Activities calendar

21 October 2015

21:28 - October 21, 2015

ఢిల్లీ : డామన్‌లో ఓ బిజెపి ఎమ్మెల్యే మహిళా కార్పొరేటర్ పై చేయి చేసుకున్నాడు. బిజెపి పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు ఓ మహిళా కార్పొరేటర్ హాల్లో నడుచుకుంటూ వెళ్తుండగా ఎమ్మెల్యే నవీన్ పాటిల్ ఏవో వ్యాఖ్యలు చేశాడు. ఆ మహిళ వెనక్కి తిరుగుతుండగానే నవీన్‌ ఆమె చెంప చెళ్లుమనిపించాడు. వెంటనే ఆ మహిళా కార్పోరేటర్‌ ఎమ్మెల్యేతో ఘర్షణకు దిగింది. ఇరు పక్షాల మద్దతుదారులు గొడవ పడ్డారు. డామన్లో బీజేపీ నిర్వహిస్తున్న మేథోమదన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే నవీన్ పాటిల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

 

21:27 - October 21, 2015

పంజాబ్ : రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సిక్కుల పవిత్ర గ్రంథమైన 'గురుగ్రంథ్ సాహెబ్'ను అవమానించారంటూ కొనసాగుతున్న అల్లర్లు పంజాబ్లో ఉద్రిక్తతకు దారితీశాయి. పంజాబ్‌ లోని పలు పట్టణాల్లో ఆందోళనకారులు తమ నిరసనలు తెలుపున్నారు. రోడ్లను దిగ్బంధనం చేస్తున్నారు. ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలోని సమస్యాత్మక నగరాలు అమృత్‌సర్, జలంధర్, లూధియానా, తరన్‌ తరన్‌లో పారామిలటరీ బలగాలను మోహరించారు. ప్రజలు సంయమనం పాటించాలని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ పిలుపునిచ్చారు. ఈ అల్లర్ల వెనక పాక్‌ హస్తం ఉందని, దుబాయ్‌, ఆస్ట్రేలియా నుంచి నిధులు అందుతున్నట్టు ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. పంజాబ్‌లో అల్లర్లు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు 15 రోజుల ముందే హెచ్చరించడం గమనార్హం.

21:22 - October 21, 2015

గుంటూరు : జీవనదులు... కృష్ణా, గోదావరి వాసుల భాషా యాసలే కాదు.. రుచులూ, అభిరుచులూ ఒకే మాదిరిగా ఉంటాయి. జిహ్వచాపల్యాన్ని తృప్తి పరిచే నోరూరించే వంటకాలకు ఈ ప్రాంతాలు ప్రసిద్ధం. తిండీ.. తిట్టు విషయంలో.. వెటకారంతో పాటు మమకారమూ మాధుర్యమై పలకరించడం ఇక్కడి ప్రత్యేకత. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవంలోనూ ఈ రుచుల సంగమం అతిథులకు, ఆహుతులకు షడ్రసోపేతమై సంతృప్తి కలిగించబోతోంది. గుంటూరు జిల్లా అమరావతి సమీపంలో కష్ణమ్మ చెంత సాగనున్న చారిత్రక పరిణామం నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ అంకురార్పణ మహోత్సవం. తెలుగు జాతి సగర్వంగా చాటి చెప్పుకోవాల్సిన మధురక్షణం.

కాజా రుచులు...
గత వైభవ దీప్తిగా మిగిలిన అమరావతిని భావి ఆశల స్ఫూర్తిగా మలిచే ఈ మహా క్రతువుకు దేశ విదేశాల అతిథులు, అతిరథులు, ప్రవాసాంధ్రులు పలు ప్రాంతాల నుంచి వస్తున్నారు. వీరందరికీ ఘుమఘుమలాడే వంటకాలను రుచి చూపించేందుకు సిద్ధమవుతోంది అమరావతి. గోదావరి జిల్లాలు, తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధమైన తాపేశ్వరం తీపి రుచులను అతిథులకు వడ్డించనున్నారు. సమావేశానికి హాజరవుతున్న ప్రతి ఒక్కరికీ ఇక్కడి కాజా రుచులను పంచనున్నారు. దాంతో పాటు వంటకు వినియోగించే బియ్యాన్ని కూడా మండపేట రైసుమిల్లుల నుంచే పంపించారు. ప్రత్యేక అతిథుల కోసం ఆత్రేయపురం పూత రేకులనూ కొనుగోలు చేశారు. వంటకానికి వినియోగించే కూరగాయలు,నాణ్యమైన పప్పు దినుసులను సైతం ఇక్కడి నుంచి సేకరించారు.

నల భీములు...
వంటల తయారీ కోసం.. చేయి తిరిగిన నలభీములనూ కొందర్ని ఎంపిక చేశారు. చరిత్రలో అత్యంత అరుదుగా లభించే ఈ అవకాశం తమకే దక్కడం ఆనందదాయకమని గోదారి వాసులు సైతం పులకించి పోతున్నారు. బూరెలు, నేతి గారెలు, ఆవకాయ, కాజాలు, చక్కెర పొంగలి, గోంగూర పచ్చడి, వంకాయ కూర, మిర్చి పచ్చడి వంటి విభిన్న వంటకాలు వీఐపీలు, వీవీఐపీల ఆకలి తీర్చనున్నాయి. కృష్ణా, గోదారి రుచుల గొప్పతనాన్ని దశదిశలా చాటి చెప్పనున్నాయి. 

21:17 - October 21, 2015

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ వామపక్షాలు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశాయి. నూతన రాజధాని అమరావతి శంఖుస్థాపన సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటన చేయాలని లేఖలో పేర్కొన్నట్టు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని యుపిఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, అవసరమైతే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని బిజెపి వాగ్దానం చేసిందని ఏచూరి గుర్తు చేశారు కానీ ఇంతవరకు ఆ దిశగా ఒక్క చర్య చేపట్టలేదని ఏచూరి పేర్కొన్నారు.

21:15 - October 21, 2015

గుంటూరు : అన్నిదారులూ అక్కడికే..అందరి ఆలోచనలూ అటువైపే. అదే ఆశల నగరి..ఆంధ్రుల రాజ సిరి అమరావతి. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఒక మహోత్కృష్ట ఘట్గానికి ఎదురుచూస్తోంది. భావోద్వేగ సన్నివేశానికి బాటలు వేస్తోంది. క్షణమొకయుగంగా చారిత్రక మైలు రాయి వైపు కదులుతోంది. దేశవిదేశాల నుంచి తరలివస్తున్న అతిరథమహారథులకు, అతిథులకు, ఆహుతులకు, రారమ్మంటూ స్వాగత గీతం పాడుతోంది. కమ్మని ఆతిథ్య పరిమళం ఘుమఘుమల గుబాళింపు వెదజల్లుతోంది.

మహానగరానికి అంకురార్పణ..
నవ్యాంధ్రలో నవశకం... నూతన రాజధాని నిర్మాణం. మరికొన్ని గంటల్లో సాకారం కాబోతున్న స్వప్నం. మొలకలెతుత్తుతున్న ఆశల వట వృక్షం. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా శిలాన్యాసంతో శంకుస్థాపన జరుపుకొని మహానగరానికి అంకురార్పణ చేసుకోబోతోంది. రండి ..వచ్చి ఆశీర్వదించండి. శుభకామనలతో సంకల్పానికి సాక్షులు కండి. అంటూ చేతులు జాచి ఆహ్వానిస్తోంది.

అతిథులతో కృష్ణా తీరంలో సందడి వాతావరణం..
లక్షలాదిగా తరలిరానున్న ప్రముఖులతో తీర్థస్థలిగా మారనున్న కృష్టా తీరం ఇప్పటికే కుహుకుహు రాగాలతో పులకిస్తోంది. రాజధాని ప్రాంతంలోని పల్లె పల్లె పరవశించి నవ రాజధానికి ప్రణామాలర్పిస్తోంది. వచ్చే అతిథులకు వందనాలు సమర్పిస్తోంది. దేశంలోనే ఒక అరుదైన చారిత్రక క్షణం. మహోన్నత వైభవాన్ని సంతరించుకుని సిరి సంపదలతో కళకళలాడి శతాబ్దాల పాటు తెలుగువారి శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలిచింది అమరావతి. గత కాలపు కీర్తి ప్రతిష్ఠలు అడుగంటి చిన్న పట్టణంగా ఒదిగిపోయింది, ఒరిగిపోయింది. నాటి వైభవాన్ని పునరుద్ధరించే మహత్తర అవకాశం రాష్ట్ర విభజనతో చేజిక్కింది.

అందరికీ ఆహ్వానాలు ..

చారిత్రక వారసత్వం, అపురూప శిల్ప సంపద, కృష్ణమ్మ రూపులో జీవజలాలు కాయకష్టం చేసే మానవ వనరులు, విశాలమైన భూములు ఇవన్నీ నేటి రాజధానికి పెట్టని కోటలుగా చెప్పుకోవాలి. భావోద్వేగంతో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని భాగస్వాములను చేస్తూ అన్ని జిల్లాల నుంచి, పవిత్ర క్షేత్రాల నుంచి నీరు, పుట్టమన్ను సేకరించి ప్రత్యేక రథాల ద్వారా తరలించడం కూడా ఒక విశేషంగానే చెప్పుకోవాలి. ఇది నా రాజధాని అన్న మమైక భావనను ప్రతి ఒక్కరిలో రేకెత్తించడానికే చేపట్టిన ఒక ధార్మిక కార్యక్రమంగా దీనిని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా అన్ని ప్రాంతాల ప్రాతినిధ్యం కూడా తప్పనిసరిగా ఉండాలనే బావనతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులను కూడా శంకుస్థాపనకు ఆహ్వనించడం ముదావహం. పంచాయతీ సర్పంచుల నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల వరకూ అందరికీ ఆహ్వానాలు పంపించారు.

15 దేశాలకు చెందిన రాయబారులు..
దేశంలోని పుణ్యక్షేత్రాలు, అష్టాదశ శక్తి పీఠాలు, జెరూసలెం, మక్కా వంటి పవిత్ర ఆధ్యాత్మిక ప్రాంతాల నుంచి సైతం మట్టిని సేకరించి రాజధానికి తరలించారు. జపాన్, సింగపూర్ దేశాల నుంచి మంత్రులు కూడా పాల్గొంటున్నారు. 15 దేశాలకు చెందిన రాయబారులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు సైతం విచ్చేస్తున్నారు. దీంతో ఆంధ్రా రాజధాని అంకురార్పణ మహోత్సవం అంతర్జాతీయ వార్తాంశంగా రూపుదాలుస్తోంది. టీవీ చానళ్లు, పత్రికలు, వార్తా సంస్థలు..మొత్తంగా 150 వరకూ ప్రసార, ప్రచురణ మాధ్యమాలు ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రపంచం ముంగిట్లో ఆవిష్కరించేందుకు సన్నాహకాలు చేసుకున్నాయి.

దక్షిణ, ఉత్తర భారత వంటకాలు..
దేశవిదేశాల నుంచి తరలివస్తున్న అతిథులు ఒక ఎత్తైతే వారికి ఏర్పాటు చేస్తున్న విందు వినోదాలు మరొక ఎత్తు. దక్షిణ,ఉత్తర భారత వంటకాలే కాదు, పాశ్చాత్య ఆహార నియమాలనూ దురుష్టిలో పెట్టుకుని చవులూరించే అల్పాహారాన్ని సిద్ధం చేస్తున్నారు. బ్రేక్ఫాస్టుగా 40 రకాల విభిన్న వంటలు అతిథులకు నోరూరించనున్నాయి. ఇక జపాన్, సింగపూర్, మలేసియా ప్రాంతాలనుంచి వస్తున్న వారి కోసం బ్రోక్లీ, పోప్ చాయ్, కలర్ కాప్పికమ్, నూడిల్స్ వంటివి ప్రత్యేకంగా సిద్దం చేస్తున్నారు. హైదరాబాదు, ముంబై , బెంగులూరు ప్రాంతాల నుంచి పాకశాస్త్ర ప్రవీణులైన మాస్టర్ చెఫ్ లనూ రప్పించారు. ఆహార పానీయాలు ఆవురావురు మనిపించాలి. ఆంధ్రా ఆతిథ్యం అదరహో అనిపించాలన్నట్లుగా భోజన ఏర్పాట్లు చేశారు.

కళాకారులతో కూచిపూడి నృత్యం..
శాస్త్ర, సాంకేతిక, కళా, రాజకీయ, వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులు వేలాదిగా తరలి రానుండటంతో వారికి కాసింత వినోదం కలిగించేందుకూ సన్నాహాలు పూర్తయ్యాయి. గలగలా పారే గోదారి ఘుమఘుమలు, బిరాబిరా సాగే కురుష్ణమ్మ సవ్వడులు ఒక జీవిత కాల జ్ఞాపకంగా మధురస్ర్మతిగా మిగిలిపోయే విధంగా వందలాది కళాకారులతో కూచిపూడి నృత్యం కదంబాన్ని నిర్వహిస్తున్నారు. శాతవాహనుల శౌర్యం, కురుష్ణ దేవరాయల కీర్తి, కాకతీయ కదనకుతూహలం కళ్లకు కట్టినట్లు చూపించే సాంస్ర్కతిక కళారూపమిది. నయనానందకరమే కాదు, రెండు వేల సంవత్సరాల తెలుగు జాతి చరిత్రకు కీర్తి కిరీటం. కోట్ల ఆశలతో, కొంగొత్త కోరికలతో ఎడతెగని ఉత్సాహంతో ఎదనిండా స్వప్నాలతో భావితరాలకు బాటలు వేయాలనే సత్సంకల్పంతో స్వాగతం చెబుతోంది అమరావతి...రావోయి అతిథి.

21:11 - October 21, 2015

గుంటూరు : అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లను స్వయంగా చంద్రబాబు పర్యవేక్షించారు. ఆహ్వానాలు అందరికీ పంపామని రావడం, రాకపోవడం వారిష్టమని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి తప్పనిసరిగా సాయం అందుతుందని ఆశిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఆత్మయ అతిథి అని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లాంటివని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమం చారిత్రక ఘట్టమన్నారు. ప్రతిపక్ష నేత జగన్ ను కూడా పిలవడం జరిగిందని, కానీ రానంటున్నారని తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకే కారణం కాంగ్రెస్సే అని విమర్శించారు. 

