యక్రమాలను వైసీపీ ప్రకటించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాకు తెలిపారు. 17 నుండి 22 వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. 17 అన్ని నియోజకవర్గా కేంద్రాల్లో రిలే నిరహార దీక్షలు..18న నిరసన ప్రదర్శన..19వ తేదీన ప్రభుత్వ ఆఫీసుల వద్ద ధర్నాలు..20న కొవ్వొత్తులతో ప్రదర్శన..21న బస్సు డిపోల వద్ద ధర్నాలు..22న అమరావతిలో ప్రధాన మంత్రి మోడీకి వినతిపత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

 

ఏపీలో నీటి వినియోగదారుల సంఘాల సదస్సు..

విజయవాడ : జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నీటి వినియోగదారుల సంఘాల సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ఏపీ మంత్రులు దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్ లు పాల్గొన్నారు. 

ప్రత్యేక హోదాపై మోసం చేస్తున్నారు - దిగ్విజయ్ సింగ్...

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా సాధించే పనిని టిడిపి మరిచిపోయిందని, ప్రత్యేక హోదాపై మోడీ, చంద్రబాబు మోసం చేస్తున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం అందరూ కలిసి పోరాడాలని సూచించారు. 19వ తేదీన హైదరాబాద్ లో 25వ తేదీన రాజీవ్ సద్భావన యాత్ర ఉంటుందన్నారు. కేసీఆర్ కు తన కుటుంబంపై శ్రద్ధ తప్ప రాష్ట్రంపై లేదని, ఎన్నికల హామీలను కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. 

పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 'శంకరాభరణం' టీజర్ విడుదల..

హైదరాబాద్: నిఖిల్, నందిత జంటగా నటించిన 'శంకరాభరణం' చిత్రం టీజర్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. బుధవారం ఉదయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీజర్‌ను విడుదల చేయనున్నారు. మూవీ ప్రెజెంటర్ కోన వెంకట్ ఈ విషయాన్ని వెల్లడించారు.

సచివాలయంలో బతుకమ్మ సంబరాలు..

హైదరాబాద్: సచివాలయంలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకలు జరిపారు. సచివాలయ ప్రాంగణంలో బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందోత్సహాలతో ఆడి పాడారు. 

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 58 పాయింట్లు నష్టపోయి 26,847 వద్ద ముగిసింది. నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 8,132 వద్ద ట్రేడ్ అయింది.

ఇంజాపూర్ లో నకిలీ విత్తనాల గోదాంపై దాడులు...

రంగారెడ్డి : జిల్లా హయత్‌నగర్ మండలం ఇంజాపూర్‌లో నకిలీ విత్తనాలు, ఎరువులు తయారు చేస్తోన్న ఓ స్థావరంపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. గోదాంపై దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు తప్పించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.

16:43 - October 13, 2015

పంజాబ్ : దేశంలో రచయితలపై దాడులు, మతపరమైన ఘర్షణలపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర-రాష్ట్ర సాహిత్య అకాడమీల తీరును నిరసిస్తూ రచయితల రాజీనామా, అవార్డు వాపస్‌ల పరంపర కొనసాగుతోంది. తాజాగా అవార్డును తిరిగి ఇచ్చేయనున్నట్లు పంజాబ్ లోని లూథియానాకు చెందిన రచయిత అజ్మీర్ సింగ్ ఔలక్ ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు రచయితులు, మేధావి వర్గంపై జరుగుతున్న ఆందోళనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని అన్నారు. 

16:35 - October 13, 2015

కడప : డివిజన్ ఎల్ఐసి ఎంప్లాయిన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శుభశేఖర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు కార్మికులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కార్మిక నేత మృతిపై రాజకీయ నేతలు, ఉద్యోగులు సంతాపం తెలిపారు. శుభశేఖర్ ఎల్ఐ సి కార్మిక నేతగా విశేష సేవలందించారు. కడప డివిజన్ కు ఐదు సంవత్సరాల పాటు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ మధ్యనే జరిగిన ఎన్నికల్లో శేఖర్ ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. తిరుగులేని నేతగా ఉంటూ కార్మికుల సమస్యలపై పోరాడారు. ఎల్ ఐసిలో విదేశీ పెట్టుబడులపై ఉద్యమం నడిపారు. అంతేగాక అనేక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

16:29 - October 13, 2015

హైదరాబాద్ : మద్యం నిషా ఎక్కింది. అక్కడనే ఉన్న మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారు. కానీ ఆ మహిళ కరాటే, తైక్వాండోలో సుశిక్షితురాలు. ఇంకేముంది ఆ యువకుల వీపు మోత మోగింది. ఈఘటన ఎల్ బినగర్ లో చోటు చేసుకుంది. బండ్లగూడలో నివాసం ఉండే నవనీత కరాటే..తైక్వాండోలో సుశిక్షితురాలు. స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో పలువురికి శిక్షణనిస్తోంది. సోమవారం రాజేంద్రనగర్ లో జరిగే ఓ కాంపిటీషన్ లో పాల్గొనేందుకు నవనీత, విద్యార్థినిలతో వెళ్లారు. రాత్రి నాగోల్ కు చేరుకున్నారు. అక్కడనే మద్యం మత్తులో ఉన్న రాంనగర్ కు చెందిన పవన్, రామకృష్ణలు వీరిని వేధించడం మొదలు పెట్టారు. అసభ్యకరంగా ప్రవర్తించారు. వెంటనే నవనీత స్థానికుల సహాయంతో దేహశుద్ధి చేశారు. ఇద్దరిపై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

16:15 - October 13, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ప్రొ.కోదండరాం రైతులు ఆత్మహత్యలపై హైకోర్టు మెట్లు ఎక్కారు. రైతుల ఆత్మహత్యలపై హైకోర్టులో కోదండరాం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ విధానాలు ఆత్మహత్యలను ప్రోత్సాహించేలా ఉన్నాయని, స్వామినాథన్ కమిషన్ రిపోర్టును పట్టించుకోవడం లేదని కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున కోదండరాం పిటిషన్ దాఖలు చేశారు. కోదండరాం వేసిన ఈ పిటిషన్ పై హైకోర్టులో బుధవారం వాదనలు జరిగే అవకాశం ఉంది.
ఆత్మహత్యలు చేసుకోవద్దని కోదండరాం, చుక్కా రామయ్యలు ఇటీవలే యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజా సంఘాలు..ఇతర వారితో రైతుల సమస్యలపై కోదండరాం చర్చించారు. ఆత్మహత్య చేసుకుంటే రైతులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని ఇటీవలే పెంచిన సంగతి తెలిసిందే. రూ.1.50 వేల నుండి రూ.6లక్షలకు పెంచారు. రైతు చైతన్య వేదిక ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. చనిపోయిన తరువాత రూ.6లక్షలు ఇవ్వడం కాదు..చనిపోక ముందే రూ.2లక్షలు ఇవ్వాలంటూ గతంలో హైకోర్టు వ్యాఖ్యానాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమస్యకు సంబంధించిన మూలాలు తెలుసుకొనే ప్రయత్నం చేయాలని, దీనిపై నివేదిక అందించాలని ఉభయ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. 

16:13 - October 13, 2015

హైదరాబాద్ : బాలీవుడ్ లో ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా భజరంగి భాయిజాన్. రూ.600 కోట్లకు పైగా వసూళ్లతో ఆల్ టైం ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ లలో ఒకటిగా నిలిచింది సల్మాన్ నటించిన ఈ సినిమా. దీనికి కథకుడు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే అన్న సంగతి తెలిసిందే. విజయేంద్రుడు రాసింది కాపీ కథ అంటూ టీవీ సీరియల్ ప్రొడ్యూసర్ - డైరెక్టర్ మహిమ్ జోషి కొన్ని రోజుల కిందట ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను రాసుకున్న స్క్రిప్టును సీన్ టు సీన్ కాపీ చేశారని ఆరోపణలు చేసిన మహిమ్.. అంతటితో ఆగలేదు. ఈ సినిమా నిర్మాతల మీద ఏకంగా రూ.50 కోట్లకు కాపీ రైట్ చట్టాల కింద దావా వేశాడు. తాను కొన్ని రోజుల కింద ఓ స్క్రిప్టు రాసి 'వయాకామ్ 18 పిక్చర్స్' వాళ్లను కలిశానని.. ఐతే ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని.. ఐతే 'భజరంగి భాయిజాన్' చూసి తాను షాకయ్యానని.. తన స్క్రిప్టులోని సన్నివేశాలను అలాగే దించేశారని అతను ఆరోపిస్తున్నాడు. వయాకామ్ 18 సంస్థకు చెందిన పర్వీజ్ షేక్ కు స్ర్రీన్ ప్లేలో క్రెడిట్ కూడా ఇచ్చారని.. అతనే తన స్క్రిప్టులోని సన్నివేశాల్ని 'భజరంగి భాయిజాన్ ' లో వాడేశాడని అంటున్నాడు మహిమ్. అతను వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. డైరెక్టర్ కబీర్ ఖాన్.. నిర్మాతలు రాక్ లైన్ వెంకటేష్ రాజీష్ భట్.. హీరో సల్మాన్ ఖాన్.. రచయిత విజయేంద్ర ప్రసాద్ లకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21 లోపు సమాధానాలు చెప్పాలని ఆదేశించింది.

సిరా వేసిన కార్యకర్తలకు ఠాక్రే సన్మానం..

ముంబై : సిరా దాడికి పాల్పడదిన ఆరుగురు సేన కార్యకర్తలకు ఉద్దవ్ ఠాక్రే సన్మానం చేశారు. పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణకు నిరసనగా మంగళవారం సుధీంద్ర కులకర్ణిపై సిరా దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. 

రైతుల ఆత్మహత్యలపై కోదండరాం కోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలపై హైకోర్టులో రిటైర్డ్ ప్రొ.కోదండరాం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ విధానాలు ఆత్మహత్యలను ప్రోత్సాహించేలా ఉన్నాయని, స్వామినాథన్ కమిషన్ రిపోర్టును పట్టించుకోవడం లేదని కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున కోదండరాం పిటిషన్ దాఖలు చేశారు. కోదండరాం వేసిన ఈ పిటిషన్ పై హైకోర్టులో రేపు వాదనలు జరుగనున్నాయి.

15:57 - October 13, 2015

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎమ్‌సిఆర్‌ హెచ్‌ఆర్‌డి)లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో... సంక్షేమ కార్యక్రమాల అమలు, రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణంతోపాటు శాంతి భద్రతల పరిస్థితిపై ప్రధానంగా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. వాటర్‌గ్రిడ్‌, మిషన్‌ కాకతీయ పథకాల స్థితిగతులు, నీటి పారుదల ప్రాజెక్టుల పరిస్థితిపైనా చర్చించనున్నారు. గతంలో వివిధ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా సిఎంకి ప్రజలు పెద్ద సంఖ్యలో వినతిపత్రాలు సమర్పించారు. తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరిం చేందుకు చర్యలు చేపట్టాలంటూ సిఎం కలెక్టర్లను ఆదేశించనున్నారు. ఇవేగాక రహదారుల అభివృద్ధి, గుడుంబా నియంత్రణ, కల్తీ కల్లు మరణాలు తదితరాంశాలు భేటీలో చర్చ జరుపుతున్నట్లు సమాచారం. 

15:47 - October 13, 2015

తూర్పు గోదావరి : మధ్యాహ్నా బకాయిలు చెల్లించడం లేదు.. ఎలా బతకాలి ? పిల్లలకు ఏం పెట్టాలి ? అంటూ మిడ్ డే వర్కర్లు ప్రశ్నించారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మిడ్ డే మీల్స్ కార్మికులు ఆందోళన చేశారు. కార్యాలయంలోకి ఎవ్వరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు టెన్ టివితో మాట్లాడారు. గత ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని తాము డిమాండ్ చేయడం జరుగుతోందన్నారు. 9,10 తరగతులకు వండిన బిల్లుల బడ్జెట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. కేంద్ర బడ్జెట్ విడుదల చేసే బడ్జెట్ ను రాష్ట్రం ఇతర వాటికి ఖర్చు చేస్తోందని ఆరోపించారు. పేదలకు దూరం చేయాలని ఆలోచిస్తోందని తెలిపారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, పేద పిల్లలకు ఎంత ఉపయోగంగా ఉండే మధ్యాహ్నా భోజన పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మిడ్ డే పథకాన్ని ప్రైవేటు పరం చేయవద్దని కోరారు. 

