Activities calendar

14 October 2015

21:31 - October 14, 2015

ఢిల్లీ : దాద్రీపై ప్రధాని మోది ఆలస్యంగా స్పందించడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. భారత క్రికెట్‌ జట్టు గెలవగానే తక్షణమే శుభాకాంక్షలు చెప్పే ప్రధాని- దాద్రీ ఘటనపై ఇంత ఆలస్యంగా ప్రతిస్పందించడంపై నిలదీశాయి. దేశానికి ప్రధానమంత్రినన్న సంగతి మోది మరచి పోతున్నారని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. దాద్రి ఘటన జరిగిన 15 రోజులకు ప్రధాని స్పందించడాన్ని విపక్షాలు విమర్శించాయి. దాద్రీ ఘటన అనంతరం వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, సంజీవ్ బల్యాన్, బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ తదితరులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాల్పిన బాధ్యత ప్రధానిపై ఉందని కాంగ్రెస్ పేర్కొంది. దాద్రీపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడం, ప్రతిపక్షాలు వేలెత్తి చూపడం వల్లే ప్రధాని స్పందించారే తప్ప మరోటి కాదని సిపిఐ నేత రాజా అన్నారు.

ఇప్పుడు సారీ చెబుతారా ? 
దాద్రి ఉదంతం జాతి మనోభావాలను దెబ్బతీసిందని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ ఆక్షేపించారు. ప్రపంచమంతా ఖండించిన తర్వాత నరేంద్ర మోదీ ప్రకటన చేయడం శోచనీయమన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి అనుబంధ సంస్థలు నరేంద్ర మోదీని 'గోద్రా హీరో'గా భావిస్తున్నాయని ఆజం ఖాన్ అన్నారు. మోదీ స్పందనపై లాలూ తీవ్రంగా మండిపడ్డారు. కొట్టి చంపాక సారీ చెప్పడం ఇదేం పద్దతని విమర్శించారు. పూటకో మాట మాట్లాడే వారిని ఎవరూ నమ్మరన్నారు. ఇంత గ్యాప్‌ వచ్చాక మోడీ స్పందించడం సరికాదన్నారు. నిజాయితీ లేని ప్రకటనను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని జెడియు అధ్యక్షులు శరద్‌యాదవ్‌ అన్నారు.

గోమాంసం తిన్నాడని ఇఖ్లాక్ హత్య..
యూపీ దాద్రీలోని బిసడ గ్రామంలో గోవు మాంసం నిల్వచేశారనే పుకార్లతో 52 ఏళ్ల ఇఖ్లాక్‌ను కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. 15 రోజుల తర్వాత దాద్రి ఘటన దురదృష్టకరమంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఓ బెంగాల్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో స్పందించడం విమర్శలకు తావిస్తోంది.

21:27 - October 14, 2015

నల్గొండ : రైతులు ఆత్మహత్యలతో రాష్ట్రం అట్టుడుకుతుంటే టీఆర్‌ఎస్‌ సర్కారు మాత్రం పండుగలు చేసుకుంటోందని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయని కేసీఆర్‌.. తన కొడుకు, కూతురు, అల్లుడికి వేల కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. 

21:24 - October 14, 2015

హైదరాబాద్ : పౌరసరఫరాల శాఖలో అక్రమాల నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతున్నామని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంతో సరుకులు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కొన్ని చోట్ల అధికారుల ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని మండిపడ్డారు. ఈ అక్రమాలపై టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. బియ్యం డీలర్లతో సంబంధాలున్నట్లు..రాజకీయ నేతలతో సంబంధం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బియ్యం దుకాణాలు..హాస్టల్స్..ట్రాన్స్ పోర్టు..గౌడోన్లలో ఉన్న పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. ఇటీవల టిటిడిపి నేత రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దొడ్డు బియ్యాన్ని పాలిషింగ్ చేసి సన్న బియ్యం అంటూ హాస్టల్స్..మధ్యాహ్నా భోజన పథకానికి పంపిణీ చేస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. వెంటనే దీనిపై విచారణ కమటీ వేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

21:22 - October 14, 2015

గుంటూరు : ప్రత్యేకహోదా ఉద్యమాన్ని వైసీపీ ఉధృతం చేసింది. ఏది ఏమైనా ప్రత్యేక హోదా సాధించేంతవరకు పోరాటాన్ని ఆపేది లేదని తెగేసి చెప్తోంది. ప్రకటించిన భవిష్యత్ కార్యాచరణకు అనుగుణంగానే నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మున్ముందు కాలంలో ప్రత్యేక హోదా నిరసనలను ముమ్మరం చేస్తామని వైసీపీ హెచ్చరిస్తోంది. విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి సీఎం క్యాంప్‌ కార్యాలయం వరకు నిరసన మార్చ్‌ చేపట్టాయి. అయితే నిరసన ప్రదర్శనకు అనుమతి లేదంటూ ర్యాలీగా బయల్దేరిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
తమకు ఎలాంటి దురుద్దేశం లేదని నిరసన మార్చ్ శాంతియుతంగానే నిర్వహిస్తామని చెప్పినప్పటికి పోలీసులు ససేమిరా అన్నారు. అయినా వైసీపీ నేతలు నిరసన మార్చ్ నిర్వహించేందుకు ప్రయత్నించటంతో పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్ధితి ఉద్రిక్తంగా మారుతుండటంతో వైసీపీ నేతలను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసారు. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వంగవీటి రాధ, కొడాలి నాని, కొలుసు పార్ధసారధిలను అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా చేయదల్చుకున్న నిరసన మార్చ్ ను అడ్డుకున్నందుకు, తమ నేతలను అరెస్ట్ చేసినందుకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు జనరల్ హాస్పిటల్‌ నుంచి వైయస్‌. జగన్‌ డిశ్చార్జి అయ్యారు. గన్నవరం ఎయిర్‌ పోర్టుకు వచ్చిన జగన్‌ ఫ్లైట్ ద్వారా హైదరాబాద్‌కు చేరుకున్నారు.

21:19 - October 14, 2015

ఢిల్లీ : ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సహా పలువురు కేంద్ర మంత్రులను క్యాపిటల్‌ ఫౌండేషన్‌ సెర్మనీకి ఇన్‌వైట్‌ చేశారు. పనిలో పనిగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ అంశాలను పరిష్కరించాలని కేంద్ర మంత్రులకు విన్నవించారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన ఆయన... వరుస భేటీలతో బిజీ బిజీగా గడిపారు. ముందుగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిసి అమరావతి శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. ఏపీ భవన్‌లో ఢిల్లీ సీఎంతో భేటీ అయిన చంద్రబాబు... కేజ్రీవాల్‌కు ఆహ్వానపత్రిక అందజేశారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు చంద్రబాబు. రాజధాని శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఏపీకి తరలివచ్చే వారికి స్థానికత కల్పించేందుకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేయాలని రాజ్‌నాథ్‌ను చంద్రబాబు కోరినట్లు సమాచారం. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ అయ్యారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంపై నివేదికను మోడీకి అందజేశారు. ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా చంద్రబాబు.. మోడీని ఆహ్వానించారు. రాజధాని శంకుస్థాపనకు అరుణ్‌జైట్లీ, సుప్రీంకోర్టు సీజే హెచ్‌ఎల్‌ దత్తును ఏపీ సిఎం చంద్రబాబు వేరువేరుగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జైట్లీ, బాబు మధ్య పోలవరం, పెండింగ్‌ అంశాలపై చర్చ జరిగింది. ఏపీని అన్నీ విదాలుగా ఆదుకుంటామని జైట్లీ చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

21:08 - October 14, 2015

ఇండోర్ : రెండో మ్యాచ్ లోనైనా గెలుస్తారా ? ఓడిపోతారా ? అని భావించిన భారత అభిమానులను టీమిండియా సంతృప్తి పరిచింది. ఒక దశలో ఓడిపోతారా అని అభిమానులు భావించారు. కానీ భారత బౌలర్ల విజృంభనతో టీమిండియా గెలుపు సాధించింది. ఐదు వన్డేల సిరీస్ ను 1-1తో సమయం చేసింది. 22 పరుగుల తేడాతో ధోని సేన గెలిచింది. తొలుత టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు విఫలం కావడం..రహానే..ధోని పోరాటంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. అనంతరం 248 పరుగుల లక్ష్యంతో సౌతాఫ్రికా బరిలోకి దిగింది. ఓపెనర్లు ఆమ్లా, కాక్ లు ధాటిగానే ఆడారు. సింగిల్స్..ఫోర్సు తీస్తూ భారత బౌలర్లపై ఆరంభంలోనే వత్తిడి తెచ్చారు. జట్టుస స్కోరు 40 పరుగుల వద్ద ఉన్నప్పుడు పటేల్ బౌలింగ్ లో ఆమ్లా (17) వెనుదిరిగాడు. తరువాత కాక్ తో డుప్లెసిస్ జత కలిశాడు. వీరు కూడా భారత బౌలర్లపై తమ ప్రతాపం చూపెట్టారు. అడపదడపా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. జట్టు స్కోరు 52 పరుగుల వద్ద కాక్ (34) అవుట్ అయ్యాడు. డుప్లెసిస్ కు డుమిని కలిశాడు. వీరిద్దరూ వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. కానీ 134 పరుగుల వద్ద డుమిని పెవిలియన్ చేరాడు. మరోవైపు డుప్లెసిస్ హాఫ్ సెంచరీ సాధించాడు. దీనితో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. చివరకు పటేల్ ఆందోళనకు తెరదించాడు. డుప్లెసిస్ (51) పెవిలయన్ పంపించాడు. అనంతరం వచ్చిన ఇతర క్రీడాకారులు ఏ మాత్రం నిలదొక్కులేదు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వికెట్లు వెంటనే వెంటనే పడిపోయాయి. 

ధోని పోరాటం..
తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియాకు సౌతాఫ్రికా జట్టు బౌలర్లు చుక్కలు చూపించారు. మొదటి వన్డేలో రాణించిన రోహిత్ శర్మ మూడు పరుగులకే అవుట్ కావడం అభిమాలను తీవ్ర నిరాశకు గురి చేసింది. అనంతరం ధావన్ కు రహానే జత కలిశాడు. వీరిద్దరూ కలిసి వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. 50 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన అనంతరం ధావన్ (23) అవుట్ అయ్యాడు. తరువాత వచ్చిన కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా రాణించలేదు. కేవలం 12 పరుగులకే అవుట్ అయ్యాడు. ధనా ధన్ ధోని జాగ్రత్తగా ఆడుతూ గౌరవప్రదమైన స్కోరు సాధించే ప్రయత్నం చేశాడు. అదుపుతప్పిన బంతులను రహానే బౌండరీలకు తరలించి స్కోరు బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. ఈ తరుణంలో రహానే (51) అర్ధ సెంచరీ సాధించి వెంటనే అవుట్ అయ్యాడు. రైనా డకౌట్ అయ్యాడు. అప్పటికీ జట్టు స్కోరు 104 పరుగులు. అనంతరం వచ్చిన మిగతా బ్యాట్ మెన్స్ ఎక్కువ సేపు నిలబడలేదు. దీనితో అంతా ధోనిపై బాధ్యత పడింది. చివరకు ధోని బ్యాట్ ఝులిపించి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసింది. ధోని 92 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.

భారత్ స్కోరు కార్డు : శర్మ (3), ధావన్ (23), రహానే (51), కోహ్లీ (12), ధోని (92, నాటౌట్), రైనా (0), పటేల్ (13), భువనేశ్వర్ కుమార్ (14), హర్భజన్ సింగ్ (22), ఉమేష్ యాదవ్ (4), శర్మ (0, నాటౌట్)
దక్షిణాఫ్రికా బౌలింగ్ : స్టేన్ (3), మోర్కెల్ (2), తాహిర్ (2), రబడ (1) వికెట్లు తీశారు.
దక్షిణాఫ్రికా స్కోరు : ఆమ్లా (17), కాక్ (34), డుప్లెసిస్ (51), డుమిని (36), విలియర్స్ (19), మిల్లర్ (0), బెహార్డీన్ (18), స్టేన్ (13), రబడ (19, నాటౌట్), తాహిర్ (9), మోర్కెల్ (4).
భారత బౌలింగ్ : భువనేశ్వర్ (3), పటేల్ (3), హర్భజన్ సింగ్ (2), యాదవ్ (1), శర్మ (1) వికెట్ తీశారు. 

ఇండోర్ లో ఇండియా గెలుపు..

ఇండోర్ : రెండో మ్యాచ్ లోనైనా గెలుస్తారా ? ఓడిపోతారా ? అనే భారత అభిమానులను టీమిండియా సంతృప్తి పరిచింది. ఒకదశలో ఓడిపోతారా అని అభిమానులు భావించారు. కానీ భారత బౌలర్ల విజృంభనతో టీమిండియా గెలుపు సాధించింది. తొలుత టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు విఫలం కావడం..రహానే..ధోని పోరాటంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. అనంతరం 248 పరుగుల లక్ష్యంతో సౌతాఫ్రికా బరిలోకి దిగింది. ఓపెనర్లు ఆమ్లా, కాక్ లు ధాటిగానే ఆడారు. సింగిల్స్..ఫోర్సు తీస్తూ భారత బౌలర్లపై ఆరంభంలోనే వత్తిడి తెచ్చారు.

వైభవంగా రాజధాని శంకుస్థాపన – చంద్రబాబు..

ఢిల్లీ : అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అనంతరం బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజధాని శంకుస్థాపనంలో అందరి భాగస్వామ్యం ఉండాలని, అన్ని గ్రామాల నుండి మట్టి, నీరు సేకరిస్తున్నట్లు చెప్పారు. 

20:32 - October 14, 2015

నిజామాబాద్ : గడీల బతుకమ్మ కాదు..బడుగుల బతుకమ్మ ఆడుదామని తెలంగాణ మహిళా, సాంస్కృతిక సంఘాల ఐక్య వేదిక చేపట్టిన యాత్ర నిజామాబాద్ కు చేరుకుంది. మహిళా సంఘాల నేతృత్వంలో ధర్నా చౌక్ వద్ద బతుకమ్మ ఆడారు. మహిళలు, చిన్నారులు సందడిగా ఆడి పాడారు. స్త్రీలపై హింస లేని తెలంగాణ రాష్ట్రాన్ని సాదిద్ధామని సంఘ నేతలు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్ నుంచి యాత్ర ప్రారంభమైంది. అక్టోబర్ 12న వరంగల్ జిల్లా నర్సంపేట, అక్టోబర్‌ 13 కరీంనగర్ జిల్లా గోదావరి ఖని, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల యాత్ర జరిగింది. అక్టోబర్ 14 నిజామాబాద్‌, అక్టోబర్ 15 మెదక్ జిల్లా సంగారెడ్డి, అక్టోబర్ 16 వికారాబాద్‌ రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 17 గద్వాల మహబూబ్‌నగర్ జిల్లా, అక్టోబర్ 18 ఖమ్మం, అక్టోబర్‌ 19 నల్గొండలో నిర్వహించి అక్టోబర్ 20న ట్యాంక్‌ బండ్‌ పై బతుకమ్మ యాత్ర ముగియనుంది.

20:23 - October 14, 2015

హైదరాబాద్ : వచ్చే ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రాజధాని ప్రాంతంలోనే జరగనున్నాయా ? ఇందుకోసం తాత్కాలిక అసెంబ్లీ భవనం నిర్మించాలనుకుంటున్నారా ? భవన నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకోవడానికి తెలంగాణ, ఆంధ్రా టీడీపీ నేతలు పోటీపడుతున్నారా ? పైరవీ కారులు స్పీకర్‌ కోడెలపై ఒత్తిడి పెంచుతున్నారా..? పరిస్ధితులు, పరిణామాలు చూస్తోంటే అవుననే అన్పిస్తోంది. కొత్త రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు ఓ వైపు ఊపందుకుంటోంటే మరో వైపు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రాజధానిలో జరపాలని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత స్వరాష్ట్రంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోడెల గట్టిగా ప్రయత్నించినా...సరైన భవనం లేక వెనక్కి తగ్గారు.