21:04 - October 21, 2015

ఆంధ్రుల రాజధాని అమరావతి..ధాన్యం కటకంగా వర్ధిల్లిన నగరి. బౌద్ధం..జైనం..శైవం వంటి భిన్నమైన మతాల సంస్కృతి సమ్మేళన అధ్మాతిక జరి. కృష్ణా నది తీరాన వెలిసిన అద్భుత నగరి. ఆంధ్రుల రాజధానిగా మళ్లీ విలసిల్లబోతున్న ఆధునిక నగరం. అమరావతి శంకుస్థాపన మహోత్సవం కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన మహా వేడుకపై ప్రత్యేక కథనం.

సర్వం సిద్ధం..
ఒక మహా సంరంభం..ఒక మహా ఉత్సవం..ఒక చారిత్రక నగరం శంకుస్థాపన మహోత్సవం..ఒక ఉత్కంఠ..ఒక ఉద్వేగం..ఒకవైపు పట్టలేని ఆనందం..ఐదు కోట్ల ప్రజల ఉక్కు సంకల్పం..అంతకుమించి సరికొత్త ఆరంభానికి ప్రస్తానం. ప్రపంచమంతా అబ్బురపడేలా..దేశమంతా ముచ్చటపడేలా..తెలుగు లేన మురిసిపడేలా అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది.

వేల ఏళ్ల చరిత్ర..
అమరావతి..పేరులోనే అమరత్వం ఉన్న ఈ గడ్డకు వేల ఏళ్ల చరిత్ర. ఒకనాడు తెలుగు ప్రజలకు రాజధానిగా వెలుగొందిన ఈ నగరం బౌద్ధం విరాజిల్లిన నేల. ఇప్పుడు మళ్లీ రాజధానిగా పట్టాభిషేకం పొందుతోంది. పాత వెలుగులను పునరుద్ధరించుకొంటోంది. ఈ సందర్భంగా అమరావతి చరిత్ర స్మరానికి తెచ్చుకోవాల్సినవసరం ఉంది.

భవిష్యత్ లో అమరావతి రూపం ఎలా ఉండబోతోంది ? 
అమరావతి చరిత్ర చూశాం. మరి భవిష్యత్ లో అమరావతి రూపం ఎలా ఉండబోతోంది ? సింగపూర్ ప్రణాళిక ఏం చెబుతోంది ? అమరావతి ప్రపంచంలోనే మేటి నగరాల్లో ఒకటి కాబోతుందా ? రాజధాని అంటే నాలుగు రోడ్లు..పది భవనాలు..పార్కు కాదు. ఆకాశాన్ని అంటే ఒక్క రోజు సంరంభం అంతకన్నా కాదు. అక్కడి ప్రజలు వారి బాగోగులు..ఇతర ప్రాంతాలకు కూడా పాలనాపరంగా అందుబాటులో ఉండడం..పారదర్శకత విధానాలు గుర్తిస్తే ఆధునిక అమరావతి కల సాకారమయినట్లే. 

20:43 - October 21, 2015

గుంటూరు : రాజధాని శంకుస్థాపన ఘట్టం మరో కొద్ది గంటల్లో జరుగబోతోంది. ఉద్దండరాయపాలెంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఏపీ మంత్రులు ఇక్కడే మకాం వేశారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నామని, ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోందని ఏపీ మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు టెన్ టివితో మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్మితమౌతున్న రాజధాని ఏదైనా ఉందంటే అది అమరావతి అని మంత్రి రావెల తెలిపారు. 12.45 ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారని, రాజధాని నిర్మాణానికి..సహాయపడటానికి ప్రధాని ముందున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ జైలు పక్షి అని ఆయన కలిసి ఉంటే ఎంత కలవకపోతే ఎంత అని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఏమాత్రం ఆయనకు లేదని రావెల కిశోర్ బాబు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అనేక మార్లు కోరడం జరిగిందని మంత్రి చిన రాజప్ప తెలిపారు. అందరూ ఊహించినట్లుగానే ఉత్కంఠ నెలకొందని తెలిపారు. స్పెషల్ హోదా కావాలని సీఎం కోరడం జరుగుతోందన్నారు. 

20:40 - October 21, 2015

గుంటూరు : రాజధాని శంకుస్థాపన ఘట్టం మరో కొద్ది గంటల్లో జరుగబోతోంది. ఉద్దండరాయపాలెంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. సభలో పలువురు కళాకారులు కళా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇందులో ప్రధాన గీతం 'మా తెలుగు తల్లి' గీతాన్ని ఆలపించేందుకు కళాకారులు ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. 12.48-01.00 మధ్యలో ఆలపించాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు 'తెలుగు తల్లికి మల్లెపూ దండ' గీతాన్ని ఆలపించారు. 

20:38 - October 21, 2015

గుంటూరు : జిల్లాలోని ఉద్దండరాయపాలెంలో అమరావతి శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు విదేశీ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ముఖ్యులు ఇక్కడకు రానున్నారు. ఇందుకు మూడు వేదికలు సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై కేవలం పది హేను మంది కూర్చొనే అవకాశం కల్పించారు. విదేశాలకు చెందిన వారు కూర్చొడానికి మరో వేదిక ఏర్పాటు చేశారు. ఏపీ రాష్ట్రానికి చెందిన మంత్రులు..ఇతర ముఖ్యులు కూర్చొడానికి వీలుగా మూడో వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికల ఎదురుగా రైతుల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఇందులో భూములు ఇచ్చిన రైతులు మాత్రమే కూర్చొవడానికి వీలు కల్పించారు. మిగతా 36 గ్యాలరీలో సామాన్య ప్రజలు కూర్చొవడానికి ఏర్పాట్లు చేశారు. అంతేగాక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక్కడ నుండి సంకల్ప జ్యోతి కనిపించే విధంగా ఈ వేదికలను నిర్మాణం చేశారు. 

19:58 - October 21, 2015

అమరావతి..ఏపీ రాజధానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. దీనితో అందరి దృష్టి ప్రధాన మంత్రి మోడీపైనే ఉంది. ప్రత్యేక హోదా ప్రకటిస్తారా.. లేక దాన్ని మరిపించేంతగా ప్యాకేజీ ఇస్తారా.. లేక కేవలం మాటలతో మురిపించి మళ్లొస్తానంటారా.. ఇవే ఆలోచనలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. టీడీపీ వర్గాల్లో వినపడుతున్న కథనం ప్రకారమైతే ప్రత్యేక హోదాను ప్యాకేజీ హోరులో కలిపేస్తారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా అనే వ్యవహారాన్నే కేంద్రం పక్కన పెట్టాలనుకుంటోందని సమాచారం. కాని దాన్ని మించిన ప్యాకేజీని మోడీ శంకుస్థాపన వేదికపై ప్రకటిస్తారని టాక్‌ నడుస్తోంది. ఈ అంశంపై 'అమరావతి' ప్రాంతంలో టెన్ టివి నిర్వహించిన చర్చా వేదికలో అనురాధ (టిడిపి), బాబురావు (సీఆర్డీఏ కమిటీ కన్వీనర్), జగన్ మోహన్ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

సూర్యాపేటకు చేరుకున్న కేసీఆర్..

నల్గొండ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటకు చేరుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి నివాసంలో కేసీఆర్ బస చేయనున్నారు. గురువారం ఉదయం 10.30గంటలకు అమరావతి శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ బయలుదేరనున్నారు. 

కేసీఆర్ ఆత్మీయ అతిథి - బాబు..

గుంటూరు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఆత్మయ అతిథి అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లాంటివని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమం చారిత్రక ఘట్టమని, ఈ మహోత్సవానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించడం జరిగిందన్నారు. 

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. దీనితో అధికారులు నేరుగా శ్రీవారి దర్శనం కల్పించారు. గంటల తరబడి క్యూలో నిలబడితే దర్శన భాగ్యం కలగని అవకాశం నేడు నేరుగా శ్రీవారు దర్శనం భాగ్యం కలగడంతో భక్తులు ఆనంద పడుతున్నారు. 

గోదావరి ఖనిలో కాల్పుల కలకలం..

కరీంనగర్ : జిల్లా గోదావరిఖనిలో కాల్పుల కలకలం రేగింది. ఓ రౌడీషీటర్ పోలీసులపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. దీనితో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం ఆ రౌడీషీటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

శంకుస్థాపన ప్రాంతానికి చేరుకున్న బాబు..

గుంటూరు : అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఉద్దండరాయపాలెంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 

55 మంది తమిళ కూలీల అరెస్టు..

కడప : కాశినాయన (మం) ఇటుకలపాడు ఫారెస్టు బీచ్ లో 55 మంది తమిళ కూలీలను పోలీసులు అరెస్టు చేశారు. రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మోడీకి సీపీఎం..సీపీఐ లేఖ..

హైదరాబాద్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు లేఖ రాశారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని లేఖలో వారు కోరారు. తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వామపక్ష అధినేతలు సూచించారు. 

19:18 - October 21, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం ఏ విధంగా ఉండబోతోంది ? ఎక్కడకెక్కడ కట్టడాలు వస్తాయి ? ఏ ప్రాంతంలో సచివాలయం..ఎమ్మెల్యే క్వార్టర్స్..ఇతరత్రా ఎక్కడుండనున్నాయి ? వీటన్నింటినీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం చంద్రబాబు నాయుడు తెలియచేయనున్నారు. ఇందుకోసం కళాకారులు శ్రమిస్తున్నారు. సింగపూర్ తొలి మాస్టర్ ప్లాన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాస్టర్ ప్లాన్ లో ఏమిచ్చారో అదే విధంగా ఉండే విధంగా కళాకారులు ఆకృతులను తీర్చిదిద్దుతున్నారు. త్రీడీ ప్రింట్ నమూనాను రూపొందిస్తున్నారు. ఇందులో ఫ్లై ఓవర్లు, బ్రిడ్జీలు, స్కై టవర్స్ నిర్మాణాలున్నాయి. ఏపీ మంత్రులు నివాసాలు, ప్రభుత్వాధికారుల నివాసాలు..మెట్రో రూట్ ఏ ప్రాంతంలో వెళ్లాలో సూచించారు. దీనిని ప్రధాన మంత్రి మోడీకి సీఎం చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. 

18:40 - October 21, 2015

ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి అండ్‌ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. ఈ చిత్రం టీజర్‌ బుధవారం విడుదలైంది. ఈ టీజర్ లో ఎన్టీఆర్ డిఫరెంట్ స్టైల్ ను ప్రదర్శించారు. న్యూ హెయిర్ కటింగ్..లుక్, డిఫరెంట్ గడ్డంతో జూనియర్ కనిపిస్తున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించి 60 రోజులపాటు లండన్‌లో భారీ షెడ్యూల్‌ నిర్వహించినట్లు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ పేర్కొంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని తెలిపింది. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. 

18:34 - October 21, 2015

వరంగల్ : చాలా రోజులుగా ఎదురు చూస్తున్న లోక్ సభ ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. బుధవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈనెల 28వ తేదీన ఎన్నిక నోటిఫికేషన్ జరుగనుంది. నామినేషన్ దాఖలుకు నవంబర్ 4వ తేదీ చివరి తేదీగా నామినేషన్ల ఉపసంహరణకు 7వ తేదీగా నిర్ణయించారు. 21వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. 24న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
వరంగల్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ బీహర్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు విడుదలౌతుందని అన్ని రాజకీయ పార్టీలు భావించాయి. కానీ,వరంగల్‌ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్‌ను సీఈసీ విడుదల చేయలేదు. గత కొన్ని రోజులుగా వరంగల్‌ ఉప ఎన్నిక కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు ఎంపీ సీటు దక్కకుండా చేయడానికి విపక్షాలు వ్యూహాలు రచించనున్నాయి. మరోవైపు టీఆర్‌ఎస్‌ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటనలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఎన్నికల నగారా మోగడంతో రేపటి నుండి అధికార..విపక్షాల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. 

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..

వరంగల్ : జిల్లా ఎంపీ స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 28వ తేదీన ఎన్నిక నోటిఫికేషన్ జరుగనుంది. నామినేషన్ దాఖలుకు నవంబర్ 4వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. 21వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. 24న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. 

ప్రజల భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం - ఏపీ మంత్రులు..

గుంటూరు : ప్రజల భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం జరుగనుందని, రాజధానిలో లో భాగస్వాములు కావాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారని ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, రావెల, ఎంపీ సీఎం రమేష్ లు పేర్కొన్నారు. శంకుస్థాపనకు రాకుండా కాంగ్రెస్, వైసీపీ ప్రజలను మోసం చేస్తున్నారని, తల్లి, పిల్ల కాంగ్రెస్ లు ఒకటే అని మరోసారి రుజవైందని విమర్శించారు. జగన్ ఇప్పటికైనా శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ప్రభుత్వం కోరుకొంటోందన్నారు. 

అమరావతికి టి.డిప్యూటి సీఎం..మంత్రులు..

హైదరాబాద్ : అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, మంత్రులు ఈటెల, జగదీశ్ రెడ్డి హాజరు కానున్నారు. 

గాదెపాలెంలో రైతు నర్సారెడ్డి ఆత్మహత్య..

ప్రకాశం : కొత్తపట్నం (మం) గాదెపాలెంలో రైతు నర్సారెడ్డి (45) ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని పొగాకు బోర్డు కార్యాలయం ఎదుట రైతు సంఘం ధర్నా చేపట్టింది. 