15:41 - October 13, 2015

హైదరాబాద్: సాధారణ స్థాయి నుంచి విద్యావ్యాపారం.. రాజకీయ పరంగా ఎంతో బిజీగా ఉండే మల్కాజ్ గిరి ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి(56) సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజిలో ఆదివారం జరిగిన వార్షికోత్సవంలో మల్లారెడ్డి తన డ్యాన్సుతో అదరగొట్టేశారు.. ఎంపీ డ్యాన్సుకు షాకైన విద్యార్థులు తాము కూడా కాళ్లు కదిపి డ్యాన్సులేశారు. వైద్య, ఇంజనీరింగ్ కాలేజీల యజమాని కూడా అయిన మల్లారెడ్డి విద్యార్థుల ఈలలు, చప్పట్ల మధ్య గంగ్నమ్ స్టైల్లో డాన్స్ అదరగొట్టేశారు. ఈ దృశ్యాన్ని తమ మొబైళ్లలో చిత్రీకరించిన స్టూడెంట్లు వెంటనే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అక్కడా మంచి రెస్పాన్సు వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో మల్లారెడ్డి టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాల్లో మాత్రం యాక్టివ్ గా కనిపించడంలేదు. అలాంటిది కాలేజి ఫంక్షన్ లో మాత్రం దుమ్ము దులిపేశారు.

పోలవరాన్ని పూర్తి చేయాలి - రఘువీరా..

హైదరాబాద్ : నిన్న పనికి రావన్న సంస్థలకే ఇప్పుడు పోలవరం పనులను కట్టబెడుతున్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. పోలవరాన్ని కేంద్రం 2018లోపు పూర్తి చేయాలని, అమరావతి నిర్మాణంలో ప్రజలను, రాజకీయ పార్టీలను ప్రభుత్వం భాగస్వామ్యం చేయడం లేదన్నారు. 

రాజ్ నాథ్ సింగ్ కు బాబు లేఖ..

విజయవాడ : స్థానికత అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాజధానికి తరలి వచ్చే ఉద్యోగులు, ఇతర వర్గాల పిల్లల స్థానికత అంశంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానికత సమస్య పరిష్కారానికి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఏపీలో నగర, పురపాలక ఉద్యోగుల జీతాలు పెంపు..

విజయవాడ : ఏపీలో నగర, పురపాలక, నగర పంచాయతీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచారు. నగర, పురపాలక ఉద్యోగులకు రూ.8 వేల నుండి రూ.11వేలకు..నగర పంచాయతీ ఉద్యోగులకు రూ.7,300 నుండి రూ.10వేలకు పెంచారు. 

సొహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ లో అమిత్ షాకు ఊరట..

ఢిల్లీ : సొహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఊరట లభించింది. సంజీవ్ భట్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అమిత్ షాపై విచారణ జరిపించాలని సంజీవ్ భట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

రుణమాఫీపై టిడిపి, బిజెపి ఆందోళన..

హైదరాబాద్ : కలెక్టరేట్ ఎదుట టిడిపి, బిజెపి పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. ఒకే దఫా రైతు రుణమాఫీ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేసి ఆబిడ్స్ పీఎస్ కు తరలించారు. రైతులకు రూ.17వేల కోట్లు రుణాలివ్వాల్సిన బ్యాంకులు కేవలం రూ.5వేల కోట్లతో సరిపెట్టాయని ఎల్ రమణ పేర్కొన్నారు.

 

విజయవాడలో రేపు అమరావతిపై సదస్సు..

కృష్ణా : బుధవారం విజయవాడలో అమరావతిపై సదస్సు జరుగనుంది. రాజధాని కార్పొరేట్ల కోసమా - ప్రజల కోసమా అనే అంశంపై ఈ సదస్సు జరుగనుంది. శిలాఫలకాలపై రైతుల పేర్లు రాయడం కాకుండా హామీలను అమలు చేయాలని రాజధాని ప్రాంత సీపీఎం కన్వీనర్ సి.హెచ్.బాబురావు డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చిన తరువాతే శంకుస్థాపన చేస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో అర్హులందరికీ ఫించన్లు ఇవ్వాలని, ప్రజల కోసం నోరు విప్పిన వాళ్లను ప్రభుత్వం అరెస్టు చేస్తోందని విమర్శించారు.

 

రూ.12 కోట్ల విలువైన ఏనుగు దంతాల స్వాధీనం..

ఢిల్లీ : కేరళ జరిపిన దాడుల్లో రూ.12 కోట్ల విలువైన ఏనుగు దంతాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 487 కిలోల దంతాలను స్వాధీనం చేసుకున్నారు. దంతాల కోసం దక్షిణ భారతదేశంలో 40 ఏనుగులను చంపినట్లు అంచనా వేస్తున్నారు. ఈనెల 2న ఉమేష్ అగర్వాల్ అరెస్టుతో ఏనుగు దంతాల నిల్వలు వెల్లడయ్యాయి. 

ప్రకాశంలో ఇద్దరు రైతుల ఆత్మహత్య..

ప్రకాశం : జిల్లాలో అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కారం చేడు (మం) కేశవరప్పాడులో కౌలు రౌతు ఆత్మహత్య చేసుకోగా లింగసముద్రం (మం) మాలకొండరాయులపాలెంలో రైతు చిన్నబ్బాయి పురుగుల మందు సేవించి బలవన్మరణాలకు పాల్పడ్డారు. 

హయత్ నగర్ లో వివాహితపై అత్యాచారం..

హైదరాబాద్ : హయత్ నగర్ కుంట్లూరులో వివాహితపై ఇద్దరు వ్యక్తులు ఆత్యాచారానికి పాల్పడ్డారు. పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపులు చేపట్టారు.

 

14:58 - October 13, 2015

పిల్లల దత్తతలన్నీ చట్టపరంగా, నిబంధనలకనుగుణంగా జరగాలని వక్తలు సూచించారు. ఈ అంశపై మానవి నిర్వహించిన 'వేదిక' చర్చా కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్యామ సుందరి, అడ్వకేట్ శ్రీశైలం, సీడబ్ల్యుసీ చైర్ పర్సన్ పద్మావతి పాల్గొని, మాట్లాడారు. దత్తత తీసుకున్న పిల్లల బాగోగుల పట్ల ప్రభుత్వం నుంచి మానిటరింగ్ ఉండాలని కోరారు. దత్తత స్వీకరించిన పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. దత్తతకు వెళ్లిన పిల్లలను మధ్యలో వదిలేసే స్థితి మారాలని చెప్పారు. పిల్లలు తప్పులు చేసినా క్షమించే తీరును దత్తత స్వీకరించిన తల్లిదండ్రులు అలవర్చుకోవాలన్నారు. దత్తత పట్ల సమాజంలో అవగాహన రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మరిన్ని విశేషాల కోసం వీడియో చూడండి.

14:45 - October 13, 2015

ఇప్పటికే 11 ప్రపంచ రికార్డులతో తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న డాక్టర్.నారాయణ గ్రూప్ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఛైర్మన్ ఖాతాలో.. మరో కలికితురాయి వచ్చి చేరింది. ఎందరో విద్యార్థులను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్న డాక్టర్‌ నారాయణ కృషికి గాను జెమ్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు వరించింది. న్యూఢిల్లీలోని లీ-మెరిడియన్‌ హోటల్‌లో జరిగిన సదస్సులో ఎంపీ విజయ్‌ గోయల్‌.. ఈ అవార్డును ప్రదానం చేశారు. జెమ్‌ ఆఫ్‌ అవార్డు తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేసిన నారాయణ.. ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు.

14:43 - October 13, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లిలో స్థల వివాదంలో నలుగురు వ్యక్తులు పురుగుల మందు తాగిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. రెండు రోజుల క్రితం జడ్చర్లలో టీఆర్‌ఎస్‌ నేత ఇర్ఫాన్‌ ఇంటి ఎదుట ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు పురుగుల మందు తాగారు. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. నిన్న ఇద్దరు చనిపోయారు. ఇవాళ మరో వ్యక్తి చనిపోయాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు యువకులు చనిపోవడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
గొల్లపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోందిది. గొల్లపల్లి లో ఓ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానిక సర్పంచ్ ఇతరులు నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణం చేసే స్థలం తనదని, తాను గతంలో కొనుగోలు చేయడం జరిగిందని వెంకటయ్య వారికి చెప్పాడు. దీనికి సంబంధించిన కాగితాలు తన దగ్గర ఉన్నాయని తెలిపాడు. ఈ విషయాన్ని పరిష్కరించాలని టీఆర్ఎస్ నేత ఇర్ఫాన్ ను వెంకటయ్య ఆశ్రయించాడు. కానీ రోజులు గడిచిపోయాయి. కానీ సమస్య మాత్రం పరిష్కారం రాలేదు. ఆ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడానికే అందరూ నిర్ణయానికి వచ్చారని, ఇర్ఫాన్ మోసం చేశాడని వెంకటయ్య భావించాడు. తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటయ్య తన ముగ్గురు కుమారులు శ్రీశైలం, మహేష్, చంద్రశేఖర్ లను తీసుకుని ఇర్ఫాన్ ఇంటికి చేరుకున్నాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందును అందరూ సేవించారు. సృహలో వారు లేకపోవడాన్ని గమనించిన స్థానికులు ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ శ్రీశైలం, మహేష్ లు మృతి చెందారు. వీరి మృతదేహాలను సోమవారం తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుని రాస్తారోకో చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీఛార్జీ చేశారు. ప్రస్తుతం ఆ కుటుంబంలో మరొకరు మృతి చెందడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 

14:36 - October 13, 2015

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజైన నేడు.. దుర్గమ్మ శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. స్నపనాభిషేకం తర్వాత.. భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. స్వర్ణ కవచాలంకృత కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ రూపులోని అమ్మవారి దర్శనం వల్ల దారిద్ర్యం తీరుతుందన్నది భక్తుల నమ్మకం.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
కనకదుర్గ దర్శనానికి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కెనాల్‌ రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి.. ఇంద్రకీలాద్రి వరకూ ఐదు క్యూలను సిద్ధం చేశారు. అనూహ్యంగా వర్షం వచ్చినా భక్తులు తడవకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. స్నానఘాట్లలో తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలు వస్త్రాలు మార్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు. లడ్డూ ప్రసాదాల తయరీ, కనకదుర్గ నగర్ లో ప్రసాదాల కౌంటర్లను ఏర్పాట్లు చేశారు. 18 లక్షలకుపైగా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. గత ఏడాదికన్నా 30 శాతం అధికంగా భక్తులు వస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22న విజయదశమి వరకూ .. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా.. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు నిర్దిష్ట ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 

14:34 - October 13, 2015

వరంగల్‌ : జిల్లా హన్మకొండలో టీడీపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య భూ వివాదం తలెత్తింది. గ్రేటర్ టి.టిడిపి నేత మురళిని డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తుపాకితో బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే పోచమ్మ కుంట ప్రాంతంలో ఉన్న స్థలాన్ని పార్కుకు కేటాయించారు. అక్కడ చిన్నారులు ఆడుకుంటుంటారు. కానీ ఆ స్థలంలో వినాయక విగ్రహం బయటపడిందంటూ ఈ స్థలాన్ని ఆలయానికి కేటాయించాలని రాజేందర్ రెడ్డి అనుచరులు డిమాండ్ చేశారు. దీనిని టిడిపి నేత మురళి తీవ్రంగా వ్యతిరేకించారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప చేశారు. డీసీసీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి తనను తుపాకితో బెదిరించాడంటూ, లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని హన్మకొండ పీఎస్ లో మురళి ఫిర్యాదు చేశారు. 

