Activities calendar

16 October 2015

21:38 - October 16, 2015

హైదరాబాద్ : అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రిక ఇచ్చేందుకు ప్రయత్నించిన ఏపీ మంత్రులకు వైఎస్ జగన్ అపాయింట్‌మెంట్ నిరాకరించారు. లోటస్‌పాండ్ నివాసంలో జగన్‌ను కలిసేందుకు మంత్రులు అపాయింట్‌మెంట్ కోరగా... వైసీపీ నేతలు తిరస్కరించారు. జగన్ విశ్రాంతిలో ఉన్నందున అనుమతి ఇవ్వలేమన్నారు. రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు తాము జగన్‌కు ఫోన్ చేయగా... వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడాలంటూ ఫోన్ పెట్టేశారని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. 

21:36 - October 16, 2015

హైదరాబాద్ : పెట్టుబడులకు తమ రాష్ట్రం స్వర్గధామమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఇవాళ హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ లో.. చైనా పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. 14 చైనా కంపెనీలకు చెందిన 45మంది ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి.. అవినీతికి ఆస్కారం లేకుండా... శీఘ్ర అనుమతులతో సహకరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

21:33 - October 16, 2015

హైదరాబాద్ : కొలీజియం వ్యవస్థను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కొలీజియం వ్యవస్థను సమర్థించింది. యూపీఏ హయాంలో 2013లో కొలీజియం స్థానంలో నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ప్రవేశపెట్టారు. ఎన్‌జెఎసీ రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రాజకీయ జోక్యం ఎక్కువవుతోందని....

నేషనల్ జ్యూడిషియల్ కమిషన్లో రాజకీయ జోక్యం ఎక్కువవుతోందని కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కీలక తీర్పు వెలువడింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ వ్యవస్థను రద్దు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీం చీఫ్ జస్టిస్ సారథ్యంలోని కొలీజియం...

గతంలో హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో జడ్జిల నియామకాలను సుప్రీం చీఫ్ జస్టిస్ సారథ్యంలోని కొలీజియం చూసేది. కొలీజియం వ్యవస్థలో లోపాలున్నాయని పేర్కొంటూ 99వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం ఎన్‌జేఏసీని ఏర్పాటు చేసింది. ఇదిలాఉంటే జస్టిస్ జే.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ అదర్శ్‌కుమార్ గోయల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను 31రోజుల పాటు విచారించింది. ఈ ఏడాది జూలై15న తీర్పును రిజర్వు చేసింది.

ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు సీజే......

ఇక కేంద్రం అమల్లోకి తెచ్చిన ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు సీజే, సర్వోన్నత న్యాయస్థానంలోని ఇద్దరు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు, న్యాయశాఖ మంత్రితో పా టు ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. ఈ ఇద్దరు ప్రముఖుల పేరిట న్యాయ నియామకాల్లో బయటి జోక్యం పెరుగుతుందని, న్యాయవ్యవస్థ స్వతంత్రను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఎన్‌జేఏసీ ఏర్పాటు జరిగిందని.... దీనిని వ్యతిరేకించిన రాంజెఠ్మలానీ, ఫాలీ నారిమన్, అనిల్ దివాన్ లాంటి లాయర్లు వాదించారు.

జడ్జిల నియామకాల్లో.....

ఇదిలా ఉంటే న్యాయపరిజ్ఞానం లేని వారిని జడ్జిల నియామకాల్లో భాగస్వామ్యం చేయడం వల్ల ఉపయోగం ఉండదని వాదనల సందర్భంగా ధర్మాసనం కూడా అభిప్రాయపడింది. కమిషన్లు, ట్రిబ్యునళ్లలో ఇతర ప్రముఖులు ఉంటున్నపుడు జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్‌లో ఎందుకు ఉండకూదని అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ వాదించారు. తాజా తీర్పుపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి స్పందించారు. సుప్రీం ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉంటామన్నారు. తాజా తీర్పుతో అటు కేంద్ర ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు అగాథం పెరిగిందని నిపుణులు అంటున్నారు. ఈ పరిణామం హర్షదాయకం కాదని సూచిస్తున్నారు. 

21:31 - October 16, 2015

హైదరాబాద్ : ఆర్జేడి చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బీహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోతిహరి ఎన్నికల సభా వేదికపై లాలూ ఆసీనులై ఉండగా పైనుంచి సీలింగ్‌ ఫ్యాన్‌ ఊడి పడింది. ఆ ఫ్యాన్‌ లాలూ చేతిని తగులుకుంటూ పక్క కుర్చీలో పడడంతో ప్రమాదం తప్పింది. ఆయన పక్క కుర్చీలో ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. పోలీసుల వైఫల్యమే కారణమని లాలూ ఆరోపించారు.

21:23 - October 16, 2015

తిరిగిన కాలు ఆడే నోరు ఆగవంటారు...ఇలాగే మన దర్శకులు తీసే కథలూ మారవు. దీనికి కొత్త ఉదహరణ శ్రీనువైట్ల. ఢీ ఫార్మేట్ సినిమాలతో విసిగెత్తించి...కావాల్సినంత గుడ్ విల్ పొగొట్టుకున్నాడు. తన పంథా మార్చి..కొత్త తరహా కథతో బ్రూస్ లీ సినిమా చేశానని చెప్పుకున్నాడు. కానీ సినిమా చూశాక...ఇందులో కొత్త ఏముందో అర్థం కాలేదు. మొదటి అర్థభాగాన్ని కనెక్టింగ్ సీన్స్ తో బాగా తీసిన శ్రీనువైట్ల...సెకండాఫ్ మళ్లీ పాత పాటే పాడాడు. దీంతో బ్రూస్ ద ఫైటర్....బాక్సాఫీస్ షూటర్ కాలేకపోయింది...

సెంటిమెంట్ అంశంగా రాసుకున్న మూల కథ ఇది....

అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ అంశంగా రాసుకున్న మూల కథ ఇది. రామ్ చరణ్, కృతి కర్భంద రావు రమేష్ కున్న ఇద్దరు పిల్లలు. కలెక్టర్ అవ్వాలన్నది విద్యార్థిగా ఉన్నప్పుడు కృతి కర్భంద లక్ష్యం. కానీ...రావు రమేష్ చరణ్ ని కలెక్టర్ చదివించాలనుకుంటాడు. అక్క ఆసక్తి తెలిసిన చరణ్...కావాలనే క్లాసులో ఫెయిల్ అవుతాడు. దీంతో తండ్రి కొడుకు బదులు కూతుర్ని బాగా చదివించాలని నిర్ణయించుకుంటుడు. ఈ పాయింట్ తో సినిమా టేకాఫ్ అయ్యి.....అక్క కలెక్టర్ అయ్యేందుకు...తమ్ముడు చరణ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడన్న సీన్స్ తో ఇంటర్వెల్ కు వస్తుంది. ఈ క్రమంలో తనకు ఎదురైన చాలా మంది విలన్లను హీరో ఎలా అంతం చేశాడన్నది మిగిలిన కథ......

అక్క కోసం తమ్ముడు త్యాగం...

అక్క కోసం తమ్ముడు త్యాగం చేసి ఆమె లక్ష్యం కోసం నిలబడటం...అదీ తండ్రికి తెలీకుండా...అతని ముందు ఫూల్ అవుతూ చేయడం...ఈ ఇది తెలిసిన కథే. ఈ క్రమంలో చాలా మంది విలన్లు రావడం కమర్షియల్ ఫార్మేట్ . ఇదీ కొత్తేం కాదు. అయితే ఫస్టాప్ లో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ ను చాలా ఫ్రెష్ గా ఎనర్జిటిక్ గా చూపించాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఫైటర్ గా రామ్ చరణ్ బాగా నటించాడు. గత చిత్రాల కంటే బెటర్ యాక్టింగ్ చూపించాడు. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో పాటు..పాటల్లో డాన్సులతో అట్రాక్ట్ చేసింది. సెకండాఫ్ కి వచ్చేటప్పటికి మళ్లీ తన బ్రాండ్ ను రిపీట్ చేశాడు దర్శకుడు. వెన్నెల కిషోర్, అలీ, బ్రహ్మానందం, జబర్దస్త్ ఆర్టిస్టులు సహా...కుప్పలు తెప్పలుగా కమెడిన్లు రావడం...డ్రామాలు ఆడటం..ఇవన్నీ విలన్లు వెర్రిపప్పల్లా చూస్తు ఊరుకోవడం విసుగెత్తిస్తుంటుంది. హీరో డబుల్ రోల్స్ అంటూ మరో నాటకం ఆడటం...అన్ని క్యారెక్టర్లు వీటిని నమ్మడం....బాద్షా, ఆగడు సినిమాలనే చూసినట్లుంది. క్లైమాక్స్ లో చిరంజీవి మూడు నిమిషాల అప్పీయరెన్స్ సినిమాకు హైలెట్. ఈలలు , గోలలతో ఈ కొద్దిసేపు థియేటర్ కంపిస్తోంది.....

టెక్నీషియన్స్ టాలెంట్ చూస్తే......

టెక్నీషియన్స్ టాలెంట్ చూస్తే....థమన్ పాటలు రొటీన్ గా ఉన్నా...బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బ్రూస్ లీ కి బ్రైట్ నెస్ తెచ్చింది. ఒకటి రెండు పాటల డాన్సులనే మిగతా అన్నింట్లో రిపీట్ చేశారా అన్నట్లుంది కొరియోగ్రఫీ. ఈ స్టెప్పుల నుంచి హీరో త్వరగా బయటపడాలి. ఇక సక్సెస్ తో ఇండస్ట్రీలో తలెత్తుకోవాలి అని ఆశించి..బాగా కష్టపడిన శ్రీనువైట్ల గోల్ రీచ్ అవలేకపోయాడు. బ్రూస్ లీ ద ఫైటర్ కొత్త ప్రయత్నం కాకపోయినా....ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా మిగిలిపోతుంది.

 

ఫ్లస్ పాయింట్స్

  1. చిరంజీవి

  2. చరణ్ ఫర్మార్మెన్స్

  3. ఫస్టాప్

  4. బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  5. సినిమాటోగ్రఫీ

 

మైనస్ పాయింట్స్

  1. పాత కథ

  2. బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే

  3. ఢీ ఫార్మేట్ సెకండాఫ్

  4. కామెడీ కనెక్ట్ కాకపోవడం

  5. ప్రాధాన్యం లేని కీ రోల్స్

 

టెన్ టివి రేటింగ్ 2/5

రాజమహేంద్రవరంగా.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ :తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి నగరం పేరును రాజమహేంద్రవరంగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా రెవెన్యూ డివిజన్ పేరును కూడా రాజమహేంద్రవరంగా మార్చుతున్నట్లు తెలిపింది. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రోశయ్యకు కొరియర్ ఆహ్వానంపై విమర్శలు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానాలు పంపడంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్యకు శంకుస్ధాపనకు సంబంధించి ఆహ్వాన పత్రికను కొరియర్‌లో పంపడంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలను రాచమర్యాదలతో పిలుస్తూ..రోశయ్యలాంటి సీనియర్‌ రాజకీయ నేతకు మాత్రం కొరియర్‌లో ఆహ్వానాన్ని పంపడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.

మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన కనదుర్గమ్మ

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాలలో నాలుగో రోజైన శుక్రవారం మహలక్ష్మిగా కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాలు, శుక్రవారం ప్రత్యేకత, మహలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం కావడంతో భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. దాదాపు 50 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భవానీదీక్షా మండపంలో విశేష కుంకుమార్చనలు జరిగాయి. భక్తులు అమ్మవారి స్తోత్రాలను భక్తి ప్రపత్తులతో గానం చేశారు. మహాలక్ష్మి నామం మారు మ్రోగింది. అమ్మవారిని దర్శించుకున్న వారిలో తెలంగాణాకు చెందిన రాజకీయ నాయకులు నల్గొండ ఎమ్మెల్యే వెంకటరెడ్డి, పొంగులేటి సుధాకర్‌లు ఉన్నారు.

చైనా ప్రతినిధులతో టి సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందాలు ఇవే..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, చైనా ప్రతినిధుల నడుమ రెండు కీలక ఒప్పందాలు కుదిరాయి. 14 కంపెనీల నుంచి 45 మంది ప్రతినిధులతో కూడిన బృందంతో సీఎం కేసీఆర్ నేడు నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రాధామ్యాలు, సంక్షేమం, పారిశ్రామిక విధానం వంటి పలు అంశాలపై చైనా ప్రతినిధులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భేటీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, చైనా కంపెనీల మధ్య కుదిరిన రెండు కీలక ఒప్పందాలు జరిగాయి.

తిరుమల నుంచి నీరు, మట్టి సేకరణ

తిరుమల :రాజధాని శంకుస్థాపనకు రేపు ఏడుకొండలు, తీర్థాల నుంచి నీరు, మట్టి సేకరణ చేస్తామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. సేకరించిన నీరు, మట్టికి రేపు సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఎల్లుండి సీఎం చంద్రబాబుకు నీరు, మట్టిని అందజేస్తామని శ్రీనివాసరాజు తెలిపారు.

నిర్భయ్ క్షిపణి ప్రయోగం విఫలం...