17:43 - October 21, 2015

మంచు విష్ణు హీరోగా డి.కుమార్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఫిలింస్‌ పతాకంపై జి.కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో సోమా విజయ్ ప్రకాష్‌, పల్లికేశవరావులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి 'సరదా' అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇటీవలే రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రతి మనిషిలోనూ 'సరదా' ఉంటుందని, ప్రతి ప్రేమలోనూ 'సరదా' ఉంటుందని, ఆ సరదాను హైలైట్‌ చేస్తూ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర దర్శకుడు పేర్కొన్నారు. అందుకే ఈ చిత్రానికి 'సరదా' టైటిల్‌ని ఖరారు చేయడం జరిగిందన్నారు. ఈ చిత్రంలో విష్ణు సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో పాటు సరికొత్త డైలాగ్‌ డెలివరీతో అలరిస్తారన్నారు. ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నామని, చిత్రంలో మంచు విష్ణు సరసన సోనారికతోపాటు మరో ప్రముఖ కథానాయిక నటించనుందని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, రవికిషన్‌, పృధ్వీ, రాజారవీంద్ర, వెన్నెలకిషోర్‌, శ్రీనివాసరెడ్డి, నవభారత్‌ బాలాజీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 19పాయింట్లు నష్టపోయి 27,287 పాయింట్ల వద్ద ముగియగా..నిఫ్టీ 9పాయింట్లు నష్టపోయి 8,251 పాయింట్ల వద్ద ముగిసింది. 

మన్ కీ బాత్ కు ఈసీ అనుమతి..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించనున్న మన్ కీ బాత్ కార్యక్రమానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతినిచ్చింది. ఈ నెల 25న నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని జరుపుకోవచ్చని ఈసీ వెల్లడించింది.

17:26 - October 21, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం ఏ విధంగా ఉండబోతోంది ? ఎక్కడకెక్కడ కట్టడాలు వస్తాయి ? ఏ ప్రాంతంలో సచివాలయం..ఎమ్మెల్యే క్వార్టర్స్..ఇతరత్రా ఎక్కడుండనున్నాయి ? వీటన్నింటినీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం చంద్రబాబు నాయుడు తెలియచేయనున్నారు. ఇందుకోసం కళాకారులు శ్రమిస్తున్నారు. సింగపూర్ తొలి మాస్టర్ ప్లాన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాస్టర్ ప్లాన్ లో ఏమిచ్చారో అదే విధంగా ఉండే విధంగా కళాకారులు ఆకృతులను తీర్చిదిద్దుతున్నారు. త్రీడీ ప్రింట్ నమూనాను రూపొందిస్తున్నారు. ఇందులో ఫ్లై ఓవర్లు, బ్రిడ్జీలు, స్కై టవర్స్ నిర్మాణాలున్నాయి. ఏపీ మంత్రులు నివాసాలు, ప్రభుత్వాధికారుల నివాసాలు..మెట్రో రూట్ ఏ ప్రాంతంలో వెళ్లాలో సూచించారు. దీనిని ప్రధాన మంత్రి మోడీకి సీఎం చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. 

మణిపూర్ ఎమ్మెల్యే నివాసం ఎదుట పేలిన బాంబు..

మణిపూర్ : కెయిరావ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కరణ్ తామర్జిత్ సింగ్ నివాసం ఎదుట బుధవారం తెల్లవారుజామున బాంబు పేలింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని సమాచారం. 

ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్లో కశ్యప్, జ్వాలా-అశ్వినీల జోడి..

ఫ్రాన్స్ : రాజధాని పారిస్ లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటెన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్ కు చేరుకున్నారు. ఫ్రాన్స్ క్రీడాకారుడు ధామస్ రూక్సిల్ తో జరిగిన మ్యాచ్ లో 21-11, 22-30 వరుస సెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి రెండో రౌండ్ కు చేరుకున్నారు. మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని, జ్వాలల జోడి కూడా రెండో రౌండ్ కు చేరుకుంది. తొలి రౌండ్లో థాయ్ లాండ్ జోడి జరిగిన మ్యాచ్ లో 21-15, 21-12 వరుస సెట్ల తేడాతో విజయం సాధించి రెండో రౌండ్ కు చేరుకున్నారు. 

విజయవాడకు చేరుకున్న శివమణి..

విజయవాడ : ప్రఖ్యాత సంగీత కళాకారుడు శివమణి గురురవారం జరిగే అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావడానికి విజయవాడ చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఫేస్ బుక్ ద్వారా పేర్కొన్నారు. 

అమరావతి శంకుస్థాపన షెడ్యూల్..

గుంటూరు : అమరావతి శంకుస్థాపన షెడ్యూల్ విడుదలైంది. గురువారం మధ్యాహ్నాం 12.30గంటలకు ప్రధాని మోడీ రానున్నారు. 12.30 నుండి 12.35 గంటల మధ్య గ్యాలరీలో ప్రధాని ఉండనున్నారు. 12.35-12.43 గంటల మధ్య శంకుస్థాపన జరుగనుంది. 12.43-12.45 వేదిక వద్దకు ప్రధాని మోడీ రానున్నారు. 12.45-12.48 మధ్య ఆహ్వానాలు చేయనున్నారు. 12.48-12.50 మధ్య తెలుగుతల్లికి గీతాలాపన జరుగనుంది. 12.50-12.53 మధ్య జపాన్ మంత్రి యోసుకే ప్రసంగించనున్నారు. 12.53-12.56 మధ్య సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగం జరుగనుంది. 12.58-1.01 కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగించనున్నారు.

వనపర్తి బియ్యం బిల్లులో అక్రమాలు...

మహబూబ్ నగర్ : వనపర్తి బియ్యం మిల్లులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. రేషన్ బియ్యానికి పాలిష్ చేసి ఎగుమతులు చేస్తున్నా పౌర సరఫరాలా శాఖాధికారులు పట్టంచుకోవడం లేదు.

 

ఓబులాపురం వద్ద రోడ్డు ఆక్సిడెంట్...

కర్నూలు : డోన్ (మం) ఓబులాపురం మిట్ట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మూడు సుమోలు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. బెంగళూరు నుండి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

రెండు పడకల ఇళ్ల ప్రారంభోత్సవం వాయిదా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రెండు పడకల గదుల ఇళ్ల ప్రారంభోత్సవం వాయిదా పడింది. గురువారం సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇళ్లను సీఎం కేసీఆర్ ప్రారంభించాల్సి ఉంది. సీఎం కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళుతున్నందు వల్ల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

భారత సరిహద్దులో హై అలర్ట్...

జమ్మూ కాశ్మీర్ : భారత సరిహద్దులో 60-70 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీఎస్ఎఫ్ సిద్ధంగా ఉన్నట్లు బీఎస్ఎఫ్ ఐజీ రాకేష్ కుమార్ హెచ్చరికలు జారీ చశారు. దీనితో భారత సరిహద్దులో భద్రతా దళాలు అప్రమత్తమయ్యారు. 

దత్తాత్రేయను తిప్పిన అధికారులు..

విజయవాడ : వీవీఐపీలకు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర మంత్రి దత్తాత్రేయను అధికారులు మూడు హోటళ్లకు తిప్పారు. చివరకు ఆయన బీజేపీ కార్యాలయానికి వెళ్లిపోయారు. 

కేసీఆర్, బాబు కలయిక హర్షణీయం - డీఎస్..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు కలయిక హర్షణీయమని టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తొలగిపోయి అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు. 

పలువురి నేతలకు రాజధాని ఆహ్వానపత్రికలు...

హైదరాబాద్ : రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని ఏపీ మంత్రులు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, డి.శ్రీనివాస్, మాజీ స్పీకర్ సి.నారాయణరెడ్డికి ఆహ్వాన పత్రికలు అందచేశారు. 

బతుకమ్మ పేరిట వంద కోట్లు దుబారా - ఎంపీ గుత్తా...

నల్గొండ : బతుకమ్మ పేరిట ప్రభుత్వం రూ.100 కోట్లు దుబారా చేసిందని ఎంపీ గుత్తా విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబపాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని తెలిపారు. 

బుగ్గవీధిలో ఇద్దరు బాలికల అదృశ్యం..

తిరుపతి : రేణిగుంట బుగ్గవీధిలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. ఇంటి ముంద ఆడుకుంటూ గాయత్రి (12), వెన్నెల (4) మిస్సింగ్ అయ్యారు. గాయత్రికి మతిస్థిమితి లేదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. 

భారత స్పిన్నర్ మిశ్రాపై విచారణకు బీసీసీఐ ఆదేశం..

ఢిల్లీ : భారత స్పిన్నర్ అమిత్ మిశ్రాపై విచారణకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరులో మహిళపై దాడి చేశాడని మిశ్రాపై ఆరోపణలున్నాయి. మిశ్రాపై ఐపీసీ 354, 328 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేగాకుండా మిశ్రాపై ఎఫ్ఐఆర్ కాపీని బీసీసీఐకి పోలీసులు పంపారు. 

 

తిరుమలలో అడుగడుగునా ఆంక్షలు..

చిత్తూరు : తిరుమలలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. రేపు ప్రధాని మోడీ తిరుమలకు రానున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం నుండి కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రధాని భద్రత పేరిట పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. దుకాణాలను మూసివేయిస్తున్నారు. ఎవ్వరూ రోడ్ల మీద తిరగవద్దంటూ ఆంక్షలు విధించారు. 

 

శంకుస్థాపన..విజయవాడ హైవే దారి మళ్లింపు..

నల్గొండ : ఏపీ రాజధాని శంకుస్థాపన సందర్భంగా విజయవాడ జాతీయ రహదారిపై దారిని మళ్లించనున్నారు. చెన్నై వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి, మిర్యాలగూడ, గుంటూరు, అద్దంకి మీదుగా మళ్లించనున్నారు. వైజాగ్ వెళ్లే వాహనాలు సూర్యాపేట మీదుగా మళ్లించనున్నారు. వైజాగ్, ఒడిశా, బెంగాల్ వెళ్లే వాహనాలు కోదాడ నుండది ఖమ్మంకు వెళ్లాల్సి ఉంటుందని ఎస్పీ విక్రమ్ జిత్ తెలిపారు.

15:51 - October 21, 2015

శ్రీకాకుళం : తమ గ్రామంలో ఎలుగుబంటి తిరుగుతోంది..దీని నుండి రక్షించాలని..చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు ఎన్నిసార్లు కోరినా అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎలుగుబంటి దాడి చేయడంతో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వజ్రపు కొత్తూరు మండలం ఒంకుటూరులో చోటు చేసుకుంది. ఇప్పటికే పదిహేను సార్లు దాడి చేసినా అటవీ శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో పలు ప్రాంతాల్లో ఎలుగుబంట్లు దాడికి పాల్పడుతున్నాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

15:48 - October 21, 2015

గుంటూరు : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చే ప్రకటనపై వాస్తవంగానే ఉత్కంఠ నెలకొందని టిడిపి నేత పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శంకుస్థాపన జరిగే ప్రాంతాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు. ఆయనతో పాటు ధూళిపాల నరేంద్ర కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ, ఇతరత్రా వాటిపై కేంద్రం వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏం చేయబోతున్నారనేది సస్పెన్ష్ గానే ఉందన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, రాజధాని నిర్మాణం అనే దానిపై ప్రజలు దృష్టి కేంద్రీకరించారన్నారు. ప్రజల ఆశయాలు..నమ్మకాలపై ప్రధాని సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. భస్మాసురుడు ఎవరు అంటే ప్రతిపక్ష నేత జగన్ అని ఎద్దేవా చేశారు. రాజకీయాలకతీతంగా రాజధాని నిర్మాణం జరుగుతోందని, ఈ కార్యక్రమానికి రానని ముందే చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. ఆయనకు రాజకీయ మనుగడ ఉండదని విమర్శించారు. శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ధూళిపాల తెలిపారు. ఎవరికి కూడా అసౌకర్యం కలుగనీయకండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తెలుగు జాతి పండుగ అని, ప్రతొక్కరు కార్యక్రమం చూసేందుకు వీలు కల్పించినట్లు తెలిపారు. 

15:45 - October 21, 2015

గుంటూరు : అమరావతి..శంకుస్థాపనకు మరో కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇందుకు ఏపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శంకుస్థాపనకు వచ్చే ముఖ్య అతిథిలు..ఇతరులు భారీ సంఖ్యలో వాహనాలతో రానున్నారు. అయితే ఎక్కడైనా వాహనం మొరాయిస్తే భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఇతరత్రా సమస్యలు ఏర్పడనున్నాయి. ఇందుకోసం వివిధ కంపెనీలు తమ సిబ్బందితో శంకుస్థాపన ప్రాంతంలో మోహరించారు. ఎక్కడ వాహనాలు ఆగిపోయినా రిపేర్ చేసేందుకు సిబ్బంది రెడీగా ఉన్నారు. మహీంద్రా, టాటా, సుజుకీ కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీల సిబ్బంది శంకుస్థాపన ప్రాంతానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. మహీంద్రా బోలెరో వాహనాలు చాలా ఉన్నాయని, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు సామాగ్రీని కూడా సమకూర్చుకుని ఇక్కడకు రావడం జరిగిందన్నారు. రూట్ మ్యాప్ ల ప్రకారం ప్రయాణం జరుగుతుందని, టెక్నికల్ గా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు. మహీంద్రా, టాటా, లక్ష్మీ మోటార్స్, సుజుకీ కంపెనీల నుండి టెక్నికల్ సిబ్బంది రావడం జరిగిందన్నారు. 