డబుల్ బెడ్ రూంలపై మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 

అందుబాటులో ఉండాలనే ఉద్ధేశ్యంతో రాజధాని నిర్మాణం - బాబు..

చిత్తూరు : అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే అమరావతిలో రాజధానిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతికి గొప్ప చరిత్ర ఉందని, 16వేల గ్రామాల్లో మన నీరు - మన చెట్టు - మన రాజధాని కార్యక్రమం జరుగుతుందన్నారు. తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు చాటి చెప్పేలా అమరావతి రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు.

 

నారావారిపల్లెలో హోమం...

చిత్తూరు : నారావారిపల్లెలో మన మట్టి -మన నీరు-మన రాజధాని టిటిడి కళ్యాణ మండపంలో హోమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. పుట్ట నుండి మట్టిని చంద్రబాబు సేకరించారు. 

బుధవారం దేశ వ్యాపితంగా మెడికల్ షాపులు బంద్...

ఢిల్లీ : బుధవారం దేశ వ్యాపితంగా మెడికల్ షాఫులను మూసివేయనున్నారు. ఆన్ లైన్ లో మందుల అమ్మకాలకు వ్యతిరేకంగా నిరసనగా ఈ బంద్ కొనసాగనుంది. ఆన్ లైన్ లో మందుల అమ్మకాలు ప్రమాదాలకు దారితీస్తాయని దుకాణదారులు పేర్కొంటున్నారు. 

14:10 - October 13, 2015

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ఏ విధంగా ముందుకెళ్లాలి ? ఉద్యమం ఏ విధంగా రూపొందించాలి ? అనే దానిపై వైసీపీ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. జగన్ దీక్ష భగ్నం అనంతరం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వైసీప ముఖ్య నేతలు భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఈ భేటీ ముగిసింది. అనంతరం నేతలంతా జగన్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి బయలుదేరారు. చర్చల్లో ముఖ్యంగా ఐదు అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. చర్చల సారాంశాన్ని ఆయనకు వివరిస్తున్నట్లు సమాచారం. అనంతరం జగన్ నిర్ణయం ప్రకారం ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ? నిరసన కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి ? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి ఎలా తేవాలి ? అన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. జగన్ తో భేటీ అనంతరం పార్టీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎపికి ప్రత్యేకహోదా కోరుతూ వైఎస్‌ జగన్‌ చేపట్టిన దీక్షను తెల్లవారుజామున 4గంటలకు జగన్‌ నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రత్యేక అంబులెన్స్‌లో జగన్‌ను జీజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసేటప్పుడు వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షా శిబిరం వద్ద గుమిగూడారు. దీక్షను విరమించేది లేదని జగన్ వారించినా..పోలీసులు బలవంతంగా జగన్ దీక్షను భగ్నం చేశారు. దీక్ష 7వ రోజుకు చేరుకోవడంతో జగన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. బీపీ, షుగర్‌ లెవల్స్ బాగా పడిపోవడంతో..జగన్‌ బాగా నీరసించిపోయారు.

14:00 - October 13, 2015

గుంటూరు : నగరంలో 'మన మట్టి-మన నీరు' కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. అమరావతి శంకుస్థాపన కోసం పుట్టకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్ను సేకరిస్తున్నారు. 7 రోజులపాటు కార్యక్రమం నిర్వహించాలని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ఇంటి పండుగలా... ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని కోరారు. ఆయా గ్రామాల్లో వీధివీధి నుంచి ప్రదర్శనగా మట్టిని తీసుకొస్తారని...170 వాహనాల్లో వచ్చిన మట్టిని అమరావతికి తీసుకొస్తారని పేర్కొన్నారు.
మంత్రి రావెల కిశోర్ బాబు..
ఇది మహా ఉద్యమం. ఎపికి చరిత్రను బాబు రాస్తున్నారు. అందరూ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
మంత్రి నారాయణ...
అమరావతి ప్రజా రాజధాని. 'మన మట్టి.. మన నీరు' ను కుల, మతాలకతీతంగా వారి వారి పద్ధతుల ప్రకారం ఆయామండల కేంద్రాలకు తేవాలి. కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది'. అని అన్నారు. 

13:51 - October 13, 2015

హైదరాబాద్ : రోజురోజుకు టెక్నాలజీకి అనుగుణంగా మోసాల తీరు మారుతోంది. ప్రజల వీక్‌నెస్‌ను ఆసరా చేసుకుంటున్న మోసగాళ్లు.. మోసాల కోసం కొత్త తరహా వ్యూహాలు రచిస్తున్నారు. విదేశాల్లో ఇంటర్నేషనల్‌ సెమినార్‌ పేరుతో ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్‌ చేయడంతో ముఠా గుట్టు రట్టయింది.
అనేక రకాల మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లు
నైజీరియర్ల ఆగడాలకు అంతే లేకుండాపోతోంది. దేశవ్యాప్తంగా తిష్టవేసిన నైజీరియన్లు.. భారతీయులను టార్గెట్‌ చేసుకుని అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఉద్యోగాలు, ఆన్‌లైన్‌ పెళ్లి సంబంధాలు, లాటరీ వంటి మోసాలు చేసిన వీరు ఇప్పుడు కొత్త తరహా వ్యూహం రచించారు. ఢిల్లీని కేంద్రంగా చేసుకుని.. విదేశాలలో ఇంటర్‌ నేషనల్‌ సెమినార్ల పేరుతో మోసాలకు శ్రీకారం చుట్టారు.
ఫేక్‌ వెబ్‌సైట్ల ద్వారా మోసాలు
హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు నైజీరియన్లు అయిన టోమ్మి మ్యాక్‌, హెన్‌ కొంచన్‌తో పాటు.. మణిపూర్‌కు చెందిన అజిమ్‌ఖాన్‌లను అరెస్ట్‌ చేశారు. వీరు కొన్ని ఫేక్‌ వెబ్‌సైట్లను ఏర్పాటు చేసి మోసాలకు తెరదించారు. లండన్‌లో ఇంటర్నేషనల్‌ సెమినార్‌ ఉందని.. ఇంట్రస్ట్‌ ఉన్నవాళ్లు హాజరుకావచ్చని.. అన్ని యూనివర్సిటీలకు మెయిల్‌ పంపుతారు. ఎవరైనా స్పందించి రిప్లై పంపిస్తే.. ఇందుకోసం కొంత డబ్బు చెల్లించాలని కోరుతారు. ఇలా వీరి బుట్టలో చాలామంది పడినట్లు తెలుస్తోంది.
  పోలీసులను ఆశ్రయించిన మహిళ   
ఇక నైజీరియన్ల మోసానికి బలైనవారిలో జగిత్యాల పొలాస అగ్రికల్చరల్‌ యూనివర్సిటీకి చెందిన ఓ మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కూడా ఉన్నారు. నైజీరియన్ల మాటలు నమ్మిన ఆమె.. ఇప్పటివరకు 2 లక్షల 82 వేల రూపాయలు సమర్పించుకుంది. ఇక ఆ తర్వాత కూడా నైజీరియన్లు.. విమానం హైక్లాస్‌ టికెట్‌ కోసం మరో 96 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీన్ని తిరస్కరించిన ఆమె.. అనుమానం వచ్చి ఆ వైబ్‌సైట్‌ గురించి ఆరా తీసింది. అవి నకిలీ వెబ్‌సైట్లుగా గుర్తించిన ఆమె.. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఇక నిందితుల నుంచి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, డెబిట్‌కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

13:43 - October 13, 2015

వరంగల్ : జిల్లా ఎనుమాముల మార్కెట్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పత్తికి సరైన మద్దతు ధర ఇవ్వాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. క్వింటాల్‌ పత్తికి ఐదు వేల రూపాయల చెల్లించాలంటూ రైతులు నిరసన చేస్తున్నారు. పత్తికి రూ.5 వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పత్తికి రూ.4800 మద్దతు ధర ప్రకటించనప్పటికీ రైతుల ఆందోళన నెలకొంది. రైతుల పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని రైతుల మండిపడుతున్నారు. మార్కెట్ సిబ్బంది, సీసీఐ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.3800 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు గిట్టుబాట ధర ఇస్తే.. తాము ఎందుకు ఆందోళన చేస్తామని రైతులు అంటున్నారు. మార్కెట్ కు పత్తి తీసుకొచ్చి.,.. నాలుగు రోజులు అయిందని... కానీ ఇప్పటికీ ప్రభుత్వం కొనగులు చేయలేదని వాపోయారు. రూ6 వేలతో పత్తిని కొనుగోలు చేయాలని కొంతమంది రైతులు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని విమర్శించారు. పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. సీపీఐ, మార్కెట్ అధికారులు కుమ్మక్కు అయి.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

 

ఏలూరులోని ప్రైవేట్ స్కూల్ దారుణం..

తూ.గో : ఏలూరులోని ఓ ప్రైవేటు స్కూల్లో దారుణం జరిగింది. చాటపర్రులోని హోప్‌ స్కూల్లో ఓ టీచర్‌ ముక్కుపచ్చలారని చిన్నారిపట్ల కర్కశత్వం ప్రదర్శించింది. తరగతి గదిలో మూత్రవిసర్జన చేస్తుందన్న కోపంతో టీచర్‌ చిన్నారిని ఎండలో జారుడు బల్లపై కూర్చోబెట్టింది. దీంతో విద్యార్థిని అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

13:33 - October 13, 2015

తూ.గో : ఏలూరులోని ఓ ప్రైవేటు స్కూల్లో దారుణం జరిగింది. చాటపర్రులోని హోప్‌ స్కూల్లో ఓ టీచర్‌ ముక్కుపచ్చలారని చిన్నారిపట్ల కర్కశత్వం ప్రదర్శించింది. తరగతి గదిలో మూత్రవిసర్జన చేస్తుందన్న కోపంతో టీచర్‌ చిన్నారిని ఎండలో జారుడు బల్లపై కూర్చోబెట్టింది. దీంతో విద్యార్థిని అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్కూల్‌ ఎదుట విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. టీచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ యాజమాన్యాల ఆగడాలకు అడ్డు కట్ట వేయాలని కోరారు. 