యూనివర్సిటీ ఆడిటోరియం పరిశీలన..
వర్షాకాల సమావేశాల కోసం అప్పట్లో విశాఖ, గుంటూరులోని యూనివర్సిటీ ఆడిటోరియంలను పరిశీలించారు. అయితే వసతి ఇబ్బందుల దృష్ట్యా వర్షాకాల సమావేశాలు హైదరాబాద్‌లోనే నిర్వహించారు. ప్రస్తుతం రాజధాని శంకుస్థాపన జరుగుతుండటంతో...ఇప్పటికే ప్రధాన శాఖలు అన్నీ విజయవాడకు తరలుతున్నాయి. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాలు ఎట్టి పరిస్థితుల్లో తుళ్ళూరులో నిర్వహించాలని కోడెల భావిస్తున్నారు. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్న తాత్కాలిక అసెంబ్లీ భవనాల కాంట్రాక్ట్ తమకే ఇవ్వాలని తెలంగాణకు చెందిన టిడిపి రాజ్యసభ ఎంపీ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వియ్యంకుడు గరికపాటి మోహనరావు ఎంట్రీ ఇచ్చారు. స్పీకర్ నిర్వహించిన సమావేశానికి హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం...ఏపీ తెలుగు తముళ్ళలో కలవరం రేపుతోంది.

అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదే..
రాష్ట్ర విభజన తర్వాత తుమ్మల టిడిపిని వీడి టి.ఆర్.ఎస్‌లో చేరి మంత్రి అయ్యి టిడిపిని ,చంద్రబాబుని విమర్శించటం తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వయంగా తుమ్మలకు వియ్యంకుడు అయి ఇప్పుడు ఏపీలో జరిగే పనులు తమకే కావాలని ఎలా పట్టుబడతారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ నేతలకు ఇక్కడ కాంట్రాక్టులు ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు ఆంధ్రా టిడిపి లీడర్లు. అయితే స్పీకర్ కార్యాలయం మాత్రం ఇది ప్రాథమిక సమావేశం మాత్రమేనని దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదే అని చెప్పుకొస్తుంది. 

20:16 - October 14, 2015

హైదరాబాద్ : ఏకపక్ష నిర్ణయాలంటూ టీ సర్కారుపై విమర్శల వాన కురుస్తూనే ఉంది. నిన్నటివరకూ ప్రతిపక్షాలు ఈ ఆరోపణలతో వేడెక్కించగా.. ఇప్పుడు విద్యుత్ రంగ నిపుణులు వంతొచ్చింది.. ఎవరినీ సంప్రదించకుండా చత్తీస్‌గఢ్‌తో ఒప్పందం కుదర్చుకున్నారని వీరంతా మండిపడుతున్నారు.. ఈ అగ్రిమెంట్‌తో తెలంగాణకు చాలా నష్టం జరుగుతుందంటూ టీ విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాశారు. తెలంగాణలో కరెంటు కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం.. చత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. వెయ్యి మెగావాట్ల కరెంటు కొనుగోలుకు రెండు ప్రభుత్వాల మధ్య అగ్రిమెంట్‌ కుదిరింది. ఇందుకోసం టీసర్కారు ప్రతి ఏడాది 13వందల 14కోట్లు చెల్లించాల్సిఉంటుంది. ఈ ఒప్పందంపై అభ్యంతరాలుంటే తెలపాలని టీ విద్యుత్ నియంత్రణమండలి బహిరంగ ప్రకటన జారీచేసింది. దీనికి స్పందించిన విద్యుత్ రంగ నిపుణులు ఈ ఒప్పందంవల్ల జరిగే నష్టాలను వివరిస్తూ విద్యుత్ మండలికి లేఖ రాశారు.

విద్యుత్ ఒప్పందం ఏకపక్షంగా ఉందంటున్న నిపుణులు..
చత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం ఏకపక్షం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఇది తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఉందని వాదిస్తున్నారు. ఒకవేళ ఇతర కారణాలతో కరెంటు కొనుగోలు చేయక పోయినా స్థిర చార్జీల రూపంలో ప్రతి ఏడాది 13వందల 14కోట్లు చెల్లించక తప్పదని సూచిస్తున్నారు. అలాగే రెగ్యులర్ విద్యుత్ ఒప్పందాలకు ఉండే కనీస లక్షణాలు ఇందులో లేవని ఆరోపిస్తున్నారు. పూర్తిగా చత్తీస్‌గఢ్‌కు అనుకూలంగా ఉన్న ఈ అగ్రిమెంట్‌వల్ల భవిష్యత్తులో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని లేఖలో రాశారు నిపుణులు.

ఒప్పందాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించొద్దని సూచన..
మరోవైపు విద్యుత్ కొనుగోళ్లకు టెండర్లు పిలవకుండానే ప్రభుత్వం చత్తీస్‌గఢ్‌తో డైరెక్టుగా ఒప్పందం కుదుర్చుకుందని విమర్శలొస్తున్నాయి. అంతకంటే తక్కువధరకు అందించే ఇతర కంపెనీలున్నా ఇలా అగ్రిమెంట్‌ కుదుర్చోవడం సరికాదంటున్నారు. పైగా టారిఫ్‌కు సంబంధించి ఇందులో ఎలాంటి నిబంధనలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించొద్దని నిపుణులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఒప్పందంపై బహిరంగ విచారణ జరిపి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని విద్యుత్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. టెండర్లకు వెళ్లేలా పంపిణీ సంస్థలను ఆదేశించాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

20:12 - October 14, 2015

ఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన దాద్రి ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు స్పందించారు. దాద్రి, గులాం అలీ కార్యక్రమం అడ్డుకోవడంలాంటి ఘటనలు విచారకరం, దురదృష్టకరమన్నారు. బీజేపీ ఇలాంటి ఘటనలకు మద్దతివ్వదని పేర్కొన్నారు. వీటిపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. విపక్షాల బూటకపు లౌకికత్వానికి బీజేపీ విరుద్ధం' అని చెప్పారు. విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఓ బెంగాల్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ప్రధాని దాద్రి ఘటనను ప్రస్తావించారు. సుదీంధ్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తల దాడిని కూడా ప్రధాని ఖండించారు.  

20:10 - October 14, 2015

ఢిల్లీ : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణానికి సంబంధించిన సంధిగ్దతకు తెరపడనుందా? నేతాజీకి సంబంధించిన ఫైళ్లు 2016లో బహిర్గతం కానున్నాయి. నేతాజీ రహస్య ఫైళ్లను బయటపెట్టాలన్న బోసు కుటుంబం ప్రధానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్రమోది నేతాజీ జయంతి సందర్భంగా తొలిదశ రహస్య ఫైళ్లను బహిర్గతం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. దీంతో నేతాజీ మృతిపై 70 ఏళ్లుగా కొనసాగుతున్న మిస్టరీ వీడే అవకాశం ఉంది.
నేతాజి మృతి..అదృశ్యం వెనుక గత 70 ఏళ్లుగా మిస్టరీ నెలకొంది. కాంగ్రెస్ నిఘా కొనసాగించిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మన్ కీ బాత్ కార్యక్రమంలో నేతాజీ కుటుంబసభ్యులందరినీ కలుసుకుంటానని మోడీ హామీనిచ్చారు. దీనితో నేతాజి ఫ్యామిలీకి చెందిన 50 మంది బుధవారం మోడీని కలిశారు. ఈ విషయంలో రష్యా..చైనా..ఇతర దేశాలను సంప్రదించాలని ఎన్డీయే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

19:53 - October 14, 2015

విశాఖపట్టణం : బాక్సైట్ తవ్వకాలు ఏజెన్సీ టిడిపి ప్రజాప్రతినిధుల గుండెల్లో గునపాలు గుచ్చుకుంటున్నాయి. మావోయిస్టుల హెచ్చరికలు..ఏపీ ప్రభుత్వం వైఖరితో పార్టీ ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అలజడి రేగుతోంది. ఇటీవలే కొత్తగూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు మామిడి బాలయ్య పడాల్ (45) గూడెం గ్రామానికి చెందిన జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్కలి మహేష్ (42), కొత్తూరు గ్రామానికి చెందిన వండలం బాలయ్య(48)లను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. బాక్సైట్ తవ్వకాలను నిలుపుదల చేయాలని, ప్రభుత్వ వైఖరి వెల్లడించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. కానీ ప్రభుత్వం స్పష్టమైన హామీనివ్వకపోతుండడంతో టిడిపి ప్రజాప్రతినిధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాడేరులో ముగ్గురు మార్కెట్ డైరెక్టర్లు రాజీనామా చేయగా గురువారం అనాకపల్లిపల్లి పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎదుట 11మండలాల ఏజెన్సీలకు చెందిన టిడిపి ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కిడ్నాప్ లకు గురైన టిడిపి నేతల కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

సౌతాఫ్రికా 142/5..

ఇండోర్ : టీ మిండియా విధించిన 248 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడానికి సౌతాఫ్రికా బ్యాట్ మెన్స్ శ్రమిస్తున్నారు. 27.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 143 పరుగులు సాధించింది. విలియర్స్ 3, బెహార్డీన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

19:30 - October 14, 2015

నిజామాబాద్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ ఎంపీ కవిత బతుకమ్మ పేర్చి ఆట ఆడారు. వీక్లీ మార్కెట్ మైదానంలో జరిగిన బతుకమ్మ సంబరాలు భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కవితతో కరచాలనం చేసేందుకు పోటీ పడడంతో తోపులాట చోటు చేసుకుంది. అక్కడనే ఉన్న పోలీసులు మహిళలను శాంతిపచేశారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు కళా ప్రదర్శనలు ఇచ్చారు. 

19:23 - October 14, 2015

పశ్చిమగోదావరి : జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. బుధవారం హైకోర్టులో దీనిపై విచారణ జరిగింది. జిల్లా మొత్తం ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని స్టే విధించిన ఉన్నత ధర్మాసనం తాజాగా కేవలం పత్తిలంకలో ఇసుక తవ్వకాలను నిషేధం విధించాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా మొత్తం ఇచ్చారని ఇసుక తవ్వకాలు ఆపివేశారని న్యాయవాది పేర్కొన్నారు. హైకోర్టు స్టే తో జిల్లాలో ఇసుక తవ్వకాల కొరత ఏర్పడిందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఇసుక తవ్వకాలపై గతంలో కోర్టు మండిపడిన సంగతి తెలిసిందే. ఇసుక తరలింపు పెద్ద మాఫియాగా మారిందని వ్యాఖ్యానించింది. జిల్లాలో ఇసుక తవ్వకాలపై కలెక్టర్ వివరణతో సంతృప్తి చెందని కోర్టు.. అక్రమ ఇసుక రవాణ ఎందుకు అరికట్టలేదని ప్రశ్నించింది. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఇసుక మాఫియాపై అనేక విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల నేతృత్వంలో ఇసుక మాఫియా జరుగుతుందనే ఆరోపణలూ వున్నాయి. ఈ వ్యవహారంలో ఇటీవలే ముసునూరు తహశీల్దార్ వనజాక్షి పై దాడి ఘటన పరిస్థితిని అద్దం పట్టింది.

19:11 - October 14, 2015

రంగారెడ్డి : చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగం..కానీ నీచమైన పనికి ఒడిగట్టాడు. ఓ వైద్యురాలిపై అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈఘటన రాజేంద్రనగర్ మండలంలోని బండ్లగూడలో చోటు చేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లో మనోజ్ సాఫ్ట్ వేర్, మహిళా వైద్యురాలు నివాసం ఉంటున్నారు. తనకు జ్వరం వచ్చిందని..విషమంగా ఉందంటూ వైద్యురాలికి మనోజ్ ఫోన్ చేసి తెలిపాడు. అక్కడకు చేరుకున్న అనంతరం మనోజ్ కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి వైద్యురాలికి ఇచ్చాడు. ఇది తెలియని ఆ వైద్యురాలి తాగి సృహ కోల్పోయింది. అనంతరం మేల్కోన్న తరువాత విషయం తెలుసుకుంది. వెంటనే వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు మనోజ్ ను అదుపులోకి తీసుకున్నారు. 

ప్రత్యేక హోదా కోసం విద్యార్థి ఆత్మహత్యాయత్నం..

ప్రకాశం : ఒంగోలు (మం) గద్దలకుంటలో విద్యార్థి వివేక్ ఆత్మహత్యాయత్యానికి ఒడిగట్టాడు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వివేక్ పురుగుల మందు తాగాడు. ఇతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్కాపురం చైతన్య కాలేజీలో బీ ఫార్మసీ అభ్యసిస్తున్నాడు. 

వైద్యురాలిపై సాఫ్ట్ వేర్ ఉద్యోగి అత్యాచారం..

రంగారెడ్డి : రాజేంద్రనగర్ (మం) బండ్లగూడలోని ఓ అపార్ట్ మెంట్ లో మహిళా వైద్యురాలిపై సాఫ్ట్ వేర్ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

మానవపాడు చోరీని చేధించిన పోలీసులు..

మహబూబ్ నగర్ : గత నెల 27వ తేదీన మానవపాడు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. మధ్యప్రదేశ్ కు చెందిన నిందితుడు మహబూబ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్ నుండి రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు, ముఠా సభ్యుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు డీఐజీ గంగాధర్ వెల్లడించారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. 

18:35 - October 14, 2015

పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు చేపట్టిన మహా పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. కోమర్రు గ్రామం నుండి పోలసానిపల్లె వరకు ఈ పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో మట్టి పవిత్ర జలాలు సేకరించారు. ఈ పాదయాత్రకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే టెన్ టివితో మాట్లాడారు. మంగళశారం ఉదయం పాదయాత్ర ప్రారంభించడం జరిగిందని సుమారు 60 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. పాదయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని పేర్కొన్నారు. 

18:22 - October 14, 2015

కృష్ణా : ఏపీ రాష్ట్రంలో రైతన్న ఆత్మహత్యలు ఆగడం లేదు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక..ఎండిపోతున్న పంటలు..తీవ్రమైన వత్తిడిలు భరించలేని రైతన్నలు తనువు చాలిస్తే చాలని అనుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీనితో ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా జిల్లాలో కొత్తపేట ప్రాంతానికి చెందిన అప్పికట్ల నర్సింహరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎకన్నరం పొలంతో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. కాలువ నీరు విడుదలవుతుందని ఆశించిన నర్సింహరావు వరి నారుమళ్లు వేశాడు. నీరు రాకపోవడంతో పంట ఎండిపోయింది. బోర్లు వేసుకుని పంటను కాపాడుకుందామనే ప్రయత్నం విఫలమయ్యాయి. ఎక్కడా అప్పు దొరకకపోవడంతో మనస్థాపానికి గురైన నర్సింహరావు ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే స్థానికులు ఆవనిగడ్డ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నర్సింహరావు కన్నుమూశాడు. 

18:11 - October 14, 2015

కర్నూలు : వివిధ ఆరోపణలు వస్తున్న అధికారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. కర్నూలు, కృష్ణా జిల్లాల డీఈవోలను సస్పెండ్ చేశారు. రేషన్ లైజేషన్ విధానంలో అక్రమాలు చేశారని అందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా ఇతర కారణాలున్నాయని తెలుస్తోంది. ఇటీవలే కర్నూలు జిల్లా డీఈవో రాసలీలపై ఈనెల ఆరో తేదీన వరుస కథనాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వెంటనే కడప జిల్లాకు చెందిన అధికారి సుబ్బారావు విచారణ చేపట్టారు. ప్రభుత్వానికి నివేదిక అందించారు. అనంతరం మంత్రి గంటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే శ్రీకాకుళం రాజీవ్ విద్యామిషన్ అధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేసింది. 

శంకుస్థాపనకు పిలిస్తే వెళుతాం - కేటీఆర్...

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి శంకుస్థాపనకు పిలిస్తే వెళ్లి శుభాకాంక్షలు తెలిపి వస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వల్లే ఏపీ అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ లో ఎవరైనా ఉండవచ్చునని తెలిపారు. ఆంధ్ర ప్రాంతంలో విబేధాలు లేవని, నగర అభివృద్ధికి రూ.20వేల కోట్లతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. 