15:42 - October 21, 2015

గుంటూరు : రాజధానికి వివిధ ప్రాంతాల నుండి సేకరించిన మట్టి..నీరును చల్లించే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రత్యేక హెలిక్టాపర్ లో రాజధాని నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో మట్టిని..నీటిని చల్లారు. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. హైదరాబాద్ నుండి ఇక్కడకు రావడం జరిగిందని, ఇక్కడ రావడం జరగడం సంతోషం కలిగిందని తెలంగాణ వాసి పేర్కొన్నాడు. ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయని తెలిపాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు. 
రాజధాని శంకుస్థాపన విజయదశమి రోజున జరుగుతున్న సంగతి తెలిసిందే. భారతదేశ ప్రధానితో పాటు వివిధ దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇందుకు ఏపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 

15:40 - October 21, 2015

గుంటూరు : అమరావతి శంకుస్థాపన వేదికపై విజయదశమి రోజున అశేష ప్రజానీకం సమక్షంలో అందర్నీ అలరించే అవకాశం ప్రముఖ గాయని సునీత సొంతం చేసుకుంది. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ తో కలిసి వేదికను పంచుకోబోతున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో గాయని సునీత పాల్గొని విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా 'మా తెలుగు తల్లికి తల్లికి మల్లెపూ దండ' అనే గేయాన్ని ఆలపించారు. ఈ గేయం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:35 - October 21, 2015

గుంటూరు : అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో యాంకరింగ్ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు నటుడు సాయికుమార్, గాయని సునీత పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శంకుస్థాపన కార్యక్రమంలో యాంకరింగ్ చేయడం గొప్ప గౌరవమని సాయికుమార్ పేర్కొన్నారు. ఈ గొంతు నాన్నదని, అమ్మ తనకు సంస్కృతి, గౌరవం నేర్పిందన్నారు. తల్లికి ఈ విధంగా రుణం ఇచ్చే అవకాశం రావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతి తెలుగు వారు గర్వపడే విధంగా కార్యక్రమం ఉంటుందన్నారు. చారిత్రాత్మక ఘట్టంలో ఈ అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు గాయని సునీత చెప్పారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల నడుమ జరిగే ఈ సభ నిర్విఘ్నంగా సాగాలని, చిన్న పొరపాటు జరగకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అందరీ ఆశీస్సులు ఉండాలన్నారు. 

దళితులపై దాడిని ఖండించిన సీపీఎం..

హర్యానా : దళితులపై పెత్తందారుల దాడిని సీపీఎం ఖండించింది. దళితుల కుటుంబాన్ని బృందాకారత్ సందర్శించారు. దళితులకు రక్షణ కల్పించడంలో హర్యానా ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని తెలిపారు. 

ఫరీదాబాద్ వద్ద గ్రామ దళితుల రాస్తారోకో..

హర్యానా : ఫరీదాబాద్ వద్ద సోన్ పెడ్ గ్రామ దళితులు రాస్తారోకో నిర్వహించారు. దళితుల సజీవదహనాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.

 

మట్టి..నీటిని చల్లిన సీఎం చంద్రబాబు..

విజయవాడ : వివిధ పుణ్యక్షేత్రాలు, నదుల నుండి సేకరించిన మట్టి, నీటిని హెలికాప్టర్ నుండి శంకుస్థాపన ప్రాంతంలో సీఎం చంద్రబాబు చల్లారు. శంకుస్థాపన ఆవరణలో 36 ఎల్ఈడీ టీవీ తెరలు ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు ఎక్కడ కూర్చొన్నా కార్యక్రమాలను చూసే వీలు కలిపించారు. 

శంకుస్థాపన అతిథులకు ఓల్వో బస్సులు..బెంజ్ కార్లు..

విజయవాడ : శంకుస్థాపనకు వచ్చే అతిథులకు ఓల్వో బస్సులు, బెంజ్ కార్లను అధికారులు సిద్ధం చేశారు. స్వరాజ్య మైదానంలో 500 వాహనాలు సిద్ధంగా ఉంచారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఉద్ధేశ్యంతో వాహనాలను వ్యాపారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా ఇచ్చారు. 

 

దళితుల సజీవ దహనం పోస్టు మార్టం పూర్తి..

హర్యానా : దళితుల సహజీవనం కేసులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. మృతదేహాలను స్వగ్రామం సోన్ దీప్ కు తరలించారు. దళితుల సజీవదహనం కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. దళితులకు రక్షణ కల్పించడంలో విఫలమైన ఏడుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఫరీదాబాద్ లో బాధితు కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. సోన్ దీప్ గ్రామంలో దళితులకు రక్షణగా పోలీసులు మోహరించారు. బాధిత కుటుంబానికి రూ. పది లక్షల పరిహారాన్ని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. 

14:47 - October 21, 2015

వినియోగదారులు వస్తు రూపేణ, ఇతర నిర్లక్ష్యాల కారణంగా మోస పోవడమే కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారి కోసం వినియోగదారుల చట్టాన్ని రూపొందించారని లాయర్ పార్వతి పేర్కొన్నారు. మానవి 'మై రైట్' కార్యక్రమంలో వినియోగదారులు..చట్టంపై విశ్లేషించారు. వినియోగదారుల చట్టం 1986లో వచ్చిందన్నారు. నిత్య జీవితంలో అనేక సేవలను పొందుతుంటామని, అలాగే వస్తువులు కొనడం జరుగుతుందన్నారు. ఇందులో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా వినియోగదారుల చట్టాన్ని ఆశ్రయించవచ్చని సూచించారు. అలాగే ప్రజలు వ్యక్తపరిచిన న్యాయపరమైన సందేహాలను లాయర్ పార్వతి నివృత్తి చేశారు. మరిన్ని విశేషాల కోసం వీడియో చూడండి. 

14:44 - October 21, 2015

విశాఖపట్టణం : అమరావతి శంకుస్థాపనలోనైనా ప్రధాని మోడీ విభజన చట్టం హామీలు ప్రస్తావించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజయ్ శర్మ డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు, రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అజయ్ శర్మ టెన్ టివితో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం అమలు చేసి సంవత్సరన్నర అయ్యిందని, కేంద్ర ప్రభుత్వం హామీలు అమలు చేస్తుందని ఆశించినట్లు తెలిపారు. కానీ నిర్ధిష్టమైన చర్యలు చేపట్ట లేదన్నారు. విభజన చట్టం 46 లో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పడం జరిగిందని, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ చేస్తామని సెక్షన్ 96లో చెప్పారని, అలాగే రైల్వే జోన్ చేస్తామని చెప్పారు కానీ ఇవన్నీ అమలు చేయలేదని విమర్శించారు. చట్టంలో పేర్కొన్న అంశాలను రాయితీలు, ప్యాకేజీలు ప్రకటించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఐఐఎంకు భూములివ్వడం జరిగిందని, ఇందుకు నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించడాన్ని నిరాకరిస్తున్నారని, సొంత గనులు కేటాయించి బలోపేతం చేయాలన్నారు. పది శాతం వాటా అమ్మాలనే ప్రతిపాదనను విరమించాలని డిమాండ్ చేశారు. 

14:40 - October 21, 2015

గుంటూరు : నూతన రాజధాని నిర్మాణం తన జీవితంలో మరపురాని ఘట్టమని మా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని అమరావతి ఓ చరిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఆయన బుధవారం వీడియాతో మాట్లాడారు. మనిషి జీవితంలో బతికినంత కాలం జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఈ అమరావతి శంకుస్థాపన రాజధాని గుర్తుకు వస్తుందన్నారు. అమరావతిని నిర్మించుకుంది ఇంద్రుడని...ఇప్పుడు చంద్రుడు నిర్మాణం చేపడుతున్నారని కొనియాడారు. విజన్ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు అవకాశంగా తీసుకుని అందరి జీవితాల్లో గుర్తు తెచ్చే విధంగా చేయడం అభినందనీయమన్నారు. 

14:38 - October 21, 2015

గుంటూరు : జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ల్యాండ్ పూలింగ ప్రక్రియ నుండి మొదలు కొని అనునిత్యం ఏర్పాట్లలో బిజీ బిజీగా గడుపుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు సర్వం సిద్ధమైందని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే టెన్ టివికి తెలిపారు. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేసి.. ప్రపంచస్థాయి ఆతిథ్యానికి సిద్ధం చేశామన్నారు. రేపటి శంకుస్థాపన చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుందని తెలిపారు. ఆయన టెన్ టివితో పలు విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అందుబాటులో ఉండే విధంగా ఉద్దండరాయపాలెంను ఎంపిక చేయడం జరిగిందని, చక్కటి రాజధాని ఏర్పాటు చేయాలనే ఉద్ధేశ్యంతో చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీతో రైతులు ముందుకొచ్చి 35వేల ఎకరాల పట్టా భూములివ్వడం జరిగిందన్నారు. తొలుత భూమి పూజ చేయడం జరిగిందని, 22వ తేదీన ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. సభకు వచ్చే లక్షలాది మంది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భోజనం నుండి మంచినీరు వరకు సౌకర్యాలు కలిపించినట్లు తెలిపారు. శంకుస్థాపనకు వచ్చే వారికి కొన్ని ప్రాంతాల రోడ్లను డిసైడ్ చేయడం జరిగిందని, సజావుగా వేదిక వచ్చే విధంగా అంతా ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. సభలో ప్రధాని, ఇతర ముఖ్య అతిథుల ప్రసంగాలు వినేందుకు సభా ప్రాంగణంలో 35 ఎల్ ఈడీ స్ర్కీన్ లు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. 

14:31 - October 21, 2015

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు ఫేస్‌ బుక్‌ వేదికగా అమరావతిపై ప్రచారం చేస్తున్నారు. మన అమరావతి మన రాజధాని అంటూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ సెల్ఫీలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.

14:29 - October 21, 2015

విజయవాడ : ఏపీ రాజధాని 'అమరావతి' శంకుస్థాపనకు ఉద్దండరాయపాలెం సిద్ధమైంది. ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రాజధాని శంకుస్థాపన ప్రాంగణాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ముస్తాబైన వేదికలు, లోపలికి ఏ ఒక్కరినీ పోలీసులు అనుమతించడం లేదు. ఉద్ధండరాయుని పాలెంలో శంకుస్థాపన ఏర్పాట్లను చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
మూడు సభా వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాని, ముఖ్యమంత్రులు, ఇతర వీవీఐపీలు కూర్చొనేందుకు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. ఈ శంకుస్థాపనకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్న దృష్ట్టా ఏపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. శంకుస్థాపనకు సింగపూర్, జపాన్, బంగ్లాదేశ్, బెల్జియం, వెనిజులా, బల్గేరియా, బ్రిటన్, రువాండా రాయబారులు హాజరు కానున్నారు. మిత్సుబిషి భారత ప్రతినిధి, వాల్ మార్ట్ ఉపాధ్యక్షుడు, సుమిటోము కార్పొరేషన్ ప్రతినిధి, వాండా గ్రూప్ అధినేత ఉద్దండరాయపాలెంకు రానున్నారు. ఏస్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఉపాధ్యక్షులు హాజరు కానున్నారు. ఏషియన్ పేయింట్స్, లాక్ హిడ్ మార్టిన్ సంస్థ ప్రతినిధులు రానున్నారు. అలాగే జపాన్, సింగపూర్ నుండి 25 మంది పారిశ్రామిక వేత్తలు రానున్నారు. మరోవైపు రేపు ఉదయం 10.45గంటలకు సూర్యాపేట హెలికాప్టర్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతికి వెళ్లనున్నారు. మొత్తానికి శంకుస్థాపన ప్రాంతం అంతా కోలాహాలంగా మారింది. 

13:28 - October 21, 2015

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ మహిషాసురమర్దనీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో బారులు తీరారు.

13:19 - October 21, 2015

గుంటూరు : అంగరంగవైభవంగా జరగబోతున్న అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోదీ షెడ్యూల్ ఓకే అయింది.. మధ్యాహ్నం 12గంటలనుంచి రాత్రి 7గంటలవరకూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు మోదీ.. సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు..

రేపు ఉదయం 11గంటల 50నిమిషాలకు....

అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైంది.. రేపు ఉదయం 11గంటల 50నిమిషాలకు ప్రధాని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.. 11.55కు హెలికాప్టర్‌ ద్వారా అమరావతికి బయలుదేరుతారు.. మధ్యాహ్నం 12.20కి అమరావతి హెలిప్యాడ్‌ దగ్గరకు చేరుకుంటారు.. 12.30కి శంకుస్థాపన వేదికకు చేరుకుంటారు మోదీ.. 1.45వరకు అమరావతిలోనే ఉంటారు.. 1.50కి అక్కడినుంచి బయలుదేరతారు.. రెండున్నరగంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుపతికి బయలుదేరతారు... 3గంటల  25నిమిషాలకు తిరుపతి చేరుకుంటారు పీఎం.. 3.30కి రేణిగుంట విమానాశ్రయంలో టెర్మినల్‌ను ప్రారంభిస్తారు.. 3.55నుంచి సాయంత్రం 4గంటల 15 నిమిషాలమధ్య తిరుపతి మొబైల్ మ్యాన్యుఫాక్చరింగ్‌ హబ్‌కు శంకుస్థాపన చేస్తారు.. సాయంత్రం 5గంటలకు పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు ప్రధాని... సాయంత్రం 5 గంటల 15 నిమిషాలనుంచి 6గంటల 15మధ్య తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.. అక్కడినుంచి రాత్రి 7గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్టునుంచి ఢిల్లీకి పీఎం మోడీ తిరుగుప్రయాణమవుతారు .. 

13:16 - October 21, 2015

గుంటూరు :ప్రపంచవ్యాప్తంగా 16వేల పుణ్యక్షేత్రాలనుంచి సేకరించిన మట్టి, నీరు సేకరించామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. ఈ మట్టి, నీరుతో రాజధాని ప్రాంతం పవిత్రమైన.. శక్తివంతమైన స్థలంగా మారుతుందని చెప్పారు.. ఈ కార్యక్రమంలో అన్ని మతాలవారిని భాగస్వామ్యం చేశామని తెలిపారు.. 

13:14 - October 21, 2015

గుంటూరు : ఉద్ధండరాయుని పాలెంలో నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. రాజధాని శంకుస్థాపన ప్రాంగణాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ముస్తాబైన వేదికలు, లోపలికి ఏ ఒక్కరినీ పోలీసులు అనుమతించడం లేదు. ఉద్ధండరాయుని పాలెంలో శంకుస్థాపన ఏర్పాట్లను చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు.

స్కాలర్ షిప్ దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు...

హైదరాబాద్ : 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఉపకార వేతనాల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం మళ్లీ పెంచింది. దీంతో కళాశాలల్లో చదువుతూ ఇంకా స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు దరఖాస్తులు చేయని విద్యార్థులు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు అక్టోబర్ 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్ చేయాలని జిల్లా ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ హనుమంతు నాయక్ తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సర్వం సిద్ధం

గుంటూరు: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధమయ్యింది. ఎస్ పిజీ బలగాలు రాజధాని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని అణువణునా జల్లెడ పడుతున్నారు. 