13:27 - October 13, 2015

చిత్తూరు : ఎపి రాజధాని అమరావతి ప్రజా రాజధాని అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. జిల్లాలోని చంద్రబాబు స్వస్థలం అయిన నారావారిపెల్లెలో ఆయన 'మన మట్టి... మన నీరు' కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్వ మతస్తులు ప్రార్థనలు, పూజల అనంతరం పుట్టకు పూజ చేసి... మట్టిని సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. తెలుగువారి కీర్తి, ప్రతిష్టలు తెలిపే విధంగా అమరావతి స్థలం ఉందని చెప్పారు. ఇంద్రుడు రాజధాని అమరావతని.. అన్ని విధాలా అమరావతికి చరిత్ర ఉందన్నారు. శాతావాహనులు అమరావతిని రాజధానిగా పరిపాలించారని తెలిపారు. అన్ని అనూకలమైన పరిస్థితులు ఉన్న ప్రాంతమన్నారు. మన నీరు, మన మట్టి, మన అమరావతి కార్యక్రమానికి శ్రీకారం చేపట్టామని తెలిపారు. నేటి నుంచి 22 వ తేదీ వరకు దసరా పెద్ద ఎత్తున జరుపుకుంటామని..కానీ జీవితంలో, చరిత్రలో ఒకే సారి వచ్చే పండుగ అమరావతి శంకుస్థాపన పండుగ అని అన్నారు.
అమరావతికి స్థల, వాస్తు బలం  
అమరావతికి స్థల, వాస్తు బలం ఉందని చెప్పారు. తెలుగు వారి కీర్తి, ప్రతిష్టలను నలుదిశలా తెలిపే అవకాశం ఉన్న ప్రాంతమన్నారు. మన మట్టి...మన నీరు కార్యక్రమాన్ని ఈనెల 13 న అన్ని గ్రామాల్లో కార్యక్రమం ప్రారంభం కావాలని సూంచించారు. అన్ని మతాలకు చెందిన పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నామని.. హిందూ పూజారులు, ముస్లీం మతత్థులు, జైన మతస్థులు, బ్రహ్మకుమారులు వచ్చారని... సర్వమత ప్రార్థనలతో అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. అమరాతి నిర్మాణం అంశం.. 5 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయమన్నారు. ఒకసారి సంకల్పం చేస్తే.. సాధించడం పెద్ద సమస్య కాదన్నారు. అన్ని మతాలు, అన్ని కులాల వారు కలవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజలు, దేవుని ఆశీస్సులు ఉండాలి
ప్రజలు, దేవుని ఆశీస్సులు ఉండాలని కోరారు. పవిత్రమైన భావంతో నిర్వహించాలని సూచించారు. ప్రపంచాన్ని నడిపించేది నమ్మకమని.. నమ్మకంతోనే ప్రపంచం నడుస్తుందన్నారు. మన నీరు, మన మట్టి కార్యక్రమానికి మూడు, నాలుగు రోజులు పూజలు చేయాలని తెలిపారు. గ్రామాల నుంచి పుట్టమట్టిని ఆయా మండల కేంద్రాలకు తీసుకురావాలని చెప్పారు.
అందరికీ ఉపాధి అవకాశాలు 
రాష్ట్రంలోని 16 వేల గ్రామాల సంస్కృతి, మనోభావాలు, దేవుళ్లు, వివిధ మతస్తుల నమ్మకాలను అక్కడ భద్రపరుస్తామన్నారు. అమరావతి.. పవిత్రమైన ప్రాంతమన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల సంకల్పమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అందరికీ ఉపాధి అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. రాజధాని శంకుస్థాపనకు సింగపూర్, జపాన్ నుంచి ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు.

 

12:59 - October 13, 2015

సీతాఫలం.. ఈ మాట వింటేనే నోరూరుతుంది. ఈ పండులో అంతటి తియ్యదనంతో పాటు పుష్కలమైన పోషకాలు కూడా ఉన్నాయి. చలికాలంలో విరివిగా లభించే ఫలాలలో సీతాఫలం ఒకటి, సీతాఫలాన్ని రకరకాలుగా పిలుస్తారు. సీతాఫలం అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు. ఏ పండు అయినా, శరీరానికి కేలరీలుతోపాటు తగిన మోతాదులో మాంసకృత్తులను సైతం అందించగలవు, అయితే సీతాఫలం మాత్రం ఇందుకు భిన్నమైనదనక తప్పదు. ఆహార పదార్థాంగా ఆకలిని తీర్చడం మాత్రమేగాక, ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలు ఇందులో దాగివున్నాయంటే ఆశ్ఛర్యం కలగక మానదు. ఇంకా కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. సీతాఫలం ఆకు మొదలుకుని గుజ్జు తిన్న తరువాత పారవేసే గింజల వరకూ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని వైద్యశాస్త్రం నొక్కినొక్కాణిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పండులోని ప్రతి భాగం ఔషధమని చెప్పక తప్పదు.

విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఈ పండు తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటివి దరిచేరవు.

కేన్సర్‌ కణాలతో పోరాడే లక్షణం వీటికుంది. లివర్‌ కేన్సర్‌, మెదడులో ట్యూమర్స్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండా చేసే గుణం సీతాఫలానికుంది.బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండా చేసే గుణం సీతాఫలానికుంది.

ఈ పండ్లలో బి6 విటమిన్‌ అధికంగా ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్‌ రాకుండా చేయటంతో పాటు మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

ఐరన్‌ అధికంగా ఉండే సీతాఫలాలు తినటం వల్ల అనీమియా వ్యాధి రాదు. కళ్ల ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోపడుతుంది.

సీతాఫలాలు తినటం వల్ల కీళ్లనొప్పులు వచ్చే శాతం తక్కువగా ఉంటుంది.

గుండెకు మంచిది, డయాబెటిస్‌ దరి చేరనివ్వదు.

చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి సీతాఫలాలు చక్కగా ఉపయోగపడతాయి. చర్మ సమస్యల్ని నివాంచే లక్షణం కూడా వీటికి ఉంది.

మలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. రోజూ తినగలిగితే.. ఎంతో మార్పు కనిపిస్తుంది.

డైటింగ్‌ నియమాలు పాటించే వారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు. * పండులోని సల్ఫర్‌ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది.

సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపించి వేస్తుంది.

ఆకుల్ని మెత్తగా నూరి.. కాస్త పసుపు కలిపి.. మానని గాయాలు, గజ్జి, తామర ఉన్న చోట పూతగా రాస్తే సరిపోతుంది.

సీతాఫలం బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి ఔషధంగా ఇస్తుంటారు.

సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. అయితే కళ్లల్లో పడకుండా చూసుకోవాలి.

గర్భిణులు ఈ పండును సాధ్యమైంత తక్కువగా తినాలి. పొరబాటున గింజలు లోపలికి పోతే గర్భస్రావం అయ్యే ప్రమాదముంది.

గమనిక: మోతాదుకు మించి తీసుకోకూడదు. కడుపులో మంట, ఉబ్బరం బాధిస్తాయి. అలాంటప్పుడు వేడినీరు తాగినా.. అరచెంచా వాము లేదా ఉప్పు నమిలినా ఉపశమనం లభిస్తుంది. సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.

12:53 - October 13, 2015

చిత్తూరు : తిరుపతి బస్టాండులో ఆర్టీసీ బస్సుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. బస్సులోనే నిద్రిస్తున్న డ్రైవర్‌ కండక్టరుకు గాయాలయ్యాయి. వీరిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి. జగన్‌ దీక్ష భగ్నానికి నిరసనగా వైసీపీ కార్యకర్తలే బస్సుకు నిప్పు పెట్టుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

మ. 2 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ : మధ్యాహ్నం 2 గంటలకు హెచ్ ఆర్ డీలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. కరవు, రైతు సమస్యలు, డబుల్ బెడ్ రూం ఇండ్లపై చర్చించనున్నారు. మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల భూసమీకరణపై సమీక్ష చేయనున్నారు. 

12:45 - October 13, 2015

విశాఖ : ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ విశాఖలో మౌనదీక్ష చేపట్టారు. వైజాగ్‌లో వెంటనే జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణం ప్రారంభించాలని మౌనదీక్ష చేపట్టారు. లైబ్రరీ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోని.. లైబ్రరీ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని శర్మ డిమాండ్‌ చేస్తున్నారు. దీక్ష ప్రారంభించే ముందు ఎమ్మెల్సీ శర్మ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. ఇటు శర్మ మౌనదీక్షకు జిల్లా గ్రంథాలయ సంస్థ పింఛనుదారుల సంఘం సభ్యులు మద్దతు తెలిపారు.

 

12:43 - October 13, 2015

చిత్తూరు : రాజధాని అమరావతి శంకుస్ధాపనలో రాష్ట్ర ప్రజలందరిని భాగస్వామ్యులను చేయాలని ఏపి సర్కార్ పిలుపునిచ్చింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనమట్టి-మననీరు కార్యక్రమాన్ని ప్రారంభించింది. నారావారిపల్లెలో చంద్రబాబు మనమట్టి మన నీరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజధాని అమరావతి కోసం పుట్టమన్నును సేకరించారు.

12:00 - October 13, 2015

కర్ణుడు లేని భారతం,కరివేపాకు లేని కూర ఒకటేనని అంటారు మన పెద్దలు. భారతదేశంలో కరివేపాకు లేని తాలింపు ఉండదంటే అతిశయోక్తి కాదు. "కూరలో కరివేపాకులా తీసిపారేసేరు" అనే సామెత నానుడు ఉంది. కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి. కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరు పై బెరడు, కాండం పై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. కానీ, ఇష్టంలేకో లేక అలవాటులో పొరపాటో... కరివేపాకుని తినకపోవడానికి సవాలక్ష కారణాలు వెతుక్కుంటారు.

పుష్కలంగా ఆరోగ్య గుణాలు...

కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు కూడా లభిస్తాయి. ఇలా పౌష్టిక విలువలలో ఏ కూరకీ ఏమాత్రం తీసిపోని కరివేపాకుని కేవలం రుచి గురించి మాత్రమే వాడతాం మనం. పూర్వమయితే కరివేపాకు పొడులు, కరివేపాకు పచ్చడి అంటూ కరివేపాకు వినియోగం కొంచెం ఎక్కువగానే వుండేది. నేడు మారిన ఫాస్ట్ ఫుడ్ కల్చర్ లో కరివేపాకు వాడుక తగ్గుతుందేమో అనిపిస్తోంది.

మధుమేహానికి మంచి మందుగా....

కరివేపాకుని మధుమేహానికి మంచి మందుగా పాశ్చాత్యులు సైతం గుర్తించారు. ఇందులోని కొయినిజన్ వంటి కొన్ని రసాయనాలు చక్కెర వ్యాధిగ్రస్తుల పాలిట వరం అంటారు నిపుణులు. ఎలా అంటే, తీసుకున్న ఆహారాన్ని గ్లూకోజ్‌గా మార్చి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచేందుకు క్లోమగ్రంధి నుంచి విడుదలయ్యే అల్థాఎమిలేజ్ అనే ఎంజైమే కారణం. కరివేపాకులోని ప్రత్యేక పదార్ధాలు ఈ ఎంజైమ్ స్రావాన్ని తగ్గిస్తాయని గుర్తించారు నిపుణులు. నిజానికి జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా వచ్చే మధుమేహాన్ని కరివేపాకు ద్వారా నియంత్రివచ్చని ఆయుర్వేద నిపుణులూ చెబుతుంటారు. ప్రతిరోజూ ఉదయమే పది కరివేపాకుల చొప్పున మూడు నెలలపాటు తింటే స్థూలకాయం, అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతాయంటారు ఆయుర్వేద వైద్యులు.

అజీర్తిని తగ్గిస్తుంది...

పిల్లలు ఆకలిగా లేదంటూ అన్నం చూడగానే ముఖం తిప్పేస్తుంటే చక్కగా స్పూన్ నెయ్యి వేసి కరివేపాకు పొడి కలిపి రోజు మొదటగా రెండు ముద్దలు పెడితే చాలుట. ఆకలి పెరుగుతుంది. అజీర్తి తగ్గుతుంది కూడా. కరివేపాకు పొడి అంటే ఒట్టి కరివేపాకే కాదు.. మెంతులు, మిరియాలు కూడా కలపాలి.

డయేరియాకు....

డయేరియా వంటి వాటికి రెండు టీస్పూన్ల కరివేపాకు రసం బాగా పనిచేస్తుందిట. అలాగే మజ్జిగలో కాసిన్ని కరివేపాకుల్ని నలిపి లేదా రసం తీసి వేస్తే కడుపులోని బాధలు ఏవైనా తగ్గుతాయిట. అలాగే ఒట్టి కరివేపాకుని వేయించిగానీ, ఎండబెట్టిగానీ పొడిచేసి పెట్టుకుని రోజూ ఓ స్పూన్ తేనెతో ఓ స్పూన్ కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

తెల్లజుట్టుకు చెక్ ....