17:39 - October 14, 2015

కరీంనగర్ : వరంగల్ జిల్లాలో పత్తి రైతుల ఆందోళన మరచిపోకముందే కరీంనగర్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. పత్తి రైతుల కొనుగోలు విషయంలో ఎంతో ఆశలు రేపిన సీసీఐ కేంద్రాలు ఊరించి ఉసురుమనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో అట్టహాసంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. బుధవారం మార్కెట్ యార్డుకు సుమారు వేయి క్వింటాళ్ల పత్తి వచ్చింది. కానీ సీసీఐ కేవలం 120 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసింది. నామమాత్రపు పత్తి కొనుగోలు చేయడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 12 శాతం తేమ ఎక్కువగా ఉందని సీసీఐ పత్తిని తిరస్కరించింది. 

17:33 - October 14, 2015

మహబూబ్ నగర్ : జడ్చర్ల (మం) గొల్లపల్లిలో స్థల వివాద బాధితులకు ఎమ్మెల్యే డీకే అరుణ పరామర్శించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, కనీసం మూడెకరాల భూమివ్వాలని డిమాండ్ చేశారు. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నేతలు..కార్యకర్తల ఆగడాలు అధికమయ్యాయని ఆరోపించారు. ఇద్దరి చావుకు కారణమైన టీఆర్ఎస్ నేత ఇర్ఫాన్ పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

అసలేమైంది...
గొల్లపల్లి లో ఓ ప్రాంతంలో తాను కొన్న స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక టీఆర్ఎస్ నేత ఇర్ఫాన్ ను స్థల యజమాని వెంకటయ్య కోరాడు. కానీ రోజులు గడిచిపోయాయి. కానీ సమస్య మాత్రం పరిష్కారం రాలేదు. ఆ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడానికే అందరూ నిర్ణయానికి వచ్చారని, ఇర్ఫాన్ మోసం చేశాడని వెంకటయ్య భావించాడు. తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటయ్య తన ముగ్గురు కుమారులు శ్రీశైలం, మహేష్, చంద్రశేఖర్ లను తీసుకుని ఇర్ఫాన్ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. దీనితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. డీకే అరుణ చేసిన డిమాండ్స్ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

17:23 - October 14, 2015

హైదరాబాద్ : తెలంగాణ బతుకమ్మ సంబరాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జరుపుతోంది. ఏకంగా రూ. పది కోట్లను విడుదల చేసింది. పలు జిల్లాల్లో పలు కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు బతుకమ్మ ఆడటానికి సిద్ధమయ్యారు. కానీ ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి కారణం ఏపీ ఎన్జీవో హోం ఎదుట ఆడటమే. బతుకమ్మ ఆడటానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఉద్యోగులు వారితో వాగ్వాదానికి దిగారు. గేటుకు తాళం వేయడంతో రోడ్డుపై మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. దీనితో ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జాం అయ్యింది. చివరకు పోలీసులు ఉద్యోగులను అరెస్టు చేసి ఆబిడ్స్ పీఎస్ కు తరలించారు. 

17:20 - October 14, 2015

మెదక్ : మంత్రి హరీష్ రావు జిల్లాకు వస్తున్నారంటే ముందుగా పోలీసులు ఆశా వర్కర్లపై దృష్టి సారిస్తున్నారు. ఆయన పర్యటనలో సమస్యలు చెప్పుకుంటున్నారని..నిరసనలు వ్యక్తం చేస్తున్నారని పోలీసులు ముందస్తుగా అరెస్టులకు తెరలేపుతున్నారు. తాజాగా నారాయణఖేడ్ లో హరీష్ రావు పర్యటన నేపథ్యంలో సుమారు 60 మంది ఆశా వర్కర్లను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. ఈ అరెస్టులపై ఆశా వర్కర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే ఇలా వ్యవహరించడం సరికాదని విమర్శించారు.
గత కొన్ని రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం స్పందించకపోయేసరికి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న మంత్రులకు తమ సమస్యలు పరిష్కరించాలని చెబుతున్నారు. అదే విధంగా మంత్రి హరీష్ రావుకు కూడా ఇటీవలే ఆశా వర్కర్లు తమ సమస్యలు చెప్పుకున్నారు. కానీ మంత్రి హరీష్ రావు వీరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పలు విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. 

భారత్ 247/9....

ఇండోర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది.

అందుకే డ్రోన్ సర్వే - మంత్రి ప్రత్తిపాటి..

గుంటూరు : సర్వేయర్ల కొరతను భర్తీ చేసేందుకు డ్రోన్ సర్వే చేపట్టినట్లు మంత్రి ప్రత్తిపాటి పేర్కొన్నారు. డిసెంబర్ 31వలోగా రైతులకు భూములు అందచేస్తామన్నారు. 

ఆన్ లైన్ మందుల అమ్మక విధానాన్ని రద్దు చేయాలి - తమ్మినేని..

హైదరాబాద్ : ఆన్ లైన్ మందుల అమ్మక విధానాన్ని రద్దు చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఆన్ లైన్ లో మందుల అమ్మకం ద్వారా చిల్లర వ్యాపారులు, సామాన్యులు నష్టపోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా సాగుతున్న ఈ మందుల వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి కన్నుమూత..

హైదరాబాద్ : ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి బుధవారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో కిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1996 తెలంగాణ రెండో దశ ఉద్యమంలో మద్దిలేటి క్రియాశీలంగా వ్యవహరించారు. మద్దిలేటి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు.

 

ప్రధానితో ముగిసిన బాబు భేటీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జరిపిన ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కొద్దిసేపటికి క్రితం ముగిసింది. స్వచ్ఛ భారత్ పై ఉపసంఘం ఇచ్చిన నివేదికను మోడీకి బాబు అందచేశారు. 

ధోని హాఫ్ సెంచరీ..భారత్ 210/7..

ఇండోర్ : టీమిండియా కెప్టెన్ ధోని హాఫ్ సెంచరీ సాధించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ 7 వికెట్లు కోల్పోయి 210 రన్లు సాధించింది. ధోని 69, హర్భజన్ 14 పరుగులతో ఆడుతున్నారు. 

16:34 - October 14, 2015

నల్గొండ : రుణమాఫీలో మిగిలిన రెండు వాయిదాలపై బ్యాంకులు హామీ పత్రాలు ఇచ్చినట్లు మంత్రి పోచారం పదే పదే అబద్ధాలు చెబుతున్నారని, ఏ ఒక్క బ్యాంకైనా హామీ పత్రాలు ఇచ్చినట్లు నిరూపించాలని సవాల్ విసురుతున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని తెలిపారు. నల్గొండలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో తమ్మినేని పాల్గొని మీడియాతో మాట్లాడారు. రైతు సమస్యలపై అబద్దాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఆందోళనకారుల పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందని తెలిపారు. 45 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశాల సమస్యలపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ తన అసమర్థతను కప్పి పుచ్చుకొనేందుకు విపక్షాలపై దాడికి దిగుతున్నారని విమర్శించారు. మావోయిస్టు సిద్ధాంతాన్ని సీపీఎం ఏనాడూ సమర్థించలేదని, అలాగే మావోయిస్టులను హింసించి చంపడాన్ని ఏ ప్రజాస్వామ్యవాది సమర్థించడన్నారు. తక్షణమే కరవు ప్రాంతాలను ప్రకటించి సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు. 

16:29 - October 14, 2015

గుంటూరు : రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి పనులకే కాదు..చెడు పనులకూ వినియోగిస్తున్నారు. అందులో నుండి వచ్చిందే 'డ్రోన్లు'. వీటిని ఏపీ సర్కార్ రైతుల భూములపై ప్రయోగిస్తోంది. ఇటీవలే ఏపీ సర్కార్ 'అమరావతి' రాజధాని నిర్మాణం కోసం రైతుల నుండి 33వేల ఎకరాలు సేకరించిన విషయం తెలిసిందే. భూములిచ్చిన రైతులకు పలు పథకాలను ప్రవేశ పెట్టింది. అందులో ప్రధానమైన అంశం ఒకటి ఉంది. భూములిచ్చిన రైతులకు అదే ప్రాంతంలో భూమి ఇస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. భూములను గుర్తించేందుకు 'డ్రోన్ల' సహాయాన్ని తీసుకోనున్నారు. బుధవారం సింగపూర్ బృందం రాయపూడికి చేరుకుంది. వీరితో పాటు మంత్రి నారాయణ కూడా చేరుకున్నారు. అక్కడ డ్రోన్ల పని తీరును పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి నారాయణ టెన్ టివితో మాట్లాడారు. రాజధాని నిర్మాణ పనులన్నీ వేగవంతం అవుతున్నాయని తెలిపారు. ఇందుకు రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారని, ఇక్కడ ప్రభుత్వానికి ఉన్న భూములు..కాలువలు..గుట్టలు ఉన్నాయని తెలిపారు. ఇదంతా కలిపితే 215 చ.అడుగుల భూమి వస్తుందన్నారు. భూములిచ్చిన రైతులకు ఆ ప్రాంతంలో భూములిచ్చేందుకు ప్రభుత్వం హామీనివ్వడం జరిగిందని, అందులో భాగంగా వారికి డిసెంబర్ 31వ తేదీలోపు భూములివ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారని తెలిపారు. దీనితో డ్రోన్ల ద్వారా పరిశీలించడం జరిగిందన్నారు. 

16:21 - October 14, 2015

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతిలోకి స్వచ్ఛ భారత్ నివేదిక చేరింది. స్వచ్చ భారత్ పై నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఉపసంఘానికి కన్వీనర్ గా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నివేదికను మోడీకి అందచేశారు. ఈ సమావేశంలో హార్యానా సీఎం కూడా పాల్గొన్నారు. అలాగే అమారవతి శంకుస్థాపనకు రావాలని ప్రధాన మంత్రి మోడీకి బాబు ఆహ్వాన పత్రికను అందచేశారు.
ఐదు సంవత్సరాల్లో భారత్ ను స్వచ్ఛ భారత్ గా మార్చాలని మోడీ ప్రభుత్వం తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు ఉపసంఘం ఏర్పాటు చేసింది. దీనికి కన్వీనర్ గా బాబు వ్యవహరించారు. ఇందులో పలు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్నారు. కమిటీ బెంగళూరుతో పాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో చెరో సమావేశం..ఢిల్లీలో రెండు సమావేశాలు జరిగాయి. ఇందులో పలు రాష్ట్రాల సీఎంలు వెలువరించిన సూచనలు..సలహాలు..అభిప్రాయాలను కమిటీ పరిగణలోకి తీసుకుంది. అనంతరం దీనిపై తుది నివేదికను రూపొందించింది. అందులో ప్రతి రాష్ట్రంలో ఉండే పంచాయితీల్లో నెలకు ఒక రోజు స్వచ్ఛ కార్యక్రమం రూపొందించడం..పేదలకు మరుగుదొడ్ల కోసం రూ.15వేలు అందచేయడం..కేంద్రం 75 శాతం, రాష్ట్రం 25 నిధులతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయాలని సిఫార్సు చేశారు. అంతేగాకుండా కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను భాగస్వామ్యం చేయడం..పాఠ్యాంశాల్లో స్వచ్ఛ భారత్ చేర్చాలని ప్రతిపాదించారు. 

భారత్ 148/6..

ఇండోర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ 148 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ధోని 36, భువనేశ్వర్ 10 పరుగులతో ఆడుతున్నారు.

ప్రధాని మోడీతో బాబు..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. స్వచ్ఛ భారత్ పై నివేదికను బాబు అందచేశారు. అలాగే రాజధాని శంకుస్థాపనకు రావాలని ఆహ్వానపత్రికను అందచేశారు. 

స్వచ్ఛ భారత్ నివేదికకు మద్దతు - కేజ్రీ..

ఢిల్లీ : స్వచ్ఛ భారత్ నివేదికకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. కమిటీలో సభ్యుడిగా ఉన్నా సంతృప్తి లేనని స్పష్టం చేశారు. ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. 

స్వచ్ఛ భారత్ నివేదికపై నాలుగు సమావేశాలు - బాబు..

ఢిల్లీ : స్వచ్ఛ భారత్ నివేదికపై నాలుగు సమావేశాలు నిర్వహించినట్లు ఏపీ సీఎం చంద్ర బాబు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ నివేదికకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు తెలిపారని, రాజకీయలకతీతంగా స్వచ్ఛ భారత్ కోసం కృషి చేయాలని బాబు పిలుపునిచ్చారు. 

ఏపీ ఎన్జీవో భవన్ లో బతుకమ్మ వివాదం..

హైదరాబాద్ : ఏపీ ఎన్జీవో భవన్ లో బతుకమ్మ వివాదం నెలకొంది. బతుకమ్మ ఆడేందుకు వచ్చిన తెలంగాణ ఉద్యోగులను ఏపీఎన్జీవో ఉద్యోగులు అడ్డుకున్నారు. 

ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి...

చిత్తూరు : మదనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. టీటీఎం చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 

రాజధాని శంకు స్థాపనకు ఐటీ నిపుణులు..

హైదరాబాద్ : అమరావతి రాజధాని శంకుస్థాపనకు 205 మంది ఐటీ నిపుణులు సైకిల్ యాత్రగా వెళ్లనున్నారు. అక్టోబర్ 19వ తేదీన ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుండి ఈ యాత్ర మొదలు కానుంది. 

15:52 - October 14, 2015

ముంబై : ''నిగ్గ దీసి అడుగు..ఈ సిగ్గు లేని జనాన్ని..అగ్గితో కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని..మారదు లోకం..మారదు కాలం..దేవుడు దిగి రాని..ఎవ్వరూ ఏమై పోనీ''..అనేది కవి కలం వెలువడిన పాట. కానీ ప్రస్తుతం నడుస్తున్న సమాజంలో ఇది వాస్తవం అనేది అనిపిస్తుంటుంది. ఎందుకంటే కళ్ల ముందట ఏ ఘటన జరిగినా..జరుగుతున్నా ఎవరూ స్పందించకుండా వెళుతుంటారు. తమకు ఏ సంబంధం అని అనుకుంటుంటారు. కానీ కొందరు మాత్రం స్పందించి సహాయం చేస్తుంటారు. ఓ రైళ్లో నిండు గర్భిణీకి ఓ జర్నలిస్టు సహాయం చేశాడు. తల్లి..బిడ్డ ప్రాణాలు నిలదొక్కుకొనేలా చేశాడు.
అప్పుడే పుట్టిన బిడ్డ సిగ్గుతో తలదించుకుంది..మానవ సంబంధాలు లేని జన్మ జనాల మధ్యకు ఎందుకు వచ్చానా ? అని కళ్లెదుటే నొప్పులు పడుతున్నా ఎవరూ పట్టించుకోలేని దయమాలిన సమాజాన్ని చూసి ఆ బిడ్డ తల్లడిల్లింది. ఈ దయనీయ సంఘటన ముంబై లోకల్ రైళ్లో చోటు చేసుకుంది. సుదేవి నిండు గర్భిణీ..ఆసుపత్రికి వెళ్లేందుకు తన భర్త రాంపాల్ తో కలిసి కళ్యాణ్ లో లోకల్ రైలు ఎక్కింది. అకస్మాత్తుగా సుదేవికి నొప్పులు వచ్చాయి. తన భార్యకు సహాయం చేయాలని భర్త రాంపాల్ వేడుకున్నాడు. అలానే చూస్తున్నారే కానీ ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. పైపెచ్చు..ఆ దంపతులకు దూరంగా వెళ్లి కూర్చొన్నారు. ఓ ఉర్దూ న్యూస్ పేపర్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్న అన్సారీ వ్యక్తి మాత్రం చలించిపోయాడు. వెంటనే హెల్ప్ లైన్ కు ఫోన్ చేశాడు. తరువాత వచ్చే బందూక్ స్టేషన్ లో వైద్య బృందం సిద్ధంగా ఉండేలా హెల్ప్ లైన్ తో మాట్లాడాడు. ఇంతలోనే పండండి బిడ్డకు జన్మనిచ్చింది. రక్తంతో తడిసిన ఆ పసిబిడ్డను..అచేతనస్థితిలో ఉన్న సుదేవిని చూసిన తోటి జనాలు అప్పటికీ స్పందించలేదు. బందూక్ స్టేషన్ చేరిన అనంతరం తల్లి..బిడ్డలను స్ట్రెచర్ పై పడుకొపెట్టేందుకు మాత్రం సాయం చేశారు. సహాయం చేసిన అన్సారీకి సుదేవి, రాంపాల్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. 