హైదరాబాద్ : నిర్భయ్ క్షిపణి ప్రయోగం విఫలమైంది. ఒడిశాలోని చందీపూర్ లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ద్వారా జరిగిన ప్రయోగం విఫలమవడంతో శాస్త్రవేత్తలు నిరాశ చెందారు. ఇది ప్రయోగించిన కొద్ది నిమిషాలకే క్షిపణి టార్గెట్ మిస్సయిందని డీఆర్డీఓ అధికారులు తెలిపారు. నిర్భయ్ క్షిపణి అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యంతో పాటు ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదిస్తుంది. మూడుసార్లు ప్రయోగించగా ఒకసారి మాత్రమే విజయవంతమైంది. కాగా, ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయ గత ఏడాది అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.

20:51 - October 16, 2015

హైదరాబాద్ :యుద్ధరంగంలో తొడకొట్టే సైనికుడు కనిపించడు. తుపాకీ తూటాలు పేల్చాల్సిన అవసరం లేదు. శతఘ్నుల వర్షం అక్కరలేదు. వ్యూహాలకు బుర్రలు బద్దలు చేసుకోవాల్సిన అగత్యం లేదు. అస్సలు మనిషన్నవాడు రణ క్ష్రేతంలో విడాల్సిన గతి లేదు. యోథాను యోధుల వీర విన్యాసాలు నో మోర్. ఫ్యూచర్లో జరిగేదంతా సాంకేతిక యుద్ధమే. యంత్రాలే యుద్ధ తంత్రాలు చేస్తాయి. రోబోలే తొడగొట్టి తలబడతాయి. ఎక్కడో మీటనొక్కితే శత్రువు భూమి మీద ఎక్కడ నక్కినా మట్టి కరవాల్సిందే. ఆధునిక దేశాల సాంకేతిక వ్యూహాలు, యుద్ద పరికాల పై నేటి వైడాంగిల్ లో ప్రత్యేక కథనంలో ప్రపంచ దేశాల మధ్య భయంకర రోబోటిక్ సంగ్రామం జరుగుతోంది. సాంకేతిక సమరంలో ఏ దేశానిది పై చేయి? అవుతుంది. ఈ అంశాలపై వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు. మరి ఆ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

19:47 - October 16, 2015

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పెచ్చుమీరిన సాంస్కృతిక దాడులకు నిరసనగా రచయితలు, కవులు, తమ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి తెలంగాణ సాంస్కృతిక మూర్తులు చేరారు. తమకు లభించిన కేంద్ర సాహిత్య అవార్డు, తెలంగాణ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని వాపస్ చేస్తున్నట్లు భూపాల్ ప్రకటించారు. విభాగం ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ అంటే ఇదేనా అని రచయిత, కళాకారుడు భూపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన హెడ్ లైన్ షోలో మాట్లాడుతూ... సాగర్ శృతిని హింసించి చంపడం కలిసివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. లౌకిక స్ఫూర్తికి విర్ధుంగా కేంద్రం వ్యవహరిస్తోందని తెలిపారు. ఎందుకు కలత చెంది అవార్డును వాపస్ చేశారో విశ్లేషణ చేశారు. మరి ఏఏ అంశాలను భూపాల్ ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

అమరావతి చిహ్నం... ముగిసిన ఎంట్రీల గడువు

హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి చిహ్నం రూపకల్పన కోసం ఎంట్రీల గడువు ముగిసింది. అమరావతి చిహ్నం కోసం ఇప్పటివరకు మొత్తం 2,500 ఎంట్రీలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు మొత్తం 15 రాష్ట్రాల నుంచి ఎంట్రీలు లభించాయి. అంతేకాకుండా కెనడా, యూఎస్, యూఏఈ, స్వీడన్, పోర్చుగల్, బ్రెజిల్ దేశాలతో పాటు ప్రవాసాంధ్రుల నుంచీ కూడా ఎంట్రీలు అందాయి. మొత్తం ఎంట్రీలను పరిశీలించిన అనంతరం చిహ్నం, విజేతను నిపుణుల కమిటీ ఎంపిక చేయనుంది.  

టీఆర్‌ఎస్‌ తెలంగాణ రాబందుల సమితి:మధుయాష్కీ

హైదరాబాద్ :టీఆర్‌ఎస్‌ తెలంగాణ రాబందుల సమితి అని మాజీ ఎంపీ మధుయాష్కి ఆరోపించారు. శుక్రవారం నల్గొండ జిల్లా ఆలేరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా యాత్రలో భాగంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ తెలంగాణ రాబందుల సమితి అని ఎద్దేవాచేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో దోచుకో..దాచుకో అన్నట్లుగా మారిందన్నారు. టీఆర్‌ఎస్‌లో ఇసుక మాఫియా, దొంగ నోట్ల నిందితులున్నారని ఆయన ఆరోపించారు. వాటర్‌గ్రిడ్‌లో ఎలా దోచుకోవాలో చెప్పడానికే కేటీఆర్‌ యూపీ వెళ్లారని మధుయాష్కి ఎద్దేవాచేశారు. పద్మాలయ భూవివాదంలో కోట్లు వసూలు చేశారని ఆరోపించారు.

'లాలూ'కి తృటిలో తప్పిన ప్రమాదం..

హైదరాబాద్ : రాష్ట్రీయ జనతాదళ్ నేత లాలు ప్రసాద్ యాదవ్ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. బీహార్‌లోని మోతారీలో ఓ ర్యాలీ నిర్వహణలో భాగంగా స్టేజీని ఏర్పాటు చేశారు. ఈ స్టేజీపై లాలు ప్రసాద్‌యాదవ కూర్చొని ఉన్నారు. పైన ఉన్న సీలింగ్ ఫ్యాన్ ఒక్కసారిగా ఊడి లాలుకు ప్రక్కగా అతీ సమీపంలో వేదికపై పడింది. ఈ ప్రమాదంలో లాలు ఎటువంటి గాయాల భారీన పడకుండా క్షేమంగా బయటపడ్డారు. కానీ ఈ సంఘటనతో లాలు ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. బీహార్‌లో నేడు రెండోదశ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు దశల్లో పోలింగ్ నిర్వహణ జరుగుతుంది.

టీఎస్ ప్రజాపద్దుల కమిటీ అధ్యక్షుడిగా రాంరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ ప్రజాపద్దుల కమిటీ అధ్యక్షుడుగా రాంరెడ్డి వెంకటరెడ్డి నియమితులయ్యారు. శుక్రవారం శాసనసభ కార్యదర్శి ప్రకటించారు. వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి శాసనసభ్యడుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి. క్రిష్ణారెడ్డి ఆకస్మికంగా మృతి చెందడంతో ఈ పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే.

19:30 - October 16, 2015

విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగం, చట్టాలను అపహాస్యం చేసి పౌరహక్కులను పూర్తిగా హరిస్తున్నాయని సీపీఎం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. రాజధాని సహా ఇతర ప్రాంతాల్లో బలవంతంగా భూసేకరణ జరపడం దారుణమన్నారు. పౌర హక్కులు, వర్దమాన ఆంధ్రప్రదేశ్‌ అంశంపై విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో మధుతో పాటు.. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు పి. లక్ష్మణరెడ్డి, చంద్ర కుమార్‌, పౌరహక్కుల నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాలు నచ్చకే ప్రజలు ఉద్యమబాట పడుతున్నారని మధు అన్నారు. 

19:27 - October 16, 2015

హైదరాబాద్ : రాజధాని శంకుస్థాపనకు హైదరాబాద్ లో వీఐపీలకు కార్డుల పంపిణీ మొదలైంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ఏపీ మంత్రులు ఆహ్వానించారు. ఆహ్వాన పత్రాన్ని మంత్రి కామినేని శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావులు స్వయంగా కిషన్‌రెడ్డికి అందించారు. అనంతరం ఏపీ శాసన మండలి ఛైర్మన్ చక్రపాణికి కార్డు అందించి.. ఆహ్వానించారు.

19:24 - October 16, 2015

గుంటూరు : రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించింది. తుళ్లూరు మండలం నేలపాడులో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు ఈరోజు సాయంత్రం రైతులకు ఆహ్వాన పత్రికలు అందజేసి మిఠాయిలు తినిపించారు. ఆహ్వాన పత్రికతో పాటు పంచె, చీర ఉన్న సంచిని రైతులకు అందజేశారు. 

చింతల్‌ వాణినగర్‌లో వివాహిత ఆత్మహత్య...

హైదరాబాద్‌ :చింతల్‌ వాణినగర్‌లో స్వప్న అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్తతో వివాదమేకారణమని ఆమె సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. ఆమె గ్రూప్‌-2కు ప్రిపేర్‌ అవుతోంది. ఏడాదిన్నర పాపను వదిలి సూసైడ్‌ చేసుకోవడం బాధగా ఉందని నోట్‌లో పేర్కొంది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మంత్రుల ఫోన్ లిఫ్ట్ చేయని జగన్

విజయవాడ :అమరావతి శంకుస్థాపనకు ప్రతిపక్షనేత జగన్‌మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు మంత్రులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు మంత్రులు జగన్ ఫోన్‌కు పదే పదే ట్రై చేస్తున్నా.. జగన్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం మేరకు జగన్‌ను ఆహ్వానించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని, కానీ జగన్ మాత్రం స్పందించడం లేదని మంత్రులు చెబుతున్నారు. ఆయన పీఏకు ఫోన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదని వారు వాపోతున్నారు. బాధ్యత గల ప్రతిపక్షనాయకుడిగా రాజధాని శంకుస్థాపనకు జగన్ రావాల్సిన అవసరం ఉందని మంత్రులు చెప్పారు.

భారత క్రికెట్ టీం మేనేజర్ కు మ్యాచ్ ఫీజులో కోత

హైదరాబాద్: గత ఆదివారం కాన్పూర్ లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అనంతరం ఆ మ్యాచ్ కు అంపైరింగ్ చేసిన వినీత్ కులకర్ణిపై భారత క్రికెట్ టీమ్ మేనేజర్ వినోద్ ఫాడ్కే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే వినోద్ ఫాడ్కేకు మ్యాచ్ ఫీజులో 40 శాతం మేర కోత విధించినట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పేర్కొంది. ఇండోర్ లో బుధవారం జరిగిన భారత్-దక్షిణాఫ్రికా రెండో వన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరి క్రిన్ బ్రాడ్ తెలిపారు.  

బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దు : హరీష్

మెదక్: బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి హరీష్‌రావు అన్నారు. రైతుల రుణాలపై మంత్రి స్పందిస్తూ.. బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలి. రైతుల నుంచి వడ్డీ వసూలు చేయొద్దు. బ్యాంకర్లు ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ను పాటించాలి. రైతులకు అసౌకర్యం కల్గించకుండా బ్యాంకర్లు వ్యవహరించాలని ఆయన సూచించారు.

ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ గోపాల్

మెదక్: అవినీతికి పాల్పడుతూ పంచాయతీరాజ్ ఏఈ గోపాల్ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు.గజ్వేల్‌లో రోడ్డు కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏఈ గోపాల్ ఏసీబీకి ప్రత్యక్షంగా పట్టుబడ్డాడు. నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు గోపాల్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

కేసీఆర్ తో భేటీ అయిన చైనా పారిశ్రామికవేత్తలు

హైదరాబాద్: చైనా పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరుగుతున్న ఈ భేటీలో 14 చైనా కంపెనీల నుంచి 45 మంది ప్రతినిధులతో పాటు ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్, పవర్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటున్న టీఎస్ ఐపాస్ గురించి సీఎం ఈ సమావేశంలో ఇన్వెస్టర్లకు విశదీకరించనున్నారు. భేటీలో హౌసింగ్, డ్రైపోర్టులకు సంబంధించి ఇరుపక్షాలు ఎంవోయూ కుదుర్చుకోబుతున్నట్లు సమాచారం.

శంషాబాద్ లో మహిళ నుంచి రూ.లక్ష దోపిడీ

హైదరాబాద్: నగర శివారులోని శంషాబాద్ బస్టాండ్ లో దోపిడీ జరిగింది. కొందరు దుండగులు ఓ మహిళ నుంచి రూ.లక్ష నగదును లాక్కుని పరారయ్యారు. దీనిపై బాధితురాలు శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

17:35 - October 16, 2015

హైదరాబాద్ : నగరంలో మరోసారి గొలుసు దొంగలు హల్ చల్ చేశారు. ఎస్సార్ నగర్, బల్కం పేట, యూసుఫ్ గూడలో ప్రాంతాల్లో ... గొలుసు దొంగలు సుమారు 11 తులాల ఆభరణాలు దొంగిలించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో వృద్ధురాలి నుంచి 4తులాల గొలుసు, ఎస్సార్ నగర్ కనకదుర్గ ఆలయంలో మహిళ నుంచి 2తులాల గొలుసు, యూసుఫ్ గూడలో వృద్ధురాలి వద్ద 5 తులాల గొలుసు చోరీ చేశారు. 

17:30 - October 16, 2015

హైదరాబాద్ : నగరం మరో ఇంటర్నేషనల్ ఈవెంట్ కు వేదిక కానుంది. వచ్చేనెల 14 నుంచి 20 వరకు 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుకలను ఇక్కడ నిర్వహించనున్నారు. శిల్పకళా వేదికలో నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ పోటీల్లో ఎంపికైన 1204 సినిమాలను ఈ ఈవెంట్ లో ప్రదర్శించనున్నారు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్‌కు హైదరాబాద్‌ను శాశ్వత వేదిక చేయాలనుకుంటున్నామని మంత్రి చెప్పారు.

17:29 - October 16, 2015

హైదరాబాద్ : పత్తికి మద్దతు ధర కల్పించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రం ఆంక్షలు సరికాదన్నారు. సీసీఐ సీఎండీతో వ్యక్తిగతంగా మాట్లాడి 12-16 శాతం తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని కోరామని తెలిపారు. పత్తి కొనుగోలు వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని తేల్చిచెప్పారు జితేందర్ రెడ్డి.