వాతావరణ కాలుష్యం, అధిక ఒత్తిడి కారణంగా నేటి యూత్‌కు చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేసింది. తెల్లజుట్టుకు చెక్ పెట్టాలంటే రోజూ మనం తీసుకునే ఆహారంలో కరివేపాకును తీసుకుంటే సరిపోతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. కురులకి ఈ ఆకు ఎంతో మంచిదట. కరివేపాకు వేసి కాచిన నూనెని తలకి మర్ధన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. పెరుగుతాయి కూడా. అంతేనా... జుట్టు తెల్లబడటం తగ్గి, కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయిట. ఇన్ని ఆరోగ్యగుణాలు కలిగిన కరివేపాకును కమ్మటి పచ్చడి, టేస్టీ పొడి లేదా పూర్వంలా మజ్జిగలో కరివేపాకు వేసి తాగడం వంటివి మొదలుపెట్టండి. పిల్లలు ఏరిపారేస్తారన్న భయం లేకుండా వుండాలంటే అన్ని కూరల్లో కరివేపాకు పొడిచేసి వేస్తే సరి!

11:49 - October 13, 2015

మధ్యప్రదేశ్ : భోపాల్‌ నగరంలో ఓ ఫ్లైఓవర్‌ వంతెన కూలి.. ఇద్దరు మృతి చెందారు. వంతెన అంచున భాగం ఒక్కసారి విరిగి పడింది. రాత్రి సమయంలో ఫ్లై ఓవర్‌ కింద నిద్రపోతున్న వారిపై ఆ రాళ్లు పడ్డాయి. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఉండటానికి గూడు లేక ఈ ఫ్లైఓవర్‌ కింద తలదాచుకునేవారు ఈ ఘటనలో చనిపోవడం అందరినీ బాధపెడుతోంది.

11:44 - October 13, 2015

తూర్పుగోదావరి : రాజమండ్రిలోని షాడె బాలికల హైస్కూల్‌ హాస్టల్‌లో విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. దాసరి నందిని రాజమండ్రిలోని షాడె బాలికల హాస్టలో ఉంటుంది. నారాయణ కాలేజీలో ఇంటర్మీయడ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో హాస్టల్‌లోని తను ఉంటున్న గదిలో నందిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

11:43 - October 13, 2015

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి అడుగుపెట్టి ఈ రోజుకు 19 ఏళ్లు పూర్తయింది. ఈ రోజును పవన్ అభిమానులు ‘వరల్డ్ పవనిజం డే’గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం వర్మ కొన్ని ట్వీట్లు చేశాడు. ''ఓ పవన్ కళ్యాణ్ అభిమానిగా.. మిగతా ప్రతి అభిమానులందరికంటే నేనే ఎక్కువగా పవన్ కళ్యాణ్ పై కేర్ చూపిస్తాను. ఈ ప్రపంచ పవనిజం డే నాడు.. సర్దార్ గబ్బర్ సింగ్ ‘బాహుబలి’ కంటే మిన్నగా ప్రపంచానికి చేరువవుతుందని బలంగా నమ్ముతున్నా. పవన్ కళ్యాణ్ అర్జెంటీనా ఐలాండ్ ఆఫ్రికా మొత్తం అమెరికాలో చాలా ఫేమస్. వరల్డ్ పవనిజం డే సందర్భంగా కంగ్రాట్స్'' అంటూ ట్వీట్లు చేశాడు వర్మ.

ఐతే ఈ ట్వీట్లతో పాటు ఇంతకుముందు పవన్ ఫ్యాన్స్ ను ఎద్దేవా చేస్తూ వర్మ చేసిన ట్వీట్లను కూడా దృష్టిలో ఉంచుకుని బండ్ల గణేష్.. వర్మకు వార్నింగ్ ఇచ్చాడు. ''మా పవన్ కళ్యాణ్ మీద వచ్చే విమర్శలు మాకు ఊరేగింపులో పడే మల్లె పూల లాంటివి ఆర్జీవీ సార్. సూర్యడి మీద ఉమ్మేస్తే...'' అంటూట ముందు ఓ ట్వీట్ చేశాడు బండ్ల. ఆ తర్వాత మళ్లీ.. ''ఆర్జీవీ.. మీకు పవన్ ఫ్యాన్స్ మీద అంత కోపం పనికి రాదు. మా లాంటి ఫ్యాన్స్ కి మీరు ముందు నిలబడి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ఆర్జీవీ.. నా హంబుల్ రిక్వస్ట్. పవన్ కళ్యాణ్ పై రాత్రి పూట ట్వీట్లు చేసి నిద్ర పాడు చేయొద్దు. పగలు ట్వీట్లతో పని చెడగొట్టొద్దు'' అంటూ మరో ట్వీట్ చేశాడు బండ్ల.

ఈ ట్వీట్ల తర్వాత వర్మ లైన్లోకి వచ్చాడు. పవన్ గురించి తానెప్పుడూ గొప్పగానే మాట్లాడానన్నాడు. అంతటితో ఆగకుండా.. ''పవనిజం పుస్తకంలో ప్రస్తావించిన ఆర్దర్ స్కోపెన్ హెయిర్ ఫిలాసఫీ ఆధారితంగానే నేను వ్యాఖ్యలు చేశారు. నిరక్షరాస్యుల కసం నా అక్షరాస్యతను లెవెల్ ను తగ్గించుకోలేను'' అంటూ పంచ్ వేశాడు. దీనిపై గణేష్ మళ్లీ సెటైర్ వేశాడు.. ''మీరు బాగా చదువుకొని ఉండొచ్చు. కాని మాకు సంస్కారవంతమైన జీవితం ఇచ్చిన పవన్ వివేకవంతుడు'' అన్నాడు. దీనికి బదులుగా వర్మ.. ''నువ్వు అనవసరంగా పవన్ అభిమానులను పాడుచేసి మిస్ డైరెక్ట్ చేస్తున్నావ్. నేను చెప్పినదంతా పవనిజం పుస్తకంలోదే'' అని రిప్లై ఇచ్చాడు. మళ్లీ బండ్ల బాబు.. ‘‘మాకు పుస్తకాలు అక్కర్లేదు.. పవన్ లుక్ మాపై పడితే చాలు'' అంటూ పంచ్ వేసే ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఇద్దరి మధ్య ఈ ట్వీట్ల యుద్ధం కొందరికి మజా ఇస్తే.. ఇంకొందరికి చిర్రెత్తేలా చేసింది....

11:35 - October 13, 2015

హైదరాబాద్ : వజ్రాలు అలంకరణకే కాదు.. ఆరోగ్యానికీ ప్రయోజనకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేన్సర్‌గా మారే కణితిని ముందే గుర్తించడంలో వజ్రాలు ఉపయోగపడతాయని సిడ్నీ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. విషపూరితం కాకపోవడంతోపాటు ఎలాంటి ప్రతికూల ప్రభావాలు కలిగించకపోవడం వజ్రా లకుగల మంచి లక్షణమని, దీన్ని వైద్య రంగంలో వాడుకోవచ్చని చెప్పారు. దీంతో పాటు వజ్రాలకు అతుక్కుపోయే గుణం ఉందని, ఇవి వెలువరించే సంకేతాలను ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో సులభంగా గుర్తించవచ్చని చెప్పారు. ఈ లక్షణాల ఆధారంగా శరీరంలో ఏర్పడ్డ కణితి కేన్సర్‌కు దారితీస్తుందా లేక హానిరహితమైనదా అనేది నిర్ధా రించుకోవచ్చని వర్సిటీ ప్రొఫెసర్‌ డేవిడ్‌ వివరించారు. వజ్రంలోని సూక్ష్మమైన భాగాన్ని వైద్యులు ఇప్పటికే కీమోథెరపీలో ఉపయోగిస్తున్నారని గుర్తుచేశారు.

11:27 - October 13, 2015

హైదరాబాద్ : కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రానా హీరోగా ఓ చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దసరా కానుగా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజయదశమికి ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనున్నట్లు తెలుస్తోంది. బాహుబలి, రుద్రమదేవి వంటి భారీ చిత్రాల తర్వాత రానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మిస్తున్నారు. వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న రెజీనా ఈ చిత్రంలో భల్లాలదేవ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటి వరకూ పలువురు హీరోలతో స్టెప్స్ వేయించిన ప్రేమ్ రక్షిత్ రానా కోసం ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథని సిద్దం చేశాడట. దర్శకుడిగా తన ప్రతిభను ఏ విధంగా చాటుకుంటాడో వేచి చూడాలి.

11:23 - October 13, 2015

హైదరాబాద్ : పైరసీ ముఠా గుట్టురట్టైంది. కొత్త సినిమాలను టార్గెట్ చేసి దర్జాగా పైరసీ చేస్తున్న ఓ ముఠా ఖాకీల చేతికి చిక్కింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. పైరసీ... ఇప్పుడు ఈ పేరు చెబితేనే సినీపరిశ్రమ గజగజావణికిపోతోంది. పైరసీగాళ్ల ఆటలతో అటు సినిమా యాజమాన్యాలకు ఇటు సైబర్ క్రైమ్ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. కొత్త సినిమా విడుదలయ్యిందో లేదో క్షణాల్లో పైరసీగాళ్లు రంగంలోకి దిగి ఇంటర్‌నెట్‌లలో సినిమాను అప్‌లోడ్ చేస్తున్నారు. లక్షలాది రూపాయలు క్యాష్‌ చేసుకుంటున్నారు.
పైరసీకి గురైన రుద్రమదేవి
గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన రుద్రమదేవి సినిమా పైరసీకి గురైంది. ఎంతో హైప్‌తో మార్కెట్‌లోకి వచ్చిన ఈ సినమాను పైరసీ చేసి సొమ్ముచేసుకుంటున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఒక బిజినెస్‌మెన్‌ను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా కలిసి రుద్రమాదేవితో పాటు బాహుబలి, భలేభలే మగాడివోయ్ వంటి కొత్త సినిమాలను పైరసీ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు ప్రశాంత్ చైతన్కర్, పవన్‌కంబ్లే, తన్వీర్ అహ్మద్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరు ఇప్పటికే 12 వందల సినిమాలను వివిధ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, హ‌ర్డ్‌ డిస్క్‌, ఇంటర్‌నెట్‌ రూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. ఇలా ఎవరైనా..చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

 

11:17 - October 13, 2015

హేతువాదులపై దాడులు చేయడం సమాజానికి మంచిది కాదని దిహన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ హితవుపలికారు. దేశ ప్రజలు విశాల భావాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో అనేక భావాల సంఘర్షణ ఉండాలన్నారు. భావాల సంఘర్షణ పునాదులపై ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మించగలమని చెప్పారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, పలు ఆసక్తిరమైన ఆంశాలను వివరించారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే....
ప్రతి పౌరునికి భావప్రకటన స్వేచ్ఛ
'భారతరాజ్యాంగం ప్రకారం.. 19(1)ఎలో  ప్రతి పౌరునికి భావప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. కొన్నిసహేతుకమైన ఆంక్షలు మాత్రమే పెట్టబడ్డవి. పుస్తకంపై దాడి చేయడం సరికాదు. దాడికి పాల్పడిన వారు పుస్తకం చదవ లేదు. ఆ పుస్తకంలో ఏముందో కూడా వారికి తెలియదు. అయినా పుస్తకాన్ని విశ్లేషించవచ్చు, విమర్శించవచ్చు. ఆ పుస్తకాన్ని విమర్శిస్తూ.. వంద పుస్తకాలు రాయొచ్చు. కానీ ఏ ఒక్క ఆలోచన ఉండకూడదన్న వాదన చాలా అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో అనేక భావాల సంఘర్షణ ఉండాలి. భావాల సంఘర్షణ పునాదులపై ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మించగలం. అనేక మంది రాసిన పుస్తకాల్లో ఉన్న సారాంశం ప్రకారం.. వివిధ సంస్కృతి, సంప్రదాయాలు భారత సమాజంలో వికసించాయి. కాబట్టి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజాస్వామ్య విలువు ఉండే సమాజాన్ని నిర్మింకుందామా...? లేదా...హేయభావాలపై, ద్వేష పునాదులపైన ఆందోళన, హింస పునాదులపైన సమాజాన్ని నిర్మించుకుందామా...? అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. హిందూమతం.. మతం కాదు.. విశ్వాసం కాదు.. ఇది ఒక సహేతుక ఆలోచన, ఇదొక మానసిక స్థితి. హిందూమతం అనేది అనిర్వచనీయ అనుభూతి మాత్రమే అని.. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటాడు. రాజ్యాంగం పట్ల విశ్వాసంగా ఉండడమే పౌరుని ప్రథమ కర్తవ్యం. ఆర్టికల్ 25 ప్రకారం.. పత్రి భారతీయునికి స్వేచ్ఛ ఇస్తుంది. హిందూమతాన్ని ప్రేమించే వారు ఆలోచించాలి. సమకాలీన పరిస్థితులకనుగుణంగా మతాన్ని సంస్కరించుకోవాలి. ఆధునిక భావాన్ని మత పరిజ్ఞానంలో ఇముడ్చుకుంటూ.. సమాజాన్ని నూతన నాగరికత వైపు తీసుకెళ్లాలి. దాడులు, ద్వేషం, పగలు, ప్రతీకారాల పునాదుపై నిర్మించుకునే భారత సమాజం అల్లకల్లోల సమాజం అవుతుంది. శాంతి, సుస్థిర, అభివృద్ధి అనేవి ఎక్కడా ఉండవు. ఆధునిక భారతావనిని నిర్మిస్తానని మోడీ అధికారంలోకి వచ్చారు. తాజా ఘటనల నేపథ్యంలో కాబట్టి మోడీ మౌనం వీడాలి. విశాల భావాలను అలవర్చుకోవాలన్నారు.
బీహార్ ఎన్నికలు..
బీహార్ ఎన్నికలు కులాల కుంపటి. ఏ కులాల వారు ఎవరికి అధికంగా ఓట్లు వేస్తే వారే అధికారంలోకి వస్తారు. రెండు కూటముల మధ్య బీకరమైన పోరు జరగుతోంది. నువ్వా.. నేనా అన్న రీతిలో ఉన్నాయి. ములాయం సింగ్ యాదవ్ కు బిజిపి గెలవాలని ఉంది'. అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