హాస్యనటుడు మాడ వెంకటేశ్వరరావు కన్నుమూత..

హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు మాడ వెంకటేశ్వరరావు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్ లో బుధవారం కన్నుమూశారు. 1950, అక్టోబర్ 19న జన్మించారు. ముత్యాలముగ్గు, చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాలతో ఆయనకు బాగా గుర్తింపు లభించింది. 'చూడు పిన్నమ్మ..పాడు పిన్నమ్మ' పాటతో ఆయన పాపులర్ అయ్యారు. 

15:27 - October 14, 2015

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లిన వెంటనే పలువురితో భేటీలు జరుపుతున్నారు. ఏపీ భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో బాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో నీతి ఆయోగ్ సీఈవో హిందూ శ్రీ కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి 'అమరావతి' శంకుస్థాపన ఆహ్వాన పత్రికలను వారికి అందచేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని బాబు కోరారు. అనంతరం బాబు ప్రధాన మంత్రి మోడీతో భేటీ కానున్నారు. స్వచ్ఛ భారత్ ఉప సంఘం కమిటీ తుది నివేదికను అందించనుంది. ఆమోదం తెలిపిన అనంతరం దేశ వ్యాప్తంగా కమిటీ సిఫార్సులను అమలు చేయనున్నారు.
స్వచ్ఛ భారత్ పై నియమించడిన ఈ ఉపసంఘం కమిటీలో కర్నాటక, హర్యానా, ఢిల్లీ సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్నారు. అనంతరం ఈ కమిటీ పలు సమావేశాలు జరిపింది. రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు..సలహాలు..సూచనలు తీసుకుంది. కానీ సీఎం కేజ్రీవాల్ మాత్రం ఈ సమావేశాలకు హాజరు కాలేదు. బుధవారం బాబుతో భేటీ అయిన కేజ్రీవాల్ కమిటీ సిఫార్సులకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఇందులో పేద వారికి మరుగుదొడ్ల కోసం రూ. 15వేలు ఇవ్వడంతో పాటు అందరినీ భాగస్వామ్యం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. 

రాయపూడిలో డ్రోన్ ను పరిశీలించిన నారాయణ..

గుంటూరు : అమరావతి రాయపూడిలో డ్రోన్ పనితీరును మంత్రి నారాయణ పరిశీలించారు. 27 గ్రామాల్లో డ్రోన్ లతో భూ సర్వే చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రైతులకు భూ కేటాయింపు కోసం డ్రోన్ లను వాడుతున్నట్లు, డిసెంబర్ 31 లోపు ప్రభుత్వం ప్రతిపాదించిన భూములను రైతులకు అందచేయడం జరుగుతుందన్నారు. 

టీఎస్ పీఎస్సీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం..

హైదరాబాద్ : టీఎస్ పీ ఎస్సీ నూతన సభ్యుల చేత ఛైర్మన్ గంటా చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించారు. టి.వివేక్, డి.కృష్ణారెడ్డి, కె.రామ్మోహన్ రెడ్డి, సీ.హెచ్. విద్యాసాగర్ రావులు ప్రమాణ స్వీకారం చేశారు. సాంకేతిక కారణాల వల్ల ఎం.రాజేందర్, సీహెచ్. సాయిలు ప్రమాణం చేయలేదు. 

అటవీ భూమిని కాపాడేందుకు చర్యలు - బొజ్జల..

హైదరాబాద్ : రాజధాని పరిధి అటవీ భూమిని డీనోటిఫై కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో అటవీ భూమిని కాపాడే చర్యలు తీసుకుంటున్నట్లు, త్వరలో రెండో దఫా ఎర్రచందనం వేలం వేయనున్నట్లు వెల్లడించారు.

 

రహానే హాఫ్ సెంచరీ..అవుట్..

ఇండోర్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో రహానే హాఫ్ సెంచరీ సాధించాడు. వెనువెంటనే అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 22.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు టీమిండియా 102 పరుగులు సాధించింది. 

14:56 - October 14, 2015

ఏదైనా కేసులు కోర్టుకు వస్తే ముందు అది మీడియేషన్ సెంటర్ అంటే మధ్యవర్తిత్వం వద్దకు పంపిస్తారని అడ్వకేట్ జె.ఎల్.ఎన్. మూర్తి పేర్కొన్నారు. మానవి 'మై రైట్' కార్యక్రమంలో ఈ అంశంపై విశ్లేషించారు. మధ్యవర్తిత్వంపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందని తెలిపారు. మొదట కేసును మీడియేషన్ సెంటర్ కు పంపిస్తారని, అక్కడ ట్రైనింగ్ పొందిన వ్యక్తి (మధ్యవర్తిత్వం) వద్ద కేసును పరిష్కరించే దిశగా చూస్తారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారమైతే మధ్యవర్తిత్వం ఉన్న వ్యక్తి కోర్టుకు ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నారు. ఫ్యామిలీ కేసుల్లో అత్యధికంగా కేసులు వస్తున్నాయని, అలాగే సివిల్, ల్యాండ్ ఇతర అంశాల్లో కూడా కేసులు వస్తున్నాయన్నారు. జిల్లా కోర్టులో మీడియేషన్ కోర్టులున్నాయని తెలిపారు. అలాగే ప్రజలు వ్యక్తపరిచిన న్యాయ సలహాలు, సందేహాలను జె.ఎల్.ఎన్.మూర్తి నివృత్తి చేశారు. 

ధావన్ అవుట్..

ఇండోర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ధావన్ 23 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

 

భారత్ 53/1..

ఇండోర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. మూడు పరుగుల వద్ద రోహిత్ (3) వికెట్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అనంతరం ధావనష్, రహానేలు ఆచూతూచి ఆడుతున్నారు. వీరిద్దరూ కలిసి సౌతాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. అదుపుతప్పిన బంతులను బౌండరీలకు తరలిస్తున్నారు. 11.2 ఓవర్లలో 53 పరుగులు చేసింది. ధావన్ 21, రహానే 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

14:22 - October 14, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రోజులు దగ్గర పడుతున్నాయి. దీనితో అధికారులు ఆఘమేఘాల మీద పనులు పూర్తి చేస్తున్నారు. బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపనకు ఎనిమిది కమిటీలను ప్రకంటించారు. అందులో మంత్రులు, ఎంపీలు, ఇతర ఉన్నతాధికారులున్నారు. స్వాగత కమిటీలో మంత్రులు గంటా శ్రీనివాస రావు, రావెల కిశోర్ బాబు, దేవినేని ఉమామహేశ్వర రావు, కామినేని శ్రీనివాస రావు ఉండనున్నారు. ఆతిథ్య కమిటీలో మహిళా మంత్రులు మృణాళిని, పరిటాల సునీత, పీతల సుజాత ఉన్నారు. రాష్ట్ర స్థాయి ఉత్సవాల కమిటీలో మంత్రులు మాణిక్యాలరావు, అయ్యన్నపాత్రుడులు సభ్యులుగా ఉన్నారు. మీడియా కమిటీలో సభ్యులుగా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు వ్యవహరించనున్నారు.రాజధాని వేదిక కమిటీలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ప్రత్తిపాటి పుల్లారావు, నిర్వహణ కమిటీ సభ్యులుగా యనమల రామకృష్ణుడు, నారాయణ, ఆహ్వాన కమిటీ సభ్యులుగా అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌లను నియమించారు. ప్రతి కమిటీలో సీఆర్‌డీఏ, మున్సిపల్‌, ప్రొటోకాల్‌ అధికారులు సహా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు చోటు కల్పించారు. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లపై మంత్రులు సమీక్షించారు. అనంతరం నిర్మాణ వేదికను మంత్రులు, అధికారులు పరిశీలించారు. రాజధాని శంకుస్థాపన వేదిక ఏర్పాట్లను హెలికాప్టరు ద్వారా పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

14:21 - October 14, 2015

హైదరాబాద్ : మల్లారెడ్డి వైద్య కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. 52-బి కేటగిరి సీట్లను మెరిట్ లేకుండా కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈనెల 20 లోపు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎన్టీఆర్ వర్సిటీ, తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ అసోసియేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా న్యాయవాదులు, పిటిషనర్ లు టెన్ టివితో మాట్లాడారు. తమ సంస్థ మెరిట్ విద్యార్థులకు అండగా పోరాడుతూనే ఉందని పిటిషన్ పేర్కొన్నారు. బీ కేటగిరి కింద 53 సీట్లు అమ్మిన కారణంగా పిల్లలను తీసుకొచ్చి హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించామన్నారు. మల్లారెడ్డి కాలేజీలో ఇల్లీగల్ గా ఉన్న 53 మంది విద్యార్థుల అడ్మిషన్లు క్యాన్సిల్ అవుతాయని తెలిపారు. మొత్తం ఏ, బీ, సీ కేటగిరిల కింద మల్లారెడ్డి కళాశాలకు 150సీట్లు ఉన్నాయని న్యాయవాది తెలిపారు. ఏ కేటగిరి కింద 75 సీట్లు, బీ కేటగిరి కింద 52 సీట్లు ఉంటే మిగతావి ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఉన్నాయన్నారు. కానీ 30వ తేదీన ఆర్డర్ వచ్చింది కాబట్టి కౌన్సెలింగ్ కుదరదు కాబట్టి అందుకే బి కేటగరి సీట్లను తామే భర్తీ చేశామని కళాశాల పేర్కొందని న్యాయవాదులు పేర్కొన్నారు. 

పోలీసుల అదుపులో హిరానీ ముఠా సభ్యులు...

హైదరాబాద్ : సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు హిరానీ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి కిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. దక్షిణ భారత కేంద్రంగా ఛైన్ స్నాచింగ్ లు జరుగుతున్నాయన్నారు. 

మల్లారెడ్డి వైద్య కళాశాలకు కోర్టులో చుక్కెదురు..

హైదరాబాద్ : మల్లారెడ్డి వైద్య కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. 52-బి కేటగిరి సీట్లను మెరిట్ లేకుండా కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈనెల 20 లోపు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎన్టీఆర్ వర్సిటీ, తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ అసోసియేషన్ ఆదేశాలు జారీ చేసింది. 

ఢిల్లీలో సీఎం చంద్రబాబు..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. స్వచ్చ భారత్ పై నీతి ఆయోగ్ ఉప సంఘం నివేదికను మధ్యాహ్నాం 03.45గంటలకు ప్రధాన మంత్రి మోడీకి అందచేయనున్నారు. రాజధాని శంకుస్థాపనకు మరోసారి ప్రధానిని బాబు ఆహ్వానించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని, సాయత్రం ఐదున్నరకు రాజ్ నాథ్ సింగ్ ను కలిసి రాజధాని శంకుస్థాపనను ఆహ్వానించనున్నారు. 

స్థల వివాద బాధితులకు డీకే అరుణ పరామర్శ..

మహబూబ్ నగర్ : జడ్చర్ల (మం) గొల్లపల్లిలో స్థల వివాద బాధితులకు ఎమ్మెల్యే డీకే అరుణ పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, కనీసం మూడెకరాల భూమివ్వాలని అరుణ డిమాండ్ చేశారు. 

అక్కడ ఎందుకు ఆందోళనలు చేయడం లేదు - హరీష్ రావు..

హైదరాబాద్ : తెలంగాణలో ఆందోళనలు చేస్తున్న సీపీఐ, టిడిపి, బిజెపి పార్టీలు ఏపీలో ఎందుకు చేయడం లేదని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 

ఔషధ మొక్కలపై మంత్రి కామినేని సమీక్ష..

హైదరాబాద్ : ఔషద మొక్కలపై మంత్రి కామినేని సమీక్ష నిర్వహించారు. 32వేల ఎకరాల్లో ఔషధ మొక్కల పెంపకానికి నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్స్ రే, అల్ట్రాసౌండ్, స్కానింగ్, సిటీ స్కాన్ పరీక్షలు జనవరి నుండి ఉచితంగా ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. 

13:49 - October 14, 2015

హైదరాబాద్ : ఆన్‌లైన్‌ టెలివిజన్‌ ఛానెల్‌ సర్వీసులను అందిస్తున్న యప్‌ టీవీ తాజాగా మొబైల్‌ యాప్‌ ను లాంచ్‌ చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి క్రికెట్‌ లెజెండ్‌ బ్రియన్‌ లారా, బాలివుడ్‌ తార పరిణీతి చోప్రా ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

13:47 - October 14, 2015

నెల్లూరు : జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. నగరంలో పేద ప్రజలు నివసించే ఇరుకళ పరమేశ్వరి ఆలయం సమీపంలోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని మహిళ సజీవదహనమైంది. మంటలు మరో ఐదు ఇళ్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఆరు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పైసాపైసా కూడబెట్టుకొని తెచ్చుకున్న సామాగ్రి మంటల్లో కాలిపోవడంతో స్థానికులు నిరాశ్రయులయ్యారు.

 

13:43 - October 14, 2015

పాట్నా : పంజాబ్లోని ఫరిద్ కోట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వ్యక్తులు తమ దైవదూషణలకు పాల్పడ్డారంటూ, దానికి వ్యతిరేకంగా కొందరు సిక్కులు నిర్వహించిన ర్యాలీ టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. వీరిని అడ్డుకుని, శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు భారీ సంఖ్యలో పోలీసులు అక్కడి చేరుకోగా ఘర్షణలు మరింత మించిపోయాయి. పరస్పర దాడులు జరగడంతో మొత్తం 17మందికిపైగా గాయాలపాలయ్యారు. వారిలో పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు లాఠీఛార్జి జరపి, భాష్పవాయుగోళాలను ప్రయోగించి చివరకు రెండు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉన్నా అక్కడి వాతావరణం మాత్రం గంభీరంగా తయారైంది. ప్రజలంతా శాంతితో సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ విజ్ఞప్తి చేశారు.

రోహిత్ అవుట్..

ఇండోర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ తొలి వికెట్ ను కోల్పోయింది. మూడు పరుగులు చేసిన రోహిత్ రబడా బౌలింగ్ లో వెనుదిరిగాడు.

బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా

ఇండోర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. శర్మ 3, ధావన్ 0 పరుగులతో ఆడుతున్నారు. 

13:36 - October 14, 2015

చిత్తూరు : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. దసరా సెలవులు అయినందున భక్తులు భారీగా వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. వసతి ప్రసాదాల విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు టెన్ టివితో టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడారు. భక్తులను ఆకట్టుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈనెల 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భగా ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలను రద్దు చేశామని చెప్పారు. వాహన సేవలను తిలకించే అవకాశం కల్పించామని తెలిపారు. భక్తులందరికీ భోజనం సదుపాయం కల్పించామని చెప్పారు. 500 పైగా బస్సులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నడకదారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. నాలుగు చోట్ల కళాప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

 

భారత్ లో మూడు మార్పులు..

ఇండోర్ : భారత్ జట్టులో కెప్టెన్ ధోని మూడు మార్పులు చేశారు. గాయపడిన స్పిన్ బౌలర్ అశ్విన్ స్థానంలో హర్భజన్, అమిత్ మిశ్రా, స్టువర్ట్ బిన్నీ స్థానంలో అక్షర్ పటేల్, మోహిత్ శర్మలకు అవకాశం కల్పించారు. ప్రత్యర్థి జట్టు సౌతాఫ్రికా మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. 
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రహానే, కోహ్లీ, ధోని, రైనా, అక్షర్ పటేల్, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్.

రాజంపేట జూ.కళాశాలలో విద్యార్థి సంఘాల నిరసన..

కడప : రాజంపేట నలంద జూనియర్ కళాశాలలో విద్యార్థి సంఘాల నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసనలలో కళాశాల బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. 