అమరావతిలో హెలికాప్టర్ల ట్రయల్ రన్

గుంటూరు : అమరావతి నగర శంకుస్థాపనకు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా హెలికాప్టర్ల ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఉద్ధండరాయుని పాలెం హెలిపాడ్‌లో ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ దిగింది. శంకుస్థాపన ఏర్పాట్లను సీఎం చంద్రబాబు హెలికాప్టరు నుంచి పరిశీలించారు.

తిరుమల లడ్డూపోటు నిర్వాహకుడు రమేష్ మృతి

చిత్తూరు :తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ లడ్డూ పోటు నిర్వాహకుడు రమేష్ అయ్యంగార్ మృతి చెందారు. ఈ ఉదయం 9 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో, తిరుపతిలోని అపోలో ఆసుపత్రికి ఆయనను తరలించారు. ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్ని తరాలుగా శ్రీవారి ఆలయంలో లడ్డుపోటు బాధ్యతలను వీరి కుటుంబీకులే నిర్వహిస్తున్నారు. రమేష్ అయ్యంగార్ వయసు 48 సంవత్సరాలు. రమేష్ మృతితో తిరుమలలో విషాదం అలముకుంది.

డాలర్ శేషాద్రి కి అస్వస్థత

చిత్తూరు : డాలర్ శేషాద్రి ఈ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను తిరుపతిలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వర్ణరథం ఊరేగింపు అనంతరం ఆయన ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఆయన గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా నిత్యమూ శ్రీవారి సేవలో భాగంగా, డాలర్ శేషాద్రి వాహనాల ముందు నిలిచి కనిపించారు. 

12:30 - October 21, 2015

ఆదిలాబాద్ : అధికారుల నిర్లక్ష్యం ఓ కుటుంబాన్ని రోడ్డునపడేసింది... ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్నారు కూన నరేందర్... ఐదు నెలలుగా జీతం ఇవ్వకపోవడంతో కారణం తెలియక టెన్షన్ పడ్డాడు.. తన సర్వీస్‌ బుక్‌ కనబడకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని తెలుసుకున్నాడు.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని గుర్తించాడు.. తనకు న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులతోకలిసి డిపోముందు ఆందోళనకు దిగాడు.. జీతంలేక ఆర్థిక ఇబ్బందులతో తాను నానా కష్టాలు పడుతున్నానని వాపోయాడు. ఈ విషయంపై స్పందించిన డిపో మేనేజర్‌ కండక్టర్‌ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని చెబుతున్నారు.

నవరాత్రి వేడుకల్లో సందడి చేసిన విద్యాబాలన్

హైదరాబాద్ : బాలీవుడ్ లో విద్యాబాలన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని విద్య సొంతం చేసుకుంది. ఎప్పుడూ మోడ్రన్ డ్రస్ లు, హాట్ లుక్స్ తో కనిపించే విద్య... హుందాగా ఉన్న వస్త్రధారణతో దుర్గా నవరాత్రి వేడుకల్లో సందడి చేసింది. విశ్వజిత్ ఛటర్జీ కుటుంబం నిర్వహించిన దుర్గా మాత పూజలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా బెంగాలీ వస్త్రధారణతో విద్య ఆకట్టుకుంది.

విద్యుదాఘాతంతో ఇద్దరు చిన్నారులు మృతి

వరంగల్: వరంగల్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ శివారు గుడితండాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యానికి దసరా ఒకరోజు ముందు ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. నరేష్, సురేష్ అనే ఇద్దరు కవల సోదరులు(14 ఏళ్లు) ఉన్న కొద్దిపాటి పొలానికి నీళ్లు పెట్టి తిరిగి వస్తున్నారు. ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో పొలంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ తీగలు తగిలి కవలలిద్దరూ మృతిచెందారు. కొన్ని రోజుల క్రితమే వీరి తల్లి మృతిచెందినట్లు సమాచారం.

నాపరాళ్ల గనుల్లో పేలుడు : 10మందికి గాయాలు

కర్నూలు : కొలిమిగుండ్ల మండలం తుమ్మల పెంట వద్ద నాపరాళ్ల గనుల్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

12:08 - October 21, 2015

హైదరాబాద్ : చెన్నై మెట్రో రైలులో తృటిలో ప్రమాదం తప్పింది. సెంట్రల్ నుంచి పెరుంగుడికి బయలుదేరిన మెట్రోరైలు వేలచ్చేరీకి చేరుకుంటుండగా హఠాత్తుగా ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బోగీలను తొలగించి ఇంజన్‌ను దూరంగా పట్టాలపై వదిలాడు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంపై రైల్వే ఐజి సీమాఅగర్వాల్‌ దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమిక అంచనాకు వచ్చారు. డ్రైవర్‌ అప్రమత్తం వల్లే ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని అధికారులు అంటున్నారు.

12:07 - October 21, 2015

ఢిల్లీ : కేబినెట్ రాజకీయ వ్యవహారాల కమిటీ అసంపూర్తిగా ముగిసింది. హస్తినలో జరిగిన సమావేశంలో... పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై చర్చ జరిగింది. అయితే తేదీలపై స్పష్టత రాకపోవడంతో.. ఈనెల 26న మరోసారి సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు. అదే రోజు... పార్లమెంట్ వింటర్ సెషన్ తేదీలు ఖరారు చేయనున్నారు.

పంజాబ్ లో కొనసాగుతున్న అల్లర్లు...

హైదరాబాద్ :పంజాబ్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సిక్కుల పవిత్ర గ్రంథమైన 'గురుగ్రంథ్ సాహెబ్'ను అవమానించారంటూ కొనసాగుతున్న అల్లర్లు పంజాబ్లో ఉద్రిక్తతకు దారితీశాయి. పంజాబ్లోని పలు పట్టణాల్లో ఆందోళనకారులు తమ నిరసనలు తెలుపున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యాత్మక నగరాల్లో పారామిలటరీ బలగాలను మోహరించారు. ప్రజలు సంయమనం పాటించాలని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ పిలుపునిచ్చారు. కాగా ఈ అల్లర్ల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందేమోనన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్ : కుంటాల మండలం ఓలాలో అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోవడం వల్లనే రైతు ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెప్పారు. ఈ సంఘటనతో మృతుడి బంధువులు ఆందోళన చెందుతున్నారు.

సిద్దిదాయిని అలంకారంలో భ్రమరాంబ

హైదరాబాద్ : శ్రీశైలంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నేడు సిద్దిదాయిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామి వారికి అశ్వవాహన సేవ, గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

చెన్నై లోకల్ ట్రైన్ లో చెలరేగిన మంటలు...

హైదరాబాద్: చెన్నైలోని పెరుంగుడి వద్ద లోకల్ ట్రైన్‌లోని ఓ బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు ఎక్కువగా లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. రైలు వేలచెర్రి నుంచి చెన్నై బీచ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

11:11 - October 21, 2015

గుంటూరు :దసరా, శంఖుస్థాపన ఒకేరోజు రావడంతో ఈ పల్లెల్లో సంబరాలు మరింత జోరుగా సాగుతున్నాయి.. అమ్మాయిలు గోరింటాకు పెట్టుకొని మురిసిపోతున్నారు.. పెద్దవారూ రాత్రి, పగలు తేడాలేకుండా కబుర్లతో గడిపేస్తున్నారు.. పేద, ధనిక బేధం లేకుండా అందరూ సంతోషంగా గడుపుతున్నారు.. ఇంతకుముందు ఈ ప్రాంతంలో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదంటున్నారు స్థానికులు...

రహదారులను విద్యుత్ దీపకాంతులతో.....

అటు రాజధానికి వచ్చే రహదారులను విద్యుత్ దీపకాంతులతో అలంకరిస్తున్నారు.. ప్రకాశం బ్యారేజీని సుందరంగా తీర్చిదిద్దారు.. గన్నవరంనుంచి అమరావతికివచ్చే రోడ్ల విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి.. ఈ గ్రామాల్లో ఇళ్లుకూడా అదేస్థాయిలో ధగధగలాడుతున్నాయి.. మొత్తానికి శంఖుస్థాపనకు ముందే రాజధాని గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం కొనసాగుతోంది.. 

11:08 - October 21, 2015

హైదరాబాద్ : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఓ ఇంట్లో ఉగ్రవాదులున్నారన్న... సమాచారంతో.. భద్రతా దళాలు.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అనంతరం రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మృతిచెందగా, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.

ముగిసిన పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ

ఢిల్లీ : పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ ముగిసింది. 26నజరిగే భేటీలో పార్లమెంట్ శీతాకాల సమావేవాల తేదీలు ఖరారయ్యే అవకాశముంది.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: తిమ్మాజీపేట మండలం ఆవంచలో అప్పుల బాధతో రైతు భాస్కర్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ మండలం రేలమడుగులో అప్పుల బాధతో రైతు మల్లయ్య మృతి చెందారు.

వరి, అరటి పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు..

శ్రీకాకుళం : సీతం పేట మండలం సంతవలసగూడ లో రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఐదు ఎకరాల్లోని వరి, అరిటి పంటలు ధ్వంసం చేశాయి.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 50 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్, 10 పియింట్లకు పైగా లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి.

10:29 - October 21, 2015

చిత్తూరు : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి స్వర్ణ రథోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్పస్వామి కన్యాలగ్నంలో స్వర్ణరథాన్ని అధిరోహించారు. తిరువీధుల్లో భక్త కోటిని అనుగ్రహిస్తూ అత్యంత వైభవంగా వూరేగారు. స్వర్ణరథాన్ని మహిళా భక్తులు లాగుతూ భక్తిని చాటుకున్నారు. గురువారం ఉదయం చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 

నేడు అమరావతి భూముల సంప్రోక్షణ

గుంటూరు : అమరావతి శంకుస్థాపన కోసం ప్రపంచవ్యాప్తంగా పలు పుణ్యతీర్థాల నుంచి 16వేల గ్రామాలు, పవిత్రస్థలాలు, మహనీయుల జన్మభూముల నుంచి సేకరించిన మట్టి-నీటి మిశ్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఆకాశమార్గం నుంచి కిందకు వెదజల్లనున్నారు. మానససరోవరం, జరూసలెం, మక్కామజీదుతో పాటు దేశంలోని అనేక పుణ్యనదులు, పవిత్ర ప్రదేశాల నుంచి సేకరించిన నీరు, మన మట్టి కళశాలన్నీ నిన్ననే రాజధాని ప్రాంతానికి చేరుకున్నాయి. వీటన్నింటినీ మిశ్రమంగా చేసి వాటి నుంచి కొంతభాగాన్ని తీసుకుని రాజధాని ప్రాంతంలో ఈరోజు సంప్రోక్షణ చేయనున్నారు.

10:23 - October 21, 2015

గుంటూరు : శంకుస్థాపన కార్యక్రమంతో.. రాజధాని పరిసర గ్రామాల్లో కోలాహలం అంతా ఇంతా కాదు. ఎక్కడెక్కడి నుంచో బంధువులు.. స్నేహితులు ఈ ప్రాంతంలోని తమ ఆత్మీయుల వద్దకు తరలి వస్తున్నారు. ఇప్పుడు ఏ ఇల్లు చూసినా.. బంధువులతో కళకళలాడి పోతోంది. అమ్మలక్కల ముచ్చట్లు.. చిన్నారుల ఆటపాటలు... మనసుకి, కళ్లకు విందు చేస్తున్నాయి. ఆ సుందర దృశ్యాలను చూడాల్సిందే గానీ.. వర్ణించడానికి వీల్లేని రీతిలో సంబరం అంబరమంటుతోంది.

అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో..

రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో.. ఇప్పుడు రెండు పండుగల వాతావరణం వెల్లివిరుస్తోంది. స్థానిక ప్రజలు ఒకేరోజు దసరా, శంకుస్థాపన పండుగలను జరుపుకుంటున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని తమవరకే పరిమితం చేసుకోకుండా.. బంధువులు, స్నేహితులకూ పంచేందుకు స్థానికులు సమాయత్తమయ్యారు. అందుకే.. ఎక్కడెక్కడో ఉన్నవారిని ఈ పండుగకు తమ ఇళ్లకు తరలి రావాల్సిందిగా ఆహ్వానాలు పలికారు. ఆ పిలుపులు అందుకున్న వారు.. సకుటుంబ సపరివార సమేతంగా.. రాజధాని ప్రాంతాలకు తరలి వస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా.. సందడే సందడి.

రాజధాని పరిసర గ్రామాల్లోని ఏ వీధిని చూసినా..

రాజధాని పరిసర గ్రామాల్లోని ఏ వీధిని చూసినా.. ఇంటి ముందు పిల్లల ఆటపాటలు, ఆరుబయట మహిళల ముచ్చట్ల సన్నివేశాలే దర్శనమిస్తున్నాయి. ప్రతి ఏడాది దసరా పండుగను మామూలుగా జరుపుకునేవారమని.. ఈసారి జన్మంతా గుర్తుండిపోయేలా జరుపుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు. బంధువులతో నెలకొన్న సందడి గుండెల నిండా ఆనందాన్ని నింపుతోందని రాజధాని ప్రాంత రైతులు చెబుతున్నారు.

గతంలో ముఖ్య సందర్భాలకూ రాని వారు సైతం......

గతంలో ముఖ్య సందర్భాలకూ రాని వారు సైతం.. ఈసారి పిల్లాపాపలతో తరలి వచ్చారు. పైగా కొందరైతే.. పిలుపులు అందకపోయినా.. ఫోన్లు చేసి మరీ వారే తరలి వస్తున్నారు. దీంతో ఉద్దండ్రాయినిపాలెం, లింగాయపాలెం, వెలగపూడి, మందడం వంటి గ్రామాల్లో చుట్టాల సందడి బాగా ఎక్కువగా కనిపిస్తోంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన బంధుమిత్రులు అందరూ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా... కనులారా చూడాలని కోరుకుంటున్నారు. దీనికోసం తమకూ పాసులు ఇప్పించాలని, కానీ పక్షంలో.. ప్రభుత్వం అందించిన పాసులను తమకివ్వాల్సిందిగా కోరుతున్నారు.