11:10 - October 13, 2015

హైదరాబాద్: సుమంత్ అశ్విన్ హీరోగా ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం 'కొలంబస్'....'డిస్కవరింగ్ ల‌వ్' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం షూటింగ్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటుంది. ఆర్. సామల దర్శకునిగా సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి ఇందులో కథానాయికలు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరి. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. సుమంత్ అశ్విన్ మంచి నటన కనబర్చడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్లో న‌టించాడు. ఇష్క్ సినిమా ర‌చ‌యిత‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌.సామ‌లను ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాం అని తెలిపాడు. ప్రతి అమ్మాయి, అబ్బాయి ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇందులో హీరో, హీరోయిన్ పాత్రలు ఉంటాయి. అలాగని, కేవలం యూత్ మాత్రమే చూసేలా ఉండదు. అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది. ఈ చిత్రంలో ఉన్న ఆరు పాటలకు జితిన్ మంచి స్వరాలందించారు. త్వ‌ర‌లో పాట‌లను, వ‌చ్చే నెల 13న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. నిర్మాణానంత‌ర ప‌నులు జ‌రుగుతున్నాయి అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జితిన్, కెమెరా: భాస్కర్ సామల, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, కో-డైరెక్టర్: ఇంద్ర

10:30 - October 13, 2015

శ్రీకాకుళం : దేశంలో నిర్భయ లాంటి ఎన్నో చట్టాలు వచ్చినప్పుటికీ మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మరో మహిళ మృగాళ్ల అత్యాచారానికి బలైంది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో ఓ వివాహితపై దుండగులు అత్యాచారినికి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న భార్యాభర్తలపై దుండగులు దాడి చేశారు. భర్తను తీవ్రంగా గాయపర్చి..భార్యపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాండ్యం శ్రీరాంనగర్‌ కాలనీలో ఈ దారుణం జరిగింది.

 

మహిళపై సమూహిక అత్యాచారం...

శ్రీకాకుళం : జిల్లాలోని పొందూరు మండలంలో ఓ వివాహితపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న భార్యాభర్తలపై దాడి చేసి.. భర్తను తీవ్రంగా గాయపర్చి..భార్యపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.

 

10:26 - October 13, 2015

ప్రకృతి అందిందే వరప్రదాయిణిలో టమాటా ఒకటి. మనకి నిత్యం అందుబాటులో, తక్కువ ధరలలో లభించే సహజమైన టామాటా లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్ సి పుష్కలంగా దాగివున్న టమోటాను వంటల్లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. టమోటాను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. టమోటాలో విటమిన్ సి మాత్రమే గాకుండా మేగ్నీషియం, ఫాస్పరస్, కాపర్‌లు కూడా ఉన్నాయి. టామా సహజమైన, కాంతివంతమైన చర్మం కోసం, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్తున్నారు

ఆరోగ్య సూత్రాలను పరిశీలిస్తే..

~ టమోటా చెడు కొలెస్ట్రాల్‌, గుండెపోటు, హృద్రోగ వ్యాధులకు చెక్ పెట్టవచ్చును

~ టమోటాలు తీసుకుంటే నిత్యయవ్వనులుగా ఉంటారు. చర్మాన్ని, కేశానికి సంరక్షించే యాంటీయాక్సిడెంట్లు టమోటాల్లో పుష్కలంగా వున్నాయి.
~ టమోటాను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కంటి చూపు మెరుగవుతుంది.

~ విటమిన్ కె, క్యాల్షియంలు కలిగిన టమోటాలను తీసుకుంటే ఎముకలు ఆరోగ్యమవుతాయి. విటమిన్ ఎ, సిలు వుండే టమోటాలను యాంటీయాక్సిడెంట్ల ద్వారా       డీఎన్‌ను డామేజ్ చేయకుండా కాపాడుతుంది.
~ టమోటా అనేక క్యాన్సర్ వ్యాధులు అనగా ప్రోస్టేట్, ఉదర, నోటి వంటి ఇతరత్రా క్యాన్సర్లను నియంత్రిస్తుంది. టమోటా శరీరంలోని చక్కెర శాతాన్ని              క్రమబద్ధీకరిస్తుంది.

సహజమైన, కాంతివంతమైన చర్మం కోసం ....

~ కొన్ని టమాటాలను గుజ్జుగా చేసి, కొంచెం ఓట్స్ (బియ్యపు పిండి), ఒక స్పూన్ పెరుగు కలిపి, మీ ముఖమునకు, మెడకు పట్టించి కొన్ని నిమిషాల తర్వాత శుబ్రం       చేసుకుంటే మీ చర్మాని నల్లగా చేసే పదార్దాలు తొలగిపొయి, చర్మం ఎంతో కాంతివంతంగాను మరియు మ్రుదువుగా తయారవుతుంది.గంధం పొడిని టమాట గుజ్జుతో   కలిపి కొంచెం నిమ్మరసం వేసి ఆ పేస్ట్ ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ప్రభావం చూపిస్తుంది.బిజీ సమయంలో,  టైము లేదు అనుకుంటే టమాటాల గుజ్జుని రెండు టేబుల్ స్పూన్స్ పాలతో కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మం  ఎంతో కాంతివంతంగా, ప్రకాసిస్తుంది.

~ గుజ్జుగా చేసిన టమాటాలు, నిమ్మకాయలోని సగం తీసుకుని, నిమ్మరసాన్ని, టమాట గుజ్జుని కలిపి ముఖమునకు, మెడకు పట్టించుకొని అది పొడిగా అయ్యేవరకు   వేచి ఉండాలి కొన్ని నిమిషాల తర్వాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మీ చర్మాని నల్లగా చేసే పదార్దాలు తొలగిపొయి మంచి ఉపసమనాన్ని పొందుతారు.

~ మీ ముఖాన్ని నల్లమచ్చలు ఇబ్బంది పెడుతుంటే “ముల్తానీ మట్టీ “, టమాటా గుజ్జు కలిపి ముఖానికి రాసుకుని మెల్లగా రుద్దాలి, ఎక్కువగ రుద్దినను ప్రమదమే,    శరీరం ముడతలు పడిపొతుంది.15 నిమిషాల తరువాత గొరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని ఆస్వాదించవచ్చు.

10:19 - October 13, 2015

గుంటూరు : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైఎస్‌ జగన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఫ్లూయిడ్స్‌ తీసుకునేందుకు జగన్‌ నిరాకరించారు. దీంతో డాక్టర్లు జగన్‌కు బలవంతంగా ఫ్లూయిడ్స్‌ అందిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్‌ జగన్‌ చేపట్టిన దీక్ష భగ్నమైంది. తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకు జగన్‌ నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రత్యేక అంబులెన్స్‌లో జగన్‌ను జీజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసేటప్పుడు వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షా శిబిరం వద్ద గుమిగూడారు. దీక్షను విరమించేది లేదని జగన్ వారించినా.. పోలీసులు బలవంతంగా జగన్ దీక్షను భగ్నం చేశారు. దీక్ష 7వ రోజుకు చేరుకోవడంతో జగన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. బీపీ, షుగర్‌ లెవల్స్‌ బాగా పడిపోవడంతో..జగన్‌ బాగా నీరసించిపోయారు. దీంతో ఎలాగైనా జగన్‌ను ఆసుపత్రికి తరలించాలన్న ఉద్దేశంతో దీక్షను పోలీసులు భగ్నం చేసి..గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జగన్ దీక్షాస్థలి వద్ద ఉద్రిక్తత
అయితే జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసేటప్పుడు వైసిపి కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు స్పల్ప లాఠీచార్జ్‌ చేయడంతో కార్యకర్తలంతా పరుగులు పెట్టారు. ప్రస్తుతం వైఎస్‌ జగన్ జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 7రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నిరసంగా ఉన్నారు. ప్రస్తుతం జగన్‌కు వైద్యులు ఫ్లూయిడ్స్‌ అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్‌ను వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి పరామర్శించారు.

 

10:14 - October 13, 2015

ఎపికి ప్రత్యేకహోదా కోసం జగన్ చేపట్టిన దీక్ష పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదని వక్తలు అన్నారు. హోదాకోసం చేపట్టిన జగన్ మంత్రులు తీవ్ర విమర్శలు, వ్యంగాస్త్రాలు సందించడం భావ్యం కాదన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టిడిపి నేత.. విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ నేత సంపత్, వైసిపి నేత.. మేరుగ నాగార్జున, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ఎపికి ప్రత్యేకహోదా, రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కృషి చేయాలన్నారు. టీసర్కార్.. సన్న బియ్యం.... వివాదం అనే అంశంపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రాజమండ్రి షాడె బాలిక హైస్కూల్ హాస్టల్ లో విషాదం..

తూర్పుగోదావరి : రాజమండ్రిలోని షాడె బాలిక హైస్కూల్ హాస్టల్ లో విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థిని దాసరి నందిని ఆత్మహత్యకు పాల్పడింది.

 

09:52 - October 13, 2015

హైదరాబాద్ : గతంలో ‘మిణుగురులు’ మూవీని తెరకెక్కించిన అయోధ్యకుమార్, తన నెక్ట్స్ మూవీలో హీరోయిన్‌గా నిహారికను ఎంపిక చేసినట్టు సమాచారం. కొద్దిరోజుల కిందట అయోధ్యకుమార్ ఓ స్టోరీని నాగబాబు ఫ్యామిలీకి వినిపించాడట. కథ బాగుండడంతో వెంటనే ఓకే చేసినట్టు ఇన్‌సైడ్ న్యూస్. ఈ ఫిల్మ్‌ని తెలుగు, తమిళంలో చేయాలని ప్రొడ్యూసర్ ప్లాన్. మరోవైపు నాగశౌర్య- నిహారిక జంటగా రానున్న ఫిల్మ్‌ని మధుర శ్రీధర్ నిర్మిస్తున్నాడు. వచ్చేనెల‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సో.. వెండితెరపై నిహారిక కెరీర్ మరింత స్పీడ్ అందుకోవడం ఖాయమనే టాక్ నడుస్తోంది.