 

మంత్రి పోచారానికి తమ్మినేని సవాల్...

నల్గొండ : రుణమాఫీలో మిగిలిన రెండు కిస్తీలపై బ్యాంకులు హామీ పత్రాలు ఇచ్చినట్లు మంత్రి పోచారం పదే పదే అబద్ధాలు చెబుతున్నారని, ఏ ఒక్క బ్యాంకైనా హామీ పత్రాలు ఇచ్చినట్లు నిరూపించాలని సవాల్ విసురుతున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని తెలిపారు. రైతు సమస్యలపై అబద్దాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఆందోళనకారుల పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందని తెలిపారు. 45 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశాల సమస్యలపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ తన అసమర్థతను కప్పి పుచ్చుకొనేందుకు విపక్షాలపై దాడికి దిగుతున్నారని విమర్శించారు.

రాజధాని మాస్టర్ ప్లాన్ కార్పొరేట్ల కోసమా ? ప్రజల కోసమా ?

విజయవాడ : రాజధాని మాస్టర్ ప్లాన్ కార్పొరేట్ల కోసమా ? ప్రజల కోసమా ? సదస్సు జరిగింది. సీపీఎం, రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సు ఏర్పాటైంది. ఈ సదస్సులో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పాల్గొన్నారు. 

రాజధాని శంకుస్థాపనకు కమిటీలు..

విజయవాడ : అమరావతి శంకుస్థాపన నిర్వాహణ కమిటీలను సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వాగత కమిటీ సభ్యులుగా మంత్రులు రావెల, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ, కామినేనిలున్నారు. అతిథ్య కమిటీ సభ్యులుగా మంత్రులు మృణాళిని, పరిటాల సునీత, పీతల సుజాత, ఉత్సవ కమిటీ సభ్యుడిగా మాణిక్యాలరావు, మీడియా కమిటీలో మంత్రులు పల్లె, బొజ్జల సభ్యులుగా ఉన్నారు. వేదిక కమిటీ సభ్యుడిగా డిప్యూటి సీఎం కేఈ, మంత్రి ప్రత్తిపాటి, నిర్వాహణ కమిటీ సభ్యులుగా మంత్రులు యనమల, నారాయణ, ఆహ్వాన కమిటీ సభ్యులుగా మంత్రులు అయ్యన్న, కామినేనిలున్నారు.

హామీలను నెరవేరుస్తున్నాం - వెంకయ్య..

ఢిల్లీ : ఏపికి ఇచ్చిన హామీలను కేంద్రం ఒక్కొక్కటి నెరవేరుస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య వెల్లడించారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని, ప్రణాళిక సిద్ధం కాకముందే రాజధానికి రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులివ్వడం జరిగిందని తెలిపారు. 

జగన్ కు కొనసాగుతున్న చికిత్స..

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ కు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. సాయంత్రం హైదరాబాద్ కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

శారదానదిలో ఇద్దరు యువకుల గల్లంతు..

విశాఖపట్టణం: మునగపాక మండలం గణపర్తిలో విషాదం చోటు చేసుకుంది. శారదానదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. 

రష్యాలో భూకంపం..

రష్యా : దేశంలో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.3గా నమోదైంది. దక్షిణ రష్యాలోని కురిలె ఐలాండ్ లో భూ ప్రకంపనాలు వచ్చాయి. సెవెరో కురిల్ స్క్ వద్ద 34 కి.మీ.లోతులో భూకంప కేంద్రంగా గుర్తించారు. 

రేపు, ఎల్లుండి కేంద్ర మంత్రులను కలుస్తాం - రమణ..

వరంగల్ : పత్తి రైతు సమస్యల పరిష్కారం కోసం రేపు, ఎల్లుండి కేంద్ర మంత్రులను కలుస్తామని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించారు. వాణిజ్య, ఆర్థిక, టెక్స్ టైల్ మంత్రులను కలువనున్నట్లు వెల్లడించారు.

 

చౌటుప్పల్ లో టి.టిడిపి నేతలు...

నల్గొండ : చౌటుప్పల్ లో వాటర్ గ్రిడ్ పైలాన్ ను టిడిపి నేతలు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లిలు పరిశీలించారు. నామినేషన్ పద్ధతిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.2కోట్లతో పైలాన్ పనులను అప్పగించారని, నాసిరకం పనులకు నిదర్శనంగా నిలుస్తోందని రేవంత్ ఆరోపించారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్...

ఇండోర్ : భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఇండోర్ స్టేడియం వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

13:05 - October 14, 2015

ఢిల్లీ : ప్రముఖ మ్యాగజైన్ ప్లే బాయ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళల నగ్న ఫోటోలు ప్రచురించబోమని అది స్పష్టం చేసింది. అయితే అరకొర అందాలు ఒలకబోసే పడుచుల ఫోటోలకు కొదవలేదని పేర్కొంది. 1953లో మార్లిన్ మన్రో నగ్న ఫోటోల ప్రచురణతో సంచలనం రేపి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిన ప్లేబాయ్ అనంతర కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒకప్పుడు 1975లో 56 లక్షల కాపీల సర్కులేషన్ ఉన్న ప్లేబాయ్‌ మ్యాగజైన్‌ ప్రస్తుతం 8 లక్షలకు పడిపోయింది. మొదటి నుంచి రాజకీయంగానే గాక మహిళా సంఘాల నుంచి అనేక విమర్శలను ప్లేబాయ్ ఎదుర్కొంటోంది.

 

13:01 - October 14, 2015

ఢిల్లీ : దాదరీ ఘటన, కల్బుర్గీ హత్యకు నిరసనగా అవార్డులు వెనక్కి ఇచ్చే పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రసిద్ధ కన్నడ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ రహమత్‌ తరికేరీ తన పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు. కల్బుర్గీ వైస్‌ చాన్సలర్‌గా పనిచేసిన హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో రహమత్‌ బోధిస్తున్నారు. అసోమీ రచయిత హోమెన్‌ బోర్గొహెయిన్‌ సైతం అదే దారిలో నడిచారు. అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. పంజాబీ రచయిత్రి దిలీప్‌ కౌర్‌ తివానా తనకు లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు. దేశంలో పెరిగిపోయిన మత ఘర్షణలకు నిరసనగా తానీ నిర్ణయం తీసుకొన్నట్టు తివానా తెలిపారు. పంజాబ్‌ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన తివానాకు 2004లో పద్మశ్రీ లభించింది. గత మూడు రోజుల్లో అవార్డులను వెనక్కి ఇచ్చేసిన పంజాబీ సాహిత్యకారుల్లో తివానా ఎనిమిదోవారు.

12:44 - October 14, 2015

నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం తుంగపాడు బంధం కాలువ ఏరియా పరిధిలో ఎండుతున్న పంటపొలాలను సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు. సాగర్‌ ఆయకట్టు పరిధిలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ప్రస్తుతం పొలాలు పొట్ట దశకు వచ్చి నీళ్లు లేక నిలువునా ఎండిపోతున్నాయని, కనీసం వారం రోజులైనా సాగర్‌ నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ ఏశారు.

 

12:38 - October 14, 2015

గుంటూరు : ఎపి నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అమరావతి నిర్మాణానికి అనుమతుల ప్రక్రియ పూర్తి అయింది. అమరావతి నిర్మాణానికి అన్ని అనుమతులను కేంద్ర పర్యావరణశాఖ, అటవీ మంత్రిత్వ శాఖలు ఇచ్చాయి. అనుమతుల ప్రక్రియ పూర్తయినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఢిల్లీలో ప్రకటించారు. దీంతో అమరావతి నిర్మాణానికి అన్ని రకాల క్లియరెన్సులతో గ్రీన్‌సిగ్నల్‌ వచ్చేసింది. ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ లో ఎపి రాజధాని నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అంశంపై కేసు విచారణలో ఉంది.

 

 

'అమరావతి'కి అనుమతుల ప్రక్రియ పూర్తి..

హైదరాబాద్ : అమరావతి నిర్మాణానికి అనుమతుల ప్రక్రియ పూర్తి అయింది. రాజధాని నిర్మాణానికి పర్యావరణ, పర్యాటక శాఖలు అనుమతులు ఇచ్చాయి. ఈమేరకు అనుమతుల ప్రక్రియ పూర్తి అయినట్లు ఢిల్లీలో కేంత్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. 

12:24 - October 14, 2015

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం సహాయం చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో మీడియాతో ముచ్చటించిన వెంకయ్యనాయుడు రాజధాని శంకు స్థాపనకు ఎవరెవరు హాజరయ్యేది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేంద్ర సహాయం గురించి ఆందోళనలు, ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని వెంకయ్య అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని వెంకయ్య అన్నారు.

 

12:18 - October 14, 2015

చైనా : బ్రహ్మపుత్ర నదిపై టిబెట్‌లో నిర్మించిన అతిపెద్ద జలవిద్యుత్‌ కేంద్రం జామ్‌ హైడ్రోపవర్‌ స్టేషన్‌ ద్వారా చైనా విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రపంచంలోనే అతిఎత్తయిన జలవిద్యుత్‌ కేంద్రమైన ఈ ప్రాజెక్టును టిబెట్‌లోని గయాకా కౌంటీలో రూ. 9700 కోట్ల ఖర్చుతో చైనా నిర్మించింది. ఈ పవర్‌ స్టేషన్‌ ఏటా 2.5 బిలియన్‌ కిలోవాట్‌-హవర్స్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. జామ్‌ విద్యుత్‌ కేంద్రంతోపాటు బ్రహ్మపుత్ర నదిపై మరో రెండు జలవిద్యుత్‌ కేంద్రాలను చైనా నిర్మించనుంది. ఈ ప్రాజెక్టులు నదిలోని నీటిని అడ్డుకోవని, కిందికి ప్రవహించే నీటిని మాత్రమే ఉపయోగించుకుంటాయని చైనా చెబుతున్నా.. భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

12:15 - October 14, 2015

ఢిల్లీ : తీవ్రవాదానికి వ్యతిరేకంగా 10 రోజులపాటు నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను భారత, చైనా సైనిక దళాలు ప్రారంభించాయి. చైనాలోని యునాన్ రాష్ట్రంలో ప్రారంభమైన ఈ విన్యాసాలు రెండు దేశాల సైనిక బలగాల మధ్య పరస్పర అవగాహనను, సహకారాన్ని, సమాచార మార్పిడిని పెంపొందించుకునేందుకు దోహదపడతాయని అధికారులు తెలిపారు. చైనా సరిహద్దును పర్యవేక్షిస్తున్న నాగా రెజిమెంట్ నుంచి 175 బలగాలను భారత్ తొలిసారి ఈ విన్యాసాలకు పంపగా, భారత సరిహద్దులను పర్యవేక్షిస్తున్న చెంగ్డు మిలటరీ రీజియన్‌లోని 14 కార్ప్స్‌కు చెందిన బలగాలను చైనా ఈ విన్యాసాల్లో మోహరించింది. కున్మింగ్ నగరంలో జరుగుతున్న ఈ విన్యాసాలకు ఇరు దేశాలు సమాన సంఖ్యలో బలగాలను దింపాయి, ఈ నెల 22వ తేదీన ఈ విన్యాసాలు ముగుస్తాయి.

 

12:13 - October 14, 2015

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
దసరా ఉత్సవాలు ప్రారంభం
విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. స్నపనాభిషేకం తర్వాత.. భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. స్వర్ణ కవచాలంకృత కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ రూపులోని అమ్మవారి దర్శనం వల్ల దారిద్ర్యం తీరుతుందన్నది భక్తుల నమ్మకం.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
కనకదుర్గ దర్శనానికి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కెనాల్‌ రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి.. ఇంద్రకీలాద్రి వరకూ ఐదు క్యూలను సిద్ధం చేశారు. అనూహ్యంగా వర్షం వచ్చినా భక్తులు తడవకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. స్నానఘాట్లలో తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలు వస్త్రాలు మార్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు. లడ్డూ ప్రసాదాల తయరీ, కనకదుర్గ నగర్ లో ప్రసాదాల కౌంటర్లను ఏర్పాట్లు చేశారు. 18 లక్షలకుపైగా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు.
నిర్దిష్ట ప్రణాళిక ఏర్పాటు
గత ఏడాదికన్నా 30 శాతం అధికంగా భక్తులు వస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22న విజయదశమి వరకూ .. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా.. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు నిర్దిష్ట ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

 

12:02 - October 14, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ తీరు రైతు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా ఉందని జేఏసీ చైర్మన్‌ కోదండరాం పేర్కొన్నారు. గతంలో దాఖలైన ఓ పిటిషన్‌లో.. ఇంప్లీడ్‌ అయిన కోదండరాం.. ప్రభుత్వం స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను పరిగణలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
హైకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌
తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యల అంశానికి సంబంధించి.. హైకోర్టులో ఈరోజు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలైంది. 15 రోజుల క్రితం వ్యవసాయ జన చైతన్య వేదిక దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 13వ తేదీలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే.. మంగళవారం జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ చర్య రైతు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా ఉందని.. స్వామినాథన్‌ కమిటీ నివేదికలు అమలు చేయడం లేదని కోదండరాం పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఇంచార్జి చీఫ్‌ జస్టిస్‌ దిలీప్‌ బి భోస్లే, జస్టిస్‌ ఎస్‌వీ భట్‌లు ఈ విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం
రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆరు లక్షలు ఇవ్వడం ఎందుకు.. చనిపోక ముందే రెండు లక్షలు ఇవ్వవచ్చు కదా అని గత విచారణలో హైకోర్టు ప్రభుత్వాలను ప్రశ్నించింది. రైతు ఆత్మహత్యల మూలాలను గుర్తించి.. వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలేంటో తెలపాలని సూచించింది. ఈమేరకు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. స్వామినాథన్‌ కమీషన్‌ ప్రకారం పంటకు బీమా, సాగునీటి వసతి, విత్తనాలు, పనిముట్లను సబ్సిడీ ఇవ్వడం ద్వారా రైతుల్లో ధీమా కల్పించాలని ప్రధాన పిటిషనర్‌ వ్యవసాయ జన చైతన్య వేదిక డిమాండ్‌ చేస్తోంది. ఈ పిటిషన్‌పై బుధవారం వాదనలు కొనసాగుతాయి.

 

11:58 - October 14, 2015

గుంటూరు : ప్రపంచాన్నే ఆకర్షించాలి. చరిత్రలో ఇదో మైలురాయి. అందుకే 10 కోట్లు పోయినా పర్వాలేదు. అంగరంగ వైభవంగా జరిపేస్తాం. అద్భుతం సృష్టిస్తామన్నారు. డబ్బు గురించి కాదు ప్రతిష్ట గురించి ఆలోచిస్తున్నామన్నారు. అందుకే ఓ కన్సల్టెన్సీని రంగంలోకి దింపారు. కాంట్రాక్ట్‌ కట్టబెట్టారు. అది అస్మదీయ కంపెనీ అంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. అయినా లెక్క చేయలేదు. ఏమైందో ఏమో ముహూర్తం దగ్గరపడేసరికి కథ మార్చేశారు.
ప్రభుత్వ కార్యక్రమం ప్రైవేటువారికివ్వడంపై విమర్శలు
అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా చేస్తున్న ప్రభుత్వం.. ఆ ఏర్పాట్లను విజ్‌క్రాఫ్ట్‌ సంస్థకు అప్పచెప్పింది. 10 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను వారికి ఇచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ కార్యక్రమం ప్రైవేటు సంస్థ నిర్వహించడమేంటని.. ప్రభుత్వానికి అధికార యంత్రాంగం లేదా అని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయినా ప్రభుత్వం లెక్క చేయలేదు.
మనసు మార్చుకున్న సర్కార్ 
మరో 8 రోజుల్లో కార్యక్రమం ఉందనగా.. ప్రభుత్వం మనసు మార్చుకుంది. విజ్‌క్రాఫ్ట్‌ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకుంది. ఆరోపణలు రావడంతోనే కాంట్రాక్ట్‌ రద్దు చేసుకున్నట్లు పైకి ప్రచారం జరుగుతున్నా.. విజ్‌క్రాఫ్ట్‌ సంస్థకు ప్రభుత్వానికి ఏర్పాట్లపై, ఖర్చులపై ఏకాభిప్రాయం కుదరలేదనే వాదన కూడా వినపడుతోంది. ఇప్పుడు కొత్త నిర్ణయం ప్రకారం పర్యాటక, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతాయి.
భోజనం ఏర్పాట్లు కేఎంకే సంస్థకు అప్పగింత
కొన్ని పనులను మాత్రం మాన్‌ డెకార్‌కు అప్పచెప్పగా, అల్పాహార, భోజనాల కార్యక్రమాన్ని కేఎంకేకు అప్ప చెప్పారు. గుంటూరు జిల్లా కాంతిలాల్‌ దండేకే ఓవరాల్‌ బాధ్యతలు అప్పగించారు. ఇక మంత్రుల పర్యవేక్షణ ఎటూ ఉంటుంది. మొత్తం మీద 10 కోట్ల కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన ప్రభుత్వం.. స్వయంగా ఎంత ఖర్చు పెడుతుందో చూడాలి.