17:26 - October 16, 2015

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈనెల 20న ట్యాంక్‌బండ్‌పై జరిగే బతుకమ్మ ముగింపు వేడుకలకు గవర్నర్‌ను సీఎం ఆహ్వానించారు. వీటితో పాటు దసరా పండగ రోజున ప్రభుత్వ ప్రతిష్టాత్మక డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ప్రారంభించేందుకు కూడా ఆహ్వానించారు. నగరంలోని ఐడీహెచ్ కాలనీలోని ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. 

17:25 - October 16, 2015

హైదరాబాద్ : నగరంలో హుజీ సభ్యుడు ఉగ్రవాది అలీముల్ ఇస్లాంను పోలీసులు అరెస్టు చేశారు. చర్లపల్లి జైలులో పాక్ హుజీ ఉగ్రవాది నజీర్‌ను కలిసేందుకు అలీముల్ యత్నించారు. నజీర్‌తో కలిసి జిహాదీ కేంద్రం ఏర్పాటుకు అలీముల్ కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. అలీముల్ అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్లపల్లి జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇస్లాంను పశ్చిమ బెంగాల్ వాసిగా పోలీసులు గుర్తించారు.

17:23 - October 16, 2015

హైదరాబాద్ : వరంగల్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆర్డీ నాగేశ్వరరావు అక్రమాలపై తెలంగాణ సర్కార్‌ స్పందించింది. నాగేశ్వరరావు అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఏసీబీ, ఇంటెలిజెన్స్‌ను రంగంలోకి దింపింది. బదిలీలు, పదోన్నతుల కోసం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు నాగేశ్వరరావుపై ఆరోపణలున్నాయి. ఆర్‌డీ నాగేశ్వరరావు అవినీతిపై సీఎంవో ఆఫీస్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వరంగల్‌ ఆర్డీ కార్యాలయానికి చేరుకున్న విచారణ అధికారులు ఫైళ్లను తనిఖీ చేపట్టారు. నాగేశ్వరరావు అక్రమాలపై వివరాలు సేకరించేపనిలో పడ్డారు. 

ఎస్ ఐ ని నరికి చంపిన దుండగులు..

హైదరాబాద్ : కర్నాటక రాష్ట్రంలోని దొడ్డబళ్లాపురంలో బైక్‌ దొంగలు బరి తెగించారు. ఈ ఘటనలో బైక్ దొంగల్ని పట్టుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్లిన ఎస్సైపై దొంగలు కత్తులతో దాడి చేసి నరికిచంపారు. అనంతరం ఎస్‌‌ఐ సర్వీస్‌ రివాల్వర్‌తో దుండగులు పరారీ అయ్యారు. దీంతో పోలీసులు దొంగల కోసం వేట ప్రారంభించారు.

హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు..

హైదరాబాద్ : నగరంలో వివిధ ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఈ రోజు అమీర్ పేట, బల్కంపేటలో మహిళల మెడలోంచి గొలుసులను లాక్కెళ్లారు. ఆలయనాకి వచ్చిన ఓ భక్తురాలి మెడలోంచి ముగ్గురు మహిళలు నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. మరో ఘటన అమీర్ పేటలోని కనకదుర్గ ఆయలం వద్ద ఓ మహిళ మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును అపహరించారు.

16:40 - October 16, 2015

హైదరాబాద్ ప్రముఖ రచయిత, కళాకారుడు భూపాల్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. పలు విషయాల్లో ప్రస్తుత కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆయనకు లభించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలకు సంబంధించిన కథాంశంతో 'ఉగ్గుపాలు' అనే పేరుతో ఆయన రాసిన పుస్తకానికిగానూ 2010లో భూపాల్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. రచయితగానే కాక సినీనటుడుగానూ ఆయన ప్రసిద్ధి. మా భూమి, కొమరం భీం సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, మోదీ సర్కార్ విధానాలను నిరసిస్తూ పలువురు రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగిచ్చేస్తున్న సందర్భంలో ఆ నిర్ణయాన్ని ప్రకటించిన మొదటి తెలుగు రచయితగా భూపాల్‌ నిలబడ్డారు. అలాగే ఎన్‌ కౌంటర్లకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాన్ని సైతం భూపాల్‌ తిరిగిచ్చేశారు.  

 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం సాయంత్రం లాభాలతో ముగిశాయి. 204 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 27,214 వద్ద ముగియగా, నిఫ్టీ 58 పాయింట్లు లాభపడి 8,238 వద్ద ముగిసింది. ఇక ఇవాళ ఉదయం స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఎంపీ మల్లారెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురు...

న్యూఢిల్లీ : టీడీపీ ఎంపీ మల్లారెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో సీట్ల భర్తీపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 150 మెడికల్ సీట్ల భర్తీ నిలిపివేయాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. 2014లో మల్లారెడ్డికి చెందిన ఎమ్ఎన్ఆర్ మెడికల్ కాలేజీలో అవకతవకలు జరిగాయనే కారణంతో 2015కు సంబంధించి 150 మెడికల్ సీట్ల భర్తీకి ఎమ్‌సీఐ అనుమతి నిరాకరించింది. దీనిపై మల్లారెడ్డి కేంద్రాన్ని ఆశ్రయించగా అందుకు కేంద్ర ప్రభుత్వం సీట్ల భర్తీకి అనుమతినిచ్చింది.అయినప్పటికీ ఎమ్‌సీఐ ఆదేశాల మేరకు మొత్తం సీట్లను భర్తీ చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది.

హుజీ అనుమానిత ఉగ్రవాది అలీముల్ అరెస్ట్

హైదరాబాద్ : నగరంలో హుజీ అనుమానిత ఉగ్రవాది అలీముల్ ఇస్లాంను పోలీసులు అరెస్టు చేశారు. చర్లపల్లి జైలులో పాక్ హుజీ ఉగ్రవాది నజీర్‌ను కలిసేందుకు అలీముల్ యత్నించారు. నజీర్‌తో కలిసి జిహాదీ కేంద్రం ఏర్పాటుకు అలీముల్ కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. అలీముల్ అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్లపల్లి జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇస్లాంను పశ్చిమ బెంగాల్ వాసిగా పోలీసులు గుర్తించారు.

15:47 - October 16, 2015

వరంగల్:వరంగల్ జిల్లా మద్దూరు మండలం గాగిలాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఊర చెరువులో ఈతకు వెళ్లి నలుగురు యువకులు మృతిచెందారు. దసరా సెలవుల్లో బంధువుల ఇంటికి వెళ్లిన నలుగురు హైదరాబాద్ వాసులు అనూహ్యరీతిలో మృత్యువాత పడ్డారు. నగరానికి చెందిన టీనేజర్లు ప్రవీణ్(19), మధు(14) సహా ప్రవీణ్ తండ్రి బాలపోచయ్య (42), నరసింహం(41)లు.. ఈ నలుగురు హైదరాబాద్ లోని రంగారెడ్డినగర్‌ (చిక్కడపల్లి)కు చెందినవారు. దసరా పండగకు గాజిల్లాపూర్లోని బంధువుల ఇళ్లకువెళ్లి ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.స్నానం సరదాతో ఈత రాకపోయినప్పటికీ ప్రవీణ్, మధులు పెద్ద చెరువులోకి దిగి మునిగిపోయారు. ఇది గమనించిన ప్రవీణ్ తండ్రి బాలపోచయ్య, నరసింహలు.. పిల్లల్ని కాపాడేందుకు చెరువులోకి దూకారు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో నలుగురూ గల్లంతయ్యారు. కొద్దిసేపటి తర్వాత గ్రామస్థులు గాలింపు చేపట్టడంతో నాలుగు మృతదేహలు బయటపడ్డాయి.

15:43 - October 16, 2015

హైదరాబాద్ : ఏపీ శాసనసభాపతి, శాసనమండలి ఛైర్మన్ భేటీ అయ్యారు. తుళ్లూరులో అసెంబ్లీ సమావేశాలపై వీరిద్దరు చర్చించారు. ఈభేటీకి శాసనసభ డిప్యూటీ స్పీకర్ బుద్ధ ప్రసాద్ తో పాటు... చీఫ్ విప్, విప్ లు, ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు హాజరయ్యారు. తాత్కాలిక అసెంబ్లీ ఏర్పాటుపై అధికారులు స్పీకర్ కు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

 

15:40 - October 16, 2015

హైదరాబాద్ : వరంగల్‌ శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. నాల్గోవ రోజున అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. నవరాత్రులను నవదుర్గా విధానంలో ఆరాధించి కొలిచిన వారికి అమ్మవారు సకల బాధలను తొలగిస్తారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. 

తహశీల్దారు ఆఫీసులో ఏసీబీ సోదాలు..

అనంతపురం :భూ పంపిణీలో అవకతవకలపై అనంతపురం జిల్లా తలుపుల తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. తలుపుల మండలం కుర్లి గ్రామంలో 2008-09 సంవత్సరంలో ప్రభుత్వం కొందరికి భూ పంపిణీ చేసింది. అయితే భూమి అనర్హులకు పంచిపెట్టారంటూ నెల క్రితం కొందరు ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన ఏసీబీ హిందూపురం డీఎస్పీ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు తలుపుల తహశీల్దార్ కార్యాలయంలో సంబంధిత దస్త్రాలను పరిశీలిస్తున్నారు.

తిరుపతి ప్యాసింజర్ రైలులో సాంకేతిక లోపం

చిత్తూరు: జిల్లాలోని పెద్దపాలెం వద్ద గుంతకల్లు-తిరుపతి ప్యాసింజర్‌ రైలు నిలిచిపోయింది. సాంకేతికలోపం కారణంగా అధికారులు రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు రైలులోనే పడిగాపులు కాస్తున్నారు.

బొగ్గు కుంభకోణంలో మనోహ్మన్ కు ఊరట

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఊరట లభించింది. మన్మోహన్ సింగ్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను శుక్రవారం సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మన్మోహన్ సింగ్ను నిందితుడిగా చేర్చరాదని, సమన్లు జారీ చేయబోమని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో మాజీ పీఎం ప్రమేయం ఉందని, ఆయనకు సమన్లు జారీ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో సీబీఐ మన్మోహన్ సింగ్కు క్లీన్ చిట్ ఇచ్చింది.

చిల్ర్డన్ ఫిలిం ఫెస్టివల్ కు భారీ ఏర్పాట్లు..

హైదరాబాద్ : సచివాలయంలో 19వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వెబ్‌సైట్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దేశ విదేశాల నుంచి 450 మంది ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్‌కు హైదరాబాద్‌ను శాశ్వత వేదిక చేయాలనుకుంటున్నామని చెప్పారు.

ఈతకెళ్లి నలుగురు మృతి

వరంగల్ : మద్దూరు మండలం గాగిళ్లాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పెద్ద చెరువులో ఈతకు వెళ్లిన ఆ నలుగురు వ్యక్తులు మృతి చెందారు. బాల పోచయ్య(42), నర్సింహులు(40), మధు(14), ప్రవీణ్(17). మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులు నలుగురు హైదరాబాద్‌కు చెందిన వారే. అయితే దసరా పండుగ కోసం తమ బంధువుల ఊరైన గాగిళ్లాపూర్‌కు ఆ నలుగురు వెళ్లారు. 

బతుకమ్మ ఉత్సవాలకు గవర్నర్ కు ఆహ్వానం..

హైదరాబాద్ :ఉమ్మడి రాష్ర్టాల గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బతుకమ్మ ముగింపు ఉత్సవాలకు రావాల్సిందిగా గవర్నర్‌ను సీఎం ఆహ్వానించారు.

ఆవులను తీసుకెళ్తున్న ముస్లిం యువకుడిని కొట్టి చంపేశారు..

హైదరాబాద్: ఆవులను ట్రక్కులో తరలిస్తున్నాడని ఆరోపిస్తూ, ఓ ముస్లిం యువకుడిని కొట్టి చంపేశారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. రాష్ట్ర రాజధాని సిమ్లాకు దగ్గర్లో ఉన్న సరహాన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన సోదర ద్వయం నోమన్, ఇమ్రాన్ అస్గర్ లు హిమాచల్ ప్రదేశ్ నుంచి కొన్ని ఆవులను లారీలో తీసుకువెళుతున్నారు. దీన్ని గుర్తించిన కొందరు వ్యక్తులు లారీని ఆపి, వీటిని చంపేందుకే తీసుకెళ్తున్నారని ఆరోపిస్తూ, వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో నోమన్ తీవ్రగాయాల పాలు కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించినా, ప్రాణాలు దక్కలేదు.

జగన్ ను ప్రజలు క్షమించరు : కేఈ

కర్నూలు: జగన్‌ కంటే కేటీఆర్‌ నయంమని ఎపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శుభకార్యానికి పిలిస్తే శత్రువైనా వస్తారన్నారు. అయితే రాజధాని శంకుస్థాపనకు జగన్‌ రానని చెప్పడం అవివేకమన్నారు. జగన్‌ తీరు మార్చుకోకుంటే ప్రజలు క్షమించరని కృష్ణమూర్తి అన్నారు.

వృద్ధురాలి దృష్టి మరల్చి బంగారం దేచేశారు..

హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద బంగారం అపహరణ జరిగింది. దేవాలయం వద్ద ఉన్న ఓ వృద్ధురాలి దృష్టి మరల్చి ముగ్గురు మహిళలు 4 తులాల బంగారం గొలుసును అపహరించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

15:06 - October 16, 2015

ఆదిలాబాద్‌ : బెల్లంపల్లి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు నేడు కరెన్సీ అమ్మవారిగా దర్శనమిచ్చారు. అమ్మవారి గర్భగుడిని రూపాయి, రెండు రూపాయల నుంచి వెయ్యి రూపాయల నోట్ల అలకరించారు. అమ్మవారి అలంకరణలో మొత్తం ఇందులో 30 లక్షల రూపాయల కరెన్సీని వాడారు. కరెన్సీ నోట్లతో కట్టిన తోరణాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

15:05 - October 16, 2015

హైదరాబాద్ : ఓటు నోటు వివాదం సుడిగుండంలా మారి ఎప్పుడు ఎవరిని లాగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొందరు ముడుపులకు ఓకే చెప్పి గులాబీ బాస్‌ను వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారని వార్తలు వెలువడ్డాయి. రేవంత్‌ రెడ్డి, స్టీఫెన్‌సన్‌ వ్యవహారం బయటకు పొక్కి సంచలనం కావడంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముడుపులు వాపస్‌ ఇచ్చేసి గప్‌చిప్‌ అయిపోయినట్లు సమాచారం.

గులాబీబాస్‌ కు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైన ఆ నేతలు ఎవరు ?

అయితే ఇంతకీ గులాబీబాస్‌ కు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైన ఆ నేతలు ఎవరనే సస్పెన్స్‌ మొదలైంది. ప్రధానంగా కరీంనగర్‌ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ముడుపులు అందాయని వారంతా టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్ధపడినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వ్యవహారమంతా టీడీపీ అధినేత చంద్రబాబుకు జిల్లాలో నమ్మినబంటు అయిన ఓ రాష్ట్రనాయకుడు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.

ముడుపులు అందుకున్న వారిలో మాజీ టీడీపీ సభ్యులు.......

ఇదిలా ఉంటే ముడుపులు తీసుకున్న నేతల్లో గతంలో టీడీపీలో ఉండి ప్రస్తుతం కరీంనగర్‌లో అధికారపార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. మరొకరు గ్రానైట్‌ వ్యాపారంతో జిల్లాలో చక్రం తిప్పుతున్న జిల్లా ఎమ్మెల్యే అని తెలిసింది. ఇక గతంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేత టీడీపీ నుంచి ముడుపులు తీసుకున్నట్లు గులాబీ బాసు వద్ద సమాచారం ఉంది.

సీఎం కేసీఆర్‌ కనుసన్నల్లో విచారణ.......

రేవంత్‌ రెడ్డి అరెస్టుతో కేసు సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో ముడుపులు అందుకున్న అధికారపార్టీల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటున్నారనే వార్త కలకలం రేపుతోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ కనుసన్నల్లో విచారణ కొనసాగుతోందని జిల్లాలో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఆరోపణలు రుజువైతే పరిణమాలు ఎలా ఉంటాయో అనే గుబులు ముడుపులు అందుకున్న ఎమ్మెల్యేల్లో నెలకొంది.

15:02 - October 16, 2015

హైదరాబాద్ : రైతు సమస్యలను తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు.. మంత్రి హరీశ్ రావు కేంద్రానికి లేఖరాసి తన పనైపోయిందని చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.. సీఎం స్వయంగా కేంద్ర వ్యవసాయ మంత్రిని ఎందుకు కలవరని ప్రశ్నించారు.. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, వెంకయ్య నాయుడును కలిసి రైతులకు సహాయం చేయాలని కోరామని ఎర్రబెల్లి తెలిపారు..

15:00 - October 16, 2015

హైదరాబాద్ : వరంగల్‌ జిల్లా ఎనుమాముల పత్తి మార్కెట్‌లో కుండపోతగా కురిసిన భారీవర్షం రైతులకు ఆవేదన మిగిల్చింది. సుమారు 30 వేల బస్తాల పత్తి మార్కెట్‌కు తరలి వచ్చింది. భారీ వర్షంతో పత్తి బస్తాలు తడిశాయి. ఉదయం క్వింటాల్‌కు 3వేల950 రూపాయలకు పత్తి బస్తా ధర పలికింది. అయితే ఖరీదు దారులు పత్తి తడిసిందనే సాకుతో క్వింటాలుకు 5 వందలు చోప్పున ధర తగ్గించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్లో మోసం జరుగుతోందని ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు.  

14:51 - October 16, 2015

బతుకమ్మ పూలతో చేసే జాతర. అందాల హరివిల్లును నేలమీద పరిచే తిరునాళ్లు . కంచెలు కంచెలుగా, బీళ్లు బీళ్లుగా విస్తరించుకున్న నీళ్లులేని తెలంగాణలో క'న్నీటి' చెలిమె బతుకమ్మ. ఉయ్యాలలూపే పాటల పల్లవుల్లో ఆడపడుచుల ఆర్భాటపు పండగ బతుకమ్మ. ఆ బతుకమ్మకి మానవి అక్షరాభిషేకం చేస్తోంది. ఆటాపాటా కలబోసుకున్న అచ్చ తెలంగాణా ఆడపడుచుల పండుగ బతుకమ్మ. భారత్ లోనే కాదు, ప్రపంచంలోనే మరెక్కడా లేని పూల జాతర. పూల పరిమళం ఆవహించిన నీటి పండుగ. రతరాలుగా కొన్ని సామాజిక వర్గాలు, అభివృద్ధికి దూరంగా ఎలా నెట్టబడ్డాయో, అలాగే ప్రకృతి అందించే కొన్ని రంగు రంగుల పూలు కూడా ఏ రకమైన ప్రత్యేక వేడుకలకు వాడకుండా దూరం పెట్టబడ్డాయి. అటువంటి పూలన్నీ బతుకమ్మలో పేర్చడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

బతుకమ్మ పాట పాడాలంటే , అక్షర జ్నానం అక్కరలేదు....

బతుకమ్మ పాట పాడాలంటే , అక్షర జ్నానం అక్కరలేదు. బతుకమ్మను ఆడాలంటే ఎటువంటి శిక్షణా అవరసం లేదు. ప్రకృతితో మమేకమయ్యే మనసుంటే చాలు.. బతుకమ్మ పూలపేర్పు మాత్రమే కాదు. రాష్ట్రంలో జరిగిన అనేక చారిత్రక ఉద్యమాల్లోని నినాదమై నిలిచింది. ఉద్యమ గీతమై వినిపించింది.

బతుకమ్మ ను సజీవంగా ఉంచుకోవాలంటే....

బతుకమ్మ ను సజీవంగా ఉంచుకోవాలంటే, ఊరు బతకాలి. ఊరిని కళకళలాడేలా ఉంచే చెరువులు, చెలమల్లో నీరు నిండా నిలవాలి. . కబ్జాలను అడ్డుకోవాలి. నదుల్లో నీటి గలగలలు వినిపించాలి. చేతివృత్తుల్లు మళ్లీ కొత్త ఊపిరి నింపుకోవాలి. పల్లె రమ్మనాలె.. మనందరినీ తన ఒడిలోకి తీసుకొని, ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవాలి. అక్కడి పూల పరిమళాలు మనని ఆకర్షించాలి. అప్పుడే బతుకమ్మ ఎప్పటికీ సజీవంగా నిలుస్తుంది. 

28న ఢిల్లీకి ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్

హైదరాబాద్ : ఈ నెల 28న దేశ రాజధాని హస్తినకు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ రానున్నారు. 28న ఢిల్లీలోని ఐఐటీలో జరిగే ఓ కార్యక్రమంలో జుకర్‌బర్గ్ పాల్గొననున్నారు. అనంతరం విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానని తెలిపారు. ఇండియాలో 130 మంది మిలియన్ ప్రజలు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో ఫేస్‌బుక్‌కు ఇండియా నుంచి ఆదాయం ఎక్కువ వస్తుంది. గత నెలలో కాలిఫోర్నియాలోని ఫేస్‌బుక్ అధికార కార్యాలయంలో జుకర్‌బర్గ్‌ను మోడీ కలిసిన విషయం విదితమే.

 

'అఖిల్' విడుదల వాయిదా

హైదరాబాద్ : ప్రముఖ నటుడు నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా ప్రేక్షకుల మందుకు రాబోతున్న అఖిల్ చిత్రం విడుదల వాయిదా పడింది. దసరా పండుగకు ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ సినిమా గ్రాఫిక్స్ పనుల్లో జాప్యం జరగడం వల్లనే సినిమాను 22న విడుదల చేయలేకపోతున్నామని నిర్మాత నితిన్ తెలిపారు. సినిమాను ఎప్పుడు విడుదల చేస్తామన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. అఖిల్ సరసన బాలీవుడ్ భామ సయేషా సైగల్ నటిస్తుంది. దర్శకుడు వివి వినాయక్. మ్యూజిక్ డైరెక్టర్ థమన్.

విదేశీ కరెన్సీ పేరుతో రూ. 75 లక్షలు కాజేశాడు

హైదరాబాద్ : విదేశీ కరెన్సీ పేరుతో రూ. 75 లక్షలు కాజేశాడో వ్యక్తి ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. విదేశీ కరెన్సీ కావలనుకొని ఇబ్రహీం అనే వ్యక్తి డేవిడ్‌‌ని కలిసి రూ.75 లక్షలు చెల్లించాడు. కాని తిరిగి డేవిడ్ విదేశీ కరెన్సీని ఇబ్రహీంకు చెల్లించకపోవడంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అతని ఫిర్యాదు మేరకు పోలీసులు డేవిడ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

13:54 - October 16, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టాన్ని ప్రతిష్టాత్మక అవార్డు వరింది. సీఎన్ బీసి-టీవీ18 ఐబీఎల్ తెలంగాణ రాష్ర్టానికి ప్రామిసింగ్‌ స్టేట్‌ ఆఫ్‌ ద ఇయర్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుకు తెలంగాణ రాష్ర్టాన్ని ఎంపిక చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
అవార్డును ప్రకటించిన సీఎన్ బీసి-టీవీ18 ఐబీఎల్
అభివృద్ధి, సమగ్రత, నాయకత్వం, అంకితభావం అర్హతలు కొత్త రాష్ర్టమైన తెలంగాణాకు ఉన్నాయంటోంది సీఎన్ బీసి-టీవీ18 ఐబీఎల్ జ్యూరీ కమిటీ. అందుకే 2015కు గాను ప్రామిసింగ్ స్టేట్‌ ఆఫ్‌ ద ఇయర్ అవార్డుకు తెలంగాణ రాష్ర్టాన్ని ఎంపిక చేసింది.
11 ఏళ్లుగా అవార్డులు ప్రకటిస్తున్న ఐబీఎల్
11 ఏళ్లుగా ఐబిఎల్ ఈ అవార్డును ఇస్తోంది. రాష్ర్టంలో అభివృద్ధి ఆశాజనకంగా ఉండటంతో పాటు నూతన ఒరవడిని సృష్టించే నాయకత్వాన్ని కూడా గుర్తించి అవార్డును ఇస్తామంటున్నారు ఐబీఎల్ జ్యూరీ కమిటీ. జ్యూరీ కమిటీ నియమాలు, నిబంధనలు తెలంగాణకు సరితూగడంతో అవార్డును ప్రకటించామంటున్నారు. త్వరలో ముంబైలో జరిగే బిజినెస్‌ లీడర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందుకోనున్నారు. ఈ మేరకు సీఎన్ బీసి-టీవీ18 మేనేజింగ్‌ డైరెక్టర్‌ షెరీన్‌ భాన్‌ కేసీఆర్‌కు లేఖ కూడా రాశారు.

 

13:48 - October 16, 2015

విజయవాడ : అమరావతి శంకుస్థాపన ఆహ్వానం తనకు పంపొద్దన్న జగన్‌ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. జగన్.. శంకుస్థాపన ఆహ్వానం పంపొద్దని అనడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. జగన్‌ దీక్ష అట్టర్‌ ఫ్లాప్‌ షో అంటూ మండిపడ్డారు. మానసిక పరిస్థితి సరిగాలేనివారే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు.

13:45 - October 16, 2015

రంగారెడ్డి : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇవాళ రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన టీఆర్‌ఎస్ ఎంపీ కవితకు మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె అనంతగిరి కొండల్లోని అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నమహిళలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొననున్నారు. 

13:42 - October 16, 2015

ఢిల్లీ : అన్ని రంగాల్లోనూ పారదర్శకత ఆవశ్యకమని ప్రధాని నరేంద్రమోడీ అభిప్రాయపడ్డారు. కేంద్ర సమాచార కమిషన్‌ దశాబ్ద కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సదస్సులో మోడీ ప్రసంగించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకి భద్రతా కారణాల దృష్ట్యా ఆహ్వానించలేదు. దీంతో ఆర్టీఐ ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ ఆర్టీఐ యాక్టివిస్టు అరుణా రాయ్‌ సైతం ఈ సదస్సుకి హాజరుకాలేదు. పారదర్శక చట్టంపై నిర్వహించిన ఈ సదస్సును లోకేష్ బత్రా, వెంకటేష్‌ నాయక్‌, అంజలి భరద్వాజ్‌, నిఖిల్‌ డే బాయకాట్‌ చేశారు.

 

13:37 - October 16, 2015

ఢిల్లీ : సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. ఎన్‌జేఏసీ రద్దుపై కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని ఈ సదానంద తెలిపారు. తర్వాతి పరిణామాలపై ప్రధానితోనూ, న్యాయశాఖకు చెందిన నిపుణులతోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామని సదానంద తెలిపారు.