09:46 - October 13, 2015

హైదరాబాద్: గౌరవం సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ తమిళ సూపర్ హిట్ హారర్ చిత్రం "యామురిక్క బయమెయ్" రీమేక్ చేయనున్నాడు. ఎప్పట్నుండి గీతా ఆర్ట్స్ లో తిష్ట వేసుకున్న ప్రభాకర్ (ఈటివి ప్రభాకర్) ఈ సినిమాతో మెగాఫోన్ పట్టనున్నారని సమాచారం. హారర్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కథ ఆసక్తి కరంగా వుండటంతో అల్లు వారి నుండి ప్రభాకర్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట. భలే భలే మగాడివోయ్ సినిమాతో హిట్ కొట్టిన లావణ్య త్రిపాఠి శిరీష్ తో జత కట్టనుంది. "ఒక దెయ్యం ఉన్న హోటల్ కు హనీమూన్ కోసం వెళ్లిన జంట ఎదుర్కొన్న సమస్యలేంటి..? అనేది ఈ సినిమా కథ. ఈ కథను అక్కడ పూర్తి స్థాయి వినోదభరితంగా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు. అల్లువారి పిల్లగాడికి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో మరి.

09:41 - October 13, 2015

గుంటూరు : ఎపికి ప్రత్యేకహోదా కోసం జగన్ 6 రోజులుగా దీక్ష చేపట్టారని... ప్రభుత్వం ప్రత్యేకహోదాపై మాట్లాడకుండా.. జగన్ దీక్షను భగ్నం చేయడం అన్యాయమని, దారుణమని వైసిపి నేత బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ దీక్షను భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. చికిత్సకు జగన్ నిరాకరించారు. అయినా పోలీసులు వైద్యులచే బలవంతంగా చికిత్స అందిస్తున్నారు. బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. ప్రత్యేకహోదా లేకుండా సీఎం చంద్రబాబు సింగపూర్, జపాన్ కు వెళ్లడంతో రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయన్నారు. చంద్రబాబు ప్రజలను మోసం తీరని ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుల భవిష్యత్ ను గంగలో కలిపే పరిస్థితి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆశలను, ఆగ్రహాన్ని నిలువరించలేదన్నారు. దీక్షను ప్రభుత్వం ఆపలేదని చెప్పారు. ఇవాళా ఉదయం 11 గంటలకు సమావేశమై భవిష్యత్ కార్యచరణను తెలియచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే వరకు వైసిపి కృతనిశ్చయంతో పని చేస్తుందన్నారు. యువకులకు బంగారు భవిష్యత్ తెస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు.
మేరుగ నాగార్జున...
'జగన్ దీక్షను భగ్నం చేయడం బాధాకరం. ప్రభుత్వం, పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించి దీక్ష భగ్నం.. చేసి జగన్ ను అరెస్టు చేశారు. దీక్షను భగ్నం చేయడం అప్రజాస్వామికం. ఉదయం 11 గంటలకు జరిగే మీటింగ్ లో దీక్ష భగ్నం, తదితర అంశాలపై చర్చిస్తాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తాము'. అని చెప్పారు.

 

09:39 - October 13, 2015

హైదరాబాద్ : ఆరడుగుల అందగాడు రానా ఇప్పుడు సమంతతో జోడీ కట్టబోతున్నాడు. వీళ్లిద్దరూ బెంగళూరు డేస్ రీమేక్ లో నటించారు. అయితే అందులో బోలెడు మంది హీరోలు బోలెడుమంతి హీరోయిన్లున్నారు. మరి వాళ్ల మద్య ఈ జోడీ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియదు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా మాత్రం మరో సినిమా చేయాలని డిసైడ్ అయిపోయారు. వీళ్లిద్దరి కోరిక వల్లే ఆ ప్రాజెక్టుకూడా ఓకే అయ్యిందట. ఆ వివరాల్లోకి వెళితే సంకల్ప్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రానా. ఇదో డిఫరెంట్ సినిమా. ఇండియా – పాకిస్తాన్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఓ సబ్ మెరైన్ మిస్టరీని తెరపై చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం అన్వేషి స్తున్న చిత్ర బృందం .. సమంతను సంప్రదించినట్లు తెలిసింది. సమంత కూడా చిత్రానికి డేట్లు సర్దుబాటు చేసే పనిలో వుందని సమాచారం. ఆరున్నరడుగుల ఎత్తున్న అబ్బాయి రానా పక్కన సమంత ఎలా కనిపిస్తుందో చూడాలి మరి.

09:34 - October 13, 2015

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బ్రూస్ లీ'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 16న విడుదల కావడానికి రెడీ అవుతుంది. కాగా ఈ సినిమా సెన్సార్ లో ఎటువంటి కట్స్ లేకుండా.... యూ/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకొంది. కాగా ఈ సినిమా రుద్రమ దేవి సినిమా రిలీజైన వారం రోజులకే రిలీజ్ కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 స్క్రీన్లలో ఈ సినిమా విడుదల చేయనున్నారు. అమెరికాలో 220 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ చేయడం తో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రామ్ చరణ్, రకుల్ హీరో హీరోయిన్లుగా ... నదియా, అరుణ్ విజయ్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు.

09:31 - October 13, 2015

విజయవాడ : కృష్ణమ్మ ఒడిలో దసరా సందడి మొదలైంది. ఇంద్రకీలాద్రిపై బెజవాడ దుర్గమ్మ నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు శ్రీస్వర్ణ కవచ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
శ్రీస్వర్ణ కవచ దుర్గాదేవిగా దర్శనం
భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలుస్తున్న బెజవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రోత్సవాలు ఈనెల 22 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తొలిరోజు అమ్మవారు శ్రీస్వర్ణ కవచ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
విజయదశమిన శ్రీ రాజరాజేశ్వరిదేవి
ఇక రెండోరోజు శ్రీబాలాత్రిపురసుందరీదేవీగా.., మూడోరోజు శ్రీగాయత్రీ దేవిగా, నాలుగోరోజు శ్రీమహాలక్ష్మీదేవిగా,.. ఐదో రోజు శ్రీఅన్నపూర్ణాదేవిగా, ఆరో రోజు శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా, ఏడో రోజు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతీ దేవీగా, ఎనిమిదో రోజు శ్రీదుర్గాదేవిగా, తొమ్మిదో రోజు దుర్గాష్టమి రోజున శ్రీమహిషాసురమర్ధనిగా,.. ఇక విజయదశమి రోజున శ్రీరాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
భారీగా రానున్న భక్తులు
రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలిరానున్న భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. కెనాల్‌ రోడ్డులోని వినాయకుడి ఆలయం నుంచి కొండపై వరకు ఐదు లైన్లలో క్యూలు ఏర్పాటు చేశారు. భక్తులు ఎండకు, వర్షానికి తట్టుకునేందుకు క్యూలైన్లపై షామియానాలు ఏర్పాటు చేశారు. స్నానఘాట్లలో తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలు వస్త్రాలు మార్చుకునేందుకు ప్రత్యేక రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రాథమిక చికిత్స కోసం 14 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 30 శాతం భక్తులు పెరిగే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల ప్రసాదాల కోసం 18 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచారు.
పట్టుచీరను సమర్పించిన సీపీ గౌతమ్‌ సవాంగ్‌ 
ఇక అమ్మవారికి నగర పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ పట్టుచీరను సమర్పించారు. దుర్గమ్మకు పట్టుచీర సమర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు గౌతమ్‌ సవాంగ్‌. ఇక దసరా ఉత్సవాల కోసం ఆలయ ప్రాంగణాన్ని మొత్తం విద్యుద్ధీపాలంకరణాలతో అలంకరించారు. మరోవైపు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

 

09:20 - October 13, 2015

రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రైతు సంఘం నేత సాగర్‌ విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా పత్తి విస్తీర్ణం పెరుగుతుందన్నారు. 1400 మంది రైతులు తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆత్మహత్మలు చేసుకున్నారు. విత్తన కంపెనీలు తమ లాభాల కోసం ఉత్పత్తిని పెంచాయన్నారు. విత్తనాలు, ఎరువులు తయారు చేసే కంపెనీలు, దళారులు లాభాల్లో ఉన్నారు. కానీ రైతులు మాత్రం నష్టాల్లో ఉన్నారని తెలిపారు. పండిస్తున్న పత్తికి అనుగుణంగా రాష్ట్రంలో కంపెనీలు లేవని వాపోయారు. రైతులు మాత్రమే సంక్షోభంలో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్నారు. వడ్డీ వ్యాపారస్తులను నియంత్రించాలని చెప్పారు. ప్రభుత్వం బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు ఇప్పించినప్పుడే వడ్డీ వ్యాపారాలను నియంత్రించడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే దళారులను ఆరికట్టాలని కోరారు. పత్తి రైతుకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. 'తెలంగాణలో ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. మరోవైపు పత్తికొనుగోళ్లు కేంద్రాల్లో రైతులకు ఆశాభంగం తప్పడం లేదు. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? పత్తి రైతుల జీవితాలు మెరుగుపడాలంటే ఈ సమయంలో ప్రభుత్వం ఎలాంటి చేయూతనందించాలి?' అనే అంశాలపై సాగర్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:49 - October 13, 2015

గుంటూరు : అందరూ భాగస్వాములవ్వాలి. ప్రతిఒక్కరూ తనవంతు బాధ్యత నిర్వహించాలి. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వేడుకను మరింత కమనీయంగా జరిపించాలి. నవ్యాంధ్ర రాజధాని శంకుస్ధాపన వేడుకపై ఏపి ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరు ఇది. కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణను కూడా సిద్ధం చేసింది. శంకుస్ధాపన మహోత్సవంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసే ఓ బృహత్తర ప్రయత్నానికి తెర తీసింది.
కేజి మట్టి-పావు లీటరు నీరు
రాజధాని అమరావతి శంకుస్ధాపనలో రాష్ట్ర ప్రజలందరిని భాగస్వామ్యులను చేయాలని ఏపి సర్కార్ డిసైడయింది. అనుకున్నట్లుగానే అక్టోబర్ 13 మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనమట్టి-మననీరు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మన మట్టి-మననీరు కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం నుంచి కేజి మట్టి- పావు లీటరు నీటిని తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించింది. ప్రతిష్ఠాత్మక రాజధాని నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు ఏకమై కదలాలని పిలుపునిచ్చింది.
వారం రోజులు రాజధాని శంకుస్ధాపన వేడుకలు
ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం వారం పాటు రాజధాని శంకుస్ధాపన వేడుక కార్యక్రమాలుంటాయి. మన అమరావతి, మన మట్టి-మన నీరు పేరుతో పండుగలా కార్యక్రమం చేపట్టాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు ఇప్పటికే టెలి కాన్ఫరెన్స్ ద్వారా జన్మభూమి కమిటీలు, స్ధానిక ప్రజా ప్రతినిధులకు సూచనలు చేసారు. మంగళవారం నుంచి 3 రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి పసుపు వస్త్రంలో కేజీ మట్టి, రాగి కలశంలో పావు లీటరు నీటిని సేకరించాలని చెప్పారు. అలా సేకరించిన మట్టి, రాగి కలశాన్ని ఈ నెల 16న ఆయా మండల కేంద్రాల్లో భద్రపరుస్తారు. తరువాతి రోజు అంటే అక్టోబర్‌ 17న ఆ మట్టి, నీటిని నియోజక వర్గ కేంద్రాలకు తరలిస్తారు.
వేడుకల్ని వీడియో తీయాలని ఆదేశం
ఇక మిగిలిన 3మూడు రోజులు గ్రామాల్లో విద్యార్ధులు, యువకులు ర్యాలీలు, దేవాలయాల్లో పూజలు నిర్వహించాలి. వీటితో పాటు రాజధాని శంకుస్ధాపన వేడుకకు సంబంధించి జరిగే ప్రతి కార్యక్రమాన్ని వీడియోతీసి జిల్లా కలెక్టర్‌ ద్వారా సీఆర్ డీఏ ఐటీ వింగ్‌కు పంపాలనేది ప్రభుత్వ సూచన. ఇక నియోజకవర్గ కేంద్రాల్లో భద్రపరిచిన మట్టి మూట, కలశాల్లోని నీటిని వాహనాల్లో అమరావతికి పంపాల్సి ఉంటుంది. ఈ వాహనాలకు మన మట్టి-మననీరు, దాని పక్కనే జిల్లా పేరు రాసి ఉన్న బ్యానర్లతో వాహనాలు అమరావతికి బయల్దేరాలి. అలా బయలు దేరిన 175 వాహనాలు 19వ తేదిన నాగార్జున యూనివర్సిటీకి చేరుకోవాలి. ఇక్కడ వీటి సంరక్షణా బాధ్యత మొత్తం సీఆర్ డీఏనే చూసుకుంటుంది. 20 తేదిన చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించే కార్యక్రమంతో ఈ వాహనాలు శంకుస్ధాపన ప్రాంతానికి తరలుతాయి. ఇక 21న దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నదుల పుణ్య జలాలతో కలిపి మట్టి-నీటిని శంకుస్ధాపనలో వినియోగిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఆహ్వానిస్తున్న ప్రజలు
ఇలా రాజధాని శంకుస్ధాపన వేడుకలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలనే అమరావతి సంకల్పాన్ని ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్లుగా శంకుస్ధాపన మహావేడుకను ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వ యంత్రాగం చెబుతోంది.