 

11:51 - October 14, 2015

హైదరాబాద్ : ఆన్ లైన్ లో మెడిసిన్ అమ్మకాలను రద్దు చేయాలని మెడికల్ షాప్ యజమానులు డిమాండ్ చేశారు. ఆన్ లైన్ మందుల అమ్మకాలను నిరసనగా ఇవాళా దేశ వ్యాప్తంగా బంద్ చేపట్టారు. అందులో భాగంగా హైదరాబాద్ లో మెడికల్ షాప్ ల యజమానులు బంద్ పాటించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆన్ లైన్ లో మెడిసిన్స్ అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిస్తుందని..దానికి విరమించుకోవాలని కోరారు. ఆన్ లైన్ లోని డ్రగ్స్ నిరుపయోగం అవుతాయని చెప్పారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోనే మందులు ఇవ్వాలని చెప్పారు. మెడిసిన్లను ఆన్ లైన్ చేయడం తప్ప అని అన్నారు. ఆన్ లైన్ లో ఎలాంటి చెక్ అప్ ఉండదని తెలిపారు. ఆన్ లైన్ మందులతో డ్రగ్స్ తో ప్రమాదం, దుష్ప్రభావం.. పొంచివుందన్నారు. కొన్ని డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ తోనే తీసుకోవాలన్నారు. డాక్టరు సలహాలతోనే మందులు వాడాలన్నారు. సైడ్ ఎఫెక్ట్ తో పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఆన్ లైన్ విధానం రద్దు చేయాలని కోరారు. అలాగే మందులను ఆన్ లైన్ కోనుగోలు చేయడాన్ని అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

 

11:04 - October 14, 2015

హైదరాబాద్ : కార్బైడ్ వినియోగించి పక్వానికి తెచ్చిన ఫలాలను తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని, వినియోగదారులకు అవగాహన కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. కార్బైడ్ ప్రభావంతో జరిగే నష్టాలను ప్రకటనలు, వాల్‌పోస్టర్ల ద్వారా వినియోగదారులకు అవగాహన కల్పించే చర్యలను చేపట్టాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు తాత్కాలిక చీఫ్ జస్టిస్ దిలీప్ బీ భోసలే ఆధ్వర్యంలోని ధర్మాసనం సూచించింది. ఇలాంటి పండ్లను తినడం ద్వారా క్యాన్సర్ వ్యాధికి దారితీసే పరిస్థితులపై సదస్సుల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాలని ధర్మాసనం పేర్కొంది. కాయలను పండ్లుగా మార్చడానికి కార్బైడ్, ఇతర రసాయన పదార్థాలు ఉపయోగించడంపై ఇటీవల హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసును హైకోర్టు స్వీకరించి పలుమార్లు విచారించింది.

 

11:00 - October 14, 2015

హైదరాబాద్ : ఇకపై వాహనదారులు తమ గమ్యాన్ని ట్రాఫిక్‌ చిక్కుల నుంచి తప్పించుకుని సకాలంలో చేరుకునే అవకాశాన్ని పోలీసుల కల్పించారు. ట్రాఫిక్‌ జామ్‌ వివరాలను పోలీసులు రూపొందించిన మొబైల్‌ యాప్‌ సహాయంతో తెలుసుకోవచ్చు. అంతే కాదు ఆటో ఎక్కితే ఏ మేరకు ఛార్జీ చెల్లించాలో కూడా ఈ యాప్‌ చెబుతుంది. ఇలా అనేక సమస్యలకు చెక్‌ పెట్టే హైదరాబాద్‌ ట్రాఫిక్‌ లైవ్‌ యాప్‌ మీ స్మార్ట్ మొబైల్‌లో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
మొబైల్‌ యాప్‌కు రూపకల్పన
సిటీ ట్రాఫిక్‌ పోలీసులు రేయింబవళ్లు శ్రమించి వివిధ అంశాలతో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ లైవ్‌ పేర మొబైల్‌ యాప్‌కు రూపకల్పన చేశారు. ఈ యాప్‌తో వాహనదారులు వివిధ అంశాలపై సమాచారం తెలుసుకోవచ్చు. నగరంలో ఏ రూట్‌లో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంది.. గమ్య స్థానానికి ఎలా వెళ్తే బాగుంటుందో ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కొత్తవారికి కొందరు ఆటో డ్రైవర్లు ఎక్కువ ఛార్జీ వసూలు చేసి చుక్కలు చూపిస్తారు. ఇటువంటి సమయంలో తాము ఉన్న ప్రాంతం నుంచి గమ్యస్థానం చేరుకునేందుకు ఏ మేరకు ఛార్జీ చెల్లించాలో ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. పది రూపాయలు అటూ ఇటూగా చెల్లించే అవకాశం ఉంటుంది. అంతకు మించి ఎక్కువ డిమాండ్‌ చేస్తే పోలీసులకు ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.
నో పార్కింగ్‌ ఏరియాలోని వాహనాల తరలింపు
నో పార్కింగ్‌ ఏరియాలో పార్క్‌ చేసిన వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు తరలిస్తుంటారు. సమీపంలోని ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో వీటిని ఉంచుతారు. తమ వాహనం ఎక్కడుందో తెలియక ఆందోళన చెందేవారు ఈ యాప్‌ ద్వారా తమ వాహనం ఎక్కడుంది. ఎంత చలానా కట్టాలి. ఏ అధికారితో సంప్రదించాలి అన్న వివరాలు తెలుసుకోవచ్చు. చలానాను మొబైల్‌ ద్వారా చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. దీంతో వాహనదారులు త్వరగా తమ వాహనాన్ని తిరిగి తీసుకునే అవకాశం కల్పిస్తుంది.
యాప్‌లో ఇంకా అనేక సౌకర్యాలు
హైదరాబాద్‌ ట్రాఫిక్‌ లైవ్‌ యాప్‌లో ఇంకా అనేక సౌకర్యాలు ఉన్నాయి. వాహనం రిజిస్ర్టేషన్‌ వివరాలు. సమీపంలోని ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ సమాచారం, ఎవరైనా ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడితే వెంటనే ఫోన్‌ కెమెరాతో దృశ్యాన్ని తీసి ట్రాఫిక్‌ పోలీసులకు అందించవచ్చు. వీటితో పాటు అంబులెన్స్‌, హాస్పిటల్స్‌, ట్రాఫిక్‌ చట్టాలు వంటి అనేక సమాచారం ఈ యాప్‌ ద్వారా అందుబాటులోకి వస్తోంది. ఈ యాప్‌కు త్వరలోనే ఆదరణ పెరుగుతుందని, హైదరాబాద్‌లో రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనదారుడికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

 

 

అంబర్ పేట వీరన్నగుట్ట వాంబే ఇళ్లల్లో సోదాలు

హైదరాబాద్ : అంబర్ పేట వీరన్నగుట్ట వాంబే ఇళ్లల్లో తహశీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. అక్రమ నివాసులను సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు. 15 ఇళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

1300 పైగా గుడుంబా ప్యాకెట్ల స్వాధీనం

హైదరాబాద్ : సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆబ్కారీశాఖ.. 1300 పైగా గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంది. 13 మందిని అరెస్టు చేసింది. 

దాద్రీ ఘటన దురదృష్టకరం : మోడీ

ఢిల్లీ : ఎట్టకేలకు దాద్రి ఘటనపై ప్రధాని మోడీ నోరు విప్పారు. ఓ వార్తా సంస్థతో ప్రధాని ముఖాముఖిలో మాట్లాడారు. దాద్రీ ఘటన దురదృష్టకరమన్నారు. దాద్రీ ఘటనపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయని చెప్పారు. కుహనా లౌకిక వాదానికి బీజేపీ వ్యతరేకమని పేర్కొన్నారు. 

10:30 - October 14, 2015

ప్రభుత్వ భూములను అమ్మడం సరికాదని.. వాటిని అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని దిహన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, పలు విషయాలను విశ్లేషించారు. భూములు అనేవి ప్రభుత్వాలకు ఆస్తులని... వాటికి ప్రభుత్వం ట్రస్టీ కాని యజమాని కాదన్నారు. పునరుత్పత్తికి అవకాశం లేని సహజ వనరు భూమని.. నైతికంగా భూమిని సృష్టించలేమని చెప్పారు. నైతికంగా పునరుత్పత్తికి అవకాశం లేని వాటిని ప్రభుత్వానికి అమ్మే హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు ఉపయోగపడే భూములు ప్రభుత్వానికి ఎందుకు ఉపయోగపడవని ప్రశ్నించారు. ఏ రాజకీయ సహకారం లేకుండా ఎవరూ భూకబ్జాలు చేయలేరని తేల్చి చెప్పారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే చూద్దాం...
పునరుత్పత్తికి అవకాశం లేని సహజ వనరు భూమి
'భూములు అనేవి ప్రభుత్వాలకు ఆస్తులు. ప్రభుత్వ ఆస్తులకు.. సర్కార్ ట్రస్టీ కాని యజమాని కాదు. నైతికంగా భూమిని సృష్టించలేము. పునరుత్పత్తికి అవకాశం లేని సహజ వనరు భూమి. ప్రభుత్వం భూమి... ఇప్పుడున్న ప్రభుత్వం భూమి కాదు. భవిష్యత్ లో ప్రభుత్వం భూముల ప్రజా అవసరాలపై నిర్ధిస్టమైన అంచాన వేయకుండా... మిగులు భూములు అమ్ముతామనడంతో అర్థంలో లేదు. నిధులు కావాలనే దానిలో అభ్యంతరం లేదు. కానీ భూమిని అభివృద్ధి చేసి కాలక్రమేణా డబ్బులు సంపాదించవచ్చు. ప్రభుత్వ భమూలను అమ్మి రూ.13 వేల కోట్లను సంపాదిస్తామని మొదట్లోనే ప్రభుత్వం చెప్పింది. ఇదిలావుంటే గతంలో భూములు అమ్మినప్పడు.. టీఆర్ ఎస్ వ్యతిరేకించింది. కానీ అధికారంలోకి రాగానే టీసర్కార్ కూడా భూముల అమ్మకానికి పూనుకుంది. గతంలో కాంగ్రెస్ అడ్డగోలుగా భూములు అమ్మేసింది.
పత్రిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధానం.. అధికారంలోకి రాగానే మరో విధానం 
ఇప్పుడు భూమలు అమ్మకాన్ని వ్యతిరేకిస్తుంది. పత్రిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధానం.. అధికారంలోకి రాగానే మరో విధానం అనుస్తరిస్తున్నారు. భూముల కోనుగోలు వ్యవహారం... రాజకీయ నిర్ణయం. తెలంగాణ రాష్ట్రంలో రూ. 61 వేల కోట్లు అదనంగా అప్పులు చేశారు. భూములు అమ్మడం తప్పా.. వేరే మార్గం లేదా.. అనే ప్రశ్న తలెత్తింది. అధికారంలో ఉన్నవారు... గతంలో అధికారంలో ఉన్న వారు మాత్రమే... ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడుతున్నారు. రాజకీయ ప్రాబళ్యం లేకుండా భూముల కబ్జా లేదు. దేశంలోపలి భూములను కాపాడ లేని ప్రభుత్వాలు భారత సరిహద్దులోని భూభాగాన్ని ఎలా కాపాడుతారు. తెలంగాణలో 1800 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి. ఒకవేల అమ్మాల్సిన పరిస్థితి వస్తే... వ్యాల్యు అడిషన్ చేసి..భూములను అభివృద్ధి చేయాలి. ఇప్పుడు అవసరాలు.. భవిష్యత్ అవసరాలు పోగా.. మిగిలిన భూములను మాత్రమే అమ్మాలి. అయితే ప్రభుత్వ సంస్థలను అడిగి అమ్మాలి. ప్రభుత్వ భూములను అమ్మడంతో భూమలు శాశ్వతంగా ప్రజలకు, ప్రభుత్వాలకు దూరం అవుతాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ గా ఉంది. మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు భూములు అమ్మితే ప్రభుత్వానికి నష్టం వస్తుందన్నారు.
ప్రైవేట్ యూనివర్సిటీలు..
ప్రభుత్వ యూనివర్సిటీలు.. ఫైనాన్సియల్ ప్రైవేటైజైషన్ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వం ఉన్నత విద్యలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచం వ్యాప్తంగా 8 శాతం విద్యార్థులు మాత్రమే... ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్నారు. మిగిలిన 92 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుతున్నారు. అమెరికాలో కూడా.. 40 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదువుతున్నారు. జపాన్ లో 51 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదువుతున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నత విద్యలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది. ఉన్నత విద్య సామాన్యులకు అందుబాటులో ఉండాలంటే.. ఫీజులు వసూలు చేయవద్దు. ఉన్నత విద్య సమాన్యులకు అందాలంటే ప్రభుత్వం కీలక పాత్రం పోషించాలి. మనదేశంలో ప్రభుత్వ రంగాన్ని తోసేసి ప్రైవేట్ రంగం ముందుకు వస్తుంది. విదేశీల్లో ప్రభుత్వాలకు ప్రైవేట్ రంగం సహకరిస్తుంది. ప్రభుత్వ యూనివర్సిటీలను నీరుగార్చే విదేశీ, ప్రైవేట్ విశ్వ విద్యాలయాలు రావడం ప్రమాదం. రెగ్యులేటరీ వ్యవస్థ ఉండాలి'. అని నాగేశ్వర్ చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:31 - October 14, 2015

తిరుపతి : నేటి నుంచి తిరుమలేశుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం బంగారు తిరుచ్చి వాహనంపై తిరుమలేశుడు విహరించనున్నాడు. రాత్రి నుంచి రోజూ రెండేసి వాహనాలపై శ్రీదేవీ భూదేవీ సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నాడు.
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీ వేంకటేశుని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆనవాయితీ ప్రకారం.. శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడి ఉత్సవ మూర్తిని.. తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను విష్వక్సేనుడు పర్యవేక్షిస్తాడన్నది భక్తుల నమ్మకం. బుధవారం ఉదయం బంగారు తిరుచ్చి వాహనంపైన, రాత్రి పెద్ద శేష వాహనంపైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు విహరించనున్నాడు. అటు తర్వాత తొమ్మిది రోజుల పాటు శ్రీనివాసుడు వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నాడు.
గత నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు
మూడేళ్లకోసారి వచ్చే అధిక మాసం కారణంగా.. గత నెలలోనే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరిగాయి. ప్రస్తుతం నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రస్తుత వేడుకల్లో ధ్వజారోహణ, అవరోహణ కార్యక్రమాలు ఉండవు. అదేవిధంగా.. మహారథం స్థానంలో స్వర్ణరథోత్సవం ఉంటుంది. రథ రంగ డోలోత్సవం బదులు స్వామి వారికి పుష్పపల్లకీ సేవను నిర్వహిస్తారు.
ఈనెల 18న గరుడ వాహన సేవ
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ ఈనెల 18న జరుగనుంది. ఆరోజు ఆదివారం కావడంతో.. ఈసారీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని టీటీడీ భావిస్తోంది. అందుకే ఆర్జిత సేవలు, ప్రత్యేక, వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. భక్తుల కోసం 6 లక్షలకు పైగా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేసింది. గరుడవాహన సేవ రోజున అదనంగా 994 మంది సిబ్బంది సేవలను వినియోగించుకోనుంది. పోలీసు శాఖ కూడా 2,616 మందితో భద్రత కల్పిస్తోంది.