 

13:33 - October 16, 2015

ఆదిలాబాద్‌ : రంగు రంగుల బతుకమ్మ తెలంగాణ ప్రజల్లోనే కాదు... రైతుల సంతోషాల్లోనూ వెలుగులు నింపుతోంది.. సీతమ్మ జడల పూలసాగుతో లాభాల బాటపడుతున్నారు అన్నదాతలు.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదిస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
బతుకమ్మ తెలంగాణలో అతిపెద్ద పండుగ
ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ పాడుకునే బతుకమ్మ తెలంగాణలో అతిపెద్ద పండుగ... రంగు రంగుల బతుకమ్మలు ఊరూవాడా సరికొత్త అందాన్ని తెస్తున్నాయి... ఒక్కో పువ్వు పేరుస్తూ ఆటపాటలతో ఈ పండుగ తెచ్చే సందడే వేరు.. ముఖ్యంగా సీతమ్మ జడల పూలతో బతుకమ్మకు మరింత అందం వస్తుంది.. ఎరుపు రంగుతో కుచ్చులు కుచ్చులుగా ఉండే ఈ పూలను బతుకమ్మపై పేరుస్తూ మురిసిపోతారు మగువలు..
మామూలు రోజుల్లో రోడ్డుపైనే పూల విక్రయం
బతుకమ్మ రైతులకూ చక్కటి లాభాలు అందిస్తోంది.. ఈ సీజన్‌కు తగినట్లు పూలసాగు చేస్తూ రైతన్నలు ఆర్థికంగా పుంజుకుంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇటిక్యాలలో సీతమ్మ జడల సాగు జోరుగా సాగుతోంది.. పెద్దగా పెట్టుబడి అవసరంలేని ఈ పూలు అన్నదాతలకు సిరుల పంట పండిస్తున్నాయి.. బతుకమ్మ మొదలైనప్పటినుంచి సద్దుల వరకూ సీతమ్మ జడలకు చాలా డిమాండ్ ఉంటుంది.. నవరాత్రులకు ఇక్కడి రోడ్డుపై పూలు విక్రయిస్తారు ఈ రైతు కుటుంబసభ్యులు.. సద్దుల బతుకమ్మకు మాత్రం పూలన్నీ కోసి మంచిర్యాల మార్కెట్‌కు తరలిస్తారు.. ఈ పంట సాగుకోసం ఎకరాకు 5వేలనుంచి 10వేలవరకూ పెట్టుబడి అవసరమవుతుంది.. పూలు చేతికొచ్చాక 20నుంచి 25వేల రూపాయలవరకూ మిగులుతుంది. ఈ పూల సాగుకు ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు, పురుగులమందులు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.. ఈ పంట సాగును ప్రోత్సహిస్తే రైతులు ఆత్మహత్య బాట పట్టరని సూచిస్తున్నారు.. ఉద్యానవన శాఖ ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు..

 

 

13:24 - October 16, 2015

హైదరాబాద్ : ఉపాధి హామీతో ఉపాధి కల్పిస్తామంటూనే కొత్త మెలికలతో కూలీల ఉసురు తీస్తోంది కేంద్రం.. పనిదినాలు పెంచుతామంటూనే మరో చేత్తో కరువు మండలాల్లోనే పెంచుతామంటూ కూలీల కడుపుకొడుతోంది. గతంలో జాతీయ ఉపాధి హామీ పథకం అమలయ్యే మండలాల సంఖ్యను తగ్గించి అసలు పథకం ఉద్దేశ్యాన్నే పథకం ప్రకారం పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది మోడీ సర్కార్.. ఇప్పుడు మండలాలు ప్రకటించకుండా.. ఉపాధి హామీ కూలీలకు పని దినాలు పెంచుతామని ప్రకటన చేసింది.. పనిదినాలు పెరుగుతున్నాయని అందరూ సంతోషపడ్డారు.. అయితే కేవలం కరవు మండలాలు గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే మండలాల్లో మాత్రమే పనిదినాలు పెంపు నిబంధన వర్తింపజేస్తామంటూ కొత్త మెలిక పెట్టింది.. మరీ మిగతా మండలాల్లో పరిస్థితి ఏంటీ?
పేదలకు ఆసరాగా ఉపాధి హామీ
దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదలకు ఉపాధి హామీకి ఆసరాగా నిలుస్తోంది.. అయితే దేశంలో కరవు ఛాయలు ఏర్పడిన రాష్ట్రాల్లో పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచుతామని కేంద్రం ప్రకటించింది.. కానీ అది కరవు మండలాల్లోనే అంటూ ఇచ్చిన తాజా ఆదేశం మిగతా మండలాల్లో బడుగు జీవులపై తీవ్ర ప్రభావం చూపనుంది.. తెలంగాణ రాష్ట్రానికి సంబందించి ఇప్పటి వరకు కరవు మండలాల ప్రకటనే జరగలేదు... ఆచార్య జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 261 మండలాల్లో కరవు ఉందని అంచనా వేసింది. అలాగే వాతావరణ శాఖ 218 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించింది కానీ ప్రభుత్వానికి కరవు మండలాలు 60 యేనంటూ కలెక్టర్లు నివేదిక ఇచ్చినట్లు వార్తలొచ్చాయి.. దీంతో ఉపాధి కూలీల్లో గందరగోళం నెలకొంది.
కేంద్రానికి అందని నివేదికలు...
ఇంతవరకు కరువును అంచనా వేయడం, మండలాలను గుర్తించడం, ఆ వివరాలను రాష్ట్ర మంత్రివర్గం ఎదుట పెట్టడం తదితర పనులేవీ జరగలేదు. పూర్తి వివరాలతో కేంద్రానికి నివేదిక పంపే ప్రక్రియ దాదాపుగా ఆగిపోయినట్టుగా కనిపిస్తోంది. ఆయా జిల్లాలకు సంబంధించిన వర్షాభావ పరిస్థితులు, పంటలు ఎండిపోవడం, నష్టపరిహారం, ఇతర అంశాలకు సంబంధించి తాత్కాలిక నివేదికలు మాత్రమే జిల్లా కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గం ఆ నివేదికను పరిశీలించి, ఆమోదించిన తరువాతే కేంద్రానికి పంపాల్సి ఉంటుంది.
9 జిల్లాల్లో ఉపాధి హామీ పనులు
రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 440 మండలాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనులు జరుగుతున్నాయి. మొత్తం కూలీల్లో దాదాపు 72వేల మంది 100 రోజుల పనిదినాలు పూర్తి చేశారు. ఇది ఈనెలాఖరుకు లక్షకి చేరే అవకాశం ఉన్నట్లు అధికారిక సమాచారం. ఈ లెక్కన రోజుకు ఒక కూలీకి 180 రూపాయిల చొప్పున లక్ష మందికి అదనంగా వచ్చే 50 రోజులకుగాను 100 కోట్ల మేర నిధులు అవసరమవుతాయి. ప్రభుత్వం కరువు నివేదికను కేంద్రానికి పంపితేనే నిధులు విడుదలవుతాయి..
కేంద్రం కొత్త షరతులు విధించడంపై విమర్శలు
నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాల పరిస్థితి దారుణంగా మారింది. అప్పుడే అక్కడక్కడా వలసలు ప్రారంభమయ్యాయి.. రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.. కరవు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సరైన సలహా, భరోసా లేకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఇలాంటి సందర్భంలో ఆసరాగా నిలవాల్సిన ఉపాధి హామీ పథకంపై కేంద్రం కొత్త షరతులు విధించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి..

 

ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు

హైదరాబాద్‌ : ప్రేమించడం లేదని అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ పోసిన దాడులు ఇప్పటి వరకు విన్నాం. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తనను ప్రేమించడం లేదని ఓ యువకుడిపై అతన్ని ప్రేమించిన ఓ యువతి యాసిడ్ దాడి చేసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. వెంకటేష్ అనే యువకుడిపై అతని మాజీ ప్రియురాలు గీతాంజలి యాసిడ్ దాడి కి పాల్పడింది. తనకు తెలియకుండా మరో అమ్మాయితో కూడా ప్రేమాయణం సాగిస్తున్నాడని తెలిసి కోపం పట్టలేక అతని ముఖం పై యాసిడ్ పోసింది. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు ముఖంతో పాటు శరీరంలోని పలు చోట్ల కాలిన గాయాలు అయ్యాయి.

బీహార్‌లో రెండో దశలో పోలింగ్‌..30 శాతం ఓటింగ్

హైదరాబాద్ : బీహార్‌లో జరుగుతున్న రెండో దశలో పోలింగ్‌ ఊపందుకుంది. 11గంటల సమయానికి 30శాతం ఓటింగ్‌ నమోదయింది. ఉదయం మందకోడిగా ప్రారంభమయిన ఓటింగ్‌ నెమ్మది నెమ్మదిగా ఊపందుకుంది. తొలి గంటలో కేవలం 5.59 శాతం నమోదైన ఓటింగ్‌ ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. 10 గంటల ప్రాంతానికి 16 శాతం ఓటింగ్‌ నమోదు కాగా...మరో గంటలో అది 30 శాతానికి చేరింది. ఎన్నికలు జరుగుతున్న 32 నియోజకవర్గాల్లో 23 నియోజక వర్గాలు నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకే ముగియనుంది.

 

రాహుల్ ను కలిసిన ఎపిసిసి చీఫ్ రఘువీరా

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి కలిశారు. పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

 

12:17 - October 16, 2015

ఢిల్లీ : ఎన్ డిఎ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. పాత పద్ధతిలోనే జడ్జీల నియామకం జరగాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల కోసం గతంలో ఉన్న కొలీజియం వ్యవస్థస్థానంలో మోడీ సర్కారు ఎన్‌జేఏసీని తీసుకువచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.... జడ్డీల నియాయకంపై ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. కొలీజియం వ్యవస్థను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. జడ్జీల నియామకం విషయంలో గతంలోని కొలీజియం వ్యవస్థనే కొనసాగించాలని కోర్టు తెలిపింది. నేషనల్ జ్యుడీయల్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగం విరుద్ధమని స్పష్టం చేసింది. జడ్డీల నియామకంలో కేంద్రం జోక్యం.. న్యాయవ్యవస్థకు మంచిది కాదని ధర్మాసనం హితవుపలికింది. 

ఆడపిల్ల పుట్టిందని హత మార్చిన తండ్రి

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మండలంలో దారుణం జరిగింది. కన్న తండ్రే కూతురు పాలిట కాలయముడయ్యాడు. మళ్లీ ఆడపిల్ల పుట్టిందని కసాయి తండ్రి 9 నెలల పాపను కడతేర్చాడు.

బీహార్ రెండో దశ ఎన్నికల్లో బాంబు కలకలం..

హైదరాబాద్ : బీహార్‌ రెండో దశ ఎన్నికల్లో ఓ బాంబు కలకలం రేపింది. జౌరంగా బాద్‌ జిల్లాలోని రఫిగంజ్‌ నియోజకవర్గంలో బూత్‌ నెంబర్‌ 144 వద్ద ఓ బాంబును పోలీసులు గుర్తించారు. ఇంకా పోలింగ్‌ ప్రారంభం కాక ముందే ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే పోలీసులు సంబందిత అధికారులు బాంబ్ స్వాడ్‌కు సమాచారం అందించడంతో వారు అక్కడకు వచ్చి ప్రమాదం జరగకుండా నివారించగలిగారు. ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డ ప్రజలు ఈ సంఘటనతో ఒక్కసారిగా దిగ్బాంత్రికి గురయ్యారు.

 

దంపతుల అనుమానాస్పద మృతి...

మహబూబ్‌నగర్ : కొత్తకోట మండలం అమడబాకులలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పదస్థితిలో భార్యాభర్తలు మృతి చెందారు. భార్య మృతదేహం ఇంట్లో రక్తపుమడుగులో ఉంది. కిరోసిన్ మంటల్లో భర్త మృతదేహం ఉంది. భార్యను చంపి భర్త కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఉంటాడా? లేక ఎవరైనా ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారా? అన్నది తేలాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

స్వదేశానికి తిరిగొచ్చిన ప్రణబ్

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 3 దేశాల విదేశీ పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకుని భారత దేశం తిరిగి వచ్చారు. అక్టోబర్‌ 10 నుంచి అక్టోబర్‌ 15 వరకూ ఆయన జోర్డాన్‌, పాలస్థీనా, ఇజ్రాయిల్‌ దేశాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

11:45 - October 16, 2015

చండీఘర్ : వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు పరిపాటి అయింది. అనునిత్యం ఏదో ఒక అంశంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ముస్లీంలపై వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దాద్రీ ఘటన చేసిన గాయంపై బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ వరుసలో హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌ వచ్చి చేరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఖట్టర్‌ మాట్లాడుతూ, ముస్లిం మతస్తులు ఈ దేశంలో ఉండాలంటే గొడ్డు మాంసం తినడం మానివేయాలంటూ ప్రకటించారు. దేశంలో మెజారిటీ మతస్తులకు ఆవు పవిత్ర జంతువని అందుకే గొడ్డుమాంసం తినడం మానివేయాలంటూ తెలిపారు. అంతేకాదు దాద్రీ ఘటన కేవలం అవగాహానాలోపంతోనే జరిగిందని ఖట్టర్‌ అన్నారు. అలాగే దాద్రీ ఘటనలో మృతి చెందిన అఖ్లాక్‌.. ఆవుపై చులకనగా మాట్లాడారని మెజారిటీ మనోభావాలు దెబ్బతిన్నందుకే దాడి జరిగిందని భాష్యం చెప్పారు. అంతేకాదు బీఫ్‌ తినడం రాజ్యాంగానికి విరుద్ధమని ఖట్టర్‌ తెలిపారు.