పొరుగు రాష్ట్రాల్లో స్థిరపడ్డ వారుకూడా..

ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి.. పొరుగు రాష్ట్రాల్లో స్థిరపడ్డ వారుకూడా.. రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకించేందుకు.. తిరిగి వస్తున్నారు. ఇక్కడ ఆడిపాడిన తమ చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చుకొని మురిసిపోతున్నారు. మొత్తానికి శంకుస్థాపన కార్యక్రమంతో.. అమరావతి పరిసర గ్రామాలు బందువుల సందడితో కనువిందు చేస్తున్నాయి. 

10:19 - October 21, 2015

హైదరాబాద్ : అమరుల సంస్మరణ సభలో పోలీసులకు వరాలు కురిపించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌... డబుల్ బెడ్‌రూం ఇళ్లలో 10శాతం పోలీసులు, హోంగార్డులు, మాజీ సైనికులకు కేటాయిస్తామని ప్రకటించారు.. ఎస్ఐ, ఆపైస్థాయి అధికారుల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిస్తామని తెలిపారు.. హైదరాబాద్‌ గోషామహల్‌ స్టేడియంలో జరిగిన సభకు సీఎం హజరయ్యారు..

10:17 - October 21, 2015

ఏలూరు : ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ... వైసీపీ నేతలు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఆర్టీసీ బస్సులను ఆపి ధర్నా నిర్వహించారు. హోదా కోసం జగన్ దీక్ష చేస్తుంటే... ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని పార్టీ నేతలు ఆరోపించారు. ప్రత్యేక హోదా వస్తే.. ఉద్యోగాలు పెరుగుతాయని... తెలిసి కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు విమర్శించారు.

10:16 - October 21, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి చరిత్రలో విశిష్ట స్థానముంది. ముఖ్యంగా తుళ్లూరు మండలంలోని మందడం గ్రామం.. చారిత్రక ప్రసిద్ధమైనదని చరిత్రకారులు చెబుతారు. మందడం గ్రామం.. కాకతీయ రాజుల కాలం నుంచే ఉందని.. ఈ గ్రామంలో రాణి రుద్రమదేవి, గణపతి దేవుడూ తిరిగారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది.

ఉత్తరవాహినిగా కృష్ణానది ఉండడం వల్ల..

ఉత్తరవాహినిగా కృష్ణానది ఉండడం వల్ల.. కాకతీయ ప్రభువుల పాలనలో ఈ ప్రాంతం ఓ వెలుగు వెలిగిందని చెబుతారు. రాణి రుద్రమ వేయించిన 14 అడుగుల ఎత్తైన శిలా శాసనం నేటికీ ఇక్కడ కనిపిస్తుంది. 200 వాక్యాలతో రూపొందించిన ఈ శాసనం.. మందడం శివారులోని మల్కాపురం అనే సుగాలీ కాలనీ వద్ద దర్శనమిస్తుంది. 1261వ సంవత్సరంలో ఈ శాసనం రూపొందించినట్లు తెలుస్తోంది.

మందడంలో ప్రసిద్ధ విశ్వేశ్వరాలయం.....

మందడంలో ప్రసిద్ధ విశ్వేశ్వరాలయం ఉంది. దీన్ని గణపతి దేవుడే నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆలయానికి సమీపంలో ఓ కొలను కూడా ఉంది. అయితే.. ప్రస్తుతం ఇది పూర్తిగా పాడుబడిపోయింది. రుద్రమదేవి ప్రతి సంవత్సరం మార్చి 25న జన్మదినోత్సవాలు జరుపుకునేందుకు ఏటా ఇక్కడికి వచ్చేదని.. కొలనులో స్నానమాచరించి విశ్వేశ్వరుడిని దర్శించుకునేదని శాసనాల్లోని అక్షరాలను బట్టి తెలుస్తుంది. కాకతీయ ప్రభువుల ఏలుబడి అనంతరం.. ఈ ప్రాంతం కృష్ణరాయల పాలనలో ఉండేది. అప్పట్లో మల్లిక అనే నర్తకికి ఈ గ్రామాన్ని దత్తత ఇచ్చారని.. ఆమె పేరిట దీన్ని మల్లికాపురంగా పిలిచేవారని అంటారు. కాలక్రమంలో అదే మల్కాపురంగా మారిందని చెబుతారు. బ్రిటిష్‌ వారి కాలంలో ఆలయ సంపదను శిథిలం చేశారని స్థానికులు విశ్వసిస్తారు.

శిథిల దశలో ఉన్న రుద్రమదేవి శాసన స్తూపాన్ని.....

చాలాకాలంగా శిథిల దశలో ఉన్న రుద్రమదేవి శాసన స్తూపాన్ని, విశ్వేశ్వరుడి ఆలయాన్ని ఇప్పుడు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమరావతి రాజధాని శంకుస్థాపన పనుల్లో భాగంగా.. ఈ ప్రాంతాన్నీ వృద్ధి చేస్తుండడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శతాబ్దాల క్రితమే ఎంతో విశిష్టత సంతరించుకున్న మందడం, మల్కాపురం ప్రాంతాల్లో ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని ఏర్పడుతుండడాన్ని స్థానికులు అదృష్టంగా భావిస్తున్నారు. 

పోలీసులపై కేసీఆర్ వరాల జల్లులు..

హైదరాబాద్: పోలీసులపై వరాల జల్లు కురిపించారు. ప్రోలీసులకు ప్రోత్సాహకాలు... ప్రమోషన్లు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. గోషామహాల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. పోలీసు అమరవీరులకు ఈ సందర్భంగా కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... ఎస్సై పై స్థాయి అధికారులకు విధులు నిర్వహిస్తున్న చోటే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు రూ. 3 వేలు అలవెన్స్ను కేసీఆర్ ఈ సందర్బంగా ప్రకటించారు. అలాగే పోలీసుల యూనిఫామ్ వార్షిక అలవెన్స్ రూ. 3, 500 నుంచి రూ. 7,000 వరకు పెంచుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన కేసీఆర్

హైదరాబాద్: నేటి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలోని గోషామహల్ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

09:41 - October 21, 2015

హైదరాబాద్ : విశాఖనగరం నడిబొడ్డున వెంకోజీపాలెం ప్రధాన రహదారిపై ఫుల్‌ లోడ్‌తో వస్తున్న గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. దీంతో పోలీసులు స్థానికులను అప్రమత్తం చేశారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. ట్యాంకర్‌ను అక్కడి నుంచి మళ్లించే ప్రయత్నాలు సాగుతున్నాయి. 

09:40 - October 21, 2015

విజయవాడ : పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. దేశసేవకోసం ప్రాణాలర్పించినవారి సేవలు మరువలేనివని కొనియాడారు.. విజయవాడలో ఈ కార్యక్రమం జరిగింది.. ఈ సభలో మంత్రి చినరాజప్పతోపాలు పలువురు పోలీస్ ప్రముఖులు పాల్గొన్నారు..

09:38 - October 21, 2015

హైదరాబాద్ : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల అటవీ ప్రాంతంలో కోటి రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా 50 తమిళ కూలీలు మినీలారీని వదిలేసి పారిపోయారు.

08:39 - October 21, 2015

హైదరాబాద్ :రాజధాని సెంటిమెంట్ తోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు అని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' ప్రోగ్రాంలో ద హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె.నాగేశ్వర్ అన్నారు. అమరావతి శంకుస్థాపన చుట్టూ ఒక రాజకీయం జరుగుతోందన్న ఒక వాదన బలంగా వినిపిస్తోంది. సెంటిమెంట్ ఆధారంగానే టిడిపి పుట్టింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. రకరకాల సెంటిమెంట్లతో టిడిపి బలపడిందా? అసలు తెలుగుదేశం పార్టీ వెనుక ఉన్న రాజకీయం, పూర్వరంగం గురించి నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. పూర్తి విశ్లేషణ చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

08:38 - October 21, 2015

హైదరాబాద్ : 2003లో అహ్మదాబాద్ లో జరిగిన పేలుళ్ల ప్రధాన నిందితుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది గులాం జాఫర్ షేక్ ను గుజరాత్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. గోద్రాలో జరిగిన అల్లర్ల తరువాత కుటుంబంతో సహా హైదరాబాద్ కు వచ్చి బేగంపేటలో నివసిస్తున్న ఆయనను గుజరాత్ నుంచి వచ్చిన ప్రత్యేక ఏటీఎస్ పోలీసుల బృందం అదుపులోకి తీసుకుంది. జాఫర్ కు ఐఎస్ఐ, జైషే మహమ్మద్, లష్కరే తోయిబాతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని, ఆయన్ను నేర పరిశోధన విభాగానికి అప్పగించామని పోలీసులు తెలిపారు. గోద్రా అల్లర్ల తరువాత ప్రతీకార దాడుల కోసం జాఫర్ ఐఎస్ఐలో చేరి ఉగ్రవాదిగా మారాడని వివరించారు. జాఫర్ స్వస్థలం గుజరాత్ లోని దరియాపూర్ అని, 12 సంవత్సరాలుగా హైదరాబాద్ లో అజ్ఞాత జీవితం గడుపుతున్నాడని వెల్లడించారు.  

భార్య గొంతుకోసి భర్త ఆత్మహత్య...

హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో కుటుంబ కలహాలు ఇద్దరి ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాయి. ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో కుటుంబ కలహాలతో భార్యను గొంతు కోసి భర్త చంపేశాడు. అనంతరం భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరి మృతితో బూదగవి గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు ఆరంభించారు.

శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం పట్టివేత...

హైదరాబాద్ : చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనాన్ని అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. రాగిమాకులకుంట దగ్గర కోటి రూపాయల విలువైన ఎర్రచందనాన్ని భాకరాపేట అటవీ సిబ్బంది పట్టుకున్నారు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్‌ వెనుక ఎవరున్నారనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మహిషాసురమర్ధిని అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మ

విజయవాడ : ఇంద్రకీలాద్రి పై అమ్మవారు మహిసాసురమర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. లోక కంటకుడైన మహిషాసురిడిని చంపిన మహోగ్రరూపం ఇది. సకలదేవీ, దేవతల శక్తులన్నీ ఈ దేవిలో మూర్తీభవించి ఉంటాయి. ఈ తల్లి అనుగ్రహం పొందితే అసాధ్యమేనది ఉండదు.మహిషాసుర సంహారం జరిగిన రోజునే మహార్నవమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున చండీ సప్తశతీహోమం చేసిన వారికి శత్రుభయం ఉండదని, అన్నిటా విజయం కలుగుతుందని భక్తుల నమ్మకం.

07:53 - October 21, 2015

హైదరాబాద్ : వ్యవసాయ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల రైతు ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగాన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సాయం చేయడం లేదా? రైతు ఆత్మహ్యలు రోజు రోజుకూ ఎందుకు పెరుగుతున్నాయి? రైతు ఆత్మహత్యలపై కేంద్రానికి నివేదిక సమర్పించడం పై కేసీఆర్ సర్కార్ విఫలం అయ్యిందా? ప్రజల సమస్యలను పక్కన పెట్టి... రాజధాని నిర్మాణమే ప్రధానాంశంగా చంద్రబాబు ఎందుకు చూస్తున్నారు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత వ్యవహారాలను ప్రభుత్వ వ్యవహారాల్లో చేయడం రాజ్యాంగ విరద్ధం కాదా? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసి) నేత వెంకట రామయ్యణ, బిజెపి నేత ఆచారి,కాంగ్రెస్ నేత కైలాష్, టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి లు పాల్గొన్నారు. మరి వారి మధ్య ఎలాంటి జరిగిన చర్చను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

హైదరాబాద్: నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గోషామహల్ అమరవీరుల స్థూపం వద్ద గవర్నర్ నరసింహాన్, సీఎం కేసీఆర్‌లు నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

బంగారు రథంపై ఊరేగుతున్న శ్రీవారు...

చిత్తూరు: నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు వచ్చిన వేళ, నేడు బంగారు రథంపై శ్రీవెంకటేశ్వరుడు తిరు మాడవీధుల్లో ఊరేగుతున్నాడు. ఉదయం 7 గంటల సమయంలో ఊరేగింపు ప్రారంభమైంది. రేపటితో బ్రహ్మోత్సవాలు ముగియనున్న సంగతి తెలిసిందే. పవిత్ర పుష్కరిణిలో చక్రస్నానంతో ఈ ఏటి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.  

హనుమాన్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం : ఒకరి మృతి

కృష్ణా : హనుమాన్ జంక్షన్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందారు...బైక్ పై వెళ్తున్న దంపతులను కేనినేని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

హైదరాబాద్ లో ఉగ్రవాది పట్టివేత

హైదరాబాద్ : నగరంలో ఓ ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. 2003 అహ్మదాబాద్ పలుళ్ల నిందితుడు గులాం జాఫర్ షేక్ గా గుర్తించారు. ఆ ఉగ్రవాది హైదరాబాద్ లో దర్జీగా పని చేస్తున్నాడు.

విశాఖ లో బోల్తా పడ్డ గ్యాస్ ట్యాంకర్

హైదరాబాద్ : విశాఖలోని కొత్త వెంకోజీపాలెం వద్ద విశాఖ నుంచి ఒడిశా వెళ్తున్న ఓ గ్యాస్ ట్యాంకర్ అర్థరాత్రి బోల్తా పడింది. 17 టన్నుల సామర్థ్యం గల ఈ గ్యాస్ ట్యాంకర్ రాత్రి రెండు గంటల సమయంలో జాతీయ రహదారి పై బోల్తా పడటంతో అప్రమత్తమైన స్థానికులను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. హెచ్ పీసీఎల్ అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో పోలీసులే గ్యాస్ ట్యాంకర్ ను పక్కకు తప్పించేందుకు చర్యలు తీసుకున్నారు.