 

 

09:18 - October 14, 2015

రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంతో టీప్రభుత్వం విఫలమైందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్, బిజెపి నేత లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్లు రవి, వరంగల్ పిడిఎఫ్ ఎంపీ అభ్యర్థి గాలి వినోద్ కుమార్ పాల్గొని, మాట్లాడారు. ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కరువు మండలాలను ప్రకటించలేదని పేర్కొన్నారు. మరన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:51 - October 14, 2015

ఢిల్లీ : ఆన్‌లైన్ ఫార్మసీ విక్రయాలకు నిరసనగా అఖిల భారత ఔషధ విక్రేతల సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా 8 లక్షల 50 వేల మెడికల్‌ రిటేల్‌ షాపులు నేడు మూతపడనున్నాయి. ఆన్‌లైన్ విక్రయాల ద్వారా మెడికల్‌ షాపులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఏఐఓసిడి పేర్కొంది. ఆన్‌లైన్‌ మందుల అమ్మకాలపై నియంత్రణ విధించాలని ఏఐఓసిడి కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తోంది.
ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ అమ్మకాల జోరు
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ రోజు రోజుకు విస్తరిస్తోంది. మొబైల్‌ ఫోన్లు, దుస్తులు, ఎలక్ట్రానిక్‌ తదితర వస్తువుల అమ్మకాలు ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటికే ఊపందుకున్నాయి. ఇపుడు ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ అమ్మకాలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ-ఫార్మసీ కారణంగా లక్షలాది చిన్న మెడికల్‌ షాపుల ఆదాయానికి గండి పడుతోంది. ఇందుకు నిరసనగా అక్టోబర్‌ 14, బుధవారం దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు అఖిల భారత ఔషధ విక్రేతల సంఘం-ఏఐఓసీడీ ప్రకటించింది.
ఇంటర్నెట్‌ ద్వారా మందుల విక్రయాలపై వ్యతిరేకత
ఇంటర్నెట్‌ ద్వారా మందుల విక్రయాన్ని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నట్లు ఏఐఓసీడీ తెలిపింది. ఆన్‌లైన్‌ విక్రయాల ద్వారా మందులు వికటించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, తక్కువ నాణ్యత, నకిలీ ఉత్పత్తుల డ్రగ్స్ ప్రవేశించే అవకాశం ఉందని ఏఐఓసీడీ హెచ్చరించింది. కేంద్రం ఆన్‌లైన్ విక్రయాలను అనుమతిస్తే 8 లక్షల మంది ఔషధ విక్రేతలు, 80 లక్షల ఉద్యోగులు, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. ఇంటర్నెట్‌ ద్వారా అక్రమంగా మందులు విక్రయించడంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఏఐఓసీడీ డిమాండ్ చేసింది. ఒకవేళ కేంద్రం తగు చర్యలు చేపట్టకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. ఆసుపత్రుల్లోని మెడికల్‌ షాపులు, 24 గంటలు పనిచేసే మెడికల్‌ షాపులకు బంద్‌ నుంచి మినహాయింపు నిచ్చారు.

 

08:46 - October 14, 2015

ఇండోర్ : భారత్ వేదికగా జరుగుతున్న టీమిండియా, సౌతాఫ్రికాజట్ల..వన్డే సిరీస్ ...రెండోమ్యాచ్ కే హాట్ హాట్ గా మారింది. కాన్పూర్ వన్డే విజయంతో సఫారీటీమ్ ఓవైపు కేరింతలు కొడుతుంటే...విజయం ముంగిట్లో బోల్తా కొట్టిన టీమిండియా మాత్రం...పరాజయం భారంతో రగిలిపోతోంది. ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ఇవాళ జరిగే డే నైట్ మ్యాచ్లో దెబ్బకు దెబ్బతీయాలన్న కసితో ధోనీసేన బరిలోకి దిగుతోంది.
మహాత్మాగాంధీ నెల్సన్ మండేలా ట్రోఫీ
టీమిండియా, సౌతాఫ్రికాజట్ల మధ్య ... మహాత్మాగాంధీ నెల్సన్ మండేలా ట్రోఫీ కోసం జరుగుతున్న ఫ్రీడమ్ సిరీస్ లోని ఐదుమ్యాచ్ ల వన్డే సర్కస్.. కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం నుంచి...ఇండోర్ హోల్కార్ స్టేడియానికి చేరింది. పరుగుల వెల్లువలా సాగిన తొలివన్డేలో...ఐదు పరుగుల తేడాతో ఓడిన ధోనీసేనకు...రెండోవన్డేలో విజయం అనివార్యంగా మారింది. సిరీస్ అవకాశాలను చేజారిపోకుండా నిలుపుకోవాలంటే..రెండోవన్డేలో నెగ్గితీరాల్సి ఉంది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ..నువ్వానేనా అన్నట్లుగా సాగిన తొలివన్డేలో సఫారీ టీమ్ గెలుపు, టీమిండియా ఓటమి...అభిమానుల్లో ఆసక్తిని మరింతగా పెంచింది. 303 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదిస్తూ..గెలుపు ముంగిట్లో బోల్తా కొట్టినతీరును ధోనీ అండ్ కో మాత్రమే కాదు..ఫ్యాన్స్ సైతం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే...డెత్ ఓవర్ల వైఫల్యమే టీమిండియా ఓటమికి ప్రధానకారణమని తేలింది.
రెండో విజయానికి ఉరకలేస్తోన్న సఫారీ..
మరోవైపు...ఆట అన్ని విభాగాలలోనూ అద్భుతంగా రాణించి...టీమిండియాకు పగ్గాలు వేసిన ఆత్మవిశ్వాసంతో...సఫారీటీమ్ వరుసగా రెండో విజయానికి ఉరకలేస్తోంది. కెప్టెన్ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ, ఆఖరి 10 ఓవర్లలో బెహార్డిన్ తో కలసి 110 పరుగులు, చివరి మూడు ఓవర్లలో 53 పరుగులు కొల్లగొట్టినతీరు చూస్తే...డెత్ ఓవర్లలో టీమిండియా బౌలింగ్ ఎంత అధ్వాన్నంగా ఉందీ మరి చెప్పాల్సిన పనిలేదు.
రెండో వన్డేలో గెలవాలని భావిస్తున్న టీమిండియా
డేమ్యాచ్ గా ముగిసిన తొలివన్డే వైఫల్యాలను...డే-నైట్ గా జరిగే రెండో వన్డే విజయానికి మెట్లుగా చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. భారత బౌలింగ్ తురుపుముక్క అశ్విన్ గాయం, ఫిట్ నెస్ కు సంబంధించి సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతేకాదు..ఒకవేళ అశ్విన్ కు మ్యాచ్ ఫిట్ నెస్ లేకపోతే..వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను తుదిజట్టులోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఓపెనింగ్ జోడీ భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, మీడియం పేసర్ స్టువర్ట్ బిన్నీ..తొలివన్డేలో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయారు. చేతికి ఎముకలేదన్నట్లుగా పరుగులు సమర్పించుకొన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే..స్పిన్ జోడీ అమిత్ మిశ్రా, అశ్విన్ అద్భుతంగా రాణిస్తుంటే...పేస్ విభాగం దారుణంగా విఫలం కావడం..ధోనీసేనకు ప్రధానబలహీనతగా మారింది.
రాణించలేకపోతున్న కొహ్లీ
టీమిండియా బ్యాటింగ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్, మిడిలార్డర్ ఆటగాడు సురేశ్ రైనా గుదిబండల్లా మారినట్లే కనిపిస్తున్నారు. విరాట్ కొహ్లీ సైతం స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, అజంక్యా రహానేలపైనే టీమిండియా బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడి ఉంది.ధోనీసైతం ఫినిషర్ గా తన స్థాయిని మెరుగుపరచుకోవాల్సి ఉంది. టీమిండియా తుదిజట్టులో ఒకటి రెండుమార్పులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో రహానేను దించి..మిడిలార్డర్లో అంబటి రాయుడు లేదా ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ గురుకీరత్ సింగ్ మాన్ కు చోటు కల్పించే ఆలోచన సైతం లేకపోలేదు.
సమతూకంతో కనిపిస్తోన్న సఫారీటీమ్
మరోవైపు...సఫారీటీమ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఎంతో పటిష్టంగా, సమతూకంతో కనిపిస్తోంది. భారతగడ్డపై ఈ రెండుజట్లూ ఇప్పటి వరకూ 24 వన్డేల్లో తలపడితే...టీమిండియా 13, సౌతాఫ్రికా 11 విజయాల రికార్డుతో ఉన్నాయి. మ్యాచ్ కు వేదికగా ఉన్న ఇండోర్ హోల్కార్ స్టేడియంలో..టీమిండియాకు తిరుగులేని రికార్డే ఉంది. ఇప్పటి వరకూ ఆడిన నాలుగుకు నాలుగుమ్యాచ్ లూ నెగ్గిన టీమిండియా..నూటికి నూరుశాతం విజయాల రికార్డుతో ఉంది.
టాస్ తో పాటు మంచుప్రభావం కీలకం
డే-నైట్ గా జరుగుతున్న ఈమ్యాచ్ లో ..టాస్ తో పాటు...మంచుప్రభావం సైతం కీలకంకానున్నాయి.ఒక్కమాటలో చెప్పాలంటే...ఈమ్యాచ్ సఫారీలకు చెలగాటం...టీమిండియాకు సిరీస్ సంకటంగా తయారయ్యింది. టీమిండియాకు మాత్రమే కాదు..కెప్టెన్ గా ధోనీకి సైతం ఇది అతిపెద్ద సవాలే.

 

 

08:36 - October 14, 2015

ఒకవైపు ఉత్సవాలు. మరోవైపు పుట్టమన్ను, కళశాలలో జలం సేకరణలు. మరోవైపు భూ సేకరణలు. వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు. అరెస్టులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్న విభిన్న దృశ్యాలు రేపు ఎవరి జీవితాలను ఏ మలుపు తిప్పుతాయోననన్న ఉత్కంఠను కలిగిస్తున్నాయి.
ఎపిలో విచిత్రకర అరుదైన వాతావరణం
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఒక విచిత్రకర అరుదైన వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గుళ్లు గోపురాలు శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. మరోవైపు కొత్త రాజధాని అమరావతి శంఖు స్థాపన ముహూర్తం సమీపిస్తుండడంతో ప్రభుత్వం అందుకు సంబంధించిన పనులు వేగవంతం చేస్తోంది. ఆహ్వాన పత్రికల పంపిణీ, పుట్టమన్ను సేకరణ కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే తన స్వగ్రామంలో శ్రీకారం చుట్టారు. ఊరూరా మట్టి, జలం సేకరించే కార్యక్రమం నడుస్తోంది. ఇలాంటి భారీ ఈవెంట్స్ ను నిర్వహించడంలో, వాటికి పబ్లిసిటీ సంపాదించడంలో తానెంతటి సమర్ధుడో చంద్రబాబునాయుడు మరోసారి నిరూపించుకుంటున్నారు. వరదలైనా, తుపాన్ లైనా, ఉత్సవాలైనా, పుష్కరాలైనా, ఇప్పుడు శంఖుస్థాపన కార్యక్రమమైనా ఇలాంటివి మేనేజ్ చేయడంలో చంద్రబాబు శైలి ప్రత్యేకమైనది. ఇలాంటి సందర్భాలలో ప్రత్యర్ధులను సైతం ఆయన వ్యవహార శైలి అబ్బురపరుస్తూ వుంటుంది.
ర్యాలీలు, ధర్నాలు, నిరాహార దీక్షలు
ఓ వైపు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి కోలాహల వాతావరణంతో పాటు ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, నిరాహారదీక్షలు, అరెస్టులు లాంటి సంఘటనలూ రోజూ జరుగుతున్నాయి. ఓ వైపు ప్రతిపక్ష నేత జగన్ ఆరు రోజుల పాటు గుంటూరులో నిరాహార దీక్ష చేశారు. చివరకు ఆయనను తెల్లవారుఝామున ఆస్పత్రికి తరలించడంతో ఆ ఎపిసోడ్ ముగిసింది. ఈ వార్త ఇంకా అందరి చెవిన పడకముందే, నారావారిపల్లెలో పుట్టమన్ను సేకరణ చేపట్టడం చంద్రబాబు వ్యూహ రచనా సామర్థ్యానికి నిదర్శనం.
వ్యూహరచనలో చంద్రబాబు మహా దిట్ట
అవును. అనుమానం లేదు. చంద్రబాబు వ్యూహరచనలో మహా దిట్ట. అయితే, ఆయన రచించే వ్యూహాలు తరచూ ప్రజలను కష్టాల్లోకి, ఆందోళనల్లోకి నెడుతుండడం సర్వసాధారణ ద్రుశ్యం. రాజధాని, ఎయిర్ పోర్టులు, పరిశ్రమలు అంటూ ఆయన దొరికన చోటల్లా వేల వేల ఎకరాలు జనం నుంచి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు దాదాపు ప్రతి జిల్లాలోనూ ఇప్పుడు ఏదో ఒక భూ సమస్య రగులుకుంటోంది. అమరావతి, భోగాపురం, మచిలీపట్నం, అనంతపురం ఇలా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వం భూములు సేకరిస్తున్న తీరు తీవ్ర వివాదస్పదమవుతోంది. ప్రభుత్వం తమకు బంపర్ ఆఫర్ ప్రకటించిం దని సంబరపడుతున్నవారికంటే, రేపు ఎలా బతకాలి? అని ఆవేదన చెందుతున్నవారి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఆందోళనే వారిని ఉద్యమబాట పట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలంటూ వామపక్ష నేతలు, మరికొందరు మేథావులు పాదయాత్రలు చేస్తున్నారు. పరిశ్రమల పేరుతో, అభివ్రుద్ధి పేరుతో తమ భూములు లాక్కుంటే సహించేది లేదంటూ అనేక ప్రాంతాల్లో జనం ఉద్యమిస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో అరెస్టులు సర్వసాధారణమవుతున్నాయి. బహిరంగ ప్రదర్శనలకు, సభలకు పోలీస్ యంత్రాంగం అనుమతించకపోతే, ఎవరి ఇళ్లలో వారు కూర్చొని నిరసనలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ లో కొత్త చరిత్రను జనం లిఖిస్తున్నారు. న భూతో న భవిష్యత్ అన్న రీతిలో శంఖు స్థాపన కార్యక్రమం నిర్వహించాలని ముచ్చటపడుతున్న చంద్రబాబునాయుడు ప్రజలు రచిస్తున్న ఈ కొత్త చరిత్రను ఎలా అర్ధం చేసుకుంటున్నారో తెలియదు. విభిన్న ప్రాంతాల, విభిన్న వర్గాల ప్రజల గుండెల్లో గూడుకట్టుకుంటున్న భావాలు ఆయనకు అర్ధమవుతున్నాయో లేదో తెలియదు. ప్రజలు, ప్రజాసంఘాల నేతలు విభిన్న సందర్భాలలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు చంద్రబాబుకి ప్రస్తుతం అభివ్రుద్ధి నిరోధకంగా అనిపించవచ్చు. కానీ, అభివ్రుద్ధి పేరుతో తమకున్న ఒకట్రెండు ఎకరాల భూమిని కూడా లాక్కుని, పచ్చటి పొలాలను కమర్షియల్ వెంచర్లుగా మారుస్తుంటే, ఉపాధి కోల్పోతున్నవారంతా , వీధినపడుతున్న వారంతా రేపు ఎలా రియాక్టవుతారో ఊహించలేం.

 

 

నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన

మెదక్ : తెలంగాణ మంత్రి హరీష్ రావు నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోనున్నారు.

నేడు గజ్వేల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

మెదక్ : తెలంగాణ మంత్రి కేటీఆర్ నేడు మెదక్ జిల్లా గజ్వేల్ లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోనున్నారు.