 

11:28 - October 16, 2015

ఢిల్లీ :  భారత్‌లో మత స్వేచ్ఛ కరువైందని అమెరికా పేర్కొంది. మతపరమైన ఘర్షణలు, హత్యలు పెరిగిపోయాయని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛకు సంబంధించిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడించింది. మతపరమైన ఘర్షణలు ఆపడంలో పోలీసులు కూడా విఫలమయ్యారని తెలిపింది.
'అంతర్జాతీయ మత స్వేచ్ఛ' నివేదిక విడుదల
2014 సంవత్సరానికి సంబంధించిన 'అంతర్జాతీయ మత స్వేచ్ఛ' నివేదికను అమెరికా విడుదల చేసింది. భారత్‌లో మత స్వేచ్ఛ హరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. మత మార్పిడులు, మతపరమైన హత్యలు, ఘర్షణలు, అరెస్ట్‌లతో భారత్‌లో ఉద్రిక్తత పరిస్తితులు చోటు చేసుకున్నాయని తన వార్షిక నివేదికలో పేర్కొంది. అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ ఈ రిపోర్టును విడుదల చేశారు. ప్రభుత్వంలో ఉన్న కొందరు ప్రతినిధులు మైనారిటీల పట్ల వివక్షపూరిత ప్రకటనలు చేశారని వెల్లడించింది.
మత ఘర్షణలను అరికట్టడంలో పోలీసులు విఫలం
కొన్ని సందర్భాల్లో మత ఘర్షణలను అరికట్టడంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అమెరికా తెలిపింది. ఘర్‌ వాప్‌సీ పేరిట బలవంతపు మత మార్పిడులు, చర్చిలపై, మైనారిటీలపై జరిగిన దాడులను ఆపడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించింది. 2014 మే నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు భారత్‌లో మతపరమైన దాడులు 8 వందలకు పైగా చోటుచోసుకున్నాయని 'యాక్ట్‌ నౌ ఫర్‌ హార్మనీ అండ్‌ డెమాక్రసీ' అనే స్వచ్చంధ సంస్థ వెల్లడించింది.
నిరంజన్‌ జ్యోతి వివాదస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్రమంత్రి నిరంజన్‌ జ్యోతి మైనారిటీలను ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోది వివరణ ఇచ్చిన విషయాన్ని కూడా రిపోర్టు ఉదహరించింది. 1984 లో జరిగిన సిక్కులపై దాడులు, 2002 గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన వందలాది కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని రిపోర్ట్‌ తెలిపింది.

 

కొలీజియం వ్యవస్థనే కొనసాగించాలన్న 'సుప్రీం'

ఢిల్లీ : జడ్జీల నియామకాలు పాతపద్ధతిలోనే జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలోని కొలీజియం వ్యవస్థనే కొనసాగించాలని కోర్టు తెలిపింది.

 

10:59 - October 16, 2015

హైదరాబాద్ : తెలంగాణాలో అధికార పార్టీ శాసనసభ్యుల ఆగడాలు రోజుకో జిల్లాలో వెలుగు చూస్తున్నాయి. ఒకరు అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తే....మరొకరు ప్రభుత్వ నిర్ణయాల ఆధారంగానే తమ వసూళ్లను మరింత పెంచుకుంటున్నారు. ఇటీవలే ప్రభుత్వం కల్తీ కల్లుపై తీసుకున్న నిర్ణయంతో ఓ ప్రజా ప్రతినిధి.. కోట్ల రుపాయాల పంట పండించుకుంటున్నాడు.
కల్తీ కల్లు తయారీదారులపై ఉక్కుపాదం
తెలంగాణాను కల్తీ కల్లు రహిత రాష్ట్రంగా మార్చేందుకు.. ప్రభుత్వం కల్తీ కల్లు తయారీదారులపై ఉక్కు పాదం మోపుతోంది. కల్తీకల్లుకు అలవాటు పడ్డ జనం.. అధికారుల దాడులతో ఉక్కిరిబిక్కిరయ్యారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కల్తీ కల్లు బాధితులు మతిస్థిమితం కోల్పోయి ఆసుపత్రుల పాలయ్యారు. వ్యవహారం తీవ్ర రూపం దాలుస్తుండడంతో... ప్రభుత్వం కొద్దిగా వెనుకడుగు వేసింది. ముందుగా డీ-అడిక్షన్ సెంటర్ లను ఏర్పాటు చేసి కల్తీ కల్లును పూర్తిగా నిర్మూలించాలని భావించింది.
పెద్ద మొత్తంలో ముడుపులు
కల్తీ కల్లుపై ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో.. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే జోరును పెంచారు. కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగే మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని సొసైటీల మాఫియాతో మంత్రాంగం నడిపారు. ఈ మూడు జిల్లాల్లో యధేచ్ఛగా కల్తీ కల్లు తయారు చేసుకొమ్మని.. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. అవసరమైతే ముఖ్యమంత్రితో చర్చించి దాడులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీనికిగాను కల్తీ కల్లు తయారీ మాఫియా నుంచి పెద్ద ఎత్తున ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే చేతివాటం నిజమేనని నివేదికలు?
ఎమ్మెల్యేగారి ముడుపుల విషయం ఓ ఉన్నతాధికారి దృష్టికి వెళ్లడంతో.... ఆయన సమాచారాన్ని నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో... సీఎం కేసీఆర్ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలతో ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెప్పించుకున్నట్లు తెలిసింది. శాసనసభ్యుడి చేతివాటం నిజమేనని సీఎంకు నివేదికలు అందినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
పార్టీకి చిక్కులు తెచ్చి పెట్టనున్న అధికార పార్టీ ఎమ్మెల్యేల దందా
తాత్కాలికంగా కల్తీ కల్లుపై దాడులు ఆగినా....... త్వరలో ఆ మూడు జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అవినీతిని ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలకు... క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వ్యవహారానికి పొంతన లేకుండా పోతుంది. అధికార పార్టీ నేతలే అవినీతిపై ఆసక్తి చూపిస్తుండడం గులాబి పార్టీకి దీర్ఘకాలంలో ఇబ్బందులు సృష్టించేవిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతల అవినీతికి ముఖ్యమంత్రి ఎలా చెక్ పెడుతారన్నది చర్చనీయంశంగా మారింది.

 

10:51 - October 16, 2015

హైదరాబాద్ : ప్రముఖ రచయిత, కళాకారుడు భూపాల్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. పలు విషయాల్లో ప్రస్తుత కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆయనకు లభించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలకు సంబంధించిన కథాంశంతో 'ఉగ్గుపాలు' అనే పేరుతో ఆయన రాసిన పుస్తకానికిగానూ 2010లో భూపాల్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. రచయితగానే కాక సినీనటుడుగానూ ఆయన ప్రసిద్ధి. మా భూమి, కొమరం భీం సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, మోడీ సర్కార్ విధానాలను నిరసిస్తూ పలువురు రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగిచ్చేస్తున్న సందర్భంలో ఆ నిర్ణయాన్ని ప్రకటించిన మొదటి తెలుగు రచయితగా భూపాల్‌ నిలబడ్డారు. రచయిత కల్‌బుర్గీ హత్యకు నిరసనగా భూపాల్‌ తనకు వచ్చిన అవార్డు తిరిగిఇచ్చేశారు. అలాగే ఎన్‌ కౌంటర్లకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాన్ని సైతం భూపాల్‌ తిరిగిచ్చేశారు.  

10:43 - October 16, 2015

కర్నూలు : నకిలీ కుల ధృవీకరణ పత్రాల విషయంలో కర్నూలులో ఆరుగురు మెడికల్‌ విద్యార్థులపై కేసు నమోదైంది. నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో వీరు సీటు సంపాదించారు. కల్లూరు తహశీల్దార్‌ కార్యాలయం నుంచి ఐదుగురు, కర్నూలు తహశీల్దార్‌ కార్యాలయం నుంచి ఒకరు నకీలీ కులధృవీకరణ పత్రాలు పొందినట్టు విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

కర్నూలులో ఆరుగురు మెడికల్‌ విద్యార్థులపై కేసు నమోదు

కర్నూలు : నకిలీ కుల ధృవీకరణ పత్రాల విషయంలో కర్నూలులో ఆరుగురు మెడికల్‌ విద్యార్థులపై కేసు నమోదైంది. నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో వీరు సీటు సంపాదించారు. కల్లూరు తహశీల్దార్‌ కార్యాలయం నుంచి ఐదుగురు, కర్నూలు తహశీల్దార్‌ కార్యాలయం నుంచి ఒకరు నకీలీ కులధృవీకరణ పత్రాలు పొందినట్టు విచారణలో వెల్లడైంది.

10:36 - October 16, 2015

ఎపి రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని... వైసిపి అధినేత జగన్ రాజధాని శంకుస్థాపనకు పోననడం సరికాదని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. రాజధాని శంకుస్థాపన చారిత్రక ఘట్టం.. ఆ కార్యక్రమానికి జగన్ వెళ్లకపోవడం తప్పిదమే అవుతుందన్నారు. జగన్.. శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లకపోతే.. రాజకీయంగా అనేక విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపారు. రాజధానిపై అనేక విమర్శలు ఉండవచ్చు, ప్రభుత్వ వ్యవహార శైలి సరిగ్గా లేకపోవచ్చు, నిర్మాణం భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు.. అంత మాత్రాన రాజధాని నిర్మాణాన్ని భహిష్కరించడం సబబు కాదన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే...
ప్రతిదాన్ని వివాదం చేయాల్సిన పని లేదు.
'వివాదాలు, విభేధాలు, సందర్భం వేర్వేరు. ప్రతిదాన్ని వివాదం చేయాల్సిన పని లేదు. జగన్ శంకుస్థాపనకు తనకు ఆహ్వానం పంపవద్దని లేఖ రాసి.. ఆయనపై ఆయనే బండ వేసుకున్నారు. అయితే జగన్ లేఖలో పేర్కొన్న కొన్ని అంశాలు లేవనెత్తాడు. రాజధాని శంకుస్థాపన, నిర్మాణం విషయాల్లో అనవసరపు ఖర్చులను వ్యతిరేకించాలి.
రాజధాని నిర్మాణంపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత లేదు...
రాజధాని నిర్మాణంపై ఎపి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత లేదు. జరీ భూములున్న రైతులు వ్యతిరేకించారు. తప్పని పరిస్థితుల్లో కొంత మంది రైతులు భూములిచ్చారు. మరోవైపు తుళ్లూరు ప్రాంతంలో రాజధానికి భూములను ఇష్టపూర్వకంగా ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నేతల్లో రాజధాని నిర్మాణంపై మంచి అభిప్రాయం ఉంది. దక్షిణాంధ్ర ఎమ్మెల్యేలు మాత్రమే రాజధాని స్టేట్ ఇస్తున్నారు. ఎపిలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితి వేరుగా ఉంది. రాజధాని నిర్మాణంపై సుముఖంగా లేరు. రాజధాని నిర్మాణంపై ఉత్తరాంధ్ర, రాయలసీమలోని నేతల్లో అంత ఆసక్తి లేనట్లుగా కనిపిస్తోంది.
ఎపి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది...
రాజధాని అనేది వేల సంవత్సరాల వరకు ఉంటుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎపి సర్కార్.. ఏ అంశంలోనూ ప్రతిపక్షాలను ఇన్ వాల్వ్ చేయలేదు. రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. అసెంబ్లీలో ప్రభుత్వం... ప్రధాన ప్రతిపక్ష నాయుకునికి గౌరవం ఇవ్వలేదు. ప్రతిపక్షాలకు సర్కార్ గౌరవం ఇవ్వడం లేదు.. అన్ని రాజకీయ పక్షాలను ఇన్ వాల్వ్ చేయాలి. రాజధాని నిర్మాణంలో ప్రజలందరినీ భాగసామ్యం చేయడం సబబు. అయితే ఈ విషయంపై ప్రజాభిప్రాయం చాలా వేగంగా మారుతుంది. రాజధాని విషయంలో అన్ని రాజకీయా పార్టీలను కలుపుకుని పోవాలి. అయితే ప్రజల భావోద్వేగాలపై రాజధాని నిర్మాణం చేయడం ప్రమాదకరం. సెంటిమెంట్ వల్లే సమస్యలు ఉత్పన్నమవుతాయి. లాభనష్టాలను బేరీజు చేయాలి. ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలి.
కృష్ణా జలాలు వివాదం... సుప్రీంకోర్టు తీర్పు...
కృష్ణా జలాలు వివాదాంలోకి మహారాష్ట్ర, కర్నాటక, ఎపి, ఇప్పుడు కొత్తగా తెలంగాణ వచ్చింది. ఉమ్మడి సమస్యలను సుప్రీంకోర్టు పరిష్కరించాలి. గతంలో కృష్ణా నది మిగులు జలాలు వాడుకునే అవకాశం ఉమ్మడి ఎపికి ఉండేది... కానీ ఇప్పుడు లేదు.
తెలంగాణ ప్రభుత్వం.. నెంబర్ ప్లేట్ల మార్పు
వాహనాల నెంబర్ ప్లేట్ల మార్పుకు తెలంగాణ రావాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇంతకముందున్న ఎపి నెంబర్ ప్లేట్లను తెలంగాణ స్టేట్ మార్చడంపై సమస్యలు తలెత్తుతాయి. ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాక టీఎస్ పేరుతో వాహనాల నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవడం తేలికే. కానీ అంతకముందున్న ఎపి వాహనాలను కూడా టీఎస్ పేరుతో మార్చుకోవాలంటే మళ్లీ ఖర్చు అవుతుంది'. అని వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:37 - October 16, 2015

 

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని వక్తలు విమర్మించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ చర్చా కార్యక్రమంలో నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య, బిజెపి నాయకురాలు పాదూరి కరుణ, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, టీడీపీ నేత.. సతీష్ మాదిగ పాల్గొని, మాట్లాడారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో, రైతుల ఆత్మహత్యలను నివారించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అన్నప్పుడు ఇంత అప్పు చేయాల్సిన అవసరమేంటి అనే ప్రశ్న వస్తుందన్నారు. విత్తన చట్టం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ మౌళిక రంగాల కుంటుపడుతున్నాయని ఆదేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పంటలకు భీమా పథకం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. కరువు, రైతుల ఆత్మహత్యలకు రాష్ట్రం సర్కార్ తోపాటుగా కేంద్రప్రభుత్వానిది కూడా బాధ్యత ఉందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

మూడో రోజు తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు..