రామోజీతో దిగ్విజయ్ భేటీ....

హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ మంగళవారం భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలసి ఆయన రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. వీరు ముగ్గురే కొంతసేపు సమావేశమయ్యారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత, ఇతర ముఖ్యమైన అంశాలేమీ లేవని, కేవలం మర్యాదపూర్వకంగానే రామోజీరావును కలిసినట్లు దిగ్విజయ్ మీడియాకు వెల్లడించారు.

ఢిల్లీలో కాల్పుల కలకలం

హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ... మరొకరరి పరస్థితి విషమంగా ఉంది. భగీరథీ విహార్ లో తన ఇంట్లో ఎలుకలు వదిలి పెట్టారని కాల్పులు జరిపినట్లు సమాచారం...

బతుకమ్మ పాటలతో హోరెత్తించిన తెలంగాణ

హైదరాబాద్ : తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పూల పండుగతో నేల పులకించిపోయింది. వాడవాడలా బతుకమ్మ పాటలతో హోరెత్తాయి. బతుకమ్మ ఆటలతో అందంగా మారాయి. తొమ్మిది రోజుల పాటు జరిగిన ఉత్సవాలతో తెలంగాణ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.

06:47 - October 21, 2015

హైదరాబాద్ : అమరావతి నిర్మాణం ప్రభుత్వపరంగానే కాదు వ్యక్తిగతంగానూ చంద్రబాబునాయుడికి ప్రతిష్టాత్మకం. దాని చుట్టూనే ఆయనతో పాటు ఆయన రాజకీయ వారసుల భవిష్యత్ కూడా అమరావతితో ముడిపడి వుంటుందనడంలో సందేహం లేదు. అందుకే ఆయన ఎప్పుడూ ఎక్కడా జరగని రీతిలో శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికలలోగా ఎంతోకొంత పనిచేసి చూపించాలన్న పట్టుదల ఆయనలో కనిపిస్తోంది. ఏ కొంచెం పని జరిగినా దానికి పదింతల ప్రచారం పొందడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు.

ఎవరి మీదా ఒక్క లాఠీ దెబ్బ కూడా పడకుండా .....

ఎవరి మీదా ఒక్క లాఠీ దెబ్బ కూడా పడకుండా 30వేల ఎకరాలు సమీకరించడం సాధారణ విషయమేమీ కాదని మంత్రులు అంటున్నారు. తన మీద నమ్మకంతోనే రైతులు ఇన్ని వేల ఎకరాల భూమిని అప్పగించారని చంద్రబాబు చెబుతున్నారు. భూ సమీకరణకు అనుసరించిన పద్ధతి, రాజధాని నిర్మాణంలో అవలంభిస్తున్న కొత్త పోకడలు, ఎంచుకున్న ప్రాంతం, భూములిచ్చినవారికి, ఉపాధి కోల్పోయినవారికి ఇవ్వజూపిన ప్రతిఫలాల విషయంలోనూ, పర్యావరణం లాంటి సున్నితాంశాల విషయంలోనూ ఎవరు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఇప్పటిదాకా వ్యవహారాన్ని చంద్రబాబు సాఫీగానే నడుపుకుంటూ వచ్చారు. ఇక ఇక్కడ నుంచి కొత్త అంకం మొదలుకాబోతోంది.

చంద్రబాబు చెబుతున్న మాటలను సంభ్రమాశ్చర్యాలతో .....

ఇప్పటిదాకా చంద్రబాబు చెబుతున్న మాటలను సంభ్రమాశ్చర్యాలతో వింటూ వచ్చినవారు, ఆయనకు సహకరించినవారూ ఇక నుంచి ఫలితాలు ఆశిస్తారు. ప్రభుత్వం నుంచి నయా పైసా నష్టపరిహారం తీసుకోకుండా 30వేల ఎకరాల భూములిచ్చినవారి ఆశలు వాస్తవరూపం దాల్చడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. ఇన్నాళ్లూ అక్కడ కౌళ్లూ, కూలీలు చేసుకుంటూ బతుకుబండిని లాగించినవారి జీవితం కొత్త మలుపులో వుంది. భూములిచ్చిన రైతులకీ, కౌలు రైతులకీ, కూలీలకీ, ఆ ప్రాంతంలోని ఇతర వ్రుత్తులవారికి ఎదురుకాబోతున్న అనుభవాలను ఆంధ్రప్రదేశ్ తో పాటు యావత్ దేశం గమనించబోతున్నది. భవిష్యత్ లో వివిధ ప్రాంతాల్లో రాబోయే విభిన్నరకాల ప్రాజెక్ట్ లను ప్రభావితం చేయబోతున్నది. అమరావతి నిర్మాణం ఒక కొత్త పాఠం కాబోతున్నది. ఇప్పటి దాకా హైదరాబాద్ తో అనుసంధానమైన 13 జిల్లాల ప్రజల జీవితాలు ఇక నుంచి అమరావతి అనే కొత్త నగరంతో అనుసంధానం కాబోతున్నాయి.

తన ప్రతిష్టకు సవాలుగా తీసుకున్న చంద్రబాబు....

అమరావతి నిర్మాణాన్ని తన ప్రతిష్టకు సవాలుగా తీసుకున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను కూడా అర్ధం చేసుకోవాల్సి వుంటుంది. విభిన్న ప్రాంతాల్లో , విభిన్న వర్గాల్లో గూడుకట్టుకుంటున్న ఆవేదనలనూ వినాల్సి వుంటుంది. ఊరూరా తిరిగి పుట్టమన్ను, చెంబెడు నీళ్లు, ఇటుకలు సేకరించడం వల్ల కొత్తగా నిర్మిస్తున్న రాజధాని తమదేనన్న భావన ప్రజల్లో కలుగుతుందన్నది చంద్రబాబు నమ్మకం. కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలు మేళతాళాలతో తమ అధినేత పెట్టిన బాధ్యతను నిర్వర్తించారు. మరికొన్ని చోట్ల మొక్కబడిగా సాగించారు. ఇంకొన్ని చోట్ల మిన్నకుండిపోయారు. అసలు ఈ కార్యక్రమానికి తాను రాననీ, తనను ఆహ్వానించవద్దని ప్రతిపక్షనేత జగన్ ఖరాఖండిగా చెప్పారు. ఇది అపరిపక్వ నిర్ణయమని రాజకీయ పండితులంటున్నారు. ఈ నిర్ణయం జగన్ కి రాజకీయంగా లాభం చేస్తుందో, నష్టం చేస్తుందో ఇప్పుడే ఊహించడం కష్టం. ఇక కేసీఆర్ కుటుంబం ఆహ్వానం అందడానికి ముందే సానుకూలంగా స్పందించింది. తాము వెళ్లడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఇలా విభిన్నరకాల స్పందనలు ఎందుకు వస్తున్నాయో బేరీజు వేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వుంది.

ప్రజల జీవితాలతో ముడిపడిన వ్యవహారం......

నిజానికి రాజధాని నిర్మాణం చంద్రబాబు వ్యక్తిగత వ్యవహారం కాదు. అధికారపార్టీ టీడీపీ ఆంతరంగిక ఎఫైర్ కాదు. 13 జిల్లాలు మూడు ప్రాంతాల ప్రజల జీవితాలతో ముడిపడిన వ్యవహారం. అభివ్రుద్ధినంతా ఒకచోటే కేంద్రీకరిస్తూ తమను చిన్నచూపు చూస్తున్నారన్న భావన్న ఏ ఒక్కరిలోనూ కలిగించకూడదు. చంద్రబాబు అభివ్రుద్ధి నమూనా తమను ఓల్డ్ సిటీగా మార్చేస్తుందేమోనన్న భావన విజయవాడ, గుంటూరులలో వ్యక్తమవుతోంది. అమరావతికి 30, 40 కిలోమీటర్ల సమీపంలోనే వున్నవారి భావాలు, ఆందోళనలు ఇలా వుంటే, ఇక మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో వున్నవారి మనోభావాలు ఇంకెలా వుంటాయో అర్ధం చేసుకుని, సమగ్రాభివ్రుద్ధికి ప్రణాళికలు రచిస్తేనే అమరావతి ప్రజా రాజధానిగా విరాజిల్లుతుంది. లేదంటే ప్రజల జీవితాలతో సంబంధం లేని, సామాన్య ప్రజల ప్రవేశానికి అనుమతిలేని అత్యాధునిక రాజకోటలాగా మిగిలిపోతుంది. ఒకటి మాత్రం నిజం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందమైన రాజకోటను కోరుకోవడం లేదు. తమ కష్ట సుఖాలు చర్చించే ఒక కొత్త అసెంబ్లీని, తమ జీవితాలు మెరుగుపడేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించే కొంగొత్త సచివాలయాన్ని, వాటిని చిత్తశుద్ధితో, నిజాయితీగా అమలుచేసే చక్కటి అధికార యంత్రాంగాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తున్నదా? అత్యాధునిక అద్భుత కట్టడాల నిర్మాణానికే ప్రాధాన్యత ఇస్తున్నదా? అన్నదే ప్రశ్న. 

06:43 - October 21, 2015

హైదరాబాద్ : అమరావతి శంఖుస్థాపన ముహూర్తం దగ్గరపడుతోంది. ఎందరెందరో ప్రముఖులు హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని అదరహో అనిపించేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే, అమరావతి ప్రజా రాజధానిగా విరాజిల్లాలంటే ఎలాంటి క్రుషి చేయాలి? నగర నిర్మాణంలో ఏయే అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి? అమరావతి విషయంలో ఇప్పటిదాకా ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఆహ్వానించదగ్గ అంశాలేమిటి? నిరసించాల్సిన అంశాలేమిటి? రాజధాని నిర్మాణానికి కేంద్రం ఎలాంటి సహకారం అందించాలి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథం చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో విజయవాడ నుంచి క్రీడా సీపీఎం కన్వీనర్ బాబూరావు పాల్గొన్నారు. వారు ఎలాంటి అంశాలను సూచించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయాలి.

రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా

హైదరాబాద్ : తిరుపతి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. తిరుపతి నగరానికి తలమానికమైన రేణిగుంట విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిని ఆర్జించనుంది. అధునాతన సదుపాయాలతో తీర్చిదిద్దిన అంతర్జాతీయ టెర్మినల్ అందుబాటులోకి రానుంది. ఈ నెల 22న ప్రధాని మోడీ స్వయంగా ఈ నూతన విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు.  

06:39 - October 21, 2015

హైదరాబాద్ : తాళం వేశారు గొళ్ళెం మ‌రిచారు. క‌ష్టాల్లో ఉన్న పార్టీ సార‌థులుంటే స‌రిపోదు. కార్యవర్గం కూడా కావాల్సిందే. ఇది డిగ్గీ ముందు హ‌స్తం నేత‌లు వినిపించిన వాద‌న‌. అంతేకాదు..గాడి త‌ప్పుతున్న నేత‌ల‌ను దారిలో పెట్టకపోతే..రాబోయే రోజుల్లో మ‌రింత న‌ష్టం త‌ప్పదని డిగ్గి రాజా ముందు ఫిర్యాదుల చిట్టా విప్పారు హ‌స్తం నేత‌లు.

నేత‌లను గాడిలో పెట్టండని ఫిర్యాదు .....

రెండు రోజుల తెలంగాణ రాష్ట్ర ప‌ర్యటనలో దిగ్విజ‌య్ సింగ్‌..రాష్ట్ర నేత‌ల రెండు ఫిర్యాదులు..మూడు ఆవేద‌న‌ల‌తో బిజీ బిజీగా గ‌డిపారు. పార్టీ క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో ప‌టిష్టమైన నాయ‌క‌త్వం అవ‌స‌ర‌మ‌ని పిసిసి మార్పుకు నాంది ప‌లికిన ఏఐసిసి పెద్దలు..ఆ త‌రువాత ర‌థ‌సార‌థుల‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోవడంపై ప‌లువురు త‌మ ఆవేద‌న‌ను వెలిబుచ్చారు. పిసిసి చీఫ్‌గా ఉత్తం కుమార్‌రెడ్డిని నియ‌మించిన త‌ర్వాత పూర్తి స్థాయిలో క‌మిటీ ప్రక్షాళన ఉంటుంద‌ని ప్రకటించారు. కానీ నెల‌లు గ‌డుస్తున్నా అతీగ‌తి లేకుండా పోయింది. దీంతో ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నవారు ఎప్పటికప్పుడు త‌మ ఆవేద‌నా గ‌ళాన్ని విన్పిస్తునే ఉన్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని రాష్ట్ర పర్యటనకొచ్చిన డిగ్గీ ముందు త‌మ ఆవేద‌న‌ను వెళ్లగక్కారు నేత‌లు. పూర్తి స్థాయిలో క‌మిటీ లేక‌పోవ‌డంవ‌ల్ల ఎదురవుతున్న న‌ష్టాల‌ను డిగ్గీ రాజాకు విన్నవించారు నేత‌లు.

క్రమశిక్షణ ఉల్లంఘ‌న‌ల‌పైనా దిగ్విజ‌యికి ఫిర్యాదులు.....

మ‌రోవైపు పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘ‌న‌ల‌పైనా దిగ్విజ‌యికి ఫిర్యాదులు చేశారు నేతలు. ఖ‌మ్మం జిల్లా కొత్తగూడెంకు 2019 ఎన్నిక‌ల అభ్యర్థిని ప్రకటించడంపై దిగ్విజయ్‌సింగ్‌ దృష్టికి తీసుకెళ్ళారు కొంద‌రు నేత‌లు. ఈ సందర్బంగా రేణుకచౌదరి వ్యవహారశైలి పార్టీకి న‌ష్టం క‌లిగించేలా ఉంద‌ని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి మరికొంత మంది నేత‌లు దిగ్విజయికి ఫిర్యాదు చేశారు. ఆమెపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇదిలా ఉంటే దానం నాగేంద‌ర్ వ్యవహారశైలిపై కూడా రంగా రెడ్డి జిల్లా నేత‌లు దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. గ్రేట‌ర్ అధ్యక్షుడిగా దానం ఒంటెద్దుపోక‌డ‌ల‌తో పార్టీకి న‌ష్టం క‌లుగుతుందని విన్నవించారు. పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న దానంను త‌ప్పించి గ్రేట‌ర్ కొత్త క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని కోరారు. పనిలో పనిగా సీఎల్పీ లీడర్ జానారెడ్డిపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నేతలు. జానారెడ్డి పోరాట పటిమను ప్రదర్శించడంలేదని సీనియర్ నేత పాల్వాయి ఆవేదన వెల్లగక్కారు.