07:43 - October 14, 2015

ఎపిలో రాజధాని పేరుతో విస్తృతంగా చేస్తున్న బలవంతపు భూసేకరణ ఆపాలని కేవీపీఎస్ ఎపి నేత మాల్యాద్రి డిమాండ్ చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని హితవు పలికారు. ఇప్పటికే భూములు తీసుకున్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కార్పొరేట్లకు కట్టబెట్టడానికే అవసరానికి మించి భూములను సేకరిస్తున్నారని విమర్శించారు. 'ఆంధ్రప్రదేశ్ లో భూ సమీకరణ, భూ సే కరణ లాంటి అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చెలరేగుతున్నాయి. వివిధ అవసరాల కోసం లక్షల ఎకరాలు ప్రభుత్వం సేకరించబోతున్నదన్న వార్త, అందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నాయి. తమకే ఎక్కువ నష్టం జరుగుతోందన్న ఆందోళన, ఆవేదన దళితుల గుండెల్లో గూడుకట్టుకుంటోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? ప్రభుత్వం చేపడుతున్న భూసే కరణ జనం జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోంది? ఇలాంటి అంశాలపై మాల్యాద్రి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం...

నల్గొండ : జిల్లాలోని చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

07:29 - October 14, 2015

గుంటూరు : ఎపి రాజధాని అమరావతి శంకుస్థాన కార్యక్రమ నిర్వహణకు విజ్ క్రాఫ్ట్ ప్రైవేట్ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్ట్ ను ఎపి ప్రభుత్వం రద్దు చేసింది. నేరుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనుంది. పర్యాటక, సాంస్కృతిక శాఖలు శంకుస్థాపన ఏర్పాట్లను నిర్వహించనున్నాయి. రూ.10 కోట్ల రూపాయలతో మొదటగా విజ్ క్రాఫ్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం, విజ్ క్రాఫ్ట్ సంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. కాంట్రాక్ట్ ను ఉపసంహరించుకుంటూ..ఎపి సర్కార్ నిర్ణయం తీసుకుంది. శంకుస్థాపన ఏర్పాట్ల బాధ్యతలను పర్యాటక, సాంస్కృతిక శాఖలకు అప్పగించింది. అమరావతి శంకుస్థాన కార్యక్రమ నిర్వహణను విజ్ క్రాఫ్ట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. శంకుస్థాపన ఏర్పాట్ల బాధ్యతలను పది కోట్ల రూపాయలతో ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడాన్ని కేంద్రప్రభుత్వం కూడా తప్పుబట్టింది. ఈనేపథ్యంలో ప్రభుత్వం విజ్ క్రాఫ్ట్ సంస్థతో కుదుర్చుకున్న కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.  

 

 

 

విజ్ క్రాఫ్ట్ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు..

గుంటూరు : ఎపి రాజధాని అమరావతి శంకుస్థాన కార్యక్రమ నిర్వహణకు విజ్ క్రాఫ్ట్ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్ట్ ను ఎపి ప్రభుత్వం రద్దు చేసింది. నేరుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనుంది. 

07:14 - October 14, 2015

తూర్పుగోదావరి : జిల్లాలోని రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు పోరుబాట పట్టారు. యాజమాన్యం బలవంతంగా నూతన యంత్రాలతో కార్మికులను పనిచేయించడాన్ని తీవ్రంగా నిరసించడంతో 12మంది కార్మికనేతలను ఉద్యోగాల నుంచి తొలగించింది. ఫ్యాక్టరీలో కొత్తయంత్రాలను అమర్చి వాటిని వినియోగంలోకి తీసుకురావాలంటే, నిబంధనల ప్రకారం యాజమాన్యం కార్మికసంఘాలతో ముందుగా వేతన ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరించడంతో ఫ్యాక్టరీలోని కార్మికనాయకులు నిరసన వ్యక్తం చేశారు.
యూనియన్ నేతలపై వేటు
40 రోజుల క్రితం యాజమాన్యం 12మంది యూనియన్ నేతలపై వేటువేసింది. పైగా కొత్తయంత్రాలను వినియోగంలోకి తీసుకురాలేకపోవడంతో ఫ్యాక్టరీకి భారీగా నష్టం వాటిల్లిందన్న నెపంతో 600 మంది కార్మికుల వేతనాల నుంచి గరిష్ఠంగా ఒక్కొక్కరి నుంచి 8వేల నుంచి 20వేల రూపాయలను యాజమాన్యం రికవరీ చేసింది. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా, కొత్త యంత్రాలను వాడుకలోకి తీసుకురావడాన్ని నిరసిస్తూ 36రోజుల పాటు కార్మికనేతలు రిలేదీక్షలు చేపట్టారు. యాజమాన్యం తీరులో మార్పులేకపోవడంతో నాలుగు రోజుల నుంచి నిరవధిక దీక్షలు చేపట్టారు. కార్మికుల దీక్షలకు సీపీఎం పార్టీతో పాటు సిఐటియు సంఘ నేతలు సంఘీబావం ప్రకటించారు.
బోనస్‌ ఇవ్వాలని కార్మికుల డిమాండ్
ఈ ఏడాది యాజమాన్యం చెల్లించాల్సిన బోనస్‌ను ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అకారణంగా విధుల నుంచి తొలగించిన 12 మంది ఉద్యోగులను బేషరుతుగా విధుల్లోని తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గత వేతన ఒప్పందం గడువు ముగిసి 10నెలలు కావొస్తున్నా... నేటికీ కార్మికులతో నూతన వేతన ఒప్పందం చేసుకోకుండా కొత్తయంత్రాలను ఫ్యాక్టరీలోకి దించి కార్మికుల సంఖ్యను తగ్గించాలనే కుట్ర జరుగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికశాఖ అధికారులతో పాటు, ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కారానికి చొరవచూపించాలని కార్మికులు కోరుతున్నారు.

 

 

07:09 - October 14, 2015

హైదరాబాద్ : నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. పప్పును ముట్టుకుంటే షాక్‌కొట్టేలా తయారైంది. ధరలు ఆకాశన్నంటడడంతో ఈసారి దసరా పండుగ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. పప్పులు, నూనెల ధరలు కొండెక్కి కూర్చోవడంతో పండగను ఎలా జరుపుకోవాలో తెలియక సామాన్యులు దిక్కులు చూస్తున్నారు. ఈసారి దసరా పండుగ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. పిండివంటల మాట అటుంచి కనీసం పప్పన్నం తినేందుకు కూడా నోచుకోకుండా ధరలు పెరిగిపోయాయి.
రికార్డు స్థాయికి చేరిన కందిపప్పు ధర
కందిపప్పు ధర రికార్డు స్థాయికి చేరింది. కేజీ చికెన్‌ 100 రూపాయలు ఉంటే..కందిపప్పు మాత్రం ఏకంగా 180 నుంచి 190 రూపాయలు పలుకుతోంది. ఒక్క కంది పప్పే కాదు అన్ని రకాల పప్పులు, బెల్లం, చక్కెర, నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదల దసరా సంబరాన్ని సామాన్యుడికి దూరం చేస్తోంది.
పైపైకి ఎగబాకుతున్న నిత్యావసరాల ధరలు
రాష్ర్టంలో కరవు పరిస్థితులు, పెరుగుతున్న డిమాండ్‌కు సరిపడా దిగుమతులు లేకపోవడంతో ఒక్కసారిగా నిత్యావసరాల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. సామాన్యులకు అందుబాటులో లేనంతగా పెరిగిపోతున్నాయి. కందిపప్పు ధర కేవలం నెల రోజుల వ్యవధిలో 50 రూపాయలు పెరిగింది. నెంబర్‌ వన్‌ రకం కందిపప్పు మార్కెట్లో కనిపించడం లేదు. రెండో రకానికే 180 రూపాయలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. పెసరపప్పు ధర 160 రూపాయలు, మినపప్పు ధర 185 రూపాయలకు చేరుకుంది. దీంతో దసరా పండుగకు పిండివంటలు చేసుకునే ఛాన్స్‌లేకుండా ధరలు పెరిగిపోయాయి. పిండివంటలకు ఉపయోగించే పప్పులు, నూనెలు, బెల్లం, పంచదార వంటి ప్రతి వస్తువు ధరలు అమాంతం పెరిగిపోయాయి.
రోజురోజుకూ పెరుగుతున్న నూనెల ధరలు
పప్పుల ధరలు ఇలా ఉంటే ఇక వంట నూనెల ధరలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర ఏకంగా 85 రూపాయలకు చేరుకుంది. 50 రూపాయలు పలకని పామాయిల్‌ నూనె ఏకంగా 70 రూపాయలకు చేరుకుంది. బెల్లం 40 రూపాయలు, చెక్కర 35 రూపాయల ధర పలుకుతోంది. గత 15గత రోజులుగా నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ ధరలు ఇంకా పెరుగుతాయని వ్యాపారులు చెప్తున్నారు. కందిపప్పు ధర 200లకు చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయంలో 110 రూపాయలు పలికిన కేజీ కందిపప్పు ధర..ఇప్పుడు రెట్టింపు ధర పలుకుతోంది.
మహారాష్ట్ర, కర్టాటకకు ఎగుమతి
రంగారెడ్డి జిల్లా తాండూరులో కందులు, మినుముల పంటల విస్తీర్ణం ఏటా అధికంగా ఉంటుంది. ఇక్కడి నుంచే మహారాష్ర్ట, కర్నాటక రాష్ర్టాలకు పప్పులు ఎగుమతి జరుగుతుంది. అయితే తాండూరులోనే వీటి ధరలు అమాంతం పెరిగాయి. కందిపప్పుకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాలలో డిమాండ్‌ అధికంగా ఉంటుంది. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి సగం కూడా ఉత్పత్తి కాలేదని రైతులు వాపోతున్నారు. పంట చేతికి రాకపోవడంతో మార్కెట్‌లో ధరలు పెరిగిపోయాయని చెబుతున్నారు. ఒకపక్క గిట్టుబాటు ధరలేక రైతులు నష్టపోతుండగా మరోవైపు సామాన్యుడికి ధరలు అందుబాటులో లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ధరల పెరుగుదల శాతం అధికంగా ఉందని వ్యాపారులు అంటున్నారు. సాధారణంగా దసరా, సంక్రాంతి పండుగల సమయలో నిత్యావసర వస్తువుల ధరలు 5 నుంచి 10 శాతం పెరుగుతాయి. కానీ..ఈసారి 30 నుంచి 50 శాతం వరకు పెరగడంతో...సామాన్యులు ఈసారి పండుగ సంబరాలు దూరం అవుతున్నారు.

 

07:00 - October 14, 2015

గుంటూరు : అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. దేశ, విదేశాల నుంచి వేలాదిమంది అతిరథ మహారధథులు తరలివస్తుండడంతో.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. ఒక వైపు డ‌యాస్‌ నిర్మాణాలు, మ‌రో వైపు సాంస్కృతిక కార్యక్రమాలను అదరహో అనిపించేలా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోడిని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళుతున్నారు.
మోడిని ఆహ్వానించేందుకు చంద్రబాబు ఢిల్లీ పయనం
ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడిని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధానితో పాటు..కేబినెట్‌ మంత్రులను కూడా చంద్రబాబు స్వయంగా ఆహ్వానించనున్నారు. దాంతో పాటు..రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై మోడితో పాటు కేబినెట్‌ మంత్రులతో చంద్రబాబు సమావేశమై చర్చించనున్నారు. అయితే ఢిల్లీకి వెళ్లే ముందు అమరావతి శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణపై అధికారులు, మంత్రులు, డీజీపీతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
అంతర్జాతీయస్థాయిలో ఏర్పాట్లు
అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని..దేశ చ‌రిత్రలో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్లుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేఎంకే సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. తొలుత విజ్‌క్రాఫ్ట్‌ అనే సంస్థకు పనుల్ని అప్పగించినా..ఆ తర్వాత కేఎంకే సంస్థకే పెద్ద మొత్తంలో పనుల్ని అప్పగించారు. విజ్‌క్రాఫ్ట్‌ సంస్థ కేవలం ప్రధాన డయాస్‌, వీవీఐపీల సౌకర్యాలకే పరిమితమైంది. ఇక కార్యక్రమం కోసం అతిపెద్ద వేదిక‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 250 ఎక‌రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. రాష్ట్రపతి దగ్గరనుంచి గ్రామ స‌ర్పంచ్ వ‌ర‌కు అంద‌ర్నీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తుండ‌డంతో అతి పెద్ద వేదికను తయారు చేస్తున్నారు. ఇందులో 2 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 13 జిల్లాల ప్రాతినిధ్యం ఉండేలా కొన్ని కలశాలు, సంకల్ప పత్రాలు అందరికీ కన్పించేలా ప్రదర్శించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
3 డయాస్‌లుగా సభాప్రాంగణం
ఇక శంఖుస్థాప‌న ప్రాంతంలో సభా ప్రాంగ‌ణాన్ని మొత్తం 3 డ‌యాస్‌లుగా విభజిస్తున్నారు. ప్రధాన డయాస్‌లో ప్రధాన మంత్రితో పాటు ముఖ్యమంత్రి, వీవీఐపీలు..ఇలా 15 మంది కూర్చుంటారు. ప్రభుత్వ అంచ‌నా ప్రకారం వీవీఐపీలు 3వేల మంది వ‌చ్చినా వారికి త‌గ్గట్లుగా ప్రత్యేకంగా ఒక డ‌యాస్‌ను కేటాయించ‌నున్నారు. అదే విధంగా మరో వేదికను న్యాయమూర్తులు, రాయబారులు, బిజినెస్‌ టైకూన్లకు కేటాయిస్తారు. మూడో వేదికను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రముఖులు, సాంస్కృతిక క‌ళాకారులు, వారి కార్యక్రమాల కోసం కేటాయిస్తారు. మొత్తం 3 డ‌యాస్‌లు యూ ఆకారంలో ఉంటాయి. ఇక 2లక్షల మంది ప్రజలు కార్యక్రమాన్ని వీక్షించేలా ప్రాంగణం చుట్టూ 100 ఎల్సీడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయనున్నారు. డ‌యాస్‌కు వెనుక వైపున 8 హెలీపాడ్లు నిర్మిస్తున్నారు. అతిథుల భోజన సదుపాయాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భోజన ఏర్పాట్లను మొత్తం విజ‌య‌వాడకు చెందిన కేఎంకే సంస్థ చూసుకుంటోంది. మొత్తం ఈ నిర్మాణ ప‌నుల‌న్నీ ఈ నెల 17 క‌ల్లా పూర్తికానున్నాయి.
వ్యాఖ్యతగా సినీ నటుడు సాయికుమార్‌
ఇక అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఘనంగా జరిపేందుకు ఏపీ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అమరావతి చరిత్రను తెలిపేలా ప్రత్యేక ప్రదర్శనలతో పాటు,.కళాకారులు శివమణి, కూచిబొట్ల ఆనంద్‌ ఆధ్వర్యంలో కూచిపూడి కళా నృత్యాల ప్రదర్శన ఉంటుంది. ఇక ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వ్యాఖ్యతగా ప్రముఖ నటుడు సాయికుమార్‌ వ్యవహరించనున్నారు.

 

06:37 - October 14, 2015

నల్గొండ : జిల్లాలోని చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయరహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతులు నాగేందర్‌ శర్మ, అక్కినపల్లి వెంకటేశ్వరరావుగా గుర్తించారు.

 

నేడు విజయవాడలో అమరావతిపై సదస్సు

కృష్ణా : నేడు విజయవాడలో అమరావతిపై సదస్సు నిర్వహించనున్నారు. 'రాజధాని కార్పొరేట్ల కోసమా...ప్రజల కోసమా' అనే అంశంపై సెమినార్ జరుపనున్నారు. ఈ సదస్సులో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పాల్గోనున్నారు.

నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ ల బంద్

ఢిల్లీ : నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ ల బంద్ నిర్వహించనున్నారు. ఆన్ లైన్ లో మందుల అమ్మకాలకు వ్యతరేకంగా నిరసన వ్యక్తం చేయనునాన్నారు. 

Don't Miss