తిరుపతి : నేడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటలకు సింహ వాహనం, రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. 

నేడు ఆలేరు నియోజవర్గంలో కాంగ్రెస్ రైతు భరోసాయాత్ర

నల్గొండ : నేడు ఆలేరు నియోజవర్గంలో కాంగ్రెస్ రైతు భరోసాయాత్ర నిర్వహించనుంది. 

శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం టీటీడీలో విలీనం..?

గుంటూరు : అమరావతిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని అధికారులు టీటీడీలో విలీనం చేయనున్నారు. 

07:58 - October 16, 2015

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, వైఫల్యాల వల్లే నిత్యవసర వస్తువుల ధరలు అధికమయ్యాయని రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధిక ధరలు పెరుగుతుంటే ప్రభుత్వ నిఘా లేదని ఆరోపించారు. 'పప్పు, ఉప్పు, ఉల్లి, నూనె ఏదీ కొనలేని పరిస్థితి దాపురిస్తోంది. అన్ని పప్పుల ధరలు మునుపెన్నడూలేనిరీతిలో రికార్డు స్థాయికి చేరుతున్నాయి. నూనెలు కాగిపోతున్నాయి. ఉల్లి ధర పెద్దగా దిగిరావడం లేదు. సామాన్యుడి వంటింటి బడ్జెట్ చుక్కలు చూపిస్తోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? ధరలు అదుపుతప్పి ఆకాశమార్గం పట్టడానికి కారణం ఏమిటి? అధికారం ఇస్తే వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు పగ్గం వేయలేకపోతోంది? సామాన్యుడికి ఉపశమనం కలగాలంటే తక్షణం చేపట్టాల్సిన చర్యలేమిటి? ధరల కట్టడికి దీర్ఘకాలిక వ్యూహాలేమిటి? మధ్య కాలిక తరుణోపాయాలేమిటి? వంటి అంశాలపై సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:48 - October 16, 2015

హైదరాబాద్ : అధికారమిస్తే వంద రోజుల్లో నిత్యావసరాల ధరలు తగ్గిస్తామన్నది బీజేపీ ఎన్నికల వాగ్ధానం. కానీ ధరలు తగ్గకపోగా, ఈ ఏడాదిన్నర కాలంలో రెండు మూడు రెట్లు పెరిగాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? వరుసగా పండగలొస్తున్నాయ్. పండగ పూట బంధువులను ఆహ్వానించుకోవడం, కమ్మటి పిండివంటలు చేసుకోవడం మన సంప్రదాయం. కానీ, మార్కెట్ లో మండిపోతున్న ధరలను చూస్తుంటే గుండె గుభేల్ మంటోంది. కందిపప్పు రెండు వందలు దాటింది. పెసరపప్పు, పల్లీలు, మినపప్పు ఇవన్నీ వంద దాటి, నూట ముప్పైకి చేరాయి. వంట నూనెల ధరలూ కాగిపోతున్నాయి. ఉల్లిగడ్డ ధర కూడా దిగిరాలేదు. ఇప్పటికీ ఉల్లిగడ్డ కేంద్రాల దగ్గర జనం బారులుతీరి కనిపిస్తున్నారు. గోధుమ రవ్వ, బొంబాయి, ఇడ్లీ రవ్వ ఏదీ కొనాలన్నా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. గతంలో నిలకడగా వున్న పంచదార ధర కూడా ఇప్పుడు పైకి ఎగబాకుతోంది. ఇక టీ పొడి సరేసరి.
పెరుగుతున్న సామాన్యుడి వంటింటి బడ్జెట్
సామాన్యుడి వంటింటి బడ్జెట్ ఏ నెలకు ఆ నెల పెరిగిపోతోంది. ఏడాదిన్నర క్రితం కిరాణా సామాన్లకు నెలకు వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే, ఇప్పుడు అవే సామాన్లకు రెండు వేల రూపాయలు దాటుతోంది. రెండేళ్లలోనే వంటింటి బడ్జెట్ రెట్టింపయ్యింది. దానికితగ్గట్టుగా ప్రయివేట్ సంస్థల్లో పనిచేసే ఏ ఒక్క వ్యక్తీ వేతనమూ పెరగలేదు. ఇక దినసరి కూలీలు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అసలు పనులే దొరక్క అవస్థపడుతున్నారు. ఇక రైతుల పరిస్థితి మరీ దయనీయం. ఒకవైపు కుటుంబాన్ని వెళ్లదీసుకోవాలి. మరోవైపు వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టాలి. చేతికొచ్చిన పంటను అమ్ముకోబోతే ఎన్నెన్నో వంకలు పెట్టి, వెక్కిరిస్తున్నారు.
సామాన్యుడి వంటింటి బడ్జెట్ తగ్గేదెప్పుడు?
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిత్యావసరాల ధరలు నెత్తిమీద దరువేస్తున్నాయి. ఏ షాపుకెళ్లినా బస్తాల కొద్ది నిల్వలు కనిపిస్తున్నాయి. కానీ, ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు పెట్రోల్, డీజిల్ మీద స్వచ్ఛభారత్ సెస్ విధించేందుకు కేంద్రం ఆవురావురుమంటోంది. అంటే మరికొద్ది రోజుల్లో బైక్ ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా ఇంకొంత పెరగబోతున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు కళ్లెం వేయకపోగా, అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గినా, రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా పన్నులు పెంచేసి, సామాన్యుడికి ఆ మాత్రం ఊరటకూడా లేకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితి మారెదప్పుడు? సామాన్యుడి వంటింటి బడ్జెట్ తగ్గేదెప్పుడు? బంధు మిత్రులంతా కలిసి మనస్పూర్తిగా, సంతోషంగా పండుగలు చేసుకునేదెప్పుడు?

 

 

07:39 - October 16, 2015

హైదరాబాద్ : త‌రుముకొస్తున్న ఉపఎన్నిక‌లు కాంగ్రెస్‌కు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఒకవైపు టీఆర్ఎస్ త‌న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో ప‌రేషాన్ చేస్తోంది. దీంతో సొంతింట్లో అభ్యర్థిని వెత‌క‌డం హ‌స్థం పార్టీకి పెద్ద స‌వాల్‌గా మారింది. ఓరుగ‌ల్లులో అభ్యర్థి కోసం బూత‌ద్దం ప‌ట్టుకుని వెతుకుతుంటే.. నాయ‌రాయ‌ణ్ ఖేడ్‌లో త‌మ అభ్యర్థి ఎక్కడ చేజారుతారో అన్న భయం కాంగ్రెస్‌ను వెంటాడుతుంది.
కాంగ్రెస్ కు వింత ప‌రిస్థితి
అధికార ప‌క్షంపై నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్న టీ కాంగ్రెస్‌కు త్వరలో రానున్న ఉప ఎన్నిక‌లు వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నాయి. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అనుకుంటున్న కాంగ్రెస్ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న వ‌రంగ‌ల్, నారాయ‌ణ్‌ఖేడ్‌లో వింత ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఓరుగ‌ల్లులో టీఆర్ఎస్‌కు ఝల‌క్ ఇచ్చి..నారాయణఖేడ్‌ను సొంత చేసుకుంటామ‌ని చెప్తున్న హ‌స్తం నేత‌ల‌కు గ్రౌండ్‌లో భిన్నమైన చిత్రం క‌నిపిస్తుండ‌టం తెగ క‌ల‌వ‌ర‌పెడుతోంది.
కాంగ్రెస్‌కు స‌వాల్ గా ఎంపీ ఉపఎన్నిక
క‌డియం రాజీనామాతో వచ్చిన వరంగల్‌ ఎంపీ ఉపఎన్నిక.. కాంగ్రెస్‌కు స‌వాల్ గామారింది. ఎన్నిక‌ల్లో బరిలోకి దింపే అభ్యర్ధికోసం హ‌స్తం పార్టీ బూత‌ద్దం పట్టుకుని వెతుకుతోంది. ఇక్కడ నుండి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోద‌ర రాజ‌న‌ర్శింహ, కేంద్ర మాజీ మంత్రి స‌ర్వే స‌త్యనారాయణ, రాజ‌య్యతో పాటు.. ఒకరిద్దరి లోక‌ల్ నేత‌ల పేర్లు వినిపించినా..అదిష్టానం మాత్రం దామోదర వైపే మొగ్గు చూపుతోంది. అయితే దీనికి దామోద‌ర ఆస‌క్తి చూప‌డంలేద‌ట‌. ఇక స‌ర్వే సత్యనారాయణ పోటీకి ఉషారుగానే ఉన్నప్పటికీ.. ఆయ‌నపై లోక‌ల్ నేత‌ల్లో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థిని వెతుకులాటలో తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్... విధిలేని ప‌రిస్థితిలో మాజీ ఎంపీ రాజ‌య్య వైపు చూస్తున్నట్లు సమాచారం. అయితే ఆయ‌న‌ కూడా కాదంటే.. కాంగ్రెస్‌కు అభ్యర్థి క‌రువే అని చెప్పకతప్పదు.
నారాయ‌ణ్‌ఖేడ్‌లో కాంగ్రెస్ క‌ష్టాలు
ఇక నారాయ‌ణ్‌ఖేడ్‌లో కాంగ్రెస్‌కు అన్ని క‌ష్టాలే వెంటాడుతున్నాయి. ఆన‌వాయితి ప్రకారం..ఏక‌గ్రీవంతో మ‌ళ్ళీ నారాయ‌ణ్‌ఖేడ్‌ను సొంతం చేసుకోవ‌చ్చని ఆశ‌ప‌డ్డ కాంగ్రెస్..లోక‌ల్‌లో క‌నిపిస్తున్న సీన్ తెగ ప‌రేషాన్ చేస్తోంది. కిష్టారెడ్డి కుమారుడు సంజీవ్ రెడ్డికి టికెట్ ఇవ్వాల‌ని.. పీసీసీ-సీఎల్పీ నిర్ణయించినప్పటికి..ఆ అభ్యర్థినే త‌మ గూటికి ఎగ‌రేసుకుపోయేందుకు టీఆర్ఎస్ మంత్రాంగం నడిపిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు..ఇదే టాస్క్‌లో మంత్రి హ‌రీష్‌రావు తెరవెనుక మంత్రాంగం న‌డుపుతున్నట్లు వ‌స్తున్న వార్తలు కాంగ్రెస్‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ఇది చాల‌ద‌న్నట్లు నారాయ‌ణ‌ఖేడ్‌ నుండి త‌న కుటుంబ స‌భ్యులను దింపాల‌ని మాజీ ఎంపి సురేశ్ షెట్కర్‌ చేస్తున్న ప్రయత్నాలు హ‌స్థం పార్టీకి ఇబ్బందిగా మారాయి. త‌న ఫ్యామిలీకి టికెట్ ఇవ్వకపోతే రెబ‌ల్‌గా బ‌రిలో దిగేందుకు సురేష్‌షెట్కర్‌ ఇప్పడికే సరంజామా రెడీ చేసుకుంటున్నట్లు పార్టీలో టాక్. దీన్ని స‌ర్దుబాటు చేయ‌డం టి పిసిసికి త‌ల‌నొప్పిగా మారింది. మొత్తానికి ఇలా వ‌రంగ‌ల్‌లో అభ్యర్థిపై వెతుకులాట‌,.నారాయ‌ణ్‌ఖేడ్‌లో రెబ‌ల్ బెడ‌ద‌ కాంగ్రెస్‌ను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇది చాల‌ద‌న్నట్లు మొద‌టి పుట్టిముంచేందుకు అధికార పార్టీ ఆక‌ర్ష్ మంత్రం జపిస్తుండడం కాంగ్రెస్‌ను వణికిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉప ఎన్నిక‌ల్లో ఎలా గ‌ట్టెక్కుతుందో చూడాలి.