 

08:45 - October 13, 2015

మన దేశంలో పత్తి అత్యంత కీలకమైన పంట. 60 లక్షల మంది రైతులు పత్తినే సాగు చేస్తున్నారు. పత్తి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. పత్తి రైతుల కష్టాలకు కారణం ఏమిటి? పత్తి రైతులకు మద్దతు ధర ఎందుకు లభించడం లేదు?
వరి తర్వాత ఎక్కువ మంది సాగు చేస్తున్నది పత్తి
మనదేశంలో వరి తర్వాత ఎక్కువ మంది సాగు చేస్తున్నది పత్తి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్నాటక, గుజరాత్‌, పంజాబ్‌, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పత్తి ఎక్కువగా సాగవుతోంది. ఈ రాష్ట్రాల్లోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ లెక్క చాలదా? ఈ దేశంలో పత్తి రైతుల జీవితాలు ఎంత దుర్భరంగా మారుతున్నాయో అర్ధం చేసుకోవడానికి.
పత్తి విషయంలో మురిసిపోదగ్గ రికార్డులే
నిజానికి పత్తి విషయంలో మనమంతా మురిసిపోదగ్గ రికార్డులే మనదేశానికి వున్నాయి. చైనా, అమెరికాల తర్వాత పత్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం మనదే. ప్రపంచం మొత్తం మీద పత్తి పండించే ప్రతి నాలుగు ఎకరాల భూమిలో ఒక ఎకరం భూమి మనదేశానిదే. ప్రపంచంలో దాదాపు 850 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుంటే అందులో 225 లక్షల హెక్టార్లు మనదేశంలోనే వుంది.
కోటి లక్షల బేళ్ల పత్తి విదేశాలకు ఎగుమతి
మన దేశం నుంచి దాదాపు 75 నుంచి కోటి లక్షల బేళ్ల పత్తి విదేశాలకు ఎగుమతి అవుతోంది. వివిధ రకాల దుస్తుల ఎగుమతుల్లో మనం రెండో స్థానంలో వున్నాం. మన టెక్స్‌టైల్‌ ఎగుమతుల విలువ 40 బిలియన్‌ డాలర్లు దాటిపోయింది. అమెరికాకు దుస్తులు ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో మనది మూడోస్థానం. అయితే.... ఏం లాభం?
చిత్రవధ అనుభవిస్తున్న పత్తి రైతులెందరో....?
భారతదేశ ఆర్థికాభివృద్ధికీ, వాణిజ్యాభివృద్ధికి ఇంతగా తోడ్పడుతున్న పత్తి రైతుల జీవితాల్లోకి తొంగిచూస్తే వారి గుండెలోతుల్లోంచి కన్నీళ్లు జలజలారాలిపడతాయి. తమ బిడ్డలకు ప్రతి ఏటా కనీసం రెండు జతల మంచి దుస్తులైనా కొనివ్వలేని దీనత్వంలో మిలిపోతుంటారు. విత్తనాల కోసం కుదవపెట్టిన భార్య పుస్తెల తాడు తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేక, పిల్లలకు చదువు చెప్పించలేక, పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లకు పెళ్లి చేయలేక మానసికంగా నలిగిపోతూ, చిత్రవధ అనుభవిస్తున్న పత్తి రైతులెందరో....?
పత్తి రైతులకు ఎందుకింత దుస్థితి?
పత్తి రైతులకు ఎందుకింత దుస్థితి? మరే రంగంలోనూ లేనన్ని ఆత్మహత్యలు వ్యవసాయరంగంలోనే ఎందుకు జరుగుతున్నాయి? కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలున్నాయేమో కానీ పత్తి రైతుల చావులకి మాత్రం ఒకే ఒక్క కారణం వుంది. అదే ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం. గత సంవత్సరం పది దేశాలు పత్తి రైతులకు 650 కోట్ల డాలర్లను సబ్సిడీగా అందించాయి. ఇందులో చైనా వాటాయే 480 కోట్ల డాలర్లుంది. అంటే మన లెక్కల్లో దాదాపు 30 వేల కోట్లు. కానీ , నష్టాల్లో చిక్కుకున్న సీసీఐకి 2001 నుంచి 2011 వరకు ప్రభుత్వాలు ఇచ్చింది కేవలం 3వేల 99 కోట్లు. ఏడాదికి చైనా ఇచ్చిన 30 వేల కోట్లు ఎక్కడ? పదేళ్లలో ఇండియాలో ఇచ్చిన మూడువేల కోట్లెక్కడ? చివరకు అమెరికా కూడా తనదేశంలోని పత్తి రైతులకు భారీగా సబ్సిడీలిస్తోంది. ఓ పాతిక వేలమంది పత్తి రైతులు 300 కోట్ల డాలర్ల విలువైన పత్తిని పండిస్తే వారికి ప్రభుత్వం 450 కోట్ల డాలర్ల విలువైన సబ్సిడీలిచ్చినట్టు ఓ అధ్యయనంలో తేలింది. ఈ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు ఎదురైనా చైనా, అమెరికా రైతులు నిబ్బరంగా వుండగలుగుతున్నారు. చైనా, అమెరికాలు ప్రదర్శిస్తున్న ఇలాంటి ఔదర్యాన్ని మన పత్తి రైతుల విషయంలో మన ప్రభుత్వాలు ఎందుకు ప్రదర్శించడం లేదు.?
6 కోట్ల కుటుంబాల జీవితాలు దూదిపూలతో అనుసంధానం
మనదేశంలో దాదాపు ఆరు కోట్ల కుటుంబాల జీవితాలు దూదిపూలతో అనుసంధానమై వున్నాయి. 60 లక్షల మంది నేరుగా పత్తి పండిస్తుంటే, అయిదు కోట్ల మందికి పైగా టెక్స్‌టైల్‌ సంబంధ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. ఇంతమంది యోగక్షేమాల గురించి ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వాలు నాలుగైదు పత్తి విత్తన కంపెనీల సేవలో తరించిపోతున్నాయి. 450 గ్రాములుండే పత్తి విత్తన ప్యాకెట్‌ మీద కంపెనీ యజమానికి ఎంతలేదన్నా 200 రూపాయల లాభం వస్తే, అదే విత్తనాలను భూమిలో చల్లి, ఆరుగాలం కష్టపడ్డ రైతులకు చివరకు మిగులుతున్నదేమిటి?
ప్రభుత్వం తీరు వల్లే రైతులకు కష్టాలు
నకిలీ విత్తనాలు వెక్కిరించినా, నాణ్యత లేని పురుగుమందులు పరిహసించినా, పత్తి చేతికొచ్చిన సమయంలో మార్కెట్‌ శక్తులు జూదమాడినా, కొనుగోళ్ల విషయంలో సీసీఐ చిత్తశుద్ధి ప్రదర్శించకపోయినా, తేమ పేరుతో, నాణ్యత పేరుతో దళారీలు మద్దతు ధరకు ఎసరు పెడుతున్నా ప్రభుత్వం కళ్లుమూసుకుంటున్న కారణంగానే రైతులకు ఇన్ని కష్టాలు. ఇన్ని వేదనలు.

 

జగన్ దీక్ష కొనసాగిస్తున్నారు : చెవిరెడ్డి

గుంటూరు : జీజీహెచ్ లో జగన్ దీక్ష కొనసాగిస్తున్నారని వైసిపి నేత చెవిరెడ్డి అన్నారు. జగన్ దీక్ష భగ్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 

నేడు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటించన

తిరుపతి : నేడు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రబాబు పుట్టమన్ను సేకరించనున్నారు. 

ఉ.11 గంటలకు పార్టీ కార్యాలయంలో వైసిపి ముఖ్యనేతల భేటీ

గుంటూరు : ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయంలో వైసిపి ముఖ్యనేతలు భేటీ కానున్నారు.

 

06:57 - October 13, 2015

గుంటూరు : జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు. చిట్టిగుంట ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత పల్లెవెలుగు బస్సును తగులబెట్టారు. ఘటనా సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు

గుంటూరు : జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు. చిట్టిగుంట ప్రాంతంలో అర్థరాత్రి దాటిన తర్వాత పల్లెవెలుగు బస్సును తగులబెట్టారు. ఘటనా సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

06:52 - October 13, 2015

గుంటూరు : ఎపికి ప్రత్యేకహోదా కోరుతూ వైఎస్‌ జగన్‌ చేపట్టిన దీక్ష భగ్నమైంది. తెల్లవారుజామున 4గంటలకు జగన్‌ నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రత్యేక అంబులెన్స్‌లో జగన్‌ను జీజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసేటప్పుడు వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షా శిబిరం వద్ద గుమిగూడారు. దీక్షను విరమించేది లేదని జగన్ వారించినా..పోలీసులు బలవంతంగా జగన్ దీక్షను భగ్నం చేశారు. దీక్ష 7వ రోజుకు చేరుకోవడంతో జగన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. బీపీ, షుగర్‌ లెవల్స్‌ బాగా పడిపోవడంతో..జగన్‌ బాగా నీరసించిపోయారు. దీంతో ఎలాగైనా జగన్‌ను ఆసుపత్రికి తరలించాలన్న ఉద్దేశ్యంతో దీక్షను పోలీసులు భగ్నం చేసి..గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసేటప్పుడు వైసిపి కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు స్పల్ప లాఠీచార్జ్‌ చేయడంతో కార్యకర్తలంతా పరుగులు పెట్టారు. ప్రస్తుతం వైఎస్‌ జగన్ జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 7రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నిరసంగా ఉన్నారు. దీంతో శరీరానికి శక్తినిచ్చే ఫ్లూయిడ్స్‌ను వైద్యులు ఎక్కిస్తున్నారు. 

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జగన్ కు చికిత్స

గుంటూరు : వైఎస్ జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అంబులెన్స్ లో ఆయన్ను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు జగన్ కు చికిత్స అందిస్తున్నారు. ఫ్లూయిడ్స్, ఎక్కిస్తున్న వైద్యులు.. జగన్ నిరాకరిస్తున్నారు. వైసిపి శ్రేణులు జీజీహెచ్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఎపికి ప్రత్యేకోహదా కోసం ఆరు రోజులుగా జగన్ దీక్ష చేస్తున్నారు.

 

జగన్ దీక్ష భగ్నం

గుంటూరు : వైఎస్ జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అంబులెన్స్ లో జగన్ ను ఆస్పత్రికి తరలించారు. వైసిపి కార్యక్ర్తలు అంబులెన్స్ ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఎపికి ప్రత్యేకహోదా కోసం 6 రోజులుగా జగన్ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. 

Don't Miss