జైరాం ర‌మేశ్ చేసిన వ్యాఖ్యలను సైతం....

దీంతో పాటు 60 ఏళ్ళు దాటిన సీనియ‌ర్లంతా పార్టీకి స‌ల‌హాల‌కే ప‌రిమితం కావాలంటూ జైరాం ర‌మేశ్ చేసిన వ్యాఖ్యలను సైతం దిగ్విజ‌య్ ముందు ప్రస్తావించారు సీనియర్లు. ఇలాంటి అవ‌గాహ‌న లేనికామెంట్స్‌తో ప్రత్యర్థి పార్టీల‌కు అవ‌కాశం ఇచ్చిన వాళ్లమవుతామని ఆవేద‌న వెలిబుచ్చారు. ఇలా పార్టీ గీత దాటుతున్న నేత‌ల‌ను ఇకనైనా గాడిలో పెట్టాల‌ని డిగ్గీరాజాకు అనేకమంది ఫిర్యాదులు చేశారు. 

06:36 - October 21, 2015

హైదరాబాద్ : తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మ వేడుకలు తమిళనాడులోని చెన్నైలో ఘనంగా ముగిశాయి. ఏళ్ల తరబడి తెలంగాణా నుండి వలసవచ్చి చెన్నైలో స్థిరపడ్డ వేలాది కుటుంబాలు గత నాలుగేళ్లుగా బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. తమ ప్రాంత పండుగను వేడుకగా నిర్వహించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని బతుకమ్మ ఉత్సవాలను తమిళనాట వైభవంగా నిర్వహించారు. చెన్నైలోని షావుకారుపేట కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాలలో ఉన్న భారీ మైదానంలో వేలాదిగా తరలివచ్చిన తెలంగాణా ఆడపడుచులు బతుకమ్మలను పేర్చి వాటిచుట్టు తిరుగుతూ పాటలు పాడారు. చెన్నై నగరంలో పరిసర ప్రాంతాల్లో ఉండే సుమారు ఐదువేలకుపైగా తెలంగాణా ఆడపడుచులు పాల్గొనటం విశేషం.

06:33 - October 21, 2015

హైదరాబాద్ : అమరావతికి పసుపుదండు కదిలింది. ఏపీ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లేందుకు తెలంగాణ టిడిపి శ్రేణులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే 10 జిల్లాల్లోని పవిత్ర స్ధలాల్లో మట్టిని, జలాల్ని సేకరించిన టిడిపి శ్రేణులు..వాటిని అమరావతికి చేర్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్ని పార్టీల నాయకుల చూపు ఇప్పుడు అమరావతి వైపే....

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని అన్ని పార్టీల నాయకుల చూపు ఇప్పుడు అమరావతి వైపే ఉంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి కుటుంబసమేతంగా తరలివెళ్లేందుకు తెలంగాణ టిడిపి బృందం రెడీ అయింది.

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి దేవాలయం......

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సేకరించిన పవిత్ర జలాన్ని, మట్టిని అక్కడికి తరలించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి దేవాలయంలో పవిత్ర మట్టిని, జలాన్ని ఎమ్మెల్యే మాగుంట గోపీనాధ్ సేకరించగా, యాదాద్రి నుండి టి టిడిపి సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు, తెలంగాణ టిడిపి మహిళా అధ్యక్షురాలు శోభారాణిలు సేకరించారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మల్లన్న వద్దనుండి టి టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ సేకరించగా..ఖమ్మం జిల్లా భద్రాచలం నుండి జిల్లా నేతలు ఎక్కడికక్కడ మట్టిని, పవిత్ర జలాన్ని సేకరించి హైదరాబాద్‌లోని టిటిడి కళ్యాణ మండపానికి తరలించారు. ప్రత్యేక పూజలనంతరం ఇవన్నీ అమరావతికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లనున్న సీఎం కేసీఆర్ ......

ఇక అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ప్రమఖ నాయకులు, మంత్రులు కూడా అమరావతికి బయలుదేరుతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ అమరావతికి కుటుంబసమేతంగా ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లే షెడ్యూల్‌ ఖరారైంది. ముఖ్యమంత్రితో పాటు కొందరు మంత్రులు కూడా అమరావతికి వెళ్తారని సమాచారం. అటు ఏపీ, ఇటు తెలంగాణ నుంచి వేలాది మంది ముఖ్యనేతలు అమరావతికి వెళ్తుండడంతో...అటు ఏపీ ప్రభుత్వం సైతం వీరికోసం ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది. దీనికి సంబంధించిన బాధ్యతను మంత్రి యనమలకు అప్పగించారు.

శంకుస్థాపన మహోత్సవానికి పార్టీలకతీతంగా......

మొత్తంమీద అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి పార్టీలకతీతంగా..తెలంగాణ నాయకగణమంతా అమరావతికి బయలు దేరుతోంది. దాదాపు 2లక్షల మంది ప్రజలు, వందలాది మంది వీవీఐపీలు, వివిధ దేశాధినేతలు శంకుస్థాపన మహోత్సవానికి రానుండడంతో...ఏపీ ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిస్ట బందోబస్త్‌ను ఏర్పాటు చేస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా...తెలిసేలా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.

 

06:29 - October 21, 2015

గుంటూరు : అక్టోబర్‌ 22. ఈ రోజు కోసం ఆంధ్రదేశమంతా ఎదురు చూస్తోంది. ప్రతి ఒక్కరూ ఆ రోజు కోసం ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురుచూపులన్నీ ఆ రోజు జరిగే రాజధాని శంకుస్థాపన కోసం కాదు.. చీఫ్‌ గెస్ట్‌గా వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కోసం కాదు.. విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసమూ కాదు. అంగరంగ వైభవంగా జరగబోయే వేడుకల కోసం అంతకన్నా కాదు. ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందోనని కూడా కాదు. భోజనాల్లో ఏం వడ్డిస్తారా అనేది అసలే కాదు. మరి దేని కోసం?

దసరా పండగరోజే అమరావతి శంకుస్థాపన....

దసరా పండగ రోజే జరుగుతున్న శంకుస్థాపనకు అమరావతి అద్భుతంగా తయారవుతుంది. శంకుస్థాపన ఎలాగూ జరుగుతుంది. ప్రధాని మోదీ రావటమూ ఖాయమే. విదేశీ అతిథులు వచ్చేది వాస్తవమే. వేడుకలు ఘనంగా జరుగుతాయనడంలోనూ అనుమానం లేదు. భోజనాలు రుచిగా ఉంటాయనడంలోనూ సందేహం లేదు. కాని అందరూ ఎదురు చూస్తుంది వీటి కోసం కాదు.

ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటారా?.......

విభజనతో నొచ్చుకున్న జనహృదయాలకు ఏ మందిస్తారోనని. పగిలిన గుండెలను అతికించడానికి ఏ సర్జరీ చేస్తారా అని. అన్నపూర్ణ లాంటి ఆంధ్రదేశం అప్పుల కోసం సాగిలబడ్డ తరుణంలో.. ఎలాంటి విందు అందిస్తారా అని. కోట్లాదిమంది భవిష్యత్‌ను ఏమిచ్చి కాపాడతారా అని. ఆర్ధికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఏ పుష్పగుచ్చం ఇచ్చి హత్తుకుంటారా అని. ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఆంధ్ర ప్రజలందరి మనసులను మెలిపెడుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఏం ప్రకటన చేస్తారోనని ఎదురు చూస్తున్నాయి.

ప్రత్యేకహోదానా.. లేక దాన్ని మించిన ప్యాకేజియా?.....

ప్రత్యేకహోదా ప్రకటిస్తారా.. లేక దాన్ని మరిపించేంతగా ప్యాకేజీ ఇస్తారా.. లేక కేవలం మాటలతో మురిపించి మళ్లొస్తానంటారా.. ఇవే ఆలోచనలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. టీడీపీ వర్గాల్లో వినపడుతున్న కథనం ప్రకారమైతే ప్రత్యేకహోదాను ప్యాకేజీ హోరులో కలిపేస్తారని తెలుస్తోంది. ప్రత్యేకహోదా అనే వ్యవహారాన్నే కేంద్రం పక్కన పెట్టాలనుకుంటోందని సమాచారం. కాని దాన్ని మించిన ప్యాకేజీని మోదీ శంకుస్థాపన వేదికపై ప్రకటిస్తారని టాక్‌ నడుస్తోంది. ఆ ప్యాకేజీ ఎంతంటే లక్ష కోట్లని వినపడుతోంది.

అమరావతి వేదికపై లక్ష కోట్ల ప్యాకేజి ప్రకటన?.....

ఇప్పటికే నీతి అయోగ్‌ అన్ని రకాల లెక్కలు వేసి.. ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేకరించిన సమాచారాన్ని మొత్తం స్టడీ చేసి.. ఒక ప్యాకేజీ ప్రతిపాదనను నీతి అయోగ్‌ కేంద్రానికి అందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుందేల్‌ఖండ్‌ తరహాలో బీహార్‌కు లక్షా 25 వేల కోట్ల ప్యాకేజిని ప్రకటించిన నరేంద్ర మోదీ.. అదే తరహాలో అమరావతి వేదికపై లక్ష కోట్ల ప్యాకేజిని ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటిస్తారని సమాచారం.

దశలవారీగా అమలు కానున్న ప్యాకేజి.....

ఈ ప్యాకేజీ మాత్రం దశలవారీగా అమలవుతుందని.. దాదాపు ఐదు ఏళ్లపాటు అమలయ్యేలా ఈ ప్యాకేజీ ఉంటుందని చెప్పుకుంటున్నారు. అంతే కాదు ఉత్తరాంధ్ర, రాయలసీమలకు కూడా ప్రత్యేకంగా ఈ ప్యాకేజీలో స్థానం ఉంటుందని ఆశిస్తున్నారు. లక్ష కోట్ల ప్యాకేజితో ప్రత్యేకహోదా డిమాండ్‌తో పాటు ప్రతిపక్షాల ఆందోళనలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేయొచ్చని టీడీపీ, బిజెపి కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి శంకుస్థాపన శుభఘడియల్లో.. ఈ శుభవార్త మోదీ వినిపిస్తారా.. ఆంధ్రులు నిజంగానే దసరా పండుగ జరుపుకునేలా చేస్తారా.. అనేది వేచి చూడాల్సిందే.

06:25 - October 21, 2015

హైదరాబాద్ : సంబరాలు అంబరాన్ని అంటే విధంగా నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రపంచం చూపంతా అమరావతి వైపే ఉండడంతో.. శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. చంద్రబాబు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.

ఉదయం 5 గంటలకు కార్యక్రమాలు ప్రారంభం......

చారిత్రక నిర్మాణానికి ముహూర్త ఘడియలు దగ్గరపడ్డాయి. ఆంధ్రుల కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపనకు సమయం ఆసన్నమైంది. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య గురువారం ఉదయం ఐదు గంటలకే శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మ ముహూర్తంలో పూజా కార్యక్రమం జరగనుంది. విజయదశమి రోజున శుభ ముహుర్తంలో రాజధాని శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్కార్‌ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన వేదికకు సమీపంలో హోమం నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

ఉ.9 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు.....

ఉదయం తొమ్మిది గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రముఖ నటులు, డబ్బింగ్‌ కళాకారుడు సాయికుమార్‌, గాయని సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ఇంకా అనేక నృత్యాలు, శివమణి డ్రమ్స్‌, కళాకారుల రూపకాలు, అమరావతి ప్రత్యేక గీతాలు ఆహుతులను అలరించనున్నాయి. ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదికను నిర్మించారు.

మ.12.30 గంటలకు రానున్న ప్రధాని మోదీ .....

మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రధాని మోదీ వచ్చిన వెంటనే శంకుస్థాపన కార్యక్రమం మొదలవుతుంది. శంకుస్థాపనలో ప్రధానమైన పూర్ణాహుతి, రత్నన్నాస్యం, శిలాన్యాసం వంటి కార్యక్రమాలు ప్రధాని చేతుల మీదుగా జరుగుతాయి. మోదీతో పాటు గవర్నర్‌, చంద్రబాబుతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం ......

శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం ఆలపిస్తారు. తర్వాత జపాన్‌, సింగపూర్‌ మంత్రులు ప్రసంగిస్తారు. అనంతరం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు,.. సీఎం చంద్రబాబుల ప్రసంగాలుంటాయి. చివరగా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. శరవేగంగా కొనసాగుతున్న ఏర్పాట్లను చంద్రబాబు పరిశీలించారు. ప్రధాని మోదీతో పాటు విదేశీ ప్రతినిధులు భారీ ఎత్తున రానుండడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 

06:20 - October 21, 2015

హైదరాబాద్ : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సమయపురం వద్ద ఆగిఉన్న లారీని ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమారు తొమ్మిది మంది మృతి చెందారు. మరో ముప్ఫై మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

06:18 - October 21, 2015

హైదరాబాద్ : న్యూదిల్లీ నుంచి తమిళనాడు వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో జనరల్‌ బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో రైలు వరంగల్ జిల్లా తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్లో దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది. మంటలను గుర్తించిన సిబ్బంది ప్రయాణికులను మరో బోగీలోకి చేర్చడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణీకులు ఒక్కసారిగా రైలు నుండి దూకి పరిగెత్తడంతో చాలా మంది ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి.

చంద్రప్రభ వాహనం పై విహరించిన దేవదేవుడు

హైదరాబాద్ : దివ్యారామం తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు రాత్రి మలయప్పస్వామి మోహినీ రూపంలో చంద్రప్రభ వాహనంపై విహరించారు. 

Don't Miss