 

07:33 - October 16, 2015

హైదరాబాద్ : తెలంగాణలోని భారీ, మధ్యతరహా పెండింగ్ ప్రాజెక్టు ప‌నుల‌ను సకాలంలో పూర్తిచేసేందుకు ప్రభుత్వం డెడ్ లైన్ విధించుకుంది. 2016 జూన్ నాటికి ఈ పెండింగ్ ప్రాజెక్టుల ప‌నులు పూర్తి చేయాల‌ని మంత్రి హ‌రీష్ రావు అధికారుల‌ను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల ప‌నుల‌పై స‌చివాల‌యంలో అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. భూసేక‌ర‌ణ‌పై ప్రత్యేక దృష్టి సారించాల‌న్నారు హరీష్‌రావు.
యుద్ధ ప్రాతిపదిక‌న సాగునీటి ప్రాజెక్టులు
పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల‌ను యుద్ధ ప్రాతిపదిక‌న పూర్తిచేసేందుకు టీ సర్కార్‌ నిర్ణయించింది. పాత ప‌ద్ధతుల‌ను ప‌క్కన పెట్టి త్వరితగతిన ప‌నిచేయాల‌ని సాగునీటి శాఖ మంత్రి హ‌రీష్ రావు అధికారుల‌ను ఆదేశించారు. ప్రాజెక్టుల ధ‌ర‌ల పెంపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల‌ను అధికారుల‌కు వివ‌రించారు. భూసేక‌ర‌ణ‌కు ఉన్న అడ్డంకుల‌ను అధిగ‌మించి జీవో 146 ప్రకారం భూసేక‌ర‌ణ చేయాల‌న్నారు. మ‌హబుబ్‌ నగర్ జిల్లాలోని పెండిగ్ ప్రాజెక్టులు బీమా, నెట్టెంపాడు, క‌ల్వకుర్తి, కోయ‌ల్ సాగ‌ర్ ప్రాజెక్టుల‌కు 14 వందల ఎకరాల భూసేకరణను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలన్నారు. పాలమూరు రంగారెడ్డి, ప్రాణహిత ప్రాజెక్ట్ కోసం భూసేకరణను వేగవంతం చేయాలని చెప్పారు.
మిని ట్యాంక్ బండ్లకు అనుమతులు
మిని ట్యాంక్ బండ్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులను ఇచ్చింది. కరీంనగర్ జిల్లాలోని మానకొండురు పెద్ద చెరువును మిని ట్యాంక్ బండ్‌గా మార్చడానికి ఇరిగేషన్ శాఖ పరిపాలనా అనుమతులను ఇస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. పెద్ద చెరువు సుందరీకరణ కోసం ఐదు కోట్ల యాబైతొమ్మిది లక్షల రూపాయలను మంజూరు చేస్తూ జివో విడుదల చేశారు. దీంతో పాటు మెదక్ జిల్లా నారాయణ ఖేడ్‌లోని కమలాపూర్ గ్రామంలో ఉన్న రిజర్వాయర్‌ను మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడానికి జీవో విడుదలైంది. మూడు కోట్ల యాబై ఎనిమిది లక్షల రూపాయలతో ఈ చెరువును సుందరీకరిచబోతున్నారు. వరంగల్ జిల్లా ఉర్సు గ్రామంలోని రంగ సముద్రం చెరువును కూడా మిని ట్యాంక్ బండ్‌గా మార్చబోతున్నారు. రంగ సముద్రం చెరువుకు మూడు కోట్ల పది లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరి ఇచ్చింది. ఈ పనులను మిషన్ కాకతీయ రెండో ఫేస్‌లో చెపట్టబోతున్నారు.
కొత్త ప్రణాళిక‌ల మేర‌కే ప‌నులు
నూత‌న జ‌ల విధానంపై క‌స‌ర‌త్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మొద‌ట పెండింగ్ ప్రాజెక్టుల ప‌నులు పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యంతో ప‌నిచేస్తోంది. అయితే పెండింగ్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేప‌ట్టిన స‌ర్కారు...కొత్త ప్రణాళిక‌ల మేర‌కే ప‌నులు చేయాలని అధికారుల‌ను ఆదేశిస్తోంది.

 

07:22 - October 16, 2015

గుంటూరు : రాజధాని శంకుస్థాపనకు హాజరు కారాదని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈమేరకు తనకు ఆహ్వానం పంపవద్దంటూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. లంచాల కోసం.. రైతుల భూములతో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని.. ఆ స్కాంలో బాబుకు మద్దతు తెలపరాదన్న ఉద్దేశంతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్లు జగన్‌ లేఖలో పేర్కొన్నారు.
ఆహ్వానం పంపవద్దంటూ సీఎంకు జగన్‌ లేఖ
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న రాజధాని శంకుస్థాపనకు.. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి డుమ్మా కొట్టనున్నారు. ప్రధాని సహా.. వేలాది ప్రముఖులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి హాజరు కారాదని జగన్‌ నిర్ణయించుకున్నారు. తనకు ఆహ్వానం పంపవద్దని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరారు. తాను శంకుస్థాపనను బాయ్‌కాట్‌ చేయడానికి ఎనిమిది కారణాలను పేర్కొన్నారు.
చంద్రబాబు వైఖరికి నిరసనగానే గైర్హాజరు నిర్ణయం
మూడు పంటలు పండే మాగాణిని.. రైతుల మెడపై కత్తిపెట్టి పూలింగ్‌ పేరిట లాక్కున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా తానీ నిర్ణయం తీసుకున్నానని లేఖలో వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో సెక్షన్‌30, సెక్షన్‌ 144 అమలు చేస్తుండడాన్ని బట్టి.. ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీర్పును బేఖాతరు చేసిన చంద్రబాబు వైఖరికి నిరసనగా తాను హాజరు కాదలచుకోలేదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే మౌనంగా ఉన్నారని జగన్‌ ఆరోపించారు.
పేదల భూములతో చంద్రబాబు రియల్‌ వ్యాపారం : జగన్
పేదల భూములను.. లంచాల కోసం విదేశీ సంస్థలకు కట్టబెడుతూ.. చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. ఒక్కరోజు కోసం 400 కోట్లు బూడిదపాలు చేస్తున్న చంద్రబాబు తీరుకు నిరసనగానే శంకుస్థాపనకు రాదలచుకోలేదన్నారు. చంద్రబాబు నిర్మిస్తున్నది ప్రజల రాజధాని కాదని.. లక్షల కోట్ల అక్రమ సంపాదనకు చంద్రబాబు చేస్తున్న రచించిన వ్యూహమని ఆరోపించారు. ఆహ్వానం పంపినా రాలేదంటూ తనపై ఆనక రాళ్లు రువ్వవద్దని కూడా జగన్‌ కోరారు.

 

బీహార్‌లో రెండో దశ ఎన్నికలు ప్రారంభం..

పాట్నా : బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 32 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 456 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ దశ ఎన్నికల్లో ఆరు నక్సల్స్ జిల్లాలు కైమూర్, రోహతస్, ఆర్వాల్, జెహానాబాద్, ఔరంగాబాద్, గయా ఉండటంతో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 23 నియోజక వర్గాలు ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ జిల్లాలన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావటంతో పోలింగ్ సమయాలను గంట నుంచి రెండు గంటలు తగ్గించారు.

07:06 - October 16, 2015

పాట్నా : బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు నేడు జరగనున్నాయి. మొత్తం 32 నియోజకవర్గాల్లో 456 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ దశ ఎన్నికల్లో ఆరు నక్సల్స్ జిల్లాలు కైమూర్, రోహతస్, ఆర్వాల్, జెహానాబాద్, ఔరంగాబాద్, గయా ఉండటంతో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 23 నియోజక వర్గాలు ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ జిల్లాలన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావటంతో పోలింగ్ సమయాలను గంట నుంచి రెండు గంటలు తగ్గించారు. మొత్తం 32 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. అయితే 11 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3గంటలకు, 12స్థానాల్లో సాయంత్రం 4గంటలకు పోలింగ్ ముగిసిపోతుంది. కేవలం 9 నియోజక వర్గాల్లో మాత్రమే సాయంత్రం 5గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నియోజకవర్గాల్లో 993 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. నేడు ఎన్నికలు జరగనున్న ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన ఇమామ్‌గంజ్ నుంచి మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా నేత జితన్ రామ్ మాంఝీ పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్, జేడీయూ నేత ఉదయ్‌నారాయణ్ చౌదురీ మాంఝీని ఈ నియోజకవర్గంలో ఎదుర్కొంటున్నారు. రెండో దశ ఎన్నికల్లో కుల ప్రభావమే అధికంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

06:59 - October 16, 2015

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో ఇప్పుడు ఎక్కడ చూసినా సందడే సందడి. అమరావతి శంకుస్థాపన పనులు శరవేగంగా సాగుతున్నాయి. అక్టోబర్‌ 22న చరిత్రలో నిలిచిపోయేవిధంగా శంకుస్థాపన ఉండేలా ప్రభుత్వం కార్యక్రమాల్ని రూపొందిస్తోంది. దసరా పండుగ పర్వదినం నాడే శంకుస్థాపన జరుగుతుండడంతో...శంకుస్థాపన కార్యక్రమాన్ని ఓ పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఊపందుకున్న శంఖుస్థాపన పనులు
ఏపీ రాజధాని అమరావతి శంఖుస్థాపన పనులు ఊపందుకున్నాయి. వేదిక నిర్మాణాలు, సభా ప్రాంగణం, హెలిప్యాడ్ నిర్మాణాలను వేగంగా పూర్తి చేస్తున్నారు. రహదారులతో పాటు పార్కింగ్ ప్రదేశాలను రెడీ చేస్తున్నారు.
హాజరుకానున్న ప్రధాని నరేంద్రమోడి
అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడి హాజరుకానుండడంతో.. భద్రతా అధికారులు సభా ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధాని హెలిప్యాడ్, కాన్వాయ్ రూట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం మూడు వేదికల నిర్మాణాలను వేగంగా పూర్తి చేస్తున్నారు. అలాగే యాగశాల నిర్మాణాన్ని కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రాంగణం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. సభాప్రాంగణంలోకి కాన్వాయ్‌లు, ముఖ్య అతిథులు, ప్రజలు రావడానికి విడివిడిగా ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా..చూసేందుకు ప్రత్యేకంగా వాలంటీర్లను నియమిస్తున్నారు.
ప్రాంగణం చుట్టూ మూడు బారికేడ్లు
ఇక ఆహారం విషయంలో అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి నారాయణ సీఆర్డీఏ అధికారులకు సూచించారు. ఉదయం సభా ప్రాంగణానికి వచ్చే ప్రజలకు రాగానే రెండు అరటి పండ్లు, రెండు మజ్జిగ ప్యాకెట్లను అందించచున్నారు. ఇక శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన వెంటనే మధ్యాహ్నం పూట వెజిటెబుల్ రైస్, రెండు గారెలు, ఒక బూరెతో కూడిన ప్యాకెట్‌ను అందరికీ అందించనున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారికి దసరా పండగను మిస్ అవుతున్నామనే భావన కలకకుండా ఆహారాన్ని అందించనున్నారు. రాజధాని శంఖుస్థాపన కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామన్న ప్రచారంలో నిజం లేదని మంత్రి నారాయణ తెలిపారు. శంఖుస్థాపన కార్యక్రమాన్ని రిచ్‌గా చేస్తున్నాం గాని ఖర్చు ఎక్కువతో కాదని మంత్రి తెలిపారు. శంఖుస్థాపన మహోత్సవం ఓ పండగలాగా జరుగుతుందని, అందరూ పాల్గొని సంతోషంతో తిరిగి వెళ్లేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు.
పండుగలా శంకుస్థాపన మహోత్సవం
రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేవిధంగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రకాశం బ్యారేజీపై పెద్ద ఎత్తున లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో కరకట్ట ప్రాంతంలోనూ, ఉండవల్లి ప్రధాన రహదారి మార్గంలోనూ లైటింగ్స్ తో కూడిన భారీ స్వాగత ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి అమరావతి శంకుస్థాపన మహోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా చేసేందుకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు శంకుస్థాపన పనుల్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో..అంతటా సందడి నెలకొంది.

 

06:52 - October 16, 2015

హైదరాబాద్ : భూ వివాదంలో వ్యక్తిని బెదిరించిన ఇద్దరు ఎస్సైలు అరెస్టయ్యారు. సికింద్రాబాద్‌ ఆల్వాల్‌ పోలీసులు ఇద్దరు ఎస్సైలతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 2 కోట్ల విలువైన స్థల వివాదంలో నిజామాబాద్‌ జిల్లా సదాశివనగర్‌ ఎస్సై ప్రతాప్‌లింగం, మెదక్‌ రూరల్‌ ఎస్సై వినాయక్‌రెడ్డి తనను రివాల్వర్‌తో బెదిరించారంటూ రియల్టర్‌ శ్రీనివాస్‌ ఆల్వాల్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు ఎస్సైలతో పాటు వారికి సహకరించిన రఘు, లక్ష్మినారాయణను పోలీసులు అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

నేడు బీహార్ లో రెండ్ దశ ఎన్నికలు

పాట్నా : నేడు బీహార్ లో రెండ్ దశ ఎన్నికలు జరుగనున్నాయి. 34 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. బరిలో 456 మంది అభ్యర్థులు ఉన్నారు. 

నేడు చైనా కంపెనీల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : చైనా కంపెనీల ప్రతినిధులతో నేడు సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకోసం ఉన్న అవకాశాలను చైనా ప్రతినిధులకు వివరించనున్నారు. ఈ సమావేశానికి 45 మంది చైనా కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు.

రియల్టర్ ను బెదిరించిన ఇద్దరు ఎస్సైల అరెస్టు..

హైదరాబాద్ : ఓ రియల్టర్ ను బెదిరించిన ఇద్దరు ఎస్సైలను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ ఎస్సై ప్రతాప్ లింగం, మెదక్ రూరల్ ఎస్సై వినాయక్ రెడ్డిలు తనను బెబిరించారని శ్రీనివాస్ అనే రియల్టర్ ఎస్సైలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రతాప్ లింగం, వినాయక్ రెడ్డిలను పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.  

 

Don't Miss